మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

యూని”వర్సిటీ’ లైఫ్…

by Sushma Merugu January 29, 2025
written by Sushma Merugu

ఇదొక గోప్ప అనుభవం…మధురమైన అనుభూతి…!!
గమ్యం ఏటో తెలియకుండా మొదలైంది నా పయనం. ఈ జీవితపు రైలు చక్రాలు ఎటు నడిస్తే అటే ఇక!!
మాదొక చిన్న పల్లెటూరు…ఏకైక కూతర్ని కాదు గానీ..కనిష్ఠ పుత్రికను నేను!
మా ఊరికి ఓ మూడు మైళ్ల దూరంలో పదవతరగతి వరకు చదివాను… జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు…ఓకే బెంచీ లో కూర్చున్న వాళ్ళం కూడా తరువాత ఒకే కోర్సులు చదవలేదు. ఎవరి అభిరుచిని బట్టి మార్గాన్ని ఎంపికచేసుకున్నాం….
మరో ఇరవై మైళ్ల దూరంలో గురుకుల కళాశాలలొ నా ప్రీ డిగ్రీ పూర్తిచేసాను. మరో యాభై మైళ్లలో డిగ్రీ కుడా పూర్తయింది.ఇప్పుడే మొదలైంది అసలైన ఘట్టం….ఇప్పుడే తీసుకోవాలి అతి కీలకమైన నిర్ణయం… జీవిత గమనాన్ని నిర్దేశించే మలుపు ఇది…
“కష్టే ఫలి’.. అనుకున్నట్లు గానే నేను అనుకున్న విశ్వవిద్యాలయం లోనే నాకు సీటు వచింది. అక్కడ చదుకోవాలనేది నా అభిలాష!!
ఇదొక గమ్మత్తైన ప్రపంచం..నిజమే ఇదొక వింత ప్రపంచమే… బయటి టైమూ….మనుషులు ఆచారాలు..అలవాట్లు అన్నీ వేరే….
మెదటి రోజు కాలేజీ కి వెళ్ళేటప్పుడు..’ జుట్టుకి నూనే రాసుకుని వెళతావా..?? అన్న నా సహచరిని మాటలు వెరైటీ గా అనిపించాయి నాకు…. ఈ కాస్త శ్రద్ధ లేకపోతే ఉన్న చీపురుకట్ట కాస్త కొత్తిమీర కాట్టైనా ఆశశ్చర్యం లేేదు..!!
స్వదేశీయులకన్నా విదేశీయులతోనే నిండిపొయింది క్యాంపస్. కొత్తదనం వాతావరణం మనుషుల్లోనే కాదు…భోజనం లో కూడా… చప్పటి మెతుకుల పప్పు, చిన్నరొట్టే,కూరగాయ తొక్కు,చారు ,పెరుగు…… కంచం ఎంత నిండుగా ఉన్నా నా కడుపుని మాత్రం నింపలేకపోయాయి…
నేనో చిన్నపాటి భక్తురాల్ని ప్రతీ శనివారం తలంటుకుని,కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని పోతే…తదేకమైన చూపులు…మా స్నేహితుల కాంప్లిమెంట్లు..కామెంట్లు…
మనం ఉండే చోటు మారినా…మనం మన సాంప్రదాయాలు…అలవాట్లు మారవు కదా మరి!!
ఒక్కోసారి గడవమన్నా గడవని కాలం ఇక్కడ చక్రాలేసుకుని మరీ పరిగెడుతుంది…రోజు కాలేజీకి వెళ్ళటం రావటం ఇరవైనాల్గు గంటలు సెకన్లలాగ గడిచేవి…ఇక్కడ కాలం మనుషులు రెండూ ఫాస్టే…!!
కొత్త విద్యార్థులకు టీ పార్టీ కహానిలు..కబుర్లు..ఆటపాటలతో స్వాగతం పలికారు మా సీనియర్లు…ఆ కార్యక్రమంలో వర్షం కూడా మాతో పాల్గొంది.
మళ్ళీ పక్షం రోజులకే ఫ్రెషర్స్ పార్టీ…ఆ చల్లటి సాయంత్రాన..లైట్ల వెలుగులు…తారాలు..
బాగానే తయారయి వెళ్ళాం…
వారి కళలతోఅందర్ని ఆశ్చర్యగొలిపారు…ఒక్కొక్కరు ఒక జాతిరత్నమే…!!
ఆరోజు సందడి గురించి చర్చించుకునే లోపే..సెమిస్టర్ వచ్చేసింది… వారం రోజులల్లోనే ప్రశ్నాపత్రాలు గాల్లో ఎగిరాయి.
ఏమాటకామేటె చెప్పాలి..స్నేహం ఎక్కడైనా తీయని ఫలమే… రకరకాల పండ్లరసం లాంటిది ఆరోగ్యమూ..ఆనందమూ..!
మా మిత్రులగురించి ఒక్క మాటలో చెప్పాలంటే…
‘కెంపులు…రత్నాలు…పగడాలు..ముత్యాలు అన్ని కలగలసిన హారం” అలా ఉంటాం మేమంతా…
నాకూ…నలుగురు ఆణిముత్యాలు దొరికారు…మా కాలక్షేపంలో సమయం రన్నింగ్ రేస్ పెట్టినట్లు పరిగెడుతుంది… ప్రతీ ఒక్కరి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయే కొన్ని గోల్డెన్ డేస్ ఉంటాయి..అవి కాలేజీ రోజులనటం లో సందేహం లేదు…
ఏదేమైనా…కొన్ని రోజుల తరువాత ఈ అనుభూతుల గురించి…అవి కష్టాలైనా..ఇష్టాలైనా..కలహమైనా..స్నేహమైనా…ప్రేమైనా..ఈ జ్ఞాపకాలన్నింటిని
తమవైన అనుభవాలను నెమరవెస్కుంటూ అనాల్సిందే…” ఆరోజులూ…మళ్ళీ రావూ…ఈరోజుల్లా కానేకావు!..అంతే లేని ఆనందాలు…
వెంటే వస్తే అంతే చాలు..!!!

January 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పడుగు జీవన కదంబం

by Dr. chitikena Kirankumar November 30, 2024
written by Dr. chitikena Kirankumar

నమ్ముకున్న వృత్తిపై మమకారంతో బతుకు జీవన బాటలో నిత్యం శ్రమిస్తున్న నేతన్నల జీవిత చిత్రంలోకి తొంగి చూస్తే మరెన్నో కథనాలు కనిపిస్తాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కథనాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం…

సిరిసిల్ల అంటేనే తెలంగాణలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఎంతో ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో కార్మికులు మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి సాగిస్తారు. ఇక్కడ చేనేత మగ్గాలపై ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ కుటీర పరిశ్రమతో అనేక ఉత్పత్తులు చేస్తూ కాలానుగుణంగా మరమగ్గాలుగా ఇంగ్లీష్ లూంలు సురూ, గపూర్, రమేష్, మేకర్లు, కండెలు చుట్టే మిషన్లు, సైజింగ్లు, వార్పింగ్ మిషన్లు, ట్విస్టింగ్ మిషన్ లు, రేపర్ లూంలు, ఇలా ఆటోమేటిక్ మర మగ్గాలు అనేక రకాలుగా వారి వారి ఉత్పత్తులకు అనుగుణంగా నిర్మించుకుని యజమానులు, ఆసాములు, కార్మికులుగా మూడు తరహాలుగా విభజింపబడి వస్రోత్పత్తి ఏళ్లుగా కొనసాగుతుంది. ఇలా ఉత్పత్తి అయిన వస్త్రాలను సిరిసిల్లలో డయింగ్ వ్యవస్థ అంటే ఉత్పత్తి అయిన కాటన్ గుడ్డ అద్దకంతో కేస్మేట్, పాప్లిన్ వస్త్రాలుగా తయారు చేయబడి ఆర్డర్ పై పెట్టికోట్స్, సారీస్, బ్లౌజ్ పీస్ లు పలు గార్మెంట్లుగా సరఫరా చేస్తూ వస్రోత్పత్తిదారులు నేరుగా అమ్మకం దారులుగా వివిధ అనేక రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకొని అమ్మకాలు జరుపుతున్న నేపథ్యం ఒక కోణం అయితే, అందులో పాలిస్టర్ వస్త్రాన్ని తయారు చేయడం మరో విభాగం అని చెప్పవచ్చు. పాలిస్టర్ గుడ్డను తయారు విషయంలో బోస్ కి, లైనింగ్, షూటింగ్, షర్టింగ్ , సారీస్ గ్రే ఇలా పలు రకాలుగా తయారు చేసి హైదరాబాద్ ఏజెంట్ల ద్వారా, యజమానులకు అమ్మి దానిని ప్రాసెసింగ్ తో ఫినిషింగ్గా సిల్క్ మిల్లుల ద్వారా ఏర్పడి అనేక హోల్సేల్, రిటైల్ దుకాణాలకు సప్లై జరిగుతున్నాయి. కాటన్ వ్యవస్థ, పాలిస్టర్ వ్యవస్థ రెండు విభాగాలుగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో వేల సంఖ్యలో కార్మికులు, వందల సంఖ్యలో ఆసాములు, యజమానులు ఉత్పత్తి రంగంలో మనుగడ కొనసాగుతున్న క్రమంలో ఒకవైపు ఉపాధి, మరోవైపు నైపుణ్యం, కళాత్మకత వివిధ రకాలుగా అంతర్లీనంగా ప్రాముఖ్యతను సంతరించుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అందుకు ప్రధాన కారణం ఉత్పత్తిదారుడే అమ్మకందారుడుగా మారి తయారుచేసిన గుడ్డను యజమాని నేరుగా మార్కెట్ సెంటర్లలో కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా అమ్మకాలు జరిపిన తరుణంలో అక్కడి మార్కెట్ పరిస్థితుల యొక్క ప్రభావం పోటీగా దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచిన తిరుపూర్, సూరత్, అహ్మదాబాద్, సోలాపూర్ లతో పోటీకి ధీటుగా నిలిచే ప్రయత్నాలు సిరిసిల్ల వస్త్ర యజమానుల వస్త్ర ఉత్పత్తులు అంతగా నిలువలేకపోయాయి. దానికి ప్రధాన కారణం ఏదేని ఒక వస్త్ర పరిశ్రమకు కావలసినటువంటి రవాణా మార్గాలైన ప్రధాన రైల్వే మార్గాలు , అతిపెద్ద అంగడి మార్కెట్లు చేరువలో లేక పెద్ద మొత్తంలో భారాన్ని. మోస్తున్నది. దిగుమతిగా తయారు చేసే విషయంలో, ఎగుమతి చేసే విషయంలో కానీ భరించి ప్రధాన పోటీ ఇవ్వలేకపోగా అయినా సిరిసిల్ల ప్రాంతంలో అతిపెద్ద సామాజిక వర్గం పద్మశాలి వర్గం ఉండడం వల్ల వారికి ప్రధాన వృత్తి చేనేత వృత్తి అవ్వడం ఆటుపోట్లు ఎదుర్కొన్న గానీ నమ్మిన వృత్తిని వదలక, మరో కొత్త వృత్తిలో అనుభవం లేక ఒక్కోసారి తీవ్ర విపత్కర పరిస్థితులు అయిన ( మందం)లను ఎదుర్కొన్నది. అప్పుడు నమ్ముకున్న వృత్తితో వారి జీవనం గడపలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ సమయంలో ప్రభుత్వ నేపథ్యం సిరిసిల్లకు ఎంతైనా అవసరం అని భావించి పలు ఉపాధి పథకాలు కొన్ని ప్రత్యేకమైనవి కార్మికులకు, ఆసాములకు, యజమానులకు ప్రభుత్వాలు కల్పించినవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు గతంలో చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ సమయంలో అప్పటి ప్రభుత్వ అధికారులు గోడలపై “జోట కూసున్నదని ఊరుకోకు, పూట గడుస్తలేదని ఉరి వేసుకోకు ” ఈ అక్షరాలు రాయించిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుండి బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చూసి ఏమిటి ఈ పరిస్థితి అని చాలా మందిని ఆలోచింపజేసింది. చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భాన్ని అప్పట్లో గ్రహించిన సినీ నటుడు చిరంజీవి సిరిసిల్లకు విచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? నేత కార్మికులను ఉద్దేశించి తన సానుభూతి మాటలు తన ప్రసంగంలో వినిపించాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో సిరిసిల్ల ప్రాంత పరిస్థితులలో ప్రధాన సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మరియు పలు సమస్యలకు పరిష్కార దిశగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం “బతుకమ్మ చీరల తయారీ” పథకాన్ని రూపొందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వెలుగులు నింపే ప్రయత్నం చేయటంలో ప్రధాన భాగం అయింది.

మార్పు దిశగా” బతుకమ్మ చీరల తయారీ పథకం “

దశాబ్దాల నుండి యజమానులు, ఆసాములు, కార్మికులు మూడు విభాగాలుగా సిరిసిల్ల సామాజిక వర్గం లో ప్రధానంగా పద్మశాలి వర్గం ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. అయితే సొంత వ్యాపారాలను అనాదిగా కోనసాగిస్తున్న ప్పటికీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. కానీ బతుకమ్మ చీరల తయారీ పథకం సిరిసిల్ల సమాజంలో మార్పు దిశగా అడుగులు వేసింది. గతంలో ఇతర రాష్ట్రాలలో,ఇతర ప్రాంతాలలో వ్యాపారాలతో తలమునకలుగా ఆటుపోట్లు ఎదుర్కొన్న కష్టాలకు ఇక చరమగీతం పాడి ఒక కొత్త మార్గంలో ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీ సంవత్సరంలో ఎక్కువ రోజులు పని కల్పించడం ఒక భాగమైతే, ఆర్. వి.ఎం ఆర్డర్లైనా స్కూల్ యూనిఫామ్ లు గుడ్డ తయారు కూడా కొంత భాగమైంది. చేనేతన్నలకు ఉపాధి కోసం ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల తయారీ పథకం అనేక సంస్థలు ఇట్టి ప్రయోగాన్నిఅభినందించడం జరిగింది. పెద్ద మొత్తంలో నేత అనుబంధ సంఘాలలో అనేక మార్పులుగా మ్యాక్స్ సొసైటీలు గా ఏర్పడి ప్రభుత్వ ఆర్డర్లను తయారుచేసి గతంలో కంటే చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల నేత కార్మిక వర్గం ఎక్కువగా సుముకత చూపింది. ఇది శాశ్వత పరిష్కార మార్గంగా మారాలని యోచించింది.

నేత కళాత్మకత ఒక ప్రత్యేకం

నేతతో అనేక కళాత్మకాలను సృష్టించిన ఘనత కూడా సిరిసిల్ల వాసులకే దక్కడం ఒక ప్రత్యేకత. అగ్గిపెట్టలో అమర్చేంత చీరను తయారుచేసిన కళాకారులు సిరిసిల్ల లో ఉండడం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. సిరిసిల్ల ప్రాంత నేత కళాకారులకు ఒక ప్రత్యేక తర్ఫీదు ఇప్పిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణలను చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అనుబంధ సంఘాల ఆవేదన
కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి!
కాటన్ పరిశ్రమను కాపాడాలి!!
వస్త్రోత్పత్తికి అనుబంధంగా నిలిచిన సైజింగ్ పరిశ్రమ, అద్దకం పరిశ్రమ ప్రధాన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇటీవల కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కళాత్మకత సృజన కలిగిన కార్మికులు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల కార్మిక వర్గం ఆధారపడి ఉందని వారికి చేయూత అవసరమని, అందుకు ప్రభుత్వ పథకాలైన ఆర్డర్ల ఆవశ్యకమని తెలుపుతూ ఇటీవల దసరా పండుగ సందర్భంగా కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి! కాటన్ పరిశ్రమను కాపాడాలి!! అంటూ ఫ్లెక్సీలతో సిరిసిల్ల లో దసరా పండుగ వాతావరణంలో పట్టణం మొత్తం అనుబంధ సంఘాల ఆవేదనను వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం.
సిరిసిల్లకు ప్రభుత్వ పథకాలే ఆధారం
యార్న్ డిపో ఏర్పాటు మరో మలుపు
సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ రూపాంతరాలు చెంది మరమగ్గాలపై అనేక కళాకృతులు ఇతర ఉత్పత్తులు తయారుచేసిన దశాబ్దాల చరిత్ర కలిగిన సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలుసు మరో . కొత్త కోణంలో నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వస్త్రోత్పత్తికి అవసరమైన యార్న్ డిపో ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్న సంగతి సిరిసిల్ల వస్త్ర వ్యాపారులలో మళ్లీ మరో కొత్త కోణంలో నేత ఉత్పత్తులపై ఆశలు చిగురించాయి.
రెక్కాడితే గానే డొక్కాడని జీవితాలను గడుపుతున్న నేత కార్మికులకు గతంలో ఉత్పత్తి, మార్కెట్ మాంద్యం లాంటి అనేక పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడగా ఆ పరిస్థితుల మార్పుకై మొదటగా “బతుకమ్మ చీరల తయారీ పథకం ” గత ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్త మార్గంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టగా నేడు “యార్న్ డిపో” ద్వారా వస్ట్ర ఉత్పత్తికి ప్రధాన భాగంగా నిలిచే నూలును ప్రభుత్వం అందించే ప్రయత్నం మరో నూతన ఆవిష్కరణకు, మార్పుకు మార్గం చూపుతోందని భావిస్తున్న సిరిసిల్ల చేనేతన్నల ఆశాభావం. పడుగులను నమ్ముకున్న నేతన్నల బతుకు జీవన చిత్రంలో నూతన ఆవిష్కరణలు వారి నుండి వెలువడాలని ఆశిద్దాం.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

యువతరం – younger generation

by Kondapally Neeharini November 30, 2024
written by Kondapally Neeharini

నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ ఎడిటర్

నువ్వు ఏదైనా చెబితే నేను మరిచిపోతాను. నువ్వు ఏదైనా నేర్పిస్తే నేను గుర్తు పెట్టుకుంటాను
నువ్వు నన్ను పనిలో భాగం చేస్తే నేను నేర్చుకుంటాను
ఎంత సత్య వచనాలు!! నమ్మకమే నిన్ను నడిపిస్తుంది అంటాం కదా? ఇప్పటి యువతరాన్ని చూస్తే వీటిలో ఏది నమ్ముతున్నారు అర్థం కావడం లేదు ఆలోచించాల్సి వస్తోంది. వాళ్లు వాళ్ల సమయాన్ని కోరుతున్నారు వాళ్ళదైనా సమయాన్ని మాత్రమే కోరుతున్నారు. ఈ సమయాన్ని కప్పిపుచ్చుతున్నదంతా స్వార్థం. స్వార్థం అవసరమే కొంతవరకు కానీ మితిమీరిన స్వార్థం ప్రమాదకరం. ఈ మాట స్వేచ్ఛ అనే పదంతో కూడా జోడించుకోవచ్చు మనం ఇటు స్వేచ్ఛ అటు స్వార్థం రెండూ కలగసి ఇప్పటివరకు సరైన నిర్ణయాలు తీసుకొని ఇవ్వడం లేదు. వాళ్లు వైపు మొత్తుకుంటున్నారు మాకు మా కుటుంబం అంటే ఇష్టం అమ్మ నాన్న అంటే ఇష్టం అని. తల్లిదండ్రులు వాళ్లకు టైం ను కేటాయించడం లేదు టైం స్పెండ్ చేయడం లేదు మాతోని అంటూ కంప్లైంట్స్ కూడా ఇస్తున్నారు.
పైన చెప్పిన రెండు వాస్తవాలే కానీ… స్వేచ్ఛ స్వార్థం రెండూ వాళ్ళ తెలివిని ఆలోచన నిర్వీర్యం చేస్తున్నాయి అన్నది సత్యమే తల్లిదండ్రులు సరైన సమయాన్ని పిల్లల మీద పెట్టలేకపోతున్నారు అనేది సత్యమే. మీ రెండు తప్పవు ఓవైపు బాగా చదువుకోవాలి లేదా గొప్ప ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి డబ్బు పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు యువత ఒకవైపు. ఇదే యువతకు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్లు కూడా డబ్బు సంపాదించాలి అనే కాకుండా ఉద్యోగ ధర్మం కదా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కదా అంటూ జీవితాన్నే పరిగెత్తిస్తున్నారు.
ఓ 20 ఏళ్ల క్రితం వాళ్లు పడ్డ కష్టనష్టాలు తమ సంతానం పడవద్దు అనే ఆలోచనతోనే తమ పిల్లలకు కావలసిన వాటికంటే ఎక్కువ సదుపాయాలను సమకూరుస్తున్నారు. వాళ్ళు అప్పుడు పొదుపుగా ఉన్నారు నోరు కట్టుకొని మరీ బ్రతికారు పైసా పైసా కూడ పెట్టి పిల్లల అవసరాల కోసం ఖర్చుచేసారు.మగ పిల్లాడైతే అందరిలో నా కొడుకు బాగుండాలి…. అని, నాకన్నా బాగుండాలి అని అనుకుంటున్నారు అమ్మాయైతే కొడుకులతో సమానంగా కూతుర్లను పెంచారు.ఆడపిల్లలు బాగా చదువుతున్న ఈ కాలంలో కూతురు ఎందుకు ఉద్యోగం చేయవద్దు తను తన కాళ్ళ మీద తాను నిలబడాలి అంటే ఉద్యోగం చేయాలి అని గట్టిగా నమ్మి అదే బాటలో నడిచేలా చేస్తున్నారు. తప్పదు కదా అస్తిత్వ పోరాటాలలో ప్రథమ స్థానం ఇదే కదా. ఆర్థిక స్వావలంబన అవసరం కాబట్టి ఇక్కడి వరకు బాగానే జరుగుతున్నది కానీ, మరి వీటికి ప్రతిఫలంగా ఇదే సంతానం కుటుంబానికి ఏమిస్తుంది?
సాధించాలనుకున్న గమ్యానికి తమదైన ప్రతిభతో ఒక గోల్ పెట్టుకుని ప్రయత్నిస్తున్న వీళ్ళు ఇళ్లల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నారు. అసలు పనులు చేయడానికి ఇష్టపడడం లేదు. ఉదాహరణగా చెప్పాలంటే… ఇంట్లో చెత్త డబ్బా తీసుకువెళ్లి చెత్త తీసుకువెళ్లే వాళ్లకు ఇవ్వాలి అనే స్పృహ ఉండడం లేదు. అదేదో మన పని కాదు అన్నట్టే ఉంటున్నారు కానీ ఎంతకని అమ్మ మాత్రమే చేస్తుంది ఎంతకని నాన్న మాత్రమే చేస్తాడు అని ఆలోచన ఉండడం లేదు. వంట ఎలా వస్తుంది టేబుల్ మీదికి అనే ధ్యాస లేని పిల్లలకు చెత్త డబ్బా గురించి ఏం చెప్తాం? అది మరీ పెద్ద విషయం. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చేసేది ఎవరు? పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తేనే ఇల్లు శుభ్రం కావడం లేదంటే అట్లాగే ఉంటుంది లేదా అమ్మ చేస్తుంది ఎంతకని? ఎంతకాలం ఈ ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటుందో!
వంటలో సాయం చేయడం, ఇల్లు శుభ్రంగా .. నీట్ గా పెట్టడం అందరి పని అనుకోవడం ఇలా… ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోని యువత రేపటి రోజున ఎవరికి ఆదర్శమవుతారు? ఎలా ఆదర్శమవుతారు?
There is no elevator to success you have to take the stairs … ఈ మెట్లు ఏవి అంటే ఇదిగో ఇవే…. చిన్న చిన్న ఆనందాలు దొరుకుతాయి ఇంటి పనుల్లో భాగస్వాములైతే! ఇది నిజం గా నిజం. చక్కని జ్ఞాపకాలు వెంట వస్తాయి. అమ్మా నాన్న ల కష్ట సుఖాల్లో మేం ఉండాలి అని అనుకున్న వాళ్ళు గొప్ప స్థితికి చేరుకుంటారు.
పాపం ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు అస్సలు పని నేర్పుకుంటారు. బహుశా విధి విధానాలు వేరుకావచ్చు. అంతేకానీ ఎవరు కూడా వాళ్ళ పిల్లలు సోమరులు అవ్వాలనో దుర్మార్గాలు తొక్కాలనో అనుకోరు.
The greatest gifts we can give our children are the roots of responsibility and the wings of independence అంటాం కదా! స్వేచ్ఛ తో పాటు బాధ్యత లను నేర్పించాలి. పదహారేళ్ళు వచ్చాక కూడా బుద్ధి రాకుంటే ఎట్లా? చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బయటి వాళ్ళు చెప్పేవి…. మీ జీవితం బలి కాకుండా చూసుకోవాలి.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చెదరని స్వప్నం

by Lakshmi Sharma November 30, 2024
written by Lakshmi Sharma

“ ఏయ్ మౌనికా… అబ్బా ఎన్నాళ్ళైందే నిన్ను  చూసి,  ఒక్కదానివే బాబును తీసుకుని వచ్చావు మీ ఆయన  రాలేదేమిటి ? ఓ నాకర్ధమైందిలే   మనిద్దరం  కలిసి  గడపాలని వచ్చావు కదా! సరే రా మంచిపని చేసావు,” అంటూ  మౌనికను చూసిన  సంతోషంలో గడగడా మాట్లాడేసిందిఅవంతిక . అవంతిక  మౌనిక  చిన్నప్పటినుండి  ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం  ఈ మధ్యలో ఇద్దరు కలుసుకోలేదు . మౌనిక పెళ్ళిచేసుకుని ఒక బాబుకు తల్లి అయింది. అవంతికకు  తన  మనసుకు సరిపడిన మనిషి తనకు దొరకనందుకు పెళ్ళిచేసుకోకుండా  అలానే ఉండిపోయింది.

“ అవంతిక… నాకో సహాయం చేస్తావా?  కొన్నాళ్ళు  నేను  నీ దగ్గరే ఉందామనుకుంటున్నాను  నీకేం ఇబ్బంది లేదు కదా,” అడిగింది  మౌనిక.

“ మౌనికా… ఏమిటి  నువ్వంటున్నది  నువ్వు  నా దగ్గరుండడమేమిటి, ఏమయిందే నీ ముఖంలో  ఏదో బాధపడుతున్నట్టు  కనిపిస్తుందిఎప్పుడు చలాకీగా  ఉండేదానివిస్కూల్లో

అందరు నిన్ను నవ్వులరాణి  అని పిలిచేవారు, ఏమైందే  నీ నవ్వులేవి ఎందుకంత బాధగా ఉన్నావు  చెప్పు మౌనిక,  నువ్వు  నా దగ్గరుంటానని అడగడమేమిటి  ఇది నీ ఇల్లనుకో,”

అంది  మౌనిక భుజం మీద చెయ్యివేస్తూ.

“ అవంతిక… ఏం  చెప్పమంటావు  నా జీవితం  తలకిందులైన నావలా అయింది, 

ఒడ్డుకు చేరే దారి తెన్ను లేకా  నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఏదైనా ఉపాయం చెబుతావేమోనని,” అంది  భారంగా.

“ మౌనికా…  సాకేత్  నువ్వు కలిసి ఉండడం లేదా? సాకేత్  బాగానే ఉన్నాడు కదా!

ఏం జరిగిందో  చెప్పవే నాకు భయంగా ఉంది  నిన్ను చూస్తుంటే ,” కంగారుపడుతూ అడిగింది.

“ ఆయనకేం ఆయన బాగానే ఉంటాడు నమ్మిన నన్ను మోసంచేసాడు, ప్రాణానికి ప్రాణంగా

చూసుకుంటున్నాడనుకున్నాను కానీ  నా వెనక  పెద్ద కుట్రజరుగుతుందని తెలుసుకోలేకపోయానే , బయటపడనంతవరకు అందరు పెద్దమనుషులే  బయటపడినప్పుడే కదా  వాళ్ళెలాంటివారో  తెలిసేది,  తీరా తెలిసాక  అందులోనుండి  బయటపడడం తప్పా ఇంకేం  చెయ్యలేకపోతున్నాను  అవంతిక,”అంటూ  అవంతికను గట్టిగా వాటేసుకొని తన తనివితీరా  ఏడివసాగింది  మౌనిక.

“ ఛ ఛా… ఏమిటిది  మౌనిక  ఏమైందసలు  ఎందుకు ఇంతగా బాధపడుతున్నావో చెప్పు

ఇలారా  కూర్చో,”  కాసేపు ఓదార్చింది .

“ చెబుతానే  నీకు కాకపోతే  నాకున్న ఆత్మీయులు ఎవరు?  నా భర్తనే నన్ను మోసంచేసాడు అవంతిక,  పెద్దలు కుదిర్చిన పెళ్ళి కదా ! ఎలాంటి మోసం ఉండదనుకున్నాను,  పెళ్ళైన ఇన్నేళ్ళలో  తన గతమంతా దాచి నాతో  కాపురం చేసాడు  ఏ మాత్రం అనుమానం రాకుండా,

మా ఇద్దరి మధ్యలో దాపరికాలు  లేవు అనుకున్నాను, కానీ  నా వెనుక  ఆయన చాలా కథ నడుపుతున్నాడని  ఈ మధ్యలోనే తెలిసింది, మా  పెళ్ళికకాముందే ఆయనకొక కొడుకున్నాడు  హాస్టల్ లో పెట్టి చదివిస్తున్నడు, ప్రతి నెల డబ్బులు పంపడమే కాకుండా

తను వెళ్ళి చూసి వస్తాడు ఇంత గుట్టు చప్పుడు కాకుండా  తన పని తాను చేసుకపోతున్నాడు నాకు తెలియనివ్వకుండా ,  అవంతిక  ఇది పచ్చి మోసమా కాదా చెప్పు?  ఏ ఆడదయినా  ఇలాంటివి సహిస్తుందా చెప్పు,  అందుకే  నేను అతని నుండి విడాకులు కోరుతూ  పిటిషన్  పంపించాను,  అందుకే  ఈ కేసు విషయం తేలే వరకు నీ దగ్గరుంటానని వచ్చాను,” అంది .

“ మౌనిక …  నువ్వు తొందరపడుతున్నావేమోనని అనుకుంటున్నాను,  నాకు తెలిసి సాకేత్ అలాంటివాడు కాదు అంటాను, ఎందుకంటే  సాకేత్ నేను రెండుసంవత్సరాలు  ఇంటర్ కలిసే చేసాము,  అసలు ఆడపిల్లలవైపు  కన్నెత్తి  చూసేవాడు కాదు తెలుసా? అలాంటి వాడు  ఇలా చేసాడంటే  నేను నమ్మను,  నువ్వు  ఆవేశంతో  తప్పుడు  నిర్ణయం తీసుకున్నావనిపిస్తుంది,

సాకేత్ ను నిలదీసి అడగలేకపోయావా   ఆ బాబేవరు అని ,” అనునయంగా అడిగింది అవంతిక.

“ పిచ్చి అవంతికా… ఎవరైన  తప్పు చేసి తప్పును ఒప్పుకుంటారా? అదీ అయింది , నిలదీసి

అడిగాను  ఇప్పుడు నేనేం చెప్పలేను అని  దాటేస్తున్నాడు,   తనకు పుట్టిన కొడుకుకాకపోతే దాచవలసిన  అవసరం ఏముంది,  హాస్టల్ లో  తన కొడుకుగానే  పేరు రాసాడు,  నెలనెలా

డబ్బులు  పంపించేది  కూడా తనే అని ఋజువైంది, ఇంకా ఏం కావాలి చెప్పు  ఇంతకంటే నిదర్శనం, పెళ్లికి  ముందే  ఒక బాబున్నాడు  అంటే ? ఆమె కూడా ఎక్కడో ఉండే  ఉంటుంది కదా!  నాకు తెలియనివ్వకుండా  బాబు దగ్గరకు వెళుతున్నట్టే  ఆమె దగ్గరకు కూడా వెళుతున్నాడేమో ఎవరికి తెలుసు,   అవంతిక నా వల్ల కాదు  ఇలాంటి మోసగాడితో కాపురం

చెయ్యడం , నాకు ఖచ్చితంగా  విడాకులు కావలసిందే,” మొండిగా వాదిస్తూ  అంది.

“  మౌనిక  నువ్వు ఆవేశం  తగ్గించుకో  నువ్వున్నట్టుగానే  రేపు కోర్టులో విడాకులు వస్తాయనుకో , అప్పుడు  నువ్వు ఒంటరిగా బతుకగలవా?  ఈ ప్రపంచంలో తోడు నీడలేని ఆడదాని బతుకు ఎలా ఉంటుందో  తెలుసా,”

అవంతిక …   నువ్వు  ఒంటరిగానే బతుకుతున్నావన్న విషయం మరిచిపోతున్నావు,  ఏం నువ్వు బతుకడంలేదా  నేను నీలాగే  బతుకుతాను, అంటే నీ ఉద్ధేశం  మగాడు  ఎన్ని తప్పులుచేసినా  చూసి చూడనట్టు అతనితో కాపురం చెయ్యాలంటావు,” అవంతిక మాటలకు అడ్డువస్తూ  అడిగింది.

“ అదికాదు  మౌనిక … నేను  నీ మంచికోసం  చెబుతున్నాను,  నా జీవితానికి   ఎలాగు   దారితెన్ను లేదు  కనీసం  నీ జీవితం  అయినా బాగుండాలని  కోరుకుంటున్నాను,  మగాడు అన్నాక  ఏదో  తప్పు చెయ్యకుండా  ఉంటాడా?  ఏదో చూసి చూడనట్లుగా సర్దుకుపోవడం

మంచిది  మౌనిక,  రేపు నీ కొడుకు  పెద్దయ్యాక మా నాన్న ఎవరు  అంటే  ఏం  చెబుతావు,

జీవితమంతా ఒంటరిగా గడుపుతావా? లేకపోతే మళ్ళి పెళ్ళి చేసుకుంటావా,”  అడిగింది అవంతిక.

“ అబ్బా … ఏం మాటలు నేర్చావు  అవంతిక,  ఒకప్పుడు  చాలా గొప్పగా  మాట్లాడేదానివి కదా!  ఈ మగాళ్ళ గురించి,  అందుకే కదా  నీకు పెళ్ళి చేసుకోవడం  ఇష్టంలేదని  చెప్పావు,

నమ్మించి గొంతులు కోస్తారని    ఒకరిని  ప్రేమించి  ఇంకొకరితో  కాపురం చేస్తారని, ఈ పెళ్ళిళ్ళ మీద  నమ్మకం లేదని  మనం  డిగ్రీ   చదువుతున్నప్పుడు  లెక్చర్లు  ఇచ్చావే  నువ్వు మరిచిపోయావేమో  నేను  మరిచిపోలేదు, చూడు అవంతిక  నీకు ఇష్టంలేదంటే  నీ దగ్గర ఉండను  ఎక్కడోచోట  ఆశ్రయం దొరక్కపోదు,  కానీ!  ఒక్కమాట  ఆడది  దేన్నైనా  భరిస్తుంది

కానీ, తన కాపురంలో  మరో  ఆడదానికి  చోటుందంటే  ఏ ఆడది సహించదు, తన భర్త తనకే స్వంతం కావాలనుకుంటుందే  తప్పా  పొరపాటున కూడా  సవతిని కోరుకోదు, నన్ను మోసం చేసి    ఒక బిడ్డకు   తండ్రి అయ్యాడంటే,  అది నేను ఎలా భరించుకోవాలో చెప్పు అవంతిక ,”

అంటూ అవంతికను  పట్టుకుని బోరు బోరుమని విలపించింది  మౌనిక.

మౌనికను  చూసి  అవంతిక  తట్టుకోలేకపోయింది.  గట్టిగా గుండెలకదుముకుని  ఊరడించింది. ఇప్పుడేం చెప్పినా  తనను బాధపెట్టినదానను అవుతానే కానీ ! తను వినే పరిస్థితిలో లేదు. కొంచెం కుదుటపడ్డాక  సర్ది చెప్పాలి  ఎలాగైనా  సాకేత్  మౌనికలను విడిపోకుండా  చూడాలి అనుకుంది.

“  హయ్ సాకేత్  బాగున్నావా?  ఏంటి నన్ను గుర్తుపట్టలేదా   నేనండి బాబు  అవంతికను,

మనం  ఇంటర్  లో ఒకే కాలేజిలో చదువుకున్నాము  గుర్తుకు వచ్చిందా? పోని ఒకటి చెప్పనా “  ఏయ్ సాకేత్  ఎంతందంగా ఉన్నావో తెలుసా  నేను నిన్ను ప్రేమిస్తున్నానోచ్”

అంటూ గట్టిగా  కాలేజి గదిలో చెప్పాను అందరిముందు, నువ్వు బిత్తరపోయి  నన్ను కొట్టడానికి  చెయ్యిలేపావు  నీకు దొరకకుండా  గదంతా తిప్పించాను, చివరకు మన స్నేహితులంతా నీ దగ్గరకు వచ్చి, పాపం నిన్ను ప్రేమిస్తున్నానని అంటుంది కదా! నువ్వు

ఓకే  చెప్పాలి లేదంటే మేమందరం బాయికాట్ చేస్తాము అని   నిన్ను బెదిరించారు, అప్పుడు నువ్వు  ఏం చెయ్యాలో అర్ధంకాక  నాకు  ఓకే చెప్పావు, ఎప్రిల్ పూల్ అంటూ నిన్ను అందరం ఆటపట్టించాముగుర్తుకొచ్చిందా,” అంటూ  సాకేత్ చెవి మెలిపెట్టింది అవంతిక.

“ ఏయ్ నువ్వా… ఏంటి మహాతల్లి  ఇన్నాళ్ళు ఎక్కడ మాయమైపోయావు, ఏంటి మళ్ళి

నా కొంపమీదకు  ఏమైనా ఉపద్రవం తెచ్చావా,” తన చెవిని వదిలించుకుంటూ దూరం జరిగి అడిగాడు సాకేత్ .

“ ఆహా  అదే పని మాకు  … నువ్వు కూరుకపోయిన  ఉపద్రవం కంటే  నేను చేసింది పెద్దదా

చెప్పు? ఏంటి  సంగతులు  సాకేత్   నేను  విన్నది  నిజమేనా? నువ్వు నీ భార్య అదే నా స్నేహితురాలు  మౌనిక  విడిపోతున్నారని  విన్నాను,  అసలేం జరిగింది   ఆ బాబేవరు

మౌనికకు  తెలియకుండా  నువ్వు  ఇలా చెయ్యడం ఏం బాగాలేదు సాకేత్ , అసలు నువ్వేంటి ఆడపిల్లలవైపు కన్నెత్తి చూసేవాడివి కాదు, అలాంటి నువ్వు   బంగారంలాంటి  భార్య ఉండగా

ఇంకొకరితో  జీవితం పంచుకున్నావంటే  నేను నమ్మలేకపోతున్నాను,” ఆశ్చర్యంతో అడిగింది  అవంతిక పాత స్నేహితుడన్న చనువుతో.

“ ఓహో  నీకంతా తెలిసిపోయిందన్నమాట… అంటే  మౌనిక  నీ దగ్గరకు వచ్చిందా, వాళ్ళ అమ్మానాన్నల  వద్దకు పోయిందనుకున్నాను,  అవంతిక…  ఇంతవరకు  వచ్చాక  నేను నిజం దాచి  ప్రయోజనంలేదు,  మౌనికకు  నిజం  చెపితే   వినే  పరిస్థితుల్లో లేదు  నా మీద చాలా కోపంగా  ఉంది,  నేను చెప్పేది  నువ్వన్నా జాగ్రత్తగా  విని  మౌనిక  మనసుకు తగిలిన

గాయాన్ని  మానేలా చెయ్యి,  మా జీవితం పూలనావలా  సాగిపోతుందనుకున్న సమయంలో

తుపాను చెలరేగింది,” అంటూ శూన్యంలోకి చూస్తూ అన్నాడు  సాకేత్ .

“ సాకేత్ … అంటే  నువ్వు  తప్పుచేసానని  ఒప్పుకుంటున్నావా? మౌనిక గురించి  ఆలోచించలేదా  నువ్వు,  మౌనిక  నీకేం తక్కువచేసిందని ఇలాంటి పని చేసావు, నువ్వేదో

అపర శ్రీరామచంద్రుడిలా   నేను ఎంతగా ప్రయత్నం చేసినా  నన్ను ఆమడ దూరంలో పెట్టావు, మరీ  ఇప్పుడేమో  ఉన్న భార్య సరిపోదన్నట్టు  చాటుమాటుగా  వ్యవహారం నడిపించి  దొరికిపోయావు,” అంది  దెప్పిపొడుపుగా .

“ అబ్బా  అవంతిక  కాసేపు   నీ సోది ఆపుతావా… “తమ్మళి తన చప్పుడే  తప్పా ఎదిటివాళ్ళది  వినడు”  అన్నట్టు  నేను  జరిగింది చెబుతాను  అంటున్నాను కదా! నీ ఇష్టం వచ్చినట్టు  నువ్వు  కథలు అల్లుకోవడమేనా,” అవంతికను గట్టిగా పిలుస్తూ అన్నాడు.

గప్ చుప్ అయింది  అవంతిక.

“ చూడు అవంతిక … మీరందరు అనుకున్నట్టుగా  నేను  మౌనికకు  అన్యాయం చెయ్యలేదు,

హాస్టల్ లో పెరుగుతున్న బాబు  నా స్నేహితుడి  కొడుకు, వాళ్ళిద్దరు  ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు   వాళ్ళ ప్రేమను  పెద్దలు అంగీకరించలేదు , పైగా  వాళ్ళ కులమునుండి వాళ్ళను  బహిష్కరించారు, చేసేది  లేక   ఆర్య సమాజంలో  స్నేహితుల సమక్షంలో  పెళ్ళిచేసుకున్నారు,  వాళ్ళ అదృష్టమో  దురదృష్టమో  తెలియదు కానీ!  సంవత్సరంలోపే పండంటి  బాబుకు జన్మనిచ్చింది ఆమె,  ఎవ్వరు దగ్గరకు తీయకపోయినా  బాబుతోటిదే  లోకం  అనుకున్నారు, బాబుకు రెండోయేడు  వెళ్ళి మూడో సంవత్సరంలో  అడుగుపెడుతున్నాడు , ఈసారి పుట్టినరోజు  ఘనంగా చెయ్యాలని   అది కూడా  “శాంతి అనాథ శరణాలయంలో” మమ్మల్నందరిని  కూడా పిలిచాడు, అలా అన్ని ఏర్పాట్లు చేసుకుని

వెళుతుండగా  ఘోరంగా  కారును  లారి  గుద్దేసింది,  వెనుకనే  మా కారు ఉంది  వెంటనే  కారు దిగి వాడిని రక్షించాలనుకున్నాము, కానీ  వాడు  అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు

ఆమె  ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది, పసివాడు  భయంకరంగా  రోదిస్తున్నాడు దెబ్బలు

గట్టిగా తగిలినట్టున్నాయి,  అమాంతంగా  బాబును ఎత్తుకున్నాను  ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయాడు,  కొన ఊపిరితో  ఉన్న ఆమె  నన్ను దగ్గరకు రమ్మని సైగచేసింది బాబుతో

పాటుగా వెళ్ళాను,  “ ఏమండి  నా కొడుకును  మీ కొడుకుగా  చూసుకొండి, వాడిని  ఎవ్వరికి ఇవ్వనని నాకు  మాటివ్వండి , వాడిని అనాథను  చేసి  పోతున్నాము  ఇక నుండి వాడికి తల్లి తండ్రి అన్నీ మీరే, లోకానికి  వాడు మీ కొడుకుగానే  తెలియచేయండి,” అంటూ ఆమె కన్నుమూసింది,” చెప్పడం ఆపి  కళ్ళు  తుడుచుకున్నాడు సాకేత్ .

“ సాకేత్ … నువ్వు చెబుతుంటే  నాకే  కన్నీళ్లు  ఆగడంలేదు, ప్రత్యక్షంగా  చూసిన నీకు

ఎంత బాధగా  ఉంటుందో  నేనర్థంచేసుకోగలను,” అంది అతనిని ఓదారుస్తూ.

“ అవంతిక… నిజంగా  ఆ సమయంలో  నేనేం చేస్తున్నానో  నాకు  తెలియడంలేదు, అప్పటికే నాకు  మౌనికకు పెళ్ళై  ఆరునెలలు కావస్తుంది,  వాళ్ళవాళ్ళకు తెలియచేద్దామంటే  ఎవ్వరి దగ్గర  వాళ్ళ ఫోన్ నెంబర్లు లేవు,  ఇక  మేమంతా కలిసి  వాళ్ళకు అన్ని కార్యక్రమాలు జరిపించాము,  మా స్నేహితులంతా  బాబును నన్ను  వదిలేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు, అప్పుడు  నాకు  ఆ బాబును  ఏం  చెయ్యాలి  ఇంటికి తీసుకవెళదామంటే

మౌనిక  కడుపుతో ఉన్న మనిషి, ఎలా  అర్థం చేసుకుంటుందో ఏమో తనను ఇబ్బంది పెట్టడడం ఇష్టంలేక,  నా స్నేహితుడు  ఏ శరణాలయం కోసం వచ్చాడో  అందులోనే  ఆ బాబును  ఉంచి , తనకవసరమైన  డబ్బులు   వాడి బాగోగులు  తండ్రిగా  నా బాధ్యతని

వాళ్ళకు  చెప్పి వచ్చాను , అదిగో అప్పటినుండి  మౌనికకు  తెలియనివ్వకుండా  చూసుకున్నాను, ఎలా  తెలిసిందో  ఏమిటోగానీ  నేనంత  చెప్పినా తను  నా మాట

వినిపించుకునేలా  లేదు, ముందే తొందరెక్కువ తనకు  ఆ కోపంతో  నన్ను నానా మాటలని

బాబును తీసుకుని వెళ్ళిపోయింది,  పోనిలే  కొంచెం  కోపం తగ్గాకా  నేనే వెళ్ళి తీసుకుని వద్దామనుకున్నాను,” తన మనసులో పడుతున్న ఆవేదనంతా  చెప్పాడు.

“ నాకు  తెలుసు సాకేత్ … నువ్వెటువంటివాడివో,  మౌనికకు అదే  చెప్పాను నువ్వు అలాంటి వాడివి  కాదని, నాపైన  కూడా  గట్టిగా  అరిచింది  ఇక  తనతో  మాటలనవసరం అనిపించి  నీ దగ్గరకు  వస్తే కానీ  నిజమేమిటో  తెలుసుకుందామని  వచ్చాను,  సాకేత్  నువ్వేం  దిగులుపడకు  నేను  మౌనికను  తీసుకుని  వస్తాను,” అంటూ  వెళ్ళిపోయింది .

“ అవంతిక … ఎక్కడకు  వెళ్ళావు  నా మీద  కోపం వచ్చిందా  ఉదయం  నీ మీదకు

గట్టిగా అరిచానని, ఏం చెయ్యను చెప్పు ? మా అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా… ప్రాణస్నేహితురాలవని  నీ దగ్గరకు వచ్చాను, ఆపదలో నన్ను ఆదుకుంటావని  వస్తే నువ్వు నాదే తప్పన్నట్టుగా  మాట్లాడేసరికి కోపం వచ్చింది,”  అంది  మౌనిక.

“ మౌనిక… నిన్ను చూస్తుంటే  ఒకపక్క జాలివేస్తుంది, మరోపక్క  ఈర్ష్య గా ఉంది తెలుసా,”

అడిగింది అవంతిక .

“ ఊహు  … నా జీవితం ఇలా అయినందుకు జాలిపడుతున్నావు  సరే , మరీ  నామీద  ఈర్ష్య

ఎందుకో అర్థంకాలేదు  అవంతిక,”  ఆశ్చర్యపోతూ అంది.

“ ఎందుకంటే    ప్రతీది  భూతద్దంలో  చూసే అలవాటు నీకు  చిన్నప్పటినుండి  ఉంది,

అసలు  విషయం తెలుసుకోకుండా  తొందరపడి  జీవితాన్ని  ముక్కలు చేసుకుంటే  నష్టపోయేది  నువ్వే,  ఆవేశం ఎన్ని అనర్థాలకు  దారి తీస్తుందో  ఇప్పుడు తెలియదు,

జీవితం  చేజారిపోయిన తరువాత  ఎంత బాధపడినా  తిరిగి దొరకదు, నువ్వు  కొంచెం ఓపికగా  సాకేత్  చెప్పేది  విని  ఉంటే  ఇలా  నా దగ్గరకు వచ్చేదానివి కాదు,” అంటూ సాకేత్

చెప్పినదంతా చెప్పింది  అవంతిక.  అంతా విన్న మౌనికకుదుఃఖం ఆగడంలేదు.

ఎంత పొరబాటు చేసాను  సాకేత్   మనసు గాయపరిచాను. నేను ఒక్క క్షణం  తను చెప్పేది వినకపోవడం  నా తొందరపాటు.  సాకేత్  నా కోసం  రాక ముందే  నేను  వెళ్ళి  నన్ను క్షమించమని అడగాలి  అనుకుంది మనసులో.

“ అవంతిక …  నేను తప్పుచేసాను   ఇప్పుడే వెళ్ళి  సాకేత్ ను తప్పయిందని  చెబుతాను,

నువ్వు  చేసిన సహాయానికి  చాలా చాలా కృతజ్ఞతలు  నువ్వే గనుక  సాకేత్ తో మాట్లడకపోయినట్టయితే , మా మధ్యలో   చాలా  అగాధం  ఏర్పడేది  నేను నీ దగ్గరకు రావడం   మంచిదైంది,” అంటూ  అవంతిక  రెండు చేతులు పట్టుకుని  ఆనందంతో కళ్ళకద్దుకుంది  మౌనిక.

“ సరే  నువ్వన్నట్టుగానే  మీ ఆయన దగ్గరకు వెళుదువుగాని, కాకపోతే  రేపు మనం ఒక దగ్గరకు వెళ్ళి  అటునుండి అటే వెళ్ళపోదువుగానీ,  ఈ ఒక్కపూటకు  మీ ఆయనేం కరిగిపోడులే  రేపు జాగ్రత్తగా మీ ఆయనకు అప్పచెబుతాను, ఈ రాత్రంతా మీ ఆయన గురించి కమ్మటి కలలు కంటూ ప్రశాంతంగా నిద్రపో,” అంది పరిహాసమాడుతూ.

“ కానీ … పాపం ఆయన  ఎంత బాధపడుతున్నారో  నా గురించి,” అంది పరధ్యానంగా.

“ అబ్బో … ఇప్పుడు మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావు, మరి ఇంతకు ముందు వరకు మీ ఆయన గుర్తుకు రాలేదా, నేను చెప్పానా మీ ఆయన  చాలా బుద్ధిమంతుడని, ఎంత మంది ఆడవాళ్ళు వల విసిరినా  చెదరని   మనసు మీ ఆయనది,  నీకు తెలుసా మౌనిక  మీ ఆయనకోసం  నేను పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయానని, నా మొదటి  ప్రేమికుడు మీ ఆయనే,  కాకపోతే  నాది  ఒకవైపు నుండే ప్రేమ, అతనిని ఎంత ప్రయత్నం చేసినా అతన్ని గెలుచుకోలేకపోయానంటే  నువ్వు నమ్ముతావా?  అందుకే  ఇప్పటివరకు  నాకు  సాకేత్ వంటి  మనిషి  దొరకలేదు,  నేను నా మనసు ఎప్పుడో అతనికి అంకితమైంది  ఇప్పుడు నాకు ఇంకేది అవసరంలేదు మౌనిక,”  చెబుతూ నిద్రలోకి జారిపోయింది అవంతిక.

మౌనిక  వింటుదనుకుని  మొత్తం చెప్పాననుకున్నది కానీ , మౌనికకు  అలసిన మనసు తొందరగానే నిద్రపోయింది  అవంతిక చెప్పేది వినకుండానే.

“ అవంతిక … ఇదేంటి  ఇక్కడకు  తీసుకవచ్చావు,   ఇది ఆ బాబు ఉన్న  అనాథశరణాలయం  కదా! ఇక్కడికెందుకు  వచ్చాము,” ఆశ్చర్యంతో అడిగింది.

“ కాస్త ఓపికపట్టు  తల్లి అటువైపు చూడు,” అంది  వేలు చూపెడుతూ.

 ఆశ్చర్యంతో పాటు ఆనందమేసింది  గబగబా పరుగెత్తింది అటుగా వస్తున్న సాకేత్ ను చూసి.

తండ్రిని చూడగానే  మౌనిక  చేతిలో  ఉన్న బాబు  నవ్వుతూ  “నాన్న “ అంటూ ముద్దుగా పిలిచాడు.

“ ఏమండీ… మౌనిక…,” అంటూ  ఇద్దరూ ఒకేసారి పిలుచుకున్నారు. బాబును చేతిలోకి తీసుకున్నాడు  సాకేత్. మౌనికను దగ్గరకు తీసుకుంటూ “ మౌనిక … నా మీద కోపం పోయినట్టేనా,” నవ్వుతూ అడిగాడు . అదేంటి నేనింకా  తనకు చెప్పనేలేదు ఎలా తెలిసింది అనుకుంటూ  అవంతిక వైపు చూసింది. కళ్ళతోనే సైగ చేసింది  నేను చెప్పాను అని .

లత లాగా అతన్ని అల్లుకుపోయింది  మౌనిక .  “ మౌనిక  … ఇది మీ ఇల్లు కాదు కాస్త వదిలిపెట్టు  మీ ఆయనను అంది,” నవ్వుతూ అవంతిక. సిగ్గపడుతూ దూరంజరిగింది మౌనిక.

“ అవంతికా … ఇదిగో  ఈ బాబుకు  ఇక నుండి    తల్లి తండ్రి అన్ని నువ్వే, నీ కొడుకుగా వాడికి ఏ కష్టం రాకుండా  చూసుకునే  బాధ్యత నీది, అంతేకాదు  ఈ బాబు  విషయంలో

మన మధ్య  ఎలాంటి రాకపోకలు  ఉండకూడదు,  ఎందుకంటే  మీ ఆడవాళ్ళు ఎప్పుడు

ఎలా మారిపోతారో   మౌనికను చూసాక అర్థమైంది,  నువ్వు అడిగావు కాబట్టి  ఈ బాబు సంరక్షణ నీకు  అప్పచెబుతున్నాను, ఇప్పటికి  ఈ బాబు  అదృష్టవంతుడని అనుకుంటున్నాను ,” అంటూ బాబుకు సంబంధించిన  సర్టిఫికెట్లన్ని  అవంతికకు అప్పచెప్పాడు . సంతోషంతో బాబును దగ్గరకు తీసుకుని ముద్దాడింది అవంతిక.

విషయం అర్ధం చేసుకున్న మౌనిక  తృప్తిగా  అవంతిక వైపు చూసింది. తన జీవితాన్ని

చెదిరిన స్వప్నంలా మారకుండా చేసిన అవంతికకు మనసులో  వేయి మార్లు కృతజ్ఞతలు చెప్పుకుంది.    జీవితంలో సాకేత్  ప్రేమను పొందలేకపోయినా  సాకేత్  కొడుకుగా  పేరున్న  బాబును తన కొడుకుగా  తీసుకుని  అందులోనే తృప్తిపడాలి అని అనుకున్నది

అవంతిక.  అవంతిక  నీవు నన్ను ప్రేమించానని చాలా సార్లు చెప్పావు కానీ నేను నీ ప్రేమను అంగీకరించలేకపోయాను, అయినా నువ్వు అదేది మనసులో పెట్టుకోకుండా నా జీవితం బాగుండాలని నువ్వు  చేసిన సహాయం  మరిచిపోలేను నీకు  చాలా  కృతజ్ఞతలు అవంతిక

కళ్ళతోనే   చెబుతూ అవంతిక వైపు చూసాడు.  నీళ్ళు నిండిన కళ్ళతో ఆప్యాయంగా చూసింది సాకేత్ వైపు . ఇదేమి గమనించని మౌనిక  భర్త చేతిని పట్టుకుని బాబును ఎత్తుకుని అక్కడనుండి వెళ్ళిపోయింది.

***********     *********      ********     ********

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శబరి

by రంగరాజు పద్మజ November 30, 2024
written by రంగరాజు పద్మజ

 సేవ అనేది అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమ ధర్మం. మన ఈ భారతదేశంలో కుల,మత, జాతులకు అతీతంగా సేవాగుణం గురించి బోధించి, ఆచరణలో పెట్టి సేవాధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. సేవ అనేది ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే నిజమైన సేవ. పేరు కోసం పాకులాడి చేసే సేవలో స్వార్ధం ఉంటుంది.
మానవాళి ఎలా జీవించాలో నేర్పింది రామాయణం. చిన్న చిన్న కథల ద్వారా, వ్యక్తుల ద్వారా సేవా ధర్మాన్ని అంతగా చదువుకోని వారికి కూడా తెలిసేలా వివరించింది. సమాజంలో ఒకరికొకరి మధ్యన సేవాగుణం ఉంటేనే బంధాలు నిలుస్తాయి.
సేవలు ఎన్నో రకాలుగా చేయవచ్చు. రోగులు, అనాధ శిశువులకు, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం మొదలైనవెన్నో ఉన్నాయి.
సేవ చేయడంలో సేవలు పొందినవారే కాక- సేవలు అందించిన వారికి కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఒకసారి అనుభవంలోకి వస్తే పదే పదే సేవలు చేయాలని అనిపిస్తుంది. సేవ చేయడానికి స్వార్ధం వదిలితే చాలు!
అటువంటి సేవా గుణాన్ని శబరి పాత్ర ద్వారా రామాయణం చెప్తుంది.సేవాగుణం పెంపొందించేలా మాటిమాటికి చెప్పకపోతే మానవ మనస్తత్వాలు, విద్రోహ చర్యలు ఎక్కువగా పెరిగిపోతున్న ఈ రోజులలో సేవాధర్మం పెంచి, సత్ప్రవర్తన అలవర్చుకొనే దిశగా సాగాలి.
శబరి  బోయ  జాతిలో పుట్టిన పరమ భక్తురాలు. భక్తికీ, ప్రపత్తికీ… పరాకాష్టగా  నిలిచి, నిష్ఠతో రాముని పూజించి తరించిన  మహిళా భక్తురాలు ..
నవ విధ భక్తి  మార్గాలలో తరించినవారుగా పేరు పొందిన వారిలో…. శ్రీరాముడి కథ వింటూ  ప్రేమించిన వాడు హనుమంతుడు,  కీర్తించి తరించిన వాడు వాల్మీకి. పాదుకా సేవ చేసి తన భక్తిని లోకానికి తెలిపిన వాడు భరతుడు… ఇలా రామాయణంలో ఎందరో భక్తులు మనకు దర్శనమిస్తారు… అందులో రాముని పూజించి తన్మయురాలయింది ‘శబరి’.
శబరికి జన పదాలలో జీవితం కృత్రిమంగా కనపడటంతో ఆ జీవితం నచ్చక  అడవిలో కాలం గడుపుతూ… అక్కడి మునులను, ఋషులను దర్శిస్తూ… వారు భగవంతుడి గురించి చెప్పే  బోధనలు వింటూ… చూస్తూ గడుపుతుంది… ఎందుకంటే ఆ కాలంలో మహిళలను ఆశ్రమాలలో  ఋషులు చేర్చుకోక పోయేవారు… అయినా ఆమె మతంగ మహాముని తన గురువుగా భావించి, ఆ గురువుగారి ఆశ్రమాన్ని
మతంగముని సమిధల కొరకు, పూలు పండ్లు, దుంపల కొరకు వెళ్ళినప్పుడు చక్కగా శుభ్రపరిచి ప్రాంగణమంతా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేది.. ఇలా ఎన్నో రకాల సేవలు చేసేది.


పంపా సరస్సుకు వెళ్ళే తోవలో ముళ్ళు, రాళ్లు లేకుండా  దారి అంతా బాగు చేసేది. ఇదంతా గురువుగారి కటాక్షం ముఖ్యమని, రాముడి దర్శనం కావాలంటే గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడిని పొందాలని ఆమె ఎంపిక చేసుకున్న  ప్రపత్తి మార్గము.
మతంగ మహాముని శబరితో రాముడు వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు… రాముడిని దర్శనం చేసుకొమ్మని చెప్పి, మతంగముని ఆయువు తీరడంతో ఆయన దేహాన్ని చాలిస్తాడు. ఆనాటి నుండి 14 సంవత్సరాలు నిరంతరంగా రామనామం చేస్తూ… రాముడి కొరకు ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది శబరి.
రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ పంపా తీరానికి వచ్చే  తోవలో వృద్ధురాలై,  వంగిపోయిన నడుముతో, తలంతా నెరసి, కళ్ళు కనిపించక, చేతులు నొసట ఆనించుకుని  చూస్తూ… వణుకుతున్న చేతులతో ఒక పండ్ల బుట్టను పట్టుకొని వస్తూ కనిపించింది.
ఆమె ఎదురుగా ఆజానుబాహులైన  సుందరమైన రామలక్ష్మణులను చూసింది…. వీరే మునులు చెప్పిన రామలక్ష్మణులనుకున్నది… చేతిలోని బుట్టను కింద పెట్టి నమస్కరిస్తూ….
రామా! రామా!  నా తండ్రీ ! అని పిలుస్తూ కనపడిన శబరిని చూసి లక్ష్మణుడు రాక్షస స్త్రీ మనుష్య  రూపంగా వచ్చిందని అంటాడు. రాముడికి మాత్రం ఆమె రాక్షస స్త్రీ కాదని… సరే గమనిద్దాం… అనుకొని ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని కూర్చున్నారు… ఆ పక్కనే శబరి కుటీరం ఉన్నది.
వచ్చింది రామలక్ష్మణులే అని శబరి అనుకొని రాముడి పాదాల మీద పడి ఏడుస్తూ…. నాయనా నీ భార్యను రాక్షసుడు అపహరించాడట కదా!  అయినా సీతమ్మ నీ దగ్గరికి వస్తుందని రాముడిని ఓదారుస్తుంది…
ఇది కూడా సేవాభావమే! ఆపదలో ఉన్నవారికి ఓదార్పు నివ్వడం నిజమైనసేవే!!
నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను.. నా గురువుల అనుగ్రహమే మీ దర్శనం అయిందని కళ్ళల్లో నీరు ధారగా కారుతూండగా… నాయనా నా కుటీరంలోకి రాండి… కాసేపు విశ్రమిద్దురు  అని, పళ్ళ బుట్టను చేతిలో పట్టుకొని కుటీరం వైపు తోవ చూపిస్తూ ఉండగా.. అమ్మా!  నీ గురువు ఎవరు? అని అడుగుతాడు రాముడు.
నా గురువు  మతంగ ముని… ఆయన నీ గురించి చెప్పి నువ్వు ఇక్కడే ఉండు… శ్రీరాముడు వస్తాడు సేవలు చేయమని చెప్పగా ఆనాటినుండి మీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పింది శబరి.
రాముడి కొరకు రోజూ చెట్టుచెట్టు కూ తిరిగి తీయని మామిడి పండ్లు తాను రుచి చూసి, బాగుంటేనే రాముడి కొరకని అలా నైవేద్యం పెట్టేది..
రాముడు పండ్లు తింటూ రాముడు నీ మనసు వలనే ఈ పండ్లు కూడా తీయగా ఉన్నాయి… ఎందుకంటే భక్తిశ్రద్ధలతో ఇచ్చిన పండ్లు ఇవి అని  రాముడుతింటూ ఉంటే… లక్ష్మణుడికి చాలా సంతోషం కలిగింది… ఎందుకంటే సీతా వియోగం జరిగినప్పటి నుండి రాముడు ఆహారం తీసుకోలేదు. శబరి ప్రేమతో కూడిన భక్తితో ఇవ్వడం వలన తింటున్నాడని సంతోషం…(ఇది లక్ష్మణుని సేవాగుణం)
శబరి కూడా 14 సంవత్సరాలుగా  రోజూ రాముడికని పండ్లు ఏరుకొని తేవడం, నివేదించడం…( ఏదేని పని తలపెడితే కొద్ది రోజులు ఉత్సాహంగాఆ పని చేయడం, తరువాత ఆ పనినుండి పక్కకు వైదొలగడం కాకుండా ఆ పని అయ్యేటంత వరకూ దీక్ష వలె చేయడం అనేది కార్యసాధకుల గొప్ప లక్షణం…ఇదిఆచరణీయం…)
ఎదురు చూసి ఎదురు చూసి రాముడు రాకపోయేసరికి.. రాముని ప్రసాదంగా ఆ పళ్ళను తానుతిని, మళ్లీ తెల్లవారి మంచి పండ్లు  ఏరుకొని తెచ్చి పెట్టేది.
శబరి రాముడితో నేను బోయ జాతిలో పుట్టాను. నేను చదువుకున్న దాన్ని కాదు, పెద్దగా విషయాలు తెలియవు, మంచిగా మాట్లాడటం కూడా రాదు… అయినా రామా!… నామీద దయ తలచి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు… నా అదృష్టం సుమా!( వినయప్రకటనం- గ్రహించవలసిన విషయం)
ఏదీ?  నీ పాదాలను చూడనీ!  అయ్యో! రాళ్లు ముళ్ళు గుచ్చుకొని, నీ పాదాలు వాచి పోయాయి అంటూ… తన పమిట కొంగును నోటికి చేర్చి ఆవిరిపట్టి వేడి కాపు రాముడి పాదాలకు పెట్టింది…( ప్రేమ తత్త్వం) అయినా రామా!   మీకూ.. మాకూ ఎప్పటినుండో సంబంధంఉంది . నీ పాదాలను తాకే అధికారం మా బోయల కే ఉంది… ఒక నాడు గుహుడికి నీ పాదాలను  కడిగే భాగ్యం, గౌరవం దక్కింది.. ఆ గుహుడు మా జాతి వాడే.. కాబట్టి  శ్రీరామ చరణాలు  తాకె అదృష్టం భిల్ల వంశీయులకే  ఉంది.. ( హక్కులు తెలుపడం- తెలుసుకోవడం)దానికి కారణం.. ఆచార్య కటాక్షమే కారణం అంటుంది. ( గురుభక్తి)
ఆమె ఆర్తి చూసిన రాముడు తనకు భక్తి మాత్రమే ముఖ్యమని, జాతి, వంశాలతో నాకు అవసరం లేదు అని అంటాడు.(జాతి వివక్షత లేకపోవడం )భక్తి లేని వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టి నా… ఎంత గొప్పవాడైనా నాకు దగ్గర కాలేడు.
నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించావు కాబట్టి ధన్యురాలువి అన్నాడు రాముడు.
భగవంతుడు భక్తినే చూస్తాడు… కానీ జాతిని చూడడు కదా!  భగవంతుని పొందుటకు… భగవంతుడే ఉపాయమని నమ్మినవారిని ప్రపన్నులని అంటారు.( ప్రపన్నతనే భక్తి తో భగవంతుని కరుణాకటాక్షం పొందగలుగుతాం)భగవంతుని పొందుటకు ఆచార్యుడే
ఉపాయమని విశ్వసించిన శబరి అంతకన్నా ఒక మెట్టు పైనే నిలుచున్న భక్తురాలు. ఆమె ఆచార్య కటాక్షం, భగవత్ కటాక్షం రెండూ ఆచరించి.. మోక్షం పొందడానికి కావలసిన ఆరెండు ముఖ్య సాధనాలను స్వంతం చేసుకున్న శబరి…యోగంతో అగ్నిని పుట్టించుకొని, రామలక్ష్మణుల ఎదుటనే యోగాగ్నిలో ప్రవేశించి, పరమపదము పొందిన శబరి ధన్యురాలు.
భక్తి, ప్రపత్తులకు సేవకూ పరాకాష్ట శబరి వృత్తాంతం…
శబరి నదిగా మారిందని అనడంలో కూడా సేవ అనేదిఏ ఒక్క రోజో చేసి ఊరుకునేది కాదనీ, నిరంతరం నది ఎలా ప్రవహిస్తుందో…సహజంగా అలాగే సేవా గుణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలని సూచించే శబరి కథ ఆనాటికీ – ఈనాటికీ ఆచరణీయం!
చిన్న ఆఖ్యానంలో దార్శనికులైన ఋషులు లక్ష్యం ఏర్పరుచుకోవడం, దానికై శ్రద్ధగా శ్రమించడం, సేవాతత్పరత, ప్రేమ, భక్తి….రామునిలో ఐక్యమైనదంటే ఈ గుణాలన్నీ రాముడిని కూడా కదా! అలా మంచి మార్గం చూపేవారి భావాలతో, చేతలతో మమేకవడమే కదా!
శబరిలోని ఏ ఒక్క గుణం మనం స్వీకరించి పాటించినా మన జన్మ ధన్యమే కాకుండా… సమాజ అశాంతి, అల్లరుల నుండి బయటపడడమే కాకుండా మంచి లక్ష్యాలతో ముందుకు సాగవచ్చు.
పురాణ కథలను యథాతథంగా చదవడం మంచిదే ఐనా అంతరార్ధం గ్రహిస్తే ఋషుల ప్రయత్నం ఫలించినట్టే….

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సాగిపోవాల్సిందే జీవితం!

by Acharya Veerareddy November 30, 2024
written by Acharya Veerareddy

సూర్యచంద్రుల సాక్షిగా

నిత్యం రగులుతున్న భూగోళం

పొంతన కుదరని దాని ఉపరితలం. 

అగాథ జల నిధితో

అవగాహనకు అందని సముద్ర గర్భం.  

ఉరుములు మెరుపులతో  

అగ్నిధారలు కురిపిస్తున్న

యుద్ధ మేఘాలతో

ఆవృతమైన ఆకాశం ఒక వైపు.   

ఇవేమీ పట్టనట్టు

గుంపులు గుంపులుగా ఎగురుతున్న

శాంతి కపోతాలు మరో వైపు. 

అయితేనేం..

సాగిపోవాల్సిందే జీవితం!  

ఎప్పటికీ ఏదో ఓ సందోహం

ఓ రెండు దేశాల నడుమ.  

కారణం కానరాకున్నా  

విరమణ ఎరుగని మారణకాండ.  

నాడే కాదు నేడూ

ప్రపంచ శాంతికి మనుగడ లేదు.

అయితేనేం..

ఆగిపోవాలా జీవితం?

నాటుకున్నది మొలకెత్తక మానదు

రాజుకుంటే విస్ఫోటనం తప్పదు.

వీచే గాలిలా ప్రవహించే నీటిలా  

జనన మరణాలూ సహజం!

ప్రకృతి పొట్టలో జరిగే పరిణామాలు

పరిపాటే కదా సంభవించడం.

ఉత్పత్తులతో పాటు

విపత్తులూ సహజం.

ఒకప్పుడు వెలసిన కంచెలన్నీ  

కాలక్రమేణా తొలగడం సహజం.   

చిరునామా లేకుండా

మసకబారి పోవడమూ సహజం.    

అయితేనేం..

సాగిపోవాల్సిందే కదా జీవితం!

నిప్పుకు కాల్చే గుణం

నీటికి ఆర్పే గుణం

రెండూ తలపడితే తప్పదు  

గెలుపోటములకు దాగుడుమూతలు.  

గాజుకు పగిలే గుణం

రాయికి తగిలే గుణం

దేని హద్దుల్లో అది ఉన్నంతకాలం  

లోక కళ్యాణానికి ఉపయోగకరం.

కండబలం, బుద్ధిబలం

వేటికవే గెలుపు గుర్రాలు.

విడివిడిగానో, కలివిడిగానో

సమయోచిత ఉపయోగం నిర్మాణాత్మకం.

చలనమే జీవితం!  

చల్నేకా కామ్ గాడీకా 

చలానేకా కామ్ ఆద్మీకా!

కిసీభీ హాల్మే గాడీ చల్నా హై తో

చలానేకా ఆద్మీ రహ్నా

జరూరీ హై హమేషా!

–       ఆచార్య కడారు వీరారెడ్డి; 9392447007

November 30, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మనుషుల్లా కాసేపు

by కుడికాల వంశీధర్ November 30, 2024
written by కుడికాల వంశీధర్

రోజు రోజుకీ
పెరుగుతున్న కృత్రిమ మేధతో
పరికరాలు స్మార్ట్ అవుతున్నాయి
మన రోజువారీ కార్యక్రమాలు అవే చూస్తున్నాయి.

దైనందిన జీవితాల్లోకి చొరబడి
సంభాషణలను, జీవనశైలిని,
గోప్యతలేని గతాన్ని తోడుకొని
భవిష్యత్తుని అంచనా వేస్తుంది.

అమ్మ పుట్టిన రోజు అంటే
కృత్రిమ మేధ కొలువైన మొబైల్ ఫోన్
కేక్‌తో బొకే ఆర్డర్ చేసి పంపిస్తానన్నది,
సర్‌ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేయమన్నది
కానీ
అమ్మతో మాట్లాడి
వీలైతే దీవెనలందుకో అనలేదు.

ఎవరి కెప్పుడు డబ్బు జమ చెయ్యాలో,
ఎవరు ఎంత ఇవ్వాలో
ఇలాంటివి ఎన్నైనా
కృత్రిమ మేధ లెక్కలు ఖచ్చితమైనవే కావచ్చు,
దాని సూచనలు సమర్థవంతమైనవై ఉండొచ్చు
అయినా
గత నెలలో
చేబదులు తీసుకున్న మిత్రుడు
డబ్బెందుకు తిరిగి ఇవ్వలేదో
కారణం అర్థం చేసుకోలేదు.

కరిగే హృదయం లేనిది కదా
మనుషుల భావోద్వేగాలను పట్టుకోలేదు.

నేను కృత్రిమ మేధస్సును
ద్వేషించడం లేదు
ప్రకృతి సిద్ధమైన స్పందనల అనుభూతిని,
మనిషిలోని చైతన్యాన్ని
వాటితో పొందలేము.

అన్నింటా తానై
కృత్రిమ మేధస్సు వికృతంగా నవ్వక ముందే
ప్రత్యామ్నాయ సాంకేతికత లేని
మనిషి సాంగత్యాన్ని నేను కోరుకుంటాను.

ఫోన్‌లో వద్దు మిత్రమా!
మనుషుల్లా కాసేపు
కలిసి

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

అన్నదమ్ముల ఆదర్శం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, November 30, 2024
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

         అది నరసింహపురం లోని ఒక పాఠశాల.   అక్కడికి రంగయ్య తాత  వచ్చి రాఘవయ్య మాస్టారుతో  “మాస్టారూ! మీ తరగతిలో అందరికన్నా ఎక్కువ మార్కులు సాధించిన  ఒకే ఒక్క ఉత్తమ  విద్యార్థికి నేను బహుమతిని ఇవ్వదలుచుకున్నాను.   వారెవరో మీరు నిర్ణయించండి “అని అన్నాడు.   రాఘవయ్య మాస్టారు ఆలోచనలో పడి  సరేనన్నాడు . 
        ఆయన తరగతి మాస్టారుగా ఉన్న ఐదవ తరగతిలో   రాము ,సోము అనే ఇద్దరు విద్యార్థులు  ఉండేవారు. వారు అన్నదమ్ములు మరియు కవలలు కూడా!   వారిద్దరూ  పోటీపడి చదివే వారు.    వారితో పాటు ఆనంద్ అనే విద్యార్థి  కూడా వీరికి పోటీగా నిలిచేవాడు.   రాఘవయ్య మాస్టారు రంగయ్యతో “సరేనండీ!  వారెవరో  నిర్ణయించిన తర్వాత మీకు కబురు చేస్తాను “అని అన్నాడు.   రంగయ్య తాత  అక్కడి నుండి వెళ్ళిపోయాడు .
       రాఘవయ్య మాస్టారు పిల్లలకు ఎన్నో రకాల పరీక్షలు పెట్టాడు.   అన్నింటిలో రాము ,సోము ప్రథములుగా నిలిచారు.     వారిలో ఎవర్ని  ప్రథములుగా నిర్ణయించాలో మాస్టారుకు అంతుపట్టలేదు.  చివరికి  ఆయన ఒక గదిలో  ఒంటరిగా కూర్చుండి రామును  పిలిపించాడు.  ” ఒరేయ్ !  నేను ఒక బహుమతిని నీకు ఇప్పించాలని అనుకుంటున్నాను .  అది నీకు ఇప్పించాలా!  మీ తమ్మునికి ఇప్పించాలా!” అని అడిగాడు.  అప్పుడు రాము ” మాస్టారూ!  ఆ బహుమతిని  మా తమ్మునికే  ఇప్పించండి”అని అన్నాడు.  అప్పుడు రాఘవయ్య మాస్టారు ” అది నీకు ఎందుకు వద్దురా!” అని ప్రశ్నించాడు.  అప్పుడు రాము ” మాస్టారూ! మా తమ్ముడు  చాలా మంచివాడు.   నేను చెప్పింది వింటాడు. అందువల్ల అతనికే ఇప్పించండి ” అని అన్నాడు. 
        ఆ  తర్వాత మాస్టారు సోమును తన గదికి పిలిపించి అతనిని  ఇదే ప్రశ్న అడిగాడు.   అప్పుడు సోము  “మాస్టారూ!  ఈ బహుమతి నాకు వద్దు.  మా అన్నయ్యకే ఈ బహుమతిని ఇప్పించండి.   ఎందుకంటే మా అన్నయ్య నాకు తాను తినకుండా చాక్లెట్లు,  ఐస్ క్రీములు నాకోసం దాచిపెట్టి  ఇస్తాడు .  తాను డబ్బుతో ఏమి  కొనుక్కున్నా లేదా ఎవరైనా అతనికి తినుబండారాలు ఇచ్చినా  వాటిలో ఎక్కువ భాగం  నాకే ఇస్తాడు” అని అన్నాడు.   మాస్టారుకు  ఏమి చేయాలో పాలు పోలేదు. 
          వెంటనే  మాస్టారుకు   ఒక ఆలోచన వచ్చింది .   అతడు వెంటనే  రంగయ్య తాతను పిలిపించి  తాతతో ” తాతా!  వారిద్దరూ సమానస్కందులే.   వారిద్దరిలో ఈ బహుమతిని ఎవ్వరికీ ఇవ్వాలో  నాకు అర్థం కావడం లేదు.  మీరే నిర్ణయించండి .  ఎందుకంటే వారిద్దరికీ మార్కులు సమానంగా వచ్చాయి.    దానితోపాటు వారిద్దరి స్వభావం కూడా  ఇతరులకు ఆదర్శంగా  ఉంది . వారిద్దరిలో ఒక్కరిని నిర్ణయించడం  నాకు చాలా కష్టంగా ఉంది “అని అన్నాడు.    అప్పుడు రంగయ్య తాత ”   అయ్యో మాస్టారూ!  ఈమాత్రం దానికి నన్ను అడగడం దేనికి?   ఆ ఇద్దరికీ  బహుమతులను ఇవ్వండి.   నేను నాకు తెలియక ముందు ఒక్కరికే అన్నాను.   ఎలాగూ ఆర్థిక సాయం చేసెందుకు   నేను ఉన్నాను కదా! పిల్లలను అలా నిరాశపరచకండి .  వారిద్దరూ చాలా ఉత్తములైన విద్యార్థులు.   అంతేకాదు. ఇతరులకు  ఆదర్శంగా ఉండే అన్నదమ్ములు.  అన్నదమ్ములంటే అలా ఉండాలి “అని ఆ ఇద్దరికీ బహుమతుల కొరకు డబ్బును ఇచ్చి వెళ్ళాడు .  మరునాడు  మాస్టారు  ఆ బహుమతులను రాము ,సోములకు ఇస్తూ  ”  వీరిద్దరూ అన్నదమ్ములందరికీ  ఆదర్శం ” అని అన్నాడు.  అప్పుడు తరగతి పిల్లలు  వారిద్దరిని  కరతాళ ధ్వనులతో మిక్కిలి అభినందించారు.

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అభ్యాసకుల కరదీపిక “తెలుగుబడి బాలవాచకం”

by Kukatla Sai November 30, 2024
written by Kukatla Sai

కమ్మనైన భాష అమ్మభాష. మధురమైన భాష మన మాతృభాష. తీయనైన భాష తెలుగుభాష. తేనెలొలుకు భాష మన తెలుగుభాష అని వేనోళ్ళ కొనియాడబడిన భాష. ఆంధ్రభోజుడుగా గణుతికెక్కిన శ్రీకృష్ణదేవరాయలు “దేశభాషలందు తెలుగు లెస్స” అన్నారు. ప్రముఖ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి “సుందర తెలుంగు తెలుగు” అని తెలుగుభాష గొప్పదనాన్ని చెప్పారు. “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అని ఇటలీ దేశస్థుడైన నికోలా డి కాంటి తెలుగు భాషను కొనియాడినారు. అజంత భాష మనది. అమృత భాష మనది. అట్లాంటి తెలుగు భాషను మన పిల్లలు దోషరహిరంగా చదువలసిన అవసరాన్ని, తప్పులు దొర్లకుండా రాయవలసిన ఆవశ్యకతను రచయిత కూకట్ల తిరుపతి “తెలుగుబడి బాలవాచకం” ద్వారా నొక్కి చెప్పారు. అందు కోసమే ఈ చిరు పొత్తాన్ని మన ముందుంచారు. ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభావం వల్ల అందరూ అన్యభాషైన ఆంగ్లం మోజులో పడి, అమ్మభాషను అభాసుపాలు చేస్తున్న క్లిష్ట సందర్భంలో ఉన్నారు. అంతర్జాతీయంగా అనుసంధానం చేసే ఆంగ్లభాషను నేర్చుకోవడం మంచిదే కావచ్చు కానీ మన తల్లిభాషను మరచిపోతే తెలుగుజాతి మనుగడకు ముప్పు తప్పదని రచయిత నొక్కి వక్కానించారు. తెలుగు భాషను సులభంగా చదువ, రాయ నేర్చుకోవడానికి కవి, రచయిత కూకట్ల తిరుపతి తెలుగుబడి బాలవాచకం అనే పుస్తకాన్ని చక్కగా రూపొందించారు. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈయన పెద్దపల్లి జిల్లా, మండలంలోని మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ పుస్తకం ద్వారా పిల్లలు తెలుగు భాషను దోషరహితంగా చదువడం, రాయడంను సులువుగా నేర్చుకోవచ్చు. ఇందులో సరళపదాలు, గుణింతపదాలు, ద్విత్వాక్షరపదాలు, సంయుక్తాక్షరపదాలు, సంశ్లేషాక్షరపదాలు మరియు ఆ పదాలతో కూడిన వాక్య రచనలను సోదాహరణంగా వివరించిన తీరు పాఠకులను ఆకర్షిస్తుంది. ఇదే వరుస క్రమంతో, పద పద్ధతిలో తెలుగు భాషను సులభంగా అభ్యసించవచ్చు. ప్రతి అంశంలో వాక్య నిర్మాణాన్ని కూడా తేలికగా చేసి చూపించారు. వీటికి సంబంధించిన డిజిటల్ పాఠాల క్యూఆర్ కోడ్లను ఆయా పాఠాల దగ్గర పొందుపరచడం విశేషం. పాఠకుడు స్వయంగా ఈ పుస్తకంలోని పాఠాలను చదువుకోవచ్చును. అలాగే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ పాఠాలను చూస్తూ, వింటూ భాషను సొంతంగా నేర్చుకోవడానికి అనువుగా ఈ పుస్తకాన్ని రచయిత కూకట్ల తిరుపతి అభ్యాసకులకు అనుకూలంగా మలచినారు. ఇలా సాంకేతిక పరిజ్ఞానం జోడించబడడం పుస్తక ప్రపంచంలో కొత్తదనంగా భావించవచ్చు. తెలుగు భాషలో సులభతరం నుంచి కఠినతరం వైపుగా బోధనాభ్యసన ప్రక్రియను కొనసాగించడానికి వీలుగా ఈ పుస్తక రూపకల్పన చేశారు.

తెలుగు భాషను చదువడం, రాయడం నేర్చుకున్న తర్వాత తెలుగు వాడిగా జీవించడానికి పనికి వచ్చే పాఠాలను ఇందులో పొందుపరచడం ముదావహం. తెలుగు పండుగలు, మన ఆటలు, తెలుగు సామెతలు, తెలుగు జాతీయాలు, పొడుపు కథలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, కార్తెలు, మాసాలు, ఋతువులు, కాలాలు, ఆయనాలు, తెలుగు సంవత్సరాలు, తెలుగు అంకెలను అందుబాటులో ఉంచారు. ఇప్పటి తరానికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉన్నది. తెలుగు భాషను నేర్చుకోవడంతో పాటు తెలుగువాడిగా జీవించడానికి, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను అలవర్చుకోవడానికి, అనువుగా ఈ పుస్తక రూపకల్పన జరిగిందని చెప్పవచ్చు. ఈ పుస్తకానికి భావస్పోరకమైన ముఖచిత్రాన్ని కూకట్ల సాయి భారవి అందించారు. ఈ చిరు పొత్తానికి విశేషమైన ప్రజాదరణ లభించడాన్ని బట్టి చూస్తే, మాతృభాషాభిమానం ఇంకా సన్నగిల్లడం లేదనిపిస్తున్నది. మన దేశంలోని ముంబై, చెన్నై, రాజస్థాన్, న్యూఢిల్లీ తదితర ప్రాంతాలలోని తెలుగువారితో పాటు అమెరికా, మయన్మార్, దుబాయ్ మొదలైన దేశాలలోని ప్రవాస తెలుగువారి నుంచి ఈ పుస్తకానికి విశేషమైన స్పందన లభించడం అభినందనీయం. దక్షణాఫ్రిక దేశంలోని ప్రవాస తెలుగు పిల్లలకు తెలుగు పాఠ్య పుస్తకంగా తెలుగుబడి బాలవాచకంను వినియోగించుకోవడం గర్వకారణం. తీయనైన తెలుగు భాష మూలాల్లోకి వెళ్ళి, తెలుగును తేలికగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది. ప్రతి తెలుగువాడు చదవవలసిన పుస్తకమిది. ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకం తెలుగుబడి బాలవాచకం. మాతృభాషాభిమాని, తెలుగుభాషోద్యమకారుడు, తెలుగుభాషోపాధ్యాయుడు, కవి, రచయిత కూకట్ల తిరుపతి కలం నుండి తెలుగుభాషకు సంబంధించిన పుస్తకాలు ఇతోధికంగా వెలువడాలని కోరుకుంటున్నాను. మాతృభాష పరిరక్షణ కోసం పాటుపడుతున్న కూకట్ల తిరుపతి గారికి అభివాదాలతో కూడిన అభినందనలు, శుభాకాంక్షలు.

తెలుగుబడి బాలవాచకం
రచయిత: కూకట్ల తిరుపతి
వెల : 80/-
పుటలు: 79
ప్రతులకు: కూకట్ల లక్ష్మి,
ఇ.నం: 08-03-207/4/2/ఇ/1, రోడ్డు నం.07,
వాసుదేవ కాలని, కట్టరాంపూర్, కరీంనగర్.
పిన్: 505001. తెలంగాణ రాష్ట్రం. చేబలుకు: 9949247591.

November 30, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

నేస్తమంటే…..

by Ramesh November 30, 2024
written by Ramesh

సైకిల్ తోలడమైనా
బైక్ నడపడమైనా
ఒకరికి ఒకరుగా
మిత్రులు నేర్చుకుంటారు
చిన్నప్పుడు మొదలై
చివరిదాకా వీడని జర్నీ స్నేహమంటే

ఒన్ బై టూ అయిన అలవాట్లు
గుణపాఠం నేర్పిన పొరపాట్లు
జీవితానికి చలువదనం చెలిమిచెట్టు నీడలు.

మనసులోని మాట
గూడుకట్టుకున్న వెత వెల్లడవుతుంది
గుండెలోని బరువు దిగిపోయి తేలికవుతుంది
ఏడుపు ముఖమైన నవ్వుముఖమైనా
చిరునవ్వే ఇక
చిరకాలమిత్రుని ముంగిట
చీకటి వెన్నెలౌను
వెనుకటి జ్ఞాపకాలు ప్రవహిస్తాయ్
చిననాటిమాటల ఏరులా
దిగులు ఉపశమిస్తుంది
బలహీనతలకొండల పై మంచుకురుస్తుంది
కన్నుఆకాశంలో మెరుపులు మెరుస్తాయ్
నలుగురుమిత్రులు సమూహమైనపుడు
సమయం,ఆకలి, దాహం మరచిన
అద్భుతమైన రహస్యమెరుగని ఆనందాల లోకం
భుజం పై దోస్తుచెయ్యి వేశాడంటే
మనసులో వెయ్యి ఏనుగుల బలం

అబద్దం,అరాచకం కాదు
అసూయ,ద్వేషంకాదు

మంచితనం,ప్రేమ
త్యాగభావం నేస్తమంటే.
‌ ‌ ‌‌

November 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us