

చాచా నెహ్రూ (రూపకం)
నానమ్మ : ఏమర్రా ! ఏమిటీ హడావుడి. ఈ రోజు ఇంత తొందరగా తయారవుతున్నారు. ఎక్కడికి?
బాబు : స్కూలుకి నానమ్మా! ఈ రోజు బాలల దినోత్సవం కదా! అందుకే త్వరగా వెళ్తున్నాము.
పాప : అవును నానమ్మా ! ఈరోజు నెహ్రూ పుట్టినరోజు కదా! నాలుగు రోజులుగా మా పాఠశాలలో ఇదే హడావిడి. మాకు అన్ని రంగాలలో పోటీలు జరిపారు. మరి నాకు పాటల పోటీలో, తమ్ముడికేమో పరుగు పందెంలో బహుమతులు వచ్చాయి. అవి ఈ రోజు ముఖ్య అతిథి చేతుల మీదుగా మాకు అందజేస్తారు. అందుకే తొందరగా వెళ్ళాలి.
నానమ్మ : ఓహో అలాగా ! అయితే వెళ్ళి రండి.
xxxxxxxxxxxxxxxxxxxxxxxx
నానమ్మ : వచ్చేసారా పిల్లలు ! మీ బళ్ళో కార్యక్రమాలు ఎలా జరిగాయి ?
బాబు : స్కూల్లో ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందనుకున్నావు? డాన్సులు, ఆటలు, పాటలు. అందరు చాచా నెహ్రూ గురించిన పాటలే పాడారు.
పాప : మా హెడ్ మాస్టర్ నెహ్రూజీ గురించి క్లుప్తంగా చెప్పారు. నానమ్మ! మాకు ఇంకా నెహ్రూ గురించి తెలుసుకోవాలని వుంది. చెప్పవూ !
నానమ్మ : ఆకలిగా వుంది కదర్రా ! ప్రొద్దున హడావిడిలో ఏమి తినకుండానే వెళ్ళారు. అన్నం తిన్న తర్వాత నిదానంగా అన్ని చెపుతాను రండి. మీకు ఆకలిగా లేదా?
బాబు : ఎందుకు లేదు? ఆకలి దంచేస్తుంది. పద పద….
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
పాప : అన్నం తిన్నాం కదా! ఇప్పుడు చెప్పు నానమ్మా ! చాచాజీ గురించి తెలుసుకోవాలని వుంది.
నానమ్మ : చూడండి పిల్లలు ! నిశ్శబ్దంగా కూర్చుని శ్రద్ధగా వినండి.
మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ. ఈయన పూర్తి పేరు జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ అంటే రత్నం అని అర్థం.
బాబు : నెహ్రూ పుట్టిన ఊరేది నానమ్మా ?
నానమ్మ : ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాదు పట్టణంలో మన చాచాజీ పుట్టాడు. అలహాబాదు త్రివేణి సంగమం. గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల కలయిక అలహాబాదును ఒకప్పుడు ప్రయాగ అనే వారు. అలాంటి పవిత్ర స్థలంలో పుట్టిన పవిత్రమూర్తి నెహ్రూ.
పాప : నవంబర్ 14న (అంటే ఈ రోజే) కదా ఆయన పుటా
నానమ్మ : అవునర్రా! 1889 సం|| నవంబర్ 14న చాలా ధనవంతులైన మోతీలాల్ నెహ్రూ, స్వరూప రాణి దంపతులకు ముద్దుబిడ్డగా జవహర్ పుట్టాడు. నెహ్రూకి ఇద్దరు చెల్లెళ్ళు. ఒకరు విజయలక్ష్మి పండిట్, చిన్న చెల్లెలు కృష్ణ (హతీసింగ్)
పాప : మరి నెహ్రూ ఎక్కడ చదువుకున్నారు నానమ్మా ?
నానమ్మ : ముందు అలహాబాదులో చదువుకున్నారు. ఆ తరువాత ఇంగ్లాండ్ వెళ్ళా అక్కడ చదువుకొన్నారు. నెహ్రూ ఇంగ్లాండులో చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి ఏమయిందంటే!
బాబు : ఆఁ ఏమయింది?
నానమ్మ : నెహ్రూ చదివే పాఠశాలకు అనేక గేట్లుండేవట. పాఠశాల వదిలాక ఇంటికి వెళుదామని నెహ్రూ తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ గేటు వరకు వచ్చాడు. తండ్రి తనకోసం ఏర్పాటు చేసిన కారు అక్కడ లేదు. పాఠశాల కున్న అన్ని గేట్లలో ఏ గేటు దగ్గర తన కారు వుందో తెలుసుకోవడం కష్టమైంది నెహ్రూకి. ఈ విషయాన్ని గురించి తన తండ్రి మోతిలాల్ నెహ్రూకీ ఒక చిన్న జాబు వ్రాశారు చాచాజీ. అంతే ఆ తరువాత ఆ పాఠశాలకు వున్న అన్ని గ్లే ముందు ఒక్కొక్క కారు నెహ్రూ కోసం వేచి వుండేదట. అటువంటి ఏర్పాటు చేయగలిగిన మోతీలాల్ సంపద గురించి జనం ఆ రోజుల్లో కథలుగా చెప్పుకునేవారట.
పాప : అవును నానమ్మా ! చాచాజీ పేరు జవహర్ లాల్ కదా! మరి నెహ్రూ అన అంటారెందుకు?
నానమ్మ : నెహ్రూ అనేది జవహర్ లాల్ ఇంటిపేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, నెహ్రూ పూర్వికులు కాశ్మీరులో ఓ కాలువ ఒడ్డున వున్న ఇంట్లో ఉండేవారుట. కాశ్మీరు భాషలో నహర్ అంటే కాలువ అని అర్థం. కాలక్రమేణ నహర్ నెహ్రూగా మారింది. ఆ తరువాత వారు అక్కడినుండి అలహాబాదు వచ్చి స్థిరపడ్డారు. ఆ విధంగా నెహ్రూ అనేది వారికి ఇంటిపేరుగా మారింది.
బాబు : నెహ్రూ ఎంతవరకు చదువుకున్నాడు నానమ్మ ?
నానమ్మ : నెహ్రూ బారిష్టర్ అంటే న్యాయవాద విద్య పూర్తి చేసుకుని 1912 సం||లో భారతదేశానికి తిరిగి వచ్చారు. లాయరుగా (న్యాయవాది) జీవితం అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సమయంలోనే 1914 సం||లో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది.
బాబు : నువ్వు నెహ్రూజీని చూసావా నానమ్మ ?
నానమ్మ : లేదురా! అప్పుడు మేము మీ అంటే వున్నాము. మా తాత చెప్పితే మాకు తెలిసింది. పుస్తకాల్లో చదివా. ఫోటోలోనే నెహ్రూని చూసాం. అంతే.
నానమ్మ : ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కొఱకు వచ్చి మన దేశాన్ని చిన్య రాజ్యాల్ని మోసంతో గెలిచి క్రమంగా మనల్ని బానిసలుగా చేసారు.
1857వ సం||రం లో సిపాయిల తిరుగుబాటుతో మన స్వాతంత్య్ర పోరాటం మొదలయింది. అలా తిరుగుబాటు చేసినవారు చాలామంది వున్నారు. ఝాన్సీ లక్ష్మిబాయి, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, చంథ్రేఖర్ ఆజాద్, తాంతియా తోపే, నానా సాహెబ్ ఇలా చాలా మంది వున్నారు. 80 సం||రాలకు పైగా హింసాయుత మార్గంలో పోరాటం జరిపినప్పటికి మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదు. ఇలా ఎందరో నాయకులు స్వాతంత్య్ర పోరాటం జరుపుతూనే వున్నారు. (ఆ సమయంలోనే జాతీయ నాయకుడైన బాలగంగాధర తిలక్ 1914 సం|| జైలు నుండి విడుదలై వచ్చారు.)
1915 సం|| గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి వచ్చి స్వాతంత్య్రం కోసం అప్పటికే పోరాటం సాగిస్తున్న నాయకులను కలుసుకున్నారు. అహింసాయుత స్వాతంత్య్ర పోరాటానికి నాంది పలికారు.
పాప : అవునవును గాంధీజీ యుద్ధం లేకుండా (ఎవరిని చంపకుండా) అహింసాయుతంగా పోరాడి మనకు స్వాతంత్య్రం తెచ్చారని మా టీచర్ చెప్పారు. నెహ్రూజీకి గాంధీ తాతతో పరిచయం ఎలా అయింది? చెప్పు నానమ్మ!
నానమ్మ : అదే కదా చెపుతున్నా ! చాచాజీ మొదటి నుండి మొహమాటస్థుడు, బిడియస్తుడు. అందుకని స్వాతంత్య్ర పోరాటం పట్ల ఆసక్తి ఉన్నప్పటికి చాలారోజుల వరకు రాజకీయ రంగంలో (ప్రత్యక్షంగా) పాల్గొనలేదు.
పిల్లలు : అలాగా !
నానమ్మ : 1916 సం||రం డిసెంబర్ నెలలో లక్నోలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పత్రికా స్వాతంత్య్రాన్ని భంగ పరచడానికి ఉద్దేశించిన కొత్త చట్టం వస్తె దాన్ని తీవ్రంగా విమర్షిస్తు మొట్టమొదటి సారిగా ఆ సభలో ఉపన్యసించారు. ఆ సమావేశంలో గాంధీజీని మొదటిసారిగా కలుసుకున్నారు నెహ్రూజీ.
సహజంగా మృదు స్వభావి, మితభాషి అయిన నెహ్రూ గాంధీజీ సిద్ధాంతాల పట్ల అహింసా యుత విధానాల పట్ల ఆకర్షితుడైనాడు. రానురాను గాంధీజీకి కూడా తన మితవాద సిద్ధాంతాలను గౌరవించి, అహింసాయుత పోరాటానికి తగిన అత్యంత సన్నిహితమైన అనుచరుడు నెహ్రూయే అని నమ్మకం కలిగింది. తరువాత బార్దోలి సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి అనేక స్వాతంత్య్ర ఉద్యమాల్లో సత్యాగ్రహాల్లో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్ళాడు. దాదాపు 30 సం||రాలు అగ్రశ్రేణి నాయకుడుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న నెహ్రూ నాయకత్వం జనాకర్షణకి, దేశభక్తికి నిలయం కావడం వల్ల ఇంకా అనేక కారణాల వల్ల తన వారసుడు నెహ్రూయేనని గాంధీజీ ప్రకటించాడు. భారతదేశ భవిష్యత్తు నెహ్రూ చేతుల్లో భద్రంగా వుంటుందని కూడా గాంధీజీ పేర్కొన్నారు. అందుకే 1946 వ సం|| సెప్టెంబర్ 2వ తేదీన 12 మంది సభ్యులతో మధ్యంతర ప్రభుత్వం నిర్వహణ కొఱకు ఉపాధ్యకక్షుడుగా నెహ్రూని ఎన్నుకున్నారు.
ఆ తరువాత 1947 ఆగస్టు 15 తేదీన స్వాతంత్య్రం రాగానే జవహర్ లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.
బాబు : అబ్బా ! దానమ్మ నువ్వు ఈ విషయాలన్ని చెపుతుంటే టైమే తెలియలేదు. హాయ్ అదిగో అన్న కూడా కాలేజీ నుండి వచ్చేసాడు.
అన్న : ఏరా బబ్లూ ! నానమ్మని కాసేపైనా రెస్ట్ తీసుకోకుండా కథలు చెప్పుమని వేధిస్తున్నారా ఏమిటి?
నానమ్మ : అన్న వచ్చాడుగా అన్న చెపుతాడులే. ఇంతలో నేను అక్కకి తింటానికి ఏమయినా ఇచ్చి కాసేపు నడుం వాలుస్తానర్రా !
అన్న : నువ్వు రెస్ట్ తీసుకో నానమ్మ ! నాకిప్పుడేమి వద్దు.
బాబు : అన్నా! అన్నా ! నెహ్రూ గురించి ఇంకా చెప్పన్నా !
పాప : అవుననాన ! నెహ్రూ ప్రధాని అయ్యాక మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేశాడో చెప్పు.
అన్న : ఓకే, ఓకే చెపుతాను. 200 సం|| పరాయి పీడన తరువాత అన్ని విషయాలలో మన దేశం వెనుకబడి వుండేది. అంటే, అనారోగ్యం, అవిద్య, నిరుద్యోగం, బీదరికం ఇలా అన్ని రంగాలలో చితికిపోయిన మన స్వతంత్ర భారతదేశాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత నెహ్రూపై పడింది. స్వాతంత్య్రం రావడానికి 19 సం||రాల ముందే భావి స్వాతంత్య్ర నవ భారతానికి పటిష్ఠమైన పునాదులు వేసిన ద్రష్ఠ నెహ్రూజీ. లాహోర్ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం, మిశ్రమ ఆర్థిక విధానం, ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, మతాతీత రాజ్యాంగం మన ధ్యేయం కావాలని ప్రకటించిన మనిషి నెహ్రూజీ. ఈ విధానాలను స్వాతంత్య్రం వచ్చాక కార్య రూపంలోకి తీసుకువచ్చారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు.
బాబు : పంచవర్ష ప్రణాళికలు అంటే ఏమిటన్నా ?
అన్న : ఒక్కొక్క రంగంలో దేశం అభివృద్ధి చెందడం కోసం 5 సం|| పాటు అమలులో ఉండే విధానం. అన్ని రంగాల్లో ఒకేసారి అభివృద్ధి సాధించడం కష్టం కదా! అందుకని ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఒక్కో రంగానికి ప్రాముఖ్యతనిచ్చి అభివృద్ధి సాధించడం. ఉదాహరణకు మొదటి పంచవర్ష ప్రణాళిక గ్రామీణాభివృద్ధి అయితే, రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలు, మూడవ పంచవర్ష ప్రణాళిక బీదరిక నిర్మూలనం, ఉత్పత్తులు పెంచడం ఇలా ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క విషయానికి ప్రాముఖ్యానిస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడం.
పాప : ఎంత మంచి ప్లాన్ కదా అన్నయ్య !
అన్నయ్య: అవును నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో మూడు పంచవర్ష ప్రణాళికలు అమలు జరిగాయి. వీటి ద్వారా చక్కటి పథకాలు అమలుపరచి, వ్యవసాయ పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చేసి దేశాభివృద్ధికి ఎంత కృషి చేసారు నెహ్రూజీ. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద ప్రాజెక్టులైన బాక్రానంగల్, నాగార్జున సాగర్, హిరాకుడ్ మొదలైన ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేసింది నెహ్రూజీయే. అంటే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్నది నెహ్రూయే. రోజులో 4 గంటలు విశ్రాంతి తీసుకుని 20 గంటలు దేశాభివృద్ధికి పాటు పడిన వ్యక్తి చాచాజీ. అందుకే నెహ్రూజీని ”నవభారత నిర్మాత” అన్నారు.
పాప : మరి భారత్ నుండి పాకిస్తాన్ ఎందుకు విడిపోయిందన్నా?
అన్నయ్య: కలిసివుండి అలజడులు, అరాచకాలు సృష్టించుకొని బాధపడటం కన్న విడిపోవడమే మేలు కదా! అలా మత ప్రాతిపదిక మీద ఏర్పడిన పాకిస్తాన్, భారత్ నుండి వేరయింది. అప్పుడు కూడా మన దేశం విషమ పరిస్థితులను ఎదుర్కొంది. లక్షలాది మంది కాందిశీకులుగా పాకిస్థాన్ నుండి భారతదేశానికి కాందిశీకులుగా తరలి వస్తే వారికి జీవనోపాధి, గృహ వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రధానిగా నెహ్రూ పైనే పడింది. దాదాపు 55 లక్షల మంది పాకిస్తాను నుండి తరలి వచ్చిన వారికి పునరావాసము కల్పించడంలో నెహ్రూ ప్రభుత్వం సఫలీకృతమైంది.
స్వాతంత్య్రం వచ్చాక అస్తవ్యస్థంగా వున్న మన పరిపాలనా విధానాన్ని దేశాన్ని ఒక క్రమ పద్ధతిలోకి మార్చుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించుకొని 1950 జనవరి 26 నుండి నూతన రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడంతో భారతదేశం సర్వ స్వతంత్ర ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
మన రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రపంచంలోని ఏ ఇతర రాజ్యాంగంలో లేవు.
బాబు : మన రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఏమిటి అన్నా ?
అన్న : 14 సం|| వరకు బాల బాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్య కల్పించడం, 2) అంతర్జాతీయ ఖ్యాతికి కృషి చేయడం, 3) గ్రామ పంచాయితీలను నెలకొల్పి స్థానిక స్వపరిపాలనను పెంపొందించడం, 4) అడవులను వన్యప్రాణులను రక్షించడం, 5) స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇలా ఇంకా చాలా వున్నాయిలే.
పాప : నెహ్రూజీని ”శాంతిదూత” అని ఎందుకంటారన్నా?
అన్న : శాంతి కాముకుడైన నెహ్రూ దేశ ఆర్థిక ప్రగతికి, విశ్వ కళ్యాణానికి, శాంతి ఎంతో అవసరం అన్న విశ్వాసంతో ప్రపంచ శాంతికి కృషి చేసాడు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పడానికి ప్రపంచంలో అన్ని దేశాలలోనూ అనేక పర్యాయములు పర్యటించి భారత దేశానికి గొప్ప స్థానం కల్పించడానికి నిరంతరం పాటుపడ్డాడు. అగ్రరాజ్యాల మధ్య సమభావాన్ని, సమతౌల్యాన్ని సాధించేందుకు ఎప్పటికప్పుడు ప్రతి సమస్యను పరిశీలిస్తూ ముఖ్యంగా అమెరికా, రష్యా దేశాల పట్ల ఖచ్చితమైన తన అభిప్రాయాన్ని నిస్పక్షపాతంగా ధైర్యంగా సౌమ్యంగా హేతుబద్ధంగా ప్రకటించేవాడు. ఆ విధంగా రష్యా, అమెరికాలతో సత్సంబంధాలను కొనసాగించేవాడు. అలీన విధానానికి అంకురార్పణ చేసి ఒక కొత్త విదేశాంగ విధానాన్ని రూపొందించాడు. బ్రిటన్ తో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి కామన్ వెల్త్ లో మన దేశానికి సభ్యత్వం కల్పించాడు. ప్రపంచంలో చాలాసార్లు విషమ పరిస్థితులు ఎదురైనపుడు, విషమ పరిస్థితుల్లో వున్నప్పుడు ప్రపంచంలో చాలాసార్లు ఉద్రిక్తతను తగ్గించడానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల శాంతికి తద్వార ప్రపంచ శాంతికి కృషి చేసి ”శాంతి దూత” గా ప్రఖ్యాతి గాంచాడు.
పాప : నెహ్రూజీకి విదేశాలలో కూడా మంచి నేతగా పేరుందంటారు కదన్నా !
అన్న : అవును స్నిగ్ధ ! నెహ్రూ భారతదేశ ప్రగతికి ఎంత కృషి చేశారో ప్రపంచ శాంతికి, భారత్ తో అన్ని దేశాల మధ్య సత్సంబంధాలకు అంతే కృషి చేశారు. 1954లో చైనా ప్రధాని చౌ-ఎన్-లై తో కలిసి ప్రకటించిన ఐదు సూత్రాల ”పంచశీల” అను పేరుతో ప్రపంచ రాజ్యాల మన్ననలను అందుకున్నాయి. ఈ నాటికి వాటి విలువ తగ్గలేదు. దేశ ఆర్థిక ప్రగతికి స్వతంత్ర అలీన విధానం ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఆయన స్వతంత్ర భారత విదేశ విధానాన్ని రూపొందించాడు. ఆ విధానము ఇప్పటికి భారత విదేశాంగ విధానాలలో ముఖ్య సూత్రంగా వుంది.
పాప : నెహ్రూ ఏం పుస్తకాలు రచించారన్నా ?
అన్న : రచయితగా నెహ్రూ ఆంగ్ల రచనా విధానంలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన రచించిన డిస్కవరి ఆఫ్ ఇండియా, ఆటో బయోగ్రఫి, గ్లిమెన్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ గ్రంథాలు అందుకు నిదర్శనాలు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జైల్లో ఉన్నప్పుడు తన కూతురు ఇందిరకు వ్రాసిన లేఖలు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఆ తరువాత కాలంలో అవి లెటర్స్ టు హిజ్ డాటర్ అన్న పేరుతో పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. అవి నాటి మన భారత స్వాతంత్య్ర ఆర్థిక చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఆ లేఖల ద్వారానే తన కూతురును ఒక గొప్ప రాజకీయ వేత్తగా తీర్చిదిద్దిన ఘనత నెహ్రూదే.
పాప : ఆయన ఎన్ని సం||రాలు ప్రధానిగా వున్నారు?
అన్న : 1947 ఆగస్టు 15 నుండి 1964 మే 27 వరకు దాదాపు 17 సం||రాలు. భారత భవిష్యత్తును అభివృద్ధి పథంలోకి నడిపించిన మహనీయుడు కూడా ఆయన. 1964 మే నెల 27వ తేదీన అశేష భారత ప్రజానీకాన్ని శోక సముద్రంలో ముంచి తీవ్రమైన గుండెపోటులో మరణించారు. నెహ్రూ మరణించినప్పటికి ఆయన సిద్ధాంతాలు, రాజనీతి, విధానాలు, శాంతిమార్గం ప్రజల గుండెల్లో పదిలంగా వున్నాయి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాప్నికుడు, దార్శనికుడు, 20వ శతాబ్దపు ఉత్తమ రాజకీయవేత్త ప్రపంచ నేతల చరిత్ర గమనాన్ని అంచనా వేయగల దూరదృష్టి గల ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు. అతని జీవితం ఎందరికో ఆదర్శనీయం. అందరికి మార్గదర్శకం.
బాబు : బాలల పండుగ నెహ్రూ పుట్టిన రోజు నాడే ఎందుకు చేస్తారన్నా ?
అన్న : నెహ్రూజీకి బాలలన్నా పువ్వులన్నా ఎంతో ఇష్టం. ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవంగా ప్రకటించారు. పెదవులపై చిరునవ్వు తెల్లని కోటుపై ఎర్రని గులాబీ చేతిలో శాంతి పావురం ఇవన్ని ఆయనను శాంతి దూతగా తలపిస్తాయి.
బాబు : అన్నా ! అన్నా ! గాంధీ తాత గురించి చెప్పన్నా ?
అన్న : ఇప్పుడు కాదు! మరోసారి ఎప్పుడైనా చెపుతాను. నీకు రేపు పరీక్ష వుంది. చదువుకోవాలి. మీరు కూడా వెళ్ళి కాసేపు చదువుకోండి. బాగా చదువుకొని పెద్దయ్యాక గాంధీజీలా చాచాజీలా గొప్పపేరు తెచ్చుకోవాలి తెల్సిందా?
పిల్లలు : అలాగే అన్నా బాగా చదువుకుంటాం …!
నెహ్రూ ఉన్నత ధనిక కుటుంబంలో పుట్టినా ఎంతో నిరాడంబరమైన జీవితం గడిపాడు. స్వాతంత్య్రం తేవడంలో గాంధీజీకి కుడి భుజంగా ఉంటూ ఆయన నేతృత్వంలోని ఎన్నో ఉద్యమాలలో పాల్గొని అనేకసార్లు జైలుకి వెళ్ళారు. స్వాతంత్య్ర భారతానికి 18 సం|| ప్రధానిగా వుండి విశిష్ట సేవలు అందించారు. దేశాభివృద్ధి కోసం వీరు ప్రవేశపెట్టిన పంచశీల సూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, అలీన విధానం మన దేశ కీర్తిని నలుమూలలా చాటినది. శాంతిదూతగా నెహ్రూ ప్రపంచ ప్రసిద్ధులు.
నెహ్రూ పిల్లలను రేపటి పౌరులుగా మాత్రమే కాదు, దేశ భవిష్యత్తుకు వారు వెన్నెముకగా, మూల స్థంభాలుగా భావించారు. ఏ చిన్నారికైనా తన తల్లిని మించిన ఉత్తమ స్నేహితురాలు మరొకరుండరు. ఆమెను ప్రేమించడం, గౌరవించడం మన బాధ్యత అని బోధించారు.
సరే చాలా పొద్దుపోయింది రాజ్యాంగం గురించి దాని పుట్టుపూర్వోత్తరాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం పడుకోండి.
ధారావాహికం – 10వ భాగం
శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసుమంత్రి,పెమ్మసాని రామలింగ నాయకుడితో సుదీర్ఘసమాలోచనలు జరుపుతున్నారు.
‘‘రాయా! మనం అనుకున్నట్లుగానే కర్ణాటక, తమిళ ప్రాంతాలు దక్కనులో మలబారు ప్రాంతమేగాక సింహాళంలోని కొంతభాగం కూడా మన వశమైంది’’ తిమ్మరుసు గంభీర ఉత్సాహంతో చెప్పాడు.
‘‘దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు ప్రభువులవారి కీర్తిని మరింత ఇనుమడిరపజేస్తున్నది మహామంత్రి!’’ రామలింగనాయకుడు సంతృప్తిగా అన్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు ఆనందాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేశారు. తర్వాత తిమ్మరుసు తను వ్యూహరచనను వెల్లడిరచాడు.
‘‘ఇప్పటివరకు మనం జయించిన దక్షిణ ప్రాంతాలు గాక ముఖ్యమైన శత్రువుల గురించి ఆలోచించాలి ప్రభూ!’’
తిమ్మరుసు మాటలకు అవునన్నట్లు తల పంకించారు రాయలు. తిమ్మరుసు ఇలా చెప్పారు ‘‘మన శత్రువులలో అతి బలవంతులు బహ్మనీలు. బహ్మనీ ప్రభువు మామూద్ షాయే గాక బహ్మనీ రాజ్యంలో బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్ రాష్ట్రపాలకులు సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించి స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నారు.’’ ‘‘అది వారి సమస్య కదా అప్పాజీ?’’ రాయలు ప్రశ్నించాడు. ‘‘కానేకాదు. ఇది మన సమస్య కూడా! ఎందుకంటే వారిలో వారికి ఎంత విద్వేషమున్నా ఒక్కవిషయంలో వారికి ఐక్యత ఉంది. అదే విజయనగర సామ్రాజ్యం పట్ల ద్వేషం. మన సిరిసంపదలు, వైభవం చూసి అసూయ పొందటమే గాక ఈ ఐశ్వర్యాన్ని కొల్లగొట్టటం లక్ష్యంగా భావించి అదను దొరికినప్పుడల్లా మన రాజ్యంపై దురాక్రమణ జరపటం వారికి పరిపాటి అయింది’’ తిమ్మరుసు విశదీకరించాడు. ‘‘మరి మన కర్తవ్యం?’’ రాయలు సూటిగా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. ‘‘బహ్మనీసుల్తాన్ మహ్మద్ షా విజయనగరంపై ‘జీహాదు’ ప్రకటించినా బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షా యుద్ధం చేసినా బహమనులతో మన యుద్ధాలు ముగియలేదు ప్రభూ’’ ‘‘గతంలో మీరు బీజాపుర్ జయించి బీదర్‌ను వశం చేసుకుని బందీగా ఉన్న బీదర్ సుల్తాన్‌ను తిరిగి బహ్మనీ సింహాసనంపై ప్రతిష్టించి ‘యవనరాజ్య స్థాపకాచార్య’ అనే కీర్తి పొందినాక బహమనీ సుల్తానులకు మీ కీర్తి ప్రతిష్టల మీద కన్నెర్ర అయింది రాయా.’’ తిమ్మరుసు ప్రశంసకు రాయలు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఆత్మవిశ్వాస సాహసాలు తొంగిచూశాయి. ష్ట్ర ష్ట్ర ష్ట్ర చంద్రప్ప ఈ మధ్య బాగా గమనిస్తున్నాడు. మంజరి తనని తప్పించుకు తిరుగుతోందని. కారణం బోధపడటం లేదు. క్షమాభిక్ష పొంది కారాగారం నుంచి విడుదల అయిన కంటకునితో రెండు మూడుసార్లు కన్పించింది కూడా! చంద్రప్పకి తీరని వేదనగా ఉంది. మంజరి ప్రవర్తనలోని మార్పు అతడిని వేధిస్తున్నది. బాధ్యతా నిర్వహణ కూడా సరిగా చేయలేకపోతున్నాడు. పిచ్చివాడిలా విఠల దేవాలయం, రాతిరథం చుట్టూ తిరుగుతూ మంజరి కోసం పరితపిస్తున్నాడు. అన్నపూర్ణాదేవి మందిరంలో ఉంటున్న మంజరి అతనికి పంజరంలో చిలకలా కన్పిస్తోంది. ఆమె సాన్నిహిత్యం కోసం అతని మనస్సు పరితపిస్తున్నది. మంజరికి కూడా అలాగే ఉన్నా చంద్రప్ప మేలుకోరింది కనుక దూరంగా ఉండదలిచింది. ఈ మధ్య ఎవరో ఆమెకి చెప్పారు. అతను నవమోహిని విగ్రహం దగ్గరే సొమ్మసిల్లి పడి ఉన్నాడట. ఎవరు కన్పించినా ‘‘మంజూని చూశారా?’’ అని అడుగుతున్నాడట. ఇవన్నీ వింటుంటే మంజరికి కన్నీళ్ళాగటం లేదు. ‘‘చంద్రా! నీవు లేని నా జీవితం తావిలేని పూవే కదా! ఏం చేయను? మనిద్దరికీ ఆ బ్రహ్మ రాయలేదు’’ అనుకుంటూ దుఃఖిస్తున్నది. మరోపక్క కంటకుని చొరవ ఆమెకు చీదరగా ఉంది. ‘‘శిలలో దాగిన శిల్పాలను కనులముందు నిలుపుతావనీ శ్రుతి చేసిన వలపు వీణను బ్రతుకంతా పలికించేవనీ తలచినదంతా కల్లలాయెనా వలపు వల్లరులే వాడిపోవునా ॥ ఆమె మనసు విషాదగీతికలా ఉంది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర రాయలు బహమనీలను అదుపుచేయగలిగానని తలిచాడు. విజయోత్సవాలు జరిగాయి. తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళ్ళి వచ్చారు. ‘‘రాయా! నామమాత్రంగా మనం బహ్మనీ సుల్తాన్‌ను సింహాసనంపై నిలిపాం. వారిలో వారు అంతఃకలహాలలో మునిగిఉంటారనీ, విజయనగర సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడరనీ భావించాం’’ తిమ్మరుసు విశ్లేషించారు. ‘‘అవును అప్పాజీ! మరి ఈ పెనుమార్పేమిటి?’’ రాయలు అసహనంగా అడిగారు. ‘‘బీజాపూర్, గోల్కొండ, అహ్మద్‌నగర్, బీదర్, బీరారు సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నా వారిని చూస్తూ ఉండిపోయాం. కానీ గోల్కొండ రాజ్యం నుండి కులీకుతుబ్‌షా మన కొండవీడుపై దాడికి సిద్ధమయ్యాడు.’’ ‘‘ఫర్వాలేదు అప్పాజీ! మన పాండురంగ సేనాపతి ఆ సంగతి చూడగలరని భావిస్తున్నాం.’’ ‘‘రాయా! అదే నా యోచన కూడా’’ ఇరువురు ప్రశాంత మనస్కులై సమావేశ మందిరం నుండి బయటికి వస్తుంటే చాటుగా స్తంభం మాటున జరిగిన ఓ నీడ తిమ్మరుసుమంత్రి దృష్టిలో పడకపోలేదు. ఆయన కళ్ళు ఎరుపెక్కాయి. నొసలు ముడిపడిరది. ష్ట్ర ష్ట్ర ష్ట్ర వీరేంద్రుడు, కంటకుడు మదిరాపానం చేస్తూ ఒళ్ళు తెలియని ప్రేలాపన స్థితిలో ఉన్నారు. ‘రాళ్ళన్నీ ఒకచోట, రత్నాలన్నీ ఒకచోట’ అన్నట్లుగా వీళ్ళిద్దరిదీ ఒకే ఆలోచన. విజయనగర సామ్రాజ్యాన్ని అంతం చేయాలని. ఒకే స్నేహం, కుటిలబుద్ధితో లాభం పొందటానికి. ‘‘ఆ ముసలినక్కను తప్పిస్తేగానీ మన పాచిక పారదు’’ వీరేంద్రుని మాటలు ముద్దముద్దగా ఉన్నాయి. ‘‘అది అంత సులభంకాదు వీరేంద్రా! తిమ్మరుసుమంత్రి రాయలవారికంటే రాజనీతి చతురుడు. ఆయనని తప్పించటమంటే రాయలవారినే’’ ‘‘హుష్’’ నోటిమీద వేలుంచి ఆపాడు వీరేంద్రుడు. ‘‘జగన్నాథ! ఆ పని మనమెందుకు చేస్తాం? రాయలతోనే చేయిద్దాం’’ వీరేంద్రుడు కుటిలంగా అన్నాడు. ‘‘అసాధ్యం. తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాయలు తిమ్మరుసును వదులుకోడు’’ కంటకుని నిరాశాస్వరం. ‘‘జగన్నాథ! అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికే గదా ఈ వీరేంద్రుడున్నది’’ మరోసారి మదిర సేవించాడు వీరేంద్రుడు. ‘‘మీ మాటలు నాకు బోధపడటం లేదు. వారిద్దరూ ఒకరికొకరు బహిర్ ప్రాణాలు.’’ ‘‘జగన్నాథ! బహిర్‌ప్రాణాలు. హ్హాహ్హాహ్హా! ఆ ప్రాణాలు పోతే పోలా’’ ‘‘ఆఁ!’’ నిర్ఘాంతపోయాడు కంటకుడు. భయపడ్డాడు కూడా! ‘‘మా నాయన గండమనాయకుడు వంటి నమ్మకమైన సేనాధికారులున్నంత వరకూ అది కుదరని పని’’ కంటకుడు పళ్ళు కొరికాడు. తనని కారాగారంలో వేసినప్పుడు ఏ సహాయం చేయని తండ్రి అంటే అతనికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! నేను ఎన్నిసార్లు మహారాజుకు ఆ ముసలి మంత్రి మీద ఆరోపణలు చెప్పాను! ఉహు వింటేనా? కానీ నా దగ్గర మరో బ్రహ్మాస్త్రం ఉంది’’ వీరేంద్రుడు కళ్ళు పెద్దవి చేశాడు. బ్రహ్మాస్త్రం పేరు వింటూనే కంటకునిలో ఆసక్తి పెరిగింది. ‘‘ఏమిటది వీరేంద్రా!నీవు చాలా తెలివైనవాడివి.చెప్పు చెప్పు’’ ఆరాటపడ్డాడు. ‘‘ఆఁ! అది చెప్పేది కాదు జగన్నాథ! చేసి చూపించేది. ఆ బ్రహ్మాస్త్రాన్ని మా గజపతుల వంశంలోంచే తెచ్చాము. మా దుర్గాలన్నీ స్వాధీనపర్చుకొని మాకింత బిచ్చం వేస్తాడా ఆ రాయలు’’ వీరేంద్రుని కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. కంటకునికేదో అర్థం అయీ కానట్లుంది. ఆరేళ్ళ తిరుమలరాయుడు పరుగుపరుగున వచ్చాడు. ‘‘మామయ్యా! మీరు నాకు కత్తియుద్ధం ఇంకా ఎప్పుడు నేర్పిస్తారు?’’ ‘‘కాలం వచ్చేసింది నాయనా! జగన్నాథ! నేర్పిస్తాను. నువ్వు వెళ్ళి ఆడుకో’’ వీరేంద్రుడు తిరుమలరాయని బుజ్జగించి పంపేశాడు. ‘‘చాలా పొద్దుపోయింది వీరేంద్రా! మేము వెళ్తాం’’ ‘‘జగన్నాథ’’ కంటకునికి వీడ్కోలిచ్చి పంపేశాడు వీరేంద్రుడు. తూలుతూ ఇటు తిరిగిన వీరేంద్రునికి కాళికలా నిప్పులు చెరిగే కళ్ళతో అన్నపూర్ణాదేవి కన్పించింది. ‘‘ఏమిటిది వీరేంద్రా! నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదు. చుట్టమై వచ్చి దయ్యమై పట్టినట్లు.’’ నిందావాక్యాలకు అతడేమీ చలించలేదు. వీరేంద్రునికి కార్యసాధనే ముఖ్యం. ‘‘జగన్నాథ! చుట్టాన్ని కాబట్టే నీ గురించే నా ఆరాటమంతా’’ లేని ప్రేమ ఒలకబోశాడు. ‘‘నా గురించి నువ్వేం ఆరాటపడనక్కర్లేదు. నా పుట్టింటి చుట్టానివని ప్రభువు ఆదరిస్తుంటే ఇంకా ఎన్నాళ్ళిక్కడ?’’ అన్నపూర్ణాదేవికి చాలా కోపంగా ఉంది. ‘‘జగన్నాథ! అంత కోపం వద్దమ్మా! మహారాజుకు ఎందరో భార్యలుండటం మామూలే! కానీ వీరగజపతి వంశంలో పుట్టిన నిన్ను అందరిలో కలపటమే’’ నసిగాడు. ‘‘అది మా స్వవిషయం. ఇందులో నీ ప్రమేయమవసరం లేదు’’ గిరుక్కున వెనుదిగిరింది అన్నపుర్ణాదేవి. ‘‘జగన్నాథ! నీ స్వవిషయమే! మా ఇంటి ఆడపడుచువైన నీ గురించి నీ కొడుకు గురించి నువ్వు వద్దన్నా మాకు తాపత్రయమే!’’ నచ్చజెప్తూ రెచ్చగొడుతున్నాడు. ‘‘ఇప్పుడు నాకు, యువరాజుకి వచ్చిన లోటేం లేదు. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండేట్లు లేదు’’ కుపిత స్వరంతో అంది అన్నపూర్ణాదేవి. ‘‘జగన్నాథ! మన యువరాజే రాజు కావాలని నా ఆశ.’’ ‘‘నీ ఆశ అనకు. అది విజయనగర ప్రజల ఆశ. ప్రభువు కోరిక కూడా.’’ ‘‘జగన్నాథ! కోరితే తీరుతుందా! విజయనగర సింహాసనం మీద ఏ రాజైనా సరి అయిన పద్ధతిలో కూర్చున్నాడా!అంతదాకా ఎందుకు?నీ భర్త.. అదే శ్రీకృష్ణదేవరాయ ప్రభువు సోదరులను, వారి కుమారుడ్ని చంద్రగిరిలో బందీగా చేసేగా రాజయ్యాడు! పైగా ఈ ముసలిమంత్రేగా తంత్రమంతా నడిపింది’’ ఆలోచింపజేస్తున్నాడు. ‘‘అయితే’’ అన్నపూర్ణాదేవి అతనికేసి తిరిగింది. ‘‘జగన్నాథ! అయితే అంటావేమిటి తల్లీ! ఈ రాజ్యంలో తిమ్మిని బమ్మి చేయాలన్న బమ్మిని తిమ్మి చేయాలన్నా తిమ్మరుసు మంత్రికి నల్లేరు మీద బండి నడకే!’’ రహస్యం చెబుతున్నట్లు అన్నాడు. మళ్ళీ తన బోధ కొనసాగించాడు. ఆమె ముఖ కవళికలు మారుతున్నాయి. ‘‘ఈ మహామంత్రి మనసులో ఏముందో తెలుసా! నేను బాగా కనిపెట్టాను. రాయలు తన చేతిలో కీలుబొమ్మ. కాలం కలిసిరాగానే రాయల్ని అడ్డు తొలగించి తన కొడుకు గోవిందరాయలకి పట్టం గట్టాలని.’’ ‘‘స్వామీ జగన్నాథ! ఎంత మాట విన్నాను! తిమ్మరుసు మహామంత్రి కృష్ణరాయల కెగ్గు తలపెట్టటమా! కలలోనైనా ఊహించలేమే’’ ఆవేదనగా అంది అన్నపూర్ణాదేవి. ‘‘ఆ కలలో కూడా ఊహించనిది చేయటమే తిమ్మరుసు తెలివి’’ ‘‘నువ్వు చెప్పేది వింటుంటే నా తల తిరిగిపోతున్నది. నేనిప్పుడేం చేయాలి? నా ప్రభువునెలా రక్షించుకోవాలి’’ ఆసనంపై కూలబడిరదామె. ‘‘నీ ప్రభువును రక్షించుకోవాలంటే నీ కుమారుడు తిరుమలరాయని ఈ విశాల విజయనగరానికి సామ్రాట్టుని చేయాలంటే ముందు రాయలవారు తిమ్మరుసును గుడ్డిగా నమ్మరాదు. బానిసలా బతకరాదు. స్వంతబుద్ధితో ఆలోచించాలి. జగన్నాథ!’’ ‘‘అదెలా సాధ్యం! వారు ప్రభువుకు తండ్రిలాంటివారు. ఏ పనిచేసినా తిమ్మరుసులవారిని సంప్రదించనిదే జరుగదు.ఆఖరికి మా వివాహ విషయంలో కుడా తిమ్మరుసువారి పట్టుదలే కారణం’’ అన్నపూర్ణాదేవి గతంలోకి చూసింది. ‘‘ఆ! అక్కడే ఉంది కుట్ర. గజపతులు చాలా పరాక్రమవంతులు. వారింటి ఆడబిడ్డను వివాహమాడితే బంధుత్వరీత్యా ఆ ముప్పు తొలగిందిగా!’’ ‘‘వారు నన్ను వీరభోజ్యంగా గ్రహించారు వీరేంద్రా! ఇంతకాలంలో ఏనాడూ నాపట్ల ఇసుమంతైనా చిన్నచూపు చూసింది లేదు. పైగా తిరుమల రాయలు మా విజయనగర సామ్రాజ్యానికి ఏకైక వారసుడు. ఇక ముప్పేముంది?’’ ‘‘అని నువ్వనుకుంటే సరిపోయిందా పిచ్చితల్లీ! నేనిందాకే చెప్పాను. ఈ సింహాసనానికి వారసత్వశక్తి లేదు.’’ ‘‘మరి ఏం చేద్దాం’’ ప్రశ్నించింది ఆరాటంగా రాణి. అన్నపూర్ణ తన దారిలోకి రావటం వీరేంద్రునికి పరమానందంగా ఉంది. ‘‘జగన్నాథ! ఇప్పటికి నేను చెప్పేది నీకు అర్థమైంది. ఇన్నాళ్ళు నీకు అరణపుచుట్టంగా ఇక్కడ పడిఉన్నందుకు ఫలితం దక్కుతున్నది.’’ గొంతు తగ్గించాడు. అటూ ఇటూ చూశాడు. చాటున ఉండి రహస్యంగా వింటున్న మంజరి కొద్దిగా నీడలోకి జరిగింది కనపడకుండా. ఆమె మొహం విషాదంలో ముడుచుకుపోయింది. వీరేంద్రుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వచ్చి రహస్యం చెప్తున్నట్లు చెప్పాడు
‘‘చూడమ్మా! మన గజపతుల వంశాంకురమే విజయనగర సింహాసనం అధిష్టించాలని నా ప్రాణం కొట్టుకుంటున్నది. పుట్టింటి మీద నీకుమాత్రం ప్రేమలేదా ఏంటి? కృష్ణరాయల్ని, కుమారుడిని రక్షించుకోవాలంటే మనపని నెరవేరాలంటే… రాయలను నువ్వో కోరిక కోరాలి.’’
‘‘కోరికా! ఏమని?’’
‘‘నీ కుమారుడికి పట్టాభిషేకం చెయ్యమని’’
‘‘అందుకు ప్రభువు అంగీకరిస్తారా! తిరుమలరాయలింకా పసివాడే గదా!’’ అన్నపూర్ణాదేవి సందేహం.
‘‘జగన్నాథ! అక్కడే ఉంది కిటుకు. రాయలు నీ ముచ్చట తీర్చటానికైనా అంగీకరిస్తాడు.కానీ ఆ తిమ్మరుసు ఒప్పుకోవటమే అనుమానం. దీనిలో అతని కుటిలత్వం ప్రభువుకు కూడా తెలుస్తుంది’’గుట్టు విప్పినట్లు నవ్వాడు వీరేంద్రుడు.
ఇప్పుడు అన్నపూర్ణాదేవి పూర్తిగా వీరేంద్రుని మాయాజాలంలో పడిపోయింది. పుత్రప్రేమ ఆమె కళ్ళు కప్పేసింది.
‘‘నువ్వు చెప్పినట్లే నేను ప్రభువును ఆ కోరిక కోరతాను’’ ఆమె నిర్ణయించుకుంది.
వీరేంద్రుని ఆనందానికి అవధులు లేవు. తన మొదటి పాచిక పారుతోంది. సరిగ్గా గురిచూసి తగిలితే తిమ్మరుసుకూ, రాయలకూ మధ్య మొదటి విభేదం తలెత్తుతుంది. పసివాడికి పట్టం గట్టటానికి తిమ్మరుసు ఎటూ ఒప్పుకోడు. దాంతో రాయలు రాణికిచ్చిన మాటకోసం తిమ్మరుసును కాదనవలసి వస్తుంది. రాణి కోరిక రాయలు ఒప్పుకుంటాడా? ఒకవేళ తిమ్మరుసు రాయల మాటకు ఒప్పుకుంటే?’’ వీరేంద్రుడు ఉత్కంఠభరితంగా నవ్వుకున్నాడు.
మంజరి మనసు కలతపడుతున్నది. సాధ్వి అన్నపూర్ణాదేవి మనసులో విషబీజం నాటుతున్నాడీ దుర్మార్గుడు. తిమ్మరుసులవారికి రాయలవారికి తగవు తేవాలనే ఈ ప్రయత్నాన్ని వమ్ముచేయి స్వామీ విరూపాక్షా! అనుకుంటూ బయలుదేరిన మంజరి తిమ్మరుసు మహామంత్రికీ వార్తను అతి రహస్యంగా చేరవేయటంలో సఫలురాలయింది.
* * *
తిమ్మరుసు, రామలింగనాయకుడు వ్యాసరాయలు ఆశ్రమంలో సమావేశమైనారు.
‘‘ఏదో బురదపామనుకున్నాం గానీ తాచులా బుసలుకొడుతోంది’’ రామలింగనాయకుడు కోపంతో ఆవిర్లు కక్కుతున్నాడు.
‘‘ఆ తాచుపాము మెడపట్టి పడగ దింపాలి రామలింగ నాయకా! ఇక
ఉపేక్ష పనికిరాదు’’ తిమ్మరుసు నెమ్మదిగా చెప్పినా నిర్ణయం దృఢంగా ఉంది.
‘‘కాగల కార్యమేమిటి మహామంత్రీ!’’ వ్యాసరాయలు శాంతంగా అడిగారు.
‘‘ఏముందీ! వీరేంద్రుడిని తన్ని తగలేయటమే’’ ఆవేశంగా బుసలుకొట్టాడు రామలింగనాయకుడు.
‘‘ఆ…ఆ…! అలా చేస్తే రాయలవారి దృష్టిలో నిజంగానే మనం దుర్మార్గులమైపోతాం. ఆ వీరేంద్రుని పాచికకు ఎదురు పాచిక వేయటమే మనం చేయాల్సిన పని’’ తిమ్మరుసు సాలోచనగా అన్నారు.
‘‘ఏమిటది మహామంత్రీ’’ వ్యాసరాయలి ప్రశ్నకు తిమ్మరుసు ఇలా వివరించారు`
‘‘మనకి అందిన వార్త ప్రకారం అన్నపూర్ణాదేవి మహారాజును ఓ కోరిక కోరతారు.’’
‘‘ఏమని?’’ వ్యాసరాయలు అడిగారు.తిమ్మరుసు తన వివరణ కొనసాగించారు.
‘‘అదేమంటే యువరాజు తిరుమలరాయలకు పట్టాభిషేకం చేయమని.’’
‘‘ఆఁ! అంత పసివాడికి పట్టాభిషేకమా’’ రామలింగనాయకుడు నిర్ఘాంతపోయాడు.
‘‘అవును. దీనికి నేను ఒప్పుకోననీ, తద్వారా రాయలవారికి నాకూ విభేదాలు పెంచాలని వీరేంద్రుని పాచిక’’ తిమ్మరుసు విడమరిచారు.
‘‘మరి మనం అవునంటే?’’ వ్యాసరాయలు సందిగ్ధంగా చూశాడు.
‘‘అవునంటే పట్టాభిషేకం చేయాలి’’ తేల్చి చెప్పారు మహామంత్రి.
‘‘కాదంటే’’ రామలింగనాయకుడి ఆవేశం.
‘‘రాయలకూ, మాకూ విభేదం’’ స్థిరంగా ఉంది తిమ్మరుసు స్వరం.
‘‘రాయలవారికి ఇంతటిస్థానం సంపాదించి ఇచ్చింది మీరు. మీతోనే విభేదిస్తారా?’’ రామలింగనాయకుడు కలవరపడ్డాడు.
‘‘రామలింగనాయకా! అధికారం విచక్షణ కళ్ళుమూస్తుంది. అది ఎవరికైనా ఒకటే! ఇన్నాళ్ళకి రాయలకూ నాకూ ఒక విషమపరీక్ష ఎదురైంది. చూద్దాం! నా రాయలు దీనిని ఎలా ఎదుర్కొంటాడో!’’ తిమ్మరుసు మంత్రి కంఠంలో సన్నని వణుకు మొదటిసారిగా ధ్వనించింది.
‘‘మన కర్తవ్యం?’’ వ్యాసరాయలు వాతావరణాన్ని తేలిక చేశారు.
‘‘గురువర్యా! గతంలో రాయలవారి జన్మకుండలి ప్రకారం యోగం తప్పినప్పుడు మీరే విజయనగర సామ్రాజ్యమధిష్టించి సహాయం చేశారు. మరోసారి రాయలవారి జాతకాన్ని పరిశీలించండి. మనమేం చేయాలో దానిననుసరించి నిర్ణయిద్దాం.’’
తిమ్మరుసు మాట ప్రకారం వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయల జన్మకుండలి పరిశీలించారు. ఆయన వదనం వివర్ణమయింది.
‘‘మహామంత్రీ! రాయలవారి రోజులు అంతగా బాగాలేవు. కొంత గ్రహశాంతి చేయాలి. యువరాజుగారి జాతకం కూడా ఆపద సూచిస్తున్నది.’’
‘‘దీని పరిహారం?’’ తిమ్మరుసు మంత్రి ఆందోళనగా చూశారు.
‘‘యువరాజు పట్టాభిషేకం ఇప్పట్లో జరగరాదు’’ వ్యాసరాయలు తేల్చి చెప్పారు.
‘‘అదెలా సాధ్యం? రాయలవారు జరపదలుస్తారు కదా!’’ రామలింగ నాయకుని సందేహం.
జరుపదలుస్తారు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకుండా
కొన్నాళ్ళు రాయలవారిని ఆపగలిగితే… తిమ్మరుసు ఆలోచనలో పడ్డాడు.
‘‘గురుదేవా! మేమిక వెళ్ళివస్తాం. ప్రణామాలు! మేమీ చర్చ చేసిన విషయం కడు రహస్యం. మీకు తెలుసుగదా!’’ నర్మగర్భంగా నవ్వారు తిమ్మరుసు.
‘‘మంచిది మహామంత్రీ! నిశ్చింతగా వెళ్ళిరండి. శుభం’’
వ్యాసరాయలు ఆశీస్సులు తీసుకొని తిమ్మరుసు, రామలింగ నాయకుడు వెళ్ళిపోయారు. విజయనగర సామ్రాజ్య రక్షణకు కట్టుబడి ఉన్న ఆ ఇద్దరు దేశభక్తులను చూస్తూండిపోయారు వ్యాసరాయలు.
* * *
‘‘మంజూ! ఆగు’’
ఒంటరిగా ఇన్నాళ్ళ తరువాత కలిసింది తన ప్రేయసి. చంద్రప్ప ఆమె చేతిని బిగించి పట్టుకున్నాడు.
అది వాళ్ళు తరచుగా కలుగుకునే ఉద్యానవనం. అయితే చాలారోజులుగా ఆ తోట చిన్నబోయింది. ఈ ప్రేమికుల సందడి లేక వెలవెలబోత్నుది. ఆమె ఆగింది. పెడమోమై నిల్చున్నది.
‘‘మంజూ! నీకిది న్యాయంగా ఉందా! ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు?’’ దీనంగా అడిగాడు.
తన కన్నీళ్ళు అతనికి కన్పించనీయలేదామె.
‘‘నావల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను శిక్షించు. అంతేగానీ ఇలా దూరం చేస్తే చచ్చిపోతాను.’’
చటుక్కున వెనుదిరిగి చేత్తో అతని నోరు మూసేసింది. ‘‘చంద్రా!’’ అంటూ అరచేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
‘‘మంజూ!’’ ఆమెని దగ్గరికి తీసుకున్నాడతను.
‘‘జాతకం నమ్మి నన్ను దూరం చేస్తావా! చావైనా బతుకైనా ఇద్దరికీ ఒకసారే అనుకున్నాం కదా! ఆ కంటకునితో కలిసి ఎందుకు నా కంటబడుతున్నావో తెలుసుకోలేని బుద్ధిహీనుడ్ని కాను’’ కోపంగా అన్నాడు.
‘‘నువ్వు గ్రహించగలవని నాకు తెలుసు చంద్రా! నిన్ను నొప్పించాను. మన్నించు’’ దీనంగా అంది.
‘‘అలా అడిగితే సరిపోదు.శిక్ష వేయాల్సిందే’’ అల్లరిగా అన్నాడు.
‘‘ఏం శిక్ష వేస్తావ్?’’ నడుం మీద చేతులుంచుకొని మంజరి అడిగిన తీరుకు నవ్వేశాడు.
‘‘శిక్షా! మూడుముళ్లే…’’
ఆమె మొహం వివర్ణమయిందా ప్రస్తావనతో. పైకి బింకంగా మాట్లాడుతోందే గానీ తనవల్ల చంద్రప్పకి ఎటువంటి ఆపదయినా, అదీ పెళ్ళి రూపంలోనైనా రాకూడదని ఆమె ఆలోచన.
‘‘సర్లేగానీ ఇలా రా కూర్చో. నీతో చాలా సంగతులు చెప్పాలి. మనం కలిసి చాలా రోజులైంది కదా!’’ చంద్రప్ప ఆమె చేయిపట్టి పూపొదరింట కూర్చోబెట్టుకున్నాడు.
‘‘మన పెళ్ళి ఎల్లుండి పున్నమిరోజు విఠల మందిరంలో. ఇంకేం మాట్లాడకు సరేనా?’’
ఆమె అంగీకరసూచకంగా తలూపింది. అతని ఆనందానికి అవధులు లేవు. వాళ్ళిద్దరి మధ్య కాలం మరపురాని మధురగీతంలా జాలువారింది.
ఆమె : తొలగించవే తెరలు తారకా
పులకింపనీ వలపు మల్లికా
అతడు : సద్దు దేయని రేయి జారిపోనీక
ముగ్ధమోహనగీతి పాడనీ ఇంక ॥
ఆమె : ఆనాటి నా కలలు నెరవేరు వేళ
అందాల జాబిల్లి అందేటి వేళ
అతడు : కొమ్మ కొమ్మన చివురు పులకరించింది
పూవుపూవున తావి పొంగిపోయింది ॥
ఆమె : కొండకోనల గాలి కునికేటి వేళ
కోటితలపులు ఎదను కొలువైన వేళ
అతడు : అల్లనల్లన పదము పాట పాడిరది
జల్లుజల్లుగ మనసు కరిగిపోయింది ॥
చాలాసేపు మైమరచి అలాగే ఉండిపోయారా ప్రేమికులు.
దూరంగా నగారా మోగింది. చంద్రప్ప ఈ లోకంలోకి వచ్చాడు ఏదో గుర్తొచ్చినట్లుగా.
‘‘మంజూ! రామేశ్వరశాస్త్రి సన్యసించాడు. తెల్సుగదా!’’
‘‘అవును చంద్రా! అతను మహాశిల్ప గాయకుడు. ఉపాసకుడు. నిజానికి విఠల దేవాలయ సప్తస్వర స్తంభాల పూర్ణాకృతి అతనివల్లనే సిద్ధించింది.’’ గౌరవం ధ్వనించిందామె స్వరంలో.
‘‘శాస్త్రి విజయనగరం వీడి వెళ్ళిపోయాడట మంజూ!’’
ఆమె ఆశ్చర్యపోలేదు. శాస్త్రి గురించి అప్పటికే చాలా కథనాలు విన్నది. అతను అడుగుపెట్టిన చోట శుభప్రదంగా ఉంటుందనీ, ఏదైనా అశుభాలు జరుగబోతుంటే అతనా స్థలంలో ఉండడనీ.
‘‘నాకు అదే కలవరంగా ఉంది చంద్రా!శాస్త్రి విజయనగర విశిష్టశిల్పుల్లో ఒకడు. అలాంటిది ఈ నగరాన్ని వీడిపోయాడంటే అదీ ఎక్కడికో తెలీదంటే’’ అర్థోక్తిలో ఆగింది.
‘‘కాశీలో ఎవరికో కన్పించాడట. వెళ్ళేముందు ఆశ్రమవాసులతో ఇక విజయనగర వైభవం కనుమరుగవుతుందని అన్నాడట’’ బాధగా చెప్పాడు.
ఆ విషయం నేనూ విన్నాను. అతను సన్యాసం తీసుకున్న తర్వాత పెనుమార్పు జరిగింది. కుండలిని సాధనతో భవిష్యత్ చెప్పగల శక్తి వచ్చిందట. ఏది ఏమైనా గొప్ప సంగీత శిల్పి’’ నిట్టూర్చిందామె.
‘‘నిజమే! ఇప్పుడు విజయనగర పరిస్థితులు ఆ సూచన చేస్తున్నాయి కూడా… ఆ వీరేంద్రుడు’’ కోపంగా ఏదో చెప్పబోయాడు. ఆమె మధ్యలోనే ఆపింది.
‘‘చంద్రా! నీకు మరో ముఖ్యవిషయం చెప్పాలి. ఆ వీరేంద్రుడు ప్రభువుకూ మహామంత్రికీ వివాదం రేపాలని కుట్రపన్నుతున్నాడు.’’
‘‘అలాచేస్తే గానీ వాడి ఆటలు సాగవని పన్నాగం కాబోలు’’ చంద్రప్ప దవడ ఎముకలు బిగిసాయి.
‘‘ఆ వివాదం యువరాజు పట్టాభిషేకరూపంలో వస్తున్నది’’ మంజరి వివరించింది.
‘‘అయితే మనమేం చేయాలి’’ చంద్రప్ప ఆలోచించాడు.
‘‘మనం చేయగలిగేది మహామంత్రి చెప్తారు. ఆ కంటకుడితో నేను మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. ఆ ద్రోహి కూడా వీరేంద్రునితో చేతులు కలిపాడు. వాడేమన్నాడంటే’’ అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది.
‘‘ఆఁ! దుర్మార్గుడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెడతాడా!’’ పళ్ళు కొరికాడు చంద్రప్ప.
‘‘మనం మహామంత్రి చెప్పినట్లే చేయాలి. తెలిసిందా! ఆవేశపడి రహస్యాన్ని బట్టబయలు చేయకు.’’
అతను కొంత తగ్గాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగింది.
‘‘ఈ ప్రశాంతమైన రాత్రి ఓ పాట పాడు చంద్రా! విని చాలానాళ్ళయింది’’ బతిమలాటగా అంది. మనసులో మాత్రం చంద్రప్పను మళ్ళీ ఎప్పుడు కలుస్తానో అని బెంగగా ఉందామెకు.
‘‘ఈ చల్లని రేయిలో
నా ఉల్లము రంజిలగా
పాట పాడనా చెలీ
పరవశించనా’’
అతనలా పాడుతూనే ఉన్నాడు. ఆమె అతని భుజంమీద తలవాల్చి వింటున్నది.
‘‘బాగు బాగు’’ చప్పట్లు విన్పించటంతో ఇద్దరూ దిగ్గున లేచి నిలిచారు. ఎదురుగా రామకృష్ణ కవీంద్రులు.
మంజరి అనవతంగా నిలబడిరది. చంద్రప్ప రామకృష్ణునికి నమస్కరించాడు.
‘‘కవీశ్వరులకు అభివాదం’’
‘‘చిరంజీవ. విజయనగర సామ్రాజ్యంలో కళారాధనకు వెన్నెల కూడా వికసిస్తుందని ఇవాళే తెలిసింది’’ కొంటెగా నవ్వాడు రామకృష్ణుడు.
‘‘క్షమించాలి స్వామీ! మంజరి, నేను…’’ తడబడ్డాడు చంద్రప్ప.
‘‘నాకు తెల్సుగానీ మీరు నిర్వహించవలసిన రాచకార్యమొకటున్నది. ఇది అతి రహస్యము. మహామాత్యులు సెలవిచ్చారు’’ అంటూ రామకృష్ణకవి చంద్రప్ప, మంజరిలని దగ్గరిగా పిలిచి కొన్నిమాటలు చెప్పారు.
‘‘అర్థమైందికదా! ఎలాగైనా సరే ప్రభువు పదిహేను దినాలు అన్నపూర్ణాదేవి మందిరానికి వెళ్ళకూడదు. అంతే! అన్నపూర్ణాదేవి మందిరంలో చక్కబెట్టే పని మంజరిది. మిగతా పని నీది చంద్రప్పా! ఆపైన అంతా విరూపాక్షునిది’’ రామకృష్ణుని దగ్గర సెలవు తీసుకుని కార్యభారంతో ఇద్దరూ బయలుదేరారు.
ట్రింగ్ …ట్రింగ్ ..
ఫోన్ మోగడం తో వంట గదిలో నుంచి వచ్చింది సుజాత “హలో, హలో ,నేను అమ్మా నీ శీను ని మాట్లాడుతున్నాను.”
” చెప్పు బాబూ, ఏంటి సంగతి అంత ఆనందంగా ఉన్నావు?”
” ఆ అవునమ్మా ! ఆనందం కాదు అంతకు మించి. నా (నీ) కల నెరవేరింది అమ్మా. నేను కలెక్టర్ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను.. ఇప్పుడే రిజల్ట్స్ వచ్చాయి. వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను.
ఈ క్షణం నీ పక్కన ఉండి ఉంటే బాగుండు. నీ కళ్ళల్లో ఆ వెలుగులు చూస్తే బాగుండు అనిపిస్తోంది అమ్మా. రాత్రి ట్రైన్ కి బయలుదేరి వస్తాను.”
“ఏంటి శ్రీనూ, నువ్వు చెప్పేది నిజమా? మన కల నెరవేరిందా? సో గ్రేట్ నాన్నా! కంగ్రాట్యులేషన్స్! మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఎంతో గర్వంగా ఉంది. సరే వెంటనే బయలుదేరిరా.
నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైన బొబ్బట్లు, ఆవ పెట్టిన పులిహోర చేసి ఉంచుతాను. మీ స్నేహితులను కూడా భోజనానికి పిలువు. ఈ ఆనందం వాళ్ళ అందరితో షేర్ చేసుకుందువు గానీ.”
“అలాగే అమ్మా. అలా అయితే ముద్దపప్పు ఉంచు. ఆ వెంకట్ గాడికి మన ఇంట్లో ముద్దు పప్పు ఆవకాయ అంటే ప్రాణం. మీ అమ్మ అంత బాగా ఆవకాయ ఎవరూ చేయలేరు రా అంటాడు. ఇక ఉంటాను మరి. వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. బై,”
” బై శీను, జాగ్రత్త. బయలుదేరినప్పుడు ఫోన్ చెయ్,” చెప్పింది సుజాత.
ఫోన్ పెట్టేసి ఆనందభాష్పాలు తుడుచుకుంటూ సోఫాలో కూర్చుంది. మనసు గతంలోకి జారిపోయింది అప్రయత్నంగా.
“అది కాదమ్మా, నువ్వు ఇప్పుడు భర్తను వదిలేస్తే ఈ పిల్లాడిని పెట్టుకుని ఎలా బతుకుతావు? నువ్వు చేస్తున్నది ప్రైవేట్ ఉద్యోగం. ఆ సంపాదనతో పిల్లాడిని చదివించడం సాధ్యమవుతుందా? మంచో చెడో పిల్లాడి కోసమైనా నువ్వు సర్దుకుపోవాలి అతడితో,” తన తల్లి మాటలు.
“లేదమ్మా అతనితో కలిసి ఉంటే నా పిల్లాడికి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది నాకు. అతడి చెడు ప్రవర్తన పిల్లాడి పెరుగుదల పై ప్రభావం చూపిస్తుంది. నాకది ఇష్టం లేదు. నేను నా శ్రీనూని ఒక గొప్ప పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను.సాధ్యమైతే వాడిని కలెక్టర్ గా చూడాలనుకుంటున్నాను. నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకు. అతనితో కలిసి ఉండమని చెప్పకు, ప్లీజ్.”
ఏ ధైర్యంతో ఆ నిర్ణయం తీసుకుందో తెలీదు కానీ తన భర్త తనను మోసం చేస్తున్నాడని, తిరుగుబోతు గా మారాడని తెలియగానే అతడితో విడాకులకు సిద్ధమైంది.
కానీ అమ్మ చెప్పిన మాట నిజమే. తన ప్రైవేట్ టీచర్ ఉద్యోగం తో కొడుకుకి మంచి చదువు చెప్పించడం కష్టం. కనుక దీనికి ఏదైనా చేయాలి. శ్రీను ని బాగా చదివించాలి. ఎలా? ఏం చేయటం? ఆలోచిస్తూ ఉండగా ఒక మంచి ఉపాయం తట్టింది సుజాతకి.
అవును కరెక్ట్ అలా చేస్తే తనతోపాటు తన లాంటి మరికొందరు మహిళలకు కూడా ఉపాధి కల్పించవచ్చు. సంపాదన పెరుగుతుంది కనుక ఇబ్బంది ఉండదు.
కానీ తను అనుకున్నది ఆచరణలో పెట్టి ఫలితం రావడానికి కనీసం ఒక ఏడాది కాలం పడుతుంది, అప్పటి వరకూ తనూ, పిల్లాడు బ్రతకడానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోతుందా? మళ్లీ ఆలోచనలో పడింది సుజాత.
తన ఆలోచనని, ప్రణాళికను అన్నగారితో చర్చించింది. చిన్ననాటి నుంచి అన్నయ్య తను మంచి ఫ్రెండ్స్. తన ప్రతి సంతోషంలో, కష్టంలోనూ తోడు ఉన్నవాడు అన్నయ్య. ఇది కూడా తన ధైర్యానికి కారణం కావచ్చు.
“చాలా బాగుంది సుజాతా. నీకు ఎలాగు వంట చేయడం ఇష్టం కదా. నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది కాబట్టి తప్పక విజయం సాధిస్తావు. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అన్నా వదినలు ఉన్నారని మర్చిపోకు,” అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించాడు అన్నయ్య.
అదిగో ఆరోజు తన ఆలోచనల్లో మొదలైనది “అమ్మ చేతి వంట” అనే క్లౌడ్ కిచెన్. పూర్తి శాకాహార ఆంధ్ర భోజనం.
ఉన్నపళంగా హైదరాబాద్ వచ్చేసింది తను. భర్త (తను) ఉద్యోగం చేస్తున్న ఊరిని వదిలి. అయితే ఇక్కడ తన చిన్ననాటి స్నేహితులు చాలామంది ఉన్నారు. వారికి ఫోన్ చేసి చెప్పింది తను వస్తున్నానని.
తన స్నేహితురాలు సీత ఎంతో సహాయం చేసింది. ఉండేందుకు ఇల్లు చూసి పెట్టడమే కాక ఆమె భర్త వ్యాపారంలోనే ఉండడంవల్ల తను వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన సరుకులు వస్తువులు వంటివి అతని స్నేహితుల వద్ద హోల్ సేల్ ధరలకు ఇప్పించడం వంటి ఎన్నో.
చివరికి తను విడాకులకు అప్లై చేసేందుకు లాయర్ గారిని కూడా పరిచయం చేసింది సీత. ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి.
ఆ విడాకుల ప్రహసనం మామూలుగా జరిగిందా? తను మగవాడిని కనుక ఎంతమందితో తిరిగినా తప్పులేదనే అహంకారంతో ఉన్న భర్త, అంతే గొప్పగా అతనికి వత్తాసు పలికే అత్తగారు ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయడానికి ప్రయత్నించారు!
తనకు తెలియకుండా
పిల్ల వాడిని కలుసుకుని వాడి బుర్రలో తనకు వ్యతిరేకంగా విషం నూరి పోయడానికి కూడా సిద్ధపడ్డారు.
పాపం శీను, చిన్న పిల్లవాడు. తల్లా,తండ్రా అంటే ?కానీ వాడు చాలా తెలివైనవాడు. అంతేకాక చిన్ననాటి నుండి తానే లోకంగా బ్రతుకుతున్న తన తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. తన తోటే ఉన్నాడు. తనని పూర్తిగా నమ్మాడు.
తన భర్త లాంటి మగవారిని ఏం చేయాలి అసలు? కాలం ఎంత మారినా తాము మారమని, మగవాడు అంటే అదేదో దేవుడు అన్నంత అహంకారం. తాను విడాకులు అనే సరికి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు తల్లీ కొడుకులు. అయినా తన తప్పు ఒప్పుకునేంత ఔన్నత్యం లేదు కదా!
అతని తప్పు మూలానే తాను విడాకులు కోరుతున్న విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
తన అన్నయ్య స్నేహితుడైన ఒక ఇన్స్పెక్టర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించగలిగింది.
కేవలం విడాకులతో వదిలేయాలా లేక తనను మానసికంగా ఇంత బాధపెట్టిన అతడినిజైలుకు పంపించాలా? ఎన్నో ఆలోచనలు.
కొత్తగా మొదలు పెట్టిన వ్యాపారం ఒకపక్క, కోర్టు కోసం తిరగటం ఒకపక్క. ఈ మధ్యలో బంధువులలో గుసగుసలు. వీటన్నిటినీ అధిగమిస్తూ శ్రీను చదువుకు ఏమాత్రం అంతరాయం కలుగకుండా చూసుకుంటూ తన వ్యాపారంపై దృష్టి పెట్టలేక పోతోంది.కానీ పోరాడాలి, గెలవాలి అన్న తపన, గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసం ఏనాడు విడవలేదు సుజాత.
ఏదైనా వ్యాపారం మొదలు పెట్టి అందులో విజయం సాధించడం సినిమాలో చూపించినంత సులువైన విషయం కాదు అని అర్థమైంది సుజాతకు.
అందులోనూ తన లాంటి ఒంటరి మహిళలకు ఆ పోరాటం ఇంకా ఎక్కువ. కానీ పోరాడితే విజయం తప్పక సాధించగలం అని నిరూపించింది కూడా తను.
తను ఆనాడు ఒక శాఖగా ప్రారంభించిన “అమ్మ చేతి వంట” తన అయిన వాళ్ళు, స్నేహితుల ప్రోత్సాహం తో పాటు హైదరాబాద్ నగర వాసుల ప్రోత్సాహంతో, వారి శాఖాహార అవసరం తీరుస్తూ, వారిచ్చిన మంచి ఫీడ్ బ్యాక్ వలన ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలలో 8 శాఖలుగా విస్తరించింది.
అన్ని శాఖలలో కలిపి దాదాపు 50 మందికి పైగా ఆడవారు పనిచేస్తున్నారు. వారంతా తనలాగా జీవితంలో ఏదో విధంగా దెబ్బతిన్నవాళ్లే.
కొత్త శాఖను ప్రారంభించినప్పుడల్లా కనీసం ఒక నెల రోజులు తను అక్కడే ఉంటూ అక్కడ వంట చేయడానికి వచ్చిన వారికి ప్రతి ఆహారం తను అనుకున్న రుచి వచ్చేలా ఎలా చేయాలో కొలతలతో నేర్పించడం చేసింది .
అందువల్ల అన్ని శాఖలలోనూ ప్రతి రోజూ ఒకే రుచి. రుచి, శుచి, నాణ్యత విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం వల్ల తను అనుకున్న విధంగా విజయం సాధించగలిగింది.
వ్యాపారం లో ఎంత బిజీగా ఉన్నా శ్రీను చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎప్పుడూ మర్చిపోలేదు సుజాత. మంచి కాలేజీలో ఇంటర్ చదివాడు.
ఫ్రెండ్స్ అంతా ఇంజనీరింగ్ చదువుతున్నా తన ఆశయం అది కాదని తెలుసు కనుక డిగ్రీలో చేరాడు శ్రీను. చదువులో ఎప్పుడూ అశ్రద్ధ చూపలేదు. పీజీ చదువుకుంటూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు.
తల్లి కష్టం, మనసు అర్థం చేసుకున్నాడో ఏమో చిన్ననాటి నుంచి తల్లి కలనే తన కలగా చేసుకుని కలెక్టర్ అవడం కోసమే చదివాడు. గత రెండు ప్రయత్నాలు విఫలం అయినప్పుడు కుంగిపోకుండా ముచ్చటగా మూడో ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు.
ఈ సంతోషానికి అవధులు ఉన్నాయా? అసలు ఇది నిజమేనా? తను కలగంటోందా? చేతి మీద గిల్లుకుంది సుజాత. ‘అబ్బా!’ నొప్పి తెలుస్తోంది. అయితే ఇది నిజమే అన్నమాట.
వెంటనే ఈ ఆనందాన్ని తన తల్లిదండ్రుల తోటి, అన్నా వదినల తోటి పంచుకోవాలి. తన స్టాఫ్ అందరికీ శ్రీను వచ్చాక పెద్ద పార్టీ ఇవ్వాలి.
“అమ్మా, నేను కలెక్టర్ అయిన తర్వాత నువ్వు ఇంక ఏ మాత్రం కష్టపడొద్దు.నాతోటే ఉండాలి. ఈ ఆంటీలందరికీ నేను ప్రభుత్వ రుణాలు వచ్చేలా చేసి సొంత వ్యాపారాలు చేసుకునేలా చేస్తాను,” అని చెప్పే శ్రీను అంటే వాళ్ళందరికీ ఎంత ఇష్టమో. ఈ వార్త విని చాలా సంతోషిస్తారు. ఆలోచిస్తూ సోఫాలోంచి లేచింది తన పుత్రోత్సాహాన్ని అందరితో పంచుకోవడం కోసం సుజాత.
రచన : కట్టెకోల విద్యుల్లత
6302805571
పాఠశాలలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకైనా , విద్య నేర్చుకొనే చిన్నారులకైనా పెద్ద సమస్య ఏమిటంటే? ఏది సంస్కృత పదం?, ఏది తెలుగు పదం? అని గుర్తించడం, కత్తి మీద సామే . అయితే కొంచెం కష్టపడి ప్రయత్నం చేస్తే సంస్కృతం, తెలుగు పదాలును సులభంగా కొనుక్కోవచ్చు. కష్ట పడితే సాధించలేనిది లేదు కదా! తెలుగు, సంస్కృత పదాలను సులభంగా ఎలా తెలుసుకోవచ్చో చేసే చిరు ప్రయత్నం ఇది.
బాలవ్యాకరణంలో చిన్నయసూరి సంస్కృత సమం , సంస్కృత భవం, ప్రాకృత సమం, ప్రాకృత భవం, దేశ్యాలు గురించి సంజ్ఞాపరిచ్ఛేదంలో చక్కగా వివరించారు. సంస్కృత పదాలను తత్సమాలని, తెలుగు పదాలను ఆచ్ఛికాలని చెప్పారు.ఆచ్ఛిక పరిచ్ఛేదంలో
“సంస్కృత సమేతరంబైన యీ భాష యచ్చనా బడు” అని సూత్రీకరించారు.
అనగా పైన చెప్పిన సంస్కృత సమ పదాలుగాక , సంస్కృత భవం ,ప్రాకృత సమం ,ప్రాకృత భవం ,దేశ్యాలతో కూడిన పదాలను ఆచ్చికపదాలు లేదా తెలుగు పదాలని చెప్పవచ్చని ఫలితార్థం.
మొదట సంస్కృత పదములను… గురించి తెలుసుకుందాం
1.సంయుక్తాక్షరములతో కూడిన పదములన్నీ సంస్కృతపదాలు.
ఉదా:-చక్రః , వర్షమ్ , మూర్ఖః ,అర్చన , కర్పూరమ్ ……
ఇవి తెలుగులో చేరునపుడు వీటికి తెలుగు ప్రత్యయాలైన డు, ము ,వు లు చేరి చక్రము, వర్షము , మూర్ఖుడు , అర్చన , కర్పూరము అని మారుతాయి.
2. సంశ్లిష్టాక్షరములతో కూడిన పదములు సంస్కృత పదాలు….
ఉదా:-స్త్రీ ,రాష్ట్రం ,అర్ఘ్యం ,జోత్స్న ,క్త్వార్థం……
3 మహాప్రాణాక్షరాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు…….
ఖరం ,ఘటం ,ఛత్రం ,ఝషం ,కంఠం ,ఢంకా ,కథ ,ధనం ,ఫలం భజన…..
4.విసర్గతో కూడినవి సంస్కృత పదాలు….
ఉదా:-దుఃఖం ,అంతఃపురం ,అంతఃకరణ ,తపఃఫలం, మనఃకాయం….
5.ఋ ౠలతో కూడిన పదాలు సంస్కృత పదాలు….
ఉదా:-ఋషి ,ఋణం , ఋతువు ,….
6.శ ,ష ,హలతో కూడినపదాలు సంస్కృత పదాలు….
ఉదా:- శతము ,శంకర ,శశము, శంతనుడు ,ఆశ ,ఆకాశం ,
వేషము, దోషము ,ప్రదోషము ,
హంస ,హలము ,హాలాహలం ,హారం హీనం ,హోమం……
7.డు ,ము,వులు చేరడానికి తగిన పదాలు సంస్కృత పదాలు….( ఇవి తెలుగులోకి చేర్చేటప్పుడు డు ,ము ,వు లు చేరి వస్తాయి.)
రామ, భీమ , భయంకర, కంస
వన, దేశ , ప్రాంత ,ఆవేశ ,
చిత్ర, క్రతు , ధేను, తరు గురు,….
రాముడు, భీముడు , భయంకరుడు, కంసుడు
వనము, దేశము , ప్రాంతము ,ఆవేశము ,
చిత్రము, క్రతువు , ధేనువు, తరువు గురువు,….
8.ఉపసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు….
ఉదా:-ప్రతిదినం , ప్రఖ్యాతి , సకుటుంబం , ప్రత్యక్షం , పరోక్షం , దుర్లభం , సంతృప్తి, అపరిశుభ్రం , ,…
9.సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు….
ఏక ,ద్వి ,త్రి చతు ,పంచ ,షష్టి సప్త, అష్ట, నవ , దశ , శత , సహస్ర….
10. సవర్ణదీర్ఘ ,గుణ ,యణాదేశ వృద్ది , అనునాసిక , విసర్గ , జస్త్వ , శ్చుత్త్వ…. సంధులతో కూడినవి సంస్కృత పదాలు….
అష్టావధానం, కవీశ్వర, గురూపదేశం, పితౄణం వేంకటేశ్వర ,మహర్షి ,ప్రత్యేక, అణ్వస్త్రం, ఏకైక ,పరమౌషదం మనోహరం ,చతుషష్టి……
11 ఋతువుల పేర్లు , తిథులపేర్లు , నక్షత్రాల పేర్లు ,తెలుగు సంవత్సరాలు…. సంస్కృత పదాలు
ఉదా:-వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు….
అమావాస్య ,పాఢ్యమి …..
అశ్వని ,భరణి,…..
ప్రభవ, విభవ….
12. వట్రుసుడితో కూడినవి సంస్కృత పదాలు….
ఉదా:-గృహము ,కౄరుడు , కృపాణము , ధృతరాష్ట్రుడు , దృష్టి , ధృవీకరణ, పృథివి , పృచ్ఛకులు , భృగువు , సవితృ ,ధాతృ ,నేతృ ,భర్తృ కర్తృ …..
13.యకారముతో కూడిన పదాలు తెలుగులో లేవు. అంటే యకారంతో కూడిన పదాలన్నీ సంస్కృత పదాలే.
యమున , యముడు , యజ్ఞము , యంత్రము , యాత్ర….
ఇక తెలుగు పదాల గురించి తెలుసుకుందాం
1.ద్విత్వాక్షరములతో కూడిన పదాలు తెలుగు పదాలు
ఉదా:-అమ్మ, అక్క ,అవ్వ, అత్త , కుక్క, మొగ్గ , వెన్న , కర్ర , నిచ్చెన , గజ్జెలు , పిట్ట….
2 .అరసున్నతో కూడిన పదాలు తెలుగు పదాలు
ఉదా:-తెలుఁగు ,మూఁడు ,చీఁకటి ,పాఁత , కోఁతి మూఁత. కోఁట పేఁట మూఁట……
3.సర్వనామాలన్నీ తెలుగుపదాలు
ఉదా:-నేను, మేము, నీవు మీరు, అతడు , వాడు , వారు , వాడు , వీడు, ఎవడు, ఎంత , అంత , ఇంత, కొంత, కొన్ని, ఎన్ని , అన్ని , అక్కడ, ఇక్కడ , ఎక్కడ….
4.క్రియలతో కూడినపదాలు తెలుగు పదాలు
ఉదా:-వండు ,తిను,చదువు ,పాడు ,వచ్చు ,పోవు ,అమ్ము , కొను….
(లిఖించు ,భావించు ,భేధించు ,ఖండించు ఇలాంటివి సంస్కృత క్రియలు. సంస్కృత క్రియలు తెలుగులో అలాగే చేరవు. క్రియలు చివరి ఇంచు చేరుతాయి)
5.స.. తో కూడిన పదాలు ఎక్కువగా తెలుగు పదాలు
ఉదా:-సంత, సంచి , సంతకం ,ఆస ,ఆకసం ,పూస, గసగసాలు……
(సంతోషం , సంభవం… ఇలాంటివి సంస్కృత పదాలు)
6.కొన్ని డు, ము, వులతో కూడినవి తెలుగు పదాలు
ఉదా:-వాడు ,వీడు ,పాపడు ,మగడు, కైరుడు, కత్తలుడు , జన్నడు , తమ్ముడు, మనుమడు, ఆటగాడు , జూదగాడు, పాటగాడు , వేటగాడు, బల్లిదుడు, ఱేడు, చెలికాడు , హెగ్గడికాడు , అటమటీడు , కన్నడీడు , కల్లరుడు , పాము , ఇనుము , అల్లము, సున్నము, బియ్యము , అందము, చందము,చెరువు, పరువు, కరువు, దరువు, నిలువు , కొలువు,….
7. సంయుక్తాక్షరంతో గానీ మహాప్రాణాక్షరంతో గానీ కూడినప్పటికి పదం చివర డు ,ము ,వు … చేరితే అవి తెలుగు పదాలుగా మారుతాయి. (కానీ మూలం సంస్కృత పదం) వీటినే తత్సమాలు అంటారు. వీటికి మరొక పేరు ప్రకృతులు.
ఉదా:- ఈశ్వరుడు, భీముడు , పర్వతము, భయము , క్రతువు , తరువు..
భీముడు+ అతడు
పర్వతము + అది
భయము +ఎందుకు
8.ఎ ,ఒ, చ, జ(దంత్యాలతో కూడినవి) లతో కూడినపదాలు తెలుగు పదాలు
ఉదా:-ఎలుక ,ఎంత ,ఎవరు, ఎప్పుడు, ఎక్కడ ,ఎరుక, ఎరువు ,ఎరుపు , ఒక , ఒంటె, ఒంటరి, ఒనరు, ఒప్పు, ఒత్తు, ఒద్దిక , చాప, చురక ,చూలు, చందమామ, జడ, జల్లెడ, జముడు ,జాతర ,జున్ను
9.సంఖ్యలన్నీ తెలుగు పదాలు
ఉదా:-ఒకటి ,రెండు,మూడు ,నాలుగు ,ఐదు ,ఆరు…నూరు ,వంద ,ఇన్నూరు ,వేయి,
10. కృదంత ప్రత్యయాలు చేరిన పదములు అచ్చతెలుగు పదాలు
కోయు+త….కోత
కోయు అనేది క్రియ .. క్రియా మీద త అనే కృదంత ప్రత్యయం చేరి కోత అని నామవాచకంగా మారింది.
పండు+ట..పంట
మూయు+త…మూత
పూయు +త…పూత
మండు +ట…మంట
అరుచు+పు…అరుపు
మునుగు +క…మనక
చేరు+ఇక…..చేరిక
కోరు+ఇక…..కోరిక
అలుగు+క….అలక
పోవు+ క….పోక
ఊరు +ట….ఊట
11.తద్దిత రూపాలతో ఏర్పడు పదాలు తెలుగు పదాలు.
నామవాచకాల మీద గానీ, విశేషణాల మీద గానీ చేరి నామవాచకంగా మారే పదాలను తద్దినాలు అంటారు.
పెద్దతనము… పెద్ద అనేది విశేషణం. దాని మీద తనము అనే తద్దిత ప్రత్యయం చేరి పెద్దతనంగా మారింది.
పెద్దఱికము, చుట్టఱికము , కన్నెఱికము, పూజారి, అరమరిక ,చదువరి ,తెంపరీ , తెరువరి ,సుంకరి ,జూదరి,
జాలరి ,టక్కరి ,వగలాడు ,దొమ్మరి ,ముక్కిడి,ఆటగత్తె , మోసగత్తె ,చాకిత ,కఱవత , చిఱుతుక , నాతుక, నెలతుక
12.శకటరేఫములతో ఏర్పడేవి తెలుగుపదాలు.
కఱ్ఱ ,బఱ్ఱె ,తొఱ్ఱ ,గొఱ్ఱె ,ఱంపము ,జుఱ్ఱు ,కఱ్ఱు ,మఱ్ఱి ,,……..
13.కొలమానం తెలుపే పదాలు అచ్చతెలుగుపదాలు….
జాన ,మూర ,బిత్తెడు ,దోసెడు ,మానిక, కుంచం , పడి , సేరు , అణా , దమ్మిడి , రూక ,రూపాయి
గుర్తించుకోవలసినవి….
1.సంయుక్తాక్షర పదములన్నీ సంస్కృతపదాలే కానీ
కర్జము ,సంద్రం ,….మొదలైన పదములు ఆచ్చికపదాలు.
2 వస్తే ,ఇస్తే ,తెస్తే,అరిస్తే మొదలైన చేదర్థకాలతో కూడినవి ఇవి సంయుక్తాక్షరాలతో కూడినా మూల రూపం వచ్చు ఇచ్చు తెచ్చు అరుచు అనేవి అచ్చతెలుగు పదాలు.
(మూల రూపం వచ్చు+తే… వస్తే)
3.అన్నము వంటి ద్విత్వాక్షర పదాలు సంస్కృత పదాలుగా ఉన్నాయి.
ఇలా తెలుగు, సంస్కృత పదాలను సులభంగా గుర్తించవచ్చు. కానీ అభ్యాసం వలన మరి కొన్నింటిని తెలుసుకోవచ్చు
కళ్ళు ఎప్పుడూ….
భావాలను తర్జుమా చేస్తాయి
కన్నీళ్ళు కళ్ళకు తోడై నిలుస్తాయి!
మాట మౌనం వహించినప్పుడు
మరో కొత్త భాషగా కన్నీళ్ళు!
మనసు అద్దానికి కళ్ళు ప్రతిబింబమైతే
కళ్ళ తో చెప్పలేని …
భావాల సమూహం కన్నీళ్ళు !

నిత్యం
అనేక సంఘర్షణల నడుమ నలిగిపోయి
హృదయం ద్రవించి కళ్ళనుండి ధారాపాతమై
దగ్ధమైన హృదయాన్ని చల్లబరుస్తాయి కన్నీళ్ళు!
ఓదార్పు మాటల ప్రవాహంతో
రాలుతున్న ఒక్కో కన్నీటి చుక్కా
పెదాలపైని చిరునవ్వుతో
అంతర్థానమవుతాయి!
కన్నీళ్ళు విలువైనవి
వాటిని దాచుకునే చోటు చిరునవ్వు!
గాయాలెన్నైను
గుట్టుగా సర్దుకోవడమే తప్ప
మనసు విప్పి చెప్పలేను
అర్థం చేసుకోవడమే తప్ప
అవసరమైనవి అడగలేను
కష్టమెంతైనను కన్నీరు కార్చడమే తప్ప
కాదని అనలేను
అందరిప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే తప్ప
ప్రశ్నించలేను
సుఖదుఃఖాలలో సహాచరిణిని
సర్వము అంకితం చేసిన సౌభాగ్యినిని
ఇంటందరి బాగోగులు చూసే ఇల్లాలిని
కాపురం గుట్టుచప్పుడు కాకుండా సర్దుకుపోయే గృహిణిని
జీవితపయనంలో జీవచ్చవంగా బతుకుతున్న
అతిసాధారణమైన అర్ధాంగిని నేను
ఈ తరతరాల బ్రతుకులో తరుణిగా బ్రతుకుతున్న
అనుదినం నా వేదనలను వెనుకేసి ముందుకు కదులుతున్న
కదనరంగంలో నన్ను నేను
నిరంతరం
నిత్యచైతన్యవంతంగా నిలబెట్టుకుంటున్న
అయినా ఈనాటికి ఒంటరి ఆడది అంటే ఆ లోకం చూపేవేరు
ఆదిశక్తిలా కొలువైన ఆడదానిగా అలుసైన
నివురుగప్పిన ఈ సమాజం ఎప్పుడూ విసురుతూనే ఉంటుంది నాపై ఓ చూపు
అవధాన వరేణ్యులు మాన్యులు శ్రీ ముత్యంపేటగౌరీ శంకరశర్మ గారితో మయూఖ పత్రిక పరిపృచ్ఛా
సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!
సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు…

ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.
సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..
ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!!
ఆస్వాదించండి!
అష్టావధాన కార్య మ
దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్
కష్టమో సుఖమో యది యు
తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥
మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!
పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన కార్యక్రమంలో
బహుముఖీన విద్యా విశారదులు, జంట అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,
1,మహాకాళీ సుప్రభాతం ,
2. శ్రీరామచంద్ర సుప్రభాతం,
3.శ్రీ శివానందోదాహరణం,
4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము.
పద్మజ. నమస్కారమండీ!
ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.
పద్మజ (ప్ర) :-
మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?
గౌరీశంకర శర్మ:- (జ)
మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు.
న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.
పద్మజ:- (ప్ర)
మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?
గౌరీశంకర:- (జ)
నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను. సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.

పద్మజ ( ప్ర):–
ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?
గౌరీశంకర ( జ).
వృత్తిలో 2014లో జిల్లా స్థాయి [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.

పద్మజ ( ప్ర):-
పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?
గౌరీశంకర శర్మ (జ):-
“పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను
పద్మజ. ప్ర :-

ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?
గౌరీశంకర ( జ):- ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.
పద్మజ(ప్ర) :–
నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?
గౌరీశంకర ( జ):–
సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని
భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది.
పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.
పద్మజ (ప్ర):-
మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?
గౌరీశంకర ( జ) :–
అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.
పద్మజ( ప్ర) :–
అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలువివరించండి!
గౌరీశంకర శర్మ:- (జ)
మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు
వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది.

పద్మజ (ప్ర) :–
అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ(జ) :–
అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!

పద్మజ( ప్ర):–
కళలకు సమయం వెచ్చిస్తే చదువు
కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ (జ):–
కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!
పద్మజ ( ప్ర):–
తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?
గౌరీశంకర శర్మ (జ) :-
తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.

పద్మజ( ప్ర) :–
కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
గౌరీశంకర శర్మ ( జ):–
పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.
పద్మజ ( ప్ర):-
అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!
గౌరీశంకర శర్మ (జ):-
వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకచేస్తున్నాను.
క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…
పద్మజ ( ప్ర) :-
మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!
గౌరీశంకర శర్మ ( జ):–
అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!
హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!
వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్
ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్
అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే
హనుమత్పుత్రుడు …..
అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా! అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.
మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై
సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై
కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా
క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!
అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.
దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.
నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో పాల్గొనే అవకాశం లభించింది.
చివరగా మయూఖపత్రికా ప్రశంస
ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి
బహుముఖీనము గాంచుచు భద్రమగుత!
సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు
కీర్తినందుచుభవితకు స్ఫూర్తినిడుత!
ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.
శుభం.
రంగ రాజు పద్మజ:-
గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!
మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…
జయతు ! తెలుగు భాషామతల్లీ! జయతు !
పరిపృచ్ఛ- రంగరాజు పద్మజ.[కథా రచయిత్రి]
మనసైనది రాయకుంటే ఎలా? అంటూ మనసులోని భావాలన్నింటినీ “భావకదంబం”గా అందించిన మనసుకల రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి. పరిశీలన గుణం, స్పందించే గుణం ఈ రెండు కవికి చాలంటాను అయితే వీటి వెనుక హృదయం ఉండాలి. సమాజాన్ని పరిశీలించి, హృదయముతో స్పందించి, భావాలను కవితా సంపుటిగా తీసుకురావడం అభినందనీయం.

కవిని కాదు,కవితారీతులు నాకు తెలియదంటూనే కవితాత్మకంగా కవిత్వం చెప్పిన రచయిత నిరాడంబరులు, నిరహంకారులని అర్థమవుతుంది. కవిత్వం చాలావరకు ఆత్మాశ్రయమే అయినా విరివిగా వస్తువులను ఎంచుకున్నారు. సంపుటిలోని పలు కవితలు సామాజిక, ధార్మిక, దేశభక్తి ప్రబోధాత్మకంగా పటుత్వాన్ని కలిగి ఉన్నవి. అనేక కవితల్లో సహజమైన అంత్యనుప్రాస అలరింపజేస్తుంది. అల్ప అక్షరాలతో అనల్ప భావాలను వెదజల్లిన కవితలు మరెన్నో. పద సంపద కొదువలేనంతగా…..బలంగా, భావ సంపద అదుపులేనంతగా…. వేగంగా ప్రకటించటం ఈ రచయితకే చెల్లింది.
కవికి జీవితానుభవం ఎక్కువ. అందుకే “జీవితం” కవితలో అక్షరాలతో ఆడుకున్నారు. జననం,మరణం,పయనం,తోరణం,పోరాటం, ఆరాటం, కోలాటం, ఊగిసలాట, దోబూచులాట, సోపానపు ఆట, చదరంగం, రణరంగం, బొంగరం, క్షణభంగురం, అమరం, అజరామరం వంటి పదాలతో జీవితాన్ని హృద్యంగా చెప్పారు. “అనంత గమనం” లో విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థను గుర్తు చేస్తూ, భార్యాభర్తల అనుబంధం ప్రాధాన్యతను చెప్పుకొచ్చారు. “నువ్వు ఏడుస్తూనే ఉండు నేను నవ్వుతూనే ఉంటా” కవిత ద్వారా ఈర్ష్యా ద్వేషాలను విడిచి జీవించాలనే సందేశం నర్మగర్భంగా నొక్కి చెప్పారు రచయిత. “దేవుడు దీవించాడు” అంటూ అమ్మలో అందరినీ, అన్నింటిని ఇచ్చాడని అమ్మ గొప్పతనాన్ని కవిత్వంలో పంచారు. “పెళ్లి సందడి”లో సాంప్రదాయ వివాహ పద్ధతిని కళ్ళ ముందు నిలబెట్టారు. సామాన్యుడి సైకిల్ గురించి చెబుతూ బాలగేయం లాంటి కవితని రాసిన విషయం పాఠకులకు ఇట్లే తెలిసిపోతుంది.
నిరీక్షణ,జ్ఞాపకాలపుటలు, పాదాక్రాంతం, ఎదురుచూపులు, నీకు తెలుసా, ఇలా సాగనీ ప్రియా, రారాధ నా ప్రియ, నడిచిరా నా ప్రియ, తకిట తకధిమి కవితల్లో భావకవి కృష్ణశాస్త్రిలా ఊహాసుందరిని సృష్టించుకున్నారో, గతకాలపు మధుర అనుభూతులో, భార్యని ప్రేయసిగా ఊహించుకొని రాసుకున్నారో కానీ అన్నియు సుమధుర సుస్వర మధుర కవితలే.
“నిర్భయ”కవితలో రచయిత భావావేశాన్ని “వావి వరస మరచిన జాతిని నపుంసకుల చేయమని” దేవతలకు వినిపించేలా ప్రకటించాడు. ‘పీఎసెల్వీ’ లో దేశభక్తిని, ‘అమ్మ భాష’లో భాషానురక్తిని, ‘ఇది జన ఉగాది’ లో హిందూ ధర్మ ప్రశస్తి ని చాటి చెప్పారు. “గాంధారం గొల్లుమంటుంది” కవిత మధ్యయుగాలనాటి మతమౌడ్యమూలాలను ప్రశ్నిస్తుంది. మానవత్వ రక్షణకు క్రూరత్వం అంతం కావాలని కవి అంతరంగం. విస్తరిస్తున్న మతమౌడ్య ఛాయలను “షరియా కోరలు చాస్తోంది, తుపాకి గొట్టం చట్టం చేస్తోంది” అంటూ ధ్వనిస్పోరకంగా ఉగ్రమనస్తత్వాలను ధైర్యంగా దునుమాడారు. “పరాన్నభుక్కులు”, “అక్షరం అమ్ముడుపోయింది” కవితలలో వాళ్లే….వాళ్లే….. అంటూ హిందూ వ్యతిరేకుల కుట్రలను బట్టబయలు చేశారు. ‘దేశం గీశం జాన్తానై యని వేషాలెన్నో వేస్తోంది మోసాలెన్నో చేస్తోంది’ అని చైనా, పాకిస్తాన్ లకు వంత పాడే కలాలను కడిగిపారేశారు. అసంపూర్ణ తైల వర్ణచిత్రంలో ‘విప్లవపు పసిగుడ్డు’ విధ్వంస సిద్ధాంతాన్ని ఆవిష్కరింపజేశారు. ఇలా అనేక కవితల ద్వారా సాహితీ, సామాజిక, చారిత్రక రంగాలలో చొరబడిన భీభత్సకారుల్ని చెడుగుడి ఆడుకున్నారు.
రచయిత శ్యామప్రసాదులు కావున శ్రీకృష్ణుడే ఇష్టసఖుడేమో…. పలు కవితలను జగద్గురువు పై సృష్టించారు. “మీ కన్నవాడు మీ కన్నా మిన్నవాడు” అంత్యప్రాసలతో కన్నయ్యకు పట్టాభిషేకం చేసింది. “కలుద్దాం కడుగుదాం” అంటూ సమాజంలోని దుర్మార్గాలను చెండాడేందుకు ఒక్కసారైనా కన్నీరు కార్చేద్దామంటూ పిలుపునిస్తారు రచయిత. “కల్లోలిత కలం”తో కవితా సంపుటిని పూర్తిచేస్తూ – నా కలం రేపిన కలకలం తప్ప, నా తప్పేం లేదు’అంటూ కవితలన్నింటితో కవిత రాయడం ఈ సంపుటి ఓ విశేషం అయితే, ముగ్గురు లబ్ద ప్రతిష్ఠితులతో ముందుమాట రాయించటం మరో విశేషం. ఆకర్షణీయమైన ముఖచిత్రముతో పుస్తక ప్రచురణల సంస్థ మెగా మైండ్స్ ముద్రించడం ఆనందదాయకం. మొదటి సంపుటితోనే పాఠకుల హృదయాలను ఆకట్టుకునే కవిత్వాన్ని అందించిన రచయిత మరెన్నో రచనలు తీసుకురావాలని ఆశిద్దాం, అభినందిద్దాం.
ప్రతులకు:-
మెగా మైండ్స్ పబ్లికేషన్స్ – 8500581928
