మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

రాము కొరకు నిధి

by ఒద్దిరాజు మురళీధరంరావు August 15, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రాము మరియు రాణి వ్యవసాయస్థులు. వాళ్ళు వారి చెలుకలో బాగా కష్టపడి బాగా డబ్బు సంపాదించారు. అది వారి పిల్లల తిండి మరియు ఇతర ఖర్చులకు సరిపోయేంత ఉంది. వారు ధనికులు కాదు, కొన్నిసార్లు కొన్న కొత్త బట్టలు మరియు అంత మంచి భోజనం కూడా లేకుండా సర్దుకుపోయేవారు.

ఒకరోజు, రాణి ఆమె తోటలో చెట్టు నాటేందుకు చెలుకలో ఒక మూలన తవ్వుతుండెను. ఆమె లోతుకు తవ్వేవరకు క్లాంగ్ అనే పెద్ద శబ్దం వినపడింది! ఆమె గడ్డపార భూమిలో ఏదో లోహపు వస్తువుకు తగిలింది. ఏదో ఉన్నదన్న సంతోషంతో గబగబ తవ్వింది. అక్కడ ఒక లోహపు పెట్టె దొరికింది. ఎప్పుడైతే ఆమె దాన్ని తెరిచిందో ఆమె కండ్లను ఆమె నమ్మలేకపోయింది. అది బంగారం, వెండి సొమ్ములతో నిండి వున్నది. కొద్దిసేపు రాణి మాటరాక నిలబడిపోయింది. అప్పుడు ఆమె సంతోషంగా ఊహ్ అని పెట్టెను చంకల పెట్టుకొని ఇంటికి పోయింది.

“ రామూ,

రామూ చూడు నాకు మన తోటలో ఏమి దొరికిందో” అని బిగ్గరగా అరిచింది.

రాము ఆ నెల కొరకు అయ్యే ఖర్చులు లెక్క రాస్తుండెను. మరియు కొంతసేపు వరకు అతను భార్య మాటలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె సమీపానికి వచ్చి సంతోషంగా అతని దగ్గర పడిందో అప్పుడు ఆయన పైకి చూశాడు. ఆయన సొమ్ము పెట్టెను చూసినపుడు ఊహించండి ఆయన నోరు ఆశ్చర్యంతో ఎంత తెరువబడిందో?

త్వరలోనే గ్రామంలో రాము, రాణి అతి ధనవంతులు అయినారు. వాళ్ళు పనికి పోవడం మానేశారు. అయినా ఏమవసరం, వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నారు. వాళ్ళకు ఇంట్లో కట్టలకు కట్టల డబ్బు ఉన్నప్పుడు వాళ్ళు ఎండలో ఎందుకు పని చేయాలి? వాళ్ళు వాళ్ళ చిన్న ఇల్లు వదిలిపెట్టి అదే ఊరిలో పెద్ద ఇంట్లోకి వెళ్ళారు. వాళ్ళకు నౌకర్లు ఉన్నారు, వారు రేయింబగళ్ళు ప్రతి చిన్న పని చేస్తూండడం వలన రాము, రాణిలకు వేలు కదిలే అవసరం కూడా లేకుండెను. వారికి అన్ని పదార్థాలు రుచిగా వండే వంట మనిషి, ఇంకో మనిషి వడ్డన కొరకు, ఇంకొకరు కేవలం బూట్లు

తుడిచేందుకు మరియు ఇంకో మనిషి దినమంతా రాము అతని నూతన మిత్రులతో తన బెడ్లో కూర్చొని గప్పాలు కొడుతున్నపుడు అతనికి విసురుతూ ఉండేవాడు.

తరువాత రాము గ్రామ జీవితం చాలా చిరాకుగా ఉంటుందని, ఇద్దరు పెద్ద సిటీకి వెళ్ళారు. అక్కడ వారికి ఒక పెద్ద ఇల్లు, ఎక్కువ నౌకర్లు మరియు అనేక పార్టీల్లో వారు సంతోషంగా గడిపారు. వారు ముందు ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి పనులు మరిచిపోయారు. వారు బాగా కఠినమయిన పనులు చేయడం, ఇతరులకు అవసరం ఉన్నపుడు సహాయపడటం మరిచిపోయారు. వారు డబ్బుతో ఏదైనా గౌరవంతో సహా కొనవచ్చని అనుకున్నారు. వారు ఇతరులతో మొరటుగా ఉండేవారు. వారు బట్టలమీద, పార్టీలమీద చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మరియు వారు ఏ పని చేయనందున డబ్బు తగ్గిపోయింది. వారు ఇతరుల వద్ద అప్పు చేయడం అది తిరిగి ఇవ్వలేకపోవడం జరిగింది. ఒకరోజు రాము తన జమ, ఖర్చుల పుస్తకం చూసి బాధ పడ్డాడు.

దాని నిండా ఇతరులకు ఇవ్వవలసిన బాకీల వివరాలు ఉండెను. అక్కడ అతనికి ఏమాత్రం డబ్బు మిగిలి ఉండలేదు. బరువైన ధ్వనితో భార్యను పిలిచాడు, “ప్రియమైన రాణి, మంచిరోజుల మనవి అయిపోయాయి. నేను అనుకుంటూ మనం లక్ష్మి దేవత ఇష్టపడిన బీదప్రజలను మరిచిపోయాము. ఆమె వేరే ఎక్కడికో పోయింది, మరియు మన వద్ద ఏమి మిగులలేదు”.

రాణి కొద్దిసేపు మాట్లాడకుండ నిలబడి ఉండి, అప్పుడు జవాబు ఇచ్చింది. ఏం విచారించకు రామూ. మనం మన పాఠం నేర్చుకున్నాము. నేను ఇప్పుడు అనుకున్నా, దినం అంతా కష్టపడి పని చేసి బాగా అలసి గాఢనిద్రలకు పోగలను. నేను పక్కమీద వాలంగనే హాయిగ సుఖనిద్రలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను తెలివితో ఉండి రేపు ఉదయం ఏ చీర కట్టుకోవాలి, డబ్బుతో ఏం చేయాలి అనే ఆవేదనతో ఉంటున్నాను. నేను ఇప్పుడు ఇంతకుముందు సొమ్ము తవ్వి తీసినప్పటి వలె వంగకుండా బాగా లావైపోయాను.

రాము నవ్వి అతని భార్యను కౌగిలించుకున్నాడు. “మనం మన ఊరికి తిరిగి వెళ్ళిపోదాము. మరియు మన పాత పద్ధతులే పాటిద్దాం. మనం ఇదివరకు చేసినట్లే బాగా కష్టపడుదాము మరియు మనం పక్కవాళ్ళకు సహాయం చేద్దాం.

మనం అలా చేస్తే లక్ష్మీదేవీ తిరిగి ఒక రోజు మన వద్దకు రావొచ్చు. ఒకవేళ ఆమె రానప్పటికి మనం ప్రయత్నం చేద్దాం మరియు ఉన్నదాంతో సంతోషంగా ఉందాం”.

ఆ తీరుగ రాము మరియు అతని కుటుంబం వారి పాత ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. మరియు ఏంటో నీకు తెలుసా? అప్పటినుండి వారు సంతోషంగా జీవించారు.

మనం మన ఇంట్లో కష్టపడి పని చేసుకుంటూ, ఇతరులకు సహాయం చేసినపుడే, మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది, లేనిచో వెళ్ళిపోతుంది, అంటే మనకు కష్టాలు వస్తాయన్నమాట.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పాడే పక్షులు

by ఒద్దిరాజు మురళీధరంరావు August 15, 2022
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకసారి ఒక అడవిలో పాడే పక్షుల సమావేశం జరుగుతుంది. కోకిల కూడా ఒక పాడే పక్షిగా ఉన్నది. దాని “కూహ్ కూహ్” పాట తీయనిది. ఇతర పక్షులు దాన్ని ఇష్టపడలేదు. ఎవరు కూడా దాని తీయని పాటనూ కూడా ఇష్టపడలేదు. ఏది ఎట్లైనా వీలు చేసుకొని, కోకిల మాట్లాడింది : “ప్రియమైన మిత్రులారా, మనం భూమి మీద ఉండే జనుల హృదయాలను సంతోషపెట్టే పాటను కనిపెట్టాలి. వాళ్ళు పాటలను వినడానికి సంతోషపడుతారు. అప్పుడు ప్రపంచం అంతా ఆనందమయ మవుతుంది” అన్నది.

వెంటనే “అది ఎట్లా సంభవం? అటువంటి పాటను ఎట్లా వెదకాలి? అది అంత సులభం కాదు” అన్నది హంస. (హంస = పొడుగైన మెడగల చైనా బాతు)

“ఎందుకు కాదు? మనందరమూ దూరపు ప్రాంతాలకు ఎగిరిపోదాం, వేరేవి చాలా పాటలను తెలుసుకుందాం. దాని తరువాత మనం మళ్ళీ అడవిలో కలుసుకొని ఒక్కొక్కరం విడివిడిగా పాడుదాం. అప్పుడు అన్నింటిలో చాలా బాగున్నదాన్ని ఎన్నుకొని దాన్ని ప్రపంచానికి విరాళంగా ఇద్దాం” అన్నది కోకిల.

పక్షులన్ని అంగీకరించాయి, వేరు వేరు ప్రాంతాలకు ఎగిరిపోయాయి. కూకూ, భ్రష్ అనే తీయని పాట పాడే పక్షులు మంచి ఊపులో ఉన్నాయి. ఆ చిన్నపక్షి కోకిల చాలా గ్రామాలు, పట్టణాలు దాటిపోయింది. ఎక్కడ కూడా శ్రావ్యమైన కంఠధ్వని వినలేదు. అవ్వన్ని కర్ణకఠోరంగా ఉన్నాయి, ఏమాత్రం తీయగ లేవు. అప్పుడు అది ఎత్తైన గుట్ట దగ్గరకు వచ్చింది. కానీ దాని రెక్కలు బాగా నొప్పి పెట్టడం వలన అది బాగా నీరసపడింది. అది ఒక బలహీనమైన పక్షి. చాలా నిరుత్సాహపడింది. అక్కడికి ఒక గద్ద వచ్చింది. ఆ సమయాన కోకిల రంధిగా ఒక పాట పాడుతున్నది.

“చెల్లీ, నీవు ఇంత రంధిగ ఉన్నావు ఎందుకు?” అని గద్ద అడిగింది.

“నేనేమి చేయగలను? నేను ఒక కొత్త పాటను వెదుకాలి, అది జనులందరిని సంతోషపెట్టాలి” ఆ చిన్న పక్షి అంది.

“నీకు ఆ పాట ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగిన గద్దతో

“ఒకవేళ ఆ ఎత్తైన కొండను దాటితే నేను వెదికే పాట నాకు దొరుకుతుంది” అన్నది కోకిల.

“ఓహ్! చెల్లీ. అదానీ సమస్య. నీవు ఒక పనిచేయి. నేను రేపు ఉదయాన ఎత్తైన పర్వతం దాటుతాను. నీవు నా మెడ రెక్కలను గట్టిగా పట్టుకో. నేను నిన్ను మంచుకొండల వరుసలు దాటిస్తాను. నీవు అక్కడ రెండు మూడు రోజులు వుండు. నీ పని అయిన తరువాత నేను నిన్ను తిరిగి తీసుకవస్తాను” అన్నది గద్ద.

ఆ చిన్నపక్షి అంగీకరించింది. మరునాడు ఉదయమే గద్ద ఆ చిన్నపక్షిని పట్టుకొని ఆకాశంలోకి ఎగిరింది. గద్ద చాలా ఎత్తుకు ఎగిరింది. ఆ గద్ద చిన్నపక్షిని పర్వత శిఖరాన దింపింది.

ఆ చిన్న కోకిల కుతూహలంగ చుట్టూ చూసింది. ఆ శిఖరంపై ఒక చిన్న గుడిసె ఉన్నది. ఆ గుడిసెలో ఒక ఋషి ఉన్నాడు. అతడు వృద్ధుడు, తెలివైనవాడు కూడా.

ఆ ఋషి మాట్లాడాడు. “నాకు తెలుసు నువ్వు ఎవ్వరివో. నీవు ఒక చిన్న పక్షివి. కాని ఎందుకు ఆలస్యం చేశావు. చాలాకాలం నుండి నీ కొరకు ఎదిరి చూస్తున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కూడా తెలుసు.” అన్నాడు.

“ఓహ్! నా అదృష్టం! ఋషి వర్యా, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. కాని మీకు ఎట్లా తెలిసింది” అని అడిగింది.

ఓ పక్ష్మీ నేను భగవంతుని అన్వేషణలో ఉన్నాను. అతడు అతిబలవంతుడు. నాకు ఈ ప్రపంచంలో అన్నీ తెలుసు. నీవు ఒక పాట అన్వేషణలో వచ్చావు. నీవు మనుషుల హృదయాలను సంతోషపెట్టడానికి ఓ పాట నేర్చుకుందామని అనుకుంటున్నావు. కాని అది సామాన్యమైన పని కాదు. దానికొరకు చాలా ఓపికతో ఉండాలి” ఋషి సమాధానమిచ్చాడు.

“సార్, నేను రెడీ. ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే చాలా ఓపిక కల్గి ఉండటం అవసరం. ఎడతెగని ప్రయత్నం చేయకుంటే ఎవరు గొప్పవారు కాలేరు. దయతో నాకు బోధించండి” అన్నది ఆ పక్షి.

“సరే, నీవు ఈ తీరుగ చెయ్యి. నీ గుడిసె వెనుక ఒక ముళ్ల చెట్టు వుంది. అక్కడికి వెళ్ళి ముళ్ళ మీద కూర్చో. సహజంగానే ముళ్ళు నీకు గుచ్చుకుంటూ బాధపెడతాయి. నీవు ఆ బాధను ఒక వారం సహించాలి. నీ రక్తం బయటికి వస్తుంది, తప్పదు. కాని రోజు రోజుకు నీ గానం మెరుగు పడుతుంది. వారం రోజుల చివరన నీ గానం చాలా బాగుంటుంది. అది జనుల హృదయాలను సంతోష

పెడుతుంది. నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. నేను నా మహిమలతో నీ గాయాలను నయం చేస్తాను. గద్ద నిన్ను నీ స్థలానికి తీసుకుపోతుంది” అని చెప్పాడు ఋషి.

ఆ పక్షి అంగీకరించి ఋషి చెప్పినట్లు చేసింది. అది మొదటిరోజే పాడటం మొదలుపెట్టింది. దినం తరువాత దినం దాని పాట మెరుగయ్యింది. వారం చివరిలో గాయాలతో బాధపడుతున్న కోకిల తన పాటను చాలా శ్రావ్యంగా పాడగలిగింది. ఆ వయసు మళ్ళిన ఋషి అవస్థ పడుతున్న పక్షిని తన చేతుల్లోకి తీసుకొని తన మహిమతో దాని గాయాలను ముట్టుకొని నయం చేశాడు.

“పక్షి, నీవు ఇప్పుడు భూమి మీదికి తిరిగిపో, అక్కడ ఈ కొత్త పాట పాడు. జనాలు కూహ్ కూహ్ అను నీ తీయని స్వరం విని ఆశ్చర్యపడుతారు” ఋషి అన్నాడు. కోకిల ఋషికి ధన్యవాదాలు చెప్పి గద్ద కోసం ఎదురు చూస్తూ ఉన్నది.

గద్ద అన్నమాట ప్రకారం మరుసటి రోజు వచ్చింది. కోకిలను ఎత్తుకు పోయింది. కోకిల దాని ఇంటికి తిరిగి వచ్చింది. సమావేశంలో అది బహు శ్రావ్యంగ పాట పాడింది. అది ఒక గొప్ప సంతోష సంఘటన. పక్షులన్ని భళా భళా అని మెచ్చుకున్నాయి.

ఈ రోజు కూడా కోకిల గానం విన్న వాళ్ళందరి హృదయాలను సంతోషపెడుతుంది.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

యోగాసనాలు

by Bandi Usha August 15, 2022
written by Bandi Usha

నిల్చొని చేసే ఆసనాలు

(part -3)

అర్థకటి చక్రాసన్

అర్థకటి చక్రాసన్

ఆసనం వేయు విధానం

తివాచీపై సమస్థితిలో నిల్చొని రెండు చేతులను భూమికి సమాంతరంగా, భుజాల పక్కగా చాచాలి. శ్వాసవదులుతూ తలను కుడివైపుకు వంచుతూ కుడిచేతిని క్రిందికి జరపాలి. ఎడమ చేతిని పైకెత్తి ఎడమ చెవిని తాకునట్లుగా చాచి, ఎడమ అరచేయిపై దృష్టి నిలపాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకొని సమస్థికి రావాలి. తదుపరి కుడివైపు చేసిన విధంగానే ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు

  1. మెడచుట్టూ వలయాలు తగ్గుతాయి.
  2. తలకు రక్తప్రసరణ జరగటఁ వలన జ్ఞాపకశక్తి పెరుగును.         
  3. నడుముకు ఇరువైపులా ఉన్న కొవ్వు తగ్గి నడుముకు చక్కటి ఆకృతి వస్తుంది.
  4. భుజాలు గట్టిపడును.

Step-2

చేయు విధానం : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచుతూ తివాచిపై సమస్థితిలో నిల్చోవాలి. శ్వాస వదులుతూ తలను కుడివైపుకు వంచుతూ కుడి అరచేతితో ఎడమ మోకాలి క్రింద తాకాలి. ఎడమ చేతిని ఎడమ చెవి తాకునట్లుగా చాచి, ఎడమ అరచేతిపై దృష్టి నిలపాలి. తదుపరి కుడివైపు చేసిన విధంగానే ఎడమవైపు చేయాలి.

ఉపయోగాలు

  1. Step 1 లోని అన్ని ప్రయోజనాలతో పాటు ఛాతీ ధృడఁగా తయారగును.

గమనిక: యథాస్థితికి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోవాలి.

సమ ఉత్కటాసన్

ఉత్కటాసనం

ఉత్కట అంటే ఎత్తు అని అర్థం. ఈ ఆసన స్థితి ఎత్తులో కూర్చున్నట్లు ఉండటం వలన ఉత్కటాసన్ అనే పేరు వచ్చింది. దీనిని నాలుగు విధములుగా వేయవచ్చు.

ఊర్థ్వ ఉత్కటాసనం
  1. సమ ఉత్కటాసన్ : ముందుగా రెండు కాళ్ళ దగ్గర చేసి తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. రెండు చేతులను ముందు నేలకు సమాంతరంగా చాచాలి. నెమ్మదిగా శ్వాస విడుస్తూ మోకాళ్లను సగం వంచి మడమలను పైకెత్తి వేళ్ళపై కూర్చోవాలి. దీనిని చేతులు పైకి ఎత్తి కూడా చేయవచ్చు. దృష్టిని సూటిగా కేంద్రీకరించి ఉంచాలి.
  2.  ఊర్థ్వ ఉత్కటాసనం – ముందుగా తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తరువాత పాదములను వ్యతిరేక దిశలో ఉంచి, చేతులను పైకి తీసుకొని వెళ్లి నమస్కార ముద్రలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళ వద్ద వంచుతూ కుర్చీపై కూర్చున్నట్లు కూర్చోవాలి. దృష్టి ఒకదానిపై సూటిగా కేంద్రీకరించాలి.
  3. స్థిర ఉత్కటాసనం – తివాచీపై సమస్థిలి నిల్చోవాలి. తదుపరి చేతుల్ని, కాలి మడమల్ని పైకెత్తాలి. చేతుల్ని మోకాళ్లపైకి తీసుకొని వస్తూ కాలిమడమలపై పిరుదులు ఆనేటట్లు కూర్చోవాలి. దృష్టిని సూటిగా ఉంచాలి. ప్రారంభంలో పదిసెకన్లు ఉంటూ తరువాత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.
  4. ఏకపాద ఉత్కటాసనం – ముందుగా తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలిని మడిచి ఎడమకాలి పైభాగంలో కుడిపాదంను ఉంచి నిటారుగా రెండు చేతులను పైకెత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడమ మోకాలిని వంచుతూ కుర్చీలో కూర్చున్నట్లు కూర్చోవాలి. ఇదేవిధంగా మరో కాలుతో చేయాలి. దృష్టిని సూటిగా కేంద్రీకరించాలి.
ఏకపాద ఉత్కటాసనం

ఉపయోగాలు :  

  • నడుము, కండరాలు, శక్తివంతం అవుతాయి.
  • బోధకాళ్ళు సరిచేయబడతాయి.
  • గుండెకు మేలు చేకూరుతుంది.
  • కీళ్ళ నొప్పులు, మూలవ్యాధులు నయమవుతాయి.
  • మలబద్దకం ఉండదు.

ఏకపాద ఉత్కటాసన్ లో వీటితోపాటు తొడ కండరాలు, వెన్నెముక మరింత బలోపేతం అవుతాయి.

గరుడాసనం – గరుడ అంటే గ్రద్ధ. ఈ ఆసనం గ్రద్ధ ఆకారంలో ఉంటుంది. కావున  గరుడాసన్ అనే పేరు వచ్చింది. ఇది అందరూ వేయదగిన ఆసనం.

చేయు విధానము : తివాచీపై సమస్థితిలో నిల్చొని ఎడమ తొడను కుడి తొడ ఎడమ చేతిని కుడిచేతితో చుట్టి రెండు అరచేతులను నమస్కరిస్తున్నట్లు చేసి వీపును తలను నిటారుగా ఉంచాలి. తరువాత ఎడమవైపు కూడా కుడివైపు మాదిరిగానే చేయాలి. ఆసనం వేయునపుడు శ్వాస వదులుతూ గోడ కుర్చీ మాదిరిగా కూర్చోవాలి. తరువాత శ్వాస తీసుకుంటూ సమస్థితిలోకి రావాలి.

అర్థచంద్రాసనం

ఉపయోగాలు: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

  •  వెన్నెముక దృఢంగా తయారగును.
  • రక్తనాళాలు బాగా సాగి బలపడతాయి.
  • వరి బీజం తగ్గుతుంది.
  • వృషణాల వాపులు, నొప్పులు ఉండవు.
  • గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది.
  • సర్వయికల్, థైరాయిడ్ తగ్గును.

అర్థచంద్రాసనం : తివాచీపై వజ్రాసనంలో కూర్చొని తరువాత మోకాళ్ళపై నిల్చొని రెండు చేతులను ఛాతీపై కలిపి ఉంచాలి. సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ తలను వెనుకకు తీసుకెళ్ళాలి. జననాంగం, మలనాంగం బంధించాలి. ఉండగలిగినంతసేపు ఉండి మరలా యధాస్థితికి రావాలి.

ఉపయోగాలు – నడుము నొప్పి, వెన్నెముక సమస్యలు తొలగిపోతాయి.

  • థైరాయిడ్ సమస్యలు, జననేంద్రియ సమస్యలు, ఉదర సంబంధిత తొలగిపోతాయి.
  • ముఖవర్చస్సు పెరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది..
  • కండరాలు గట్టి పడతాయి.
అర్థశీర్షాసనము

అర్థశీర్షాసనము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. వీలయినంత దూరంగా రెండుకాళ్ళను జరిపి, చేతులను నేలకు సమాంతరంగా అరచేతులు నేలను చూస్తున్నట్లు ఉంచాలి. గాలిని నెమ్మదిగా వదులుతూ ముందుకు వంగి అరచేతులను నేలపై ఉంచాలి. తదుపరి నెమ్మదిగా శ్వాస విడుస్తూ చేతుల సహాయంతో తలను కూడా నేలకు ఆనించాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకున్న తరువాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి రావాలి.

ఉపయోగాలు     – తలకు రక్త్రపసరణ బాగా జరుగును. 

  • కంటిచూపు మెరుగుపడుతుంది.
  • కాలి మరియు చేతి కండరాలు బలపడును.
  • వీపు నొప్పి తగ్గిపోవును.
  • నిద్రలేమి, మలబద్ధకం పోతుంది.
  • పక్షవాతం రానివ్వదు.

అర్థచక్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి నెమ్మదిగా రెండు చేతులను నడుముపై ఉంచి, శ్వాస తీసుకుంటూ వీలయినంత వెనకకు వంగి ఆకాశంవైపు చూడాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకున్న తరువాత శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు

  • వెన్నెముక, మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారగును.
  • మెడనప్పులు, నడుము నొప్పులు తగ్గిపోవును.
  • భుజాలు గట్టిపడును.

ఉత్తట అర్థచక్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు చేతులను జతచేసి నాభిస్థానము నందు ఉంచి నెమ్మదిగా శ్వాస వదులుతూ నడుమును వీలయినంత వెనుకకు వంచాలి. ఈ స్థితిలో 4,5 శ్వాసలు తీసుకొని మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు:

  • థైరాయిడ్ సమస్య తగ్గును.
  • తలకు ఆక్సిజన్ బాగా అందుతుంది.
  • వెన్నెముక, మెడ కండరాలు, ఛాతీ కండరాలు మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారగును.

ఊర్థ్వ ఉష్ట్రాసనము – తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు చేతులను పిరుదులపై ఉంచి శ్వాస తీసుకొంటూ వీలయినంత వెనుకకు వంగాలి. 4,5 శ్వాసల అనంతరం మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి.

ఉపయోగాలు – ఉత్తిట అర్థచక్రాసనములోని ఉపయోగాలతోపాటు పొట్టలోపలి కండరాలు ఆరోగ్యంగా తయారగును.

ఖగాసనము : తివాచీపై సమస్థితిలో నిల్చోవాలి. తదుపరి రెండు కాళ్ళ మధ్య అడుగుదూరం ఉంచి మోకాళ్ళపై కూర్చోవాలి. మోకాళ్ళపై చేతులుంచి ఎడమ మోకాలిని కుడిపాదంపై ఉండేలా శ్వాస విడుస్తూ కుడివైపుకు తిరగాలి. మరలా శ్వాస తీసుకుంటూ యధాస్థితికి రావాలి. ఇదే విధంగా కుడి మోకాలిని ఎడమపాదంపై ఉంచి శ్వాస విడుస్తూ ఎడమవైపుకు తిరగాలి.

ఉపయోగాలు : మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ పోతుంది.

  • మెడ ఛాతీ కండరాలు ఆరోగ్యవంతంగా ఉండును.
  • నడుము ఆకర్షణీయంగా తయారగును.
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఆగస్టు – వర్ష ఋతువు మయూఖ సంపాదకీయం

by mayuukha August 15, 2022
written by mayuukha

స్వతంత్రత – నీవు

ఈ జీవన పోరాటంలో అనునిత్యం అనుక్షణం కొత్తదనాన్నే ఆస్వాదిస్తారెవరైనా! కాని ఒప్పుకోరు. బ్రతుకు బడి చాలా పెద్దది. కూర్చుని చదువుకోని పాఠాలన్నో ఉంటాయి. పాఠాలు నేర్పని గురువులా కాలం వెంటనే ఉంటుంది.
చాలా విషయాల్లో తేలికగా తీసుకునే మనిషి తన అస్తిత్వానికి దెబ్బ అనుకుంటే మాత్రం సహించని స్థితి ఉంటుంది
పరాయిపాలనలో నికృష్టంగా ఉండే కష్టాలేమీలేవు ప్రస్తుతం , కానీ .. . ఈ “కానీ” కి చాలా అర్థాలున్నాయి. ఆ నాటి పరిస్థితులేవీలేని పరమ స్వేచ్ఛగా వెళ్ళదీసుకునే వీలున్నదిప్పుడు. కానీ…
భూగోళం మీద దాదాపు తొంభై శాతం ఆక్రమించి పాలించిన ఒక చిన్న దేశం బ్రిటన్! సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అంటూ ఉంటాము . అంటే ఏంటి ? అంటే బ్రిటన్ దేశం లో సూర్యుడు అక్కడ అస్సలే అస్తమించడా?కాదు! బ్రిటన్ లో కూడా సూర్యాస్తమయం అవుతుంది.మరెందుకు ఈ మాట అంటారు? అంటే, ప్రపంచం లో ఎక్కడచూడూ అన్ని దేశాలు బ్రిటిష్ వారి పాలనలోనే అప్పుడు ఉండేవి . భూమి ఎటుతిరిగినాగానీ అటు సూర్యుడు కనిపిస్తాడు ,సూర్యరశ్మి ఉంటుంది. ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలుగానే ఉండేవి. దీంతో “సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని “అని అనడం పరిపాటి అయ్యింది.
మన భారతదేశాన్ని కూడా బ్రిటషర్లు అలా యుక్తి , కుయుక్తులతో చేజిక్కించుకుని ఓ రెండు వందల సంవత్సరాలు పాలించారు. మనదేశ సంపద కొల్లగొట్టి, మనని మనుషులు గా చూడక అవమానపరుస్తూ హీనాతిహీనంగా చూసేవారు. అన్నదమ్ముల మధ్య , రాజ్యాలమధ్య , సంస్థానలమధ్య విభేదాలు సృష్టించి విభజించి , ఐదు ఆవులు ఒక పులి కథ లాగా మన పాలకులను అంతం చేసి తమ హస్తగతం చేసుకున్నారు. అన్నేళ్ళల్లో వాళ్ళు చేయని అరాచకం లేదు. మన విజ్ఞాన గ్రంథాలను, మన పండితులను ఎత్తు కెళ్ళి సంస్కృత భాషలో ఉన్న ఆయా శాస్త్రాలను ఇంగ్లీష్ లో కి అనువాదం చేయించి ప్రయోగాలు చేసుకున్నారు . ఆధునిక విజ్ఞాన సంపన్నులైనారు. మన దేవాలయాల లోని విగ్రహాలను ఎత్తుకెళ్లి వాళ్ళ మ్యూజియంలలో పెట్టుకున్నారు.అవి చూస్తున్నప్పుడు కడుపు తరుక్కుపోతుంది. అందమైన గాజు నిర్మాణాల్లో మన ఆధ్యాత్మిక అమృతవాహిని ని బంధించారు కదా అని మనసు అల్లకల్లోలమైపోతుంది.
ఇవన్నీ మేధావులకు తెలుసు . కానీ ఇవి తెలియని తరాలు వచ్చాయి . మారిన తరాలకు మన వీరులు , మన సైనికులు , మన నాయకులు పడిన కష్టాలు తెలియాలి. ఎన్ని ప్రాణాలు పోతే ఈ స్వాతంత్ర్య సాధించుకున్నామో తెలియాలి . లేకుంటే చాపక్రింద నీరులా వస్తున్న దేశ ద్రోహం మన పిల్లలకు ఈ కొత్త తరాలకు తెలియదు, అర్థం కాదు. ఆక్రమించే రూపం మారవచ్చు, అణగద్రొక్కే విధానం మారవచ్చు వాళ్ళ విషపు చూపులను పసిగట్టేందుకు కొత్త స్ఫూర్తి ఇప్పుడు అవసరం . వడ్డించిన విస్తరి అయింది మన దేశం . రేపటి రోజులలో “… చింపిన విస్తరి కావద్దు” ఇది ఈ అమృతోత్సవ శుభ సందర్బంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి . ఇది ఒక ప్రత్యేక అవసరం. మనకాలంలోనూ ఇప్పటికీ యుద్ధాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం కూడా! పరోక్ష యుద్ధాలు ఏవో సభ్యసమాజానికి తెలుసు . ప్రత్యక్ష యుద్ధం కూడా జరుగుతున్నది . ఆక్రమణకు గురయ్యే దేశం ఎంత , ఎన్ని విధాలుగా నష్ట పోతున్నదో తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని , గమనింపులోకి తెచ్చుకొని మనం మన దేశాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఈ వజ్రోత్సవ సందర్భంగా మనమంతా , మన యువతరమంతా భారతదేశ సమగ్రతకోసం ఆలోచనలను పదునుపెట్టాలి. రేపటి తరానికి ఏ కష్టాలు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఒక్క గొంతుకలం కావాలి . నా దేశ సర్వోన్నతి నేను ఏం చేస్తున్నాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి, దేశ సుభిక్షత కోసం నేను ఏం చేయాలి అని నిన్ను ప్రశ్నికుని పూని ఏమైనా మేలు చేయాలి . అప్పుడే నీదే అనుకునే స్వతంత్ర భారత దేశం నీదవుతుంది.

అందరికీ డెభ్భై ఏళ్ల భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్ !!

August 15, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

జలం – ప్రాణ ధార                              

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ August 15, 2022
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్


జలం ఉనికి ఎప్పుడూ ఒక రహస్యమే! జలం పరుగు ఎప్పుడూ ఒక రాజకీయ పన్నాగమే!
జలాలపై చర్చ ఒక సాలెగూడు అల్లికయే! జలం ఎప్పుడూ ఒక పోరాటానికి ఎజెండానే!
తెలియదు గాని – జల అస్తిత్వపు దేహంపై గాయం చేసేదెవరో !?
ప్రకృతికి, పర్యావరణానికి, మానవ మనుగడకు సారాన్ని అందించే
జలం మనుగడకే ఎసరు పెట్టే కుతంత్రం ఎవరిదో?
జడత్వానికి చేతననిచ్చే జలస్పర్శకు విష తుల్యం చేసే ప్రణాళికలు –
మంచి నీటి చుక్కై గొంతు లోకి ప్రవహించి – గుండె లయకు జీవ సంగీతాన్నందించే గుక్కెడు జలాన్ని
కళ్ళలో ఉప్పు నీటి సంద్రమై ఎగసిపడే అలలుగా చేసి ఆనందించే రాక్షస క్రీడలు ఎవరివో?

* * *

విషాద వలయంలో వారు, అగాధాల చీకట్లలో వారు
వర్తమానపు విచారాలను మరిచి- రేపటి వెలుగు కిరణాల దాహార్తులుగా బలిపశువులై వారు
ఎండిన డొక్కలతో తడి మట్టి వాసనలకై పొడి బారిన నాలుకలు చాచి వారు
వేయి కలలతో – నిద్ర కళ్ళతో వారు

* * *

ఇక – వేదనాభారంతో పూడుకుపోయిన గొంతుకల పూడికలు తవ్వి తీద్దాం
మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు, హరిత హారాలను ఆయుధాలుగా చేద్దాం
గొలుసుకట్టు చెరువులను నిండు కుండల్లా మార్చుకుందాం
రేపటి ఉదయాలలో వానచినుకుల ధ్వనులతో నేటి తరాన్ని మేల్కొలుపుదాం
ఇంతకాలం దుఃఖ స్వరాలతోనే సుప్రభాతాలు విన్నాం
ఇంతకాలం వొడిలోని పాప అమాయకపు కళ్ళలోని చిలిపి తనాన్ని చూడనేలేదు
సంవత్సరాల నిరీక్షణలో ముక్కలైన గుండెలను ఎవ్వరి సాంత్వనతో అతికించను,
ఇకనైనా ప్రశాంతంగా జీవించనీ – కాలం తన నియతిలో నిజాయతీగానే సాగనీ –
అమాయక జీవుల సిరలలో జలాన్ని ప్రాణ ధారయై ప్రవహించనీ !!

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

‘నేను సైతం’

by Peddurti Venkatadasu August 15, 2022
written by Peddurti Venkatadasu

(స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నా కవిత.)

వెలుగును పంచుతూ బతుకును బలిఇచ్చే-
కొవ్వత్తిని కాను…..
కాసేపు మెరిసినా కళ్ళ కద్దుకునేలా బతుకును సాగించే –
కర్పూరాన్ని కాను…..
తాను అరిగిపోతూ కూడా సుగంధ పరిమళాన్ని అందిస్తూ మురిసే –
గంధపుచెక్క ను కాను…..
అంధకారం అలుముకున్న బతుకుల్లో అజ్ఞానాన్ని తొలగించే –
అక్షరం ముక్కను కాను…..
నీడ నిస్తూ,పూలనిస్తూ,ఫలాలనిస్తూ, ప్రాణవాయువు నందిస్తూ –
రకరకాల గృహోపకరణాల రూపంలో సేవలందిస్తూ –
సస్యశ్యామలంగా నా దేశాన్ని నిలుపుతూ –
మొడై పండు ముదుసలిలా చిక్కి శల్యమై ఎండుకట్టేలా మారినా –
కడకు కాలుతూ కూడా పరులకు పనికొచ్చే –
తరువును అసలే కాను…..
అందుకే ఎందుకు ఈ బతుకు అనుకున్నా –
మనిషినై ఈ మట్టిలో పుట్టినందుకు –
నా జన్మభూమి కి ఒక్క మంచి పనైనా చేయాలనుకున్నా –
అవసరమైతే – దేశంకోసం
నా దేహాన్ని – అర్పించాలనుకున్నా!!

                
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శోకం లేని లోకం …

by Rama Devi Nellutla August 15, 2022
written by Rama Devi Nellutla

ఈ భూమి పుట్టినప్పుడే నా దేశం పుట్టింది
నేల నాగరికత నేర్చినప్పుడే ఇక్కడ నాగరికత విలసిల్లింది
ప్రపంచ పటంలో చిన్న భాగమే అయినా
అధిక మానవ వనరుల్ని అందిస్తున్న దేశం
రణక్షేత్రం నడుమ గీతోపదేశం అందించిన దేశం
మూడు సముద్రాల మధ్యనున్న మానవ మహా సముద్రం
కోహినూర్ వజ్రంతో బాటు కోట్లాది అపురూప వ్యక్తులకు జన్మనిచ్చిన రత్నగర్భ
వేదాలను అందించడమే కాదు వేదాంతాన్ని తెలియజేసిన నేల
సున్నాను కనిపెట్టి శూన్యంలో అనంతం ఉందని చాటి చెప్పిన భూమి
తిరిగొచ్చే దారి తెలియక పోయినా పద్మవ్యూహం లోకి
చొచ్చుకు పోయే యోధులు పుట్టిన గడ్డ
హంసను బాణంతో బాధించిన దేవదత్తుడి పేరు చరిత్రలో మాసిపోయినా
లేపనం పూసి ఊరడించిన సిద్దార్ధుణ్ణి మరవక బుద్ధుణ్ణి చేసి నెత్తికెత్తుకున్న నేల
గాయం చేసిన వాడిని మరిచినా గాయం నయం చేసిన వాడిని మరువని ఔదార్యం కల జాతి
హంసలు నడయాడిన అవని
పరమ హంసల బోధనల పావని
ప్రపంచమంతా చెట్ల బెరళ్లు కట్టుకుని తిరిగినప్పుడు చీనాంబరాలు ధరించిన ధరిత్రి
సింధు నదీ లోయల్లో చిందులేసిన నాగరికతను సృజించిన భూమాత
సప్త సాగరాలకు సప్తస్వరాలను బహూకరించిన భరత మాత
కంప్యూటర్లు పుట్టక మునుపే మానవ కంప్యూటర్ ను కన్న మాతృ మూర్తి
జీలం నది సాక్షిగా కట్టించుకున్న ఒక్క దారపు పోగుకు
కట్టుబడిన పురుషోత్తముల సౌభ్రాతృత్వం
నరేంద్రుడే వివేకానందుడై చిన్న ఊరి నుండి చికాగో దాకా పాకిన విజ్ఞానం
మొక్కల్నీ కుక్కల్నీ పెంచడమే కాదు మొక్కుకునే ప్రజలున్న దేశం
నీళ్లకూ పూలకూ హారతులిచ్చే ధరణి
పుట్టలనూ గుట్టలనూ పూజించే పుడమి
ఎలుకలకూ , ఏనుగులకూ ఒకేలా దండం పెట్టే దేశం
ఆహారమడిగిన డేగకు సైతం తొడను కోసి ఇచ్చిన శిబి దాతృత్వం
పర్యావరణ స్పృహ లేనప్పుడే ‘వృక్షో రక్షతి రక్షిత ‘అని చాటిన ధరిత్రి
జీవ వైవిధ్య రక్షణ మాట తెలియనప్పుడే పాములకు సైతం పాలు పోసి పూజించిన భూమి
నల్లని రాళ్ళనూ , నల్లని దేవుళ్లనూ ఆరాధించే వర్ణ వివక్షత లేని వసుధ
యోగాతో ఆరోగ్యాన్నీ గీతతో వైరాగ్యాన్నీ గీతాంజలితో సాహిత్యాన్నీ
బహుమతి నిచ్చిన మహీమండలం
చుట్టుపక్కల మానవబాంబులు పుట్టుకొస్తున్న వేళ
మానవ ప్రేమే పరమావధిగా భావించిన నేల
నెత్తురోడుతున్న దేశాల దేహాలకు
శాంతి లేపనాన్ని పూసిన శ్వేత కపోతం
బక్క చిక్కిన దేహంతో బానిసత్వపు సంకెళ్లను తెంపిన
కారుణ్య మూర్తిని కన్న తల్లి
జగతికి శాంతి కాంతిని ప్రసరించి అహింసా మంత్రాన్ని బోధించిన అమృత మూర్తి నా భరత మాత !!
ఏడు దశాబ్దాల క్రితమైనా .. ఇప్పుడైనా నా దేశ పతాకానికి మూడే రంగులు
సత్యం .. శాంతి … అహింస ..
నా దేశ జెండా మధ్యలో ఎప్పటికీ అశోక చక్రమే !
నా జాతి లక్ష్యం శోకమే లేని సరి కొత్త ప్రపంచమే !!

August 15, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ముసురు

by Giriprasad Chelamallu August 15, 2022
written by Giriprasad Chelamallu

ఎన్నాళ్ళైంది వాన

వానాకాలం పొడవునా కురిసి

నేల దాహం నీ దాహం తీరేదాకా కురువు 

మీ ప్రేమ పరిపూర్ణత సాధించే దిశగా 

పరుగు పరుగున వచ్చి

చెరువు కట్ట రాతి ని ముద్దాడాలని 

ప్రవాహ పరువం తహ తహ

సంద్రమెరుగని పల్లె పడుచు

రాతి ని తాకి కట్ట మీద పడే జల్లు లో తడిసి

పరవశించే

ఎప్పుడెప్పుడు దూకుదామని

ఆతృతలో వాగు

అలుగు రాళ్ళ లెక్కెట్టుకుంటూ

ఒంట్లు నేర్చుకుంటుంది

అలుగు పారితే నమ్మకం తో 

కోసే యాట కోసం మైసమ్మ 

కళ్ళల్లో వత్తులు వేసుకుని 

ఎదురు చూస్తుంది 

మోట బొక్కెన లో

నాన బోసిన వడ్లు మొలకెత్తి

ఎప్పుడు అలుకుతావని రైతుని

మడి దున్నమని అడుగుతున్నాయి

ముసురు లో

జారుతున్న కట్ట తోవ మీద

విన్యాసాలు చేస్తూ

కొక్కెరలు తల మీంచి కింది దాకా వేసుకుని

బడి బాట పడుతున్న పిల్లలు

ఎదురెక్కే చేపల కోసం

ఎర గాలాలతో వాగొడ్డున

సోపతి గాళ్ళు  ముచ్చట్ల  మురిపాల్లో

మంచు ముత్యమెరుగని మర్రి

ఆకాశాన్నంటిన తాటాకు కొసన 

రాలనా వద్దా అని ఆలోచిస్తున్న వాన బిందువును

ఒడిసిపట్టుకుందామని నిరీక్షణ లో మర్రి ఆకు

కలిసి పెరిగిన 

వేప రావి సహజీవనం లో

రాలే చినుకులు కొత్త దనాన్ని

సృష్టిస్తున్నాయి

మోదుగు పువ్వుపై

రాలిన చుక్క ఎరుపు రంగు పులుముకుని

తంగేడు పూల జత కలిసి

కొత్త సంధ్య కోసం దారి పరుస్తున్నాయి 

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వెలుతురు చెట్టు

by కుడికాల వంశీధర్ August 15, 2022
written by కుడికాల వంశీధర్


అది నిన్నటి నీటిని,
ఈనాటి కన్నీటిని
పీల్చుకొని ఊపిరి పోసుకుంది.
ఆటంకాలని చీల్చుకొని,
చీకటి తొడుగుని
విప్పుకొని మొలకెత్తింది.

కొండగాలి కొంటెగా
హార్మోనియం వాయిస్తుంటే
అడుగుల్లో అమ్మోనియం నైట్రేట్
రైట్! రైట్! అంటుంటే
శ్రవణానందకరంగా
ఆకులు అల్లరి చేస్తాయి
నయన మనోహరంగా
కొమ్మలు ఊయలలూగుతాయి
కిరణజన్య సంయోగ క్రియతో
పరిసరమంతా
పత్రహరిత నర్తనమౌతుంది.

దాని వేర్లలో
నల్లని జాడలు ఇంకా ఉన్నాయి.
అయినా
ఆత్మీయతా వెలుతురు సోకినప్పుడల్లా
ఆకుపచ్చని ఆశలను కలగంటుంది

August 15, 2022 2 comments
1 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అత్యద్భుత యాత్రా ప్రదేశం లడక్

by Rangaraju Shyamsundar August 15, 2022
written by Rangaraju Shyamsundar

ఏం కొంచెం యాత్రా స్థలాల దర్శనానికి అవకాశం ఉన్నా ముందుండేది మేమే. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభలడంతో టూరిజం మొత్తంగా కుప్పకూలడం యాత్రా ప్రదేశాలపై కోవిడ్ ఆంక్షల వల్ల ఎక్కడకైనా వెళ్ళాలన్నా అవకాశాలు తగ్గిపోవడంతో రెండు సంవత్సరాల పాటు అన్ని ఆలోచనలకి, కోరికలకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది.

కొంచెం కొంచెంగా కోవిడ్ తగ్గుముఖం పడ్తున్న ఈ సందర్భంలో లడక్ యాత్ర గురించి మిత్రుల ద్వారా తెల్సుకొని ఎలా అయినా ఈసారి టూర్ మిస్ కావద్దు అనుకొని ముందుగానే వెళ్ళాల్సిన ప్రాంతం వివరాలు ఎక్కువగా తెలువకున్నా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం.

ప్యాకేజి అయితే బుక్ చేసుకున్నాం కాని, సహచర మిత్రులను ఆహ్వానిస్తే వారు మా ఆహ్వానం తిరస్కరించడమే కాకుండా ఒకరకంగా మమ్మల్ని టూర్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిదని వత్తిడి తేవడం ప్రారంభించారు. వాళ్ళు చెప్పిన విషయం సూక్ష్మంగా ప్రపంచంలోనే అతి ఎత్తైన కర్ దుంగ్లా పాస్ 18000 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఆ శిఖరాలు అన్ని మంచుతో కప్పబడి ఉంటాయని, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి హై ఆల్ టిట్యూడ్ సిక్ నెస్ తో వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ ప్రాంతంలో అక్కడక్కడ మిలటరీ క్యాంప్స్ తప్ప పెద్దగా జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటాయని వైద్య సౌకర్యాలు కూడా చాల తక్కువగా ఉంటాయని, ప్రయాణించే ప్రతి వెహికిల్ లో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా క్యారీ చేస్తారని, ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్ ద్వారా ధృవపత్రం అందజేస్తేనే ప్రయాణానికి అనుమతి ఉంటుందని వివిధ కారణాలతో మాతో లదాక్ రావడానికి ఉత్సాహం చూపలేదు. మేము మాత్రం ఈ టూర్ ఎలా అయినా వెళ్ళాలనే దృఢ నిశ్చయంతో ప్రయాణానికి సన్నాహాలు మొదలు పెట్టాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకసారి ఈ

ప్రాంత విశేషాలను, ఈ ప్రాంతాలు దర్శించిన యాత్రికుల అనుభవాలు కొంత ఉపయోగపడతాయని

వివరాలు సేకరించడం మొదలు పెట్టాం.

మొట్టమొదటగా ఈ ప్రాంతంలో కొంతకాలం పనిచేసిన ఒక డాక్టర్ మిత్రున్ని సంప్రదించి మేం లడక్ వెళ్తున్న విషయం చెప్పగానే చాలా పెద్ద సాహసయాత్ర చేయబోతున్నావ్ అంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించి, అక్కడ పరిస్థితులను, అసౌకర్యంగా ఉన్నప్పుడు ఏ సమయాల్లో ఏం మందులు అవసరమో వివరంగా చెప్పడంతో నేను నా డైరీలో వాటికి సంబంధించిన వివరాలను నోట్ చేసుకుని భద్రపరచుకున్నా. దీనితో పాటు యాత్రలో సందర్శించబోయే ప్రాంతాలు, వాటికి సంభంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంతో మునిగిపోయా.

ఇక లడాక్ వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ రూఫ్ టాప్ గా పరిగణించే లడక్ ఒక సుందరమైన ప్రదేశం. పర్యాటకులకు స్వర్గధామం. ముఖ్యంగా జూన్, జులై మాసాల్లో అయితే లడక్ లోని వివిధ ప్రాంతాలు సందర్శించుకోవడానికి చాలా మంది యాత్రికులు ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు వారి సైకిల్ మోటార్లపై సాహసోపేతంగా ప్రయాణించడానికి ప్రపంచంలోని అతి ఎత్తైన ప్రాంతం ఐన కార్డుంగ్ లాపాస్ ప్రాంతానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

ఈ ప్రాంతంలో విహరించిన వారం రోజులు ప్రకృతిలో లీనమయినట్టుగా జీవితం సాగిపోయింది, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అన్నట్టు ఉండే కరెంటు. ఎప్పుడో ఒక సారికాని కనెక్ట్ కాని ఫోన్, స్వచ్ఛంగా తెల్లగా మెర్సిపోతున్న మంచు కొండలు, గడ్డకట్టి చలిగాలులు, ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాలు, కిలోమీటర్ల కొద్ది కానరాని మనుషులు, కుడివైపు అంతా కారకోరం పాస్ పర్వత శిఖరాలు, పర్వతాలపై పడి కర్గి పోతున్న మంచు తాలుకు నీటితో లోయలోకి ప్రవాహంలా దూసుకపోతున్న సయోక్ నది ఎడమవైపు ఎంతో ఇరుకైన రహదారి మనని ఎంతో ఆహ్లాదంలో, ఆనందంలో ముంచెత్తుతాయి.

లడక్ ప్రాంతంలో గల లెహ్ ప్రాంతం సముద్రమట్టానికి 11562 అడుగుల ఎత్తున ఉండే అందమైన ప్రదేశం ఇది. పురాతన చరిత్ర పరిశీలిస్తే మొదటి శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి కాలంలోనే లడక్ నుండి ఇండియాకు చైనా ద్వారా వ్యాపార సంబంధాలు ఉండేవని దీన్ని సిల్క్ రోడ్ గా వ్యవహరించారని ఇండియాలోని చివరి గ్రామమైన తు తు అనే గ్రామ ప్రాంతం ద్వారా సిల్క్ రూట్ గా ప్రాముఖ్యత వహించిన ప్రాంతం ఇప్పటికి దర్శనీయ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది.

పర్యావరణ మార్పులు, మామూలు వర్షపాతం కంటే అత్యధిక వర్షం పడ్తున్న ప్రాంతాల్లోని 100 ప్రాంతాల్లో ఈ పాతనగరమైన లేహ్ కూడ ఉంది. యాత్రా ప్రదేశమవడం చేతను, జనాభా అధికంగా పెరగడం వల్ల నగర విస్తరణ లేకపోవడం మూలాన, అత్యధిక వర్షపాతం వల్ల వచ్చే ఆకస్మిక వరదలూ ఈ ప్రాంత సురక్షితాన్ని ప్రశ్నిస్తున్నాయి.

లడక్ అంటేనే ల్యాండ్ ఆఫ్ హై పాసెస్ గా పరిగణిస్తారు. ఈ మౌంటేన్ రేంజెస్ సముద్రమట్టానికి 16400 అడుగుల నుండి 22000 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇవి దాదాపు 45 మిలియన్ సంవత్సరాల క్రితం తయారు అయినట్టుగా పరిగణిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని కారకోరం పాస్ శిఖరాలు సముద్రమట్టానికి 18875 అడుగుల ఎత్తు నుండి 25171 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.

ప్రపంచంలోనే అతి ఎత్తైన మోటరబుల్ రోడ్ ఈ ప్రాంతంలోనే ఉంది. మౌంటేన్ బైకింగ్ కు ఎంతో ప్రాముఖ్యంగా ఉండే ఈ రోడ్డు సముద్ర మట్టానికి 17893 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతాన్ని కర్ దుంగ్ లా పాస్ గా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ ప్రాంతంలోనే జాన్ స్కర్ నది మరియు ఇండస్ నది రెండు కల్సి ఇండస్ నదిగా మారి పాకిస్తాన్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.

దక్షిణ ఆసియాలోనే అతి పెద్ద పార్కైన హెర్నీస్ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంది.

వారం రోజుల లడక్ యాత్ర ఆ రోజు ఉదయం నాలుగు గంటలలో ప్రారంభమయింది. ప్రొద్దున్నే 7 గం||లకు ఫ్లైట్ ద్వారా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుండి లేహ్ ఎయిర్ పోర్టుకి మద్యాహ్నం వరకు వెళ్ళడం జరిగింది. లేహ్ ఎయిర్ పోర్టులో దిగగానే అతి ఎత్తైన ప్రదేశం అవడం మూలాన హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ వచ్చేసిందా అనే మానసిక వత్తిడి ఫీల్ అవడం కూడా జర్గి పోయింది. ఏదో ఒక అనిర్వచనీయమయిన భయం ఆవహించి ఎంత తొందరగా రూంకి వెళ్ళి, చలికి తట్టుకునేలా నూతన వాతావరణానికి, హై ఆల్ ట్ట్యూడ్ కి శరీరం తట్టుకునేలా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి వెహికిల్ లో కూర్చున్నాం. థెర్మల్ తో సహా 4 లేయర్స్ తో డ్రెస్ వేసుకున్నా ఇంకా చలిగా ఉండడంతో ఒక్కసారిగా మిత్రులు లడక్ ప్రయాణమంటే ఎందుకు భయపడ్డారో అర్థం అయింది. ఈ ప్రాంతం చూడాలనే ఉత్సుకత ఎంతో ఉన్నా, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాక ఒక విధమైన నిర్వేదం, భయం ఆవహించాయి. హై ఆల్ టైట్యు లో తట్టుకోవడం కోసం మా డాక్టర్ సూచించిన డయామోక్స్ 250 ఆ రోజు విమానంలో వేసుకోవడంతో దాని పనితనం కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. సహచర తోటి ప్రయాణీకుల్లో ఉన్న తలనొప్పి, అసస్వత మాలో చాలా తక్కువ

శాంతి స్థూపం

మోతాదులో ఉన్నట్లు ఫీల్ అయ్యాం . మాకు కేటాయించిన రూంకి వెళ్ళి వేడివేడిగా టీ త్రాగి, తోటి యాత్రికులతో కాసేపు కబుర్లతో గడిపాము. అప్పటికి కొంత యాంగ్లైంటీ తగ్గింది. హోటల్ లో సర్వ్ చేసిన వేడివేడి ఫుడ్ తినేప్పటికి కొంచెం కొంచెం నార్మల్ స్థితికి వచ్చినట్టుగా రిలాక్స్ అవడం జర్గి, ఆ రోజు క్రొత్త క్రొత్త అనుభూతులతో రాత్రంతా చలితోనే గడిచిపోయింది.

ఆ తర్వాత రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ చేసి ఆ రోజు దర్శనీయ ప్రాంతాల్లో మొదటిదైన ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా పేరుగాంచిన శాంతిస్తూపం దర్శించడం జరిగింది. ఇక్కడ సూర్యోదయ, సూర్యాస్తమయలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇది 11841 అడుగుల ఎత్తులో చాన్స్పా అనే కొండపై, చంద్ స్పా అనే గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ తెల్లని స్తూపం. 1991లో జపనీస్ బౌద్ధ బిష్ణువు గ్యామియో నకమురా చే నిర్మింపబడి 14వ దలైలామ టెస్టిన్ గ్యాట్సో ద్వారా ఆగష్టులో ప్రతిష్టించబడింది.

రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా, నాగసాకి పై జర్గిన అణుబాంబుల దాడిలో దాదాపు 150000 సామాన్య ప్రజలు మరణించాక జపానీ బుద్ధిప్ట్ మాంకు నిచిదత్యుపూజి ఆధ్వర్యంలో ప్రపంచశాంతి కోసం దాదాపు 80 పీస్ పగోడాలు ప్రపంచవ్యాప్తంగా నిర్మించడం జర్గింది. ఇందులో భాగంగా నిర్మించిందే ఈ శాంతిస్తూపం.

ప్రపంచశాంతి మరియు ప్రపంచ శ్రేయస్సులను ప్రోత్సహించడానికి బౌద్ధమతం యొక్క 2500 సంవత్సరాల జ్ఞాపకార్థం దీని నిర్మాణం ఏప్రిల్ 1983లో ప్రారంభమైంది. శాంతి స్థూపం రెండు అంతస్తుల నిర్మాణంగా కల్గి ఉండి మొదటి అంతస్తులో బంగారు బుద్ధ విగ్రహ చిత్రం, రెండో అంతస్తులో బుద్ధుని పుట్టుక, ధ్యానం మరియు మహా నిర్యాణం చిత్రాలు దర్శనమిస్తాయి.

ప్రపంచ శాంతి కోసం నిర్మించిన అద్భుత కట్టడం శాంతిస్థూపం దర్శించుకున్న జ్ఞాపకాలతో ఇంకో ప్రాచుర్య పర్యాటక స్థలం అయిన లెహ్ ప్యాలెస్ దర్శించుకోవడం కోసం వెళ్ళాం. లేహ్ ప్యాలేస్ గా పిలువబడే లాచన్ ఫాల్కర్ ప్యాలెస్ 1645 సం||లో సెంగే న్యాంగన్ నిర్మించిన పూర్వపు టిబెట్ స్టైల్ లోని రాజభవనం. 19వ శతాబ్దంలో డోగ్రా సేనలు లడఖ్ ని తమ ఆధీనంలోకి తీసుకొనే వరకు ఈ రాజభవనం నివాస యోగ్యంగా ఉండేదని చెప్తారు, 9 అంతస్తులుగా ఉన్న ఈ రాజభవనంలో 9వ అంతస్తులో రాజకుటుంబ వసతిగా ఉండేది. క్రింది అంతస్తులో రాజకుటుంబ సహాయకులు, మధ్య అంతస్తులో రాజకీయ ఇతర కార్యకలాపాలకు ఉపయోగపడేలా వివిధ సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆకస్మికంగా వచ్చే వరదలను, భూకంపాలను తట్టుకునేలా ఉన్న ఈ మట్టి/రాతిలో ఉన్న నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చాలా వరకు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో అవసానదశలో ఉన్న ఈ నిర్మాణంలో 450 సం||ల వరకు పూర్వం చిత్రించిన చిత్రాలు మనం దర్శించుకోవచ్చు. మొత్తం 9 అంతస్తులు ఎక్కి చూడ్డానికి చాలా మంది యాత్రికులు ఉత్సాహంతో ప్రయత్నించారు. ఇరుకుగా ఉన్న వుడెన్ స్టెప్స్, అంతస్తు, అంతస్తు ఎక్కటంలో ఉండే అలసట, ఎక్కువగా చలిగా ఉండటమూ కొంత నిరుత్సాహం కల్గించినా, 9వ అంతస్తు పై భాగంలోకి వెళ్ళాక ఎంతో అద్భుతంగా కన్పిస్తుంది ఈ ప్యాలెస్. అక్కడ నుంచి చుట్టూ కనుచూపు మేరలో కన్పిస్తున్న నివాసాలు, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది.

లేహ్ ప్యాలేస్ నుండి ఎంతో ప్రాముఖ్యం గలది, తప్పని సరిగా చూడాల్సిన ప్రాంతం అయిన “హల్ ఆఫ్ ఫేం”కి వెళ్ళడం జర్గింది. ఇండో పాక్ యుద్ధంలో ఇండియాను రక్షించడానికి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర భారత సైనికుల

జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మ్యూజియం లే కార్గిల్ రోడ్ ‘లేహ్‘ నగరానికి 4 కి.మీ. దూరంలో ఉంటుంది. కార్గిల్ యుద్ధ సమయంలో ఉపయోగించిన వివిధ రకాల ఆయుధాలు, స్వాధీన పర్చుకున్న ఆయుధాలు,

సియాచిన్ ప్రాంతంలో భారత సైన్యం ఉపయోగించిన వివిధ రకాల దుస్తులు, మంచులో కర్తవ్య నిర్వహణలో ఉన్న సైనికుల చిత్రాలు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న యుద్ధ చిత్రాలు, దేశాన్ని కాపాడడం కోసం తమ ప్రాణాలను అర్పించిన సైనికుల చిత్రాలు మనకు ఎంతో ఉత్తేజాన్ని కల్గించడమే కాకుండా సైనికులు చేస్తున్న త్యాగాలకు జోహార్లు అర్పించేలా మనసంతా దేశభక్తితో నిండిపోతుంది.

మూడవ రోజు ప్రయాణం ఎంతో ఉత్సుకత, ఉత్సాహంతో ప్రారంభమైంది. ప్రయాణం ఆద్యంతమూ హాలివుడ్ సినిమాల్లోనూ మెకనాస్ గోల్డ్ చిత్రాల్లోను చూపించిన లొకేషన్స్ మాదిరిగా ఎత్తైన కొండలు, లోతైన లోయలూ, ఆ ప్రాంతమంతా ప్రకృతి తప్ప ఎవరూ లేనట్టుగా ఎంతో అద్భుతమయిన రోడ్లపై సాగింది మాప్రయాణం.

ఇక ఈ కర్ దుంగ్ లా పాస్ వివరాల్లోకి వెళ్తే ఈ మార్గాన్ని 1976లో ఆర్మీవారు సియాచిన్ ప్రాంతంలో పహారా కాచే సైనికులకు నిత్యావసర వస్తువులు, ఆయుధాలు చేరవేయడం కోసం నిర్మించబడిందని చెప్తారు. 1988 వరకు ఆర్మీ అవసరాలకు మాత్రమే దీన్ని వాడేవారు. ఆ తర్వాత యాత్రికులను కూడా అనుమతిస్తున్నారు. సంవత్సరంలో 9 నెలలు మంచుతో కప్పబడి ఉండే ఈ రోడ్డు కేవలం మూడు నెలలు మాత్రమే రహదారిగా వాడబడుతూ ఉంటుంది. కారకోరం శిఖరాలు ఒకదానితో ఒకటి పోటీ పడున్నావా అనే విధంగా ఆకాశం తాకుతున్నట్టుగా ఎత్తైన శిఖరాలు, కుడివైపు, లోతు కన్పించనంతగా లోయ, లోయలో మంచు కర్గి నీరు పారుతున్న దృశ్యాలు, ఎడమవైపు క్షణాల్లో ఆకాశంలో మారుతున్న అందమైన దృశ్యాలు చూస్తుంటె, లడక్ యాత్రికులకు ఎందుకు స్వర్గధామంగా విలసిల్లుతోందో ఆ ప్రదేశం చూడాలనే తాపత్రయం ప్రభలంగా ఎందుకు అన్పిస్తుందో అనుభవంలోకి వచ్చింది. కొంత దూరం వెళ్ళేటప్పటికి మంచు విపరీతంగా కురవడంతో కొండలన్ని మంచుదుప్పటి కప్పుకున్నట్టుగా ఉన్న చిత్రం చూశాక మానసికంగా ఎంతో తృప్తిగా, అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడింది.

ఎత్తైన రోడ్డు, పైకి ఎక్కలేక, మంచులో కూరుకుపోయిన కార్లు, వాటిని తోయడానికి దిగిన లోకల్ డ్రైవర్లతో మొత్తం కార్ల కాన్వాయ్ ఆగిపోయింది. అందరూ తమ తమ కార్లలోనుంచి దిగి మంచుతో ఆడుకొనే దృష్యాలు, ఫోటోలతో, సెల్ఫీలతో ఆ ప్రదేశమంతా యాత్రికులతో నిండిపోయింది.

ప్రకృతిని, శిఖరాలను, లోయలో పారుతున్న నదిని, ఆకాశంలో మారుతున్న మేఘాలను చూస్తూ రెండు గంటల ప్రయాణం కొనసాగాక ప్రపంచంలోని ఎత్తైన కదుం యో పాస్ 18000 అడుగుల మైలురాయి రానే వచ్చింది. మొత్తం అన్ని కార్లు ఆగాక అందులోని యాత్రికులు క్రిందకు దిగి ఆ మైలురాయి వద్ద ఫోటోల కోసం వరుసలో నిలబడ్డారు.

నాకైతే ఉత్సాహంతో పాటు మానసిక సంఘర్షణ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైన మోటరబుల్ రోడ్ పైన ప్రయాణం చేస్తున్న విషయం సాహసోపేతంగా ఉంటే ఆప్రాంతంలో కొంచెం సేపైనా గడపాలంటె మరి అక్కడ ఉండే ఆక్సిజన్ మనకు సరిపోతుందా, ఇలాంటి ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు వస్తే ఎదుర్కోవడం ఎలా? మా వాహనంలో అయితే ఆక్సిజన్ సిలిండర్ ఉన్నాయి. కాని పార్కింగ్ ప్లేస్ నుండి కర్ దుంగ్ లా పాస్ ఓ మూడు, నాలుగు వందల ఫీట్ల దూరంలో ఉంటుంది. ఇలా మనసులో పరిపరివిధాలుగా ఆలోచనలు సుడితిర్గుతుంటే ఎలాగు ధైర్యం చేసి ఇంత దూరం వచ్చాం. అంటూ ధైర్యం చేసి కర్ దుంగ్ లా పాస్ మైల్ స్టోన్ దగ్గర ఫోటోలకు పోజులిచ్చి మరికొంత సేపు గడిపాంజ అప్పటికి మాత్రం జీవిత ధ్యేయం నెరవేరినట్టుగా, ఒక గొప్ప అనుభూతిని స్వంతం చేసుకున్న ఆనందంతో పాటు, గిన్నిస్ బుక్ రికార్డు సర్టిఫికెట్ సంపాదించినంత ఫీల్ అయితే వచ్చింది.

దారిలో సయాక్ వార్ మెమోరియల్స్ దర్శించుకొని సియాచిన్ ప్రాంతంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు అంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నాం.

ఆగుతూ, ఆగుతూ వెళ్ళడం మూలాన ప్రయాణం ఆలస్యం అయి భోజనాల సమయం కూడా దాటిపోయింది. సాయంత్రం నాలుగంటల సమయంలో డిక్ సిట్ మోనాస్టీ చూడ్డానికి వెళ్ళాం.

మోనాస్టీ పరిసర ప్రాంతం వెళ్ళెవరకు విపరీతమయిన వర్షం ప్రారంభమయింది. లడక్ ప్రాంతం అంతా వాతావరణం విషయంలో ఏ నిమిషానికి ఏం జరుగునో’ అన్నట్లుగా ఉంటుంది. కొద్దిసేపు విపరీతంగా ఎండ, కొంతసేపటికి వర్షం, కొంతసేపటికి విపరీతమయిన చలి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి.

ఈ డిక్ సిట్ మోనాస్టీ 10315 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దంలో చాంగ్ జెమ్ తెసరాజ్ జాంగో స్థాపించారు. ఈ మఠం సమీపంలో 106 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం సయాక్ నదికి ఎదురుగా నుబ్రావ్యాలీ వైపు ఉంటుంది. ఈ విగ్రహం నిర్మాణం ఏప్రిల్ 2006లో ప్రారంభించబడింది. దీనిని దలైలామ 25 జులై 2010న ప్రతిష్టించారు. మూడు ప్రధాన కారణాలతో దీనిని నిర్మించారని చెప్తారు. డిక్ సిట్ విలేజ్ రక్షణ, ప్రక్క దేశాలతో తదుపరి యుద్ధాన్ని నివారించడం మరియు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడం. నుబ్రా వ్యాలి, పరిసర ప్రాంతాలలో చలికాలంలో మంచుతో పూర్తిగా కప్పబడ్డాయి. ఈ సమయంలో ప్రజలకు ఈ మఠంలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించబడ్డాయి. ఈ మఠంలో మంగోలియన్ మరియు టిబెటన్ గ్రంధాలు కూడా ఉన్నాయి.

డిక్ సిట్ మోనాస్టీ నుండి అతి ఎత్తైన ప్రదేశంలో అతి చల్లని ఎడారిగా పిలవబడే హుందర్ గ్రామంలోని ఇసుక తిన్నెలకు వెళ్ళాం. మంగోలియా నుండి వచ్చి స్థిరపడిన రెండు మూపురాల ఒంటెల పై ప్రయాణించడం ఇక్కడకు వచ్చిన యాత్రికుల సరదా. మేం కూడా ఈ ఒంటెల పై కొంతసేపు ప్రయాణించి ఈ నుబ్రాలోయలోని టెంట్స్ లో బస చేయడానికి సయూక్ నదీ తీరంలో ఉన్న మాకు కేటాయించిన టెం లోకి వెళ్ళాం.

నుబ్రావ్యాలీని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. నుబ్రా నది (సియాచిన్ నది అని కూడా పిలుస్తారు) మరియు సయోక్ నది ప్రవహించే అందమైన లోయ ప్రాంతాన్ని నుబ్రా వ్యాలీగా వ్యవహరిస్తారు. సముద్రమట్టానికి 10000 అడుగుల ఎత్తును ఉన్న ఈ ప్రాంతంలో రెండు రాత్రులు టెంట్ లో ఉండటం జరిగింది. ఇది ప్యాంగాంగ్ సో లేక్ వద్ద గడపబోయే ఒక రాత్రికి ప్రిపరేటివ్ గా ఉండే విధంగా ఉపయోగపడుతుంది. యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా నిర్మింపబడ్డ ఈ టెంట్ లో ఒక వరండా, ఒక బెడ్ రూం, ఒక రెస్ట్ రూంతో కల్సి బట్టతో తయారు చేయబడిన ఈ టెంట్ లో, మనం లోపలికి వెళ్ళాక జిప్ తో అన్ని రూములు మూయాల్సి ఉంటుంది. రాత్రంతా విపరీతంగా చలి వల్ల నిద్రలేమిగా ఉన్నా ఒక క్రొత్త అనుభవంతో ఏదో అనిర్వచనీయమైన అనుభూతి పొందగల్గాం.

మరుసటి రోజు ప్రొద్దునే బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని ఇండియా పాకిస్థాన్ బార్డర్ లోని చివరి గ్రామమైన తురు అనే గ్రామాన్ని చూడ్డానికి వెళ్ళాం. రెండు గంటల ప్రయాణం తర్వాత హిమాలయా ప్రాంతంలోని కారకోరం రేంజ్ లోని తు తు గ్రామంలో ప్రవేశించాం. ఈ గ్రామం నుబ్రోవ్యాలీలోని సయోక్ నదీ తీర ప్రాంతంలో ఉంది. ఇది ఒకప్పుడు బలిస్తాన్ చక్రవర్తి రాజ్యంలో ఉండే ఈ గ్రామం 13వ శతాబ్దం వరకు బుద్ధిప్ట్ రీజియన్ గా ఉండేది. ఇది 1971 వరకు పాకిస్తాన్ ప్రాంతంలోని కాశ్మీరీ భాగంలో ఉండేది. ఇక్కడ ఉన్న మోనా’ నుండి మౌంట్ పార్క్ కె2ను చూడొచ్చు.

ఎత్తయిన బుద్ధ విగ్రహం

బల్టీ  మ్యూజియంలో 400 సంవత్సరాల క్రితం వాడిన వస్తువులను మనం దర్శించవచ్చు. నేచురల్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతంలో ఫ్రెష్ గా వున్న స్టాక్స్ ను మనం గమనించవచ్చు. 2.2 కి.మీ. దూరంలో ఉన్న పాకిస్తాన్ ఆక్రమించిన గిల్ గేట్ – బల్టిస్తాన్ బార్డర్ ఫెన్ సింగ్ ని టెలిస్కోప్ ద్వారా చూసాం. అప్రికాట్, వాల్ నట్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. 5000 సం||ల క్రితం నిర్మించిన బో క్రాఫోర్ట్ ని యాంగ్బో డైనాస్టీకి సంబంధించిన షయాక్ నదీ తీర ప్రాంతంలో ఉన్న కోట అవశేషాలను సమయాభావం వల్ల చూడలేకపోయాం. తిరుగు ప్రయాణం చేసి హుందర్ ప్రాంతంలోని మా అతిథి గృహమైన టెంట్ కి వెళ్ళాం. ఆరోజు ప్రత్యేక ఆకర్షణగా స్థానిక మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడాక్ గ్రామీణ యువతులు నిర్వహించిన నృత్య కార్యక్రమాల్లో పాల్గొని భోజనం తర్వాత రిలాక్ అయ్యాం .

ఆ మరుసటి రోజు హుందర్ గ్రామం నుండి ప్యాంగాంగ్ సో సరస్సుకి దాదాపు 274 కి.మీ. 8 గం||ల ప్రయాణం చేసి, సాయంత్రం 5 గం||లకి చేరుకున్నాం.

2017 ఆగష్టులో ప్యాంగాంగ్ సో సమీపంలో చైనా | భారత దళాలు పరస్పరం రాళ్ళు విసురుకోవడం, 2020 మే 5-6 తారీఖున సుమారు 250 భారతీయ, చైనా దళాలు ముఖాముఖి తలపడడంతో ప్యాంగాంగ్ సో సరస్సు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది.

సముద్రమట్టానికి 13862 అడుగుల ఎత్తున ఉండే ఈ సరస్సు అంతర్టీనంగా త్యోనాక్, రమ్ తో – జంట సరస్సులు, న్యాక్ స్సో అనే ఐదు ఉప సరస్సులతో మిళితమై ఉంటుంది. ఈ సరస్సు 134 కి.మీ. పొడవు, 5 మీటర్ల గరిష్ట – 3.1 మీటర్ల వెడల్పు కనిష్టంగా ఉండి 50% శాంతం చైనా భూభాగంలో, 40% ఇండియా భూభాగంలో 10% రెండు దేశాల పరిధిలో ఉన్నది. ఇది చలికాలంలో పూర్తిగా గడ్డకట్టబడి ఉండి వేసవికాలంలో మాత్రం హిమాలయ శిఖరాలను

ప్రతిబింభించే విధంగా స్వచ్ఛంగా ఉన్న నీరు, ఏడు వివిధ రంగుల్లో ఉండి కొన్ని ప్రాంతాల్లో ఫోటో-6 అడుగు భాగం స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ప్రకృతిలో ఉండే స్వచ్ఛదనం, రాత్రిపూట ఆకాశంలోని

నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ జీవితంలో మనం ఎప్పుడూ చూడని క్రొత్త ప్రపంచం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మేము మాత్రం విపరీతంగా చలి ఉన్నా మా రూంకి ఉన్న గ్లాస్

డోర్ సహాయంతో ఆకాశం అంతా పరుచుకొని ఉన్నట్లున్న నక్షత్రాలను తనవి తీరా చూసి ఆనందించాం. మాటలకు, రాతలకు అందని అనిర్వచనీయమైన ఆనందం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. లే లో గడిపిన రెండు రోజులు నుబ్రావ్యాలీలోని హుందర్లో గడిపిన అనుభవంతో ప్యాంగాంగ్ సోలోని ఒక రాత్రి

గడపడానికి ఎంతో ఉపయోగపడింది. హై ఆల్టిట్యూడ్ సిక్ నెస్ దాని పర్యావసనాలు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా దాని వల్ల వచ్చే సమస్యలు, అతి కష్టంగానైనా అందుబాటులో దొరకని వైద్యులు ఇవన్నీ కలసి మానసిక ధైర్యం ఈ సాహసయాత్రకు ఎంతో ఉపయోగపడతాయి. ఉదయం ప్యాంగాంగ్ సో సరస్సు మీదుగా వస్తున్న సూర్యోదయ చిత్రం ఎంతో అద్భుతంగా అనిపించింది.

ఈ లేక్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ ఊసరవెల్లిలా ఈ లేక్ లోని నీటి రంగు మారుతూ ఉంటుంది. నీటి అడుగుభాగం కూడా స్వచ్ఛంగా కన్పించేలా ఉంటుంది. ఇది -30 డిగ్రీల నుండి -10 డిగ్రీల వద్ద గడ్డకట్టబడి ఉండి చలికాలంలో అనేక రకమైన పక్షులను ఆకర్షిస్తుంది. గడ్డకట్టిన లేక్ లో నిర్వహించబడే ట్రెక్కింగ్ ఇక్కడ ప్రత్యేకత. మంచు చిరుతలు ఉండే ఒకే ఒక్క ప్రదేశం లడక్ ఈ లేక్ చలికాలంలో పూర్తిగా గడ్డకట్టి ఉంటుంది.

ఆ మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని యాత్ర కొనసాగింపుగా ఆ చివరి రోజు ఫోటో-7 సాహసయాత్ర మళ్ళీ కొనసాగింది. తిరుగు ప్రయాణం 150 కి.మీ దూరం ప్రపంచంలోనే రెండో

ఎత్తైన ప్రదేశమైన చాంగ్లాపాస్ 17857 అడుగుల ఎత్తున గల ఈ ప్రాంతంలో చాలా వరకు ల్యాండ్ స్టెడ్స్ జరగడం మూలాన డ్యామేజి అయిన రోడ్లతోను, విపరీతంగా మంచుపడి వాటి ప్రవాహంతో కొట్టుకుపోయిన రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణంవల్ల ప్రయాణం ఆగుతూ, సాగుతూ సాగింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని ఉద్యోగులు అంత చలిలోను, నిరంతరం శ్రమిస్తూ రోడ్ల నిర్మాణానికి, యాత్రికుల సౌకర్యం కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తే వాళ్ళ త్యాగ నిరతికి మనసులోనే జోహార్లు సమర్పించుకోవడం జరిగింది.

దాదాపు 6 గం||ల సాహసయాత్ర ముగించుకొని, లేప్లో ఇంకా చూడాల్సిన షేప్యాలెస్లోకి ప్రవేశించాం. దీన్ని 10వ శతాబ్దంలో ల్యాచెన్ పాల్గగాన్ అనే బుద్ధ గురువు నిర్మించారు ఇది లేహ్ సిటికి 15 కి.మీ దూరంగా ఉన్న లేహ్ – మనాలి రోడ్డులో 11204 అడుగుల ఎత్తులో ఉంది. లడక్ కి గతంలో వేసవికాలంలో క్యాపిటల్ గా ఉన్న ఈ ప్రాంతంలో బుద్ధుని అవతారమైన షాక్యముని బుద్ధ రెండవ అతిపెద్ద స్థూపం 39 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ అత్యంత ఎత్తుపైన ఉన్న ఈ ప్యాలెస్ పై భాగం నుండి చూస్తె చుట్టు ప్రక్క సింధునది ప్రాంతాలు ఎంతో అందంగా కన్పించి టూరిస్ట్ స్పాట్ లాగా వెలుగొందుచున్నది. షాక్యముని బుద్ధస్థూపం దర్శించుకొని అక్కడి నుండి లేహ్ ప్రాంతంలోని చివరి టూరిస్ట్ ప్రాంతమైన తిక్ సె మోనా’ దర్శించుకోవడానికి వెళ్ళాం.

థిక్ సె మోనాస్తి లడక్ లోని అతి పెద్ద మానాస్టీల్లో ఒకటి. ఇది 11800 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 12 అంతస్తులుగా ఉన్న ఈ మోనా’ పైకి ఎక్కడానికి కొంత ఆయాసపడ్డాం. ఎందుకంటే ఉదయం నుండి నిరంతరంగా ప్రయాణం చేయడం, చలీ ఇబ్బంది పెట్టాయి. ఈ 49 అడుగుల ఎత్తైన మైత్రేయ బుద్ధ విగ్రహం. 1970లో 14 దలైలామాచే ప్రారంభించబడ్డ ఈ రెండంతస్తుల విగ్రహంలో అతి ముఖ్య ఆకర్షణ.

చివరిదైన థిక్ సె మోనాస్టీ దర్శించుకొని లేహ్ లోని మా హోటల్ కి చేరుకొని మరుసటి రోజు తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యాం.

మరుసటి రోజు ఉదయం గడిచిన వారం రోజుల యాత్ర తాలూకు జ్ఞాపకాలతో అందరికీ వీడ్కోలు పల్కుతూ, ఎయిర్ పోర్ట్ కు వెళ్ళాం. మధ్యాహ్నం వరకు నిరీక్షించినా ఆరోజు రావలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అవడం మూలాన, (వాతావరణ పరిస్థితులు అని కొందరంటె, సాంకేతిక కారణాలు అని మరికొందరు చెప్పారు) మళ్ళీ తిరిగి మా హోటల్ కి వెళ్ళి ఆ మరుసటి రోజు ప్రయాణంతో మా లడయాత్ర సుసంపన్నమైంది.

జీవితంలో అత్యద్భుతమైన సాహసయాత్రగా, చిరస్మరణీయ జ్ఞాపకాలతో మాయాత్ర ముగిసింది.

August 15, 2022 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us