మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అన్వేషణ

by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం January 2, 2023
written by బ్రహ్మశ్రీ సూలూరి శివసుబ్రహ్మణ్యం

        ( వచనకవిత )

మనిషి!

నిరంతరాన్వేషి!!

మాతృగర్భంలోనే

మొదలౌతుంది

వెదుకులాట!

అగమ్యాటవిలో

అమాయకుడి వేట!!

గర్భశోకవిముక్తికోసం

పెనుగులాడుతూ,

సుడులుతిరుగుతూ…..

బయటపడి

అంతులేని

దుఃఖసాగరంలో

పడతాడు!

ప్రేమకోసం పరితపించే

ఆ  పసి గుండెలు

ఎన్నిటికో

ఆశ్రయమిస్తాయి

పెంపకుప్పలు!

కొన్నిటికి

“కిరాయి తల్లుల కూటములు!!”

బాల్యం

మొగ్గతొడక్కముందే

విజ్ఞానార్జన పేరుతో

మాతృప్రేమ

అందనంత దూరం

వెళ్ళిపోతుంది!

కూటికోసం,

గూటికోసం,

సమాజంతో

పోటీకోసం…….

ఆరాటపడే

ఆ  అరవిరిసిన మొగ్గకు

దృష్టిపథంనుండి

తప్పుకుంటుంది

ప్రేమ!

ఎండమావులై

ప్రలోభింపజేస్తూ

ముందుకు తోస్తూంటాయి

ఎన్నో ఆసలు!!

బాల్యంలో –

యౌవనంలో

తీరని

ముద్దులు – ముచ్చట్లు

ముసలితనం

ముంచుకొస్తూంటే

‘వ్వె వ్వె వ్వె’  అంటూ

వెక్కిరిస్తాయి!

కడుపుపంటల రూపంలో

కొక్కరిస్తాయి!!

ముదిరిన ముసలితనం

చేతగానితనమై

ధిక్కరిస్తుంది!!!

ప్రకృతి అందించిన

ఇంద్రియపటుత్వం

కోశస్థదశకు

ఆహ్వానిస్తుంది!

అందని ద్రాక్ష పండైన

ప్రే మ కో సం

నిస్తేజస్కాలైన

ఆ కళ్ళు

చివరివరకూ

వెదుకుతూనే ఉంటాయి!

దేనికో అమ్ముడుపోయిన

“ఆ  ప్రే మ“

మరో జన్మకైనా

దక్కుతుందా?

ఆ జీవికి

ఆ నం దం

చిక్కుతుందా??

ఏమో!?!?!?

మనిషి!

నిరంతరాన్వేషి!!

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్వరాంజలి-11

by Krishna Kumari Yagnambhatt January 2, 2023
written by Krishna Kumari Yagnambhatt

ముత్తుస్వామి దీక్షితులవారు సంగీత శాస్త్ర రహస్యాలు ఇమిడ్చి కీర్తనలు రచించారు. అంతేకాదు, వీరు ఇతర శాస్తాల నెన్నింటిలోనో అపారమైన జ్ఞానం ఉన్నవారు. ఈ జ్ఞానమంతా వారి కీర్తనలలో గమనించవచ్చును. “గురు గుహ” ముద్రతో వీరు రచించిన కీర్తనలు సంస్కృతంలో ఉన్నప్పటికీ తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైనవి.

వెంకట మఖీ సంప్రదాయాన్ని అనుసరించి రాగ నామాలు కీర్తనలో వచ్చేవిధంగా రచించడమే కాకుండా సూళాదిసప్త తాళాలతో నవావరణ కీర్తనలు, నవగ్రహ కీర్తనలు రచించారు. ఇటువంటి అపూర్వ రచనలు ఏ వాగ్గేయకారుడు కూడా చేయలేదు. ప్రపంచంలో అన్ని రకాల సంగీతం కంటే భారతీయ సంగీతం ముఖ్యంగా రాగానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కొక్క రాగం, దాని స్వరసమూహాలు, స్వరప్రస్తారాలు ఎంతో ప్రత్యేకంగా పేర్కొనదగినవి. అటువంటి ప్రత్యేకత కల్గిన “రాగం” పట్ల దీక్షితుల వారి అవగాహన అద్భుతం. అందువలననే వారి కీర్తనలకు ఒక ప్రత్యేకత కల్గింది. రచన ఎంత ప్రౌఢంగా ఉన్నప్పటికి, మంత్రపూరితములైనప్పటికి, వారి రచనలు ప్రాచుర్యాన్ని పొందడానికి కారణమైంది వారి రాగ పద్ధతి. దీక్షితులవారి కీర్తనలు శ్రేష్ఠమైన సంస్కృతి పాండిత్యము, స్వరరాగ పద్ధతిపాటు భక్తి, ధ్యానము కూడా కలిసి శాస్త్రసమ్మతిని రచింపబడ్డాయి. ఈ ఉదాహరణ చూడండి.

 ప్లల వి:

నీలోత్పలాంబికే నిత్య శుద్ధాంబికే మామవ!

అనుప్లల వి:

 త్రిలోక జననీ త్రిభువన మోహిని

త్రైలోక్య చక్రలాసిన

సత్ గురుగుహ విశ్వాసిని!

చరణం :

మాయా ప్రభంజాతీత సవరూపిణీ

 ముచుకంద బాకట పాలిని వరదాయిని

“ఛాయా గౌళ” రాగ రంజని నిరంజని

సాయుజ్యాది దాయిని సచ్చిదానంద రూపిణి !

 ఈ నాటికి కూడా చాలా మంది విద్వాంసులు సంగీత సభ ప్రారంభంలో దీక్షితుల వారి కృతి అయిన హంసధ్వని రాగంలోని వాతాపి గణపతింభజే ఆలపిస్తారు.

వీరి కీర్తనలలోని మంత్రశాస్త్ర తత్త్వంవారి మంత్రశాస్త్ర సమర్థతని, వైదుష్యాన్ని తెలియచేస్తాయి. వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతంలో చాలా వైవిధ్యం ఉంది కానీ, దీక్షితులవారి కృతులలో అతి సహజంగా సంస్కృత భాష ఒదిగిపోయింది.

దీక్షితులవారు తమ భక్తిని అనేక రకాలుగా ప్రదర్శించలేదు కానీ ఏ దైవాన్ని అర్పించినా అమేయమైన సమర్పణ భావనతోనే రచనలు చేశారు. భగవంతుడు– భక్తుడు అన్న సంబంధం తప్ప ఇతర ప్రక్రియలను వారు ఉపయోగించలేదు. ఇది వారి అనన్య భక్తి తత్పరతకు తార్కాణం.

 ఈ కీర్తనను చూడండి

ప్లల వి:

శ్రీ మహా గణపతి రవతుమాం

 సిద్ధి వినాయకో మాతంగ్ ముఖ: !

అనుప్లల వి:

 కామ జనక విధీంద్ర సన్నుత

 కమలాలయ తట న్నివాసొ

 కోమలధర పల్లవ పద ఖర

 గురుగుహోగ్రజ శివాత్మజ!

చరణం:

 సువర్ణా కర్ణణ విఘ్న రాజో

పాదాం బుజో గౌర వర్ణ వసన ధరో

 బాలచంద్రో నరాది వినుత లంబోధరో

 కువలయ స్వ విషాణ పాశాంకుశ

 మోదక ప్రకాశ కరో భవ జలధి నావో

 మూల ప్ర కృతి సవభావ సూకతరో

 రవి సహసర సన్నిభ దేహో

 కవి జననుత మూషిక వాహో

 అవనత దేవతా సమూహో

 ఆవినాశ కైవల్య గేహో !

January 2, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యంపుస్త‌క స‌మీక్ష‌

ప్రదీప్ బిస్వాల్ వి రెండు కవితలు

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు January 2, 2023
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

మాటలు

మాటల గురించి మాట్లాడకపోవడమే మంచిది

అనాథ పిల్లల్లాగా అవి శవాల వెనుక

శ్మశానం వైపు పరుగెత్తుతాయి

చుట్టూ పడిపోయిన చిల్లర నాణేలను ఏరుకుంటాయి

వాటిని ఆపేవాళ్లెవరూ లేరు

చీకటి నిండిన రాత్రిలో

నక్షత్రాల మసక వెలుతురులో

దుమ్ము నిండిన ఊరితోవ మీద

కలల ముక్కల్ని వెతుకుతూ సాగుతాయి అవి

ఎవరు చెప్పగలరు వాటికి, అది నిరర్థకం అని?

వేకువ వేళ కొండకొమ్ము మీద

కొన్ని పచ్చని ఆకులు సూర్యకాంతితో మెరుస్తాయి

అక్కడ చారెడు కాంతిని చేజిక్కించుకునేందుకు

                                         సాహసిస్తాయి

వద్దనేందుకు నేనెవర్ని?

ఇక్కడ నా భార్య

నన్ను వాటికి దూరంగా ఉండమంటోంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ఎక్కడున్నావిప్పుడు?

భరత్! నువ్వెక్కడున్నావు?

దినపత్రికల్లో గానీ

వార, మాస పత్రికల్లో గానీ

ఎన్నో రోజులనుండి నువ్వు కనిపించలేదు

రాజధానిలో నల్లజెండాలతో

ప్రదర్శనలు జరిపినవారిలో నువ్వు లేవు

పాత బస్ స్టాండ్ లో ఎవరో

నీ ప్రసక్తిని తీసుకొచ్చారు

నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చినట్టు

నీ ఫోన్ నంబరును మారుస్తుంటావు

అంతేనా భరత్?

ఇప్పుడెక్కడున్నావు నువ్వు?

బొలంగీర్ లోనా, భువనేశ్వర్ లోనా?

కలహండికి వెళ్లావా నువ్వు?

అక్కడ ఒక ముసలి తండ్రి

పొలాల్లో కాయకష్టం చేస్తుంటాడు

ఇప్పుడు పిఛనుదార్ల వెంట

ఎందుకు పడుతున్నావు నువ్వు?

రైతులు ప్రభుత్వోద్యోగులు కారు

మాలో చాలా మంది లాగే

నువ్వు కూడా ఉన్నదాంతో తృప్తిగా ఉండు

భరత్!

రా ఒకసారి

మనం ఎన్నో చర్చించుకోవాల్సి ఉంది

ఆంగ్లమూలం: ప్రదీప్ బిస్వాల్

తెలుగు సేత: ఎలనాగ

***

ప్రదీప్ బిస్వాల్ పరిచయం:

ప్రదీప్ బిస్వాల్ రెండు భాషలలో రచనా నైపుణ్యం ఉన్న ప్రసిద్ధ కవి. సుమారు నాలుగు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ఒడియా భాషలో ఆరు కవితా సంపుటులను, ఆంగ్లంలో రెండింటిని వెలువరించారు. వీరి రెండు కవితా సంపుటులు హిందీలోకి అనువదింపబడినాయి.కొన్ని కవితలు హిందీ, ఇంగ్లిష్, తమిళం తదితర ప్రధాన భారతీయ భాషలలోకి తర్జుమా చేయబడినాయి. వీరు ఒడిశా రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం, నేషనల్ బుక్ ట్రస్ట్ పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.సరళమైన భాషలో హృద్యమైన కవిత్వం రాస్తారు.ఈయన పేరెన్నిక గన్న సంపాదకులు, అనువాదకులు. ఇప్పుడు kabitalive(kabitalive.com)అనే వెబ్ మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.IAS క్యాడర్ కు చెందిన ఈయన ఒడిశా రాష్ట్రప్రభుత్వంలో పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత,ప్రభుత్వం చేత మళ్లీ ఒడిశా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA)మెంబర్ గా నియమితులైనారు. ప్రస్తుతం వీరు భువనేశ్వర్ లో నివసిస్తున్నారు.

***

January 2, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితా టపాసులు ఎడ్డీయకుండ్రి!

by సుదర్శనం వేణుశ్రీ. January 1, 2023
written by సుదర్శనం వేణుశ్రీ.

వచన కవిత్వాన్ని ఉమ్మగిల్లనీయకుండ
వడ్డిస్తున్నారు అందరూ అని ఎగాదిగా చూడకండి

మార్మికత సంక్లిష్టత ప్రతీకలు లేకుండా కవిత్వమా అనుకోకండి

అవార్డు రివార్డుల కోసంకాదు
తాడిత పీడితుల కొరకే
సామాన్య జనుల కొరకే కవిత్వం
వాడుక భాష పచనం కాని వచన కవితలనకండి

సమాజ మనుగడకోసమే సామాన్యుల మాటలు కవితా వాహిని అయ్యేది

ఎవరేమన్నా కిమ్మనకుండా కవిత్వ బాటలో పోయేటోళ్లం

పద్యాన్ని అలంకార సమాసాల నింపకుండ
జిగిబిగి లేకున్నా గజిబిజి లేకుండా ఉండాలనుకుంటాము
పద ఫలహారాలు పంచుతున్నామనుకోని పరిహాసాలాడకండి

జరుగుబాటుకో తిరుగుబాటుకో రాయడం లేదు
జరిగిన వాస్తవాలను
వాడుక భాషలో రాసేటోళ్లం పెదవుల మీద చిరునవ్వుల భాషణ చేయటం
కాగితాలపై అందమైన ఆదర్శ కవిత్వం కురిపించడం
మనసు కుళ్లు కుతంత్రాలతో
కుతకుతలతో
తోటి కవుల అంతర్గత యుద్ధాలను కోరడం చేయం
కుల మత వర్గ విభేదాల కవిత్వ కుంపటులను రగిలించము
ఒకే భావజాలంలోనూ అంతర్యుద్ధాలనూ కోరము

భక్తి శృంగార భావకవులలో మతాలతో మనుషులు వేరై రాజకీయపు టెత్తులు కవుల హృదయాల్లో తిష్టవేసుకున్న కవులున్నా
అనైక్యత సృష్టించం
ఐక్యత చెడగొట్టం

కవులందరూ కాగితాల పెదవులపై కవితలవుతారు
ఎవరికి అర్థం కాని కవులుంటారు
ఎవరి ధోరణిలలో వారు ఉంటారు
సమాజ శ్రేయస్సొక్కటే అసలు నినాదమై
వినూత్న పోకడల బాటలేసుకుంటాం
వాద వివాదాల పోత పోసుకుంటాం
అసలు జనానికి అందాలన్నదేకాక
అస్సలు అంతరాలు లేకపోలేదుసుమా!
అందరు కవులొక్కతీరేకారుసుమా!
తోటి కవుల తొక్కి పైకెక్కి మహాకవులు ఉన్నారు!
తోటి కవులు పైకెదగాలని అక్కున చేర్చుకునే కవులూ ఉన్నారు!

కాల ప్రవాహానికి నిలిచే కవులున్నారు జన కవులున్నారు
స్వార్థం వీడి కవిత్వ సాంగత్యం కోరే కవులూ ఉన్నారు
ఉన్నమాటకు ఎవరు ఉలిక్కిపడక
అన్న మాటలను ఆలోచించండి
అందుకే అందరిని కోరుతున్న-
ఎడ్డీయకుండ్రి!
కవితా టపాసులు ఎడ్డీయకుండ్రి!!

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధరిత్రీవందనం

by Damaraju Vishalakshi January 1, 2023
written by Damaraju Vishalakshi

బంగారు సింగారు భరతమాతకు మనము నిండార దండాలు పెడదామా
దండిగాసేవలు చేద్దామా !బంగారు సింగారు!!

గంగ యమున సింధు
కన్నతల్లయినట్టి భరతమాతకు
దండమెడదామా
భక్తితో సేవలు చేద్దామా !బంగారు!

వింధ్య ఆరావళి
హిమగిరులతో ఒప్పేటి
ధర్మమూర్తికి దండం
పెడతామా
ధరణిలో శ్రేష్టతను చూద్దామా !బంగారు!

తల్లి స్వేచ్ఛ కొరకు
తనువు లర్పించినా త్యాగధనులను తలచుకుందామా
తరతరములకు
చెప్పుకుందామా !బంగారుసింగారు !

వీరులను శూరులను
విజ్ఞాన వేత్తలను
కన్న భారతి కి దండం పెడతామా
విజయ మాలలు
మెడలో వేద్దామా !బంగారు!

అన్నపూర్ణగ జనని
నావిష్కరించిన
అన్నదాతల
తలచుకుందామా
అవనినిలో
కాపాడుకుందామా !బంగారు!

రేయనక పగలనక
సరిహద్దులలొ కాచి
శత్రువులశిరములతో ఆటలాడునట్టి
సైనికులకుమొక్కు కుందామా
సాహసులను తలచుకుందామా !బంగారు!

దేశసేవ యనెడి
దీక్షను వహించి దేశభక్తి తోడ
ధీరులై చరియించు
స్త్రీ బాల వృధ్ధులను
చూద్దామా
చేయెత్తి దండము
పెడతామా !బంగారు!

సహజవనరులతోన సశ్యశ్యామలమైన
శ్రామికులకృషితోన
శోభిల్లి వెలిగినా
సవిత్రికి దండమెడదామా
ధరణిలో గొప్పదని చెబ్దామా !బంగారు!

January 1, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆరోగ్య పరిరక్షణ : అయ్యప్ప దీక్ష

by రసస్రవంతి& కావ్యసుధ January 1, 2023
written by రసస్రవంతి& కావ్యసుధ

శబరిమలలోని స్వామి అయ్యప్పను దర్శించ టానికి మండల దీక్ష చేసే వారు మెడలో దీక్షా మాలను ధరించడం ఎంతో ముఖ్యం. ఆ మాలను మంత్రయుక్తంగా గురుస్వామి చేతుల మీదుగా ధరించాలి. దీక్షామాల ఎంతో పవిత్రమైనది. మండల దీక్ష ఆరంభించిన అయ్యప్ప భక్తులు, వారికివారే ఆ మాలను ధరించకూడదు. దేవాలయంలో కానీ, భక్తుని గృహంలో కానీ, తన గృహంలో కానీ శిష్యునికి మాలను గురుస్వామి ధరింపచేయాలి. గురుస్వాములు అయిన వారు గురువు లేకపోతే అయ్యప్ప దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చకునినే గురువుగా భావించి అర్చకుని చేత మాలధారణ చేయించు కుని తాంబూలం, పండు, దక్షిణతో ఆయనను సత్క రించాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు శబరిమల దీక్ష పట్టి, స్వామిని దర్శించి గురుస్వామి అర్హత పొందిన అయ్యప్ప భక్తులైన గురుస్వాములు, తమకంటే ఎక్కువసార్లు దీక్షతో శబరిమల యాత్ర చేసిన గురుస్వాముల చేత మాల ధారణ చేయించు కోవాలని ఇంకొందరు చెబుతున్నారు. ఇంకొంతమంది. భక్తులు తమ తల్లి చేతనే మాలను ధరింపచేసుకుంటు న్నారు. మాతృదేవోభవ అన్న సూక్తి ప్రకారంగా వారా విధంగా చేస్తున్నప్పటికీ కొడుకుకు మాల ధారణ విషయంలో తల్లి జోక్యం అభిలషణీయం కాదని ప్రముఖ గురుస్వాములు అంటున్నారు.

అయ్యప్ప దీక్ష మాలధారణ దేవాలయంలో లేదా గృహంలో జరిగినా, గురుస్వామి గృహంలో జరిగినా గురువు ద్వారానే మంత్రం పఠిస్తూ దీక్షా మాలను ధరింపచేసి శిష్యుని ఆశీర్వదించడమన్నది విధాయకం. స్వామివారికి పూజాభిషేకాలు చేసి, స్వామి వారిని హృదయంలో నిలుపుకుని మనో నేత్రాలతో ఆయనను దర్శిస్తూ శిష్యుని మనసులోకి స్వామిని ప్రవేశింపచేస్తాడు గురుస్వామి. తులసి పూసలతో, రుద్రాక్షలతో, స్ఫటికాలతో తయారు చేసిన ఏ మాలనైనా దీక్ష మాలగా ఉపయోగించవచ్చు. మండల దీక్షను స్వీకరించి మెడలో మంత్ర పూర్వకంగా మాలను ధరించిన అయ్యప్ప భక్తులు యాత్ర పూర్తి చేసుకుని గృహానికి చేరుకునే వరకూ మెడలో నుంచి మాలను తీయకూడదు. మాలను ధరించటానికి ముందు రోజున మాలను శుభ్రపరచాలి. మర్నాడు బ్రహ్మీ ముహూర్త సమయము నకు ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని అభ్యంగన స్నానం ఆచరించి మాల ధరించటానికి సిద్ధపడి ఉండాలి. గురుస్వామి సన్నిధిలో ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి.

అయ్యప్ప దీక్ష సక్రమంగా భక్తితో పాప్తి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యంగా, ఉత్సాహవంతులుగా కూర… తుంటారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేచి, చన్నీటి స్నానం చేయడం, నుదుట విభూతి, చందనం కుంకుమ ధరించి దీపారాధన చేసి, పూజ, శరణు ఘోష ముగించి ఏదో ఒక దేవాలయానికి దైవదర్శనానికి స్వాములు వెళతారు. ఉదయమే కాళ్లకు చెప్పులు లేకుండా నడచి దేవాలయానికి వెళ్ళి, ప్రదక్షిణలు చేసి దైవదర్శనం చేసుకోవడం వల్ల స్వామి కార్యం, స్వకార్యం పూర్తి అయినట్టు ఉదయపు నడకను భక్తిగా చేసినట్లవుతుంది. అదే విధంగా సాయంత్రం తలకు చన్నీటి స్నానం చేసి, పూజా కార్య క్రమాలు ముగించాక దేవాలయానికి కానీ, భజనలకు గానీ, నడ వెల్లడం వల్ల సాయంత్రపు నడక పూర్తి అవుతుంది.

బ్రహ్మచర్య వ్రతం దీక్షలో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. బ్రహ్మ -చర్య వ్రతం పాటిస్తూ నేలపై చాపమీద రెందుకూడా లేకుండా నిద్రించడం వల్ల మెడనొప్పి, నడుము నొప్పి వంటివి దరికి చేరవు.. ఉన్నవారికి నయమవుతుంది. నేలపై పడక మొదట్లో ఇబ్బంది. కలిగించినా, తరువాత చక్కగా నిద్రపడుతుంది. సాత్వికాహారం మేలు చేస్తుంది. ఒక పూట భోజనం, రెండో పూట అల్పాహారం, నియమబద్ధంగా ఆహారం సేవించడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. ఊబకాయం ఉన్నవారు మండల దీక్షతో తెలియకుండానే కొన్ని కిలోలు బరువు తగ్గి, శరీరం తేలిక అవుతుంది. శబరిమల యాత్రకు వెళ్ళి వారు అడవుల్లో చురుగ్గా నడవ గలుగుతారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు రాళ్లు వంటివి గుచ్చుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఉత్సాహంగా ఉంటారు. అలాగే భజన కార్యక్రమంలో రెండు అర చేతులతో, తరచూ చప్పట్లు కొట్టడం వల్ల చేతిలో వేళ్ల నరాల్లో రక్త ప్రసరణ బాగా జరిగి తెలియని ఆనందాన్ని, తన్మయత్వాన్ని పొందుతారు.

దీక్షలో మాంసాహారం, రోడ్డు పక్క చిల్లర తిళ్ళు వంటివి.తినకపోవడం వల్ల, పొగ తాగడం, మద్యపానం, గుట్కా, కారా , కిల్లీ వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల అనారోగ్యం వారి దరికి చేరదు.
తరచూ కర్పూరహారతి ఇవ్వడం వల్ల, సూక్ష్మక్రిములు దరిదాపుల్లోకి రావు. పూజ, భజనానంతరం, సహపంక్తి భోజనాలు భిక్ష, అందరూ నల్ల బట్టలు ధరించి, మాసిన గెద్దాలతో, బికారిగా ఉండటం, సమానత్వ భావన పెంపొందిస్తాయి. కులం, మతం, తేడా , అంతస్తు, గొప్ప, బీద తారతమ్యం మరచి స్వాములు తిన్న ఎంగిరి విస్తరు ఎత్తడానికి పోటీపడి తనలో ఉన్న గర్వం అహంకారాన్ని పక్కన బెట్టి దైవకార్యంగా భావించి పవిత్రంగా చేస్తారు. “అహం బ్రహ్మాస్మి తత్త్వమసి సిద్ధాంతం” అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్ము. ప్రతి ఒక్కరిలో అయ్యప్పస్వామిని దర్శించి తనలో కూడా దైవాన్ని సందర్శించడమే ఈ దీక్ష ప్రత్యేకతా మాలధరించి దీక్షలో ఉన్న స్వాములు సాక్షాత్తు అయ్యప్ప స్వామికి ప్రతి రూపాలుగా, భావిస్తారు. ఎవ్వరూ పేరు పెట్టి పిలువకుండా పేరుకు అయ్యప్పని కానీ స్వామీ అని కానీ చేర్చి పిలిచి
శరణం అని నమస్కరించి మాట్లాడుతారు. కొందరు పాదాభివందనం చేసి గౌరవిస్తారు.

” స్వామియే శరణమయ్యప్ప”

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కలలు

by Pendyala Shaymsunder January 1, 2023
written by Pendyala Shaymsunder

గాలి చెట్ల మధ్యన అల్లుకోవటం ప్రకృతి
పగిలిన గ్రుడ్డు ఆకాశం పై పరిచినట్టు గా కరిగిపోవడం
ఒక అనుభూతి

మంచి ఆలోచనలు నాలో రేకెత్తినట్టుగా
అందమైన జీవితం నా చుట్టూ అల్లుకున్నది
చాలా రోజుల క్రితం నాలో నిండిన
రంగురంగుల
ఆ కలలో నేను కులాసాగా కరిగిన దృశ్యం లా!
కానీ,
నిజజీవితంలోని నిస్సారాన్ని
అధిగమిస్తూ
లెక్కల టీచర్ చెప్పే బోరింగ్ ఫ్రాక్షన్ గణితాన్ని వినడానికి
స్కూల్ కు పరుగెత్తినట్టుగా
నాదైన అవర్ గ్లాస్ పగిలి
ఇసుక అంతా వేళ్ళ మధ్యన కారినట్టు కాని నిజాన్ని నేను అనుభవించాలికదా
పగిలిన గ్లాసు లో కారుతున్న ఇసుకను పెట్టడానికి ప్రయత్నించినట్టు
కరిగిపోయిన కలలను
తిరిగి కూర్చి
మెదడులో నింపడానికి ప్రయత్నించినట్టు ఆలోచించాను
ఈ ప్రపంచ తత్వం
నిర్ణయ సాధ్యం కాదని ద్వేషించడం సులభం
ప్రేమించడం కష్టం
నిర్ణయాలైతే సులభంగా నిర్ణయానికి వస్తాం
కాని
ఒప్పుకోవడం కదా మనసుకు కష్టం
ప్రపంచ నీతి అది
అయినా ఈ ప్రపంచం ఎంతో అందమైనది
ప్రపంచం నడిచే పద్ధతి లో
నా కలల్లోకి దూరిపోకుండా
నా రంగుల కలను
నా ఆశయాలను జీవిత కాన్వాస్ పై
చిత్రీకరించాలని ఆశిస్తున్నాను

అనువాదం- పెండ్యాల శ్యామ్ సుందర్ రావు
మూలం – మేఘా ఇషాణి పెండ్యాల.

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నాన్న ఎక్కడ

by Dr. Aruna Parandhamulu January 1, 2023
written by Dr. Aruna Parandhamulu

పట్టరాని సంతోషముతో నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళా!

నాన్న అప్పుడే ఎందుకో
కోపంగా ఉన్నాడు..

అమ్మతో కస్సు బుస్సు
లాడుతున్నాడు..

నాన్న కోపం నాకు అర్థం కాలేదప్పుడు….

అమ్మ నన్ను బడికి పంపినందుకు….
నాకు పని
నేర్పించనందుకు!

సద్గుణాలు ఎన్నో..
ఉన్న నాన్న అమ్మను కసిరించుకుంటుంటే….
ఆ క్షణాన నాన్నను
ఎదిరించ
కుండా
ఉండే
మనసు
నాక్కేడిది..!

ఆడపిల్లలు
ఆరు బయట
కూర్చోరాదని…… ఆంక్షలెట్టినప్పుడు…
నాన్న నన్ను
అనుక్షణం
కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడని
సంతోషపడ్డా…!

కానీ….!
నాన్నే….
నా స్వేచ్ఛ కు అడ్డుకట్ట
వేసే మొదటి వ్యక్తి అని…
అప్పుడు
తెలుసుకో
లేకపోయా…
ఇప్పుడే
తెలిసింది…
మా నాన్న
మగామహారాజు…
అని ఆడజాతిని
అణిచి వేసే
శక్తివంతుడని ….

నాన్న శక్తి
నాకు నచ్చలే…
నాన్నను ఏదురించ
కుండ ఉండలేపోయా…

ఆడపిల్లలు
ఆరు బయటనే
కాదు
అర్థరాత్రి ఒంటరిగా
తిరగాలని నిర్ణయానికీ
వోచ్చా…
మా నాన్న విధించిన
అంక్షాల సంకెళ్లలను తెంచుకొని..

మా నాన్న లాంటి
నాన్నలను
ఒప్పించి
మెప్పించి
అమ్మాయిలందరినీ
బడికి పంపించా……
అమ్మాయి చదువు అవనికి
వెలుగు అని

ఇప్పుడు
మా నాన్నే
ప్రతి ఇంటి వెళ్లి
అమ్మాలoదర్ని
బడికి
పంపించే మార్గం వెతుకుతున్నారు…

డాక్టర్. అరుణ పరంధాములు

(హామీ పత్రము:-ఇది నా స్వీయ రచన ఎక్కడ నుండి కాఫీ చేయలేదు.)

January 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రమేశ్వర్ రాజు

by Ananthaacharaya K.S. January 1, 2023
written by Ananthaacharaya K.S.

రమేశ్వర్ రాజు గారిది గొప్ప అనుశీలనం. అదిత్యుడి కిరణ శక్తి పరిపూర్ణంగా వీరిపై ఉంది. వీరు వైష్ణవ మతానుయాయులు.శ్రీమన్నారాయణ భక్తులు. అది పద్యాలను పరికిస్తే కనపడుతుంది. నేటి పద్యంలో అనుచు నారాయణా….తుంబురు నారదాదలు నంబరమున… ఆ దృశ్యాన్ని కేవలం ఉహించగలం కానీ అనుభవించలేమన్న దృగ్విషయం తేటతెల్లబరిచారు. దేవలోకం లో తుంబురు నారాదులు ఇద్దరు సంగీత విద్వాంసులు. ఇరువురు ముల్లోక సంచారులు. మహావిష్ణువును స్తుతియిస్తూ కీర్తనలు గానం చేసే వారు. నారదుడి వీణ మహతి అయితే తుంబురుని వీణ కళావతి.
అహో దేవర్షార్ధన్యోయం యత్కీర్తిం శార్ ఙ్గ ధన్వనః
గాయన్మాద్యన్నిదం తంత్ర్యా రమయత్యాతురం జగత్!
దేవర్షి నారదుడు బహుధన్యుడు. ఏల అనగా వీణ మ్రోగిoచుచూ
హరి గుణగానం చేయుచూ పారవశ్వము నందుచూ ఈ జగత్తునంతయూ ఆనందింప చేస్తూ సంచరించేవాడు ఆలాగే సూర్యుడు సంచారీ ఆ గాన మాధుర్యం అలపన అద్భుతమైన దృశ్యం వీక్షించిన వాడే సూర్య నారాయణుడు. అన్ని అవతారలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరయోగీంద్రులకు దర్శనీయుడు. సకల సృష్టి అవతారాలకు ఆయనే మూలం. ఆది మూల మితడు అని అన్నయ్య కీర్తనలో కొనియాడినాడు.
దేవ్ ఋషియైన నారాదునిగా అవతరించి శ్రీమన్నారాయణుడు సమస్త కర్మల నుండి విముక్తిని ప్రసాదించే పాంచారాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
మహావిష్ణువు 21 అవతారాలలో మూడో అవతారం నారదుడు. మహాజ్ఞాని.బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వక్త,రాజ నీతిజ్ఞుడు,లోకహితవాది ( భాగవత ప్రథమ స్కంధం) అన్నింటిని మించి భగవద్భక్తుడు. సర్వలోక సంచారీ.అనంత బ్రహ్మాoడములలో ఎక్కడా ఏది జరిగినా ఆయనకు ఇట్టే తెల్సిపోయేది. నారద అన్న శబ్దం లోనే జ్ఞానాన్ని అందించే వాడని అర్థం. ఈ జ్ఞాన బోధకోసమే ఆయన లోకాలు తిరిగేవాడు.అలాగే సూర్యుడూ లోకసంచారియే. ఇరువురి
మార్గాలు ఒక్కటే, స్వరూపాలు నారాయణుడివే. భాగవతాన్ని రచింపమని వేదవ్యాసునికి నారదుడు చెప్పినట్లు భాగవత ప్రథమ స్కంధంలో ఉంది.
వాల్మీకి కి రామాయణం నారదుడు రచింపమనట్లుబాలకాండలో ఉంది. అలాటి అద్భుత భక్తి భావ తత్పరుడు పరమభాగవతోత్తముడు చేసే
దివ్యగానం వినే భాగ్యశాలి సూరుడిని అభివర్ణించడం సహేతుకం. అట్లాంటి నారదుని చూడకున్నా సూర్య నారాయణుడిని సేవిస్తున్నామని రాజు గారు పద్యం లో చెప్పారు.
పరమశివుని డమరుక నాదంలోంచి జన్మించి సంగీతమును విశ్వవ్యాప్తం చేసేందుకు బయలు దేరిన నారద తుంబుర జంటలో ఒకడుగా ప్రసిద్ది పొందినాడు.గంధర్వుడు తుంబురుడు విష్ణుమూర్తి భక్తుడు..పౌరాణిక ప్రసిద్ధి హిందూ పురాణాల ప్రకారం. సూర్యగణంలో సూర్యునికి తోడుగా ప్రతీ ఋతువులో అతని రథంలో ఇద్దరు ఆదిత్యులు,ఇద్దరు ఋషులు, ఇద్దరు గంధర్వులు, ఇద్దరు అప్సరసలు ఇద్దరు రాక్షసులు, ఇద్దరు నాగులు ప్రయాణిస్తారు. చైత్రమాసం ( మధుమాసం)లో ధాత,హేతి,వాసుకి, రథకృతి,పులస్త్య, కృతస్థలి,అనే వారితో పాటు తుంబురుడు రథం లో తిరుగుతాడు. ఈ ఇరువురి ప్రస్తావనతో పద్యానికి నిండుదనం చేకూర్చారు. ఆది దేవా అని,అమరవంద్యుడిని చక్కగా సంబోధించి నిన్ను ఒక్కడిని చూస్తే సకల సౌభాగ్యాలు ఓన గూరుతాయని మంచి పద్యం అందించిన రమేశ్వర రాజుగారికి అభినందనలు.

స్వార్థ రహిత సేవకు నీవే అంటూ ఈ రోజు పద్యానికి శ్రీకారం చుట్టిన రమేశ్వర రాజు గారి కవనాశ్వం సూర్య తేజో విరాజమానంగా సాగుతుంది. మనిషి స్వార్థాన్ని వీడి పరమార్థం వైపుకు అడుగు వేయాలని అందుకు సూర్యుడిని ఉదాహరించారు…ఎటుల బాగుపడునో ఇజ్య దేవ అని చిక్కటి పదప్రయోగం చేశారు రాజు గారు. విష్ణువు సహస్రనామాలలో 446వ నామం ఇజ్య…ఇజ్య దేవుడు అంటే యజ్ఞముల చేత ఆరాధింపబడేవాడు. విష్ణు సహస్రనామo విశ్వం విష్ణుర్…అని మొదలవుతుంది. విశ్వo అంటే విశ్వమంతా తానే అయినవాడు ( నామ రూపాత్మకమై,చిత్రాతి చిత్రమై,వికసించి,విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చారా చర జాడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము ) సకల విషయములందు సంపూర్ణమైనవాడు. అంతా భగవంతుడే భాష్యకారుల వ్యాఖ్యానం. విష్ణుః అంతట వ్యాపించి వున్నవాడు. వషట్కారహః వేదమంత్ర స్వరూప, వషట్ క్రియకు గమ్యము ( యజ్ఞం లో ప్రతీ మంత్రం చివర మంత్ర జలమును వషట్ అనే శబ్దంతో వదులుతారు) అంతటిని నియంత్రించి పాలించేవాడు. పరమాత్మ అయిన నేను యజ్ఞ పురుషుడిని,యజ్ఞకర్తను,యజ్ఞఫల స్వరూపుడిని అనిచెప్పారు. కాబట్టి అలాటి ఇజ్య దేవుడిని యజ్ఞం తోనే ఆరాధిస్తారు. యజ్ఞం అనేది అనాదిగా వస్తున్న ఒక హిందూ సంప్రదాయం. వేదం లో యజ్ఞోవై విష్ణుః అని చెప్పబడినది. అనగా యజ్ఞం విష్ణుస్వరూపంగా భావించవచ్చు.యజ్ఞం అను శబ్దం యజ దేవ పూజయామ్ అనే ధాతువు నుండి ఏర్పడింది.దైవ పూజయే యజ్ఞం.యజ్ఞం అంతిమ లక్ష్యం దేవతలను సంతృప్తి పరచడం,వారిని మెప్పించడం. యజ్ఞం అనేది అగ్ని ( హోమం) వద్ద వేద మంత్రాల సాక్షిగా హావిస్సులు స్వాహాకారాల తో సంతృప్తి పరుస్తాం హావిస్సులు అగ్నిలో పడుతున్నప్పుడు పరిపూర్ణ ఏకాగ్రతతో విష్ణవే ఇదం నామమ ఇది విష్ణువు కు సమర్పితం నాది కాదు అని సమర్పిస్తాం.తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది. ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి. ఈ కవిగారు అక్షర యజ్ఞం చేస్తూ స్వార్థ బుద్ధిని సమాజ పోకడలు మార్చమని సూర్య నారాయణుడి ద్వారా శ్రీమన్నారాయణుడిని వేడుకుంటున్నారు. పరస్పరo భావయన్తహః శ్రేయః పర్మవ్యాప్సధ…. పరమాత్మ తాను సృష్టించిన ప్రజలను.. ఓ ప్రజాలారా ఈ యజ్ఞం ద్వారా మీరు శ్రేయస్సును కాంక్షించి అందరూ లాభం పొందండని యజ్ఞ సూత్రాన్ని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. యజ్ఞం చేయడం అంటే సర్వజీవి ఆరాధన చేయడం అనే సత్యం పద్యంలో స్ఫురిస్తుంది. యజ్ఞం లో కూడా చాలా రకాలున్నాయి.మానవ జీవితంలో యజ్ఞాలు చేస్తే పరమాత్మకు ప్రీతి కలుగుతుంది. ఈ యజ్ఞాలు 5 రకాలు బ్రహ్మ యజ్ఞము,దేవ యజ్ఞము, పితృ యజ్ఞము, భూత యజ్ఞము, నృయజ్ఞము. బ్రహ్మ యజ్ఞము అంటే వేదాధ్యయనం చేయడం. జ్ఞాన విస్తరణ చేయటం. దేవయజ్ఞం అంటే కామ్యం ..ఆజ్యాది హోమద్రవ్యాలను వినియోగించి చేసే ప్రక్రియ.పితృ యజ్ఞము అంటే పరలోకంలో ఉన్న తండ్రికి, పూర్వీకులకు శ్రాద్ధ, తర్పణాలు నిర్వహించడం. భూత యజ్ఞము అంటే సకల జీవరాసులకు ఉపయోగపడేలా నడుచుకోవాలి.
నృయజ్ఞము అంటే అతిథి స్వయం విష్ణుః అని ఆదరించి గౌరవించాలి. కనీసం దైవారాధన ,ఐక్యత దానం చేయడం ద్వారా యజ్ఞ పురుషుడిని సంతృప్తి పరుచవచ్చు. మానవ హితాన్ని కోరి రాజు గారు యజ్ఞకర్మల బోధ చేశారు. చక్కటి పద్యం అందించిన మీకు అభినందనలు .

January 1, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తులసీదాసు

by Geetha Charmy nunepally January 1, 2023
written by Geetha Charmy nunepally
January 1, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us