మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

స్వశక్తి

by Nellutla Madhava Srinivas July 30, 2025
written by Nellutla Madhava Srinivas

చిట్టి కథ

చైనీస్ బ్యాoబు అని ఒక చెట్టు యొక్క విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల కనిపించదు. కానీ ఓపికగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఐదవ సంవత్సరము కూడా ఆ నాటిన విత్తనాలకు నీళ్లు పడుతూ ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఆరువారాలలోనే 90 ఫీట్ ఎత్తు ఎదుగుతుంది. చూసేవాళ్ళందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తారు. అరే!!!! ఇన్ని రోజులు ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగే ఉన్నది ఇది. ఆరు వారాల్లో ఎంత ఎత్తు ఎదిగిపోయింది అని. కానీ చూసే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అది స్తబ్దుగా ఉంది కాదు కాదు ఉన్నట్లు కనిపించింది కానీ అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. వేర్లను బలంగా భూమిలోకి పాతుకపోయింది. పైన దాని యజమాని ఎంత కష్టపడ్డాడో, అది అంతకు రెట్టింపు భూమిలోనికి పాదుకొని పోయింది. దేనికైనా ఒక సమయం అంటూ వస్తుంది కదా!!!! అదే విధంగా దానికి కూడా సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా ఆకాశానికి ఎదుగుతుంది. దాని యజమాని నిరాశ పడి ఇది పెరగట్లేదు అని దానికి నీరు పట్టడం ఆపేస్తే ఆ మొక్క ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండేదేమో.!!! కానీ ఆయన అలా చేయలేదు .ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దానికి నీళ్లు పట్టేవారు .పోషణ అందించేవాడు. యజమాని ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఆ మొక్క కూడా భూమి లోపల తన పని తాను చేసుకుని అకస్మాత్తుగా అందరు ఆశ్చర్యపడే విధంగా ఆకాశానికి ఎదిగింది.అదేవిధంగా మనిషి కూడా అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకుని పనిని కల్పించుకొని నమ్మకంతో మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యేవరకు ఎదురు చూడగలిగితే అది తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు అంటారు కష్టేఫలి అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వండకుండా నోట్లోకి ముద్ద రావాలి అనుకునే అంత మూర్ఖత్వం. నిజాయితీగా కష్టపడితే ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక రోజుఫలితం తప్పకుండా దక్కుతుంది . ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సినవి ప్రకృతి మనకు నేర్పించేవి చాలా ఉంటాయి. సరిగ్గా శ్రద్ధ పెడితే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదిగానే కనిపిస్తుంది. తదనుగుణంగా మనం మసలగలిగితే అది మన ఎదుగుదలకు సహకరిస్తుంది. చిట్టి కథ గొప్ప సందేశం. నాకైతే బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనిపించి రాశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.

సర్వేజనా సుఖినోభవంతు

July 30, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

హోమ్ టూర్ ( హాస్య కథ )

by Laxmi Madan July 29, 2025
written by Laxmi Madan

డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది.

తలుపు తెరిచిన జయప్రదకి బయట జయసుధ నిలబడి ఉండటం చూసింది.

“ఏంటి జయా! ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఉరుములేని పిడుగులా ” అన్నది నవ్వుతూ.

” లోపలికి రానిస్తావా లేదా?”అంటూ లోపలికి తోసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది.

ఫ్రిజ్లో నుండి చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్ తెచ్చి పెట్టింది జయప్రద.

చల్లగా గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమిత పడింది.

“ఇప్పుడు చెప్పు. ఈ అకాల ఆగమనానికి కారణం?”అన్నది జయప్రద.

“ఏమీ లేదే, మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది. అందంగా దమడమ ఇల్లు లాగా ఉంటుంది అనుకున్నాను”అన్నది జయసుధ ముఖం చిట్లిస్తూ.

“ఏంటి అద్దంలా మెరుస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది? పిల్లలు, ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి. రోజంతా తుడిచినయే తుడవటం కడిగినవే కడగటం చేయలేం కదా!”అన్నది జయప్రద ఆయాసంగా.

” మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను. ఇంతలో మా అత్తయ్య పిలిచారు.

తీరా ఎందుకు పిలిచారు, అని వస్తే యూట్యూబ్ లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి, మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు? అని పెద్ద క్లాసు. ఇలా రోజూ నస తో చంపేస్తుంది .ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను”అన్నది జయసుధ.

ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ చప్పుడు అయింది.

తలుపు తీసి చూసిన జయప్రదకు బయట శ్రీదేవి నిలబడి ఉంది.

“ఒసేయ్ శ్రీ, నువ్వేంటే ఇలా వచ్చావు. ఇప్పుడే జయసుధ వచ్చింది”అన్నది నోరు 70mm సైజ్ చేసి.

శ్రీదేవి కూడా లోపలికి వచ్చి కూర్చుంది. మంచినీళ్లు, కూల్ డ్రింక్ తాగింది.

తనది కూడా అదే సమస్య. ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి, “నువ్వు అలా ఎందుకు సర్దుకోవు?ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయి” అని అరుస్తున్నాడు.

“నా సంగతి అంతేనే! మా ఇంట్లో కూడా అదే గోల. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ..

“ఇది మాహాలు. ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి. ఇది సోఫా, సోలాపూర్ నుంచి తెప్పించాము. ఆర్డర్ చేసిన నెలకి వచ్చింది.

ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుంచి తెచ్చాము. దీన్ని ఇలా నీట్ గా సర్దితేనే నాకు ఇష్టం. ఇదిగో చూసారా దీనిమీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్స్లో అందంగా పెట్టాను. ఈ బాస్కెట్ బాంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇదిగో కిచెన్ చూడండి. ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా పెట్టుకున్నానో !ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుంచి పంపించింది. నాకు అన్ని డబ్బాలు నీట్ గా ఉండి, వాటిలో సామాను కూడా సర్దేసి ఉండాలి. కొంచెం డస్ట్ ఉన్నా నాకు అసలు నచ్చదు.

ఇప్పుడు మా బాత్రూంలోకి రండి. టట్టడాయ్! ఎంత బాగుందో చూసారా? అసలు ఎంత పరిమళం! ఎప్పుడు మా బాత్రూం ఇలాగే ఉంటుంది.

ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను. ఇదిగో ఈ షాంపు కంపుల సైట్ లో ఆర్డర్ చేశాను.

ఇదేమో వాష్ బేసిన్. అదేమో కమోడ్ దానిమీద కూర్చుంటాం అన్నమాట. మరి మీరు ఎలా కూర్చుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి”ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది. చివరికి బెడ్ రూమ్ లు కూడా వదలలేదు. ఆమె పెట్టుకునే ఇన్నర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది.

అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది. నువ్వు అస్సలు శుభ్రంగా పెట్టవు అంటూ.

అయితే మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలి. ఈ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందట. మనం ఒకసారి వెళ్లి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగి వద్దామా”అన్నది జయప్రద.

“నిజమా? ఈ కాలనీలో ఉంటుందా? వెళ్లి కలుద్దాం,ఆమె పేరు డమడమ”అన్నది జయసుధ.

“అయితే మరి వాళ్ళ ఇంటికి వెళితే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో! లేదో! ఏం చేద్దాం”అన్నది శ్రీదేవి.

“ఆమె చూడటానికి కూడా చాల అందంగా ఉంటుంది”అన్నది జయప్రద.

“ఆమె కోసం కొన్ని గిఫ్ట్ లు కొనుక్కొని వెళ్దాము. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు” అని అనుకోని, ముగ్గురు షాపులో ఖరీదైన గిఫ్ట్ లు కొనుక్కొని, వాళ్ళ ఇంటికి వెళ్లారు. గేటు దగ్గర ఎవరూ లేరు. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే, యూట్యూబ్ లో చూపినంత అందంగా ఏమీ లేదు. ఎక్కడి చెత్త అక్కడ పేరుకొని ఉంది. యూట్యూబ్లో వీడియో లో చూపించినప్పుడు, అందమైన పెద్ద రంగు రంగుల ముగ్గు కనబడింది. ఇప్పుడు కనీసం పాచి ఊడ్చినట్లు కూడా లేదు.

చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. నీళ్లు పోసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి. అన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టినట్లు ఉంది.

బెల్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. మురికి పట్టిన పాత నైటీ, ముఖమంతా ముడతలు, జుట్టంతా రేగిపోయి ఉంది.

“ఎవరు కావాలి” అని అడిగింది.

“డమడమ గారు కావాలండి”అన్నారు ముగ్గురు.

“నా పేరు డమడమ మీరు ఎందుకు వచ్చారు”? అని అడిగింది.

ముగ్గురు షాక్ తిన్నారు. ఈమె ఏంటి ఇలా ఉంది? ఎంతో అందంగా ఉంటుంది కదా వీడియోలో” అని అనుకొని మనసులో భావాలు బయట కనబడకుండా నవ్వుతూ..

“మీరంటే మాకు చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము. అని గిఫ్ట్ లను చూపించారు.

అవి చూడగానే నోరు తెరిచి పార పండ్లతో నవ్వింది.

లోపలికి రమ్మని పిలవగానే వెళ్లి సోఫాలో కూర్చున్నారు.

అందంగా ఉండనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది. సోఫాలో కుక్క పడుకుని ఉంది .కుక్క జుట్టు అంతా సోఫాల నిండా ఉంది. ఇల్లంతా దుమ్ము .ఎక్కడ సామాను అక్కడే ఉంది. అందంగా కనిపించే ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది.

యూట్యూబ్లో అందంగా కనిపించే ఆ ఇల్లు బూత్ బంగ్లా లాగా ఉంది.

ముగ్గురు ముఖా ముఖాలు చూసుకున్నారు.

“డమడమ గారు! మీ ఇల్లు చూడవచ్చా?”అని అడిగారు.

“దానికేమి భాగ్యం రండి” అని లోపలికి తీసుకెళ్ళింది.

ఘోరాతి ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు. వంటిల్లు అయితే చెప్ప తరం కాదు .అక్కడి వంట ఎవరు తిన్నా, తిన్నగా హాస్పిటల్ కి వెళ్లడమే.

హాల్లో ఉన్న వాష్ బేసిన్ నిండా మరకలు నిండి అసహ్యంగా ఉంది. ఇక బాత్రూం ఏ లెవెల్ లో ఉంటుందో అనుకున్నారు.

“టీ పెడతాను. అక్కడి నుండి నాకోసం వచ్చారు మీరు”అన్నది డమడమ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ లని ఊహించుకొని.

“వద్దు వద్దు” అని ముగ్గురు ఒకటేసారి అరిచారు.

మేము ఇక వెళ్తామండి. చాలా థాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు. అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు” అని చెప్పి ఉరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు.

“ఆ ఇల్లు ఏంటి అంత చెండాలంగా ఉంది? ఒక్కసారి మనవాళ్ళకి చూపిస్తే అర్థం అయ్యేది. యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని? అయినా 24 గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా? పిల్లలు ఉన్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా? వీలైనంతవరకు శుభ్రంగా అమర్చుకుంటాము. మన ఇళ్లే నయం ఆమె ఇంతకన్నా.క అద్దంలా పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా? ఎవరి ఇల్లు అయినా ఓ మోస్తారు గా ఇలాగే ఉంటాయి. మన వాళ్ళకి ఒకసారి ఆ ఇల్లు చూపిద్దాము. అప్పుడు గాని నోళ్లు మూసుకోరు”అని ముగ్గురు అనుకున్నారు. కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది. యూట్యూబ్ లో చూపించే ఇళ్ళు నిజంగా రోజంతా ఇలా ఉండవని.

ఇంట్లో వాళ్లకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలని ముగ్గురు ఆలోచించనలో పడ్డారు.

ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా! అని తలబాదుకున్నారు ముగ్గురూ!!

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

మామిళ్ళ ముచ్చట్లు

by Laxmi Madan July 29, 2025
written by Laxmi Madan

మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కాక ఉండరు. దేవుడికి కూడా ఇష్టమైన పండు మామిడి పండే. కావాలంటే రోజు ఒక పండు నైవేద్యం పెడతారు కదా? మామిడిపండు పెట్టిన రోజు మందిరంలో ఉన్న దేవుడి ముఖం చూడండి. ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటారు స్వామి. అదన్నమాట మామిడిపండు మహిమ.

మామిడి పండు అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలియా లంటే ఈ మామిడిపండ్లు ఏం మాట్లాడుతున్నాయో వినండి!

ఒక తోటలో బోలెడన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు కాసిన కాయలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.

“మనము ఇప్పుడే పిందెలుగా మారాము. ఇప్పటి నుండే మనకు కష్టాలు మొదలు”అన్నది బంగి నపల్లి.

“అవునే! కసి పిందెలమని కూడా చూడకుండా, కసా కసా కోసి, ఉగాది పచ్చడితో మొదలుపెడతారు. తర్వాత కోసి ఉప్పు కారం పెట్టుకొని ఓ కన్ను మూసుకొని, ఓ కన్ను తెరిచి లొట్టలు వేసుకుంటూ తింటారు”అన్నది తోతాపురి.

“ఏంటో నే సంవత్సరానికి ఒకసారి వస్తామా? మనల్ని పీల్చి పీల్చి పెడతారు ఈ మనుషులు”అన్నది రసాలు.

“పిందే నుండి కాయగా మారుతామా! అప్పటినుండి మొదలు లేతావకాయ అని రోజు ఉప్పు, కారం వేసి మనల్ని ముక్కలుగా తరిగి, వాటిని ఊరబెట్టుకొని రోజు వేడన్నంలో తింటారు”అన్నది మల్లిక.

“ఇంకా ముందుంది! కాయ పాకం పట్టిన తర్వాత ఇక అసలైన ఆవకాయలు మొదలు. ముక్కలు కొట్టి రకరకాల ఆవలు పెట్టుకుంటారు. వాళ్ల ముఖాలు మండ! ఒళ్లంతా మంట పుడుతుంది. ఆ కారంతో సంవత్సరం పొడుగునా ఆ జాడీలల్లో మనల్ని మగ్గబెడతారు”అన్నది నూజివీడు.

“ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్లీ కాయలు మిగిలాయని, తొక్క తీసి ఉప్పు కారం చల్లి, ఎండలో పెట్టుకుని సంవత్సరమంతా తింటారు”అన్నది రసాలు.

“ఇవన్నీ అయిపోయాక అసలు ముచ్చట ఉంటుంది. మనల్ని తీసుకెళ్లి ఓ రూమ్ లో పడేసి, ఆకులు కప్పేసి తలుపులు గట్టిగా బిగించి పెట్టేసి, మగ్గబెడతారు .అసలు ఊపిరాడుతుందా”అన్నది ఆల్ఫాంజా.

“నాలుగు రోజుల తర్వాత తలుపులు తీసి, మెత్తబడ్డ మనలని గొర గోరా తీసుకొని వచ్చి ,నీళ్లలో పడేస్తారు” అన్నది దశేరి.

“ఆ తరువాత చక్కగా వేడి అన్నం కంచాలలో వడ్డించుకుని, మనతోనే పెట్టుకున్న ఆవకాయను వేసుకొని, మనల్ని పిండి తింటారు. లొట్టలేసుకుని వాళ్లు తింటుంటే నాకైతే చిరాకు వస్తుంది” అన్నది కేసరి.

“అదంతా సరే ఎన్ని పండ్లను తిన్నా వీళ్ళకు అగడు తీరదా? వత్తి వత్తి రసమంతా పీల్చేస్తారు కదా? అయినా వాళ్లకు తనివి తీరదు. పీచును పట్టి చీకేసి ,నాకేసి గట్టిగా కొరికేస్తుంటే ఒ ళ్ళంతా నొప్పులు. వీళ్ళకి ఏం పోయేకాలం ?అన్ని పండ్లు తిన్న కడుపునిండదా “అన్నది సువర్ణ రేఖ.

“నన్నయితే వాళ్ళ పిల్లలు బయట అరుగు మీద కూర్చొని, నా లోపల ఉన్న పీచుని అసలు నేనేనా అనిపించేంత ఘోరంగా మార్చివేశారు .తెల్లగా అయిపోయింది. జుట్టంతా పోయింది. ఇంకా నాకుతూనే ఉన్నారు. పిల్లలా పిశాచాలా?”అన్నది నీలం.

ఇలా పండ్లన్ని వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉన్నాయి.

“మరి మనమంతా ఏం చేద్దాం? మన బాధకు విముక్తి లేదా?”అని బాధ పడ్డాయి.

అందులో నుండి ఒక మామిడికాయ చెప్పింది “మనం బ్రహ్మ దగ్గరికి వెళదామా? మన సమస్యకు పరిష్కారం అడుగుదాము. అందర్నీ పుట్టించింది ఆయననే కదా?” అన్నది.

“వద్దు, వద్దు పోయినసారి మన చాయ గిన్నె ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అటు ఉంచు ,మళ్ళీ ఆ గిన్నెలో చాయ్ పెట్టమని అడిగాడు.( నా కథ చాయ్ గిన్నె లో )”అన్నది మరో మామిడి.

“పోనీ ఈసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము”అని అన్ని అనుకొని మామిళ్ళన్ని కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయి.

హాయిగా పాలసముద్రంలో శేష శాయి పై పడుకొని లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంటే, కళ్ళు మూసుకొని ఇళయరాజా గారి పాటలు వింటున్నాడు. మామిళ్ళు మెల్లగా వైకుంఠపురం చేరుకునేసరికి మామిడిపండ్ల వాసన స్వామికి విపరీతంగా వచ్చింది.

“లక్ష్మి! చక్కని మామిడి పండ్ల వాసన వస్తున్నది .ఎక్కడ నుండి?”అన్నాడు కళ్ళు తెరిచి.

“ఏమో స్వామి నాకు కూడా వచ్చుచున్నది”అన్నది లక్ష్మి పాదాలు వత్తడం మానేసి.

ఇంతలో మామిళ్లన్ని కట్ట కట్టుకొని విష్ణుమూర్తి చెంతకు చేరాయి.

అన్ని మామిళ్ళను ఒక్కసారి చూడగానే విపరీతమైన ఆశ్చర్యం వేసింది విష్ణుమూర్తికి. లక్ష్మీదేవి కూడా అపురూపంగా చూడ సాగింది.

“ఏంటి ఇలా వచ్చారు”అని స్వామి అడిగాడు.

“ఏం చేయమంటారు స్వామి !మా కష్టాలు ఎలా చెప్పమంటారు? సంవత్సరానికి ఒకసారి కాస్తామా? మమ్మల్ని ఈ మనుషులు పీక్కొని తింటున్నారు. రకరకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. ప్రతి వంటలో వాడుతున్నారు .పప్పని, ఉప్పని ఇలా అన్నింట్లోనూ మమ్మల్ని వేసేస్తున్నారు. అదీ గాక సంవత్సరం పొడవున నిలువ కూడా ఉంచుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మా సమస్య తీర్చండి స్వామి”అంటూ మామిడిలన్నీ మొరపెట్టుకున్నాయి.

“ఆహా కమ్మటి సువాసన వస్తుంది”అంటూ లక్ష్మీదేవి వైపు తిరిగాడు.

“వాళ్ళు ఏదో చెప్తున్నారు. నాకైతే ఏమీ వినపడటం లేదు. నువ్వు వెళ్లి ఒక డజన్ పూరీలు చెయ్యి. అందులోకి ఈ మామిడి పండ్లను రసం చేసి పెట్టు. నేను రాత్రికి మామిడిపండ్ల రసం నంచుకుంటూ పూరీలను తింటాను. ఇంతకు వాళ్ళు వచ్చిన పని ఏంటో అడుగు. నాకు నిద్ర వస్తుంది “అంటూ కళ్ళు మూసుకొని పడుకున్నారు.

లక్ష్మీదేవి మెల్లగా లేచి..

“స్వామి ఏమంటున్నారో విన్నారు కదా! స్వామికి రాత్రి నైవేద్యం మీతోనే రండి మరి” అని దగ్గరికి రాసాగింది.

అంతే! మామిడిలన్నీ కట్టకట్టుకొని ,మనకి ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. పదండి మన కర్మ ఇంతే !మానవులకు పంటికింద ఆహారమై ఉండవలసిందే. ఇప్పుడు స్వామి కూడా మనల్ని ఆరగిస్తే,మన జాతులు మళ్లీ చిగురించవేమో! పదండి పోదాం”అంటూ పరిగెత్తి భూలోకం కి వెళ్ళిపోయాయి.

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాధ గాధ

by Mrudula July 29, 2025
written by Mrudula

కాసులు కాదు
ఆమె దోసిలికి చేరింది
కడుపు నింపుకోవడానికి
అశ్రువులు చేరాయి
కడుపు నిండకుండానే

కానీ
రోజూ ఎక్కడో
కాసులు రాలుతూనే ఉంటాయి
వద్దనుకుంటే పండిన
కడుపును తీయించి
అడ్రస్ లేని కుండగానే
ఉంచేందుకు

రేపు
మళ్లీ ఎక్కడో
అశ్రువులు రాలుతూనే ఉంటాయి
కావాలనుకున్నా పండని
కడుపును సరోగసీతో
అడ్రస్ ఉన్న కుండగానే
ఉంచేందుకు

ఒకరిది
ఆకలి మండే బాధ ఐతే
మరొకరిది
పరువు పోయిన బాధ
వేరొకరిది
పరువు నింపుకునే బాధ
బాధ మాత్రం షరామామూలే
తరాలుగా…………….

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

విగత జీవులు

by Radhika Suri July 29, 2025
written by Radhika Suri

చంటి బిడ్డను లాలించాలనో! అర్ధాంగితో ఆంతరంగిక చర్చలకనో! సేదతీర్చిన జన్మభూమి సంగతులన్నీ గుదిగుచ్చి
ఐనవారితో పంచుకోవాలనో !

మనసుకు రెక్కలు కట్టి
ఊసులన్నీ మూటగట్టుకుని
ఒంటరిగానో జంటగానో పయనమైనవారే అందరూ!

ఆతిథ్యానికి సరైన చిరునామాలా చెరగని దరహాసంతో చక్కని పలకరింపుల గగన సేవికలు
వడివడి అడుగులతో తొణకిసలాడుతున్న ఆత్మవిశ్వాసంతో అభివాదం చేస్తూ సాగుతున్న మెరికల్లాంటి
యువకులు
విమానమెక్కిన వారందరి
ఆరాటం ఒక్కటే … గమ్యం
ఇంకెన్ని యోజనాలోనని!

అందని చందమామను
ఒడిసి పట్టిన ఆత్మవిశ్వాసం కొందరిది
భూతలస్వర్గాన్ని అందుకున్న
ఆనందం ఇంకొందరిది కానీ…

వారికేం తెలుసు కొన్ని
ఘడియల్లో తమకు నూకలు చెల్లబోతున్నాయని…

ప్రయాణంలో మొదలైన అపశృతులతో
కల్లోలపు కడలిలా మనసులో రేగే సుడిగుండాల ఘోష!

జీవితం క్షణ భంగురమని తెలుసుకున్న తరుణంలో
తల్లడిల్లే మనసుల అర్తనాదాలు వినువీధిలో హోరెత్తిస్తుంటే

సుశిక్షితులైన చోదకులైనా…
విషయం భూతద్దంలో భయపెడుతుంటే
ఉద్యోగ ధర్మానికి కట్టుబడి బాధ్యతలకు తలవంచి
ప్రాణాలను ఫణంగా పెట్టిన
నిస్వార్థ సేవకులు
పెనవేసుకున్న ప్రేమపాశం
కళ్ళ ముందు మెదిలినా
అందరి కోసం అసువులుబాసిన త్యాగధనులు

కాలిన బూడిద కుప్పలు కావవి
హృదయాంతరాళపు
మరణమృదంగ హేలలు!
కర్ణుడి చావుకు వేయికారణాలట మరి ఈ మారణహోమానికి బాధ్యులెవరు
ఎదిగిన టెక్నాలజీనా?
మానవ తప్పిదమా ?

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రైతు – కవయిత్రి

by Y. Sujatha July 29, 2025
written by Y. Sujatha

నాగలి పట్టుకొని రైత న్న నీవు
పొలం దున్నడానికి
సన్నద్ధమైనట్లు.. నేను
కలం పట్టుకొని కవయిత్రినై
కవిత్వం రాయడానికి
ఉపక్రమిస్తా నన్న !

బీడు బారిపోయిన భూమిని
జీవమిచ్చే మట్టిగా
రైత న్న నీవు మార్చినట్లు
గడ్డకట్టుకొని పోయిన భావాన్ని
ప్రవహించే జీవనదిలా నేను
మలుస్తా నన్న !

దమ్ముపట్టి రైత న్న నీవు
విత్తనానికి ప్రాణమిచ్చినట్లు
కలాన్ని సానబట్టి నేను
అక్షరాన్ని మొలిపిస్తా నన్న !

నీరుపోసి రైత న్న నీవు
పైరుని పెంచినట్లు
భాషను కూర్చి నేను
కవితను పేరుస్తా నన్న !

పంట చేతికొచ్చి రైత న్న నీవు
నూర్పులు చేసినట్లు
కవిత పూర్తవడానికి నేను
మార్పులు చేస్తుంటా నన్న !

గాలి పట్టి రైత న్న నీవు
గింజలు కుప్ప పోసినట్లు
ఒడిసి పట్టి నేను
పదాలు ఒద్దిక చేస్తా నన్నా !

పంట ఫలాలు అందరికీ చేరాలని
రైత న్న.. నీవుఆశించినట్లు
కవిత్వఫలాలు చైతన్యం నింపాలని
కోరుకుంటా నన్న ! అందుకే
దేశ ప్రగతికి. మనిద్దరము రెండు
రథచక్రాల లాంటి వాళ్ళము..

July 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

“స హితస్య భావః సాహిత్యం”

by Aruna Dhulipala July 29, 2025
written by Aruna Dhulipala
  • తిరుమల శ్రీనివాసాచార్యులు

‘సాహితీ సుధానిధి’ బిరుదాంకితులు బహుగ్రంథకర్త, ప్రముఖకవి, రచయిత, వక్త ఆచార్య తిరుమల శ్రీనవాసాచార్యులు గారితో మయూఖ ముఖాముఖి

సహృదయతామూర్తి, స్ఫురద్రూపి, నిరంతర అధ్యయన శీలి, నిత్య సాహిత్య పిపాసితులు అయిన ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యులు గారి జీవిత వివరాలను, సాహిత్య కృషిని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్

1 ప్ర. మా మయూఖ పాఠకులకు ఈరోజు మిమ్మల్ని పరిచయం చేయడం మహదవకాశంగా భావిస్తున్నాను.
మొదటగా మీ జననం, విద్యా విశేషాలను తెలపండి.

నేను స్వస్తిశ్రీ బహుధాన్య సంవత్సరం, మాఘశుద్ధ పంచమి నాడు (జనవరి 1, 1938) సిరిసిల్ల దగ్గర ఉన్న నారాయణపురం అనే చిన్న గ్రామంలో పుట్టాను. అప్పుడు సిరిసిల్ల తాలూకాగా ఉండేది. మా అమ్మ వేంకటమ్మ, నాన్న మనోహరాచార్యులు గారు. మా ఇంటిపేరు కారంచేడి తిరుమల వాళ్ళు. కానీ నేను మొత్తం రాయకుండా తిరుమల అని రాస్తుండడంతో అదే స్థిరపడిపోయింది(నవ్వుతూ). మేము ఐదుగురం అన్నదమ్ములం. ఇప్పుడు రమణాచారి ఉన్నాడు కదా! ఆయన తండ్రి మా పెద్దన్న రాఘవాచారి గారు. రెండవ అన్న పార్థసారథి గారు, మూడవ అన్న నర్సింహాచార్యులు గారు, నాల్గవవాడిని నేను. మా తమ్ముడు వెంకటరమణ డాక్టరుగా చేసేవాడు. చనిపోయినాడు. మా ఊళ్ళో మూడవ తరగతి వరకు మాత్రమే ఉండేది. పన్నెండు సంవత్సరాల వరకే ఆలయాల్లో చదివే తిరువాయు మొళి, తిరుప్పావైలతో పాటు పద్యాలు, శ్లోకాలు ఎన్నో నేర్చుకున్నాను. మా ఊరిపక్కనే ఉన్న ఎల్లారెడ్డి పేటలో నాలుగవ తరగతి, ఆ తర్వాత సిరిసిల్లలో అయిదు, ఆరు తరగతులు చదువుకున్నా. మా అన్నయ్య మెదక్ లో టీచరుగా పనిచేస్తుండేవాడు. అక్కడ మల్టీ పర్పస్ హైస్కూల్లో ఏడవతరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఎమ్.పి.సి ఆప్షనల్ గా తీసుకోవాలనుకున్నా. కానీ కాలేజీకి తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. పేదరికం వల్ల వెళ్లలేకపోయాను. ఏదైనా ఉద్యోగం చేస్తూ చదువుకోమని, ముఖ్యంగా టీచరు ఉద్యోగం చేయుమని మా అన్న సలహా ఇచ్చాడు.

మీ అన్నయ్య గారు టీచరు జాబ్ మాత్రమే బాగుంటుందని, అదే చేయమనడానికి కారణం ఏమిటి? మీరు ఆ కారణంగానే ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారా?
అంటే… నాకు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సైన్స్ సబ్జెక్టు కాలేజీకి వెళ్లి చేయడం కుదరలేదు అన్నాను కదా! మిగతా ఉద్యోగాల్లో కాకుండా గవర్నమెంట్ టీచరుగా వెళితే వాళ్లే చదువు కొరకు పర్మిషన్ ఇస్తారు కాబట్టి నాకు చదువు మీద ఉన్న ఆసక్తితో అన్నయ్య ఆ సూచన చేశారు. నేను కూడా ఇష్టంతోనే ఆ వృత్తిలోకి వెళ్ళాను. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం ఏ విధంగా సంపాదించారు?

ముందుగా ఒక ప్రయివేట్ స్కూల్లో చేరాను. వాలీబాల్ ఆడడం నా హాబీ. నేను గ్రౌండ్ లో ఆడుతుంటే ఐ.జి.దేవేందర్ అని ఎమ్. ఏ. ఇంగ్లీష్ . ఆయనతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. వెంకటాపురంలో ఉద్యోగం ఉందని చెప్పాడు. కానీ అది కల్వకుర్తి దగ్గర ఉన్న
వెంకటాపురం. నేను వెళ్ళలేదు. రెండు మూడు నెలలు దేవేందర్ దగ్గర ఉన్నాను. వెంకటాపురం వాళ్ళు “మాకు టీచరును అపాయింట్ చేసినా ఇంతవరకు రాలేద”ని కంప్లయింట్ ఇచ్చారు. బిడిఓ సీతారాం దేవేందర్ కు నోటీస్ పంపాడు. దాంతో వెంకటాపురం స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటికక్కడ ఒక భార్యాభర్తల జంట ప్రయివేటుగా ఆ పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నేను వెళ్ళగానే వాళ్ళు వెళ్లిపోయారు. అక్కడినుండి చిన్న శంకరంపేట దగ్గర సూరారం అనే ఊరుకు ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ రెండేళ్ల తరువాత చేగుంటకు వేశారు. ప్రయివేటుగా బిఏ కట్టి పాసయినాను. అప్పుడు ప్రైమరీ టీచరు నుండి హై స్కూల్ టీచరుగా ప్రమోట్ చేస్తూ రామాయంపేటకు ట్రాన్స్ ఫర్ చేశారు. రామాయంపేటలో ఎమ్.ఏ. తెలుగుకు కట్టాను.

సైన్స్ గ్రూపులో వెళ్లాలనుకున్న మీకు ఎమ్.ఏ. తెలుగు వైపు దృష్టి ఎందుకు మళ్లింది? అటు తరువాత ఉద్యోగ ప్రస్థానం ఎట్లా కొనసాగింది?
ఎంపిసి లో లెక్కలు, ప్రయోగాలు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ లేకుండా ఉండాలంటే బిఏ చేయాలన్నారు. ముందు చెప్పాను కదా! నేను పద్యాలు, శ్లోకాలు నేర్చుకున్నానని. తెలుగంటే ముందు నుండీ ఇష్టం ఉండేది. అందువల్ల మోడల్ లాంగ్వేజెస్ బేసిస్ మీద ఎమ్.ఏ. చేయాలనుకున్నా. ఈ లోపు దుబ్బాకకు ట్రాన్స్ ఫర్ అయింది. అక్కడే ఎమ్.ఏ పూర్తి చేసి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఆ తర్వాత కాలేజీ సర్వీసుకు వెళ్ళమన్నారు. ఆరేండ్ల సర్వీసుకు రాజీనామా పెట్టేశాను. ఖమ్మంలో ఫ్రెష్ గా ఈవెనింగ్ కాలేజీలో చేరాను. అక్కడ రెండేళ్లు ఉన్నాను. శ్రీకాకుళం బదిలీ చేశారు. అప్పటికి తెలంగాణా ఉద్యమం నడుస్తున్నది(1969). ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఆంధ్రాకు ఎందుకు బదిలీ చేస్తున్నారని అడగడానికి నా బిడ్డను ఎత్తుకొని వాళ్ళ దగ్గరకు పోయిన. అప్పుడు డైరెక్టర్ గా ప్రతాపరెడ్డి గారున్నారు. “ఈ పిల్ల తోటి ఎట్ల వోత సార్ అంతదూరం?” అని అడిగాను (పెద్దగా నవ్వుతో). ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకొని సరేనని సిద్దిపేటకు బదిలీ చేశారు. అక్కడ మళ్ళీ రెండేళ్లు. అదే సమయంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ (OGA) వాళ్ళు సికింద్రాబాద్ పద్మానగర్ లో సర్దార్ పటేల్ కాలేజ్, వరంగల్ లో లాల్ బహదూర్ కాలేజీలు రెండు పెట్టారు. నేను ఇంటర్వ్యూకు వెళ్ళాను. “గవర్నమెంట్ కాలేజీ వదిలి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు?” అని అడిగారు. నా భార్య ఇక్కడే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో డెమోన్ స్ట్రేటర్ గా పనిచేస్తున్నదని అందువల్ల రావాల్సి వస్తున్నదని చెప్పాను. వెంటనే జాయిన్ చేసుకున్నారు. అక్కడనే 1995 రిటైర్మెంట్ వరకు చేశాను. ఆ తరువాత కూడా టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి రికమెండ్ చేయడం వల్ల దిల్ సుఖ్ నగర్ అనిబిసెంట్ కాలేజీలో ఒక సంవత్సరం ప్రిన్సిపాల్ గా చేశాను.

ఇటువంటి భిన్న పరిస్థితుల్లో సాహిత్యం వైపు ఎట్లా దృష్టి సారించారు? లలితగీతాలపై ‘గంగాతరంగాలు’ రాయడంలో మీకు కలిగిన ఆసక్తి ఎటువంటిది?

నాకు మొదటినుండీ రాయడం, చదవడం ఇష్టం ఉండేది. పాటలు రాయాలని ఉత్సాహంగా ఉండేది. మాకు దగ్గరలో తిరుమల అనే కొండ ఉండేది. ప్రతిదినం
అక్కడికి వెళ్లి పాట రాసుకునేవాణ్ణి. అట్లా ‘గంగాతరంగాలు’ అని పాటలు రాసుకున్నాను. కరీంనగర్ లో పని చేసినప్పుడు గరేపల్లి సత్యనారాయణ అని నన్ను ఏదైనా రాయుమని ప్రోత్సహించేవాడు. దాంతో ‘ఉదయరాగం’ పుస్తకం రాశాను. అది చూసి ధోరణి బాగుందని మెచ్చుకున్నాడు. సిద్దిపేటకు వచ్చిన తరువాత గొప్పకవి వేముగంటి నరసింహాచార్యులు గారితో ఏర్పడిన స్నేహం వలన ఇద్దరం కలిసి చెరి పది కవితలు వేసి ‘జీవనస్వరాలు’ అని సంయుక్త రచన చేశాము. అదే వరుసలో కిరణాలు-కెరటాలు, కావ్య పుష్కరిణి, ప్రపంచ విపంచి ఇట్లా కావ్యాలు రాశాను.
“మన మనస్సు, మంచుకొండలా నిలవాలి
మన తలపులు, గంగానదిలా పారాలి
ప్రతి గుడిసె గోపురమ్ములా లేవాలి
ప్రతిపల్లె సురపురమ్ముగా మారాలి” ఇట్లా ఎన్నో అంశాలతో ‘గంగాతరంగాలు’ సాగుతుంది

పరిశోధనకు కావల్సిన విషయ సమీకరణ, నిశిత విశ్లేషణ, సమృద్ధిగా ఉన్నాయ”ని సినారె గారితో ప్రశంసలు పొందిన మీ సిద్ధాంతగ్రంథం “తెలుగులో గేయ నాటికలు” లో అంశాలలోని వైవిధ్యాలను ఎట్లా చూపించారు?

డా. సి.నారాయణరెడ్డి గారి మార్గదర్శకత్వంలో నేను “తెలుగులో గేయ నాటికలు” అనే అంశంపై పిహెచ్ డి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించాను. తెలుగు సాహిత్యంలో ప్రాచీన ప్రక్రియ గేయ నాటికలు. ఇవి పాశ్చాత్య ప్రభావంతో వచ్చినవే అయినా ప్రాచ్య మూలాలు ఉన్నాయని నిరూపించాను. దేశి, మార్గ, ఆధునిక మూడు విభాగాల్లో వీటిని అధ్యయనం చేశాను. ఛందో దృష్టితోను, వస్తు దృష్టితో విభజించాను. అందులోనూ పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సాంస్కృతిక, అనుసరణాత్మక, ప్రకృతి సంబంధ, ప్రతీకాత్మ, ప్రబోధాత్మక, బాల సంబంధ, చలన చిత్ర రంగ సంబంధాలుగా అంశాలను తీసుకున్నాను. ప్రతీ వర్గంలో పద్య గేయ వచన మిశ్ర నాటికలు, పద్య గేయ నాటికలు, గేయ నాటికలుగా ఉప వర్గీకరణ చేశాను.
వాటిలో గ్రాంథిక వ్యావహారిక భాషా ప్రయోగాలే కాక అన్యభాషా ప్రయోగాలు కూడా ఉన్నాయి. తెలుగులో వెలువడినటువంటి 318 గేయ నాటికల స్వభావాలను పరిశోధించి వాటిని వర్గీకరించి పదమూడు అధ్యాయాలుగా వివరించాను.  14 వ అధ్యాయంలో ‘గేయనాటికల భవితవ్యం’ పేరుతో ఉపసంహారం ఉంటుంది. తమిళం, కన్నడ, మరాఠీ, హిందీ, ఉర్దూ, పాశ్చాత్య భాషలలో ఉన్నటువంటి గేయ నాటికల సమాచారాన్ని ఆయా భాషా పండితుల నుండి, విజ్ఞాన సర్వస్వాల నుండి సేకరించి ఒక అధ్యాయంగా కూర్చాను. దీన్ని సినారె గారు “ఆధునికాంధ్రలో వెలువడిన సమస్త గేయ నాటికలకు పట్టిన నిలువెత్తు అద్దం ఈ గ్రంథం” అని మెచ్చుకోవడం చాలా సంతోషం కలిగించింది.

డా. సి. నారాయణ రెడ్డి గారి ప్రభావం మీమీద చాలా ఉందని చెబుతుంటారు. ఆ వివరాలు చెప్తారా?

నాకు మొదటి నుండీ దాశరథిగారు, సినారె గారు అంటే ఎంతో అభిమానం. పద్యం విషయంలో దాశరథి గారు, గేయం విషయంలో నారాయణరెడ్డి గారి ప్రభావం నామీద చాలా ఉంది. సినారె గారు త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులు ఏవి రాసినా పాట లాగా పాడుకుంటూ రాసేవారు. అది నాకు ప్రేరణనిచ్చింది. నేను సినారె గారు రచించిన 45 పుస్తకాల మీద ఒక పుస్తకం రాశాను. అప్పుడు ‘యువ భారతి’ ప్రెసిడెంట్ గా ఇరివెంటి కృష్ణమూర్తి గారు ఉండేవారు. ఆయనతో స్నేహం ఏర్పడింది. ఆ పుస్తకాన్ని ఆయనకు చదివి వినిపిస్తే దాన్ని సంక్షిప్తం చేశారు. ఆ తరువాత అది పుస్తకంగా వెలువడింది. ఆ పుస్తకాన్ని చూసి సినారె గారు చాలా మెచ్చుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. తిరుపతిలో పద్మావతీ విశ్వవిద్యాలయం వారు సినారె గారిని ఒక పాట రాయమన్నారు. ఆయన ఆ పని నాకు అప్పగించారు. విశ్వవిద్యాలయం వారు బాగుందని మెచ్చుకొని ఖర్చులు పెట్టుకొని నన్ను తీసుకువెళ్లి తిరుపతిలో సన్మానం చేశారు. అంత నమ్మకం ఆయనకు నా మీద ఉండేది.

పాటలంటే ఎంతో ఇష్టపడే మీరు, సినారె గారి పట్ల అత్యంత ఆదరణ కలిగిన మీరు సినిమాలకు పాటలు రాయాలని ఎప్పుడైనా అనుకున్నారా?

(నవ్వుతూనే)….అనుకున్నాను. కానీ కుదరలేదు. పాటలు రాసి కె.విశ్వనాథ్ కు అంకితం కూడా ఇచ్చాను. వాటిని చూసి ఏమైనా అవకాశం ఇస్తాడేమో అనుకున్నా. ‘గంగాతరంగాలు’ పాటలను ఏదైనా సినిమాలోకి తీసుకుంటాడనుకున్నా. అదీ చేయలేదు. అందువల్ల సినిమాల మీద ధ్యాస వదిలేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వాడిని కావడం వలన ఇవ్వలేదని అర్థమైంది. కానీ ‘గంగాతరంగాలు’ క్యాసెట్ గా వచ్చింది. గోపీరాధ సంగీతంలో 1995 లో వెలువడింది. ఎమ్.కె రాము అని ఏవైనా సభలు జరిగినప్పుడు ఆ క్యాసెట్ తీసుకువచ్చి పాటలు వేసేవాడు.

మీ రచనల్లో ఎక్కువ భాగం ‘రుబాయీలు’ చోటు చేసుకోవడానికి కారణం ఏమిటి? ఇందులో మీరు ఎంచుకున్న వస్తు వైవిధ్యం ఎటువంటిది?

రుబాయీలు, గజళ్ళ ప్రక్రియలను తెలుగులోకి తీసుకు వచ్చినవారు దాశరథి గారు. ఆ కాలంలో ఉర్దూ, ఇంగ్లీష్ చదువుకున్నవాడు. స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కవిసమ్మేళనం పెట్టేవారు. అక్కడ రుబాయీలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నేను ఎటువంటి లక్షణాలను పాటించకుండానే వారు చెప్పిన ధోరణిని పట్టుకొని రాసి సినారె గారికి చూపించాను. అప్పుడాయన దానికి ఉండే లక్షణాలను చెప్పారు. రుబాయీల్లో నాలుగు పాదాలుంటాయి. ఒకటి, రెండు, నాలుగు పాదాలు అంత్యప్రాసలతో ఉండాలి. మూడవ పాదానికి కవి స్వతంత్రత ఉంటుంది. ఉదాహరణకు….
“మార్పు మంచిదే కాని శిల్పం శిల కావద్దు
మార్పు గొప్పదే కాని పువ్వు మొగ్గ కావద్దు
మార్పు తప్పదెపుడైన చెయి చెంచా కావద్దు
మార్పు తోసుకుని రానీ నీతి బూతు కావద్దు”
“మహిళా మణులెవరున్నా మాతృమూర్తి గొప్ప కదా
మాన్య భూములెన్నున్నా మాతృభూమి గొప్పకదా
ఘన సంస్కృతులెన్నున్నా తన సంస్కృతి వరణీయం
మహా భాషలెన్నున్నా మాతృభాష గొప్ప కదా”
ఈ విధంగా చివర్లో చెప్పే విషయం కోసం మిగతా మూడు పాదాలను మనం నిర్మించుకోవాలి. అనేక కవిసమ్మేళనాల్లో, సభల్లో నా రుబాయీలను విని దాశరథి గారు ఎంతో ప్రశంసించేవారు. వ్యక్తిత్వ పరమైనవి, సందేశాత్మకమైనవి, హాస్యప్రధానమైనవి, ప్రాకృతికమైనవి, ప్రగతిశీలమైనవి, రాజకీయమైనవి, శృంగార సంబంధమైనవి, దేశభక్తి యుతాలు, ప్రగతిశీలాలు, ప్రకృతి ప్రబోధాలు వంటి ఎన్నో అంశాలతో రాశాను. దాశరథి గారంటే ఎంతో అభిమానం నాకు. అందుకే ఆయన వ్యక్తిత్వ, జీవిత, సాహిత్యాలను వివరిస్తూ ‘దాశరథి’ పేరుతో పుస్తకం రాశాను. కేంద్రసాహిత్య అకాడెమీ వారు 2006వ సంవత్సరంలో దీనిని ప్రచురించారు. “భారతీయ సాహిత్య నిర్మాతలు” పరంపరలో వెలువడిన పుస్తకమిది. ఎంతోమంది ప్రశంసలు పొందింది.

‘కావ్యపుష్కరిణి’ కావ్యమంతా మీలోని ప్రగతిశీల భావాలకు దర్పణంగా భాసించింది. అందులోని పద్యాలు మచ్చుకు ఏవైనా తెలపండి.

సనాతన ధర్మంతో పాటు ఆధునిక అభ్యున్నతిని నేను కోరుకుంటాను. సంప్రదాయ వాదినే కాదు, అభ్యుదయ వాదిని కూడా. అందుకే వివిధ అంశాలున్నప్పటికీ ఇందులో ప్రగతిశీల ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే దీని గురించి “ఈ సంపుటిలో వస్తువేదైనా మానవీయ దృక్పథమే ప్రఫుల్ల రూపంలో అగుపిస్తుంది” అని సినారె గారు ప్రశంసించారు.
“ప్రకృతి జీవాత్మ ఘోషయే భాష నాకు
హితము సేయుటే ఏకైక మతము నాకు
భూరి విశ్వ గోళము జన్మభూమి నాకు
జీవకోటియే ఆరాధ్య దేవి నాకు”
“సాయము సహజీవనమున
కాయము కాయమ్ము గలుపగా నభ్యుదయ
శ్రీ యింకెచటికి పోవును?
మాయలు గాయాలు లేక మనుగడ సాగున్” ఈ విధంగా ఇందులోని పద్యాలు సాగుతుంటాయి.

మీ అనుసృజనాత్మకత శైలీ నిపుణతకు ప్రతీకగా నిలిచిన ‘జాతీయ కవితా సౌరభాల’ను గురించి చెప్పండి.

ప్రతీ సంవత్సరం ఆకాశవాణి కేంద్రం వారు ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా భారతీయ భాషల్లో జాతీయ కవిసమ్మేళనాలను నిర్వహించడం మీకందరికీ తెలిసిందే. అట్లా ప్రసారం అయిన పన్నెండు కవితలను నేను తెలుగులోకి అనువదించాను. వాటిని ‘జాతీయ కవితా సౌరభాలు’ అనే పుస్తకంగా వెలువరించాను. ఇతర భాషలలోనివి అనువాదం చేయాలంటే యథాతథంగా చేస్తే అది రక్తి కట్టదు. ఒక్కోచోట కొత్త పదబంధాలను చేర్చాలి. కొన్నిసార్లు భావానికనుగుణమైన అదనపు పంక్తి చేర్చాలి. అంతేకాదు తెలుగు నుడికారపు సొంపు అందులో ప్రతిఫలించాలి. ప్రాసలు, సమాసాలు, అలంకారాలు ఇవన్నీ ఇందులో ప్రాధాన్యం వహించేవే. కొన్నిచోట్ల ఇతర భాషలోని కవిత ఏ ప్రక్రియా రూపంలో ఉంటే అట్లాగే తెనిగించాను. ఉదాహరణకు గుజరాతీ లోని ఒక గజల్ ను గజల్ గానే అనువదించాను. ఛందోసంబంధమైన లక్షణంతో అప్పుడే దాని సౌందర్యం ఇనుమడిస్తుంది. మూల భాషాకవి హృదయానుగుణంగా ఆంధ్రీకరణ చేశాను. దానితో పాటు తెలుగు అనువాదం రమ్యంగా, సహృదయ గమ్యంగా ఉండడానికి యథాశక్తి ప్రయత్నించాను.

భాస్కర శతకానికి మీరు రచించిన వ్యాఖ్య ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఆ నేపథ్యం ఏమిటి?

“శ్రీ పావని సేవాసమితి” వారు తెలుగులో ప్రసిద్ధి చెందిన శతకాలకు పండితులచేత వ్యాఖ్యలు రాయించి ప్రచురించారు. అందులో భాగంగా నన్ను భాస్కర శతకానికి వ్యాఖ్య రాయమన్నారు. ‘భాస్కర శతకము- సుదర్శన వ్యాఖ్య’ పేరుతో చేశాను. ఇందులో భాస్కర శతక కర్త గురించి, ఆ శతక ప్రత్యేకతను గురించి విపులంగా వివరించాను. రెండు చోట్ల ఔచిత్యాన్ని అనుసరించి సవరణలు చేశాను. పద్యం, దాని అర్థ తాత్పర్యాలు, పదాలకున్న విశేష అర్థాలు, ఆ పదప్రయోగంలోని పరమార్థాన్ని వివరించాను. సందర్భాన్ని బట్టి పౌరాణిక కథలను, కొన్ని న్యాయాలను, కొన్ని సామెతలను తెలిపాను. పూర్వకవుల నీతి పద్యాలను, శ్లోకాలను ఉదాహరణగా చూపాను. ఈ శతకంలోని పద్యాలకు దాదాపు 500 కు పైగా శ్లోకాలను ఉదాహరించాను.

వానమామలై వరదాచార్యుల గారి జీవితాన్ని గురించి పుస్తకం రాయడమే కాకుండా ఆయన శతక పద్యాలకు వ్యాఖ్య కూడా రాశారు కదా? ఆయనకు మీకు ఉన్న అనుబంధం ఎటువంటిది?

వానమామలై వరదాచార్యులు గారు అద్భుతంగా ‘పోతన చరిత్రము’ రాశారు. ‘అభినవ పోతన’గా బిరుదు గడించారు. ఆ పుస్తకం బాగా చదివాను. ఆయన గురించి వ్యాసాలు రాశాను. బాగా రాశావని ఆయన మెచ్చుకున్నారు కూడా. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కు నేను వెళ్ళే వాడిని. నేను రాసిన వ్యాసాలు చూపించేవాణ్ణి. ఏమైనా తప్పులుంటే చర్చించి సరిదిద్దేవారు. ఆయనకు చూపించిన తరువాతే అచ్చు వేసుకునే వాడిని. అట్లా ఆయనతో అనుబంధం ఏర్పడింది. ఆయన మహోన్నత వ్యక్తి. ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని వివరిస్తూ పుస్తకం రాశాను. అట్లాగే ఆయన రచించిన గ్రంథాలలోని కొన్ని ముఖ్య పద్యాలను తీసుకొని ఆయన శత జయంత్యుత్సవ సందర్భంగా ‘వానమామలై శతపద్య పారిజాతాలు పరిమళ వ్యాఖ్య’ పేరుతో భాస్కర శతకానికి రాసినట్టు పుస్తకం రాశాను. దానిని అభినవ పోతన శతజయంత్యుత్సవ సమితి ప్రచురించింది.

నటనా రంగం పట్ల ఆసక్తి ఎట్లా కలిగింది? అందులో కూడా అనుభవజ్ఞులైన మీరు ఏ ఏ పాత్రలను ధరించేవారు?

దివాకర్ల వేంకటావధాని గారి అవధానాలు ఎన్నో విన్నాను. యువభారతి పక్షాన నన్నయ్య, తిక్కన, ఎఱ్ఱన, దాక్షిణాత్యయుగం, ప్రబంధాలకు సంబంధించిన ఉపన్యాసాలు చేసేవారాయన. యువభారతి వారు లహరి ఉపన్యాసాల పరంపర అని నడిపించేవారు. దానికి నేను ఒక్కోసారి ప్రస్తావన రాసి చదివేవాడిని. కొన్నిసార్లు ఉపసంహారం చదివేవాడిని. అట్లా నాకు దివాకర్ల వేంకటావధాని గారి ప్రభావం పడింది. ఆయన నిలబడి కదలకుండా రెండు మూడు గంటలు ఉపన్యాసాలు చెప్పేవాడు. అది దైవశక్తి అనుకోవాలి. ఆయన అవధానాల్లో కూడా పృచ్ఛకునిగా పాల్గొన్నాను. ఆయన ఇంటికి కూడా వెళ్ళేవాడిని. ఉస్మానియా విశ్వవిద్యాలయం తరఫున భారతం ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి నేతృత్వంలో తిరిగి ప్రింట్ చేస్తున్నారు. దివాకర్ల వారు నన్ను ప్రూఫులు చూడమన్నారు. ప్రతిరోజూ ఆయన ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు కూర్చొని చూసేవాణ్ణి. ఆ తరువాత విశ్వ విద్యాలయం వాళ్ళు దాన్ని ప్రచురించారు. అటువంటి సమయంలో వేంకటావధాని గారు వాళ్ళు ‘భువన విజయం’ నాటకం వేస్తుండేవారు. నన్ను ఒకసారి పద్యం చదువుమని అడిగారు. రాగయుక్తంగా చదవడంతో నాటకానికి సరిపోతుందని అన్నారు. అట్లా మాదయగారి మల్లన, పింగళి సూరన, మొదలైన పాత్రలు ఇచ్చేవారు. పింగళి సత్యనారాయణ అని ఆయన సూరన పాత్రలు వేసేవాడు. మంచి గొంతు ఉండేది ఆయనకు. ఆయన తరువాత ఆ పాత్రను నేను వేశాను. గుంటూరు శేషేంద్రశర్మ గారు ఉన్నన్నాళ్ళు శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఆయనే వేసేవారు. అయ్యదేవర పురుషోత్తమ రావు గారు కూడా ఉండేవారు. అవధాని గారు లేనప్పుడు అల్లసాని పెద్దన పాత్ర నాకే ఇచ్చారు.

మీ సతీమణి స్వరాజ్యలక్ష్మి గారి పేరు మీద ఇచ్చే పురస్కారాన్ని గురించి చెప్పండి.

అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు గొప్ప సంస్థ. దేవులపల్లి రామానుజరావు గారి అధ్యక్షతన అనేక సమావేశాలు జరిగేవి. అందులో జరిగే కవిసమ్మేళనాల్లో నేను పాల్గొనేవాడిని. అట్లా ఆయనతో ఒక అనుబంధం ఏర్పడింది. నా ఊహకొద్దీ రాసి చదివేవాడిని. ఈ రాసే నేపథ్యంలో నా భార్య స్వరాజ్యలక్ష్మి సహకారం చాలా ఉండేది. తను కూడా ఉద్యోగిని కావడం వల్ల ఇంటిని నడిపే బాధ్యత తాను తీసుకుంటానని, నాకు వచ్చే జీతం డబ్బులతో పుస్తకాలు వేసుకోమని ప్రోత్సహించేది. ఆరుద్ర, శ్రీశ్రీ మొదలైన ప్రముఖ కవులు, రచయితల పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని. నేను ఇన్ని పుస్తకాలు రాయడానికి కారణం ఆమె సహకారమే. అందువల్ల ఆమె మరణానంతరం ఆమె పేరుమీద సాహితీసేవ చేస్తున్న ప్రముఖులకు ఒకరికి పురస్కారాన్ని ఇస్తున్నాను. అదేవిధంగా నా పేరు మీద, మా అన్న రాఘవాచార్యుల పేరు మీద కూడా పురస్కారాలు ఇస్తున్నాను.

సాహిత్య ప్రయోజనాన్ని వివరిస్తూ ఆధునిక రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.

సాహిత్యమంటే దీంట్లో అన్నీ వస్తాయి. భాష, సారస్వతం, సాహిత్యం. ఈ మూడింటిలో భాష అందరూ మాట్లాడుకునేది. మన భావాలను వెల్లడించేది. సారస్వతం కొంత కవిత్వానికి సంబంధించినది. ఇక సాహిత్యం రస భావాదులతో కూడినది. “స హితస్య భావః సాహిత్యం”. ఇందులో చెప్పదలచుకొన్న దానిని ధ్వనిమంతంగా, అన్యాపదేశంగా చెప్పాలి. చెప్పే విషయం పైకి కనబడినట్లుగా కాక లోతుగా పరిశీలించేదిగా ఉండాలి. దానికి ఊహాశక్తి చాలా అవసరం. సృజనాత్మకత అవసరం. ఆధునిక సాహిత్యంలో వచన కవిత్వం వచ్చిన తరువాత పద్యం, గేయం పడిపోయాయి. గణ చందస్సులు, మాత్రా ఛందస్సులు ఈ నిబంధనలన్నీ ఎందుకని ఇవేవీ లేని వచన కవిత్వంపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు పద్యం ఎవరైనా రాస్తే వాళ్లే చదువుకోవాలి (నవ్వుతూ). మానవుడు ఎప్పుడూ సుఖాన్ని కోరుకుంటాడు. సాహిత్యంలో అన్నీ ఆశించదగ్గ పరిణామాలే. కానీ అధ్యయనం చేయకుండా రాసే రాతల్లో భావ గాఢత లోపిస్తుంది. అందుకే ఎవ్వరైనా అధ్యయనం చేయాల్సిందే.

చాలా సంతోషం సార్. మీ సమయంలో కొంత మాకు కేటాయించి, ఇంత వివరంగా మీ జీవన, సాహిత్య విశేషాలను తెలిపినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన మీకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.

July 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆత్మవిశ్వాసానికి అక్షర గుళికలు – కథాకేళికార్డులు

by డా: అమ్మిన శ్రీనివాస రాజు July 29, 2025
written by డా: అమ్మిన శ్రీనివాస రాజు

మనిషిని సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే సమయం బాల్యం అపురూపమైన ఈ పసివయసును తీర్చిదిద్దుకునే అనేక సాధనాల్లో ఒకటి సాహిత్య పరమైన ప్రక్రియ కథ, దీనిని వినడం సులువే కానీ వ్రాయడం కష్టం చెప్పటం మరీ కష్టం, కానీ పూర్వం మన మౌఖిక సాహిత్యం లోని బాలసాహిత్య
మంతా ఆసక్తిదాయకంగా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బామ్మలు , నోటి వెంట అలవోకగా వెలువడి నాటితరం బాల్యాన్ని అందంగా తీర్చిదిద్దింది.
నేటి ఆధునిక కాలంలో బాలసాహిత్యపు కొమ్మగా ఎదిగిన వ్యక్తిత్వ వికాసం అనే ఈ సాధనం నేడు అన్ని వయసుల వారికి అత్యవసరమైంది, కారణం గతంలో ఇది పాఠ్యాంశాల గతంగా ఉండి విద్యార్థులకు పాఠ్యాంశాల యుతంగా అందేది, నేడున్న యాంత్రిక, మార్కుల ర్యాంకుల పోటీ చదువుల్లో కేవలం సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించి మార్కులు పెంచుకునే పనిలోబడి అసలైన వ్యక్తిత్వ వికాసం లేక దానికోసం మళ్లీ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవాల్సిన బిజీ షెడ్యూల్ మనది,
అందుకనే నేడు బోధనా వృత్తితో సరి సమానంగా వ్యక్తిత్వ వికాస నిపుణుల సేవ కూడా అత్యవసరం అయిపోయింది, అందుకు అనేక పాఠ్యాంశాలు అవసరమయ్యాయి అందుకోసం అందరికీ అర్థమయ్యేలా మాత్రమే కాక అందరూ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా తయారు కావాలనే లక్ష్యంతో రూపొందించబడినవి కథాకేళికార్డులు వీటి సృష్టికర్త బాలల కథాతపస్వి చొక్కాపు వెంకటరమణ, వీరు ప్రసిద్ధ పత్రికా రచయిత, ఇంద్ర జాలికుడు, వ్యక్తిత్వ వికాసనిపుణుడు,


తను యావత్ సంసారాన్ని బాలల కోసం అర్పించిన అచ్చమైన బాలసాహితీవేత్త, 2015సం: బాల సాహిత్యంలో కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత,
మనం ముందు చెప్పుకున్నట్లు కథలు, అందునా బాలల కథలు వ్రాయడం కన్నా చెప్పడం చాలా కష్టం, కానీ కథలు చెప్పడంలోని మెళకువలు గురించి ఆసక్తి దయకంగా అనేక టెక్నిక్స్ వివరించారు చొక్కాపు వెంకటరమణ, ఇవి పుస్తక రూపంలో కాకుండా అందమైన ఆకర్షణీయంగా ఉండే పంచరంగుల బొమ్మలతో కూడిన కార్డుల రూపంలో ఉన్నాయి,
“మనిషి మనసును రాకెట్ వేగంతో స్వప్న లోకాలన్నీ తిప్పి తీసుకువచ్చే మాయాతివాచి ఈ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కు సంబంధించిన కథాకేళి కార్డులు” అని రచయిత అభివర్ణించడంలో అక్షరసత్యం ఉంది.
దీనిలో 130 కథలు చెప్పే మెళకువలు,78 కోసమెరుపు కథలు, 120 “పంచ్”దారపలుకులు, కలిసి 56 కలర్ ఫుల్ కార్డులు గా ఉన్నాయి,
రాత్రి నిద్ర పట్టని 60 ఏళ్ళ ముసలాయనకు నిద్ర రప్పించడం కోసం ఆ ఇంటి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు అతనికి నిద్ర మాత్రల వల్ల కూడా నిద్ర రావడం లేదు, చివరికి హిప్నాటిస్టు ద్వారా ఆయనకు ఎలా నిద్ర వచ్చిందో చక్కని చమక్కు గల హాస్యం కలిపి చెప్పిన కథ “పిచ్చోడు” బాల్యంలో కలాం ఆయన పిన్ని కూతురు చెట్టు ఎక్కి ఆడుకుంటున్న వేళ పెద్ద గాలి దుమారం వచ్చింది, ఆ ప్రమాదం నుంచి కలాం ఎలా బయటపడ్డాడు, పిన్ని కూతురు చెట్టు నుంచి కిందపడి కాళ్లు విరగొట్టుకున్న విషయం చెబుతూ పెద్దలు పిల్లలకు జాగ్రత్తలు చెప్పడంలో తీసుకోవలసిన శ్రద్ధ గురించి చక్కగా చెప్పారు, సైకాలజీ కథల విభాగంలో,
పని ప్రారంభించకుండానే ఫలితం ఆశించే బద్దకస్తులకు చెంపపెట్టులా ఉండే చక్కని హాస్యపు గుళిక వంటి కథ “ప్రారంభించు”, కష్టపడకుండానే గొప్పవారు అయిపోవాలని అత్యాశపరులకు కనువిప్పు కలిగిస్తూ చక్కిలి గిలి పెట్టే “వరాలు” కథ కూడా అదే విభాగంలో చేరింది,
కథల్లో క్లుప్తత, మాటల్లో చతురత, ముగింపులో మంచి నవ్వింత, కలిగి ఉండటం ఈ బుల్లి కథల్లోని ప్రత్యేకతలు,
ఆరోగ్యదాయకమైన హాస్యంతో పాటు ఆలోచింపజేసే పదాలు కలిపిన ‘పంచ్’ ధార పలుకులు, భలేగా ఉంటాయి చదివే కొద్దీ చదవాలి అనిపించే ఈ పలుకులు ఎలా ఉన్నాయో మచ్చుకు ఒకటి చదవండి,
“అద్దం చూసుకుంటే/ మనకు మనమే కనిపిస్తాం/ అర్థం చేసుకుంటే/ ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం/..” ఈ పంచ్ లో ఎంత పరమార్థం ఉందో అర్థమైంది కదా??
ఇకపోతే ఇందులో మరో ముఖ్యమైన విషయం గురించి ప్రధానంగా చెప్పుకోవాలి ఎవరిమైనా ఎవరికైనా కథ చెబుతున్న.. వ్రాస్తున్న అతి ముఖ్యమైన ఆరు సూత్రాలు పాటించాలి అంటారు రచయిత చొక్కాపు, కథలు చెప్పడానికి కమ్యూనికేషన్ అత్యవసరం అంటూ… పాటించాల్సిన ఆరు సూత్రాల గురించి గుర్తు చేస్తూ…
ఎవరు చెప్పబోతున్నారు? ఏ కథ చెప్పబోతున్నారు? ఎవరికి చెప్పబోతున్నారు? ఏ సమయంలో చెప్పబోతున్నారు? ఎక్కడ చెప్పబోతున్నారు? ఎలా చెప్పబోతున్నారు? అనే అంశాల గురించి కూలంకుషంగా చెప్పారు, ఇవి పాటించటం ద్వారా మనం చెప్తే కథాంశం ఎవరికి ఎలా చేరాలో అలా స్పష్టంగా చేరుతుంది, ఈ అంశాలు కథా రచయితలకు చాలా ఉపయోగం ఉంటాయి అలాగే ఈ కార్డుల్లో పొందుపర్చిన కథలు చెప్పడంలో వాడాల్సిన కళలతో పాటు, వాడకూడని అంశాలు కూడా పేర్కొన్నారు,
అదేవిధంగా కథ బాగా చెప్పాలంటే చేయాల్సిన పనులతో పాటు.. ఒకే కథను పెంచి చెప్పడం, తగ్గించి చెప్పడం,లోని మెళకువలు కూడా ఇందులో ఉదహరించడం చాలా ఉపయోగంగా ఉంది, అంతేకాకుండా పిల్లలకి పాఠాన్ని కథగా ఎలా చెప్పాలో ఇందులో అద్భుతంగా చెప్పారు, ఇది బోధనారంగం వారికి అత్యవసరమైన అంశం,
ఈ కథలు కేవలం పిల్లల కోసం మాత్రమే అనుకుంటే పొరపాటే?! వ్యాపార కథలు, కోర్టు కథలు, ఉపాధ్యాయుల కథలు, ఉపన్యాసకుల కథలు, పేరెంట్ కథలు, సీనియర్ సిటిజన్ కథలు, రేపటి పౌరుల కథలు, భాష విన్యాస కథలు, మూఢనమ్మకాల కథలు, మూర్ఖుల కథలు, ఉపాయం, కంగారు, లాజిక్, నిర్ణయం, విమర్శ, మొదలైన విభాగపు కథలను సరళంగా స్పష్టంగా ఆకట్టుకునే విధంగా చెప్పి.. పాత కథకులను కొత్త కథకులను ఔరా! అనిపించారు చొక్కాపు,
కథలు వినడం వల్ల కలిగే లాభాలు చెప్పడంతో పాటు వినూత్నంగా రూపకల్పన చేసిన ఈ కథాకేళికార్డులను ఎలా ఉపయోగించాలో కూడా చాలా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాశారు..
ప్రశ్నించే గుణం ఊహశక్తి సృజనాత్మకత జ్ఞానం శ్రవణ నైపుణ్యం కథలు వినడం చదవడం వల్ల వెంటనే అభివృద్ధి అవుతాయి అనే గొప్ప విషయం ఇందులో వెల్లడించారు భాష మీద పట్టు పెరగటంతో పాటు సంభాషణ చతురత పెంచుతూ స్టేజి ఫియర్ పోగొట్టి ఆత్మవిశ్వాసం పెంచడానికి అన్ని రకాల వారికి అక్షర ఔషధ గుళికలు ఈ కథకి రికార్డులు భావి పౌరులే కాదు సమాజ బాధ్యత తెలిసిన ప్రతి ఒక్కరూ వీటిని సొంతం చేసుకోవడం నేటి ఆధునిక కాలంలో అత్యవసరం అన్ని వివరాలకు రూపకర్త చొక్కాపు వెంకటరమణ సెల్:+91- 9246520050.

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

శాంతి చేకూర్చండి

by A Akshaya July 29, 2025
written by A Akshaya

శాంతికి ఆలవాలమై

ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన దేశం

నేడు అశాంతిని తరిమేయడంలో

తలమునకలవుతుంది

స్త్రీలను గౌరవించడం

మన సంప్రదాయం

కానీ స్త్రీల హత్యలను చూసి

నలుగుతుంది మా హృదయం

పుట్టుకకు కారణం తల్లిదండ్రులే కావచ్చు

పుట్టగానే చేతిలోకి తీసుకునేది మాత్రం డాక్టరే

అట్టి ఒక మహిళా డాక్టరు చావుకు కారణం ఏడుగురు

నమ్మిన వారే నమ్మకద్రోహం చేశారు

భావి డాక్టర్ జీవితాన్ని తుడిచేశారు

బలానికి ఔషధం డాక్టరే ఇస్తారు

కానీ తన బలాన్ని మొత్తం ఉపయోగించినా వదలలేదు

కాళ్లు పట్టుకున్నా కరుణించలేదు

కన్నీరు కార్చినా కనికరం చూపలేదు

భూదేవితో పోల్చిన స్త్రీని

చివరికి బూడిదలో కలిపేశారు

శిక్షలు కఠినంగా లేని చోట

విశృఖలత్వం వీరవిహారం చేస్తుంది

తప్పుచేసేదొకరు తప్పించేదొకరైనప్పుడు

పేదవాడికి న్యాయమెప్పుడూ

అందని ద్రాక్షే అవుతుంది

ఖద్దరుధారులారా బద్దకంకణులుకండి

నల్ల కోటు వీరులారా నడుంకట్టండి

ఖాకీ వీరులారా కదంతొక్కండి

న్యాయాన్ని రక్షించి,నిందితుల్ని శిక్షించి

మీ వృత్తికి న్యాయం చేయండి

మౌమిత ఆత్మకు శాంతి చేకూర్చండి

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

కవులూ, రచయితలూ మీకో సవాల్ !

by Kondapally Neeharini July 29, 2025
written by Kondapally Neeharini

– డాక్టర్ కొండపల్లి నీహారిణి,

మయూఖ ఎడిటర్ ( జూలై మయూఖ పత్రిక సంపాదకీయం) _____________

కవిత్వం రాస్తున్నారా? వ్యాసరచన చేస్తున్నారా? పుస్తకాలు ముద్రించుకుంటున్నారా? వేసుకోండి. వేసుకోవాలి. లేకుంటే ఎలా? లేకుంటే మనవైన భావనలు అక్షరాలలో తొంగి చూస్తూ వెక్కిరించవూ! పుస్తక రూపంలో కి తెచ్చుకోకుంటె, నన్ను అలా వదేలేస్తావా … పట్టించుకోవూ అని సాహిత్యం దిగాలుగా అడుగుతున్నట్టే అనిపిస్తుంది కదూ! ఈ భావనలు, ఈ ఎదురుచూపులు,ఈ ఆవేదనలు భవిష్యత్తులో కోకొల్లలు గా చరిత్ర రికార్డు చేసి పెట్టే రోజులు రానున్నవి. తస్మాత్ జాగ్రత్త! మాతృభాష తెలుగు కోసం పరితపిస్తున్న వాళ్ళ ఆరాటం వెనక ఏముంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

భాష నా భవ బంధనం
భాష నా భావ బంధురం
యాసా బాసా నా రెండు కన్నులు
నా రెండు  చేతులు రెండు కాళ్ళు!
ఒక్క గుండె కు పద గుంఫన ఫలాలు
ఒక్కో అడుగుకు నవ చేతన బలగాలు!!
ఇది కవులందరి హృదయ శ్వాస హృదయ ఘోష.  కాదంటారా?  మరెలా రాబోయే కాలంలో ” తెలుగు చచ్చిపోతుంది” అంటే వింటూ ఊరుకుందామా?
ప్రాచీన సాహిత్య చరిత్ర అంతా బాగా వంట పట్టించుకున్న పండితుల కాలం నుండి, భావ కవిత్వం అభ్యుదయ కవిత్వం అలవాటైన ఆధునిక కాలం వరకు తెలుగు భాషకు ప్రమాదం ఉంచుకొస్తుంది అన్న ఊహ కూడా ఎవ్వరూ చేయలేదు . బహుశా ఆ నాటి క్షీణ యుగంలో ఏ ఆదరణలేక బీరిపోయి పండిత కవులు భావించి ఉంటారు, ఊహించే ఉంటారు. కానీ, కవిత్వం వచన కవిత్వంగా ఉదృతంగా ప్రవహించినప్పుడు, కథలు వ్యాసాలు పరిశోధనలు పుస్తకాలుగా గ్రంథాలుగా వెల్లివిరిసినప్పుడు ఎవరూ ఊహించి ఉండరు.  పూర్వకవుల కవిత్వ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ విశ్లేషించిన కవులు ఉండేవాళ్లు. తర్వాత కాలంలో ఆధునిక సాహిత్య వికాసానికి తోడ్పడిన సాహిత్య విమర్శకులు ఉండేవారు. వాళ్లు కవిత పండితులు. వాళ్ళు చెప్పిన వాక్య సొబగులను తలకెత్తుకొని పుస్తకాలుగా విరిసిన సాహిత్యాభిలాషులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించాయి.  ఈ యజ్ఞం లో మనమందరము ఉన్నాము కాబట్టి, మనమందరము చదివాము, మనమందరము రాసాము కాబట్టి. మరి ఇప్పుడు ? గుట్టలు గుట్టలుగా పుస్తకాలు పేరుకొని పోతాయి కానీ  రేపటి రోజు ల్లో చదివే వారు ఉండరు అనే బాధ.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరనింద ఆత్మ స్తుతి  పొంగిపొర్లుతూ పక్క వాళ్ళ కవిత్వాన్ని పట్టించుకోని దుస్థితి వస్తుందని ఎవ్వరంటే ఎవ్వరు ఊహించి ఉండరు.
అరచేతిలో భూతల స్వర్గం ఇమిడిన వింతపోకడల కాలంలో కవిత్వం పలుచబడి , పోటీ తత్వం, భజన పరత్వం అలవడి, అభినందనల కోసం అవార్డుల కోసం అర్రులు చాస్తూ మేధావులను ఆలోచనలో పడేస్తున్నదీ చూస్తున్నాం. సరే ఏదో ఒకటి అక్షరాలనయితే కుమ్మరిస్తున్నారు కదా అని సరిపెట్టుకోవాలా అక్షరాలలో సత్తువ తగ్గిందని బాధపడాలా అర్థంగాని స్థితి.
కవిత్వ సంపద కొరవడితే కొరవడింది గాని భావాలయితే బాగానే ఉన్నాయి. ఏదో విధంగా తెలుగు వెలుగుతున్నదని మిన్నకుంటున్న దుస్థితి.
విరసి తెలుగు భాషకు ఏదో తెగులు పుట్టుకొస్తున్నది అని మాత్రం సమస్త జనావళికి అర్థం అయిపోతున్నది.
ఇక అర్థం కావలసిన సమస్య ఏంటంటే, ఇంతమంది కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, సినీ జగత్తులో విహరిస్తున్న పాటల తేజోవిలాసమూ, పది రోజులకో పత్రిక పుట్టుకొస్తున్న పత్రికా రంగమూ తెలుసుకోవాల్సిన విషయం సావధానంగా చర్చించుకోవాలి. ఇవన్నీ ఎక్కువ కాలం మన్నికగా నిలవాలంటే తెలుగు భాష అనేది బ్రతికి ఉండాలి కదా!
రేపు మన సాహిత్యాన్ని తలకెత్తుకునే వాళ్ళు ఎవరు? తలకెత్తుకోకుండా సరే బతికించే వాళ్ళు ఎవరు? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఇంగ్లీషులో చదువుకొని డిగ్రీలు సంపాదించి ఉద్యోగాల్లో డబ్బులు గడించొద్దని ఎవ్వరు
అనడం లేదు, కోరుకోవడం లేదు. తప్పదు కాలానుగుణంగా ఆధునిక విజ్ఞానం వెల్లి విరుస్తున్న ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక విద్యను అభ్యసించడానికి ఇంగ్లీష్ లో చదవాలి, పట్టాలు పొందాలి, పరుగులు పెట్టాలి. ఏమి వద్దనడం లేదు కానీ ఇంత కష్టమైనటువంటి చదువును చదవగల విద్యార్థులకు తనదైన మాతృభాషలో ఒక తరగతి కి ఒక తెలుగు పీరియడ్ ఉంటే చదవలేరు అనే ఆలోచన ఎందుకు వస్తున్నది? అబ్బో కష్టం తెలుగు చదివి మార్కులు తెచ్చుకోవడం అని ఎందుకు అంటున్నారు? పిల్లలు అవలీలగా చదవగలరు చిన్నప్పటినుంచి ఒక క్లాసులో ఒక సబ్జెక్టు గా తెలుగును నేర్చుకుంటే! 

ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన సాగుతూ, కేజీ నుండి పీజీ వరకు ఒక విషయం(సబ్జెక్టు) తెలుగు భాష వాళ్ళ వాళ్ళ తరగతి స్థాయిని అనుసరిస్తూ పెంచుతూ పోతుంటే తెలుగు భాష నేర్చుకుంటారు. కనుమరుగు కాదు. ఇలా భాష నేర్చుకునే వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ ప్రక్రియపై ఆసక్తి ఉంటే వాళ్ళు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి తెలుగు సాహిత్యాన్ని చదివి భవిష్యత్తులో కవులుగా, రచయితలుగా, సాహిత్య విమర్శకులుగా, పాటల రచయితలుగా ఎదుగుతారు. తెలుగు భాష బోధన లో ఉన్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉద్యోగాలు పోవు. రాబోయే కాలంలో కొత్త వాళ్లకు ఈ ఉద్యోగాలు వస్తాయి. అసలు భాష నే కనుమరుగైతే ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి?
జానపద సాహిత్యాన్ని పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన తర్వాత కదా వెలుగులోకి వచ్చింది. వాళ్లదైన సొంత తెలుగు తీయదనమంతా జనపదుల పాటల్లో కథల్లో దాగి ఉన్నది మొత్తం గుత్తంగా గ్రంథరూపంలో తెచ్చారు కాబట్టే పట్టణంలో మనకు చేరింది.ఆధునిక మాధ్యమాలైన టి.వి., సినిమా, యూట్యూబ్ లలోకి వచ్చిన తర్వాతే ప్రపంచానికి అందింది. అందుతున్నది. ఇందుకోసమైనా తెలుగు రావాలి కదా!
ఇప్పుడు అసలే అత్యంత ఆధునికమైన ఏ.  ఐ. వచ్చింది. ఈ కృత్రిమ విజ్ఞానం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ వల్ల తెలుగు బ్రతుకుతున్నది అని అనుకుందామా తెలుగును సమూలంగా నాశనం చేయడానికి ఇది ఒక కారకం అవ్వబోతుంది అని అనుకుందామా అర్థం కాని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చిన తెలుగు నైనా చదవగలిగే శక్తి మునుముందు మన పిల్లలకు ఉంటుందా  అనేదే ఒక పెద్ద ప్రశ్న!
    ఆ రోజుల్లో మనము మన తర్వాతి రెండు మూడు తరం వాళ్లమంతా ఇప్పటివరకు తెలుగు భాషలో ఇంతో అంతో పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాం కాబట్టే ఇప్పుడు రచనలు చేయగలుగుతున్నాం. ఇది ఎన్నటికీ మరవద్దు!
 తెలుగు ప్రాంతంలో ఉన్న ఒక డాక్టర్ కి పేషెంట్స్ అందరూ ఇంగ్లీష్ వాళ్లే, ఇంగ్లీష్ అర్థం అయ్యే వాళ్లే వస్తారా? చదివిన శాస్త్ర విజ్ఞానమంతా ఇంగ్లీషులోనే ఉండవచ్చు, మెడిసిన్స్ ఇవ్వవచ్చు, ఆపరేషన్స్ చేయవచ్చు కానీ రోగి బంధుమిత్రులతో , అయిన వాళ్లతో దగ్గర వాళ్లతో అనునయించి మాట్లాడడానికి వాళ్లదైన భాష తెలుగులో నాలుగు మాటలు మాట్లాడి అనునయిస్తే ఆ భయం పోతుంది ,  కొంత ఊరట చెందుతారు. ఒక లాయర్ వాదోపవాదనలు అయిపోయిన తర్వాత గెలుపు ఓటముల సందర్భంలో  తెలుగు వాళ్లతో తెలుగులో మాట్లాడితే తొందరగా అర్థం అవుతుంది,  బాగుంటుంది కదా!  ఒక పోలీసు, ఒక బ్యాంకు ఎంప్లాయ్, వ్యాపారస్తులు, విద్యావేత్తలు అందరూ ఎవ్వరైనా తెలుగు ప్రాంతంలో ఉన్నంతవరకు తెలుగులో మాట్లాడితే తెలుగు ప్రజలు  ఆనందిస్తారు. ఈ సాన్నిహిత్యానికి వారధి తెలుగు వాళ్ళకి తెలుగు భాష నే!  ఇదే విషయం సాహిత్యానికి కూడా వర్తిస్తుంది. ఇది సత్య దూరం కాదు!!
“విద్య యశస్సు ,భోగ కరి, విద్య గురుండు విదేశీ బంధుడు…” కదా! “చదవని వాడజ్ఞుండు..” కదా! మరి…”తేనె జుంటియల తెలుగు …” మన పిల్లలకు రావద్దా? రావాలి! ఎట్లా? మనోవికాసానికి చైతన్యానికి మనదైన మాతృ భాష వచ్చుండాలి కదా! మరి ఏం చేద్దాం ఎట్లా??
     ఇప్పుడు కవులకు రచయితలకు ఇది ఒక పెద్ద సవాల్ గా పరిణమించింది. మరి ఏం చేద్దాం? ఏదో కొంత కృషి చేయవలసిందే! ఏవో కొన్ని కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిందే!! ఇళ్లల్లో కొడుకు లు కూతుళ్లు తెలుగు పుస్తకాన్ని పట్టుకోవడం లేదు మనం రాసిన మన కవితల పుస్తకాలు మన రచనలు ఒక్క పేజీ కూడా చదవలేరు. ఈ దుస్థితి దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఉన్నది. ఈ సమస్యని ఎదుర్కోవాలంటే కొంత సమయం మనంది కావాలి కొంత సహనాన్ని  వెచ్చించాలి.ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఓపిక తెచ్చుకుని తెలుగును చదివే లాగా నచ్చ చెప్పాలి.  బ్రతిమిలాడి తెలుగును వినేలాగా తెలుగు చూసేలాగా ప్రయత్నించాలి.
అయితే ఇలా ఎంత చేసినా బడిలోంచి వచ్చే తెలివితేటలు వేరు! ఒక్క కొడుకునో ఒక్క కూతురునో కూర్చోపెట్టి  పాఠం చెప్పుకోలేని, తెలుగు ను నేర్పించలేని చదువును 50 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ అవలీలగా నేర్పగలరు. ఈ క్రమశిక్షణ, ఈ భయమూ బడి వాతావరణం లో ఉంటుంది. కాబట్టి, ఈ నిజాన్ని అందరూ ఒప్పుకొని పాఠశాల చదువులో తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పకుండా ఉండేలా  ఉద్యమం చేయాలని కంకణం కట్టుకొని కవులందరూ బయలుదేరాలి. పోరాటాలతో స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న రక్తం మనలో ప్రవహిస్తున్నది. మన తాత ముత్తాతల పౌరుషం మనకు తప్పకుండా స్ఫూర్తినిస్తుంది. ఇది నిజం కాదంటారా?

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us