మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

మృత్యు వాంగ్మూలం..!

by ManapuramRaja Chandrashekar September 28, 2022
written by ManapuramRaja Chandrashekar

మానాపురపు చంద్రశేఖర్

యుద్ధంఎప్పుడూఒకరాక్షసక్రీడే!

సరిహద్దుల్లోమోహరించినమృత్యుకెరటాలన్నీ

రణశకటాలుగాఎగిసిపడుతుంటే,

గగనతలంలోంచిఇలాతలంలోకి

విపత్తుసమయాల్లోజారవిడిచిన 

ఆహారపొట్లాల్లాయుద్ధక్షిపణులు

మానవబతుకుల్నిఛిద్రంచేస్తూ

వర్తమానవిధ్వంసాన్నిసృష్టిస్తున్నాయి!

మస్తిస్కానికీమేధోమథనానికి 

అంతరంపెరుగుతున్నవేళ

ఆహంకారంఅధికారమదంగారూపాంతరంచెందితే

శృతిమించినరాజ్యకాంక్షపాశవికంగామారితే

ఈ నేలపైరాల్చడానికి

ఒకకన్నీటిబొట్టూమిగలదు

సర్వంబూడిదమయమే..!

బాగస్వామ్యదేశాలపై 

అధిపత్యపట్టుకోసం

ఉక్రెయిన్ ‘నాటో’ కూటమిలోచేరికపై 

గుర్రెత్తినరష్యాబలగాలు!

సమస్యఒకప్రాంతానిదికాదు

మానవత్వంకరడుకట్టినచూపులతో

దేశంమొత్తంశవాలగుట్టలతోవల్లకాడైపోతోంది! 

శిథిలమైనభవనాలు..కుప్పలుతెప్పలుగాపడినశవాలు

మిన్నంటినబాధితులరోదనలు

జననంఖననంకోసమేఅన్నట్లుగా

అగ్రబలగాలసామూహికముట్టడితోముప్పేటదాడి

ఇదిమూడుదశాబ్దాల 

వివాదవైరిఫలితంమాత్రమేకాదు

యుద్ధశరణార్థుల 

ఆంతరంగికమౌనవేదనలప్రతిధ్వనికూడా!

ఈ నేలపైఆధిపత్యపోరుకోసం

బలిపశువులఆర్తనాదాలరణన్నినాదాలమృత్యుఘోష!

కార్చిచ్చురగిల్చడంతేలికే! 

బూడిదలోశూన్యమైనకలలకట్టడాల్ని

పనర్నిర్మించడమే ఒక ప్రశ్నార్థకం?!

ఎన్నిదౌత్యపైత్యాల్నిసంధిప్రయత్నాలుగానెరిపినా

శాంతిమంత్రాలన్నీఅపశ్రుతులుగానేరాలిపోతున్నాయి

చరిత్రఒకరణస్థలనితెలిసినా

ఈ బహిరంతరయుద్ధకాంక్ష

జీవనమానవవ్యామోహంగానేమిగిలిపోయిందిప్పుడు!

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కంచికి చేరని కథ

by Sudharshan Chintapatla August 22, 2022
written by Sudharshan Chintapatla

బెంచీల మీదనుంచి లేచి వెళ్ళిపోయిన జంటల వెచ్చదనం ఇంకా అలాగే ఉంది. పొదలు తమ పక్కనే కూచుని మాట్లాడుకున్న ప్రేమికుల గుసగుసలు మననం చేసుకుంటున్నవి. పచ్చిక తన మీద నడచిన సున్నితమైన పాదాల స్పర్శను ఇంకా అనుభవిస్తూనే ఉంది.

చిల్లు బడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులా చీకటి క్రమక్రమంగా వ్యాపిస్తున్నది. మసక వెలుతురులో బూరు మిఠాయి చుట్టిన కర్రల్లా కనిపించసాగాయి చెట్లు.

‘ఇంక వెళ్దామా?’ అన్నాడు ఐదడుగుల పది అంగుళాల పొడవైన బలమైన శరీరమూ, రింగుల జుట్టూ సన్నటి మీసం, వెడల్పాటి నుదురు ఓనర్.

‘అప్పుడేనా?’ అన్నది అతని కంటే నాలుగు ఇంచీలు పొడవు తక్కువ సున్నితమైన బంగారు రంగు దేహమూ, సన్నటి ముక్కు, అక్వేరియంలో కదిలే చేపల్లాంటి కళ్లు ధనుస్సులా తీర్చి దిద్దినట్టున్న పెదాల స్వంతదారు.

పోలీసు వ్యాన్ సైరన్ శబ్దానికి పారిపోయిన దొంగల్లా మాయమై పోయేయి నక్షత్రాలు. ఉన్నట్టుండి ఆకాశంలోకి తొండాలు ఎత్తి పట్టుకున్న ఏనుగుల గుంపు ఒకటి వచ్చి చేరింది.

‘లే…. లే… పార్కు మొత్తం ఖాళీ అయింది మనమే ఉన్నట్టున్నాం’ అన్నాడతను తన చేయి ఆమెకు అందిస్తూ.

అతని చేయి అందుకుని  పైకి లేచింది ఆమె. ఇద్దరూ పార్కు గేటు దాటారు. వీళ్ళు పార్కుకు రావడం మొదలు పెట్టి రెండేళ్ళాయింది అనుకుంది. గేటు పక్కన ఉన్నా బోగన్ విల్లా కాసిని ఎర్రపూలు ఆమె తలమీద రాలుస్తూ.

పార్క్ చేసిన బైక్ దగ్గరికి నడిచాడతను. ఆమె పరుగెత్తింది. ఇద్దరూ ఎక్కాక బైక్ చక్రాలు పరుగెత్తేయి.

*   *   *

గోడమీద గడియారంలో జంట ముళ్ళు తిరుగుతున్నాయి. దానికింద జంటగా ఓ టేబిలూ కుర్చీ ఉన్నాయి. కుర్చీలో ఎందరినో జంటలుగా కలిపిన సుదీర్ఘమైన అనుభవం వల్ల ఒక్క వెంట్రుకా మిగలక మైదానంగా మారిన బట్ట తల మోస్తున్న రిజిస్ట్రార్ ఉన్నాడు.

ఆయనకు ఎదురుగా కొత్త జంటలో ఒకడవ బోతున్న శంకర్ ఉన్నాడు. అతనికి ఎదురుగా పంచదార బొమ్మలాంటి రమ్య ఉంది. శంకర్ రమ్యల రిజిస్ట్రేషన్ పెళ్ళికి పదిమంది మిత్రులొచ్చారు. వాళ్ళల్లో ముగ్గురు అమ్మాయిలూ ఉన్నారు. జెయింట్ సైజు బౌండు రిజిష్టర్లో తెర్చుకున్న పేజీ వుంది. ఆ పేజీలో శంకర్ సంతకం చేశాడు. రమ్య సంతకం చేసింది. సాక్షులు సంతకం చేశారు. రెండు జతల సంతకాలతో ఒక జత జత అయింది. ఇద్దరూ మార్చుకున్న దండల్లో చిక్కుకున్న పూలు పరిమళాలు వెదజల్తాయి. స్నేహితులు అభినందించారు.

*   *   *

పార్కులో కల్సుకునే శంకర్ రమ్యలు అద్దె యింట్లో అడుగుపెట్టారు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా అనే వారు లేకపోయేరు. రెండు కుడి కాళ్ళు ముందుపెట్టి ఇద్దరూ అద్దె స్వర్గసీమలో అడుగుపెట్టారు. హాల్లో వెలిగిన ట్యూబ్ లైట్ వాళ్ళకు స్వాగతం పలికింది. వాళ్లు కన్న కలల్ని నిజం చెయ్యడానికి జీరోబల్బు వెలిగింది.

*   *   *

ప్రభాకరరావు ఒక బిజినెస్ మాగ్నెట్. ఆస్తీ అంతస్తూ డబ్బూ అన్నీ ఎక్కువే కనుక ఆయనకు మమకారం కన్నా అహంకారం ఎక్కవ. ఈ అహానికి అతని గొప్ప కులం కూడా ఓ కారణమే. ప్రభాకరరావుకి ఇద్దరు కూతుర్లు ఓ కొడుకు. కూతుర్లలో ఒకరి పేరు రమ్య.

రమ్య తక్కువ కులంవాడిని ఇష్టపడ్డం రహస్యంగా పెళ్ళాడ్డం తన దారి తను చూసుకోవడంతో ప్రభాకరరావు పరువు ప్రతిష్ట ప్రమాదంలో పడ్డవి. ఆస్తీ అంతస్తూ అడ్రసూ లేనివాడు అల్లుడవడం భరించలేకపోయేడు.  చీలిన పాము నాలుకల్లా ఎగసి పడుతున్న ఆగ్రహజ్వాలలు తనని దహిస్తుంటే ప్రతీకారం కోసం నిరీక్షణలో ఉన్నాడు. ఇంట్లోనే పట్టు చీరల షోరూము, జూయల్రీ షాపు ఉన్న తల్లి తల ఎక్కడ పెట్టుకోవాలా, నలుగురికీ మేం సమాధానం చెప్పుకోవాలా అని నిత్యం విచారించసాగింది.

*   *   *

శంకర్ తప్ప తనకు లోకంలో ఇంకెవ్వరూ లేరు అనుకుంది రమ్య. మొట్టమొదటిసారి శంకర్ ను చూసినప్పుడు ఆమె గుండ యిదివరకటి లయను వదిలేసి కొత్త రిథమ్ ను అందుకుంది. అది శంకర్ నే కోరుకుంది. ఆమెకు అతని మాట తీరు నచ్చింది. అభిప్రాయాలూ ఆలోచన్లూ బాగున్నాయనుకుంది. అతని సెన్నాఫ్ హ్యూమర్ కు ఫిదా అయింది.  అతనిలోని ప్రేమికుడు అయస్కాంతంలా ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు. అప్పుడామెకు ఆస్తీ అంతస్తూ కులమూ ఏవీ గుర్తుకు రాలేదు. పరువు కోసమే బ్రతికే తండ్రి మాటే మర్చిపోయింది. తను తన ఇంట్లో అనుభవించిన సుఖాల్ని, రిచ్ లైఫ్ ని ఆమె ప్రేమ కోసం త్యాగం చెయ్యవచ్చు ననుకుంది.

ఇప్పుడు రమ్యకు జీవితం అంటే యిదే అనిపిస్తున్నది.  ఒకటీ ఒకటీ కలిస్తే రెండు కాదు ఒకటే అనుకుంది. తన కాళ్ళకి బంగారు పట్టీల కంటే శంకర్ ఇష్టపడే గజ్జెల వెండి పట్టేలే విలువైన వనుకుంది. తన తండ్రి ఇంట్లో తోటలోని రకరకాల రంగురంగుల పూలకంటే కిటికీ అవతల పూలకుండీలోని పూలే అందంగా ఉన్నాయని ఫిక్సయిపోయింది.

శంకర్ రమ్యలు నెలల్ని రోజులుగా రోజుల్ని గంటలుగా గంటల్ని మధుర క్షణాలుగా ఒకరికి ఒకరుగా ఒకరి కళ్ళల్లో మరొకర్ని చూసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫులం అనుకుంటున్నారు.

కొడుకు తమకు చెప్పకపోతేనేం పట్నంలో ఉద్యోగం చేస్తూ తనకు నచ్చిన అమ్మాయిని  పెళ్లి చేసుకోవడం శంకర్ తల్లీ దండ్రులకు సంతోషాన్నే కలిగించింది.

కొడుకు సంసారాన్ని చూడటానికి సిటీకి వచ్చారిద్దరూ. వాళ్లను చూశాక కానీ రమ్యకు శంకర్ కులం గుర్తుకు రాలేదు. అతని కుటుంబ స్థాయి అర్థం కాలేదు. వాళ్లు వచ్చిననాడు రాత్రి తండ్రి కోసం ‘మందు’ అందులోకి చికెనూ తీసుకువచ్చాడు శంకర్. అప్పుడు తెలిసి వచ్చింది రమ్యకు శంకర్ ‘నాన్ వెజ్జీ’ అని మందు రుచి తెల్సినవాడని ఇన్నాళ్ళూ తన కోసం అదేమిటో ఎరుగని వాడిలా ఉన్నాడని.

గదిలో శంకర్ తల్లీ తండ్రీతో ఉన్న సమయంలో రమ్య బయట హాల్లో నుదుటి మీద మొలుచుకు వస్తున్న మూడవ కంటితో అసహనంగా కూచుంది. ఈ అసహనం, కోపం రమ్యలో అత్తామామ ఉన్నంతకాలమూ పెరుగుతూ పోయి వాళ్ళు వెల్ళిపోయాక ‘కంటిన్యూ’ అయింది.

ఇదివరకు శంకర్లో కనిపించని చెడ్డ లక్షణాలన్నీ ఇప్పుడు రమ్యకు ఒక్కటొక్కటిగా కనిపించసాగాయి. అతను మాట్లాడే భాషలో, తిండి తినే పద్ధతిలో శుచీ శుభ్రత పాటించే తీరులో తేడాలు ఆమెకు తన కళ్ళకు బిగించుకున్న భూతద్దంలో చాలా పెద్ద సైజులో కనిపించసాగాయి.

ఇద్దరూ కల్సి బయటకు వెళ్ళినప్పుడు డబ్బు ఖర్చు చేసేప్పుడు అతనిలో పిసినారి కనిపించాడు. తను ఔనన్నది కాదనడంలో అతనిలోని అజ్ఞాని దర్శనమిచ్చాడు. తక్కువ మార్కులతో డిగ్రీ పాసయినా అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి రిజర్వేషన్ తప్ప మెరిట్ కారణం కాదని ఆమె అనుకోసాగింది.

కాలం గడుస్తున్న కొద్దీ ఆమెలో ప్రేమ గ్లోబల్ వార్మింగ్కి కరగి నీరైపోతున్న హిమాలయంగా మారింది. వెట్రోల్ కి మ్యాచ్ బాక్స్ మేచ్ అయినట్టు ఒకటి రెండు సార్లు శంకర్ ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసి రావడంవల్ల జరిగిన వేడి వాదోపవాదాల కారణంగా ఆమెను తను శంకర్ ని చూడ్డానికి ముందు ఉన్న రమ్య క్రమక్రమంగా ఆక్రమించసాగింది.

*   *   *

ఒక సాయంత్రం శంకర్ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చింది రమ్య. అమావాస్యనాడు పొరపాటున చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడే అనుకున్నాడు శంకర్. కాఫీ అందిస్తూ దేవతలకు అమృతం పంచిన మోహినిలా కనిపించింది.

ఇక నుండి తను జాగ్రత్తగా ఉండాలని రమ్యకు కోపం తెప్పించకూడదని అనుకున్నాడు శంకర్.

ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడు అంది రమ్య.

‘మా అక్కయ్య ఫోన్ చేసింది’ ఉలిక్కి పడ్డాడు శంకర్. ఉలిక్కి పడ్డ శంకర్ మాట్లాడకుండా రమ్యవైపు చూశాడు.

‘అమ్మ కూడా మాట్లాడింది’

అవునా అన్నట్టు చూశాడు కళ్ళు ఎత్తి మనసులో రకరకాల ఆలోచన్లు ముళ్ళల్లా గుచ్చుకుంటుటే.

‘తమ్ముడి పెళ్లి వారం రోజుల్లో మనిద్దర్నీ రమ్మన్నారు. వాళ్లకు మన మీద కోపం పోయినట్టుంది. డాడీ కూడా చెప్పమన్నారట. వెళ్దాం ప్లీజ్ అంది రమ్య చేతిలో ఉన్న అన్నం ముద్దని అలాగే పట్టుకుని తాము పార్కులో కలిసే రోజుల్లో అతనివైపు చూసిన చూపుల్ని రిపీట్ చేస్తూ అంత సడన్ గా ఆమె చెప్పింది వినడానికి అతను సిద్ధంగా లేడు. కానీ ఆమె అడిగింది కాదన లేడు. కాసేపు సీలింగ్ ఫ్యాన్ కేసి చూశాడు. అది తనలోపల జొరబడి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఇన్నాళ్లకు వాళ్లు ఫోన్ చెయ్యడం ఏమిటో అర్థం కాలేదు. కులం కన్నా కూతురు  ముఖ్యం  అనుకున్నారేమో. ఆస్తికన్నా అమ్మాయి మీది ప్రేమ ఎక్కువనిపించిందేమో అనుకున్నాడు.

‘నీకు వెళ్లాలని ఉందా?’ అన్నాడు చివరికి కంచం అంచుమీద చేయి ఆనించి.

‘చెప్పాను కదా. వాళ్ళ కోపం పోయింది. మనల్ని తమ వాళ్ళు అనుకుంటున్నారు. ఇంతకంటే కావల్సిందేముంది’ అందామె ఎడమచేతిని సుతారంగా అతని భుజం మీద వేస్తూ.

ఆ వేళ్ళ కొసలు భుజంలోకి ట్రాన్స్ ఫామ్ చేస్తున్న విద్యుత్ షాక్ ను తట్టుకుంటూ

సరే! నీ ఇష్టం వెళ్ళాలనుకుంటే నువ్వు రేపే వెళ్ళు. నన్ను రమ్మని ఫోర్స్ చెయ్యకు అన్నాడు. ఇద్దరి మధ్య ఈ విషయం మీద సుహృద్భావ చర్చ జరిగింది. రమ్య తను వెళ్తానని ముందు ముందు అతనూ రావల్సి ఉంటుందని అన్నది.

*   *   *

తమ్ముడి పెళ్ళికి వారం రోజుల ముందే తను  దాటిపోయిన గడపలోకి మళ్ళీ వచ్చింది రమ్య. అక్కడ ఎవ్వరిలోనూ ఏదో జరిగి పోయిందనే భావన కనిపించలేదు. ఎప్పటి లాగానే మాట్లాడారందరు. తండ్రి ఎదుట పడలేదు కానీ చిన్నాన్న మాటి మాటికీ ఎదుట పడసాగాడు. కొందరు యే విషయాన్నైనా సరదాగా ప్రస్తావిస్తారు. గుచ్చినట్టు తెలీకుండానే సూది గుచ్చేస్తారు. అలాంటి వాడే రమ్య చిన్నాన్న. రమ్యకు తెలీకుండానే ఆమె బ్రెయిన్ వాష్ చేసే పని మొదలు పెట్టాడు. అనుకోకుండా అన్నట్టుగా వివిధ కులాల మనుషుల మనస్తత్వం మ్యాపుగీశాడు. కులాంతర వివాహాల వల్ల వచ్చే కష్టనష్టాల్ని తూకం వేసి చెప్పాడు. ఒకసారి దేశంలో పెరుగుతున్న పరువు హత్యల గురించి, మరోసారి రాష్ట్రంలో జరుగుతున్న దుస్సంఘటనల గురించి వివరించాడు.

అసలు డబ్బు ఉన్న వాళ్లందరిదీ కులరహిత సమాజమని డబ్బు మాత్రమే కులాల ఎక్కువతక్కువల్ని బ్యాలెన్సు చేసే మహామంత్రమని సెలవిచ్చాడు. విన్నా వినకపోయినా చెబుతూనే వుంటాడని చిన్నాన్న మనస్తత్త్వం తెల్సిన రమ్య కొన్నిసార్లు విన్నది. కొన్నిమార్లు విన్నట్టు నటించింది. ఏది ఏమైనా చిన్నాన్న మాటల్లో కొన్ని రమ్య మెదడు అడుగు భాగం దాకా వెళ్లి పోయేయి.

పొగ త్రాగడం ఆరోగ్యానికి ఎంత హానికరమో పోలిక కూడా అంత హానికరమైనదే. అది రమ్య తన ఇంటికి వచ్చిన రెండవ నాటి నుంచే చాపకింద నీరులా మొదలైంది. గదిలో కప్ బోర్డులో తన దుస్తులు, బాక్స్ లో తండ్రి తన కోసం అపురూపంగా చేయించిన నగలు చూస్తున్నప్పుడు ఆమె మనోసముద్రంలో వాయుగుండం ఏర్పడింది. తమ్ముడి పెళ్లి సందర్భంగా జరుగుతున్న సెలిబ్రేషన్స్, విందు వినోదాల వల్ల, పడవ కారులో వెళ్లి తను చేస్తున్న షాపింగ్ల వల్ల అది మరింత బలపడింది. రమ్య తను శంకర్ తో గడుపుతున్న జీవితాన్ని ఇక్కడి జీవితాన్ని పోల్చి చూసుకోవడంతో తుపానుగా మారింది. ఎన్ని సంవత్సరాలయినా తాము ఇలాంటి జీవనం గడపలేము అని అనుకుంది. మొట్టమొదటిసారి తను లోతు తెలియని నీటిలో దిగేశానా అని ‘బ్లైండ్ ఎండ్’ ఉన్న రోడ్డులో నడిచానా అని అనుకుంది.

పెళ్లికి వచ్చిన చుట్టాల్లో మేనత్త కూతురు నళిని రమ్యకు పెళ్లి పట్ల ఉన్న నిబద్ధత వెన్ను విరిచేసింది. ప్రేమించిన వాడితో వెళ్లిపోయి ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చి తమ స్టేటస్ కు తగినవాణ్ణి మళ్లీ పెళ్లి చేసుకున్న నళిని భర్తతో కలసి పెళ్ళికి వచ్చింది. తండ్రి తలుచుకుంటే షాపులో ఖరీదయిన బొమ్మని కొనిచ్చినట్టు తనకు ఓ కుర్రాణ్ణి కొనియివ్వగలడు అన్న వేరు పురుగు ఆమె ఒంట్లో ప్రవేశించింది.

*   *   *

పెళ్లి అయిన మర్నాడు రమ్యకు ఫోన్ చేశాడు శంకర్. ఇన్నాళ్ళూ ఆమె బిజీగా ఉంటుందని గొంతుక విన వస్తుందని అనుకున్నాడు, చెవులు రిక్కించాడు కాని ఆమె ఫోన్ ఎత్త లేదు. మరో గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి కూడా అతని చెవి నిరాశ పడాల్సి వచ్చింది. రమ్య ఫోన్ స్పిచ్ ఆఫ్ అని తెల్సింది.

రెండు గంటల తర్వాత మరో నాలుగు సార్లు ఫోన్ చేసిన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో దిగులు పడ్డాడు. ఏం జరిగిందోనని భయపడ్డాడు.

పెళ్లి హడావిడి తగ్గాక రమ్య గదిలోకి వచ్చి తల్లీ దండ్రీ చాలాసేపు మాట్లాడారు. తండ్రి అంత ప్రేమగా మాటాడ్డం రమ్యకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది. వాళ్ళు గదిలోంచి వెళ్ళిపోయాక రమ్య సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డు కిటికీలోంచి బయటకు విసిరేయబడింది.

మళ్లీ మళ్లీ ఫోన్ చేశాడు శంకర్. ఈ నంబర్ తో యే ఫోనూ పనిచేయడం లేదు అని అనేకసార్లు విన్నాక ఒక నిశ్చయానికి వచ్చాడు శంకర్.

*   *   *

సెక్యూరిటీ వాళ్లు అరగంట గేటు దగ్గర ఆపి లోపలికి పంపించారు శంకర్ ని. ఇంటి ముందు లాన్ లో కూర్చోమన్నారెవరో.

ఏ వైపు నించైనా రమ్య కనిపిస్తుందేమో నన్న ఆశతో భవనం వైపు చూస్తూ కూచోవడం వల్ల తన ఎదురుగ్గా వచ్చి కూచున్న మనిషిని చూడలేదు శంకర్.

తను రమ్య చిన్నాన్నానని పరిచయం చేసుకున్నాడు ప్రకాశ్ రావు. రమ్య నాన్నగారు బిజీగా ఉండటంవల్ల తను రావాల్సి వచ్చింది అన్నాడు. ఆయనకు కాస్త దూరంలో నలుగురు బౌన్సర్లు నిలబడి ఉండటం గమనించాడు శంకర్.

శంకర్ ముఖం కొద్దిగా ఎర్రబడింది. ప్రకాశ్ రావు చిరునవ్వు విసిరాడు.

అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు.  కులం తక్కువవాడివైనా మా స్థాయికి యే మాత్రం సరిపోనివాడివైనా అన్నయ్య మంచివాడు కనక నిన్ను క్షమించాడు…. లేకపోతే… వాక్యాన్ని అసంపూర్ణంగా వదిలేశాడు ప్రకాశరావు.

శంకర్ కు కోపం లోపల్నించి తన్నుకు వస్తున్నది. రమ్య ఒక్కసారి బయటకు వస్తే బాగుండేది. ఏమైనా చేసి ఉండేవాడిని అనుకున్నాడు.

ఆ మాటే అన్నాడు.

‘ఒకసారి రమ్యను పిలుస్తారా మాట్లాడాలి’

రమ్య నీతో మాట్లాడదు. నువ్వు జరిగిందంతా మరచిపోవటం మంచిది.

‘మాకు ఇలాంటివి కొత్తేం కాదు. మా పరువునీ, ప్రతిష్టనీ ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసు’ అంటూ వెనక్కి తిరిగి ఇంటివైపు నడిచాడు ప్రకాశంరావు.

మొదలు నరికిన చెట్టులా కూలి పోయాడు శంకర్.

శంకర్ దీనస్థితిని చూడలేక ఆకాశంలో నక్షత్రాలు కనపడకుండా పోయాయి.

చిల్లు పడ్డ డబ్బాలోంచి కారుతున్న తారులాంటి చీకటి శంకర్ ముఖాన్ని కప్పేసింది.

August 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం

by Dr. Lakshmanacharyulu M August 21, 2022
written by Dr. Lakshmanacharyulu M
  1. ఓ నిజాయితీ మనిషి

భూషణంగాదు ఓ పెద్దమనిషి. కొందరైతే ఆయన్ని అసలు ప్రపంచంలో కెల్లా గొప్ప వ్యక్తి అని అంటూ ఉంటారు. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఆయన పేదల పాలిటి పెన్నిధి. మంచి విషయాన్ని ప్రచారం చేస్తాడని, ఓ గొప్ప నిజాయితీ పరుడని… ఇలా… ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు జనం.

ఇవాళ పొద్దు నుంచి ఎందుకో మరి ఆయన చాలా బాధ పడిపోతున్నాడు. తన చుట్టూతా ఉండేవారి బాధల్ని దుఃఖాల్ని చూసి ఆయన పాపం, తీవ్రంగా బాధ పడిపోతాడు. వెంటనే తన సెక్రటరీని పిలిచాడు. ఆయన వచ్చి మౌనంగా తలొంచుకునే ‘సార్! మీరు నన్ను పిలిచారా?’ చెప్పండి సార్. ఏం చేయమంటారు? అని అడిగాడు.

‘ఆఁ నిన్ను పిలిచా. నీకు తెలుసు కదా! ఎవరన్నా సరే, బాధపడితే నేను చూడలేనని. చూడు! మన వీధిలోనే ఒక ‘విధవరాలు’ ఉంది కదా! ఆమె యవ్వనంలో ఉన్నఅందగత్తె కూడా. ఆమెకి ఎవరైనా మంచి కుర్రాణ్ణి తెచ్చి పెళ్ళి చేయాలని ఉందోయ్!’ అన్నాడు.

దానికి సెక్రటరీ ఒక్క క్షణం ఆలోచించి “సార్! మీ తమ్ముణ్ణి మించిన యోగ్యుడూ, మంచివాడూ, అందగాడు మరెవరున్నారు మన వీధిలో? పైగా అతనికి పెళ్ళి కూడా కాలేదు కదా!”

‘అంతే! మర్నాడే పాపం! ఆ సెక్రటరీ గారి ఉద్యోగం ఊడి పోయింది.

2. అనుకరణ (నకలు)

25 సంవత్సరాల సుధారాణికి వ్యతిరేకంగా ఉన్న కేసు ఎలాంటి మెలికలు, ఇబ్బందులు లేకుండా, స్పష్టంగా ఉండడంతో – ఒక జడ్జిగా – నా నిర్ణయఁ పెద్దగా కష్టపడకుండానే, వినిపించా.

తీర్పు చెప్తూ – సుధారాణీ! నువ్వు మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, నీ ఆరేళ్ళ కూతురు మీనాని ఇద్దరు కుర్రాళ్ళకి అప్పగించేసావ్. పాపం, అపరాధాల చరిత్రలో బహుశా ఇది అన్నిటికన్నా ఘోరాతి ఘోరం. దీనికిగాను నువ్వు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.  పారిపోయిన ఆ కుర్రాళ్ళిద్దరి సంగతి పోలీసు చూసుకుంటుంది” అని అన్నా.

తీర్పు వినిపించాక, ఒక తాత దృష్టితో నేను ఆ పాప మీనాని చూసా. రేపు ఈ అమ్మాయి కూడా వాళ్లమ్మను అనుకరించదు కదా! అలాగే తయారవదు కదా”!  అని అనిపించింది నాకు

3. ఫోటో

కార్యక్రమం ఎంతో హంగూ – ఆర్భాటాలతో హడావుడిగా ప్రారంభమైంది. పెద్ద షామియానా, లోపల, క్రింద నేలపై పెద్ద సంఖ్యలో కూర్చుని ఉన్న నిరుపేదలు, పైన వేదికపై చక్కగా అలంకరించిన మేజా బల్ల, కుర్చీలు అన్నీ యథాస్థానంలో అందంగా ఉన్నాయి.

ఇక మొదలైంది కార్యక్రమం. ఉపన్యాసాలు మొదలైనాయి. ఒకరి వెంట ఒకరు వచ్చి గోపాలయ్యను, ఆయన గొప్పతనాన్ని పోటీపడి పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మేడనిండా పూలమాలలో గోపలయ్యగారు గంభీరంగా, చిద్విలాసంగా ఉన్నాడు. ఏదో అప్పుడప్పుడు చిరునవ్వులు రువ్వుతూ ఉన్నాడు.

సరే, భోజనాలు, కంబళ్ళు పంపిణీ కార్యక్రమం… అన్ని మునిగిపోయి, అందరూ ఒక్కొక్కరే మెల్లగా వెళ్లిపోయారు. ఫోటోగ్రాఫర్ కూడా వెళ్లిపోయాడు. అదిగో, అప్పుడొచ్చాడు ఓ ములి నిరుపేద వ్యక్తి, తన మనవడి సహాయంతో వచ్చి గోపాలయ్యను దీవించి, “అయ్యా1 నేను అనాథను, నిరుపేదను, కొంచెం ఆలస్యం అయింది. మన్నించండి. సమయానికి రాలేకపోయా. ఒంట్లో బాగాలేదు. వీడూ లేడు దగ్గర. చివరికి ఎలాగో రాగలిగా! దయచేసి నాకు కంబళి, భోజనం దయచేస్తే…”

గోపాలయ్యగారు అతని మాటల్ని వినీ విననట్లుగా అలా ముందుకి వెళ్లి – “ముసలోడు పిచ్చోళ్ళా ఉన్నాడు. అంతా అయిపోయాక వీడికెవరిస్తాడు కంబళి, భోజనం? ఆ ఫోటో గ్రాఫర్ ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో! అయినా… ఫోటో లేకుండా పుణ్యకార్యక్రమాలు, దానధర్మాలు చేస్తే స్వర్గం దొరకదు కదా!” అన్నాడు చిన్నగా నవ్వుతూ తన అనుచరుడితో

4. దర్యాప్తు

ప్రజలు పెట్టిన గగ్గోలు విని మంత్రిగారు లక్షల రూపాయల కుంభకోణం కేసు పరిష్కరించేందుకుగాను ఒక ‘కమీషన్’ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎంతో నిజాయితీగా, న్యాయబద్ధంగా తన పని ప్రారంభించింది.

ముందుగా ఆ విభాగం అధ్యక్షుణ్ణి, వారి క్రింద పనిచేసే ఉపాధ్యక్షుణ్ణి, అలాగే వరుసగా పెద్దా – చిన్నా అధికారులందరినీ లోతుగా విచారణ చేసింది ఆ కమిటీ. అందరూ తమ తమ తెలివి తేటల్తో, మరో కారణాలతో చక్కగా తప్పించుకున్నారు. చట్టం వారికి చుట్టం అయింది. చివరికి ఆ కార్యాలయంలో పనిచేసే ఓ అటెండర్ (చప్రాసీ) ఇరుక్కున్నాడు. ఆ విచారణ కమిటీ తన నిర్ణయం వినిపిస్తూ – మాయమైన 5 లక్షల కుంభకోణం కేసులో ప్రధానమైన వేరులాంటివాడు ఈ అటెండర్. అందుకనే మేం ఆ ‘వేరును’ తొలగించేసాం. ఇక చెట్టు, కాండం, ఆకులు, పూలు అన్నీ ఆనందంగా ఉన్నాయి. ఈ విభాగం ప్రగతిపథంలో చక్కగా పరిగెడుతుంది అని అన్నారు.

5 

నేనొక శిల్పిని. విగ్రహాలు రూపొందిస్తూ ఉంటాను. ఓ రోజున సీతారామయ్యగారు తన మనసులోని మాట చెప్పడంలో నేను ఆయన అభిమానుల్ని కలిసి, సంప్రదింపులు జరిపా. అంతా చక్కగా నిర్ణయించి, ఆయన విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడానికై ఏర్పాట్లు ప్రారంభించాడు. విగ్రహం రూపొందించే పని నా కప్పగించారు. చివరికి విగ్రహం తయారైంది. దాన్ని స్థాపించడం  సీతారామయ్య తాను జీవించి ఉండగానే తన విగ్రహావిష్కరణ దృశ్యం చక్కగా చూడగలిగాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించాడు. ఓ రోజు రాత్రి ఆయన నా కలలోకి వచ్చి చాలా బాధతో – “నా విగ్రహం కారణంగా నేను చాలా బాధపడుతున్నా. విగ్రహం పెట్టిన కొత్తల్లో నాకు చాలా ఆనందం కలిగేది. విగ్రహం ఏర్పాటు కాగానే నా బాధ మొదలైంది. విగ్రహం విగ్రహమే కదా! అది జీవించి ఉండేవారి స్థానం భర్తీ చేయగలదా? అది కేవలం పైన పక్షులకి, క్రింద కుక్కలకు, పందులకు ఆశ్రయం ఇస్తోంది” అని అన్నాడు. ఇప్పుడేమీ ఆ విగ్రహం పేరు తలచుకుంటేనే వాళ్ళు కంపరమెత్తిపోతుంది. దాని స్థితి చూస్తే నాకు కడుపులో దేలినట్టౌతోంది. ఇది మీకే కాదు, నాకూ అవమానమే. ఇప్పుడు నేను కూడా ఆ విగ్రహంలా వివశత్వంతో, తప్పించుకోలేని స్థితిలో ఉన్నా” అని ఆయన నిట్టూర్చాడు.  

August 21, 2022 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

చందమామ పుస్తక సమీక్షా

by lalitha chitte August 21, 2022
written by lalitha chitte

31.07.22 ఆదివారం గోదావరిఖనిలో..
అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో చందమామ కవితా సంపుటి ఆవిష్కరింపబడినది.
ఆ వేదికపై దోసిట్లో చందమామను పరిచయం చేసే అవకాశం నాకు లభించింది.

వేదికపై సుద్దాల అశోక్ తేజ గారు, మౌనశ్రీ మల్లిక్ గారు, ఎం.ఎల్.ఏ. కోరుకంటి చందర్ గారు, దాస్యం లక్ష్మయ్య గారు, జెవి రాజు గారు, శ్రీనివాస్ గారు, ముక్కెర సంపత్ గారు, వైరాగ్యం ప్రభాకర్ గారు, నాగా నూగూరి గారు, ఉషామధు వెగ్గలం గారు, వకుళవాసు గారు వున్నారు..💐
శ్రీ శ్రీ కళావేదిక మహిళా అధ్యక్షురాలిగా స్త్రీల తరపున గళాన్ని వినిపించడం సంతోషాన్ని కలిగించే విషయం.

* *

తెలంగాణా కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్యులు గారు, సి. నారాయణ రెడ్డి గారు, కాళోజీ లాంటి మహామహులు జన్మించిన పోరుగడ్డ..

గోదావరి ప్రవహిఒచే పుణ్యభూమి తెలంగాణా.

స్త్రీగా.. శ్రీ పదాల రూపకర్తగా.. అడ్మిన్ గా గ్రూపును నిర్వహిస్తూ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న అనుశ్రీ సాహిత్యాభిలాష అభినందనీయం.

ఒక స్త్రీగా  ఆమె సంకల్పం ఉన్నతమైనది.

పరాక్రమ శాలిని రుద్రమ దేవి పుట్టిన ఈ గడ్డలో ప్రతి స్త్రీ రుద్రమ దేవే. తుచ్చమైన ంలేచ్చులను తరిమి కొట్టిన పౌరుషాగ్ని రుద్రమ స్ఫూర్తిని, గుణ గణాలను పుణికి పుచ్చుకున్నదే ప్రతి మహిళ.

ఆ రుద్రమకు వారసురాలిగా ఎన్నో అడ్డంకులను ధాటీగా ఎదుర్కుంటూ.. ముందుకు దూసుకుపోతూ, కవిత్వంతో ఘన కీర్తిని పొందిన అనూశ్రీ గారికి ప్రశంసలు.

వారి కలం నుండి వెలువడిన దోసిట్లో చందమామ.. ఏమంటోందో ఇప్పుడు చూద్దాం.

💐💐💐💐💐

శ్రీ పదాలు ప్రథాన అడ్మిన్ జె.వి. రాజు గారి సౌజన్యంతో రూపుదిద్దుకున్న ఈ దోసిట్లో చందమామ..

140 పేజీలలో 90 కవితల కౌముదీ కిరణాలతో అలరిస్తోంది.

ప్రముఖ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారి అనుశ్రీ అనురాగ లిపి అనే ముందు మాటలతో..

ప్రముఖ కవయిత్రి మాతృ సమానురాలు మెరాజ్ ఫాతిమా గారి అనుశ్రీ అక్షర సోయగం అనే ఆశీస్సులతో..

అనూశ్రీ కి ఎదగడమే కాదు ఒదగడం తెలుసు అన్న కవి సాయంత్రం గ్రూపు అడ్మిన్ ముక్కెర సంపత్ కుమార్ గారి మాటలతో,

ప్రథాన అడ్మిన్ జె.వి రాజు గారి భావ సౌరభాలతో మొదలైన ఈ చందమామ లలితమైన పద ఝరులతో ఆకట్టుకుంటోంది.

🌿🌿🌿

కవయిత్రి అనుశ్రీ గౌరోజు గారి

దోసిట్లో చందమామ…

~~•••••~~💐

చందమామ ఆకాశంలో వుంటుందనుకున్నాను.. కానీ మన కవయిత్రి అనూశ్రీ ఆ చందమామను మన దోసిట్లోకి తెచ్చింది.

ఈ ప్రేమ కవిత్వాన్ని చదువుతుంటే తెల్ల చీర కట్టుకుని తలనిండా మల్లె పూలు పెట్టుకుని పండు వెన్నెల్లో ఇంటి ముందరి తోటలో హాయిగా విహరిస్తున్నట్లు అనిపించింది.

వెన్నెల్లో గోదారి తిన్నెల్లో కూర్చుని ప్రియునితో సంభాషిస్తున్నట్లు అనిపించి అంతటి హాయి మృదువుగా మదిలోకి ప్రవహించింది.

అనూశ్రీ గారి హృదయం ఎంతటి నవనీతమో, మధురమో, సున్నితమో, భావరాగ తరంగమో ఈ దోసిట్లో చందమామను చదివితే మనకు అర్థమవుతుంది.

ఇది కమర్షియల్ కవిత్వం కాదు. పాఠకులనో.. ఎవరినో ఆకట్టుకునే ప్రక్రియా కాదు.

ఇది అనూశ్రీ గారి హృదయ స్పందన. భావాల సమాహారం. ఇదొక అపురూపమైన ప్రేమ కావ్యం. అనూశ్రీ గారు తమ హృదయాన్ని ఇందులోకి ప్రేమగా ఒంపేసారు. ప్రతి అక్షరాన్ని ప్రేమతో పద్ధతిగా అమర్చారు.

ఇందులోని ఒక్కో వాక్యం వీణా తంత్రుల వలె మదిని మీటుతుంటే చదివే పాఠకులు ఆమె భావ ప్రకంపనలకు ఆశ్చర్య చకితులై పోవాల్సిందే.

అవని నుండి ఆకాశందాకా మదిలోని గోడలన్నీ మారుమ్రోగే స్వరం ఇది.

గోదావరి అలల గలగలలు ఆమె తమ పదాలలో ఒంపుకున్నారు అనుకుంటాను. అందుకే ఆ పదాల హోరు జోరు మాటల్లో వర్ణింప శక్యం కానిది.

*

గుండె సడి అనే కవితలో ఆమె

కన్నీటికి చెప్పిన నిర్వచనం అబ్బుర పరిచింది.

కళ్ళవెంట జారే కన్నీళ్ళు

బాధకు ఆనవాళ్ళే కాదు

ప్రేమకు సైతం చిరునామాలు..

నేనింతవరకూ కన్నీళ్ళు బాధకు సాదృశాలు అనుకున్నాను. కానీ ఇది చదివాక కాసేపు ఆలోచనలోకి ప్రయాణించాను.

నిజమే ఎంత ప్రేముంటే కన్నీరు బయటికి వస్తుంది..

ప్రేమే లేకపోతే బాధనేది లేదు కదా… అనిపించింది.

ఒకే మూసలో.. ఒకే ధోరణిలో, ఒకే కోణంలో, ఎవరినో అనుసరించి ఆ పంథాలో ఆవిష్కరించేది కవిత్వం కాదు. అది కాపీ అవుతుంది.

సరి కొత్త భావాలు.. అర్థాలు.. జవాబులు.. నిర్వచనాలు చెప్పేదే కవిత్వం.

అలాంటి ఒరవడితో నిండిన కవిత్వమే అనూశ్రీ గౌరోజు గారి దోసిట్లో ఒదిగిన చందమామ.

*

నీ వల్ల కలిగిన దు:ఖమంటేనే అది కొండంత ఆవేదన

అది తోడిపోసేందుకు

నేను అనంతమైన నదినై ప్రవహించాల్సిందేగా..

నదులన్నీ సంద్రాన్ని చేరడం అందులో కలిసిపోవడం మనకు తెలుసు. అది సహజం కూడా..

కానీ ఆశ్చర్యంగా కొత్త విషయాన్ని ఇక్కడ చదివాను.

కొండంత ఆవేదనను తోడిపొయ్యడానికి నదినై బయటికి ప్రవహిస్తా అనడం కొత్తగా వుంది.

భావాలను తలక్రిందులు చేసి వింతైన కొత్త అర్థాలను సృష్టించడం ఈ కవయిత్రికే చెల్లింది.

హేట్సాఫ్ అనుశ్రీ…

నిను చేరు వేళ కవిత అద్భుతమైన ప్రేమకు ప్రతీక. సాగర సంగమం ప్రతి నదికీ అనివార్యం.

నదిని స్త్రీతో సంద్రాన్ని పురుషునితో పోల్చి చెప్పడం అనంతమైన భావం.

ఈ కవిత నేను రాసిన మది నదిలో… కవితల సంపుటిని గుర్తుకు తెచ్చింది.

ప్రతి స్త్రీ ఇలాగే ఆలోచిస్తుందేమో..

నదిలా సాగాలని.. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ, మలుపులను తిరుగుతూ.. సుధీర్ఘ ప్రయాణం తరువాత ప్రియుని పరిష్వంగంలో అలసటను తీర్చుకుని ఇన్నాళ్ళ ఎడబాటును మరిచిపోవాలని….

నది నాకిష్టమైనది. నన్ను నేను నదితో పోల్చుకుంటూ వుంటాను.

నది స్త్రీలాగే ఎన్నో సంస్కృతులను సృష్టించింది. నదీ తీరాలు నాగరికతకు ఆలవాలాలు.

స్త్రీ ని నదితో పోల్చడం ఈ కవితను ఉన్నతమైన శ్రేణిలో నిలబెట్టింది అనడం సముచితం.

అంతేకాదు.. ప్రేమనే కాదు, ఎడబాటును, ఎదకోతను కూడా అనూశ్రీ గారు అద్భుతంగా వ్యక్తీకరించారు. హృద్యంఫా ఆవిష్కరించారు.

అన్ని భావాలను ఒడిసిపట్టి అక్షరాల్లో నింపి చందమామగా మలచి మన దోసిట్లోకి చేర్చారు.

ఈ కవితా సంపుటికి ఈ పేరు సరిగ్గా అమరింది. కవిత్వానికి తగిన శీర్షిక ఇది.

**

ఇందులో ల్ని నలుపురంగు అనే కవిత ప్రేమిక హృదయాన్ని కొత్తగా ఆవిష్కరిస్తోంది.

నాలోకి నేను ప్రవహిస్తూ నిన్ను అన్వేషించాలంటే చిక్కటి చీకటి రాత్రి కావాలి అనే అర్థింపు సమంజసంగా వుందనిపిస్తోంది.

ప్రేమలోని లోతులను, గాఢతను, తీవ్రతను, ఒత్తిడిని, మధురిమను కవయిత్రి కలం ఆర్తిగా పొదివి పట్టుకుంది. అన్నిరంగుల్లో అక్షరమై ప్రవహించింది.

*

మరో కవిత ఆనంద తీరం..

చదువుతుంటే చిరునవ్వును పెదవులపై నిలిపింది..

ఆనందాల తీరం నీవే

సమస్యల ఉప్పెనవూ నీవే..

నిన్ను దాటలేని అలను నేను అంటూ..

ప్రేమించిన స్త్రీ హృదయ సంఘర్షణను చక్కగా అక్షరీకరించారు.

కవయిత్రి ప్రతిభకు తార్కాణం ఈ ఆనంద తీరం.

**

నీ చేరువ అనే కవిత అవ్యక్తానుభూతికి లోను చేస్తుంది.

ప్రేమ తరంగాలను ఒడుపుగా హృదయంలోకి ఒలికిస్తుంది.

త్వమేవాహం, ప్రయాణం..మాధుర్యాలు.. మౌనరాగాలు..ఆశల నిచ్చెన.. అనివార్యం మదిని కలవరపెట్టే కవితలు.

కొన్ని గిలిగింతలు, కొన్ని కలవరింతలు, మరి కొన్ని కేరింతలు, పులకరింతలు కలగలిసి అనూశ్రీ కవిత్వం పురుడు పోసుకుంది.

కవిత్వం రాయాలంటే ప్రసవవేదన పడతారు కవులు అంటారు. కానీ ఈ దోసిట్లో చందమామలో ఆ లక్షణాలు ఎక్కడా కనిపించవు.

అలవోకగా అంతర్లీనంగా మది గదిలో దాగిన భావాలను కలంలోకి ఒంపినట్లు కనబడుతుంది.

అనూశ్రీ అక్షరం అలరిస్తుంది. కవిత్వం ఆసాంతం ఆకట్టుకుంటుంది. చదివాక మదిని మైమరిపిస్తుంది. అవ్యక్తానుభూతికి లోనయ్యేలా చేస్తుంది.

ఉప్పొంగే నదిలాంటి ఆ ఒరవడి ఒక్కుదుటున చదివింపజేస్తుంది.

ముఖ్యంగా ఆకట్టుకునే కవిత్వం వెలువడాలంటే ఆత్మ సౌందర్యం ముఖ్యం.

నిష్కల్మషమైన హృదయం అవసరం.

ప్రేమించే మనసుకే అది సాధ్యం.

ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కవయిత్రి అనూశ్రీ గౌరోజు గారు.

వారు మరిన్ని సంపుటాలను వెలువరించాలని, వారి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని, మరెందరికో స్ఫూర్తిదాయకమై, ప్రేరణ కలిగిస్తూ సాహితీ శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.

ధన్యవాదములు.


August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అద్దం..

by Chandu Pendyala August 21, 2022
written by Chandu Pendyala

ఎవరయినా తన ముందుకు
రావాలని కోరిక
వచ్చిన వారి చిత్ర విచిత్ర
ముఖ కవళికలను
చూడాలని తపన

తీరొక్క మంది
తీరుతెన్నులు
తేరిపారా తన మెరుపులో బంధించాలని ఆశ

వివిధ భంగిమలను తనలో
బధ్రపరుచుకోవాలన్న ఎదురుచూపులు

తన ముందుకు వచ్చేవారు
నవ్వుతూ నాట్యం చేయాలని
దు:ఖాన్ని దువ్వెనల దులుపాలని
పట్టులంగా వేసుకున్న గారాల పట్టిని
తన గోళం లో బంధించాలని
పట్టుధోతి కట్టుకున్న చినరాయుని
చిద్విలాసం కనాలని
లేలేత లేడిపిల్లలంటి భావాలకు గాలం వేయాలని
ఆనంద రూపాల
అందాలను అద్దుకోవాలని
నూనూగు మీసాల
కుర్రతనం చూడాలని
తను శుభ్రంగా ముస్తాబయి
ఎదుటివారిని తనలా
తనలో చూసుకోవాలని ఉందనంటది…

August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

స్వరాంజలి -9

by Krishna Kumari Yagnambhatt August 21, 2022
written by Krishna Kumari Yagnambhatt

 త్యాగయ్య గారు నవవిధ భక్తి మార్గాలలో రచించిన కీర్తనలు కొన్ని పరిశీలిద్దాం. 1)శ్రవణం ..

పల్లవి ­- రామకథా సుధారస పానమొక రాజ్యము చేసునే!

ధర్మాద్యఖిల ఫలదమె మనసా -ధైర్యానంద సౌఖ్య నికేతనమే

కర్మబంధ జ్వలన ఆబ్ది నావయే -కలిహరమే త్యాగరాజ వినుతుడగు!!

ఈ కీర్తనలో రామనామ మహిమ చెప్పబడింది.

2)కీర్తనం..

పల్లవి-

రామాభిరామ మనసు రంజిల్ల  బల్కరాదా!

బంగారు మేటి పాన్పు పై భామామణి జానకి

శృంగారించుకొని చెలువొంద నినుగని

పొంగుచు మల్లె విరుల పూజించు వేళ శ్రీ హరి

సంగీతము పాడుచును త్యాగరాజు నితో!!

త్యాగయ్య ప్రతి కీర్తనలో రామ కీర్తనం వివరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఏదో ఒక కృతిని ఉదహరించడం కొంత కష్టమే.

” ఏలావతార మెత్తు కొంటివి -ఏమి కారణము రాముడై “ అను కీర్తనలో

 “యోగులను జూచుటకా భవ రోగులను బ్రోచుటకా శత

రాగ రత్న మాలికను రచించిన త్యాగరాజు నకు వర మోసంగుటకు’

అని తన శత రాగ రత్న మాలిక నంగీకరించి వరమిచ్చుటకై అవతరించి నాడని  రామచంద్రుని కీర్తించుట ఎంతో మనోహరమైన భావన.

3 )స్మరణము..

“ శ్రీపతే నీ పద చింతనే జీవనము’

అను కీర్తనమున భగవంతుని స్మరించుటయే తన జీవిత లక్ష్యమని అట్టి చింతనే ఇంద్రాదులు గొప్ప మహిమను పొందారని చెప్పుచు

 ‘రామ నామ స్మరణము వల్ల నామ రూపమే హృదయము నిండి ప్రేమ పుట్ట జేయగలేదా’

 అంటూ స్మరణ విశిష్టతను తెలిపారు.

4 )పాద సేవనం..

‘శ్రీరామ పాదమా! నీ కృప జాలునే చిత్తానికి రావే!

అను కృతిలో పాదాభివందన మొక్కటే అన్ని దురితాలను అపహరించగల సామర్థ్యం ఉందని చెప్పుతూ అహల్య వృత్తాంతాన్ని నిదర్శనంగా పేర్కొని, బ్రహ్మాదుల చేత పూజింపబడే ఆ పాదాలు  తన మనస్సులో నిరంతరం స్థిరంగా నిలవాలని ప్రార్థించాడు. సందేహమును దీర్చవయ్య సాకేత నిలయ’అను కృతిలో

 ‘వర మౌను లెల్ల జరణమ్ములను,స్మరియింప నీడు పద మొసంగెనో

భరతార్చనచే  బాదుకలు ,ధర నిన్నొసంగె త్యాగరాజ భాగ్యమా!!  

అంటూ శ్రీ రామ చంద్రుని చరణాల కన్నా ,వాటిని సేవించిన పాదుకలు మరింత గొప్పవని  భరతుని వృత్తాంతాన్ని నిదర్శనంగా  పేర్కొని కీర్తించారు.

 ‘రఘునాయక !నీ పాద యుగ రాజీవముల నే విడ జాల’ అను కీర్తనలో భవ సాగరమును దాటగోరు  వారికి శ్రీ రాముని తప్ప వేరుగతి లేదని తెలిపారు.

‘శ్రీ మానినీ మనోహర ! చిరకాలము మాట యొక టేరా ‘ అను కృతిలో భక్తులు తమ సర్వస్వాన్ని భగవంతుని చరణాల యందు సమర్పించి పాద సేవచే ధన్యులవుతారు అంటూ ప్రశంసించారు.

5 )అర్చన..   

. రార సీతా రమణీ  మనోహరా’ అను కృతిలో

‘బంగారు వల్వలు నే  బాగుగా గట్టెద మరి

శృంగారించి సేవ చేసి కౌగిట జేర్చేద

సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టేద  

సారమైన ముక్తా హారములు నిక దిద్దేద ‘

అంటూ అనేక విధాలుగా పరమ భక్తితో భగవంతుని సేవ చేసి తరింతు నని

పేర్కొన్నారు.

 ‘తులసీ బిల్వ మల్లికాది జలజముల పూజలు గైకొనవే ‘అనే కృతిలో

‘ఉరమున ముఖమున శిరమున భజమున

గరమున నేత్రమున చరణ యుగమ్మున

గరుణతో నెనరుతో పరమానందముతో ‘అంటూ వివిధములైన పుష్పాలతో శాస్త్రవిధిని పాదాది శిరః పర్యంతము ప్రత్యంగ పూజ చేసే విధానాన్ని వివరించారు. 6 6 )వందనము..

‘వందనము రఘు నందన’అనే కృతిలో పరమ భక్తి భావము మనసులో ఉప్పొంగు చుండగా భగవంతునకు నమస్కరించు పద్ధతి తెలియ చేశారు.

7 )దాస్యము..

‘తవ దాసోహం తవ దాసోహం దాశరథి’ అను కృతిలో త్యాగరాజు దాసత్వమే సరియైన తరణొ పాయమని విశ్వాసంతో పలికారు.

8 )సఖ్యము..

‘సామికి సరి జెప్ప జాల వేల్పుల’అనే కీర్తనలో

‘తన కంటి కెంతో ముద్దు తప్ప దాడిన వద్దు చనువు చేయునొ  పొద్దు చల్లని చూపు కద్దు

అన్నీ వేల్పుల లోన అతనికి సరిగాన

తన్ను బ్రోచిన ఘన త్యాగరాజు సఖు డైన’

ఆంటూ శ్రీ రాముని పట్ల తనకు గల స్నేహ భావాన్ని ప్రకటించారు.

9 )ఆత్మ నివేదనము..

‘కాలహరణ మేలరా హరే’ అన్న కృతిలో

‘చుట్టి చుట్టి పక్షు లెల్ల చెట్టు వెదకు రీతి

 భువిని పుట్టగానే నీ పదముల బట్టుకొన్ననన్ను బ్రోవ

దినదినమును తిరిగితిరిగి  దిక్కు లేక శరణు జొచ్చి

తనువు ధనము నీదే యంటి  త్యాగరాజ వినుత రామ’

అంటూ అనన్య గతికత్వముతో శరణు కోరారు త్యాగయ్య ఈ కృతిలో.

‘నన్ను విడిచి  కదలకురా’ అనే కృతిలో కూడా మనసు కరిగే విధంగా శరణు వెడుతూ తన సర్వస్వాన్ని రామ చంద్రునికి సమర్పించారు.

ఈ రకంగా ఎన్నో విధాల తమ కవితా శక్తిని ప్రదర్శించి తమ భక్తిని అనేక కృతులలో వర్ణించారు. ప్రాచీన కవులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ,భక్తా గ్రేసరులైన నారదాది ఋషుల లాగా తమ భక్తి ప్రపత్తులను వెల్లడి   చేసిన ఉత్తమోత్తమ వాగ్గేయ కారులు త్యాగయ్య గారు.

                      **************************************

August 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మన ప్రగతి

by A. Venugopal August 15, 2022
written by A. Venugopal

ప్రగతి పథంలో పయనిస్తున్నది భారత మిది మనదీ

జగతి కంతటికి ‘మార్గదర్శి’యై చరిత ఘటించినదీ

**

కాశ్మీరయోధ్య జఠిల సమస్యల పరిష్కరించినది

రశ్మివోలె తా నేటితరానికి రక్షణ నిచ్చింది…1

**

ప్రపంచ క్రీడా మైదానంలో ప్రభవము నందినది

అపురూపంగా అందరి దృష్టిని ఆకర్షించినదీ

**

కరోన- రక్కసి కోరలు విరిచే ‘టీక’ కనుగొన్నదీ

హీరోలౌ మన శాస్త్రవేత్తలను ‘ఇతి’ మెచ్చకున్నది

**

మన సంస్కృతినీ, సంప్రదాయమును ‘మహి’ కందించినదీ

మనః పూర్తిగా నమస్కార – బహుమానము నిచ్చినదీ

**

ఋషులందించిన యోగ ప్రక్రియను రూఢిగ / రూలుగ జేసినది

దేశ విదేశమందు ‘ధ్యాన’ మను దీప్తిని నింపినదీ….

**

అంతరిక్ష గమనానికతివలకు అండగ నిల్చినదీ,

అంతులేని విజయాలు పొందుటకు అడుగులేస్తున్నదీ ||ప్రగతి||

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

భారత్ కీ అవాజ్!!

by madishetti gopal August 15, 2022
written by madishetti gopal

వజ్రోత్సవ సంబరం
వీరుల త్యాగాల పునాదుల మీద మొలచిన స్వాత్రంత్ర ఫలం
దేశo దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది
స్వేఛ్చావాయువులు పీల్చిన చారిత్రాత్మక సందర్భం

పిల్లా పాపలను వదిలేసి
వీరతిలకం దిద్దుకొని ప్రాణాన్ని
తృణప్రాయంగా అర్పించిన
అమరవీరుల పోరాటాల త్యాగాల మీద ఎగురుతుందీ జండా
పొగరుగా!!
ఈ అద్భుత సంస్కృతిని ఒంటినిండా పూసుకొని
ఎగురుతుంది!!

ఒక్క నినాదం బక్క మనిషి
సంగ్రామం
ఒక్క విల్లు, పిరికెడు ఉప్పు
తప్పుల మీది నిప్పులు చెరిగిన భగత్ సింగ్
భారత్ కీ అవాజ్

తల్లిపాల రుచి
భూమి తల్లి సహనం
వారసత్వ శూరత్వం
ఝాన్సీరాణి అమరత్వం

ఈ గాలి లో
వేద నాదాల ధ్వని మారుమోగింది
ఈ మట్టి లో గంగా సారం
నమస్కారపు సంస్కారం

అందుకే ఈ దేశం వట్టి మట్టికాదు
సహనాన్ని చేతకాని తనమని అనుకోకండి
ఎదురు తిరిగే
మధ్యాందిన మార్తాoడం
ముష్కరులారా ఖబడ్దార్

వజ్రోత్సవపు అనుభవాల మీద
ఎగురు తోంది
త్రివర్ణ పతాకం
ధగద్దగాయమానంగా
దేశభక్తితో హృదయమంతా ఉప్పొంగగా
జై భారత్ అందాం
జైహింద్ అని నినదిద్దాం !!

మాడిశెట్టి గోపాల్
అధ్యక్షుడు సమైక్య సాహితీ

August 15, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అహం బ్రహ్మస్మి

by Vani Devulapalli August 15, 2022
written by Vani Devulapalli

మనసు గదులు మూసుకుపోయాక
ఒంటరిగా గదిలో బందీ కావడమే బాగుంటుందా?

హృదయం తో పనిలేకుండా నామ్ కె వాస్తే గా జమీన్ ఆస్మా ఫరక్ తో సాగిపోతున్న దైనందికావసరాలు దేహ ప్రాణాల్ని నిలుపుతూనే ఉంటాయి

ప్రేమ పాశం తో మనసు గెల్చుకోవడమన్న యుద్ధనీతి
ఇప్పుడు పాతదై పనికి రాకుండా పోవడం విషాదం కాదా ?

ఎల్లలు దాటిన స్వార్థాన్నోదిలి ఒక్కసారైనా తనవైపు
దృష్టి సారించమంటూ పోరుతోంది ధర్మం …

అంతుపట్టని అంతర్ముఖీనత తో
అంతేలేని అహంభావం తో దగ్ధం కావడం …
సెగలు పొగల్ని పంచడం కాదు జీవితమంటే ..!

శతాబ్దాలుగా రగిలిపోతూ …
ఇంకా మిగిలిన అహం శకలాల మధ్య
కమ్ముకున్న పొగచూరిన భావజాల గోడలు
మరింత భ్రష్టుపట్టి పోకముందే వెల్లవేసుకొని
తెల్లబరుచు కోవాల్సిన సమయం ఆసన్నమైందిక..!

                                       -డాక్టర్ వాణీ దేవులపల్లి
                                             9866962414
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సమాజదర్పణం భీమేశ్వరపురాణం

by డా॥ వెలుదండ నిత్యానంద రావు August 15, 2022
written by డా॥ వెలుదండ నిత్యానంద రావు

తెలుగు వారి విస్తార చరిత్రలో రెడ్డిరాజుల యుగం (1324-1402  ) ఒకమహోజ్జ్వలఘట్టం. గీర్వాణాంధ్ర భాషా సారస్వతాలకు సువర్ణాధ్యాయం.  రాజులు, మంత్రులు స్వయంగా రసజ్ఞలైన కవి పండితులు కావడం; కృతికర్తలు. కృతిభర్తలు కావడం ఈ యుగవిశేషం. ప్రోలయవేమారెడ్డి(1324-53), అనపోతారెడ్డి(1353-64) అనవేమారెడ్డి (1364-1386)  కుమారగిరి రెడ్డి (1386-1402) లాంటి రెడ్డిరాజులు  షట్కాల శివపూజా పరాయణులై, దేవాలయ నిర్మాతలై, దాననిరతులై, ఉదారచింతనాపరులై విలసిల్లారు. ఆనాటి రాజులు మెచ్చిరా- రత్నాంబరాలు, కస్తూరిదానాలు, భూరి దినవెచ్చాలు, హేమపాత్రాన్న పంక్తి భోజనాలు… మెచ్చక పోయిరా- నిగళయుగళ సత్కారాలు, పురవీధి పొగడదండ పరిష్వంగాలు, వెదురు గొడియలతో వియ్యాలు, నగరి వాకిట నుండు నల్లగుండుకు  భూజాస్తంభ గౌరవాలు… ఈ యుగ సాహిత్య నాయకుడు శ్రీనాథకవిసార్వభౌముడు. అశేష మనీషిహృదయంగమంగ కావ్య సృజనం చేసిన ధీశాలి. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. ఉరుప్రజ్ఞా విశేషోదయడు. సాహిత్య పదవీ మహారాజ్య భద్రాసనాసీనుడు(1-7). సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్యభాషాపరిజ్ఞానం. మహాభాష్య విద్యా సమభ్యాసబలం, శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంతకబళన వ్యుత్పత్తి గౌరవం, పూర్వ కవి ముఖ్యవిరచితాపూర్వ కావ్య భావరస సుధా చర్వణ విస్తారంగా గలిగిన వాడు శ్రీనాథకవీంద్రుడు.

శ్రీనాథ కవిసార్వభౌముడు ప్రౌఢనిర్భర వయః పరిపాకాన భీమేశ్వరపురాణాన్ని రచించాడు. మూలం స్కాంద పురాణాంతర్గతమని శ్రీనాథుడే స్వయంగా చెప్పినా అది అవిశ్వసనీయం.

దక్షారామ భీమేశ్వర సంకీర్తనను సభక్తికంగా సాగిస్తూనే స్థానిక కథా విశేషాలను, సాంఘిక సామాజిక స్థితిగతులను తనివితీరా వర్ణించాడు. శ్రీనాథుని సమకాలీన సమాజస్వరూపాన్ని మిగిలిన కృతులకన్నా భీమేశ్వర పురాణమే అత్యధికంగా ప్రతిఫలించిం దన్న అతిశయోక్తి కాదు.

జీవన స్థాయి, భోజనప్రీతి, మర్యాదలు లాంటి భౌతికాంశాలు, విశ్వాసాలు, ఆచారవ్యవహారాలు. అర్చనాది  ఆధ్యాత్మికవిశేషాలు, అసూయలు, కోపతాపాలు మొదలైన మానసికాంశాలు  భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు ఔచితీమంతంగా నిక్షిప్తం చేశాడు. భీమేశ్వరపురాణం మొదటి సగంలో వున్న బిగి తరువాతి సగంలో చెడింది. సంకీర్తనకే పరిమితమై ఉదాత్త కావ్యనిర్మాణశోభాకరాలైన ఇతరేతరాంశాలను పక్కకు పెట్టాడనిపించింది. పునరుక్తులు పరిహరిస్తే సగానికి సగం కావ్యం తగ్గుతుంది. ప్రాచీనకావ్యాలలో సాంఘికాంశాలను అన్వేషించడం అనేది స్వాగతించదగిన ఉదాత్తయత్నమే. ఒక్కరు కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి చదువుతూ సాగించవలసిన సత్కాలక్షేపం.  

మానసికఅంశాలు

          బోద్ధారో మత్సరగ్రస్తాః. అసూయాగ్రస్తమైన మనస్సులకు, అపండితులకు కాల నియతి ఉండదు. పండితులకు పండితమ్మన్యులకు; కవులకు కవిబ్రువులకు నిత్యఘర్షణ ఎప్పుడు ఉండేదే. శ్రీనాథుని కాలం దీనికి మినహాయింపు కాదు. ఆంధ్రనైషధాజ్జ భవుని కీర్తి ధాళధళ్యం ముందు ఎందరో కవుల కనులు మూతబడివుండడం సామాన్యాంశం.

బోధ మల్పంబు గర్వమభ్యున్నతంబు,

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము

కూప మండూకములుఁ బోలెఁ  గొంచె మెఱిఁగి,

పండితమ్మన్యులైన వైతండికులకు                             1-13

నికటమున నుండి శ్రుతిపుట నిష్ఠురముగ,

నడరి కాకులు బిట్టు పె ద్దఱచినప్పు

డుదధిరాయంచ యూరక యుంటలెన్స,

 సైఁపరాకున్న నెందేనిఁ జనుట యొప్పు.                     1-14

అని శ్రీనాథుడు విసిగి వేసారిపోయాడు.   గౌడడిండిమ భట్టు లాంటి మహావిద్వాంసునితో మొదలుకొని ఏస్థాయి, ఏ అర్హత లేని వాచాలుర దాక ఎదుర్కోవలసి వచ్చి వుంటుంది. తన జయకేతనాన్ని స్థిరంగా ఎగర వేసి ప్రౌఢ నిర్భర వయః పరిపాకంలోకి వచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ అవే కాకులు ఊరకే అరుస్తుంటే రాజహంస మౌనంగా ఉండడమే మంచిది. లేక వివాదాలు నుండి తప్పుకోవడమే ఔచిత్యమన్న ధోరణికి రాక తప్పలేదు. మునపటిలా వాదించే ఓపిక కానీ, అవసరం కానీ ఆయనకు లేవు. శ్రీనాథుని లాంటి పండిత కవులు ఒకరిద్దరయితే  కూపస్థ మండూకాల్లాంటి పండితమ్మన్యులు ప్రతి కాలంలోను అగణితమే.

తాము నివసించే ప్రాంతం, లేదా తాము విశ్వసించే దైవం అన్నింటి కన్నా గొప్పదని తలపోయడం సర్వ సామాన్యాంశం.  దక్షారామం కథాకేంద్రం కనుక  గొప్పదని శ్రీనాథుడు చెప్పారు. అన్ని తీర్థాల కన్నా కాశి గొప్పది. ఇది భారతీయులందరి సాధారణ విశ్వాసం. కాశి కన్న దక్షవాటి గొప్పది (2-8). కాశి కేవలం మోక్షదాయిని. కొన్ని నగరాలు భోగదాయినులు. మరికొన్ని మోక్షదాయినులు కాని దక్షారామం భోగమోక్షాలు రెండూ ప్రసాదిస్తుంది.(2-17). భీమేశ్వరుని కన్న పెద్ద వేల్పు, దక్ష వాటి కన్న గొప్ప ప్రాంతం,  సప్తగోదావరి కన్న తీర్థరాజం మరొకటి లేదు. (2-18) ఏటేట జాతరలు చేయడం (3-44), జపహోమదాన యజ్ఞము లుపవాస వ్రతాలు మోక్షదాయకాలు (3-12, 3-148) శ్రాద్ధతిల తర్పణాదులు (3-154 ) విధాయకాలుగా తలపోయడం కనిపిస్తుంది.

ఏమి శకునమున చొచ్చితిమో కాశికి (2-95) అని అనడం వల్ల శకునాలను నమ్మడం కూడ ఆ సమాజంలో వుందని తెలుస్తుంది. భారతీయ సమాజంలో ఇది సామాన్యాంశమే. ఏ పని చేసినా శుభముహర్తం చూసుకోవడం కాలశుద్ధి తెలుసుకోవడం అలవాటు. వ్యాసుడు అగస్త్యుడు దక్షారామానికి తిరిగి పోతున్నపుడు నగర ప్రవేశానికి శుభముహూర్తం (3-39) (3-56) చూశారు. ఏ ముహూర్తం సరిగా కుదరని పక్షంలో అభిజిన్ముహూర్తం మధ్యాహ్నం 11.45 నుండి 12.30 వరకు నిస్సంకోచంగా చేయవచ్చు. అది విజయముహూర్తం అన్న విశ్వాసం నాటికీ నేటికీ ప్రబలంగానే ఉంది.

అబద్ధాలాడే వాళ్ళ కళ్ళల్లో, ముఖంలో ఒక విధమైన సూచన కనిపిస్తుంది. దాన్ని పసిగట్టిన వారికి వారు అబద్ధలాడుతున్నారని తెలిసిపోతుంది మరి. చల్లని సౌమ్యదృష్టి, ప్రసాదము, మాధురియు, వివేకం, వెల్లదనం, మౌగ్థ్యం, నిర్మలినత్వం అబద్ధమాడే వాళ్ళల్లో ఉండక సత్యంపలికేవారిలో ఉంటుందని శ్రీనాథుడు రాశాడు. (2-134)

కార్తికీవేళభీమశంకరని నగరఁ

దూఱునెవ్వాడు చిచ్చఱతోరణంబు

వాడు దూఱడు ప్రాణనిర్యాణవేళ

ఘోరయమపట్టణద్వారతోరణంబు  3-25

దక్షారామ భీమేశ్వరునికి కార్తీక పౌర్ణమి నాడు రాత్రి జ్వాలాతోరణం ఏర్పరుస్తారట.  దాని గుండా దూరి పోతే భక్తుడు యమలోకంలోకి పోడు.  అంటే పుణ్యం వస్తుందని విశ్వాసం. దీన్ని శ్రీనాథుడు కాశీఖండంలో కూడ ప్రస్తావించాడు. తారకాసురుడు రెల్లుగడ్డిలో కుమారస్వామి జన్మించాడని చెప్పి రెల్లుగడ్డి నంతా కాల్పించాడట. ఆ కథకు ప్రతీకగా వచ్చిన ఆచార మిది అని అంటారు.

ఆకలి గొన్న వ్యాసుని, అతని శిష్యులు మూడువందలమందినీ కాశీ అన్నపూర్ణ ఆహ్వానించి చతుశ్శాలా భోజన మందిరంబున వృద్ధానుపూర్వకముగా ఉచితాసనంబుల కూర్చుండ నియమించినదట. (2-127). ఉచితాసనాలనగా తగిన పీటలు. పీటల మీద కూర్చొని, ఆపోసన చేసి, శాంతి మాత్రం చదివాక భోజనం చేయడం ఆచారం. చాల మంది కలిసి భోజనం చేసే అప్పుడు వారి వయస్సుల క్రమంగా కూర్చునే తినడం  ఆనాటి సాంఘిక ఆచారం తెలుస్తుంది.

అతిథి అభ్యాగతులకు   భక్తి శ్రద్ధా తాత్పర్య విశ్వాస పూర్వకంగా భోజనం పెట్టినపుడే అది ఫలితాన్నిస్తుంది (2-132). – అని ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భావించడం గమనించవచ్చు.

తిట్లు , సామెతలు, ఎప్పుడూ వుంటాయి. కాని ఛందస్సు కనుగుణంగా కొంత మారవచ్చు. సభ్యత వల్ల రూపాంతరం చెందివుండవచ్చు.

ముండదైవం (3-6). కాశిని ఎడబాసిన వ్యాసుడు తన మనోవ్యథను అగస్త్యున కెరుక పరచు సందర్భంలో మనస్సును తేలిక పరచుకోవడానికి అన్నమాట. ఆకలికి తట్టుకోలేక వ్యాసుడు  కాశిని శపించబూనాడు.

మా భూ త్త్రైపూరుషీ విద్యా,   మా భూ త్త్రైపూరుషం ధనం,

మా భూ త్త్రైపూరుషీ భక్తిః,     కాశ్యాం నివసతాం సదా 2-108

కాశీనగరంలో మూడుతరాలపాటు విద్య, ధనం, భక్తి ఉండొద్దుగాక అని- అంటే మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధులకు ఇది గొడ్డలిపెట్టేకాక తరువాతి తరాలు కూడదీని ప్రభావానికి లోనవుతాయి.  అలా కాశిని శపించ బూనుకున్న వ్యాసుని కాశీ విశ్వేశ్వరుడు తీవ్రంగా దూషిస్తాడు.

ఓరి దురాత్మ! నీవారముష్టింపచా

భాస! యోజనగంధి ప్రథమపుత్ర!

దేవరన్యాయదుర్భావనాపరతంత్ర!

                        బహుసంహితావృథా పాఠపఠన!

భారతగ్రంథ గుంభన పండితంమన్య!

                        నీవా మదీయపత్నికి నశేష

కైవల్య కళ్యాణ ఘంటాపథమునకుఁ

గాశికాపురికి ని ష్కారణంబ

శాపమిచ్చెదనని యనాచారసరణి

నడుగు వెట్టినవాడవహంకరించి

పొమ్ము నిర్భాగ్య ! మాయూరి పొలము విడిచి

యెచటికేన్ శిష్యులును నీవు నీక్షణంబ                      2-153

ఓ దుష్టుడా!  సామాన్య గృహస్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కేవలం పిడికిట్లో పట్టేడన్ని బియ్యం దాన మివ్వడం సంప్రదాయమైంది. అది గొప్ప. కానీ గతిలేక ముష్టి అడుక్కుంటున్న వాడా అని ఇక్కడ  తిట్టు. యోజనగంథి ప్రథమ పుత్ర అనడంలోని ఆంతర్యం సామాజిక సంప్రదాయం తెలియనివాని కర్థం కాదు. సత్యవతికి పెళ్ళి కాకముందే పుట్టిన వాడా అని తిట్టడం. మరి పుట్టిన వాడిది తప్పా పుట్టించిన వారిది తప్పా అని చర్చించడం అప్రస్తతం. పెళ్ళి కాకుండా తల్లి కావడం నిషిద్ధమైన సమాజంలోనే ఇది తిట్టు కాగలదు. లేని చోట కాదు. వ్యాసుడు వరుసకు మరదళ్ళైన, భర్తృహీనలైన అంబిక అంబాలికలకు సంతానాన్ని కంటాడు. ఇది అక్కడ విధి లేని పరిస్థితి కావచ్చు.  కాని ఇక్కడ మాత్రం దూషణ. వ్యాసుడు ఏడురోజులు తిండికి ఓర్వలేక నగరాన్ని శపించబూనుకున్నాడు. అలాంటి వ్యాసుని వేద పురాణవిజ్ఞానం అంతా వృథానే కదా. భారతం లాంటి పంచమవేదాన్ని సృష్టించిన పండితుడయ్యు కాశికి శాపం ఇవ్వపూనుకొని పండితమ్మన్యుడయ్యాడు.  పండితంమన్యుడు అంటే తననుతాను పండితుడనుకొనేవాడు. నిజానికి కాడని భావం. చదువు కొన్న మూర్ఖుడయ్యాడు. నిర్భాగ్యనీచ చరిత్ర లాంటి వన్ని తిట్లు.  కాశినుండి వెళ్ళిపోకపోతే వ్యాసుని రాతిమీద రాకిస్తానన్నాడు శివుడు. రాతిమీద రాకించడం ఆ కాలంలో  శిక్షించే ఒక పద్ధతి కావచ్చు.   శ్రీనాథుడు వీరశైవుడు కూడ. వైదికుడైన వ్యాసుని తిట్టడానికి అందివచ్చిన సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.   

రాచమర్యాదలు

కృతిస్వీకర్త బెండపూడన్నయ మంత్రి కీర్తి ఏడుసంధ్రాల అవతలి చీకటిని పోగొట్టిందనడం, ఆయన కీర్తి కర్ణాట లాట వంగ కుంతల అవంతి ఘర్జర రాజుల సభాస్థానాల్లోని బుధులు కీర్తిస్తారనడం లాంటి వాటిని అతిశయోక్తులని చిన్న చూపు చూడకుండా సాహిత్య సంప్రదాయమని మిన్నకుండడం సముచితం. అలాంటి మంత్రి గారి పేరోలగంలో ఉద్దండ పండితులు, వ్యాకర్తలు, వేదాంతులు, ఉపనిషత్ తత్వ్తజ్ఞులు, లాక్షణికులు, సంస్కృతాంధ్ర కవులు వీరితో పాటు వేశ్యలు, వీరభటులు  ఉండే వారు. ఇది సమకాలీన మర్యాద. కవులను సన్మానించడం, కావ్యం రాయించి అంకితం తీసుకోవడం పాలకుల కర్తవ్యాలలో ఒకటిగా తలపోసేవారు.

బెండపూడన్న మంత్రి కీర్తికారకాలైన సప్తసంతానాలలో “ఒక్క ప్రబంధస్వీకరణం తప్ప అన్నీ నాకు లభించాయి” ఆ ఒక్క వెలితి తీర్చలసిందని శ్రీనాథుని అర్థించి భీమేశ్వరపురాణరచనకు పురికొల్పాడు. ఇది అబద్ధంగానో, కవిత్వమనో భావించాల్సిన పని లేదు. రాచరిక వ్యవస్థలో రాజులు మంత్రులు అందరూ చేసేదే. సప్తసంతానాలంటే ఇవి.

  1. కూపం – మంచినీళ్ళ బావులు తవ్వించి దాహం తీర్చాలి.
  2. తటాకం – చెరువులు నిర్మించి పంటలకు దోహదం చేయాలి.
  3. ఉద్యానవనాలు – తోటలు నిర్మించి ఆహ్లాదకరవాతావరణానికి ఏర్పరచాలి.
  4. దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక చింతనను  పెంచాలి.
  5. పుత్రులను కని వంశాన్ని నిలబెట్టాలి.
  6. ధర్మబద్ధంగా జీవించాలి..
  7.  కవులను ప్రోత్సహించి కావ్యాలు రచింపచేయాలి.

సప్త సంతానములలోన భిలము గాకుండు నది ధాత్రి కృతియె గాన అని అల్లసాని పెద్దన అన్నాడు.

గుడి కూలును, నుయి పూడును

వడి నీళ్ళను చెరువు తెగును, వనమును ఖిలమౌ

చెడనిది పద్యం బొకటియె

కుడి యెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా.

అని గువ్వల చెన్నడు అన్నట్లే మిగిలిన ఆరింటి కన్నా కావ్యాన్ని అంకితం తీసుకోవడం శాశ్వత కీర్తికారకమని ప్రాచీనులు భావించారు. అలానే వ్యవహరించారు.   రాజరాజనరేంద్రుడు ఈ రోజు చిరస్మరణీయుడయ్యాడంటే ఆయన పాలనవైభవం వల్ల కాక కేవలం నన్నయ చేత భారతం రాయించడం వల్లనే అన్నది నిర్వివాదాంశం. బెండపూడన్నయ మంత్రి కూడా అంతే. దక్షారామంలో భీమేశ్వరునకు మొగలివాకిటధామం, తూర్పు దిక్కున మరొక మంటపం  నిర్మించాడు (1-74). బహుశా ఆ సందర్బంలో ఓ వారం పదిరోజులు ఇదే విషయంపై పురాణ కాలక్షేపం జరిపి వుంటారు. ఆ ప్రేరణతో  కనీసం వచ్చే సంవత్సరం వార్షికోత్సవాల (బ్రహ్మోత్సవాల) నాటికి దక్షారామ భీమేశ్వరునీ, సప్తగోదావరి తీర్థాలను కీర్తిస్తూ కావ్యరచన చేయవలసిందని  సబహుమానంబుగా కర్పూరతాంబూల జాంబూనద ఆభరణాలతో ఘనంగా సత్కరించి  అర్థించి వుంటాడు. భీమేశ్వరపురాణంలో వున్నవి రెండే పాత్రలు.  వక్త, శ్రోత. వక్తవ్యాంశం భీమేశ్వరసంకీర్తనం. ఇది కృతికర్త, కృతిభర్తలకు అభీష్టాంశం. కాశికన్నా గొప్పది దక్షవాటి అని అనుకోవడంలో, స్వస్థాన వేషభాషాభివ్యక్తీకరణంలో  ఒక నిర్వచనీయమైన ఆనందం దాగుండడం సహజం.  వింధ్యగర్వాన్ని అణచడంకోసం ఉత్తరాదినుండి వచ్చి దక్షిణాదిలో స్థిరపడ్డ అగస్త్యమహర్షి నివాసమే దక్షారామంగా చిత్రించాడు. కాశీపట్టణ మెంత గొప్పదైనా, ప్రీతి పాత్రమైనదైనా అగస్త్యుడు ఉత్తరాదికి పోలేని దుస్థితి.

దురదృష్టం వల్ల వ్యాసమహర్షి కాశీనుండి బహిష్కృతుడై కొత్తగా తనకు అంతగా తెలియని దక్షారామానికి రావలసి వచ్చినవాడు. 

వ్యాసాగస్త్యు లిరువురికీ కాశీకి విశ్వనాథుని సేవించలేమన్న ఆవేదన సమానధర్మం. అందువల్లనే దక్షారామప్రాశస్త్యాన్ని తెలిపే వక్తగా అగస్త్యుని , విని ఊరడిల్లే శ్రోతగా వ్యాసుని పాత్రలుగా శ్రీనాథుడు మలచడంలోని హేతువు ఈ సమానధర్మమే. నిజానికి ఇక్కడ వ్యాస అగస్త్యులు నిమిత్తమాత్రులే. శ్రీనాథుడే అసలు వక్త. అసలు శ్రోత బెండపూడన్నయమంత్రి. అంతే.   

   ప్రజానీకం

పద్మనాయకులు, వెలమలు, కమ్మలు, సరిసర్లు, పంటర్లు(1-32) ను మొదటిసారిగా కావ్యంలో నమోదు చేసిన ఘనత శ్రీనాథునిదేనేమో! పరిశీలించాలి.  బ్రాహ్మణులు, క్షత్రియులు, చతుర్థకులాలు, పంచజనులు, వైశ్యులు, వేశ్యలు,(3-63)  ఇంకా ఏకవింశతి కులాలవారు(3-153) ఆకాలంలో వున్నట్లు తెలుస్తుంది.   వర్ణసాంకర్యం లేకుండా చాతుర్వర్ణ్యస్థితి వుందని చెప్పడం గొప్పగా తలపోసేవారు. (1-110)  ఆనాటి వారికి బ్రాహ్మణ భక్తి మిక్కుటం. సాధారణంగా వేదపఠనం చేసే విప్రులు పేదలే. బెండపూడి అన్నయ మంత్రి లాంటి ఉన్నతాధికారుల ప్రాపు లభించిన వైదికులు ఉన్నత స్థాయి కెదుగుతారు. తక్కినవారు సాధారణులు గానే మిగిలి పోతారు.

   ధరియింప నేర్చిరి దర్భ పెట్టెడు వ్రేళ్ళ

            లీల మాణిక్యాంగుళీయకములు

    కల్సింపనేర్చిరి గంగమట్టియ మీఁదఁ

            గస్తూరికా పుండ్రకములు నొసలు.

    సవరింప నేర్చిరి జన్నిదంబుల మ్రోలఁ

            దారహారములు ముత్యాల సరులు

   చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల

            గమ్మని క్రొత్త చెంగల్వ విరులు

ధామముల వెండియును బైఁడి దడఁబడంగ

బ్రాహ్మణోత్తము లగ్రహారములలోన

వేమ భూపాలుడనుజన్ము వీరభద్రు

ధాత్రి యేలింప గౌతమీతటమునందు.            1-41

కాశీఖండంలో సైతం శ్రీనాథుడు ఈ పద్యాన్ని ప్రీతితో వాడుకొన్నాడు.   విప్రుడు గాన నేరము వెదక దగదు అనుకోవడం(2-118). కనిపిస్తుంది. ప్రతి నెల ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం సాధారణాచారం. వైకుంఠ ఏకాదశి నాడు మరీ ముఖ్యం. ద్వాదశి నాడు పారణచేసి భోజనం చేయడం విధాయకం. అందువల్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులకు సంతర్పణలు చేయడం పుణ్యకార్యంగా తలపోసేవారు, అది ఆ కాలంలో ఆచారంగా మారింది కూడా. ), అశ్వగోమహిషరూప్య సువర్ణ వస్త్రంబులు దానం చేయుట (4-32) పుణ్యమనుకొన్నారు.

భోజన రసికత

ఆనాటి వారి భోజన రసికతను శ్రీనాథుడు తనవితీరా వర్ణించాడు.  ఆనాటివారు తిన్నది అరిగించుకోగలగిన వారు. అది తింటే షుగర్ వస్తుంది ఇది తింటే ఇంకేదో వస్తుంది అని నాలుక చంపుకొని జీవించిన వారు కాదు. పంచభక్ష్యపరమాన్నాలను నిండార తిని పరవశించారు. త్రేంచారు. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పేయం- ఇవి పంచభక్ష్యాలు. దోసెలు, వడలు, సేమ్యాపాయసం, కమ్మగా కాచిన నెయ్యి, శాకం, పాకం, పెసరుపప్పు, తేనె, పానకం, ఉప్పు, తెల్లని పెరుగు, పచ్చకప్పురం, సొజ్జెపిండి, పిండివంటలు, బెల్లం, ద్రాక్షాపానం ఖండశర్కర, అరటి పండ్లు. ఆవుపాలు, వరి అన్నం మొదలగు వాటిని నిశ్శంకతో అంటే ఎలాంటి సంశయం లేకుండా కుక్షుల్ నిండగ ఆరగించారు. అన్నీ అయ్యాక మందార తరుపుష్ప మధుపానగోష్టి (2-28) కొందరికైనా ఉండకపోతే ఎలా?

                పప్పును, బిండి వంటలును, బాయసముల్, ఘృతముల్, గుడంబులుం

                  గుప్పలు గాఁగఁ జుట్టునను గుర్పఁగఁ గూడిన యేరుఁబ్రాల తె

                  ల్గప్పురభోగి వంటకము గమ్మని తాలిపు సొజ్జ పిండితో       

                  నొప్పులుగా భుజించిరి బుధోత్తము లాఁకటి చిచ్చు పెచ్చునన్. 2-140

      ద్రాక్షపానక ఖండశర్కరలతో, రంభాఫలశ్రేణితో

       గోక్షీరంబుల తోడ, మండెఁగలతో, గ్రొన్నేతితోఁ , బప్పుతో

       నక్షయ్యంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం

                   గుక్షుల్ నిండఁగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.    2-142

మోదకాపూప పాయస ఘృత మధుక్షీర శర్కకాపూపాలతో భోజనం( 4-91)          ఇలా భీమేశ్వరపురాణంలో రెండుమూడు చోట్ల ఆహార ప్రస్తావనలు వస్తాయి. ఆకాలంలో  అవన్నీ అందరూ తినేవేనని గుర్తించవచ్చు.

దేవదాసి సంప్రదాయం

      దక్షారామంలో దేవదాసి సంప్రదాయ ముంది. దేవదాసీలు భగవంతుని కంకితమైన పవిత్రమూర్తులు. భగవంతుని ఎదుట నాట్యం చేసే తరించేవారు. భగవంతునికి చేసే షోడషోపచారపూజల్లో నాట్యం కూడ ఒకటి. విశ్వనాథసత్యనారాయణ వేయిపడగలులో ముఖ్యంగా గిరిక ఘట్టం చదివితే దేవదాసీ సంపంప్రదాయ ఔన్నత్యం తెలిసి వస్తుంది. వారిని పోషించడం పురప్రముఖుల విధి. కాలక్రమంలో వేశ్యల స్థాయికి దిగజారడం వేరే అంశం.  

దక్షపురిసాని కూతుల దవిలి నాడు

విశ్వలోక కుటుంబి భీమేశ్వరుడు – 1-110

అనీ  పదునాల్గు మహాయుగాల ముదుసలి భీమేశ్వరునికి సానితో పెండ్లి (1-112) అని కూడ చమత్కరించాడు.  వికటశృంగారము నొప్పు భీమేశ్వరుడని కూడ(1-80) అన్నారు. ఇలా అనడంలో ఆంతర్యం అక్కడి సంప్రదాయ విశేషమే తప్ప అన్యంకాదు. దక్షారామంలో వెలసిన మాణిక్యాంబ ఒక దేవదాసి అని ఐతిహ్యం.

వస్తసంస్కృతి      

ముత్యాల గొడుగు (2-43), రత్న దర్పణం (2-49) పసిడి కమ్ముల పట్టు పచ్చడం,  తారహారాలు, కల్హారదామాలు, కట్టాణి ముత్యాల కంఠమాల మాణిక్యఖచిత కేయూరము. వజ్రపుటుంగరం, పగడాల ఒడ్డాణం. (1-115 &116) హేమ మణిభూషణాలు. ముత్యాలపేరు (2-52) . గోమేదికం = మణులు, బంగారం, రత్నాలు ( 3-61) రత్నకంకణాలు. ముత్యాల రంగవల్లలు (3-63)  కంకణాలు, అందియలు, మట్టియలు (2-110)  ఇవన్నీ భీమేశ్వరుడు ధరించినవి మాత్రమే కాదు సమకాలీన సంపన్న గృహస్థులందరూ దాల్చినవేనని భావించడంలో విప్రతిపత్తి లేదు.

కురంగనాభిసౌరభాలు, సంకుమద పరిమళాలు, కర్పూర వాసము, కాలాగురు కర్దమాలు సర్వులకూ ప్రీతి పాత్రాలే (1- 117) గొజ్జంగి నీటి నెత్తావి, దాన్ని మించిన గంధపుపొడి పొలుపు, దాన్ని మించిన ధమ్మిల్ల మల్లికాహల్ల వకుళవాసంతికా జాతి కేతకీకుంద కుసుమ గంధబులు (1- 117) వ్యాపించేవి. ఒకదాని మించి ఒకటి అని శ్రీనాథుడు వర్ణించడం వల్ల ఏ స్థాయి వారు ఆ స్థాయిలో వాటిని వినియోగించేవారని తలపోయవచ్చు. చెంగల్వ దండలు (2-51), (2-67) ధరించేవారు

 చతుశ్శాలా, భవంతులు, జోడరుగులు, అంతర్గేహాలు, బహిర్గేహాలు, సౌధమధ్యంలో వేదికాస్థలం.(2-146).  గోపురాలు, మేడలమీద పసిడి కలశాలు మొదలైనవి గృహ వైవిధ్యాలు. 

చామరము, తోమరము, ఛత్రము, ధనుస్సు, ఖడ్గాదులు ఆనాటి ఆయుధాలు. (1-31).

శంఖ భేరీ మృదంగ నిస్సాణ పటహ

ఝల్లరీ వేణు వీణాది వాయిద్యాలు

            శంఖం, భేరి, మద్దెల, విస్సాణ=చర్మ వాద్యం, పటహ= తప్పెట ఝల్లరి=డక్కి, పెద్దడోలు వేణు-పిల్లనగ్రోవి, వీణ =వీణ భీమేశ్వరుని మ్రోల మోగిస్తారు. దాని వల్ల పాపాలు తొలుగుతాయి. తొలుగుతాయో లేదో కాని ఆనాడు ఈ వాయిద్యాలున్నాయన్న సంగతి స్పష్టం.

ఉపసంహారం

ఇంకా నిశితంగా ఓపిగ్గా పరిశీలిస్తూపోతే మరెన్నో విశేషాలు దొరకగలవు. భీమేశ్వరపురాణం ఒక్కదానికే పరిమితం కాకుండా శ్రీనాథునికృతులన్నింటినీ పరిశీలించాలి. ఆపైన సమకాలిక కవులకృతులను పరిగణనలోకి తీసుకొని సేకరిస్తే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తాయి. అలా సేకరించినవాటిని తక్కినకాలాల కవుల రచనలతో తులనాత్మకంగా విశ్లేషిస్తే వాటి పరిణామాలు తెలియవస్తాయి. అలాంటి ఉత్తమ ప్రయత్నానికి ఈ సదస్సు దోహదం చేయగలదని విశ్వసిస్తు నిర్వాహకుల ఉత్తమాభిరుచిని, ఉదాత్తసంకల్పాన్నీ  మనఃపూర్వకంగా అభినందిస్తు ముగిస్తున్నాను.    

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us