మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

అల్లనేరేడు !!

by Ananthaacharaya K.S. June 24, 2022
written by Ananthaacharaya K.S.

కూసే పిట్ట వాలే చెట్టు
పొదల్లో గెంతే కుందేళ్లు
పిట్టలు కట్టిన గూళ్ళు
పారే నదిమీద వాలే
కొంగలు
ఇవన్నీ ఇప్పుడు స్క్రీన్ మీది
బొమ్మల సింగారమే
నిజ రూప దర్శనం కరవైన బంగారమే!

కౌసు పిట్టలు కాగితాల్లో మిగిలిన కారికేచర్స్
కోయిల అమెజాన్ లో అమ్మకానికి కూసే కూలి !

వెదురు గొంతులు బొంగురు పోయి కురచనయిన మాటలు
కీ బోర్డులో e రాత. !
మౌస్ రాక్షసి నోట చేతి రాత!

బయోడైవర్సిటీలో నడక తప్పిన గుడ్డి ఎద్దు !ఎడారి మీద పచ్చ గడ్డి మైదానపు మరీచిక!

స్వరం తప్పిన
పచ్చని జావళీలు…. ప్లాస్టిక్ హంగుతో
పాప్ మ్యూజిక్

గాలికీ ఓ లెక్కుంది
కరెన్సీ ని పీలుస్తుంది
ఊపిరితిత్తుల వ్యాపారానికి
ప్రాణవాయువే పెట్టుబడి

ప్లాస్టిక్ కవర్ల
గుట్టలు తవ్వకుండా దొరికే
కాలాంతర గుప్తులు!

కాలాలు మారినా వర్షాలు ముఖం చాటేసిన
విప్పుకొనే మల్లె
మనసు మాలిన్యాన్ని
కడుగుతుoది

అల్ల నేరేడుయే
ఆకలికి
నైవైద్యమవుతుంది

పచ్చని మొక్కయే
కాలుష్యం మీద
పచ్చ బొట్టయి మెరుస్తుంది !!

June 24, 2022 0 comment
3 FacebookTwitterPinterestEmail
కథలు

‘బెల్లం ఆవకాయ తెచ్చిన తంటా’

by Madhavapeddi Usha June 21, 2022
written by Madhavapeddi Usha

ఈ రోజు నేను ఆవకాయ గురించి వ్రాయబోతున్నాను. ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారు ఉంటారా అసలు? ఆ మిథునం సినిమా పాట ఎంతో సమయోచితంగాను, తెలుగువారికి ఓ కితాబు ఇచ్చినట్లే ఉంటుంది. ఆ పాట విన్నప్పట్నుంచి మనందరికీ ఆవకాయమీద ప్రేమాభిమానాలు పొంగి పొర్లాయంటే ఒప్పుకుంటారా? అసలైనా తినబోతూ రుచిలెందుకు లెండి! నేను ఇప్పుడు రాయబోయే మా ఇంట్లో ప్రతి ఏడాది జరిగే ఆవకాయ ప్రహసనం చదివారంటే, మన భానుమతి అత్తగారి కథలు బలాదూర్ అనుకొని నాకు కూడా ఒక స్పెషల్ బిరుదు ఇచ్చేస్తారు తెలుసా!

సరే, అసలు విషయానికి వద్దాం. పోయిన సమ్మర్ లో మాకూ కరోనా రావడంవల్ల నేను ఊరగాయలు ఓ మాదిరిగ పెట్టాను. ఇంతకీ మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేటంటే మాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒకళ్ళు U.S అయితే ఇంకొకరు ఎవరూ అంతగా పట్టించుకోని కానీ world అంతా మెచ్చుకొనే బుల్లి దేశం ఉందే…. అదే న్యూజిలాండ్ అండీ…. పోయి పోయి అక్కడ సెటిలైంది. పైగా అక్కడ వాతావరణం సీనిక్ బ్యూటి అంతా నాకు నచ్చాయి పో. (అంటే మా అల్లుడుగారికి కూడా లెండి) అని ఒక్క అక్షరంలో తేల్చిపారేసింది. ఇంకా ముఖ్యమైన కారణం అక్కడ  ఇండియాలో లాగా దోమలుండవట (మా అమ్మాయికి దోమల ఎలర్జీ ఉంది లెండి). అందుకని అక్కడకి వెళ్ళాక అది సుఖసంతోషాలతో వర్థిల్లుతోంది. మనకి, అంటే తల్లిదండ్రులకి కూడా కావల్సిందదేగదండి!

ఇకపోతే అప్పట్నుంచి నేను ప్రతి ఏడాది కిలోలకి కిలోలు ఊరగాయలు ఇటు అటు ఎడాపెడా పెట్టేసి, వాళ్ళకి కొరియర్లో పంపించటం అలవాటైపోయింది. (మా వాళ్ళకి, అల్లుళ్లకీ, మనవళ్లకి ఆవకాయన్నా, దానితోపాటొచ్చే రకరకాల పచ్చళ్ళన్నీ కూడా చాలా ఇష్టమండీ). పంపించాక వాళ్లకి అందడం పెద్ద process  అన్నమాట.

కానీ U.S.వాళ్లు ఏవన్నా అనండి, చాలా మంచివాళ్ళు కరెక్టుగా మూడు, నాల్గు రోజులలో చేరిపోతాయి. కానీ ఈ న్యూజిలాండ్ కస్టమ్స్ వాళ్ళేమో పరమ దుర్మార్గులండీ! మన పికిల్స్ చేరడం చేరతాయి. కాని వాళ్ళ చేతుల్లో పడ్డాయంటే చాలు. ఇక మనం రామనామ జపం చేయాల్సిందే లేక ఆ క్షణ క్షణంలో సినిమాలో లాగా ‘దేవుడా! దేవుడా!’ అంటూ కూర్చోవాల్సిందే. మొన్నైతే మేము న్యూజిలాండ్ కు పికిల్స్ పంపినపుడు ఓ వారం రోజుల ఎదురు చూపుల అనంతరం మా అమ్మాయి దగ్గరనుండి ఒక ఫన్నీ మెసేజ్ వచ్చింది. అదేంటంటే ‘అభిమన్యు హాజ్ రీచ్ డ్ కురుక్షేత్ర బాటిల్ ఫీల్డ్” అని వచ్చింది. మేము ఫోన్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. కష్టమ్ వాళ్ళమో కురుక్షేత్ర్ యుద్ధభూమి, పద్మవ్యూహంలో చేరిన అభిమన్యుడేమో ఆవకాయ. ఇక వాటిని పరిక్షించేందుకు కస్టమ్స్ అధికారులు మొదలుపెడతారని దాని సారాంశం. అది విని మాకు నవ్వాగలేదు. అసలు మహాభారతంలో, అభిమన్యుడు చనిపోతాడు కదూ. కానీ మా చిన్నమ్మాయి భారతంలో మాత్రం చావడు. ఏదో కొన్ని రోజులు హోరా హోరీ కష్టమ్స్ ఆఫీసర్సతో యుద్ధం చేశాక విజయుడై ఇంటికి చేరతాడన్నమాట.

ఇక ఊరగాయల పార్సెల్ దగ్గర్నుంచి ఊరగాయలన్నీ బయటికి తీసాక వాటిని బాటిల్స్లో పెట్టాక వాటిని కూడా ఫోటో తీసి మాకు వాట్సప్ లో పెట్తారన్నమాట. అవి చూసుకని మేము ఆనందంతో తబ్బిబ్బై ఇక డాన్స్ చేయడమే తరువాయి.

మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే ఈసారి నన్ను అందరూ బెల్లం ఆవకాయ గూర్చి అడగడం, దాని రెసిపీ చెప్పడంతో నేను కూడా బెల్లం ఆవకాయ పెడదామని ఉబలాటపడ్డాను. ఒకరైతే బెల్లం పాకం పట్టాలి వగైరా – వగైరా అని చెప్పారు. ఆ సింగినాదం – జీలక్రర అదేం అక్కర్లేదండీ, మన రెగ్యులర్ ఆవకాయలోనే బెల్లం కలపండి, అదే బెల్లం ఆవకాయ అంటే అంతే ఇంకేం లేదు మరొకరూ చెప్పారు. ఇంకేం, అంతే కదా వెరీసింపుల్ అనుకుంటూ కొంచెం ఆవకాయ జాడిలోంచి విడిగా తీసి అందులో తగినంత మోతాదులో బెల్లం కలిపేసి, బెల్లం ఆవకాయ జిందాబాద్ అనుకుని నన్ను నేనే అభినందించుకున్నాను. తీరా పిల్లలకి పంపేందుకు వాళ్లనడిగితే ‘వామ్మో అదేంటి ఎప్పుడూ వినలేదే. బెల్లం మాగాయ విన్నాంగాని బెల్లం ఆవకాయ గురించి వినలేదు. తినలేదు. అయినా మేము రిస్క్ తీసుకోదల్చుకోలేదు. మా కొద్దంటే మాకొద్దని ఇద్దరూ ముక్తకంఠతో సెలవిచ్చారు. దాంతో నా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయడం అంత ఆవకాయలో బెల్లం కలిపానే అదంతా ఎవరు తింటారు? ఇంతలో నాకొక బ్రిలియంట్ ఐడియా తట్టింది. అది వినే ముందు తెనాలి రామకృష్ణులవారి కథ తెలుసుండాలి.

ఒకసారి రాయలవారు వారి తల్లిగారి ఆబ్దికమప్పుడు భోక్తలకు ఒక బంగారు మామిడిపండు తలా ఒకటి చొప్పున ఇద్దామనుకున్నారు. కారణం వారి తల్లిగారు చనిపోతూ మామిడిపండు తినాలన్న తన కోరికను వెలిబుచ్చారట. కాని ఆ కోరిక తీరకుండానే కాలం చేశారు. రాయలవారందుకు చాలా వ్యథ చెంది ఆబ్ధికం రోజున తల్లిగారి ఆత్మశాంతి కోసము అందరికీ బంగారు మామిడి పండ్లు దానమిస్తున్నారు. కాని అక్కడ కొంత మోసము జరగనారంభించింది. భోక్తలందరూ పేరాశతో రెండోసారి కూడా తీసుకొనడం మొదలుపెట్టారు. అది గమనించి రామకృష్ణులవారు ఇలాగైతే ఖజానా ఖాళీ అవుతుందని భయపడి వీరికి గుణపాఠం చెప్పాలని ఒక ట్రిక్ చేస్తారు. వెంటనే ఏమని ఎనౌన్స్ చేశారంటే, రామక్రిష్ణులవారి తల్లిగారు చనిపోయే ముందు తనకు వాతలు పెట్టమని కోరుకున్నారట. (బహుశా ఆ రోజుల్లో అదో రకం వైద్యం అయి ఉండవచ్చు). కానీ చూస్తూ చూస్తూ తల్లికి వాతలు పెట్టే బాధాకరమైన పని చేయనంటే చేయనని భీష్మించుకు కూర్చున్నారట. దాంతో ఆవిడ కోరిక తీరకనే పరమపదించారట. కానీ ఎవరూ వాతలు పెట్టించుకోవడానికి ఒప్పుకోరు కనక తన తల్లి కోరిక తీర్చుటకిదే తగిన సందర్బం అని తలచి ఒక బంగారు మామిడి పండుకి ఒక వాత తీసుకోవాల్సిందిగా ఒక నిబంధన పెట్టారు. దాంతో కొంతమంది పెట్టించుకున్నారు. కానీ అందరూ సాహసించలేకపోయారు. దాంతో ఖజానా ఖాళీ అయిపోతుందన్న రామకృష్ణులవారి భయానికి చెక్ పడింది.

సో, ఆ కథ లాగ నేను కూడా మా పిల్లలకి నేను పెట్టిన పికిల్స్ కావాలంటే బెల్లం ఆవకాయ కూడా ఒక్కో కిలో చప్పున తీసుకోవాలని ఒక కండిషన్ పెట్టాను. దాంతో పిల్లలు తప్పనిసరి ఒప్పుకోవల్సి వచ్చంది.

తరువాత ఆ రుచిలేని బెల్లం ఆవకాయ తీసుకున్నారేగాని దాన్నలాగే ఉంచి మిగతావి లాగించడం మొదలెట్టారు. కానీ నేను ఊరుకోక రోజూ బెల్లం ఆవకాయ తిన్నారా? లేదా? అని ఫోన్ లో సతాయించే దాన్ని – అది భరించలేక వారం వారం గెష్ట్లలని భోజనానికి పిల్చి ఆ బెల్లం ఆవకాయ వాళ్లకి వేసి ఖర్చు చేశారు. అప్పట్నుండి ఆ బెల్లం ఆవకాయ బాధితులెవరూ వారింటిపై కన్నెత్తి చూడ్డానికి కూడా సాహసించలేదు. నేను కూడా బెల్లం ఆవకాయ మాట కలలో కూడా తలచడం మానేసాను.

ఇంతకీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు నాకు ఏం బిరుదునిస్తున్నారు? చెప్పరూ।।

June 21, 2022 4 comments
3 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నాకు తెలిసిన ‘సి.నా.రె.’

by Kopparti Rambabu June 21, 2022
written by Kopparti Rambabu

2019 లో కీ.సే. సి.నారాయణ రెడ్డి గారి గురించి రాసినది. మరొక్కసారి వారిని స్మరించుకుంటూ……….

ఆధునిక తెలుగు సాహితీ జగత్తులో , నిలువెత్తు రూపం …..సి నా రే. ఆయనకి రోజూ కవిత రాయనిదే తెల్లవారదు, కవితకు కొత్త సొబగులు అద్దనిదే నిద్దర రాదు.

ఆయన కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు. అన్నిటినీమించి మనిషి జీవితాన్ని ఒక ప్రిజమ్ లోంచి కాంతి ప్రసరించినప్పుడు వెలువడే రంగులన్నింటినీ మేళవించి, పద చిత్రణతో , రూపుకట్టించిన మేధావి.

ఆయన మాట్లాడుతుంటే మువ్వల సవ్వడి గొంతులో వినిపిస్తుంది.ఆయన బహుముఖ సాహితీ స్వరూపాన్ని దర్శించడం అంటే , గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ , గుడి గోపురం, గోడల మీద చెక్కిన శిల్పాలను చూడడం వంటిది.

ఆయన రచనల్లో అత్యంత ప్రశస్తమైనది గా భావించబడేది ఆయనకు జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన ” విశ్వంభర ” వచన కావ్యం. మానవుడు ఆ కావ్యానికి నాయకుడు. ప్రకృతి నాయిక.ఆదిమ కాలంనించీ ఆధునిక కాలం వరకూ సాగిన మనిషి జీవన ప్రస్థానం , ఐదు ప్రకరణాలుగా సాగిన సుదీర్ఘ కవిత.” నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర.కాళ్ళ కింద ధూళి పొర.” అంటూ మొదలయ్యి “ఎంతటి కలవరమో వెదుళ్లకు ప్రతి అంగం నాదంగా పరిణమించాలని……ఎంతటి ఆరాటమో కొండరాళ్లకు ……అఖిలాణువులు మూర్తులుగా మూర్తీభవించాలని…. అనిసాగిపోయే కవితా ప్రవాహం గుక్కతిప్పుకొనివ్వదు.

నారాయణ రెడ్డి గారిని చూసి మాట్లాడిన అదృష్టం నాది.ఆయన సినిమా పాటల సంకలనం ” పగలే వెన్నెల ” ఆయన చేతులమీదుగా కాలేజీలో బహుమతిగా అందుకున్నాను.మూడు వేల పైచిలుకు పాటలు రాసిన ప్రతిభా మూర్తి. జ్ఞానపీఠ బహుమతి పొందిన విశ్వనాథ వారిని మెప్పించటంకోసం ” ఏకవీర ” సినిమాకు మాటలు రాశారు.ఆ సినిమా చూసి హాల్లోంచి బయటికి వస్తూ ఒక సామాన్య ప్రేక్షకుడు అన్నాట్ట ” ఈ సినిమాలో పాటలు అన్నీ అర్థం అయ్యాయి కానీ మాటలు ఒక్క ముక్కా అర్థం కాలేదు ” అని.

అయితే ఆ సినిమాలో ” తోటలో నారాజు ” పాట సినీ ఉద్యానవనంలో రెడ్డిగారిని రారాజుగా నిలిపిన పాట.ఆ పాటలో ఆయనే అన్నట్టు అది రస రమ్య గీతం.అదే సినిమాలో ఆయన తాను కాలేజీ రోజుల్లో రాసిన ” ప్రకృతిలో ప్రణయిని కవితని పాటగా పెట్టారు.బాలూ ఎంత నిదానంగా పాడారు అంటే , పడవలో వెళ్తూ పాట వింటే , పడవ కంటే పాట వెనకబడినట్టు అనిపిస్తుంది.

గులేబకావళి కథ (1962)నించీ మొదలైన ఆయన సినీ గీత రచనా ప్రస్థానం , ఐదు దశాబ్దాలకు పైగా సాగింది.ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉంటూ , హైద్రాబాద్ నించీ చెన్నైకి విమానంలో వచ్చేలోపు కొన్ని పాటలు రాసేసే వారుట.చెన్నైలో మేము ఉన్న టీ నగర్ , బస్ స్టాండ్ ఎదురుగా సుధార హోటల్ లో బసచేసేవారుట.

నారాయణ రెడ్డి గారిని సాహితీ మూర్తిగా , మరొక మారు దర్శించాలి అంటే, ఆయన అనేకానేక రచనలు ఆధారంగా ఆయన బహుముఖ సాహితీ రూపాన్ని సందర్శించాలి.కవిగా పద్య రచనతో శ్రీకారం చుట్టి , కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, ఋతు చక్రం వంటి పద్య కావ్యాలు రాశారు. వచన కవిగా జలపాతం, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మంటలూ – మానవుడు, ఉదయం నా హృదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటిపేరు చైతన్యం, కవిత నా చిరునామా, కాలం అంచుమీద, నడక నా తల్లి, శిఖరాలూ లోయలూ, మట్టీ మనిషీ ఆకాశం, దూరాలను దూసుకొచ్చి, ఆరోహణ, దృక్పథం, భూగోళమంత మనిషి బొమ్మ, , వ్యక్తిత్వం, గదిలో సముద్రం.
:
👆 ఆయన కావ్యాల పేర్లు ….ఒక క్రమపద్ధతిలో పెర్చితే అది ఒక కవిత అవుతుంది. అందువల్లే భారతీయ జ్ఞానపీఠ కమిటీ, వారి సృజనాత్మక సాహితీ సేవకు మెచ్చి వారి చుట్టూ పట్టు ఉత్తరీయం కప్పినట్టు వారి సమగ్ర సాహిత్యానికి జ్ఞాన పీఠ బహుమతి ప్రకటించింది

సి నా రే ని తిరుగులేని పరిశోధకుడిగా మాత్రమే కాకుండా ఆచార్య స్థానంలో నిలబెట్టిన గ్రంధం “ఆధునిక ఆంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు.” రిఫరెన్స్ పుస్తకంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద దీనిని మించిన పరిశోధనా గ్రంధం వేరొకటి ఇప్పటిదాకా రాలేదు.

సినిమా పాటల రచయితగా ఎన్ని ఉదాహరణలు చెప్పినా , ఆయన పాటలలోని మాటల సొగసు తరగదు. పాటలో ఏముంది నా మాటలో ఏముంది అంటూ ఆయన రాసిన సినిమా పాటలమీద ఆయనే రాసిన లఘు వ్యాఖ్యానాలు , పాటలలోని అందాలను వెతికి పట్టుకునేలా చేస్తాయి.

కృష్ణవేణి సినిమాలో నాయికని నది తో పోలుస్తూ రాసిన “శ్రీగిరి లోయల సాగే జాడల శతకోటి విద్యుల్లతలు వికశింపచేసినావు ” అంటారు, శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ గురించి.
సీతా కళ్యాణం సినిమాలో గంగావతరణం పాట ఆయన పాండితీ ప్రకర్షకు నిదర్శనం. “కదిలింది కదిలింది గంగ, మహోత్తుంగ తరంగ ” అంటూ గంగా నదీ ప్రవాహాన్ని , పదప్రవాహంగా, కవితా ఝరిగా పరుగులెత్తించారు.

నదులు అంటే ఆయనకు బహు మక్కువ, ఆయనకు నలుగురు కుమార్తెలు, గంగ,యమున, సరస్వతి,కృష్ణ ,….వారి పేర్లు.

ఆయనకు, జ్ఞానపీఠ బహుమతి వచ్చాక , శృతి నీవు గతి నీవు, ఈ నా కృతి నీవు భారతీ …… అంటూ రాసుకొచ్చి శరణాగతి నీవు భారతీ అంటారు.ఆ పాట ఆయన జ్ఞానపీఠం పై నిలిచిన సరస్వతీ దేవికి చేసిన గీతార్చన. ఆ పాటలో ప్రతి పదమూ , కవితాత్మ దర్శన ప్రాప్తి కలిగించే కైవల్య పథం.
:
ఒక సినిమా పాట మీద పాఠం రావడం , ఆయనకే చెల్లింది…..” వట పత్ర సాయికి ” పాట రాసిన ఆయన వెళ్లిపోయారు అని బాధ కలిగినా తాత రాసిన జోల పాట పిల్లలరూపంలో సాక్షాత్తూ ఆభగవంతుడు నిత్యం విని ఆనందిస్తూనే ఉంటాడు.

నారాయణరెడ్డి గారు , తెలంగాణాలో , హనుమాజీ పేటలో జన్మించారు.ఉర్దూ మీడియంలో చదువుకున్నారు.పారసీక భాషలో కూడా పట్టు ఉంది. ఆ పాండిత్యం ఆయన చేత తెలుగులో గజల్స్ రాయించింది.గజల్ శ్రీనివాస్ ఆయన గజల్స్ బాగా పాడి ఆయన మానస పుత్రుడిగా పేరుతెచ్చుకున్నాడు.
ఆయన కూడా తన గజల్స్ చాలా బాగా పాడి క్యాసెట్స్ రూపంలో తీసుకొచ్చారు.”అమ్మ ఒక వైపు , దేవతలంతా ఒక వైపు, సరి తూగమంటే, అమ్మవైపు ” అన్న ఆయన గజల్ మాతృవాత్సల్యాన్ని మనసుకి హత్తుకునేలా చేస్తుంది.
ఆయనకు సమకాలికుడైన ఆయన మిత్రుడు దాశరథి తో కలిసి తొలి రోజుల్లో జంట కవిత్వం రాశారు.
పోతన భాగవత పద్యాలకు మందార మకరందాలు పేరిట సరళ వ్యాఖ్య రాశారు. 85 సంవత్సరాలు పైగా జీవించి , పుట్టినప్పటినించీ లెక్క గట్టుకున్నట్టు 85 కి పైగా రచనలు ప్రచురించారు.ఏటేటా వచ్చే ఏ సంస్థ తెచ్చే కవితా సంకలనాల్లో ఐనా ఆయన కవిత ఉండ వలసిందే. అది ఆయనకు జ్ఞానపీఠం వచ్చింది కనుక వేసే పెద్ద పీట కాదు . కాలానుగుణంగా, భావజాలానికి , కవిత్వ వ్యక్తీకరణ విధానానికి పదును పెట్టుకుంటూ, పాళీకీ పదును తగ్గలేదని కొత్త కలాలకి ధీటుగా కవిత్వం రాసే ఆ నిత్య కవితా వసంత భోగ రాయుని గొప్పదనం అది.

నారాయణరెడ్డి మౌలికంగా కవి.కవిత్వం విషయంలో ఆయన నమ్మిన ఆచరించిన, అనుసరించిన రచనా సూత్రం “కవిత్వానికి మూలం భావం…..అదే కవితాత్మ……. ఆ ఆత్మకు రూపాన్నిచ్చేది భాష…… అది దేహం. ” ఈ సూత్రం ఆధారంగానే ఆయన ఏడు దశాబ్దాలు కవిగా మనగలిగాడు.

మనమధ్య, నరుడిగా , నారాయణుడి గా తన విశ్వంభర మహా కావ్యం ద్వారా కవితా విశ్వ విహారం చేశారు. ఆయన తన రచనల ద్వారా చేసిన “సదాలోచనలు అంతరంగాలను సమీక్షించి చూపుతాయి.ఆ సమీక్షలు జీవన నిర్వహణకు పురోదర్శినులవుతాయి ” కళాత్మకత, వైజ్ఞానికత, ఆధ్యాత్మికత , సాధనలోఎన్ని ఎదుదెబ్బలు తగిలినా మనిషి ఎప్పుడూ తిరోగామి కాడు, అనేది ఆయన ప్రగాఢ నమ్మకం.అదే విశ్వంభర కావ్యంలో ఆయన సృష్టించిన కవితా సారాంశం.

కవిత రాయనిదే నిదుర రాని ఆయన శాశ్వత నిధురలోకి వెళ్లి పోయారు, తన రచనల ద్వారా తెలుగు మానవాళిని నిత్య. జాగురూకులై ఉండమని నిర్దేశిస్తూ….ఆ కవితా శిఖరానికి శిరస్సు ఎత్తి నమస్కారం.ఆయన కవితా సంస్కారానికి శిరస్సు వంచి అభివాదం.నివాళి.

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాపు

by పొట్లపల్లి శ్రీనివాసరావు June 21, 2022
written by పొట్లపల్లి శ్రీనివాసరావు

నీవు లేని నీకోసం కవిత రాయాలని
ముప్పిరి గొన్న ఆలోచనల.. కలం చేత పెట్టాను
ఆరు పదుల పైగా నీ తో నడిచిన రోజులన్నీ
ఒకటొకటిగా మెదడు సందుగ దూకి నెట్టుకొస్తున్నాయి

నీవు లేని నీకోసం తన్నుకొస్తున్న అక్షర ప్రవాహం
కంటి సుడిగుండాల వలయాల చీల్చి వర్శిస్తూ..
మసక మసకగా కాగితం మీద వాలిన
పదాల పాదాలను నదీ జలమై అభిషేకిస్తూ..

బాపూ!నీవు లేని నీకోసం కవిత రాయాలనుకున్నా
నీ చుట్టే నేనున్నానని భుజం తడుతున్నట్టు..బాపు

ముందు రోజు మల్లెపువ్వులా నవ్వులు చల్లి
మనవడి పెళ్లి శుభలేఖ ఆసాంతం చదివి
అందులో నీ పేరు ఉందని మెరిసి
విద్యుద్దీపకాంతుల్లో ఇల్లంతా బాగుందని మురిసి
చక్రాల కుర్చీ మీద ఫోటోలకు ఫోజులిస్తివి
చూసి అబ్బురపడితివి కదా బాపూ..
పత్తి పువ్వు లా చూసుకున్నాము కదా …
అంతలోనే ఏమైంది…ఇంటి నిండా చీకట్లు
చెప్పా చెయ్యక ఎలా వెళ్ళిపోయావు బాపూ..

మేమంతా ఉన్నతంగా ఎదగాలి అన్నావు
నీవేమో ఉన్నంతలోనే బతకాలనుకున్నావు

నీ స్వప్న సాకారం కోసం మా చదువుల కోసం
మాటిమాటికి ఇరుకిరుకు ఇళ్లకు మారుతూ
కిరాయి ,కిరాణా దుకాణం ఖాతా,ఫీజులు బట్టలు పుస్తకాలు,రోగాలు..మధ్యతరగతి ఖర్చులకై..
బతుకు తెరువు కోసం చాలీచాలని
ఆనాటి అత్తెసరు జీతాల బడిపంతులు నీవైనా
నిర్మొహమాటంగా గలగల మాట్లాడే నిష్కపటి వై
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకుడివై
ఎదిగి జీవించిన ఆత్మాభిమానపు జెండా నీవు బాపు

ఉద్యోగానంతరమే అసలు జీవితమని
అరిగిపోయిన శేష జీవితం కాదని అది అశేష మని
సుప్తంగా ఉన్న అంతశ్చేతనను తట్టిలేపి
పసితనపు ఛాయతో కవిత్వమై వెలిగావు
ఒక విశాల ప్రపంచంలో ఒదిగి పోయావు

తనదైన భావన పరిధిలో తట్టిన ప్రతిదీ
కవిత్వీకరించి పిలిచిన ప్రతి చోటా
దూరాభారమనక వయసును మరిచి
వినిపించి పొంగిపోయావు కదా!బాపు

కలల కుంచెతో అక్షరీకరించి
కలల కొలిమి తో స్నేహించి
కలల సంతకం చేసిన చెలిమి నీవు
కలుపుగోలుతనం అసలు రూపం నీవు

కోపం లోనూఆర్ద్రతలోను శివుడి పేరును
సార్థకం చేసుకున్న ధరణీశ్వరుడవు నీవు
అవును భోళాశంకరుడివి నీవు నీ వని
నీవు లేని నీకోసం ఏమి రాసినా…

గుర్తొస్తే చాలు బరువెక్కి ఎక్కెక్కి ఏడిచే గుండెలు
మర్చిపోతే కదా!చాక్పీస్ చేతులతోఎందరికో
జ్ఞాన గవాక్షాలు తెరిపించిన బోధి వృక్షాన్ని…
ఆ నీడలో మమ్ము నడిపించిన జ్ఞాన సుగంధాన్ని..

అన్నీ ఉన్నా నీవు లేవు
నీవే లేనప్పుడు ఎన్ని ఉన్నా ఏదో వెలితి
మా అందరి హృదయాల్లో ఏదో కలత

June 21, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సోమరితనం కూడదు

by Kura Chidambaram June 21, 2022
written by Kura Chidambaram

రామాపురం అనే ఊళ్ళో ఒక సంపన్నుడుండేవాడు. అతడు సంపన్నుడే కాక, మంచివాడు కూడా! తన దగ్గరకు వచ్చిన కుంటి, గ్రుడ్డి, వికలాంగులైన బీదవారిని ఆదరించేవాడు. వారికి అన్నం పెట్టి ఆదరించటమే కాకుండా అలా వచ్చినవారికి చేతనైనంత ధనసాయం చేసి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేవాడు. కష్టపడి పనిచేయాలనీ దేవుడు మనిషికి తినటానికి ఒకే ఒక్క నోరు ఇచ్చినా, కష్టపడని పనిచేయటానికి రెండు చేతులు ఇవ్వటంలోని ఆంతర్యం, మరో చేతితో కలిగినంత ఇతరులకు పెట్టటానికేనని చెప్పేవాడు. మనం అందరం కోరుకునే ధనలక్ష్మీ మన కష్టంలో, మరియు మన చెమటలో ఉంటుంది అని చెప్పేవాడు.

ఆ సంపన్నుడి సహాయంవల్ల ఉపాధి పొందినవారు ఎందరో ఆయన చల్లగా ఉండాలని, నాలుగు కాలాలపాటు  ఇలాగే బీదసాదలకు సహాయం చేయాలని, ఆపన్నులను ఆదుకుంటూ ఉండాలని దీవించేవారు.

ఒకనాడు ఆ సంపన్నుడి ఇంటిముందు ఒక గ్రుడ్డివాడు నిలబడి సాహాయం చేయమని దీనంగా అర్థించసాగాడు.  గ్రుడ్డివాడిని, ఆయన దీనస్థితిని చూసిన సంపన్నుడి గుండె నీరయింది. లోనికి తీసుకుని రమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. లోనికి వచ్చిన గ్రుడ్డివాడి వివరాలు అడిగాడు.

అందులకు ఆ గ్రుడ్డివాడు “అయ్యా! నేను పుట్టు గ్రుడ్డిని. నా తల్లదండ్రులెవరో నాకు తెలియదు. తమ వంటి కరుణ గల ప్రభువుల చలువ వల్ల వారు చూపే దయాదాక్షిణ్యాలవల్ల ఇలా కాలం గడుపుతున్నాను. దయగల మారాజులెవరైనా నాకు ఉపాధి కల్పిస్తే బావుంటుంది” అంటాడు.

గ్రుడ్డివాడు దీనస్థితికి , ఆత్మాభిమానానికి సంపన్నుడి మనసు కరుగుతుంది.

కడుపునిండా తిండి పెట్టించి, కట్టుకోవటానికి క్రొత్త బట్టలు ఇప్పించి, ఏదైనా పనిచేసుకునేందుకు ఆసరాగా కొంత డబ్బు ఇచ్చి పంపుతాడు.

సంపన్నుడు ఇచ్చిన ధనంతో ఆ గ్రుడ్డివాడు ఒక చిన్న కూరగాయల దుకాణం పెట్టుకుని, సహాయంగా మరో అనాథ పిల్లవాడిని నియమించుకుని, తన కాళ్లమీద తాను నిలబడడమే కాకుండా, తన శక్త్యానుసారం ఇతరులకు సహాయం చేసేవాడు.

నిన్నటివరకు చింకిపాతలతో, వీధుల్లో అడుక్కునే గ్రుడ్డివానికి ఉపాధి దొరకటమే కాకుండా, అనాథలకు తోచిన సహాయం చేస్తుండటం అదే ఊళ్ళో ఉన్న కొందరు సోమరిపోతులకు కన్నెర్ర అయింది. అసూయ కలిగింది.

వాళ్ళకు కూడా ఆ సంపన్నుడి నుండి ధనం సంపాదించాలన్న దురాశ కలిగింది.

వారిలో, తమకు తామే తెలివైన వారమనే భావించే ఇద్దరు ఒక జట్టుగా ఏర్పడి సంపన్నుడి ఇంటిముందు యాచించసాగారు. అది గమనించిన ఆ సంపన్నుడు

‘కాళ్ళూ, చేతులు, కళ్ళు, ఒళ్ళు – అన్నీ సవ్యంగా ఉన్నా ఎందుకు మీరు యాచించాల్సిన అవసరం కలిగింది’ అని అడుగుతాడు.

జవాబుగా, ఆ సోమరిపోతులు : “అయ్యా మాకు పనిచేయాలనే ఉంది, కాని మా వీపుల మీద సైతానం తిష్టవేసింది. ఏ పని చేయాలన్నా అడ్డుకుంటున్నది” అంటూ ఏడుపు నటించసాగారు.

ఆ సంపన్నుడు ధనవంతుడే కాకుండా తెలివైనవాడు కూడా! వచ్చినవారు సోమరిపోతులని, సహాయం చేసినా దుర్వినియోగం అవుతుందని, గ్రుడ్డివాడిలా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేస్తారని గ్రహించాడు. అలాంటివారికి  గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అలా అనుకుని వారితో ఇలా అంటాడు.

“తమ్ముళ్ళూ, మీ దీనస్థితి నాకు అర్థం అయింది. నేను తప్పక మీకు సహాయం చేస్తాను. కాని మొదట మీ వీపుల్ని ఎక్కి కూర్చున్న సైతాన్ ను నా మంత్రంతో దూరం చేయాలి. అందుకు మీకు సమ్మతమేనా?” అని అడుగుతాడు.

సహాయం అందుతుందన్న సంతోషంలో ఆ సోమరి పోతులు సరేనంటారు.

ఆయన తన సేవకులను పిలిపించి వీరిని ఒక గదిలో బంధించి ఉంచుతాడు. కొరడాలను తెప్పించి వీపుల మీద వాతలు తేలేలా కొట్టించసాగాడు. కారణం అడిగిన ఆ సోమరిపోతులకు సైతాన్ ను పార్రదోలటం అని చెబుతాడు.

దెబ్బలకు తాళలేక సోమరిపోతులు లబోదిబోమంటూ, తమకు బుద్ధి వచ్చిందనీ, ఇకముందు కష్టపడి బ్రతుకుతాము అనీ, వేడుకుని, బ్రతుకు జీవుడా అంటూ బయటపడుతారు.

ఆ సంపన్నుడు ఆ సోమరిపోతులకు బుద్ధి గరిపి పంపివేస్తాడు.

(నీతి: కష్టపడి పనిచేయాలి. ఇతరులను యాచించవద్దు.)

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం -7

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి June 17, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

పజిల్ నింపి పంపిన వారు – ఉమ నెల్లుట్ల

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ June 17, 2022
written by కొరుప్రోలు హరనాథ్

తేడా….

ఈ కులాలు

ఈ మతాలు

ఈ వరకట్నపు

దురాచారాలు

ఈ సనాతన సాంప్రదాయాలు

మానవుడు నిర్మించుకున్న

సామ్రాజ్య సౌధాలయితే

దేవుని దృష్టిలో

ఇవన్ని

పనికిరాని శిథిలాలు

పగిలిన ప్రతిబింబాలు

తెలివి

ఎదుటివాడి కంటే

నువ్వు తెలివిగా

ఉండాలనుకోవడంలో

తప్పు లేదు –

కాని

వాడి తెలివిని

దెబ్బ కొట్టాలని

అతి తెలివి

ప్రదర్శించావో

నీ అంత మూర్ఖుడు

మరొకడు లేడు

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M June 17, 2022
written by Dr. Lakshmanacharyulu M
  1. వైమనస్యం

సామాన్యంగా నేను చాలా తక్కువగానే మాట్లడతాను. చెడు మంచి గురించి వాటిని ఎత్తి చూపడం గురించీ మాట్లాడను. నలుగురితో కలివిడిగా కూడా ఉండను. అలా దూరం దూరంగా ఉండడంలోనే నాకానందం కలుగుతంది.

నిన్ననే జరిగిన సంఘటన. మా ఆవిడతో కలసి జమునాదాస్ గారింటికి వెళ్ళా. పలకరింపులయ్యాయి. కొద్దిసేపయ్యాక, ఆ వీధిలో ఎవరున్నారు, వారెలాంటివారు అనే విషయంపై మా చర్చ నడిచింది. ఇదిగో, ఇదే నాకు చిరాకు తెప్పించే విషయం. ఎలాగో, ముళ్ళమీద కూర్చున్నట్టుగా అలా కూర్చుని వాళ్ల మాటలు వింటున్నా.

మాటల్లో ఓ పెద్ద మనిషి బిహారీ బాబు గురించిన ప్రసక్తి వచ్చింది. జమునాదాస్ ఆయన్ని జోడింపచేస్తూ, నానా మాటలూ అన్నాడు. చివరికి…. “మర్యాద – మన్నన, సత్ప్రవర్తన లాంటివేమీ ఆయనకి తెలీవు. ఎప్పుడు పలకరించినా మేం తెలియనట్టుగానే మొహం పెడతాడు. ‘నమస్తే’కి జవాబు కూడా ఇవ్వడు. రాత్రిళ్ళైతే మనిషే కనబడదు. బహుశా ఇంట్లో ‘ముందు’ సేవిస్తూ ఉంటాడేమో మరి.”

తర్వాత నావైపు తిరిగి – “మీరేమంటారు, డాక్టరుగారూ!” అని అన్నాడు.

ఇక నాకు మాట్లాడడం తప్పనిసరై. “బిహారీబాబు ఓ పెద్ద మనిషి, మంచి మనిషి. రాత్రిళ్లు ఆయనకి సరిగ్గా కనపడదు. ఆయనకి విటమిన్ ‘ఏ’ లోపం ఉంది. నా దగ్గర వైద్యం చేయించుకుంటూ ఉన్నాడు. కొద్దిరోజుల్లో నయం అవుతుంది” అని అన్నాను. అంతే!! అక్కడివారి కబుర్లు మరొకరిని విమర్శించడంవైపుకి మళ్ళాయి.

2. ఏరుదాటాక….

ప్రొఫెసర్ మనోహర్ గారి ప్రక్క నుండి అలా వెళ్ళిపోయింది రేణు. ఓ ‘నమస్తే’ లేదు, ఓ ‘హలో’ లేదు. ప్రొఫెసర్ కి ఇది నచ్చలేదు. బాధ కూడా కలిగింది. ఆమె ఆయన విషయానికే చెందిన ఒక పరిశోధక విద్యార్థిని. ఆయన దగ్గరకు పరిశోధనకి సంబంధించి అవసరం ఏర్పడితే వస్తూ ఉండేది. బహుశా తను నన్ను గమనించలేదేమో అని అనుకున్నాడు. సరే అనుకుని లేచి ఆమె దగ్గరకు వెళ్లి – “నమస్తే! రేణూ! ఎలా ఉన్నావ్?” ప్రశ్నించాడాయన.

రేణు నమస్కరిస్తూ – “క్షమించండి! నాక్కొంచెం పని ఉంది” అని చెప్పి ఆమె జారుకుంది. అయినా ప్రొఫెసర్ గారు తన పట్టు వదల్లేదు. ఆయన రేణు వెనకే వెళ్ళాడు. అసలు ఈ రేణు, ఆ రేణేనా? “సర్! మీరు జీనియస్!” అంటూ తెగపగడుతూ ఉండేది. ఇవాళ అదే రేణు ఇలా ప్రవర్తిస్తున్నది. ఇలా అనుకుంటూ ప్రొఫెసర్ నడుస్తూ ఉంటే ఓ గది లోంచి రేణు తన స్నేహితురాల్తో – “ఆ ముసలోడు నా వెంట పడుతూ ఉన్నాడే? వదల్టంలేదు. నా మంచి ఏంకోరుకుంటున్నాడో మరి?”

“ఒకప్పుడు నువ్వాయిన్ని తెగ పొగిడేదానివి కదే!” అడిగింది స్నేహితురాలు.

“అప్పటిసంగతే వేరు.  అప్పుడు నాకు పరిశోధనలో సహాయం అవసరం. ఇప్పుడా థీసిస్ చాలావరకూ పూర్తి అయింది. ఇక ఆయనతో నాకేం పని?”

3. వ్యామోహం

ఇవ్వాళ బహుశా అన్నిటికన్నా క్రికెట్ కే చాలా పేరు, ఆకర్షణా ఉన్నాయి. ఆట అర్థం అయినా కాకపోయినా, ఆ ఆటలో ఆసక్తి చూపించటమే ఒక ఆకర్షణ, అభిరుచి. సందులు – గొందుల్లోను, ఆఫీసులోను, అంతెందుకు, స్నానం చేసేటప్పుడూ ఆ ఆటంటే చెవి కోసుకునేవాళ్ళు కామెంట్రీ వింటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. అయితే రామ్ దయాళ్ గారు వీటన్నిటికీ మినహాయింపు అనే చెప్పాలి.  ఆయనకి ఈ వ్యామోహం అంటే అస్సలు పడదు. “క్రికెట్ మన కాలాన్ని వృథా చేస్తే, ఈ కామెంట్రీ అనేది ఇంకా, ఇంకా మన సమయాన్ని నష్టపరుస్తుందని” ఆయన ఎప్పుడూ అంటూ ఉంటాడు.

ఒక రోజున ఏమైందంటే…. రామ్ దయాళ్ గారు తన ఆఫీసుకి వెళ్లే హడావుడిలో ఉన్నారు. ఇంతలో ట్రాన్సిస్టర్ రొద వినబడింది. అంతే! ఆయనగారి ‘మోడ్’ ఖరాబైపోయింది. “ఇదేమన్నా కామెట్రి వినే టైమా? చదువూ సంధ్యా ఉండదు. రేడియో మాత్రం తప్పకుండా ఉండాలి. ఆ పిచ్చి కామెంట్రీ కట్టెయ్!”

ఆ రోజున ఆయన అందరిమీద ‘అక్షింత వేసాడు’. పిల్లల్ని కూడా ఆయన వదల్లేదు. అందరూ పాపం బిక్క మొహాలతో తమ చదువు సంధ్యల్లో మునిగిపోయారు.

దడదడా రామదయాళ్ గారు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. తరువాత స్కూటరెక్కి బయటికి వచ్చేసి, ఎవ్వరూ లేని ఒక మారుమూల ప్రదేశంలో బండి పార్క్ చేసి, తన జేబులోంచి ప్యాకెట్ సైజ్ ట్రాన్సిస్టర్ బయటకు తీసి, స్కూటర్ పైన విశ్రాంతిగా కూర్చొని ఎంతో ఆసక్తితో క్రికెట్ కామెంట్రీ వినసాగారు.

4. మత్తు – చిత్తు

“ఎన్నోసార్లు నేను వద్దని చెప్పా, వేలసార్లు నచ్చ చెప్పా, కాని వాడి బుర్రలో ఏమన్నా ఎక్కితేగా? అసలు ఇలా చేసే వయసా వాడిది.”

దీనానాథ్ నాకో సెంటర్లో కనబడ్డారు. ‘కొత్త బజారు’ లోని ఆ సెంటరు ఇలాంటివాటికి బాగా పేరుపడింది. ఇక్కడ ఒక హెయిర్ కటింగ్ సెలూన్, హల్వా దుకాణం, పూలదుకాణం ఇలా అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి. జనం తమకి కావల్సిన సామాన్లు కొనుక్కోడానికి వస్తూ ఉంటారు. అలాల వచ్చినవాళ్ళ పరస్పరం పిచ్చాపాటీ మాట్లాడుకుంటారు, కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు.

దీనానాథ్ నిట్టూరుస్తూ – “ఆ దేవుడి లాంటి కొడుకుని ఎవరికీ ఇవ్వకూడదు. పట్టుమని పదిహేడేళ్ళుంటాయేమో! కాని, చేపలా మందు తాగుతూ ఉంటాడు. ఎంతగా చెప్పినా వినడం లేదు. నేను మందు త్రాగొద్దని చెప్పను. కాని ఇంత చిన్న వయసులో ఇంతలా త్రాగడం అనేది బుద్ధుండి చేసే పనేనా?”

చిట్టచివరి వాక్యం వినగానే నాకెందుకో అనుమానం వచ్చింది. నేను దీనానాథుణ్ణి పరీక్షగా చూస్తా, కొంచెం దగ్గరగా జరిగి వాసన పీల్చా. అంతే!! ఆయన మత్తులో బాగా చిత్తై ఉన్నాడు.

5. బేరం

ఈ కథ ఏ కాలానికి చెందినదైనా కావచ్చు. అంటే జరిగిపోయిన కాలానికి, జరుగుతున్న కాలానికి, అలాగే జరగబోయే కాలానికి కూడా సంబంధించినది కావచ్చు.

ప్రతిదేశానికి రక్షణ వ్యవస్థ అంటూ ఉంటుంది. ఈ కథలోని కాల్పనిక దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ ఉన్నది. ప్రతి దేశంలో పెద్ద పెద్ద అధికారులున్నట్టే ఈ దేశంలో కూడా నేరాలు జరుగుతాయి.

మన కాల్పనిక దేశానికి చెందిన ఒక సజ్జనుడు నేరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన కూతుర్ని ఎవరో అపహరించుకుపోయారు. నేరం చాలా తీవ్రమైనది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా సన్నద్ధమైంది.

ఎలాగో అలా చివరికి అమ్మాయి దొరికింది. కాని…అపహరించినవారు దొరకలేదు. చివరికి రక్షణ యంత్రాంగం ఒక వ్యక్తిని అరెస్టు చేసింది. పోలీసు అధికారి అతణ్ణి చూస్తూ – “నీకు రోజుకి యాభై రూపాయలు దొరుకుతాయి. ఏడు రోజుల్లో ఈ వ్యవహారమంతా చల్లబడిపోయింది. నిన్ను విడిపించే బాధ్యత మాది సరేనా?” అని అన్నాడు.

ఆ వ్యక్తి పేదవాడు, నవ్వుతూ – “అయ్యా! నన్నువిడిపించొద్దు. ఈ యాభై రూపాయల రేటుమీద నేను జీవితాంతం జైల్లో ఉండగలను. నేనిలా లోపల ఉన్నా నా కుటుంబం బయట హాయిగా ఉండగలుగుతుంది” అని అన్నాడు.

June 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నిల్చొని చేసే మరికొన్ని ఆసనములు

by Bandi Usha June 16, 2022
written by Bandi Usha

ఆసనం వేసే విధానం: రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, రెండు చేతులను ముందుకు చాచి, నెమ్మదిగా ఎడమ చేతిని కుడిభుజంపై, కుడిచేతి వ్రేళ్ళు ఎడమవైపు నుంచి ముందుకు వచ్చేలా కుడిచేతితో నడుమును చుట్టి, నడుము నుంచి పై భాగం కుడివైపు నుండి వెనకకు తిప్పాలి. క్రింది భాగం కదలకూడదు. మరలా చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై, ఎడమచేతితో నడుమును చుడుతూ, నడుము నుండి పై భాగం ఎడమవైపు నుండి వెనుకకు తిరగాలి.

ఉపయోగాలు : 1. నడుము దగ్గర కొవ్వు కరిగి సన్నగా అవుతుంది.

2. ఉదర సమస్యలు తగ్గుతాయి.

3. భుజకండరాలు గట్టి పడతాయి.

4. చేతులు బలంగా తయారవుతాయి.

5. పొట్ట తగ్గుతుంది.

6. పక్కటెముకలు బలపడతాయి.

ఉదర కరాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి చేతులను ముందుకు చాచాలి. ఎడమ చేతిని కుడిభుజంపై వేసి, కుడివైపు వెనుకకు తిరుగుతూ కుడిచేతిని వెనకకు చాచి ఉంచాలి. క్రింది భాగం కదలకూడదు.

చేతులను ముందుకు తీసుకొని వచ్చి కుడిచేతిని ఎడమ భుజంపై వేసి, ఎడమవైపు వెనుకకు దిరుగుతూ ఎడమచేతిని చాచాలి.

ప్రయోజనాలు : కటిచ్రకాసనం వలన కలిగే ప్రయోజనాలతోపాటు అదనంగా కలిగే ప్రయోజనం.

వెన్నెముక బలోపేతం అవుతుంది.

తిర్యక్ తాడాసనము : రెండు కాళ్ళ మధ్య రెండు అడుగుల దూరం ఉంచి, చేతివేళ్ళను కలిపి, అరచేతులు పైకి చూస్తున్నట్లు చేతులను తలపైకి బాగా సాగదీయాలి. తరువాత చేతులను ముందుకు చాచుతూ వంగి, కుడివైపు నుండి పైకి లేస్తూ నడుము నుంచి పై భాగం నిటారుగా వెనుకకు తిప్పవలెను.

కొద్దిసేపు అలా ఉన్న తరువాత మరలా ముందుకు వంగి ఎడమవైపు పైకి లేస్తూ నడుము నుంచి పైభాగం నిటారుగా వెనుకకు తిప్పాలి.

ప్రయోజనాలు :

  1. కాళ్ళు చేతులు దృఢంగా తయారవుతాయి (దృఢంగా).
  2.  భుజాలు గట్టి పడతాయి.
  3. పొట్ట తగ్గుతుంది.
  4. వెన్నెముక బలపడుతుంది.
  5. తొడ భాగంలో, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది.
  6. పక్కటెముకలు బలంగా తయారవుతాయి.

వృక్షాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. ఎడమకాలిని మడిచి కుడి తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. మోచేతుల్ని వంచరాదు. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని తరువాత మామూలు స్థితికి వచ్చి కుడికాలిని మడిచి ఎడమ తొడకు ఆనించి చేతుల్ని పైకి తీసుకెళ్ళి నమస్కార ముద్రలో ఉంచాలి. చూపు ఒకే బిందువుపై కేంద్రీకరిస్తే ఎక్కువ సేపు ఉండగలుగుతారు.

ప్రయోజనాలు:  1. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది.

2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

4. కాళ్లు చేతులు బలోపేతం అవుతాయి.

3. పొట్ట తగ్గుతుంది.

5.  రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

సంతులనాసనము (సంతులనాసనము) : రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. అనగా సమస్థితిలో నిల్చోవాలి. తరువాత ఎడమ కాలిని వెనుకకు మడిచి ఎడమచేతితో పట్టుకొని కుడిచేతిని నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఇక్కడ కూడా చూపు ఒకే బిందువుపై కేంద్రీకరించాలి. ఉండగలిగినంతసేపు ఉంచి తరువాత మరో కాలిని మడిచి చేయాలి.

ప్రయోజనాలు :  1. ఏకాగ్రత పెరుగుతుంది, 2. కీళ్ళనొప్పులు తగ్గుతాయి. 3. కాలివేళ్ళకు, చేతివేళ్లకు రక్త్రపసరణ బాగా జరుగుతుంది.4. కండరాలు గట్టిపడతాయి. 5. పొట్ట తగ్గి శరీరం నాజూకుగా అవుతుంది.

నటరాజాసనము : మొదట సమస్థితిలో నిల్చోవాలి. కుడికాలును మోకాలివరకు వెనుకకు మడిచి కుడిచేతితో పట్టుకోవాలి. కాస్త ముందుకు వంగుతూ ఎడమ చేతిని, వెనుకకు మడిచిన కుడికాలిని తలకన్నా కాస్త పైకెత్తాలి. ఉండగలిగినంతసేపు ఉండి తరువాత మరో కాలు మడిచి చేయాలి. ఒకే బిందువుపై దృష్టి పెట్టడం మరచిపోవద్దు.

ప్రయోజనాలు :  1. చేతులు, కాళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి. 2. వెన్నెముక సమస్యలు తొలగుతాయి.

3. నడుము సన్నబడుతుంది. 4.  మూలశంక తగ్గుతుంది. 5. కీళ్ళనొప్పులు తగ్గుతాయి.

6. ఏకాగ్రత పెరుగుతుంది.

రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు. బ్యాలెన్స్ కోసం గోడ పక్కగా నిల్చోవడం మంచిది.

గరుడాసనము: ఇది గరుడపక్షి ఆకారంలో ఉంటుంది కావున దీనికి ఆ పేరు వచ్చింది. ఇది అందరూ చేయదగిన ఆసనము.

చేయు విధానం : తివాచీపై సమస్థితిలో నిల్చొని ఎడమ తొడను కుడితొడ మీదకు చేర్చి, అదా కాలుని మెలిపెట్టి కుడికాలి చీలమండల వద్ద ఆనించాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని కుడిచేతితో చుట్టి రెండు అరచేతులను నమస్కార ముద్రలో ఉంచాలి. నాలుగు అయిదు శ్వాసలు తీసుకొని మరలా సమస్థితికి రావాలి. ఈ సారి మరో కాలు, మరో చేతితో చేయాలి. ఈ స్థితిలో వీపు, తల నిటారుగా ఉంచాలి.

ఉపయోగాలు :  1. రక్తనాళాలు బాగా సాగి బల పడతాయి. 2. సర్వయికల్, థైరాయిడ్, కీళ్లనొప్పులు తగ్గుతాయి.

3. నడుము, వెన్నెముకను బలోపేతం చేస్తాయి. 4. వృషణాల వాపును తగ్గిస్తాయి.

  • తొడకండరాలు, తుంటి ఎముకలను బలం చేకూరుతుంది.
  • ఎక్కువగా కుర్చీలో కూర్చొని పనిచేసేవారికి చాలా ఉపయోగం.

హస్తపాదాంగుష్టాసనము: తివాచీపై రెండు కాళ్ల మధ్య అడుగు దూరం ఉంచి ఎడమచేతిని నడుముపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ కుడికాలిని మోకాలివరకు మడిచి ఎడమకాలి తొడపైకి తీసుకొచ్చిన తరువాత కుడిచేత్తో కుడికాలి బొటన వేలును పట్టుకొని శ్వాసవదులుతూ మోకాలు వంచకుండా కాలును చక్కగా ముందుకు చాచాలి.  ఇక్కడ శరీరబరువు మొత్తం ఎడమకాలిపై పడుతుంది. ఈ స్థితిలో నాలుగైదు శ్వాసలు తీసుకొని మరలా యధాస్థితికి వచ్చి ఈసారి ఎడమకాలు, ఎడమచేతితో చేయాలి.

ప్రయోజనాలు

  1. తొడ కండరాలకు శక్తి చేకూరుతుంది.
  2. సయాటికా, వెన్నెముక, మోకాళ్ళ, కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
  3. కాళ్లు, చేతులు, నడుముకు బలం చేకూరుతుంది.
  4. శరీరము చక్కని ఆకారంలో ఉంటుంది.

త్రికోణాసనము : త్రికోణము అనగా మూడు కోణములు కలిగినదని అర్థము. ఈ ఆసనము త్రిభుజాకారంలో మూడు కోణములను కలిగి ఉండటంవలన త్రికోణాసనం అనే పేరు వచ్చింది.

చేయు విధానం : రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులను భూమికి సమాంతరంగా చాచుతూ రెండు అరచేతులను నేలను చూస్తున్నట్లు ఉంచాలి.

శ్వాస విడుస్తూ నెమ్మిదిగా నడుమును కుడిపక్కకు వంచుతూ కుడిచేతిని కుడిపాదం చివరకాని, పక్కనకాని ఉంచాలి. తరువాత తలపైకి తిప్పి ఎడమ అరచేతిని చూడాలి. ఈ స్థితిలో 5,6 శ్వాసలు  తీసుకొని తరువాత శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఇదే విధంగా ఎడమవైపు చేసి సమస్థితికి రావాలి.

ప్రయోజనాలు :   1. కాలికండరాలకు బలం చేకూరుతుంది.

  • చీలమండలు శక్తివంతం అవుతాయి.
  • వెన్ను నొప్పి తగ్గుతుంది.
  • జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • పిల్లలు ఎత్తు పెరుగుతారు.
  • నడుము పక్కన కొవ్వు తగ్గి ఆకర్షణీయంగా కనబడతారు.

పరివృత త్రికోణాసన్:  రెండు కాళ్లను వీలయినంత దూరం జరుపుతూ తివాచీపై నిల్చోవాలి. రెండు చేతులు భూమికి సమాంతరంగా అరచేతులు నేలను చూస్తున్నట్లు ఉంచాలి.  శ్వాస విడుస్తూ నడుమును కుడివైపు తిప్పుతూ ఎడమ చేత్తో కుడిపాదం ను పట్టుకోవాలి. తరువాత తలను పైకెత్తి కుడి అరచేతిని చూస్తూ 5,6 శ్వాసలవరకు ఆసన స్థితిలో ఉండి మరలా శ్వాస తీసుకుంటూ సమస్థితికి రావాలి. ఇదేవిధంగా మరోవైపు చేయాలి.

ప్రయోజనాలు :  1. పొట్ట తగ్గుతుంది.  2. మూత్రపిండాలు ఆరోగ్యంగా తయారవుతాయి. 3. చేతులు కాళ్లు బలపడతాయి. 4. గూనితగ్గుతుంది. 5. మెడసన్నగా అవుతుంది. 6. కండరాల నొప్పులు తగ్గుతాయి.

విమానాసనము : విమాన రూపంలో ఆసన స్థితి ఉండటం వలన ఆ పేరు వచ్చింది. తివాచీపై సమస్థితిలో నిల్చొని రెండు చేతులను భుజాలకు సమాంతరంగా ప్రక్కకు చాచాలి. నెమ్మదిగా నడుము దగ్గర నుండి ముందుకు వంగుతూ ఎడమకాలు చక్కగా పైకి లేపాలి. ఈ స్థితి T ఆకారంను పోలి ఉంటుంది. శరీరము యొక్క బరువంతా కుడికాలుపై కేంద్రీకృతం అవుతుంది. నాలుగైదు శ్వాసం అనంతరం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సమాంతర స్థితికి వచ్చి ఈసారి కుడికాలును చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండువైపులా చేయాలి.

ప్రయోజనాలు :  1. ఏకాగ్రత పెరుగుతుంది., 2. శరీరం తేలికగా ఉంటుంది. 3. కాలిపిక్కలు గట్టి పడతాయి. 4. శరీరము, మనసు నిశ్చలంగా ఉంటుంది.

రాకెట్ ఆసనము : ఈ ఆసనము రాకెట్ రూపంలో ఉంటుంది.

చేయు విధానం: రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి, చేతులను పైకి చాచి నమస్కార ముద్రలో ఉంచాలి. నెమ్మదిగా నడుము నుండి ముందుకు వంగుతూ ఎడమకాలిని వెనకకు చాచాలి. చేతులను నమస్కార ముద్రలో చక్కగా చాచి ఉంచాలి. 4,5 శ్వాసల అనంతరం శ్వాసతీసుకుంటూ నిటారుగా పైకి రావాలి.

మరోసారి ముందుకు వంగుతూ ఈసారి కుడికాలిని చక్కగా వెనక్కి చాచాలి. ఈ విధంగా రెండు కాళ్ళతో చేయాలి.

ప్రయోజనాలు :   1. శరీరము, మనసు సమస్థితిలో ఉంటాయి.2. ఏకాగ్రత పెరుగుతుంది.

3. చేతులకు, కాళ్ళకు బలం చేకూరుతుంది.  4. పొట్ట తగ్గుతుంది. 5. కండరాలు గట్టి పడతాయి.

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పాలపిట్ట పుష్కరయానం

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ June 16, 2022
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

      తెలుగులో సాహిత్యాన్ని పరిమళింప జేస్తూ  వచ్చిన ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రిక, గుడిపాటి గారి సంపాదకత్వంలో జనవరి, 2022తో పన్నెండేళ్ళు  పూర్తి  చేసుకుంది. ఈ సందర్భంగా సాహిత్యం మీద అవ్యాజ్యమైన ప్రేమతో  సాహిత్య  మాసపత్రికను నిరాటంకంగా ఒక పుష్కరకాలాన్ని  ప్రయాణింపజేసిన సాహిత్య ప్రేమికుడు గుడిపాటిని అభినందించాల్సిన విషయమే.  పెద్ద పెద్ద సంస్థలు, ఆర్ధిక బలం వున్న యాజమాన్యాలు కూడా సాహిత్య సంబంధ పత్రికలను మూసివేసిన సందర్భాలలో, కరోనా మహమ్మారి లాంటి కల్లోల సమయంలో ఒక వ్యక్తి, ఒంటి చేత్తో, ఆర్ధిక వనరులకై  సంఘర్షణపడుతూ, పాఠకుల చందాలపై ఆధారపడుతూ, పిడికెడు స్నేహితుల, హితైషుల  సహాయం, విరాళాలపై నిలబడుతూ,  పాలపిట్ట రెక్కలను విప్పార్చుతూ  సాహితీ వినీలాకాశ  వైశాల్యాన్ని పెంచుకోగల నిబ్బరాన్ని కలిగిన వాడిగా దర్శనమిచ్చే గుడిపాటిలో కేవలం సంపాదకుడే కాదు, ఒక కవి, ఒక విమర్శకుడు  ఒక వ్యాసకర్త , విశ్లేషకుడు  కూడా వున్నాడు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జననం. సాధారణ మధ్య తరగతి కుటుంబం. ఎలాంటి సాహితీవాసనలు లేని కుటుంబ నేపథ్యం ఐనా గుడిపాటిలో బహుముఖీనత కలిగిన వ్యక్తిత్వాన్ని స్వంతం చేసుకున్న  దార్శనికుడు కనబడతాడు.  జర్నలిజం పై  మమకారం, సాహిత్యం పై ఆసక్తి , వార్త  ఆదివారం పత్రికకు ఎడిటర్ గా, నవతెలంగాణ దినపత్రికలో అసిస్టెంట్  ఎడిటర్ గా విశేషమైన అనుభవం,  జర్నలిజం, సాహిత్యపరమైన అనేక విషయాల్లో అపారమైన పరిజ్ఞానం, అవగాహనతో పాలపిట్టను ఫిబ్రవరి 2010 ప్రారంభ సంచికగా ఆవిష్కరించారు. పత్రిక నడపడం అంత  సులువైన పని కాదు.  అభిరుచి, ఇష్టం వేరు,  సృజనతో ముడిపడిన ఒక non – commercial subject ను  నడిపించడంలో ఎదురయ్యే కష్టాలు వేరు.  పత్రిక ప్రారంభ మయ్యాక మూడేళ్లపాటు ఆగకుండా ప్రయాణం కొనసాగింది.  అనేకమైన విలక్షణ సంచికలనందించింది.  సంచిక లోపలి బ్లాక్ అండ్ వైట్  పేజీలు 80 , మల్టీ కలర్ కవర్ పేజీలు నాలుగు  మొత్తం 84 పేజీలతో పత్రిక పాలరాతి మెరుపు, నునుపు  వంటి మ్యాప్ లితో  అచ్చవుతూ ఆకర్షణీయంగా వచ్చింది. వస్తున్నది.  మార్చి, 2010 లో మహిళా ప్రత్యేక సంచికగా 120 పేజీలతో వెలువడింది . అలాగే ఏప్రిల్, 2010 లో గోరటి వెంకన్న ప్రత్యేక సంచిక 100 పేజీలతో,  మే ,2010  సామల సదాశివ ప్రత్యేక సంచికగా , జూన్, 2010  బండి నారాయణ స్వామి ప్రత్యేక సంచికగా వెలువడినాయి. సాహిత్యంలో తమదైన ప్రత్యేక శైలి , కంఠ స్వరంతో  ప్రత్యేక ముద్ర కనబరిచే సాహితీవేత్తల రచనా విశేషణాలతో  వచ్చిన సంచికలు ఇవి. వీటికి విభిన్న వర్గాల నుంచి మంచి ఆదరణ వచ్చింది.   అలానే జులై, 2010 సంచిక సంగీత  శిఖరమైన మంగళంపల్లి బాలమురళీ కృష్ణ మీద వచ్చింది. కాళోజి శత జయంతి సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు బి. నర్సింగరావు గారి  గౌరవ సంపాదకత్వంలో సెప్టెంబర్, 2013 లో 120  పేజీలతో కాళోజి ప్రత్యేక సంచిక వెలువడింది . ఇలాంటి విశేష సంచికలు వెలుగులోకి రావడానికి సాహితీ మిత్రుల సహకారం , ప్రోత్సాహం  అభినందించదగినది .

     2014-15 సంవత్సర కాలం ఆర్ధిక వనరుల కొరత కారణంగా ఈ ఏడాదిలో ఆరు సంచికలు మాత్రమే వచ్చినా,  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భాన్ని పురష్కరించుకొని  తెలంగాణ ప్రత్యేక సంచికగా 160 పేజీలతో ఫిబ్రవరి -మార్చి 2014 లో వచ్చింది. తెలంగాణాకు సంబంధిన పలు విషయాలను అందించిన  తెలంగాణ ప్రత్యేక సంచికగా కేవలం పాలపిట్ట మాత్రమే వెలుగు చూడటం గమనించాల్సిన విషయం.

     కోవిడ్ -19 ప్రభావం కారణంగా మన రాష్ట్రం, దేశమే కాదు యావత్ప్రపంచం  అల్లకల్లోలానికి గురైంది.  ప్రజల జీవన శైలి మీద  తీవ్రమైన ప్రభావం పడింది.  వైద్యం, ఫార్మసీ లాంటి సంస్థలు/రంగాలు మినహా  అన్ని రంగాలు కుదేలైపోయాయి.  కోవిడ్-19  ప్రభావం సాహిత్యరంగం మీద పడి అచ్చులో వచ్చే తెలుగు సాహిత్య పత్రికలన్నీ  చాలా వరకు అంతర్థానమయ్యాయి.  కొత్త పత్రికలు వెబ్ మ్యాగజైన్లుగా , ‘ఆన్ లైన్ ‘ పత్రికలుగా  దర్శనమిచ్చినా మచ్చుకు కొన్ని పత్రికలు అచ్చులో రాసాగాయి, అందులో  ‘పాలపిట్ట ‘ సాహిత్య మాస పత్రిక ఒకటి . సిసలైన సృజనకు వేదికగా వుంటూ, ప్రమాణాలు పాటిస్తూ అనేక ఒత్తిళ్ల నడుమ తన ఉనికిని, అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది.  అందుకు సంపాదకుడిగా గుడిపాటి గారి సంకల్ప బలం పునాది రాయి వంటిది. కరోనా తీవ్రత కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో దాదాపుగా అన్ని కార్యాలయాలతో పాటు  ప్రెస్సులు మూతపడటంతో పాలపిట్ట ఫిబ్రవరి, 2020 సంచిక నుండి కొన్ని నెలలు పి  డి ఎఫ్  కాపీలు చేసి వందలాది మందికి పంపించడం జరిగింది. ఇందులో చందాదారులతో పాటు వందలాది పాఠకులు  వున్నారు.  ఫలితంగా ‘పాలపిట్ట’ అందరికి అందుబాటులో వుండి పాఠకుల సంఖ్య పెరగడంతో పాటు  అందరి నుండి మంచి స్పందన వచ్చింది.  దీనితో పాఠకుల సంఖ్య పెరగడం తదనుగుణంగా చందాదారుల సంఖ్య కూడా పెరగడంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్న పట్టుదల పెరగడం గుడిపాటి గారి సంకల్పానికి మరో నిదర్శనం .

      మే, 2020  సంచిక లాక్ డౌన్ సమయంలో విల్సన్ రావు  కొమ్మవరపు ప్రత్యేక సంచికగా వచ్చింది. ఆ తర్వాత వరసగా సంచికలు వచ్చాయి. కరోనా మహామ్మారి సమయం లాక్ డౌన్ లో కూడా సంచికలు రావడం,  పి డి ఎఫ్  రూపంలో పాఠకులందరికి అందుబాటులో ఉండటంచేత, పాత వారితో పాటు కొత్త పాఠకులు, యువ రచయితలూ, రచయిత్రులు, పరిశోధక విద్యార్థులు కూడా పాలపిట్ట సభ్యులుగా చేరడంతో, పాలపిట్ట రెక్కలకు కొత్త  ఉత్తేజo, బలo అంది వచ్చాయి. అలా ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ ఈ పన్నెండేళ్ల ప్రయాణంలో మొత్తం 116 సంచికలు వెలుగు చూసాయి.  ప్రతి సంచిక, ప్రత్యేక సంచికలు సాహిత్య విషయాలతో పరిపుష్ఠిగా వచ్చాయనటంలో సందేహం లేదు. సంపాదకుల సంకల్పబలం ఎంతగా వున్నా నిజానికి ఆయా కాలాల, సమాజాల అవసరాలు వ్యక్తుల, సంస్థల, పత్రికల ఉనికికి, మనుగడకు తోడ్పడతాయి. తెలుగు సమాజానికి, తెలుగు సాహిత్యం అవసరం ఉన్నందుకే ‘పాలపిట్ట’  ప్రయాణం కొనసాగుతున్నది .

     విభిన్న సాహితీ ప్రక్రియలకు,  విభిన్న అస్తిత్వాలకు వేదికగా వుంటూ తనదైన ముద్ర వేసుకుంది. కవితలు కథలు, విమర్శ, సమీక్షా వ్యాసాలూ,  సీరియళ్లు, ప్రముఖ సాహితీ వేత్తల ఇంటర్వ్యూ లు/ముఖాముఖి సంభాషణలు  తెలుగు సాహిత్యానికి వారందించిన ఆదాన ప్రదానాలు ఇలా అనేక అంశాలతో సాధారణ పాఠకులకే కాదు తెలుగు ఉపాధ్యాయులకు, పరిశోధక విద్యార్థులకు (Research Scholars) కూడా ఉపయోగకరంగా ఉంటాయి. అందమైన ముఖచిత్రంతో, సాహిత్య విషయాల పరిపుష్టితో  వస్తున్న ‘పాలపిట్ట’ సదా సచేతనంగా,  క్రియాశీలంగా, సృజనశీలుర ఆదరణతో, సాహితీ వినీలాకాశంలో ఎగరాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు గుడిపాటి గారికి  ఈ పుష్కరయానం  పూర్తిచేసుకున్న సందర్భంగా  అభినందిస్తూ… పాలపిట్ట ప్రయాణం ఆగకుండా సాహితీ వైదగ్ధ్యంతో సంపద్వంతంగా కొనసాగాలని ఆశిస్తూ, శుభాకాంక్షలతో…

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us