మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఎన్ని”కలలో”

by dr. Lakkraju Nirmala November 24, 2023
written by dr. Lakkraju Nirmala

ఏసీలో ఉండే నాయకుడికి
నేలపై సామాన్యుడి బాధ
ఎన్నేళ్లయితే తెలుస్తది
తెప్ప దాటేతత్వం ఈ” రాజకీయం”

పగలే నీకు రక్షణ లేదు
మహిళా మేలుకో
నీకు రక్షణ నిచ్చే
రాజ్యాన్ని నీ వెన్నుకో!

ఆత్మీయత అనురాగం
పెంచే రాజ్యం కావాలి
కుల మతాలు లేని
ఆత్మీయ సభ్యులం! ఓటర్ల ం

ఇది ఎలక్షన్ కాలం
కలెక్షన్ జంక్షన్
డబ్బున్న అన్నా జర జాగ్రత్త
చేయి జారితే నీ ఇల్లే గుల్ల!

మన ఓటు
మనం వేసుకుందాం
మన గీత మనం
రాసుకుందాం

నీతో ఆప్యాయత
నీతో స్నేహం
నిజం అనుకోకు ఓటరు
నటించడం తెలుసు అతనికి!

నిన్న రంగు మొహంలో
ఇవ్వాళ రంగు మొహానికి
ఎన్నికల రణరంగమా
రంగోలి అనుకున్న

నిన్నొక పార్టీ
నేడొక పార్టీ
రేపు ఒక పార్టీ
నీవు మారొచ్చోయ్

కులమతాలకతీతంగా
గాంధీ రాజ్యం ఏలాడు
కులమతాలే ఈనాడు
గాంధీ గిరి చలాయిస్తున్నాయి.

చెట్టు నాటే వాడు
ఓనాడు రాజు
చెట్టు నరికే వాడు
ఈనాటి రాజకీయ నాయకుడు.

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

‘గమనిక’

by C.S. Rambabu November 24, 2023
written by C.S. Rambabu


కొంతమందికి పేరెందుకు వస్తుందో తెలియదు. కానీ పేరొచ్చిన వాళ్ళేం చేసినా చెల్లుబాటవుతుందని శంకర్రావును చూశాక ఎవరికయినా అర్ధమవుతుంది. అతనేం చేస్తుంటాడో మాకెవరికీ తెలీదు కానీ మా కాలనీలో పండగ వచ్చిందంటే మాత్రం శంకర్రావు లేకుండా జరగదు.  వినాయక చవితితో మొదలు పెడితే ఉగాది వరకూ ఏ పండగైనా అతని కనుసన్నల్లోంచి బయటపడలేదు.  చందాలు వసూలు చేస్తాడు.పూజలు ఆర్గనైజ్ చేస్తాడు.ప్రసాదాలు పంచుతాడు.  ఆర్కెస్ట్రాలు పెడతాడు.నిమజ్జనం అంటే పిల్లా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఒక్కచోట చేరుస్తాడు.అతను జై శ్రీరామన్నా, జై భారతమాత అన్నా తిరుగులేదు.ఒకసారెవరో చందా ఎందుకివ్వాలి అని అడిగినట్టున్నారు, అలా అడిగినందుకు ఆ వ్యక్తిని ఉతికి ఆరేశాడు.అలా ఇలా కాదు, మరక మంచిది కాదన్నట్టు సంస్కారవంతంగా ఆరేశాడు.ఆ దెబ్బకు మళ్ళీ ఇంకొకరు అలాంటి ప్రయత్నం చేయలేదు.ఒక్క మాటలో చెప్పాలంటే He is a law unto himself… తను చెప్పిందే చట్టమన్నట్టు ప్రవర్తించే శంకర్రావంటే కోపమున్నవాళ్ళూ లేకపోలేదు.  అయితే వాళ్ళందరూ అర్భకజీవులు మా కాలనీలో.  అసోసియేషన్ పెత్తనమంతా శంకర్రావు, ఇంకా అతని బృందానిదే కాబట్టి మెజారిటీ అతని వైపే ఉండేవారు.  మాలాంటి వారు మైనారిటీ వర్గం కిందే లెక్క.  
 
శంకర్రావు ఏ రోజూ లెక్కలు చెప్పిన పాపానపోడు. ‘అన్నా నువ్వేం చెప్పక్కర్లేదు ఎవడికీ’ …. అనే కోరస్ డిజిటల్ సౌండ్ తో వినిపిస్తుంటే అడిగే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది …. చూశారా నా వెంట ఎంతమందున్నారో అనే అతని తిరస్కార చూపు మాకు ఒళ్ళంతా తూట్లు పొడుస్తూ ఉండేది… ఎప్పుడూ లేంది ఈ సారి సంక్రాంతికి కూడా సంబరాల పందిరేశాడు శంకర్రావు.  రోజూ కాలనీ వాళ్ళతో ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టించాడు … పోటీలన్నాడు …ఈసారి డబ్బుల వసూలు గొడవలేదన్నాడు … అందరూ ఊపిరి పీల్చుకున్నారు … సంక్రాంతి సరదాలంటూ మగవాళ్ళకూ పోటీలు పెట్టాడు.  పోటీలకు వెళ్ళని మాలాంటి వాళ్ళం ఉడుక్కుంటూ కూర్చున్నాం … ప్రతి సంక్రాంతికీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే శంకర్రావు ఈ సారి ఇలాంటి హింస పెట్టాడెందుకా అని మాలో మేం కొట్టుకు చస్తుంటే శంకర్రావు ఎవరితోనో  కొట్లాడుతూ ఉండటం మమ్మల్ని ఉలిక్కిపడేలా చేసింది …
 
సంక్రాంతి పండగ చివరి రోజున అయ్యవార్లను పిలిచి ప్రత్యేక పూజలు చేయిస్తున్నాడు శంకర్రావు.  తెల్లటి లాల్చీతో ఎర్రటి బొట్టుతో మెళ్ళో పచ్చని కండువా వేసుకుని కొత్త దేశభక్తుడిలా ధగధగమంటున్నాడు.  ఆ ధగధగలలో ఈ బుసబుసలేమిటా అని చూద్దుము కదా ఒక గంగిరెద్దు వాడితో గొడవపడుతున్నాడు శంకర్రావు.
మేం చూడని శంకర్రావు ఆ అవతారంలో ముక్కంటిలా కాల్చేస్తున్నాడు… దూర్వాసుడిలా దూషిస్తున్నాడు… ఇంతకీ ఆ గంగిరెద్దు అతను కాస్త ఇనాము ఇప్పించు సామీ అని వేడుకుంటున్నాడు …. మరి దానికి ఇంత సీరియస్ అయిపోయి కొట్లాట స్థాయికి ఎందుకొచ్చాడు శంకర్రావు … అర్ధంకాని అయోమయంలో మేమంతా ఉండగా శంకర్రావు తిట్లతోకూడిన గాలి తరంగాలు  దుర్గంధంలా మమ్మల్ని చేరుతున్నాయి.
విచిత్రంగా ఆ గంగిరెద్దు వాడు కూడా తగ్గటం లేదు.  అదే స్థాయిలో నేనేమన్నా దొరా అని శిలా ప్రతిమలా నుంచున్నాడు.  చూసేవాళ్లకు అది వినోద స్థాయిలో ఉందేమో కానీ శంకర్రావంటే కోపమున్న మాకు కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనిపించింది.  ఈలోగా రంకెలేస్తున్న శంకర్రావుని పక్కకు తీసుకెళ్లారెవరో …
 
మాలో ఒకరం కదిలి ఆ గంగిరెద్దు వాడిని సముదాయించి వాడి చేతిలో నూట పదహారు పెట్టి ఇక మమ్మల్ని వదల్రా నాయనా అని బతిమాలాం…
నాకెందుకో చిన్న అనుమానమొచ్చి వాడిని ఫాలో అయ్యాను.  నన్ను గమనించినట్టున్నాడు ఆ గంగిరెద్దువాడు.  నాకో దండం పెట్టాడు.  వాడితో మాటలు కలపటం మొదలుపెట్టాను…
‘ఏ ఊరు స్వామీ మీది ….నీ పేరేంది’
‘పక్కనే మారాజా … ఇక్కడికి 20 కిలోమీటర్లుంటది… నన్ను రాములంటారు’
‘మీరు రోజూ వచ్చివెళ్తూ ఉంటారా’
‘లేదు మారాజా … మా ఊరోళ్లందరం ఒకచోట ఉంటున్నాం కలిసి, పండగ అయినంక ఎల్లిపోతాం’
‘గిట్టుబాటవుతుందా … చూస్తే ఎవరూ ఇస్తున్నట్టులేరు’
‘ఇచ్చే మారాజులు ఇస్తరు సారూ’
ఈ సంభాషణ ఎటూ సాగటం లేదనిపించి అడగదలుచుకున్న విషయం అడిగేశాను.
‘మా శంకర్రావు సారూ ఎందుకో నీ మీద కోపంగా వున్నాడు …. ఆయన ఎవరినీ అట్లనడే … నువ్వు తెలుసా ఆ సారుకి’ అలా చీకట్లో బాణమేసాను కానీ, తగులుతుందనుకోలేదు…
‘నాకెరికే  సారూ,  శంకరన్న అంటాం మేమా సారుని’ అన్నాడు రాములు
‘నువ్వు తెలిస్తే మరెందుకు నీమీద కోప్పడ్డాడు’
‘అదా సార్ … ఆ సారు మా ఊర్లో పొలం కొనబట్టిండు … తక్కువ ధరిచ్చి కొన్నాడు సార్.  ఆ పొలం మా పెదనాయన కొడుకుది… మా MLA సార్ కి చెప్పి బెదిరించాడు … అందుకే ఆయనంటే మా ఊర్లో అందరికీ కోపం’
‘ఆయన ఇక్కడే ఉంటాడని తెలుసా నీకు’ ఆశ్చర్యంగా అడిగాను
‘తెలిసే వచ్చినా సారూ’ …
రాములు ధైర్యానికి నాకు ముచ్చటేసింది.
ఇదా శంకర్రావు అసలు రూపం … ఎందుకో రహస్యం తెలుసుకున్నానన్న సంతోషం కన్నా అన్యాయం చేశాడన్న బాధే కలిగింది…
‘ఆయన నిన్ను గుర్తు పట్టాడా ?’ జాలిపడుతూ అడిగాను…
‘గుర్తు పట్టిండు సార్ …అందుకేగా ఎల్లగొడదామని చూసిండు … అందుకే నేనూ వదల్లే’
ఈ రాములు లాంటి వాళ్లకి ఎలా అర్ధమవుతుంది.  క్రూర జంతువులు బయట ఎక్కడ్నించో రావని, మన మధ్య ఉండే మనుషులే ఆ రూపం దాలుస్తారని ఎలా చెప్పగలుగుతాం అనిపించింది… పర్సుదీసి చూస్తే కొన్ని నోట్లు కనిపించాయి. అవి అతని చేతిలో పెట్టి నమస్కారం పెట్టాను.  
 
 నిత్యం గంగిరెద్దులా కనిపించే ఈ శంకర్రావు గంగిరెద్దు వేషం వేసుకున్న గుంటనక్క అని ఎలా చెప్పాలి అన్న ఆలోచనలో పడ్డాను.
అప్రయత్నంగా ప్రయాణీకులకు ముఖ్య గమనిక అని రైల్వే స్టేషన్ లో జేబుదొంగల గురించిన ప్రకటన గుర్తుకొచ్చింది.  శంకర్రావు లాంటి వారికి కూడా వర్తించే ఆ ‘గమనిక’ అందరికీ చెప్పాల్సిందే అనుకుంటూ దుఃఖంతో నిండిన మనసును ఊరడిస్తూ ముందుకు సాగాను ….

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మనుషుల్లా కాసేపు

by కుడికాల వంశీధర్ November 24, 2023
written by కుడికాల వంశీధర్


రోజు రోజుకీ
పెరుగుతున్న కృత్రిమ మేధతో
పరికరాలు స్మార్ట్ అవుతున్నాయి
మన రోజువారీ కార్యక్రమాలు అవే చూస్తున్నాయి.

దైనందిన జీవితాల్లోకి చొరబడి
సంభాషణలను, జీవనశైలిని,
గోప్యతలేని గతాన్ని తోడుకొని
భవిష్యత్తుని అంచనా వేస్తుంది.

అమ్మ పుట్టిన రోజు అంటే
కృత్రిమ మేధ కొలువైన మొబైల్ ఫోన్
కేక్‌తో బొకే ఆర్డర్ చేసి పంపిస్తానన్నది,
సర్‌ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేయమన్నది
కానీ
అమ్మతో మాట్లాడి
వీలైతే దీవెనలందుకో అనలేదు.

ఎవరి కెప్పుడు డబ్బు జమ చెయ్యాలో,
ఎవరు ఎంత ఇవ్వాలో
ఇలాంటివి ఎన్నైనా
కృత్రిమ మేధ లెక్కలు ఖచ్చితమైనవే కావచ్చు,
దాని సూచనలు సమర్థవంతమైనవై ఉండొచ్చు
అయినా
గత నెలలో
చేబదులు తీసుకున్న మిత్రుడు
డబ్బెందుకు తిరిగి ఇవ్వలేదో
కారణం అర్థం చేసుకోలేదు.

కరిగే హృదయం లేనిది కదా
మనుషుల భావోద్వేగాలను పట్టుకోలేదు.

నేను కృత్రిమ మేధస్సును
ద్వేషించడం లేదు
ప్రకృతి సిద్ధమైన స్పందనల అనుభూతిని,
మనిషిలోని చైతన్యాన్ని
వాటితో పొందలేము.

అన్నింటా తానై
కృత్రిమ మేధస్సు వికృతంగా నవ్వక ముందే
ప్రత్యామ్నాయ సాంకేతికత లేని
మనిషి సాంగత్యాన్ని నేను కోరుకుంటాను.

ఫోన్‌లో వద్దు మిత్రమా!
మనుషుల్లా కాసేపు
కలిసి మాట్లాడుకుందాం.

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శ్రమ గీతాలు

by Rama Devi Nellutla November 24, 2023
written by Rama Devi Nellutla

ఎండకు వేగీ వానకు తడిసీ చలికి వణికీ
ఎడతెగని శ్రమ గీతాలమై సాగుతుంటాం

పహారా కాస్తున్నప్పుడు కాళ్ళు నేలలో పాతిన స్తంభాలై
గస్తీ తిరుగుతున్నప్పుడు కళ్ళు సెర్చి లైట్లయి
కవాతు చేస్తున్నప్పుడు క్రమశిక్షణే దేహభాషయి
కఠిన శ్రమకోర్చే కార్మికులం
సమాజం లోని కలుపు మొక్కల్ని ఏరి పారేసే కర్షకులం
దొరల్లో దొంగల్ని గుర్తించే మనస్తత్వ వేత్తలం

చల్లని నీడ పట్టునో చలువ యంత్రాల క్రిందనో
సేద తీరే అవకాశమే లేని వాళ్ళం
విధి నిర్వహణలో విలువైన క్షణాలెన్నో కోల్పోయినా
వీసమెత్తు సానుభూతి పొందని ఉద్యోగాల వాళ్ళం

ఉత్సవాల్ని క్యూ లైన్ల లోనూ
పండుగల్ని పదిమందిని అదమాయించడం లోనూ గడిపే వాళ్ళం
వేనవేల చెమట చుక్కల్ని కార్చి
వందల జనసభల్ని విజయవంతం చేసే వాళ్ళం

కోరుకున్నదో ఎన్నుకున్నదో
విధి లేకనో విధి నిర్ణయమో
వృత్తి ధర్మమో బతుకు తెరువో గానీ
లోలోపలి మనసుని కప్పి పెట్టి
కర్తవ్య నిర్వహణ చేసే వాళ్ళం

కఠినత్వాన్ని ఖాకీ యూనిఫామ్ గానూ
ఆత్మ విశ్వాసాన్ని తల టోపీ గానూ ధరించిన వాళ్ళం
సౌందర్య శిల్పాలుగా కాక ఇనుప చువ్వలుగా
శరీరాల్ని మార్చుకున్నవాళ్ళం

ఉషోదయాల ఊసే లేకుండా
సాయం సంధ్యల సాయం పొందకుండా
కాలాన్ని కర్తవ్యానికి కుదువ బెట్టిన వాళ్ళం

నేర చరితుల మధ్య నిరంతరం గడుపుతున్నా బురద అంటకుండా
ఉండాల్సిన పద్మాలం
ప్రమాదంలో మీకోసం పరిగెత్తుకొచ్చే
తక్షణ సహాయకులం
అసహాయులకు అండగా నిలిచే
రక్షణ కవచాలం

భయం తోనో అపార్ధం తోనో
దూరం చేయకండి
మేము మీలాంటి పౌరులం
ఫ్రెండ్లీ మహిళా పోలీసులం

November 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

భారత సువర్ణ కమలం

by -డాక్టర్ కాసర్ల రంగారావు November 23, 2023
written by -డాక్టర్ కాసర్ల రంగారావు

సహాయ నిరాకరణ ఆనుపానుల్లో జననం
భవిష్యత్ సహాయీకరణకు సోపానం
సరస్వతీ శిశుమందిర్ డిఎవిబళ్ళలోవిద్యా భ్యాసం
సంస్కృతీ నాగరికతల బలమైన పునాది కోసం
కౌమార తొలియవ్వనదశలో వక్తృత్వ పోటీలో విజయం
అసమాన అత్యుత్తమ ప్రేమికుడుగా పరిణామం
క్విట్ ఇండియా లో ఉద్యమ ఉపన్యాసం
23 రోజుల జైలు సహవాసం.
తండ్రీ కొడుకులు న్యాయవిద్యలో సహాధ్యాయులు కావడం
కామ్రేడ్ కాబోయే కాషాయం ధరించడం
తండ్రిపై తనరాజకీయక్రీనీడ పడకుండా గది మార్చడం
క్యాబినెట్ మిషన్ నుండి కాశ్మీర్ వరకు మార్పులు నెహ్రూ పటేల్ ఎత్తుకు పై ఎత్తులు.
రాజకీయ దుమారం ప్రభావం.
అంబేద్కర్ ను క్యాబినెట్లో తీసుకునేటట్లు శ్యాంప్రసాద్ ముఖర్జీ సఫలయత్నం.
హిందూమహాసభ ముఖ్యుల అనలసందేశం
శ్యాంప్రసాద్ ముఖర్జీ వ్యక్తిగత కార్యదర్శి.
కిశోరప్రాయంలోనే కాశ్మీర్ ప్రవేశం.
జైలుశిక్ష విడుదల.


అఖండ భారత్.భారతీయ ఔన్నత్యపు పునరుద్ధరణ శపథం
జనసంఘ్ లోకసభ సభ్యత్వం.
నెహ్రూను ఘాటుగా విమర్శించినయువకిశోరం
విదేశీ ప్రతినిధికి కాబోయే ప్రధానిగా నెహ్రూ పరిచయం చేయక తప్పనిస్థితి.
జనసంఘ్ అఖండ భారత్ భారతీయ పునరుద్ధానంతో రెండు దశాబ్దాల పైగా పయనం
1966లోఆర్సస్ ప్రచారక్ నుంచి తొలగింపు.
ఐనా ఆర్సస్ జనసంఘ్ లకుఆయనే రాజకీయ పరిమళింపు.
ఇందిరను దుర్గామాతగా పొగిడిన ప్రతిపక్ష ప‌రిణితి.
అవినీతి రాజకీయ అసమ్మతులపై చీల్చి చెండాడిన అద్భుత అత్యుత్తమ రీతి.
రాజకీయ బఫూన్ తుఫాన్.
అత్యయిక పరిస్థితి కాంపేన్.
రాజకీయ లాలూచీ తో ఇందిర పాచిక.
జగ్జీవన్ రాంను ముందు పెట్టి చంద్రశేఖర్ తో నీ ఎదురు పాచిక.
సంజీవరెడ్డి అండతో ఇందిరా-రాజీవం.
భారతీయ జనతా పార్టీగా పార్టీ పునర్నిర్మాణం.
వరంగల్ సామ జగన్మోహన్ రెడ్డి సంస్మరణ
సభలో పాల్గొనడం.
నక్సలైట్ల చేతిలో చనిపోయిన వారి సంస్మరణ సభల్లో పాల్గొనడం.
ఇక్కడి నుంచే నీ అనుజుడు హృదయాల్ని కరిగించి మనసుల్ని రగిలించి విప్లవ దుమారాలు లేపడం.
దక్షిణాంధ్ర నుంచి ఉత్తర భారత మంతా
విప్లవ కాన్వాసు నిర్మాణం.
విముక్త కారిడార్ ల ఆవిర్భావం.
విముక్త కారిడార్ లలో బిజెపి యం.పి.లు , ప్రభుత్వాలు రావడం.
ఇదేకదా భారతీయ వైచిత్రి.
చిత్ర చిత్ర ప్రతిభా ధవళ కీర్తి.
అయోధ్య రామజన్మభూమి ఉద్యమ ఉధృతం.
హిమాలయన్ బ్లండర్ గా పే‍ర్కొన్నా లక్ష్మణుని రామభక్తి నిరూపణం.
ఇంద్రజిత్తు మరణం.
గోవిందా చార్యే ఉవాచః
ఆయనే మా ముసగు.
ఇంకా మాకెందుకు మరి విసుగు.
వైరుధ్యాలు, సంక్షోభాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారతవాణి విన్పించి మెప్పించడం.
భాజపా నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం
సిపిఎం చారిత్రిక తప్పిదం
నీ ఎదుగుదలకు సోపానం.
ప్రధానిగా మా‍ర్గ సోపాన వీచిక.
13రోజులు,13నెలలు ,పూర్తిస్థాయి ప్రధానిగా సంకీర్ణ కీలల కత్తుల ఢమరుక.
అవివాహితుడు బ్రహ్మచారి అయినా లలిత, సమత ,మమతల కౌగిలిలో ఉక్కిరిబిక్కిరి.
ఛలోక్తులతో ,కవిత్వం తో వాగ్దాటితో అందరు నీకు చిక్కిరి చిక్కిరి.
అవివాహితుడనే కాని బ్రహ్మచారిని కానని
నువ్వు మొత్తుకున్నా పట్టించుకోని జనం.
రాజకుమారి కౌల్ తో నీ సహజీవనం.
చెప్పకనే చెప్పిన నీ జీవనం.
అజాతశత్రువు ,రాజర్షి ,బ్రహ్మర్షిగా నీ సోపాన
పయనం.
ఇప్పటి ఈ మూర్ఖులు సహజీవనానికి నిన్నే చూపితే మేమేమై పోవాలి తండ్రీ.
సహజీవనానికి గూడా మేమే అని చంకలు గుద్దుకునేలా బిజెపి శ్రేణులకు అవకాశమిచ్చావా ఫౌండ్రీ
పోరాటం చేస్తున్న దళిత గిరిజనులంతా మేంమీ వాళ్ళంకామా అని ప్రశ్నిస్తున్నారు
ఓ భారత రాజకీయ భీష్మా!
జర్నలిస్టువు ,పౌరహక్కుల అవగాహనవు ఈ దేశ భవిష్యత్తుకు ఏది దిక్సూచీ అని అడుగుతున్నారు పితామహా!?
అంతర్జాతీయ ఒత్తిడికి,బహిష్కరణకు భయపడిన పీవీ.
పోఖ్రాన్ ద్వారా ధృఢచిత్తాన్ని చాటావా భావీ
శతృవు ని లాలిస్తూనే మితృత్వం.
హద్దు మీరితే కఠినచిత్తంతో అణచడం.
గోద్రా పై నీ హితవు బుట్టదాఖలు.
ఓడిపోయే మోడీని ప్రజల నెత్తిపై దఖలు.
నీవు పేర్కొన్న రామలక్ష్మణులు పార్టీకి కైంకర్యం
జరుగుతున్న భీభత్సాలకు అచేతనంగా నీవు
రాజకీయ దురంధరుడుగా సఫలీకృతుడైనావు.
చారిత్రక విలువలను సమాధి చేస్తున్న నీ అనుచర గణం
రాజదండం ద్వారా ఫ్య్హూఢలిజం పునరుద్ధరిస్తున్న వైనం
అఖిల పక్ష చర్చలకు ఎప్పుడో తిలోదకాలు
నీ చారిత్రాత్మక ప్రయాణమైనా కనువిప్పౌ జ్ఞానోదయాలు
ఈనాటి విభజన రాజకీయాలు నీ విలువలకు తూట్లు
పునాదులు విస్మరించినఅహంకారంపతనానికి జారుడుమెట్లు
అందరినీ కలుపుకు పోయే దక్షతే కొరవడితే పాట్లు
అభివృద్ధికి పునాదులు నిర్మించడమే భవిష్యత్తుకు స్వీట్లు
సంతృప్తిగా సాగిన నీ జీవిత చరమాంకం.
భా‌రతరత్నగా ప్రకాశించేవు అనునిత్యం.
కర్మయోగి ,మర్మయోగిగా నీ ప్రస్థానం.
భారతదేశ నిత్య వెలుగులో నిలుస్తుంది నీ ప్రకాశం.

November 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

విలువ

by Kondapally Neeharini November 22, 2023
written by Kondapally Neeharini

మయూఖ సంపాదకీయం, నవంబర్ 2023

– డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు

వాద ప్రతివాదనలలో నిలిచి ఎగిసిపడే మనుషుల జీవితాలు ఇవి. ప్రతి క్షణం విలువకట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి విషయాలు లెక్కల కు అంతు చిక్కనివి. దేశ ఆర్థిక స్థితిగతుల గ్రాఫ్ లైన్స్ ల లో సాధారణ మానవుల పాత్ర ఎంత అని చర్చించుకోవాల్సి వచ్చే పరిస్థితులు. ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టినట్టు దేశ నిర్మాణంలో మనిషి ఎక్కడ కనిపిస్తాడు.మనుగడే ప్రశ్నార్ధకమయ్యే రోజులు కదా!

సమాజం కోసం మనం చేసే పని ఏంటి అని ఆలోచిస్తే జవాబు దొరకని స్థితి ఉండదు. ఒక మాట మాట్లాడినా ఒక పని చేసిన నిబద్ధత ఉండాలి,నిజాయితీ ఉండాలి. విలువలు అనేవి ఎన్నికల విషయం లో ఎలా ఉండాలి అనేది పరిశీలిద్దాం. ప్రజలు రాజకీయాలు తెలియనట్లే కనిపిస్తారు కానీ నిజానికి అన్ని తెలుసు. భారతదేశం గణతంత్ర రాజ్యం. ఒక సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశం. అతి పెద్ద రాజ్యాంగం. భారత రాజ్యాంగ ఎన్నికల కమిషన్ సంస్థ ఎన్నికల విషయం చూస్తుంది. ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు ప్రజా జీవనానికి ఎంతో ముఖ్యమైనవి. ప్రతి విషయము రాజకీయాలతో ముడిపడి ఉంటున్న కారణాలు ఎన్నుకోబోయే వ్యక్తి ధర్మబద్ధుడు అయి ఉంటాడా కానీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రజలదే. పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి వ్యక్తి ఓటు అర్హత కలిగి ఉంటారు. లోక్ సభ, విధాన సభలకు

నాయకులను ప్రజాప్రతినిధులు గా ప్రజలే ఎన్నుకుంటారు. ఇలా ప్రత్యక్ష పద్ధతిలో ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి లోక్ సభను ప్రజల సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటాం. ఈ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు. ప్రతి రాష్ట్రానికి శాసనసభ లేదా విధానసభ ఉంటుంది ప్రజాప్రతినిధులుగా మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉంటారు. రాష్ట్రానికి సంబంధించిన అంతవరకు ప్రభుత్వ అన్ని అధినేతనే ముఖ్యమంత్రి అని అంటాం .కనీస ఆధిక్యతతో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి

అవుతాడు. ముఖ్యమంత్రి తన పరిపాలనకు అనుకూలంగా ఉండేలా సహాయ మంత్రులను మంత్రివర్గాన్ని ఏర్పరచుకుంటాడు. ఈ రాష్ట్ర మంత్రి మండలికి ముఖ్యమంత్రి అధిపతి. రాష్ట్ర అంతర్గత భద్రత విషయాలు రాష్ట్ర సర్వతో ముఖ అభివృద్ధి వంటి విషయాలు ప్రముఖమైనవి. ఉత్పత్తి పన్నులు ఆదాయపన్నులు సరిహద్దుల సరైన సుంకాలు, టాక్సులు, శాంతి భద్రతలు వంటి ఎన్నో విషయాలపై రాష్ట్ర కార్యనిర్వాహక అధికార లతో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. రాజ్యాంగ యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదంతో పనిచేస్తుంది.

ఓటు వేయకుండా ఉండవద్దు. ఓటు ప్రాధమిక హక్కు. విధి నిర్వహణ సరిగా చేసినటువంటి వ్యక్తిని ఎన్నుకొని పరిపాలనాసభకు పంపించాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ రాజకీయ నాయకులు అనేవాళ్లు ఎక్కడి నుంచో ఊడిపడరు. తమ మధ్య తిరిగే వ్యక్తులే అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారు అనే విషయం అర్ధం చేసుకోవాలి ప్రజలు. ఆకాశానికి నిచ్చెనలు వేసుకుని పగటి కలలు కనడం కాదు రాజకీయాలనేవి. నిజాయితీ గల వాళ్ళను చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. చరిత్ర అంటే ప్రజా జీవితమే.ఈ రాజకీయ నాయకుల క్యారెక్టర్ ఎలాంటిదో ఒక గమనింపు తో ఉండాల్సిన బాధ్యత ప్రజలదే. అవినీతిపరులను చెడు బుద్ధి కలవాళ్ళనూ ఎన్నుకుంటే అనుభవించాల్సింది ప్రజలే. గత చరిత్రను తవ్వుకోవాలి, నిజ నిజాలు తెలుసుకోవాలి. ఎంతో విలువైన ఓటును ఎన్నికల్లో

ఉపయోగించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి ఓటు వేయాలి. కొన్ని సందర్భాలలో పార్టీ మీద అభిమానము పోటీలో నిలిచిన వ్యక్తి మీద దురభిమానం ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో వ్యక్తి మీద అభిమానము పార్టీ మీద దురభిమానం ఉండొచ్చు. ఈ రెండింటినీ సమన్వయ

పరుచుకుంటూ, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మాటకి విలువ, చేతకు విలువ ఉంటుందని గ్రహించి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక్క ఓటు నిర్ణయం చేసి నిలబెడుతుంది. వెలకట్టలేని ఓటు హక్కును దుర్వినియోగం చేయవద్దు.

రాజ్యాలు కూల్చి రాజరికాలనీ కూల్చి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది మన దేశం! ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మన దేశానికి మన రాష్ట్రానికీ ఉన్నది. కాలం చెప్పే తీర్పు లో క్షణక్షణాల అక్షర సత్యం లా బతుకు ఉంటుంది. కులం అని మతం అని ప్రాంతం అనే లింగమని జాతి అని భాష అని భేదాలు అభిప్రాయాలు లేకుండా ప్రతి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకొని విలువని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య విధానానికి ఓటు ఒక్కటే పునాది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఓటు. చూడడానికి రెండు అక్షరాలే కానీ ఎన్నో విలువలను తనలో దాచుకున్నది ఓటు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ఎంపిక విధానానికి గోపిక రూపంతో ఉండే ప్రక్రియ. బ్యాలెట్ బాక్స్ ఎంతో రహస్యంగా జాగ్రత్తగా కాపాడుతారు. దీనికి కారణం ఓట్లు దుర్వినియోగం కావద్దని. గత కొన్నేళ్లుగా ఓటింగ్ యంత్రం ద్వారా ఓటు వేసే విధానం అమల్లోకి వచ్చింది ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ మిషన్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఓటును వినియోగించాల్సిన బాధ్యత పౌరుడి మీదనే ఉంటుంది. 80 ఏళ్ల వయోవృద్ధులు కూడా వచ్చి ఓటు వినియోగిస్తున్నారు కానీ యువత ముందుకు రావడం లేదు. యువకులు పావన నవజీవన నిర్మాతలు. యువతరం తలుచుకుంటే సాధించలేని దేవి లేదు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకున్నప్పుడే సుస్థిరమైన స్వచ్ఛమైన పాలన లభిస్తుంది.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

దైన్యం నిండిన శవవాహకుల గాథ

by డా. ఏనుగు నరసింహారెడ్డి November 22, 2023
written by డా. ఏనుగు నరసింహారెడ్డి

ఎలనాగ చేసిన సైరస్‌ మిస్త్రీ అనువాద నవల ‘శవాలను మోసేవాడి కథ‘పై వ్యాసం

కాలం మారినా అన్ని మతాలలోని అట్టడుగు వర్గాల స్థితిగతులు ఉన్నత వర్గాలతో పోల్చదగినంతగా మారలేదు. అందుకు సామాజిక కారణాలు, ధార్మికత నెపంతో రుద్దబడిన కట్టుబాట్లు, వాటి వల్ల ఆవరించిన పేదరికం ప్రధాన కారణాలు. ఈ వలయం నుండి బయటపడలేని సమూహాలు కనీసావసరాలకు, మానవ హక్కులకు నోచుకోనంతగా అణచివేయబడ్డాయి. అటువంటి సమూహాలు సాహిత్యానికెక్కడం అరుదు. మరాఠాలో దళిత సాహిత్యం విస్తారంగా వచ్చింది కానీ అది హిందూ మతంలోని నిమ్న కులాల కోసం రాయబడింది. అదే ప్రాంతం నుండి పార్శీ మతంలోని ఖాంథియాల గురించి రాయబడిన నవల Chrolicle of a Corps Bearer.

ఈ నవలా రచయిత సైరస్‌ మిస్త్రీ. ఈయన జర్నలిస్టుగా, Short Films రచయితగా ప్రసిద్ధుడు. Radiance Ashes అనే నవల, కొన్ని కథలు ప్రచురించిన మిస్త్రీకి Chrolicle of a Corps Bearer చాలా పేరు తెచ్చింది. దీనికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2014 సం||నికి గాను దక్షిణాసియా సాహిత్య బహుమతి లభించింది. సాహిత్య అకాడమీ కోరిక మేరకు ప్రసిద్ధ అనువాదకుడు ఎలనాగ ఈ నవలను ‘శవాలను మోసేవాడి కథ’గా అనువదించారు.

పార్సీలలో ఒక ప్రత్యేకమైన తెగ ఖాంథియాలు. శవాలను శుద్ధి చేయడం, మోసుకుపోవడం, రాబందులు ఇతర పకక్షులకు ఆ శవాలను ఆహారంగా బురుజుల మధ్య వదలి రావడం వీరి వృత్తి. ఈ వృత్తి నిర్వహణ కోసం ఖాంథియా కుటుంబాలన్నీ బురుజుల దగ్గరి స్మశాన వాటిక దగ్గరే నివసిస్తాయి. కుటుంబాలన్నీ అక్కడే నివసించడం వల్ల స్మశానవాటిక ప్రభావం వారి మీద పడుతుంది. శుభ్రత లోపిస్తుంది. పిల్లలకు సమీపంలో బడి ఉండదు. చుట్టూ అడవి ఆవరించి ఉండడం వల్ల పురుగు పుట్రతో సహవాసం తప్పదు. ఇక అసలు వృత్తి నిర్వహించే శవ వాహకులకు చాలా వేదన ఉంటుంది. సాధారణంగా శవాలకు దగ్గరగా ఉండలేని పరిస్థితి మనుష్యులది. వీరు మాత్రం శవాల శరీర భాగాలను శుభ్రపరిచి, చనిపోయిన ప్రదేశం నుండి బురుజుల ప్రాంతాన్ని మోసుకు రావాలి. బురుజుల ప్రాంతంలో శవాలను ఎత్తైన ప్రాంతానికి తీసుకుపోయి, మళ్ళీ లోయలోకి దించాలి. ఈ పనిలో శారీరక శ్రమ ఎక్కువే కాక తీవ్రమైన మానసిక అయిష్టతను ఎదుర్కోవలసి వస్తుంది. నిర్ణీత సమయంలేని పని కూడా కావడం మరొక సమస్య. అందువల్ల ఖాంథియాలంతా తప్పనిసరిగా మద్యం సేవిస్తారు. శవాల అంత్యక్రియలు కాకముందు మందు తాగొద్దని నిబంధన పెడతారు ట్రస్టీలు. మందు కొడితేనే కానీ శవాల పని చేయలేమన్న బాధ ఖాంథియాలది. ఇంత కఠినమైన వృత్తిలో ఉన్న ఖాంథియాలకు వచ్చే కూలీ తక్కువ. సెలవులు ఉండవు. అందువల్ల ఆ కుటుంబాల స్త్రీలు వ్యభిచారం చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ వృత్తిలో విటుల చేతుల్లో స్త్రీలు హత్యకు గురైన సందర్భాలూ ఉంటాయి. ఇలాంటి ఖాంథియాల దయనీయ జీవితాన్ని రెండు మూడు కుటుంబాల కథల నేపథ్యంలో విస్తృతంగా చిత్రించాడు రచయిత.

శవాలు మోసేవాడు ఫిరోజ్‌ ఎల్చిదానా. ఫిరోజ్‌ పుట్టి పెరిగింది బొంబాయిలోని ఇచ్చాపోరియా  అగ్ని దేవాలయ ప్రాంతం. చదువు ఆగిపోవడంతో బొంబాయి వీధులన్నీ లక్ష్యం లేకుండా, జులాయిగా తిరిగాడు. డూంగర్‌ వాడీ బురుజుల దగ్గర ఖాంథియాగా నుసెస్సెల్లార్‌ పని చేస్తూ జీవితం గడుపుతాడు.

ఫిరోజ్‌ నాన్న ఫ్రాంరోజ్‌ పార్శీ పూజారి. ఇచ్చాపోరియా గుడి వెనక నివసించే ఫ్రాంరోజ్‌ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన స్థానం ఉంటుంది పార్శీ సమాజంలో. ఫ్రాంరోజ్‌ నాన్న మొదటి భార్య కూతురు రుదాబె. ఆమె ఫ్రాంరోజ్‌ కు సోదరి కిందే లెక్క. కానీ రుదాబెతో ఫ్రాంరోజ్‌ లైంగికాసక్తిని కనబరచడంతో వారి తండ్రి తీవ్రంగా మందలిస్తాడు. రుదాబె చెడు తిరుగుళ్ళతో బొంబాయి వీధుల వెంట కనబడుతుంది. అలాంటి తిరుగుడులలో భాగంగా తెమూరస్‌ తో కలుస్తుంది, పెళ్ళాడుతుంది. అలా తెమూకు ఫ్రాంరోజ్‌ కు వైరం ఏర్పడుతుంది. వారికి సెపిడె అనే కూతురు పుడుతుంది. వారిది శవాలను మోసే వృత్తి. డూంగర్‌ వాడీలో ఉంటారు.

అగ్ని దేవాలయం దగ్గర ఉంటున్న ఫ్రాంరోజ్‌ కు ఇద్దరు కొడుకులు, విస్ఫీ, ఫిరోజ్‌. విస్ఫీ చదువులో ఆసక్తి చూపిస్తాడు కానీ, ఫిరోజ్‌ ఫేలై జులాయిగా తిరుగుతాడు. బొంబాయి అంతా తిరిగి చెడు అలవాట్లన్నీ నేర్చుకుంటాడు. తల్లి హిల్లాతో కలిసి డూంగర్‌ వాడీలో ఒక బంధువు అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు సెపిడెను చూసి ప్రేమలో పడతాడు. ఇక అప్పడినుండి డూంగర్‌ వాడీకి వెళ్ళి సెపిడెతో తిరుగుతాడు. సెపిడెను పెళ్ళాడడానికి ఖాంథియాగా మారాలన్న షరతుకు తల ఒగ్గుతాడు. అమ్మానాన్నలను ఎదిరించి పెళ్ళాడి శవాలను మోస్తూ బతుకుతుంటాడు. ఫరీదా అనే కూతురు పుట్టాక సెపిడె పాము కరిచి చనిపోతుంది. శవవాహకులు అంతా తాగి శవాలను మోస్తూ ఉంటారు. ఫిరోజ్‌ ఒకరోజు శవాన్ని మోస్తూ బోర్లా పడేస్తాడు. ట్రస్టీలు మెమో ఇస్తారు. ట్రేడ్‌ యూనియన్‌ పెట్టడంతో తగ్గుతారు.

బొంబాయిలో పార్శీ ప్రముఖుడు నారిమన్‌ మొదటి భార్య కొడుకు వ్యాధితో బాధపడుతూ పార్శీగా చనిపోవాలనుకుంటాడు. అందుకు అతని తమ్ముడైన రోహింటన్‌, ఫిరోజ్‌ ను అతని తండ్రిని ధర్మ సలహాకు ఒప్పించమంటాడు. ఫిరోజ్‌ కోరికను తిరస్కరించిన తండ్రి, నారిమన్‌ డబ్బుతో ట్రస్టీలను ఒప్పించి పార్శీ పద్ధతిలోనే కొడుకు అంత్యక్రియలను జరిపిస్తాడని అంచనా వేస్తాడు. అతని అంచనా ప్రకారం ట్రస్టీలు నారిమన్‌ కొడుకు జోసెఫ్‌ శవాన్ని పార్శి పద్ధతిలో రాబందులకు పెట్టడానికి ఒప్పుకుంటారు. కానీ, ఇది పార్శీమతం పట్ల విఘాతమని బుఖియా, జోసెఫ్‌ శవాన్ని రాత్రికి రాత్రి దొంగిలించి క్రిస్టియన్‌ స్మశానవాటికలో రహస్యంగా అంత్యక్రియలు జరిపేస్తాడు.

ఫ్రాంరోజ్‌ మరణించడంతో ఆయన పెద్ద కుమారుడు విస్ఫీ, తమ్ముడు ఫిరోజ్‌ సహాయంతో ఇల్లు ఇతర ప్రాంతానికి మార్చడంతో కథ ముగుస్తుంది.

ఖాంథియాల దైన్య జీవితానికి తిరుగులేదని చెప్పే ఒక గొప్ప ధర్మపన్నాగం మతంలో ఉంది. ‘నిజానికి నుసెసెల్లార్లు శవాల కుళ్ళు తాలూకు దుష్ప్రభావాన్ని పీల్చుకొని సమాజాన్ని కాపాడుతారు. ఈ ఉదాత్తమైన పనికి ప్రతిఫలంగా వారి ఆత్మ మళ్ళీ పుట్టదని మా మతగ్రంథాలు వాగ్దానం చేస్తున్నాయి. నిష్టతో శ్రద్ధతో ఆ పనిని నిర్వర్తించే శవ సంరక్షకుడు దేహం శిథిలం కావడం, మరణం, పునర్జన్మల నుండి విముక్తి పొందుతాడు’ అని ఫిరోజ్‌ చెప్పుకొస్తాడు. అతనే ‘అయితే, ఈ జన్మలో ప్రజలు అతన్ని మకింలాగా, మలంలాగా, అస్పృశ్యునిగా చూస్తారనే విషయాన్ని మత గ్రంథాలు రాయలేదు’ అని కూడా అంటాడు.

ఏమీ చేయలేని అశక్తులు యజమాని లేని సమయంలో ఎంత కోపంగా మాట్లాడుకుంటారో మామూలుగా యజమానులు ఊహించలేరు. ఫిరోజ్‌ పని ఒత్తిడి వల్ల ఒకసారి కళ్ళు తిరిగి శవాన్ని పడవేస్తాడు. అప్పుడు యాజమాన్యం వాళ్ళకు మెమోలు ఇచ్చి శవాలను మోసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించకూడదని హెచ్చరిస్తుంది. అప్పుడు నుసెసెల్లారు యాజమాన్యాన్ని బూతులు తిడతారు. వాడీ పని చేస్తే తెలిసేది అని కూడా ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తారు.

ఖాంథియాలలో భరించలేనంత పేదరికం ఉంటుంది. పూట గడవడం కోసం మగవాళ్ళు శవాలను మోస్తే కొందరిండ్లల్లో స్త్రీలు వ్యభిచారం చేయడం కూడా తప్పనిసరవడం ఈ నవలలో చిత్రించాడు రచయిత. తెమూరస్‌ భార్య రుదాబె దాదాపు ప్రతిరోజు రాత్రి అలంకరించుకొని పోవడం భర్తకు తెలుసు. ఇంకోరకంగా ఆయన అనుమతి కూడా ఉంటుంది. చిన్న పాపను భర్తను ఇంట్లో వదిలేసి వెళ్ళి రుదెబా తీవ్రమైన లైంగిక వేధింపులకు గురై చనిపోతుంది. కానీ దోషి దొరకడు. ఎవరికీ ఏ శిక్షా పడని, పడడానికి పట్టుబట్టలేని స్థితి ఖాంథియాలది.

మతం పట్ల మనుషుల పట్టుదల ఎంత కఠినంగా ఉంటుందో ఈ నవల అడుగడుగునా గమనించవచ్చు. నిజానికి ధర్మం పేరు మీద మతం విధించిన కట్టుబాట్లు మనుష్యుల్ని ఎంతో బాధకు గురి చేస్తుంటాయి. అయినా వాటిని సడలించరాదన్నంత స్థిరంగా మనుష్యుల అంతరంగంలో అవి గూడు కట్టేట్లు చేయడంలో అన్ని మతాల మతపెద్దలు విజయమే సాధించారన్నది శవాలు మోసేవాడి కథలో గమనించవచ్చు. జోసెఫ్‌ నారిమన్‌ కొడుకే అయినప్పటికీ ఆయన క్రిష్టియన్‌ భార్యకు పుట్టిన కొడుకు. అతను ఇంగ్లండులో మతాల ధార్మికత మీద పరిశోధన చేసి పార్శీ మతమే అన్ని మతాలలో గొప్పదని భావించి తను చనిపోయాక పార్శీ మతం పద్ధతిలో అంత్యక్రియలు జరగాలని భావించి బొంబాయి వస్తాడు. జోసెఫ్‌ తమ్ముడు రోహింటన్‌, ఫిరోజ్‌ తో తనకున్న స్నేహాన్ని ఆధారం చేసుకొని ఫిరోజ్‌ తండ్రి ఫ్రాంరోజ్‌ తో పార్సీ ట్రస్టీలకు సిఫారసు చేయించుకొని అన్నకు పార్సీ పద్ధతిలో అంత్యక్రియలు జరిపించాలనుకుంటాడు. ఫ్రాంరోజ్‌ అందుకు తప్పుబట్టడమే కాకుండా నుసెసెల్లార్‌ అయిన ఫిరోజ్‌ కూడా దానికి వ్యతిరేకించాలంటాడు. చివరికి నారిమన్‌ తన పలుకుబడితో పార్సీ ట్రస్టీలను ఒప్పించగలుగుతాడు. కానీ ఆ ధర్మ వ్యతిరేక కార్యానికి బుఖియా గండికొట్టి ఆ శవాన్ని క్రిస్టియన్‌ సిమెటరీలోనే ఖననం చేస్తాడు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయమేమిటంటే క్రిస్టియన్‌ సిమెటరీ నిర్వాహకుడు గోమ్స్‌ శవపేటిక లేకుండా ఖననం చేయడం తప్పని, అంతటి రాత్రిలోనూ ఏ ప్రలోభాలకు లొంగకుండా పేటిక తెప్పించాకే ఖననం చేయనిస్తాడు.

శవాలను మోసేవాడి కథలో కొన్ని అలవోకగా వేసినట్లనిపించే ప్రశ్నలలో గొప్ప జీవన తాత్వికత పొడసూపుతుంది. సెపీడె తన జీవిత కాలమంతా జంతువులకు, పకక్షులకు, పురుగు పుట్రకు ప్రేమతో ఆహారం పెడుతుంది. చివరకు ఆమె పాముకాటుకు చనిపోయిందని కూతురు ఫరీదాకు చెప్పినప్పుడు ఆమె వేసిన అస్పష్టమైన ప్రశ్నలో ఈ ప్రకృతిలో ఏ నీతీ, ధర్మం లేనే లేదా అనే అర్థం ఇమిడి ఉన్నట్లు ఫిరోజ్‌ కు అనిపిస్తుంది. ఫిరోజ్‌ నుసెసెలార్‌ గా మారడానికి చెప్పుకున్న కారణం తాత్వికంగా ఆలోచనా త్మకంగా ఉంటుంది. అతడు ఇలా అనుకుంటాడు :

”నా విధి తాలూకు భవిష్య దర్శనం నన్ను ఆ అంతిమ విశ్రాంతి స్థలాలవైపు లాగిందా? ఆ ప్రదేశాల నుండి ఇంటికి తిరిగి వచ్చింతర్వాత ఒక్కసారి కూడా నేను కాళ్ళు చేతులు కడుక్కోలేదు. రాత్రివేళ మా దేవాలయంలోకి పోయే ముందు స్నానం చేసే ఆచారాన్ని ఎన్నడూ పాటించలేదు. నేను చేసిన నీచమైన మురికి పనుల గురించి తెలిస్తే నాన్న చాలా భయపడేవాడు. ఒకవేళ మనుష్యులకు పునర్జన్మ అనేది ఉంటే, ఇప్పుడు సైతం అప్పటి నా రహస్య కార్యకలాపాల గురించి తెలిస్తే ఆయన నన్ను క్షమిస్తాడనుకోను”.

మనుషుల ప్రవర్తనలోని డొల్లతనాన్ని రచయిత అనేక సందర్భాలలో వ్యక్తపరుస్తాడు. ఒక తల్లి శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆమె కుమారుడు వీళ్ళేదని అడ్డం పడతాడు. పెద్దవాళ్ళు సర్దిచెప్పి నప్పుడు పాడెలో తనూ పడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది వాస్తవమైన ఫీలింగా, లేక ప్రదర్శనా అనే అనుమానాలు పాఠకులకు రావాలని రాసినట్లనిపిస్తుంది. ఆ శవం పోతే బతకలేమన్నట్లు ఏడ్చినవాళ్ళు శవాన్ని లేపడంలో కొద్దిగ కూడా సహాయం చేయరు. ఎంతో కష్టంగా ఖాంథియాలు శవాన్ని అతి కష్టం మీద మోస్తే కంటి తుడుపుగా ఇరవై రూపాయల టిప్పుతో సరిపెడతారు.

ఖాంథియాల వృత్తి దైన్యం, తద్వారా విస్తరించే కుటుంబ దైన్యం, మత పెద్దలు, ట్రస్టీల చర్యలలోని డొల్లతనం విస్తృతంగా చర్చించిన నవల ”శవాలను మోసేవాడి కథ”. పట్టణీకరణ విపరీతంగా పెరిగిన ఇలాంటి రోజుల్లో శవాలను తినే పకక్షులు జంతువులు రావడం లేదనే వాదనకు ఆస్కారం కలిగించే రెండు మూడు సంఘటనల్ని కూడా ఉదహరించారు రచయిత. విలువైన భూముల ఆక్రమణ కోసం శవాలను తినే జీవరాశి రావడం లేదనే వాదనను పుట్టించారనే ఇంకో వర్గపు అభిప్రాయానికి కూడా అవకాశం కల్పించాడీ నవలా రచయిత.

ఇది ఒక మౌలికమైన విషయాన్ని అద్భుతంగా చర్చకు పెట్టిన నవల. తెలుగులో రాయబడ్డ నవలేనా అన్నంత సహజంగా అనువదించారు అనువాదకులు ఎలనాగ.

November 22, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడదంటే

by Y. Sujatha November 22, 2023
written by Y. Sujatha

ఆడదంటే కష్టాలు కన్నీళ్ళు కాదు –
బయపడకు తల్లి భయఆపడకు
ఇప్పుడు నీ కర్తవ్యం కన్నీళ్ళు కార్చడం కాదు
నీ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవడం.
నీశక్తి నీవు తెలుసుకొని. ఆపరకాళిలా మారాలి నివు
మహభారతపర్వంలో ద్రౌపతి కావు నీవు
నిప్పును నీళ్ళలా దోసిళ్ళతో సేవించగల నేర్పరివి నివు
అబలవు కావు నీవు బద్దలైన అగ్ని పర్వతం జ్వలనం నీవు.
స్తన్యం. అందని చంటిపిల్లలా ఎక్కేక్కి పడి ఏడువకు నీవు
మోసపోయిన ఆడకూతూర్ల నిక్కమైన దిక్కారస్వరం నీవు..
దగాపడ్డ ఆడపిల్లలు ఆలపించిన విముక్తగేయం నీవు.
ప్రశ్నార్ధకమైన బతుకులకు పోరాట నినాదం నీవు ..

శాంతివ్యూహాలను వల్లిస్తే సరిపోదు నీవు
సర్వతంత్రులను మీటి నీవు వేటాడే మగ మృగాలను ప్రారతోలాలి నీవు
అప్పుడే తిరగపడ్డ వీణ ఆగ్రహాజన తంత్రివి నీవు
అసిత్వ పోరుకు ఆర్తివి కావాలి నీవు
పక్షవాతం వచ్చిన మగహృదయలకు నీవు అక్షరజ్ఞానా ఖడ్గాలను సంధిస్తూ నీవు
శస్త్రచికిత్సలు చేయాలి నీవు
రాబోయే తరాలకు కొత్త కాలజ్ఞానం లిఖిoచాలి నీవు
పసిరికలు వచ్చి పచ్చబడ్డ కీచకుల కళ్ళల్లో నీవు కారం నీళ్ళు చల్లాలి నీవు
నీవు ఓక సైన్యంగా పోరాటం చేస్తూ
పోరు జీవన పాఠాలు నేర్పాలి నీవు
మగవాళ్ళ గుండెల్లొ పెల్లుబికిన అగ్నిశిఖలా ప్రజ్వలించాలి. నీవు
స్త్రీ జాతిస్వప్నం సాకారం చేస్తూ ప్రణవమై ప్రదీప్తించాలి నీవు
అప్పుడే ధిక్కార పు సమాజంలో దివిటివి అవుతావు నీవు
స్వయం సంపూర్ణ చిహ్నానివి నీవు అవుతావు బిడ్డా..

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వైద్య పరిజ్ఞానం- ఇంట్లో ఆరోగ్యం

by రంగరాజు పద్మజ November 22, 2023
written by రంగరాజు పద్మజ

డా॥ పెళ్ళకూరి జయప్రద సోమిరెడ్డి.

ప్రతి జీవి తన ఉనికి, బతుకు కోసం పోరాడుతూనే ఉంటుంది. శరీరంలోని ప్రతి జీవకణం ప్రోగ్రాం చేయబడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే అయినా… మనుగడకోసం యుద్ధం తప్పదు!

   ఈనాటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా దీర్ఘ రోగాలతో బాధపడుతున్నారు. రకరకాల వ్యాధుల గురించీ, ఆ బాధల నుంచి ఎలా తట్టుకొని నిలబడాలో * వైద్య పరిజ్ఞానం -ఇంట్లో ఆరోగ్యం* అనే పుస్తకం ద్వారా  శాస్త్రీయ పరిజ్ఞాన వ్యాస పరంపరను మనకు డాక్టర్ పెళ్ళకూరు జయప్రదా సోమిరెడ్డి గారు అందించారు. వీరు వృత్తిరీత్యా డాక్టర్ అయినా ప్రవృత్తి రీత్యా చక్కని రచయిత్రికి.  నవల, కథలు, కవితలు ఇలా ఎన్నో ప్రక్రియలలో  రచనలు వెలువడ్డాయి.

   ఈ పుస్తకం చదివినప్పుడు నేను గమనించినదేమంటే? అటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే… రచయిత్రిగా సామాన్య శాస్త్ర వ్యాసాలు రాసి  ప్రజలలో వైద్యం, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.

  రోజులు మారినా, మానవత్వ విలువలు మారినా, చదువుతున్న వారి సంఖ్య పెరిగినా, నాగరికత ఎంత పెరిగినా, మూఢనమ్మకాలతో బలైపోయే రోగులు ఎందరో???

ఇలా మూఢనమ్మకమున్న రోగులు ఆరోగ్యానికి ఆమడ దూరంగా ఉండడం… రక్తదానం చేస్తే తాము బలహీనులవుతామని అపోహలో దగ్గర వారిని కోల్పోవడం ఇలాంటి సంఘటనలు తమ వృత్తిరీత్యా ఎదుర్కొని, ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరుగకూడదని ఒక ప్రేరణ ప్రజల్లో కల్పించి, వారి అజ్ఞానం తొలగించాలని సైన్స్ ఆధారిత వ్యాసాలు రాశారు.

    వ్యాసాలు పాఠకులపై ఎక్కువ ప్రభావం చూపెట్టలేవని, కథలుగా మలచానని స్వయంగా రచయిత్రి తమ ముందుమాటలో రాశారు.

         ఆడపిల్లనే చిన్న చూపుతో కడుపులో ఉన్న బిడ్డను ఆపరేషన్ చేసి తీయాలంటే, వద్దన్న తల్లి-అత్తల అమానుషానికి బలైన శిశువు మృతిని మరో కథగా మలిచారు.

   ఎయిడ్స్ వంటి రోగాల పట్ల సరైనా అవగాహన లేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని వదిలేయడం, డిప్రెషన్ అనే జబ్బును దయ్యం పట్టిందని, నాటు వైద్యాలు చేయించి నిండు జీవితాలు నాశనం చేసుకున్నటువంటి ఎన్నో ఘటనలు రచయిత్రి చేత కథలుగా మలచబడ్డాయి.

   రక్త సంబంధీకుల మధ్య వివాహాలు అంగవైకల్యంతో పుట్టిన పిల్లల గురించి చక్కటి  అవగాహన కలిగేలా కీబోర్డ్ అనే కథను రాశారు.

  ఈ వీణకు శృతి అనే నవల అవయవ మార్పిడి పట్ల అవగాహన కల్పించే రచన!

   అలాగే వైద్యపరమైన ఎన్నో విషయాలపై వ్యాసాలు , కవితలు రాసి, రోగుల బంధువులు వాళ్ళ నిర్లక్ష్యంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని వాటి గురించి తెలిపారు!

   ఈ పుస్తకానికి ముఖచిత్రం రచయిత్రి- డాక్టర్ పెళ్ళకూరి జయప్రద రెడ్డిగారి చిత్రమే అందంగా వేశారు.

   ఈ పుస్తకానికి ముందు మాట శ్రీ గుమ్మా సాంబశివరావు గారు విశ్రాంత ప్రిన్సిపల్ రాస్తూ రచయిత్రిగా, డాక్టర్ గాతన అనుభవాలను రంగరించి వైద్య విజ్ఞానాన్ని- సాహిత్య సంస్కారాన్ని జోడించి రాసిన ఈ పుస్తకం అమృత గుళికని ప్రశంసించారు.

   ఎంత అభివృద్ధి చెందామని అనుకుంటున్నా ఇంకా మనకు ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఏర్పడలేదని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఈ ఆరోగ్య అవగాహన కల్పించే వైద్య పరిజ్ఞానం పుస్తకంలో… మహిళలకు సంబంధించిన వ్యాధుల గురించిన ఎన్నోఅధ్యాయాలు ఉన్నాయి.

1. పిల్లలు కలగక పోవడానికి కారణం

2.తల్లి కావాలనుకుంటే…

3. గర్భం ధరించాక,

4. అబార్షన్ పర్వం,

5. ముత్యాల గర్భం,

6. ఎదురు కాళ్ళు,

7. ఎక్టోపిక్ ప్గ్రెన్సీ ( పక్కపేగులో గర్భంరావడం),

8.  ప్రసవంలో ప్రమాదం,

9.  బ్లడ్ బ్యాంకు లేని రోజుల్లో,

10. నాలుగు దశాబ్దాల సిజేరియన్ చరిత్ర.

       ఈ అంశాలపై చక్కని వ్యాసాలు అందించారు డాక్టర్ జయప్రదగారు.

  తల్లి కావాలనే కోరికను ఎండమావి చేయకూడదని, తపనతో పిల్లలు కలగక పోవడానికి కారణాలు, వైజ్ఞానిక కారణాలతో పాటు డాక్టర్లు ఏం చేయగలరు? అని విశ్లేషించిన వైనం చాలా బాగుంది. అలాగే సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

   తల్లి కావాలనుకునేవారు పాటించాల్సిన మూడు సూత్రాలను పాటించే విషయ వివరణ చాలా బాగుంది.

   అలాగే గర్భం రాకముందు వారి మానసిక పరిస్థితి- ఒత్తిడికి లోనుకావద్దనే సలహా పాటిస్తే ఆ సమస్య నుండి బయటపడే విధానం చక్కగా వివరించారు.

   గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్పులని మొదటి మూడు నెలలు గుండెల్లో మంట మలబద్ధకం మొదలైన శీర్షికలు పెట్టి చాలా చక్కగా వివరించారు. గర్భిణీ స్త్రీల నిద్రలేమి ఎందుకు వస్తుందని చెప్పారు.

   ఇక గర్భస్రావాలు ఎన్నిరకాలు? వాటిని ఎలా కనుక్కోవాలి? వాటి నిర్ధారణ !వాటికి వైద్యం? పూర్తిగా గర్భస్రావం , మరియు పూర్తిగాని గర్భస్రావాలు ఎలా ఉంటాయి? వాటి లక్షణాలు.. వాటి నివారణకు ఏం చేయాలని వీటికి కారణాలు, వైద్యం, ఇవన్నీ గర్భం దాల్చే యువతులకే కాదు కుటుంబ సభ్యులు కూడా తెలుసుకొని ఉంటే… గర్భం దాల్చే స్త్రీలకే కాకుండా, ఆ యువతులకు ఒత్తిడికి లోనుకాకుండా చేయగలరు. అంత విషయ పరిజ్ఞానం ఉందీ పుస్తకంలో…

  ముత్యాల గర్భం అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది?  వాటి లక్షణాలు- వైద్యంతో పాటు, గర్భిణీ స్త్రీకి కడుపునొప్పి రావడానికి కారణాలు, ఎదురు కాళ్లతో ప్రసవంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపరేషన్ కు సంబంధించిన విషయాలు కూలంకషంగా చర్చించారు స్వతహాగా రచయిత్రి అయిన డాక్టర్ జయప్రద గారు.

   గర్భం పక్క పేగుల్లో రావడానికి కారణాలు, ఇన్ఫెక్షన్లు, వైద్యం కూడా వివరించారు.

      ప్రసవంలో ప్రమాదాలు గురించి ఎంతచక్కగా వివరించారంటే ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన విషయమిది.

  సరే ఇక రక్తం గురించి ఇప్పుడు సామాన్యులకు కూడా తెలుస్తుంది , బంధువులు ఇవ్వకపోయినా, బ్లడ్ బ్యాంకులలో దొరుకుతున్నది లేదా రక్తదాతలు ఇస్తారని …ఈ అధ్యాయం ఎందుకు అనుకోవద్దు! ఒక వైద్యురాలి ద్వారా తెలిసిన విషయం అరాకొరగా ఉండకుండా… పూర్తి అవగాహనతో చదువుకున్న వైద్యశాస్త్రంతో వివరించారు కాబట్టి ఈ నా ఆలోచనల్లో- ఆమె అధ్యాయంకూడా ముఖ్యమే! ఎందుకంటే? రక్తం కావాల్సిన వారికే  కాకుండా రక్తదాతలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ సలహాలతో అపోహలు తొలగిపోతాయి.

  40 సంవత్సరాలుగా ఆపరేషన్ల గురించి, వాటి మీద అపోహల గురించి చెప్పి, అటు పేషెంట్లూ నష్టపోకుండా, ఇటు డాక్టర్లు కూడా వివాదాస్పదంలో పడకుండా ఉపయోగపడే అధ్యాయమే ఈ నాలుగు దశాబ్దాల చరిత్ర ! అందుకు గల కారణాలు మనమూ తెలుసుకోవాలి…

   “గర్భసంచి సంబంధిత జబ్బుల విభాగంలో” ఎన్ని విభాగాలున్నాయో? వాటి పనితీరులు చక్కగా వర్ణించారు రచయిత్రి.

   మోనోపాజ్ (ఋతువిరతి ) ఎదుర్కొనే మహిళల అవస్థలు- అనారోగ్యాలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూనే.. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని హెచ్చరిక చేశారు. గర్భసంచి జారడం గురించి చక్కని వివరణ ఇచ్చారు.

    ఇలా మహిళలకు గర్భసంచి సంబంధిత రోగాలు, వాటి లక్షణాలు ,ఆరోగ్యం గురించి అవగాహన లేకపోయినా, సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోయిన ఆ వ్యాధి క్యాన్సర్ గా ఎలా మారుతుందని? అప్పుడిక చేసేది ఏమీ లేక క్యాన్సర్ హాస్పిటల్కు పంపడమేనని బాధగా అనడం.. స్త్రీ సహజమైన జాలిగుణం కనపడుతున్నది డాక్టర్ గారిలో…

   మూఢ నమ్మకాలగురించి చెప్తూ డాక్టర్ కూ పేషెంట్ కు మధ్య స్నేహభావం, నమ్మకం ఉండాలని చెప్పడం బాగుంది.

  అప్పుడే పేషెంట్ తన మనసులోని బాధని చెప్పుకుంటుంది కదా!

   ముఖ్యంగా డాక్టర్ గానూ రచయిత్రిగాను చెప్పేది ఏమిటంటే యువత  వ్యాధి సోకిన తరువాత మూఢనమ్మకాలతో  కాలం వెళ్ళబుచ్చకుండా ఆరోగ్యంపట్ల జాగ్రత్త, సైన్స్ విజ్ఞానాన్ని కలిగి ఉండాలనీ, డాక్టర్లు పేషెంట్లకు ఏం వైద్యం చేస్తున్నారో తెలుసుకొని ఉండాలని , వితండ వాదంతో పూర్తి అవగాహన ఏర్పరుచుకోకుండా డాక్టర్ల పై నిందలు మోపడం సరికాదనీ సూచించారు.

       కొన్ని చిట్కాలు ఇంట్లో దొరికే పదార్థాలలో ఏ ఏ మంచి గుణాలుంటాయో? వాటి వాడకంవల్ల ఎటువంటి ఫలితాలను పొందుతామో  ఒక అమ్మమ్మ వలెనో, ఒక బామ్మ వలెనో చక్కగా విడమర్చి చెప్పారు రచయిత్రి .

అలానే జీవన విధానాన్ని మార్చుకోమని సున్నితంగా హెచ్చరిక చేశారు. మంచి ఆహారాలు తీసుకుంటే వాటిలో ఉండే సుగుణాలు అవి ఎలా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని వివరించారు. నమ్మకూడని నమ్మకాలు నమ్మవద్దని చెప్పారు.

    ఈ విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మన ఆరోగ్యం పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, వైద్యం మొదలైన ఎన్నో విషయాలు తెలుసుకొని, వాటిని ఆచరించి ,మన జీవితాలను బాగు చేసుకుందాం! నలుగురికీ చెప్పి డాక్టర్ గారి వలె సమాజంలో ఆరోగ్యపరమైన సేవచేద్దాం!

  అందరూ జబ్బుల పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల , డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించి, ప్రాణాలు కాపాడుకొని, హాయిగా జీవించాలనే సదుద్దేశంతో చేసిన రచన ఈ పుస్తకం వైద్య పరిజ్ఞానం-ఇంట్లో ఆరోగ్యం. ఈ రచన చదివి….

శతంజీవ – శతదో వర్ధమానః

శతం వసంతాన్- శతం హేమంతాన్ ॥

వంద వసంతాలు , వంద హేమంతాలు వర్ధిల్లుతూ జీవించండి॥

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆడ సిపాయి!

by Ramesh November 22, 2023
written by Ramesh

సుగుణమ్మ ఒక ఆడ సిపాయే
ముసలవ్వను,తన బిడ్డను అద్దెగుడిసెలో విడిచి
ఉదయం మా పాఠశాలకు బయలుదేరినప్పుడు
ఆమె తరగతి గది తలుపులు కిటికీలు తెరవందే
సూర్యుడి లేతఎండ వాలదు
స్వచ్ఛమైన కొండగాలీ వీయదు
తళతళా మెరవాల్సిందే
పాఠశాల గచ్చునేలైనా తినే బువ్వ పళ్లాలైనా
ఆమెచేతిలో చీపురు పడ్తేచాలు
చెత్తాచెదారమంతా దూరం
వానాకాలం వరండాలో
ప్రతిబింబాలు చూపే నీళ్లమడుగు మాయం

క్లాస్ రూముల్లో ఊడ్చేవేళ బడిపిల్లలు చింపి పారేసిన
చిత్తుకాయిదాలు గాలిఅలల్తో ఆడే భరతనాట్యం
శిశిరాన ఆ కానుగమానులురాల్చినఎండుటాకులరాశులు
బడిలో పనిచేసే ఆమె సహనానికి వార్షిక పరీక్షే
చిరునవ్వు తప్ప చిరాకు కానరాదు ఆ ముఖంలో

ఉదయంపూటా పిల్లల దాహానికి మంచినీరు
ఇంటర్వెల్ లో టీచర్లకు తేనీరు ఆమె
తేనీరు మిగులని వేళ
ఎవరైనా అతిథి అరుదెంచిన వేళ
మీరు తాగితే నేనుతాగినట్టే..అన్న వాక్యంలో
ఆమె దయాహృదయమే ధ్వనిస్తున్నది
నిర్మలమైన ప్రేమే కనిపిస్తుంది నాకు
వంటావార్పుకాడ ఆమె నగుమోముదే వెలుగంతా
మధ్యాహ్నభోజన సమయం
ఆమె వుంటే వుండబోదు ఏ అంతరాయం
భోజన విరామ అనంతరం
వరండా నిండా చిందవందరగా
రహస్యలిపిలా రాలిపడివున్న విద్యార్థులఅన్నం మెతుకులు…
టీచర్ల కంచాలు, ఖాళీగాచూస్తున్న అంట్ల లంచ్ బాక్స్ లు…
స్వాగతం చెబుతుంటాయ్ ఆమెకు
ఐదుపదులు దాటినవయోభారమైనా పనిభారమైనా
ఏనాడూ ధిక్కార స్వరం వినిపించిందిలేదు
పనికాడ వెనుకడుగు వేసిందీలేదు ఆమె
గంటతరపడి బడంతా బండచాకిరీ చేసినా
తనకు బుక్కడుఅన్నంకూడా మిగలనిరోజు
మందహాసం తప్ప నీరసం కంటికి ఆనదు నాకు
సర్దుబాటుతత్వం ఆమె సుగుణం అనుకుంటా
రాజీమార్గం ఆమెకు జీవితం నేర్పిన పాఠం బహుశా
పనిలోనే ఆనందం…పనే దైవం ఆమెకు
ఆకాశాన మార్తాండు మండుతూ పడమరకొండదిశకు వాలేవేళ
ఎపుడో ఆమె పేగుల్లో ఆకలిఆదితాళం
అపుడే పిడికెడు కడుపులో ఇంత ఆహారం
ఆఖరు గంటమోగిన అరగంట తర్వాతే ఆమెకు చుట్టి
పెద్దబడిలో…ఇంతసేవజేసినా ఇంత ఊడిగంజేసినా
గూడులేదు,గుంట భూమీ లేదు
చిల్లి గవ్వా చేతిలో లేదు
కిరాణదుకాణంలో బారువడ్డీ అప్పులు
ఊర్లో అవమానాల,వెటకారాల మాలలు తప్ప
పాఠశాల విద్యాసంవత్సర ఆరంభం నుండి అణారాలేదు ఆమెజీతం
బాధలు,బరువుల బడబాగ్నుల గుండె నాదమై పాడుతున్న గీతం ఆమె
అభినవ సీతమ్మ తల్లి ఆమె
అందుకే ఆమె సుగుణమ్మ కాదు సుగుణాల అమ్మ

సమాన పనికి సమానవేతనమేది?
అంతరిక్షంలో చందమామ అందడం అద్భుతం
నిగూఢ రహస్యాలు పరిశోధనలకు అందనుండడం ఆనందమే
ఆకలి మూలాలు
కార్చిచ్చులా వ్యాపిస్తున్న అవినీతి మూలాలు
అంతుచిక్కకపోవడమే బహుఆశ్చర్యం!
భూలోకంలో ఇంకా ఎన్నాళ్లు ?
సముద్రఅగాధమంతటి సమసిపోని ఈ అంతరాలు?.

November 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us