Imitation బహుశా తెలుగులో దీనర్ధం అనుకరణ అనుకుంటా. దేశాలు మారినా సంస్కృతి మారదు. పిల్లలు అల్లరి చేస్తుంటే రకరకాల Cartoon shows పెట్టి కాసేపు వాళ్ళ అల్లరి నుండి ఉపశమనం పొందడానికి కొత్త Shows వెదుకుటలో భాగంగా ఈ మధ్య TV లో రామాయణం సంబంధించిన Animation Movie పెడితే గత నాలుగు రోజులుగా ఆ Show చూస్తున్న పిలగాడు దానిలో మొత్తం లీనమయి ఇంట్లో రకరకాల యుద్ధవిద్యలు ప్రదర్శిస్తున్నడు. ఇంగ్లీష్ లో ఏవేవో యుద్ధానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతుంటే ఆ యుద్ధానికి ముందటి కవ్వింపులు అర్ధం కాలేదు గానీ పిలగాడు డైలాగ్ కొట్టే తీరుని బట్టి ఇది తప్పకుండా ఈ Animation Movie ప్రభావమే అని అర్ధమయింది.
ఎనుకటికి బాలమిత్ర , చందమామ పుస్తకాల్లో కవర్ పేజీపై వేసిన విక్రమార్కుని బొమ్మలు , రామాయణ , మహాభారత పాత్రల చిత్రాలు అలాగే వివిధ దేవుళ్ల బొమ్మలు పిల్లలనే గాక పెద్దలను సైతం బాగా ఆకర్షించేవి. లోపలి పేజీల్లో కూడా ఒక్కో కథకు ఒక్కో చిత్రం బహు ముచ్చటగా ఉండేవి. కాగా ఆ రామాయణం షో చూసిన పిలగాడు ఆంజనేయుడు సంజీవనీ పర్వతాన్ని ఎత్తుకొచ్చే సీన్ ను అనుకరణ చేస్తూ ఇంట్లో వున్న బరువైన వస్తువులను పైకి ఎత్తి హావభావాలతో హంగామా చేస్తున్నడు. రామరావణ యుద్ధం దృశ్యాలు, ఒకరిపై ఒకరు వాళ్ళు వేసుకునే వ్యంగ్యాస్త్రాలు, బాణాల ప్రదర్శనలు ముమ్మరంగా నడుస్తున్నయి.
ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు బడికి పొయొచ్చినాక స్కూల్లో టీచర్స్ చేసినట్లుగా ఆక్షన్స్ చేయడం , వాళ్ళు స్టూడెంట్స్ ను ప్రశ్నలు అడిగే విధానం , వాళ్ళ ను కట్టె పట్టుకుని కొట్టినట్లు Action చేయడం లాంటివన్నీ గుర్తుకొచ్చినయి. దాదాపు ఈ ఆటలన్నీ అందరూ వాళ్ళ వాళ్ళ చిన్నతనంలో ఆడినవే.
చివరకు ఈ Imitation అనేది ఎక్కడిదాకా పోయిందంటే Jewellery ని కూడా వదల్లేదు…
అమ్మ
ఎంతో కమ్మని పిలుపు మమతల పిలుపు
వినగానే ఆ పిలుపు ఉవ్వెత్తున లేస్తుంటాయి నాలో కోట్లాది ప్రేమ తరంగాలు
అమ్మ
తన రక్తంతో మూడేసి
పొరల మాటున
నవ మాసాలు నిలుపుకుంది కడుపులో నేను భారమైనా కొద్దీ సంబరపడేది
అమ్మ
నన్ను కనేటప్పుడు వేసిన కేకకు
జీవితాంతం సేవ చేసిన తీరని రుణకేక అది
అమ్మ
రెండు సంవత్సరాలు తన రక్తాన్ని పాలుగా చేసి తాపింది ఆ పాలబలమే ఈనాటికి నన్ను నడుపుతోంది
అమ్మ
నా బోసి నవ్వులు
నా తప్పటడుగులు
తన గుండెల్లో నిలుపుకున్న దృశ్యాలు
అమ్మలో ప్రేమ లేకపోతే నాన్నలో దయ లేకపోతే
ఏ చెత్తా కుండీలోనో
విసిరి వేయబడే వాణ్ణి
అమ్మ
అమ్మ హృదయం అమృతం ఆమె తినకుండా తినిపించింది
ఆమె నిద్రపోకుండా
నిద్దుర పుచ్చింది
నేను కష్టాల్లో ఉంటే ఓదార్చేది నేను నష్టాల్లో ఉంటే పూడ్చేది
నాకు ఏడు పదులు దాటినా ఏడేళ్ల వానిగానే తలుస్తుంది తన కోడలు తన మనుమలను చూసి ఉప్పొంగుతుంది
కానీ
నేనే…
నేనే…
ఆమెను ఓల్డ్ ఏజ్ హౌస్ లో విడిచి వచ్చాను
ఓ మనిషీ!
తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్న ప్రవక్తను మార్చావా పో నరకానికి పో
అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి దూరం మాత్రమే! రెప్పపాటు కాలం అందలమైనా ఎక్కించగలదు లేదా అధఃపాతాళానికైనా తొక్కేయగలదు. వైద్యం కొత్త పుంతలు తొక్కి, ఔషధం ఎల్లలు దాటి సేదదీరుస్తున్నా ! ఎక్కడో ఒకచోట అపశృతి విలయతాండవం చేస్తూనే ఉంటుంది. అందమైన జీవితాల్లో కల్లోలం సృష్టిస్తూనే ఉంటుంది. అలా ఓ భావి జీవితాన్ని నిర్దయగా కబళించి, నిస్తేజంలోకి నెట్టిన సంఘటన.వివరాల్లోకి వెళ్తే… వైకల్యాన్ని తన మనోబలమనే ఉక్కు పాదంతో తొక్కి పెట్టి, పడి లేచిన కడలితరంగమై, నింగి కెగసిన తారాజువ్వలా దూసుకుపోతున్న ఈ ఆత్మవిశ్వాసం పేరే బాలలత మల్లవరపు.
సివిల్ సర్వీస్ అభ్యర్థుల ఆరాధ్య దైవం, ఆమె మార్గ నిర్దేశం కోసం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటారు. తనకు ప్రాంతీయ భేదాలు లేవని తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన
వ్యక్తినంటూ చెప్పే వీరు గుంటూరు వాస్తవ్యులైన శ్రీ శౌరయ్య, విజయ దంపతుల కుమార్తె. ఈమెకు సంవత్సరంలోపే పోలియో చుక్కలు వికటించి రెండు కాళ్లు పని చేయకపోవడంతో డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించలేదట. ఆటపాటలతో, చదువుసంధ్యలతో హాయిగా సాగాల్సిన బాల్యంలో
ఆ చిన్ని మనసు ఎన్ని అలజడలకు లోనై ఉంటుందో కదా! ‘వైకల్యం అపహాస్యం చేసినా చివరికి సంకల్పబలం ముందు తలవాల్చింది’ .ఆత్మస్థైర్యంతో చదువు కొనసాగిస్తూ న్యాయ శాస్త్రంలో పట్టా పొందినా, సమాజం వికలాంగురాలిగా గుర్తించడం బాధించిందంటారు. డాక్టర్ల చుట్టూ తిరిగినప్పుడు లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి వ్యక్తుల్లో అని వారు అన్నప్పుడు, నేను ఎక్కువ రోజులు బతికి చూపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నానని కానీ ఎన్ని రోజులు బతికామన్నది కాదు, ఎంత సాధించాం ,సమాజానికి ఏం చేశామన్నది మాత్రమే ముఖ్యం అంటారామె .
బాల్యం నుండి అవహేళనలతో బాధకు గురైన సందర్భాలెన్నో గుర్తొస్తాయంటారు. నన్ను నేను నిరూపించుకోవాలనుకుని , డిగ్రీ సెకండ్ ఇయర్లో ఐ.ఏ.ఎస్ . కోచింగ్ కోసం ఒక కోచింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ ‘ఆసి రెడ్డి ‘గారు మాట్లాడుతూ గ్రూపు 2. లాంటి పరీక్షలు రాయమ్మా, రెండు సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయత్నించు కావాలంటే స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తానంటూ అనునయించి పంపారని గుర్తు చేసుకుంటారు. వారికి తాను ‘ఏకలవ్య శిష్యురాలి’నని పేర్కొంటారు.
ఎంతసేపు చదివామన్న దానికంటే ఎంత మనసు పెట్టి చదివామన్నదే ముఖ్యం. గడచిన క్షణాలు తిరిగి రావు కాబట్టి జీవితాన్ని ‘పాషన్’తో ఉత్సాహంగా గడపాలంటారు. సివిల్స్ పై దృష్టి పెట్టి ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే 2004లో ,399 ర్యాంక్ సాధించి, రక్షణ మంత్రిత్వ శాఖలో అకౌంట్స్ సర్వీసెస్ కు ఎంపిక కావడం తనలో ఆత్మవిశ్వాసాన్ని అధికం చేసిందంటారు. తన విజయం వెనుక నాన్న కృషి వెలకట్టలేనిదని , విలేకరిగా వారి అనుభవాలు సమాజాన్ని చూపించిన తీరు తనకు ఎంతో కలిసి వచ్చిన అంశాలుగా పేర్కొంటారు. నాన్న బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చినప్పుడు పుస్తకాలు కావాలంటూ తెప్పించుకుని చదివేదాన్నని రెండు సంవత్సరాలు ఇంటికే పరిమితమయ్యానంటారు. ఐ.ఏ.యస్.గా పేపర్లో ఫోటో చూసుకోవడమే తన ధ్యేయంగా దాదాపు 12 – 15 గంటలు చేసిన కృషికి దక్కిన ఫలితంగా పేర్కొంటారు.
సివిల్స్ ఆస్పిరెంట్స్ యన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాలు 6 నుండి 12వ తరగతి వరకు చదివి జ్ఞానం సంపాదించాలంటారు .
ఉద్యోగరీత్యా చెన్నైలో ఉన్నప్పుడు ఎంతోమంది సివిల్స్ అభ్యర్థులు తన సలహాల కోసం రావడం మొదలుపెట్టారని మెంటార్ గా ఎంతోమందికి ర్యాంకులు రావడంలో సహాయసహకారాలు అందించానంటారు .అప్పుడే తనలో ‘నేర్పాలనే’ ఆలోచనకు బీజం పడిందంటారు. ఆరు సంవత్సరాల క్రితం సి .యస్.బి.
ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ పెట్టాలని నిర్ణయించుకున్నపుడు ముందుగా తనపై తానే ప్రయోగం చేసుకోవాలనుకుని తిరిగి 2016లో సివిల్ సర్వీసెస్ కు అప్లై చేసి 167వ ర్యాంకు పొందినపుడు తన నిర్ణయం సరైనదేనని భావించారట.
మెంటర్ గా ఎంతోమంది కి శిక్షణ ఇస్తూ , వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతూ సమాజానికి చక్కటి యువతను, అధికారులను అందిస్తూ ప్రభంజనమై సాగుతున్న వీరి జీవిత భాగస్వామి శ్రీ సురేష్ బాబు ‘ గ్రూప్ వన్’ ఆఫీసర్ కాగా, పదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు.
తల్లిదండ్రులు తమ ఆశయాలకు అనుగుణంగా కాకుండా నిర్ణయాధికారం పిల్లలకే వదిలేసి వారికి నచ్చిన రంగాల వైపు నడిపించాలంటారు.
ఒక ఐఏఎస్ అధికారిణిగా ఉండడంలోని తృప్తి కంటే ఎంతో మందికి శిక్షణనిస్తూ మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకంగా ఉండటంలోనే తనకు ఆత్మసంతృప్తి లభించిందంటారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిస్తున్న వీరు భారతదేశంలో స్త్రీలు మరియు దివ్యాంగులపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలన్నదే తన తపన అంటారు. దాంట్లో విజయం సాధిస్తేనే తన లక్ష్యం నెరవేరినట్లు అంటారామె.
జీవితం ప్రశాంతంగా ఉండాలంటే తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగాలనే వీరు, సివిల్స్అభ్యర్థులు ప్రారంభం నుండే టెస్టులు రాస్తూ ఉండాలని ,సిలబస్ అయ్యాక రాయడం మంచిది కాదంటారు. రివర్స్’ ఇంజనీరింగ్ మెథడ్ ‘ఫాలో అవ్వాలని సూచిస్తారు.
జనం ఎవరేమన్నా పట్టించుకోకు శత్రువుల్ని గెలవాలంటే లక్ష్యం మాత్రమే మన మనసులో మెదులుతూ ఉండాలని, ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే విజయం నీకు దాసోహం ఔతుందంటారు . మన ఆలోచనలే మనల్ని డిసైడ్ చేస్తాయి థాట్స్ ని సీరియస్గా తీసుకోకూడదంటారు “ఐయామ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్” అన్న భావన బలీయంగా ఉండాలంటారు. మన జీవితం మనకు మాత్రమే సొంతం. గతాన్ని తలుచుకుంటూ కూర్చోకుండా అనుభవాలనే జీవిత పాఠాలుగా మలుచుకోవాలని ,ప్రతి విషయానికి టెన్షన్ పడుతూ, నిర్ణయాల్ని వాయిదా వేసి, ఆలోచనాశక్తిని కోల్పోకుండా తట్టుకుంటూ ముందుకు సాగా లంటారు. సమాజంలో అందరూ మంచివాళ్లే ఉంటారనుకుని భ్రమ పడక, జాగ్రత్తగా అడుగులు వెయ మంటూ దారి చూపుతారు. నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడే సమాజం నిన్ను గౌరవిస్తుందనే
వీరి దృష్టిలో,’ మనోబలమే నిజమైన శక్తి ‘.
జీవితం రైలుబండి లాంటిది ఎంతోమంది తారసపడుతుంటారు. బంధాలు బాంధవ్యాలు దూరం అయినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్తుంటారు .అశాశ్వతమైన బంధాల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడం సరికాదు అంటూ యువతకు హితోపదేశం చేస్తారు .మన అనుభవాల్ని జీవిత పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగాలంటూ ధైర్య వచనాల్ని స్వానుభవంతో చెప్పారు .గతాన్ని వదిలేసి భవిష్యత్తును ఊహిస్తూ ఆలోచనల్లో ఊగిసలాడడం సరికాదంటూ సలహా ఇస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని వెన్ను తట్టి చెబుతారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమార్గం
ఎంతో అనుకూలమైందంటూ సూచిస్తారు.
సమయం ఎవరికోసం ఆగదు తెలివిగా సమయాన్ని ఒడిసిపడితేనే విజయం నీదౌతుందంటూ
వెన్ను తడతారు.మన కోసం మనం జీవించాలి. అనునిత్యం ఆత్మ పరిశీలన అవసరం , కలల్ని కంటూ సాకారం చేసుకోవాలనే వీరు నిర్ణయాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం సరికాదంటారు.
సామాజికాంశాల్ని ఎప్పటి కప్పుడు తెలియజేసే వీరు, కీర్తిశేషులు. శ్రీమతి సుష్మా స్వరాజ్ గారిని తన స్ఫూర్తి ప్రదాతగా పేర్కొంటారు.
వ్యవస్థ ,మనుషుల్లో అంత త్వరగా మార్పు కనిపించిందని, యువతను మార్చడమే తన ఆశయమని.’ వేచి చూస్తేనే విజయం వరిస్తుంది ‘పోరాడి గెలిచిన వాడే రియల్ హీరో ‘అంటూ, సవాలును స్వీకరిస్తూ మంచి ఆశయాలతో ముందుకు సాగాలంటారు. మనిషి కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేసే రోజులు రావాలంటూ ఆకాంక్షిస్తారు . ఆత్మ న్యూనతకు లోనైతే ఏది సాధించలేరంటూ , ‘భయపడడం తప్పు కాదు, భయాన్ని జయించలేకపోవడమే పెద్ద తప్పు’ అంటారు. భయాన్ని వీడితే నిన్ను ఏ శక్తి ఆపలేదంటూ ధైర్యం నూరిపోస్తారు.ఎంచుకున్న మార్గం స్పష్టంగా ఉన్నప్పుడు ప్రయత్నం నల్లేరుపై నడకలా సాగిపోతుందని, ప్రతి నిమిషం చాలా విలువైనదని, గెలుపోటములు పక్కన పెట్టి వర్తమానంలో జీవిస్తేనే ప్రశాంతత దొరుకుతుందంటారు.
ఓపిక ,పట్టుదల గెలుపుకు రెండు మెట్లలాంటివని మనల్ని మనం అభిమానించుకుంటేనే ఎన్నో విజయాలను అందుకోగలం ఇతరుల గురించి ఆలోచించడం, అసూయాద్వేషాల మధ్య కొట్టు మిట్టాడితే నీ లక్ష్యాన్ని మరిచిపోతావంటారీమె .
‘లాయిడ్ గ్రూప్ ‘సంస్థల అధిపతి శ్రీ విక్రమ్ నారాయణ గారి ఉదారత, సేవానిరతి తననెంతో ప్రభావితం చేశాయని వారు’ ధనిక్ భారత్ మిషన్ ‘విద్యా సంస్థలను ప్రారంభించడానికి ముందు నన్ను సంప్రదించినప్పుడు ‘ సర్ , మీరు నా స్పీడును అందుకోగలరా !అంటూ ప్రశ్నించిన ఆమె ఆత్మ స్థైర్యానికి ఆశ్చర్యపోకుండా ఉండడం అసాధ్యమని నా భావన. దాదాపు ఒక లక్షా యాభైవేల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినప్పుడు వారి అభిప్రాయాలు విన్న తర్వాత ఆ పదహారేళ్ల వయసు పిల్లల్లో తప్పకుండా మార్పు తీసుకు రాగల సత్తా నాకుందనిపించి ఈ విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉండడానికి నిశ్చయించుకున్నానని ,
‘ధనిక్ భారత్’ విద్యాసంస్థల పేరిట 16 బ్రాంచీలతో ‘ఇంటర్ మీడియట్’ కాలేజీ’లు ప్రారంభించబోతున్నామంటూ, తమ కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం ఉండదంటూ స్పష్టం చేశారు. యువతకు సరైన దిశా నిర్దేశం చేస్తూ జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సరైన మార్గం చూపించగలమని గట్టిగా చెప్పగలనన్నారు. సాధారణ విద్యార్థినినైన నేను ,నాపై నాకు నమ్మకం లేకున్నా మొండి ధైర్యంతో ముందుకు నడిచి గెలుపు సాధించాను ,అలాగే అంగవైకల్యం ఉన్న పిల్లలకి కోచింగ్ ఇస్తున్నప్పుడు వారిలో నన్ను నేను చూసుకుంటాను అంటూ చెప్పే వీరు గెలుపు కోసం ఐదు సూత్రాలను పాటించాలంటారు .
ఒకటి . డిసిప్లిన్ ,
రెండు . క్లారిటీ అఫ్ థాట్
మూడు. ప్లానింగ్
నాలుగు. డిజైన్
ఐదు. పర్పస్ ఆఫ్ లైఫ్
సరైన ప్రణాళిక ,అవగాహన ఉత్సాహం ఉంటే రెండు సంవత్సరాల్లో సులభంగా సివిల్స్ లో విజయం సాధించవచ్చు అంటూనే ,ఒకవేళ ఓటమి ఎదురైనా ఆ అనుభవంతో జీవితంలో ఏదో ఒక రకంగా ఉన్నతంగా జీవించగలరని ధీమాగా చెప్తారు. భావోద్వేగంతో కూడిన జీవనశైలి అంటే తనకు ఎంతో ఇష్టమని, ” తన జీవిత పుస్తకంలో ప్రతి పేజీ కొట్టివేతలు లేకుండా అందంగా మలుచుకోవాలనే తపన ఆరాటం తనలో అనుక్షణం ఉంటుందంటూ ‘ చెప్పే వీరు,
చిన్ననాడు ‘వడ్డాణం ‘కొని పెడతానన్న తాతయ్య మురిపెపు మాటలకు బంధువులు చేసిన అవహేళనలు తనను ఇప్పటికీ బాధించే సంఘటనైననా “నా పేరే నాకు ఆభరణం”లా మారిందంటూ ఆత్మవిశ్వాసంతో ,ఒకింత ఆనందంతో చెప్తారు . విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో తన జీవితాన్ని అంకితం చేస్తానంటూ దానికోసం కుటుంబానికి కూడా దూరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు, వారి భాగస్వామి మమ్మల్ని వదిలేసావన్నమాట అంటూ నవ్వుతూ అన్న మాటల్ని గుర్తు చేస్తూ, మంచి భర్తకు సరైన నిర్వచనం మావారంటూ కితాబిస్తారు.
తొణకని ఆత్మవిశ్వాసం, ప్రవాహం లాంటి మాట తీరు ,ఎంతోమంది పిల్లల్ని ఐ.య్యే.యస్ .లుగా చేయాలన్న మీ తపన అభినందనీయం . విద్యార్థుల్ని గైడ్ చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతున్న మీరు మరెందరికో రోల్ మోడల్ గా మారి మునుముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ.
సొగసైన అక్షర శిల్పాలను కలబోసి ఒడుపుగా కూర్చిన తేటతెనుగు అక్షరకాంతను నేను
శివుని పంపున ఇలకు దిగిన పుష్పగంధను నేను
వసివాడిన శబ్దకుసుమాలలో
జీవకళ నింపే అంగీరసను నేను
ముద్దుగారే చిన్నారుల నోటి
మాటల జుంటి తేనియను నేను
ఒడుపైన దోసిట అక్షరమై ఒదిగిపోయే అమృతభాండాన్ని నేను
కళతప్పిన తెలుగుదనానికి రంగులు కలబోసిన హరివిల్లును నేను
అలసిన వేళ వర్ణరాగ రంజితమై హాయిని గొలిపే మలయ సమీరాన్ని నేను
క్షరమైపోతున్న పద సౌందర్యానికి వన్నెచిన్నెలద్దే కవి కోకిలలు చేతబట్టిన అక్షర తూలికను నేను
ఉనికి ప్రశ్నార్థకమైన ఊగిసలాటలో భావితరానికి ఊతమయ్యే
శబ్ద క్రాంతిని నేను
హంసవాహిని చేతిలో ఆభరణమై వెలుగులీనుతున్న జ్ఞాన
జ్యోతిని నేను
అంతిమంగా అమ్మ భాషలోని కమ్మదనపు తేనెలొలుకు
తేట తెనుగును నేను.
మహిళలు వంటగదిని దాటి ఇప్పుడు ఉద్యోగాలలోకి వస్తున్నారు కానీ మొన్నమొన్నటి వరకు ఆ పరిస్థితి లేదు.అంతకుముందు వాళ్లకు అసలు చదువే లేదు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి ఆడపిల్లలను చదువుకొమ్మనే దాకా మనవాళ్లకు ఆ ధ్యాసే లేదు.ఒకవేళ తెగించి ఎవరైనా చదువుదామని ప్రయత్నం చేస్తే మన సమాజంలోని చాందసులు గగ్గోలు పెట్టేవారు. ఆడపిల్లల చదువుకోసం జ్యోతిరావు ఫూలే దంపతులు ఎలాంటి కృషి చేశారో అందరికీ తెలుసు. వారికి అడుగడుగునా అడ్డుపడింది ఎవరో కూడా తెలుసు. ఆ వర్గం వారి కుట్రల ఫలితంగానే భారత దేశంలోని మహిళలు వందలేళ్ళుగా బానిసలుగా బతుకీడుస్తున్నారు.మహిళలు ఇంటిగడప దాటి బయటకు రావటమే మహాపాపంగా అభివర్ణించారు పండితులు.తమకున్న పాండిత్యంతో సమాజాన్ని ప్రభావితం చేసి మహిళలను అన్నిరకాలుగా అణిచివేశారు.ఈ అణిచివేత మొన్నమొన్నటి వరకు నిరాఘాటంగా కొనసాగింది.ఇప్పటికీ చాలా ఇళ్లలో ఇది అనధికారికంగా కొనసాగుతున్నది.ఈ కుట్రల రాజకీయానికి ఒక అందమైన పేరున్నది. అదే’పితృస్వామ్య వ్యవస్థ’.దీన్ని ‘పురుషస్వామ్య వ్యవస్థ’అని కూడా పిలుస్తున్నాం.మగవాడి ఆధిపత్యం నడిచే వ్యవస్థ కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది.మన సమాజాన్ని పరిశీలించినా, సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పరిశీలించినా మగవాడి ఆధిపత్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది.ఈ ఆధిపత్యం కారణంగానే మహిళలు ఇప్పటివరకు అన్నిరంగాలలో మగవాళ్ళతో సమానంగా ముందుకు వెళ్లలేకపోయారు. ఇటీవలి కాలంలో ఆధునికత కేవలం చదువులోనే కాకుండా జీవితంలో కూడా చేరిపోయిన కారణంగా, మహిళలు తమ హక్కుల కోసం రాజ్యాంగ బద్ధమైన పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో వారి భాగస్వామ్యాన్ని సమాజం కొంత అయిష్టంగానైనా సరే ఆమోదించే పరిస్థితి వచ్చింది. దేనివెనుక పెద్ద చరిత్రనే ఉంది.స్థూలంగా చెప్పాలంటే 1975 నాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుకు వచ్చిన చైతన్యంలోనుంచి మహిళలు గొంతువిప్పటం ప్రారంభించారు.1980 తర్వాత స్త్రీల చైతన్య ధార స్త్రీవాదంగా రూపొందింది.

స్త్రీవాదం తెచ్చిన చైతన్యంతో స్త్రీలు చరిత్రలో తమ స్థానం గురించి రకరకాల కోణాల్లో పరిశోధనలు ప్రారంభించారు.ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యాన్ని స్త్రీ వాదం నుంచి రూపొందిన నూతన పరికరాలతో చూడటం ప్రారంభించారు. ప్రాచీన సాహిత్యాన్ని కూడా స్త్రీవాద దృక్పథంతో పరిశీలించటం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ప్రసిద్ధ రచయితలు కాత్యాయని విద్మహే,కె. ఎన్. మల్లీశ్వరి పూనుకొని ప్రాచీన సాహిత్యంలో తమ భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషాధిక్యత కారణంగా మరుగున పడిపోయిన కవయిత్రులను వెలికి తీసి వారిని చరిత్రలో నిలిపే ప్రయత్నం చేశారు. చరిత్రను పరిశోధించి తెలుగులో రాసిన 18 మందితో పాటు, తెలుగువాళ్లే అయినప్పటికీ ప్రాకృతంలో,సంస్కృతంలో రచనలు చేసిన 22 మంది ప్రాచీన కవయిత్రులను “ప్రాచీన తెలుగు కవయిత్రులు”పేరుతో వేసిన పుస్తకంలో పరిచయం చేశారు.ఇది’ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’తరుపున వెలువడిన వ్యాస సంకలనం.
ముందే చెప్పినట్టు మహిళలు కాబట్టి వీళ్ల గురించి చరిత్రలో దొరికే ఆధారాలు తక్కువ.ఎందుకంటే ప్రాచీన కాలంలో మహిళలకు విద్యాహక్కు లేదు.శూద్రులతో పాటుగా బ్రాహ్మణ మహిళలకు కూడా విద్య నిరాకరింపబడింది. చదివితే తమతో సమానమవుతారనే స్వార్ధంతో నాటి పండితులు ధర్మ శాస్త్రాల ఉటంకింపులు చూపిస్తూ మహిళలను అన్నిరకాలుగా అణచివేశారు. ప్రాచీన కాలంలో కవిత్వం రాసిన కవయిత్రులందరూ ధిక్కార స్వభావం కలిగినవాళ్ళు.ఆనాటి ఆచారాలను ధిక్కరించి,పితృస్వామ్య భావజాలాన్ని ఎదిరించి చదువుకోవటమే కాకుండా కవిత్వం చెప్పగల స్థాయికి చేరటమంటే మామూలు విషయం కాదు.ఈ క్రమమంతా పండిత వర్గ భావజాలానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి సహజంగానే వారి గురించి సమాచారాన్ని తొక్కిపెట్టే అవకాశం ఉంది.అందుకే ప్రాచీనకాలంలో పురుష కవుల రచనలు గానీ వివరాలు గానీ లభ్యమైనంత సులభంగా కవయిత్రుల రచనలు గానీ వివరాలు గానీ లభించటం లేదు. సాహిత్య చరిత్రలు విస్మరించిన ఇటువంటి కవయిత్రులను వెలుగులోకి తీసుకురావడానికి ఈ పరిశోధకులు ఎంత ఎంత కష్టపడ్డారో?
ఇందులో కవయిత్రులను పరిచయం చేస్తూ కాత్యాయని గారు కొన్ని, మల్లీశ్వరి గారు కొన్ని వ్యాసాలు రాశారు. అయితే ఆ వ్యాసాలు సాహిత్య చరిత్ర నమూనాలో కేవలం వివరాలు చెప్పటానికే పరిమితం కాలేదు. సందర్భానుసారంగా ఆ కవయిత్రులు పితృస్వామ్య వ్యవస్థ రూపొందించిన చట్రంలోనుంచి మాట్లాడారా లేదా దానికి వ్యతిరేకంగా నిరసన పూర్వకమైన స్వరాన్ని వినిపించారా అన్న విషయాన్ని నిర్ధారిస్తూ వ్యాఖ్యానించారు.కుప్పాంబికను పరిచయం చేసే వ్యాసంలో “కుప్పాంబిక పద్యం ఒక శారీరక స్పృహ కలిగినటువంటి స్త్రీ యొక్క అంతరంగాన్ని, ఆంతరంగిక ఉద్వేగాన్ని వ్యక్తీకరించటంలో ఒక మలుపు”అని చెప్తూ చానమ్మ, ప్రోలమ్మల పద్యాలతో ఎలా పోల్చి చూడవచ్చో చెప్పారు.”ఖడ్గ తిక్కనను ఆడవాళ్లతో పోల్చటం ద్వారా అవమానపరిచాం అనుకున్నారు.అందులో తమను తాము కించపరచుకుంటున్నాం అన్న స్పృహ వాళ్లకు లేదు” అన్న విశ్లేషణతో చానమ్మ, ప్రోలమ్మలు ఆనాటి సమాజం నిర్దేశించిన చట్రంలో ఎలా ఒదిగిపోయారో వివరించారు.ఇలా కవయిత్రులను కేవలం వారి రచనల పట్టికలతో మాత్రమే పరిచయం చేయకుండా వారివారి వ్యక్తిత్వాలలోని వైవిధ్యాన్ని విమర్శా దృష్టితో పరిశీలన చేయటం ద్వారా ఈ పుస్తకాన్ని భావి పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా మలిచినట్లైంది.
ఇప్పటివరకు కేవలం కవయిత్రులను గురించి వచ్చిన సాహిత్య చరిత్రలు తెలుగులో రెండే ఉన్నాయి. అందులో ఒకటి ఆండ్ర శేషగిరిరావు రాసిన”ఆంధ్ర విదుషీమణులు”,మరొకటి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ రాసిన”ఆంధ్ర కవయిత్రులు”.వీటితో పాటు విడివిడి వ్యాసాల సందర్భంగా అక్కడక్కడా ప్రస్తావనకు వచ్చిన కవయిత్రుల తగుమాత్ర సమాచారం మినహా ఈ విషయంలో జరిగిన పెద్ద కృషి లేదు. వీటిలో కూడా రకరకాల కారణాలవల్ల,ముఖ్యంగా సమాచార లేమి వల్ల అందరూ చేరకపోవటం ఒక చిన్న వెలితి.దానిని పూరిస్తూ ఇప్పటివరకు నమోదైన అందరితోపాటు కొత్తవారిని కలుపుకొని వచ్చిన సమగ్ర సాహిత్య చరిత్ర ఇది.రచయిత్రుల మాటల్లో చెప్పాలంటే”అనేక పరిమితుల మధ్య ఇప్పటికి ఇది ప్రాచీన తెలుగు కవయిత్రులకు సంబంధించిన సమగ్ర సాహిత్య సమీక్షా రచన”.
ఈ సాహిత్య చరిత్రను మునుపటి రచనలకంటే సమగ్రం చేయటానికి వారు చాలా శ్రమ పడవలసి వచ్చింది. సమకాలీన సాహిత్య చరిత్ర రాయటం వనరుల లభ్యత దృష్ట్యా పెద్ద కష్టమైన పని కాదు. కానీ ప్రాచీన కవుల అందునా కవయిత్రుల చరిత్ర రాయటం నిజంగా కష్ట సాధ్యమైన పని. ఆ కష్టాన్ని వారు ఇలా చెప్పుకున్నారు.”చెలికాని చెల్లాయమ్మ గురించి ఏక వాక్య సమాచారాన్ని అందిపుచ్చుకుని ఆమె గురించి తెలుసుకోగలిగాము. అన్నదానం వెంకటాంబ, శిరిగంబూరు అన్నపూర్ణమ్మ వంటి కొత్తవాళ్లను పరిచయం చేసుకోగలిగాము.కృష్ణాజమ్మ గురించి ఇంకొన్ని వివరాలు సేకరించగలిగాము. బాల పాపాంబ,బలభద్ర దాసి, దార్ల సుందరమ్మ, మదిన సుభద్రయ్యమ్మ మొదలైన వాళ్ళ సాహిత్యాన్ని సంపాదించి విశ్లేషణలు మొదలుపెట్టాం. తెలుగు వాళ్లే అయి సంస్కృతంలో రాసిన కవయిత్రులను గురించి కూడా చదవటం చెప్పటం వలన తెలుగు స్త్రీల బహుముఖ ప్రజ్ఞను మొత్తంగా అర్థం చేసుకునే అవకాశం దొరికింది”.ఈ మాటల వల్ల ఈ సాహిత్య చరిత్ర నిర్మాణ క్రమం ఎంత పకడ్బందీగా జరిగిందో తెలుస్తుంది.
ముందే చెప్పినట్టు ఇది కేవలం సాహిత్య చరిత్ర పరిధిలోకి వచ్చే లక్షణాలతో సాగిన రచన కాదు.ఆయా కవయిత్రుల కవిత్వ సమీక్ష ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.ఆయా సమాజాలలో కవయిత్రులుగా నిలబడటం దగ్గరినుంచి వారి జీవిత నేపథ్యం,అలాగే కవిత్వ నేపథ్యం వారి రచనలను ఎలా ప్రభావితం చేశాయో లాంటి కీలకమైన అంశాల ప్రస్తావన దాకా సాగిన ఈ సాహిత్య పరామర్శ విమర్శా లక్షణాలను పుణికి పుచ్చుకున్న సాహిత్య చరిత్రగా అవతరించింది. ఇట్లాంటి కృషి సాహిత్య చరిత్ర రచనలో ఏర్పడిన ఖాళీలను పూరించడానికి బాగా పనికి వస్తుంది. భవిష్యత్తులో ఇతర సమూహాల ప్రాచీనతను దేవులాడటానికి కూడా ఈ కృషి ఒక ఆదర్శంగా నిలుస్తుంది.
వేదకాలపు బ్రహ్మవాదినులు కేవలం విదుషీమణులు మాత్రమే కాదు, వారు భారతీయ విజ్ఞాన, తాత్విక వారసత్వానికి మార్గదర్శనం చేసిన వారు. గార్గి తర్కవిన్యాసం, వాదన పటిమ, మైత్రేయి ఆత్మ జిజ్ఞాస, లోపాముద్ర సమన్వయ దృక్పథం, వాగామ్భృణి ఆత్మవిశ్వాసం.. ఇవన్నీ వేదకాలపు స్త్రీల బహుముఖ ప్రజ్ఞను చాటి చెబుతున్నాయి. అలా ఋగ్వేదంలో ప్రసిద్ధి చెందిన ఋషికలలో ఒకరుఅపాల ఆత్రేయి (ApālāĀtreyī). ఆమె గురించి ఉన్న సమాచారం చాలా ఆసక్తికరంగా, ఆధ్యాత్మికంగా కూడా లోతైనది. ఆమె చర్మవ్యాధితో బాధపడుతూ, ఇంద్రుని గూర్చి తపస్సు చేసి, ఆయన అనుగ్రహంతో స్వస్థత పొందిందని ఈమె రచించిన సూక్తం (8. 91) ఋగ్వేదంలో ఉంది.
అపాలఆత్రేయ అత్రి మహర్షి వంశం అయిన ఆత్రేయ గోత్రానికి చెందిన ఋషిక.ఆమెను ఒక స్త్రీ ఋషికగా గౌరవిస్తారు. ఋగ్వేదంలో మాండల 8, సూక్తం 91 (RV 8.91) ఆమె రచించినట్లుగా ఆపాదించబడింది.అపాల సూక్తంలో ఆమె దేవుడైన ఇంద్ర దేవుడిని ప్రార్థిస్తుంది.ఇందులో తన శరీరంలోనిరోగం / చర్మ వ్యాధి నుండి విముక్తి, తననుశుద్ధి చేయమని, అందంగా మార్చమని,తన జీవితంలోశుభం, శక్తి, కాంతిరావాలని కోరుతూ ప్రార్థిస్తూన్నవి ప్రధాన అంశాలు.
పురాణాలు, వ్యాఖ్యానాల ప్రకారంఅపాల పేరు “ఆత్రేయి” అంటేఆమెఅత్రి వంశానికి చెందినది. ఆమె తండ్రి ఒకఋషి వంశస్థుడు(అత్రి గోత్రం). కొన్ని వ్యాఖ్యానాల ప్రకారంఆమె తండ్రి ఒకవేదజ్ఞాని, ఋషి స్వభావం గలవాడు. ఆమె పెరిగింది ఒకఆధ్యాత్మిక వాతావరణంలో. కానీతల్లి పేరు, తండ్రి వ్యక్తిగత వివరాలువేదాల్లో స్పష్టంగా లేవు. అపాల బాల్యం గురించి నేరుగా వేదంలో కథ లేదు. సూక్తం ద్వారా పండితులు అంచనా వేసిన విషయాలు మాత్రమే.ఆమె చిన్నప్పటి నుంచేప్రజ్ఞాశాలి (intelligent), ధ్యాన స్వభావంకలిగినది. ప్రకృతి, యజ్ఞాలు, మంత్రాలు చూసి పెరిగింది.వేద కాలంలో ఋషుల కుటుంబాల్లోపిల్లలకు (కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకు కూడా)వేద మంత్రాలు వినడం అలవాటు. అలాగే ఆమె కూడా తండ్రి దగ్గర మంత్రాలు వింటుంది. కానీ ఆమెకు నిజమైన జ్ఞానంఅనుభవంలోవస్తుంది.
యజ్ఞ విధానాలు తెలుసుకోవడం, ధ్యానం, ఆత్మచింతననేర్పేవారు.అపాల ఒకఋషికకాబట్టిఆమెకువేద జ్ఞానం ఉంది. మంత్రాలనుస్వయంగా అనుభవించి పలికింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆమె కేవలం నేర్చుకున్నది కాదు. అనుభవం ద్వారా మంత్రం వెలువరించింది.అపాల వంటి ఋషికలు, వేదకాలంలో కొంతమంది స్త్రీలు కూడాఆధ్యాత్మిక విద్య పొందారు. మంత్ర దృష్టి (mantra-dṛṣṭā) సాధించారు. అంటేవారు “పఠించేవారు” మాత్రమే కాదు. “సృష్టించేవారు” కూడా.ఆమెకుచర్మ సంబంధిత వ్యాధిఆమె బాల్యంలోనే ప్రారంభమై ఉండవచ్చునని తెలుస్తుంది.దీనివల్ల సమాజంలో కొంతవేరుపాటు (isolation) ఎదుర్కొనిందని,ఆమెను సమాజం దూరం పెట్టిందని అదే ఆమెను అంతర్ముఖి (introverted, reflective) గా మార్చిందని చెప్పబడింది.ఒంటరిగా ప్రకృతిలో తిరుగుతూ ప్రశ్నలు వేసుకుంటుంది. “నేను ఎందుకు ఇలా?” అనే ఆత్మవిచారం.అపాల ఒకస్వతంత్ర ఆలోచన గల ఋషిక. ఆమె సూక్తం వేదాలలోస్త్రీ అనుభూతి, శరీర-మనస్సు బాధ, ఆత్మవిశ్వాసంని ప్రతిబింబిస్తుంది. ఆ కష్టం వల్లే ఆధ్యాత్మికంగా ఎదిగింది. చివరికి ఒకఋషికగా నిలిచింది.
ఒకసారి ఆమె అడవిలో సోమలత (Soma creeper)ను కనుగొని, దానిని నమిలిఆ సోమాన్నిఇంద్రదేవుడికి సమర్పించిందని, ఆమె భక్తి చూసి ఇంద్రుడుఆమెనురోగమునుండి విముక్తి చేశాడని,ఆమెకుఅందం, కాంతి, గౌరవంప్రసాదించాడని భావిస్తారు.అపాల ఇంద్రుడిని స్తుతిస్తూ రాసిన రచనలు ఋగ్వేదం లో RV 8.91సూక్తం ద్వారా తెలుస్తుంది. దానిలో ఒక స్త్రీ తనవ్యక్తిగత బాధను దేవునితో పంచుకుంటుంది. అది వేదాలలోస్త్రీ స్వరాన్ని (female voice) బలంగా చూపిస్తుంది. అపాల ఆత్రేయి రచించిన సూక్తం వేదాలలో చాలా ప్రత్యేకమైనది.
ఇక ఆమె రచించిన ఋగ్వేదం లో RV 8.91సూక్తాలను గమనిస్తే ఆమె భావాత్మకమైన అభ్యర్థన తెలుస్తుంది.
మంత్రం 1: ఉప త్వా సోమమింద్రాయ సున్వేబ్రాహ్మణో నృచక్షసం మనీషాం।అయం తే అస్తు హర్యతః సుతాసఃపిబా సోమం మదాయ గచ్చ॥
భావార్థం:ఓ ఇంద్రా! నేను సిద్ధం చేసిన ఈ సోమరసాన్ని నీకు సమర్పిస్తున్నాను. జ్ఞానంతో చేసిన నా ఈ యజ్ఞాన్ని అంగీకరించి, వచ్చి దీనిని పానం చేయి.
“ఓ ఇంద్రా! నేను కనుగొన్న ఈ సోమాన్ని స్వీకరించు.నా భక్తిని అంగీకరించు.”అంతర్భావం:ఆమెకు గురువు లేకుండా, స్వయంగా సోమాన్ని కనుగొని సమర్పిస్తుంది. ఇదిస్వయంప్రేరిత భక్తి (self-realized devotion).
మంత్రం 2: ఇమం మే గాథమింద్ర శృణు త్వంయథా నః శృణవో హవం పురూణాం।ఆ త్వా వహంతు హరయో వృషాణోయథా మదాయ పిబసి సుతస్య॥
భావార్థం:ఓ ఇంద్రా! నా ఈ గాథను, నా ప్రార్థనను విను. నువ్వు యజ్ఞాలలో భక్తుల ప్రార్థనలు ఎలా వింటావో, అలాగే నా పిలుపునూ ఆలకించి నా దగ్గరకు రా.
దైవాన్ని ఆహ్వానించడం. “ఓ ఇంద్రా! నా దగ్గరకు రా. ఈ సోమాన్ని పానం చేయి.”అంతర్భావం:దేవుని తన దగ్గరకు పిలిచే ధైర్యం. ఒక స్త్రీ స్వరం ఎంత నిశ్చయంగా ఉందో చూపిస్తుంది
మంత్రం 3: కన్యా వారవాయతి సోమమపాలాపిణ్వతి ధాన్యమివ ప్ర వృణక్తి।ఇంద్రాయ త్వా సుతమిమం జుషస్వయథా నః శృణవో హవం పురూణాం॥
భావార్థం:నేను అపాల అనే కన్యను. నేను ఈ సోమాన్ని సిద్ధం చేసి నీకు సమర్పిస్తున్నాను. నా ఈ అర్పణను స్వీకరించి, నా ప్రార్థనను విను.(ఇక్కడ అపాల తన వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తుంది)
మంత్రం 4: త్రిః మామింద్రః పవమానః పునాతుత్రిః శుద్ధో భవామ్యంతరాత్మా।శిరో మే శుద్ధం కరోతు ప్రజాభ్యఃఅథో మే తన్వం శుచిమింద్ర కర్ధి॥
భావార్థం: ఓ ఇంద్రా! నన్ను మూడు సార్లు పవిత్రం చేయి. నా అంతరంగాన్ని శుద్ధి చేసి, నా శరీరాన్ని కూడా పవిత్రంగా, నిర్మలంగా మార్చు.(శరీరం–మనసు–ఆత్మ శుద్ధి భావం)
శుద్ధి కోసం ప్రార్థన భావం: “నా శరీరంలోని మలినాన్ని తొలగించు. నన్ను పవిత్రంగా మార్చు.”అంతర్భావం: ఇది కేవలం శరీర వ్యాధి కాదు. నా శరీరంలోని కఠినత్వాన్ని తొలగించు. మలినాన్ని పోగొట్టు.అంతరంగ శుద్ధికోసం కూడా ప్రార్థన.
మంత్రం 5: అస్మాన్ మే రోగాన్ అప హన్యాదింద్రఃత్వచం మే కృణుహి శుచిమింద్ర దేవ।యథా సూర్యః ప్రకాశతే దివితథా మే దేహి తన్వే శోభమానామ్॥
భావార్థం: ఓ ఇంద్రా! నా శరీరంలోని వ్యాధులను తొలగించు. నా చర్మాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మార్చు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్లు, నా శరీరం కూడా కాంతిమంతంగా ఉండేలా చేయి.
సౌందర్యం, కాంతి కోరిక. భావం: “నన్ను అందంగా, కాంతిమంతురాలిగా మార్చు.” అంతర్భావం: సౌందర్యం అంటే కేవలం రూపం కాదు. అదిఆత్మవిశ్వాసం, జీవశక్తి
మంత్రం 6: సుశ్రియం మే కర్ధి సుపేశసం చయశో మే దేహి శుభగే సువీరమ్।అథో మే తన్వం వర్ధయ స్వస్తిఇంద్ర ప్రజాభ్యః శం యచ్ఛ నః॥
భావార్థం:నాకు శోభ, సౌందర్యం, మంచి కీర్తి ప్రసాదించు. నా జీవితాన్ని శ్రేయస్సుతో నింపి, నా శరీరాన్ని ఆరోగ్యంగా, బలంగా ఉంచు. మా ప్రజలకు కూడా మేలు కలిగించు.
సంపూర్ణ మార్పు భావం: “నా లోపాలను పూర్తిగా తొలగించి, నన్ను నూతనంగా సృష్టించు.” అంతర్భావం: ఇది ఒకపునర్జన్మ భావన (inner rebirth)
మంత్రం 7: పితుర్మే గృహమావహ శ్రియమింద్రసుప్రజాస్త్వం కర్ధి మే గృహేషు।అథో మే దేహి శుభగే సువీరమ్జీవాతవే నః కృణుహి ప్రజాభ్యః॥
భావార్థం:ఓ ఇంద్రా! నా తండ్రి గృహానికి శోభ, సంపద తీసుకురా. మా కుటుంబానికి మంచి సంతానం, శ్రేయస్సు కలిగించు. మా జీవితాలు సుఖంగా, దీర్ఘకాలం ఉండేలా ఆశీర్వదించు.
కుటుంబ శ్రేయస్సు భావం: “నా తండ్రి గృహానికి శోభ తీసుకురా.” అంతర్భావం: ఆమె వ్యక్తిగత కోరిక మాత్రమే కాదు. కుటుంబ గౌరవం కూడా కోరుతుంది.
బాధ → భక్తి → మార్పు, శరీర వ్యాధి → ఆత్మ శక్తి, నిరాకరణ → ఆత్మవిశ్వాసం. అపాల సూక్తం మనకు చెప్తుంది. ఇది ఒక స్త్రీ యొక్కవ్యక్తిగత ప్రార్థనమాత్రమే కాదు. ఒకఆధ్యాత్మిక ప్రయాణం.అపాల తన పేరు చెప్పి ప్రార్థించడం →వ్యక్తిగత స్వరం. శరీర బాధను చెప్పడం →నిజమైన అనుభవం. శుద్ధి కోరిక →ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది ఆమె ప్రత్యేకత.
అపాల ఆత్రేయి గురించి పండితుల అభిప్రాయాలు చాలా ఆసక్తికరంగా, కొన్నిసార్లు భిన్నంగా ఉన్నాయి.ముఖ్యమైనపాశ్చాత్య, భారతీయ పండితుల వ్యాఖ్యానాల్లో అపాలా మహోన్నతంగా చూపబడింది.
1. రాల్ఫ్ టి.హెచ్. గ్రిఫిత్. అపాల సూక్తాన్ని ఆయన ఒక “personal prayer”గా చూసారు. ముఖ్యంగాఒక స్త్రీ తనవ్యక్తిగత బాధ (చర్మ వ్యాధి)గురించి దేవునితో మాట్లాడుతోంది. ఆయన దృష్టిలో ఇది“Prayer for healing and beauty”. ఇది ఒకవ్యక్తిగత అనుభవ కవిత్వం (personal lyric).
2. కార్ల్ గెల్డనర్. Geldnerప్రకారంఅపాల కథలోసోమ యాగం ఒక ముఖ్యాంశం. ఆమె సోమాన్ని నమిలి ఇంద్రుడికి సమర్పించడం → ఒక ప్రత్యేక దృశ్యం. ఆయన దీన్ని ఒక ritual + personal experience కలయికగా చూస్తారు. యజ్ఞ పద్ధతి + వ్యక్తిగత భక్తి.
3. స్టెఫిన్ జేమిసన్. అపాల సూక్తాన్ని: “female voice in Rigveda”గా విశ్లేషిస్తారు. ముఖ్యంగాఒక స్త్రీ తన శరీరాన్ని గురించి నేరుగా మాట్లాడడం. తన బాధను దాచకుండా వ్యక్తపరచడం. ఇదిస్త్రీ అనుభవానికి ప్రతిబింబం.
4. భారతీయ సంప్రదాయం (సాయణ భాష్యం) చెప్పిన వారు సాయన.సాయణాచార్యుల అభిప్రాయంప్రకారంఅపాలఆత్రేయ నిజంగా ఒకఋషిక (మంత్రదృష్ట). ఆమెసోమాన్ని సమర్పించిఇంద్రుడి కృపతోరోగ విముక్తి పొందింది.ఇది కేవలం కవిత్వం కాదుఒకయథార్థదైవానుభవం.భక్తి, దైవకృప, శుద్ధి అని అర్థం.
5. ఆధునిక భారతీయ పండితులు కూడా అపాలసూక్తుల పై పరిశోధనలు చేసారు.అపాల సూక్తంఒకఆధ్యాత్మిక రూపకం (symbolic meaning). చర్మ వ్యాధి → అజ్ఞానం / కర్మబంధం, శుద్ధి → జ్ఞానం, ఇంద్రుడు → చైతన్య శక్తి గా అబభివర్ణించారు. ఇది inner transformation allegory.
క్లుప్తంగా చెప్పాలంటే గ్రిఫిత్ వ్యక్తిగత ప్రార్థన అన్నారు. గెల్డ్నర్ యజ్ఞం తో కూడిన అనుభవమని, జామిసన్ స్త్రీ స్వరం, సాయనా నిజమైన ఋషిక అనుభవం అంటే ఆధునికులు ఆధ్యాత్మిక రూపకం అని విశ్లేషించారు.ఆమె సూక్తం కేవలం శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే కాదు బాహ్య లోపాల కంటే అంతర్గత శక్తి ముఖ్యము. భక్తి మరియు స్వయంప్రయత్నం ద్వారా మార్పు సాధ్యం. ఒక స్త్రీ కూడాదైవానుభూతిని పొందగలదుఅనే భావన. అందుకే పండితులు దీనిని “Personal prayer of healing and transformation”గా కూడా విశ్లేషిస్తారు.
వేదకాలంలో ఇంత ఉన్నత స్థానంలో ఉన్న మహిళల స్థితి, వేదానంతర కాలంలో మహిళల స్థితికాలక్రమేణా మలివేద, సూత్ర, స్మృతుల కాలంలో క్షీణించడం ప్రారంభమైందని చెబుతారు పండితులు. దీనికి అనేక సామాజిక, రాజకీయ, మతపరమైన కారణాలు ఉన్నాయి. వర్ణ వ్యవస్థ పటిష్టం కావడం, యజ్ఞయాగాదులు క్లిష్టతరమవడం, ధర్మసూత్రాలు (ముఖ్యంగా మనుస్మృతి వంటివి) స్త్రీ స్వాతంత్ర్యాన్ని పరిమితం చేసే నియమాలను ప్రవేశపెట్టడం వంటివి జరిగాయి. బాల్య వివాహాలు ప్రబలడంతో స్త్రీలకు విద్యనభ్యసించే అవకాశం లేకుండా పోయింది. క్రమంగా, స్త్రీలకు ఉపనయన సంస్కారం నిరాకరించబడివివాహమే వారికి ఉపనయనంతో సమానంగా పరిగణించబడింది. వారు పురుషులతో సమానంగా జ్ఞానయజ్ఞంలో పాల్గొని, వేద సాహిత్యానికి తమదైన ముద్ర వేసి, భారతీయ తాత్విక చింతనను సుసంపన్నం చేశారు. తరువాతి పరిణామాలలో వారి స్వేచ్ఛను కోల్పోయినా వారి వారసత్వం పూర్తిగా కనుమరుగు కాలేదు. వారి జీవితాలు, రచనలు ఆధునిక తరానికి, ముఖ్యంగా స్త్రీలకు, అంతులేని స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో మహిళల ఉన్నత స్థానాన్ని, వారి మేధో స్వాతంత్ర్యాన్ని అర్థం చేసుకోవడానికి,లింగ సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి బ్రహ్మవాదినుల గురించి అధ్యయనం చేయడం ఎంతైనా అవసరం. వారు భారతీయ సంస్కృతి అనే ఆకాశంలో శాశ్వతంగా ప్రకాశించే జ్ఞాన తారలు.
అది ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కీ.శే. ప్రొఫెసర్ రామరాజు వెంకటేశ్వర రావు ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా పని చేసి అంచెలంచెలుగా ఎదిగిన విద్యా కుసుమం. వారు నీతి, నియమం, నిజాయితీ, నిబద్ధతతో క్రమశిక్షణకు గీటురాయిగా నిలిచి పెరిగిన ఉపన్యాసకులు. కీ.శే. ప్రొఫెసర్ మల్లారెడ్డి మామిడి గారు శాఖాధిపతిగా ఉన్నప్పుడు వారు ఉపన్యాసకులుగా పని చేశారు. వారు ప్రొఫెసర్ పదవిని చేపట్టాలంటే కనీసం ఒక పిహెచ్.డి విద్యార్థికైనా పర్యవేక్షకులుగా పని చేయవలసిన అవసరం ఏర్పడింది. అలాంటి సమయంలో నేను మొదటి పిహెచ్.డి విద్యార్థిగా 38 సంవత్సరాల క్రితం 1988లో వారి దగ్గరకు వెళ్ళడం జరిగింది . అంతకు ముందే నేను యస్.సి.ఇ.ఆర్.టి. లో ఎన్నో కార్యక్రమాలకు ఢిల్లీ వెళ్లడం జరిగింది. స్త్రీ విద్య, బాలికల విద్య, అనియత విద్య, మూల్యాంకన విభాగాలలో యస్.సి.ఇ.ఆర్.టి.లో పని చేసిన విస్తృత అనుభవం ఉన్నందున యం.ఫిల్. అవసరం నాకు కలుగలేదు. 1980లో ప్రభుత్వ ఉన్నత స్థాయి విద్య అధ్యయన సంస్థలో నేను మహబూబియా హైస్కూలు నుంచి పదోన్నతి పొంది సమగ్ర విద్యా తత్వ కళాశాలకు వెళ్లాను. అప్పటి నా శాఖాధిపతులు కీ.శే. భాష్యం గారు. ఏవో తాను పాఠశాలల్లో మ్యాగజైనులల్లో రాసిన వ్యాసాలను చూపి పి.హెచ్.డి. లో స్థానం సంపాదించుకున్నారు. కాని వారు పిహెచ్.డి పూర్తి చేయలేకపోయారు. మల్లారెడ్డి గారు ముందు భాష్యం గారి పదవీ విరమణ దగ్గరగా ఉన్నందున ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. “అమ్మా! భాష్యం గారి తరువాత నేను తప్పకుండ నీటు ఇస్తాను. నీవు పిహెచ్.డి.కి కావలసిన సామాగ్రిని అంతా తయారు చేసుకొమ్మని” అనునయంగా చెప్పారు. వారి మాటను నేను శిరోధార్యంగా భావించాను. సరేనని చెప్పాను.
ఈ మధ్య కాలంలో పాఠశాల విద్య గుమాస్తా ఒకరు నన్ను కలువుమని చెప్పి సమాచార మందించారు. నేను ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించి యం.ఇడి. చదివాను కాబట్టి వారిని ఎందుకు కలవాలి? అని ఊర్కున్నాను. అదే కథ అడ్డం తిరిగింది. నాతో పాటుగా ఇద్దరు ఉపన్యాసకులు కళాశాలలో చేరారు. వారిద్దరూ ఏం చేశారో నాకు తెలియదు. నేను అమాయకురాలిని. లంచం ఎలా ఇవ్వాలో నాకు తెలియదు. పల్లెటూరి బైతును. ఎంతసేపు “ప్రతిభ” ఆధారంగానే ఆశిస్తాను, ఆలోచిస్తాను. రెండు మూడు నెలలు నేను పచ్చ కామెర్లతో బాధపడ్డాను. కాబట్టి నేను పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న గుమాస్తా దగ్గరకు పోలేదు. “మే” నెల అంతా కళాశాలకు సెలవులు. “జూన్”లో కళాశాల ప్రారంభమయింది. అలిఘడ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. రాజకీయ శాస్త్రం, హిందీ ప్రవీణ మొదలైన పరీక్షలు రాసిన ఇంకో ఉపన్యాసకుడు ఇద్దరికి 1981 జూన్ లో ప్రమోషన్ ఇచ్చారు. ఒకరికి ‘తెలుగు పండిట్’ కోర్సులో, ఇంకొకరికి ‘హిందీ పండిట్’ కోర్సులో. ఎం.ఏ. తెలుగు, యం.ఇడి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలనైన నన్ను ప్రమోషన్ నుంచి తప్పించారు. 1980లో యస్.సి. కోటాలో, 1981లో యస్.టి. కోటాల నన్ను మాత్రం “చాదర్ ఘాట్ బాలికల పాఠశాల” కమాల్ టాకీస్ కు పంపారు. ఇది నా జీవితంలో ఎదుర్కొన్న మొదటి వివక్ష, అన్యాయం నాకంటే ముందుగా నాంపల్లిలో పని చేసే ఒక ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న అగ్రకులస్తురాలైన ఉపాధ్యాయునికి ప్రమోషన్ ఇచ్చారు. అది “ప్రజాభీష్టం” కోసమట. “Public Interest”. “వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూచుంటే ఏమిటి?” అన్న సామెత పాఠశాల విద్యకు సరిపోతుంది. జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి వెనువెంటనే కోర్టులో దావా వేశాను.
పాఠశాల విద్యలో జరిగే ఈ అన్యాయాన్ని ఉటంకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కీ.శే. నందమూరి తారక రామారావు గారికి ఒక కథనం రాని అర్జీ పెట్టుకున్నాను. ఒక శుభోదయం అబిడ్స్ లోని వారింటికి వెళ్లి వారి ఉచిత దర్శనం వేళల్లో వారికి అందజేశాను. విచారణ మొదలయ్యింది. ముఖ్యమంత్రి గారు ప్రాథమ్య క్రమంలో ‘సరోజన’కు ప్రమోషన్ ఇవ్వాలని అర్జీ పత్రంపై రాశారు. విద్యాశాఖలో గందరగోళం మొదలయ్యింది. కోర్టు కేసును విరమించుకుంటే ప్రమోషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ వారు నాకు రాయబారం పంపారు. మీరు ప్రమోషన్ ఇచ్చిన వెంటనే యాంత్రికంగా నా అర్జీ రద్దవుతుందని నేను చెప్పాను. పాఠశాల విద్యా డైరెక్టర్ కీ.శే. వెంకారెడ్డి గారు ఏదో ఒక శాఖలో నాకు ప్రమోషన్ ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేశారు. తుదకు దృశ్య శ్రవణ విభాగంలో నన్ను సర్దడానికి ప్రయత్నించారు. కాని గుమాస్తా గారు, సూపర్నిడెంటు గారు వారి తెలివితేటల్ని ప్రదర్శించి అది కూడా చెల్లకుండా చేశారు. Audio visual A.V. Education ను A.V. Aducation Andhra University Education మన వద్ద ఎవరు లేరని బుకాయించారు.
నా పదోన్నతికి ఈ నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. రాజకీయ సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి యన్.టి. రామారావు గారు పదవీచ్యుతులై కీ.శే. నాదెండ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రి హోదాలో నియమితులయ్యారు. వారు అతి కొద్ది కాలం ఆ పదవిలో కొనసాగారు. పదవీ విరమణ కాలం 55 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలయింది. ఈ సంధి కాలంలో పదవీ విరమణ పొందిన శ్రీ భాష్యం గారు తన పదవిని మూడేండ్లు కొనసాగించాలని అర్జీ పెట్టుకున్నారు. నన్ను తన స్థానంలో సర్దుబాటు చేయడానికి విద్యాశాఖ అప్పటికే సన్నద్ధమయ్యింది. ఈ యాంత్రిక అభ్యంతరం తొలగిపోతే మీ ప్రమోషన్ కు దారి సుగమమవుతుందని విద్యాశాఖ వారు మాకు తెలిపారు. ఈ మధ్య కాలంలో వెంకారెడ్డి డైరెక్టర్ గారు పదవీ విరమణ చేశారు. కేరళకు చెందిన సతీనయ్యర్ ఐ.ఏ.యస్. గారు కమీషనరుగా విద్యాశాఖకు వచ్చారు. కీ.శే. ఆలె నరేంద్ర పాతబస్తీ టైగర్ సతీనయ్యర్తో సంప్రదింపులు జరిపారు. 3 సంవత్సరాల జీతభత్యాలు శ్రీభాష్యం గారికి చెల్లించి వారి అడ్డును తొలగించినారు. తేది 22 డిసెంబర్ 1983 రోజున ప్రమోషన్ ఇచ్చి సంతకం చేసి సతీనయ్యర్ ఐ.ఏ.యస్. తబాదిలా రీత్యా ఢిల్లీ విమానం ఎక్కారు. 23 డిసెంబరున నేను కళాశాలలో ప్రవేశించకపోతే నాకు 5 రోజులు ప్రభుత్వ సెలవులు వస్తాయి. 28 డిసెంబరు నెల నుంచి నా సర్వీసు మొదలవుతుంది. కాబట్టి చాదర్ ఘాట్ హెడ్మాస్టరు గారు సెలవుపై వెళ్లినందున ఒక సీనియర్ అధ్యాపకురాలు ప్రేమలతగారికి చార్జీ ఇచ్చారు. వారు కూడా ఊరు మీద తిరుగడానికి వెళ్లారు. దిక్కుతోచని పరిస్థితులల్లో వారిని పాఠశాలకు పిలిపించి నేను డ్యూటీ నుంచి విడుదలై విద్యా కళాశాలలో ప్రవేశించాను. (నాటి నుంచి 23 డిసెంబరు 1983) నా రెండవ దశ సర్వీసు మొదలయ్యింది. నేను యస్.సి. ప్రణాళికలో పని చేసిన 14 నెలల సర్వీసును కూడ నాకు కలిపారు. ఇంచుమించు 1 సంవత్సరం 9 నెలల సర్వీసు పోయింది. ఈ విధంగా ప్రభుత్వ రంగంలో కూడ “లంచగొండితనం” విశృంఖలంగా స్వైర విహారం చేస్తుంది. ‘బడిత ఉన్నోడితే బర్రె, నోరు ఉన్న వాడికే మోక్షం” అన్న సామెత ఋజువయ్యింది.
1985లో నాకు గెజిటెడ్ ప్రమోషన్ వచ్చింది. అప్పటినుంచి బాధ్యతాయుతమైన అన్ని పనులను డైరెక్టర్లు నాకు అప్పజెప్పడం మొదలయింది. అనేక రకాల పరీక్షా పత్రాలను తయారు చేయడం, జాతీయ స్థాయి కార్యక్రమ నిర్వహణ, కొత్త విద్యా ప్రణాళికను చేపట్టడం (1986) అనువాద కార్యక్రమాలు. విద్యా సంబంధమైన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణలో, మధ్య మధ్య ఆకాశవాణి హైద్రాబాదు కార్యక్రమాలు, పుస్తక రచన, పుస్తకాలను సమీక్షించి గ్రంథాలయాలను సూచించడం, అవసరాన్ని బట్టి ఇతర శాఖలకు సహకారాన్ని అందించడం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక డైరెక్టర్, 11 మంది ప్రొఫెసర్లు, 11 శాఖలు, 34 మంది ఉపన్యాసకులు, నాన్ టీచింగ్ స్టాఫు, ఆ కాలంలో S.C.E.R.T. స్వర్ణ యుగాన్ని తలపించేది. దినమంతా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ఉండేది. వీలునుబట్టి సాహిత్య కార్యక్రమాలకు, సమావేశాలకు, డైటు సంస్థల పర్యవేక్షణకు హాజరయ్యేది.
ఒకనాడు నిజామాబాదు ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉపన్యాసకులు డాక్టర్. సూర్య ప్రకాశ్ రెడ్డి గారు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు వచ్చారు. వారి చేతిలో ఏవో పేపర్లు ఉన్నాయి. రెడ్డీ! అని ఏమి పేపర్లని అడిగాను. పిహెచ్.డి. అప్లికేషన్ అని చెప్పారు. అవి నాకు ఇచ్చి నీవు వేరే తీసుకొమ్మని చెప్పాను. వారు మీరు అడగడం నేను ఇవ్వకపోవడమా? అని నాకు ఆ అప్లికేషను ఇచ్చి వెంటనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. నేను ఆ రాత్రి పిహెచ్.డి.కి కావలసిన అర్హత పత్రాలు, అప్లికేషన్ని నింపడం వంటి కార్యక్రమాలను పూర్తి చేసుకొని తెల్లవారి ఉస్మానియా విశ్వవిద్యాలయం, బోధనా కళాశాలకు వెళ్లి అప్లికేషన్ ఇచ్చి వచ్చాను. నా ప్రవేశం పిహెచ్.డి.లో ఖాయమయ్యింది. ఉపశీర్షికల పట్టిక తయారు చేసి ఇచ్చాను. ఇక గైడును నిర్ధారించుకోవడమే మిగిలింది. ముందుగా డాక్టర్ శ్రీధరస్వామి ప్రొఫెసర్ ను పెట్టుకోవాలనుకున్నాను. శ్రీధర స్వామి గారు నా భర్త కీ.శే. కనకయ్య గారికి ఆప్తమిత్రులు. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో తెలియదు. కాని కనకయ్యా! నేను నీ ముఖం చూసి సరోజనకు గైడెన్సు ఇస్తున్నానని అన్నారు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఒక విధంగా రోషం కూడా ఎక్కువే! నేను చాలా బాధ పడ్డాను. నా భర్తతో సారూ! మీ ముఖం చూసి శ్రీధర స్వామి గారు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నానని అన్నారు. వారు నా ప్రతిభను లెక్కించాలి కాని అదేమి మాట అని నొచ్చుకున్నాను. వారు ఆ మాటను గ్రహించారు. అయితే అక్కడే డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావని ఇంకొకరు ఉన్నారు. వారు కూడా నాకు ఆత్మీయులే. వారి దగ్గర పిహెచ్.డి. అభ్యర్థిగా చేరమన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.
నేను అంతకుముందే పాఠ్యపుస్తకాల్లో స్త్రీ హోదా, చిత్రణ, స్త్రీ సమానత్వం, సాధికారత, వివక్షత ఏ విధంగా ఉందో? ఎన్నో సదస్సులకు, సమావేశాలకు హాజరయ్యాను. కూలంకషంగా అధ్యయనం చేశాను. స్త్రీ విద్య, బాలికల విద్య గురించి ఆపోషం పట్టాను. ఒక నిర్ధారిత భావం నాకుంది. 1986 విద్యా ప్రణాళికలో ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో ఉటంకించబడింది. మూల్యాంకన పత్రం కూడ ఇవ్వబడింది. ఇతిహాసం – పాఠ్యాంశం ఎంపిక, ప్రదర్శన, భాష, భావం, సామెతలు, జాతీయాలు, నానుడులు మొదలైన వాటి వివరణలు, వర్ణన, చిత్రీకరణ, ధనాత్మక, ఋణాత్మక భావాలు మొదలైన వాటి విస్తృత అధ్యయనం చేయడం జరిగింది. దానిలో స్వామికత్వం పొండం జరిగింది. చిత్రాలు, బొమ్మలను కూడ పరిశీలించడం, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, విద్య, వైద్యం, శాస్త్ర విజ్ఞానం, సృజనాత్మకత, సాంకేతిక, పశువైద్యం, కుటుంబం, పిల్లల పోషణ, శారీరక, మానసిక, బౌద్ధిక, మత సంబంధమైన అంశాలు, పాఠ్య పుస్తక రచన, సంపాదకత్వం, అన్నిట్లో కూడ స్త్రీల పాత్ర ఋణాత్మకమే. ఆడ మగ కూలి, ఆరోగ్యం, తిండి, పుట్టుక, వివాహం, విద్య, ఉద్యోగం, పోషణ అన్నిట్లో వివక్షతే. వీటన్నిటి సమూల అధ్యయనం వల్ల నాకు పిహెచ్.డి. సులభమైంది. క్రితంలో నేను రెండవ భాషగా తెలుగు బోధనాభ్యసన సమస్యలు, కారణాలు, నివారం ఉపాయాలు సమస్యగా తీసుకొని పిహెచ్.డి. చేయాలనుకున్నాను. కాని మనసు మార్చుకున్నాను.
ఒకరోజు మామిడి మల్లారెడ్డి శాఖాధిపతుల దగ్గరకు వెళ్లి, సార్! నా పిహెచ్.డి. పర్యవేక్షకులను నిర్ణయించండి. నా శీర్షికను గైడును మార్చుకోవడానికి నాకు అనుమతి నివ్వండి అని కోరాను. వారు డాక్టర్ ఆర్. వెంకటేశ్వరరావు గారి గదికి నన్ను తీసుకెళ్లి సరోజనకు పర్యవేక్షకులుగా వ్యవహరించమని కోరారు. వెంకటేశ్వరరావు గారు సార్ నాకు ఆ సమస్య చాలా కొత్త అని చెప్పారు. అప్పుడు మల్లారెడ్డి గారు ఏముందిలే సరోజన “నీకు అంతా చెప్పుతుంది” అన్నారు. తరువాత నేను వారికి సంక్షిప్తంగా అన్ని విషయాల గురించి చెప్పాను. వారు సుముఖత వ్యక్తపరిచారు. ఒక ముఖ్యమైన ఘట్టం ముగిసింది.
రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థకు సాధారణ సెలవు దినాలున్నప్పుడు, రెండవ శనివారం, ఆదివారం సెలవు దినాలల్లో అలకాపురిలోని వెంకటేశ్వరరావు గారి ఇంటికి నేను వెళ్లేదాన్ని, వారి సూచనలు, సలహాలు, గమనికలు తీసుకునేదాన్ని, ఉస్మానియా విశ్వవిద్యాలయం, గ్రంథాలయానికి వెళ్లి పరిశీలనా గ్రంథాలు తీసుకొని నోట్సు తయారు చేసుకోవడం, ప్రశ్నావళిని రూపొందించుకోవడం, ముఖాముఖి కోసం ప్రశ్నలు తయారు చేసుకోవడం, గవర్నర్ సదనానికి వెళ్లి సంబంధిత సాహిత్యాన్ని తీసుకోవడం, ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రం కీ.శే. తరుగా జానకి రాణి దగ్గర నుంచి కీ.శే. మల్లాది సుబ్బమ్మ వరకు స్త్రీల సమస్యలపై పోరాడే వాళ్లను సంప్రదించి వివిధాంశాలను సేకరించేదాన్ని. అప్పట్లో మహిళా సాధికారత, చైతన్యం కోసం ఆకాశవాణి హైద్రాబాదులో అనేక వ్యాసాలను రాసి ప్రసారం చేసేదాన్ని. ఒకసారి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థలో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తీసి పరిశీలించాను. అందులో నుంచి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యంలో 1958లో వెలువడిన “National committee on Women Education” అనే పుస్తకం దొరికింది. వీటన్నిటితో నా పీహెచ్.డి. గ్రంథానికి పరిణతి లభించింది. మొత్తం 247 పాఠశాల పుస్తకాలను పరిశీలించాను. ధనాత్మక, ఋణాత్మక విషయాలను క్రోడీకరించాను. వివిధ రంగాలలో మహిళల స్థాయిని, హోదాను పరిగణలోకి తీసుకున్నాను. 14 మంది పాఠశాల విద్యకు సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్న ఆఫీసర్ల డైరెక్టర్ల ముఖాముఖి తీసుకొని విషయ వివరణ చేశాను. మూల్యాంకన విభాగానికి చెందిన మా ‘అధిపతి’ని సంప్రదించాను. మొత్తం మీద ఆర్. వెంకటేశ్వరరావు పర్యవేక్షకులుగా నా విహెచ్.డి. 1992లో ముగిసింది. అది ఫిబ్రవరి నెల. ఈ తతంగంలో నాకు అండగా నిలబడి ‘స్టాటిటిన్స్’ చేయించిన శ్రీధరస్వామి ప్రొఫెసర్ గారికి నా కృతజ్ఞతాభివందనాలు. ఎండనక, వాననక కష్టపడి ఒక నిజమైన విహెచ్.డి. చేసినందుకు విద్యాశాఖ నుంచి నాకు పొగడ్తలు అందాయి. ఏడవ తరగతి నుంచి ఒక పిహెచ్.డి. స్థాయికి ఎదిగినందుకు నేను నన్ను అభ్యుదయ పథంలో నడిపించిన ఆ “అజ్ఞాత శక్తి”కి ఎల్లవేళలా ఋణపడి ఉంటాను. ప్రొఫెసర్ మల్లారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నా పర్యవేక్షకులు ఆర్.వెంకటేశ్వరరావు, శ్రీధరస్వామి, సాందీప్, అడుగడుగున నన్ను నడిపించారు. ప్రొఫెసర్ నాయుడు, రాధాకృష్ణ, రుక్మారావు, ఫరీదాభాతూన్, అన్వర్ జహాన్, బృందావనం, శ్రీరామమూర్తి, డా. సుబ్రహ్మణ్యం బోధనతో తరించిన ఆ రోజులు స్వర్ణయుగాన్ని తలపిస్తాయి. ప్రొఫెసర్ వేదాంతాచారి గారి బోధన నన్ను ముగ్దురాలిని చేసేది.
ప్రొఫెసర్ ఆర్.వెంకటేశ్వరరావు గారు నల్లగొండ జిల్లా జాజిరెడ్డి గూడెంలో జన్మించారు. తండ్రి రాఘవరావు, తల్లి లక్ష్మీదేవమ్మ. వారు ఎం.ఏ. తెలుగు. యం.ఇడి. విహెచ్.డి. చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం, విద్యా కళాశాలలో ఉపన్యాసకులుగా చేరారు. వారి జీవిత భాగస్వామి కీ.శే. సుజాతమ్మ, హైద్రాబాదులోని అలకాపురి వారి స్థిర నివాసం. వారి సంతానం ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్దవాడు కుమారుడు రాం మోహన్ రావు, కూతుళ్లు రాధ, రేఖ.
వద్దిరాజు సీతారామచంద్రరావు, వద్దిరాజు రాఘవ రంగారావు ఈ ఇద్దరు అన్నదమ్ములు వద్దిరాజు సోదరులుగా చరిత్ర ప్రసిద్ధి నందిన వారు. చిన్నవాడు వద్దిరాజు రాఘవ రంగారావు కూతురు రంగరాజు పద్మజ కవయిత్రి, రచయిత్రి. వారు అనేక ఉత్తమ రచనలు చేసిన యశఃకాములు. పద్మజ భర్త కీ.శే. రంగరాజు వెంకటేశ్వరరావు గారు, జనగామ నివాసి. ప్రసిద్ధ న్యాయవాది. రామమోహనరావు గారి అర్ధాంగి రంగరాజు పద్మజ కూతురు, పద్మజ ఆడపడుచు కీ.శే. రంగరాజు సుశీల ప్రముఖ రేడియో కళాకారిణి. వీరి కుటుంబ సభ్యులంతా విద్యాధురీణులు, విజ్ఞాన విభవులు, విశేష సాహితీ సంపన్నులు.
కీ.శే. పెండ్యాల రాఘవరావు స్వాతంత్య్ర సమరయోధులు. ఆ కాలంలో లబ్దప్రతిష్ఠులైన కమ్యూనిస్టు నాయకులు. ముచ్చటగా మూడు సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన ప్రజారంజకులుగా పేరు గాంచిన రాజకీయ నాయకుడు.
తమ ఊరు పెండ్యాల గ్రామాన్ని ఇంటి పేరుగా మలచుకొన్న జాతీయ నాయకుడు. వారి కుమార్తె డా.కొండపల్లి నీహారిణి. ప్రముఖ కవయిత్రి, మేటి రచయిత్రి, సాహిత్య విదుషీమణి, సారస్వత రంగంలో అందెవేసిన చేయి. వారి భర్త వేణుగోపాల్ గారు ప్రముఖ ఇంజనీరు. నీటిపారుదల శాఖలో ముఖ్య ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు. నా సోదరుడు కీ.శే. బండ రామయ్య గారికి చిరపరిచితులు. డా. కొండపల్లి నీహారిణి తరుణి, మయూఖ లాంటి పత్రికలకు అధినేత్రి. (అవి ఆన్ లైను పత్రికలు).
రంగరాజు పద్మజ, అరుణ ధూళిపాల ఎంతోమంది లబ్దప్రతిష్టులైన వారి ముఖాముఖిని నిర్వహించి నెల్లుట్ల రమాదేవి ఆంధ్ర బ్యాంకు విశ్రాంత ప్రజాసంబంధాల శాఖతో పాటు కీర్తి ప్రతిష్టల నందారు. కొండపల్లి నీహారిణి వద్దిరాజు సోదరులపై విహెచ్.డి. చేసి కృతకృత్యులయ్యారు. వీరి కుటుంబంలోని వారందరు విద్యాగంధంతో విలసిల్లిన వారే. సాహితీ క్షేత్రం, సారస్వత రంగ పారంగతులే. ప్రజాసేవకులుగా పరిణతినందిన వారే. కొండపల్లి నీహారిణి మామగారు కీ.శే. కొండపల్లి శేషగిరి ఆవు గారు ప్రసిద్ధ చిత్రకారులు. వైవిధ్యభరితమైన బొమ్మలతో, ఎన్నో కులాల వారి సమ్మేళనంలో రూపుదిద్దుకున్న వారి కళాభిరతి, కళాభిమానం, తెలంగాణ తేజోకిరణాలుగా నలువైపులా ప్రసరించాయి. వారు పుణ్యజీవులు. ధన్యాత్ములు. కళామూర్తులు.
నా పిహెచ్.డి. పర్యవేక్షకులు డా.ఆర్. వెంకటేశ్వరరావు తమ్ముడు కీ.శే.ఆర్. విద్యాసాగర రావు గారు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారి వద్ద నీటిపారుదల శాఖ సలహాదారుగా పని చేశారు. రంగరాజు వెంకటేశ్వరరావు న్యాయవాది, మా అన్నయ్య కీ.శే. బండ శ్రీహరి న్యాయవాదికి జనగామలో ఆత్మీయ మిత్రుడిగా పేరెన్నిక గన్నవారు. ఈ విధంగా మేమంతా స్నేహ సంబంధ బాంధవ్య, ఆత్మీయులుగా కలిసి ఉండడానికి కారణభూతమయ్యాయి
నా భర్త కడారి కనకయ్య గారిక శ్రీధరస్వామి, వెంకటేశ్వరరావు గారు ఆత్మీయ మిత్రులు. కీ.శే. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కీ.శే. డాక్టర్ వేణుమాధవ్ గారు బాల్యమిత్రులు. శిశు తరగతి నుంచి వారు ఒకే తరగతిలో చదువుకున్నారు. కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమారాచార్య వారి సహబోధకులు. వీరి గ్రంథ సమీక్షలు చేయడం వల్ల అరుణ ధూళిపాల కూడ నాకు ఆత్మీయులైనారు. అరుణ ధూళిపాల మంచి భాషా నిష్ణాతులు, భాషా ప్రేమికులు, భాషా విన్యాసకులు.
కనకయ్య గారి స్నేహితుల కూటమి 22 మంది. సంతుల వారీగా వీరంతా విందు భోజనాలు ఆరగించేవారు. వారి కాలం, వారి స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనుబంధాలు కూడ మనం ముందు తరాలలో చూడలేము. వారు జీవించిన కాలం చరిత్రకో నిదర్శనం.
“వయసులో చిన్న అయినా జ్ఞానంలో మిన్న” అయిన డా. కొండపల్లి నీహారిణి, రంగరాజు పద్మజ, ధూళిపాళ అరుణ, నెల్లుట్ల రమాదేవి స్నేహ సాంగత్యాలు లభించినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.
నాలుగుతరాల రచయితల కథల మూట, ఈ “కళింగ కథా జాడ” అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కళింగాంధ్ర ప్రజల బ్రతుకు చిత్రాలతో, ముందు తరాలకు కథల బాటను వేస్తుంది అనడంలో కూడా సంశయం లేదు. ఈ పుస్తకంలోని కథలన్నీ కళింగాంధ్రకే ప్రత్యేకమైన బాస, యాస, స్థితిగతులను ప్రతిఫలించి, మానవ స్వభావాలను నగ్నంగా, మన ముందు నిలబెట్టినవే. తరాలు మారినా పేదల తలరాతలు మారలేదన్నది కాదనలేని సత్యం. కాలమేదైనా, పాత్రలేవైనా మానవ స్వభావం మారలేదన్న పచ్చి నిజాన్ని మనకు చెప్పేవే ఇందులోని కథలన్నీ. కొందరి స్వార్థమే ఎందరి వెతలకో కారణమౌతుంది. అందుకే తరాల క్రింద వ్రాసినా, నేటి పరిస్థితులకు కూడా అన్వయించేలా, కొన్ని కథలు ఈనాటివిలాగే అగుపిస్తాయి. మనం గమనిస్తే, మానవ స్వభావాలను చిత్రీకరించే కథలు ఏ తరం రచయితలు వ్రాసినా, ప్రస్తుత తరంలోని సమాజానికి కూడా అన్వయించేటట్లుగానే ఉన్నాయి.
ఈ సంకలనంలో ఎక్కువ శాతం కథలు ఉత్తరాంధ్ర మాండలికంతో వన్నె నింపుకున్నవే, వస్తు శిల్పాల్లో వైవిధ్యమున్నవే, అణగారిన బ్రతుకుల గురించి, ప్రజల జీవన స్థితిగతులను మన కళ్ళముందు నిలిపేవే.
మొదటి, రెండవ తరం కథలలో ఎక్కువగా పెత్తందారుల, శ్రామికవర్గాల మధ్య తారతమ్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆ కాలంలో ఉన్న సమస్యలను చర్చించే కథలుంటే, మూడవ తరం వారు వ్రాసిన కథలు, రెక్కాడితేగాని డొక్కాడని పల్లె బతుకులను, ఆదివాసి పోరాటాలను మన కళ్ళముందు నిలబెట్టాయి. సంపాదకులు చెప్పినట్లు నాల్గవ తరం సమాజంలోని అన్ని వర్గాలను స్పృశిస్తూ కథలల్లారు. ఏ తరమైనా సమకాలీన, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేటట్లుగా కథలను వ్రాశారు. ఇందులోని ప్రతి కథా ఆణిముత్యమే.

మొదటి తరం రచయితల కథలు:
“దిద్దుబాటు” కథ ద్వారా తెలుగు కథకు ఆద్యుడైన గురజాడవారి “దేవుళ్ళారా మీ పేరేమిటి” లో, ఒక వ్యక్తి స్వార్థచింతన కారణంగా శైవులకు వైష్ణవులకు మధ్య ఘర్షణలు చెలరేగే పరిస్థితి… నిజానికి దేవుడిని నమ్మిన ఎవరైనా, ఇతరులతో సంబంధం లేకుండా తమ నమ్మకానికి కట్టుబడి ఉంటూ, ఇతరుల నమ్మకాలకు కూడా గౌరవిస్తూ సమాజ ధర్మం పాటిస్తారు. గాని కొంతమంది స్వార్థపరుల కారణంగానే మతాలమధ్యనో, లేక ఒకే మతంలో ఉన్న వేర్వేరు వర్గాల మధ్యనో కలహాలు చెలరేగుతుంటాయి.
“ఈ కథలో పీరు అనేది ఏమిటనుకున్నారు స్వామి వారి తిరునామమే” అంటూ, నాంచారమ్మ అనే ఒక బలమైన పాత్రను సృష్టించి, ఆ పాత్ర ద్వారా చెప్పించి, ఆఖరికి అది త్రిశూలాకారం గనక శివ పీరని శైవులు, రామస్వామి వారి నామము గనుక విష్ణు పీరని వైష్ణవుడు వాదించినప్పుడు, శివుడు విష్ణు పీర్లే అయినప్పుడు బుద్ధుడు శివుడు కారాదా అని ఒక ప్రశ్న ఇంకొకరితో లేవనెత్తించి, “శివుడో, విష్ణువో, పీరో, బుద్ధుడో… పేరేదైనా పరమాత్మ ఒక్కడే కదా!” అన్న బ్రహ్మాండమైన సందేశాన్ని ఇస్తారు గురజాడవారు.
కూలిపనినే వారసత్వంగా పిల్లలకిచ్చే పేదరికాన్ని “వారసత్వం” కథలో ఆయల నరసింహశర్మ గారు ఆవిష్కరిస్తే, పనిచేస్తున్న వాళ్లు ఎందుకు పడుండాలని ప్రశ్నిస్తుందొక గొంతు “ప్రభువెక్కిన పల్లకి”లో బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావుగారి కలం నుండి. పెత్తందారులు ఏమి చేసినా మారు మాటాడకుండా చేసిన తరం నుండి, ప్రశ్నించే స్థాయికి చేరుకుంది ఆ తర్వాతి తరం.
రెండవ తరం రచయితల కథలు:
పొయ్యి మీదకు ఉన్నా, లేకపోయినా పొయ్యి లోపలికి కంపో, ఎండిన ఆకులో తేవలసిన బాధ్యత, బడికి వెళ్లి చదువుకోవలసిన ఎనిమిదేళ్ల బాలిక మీద పడితే, ఆ ఎండుటాకులు ఏరడానికి ఆ బాలిక పడే అవస్థ ద్వారా… “కుంకుడాకు”లో చాసోగారు పేదల దయనీయ స్థితిని వర్ణిస్తే, తప్పులెన్ని చేసినా శివరాత్రి రోజు చనిపోతే స్వర్గప్రాప్తి అవుతుందన్న ప్రజల మూఢ నమ్మకాన్ని వ్యంగ్యంగా చెప్పిన కథ రావిశాస్త్రి గారి “పాపి”.
మా అమ్మ చాలా మంచిది, నన్ను చెప్పలేనంత ప్రేమిస్తుంది, నా కొరకు ఎంత కష్టమైనా ఓరుస్తుంది, అన్నమాట తల్లి హృదయమేమిటో, కులమత ఆర్థిక స్థితులకు అతీతంగా, దేశ, కాలమాన పరిస్థితులకు అతీతంగా అమ్మంటే ఏమిటో హృదయానికి హత్తుకునేలా చెప్పారు అవసరాల రామకృష్ణారావు, “అమ్మ చాలా మంచిది” అన్న కథలో.
కారా మాస్టారు గారి “ఆర్తి” కథనే తీసుకుంటే… “ఎంగిలాకుల కోసం వీధి కుక్కలు ఎందుకు చస్తాయో, ఆ విస్తళ్ళలో భోజనం చేసిన వారికి అర్థం కాకపోవచ్చంటూ”, కాలు ఆడి కూలి చేస్తే గాని నోటికెల్లని వేళ్ళు, కూలి డబ్బుల కోసం బంధువుల మధ్య చెలరేగే తగాదాలు, పల్లెటూర్లలో సామాన్య ప్రజానీక స్థితిగతులు, ఆకలి తీరడానికి పడే పాట్లు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తాయి ఆ కథలో. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు, పని చేస్తే వచ్చే కూలి కోసం కూతురు నా దగ్గర ఉండాలని తల్లి, కోడలు నా ఇంట్లో ఉండాలని అత్త పోట్లాడుకోవడం పేదల బతుకులకు అద్దం పడుతుందీ కథ.
మూడవ తరం రచయితల కథలు:
భర్త తాగి వచ్చి కష్టాలు పెడుతున్నాడని బాధపడ్డ పనమ్మాయితో, అటువంటి భర్తను విడిచి పెట్టాలని సలహా ఇచ్చిన ఇల్లాలు, తన వరకు వచ్చేసరికి… తన భర్తకు అక్రమసంబంధం ఉందని తెలిసాక, నిలదీస్తే నా ఇష్టమన్న భర్తను వదిలేయలేక పోతుంది ఆ ఇల్లాలు. మహిళల గురించి ఆమె ఊహించుకున్న స్వాతంత్ర్యం, స్త్రీ పురుష సమానత్వం తన దగ్గరికి వచ్చేసరికి ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఆడవాళ్ళ స్థితిగతులేవైనా ఫలితం ఒక్కటేనంటూ సుతిమెత్తగా చాగంటి తులసి గారు చురక వేసి చెప్పిన కథ “మనువు.
అన్యాయం అయిపోతున్న వాళ్ళు, వాళ్లకు న్యాయం చేయాలనుకుంటున్న వాళ్ళు, తుపాకులు పట్టుకొని అడవి దారి పడుతున్నారు. దౌర్జన్యం, అన్యాయం లేకపోతే అడవి దారి పట్టాల్సిన అవసరమేమిటి ఎవరికైనా? ఈ విషయం సమాజం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ, ఆదివాసీ రైతులకు అప్పులిచ్చి, వడ్డీ రూపంలో పండిన పంటను పీల్చేస్తూ, అసలు కోసం దౌర్జన్యంగా భూమిని రాయించుకుంటే తిరగబడ్డ రాజన్న గురించి “ఇదే దారి” లో భూషణం గారు చెప్తారు.
నాల్గవ తరం రచయితల కథలు:
“మీ రేపటి కోసం మా నేటిని త్యాగం చేస్తున్నామన్న వాళ్లు”… వాళ్ళెవరో పాఠకుల ఊహకే వదిలేస్తూ కథ మొత్తం నడిపించారు ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడుగారు “వాళ్లు” కథలో. వాళ్లను పట్టుకోవడానికి వచ్చినా, “వాళ్ల తుపాకులకు ఆశయముందని భావించి, తుపాకీతో వాళ్ల ఉద్యమాన్ని ఆపగలమా?” అని తనను తానే ప్రశ్నించుకుంటూ, తాను వ్రాస్తున్న కథకైనా, ఇప్పటి వర్తమానానికైనా, జరుగుతున్న ఎన్ కౌంటర్… ఇది ముగింపేనా అన్న సంశయంతో తటపటాయిస్తూ నమ్మిన సిద్ధాంతానికి, డ్యూటీకి మధ్య నలిగిపోయిన వ్యక్తిగా ఈ కథలో జిల్లా ఎస్పీ కనిపిస్తారు.
తాత ముత్తాతల నుండి పొలాలకు అరకలు, బండ్లు వెళ్లే త్రోవలను మూసివేసి, పంట పండించుకోవడానికి వీల్లేకుండా చేసి, పొలం అమ్ముకొనక తప్పనిసరి పరిస్థితులను సృష్టించి, ఉత్తరాంధ్రలోని భూములను చవగ్గా కొనుక్కొని ఇక్కడి రైతుల మీదే పెత్తనం చలాయించే దొరల గురించి, తమ పొలాల్లో తామే పాలేరులైన దుస్థితి గురించి “తిరుగుడిగుమ్మి” లో, ఇంకొక ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడుగారు విశదపరిచిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
తప్పనిసరి పరిస్థితులలో పొలాలను అమ్ముకున్న రైతుల కష్టాలను దగ్గరనుండి చూసిన వారి కలం, “ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చిన పెట్టుబడులు, మన ముందు ఓ సాగరంలాగ తయారై, అలల నాలుకల తోటి ఆహ్వానిస్తుంటే, ఈతకొలను అనుకొని మురిసిపోతున్నాం గాని, అదొక తిరుగుడు గుమ్మని తెలుసుకోలేక పోతున్నాం. రేపది మన ఊళ్ళనే ముంచేస్తుందన్నా ఆశ్చర్యం లేదు” అంటూ పదునైన సంభాషణలను రాయడం ద్వారా, తాత ముత్తాతల నాటి తమ ఊర్లలో, తామే వలసదారులైన ఉత్తరాంధ్ర రైతుల దుస్థితి గురించి చెప్పారు.
అణగారిన కులాలకు రిజర్వేషన్ల పేరుతో ప్రభుత్వంలో పదవులు ఇచ్చినా, అవి పేరుకు మాత్రమేనని “పెద్దోళ్ళు” కథలో బొడ్డ కూర్మారావు గారు తెలియబరిస్తే, పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధాలు శుద్ధి చెయ్యకుండా వదిలేస్తుంటే భూగర్భ జలాలు, భూమి, గాలి కలుషితమై ప్రజానీకం జబ్బులు పాలవుతుంటే, తనకెందుకులే అని ఊరుకోలేక, చేస్తున్న పీహెచ్డీని వదిలి, ప్రజల మధ్య ఉండి పోరాడాలని కొడుకు అనుకుంటే, అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రుల బాధను తెలిపే కథ, బివిఏ రామారావు నాయుడుగారి “ఎదిగొచ్చే కొడుకు.

నేటి సినిమాలు పిల్లలనెలా ప్రభావితం చేస్తున్నాయో “ఆయుధపాణి”లో దాసరి రామచంద్రరావు గారు వివరిస్తే, నాటకాలు వేయడానికి ఇష్టపడే రైతు మనోవేదనను, పూర్వకాలంలో నాటకాలు చూడడానికి గ్రామస్తులు ఎలా వెళ్లేవారో వివరిస్తూ జ్ఞాపకాలలోనికి తీసుకు వెళ్తుంది, ఆల్తి మోహనరావుగారి “ఋషి” కథ.
యాక్సిడెంట్ అయిన వ్యక్తిని రక్షించే క్రమంలో, తన ఎంట్రెన్స్ ఎగ్జామ్ టైం దాటిపోయినా బాధపడని యువకుడు, కొడుకు చేసిన పనిని సమర్థిస్తూ ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదని భావించే తండ్రి, విద్యార్థులకు పరీక్షల్లో సోషల్ బిహేవియరుకు కూడా మార్కులుంటే బాగుండేదని ఆ తండ్రి అన్నప్పుడు, “పొలమైనా, రానున్న తరమైనా సరిగ్గా సాకగల చేతుల్లో ఉన్నప్పుడే ఫలవంతం అయ్యేదని”, “ఫలితం” కథలో తన భావాన్ని వ్యక్తీకరిస్తారు మాజీ ఎంపీ, రచయిత డివిజి శంకర్రావుగారు. పుట్టుకతో ఎవరూ దొంగలు కాదు పరిస్థితుల బట్టి దొంగలమయ్యామంటూ “సమాజం చెక్కిన దొంగలు”లో కలమట దాసుబాబుగారు చెప్తున్నారు.
రచయిత్రులను తీసుకుంటే, తొలితరంలో రుక్మిణమ్మగారు సాధారణంగా కుటుంబాల్లో దాయాదుల మధ్య జరిగే గొడవల గురించి చెప్తే, మూడవతరంలో చాగంటి తులసిగారు – “మనువు”లో భార్యల మీద భర్తల దాష్టీకం, భార్యల సర్దుకుపోయే తత్వాన్ని చెప్తే, నాల్గవ తరంలో మల్లీశ్వరిగారు భర్త చేతిలో కష్టాలు పడ్డ రావులమ్మ కథ చెప్తే, తండ్రైనా, భర్తైనా, బాంధవ్యం ఏదైనా మగాడన్నవాడి చేతిలో దగా చెయ్యబడుతూనే ఉంటారు ఆడవాళ్లు. అలా దగా కాబడ్డ కనక గురించి “కూరాకుల మడి”లో అయ్యగారి సీతారత్నం గారు చెప్తే, “మా ఊరి కథ” అని ఇనుగంటి జానకి గారు ఆ ఊరిలో జరిగిన కథల గురించి చెప్తూ, అందులో మరల అన్యాయంగా చనిపోయిన స్త్రీ మూర్తుల కథలే ఉంటే, చెట్లను నరుకుతూ, డైనమైట్లు పెట్టి కొండల్ని పిండి చేస్తూ, భూగర్భ జలాలను ఇష్టానుసారం తోడేస్తూ, పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే, భూకంపాలు రాక ఏమవుతాయని ప్రశ్నిస్తూ, అలా కాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలో “కల” కథలో మజ్జి భారతి గారు, వివరిస్తారు.
ఉత్తరాంధ్ర కవుల కథలను సంకలనంగా చేసి, “కళింగ కథా జాడ” అని పేరు పెట్టారు గాని, ఇందులోని అన్ని కథలు, అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ, సమస్యలకు ముగింపు ఏ రకంగా దొరుకుతుందని పాఠకులను ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వ్యాసంలో కొన్ని కథలనే ఉటంకించడం జరిగింది. గాని, ఇందులోని ప్రతికథ ఒక ఆణిముత్యమే. అందుకే కొని, చదవవలసిన కథల సంకలనమిది అనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సంకలనం తేవాలన్న ఆలోచన చేసి, శ్రమ కోర్చి, కథలను యేరి, వడబోసి, అర్థవంతమైన ముఖచిత్రంతో అలంకరించి, మనకందించిన సంపాదకత్రయం అట్టాడ అప్పలనాయుడు గారు, గంటేడ గౌరునాయుడు గారు మరియు చీకటి దివాకర్ గార్లకు ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, మాతృకలో ప్రచురింపబడ్డ నా కథ “కల” ను కూడా, ఈ సంకలనంలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి
*
ఉదయం సూర్యుడు ప్రపంచాన్ని నిద్రలేపే ముందు మనం పట్టించుకోని, సాధారణంగా జరిగుతున్న విషయం, ఎవరో ఒకరి చెమట భూమిని తడుపుతుందని. మనం గ్రహించని, కళ్లకు కనిపించని ఆ క్షణంలోనే ప్రపంచం మేలుకుంటుందని.
మానవ సమాజం నాగరికతను, అభివృద్ధిని రూపుదిద్దుకుంటున్న వేళ పంటలను పండించడం, పండిన ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించి నిప్పులపై వండుకుని తినే కాలం వచ్చింది. నివాసయోగ్యమైన నీడను కల్పించుకునే దశలోకి ప్రవేశించాడు మానవుడు. అప్పటినుండే పొలం దున్నే రైతు చెమటలో అన్నం మొలుస్తుంది. ఇటుక మోసే కూలీ భుజంపై ఇల్లు నిలబడుతుంది. మిల్లులో చక్రం తిప్పే కార్మికుడి చేతుల్లో సమాజం కదులుతుంది. వారివల్లే ప్రపంచం ఒక విస్తారమైన రంగస్థలం అయితే, దానిపై నిశ్శబ్దంగా నడిచే పాత్రలు శ్రామికులయ్యారు. వారి పేర్లు చరిత్ర పుస్తకాలలో పెద్ద అక్షరాల్లో ఉండకపోవచ్చు… కానీ వారి చెమట చుక్కలతోనే నాగరికత తన కథను రాసుకుందనేది జగమెరుగని సత్యం.
ప్రథమంగా ప్రధానమైంది వ్యవసాయం. ఎక్కువ మంది రైతులుగానే ఉండేవారు. తమ భూముల్లో లేదా జమీందార్ల భూముల్లో పనిచేసేవారు. వీరికి సమయ నిబంధన ఏదీ లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు, ప్రకృతి ఆధారితంగా పని చేసేవారు.
తరువాత వృత్తిదారులు. అంటే నేయుగాళ్ళు, కమ్మర్లు, కుండలు చేసేవారు, బంగారు పని చేసే వారు. ఇవే వీరి కులవృత్తులుగా మారాయి. వీరంతా తమ ఇంటి దగ్గరనుంచే, కుటుంబం అంతా కలిపి పని చేసే తమ పనికి తామే యజమానులు ఉండేవారు. కుటుంబ ఆధారిత పనులు. పిల్లలు కూడా చిన్న చిన్న పనుల్లో సహాయం చేసేవారు. పిల్లల శ్రమలాగా కాకుండా కుటుంబ సహాయంగా ఉండేది.
రాజులు, జమీందారుల వ్యవస్థ ఏర్పడింది. చాలా మంది “సర్వులు” (serfs)గా ఉండేవారు. భూమి యజమానుల కోసం పనిచేసేవారు. చాలా భాగం తమ స్వేచ్ఛను కోల్పోయారు. వారి పనికి సమయ నిబంధనలు హరించుకు పోయాయి.
18వ శతాబ్దం చివరిలో పారిశ్రామిక విప్లవం (Industrial Revolution)ప్రారంభమైంది. యంత్రాలు వచ్చాయి. ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ప్రజలు తమ భూములు భూస్వాముల ఆధీనంలోకి వెళ్ళి పోవటంతో జీవనాధారం కోసం గ్రామాలనుండి పట్టణాలకు వలసలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలలో పని చేయటం వల్ల వారి జీవన విధానంలో చాలా మార్పులొచ్చాయి. ముందు “తమ పని-తమ సమయం” తర్వాత “యజమాని పని-నిర్ణీతకాలం” అయిపోయాయి. ఇదే “కార్మికుడు” అనే కొత్త వర్గాన్ని సృష్టించింది. ఎడతెరపిలేని పని వల్ల పని చేసే గంటలు కూడా పెరిగాయి. 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. యంత్రాలు 24 గంటలు నడవాలి. యజమానులు లాభాలకోసం ఎక్కువ పని చేయించేవారు. ఫాక్టరీల ప్రారంభ దశ కావడంతో ఉద్యోగాలు తక్కువ, పోటీలు ఎక్కువగా ఉండి, ఆ కార్మికుడు బలవంతంగా ఎక్కువ సేపు పని చేయాల్సి వచ్చేది. వారి జీవిత కాలంలో ఎక్కవ భాగం ఫాక్టరీల్లోనే గడిచిపోయేది. ఆరోగ్యాలు పాడై పోయేవి. అప్పుడు చట్టాలు, కార్మికుల హక్కులు లేవు.
ముందు స్వయం ఉపాది, ప్రకృతి ఆధారితం, కొంత స్వేచ్ఛ, కుటుంబ పనిగా ఉండే జీవనోపాధి రానురాను ఫాక్టరీ ఉద్యోగం, యంత్రాల ఆధారితం, కఠిన నియంత్రణ, వేతనాల కార్మికుడి జీవితం చట్రంలో బంధింపబడింది. మానవుడు ఒకప్పుడు తన పనికి యజమాని… పరిశ్రమల యుగంలో తన శ్రమకు మాత్రమే యజమాని అయ్యాడు.
కర్మాగారాల గోడలు మానవ విలాపనలు వినేవి. వెలుతురు కన్నా చీకటి ఎక్కువగా ఉండే కార్మికుల జీవితాలు యంత్రాల కంటే చవకగా మారాయి. పగలు-రాత్రి అనే తేడా లేకుండా, 16 గంటల వరకు పనిచేసే వారి శరీరాలు అలసిపోయేవి. కర్మాగారాల పొగమంచులో మానవ శ్వాసలు కనుమరుగైపోవటం ప్రారంభమైంది. యంత్రాల గర్జనలో మనిషి హృదయ స్పందన వినిపించని కాలమై పోయింది.
ఏదైనా పెరుగుట విరుగుట కొరకే. ఎంత అణచి వేతలుంటాయో అంత తిరుగుబాట్లు మొదలవుతాయనటానికి నిదర్శనంగా వారి ఆశలు మేల్కొన్నాయి. ఆ ఆశలే ఒక రోజు నినాదాలుగా మారాయి. అప్పుడు ఒక చిన్న స్వరం పుట్టింది. “జీవితం కూడా కావాలి…” ఆ స్వరం పెరిగి నినాదమైంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల మనసు కోసం…” ఆ నినాదం వీధుల్లో ప్రవహించింది… చికాగో గుండెల్లో అగ్నిలా రగిలింది… అక్కడే చరిత్ర రక్తంతో రాసుకుంది. “ఎనిమిది గంటల పని… ఎనిమిది గంటల విశ్రాంతి… ఎనిమిది గంటల జీవితం.” ఆ నినాదాల ప్రతిధ్వని 1886 మే 1న అమెరికాలో గర్జించింది. చికాగో వీధుల్లో కార్మికుల అడుగులు భూమిని కంపించాయి. కానీ ఆ స్వరాలను అణచివేయడానికి ప్రయత్నించిన హింస, రక్తపాతం చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ రోజు జరిగిన హింసాత్మక సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ నిరసనలో బాంబు పేలుళ్ళు, పోలీసుల కాల్పులు జరిగాయి అనేక మంది కార్మికులు, పోలీసుల మరణించారు. ఈ సంఘటన కార్మిక ఉద్యమానికి మలుపు తీసుకువచ్చింది.
ఆ త్యాగాలు వృథా కాలేదు. అవి ప్రపంచ కార్మిక హక్కుల పునాది అయ్యాయి. ఆ సంఘటననే మనం “హేమార్కెట్ అఫైర్” (Haymarket Affair)గా ప్రపంచం గుర్తుంచుకునేలా చేసింది. అక్కడ చిందిన ప్రతి రక్తపు చుక్క, భవిష్యత్తులో కార్మిక హక్కుల విత్తనంగా మొలిచింది. ఆ రక్తపు ప్రతి చుక్క ఈ రోజు మన హక్కుల పునాది అయింది.
1886 మే 1న అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం, చికాగోలో జరిగిన Haymarket Affair ద్వారా ప్రపంచ చరిత్రలో ఒక కీలక మలుపు తీసుకుంది.చికాగోలో జరిగిన ఉద్యమం ఒక చినుకు కాదు, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక చైతన్యాన్ని రగిలించిన మెరుపు. భారీ సమ్మెలు, 8 గంటల పని కోసం పోరాటాల అంకురార్పణ జరిగింది. ఇదే ప్రపంచ కార్మిక ఉద్యమానికి బీజం.
ఇది అలలా వ్యాపించిన ఉద్యమం ఒకేసారి అనేక ప్రాంతాల్లో పెల్లుబికింది. చరిత్రలో నిలిచి పోయింది. ప్రపంచమంతా వ్యాపించింది. చికాగోలో మొదలైన ఆ నినాదం, సరిహద్దులు దాటి ఖండాలను తాకింది. ఒక నగరంలో పుట్టిన స్వరం, ప్రపంచ కార్మికుల గొంతుకగా మారింది.
తరువాత 1880ల చివరన కెనడాలో అమెరికా ప్రభావంతో కార్మిక సంఘాలు బలపడాయి. 8 గంటల పని కోసం డిమాండ్లు మొదలయ్యాయి.
1889–1891 కాలంలో యూరప్ లో ఉద్యమం వేగంగా వ్యాప్తి చెందింది. సెకెండ్ ఇంటర్నేషనల్ సమావేశం పారిస్ లో 1889 సంవత్సరంలో ముఖ్య మలుపు తిరిగింది. మే 1ను అంతర్జాతీయ కార్మిక దినంగా ప్రకటించారు. వెంటనే యూరప్ దేశాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలుబ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో విస్తరించాయి. 1890లోనే యూరప్ అంతటా మొదటి “గ్లోబల్ మే డే” జరుపుకున్నారు.
1890లు–1917 లలో రష్యా విప్లవ దిశగా అడుగులు వేసింది. సర్కార్ భయం వల్ల మే డే రహస్యంగా జరిపేవారు. తర్వాత ఇది పెద్ద రాజకీయ ఉద్యమంగా మారింది. చివరికిది రష్యన్ రెవల్యూషన్ (Russian Revolution) కి దారితీసిన చైతన్యంలో భాగమైంది.
1900–1920 ఆసియాలో ప్రారంభమై వ్యాప్తిచెందింది.జపాన్, చైనా దేశాల్లో కార్మిక ఉద్యమాలు మొదలయ్యాయి. మే డే జరుపుకోవడం ప్రారంభమైంది
భారతదేశం లో 1923 లో అధికారికంగా ఆరంభం మైంది.మొదటి మే డే చెన్నైలో జరిగింది. సముద్ర గాలిలో ఎర్ర జెండా, చెన్నైతీరాన ఎమ్. సింగరవేలు చెట్టియార్చేతుల్లో మొదటిసారి ఎగిరింది. అది కేవలం జెండా కాదు వేదనకు రంగు, పోరాటానికి రూపం. ఆయనేభారత కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించి మార్గదర్శకుడిగా నిలిచారు. అదే సందర్భంలో ఎర్ర జెండాను కార్మిక ఐక్యతకు ప్రతీకగా ఎగురవేశారు. ఆ జెండా కేవలం ఒక రంగు కాదు, అది బాధల జ్ఞాపకం, పోరాటాల ప్రతీక, ఐక్యతకు సంకేతంగా ముద్రవేసుకుంది. అప్పటి నుంచి మే డే భారతదేశంలో కూడా శ్రమకు గౌరవం ఇచ్చే రోజుగా స్థిరపడింది. ఇక్కడి నుంచి భారత కార్మిక ఉద్యమం బలపడింది.
ప్రపంచవ్యాప్తంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాలలో 20వ శతాబ్దం మధ్యకాలంలో విస్తరించింది. అప్పటినుండి మే డే ఒక గ్లోబల్ ఉద్యమంగా మారింది. శ్రామికుడి చెమటకు భాష్యం చెప్పిన రోజే ఆ మేడగా అవతరించింది.
ఆ శ్రమించే కార్మికుడి చేతుల్ని మనం ఎప్పుడైనా గమనించామా? ఆ చెమట చుక్కలకి కూడా ఒక రోజు పండుగగా చేసుకునే రోజుకొటి ఉంది. అదే మే ఒకటవ తారీకు అని చరిత్ర నినదించింది. మనమది“ఇంటర్నేషనల్ వర్కర్స్ డే” అని పిలుస్తాం.
కానీ, ఆ రోజు కేవలం ఒక తేదీ కాదు. నిశ్శబ్దంగా రాసుకున్న రక్త గాథ. ప్రపంచాన్ని ముందుకు నడిపేది యంత్రాలు కాదు. వాటిని నడిపించే చేతులు. ఆ చేతుల వెనుక ఉన్న శ్రమ, చెమట, నొప్పి, ఆశల సమాహారానికి ప్రతీకగా నిలిచిన రోజు మే డే. ప్రతి సంవత్సరం మే 1న జరుపుకునే International Workers’ Day కేవలం ఒక పండుగ కాదు. ఇది పోరాటాల చరిత్ర, హక్కుల సాధన, సమానత్వ స్వప్నాలకు చిహ్నం.
మే డే మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. పని చేసే ప్రతి మనిషి గౌరవించబడాలి. కనీస వేతనం, సురక్షిత పని పరిస్థితులు, సమాన అవకాశాలు ఇవన్నీ హక్కులుగా మారడానికి ఈ రోజు పునాది వేసింది. కార్మికుల ఐక్యత ఎంత శక్తివంతమో ప్రపంచానికి తెలియజేసింది.
ఆశ్చర్యకరంగా, ఈ ఉద్యమానికి జన్మనిచ్చిన అమెరికాలో మే 1న లేబర్ డే జరపరు. అక్కడ అది సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మే డే ఒకప్పుడు యూరప్‌లో వసంత ఋతువును ఆహ్వానించే పండుగగా కూడా ఉండేది. కాలక్రమేణా అది కార్మికుల హక్కుల దినంగా మారింది.
మే డే కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది మనం వినియోగించే ప్రతి సౌకర్యం వెనుక ఉన్న శ్రమను గుర్తు చేసే రోజు. కార్మికుల చెమటతో నిర్మితమైన ఈ ప్రపంచంలో, వారి గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. శ్రమే శక్తి… శ్రామికుడే సమాజానికి అసలైన ఆధారం. చెమట చుక్కల చరిత్ర – మే డే”. ఇది మనకు ఒక గాఢమైన సత్యాన్ని చెబుతుంది. శ్రమే సృష్టి మూలం. ఈ ప్రపంచం నడిచేది చేతుల శ్రమతోనే. ఈ రోజు వెనుక మరో మృదువైన గాథ ఉంది. ఒకప్పుడు మే 1 వసంత ఋతువు ఆరంభంగా పండుగలా జరుపుకునేవారు. ప్రకృతి పచ్చదనాన్ని ఆహ్వానించే ఆ రోజు, కాలక్రమేణా శ్రమికుల గౌరవానికి అంకితమైంది. ప్రకృతి పునర్జన్మ పొందినట్లే, కార్మికుల హక్కులు కూడా పునర్జన్మ పొందిన రోజు ఇది.

మే డే చరిత్రలో మహిళల అడుగులు కూడా స్పష్టంగా వినిపిస్తాయి. నూలు మిల్లులలో, గార్మెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసిన మహిళలు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడ్డారు. తమ హక్కుల కోసం ముందుండి పోరాటం చేశారు. వారి స్వరం సున్నితమైనదైనా, దాని ప్రభావం గొప్పది. అలాగే చిన్నారులపై బానిసత్వపు బరువును తగ్గించడంలో కూడా ఈ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మే డే చరిత్రలో మహిళల పాత్రను ప్రత్యేకంగా గుర్తించాలి. అలాగే పిల్లల శ్రమ నిర్మూలనలో కూడా కార్మిక ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి.
ఈరోజు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నప్పటికీ, శ్రమ విలువ తగ్గలేదు. కొత్త రూపాల్లో సమస్యలు మారినా అసంఘటిత రంగం, అందుకే మే డే కేవలం చరిత్ర కాదు… అది ప్రస్తుతానికి కూడా మార్గదర్శకం. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగినా, కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు. కొన్నిరంగాలలో పనిచేసే వారికి ఇంకా సరైన రక్షణ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు, గిగ్ వర్క్ కార్మికుని పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటువంటి కొత్త తరహా కార్మికులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే మే డే ప్రాముఖ్యత ఇప్పటికీ తగ్గలేదు. అది మరింత అవసరమైంది.
ముగింపుగా, మే డే మనకు ఒక ప్రశ్న వేస్తుంది. “మన జీవితాన్ని సులభం చేసిన ఆ చేతులను మనం గౌరవిస్తున్నామా?” ప్రపంచం, ఎత్తుకు ఎదిగిన ప్రతి మెట్టు వెనుక, ఒక కార్మికుడి చెమట చుక్క ఉంది. ఆ చుక్కను గుర్తు చేసుకోవడమే మే డే. ఇది ఒక ప్రశ్న, ఒక జ్ఞాపకం, ఒక కర్తవ్యం. హక్కులు పుట్టాయి పోరాటంతో. నిశ్శబ్దంగా పనిచేసే మహిళా చేతులు చరిత్రను నెమ్మదిగా మార్చాయి. చిన్నారి కన్నీళ్లు తగ్గించడానికి ఈ ఉద్యమం కవచమైంది. ఇప్పటికీ ప్రపంచం మారినా శ్రమ మారలేదు. పేర్లు మారాయి. గిగ్ వర్కర్… కాంట్రాక్ట్ ఉద్యోగి…కానీ బాధ మాత్రం అదే… అందుకే మే డే ఇంకా ముగియని కవిత. మన సుఖాల వెనుక వారి నిశ్శబ్ద త్యాగం ఉంది. ఆ చెమటకు నమస్కరించే రోజు మే డే.
శ్రమ ఒక పదం కాదు. అది జీవితం. శ్రామికుడు ఒక మనిషి కాదు. అతడే సమాజం. శ్రమకు నమస్కారం… శ్రామికుడికి గౌరవం… అదే మే డే సారాంశం. చెమట చుక్కల సాక్ష్యం మే డే”
కీర్తిశేషులు గుండవరం చంద్రశేఖర రావు గారు రచించిన పద్య కావ్యం ప్రబోధ నిర్వచనం నీతి చంద్రిక, మిత్ర లాభం. ఆయన పుత్రులు, కవి, గుండవరం ప్రభాకరరావు ,రెండవ కుమారుడు కొండల్ రావు ,కూతురు శారదాదేవి ఈ పుస్తకాన్ని పునర్ ముద్రించారు. భవానీ సాహిత్య వేదిక నిర్వాహకులు వైరాగ్యం ప్రభాకర్ ప్రచురణ కర్తగా వ్యవహరించారు.
బుద్ధి కుశలత లేని రాజకుమారులను తీర్చిదిద్దడం లక్ష్యం. విష్ణుశర్మ అనే గురువు ద్వారా ఇది జరిగింది. ఒకప్పుడు సంస్కృత సాహిత్యంలో భానుని కాదంబరి, దండి దశకుమార చరిత్ర గొప్ప వచన గ్రంథాలు. తెలుగులో చిన్నయ్య సూరి బాల వ్యాకరణం, వ్యాకరణం అభ్యసించే వాళ్ళకి అనుకూలంగా తీర్చారు. అదే క్రమంలో రచించిన నీతి కథల వెన్నెల ఈ నీతి చంద్రిక. అందులోని మిత్ర లాభాన్ని గుండవరం వారు చాలా చక్కని పద్యాలలో రచించారు.
పీఠికలో గండ్ర లక్ష్మణరావు గారు చెప్పినట్టు వచనాన్ని పద్యంలో రాయడం చాలా కష్టం. ఈ కష్టమైన కృతి నిర్వహణ చంద్రశేఖర రావు గారి చేతిలో ఆలవోకగా కొనసాగింది.

గుండవరం చంద్రశేఖర రావు ఈ రచనను పూర్తిస్థాయి ప్రాచీన కావ్య రచనా పద్ధతిలోనే రచించారు. ఇష్ట దేవతా స్తుతి, మాతృ స్తుతి, పండిత స్తుతి. మొదలైన కావ్య సంప్రదాయాలను పాటించారు. పద్యాలను ఎత్తుకోవడం, నడిపించడం, సమస్తము నాటి ప్రబంధ పద్ధతే. ఆయన మిత్ర లాభము కథను ఈ పద్య శిల్పంతో చెప్పడం ఆధునిక సాహితీ రంగంలో ఒక నూతన ప్రయోగం.
చిన్నయ్య సూరి నీతిచంద్రికలో వివిధ జంతువులు మాట్లాడుతాయి. మానవుల వలె ఆలోచిస్తాయి. ఇట్లాంటి anthropomorphism ఆనాడే చిన్నయ్య ప్రయోగించాడు. ఇది గుండవరం చేతిలో మరింత రసవంతమైంది.
ఆయన మిత్ర లాభం కథా ప్రారంభం చిన్నయ్య సూరి పద్ధతిలోనే మొదలుపెట్టినా నాటి ప్రబంధాలనే స్తురింపజేస్తుంది. “గంగ కనతి దండ గలదొక్క నగరంబు, అఖిల సంపదగల్గి అలరుచుండు”
అంటూ మొదలవుతుంది. పావురములు వలలో చిక్కుకోవడం, బ్రాహ్మణుడు పులి కథ, లఘు పతనకుడు హిరణ్యకుని స్నేహమాశించడం, పిల్లి చేసిన మోసం వల్ల ముసలిగద్ద బలి కావడం, హిరణ్యకుడు పూర్వకథ చెప్పడం,బ్రాహ్మణుడు_ నువ్వుల కథ, మందరుడునక్క_విల్లు కథ చెప్పడం, చిత్రాంగుడు తన పూర్వ కథ చెప్పడం, ఇలాంటి కథలూ , ఉపకథలతో సాగిపోతుంది కథాకథనం.
గుండవరం వారి శైలి ప్రసాద మాధుర్యంతో ఉంటుంది. ఆయన పద్యాలు పాంచాలి రీతిలో కొనసాగుతాయి. ఆయన వాడిన అలంకారాలు ఆధునిక కవి మార్గదర్శకాలు.
చింతలు గ్రమ్మె చందురుని చీకటి మబ్బులు ముంచునా విధం, (28 పేజీలో 5వ పద్యం) కాల ప్రవాహము నాపశక్యమే ( 47వ పేజీలో 108వ పద్యం ) భీరుని కైవడి భూరుహంబునన్ (136 పద్యం 52 పేజీ ) గణనౌనగు వన ప్రకృతి, వనితామణి నీల గగన వర్ణము తోడన్, ( 88వ పేజీ 339 పద్యం )
ఈయన పద్యాలలో లోక సహజ రీతి సామెతలుగా నిలబడిపోగలిగే పాదాలు ఎన్నో కనబడతాయి.
బుద్ధిబలుండబలుడై నభూషణుడవనిన్. (56వ పద్యం ) ఆశింపకు కపట కుఠిల మానస మైత్రిన్ ( 43 వ పద్యం )
ఈయన రాసిన పద్యాలు ప్రసిద్ధ కవుల ఒరవడిలో సాగినవి. 43 వ పద్యం కొరవి గోపరాజును, 47 వ పద్యం బలిజేపల్లి లక్ష్మికాంతమును, 68, 82, పద్యాలు కరుణశ్రీని, 72వ పద్యం పోతనని,76వ పద్యం పెద్దనను, 113 వ పద్యం ముక్కు తిమ్మనను, స్పురింపజేస్తాయి. 161 పద్యంలో కవి ప్రయోగించిన దుష్కరప్రాస ఈయన పద్య రచనా కౌశలాన్ని తెలియజేస్తుంది.
పావురాలన్నీ వలలో చిక్కుకున్న తర్వాత తమను అందుకు ప్రోత్సహించిన వృద్ధకపోతాన్ని మిగతా పావురాలు చిన్నయ్య సూరి కథనంలో ఈ విధంగా నిందిస్తాయి. “నీవు వృద్ధుడవు, తెలిసిన వాడివి అని భ్రాంతిపడి నీ మాటలను విని, ఈ విపత్తు తెచ్చుకుంటిమి. ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడు కాని, ఏండ్లు మీరిన వాడా వృద్ధుడు..
ఈ మాటలకు చంద్రశేఖర రావు పద్యానువాదం చూడండి,
వృద్ధులిట లక్షలున్నను
బుద్ధికి బలుడైనవాడె,వృద్ధుండిల సద్,
బుద్దికి వృద్ధుడె బద్దుడ
బుద్దిబలుండబలుడైన భూషణు డవనిన్
ఇంత చక్కని ఈ పద్య కావ్యం లో అక్కడక్కడ యతిభంగి పద్యాలు చేరాయి. ఇది డిటిపి చేసిన వాళ్ల దోషం అయి ఉంటుంది.
మరొక ముద్రణలో దీన్ని సవరించుకోవాలి.
