మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

బావండీ!

by Mala Kumar May 24, 2024
written by Mala Kumar

“మనసెరిగి మసలు కునే వాళ్ళేమన వాళ్ళు.” అప్పటికి లక్షా తొంభై సార్లు… కాదు కాదు కోటీ థొంభై షార్లు… ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు అనుకున్నాడు రంగారావు. కళ్ళల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తామూ అని మారాము చేస్తున్నాయి. గొంతు గురఘురా అంటోంది. చీ… తన బతుకెంత అధ్వానం అయిపోయింది? తనేమన్నా చిన్నా చితకా వాడా? ఆకుపచ్చ సంతకాలు చేసిన గెజిటెడ్ ఆఫీసర్! హిప్పుడు చప్రాసీ అయిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? గత కొన్ని నెలలు గా జరిగిన దానికన్నా ఈరోజు జరిగింది గుండెను మండిస్తోంది. రిటైర్ అవుతే జీవితం ఇంతలా మారిపోతుందా? ఆ రోజు…

తన రిటైర్మెంట్ రోజున, తననూ, కాంతం నూ కూర్చోబెట్టి ఘనసన్మానం చేసారు. సహోద్యోగులందరూ తన గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. పెద్దపెద్ద దండలు వేసారు. శాలువా కప్పారు. హబ్బో ఆ ఫంక్షన్ తెలుచుకుంటేనే వళ్ళు ఉప్పొంగుతుంది. తనకు ఇష్టమైన వాటితో మంచి విందు ఇచ్చారు. ఇంటికొచ్చాక ఎవరికీ జరగనంత గొప్పగా తన రిటైర్మెంట్ పార్టీ జరిగిందని  తలుచుకొని మురిసిపోతుంటే “ఆ… అమ్మయ్య మనకు వీడి బాధ తప్పింది, అని అంత పార్టీ ఇచ్చారేమోలే” అని తీసిపారేసింది కాంతం. చుప్పనాతి శూర్ఫణక పోనీలే అని ఊరుకున్నాడు.

మరునాడు రోజులాగే పొద్దున్నే మెలుకువ వచ్చింది. ఆ అప్పుడే లేచి చేసేదేముంది అని కాసేపు అలాగే మంచం మీద అటూఇటూ దొర్లి, ఇక దొర్లలేక లేచాడు. కాంతం ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడే వచ్చిన పేపర్ చదివాడు. స్నానం అయ్యాక దండం పెట్టుకోవటమే కానీ రోజూ వారీ జపాలు, పూజ ఎప్పుడూ అలవాటు లేదు. కాసేపు వరండాలో అటూ ఇటూ అచార్లు, పచార్లు చేసి టిఫిన్ తిన్నాక ఇంకేం చేయాలబ్బా అని చించీ…చించీ కేబుల్ వాడికి అప్పనంగా కి బోలెడంత డబ్బుపోస్తున్నాము, ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు ఇక చూద్దాం అని టీ.వీ పెట్టాడు. ఎన్ని ఛానల్సో! ఎన్ని ప్రోగ్రాం లో! రోజంతా, రోజంతా ఏమిటీ రాత్రి దాకా ఛానల్స్ తిప్పీతిప్పి అర్ణబ్ వార్తలు, టీ.వీ వార్తలూ, అత్తకోడళ్ళ సీరియల్లూ హబ్బో అన్నీ  చూసీసీ…  అలవాటు లేని పని కావటం తో కళ్ళూ, వేళ్ళూ నొప్పులు పుట్టాక టీ.వీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అరే ఇదేదో బాగుందే! అందుకే అందరూ టీ.వీ కి అతుక్కుపోతారు అని ఆ ప్రోగ్రాం కే ఫిక్సైపోయాడు. తినటం, టీ.వీ చూడటం, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్, స్నాక్స్ తో సహా టీ.వీ ముందే సెటిల్డ్! ఇలా కొన్ని నెలలు గడిచాయి…

సడన్ గా కాంతం కు ఏమయిందో “ఊరికే మిడిగుడ్లేసుకొని టీ.వీ ముందు కూర్చోకపోతే మార్కెట్ దాకా వెళ్ళి కూరలు తేవచ్చుగా” అని సంచీ విసురుగా వళ్ళో వేసింది. కాంతం సణుగుడు భరించలేక కూరలు తెచ్చి ఇచ్చాడు. సాయంకాలం రామం ఏవో స్వీట్స్ పాకెట్స్ తెస్తే, అవేమిటీ నాకిటివ్వరా అని కొడుకును అడుగుతున్నా వినిపించుకోకుండా కోడలు అంజలి కొంగు చాటుగా పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.

ఇదేమిటీ ఎప్పుడూ లేని అలవాటు అనుకొని హాచర్యపోతూ “కాంతం  ఇదేమిటే అడుగుతున్నా పెట్టకుండాతీసుకుపోయింది?” రాత్రి భోజనానికి పిలిచిన కాంతం ను అడిగాడు.

“అన్ని ఆరాలూ కావాలి. అయినా ఇప్పుడు నీ తిండికే లోటు వచ్చింది?” విసుక్కుంటూ కంచంలో రెండు ఫుల్కాలూ, పక్కన ప్లేట్ లో ఏవో కూరగాయముక్కలూ, గ్లాస్ లో మజ్జిగ పెట్టింది.

“ఈ రొట్టెముక్కలు, పచ్చి కూరగాయలు, మజ్జిగ ఏమిటీ? నేనెప్పుడైనా తిన్నానా? ఎన్నడైనా పెరుగు తప్ప మజ్జిగ పోసుకున్నానా?” కోపంగా అరిచాడు.

వినిపించుకోకుండా మనవడికి తినిపించటం లో ఉండిపోయింది.

అదిమొదలు తన తిండి ఖనాఖష్టం అయిపోయింది. స్వీట్స్ తనకు పెట్టకుండా దాచుకోని తినటం, తనకిష్టమైన పూరీలు అవీ కూడా తన ముందే తనకు పెట్టకుండా మనవడికి పెట్టటం ఇలా బోలెడు మార్పులు తన తిండిలో. అప్పటికీ ఉక్రోషం ఆపుకోలేక “నేనేమైనా పశువునా ఈ గడ్డీగాదం తింటానికి?” అని అరిచినా పట్టించుకున్న వాళ్ళే లేరు. సాత్వికులైన కొడుకూ కోడలు మారిపోయారు. “నా కొడుకు అమాయకుడమ్మా, వాడికి కాస్త తిండిపుష్ఠి ఉన్నదని వాడి మనసెరిగి కావలసినవి చేసిపెడుతూ, కాస్త కనిపెట్టుకొని ఉంటావని నీ చేతిలో పెడుతున్నానే కోడలుపిల్లా” అని అమ్మ మేనకోడలికి తనను అప్పగించినప్పటి నుంచీ ఏదో అప్పుడప్పుడు అరవటం తప్ప ముద్దుగా చూసుకుంటున్న కాంతం సూర్యకాంతం పేరును సార్ధకం చేసుకుంటూ ముందే కాస్త గట్టిదేమో ఇప్పుడు మరీ గంపగయ్యాళమ్మ అయిపోయి కొడుకుకు, కోడలికి వంతపాడుతోంది. పైగా “ఎద్దులా కూర్చున్నావు. కాస్త మనవడిని పార్క్ కు తీసుకెళ్ళి ఆడించవచ్చుగా” అని కూడా కసురుకుంటోంది మొగుడన్న మర్యాదలేకుండా! అందుకే మావకూతురిని పెళ్ళి చేసుకోకూడదు. ఇట్లాగే నెత్తినెక్కుతారు. ఇప్పుడనుకొని ఏమి లాభం!

అంతటితో తన కష్టాలు  ఆగలేదు, “ఎప్పుడూ ఆ టీ.వీ ముందు కూర్చొని అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూడకపోతే చెట్లకు నీళ్ళుపోసి, తోట పని చూసుకోవచ్చుగా రెండురోజుల నుంచి మాలి రావటం లేదు. పెరట్లో కూరగాయల మడులు, ముందు పూల మొక్కలూ ఎండిపోతున్నాయి. ఏదీ పట్టదు దిష్ఠిబొమ్మలా హాల్ మధ్యలో కూర్చున్నావు” అని చిరాకు పడ్డాడు రామం.

అట్లా ఒక్కొక్కపని తనకు అప్పగించారు. పకోడీల వాసన వస్తుంటే హబ్బా తనకిష్టమైన పకోడీలూ హూ అని వంటింట్లోకి వెళ్ళాడు. మీకిక్కడేమి పని బయటకెళ్ళండి అని తరిమింది అంజలి. హంతే తనకు పౌరుషం వచ్చేసింది. “రామం” భీకరంగా అరిచాడు.

ఆ అరుపుకు అదురుబెదురు లేకుండా గదిలో నుంచి బయటకు వచ్చి “ఏమిటీ” అడిగాడు థాఫీగా.

“ఆ మధ్య నా బాంక్ పాస్ బుక్ తీసుకున్నావు అది ఇటివ్వు. ముద్దకుడుముల్లా నా పెన్షన్ బోలెడు మీ చేతుల్లో పోస్తుంటే నాకుతిండి పెట్టకుండా గొడ్డు చాకిరీ చేయిస్తూ హీనంగా చూస్తున్నారు. ఇంకా ఊరుకునేదిలేదు. నాకన్నా ముందే మీ అమ్మ డబ్బులు తెచ్చేసుకుంటోంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తోంది.నా ఎకౌంట్ మీ అమ్మతో జాయింట్ కాకుండా నా పేరు మీదకే మార్చుకుంటాను. నాకు కావలసినవి తెచ్చుకుంటాను. హోటల్ కు వెళ్ళి తింటాను.అప్పుడు కుదురుతుంది మీ తిక్క.నువ్వు పాస్ బుక్ ఇవ్వకపోయినా బాంక్ కు వెళ్ళి మార్చుకోగలను ఏమనుకుంటున్నారో ఖబడ్ధార్” ఆయాసపడిపోయి, ఖళ్ ఖళ్ మని కాస్త దగ్గాడు కూడా!

“ఓయబ్బో మహా వచ్చాడండీ.ఆ పని నువ్వు చేస్తే ఇదో ఈ ఫాన్ కు ఉరేసుకొని చస్తా. దయ్యమై నిన్ను పీడిస్తా” కళ్ళు పెద్దగా చేసి, చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.

ఒక్క క్షణం బిత్తరపోయి, ఇంక ఏమి మాట్లాడలేకవిసురుగా బయటకు వచ్చి మొక్కలల్లో గడ్డిని పీకుతూ కూర్చున్నాడు. పక్కింటి ఛాయమ్మ ఎందుకో బయటకు వచ్చి తనను చూసి “ఇదేంటన్నయ్యగారూ, వేళకాని వేళ గడ్డి పీకుతున్నారు? చాయ్ తాగారా?” అడిగింది.

ఆప్తురాలు దొరికినట్లుగా తన ఘోషను వెళ్ళబోసుకుంటుంటే “ఏమిటో నండి ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు” అని సానుభూతిని చూపిస్తున్న ఛాయమ్మను భర్త రమణారావు వచ్చి “నీకెందుకూ లోపలికి రా” అనిగడకర్రలాగాలికి ఊగిపోతూ పిలుస్తూనే ఉన్నాడు లోపలి నుంచి కాంతమ్మ వచ్చింది.

“బజార్ లో పక్కింటోళ్ళతో పంచాయితీ పెట్టిస్తున్నావా?దేభ్యమొహం వేసుకొనిఆడోళ్ళతో నీకేమిటి మాటలు? ఏందమ్మా ఛాయమ్మ నా కాపురంలో నిప్పులు పోస్తావా?” అని అరిచేస్తుంటే ఛాయమ్మ ఊరుకుంటుందా? ఇద్దరూ చేతులు తిప్పుకుంటూ పెద్ద గొంతులేసుకొని అరుచుకుంటుంటే తను ఆ గంపమ్మ కథ చూడలేకఇదో ఇట్లా వచ్చి, పార్క్ లో  వేపచెట్టుకింద బెంచీ మీద కూలబడ్డాడు.

అవును ఏ రచయత అన్నాడో కానీ “మనసెరిగి మసలు…కునే వాళ్ళే మన వాళ్ళు.” వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని మళ్ళీ లెక్కపెట్టలేనన్నోసారి అనేసుకొని, పరిపరి విధాల చింతిస్తూ, ధుఃఖిస్తూన్న రంగారావు నెత్తిన ఠప్ మని ఓ వేపకాయ, ఆ వెనువెంటనే ఓ వేప రెమ్మ వచ్చి నెత్తిన పడ్డాయి. అవి చూడగానే, అప్పుడే కాంతగంపమ్మ ఉరేసుకున్నట్లూ, దయ్యమై తనను ఘట్టిగా పట్టేసుకొని ఖంగాళీ నృత్యం తనతో చేయిస్తున్నట్లూ, మంత్రాల మాంచారయ్య వచ్చి వేపకొమ్మలతో కసాబిసా బాదేస్తున్నట్లూ, గంపమ్మ వికట్టాట్టహ్హాసం చేస్తున్నట్లూ ఊహ వచ్చేసి వణికిపోయాడు రంగారావు. అంతలోనే తెలివి తెచ్చుకొని చుట్టూ చూసాడు. పార్క్ లో అందరూ వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న మనవడు కూడా లేడు. వెధవ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? ఇహ ఇప్పుడేమి గోల ఉందో కొంపలో నిట్టూరుస్తూ, అయినానేనెందుకు వీళ్ళకు భయపడాలి?  అసలు ఆ చావేదో నేనే చచ్చి వీళ్ళను పీడిస్తే! మంత్రాల మాంచారయ్య వీళ్ళను చితక బాదాలి.తను భీకరంగా నవ్వాలి.  వళ్ళో పడ్డ వేపకాయను నలుస్తూ, కాసేపు ఏ విధంగా చస్తే బాధలేకుండా చావొచ్చా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలతోనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.

“ఇంతసేపటి వరకు ఎక్కడికెళ్ళావు?” గయ్ మంది కాంతమ్మ.

కాంతమ్మను నిర్లిప్తంగా చూసి, లోపలి నుంచి నిద్ర మాత్రల సీసా తెచ్చి చూపిస్తూ “నేనింక నీ కడవళ్ళు భరించలేను. ఈ మాత్రలు మింగి చస్తాను” అని చేతిలోకి సీసా వంపుకొని, మంచి నీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ, మనవడు, కొడుకు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద పొగలు చిమ్ముతూ అన్నం, ముక్కుపుటాలను అధిరిస్తూ ఘాటుఘాటు కొత్తావకాయ, కొద్ది దూరం లో చెరుకు రసాలు కనిపించి నోరూరించాయి. అవి తిని చద్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిచ్చికానీ ఈ రాక్షసులు  తనను తిననిస్తారా విరక్తిగా అనుకొని వాటి వైపు చూడకుండా మనసును అదుపు చేసుకుంటూ,కళ్ళుమూసుకొని నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు.

“బావండీ…”

“డాడీ…”

“మామయ్యగారూ…”

“తాతయ్యా…”

అందరూ గగ్గోలుగా అరిచారు. పక్కింటి నుంచి రమణారావు, ఛాయమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. రమణారావు, రంగారావు చేతిలోనుంచి మాత్రలు గుంజుకొని “ఏం పనిది” మందలింపుగా అన్నాడు.

“మీకు తెలియదు వీళ్ళు నాకు తిండిపెట్ట కుండా ఎంత హింస పెడుతున్నారో, చాకిరీ చేయిస్తున్నారో” అన్నాడు ఉక్రోషంగా.

“బావండీ నన్ను క్షమించు బావా క్షమించు” రంగారావు చేతులు పట్టుకొని బాధగా అంది కాంతం.

“దీని దుంపతెగ ఇప్పుడూ కాళ్ళు కాకుండా చేతులు పట్టుకుంది హెంత గీర” మనసులో అనుకొని “క్షమించను పో” అన్నాడు రంగారావు మరింత గీరగా!

“నాన్నా అదికాదు, అసలు సంగతేమిటంటే అయిదు నెలల క్రితం నువ్వు టీ. వీ చూస్తుండగా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో” రింగులు తిప్పాడు రామారావు.

“ఆ …ఇప్పుడు రింగులు తిప్పి అంత హవస్త ఎందుకు కానీ, బావండీ ఆరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అట్లా రెండు సార్లు జరిగే సరికి నిన్ను రామం డాక్టర్ కు చూపించాడు. అన్ని టెస్ట్ లూ చేసి, నీకు బీ.పీ బాగా పెరిగిందనీ, షుగర్ బార్డర్ లోకి వచ్చిందనీ, బరువు 200 కిలోలు పెరిగావు, బరువు తగ్గాలనీ జాగ్రత్త పడాలనీ చెప్పాడు గుర్తుందా?కుర్చీలో నుంచి లేవటానికీ, నడవటానికీ ఇబ్బంది పడ్డావు. పైగా ఆ శంఖుమార్క్ లుంగీలు వదలవు. గడ్డం చేసుకోమన్నా చిరాకు పడిపోతూ ఎంతసేపటికీటీ.వీ ముందు నుంచి లేవవు. అక్కడికే రకరకాల రుచులతో స్నాక్స్ కావాలి.ఎంత చెప్పినా నీకు తిండియావ తగ్గదు.”

“వాకింగ్ కు వెళ్ళమంటే వెళ్ళవు.”

“అమ్మాయ్ అంజలీ నువ్వు మీ అత్తయ్యా ఓసారి ఈ సీరియల్ లో లాగా పోట్లాడుకోండి అని సరదా పడిపోయారు.”

ఒకళ్ళ తరువాత ఒకరు చెప్పుకుంటూ పోయారు.

“భారీ ఏనుగులా వళ్ళు పెంచేసావు. తాతయ్య కు బీ.పీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి ఎన్నాళ్ళో మంచాన తీసుకొని తీసుకొనిపోయాడు. బామ్మా, తాతయ్యషుగర్ ఎక్కువ అయ్యి గుండెపోటుతో పోయారు. నీకు ఆ పరిస్తితి రాకూడదని ఎంతో  ఆలోచించి ఈ ప్లాన్ వేసాము. ఇప్పుడు చూడు నువ్వు గున్న ఏనుగులాగా కాదు బుజ్జి ఏనుగుసైజుకు వచ్చావు. నీకోసమే డాడీ ఇదంతా నీ కోసమే”  బాధగా పిడికిలి నోటికి సుతారంగా ఆనించుకొని, మొహం బాధగా పెట్టిఅన్నాడు రామారావ్.

“అవును మామయ్యగారు అట్లా మాట్లాడినప్పుడల్లా ఎంత బాధ పడ్డామో తెలుసా” చేతులు నలుపుకుంటూ, కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది అంజలి.

“బావండీ నిన్ను చూసినప్పుడల్లా మాయాబజార్ లోని ఘటోత్కచునిలా కనిపించి ఎంత దడుచుకునే దాన్నో తెలుసా? ఉమ్మడి కుటుంబం లో యమధర్మరాజులాగా దున్నపోతెక్కి యముండ అని భీఖరంగా అరుస్తూ యమధర్మరాజు వస్తుంటే నిన్ను కాపాడాలని ఆ సావిత్రిలా నీతో ఈ నిరాహార దీక్ష హెంత నిష్ఠతో చేయించాను” అంటూకాంతం కొంగు నోట్లో కుక్కుకుంటూ ఆపసోపాలు పడుతోంది.

హోరినీ హిదా సంగతి అని రమణారవు, ఛాయాదేవి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.

శుభం కార్డ్ పట్టుకొని తన చుట్టూ నిలుచున్న అందరి మొహాలు ఒకటొకటిగా స్లో మోషన్ లో చూసాడు. చిన్నగా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు…

“అమ్మాయ్ ఆ రెండు చెరుకు రసాలు ఇటందుకో”అంటూకంచం దగ్గరికి జరుపుకున్నాడు…

వేడి అన్నం, ఆవకాయ కంచంలో తోడుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్న వెన్న ముద్దను చేతిలోకి తీసుకొని మొత్తం వేసేసుకున్నాడు…

అన్నం కలిపాడు…

గుండ్రాయంత ముద్దను చేసి, ఆబగా నోటి దగ్గరగా తెస్తుంటే…

“బావండీ…”

“డాడీ…”

“మామయ్యగారూ…”

“తాతయ్యా…”

“రంగారావ్…”

“హన్నయ్యగారు…”

ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా, చేతిలోని ఆవకాయ ముద్దను మురిపెంగా చూసి, ఘాఠ్ఠిగా వాసన పీల్చి, ఆ ఘాటుకు, ముక్కు, కళ్లు ధారలు కారుతుండగా అందరి వంకా చిద్విలాసంగా చూసి, నోట్లో కూరుతూ, ఆహా ఇది కదా “స్వర్గం అంటే” తన్మయంగా అన్నాడు.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

విడాకులు

by Yalamarti Anuradha May 24, 2024
written by Yalamarti Anuradha

కారు హారన్‌ మ్రోగుతోంది.

అన్వేష్‌ వచ్చినట్టున్నాడు అనుకొని స్నేహ చెప్పులేసుకొని వచ్చి కారులో కూర్చుంది.

‘దారిలో నీలూని పికప్‌ చేసుకుందాం’ అంది ముక్తసరిగా !

‘ఏమిటే హాట్‌ హాట్‌ గా ఉన్నావ్‌ ! ఎటు వెళ్దాం !’

”హాటా నా ముఖమా? బాధగా ఉంది. అంతే. ఎక్కడికయినా ప్రశాంతంగా ఉండే చోటుకు పోనీయ్‌” అంది. కాస్త దూరం వెళ్ళగానే కారు ఆపాడు అన్వేష్‌.

హారన్‌ ఎంతగా మ్రోగించినా నీలూ రాదేం? చూద్దాం అని లోపలికి వెళ్ళింది.

అప్పుడే బయటకు వస్తూ కనిపించింది నీలిమ తల్లి.

”స్నేహా! నీలూ రాంబాణమ్మ గారి పాపకు జాండీస్‌ అయితే హాస్పిటల్‌ లో చేర్చారట. అక్కడే ఉందట”.

”అలాగా! నేను వచ్చి వెళ్ళానని చెప్పండి” అని వచ్చి కారులో కూర్చుంటూ విషయాన్ని చెప్పింది అన్వేష్‌ కి.

”ఈ విషయం సరే! అసలు విషయం చెప్పు !”

”చెబితే సిల్లీగా ఉందని నవ్వుతావేమో?” సందేహిస్తూ అంది.

”నా సంగతి తెలియదా? కొత్తగా మాట్లాడుతున్నావ్‌?”

”నాకు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. నలభై యేళ్ళు కాపురం చేసిన మా మాయ్య, అత్తయ్య ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకోవటమేమిటి?”

”అదేముంది ఎప్పుడు పడకపోతే అప్పుడు విడాకులు. దానికి వయసుతో సంబంధం ఏముంది? నాకిందులో ఏం కొత్తదనం కనిపించటం లేదే!”

”జనాలంతా ఇలా తయారయ్యారేం? విడాకులు అనేది మన సంస్కృతికి విరుద్ధం. అలాంటి ఆలోచనే రావద్దంటాను”

”అలా అని ఇష్టం లేకున్నా సర్దుకు పోవాలా? ఎన్నాళ్ళిలా ?”

”అందుకని మనుమళ్ళు వచ్చే వయసులో విడాకులా! ఛ !ఛీ”

‘ఇంతకీ సమస్య ఏమిటీ?”

”ఇన్నాళ్ళూ అత్తయ్య చెప్పినట్లు మామయ్య వినేవాడు. ఏమయ్యిందో తెలియదు. ఎదురు తిరిగాడు. మామయ్య నేనేం చెబితే అది జరగాలి అంటున్నాడు. అది అత్తయ్య తట్టుకోలేకపోతోంది.”

”బుద్ధునికి బోధి చెట్టులా ఎక్కడో జ్ఞానోదయమయి ఉంటుంది”

”నాకనిపిస్తుంది ఈ బుద్ధి పెళ్ళయిన కొత్తలోనే ఉంటే బాగుండేది అని. అప్పుడే ఆవిడను అదుపులో పెట్టుకొని ఉంటే ఈ సమస్య ఉండేది కాదుగా!”

”అదేంటి స్నేహా! ఆడవాళ్ళను అదుపులో పెట్టుకోవటం అనేది మీ స్త్రీవాదులు ఒప్పుకోరుగా!”

”అదే! నాకు ఒళ్ళు మండుతుంది. అదుపులో పెట్టుకోవటం అంటే మనులు చెప్పి చేయించుకొనే పని మనిషిలా చూడటం అని గాదు. తప్పుగా ప్రవర్తిస్తే భార్యనయినా సరైన దారిలో పెట్టాల్సిందే అని. నీకు తెలుసా! మా అత్తయ్యా మాటలు విని మా అమ్మమ్మకు మందులు కూడా కొనేవాడు కాడు మామయ్య. తాతయ్య చనిపోయిన దగ్గరనుంచీ ఒక్కర్తీ కష్టపడి పెంచి, పెద్దచేసి ఇలా తన తిండి తను తిని వీళ్ళందరికీ ఇంత సంపాదించి పెడుతున్నాడంటే ఆ క్రెడిట్‌ ఎవరిది మా అమ్మమ్మది కాదూ! అలాంటి అమ్మమ్మను సరిగ్గా చూచుకోపోతే ఊరుకోను” అని గట్టిగా చెబితే ఇప్పుడే అవస్థ తప్పేదిగా! ఎవరికిచ్చే వాల్యూ వాళ్ళకివ్వాలని. ఎవరినీ కించపరచుకుండా ఇద్దరికీ న్యాయం చేసే దక్షత భర్తగా ఈ మగవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో’ అని జాలివేస్తుంది కూడా!”

రేపు తను ఒక భర్త అయితే ఇదేనా పరిస్థితి అని దిగులుగా పెట్టాడు ముఖం అన్వేష్‌!

”ఏమిటా ఫేస్‌! ఇప్పుడు ఆ కష్టమే నీకు వచ్చినట్లు అంత దీనంగా!”

”నిజంగా వచ్చినట్లే ఉంది”

”వస్తే ఎలా నడుచుకోవాలో చెప్పటానికి నేనున్నానుగా!” అభయహస్తం ఇస్తూ ఉంది.

”ఇంకా చెప్పేదేమిటి ఆల్‌ రడీ చెప్పేసావ్‌ గా”

”ఎక్కడ పూర్తిగా చెప్పనివే”

ఇంకా డీలా పడిపోయాడు.

”నువ్వు జాగర్తగా డ్రైవ్‌ చెయ్యి నాయినా. లేకుంటే ఈ సమస్యలకు దూరంగా పై లోకాలల్లోకి వెళ్ళి తెలియని సమస్యల మధ్య పడతాం”

అన్వేష్‌ సడెన్‌ బ్రేక్‌ వేశాడు విసుక్కుంటూ.

బ్రేక్‌ పడకపోతే ఆ కాలేజీ కుర్రాడు ప్రాణం అరక్షణంలో గాలిలోకి ఎగిరిపోయేవే! అసలు ప్రాణాల మీద తీపి కనిపించడం లేదే! రోడ్డు వాళ్ళ సొంత ఇంటిదారిలా ఆ నడక లేమిటో!”

”అందుకే! నేనసలు డ్రైవ్‌ చెయ్యను” అంది స్నేహ.

”అదృష్టవంతురాలివి” అయినా అతనంత ధీమాగా ఎలా వెళ్తున్నాడు? వాళ్ళ అమ్మా నాన్న  ఎంత కష్టపడి పెంచుతూ ఉండి ఉంటారు! వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడకపోయినా ఫరవాలేదు. తమ ప్రాణాలు గురించి కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదేమిటి?”

”వింత వింత లోకంలో ఎన్నెన్నో చూడాలి..” హమ్‌ చేస్తున్నాడు అన్వేష్‌.

ఒక్కోసారి ట్యూన్స్‌ కి తగ్గ మాటలు సొంతవి కలిపి పాడటం అలవాటు అన్వేష్‌ కి.

అవన్నీ గమనించే స్థితిలో లేదు స్నేహ!

”మామయ్య, అత్తయ్యని ఇంట్లోంచి పొమ్మనటమేమిటి?” ఆ విషయం విని తట్టుకోలేక పోతోంది. అత్తయ్య చెడ్డపనులే చేసింది. దానిని సహించటం కూడా చెడ్డపనే. అది మామయ్య చేసాడు. ఇప్పుడు తనో బుద్ధిమంతుడిలా అత్తయ్యను ఉన్న ఫళాన బయటకు పొమ్మంటే ఎక్కడికి వెళుతుంది?”

”ఏమిటి! నాతో మాట్లాడకుండా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావ్‌?”

”ఆఁ ఏం లేదు. మా మగవాళ్ళు ఎంత స్వార్థపరులో అని!”

”అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా మగజాతి మీదకే యుద్ధమా?”

”కాదా మరి! పెళ్ళయిన దగ్గరినుంచీ భర్తే సర్వస్వం అని అతని చుట్టూ అల్లుకుంటూ తన గురించి ఆలోచించుకోకుండా, తన కోసం ఏ డబ్బూ దాచుకోకుండా అంతా మనది అనుకుంటే ఉన్నట్టుండి భర్త నా ఇల్లు, నా ఆస్థి, నీకేం లేదు పొమ్మంటే ఎంత దారుణం?”

అన్వేష్‌ మౌనం పాటించాడు.

”భర్తే కదా ఆమె ఆస్థి. అతనే నిరాకరిస్తే ఆమె పరిస్థితి ఏమిటి?”

”ఏం చెయ్యమంటావ్‌!”

”భార్య తనకంటూ సంపాదనను సమకూర్చుకోవాల్సిందే! ఒకరకంగా చూస్తే తప్పే! కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తే అది ఒప్పే అనిపిస్తుంది?”

”దీనికి మరో పరిష్కారం లేదా?”

”ఎందుకు లేదు. విడాకులు తీసుకోకుండా చక్కగా  కలిసి ఉండటమే అసలైన పరిష్కారం” ఆశ్చర్యంగా చూసాడు అన్వేష్‌.

”అవును అనూ! భార్య అంటే ఒకరు, భర్త అంటే ఒకరు. ఆ ఒకరు + ఒకరు పెళ్ళితో కలిసిపోయి ఒకరు అవటమే వివాహమంటే, ఒకటి + ఒకటి = ఇద్దరు అంటే అది వివాహ బంధానికి సరైన ఈక్వేషన్‌ కాదంటాను”

”అసలు ఇదంతా కాదుగానీ ఇన్నాళ్ళూ అత్తయ్య మామయ్యను అలా ఏడిపిస్తోంది, ఇలా ఏడిపిస్తోంది అని మామయ్య మీద జాలిపడే దానివి. మరి ఇప్పుడేమిటి ప్లేట్‌ ఫిరాయించేసావ్‌ అత్తయ్య వైపు తిరిగి”

”అప్పుడు మామయ్య బాధితుడు కాబట్టి అతని మీద జాలి. ఇప్పుడు అత్తయ్య బాధితురాలు కాబట్టి ఈమె మీద జాలి. అందులో ఈమె స్త్రీ.”

”అంతేలే ! పక్షపాతం.. ఎక్కడికిపోతాయ్‌ బుద్ధులు”.

”అవును… అసహాయ స్థితిలో ఎవరున్నా ఆదుకోవల్సిందే ! అత్తయ్యకు బుద్ధి చెప్పాలి. అంతవరకు ఒప్పుకొంటాను. వీధిన పడెయ్యటానికి ఒప్పుకోనంటాను”

”నేనూ ఒప్పుకుంటాను లేకపోతే నువ్వు నన్ను చంపేస్తావ్‌!”

”ఆడవాళ్ళను ఏడిపించే, మగవాళ్ళందరినీ అదే చెయ్యాలనిపిస్తుంది”

”మరి మగవాళ్ళను ఏడిపించే ఆడవాళ్ళని” భయపడుతూనే అడిగాడు.

”మీకులా మాకు రెండు న్యాయాలు ఉండవు మగాళ్ళకో న్యాయం, ఆడోళ్ళకో న్యాయం. అందరికీ ఒకటే న్యాయం.”

”స్నేహా! అయిపోతున్నా!” అన్నది దీనంగా ముఖం పెడుతూ.

సరే సరదాలోకి దిగిపోదాం. ఈ విడాకుల మాటలు వినీ వినీ ఇంట్లో మేం సరదాగా విడాకులు నీవే ఏర్పరచుకున్నాం! చివరకు ఏం అనిపించింది?

”సరదాకి కూడా ఈ విడాకులు సీను ఇంట్లో బాగోలేదని అందరిదీ ఒకటే మాట”

”మంచిది. ఇంక కారు దిగి మంచి కాఫీ కొట్టిస్తే వెళ్ళిపోతాను”

”అసలు తను చూడనే లేదు. కారు తమ ఇంటి ముందే ఉంది”

”అదేమిటి. ఇంటికి తీసుకు వచ్చావ్‌?” ఆశ్చర్యంగా అడిగింది.

”నువ్వు ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకు వెళ్ళమన్నావ్‌? అది నీకు ఇక్కడే బాగా దొరుకుతుందనిపించింది. అందుకే ఇక్కడికే తీసుకువచ్చాను” అన్నాడు.

అతని సమాధానానికి చిన్నగా నవ్వుతూ.. ”సరే! రా కాఫీ తాగి వెళ్దువు గాని” అని అంది స్నేహ. ఇద్దరూ నవ్వేసుకుంటూ లోపలికి నడిచారు.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఒకరి ఆకలికిమరోకరి ఇష్టమే ఆహారంగా

by Chandaluri Narayana Rao May 24, 2024
written by Chandaluri Narayana Rao

రాత్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే…

రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని

మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో?

అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ

అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో

పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరోకరి ఇష్టమే ఆహారంగా

బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా

వృద్దాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే

సత్యానికి రెపరెపలాడే జీవులు
ఆఖరిరోజుకూ
ప్రేమతో ప్రాణంపోసే ధన్యులు.

( తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమదంపతులైన
నా వృద్ధ తల్లిదండ్రుల జీవితాన్ని చూస్తూ, వారి  పాదాలకు కవితను అంకితం చేస్తూ…..)

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నొసటి మీద గీతలు 

by Jyothi Muvvala May 24, 2024
written by Jyothi Muvvala

ఆ బ్రహ్మ పోసినా ప్రాణమా 
విధి వెక్కిరింపుకు సాక్ష్యమా
లేక….
సమాజంలోని కుటిలత్వానికి 
శాపంగా మిగిలిన దేహమా 

నీ తలరాతను మార్చేస్తున్న ఆ గీతలు 
చావుపుట్టుకులే చెప్పలేని రాతలు
బతుకు భారాలను తెలిపే ఒట్టి శరీరపు ముడతలు 
శాస్త్రనికి సైన్స్కి మధ్య ఊగిసలాడే విధిలిఖితాలు

తప్పొప్పులు తేల్చలేని ధర్మసందేహాలు
నిగూఢంగా  నిలిచిపోయిన వాస్తవ రేఖలు 
మనిషి విజ్ఞానానికి అంతుపట్టని రహస్యాలు
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ఆలోచనలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మేధావులు 

సహజ గుణాన్ని కోల్పోతున్నా దేహాలు 
ప్రాణం పోయటానికి పనికిరాని విజ్ఞతలు 
ప్రాణాలను తీసేందుకు మాత్రం ఎన్నో తంత్రాలు
మనిషికి మనిషే శత్రువై మార్చేస్తున్నారు
 నోసటి మీద గీతలు… మీ తలరాతలు…!!

May 24, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కథలు

సీ “రియల్”

by Shamir Janakidevi May 24, 2024
written by Shamir Janakidevi

కొత్తగా పెళ్ళిచేసుకుని వచ్చిన మాధురికి అత్తగారిల్లు చూడగానే అయోమయంగా అనిపించింది… ఏదో తిన్నాము అన్నట్లు ఉంటారు… లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకోవడం…మామగారు రిటైర్ అయ్యారు… ఆయనకి ఒక రూమ్ అందులో టి వి… అత్తగారు, ఆమె తల్లి మధ్య హాల్లో ఉంటారు…  అత్తగారి తల్లి మంచంలోనే ఉంటుంది… అన్నీ చేతికి ఇవ్వాలి…ఇద్దరూ తెలుగు హిందీ సీరియల్స్ కలిపి రాత్రి పది గంటల వరకు చూస్తూనే ఉంటారు…

తమది పెద్దలు కుదిర్చిన వివాహమే.. ప్రశాంత్ ది ఒక మంచి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం… పెళ్ళిచూపుల్లోనే చెప్పాడు ఆమె ఉద్యోగం చెయ్యటం తనకు ఇష్టం లేదని…తన ఇంటి పరిస్థితి తెలిసిన ప్రశాంత్  ఆవిషయం చెప్పకుండా తనకే ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదని చెప్పాడు…తనకు ఎప్పుడూ ఒక మంచి గృహిణిగా ఉండాలని కోరిక… అదే మాట ఇలా వినడం నెత్తిన పాలు పోసి నట్లుగా అనిపించి ఒప్పుకుంది…మొదటి రాత్రి తన ఇంటి వ్యవహారం చెప్పాడు… ఈ ఇల్లు అమ్మమ్మది  అనీ, అమ్మ ఒక్కతే కూతురనీ, అన్నిటికీ తను సర్దుకు పోవాలని… నీకు వీలైతే ఇంటి వాతావరణం మార్చు అంటూ హింట్ ఇచ్చాడు… బలాదూరుగా తిరిగే మరిది శ్రీకాంత్… ఉద్యోగం లేదు… బి టెక్ చదివినా ఉద్యోగం చెయ్యడు… బయటి వ్యాపకాలు ఎక్కువ…

డిగ్రీ చదివి ఎమ్ బి ఎ పూర్తి చేసిన మాధురి, ఒక గృహిణిగా ఆ ఇంట్లో కాలు పెట్టింది… బ్రేక్ ఫాస్ట్, కూరలు బయటి నుంచి వస్తాయి… అన్నం మాత్రం వండుకుంటారు… టి వి సీరియల్లో వంట చెయ్యని అత్తగారిని మాత్రం, ఇద్దరూ తిట్టుకుంటూ కూర్చుంటారు… వింతగా అనిపించింది తనకు…

ఇలా పనీ పాటా లేకుండా  కూర్చోవడం, తనకు నచ్చటం లేదు… ఒక రోజు భర్తని అడిగింది…”ఇక నుంచి రోజూ నేను వంట చేస్తాను..” 

“అందరూ పని చెయ్యకుండా సినిమాలూ, షికార్లూ,పార్లర్ల  చుట్టూ తిరగడం చేస్తారు… నువ్వేంటి ఇలా ?” అంటూ నవ్వాడు…

“అయినా నీది ఒంటరి పోరాటం అవుతుంది… ఇక్కడ ఎవరూ అంతగా పాటించరు జాగ్రత్త సుమా” అని హెచ్చరించాడు…

“మీరు అవసరం అయిన సహాయం చెయ్యండి చాలు…” అంటూ తన నిర్ణయం చెప్పింది…

“ఓకె “అంటూ తంబ్ చూపించాడు ప్రశాంత్…

మరుసటి రోజు అత్తగారితో చెప్పింది…”ఈ కూరలు ఇలా బయట నుండి వద్దు అత్తయ్యా! నేను వంట చేస్తాను ఈ రోజు నుంచి” 

సీరియల్లో మునిగి ఉన్న అత్తగారు మొహం పక్కకి తిప్పి, “ ఇదుగో అమ్మాయ్! నీ ఇష్టం… నాకు మాత్రం పని చెప్పకు…” అని అన్నది…

ఏమనాలో తెలియక, తల ఊపి లోపలికి వెళ్ళింది మాధురి…పనిమనిషిని పిలిచి వంట గది శుభ్రం చేయించింది… రోజూ చేసే పనులు కాకుండా ముందుగా కూరగాయలు  తరిగి ఇవ్వాలని చెప్పింది…

అది డూప్లెక్స్ విల్లా… క్రింద ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్… ఫస్ట్ ఫ్లోరులో మూడు బెడ్ రూములు ఉన్నాయి… అందులో ఒక రూమ్ తమది, ఒకటి మామగారిది, ఇంకొకటి ఊర్లో ఉన్న ఆడపడుచు పద్మది… ఆడపడుచు ప్రతి వారం వస్తూనే ఉంటుంది…సెకండ్ ఫ్లోరులో పెంట్ హౌసులా, ఒకే రూమ్ వేసారు… అది మరిది రూము… అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ, ఎవరి లోకం వారిదే అన్నట్టుగా వుంటారు… మామగారికి రాజకీయాలు, అత్తగారు, ఆమె తల్లిగారలకు సీరియల్స్, మరిదికి సినిమాలు… వింత ప్రపంచంలో వున్నట్టుగా వుంది… తను పెరిగిన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకంగా వుంది ఈ ఇంట్లో పరిస్థితి… పాత సినిమాల్లో సావిత్రి బతుకులా ఉంది అనుకుని ప్రక్షాళన మొదలు పెట్టింది మాధురి…

కిచెన్ లో ఒక ప్రక్కన ఉన్న దేవుడి బొమ్మలు అన్నీ శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపారాధన చేసింది… మామగారు రోజూ కాసేపు తోట పని చేస్తారు… ఆ కాస్త జాగాలోనే ఎన్నో పూలు… అవి కోసి పూజ చేసింది… రోజూ అందరూ పాలల్లో బ్రూ కలుపుకుని త్రాగుతారు…. అలా కాదని ఫిల్టర్ వేసి అందరికీ కప్పుల్లో కాఫీ పోసి ట్రేలో  పెట్టుకుని, తీసుకు వెళ్ళి ముందు మామ గారికి ఇచ్చి, తరువాత అత్తగారికి, మామ్మగారికి ఇచ్చింది…

“కాఫీ సూపర్” అంటూ అత్తగారు ఈమోజీలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది… “ అమ్మాయి! అచ్చం కొంగు ముడి సీరియల్లోలా తెచ్చావు… బాగుంది…” ఆమె మెచ్చుకున్నది సీరియల్నా, నన్నా, ఒకింత ఆశ్చర్యపడుతూ, ఒక పిచ్చి నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది…

ఇంకా పిండి అదీ రుబ్బుకోలేదని, గోధుమరవ్వ ఉప్మా అన్ని కూరగాయలు, జీడిపప్పు, బఠాణీలు వేసి చేసింది…ఆ రోజు ప్రశాంత్, శ్రీకాంత్, మామగారు వెంకట్రావు చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తిన్నారు… టేబుల్ పైన ఒక గాజు గ్లాసులో నీళ్ళుపోసి రెండు గులాబీలు పెట్టింది… మామగారు ఆ పూలని చూసి ఆమె అభిరుచికి మెచ్చుకున్నారు…

రోజూ ఆఫీసులో తినే ప్రశాంత్ కు ఆనందంగా ఉంది…ఒక ఇంటిని స్వర్గం చేసినా, నరకంగా మార్చినా స్త్రీ చేతిలోనే ఉంటుంది అని అనుకున్నాడు… “ఏమండీ! రేపటి నుండి మీకు లంచ్ బాక్స్ కూడా ఇస్తాను…” అన్నది…

“మాధురీ ఏమైనా కొనాలంటే తీసుకో…” అంటూ కొంత డబ్బు ఇచ్చాడు…

అత్తగారికి, మామ్మ గారికి టిఫిన్ పెట్టి, తరువాత పనిమనిషికి పెట్టి, తను కూడా తిన్నది…

మధ్యాహ్నం వంటలో మామిడికాయ పప్పు, కంది పచ్చడి, బెండకాయ కూర, చారు చేసింది… అత్తగారితో ఆమె సీరియల్స్ భాషలో మాట్లాడుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్ళింది…

మామ్మగారికి అన్నం పెట్టి, కాసేపు టి వి ఆఫ్ చేసింది… సీరియల్ తరువాత హాట్ స్టార్ లో చూడవచ్చు ప్రశాంతంగా తినమని చెప్పింది…

“అమ్మాయి! నీ కోడలు వంట బాగా చేసింది… ఉదయ రాగం సీరియల్లోలా పనంతా ఒక్కతే చేస్తోంది… కంది పచ్చడి పేరు కూడా మరచి పోయాను…”  అని కూతురుతో చెపుతూ, తన వైపు తిరిగి “వంట బాగా చేసావు  మాధురీ…” అంటూ మెచ్చుకుంది మామ్మగారు… 

సీరియల్స్ చూస్తూ బద్దకంతో కదలని శరీరాలు వాళ్ళని అశక్తులుగా మార్చాయి… అందుకే పని చెయ్యకుండా ఇలా తయారయ్యారు…

అత్తగారికి, మామగారికి, వెండి కంచాలు పెట్టి వడ్డించింది… కొంగుముడి సీరియల్లో కొత్త కోడలులా ఉంటుంది అనుకున్న తనకు ఇంత మంచి కోడలు వచ్చినందుకు మనసులో సంతోషిస్తూ, తృప్తిగా భోజనం చేసింది విజయ…

వాళ్ళలో మార్పు చూసి తను ఇంటిని మార్చగలను అనుకుంది మాధురి…

ఈ రచన నా స్వంతం… ఎక్కడా ప్రచురించలేదు..

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 24, 2024
written by Narendra Sandineni

మంగారి రాజేందర్ జింబో కవిత్వం సామాజిక సమస్యలకు అద్దం పడుతుంది. మంగారి రాజేందర్ జింబో అనగనగా … కవిత

ప్రముఖ కవి,రిటైర్డ్ జిల్లా జడ్జి,ప్రస్తుతం తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.మంగారి రాజేందర్ జింబో కలం నుండి జాలువారిన చూస్తుండగానే … కవితా సంపుటిలోని అనగనగా…కవిత పై విశ్లేషణా వ్యాసం.అనగనగా కథ ఒకప్పుడుతో మొదలవుతుంది.అనగనగా అనే తెలుగు పదానికి నిర్దిష్టమైన,ప్రత్యక్షమైన అర్థం లేదు.అనగనగా సమాజంలో జరిగిన సంఘటనల సరళిలో ప్రారంభమయ్యే కథలను కవిత రూపంలో వ్యక్తం చేయడం కొత్తగా వింతగా ఉంది.అనగనగా ఇది కచ్చితంగా అని కాకుండా భావాన్ని లేదా భావోద్వేగాన్ని తెలియజేయడానికి ఉపయోగించబడుతుంది.అనగనగా సాధారణంగా తెలుగులో ఒక నిర్దిష్ట అర్థాన్ని తెలియజేయడానికి కాకుండా లయను సృష్టించడానికి ఉపయోగిస్తారు. అనగనగా అని కథను ప్రారంభించడానికి మొదట ఉపయోగిస్తారు.కథను ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా తరతరాలుగా సమాజంలో వ్యాప్తిలో ఉన్నాయి.అనగనగా ఎప్పుడో ఒక కాలంలో జరిగాయి.అవి జనంలో వాడుకలో ఉన్నాయి.చిన్న పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్ద వాళ్ళు అనగనగా ఒక రాజు ఉండే వాడు అని కథ చెప్పి పిల్లవాడిని నిద్రపుచ్చడం లోకం ఎరిగినదే.ఇప్పుడు మనం నివసిస్తున్న వర్తమాన సమాజంలో లోకంలో జరుగుతున్న రీతి రివాజులను బట్టబయలు చేస్తూ కవి జింబో పిల్లలకు కథ చెప్పినట్లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.సమాజంలో ఏం జరుగుతుంది? సమాజంలోని జనాలను జాగృత పరచడం కోసం అనగనగా కవిత రాసినట్లుగా తోస్తుంది.జింబో రాసిన అనగనగా కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అపారమైన అనుభూతిని సొంతం చేసుకుందాం.
“అనగనగా …
“ఓ వాగుండేది
“ఏ నగరం దాని మీద దాడి చేసిందో
“ఏమో –
“నీళ్ళే కాదు
“ఇసుక కూడా లేకుండా పోయింది.

వాగు అంటే కొండల మీది నుండి ప్రవహించే చిన్న నీటి ప్రవాహం.ఇది మంచి నీటి సెలయేరు.నగరం విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశం.నగరం జనసాంద్రత చాలా అధికంగా కలిగిన ప్రదేశం. నగరాలు చారిత్రక ప్రాధాన్యత,ప్రత్యేక అధికారం కలిగి స్వయం పరిపాలన అనేక చట్టపరమైన అధికారాలు కలిగి ఉంటాయి.నగరాలు వసతులు కల్పించడంలోను,మురుగునీటి కాలువల నిర్వహణ,విస్తృతంగా రవాణా సౌకర్యాలు,నివాస గృహ సముదాయాలు కలిగి ఉండటం వలన ప్రజలను ఆకర్షించి అధిక జనాభా నివాస పట్టణాలు నగరాలుగా వృద్ధి చెందుతూ ఉంటాయి.ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులు ఉద్యోగాలు లభించడం వలన పరిశ్రమలు పరస్పరం లబ్ధి పొందుతూ ఉండటం వలన నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి.ప్రజలు అధికంగా ఉండటం, వ్యాపార అభివృద్ధికి,కళా,వినోదం,పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయి.ప్రజల ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలు,విద్యను అభ్యసించడానికి విద్యాసంస్థలు,ఇలా ఒక దాని కొకటి అనుబంధంగా వృద్ధి చెందాయి.ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి.నీళ్ళు ఘన రూపం,మంచు గడ్డల రూపంలో మరియు ద్రవ రూపంలో సముద్రాలు,నదులు,తటాకములు ఉన్నాయి.భూతలంపై ఆవిరితో వాయు రూపంలో మేఘాలు ఉన్నాయి.మహా సముద్రాలు,నదులు, తటాకాలు ఉపరితల జలాలతో నిండి ఉంటాయి. ఇసుక అనేది విచ్ఛిన్నమైన రాతి ఖనిజ కణాలతో ఏర్పడిన మిశ్రమం.ఇది ప్రకృతిలో లభించే విలువైన పదార్థం.ఇది పరిమాణం ద్వారా నిర్వచింపబడింది. కంకర కంటే చిన్నదిగా,మెరుగ్గా,ఓండ్రు మట్టి కంటే గరుకుగా ఉంటుంది.కాంక్రీట్ తయారీకి అనువైన ఇసుకకు అధిక డిమాండ్ ఉంది.నదులలో వాగులలో ఇసుక ఎక్కువగా ఉంటుంది.సిమెంటు, నీటిలో కలిపి తడపటం వలన అది గట్టి బండలాగా తయారవుతుంది.నిర్మాణ రంగంలో ఇసుకను ఎక్కువగా వాడుతారు.పునాదులలో మొదటగా ఇసుకను ఒక పొరగా వేసి కూరుతారు.దీని వల్ల నిర్మాణాలలో పగుళ్లు రాకుండా ఉంటాయి. చిన్న వాగులు,వంకలు మొదలుకొని నదుల్లోని పెద్ద రీచ్ ల వరకు భారీ ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతుంది.అక్రమార్కులు రాత్రి,పగలు తేడా లేకుండా వేల కొద్ది లారీల్లో,ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.పేరుకు ఏదో ప్రభుత్వ పథకానికి అని అనుమతులు తీసుకోవడం,లారీలు,ట్రాక్టర్లతో పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవడం పరిపాటి అయింది.ఇసుక విధానంలో ఉన్న లోపాలను ఆధారం చేసుకుని ఇసుక మాఫియా చెలరేగుతుంది. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట కురిపించాల్సిన ఇసుక తవ్వకాలు అక్రమార్కుల జేబులు నింపుతున్నాయి.డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రభుత్వాధికారులు చూసి చూడనట్టు వదిలి వేయడంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతున్నది. ఇసుక దందా అంతా రాజకీయ నాయకుల పర్యవేక్షణలో కొనసాగుతుంది.కవి జింబో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్లుగా అనగనగా ఒక వాగు ఉండేది.అలాంటి వాగుపై ఏ నగరం దాడి చేసింది ఏమో అని అంటున్నాడు.నగరం విస్తరణలో భాగంగా వాగులోని నీళ్లు అన్ని తోడేశారు.వాగులోని ఇసుకను కూడా తరలించారు అని కవి జింబో తీవ్రమైన ఆవేదనకు గురి అయినట్లుగా తోస్తుంది. వాగు కింద వేల ఎకరాల పొలాలకు నీళ్లు పారేవి. అట్టి వాగు ఎన్నో గ్రామాలకు త్రాగు నీరుగా ఉపయోగపడేది.వాగు ఇసుకతో ఎంతో మంది గ్రామాల జనాలు ఇల్లు కట్టుకున్నారు.అక్కడి జనాల బాగోగుల కొరకు తాగు నీరు మరియు సాగు నీరు కోసం ఉన్న వాగును నగరం వాళ్ళు వచ్చి నీళ్లను, ఇసుకను దోపిడీ చేయడం వల్ల వాగులో నీళ్లు లేవు. వాగులోని ఇసుకను తరలించి వాగు లేకుండా చేసిన స్థితిని,దుర్మార్గాన్ని,దోపిడిని ఎండగడుతూ కవి జింబో వ్యక్తీకరించిన భావం అద్భుతంగా ఉంది.
“అనగనగా
“ఓ చెరువుండేది
“ఎవరి కాంక్షకి బలయ్యిందో
“ఏమో –
“దాన్నిండా సర్కారు తుమ్మల్లా
“ఇండ్లు మొలిచాయి.
చెరువు అనేది నిశ్చలమైన మంచి నీటితో కూడిన చిన్న ప్రాంతం.ఇది ఒక నది లేదా ప్రవాహానికి భిన్నంగా ఉంటుంది.చెరువు సంస్కృతికి అనుకూలం.ప్రతి ఊరిలో చెరువులు ఉన్నాయి. చెరువు వద్ద బతుకమ్మ ఆటను ఆడుతారు.ఆట పూర్తి కాగానే ఊరి జనాలు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు.చెరువులో వినాయకులను నిమజ్జనం చేస్తారు.పల్లెటూరి కల్పవల్లి చెరువు. పల్లెలో చెరువు మీదుగా పక్షులు ఒక వరుసలో ఆకాశంలోకి ఎగురుతాయి.చెరువును జలాశయం అని అంటారు.చెరువు మంచి నీరు నిలువ చేయు ప్రదేశం.చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరి కొన్ని చెరువులు అడుగున ఊట బావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి.చాలా గ్రామములలో చెరువు నీరు త్రాగడానికి ఉపయోగిస్తారు.కొన్ని పెద్ద చెరువులు పంట పొలాలకు నీరు అందిస్తున్నాయి.పూర్వ కాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి చెరువులు త్రవ్వించారు.ఊర చెరువులు పశువులు కడిగేందుకు చాకలి వాళ్లు బట్టలను ఉతికేందుకు వినియోగిస్తారు.చెరువులు చేపల పెంపకానికి ఉపయోగిస్తారు.చెరువు మట్టిలో ఉండే సేంద్రియ పదార్థం,సూక్ష్మ ఇతర పోషక పదార్థాలను సమతూకంగా మొక్కలకు అందిస్తుంది.చెరువు మట్టి ఎర్ర చల్క,దుబ్బ నేల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించి,నేలల్లో సమపాళ్లలో గాలి,నీరు ఉండేట్లు చేస్తుంది.చెరువులు అనేక రకాల జీవులను సంరక్షిస్తాయి.చెరువుల వల్ల వ్యవసాయానికి నీరు దొరుకుతుంది.కొన్ని గ్రామాలకు చెరువు నీరే మంచి నీరు.చెరువు నీరును ఊరి జనాలు త్రాగుతారు. కొన్ని చెరువులలో ఊరి ప్రజలందరు స్నానం చేస్తారు.చెరువులోని నీరు పక్షులకు,పశువులకు తాగడానికి స్నానం చేయడానికి,శరీరం చల్లబడడానికి ఉపయోగపడతాయి.వేసవికాలంలో పిల్లలు చెరువులో ఈత నేర్చుకుంటారు.చెరువుల దగ్గర భూమి సారవంతంగా ఉంటుంది.అనగనగా ప్రతి గ్రామంలో ఓ చెరువు ఉండేది.అన్ని గ్రామాల్లో చెరువులు మాయమై పోయినాయి.చెరువు మీద చెరువు కట్ట చక్కగా చూపరులకు కనువిందు చేసేలా ట్యాంక్ బండ్ లాగా అగుపిస్తుంది.చెరువు నిండా నీటితో పక్షులతో కళకళలాడుతుండేది.చెరువు నీరు రైతులు తమ పొలాలకు పారించి అద్భుతమైన పంటలు పండించే వారు.ప్రతి గ్రామంలో చెరువు ఉండేది.వర్షాలు లేక కరువు కాటకాలతో గ్రామాల్లో చెరువులు ఎండి పోయాయి.పాడి పంటలతో కళకళలాడాల్సిన చెరువు కింద భూములు బీడుపోయాయి.పశువులు మేత లేక కబేళాకి వెళ్ళి పోయాయి.చెరువు ఎండిపోవడం వలన కొందరు కబ్జాదారులు చెరువు కింద ఉన్న గ్రామస్తుల భూమిని స్వార్థంతో కబ్జా చేసి ప్లాట్లు చేసి ఇళ్ల స్థలాలకు అమ్మేశారు.కబ్జాదారులకు స్వార్థపర రాజకీయ నాయకులు మరియు అధికారుల అండదండలు ఉన్నాయి.కబ్జాదారులు పెట్రేగి పోయి చెరువు స్థలాలను స్వాధీనం చేసుకొని అక్రమంగా అమ్మడం వల్ల చెరువు స్థలంలో ఇండ్లు ఏర్పడ్డాయి. చెరువు ఎండి పోతే ఏం జరుగుతుంది?చెరువు స్థలంలో సర్కారు తుమ్మలు మొలవడం ఆనవాయితిగా జరుగుతుంది.కాని ఇప్పుడు కబ్జాదారుల కాంక్ష వల్ల చెరువులు బలి అయిపోవడం జరిగింది.చెరువులో ఉండాల్సిన సర్కారు తుమ్మల స్థానంలో ఇల్లు మొలిచాయి. సమాజంలో కబ్జాదారుల కుట్రలకు అనుగుణంగా వారికి గల రాజకీయ నాయకుల,రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతో చెరువులు మాయమై పోవడం వింతైన విషయం ఏమీ కాదు.ఈనాటి సమాజంలో గ్రామస్తుల జీవన ఆధారమైన చెరువు మాయమైపోవడం చూసి ఆవేదనతో కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

రాజేందర్ జింబో

“అనగనగా
“ఓ ఇల్లుండేది
“ఎందరి స్పేస్ ప్రాబ్లమో
“ఏమో –
“దాని గుండె బరువుకు మించి
“ప్లాట్లు కట్టారు.
ఒక ఇల్లు మానవుల నివాసానికి ఉపయోగించే నిర్మాణం.ఇల్లుని గృహం అని కూడా అంటారు.ఇల్లు మనం నివసించే ప్రదేశం.ఇల్లు అనేది ప్రజలు నివసించే భవనం.ఒకే కుటుంబమునకు చెందిన వ్యక్తులు కాపురము ఉండిన దానిని ఇల్లు అని అంటారు.ఇల్లు గాలి,వెలుతురు చక్కగా ప్రసరించగలిగేలా ఇంటి నిర్మాణం ఉంటుంది.కవి అనగనగా అని చెబుతూ ఓ ఇల్లు ఉండేది.రోజులు గడుస్తున్నాయి.కుటుంబం పెరిగింది.ఆ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులకు నివాసం ఉండటానికి ఆ ఇల్లు ఇరుకుగా ఉండి సరిపోవటం లేదు.ఆ ఇంటిలోని వ్యక్తులు ఆ జాగలో అపార్ట్మెంట్ కట్టి అగ్గిపెట్టెలాగా ఒక దాని మీద ఒకటి బహుళ అంతస్తుల నిర్మాణం చేసి ప్లాట్లు కట్టారు.ఎప్పుడో కట్టిన ఆ పాత ఇంటికి కూడా గుండె ఉంటుంది అని ఆ ఇల్లుకు గుండెకు బరువు మించిన ప్లాట్లు కట్టారని ఆ ఇల్లు తన స్వగతం చెప్పినట్లుగా కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ వూరుండేది
“ఎవరి కండ్లు పడ్డాయో
“ఏమో –
“ఊరు మాయమైపోయింది.
ఒక ప్రాంతంలో గుర్తింపు పొందిన జనావాసాల సముదాయాన్ని ఊరు అని అంటారు.ఊరు అంటే పల్లె కన్నా పెద్దది,పట్టణం కన్నా చిన్నది.ఊరు అనగా కొద్దిమంది జనావాసాలు ఉన్న ప్రాంతం.కవి జింబో అనగనగా అని చెబుతూ ఓ ఊరు ఉండేది అని అంటున్నాడు.మరి ఆ ఊరి సంగతులు కథా కమామీషు ఏమిటో తెలుసుకుందాం.ఇవ్వాళ పట్టణాల్లో నివసించే వాళ్లంతా ఏదో ఒక ఊరికి చెందిన వారే.పాడి పంటలతో కళకళలాడుతున్న ఊరు కరువు బారిన పడింది.ఆరుగాలం కష్టం చేసి పంట పండించిన రైతులు సంవత్సరాల తరబడి కరువు రాజ్యం ఏలుతుంటే బతుకు గడవక ఊరిని విడిచి వలస బాట పట్టారు.ఊరి జనాలు తిండి లేక పస్తులతో ప్రాణాలు తీసుకోరు కదా! ఊరి జనాలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడో ఒక చోట బతుకు సాగుతుందనే ఉద్దేశంతో వలసలకు పాల్పడ్డారు.అన్నమో రామచంద్ర అని జనాలు ‌కడుపు చేత పట్టుకొని ఊరు విడిచి వలస బాట పట్టినారు.కరువు కాటకాలు ఒక వైపు,స్వార్థపూరిత రాజకీయ నాయకుల అనైతిక చర్యల వల్ల ఊరిలో ఉండాల్సిన జనం ఊరు విడిచి వలస పోవాల్సిన దుస్థితి ఏర్పడింది.కవి జింబో అనగనగా ఓ ఊరు ఉండేది అని చెప్పిన భావంతో కవితకు ప్రాణం పోశారు.ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వ నేతల నిర్లక్ష్యం వల్ల మరియు ప్రకృతి ప్రకోపం వల్ల మానవాళికి శాపంగా మారి ఊరి జనాలు గ్రామం విడిచి వెళ్లారు.పాడువడిన ఊరు దుస్థితిని తలుచుకుంటే కళ్ళనుండి కన్నీరు ఊబికి వస్తుంది. ఎవరి కన్నులు పడ్డాయో ఏమో ఊరు మాయమైపోయింది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ కోడి వుండేది
“అది ఉదయాన్నే నిద్ర లేపడం
“ఎవరికి నచ్చలేదో
“ఏమో –
“దాని గొంతు నొక్కేశారు.
కోడి ఒక పెంపుడు పక్షి.కోడిని ఆహారం కోసం ఇళ్లలో పెంచుకుంటారు.కోడి గుడ్లు,కోడి మాంసం ఆహారంగా తీసుకుంటారు.మగ కోడిని కోడిపుంజు అని ఆడ కోడిని కోడిపెట్ట అని అంటారు.కోడి ఉదయాన్నే లేచి తన గూటి నుండి కొక్కరోకో అని కూస్తుంది.కోడి కూయగానే ఊరిలోని జనాలు తెల్లవారుతుందని నిద్ర నుండి లేస్తారు.పట్టణాల్లో అయితే కోడి ఇళ్లలో ఉండదు.కోడి కూత విన రాదు.చదువుకునే పిల్లలు మరియు ఉద్యోగానికి వెళ్లే పెద్దలు అలారం పెట్టుకుంటారు.అలారం మోగ గానే నిద్ర నుండి లేస్తారు.ఊరిలో కూడా పట్టణ సంస్కృతి వచ్చింది. బాయిలర్ కోళ్ల పెంపకం పెరిగింది.చికెన్ సెంటర్ కి వెళ్లి చికెన్ కొంటున్నారు.పూర్వకాలంలో అలారం వలె పని చేసి ఉదయాన్నే నిద్ర లేపే కోడిని ఎవరికి ఇష్టం లేదో ఏమో దాని గొంతు కూడా నొక్కేశారు అనడం ఆశ్చర్యం కలిగిస్తుంది.నిజం చెబితే నిష్ఠురంగా ఉంది అంటారు.కోడి కూతతో నిద్ర లేచి రైతులు తమ వ్యవసాయ పనులకు వెళుతారు. రైతులు పొలానికి మరియు పెరట్లో చేనుకు నీళ్లు పారిస్తారు.పొద్దున నిద్ర లేవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.కోడి కూస్తే నిద్ర చెదిరిపోతుందని కోడిని లేకుండా చేసే దుర్మార్గపు సంస్కృతి మనకు ఎల్లెడలా కనిపిస్తుంది.కోడి గొంతు నొక్కేశారు అని కవి జింబో కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా ….
“ఓ సంస్కృతి వుండేది
“ఏ పడమటి గాలి కాటేసిందో
“ఏమో –
“అది శిల్పారామంలో అవశేషమై పోయింది.
ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు,వ్యవస్థలు,ఆచారాలు,వ్యవహారాలు సంస్కృతిలోకి వస్తాయి.ఈ సంస్కృతికి హద్దులు లేవు.అవి నిరంతరాయంగా మారుతుంటాయి.ఒక దానితో ఒకటి కలుస్తూ విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు,నమ్మకాలు,సంస్థలు,తరాలలో జరిగే మార్పులు,తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానం అన్ని కలిపి సంస్కృతి అంటారు. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు,వస్త్రధారణ,ఆటలు,విశ్వాసాలు, కళలు అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి.గతించిన కాలం గురించి,భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి.ఒక సమాజం చేసిన,వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు,వారి సంగీతం,కళ,జీవన విధానం,ఆహారం,శిల్పం,చిత్రం,నాటకం,నాట్యం, సినిమా ఇవన్ని ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి.ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం,సంపన్నత,జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావించబడతాయి. తెలంగాణలో ప్రాచుర్యంలో ఉన్న వినాయక చవితి, ఉగాది,ఏరువాక,అట్లతద్ది,భోగి, సంక్రాంతి,కనుమ, బోనాలు,బతుకమ్మ,దీపావళి,గ్రామదేవతల పూజలు.తెలంగాణ భాషలోని యాస సొగసులు, కట్టు బొట్టులలో సంస్కృతి విలువలు ఉన్నాయి. ఊరి వారి పిలుపులో బంధుత్వాలు,అనుబంధాలు ఉన్నాయి.ఇక్కడి రైతులు,వృత్తి కార్మికులు చాలా ప్రతిభావంతులు.మానవతా విలువలకు దర్పణాలు. తెలంగాణ పల్లెలు సంస్కృతికి పట్టుకొమ్మలు.ఇక్కడ నివసించే ప్రజలు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఊరి కింద చెరువులో నీళ్ళు ఊరి వాగులో నీళ్లు తాగి జీవించే వారు.కుమ్మరి కుండలు తయారు చేస్తాడు.కమ్మరి ఇనుప వస్తువులు తయారు చేస్తాడు.వడ్రంగి కర్ర పని చేస్తాడు.బతుకమ్మ పండుగలో ఆట పాట ఉంది.ఊరి వారంతా చెరువు దగ్గరకు చేరి బతుకమ్మ ఆడుకునే వారు.కుండను దేవుడుగా పూజించే సంస్కారంతో కూరాడును ఇంటిలో నిలుపుకుంటారు.గిర్నీలు లేని కాలంలో వడ్లను దంచి బియ్యం తీసేవారు.రోట్లో వడ్లను పోసి కుందెన పెట్టి రోకలితో దంచే వారు.రైతు వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజును సాగువాటు అంటారు. రైతులు జీవితంలో భాగంగా నాగలి కట్టి మొక్కుకుంటారు.ఎద్దుల్ని బాగా కడిగి కొమ్ములకు నూనె రాస్తారు.దేవుడిని మొక్కుకుంటారు. సాగువాటును రైతులు శుభకార్యంగా చేసే వారు. చెరువు పంటలకు నీరు అందించేది.ఊరిలోని బర్రెలు ఒకసారి చెరువులో మునిగేవి.ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి.మంచి చెడ్డలు పంచుకునే సంస్కృతి అంతరించి పోతుంది.ఊరి జనాలు రాత్రంతా మెలకువగా ఉండి నాటకాలు చూసే వారు. రాత్రంతా ఆడే ఆటలతో పాటలతో విలసిల్లిన పల్లె సంస్కృతి మాయమైపోతుంది.కుటుంబ సభ్యులు ఎవరికి వారే విడిపోతున్నారు.శిల్పారామం హైదరాబాదులోని మాదాపూర్ గ్రామంలో తెలంగాణలో ఉంది.సాంప్రదాయ భారతీయ చేతి పనుల పరిరక్షణకు వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో ఈ గ్రామాన్ని రూపొందించారు.ఏడాది పొడవునా రోజు ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్ హైటెక్ హబ్ నగరంలో 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శిల్పారామం సంప్రదాయం సాంస్కృతిక వారసత్వం యొక్క సుందరమైన వాతావరణాన్ని ఇస్తుంది.భారతీయ కళలు చేతి పనుల ప్రోత్సాహం సంరక్షణ కోసం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1992 సంవత్సరంలో ఈ వేదికను ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉప్పల్ ప్రాంతంలో మినీ శిల్పారామం ఏర్పాటు చేయబడింది.అనగనగా అని చెబుతూ ఓ సంస్కృతి ఉండేది.ఆ సంస్కృతి ఏమైంది? ఇప్పుడు ఆ సంస్కృతికి సంబంధించిన వాతావరణం మరియు రూపురేఖలు ఎక్కడ కనబడడం లేదు.అట్టి ఘనమైన సంస్కృతి ఎక్కడినుండో తుఫాను వలె దూసుకు వచ్చిన పడమటి గాలి కాటుకు గురై పోయింది ఏమో అని అంటున్నాడు.మన ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయం యొక్క వారసత్వం శిల్పారామం లోకి చేరిపోయింది అని ఆవేదనతో కవి జింబో వ్యక్తీకరించిన తీరు అద్భుతంగా ఉంది.
“అనగనగా …
“ఓ మనిషి ఉండేవాడు
“అతని మీద అతనికే కోపమొచ్చి
“తలని తీసి మానిటర్ ని
“తగిలించుకున్నాడు.
క్రోధం అనగా కోపం లేదా ఆగ్రహం.మన మనసుకి నచ్చక పోయినా లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారి పై మనకు కలిగే వ్యతిరేకతానుభూతిని,ఉద్రేకం లేదా కోపం అనవచ్చు.కోపం పర్యవసానంగా ఎదుటి వారిపై దాడి చేయటం,ఎదుటివారిని దూషించటం వంటి వికారాలు కలుగుతాయి.కోపం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపరచుకోవడం ఎంతైనా అవసరం.కోపం ప్రకృతి పరమైన సహజ ఉద్వేగం.ఇది జీవుల శరీర భౌతిక ధర్మం.నేల మీద మనుగడ సాగించే ప్రతి జీవి కోప లక్షణాన్ని తనలో ఇముడ్చకునే పుడుతుంది. జీవులు మనుగడ సాగించడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన రక్షణ ఆయుధం కోపం.కోపం వచ్చినప్పుడు మనుషులు అరవటం,తిట్టడం,అవమానపర్చటం, చేయి చేసుకోవటం,దాడి చేయడం, పగులగొట్టటంతో పాటు మౌన పోరాటం,నిరాహార దీక్ష, అలగటం,సహాయ నిరాకరణ అలాంటి రూపాలతో కోపాన్ని చూపుతారు.కోపాన్ని ప్రదర్శించడంలో వ్యక్తిగత వైవిధ్యాలే కాకుండా ఒక సమిష్టి ప్రయోజనం కోసం సామూహికంగా కోపాన్ని ప్రదర్శించే రూపాలు బందులు,దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు,మానవహారాలు కూడా ఉంటాయి. అనగనగా అని చెబుతూ ఓ మనిషి ఉండే వాడు.మనిషి అంటే ఎవరు?మనిషి అంటే ఒక వ్యక్తి.ఎందుకో తెలియదు? కొన్ని సమయాల్లో మనిషికి తన మీద తనకే కోపం వస్తుంది.అలాంటి కోపంలో మనిషి తన తలను తీసి కంప్యూటర్లో గల మానిటర్ కు తగిలించుకున్నాడు.అప్పటి నుండి మనిషి మెదడు ఉన్నప్పటికీ ఆలోచించడం లేదు. మనిషి తయారు చేసిన కంప్యూటర్ లోని మానిటర్ చెప్పినట్టల్లా పని చేస్తున్నాడు.మానిటర్ అనగా కంప్యూటర్ స్క్రీన్ లేదా పదాలను చిత్రాలను చూపగలిగే పరికరం.అనంతమైన జ్ఞానం ఉన్నప్పటికీ మనిషి తన మెదడుతో ఆలోచించడం మానేశాడు. కంప్యూటర్లోని మానిటర్ కు తన తలను తగిలించుకున్నాడు అని కవి జింబో కవితలో వ్యక్తపరిచిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ ఓ కల వుండేది
“ఏ పీడ కల దాన్ని కాటేసిందో
“ఏమో –
“కంప్యూటరే కలగంటుంది నేడు.
చాలా కలలు దృశ్యమానంగా ఉంటాయి.అంటే వాసన లేదా స్పర్శ వంటి ఇతర ఇంద్రియాలు, చిత్రాలు కలలలో ముందంజలో ఉంటాయి.నిద్రకు చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల,భావావేశాల,ఇంద్రియ సంవేదనల సందోహాలని స్వప్నాలు లేదా కలలు అంటారు. కలలు యొక్క అంతరార్థం ఏమిటో వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకు పూర్తిగా అర్థం కాదు.కల నిజం కావాలని కోరుకుంటాం.కాని ఆ కల జరిగే అవకాశం ఎక్కువ లేదు.మనలో చాలా మంది కునుకు తీయడం ప్రారంభమైన కొద్ది సేపటికే ఏవేవో కలలు వస్తుంటాయి.ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు,వింతలు,విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. కలలు కనడం రాత్రంతా జరుగుతుంది.మనం నిద్ర పోయే ముందు ఏమి ఆలోచిస్తామో లేదా మేల్కొన్న సమయంలో మనం చేసిన పనుల ద్వారా కల ప్రభావితం అవుతాయి.మరి కొందరికి పీడ కలలు వస్తుంటాయి.పీడ కల రాగానే నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు.పీడ కలలు భయానకంగా లేదా కలవర పెట్టే కలలు.దాదాపు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక సారి పీడ కలను కని ఉంటారు.పీడ కలలు రావడానికి కారణం అంటూ ఉండదు.భయానకంగా ఏదో చూడటం లేదా చదవడం,నిద్రలేమి,అనారోగ్యంతో ఉండటం, మరణం,శారీరక హింస,వెంబడించడం,వేటాడటం వంటి కారణాలు ఈ పీడకలలకు మూలం.కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలోని భాగం ఈ కలలు సాధారణంగా నిద్రపై ఎటు వంటి ప్రతికూల ప్రభావాలను చూపవు.అనగనగా అని చెబుతూ ఓ కల ఉండేది అని అంటున్నాడు.మనిషి నిద్రలో కల కనడం సహజమే.మనిషి నిద్రలో ఉండగా కలను ఏ పీడ కల వచ్చి కాటేసిందో ఏమో అని అంటున్నాడు. కలపై పీడ కల దాడి చేయడం ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.రోజులు మారాయి.కాని మనిషి ఇప్పుడు కల కనడం మానేశాడు.మనిషి ఎందుకు కల కనడం మానేశాడు అనే ప్రశ్నలు మనకు తలెత్తవచ్చు.ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి తయారు చేసిన కంప్యూటర్ కల గంటుంది.కంప్యూటరే మనిషిలా పని చేస్తుంది. మనిషి మాత్రం కంప్యూటర్ వచ్చినంక కలలు కనడం మానేశాడు అనే వాస్తవాన్ని లోకంలో జరుగుతున్న తీరును తెలియజేయడం అద్భుతంగా ఉంది.నేటి ఆధునిక కాలంలో కంప్యూటరే కల గంటుంది అని కవి జింబో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అనగనగా …
“ఓ కథ వుంది
“వినే నాథుడే లేడు.
కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ.కథ అనగా కల్పిత గద్య గ్రంధం.మన రాష్ట్రంలో చిన్న పిల్లలు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్న కథలు చెప్పడం బాగా అలవాటు.కథ ప్రకృతి అయితే కత వికృతి.జీవితంలోని ఒకానొక మహత్తర సత్యాన్ని అద్భుత శిల్ప నైపుణ్యంతో కళ్ళకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఒక మహత్తరమైన అనుభూతిలో నింపి పదే పదే వినాలనిపించేది, చదవాలనిపించేది గొప్ప కథ.ఎవరైనా లేనిది కల్పించి మాట్లాడితే కతలు చెప్పకు అంటాం.కల్పిత వృత్తాంతం కలిగినది కథ.అనగనగా అని చెబుతూ ఓ కథ ఉంది అని అంటున్నాడు.మనిషి జీవితంలో వేగం పెరిగింది.ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైనాయి.వ్యక్తిగత కుటుంబాలు వచ్చాయి. ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.ఎవరి సెల్ ఫోన్ వారిదే.ఎవరిని ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత కుటుంబాల్లో పెద్ద వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు గా ఉంటున్నారు. వాళ్లు తమ పిల్లలతో గడిపే సమయం తక్కువ. తక్కువ సమయంలో కథలు చెప్పే ఓపిక వాళ్లకు లేదు.కథలు చదివే వాళ్ళు కూడా తగ్గిపోయారు.ఒక రచయిత ఇంకో రచయిత రాసిన కథలు చదవడం లేదు.ఎవరి కథలు వారే రాసుకుంటున్నారు.కథ చెబితే వినే నాథుడే లేడు.కుటుంబంలో కూడా ఒకరి మాట ఒకరు వినడం లేదు.ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ వారు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటారు.ఒకరి గదిలోకి ఇంకొకరు వెళ్ళరు.ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ మాట్లాడుకోవడం అరుదు.సెల్ ఫోన్ తో జీవితాలు గడుపుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్ లో గేములు ఆడుతున్నారు. పెద్దలు సెల్ ఫోన్ ద్వారా కాలక్షేపం చేస్తున్నారు బంధువులు,ఇరుగు పొరుగు వారితో కలవడం కూడా తగ్గిపోయింది.అనగనగా ఒక కథ ఉంది.కథ వినే నాథుడే లేడు అని కవి జింబో కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.కవి జింబో మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇంటిదేవత

by Pothula Umadevi May 24, 2024
written by Pothula Umadevi

గంపకింద కోడి కొక్కొరొక్కో కొక్కొరక్కో అనికూస్తుంది పందిరి కింద గడెoచెల పoడుకున్న సిరిలచ్చిమికి మేల్కొచ్చింది కానీ లేవబుద్దికాలేదు మళ్లోసారి కొక్కరొకో కొక్కరొకో అన్నదికోడి. ఇగ లేసి శిఖ ముడుసుకొని బొట్టు సరిజేసుకొని చీపురుకట్ట పట్టింది. ఊడువoగ ఊడువoగ యాప చెట్టుకింద నాలుగు తట్టల కసువుఎల్లిoది నిన్న పొద్దుగూకి ఊడ్చిన కుప్పతోటి. ఎత్తి పెoట మీదపోసొచ్చి రోటి మీద కూసున్నది సిరిలచ్చిమి.

అంతలోనే బర్రెనుగొట్టొచ్చిన భర్త మల్రెడ్డి
ఏoదే చిన్నబోయికూసున్నవు లచ్చిమి అన్నడు.
నాతోటైతలేదయ్య ఊడిసిఊడిసీ నా రెక్కలుబోతానయి అన్నది లచ్చిమి
మొన్న యాకన్నకిద్ధామంటే నువ్వే వద్దంటివి ” మొదలు మంచిగా ముదిరింది కోస్తే తలుపు చెక్కలెల్తయ్ నాకీయమని ఒక్క తీరుగా బతిలాడితె నువ్వే వద్దంటివానాడు”… ఇచ్చేయనామరి ? అన్నడు మల్రెడ్డి. “ఇగ ఇయ్యిమరి నాతోటైతలేదు నీడ ఉంటదిగదా అనుకున్నగని” ఇగ ఇయ్యిమరి అని లేసి ఇంట్లోకి బోయింది
సిరిలచ్చిమి.

పన్నెండుగొట్టంగా సిరిలచ్చిమి చిన్న బిడ్డ లలిత ఉరికొచ్చి అమ్మా….. యాకన్న మామ మన యాపచెట్టు కొడ్తాండు వద్దని చెప్పవే…. నా బొమ్మరిల్లుoదాడ… అన్నది
అవును బిడ్డా “మీ బాపూ…చెట్టు అమ్మిoడు ఆ మావకు.” ఆళ్లదే… కొట్టుక పోనీ అన్నది. తల్లి మాటలకు గుడ్లల్ల నీళ్ళు చెంపల మీదికిగారతాoటే లలిత ఇంటిముందుకిపోయి కూసున్నది ఆసాంతం చెట్టు నరికి తీసుకు పోయే దాకా పానమంటి నేస్తాన్ని తీసుకో పోయినట్లు చూస్తూ….

ఓ నాలుగు రోజులు గడిచినంక ఒక నాడు పొద్దుగూకి దిగులుతో కూర్చున్నది లక్ష్మి
అంతలోకే మల్రెడ్డి వచ్చి ఏమైంది లచ్చిమి అట్లున్నావ్? అన్నాడు ఇయాల పక్కూరి పార్వతమ్మ వచ్చి పోయింది నిరుడెండాకాలమంతా మన యాప కాయలు ఏరుకపోయింది మొన్న ఎన్నడో చేనుకు పురుగు పట్టకుండా వేయడానికి యాప గింజలు కావాలని ఎవరో వచ్చి 4000 రూపాయలు ఇచ్చి తీసుక పోయింరట. వద్దంటాంటె నా చేతుల 500 పెట్టి పోయింది ” మీ చెట్టు కాయలే కదా “అనుకుంటా… అన్నది సిరి లచ్చిమి బాధగా నిట్టూర్పుతో… దానికి మనకు రుణం తీరిపోయింది మనసు నిమ్మలం చేసుకో అన్నాడు మల్రెడ్డి.

చెట్టు పోయినా ఆ బొమ్మరిoట్లనే ఆడుతున్నది లలిత రోజూ.
వారం రోజులకు ఓనాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అడ్డం పడ్డది లలిత.
సిరిలచ్చిమి గాబరపడి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే అన్ని పరీక్షలు చేసి ,”పాపను ఎండలు తిప్పింరా వడ దెబ్బ కొట్టింది…ఎండల ఆడిందా? అని చెప్పి మందులు రాసిచ్చిoడు. పార్వతమ్మ ఇచ్చిన 500 పెట్టి మందులు తెచ్చిన… కసాయిదాన్నై చెట్టుకొట్టిచ్చినా కూడా ఇంటి దేవతై నా బిడ్డను ఆదుకున్నది పది రోజులకు గానీ లేవలేదు బిడ్డ.
అప్పుడు లచ్చిమి బాధతో తoడ్లాడుతూ కన్నతల్లిలాంటి చెట్టును పోగుట్టుకుంటినే…. అని వెంటనే ఒక యాపచెట్టు తెచ్చి మళ్లీ నాటిoది…. అప్పుడే వచ్చిన
లలిత అమ్మ కొంగు పట్టుకొని అమ్మా… ఈ చెట్టు ఎప్పుడు పెద్దగయితదే అని అడిగింది అమాయకంగా…పోయిందేదైనా తొoదరగారాదు బిడ్డా అన్నది తాను చేసిన తప్పుపనికి బాధపడుతూ…

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మేడే పండగ

by Y. Chandra Kala May 24, 2024
written by Y. Chandra Kala

వారు నాడు రాణి వాసపు స్త్రీల పల్లకీల మోసిన బోయిలు
ప్రపంచ వింత అయిన తాజ్ మహాల్ కి రాళ్ళు మోసిన కూలీలు

గుళ్ళు, గోపురాలు, ఇళ్ళు, వాకిళ్ళు బహుళ అంతస్తులు
కట్టే శ్రామికులు

నిత్యం గనుల్లో, కర్మాగారాల్లో కష్టించి పనిచేసే కార్మికులు
రక్తాన్ని చెమట చుక్కలుగా కార్చే
బడుగు జీవులు

నవ్య భవంతుల నిర్మాణం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమ జీవులు

తాము మాత్రం రహదారి ప్రక్క
తడికల్లోనే కాపురముండే
అభాగ్యులు

ఎన్నడు రానున్నదో క్రాంతి
సమసమాజ స్థాపన తోనే శాంతి

అప్పుడే అందగా నిండుగా నిజంగా సందడిగ
జరుపుకుందాం మెండుగా మేడే పండగ**

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చిన్న కుటుంబం,చింత లేని కుటుంబం

by Pratyusha Itikyala May 24, 2024
written by Pratyusha Itikyala

నేను గజిని లెక్క. ఒకసారి చూసిన మొహం, విన్న పేరు అంత బాగా గుర్తుండవు. నాతో కాసేపు మాట్లాడి, మీ పేరు మీరే చెప్తే అప్పుడు మీ గొంతులో మీ పేరు, ఆ పేరుకి ఒక మొహం నా బుర్రలో ఫీడ్ అవుతాయి.

అలాంటి నాకు నా పెళ్ళికి ముందు పెద్దగా పెళ్లిళ్లకు వెళ్ళే అలవాటు అవసరం, అవకాశం కూడా లేవు. ఇంటరు వరకు చదువు చదువు అని హోం అరెస్ట్. ఆ తరువాత చదువు ఉద్యోగం కోసం రాష్ట్రం బహిష్కరణ.

కట్ చేస్తే నా పెళ్లికి పదిహేను వందల మంది అతిథులు. అందులో నాకు తెలిసింది తిప్పి తిప్పి కొడితే వంద మంది. ఏదో ప్లాస్టిక్ నవ్వుతో పెళ్లి అయిపోయింది.

ఆ తరువాత చూస్కోండి ఇంటికి ఏ పెళ్లి శుభలేఖ వచ్చినా ఇదే తంతు.

“వీళ్లు నాకు తెలియదు. నేను పెళ్లికి వచ్చి ఏం చేస్తాను అత్తమ్మా? పైగా సెలవు కూడా లేదు.”

“దగ్గరి వాళ్ళేనే. మా చిన్నమ్మ ఆడిబిడ్డ మేనల్లుడికి మరదలు. ఆళ్ళ మొగుడు మా మారక్క మనుమరాలు అత్త ఏరాలి తమ్ముడే. రెండు దిక్కుల దగ్గరే కదా. సెలవు పెట్టు. వెళ్లక పోతే బాగుండదు.”

వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ఆట మొదలు. ఆ చిన్నమ్మ ఆడిబిడ్డ దగ్గరే నా బుర్ర వాళ్ళ మొహాలు, పేర్లు వెతుక్కుంటూ “Error 404 Not Found” అని తెల్ల మొహం వేస్తుంది.

అలా హాజరు అయిన పెళ్లిళ్ల సాక్షిగా ఆ పెళ్ళిళ్ళలో మరో సీన్ రిపీట్

“ఈమెను గుర్తు పట్టినవా?

ఆరోజు చెప్పిన గదా. మా పెద్దాడిబిడ్డ వాళ్ళ అత్త తల్లిగారు వీళ్ళ ఊరే. చిన్నప్పుడు ఒకసారి వెళ్లి వాళ్ళ ఇంట్లో తిన్నం. మంచి మనుషులు.”

ఈలోపు నా బుర్ర మీ పేరెంత.. సారీ..పేరేంటి, మాకు ఏమవుతారు అని అడగాలని ప్రయత్నిస్తూ ఆ వరసల పురాణం ఎప్పుడు తెగేను అని స్విచ్ ఆఫ్ అయిపోతుంది.

ఇహ ఎంతో పరిచయం ఉన్నవాళ్ళ లాగా వాళ్ళే దగ్గరికి వచ్చి మనం నమస్కారం చేశాక “హే నన్ను గుర్తు పట్టావా, నా పేరేంటి చెప్పుకో చూద్దాం” అన్నప్పుడు వెయ్యి ఓల్టుల కరెంటు షాక్ కొట్టి మెదడు మొత్తం కొయ్యబారిపోయినట్టు ఉంటుంది..

అదండీ నా అశక్తతకు అంచనాలకు మధ్య యుధ్ధాలు నా సహనాన్ని అలా పరీక్షిస్తూ ఉంటాయి. ఎవరైనా పూనుకుని ఎదుటి వాళ్ళ మొహం స్కాన్ చేసి మన ఫోన్ మీద వాళ్ల పేరు, ఊరు, మనకు ఏమవుతారు లాంటి వివరాలు వచ్చేలా ఒక యాప్ చేస్తే బాగుండు.

May 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక క్రూరమైన మారుతల్లి మరియు పన్నెండు మంది యువకులు

by ఒద్దిరాజు మురళీధరంరావు May 22, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్‌. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.
రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.
రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్‌ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్‌ దుస్తులు ఉండేవి.
అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.
ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్‌ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.
మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి  మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్‌ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.
మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి  జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్‌ సిస్టర్‌ పియర్‌ మేన్స్‌ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.

May 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us