ఎర్ర కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సంరంభంగా జరుగుతున్నాయి. ఇంట్లో సోఫాలో కాళ్ళు చాపుక్కూర్చుని టీవీలో ఆ కార్యక్రమం చూస్తున్న ప్రసాద్ “మన వాళ్ళు ఒట్టి సన్నాసులు. ఏ అంతర్జాతీయ ఆటల పోటీల్లోనైనా ఎక్కడో వెనక బెంచీల్లో తప్ప ఉండరు. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి రావల్సిన పతకాలు ఇన్నేనా? ఆ చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు డజన్లల్లో పతకాలు కొట్టుకు పోతుంటే, మన వాళ్ళు చచ్చీ చెడి ఓ కాంస్యమో, ఓ రజతమో తెచ్చుకునేసరికి కాళ్ళు లాగుతాయి” అన్నాడు ఈసడింపుగా.
“మన చదువుల్లో అసలు ఆటలకి స్థానమే లేదాయే! అదివరకు మధ్యతరగతి వాళ్ళంతా పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళల్లోనే, చదివించేవారు. అక్కడ చదువుతో పాటు కనీస ఆటలు, వ్యాయామాలు ఉండేవి. పాఠాలు లేనప్పుడు…టీచర్ రానప్పుడు గ్రౌండ్ లో కాలికొద్దీ పరుగెత్తేవారు. ఆడపిల్లలు రింగాట, ఫ్రిస్బీ ఆడేవారు. తొక్కుడు బిళ్ళలు, కుంటికాలితో ముట్టించుకునే ఆటలు ఆడేవారు. పిల్లలంతా కలిసి ఏ వాలీబాల్ లాంటివి ప్రాక్టీస్ చెయ్యటమో, ఖోఖో..చెయిన్ కట్ లాంటి ఆటలో, దాగుడు మూతలో ఆడుకునే వారు. ఒంటికి వ్యాయామం ఉండేది. గెలుపుని -ఓటమిని ఆస్వాదించటం తెలిసేది. సమూహ తత్వం (టీం స్పిరిట్) ఉండేది.”
“ఇంకా క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రత్యేక తర్ఫీదు తీసుకోవటానికి ఏ “వై ఎం సి ఏ” లకో ఇతర ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకో వెళ్ళేవారు.”
“ఇప్పుడు అందరూ పిల్లలని ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు. ఆ స్కూళ్ళు అపార్ట్ మెంటుల్లో నడుపుతున్నారు. ప్లే గ్రౌండే ఉండట్లేదు.”
“కార్పొరేట్ స్కూళ్ళ నాగరికత వచ్చాక చదువులు అంటే బందిల దొడ్లో కట్టేసే గొడ్ల చందాన నాలుగు గోడల మధ్యన బంధించి అయిన కాడికి రాత్రింబవళ్ళు రుబ్బెయ్యటమేగా” అన్నది చందన..అంతకంటే నిరసనగా.
అన్ని వేలమంది సమక్షంలో పతకాలు అందుకుంటున్న క్రీడాకారులని, వారిని అత్యంత గౌరవప్రదంగా చూస్తున్న ప్రభుత్వ పెద్దలని…ఎర్రకోటలో జండా వందనంలో దేశ ప్రధాని తో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారి అదృష్టాన్ని..ఆ అదృష్టాన్ని ప్రసాదించిన వారి క్రీడా నేపధ్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు వినీత్, తల్లిదండ్రుల మాటలు వింటూ!
***
ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న ప్రసాద్ రెణ్ణెల్లకోసారి విజయవాడ వెళ్ళి తల్లిదండ్రులని చూసొస్తూ ఉంటాడు.
అలా వస్తూ ఈ సారి కొడుకు వినీత్ ని వెంటపెట్టుకొచ్చాడు. “ఏరా తాతా చదువెలా సాగుతున్నది?” అన్నాడు మనవడిని దగ్గరకి తీసుకుంటూ తాత వెంకట్రామయ్య గారు.”
“బానే ఉంది తాతయ్యా. నాకేమో బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటలు ఇష్టం. నాన్నేమో ‘ఎప్పుడు ఆటలు ఆటలు అని టైం వేస్ట్ చేస్తే, చదువు చంక నాకిపోతుంది. ఇప్పటి నించి ఫోకస్ చెయ్యకపోతే ర్యాంక్ రాదు’ అని కేకలేస్తారు. నాన్నే కదా..నాకు ఆటల్లో ప్రత్యేక కోచింగ్ కోసం డబ్బు కట్టాల్సింది! రోజూ అక్కడికి నన్ను స్కూటర్ మీద తెలుసుకెళ్ళాల్సింది. నువ్వైనా చెప్పు తాతయ్యా” అని తాతయ్య దగ్గర దూరిపోయి ఆ అండతో ధైర్యంగా తండ్రి మీద ఆరోపణ చేశాడు వినీత్.
“చూడండి నాన్నా మీ మనవడు చెప్పిన మాట వినకుండా ఆటల పేరు చెప్పి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడు. మన బోటి వాళ్ళకి ఆటల పేరు చెప్పి చదువుని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదురా అంటే అర్ధం చేసుకోవట్లేదు. చదువు లేకపోతే రేపు అడుక్కు తినాలి. ఆటలు అనేవి ఖరీదైన విషయమనీ, బోలెడంత ఏకాగ్రత ఉండాలనీ, నిరంతర సాధన ఉండాలనీ తెలియట్లేదు వాడికి.”
“స్కూల్ కి ప్రాతినిధ్యం వహించటం దగ్గరనించీ, రాష్ట్ర ప్రతినిధిగా ఆడే స్థాయి వరకు…ఎవరో ఒకరి సహాయం అవసరం. మళ్ళీ అందులో బోలెడు రాజకీయాలు అని చెబితే అర్ధం చేసుకునే వయసులేదు. మీరైనా చెప్పండి”అన్నాడు అమ్మ చేతి కాఫీ అందుకుంటూ.
“మొన్న నాన్న టీవీ చూస్తూ… ఇంత పెద్ద దేశంలో పుట్టి మనం అంతర్జాతీయ క్రీడల్లో ఎంత వెనకపడ్డాం! సిగ్గుచేటు అన్నారు. మరి నేను ఆటలు ఆడతానంటే ఎందుకు తాతయ్యా ఇలా అంటున్నారు” అన్నాడు వినీత్
“నువ్వన్నట్టు చదువు ముఖ్యమే! దాని గురించిన నీ ఆరాటమూ నిజమేరా” అన్నాడు కొడుకు వీపు నిమురుతూ.
“కానీ ఆటలూ ముఖ్యమే. మానసిక వికాసానికి..శారీరక దారుఢ్యానికి ఆటలు ఎంతో అవసరం! అందుకే చైనా వారు మూడు నాలుగేళ్ళ వయసు నించే పిల్లలందరికీ ఆటల్లో తర్ఫీదు ఇస్తారుట. అక్కడ అది తప్పనిసరిట. అందుకే వాళ్ళు శారీరకంగా ఫిట్ గా ఉండి చురుకుగా ఉంటారు. చదువులోను, సాంకేతిక విషయాల్లోను కూడా బాగా రాణిస్తారు. విశ్వ క్రీడల్లో వారివే పతకాలన్నీను..మనం చూస్తూనే ఉన్నాంగా!”
“మన దగ్గర ఇప్పుడున్న విద్యా విధానం లో శారీరక వ్యాయామం, ఆటలు అనేదానికి అవకాశమే లేదు. చరిత్రలోకి వెళితే…. మన సనాతన భారతీయ విద్యా విధానంలో పిల్లలందరూ గురుకులవాసం చేసి చదువుకునేవారు. రొడ్డుకొట్టుడు చదువు కాకుండా… పిల్లల తెలివితేటలని బట్టి, శరీర దార్ఢ్యాన్ని బట్టి ఎవరికి ఏది హితవో గురువుగారు ఆ చదువే నేర్పేవారు.”
“మహారాజులు కూడా తమ పిల్లలని ఆ గురుకులాలకి పంపించేవారు. రాజకుమారులతో పాటు కులాలతో సంబంధం లేకుండా వారి వారి ఆసక్తులని బట్టి మిగిలిన పిల్లలు కూడా అన్ని రకాల క్రీడలు, యుద్ధ విద్యలు, సాము గరిడీలు, కర్ర సాము, సంగీతం, హస్త కళలు, సాంకేతిక విద్యలు నేర్చుకునేవారు. అసలు విద్యాభ్యాసం అంటే ఇవన్నీ కలిసిన సమాహారమే. జన్మతః బ్రాహ్మణుడై ఉండి కూడా, ద్రోణుడు రాజకుమారుడైన దృపదునితో సమానంగా తన తండ్రి నించి అలాగే కదా యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నది!”
“అనేక రకాల విదేశీ దాడులతో దెబ్బతిని మన సంప్రదాయ విద్యా విధానం భ్రష్టు పట్టిపోయింది. అది చాలనట్టు..ఇప్పుడు చదువు ఒక పాడికుండ లాంటి వ్యాపారం అయిపోయింది.”
“హోరెత్తించే వ్యాపార ప్రకటనల ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలు….మనుషులు తమ బుర్రతో తమని ఆలోచించుకోనివ్వకుండా ‘మా దగ్గర చేరితే ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ, ఒకటి నించి పదిలోపు ర్యాంకులన్నీ మావే ‘ అంటూ ఊదరకొట్టేస్తూ ఆకర్షిస్తున్నాయి. మనమూ ఆ వ్యవస్థలో చిక్కుకున్న శలభాలమే!”
“ఇక నువ్వన్నట్టు ఆటలకి కావలసిన ఆర్ధిక స్థోమతు విషయానికొస్తే…. పూర్వం రాజులే క్రీడలని, వ్యాయామాలని, కళలని, సంగీత సాహిత్యాలని పోషించేవారు. ఇప్పుడు రాజులు లేరు. కానీ ఆ బాధ్యత వహించవలసిన మన ప్రభుత్వాలు తమ బాధ్యతలు ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నారే కానీ ప్రణాళికా బద్ధంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం తమ కర్తవ్యం అనుకోవట్లేదు. విత్తనం నాటే రోజులనించి బడ్జెట్ కేటాయింపుల ద్వారా శ్రద్ధ పెడితేనే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, శాస్త్రవేత్తలు కానీ తయారవుతారు. అంత చిత్తశుద్ధి ఏది? అన్ని రాజకీయాలే!.”
“నీ చిన్నప్పుడు నీకు ఇష్టమని నాకు వీలైనప్పుడల్లా క్యారం బోర్డ్ టార్నమెంట్స్ కి తీసుకెళ్ళేవాడిని కదా! కొంచెం పెద్దయ్యాక సైకిల్ మీద నువ్వే వెళ్ళేవాడివి. మరిప్పుడు జనాభా పెరిగింది. వారి అవసరాల కొరకు వాహనాలు పెరిగాయి. రోడ్ల మీద ట్రాఫిక్ పెరిగింది. పిల్లలని ఒంటరిగా పంపలేము కాబట్టి మనమే తీసుకెళ్ళాలి. ఆటల మీద ఆసక్తి నీకున్నట్టే వాడికీ ఉన్నది. కాకపోతే ఇప్పుడు నీ చిన్నప్పటికంటే చదువుల మీద అనారోగ్యకర పోటీ పెరిగి మిమ్మల్ని సరిగా ఆలోచించనివ్వట్లేదు” అన్నారు వెంకట్రామయ్యగారు.
“సరిలే.. శేషాచలం మామయ్య రమ్మని కబురు పెట్టాడు. అలా మాట్లాడుకుంటూ వెళ్ళొద్దాం పద” అని కొడుకు భుజం మీద చెయ్యేసి బయలుదేర దీశాడు.
వెంకట్రామయ్యగారు దారిలో తన సంభాషణని కొనసాగిస్తూ “ఇప్పుడు అదివరకు లాగా ఒక ఇంట్లో నలుగురైదుగురు పిల్లలుండట్లేదు. ఉన్న ఒక్కరినో ఇద్దరినో బాగా చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగు పడతాయని శక్తికి మించి కోచింగులు ఇప్పించి చదివించాలనుకుంటున్నారే కానీ, ఆటలని ప్రోత్సహించలేకపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిల్లల చదువుల విషయంలో పోటీలు పడుతున్నార్రా మీ తరం వాళ్ళు! వాళ్ళకి ఆసక్తి లేని ఇంజనీరింగు చదువులో బలవంతానా చేర్చాలని తాపత్రయ పడుతున్నారు. పూర్వం ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లిటరేచర్, మ్యాత్స్…ఇలా అనేక కోర్సులు చదివే వారు. ఆ కోర్సులకి చదువు భారం తక్కువగా ఉండటంతో ఆటలమీద కూడా శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడు గొర్రెల మంద లాగా అందరూ ఇంజనీరింగేనాయే! కానీ, సరైన మార్కులతో పాస్ అవకపోతే ఆ చదువుకి మాత్రం మంచి ఉద్యోగాలు ఏం వస్తాయని ఆలోచించట్లేదు.”
ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా శేషాచలం గారి ఇల్లు వచ్చేసింది. బయట వరండాలో ఉన్న శేషాచలం “ఓరి ప్రసాదు..నువ్వు కూడా వచ్చావా? రండి రండి” అని ఇంట్లోకి తొంగి చూసి “ఏమోయ్ మీ వెంకట్రామయ్య అన్నయ్య వచ్చాడు. ప్రసాద్ కూడా వచ్చాడు. ముగ్గురికీ కాఫీ పట్రా” అన్నాడు.
“ఏదో పనుంది రమ్మన్నావని వీడిని కూడా తీసుకొచ్చానోయ్” అన్నారు వెంకట్రామయ్యగారు.
“ఆ:( పెద్ద విషయం ఏమీ కాదు. మా మనవడు స్విమ్మింగ్ నేర్చుకుని, జాతీయ పోటీల్లో పాల్గొంటాను అని ఒకటే గొడవ చేస్తున్నాడుట. మొన్న మా అమ్మాయి ఫోన్ చేసి మాటల్లో ఈ విషయం చెప్పి, ఈ “ఒలింపిక్ క్రీడలు” టీవీలో చూసి నేను కూడా పతకం సాధిస్తా అని పట్టుపడుతున్నాడని చెప్పింది. వాడు ఈత బాగానే కొడతాడు. కానీ మన దేశంలో క్రీడలకి ప్రభుత్వం తరఫున పెద్దగా సౌకర్యాలు కానీ, ప్రోత్సాహం కానీ లేవు కద నాన్నా!”
“మనం స్వంతంగా కష్టపడి రాణించి ఏ పతకాలో గెలుచుకొస్తే మాత్రం ఆకాశానికెత్తేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఉద్యోగాలిస్తామని, క్యాష్ ప్రైజులిస్తామని ప్రకటనలిచ్చేస్తారు. అవన్నీ నిజంగా క్రీడాకారులని ప్రోత్సహించే ఉద్దేశ్యం తో కాదు, వాళ్ళ ట్యాక్స్ బరువులు తగ్గించుకోవటానికే అనిపిస్తుంది నా మటుకు నాకు. మరీ ఒలింపిక్స్, కామన్వెల్త్, వింబుల్డన్ స్థాయి అయితే ఇస్తారేమో కానీ..మన దేశంలోనే ఏ జాతీయ స్థాయిలోనో పతకాలు గెలిస్తే ప్రకటనలకి పరిమితం కాకుండా నిజంగా ఇస్తారంటావా?” అని మా సరస్వతి తన సందేహం తను వెలిబుచ్చింది.
“పాపం వాళ్ళు నిజంగా ఆ స్థాయికి రావాలంటే ఎంత పౌష్టికాహారం తీసుకోవాలి? కుటుంబ సభ్యులు ఎంత త్యాగం చేస్తే వాళ్ళని పోషించగలరు? క్రీడల పట్ల ఆసక్తి, ఆడగల సమర్ధత..ఆర్ధిక స్థోమత ఒకదానికి ఒకటి సంబంధంలేని విషయాలు! ఆటల మీదే దృష్టి పెట్టాల్సిన క్రీడాకారులకి నికర ఆదాయ వనరులు ఉండాలి. క్రీడాకారులు సరైన గుర్తింపు, తీరైన ఉద్యోగము లేక కుటుంబ పోషణ కొరకు రోజు కూలీలకి వెళుతున్నారని మనం ఎన్నోసార్లు పేపర్లల్లో చదువుతున్నాం.”
“నిన్న పేపర్లో చదివాను..ఒలింపిక్స్ లో పతకాలు సాధించే స్థాయి అథ్లెట్స్ ని అందిస్తున్న ఆఫ్రికాలో చాలా దేశాలు ఆకలి చావులకి నిలయాలు. అక్కడ వనరులు తక్కువ. అయినా కెన్యా, జమైకా లాంటి దేశాలు ప్రపంచ స్థాయి ‘అథ్లెట్స్ ‘ని అందిస్తున్నాయి. అంటే ఆర్ధిక స్థితి గతులతో సంబంధం లేకుండా విశ్వక్రీడల్లో మనం కూడా భాగస్వాములమవ్వాలి అనే స్పృహ దేశ ప్రభుత్వాలకి తప్పనిసరిగా ఉండాలి.”
“క్రీడలపై పరిశోధనలు, క్రీడాకారులకి వసతులు కల్పించటంలో ఆస్ట్రేలియా దేశం ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉన్నదిట. అలాగే జపాన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ పతకాల పట్టికలో ప్రధమ స్థానాల్లో ఉంటున్నారు. అసలు చైనా వారయితే పిల్లలని ఐదో సంవత్సరం నించే నిర్బంధంగా క్రీడల్లో తర్ఫీదు ఇస్తారుట. వారికి ఆసక్తి ఉన్న క్రీడలో ప్రోత్సహిస్తారుట. అందుకే ఎక్కువ సంఖ్యలో పతకాలు కూడా వాళ్ళే గెలుచుకుంటారు. దక్షిణ కొరియా ప్రపంచంలో అన్ని దేశాల కంటే క్రీడల అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయిస్తుందిట. మన దేశంలో క్రీడల గురించిన కనీస అవగాహన లేకుండానే కాలేజి స్థాయి చదువులు అయిపోతున్నాయి.”
“క్రీడల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వాలకి సమగ్ర క్రీడా విధానం ఉండాలి. అప్పుడే మన మనవలు కోరుకున్నట్టు, క్రీడల్లో వారిని మనం ప్రోత్సహించగలము. వారికి కూడా భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది అని నమ్మగలము. అదే నీతో మాట్లాడదామని రమ్మన్నాను” అన్నారు శేషాచలం గారు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించి ఊపిరి తీసుకుంటూ!
“సరిపోయింది..నీ మనవడే కాదు, నా మనవడూ వాళ్ళ నాన్న తనని ఆటల్లో ప్రోత్సహించట్లేదని బిక్క మొహం వేశాడు. ఏవయినా అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగినప్పుడు జనాలు హాట్ హాట్ గా ఆ విషయం చర్చించుకుంటారు. రొటీన్ లో పడితే మళ్ళీ మన గొర్రెల మంద ఆలోచనలు మనవే! కనీసం మన మనవలు మనకంటే భిన్నంగా ఆలోచిస్తున్నారని సంతోషంగా ఉంది.”
“అవును నాన్నా..పోయిన సారి ఒలింపిక్ గేంస్ తరువాత మా కొలీగ్ వాళ్ళబ్బాయిని బలవంతంగా ఆటల్లో చేర్పించాడు. “వాడికి ఆటల పట్ల ఏ ఆసక్తి లేదు కదా, ఎందుకు చేర్చావ్” అని అడిగా! ‘ఇంజనీరింగ్ కాలేజిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది..అలా అయినా మా వాడికి సీట్ గ్యారంటీ ఉంటుందని ‘ సిగ్గులేని సమాధానం చెప్పాడు.
“అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజలు కానీ స్పోర్ట్స్ గురించి చిత్త శుద్ధితో సరైన పంధాలో ఆలోచించట్లేదు. ఉద్యోగాల్లో, కాలేజిల్లో స్పోర్ట్స్ కోటాలుంటాయని ఆలోచించే జనాలు కొందరైతే, ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిజమైన క్రీడాసక్తిని చంపేసుకుంటున్న జనాలు కొందరు!”
“వ్యక్తిగతంగా మనం ఈ మూస పద్ధతి నించి బయటపడాలి. పిల్లలకి చదువుతో పాటు క్రీడలకి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించే స్కూళ్ళల్లో చేర్చాలి. అందరూ జాతీయ చాంపియన్స్ అవుతారని కాదు. అవ్వాలని అత్యాశ కూడా పనికి రాదు. అంతమాత్రాన చదువు పేరు చెప్పి మొగ్గలోనే వారి ఆశలని, ఆసక్తిని తుంచే ప్రయత్నం చెయ్యకూడదు. కాలేజి స్థాయి వరకు క్రీడానుభవం ఉన్నవారు, పెద్దయ్యాక తాము పనిచేసే కంపెనీలో యాజమాన్యం తో సంప్రదించి ప్రతి సంవత్సరం “స్పోర్ట్స్ స్పాన్సర్షిప్” ప్రారంభింప చెయ్యచ్చు. అలా పెద్ద కంపెనీలు కొన్ని కలిసి ప్రభుత్వ పెద్దలతో విశ్వక్రీడల ప్రోత్సాహానికి కావలసిన ప్రణాళికలు తయారు చెయ్యచ్చు. లేదా తామే స్వంత కంపెనీ పెట్టే స్థాయికి వస్తే తమ సామాజిక బాధ్యతగా తమ వార్షిక ఆదాయంలో కొంత బడ్జెట్ తప్పక క్రీడలకి కేటాయించచ్చు. ఇలా అన్ని కోణాల్లోను ప్రయత్నిస్తే క్రమేణా మార్పు రావచ్చు” అన్నారు వెంకట్రామయ్య గారు.
“ముందుగా మన వినీత్ ని, శేషాచలం మామయ్య మనవడు అరుణ్ ని క్రీడల్లో చేర్పించే నిర్ణయం తీసుకుందాం. ప్రసాదు నువ్వు ఇంకొక ఖర్చు తగ్గించుకుని వాడిని కోచింగుకి పంపే పని చెయ్యి. నేను నా వంతు సహాయంగా పక్క పోర్షన్ అద్దె డబ్బు నెల నెలా నీకు పంపిస్తాను. నా పెన్షన్ నాకు, మీ అమ్మకి సరిపోతుందిలే! వాడు కాస్త నిలదొక్కుకోగలిగితే, అప్పుడు టార్నమెంట్స్ కి తయారవటానికి మీ ఫ్రెండ్స్ బృందంలో స్పాన్సరర్ల కోసం ప్రయత్నించచ్చు” అన్నారు.
అలా ఒక నిర్ణయానికి రాగలిగినందుకూ..తన కొడుకు లాగే ఇంకొకరు కూడా క్రీడల్లోకి వెళ్ళటానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసినందుకూ సంతోషించిన ప్రసాద్ గుండెల నిండా తృప్తిగా గాల్క్ పీల్చుకుని, తన ఈ ట్రిప్ విజయవంతమైనట్లు భావించాడు.
“ఇటీవల ఆసియా క్రీడల్లో భారత దేశపు క్రీడాకారులు అనేక పతకాలని గెలుచుకుని..ప్రపంచ పటంలో ఒక్క జనాభా సంఖ్యలోనే కాక క్రీడా పతకాల సంఖ్యలో కూడా మా సంఖ్య ఎక్కువే” అని నిరూపించటం..నిజంగా మంచి మార్పు అనే చెప్పుకోవాలి.
“ఇటీవల ఆసియా క్రీడల్లో భారత దేశపు క్రీడాకారులు అనేక పతకాలని గెలుచుకుని..ప్రపంచ పటంలో ఒక్క జనాభా సంఖ్యలోనే కాక క్రీడా పతకాల సంఖ్యలో కూడా మా సంఖ్య ఎక్కువే” అని నిరూపించటం..నిజంగా మంచి మార్పు అనే చెప్పుకోవాలి.
గాడాంధకారం… హోరున వీస్తున్న చలిగాలి. అప్పుడే సన్నగా ప్రారంభమైన వర్షం.
గాలి వేగానికి కొట్టుకుంటూన్న కిటికీ రెక్కల్ని మూసివేసింది రేవతి. అరగంటపైనే అయింది కరెంటుపోయి. వేసి ఉన్న లైట్ల స్విచ్ లన్నీ తీసి వేస్తూ బెడ్ రూమ్ లోకి దారి తీసిందామె.
ఊయలలోని బాబు పక్క సరిచేసి మంచంపై వాలిపోయి వెచ్చని రగ్గులో దూరిపోయి ఆనాటి దినచర్యకి…. ఆ పూట చలి బాధకీ గుడ్ బై చెప్పింది.
టక్… టక్…
తలుపు కట్టిన శబ్దం…..
నిద్రమత్తులో పట్టించుకోలేదు రేవతి. ఇంతలో వుయ్యాల్లో బాబు లేచి యేడ్పు ప్రారంభించాడు.
కళ్లు నులుముకుంటూ వెళ్లి దీపం వత్తి పెద్దది చేస్తూ వేసి వున్న బెడ్ లైట్ వేపు చూసింది. ఊహూ! కరెంటు రానేలేదింకా.
బాబుని తన పక్కమీదికి చేర్చుకుని జోకొట్టసాగింది. మళ్లీ తలుపు చప్పుడు.
సందేహం లేదు! ఎవరో ముందు గది తలుపు తడ్తున్నారు. ఈ అర్ధరాత్రి పూట ఎవరై యుంటారు?
“ఏమండీ!” పిలుస్తూ మరీ తలుపు తడుతున్నారు.
“తీయటమా? మానటమా?”
ఏదో సందేహం….
“దయచేసి తలుపు తీస్తారా? మళ్లీ వర్షం తగ్గగానే వెళ్తాను. ఈ చీకట్లో వర్షంలో వెళ్లటం చాలా కష్టంగా ఉంది. తడిసిపోయాను. తట్టుకోలేక పోతున్నాను!”
అభ్యర్థన ఆ కంఠంలో స్పష్టమౌతోంది. సందిగ్ధంలో పడిపోయింది రేవతి.
భర్త కూడా లేడు సమయానికి. వొంటరిగా చీకట్లో ఇలా అర్ధరాత్రి తలుపు తీసి అపరిచితుల్ని ఆహ్వానించటం క్షేమమేనా? ఆడమనిషిలాగే ఉంది. అయితే మాత్రం నమ్మేదెలా? దొంగలూ, నేరస్థులూ ఆడవాళ్లలో మాత్రం లేరూ? ఏమో! యే పుట్టలో ఏ పాముందో, కీడెంచి మేలెంచమన్నారు. అయినా తనకెందుకీ తనకు మాలిన ధర్మం? ఎవరెలా పోతే తనకేం?
నంగనాచిలా వచ్చి మెల్లగా యే కత్తో చూసి బెదిరించి అన్నీ లాక్కుపోతే దిక్కెవరు? పిలిచేది ఆడమనిషే అయినా వెనక యింకెవరైనా వున్నారేమో? ఇలాంటి సంఘటన గురించి ఈ మధ్యే వింది తను! ఊహూ! తలుపు తీయకూడదు, మెళ్లోని గొలుసోమారు సర్దుకుని కళ్లు మూసుకుని పడుకుంది రేవతి.
వర్షం హోరుతోపాటు కల్సిపోయి విన్పిస్తూన్న ఆ గొంతుక విన్పించనంతవరకూ గమనించిన రేవతి తేలిగ్గా నిట్టూరుస్తూ నిశ్చయంగా నిద్రాదేవి నాహ్వానించింది.
* * *
“ఏమ్మా రేవతీ! కులాసా?”
అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన భారతమ్మను చూస్తూ ఆశ్చర్యానందాల్తో అడుగు ముందుకేసింది రేవతి.
“అమ్మా! వస్తున్నట్టు ఉత్తరమైనా రాయలేదేం? స్టేషన్ కొచ్చేదాన్నిగా! ఒక్కర్తెవీ వచ్చావా? ఏ ఇబ్బందీ పడలేదుగా!” అంటూ ఆప్యాయంగా చేతిలోని బాబుని తల్లి చేతి కందించింది.
‘బాబుకి అమ్మ వెండిగిన్నెచేయించిందట. నాన్న వచ్చినప్పుడు చెప్పారు. తానొచ్చినప్పుడు తెచ్చి బాబుకి అన్న ప్రాసన వేడుక జరిపిస్తోందిట అమ్మ. చక్కని డిజైన్ తో అందంగా వుందిట ఆ గిన్నె. చూడాలని కుతూహలంగా ఉంది. కానీ తీసి చూపించదేం. యెలా అడగడం? అయినా భోజనాలూ అవీ అయ్యాక తీరిగ్గా చూపొచ్చని వుండొచ్చు’ అనుకుని పంట ప్రయత్నంలో పడిపోయిందామె.
“అమ్మా!”
తలెత్తి చూసిన భారతమ్మ యేదో అడగబోయి కూతురు సందేహించటం గమనించింది.
“ఏమ్మా ఆగిపోయావ్?”
చిర్నవ్వుతో అభిమానంగా చూస్తున్న తల్లిని చూస్తుంటే రేవతిలో సంకోచం తొలగిపోయింది.
“బాబుకి వెండిగిన్నె చేయించావటగా అమ్మా! తెచ్చావేమో చూద్దామని!”
“వెండిగిన్నె! తెచ్చానమ్మా.”
“చాలా అందంగా చక్కని లతలూ, పూలూ అవీ చెక్కించి సరికొత్త డిజైన్ లో చేయించావటగా చూడాలని ఉంది.”
ఆనందంగా అడిగేసింది ఆత్రత నణచుకోలేని రేవతి.
“అవునమ్మా! బాబు పేరిట చేయించాను. వాడికి అన్న ప్రాసన చేయించాలనుకున్నాను కానీ,”
ఆగిపోయింది భారతమ్మ.
అర్థం కాలేదు రేవతికి.
“అంటే? వెండిగిన్నెతేలేదా? మర్చిపోయావా? మరిందాక తెచ్చానన్నావుగా అమ్మా?”
కొంచం నిరాశగా ప్రశ్నించింది.
“మర్చిపోలేదు…. తెచ్చాను కానీ! రేవతీ అదిప్పుడు నా దగ్గర లేదమ్మా:”
“పోయిందా? ఎవరైనా కొట్టేశారా? అసలే రోజులు బాగాలేవు!”
రేవతి కంగారుకు సన్నగా మందహాసం చేసింది తల్లి. “వెండిగిన్నె పోగొట్టలేదు. మరెవరూ కొట్టేయలేదు. వివరంగా చెప్పాలంటే… దానికో కథలాంటి సంఘటన వుంది.”
“కధేమిటమ్మా!”
“చెబుతాను వినమ్మా।”
“నిన్న ఊర్నుండి బయల్దేరానా మీ నాన్నకేదో పనుండి రాలేకపోయారు నా వెంట. రైలు మాత్రం యెక్కించి వెళ్ళారు. మీరు ఇల్లు మారారు. కొత్త ఇల్లు నేను చూడలేదు. అడ్రస్ మాత్రం వుంది. మీ నాన్నగారన్ని గుర్తులూ చెప్పారు. ఓ వారం ఆగితే ఇద్దరం వెళ్ళొచ్చన్నారు మీ నాన్న. కానీ రేపు మంచి రోజని ఆచార్యులవారు చెప్పినందున బయల్దేరాను. అన్న ప్రాసన జరిపించొచ్చని: కానీ…. రైలు అనుకున్న టైముకన్నా మూడు గంటలు లేటయ్యింది. మార్గమధ్యంలోని మరో రైలు ప్రమాదంవల్ల దీనిక్కూడా అవరోధం కల్గింది. చీకటి పడింది. ఇక్కడి కొచ్చేసరికి వర్షం: కరెంటులేదు. ఇల్లు కనుక్కోలేకపోయాను. అదీకాక మీ కాలనీలో ఇళ్ళన్నీ ఒకేలా వున్నాయి. పొరపాటున యే సందులో కెళ్ళినా కష్టమే. ఇల్లు తెలీలేదు.
“తడిసిపోయాను చలిగాలి: పెను చీకటి. ఆ రాత్రివేళ నా అవస్థ వర్ణనాతీతం,
“అక్కడికి యే ఇల్లయితేనేం అనుకొని ఆశ్రయంకోసం ఆర్ధించాను,
“ఊహూ: చూసీ చూడనట్లు మొహం మీదే తలుపులు వేసుకున్నారు కొందరు. కొందరేమో తలుపులే తీయలేదు. ఇక ఊహించుకో తల్లీ … ఆ పరిస్థితిలో నేనేం చేయాలో.”
వింటున్న రేవతి పులిక్కిపడింది.
మళ్ళీ ప్రారంభించింది భారతమ్మ.
“ఇంక యెవర్నీ అడగాలనిపించక అలాగే రోడ్డు మీదే నడుస్తూ తడుస్తూ వెళ్ళాను. కొండ దూరం నడిచాక యింక వోపిక నశించిపోయింది. అక్కడ వో సందులో వున్న చిన్న రేకుల యింటిముందు కొంచెం స్థలంలో వొదిగి కూర్చుండి పోయాను నా ప్రారబ్దానికి చింతిస్తూ చలికి వణుకుతూ.
“అంతలోనే ఆ యింటి తలుపు తెరిచి ఓ స్త్రీ బయటకు వచ్చి చూసి నా స్థితికి యెంతో చింతిస్తూ లోపలికి తీసుకు వెళ్ళింది. వొద్దన్నా వినక కుంపటి అంటించింది. వెచ్చగా చలి కాచుకున్నానమ్మా। ఆపైన ఆ రాత్రి వంట కూడా చేసి నా ఆకలి తీర్చి అమ్మలా అన్నపూర్ణలా అందుకుంది రేవతీ. ఆ యిల్లాలు ఆ మానవతామూర్తిలో మూర్తీభవించిన మానవత నా మనసు నిండిపోయింది.
నేనెవరో తానెవరో అన్న ఆలోచనే ఆమెకు రాలేదు. నాకు రానివ్వలేదు. చాలా పేదరాల్లాపుంది. భర్తకు చెప్పుకోదగ్గ ఉద్యోగమేదీ దొరక లేదుట. ఇంట్లో స్థితిగతులలా వున్నాయిగాని ఆమెను చూస్తుంటే పేదమనిషిలా కన్పించలేదు. పెద్ద ఇళ్ళలో అడిగినా దొరకని ఆశ్రయం పెద్దమనసున్న ఆమె చిన్న యింటిలో దొరికింది అడగకనే నారు. ఆమె వెచ్చని ఆశ్రయం ఒక్క రాత్రిదే కావచ్చు. రేవతీ! కానీ నాకు మాత్రం జీవితకాలమంతా జ్ఞాపకముంటుంది”
అలా అంటున్నప్పుడు తల్లి కళ్ళలో లీలగా తడి గమనించింది రేవతి.
“చూశావా రేవతీ! రాత్రి నాకు దొరికిన ఆదరణ డబ్బుతో కొన్నదిగాదు. బంధుత్వాన్ని పురస్క రించుకున్న దిగాను. మనిషికి సాటి మనిషి పట్ల వున్న సదవగాహనే అది।
“ఉన్నవాళ్ళంతా మనసున్నవాళ్ళేకారు. లేని వాళ్ళంతా లెక్కకు రానివాళ్ళుకారు।
“రాత్రి నాకు కల్గిన సంతృప్తికి భాషగాని, వివరణగానిలేవేమో అన్పిస్తుంది. అనుకోని వరి స్థితుల్లో కూతుర్ని కలుసుకోలేకపోయినా, మరో కూతురి అనుబంధాన్ని మనిషికి మనిషికి మధ్య నున్న బంధంలో తెల్సుకోగలాను.”
“ఈ రోజే వాళ్ళ బాబు పుట్టిన రోజని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటం వాడితో దేవుడికి దణ్ణం పెట్టించి అదే పది వేలనుకో బాబూ అంటూ ఆ తల్లి కొడుకుని ఆప్యాయతతో అంతులేని బాధతో గుండెకు హత్తుకొని కన్నీళ్ళు కార్చి దీవించటం లీలగా చూశాను.
మరింక చూడలేకపోయాను రేవతీః వాడిని చేరబిలిచి ఆ వెండిగిన్నె వాడి చేతిలో వుంచాను.
వాళ్ళు సనేమిరా వద్దన్నారు.
“చూడు రాధికాః సాటిమనిషిపట్ల నీకర్త వ్యాన్ని నెర వేర్చుకున్నావ్: ఓ అనుబంధం సృష్టింపబడిందక్కడ. ఆ బంధాన్ని పురస్కరించు కునే బాబుకోసం ఈ పని చేస్తున్నాను. తెలియని నన్నాదుకున్నావ్: కాని అన్నీ తెల్పి ఇప్పుడు నేను చేస్తున్న ఈ పని నీకన్నా గొప్పది కాదు. అయినా నా ఆత్మతృప్తికోసం నీ ఆతిధ్యానికి వెలకడూ నీ ఋణం తీర్చుకుంటున్నాననే తేలిక అభిప్రాయానికి నీవు లోనుకావని భావిస్తున్నాను. నీ తల్లే యిలా ఇస్తుంటే కాదనగలవా అమ్మా: నీకు తెలీదా? ఇది మానసిక స్పందన. దీనికి ఆద్యంతాలూ ఋణశేషాలూ వుండవు కదూ ?”
“బాబు పుట్టిన రోజున నా కానుక ఇది. ఇది వాడికోసం యెలా పుపయోగపడ్డా సరేనమ్మా: కాదని నా మనసు బాధ పెట్టవని తలుస్తాను!”
ఇలా ఎంతో నచ్చజెప్పి, నా మనోభావాలన్నీ ముందు పెట్టి, నొప్పించక వారి -నొప్పించి ఆ వెండిగిన్నె ఆనందంగా వాళ్ళబ్బాయి కిచ్చేశానమ్మా!”
ఒడిలోని బాబు తల నిమురుతూ అంది భారతమ్మ కూతురి మొహంలోకి చూస్తూ.
రేవతిలో అప్పటికే సంచలనం ప్రారంభమయింది. కన్నీళ్ళు చెంపల మీదుగా ధార కడ్తున్నాయి. రాత్రి .. రాత్రి సంఘటన కళ్ళముందు కదలాడింది.
ఆమె వచ్చి తనింటి తలుపు తట్టింది తెలీకయేః ఆ విషయం తెలిస్తే యెంత బాధపడ్తుంది తన తల్లి: ఆ చీకట్లో ఈ యిల్లే రాత్రి తను తలుపు తట్టినదని తెలిసి ఉండకపోవచ్చును.
ఒక్క రాత్రికి అసహాయ స్థితిలోని సాటి ఆడదాని అవస్థను గ్రహించలేని ఆశ్రయమిచ్చి ఆదుకోలేని సంకుచితురాలూ, పిరికిమనిషీ తన కూతురని తెలిస్తే తల్లి తన్నెలా చూస్తుంది? యెంత నిరసించుకుంటుంది? దేవతలా ఆ రాధిక ఆదుకుంది గనుక సరిపోయింది లేకుంటే ఆమె యేమయ్యేదో తర్వాత గ్రహించిన తన బాధకు ఈ జీవిత కాలం సరిపోయేది.
ఎంతసేపటికీ ఏ దొంగలో, దౌర్జన్యపరులోనన్న
తన వేపు ఆలోచనలే తప్ప ఒక్క క్షణం అవతలి వ్యక్తి గురించి ఎవరూ అని అడిగైనా కనుక్కోగల్గిందా!
ఏ బీభత్స వాతావరణానికైతే తాను భయపడి తలుపులు, కిటికీలు సైతం మూసుకుందో, ఆ భయంకర వాతావరణంలోనే తనలాంటి మనిషి వుందని గ్రహించి ఎవరో తెలుసుకుని, తలుపు తీసి తన కర్తవ్యాన్ని నెరవేర్చలేక పోయింది. పిరికి తనానికి చోటిచ్చి సాటిమనిషికి చోటివ్వలేక పోయింది. తన తల్లి అవస్థకు కారణమయింది.
ఇతరుల కష్టసుఖాల్లో మనకెందుకు అనుకోక ఒక క్షణం మనిషిగా, మానవత్వంతో ప్రవర్తించి వుంటే హాయిగా అమ్మనాదుకోగలిగేది. పరాయి వాళ్ళనుకొని నిర్లక్ష్యంచేసి ఆ నిర్లక్ష్యానికి పరోక్షంగా తన తల్లినే గురిచేసి శిక్షించింది తను.
రేవతి పొంగివస్తున్న దుఃఖాన్ని బలవంతాన ఆపుకుంటోంది.
ఆ రాధికకు తన తల్లి పరాయిదేగా! అయినా ఆదుకుంది. మానవతను నిలుపుకుంది. మరి తను? ఏమౌతుందోనని భయంతో కొండంత గుండెను, సాగరమంత మనో విశాలతను పిరికి గుప్పెట్లో బంధించి వుంచింది. మనిషి జీవితమే యెప్పుడే మవుతుందో యెవరికీ తెలీదు. అలాగని మనిషి బ్రకకటం మానేస్తున్నాడా? ఆ బ్రతకటం కోసం చేసే భయం గొల్పే పనులు మానుకుని కర్తవ్యాన్ని విస్మరించి నాలుగోడల మధ్య ఎప్పుడూ సురక్షితంగా బంధింపబడి వుంటున్నాడా తనకు తాను?
ఇది తెలీని తనెంత అవివేకురాలైంది? ఎంత కథనడిపింది తన పిరికి తనం? స్వార్ధపరత్వం?
బాధావరితప్తమై వర్షించే కళ్ళతో నిల్చున్న కూతురి భుజం పై అనునయంగా చేయి వేసింది తల్లి.
” బాధపడ్తున్నావా రేవతీ ?”
కూతురి కళ్ళు తుడుస్తూ ఆర్ద్రంగా అడిగిందామె.
” రాత్రి సువ్వు పడ్డ కష్టానికి వో పక్క బార ఆ రాధిక పరోపకార గుణంతో చేసిన సహాయానికి మరో పక్క సంతోషం, సంకోచించక వాళ్ళ బాబుకి వెండిగిన్నె నిచ్చి ఆశీర్వదించి వచ్చిన నా తల్లి నిండు మనసుకు గర్వపడూ…. ఆ రాధికని నాకాదర్శంగా భావిస్తూ…. ఇన్ని కారణాల్తో ఈ కళ్ళు నిండుకున్నాయమ్మా”
తల్లి తుడిచిన కళ్ళు తడిసిన మల్లెల్లా తళతళ లాడగా అంది రేవతి.
”అమ్మా మిక్కిమౌస్” అంటూ ఒక పాప వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని లాగుతూ అటువైపు వెళ్లామని పేచీ పెడ్తోంది.
ఫంక్షన్ హాలులోకి అడుగు పెట్టగానే అరుంధతికి కనిపించిన దృశ్యం అది. మిక్కీమౌసే అటువచ్చి పాపకి షేక్ హాండ్ యిస్తుంటే ఆ పాప సంబరంగా గెంతులేస్తోంది. మిక్కీమౌస్ ఆ పాపకి ‘బై’ చెప్పి అరుంధతి వైపు వచ్చి షేక్ హాండ్ కి చెయ్యి చాపింది.
శోభతో మాట్లాడుతూనే ఎదురుగా నిలబడిన మిక్కీమౌస్ ముఖంలోకి చూసింది అరుంధతి. మిక్కీమౌస్ కళ్ళు మిలమిల మెరిసాయి. అంతలోనే మరో బాబు వస్తుంటే అటువైపు వెళ్ళిపోయింది.
‘పెళ్ళిళ్ళ సీజను అంటేనే మండే ఎండాకాలం. దానికితోడు ఆ వేషంలో… పాపం… ఎలా భరిస్తారో” జాలిగా చూసింది అరుంధతి.
”ఇంత ఆలస్యం ఏమిటే” అంటూ పెళ్ళికొడుకు తల్లి అయిన చిన్ననాటి స్నేహితురాలు ముందు వరసలో కూర్చోటానికి పిలిచింది. అక్కడ కూర్చున్న వాళ్ళకు నీళ్ళు అందిస్తున్న అమ్మాయి చటుక్కున పక్కకి తప్పుకోబోయింది.
”కాస్త నీళ్ళు యియ్యమ్మా” అని అరుంధతి చెయ్యి చాపేసరికి ముందుకు వచ్చింది. ఆ అమ్మాయిని పరకాయించి చూసి ఆశ్చర్యపోయింది అరుంధతి. ఆ అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఎనిమిదో తరగతి చదివే కమల! యూనిఫామ్ లో చిన్నగా కనిపించే ఆ పిల్ల, చీర కట్టుకొని సిగచుట్టుకొని ఉంటే గుర్తుపట్టలేక పోయింది అరుంధతి. అక్కడ నలుగురైదుగురు అమ్మాయిలు ఒకే రకమైన వేషధారణతో ఒకే అలంకరణతో అందరికీ నీళ్ళు, స్నాక్స్ అందిస్తున్నారు. వారిలో కమల ఒకతి.
”నువ్వా కమలా!” అని పలకరిస్తూ తాగిన గ్లాసుని ఆమె పట్టుకున్న ట్రేలో పెట్టింది.
”అవును టీచర్, కేటరింగు వాళ్ళు మా బస్తీ దగ్గర ఉంటారు. వాళ్ళు ఏ ఫంక్షనుకు కేటరింగు చేసినా మమ్మల్నే ‘వాటర్ ఉమెన్’గా తీసుకెళ్తారు టీచర్” అని చెప్పి మరోవైపు నీళ్ళు అందించటానికి వెళ్ళిపోయింది.
‘పరీక్షల సమయం దగ్గర పడింది. వీళ్ళు ఇలా పన్లకి పోతుంటే చదువేంగాను’ ఆలోచన్లో పడింది అరుంధతి.
అక్కడే ఉన్న శోభ ”ఇంతకు ముందుకూడా ఒకటి రెండు పార్టీలలో ఇలా చదువుకొనే వయస్సు పిల్లల్ని చూసాను. అదిగో అలాంటి కార్టూను పాత్రల వేషంలోకూడా పిల్లలే ఉంటారు. వీళ్ళకిది మామూలే. ఇంటిల్లపాదీ పన్లు చేస్తుంటారు. లేకపోతే గడిచేదెట్లా? ఇది సాధారణ విషయమే” అంది.
ఇంతకుముందు స్కూల్లో ఎవరో ఒక టీచరు చెప్తుండగా కూడా ఈ విషయం వింది అరుంధతి. చూడటం మొదటిసారేమో మనసు బాధగా మూల్గింది. చటుక్కున ఇందాకటి మిక్కీ మౌస్ గుర్తొచ్చింది. అది కమల అన్న నరేందర్ కాదుకదా?! కళ్ళు మిక్కీమౌస్ కోసం వెతికాయి. కమల కనిపిస్తే అడుగుదామని ఆమె కోసం చూసింది.
స్కూల్లో రేపటినుండి జరగబోయే పదో తరగతి పరీక్షలకోసం, బెంచీలపై నెంబరింగు పని హెచ్చెమ్ తనకి అప్పగించిన విషయం గుర్తొచ్చి గభాలున లేచింది అరుంధతి. తొందరగా భోజనం కానిచ్చి స్నేహితురాల్ని, నూతన దంపతుల్ని కలిసి హడావుడిగా బైటపడింది.
ఫంక్షనుహాలు నుండి బయటికి వస్తుంటే పిల్లలతో ఆడుతోన్న మిక్కీమౌస్ కనిపించింది. గేటు దగ్గర నిల్చున్న ఆటోని ఆగమని చెప్పి మిక్కీమౌస్ దగ్గరికి వచ్చింది అరుంధతి. ఆమెని చూసి మరోవైపు తప్పించుకు వెళ్లామనుకున్న మిక్కీమౌస్ ని చెయ్యి పట్టుకొని ఆపి ”నువ్వు నరేందర్ వేనా?” అంది అరుంధతి.
”అవును” అన్నట్లు తల వూపిన మిక్కీ మౌస్ ముఖం పకపక నవ్వుతున్నట్లుంది. కానీ మాస్క్ దాగిన నరేందర్ కళ్ళతడిని గుర్తించగలదు అరుంధతి. చెయ్యి నెమ్మదిగా జారిపోయింది.
మిక్కీమౌస్ చెరో చేత్తో ఇద్దరు చిన్నపిల్లల్ని పట్టుకొని మరోవైపు వెళ్ళిపోయింది.
‘నీకు రేపటి నుండి పరీక్షలు కదా నరేందర్’ అరుంధతి మాటలు పెదవి దాటి రాలేదు.
స్కూలుకి వచ్చినా మనసంతా వికలం అయిపోయింది. పేద బస్తీలోని పిల్లలు చదువుకొనే ఆ స్కూల్లో పనిచేస్తున్న అరుంధతికి తమ దగ్గర విద్యార్థులు పాలపేకెట్లు, పేపర్లు వేస్తారనీ, ఆడపిల్లలు బాసాన్ల పని చేసి వస్తారనీ తెలుసు. కానీ మంచి తెలివైనవాడు, మంచి భవిష్యత్తు ఉందని స్కూల్లో అందరి మెప్పు పొందే నరేందర్ ఇలా పరీక్షలముందు పనిచేయాల్సిన పరిస్థితికి బాధ కలిగింది.
తోటి టీచర్లతోపాటు ప్రతీరూములో నెంబరింగ్ పని పూర్తిచేసి సెంటర్ రూములో నిస్త్రాణగా కూచుండిపోయింది అరుంధతి. ఒక్కొక్క విషయమే ఆమె కళ్ళముందుకు వచ్చింది.
ఎయిడెడ్ స్కూలులో రిక్రూటింగ్ లేకపోవటంతో సబ్జెక్టు టీచర్లు లేక ఫలితాలు రాకపోతే పై అధికారులు అసలువిషయాన్ని పట్టించుకోక మెమోల మీద మెమోలు జారీచేస్తారు. ఆ బాధ భరించలేక బాగా చదివేపిల్లల్ని ఒక పదిమందిని ఎంపిక చేసి దగ్గర్లోని ఒక కోచింగు సెంటరు వాళ్ళతో మాట్లాడి, నాలుగు నెలలకీ తక్కువ ఫీజుతో చేర్చుకోవడానికి ఏర్పాటు చేసింది పదవ తరగతి క్లాసు టీచరుగా బాధ్యత ఉన్న అరుంధతి.
తెలిసిన వాళ్ళదగ్గర కొంత విరాళంగా తీసుకొని, అరుంధతి కొంత డబ్బు వేసి పిల్లల్ని కోచింగు సెంటరులో చేర్చింది. టీచర్లు లేని సబ్జెక్టులలోకూడా గట్టెక్కితే ఫలితాలు బాగుంటాయని ఆశించింది అరుంధతి.
తీరా రెండు నెల్లు గడిచిన తర్వాత నరేందర్ స్కూలుకి రావటం తగ్గించాడు. కోచింగు సెంటరుకీ వెళ్ళడం లేదని తెలిసింది. ఒకరోజు స్కూలు అయ్యాక ఎనిమిదో తరగతిలోని కమలని తీసుకొని వాళ్ళింటికి వెళ్లింది అరుంధతి.
అరుంధతి వెళ్ళేసరికి నరేందర్ ఇంట్లో పడుకొని ఉన్నాడు. అప్పుడే పనిలోకి వెళ్ళిన తల్లి కూడా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆమెనీ, నరేందర్ ని కూచోబెట్టుకొని బోధపరచింది. ‘మంచి మార్కులతో పది పాసైతే చదువుకోటానికి స్కాలర్ షిప్ వస్తుందనీ, వృత్తి విద్యాకోర్సులలో చేరితే ఉపాధి తొందరగా లభిస్తుంద’ని ఇలా ఎన్నో అవకాశాల గురించి వివరించి చెప్పింది. క్రమం తప్పకుండా స్కూలుకీ, కోచింగుకీ వెళ్ళటానికి ఒప్పించి తిరుగుముఖం పట్టింది అరుంధతి.
అరుంధతికి ఈ సంఘటన తర్వాత మళ్ళీ విషయం మొదటికి వచ్చిందని భయం పట్టుకుంది. అందర్నీ ఒప్పించి పైసలు సేకరించి కోచింగుకి కుదిర్చింది తను. నరేందర్ కొంచెం శ్రద్ధపెడితే 500కి పైగా మార్కులు సాధించగలడు. మంచి రాంకు సాధించగలిగే విద్యార్థులు ఉన్నారని చెప్పి కొత్త టీచర్లని స్కూలుకి కేటాయించమని డిపార్టుమెంటులో ఒత్తిడి తేవచ్చు అనుకున్న ఆశ నీరు కారేలా ఉంది. అరుంధతికి దిగులుపట్టుకుంది.
స్కూల్లో సెంటర్ ని పూర్తయ్యేసరికి సాయంత్రమైపోయింది. హెచ్చెమ్ కి కూడా విషయమంతా చెప్పింది అరుంధతి. ఒక నిర్ణయానికి వచ్చి అటెండర్ని తనకి సాయంగా పంపమని ఆమెని అడిగి నరేందర్ యింటికి బయల్దేరింది అరుంధతి.
అక్కడికి వెళ్ళేసరికి గోలగోలగా వుంది. నరేందర్, కమల ఒక మూల దిగులు ముఖాల్తో కూర్చుని ఉన్నారు. వాళ్ళమ్మ ఒకవైపు ఏడుస్తో ఎవర్నో తిట్టిపోస్తోంది. అక్కడున్న వాళ్ళంతా ఎవరికి తోచిన మాట వాళ్ళు చెపుతున్నారు.
అరుంధతి దూరంగా ఆగి అటెండర్ని పంపింది. అటెండరు నరేందర్ని, కమలని పిల్చుకొచ్చాడు.
నరేందర్ తండ్రి బస్తీ నాయకుడితో పాటు రెండు నెలలుగా దగ్గర్లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నాడట. పార్టీ సభలకి జనాన్ని పోగు చేయటంలో బస్తీ నాయకుడికి సాయపడుతున్నాడట. మామూలుగా ఎప్పుడూ చేసే కూలి పనులు మానేసి ఇదే పనిలో తిరుగుతున్నాడట. ఇంక చేతిలో పైసలు పడేసరికి తాగుడు ఎక్కువైందట” అని అటెండరు విషయం తెలియజేశాడు.
నరేందర్ దిగులు ముఖంతో ”మాయమ్మకి మూడు రోజులసంది జొరం టీచర్. ఇంట్ల బియ్యం కూడా తేకుండా అయ్య పొద్దుగూకులా తాగుడు, మాయమ్మని కొట్టుడూ సానా అయ్యింది. మాయమ్మ మందుకో, బియ్యంకో వస్తదని చెల్లీ, నేను కేటరింగు వాళ్ళతో పోయినాం. మా అయ్య మేం తెచ్చిన పైసలూ గుంజుకుపోయిండు. అడ్డుకుందని మాయమ్మని మస్తు కొట్టిండు”.
అంతవరకూ నరేందర్ పరీక్షలు రాసి స్కూలుకి రేంకులు సాధిస్తే బాగుపడబోయే స్కూలు గురించే ఆలోచించింది అరుంధతి. ఇప్పుడు బాగుపడాల్సింది నరేందర్ కుటుంబమా? స్వార్థం కోసం బడుగు జనాలకి సారా పోసి ఓట్లు సాధిస్తున్న నాయకులా? సమస్య ఎక్కడుందో అంతుపట్టలేదు.
ఏమనాలో తోచక బేగులోంచి ఓ వందరూపాయల నోటు తీసి నరేందర్ చేతిలోపెట్టి ”అమ్మకి మందు కొని వెయ్యి” అని చెప్పి వెనుతిరిగింది అరుంధతి.
(ఏప్రిల్ 2015)
హోటల్ గది కిటికీలో నుండి తదేకంగా చూస్తుంది రాణి. ఆగకుండా సాగుతున్న వాహనాలు గుండ్రం గుండ్రంగా ఉన్న రింగురోడ్లు వంతెనలు ఫ్లైవోవర్లు ఎవరికి వారే తిరిగి చూడకుండా పరుగెడుతున్నజనాలు. అబ్బో చాలా గమ్మత్తుగా ఉంది ప్రపంచం. ఆ గమ్మత్తైన జగత్తులో తన జీవితం మహా గమ్మత్తుగా తోచింది రాణికి. తను ఎక్కడుంది? ఎందుకుంది? ఏంచేస్తుంది? ఆ ప్రశ్నలు నిరంతరం వెంబడించేవే అయినా ఆ రోజు చాలా కొత్తగా ఉన్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఎంత హాయిగా గడిచిపోయింది సంవత్సరం. ఎలా గడిచిందో తెలియనే లేదు. గతకాలపు జ్ఞాపకాలన్నీ నెమరువేసుకుంటూ ఒక సంవత్సర కాలపు బంధాన్ని గుర్తు చేసుకుంటూ రాజుతో గడపాలని ఎంత ఆశతో రెక్కలు కట్టుకుని వాలింది తను.
కానీ ఊహించని విధంగా పరిణామాలు. అసలు పక్కనే ఉన్నా మనుషులెవరో తెలియనంత వ్యత్యాసాలు. ఫోన్ లు, వాట్సాప్ లు, హాంగ్ అవుట్ లు, స్కైప్ లు చివరికి జీమెయిల్స్ ఎన్ని మార్గాల కమ్యూనికేషన్ లు ఉన్నా అన్నీ ఒకేసారి మాయమైపోయాయి. అసలు మనుషులను గుర్తించలేనంతగా మైమరపు ఆవహించిందా అన్నంత మొండితనం. ఆ పరిస్థితిలో తను ఏంచేస్తుంది. ఎక్కడికి పోతుంది. ఎవరితో చెప్పుకుంటుంది. తన పరిస్థితి తనకే విచిత్రంగా తోచింది రాణికి.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఎంతో మధురంగా పలకరించాడు రాజు. హలో రాణిగారు అంటూ ఆ పిలుపులోని ఆత్మీయతకే ప్రాణం లేచి వచ్చింది తనకు. ఎన్నో కబుర్లు ఎన్నెన్నో ఊసులు మరెన్నో ఊహా ప్రపంచాలు ఇద్దరి మధ్య గూడు కట్టుకున్నాయి. మొదటి పలకరింపు ఎన్ని సంవత్సరాల అనుబంధమో అన్నంత ఆత్మీయంగా ఉంటే మొదటి స్పర్శ అంతకంటే దగ్గరితనాన్ని చవిచూపించింది. దాంతో ఇద్దరూ ప్రేమపాశంతో పెనవేసుకున్నారు చెట్టాపట్టాలేసుకుని తిరిగేసారు. తమ ఊహా ప్రపంచాన్ని నిజం చేసుకున్నారు.
రాణితో మాట్లాడకుండా రాజుకు గంట గడవదు. రాజును చూడకుండా రాణికి పొద్దు పొడవదు. ఇలా రాత్రి పగలు తేడా లేకుండా ఒకరితో ఒకరి ప్రయాణం సంవత్సర కాలం. అయితే కాలం చేసే గాయం కూడా అంతే గమ్మత్తుగా ఉంటుంది మరి. ఈ సంవత్సర కాలంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి, వాటితో పాటు ప్రవర్తనలు మారాయి. అవి, నేటి తన పరిస్థితికి దారితీసాయి. విధి ఆడే వింత నాటకంలో మరోసారి తాను బలైపోయింది. పరిస్థితులతో పాటు మనమూ మారాలి అంటాడు రాజు. కాలంతో పాటు పరిస్థితులు మారొచ్చు కానీ పరిస్థితులు బంధాలను మార్చలేవు అంటుంది తను. ఇద్దరి మధ్య ఉన్న ఆ అభిప్రాయ భేదమే నేటి రాజు మొండితనానికి కారణం.
ఏడాది గడిచిన తమ బంధానికి మరింత ప్రేరణ కలిగించాలని, రాజు పుట్టినరోజున దగ్గరుండి అతనికి ఆనందాన్ని పంచాలనీ ఎంత సంతోషంగా వచ్చింది తను. ఎయిర్ పోర్టులో రాజు కోసం చూసిన తనకు ఊహించని షాక్.
రాజు ఎయిర్ పోర్టుకు రాలేదు సరికదా, ఎన్ని ఫోన్ లు చేసిన జవాబు లేదు. పబ్లిక్ ఫోన్ లో చేసినా వినిపించుకోలేదు చివరికి వేరే వాళ్ల ఫోన్ తో చేసిన మెసేజ్ కు, టాక్సీ తీసుకుని నువ్వు వెళ్లు నేను రాలేను అంటూ సమాధానం. దిక్కు తోచలేదు తనకు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇక గత్యంతరం లేక టాక్సీ తీసుకుని హోటలుకు వచ్చేసింది. హోటలు ఫోన్ తన ఫోన్ ఎన్ని ఫోన్ లతో చేసినా పలుకు లేదు. అన్నీ బ్లాక్ చేయడం రాజుకు తెలిసిన సులువైన మార్గం.
ఎందుకు వచ్చిందో తెలియదు. ఎవరికోసం ఎదురు చూస్తుందో తెలియదు. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో కిటికీలో నుండి ఎదురు చూస్తూ తన అర్ధంలేని జీవితానికి అర్ధాన్ని వెతుక్కుంటుంది. అక్కడ ఎయిర్ పోర్టులోనే, రాజు తనను దూరం నుండి చూసి తన జీవితం వేరే వాళ్లతో ముడిపడిపోయింది కాబట్టి తనను కలవకూడదు అనుకొని వెళ్లిపోయాడని తెలియని రాణి ఎదురు చూస్తూనే ఉండిపోయింది. నాటి కలయికను తలుచుకుంటూ నేటి కలయికను కోరుకుంటున్న రాణి కోరిక కల’యిక’ గానే మిగిలిపోయింది.
”టీచర్ టీచర్! ఇందాకటిసంది యాదగిరి క్లాసుల ఒర్రుతుండు టీచర్” అయిదో క్లాసు పిల్లలిద్దరు పరుగుపరుగున అరుంధతి దగ్గరికి వచ్చారు.
అప్పుడే అదే క్లాసునుండి బెల్ అయిందని స్టాఫ్ రూముకి వచ్చిన అరుంధతి గుండె దడ దడ లాడుతుండగా పరుగున మళ్ళీ ఆ క్లాసుకి వెళ్ళింది. టీచర్ రాగానే క్లాసంతా గప్ చిప్ అయిపోయారు. అరుంధతి క్లాసంతా కలయచూసింది. మామూలుగానే ఉంది. తనని పిల్చుకొచ్చిన పిల్లల్ని ”యాదగిరి ఎవరు?” అని అడిగింది అరుంధతి.
వాళ్లు చూపిన వైపు చూస్తే ఒక పిల్లాడు లేచి నిల్చుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.
అంతలో ఆ పీరియడు టీచరు సావిత్రి గుమ్మం దగ్గర నిలబడి ”ఇంకా క్లాసులో పాఠం కాలేదా అరుంధతీ?” అంటూ వచ్చింది.
తానెందుకు పరుగున మళ్ళీ రావాల్సివచ్చిందో చెపుతూ ”యాదగిరి ఒర్రుతుండని పిల్లలు పిలుస్తే వచ్చాను” అని చెప్పి గుమ్మం బైటికి వచ్చి ‘ఒర్రటం అంటే?’ రహస్యంగా మెల్లగా అడిగింది అరుంధతి.
సావిత్రి నవ్వి ”అరవటం…” అంది.
”హమ్మయ్య, ఇంకేమిటో అనుకున్నాను” అరుంధతి కూడా నవ్వుతూ వెళ్ళిపోయింది.
వివాహం అయ్యాక హైదరాబాదులో అడుగుపెట్టిన అరుంధతి ఇంకా అక్కడి తెలుగు నుడికారానికి అలవాటుపడలేదు.
స్టాఫ్ రూముకి వచ్చి పుస్తకాలు దిద్దటానికి తీసి ఆలోచనలో పడింది.
అరుంధతికి అకస్మాత్తుగా చిన్నప్పటి స్కూల్లోని హిందీ టీచరు గుర్తుకొచ్చారు. మిగతా సబ్జెక్టుల మీదున్న శ్రద్ధ రెండో భాషగా ఉన్న హిందీ భాష మీద పెట్టటం లేదని విద్యార్థులని కోప్పడుతూ ఉండేవారు.
ఒకరోజు ఆమె కోపం తారాస్థాయికి చేరి ”మీరు పెద్దయ్యాకో, పెళ్ళయ్యాకో ఏ బొంబాయో, ఢిల్లీయో వెళ్తే అక్కడ భాష రాక యిబ్బంది పడతారు, కాస్త శ్రద్ధ పెట్టి నేర్చుకోండి” అని క్లాసులోని అందర్నీ తిట్టారు.
దానికి ఆడపిల్లలందరూ ‘అంతదూరం వెళ్ళే అవకాశం కానీ, అవసరం కానీ మాకురాదు’ అని చిన్నగా అనుకుంటూ నవ్వుకున్నారు.
అది గుర్తొచ్చిన అరుంధతి, స్టాఫ్ రూములోని టీచర్లతో చెపుతూ ”ఆవిడ అన్నట్లే నేనొచ్చి హైదరాబాదులో పడడమే కాకుండా, ఈ స్కూల్లో ఉద్యోగం వచ్చింది. అప్పుడు తధాస్తు దేవతలు ”తథాస్తు తథాస్తు’ అన్నట్లున్నారు” అంటూ నవ్వింది. అక్కడున్న టీచర్లు కూడా అరుంధతి మాటలకు పడీ పడి నవ్వారు.
ఉపాధ్యాయ శిక్షణ అనంతరం మొట్టమొదట చేరిన స్కూలు ఇది. అందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారు. అంతేకాక విద్యార్థులు చాలావరకూ శ్రామిక, కార్మిక వర్గానికి చెందినవారు. దాంతో అరుంధతికి భాష ప్రధాన సమస్య అయిపోయింది.
కొత్తగా చేరటంవలన అన్నీ ప్రాథమిక తరగతులు కేటాయించటం మూలాన క్లాసులో తాను చెప్తున్న పాఠం పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో అని బెంగ పట్టుకునేది.
అరుంధతితోబాటే ఉద్యోగంలో చేరిన సావిత్రి ఆమెకు కొంత సహాయకారిగా ఉంటూ ఉండేది.
ఒకరోజు అరుంధతి మూడో తరగతి క్లాసుకి వెళ్ళింది. క్లాసుకి క్రమం తప్పకుండా వచ్చే రాజు ఆ రోజు రాకపోవటం చూసి క్లాసులో పిల్లల్ని ప్రశ్నించింది ”రాజు రాలేదెందుకని”.
అంతలో మెల్లగా నడుచుకొంటూ, చొక్కా అంచుతో కళ్ళు తుడుచుకొంటూ వచ్చాడు రాజు.
”ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు?” అని గద్దించింది అరుంధతి.
రాజు తలదించుకొని ”మా నాయన పన్లో పోయిండని అమ్మ నన్ను ఇంట్లనే ఉండి చెల్లిని జర చూస్తుండమని, ఇస్కూలుకి ఎళ్లొద్దని అంది టీచర్. నేనే ఇస్కూలు పోతానని వచ్చేసిన” అన్నాడు మధ్యమధ్యలో వెక్కిళ్ళు పెడుతూనే.
”అయ్యో, ఎందుకు వచ్చావు. ఇంట్లో ఉండకపోయావా” కంగారుగా అంటూ ఏంచేయాలో తోచక పక్క క్లాసులోనే ఉన్న సావిత్రిని పిలిచింది ”సావిత్రీ! రాజు వాళ్ళ నాన్న పోయాడని, వాళ్ళమ్మ ఇంట్లో ఉండమంటే వచ్చేసానని చెపుతున్నాడు రాజు. ఏం చెయ్యాలి” అంది.
సావిత్రి కూడా వచ్చి రాజుని ప్రశ్నించింది ”ఏందిరా మీ నాన్నకేమయింది?” అని.
”ఏంకాలే టీచర్. మా నాయన పన్లోకి పోయిండు. మాయమ్మ ఏడకో పోవాల్నంట. ఇస్కూలు మాని చెల్లిని చూసుకోమనె. ఇస్కూలుకి పోతనంటే మాయమ్మ తిట్టింది” అన్నాడు రాజు.
సావిత్రి నవ్వుతూ ”ఇలా ప్రతీదానికీ కంగారు పడ్తావేంటి అరుంధతీ! రాజు నాన్న పనిచేయడానికి వెళ్ళాడట” అంది.
”అంతేనా! ఇంకా నేను ఇక్కడి యాసకు అలవాటుపడలేదు. అందుకే కంగారుపడ్డాను” అంటూ సిగ్గుపడింది అరుంధతి.
అప్పటినుండి విద్యార్థులు మాట్లాడుతున్నంతసేపూ ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించసాగింది అరుంధతి.
పాఠం చెపుతున్నపుడుకూడా వాళ్ళని పదే పదే పాఠానికి చెందిన ప్రశ్నలు వేసి, వాళ్లు తన మాటల్ని అర్థం చేసుకొనేవరకూ ఆగి జవాబుల్ని వినేది.
వింటున్నకొద్దీ తెలుగులోని ఆ ప్రాంతీయ యాస సొబగు అరుంధతికి అర్థం కాసాగింది. అంతేకాదు తానుకూడా విద్యార్థులతో వాళ్ళ యాసలోనే మాట్లాడడానికి ప్రయత్నించేది. అంతేకాక విద్యార్థులతో మాట్లాడుతూనే హిందీ ఉర్దూ పదాలు కూడా మెల్లమెల్లగా నేర్చుకోవటం మొదలుపెట్టింది.
విద్యార్థులుకూడా తన ప్రాంత యాస పదాలు వారికి కొత్తగా అనిపించి పదే పదే అర్థంకాక ప్రశ్నించేవారు. మొదట్లో ఎంత స్పష్టంగా వివరించి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోకపోవటం చికాకై విసుక్కొనే అరుంధతి, రాను రాను స్వీయ అనుభవంతో తనను తాను మెరుగుపరచుకొంది.
వాళ్ళ ప్రాంతీయతను తాను మరోలా అర్థం చేసుకొన్నట్లే తన ప్రాంత యాసా వారికీ వింతగా తోస్తుందనేది అనుభవ పూర్వకంగా అర్థమైంది అరుంధతికి.
ఆ నెల జీతం అందుకుని తన సహ ఉపాధ్యాయినిలు ఫాతీమా, సావిత్రిలతో కలిసి షాపింగుకు వెళ్ళింది అరుంధతి.
కొత్తగా వెలసిన ఆ పెద్ద షాపు ఆశ్చర్యంగా అనిపించింది అరుంధతికి. అందులో తానులు తానులుగా ఉన్న వివిధ డిజైన్లను చూసి వాటిని చీరలుగా తీసుకుంటే ఎలా ఉంటుందని స్నేహితురాళ్ళు ముగ్గురూ అనుకున్నారు.
అది విని సేల్స్ గర్ల్ అవే తానులతో కుట్టిన డిజైనర్ డ్రస్సులను తీసి చూపించింది. దాంతో లంగా వోణీలు, చీరలు, చుడీదార్లు కూడా డిజైన్ చేసుకోవచ్చు అనే అంశం ఆ ముగ్గురికీ చాలా నచ్చింది.
వెంటనే సావిత్రి తనకోసం చీరకి సరిపడినంత కొలిపించి తీసుకుంది. అరుంధతి తమ ఊరులో ఉన్న చెల్లెలికి లంగా వోణీకోసం కత్తిరింపించి తన చెల్లెలు కూడా తనంత పొడుగు ఉంటుందని చెప్పి అక్కడే ఉన్న టైలరుకి కొలతలు ఇచ్చింది. ఆ రంగు డిజైను నచ్చిన ఫాతీమా తనకికూడా అదే తానునుండి పంజాబీ డ్రస్సుకి సరిపడా ఇవ్వమని కొని అదే టైలరుకి కుట్టించటానికి యిచ్చింది.
అందరం ఒక తాను నుండే విభిన్న దుస్తులుగా రూపొందించటానికై అనుకోకుండా తీసుకోవడం గమనించి ప్రాంతాలు, భాషలు, యాసలు వేరైనా అందరం ఒక తాను ముక్కలమే అనుకుంది అరుంధతి. ఈ ఏకతా సూత్రాన్ని విద్యార్థులకు నేర్పవలసిన వారమూ మేమే అని మనసారా తలంచుకొంది.
ఆ అనుభూతిని దాచుకోలేక స్నేహితురాళ్ళ ముందు బయటపెట్టింది అరుంధతి. ‘అవును నేనూ అదే అనుకున్నాను’ అని ఫాతీమా, సావిత్రీ అనేసరికి ఆత్మీయంగా ఒకరి చేతులు ఒకరు కలుపుకుని నిండుగా నవ్వుకున్నారు.
మాధవ మాధుర్యం -రచన – పల్లె సీను.
మాధవ మాధుర్యం అనే కృష్ణ తత్త్వ ప్రధానమైన కృతి శ్రీ పల్లె సీను రాసారు.
క్షణంలో ఏదో మార్పు…ఏదో మెరుపు అంటూ… భగవానుని స్వరూపం దివ్య తేజస్సును పరుస్తోంది. విశ్వమంతా స్వామి ఎదుట ప్రత్యక్ష మైనట్లుంది.
జగన్నుతుని వెదకడానికి అందరికళ్ళూ ప్రయత్నిస్తున్నట్లుంది. జోడించిన చేతులు శివదేవుడు విదిలించలేదు. ఏదో అడగబోయిన అనిలుడు నోరుమూయలేదు. సుచరుణుడు ఎత్తిన తల దించనే లేదు. చూస్తుండగానే అక్కడి జనమంతా మ్రాన్పడిపోయారు. భూదేవి మొదలు ఆకాశం చివరంటా ప్రశాంతం అలుముకొని ఉందా! అనిపిస్తున్నది. ప్రాణికోటి సంచరించినట్లు కూడా లేదు. దిక్పాలకులు స్థావరములు మరచి మూగపోయారు. పంచభూతాల సవ్వడి ఎంత మాత్రమూ లేదు. అక్రూరుడు సాష్టాంగ పడి అరవలేకుండా ఉన్నాడు. రోదించడానికి నోరురాని భక్తులంతా స్తుతించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు. గోపికల భావాలు కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి.
అణువాదిగా బ్రహ్మాండంబులన్నీ నిండి వెలుగుతున్న శక్తి
ఎన్ని ఘడియలు అలా స్తంభింపచేసిందో ఊహకందని విషయం.. ఇలా సాగింది. “మాధవ మాధుర్యం” – దివ్యానుభూతి కవిత్వం :
శ్రీ పల్లె సీను గారు రచించిన “మాధవ మాధుర్యం” కృష్ణతత్త్వాన్ని ఆధారంగా చేసుకొని రచించబడిన ఒక భావరసపూరిత కృతి. ఇందులో కవి కేవలం కృష్ణుని కథను చెప్పడం మాత్రమే చేయలేదు; ఆయన దివ్యస్వరూపం అనుభూతి చెందినప్పుడు భక్తుని హృదయంలో కలిగే ఆధ్యాత్మిక స్పందనను కవిత్వంగా మలిచారు. ఈ కృతిలో కనిపించే భావ స్రవంతి భక్తి, ఆహ్లాదం, ఆశ్చర్యం, విస్మయం అనే అనేక రసాల కలయికగా నిలుస్తుంది.
దివ్యస్వరూప దర్శనానుభూతి
కవి “క్షణంలో ఏదో మార్పు… ఏదో మెరుపు” అనే పాదంతో ఆరంభించే దృశ్యం, సాధారణ దృశ్యం కాదు. అది ఒక దివ్య క్షణం — పరమాత్మ స్వరూపం ప్రత్యక్షమైన క్షణం. భగవానుని తేజస్సు విరాజిల్లినప్పుడు: విశ్వం అంతా ఒక్కసారిగా నిశ్చలమవుతుంది… దిక్కులు మాటలేని సాక్షులవుతాయి… పంచభూతాల సవ్వడీ ఆగిపోతుంది…. ఈ వర్ణనలో కవి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తున్నారు….
పరబ్రహ్మ తత్త్వం ప్రత్యక్షమైనప్పుడు ప్రకృతి కూడా క్షణకాలం మౌనమవుతుంది అనే భావనను కవితాత్మకంగా ఆవిష్కరించారు. భక్తి విస్మయానికి ప్రతీకలుగాకవి చూపించిన పాత్రలు భక్తి యొక్క రకరకాల స్థితులను ప్రతిబింబించాయి. శివదేవుడు జోడించిన చేతులను విడవలేకపోవడం అనేది పరమభక్తికి పరాకాష్ఠ!
అనిలుడు అడగబోయి మాట ఆగిపోవడమనేది ఆశ్చర్యంతో విస్మయం; సుచరుణుడు తల వంచకపోవడం అనేది దర్శనానందంలో మునిగిపోవడం; అక్రూరుడు సాష్టాంగంగా పడిపోవడం అంటే పరిపూర్ణ సమర్పణ.
ఈ ప్రతీ రూపకంలో ఒక గొప్ప భావం దాగి ఉంది:
భగవద్దర్శనం ముందు వాక్కు, మనస్సు, శరీరం అన్నీ స్థంభించిపోతాయి. సృష్టి నిశ్శబ్దం అవడం… కవిత్వంలోని గొప్ప దృశ్యం. కవి వర్ణించిన దృశ్యంలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది. అది సర్వసృష్టి నిశ్శబ్దం… భూదేవి నుంచి ఆకాశం వరకు ప్రశాంతత… ప్రాణికోటికి సంచారం లేకపోవడం… దిక్పాలకులు స్థావరాలు మరచి నిలబడిపోవడం… పంచభూతాల శబ్దం కూడా లేకపోవడం… ఇది కేవలం కవిత్వ అలంకారం కాదు. ఇది భగవంతుని సాక్షాత్కారాన్ని సూచించే విశ్వరూప భావన. ఈ సందర్భంలో శ్రీ సీను గారు చెప్పిన భావం చాలా గంభీరమైనది:
“అణువాదిగా బ్రహ్మాండంబులన్నీ నిండి వెలుగుతున్న శక్తి” ఈ ఒక్క వాక్యం కృష్ణతత్త్వాన్ని తాత్త్వికంగా నిర్వచిస్తుంది. అణువులోనూ బ్రహ్మాండంలోనూ వ్యాపించి ఉన్న పరమశక్తి — అదే మాధవుడు…గోపికాభక్తి…హృదయ భాష – కవి గోపికల భావాలను మాటల్లో చెప్పలేదు. “కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి” అని చెప్పారు. ఇది కవిత్వంలోని ఒక సున్నితమైన లక్షణం. భక్తి అత్యున్నత స్థాయికి చేరినప్పుడు మాటలు అవసరం ఉండవు.భావమే భాషగా మారుతుంది.
ఈ మాధవ మాధుర్యం రచనలో కనిపించే ముఖ్య లక్షణాలేమిటంటే? సజీవ దృశ్య నిర్మాణం; భక్తిరస ప్రధానత; విశ్వరూప భావన; తాత్త్విక అంతరార్థం. కవి పదప్రయోగం సాదాసీదాగా కనిపించినా, భావం అత్యంత లోతైనది. పాఠకుడు చదువుతుంటే తానే ఆ దివ్య దర్శనంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.
“పల్లె సీను గారి ‘మాధవ మాధుర్యం’లో దర్శనమిచ్చేది కృష్ణుడే కాదు; భక్తి మౌనంలో వికసించే విశ్వచైతన్యమే.”
పాఠకుడు చదివే ఈ భాగం మనసులో అనుభవించే మాధవమాధుర్యమే!
“మాధవ మాధుర్యం” కేవలం కృష్ణుని గానమో, స్తుతో కాదు!ఇది భగవద్భక్తి అనుభూతి యొక్క కవితాత్మక రూపం. ఈ కృతి మనకు చెప్పే సందేశం ఏమిటంటే? భగవంతుని తత్త్వం అణువులోనూ ఉంది… బ్రహ్మాండంలోనూ ఉంది… భక్తుడి హృదయంలోనూ ఉంది… అని అందుకే కవి చెప్పిన ఆ దివ్య క్షణం చివరికి మనమూ అనుభూతి చెందుతాము!
మాధవుడు ఎక్కడో దూరంలో కాదు; విశ్వమంతా నింపిన మాధుర్యమే.
రసస్వరూపుడైన శ్రీకృష్ణుడి అతిమానుషములైన చేష్టితములు, సుందర సుకుమారమైన దివ్యమంగళ విగ్రహాన్ని – చూస్తేనే మనసు ఇతర విషయముల మీదికి పోకుండా నిశ్చలంగా ఉంటుంది.
ఈ ప్రపంచానికి, మనకు- భగవంతునితో ఉన్న సంబంధం స్వామి లీలా కథల వల్లనే తెలుస్తుంది. మధురమైన మాధవ మాధుర్యంలో పల్లె సీను గారు శ్రీకృష్ణునిలోని అంతులేని తృప్తిని -అసంతృప్తుల వల్ల కలిగే స్వరూప కాంతిని అనంతమంటూ మాయలో పడిన చదువరులకు ఆ సన్నని పొర తొలగించి, రాధను పూజారిణిగా దర్శింపజేసిన కవి యోగులు.
యమునా తీరానికి మననూ నడిపించారు. ఆశరదృతువులో చక్కని పూల పరిమళముతో కూడిన గాలి బృందావనమంతా వీస్తూ.. ఆ సమయంలో గోపాలకులతో మమేకమై, వేణువు ఊదాడు!
ఆ వేణు నాదమే నందవ్రజంలో ఉన్న గోపికల మనసులో శ్రీకృష్ణ ప్రేమను ఇనుమడింపచేసింది. కృష్ణుడు ఎదురుగా లేకున్నా ఆ వేణునాదం వారి మనసుల్లో ఏవో భావాలను కలిగించింది.
ఎందుకంటే వేణువే ఓంకారం! (ప్రణవం) ఆ ప్రణవ నాదం వినగానే మనసులలో ఆ భగవంతుడే స్మరణకు వస్తాడు. ఆయనను తలుచుకోవడం మొదలవుతుంది. వేణునాద మహిమను ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు. అది ఆ గాన మధురిమ.
ఇక్కడ అక్రూరుని భక్తి-తాదాత్మ్యం వర్ణించవీలుకాని విధంగా రాసారు కవి. శ్రేష్టమైన జ్ఞానంపొందడమంటే… సాధనలో ఏమరుపాటు ఉండకూడదనే చక్కని సందేశం ఉన్న ఈ రచనలో మరెన్నో ఆచరించవలసిన విషయాలున్నాయి… ఆలోచించవలసిన విషయాలున్నాయి. భక్తి సాధకులకు కొంగుబంగారమీ భావనా కావ్యం…
కవి మాన్యులు శ్రీ పల్లె సీను గారికి శుభాభినందనలతో..
”ఎవరావిడ?” హెచ్చెమ్ రూములోకి వెళ్తున్న ఆమెని చూసి కొత్త మొహంలా కనిపించేసరికి రెండు వారాల ట్రైనింగుకి వెళ్ళివచ్చిన అరుంధతి అటుగా వస్తున్న క్లర్కు సరితని అడిగింది.
”అనాధాశ్రమం నడుపుతోందట. ఆ పిల్లల్ని మన స్కూల్లో చేర్చింది. ఫీజు కట్టటానికి వచ్చిందేమో” అంది సరిత.
నల్లపూసల దండ తెల్లని మెడని చుట్టుకొని ప్రత్యేకంగా కన్పిస్తోంది. కనీ కన్పించని సన్నటి చైను కూడా ఉన్నట్లుంది. చేతులనిండా ఎర్రని మట్టి గాజులు. చూడగానే మధ్యతరగతి శోత్రీయ కుటుంబానికి చెందినట్లుగా ఉంది. ఆ స్కూల్లో అగ్రవర్ణాలకు చెందిన పిల్లలు అతి తక్కువ. తొంభై అయిదు శాతం దళిత, మైనారిటీ, వెనుకబడిన కులాలకు చెందిన కార్మిక శ్రామిక పిల్లలే. అందుకే అరుంధతికి ఆమెని చూస్తే సందేహం కలిగింది.
కొత్తగా చేరిన గంగా, శ్యామలా చకచకా లెక్కలు చేస్తూ అరుంధతి మెప్పును పొందుతున్నారు. వాళ్ళు ఆశ్రమం పిల్లలని తెలిసి వారి తెలివితేటలకూ, వారి జీవనస్థితికీ గల వైరుధ్యాన్ని తలచుకొని వారిద్దరి మీద ప్రత్యేకమైన ఆదరణ కలుగుతూ ఉండేది ఆమెకి.
ఆశ్రమానికి చెందిన ఒక పాతికమంది వరకూ పిల్లలు వివిధ తరగతులలో ఉన్నారు. అందరూ బాగా చదువుతారు. బహుశా స్కూలునుండి వెళ్ళాక శ్రద్ధగా చదివిస్తారేమో అనుకునేవారు టీచర్లు.
”గంగా! హాస్టల్లో రోజూ ఎంతసేపు చదివిస్తారు?” అడిగింది ఒకసారి అరుంధతి.
”చదవటానికి ఒక్కొక్కరోజు టైమే ఉండదు టీచర్, అందరికీ పనులు ఉంటాయి. అక్కలు వంట చేస్తారు. గిన్నెలు తోమటం, బట్టలు ఉతుక్కోవటం, రూములు శుభ్రం చేయటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కోపని ఉంటుంది. అన్నీ అయ్యాక రాత్రికి హోమ్ వర్కు చేసుకుంటాం. పరీక్ష ఉన్నరోజు తెల్లవారు జామున లేచి చదువుకుంటాం” అంది గంగ.
”ఆ పనులకి పనివాళ్ళెవ్వరూ లేరా?” అంది ఆశ్చర్యపోతూ.
”వార్డెను మేడం, ఆయా ఉంటారు. వాళ్ళు కూరలు, సరుకులు తెస్తుంటారు” అని శ్యామల అందుకొని చెప్పింది.
”అంత పని చేస్తూకూడా మంచి మార్కులు తెచ్చుకుంటున్నారే” మెచ్చుకుంది అరుంధతి.
”పరీక్ష పెట్టి మంచి మార్కులు వస్తేనే మమ్మల్ని హాస్టల్ లో చేర్చుకుంటారు” అమాయకంగా చెప్పింది గంగ.
అరుంధతికి మరింత ఆశ్చర్యం కల్గింది. ‘అనాధాశ్రమంలో చేర్చుకోవటానికి కూడా ఎంట్రన్సు పరీక్ష లేమిటి చెప్మా!’ అని తోటి ఉపాధ్యాయినితో ఈ విషయాలన్నీ చెప్తూ అంది అరుంధతి.
”మరి తెలివైన పిల్లల్ని చేరిస్తేనే కదా వాళ్ళు మంచి మార్కులతో పాసై వీరి సమాజసేవకి గుర్తింపునిస్తారు” అంది వ్యంగ్యంగా మరో ఉపాధ్యాయిని. అరుంధతికి అది కూడా నిజమే అనిపించింది.
ఆశ్రమం పిల్లలంతా వారి వారి తరగతులలో ప్రథమ శ్రేణిలోనే ఉంటున్నారు. పోటీలలో బహుమతులూ సాధిస్తున్నారు.
మరో రెండు మూడేళ్ళకి – రయ్యిమంటూ పెద్ద శబ్దంతో ఖరీదైన స్కూటర్ని గేటుదాటి స్కూలు ఆవరణలోపలివరకూ నడుపుకుంటూ వచ్చిన ఆమెనీ, ఆమె అమర్యాదకరమైన తీరునీ విసుగుకుంటూనే ఆమె కట్టూ బొట్టూ తీరులో మార్పుని గుర్తించి ఆశ్చర్యపోవటం టీచర్ల వంతు అయింది. అక్కడున్న వారెవ్వర్నీ పట్టించుకోకుండా తిన్నగా ఆఫీసు రూములోకి వెళ్ళిపోయింది ఆమె.
ఒకరోజు ఆశ్రమం విద్యార్థి మధ్యాహ్నానికల్లా తీవ్ర జ్వరంతో సోలిపోతుంటే వాణ్ణి ఆశ్రమంలో దింపిరమ్మని ఒక టీచర్ని పంపించారు హెడ్ మిస్ట్రెస్. వెళ్ళి వచ్చిన తర్వాత టీచరు చెప్పిన మాట విని నివ్వెరపోయారు అందరూ.
”జ్వరంతో వున్న పిల్లాడిని తీసుకెళ్తే చాప, దుప్పటి పరిచి పడుకోబెట్టమన్నారు అక్కడి వార్డెన్. ‘జ్వరంతో ఉన్న పిల్లాడిని క్రింద ఎందుకండీ. అక్కడ పరుపులు ఉన్నాయి కదా!’ అన్నాను. ఒక మూల ఫోం పరుపులు ఒక దానిపై ఒక్కటి ఓ ముప్పయి వరకూ ఉండటం గమనించి అన్నాను.
‘తర్వాత వేస్తాం’ అంటూ ఓ మాత్ర తీసుకొచ్చి వాడిచేత మింగించి మీరిక వెళ్ళొచ్చు అన్నట్లు చూసింది.
మరిక ఏమీ అనలేక ‘డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వచ్చేసాను. ఇంతకు ముందే పదోక్లాసులోని పద్మని అడిగితే ఎవరైనా విఐపీ విజిటర్లు వచ్చినప్పుడే ఆ పరుపులూ, కొత్త దుప్పట్లు వేస్తారని చెప్పింది. ”ఇది చాలా అన్యాయం కదా” అంది ఆ టీచర్.
అందరూ బాధపడ్డారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయారు.
ఒకసారి ఆ ఆశ్రమం నడిపే సరోజిని ఏర్పాటుచేసిన రాజకీయవేత్త సన్మాన సమావేశం కార్డు చూపించి ”ఎవరికైనా వీలుంటే వెళ్ళి రండమ్మా” అన్నారు హెడ్ మిస్ట్రెస్.
కుతూహలంతో వెళ్ళింది అరుంధతి. సభ యింకా ప్రారంభంకాలేదు. ఆశ్రమం పిల్లలంతా మంచి బట్టలు ధరించి గుంపుగా వచ్చారు. అరుంధతిని చూసి నమస్కారం పెట్టి ఆ పక్క సీట్లలోనే కూచున్నారు.
సభ ప్రారంభమైంది. నగరంలోని ఆర్థికంగా, అధికారికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గుర్తింపు వున్న పెద్దలెందరో వేదిక మీదికి ఆహ్వానింపబడ్డారు. ఆశ్రమ నిర్వాహకురాలు సరోజిని వివిధ రంగాలలో ప్రసిద్ధులకు సత్కారాలు చేసింది.
ఆ కార్యక్రమం జరిగాక ఆశ్రమ పిల్లలందర్నీ వేదిక మీదికి రమ్మని ఆహ్వానించింది. వీళ్ళందరినీ చూసి వేదికమీది పెద్దలందరూ సరోజినికి అనాథలపట్ల గల ఆదరణనీ, అంకిత భావాన్నీ పలు విధాల ప్రస్తుతించారు.
ఆశ్రమం నిర్వహించుతున్న యింటి స్వంత దారుడైన ప్రముఖుడు సరోజిని సేవా నిరతికి ముగ్ధుడై ఆ యింటిని వారికి శాశ్వతంగా ఇవ్వదలుచుకొన్నట్లు వేదికమీదే ప్రకటించాడు.
మరొక అధికారి తన శాఖ తరుపున ఇరవై వేల చెక్కుని బహుమతిగా ఇచ్చాడు.
రాజకీయ వేత్త ఒకడు ప్రభుత్వం తరుపున సామాజిక సేవకు అవార్డును ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నాడు. ఈ విధంగా సత్కారాలందుకొన్న ప్రముఖులు అందరూ ప్రశంసలతో బాటూ తమ దాతృత్వాన్నీ ప్రకటించుకున్నారు.
పిల్లలందరూ వేదిక దిగి తిరిగి తమతమ స్థానాల్లోకి వచ్చి కూర్చున్నారు.
ఇక అక్కడ ఉండలేక అరుంధతి లేచి బయటికి నడిచింది. బస్టాపులో నిలుచున్నంతసేపూ మనసంతా పచ్చిగా అయిపోయింది. బస్సెంతకూ రాలేదు కానీ అరుంధతి తన ముందునుంచే వెళ్ళిన కారులో సరోజిని ఉండటం గమనించింది.
ఆ ఏడాది చివర్లో ఫీజులు కట్టని వాళ్ళ జాబితాని అరుంధతికి యిచ్చి, ప్రతీ తరగతిలోనూ ప్రకటించి, వసూలుచేసే బాధ్యత అప్పగించారు మేడమ్. చాలావరకూ ఆశ్రమ విద్యార్థులే ఉన్నారు ఆ జాబితాలో. తప్పదు కనుక అన్ని తరగతులలో చెప్పి వచ్చింది.
మరి రెండు రోజుల తర్వాత ఆశ్రమ వార్డెను ఒక చెక్కు తీసుకొని వచ్చి అరుంధతికి యిచ్చి అందరి ఫీజులు కట్టి రసీదులు రాయించమంది. ఆ చెక్కు ఒక కులసంఘం వాళ్ళు యిచ్చినది. ఆ కులానికి చెందినవాళ్ళు కొందరే వున్నారు. మొత్తం ఆశ్రమ విద్యార్థుల ఫీజుకన్నా అందులో సొమ్ము తక్కువగా ఉంది. అదే విషయం ఆమెకి తెలియజేసింది అరుంధతి.
”ఆశ్రమం పిల్లలకి కన్సెషను ఉంటుంది కదా! హెచ్చెమ్ని అడగండి” అంది వార్డెను.
”ఇది ఎయిడెడ్ స్కూలు కనుక ఫీజులు అతి తక్కువగా ఉంటాయి. అందులో యింకా కన్సెషన్ ఏమిటి?” ఖచ్చితంగా చెప్పింది. సభకి వెళ్ళివచ్చాక వాళ్ళమీద కోపం అనుకోకుండానే అరుంధతి గొంతులో ధ్వనించింది.
చెక్కు తీసుకొని హెచ్చెమ్ రూము వైపు నడిచింది అరుంధతి. ఆమెతోపాటే వార్డెను కూడా వస్తోంటే ”ఈ మధ్య సరోజనిగారు రావటం లేదేమి?” ఆరాగా ప్రశ్నించింది అరుంధతి.
”సరోజినిగారు మాదాపూర్ లో యిల్లు కట్టుకుంటున్నారు. ఆ పనిలో బిజీగా వున్నారు. అదీగాక గృహప్రవేశం అయ్యాక కూతురి పురిటికి స్టేట్సు వెళ్ళబోతున్నారు. వీసా పనుల్లో తిరుగుతున్నారు.” అంది ఆమె.
”మరైతే ఆశ్రమాన్ని యిక్కడే ఉంచుతారా? షిఫ్టు చేస్తారా?” అంది అరుంధతి.
”లేదు. మేము చూసుకుంటున్నాం కదా” అంది వార్డెను.
హెచ్చెమ్ తో విషయం చెప్పి చెక్కు ఆవిడకి యిచ్చి అరుంధతి రూము నుండి బయటకి వచ్చింది. అంతలో లాంగ్ బెల్ అయ్యేసరికి స్టాఫ్ రూములో బేగు సర్దుకొని స్కూలు గేటులోంచి బయటకు దారితీసింది.
బస్టాపుకు వెళ్ళే దారిలో ఒక శవయాత్ర ఎదురైంది అరుంధతికి. శవంమీద పేలాలతో పాటు చిల్లర పైసలుకూడా విసుర్తుండగా శవయాత్ర సాగుతోంది. రోడ్డుమీద పేదపిల్లలు నేలమీద పడిన చిల్లర పైసల్ని ఎగబడి ఏరుకుంటున్నారు.
ఆ దృశ్యాన్ని చూస్తూ నడుస్తున్న అరుంధతికి అకస్మాత్తుగా సరోజిని గుర్తుకు వచ్చింది.
(మే, 2015)
కుక్కతో మొదలై కుక్కతో ముగిసిన
మహాభారత గ్రంథం !!
ఔనా!!?? అలా ఎలా? అనుకుంటారు సోదరీమణులు కొందరు.
ఔను. అలానే మేము ఇదివరకే చదివాము అంటారు. మరికొందరు తెలియని వారి కోసమే ఈ సేకరణ.
ప్రపంచం గుర్తించిన మహాకావ్యం. కులమతాలకు కాలమానాలకు అతీతమైన ఆదర్శ గ్రంథం. వేదవ్యాసుడు 18 పర్వాలలో రాసిన ఈ మహాగ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, కవులు మహా కావ్యమని, ఐతిహాసికులు ‘ఇతిహాసం’ అనీ, పౌరాణికులు ‘పురాణం’ అని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని కొనియాడుతారు. ఈ గ్రంథం వ్యాసమహర్షి చెప్పగా వినాయకుడు తాళపత్రాలపై ‘లక్ష’ శ్లోకాలుగా రచించాడు. దేవతలూ, దేవర్షులూ రాసిన ఈ మహాగ్రంథం (కావ్యం) కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. ఔను ఇది నిజం !! నమ్మశక్యం కాని నిజం.
మహాభారత కథ కుక్కకు జరిగిన అవమానంతో మొదలయి కుక్కకు జరిగిన సన్మానంతో ముగుస్తుంది. వ్యాసుడు ఎందుకు కుక్కకు అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? అందులోని దేవరహస్యం ఏమిటి? అందులోని అర్థాన్ని పరమార్థాన్ని నిక్షిప్తంగా దాగి వున్న నిజాన్ని నేను విని మీకు అందిస్తున్నాను.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు కొంతకాలం హస్తినాపురాన్ని పరిపాలించిన తర్వాత అర్జునుని మనవడు, అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు తర్వాత అతని కుమారుడు జనమేజయుడు చక్రవర్తి అవుతాడు. జనమేజయుడు ఒక ‘మహాయజ్ఞం’ చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోనికి దేవతల కుక్క ఐన ‘సరమ’ బిడ్డ ‘సారమేయ’ ప్రవేశిస్తుంది.
సారమేయను చితకబాది జనమేజయుని కుమారులు, బావమరుదులు వెళ్ళగొడతారు. సారమేయ తన తల్లి సరమ దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగిన సంగతి చెపుతుంది.
వెంటనే సరమ బిడ్డను తీసుకుని యజ్ఞ ప్రాంగణంలోనికి వచ్చి జనమేజయునితో రాజా నీ కుమారులు నా బిడ్డను అకారణంగా హింసించారు. నా బిడ్డ అంత అన్యాయమేం చేసిందని జరిగింది. జనమేజయుడు తన కొడుకులను పిలిచి విచారించగా యజ్ఞం జరిగే ప్రాంగణంలో కుక్క వస్తే కొట్టక సన్మానిస్తామా? అని పొగరుగా జవాబు చెప్పారు. దానికి తల్లికుక్క సరమ తీవ్రంగా వ్యతిరేకించి రాజా మేము కుక్కలం ఆహారాన్ని ఆశించడం, తిండి ఎక్కడైనా దొరుకుతుందేమోనని వెదకడం మా స్వభావం. అదిలిస్తే వెళ్ళిపోతాం. ఇంతగా కొట్టడం తప్పుకాదా అని నిలదీసింది. రాజా తప్పు నువ్వు చేసినా నీ బంధువులు చేసినా నువ్వు చేసినట్టే. నువ్వు ఈ దేశానికి చక్రవర్తివి. ప్రజలనే కాదు, సమస్త జీవరాసుల బాగోగులు నువ్వే చూడాలి. ధర్మజ్ఞుడైన ధర్మరాజు మనవడివి. నీ వాళ్ళు అహంకారంతో విచక్షణ కోల్పోయి మూగజీవిని హింసించారు. నా మనసు శోకించింది. నువ్వు అకారణంగా బాధల పాలైతావని సరమ తన బిడ్డ సారమేయను తీసుకుని వెళ్ళిపోయింది.
ఆది పర్వం ప్రథమాశ్వాసంలోని ఘట్టం ఇది.
వ్యాసుడు – రాజులు ఎలా పరిపాలన చేయించాలో కుక్కతో చెప్పించాడు.
ఇక వ్యాసుడు కుక్కకు జరిగిన సన్మానంతో ఎలా ముగించాడో చూద్దాం.
ఈ భూమండలంతో మీ ఋణానుబంధం తీరిపోయింది. మహాప్రస్థానానికి సిద్ధం కండి అని వ్యాసుడు పంచ పాండవులకు ద్రౌపదికి ఆదేశించాడు. నార చీరలు, జింక చర్మాలు ధరించి అంతఃపురాన్ని దాటి పురవీధుల వెంట నడుస్తున్నారు. ఒక ‘కుక్క’ వారిని అనుసరిస్తోంది. ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారంలో వున్న పరీక్షిత్తు మిగతా మంత్రులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనంపారు. భారతదేశ ఉత్తరం దిక్కుగా వారి మహాప్రస్థానం సాగుతోంది. హిమాలయాలు దాటి మేరుపర్వతం చేరుకున్నారు. వారిని కుక్క అనుసరిస్తున్నది. మొదట ద్రౌపది తర్వాత వరుసగా నలుగురు తమ్ములూ తనువు చాలించారు. చివరగా ధర్మరాజు అతనితో కుక్క మేరు పర్వతం చేరుకున్నారు. దేవేంద్రుడు రథంతో వచ్చి ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించాడు.
ధర్మరాజు మొదట కుక్కను రథం ఎక్కించమన్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంతో పుణ్యం చేసివుండాలి. కుక్కలకు స్వర్గలోక ప్రవేశం లేదంటాడు. అప్పుడు ధర్మరాజు మేము హస్తినలో బయలుదేరినప్పుడు ప్రజలు, రాజులు, మంత్రులు, చివరకు నా భార్య తమ్ములు ఒక్కొక్కరుగా నన్ను వదిలేసినా ఈ కుక్క నాతోనే ఇంతవరకూ వచ్చింది. ఏమీ ఆశించకుండా రేయింబవళ్లు నాతోనే వున్నది. ఇంత విశ్వాసం వున్న కుక్క స్వర్గ ప్రవేవానికి అర్హురాలే కదా! నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి ఇంతదూరం వచ్చిన ఈ కుక్కను వదిలి నేను స్వర్గానికి వస్తే అదే పాపం నాకు వస్తుంది కదా ఇంద్రా, అందుకే నేను రాను అంటాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు ధర్మనిరతికి సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారినాడు.
ధర్మరాజా ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్న వేదోక్తిని కాపాడిన నువ్వు రక్షించినావు. అదే ధర్మం క్కు రూపంలో వచ్చి నిన్ను ఇంతదూరం వచ్చి రక్షించింది అని దేవేంద్రుడు ధర్మరాజును ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజును కాపాడుతూ చివరివరకూ అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథ ప్రారంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కతో ధర్మరక్షణ ధర్మనిరతిని చెప్పించాడు.
కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను శరీరంతో స్వర్గానికి ధర్మరాజు తీసుకెళ్తానన్నాడని ముగించాడు.
ఉరకలువేసే ఉప్పెనలాగా ఉగాదివస్తుందుత్సాహంగా
గడపగడపలో మంగళకరమౌ మామిడాకులు పూలమాలలతొ
వత్సరానికే మొదటి పర్వమై
సత్సంపదలతొ చాల కాన్కలతొ !ఉరకలు ।
కొత్తబట్టలు కుట్టించుకుని
చెత్తభావాలు నట్టే ట కలిపి
ఆరు రుచులిచ్చు పచ్చడి తోడ
అంతులేని ఆనందాలివ్వగ !ఉరకలు !
మూఢనమ్మకం మూలన వేస్తూ
చీడపీడలను ఛేదన చేస్తూ
ఐకమత్యమే మన నినాదమై
లోకహితాలే ఘన నివాళులై
మంచి విద్యలే మనలక్ష్యాలని
మన సంస్కృతులే మహి విజయాలని !ఉరకలు!
పరాభవలోన ప్రపంచ మందున
అరాచకాలే అసలు వద్దనుచు
దురహంకారము దూరమవ్వగా
నరసంహారము నాపగోరెడు
మేధావులను మేల్కొన జేయుచు
సుధా లహరులను వసుధన నింపుచు!! !ఉరకలు !
సుహృత్ కన్నా సుచరిత ప్రవర్తన ఎక్కువ బాధని కలిగిస్తోంది. వాస్తవం అంగీకరించడానికి తన మనసు ఎందుకు సిద్దం కావట్లేదో అర్థంకాదు. ఇవాళ మళ్ళీ స్కూల్ కి వెళ్ళింది. అక్కడేం జరుగుతుందో తెలిసిందే. ఇంటికొచ్చి కన్నీరు మున్నీరు అవుతుంది. రెండు రోజులవరకు మాములు మనిషి కాదు. నిద్రాహారాలు ఉండవు. తన వైఖరి సుహృత్ కి ఎంత చేటు చేస్తుందో గ్రహించదు.
ఊరికి వెళ్ళక రెండు సoవత్సారాలు అయింది. అమ్మ నాన్న ముఖ్యంగా నాన్నమ్మ ఎలా ఉందో. చిన్నప్పటి నుండి పనికైనా పరిష్కారానికైన తను చేరేది నాన్నమ్మ ఒడికే. అటువంటిది ఇప్పుడు తన జీవితంలో ఇంత పెద్ద తూఫాను చెలరేగింది. నాన్నమ్మ దగ్గర ఎపుడు ఏది దాచని తాను ఇవాళ సుచరిత వల్ల సుహృత్ విషయం దాచాల్సి వస్తోంది. “నాన్నమ్మ నాకు మార్గం చూపవు.” మనసులోనే అర్థించాను.
*
“నాన్నమ్మ నువ్వు నిజంగా వచ్చావా?” ఆనందo ఉక్కిరిబిక్కిరి చేయగా ఆటో దిగిన నాన్నమ్మని వాటేసుకున్నాను.
“బడుద్దాయి! వదలరా , ముందు ఆటో అబ్బాయ్ కి డబ్బులు ఇచ్చి పంపు.” ప్రేమపూర్వకమైన నవ్వుతో ఇంట్లోకి దారితీసింది. సామానుతో ఆ వెనుకే ఆవిడని అనుసరించాను.
అవ్వడానికి డెబ్బై ఏళ్ళ వృద్ధురాలుఅయినా పడుచు వారికి ధీటుగా ఇప్పటికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంది. ఒక్కసారి చూసిందో , ఇక అంతే , జన్మలో మర్చిపోదు. అందుకే ఆవిడ ఇక్కడికి వచ్చిమూడేళ్ళు పైన అయినా “ఎలా రాగలిగావు” అన్న ప్రశ్న వేయలేదు.
మంచి నీళ్ళు అందిస్తూ అడిగా “ కాఫీ పెట్టనా? తాగి స్నానం చేస్తావా” .
“అదేంటి నువ్వు పెట్టడం .సుచరిత ఏది”
“సుహృత్ స్కూల్ కి వెళ్ళిందిలే” చెప్పి కాఫీ పెట్టడానికి వంటిట్లోకి వెళ్ళా.
“ఏరా ఇంత విషయం ఉంటే మాకెవరికి చెప్పావు కాదే” “సుచరిత ఇష్టపడలేదు నాన్నమ్మ. అందరు పిల్లాడిని గేలి చేస్తారేమోనని భయపడింది. అలాగే మీ నుండి ఏమ్మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని కూడా కొంత భయపడింది. అందుకే రెండేళ్ళ బట్టి రావడానికి ఒప్పుకోలేదు..” సంజాయిషీ ఇచ్చాను. “అందులో తన తప్పేమీ లేదు లేరా. నూటికి నూరుపాళ్ళు ఏ తల్లి అయినా అలాంటి పరిస్థితుల్లో అలాగే చేస్తుంది.” మనుషులని మనసులని అర్థం చేసుకోవడం లో నాన్నమ్మ తర్వాతే ఎవరైనా అనిపించింది.
సుహృత్ కి Intellectual disability ( ఇంటెలెక్చువల్ డిసబిలిటి)ఉందన్న విషయం వాడికి ఐదేళ్ళు వచ్చేవరకు మాకు అర్థం కాలేదు. వాడు పాకడం , నడక , మాటలు అన్నీ ఆలస్యమే. తరగతి గదిలో ఓ చోట కుదురుగా కూర్చోలేకపోవడo, టీచర్ చెప్తోంది అర్థం చేసుకోలేకపోవడo, మిగిలిన పిల్లల మాదిరిగా కాక విషయాలని మర్చిపోతూ ఉండడం, పుస్తకంలో అక్షరాలని కుదురుగా కాక విసిరేసినట్లుగా రాయడం , ఏదైనా చెప్పడంలో , మాట్లాడటంలో పదే పదే తడబడ్డం…… వేటేనీ కూడా Intellectual disability (ఇంటెలెక్చువల్ డిసబిలిటి ) లక్షణాలుగా గుర్తిచడంలో విఫలం అయ్యాం.
“మీ అబ్బాయి ఎన్నిసార్లు చెప్పినా వేరే పిల్లల లంచ్ బాక్స్ల్లో వారు తింటుండగా తీసుకుని తింటున్నాడు. కోప్పడ్డా ప్రయోజనం లేదు. కొడితే భయపడాలన్న విషయం కూడా తెలియట్లేదు. ఒకసారి డాక్టర్ ని కలవండి…..” అని వాడి క్లాస్ టీచర్ చెప్పేవరకు , మా పిల్లాడి ప్రవర్తన మిగిలిన పిల్లలకి భిన్నంగా ఉంటోందన్న విషయం అర్థం కాలేదు.
అర్థమయినా సుచరిత అంగీకరించడానికి సిద్దపడలేదు. టీచర్ల సాకులంది. స్కూల్ మార్చాలంది. మార్చిన స్కూల్లోనూ అవే కంప్లైంట్స్ . ఇంక లాభం లేదనుకొని సుచరిత ని బలవంతం గా ఒప్పించి సుహృత్ ని మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళా.
ఏ విషయం అయితే సుచరిత మనసు స్వీకరిoచట్లేదో అదే సుహృత్ జీవితo యొక్క కఠన వాస్తవమైంది. ఆ క్షణాన ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లైంది. తండ్రిగా నా పరిస్థితే దుర్భరం . ఇక తల్లిగా సుచరిత……. అర్థం చేసుకోగలిగాను. ఓపిక పట్టాను. మెల్లిగా తనకి తాను సర్దుకుంటుందని , వాస్తవాన్ని జీర్నిoచుకుంటుందని ఆశిoచాను. కాని అలా జరగట్లేదు.
లోకమంతటినీ తప్పు పడుతోంది కాని తన బిద్దలోని లోపాన్ని మాత్రం ఒప్పుకోదు. ఎవరైనా పిల్లాడి గురించి సలహానో సానుభూతో ప్రకటిస్తే వారితో ఎదురు దాడికి దిగుతుంది. రాను రాను వైద్యం వారిద్దరిలో ఎవరికి ఎక్కువ అవసరమో తనకి అర్థం కావట్లేదు. డాక్టర్ , ఇలాంటి పిల్లల పెంపకంలో తల్లి తండ్రులిద్దరూ శిక్షణ పొందాలి అంటారు. ముఖ్యం గా తల్లి .
వాడితో ఓపిగ్గానే ఉంటుంది. వాడిని కొట్టడం కాదుకదా కనీసం విసుక్కోగా కూడా తనెప్పుడూ చూడలేదు.విరాం లేకుండా వాడి వెంటే తిరుగుతూ, వాడి ప్రతీ చర్యను సర్దుకుంటూ , సమర్థించుకుంటూ ఉంటుంది. ఇన్ని చేస్తున్నా బిడ్డకి బుద్దిమాoధ్యత ఉంది అని ఒప్పుకోదు. చర్చ కి తావులేదు. “మీ బిడ్డని మీరే వెర్రివాడని అనుకుంటున్నారా ….” అని ఆవేదన చెందుతుంది. తన దుఖాన్ని చూసి మౌనం వహించడం మినహా చేయగలిగింది లేదు.
***
“ ఏంటి! నాన్నమ్మ సుహృత్ ని ఆడిస్తున్నావా…” వెనక వైపు వసారా లో నాన్నమ్మ సుహృత్ లని అలా చూస్తుంటే తనకి తన బాల్యం గుర్తోచ్చిoది.
“సుహృత్ ! తాతమ్మ ని ఆట పట్టిస్తున్నావా …” అంటూ నా వెనుకే వచ్చిన సుచరిత వెళ్ళి వాళ్ళిద్దరి ప్రక్కగా కూర్చుంది. ఆ ముగ్ద చిత్రంలో నా స్థానానికై నేనూ వెళ్ళి కూర్చున్నాను.
నాన్నమ్మ మమ్మల్ని చూసి చిరునవ్వు తో “ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి “ అని “అక్కడెక్కడో బౌద్ధ గురువట, యేవో పరీక్షలు జరిపి ప్రపంచంలోనే అందరికన్నా సంతోషవంతుడు అని తేల్చారట. వారి పరిశీలనలు ఏమోగాని , నాకు తెలిసి ఆయన సంతోషం గా ఉండటానికి కారణం తనదైన ప్రపంచంలో హాయిగా ఆనందంగా జీవించడం , రాగద్వేషాలు కలిగి ఉండకపోవడం, ప్రకృతిని ప్రేమించడం, వస్తువులకి విలువ్వివక పోవడం, ముఖ్యంగా ఎవరితోటి దేన్నీ పోల్చుకోకపోవడం… అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు గొప్పవారిగా ఒప్పికుంటారా?” నాన్నమ్మ ప్రశ్న కి సమాధానంగా ఇద్దరం తలూపాం.
“మరి మీ బిడ్డ ఎదుగుదల పట్ల ఎందుకు అనుమానపడుతున్నారు.” నానమ్మ తర్కం అర్థంకాలేదు. నాన్నమ్మే మళ్ళీ “నా మనవడు ఎండగా ఉన్నప్పుడు వాన కావాలి అంటాడు. కుదిరిన ప్రతిమబ్బు కురవలంటాడు. అలా జరగనందుకు నిరుత్సాహ పడతాడు . ఒక్కోసారి విసుగు చెందుతాడు. ఆ ఆలోచనలో నీకు లోపం కనిపిస్తే నీ భార్యకి అది ఆందోళని కలిగిస్తుంది. అసలు ప్రకృతే గమనించడం మానివేసిన మీలాంటి వారికి అదో మానసిక రుగ్మత లా కనిపిస్తుంది.”
నాన్నమ్మ మాట్లాడుతోంది. నాకు అర్థమై కానట్లుగా ఉంది. కాని ఎక్కడో ఏదో నా ఆలోచనల్లోనే లోపం ఉందని అర్థమైంది. వికాసమైన వికలత అయినా మనిషి ఆలోచనల్లోనే ఉందని అర్థమైంది. వాడి గురించి నేనలా ఆలోచించడం నా మనో వైకల్యoలా ఇపుడు అనిపిస్తోంది.
“మనిషి ఎదిగేకొద్దీ వాడిలోని పసిమనసు కనుమరుగవుతుంది. మేధ పెరగడమే దానిక్కారణం అనుకుంటారు మీలాంటి మేథోవంతులు కాని అసలు సిసలు మేథ జిజ్ఞాసని ఎల్లప్పుడు జీవింపచేసి ఉంచటమే. ఆ మేధ వాడిలో ఉంది. మీ అజ్ఞానo వాడి మేధని అడ్డుకుంటోందని ఏనాడైనా ఆలోచించారా..?” సూటిగా ప్రశ్నించింది నాన్నమ్మ.
“నిజమే! అమ్మమ్మగారు. నలుగురిలోనూ ఆఖరికి నా భర్త సమక్షంలో కూడా నేనేనాడు నా బిడ్డకి మనో వైకల్యత ఉందని ఒప్పుకోలేదు. కాని నాకేతెలియకుండా నా అంతరంగాలలో ఎక్కడో ఎప్పుడో అదే అభిప్రాయం స్థిరపడినట్లుంది. అందువల్ల నిత్యం నేను , నాతో ఇతరులతో కూడా ఘర్షణ పడుతూ ఉండేదాన్ని. మీరు స్థిరంగా నా బిడ్డ ఆరోగ్యవంతుడు అని చెప్తున్నారు. నా మనస్సు , వాక్కు , చేత దేనికి పొంతన లేని కారణాన నా బిడ్డ జ్ఞానాన్ని జిజ్ఞాసని గుర్తించలేకపోయాను. సంఘంలో నా బిడ్డ స్థానం గురించిన ఆందోళనే తప్ప నా ఈ రకమైన ప్రవర్తన వాడి ఎదుగుదలకి అవరోధం అవుతోందని తెలుసుకోలేకపోయాను. ఇతరులకి భిన్నంగా ఉండడo ప్రత్యకమే తప్ప పొరపాటు కాదు అని ఆలోచించలేకపోయాను.” కళ్ళు వర్షిస్తుండగా మనసు విప్పి మాట్లాడుతోంది సుచరిత.
ఇన్నాళ్ళూ సుచరిత లో తప్పులు వెదకడమే తానూ చేసాడు తప్ప తన ఆలోచనల్లో దాగి ఉన్న అహంకారాన్ని అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. సుహృత్ కూడా ఆ బౌద్ధ గురువులాగే రాగద్వేషాలు లేనివాడు. దేనితోనూ ఏది పోల్చనివాడు. ప్రకృతి ని ప్రేమించేవాడు. అమ్మ అంటే విపరీతమైన అనురాగం, నిష్కల్మషమైన చిరునవ్వుతో అందరిని పలకరించే వాడి అమాయకత్వం… ఆలోచిస్తుంటే తెలుస్తోంది వాడి వ్యక్తిత్వపు పరిమళం.
నాన్నమ్మ పాదాలనoటి చెప్పాను “ఇంకెప్పుడు ఎవరితోనూ పోల్చను. వాడి ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. వాడి మేధ ఎందులో ఉందో వెలికితీస్తాను.”
“ఈయన తిప్పని psychriyatist లేరు. కాని మీలా అర్థం చేయించిన వారెవరూ లేరు. చాలా థాంక్స్ అమ్మమ్మగారు…” ఆనందాశ్రువులు రాలుతుండగా రెండు చేతులూ జోడిచింది సుచరిత. మునుపెన్నడూ లేని సంతోషం సంతృప్తి కనిపించాయ్ ఆ కళ్ళల్లో.
“చాల్లెండర్రా ! మీరు మీ పొగడ్తలూ. వీడు నా మనవడు. వాడు నా మునిమనవాడు. నా కుటుంబంలోని పిల్లలు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుస్తుంది కాని మీరు చెప్పే ఆ నాలుగు మాటలు వినే ఆ డాక్టర్ కి ఏం తెలుస్తుంది. యెంత తెలుస్తుంది. సరే!ఇంక మమ్మల్ని విసిగించక వెళ్లండి. మేమిద్దరం ఆడుకోవాలి….” అని నవ్వుతూ నా జీవితంలోని ఉప్పెనని ప్రశాంత నదీ ప్రవహంలా మార్చిన నాన్నమ్మ ఋణo ఏమిచ్చి తీర్చుకోగలను…..
