మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం

by Namani Sujanadevi November 30, 2025
written by Namani Sujanadevi

‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో! భగ్గున మండిందిరో’ అంటూ ఉరిమే మేఘమై, ఉరికే ఉప్పెనై, ఊరూ వాడా ఏకమై సాధించుకున్న తెలంగాణలో, ‘సాహిత్యానికి’ ఉన్న పాత్ర చాలా విశిష్టమైనది. అంతకుముందు వరకు తెలంగాణ భాషను, యాసను కేవలం విలనిజానికి, ఒకరకంగా అవమానించే రకంగా మాట్లాడే పద్ధతికి మాత్రమే ఎన్నుకున్న తరుణంలో జరిగిన , ‘తెలంగాణ ఆవిర్భావం’ తెలంగాణ భాష, యాస మాధుర్యాన్ని అందరికీ చవిచూపించింది. దానితోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముప్పయి మూడు జిల్ల్లాల్లో విస్తరించిన తెలంగాణ వైభవాన్ని, నలభై నాలుగు మంది తెలంగాణా మహిళా మణుల గళం నుండి కలం ద్వారా వెలువడి, తెలంగాణ నారీశక్తికి ప్రతీకగా నిలబడిన వ్యాస సంకలనమే తెలంగాణా ప్రాభవాన్ని తెలిపే ఈ ‘తెలంగాణ వైభవం- మహిళా చైతన్యం’ గ్రంథమని చెప్పవచ్చు. తెలంగాణ వైభవం- మహిళా చైతన్యంపై వచ్చిన తొలి గ్రంథం కూడా బహుశా ఇదే అయి ఉండవచ్చును.
ఈ గ్రంథ సంకలన సారథి, కృతి స్వీకర్త తెలంగాణ సాహితీ ప్రపంచంలో పరిచయం లేని ప్రముఖ సాహితీవేత్త, విద్యా వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బండ సరోజన గారు.

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయాసి’ అని జన్మభూమిని మర్చిపోకుండా తెలంగాణలోని చెట్టును, పుట్టను, గట్టును గుర్తు చేసుకుంటూ ఈ తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగి, ఈ వాసనలన్నీ ఒళ్లంతా పులుముకున్న మనసున్న మహిళామణి నిరడంబరురాలైన డాక్టర్ బండ సరోజన గారు.
సరోజన గారి కృషి ఫలితంగా వారి ఆకాంక్ష మేరకు, బలమైన నారీశక్తి అయినటువంటి రాజీవ (లక్ష్మీ వాసన్ ) చంటి ప్రసన్న కేంద్ర వ్యవస్థాపకురాలు, ప్రధాన సంపాదకురాలిగా, డాక్టర్ శారద హనుమాన్లుగారు సహా సంపాదకురాలిగా, తెలంగాణా ప్రతీకలైన కాకతీయుల తోరణాన్ని, చారిత్రిక కట్టడాలను, చార్ మినార్ లను ముఖచిత్రంగా వేసుకుని అందంగా ముస్తాబై వచ్చిందే ఈ వ్యాస సంకలనం.
ఇక్కడ మనం ఎన్నో ఏళ్లుగా మహిళలకు చేయూత నిస్తున్న చంటి ప్రసన్న కేంద్రం గురించి, అరవైలో కూడా ఇరవైలా, ఆరోగ్యం సహకరించకున్నా చైతన్యంతో ‘నారీశక్తి’ ని వెలికి తీస్తున్న రాజీవ (లక్ష్మీ వాసన్) గారి గురించి నాలుగు మాటలు తెలుసుకోకపోతే ఈ వ్యాస సంకలన సమీక్షకి సంపూర్ణత చేకూరదు అంటే అతిశయోక్తి కాదు. విషయం తెలిస్తే మీరు ( పాఠకులు) కూడా తప్పక నాతొ ఏకీభవిస్తారు అనడంలో సందేహం లేదు.
చంటి ప్రసన్న కేంద్రం తెలంగాణ, మేడ్చల్(రిజిస్టర్డ్) 1993 నుండి మహిళల రక్షణ స్వయం ఉపాధి వృత్తులలో ఉచిత శిక్షణ నిచ్చి స్వయం ఉపాథి కల్పనకు తోడ్పడింది. నేర్చుకున్న వారు ఈ ఉత్పత్తులతో జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొని పేరు తెచ్చుకున్నారు. కానీ 2022 నుండి వసతి, ఆర్ధిక సహాయం, సదుపాయం లేక ప్రస్తుతం సాహితీ జాగృతి, బాలికల విద్యకే పరిమితమైంది.

బండ సరోజన గారి కుమార్తె, కడారి అపర్ణగారి పలుకులతో ప్రారంభమైన ఈ వ్యాస సంకలనం, డాక్టర్ బండ సరోజన గారి అద్భుతమైన వాక్కులతో మొదలై, శక్తికి మించి శ్రమిస్తూ ఉత్సాహపరిస్తూ, ప్రోత్సహిస్తూ దీనికి రూపం తెచ్చిన రాజీవ, ప్రముఖ రచయిత్రి డాక్టర్ శారద హనుమాన్ల గార్ల మాటలతో ముందుకు సాగింది.

ఇది అద్భుతమైన గ్రంథంగా రూపుదిద్దుకోవడం కోసం నేపథ్యంలో కృషి చేసిన వారిలో చాలా ముఖ్యులు డాక్టర్ వంగరి త్రివేణి గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రజనీవాసన్ గారు, కడారి అపర్ణ గారు, మేక రవీంద్ర గారు, బోడ నరేన్ గారు. ఇలా చరిత్రలో నిలిచి పోయే గ్రంథంగా రూపుదాల్చడానికి పనిచేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

తెలంగాణలోని ‘కుడుమంటే పండుగనే’ అమాయక మాయని మమతలను, మట్టి వాసనలను, ఆచారాల్ని ,సంప్రదాయాలని, సంస్కృతిని, మహిళలకు ఇష్టమైన పసుపు కుంకుమలుగా ఒళ్లంతా పూసుకున్నట్లు తెలంగాణ చరిత్ర అంతటినీ ఐదు ప్రధాన అంశాలుగా తెలంగాణ వైభవాన్ని, శక్తి రూపిణులైన మహిళల గళాలని, కలాలుగా మలిచి విడుదల చేసిన చంటి ప్రసన్న కేంద్రం మేడ్చల్ తెలంగాణ వారు వెలువరించిన ఈ ‘తెలంగాణ వైభవం- మహిళ చైతన్యం’ అనే వ్యాస సంపుటి నిజంగా తెలంగాణ చరిత్రకు ఒక గీటురాయిగా నిలబడుతుంది అనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నేపథ్యంలో వచ్చిన శ్రేష్టమైన సంపుటులలో ఈ సంపుటికి అగ్ర తాంబూలమే!
సంకలనంలోని అంశాలు:
ఇందులోని విషయాలు ఐదు అంశాలుగా క్రోడీకరించారు. తెలంగాణ చరిత్ర మైలురాళ్ళు, తెలంగాణా నారీ శక్తి, తెలంగాణ సంస్కృతి- పండుగలు, తెలంగాణ కట్టడాలు -ప్రాచీన చరిత్ర, తెలంగాణ ముఖ్య వనరులు.
మొత్తం 44 మంది రచయిత్రుల అద్భుతమైన కళా సృష్టి ఈ తెలంగాణ వైభవం- మహిళా చైతన్యం.

ముఖచిత్రం:
తెలంగాణ ప్రతీకలైన కాకతీయ తోరణం, ప్రపంచ ప్రఖ్యాత రామప్ప శిలా వైభవం, గోల్కొండ కోట, చార్మినార్, తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన బతుకమ్మ, బోనాలు అన్నింటినీ కలగలుపుకున్న ముఖచిత్రాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయంగా చేయి పెట్టి ఆ గ్రంథాన్ని తడమాలనిపిస్తుంది. అలా తడిమిన మరుక్షణం చేయి నుండి విద్యుత్ నర నరాల్లో పాకినట్టుగా ఆ పుస్తకం పైన ఏమ్బోసింగ్ చేతికి అద్భుతంగా తగిలి నిజంగానే ఆ ప్రదేశాలలో మనం ఉన్నట్లుగా ఒకలాంటి తాదాత్మ్యం నరనరాన పాకుతుంది అనడంలో సందేహం లేదు. అందుకేనేమో తెలంగాణ మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయిన సీతక్క గారు కూడా తమ అభినందనలు తెలియజేశారు.

తెలంగాణపై తన అభిమానాన్ని నరనరాన నింపుకున్న నారిశక్తి అయిన రాజీవ గారు దీనిని ముందుకు నడిపించి పుస్తక రూపం రావడానికి చేసిన కృషి అనన్య సామాన్యం. తెలంగాణ చరిత్ర మైలురాళ్లు అంశంలో ‘అస్మకుల మొదలు శాతవాహనుల వరకు’ స్త్రీ సాధికారత పై ప్రముఖ విద్యావేత్త సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న డాక్టర్ శారద హనుమాన్లు గారు వ్రాసిన వ్యాసం పుస్తకానికి మా కుటాయమానమై నిలిచింది. అశ్మకులు భారతదేశంలోని మహాజనపదాల్లో ఒకటి అంటూ వారి సామాజిక జీవనం, వారి మాట, మతాచారాల గురించి, సాంస్కృతిక విశేషాల గురించి, అప్పటి భాషా సాహిత్యము, ఉత్సవాలు, ఆచారాలు, విద్య ఎలా ఉండేది అని చాలా వివరంగా తెలిపారు. అప్పట్లో కేవలము వేదమంత్రాలు బ్రాహ్మణ వంశానికి చెందిన స్త్రీలు మాత్రమే నేర్చుకునే అవకాశం ఉండేది. అప్పటి స్త్రీలు సంగీతం, నృత్యం, ఆభరణము, వస్త్రం ఇలాంటి వాటిలలో వారి ప్రతిభను చూపించే వారిగా ఉండే వారని, పరిపాలనలో కూడా భాగస్వామ్యం రాణులకు ఉండేదని, చారుమతి గురించి ఆమె అస్మకరాజకుమారిగా అభివర్ణిస్తూ, మౌర్యుల కాలంలో తెలంగాణలో మహిళల స్థానం గురించి, శాతవాహన యుగం గురించి, మలయావతి, శాతవాహన రాజు శాతకర్ణి భార్య గురించి, గౌతమపుత్ర శాతకర్ణి గురించి మొత్తం విపులంగా తన వ్యాసంలో తెలిపారు. కాకతీయులనాటి శాసనాలు అందులో స్త్రీల పాత్ర గురించి మనము చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకుంటే లాభమేంటి అనే విషయాలన్నింటిని చర్చిస్తూ రాసిన డాక్టర్ భిన్నూరి మనోహరి గారి వ్యాసం ఆద్యంతం మంచి విజ్ఞానదాయకంగా ఉంది. అందులో మైలమాంబ, కుందమాంభ, రుద్రమదేవి, కోట గణపాంబ, కుప్పాంబిక, నాగాంబిక, మైలాంబిక గురించి మొత్తం కాకతీయ కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న విషయాన్ని సవివరంగా వ్యాసంలో పొందుపరిచారు.
వై సుజాత ప్రసాద్ గారు కాకతీయ రాజుల పరిపాలన, మొదటి రాజు బేతరాజు మొదలుకొని స్థాపించిన సంవత్సరము, కాకతీయను ఏలిన పాలకులు, పరిపాలించిన ఆయా కాలాల్లో జరిగిన విషయాలు సూక్ష్మంగా తెలిపారు. అప్పటి రాజకీయ చరిత్రలో ఆలయాల నిర్మాణాలు, సంస్కృతి సంప్రదాయాల వివరాలు, కళా పోషణ, అప్పటి గుట్టలపై, శిల్పాలపై నిర్మించిన అశేష శిల్ప సంపద గురించి పూర్తి వివరాలను సూక్ష్మంగా ఇప్పటికీ మనకు ప్రత్యక్ష నిదర్శనలుగా ఉన్న ఆలయాలను గురించి వివరిస్తూ సాగింది. ఇందులో ఓరుగల్లు కోటను ఏకశిలా నగరం అని ఎందుకంటారు? అక్కడి విగ్రహాలు, అక్కాచెల్లెళ్ల బావి, కుష్మహలు, హవా మహలు కాకతీయుల కాలంలో స్థాపించిన, కట్టించిన పద్మాక్షమ్మ గుడి, రుద్రేశ్వరాలయం, వేయి స్తంభాల గుడి వివరాలు చదువుతుంటే కళ్ల ముందు మనకు ఓరుగల్లు కోట సజీవంగా కథలాడుతుంది అనడంలో సందేహం లేదు.
డాక్టర్ మామిడాల శైలజ గారిది పరిచయం అవసరం లేని పేరు తెలంగాణలో సాహిత్యంలో. కుతుబ్షాహీల కాలంలో స్త్రీల యొక్క చారిత్రక విశ్లేషణ గురించి వ్రాస్తూ అప్పటి మతపరమైన నియమాలు, పరదావ్యవస్థ, ఘోష పద్ధతి, రాజ కుటుంబానికి చెందిన స్త్రీల యొక్క విద్య వివరాలు, కుతుబ్షాహీలవంశంలోని మహిళల యొక్క పాలన వ్యవహారాల్లో రాజకీయాలలో వారి పాత్ర ద్వారా వారి అలంకారీక విద్యలు, వారితో పోలిస్తే సాధారణ స్త్రీలకు ఉండే వ్యత్యాసాలు మరియు విద్యా సాహిత్య రంగాల్లో స్త్రీల యొక్క పరిస్థితులు, అప్పుడు ఉన్న భాషలు, అప్పటి కాలంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీలకు అందించే విద్యల గురించిన వివరాలు, అప్పటి కాలంలో మహిళల యొక్క పాత్ర, సంగీతం, నాట్యం, చిత్రకళ లాంటి అనేక లలిత కళలలో స్త్రీల యొక్క పాండిత్యం గురించిన వివరాలు స్త్రీల పైన మతపరమైన పరిమితులు, వారి యొక్క మతపరమైన నియమాలు, సామాజిక పరిమితులు, ముస్లిం స్త్రీల పైన మతపరమైన నియమాలు, హిందూ స్త్రీలపై నుండి సంప్రదాయపు పరిమితులు, మతేతర ధోరణులు, ప్రముఖ కుతుబ్షాహీ మహిళల యొక్క జీవితము, వారి పాత్రలు చరిత్రలో ఎంత గుర్తింపు పొందాయో అందులో ముఖ్యమైనటువంటి వారైనా బేగ్ మల్కా బేగం, తాహిరా బేగం, సుల్తానాల పేర్లు చరిత్రపుటల్లో పేర్లు నిలిచిపోకపోయినా కళ పరిపూర్ణంగా ప్రదర్శించి కళా పోషణ చేసిన కళాభిమానులైన అనేక మంది స్త్రీల యొక్కచిత్రణ ఇందులో మనకు కనబడుతుంది.
ఇందులో రజాకార్ల ధమనకాండ స్వయంగా చూసిన డాక్టర్ బండ స్వీయ అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. పీనుగుల పెంటగా మార్చిన ఊరి గురించి ఆమె వ్రాసిన అనుభవాలు చదువుతుంటే చెమ్మగిళ్ళని కన్ను ఉండదంటే అతిశయోక్తి కాదు. అనుభవాలన్నీ మనల్ని అప్పటి రజాకార్ల యొక్క దమనకాండలను కళ్ళ ముందు సజీవంగా కదలాడేలా చేస్తాయి.
ఇక స్వయం శక్తితో పైకి వచ్చిన ఆచార్య వంగరి త్రివేణి గారి వ్యాసాలు పరిశీలిస్తే బైరాన్ పల్లి వీరభైరాంపల్లిగా నిలిచిపోయిన చరిత్ర, దానికి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన డాక్టర్ బండ సరోజన గారి వ్యాసం అత్యంతము ఒళ్ళు గగుర్ పొడిచేలా చేస్తుంది. బ్రిటిష్ కాలంలోని తెలంగాణ స్త్రీ విద్య గురించి డాక్టర్ వంగరి త్రివేణి గారు ఆమూలాగ్రహం కూలంకషంగా చర్చించారు. తెలంగాణ స్త్రీల సంస్కరణ, ఉద్యమాల గురించి కొల్లాపురం విమల గారు చెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ అని, స్త్రీవాద ఉద్యమాల నేపథ్యాల గురించి తెలిపారు. డాక్టర్ అరుణ పరంథాములు గారు తెలంగాణ రావడంలో తెలంగాణ ఉద్యమంలోని మహిళ పాత్ర అందులో సాహిత్యం ద్వారా తెలంగాణను ఉత్తేజపరిచిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఉత్తేజపరిచిన మహిళా మణుల యొక్క కృషిని చక్కగా అక్షరీకరించారు. రాజీవ్ గారు స్వతంత్ర తెలంగాణ మహిళ గురించి, మరియు తిరునగరి దేవికి దేవి గారు తెలంగాణ పోరాట నవలలలో స్త్రీ చైతన్యం గురించి, జ్వలిత గారు తెలంగాణ సాహిత్యంలోని మహిళ గురించి చక్కగా తెలిపారు.

తెలంగాణ నారీ శక్తి గురించి, రాణి రుద్రమదేవి, రణచండికా అంటూ కొలిపాక శోభా రాణి గారు, తెలంగాణకి ఎంతో కీర్తి తెచ్చిన పోరాట మహిళా మణులు సమ్మక్క సారమ్మల గురించి బండి ఉష గారు మరియు వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర గురించి డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ గారు, విప్లవంలో నిప్పు కణిక లా మెరిసిన మల్లు స్వరాజ్యం గారి గురించి బండారు సునీత గారు, రాణి శంకరమ్మ గురించి రంగరాజు పద్మజ గారు, పోరాట తేజమైన ఆరుట్ల కమలాదేవి గారి గురించి ఎస్కే సలీమా గారు, సంఘసంస్కర్త అయిన ఈశ్వరీబాయి గురించి వసంత లక్ష్మణ్ గారు, వీరవనిత అయిన లక్ష్మీబాయి గురించి డాక్టర్ కే పద్మా రాణి గారు, సదాలక్ష్మి ఉద్యమ పోరాటం గురించి డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారు, డాక్టర్ కొండా శకుంతలా దేవి గారి గురించి లావణ్య గంగుల గారు, తెలంగాణ గురించి యశోద రెడ్డి గారి గురించి డాక్టర్ దాసోజు పద్మావతి గారు అలుపెరుగని అమృతమూర్తి తెలంగాణ నారిశక్తిలో పొందుపరిచారు.

తెలంగాణ సంస్కృతి పండుగలు బోనాలు, బతుకమ్మ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతటి పాత్ర ఇంతటి ప్రముఖ పాత్రను వహించే అందరికీ తెలుసు. అలాంటి జానపద కళారూపాలలో స్త్రీ చైతన్యం గురించి కొండపల్లి నిహారిణి గారు, డాక్టర్ ఆదివాసి దండాల యొక్క సంస్కృతి గురించి రావుల కిరణ్మయి గారు, బోసంగి మహిళా సంస్కృతి సాహిత్యాల గురించి డాక్టర్ గంధం విజయలక్ష్మి గారు, బతుకమ్మ రాష్ట్ర పండుగ విశిష్టత గురించి డాక్టర్ ఆర్ కమల గారు, రాష్ట్ర పండుగ బోనాల గురించి డాక్టర్ కందిపి రాణి ప్రసాద్ గారు, పెద్ద దేవుడైన ఇంటింటి దైవమైన దుర్గమ్మ తల్లి గురించి నామని సుజనా దేవి గారు తెలంగాణ యొక్క పంటల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేశారు.

తెలంగాణ కట్టడాలు: ప్రాచీన చరిత్రలో హైదరాబాద్ అనగానే గుర్తు వచ్చే చార్మినార్ గురించి నాంపల్లి సుజాత గారు, హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియం గురించి సుజాత తిమ్మన గారు, కాకతీయుల వైభవాలను ఓరుగల్లు కీర్తిని తెలిపి వేయి స్తంభాల గుడి గురించి సరిగమల ఒడి అంటూ చెప్పిన చంద్రకళ దీకొండగారు, ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందిన రామప్ప దేవాలయం గురించి శాంతా రెడ్డి గారు, స్వయంభూ దేవాలయాల గురించి గిరిజ పైడిమర్రి గారు, మన్యంకొండ పుణ్యక్షేత్రం సంధ్యా సూత్రావే గారు, శారదా పీఠం బాసర సరస్వతి గురించి డాక్టర్ సాయి లక్ష్మి గారు, శ్రీకరం శుభకరం శ్రీ విద్యాపురం గురించి అరుణ ధూళిపాల గారు, ఉరిమిల్ల సునంద గారు జోగులాంబ శక్తి పీఠం గురించి, వనజ గారు ప్రఖ్యాతి చెందిన భద్రకాళి ఆలయం గురించి 33 జిల్లాల ప్రత్యేకతల గురించి రజనీవాసన్ గారు మొత్తం తెలంగాణ గురించి వివరించారు.
తెలంగాణ ముఖ్య వనరులైన జల వనరుల గురించి, పర్యావరణ పచ్చదనం గురించి చేనేత పరిశ్రమ గురించి చాట్ల విద్యుల్లత గారు, డాక్టర్ విజయశ్రీ గారు, బండారి సుజాత గార్ల వ్యాసాలతో ముగించడం చాలా బాగుంది. ఈ పుస్తకంలో ఆయా కళాఖండాలకు సంబంధించిన వేయి స్తంభాల గుడి చిత్రపటాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాల యొక్క చిత్రపటాలను ఇందులో పొందుపరచడం వల్ల తెలంగాణ వాళ్లకు కాకుండా ఇతరప్రాంతాల వారికి కూడా ఆ చిత్రాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పించారు
‘అద్దం ఎట్లాగైతే అబద్దం చెప్పదో, ఇందులోని వ్యాసాలన్నీ కూడా అద్దంలా ఆయా ప్రత్యేకతలను చూపించాయి.
అదుగో అంటే ఆరు నెలలు అన్న సామెత ఇక్కడ కుదరదు. ఎందుకంటే శారదా హనుమాండ్లు గారు దీక్షగా ఒక యజ్ఞంలా ఈ సంకలనాన్ని పూర్తి చేయడమే కాదు. ఆవిష్కరణ రోజు డా. బండ సరోజనమ్మ గారు చీరల వితరణ, రాజీవ గారు అందమైన జూట్ బాగ్, సర్టిఫికేట్ కూడా రచయిత్రులకు ఇవ్వడం, మంచి విందు భోజనంపెట్టించడం విశేషం.
‘అన్నం పెడ్తే అరిగిపోతది . చీర బెడితే చినిగి పోతది . కాని అక్షరం అలికితే అక్షరలక్షల పంటలొస్తాయి’, అని ఈ సంకలనం నిరూపిస్తుంది.
‘అమ్మవారి మొక్కు తీరది, ఆడబిడ్డ అప్పు తీరది’ అన్నట్లు తెలంగాణా ఆడబిడ్డ ప్రతీ గడపకి ఎంత ముఖ్యమో, తెలంగాణా సొగసులను అద్దుకున్న ఈ సంపుటి ఋణం కూడా ఈ తెలంగాణాకు తీరనిదే. ఇదే సంపుటి త్వరలో
ఇంగ్లీష్ లోకి కూడా అనువదించబడి(ఇప్పటికే అనువాదం పూర్తయింది) విశ్వవ్యాప్తం కానుండడం విశేషం.

November 30, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ప్రమాదం అంచుల్లో…

by Kondapally Neeharini November 30, 2025
written by Kondapally Neeharini

( 2025 నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం)

–  డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ పత్రిక ఎడిటర్

 కొత్త బంగారులోకం, నా బంగారు కొండా, బంగారమసొంటి గుణం, ఆ ముచ్చట్లు వివరంగా చెప్తే నీ బంగారమేం పోయింది, బంగారం వంటి జీవితం తాగి తాగి నాశనం చేసుకున్నారు – ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…

బంగారం అనే లోహం అన్ని లోహాలలో చాలా చాలా విలువైన లోహం. ఒక భారమైన మూలకం.  ఎక్కువ స్థితిస్థాపక గుణం కలిగి ఉండే ఖనిజం. బంగారం కాఠిన్యత ను పరిగణలోకి తీసుకుంటారు.

 Au అనే చిహ్నంతో శాస్త్రీయంగా పిలువబడే బంగారం ఒక విలువైన లోహం. శాస్త్ర ఆవర్తన పట్టికలో 11వ సమూహానికి చెందిన మూలకం. బ్యాటింగ్ లో Aurun  అంటారు కాబట్టి Au అనే పేరుతో  రసాయనికంగా  పిలిచే ఈ లోహం మూలవర్తన లోహం. ఈ లోహం మెత్తగా ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.

ఆమ్లాలకు విడిపోయి ఏ చర్యకు గురికానటువంటి కరగనటువంటి బంగారం కాబట్టే ఇంత విలువ.

అయితే ఇటువంటి విలువైన  ఈ బంగారం అనే లోహం పాదరసంలో హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లాలతో కలిపిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. బంగారం, పాదరసం కలిసిన ధాతు మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. మేలిమి బంగారం అంటే పసుపు పచ్చని వర్ణంతో ఎక్కువ సాంద్రతతో ఉండే మెత్తని లోహం. ఇది అత్యంత విలువైన లోహాల లో ఒకటి.

ఇతర ఆమ్లాల చర్యలకు రసాయనిక మార్పుచెందని లోహం కాబట్టే బంగారం అంటే ఇంత మోజు కలగడానికి కారణమేమో.  ఒక హౌస్ బంగారం నుండి దాదాపు 50 మైళ్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు రేకుగా సాగదీయవచ్చు , కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో నిలువ చేయవచ్చు. సాధారణంగా బంగారాన్ని karats , కారెట్స్ లలో తూకం వేస్తారు. బంగారం స్వచ్ఛత అనేది ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఫైన్నెస్

fineness ఎంత ఉంది తెలుసుకోవాలని చూడడానికి ఉపయోగిస్తారు. గ్రాములు, కిలోలు  కారెట్ల కొలతల్లో చెబుతారు. చాలావరకు 24 కారెట్ ఉంది అంటే అది కల్తీ లేని బంగారమని అర్థం. కాని, దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. అందుకే ఎటు అంటే అటు మలిగి, గట్టిగా ఉండడానికి బంగారానికి రాగి గాని వెండి గాని ఏదైనా లోహాన్ని  ఓ 2  భాగాలు కలిపి 22 కారెట్ల కు సిద్ధం చేసి వస్తువులు తయారు చేస్తారు.               భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయాల  నేల పొరలలో తక్కువ ప్రమాణంలో నిక్షిప్తమై ఉండే బంగారు నిధులు ముఖ్యంగా ప్రధమ శ్రేణి ద్వితీయ శ్రేణి నిలువలుగా చెబుతారు. భూమి లో ఉండే ‘ మాగ్మా ‘ లో బంగారం ఉంటుందని ద్రవ రూపంలో ఉన్న బంగారం అవక్షేప శిలలలో నిలుస్తుందని , రాతి పొరలలోను చేరి ఉంటుందని చెప్పడం చూస్తాం.

ఈ మెత్తటి లోహంలో వేరే లోహాలను కలిపి దృఢంగా చేసి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

పూర్వకాలం నుండి బంగారాన్ని వాడుకలో కి తెచ్చుకున్నారు ప్రజలు. శిలాజాలను తవ్వి బంగారాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తు మారక ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళు.  ముఖ్యంగా వ్యాపారానికే కాకుండా రాజవంశీయులు వాళ్ళ సింహాసనాలను, అలంకరణ వస్తువులను ఎంతో శ్రద్ధగా నిలువ చేసుకునేవాళ్ళు. రాజుల రాణుల సమాధులపై రాజ వంశీయుల సమాధులపై బంగారాన్ని అలంకరణగా పెట్టే అలవాటు ఉన్నవాళ్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖంగా ఈజిప్టులోని పురాతన దేవాలయాలలో బంగారాన్ని విరివిగా వాడే వారట.

      ఈజిప్ట్ లోని నైలునది ప్రాంతంలో, నోబియన్ ఎడారి ప్రాంతంలో, రెడ్ సి అంటే ఎర్ర సముద్రం ప్రాంతంలో గనులు బాగా ఉన్నట్టు చెబుతారు. ఏమన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో బంగారు గనులను త్రవ్వి న చరిత్ర ఉన్నది. ఇకపోతే అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, స్విజర్లాండ్ జపాన్, ఫ్రాన్స్, ,ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి  దేశాలలో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి . అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఇవి. ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి పోటీలుపడి టన్నులు టన్నులుగా నిలువ చేసి పెడతారు.

   దేశాల ముఖ్య వ్యాపార లావాదేవీలు ప్రముఖ దేశాల మధ్య జరిగినప్పుడు బంగారం నిలువల ప్రస్తావన వస్తుంది.  బంగారం ధర వ్యాపారాలను శాసిస్తుంది. సెన్సెక్స్ లెక్కలు  అధికమయ్యాయా? పడిపోయాయా? అనే చర్చల ద్వారా పసిడి ధరలు పెంచాల్సిందే.

          అత్యధిక బంగారు నిల్వలు ఉన్న అమెరికా దేశస్తులు ఒంటి మీద నగలుగా ఎక్కువ ధరించరు. అక్కడ 18 క్యారెట్స్ బంగారాన్నే నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్త చూడటానికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి నగలు.

అయితే బంగారు జీవితం అంటే బాగా బంగారు ఆభరణాలు ధరించడం కాదు. వాళ్ల జీవితం పసిడి కాంతులతో కళకళలాడుతుంది అంటే అందరూ బంగారం తో అలంకరించుకోవడం, ఇంట్లో అంతా బంగారు వస్తువులతో నింపడం కాదు.

ఆరోగ్యకరమైన , సంస్కారవంతమైన జీవితం ఉంటే బంగారు బతుకు అంటారు. బంగారం అంటే పసిడి అనీ కనకము అని కదా అర్థాలు. ” కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభ లగ్నమునన్” మనకో పద్యం కూడా ఉన్నది కదూ..

 ” పసిడికి తావి అబ్బినట్టు ” అనేది ఓ సామెత. తావి అంటే సువాసన. అతనికి గానీ ఆమెకు గాని చక్కని అందం తో పాటు మంచి గుణాలు ఉంటే ఈ సామెత ను ఉపయోగిస్తాం. ” కల్ల పసిడికి కాంతి మెండు” అంటే, False gold is very bright అదే… All is not gold that glitters అంటారు . కల్ల పయిడికి గరుకులు మెండు False gold is very rough అని , కూడా ఓ సామెత ఉన్నది. సామెత లు ఎందుకు ఆమెతలు అంటారో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. ఇవి అసలు బంగారు జీవితానికి వ్యాఖ్యానాలు. పసిడి మనసులు అంటాం. సాధారణంగా చిన్నారులను చూస్తే!!! కదా! ఏ సంఘర్షణ లు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియని పిల్లలు కాబట్టి.

ఇక ప్రస్తుతానికి వస్తే, ఎవరు ప్రమాదపు అంచుల్లో ఉన్నారు? ఎందుకు ? ఈ ప్రశ్న లు చాలా విలువైనవి. బంగారంలా విలువైనవి. బంగారం కన్నా విలువైనవి.

బంగారం ధర బాగా పెరగడం వల్ల దొంగతనాలు దోపిడీ లు ఎక్కువయ్యాయి. ముందు ఇంతగా దొంగిలించేవాళ్ళు కాదు. కానీ,

ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు నగల వ్యాపార ప్రకటన లకు సంబంధించిన ఫోటో లు పెట్టడం వల్ల సమాజానికి చేరువవడంతో అందరు ఆకర్షితులవుతున్నారు . అంత షో చేయడం, ప్రాపగాండా చేసుకోవడం . ఇవన్నీ అవసరమా? అసలే నేరప్రవృత్తి బాగా పెచ్చుమీరుతున్న రోజులు ఇవి. అసలే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం సగటు జీవుల బ్రతుకు లను అతలాకుతలం చేస్తున్నాయి. దారిద్ర్యం రేఖ కు మరీ దిగువనున్న సామాన్యులు ఉన్నారు. ఎటునుంచి ఎటు మారుతారో తెలియదు. ప్రమాదం అంచుల్లో ఉన్నది సమస్త మానవ జాతి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!

_____*****_____

November 30, 2025 5 comments
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

The Cruise ఓ దృశ్యప్రయాణం

by nellutla Indrani November 30, 2025
written by nellutla Indrani

Travelag, ధారావాహిక యాత్రాచరిత్ర

“Cruise” ఈ పదమే చాలా vibrating గా ఉంటుంది. ఇది మా సరికొత్త ప్రయాణానుభవాల పరంపర. కానీ, 2016 లో కూడా మా అన్నయ్య డాక్టర్ శ్యాంసుందర్ రావు, మా వదిన రామానుజమ్మ, మా చెల్లెలు కొండపల్లి నీహారిణి, రచయిత్రి ,తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికల ఎడిటర్, మా మరిది గారు కొండపల్లి వేణుగోపాల్ రావు గారు, మా వారు నెల్లుట్ల రఘు రామారావు గారు అందరం మూడు జంటలం Ruby Princess
అనే Cruise లో పది రోజుల ట్రిప్ కు వెళ్లి వచ్చాం. అప్పుడు చాలా enjoy చేసాం. కొత్త ప్రదేశాలు చూడడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. మేమందరం like minded people. అందుకే హాయిగా వెళ్లిరాగలిగాం. రూబీ ప్రిన్సెస్ క్రూజ్ లో అలస్కా కు వెళ్ళాం. 1. Ketchikan 2. Skagway 3.Tracy Arm 4. Sitka and Juneau and Victoria Island (BC) లు చూసి వచ్చాం .
మా చెల్లెలు నీహారిణి అప్పటినుండి ఆ టూర్ గురించి రాయమని అడుగుతూ ఉంది. నాకు బద్ధకం కొంచెం ఎక్కువ. ఇన్నాళ్లకు మళ్ళీ 2025 లో నేను మా వారు ఇద్దరం కలిసి Norwegian Joy Cruise లో unlimited Joy ను ఆస్వాదించడానికి, ఆహ్లాదించడానికి పది రోజుల విహారానికి వెళ్ళాం. మళ్లీ అదే అలస్కా టూర్ కానీ ఈసారి Icy Strait Point, Glacier Bay కూడా add అయ్యి మా ఆనందాన్ని ఇనుమడింప చేసాయి.

“బైటే బైటే క్యా కరే…” అన్నట్టు ఒకరోజు Cruise price లను చూసాం. Lucky గా cheap deal కనిపించింది. వెంటనే టిక్కెట్లు బుక్ చేశాము. అలా స్టార్ట్ అయ్యింది మా అలాస్కా క్రూజ్ ప్రయాణం! మేం ఎక్కిన క్రూజ్ చాలా పెద్ద క్రూజ్. Norwegian Joy లో 10 రోజులు వెళ్ళి వచ్చాం. 2016లో వెళ్ళినప్పుడు క్రూజ్ బుకింగ్ మా పిల్లలు చేశారు. ఈసారి మేమే ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవడం external tours అంటే వేల్ వాచింగ్ లాంటివి అన్ని మేమే స్వయంగా సెలెక్ట్ చేసుకోవడం కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది. Balcony tickets మాకు expensive అనిపించింది. మేం Ocean view tickets తీసుకున్నాం.
టికెట్స్ కొన్న తర్వాత వెళ్లేముందు ఒక అప్లికేషన్ నింపవలసి ఉంటుంది. అప్లికేషన్లో పుట్టినరోజు, పెళ్లిరోజు అలాంటివి ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే

వైభోగమే ఇక. క్రూజ్ రూములోంచి బయటకు వెళ్లి వచ్చేసరికి బెడ్ పైన love గుర్తులు ఉండే balloons , కొన్ని చాక్లెట్స్ పూలు పెట్టి ఉంటాయి ఈ దృశ్యం చూడగానే పెదాల పైన నవ్వు అనుకోకుండా వస్తుంది. బర్త్ డే కేక్ కూడా కట్ చేయిస్తారు. ప్రతిరోజు మన రూమ్ బయట డోర్ కు చిన్న నోటీస్ బాక్సులో ఆరోజు క్రూజ్ లో ఏమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో వివరాలు ఉంచుతారు.

ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.
కానీ ఈసారి ప్రతి ఫ్లోర్ లో ఒక చిన్న ఎలక్ట్రానిక్ స్క్రీన్ పెట్టారు. దాంట్లో మనం అన్ని వివరాలు చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.
జూలై 16 నుండి జూలై 25 వరకు క్రుజ్ ప్రయాణం. మేము వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ లో ఉంటున్నాం. సియాటిల్ లో క్రూజ్ ప్రారంభమయ్యే పాయింట్ ఉన్నది. ఆ ప్రదేశాన్ని Pier 66 అంటారు. అలాస్కా క్రూజ్ లో వెళ్లాలంటే కెనడా వీసా కావాలి. తిరుగు ప్రయాణంలో క్రూజ్ విక్టోరియా ఐలాండ్ కు వెళుతుంది విక్టోరియా ఐలాండ్ కెనడాలో ఉన్నది. సాయంత్రం నాలుగు గంటలకు క్రూజ్ యాత్ర ప్రారంభం అవుతుంది పన్నెండు ఒంటిగంట మధ్య రిపోర్ట్ చేయాల్సిన సమయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మూడు గంటలు ముందు వెళ్లినట్టే సి పోర్టుకు కూడా మూడు గంటల ముందే వెళ్లాలి. మాకు ఉన్న అత్యుత్సాహంతో నాలుగు గంటల ముందే వెళ్ళాం.
నార్వేజియన్ క్రూజ్ 20 అంతస్తుల ఉన్న క్రూజ్ .2016 లో రూబీ ప్రిన్స్స్ క్రూజ్ వెళ్ళాము కదా ఆ క్రూజ 19 అంతస్తులు ఉండింది .
ఈ నార్వేజియన్ క్రూజ్ లో ఒకటి నుండి ఆరో ఫ్లోర్ వరకు ఇంజన్స్, ఇంకా దానికి సంబంధించిన మిషనరీ ఉంటుంది. ఆరవ ఫ్లోర్లో క్రూజ్ కు రెండు వైపులా లైఫ్ బోట్స్ ఉంటాయి ఒక్కొక్క లైఫ్ బోట్ లో 135 మంది

ప్రయాణికులను తీసుకువెళ్లవచ్చు. ఏడవ ఫ్లోర్ నుండి 8, 9 ఫ్లోర్లలో రెస్టారెంట్స్, డాన్స్ ఫ్లోర్, క్యాసినోస్ ఉంటాయి. ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరిగేవి ఉంటాయి 20వ ఫ్లోర్లో గోల్ఫ్ ఆటకు సంబంధించిన స్థలం ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు ” Go Cart” కార్ రేస్ ఆటకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న అంతస్తులలో కొన్ని స్పెషల్ సూట్స్ , బాల్కనీ రూమ్స్ , విండో వ్యూ ఉన్న రూమ్స్ కొన్ని ఉంటాయి. కొన్నేమో స్టేట్ రూమ్స్ అంటే మధ్యలో వ్యూ లేకుండా ఉండేవి ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ , అధిక ధరలతో కొన్ని affordable అంటే మద్యస్థమైన ధరలతో ఎవరి ఇష్టానికి ఎవరి తాహతుకు సరిపోయేలాగా వాళ్ళ కు, డబ్బులు పెట్టగలిగేలాగా ఉంటాయి.
నార్వేజైన్ క్రూజ్ లో ఆహారం ప్రత్యేకంగా ఉంది ఫుడ్ స్పెషల్ గా ఉన్నది. The Taste of India , Mediterranean, Italian, Mexican, Chinese, American ఇలా చెబుతూ వెళితే ఎన్నో రకాలు ఉన్నాయి. Of course మేం భారతీయులం కాబట్టి “The Taste of India” prefer చేసాం. ప్రతిరోజు “వివాహ భోజనంబే….!”అంటే నమ్మండి!
పొద్దున్నే 6:30 నుండే టీ కాఫీలతో ఇంకా రకరకాల బ్రెడ్స్ ఇక ఇండియన్ రెస్టారెంట్లో చెప్పేదేముంది ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, పొంగణాలు, ఉప్మా, అటుకుల ఉప్మా అంటే పోహ అంటారే… అదీ, పూరి, వడ! వడా విత్ టమాటా చెట్నీ, ఇంకా కొబ్బరి చెట్ని సాంబారు చెప్పొద్దు కానీ నేను కొంచెం foody నే! అసలు ఈ కొబ్బరి పచ్చడి టమాటా పచ్చడి ఎంత బాగున్నాయి అనుకున్నారు అబ్బో…! ఇక మధ్యాహ్నం భోజనమో… రోజూ స్పెషల్ లంచ్ అన్నట్టు! రెండు రకాల వెజిటేరియన్ కూరలు రెండు నాన్ వెజ్ కూరలో జీరా రైస్, వెజిటబుల్ రైస్, లెంటిల్ రైస్, పులిహోర, పెరుగు పచ్చడి, పెరుగు, కడీ పకోడి , ఇట్లాంటివి ఎన్నో..
డిన్నర్ లో ఆలూ పరోటా, గోబీ పరోటా, పన్నీర్ పరోటా ఇంకా ఏవో తక్కువైనట్టు అన్ని రకాల ఆమ్లెట్స్, రకరకాల సాలడ్స్, పాపడ్స్ రకరకాల ఐస్ క్రీమ్స్ ! ఇవేనో …ఇంకా ఏమైనా మిస్ అయ్యానో ఏమో!! “తినేవాడిదే తిన్నంత మహాదేవ ” అన్నట్టు ఉంటుంది ఫుడ్! వీటిల్లో ఇంకేమో తక్కువైనట్టు కొంతమంది వాళ్ళకి ఇష్టమైన తిండి పదార్థాలను food by order తెప్పించుకుంటారు దానికి pay చేయాల్సి వస్తుంది. మాకైతే అక్కడి

వరకు రానేలేదు chance . ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం ” NCL” ( Norwegian Cruise line) నే prefer చేస్తాను. ఎందుకంటే అన్నింటికంటే తిండి ముఖ్యం. మనం భారతీయులం కదా ఎంతైనా జిహ్వచాపల్యం ఎక్కువే , రుచులు ఎక్కువే..ఇది నా అభిప్రాయం మాత్రమే సుమండీ! ఎంత పిజ్జాలో బర్గర్లో తిన్న ఒకటో రెండో రోజులే… మళ్లీ మన ఫుడ్ మన తిండి పైకే మనసు మళ్ళుతుంది. Indian food కావాలి అనుకునే వాళ్లకు మాత్రం ఈ NCL perfect.
ఇక క్రుజ్ లో ప్రతి ఫ్లోర్ ( Deck) లో పిల్లల కోసం చిన్న చిన్న బొమ్మలు చేపలు బాతులు లాంటివి పెడతారు. ఎలా అనుకున్నారు? కనీ కనిపించకుండా కార్నర్స్ లలో పెడతారు. అలా మూలల్లో ఉన్న ఆ బొమ్మలు పిల్లలు చూసుకుని ” హే.. నాకు డక్ బొమ్మ దొరికింది.. ” అనో, ” హే.. నాకు చేప బొమ్మ దొరికింది.. అంటూనో సంతోషిస్తారు. ” నీకేం దొరికింది?” అంటూ మాట్లాడుకుంటారు. ఇది ఒక సరదా పిల్లలకు వాళ్లకు .
ఇంకా, పిల్లల కోసం చిన్న స్విమ్మింగ్ పూల్, రాక్ క్లైంబింగ్ కూడా ఉంటాయి. Of course, డాన్స్ ఫ్లోర్ లలో పిల్లల్ని ప్రత్యేకంగా ఎంగేజ్ చేయవలసిన అవసరమే ఉండదు. ఈ విషయానికి నేను కాస్త ఎక్కువ పాయింట్స్ వేస్తాను. ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు చాలా రిలీఫ్ ను ఇస్తుంది. వాళ్లకు కూడా relaxation అవసరమే కదా పాపం . Food కోసం క్యూ లో నిలుచునే అవసరం కూడా అంతగా ఉండదు.
పెద్ద వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. డాన్స్ ఫ్లోర్, క్విజ్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ , బింగో, డీల్ ఆర్ నో డీల్ , ఫొటోస్ దిగడానికి ఒక ప్లేస్, స్విమ్మింగ్ పూల్స్ , బార్ లు దాదాపు ఉంటాయి.
“NCL” లో ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. ” Ruby Princess” క్రూజ్ లో ఉందో లేదో తెలియదు అప్పుడు నేను చూడలేదు. కానీ, ఇందులో ఉన్న లైబ్రరీలో బుక్స్ తో పాటు స్క్రాబెల్, చైనీస్ చెక్కర్, బింగో, చెస్ వంటి గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిని డెక్ పైకి, వాళ్ళ రూమ్స్ లోకి తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ చేయవచ్చు .
ప్రొద్దున్నే “యోగ” చేయిస్తారు. ఇంకా కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయించే వాళ్ళు ఉంటారు. చాలా పొడవు వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. పొద్దున్నే లేలేత కిరణాలు సముద్రం పైన పడుతున్నప్పుడు వాటిని చూస్తూ

వాకింగ్ ట్రాక్ పైన నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది.
Deck 9 లో షాపింగ్ కూడా చేయవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ ఇంకా కొంత జ్యువలరీ కూడా అమ్ముతారు. ఫోటో గ్యాలరీ కూడా ఉంది.
ప్రముఖ చిత్రకారుల కళాఖండాలు కూడా ‘సేల్స్’ కి ఉంటాయి చాలా ఖరీదు వాటికి నిజంగా అయితే అవి అమూల్యం.
19th Deck లో Spa ladies and gents కి separate గా ఉంటుంది.
నార్వేజియన్ జాయిలో ఫుడ్ కోసం రెస్టారెంట్లకు వెళ్లేప్పుడు అక్కడ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి. అతడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ” కంజర్” ను వాయిస్తూ, ప్రతిరోజు ఇన్విటేషన్ లా స్వాగతం పాడేవాడు. అదెలా అనుకున్నారు? ఒకే ఒక్క వర్డ్ ను రాగయుత్తంగా పాడుతూ ఇన్వైట్ చేశాడు ” wash… washy.. washu ..” అంటూ రాగయుక్తంగా పాడేవాడు అంటే ఏంటి అనుకున్నారు చేతులు కడుక్కోమని చెప్పడం అన్నమాట! కొంతమంది ప్రయాణికులు అతనితో ఫోటోలు కూడా దిగేవాళ్ళు. ఆ ప్లేస్ కి రాగానే అందరం అనుకోకుండా అటువైపే చూసేవాళ్ళం.
ఒకరోజు ” Mickey Mouse” డ్రెస్ లో ఒక అతను ప్రత్యక్షం అతని చుట్టూ పిల్లలు అప్పుడప్పుడు పెద్ద వాళ్ళు కూడా పిక్చర్స్ దిగడం గమనించాం.
మరొక రోజున ” Sponge Bob ” dress లో ఒకతణ్ణి చూశాం. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని క్రియేట్ చేసి రకరకాల వేషధారణలతో అలంకరించుకొని ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ ను మెచ్చుకోకుండా ఉండలేం .
Food లో కూడా creativity ని చూపించారు. రకరకాల shapes లలో బిస్కెట్లు కేకులు తయారుచేసి పెట్టే వాళ్ళు డైనింగ్ ఏరియాలో రకరకాల పూలతో చక్కని అలంకరణలు చేసేవాళ్ళు ఇవన్నీ ఉదయం 6:30 నుండి రాత్రి 9 కొన్ని సార్లు 10 గంటల వరకు కూడా ఉండేవి. నిజంగా క్రూజ్ స్టాప్ ఎప్పుడు పడుకుంటారో? ఎప్పుడు లేస్తారో? తెలియదు! మనకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి!!
మామూలుగా అయితే క్రూజ్ షిప్ స్పీడ్ అనేది itinerary మీద depend అయ్యుంటుంది. Average speed 20 knots . మనకు విమానంలో వచ్చేప్పుడు కూడా turbulence feel అయినట్టే క్రూజ్ లో

కూడా ఉంటాయి కొంచెం ఎక్కువైతే తూలినట్టు అవుతామని విన్నాను కానీ రెండుసార్లు వెళ్లిన నాకైతే turbulence ఎక్కువ అనిపించలేదు. రాత్రిపూట కొంచెం స్పీడ్ ఎక్కువైనట్టు మనకు తెలుస్తుంది. ఈమధ్య అందరూ వాడుతున్న జోక్ ఇక్కడ గుర్తుకొచ్చింది నాకు. ” కౌశిక్ అంటే time , time అంటే కౌశిక్” అని ఏ సినిమాలో ఎవరన్నారో తెలియదు కానీ, క్రూజ్ లో చాలా కరెక్ట్ అనిపించింది. 4.00 pm embarking time అంటే Itinerary లో
కరెక్ట్ గా 4.00 pm కు క్రూజ్ ప్రారంభమైంది. 3,200 మంది passengers. 1,200 మంది crew వాళ్ళు. ఎంత బ్రహ్మాండమైన ratio కదండి? ప్రయాణికుల పట్ల క్రూజ్ వాళ్ళు చూపించే ఆదరణ అదరహో…
Crew లో చాలామంది భారతీయులు ఉన్నారు. అందులో నాకు అర్థమైన దాని ప్రకారం crew ఉద్యోగస్తులు కేరళ వాళ్ళు ఎక్కువ అనిపించారు. అందులో ఒకరిద్దరికి మమ్మల్ని చూడగానే పాపం వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొచ్చారేమో చాలా అభిమానంగా పలకరించే వాళ్ళు. ఎంత jeans and t-shirt వేసుకున్న కూడా మన ‘బొట్టు’ తో తెలిసిపోతుంది కదా!
అందరినీ అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు కానీ, ఎందుకో మా పట్ల ఎక్కువ శ్రద్ధనే చూపించారు. మాకు కూడా “పాపం” అనిపించేది. సంవత్సరంలో 9 నెలలు ఎక్కడో సముద్రంలో వాళ్ళ family కి దూరంగా ఉంటారు కదా అని అనిపించేది.
Crew లో ఒక చిన్న pharmacy కూడా ఉంటుంది. అక్కడ, Tylenol, DayQuil, nightquil వంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా కొన్ని క్రూజ్ ల లో పైన helipad కూడా ఉంటుంది. NCL లో ఉందో లేదో తెలియదు.

కొందరికి ప్రయాణాలు అంటే పడవ ప్రయాణం , విమాన ప్రయాణం వంటివి పడవు అయితే వాళ్లకు వాంతులు రాకుండా ఇచ్చే మందులు కూడా ఉంటాయి.
క్రూజ్ లో wheelchair access గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దాదాపు ప్రతి డెక్ లో ఇవి అందుబాటులో ఉంటాయి.
అంధులకు వీళ్ళు ఇచ్చే facilities are amazing! హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చిన మ్యూజిక్ చేసిన అంటే, లిరిసిస్ట్ … రవీంద్ర జైన్

అతను కూడా అంధుడు. ఈయన వ్రాసిన “గీత్ గాతా చల్ ఓ సాథీ… గున్ గునాతా చల్…” పాటలో అతను చూసి ఆ ఆనందాన్ని అనుభవించి వ్రాసినట్టే ఉంటుంది అది ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే అందులో సముద్రపు ప్రయాణాన్ని ఆస్వాదించి enjoy చేస్తారు.
ఇక కొన్ని థీమ్స్ తోని చేసిన షో లు జరుగుతూ ఉంటాయి. ఆ వేదికకు అంటే స్టేజ్ కి ఇరువైపులా ఇద్దరు నిలబడి ” dumb and deaf వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసే తీరు ప్రశంసాత్మకంగా ఉంటుంది. ఆ దృశ్యం నిజంగా అద్భుతం. ఎంత శ్రద్ధగా చెప్తారో! ఇంకా అలాంటి వాళ్ళకి స్టాఫ్ చేసే సహాయం సదా అభినందనీయం. ఏది ఎవ్వరూ మిస్ కావద్దు అనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇది చాలా బాగుంది.
క్రూజ్ లో పెంపుడు జంతువులు, pets ను తీసుకువెళ్లలేము. కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న కుక్కలు మాత్రమే ప్రవేశం కలిగి ఉంటాయి దివ్యాంగులకు సహాయపడే ట్రైనింగ్ లాగా ఉండాలి. అది కాకుండా కుక్కలంటే చాలా ఇష్టం వాటిని వదిలి ఉండలేము భావోద్వేగాల మధ్య ఉండే రిలేషన్ షిప్ లో ఉన్న కుక్కలకు ప్రవేశం లేదు.
ఏరకమైన ట్రైనింగ్ తీసుకున్న కుక్కలేనా సరే వాటి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతేకాదు వాటికి యజమానులు అంటే ఓనర్స్ రెండు వారాల క్రితమే టికెట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ అప్పుడే వ్యాక్సినేషన్ ఇప్పించినట్టు ఇంకా హెల్త్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది వాటి ఆహారంతో పాటు వాటి మందులు, వాటికి నీళ్ళల్లో ఉపయోగించే లైఫ్ జాకెట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
క్రూజ్ లో WiFi ఉండదు. WhatsApp ల బాధ ఉండదు. బాదుడూ ఉండదు. Of course కొందరికి కావాలి. అయితే, ఒక ప్లేస్ లో డబ్బులు కట్టి చేసి ఉపయోగించుకోవచ్చు .
కానీ క్రూజ్ లో ATM సౌకర్యం కూడా ఉంటుంది ఇది ” casinos” లో ‘ cash ‘ దగ్గర ఉంటుంది చార్జెస్ కొంచెం భారీగానే ఉంటాయి క్రూజ్ లో క్యాష్ తోనే కొనే సౌకర్యం లేదు.
మరో ముఖ్యమైన విషయం ….సాధారణంగా క్రూజ్ లో పొగ త్రాగడం నిషేధం. కానీ కొన్ని areas లో స్పెషల్ గా స్మోక్ చేసే ప్రదేశాలు ఉంటాయి. NLC లో కెసినో దగ్గర పొగ తాగేందుకు కాసినో, casino దగ్గర అనుమతిఉన్నది.
19 వ డెక్ లో ఒక ” జకోజీ” , రెండు స్విమ్మింగ్ పూల్స్ ఒకటి పెద్దది మరోటి చిన్నది ఉన్నాయి. వాటికి ఎదురుగా చాలా పెద్ద T.V ఏర్పాటు చేశారు. ఒకపక్క బార్ ఇంకోపక్క రెస్టారెంట్ టీ కాఫీలు ఎక్కడున్నా ఫ్రీ ఇంకా ఏవేవో హాట్ డ్రింక్స్ అలాంటి వాటికి pay చేయాల్సి వస్తుంది.
Crew కు ప్రక్కల పెద్ద పెద్ద హీటర్స్ పెట్టారు మేము కాసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండేసరికి చల్లగా అనిపించేదే అనుకోండి వెంటనే హీటర్స్ ఉన్న ప్లేస్ లోకి వెళ్లి నిలబడే వాళ్ళం.

ఇక, elevators గురించి కూడా చెప్పుకోవాల్సిందే! ప్రతి డెక్ లో రెండు ప్రక్కల ఇటు నాలుగు అటు నాలుగు ఎలివేటర్స్ ఉంటాయి. ఎప్పుడు ఫుల్ గా ఉంటుంటాయి ప్రక్కన వాల్పపైన బోర్డులో ఏ రోజు ఏ డెక్ లో ఏమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏ రెస్టారెంట్ లో ఏఏ మెనూ ఉంది అనేది చూసుకునేలా ఏర్పరిచారు.
Cruise కు లోపల బయట C.C. camera లూ ఉంటాయి .‌ రెండు పక్కల స్క్రీన్ లలో సముద్రం పైన పడవ వెళ్లే దంతా చూడవచ్చు. 9 th డెక్ లో సోలు గా చిన్న చిన్న ఆటలు పెట్టేవాళ్ళు గేమ్స్ గెలిచిన వాళ్ళ ” Ticket to Florida అలాంటివి ఉంటాయి. 300 డాలర్లు 200 డాలర్లు అలా క్యాష్ ప్రైస్ కూడా ఉంటుంది.
ఇక్కడ సాధారణంగా Casinos ను బాగా ఇష్టపడతారు. అదికూడా డెక్ లోనే దాదాపు 24 గంటలు తెరిచే ఉంటుంది. Lucky draw లు కూడా ఉంటాయి వాటిలో వస్తే ‘ earrings’ లాంటి వి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇంకా ఓపెన్ చేయగానే ” first to come first to serve” పద్ధతిలో ఒకరోజు ” జువెలరీ ( 18 క్యారెట్స్, 16 క్యారెట్స్) వంటివి వాళ్ల నుండి ఆఫర్స్ కూడా ఉంటాయి.

(ఇంకా ఉంది)

November 30, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni November 30, 2025
written by Narendra Sandineni

డాక్టర్ కొండపల్లి నీహారిణి వెలుగుల దారి కవిత సమాజానికి వెలుగును పంచిన కవిత ఓ విశ్లేషణ


ప్రముఖ కవయిత్రి,జర్నలిస్ట్,కొండపల్లి నీహారిణి కలం నుండి జాలువారిన వెలుగుల దారి కవితపై విశ్లేషణా వ్యాసం.వెలుగుల దారి అనేది మనిషి జీవన యాత్రను సమగ్రంగా ప్రతిబింబించే కవిత.జీవితం అనే ప్రయాణంలో మనిషి అనుభవించే ప్రకృతి సౌందర్యం,భావోద్వేగ సంబంధాలు,కష్టాలు, సంతోషాలు మరియు చివరికి సంతోషంతో కలిగే తృప్తి,జీవితం అనే ప్రయాణంలో ఎదురయ్యేవిగా భావించవచ్చు.ఈ కవితలో రూపకాలూ,ప్రతీకలూ, ఉపమానాలూ,సమన్వయంతో జీవితం యొక్క వివిధ దశలను ప్రతిఫలింపజేస్తాయి.ఈ కవిత మొత్తం మనిషి జీవితం ఒక యాత్ర,ఒక వెలుగు దారి,ఒక ప్రస్థానం అనే దృక్కోణంలో సాగింది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మానవ జీవన ప్రయాణం ఏ విధంగా భావోద్వేగాలు,అనుభవాలు, సందేహాలు,సంతోషాలు,వేదనలతో నిండి ఉంటుందో కవితలో గంభీరంగా ప్రతిఫలించింది.కవయిత్రి నీహారిణి వెలుగుల దారి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.

అనేకానేక వసంతాల ప్రకృతి/అనంతాకాశ దృక్కులు/జీవితాన్ని ప్రకృతిలో ఒదిగించి చూపిన ఈ కవితా పంక్తులు అనుభవాల విస్తారతను సూచిస్తాయి.వసంతాలు అంటే ఋతువులు కాదు. మనసులో పువ్వులా వికసించిన అనుభవాలు. అనంతమైన ఆకాశంలాగా ఈ అనుభవాలకు అవధులు లేవు అని చెప్పిన తీరు గొప్పగా ఉంది. అనేకానేక వసంతాల ప్రకృతి అనేది వ్యక్తి అనుభవాల వైవిధ్యాన్ని సూచిస్తుంది.వసంతాలు ఇక్కడ సంవత్సరాలను కాకుండా మనసులో పుట్టే కొత్త అనుభూతులను సూచిస్తాయి.అలాగే అనంతాకాశ దృక్కులు అనే కవితా పంక్తి జీవితంలోని అపారమైన దృక్పథాన్ని,విశాలమైన మనసును,ప్రపంచాన్ని చూసే విస్తారమైన చూపును సూచిస్తుంది.జీవితం ఒక గమ్యం కాదు.ఒక నిరంతర ప్రయాణం అని గుర్తు చేస్తుంది.
“కష్ట సుఖానుభవ సాగర పయనం/అనే కవితా పంక్తి జీవితం ఒక సముద్రయానం వంటిది అని సూచిస్తుంది.ఈ సముద్రంలో తరంగాల్లా కష్టాలు – సుఖాలు వరుసగా వచ్చి పోతూ ఉంటాయి.మనిషి వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి అనే గొప్ప సందేశం ఇందులో ఇందులో ఉంది.
“ఓ పాత కాలపు ఆపాత మధుర గానం/అనే ఈ కవితా పంక్తి స్మృతి ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది.మనిషి జీవితంలోని గత స్మృతులు ఒక మృదులమైన స్వరంలా మన చెవుల్లో మళ్లీమళ్లీ మార్మోగి మనసులో నిలిచిపోతాయి.ఇందులో అనుభూతి సున్నితంగా ఉంటుంది.సంగీతానికి సంబంధించిన ప్రతీక కొనసాగుతుంది.భావం సహజంగా మరియు సాహిత్య బద్ధంగా నిలిచిపోతుంది.పాతకాలపు ఆపాత మధుర గానం అనే రూపకం గత స్మృతుల మాధుర్యాన్ని ప్రతిపాదిస్తుంది.జీవితం వైపు తిరిగి చూసినప్పుడు గుర్తొచ్చే మధురమైన అనుభూతులు,మనిషికి ఓదార్పు నిస్తాయి అని కవయిత్రి స్పష్టపరుస్తున్నారు.
“మహావృక్ష రూపు,మనుగడ రూపు/సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణ/అసాధారణ భావ సౌందర్యానికి ఉదాహరణ/ఈ కవితా పంక్తులలో కవయిత్రి మనిషి జీవితాన్ని మహావృక్షంతో పోల్చారు.మహావృక్షం అనేది పరిరక్షణ,ఆశ్రయం, స్థిరత్వం,విస్తరణ అనే లక్షణాలతో నిండినది.అదే విధంగా మనిషి జీవితం కూడా కాలంతో పెరిగి, అనుభవాలతో విస్తరించి,తన చుట్టూ ఉన్నవారికి ఆధారంగా నిలుస్తుంది. మనుగడ రూపు అనేది జీవితం నిరంతరంగా కొనసాగుతూ తరతరాలకు మార్గాన్ని చూపించే శక్తిని సూచిస్తుంది.ఇలా మనిషి జీవితం ప్రతి రోజు సాధారణంగా కనిపించినప్పటికీ అది లోతైన అనుభవాలు,విలువలు,పరిపక్వతతో కూడినది.
“సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణ/సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణగా నిలిచే వ్యక్తులు మహావృక్షాల్లా మనుగడ సాగిస్తూ సాధారణ మనుషుల జీవితాలకు మార్గదర్శకులై నిలుస్తారు. నిజాయితీ,శ్రమ,నిబద్ధత,ప్రేమ వంటి విలువలు సాధారణ వ్యక్తుల జీవన విధానానికి శాశ్వత ప్రేరణ కలిగిస్తాయి.
“అసాధారణ భావ సౌందర్యానికి ఉదాహరణ/అనేది జీవితం సాదాసీదాగా కనిపించినా దానిలో దాగి ఉన్న భావోద్వేగాల విశాలత,సంబంధాల లోతు అనుభవాల అందం,చాలా అసాధారణమై ఉంటుంది అని తెలుస్తుంది.జీవితమే ఒక మహా వృక్షం.ప్రతి మనిషి జీవితం చిట్టచివరికి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది.సాధారణ జీవితంలోని అసాధారణ సౌందర్యాన్ని చూపే ప్రయత్నం ఇది. జీవితం ఒక మహా వృక్షంలా విస్తరించడాన్ని సూచిస్తుంది.మనిషి బ్రతుకు సాధారణమైనదప్పటికి అందులో దాగి ఉన్న అసాధారణ సౌందర్యం,ప్రేరణ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవయిత్రి చెప్పేది మనిషి జీవితం మహావృక్షంలా నిలకడగా నిలుస్తుంది అని,దాని విస్తరించిన శాఖల వలె రోజు వారి బ్రతుకులో కనిపించే విలువలు మనకు ప్రేరణగా ఉంటాయి అని,ఆ జీవన ప్రయాణంలో నిక్షిప్తమైన భావ సౌందర్యం అసాధారణ ఉదాహరణగా నిలిచి మనిషిని సార్థకమైన జీవన గమ్యం వైపు నడిపిస్తుంది అనే గొప్ప సందేశాన్ని వ్యక్తం చేస్తున్నది.
“ఎన్ని గాలి దుమారాలో/ఎన్ని వడదెబ్బలో/అనేది సంసారంలో ఉన్న సహజ సంఘర్షణలను తెలియజేస్తుంది.జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సామాజిక,ఆర్థిక,భావోద్వేగాలను ఈ భావాలు సజీవంగా ప్రతిబింబిస్తాయి.ఈ కవితా పంక్తులు జీవితం అందరికీ సవాళ్లతో కూడుకొని ఉన్నది అని ప్రతీకాత్మకంగా చెబుతాయి.మనిషి జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు,సంక్షోభాలు మరియు ప్రతికూల పరిస్థితులను ఈ పంక్తులు వ్యక్త పరుస్తాయి.ఇక్కడ గాలి దుమారం అనేది అకస్మాత్తుగా వచ్చిన సమస్యలను,జీవితాన్ని కుదిపేసే సంఘటనలను,మనసును దెబ్బతీసే ప్రతికూలతలను సూచిస్తాయి.అదే విధంగా వడదెబ్బ అనేది మనిషిని అలసటకు గురి చేసే దుస్థితులను,దీర్ఘకాలిక ఒత్తిడులను,శ్రమతో కూడిన దశలను మరియు ఆర్థిక భావోద్వేగ సమస్యల రూపాన్ని తెలియజేస్తుంది.మనిషిని ఎన్నో కష్టాలు, విపత్తులు పరీక్షకు గురిచేస్తాయి.మనిషి ప్రతికూలతలను ఎదుర్కొంటూ తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగాలి అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
“జంట పక్షితో ఎగిరినప్పుడల్లా/తెలివయిన వృద్ధ పావురము వలతో/ఎగిరించినప్పటి మిత్రలాభ,మిత్ర భేద/కథల ప్రత్యక్షానుభూతి/ఈ కవితా పంక్తుల్లో
కవయిత్రి పంచతంత్ర కథలోని పావురాల సంఘటనను ఉదాహరణగా తీసుకున్నారు. పంచతంత్రం సాంప్రదాయకంగా నీతిని బోధించే కథల సమాహారం.అందులోని పావురాల కథ చిన్నప్పటి నుంచి స్నేహం,జాగ్రత్త,అనుభవం,వివేకం వంటి విలువలను బోధిస్తుంది.అందులోని కథ ఒక వేటగాడు చెట్టు కింద వల పరిచి గింజలు చల్లుతాడు‌.ఆ గింజలను చూసి చిన్న పావురాలు అమాయకత్వంతో వాటిని తినడానికి పరుగులు పెడతాయి.అయితే ఆ పెద్ద పావురం తన అనుభవంతో ఇది వేటగాడి ఉచ్చు అని హెచ్చరిస్తుంది.పెద్ద పావురం మాటలను పట్టించుకోకుండా చిన్న పావురాలు గింజల కోసం వెళ్లి వలలో చిక్కుకొంటాయి.పెద్ద పావురం మాట వింటే చిన్న పావురాలు వలలో చిక్కేవి కావు.చిన్న పావురాలకు ఈ దుస్థితి దాపురించేది కాదు.పెద్ద పావురం సూచనతో చిన్న పావురాలు వలతో పాటు ఎగిరిపోయి ప్రాణాలను కాపాడుకోవడం వల్ల వాటి కథ సుఖాంతమైంది.వృద్ధులు గొప్ప అనుభవజ్ఞులు. అటు వంటి వృద్ధుల మాటలు వినకపోతే ప్రమాదాల్లో చిక్కుకుంటారు.అనుభవం,జ్ఞానం, విచక్షణ,ముందస్తు జాగ్రత్తలు మనకు వృద్ధులు అందజేస్తారు.జీవితంలో అనుభవజ్ఞులైన పెద్దల సూచనలను గౌరవించాలి.ఉచ్చులో ఇరికించే ఆకర్షణీయమైన వాటికి దూరంగా ఉండాలి. ప్రమాదకరమైన వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి అని కవయిత్రి తెలియజేస్తున్నది.అనుభవం లేని తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని సంక్షోభంలో పడేస్తాయి.జ్ఞానులైన పెద్ద వారు చేసిన సూచనలు జీవితాన్ని రక్షిస్తాయి.పెద్దవారి మాట వినకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అవివేకంతో తీసుకున్న నిర్ణయాల వల్ల వారి భావి జీవితం ప్రమాదంలో పడుతుంది.పెద్దల మాట చద్దన్నం మూటగా భావించాలి అనే సందేశం ఇందులో ఉంది.
“ఒంటరి గమనపు సావధానతకూ/జంటల అనుసంధానాల పొందిక/కవయిత్రి మనిషి జీవన ప్రయాణాన్ని రెండు విరుద్ధ రూపాలలో చూపిస్తూ వాటి అంతర్భావాన్ని కళాత్మకంగా ప్రతిపాదించింది. ఈ కవితా పంక్తుల్లో ఒంటరి గమనం అనేది వ్యక్తి స్వయంగా ఎదుర్కొనే జీవన మార్గానికి ప్రతీక. ఒంటరిగా ప్రయాణించడం అంటే నిర్ణయాలు, సందేహాలు,జాగ్రత్తలు – All are solely one’s responsibility.అందుకే దీనిని సావధానత అనే పదంతో అర్థవంతం చేసింది.ఒంటరితనం మనిషిలో నిగూఢమైన జాగ్రత్తను,ప్రతి అడుగులో చిత్తశుద్ధితో, పరిసరాల పట్ల అప్రమత్తతను కలిగి ఉండాలి అనే భావన.దీనికి విరుద్ధంగా జంటల అనుసంధానాల పొందిక అనే కవితా పంక్తి మనిషి సంబంధాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.జంటగా లేదా సమూహంగా ఉన్నప్పుడు జీవితం సులభతరం అవుతుంది.బాధ్యతలు పంచబడతాయి.ప్రయాణం మరింత సురక్షితమవుతుంది.అనుసంధానం అనే పదం ఇక్కడ బంధాలు,సహకారం,పరస్పర నమ్మకం,జీవనంలో భాగస్వామ్యం వంటి విలువలను సూచిస్తుంది.పొందిక అనే పదం ఆ అనుసంధానాల లోతైన బంధాన్ని,అందాన్ని, సమన్వయాన్ని తెలియజేస్తుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవయిత్రి ఒక గాఢమైన జీవిత సత్యాన్ని చెబుతున్నది.మన జీవితం ఒంటరితనపు బాధ్యతలతో పాటు సంబంధాలు పరస్పరానుబంధాలతో కూడిన సమ్మేళనం. ఒంటరిగా నడిచే చోట కాస్త జాగ్రత్త అవసరం.కలిసి నడిచే చోట బలము,ధైర్యం,ఆత్మవిశ్వాసం ఉంటాయి.జీవితంలో కొన్ని దారులలో మనమే ఒంటరిగా సావధానంగా నడవాలి.ఆ సావధానతే పరిపక్వత.ఒంటరితనంలో అవసరమైన అప్రమత్తతను,సంబంధాలలో దాగిన బలం పొందికలను హృద్యంగా ప్రతిపాదిస్తూ జీవితం రెండు ధోరణుల సమతుల్యతతోనే పూర్ణం అవుతుందని కవయిత్రి తెలుపుతున్నది.
“వృద్ధాప్యమనే వరద గూడు ఒకటేదో/త్రికాల సమేత ప్రేమామృత జల్లు కురిసే/ఈ కవితా పంక్తులు వృద్ధుల హృదయంలోని అపారమైన ప్రేమను, సహకారాన్ని,ఆశీర్వాదాల్ని ప్రతీకాత్మకంగా చూపిస్తాయి.వరద గూడు అనే రూపకం ఇక్కడ చాలా గంభీరమైన అర్థాన్ని సూచిస్తుంది.వరద గూడు కనిపిస్తే వర్షం పడబోతుందనే సంకేతం. వృద్ధులైన పెద్దలు తమ కుటుంబంలో తమ పిల్లలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వారు కురిసే వరుణ జల్లులా సాయం అందిస్తారు.పిల్లలపై అంతు లేని ఆదరణను చూపిస్తారు.వారి ప్రేమకు కాల పరిమితి లేదు.అది త్రికాల సమేత ప్రేమామృత జల్లులా – గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ,భవిష్యత్తును ఊహిస్తూ సాగుతూనే ఉంటుంది.వృద్ధులను బలహీనులుగా చూస్తారు.కానీ వృద్ధుల ప్రేమ వర్షం లాంటిది.పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు వారు తమకు చేతనైన సహాయం చేస్తారు.వారు చేతులు ముడుచుకొని కూర్చోరు.ఆకాశంలోని మేఘాల్లా తమ ప్రేమను,సాంత్వనను,సహానుభూతిని జల్లులుగా కురిపిస్తారు.ఈ కవితా పంక్తులు వృద్ధుల ప్రేమను వర్షంతో పోల్చుతూ జీవన సత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
త్రికాల సమేత ప్రేమామృత జల్లు అనే రూపకం వారి ప్రేమ గతం,వర్తమానం,భవిష్యత్తులలో నిరంతరం ప్రదర్శితం అవుతుందని సూచిస్తుంది.
“బాల్య పూచెండు పులకరింతలు/యవ్వనపు ఉలికిపాటులు/సముద్రమంత సహన సదృశ్యమయి/ఒకానొక చరమాంకపు చలన గీతాన్ని/సందేశంగా ఆలపించు/ బాల్య పూచెండు పులకరింతలు అనేది బాల్యంలోని ఆనందాన్ని,అమాయకత్వాన్ని కవయిత్రి ఇక్కడ పూచెండుతో పోల్చింది.పూలచెండు అనే రూపకంలో బాల్యంలోని అమాయకత్వం,నిర్మలత్వం,అల్లరి నవ్వులు,చిన్నచిన్న విషయాలకు ఉప్పొంగే ఆనందాలు స్పష్టమవుతాయి.బాల్యం అంటే వికసించే పుష్పం.బాల్యం కూడా అచ్చం పుష్పం లాంటిదే.బాల్యం అమాయకత్వంతో కూడిన చిన్న చిన్న సంతోషాలకు మురిసే నవ్వులతో కూడినట్టిది. పులకరింతలు అనే పదం బాల్యంలోని ఉప్పొంగే ఆనందాలను సూచిస్తుంది.ఈ కవితా పంక్తి బాల్యపు పరిమళభరితమైన,అందమైన,ఆశ్చర్యభరితమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది.

యవ్వనపు ఉలికిపాటు అనేది బాల్యాన్ని వెన్నంటి వచ్చే యవ్వన దశలోని భావోద్వేగాల కలయికను కవయిత్రి ఉలికి పాటులు అనే పదం ద్వారా తెలియ జేస్తుంది. యవ్వనం అల్లకల్లోలమైన భావోద్వేగాల ఉద్ధృతిని తెలియజేస్తుంది.యవ్వనం అంటే ఆశలు,వెర్రితనాలు,అస్థిరతలు,ఆత్రుతలు అన్నీ కలిసిన దశ.యవ్వనం అంటే వికాసపు శిఖరం, భావోద్వేగాల అల్లకల్లోలం.ఉలికిపాటు అనే పదంలో భావోద్వేగాల క్షోభ,ఆత్రుతలు,ఉద్రిక్తతలు దాగి ఉన్నాయి.యవ్వనంలో మనసు వేగంగా పరుగులు తీస్తుంది.ఆశలు ఉబికి వస్తాయి.జీవితంపై ఎనలేని తపన పెరుగుతుంది.ఈ కవితా పంక్తిలో యవ్వన దశలోని అస్థిరత,ఉత్సాహం,ఆందోళన,బలంగా ప్రతిఫలిస్తుంది.యవ్వనపు భావావేశాలను, భావోద్వేగాల జ్వాలలను,అలజడి గాలులతో ఊగే చెట్టును ఈ కవితా పంక్తి సూచిస్తుంది.
సముద్రమంత సహన సదృశ్యమయి అనేది ఇక్కడ కవయిత్రి పరిపక్వతను సముద్రంతో సారూప్యం చేస్తున్నది.సముద్రం లోతుగా,విశాలంగా,గంభీరంగా ఉంటుంది.అందులో ఎన్నో అలలు,కల్లోలాలు వచ్చినా అది తన పరిధిని కోల్పోదు.అదే విధంగా జీవితపు అనుభవాలు మనిషికి సహనం,స్థిరత్వం, లోతైన అవగాహనను అందిస్తాయి.ఇది పెద్దరికం, పరిపక్వత,సంయమనశీలతను ప్రతిబింబించే భావ చిత్రం.వృద్ధాప్య దశలో సముద్రం లాంటి గాంబీర్యం, స్థిరత్వం,పరిపక్వత ఉంటుందని కవయిత్రి తెలియజేస్తుంది.

“ఒకానొక చరమాంకపు చలన గీతాన్ని సందేశంగా ఆలపించు/ఇదే కవిత యొక్క మర్మసందేశాన్ని ఇచ్చే చివరి పంక్తి.ఇక్కడ చరమాంకపు చలన గీతం అనగా జీవితం చివరికి మనం మిగిల్చే జీవన సందేశం,అనుభవాల సారం,తర్వాత తరాలకు నేర్ప గల పాఠం.బాల్యంలో ఉన్న అమాయకత్వం, యవ్వనంలో వచ్చిన కదలికలు,పెద్దరికంతో పొందిన సహనం,ఇవన్నీ కలిపినప్పుడు జీవన గాథ ఒక గీతంలా మారుతుంది.ఈ గీతం ఇతరులకు శబ్దం కాదు.ఒక విలువైన సందేశం.జీవితాన్ని ఎలా గడపాలి?జీవితాన్ని ఎలా తట్టుకొని నిలవాలి? జీవితాన్ని ఎలా ప్రేమించాలి?అని నేర్పేది చలన గీతం.మనిషి జీవితం చివరికి ఒక బోధగా,ఒక మార్గదర్శినిగా మారుతుంది అని ఈ కవిత తెలుపుతుంది.చివరికి జీవితం ఒక సందేశమే.మన తర్వాత తరాలకు చెప్పే పాఠమే.ఈ కవితా పంక్తి మొత్తం కవితను దార్శనిక భావంతో ముగిస్తూ జీవిత యాత్ర ఒక పాటలా,ఒక ప్రవాహంలా,ఒక సందేశాత్మక అనుభవంలా ఉందని తెలియజేస్తుంది. ఈ కవితా పంక్తులు కలిపి మనిషి జీవన ప్రస్థానాన్ని అద్భుతంగా చిత్రిస్తాయి.బాల్యం పూసే పువ్వుల అమాయక సౌందర్యం,యవ్వనం గాలి అలికిడికి వచ్చే ఉద్వేగం,పెద్దరికం సముద్రం లాంటి సహనం ఈ మూడు దశల అనుభవాలను ఒక చలన గీతంగా రాబోయే తరాలకు కవయిత్రి అందించడం జరిగింది.
“సంతాన సమాదరణల చెమరింతలు/
సంతసానంద హేలల చిగురింతలు/
కావడి కుండల‌ గాథలు నడిచొచ్చు/నవతరాల నవ దిక్సూచి ‘వయసు పండిన’ వెలుగు దారి/ఈ కవితా పంక్తులు కుటుంబ జీవితంలో సంతానంతో వచ్చిన ఆనందాలు,తల్లిదండ్రుల అనుభవాల పరిపక్వత, భవిష్యత్తు తరాల మార్గదర్శకత వంటి లోతైన భావాలను అందంగా ప్రతిబింబిస్తున్నాయి.
సంతాన సమాదరణల చెమరింతలు ఈ కవితా పంక్తి తల్లిదండ్రులకు పిల్లల వలన కలిగే ఆదరణ, ప్రేమ ఇంటి నిండా కలిగే ఉత్సాహం గురించి చెబుతుంది.చెమరింతలు అనే పదం పిల్లల వల్ల కలిగే ఆనందపు జిలుగులు,ఇంటిలో వెలిగే పులకరింతల కాంతి రూపాన్ని వ్యక్తం చేస్తుంది. తల్లిదండ్రుల జీవితంలో సంతానమే వెలుగు, సంతోషాలకు నెలవు అని కవయిత్రి వ్యక్తం చేసింది.
“సంతసానంద హేలల చిగురింతలు/ఈ కవితా పంక్తి పిల్లల నవ్వులు,చిలిపితనాలు,చిన్నచిన్న అల్లర్లు, అల్లరి హేలల వల్ల ఇంట్లో చిగురించే కొత్త సంతోషాలను సూచిస్తుంది.చిగురింతలు అనే పదం కొత్తగా మొలకెత్తే ఆనందాలు అనే భావాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నది.పిల్లల వల్ల ఇంటిలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది అని కవయిత్రి తెలియజేస్తుంది.
“కావడి కుండల‌ గాథలు నడిచొచ్చు/ఇది ఈ కవితలో ప్రాసంగికమైన రూపకం.భుజానికి రెండు వైపులా కావడి కుండల‌ను తగిలించి మోస్తున్నట్లుగానే జీవితంలో కూడా ఒక వైపు సుఖం, మరో వైపు దుఃఖం,ఒక వైపు విజయం,మరో వైపు ఓటమి,ఒకవైపు సుఖమైన బాధ్యతలు,మరో వైపు నిర్వహించాల్సిన కఠినమైన కర్తవ్యాలు అన్ని సమతుల్యంగా కావడికుండల్లా బాధ్యతగా మోస్తూ మనిషి ముందుకు నడవాల్సిందే.తల్లిదండ్రుల జీవితంలో కూడా సంతోషాలు,కష్టాలు రెండు కలిసి ఉంటాయి.ఇది జీవిత సమతౌల్యం,కుటుంబాన్ని భుజాలపై మోస్తూ నడిచే జీవన పరంపర కథ.
“నవతరాల నవ దిక్సూచి ‘వయసు పండిన’ వెలుగు దారి/ఈ కవితా పంక్తి మొత్తం కవితకు తాత్విక పరాకాష్టను అందిస్తుంది. వయస్సు పండిన వెలుగు దారి అంటే అనుభవం సంపాదించిన పెద్దల జ్ఞానం, తర్వాత తరాలకు దిక్సూచి మార్గదర్శిని అవుతుంది.జీవితంలో చూసిన అనుభవాలు, కష్టసుఖాలు కావడి కుండల గాథలు,తల్లిదండ్రులు కురిపించిన ప్రేమాభిమానాలు ఇవన్నీ రాబోయే తరాలకు వెలుగు చూపే బాటగా మారతాయి.పెద్దల అనుభవం పిల్లలకు మార్గదర్శకం అవుతుంది. తల్లిదండ్రుల జీవితం నవతరాలకు దిక్సూచి వలె నిలుస్తుంది. ఈ కవితా పంక్తులలో ఒక అందమైన జీవిత చిత్రం కళ్ళముందు కదలాడుతుంది.పిల్లలు తల్లిదండ్రుల జీవితాన్ని రంగుల మయం చేస్తారు. బుడిబుడి అడుగుల పిల్లలు చేసే అల్లరి,వారు చిందించే నవ్వులు,వారు చూపించే అపురూపమైన ప్రేమ,తల్లిదండ్రుల హృదయంలో సంతోషాలను నింపుతాయి.కుటుంబ జీవితం ఎప్పుడు సుఖదాయకం కాదు.కష్టసుఖాలు అనే రెండు కుండలను కావడిలా మోస్తూ నడవాలి.ఆ ప్రయాణంలో వచ్చిన అనుభవాలు చివరి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.ఇది కుటుంబంలో ప్రేమ, బాధ్యత,అనుభవం,విలువలు,తరాల అనుబంధం గురించి చెప్పే హృదయాన్ని స్పర్శించే కవిత.ఈ కవిత మన జీవన యాత్ర సుఖదుఃఖాల సంగమం. సంసారంలోని సరిగమల సౌందర్యంతో కూడిన జీవన సార స్ఫూర్తితో నిర్మించిన గొప్ప కవిత.ప్రతి దశలోని భావాలను రూపకాలుగా,ప్రతీకలుగా, అనుభవాల తీగలుగా అల్లుతూ కవి వెలుగుతో నిండిన జీవన దృశ్యాన్ని ప్రదర్శించింది.వెలుగుల దారి కవిత మనిషి జీవితాన్ని ప్రకృతి,అనుభవ సంపద,మానవ సంబంధాలు,వయస్సు,ప్రేమ, బాధ్యత మరియు కాలచక్రాలతో సమన్వయంగా చూపించిన ఒక జీవన దార్శనిక కవిత.ఇందులోని రూపకాలు,తాత్వికత,భావవిశాలత,పాఠకుడి ఆత్మ పరిశీలనకు జీవన సారాంశాన్ని గ్రహించేందుకు దోహదపడతాయి.చక్కటి కవితను అందించిన కవయిత్రి కొండపల్లి నీహారిణి గారిని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

November 30, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అచ్చంగా వినిపించే మరో స్త్రీవాద స్వరం – రేణుక అయోలా కవిత్వం

by ShailajaMitra November 30, 2025
written by ShailajaMitra

              ఆధునిక తెలుగు కవిత్వంలో రేణుక అయోలా ఒక ప్రత్యేకమైన గళం. ఆమె రచనల్లో మనసు, మనిషి, సమాజం, స్త్రీ అస్తిత్వం అనే అంశాలు సహజంగా కలిసిపోయి జీవనానుభవాలకు అక్షరరూపం ఇస్తాయి. జీవితాన్ని గమనించే కవయిత్రి చూపు లోతైనది, కానీ ఆ లోతు మృదుత్వంతో కూడినది. సున్నితమైన స్త్రీ మనసు లోతుల్లో పెరుగుతున్న బాధ, నిశ్శబ్దం, ప్రశ్నలు, ప్రతిఘటనలు ఇవన్నీ ఆమె కవిత్వంలో బలమైన శబ్ధంగా మారతాయి. రేణుక అయోల కవిత్వం స్త్రీని కేవలం బాధితురాలిగా కాదు, బలమైన వ్యక్తిత్వంతో కూడిన సజీవ ఆత్మగా చిత్రిస్తుంది.
           రేణుక అయోలా గారు గంటి కపర్ది మరియు గంటి హేమలతల దంపతుల కుమార్తె. ఆమె పుట్టిన ఊరు ఒడిశాలోని కటక్‌, ప్రస్తుతం నివాసం హైదరాబాద్‌. భర్త అరుణ కుమార్‌ అయ్యల సోమయాజుల. ఈ కుటుంబ నేపథ్యం ఆమె ఆలోచనలకు, సాహిత్యానికి ప్రేరణగా నిలిచింది. ఆమె జీవిత అనుభవం, గమనించే కళ్ళు, స్త్రీ జీవితం పట్ల ఉన్న లోతైన అవగాహన కవిత్వంలో ఒక వాస్తవికతను కలిగిస్తాయి. ఆమె కవిత్వం పఠించినపుడు మనకు ఒక మానవతా తత్త్వం, సామాజిక అవగాహన, స్త్రీ అవేదన, ఆత్మగౌరవం వంటి అనేక పొరలు కనిపిస్తాయి.

            రేణుక అయోల సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. ఆమె రచించిన పుస్తకాలు పడవలో చిన్ని దీపం (2006), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు (2019), రవిక (2025) ఇవన్నీ కవితా సంపుటాలుగా విడుదలై వీరి మనోభావాలకు ప్రతిబింబంలా మిగిలాయి. అలాగే కథాసంపుటి రెండు చందమామలు (2008), దీర్ఘకావ్యాలు మూడవ మనిషి(2015), పృధ ఒక అన్వేషణ (2021) వంటి గ్రంథాలు ఆమె కవిత్వపు వైవిధ్యాన్ని, ఆలోచనల లోతును స్పష్టంగా చూపిస్తాయి. ఇటీవల కాలంలో రచించిన మరొక కవితా సంపుటి (రవిక) స్త్రీవాద కవిత్వానికి తార్కాణం గా నిలిచింది.

           రేణుక అయోలా కవిత్వం స్త్రీ జీవితం మీదే ప్రధానంగా తిరుగుతుంది. కానీ అది కేవలం ఫిర్యాదుగా, బాధగా నిలవదు. ఆమె స్త్రీని ప్రశ్నించే వ్యక్తిగా, తన ఉనికి గురించి సమాజాన్ని నిలదీసే స్వరంగా చూపుతుంది. ‘‘జీవితం గాజు పెంకు లోతుగా గుచ్చుకున్నంత బాధ’ అని వీరు రాసిన వాక్యం, జీవితం అనే పాదరసంలో స్త్రీ అనుభవించే వేదనను స్పష్టంగా చెబుతుంది. అయితే ఆ బాధలోనే బలం ఉంది. రేణుక అయోల కవిత్వంలో ఆ బలం కనిపిస్తుంది.

           సమాజంలో స్త్రీపై జరిగే అన్యాయాన్ని ఆమె కేవలం వర్ణించరు. ప్రశ్నిస్తారు. వీరి కవిత్వం నిర్భయమైనది, నిర్లజ్జమైన సమాజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనది. ‘‘ఈ దేహాలకి పేర్లు లేవు’’ అనే కవితలో ఆమె స్త్రీ దేహంపై పురుషుడి కామ దృష్టిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కవిత ఆవేదనలోంచి పుట్టిన తిరుగుబాటు స్వరం. మగవారి దృష్టిలో స్త్రీ కేవలం దేహంగా కనిపిస్తే, రేణుక ఆ దేహానికే అర్థం ఇవ్వడం ద్వారా అతని అజ్ఞానాన్ని చీల్చేస్తుంది. ‘‘మా పేరు మాదే, మా ఉనికి మాదే’’ అనే పాదాలు స్త్రీ ఆత్మగౌరవానికి అక్షరరూపం.

       రేణుక అయోలా కవిత్వం స్త్రీవాదమా కాదా? స్త్రీలపై అనేకమంది కవిత్వం రచిస్తున్నారు. స్త్రీ బాధలను ఎత్తి చూపుతున్నారు. స్త్రీకి అన్యాయం జరుగుతోందని ఎలుగెత్తి తమ భావాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. అలాగని అవి స్త్రీవాదాలు కావు. కాలేవు. కారణం ప్రపంచంలో వున్న అనేక సమస్యలపై కవి స్పందించినట్లే స్త్రీ అస్తిత్వం కూడా ఒక సమస్యగా తీసుకుని చర్చిస్తున్నారు. కానీ రేణుకా అయోలా అలా కాదు. నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా స్త్రీ జీవితాన్ని విడమరచి చూపుతూ.. అనేక సమాధానాలు లేని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. కనుకనే నేను వీరి కవిత్వం స్త్రీ వాదమనే చెబుతున్నాను.  ఆమె కవిత్వంలో స్త్రీ సమస్యలను ప్రస్తావించినప్పటికీ, అవి మనిషి మనుగడకు సంబంధించినవే. స్త్రీని అణచివేసే సమాజపు ధోరణి, మనిషిని బంధించే యాంత్రిక జీవనశైలి, మానవ సంబంధాలలో పెరుగుతున్న నిశ్శబ్దం ఇవన్నీ ఆమె పదాల్లో ముడిపడి వస్తాయి. ‘‘ఆమె అతను ఒకే ఇంట్లో…మాటలు ఉండవు’’ అనే కవితలో ఆమె ఆధునిక దాంపత్య జీవితంలోని నిశ్శబ్దాన్ని ఎంత చక్కగా చిత్రించిందో గమనిస్తే మనసు కదిలిపోతుంది. కరెంటు పోయినప్పుడు వచ్చిన చీకటిలో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మాటలు మాట్లాడటం, ఆ చీకటి వారి జీవితంలో వెలుగుగా మారడం  ఇది కేవలం ఒక కవిత కాదు, ఒక ప్రతీక.

        ఆధునిక మనిషి సంబంధాల్లోని శూన్యతను, టెక్నాలజీ మధ్య చిక్కుకున్న భావనలను ఈమె ఎంతో సాధారణమైన సంఘటనతో ఆవిష్కరిస్తారు. వీరి కవిత్వంలో భాష సాధారణమే కానీ లోతైన అర్థాలను మోస్తుంది. రేణుక అయోలా పదాలను అలంకారంగా కాకుండా ఆత్మనిశ్వాసంగా వాడుతారు. ప్రతి వాక్యం వెనుక ఒక చలించిపోయిన అనుభవం ఉంటుంది. వీరి వ్యక్తీకరణలో భాష నిప్పులా మండుతుంది, కానీ అదే సమయంలో కరుణగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ‘‘ఏ విలువలేని ఆడతనం కోసం ఆమె గుమ్మం దాటకుండా హక్కుల్ని అడిగింది’ అనే వాక్యం, స్త్రీ స్థితిని నిర్లక్ష్యం చేసే సమాజం మీద ఒక పదునైన బాణంలా ఉంటుంది. ఆమె కవిత్వంలో ఉన్న వేదన నిస్సహాయతను కలిగించదు. ప్రతిఘటనను పెంచుతుంది.

              రేణుక అయోల కవిత్వం ఒక రకంగా సమాజ దర్పణం. వీరి పదాల్లో మనకు మనమే కనిపిస్తాం. వీరు రాసిన అసహ్యం వంటి కవితలు, మన సమాజంలో మహిళల పట్ల ఉండే అసభ్యపు మాటలు, అనాగరిక భావనలను సూటిగా అద్దంలో చూపుతాయి. ఆ అద్దం భయపెడుతుంది, కానీ ఆ భయం మనలో మార్పుని రగిలిస్తుంది. ఈ మార్పే రేణుక కవిత్వం ఉద్దేశం. వీరి కవిత్వంలో మరో ప్రత్యేకత. నిశ్శబ్దాన్ని కూడా ఆమె పదంగా మార్చగలగడం. ‘‘మాటలు ఉండవు’అనే పదం ఆమె రచనల్లో తరచుగా వినిపిస్తుంది. కాని ఆ నిశ్శబ్దం కూడా ఒక భాష. స్త్రీ జీవితంలోని నిశ్శబ్దం, దాచుకున్న భావనలు, చెప్తే వినబడవు అన్న భయం ఇవన్నీ ఆమె కవిత్వంలో సంభాషణగా మారుతాయి. కవయిత్రి గుండె లోతుల్లో ఉన్న ఆ నిశ్శబ్ధ కేకలు పాఠకుడి మనసును తాకుతాయి.

             రేణుక అయోలా రచనల్లో ప్రకృతి, సమాజం, మనిషి ఇవి ఒకే దారిలో కదులుతాయి. వీరి కవిత్వం లోపలి స్వరం. ఆ స్వరం కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు అగ్నిలా ఉంటుంది. ఆమె సాహిత్యంలో స్త్రీ సున్నితత్వం, సామాజిక సత్యం, ఆత్మపరిశీలన అనే త్రివేణి సంగమం ఉంటుంది. మూడవ మనిషి వంటి దీర్ఘకావ్యంలో హిజ్రాల వేదనను ఆమె మనసుకి చేరే భాషలో చెబుతుంది. ఇది కేవలం సాహిత్యం కాదు మానవతా ప్రకటన.

           రేణుక అయోల కవిత్వం ద్వారా సంధించే ప్రశ్నలు సమాజంపై, మనసుపై, సంబంధాలపై. ‘‘ప్రశ్న అనేది జీవితానికి బలమైన ఆయుధం’అని ఆమె చెప్పినట్లుగా, ఆమె కవిత్వంలో ప్రశ్నలే ఆయుధాలు. ఈ ప్రశ్నలు మనలో ఆత్మపరిశీలన రేపుతాయి. ఒక కవయిత్రిగా వీరి పాత్ర కేవలం రాయడం కాదు, మనసులను కదిలించడం.

            వీరు రాసిన ప్రతి పద్యం సాహిత్యంగా మాత్రమే కాదు, ఒక తాత్విక చింతనగా నిలుస్తుంది. ఆమె చూపు గృహస్థ జీవితం, సామాజిక అసమానతలు, టెక్నాలజీ ప్రభావం, మానవ సంబంధాల వైఖరి అన్నీ సమానంగా గమనిస్తుంది. రేణుక అయోల కవిత్వం చదివినపుడు మనం జీవితం గురించి ఆలోచిస్తాం. మనలోని మౌనాన్ని వినిపించుకుంటాం.రేణుక అయోల కవిత్వం యొక్క మూలం సత్యం. ఆమె తాను చూసినది, అనుభవించినది, ఆలోచించినదే రాస్తారు. ఆమె పదాలు ఉపమానాల వెనుక దాక్కోవు. అవి నేరుగా మనసును తాకుతాయి. ఆమె కవిత్వం పాఠకుడిలో దాగి ఉన్న మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. తన రచనలతో రేణుక అయోలా అనేక పురస్కారాలు అందుకున్నారు.  వారణాసి వెంకట శోభ స్మారక సాహిత్య ప్రతిభా పురస్కారం, అన్నమయ్య సాహితి పురస్కారం, ఇస్మాయిల్‌ సాహితి పురస్కారం, లేఖిని మాతృదేవో పురస్కారం, జోత్స్నన కళాపీఠం పురస్కారం వంటివి ఆమె సాహిత్య ప్రాభవానికి నిదర్శనం.

          కవయిత్రి రేణుక అయోల కవిత్వం చదివితే మనం మన సమాజాన్ని కొత్త కళ్ళతో చూస్తాం. ఆమె అక్షరాలు కేవలం పాఠాలు కాదు, అనుభవాల రక్తంతో రాసిన వాక్యాలు. ఆమె పదాల్లో ఒక స్త్రీ స్వరం మాత్రమే కాదు, ఒక కాలపు మనసు ఉంది. ఆమె కవిత్వం మనలో ఆలోచన, ఆవేదన, ఆవిష్కరణ అన్నింటినీ కలిగిస్తుంది. ఈ విధంగా రేణుక అయోల సాహిత్యం ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక సాక్ష్యంగా నిలుస్తుంది స్త్రీ భావోద్వేగాలకి, మనిషి బాధలకు, నిశ్శబ్దపు చీలికలకు అక్షరరూపం ఇచ్చిన ఓ జీవన ధ్వని. ఆమె కవిత్వం నేడు అవసరమైన స్వరం ప్రశ్నించే స్వరం, నిలదీసే స్వరం, ఖచ్చితమైన మార్పు కోరుకునే స్వరం. ఉదాహరణకు  ’’గాయమైన గానం’కవితలోని అద్భుతమైన దృశ్యాత్మక భాగం. ‘‘కొండ అంచుల నుండి/వాగుల అలల మీద నడుస్తూ/ప్రాణాలకి అడుగున ఉన్న/సుతారపు తీగల్ని కదిలిస్తోంది/ నిర్జన మైదానాల మీద/ వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’’ ఈ  పంక్తులలో ఒక అంతర్మధన గమనం కనిపిస్తుంది. కవయిత్రి మనసు కొండ అంచుల మీద నిలబడి, తనలోని అంతర్భావాల వాగుల మీద నడుస్తూ జీవన నాడులను తాకుతోంది. ‘‘ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగలు’ అనేది అద్భుతమైన రూపకం.  మనసులోని అత్యంత సున్నితమైన భావాల్ని సూచిస్తుంది. అవి కదిలినప్పుడు గానం పుడుతుంది, ఆ గానం కొన్నిసార్లు గాయమైనది కూడా కావచ్చు.,  ‘‘నిర్జన మైదానాల మీద వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’ఈ వాక్యం వేదనలోని శాంతిని, చీకటిలోని వెలుగును ప్రతిబింబిస్తుంది. నిశ్శబ్దం మధ్య వెలుగుల చల్లదనం అనేది కవయిత్రి అంతరాత్మలోని సాంత్వన. ఈ కవిత భాగం మనసులోని గాయాలు మరియు గానం మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. గాయమే గానంగా మారుతుంది.  వేదన సౌందర్యంగా మారుతుంది. రేణుక అయోలా గారి కవిత్వానికి ఇది ప్రత్యేక లక్షణం బాధలోనూ ఒక అందం, నిశ్శబ్దంలోనూ ఒక సంగీతం ఉంటుంది. జీవితం కొండ అంచుల్లా కఠినమైనదైనా, మనసులో ప్రవహించే వాగుల అలలు ఎప్పటికీ గమనం ఆపవు. ఆ అలల్లో కదిలే ప్రతి సుతారపు తీగ ఒక గాయమైన గానంలా మనసును తడుపుతుంది.

          రేణుక అయోలా గారి ‘‘ఎర్రమట్టి గాజులు’కవితలోని హృదయాన్ని తాకే భాగాన్ని గమనిస్తే..  అవి వీరి సాహిత్య దృష్టిలోని లోతైన స్త్రీ అనుభూతి, మాతృబంధం, కాలంతో పోరాడే ఆడపిల్ల యొక్క మౌన ప్రతిఘటనను ప్రతిబింబిస్తాయి. ఇక్కడి భావనను విశ్లేషిస్తే ‘‘కాలం గీసిన గీతాలు చూపిస్తున్నాయి. గీతాలు ఊరు చేరనివ్వని రాతలు/నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ ఇక్కడ ‘‘కాలం గీసిన గీతాలు’అనేది స్త్రీ జీవితంలోని విధి రేఖలను సూచిస్తుంది. ఆ గీతలు మనిషి చేత గీయబడినవి కాక, సమాజం, సంస్కారం, పరిమితులు గీసినవి. ‘‘గీతాలు ఊరు చేరనివ్వని రాతలు’ఈ పాదం స్త్రీకి విధించిన బంధాలను, ఆమె కాళ్లకు వేసిన అజ్ఞాత శృంఖలాలను ప్రతిబింబిస్తుంది. ‘‘నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ అనగానే, మనకు ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ అందులో ఎవరో ఒకరు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గాజులు స్త్రీత్వానికి, ప్రేమకు, బంధానికి ప్రతీక. ‘‘ఆడపిల్ల చదవాలి గుండెలు గట్టి పడాలి’’ ఇది కవయిత్రి సమాజానికి చేసిన గాఢమైన పిలుపు. ఆడపిల్ల కేవలం బంగారు బంగిళ్లలో నడవాల్సిన జీవి కాదు. ఆమె చదవాలి, ఆమె మనసు గట్టి పడాలి. ఇది ఒక స్త్రీ విద్యా మంత్రంలా అనిపిస్తుంది. ‘‘గుండెలు గట్టి పడాలి’’ అన్న పదబంధం సాహిత్యంలో చాలా బలమైనది స్త్రీ బలహీనతగా కాకుండా ధైర్యస్వరూపిణిగా అవతరించాలనే భావనను అది ప్రతిబింబిస్తుంది.

          ‘‘బోధించే చేతుల మీద అనుకున్న వెంటనే వాల లేని పిట్టలా’ఇది తల్లీబిడ్డల మధ్య ఉన్న ఆ లోతైన బంధాన్ని ప్రతిబింబించే వాక్యం. తల్లి భోదించే చేతులు ఆప్యాయత, శ్రద్ధ, సంరక్షణకు సంకేతం. కానీ ఆ చేతులపై వాలలేని పిట్టగా ఆడపిల్ల కనిపిస్తోంది అంటే, తల్లి భోదించినప్పటికీ, కాలం ఆమెకు విశ్రాంతి ఇవ్వలేదు. జీవితం ఆమెను ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంచింది. ‘‘ఎప్పటికీ లేవలేని అమ్మ నిద్రని చూడడానికి ప్రయాణిస్తున్నాయి’ఈ పంక్తి అంతరంగాన్ని గాయపరుస్తుంది. ఇది మాతృవియోగపు వేదన. తల్లి ఇక లేవని తెలుసుకున్నా, కవయిత్రి మనసు ఇంకా ఆ నిద్రను చూడాలనుకుంటుంది. ‘‘ఎప్పటికీ లేవలేని నిద్ర’అనేది మరణానికి సున్నితమైన ప్రతీక. కానీ దానిని ‘‘చూడడానికి ప్రయాణిస్తున్నాయి’అని చెప్పడం మాతృప్రేమ యొక్క శాశ్వత బంధాన్ని తెలియజేస్తుంది. ‘‘చిట్టి ఎర్రమట్టి గాజులు చప్పుడు చేస్తూనే ఉన్నాయి’ఈ చివరి పాదం కవితకు ఒక ఆత్మ ఉంటుంది. అమ్మ లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఇంకా చప్పుడు చేస్తున్నాయి. ఆ చిట్టి ఎర్రమట్టి గాజులు ఒక మౌన సంగీతం. కాలం మర్చిపోయినా, కవయిత్రి మనసులో మాత్రం ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి.    ఈ కవితలో రేణుక అయోలా తన కవిత్వపు మూలభావాన్ని  స్త్రీ, తల్లి, సమాజం, జ్ఞాపకం ఈ నాలుగు దిశల్లో ముడిపెట్టి అద్భుతమైన భావసమగ్రతను సృష్టించడం గమనిస్తాం. ఈ కవితలోని గాజులు కేవలం అలంకారం కాదు. అవి ఒక జీవిత గాధ, ఒక తల్లిదీపం, ఒక స్త్రీ ఉనికి యొక్క శబ్దం.  రేణుక అయోల శైలిలో కనిపించే సున్నితమైన వేదన, మాటల్లో లేని తడి ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పాదం వెనుక ఒక కదిలిపోయిన జీవితం ఉంది. ఈ కవిత స్త్రీ మనసులోని అత్యంత గుప్తమైన మూలలోంచి పుట్టిన ఆవేదన. అదే సమయంలో, అది ప్రేమకు, గౌరవానికి, ఆత్మబలానికి ప్రతీక. ఇదొక ప్రతీకాత్మక కవిత గాజులు అనేవి స్త్రీ జీవితం మొత్తానికి ప్రతీకగా మారాయి. ఆ గాజులు విరిగిపోయినా, వాటి శబ్దం మాత్రం సమాజం అంతా వినిపిస్తుంది.

            ఇక రేణుక అయోలా గారి ‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం గురించి ప్రస్తావించదలిచితే.. ఆ కావ్యం వీరి సాహిత్య ప్రస్థానంలో అత్యంత సామాజికంగా, తాత్వికంగా, మానవతా భావంతో నిండిన కవితా సృష్టిగా నిలిచిన రచన. రేణుక  ‘‘హిజ్రా’వ్యక్తిత్వాన్ని అంటే లింగపరమైన పరిమాణాల మధ్య చిక్కుకున్న మనిషిని అద్భుతమైన కవితా భాషలో ఆవిష్కరించారు. రేణుక అయోలా ఇక్కడ ‘హిజ్రా’ అనే పదాన్ని దయనీయమైన స్థితిగా కాకుండా, ఒక ధైర్యమైన మనిషి ఉనికిగా, బతుకు ప్రతీకగా చూపింది. ఇప్పుడు ఒక్కో భావాన్ని విశ్లేషిస్తే.. ‘‘జన్యు కారణం అనుకున్నా/పుట్టుక లోపం అనుకున్నా/లోపం శరీర భాగం అయినప్పుడు’ఇక్కడ కవయిత్రి సమాజపు దృష్టిని తాకుతోంది. సామాజం ‘‘హిజ్రా’అనే మనిషిని ‘‘లోపం’గా చూస్తుంది.  పుట్టుకలో జరిగిన తప్పిదం, ప్రకృతి పొరపాటు అని. కానీ రేణుక అయోలా ఆ దృష్టిని తిరస్కరిస్తోంది. ఆమె చెబుతోంది ‘‘లోపం శరీర భాగం అయినప్పుడు’అంటే అది ప్రకృతిలోని సహజమైన రూపం. అది తప్పు కాదు. అది మనిషి వైవిధ్యానికి సూచిక. ఈ ఒక పాదంలోనే ఆమె సామాజిక న్యాయపరమైన, మానవతా దృష్టిని ప్రతిబింబించింది.‘‘ఎక్కడనుంచి మొదలవుతుందో తెలియకపోయినా ప్రయాణం ఆగలేదు’ఈ పాదాలు అంతర్భావపూరితమైనవి.                            

     మనిషి తన ఉనికి ఎక్కడ మొదలైందో, ఎందుకు తాను భిన్నంగా ఉన్నాడో తెలియకపోయినా, జీవితం ఆగదు. హిజ్రా అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా  జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ పంక్తులు ఆత్మబలం కు ప్రతీక. కవయిత్రి ఇక్కడ జీవన గమనం గురించి మాట్లాడటం మనం గ్రహించాలి.  ‘‘లోపలి స్త్రీతో బయట ప్రపంచంలో బతకాలి అనుకున్నప్పుడు’ఇది మొత్తం దీర్ఘకావ్యంలోని హృదయం. ఇక్కడ ‘‘లోపలి స్త్రీ’అనేది హిజ్రాలోని ఆత్మస్వరూపం, అంతర్మనసులోని స్త్రీ భావన. కానీ ఆ స్త్రీ బయట ప్రపంచంలో బతకడం చాలా కష్టం. సమాజం అంగీకరించదు, గౌరవించదు, అవమానిస్తుంది. అయినప్పటికీ ఆమె బతకాలి అనుకోవడం ఇది ఒక మానవీయ తిరుగుబాటు. లోపలి స్త్రీతో బతకాలి అనుకోవడం’అనేది మనిషి ఆత్మాన్వేషణకు ప్రతీక. రేణుక అయోలా ఈ భావనను బాధతో కాదు, గౌరవంతో చెబుతారు.

            ‘‘ఆ మనిషి కోసం ఆ రూపం కోసంఎన్ని మైళ్లయినా ఎలాంటి దారైనా నడవక తప్పదు అనుకుంటూ’ఇది ఒక ప్రయాణదృశ్యం మాత్రమే కాదు. అది మనిషి ఉనికి కోసం చేసే అంతర్మథనం. హిజ్రా తన స్వరూపాన్ని కనుగొనడానికి, తన ఆత్మను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయాణం. సమాజం ఏ రకమైన అడ్డంకులు పెట్టినా, ఆ మార్గం వదిలిపెట్టకపోవడం ఇదే ‘మూడవ మనిషి’ కావ్యం యొక్క ప్రధాన తత్త్వం.‘‘ధైర్యపు గొడుగుతో నిలబడిన ప్రతిసారి నువ్వు ‘హిజ్రావి’ఈ పాదాలు ఈ కవితకు మానవతా శిఖరంగా నిలుస్తాయి. ‘‘ధైర్యపు గొడుగు’అనే రూపకం ఎంతో గాఢమైనది వర్షంలో తడవకుండా కాపాడేది గొడుగు, కాని ఇక్కడ అది సమాజపు అవమాన వర్షం నుంచి ఆత్మను కాపాడే ధైర్యం. ప్రతిసారి ఆ హిజ్రా నిలబడినప్పుడు, ప్రపంచం ఆమెను తక్కువ చేసింది, ఆమె మళ్లీ లేచి నిలబడి, నవ్వి చెబుతుంది ‘‘నువ్వు హిజ్రావి.’’ ఇక్కడ ‘‘హిజ్రావి’అనేది గౌరవ సూచిక పదంగా మారింది. అది దూషణ కాదు, గుర్తింపు. రేణుక అయోలా హిజ్రాల్ని మనిషిగా గౌరవించాలనే వాక్యాన్ని కవిత్వంగా, సున్నితంగా, కానీ కత్తిలా పదునుగా చెబుతారు. దీని ద్వారా రేణుక అయోలా కేవలం హిజ్రాల జీవితం గురించి రాయడం కాదు ఆమె మనిషితనం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేయడం కనిపిస్తోంది. మనిషి శరీరంతో కాదు, ఆత్మతో నిర్వచించబడతాడు అంటారు.

            ‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం మొత్తం, సమాజంలో తృతీయ లింగానికి ఉన్న స్థితిని మాత్రమే కాకుండా, మనం ‘‘భిన్నతను అంగీకరించగలిగే మనుషులమా?’’ అనే ప్రశ్నను నిలబెడుతుంది.ఈ కవితలోని భాష బలమైనది, కానీ కరుణతో కూడినది. పదాలు సున్నితంగా ఉంటాయి కానీ వాటి వెనుక ఒక అగ్ని ఉంటుంది. రేణుక అయోలా ఇక్కడ కవయిత్రిగా కాకుండా, ఒక తాత్వికురాలిగా మాట్లాడుతోంది ఒక ఆత్మను సమాజం ఎలా అణచిందో, ఆ ఆత్మ మళ్లీ ఎలా లేచి నిలబడిరదో చెబుతోంది. ఈ చిన్న భాగంలోనే రేణుక అయోలా గారి సాహిత్య దృష్టి, మానవతా హృదయం, స్త్రీ సున్నితత్వం అన్నీ గోచరిస్తాయి.  కవిత్వం మనిషి హృదయాన్ని చూసే ప్రయత్నం తీర్పు ఇవ్వడం కాదు, అర్థం చేసుకోవడం.

          రేణుక అయోలా గారి మరో ప్రయోగం ‘‘పృధ’దీర్ఘకావ్యంలో ఈ పాదాలు స్త్రీ అస్తిత్వం, స్వాతంత్య్రం, శరీర స్వాధీనత వంటి మౌలిక అంశాలపై అద్భుతమైన ప్రతిఘటన స్వరాన్ని మ్రోగిస్తాయి. ‘‘శరీరంతో ఆదుకునే హక్కు ఎవరిచ్చారు’అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ ఆవేదన కేవలం ఒక స్త్రీ గళం కాదు, శతాబ్దాలుగా మౌనంగా మిగిలిన స్త్రీ సమాజం తరఫున వచ్చిన గర్జన. ఈ కవితలో కవయిత్రి స్త్రీని ఆస్తిగా, వస్తువుగా చూసే పురుషాధిక్య దృష్టిని ఛిద్రం చేస్తూ, స్త్రీ శరీరం మీద ఆధిపత్యం చూపించే సమాజపు మానసికతను నిలదీసింది. ‘‘స్త్రీ పనికి వస్తుందో లేదో, మగ సంతానం ఇస్తుందో లేదో’అని స్త్రీని కొలిచే బేరగాళ్లను, ‘‘నాగరికత లేని ద్రోహులు’ గా సంబోధిస్తూ రేణుక ప్రశ్నిస్తారు. నిజంగా స్త్రీని సుఖపెట్టే, అర్థం చేసుకునే సత్తా ఈ సమాజానికి ఉందా? ‘‘నేరేడు కళ్ల కాటుక ధారలతో దుల్హన్‌ బొమ్మ నీటి మునకని అద్దానికి చూపించి అడుగుతున్న ఆమెకి రాజ్యం అధికారం ఏ అవకాశం ఇవ్వలేదు, అడవిలో వదిలేసింది’అనే పాదాల్లో పృధ పాత్ర స్త్రీ చరిత్రలోని నిరసనకారిణి ప్రతిరూపంగా వెలుగొందుతుంది.

      ఆమె కేవలం ఒక కథా పాత్ర కాదు, స్త్రీ స్వాభిమానానికి ప్రతీక. రేణుక అయోలా ఈ కవిత ద్వారా శతాబ్దాలుగా సమాజం మూసివేసిన తలుపులపై బలమైన అక్షర తాకిడి చేసింది ఇది కేవలం వేదన కాదు, స్త్రీ చైతన్యానికి ఆహ్వానం, ప్రతిఘటనకు ప్రేరణ. ఈ సమాజానికి ఇప్పుడు కవిత్వం కావాలి. ఏ జర్నలిజం తెలపలేని వేదన, వేయలేని ప్రశ్నలు, ఎదురుచూస్తున్న సమాధానాలు వంటివన్నీ ఇప్పుడు కవిత్వమే మాట్లాడుతోంది. ముఖ్యంగా స్త్రీ స్థానం పదిలం చేయడానికి కవిత్వం కావాలి. స్త్రీ దేహాలను కాపాడుకోవడానికి, స్త్రీ అస్తిత్వాల్ని మరింత గౌరవ ప్రదంగా చూపడానికి కవిత్వం కావాలి అనిపిస్తోంది. సమాజానికి కావాల్సిన కవిత్వం ఇక్కడుంది.. ఆహ్వానిద్దాం.. మరిన్ని కవితల్ని వీరి కలం నుండి..

                                                                                                                                     

November 30, 2025 9 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అద్భుతమైన బొమ్మలు

by Shaik Hazi November 30, 2025
written by Shaik Hazi

నేను ఒక బొమ్మ చేయాలనుకుంటే గూగుల్ లోకి పొయ్యి ఒక బొమ్మ ఫోటో తీసుకుంటా ఆ బొమ్మ ప్రకారం ఒక మంచి లావు అట్టపెట్ట తీసుకొని అట్టపెట్ట పైన బొమ్మ ప్రకారం పెన్సిల్ తో డ్రాయింగ్ వేస్తా ఆ డ్రాయింగ్ ప్రకారం ప్రకారం చిన్న కత్తి తీసుకొని మెల్లగా కటింగ్ చేసుకుంటా. కటింగ్ చేసుకున్న తర్వాత ఫెవికాల్ తో అతికించేస్తాను. తర్వాత దానిపైన పతలాది అట్టపెట్ట తీసుకొని ఫెవికాలతో లావు అట్ట పైన పతలాది అట్టపెట్ట అతికించేస్తా. తర్వాత ఆరబెడుత. బాగా గట్టిగా ఆరిన తర్వాత దానిపైన ఒక మంచి గుడ్డ అతికించేస్తా.
మెడికల్ స్టోర్ మధ్యాహ్నం పూట వ్యాపారం లేనప్పుడు కొద్ది కొద్దిగా చేస్తా ఉంటాను.

November 30, 2025 12 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే వ్యాసాలు రావాలి

by Aruna Dhulipala November 30, 2025
written by Aruna Dhulipala

ప్రముఖ కవి, రచయిత, ‘నంది’ పురస్కార గ్రహీత
డా.చిమ్మపూడి శ్రీ రామమూర్తి గారితో మయూఖ ముఖాముఖి            

సాహిత్యరంగంలోనూ, నాటకరంగంలోనూ కృషి చేస్తూ ‘చిమ్మపూడి ఫౌండేషన్’ స్థాపించి బాలబాలికలలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతున్న డా. చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి జీవిత విశేషాలను స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్!

మా మయూఖ పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేసే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

1ప్ర:- మొదటగా మీ జనన, బాల్య, విద్యాభ్యాస విశేషాలను చెప్పండి.

జ:–  నమస్కారమండీ! నా జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం. నేను అక్టోబర్ 20వ తేదీ 1941లో జన్మించాను. నా తల్లిదండ్రులు అన్నదానం శేషమ్మగారు, వెంకటేశ్వర్లు గారు. నా అయిదవ ఏట ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన చిమ్మపూడి సుబ్బమ్మగారు నన్ను పెంపకానికి తీసుకోవడంతో ఇంటిపేరు చిమ్మపూడి అయింది. నా పెంపుడు తండ్రి వెంకటప్పయ్యగారు అప్పటికి చాలా కాలం క్రితమే మరణించారు. ఆమె నన్ను కన్నతల్లి కంటే ఎక్కువగా ఆదరించి, పోషించింది. అక్కడి ప్రాథమిక పాఠశాలలో నేను నాలుగవ తరగతి వరకు చదువుకున్నాను. అక్కడే మా పెదనాన్న కుమారుడు సుబ్రహ్మణ్యం గారి అండదండలతో ఆయన ప్రశిక్షణలో హిందీ ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక, విశారద పరీక్షలన్నీ పాసయ్యాను. తల్లంపాడుకు సమీపంలో ఉన్నటువంటి గోకినేపల్లి గ్రామంలో స్వయంగా వండుకుంటూ, ఒక మాష్టారు గారికి వండిపెడుతూ చదువుకుంటూ హెచ్ ఎస్ సి పూర్తి చేశాను. ఖమ్మం ఎస్.ఆర్ కాలేజీలో పి.యు.సి. ఒక సంవత్సరం చదివాను. హెచ్ ఎస్ సి లో ఉండగానే నాకు వివాహమైంది. మా అన్నయ్య గారి సలహా మేరకు చంచల్ గూడ ‘హిందీ ప్రచార సభ’ లో ఒకే సంవత్సరంలో ప్రవీణ్, ప్రచారక్ ట్రైనింగ్ కోర్సులో చేరి పూర్తి చేసుకున్నాను. ఉద్యోగం చేస్తున్నప్పుడు బిఏ, హిందీ ఎమ్.ఏ, బిఇడి, సంస్కృత కోవిద్ చేశాను.

2ప్ర:- మీకు సాహిత్యరంగంలో ఆసక్తి ఏర్పడడానికి వంశానుగతంగా వచ్చిన అభిరుచి ఏమైనా ఉందా? ఇంకెవరి ప్రభావం అయినా ఉందా?

జ:– నాకు చిన్నప్పటినుండే అంటే ఎనిమిదవ తరగతి నుండే ఏదో రాయాలన్న తపన ఉండేది. పాటలు నేర్చుకోవడం, పాటలు పాడడం వల్ల రాగాల పట్ల, సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి ఏర్పడింది. పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వ, పాటల పోటీలో పాల్గొని విజేతగా అనేక బహుమతులు పొందేవాడిని. భగవద్గీత పఠన పోటీల్లో కూడా బహుమతులు వచ్చేవి. ఆటల్లో కూడా చురుకుగా ఉండేవాడిని. వంశానుగతంగా మా పూర్వీకులలో సాహిత్యాభినివేశం ఎవరికీ లేదు. నాలో ఆ ఆసక్తికి కారణం మా ఉపాధ్యాయులే అని చెప్పాలి. వాళ్ళు అంకితభావంతో చేసే కృషి, మాకు అన్ని విషయాల్లో అందించే ప్రోత్సాహం వల్ల నాకు సాహిత్యరంగంలో ఆసక్తిని ఏర్పరిచింది. నన్ను విద్యా విషయంలో ముందుకు నడిపించిన మా అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు మంచి గాయకులు. బహుశా ఆ ప్రభావం నామీద ఉండి ఉండవచ్చు.

3ప్ర:-  నాటకాలలో మీ అరంగేట్రం ఎప్పుడు జరిగింది. అందులో మీ అభిలాషకు నేపథ్యం ఏమైనా ఉందా?

జ:– నేను నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు టెక్స్ట్ లో ఉన్న ‘కృష్ణ-సుదాముడు’ అనే నాటికను మాతో వేయించారు. అందులో నా చేత కృష్ణుని పాత్ర వేయించారు. ఆ తరువాత ఉన్నత విద్యార్థి దశలో మా ఉపాధ్యాయులు, మాకంటే పెద్దవాళ్ళు డ్రామాలు వేస్తుంటే వాళ్ళతో పాటు పాల్గొనేవాడిని. పౌరాణిక నాటకాల్లో అర్జునుడు, కృష్ణుడు, సహదేవుడు పాత్రలను వేసేవాడిని. సాంఘిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు కూడా మంచి శిక్షణ ఇచ్చి మా చేత వేయించేవారు. వారి శిక్షణ వల్లనే నాకు నాటకాల పట్ల ఆసక్తి పెరిగింది. అట్లా దాదాపు వంద నాటకాలు వేశాను.

4ప్ర:- మీ ఉద్యోగ జీవితం కొనసాగిన విధానం ఎటువంటిది? వాటి అనుభవాలు ఏమైనా చెప్తారా?

జ:– ప్రవీణ్ ప్రచారక్ ట్రైనింగ్ అయిపోయిన తరువాత నాలుగు నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. ఆ సమయంలో మా బాబాయి తేరాల సూర్య నారాయణ శర్మ గారు నాకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఈ లోపు మా అన్నయ్య హైదరాబాద్ హిందీ విద్యాలయంలో 150 రూపాయలతో ప్రయివేటు ఉద్యోగం ఇప్పించాడు.  సూర్యాపేట జిల్లా సిరికొండ గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో మా బాబాయి పనిచేస్తుండేవారు. అక్కడ హిందీ టీచరు లేనందువల్ల ప్రయత్నం చేసి నాకు ఉద్యోగం ఇప్పించాడు. అప్పుడు నా జీతం 68 రూపాయలు. అట్లా సిరికొండలో నా ఉద్యోగ ప్రస్థానం మొదలయింది. వరుసగా ప్రమోషన్స్ తో గ్రేడ్ 2, గ్రేడ్ 1, జూనియర్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉద్యోగం చేసి చివరగా మంచిర్యాల కాలేజీలో రిటైర్ అయ్యాను. తరువాత 1999 లో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను.

రామ్మూర్తిగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

5ప్ర:-  విభిన్న ప్రక్రియల్లో మీరు దాదాపు ఇరవై పుస్తకాలు రచించారు కదా! అందులో మీకు బాగా నచ్చిన ప్రక్రియ ఏది?

జ:–  నేను రిటైర్మెంట్ తీసుకున్న తరువాతనే పుస్తకాలు రాశాను. అప్పటికే పాటలు, పద్యాలు, కవిత్వం రాస్తున్నప్పటికీ కాగితాలలో మాత్రమే ఉండేవి. హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఇక్కడ కవులను, సాహిత్య సభలను చూస్తూ ప్రభావితుడనయ్యాను. ఇప్పటివరకు నేను ఇరవై పుస్తకాలు రాశాను. ఇంకా ముద్రణ కావల్సినవి ఉన్నాయి. మా గురువు గారు డా. సి. నారాయణ రెడ్డిగారు. రెండు మూడు పుస్తకాలు తప్ప నా పుస్తకాలన్నీ ఆయనే ఆవిష్కరించారు. మొదటగా ‘రవ్వలు’ అనే పేరుతో మినీ కవితలు రాశాను. రెండు లలిత గేయాల పుస్తకాలు రాసి ఒకటి ఎస్. పి. బాల సుబ్రహ్మణ్యం గారికి, ఒకటి అక్కినేని నాగేశ్వరరావు గారికి, మరొక గేయ సంపుటి డా.సి. నారాయణరెడ్డి గారికి అంకితం ఇచ్చాను. ‘ఒక కొత్త శ్వాస కోసం’ అనే దీర్ఘ కవిత రాసి అది కూడా అక్కినేని గారికి అంకితం ఇచ్చాను. ఇందులో మానవీయ విలువలు, సమాజం గురించి రాశాను. సమాజానికి కేంద్రం మానవుడు, మానవునికి కేంద్రం మానవీయత. ఈ అంశాలను వివరిస్తూ, పదిమందికి పంచాలని రాశాను. నానీలు రాశాను. వచన కవితలు, మినీ కవితలు, మినీ హాస్య కవితలు సుమారు ఎనిమిది వందలకు పైగా రాశాను. అది ‘పంచ్- విపంచి’ పుస్తకంగా వచ్చింది. మూడు వేలకు పైగా కొంటె ప్రశ్నలు-కొంటె జవాబులు రాశాను. ‘నవ్వే బంగారం’ అనే పేరుతో హాస్యం గురించి పరిశోధనాత్మక పుస్తకం రాశాను. “నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును/నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు…” అన్న జాషువా పద్యాన్ని ఉటంకిస్తూ పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న హాస్య ప్రధానమైన విషయాలను, కవులు, పండితుల హాస్య సంభాషణలు …ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘నవ్వుల నక్షత్రాలు’ రాశాను. “తల్లీ నిన్ను దలంచి” అనే మాతృ శతకం రాశాను. ఇవన్నీ రాసినప్పటికీ నాకు ముందు నుండీ పద్యాలు, పాటలు చాలా ఇష్టం. ‘అంతా బాగున్నారా?’ అనే పుస్తకం ముద్రణలో ఉంది.

6ప్ర:- ప్రభుత్వం తరఫున నంది నాటకోత్సవాలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించి, స్వర్ణ నంది అవార్డు పొందిన అనుభూతిని వివరించండి.

జ:–  2010 వ సంవత్సరంలో ఖమ్మంలో జరిగిన నంది నాటకోత్సవాలకు ప్రభుత్వం వారు నన్ను జడ్జీగా పిలిచినప్పుడు ఆశ్చర్యపోయాను. వెళ్లిన తర్వాత డైరెక్టర్ పార్థసారథి గారు పిలిచి మీ అనుభవాలను చెప్పండి అని అడిగి ఒక పద్యం కూడా పాడమన్నారు. పాడిన తరువాత మరో రాగంలో పాడమన్నారు. అదీ పాడిన తర్వాత వాటి రాగాల పేర్లు చెప్పమన్నారు. అప్పుడు నన్ను ఎంపిక చేసుకున్నారు. నాతో పాటు సురభి కంపెనీ డైరెక్టర్  రామ్మోహన్ రావు గారు, అన్నమయ్య ట్రస్ట్ వాటిల్లో పాటలు రాసిన వ్యాస భట్టాగర్ గారు, నేను ముగ్గురం జడ్జీలుగా ఉన్నాము. పోటీకి ముప్పది ఆరు నాటకాలు వచ్చాయి. సాధారణంగా నాటకాలలో వివిధ అంశాలకు నంది అవార్డులు ఇస్తారని అందరికీ తెలుసు. కానీ మొదటిసారి జడ్జీలకు పురస్కారం ఇవ్వాలనే ఆలోచన వారికి కలగడం యాదృచ్ఛికంగా నాకు ఒక మంచి అవకాశం.

7ప్ర:-  కేవలం అరవై నిమిషాల్లో అరవై పాటలు పాడి వరల్డ్ రికార్డు సాధించారు కదా! ఆ ప్రత్యేకతను తెలపండి.

జ:–  ఒకసారి నా ప్రోగ్రాం చొక్కాపు వెంకటరమణ గారు చూసి మీరు “పాటలు, పద్యాలు ఇంత బాగా పాడుతున్నారు. కొత్త ప్రయోగం ఏదైనా విలక్షణంగా చేస్తే బాగుంటుంది.” అన్నారు. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. అరవై నిమిషాల్లో అరవై పాటలు పాడాలని సంకల్పించాను. మొదట పది నిమిషాల్లో పది పాటలు, ఇరవై నిమిషాల్లో ఇరవై పాటలు ఇట్లా సాధన చేశాను. దానితో పాడగలననే ధైర్యంతో వెంకట రమణ గారికి ఫోన్ చేసి, విషయం చెప్పాను. ఇంతకుముందు ఇరవై నాలుగు గంటలు పాడిన రికార్డ్స్ ఉన్నాయి. కానీ పాటల సంఖ్య లేదు. అందులో పాల్గొనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కార్యక్రమాన్ని బృందంగా నిర్వహిస్తారు. ఒక్కరు మాత్రమే పాడిన రికార్డు లేదు. అందువల్ల ఆయన నన్ను ఈ కార్యక్రమం నిర్వహించమని తేదీ కూడా నిర్ధారించారు. ‘నవరాగం-స్వరయాగం’ అనే పేరుతో దీన్ని నిర్వహించాను. కీబోర్డు, తబలా సహవాద్యకారులకు పాటల వరుసక్రమాన్ని రాసి ఇచ్చాను. దీంట్లో మరో ప్రత్యేకం ఏమిటంటే కేవలం సినిమా పాటలు కావు. ఒక సినిమా పాట, ఒక లలిత గీతం, ఒక దేశభక్తి గీతం, ఒక హరికథ కీర్తన, బుర్రకథ కీర్తన, అన్నమయ్య, త్యాగయ్యల కీర్తనలు, ఒక తరంగం, ఒక హిందీ సినిమా పాట ఇట్లా విభిన్న ప్రక్రియల్లో పాడాను. 58 నిమిషాలలోనే పూర్తయింది. ఆరు రికార్డులు సొంతం చేసుకున్నాను. వెంకట రమణ గారి సూచన, ప్రోత్సాహాలతో ప్రోగ్రామ్ దిగ్విజయంగా జరిగింది. ప్రశంసలు వెల్లువెత్తాయి.

8ప్ర:-  అంతర్జాతీయ తెలుగు టోరీ రేడియోలో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమ వివరాలు తెలపండి.

జ:–  రేడియో లైట్ మ్యూజిక్ లో నాకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నో లలితగీతాలు పాడాను కూడా. ఆకాశవాణి హైదరాబాద్ వారు ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఆడిషన్స్ కమిటీలో జడ్జీగా వేశారు. కేవలం పాటలు, లలితగీతాలే కాక పద్యపఠనం, ప్రసంగాలు, హిందీ కవితలు, హిందీ నుండి తెలుగులోకి తెలుగు నుండి హిందీలోకి అనువాద కవితలు, నాటికలు ఇట్లా అనేక ప్రక్రియలలో చేశాను. హిందీ పాఠాలు కూడా చెప్పాను. ఉదయం 6గంటలకు ‘భావన’ అనే కార్యక్రమం వచ్చేది. 5 నిమిషాల ప్రసంగం ఉంటుంది. టాపిక్స్ కూడా నన్నే ఎంపిక చేసుకోమన్నారు. ఇప్పటికి 200 ప్రసంగాలు చేశాను. ఈ విధంగా రేడియోతో నాకు ఎంతో అనుబంధం ఉంది.
        మీరడిగిన ‘టోరీ’ అనేది తెలుగు -1 రేడియోలో ఒక భాగం. ఇరవై నాలుగు గంటలూ గంట గంటకు ఒక వ్యాఖ్యాత వివిధ అంశాలపై మాట్లాడుతుంటారు. పులివర్తి కృష్ణమూర్తి గారు నాకు మిత్రులు. ఆయన టోర్నీలో వ్యాఖ్యానం చేసేవారు. ఒకసారి మాటల సందర్భంలో “మీరు కూడా మీకు ఇష్టమైన ప్రక్రియలో వ్యాఖ్యాతగా చేరొచ్చు కదా!” అన్నారు. నాకు దాని గురించి ఏమీ తెలియదు. అందుకని కొన్ని రోజులు వరుసగా ఆ కార్యక్రమాలను విన్నాను. దానితో నాకూ ఆసక్తి పెరిగింది. అట్లా వింటున్నప్పుడు ఒక సాధారణ శ్రోతగా వ్యాఖ్యాతలతో మాట్లాడేవాడిని. ఆవిధంగా రెండు నెలలు గడిచాక నేను మాట్లాడే విధానం, విషయ పరిజ్ఞానం వాళ్లకు అర్థమై పద్య ప్రక్రియలో  వ్యాఖ్యాతగా చేయమన్నారు. సరేనని అప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా చేస్తూనే ఉన్నాను. ప్రతీ శనివారం ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు నాకు స్లాట్ ఇచ్చారు. ఆ సమయంలో నేనొక పద్యం పాడి వివరిస్తాను. శ్రోతలు కూడా కొంతమంది శతకాలలోని, కావ్యాలలోని పద్యాలు చెప్తారు. ఒకసారి చెప్పిన పద్యాన్ని మరోసారి చెప్పను. ఇతిహాసాలు, కావ్యాలు, శతకాలు ఇవేకాక కొంతమంది నాకు ఇచ్చిన పుస్తకాల్లోని పద్యాలు, అప్పుడప్పుడు నేను సొంతంగా రాసిన పద్యాలు చదువుతుంటాను. రేపటి తరానికి పద్యమంటే ఏమిటి? దాని సొబగులు, వన్నెలు, సౌందర్యం ఇవన్నీ తెలపాలని నా తాపత్రయం. తెలుగు భాష, పద్యం పట్ల ఆసక్తిని కలుగ జేయడంతో పాటు పద్యం యొక్క ప్రాథమిక నిబంధనలు, ఛాయ, పోకడ ఎలా ఉంటుందో సరళంగా, సుబోధకంగా చెప్పడం నా ఉద్దేశ్యం. ఎక్కడెక్కడో ఉన్న వారిని ఫోను సంభాషణ ద్వారా లైవ్ గా ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నాను. శ్రోతలు కూడా వారిని పద్యాలు అడుగుతుంటారు. మంచి స్పందన వస్తోంది. పద్యాన్ని అందరూ ఆదరిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగువారికి పద్యం ఆస్తి. పద్యం లేకపోతే తెలుగు భాష నాస్తి. అందువల్ల ఇది ఇంకా ఇట్లాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను కూడా.

9ప్ర:- ‘రాగావధానం’ పేరుతో మీరు నెలకొల్పిన వినూత్న ప్రక్రియా విధానాన్ని వివరించండి.

జ:–   నేను సాహిత్య సభలు, చర్చలు, పాట కచేరీలు, హరికథలు, బుర్రకథలు, రంగస్థల నాటకాలు ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నా వెళ్లి ఆసాంతం వినేవాడిని.  నాలుగైదు సంవత్సరాలు చూసిన తరువాత నాకొక ఆలోచన వచ్చింది. ఇన్ని ప్రక్రియలను గంట, గంటన్నర వ్యవధిలో నేనొక్కణ్ణే పాడి ఎందుకు ప్రదర్శించకూడదు? అనిపించింది. ఇది నా మనస్సులో రాగావధానానికి పడిన సందర్భబీజం. ఈ ప్రక్రియలన్నీ ఒక కార్యక్రమంలాగా పాడి వినిపించాలి. ప్రయత్నం ప్రారంభించాను. అవధానం కాబట్టి పృచ్ఛకులు ఉండాలి. వాళ్ళు కూడా సంగీత పరిజ్ఞానం కలిగి ఉండాలి. నాకు ఇరువైపులా ఎనిమిది మంది పృచ్ఛకులు, ఒక సమన్వయ కర్త (వ్యాఖ్యాత) ఉంటాడు. ఒక పృచ్ఛకుడు లేదా పృచ్ఛకురాలు ఒక లలిత గీతం పాడి, దీనిని వేరే రాగంలో పాడమని అడుగుతారు. మొదట వాళ్ళు అడిగిన రాగాన్ని ఆలాపన చేయాలి. ఉదాహరణగా ఆ రాగంలో ఉన్నటువంటి ప్రసిద్ధ గీతం కానీ, తెలుగు లేదా హిందీ సినిమా పాట గానీ పల్లవి గానీ వినిపించి అప్పుడు వాళ్ళు అడిగిన రాగంలో ఆ లలితగీతాన్ని పాడాలి. ముందుగా ఎటువంటి రిహార్సల్స్ ఉండవు. లైవ్ గా పాడాలి. ఎనిమిది మంది రెండు రౌండ్ల చొప్పున పదహారు పాటలు వినిపించాలి. రాళ్లబండి కవితా ప్రసాద్ గారు, సినారె గారు, మాధవపెద్ది సురేశ్ గారు, సురేఖామూర్తి వంటి వారు శ్రోతలుగా పాల్గొన్నారు. ప్రముఖులైన వాళ్ళు పృచ్ఛకులుగా కూడా పాల్గొన్న సందర్భాలున్నాయి. వినూత్నంగా చాలా బాగుందని ఎంతోమంది ప్రశంసించారు. రాగ పరిమళాన్ని పరివ్యాప్తం చేయాలన్నది నా కోరిక. దీనివల్ల సంగీతం పట్ల ఆసక్తి ఉన్నవారికి రాగాల గురించి ఒక అవగాహన కలుగుతుంది.

10ప్ర:- ఈ ప్రక్రియలో మీరు ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు? దీనిలో ఇంకెవరికైనా శిక్షణ ఇస్తున్నారా?

జ:– నేను ఇప్పటికి ఈ వినూత్న ప్రక్రియలో 57 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. గుంటూరు, విజయవాడ, విజయనగరం, తెనాలి, సూర్యాపేట, ఖమ్మం మొదలైన చోట్ల ప్రదర్శించాను. హైదరాబాద్ లోని అన్ని వేదికల మీద ఇచ్చాను. బొంబాయిలో ప్రదర్శన ఇస్తే వాళ్లకు నచ్చి, మరో రెండు ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఒక జర్నలిస్టు ఒక పేపర్ కటింగ్ ఇచ్చి ఆ వార్తని మోహన రాగంలో పాడమన్నాడు. వచనంలో ఉన్నదాన్ని రాగంలో పాడడం సాధ్యమా? అయినా పాడాను. అది ఒక అనుభవం. అంటే మనం ప్రతీది సాధన చేసి ఉండాలి. లైవ్ కాబట్టి దేనికైనా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా అన్నింటి లోనూ అవగాహన ఉండాలి. ప్రయత్నమే ప్రథమ విజయం కదా! ఈ రకంగా రాగావధానాన్ని దిగ్విజయంగా చేశాను. నేను, పొనకంటి దక్షిణామూర్తి అనే మిత్రుడు ఇద్దరం కలిసి ‘యుగళ రాగావధానం’ చేశాం. ఎలాగంటే ఒక పద్యాన్ని ఒక పంక్తి నేను పాడితే రెండవది ఆయన, మూడవది నేను, నాలుగవది ఆయన పాడాలి. అట్లాగే ఒక రాగాన్ని నేను కొంత పాడితే మరికొంత ఆయన, దానికి కొనసాగింపుగా నేను, మళ్లీ ఆయన ఇట్లా ఇద్దరం కలిసి చేశాం. రాగావధానం పట్ల ఆసక్తితో నేర్చుకొని ఇద్దరు, ముగ్గురు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఋగ్వేదం పద్మశ్రీ అనే అమ్మాయి బిటెక్ పూర్తి చేసి ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ అమ్మాయికి రాగావధానంలో ప్రశిక్షణ ఇచ్చాను. సంగీతంలో మంచి పరిజ్ఞానం ఉన్న అమ్మాయి. నెల రోజులు సాధన చేసి ప్రదర్శన ఇచ్చింది. జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొరకు బింగి నరేందర్ గారి ఆధ్వర్యవంలో ఈ కార్యక్రమం జరిగింది. 90 నిమిషాల్లో ఆమె అవధానాన్ని పూర్తి చేసింది. ఇట్లా ఎంతోమంది ముందుకు వస్తున్నారు. పిల్లలను చాలా మందిని ఈ ప్రక్రియలో తయారు చేయాలన్నది నా కోరిక. చేస్తాను కూడా.

11ప్ర:- ‘పాట పల్లవించిన వేళ’, ‘పాట పరిమళించిన వేళ’ అనే పేరుతో రచించిన లలిత గీతాలను గురించి తెలపండి.

జ:– నేను చాలా కాలంగా రాసుకున్న లలితగీతాలు వందలకొద్దీ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకొని సినారె గారి దగ్గరకు వెళ్లి చూపించాను. వాటిని పుస్తకంగా వేస్తున్నానని, ఆయనను పేరు సూచించమని, అంకితం కూడా ఆయనే తీసుకోవాలని అభ్యర్థించాను. సహృదయంతో అంగీకరించారు. ‘పాట పల్లవించిన వేళ’ అని పేరు సూచించారు. దీనికి ముందుమాట ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం గారితో రాయించాను. పదహారు రోజులలోనే రాసిచ్చారు. వంశీ రామరాజు గారు ఆ కార్యక్రమ నిర్వహణకు పూనుకున్నారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ గాయనీ గాయకులతో నా ‘లలిత సంగీత విభావరి’ కూడా జరిగింది. నా గీతాలకు స్వయంగా నేనే ట్యూన్ చేసుకున్నాను. ఆ రాగాలనే వారు ఆలపించారు. తరువాత ఎన్నో గీతాలు రాశాను. మరికొన్ని గీతాలతో ‘పాట పరిమళించిన వేళ’ అనే పుస్తకం వేశాను. దానిని ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వాలని అనుకున్నాను. నేను, ఆకృతి సుధాకర్ గారు సారథి స్టూడియోలో ఉన్న బాలు గారిని కలిసి అంకితం తీసుకోమని కోరాను. నాపై ఆయనకున్న అభిమానంతో ఒప్పుకొని తనకు కుదిరే తేదీని చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అంకితోత్సవ సభ జరిగింది. అదే సమయంలో దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారు కూడా హైదరాబాద్ లో ఉన్నారని తెలిసి ఆవిష్కరణకు ఆయనను పిలవాలని సుధాకర్ గారితో వెళ్ళాను. ‘అంకితం ఎవరికిస్తున్నారు?’ అన్నారు. ‘బాలు’ గారికి అనగానే ‘ఇంకేం? మా వాడే కదా! వస్తాను’ అన్నారు వెంటనే. ఇద్దరు దిగ్దంతులు ఒకరు ఆవిష్కరించడం, ఒకరు అంకితం తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ పుస్తకంలోని సుమారు అరవై పాటలను రేడియో, దూరదర్శన్ వాళ్ళు వేరే ట్యూన్ కంపోజిషన్ చేసి ప్రముఖ గాయనీ గాయకులతో పాడించారు.
          పాటల సందర్భం వచ్చింది కాబట్టి మీకో విషయం చెప్తాను. 1987వ సంవత్సరంలో నాకు ‘ఆడబొమ్మ’ సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. మద్రాసుకు వెళ్లాను. ‘నందామయా గురుడ నందామయా’ వంటి నాలుగు పాటలు రాశాను. మనో గారు, వాణీ జయరాం గారు, జానకి గారు ఆ పాటలను పాడారు. ‘ఆదిపరాశక్తి’ మొదలైన నాలుగు టీవీ సీరియల్స్ కి నాలుగు టైటిల్ సాంగ్స్ రాశాను. బాలు గారు మూడు పాటలు, నిత్య సంతోషిణి గారు ఒక పాట పాడారు.

12ప్ర:- ‘చిమ్మపూడి ఫౌండేషన్’ ఎప్పుడు ఎట్లా స్థాపించారు? దాని నేపథ్యం, వ్యవస్థాపకులుగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎటువంటివి?

జ:– ఎంతోమంది ప్రముఖులను గుర్తిస్తూ సన్మాన సత్కారాలు చేస్తున్న ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలను నేను చూశాను. కానీ ఎవరూ పిల్లలకు ప్రోత్సాహకరంగా, ఉత్సాహకరంగా ఉండే పనులను చేయడం లేదెందుకు? అనే ఆలోచన వచ్చింది. పిల్లలకు ఏదైనా చేయించాలనే కోరికతో స్థాపించిన సంస్థ ‘చిమ్మపూడి ఫౌండేషన్’. నా ఆలోచనలకు తగిన కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా చేర్చుకొని సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ నెలా మేము బ్యాంకులో కొంత కార్పస్ ఫండ్ డిపాజిట్ చేస్తాం. విరాళాలు ఇచ్చిన వారికి పారదర్శకంగా ఉండేలా తప్పనిసరిగా రశీదులు ఇవ్వడం చేస్తాం. ఈ సంస్థ 2019 అక్టోబర్ 20వ తేదీన ప్రారంభమైంది. గౌరవ సలహాదారుగా ఉండేందుకు కె. వి. రమణాచారి గారిని అడిగితే ఆయన అంగీకరించారు. పిల్లల చేత రకరకాల కార్యక్రమాలు చేయించడం, పెద్దవాళ్లను పిలిచి సత్కరించడం, ప్రముఖులలో ఒకరికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వడం, సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ ఈ సంస్థ ద్వారా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 36 చోట్ల కన్వీనర్లను పెట్టుకున్నాం. స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, సాహిత్యానికి పురాణాలకు సంబంధించిన పజిల్స్, క్విజ్ లను ఏర్పాటు చేసి తెలుగు భాష పట్ల ఆసక్తి కలిగించేలా చేస్తున్నాం. పోటీలో విజేతలైన వారి పేర్లు, స్కూల్ పేరు, ప్రిన్సిపాల్, నిర్వాహకుల పేర్లతో సహా సావనీర్ లో ప్రింటు చేయిస్తున్నాం. ఇప్పటికి ఐదు సావనీర్లు వచ్చాయి. ఆరవది ఈ అక్టోబరులో వెలువడనుంది. దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమాలకు వెళ్లి వారికి కావలసిన అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. నగదు రూపంలో ఏదీ ఇవ్వం. ఆయా అవసరాలను బట్టి వస్తువులు కానీ ఆహార పదార్థాలు గానీ ఇస్తాం. ఇట్లా భాష, సాహిత్య, సాంస్కృతిక, కళ, విద్య, సామాజిక సేవలను అందిస్తున్నాం. జిల్లా కన్వీనర్ల సేవలను గుర్తించి, ఆహ్వానించి సత్కరించుకుంటున్నాం. యువ కవిసమ్మేళనాలతో యువతను ప్రోత్సహిస్తున్నాం.

13ప్ర:- మీ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మీరు చేయాలనుకుంటున్న కార్యాచరణ ఏమిటి? ఎటువంటి లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు?

జ:–  ఫౌండేషన్ లోని మా సభ్యులంతా ఉత్సాహవంతులు, కార్యశీలురు. వారి సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరిస్తాం. తెలుగు భాషా వైభవ పరిరక్షణ కోసం యువతలో జాగృతి కలిగిస్తాం. రామాచారి గారి(LMA డైరెక్టర్) సహకారంతో మరెంతో మంది విద్యార్థులను సమీకరించి, విలక్షణ, వినూత్న, ప్రదర్శనలు ఇప్పిస్తాం. పదిలక్షల మూల నిధితో భవిష్యత్తులో రేపటి తరానికి చైతన్య దీపికనందిస్తాం. ప్రతి జిల్లాలోనూ మా శాఖను శక్తివంతం చేస్తాం. ఈ సందర్భంగా మాకు ఆర్థిక సౌజన్యాన్ని, గ్రంథాలను అందిస్తున్న ఔదార్య మూర్తులకు, వదాన్యులకు మా ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఇక్కడి తెలుగువారు, ప్రవాసాంధ్రులు మా పారదర్శకతను అభిమానిస్తున్నందుకు శతానేక నమోవాకములు.

14ప్ర:-  ‘చిమ్మపూడి మీడియా’ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు కదా? అది వైయక్తికమా? సామాజికమా?

జ:– అది కేవలం నా వ్యక్తిగతం కాదు. సమాజానికి ఉపయోగపడే వివిధ అంశాలను తెలియజేసే ఉద్దేశ్యంతో 2023 ఆగస్ట్ 10వ తేదీ వినాయక చవితి రోజున ఈ మీడియాను ప్రారంభించాను. ప్రశ్నకు జవాబుగా ఒక కథతో ఇది ప్రారంభమైంది. ఇప్పుడు నిరంతరాయంగా అనేకమంది కథలు, ప్రసంగాలు పంపిస్తున్నారు. రామాయణంలో చాలామందికి తెలియని అనేక విషయాలను చెబుతూ ‘రామాయణ రహస్యాలు’ అనే పేరున ఇప్పటికి సుమారు ఇరవై ఐదు ప్రసంగాలు ధారావాహికగా వచ్చాయి. ‘పెళ్లి ముచ్చట్లు’ అనే శీర్షికతో పది భాగాలుగా ఒక ధారావాహిక చేశాను. పెళ్లిలో జరిగే తంతులో ఉన్న రహస్యాలు చాలామందికి తెలియవు. వాటిని వివరిస్తూ ఒక్కో విషయానికున్న ప్రాధాన్యతను ఇందులో తెలిపాను. ‘మనసా కవ్వించకే’ అనే పేరుతో మరో ధారావాహిక చేశాను. నా మిత్రులు నారుమంచి వారు, నేను మా ఆలోచనలతో దీనిని నిర్వహించాం. మనిషి ప్రవర్తన, ఖ్యాతి, అపఖ్యాతి అంతా మనసు మీదే ఆధారపడి ఉంది. మనసు మనిషిని ఎక్కడ సవ్యంగా నడుపుతుందో, ఎక్కడ దారి తప్పుతుందో చిన్న చిన్న కథలు, సంఘటనల  ద్వారా తెలపడం జరిగింది. ఇవేగాక అభిరుచి, ఆసక్తి, ఉత్కంఠ కలిగించే కథలను కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటిని చక్కగా చడవగలిగే వారితో చదివిస్తాను. నాకు సన్నిహితులైన వారు మన ప్రాంతంలోనే కాక కాలిఫోర్నియా ఆస్ట్రేలియా, మెల్ బోర్న్ ఇట్లా విదేశాలనుండి కూడా వాటిని చదివి వాటిని రికార్డు చేసి పంపిస్తారు. ఈ మీడియా ద్వారా వాటిని అందిస్తున్నాను. కవిసమ్మేళనాలు, ఏకాపాత్రాభినయాలు, పరీక్షార్థులకు చిట్కాలు, వేద సందేశాలు, రంగస్థల పద్యాలు, ప్రఖ్యాత తీర్థ క్షేత్ర విషయాలు…ఇట్లా దాదాపుగా ఇరవై ఐదు అంశాలను ఇందులో పొందుపరుస్తున్నాను.

15ప్ర:-  అమ్మాయిల చేత ‘భువన విజయం’ సాహిత్య రూపకం వేయించాలనే ఆలోచన ఎట్లా కలిగింది?

జ:– నేను ‘భువన విజయం’ రూపకాన్ని ఎన్నో చోట్ల చూశాను. ‘భువన విజయం’లో పదిహేనేళ్లుగా నేను కూడా వివిధ కవుల పాత్రలను ధరిస్తూ వస్తున్నాను.  అయితే ఇందులో పాల్గొనే కొంతమంది పద్యాన్ని భావయుక్తంగా చదువుతున్నారు కానీ శ్రుతి శుద్ధంగా, రాగ యుక్తంగా పాడడం లేదు. పిల్లలతో అందునా అమ్మాయిలతో వేయిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. ప్రగడరాజు నర్సరాజు, మొల్లమాంబలతో కలిపి అష్టదిగ్గజకవులు, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణదేవరాయలు, ఒక ప్రయోక్త, ఒక భటుడు మొత్తం పధ్నాలుగు మందిని సంగీత పరిజ్ఞానం ఉన్న అమ్మాయిలను ఎంపిక చేసుకున్నాను. వాళ్ళల్లో బిఏ, బిటెక్, ఎమ్ బిఏ, ఎమ్ సీఏ, బి ఫార్మసీలలో విద్యాభ్యాసం చేస్తున్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళను వెతికి ఎంపిక చేసుకోవడం, సమీకరించడం చాలా కష్టమైంది. వాళ్ళను నేను, నన్ను వాళ్ళు చూసింది లేదు. అంతా ఫోను ద్వారానే. జూమ్ సమావేశం ద్వారా రిహార్సల్స్ నిర్వహించేవాడిని. వివిధ రకాల విద్యాభ్యాసాల విద్యార్థినుల వాళ్ళు కాబట్టి సమయానికి అనేక అవాంతరాలు ఉండేవి. పూర్తిగా పధ్నాలుగు మంది అటెండ్ అయిన జూమ్ మీటింగ్ ఒక్కటి కూడా లేదు. ఎన్ని అవరోధాలు వచ్చినా పట్టుదలతో ప్రశిక్షణ ఇచ్చాను. ఒక్కొక్కరికి రెండు పద్యాల చొప్పున విభిన్న రాగాలు నేర్పించాను. స్క్రిప్టు తయారుచేసి చిన్న చిన్న డైలాగ్స్ పంపించాను. ఆయా కవుల వేషధారణలు ఎట్లా ఉండాలో అవగాహన చేయించాను. వారి తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందించారు. ఇప్పటికి హైదరాబాద్ వేదికల మీద మూడు, దూరదర్శన్ లో ఒకటి మొత్తం నాలుగు ప్రదర్శనలు ఇచ్చాం. ఎస్ వి బి ఛానల్ వారి నుండి ప్రదర్శన కోసం ఆహ్వానం వచ్చింది. అనితరసాధ్యమైన ఈ కార్యక్రమ రూపకల్పన నేను సాధించిన అచీవ్ మెంట్లలో ఒకటిగా భావిస్తాను.

16ప్ర:- ఈనాడు ‘అంతర్యామి’ కాలమ్ లో అడపాదడపా మీ వ్యాసాలు చదివాము. మీరు చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు కొన్ని విన్నాం. ఆ దిశగా మీరు సాగిస్తున్న ప్రస్థానం ఎటువంటిది?

జ:–  ఈనాడు ‘అంతర్యామి’ ఒక గొప్ప అవకాశం. అంతర్యామి వ్యాసాలు చదివి నేను బాగా ప్రభావితుడనయ్యాను. ముఖ్యంగా తెలుగు భాష, పదబంధాలు, పద ప్రయోగాలు, శైలి అన్నీ తెలుస్తాయి. వ్యాసం రాయడంలో పట్టు సాధించాలంటే ‘అంతర్యామి’ చదవాలి. నాకూ రాయాలనిపించి ఒకటి రాసి పంపాను. రెండవ సారి కూడా పంపాను. ఎటువంటి స్పందన వాళ్ళ నుండి రాలేదు. ‘అంతర్యామి’ లో వరుసగా వ్యాసాలు రాస్తున్న ఒక అనుభవజ్ఞుడైన రచయిత ఫోను నెంబర్ సంపాదించి కారణం అడిగాను. అప్పుడాయన మీరు పట్టు వదలకుండా వారానికి ఒకటి, రెండు వరుసగా పంపిస్తూనే ఉండండి. అప్పుడు వాళ్లకు మీ శైలి, విషయ, భాషా పరిజ్ఞానాలు తెలుస్తాయని సలహా ఇచ్చారు. అదేవిధంగా వరుసగా పంపాను. వాళ్ల నుండి “మీ వ్యాసాలు బాగున్నాయి. త్వరలో వేస్తామ”ని సమాధానం వచ్చింది. అప్పటి నుండి ప్రతీ నెలా రెండు మూడు వ్యాసాలు వస్తున్నాయి. పదిహేనేళ్లుగా సుమారు నాలుగు వందల వ్యాసాలు వచ్చాయి. ఈ వ్యాసాలు పూర్తిగా ఆధ్యాత్మికము కాదు, పూర్తి వ్యక్తిత్వ వికాసమూ కాదు. పురాణాలు, ఇతిహాసాలను ఉదాహరణలుగా తీసుకొని నేటి సమాజానికి సమన్వయం చేస్తూ వ్యక్తిత్వవికాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి. ఇవి మానవ జీవన ప్రస్థానానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ఇందులో శీర్షిక, ప్రస్తావన, ఉపసంహారం, కొసమెరుపు అన్నీ బాగుండాలి. సంప్రదాయ బద్ధంగా, సరళంగా, సుబోధకంగా పాఠకులకు అర్థమయ్యే విధంగా ఉండడం ఈ వ్యాస ముఖ్య లక్షణం.

17ప్ర:- మీ ‘మాట కచేరీ’ పుస్తక ప్రత్యేకత ఏమిటి?

జ:– నా పరిశీలనలో చాలా చోట్ల వివిధ రంగాలలో ఉన్నవారు, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటే బాగా ఆవేదనకు గురయ్యాను. ప్రసార, ప్రచార, సినిమా రంగాల గురించి చెప్పనవసరం లేదు. భాషోచ్చారణ, మాట, శైలి, వక్తృత్వం, ప్రసంగం, కథా కథనం, నాటక సంభాషణ ఇట్లా ఒక్కొక్క సందర్భంలో మాట్లాడే విధానంలో అనేకరకాలుంటాయి. సమయం, సందర్భం కూడా చూడవలసి ఉంటుంది. ఇవన్నీ ఆలోచిస్తే మాట మీద రాయాలన్న సంకల్ప బీజం నాలో నాటుకుంది. అసలు మాట ఎట్లా పుట్టింది? ఎట్లా మాట్లాడాలి? మంత్ర రూపంగా, శ్లోక రూపంగా మాటకున్న విలువ ఏమిటి? ఇవన్నీ వివరిస్తూ ‘మాట కచేరీ’ పేరుతో పుస్తకం వేశాను. రాస్తున్నప్పుడే  దీనిని  మాట విలువను గుర్తించి ప్రతీ సందర్భంలోఅద్భుతంగా మాట్లాడే మాజీ ఉపరాష్ట్రపతి డా. వెంకయ్యనాయుడు చేత ఆవిష్కరింపజేయాలని సంకల్పం పెట్టుకున్నాను. పుస్తకం పూర్తి అయిన తరువాత వారి పిఏ తో మాట్లాడి, పుస్తకం పంపించి, నా అభ్యర్థన తెలిపాను. పంపిన మూడు రోజులకే నాకు అక్కడి నుండి మూడు రోజులలో అపాయింట్మెంట్ తేదీని ఖరారు చేస్తూ కబురు వచ్చింది. అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకడం నా అదృష్టం. అంతటి గొప్ప సహృదయులు వారు. మా ఫౌండేషన్ మెంబర్స్ ని మాత్రమే ఆవిష్కరణకు రమ్మన్నారు. పుస్తకాన్ని గురించి పది నిమిషాలు చర్చించారు. ‘చాలా బాగా రాశారు’ అన్నారు. అది నా జీవితానికొక గొప్ప ధ్రువపత్రం, ప్రమాణపత్రం. ఈ పుస్తకాన్ని ఉన్నత సంస్కారి, సహృదయులు, మితభాషి, హితభాషి, స్మిత భాషి అయిన కె. వి.రమణాచారి గారికి అంకితం ఇచ్చారు. అంకితోత్సవ సభ అక్టోబర్ 4వ తేదీన త్యాగరాయ గాన సభలో జరిగింది.

ధన్యవాదాలు సార్! మా కొరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ సంగీత, సాహిత్య,

సామాజిక సేవలను గురించి తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారం. సెలవు.

November 30, 2025 9 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

పడమటి కొండమీది రవి….ప్రగాఢ భావకవి….

by Ramesh November 30, 2025
written by Ramesh

కళ కలకాలం,జీవితం చిరు కాలమని లోకోక్తి.అవును బుద్బుదమయిన మనిషి జీవితం అద్భుతమే.నూరేళ్లకాలం దీర్ఘంగా ఆలోచిస్తే చాలా చిన్నదే.తెలిసీతెలియని బాల్యం,ఉడుకుదనంఉవ్వెగిసే చురుకుదనాలయవ్వనం,కటుంబబాధ్యతలమధ్యవయసు లిప్తగా,లీలగా దాటి చివరి మజిలీ మలివయసు అలవోకగా చేరుకోవటం పరిపాటి.భారతీయుల ఆయుర్ధాయం పెరగటంమూలంగా మలిసందెల కాలం దశదిశలా కొత్త వెలుగుల్ని విరజిమ్మటం ఒక అభివృద్ధికారకం,ఆనందదాయకమూ..శేషప్ప గారన్నట్టు
“అతివిద్యనేర్చుట అన్నవస్త్రములకే/పసులనార్జించుట పాలకొరకే/సతినిబెండ్లాడుట సంసారసుఖముకొరకే/
సుతులబోషించుట గతులకొరకె/సైన్యము నేర్చుటలెల్ల శత్రుజయమునకే/సాము నేర్చుట చావు కొరకే/దానమిచ్చుట ముందటి సంచితమునకే”.చదువు సందెల తర్వాత మనిషి లక్ష్యం ఉద్యోగపర్వమే.మానవఉద్యోగ ప్రస్థానంలోఉద్యోగంలోనియామకం ,సమర్థవంతమయిన, సంతృప్తికర పనితీరు,ప్రశంసలు పదోన్నుతుల,అవార్డుల గౌరవానందాల అనంతరం చివరికి మిగిలేది ఉద్యోగ విరమణ.ఇంతకాలం వివిధ స్థాయిల్లో సంతృప్తిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందటం ఒక యోగం.ఈ కంప్యూటర్ యుగపు అర్జంట్ ఋతువుల పనిఒత్తిళ్లను అధిగమించి ఉద్యోగాల్లో అన్నీ సవ్యంగా జరిగి ఏ మచ్చా లేకుండా , ఉన్నతాధికారులు,తోటి ఉద్యోగుల మనసుల్లో ముత్యమంత స్థానం సంపాదించుకుని ఉద్యోగ విరమణ పొందటం ఉద్యోగికి దక్కిన గొప్ప విజయమే.మా మాడిశ్శెట్టి శ్రీనివాస్ సార్ ఆ కోవకే చెందుతాడు.మాడిశ్శెట్టి శ్రీనివాస్ గారు ప్రజలందరినీ అవసరాలకు గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి లో కడెంక్టర్ ఉద్యోగంతో మొదలై సూపరింటెండెంట్ స్థాయిలో హాయిగా,ఆనందంగా తన విధులను అంకితభావంతో సమర్థవంతంగా, సమన్వయకర్తగా పూర్తి చేసి ఆర్టీసిని ప్రగతి పథంలో నడిచేట్టు ముప్పై ఆరేళ్లుగాకృషిచేసిన కృషీవలుడు,ఖుషీవలుడు మా శ్రీనివాసుడు.కానేకావని గొతెంత్తిన సమస్యల చేతనే ఔనననిపించాడు. ‘ఔరా’ అనిపించాడు.ఎంతటి కఠిన సమస్యనైనా విచక్షణతో,విలక్షణంగా క్షణాల్లో పరిష్కరించి,ప్రగతిరథచక్రాలనుపరుగులుపెట్టించాడు.తన తోటి ఉద్యోగుల పట్ల కరుణ,ప్రేమ, ఆత్మీయతను కురిపించి ముందుకునడిపించాడు. సార్ కు దేవుడు,దేహం,దేశం,ఉద్యోగం మీద భక్తి ఉంది.అక్షరం,అందం,అనుబంధం,స్నేహం మీద అచంచల విశ్వాసం, అమితమయిన అనురక్తి ఉన్నాయి.ఆజానుబాహుడు,ఆకసం సాహితీ పెద్దలు,కవిమిత్రుల,కవయిత్రుల ప్రేమాభిమానాలు పొందిన మహానుభావుడు.శ్రీనివాస్ సార్ కి చిరునవ్వే తరగని ఆభరణం.మాడిశెట్టి గారి మనసు మల్లెపూవు వంటిది.వారి పరిచయం పారిజాతపూలపరిమళం.ఒక అద్భుతం. ఒక అదృష్టం .వారి స్నేహంపొందటం ఎవరికైనా పూర్వజన్మ పుణ్యమే,అద్భత వరమే. సమకాలీన ప్రపంచంలోకవిత్వం విద్యాశాఖదే సింహభాగం.ఉపాధ్యాయులు,ఆచార్యులు ఎక్కువగా రాస్తుండటం చూడవచ్చు. కవిత్వాన్నిఅనేక రంగాల,వృత్తులవారు,అనేక వర్గాల వారు రాస్తున్నారు.రాయటం సమాజానికి జీవజలం లాంటింది.అత్యవసరం.ఆనందదాయకం.కవిత్వం సర్వాంతర్యామి .సమకాలీన ప్రపంచంలో కవిత్వానికి విద్యాశాఖ ఆధిపత్యం అధికమని ఘంటాపథంగా చెప్పవచ్చు .ఉపాధ్యాయులు,ఆచార్యులు,ఎక్కువగా గొప్పగాకవిగడ్తున్నారు.అందుకు భిన్నంగాతెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ లో పనిచేస్తూ కవిత్వం రాయడం అరుదైన విషయమే.అందులో అద్భుతంగా కవిత్వం వ్రాస్తున్న కవి శ్రీనివాస్ సార్.”లక్షాధికారైనా లవణమన్నమే…” వంటి అద్భతపద్యాల నరసింహశతక కర్త శేషప్పమహాకవి నడయాడిన ధర్మపురి లో పుట్టి కలమెత్తిన మా మాడిశెట్టి అక్షరాధికారైనా భావకవనమే మిన్నా అంటూ ఊటంకించే గొప్ప భావకవి. “గుండెల్లో గోదారి” “నువ్వు నేను గోదారి” రెండుసంపుటాలు వెలువరించాక నువ్వైనా నేనైనా మాడిశెట్టిని ‘గోదారి కవి’ అనటం సబబు.ఏ కవిత రాసినా తను అమితంగా ఆరాధించే ‘గోదారి’ ఉండాల్సిందే.తెల్లని ఠావుల్లో గుండెలోతు భావాలను పాళీపావుల్లో గోదారంత విశాల తత్వాన్ని,గోదారంతా లోతైన భావాన్ని చదువరుల గుండెల్లో లలితమైనఅలతి పదాల్లో నాటటంలో సిద్ధహస్తులు.వారి అంతర్మధనం వేరు,వారి భావజాలం వేరు.వారికి పదాల లాలింపు ,భావాల గుబాళింపు తెలిసి,జీవితం తాలూకు సత్యాలను కాగితాల్లో వాక్యాలు వాక్యాలుగాపేర్చేమహానేర్పరిమామాడిశ్శెట్టి.వారిది విరహవేదన ,సందేహనివేదన,ఆశాభావం,గుప్పెడుమనసు పై సాధికారత సాధించిన భావుకత.వారిది తేటతెనుగుపదాల భాషాభిషేకం.వారి కన్నుల్లోప్రేమే!,వారి పెన్నుల్లో ప్రేమే!! నిండివుందనుకుంటా.నిజానికి మనుషుల పట్ల మరీ ముఖ్యంగా పూలవంటిమగువల పట్ల వారు చేస్తున్నది నిరంతరఅక్షరాభిషేకం,ప్రేమాభిషేకమే.”ప్రాణం లేని దేహం” కవితలో నువ్వు లేని నేను/ వెన్నెల లేని ఆకాశమే/ప్రవహించని గోదారే/ ప్రాణం లేని దేహమే అనడటం మా మాశ్రీ ( మాడిశెట్టి శ్రీనివాస్ సార్) కే చెల్లింది..”నా గుండెల్లో/ పవిత్రంగా దాచుకున్న/పాదముద్రలే నీవైనప్పుడు/ నువ్వెంకడుంటే నాకేం” అనడంలో ఎంతబాగుంది యండమూరి గారన్నట్టు గోదారంత భావుకత కదా ఇది .ఏ ఏ కవితలోనైనా తన ప్రేయసి,ప్రేమ,విరహం,ఎడబాటు,గోదారి వాటి తాలూకు గాఢమైన అభివ్యక్తి ఉండాల్సిందే.”ఓయాసిస్సు” కవితలో…నాలో ప్రణవమై/నాలో నాదమై/నే రాసిన పదమై/…ఇలా ఏది రాసినా గుండెల్లో నాదమై మోగేది.”నువ్వు” మరో కవితలో ఇలా శీనయ్య శెలవిస్తాడు” ను వెళ్ళాక/కళ్ళలో గోదారి తడి/మనసంతా అలజడి/ఇదేనేమో నీ గారడి” నిజంగా శ్రీనివాస్ సార్ అక్షరాలతో భావ కవిత్వపు గారడి చేశారు.”నువ్వునేను గోదారి” కవితా సంపుటి చదివాక ప్రముఖ సినీదర్శకులు వంశీ గారు ‘నిన్నటి రాత్రి వెండి వెన్నెల జ్ఞాపకమైపోయింద’ని ముందుమాటగా తన ఎదలోని మాటల్నిమనతో పంచుకోవడం గొప్ప విషయం .మాడిశెట్టిప్రవేశించాక భావకవిత్వపు వెండివెలుగులు ఆకసమంతా నిండాయి.ఆకులో ఆకు,కొమ్మలో కొమ్మాగా మాతో మసలిండు .మేమంతా ఈ ‘గోదారికవి’ కవితల్లో తడిసి ముద్దవుతున్నమనుటలో ఆవగింజంతైనా అతిశయోక్తి కానరాదు.అజంతాభాషకు అజంతా శిల్పంలా మలిచేవారి భావకవిత్వానికి,వారి వ్యక్తిత్వానికి మా అవధాని బ్రహ్మశ్రీ మాడుగుల నారాయణమూర్తి
సార్ తో బాటు మా అందరిహృదయాలు ఫిదా అయ్యాయనుట నూటికి నూరుపాళ్లు సత్యవాక్కే. “అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను/మృగజాతికెవ్వడుమేతబెట్టె/వనచరాదులకు భోజనమెవ్వడిపించె/…
మా మాడిశెట్టికి ఈ మంచి గుణము,మంచికవనము ఎవ్వడిచ్చెనో??… ఆశ్చర్యమే.
అన్నమయ్య ఆ వేంకటేశ్వరుణ్ణి కీర్తించే పాట వీడలేదు. ఈ శ్రీనివాసుడు ప్రేమను,ప్రేయసిని “గోదారి” పాటను,ఎడ’బాట’ను ఎనాడూవీడలేదు.ఎన్ని కవితలు ఎన్నికవిసమాయాలు, ఎన్నిసాహిత్య సమయాలు ఎలుగెత్తి వినిపించి,ఆకసంలో తుఫాన్ సృష్టించి మా ఎదల్లో పొంగించి మా నయనాలలో గోదారిని ప్రవహింపచేసి స్ఫూర్తినింపాడో నా మాటలకందదు. సార్ ఎంత అద్భుతంగా కైతకడ్తాడో, నగలో స్వర్ణకారుడు రత్నాలను పొదిగినట్టు ఆ పదాలు,వాటితాలూకూభావాలురాతల్లోబుద్ధిగాబుజ్జాయిలాఒదిగిపోతాయి.ఉత్తరాయణంలా,దక్షిణాయణంలాఇదిశ్రీనివాసాయణం.అలా రాయటం అద్భుతం.అసాధ్యం.మామూలు మనిషిలా కనిపిస్తాడు కానీ….

మహాగట్టివాడు మా మాడిశెట్టి !

మా శ్రీనివాసుడు
గోదారి గొప్ప ప్రేమికుడు
మా స్త్రీనివాసుడు
ఆమె బాధకుడు
ఆమె ఆరాధకుడు
మా శ్రీనివాసుడు
నలుపు రంగంటే పడిచస్తాడు
స్నేహమంటే ప్రాణమిస్తాడు
మా శ్రీనివాసుడు
కరుణారుణజీరల కన్నులవాడు
తరుణీ తరుణభావాలు ఉన్నవాడు
మా శ్రీనివాసుడు
నిండైన విగ్రహంవాడు
నీటైన ‘టక్కు’గలవాడు
కదలనీదు ఆయన మమతలబంధం
వదలనీదు ఆతని కవితలభావం
మా శ్రీనివాసుడు
తోలుతున్నది స్కూటీ
అందరిని కలిపి చేస్తాడు ఒక్క’టీ’
మా శ్రీనివాసుడు
కాల్ చేస్తాడు
కాలాన్ని కాఫీతో కబుర్లుచేస్తాడు
మా శ్రీవాసుడు
అహంలో సున్నవాడు
మంచిమనసున్నవాడు
అతనిసుగుణాలు చెప్పలేం ఇన్నని
ధర్మపురి ధన్యురాలైంది ఆయణ్ణి కని.

మా శ్రీనివాసుడు
వచనకవితల తృష్ణశాస్త్రిలా చూస్తాడు
కృష్ణ శాస్త్రి లా రాస్తాడు
అందాల హాసుడు
భావకవితా దాసుడు
మాడిశెట్టిమనసువెట్టి రాశాడంటే
కవితల్లో పడిపోవాల్సిందే
గుండెల్లో గోదారి సుడిరేగాల్సిందే
మాకు రాదు రాదు ఆ రాసుడు
అలపదాల,ఎలభావాల అలవోక ఆ మోసుడు
గోదారి ప్రవాహమల్లే ఆగనిది ఆతని కలం
ఆయన కవితలకు మేమంతా
మంత్రముగ్దులం,మహా ప్రేమికులం

మా శ్రీవాసుడు
ఇపుడు ‘మా’ శ్రీ నివాసుడు
అందాల, ఆత్మీయబంధాల
ఆసిఫాబాదు నివాసుడు
మాతో మసలటం మా అదృష్టంగా భావిస్తున్నాను
మా ఆకసానికి ఆకాశమంత ఇష్టమని ఊహిస్తున్నాను
ఆయన అలుపెరుగని కవితయానం
శరత్కాలపు అడవిగుండెల ఆకుపచ్చనిఅందాల గుండా
ఆర్టీసి బస్సు ప్రయాణంలా ముందుకు సాగాలి.
విరహం,ఎడబాటు,దూరం
ఆమె,అమ్మ,ఆలి,కాళి
ఏదైతేనేం పదభావం అంశమూ,వస్తువూ
గురి తప్పక చేరుతుంది
గోదారితీరాన్ని….మా గుండెల్ని

భావాలు గోదారంత లోతైన
మరెన్నో కమ్మని భావకవితలల్లి
ఎల్లకాలం
గోదారి పొంగుల్లోమమ్ములను ముంచెత్తాలి.

ఎన్ని సాయంకాలాలు వారితో కలిసి చాయ్ తాగానో,ఎన్ని సాహితీసంగతులువారునాతోపంచుకున్నారు.కోపతాపాలు పొడసూపనిహృదయాలలోప్రేమా,ఆత్మీయతానురాగాలే పల్లవించాయి.ఎన్ని సార్లు సాయంత్రాలు మా నడకల్లో తేలికగా రాత్రులుగా వీడ్కోలు పలుకాయో.వారితో నేను,బాబాయ్ గుర్రాలవారు, మధుకరన్నా,సత్యం సార్ రాధాకృష్ణచారిబావతో సాయంత్రాలు మంచులా కరిగాయి.మంచినే చెరిగాయి.
నిజం చెప్పాలంటే వాసుగారితో మేము…..

మళ్లీ మనుషులమవుతున్నం!

బరువు బాధ్యతలు దించుకున్నాక
ఇంటిపనులు కొన్ని ముగించుకున్నాక
ఈ వానాకాలం
చల్లనిగాలుల దర్బారు ఆషాఢంలో
నల్లని మబ్బుల బారుల ఆకాశంలో
పొద్దువాలే వేళ ప్రేమల పొద్దొకటి పొడుస్తది
అలుపుసొలుపులు దూరభారాలు మరచి
మూడుబాటలు కల్సుకుంటయి
ముగ్గురు కలిశాక నవ్వులు
నందివర్ధనపువ్వులుగా‌‌ విచ్చుకుంటయి
గుండెలోని బాధలకు శెలవిచ్చాక
గాయాల గాధలకు మరుపిచ్చాక
మాటలు అలలయి అందంగా పొంగుతాయి
మనసులు ఆనందం పొందుతాయి
కవితల మమతలు ఎలుగు అలుగుపారినంక
చల్లని వాతావరణ సాయంసమయాన
కమ్మని కాశ్మీరీ చాయ్ లా లేదా
మరిగిన మశాలా చాయ్ లా వేడిపొగలు విడుస్తది
ముగ్గురూ కలిసి ఏం చేస్తరు?
ముగ్గురూ కలిసి ఒక్కరవుతరు
ఒక్కరు ముగ్గురవుతరు
మోహం మోసం
దేహం దేశం
మొదలగు సంగతులు మా మతులు
లోకం శోకం అటూ ఇటూ
ఆ రెంటి నడిమధ్య కాలిబాట మీద
మానవత్వాన్ని కోరుకుంటూ
గతాన్ని తవ్వుకుంటు నవ్వుకుంటూ
మతాన్ని నములుకుంటు నడుచుకుంటూ
సాగుతున్న బాటసారులం
మౌనాన్ని తరుముతున్న మాటకారులం
ఇదేనేమో కవుల సంయోగం
బహుశా ఇదేనేమో స్నేహరాగం
మంచులా కరుగుతుంది కాలం
మంచినే చెరుగుతుంది హృదయం
ఈ గాలి ఈ నేల సాక్షిగా
కవితల మవుతున్నం
మమతల మవుతున్నం
మళ్లీ మేం మనుషులమవుతున్నం
ఇంతకంటే ఏమి కోరుకుంటది ఈ జీవితం!.

మనిషికి మరణం ఉద్యోగికి ఉద్యోగ విరమణంఈ భూమ్మీద రాసిపెట్టి ఉంటాయనేది మనకు తెలియందేంకాకపోవచ్చు.కానీ ( మాడిశెట్టి గారి లాంటి) కొన్ని ఎడబాటు మనసును వీసమంత విస్థాపనంగావిస్తాయి.అద్వైత ఎదలలో బాధలు అనునాదమై మోగుతాయి. ఇంత ఆరోగ్యంగా,ఇంత ఆనందంగా ఉన్నా శ్రీనివాస్ సార్ ని చూస్తే ఎవరికైనా ‘ఉద్యోగ విరమణ’ అంటే హాస్యమనుకుంటారు. నమ్మవశం కాదంటారు.ఇంతలోనే శ్రీనివాస్ సార్ ఉద్యోగ విరమణ పొందటం,మనల్ని ఆసిఫాబాద్ ని విడిచి ధర్మపురి కి వెళ్లడమూ మనకు ఏ మాత్రం సమ్మతం కాదు.కానీ ఇది అనివార్యం. కాల శాసనాన్ని మనం అంగీకరించాల్సిందే.నాకో సందేహం మంచితనంమంతా మన పూర్వికులు ధర్మపురి వద్దే దాచి ,దారి మరచి ఇటు దయచేసారా?. మనిషి మనిషికీ మంచితనాన్ని ధర్మపురి వాసులు(శ్రీ నివాస్ సార్ )మనసు నుండి పంచుతూవుంటేను.
బ్రహ్మంగారికి కాలజ్ఞానం తెలిసినట్లు, శ్రీనివాస్ సార్ కి కవిత్వం ఆకట్టుకునేలా’రాసే జ్ఞానం’ తెలుసనుకుంటా.కవిత్వం తీరని దాహంలాగే మా శ్రీనివాస్ సార్ నిర్మల స్నేహం కూడాను..అదిమాడిశెట్టి వంశం మంచితనపుమోహమేబహుశా..రాబోయేకాలంలో జైనూర్ జంగిల్ గుండానోఈ తిర్యణి అడవుల అందాలగుండానో ధర్మపురి కి ఒక దగ్గర దారి కనుగొనాలి,మగవాళ్లకే స్పెషల్ బస్సును ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆశిద్దాం.( ఆశించటం నేరం కాదు కదా)GST తగ్గినట్టుదూర భారాలు, స్నేహవిరహాలు తగ్గాలి.అదిగో ఆకసంలోసూరీడు ఎండలుకాచి కాచి పడమటి దిశకు విసిగిపోతున్నవేళ ఇది.మాడిశెట్టి గారి పదవీ విరమణకు వానకాలం, మేఘ విస్ఫోటనాల వానకాలమయి అవసానదశలోసెప్టెంబర్ చివరిరోజుఆకాశం నుంచి వర్షం కుండపోతలై కురుస్తూ గ్రామగ్రామాన గోదారై పొంగుతోంది .మా శ్రీనివాసుడు ఆర్టీసిలో సూపరింటెండెంట్ ఉద్యోగం దిగిపోతున్న శుభతరుణమిది.శేషప్పకవి శెలవిచ్చినట్టు”విద్యనేర్చినంతు విర్రవీగగ లేదు/భాగ్యవంతుడంచు బలకగలేదు…..మా శీనయ్య లాంటి ఇంతమంచి పుత్రరత్నాన్ని కన్నందుకు వారి తల్లిదండ్రులకు అనేక వందనాలు.శ్రీనివాస్ సార్ తో నా స్నేహ ప్రయాణానికి రెండు వసంతాలే అయినా చిరకాలం నిలిచి వుండేలా సాగింది.హృదయం ఆనంద పద్మమయి వికసించి అనురాగం వినిపించింది.మనసు అద్దం మీద మంచితనం పరావర్తనమైన మీ స్నేహాన్ని నేను మరిచిపోలేను జీవితాంతం.మా స్నేహం త్వమేవాహం.సార్ గోదారితో ధర్మపురి లో ఉన్నా ఆకసం కోసం ఆసిఫాబాద్ కు వస్తాడని( ఏ వాహనాల రాకపోకలులేనీ కేవలం ఆర్టీసీ బస్సు మాత్రమే ఆధారమయిన గ్రామాల) గ్రామస్తులు ఎర్రబస్సు కోసం ఎదురుచూస్తున్నట్టు సార్ రాక కోసం నేను ఎదురు చూస్తుంటాను.

శ్రీనివాస్ సార్,నాగమణి దంపతులు ఉద్యోగ విరమణ అనంతరంవారిపిల్లాపాపలు,మనవలు,మనవరాళ్లతో ,గోదారితో భావకవిత్వంతోఆయురారోగ్యాలతో ఆనందంగా భావిజీవితం మేలిమిబంగారంగా వెలగాలని అభిలషిస్తూ ,
మాడిశెట్టి శ్రీనివాస్ సార్ కి హృదయపూర్వక ఉద్యోగ విరమణ శుభాభినందనలు.

November 30, 2025 15 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అస్తమించని ఓ ఊరిదుఃఖం ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’

by N Lahari November 30, 2025
written by N Lahari

” మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె ” ఓ పల్లె కథల దృశ్యచిత్రం. మనిషి మనిషి అంతర్నినాదం.
ప్రతి ఊరు తనకంటూ ఒక చరిత్ర కలిగి ఉంటుంది. కానీ, మంగలిపల్లె చరిత్ర మాత్రం బతుకు కూకటివేళ్లలో దాగిన ఓ దుఃఖగాధను ప్రతిబింబిస్తుంది. బొగ్గు బాయిల కడలి కడుపు నుంచి ఉద్భవించిన ఆ ఊరు, ఇప్పుడు జ్ఞాపకాలలో మాత్రమే మిగిలివుంది. ‘ఊరంటే మనుగడ.. ఓ మమకారం’ అని చాటిచెప్పే కథకుడు నరేష్కుమార్ సూఫీ. ఈ పుస్తకంలో ఆ మనుగడ అంతరిస్తున్న తీరును ధ్వనిపూర్వకంగా ప్రస్తావించాడు. అతని అక్షరాక్షరంలో ఆ మట్టివాసన ఇంకా పరిమళిస్తూనే ఉంది.

“మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె” ను చదువుతుంటే అది ఓ కథల సంకలనంగా అనిపించదు. ఒక మట్టిచరిత్ర జీవన గ్రంథంగా అనిపిస్తుంది.
‘ఓపెన్ కాస్ట్ మైనింగ్’ అనే ‘ఆధునిక నాగరికత బుల్డోజర్‌’ పల్లె ఊపిరిని ఎలా పిండి, పీల్చి, పిప్పి చేస్తుందో తెలియజేసే ఓ కథాకథనం. ఆ ధూళి కణాల్లో విలవిల్లాడుతూ కొట్టుమిట్టాడుతున్న జీవుల బతుకుల్ని అక్షరాలధ్వనితో సూఫీ కళ్లకు కట్టిస్తాడు.
ప్రతి కథ వెనక ఒక ముఖం దాగి ఉంటుంది. రాయమల్లు, రాజేశం, ఎంకటేశం, సమక్క చెట్టు, బొగ్గు బాయి… కేవలం ఒక గ్రామమే కాదు. ఒక భావనాత్మక ప్రకృతి దృశ్యచిత్రం. వాళ్ళు బతికిన ఊరు కూలిపోయింది కానీ, ఆ విషాథకథలు మాత్రం ‘మెమొరీస్’ రూపంలో సజీవంగా నిలిచిపోయాయి.

ఈ పుస్తకంలో వాడిన భాషకు ఒక ప్రత్యేకత ఉంది. అది పల్లెభాష. ఓ గ్రామీణ పిలుపు. ఖండ్రిక సాంస్కృతిక నేపథ్య బాధ. చదువుతుంటే అక్షరాలు కాదు, మనసే మనిషిలోకి తొంగిచూసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది.

అలా చదివిన ప్రతి పేజీలోనూ ఓ ‘మంగలిపల్లె’ మెదులుతుంది. మన ఊరు, జ్ఞాపకాలు, భూమి.. ఏదీ కాలానికి అతీతం కాదనిపిస్తుంది.
సూఫీ కలంలో బొగ్గుధూళిని కాదు, మనుషుల చెమటను ప్రేమస్పర్శతో నింపుకున్నాడు. పీల్చుకొని బతుకుతున్నాడు. ఆ వాక్యాల్లో తొంగి చూసే కంటతడి ఉద్వేగంతో మౌనంగా బాధిస్తాయి. అదే సమయంలో మనసును తడిమనసుతో ఆరబెడుతుంది. మృదువైన తాకిడితో స్పృశిస్తుంది. ఎందుకంటే అవి సత్యదూరానికి చేరువగా నిలుస్తాయి.

ఈ “మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె” చదవడం పూర్తయ్యాక చివరికి అది మనలో ఓ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ ఊరు నాశనం మన అభివృద్ధికి ధ్రువపత్రమా? లేక అమానుషత్వానికి మరణ శాసనమా? అని అనిపించక మాత్రం మానదు.

November 30, 2025 13 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

‘గాయపడిన గుండె’ కు కవితా ఉపశమనం.

by N Lahari November 30, 2025
written by N Lahari

మానవాళిని పీడిస్తున్న ప్రమాదకరమైన జబ్బులలో ప్రధానమైనది క్యాన్సర్. మారిన ఆధునిక జీవన శైలుల వల్ల క్యాన్సర్ అధికంగా వచ్చే అవకాశాలు వున్నాయని నిపుణులు చెపుతున్నారు. పూర్వకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. వైద్య సదుపాయాలూ తక్కువే. కానీ నేడు అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో క్యాన్సర్ చికిత్స సులభతరమౌతోంది. అయినా క్యాన్సర్ అని నిర్థారణ అయితే ఇక జీవితం ముగిసిపోయినట్టేననే భావనలో చాలా మంది క్యాన్సర్ బాధితులు వున్నారు. అవగాహనా లేమి వల్లా, కుటుంబ సభ్యుల అనాదరణ వల్ల కూడా ఈ పరిస్థితి వస్తోంది.
ఈ పరిస్థితి నివారించడానికి, క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఒక పక్క మెరుగైన వైద్యం అందిస్తూనే, మరోపక్క క్యాన్సర్ బాధితులకు మానసికఅండగా, ధైర్యంగా వుండడానికి సాంత్వన వచనాలు, ఆత్మీయ స్పర్శ, బంధుమిత్రుల సహకార సాంగత్యం చాలా అవసరం.

క్యాన్సర్ అనేది కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ఇవి నియంత్రణ లేకుండా విభజన చెంది, కణితిలాగ పెరిగి, శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తాయి. వీటిలో కొన్ని సాధారణమైనవి. మరికొన్ని ప్రాణాంతకమైనవి. వీటిని ప్రాధమిక దశలోనే గుర్తించి, సరైన వైద్య చికిత్స అందించకపోతే, మనిషి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లవచ్చు. మారుతున్న ఆధునిక జీవన విధానాలు, అసమతుల్య పర్యావరణం, ప్రమాదకర రసాయనాలు, అనారోగ్యకర ఫైబర్ లేని జంక్ & ఫాస్ట్ ఫుడ్ ఆహారపు అలవాట్లు, జన్యు సమస్యలు మొదలైన అనేక కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఈ రోజుల్లో మెండుగా వుంది. అందులోనూ ప్రత్యేకంగా మన దేశంలో స్త్రీలకు వచ్చే రొమ్ము క్యాన్సర్ కేసులే ఎక్కువ.

అయితే క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కల్పించి, బాధితుల్లో ధైర్యం కల్పించిన రచనలు వచన రూపంలో ఎన్నో వచ్చి వుండవచ్చు. ఇటీవల సమ్మెట విజయగారు‘ ఆశే శ్వాసగా’ అనే పుస్తకంలో (ఫిబ్రవరి,2025) 21 మంది క్యాన్సర్ బాధితుల విజయగాధలను నమోదు చేసింది. కానీ, ప్రత్యేకించి రొమ్ము క్యాన్సర్ వస్తువుగా ఒక దీర్ఘకవితను ‘Monologue of a వూండెడ్ హార్ట్ ‘ (అక్టోబర్,2013) వెలువరించడం ఇదే ప్రధమం. ఇటువంటి పుస్తకాల లక్ష్యం బాధితులకు అండగా నిలబడి, ఆత్మస్థైర్యం ప్రోది చేసే సాంత్వన వాక్యాలు పలికి, వారిని ఆ జబ్బు నుండి బయట పడేయడమే..! ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఆధునిక పరికరాలు వున్నా, మనసుకు హాయి నిచ్చే ఒక మంచిమాట జబ్బు నివారణలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఆ రకంగా చూస్తే ఇటువంటి పుస్తకం క్యాన్సర్ నిరోధకతలో ఇతోధిక పాత్ర నిర్వహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులోనూ ఈ పుస్తక కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారు ఒక నిర్దేశిత లక్ష్యంతో ఈ పుస్తక రచనకు పూనుకున్నారు. ఒక ప్రణాళికాబద్ద రచనను తన మనసులో ప్రణాళిక వేసుకున్నారు. తన చుట్టూ వున్న తన బంధుమిత్రుల అనుభవాలను (సహానుభూతి) తనవిగా (స్వయం అనుభూతి) చేసుకొని, ఆ స్తనాతీత తీవ్ర అనుభూతిలోకి పరకాయప్రవేశం చేసి ఈ కవిత్వం రాసారా అనిపిస్తుంది.

ముందుగా ఈ వస్తువు (Subject) ను దీర్ఘకవితగా ఎన్నుకోవడంలోనే మెలకువ ప్రదర్శించారు కవయిత్రి శ్రీలక్ష్మి గారు. క్యాన్సర్ లోని వివిధ దశలను చెప్పడానికి విడివిడి కవితల కంటే ఎక్కడా బిగి సడలని కవితా భావధార అవసరం. అందుకే ఈ దీర్ఘకవితను ప్రోలోగ్, ఇంట్రో, స్టేజ్- 1, స్టేజ్- 2,
స్టేజ్ -3, ఇన్ ది వార్డ్, ప్లాష్ బ్యాక్, ఫ్లాష్ ప్రెజెంట్, ఇన్ ద థియేటర్, పింక్ హోప్ విభాగాలుగా విభజించి, ఒక్కొక్క విభాగంలో దశల వారీగా ఒక క్యాన్సర్ బాధిత స్థితిని వివరించే ప్రయత్నం చేసారు.

ప్రోలోగ్ (నాంది)లో ‘ ఇప్పటిదాకా మనం/ దేహం గురించి/ చర్చోపచర్చలు చేసాం./ ఇప్పుడు-/ దాని ఆదిమ / కణం గురించి డిసెక్షన్ చేద్దాం.’ అనడం ద్వారా ‘కణం’ గురించి మనం చర్చించబోతున్నాం అని తెలుస్తుంది. తర్వాత ఇంట్రో (పరిచయం) లో ‘అణు విస్ఫోటనం తెల్సు / కానీ – / కణ విస్ఫోటనం మాత్రం / కొత్తదే కదా’ అని మెల్లగా మనకు కణ విస్ఫోటనం వల్ల క్యాన్సర్ వస్తుందని చెపుతూ ‘ మహా సంక్షోభానికి…/ ఒక్క కణం కన్నెర్ర చాలు’ అని అసలు కారణాన్ని ముక్తాయించారు.

స్టేజ్ -1 లో ప్రతి ఇంట్లో సాధారణ గృహిణి దినచర్యను తనకు ఆపాదించుకొని..
‘ నేను మంచం పైనుంచి లేచినపుడే నా ఇంటికి వేకువ వస్తుంది’ అన్నప్పుడు ‘ A house remain in silence, Until the Mother wakes up’ అనే వాక్యం చాటాలున గుర్తుకు వస్తుంది. ఇంటి పనులు చేసుకుంటున్నప్పుడు దేహంలో, అందులోనూ గుండెల మీద గూడు కట్టుకుంటున్న ఈ కణితి నొప్పిని అడుగడుగునా భరిస్తూ, గుర్తిస్తూ వుంటుంది. తనలో రేగుతున్న బాధను డాక్టర్ ముందు వెల్లడించడానికి
భయవిహ్వలయై, చివరికి ఉద్విగ్నవిహ్వలగా మెటామార్ఫసిస్ చెందుతుంది. అంటే తనలో ఒక కణం కన్నెర్ర చేసిందన్న విషయం గ్రహించి, దాని చికిత్స కోసం మానసిక విచికిత్స పడుతుంది. ఇక్కడ కవయిత్రి స్తనద్వయం భార్యాభర్తల బాంధవ్యంలో నెరిపే పాత్రను శషబిషలు లేకుండా పరిధుల మేరకు వర్ణించడం గొప్పగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రస్తావనలు తెలుగు సాహిత్యంలో ( ప్రబంధ కవులను మినహాయిస్తే) తక్కువగా వచ్చాయి.

స్టేజ్ -2 లో తన కుటుంబంలో వచ్చిన అనారోగ్యాలకు తాను ఎలా తల్లడిల్లిపోయిందో, ఎంతగా తనవారి కోసం తాపత్రయపడిందో చెపుతూ సగటు గృహిణిలా తన ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి తనకు ఏమీ కాదనే ధీమాతో I’m Rock Study కదా అనే భ్రమలో వుంటుంది. ఎంత పాజిటివ్ థింకింగ్ లో వున్నా కూడా తన జబ్బు నెగెటివ్ రావాలని కోరుకుంటుంది.

స్టేజ్ -3 లో డాక్టర్ తనకి క్యాన్సర్ అని నిర్థారిస్తూ చెప్పినప్పుడు తన మానసిక భయాందోళన స్థితిని ఇందులో వర్ణిస్తుంది. ‘ కళ్ళ ముందున్న రంగులకల / ముక్కలవుతుంది./ కన్నీళ్ళ మధ్య రేపటి దృశ్యం/ మసక బారిపోతుంది.’ అని బెంబేలెత్తుతుంది. అంతేగాక తన కుటుంబసభ్యులు ఏమైపోతారా అనే బెంగ తీవ్రతరం దాల్చి కుంగిపోతుంది. ఇక్కడ ఒక స్త్రీకి జబ్బు చేస్తే, కుటుంబానికంతటికీ జబ్బు చేసినట్టే అని, అంతగా కుటుంబం ఆ స్త్రీ మీద ఆధారపడి వుంటుందని, సాధారణ కుటుంబాలలో వాస్తవ పరిస్థితిని అన్యాపదేశంగా కళ్ళకు కట్టారు.

ఇన్ ది వార్డ్ లో ఆసుపత్రి ప్రాంగణంలో వరండాలలో గదులలో ఒక క్యాన్సర్ బాధిత ఆలోచనలను, ఆ కొత్త పరిసరాలను అలవాటు చేసుకోవడాన్ని, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడాన్ని చిత్రించింది. కవయిత్రి నిజంగా తానే ఆ స్థితిని అనుభవిస్తున్నట్టు కవితను దృశ్యమానం చేయడం ఇందులో కనిపిస్తుంది. కవి సూక్ష్మదృష్టిని కూడా ఈ వ్యక్తీకరణ పట్టిస్తుంది. ‘కొంగుచాటు చంద్రుళ్ళు చేసే అలజడులు’ వినడం చెవులున్న మనసుకే సాధ్యం.

ఫ్లాష్‌బ్యాక్ విభాగం చాలా సున్నితంగా చెప్పుకొచ్చిన విభాగం. ఎక్కడైతే తనకు క్యాన్సర్ పొడచూపిందో అదే రొమ్ముల గురించి గతంలోకి ప్రయాణించి నెమరు వేసుకోవడం ఈ విభాగంలో కనిపిస్తుంది. తన స్త్రీత్వానికి అస్తిత్వానికి అవి గుర్తులని చెపుతూ, గుండెలపై నిండు చంద్రుళ్ళు, ఆత్మగౌరవ ప్రతీకలు, పూర్ణ కలశాలు, హృదయ సౌందర్య బింబాలు, అమృత భాండాలు, జీవ ధార పాలవెల్లువలు అంటూ ఆ స్తనద్వయాలు తన జీవిత వివిధ దశల గురించి తలపోస్తుంది. చివరిగా ఈ వ్యక్తీకరణలు ‘ నా గుండె వైకుంఠానికి / ఇరువైపులా- / రక్షణగా నిలుచున్న / జయవిజయులు కదా..!’ అనే ఒక అద్భుత వ్యక్తీకరణతో ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది. ఇంతవరకు స్తనద్వయాన్ని వర్ణించడం ఎలా అనే ఆత్మన్యూనత నుండి అవి తన ఆత్మగౌరవ ప్రతీకలు అని కవయిత్రి నిస్సంకోచంగా ప్రకటించడం కూడా కవులు/ కవయిత్రులకు ఒకింత ఊతమిచ్చేదే. ఈ రకంగా ఆ విషయం పట్ల చదువరుల దృష్టికోణం మార్చడం కూడా కవయిత్రి సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఇంతకు ముందు తెలుగు సాహిత్యంలో జరగలేదు.

ఫ్లాష్ ప్రెజెంట్ లో క్యాన్సర్ బాధితురాలిగా ఎన్ని చికిత్సామార్గాలు వున్నాయి..లేబొరేటరీ లో ఎలా తానొక గినియా పిగ్ లాగ పరీక్షలకు గురయింది రాసారు.

ఇన్ ది థియేటర్ లో ఆపరేషన్ థియేటర్‌ని ఒక బోధివృక్షంలా తలుస్తూ తాత్విక చర్చ చేస్తారు. జబ్బుకు గురయిన తన స్తనద్వయాన్ని ఆపరేషన్ చేసి రక్తపుముద్దలుగా తీసి పళ్ళెంలో వేసినపుడు ‘ భూమి గుండ్రంగా వుందని/ గుండెలపై చెయ్యేసుకొని / ధైర్యంగా చెప్పేదాన్ని / ఇప్పుడు – / బల్లపరుపుగా వుందని / చెప్పాలేమో’ అన్న కవయిత్రి వ్యక్తీకరణకు ఒక్క క్షణం పాఠకుని గుండె రసార్ద్రమవుతుంది. వస్తువు పట్ల కవి మగ్నతకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక వస్తువు స్థానంలో మరో వస్తువును భావతీవ్రతను పెంపుచేస్తూ ప్రతిక్షేపించడం కవయిత్రి నిపుణతకు నిదర్శనం.

పింక్ హోప్ లో తన రెండు జడలకు కట్టుకోవాలనుకునే గులాబీ రిబ్బన్లు ఇప్పుడు ఈ విధంగా ఆ కోరికను పింక్ హోప్ ద్వారా తీర్చుకుంటున్నాని కవయిత్రి ఊహ చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. ఇక్కడ పింక్ హోప్ అంటే రొమ్ము క్యాన్సర్ బాధితులకు బాసటగా వారిలో నమ్మకాన్ని, దైర్యాన్ని పాదుకొల్పడానికి ఉపయోగించే చిహ్నం. సాధారణంగా ఇది పింక్ రిబ్బన్ ఆకారంలో వుంటుంది. కాబట్టి దీన్ని పింక్ హోప్ అన్నారు. కవయిత్రి ఈ విభాగాన్ని బాధితులలో తిరిగి జీవనేచ్ఛను నెలకొల్పాడానికే బలంగా వాడుకున్నారు. ఎంతగా తన స్తనద్వయాన్ని ఆత్మగౌరవ ప్రతీక అన్నారో..అవి క్యాన్సర్ వల్ల కోల్పోవాల్సి వచ్చినా నిబ్బరం కోల్పోకుండా బాధితుల్లో ఒక నమ్మకాన్ని ఎలా కలిగిస్తున్నారో చదవండి..

‘ఆకులు రాలడమంటే
వసంతం ఆగిపోవడం కాదు కదా!

కొమ్మలు విరగడం అంటే
చెట్టు నేలకూలడం కాదు కదా!…అంటూ అనేక ఉపమానాలు చెపుతూ చెపుతూ..

‘ఈ స్తనాతీత దశని
మహిళా ప్రస్థానంలో
నవయుగోదయం అని చాటి చెపుదాం’ అంటూ ఒక నిరాశ నిస్పృహ స్థానే ఒక వెలుగు నిండిన ఆశను ప్రవేశపెట్టడం చేస్తుంది కవయిత్రి. అంతే కాదు..
‘పింక్ రిబ్బన్ తో
నాలాంటి కోట్లాది స్త్రీల గుండెల్లో
జీవనేచ్ఛను నింపడానికి
నేను కదం తొక్కాను’ అని తన కవిత్వ పరమార్థాన్ని చెప్పడమే కాకుండా ‘ జెండర్ యే కాదు / జెండా యై నిలుద్దాం’ అని దిశానిర్దేశం కూడా చేసారు. పింక్ హోప్ కవితా విభాగం నిజంగానే బాధితులలో ఒక నమ్మకం కలిగిస్తూ వుంది. మామిడి హరికృష్ణ గారు పేర్కొన్న Placibo
Effect ‘ విధిలేని పరిస్థితులలో రోగి మనసులో పాదుకున్న పాజిటివ్ థాట్స్ – సానుకూల సంకల్ప శరీరాన్ని, భౌతిక స్థితిని దానికి అనుకూలంగా సమాయాత్తం చేసి, ఆ వ్యక్తిని ప్రమాదం నుండి తప్పించగలిగే మానసిక స్థితి – ఈ Placibo Effect, ఈ కవిత్వానికి సరిపోతుంది. ఈ కవిత్వం ఇస్తున్న సాంత్వన, నమ్మకం, జీవనేచ్ఛ బాధితుల పట్ల Poetry Therapy కూడా.

మామిడి హరికృష్ణ గారు ఈ పుస్తకానికి సవివరమైన ముందుమాట రాసారు. అంతర్జాతీయ సాహిత్యంలో క్యాన్సర్ మీద వచ్చిన సాహిత్యాన్ని పరిశోధనాత్మకంగా తెలియజేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కవిత్వం ఎలా సాంత్వన పరుస్తుందో చెపుతూ, విదేశాలలో ఉపయోగిస్తున్న ‘పొయెట్రీ థెరపీ’( Poetry Therapy) ఎలా రోగనివారణకు ఉపయోగపడుతుందో.. ఈ సందర్భంలో ఈ పుస్తకం ఎలా క్యాన్సర్ బాధితులకు ఊరట ఇస్తుందో చాలా బాగా అన్వయించి చెప్పారు. Ted Hughes అనే బ్రిటీష్ కవి ‘ సాహిత్యం వంటి కళాత్మక సృజనలు మానసిక సాంత్వనను మాత్రమే కాదు, రోగనివారణను కూడా వాక్యాల వెంట తీసుకువస్తాయని, కవిత్వం ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుందని చెపుతూ ఆయన అన్న ఒక మాట ఇలా ఉదహరిస్తారు..“Prose, narratives etcetera, can carry healing Poetry does it more intensely “ అని.
చదివి తీరవలసిన ముందుమాట ఇది. రొమ్ము క్యాన్సర్ గురించిన కవితలు వెతికి పట్టుకొని ఇక్కడ పాఠకులకు అందివ్వడం, క్యాన్సర్ గురించిన ప్రపంచ సాహిత్యం విషయ పరంగానూ, వివరాల పరంగానూ, విషయాన్ని విశదీకరించడం గురించి దీనిని ది బెస్ట్ అని చెప్పాలి. శ్రీలక్ష్మి గారు ఆయన్ని ‘నడిచే గూగుల్’ అనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు.

సి.శోభ- పార్థసారథి గార్ల ఆత్మీయ వాక్యం ‘ వ్యాధిగ్రస్తులకు కావలసినది మందులు కాదు – ఆత్మీయత, ఆలంబన, ఆసరా’ అన్నది ఎప్పటికీ ఆచరణ యోగ్యం.

శ్రీలక్ష్మి గారు రాసిన ‘ఒకింత’ ఎన్నో విషయాలు చెప్పింది. తన చుట్టూ వున్న తనవాళ్ళూ, ఇతరుల క్యాన్సర్ కష్టాలు చూసి చలించిపోయి ఆమె ఈ దీర్ఘకవితా రచనకు పూనుకున్నారు. జీవితం పట్ల ఒక దృక్పథం లేనివాళ్ళకి ఈ క్యాన్సర్ వార్డుని చూయిస్తే జీవితం ఎంత అమూల్యమయిందో తెలిసి వస్తుంది అంటారు. ప్రతి స్త్రీ బాధ్యతగా తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, క్రమం తప్పకుండా ఆరోగ్యం చూసుకోవాలంటారు.

ఈ దీర్ఘకవిత వస్తు ప్రధానంగా రాయబడిందే గానీ శిల్ప ప్రధానంగా కాదు. ఈ కవిత్వం సాహిత్యం పట్ల అంతగా పరిచయం లేని క్యాన్సర్ బాధితులను ఉద్దేశించి రాయబడింది కనుక చిక్కని కవిత్వం వారికి అర్థం కాకపోయే అవకాశం వుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో వుంచుకొని శ్రీలక్ష్మి గారు సులభశైలిలో అందరూ అర్థం చేసుకోగలిగే విధంగా ఈ దీర్ఘకవితను రచించడం ఆమె ముందుచూపుకి నిదర్శనం. ఎక్కడా సంక్లిష్ట సమాసాలు, క్లిష్ట పదాలు లేని సరళ సలిలంగా ఈ కవిత సాగిపోయింది. క్యాన్సర్ స్థానంలో ఏ మరో ప్రాణాంతక వ్యాధి వున్నా ఈ కవిత్వం అన్నిటికీ నప్పుతుంది.

పుస్తకంలో ఆంగ్ల పదాల వినియోగం తగ్గించవచ్చు అనిపించింది. రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుందో, దాని లక్షణాలు ఏమిటో సంక్షిప్తంగా వివరిస్తే చదువరులకు ఉపయోగంగా వుండేది.

‘ధైర్యంతో ఆత్మస్థైర్యంతో/ బ్రెస్ట్ క్యాన్సర్‌ని/ ఎదురొడ్డి పోరాడి గెలిచిన/ మహిళలకు మానవిలకు’
ఈ పుస్తకం అంకితమివ్వడం సముచితంగా వుంది. అలాగే క్యాన్సర్ తో చివరికంటా పోరాడిన తన నాయనమ్మ నారాయణమ్మకు నివాళి ప్రకటించడం ఆర్ద్రంగా వుంది.

శ్రీ హరిచంద్ర క్రియేషన్స్ సమర్పణలో, సరోజనీ శ్యాంసుందర్ వృద్ధాశ్రమ సేవాసంఘం, హైదరాబాదు ప్రచురణలో వచ్చిన ఈ దీర్ఘ కవితను చదవడం క్యాన్సర్ బాధితులకే కాక, ఒక సాధారణ పాఠకునికి కూడా ఒక మంచి పుస్తకం చదివిన అనుభవం.

November 30, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us