మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 26, 2025
written by Narendra Sandineni

గంటా మనోహర్ రెడ్డి రచించిన “అమ్మా నువ్వెవరు ? కవిత

ప్రముఖ కవి,విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి, గంటా మనోహర్ రెడ్డి,కలం నుండి జాలువారిన ఘంటా పథం కవితా సంపుటిలోని అమ్మా నువ్వెవరు?కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితా సంపుటి 1981 సంవత్సరంలో ముద్రించబడింది.ఈ కవిత భారతదేశం స్వాతంత్ర్యం పొంది ముప్ఫయి సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భాన ఆనాటి సామాజిక,సాంఘిక,రాజకీయ ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. స్వాతంత్ర్యానంతరం కూడా దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది.భారత దేశానికి పట్టిన దుర్గతిని,ప్రజలు ఎదుర్కొంటున్న ఈతి బాధలను,సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని తన గాఢమైన భావాలతో వ్యక్తపరుస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ కవితలో కవి దేశమాతను నువ్వెవరివమ్మా?అని ప్రశ్నించడం దానికి భారత మాత సమాధానం చెబుతూ నేనో నష్టజాతకురాల్ని,స్వాతంత్ర్య భారతిని అని దిగులుతో చెప్పడం వేదన కలిగిస్తుంది.కవి మనోహర్ రెడ్డి రాసిన అమ్మా నువ్వెవరు?కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి.”కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు/అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్లు/మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన నీ ఒళ్ళు/ఇంతకూ ఎవరమ్మా నువ్వు?అని అంటున్నారు.ఒక భావోద్వేగంతో రూపు దాల్చిన కవితను చదువుతుంటే దుర్భరమైన జీవితం గడుపుతున్న అమ్మ గురించి చెప్పినట్లు అనిపిస్తోంది.అమ్మ శరీరంలోని అవయవాలు అన్ని బాధలకు గురి అయి ఉన్నాయి.అమ్మ కళ్ళు కళ తప్పి పోయినట్లుగా ఉన్నాయి.అందంతో నిగనిగలాడే అమ్మ చెక్కిళ్ళు పేలవంగా,కాంతి విహీనంగా కనిపిస్తున్నాయి.ఆకలి,అనారోగ్యంతో అమ్మకు ఎడతెగకుండా వెక్కిళ్లు వస్తున్నాయి. జీవితంలో ఎన్నో బాధలు అనుభవించిన అమ్మకు ముప్పై ఏళ్ల వయసులోనే వృద్ధాప్యపు ఛాయలు ఆవరించాయి.కవితలోని భావాలు అమ్మ జీవితంలోని కష్టాలను,శారీరకంగా,మానసికంగా, సామాజికంగా ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి.ఎవరమ్మా నువ్వు?అని అడుగుతున్నాడు.దేశ మాత అయిన తల్లిని మాత్రమే కాదు.ఆ కష్టాలను అనుభవించే ప్రతి మహిళను ప్రతినిధిగా చూపుతున్నట్లుగా తోస్తోంది. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వాటికి కారణమైన పరిస్థితులు ఏమిటి?ఇందుకు సమాజం యొక్క పాత్ర ఏమిటి?అని తెలియజేయాలన్న లక్ష్యంతో కవిత రాయబడినట్లుగా తోస్తుంది.కళ తప్పిన కళ్ళు,కాంతి లేని చెక్కిళ్ళు అనేది ఆమె శారీరక,మానసిక దుస్థితిని ప్రతిబింబిస్తోంది.అదే పనిగా వినబడుతున్న వెక్కిళ్ల ద్వారా ఆమె భావోద్వేగాలను గుండె నిండా పొంగిపొరలే బాధను వ్యక్తం చేస్తున్నారు.మూడు పదులకే ముసలి రూపు వచ్చేసిన ఒళ్ళు అంటే చిన్న వయసులోనే ఆవిడ జీవితం అనేకమైన కష్టాల సుడిగుండంలో చిక్కి కృంగి పోయిందని భావిస్తున్నారు.ఇంతకు ఎవరమ్మా నువ్వు?అని కవి ప్రశ్నించడం ద్వారా ఆమె జీవిత కథ,బాధలకు కారణాలు ఏమిటి?తెలుసుకోవాలనే ఆసక్తి గోచరమవుతుంది.ఇది కష్టాలలో ఉన్న మహిళల జీవన స్థితిగతులపై దృష్టి సారించి వారి బాధలను గుర్తించాలని హృదయగతమైన భావాలకు ప్రతీకగా నిలుస్తుంది.“వెయ్యేళ్ళ దుర్భర దారిద్ర్యాన్ని/అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు/ అంటున్నారు.ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా భారతదేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి విడివడినది.అరాచకపు పరాయి పాలన నుండి ఆగస్టు15,1947 రోజున భారతదేశం విముక్తి పొందింది.బ్రిటిష్ వారు మన దేశ సంపదను అక్రమంగా దోచుకుని వెళ్ళినారు.బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్య్రం సాధించినప్పటికీ దేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోవడం బాధను కలిగిస్తుంది. భారతదేశం ఇప్పటికీ ఆర్థికంగా,సామాజికంగా దోపిడీకి గురి అయి విలవిలలాడుతున్నది.కవి దేశ మాతను ఉద్దేశించి వెయ్యేళ్ల దుర్బర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వ్యక్తిలా విలపిస్తున్నావు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.”చీకట్లోంచి చీకట్లోకే పరుగులు తీస్తున్న పిచ్చిదానిలా ఉన్నావు/ అంటున్నారు.దేశం అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు రచించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలలో అవినీతి చోటుచేసుకున్నది.అవి సత్ఫలితాలను అందివ్వడం లేదు.దేశం ఇంకా సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి విలవిలలాడి పోతున్నది.ఇది దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న అవినీతి పాలనకు తార్కాణంగా నిలుస్తుంది.ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శను సంధించినట్టుగా తోస్తుంది.“నాడు నయాగరా జలపాతంలా కళకళలాడే నువ్వు/ నేడెందుకో సహారా ఎడారిలా వెలవెలబోతున్నావు/ అంటున్నారు.ఒకప్పుడు దేశం ఎంతో సమృద్ధిగా కళకళలాడేది.ఎంతో వైభవంగా అలరారిన దేశం మనది.ప్రకృతి అందాలకు పర్యాయపదంలా ఉండేది.మన దేశం పాడి పంటలతో విలసిల్లింది. ఒకప్పుడు రత్న గర్భగా పేరు పొందిన దేశం మనది. నేడు దేశం దుర్భర దారిద్ర్యం,పేదల ఆకలి కేకలు, అన్నార్తుల అలమటింపులు,నిరాశా నిస్పృహలు ఎల్లెడలా అలుముకున్నాయి అని కవి బాధను వ్యక్తం చేస్తున్నాడు.”గత కాలపు వైభవాల శిథిల శిల్ప సంకేతంలా ఉన్నావు/అంటున్నారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది.నేడు మన దేశం శిథిల శిల్పాల గుర్తుల రూపంలో మాత్రమే మిగిలి ఉంది.స్వాతంత్ర్యానంతరం కూడా ప్రజలు దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు అనే వాస్తవాన్ని కవితా పంక్తి తెలియజేస్తున్నది.“కుత్సిత రాజకీయ విన్యాసాన్ని తలచుకొని/అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/అంటున్నారు.కేవలం కుత్సిత రాజకీయ గందరగోళాల మధ్య చిక్కుకొని దేశం వినాశనాన్ని ఎదుర్కొంటున్నది.ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కాన రావడం లేదు.దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.కాని ఎందుకో దేశం అభివృద్ధి కుంటుపడింది అని కవి భావాల ద్వారా వ్యక్తం చేస్తున్న తీరు బాగుంది.“చచ్చిన శవంలా ఉన్నావు/అంటున్నారు.ప్రస్తుతం భారతదేశం శవం వలె చలనం లేని ఉద్దీపన రహిత పరిస్థితిలో ఉంది అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఇది ప్రజల వైపల్య భయాన్ని ప్రతిబింబిస్తుంది.”శవానికి భయం గొలిపేలా ఉన్నావు/ అంటున్నారు.శవం వలె నీ పరిస్థితి భయంకరంగా ఉంది.విపరీతంగా,అసహజంగా, భయాందోళనతో కూడిన అసహనాన్ని సూచిస్తుంది. చనిపోయిన వ్యక్తి భయానికి లోను కాడు.కానీ చనిపోయిన వ్యక్తికే భయాన్ని కలిగించేలా ఉన్నావు అని చెప్పడం బాగుంది.భయాన్ని సృష్టించడానికి చాలా తీవ్రంగా అశాంతిని కలిగించడాన్ని సూచిస్తుంది.ప్రజల చర్యలు మరియు ప్రవర్తన సహజ సిద్ధంగా ఉండక పోవడం వల్ల వారిని చూసి చనిపోయిన శవానికే భయం గొలిపేలా ఉంది అని చెప్పడం జరిగింది.వ్యంగ్యభరితమైన సమాజపు భావజాలాన్ని ప్రతిబింబించేలా ఈ కవిత ఉంది. ”భవిష్యత్తంటేనే ఎందుకో భయంతో కంపించి పోతున్నావు/అంటున్నారు.భవిష్యత్తు పట్ల ఆశ ఉంటేనే మనిషి మనుగడ కొనసాగుతుంది.మనిషి భవిష్యత్తు పట్ల ఆశను కోల్పోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది.ప్రజల్లో భవిష్యత్తు పట్ల ఎడతెగని భయం,తీవ్రమైన నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయని కవి స్పష్టంగా తెలియజేస్తున్నాడు.”ఎండిన పెదిమెలతో ఏదో చెప్పాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నావు/ అంటున్నారు.దేశంలో నివసిస్తున్న ప్రజలు నిరాశ నిస్పృహలకులోనై తమ బాధలను చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని,వారి బాధలు చెప్పేందుకు అవకాశం లేకుండా పోయిందనే భావన వ్యక్తం అవుతున్నది.”నీ బాధలకు నిష్కృతి లేదని అదే పనిగా ఆక్రోశిస్తున్నావు/“ఇకనైనా చెప్పు తల్లీ – నువ్వెవరివమ్మా?/అంటున్నారు.ఆవేదనతో,ఆక్రోశంతో బాధపడుతున్న ఆమెను కవి ప్రశ్నిస్తున్నారు. ఆమె ఎవరో అనేది తెలుసుకోవడమే కాకుండా మనసులో దాగి ఉన్న బాధకు మూలాన్ని కూడా తెలుసుకోవాలనే సంకల్పం వ్యక్తమవుతున్నది. సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు వాటి మూలాలు ఏమిటో తెలుసుకొని పరిష్కారం చూపాలని కవి ఆకాంక్షిస్తున్నాడు.బాధితురాలైన ఆమె గుండెల్లో నిండి ఉన్న బాధను,ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాడు.ఆమె ఎదుర్కొంటున్న బాధకు ముగింపు లేకుండా కొనసాగుతున్న పరిస్థితి ఎంతటి క్లేశాన్ని కలిగిస్తుందో గ్రహించవచ్చు.

ఆమె బాధలకు కారణమేమిటో చెప్పాలని కోరుతున్నాడు. సమాజంలో పేరుకుపోయిన అన్యాయం, అసమానతలను గూర్చి ప్రశ్నిస్తున్నాడు.ఈ ప్రశ్న దేశమాత ఆత్మను ఉద్దేశిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఎందుకు విఫలమయ్యాయని కవి ఆవేదన చెందుతున్నాడు.“కష్ట జీవుల నికృష్ట జీవితాలను కలం కుంచెతో/కాగితపు కాన్వాసు పైన కమనీయంగా చిత్రించాలని/వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ఓ కవీ,నేనెవర్నో నీకు తెలీదా?/నేనొక నష్టజాతకురాల్ని నా దురదృష్ట నామధేయం/ స్వాతంత్ర్య భారతి/అంటున్నారు.దేశమాత తనను నష్టజాతకురాలిగా భావిస్తూ స్వాతంత్ర్యం తనకు కలిగించిన వాస్తవ పరిస్థితులపై బాధ పడుతున్నట్లు కవి చెబుతున్నాడు.ఈ కవితను భారతదేశంలోని సామాజిక,ఆర్థిక,రాజకీయ పరిస్థితులపై గాఢమైన ఆవేదనతో కూడిన ఆత్మ విమర్శగా భావించవచ్చు. స్వాతంత్ర్యం లభించిన తర్వాత సామాన్య ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు అని కవి తీరని ఆందోళనను వ్యక్తం చేస్తున్నాడు.ఇది కేవలం ఒక కవిత మాత్రమే కాదు.భారతదేశంలోని ప్రజల హృదయాల్లో నెలకొన్న ఆక్రోశానికి ప్రతీక.భారత దేశంలోని గడచిన సామాజిక, రాజకీయ,ఆర్థిక పరిస్థితులపై విమర్శల సమాహారంగా నిలుస్తుంది. స్వాతంత్ర్యం సంపాదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.అయినప్పటికీ దేశమాత పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నది.కవి 43 సంవత్సరాల కింద కవిత రాసినప్పటికీ ఇప్పటికీ దేశమాత పరిస్థితి దుర్భరంగా ఉండడం ఆవేదన కలిగిస్తుంది.ఈ కవిత దేశమాత విలాపంగా చెప్పవచ్చు.కవి మనోహర్ రెడ్డిగారు ఘంటారావం అనే శీర్షికతో వాట్స్ అప్ వేదిక ద్వారా ప్రతి రోజు ఒక కవితను అందిస్తూ తెలుగులో ఘంటారావం అనే ఒక కొత్త కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వీరు నిర్విఘ్నంగా నేటి వరకు ఘంటారావంలో -1651 కవితలు రాసినారు. వీరు రచిస్తున్న ఘంటారావం కవితలు సుజల స్రవంతిలా నిరంతరం కొనసాగుతునే ఉన్నాయి.వీరు ఘంటారావం శీర్షికన 1008 కవితలతో కవితా సంపుటిని తేది 16 – 11 – 2023 నాడు ఆవిష్కరించడం జరిగింది.వీరు ధారావాహికంగా ఘంటారావం కవితలను అందిస్తున్నందుకు అభినందిస్తున్నాను‌.కవి మనోహర్ రెడ్డి మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

హిల్దా

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

హిల్దా అనే యువ వయసులో ఉన్న అమ్మాయి, అంత తెలివైనది కాదు. ఇంకా దానికితోడు అత్యాశాపరురాలు. ఒకరోజు తన మేనత్త తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. తన వద్ద నీకోసం వివాహ డ్రెస్సు ఉంది. అదేగాక ఇంకో అదనపు డ్రెస్సు కూడా నీకే ఇవ్వాలనుకుంటున్నాను. నేను రెండు పెట్టెల్లో ఒక్కో వస్తువు పెట్టాను. దానిలో ఏదో ఒకటి నీవు ఎంచుకోవాలి. మొదటి పెట్టెలో ఈకలతో చేసిన బహుమతి. రెండవ దానిలో లోహంతో చేసినది. ఒకటి ఖరీదయినది, రెండవది కాదు. తూకంలో రెండూ ఒకేలా ఉంటాయి. జాగ్రత్తగా విచారించు నీకు ఏది కావాలో. అది నిర్ణయించేందుకు హిల్దాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆమెకు ఈకల కన్న లోహము విలువైనదని మరియు బరువైనదని కూడా ఆమె నిర్ణయించుకుంది. ఎక్కువ విచారించకుండా ఆమె రెండవ పెట్టెను ముట్టుకుంది. ఆమె మేనత్త రెండు పెట్టెల మూతలు తెరిచింది. ఒకదానిలో ఏ పెండ్లికొడుకైనా ఇష్టపడే మెత్తని ఈకలు ఉన్నాయి. రెండవ దానిలో ఒక పాత రంద్రాలు పడిన చారు గిన్నె ఉన్నది. హిల్దా తొందరపడ్డది మరియు అప్పటినుండి కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త పడటం చేస్తుంది. ఆమె వివాహం జరిగాక ఆమె మేనత్త ఎలాగూ ఆ మెత్తని దిండు ఆమెకే ఇచ్చింది.
ఏ పనికైనా తొందరపడటం మంచిది కాదు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక పిల్లి, ఒక ఎలుక

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకరోజు ఉదయం ఒక అమాయకపు పిల్లి ఒక ఇంట్లో వంట సామాను గది ముందర ఒక ఎలుకను పట్టుకుంది. పిల్లి తన పెద్ద పంజాలో దాన్ని పట్టుకున్నప్పుడు ఎలుక అంది ”నీవు నన్ను తినే ముందు నన్ను నా తిండి తిననీయవా?” అని. ముఖ్యమైన విషయం, అమాయకపు పిల్లి తన పండ్లు చూపుతూ అదా నా తిండి అంది. నేను ఎంత అందంగా ఉన్నానో చూడలేవా? అని ఎలుక పలికింది. ఇంత అందమైన ప్రాణిని చంపేయడం దారుణం కాదా? ఆ పిల్లి తన చేజిక్కిన ఆహారాన్ని కిందా, మీదా చూచి అది చాలా అందంగా ఉందనుకుంది. ఆ ఎలుక అమాయకపు పిల్లిని ఇష్టపడుతున్నట్లు నటించింది కూడా. మోసపూరితంగా అది మనిద్దరం ఒకే సైజులో లేకపోవడం ఎంత దారుణం అంది. మనిద్దరం ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటుందని ఆ ప్రయత్నం మొదలు పెట్టుమని ఎలుక, పిల్లికి సలహా ఇచ్చింది.

అప్పటి నుండి ఎలుక వెనుక గదిలో ఒక మెత్తని దిండుపై హాయిగా కూర్చుండిపోయింది. ఆ అమాయకపు పిల్లి ఎలుకకు తినేందుకు ఎన్నో మంచి మంచి తినుబండారాలు తెచ్చి ఇస్తూ పోయింది. ఆ పిల్లి సన్నబడేందుకు తిండి బాగా తగ్గించింది. చివరకు తిండి తక్కువై పిల్లి అనారోగ్యం పాలయ్యింది, బాగా బక్కచిక్కింది. అందువలన ఎలుకే స్వయంగా వెళ్ళి ఆహారం సంపాదించుకొని తింటూ బాగా లావై తినే వస్తువుల గది తలుపుకింది బొరియలో ఇరుక్కుపోయింది. అప్పుడు ఇంటి యజమానురాలు దాన్ని పట్టుకుని బోన్లో వేసింది. ఎప్పుడైతే పిల్లి కొంత బాగైందో బోన్లో ఉన్నదాన్ని చూసేందుకు వచ్చింది. పుస్సీ, నన్ను దయతో బయటికి తీయవా అని ఎలుక బ్రతిమాలింది. నువ్వు బోన్లో వున్నందుకు, అదృష్టవంతురాలివనుకో అని కోపంగా అంది పిల్లి. నీవు బాగా బలిసావు, నేను బాగా చిక్కిపోయాను. నీవు ఒకవేళ బయట ఉంటే తప్పకుండా నిన్ను మింగేసేదాన్ని.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

రాజు వాలెన్‌ టైన్‌

by ఒద్దిరాజు మురళీధరంరావు March 26, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రాజు వాలెన్‌ టైన్‌ తన శవయాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎప్పుడూ ఆలోచిస్తుండే వాడు. వాస్తవానికి అతనికి చనిపోవాలని లేదు, కానీ ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలని ఆశ పడుతున్నాడు. అతను వాస్తవంగా చనిపోయాక ఏమి జరుగుతుందో తను ఏమీ చూడలేనని గ్రహించాడు. ఒకవేళ నేను చనిపోతే ప్రజలు ఎలా దుఃఖిస్తారో తెలుసుకోవాలంటే నేను బ్రతికుండగానే నా శవయాత్రను ఏర్పాటు చేయాలి. అందుకు అతను చనిపోయినట్లు ప్రకటించాడు. సిటీ మొత్తం ప్రజలు నల్ల జెండాలు పట్టుకొని, వెయ్యి నల్ల జెండాలు దారి పొడుగునా ఏర్పాటు చేయాలని, తనకు శవపేటికలో పడుకో బెట్టాలని ఆజ్ఞాపించాడు. అది ఎవరు తెలుసుకోకుండా తను మాత్రమే ప్రజలు బాధపడటం చూడాలని అనుకున్నాడు.
అది కేవలం ముఖ్యమంత్రికే చెప్పి శవయాత్ర తీయుటకు ఆదేశించాడు. శవయాత్ర మొదలయ్యింది. కానీ ఇది ఏమిటి? వాలెన్‌ టైన్‌ చనిపోతే ఒక్క చుక్క కన్నీరు కూడా, ఏమాత్రం బాధ కూడా ప్రజల్లో చూడలేదు. ప్రజలు వారివారి దినచర్యల గురించి మాట్లాడుకుంటున్నారు. శవం వెంట నడిచేవారు, దారి ప్రక్కన నిలబడ్డవారు కూడా. ప్రజలు ఎన్నోసార్లు వీడు పోవడం మంచిదయింది, పీడ విరగడయిందని అనుకోవడం విన్నాడు రాజు. వచ్చేవాడు ఇంతకన్న చెడ్డవాడు కాకూడదని ఊహించసాగారు. ఇంతకన్న చెడ్డవాడు ఉండడు. వీరితో ఇంకా కొందరు కలిశారు. శవపేటికలో పడి వుండి తడి చెమటల్లో మునిగిపోయాడు రాజు. కాబట్టి అతను ఈ ప్రపంచాన్ని బాధలో ఉంచి మరణించ దలచలేదు. దానికి వ్యతిరేకంగా తన ప్రజలు తను చనిపోతేనే సంతోషిస్తారని ఎప్పుడైతే అతను ఇది గ్రహించాడో వాలెన్‌ టైన్‌ వాస్తవంగా చనిపోవాలని అనుకున్నాడు.
రాజు వాలెన్‌ టైన్‌ ఎంతో విచారపడినప్పటికీ శవ పేటికలో మరణించలేదు. మొదట్లో అతనికి చాలా కోపం వచ్చింది. తనను దూషించిన వారందరినీ చంపించాలనుకున్నాడు. కానీ అప్పుడు రాజ్యంలో పనులు చేసేవారు ఉండరు కదా! అతను ఆలోచించే కొద్ది అతనే చెడ్డవాడని తెలుసుకుని మారాలను కున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రితో తను మంచిగా పరిపాలించడం మొదటినుండి నేర్చుకోవాలని చెప్పాడు. కానీ ఎలా? అది చాలా సులభం, నవ్వాడు ముఖ్యమంత్రి. మీరు చేయవలసింది మారు వేషంలో ఆ ప్రజల్లోకి వెళ్ళండి, వారితో కలిసి పని చేయండి, వారు అనేది వినండి. అప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకు ఏది ఇష్టమో, ఏది అయిష్టమో? రాజు ఏమి తప్పు చేసేవాడో వారు చెప్పినది మరిచిపోనట్లయితే నీవు తిరిగి వచ్చాక చాలా తెలివిగా పరిపాలించగలవు. వారు నన్ను గుర్తించకపోతే ఎలా? అని రాజు అడిగాడు. మీరు విచారించకండి! వారు ఎల్లప్పుడు మీ కిరీటం, మీ మెత్తని పొడుగాటి కోటును మాత్రమే చూశారు. మీ ముఖాన్ని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోలేరు అని ముఖ్యమంత్రి నమ్మ బలికాడు. కానీ ఈ మధ్యన ఎవరు పాలిస్తారు? అని రాజు అడిగాడు. రాజు లేకుండా దేశం ఉండలేదు కదా! ఓహో, అవును అది సాధ్యమే, ముఖ్యమంత్రి హేళనగా నవ్వాడు. ఇదో సమస్యా అని. మీరు వచ్చేంతవరకు ప్రజల విచారం (దుఃఖం) ప్రకటిస్తాను. ఒకవేళ ఏమైనా నిర్ణయించవలసి వస్తే నేను ఎప్పుడూ చిన్న శబ్దం చేసి మిమ్మల్ని అడుగుతాను. అందుకు వాలెన్‌ టైన్‌ అంగీకరించి, పాలించడం నేర్చుకోవడానికి వెళ్ళాడు.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శత్రువుతో ప్రయాణం జండర్‌ స్పృహ

by Devendra March 20, 2025
written by Devendra

ఈ ఉగాది
నాకు విరోధి
షడ్రుచులు వడ్డించిన
భూమి తల్లిపై
అత్యాచారం
అంటూ స్త్రీల పక్షాన నిలబడి అక్షరగొంతుకను వినిపించిన కవి, విమర్శకులు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌ గారు. శ్రీశ్రీ కోరినట్లుగా పీడితుల పక్షాన నిలబడి అభ్యుదయ దృక్పథంతో పయనిస్తున్నారు. ‘శత్రువుతో ప్రయాణం’ కవితా సంపుటిలో ఉన్న 36 కవితలు సమాజాన్ని అనేక కోణాల్లో ప్రశ్నిస్తాయి. మార్పుతో కూడిన మానవత్వాన్ని కోరుకుంటాయి. రాజకీయ రంగులను ఎండగడుతాయి. స్త్రీవాద ఉద్యమాన్ని సమర్థిస్తాయి.
అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా వచ్చిందే స్త్రీవాదం. స్త్రీల ఉనికిని, స్త్రీల హక్కులను, స్త్రీల సమస్యలను స్త్రీలే వ్యక్తపరిచే సాహిత్యాన్ని స్త్రీవాద సాహిత్యం అంటున్నాం. తరతరాల వ్యవస్థ నిర్మాణంలో మాతృస్వామ్యం రూపాంతరం చెంది పితృస్వామ్యంగా స్థిరపడిపోయింది. ఆనాటి నాగరిక సమాజం నుండి నేటికి ఆ మూలాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించి, ఎదిరించే క్రమంలో వచ్చిందే స్త్రీవాదం. జెండర్‌ స్పృహ, గృహహింస, మాతృత్వం, ఇంటి చాకిరి మొదలైన అంశాలెన్నో స్త్రీవాద ఉద్యమంలో వెలుగులోకి వచ్చిన అంశాలు. జండర్‌ సహజంగా ఏర్పడిరది కాదు. కుటుంబం, సమాజం, మతం ‘స్త్రీలు’ అంటే ఇలా ఉండాలి, ‘పురుషులు’ అంటే ఇలా ఉండాలి అని జీవనవిధానంలో అలవాటు చేసే క్రమపద్ధతిని జండర్‌స్పృహ అంటున్నాం. ఎంగెల్స్‌ ప్రకారం ‘‘పురుషత్వం, స్త్రీత్వం అనేవి శరీర ధర్మాల ప్రకారం ఏర్పడినవి కావు. ఒక సుదీర్ఘ చారిత్రక యుగంలోను పురుషత్వం, స్త్రీత్వం అనేవి వేరువేరుగా నిర్వచించబడ్డాయి. ఈ నిర్వచనం ఆయా యుగాలలోని ప్రధానఉత్పత్తి విధానమీద ఆధారపడి ఉంటుంది’’ అన్నారు. అంటే స్త్రీత్వ, పురుషత్వాల గురించి భావజాలాన్ని సమాజం తయారుచేసి అందిస్తోంది. ఆ భావజాలం తిరిగి సమాజక్రమాన్ని స్థిరపరచడంలో సహాయపడుతుంది. ఈ క్రమానంతటిని స్త్రీవాదం పరిశీలించింది. స్త్రీవాదం అంటే పురుషులను ద్వేషించడం కాదు. స్త్రీల సమస్యలను గుర్తించి స్త్రీలందరు ఏకమై పురుషులకు అర్థమయ్యేలా చెయ్యడం. ఈ భావజాలాన్ని అర్థంచేసుకున్న సహృదయ కవి ఆచార్య మాడభూషి కుమార్‌గారు. ‘ఆమె’ కవితలో స్త్రీల సమస్యలను కళ్ళకు కట్టినట్లు లోతైన భావుకతతో అక్షరీకరించారు.
‘‘చిన్నప్పటినుండి అంతే
చిన్నచూపుతోనే పెరిగింది’’ అంటారు
……….
ఇంకా
ఆమె నిఘంటువు నుంచి ఏ నిషేదం
అందుకే
ఎందుకు, ఏమిటి
లాంటి ప్రశ్నలు ఆమెనోట్లో రాకూడదని శాసనం’’
బాల్యంనుండే ఆడపిల్ల జండర్‌వివక్షను ఎదుర్కొంటుంది. కన్నతల్లే కొడుకును ఒకరకంగా కూతురును మరొరకంగా పెంచుతుంది. లేకపోతే తల్లిపెంపకం బాగాలేదంటారు. దుస్తులు, ఆటలు, ఆహారం, ఇలా అన్నిట్లోను ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కుటుంబంలో ఆడపిల్ల ఇట్లా ఉండాలి అని తర్ఫీదునివ్వబడుతుంది. తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో పెరిగిన ఆడపిల్లకు పెళ్ళి అనే బంధం మరిన్ని బాధ్యతలను, పరిమితులను విధిస్తుంది. అందుకే కవి ఇలా అంటారు.
‘‘అతగాడికి కావలసింది ఒక మరమనిషి
సంపాదించడానికి
వండిపెట్టడానికి
కోరికలు తీర్చడానికి
పెళ్ళిరోజున ఎ.టి.ఎం లాంటి
పెళ్ళాం దొరికిందని మరిసిపోతాడు’’
స్త్రీకి పెళ్ళిజీవితం అనేది రూపాయి బిల్లకు ఉండే బొమ్మ, బొరుసు లాగా మారిపోయింది. మంచి భర్త దొరికితే పరవాలేదు కాని, ఆమెను అర్థంచేసుకోలేని కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు జీవితఖైదీగా మారిపోతుంది. అసలు కుటుంబమే స్త్రీని కంట్రోల్‌ చేసే బంధిఖానా అవుతుంది. ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం అన్ని స్త్రీల బాధ్యతలే. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా వీటన్నింటిని బాలెన్స్‌ చేసుకోవాలి. తద్వార స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యాలమీద ఒత్తిడి పెరుగుతుంది. ఎదిగే క్రమంలో అనేక సవాళ్ళను స్త్రీ ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఆమె’ కవితలోనే ఈ పంక్తులు చూడండి.
‘‘ఆకాశమంత వ్యాపించి
అందీ అందని ఆ తేజోమూర్తిని చూసి
నిందలు వేసే వాళ్ళెందరో!
మబ్బుల నడుమనుంచి
అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటేనే
ఇంత అసూయగా ఉంటే
పున్నమి వెన్నెల విరిస్తే
రెక్కలు ముక్కలు చేసుకొని
ఆకాశానికి ఎగురుతున్న ఆమె రెక్కల్ని
ముక్కలు చేయడానికి ఎందరో’’
అన్న పంక్తులు బాధ్యతల దొందరలో, ఉరుకుల పరుగుల ‘ఆమె’ జీవితంలో పడగనీడలా నిందలు, ఆధిపత్యాలు, అకృత్యాలు, వివక్షలు, చిన్నచూపులు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘర్షణల మధ్య స్త్రీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటు ముందుకు వెళ్ళే సాహసం చేస్తుంది. అయినప్పటికి స్త్రీలు తమను తాము నిరూపించుకుంటూ అన్నిరంగాలలో ముందుకు వెళ్ళే ప్రయత్నంచేస్తున్నారు. అయినప్పటికి అడగడుగున పరీక్షలపర్వాలను దాటక తప్పడంలేదు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లి కలలుకంటుంది. అన్నీ తానై భరిస్తుంది. అయినప్పటికి తండ్రి అంటే పిల్లలకు గౌరవం. తల్లి అంటే చిన్నచూపు. ‘ఆమె’ గురించి కవి మాటల్లో …
ఇంట్లో సెలవులేదు
పనిలో సెలవులేదు
జీవితమంతా పిల్లలకోసం పరుగెత్తి పరుగెత్తి
అలిసిపోయిన ఆమెకు
ఆసరా లేదు
………
ఆమె లేకుండా
మానవ చక్రం పరిభ్రమించదు
అందుకే ఆమెను
పరిమళించనివ్వండి
కవితా ముగింపులో స్త్రీ ఉన్నతిని ఆకాంక్షిస్తున్నారు కవి. ఈ విశ్వమానవ కాలభ్రమణంలో స్త్రీ, పురుషులిద్దరు అవసరమే. ఎవరికివారుగా బాధ్యత నిర్వహణలో పోటీపడాలి గాని ఆధిపత్యాలు, అహంకార పెత్తనాలు స్త్రీల అశాంతికి కారణమౌతున్నాయి. హింసకు దారితీస్తున్నాయి. స్త్రీల చుట్టు భయాన్ని గుర్తుచేస్తూ ‘భయం’ కవిత లో ఇలా అంటారు.
భయం
కట్నంలా రావచ్చు
పట్నంలో రావచ్చు
అత్యాచారంలా రావచ్చు
నిత్యాచారంలా ఉండవచ్చు
……………..
భయం
మగాడిలా ఉండవచ్చు
మగడి రూపంలో ఉండవచ్చు
మైరావుణుడి రూపంలో ఉండవచ్చు
రూపం ఏదైనా
భయం మాత్రం ఒక్కటే
అది భయమే
స్త్రీలకు ఉన్న భయాలు అన్ని ఇన్ని కావు. పురుషస్వామ్య ప్రపంచంలో ఎక్కడ పొంచి ఉంటుందో ఆ భయం. కవి పై కవితలో కట్నం వలన భయం అనడంలో మనం ఇప్పటికి వరకట్న వేదింపులకు బలైన స్త్రీలను మీడియా ముఖంగా చూస్తునే ఉన్నాం. స్త్రీలపై అత్యాచారం అన్నది ఈనాటికి రూపుమాపలేకపోయాం. ప్రభుత్వాలు నిర్భయ చట్టాలు చేసిన దిశ లాంటి అమ్మాయిలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తవుతే కన్న తండ్రి కళ్ళు కామంతో కప్పబడినపుడు కూతురు పరిస్థితి అగమ్యగోచరం. ‘తండ్రి’ అన్న కవితలో
‘‘కన్న బిడ్డనే కామించే తండ్రులు
తండోపతండాలుగా పత్రికల్లో మొలుస్తూనే
టీవీలో మెరుస్తునే ఉన్నారు
వాటిని చూసిన మొహంతో
కన్నబిడ్డను చూసే శక్తిలేక
ఆత్మహత్య చేసుకుంటున్న’’
అంటారు. ఇక్కడ కవి ఈ సంఘటనకు కరుణరసభరిత కవితాక్షరాలను మనముందుంచారు. ఎవరో చేసిన పనికి తండ్రిగా కూతురు ముందు నిలబడలేని స్థితిని తండ్రులందరి పక్షాన నిలబడి బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘మగాడు’ కవిత జండర్‌ వివక్షను మరింత స్పష్టంగా చెప్తుంది.
‘‘వాడు కావాలనుకొన్నప్పుడు
నేను రావాలి
వాడు తేవాలన్నప్పుడు
నేను తేవాలి
వాడు తిరగమన్నట్టు
నేను తిరగలిగా తిరగాలి’’
స్త్రీ, పురుషులిద్దరు మనుషులే. ఇద్దరిలో ప్రవహించే రక్తం ఎర్రగానే ఉంటుంది. కాని, స్వేచ్ఛా పరిధిలోకి వచ్చేసరికి జండర్‌ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. పితృస్వామ్య వ్యవస్థ పురుషుడిని ‘మగాడు’ గా చూడాలనుకుంటుంది. మగాడు అంటే ఎలా ఉండాలని సమాజం, కుటుంబం చెప్పిందో కవి ప్రతిసందర్భంలో మగాడి రంగును తేటతెల్లం చేస్తాడు. స్త్రీ ఎల్లప్పుడు పిల్లలకోసమో, పుట్టింటి వారి కోసమనో, పరువు మర్యాదల కోసమనో తను ఉండాలనుకున్నట్టుగా ఉండలేకపోతుంది. తన అస్తిత్వాన్ని ఉనికిని పరిస్థితులకు ఫణంగాపెట్టి అన్నిటికి సర్ధుబాటుతనపు సంకెళ్ళు వేసుకుంటుంది. అందుకే ‘కవి’ స్త్రీ, పురుషుల సహవాసాన్ని శత్రువుతో పోల్చడం సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
‘‘నేను సహవాసం చేస్తున్నది
శత్రువుతో
నేను సహజీవనం చేస్తున్నది
శత్రువుతో
నేను పంచుకొంటున్నది
శత్రువుతో
పనిచేస్తున్నది
శత్రువుతో’’
ఈ శత్రువులు మిత్రులు అయ్యేదెప్పుడు! జండర్‌వివక్ష తగ్గినప్పుడు ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకెళ్ళినప్పుడు అంటే స్త్రీవాదాన్ని పురుషుడు అర్థంచేసుకున్నప్పుడే సమస్య పరిష్కారం దిశగా ముందుకు కదులుతుంది. ఆచార్యస్థానంలో ఉన్న మాడభూషి సంపత్‌గారు మహిళల ఆర్తిని, ఆవేదనను, వివక్షను అర్థంచేసుకున్న వ్యక్తిగా, కవిగా, ప్రగతిశీల మార్గదర్శకుడిగా స్త్రీల గొంతుకను ‘శత్రువుతో ప్రయాణం’ పేరుతో తన కవితాధారతో బలం చేకూర్చిన మానవతామూర్తి ఆచార్య సంపత్‌కుమార్‌గారు.

ªªª

March 20, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తొలి ఆత్మకథా రచయిత్రి

by Vijaya Kandala March 20, 2025
written by Vijaya Kandala

ఆత్మకథ రాసిన తొలి మహిళ  పేరు శ్రీమతి సత్యవతి  .ఈ చిరు వ్యాసంలో ఆమె రచించిన ఆత్మ చరితము లోని విశేషాలను  , సారాంశాన్ని  ఒకసారి గుర్తు చేసుకుందాం  .

ఆత్మకథని స్వీయ చరిత్ర అని కూడా అంటారు  .ఒక వ్యక్తి తన జీవితం గూర్చి తా నే రాసుకున్నది  ఆత్మకథ  లేక  స్వీయ చరిత్ర  .ఎవరైనా సరే వారి వారి జీవితాల్లో జరిగిన అ ను భవాలను ,సంఘటనలను,  జ్ఞాపకాలను భావితరాలకు అందించడానికి చేసే ప్రయత్నమే స్వీయ చరిత్ర.

భారతీయ భాషలలో స్త్రీలు స్వీయ చరిత్రలు రాయడం 19వ శతాబ్దపు మద్యభాగం నుంచి మొదలైంది. తెలుగులో స్త్రీలు రాసిన స్వీయ చరిత్రలు చాలా అరుదుగా కనిపిస్తాయి . మనం ఇప్పుడు తెలుసుకోబోయే   సత్యవతి గారి ఆత్మ చరితము మొట్టమొదటగా 1934లో ముద్రించబడింది  .ఇది తొలి తెలుగు మహిళా ఆత్మకథ .

మనిషి జీవితం కంటే ఆసక్తికరమైన అంశం మరొకటి ఉండదు .ప్రతి ఒక్కరు వారి వారి జీవితాల్లో అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటారు .ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే సత్యవతి గారు కూడా వారి కాలంలో ఉంటే 1934 ప్రాంతంలో జరిగిన సాంఘిక దురాచారాలకు స్పందించి ఈ రచన చేశారు

రచయిత్రి గురించి కొంత

ఈమె సున్నిత మనస్కు రాలు. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలకు ఎంతగానో బాధపడేవారు. మనసులో ఉన్న ఈ బాధంతా ఆత్మకథ రూపంలో వెలు వరించారు అని చెప్పవచ్చు. అయితే ఇందులో సత్యవతి గారి పుట్టుక ,వివాహం, ఆమె భర్తతో గడిపిన కాలం, అ  కాలంగా భర్త మరణించడం మొదలైన వివరాలన్నీ ఉన్నవి. కానీ వీటన్నిటికీ సంబంధించిన సంఘటన ,తేదీలు కానీ సమయాలు ,కానీ ఎక్కడా కనిపించవు. ఆమె వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకోలేదేమో ! అందువలన ఈ పుస్తకం తప్ప దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మనకి ఇంకా ఏ ఆధారము లేదు .పుస్తకంలో చెప్పబడిన విషయాలను బట్టి , ఆనాటి సాంఘిక పరిస్థితులను సత్యవతి గారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గురించి తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది.

రచయిత్రికి పుస్తక పఠనం బాగా అలవాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ గ్రంథం చదువుతూ ఉంటే .చాలా  చిన్న పుస్తకమైన అలంకారాలు ,మంచి భాష , చక్కటి సమాసాలను ఉపయోగించారు .పదబంధాలను అలవోకగా వాడారు.ఈ రచన చేయడానికి ముఖ్య కారణం స్త్రీ పునర్వివాహాలు, భర్త చనిపోయిన స్త్రీకి శిరోముండనం , ఒకటే పూట భోజనం, సైను బట్టలనే చీరలుగా కట్టించడం, తద్డి నాలకు సంబంధించిన విధి విధానాలను చాలా లోతుగా చర్చించారు. తనకు తోచిన సమాధానాలు కూడా ఇందులో ఆవిడ సాహసోపేతంగా ప్రకటించారు . పుస్తకాన్ని చదివినప్పుడు ఈ గ్రంథం 1934 ఫిబ్రవరిలో అవనిగడ్డలో రాసినట్లుగా తెలుస్తోంది .దీన్ని చనిపోయిన భర్త శ్రీ సీతారామయ్య గారికి ఆమె అంకితం ఇచ్చారు .ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. అయితే ముందు చెప్పుకున్నట్లుగా ఇది అర్ధాంతరంగా ముగిసింది .  మొదటి భాగంలో ఈమె జీవిత కథ రెండవ భాగంలో ఆమె అభిప్రాయాలు ఉన్నాయి .అయితే అభిప్రాయాలు ఎక్కువ శాతం దేవుడు -మతం -సమాజం ఈ మూడు అంశాల పట్ల ఉన్నట్టుగా మనకు పుస్తకం చదివితే తెలుస్తుంది.

సత్యవతి గారు తనను తాను పతివ్రతగా భావించారు .సతీ సావిత్రి వలే తాను కూడా భర్తప్రాణాన్ని వెనక్కి తెచ్చుకోగలను అనుకున్నారు .ఒక వితంతువుగా పతివ్రత స్థానం కోసం వాదించడం నేటికీ విచిత్రంగానే అనిపిస్తుంది. మరి ఆ రోజుల సంగతి చెప్పనవసరం లేదు .ఇందులో ఆమె వెల్లడించిన అభిప్రాయాలు చాలా తీవ్రమైనవి .చాలా ఆచారాల్ని, నమ్మకాల్ని హేతువాదంతో ప్రశ్నించారు .సంతృప్తికరంగా సమాధానం దొరక ఉంటే నిరా ధారమైనవి అని కొట్టివేయడానికి కూడా వెనకాడలేదు .ఇలాంటి దృక్పధం ఏర్పడడానికి గల కారణాలను ఆ పుస్తకంలో ఆవిడ చర్చించలేదు.

నాణానికి మరోవైపు

 ప్రఖ్యాత రచయిత శ్రీ చలం గారు 19204లో సావిత్రి నాటకం రచించారు.అందులో ఆయన పురాణ గాధను అంటే సావిత్రి కథను అన్యోన్య ప్రేమను ప్రశంసించేందుకు వాడుకోగా, అదే కథను సత్యవతి గారు పాతివ్రత్యం విలువ కోసం మాత్రమే కాక అన్యోన్య ప్రేమను శ్లా ఘీం చడానికి ,అమ్మాయిలు భర్తల్ని తామే ఎంచు కు నే పద్ధతిని సమర్ధించుకోవడానికి వాడారు .

1934లో ప్రచురించబడిన ఈ గ్రంధంలో అంటే 90 సంవత్సరాల క్రితం తొలి పలుకులో రచయిత్రి లోకమును జరుగుతున్న దురాచారములను నిర్మూలించుటకే నేను ఈ గ్రంథమును ప్రకటించితిని .ముఖ్యంగా అనాధలకు జరుగుతున్న శిరోముం డనాది పరాభవములను తగ్గింపవలెనని నా ముఖ్య ఉద్దేశము అని ప్రకటించుట నిస్సందేహంగా సాహసోపేతమైన చర్య.

సారాంశం

సత్యవతి తండ్రి బెజవాడలో ఓవర్ సీయర్ .ఆమె ఐదేళ్ల వయసులో వాళ్ళ ఊరిలోని బాలి కా పాఠశాలకు పంపించారు. ఆమెకి చిన్నప్పటినుంచి దైవభక్తి ఎక్కువ .పతివ్రత చరిత్రలు ఎక్కువగా చదివేది. పది సంవత్సరాల వయసులో కోరంగి గ్రామంలో జరిగిన ఒక ఉపనయన కార్యక్రమానికి హాజరై, అతనే భర్తగా కావాలనుకున్నది .తర్వాత అతనితోనే ఆమె వివాహం జరిగింది .అతని పేరు సీతారామయ్య అతను ఎఫ్ .ఏ పరీక్షలో ఉత్తీర్ణు డయ్యాక  మామగారి ప్రోద్బలంతో కాకినాడ ఉన్నత కళాశాలలో బిఏ చదివాడు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరాడు .శ్రీకాకుళంలో ఆరు నెలలు పని చేశాడు. తర్వాత ఆముదాలవలసకు బదిలీ అయింది. అక్కడ అతను అకారణంగా ఉద్యోగం కోల్పోయాడు. మద్రాసు వెళ్లి పోరాడి, తిరిగి ఉద్యోగం సంపాదించుకున్నాడు .పై అధికారి అతని మీద కోపంతో బమినిగాం  అనే ఏజెన్సీ ఏరియాకు బదిలీ చేశారు. అక్కడ నివసించడానికి అనువు గా లేకపోవడంతో సత్యావతి కొద్దిరోజులు భర్త నుంచి దూరంగా ఉండవలసి వచ్చింది. తర్వాత అతనికి దారిగం బాడీ అనే స్టేషన్కు బదిలీ అయింది. అక్కడికి తన భార్యతో పాటు ఒక మనిషిని ఇచ్చి పంపమని మామగారికి ఉత్తరం రాశాడు సీతారామయ్య .సగం దూరం వచ్చిన తర్వాత ,అక్కడి పరిస్థితులు చూసి భయపడి తోడుగా వచ్చిన ముసలామె వెనక్కి వెళ్ళిపోయింది .చివరికి దంపతులిద్దరూ దారిగం  బాడీలో కొద్ది రోజులు కాపురం చేస్తారు. తర్వాత ఇద్దరు అప్పుడప్పుడు జ్వరం బారిన పడుతూ ఉండేవారు. కొంతకాలానికి సీతారామయ్య ఆ జ్వరంతోనే  కన్నుమూశాడు.

 భర్త మీదనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న ఆమె  ఆయనతో పాటు చనిపోవాలని సహగ మనం చేయాలని ప్రయత్నం చేసింది .కానీ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఆపి తిరిగి తండ్రి వద్దకు పంపేశారు. అక్కడ నుంచి మరణించే వరకు ఆమె భర్తనే తలుచుకుంటూ జీవితం సాగించింది అనే విషయం మనకి గ్రంథం చదివినప్పుడు అర్థమవుతుంది.

ఇప్పుడు సత్యవతి గారి అభిప్రాయాలను గురించి తెలుసుకుందాం దానికి ముందుగా మరొక మాట గుర్తుంచుకోవాలి .ఇది 1934 అంటే 90 సంవత్సరాల క్రితం ప్రచురించబడి. రాయబడినటువంటి గ్రంథం అనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి.

  1. వివాహమైన వెనుక ఎట్టి శ్రీమంతులకు శ్రీమంతునులైనను తమ భర్తను అనుసరింపక తప్పదు .
  2.  చదువుకొని చేతికి అందిన కుమారుడు ఇంట నుండి సంపాదింప కున్న తల్లిదండ్రులు ఊరుకొనరు .
  3.  పోలీసు వారికి విశ్వాసము సున్న . దయాదాక్షిణ్యములు చుక్కకెదురు. సత్యము వీరికి సవ తి .తల్లి వంటిది. లంచం అన్న మరి మంచినీ రు .
  4.   లోకమున భర్తతో పాటు భార్య కూడా కష్టసుఖముల యందు పాల్గొనుట సతి ధర్మము .
  5. అందరికీ తమ భర్తలను బ్రతికించుకొని, వారితో సుఖముగా ఉండవ లేనని ఉండును. అది సాగనిచో ప్రాణమునకు తెగించి ,సహగమనము చేయుట మంచిది

 భర్త పోయిన స్త్రీలకు జరపు వంచనలు ,పరాభవములు పొందుట కన్నా, చావే  సర్వోత్తమం అనిపించును .

  • దేశము కొరకు ఎన్ని పాట్లు పడుచున్నను గాంధీని కూడా కొందరు దూషించుచునే ఉన్నారు .
  • భర్త పోయిన వెంటనే కేశఖండనము చేయించుట,సాయిను గుడ్డ కట్టించి, ముసుగు వేసి ,మూలను కూర్చుండబెట్టుట ,రాత్రులందు  తిండిని మాన్పించుట ఇవన్నీ మానవ స్వభావమునకు విరుద్ధములై యున్నవి .
  • ముసుగు వేసికొన్న  మర్యాదలు, పిండి తినినందున వైరాగ్యము అలవాడు నా   ?9)మనదేశమున కన్యాశుల్కము వర సుల్కములు పుచ్చుకొను ఆచారం ప్రభలమైనది .అందుచేతనే అనేక అనర్ధములు వాటిల్లుచున్నవి .

10 ) దంపతుల అనురాగమునకు మనస్సు కలియుటయే ప్రధానము కానీ సూత్రధారణము కాదు .

  1. భార్యకు పతివ్రతాత్వం ఎంత ఆవశ్యకమో  భర్తకు పత్నీవ్రతము అంత ఆవశ్యమే.
  2.   పుణ్య పాపములు చేసిన వారలకు భేధ మేమియు మరణమున కాన వచ్చుటలేదు .
  3.  పుణ్యమన పరోపకారమే అని యు, ఇతరుల హింసించుట, కష్టపెట్టుట పాపమని నా అభిప్రాయము.

ఆమె జీవిత చరిత్రలో కొంతకాలమునకు సంబంధించిన కొన్ని సంఘటనలు మాత్రమే ఇందులో వ్యక్తం చేయబడినవి. నేటికీ కూడా ఆశ్చర్య పడునట్టు అనేక అభిప్రాయం వ్యక్తపరిచిన సత్యవతి గారి సామర్థ్యం ఊహకందని ది .ఆ రోజులలో ఇది ఎంతో దుమారము రేపి ఉండవచ్చు. అందువల్లనే ఇది అజ్ఞాతములో ఉండిపోయనేమో.

 90 సంవత్సరాలకు పూర్వము ఇటువంటి అభిప్రాయములను కలిగి ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి వాటిని తన మనసులో దాచుకొనక ఒక పుస్తక రూపమున ప్రకటించుకొనుట అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజులలో మనము ఊహించినటువంటి కొన్ని భావాలను ఆవిడ ఆ గ్రంథంలో వెల్లడి చేశారు .ఇటువంటి కాలానికి ముందు నడిచిన వాళ్ళు ఎందరో ఉండి ఉండవచ్చు. మనకు తెలుసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ అనిపిస్తుంది.

ఇదండీ సత్యవతి గారి ఆత్మ చరితము యొక్క చిరు పరిచయం.

March 20, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ఆ బంధాలలో తీపెంత?

by Kondapally Neeharini March 16, 2025
written by Kondapally Neeharini

మార్చ్ మయూఖ పత్రిక సంపాదకీయం

  • డాక్టర్ కొండపల్లి నీహారిణి, ⁠మయూఖ ఎడిటర్

మనిషి యాంత్రిక జీవితంలో కొత్తగా ఆర్టిఫిషల్ సంతోషాలు అలుముకున్న నేపథ్యం సంతృప్తి పరుస్తున్నాయా? మరోపక్క ఉమ్మడి కుటుంబాలు ఎంతవరకు మనుగడ కొనసాగుతున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా! ప్రతి జీవితం ఆశల సౌధమే…అయితే అర్భాటాలకు పెద్ద పీటలు ఎవరు వేస్తున్నారు! ఇది ఆలోచించాల్సిన విషయం. అన్నీ కలిసిన ” మిక్సర్ ప్యాకెట్ ” జీవితం అయినప్పటికీ , ఉండాల్సిన రుచి అనే ఆత్మీయతను కోల్పోయిన బంధాలు అనుబంధాలలో పొందుతున్న అనుభూతులెంత? వీటిలోతాత్కాలిక ఆనందానికి ఆ బాటలు ఎవరికి వారు వేసుకున్నవే అనటంలో ఎటువంటి సందేహం లేదు.
   కలసి ఉంటే కలదు సుఖం అన్నారు పెద్దలు.
అమ్మ, నాన్న, భార్య భర్త, కొడుకులు, కూతుర్లు, పిల్లలు , వాళ్ళ కు కలిగే సంతానం తో వచ్చే సంబంధాల పిలులుపు, అత్త మామ , చిన్నమ్మ పెద్దమ్మ అమ్మమ్మ చిన్నాన్న, పెద్ద నాన, తాత వంటి మాటలు ఒక ధైర్యాన్ని , ఒక అనుబంధాన్నీ తెప్పించే మాటలు . వీటి విలువను తర్వాత తరాలకు అందించటానికి పునాదులు ఇప్పుడే వేస్తేనే భవిష్యత్తు ఉంటుంది.
కుటుంబ వ్యవస్థను ప్రతిబింబించే  సంకేతాన్ని తెలియజేయడానికి,  ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడం. యాంత్రిక జీవితంలో  అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయిన కారణంగా… అనేక కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే అతి చిన్న విషయాలైన ఒక వ్యక్తి ఒకరికి  చరవాణిలో పంపిన  మెసేజ్ ని చూడకపోతే , లేదంటే చూడటం సమయం ఎక్కువైపోయినా, ఆలస్యమైనా ఒక అభిప్రాయానికి వెంటనే సదరు వ్యక్తిపై సాధారణంగా ఏర్పరచుకుంటున్నారు. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. సాంకేతిక సౌకర్యాల వల్ల ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంటుంది.రోజూ వచ్చే సమస్యలు, అవి తీర్చుకునే అవసరాల వల్ల వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన, కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.
      ప్రస్తుత కాలంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఆవశ్యకతను తెలియజేయడం కోసం అందరం కృషి చేయాల్సిన కర్తవ్యం ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, సుఖ సంతోషాలు కలిగినప్పుడు కచ్చితంగా కుటుంబంతోనే చెర్చించుకుంటాం. అదే కుటుంబమే లేని రోజు మన బాధలు, మన సంతోషాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అన్నీ ఉన్నా, ఏమీ లేని వారిగా మిగిలిపోవాలి.  అంటే ఏకాకి జీవితాన్ని ఏర్పరుచుకొనే పరిస్థితులు రాకుండా ఉండడం కోసం  ప్రయత్నం చేయాలి. అన్ని జీవులలో మనిషి యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ   కుటుంబం అంటే సంతోషం, బాధ, దుఃఖం, ప్రేమ, అనుబంధాలు, ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం.  అన్నీ కలిస్తేనే జీవితమని కొత్త తరానికి అర్థం చేయించాలి.
       ఇప్పుడు ఒక్కో ఇంట్లోనూ ఎంతమంది కలిసి ఉంటున్నారు? పోనీ.. మనం ఉంటున్న ఊరిలో ఎక్కడన్నా  కుటుంబం అని చెప్పుకుంటున్న ఇంట్లో అయినా మొత్తం ఎంతమంది కలసి నివాసం ఉంటున్నారు? మహా అయితే, నలుగురు ఐదుగురు ఉంటున్నారేమో! ఓ పది పన్నెండు మంది కుటుంబసభ్యులు ఎక్కడన్నా ఒక చోట కలిసి ఉన్నట్టు చెప్పగల వాళ్ళ ను మనం కూడా చూసే ఉంటాం. అంతకు మించి కలిసి జీవిస్తున్నవారిని చూసిన గుర్తు మీకుందా?   అంటే ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్తాం. ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రశ్నను చాలా ఆలోచించాల్సి వస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం వింటే  ఒకే ఇంటిలో 38 మంది కలిసి నివసిస్తున్నారు  అంటే ఎవరైనా  నమ్ముతారా? అదీ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో కూడా…అవును అటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎక్కడంటే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ దగ్గరలో. ఒక కుటుంబంలోని  పురుషులు బయట వ్యాపారాలు..ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలంతా ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఇది నిజంగా ఒక ఆశ్చర్యంగా ఉన్న విషయమని చెప్పవచ్చు.
కలసి ఉంటె కలదు సుఖం అని ఈరోజుల్లో కూడా ఒకే ఇంటిలో కలిసి జీవిస్తున్న ఆ పెద్ద కుటుంబం గురించి కొన్ని విశేషాలు పొందే పదే గుర్తుకు చేసుకోవాలి. సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలకు ఇవే నిదర్శనం. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేయడం, బయటపడే మార్గం చూపడం చేయాలి. వీటిపై అవగాహన పెంచడం , కుటుంబాలను ప్రభావితం చేసేందుకు చాలా కోణాలలో పనిచేయడం మనందరి బాధ్యత.
” కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం – దేశాన్ని కాపాడుకుందాం”

March 16, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఆకాశవాణి

by mayuukha March 16, 2025
written by mayuukha

ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు ఎఫ్ ఎం రేడియో 103.5 మెగా హెడ్స్ పై లేదా
https://onlineradiofm.in/stations/all-india-air-warangal
లింక్ ద్వారా కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా వినవచ్చు

March 16, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రాజవరం గ్రామ ప్రజల కొంగుబంగారం –  మల్లప్పయ్య స్వామి  జాతర

by Kancharla Mahesh March 16, 2025
written by Kancharla Mahesh

           భారతరాజ్యాంగం అన్ని కులాలకు, అన్ని మతాలకు సమోన్నత స్థానాన్ని కల్పించింది. కనుక ఏ కులము, ఏ మతము తక్కువ కాదు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ యొక్క విశిష్ట లక్షణం. ఇంతటి విశిష్టత కలిగిన 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానిది ప్రత్యేక స్థానం. తెలంగాణ రాష్ట్రము అనగా గుర్తుకొచ్చేది  వీరత్వం. అలాంటి వీరత్వం కలిగిన ఈ నేలలో ఒక యుద్ధానికే కాదు దైవత్వానికి కూడా చోటు ఉంది. ఉత్తర తెలంగాణ మొత్తం శైవాన్ని ఆరాధిస్తే, దక్షిణ తెలంగాణ మాత్రం వైష్ణవాన్ని ఆరాధిస్తూ వస్తుంది. దానికి కారణమేంటంటే చారిత్రక నేపథ్యం కలిగిన రాజులు ఆ ప్రాంతాలను పరిపాలించారు. చరిత్రలో చూస్తే కాకతీయులు ఓరుగల్లును కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. వీరి ప్రధాన దైవ ప్రచారం శైవ మతం. రాజులు తమ యొక్క గొప్పతనం తెలపడం కోసం మరియు ఇష్ట దైవాలా కోసం గుళ్ళు గోపురాలు కట్టడం రాజుల యొక్క ఆనవాయితీ. వాటిలో చూడదగినవి  వేయి స్తంభాల గుడి, స్వయంభు ఆలయం, అయినవోలు మల్లన్న  మొదలైనవి. కాకతీయుల కాలంలో గొప్ప కవుల సైతం శైవ మత ప్రచారానికి తమకలాన్ని బలంగా వాడారు. వారిలో తెలంగాణ ఆదికవిగా ప్రసిద్ధి చెందిన పాల్కురికి సోమనాథుడు ఈ నేలపైన శైవ మతాన్ని ప్రచారం చేశారు. అట్లని వైష్ణవం లేకపోలేదు ఉత్తర తెలంగాణలో వైష్ణవం మరియు జైనం  కూడా స్వల్ప స్థాయిలో కనబడుతుంది. మరి దక్షిణ తెలంగాణను విష్ణు కుండీనులు పరిపాలించారు. వీరు ఇంద్రపాల నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. స్వల్ప స్థాయిలో శైవాన్ని, జైనాన్ని శిఖర స్థాయిలో వైష్ణవాన్ని ప్రోత్సహిస్తూ వచ్చారు.  వాటిలో చూడదగినవి తెలంగాణ తిరుపతిగా వర్ధిల్లే యాదగిరి నరసింహస్వామి, కృష్ణా నది ఒడ్డున విరిసిల్లిన మఠంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి మొదలైనవి. చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా విష్టకుండీలా కాలం నాటిదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కాకతీయులు తమ రాజ్యాధికారాన్ని విస్తరించుట కొరకు యుద్ధాలు చేస్తూ అక్కడక్కడ దైవత్వాన్ని ప్రతిష్టిస్తూ వెళ్లారు. అట్ల ఏర్పడినటువంటి గుళ్లలో నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం, రాజవరంకు సమీపాన ప్రతిష్టించబడిన మల్లప్ప స్వామి గుళ్ళు నిలువెత్తు నిదర్శనాలు. 12వ శతాబ్దం నాటి ఈ గుళ్ళు చెక్కుచెదరకుండా నేటికీ కొన్ని గ్రామాల ప్రజల దైవంగా వర్ధిల్లుతూ వస్తున్నాయి.
గుడి చారిత్రక నేపథ్యం :
        తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం మరియు చుట్టుపక్కల  గ్రామప్రజల దైవం మల్లప్పయ్య స్వామి. కొలిచేవారికి కొంగుబంగారమై నిలిచింది. . రాజవరం గ్రామం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో గట్ల మధ్య కొలువైన ఒక అందమైన గుడి. ఈ గుడి చారిత్రక నేపథ్యం సుమారుగా 800 సంవత్సరాల క్రితం. అంటే కాకతీయుల కాలం నాటిది. వీరి కాలంలో కట్టిన గుళ్ళు ఎక్కువగా మండపాల రూపంలో కనబడుతుండేవి. కాకతీయులు యుద్ధానికి వెళ్లే సమయంలో పేరిణి నృత్యం  ద్వారా శివుని రౌద్రాన్ని ఆరాధిస్తూ వెళ్లేవారు. అలా చేస్తే వారి యుద్ధంలో గెలుస్తారని విశ్వాసం. అట్లాంటి విశ్వాసాన్ని తెలంగాణ నేలపై అంతా విస్తరించిన ఘనత కాకతీయులది. మల్లప్పయ్య స్వామి గుడి కూడా మండపం రూపంలో ఉన్నదే. అలా కట్టిన గుళ్ళు ఇప్పటిదాకా చెక్కుచెదరలే. ఇంతటి సుందరమైన గుడులను కట్టిన కాకతీయులు తెలంగాణ నేలను, తెలుగు నేలను సుసంపన్నం చేస్తూ దైవత్వాన్ని ప్రచారం చేశారు. కాకతీయులకు అద్దం పట్టిన ఈ గుడిలో అద్భుతమైన శివలింగాన్ని చూడవచ్చు. ఇక్కడ చుట్టూ అద్భుతమైన ప్రకృతి వనంలో ఆరాధ్య యోగ్యమైన శివలింగం నిండు పున్నమిలా కనబడుతుంది.
 మహాశివరాత్రి పర్వదినం…
             జాతర అనగా జనం గుమికూడటం. జనాలు మొత్తం గుమిపూడి తమ సుఖశాంతులను పంచుకునే అద్భుతమైన వాతావరణమే పండగ. చిన్న పెద్ద ముసలి ముతక, యువకులు, కులమతలకు అతీతంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగే మహా శివరాత్రి. అలాంటి పండుగను రాజవర గ్రామం మరియు చుట్టు ప్రక్కల ప్రజల ఎక్కడలేని విధంగా అంగు ఆర్భాటాలతో  జరుపుకుంటారు. మహాశివరాత్రి అనేది ఇక్కడి గ్రామ ప్రజల పెద్ద పండుగ. తెలంగాణలో పెద్ద పండగ దసరా అయితే ఆ పండక్కు తమ ఆడ బిడ్డలని తీసుకొని రావడం ఆనవాయితి. కానీ రాజవరం గ్రామ ప్రజలు దసరా కంటే భిన్నంగా మహాశివరాత్రికి తమ ఆడబిడ్డలను తీసుకొని వస్తారు. మొక్కులు ఉన్నవారు ఉపవాసాలు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే “ప్రభలు కట్టడం”. ఇలా  ప్రభలు కట్టడం, ఉపవాసాలు ఉండటం వల్ల తమ కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం. శివరాత్రి నాడు తమ మొక్కుల తీర్చుకొనుటకు ప్రభలను కట్టి ఆ రోజంతా ఊరేగింపు చేసి 12 గంటలు దాటిన తర్వాత మల్లప్పయ్య గుడి దగ్గరికి బయలుదేరుతారు. ధూప దీప నైవేద్యాలతో, మొక్కు ముడుపులను దేవునికి సమర్పిస్తారు. జాగారాలతో జరిగే ఈ పండగ దశ దిశల విస్తరిస్తూ, కోరిన కోరికలు తీరుస్తూ మహిమను చాటుతూ వస్తుంది. ఇక్కడ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా లింగంపై పడడం. కాకతీయులు తమ గుళ్లను కట్టేటప్పుడు ఒక సైంటిఫిక్ అనువర్తనాలను అనువదిస్తూ కట్టి ఉండవచ్చు. ఈ మల్లప్ప స్వామి గుడి కూడా ఆకోవకు చెందినదే. ఇంతటి విశిష్టత కల్గిన మల్లప్పయ స్వామి మహిమలను దశ దిశలా చాటాల్సిన బాధ్యత రాజవరం మరియు చుట్టుపక్కల ఉన్న  గ్రామ ప్రజలపైనే ఉంది.
 కోనేరు ప్రత్యేకత :
    ప్రాణ కోటికి జీవనాధారం నీరు. అలాంటి నీరు భూమి పైన 97% ఉప్పునీరు. మూడు శాతం మంచినీరు కలదు. ఆ మూడు శాతం మంచినీరులో త్రాగడానికి యోగ్యమైన నీరు మాత్రం ఒక్క శాతం మాత్రమే. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే ప్రయత్నాలు జరగొచ్చు. కనుక నీరు ఎంత ముఖ్యమైనదో మనం గమనించవచ్చు. మల్లప్ప గుడి దగ్గర ఉన్న కోనేరు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. “నిత్య కళ్యాణం – పచ్చతోరణం” లాగా సంవత్సరం పొడుగు నీళ్లు ఊరుతూనే ఉంటాయి. ఏ కాలంలో పోయిన ఎంత కరువు వచ్చినా అక్కడ నీళ్లను మనము చూడవచ్చు. గుడి దగ్గరికి వచ్చిన భక్తులందరూ ఆ కోనేటిలో స్నానం చేసి తమ మొక్కుబళ్లను దేవునికి సమర్పిస్తారు. కోనేటిలో స్నానం చేయడం వల్ల తన పాపాలు పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఎంత ఎండాకాలమైనా రాళ్ల మధ్యలో నుండి వచ్చే నీరు రిఫ్రిజిరేటర్ లో నీటి కంటే చల్లదనంగా ఉంటాయి.
 ముగింపు:
   ప్రజలు అనుకున్న కోరికలు తీరాలని అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గ్రామ పెద్దలు ఎడ్ల పంద్యాలను కూడా పెడుతూ ఉండేవారు. ఈ పండక్కి ఎంత దూరాన ఉన్నా, ఏ పని చేస్తున్న కదిలి రావాల్సిందే. శివరాత్రికి వచ్చిన వారందరికీ మర్యాదలు చేస్తారు. నిజమైన భక్తి శ్రద్దలతో సేవించడం వల్ల కోరికలు తీరుతాయని, ఈ మహిమకరమైన పండుగ  సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. రాజవరం గ్రామ ప్రజలందరూ ఐక్యతతో అంగరంగ వైభవంగా నిత్య భక్తిశ్రద్ధలతో చేసే మహా అద్భుత పండుగ ఈ మహా శివరాత్రి. తమకు ఏ కష్టం వచ్చినా ముందుగా చెప్పుకునే దేవుడే మల్లప్పయ్య. స్వామి తమ కష్టాలను కన్నీళ్లను కడగండ్లను తీరుస్తారని ప్రజలందరి గట్టి నమ్మకం.                                          

March 16, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన నాటకాలు – భూతకాలం నాటకం

by Sammeta Vijaya March 16, 2025
written by Sammeta Vijaya

భూతకాలం ప్రముఖ రచయిత దివాకర్ బాబు గారు రచించిన నాటకం దీనిని డాక్టర్ వెంకట్ గోవాడ దర్శకత్వంలో 90 నిమిషాల నిడివిలో రూపొందించారు. ఈ నాటకం మానవ భావోద్వేగాలు విలువలు ప్రధానమైన అంశంగా ఎంచుకొని రచించిన నాటకం.
గోవాడ క్రియేషన్స్ 15 సంవత్సరాలుగా వివిధ నాటకాలను 25 కు పైగా ప్రదర్శించారు వీరి నాటకాలు సామాజిక స్పృహను కలిగించే దిశలో మానవ విలువల మీద దృష్టిని కేంద్రీకరించి మంచి నాటకాలను అందించే ప్రయత్నం కొనసాగిస్తూ చేసేటువంటి ప్రదర్శనలు అందులో భూతకాలం ఒకటి.
ఈ నాటకం రవీంద్రభారతిలో తొలి ప్రదర్శన మార్చి 1వ తేదీన 2024లో జరిగింది.రచయిత ఎం దివాకరబాబుతో పాటు డాక్టర్ కె.వి రమణ చారి గారు ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ బ్రహ్మానందం గారు ప్రముఖ సినీ నటులు, ఎస్వీ కృష్ణారెడ్డి గారు ప్రముఖ సినీ దర్శకులు, అచ్చిరెడ్డి గారు ప్రముఖ సినీ నిర్మాత, డాక్టర్ మామిడి హరికృష్ణ గారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, శ్రీ సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయిత, శ్రీ ఎల్ బి శ్రీరామ్ గారు ప్రముఖ రంగస్థలం నటులు, రచయిత ,శ్రీ గుంటూరు శాస్త్రి గారు ప్రముఖ రంగస్థల దర్శకులు, శ్రీ డి రామకోటేశ్వరరావు గారు ప్రముఖ రంగస్థల ప్రయోక్త అతిథులుగా వేదికను అలంకరించి ముందస్తుగా నాటకం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డాక్టర్ కేవీ రమణాచారి గారు ప్రసంగిస్తూ అద్భుతమైన నాటకం అని ప్రశంసలు కురిపించి మనిషిని సృష్టించిన భగవంతుడిని ఆ మనిషికి ఏది ఎంత ఇవ్వాలో తెలుస్తుందని అన్నారు.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు మనీషా ఫిలిమ్స్ ద్వారా విజయవంతమైన సినిమాలు తీయడానికి ప్రధాన పాత్ర వహించిన దివాకర్ బాబు రచయితగా అందరికీ సుపరిచితులని అతని కలం నుంచి వచ్చిన నాటకం భూతకాలం గొప్ప నాటకం అన్నారు. ప్రతి మాట ప్రతి అక్షరం ఆచితూచి రచించగల సాహిత్యం మీద పట్టు ఉన్న రచయిత దివాకర్ బాబు అన్నారు పలు నాటకాలను ప్రస్తావిస్తూ నాటక పరిణామ క్రమం తెలియజేశారు అద్భుతమైన నాటక విన్యాసాలను తెలియజేస్తూ నాటక ప్రక్రియకు వన్నెతెచ్చేలా భూతకాలం అనే నాటకం రచించారని ప్రశంసించారు.
శ్రీ బుర్ర సాయి మాధవ్ గారు మాట్లాడుతూ దివాకర్ బాబు గారి రేపేంది నాటకంలో నన్నుచాలా ప్రభావితం చేసింది.నన్ను నటుడిగా గుర్తింపు తెచ్చిన నాటకం అని ప్రస్తావిస్తూ భూతకాలం వంటి నాటకాలు రావాలి ఇలాంటి నాటకాలు రాయాలి ప్రేక్షకులకు మంచి నాటకాలు పిల్లలకి చూపించాలి , చదివించాలి అన్నారు. నా మంచి నాటకం అంటే కాలాన్ని గెలవడం. నాటకం అమ్మతో సమానం అమ్మని బ్రతికించండి అన్నారు.
జూన్ 30వ తేదీన కర్నూల్ లో ద్వితీయ ప్రదర్శన జరిగింది టీ జీవి కళాక్షేత్రంలో ఈ నాటకం ప్రదర్శించబడింది .
ఇక మూడవ ప్రదర్శన డిసెంబర్ 27న రవీంద్ర భారతిలో గోవాడ క్రియేషన్స్ లో రెస్రంజని ఆధ్వర్యంలో జరిగింది బుక్ మై షో ద్వారా 50 రూపాయల టిక్కెట్టుతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ నాటక ప్రదర్శనలో ప్రత్యేకతలు విస్తృతమైన ప్రచారం సోషల్ మీడియాలో ఇన్స్ట్రాగ్రామ్ లో హాజరవుతున్న అతిథులతో , నాటకం చూడాలనే ఉత్సాహం చూపించిన యువతతో వీడియోలు తీసి శ్రీ సాయి తేజ అయినంపూడి ఈ నాటకంలో ఒక పాత్రధారి అయి ఉండి చక్కని ప్రమోషన్ చేయడం శుభసూచకం. ఇది భవిష్యత్ నాటికలను యువతరానికి చేర్చేందుకు సుగమమైన బాటను వేసి నాటకాన్ని టిక్కెట్ కొని చూసే దిశలో మరికొందరిని అనుసరించేందుకు చేసిన చక్కని ప్రయోగం !
నాటకం యొక్క కథా సంగ్రహం ఎలుక దేవుడి కోసం తపస్సు చేసి ఏనుగుంట బలం కావాలని కోరిన దేవుడు ఇవ్వడు అలాగే ఏనుగు తపస్సు చేసి నాకు రెక్కలు కావాలి నేను ఎగరాలి అంటే ఇవ్వదు అదే చేస్తే ఎంత అనర్ధం జరుగుతుందో దేవుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో ఆ భగవంతుడికి తెలుసు అందుకే మనం నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఎన్ని పూజలు చేసిన భగవంతుడు ఇవ్వడు జీవితాన్ని జీవించాలి అనుకునేవాడు భూత కాలాన్ని పీడ కలగా భావించి విస్మరించాలి వర్తమానంలో కలలు కనాలి శ్రమించాలి భవిష్యత్తును భగవంతుడు నిర్ణయిస్తాడు.

ఆహారం, ప్రేమ సంతోషం సంతానం ఇలా సృష్టిలో కావలసిన వన్నీటిని మనకన్నా ముందే భగవంతుడు పంపేస్తాడు మనం చేయవలసిందల్లా మన మాట మనం తీసుకోవడంతో సహా కృషి చేయడం అలా కాదని అత్యాశకు పోతే మనకు అధికంగా ఏమీ రాకపోగా ఉన్నది కూడా పోతుంది కనుక
Be yourself
Live yourself
Achieve yourself
ఈ నేపథ్యం కలిగిన నాటికలు అతివ నాయక నాయకుడు కామనుడు. కామనుడు అతివను ప్రేమించగా అతివ అతను పేదవాడని తిరస్కరిస్తుంది .అది తట్టుకోలేక కామానుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెట్టు వద్దకు వస్తాడు. అక్కడ అతన్ని భూతాలు అడ్డుకొని తనని రక్షిస్తామని దేవుడు వరం ఇస్తే మేము రవం (రివర్స్ )ఇస్తామని నాలుగు రవాలు కోరికలుగా కోరుకోవచ్చని చెప్తారు .

దీనికి లోబడి తన బలహీనతను జయించి ఎలా నిలబడతాడు తెలుసుకోవాలంటే నాటకం ఆశాంతం చూడాల్సిందే!
నాటకంలో కామనుడిగా శ్రీ మంజునాథ , అతివగ కుమారి అనూష, ప్రధాన భూతంగా శ్రీ నిఖిలేష్ సురభి, బాబాయిగా శ్రీ స్వరాజ్ కుమార్ భట్టు, ఆడిటర్ గా డాక్టర్ వెంకట్ గోవాడ, వాస్తవ్ గా శ్రీ సతీష్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ సాయి తేజ ఐనంపూడి భూతాలుగా కుమారి దివ్య శ్రీ గణేష్ శ్రీ రుద్విఖ శ్రీ రాజేశ్వర్ శ్రీ సాకేత్ కుమారి దాక్షాయణి నటించారు నాటకం ప్రదర్శనకు అనువైన సహకారం అందించిన సాంకేతిక నిపుణులు పాటలు శ్రీ కార్తీక్ గానం శ్రీ విద్యాసాగర్ డాక్టర్ హారిక గోవాడ సంగీతం శ్రీ నాగరాజు సెట్ శ్రీ దివాకర్ ఫణీంద్ర అండ్ టీ లైటింగ్ శ్రీ చెన్నకేశవ మేకప్ శ్రీమతి సరిత నిర్వహణ డాక్టర్ రాధాగోవాడ డాక్టర్ గీతిక గోవాడ డాక్టర్ లిఖిత్కాంత్ నిర్వహణ ప్రసరంజని బృందం .
పరుచూరి రఘుబాబు నాటక కళాపరిషత్తులు ప్రదర్శించిన ఈ నాటకం ఉత్తమ ప్రదర్శనగా బహుమతి పొందడం విశేషం!
దర్శకుడు డాక్టర్ వెంకట్ గోవాడ ఈ నాటకం గురించి చెబుతూ అందరి సమిష్టి కృషి ఈ నాటకమని ఇంత అద్భుత ప్రదర్శనకు దోహదం చేసిన రచన దివాకర్ బాబు గారిదని సమినయంగా తెలిపారు. నాటకంలో ఒక తాత్వికత ఉందని జీవితంలో జరిగే అన్ని విషయాలకు భగవంతునిపై ఆధారపడే బదులు మన జీవితాలను మనం నిర్మించుకునేలా కథ మనల్ని ప్రోత్సహిస్తుంది . దురాశ మరియు నిజాయితీ మన మనసుల్ని కప్పి వేసినప్పుడు జరిగే పరిణామాలను కూడా ఈ నాటకం చూపిస్తుందన్నారు . నాటకం అంటే ఏమిటి అని ప్రశ్నించే వారికి ఈ నాటకం సమాధానంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు . నాటకం ఆధునికతతో ముందుకు దూసుకు వెళ్తుంది అనడానికి ఋజువుగా ప్రదర్శనకు ముందు నాటకం చూడమంటూ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ ప్రత్యేక ఆకర్షణ అయితే నాటక ప్రదర్శన అనంతరం అతిధుల ప్రసంగాలన్నీ అభినయ శ్రీనివాస్ గారు యూట్యూబ్లో భూతకాలం నాటక సభలో సందేశాలుగా నిక్షిప్తం చేసి అందరికీ అందుబాటులో ఉంచడం గొప్ప విషయం.
నాటకం ఆధునికత వైపు పరుగులు పెడుతుంది . థియేటర్ కి టిక్కెట్ కొని చూసే దిశకు కావలిసిన రంగం సిద్ధం చేసి సజీవతకు సప్రమాణంగా నిలిచి ప్రేక్షకుల ఆదరణ కోసం ఎదురు చూస్తుంది.

March 16, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us