మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

సామాజిక సమస్యలపై కరిగిన మానవతా శిల్పం

by Aruna Dhulipala November 24, 2023
written by Aruna Dhulipala

‘రచ్చబండ’ నాటక సంకలనం….పరిశీలనా వ్యాసం

నాటక రచయితగా, కవిగా సామాజిక పరమైన వివిధ అంశాల నేపథ్యంతో సందేశాత్మక రచనలు చేసి పలువురి ప్రశంసలకు పాత్రులై, నంది పురస్కారాలను అందుకొన్న రావుల పుల్లాచారి గారు రచించిన ‘రచ్చబండ’ నాటకాలను పరిశీలిద్దాం.
“కావ్యేషు నాటకం రమ్యం”, “నాటకాంతం హి సాహిత్యం” అన్నాడు మహాకవి కాళిదాసు. కావ్యాలలో నాటకం కడు రమ్యమైంది. అలాగే సాహిత్యంలో అన్ని ప్రక్రియలు స్పృశించాకే నాటకాన్ని స్పర్శించాలన్నాడు. వాటి పట్ల అవగాహనతో నాటకం రచించడం సరియైనదని ఆయన నొక్కి వక్కాణించారు. దీన్ని బట్టి నాటకాలకున్న విశిష్ట స్థానం మనకు తేటతెల్లం అవుతుంది. ప్రాచీన కాలం నుండీ దృశ్యకావ్యాలుగా పరిగణించబడిన నాటకాలు లలితకళల సమాహారాలు. నవరస నటనానురక్తికాలు. నన్నయ్య తన భారత అవతారికలో ” కావ్య నాటకముల్ పెక్కు జూచితి ” అని ప్రస్తావించడాన్ని బట్టి ఆనాటికే నాటకాలు ఉన్నట్టు మనకు తెలుస్తున్నది.

అలనాటి నుండి ఇప్పటివరకు నాటకాలు జనరంజకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొదట్లో పౌరాణిక నాటకాలు మొదలై భక్తిభావ భరితాలై
పద్యాలు, గేయాలు, కీర్తనలు, భజనలతో జనులను
ఉల్లసింప చేసేవి. రాను రాను సామాజిక చైతన్య దిశగా
సంఘంలోని అన్యాయ, అక్రమాలను ఉటంకిస్తూ సందేశాత్మకంగా సాగుతూ వచ్చినవి. దేశ స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలలో దేశభక్తిని పెంచేందుకు
నాటకాలు ఉత్ప్రేరకాలుగా తోడ్పడడమే కాక ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయి.
ఇరవయ్యవ శతాబ్దం తెలుగు నాటక రంగానికి గొప్ప భూమిక అని చెప్పవచ్చు. ఎంతోమంది నాటక కర్తలు ఈ రంగాన్ని ఎప్పటికప్పుడు సుసంపన్నం చేస్తూనే ఉన్నారు. అట్టివారిలో తెలంగాణ నుండి నాటకరంగంలో విశేష కృషి చేసి ‘నంది’ పురస్కారాన్ని అందుకున్న రావుల పుల్లాచారి గారు పేరెన్నిక గన్నవారు.
ఆరు దశాబ్దాలు తెలంగాణా ప్రజలతో మమేకమై వారి సాధక బాధకాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఆయనది. తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాలలో భాగస్వామ్యం వహించిన ఘనత ఆయనది. వారు 50కి పైగా కథలు, 20కి పైగా నాటకాలు రచించారు. ఆయన రచనల్లో తెలంగాణ భాష, యాస, ప్రజల కష్టాలు అన్నీ సమ్మిళితంగా మనకు కనిపిస్తాయి. ఆయన తెలంగాణా ప్రజల మనిషి. తాను రాసిన కథలనే నాటకాలుగా
మలచడం వీరి ప్రతిభకు గీటురాయి.

ఇవి “రచ్చబండ” పేరుతో సంకలనంగా ముద్రించబడ్డాయి. ఇందులో ఉన్న ఎనిమిది నాటకాలు సమాజంలో జరుగుతున్న అంశాల్ని ప్రత్యక్షంగా మనముందు నిలబెడతాయి.
“బాకీ పడ్డ బ్రతుకులు” అనే నాటికలో
గ్రామాల్లో ఉండే భూస్వాములు నిరక్షరకుక్షులైన అమాయక ప్రజలను ఎట్లా మోసం చేస్తారో, ఖాళీ కాగితాలపైన వేలిముద్రలు వేయించుకుని వారి తర్వాత తరాలను కూడా ఎలా బానిసలుగా మార్చుకుంటారో భుజంగం పాత్ర ద్వారా చూపిస్తారు. ఆ దుర్మార్గుడి దాష్టీకానికి గౌరి అనే ఆడపిల్ల బతుకు బుగ్గి అవడం చూసి, విద్యాధికుడైన విజయ్ ఏ విధంగా భుజంగానికి బుద్ధి చెప్తాడో, అన్యాయానికి గురై తండ్రిని కోల్పోయిన గౌరి జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుతాడో చూపబడింది.
ఇక “రచ్చబండ” అనే నాటిక…పుల్లాచారి గారికి
ఉత్తమ రచయితగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు గాను ప్రతిష్టాత్మకమైన రెండు నంది అవార్డులను అందించిన నాటిక. ఇది దాదాపు 50 కి పైగా ప్రదర్శనలు జరుపుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీన్ని బట్టి ఈ నాటిక ఎంత ప్రాచుర్యాన్ని సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో ఆత్మాభిమానం గల రైతు మల్లయ్య. ఊళ్ళో అందరిచేత పిల్లలమర్రి పెద్ద మల్లయ్య అని పిలువబడతాడు. తన పిల్లలకోసం ఉన్న భూమిని అమ్ముకుని, బర్లు కాస్తూ బతుకుతుంటాడు. ఆ బర్రెలు శివయ్య పొలాన్ని తొక్కి పాడుచేసాయనే ఒక నెపంతోను, ఆ బర్రెలలో పింజారి భద్రయ్య బర్రె ఒకటి మాయమవడం, దాన్ని మల్లయ్యే దొంగిలించి అమ్ముకున్నాడనే మరో నెపం తోను శివయ్య, భద్రయ్య మల్లయ్యను అవమానిస్తారు. పంచాయతీలో తేల్చాలనుకుంటారు. ఎంతో ఆత్మస్థైర్యం కలిగి ఎవరికీ తలవంచని మల్లయ్య, పంచాయతీకి వెళ్లడం తలవంపులుగా భావించి, ఆ అవమానభారాన్ని తట్టుకోలేక, మానసిక క్షోభకు గురయి మరణిస్తాడు. రచయిత ఈ సన్నివేశాన్ని పాఠకుల గుండె లోతుల్లోకి తీసుకొని పోయి కంట తడి పెట్టిస్తారు. కొసమెరుపు ఏంటంటే మాయమైన బర్రె పక్కవూర్లో నుండి ఈ ఊళ్ళో ప్రత్యక్షం అయి మల్లయ్య నిర్దోషిత్వాన్ని నిరూపించడం. కానీ అప్పటికే చేయని నేరాన్ని తలపై మోయలేక తీరని మానసికవేదనతో ప్రాణాలు కోల్పోతాడు మల్లయ్య. అప్పుల బాధలో, కరువు కాటకాల వల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనకు సాధారణమై పోయింది.. కానీ ఇందులో విభిన్నకోణంలో మల్లయ్యను మనకు చూపిస్తారు పుల్లాచారి గారు. మనిషికి ఉండే ఆత్మాభిమానం ప్రాణం కన్నా విలువైనదన్న సత్యాన్ని మరోమారు నిరూపిస్తారు.

దీంట్లో..మోకాళ్ళు నాయి కాకుంటే కాశి దాకా దేకొచ్చు/ కన్ను మిన్ను కానకుండడం/ కాకి తన్నిన బతుకాయె/ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం/ గంజిల ఈగను తీసి పారేసినట్లు తీసి పారేయడం/ తాకిన ఏలుకే పొట్రౌతు తాకినట్టు అయింది/ నూతిల పడ్డొని మీద నూరు రాళ్లు ఏయకండి/ తాడు తన్నే వాడుంటే, వాడి తలదన్నే వాడు ఉంటడు…లాంటి సామెతలు, జాతీయాలు సందర్భానుసారంగా ప్రయోగింపబడుతూ తెలంగాణా యాసకి వన్నె తేవడమే కాక నాటకానికి అలంకారాలయ్యాయి.
“ఓ ప్రేతాత్మ దిగిరా” అనే నాటికలో క్షుద్రపూజల పేరిట జరిగే మోసాలు, ప్రజలు ఎంత మూఢంగా ఇలాంటి వాటిని నమ్మి తమ జీవితాలను నరకప్రాయం చేసుకుంటారో చెప్తూనే వారి పన్నాగాలను తిప్పికొట్టే ఎమ్ ఎస్ సి విద్యార్థులు నవీన్, గీతాంజలి పాత్రల ద్వారా వాటిని దూరం చేయడానికి ప్రయత్నిస్తారు.
“మనసు చెక్కిన శిల్పం” లో కళాకారులను సమాజం ఎంత నిరాదరణకు గురి చేస్తుందో స్పష్టీకరిస్తారు. “గంగిగోవు పాలు” నాటికలో గోవుల యజమానులకు మాయమాటలు చెప్పి, వాటిని కబేళాలకు అమ్మే దళారుల అన్యాయాలను ఎండగడతారు. “ఈ వేస్తున్న అడుగు ఎటు” అనే
నాటికలో నిరుద్యోగులైన యువకులు వ్యామోహాల వలలో చిక్కుకొని డబ్బు సంపాదనకు అక్రమమైన మార్గాలను ఎన్నుకోవడం కనిపిస్తుంది. ఇందులో ఒకచోట ” అవినీతి అవినీతి మీద చెలామణి అవుతుంది” అని ప్రయోగించిన వాక్యం సమాజంలో అవినీతి వేళ్లూనుకున్న విధానాన్ని తెలియచేస్తుంది.
” ఆట” అనే నాటిక బతుకు తెరువుకోసం వచ్చిన కోతులాడించే తండ్రీ కూతుళ్ళ జీవితాన్ని కాముకుడైన
సర్పంచ్ ఎట్లా కష్టాల్లోకి తోయడానికి ప్రయత్నించాడో చెప్తుంది. ఇక చివరగా ” రిటర్న్ గిఫ్ట్ ” అనే నాటికలో నేటి సమాజంలో తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను చదివిస్తే వాళ్ళను వదిలి విదేశాలకు వలసపోతున్న వారసుల అవివేకాన్ని, తల్లిదండ్రుల ఆవేదనను హృద్యంగా వర్ణించారు.
ఈ నాటికలలో రచయిత మనలను సామాజిక, మానవీయ ఆలోచనాపథంలోకి తీసుకెళ్తారు. ప్రతీ నాటిక సమాజంలో జరుగుతున్న సత్యదూరం కాని
అంశాలతో రూపొందించబడింది. సమస్యను చూపిస్తూనే ఆ సమస్య పరిష్కారంతో ముగింపు నివ్వడం ఆయనలోని ఆశావహదృక్పథానికి తార్కాణం.
” జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం – నాటకానికి ప్రతి స్పందించేదే జీవితం ” అన్నట్లు మనిషి జీవితాన్ని తన నాటకాలకు వస్తువుగా తీసుకొని మనస్సులను కదిలించడంలో కృతకృత్యులైనారు. వారికి భగవంతుడు చక్కటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి విలువైన రచనలు కొనసాగేటట్లు అనుగ్రహించాలని కోరుకుందాం.

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహోన్నత వ్యక్తి గుంటూరు శేషేంద్ర శర్మ

by Cheedella Seetha Lakshmi November 24, 2023
written by Cheedella Seetha Lakshmi

ఆధునిక కవులలో గుంటూరు శేషేంద్ర శర్మ గారికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన ప్రముఖ కవి, విమర్శకులు, తెలుగు భాషే కాక ఆంగ్లము,హిందీ, సంస్కృత భాషలలో కూడా దిట్టగా ప్రసిద్ధి చెందారు. ఆయన “కాలరేఖ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు.

ఈయన రచనలు చదివి ముగ్ధులై అనేకమంది తమ అభిప్రాయాలను లేఖాముఖంగా వెల్లడించారు. శేషంద్ర కావ్యభూమిక (చర్చలు,లేఖలు) యుగ కవి శేషేంద్ర చర్చలు, లేఖలు ఈకోవకు చెందినవే పుస్తక రూపంలో ప్రకటించబడ్డాయి. కానీ స్వయంగా శేషేంద్ర ఉత్తరాలు అంటూ ఏమీ లేవు. శేషేంద్ర కావ్య ప్రశంస, రచనా తీరుతెన్నులు, కావ్య జగత్తులో శేషేంద్ర స్థానం మొదలైనవి లేఖల వల్ల తెలిసే అవకాశం ఉంది.

“నా దేశం నా ప్రజలు” శేషేంద్ర కలం నుండి జాలువారిన కృతి. ఈ కావ్యం హిందీ భాష లోకి “మేరీ ధర్తీ మేరీ లోగ్” పేరుతో ఓం ప్రకాష్ నిర్మల్ గారు అనువాదం చేయగా “My country my People” అను పేరుతో శేషేంద్ర స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి అంతర్జాతీయ ఖ్యాతి పొందారు.

నా దేశం నా ప్రజలు కావ్యం పై పలువురి అభిప్రాయాలు:

“ఆర్.ఎస్. సుదర్శనం”: వచన కవిత్వం కాదు ప్రవచన కవిత్వమని చెబుతూ “ఎత్తుగడలో దృక్పథంలో, ఇతివృత్తంలో, నిర్మాణ సౌష్టవంలో విలక్షణమైన నూతన సృష్టి అని ప్రస్తుతించాడు.

“అమరేంద్ర”: కవిత్వం బాగుందని మెచ్చుకుంటూనే రసావేశం ఒక ఇతివృత్తంలో ఒదిగితే ఇతిహాసానికి పరిపూర్ణత రాగలరని నా భావం” అంటూ విమర్శించారు.

“అద్దేపల్లి రామ్మోహన్ రావు”:

ప్రతి పంక్తిలో కవిత్వం ఉందంటూ “సింబాలిక్ గా మిస్టిక్ గా ఇమేజిస్టిక్ గా మీరు చెబుతున్న భావాలు పతితలో గొప్ప అనుభూతిని కలిగించగలవు” అంటాడు.

మాదిరాజు రంగారావు “ఆధునిక చైతన్యానికి ప్రతినిధి”ఈ కావ్యం అంటాడు.

“అనుముల కృష్ణమూర్తి”:

“ఆగమైన ఆంధ్రాన్ని మరింత ఆగం చేసి కోతిలా ఆడిస్తున్నారు గాడిద కొడుకులు. వాల్మీకి, భవభూతుల అంశతో ఈ కాలంలో జన్మిస్తావా… ఆంధ్రప్రభ లో ఇద్దరు పచ్చి బజారు లంజల మధ్య ఎగతాళికి గురైన ఏ పార్వతి తల్లి వలెనో ఉంది నీ కవిత” అనే భావాన్ని వ్యక్తపరుస్తూ ఎంతో విన్యాసం చూపిస్తూ రచన చేశాడు అంటాడు.
ఈ కాలంలో కవిత్వం సరిగా రావడం లేదు. శేషేంద్ర కవిత్వం చాలా గొప్పదని ప్రస్తుతించాడు.

డాక్టర్ భాను “ఒక మాటలో చెప్పాలంటే ఒక చెంబులో అంబుధి ఇముడుస్తాడు వాస్తవ మానవతను ధరిస్తాడు” అని వివరించాడు.
ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి:
“ప్రాక్ పాశ్చాత్య సాహిత్య పరిజ్ఞాన సమృద్ధి ఇందులో స్ఫుటంగా కనబడుతుంది” అని ఆవేశం, ఆలోచన మీ కవిత్వంలో ఉందని అంటాడు.

మండే సూర్యుడు కావ్యం పై పలువురి అభిప్రాయాలు:

“నాగభైరవ కోటేశ్వరరావు”:

“తన కవితా కిరణ సందోహంతో కవితాప్రియుల జడత్వాన్ని మంచులాగా కరిగించాడు. నిజమైన కవితానందాన్ని అందించాడు”. అంటూ ఈ కవిత్వంలో సింబాలిజమ్ ఉంది అని చెప్పాడు. నాగరికతకు మూలం శ్రమ, చెమట బిందువు అని కవి విశ్వాసం. చెమటబిందువు శ్రమజీవికి ప్రతీక. శ్రమజీవి మండే సూర్యుడు. శ్రమజీవి లోక శ్రేయస్సును కోరినట్లే మండే సూర్యుడు లోక కళ్యాణ కారకుడే.

“కలచవీడు మురళీధర్”:

“నూతన దృక్పథంతో ప్రాచీన నవ్య రీతులను మేళవించి విప్లవ పంథాలో నడిపిన గేయ సంకలనం”అంటాడు.

“రక్తరేఖ పై పలువురి అభిప్రాయాలు

శేషేంద్రగారి డైరీయే రక్తరేఖ
మాలతీ చందూర్ గారు 1952-74 మధ్య కాలంలో “మీ ఊహల్లో విహరించిన విహంగాలకు, ఆలోచనలకు
నిక్షిప్తం చేసిన ఈ రచన హృదయ కమలాన్ని అరుణ కిరణంతో స్పందింపజేసే రక్తరేఖ” అంటారు.

జానకీ జానీ గారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ అందరూ కవులమని చెప్పుకుంటారు కానీ,వివిధ విషయాల మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నవాళ్లు అరుదు అంటారు.

“ఋతుఘోష కావ్యం పై అభిప్రాయాలు:

శ్రీ శ్రీ తన అభిప్రాయాన్ని కవిత రూపంలో వెల్లడిస్తూ “నీ పోయెమ్స్ నన్ పసంద్ చేసేన్”అంటూనే

“శ్రీనాధుని క్రీడల్లో
అల్లసాని వాడల్లో
కూడా దొరకని పద చిత్రం
విచిత్రం కడు పవిత్రం
ధుమాగా ఉంది ఇమేజి రమారమి కవుల సమాధి”

అంటూ శేషేంద్ర గారి నూతన పద వైచిత్రీ ప్రయోగాన్ని ప్రశంసించాడు.

పుట్టపర్తి నారాయణ చార్యులు గారు తన అభిప్రాయం తెలుపుతూ:

పింగళి సూరన, నన్నయ, తిక్కన, శ్రీనాథులను శేషేంద్ర పుణికి పుచ్చుకున్నాడు అని అంటూ “శర్మ గారికి ప్రాచీన సాహిత్యం పై గౌరవం ఉంది,నవకవులపై సానుభూతి ఉంది. ఆస్తికత ఉంది. సంశయమూ ఉంది. బీదలపై సానుభూతి, వారు బాగుపడలేదేమోనని అక్కసూ,కర్మవాదంపై విశ్వాసమూ ఇన్ని భావాల మధ్య నలిగిన, నలుగుతూ ఉన్న ఆత్మ పెట్టే ఘోష “ఋతుఘోష” అని వ్యాఖ్యానించారు.

“ఆచంట జానకిరామ్ గారు”: ఋతుఘోష కావ్యాన్ని ఋతువులను వర్ణిస్తూ
ప్రతి ఋతువు చివర ఒక పద్యమో రెండు పద్యాలో బీదవారి గురించి, అనాధల గురించి,ఆకలి దప్పికలతో అలమటించే వారిని గురించి జాలికరమైన, ఒక్కొక్కప్పుడు బాధాకరమైన వర్ణన ఉంటుంది. నా దృష్టిలో ప్రధానంగా ప్రకృతి రమ్యతను గురించిన ఈ కావ్యం లో అటువంటి ప్రస్తావన తెచ్చి పెట్టుకున్నట్లు ఉంటుంది. ఆ విషయాలను గురించి వేరే రచనలు సాగించవచ్చు. తీరిక ఉండి, ఓపిక ఉంటే. కానీ ఇక్కడ అవి పానకంలో పుడకలు లాగా అడ్డు తగులుతూ ఉండటమే కాక ఈ సందర్భంలో అటువంటి ప్రస్తావన
చేస్తున్నప్పుడు కవికి సహజంగా ఉండవలసిన నిజాయితీ కొంత కొరవడుతున్నట్టు తోస్తుంది” అని విమర్శల వర్షం గుప్పించారు.

“శశాంక గారు” శర్మ గారిని కవి పండితుడని అంటూనే పశ్చిమాన బిఎస్ ఇలియట్ తోనూ,తూర్పున జగన్నాధ పండితరాయలతోనూ పోల్చవచ్చును అంటారు.

స్వర్ణ హంస గ్రంథం పై అభిప్రాయాలు:

సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు భట్టహర్షనైషద కావ్యమును గూర్చి వ్రాయబడిన విమర్శ గ్రంథం అని అంటూనే ఇది
“పీహెచ్ డి” డిగ్రీ కొరకు రాయబడిన విమర్శ వ్యాసం వలె ఉన్నది అని అభిప్రాయపడ్డారు.

_కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి” గారు నైషధీయ చరిత్రము అనగా జీవుని చరిత్ర మనియూ, హంస గమనము యోగానుష్టానమనియూ చెప్పి కావ్య గత శ్లోకార్థాలను వివరించే పద్ధతి శాస్త్ర సమ్మతముగా ఉందన్నారు.

నరుడు నక్షత్రాలు గ్రంథం పై విమర్శ:

ఇది వ్యాసాల సంపుటి. చక్కని విమర్శనాత్మక, పరిశోధనాత్మకమైన వ్యాసాలని శివప్రసాద్, జగన్నాథ్ సూచించడం జరిగింది లేఖల ద్వారా.

ఈ విధంగా పరిశీలించినట్లయితే కేవలం శేషంద్ర కావ్యాలపై వచ్చిన అభిప్రాయములకే ఈ లేఖలు పేర్కొనడం జరిగింది అని చెప్పవచ్చు.

శ్రీశ్రీ,విశ్వనాథ,జలసూత్రం, సన్నిధానం,దివాకర్ల, పుట్టపర్తి, వేలూరు శివరామశాస్త్రి ఇలా ఎంతోమంది విజ్ఞుల చేత కొనియాడబడటం బట్టి శేషేంద్ర రచనా వైభవాన్ని అంచనా వేయవచ్చు.

ఇలా ఆఫునిక కవులలో, పండితులలో శేషేంద్రకు గల సముచిత స్థానం ఈ లేఖల ద్వారా విదితమవుతుంది.

జీవన చిత్రం

తెలుగు సాహిత్యంలో తనదైన బాట వేసి నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అంటూ ఒకే పాటతో తెలుగు సినిమా పరిశ్రమలో తన పేరు నమోదు చేసుకున్న ప్రముఖ రచయిత,విమర్శకుడు ఆధునిక సాహిత్య పోకడలు రుచి చూపిన డా.గుంటూరు శేషేంద్ర శర్మ నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా లోని నాగరాజుపాడు గ్రామంలో సుబ్రహ్మణ్య శర్మ,అమ్మాయమ్మ దంపతులకు 1927 సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన జన్మించాడు.
గుంటూరు ఏ సి కళాశాలలో డిగ్రీ చేసి మద్రాసు లా కళాశాలలో లా డిగ్రీ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎన్నో రచనలు చేసిన గొప్పకవి.వక్త,విమర్శకుడు.
ఎన్నో పురస్కారాలు,అవార్డులు శేషేంద్రను వరించాయి.కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్,భారత ప్రభుత్వ రాష్ట్రేన్రు బిరుదును, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డును, తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ను పొందారు సంస్కృత, ఆంధ్ర ,ఆంగ్ల భాషల్లో పండితులైన శేషేంద్ర పద్యరచన, వచన కవిత్వం రెండింటిలో సమాన ప్రతిభ చూపిస్తూ ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాజనిత కవి. ఈయన ప్రత్యేకత వచన కవిత్వానికి కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రుడు. ఇంత గొప్ప మహాకవి 2007 మే 30వ తేదీ గుండెపోటుతో కన్నుమూశారు.అయినా ఆయన రచనల ద్వారా చిరంజీవి.

కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన అవార్డు శేషేంద్ర కీర్తికిరీటంలో కలికితురాయి. ఈయన ఆధునిక కాలంలో జీవించి ఉన్న ప్రసిద్ధ ఆంధ్ర కవులలో మహోన్నత వ్యక్తి ( లెజెండ్) గా పేర్కొనవచ్చును.

డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
విశ్రాంత సహాయ ఆచార్యులు

November 24, 2023 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఎన్ని”కలలో”

by dr. Lakkraju Nirmala November 24, 2023
written by dr. Lakkraju Nirmala

ఏసీలో ఉండే నాయకుడికి
నేలపై సామాన్యుడి బాధ
ఎన్నేళ్లయితే తెలుస్తది
తెప్ప దాటేతత్వం ఈ” రాజకీయం”

పగలే నీకు రక్షణ లేదు
మహిళా మేలుకో
నీకు రక్షణ నిచ్చే
రాజ్యాన్ని నీ వెన్నుకో!

ఆత్మీయత అనురాగం
పెంచే రాజ్యం కావాలి
కుల మతాలు లేని
ఆత్మీయ సభ్యులం! ఓటర్ల ం

ఇది ఎలక్షన్ కాలం
కలెక్షన్ జంక్షన్
డబ్బున్న అన్నా జర జాగ్రత్త
చేయి జారితే నీ ఇల్లే గుల్ల!

మన ఓటు
మనం వేసుకుందాం
మన గీత మనం
రాసుకుందాం

నీతో ఆప్యాయత
నీతో స్నేహం
నిజం అనుకోకు ఓటరు
నటించడం తెలుసు అతనికి!

నిన్న రంగు మొహంలో
ఇవ్వాళ రంగు మొహానికి
ఎన్నికల రణరంగమా
రంగోలి అనుకున్న

నిన్నొక పార్టీ
నేడొక పార్టీ
రేపు ఒక పార్టీ
నీవు మారొచ్చోయ్

కులమతాలకతీతంగా
గాంధీ రాజ్యం ఏలాడు
కులమతాలే ఈనాడు
గాంధీ గిరి చలాయిస్తున్నాయి.

చెట్టు నాటే వాడు
ఓనాడు రాజు
చెట్టు నరికే వాడు
ఈనాటి రాజకీయ నాయకుడు.

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

‘గమనిక’

by C.S. Rambabu November 24, 2023
written by C.S. Rambabu


కొంతమందికి పేరెందుకు వస్తుందో తెలియదు. కానీ పేరొచ్చిన వాళ్ళేం చేసినా చెల్లుబాటవుతుందని శంకర్రావును చూశాక ఎవరికయినా అర్ధమవుతుంది. అతనేం చేస్తుంటాడో మాకెవరికీ తెలీదు కానీ మా కాలనీలో పండగ వచ్చిందంటే మాత్రం శంకర్రావు లేకుండా జరగదు.  వినాయక చవితితో మొదలు పెడితే ఉగాది వరకూ ఏ పండగైనా అతని కనుసన్నల్లోంచి బయటపడలేదు.  చందాలు వసూలు చేస్తాడు.పూజలు ఆర్గనైజ్ చేస్తాడు.ప్రసాదాలు పంచుతాడు.  ఆర్కెస్ట్రాలు పెడతాడు.నిమజ్జనం అంటే పిల్లా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్కచోట చేరుస్తాడు.అతను జై శ్రీరామన్నా, జై భారతమాత అన్నా తిరుగులేదు.ఒకసారెవరో చందా ఎందుకివ్వాలి అని అడిగినట్టున్నారు, అలా అడిగినందుకు ఆ వ్యక్తిని ఉతికి ఆరేశాడు.అలా ఇలా కాదు, మరక మంచిది కాదన్నట్టు సంస్కారవంతంగా ఆరేశాడు.ఆ దెబ్బకు మళ్ళీ ఇంకొకరు అలాంటి ప్రయత్నం చేయలేదు.ఒక్క మాటలో చెప్పాలంటే He is a law unto himself… తను చెప్పిందే చట్టమన్నట్టు ప్రవర్తించే శంకర్రావంటే కోపమున్నవాళ్ళూ లేకపోలేదు.  అయితే వాళ్ళందరూ అర్భకజీవులు మా కాలనీలో.  అసోసియేషన్ పెత్తనమంతా శంకర్రావు, ఇంకా అతని బృందానిదే కాబట్టి మెజారిటీ అతని వైపే ఉండేవారు.  మాలాంటి వారు మైనారిటీ వర్గం కిందే లెక్క.  
 
శంకర్రావు ఏ రోజూ లెక్కలు చెప్పిన పాపానపోడు. ‘అన్నా నువ్వేం చెప్పక్కర్లేదు ఎవడికీ’ …. అనే కోరస్ డిజిటల్ సౌండ్ తో వినిపిస్తుంటే అడిగే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది …. చూశారా నా వెంట ఎంతమందున్నారో అనే అతని తిరస్కార చూపు మాకు ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ ఉండేది… ఎప్పుడూ లేంది ఈ సారి సంక్రాంతికి కూడా సంబరాల పందిరేశాడు శంకర్రావు.  రోజూ కాలనీ వాళ్ళతో ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టించాడు … పోటీలన్నాడు …ఈసారి డబ్బుల వసూలు గొడవలేదన్నాడు … అందరూ ఊపిరి పీల్చుకున్నారు … సంక్రాంతి సరదాలంటూ మగవాళ్ళకూ పోటీలు పెట్టాడు.  పోటీలకు వెళ్ళని మాలాంటి వాళ్ళం ఉడుక్కుంటూ కూర్చున్నాం … ప్రతి సంక్రాంతికీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే శంకర్రావు ఈ సారి ఇలాంటి హింస పెట్టాడెందుకా అని మాలో మేం కొట్టుకు చస్తుంటే శంకర్రావు ఎవరితోనో  కొట్లాడుతూ ఉండటం మమ్మల్ని ఉలిక్కిపడేలా చేసింది …
 
సంక్రాంతి పండగ చివరి రోజున అయ్యవార్లను పిలిచి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు శంకర్రావు.  తెల్లటి లాల్చీతో ఎర్రటి బొట్టుతో మెళ్ళో పచ్చని కండువా వేసుకుని కొత్త దేశభక్తుడిలా ధగధగమంటున్నాడు.  ఆ ధగధగలలో ఈ బుసబుసలేమిటా అని చూద్దుము కదా ఒక గంగిరెద్దు వాడితో గొడవపడుతున్నాడు శంకర్రావు.
మేం చూడని శంకర్రావు ఆ అవతారంలో ముక్కంటిలా కాల్చేస్తున్నాడు… దూర్వాసుడిలా దూషిస్తున్నాడు… ఇంతకీ ఆ గంగిరెద్దు అతను కాస్త ఇనాము ఇప్పించు సామీ అని వేడుకుంటున్నాడు …. మరి దానికి ఇంత సీరియస్ అయిపోయి కొట్లాట స్థాయికి ఎందుకొచ్చాడు శంకర్రావు … అర్ధంకాని అయోమయంలో మేమంతా ఉండగా శంకర్రావు తిట్లతోకూడిన గాలి తరంగాలు  దుర్గంధంలా మమ్మల్ని చేరుతున్నాయి.
విచిత్రంగా ఆ గంగిరెద్దు వాడు కూడా తగ్గటం లేదు.  అదే స్థాయిలో నేనేమన్నా దొరా అని శిలా ప్రతిమలా నుంచున్నాడు.  చూసేవాళ్లకు అది వినోద స్థాయిలో ఉందేమో కానీ శంకర్రావంటే కోపమున్న మాకు కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించింది.  ఈలోగా రంకెలేస్తున్న శంకర్రావుని పక్కకు తీసుకెళ్లారెవరో …
 
మాలో ఒకరం కదిలి ఆ గంగిరెద్దు వాడిని సముదాయించి వాడి చేతిలో నూట పదహారు పెట్టి ఇక మమ్మల్ని వదల్రా నాయనా అని బతిమాలాం…
నాకెందుకో చిన్న అనుమానమొచ్చి వాడిని ఫాలో అయ్యాను.  నన్ను గమనించినట్టున్నాడు ఆ గంగిరెద్దువాడు.  నాకో దండం పెట్టాడు.  వాడితో మాటలు కలపటం మొదలుపెట్టాను…
‘ఏ ఊరు స్వామీ మీది ….నీ పేరేంది’
‘పక్కనే మారాజా … ఇక్కడికి 20 కిలోమీటర్లుంటది… నన్ను రాములంటారు’
‘మీరు రోజూ వచ్చివెళ్తూ ఉంటారా’
‘లేదు మారాజా … మా ఊరోళ్లందరం ఒకచోట ఉంటున్నాం కలిసి, పండగ అయినంక ఎల్లిపోతాం’
‘గిట్టుబాటవుతుందా … చూస్తే ఎవరూ ఇస్తున్నట్టులేరు’
‘ఇచ్చే మారాజులు ఇస్తరు సారూ’
ఈ సంభాషణ ఎటూ సాగటం లేదనిపించి అడగదలుచుకున్న విషయం అడిగేశాను.
‘మా శంకర్రావు సారూ ఎందుకో నీ మీద కోపంగా వున్నాడు …. ఆయన ఎవరినీ అట్లనడే … నువ్వు తెలుసా ఆ సారుకి’ అలా చీకట్లో బాణమేసాను కానీ, తగులుతుందనుకోలేదు…
‘నాకెరికే  సారూ,  శంకరన్న అంటాం మేమా సారుని’ అన్నాడు రాములు
‘నువ్వు తెలిస్తే మరెందుకు నీమీద కోప్పడ్డాడు’
‘అదా సార్ … ఆ సారు మా ఊర్లో పొలం కొనబట్టిండు … తక్కువ ధరిచ్చి కొన్నాడు సార్.  ఆ పొలం మా పెదనాయన కొడుకుది… మా MLA సార్ కి చెప్పి బెదిరించాడు … అందుకే ఆయనంటే మా ఊర్లో అందరికీ కోపం’
‘ఆయన ఇక్కడే ఉంటాడని తెలుసా నీకు’ ఆశ్చర్యంగా అడిగాను
‘తెలిసే వచ్చినా సారూ’ …
రాములు ధైర్యానికి నాకు ముచ్చటేసింది.
ఇదా శంకర్రావు అసలు రూపం … ఎందుకో రహస్యం తెలుసుకున్నానన్న సంతోషం కన్నా అన్యాయం చేశాడన్న బాధే కలిగింది…
‘ఆయన నిన్ను గుర్తు పట్టాడా ?’ జాలిపడుతూ అడిగాను…
‘గుర్తు పట్టిండు సార్ …అందుకేగా ఎల్లగొడదామని చూసిండు … అందుకే నేనూ వదల్లే’
ఈ రాములు లాంటి వాళ్లకి ఎలా అర్ధమవుతుంది.  క్రూర జంతువులు బయట ఎక్కడ్నించో రావని, మన మధ్య ఉండే మనుషులే ఆ రూపం దాలుస్తారని ఎలా చెప్పగలుగుతాం అనిపించింది… పర్సుదీసి చూస్తే కొన్ని నోట్లు కనిపించాయి. అవి అతని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాను.  
 
 నిత్యం గంగిరెద్దులా కనిపించే ఈ శంకర్రావు గంగిరెద్దు వేషం వేసుకున్న గుంటనక్క అని ఎలా చెప్పాలి అన్న ఆలోచనలో పడ్డాను.
అప్రయత్నంగా ప్రయాణీకులకు ముఖ్య గమనిక అని రైల్వే స్టేషన్ లో జేబుదొంగల గురించిన ప్రకటన గుర్తుకొచ్చింది.  శంకర్రావు లాంటి వారికి కూడా వర్తించే ఆ ‘గమనిక’ అందరికీ చెప్పాల్సిందే అనుకుంటూ దుఃఖంతో నిండిన మనసును ఊరడిస్తూ ముందుకు సాగాను ….

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనుషుల్లా కాసేపు

by కుడికాల వంశీధర్ November 24, 2023
written by కుడికాల వంశీధర్


రోజు రోజుకీ
పెరుగుతున్న కృత్రిమ మేధతో
పరికరాలు స్మార్ట్ అవుతున్నాయి
మన రోజువారీ కార్యక్రమాలు అవే చూస్తున్నాయి.

దైనందిన జీవితాల్లోకి చొరబడి
సంభాషణలను, జీవనశైలిని,
గోప్యతలేని గతాన్ని తోడుకొని
భవిష్యత్తుని అంచనా వేస్తుంది.

అమ్మ పుట్టిన రోజు అంటే
కృత్రిమ మేధ కొలువైన మొబైల్ ఫోన్
కేక్‌తో బొకే ఆర్డర్ చేసి పంపిస్తానన్నది,
సర్‌ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేయమన్నది
కానీ
అమ్మతో మాట్లాడి
వీలైతే దీవెనలందుకో అనలేదు.

ఎవరి కెప్పుడు డబ్బు జమ చెయ్యాలో,
ఎవరు ఎంత ఇవ్వాలో
ఇలాంటివి ఎన్నైనా
కృత్రిమ మేధ లెక్కలు ఖచ్చితమైనవే కావచ్చు,
దాని సూచనలు సమర్థవంతమైనవై ఉండొచ్చు
అయినా
గత నెలలో
చేబదులు తీసుకున్న మిత్రుడు
డబ్బెందుకు తిరిగి ఇవ్వలేదో
కారణం అర్థం చేసుకోలేదు.

కరిగే హృదయం లేనిది కదా
మనుషుల భావోద్వేగాలను పట్టుకోలేదు.

నేను కృత్రిమ మేధస్సును
ద్వేషించడం లేదు
ప్రకృతి సిద్ధమైన స్పందనల అనుభూతిని,
మనిషిలోని చైతన్యాన్ని
వాటితో పొందలేము.

అన్నింటా తానై
కృత్రిమ మేధస్సు వికృతంగా నవ్వక ముందే
ప్రత్యామ్నాయ సాంకేతికత లేని
మనిషి సాంగత్యాన్ని నేను కోరుకుంటాను.

ఫోన్‌లో వద్దు మిత్రమా!
మనుషుల్లా కాసేపు
కలిసి మాట్లాడుకుందాం.

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శ్రమ గీతాలు

by Rama Devi Nellutla November 24, 2023
written by Rama Devi Nellutla

ఎండకు వేగీ వానకు తడిసీ చలికి వణికీ
ఎడతెగని శ్రమ గీతాలమై సాగుతుంటాం

పహారా కాస్తున్నప్పుడు కాళ్ళు నేలలో పాతిన స్తంభాలై
గస్తీ తిరుగుతున్నప్పుడు కళ్ళు సెర్చి లైట్లయి
కవాతు చేస్తున్నప్పుడు క్రమశిక్షణే దేహభాషయి
కఠిన శ్రమకోర్చే కార్మికులం
సమాజం లోని కలుపు మొక్కల్ని ఏరి పారేసే కర్షకులం
దొరల్లో దొంగల్ని గుర్తించే మనస్తత్వ వేత్తలం

చల్లని నీడ పట్టునో చలువ యంత్రాల క్రిందనో
సేద తీరే అవకాశమే లేని వాళ్ళం
విధి నిర్వహణలో విలువైన క్షణాలెన్నో కోల్పోయినా
వీసమెత్తు సానుభూతి పొందని ఉద్యోగాల వాళ్ళం

ఉత్సవాల్ని క్యూ లైన్ల లోనూ
పండుగల్ని పదిమందిని అదమాయించడం లోనూ గడిపే వాళ్ళం
వేనవేల చెమట చుక్కల్ని కార్చి
వందల జనసభల్ని విజయవంతం చేసే వాళ్ళం

కోరుకున్నదో ఎన్నుకున్నదో
విధి లేకనో విధి నిర్ణయమో
వృత్తి ధర్మమో బతుకు తెరువో గానీ
లోలోపలి మనసుని కప్పి పెట్టి
కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళం

కఠినత్వాన్ని ఖాకీ యూనిఫామ్ గానూ
ఆత్మ విశ్వాసాన్ని తల టోపీ గానూ ధరించిన వాళ్ళం
సౌందర్య శిల్పాలుగా కాక ఇనుప చువ్వలుగా
శరీరాల్ని మార్చుకున్నవాళ్ళం

ఉషోదయాల ఊసే లేకుండా
సాయం సంధ్యల సాయం పొందకుండా
కాలాన్ని కర్తవ్యానికి కుదువ బెట్టిన వాళ్ళం

నేర చరితుల మధ్య నిరంతరం గడుపుతున్నా బురద అంటకుండా
ఉండాల్సిన పద్మాలం
ప్రమాదంలో మీకోసం పరిగెత్తుకొచ్చే
తక్షణ సహాయకులం
అసహాయులకు అండగా నిలిచే
రక్షణ కవచాలం

భయం తోనో అపార్ధం తోనో
దూరం చేయకండి
మేము మీలాంటి పౌరులం
ఫ్రెండ్లీ మహిళా పోలీసులం

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

భారత సువర్ణ కమలం

by -డాక్టర్ కాసర్ల రంగారావు November 23, 2023
written by -డాక్టర్ కాసర్ల రంగారావు

సహాయ నిరాకరణ ఆనుపానుల్లో జననం
భవిష్యత్ సహాయీకరణకు సోపానం
సరస్వతీ శిశుమందిర్ డిఎవిబళ్ళలోవిద్యా భ్యాసం
సంస్కృతీ నాగరికతల బలమైన పునాది కోసం
కౌమార తొలియవ్వనదశలో వక్తృత్వ పోటీలో విజయం
అసమాన అత్యుత్తమ ప్రేమికుడుగా పరిణామం
క్విట్ ఇండియా లో ఉద్యమ ఉపన్యాసం
23 రోజుల జైలు సహవాసం.
తండ్రీ కొడుకులు న్యాయవిద్యలో సహాధ్యాయులు కావడం
కామ్రేడ్ కాబోయే కాషాయం ధరించడం
తండ్రిపై తనరాజకీయక్రీనీడ పడకుండా గది మార్చడం
క్యాబినెట్ మిషన్ నుండి కాశ్మీర్ వరకు మార్పులు నెహ్రూ పటేల్ ఎత్తుకు పై ఎత్తులు.
రాజకీయ దుమారం ప్రభావం.
అంబేద్కర్ ను క్యాబినెట్లో తీసుకునేటట్లు శ్యాంప్రసాద్ ముఖర్జీ సఫలయత్నం.
హిందూమహాసభ ముఖ్యుల అనలసందేశం
శ్యాంప్రసాద్ ముఖర్జీ వ్యక్తిగత కార్యదర్శి.
కిశోరప్రాయంలోనే కాశ్మీర్ ప్రవేశం.
జైలుశిక్ష విడుదల.


అఖండ భారత్.భారతీయ ఔన్నత్యపు పునరుద్ధరణ శపథం
జనసంఘ్ లోకసభ సభ్యత్వం.
నెహ్రూను ఘాటుగా విమర్శించినయువకిశోరం
విదేశీ ప్రతినిధికి కాబోయే ప్రధానిగా నెహ్రూ పరిచయం చేయక తప్పనిస్థితి.
జనసంఘ్ అఖండ భారత్ భారతీయ పునరుద్ధానంతో రెండు దశాబ్దాల పైగా పయనం
1966లోఆర్సస్ ప్రచారక్ నుంచి తొలగింపు.
ఐనా ఆర్సస్ జనసంఘ్ లకుఆయనే రాజకీయ పరిమళింపు.
ఇందిరను దుర్గామాతగా పొగిడిన ప్రతిపక్ష ప‌రిణితి.
అవినీతి రాజకీయ అసమ్మతులపై చీల్చి చెండాడిన అద్భుత అత్యుత్తమ రీతి.
రాజకీయ బఫూన్ తుఫాన్.
అత్యయిక పరిస్థితి కాంపేన్.
రాజకీయ లాలూచీ తో ఇందిర పాచిక.
జగ్జీవన్ రాంను ముందు పెట్టి చంద్రశేఖర్ తో నీ ఎదురు పాచిక.
సంజీవరెడ్డి అండతో ఇందిరా-రాజీవం.
భారతీయ జనతా పార్టీగా పార్టీ పునర్నిర్మాణం.
వరంగల్ సామ జగన్మోహన్ రెడ్డి సంస్మరణ
సభలో పాల్గొనడం.
నక్సలైట్ల చేతిలో చనిపోయిన వారి సంస్మరణ సభల్లో పాల్గొనడం.
ఇక్కడి నుంచే నీ అనుజుడు హృదయాల్ని కరిగించి మనసుల్ని రగిలించి విప్లవ దుమారాలు లేపడం.
దక్షిణాంధ్ర నుంచి ఉత్తర భారత మంతా
విప్లవ కాన్వాసు నిర్మాణం.
విముక్త కారిడార్ ల ఆవిర్భావం.
విముక్త కారిడార్ లలో బిజెపి యం.పి.లు , ప్రభుత్వాలు రావడం.
ఇదేకదా భారతీయ వైచిత్రి.
చిత్ర చిత్ర ప్రతిభా ధవళ కీర్తి.
అయోధ్య రామజన్మభూమి ఉద్యమ ఉధృతం.
హిమాలయన్ బ్లండర్ గా పే‍ర్కొన్నా లక్ష్మణుని రామభక్తి నిరూపణం.
ఇంద్రజిత్తు మరణం.
గోవిందా చార్యే ఉవాచః
ఆయనే మా ముసగు.
ఇంకా మాకెందుకు మరి విసుగు.
వైరుధ్యాలు, సంక్షోభాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారతవాణి విన్పించి మెప్పించడం.
భాజపా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం
సిపిఎం చారిత్రిక తప్పిదం
నీ ఎదుగుదలకు సోపానం.
ప్రధానిగా మా‍ర్గ సోపాన వీచిక.
13రోజులు,13నెలలు ,పూర్తిస్థాయి ప్రధానిగా సంకీర్ణ కీలల కత్తుల ఢమరుక.
అవివాహితుడు బ్రహ్మచారి అయినా లలిత, సమత ,మమతల కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి.
ఛలోక్తులతో ,కవిత్వం తో వాగ్దాటితో అందరు నీకు చిక్కిరి చిక్కిరి.
అవివాహితుడనే కాని బ్రహ్మచారిని కానని
నువ్వు మొత్తుకున్నా పట్టించుకోని జనం.
రాజకుమారి కౌల్ తో నీ సహజీవనం.
చెప్పకనే చెప్పిన నీ జీవనం.
అజాతశత్రువు ,రాజర్షి ,బ్రహ్మర్షిగా నీ సోపాన
పయనం.
ఇప్పటి ఈ మూర్ఖులు సహజీవనానికి నిన్నే చూపితే మేమేమై పోవాలి తండ్రీ.
సహజీవనానికి గూడా మేమే అని చంకలు గుద్దుకునేలా బిజెపి శ్రేణులకు అవకాశమిచ్చావా ఫౌండ్రీ
పోరాటం చేస్తున్న దళిత గిరిజనులంతా మేంమీ వాళ్ళంకామా అని ప్రశ్నిస్తున్నారు
ఓ భారత రాజకీయ భీష్మా!
జర్నలిస్టువు ,పౌరహక్కుల అవగాహనవు ఈ దేశ భవిష్యత్తుకు ఏది దిక్సూచీ అని అడుగుతున్నారు పితామహా!?
అంతర్జాతీయ ఒత్తిడికి,బహిష్కరణకు భయపడిన పీవీ.
పోఖ్రాన్ ద్వారా ధృఢచిత్తాన్ని చాటావా భావీ
శతృవు ని లాలిస్తూనే మితృత్వం.
హద్దు మీరితే కఠినచిత్తంతో అణచడం.
గోద్రా పై నీ హితవు బుట్టదాఖలు.
ఓడిపోయే మోడీని ప్రజల నెత్తిపై దఖలు.
నీవు పేర్కొన్న రామలక్ష్మణులు పార్టీకి కైంకర్యం
జరుగుతున్న భీభత్సాలకు అచేతనంగా నీవు
రాజకీయ దురంధరుడుగా సఫలీకృతుడైనావు.
చారిత్రక విలువలను సమాధి చేస్తున్న నీ అనుచర గణం
రాజదండం ద్వారా ఫ్య్హూఢలిజం పునరుద్ధరిస్తున్న వైనం
అఖిల పక్ష చర్చలకు ఎప్పుడో తిలోదకాలు
నీ చారిత్రాత్మక ప్రయాణమైనా కనువిప్పౌ జ్ఞానోదయాలు
ఈనాటి విభజన రాజకీయాలు నీ విలువలకు తూట్లు
పునాదులు విస్మరించినఅహంకారంపతనానికి జారుడుమెట్లు
అందరినీ కలుపుకు పోయే దక్షతే కొరవడితే పాట్లు
అభివృద్ధికి పునాదులు నిర్మించడమే భవిష్యత్తుకు స్వీట్లు
సంతృప్తిగా సాగిన నీ జీవిత చరమాంకం.
భా‌రతరత్నగా ప్రకాశించేవు అనునిత్యం.
కర్మయోగి ,మర్మయోగిగా నీ ప్రస్థానం.
భారతదేశ నిత్య వెలుగులో నిలుస్తుంది నీ ప్రకాశం.

November 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

విలువ

by Kondapally Neeharini November 22, 2023
written by Kondapally Neeharini

మయూఖ సంపాదకీయం, నవంబర్ 2023

– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు

వాద ప్రతివాదనలలో నిలిచి ఎగిసిపడే మనుషుల జీవితాలు ఇవి. ప్రతి క్షణం విలువకట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విషయాలు లెక్కల కు అంతు చిక్కనివి. దేశ ఆర్థిక స్థితిగతుల గ్రాఫ్ లైన్స్ ల లో సాధారణ మానవుల పాత్ర ఎంత అని చర్చించుకోవాల్సి వచ్చే పరిస్థితులు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు దేశ నిర్మాణంలో మనిషి ఎక్కడ కనిపిస్తాడు.మనుగడే ప్రశ్నార్ధకమయ్యే రోజులు కదా!

సమాజం కోసం మనం చేసే పని ఏంటి అని ఆలోచిస్తే జవాబు దొరకని స్థితి ఉండదు. ఒక మాట మాట్లాడినా ఒక పని చేసిన నిబద్ధత ఉండాలి,నిజాయితీ ఉండాలి. విలువలు అనేవి ఎన్నికల విషయం లో ఎలా ఉండాలి అనేది పరిశీలిద్దాం. ప్రజలు రాజకీయాలు తెలియనట్లే కనిపిస్తారు కానీ నిజానికి అన్ని తెలుసు. భారతదేశం గణతంత్ర రాజ్యం. ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం. అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగ ఎన్నికల కమిషన్ సంస్థ ఎన్నికల విషయం చూస్తుంది. ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు ప్రజా జీవనానికి ఎంతో ముఖ్యమైనవి. ప్రతి విషయము రాజకీయాలతో ముడిపడి ఉంటున్న కారణాలు ఎన్నుకోబోయే వ్యక్తి ధర్మబద్ధుడు అయి ఉంటాడా కానీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలదే. పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఓటు అర్హత కలిగి ఉంటారు. లోక్ సభ, విధాన సభలకు

నాయకులను ప్రజాప్రతినిధులు గా ప్రజలే ఎన్నుకుంటారు. ఇలా ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి లోక్ సభను ప్రజల సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటాం. ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు. ప్రతి రాష్ట్రానికి శాసనసభ లేదా విధానసభ ఉంటుంది ప్రజాప్రతినిధులుగా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన అంతవరకు ప్రభుత్వ అన్ని అధినేతనే ముఖ్యమంత్రి అని అంటాం .కనీస ఆధిక్యతతో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి

అవుతాడు. ముఖ్యమంత్రి తన పరిపాలనకు అనుకూలంగా ఉండేలా సహాయ మంత్రులను మంత్రివర్గాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ రాష్ట్ర మంత్రి మండలికి ముఖ్యమంత్రి అధిపతి. రాష్ట్ర అంతర్గత భద్రత విషయాలు రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్ధి వంటి విషయాలు ప్రముఖమైనవి. ఉత్పత్తి పన్నులు ఆదాయపన్నులు సరిహద్దుల సరైన సుంకాలు, టాక్సులు, శాంతి భద్రతలు వంటి ఎన్నో విషయాలపై రాష్ట్ర కార్యనిర్వాహక అధికార లతో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. రాజ్యాంగ యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదంతో పనిచేస్తుంది.

ఓటు వేయకుండా ఉండవద్దు. ఓటు ప్రాధమిక హక్కు. విధి నిర్వహణ సరిగా చేసినటువంటి వ్యక్తిని ఎన్నుకొని పరిపాలనాసభకు పంపించాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ రాజకీయ నాయకులు అనేవాళ్లు ఎక్కడి నుంచో ఊడిపడరు. తమ మధ్య తిరిగే వ్యక్తులే అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే విషయం అర్ధం చేసుకోవాలి ప్రజలు. ఆకాశానికి నిచ్చెనలు వేసుకుని పగటి కలలు కనడం కాదు రాజకీయాలనేవి. నిజాయితీ గల వాళ్ళను చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. చరిత్ర అంటే ప్రజా జీవితమే.ఈ రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎలాంటిదో ఒక గమనింపు తో ఉండాల్సిన బాధ్యత ప్రజలదే. అవినీతిపరులను చెడు బుద్ధి కలవాళ్ళనూ ఎన్నుకుంటే అనుభవించాల్సింది ప్రజలే. గత చరిత్రను తవ్వుకోవాలి, నిజ నిజాలు తెలుసుకోవాలి. ఎంతో విలువైన ఓటును ఎన్నికల్లో

ఉపయోగించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి ఓటు వేయాలి. కొన్ని సందర్భాలలో పార్టీ మీద అభిమానము పోటీలో నిలిచిన వ్యక్తి మీద దురభిమానం ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో వ్యక్తి మీద అభిమానము పార్టీ మీద దురభిమానం ఉండొచ్చు. ఈ రెండింటినీ సమన్వయ

పరుచుకుంటూ, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మాటకి విలువ, చేతకు విలువ ఉంటుందని గ్రహించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక్క ఓటు నిర్ణయం చేసి నిలబెడుతుంది. వెలకట్టలేని ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దు.

రాజ్యాలు కూల్చి రాజరికాలనీ కూల్చి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది మన దేశం! ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మన దేశానికి మన రాష్ట్రానికీ ఉన్నది. కాలం చెప్పే తీర్పు లో క్షణక్షణాల అక్షర సత్యం లా బతుకు ఉంటుంది. కులం అని మతం అని ప్రాంతం అనే లింగమని జాతి అని భాష అని భేదాలు అభిప్రాయాలు లేకుండా ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకొని విలువని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య విధానానికి ఓటు ఒక్కటే పునాది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఓటు. చూడడానికి రెండు అక్షరాలే కానీ ఎన్నో విలువలను తనలో దాచుకున్నది ఓటు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ఎంపిక విధానానికి గోపిక రూపంతో ఉండే ప్రక్రియ. బ్యాలెట్ బాక్స్ ఎంతో రహస్యంగా జాగ్రత్తగా కాపాడుతారు. దీనికి కారణం ఓట్లు దుర్వినియోగం కావద్దని. గత కొన్నేళ్లుగా ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చింది ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఓటును వినియోగించాల్సిన బాధ్యత పౌరుడి మీదనే ఉంటుంది. 80 ఏళ్ల వయోవృద్ధులు కూడా వచ్చి ఓటు వినియోగిస్తున్నారు కానీ యువత ముందుకు రావడం లేదు. యువకులు పావన నవజీవన నిర్మాతలు. యువతరం తలుచుకుంటే సాధించలేని దేవి లేదు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకున్నప్పుడే సుస్థిరమైన స్వచ్ఛమైన పాలన లభిస్తుంది.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

దైన్యం నిండిన శవవాహకుల గాథ

by డా. ఏనుగు నరసింహారెడ్డి November 22, 2023
written by డా. ఏనుగు నరసింహారెడ్డి

ఎలనాగ చేసిన సైరస్‌ మిస్త్రీ అనువాద నవల ‘శవాలను మోసేవాడి కథ‘పై వ్యాసం

కాలం మారినా అన్ని మతాలలోని అట్టడుగు వర్గాల స్థితిగతులు ఉన్నత వర్గాలతో పోల్చదగినంతగా మారలేదు. అందుకు సామాజిక కారణాలు, ధార్మికత నెపంతో రుద్దబడిన కట్టుబాట్లు, వాటి వల్ల ఆవరించిన పేదరికం ప్రధాన కారణాలు. ఈ వలయం నుండి బయటపడలేని సమూహాలు కనీసావసరాలకు, మానవ హక్కులకు నోచుకోనంతగా అణచివేయబడ్డాయి. అటువంటి సమూహాలు సాహిత్యానికెక్కడం అరుదు. మరాఠాలో దళిత సాహిత్యం విస్తారంగా వచ్చింది కానీ అది హిందూ మతంలోని నిమ్న కులాల కోసం రాయబడింది. అదే ప్రాంతం నుండి పార్శీ మతంలోని ఖాంథియాల గురించి రాయబడిన నవల Chrolicle of a Corps Bearer.

ఈ నవలా రచయిత సైరస్‌ మిస్త్రీ. ఈయన జర్నలిస్టుగా, Short Films రచయితగా ప్రసిద్ధుడు. Radiance Ashes అనే నవల, కొన్ని కథలు ప్రచురించిన మిస్త్రీకి Chrolicle of a Corps Bearer చాలా పేరు తెచ్చింది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2014 సం||నికి గాను దక్షిణాసియా సాహిత్య బహుమతి లభించింది. సాహిత్య అకాడమీ కోరిక మేరకు ప్రసిద్ధ అనువాదకుడు ఎలనాగ ఈ నవలను ‘శవాలను మోసేవాడి కథ’గా అనువదించారు.

పార్సీలలో ఒక ప్రత్యేకమైన తెగ ఖాంథియాలు. శవాలను శుద్ధి చేయడం, మోసుకుపోవడం, రాబందులు ఇతర పకక్షులకు ఆ శవాలను ఆహారంగా బురుజుల మధ్య వదలి రావడం వీరి వృత్తి. ఈ వృత్తి నిర్వహణ కోసం ఖాంథియా కుటుంబాలన్నీ బురుజుల దగ్గరి స్మశాన వాటిక దగ్గరే నివసిస్తాయి. కుటుంబాలన్నీ అక్కడే నివసించడం వల్ల స్మశానవాటిక ప్రభావం వారి మీద పడుతుంది. శుభ్రత లోపిస్తుంది. పిల్లలకు సమీపంలో బడి ఉండదు. చుట్టూ అడవి ఆవరించి ఉండడం వల్ల పురుగు పుట్రతో సహవాసం తప్పదు. ఇక అసలు వృత్తి నిర్వహించే శవ వాహకులకు చాలా వేదన ఉంటుంది. సాధారణంగా శవాలకు దగ్గరగా ఉండలేని పరిస్థితి మనుష్యులది. వీరు మాత్రం శవాల శరీర భాగాలను శుభ్రపరిచి, చనిపోయిన ప్రదేశం నుండి బురుజుల ప్రాంతాన్ని మోసుకు రావాలి. బురుజుల ప్రాంతంలో శవాలను ఎత్తైన ప్రాంతానికి తీసుకుపోయి, మళ్ళీ లోయలోకి దించాలి. ఈ పనిలో శారీరక శ్రమ ఎక్కువే కాక తీవ్రమైన మానసిక అయిష్టతను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణీత సమయంలేని పని కూడా కావడం మరొక సమస్య. అందువల్ల ఖాంథియాలంతా తప్పనిసరిగా మద్యం సేవిస్తారు. శవాల అంత్యక్రియలు కాకముందు మందు తాగొద్దని నిబంధన పెడతారు ట్రస్టీలు. మందు కొడితేనే కానీ శవాల పని చేయలేమన్న బాధ ఖాంథియాలది. ఇంత కఠినమైన వృత్తిలో ఉన్న ఖాంథియాలకు వచ్చే కూలీ తక్కువ. సెలవులు ఉండవు. అందువల్ల ఆ కుటుంబాల స్త్రీలు వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ వృత్తిలో విటుల చేతుల్లో స్త్రీలు హత్యకు గురైన సందర్భాలూ ఉంటాయి. ఇలాంటి ఖాంథియాల దయనీయ జీవితాన్ని రెండు మూడు కుటుంబాల కథల నేపథ్యంలో విస్తృతంగా చిత్రించాడు రచయిత.

శవాలు మోసేవాడు ఫిరోజ్‌ ఎల్చిదానా. ఫిరోజ్‌ పుట్టి పెరిగింది బొంబాయిలోని ఇచ్చాపోరియా  అగ్ని దేవాలయ ప్రాంతం. చదువు ఆగిపోవడంతో బొంబాయి వీధులన్నీ లక్ష్యం లేకుండా, జులాయిగా తిరిగాడు. డూంగర్‌ వాడీ బురుజుల దగ్గర ఖాంథియాగా నుసెస్సెల్లార్‌ పని చేస్తూ జీవితం గడుపుతాడు.

ఫిరోజ్‌ నాన్న ఫ్రాంరోజ్‌ పార్శీ పూజారి. ఇచ్చాపోరియా గుడి వెనక నివసించే ఫ్రాంరోజ్‌ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది పార్శీ సమాజంలో. ఫ్రాంరోజ్‌ నాన్న మొదటి భార్య కూతురు రుదాబె. ఆమె ఫ్రాంరోజ్‌ కు సోదరి కిందే లెక్క. కానీ రుదాబెతో ఫ్రాంరోజ్‌ లైంగికాసక్తిని కనబరచడంతో వారి తండ్రి తీవ్రంగా మందలిస్తాడు. రుదాబె చెడు తిరుగుళ్ళతో బొంబాయి వీధుల వెంట కనబడుతుంది. అలాంటి తిరుగుడులలో భాగంగా తెమూరస్‌ తో కలుస్తుంది, పెళ్ళాడుతుంది. అలా తెమూకు ఫ్రాంరోజ్‌ కు వైరం ఏర్పడుతుంది. వారికి సెపిడె అనే కూతురు పుడుతుంది. వారిది శవాలను మోసే వృత్తి. డూంగర్‌ వాడీలో ఉంటారు.

అగ్ని దేవాలయం దగ్గర ఉంటున్న ఫ్రాంరోజ్‌ కు ఇద్దరు కొడుకులు, విస్ఫీ, ఫిరోజ్‌. విస్ఫీ చదువులో ఆసక్తి చూపిస్తాడు కానీ, ఫిరోజ్‌ ఫేలై జులాయిగా తిరుగుతాడు. బొంబాయి అంతా తిరిగి చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటాడు. తల్లి హిల్లాతో కలిసి డూంగర్‌ వాడీలో ఒక బంధువు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు సెపిడెను చూసి ప్రేమలో పడతాడు. ఇక అప్పడినుండి డూంగర్‌ వాడీకి వెళ్ళి సెపిడెతో తిరుగుతాడు. సెపిడెను పెళ్ళాడడానికి ఖాంథియాగా మారాలన్న షరతుకు తల ఒగ్గుతాడు. అమ్మానాన్నలను ఎదిరించి పెళ్ళాడి శవాలను మోస్తూ బతుకుతుంటాడు. ఫరీదా అనే కూతురు పుట్టాక సెపిడె పాము కరిచి చనిపోతుంది. శవవాహకులు అంతా తాగి శవాలను మోస్తూ ఉంటారు. ఫిరోజ్‌ ఒకరోజు శవాన్ని మోస్తూ బోర్లా పడేస్తాడు. ట్రస్టీలు మెమో ఇస్తారు. ట్రేడ్‌ యూనియన్‌ పెట్టడంతో తగ్గుతారు.

బొంబాయిలో పార్శీ ప్రముఖుడు నారిమన్‌ మొదటి భార్య కొడుకు వ్యాధితో బాధపడుతూ పార్శీగా చనిపోవాలనుకుంటాడు. అందుకు అతని తమ్ముడైన రోహింటన్‌, ఫిరోజ్‌ ను అతని తండ్రిని ధర్మ సలహాకు ఒప్పించమంటాడు. ఫిరోజ్‌ కోరికను తిరస్కరించిన తండ్రి, నారిమన్‌ డబ్బుతో ట్రస్టీలను ఒప్పించి పార్శీ పద్ధతిలోనే కొడుకు అంత్యక్రియలను జరిపిస్తాడని అంచనా వేస్తాడు. అతని అంచనా ప్రకారం ట్రస్టీలు నారిమన్‌ కొడుకు జోసెఫ్‌ శవాన్ని పార్శి పద్ధతిలో రాబందులకు పెట్టడానికి ఒప్పుకుంటారు. కానీ, ఇది పార్శీమతం పట్ల విఘాతమని బుఖియా, జోసెఫ్‌ శవాన్ని రాత్రికి రాత్రి దొంగిలించి క్రిస్టియన్‌ స్మశానవాటికలో రహస్యంగా అంత్యక్రియలు జరిపేస్తాడు.

ఫ్రాంరోజ్‌ మరణించడంతో ఆయన పెద్ద కుమారుడు విస్ఫీ, తమ్ముడు ఫిరోజ్‌ సహాయంతో ఇల్లు ఇతర ప్రాంతానికి మార్చడంతో కథ ముగుస్తుంది.

ఖాంథియాల దైన్య జీవితానికి తిరుగులేదని చెప్పే ఒక గొప్ప ధర్మపన్నాగం మతంలో ఉంది. ‘నిజానికి నుసెసెల్లార్లు శవాల కుళ్ళు తాలూకు దుష్ప్రభావాన్ని పీల్చుకొని సమాజాన్ని కాపాడుతారు. ఈ ఉదాత్తమైన పనికి ప్రతిఫలంగా వారి ఆత్మ మళ్ళీ పుట్టదని మా మతగ్రంథాలు వాగ్దానం చేస్తున్నాయి. నిష్టతో శ్రద్ధతో ఆ పనిని నిర్వర్తించే శవ సంరక్షకుడు దేహం శిథిలం కావడం, మరణం, పునర్జన్మల నుండి విముక్తి పొందుతాడు’ అని ఫిరోజ్‌ చెప్పుకొస్తాడు. అతనే ‘అయితే, ఈ జన్మలో ప్రజలు అతన్ని మకింలాగా, మలంలాగా, అస్పృశ్యునిగా చూస్తారనే విషయాన్ని మత గ్రంథాలు రాయలేదు’ అని కూడా అంటాడు.

ఏమీ చేయలేని అశక్తులు యజమాని లేని సమయంలో ఎంత కోపంగా మాట్లాడుకుంటారో మామూలుగా యజమానులు ఊహించలేరు. ఫిరోజ్‌ పని ఒత్తిడి వల్ల ఒకసారి కళ్ళు తిరిగి శవాన్ని పడవేస్తాడు. అప్పుడు యాజమాన్యం వాళ్ళకు మెమోలు ఇచ్చి శవాలను మోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదని హెచ్చరిస్తుంది. అప్పుడు నుసెసెల్లారు యాజమాన్యాన్ని బూతులు తిడతారు. వాడీ పని చేస్తే తెలిసేది అని కూడా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు.

ఖాంథియాలలో భరించలేనంత పేదరికం ఉంటుంది. పూట గడవడం కోసం మగవాళ్ళు శవాలను మోస్తే కొందరిండ్లల్లో స్త్రీలు వ్యభిచారం చేయడం కూడా తప్పనిసరవడం ఈ నవలలో చిత్రించాడు రచయిత. తెమూరస్‌ భార్య రుదాబె దాదాపు ప్రతిరోజు రాత్రి అలంకరించుకొని పోవడం భర్తకు తెలుసు. ఇంకోరకంగా ఆయన అనుమతి కూడా ఉంటుంది. చిన్న పాపను భర్తను ఇంట్లో వదిలేసి వెళ్ళి రుదెబా తీవ్రమైన లైంగిక వేధింపులకు గురై చనిపోతుంది. కానీ దోషి దొరకడు. ఎవరికీ ఏ శిక్షా పడని, పడడానికి పట్టుబట్టలేని స్థితి ఖాంథియాలది.

మతం పట్ల మనుషుల పట్టుదల ఎంత కఠినంగా ఉంటుందో ఈ నవల అడుగడుగునా గమనించవచ్చు. నిజానికి ధర్మం పేరు మీద మతం విధించిన కట్టుబాట్లు మనుష్యుల్ని ఎంతో బాధకు గురి చేస్తుంటాయి. అయినా వాటిని సడలించరాదన్నంత స్థిరంగా మనుష్యుల అంతరంగంలో అవి గూడు కట్టేట్లు చేయడంలో అన్ని మతాల మతపెద్దలు విజయమే సాధించారన్నది శవాలు మోసేవాడి కథలో గమనించవచ్చు. జోసెఫ్‌ నారిమన్‌ కొడుకే అయినప్పటికీ ఆయన క్రిష్టియన్‌ భార్యకు పుట్టిన కొడుకు. అతను ఇంగ్లండులో మతాల ధార్మికత మీద పరిశోధన చేసి పార్శీ మతమే అన్ని మతాలలో గొప్పదని భావించి తను చనిపోయాక పార్శీ మతం పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని భావించి బొంబాయి వస్తాడు. జోసెఫ్‌ తమ్ముడు రోహింటన్‌, ఫిరోజ్‌ తో తనకున్న స్నేహాన్ని ఆధారం చేసుకొని ఫిరోజ్‌ తండ్రి ఫ్రాంరోజ్‌ తో పార్సీ ట్రస్టీలకు సిఫారసు చేయించుకొని అన్నకు పార్సీ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలనుకుంటాడు. ఫ్రాంరోజ్‌ అందుకు తప్పుబట్టడమే కాకుండా నుసెసెల్లార్‌ అయిన ఫిరోజ్‌ కూడా దానికి వ్యతిరేకించాలంటాడు. చివరికి నారిమన్‌ తన పలుకుబడితో పార్సీ ట్రస్టీలను ఒప్పించగలుగుతాడు. కానీ ఆ ధర్మ వ్యతిరేక కార్యానికి బుఖియా గండికొట్టి ఆ శవాన్ని క్రిస్టియన్‌ సిమెటరీలోనే ఖననం చేస్తాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయమేమిటంటే క్రిస్టియన్‌ సిమెటరీ నిర్వాహకుడు గోమ్స్‌ శవపేటిక లేకుండా ఖననం చేయడం తప్పని, అంతటి రాత్రిలోనూ ఏ ప్రలోభాలకు లొంగకుండా పేటిక తెప్పించాకే ఖననం చేయనిస్తాడు.

శవాలను మోసేవాడి కథలో కొన్ని అలవోకగా వేసినట్లనిపించే ప్రశ్నలలో గొప్ప జీవన తాత్వికత పొడసూపుతుంది. సెపీడె తన జీవిత కాలమంతా జంతువులకు, పకక్షులకు, పురుగు పుట్రకు ప్రేమతో ఆహారం పెడుతుంది. చివరకు ఆమె పాముకాటుకు చనిపోయిందని కూతురు ఫరీదాకు చెప్పినప్పుడు ఆమె వేసిన అస్పష్టమైన ప్రశ్నలో ఈ ప్రకృతిలో ఏ నీతీ, ధర్మం లేనే లేదా అనే అర్థం ఇమిడి ఉన్నట్లు ఫిరోజ్‌ కు అనిపిస్తుంది. ఫిరోజ్‌ నుసెసెలార్‌ గా మారడానికి చెప్పుకున్న కారణం తాత్వికంగా ఆలోచనా త్మకంగా ఉంటుంది. అతడు ఇలా అనుకుంటాడు :

”నా విధి తాలూకు భవిష్య దర్శనం నన్ను ఆ అంతిమ విశ్రాంతి స్థలాలవైపు లాగిందా? ఆ ప్రదేశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింతర్వాత ఒక్కసారి కూడా నేను కాళ్ళు చేతులు కడుక్కోలేదు. రాత్రివేళ మా దేవాలయంలోకి పోయే ముందు స్నానం చేసే ఆచారాన్ని ఎన్నడూ పాటించలేదు. నేను చేసిన నీచమైన మురికి పనుల గురించి తెలిస్తే నాన్న చాలా భయపడేవాడు. ఒకవేళ మనుష్యులకు పునర్జన్మ అనేది ఉంటే, ఇప్పుడు సైతం అప్పటి నా రహస్య కార్యకలాపాల గురించి తెలిస్తే ఆయన నన్ను క్షమిస్తాడనుకోను”.

మనుషుల ప్రవర్తనలోని డొల్లతనాన్ని రచయిత అనేక సందర్భాలలో వ్యక్తపరుస్తాడు. ఒక తల్లి శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆమె కుమారుడు వీళ్ళేదని అడ్డం పడతాడు. పెద్దవాళ్ళు సర్దిచెప్పి నప్పుడు పాడెలో తనూ పడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది వాస్తవమైన ఫీలింగా, లేక ప్రదర్శనా అనే అనుమానాలు పాఠకులకు రావాలని రాసినట్లనిపిస్తుంది. ఆ శవం పోతే బతకలేమన్నట్లు ఏడ్చినవాళ్ళు శవాన్ని లేపడంలో కొద్దిగ కూడా సహాయం చేయరు. ఎంతో కష్టంగా ఖాంథియాలు శవాన్ని అతి కష్టం మీద మోస్తే కంటి తుడుపుగా ఇరవై రూపాయల టిప్పుతో సరిపెడతారు.

ఖాంథియాల వృత్తి దైన్యం, తద్వారా విస్తరించే కుటుంబ దైన్యం, మత పెద్దలు, ట్రస్టీల చర్యలలోని డొల్లతనం విస్తృతంగా చర్చించిన నవల ”శవాలను మోసేవాడి కథ”. పట్టణీకరణ విపరీతంగా పెరిగిన ఇలాంటి రోజుల్లో శవాలను తినే పకక్షులు జంతువులు రావడం లేదనే వాదనకు ఆస్కారం కలిగించే రెండు మూడు సంఘటనల్ని కూడా ఉదహరించారు రచయిత. విలువైన భూముల ఆక్రమణ కోసం శవాలను తినే జీవరాశి రావడం లేదనే వాదనను పుట్టించారనే ఇంకో వర్గపు అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించాడీ నవలా రచయిత.

ఇది ఒక మౌలికమైన విషయాన్ని అద్భుతంగా చర్చకు పెట్టిన నవల. తెలుగులో రాయబడ్డ నవలేనా అన్నంత సహజంగా అనువదించారు అనువాదకులు ఎలనాగ.

November 22, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడదంటే

by Y. Sujatha November 22, 2023
written by Y. Sujatha

ఆడదంటే కష్టాలు కన్నీళ్ళు కాదు –
బయపడకు తల్లి భయఆపడకు
ఇప్పుడు నీ కర్తవ్యం కన్నీళ్ళు కార్చడం కాదు
నీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం.
నీశక్తి నీవు తెలుసుకొని. ఆపరకాళిలా మారాలి నివు
మహభారతపర్వంలో ద్రౌపతి కావు నీవు
నిప్పును నీళ్ళలా దోసిళ్ళతో సేవించగల నేర్పరివి నివు
అబలవు కావు నీవు బద్దలైన అగ్ని పర్వతం జ్వలనం నీవు.
స్తన్యం. అందని చంటిపిల్లలా ఎక్కేక్కి పడి ఏడువకు నీవు
మోసపోయిన ఆడకూతూర్ల నిక్కమైన దిక్కారస్వరం నీవు..
దగాపడ్డ ఆడపిల్లలు ఆలపించిన విముక్తగేయం నీవు.
ప్రశ్నార్ధకమైన బతుకులకు పోరాట నినాదం నీవు ..

శాంతివ్యూహాలను వల్లిస్తే సరిపోదు నీవు
సర్వతంత్రులను మీటి నీవు వేటాడే మగ మృగాలను ప్రారతోలాలి నీవు
అప్పుడే తిరగపడ్డ వీణ ఆగ్రహాజన తంత్రివి నీవు
అసిత్వ పోరుకు ఆర్తివి కావాలి నీవు
పక్షవాతం వచ్చిన మగహృదయలకు నీవు అక్షరజ్ఞానా ఖడ్గాలను సంధిస్తూ నీవు
శస్త్రచికిత్సలు చేయాలి నీవు
రాబోయే తరాలకు కొత్త కాలజ్ఞానం లిఖిoచాలి నీవు
పసిరికలు వచ్చి పచ్చబడ్డ కీచకుల కళ్ళల్లో నీవు కారం నీళ్ళు చల్లాలి నీవు
నీవు ఓక సైన్యంగా పోరాటం చేస్తూ
పోరు జీవన పాఠాలు నేర్పాలి నీవు
మగవాళ్ళ గుండెల్లొ పెల్లుబికిన అగ్నిశిఖలా ప్రజ్వలించాలి. నీవు
స్త్రీ జాతిస్వప్నం సాకారం చేస్తూ ప్రణవమై ప్రదీప్తించాలి నీవు
అప్పుడే ధిక్కార పు సమాజంలో దివిటివి అవుతావు నీవు
స్వయం సంపూర్ణ చిహ్నానివి నీవు అవుతావు బిడ్డా..

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us