మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా”

by Radhika Mangipudi January 31, 2025
written by Radhika Mangipudi

భారతదేశంలో అలనాటి ప్రఖ్యాత రాజకీయ నేత, అంతకుమించిన దాత, ఎందరికో స్ఫూర్తి ప్రదాత, ‘మాన్సాస్’ సంస్థ వ్యవస్థాపకులు, విజయనగరం పూసపాటి గజపతి వంశతిలకుడు, స్వర్గీయ పివిజి రాజుగారి శతజయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల సమాహారంగా ‘మాన్సాస్’ సంస్థ ప్రచురించిన  ‘The last Maharaja of vizianagaram’ ఆంగ్ల పుస్తకానికి తెలుగు అనువాద గ్రంథమే ఈ “స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా”  పుస్తకం.

ఇది కేవలం ఒక జీవిత చరిత్ర కాదు. 20వ శతాబ్దంలో మనందరి మధ్య నడచిన ఒక రాజర్షి జీవన ప్రస్థానానికి సజీవ చిత్రం. నియమబద్ధమైన వారి జీవన విధానానికి,  హృదయ సౌశీల్యానికి అక్షర రూపం.  ఇది కేవలం వారి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఉద్దేశించబడినది కాదు. వారి జీవితపయనంలోని అనేక మజిలీలతో పాటుగా, నిబద్ధతకు, నిరాడంబరతకు, నిస్వార్ధ తత్వానికి మారుపేరైన వారి జీవనశైలికి అద్దంపడుతూ రాబోవు తరాలవారికి కూడా మార్గదర్శకమయ్యే గ్రంథం. చదువుతున్నంతసేపూ మనం కూడా పివిజి రాజుగారి జీవనపయనంతో పాటుగా ప్రయాణిస్తాము. అంతలాగా మనల్ని లీనంచేసి ఆసాంతం చదివింపజేస్తుంది. చక్కటి అందమైన తెలుగుశైలిలో పొందికగా అమరిన ఈ పుస్తకం చదివితే ఎక్కడా అనువాద రచనగా అనిపించదు. అచ్చమైన తెలుగు గ్రంథంగా అనిపిస్తుంది. అనువాదకులకు నా ప్రత్యేక అభినందనలు.

‘రాజ కుటుంబీకులు’ అనగానే వారు ఎంతో  విలాసవంతమైన జీవితం గడుపుతారని, వారి జీవితం వడ్డించిన విస్తరిలా ఎప్పుడూ హాయిగా నిండుగా ఉంటుందని మాత్రమే ఆలోచించేవారు తప్పకుండా ఈ పుస్తకం చదవవలసి ఉంది. ఎందుకంటే పైకి కనిపించే వారి హుందా ఆయన చిరునవ్వు వెనుక ఎన్ని రాచరికపు కట్టుబాట్లు ఉన్నాయో, జీవితంలో ఎన్ని ఒడిదుడుకలను ఎదుర్కొన్నారో తెలుస్తుంది. అందులోనూ పివిజి రాజుగారు, వారి తండ్రి అలక్ నారాయణ గజపతి గారు బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పరిష్కరించుకునేందుకు వారు నిలబడి పోరాడిన తీరు ఈ పుస్తకం ద్వారా స్పష్టంగా తెలుస్తాయి.

పివిజి రాజు గారు అనగానే విజయనగర సంస్థానానికి పట్టాభిషిక్తులైన ఆఖరి మహారాజుగా, ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులుగా, కేంద్రమంత్రివర్యులుగా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను నిస్వార్ధంగా చేసిన మహనీయులుగా చాలామందికి తెలుసు.  వారి జీవితాన్ని గురించిన పుస్తకం అనగానే వారి జీవితంలో మధురమైన ఘట్టాలు, వారు సాధించిన విజయాలు, వారి ఉదాత్తతను చాటే కార్యాలు మాత్రమే ఉంటాయనుకుంటే అది పొరపాటే. వారి  జీవితం నిజానికి పరచిన పువ్వుల బాట కాదు. ఎన్ని రకాల సవాళ్లను సమస్యలను ఎదుర్కొంటూ వారు ఆ స్థాయికి చేరుకున్నారో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ, అన్ని కోణాలనుండీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన పుస్తకం ఇది.

పుస్తక ప్రారంభంలోనే అలక్ నారాయణ గజపతి రాజు గారు మద్రాసు కోర్టులో తన పిల్లల జీవితాలకి సంబంధించిన కీలక నిర్ణయం కోసం పోరాడిన విషయాలను గూర్చి చదివితే పసివయసులోనే ఆ పిల్లలు ఏ విధమైన ఆందోళనకు గురై ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పివిజి రాజు గారు ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా పనిచేసిన తీరు దగ్గరనుంచి, జీవితంలో రాజకీయ ఉన్నతి పొంది అత్యుత్తమ స్థాయిలో ఉన్న సమయంలో యాక్సిడెంట్ జరగడం వలన అనుభవించిన మనోవేదన వరకు ఎన్నో విషయాల గురించి విపులంగా చర్చించబడింది. ‘దుఃఖాలకు కృంగిపోక సుఖాలకు పొంగిపోకుండా జీవితంపై సమదృష్టి గలవాడే స్థితప్రజ్ఞుడు’ అని చెప్తుంది భగవద్గీత. పివిజి రాజుగారు దీనికి సజీవ ఉదాహరణగా స్ఫూరిస్తారు వారి జీవితయాత్ర చదివితే. వారియొక్క పూజ్య గురువుల అనుగ్రహంతో ఎంతో ఆధ్యాత్మిక పరిణితి పొందిన కర్మయోగి ఆయన. అందుకే ఈ వ్యాసం ప్రారంభంలో వారిని ‘రాజర్షి’ అని సంబోధించాను. చిన్న సమస్య వస్తే చాలు విపరీతంగా కృంగిపోయి ఆందోళనపడే ఈతరం పిల్లలు తప్పకుండా చదువుకోవలసిన పుస్తకం ఇది. మాన్సాస్ విద్యాసంస్థల విద్యార్థులు మరీ ముఖ్యంగా చదవాలి. ఏ ఆశయ సాధన కోసం ఎంత కష్టపడి ఈ సంస్థలను నిలబెట్టారో, ఎంతమంది అక్కడ చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారో, ఎటువంటి మహానుభావులు ఈ విజయనగరం నేలపై నడయాడారో నేటి తరం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పివిజి రాజుగారు కుసుమాగజపతి గారు దంపతులు భూదానోద్యమ సమయంలో వినోబాభావే గారితో పాటు కలసి నడిచి ఎంతో ప్రచారం చేశారు. ఊరి నడిబొడ్డులో తమ వంశపారంపర్యంగా వస్తున్న కోటను విద్యాభివృద్ధి కోసం దానం ఇచ్చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే ‘వేల ఎకరాల భూమిని  ప్రజలు కోసం దానమిచ్చిన ఉదాత్త హృదయులు మా రాజుగారిని’ విజయనగర ప్రజలు తరతరాలుగా గర్వంగా చెప్పుకుంటారు.

పూసపాటి గజపతి రాజవంశం.. నిరంతరం ప్రజల బాగును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్న కుటుంబం అది. విద్యాసంస్థలను నెలకొల్పడంలో కానీ, బ్రిటిష్ పరిపాలనా పద్ధతులకు కొన్నిసార్లు తలవంచడం కానీ, అప్పట్లో లక్షల రూపాయల విరాళాలతో వివిధ ప్రదేశాలలో కట్టించిన కట్టడాలు కానీ.. అన్నిటి వెనుక ఉద్దేశం ఒకటే..  దీనజనోద్ధరణ, నలుగురికి ఉపయోగపడాలనే తాపత్రయం. అంతటి ఉదాత్తమైన  వంశ చరిత్ర అంతా కూడా సంపూర్ణంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. కనుక సుమారు 300 యేండ్ల చరిత్రతో పాటు, రాష్ట్రంలో సంభవించిన యుద్ధాలు, అప్పటి రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలనన్నింటినీ సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.  విజయనగరంవారు మాత్రమే కాకుండా తెలుగువారందరూ గర్వపడాల్సిన అంశాలను తనలో అందంగా పొందుపరచుకున్న ఈ పుస్తకం తప్పక పాఠకాదరణ పొందుతుందని ఆశిస్తూ మాన్సాస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు,

January 31, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ఈ మౌనం మంచిది కాదు

by Kondapally Neeharini January 31, 2025
written by Kondapally Neeharini

జనవరి మయూఖ పత్రిక సంపాదకీయం

 – డాక్టర్ కొండపల్లి నీహారిణి

అందమైన జీవితాన్ని ఎవరు ఆశించరు? ఆనందమైన బ్రతుకు పయనాన్ని ఎవరు కోరుకోరు? తరతమ బేధాలలో శాతాలుగా విభజించుకొని నైతికతను తినేస్తున్నది ఇప్పటి సభ్య సమాజం. దీన్ని ఎవరికి వాళ్లు వాళ్లలోకి వాళ్లు చూడడానికి నిరాకరించుకుంటున్నారు.

“బూడా గోడా లాల్ లగామ్”ముసలి గుర్రానికి షో కైన కళ్లెం” కాదు జీవితమంటే.లౌక్యం వేరు లోకజ్ఞత వేరు. అసలే ఒకే తరహా రాజకీయ పద్ధతిని చూస్తున్నాం. అదెంతా వికారమో తెలుసు. ప్రజాస్వామ్యం ఎట్లున్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడెలా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. పార్లమెంటరీ పాలనా విధానాలు అనేవేవీలేవు. వందరెట్ల నిరంకుశతత్వాన్నే చూస్తున్నాం. పార్టీలు కాదు గెలిచేది పైసలు గెలుస్తున్నాయి అన్నట్టున్నవి పరిస్థితులు. ధైర్యం అనేది కొనుక్కుంటే వచ్చేదా?  ఇది అన్యాయం అన్నప్పుడు నిరసనను ఏ విధంగానైనా తెలియజేయాలి కదా !కేవలం నిందలు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ లాగా  అంతర్లీనంగా ఒకటి నడుస్తున్నది. ప్రత్యామ్నాయ శక్తి లేకుండా పోతున్న రోజులు . అది ఏ పార్టీ గాని అది ఏ ప్రాంతం కానీ ఇదే పరిస్థితి. ఈ రాజకీయాలు విద్యావ్యవస్థలోనూ జొరబడ్డాయి.

సమాజము, ప్రజలు ,విలువలు అనేవి ఏవి మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ….ఇవి మాత్రమే రాజ్యమేలుతున్నాయి. ఈ భావ దారిద్ర్యం ప్రజల పట్ల ఒకే సారాంశంతో సంచరిస్తున్నది. Political గా అస్తిత్వం అనే భావన కనుమరుగవుతున్న రోజులు.

ఇవన్నీ పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రభావితం చేస్తున్నవి. కళాశాల విశ్వవిద్యాలయాల స్థాయికి వెళ్లిన తర్వాత

వంటబట్టాల్సిన రాజకీయాలు, ఉన్నత ప్రాథమిక పాఠశాల నుండే కుటుంబ పరంగా, కుల పరంగా వాళ్ల మెదడులలో దూర్చి పిల్లల చైతన్యవంతమైన ఆలోచనలను శాసించి చైతన్య హీనంగా చేస్తున్నవి.  మార్కులు, ర్యాంకులు మరో విధమైన చెలగాటం ఆడుతున్న విద్యార్థులతో …దీనివల్ల తల్లిదండ్రులు, కుటుంబం, బడి ,చదువు ,టీచర్ అనే వాతావరణం నుండి మరింకేదో వాతావరణం కోరుకుంటున్నది ఈ తరం. అది కాస్త వికృత రూపం దాలుస్తున్నది. వీటి నుండి బయట పడాలంటే ఒక్కటే మార్గం… పుస్తకాలను చదివించడం. బవంతంగా నైనా చదివించడం…. ఇష్టపడేలా చేసి చదివించడం… ఎలా? రెండు వైవిద్యమైన భావాలు ఒక్కచోట చెప్పాల్సిన పరిస్థితి వస్తున్నాయి.దీనిలోని మంచి చెడులను గ్రహించి తల్లిదండ్రులు టీచర్లు కలిసి పిల్లల ముందు చర్చించుకోకుండా వాళ్ళ లేత మనసులు గాయపడకుండా జాగ్రత్తగా  ఒక ప్రణాళికను ఏర్పరచుకొని చేయాలనుకుంటే…

సారస్వత క్షేత్రంలో బంగారు పంటలు పండించిన ఇతిహాసాలు మనకున్నాయి. కావ్య యుగంలో రసవత్తరమైన రచనలు వెలువడిన సాహిత్య చరిత్ర మనకు ఉన్నది. విద్వత్ కవుల అద్భుత రచనలు అక్షర దీపాలుగా ప్రజ్వలిల్లిన వాజ్మయ చరిత్ర మనకున్నది. శాస్త్ర సాంకేతిక విద్య సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, యోగాభ్యసన, తాత్వికచింతన ఉన్న మన దేశం విలువలను ప్రస్ఫుటించే పుస్తకాలెన్నో ఉన్నాయి.  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఉన్నాయి. అటువంటివన్నీ అందుబాటులోకి తీసుకువచ్చి కొత్త తరం వాళ్లకు నేర్పించాలి. లేకుంటే చెప్పలేనంత సాచ్యురేషన్ అనేది వచ్చి అన్నీ పోతాయి . ఎక్కడికి పోతాయి?  ఆ గ్రంథాలు అలాగే ఉంటాయి భాండాగారాలలో!! ఆ  జ్ఞానసంపద అంతా అలా నిక్షిప్తమైపోయి ఉంటుందే కానీ ఏ సమాజానికైతే అవసరమో భావి పౌరుల జీవన్ మార్గానికి తోడుగా ఉంటాయో అవి ఏవి వాళ్లకు అందకుంటే అవన్నీ అక్కడ భద్రపరిచి ఉన్నా లేనట్టే!

అయితే అవన్నీ ఈ కాలం పిల్లలు చదవలేరు అనుకుంటే వాళ్లకు అర్ధమయ్యే రీతిలో వాళ్ళ వాళ్ళ మాతృభాషలో నే కాకుండా ఇప్పుడు వాళ్లు ఇంగ్లీష్ మీడియం లో  చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నైనా

చిన్న చిన్న వాక్యాలతో ఆ పెద్ద భావాన్ని ప్రోది చేస్తూ కొత్తగానైనా పుస్తకాలు రాయాలి. రాయించాలి. ఇటువంటి పుస్తకాలు యూనిక్ గా ఉండి సమాజ యోగ్యమైనవి  రచింపజేస్తే పిల్లలకు రురించి అవి మాత్రమే నిలుస్తాయి.

   గ్రూపులు కట్టడాలు, నిందలు వేయడాలు…. తీవ్రమైన లొసుగులు తో నడుస్తున్నవి రోజులు.అవినీతి చాలా పెరిగిపోయి పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగా చూస్తున్నారు. విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను  పావులుగా వాడుకుంటున్నారు.

“జై సాకరోగే వైసా బరోగే” “మనం ఎట్లా చేస్తే ఫలితం అట్లా వస్తుంది”

పాఠశాలల ఉపాధ్యాయులు శ్రద్ధగా పాఠాలు చెప్పకుంటే పిల్లలు చదువరు. పిల్లల స్థాయికి తగినట్టుగా చదువు చెప్పే వాళ్ళు లేకుంటే విద్య నిలువదు. చాలా వరకు తెలుగు మీడియంలో చదువుకున్న టీచర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వాళ్లకు బోధనలో ఉండడం అనేది శోచనీయమైనటువంటి విషయం. అంతటా కాకుండా గ్రామీణ ప్రాంత బళ్ళలో ఇదే జరుగుతుందని వినికిడి. టీచర్స్ కే రాకుంటే పిల్లలకి ఏం చెప్తారు? భాష పై పట్టు ఉండి, భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పగలిగే శక్తి ఉండి గ్రామర్ మిస్టేక్స్ పిల్లలు ఎక్కడ చేస్తున్నారో పట్టుకొని నేర్పించగలిగే యుక్తి ఉంటేగాని విద్యార్థులకు  సరైన ఇంగ్లీష్ వస్తుంది , న్యాయం జరుగుతుంది. అసలే smart phone మాయాజాలంలో అంతా బూటకపు వార్తల ప్రపంచంలో సమాజం . ఎన్నో మంచి విలువైన విశేషాలు ఉన్నా కూడా ఫోన్ ను miss use చేస్తూ పిల్లలు వాళ్ళ జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఈ విషయంపై అంతుపట్టడం లేదు. చదువుతున్నారు… ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి.. అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ, తమ పిల్లలపై ఇన్ని రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి… ఈ ఆవరణలో నుంచి బయటికి రాలేకపోతున్నారు మా పిల్లలు  అని గ్రహించలేకపోతున్నారు.ఏం చేయాలో  వాళ్ళ కూ అర్థం కావడం లేదు. మొక్కలలోనూ divinity ఉన్నదని చెప్తున్న పరిస్థితులను చూస్తున్నాం … అటువంటిది మనుషులలో ఎందుకు లోపిస్తుంది ? లోపించదు. వెలికి తీయాలి. అన్ని మతాలలోనూ నిత్య నూతనమైన సనాతనమూ ఉన్నది. నిలువెత్తు ధర్మాన్ని ఆపాదించుకున్న సంస్కృతి మనకున్నది. అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్న

భారతదేశం  ఇది. ఈ ఉన్నత విలువలను జారవిడుచుకుంటే భవిష్యత్తు అంతా అంధకారమే. సనాతన ధర్మము అంటే, సంస్కృతి అంటే, ఆచారాలు అంటే ఏవో తప్పు మాటలు అనే భావాన్ని కొత్త జనరేషన్ కు నేర్పిస్తున్నారు. ఇది ఎంతో ప్రమాదం. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా ఇవన్నీ పాటిస్తుంటారు. మరి మన దేశానికి ఏమైంది? మనుషులం… మనం ఆకాశం నుంచి ఊడిపడలేదు.  ఇవన్నీ తప్పకుండా అందరూ గ్రహించాలి. ఒక సమయమనంతో సాగాలి.

  ఒకప్పుడు ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధాసక్తులతో పాఠ్య బోధన చేసేవాళ్లు. ఆనాటి టీచర్స్ ను గుర్తు చేసుకుంటే down to Earth  అని చాలామంది అంటారే… ఆ విధమైన మనస్తత్వాలతో సమాజ నిర్మాణం వాళ్ల చేతుల్లోనే ఉన్నది అనే గొప్ప భావనతో పాఠ్య బోధన చేసేవాళ్ళు. ఇది మళ్ళీ పునరావృతం కాకుంటే…

రాబోయే తరాలకు జవాబుదారీగా నిలవాల్సింది ఎవరు? మేధావులు ఇలా మౌనం వహించడం మంచిది కాదు. ఈ మౌనం దేశ సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాలను ఎదగకుండా చేస్తుంది. కౌన్సిలింగ్ క్లాసెస్ టీచర్స్ కి కూడా పెట్టి వాళ్లలో దాగి ఉన్న మంచితనాన్ని , తెలివినీ, కృషి తత్వాన్ని, ఋషి తత్వాన్నీ  మేలుకొలిపి మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చేలా … ఎ గుడ్ టీచర్ మేక్స్ ఎ గుడ్ సొసైటీ అనే నినాదాన్ని ఎలుగెత్తి చెప్పాలి.

“పట్టుపట్టగ రాదు పట్టి విడువగ రాదు

పట్టెనేని బిగియపట్టు పట్టవలయు….” అన్నారు పెద్దలు . ఈ మాటలకున్న అర్ధాన్ని అందిపుచ్చుకొని మరణం అంచుల్లో పడిపోకుండా నిలపాల్సిన బాధ్యత ఇప్పుడు మన అందరిదీ. చాలాచోట్ల  మంచి ఉద్దేశంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు లేకపోలేదు. వాళ్ల కృషిని గ్రహించి వాళ్లకు చేయూతనిచ్చి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, ఇంకా ఇంకా న్యాయమైన పద్ధతిలో నిజాయితీగా సేవలు చేసే దిశగా పెద్దలు మాట్లాడాలి.

మన మెప్పులో వేయి సౌదామినుల మెరుపు ఉండాలి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా … గుండె లోతుల్లోనుంచి మెచ్చుకుంటామో ఈ ఫలితాలు వస్తాయి.

అన్ని సమయాలలో మౌనం మంచిది కాదు!!

____***____

January 31, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఖుద్ధనికాయ జాతకకథలు

by Acharya Madireddy Andamma January 31, 2025
written by Acharya Madireddy Andamma

(మొదటి భాగం, మహాబోధి బుద్ధవిహార)

బౌద్ధధర్మాన్ని సామాన్య ప్రజలలోనికి కొనిపోవడానికి జాతకకథలు ఎంతో ఉపయోగపడ్తాయి. ఈ  జాతక కథలు  పాలీ(భాష)లోని గాథలకు సందర్భసహిత వివరణలు. ఇవి పాలీత్రిపిటకాలలో ఖుద్ధనికాయంలో భాగంగా  ఉన్నాయి. బౌద్ధులకు ఆదర్శ గ్రంథాలు త్రిపిటకాలు. అవి: 1. వినయపిటకం, 2. సుత్తపిటకం, 3.అభిధమ్మపిటకం.ఈ త్రిపిటకాలలో రెండవదైన సుత్తపిటకానికి  సంబంధించిన గ్రంథమే ఖుద్ధనికాయగ్రంథం.

ఈ ఖుద్ధనికాయగ్రంథం మొదటిభాగంలో 150(నూటాయాబై) కథలున్నాయి. ఆ కథలను పదివర్గాలుగా  విభజించారు. అవి: 1) అపణ్ణక, 2) శీల, 3) కురుఙ్గ (కురుంగ), 4) కులావక,5) అత్థకామ, 6) ఆసీస, 7) ఇత్థి, 8) వరుణ, 9) అపాయిమ్హ .10) లిత్థ, 11) పరోసత, హంచి, కుసనాళి, 14) అసమ్పదాన, 15) కకణ్టక వర్గాలు. ఇందులోని ఒక్కొక్క వర్గంలో ‘పది కథలు’(15I10R మొత్తం 150) ఉన్నాయి.

ఒకటి రెండు కథల్లో తప్ప,  ప్రతికథలోనూ ఒక వర్తమాన కథ, ఒక అతీతకథ(గతాపూర్వ)జన్మకు సంబం ధించినకథ) ఉంటుంది. అంతేగాకుండా ఈ కథల్లో మనుష్యులు, యక్షులే గాకుండా రకరకాలప్రాణులు ాజంతువులు (ఏనుగు, కోతి మొసలి మొదలైనవి), పక్షులు(పావురాలు, చిలుకలు మొదలైనవి) కూడా కనబడుతాయి. ముందుగా ఆ కథల్లోనుండి వ్యాపారుల కష్టనష్టాల గురించి తెలుసుకుందాం,

వ్యాపారుల కష్టనష్టాలు ా సమాజం (అపణ్ణకకథ)

సరుకుల రవాణాకు పూర్వకాలమైన, ఇప్పుడైనా కష్టమైన పనే. సరుకుల రవాణా, ధరల నిర్ణయం, అనిశ్చిత స్థితి, అస్థిరస్థితి, భయాందోళనతోనే ఉంటుంది. ఆనాటికి, ఈనాటికి సరుకులరవాణాలో వేగం  పెరిగితే  పెరగవచ్చు. కాని, అవే సమస్యలు, కొన్ని వందల ఏండ్లనుండి వ్యాపారస్థులకు ఎదురు అవుతునే ఉన్నాయి. జాతకకథల   ద్వారా ఆ వ్యాపారుల సాధకబాధకాల గురించి తెలుసుకుందాం.

ప్రాచీనకాలంలో అయినా, నేటి ఆధునికకాలంలో అయినా కొన్ని ప్రాంతాల్లో సరుకు రవాణావాహనాలు  అడవులగుండా వెళ్ళాల్సి ఉంటుంది.ఆ అడవలు అనేకరకాలుగా ఉంటాయి. అవి: 1) దొంగల అడవి, 2) క్రూరమృగాల అడవి, 3) నీరులేని అడవి, 4) అమనుష్యుల అడవి, 5) తిండి దొరుకని అడవి.  

ఈ అడవులగుండా భూమార్గంలో తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు వ్యాపారనిమిత్తం బండ్లమీదసరుకు తీసుకొని రండు, మూడుజట్ల వ్యాపారులు కలిసి వెళ్లేవారు. ఆ జట్లకు ఎదురయ్యే, కలిగే లాభనష్టాలు: ` సాధారణంగా దారి, నీరు, ఆహారం, సరుకులు, వాటి విలువనిర్ణయించడాలు, దొంగలు, యక్షులు, మోసగాళ్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

రెండు, మూడుజట్ల వ్యాపారులబండ్లు ఒకేసారి ప్రయాణం చేస్తే ఒనగూరే కష్టనష్టాల గురించి, ఒక్కొక్కజట్టు వెళ్తే ఒనగూరే కష్టనష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపణణ్జజాతక కథలో బోధిసత్వుడు ఒక వ్యాపారికుటుంబంలో, సౌమ్యుడు మరో వ్యాపారికుటుంబంలో  జన్మించారు. వీరిద్దరు తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు సరుకు అమ్ముకోవడానికి వెళ్లేవారు.

బోధిసత్వుడు (మొదటి వ్యాపారి) 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి, మరో వ్యాపారి కొడుకు ` సౌమ్యుడు   కూడా 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి బయలుదేరారు.

ఇద్దరూ ఒకే సారి వెళ్తే పశువులకు మేత, నీళ్లు కష్టమౌతాయని బోధిసత్వుడు భావించాడు. అంతేగాకుండా దారి బాగా నలిగి, గతుకులు, గాళ్లు పడుతుందని, నీటికి ఇబ్బంది అవుతుందని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక నెల ఆలస్యంగా బయలుదేరితే మంచిదని బోధిసత్వుడంటాడు. అప్పుడు సౌమ్యవ్యాపారి తానే ముందుగా వెళ్తానంటాడు.అందుకు బోధిసత్వుడు అంగీకరిస్తాడు. 

ముందుజట్టువారి ఆలోచనలు: ముందుజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు

  1. దారి నలిగి పోదు. గతుకులుండవు. పశువులకు కావలసినంత మేత, నీరు పుష్కలంగా లభిస్తుంది, దారిలో ఆకుకూరలు, కూరగాయలు కొదువలేకుండా దొరుకుతాయి. పైగా ముందుగా వ్యాపారం చేయడం వల్ల ఇష్టం వచ్చిన ధరలకు సరుకులు అమ్ముకోవచ్చు.

వెనకజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు: వెనక జట్టువారి ఆలోచనలు

మొదటి జట్టు నష్టాలు రెండవ జట్టుకు లాభాలుగా మారుతాయి. 1) మొదటిజట్టులో వెళ్లినవారు ా    శ్రమించి   ఎగుడుదిగుడు బాటలను (ఎత్తుపల్లాలు)సరిచేస్తారు. 2) మొదటిజట్టువారి ఎడ్లు దారిలో     ముదురుగడ్డి తింటాయి. 3) నీరు లేని చోట చెలిమెలు తవ్వుతారు.

వెనక జట్టుకు లాభాలు:

1) బండ్ల ప్రయాణం చేసే దారి సుగమంగా ఉంటుంది.

2) లేత పసిరిక(గడ్డి), లేత కూరగాయలు దొరుకుతాయి

3) నీటి కోసం శ్రమించాల్సి అవసరం లేదు.  చెలిమలు, ఇతర నీటివనరులు సిద్ధంగా ఉంటాయి.

4) ముందుజట్టుగా పోయినవారు సరుకులధరలు నిర్ణయించాలంటే ప్రాణం పోయినంత పని అవుతుం   ది. సరుకులధరలు ముందుజట్టునిర్ణయిస్తుంది. ఆ శ్రమ వెనకజట్టుకు ఉండదు. కాబట్టి సరుకులు     తేలిగ్గా అమ్ముకోవచ్చు.

ముందు జట్టు నష్టాలు, వెనక జట్టుకు లాభాలు:

వెనక జట్టు నష్టాలు, ముందు జట్టుకు లాభాలు

యక్షులు: యక్షులతోబాధలు

జాతకకథలను చదువుతుంటె ఎక్కడ యక్షుల ప్రస్తావన వచ్చినా, వారిని నరమాంసభక్షకులుగానే చిత్రించారు, అది ఎంతవరకు నిజమో  తెలియదు. వీరు అనేకరకాలుగా మోసాలు చేస్తుంటారు.

అ) నీరు ా మోసాలు

యక్షులు చేసే మోసాలు, క్రూరకర్మలు ఇన్నిఅన్ని కావు. 1) దారెంట బండ్లు వెళ్తుంటే వ్యాపారస్తులు   తీసుకెళ్లే నీటిని మోసపు మాటలతో, మోసపువేషాలతో నమ్మించి, నీటిని పారబోయిస్తారు. 2) వారు (వ్యాపారస్తులు) నీరు లేకుండా బలహీనులైనప్పుడు వారిని పీక్కు తింటారు(అపణ్ణక కథ, పుట,85) చనిపోయినా కూడా వారిని పీక్కు   తింటారు.

ఆ) యక్షులమోసపు వేషం:

యక్షుల నాయకుడు వయస్సులో ఉన్న ఎడ్లను అందమైన బండికి కట్టుకుంటాడు. విల్లంబులు, డాలు, కత్తి ధరిస్తాడు. పదిపన్నెండు మంది అనుచరులును వెంటబెట్టుకొని, తామరపూలను, కలువపూలను  పట్టుకుంటాండు. తడిసిన వెంట్రుకలతో, తడిసిన బట్టలతో సంపన్నుల్లా బండి మీద కూర్చుంటాడు.

బురద అంటిన చక్రాలతో కూడిన బండితో వ్యాపారస్తులకు ఎదురు వస్తాడు. అనుచరులు కూడా అలాగే దాదాపు తమ నాయకుని వేషంలోనే ఉంటారు. ఆ బండిని, బండికున్న బురదను, తడిసిన బట్టలను, వెంట్రుకలను చూసి, వ్యాపారస్తొలవారు వర్షంలో తడిసి వస్తున్నారనే అనుకుంటారు.

నిజమన వ్యాపారి తన పైకి దుమ్ము రాకుండా ‘ముందుబండి’లో పయనిస్తుంటాడు. యక్షుడు అతని పక్కన బండిని పోనిస్తూ మెల్లెగా మాటల్లోకి దింపి,  తేలిగ్గా బరువులేని బండ్లతో వెళ్లమని సలహా ఇచ్చి,వారిని నమ్మేటట్లు చేస్తారు. వారి వద్ద బానల్లో ఉన్న నీటిని పార బోయిస్తాడు.

పాపం! నిజమైనవ్యాపారస్తులు ఎంతదూరం వెళ్ళినా వాన వచ్చిన జాడగానీ, నీటిజాడ గానీ ఉండదు. నీరులేక నీరసించి, బలహీనం కాగానే యక్షులు వచ్చి,  ఆ మనుష్యులను, వారి ఎద్దులను పీక్కుతింటారు.

వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం:

వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే (పుట. 92). ఎడారి ప్రయాణం   సముద్రప్రయాణం (నీటిమీది ప్రయాణం) లాంటిదే.

అ) ఎడారిలో దారి తప్పడం:

సముద్రపుప్రయాణంలో దారి గుర్తులుండవు.  అలాగే ఎడారిప్రయాణంలో కూడా నేలమీద దారి గుర్తులుండవు. అందువల్ల ఆ కాలంలో  వ్యాపారాస్తులు(సార్థవాహులు) నక్షత్రాలను బట్టి దారి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. లేదా దిశానిర్దేశం చేయడానికి ఎవరైనా నక్షత్రజ్ఞానంకలిగిన ఒక వ్యక్తిని తీసుకెళ్లేవారు. అతను రాత్రిపూట ఏమాత్రం కునుకుతీసినా ఆ బండ్లు దారి తప్పేవి.  బండ్లు ఒక్కోసారి తిరిగి, బయటుదేరిన  చోటికే వెళ్లే అవకాశాలు ఉండేవి.

ఆ) ఎడారిలో ఇసుక కాలడం:

ఎడారిఇసుకను చేతిలోకి తీసుకుంటే వేళ్లసందుల నుండి జారిపోయే సన్ననిదువ్వలా ఉంటది. పొద్దు      ఎక్కువ అవుతున్న కొద్దీ ఇసుక వేడెక్కి, ఇసుక నిప్పులరాశిలా మారుతుంది.  కాళ్లుకాల్తుంటే పశువులు నడవలేవు.   ఈ కారణంగా ప్రయాణం జటిలమౌతుంది. ప్రయాణం చేయడానికి వీలు లేకపోవడంవల్ల  ప్రయాణం ఆపేస్తారు.గుడారాల్లోనే ఉండిపోతారు.

ఒకవైపు మలమల మాడ్చే ఎండ, మరోవైపు నీళ్లకరవు:

నీటిజాడ(జలనిధి) గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటే వారివారి ద్వారా జాడ తెలసుకొని, చెలిమెలు,  బావులు తవ్వే ప్రయత్నం చేసేవారు. ఎడారిఇసుకలో ఎక్కడైనా ఆకుపచ్చగా దర్భగడ్డి ఉంటే అక్కడ నీరు ఉన్నట్టు    గ్రహించేవారు. ఆ చోట చెవిపెట్టి నీళ్లు పారుతున్నట్లుగా, జలజల శబ్ద వస్తుందా, లేదా అని వినేవారు.

క్రూరమృగాలు: వీటికి తోడు క్రూరమృగాలు. ప్రాణభయం.

రాత్రిపూట ప్రయాణం చేయడానికి చీకటి దిశ సరిగా తెలియదు, క్రూరమృగాలు ఎక్కడినుండి వచ్చి మీద పడ్తాయో  తెలియదు.

సంచారవ్యాపారుల మోసాలు:

సంచారవ్యాపారులు అంటే తాము తీసుకెళ్లిన వస్తువులపేర్లతో కేకలు వేసుకుంటూ, వీధులవెంట తిరుగు  తూ, ఇంటింటికి సరుకుల అమ్ముకునే వారు.  ఈ సంచారవ్యాపారుల్లో కొందరు అమాయకులైన ప్రజలను మోసం చేస్తుంటారు. విలువైన వస్తువులను, విలువలేని వాటిగా చెప్పి, వెల తక్కువ చేసి చెప్తారు.

వర్తకుల నియమం:

వర్తకుల నియమం ప్రకారం ఒక వర్తకుడు వచ్చి వెళ్లాకనే, మరొక వర్తకుడు వెళ్ళాలి. కాని ఒకేసారి ఇద్దరు వెళ్లకూడదు (పుట. 96).

లివితేటలుగల యువకుని వ్యాపారం:

శ్రేష్ఠికులంలో పుట్టిన బోధిసత్త్వుడు మహామేధావి, పండితుడు. అతను ఒకనాడు రాజాస్థానానికి పోతూ   పోతూ, ఒక చచ్చిన ఎలుకను చూస్తాడు. దాని నక్షత్రబలాన్ని చూసి, ‘ఎవరైనా తెలివిగలవాడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం చేసి, భార్యాపిల్లలను పోషిస్తాడు’ అని అంటాడు.

ఆ మాటలు విన్న ఒక యువకుడు  ఆ చచ్చిన ఎలుకను తీసుకెళ్ళి,  పిల్లికి మేతగా ఒక కాకణికం(అణా వంటి చిన్న నాణెం)కు అమ్ముతాడు. దానితో కొన్ని బెల్లంముక్కలు  కొంటాడు. ఒక పెద్దకుండా నీరు తీసుకొని పోయి, దారిలో పెట్టుకుంటాడు. అడవిలో పూలు ఏరుకొని,  ఆ దారెంట వచ్చే దాహార్తులకు కావలసినన్ని నీళ్లుపోసి, వారికి ఒక బెల్లం ముక్క ఇస్తాడు. వారు సంతోషంతో తలా గొప్పెడు పూలు  పెడ్తారు.

ఆ యువకుడు ఆ పూలను అమ్మి, మళ్ళీ బెల్లాన్ని కొని, వారికి ఇస్తాడు. తర్వాత అతను తోటకు వెళ్తే  పూలమొక్కలు ఇస్తారు. వాటిని అమ్మి ఎనిమిది ‘కార్షాపణాలు’ సంపాదిస్తాడు. ఇంతలో ఒక రోజు గాలివాన వస్తుంది.   రాజుగారి ఉద్యావనంలో చెట్లకొమ్మలు విరగి, ఆకులు రాలి, వాటితో నిండిపోతుంది.  తోటమాలి అనుమతితో పిల్లలతో విరిగిన చెట్లకొమ్మలను ఏరించి, ఆ చెట్లకకొమ్మలను కుమ్మరి వాళ్లకు అమ్ముతాడు.

కకుమ్మరిఅతను కుండలు, బానలు ఇస్తాడు. వాటిని అమ్మితే 16 కార్షాపణాలు వస్తాయి. మొత్తంమీద అతనికి  24 కార్షాపణాలు సంపాదించాడు. వాటితో కుండలు కొని, మంచి నీరు నింపి, గడ్డిని అమ్మేవారికి (500మందికి) దాహం తీరుస్తాడు. వారు తిరిగి అతనికి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు. వారి సహాయం తర్వాతతీసుకుంటానని చెప్తాడు.

ఆ యువకునికి ‘స్థలపథవర్తకులు (ఊర్లు తిరిగి వ్యాపారం చేసే వర్తకులు), జలపథవర్తకులు  (నౌకావ్యాపారులు)’ వద్ద పనిచేసే పరిచారకులతో పరిచయమైతది. ‘స్థలపథవర్తకుడు’ గుర్రాలతో వస్తున్నాడని తెలుసుకొని, గడ్డి వాళ్ల వద్దకు వెళ్లి, గడ్డిమోపులు మాట్లాడుకుంటాడు. ‘తన గడ్డి అయిపోయేవరకు వాళ్లు అమ్మకూడదని ఒప్పందం  చేసుకుంటాడు. 500 గడ్డిమోపులను 1000 నాణాలకు గుర్రాల వ్యాపారికి అమ్ముతాడు.

తర్వాత పెద్దనౌకలో ‘జలపథవ్యాపారి’ సరుకు తెస్తున్నాడని తెలుసుకొంటాడు. ఎనిమిది కార్షాపణాలతో బండిని కొని, చక్కగా, ఆర్భాటంగా అలంకరించుకొని, నౌకాశ్రయానికి వెళ్తాడు. తన దగ్గరున్న ఉంగరాన్ని బయానాగా (అడ్వాన్స్‌)ఇచ్చి, సరుకుతో సహా నావను కొని, అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న మంటపాన్ని ఏర్పాటుచేసుకుంటాడు.

‘బయటి నుండి ఎవరన్నా సరుకులు కొనే వ్యాపారులు వస్తే మూడవజాములో నాకు చెప్పండని అక్కడివారికి చెప్తాడు. సరుకులతో నౌక వారణాసి నుండి వచ్చిందని తెలియగానే వందమంది వ్యాపారులు  సరుకులను కొన డానికి నౌక వద్దకు వెళ్తారు. అప్పుడే సరుకు అమ్ముడు పోయిందని, ఒక యువకుడు కొన్నాడని, అతను మూడవ  జామున వస్తాడని చెప్తారు. మొత్తం మీద ఆ యువకునికి ఒక్కొక్కరు 2000కార్షాపణాలు ఇచ్చి మొత్త సరుకును కొనేస్తారు.  మొత్తం మీద రెండులక్షల (200000) కార్షాపణాలు సంపాదించుకొని తిరిగి వారణాసి వెళ్తాడు.

చచ్చినఎలుకతో వ్యాపారంచేయడమనే ఈ కథవల్ల వ్యాపారస్తునకు ఉండవలసిన లక్షణాలు తెలుస్తున్నాయి. అత్యల్పసమయంలో పనికిరాని వస్తువు(చచ్చాన ఎలుక)ను కూడా తెలివితేటలతో అమ్మవచ్చు, ముందుచూపు,    యుక్తి, లౌక్యం, సమయస్ఫూర్తి ఉంటే డబ్బును ఎంతైనా, ఎలాగైనా సంపాదించవచ్చ ని కూడా మనకు ఈ కథ వల్లతెలుస్తుంది. వ్యాపారస్తులకు ఉండవలసినివి తెలివితేటలు అని ఈ కథ నిరూపిస్తున్నది.

వ్యాపారులు ా సరుకు ధర నిర్ణయం ా అధికారులకు లంచాలు:

సర్వసాధారణంగా రాజులుకొనే సరుకులు  ` గుర్రాలు, ఏనుగులు, మణులు, మాణిక్యాలు, బంగారం    మొదలైనవి. ఆ సరుకులధరలు  నిర్ణయించడానికి ఆనాడు ‘ప్రత్యేకఅధికారులు’ఉండేవారు. ఆ ప్రత్యేకఅధికారులు   ‘న్యాయం’గా సరుకు వెల’ నిర్ణయంచి, వాటిని అమ్మేవారికి ‘రొక్కం’ ఇప్పించేవారు. అలా సరుకులవెలను న్యాయంగా ఇప్పించడంతో ఖజానా ఖాళీ అవుతుండేది. ఈ విషయాన్ని రాజు గ్రహించాడు. అందువల్ల ‘సరుకు విలువ తెలియని’ ఒక ‘మూర్ఖుడిని, లోభిని’। అధికారిగా నియమిస్తాడు. ఇతనికి సరుకు గురించి తెలియకపోవడంతో, సరుకుకు  విలువ కట్టకుండా నోటికి వచ్చినంత చెప్తుండేవాడు.

ఒకసారి ఒక వ్యాపారి ఉత్తరాపథంనుండి 500 గుర్రాలను తీసుకొని ‘ధరలనిర్ణయాధికారి’ వద్దకు వచ్చాడు. అతను వాటికి ‘మానెడు బియ్యం’ వెల కట్టాడు. ఆ వ్యాపారి అంతకుముంఉన్న ‘ధరల అధికారి’ వద్దకు వెళ్లి,  మొరపెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ అధికారికి ‘లంచం’ ఇవ్వమంటాడు. తర్వాత రాజుగారి సమక్షంలో ‘మానెడు బియ్యం విలువ’ చెప్పమంటాడు. అందుకు అతను సరేనని ఒప్పుకొని,  రాజుగారి సమక్షంలో మానెడెబియ్యం     విలువ ‘రాజుతో సహా వారణాసి రాజ్యమంత’ అని అంటాడు.  దాంతో అతని తెలివితేటలు బయటపడ్తాయి.

వర్ణాంతర వివాహం ా శ్రేష్ఠి కుటుంబం:

 శ్రేష్ఠి కుటుంబంలోని కూతురు సేవకునితో సంబంధం పెట్టుకొని, చేతికి అందినంత సొమ్ముతీసుకొని,   అతనితో ఇంట్లోనుండి వెళ్లిపోతుంది. మానసిక,  శారీరక వేదన చెందుతుంది. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళాలని    అనుకుంటది. కాని మధ్యలోనే ప్రసవం అవుతుంది. రెండుసార్లు అలాగే మధ్యలోనే ప్రసవించి,  వెనుకకు తిరిగి   వస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, తాతఅమ్మమ్మల గురించి అడిగితే వారికి ఏ విషయాలు చెప్పకుండా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వస్తుంది. నగరద్వారం వద్ద ఉన్న ధర్మశాలలో దిగి, తల్లిదండ్రులకు కబురు పంపిస్తుంది.కాని, తల్లిదండ్రులు ఆమెను ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు, ఆమెను ఇంటిలోకి రానివ్వరు.కాని పిల్లలనుతమతో ఉంచుకోవడానికి అంగీకరిస్తారు, ఆ పిల్లలను దగ్గరికి  తీసుకుంటారు.

(శ్రేష్ఠి : ఇది ఒక పదవి, ఈ పదమే శెట్టిగా మారింది)

ఇలాంటి వ్యాపార సంబంధిత అంశాలు, ఆనాటి సమాజం మనకు జాతకకథలవల్ల తెలుస్తాయి.

January 31, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

జోగుళయ్య కథలో పలాయన తత్వం

by Tirunagari Devaki Devi January 31, 2025
written by Tirunagari Devaki Devi

             మహంతయ్య మఠంల గంజాయి నిషాలో  ఉన్న నాగప్పకు వచ్చిన కొత్తమనిషితో సంభాషణలో ” ఈ జన్మ రోత ఆలి ఎవతె ? చూలు ఎవరు? ” అనే విషయం బాగా నచ్చింది. దాంతో అతను లేడికి లేచిందే పరుగు అన్నట్లు స్నేహితులతో కలిసి ఇల్లు సంసారం వదిలి మఠాల చుట్టూ తిరగడం లో మునిగి పోయిండు. ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ  రచయిత్రి .  ” ఆ మఠంలో తీరొక్క కులపోళ్ళున్నరు. తీరొక్క గుణపోళ్లున్నరు . పొట్టకు గడవక సన్నాసోడైనోడున్నడు. రోగంతోన ఏగలేక  జోలె కట్టినోళ్ళున్నరు. అప్పుల దాడికి మొకం దిస్పిచ్చినోళ్ళున్నరు. జైల్ల కెల్లి పరారై వచ్చినోళ్ళు న్నరు. కూనీలు చేసినోళ్ళున్నరు. సోరోళ్ళున్నరు. ముసలోళ్ళున్నరు. షావుకారున్నడు. చదువుకున్నోడున్నడు. సాకలోడున్నడు. సాగినోడున్నాడు. జారిపడ్డోడున్నడు…… ఆ మఠంల అందరికీ సోటుంది” అంటుంది.కాని  రచయిత్రి చెప్పిన వ్యక్తుల్లో నాగప్ప ఏ కోవలోనికి  చెందినవాడు కాదు.  అది రచయిత్రికి మఠాలపట్ల ఉన్న అవగాహన. ఈ కథలో నాగప్ప  మఠాల వెంట తిరిగింది మత్తునిషాలో , కొత్తమనిషి ద్వారా విన్న వేదాంతం వల్ల. నాగప్పకు తన దగ్గరున్న  పైస ఖర్చైన తర్వాత ఇల్లు జ్ఞాపకం రాలేదనీ కాదు. వచ్చింది. కాని క్షణికావేశంలో ఆలెవరు? చూలెవరు? అని ఇల్లొదిలిన మనిషికి  తిరిగి  ఇంటికి పోవడానికి  మొహం చెల్లలేదు. ఇక చేతిలో చిల్లి గవ్వలేని స్థితి జోలెతో భిక్క్షాటనను  ఆశ్రయించేటట్లు చేసింది.  కట్టుబట్ట తప్ప మారుబట్ట లేకపోవడంతో కట్టుకున్న బట్టలు కావిరంగులోకి మారినై. ఈ రెండూ నాగప్పకు  కొత్త జీవితాన్ని తెచ్చిపెట్టినై. వాటికి తోడు కావలసినంత సమయం గుళ్ళు గోపురాలు మఠాలు తిరిగే అవకాశాన్ని ఇచ్చినై. మఠాధిపతుల సాంగత్యమూ దొరికింది. జీవితం ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. సన్యాసి జీవితానికి ఆ జీవితం ఆకర్షితమైంది. అందుకు చాలా తాపత్రయపడింది కూడా. 

                సన్యసించడమంటె కుటుంబ బంధాలకు దూరమై రాగద్వేషాలు లేకుండా జగమంత కుటుంబం నాది అనే ధోరణిలో జీవిస్తరు. జీవించాలి కూడా. కాని అసమర్థులైన చాలామంది కుటుంబాన్ని వదిలి  దానికి సన్యాసి పూతను తగిలించుకొని  దేశ దిమ్మరులౌతుంటరు. నాగప్ప విషయంలో కొంత ప్రత్యేకత ఉన్నది. కుటుంబాన్ని వదిలినా దేశదిమ్మరైనా స్త్రీ లోలుడు కాదు. కుటుంబ వ్యాపారానికి సంబంధించిన విషయంలో లెక్క పత్రాలు పకడ్బందీగ ఉండేవి. అంటే  అతనిలో కొంత నిబధ్ధత  ఉంది. ఆ నిబద్ధత మఠాధిపతులను సేవించడంలోనూ కనబడుతుంది.  బలహీనతల్లా గంజాయి సేవించడం. సాహచర్యంలో వేదాంతధోరణి. వేదాంతం కూడా చాలా విచిత్రమైన పదం. నిజానికి వేదాలలో ఉండేది వేదాంతం. కాని బంధాలను పరిత్యజించడం కూడా వేదాంత ధోరణి అనే అర్థం స్థిరపడింది. ఈ కథలోని నాగప్ప ఆ కోవకు చెందినవాడే. మఠాల్లో  చేరిన వాళ్లలో తేడా ఉన్నట్లే, మఠాల్లో ఆ మఠాధిపతు ల్లో కూడా తేడా ఉంటుంది. మఠాధిపతులు కొందరు తమ శిష్యపుంగవులకు వాత్సల్యంతో సద్బోధనలు చేస్తే మరి కొన్ని ఆశ్రమరూపంలోని మఠాల్లో ఆయా మఠాధిపతులు అక్రమాల పుట్టగా ప్రజలను పెడమార్గం పట్టిస్తూ  డబ్బు చేసుకుంటారు. నాగప్ప చేరిన మఠం మొదటి కోవకు చెందింది.ట్రాన్స్ లో ఉన్న నాగప్ప మఠంలోని పెద్దయోగిని సన్యాసం ఇప్పించమని అడిగినప్పుడు అతను నాగప్ప మఠం వరకు రావడానికి గల కారణం క్షణికావేశమని పసిగట్టి కుటుంబం అనుమతి తీసుకొని రమ్మని సలహా ఇచ్చిండు. ఆ సలహాలో నాగప్ప స్థిరత్వాన్ని నిగ్గు తేల్చాలనుకున్నడు. అనుకున్నది సాధించిండు కూడా.         

            ” పిలగాడు ఏమంటున్నడు?”. మఠం నుండి సొంతూరుకు ఆ తర్వాత  స్వంత ఇంటికి బిచాణ మార్చిన రెండు రోజుల తర్వాత  భార్యను అడిగిండు బసప్ప ఇంటికి చేరిన కొడుకుని ఉద్దేశించి

             “ఏమంటడు? ఎద్దోలె తిని మొద్దోలె పండుతుండడు.” అన్నది భార్య సమాధానం.

ఈ సమాధానంలో నిద్రాహారవిషయంలో నాగప్ప సాధారణజనం లక్షణమే తప్ప ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలు వాళ్ళకు కన్పించలేదు. అంటే నాగప్ప దేశదిమ్మరిగా గుళ్ళూ గోపురాలు తిరిగిండు . యోగులతో కలిసి కాలం గడిపి సన్యాసి అనే ఊహాలోకంలో బతికిండే తప్ప సన్యసించిన మనిషికి ఉండాల్సిన స్థిరమైన అభిప్రాయాలు లేవని అనుకోవచ్చు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించినందుకే కోడలుకు కొడుకుకు ఏకాంతం కల్పిస్తే కొడుకు అంతరంగం ఆవిష్కృతమౌతదని ఆలోచించిన్రు. వాళ్ళ ఆలోచన నూటికి నూరుపాళ్ళునిజమైంది.  తల్లిదండ్రులు తిరిగొచ్చేవరకు ఆహారంలోనే కాదు ఆహార్యంలోనూ పూర్వపు నాగప్ప ఐండు. తప్పు చేసినవానోలె నెత్తి కిందికేసుకొని వాళ్ళకు దండం పెట్టిండు. ఈ తప్పు అనే భావన ఎందుకొచ్చిందని ప్రశ్న వేస్తే అది ఇంటినుండి జాడపత్తా లేకుండ దేశంమీద పడి తిరుగుడు, తను సన్యాసుల బ్రమలో బ్రతుకడం అనేది  క్షణికావేశంలో జరిగిందని గుర్తించడం. . 

                 ఈ కథలో అంతర్లీనంగా నాగప్ప భార్య శివమ్మ ఆత్మస్థైర్యాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు.

మఠం నుండి ఇల్లు చేరుకున్న నాగప్పను భార్య శివమ్మ దేబురించి   వేడుకోమని అడగలేదు కానీ “పనీపాటయినంక వచ్చి తలుపు పట్టుకొని నిలబడి నాగప్పను చూసి పోతది . అంతే కానీ ఏడ్వలేదు నగలేదు ఏగిర్త పడలేదు. వొణ్కలేదు. 

పొద్దు మూకి మట్కు  ముద్దుగ నెత్తి దువ్వుకొని మల్లెపూలు శికెల ముడ్సుకొని దోస పల్కు బొట్టు పెట్టుకుంటది. నాగప్ప కూసున్న అరుగు ఎదురుగా ఉన్న రెండో అర్గును అలికి శుద్ధిచేసి ముగ్గేసి అరిటాకు పర్సి రాగి చెంబుల నీళ్లు పెట్టి దానిమీద స్తాళి బోర్లించి పోతది. బంకుల కింద కాళ్లు చేతులు కడుక్కొనికే నీళ్ల కొప్పెర పెట్టి పోతుండె  “

అనే రచయిత్రి మాటల్లో ఆమె స్థిరత్వం ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఆమె అలంకరణలో జాణతనం నడతలో   తనను వదిలి పోలేడనే దృఢ నిశ్చయం కనబడుతుంది. 

        ఓ అర్ధరాత్రి దాహంతో తలుపు కొట్టి”మంచి తీర్థం ఇప్పిస్తారా”అని అడగడం, విచ్చుకున్న   మల్లె మొగ్గల సిగతోని శివమ్మ కనబడటంతో సన్యాసి నాగప్ప కు బంగు తాగినట్లైంది. కానీ నాగప్ప తనకు కలిగిన వాంఛని సంభాళించు కొని మంచినీళ్ల విషయాన్నే చెప్పినా పరిస్థితిని అర్థం చేసుకున్న శివమ్మ భర్తను గుర్తుపట్టనట్టే 

            “ఏయ్ బైరాగోడ ! మా అత్త మామ ఇంట్ల లేంది జూసి మంచి తీర్థం గించితీర్థం అనుకుంటా ఇంట్ల జొరవడ చూస్తుండవా?”అంటూ దబాయించి అతను అడిగినట్లు చెంబులో నీళ్లతో నిలబడగానే తన మనోవాంఛ మతలబును వెల్లడిస్తూ

             “శివ నీవు అదృష్టవంతురాలు నిన్ను అనుగ్రహించాలని కోరిక కలుగుతున్నది” అని నాగప్ప అనగానే 

             “ఏమో శివ్వ గివ్వ అనబడుతివి. నీకు నన్ను అనుగ్రహించాలని కోరిక పుడితే బాగానే పుట్టింది. గని మరి నిన్ను నేను అనుగ్రహించొద్దా?” అని శివమ్మ ప్రశ్నించడంలో ఆమె ఆత్మ గౌరవం

 చాలా స్పష్టం . 

              అంతేకాదు స్వాములను అనుగ్రహించాలి వాళ్ల కోర్కెను కాదనకూడదు అన్న నాగప్ప మాటలకు”గా ఇంత దానికి సన్నాసి గిన్నాసి అని దొంగేశం ఎందుకు కట్టాలె.”అని నిలదీసి అతని బుర్రకాయను  పగలగొట్టించి, మెడలో లింగంకాయ వేసి, జన్మలో సన్యాసులజాడ పట్టకుండ ఒట్టు వేయించుకొని  అతన్ని అనుగ్రహించింది. 

              మొత్తంగా రచయిత్రి యశోద రెడ్డి గారు ఈ కథలో క్షణికావేశ  పలాయన వాదులను గృహిణుల ఆత్మగౌరవ, విశ్వాసాలను దృఢ చిత్తాన్ని నిగ్గు తేల్చి చూపించారు.

               ఇక ఈ కథ పేరు విషయానికి వస్తే కథలో ముఖ్యమైన పాత్రగా నాగప్ప కనపడుతుండగా పేరేమో జోగుళయ్య అని ఉన్నది. నాగప్ప జోగిగా (యోగిగా) మారిన ముఖ్యాంశాన్ని జోగుళయ్యగా పెట్టినట్టు కనబడుతున్నది.

కథను గమనిస్తే నాగప్ప కుటుంబం లింగాయతులది అని తెలుస్తుంది. కానీ ఎందుచేతనో రచయిత్రి కథ ముగింపులో మంచి తీర్థం వంటి వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పదాన్ని వాడినారు ఆలోచించవలసిన విషయం అది. 

కథలో తెలంగాణ మాండలికాలు             

లిడ్తి వడి        =.      నష్టం 

పిస పిసలు.   =.      గుసగుసలు 

ఎదలల్ల.        =.       మనసుల్లో 

సోరోళ్ళు.       =.       యుక్త వయస్కులు

ఆడ్తి.             =.       చిన్న చిన్న రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి వ్యాపారం చేసే దుకాణం 

కీసల.             =.       జేబుల 

తాల్మివట్టు.     =.       ఓపిక పట్టు 

పొట్కు.          =.        ఒత్తిడి 

సందే.             =.        సంధ్యాకాలం 

సస్కాలు.        =.       పైసలు 

ఈ త్యాప.        =.      ఈ తడవ, ఈ సారీ 

పోవడి.            =.       పోలిక 

పావురం.          =.       ప్రేమ 

ఇర్గవడ్తుండరు.  =.      విరుచుక పడుతున్నారు 

పడ్సు.               =.      పడుచు, వయసు

గేరొచ్చి.              =.      మూర్చ వచ్చి 

సుట్క.              =.       సుట్టుక, తల తిరిగి 

సోమ్మసిల్లి.          =.      కళ్ళు తిరిగి 

ఏగిర్త.                 =.       తొందర 

స్తాళి                   =.       మూత 

తనబ్బీ.              =.       సామాను పెట్టుకునే పెద్ద

                                    గూడు 

దూప.                 =.       దాహం                                                                         

మిళ్ళి.                 =.       చెంబు 

ఏశం.                  =.       వేషం 

యీబూతి.          =.       విభూతి 

మాణిక్యాలు.       =.       మన్సాల, మగసాల, మగవాళ్లు కూర్చునే మొదటి పెద్ద గది 

బంకులు.            =.        గ్రామ జనం కూర్చోవడానికి అనుకూలంగా మొదటి పెద్ద ద్వారం నుండి ప్రవేశించగానే ఇరువైపులా ఉండే అరుగులు

నూగువిండికారం=నువ్వుల పొడితో కారం

పై తెలంగాణ మండలికాలే కాక 

నిండా మునిగినంక సలేంది

దారం గుంజినట్లల్ల బొమ్మాడినట్లు(తోలుబొమ్మలాట వలె) 

అనే సామెతలు కూడా ఉన్నాయి.

January 31, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

హక్కులు – బాధ్యతలు

by Acharya Veerareddy January 31, 2025
written by Acharya Veerareddy

ప్రతి మనిషికి జన్మతః కొన్ని హక్కులుంటాయి. వాటికి తోడు బాధ్యతలూ ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఒకే నాణానికి రెండు వైపులు. విడదీయలేనివి. తరాజుకు కుడి ఎడమల్లా ప్రాథమిక సహజాలు. మనసా, వాచా, కర్మణా ఆచరించేవి, అనుభవించేవి. ప్రేమ, గౌరవంలా ఇచ్చిపుచ్చుకునేవి.

మనిషి సంఘజీవి. సమాజమనే కొలనులో తోటివారితో కలిసిపోయి ఈదాలి. అలలను ఆస్వాదించాలి, లోతులను గౌరవిస్తూ ఆటుపోట్లను ఆకళింపు చేసుకోవాలి. కట్టుబాటులను అనుసరిస్తూ పరిధుల్లో జీవించాలి. మనిషి ఎంత స్వతంత్ర జీవి అయినా బతుకుదెరువుకు విచ్చలవిడి విధానం దరువు కాకూడదు. ఒక దేశ పౌరుడిగా చట్టబద్దంగా నడచుకోవాలి. మనిషికి హక్కులు జన్మతో సిద్ధించినా, బాధ్యత లేని స్వాతంత్ర్యం గమ్యం లేని ప్రయాణంతో సమానం. మాటల్లోనైనా, చేతల్లోనైనా ఇతరులకు హాని జరగనంత వరకే హక్కులకు చెల్లుబాటని గమనించాలి. ఎవరి జీవితాన్ని వారే చిత్రించుకునే చిత్రకారుడిలాగా, ఎవరి ప్రపంచాన్ని వారే చెక్కుకునే శిల్పిలాగా సహకరించేవే హక్కులు, బాధ్యతలు. మానవ హక్కులు అందరికీ సమానమే. హక్కుల అనుభవంలో కాని, బాధ్యతల నిర్వహణలో కాని లింగ భేదం ఉండదు, ఉండకూడదు. నో జెండర్ డిఫరెన్సియేషన్! సృష్టిలో అందరూ సమానమే.  

ప్రతి చలనం వెనుక నిశ్శబ్దంగా నడిచే కాలంలా, ప్రతి హక్కు వెనుక ఓ బాధ్యత దాగి ఉంటుంది. చలికాలం తరువాత వసంతం వచ్చినట్లు, హక్కుతో స్వాధీనం చేసుకున్న దాన్ని రక్షించుకునే బాధ్యతను కూడా ప్రకృతి నిర్దేశిస్తుంది. నిజానికి బాధ్యతతో సంరక్షించుకునేవే హక్కులు. బాధ్యత మనిషి సమర్థతకు, గొప్పతనానికి ఆంతరంగిక విలువ. ఒక నమ్మకానికి గుర్తు. ఆదర్శ దాంపత్యంలా హక్కులు, బాధ్యతలు కలగలిపిన అందమైన ఉయ్యాల జంపాలలు. పాట ప్రాభవానికి రాగం, పల్లవిలా, ఎగిరే పక్షికి రెండు రెక్కల్లా, మనిషి మనుగడకు ఈ రెండింటి సమతుల్యత ఎంతో అవసరం. ఎంత నల్లబడినా బరువెక్కని మేఘం వర్షించదు. అలాగే ఎన్ని హక్కులకు అర్హతలున్నా, బాధ్యతలు గుర్తెరిగి నడుచుకున్నంత కాలమే వాటికి గౌరవం, సాఫల్యం (చెల్లుబాటు). చెట్టు పైకి ఎంత ఎదగాలంటే దాని వేళ్లు అంత లోతుగా చొచ్చుకొని వెళ్లాలి. హక్కులకు సాధికార క్షేత్రం బాధ్యతల వక్షస్థలమైనా, హక్కు అధికారమూ కాదు, బాధ్యత బానిస కాదు!         

హక్కులు, బాధ్యతలు సమానమేనా?

సందర్భాన్ని అనుసరించి బేరీజు వేయాల్సిన విషయం ఇది. ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది కనుక సంఖ్యాపరంగా సమానం కావచ్చు. రెండింటిని విడదీయడం అసాధ్యమైనా, వాటి ప్రాధాన్యతలో కుడి ఎడమలవడం సహజం. అలా అయితేనే మనిషి మనుగడకు అర్థం, పరమార్థం ఉంటుంది. బీజగణిత సూత్రాలు నిజ జీవితానికి ఎల్లప్పుడు నూటికి నూరుపాళ్లు వర్తించవు. అటు ఇటు అయితే అసమానత అనో, అన్యాయమనో వ్యవహరించడం అర్థరహితం. 

బాధ్యతను బరువు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, హక్కును అధికారమనుకోవడం అంతే అవివేకం. చెట్టుకు ఎవరూ నేర్పించరు ఏ కొమ్మకు ఎన్ని పూలు పూయాలో, ఎన్ని కాయలు కాయాలో, ఎంత బరువును మోయాలో. అది ప్రకృతి ఆపాదించే బాధ్యత. అలాగే, బాధ్యతనెరిగి నడుచుకునే మనిషికి  హక్కులు వాటికవే మోకరిల్లుతాయి. రెండింటికీ తూకం వేయడం అసంబద్దం. ఏ బాధ్యతా లేని ఏకాంత జీవికి ఏ హక్కులూ ఉండవు. సమాజంలో ఎదుగుదలకు మరో మనిషి తోడ్పాటు అనివార్యం. ఇచ్చి పుచ్చుకునే దృక్పథం ప్రకృతి అనుసరించే సూత్రం. అది ప్రకృతి బిడ్డలందరికీ శిరోధార్యం.

హక్కుల కొరకే ఏర్పరుచుకున్న సంఘాలకు గుర్తింపు అర్థరహితం. కుల, మత, జాతి, జాతీయ, ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక, లింగ, వైకల్య, రూపురేఖల వివక్ష లేకుండా విశ్వ వ్యాప్తంగా జన్మించిన మనుషులందరికి హక్కులు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యమూ సమానమే. ఆయా దేశాల చట్టాలూ, పేదా గొప్ప తేడా లేకుండా సమానంగా వర్తించేవే. నాగరిక సమాజంలో ఎవరు ఎవరికీ తక్కువా కాదు ఎక్కువా కాదు.

హక్కులు.. బాధ్యతల సంచుల్లో ఒ(పొ)దిగిన బహుమానాలు!

బాధ్యత అంటే హక్కు అనుభవించే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యకు పరిష్కారం వెదకడం. అవసరమైన చోట ఆపన్న హస్తం అందించడం. సందర్భాన్ని బట్టి త్యాగం చేయడం. చేపట్టిన కార్యాన్ని నిర్వర్తించడంలో నిబ్బరం ప్రదర్శించడం. క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం. బాధ్యతకు కొలత పరిమాణంలో కాదు ఓర్పులో ఉంటుంది. అదొక స్థితిస్థాపకత. హక్కు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధం.. ఓ పొదుగు. హక్కుకు దున్నే గుణముంటే, మైదానానికుండే పొక్కిలి గుణం బాధ్యతకు ఉంటుంది. కత్తిలాంటి హక్కుకు బాధ్యత ఒక ఒర.. ఓ రక్షణ కవచం! హక్కు బాణమైతే, బాధ్యత ఒక విల్లు. హక్కులనే బహుమానాలకు అవసరమైన ‘గిఫ్ట్ రాప్’ బాధ్యత!   

షరతులు వర్తిస్తాయి!

హక్కు అంటే సమాజంలో ప్రతి మనిషికి తనదైన జీవన విధానంతో మనుగడ సాగించడానికి లభించే స్వేచ్ఛ. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు వర్తించని స్వతంత్రత. అది ఆరోగ్యం, విద్య, వాక్కు విషయాలలో స్వేచ్ఛా కావచ్చు. కాని షరతులు వర్తిస్తాయి. పైన పేర్కొన్నవన్నీ దేశ పౌరుడిగా రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులైనా ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లనంత వరకే వర్తిస్తాయి. చట్టపరమైన హక్కులు అందరికీ సమానం కనుక హద్దులు వర్తిస్తాయి. అది వేరొకరిని బాధించేదైతే నవ్వడమే కాదు, ఏడ్వడం కూడా నిషేధమే!

బాధ్యతలతో సరితూగేవే అనుభవించాల్సిన హక్కులు! హక్కు అధికారం కాదు. అది బాధ్యతకు సమాంతరం. బాధ్యతను విస్మరించిన హక్కు, చర్మం ఒలిచిన మృత కళేబరంలా విలువ కోల్పోతుంది. ‘రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కాంప్లిమెంటరీ!’ హక్కులు, బాధ్యతలు ఒకదానిపై ఒకటి పరస్పర ఆధారితాలు. పరిపూరక సమాంతరాలు. ‘వైన్ అండ్ డైన్’ లా పరస్పర అనుబంధం కలిగి ఉండేవి. కేశాలంకారానికి వేసే జడకు రెండు పాయల్లా, రెంటికీ విడదీయరాని అల్లిక. మనిషి వ్యక్తిత్వానికి అవసరమైన గుర్తింపు, గౌరవం దక్కాలంటే ఈ రెండింటి నడుమ సమతుల్యత అవసరం. పుట్టగానే అన్ని పువ్వులు పరిమళించనట్లు, పుట్టుకతోనే రావు అందరికీ అన్ని హక్కులు. రాని వాటిని బాధ్యతతో శ్రమించి సాధించుకోవాలి.

హక్కును అధికారంలా భావించే వారికి అదొక ‘మత్తు’ ఆవరించిన శక్తి. తమ చుట్టూ ఉన్న పర్యావరణంపై, జీవితాలపై కొంత నియంత్రణ ఉండాలనే సహజమైన కోరిక. సరైన అర్హతలు లేని వారికి అదొక బలమైన ఆకర్షణ! ‘హోదా’ అనే భ్రమలో పడేసే మానసిక ప్రేరణ. మనుషుల తత్వాలను బట్టి, కొందరు ఆకర్షితులౌతారు, మరికొందరు దానికి దూరంగా ఉంటారు. అధికారం, హోదా తరచుగా కలిసే ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఇతరులకన్న ఎక్కువగా గౌరవించబడతారని అపోహ. గౌరవం సంగతేమో కానీ, వారిని జనాలనుండి మాత్రం వేరు చేస్తుంది. అధికారానికి రెండు పార్శ్వాలు. ఒక వైపు సానుకూల మార్పుకు దోహదం చేస్తూ పురోగతిని తీసుకురావడం. మరో వైపు అవినీతితో కూడిన అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పూనుకోవడం లాంటి చీకటి కోణం. 

బహు పాత్రాభినయం

ఒంటరి కాదు మనిషి. పుట్టిన నుంచి గిట్టే దాకా కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, సమాజ పరంగా ఎన్నో పాత్రల్లో జీవించాలి. ఆయా పాత్రలకు ప్రత్యేకించిన విధులను (బాధ్యతలను) సంపూర్ణంగా నెరవేర్చే దిశలో తలమునకలవుతేనే అధికారికంగా కొన్ని హక్కులకు అర్హుడవుతాడు. గెలుస్తేనే కదా ‘పథకం’ వరించేది! నెరవేర్చిన బాధ్యతలకు గుర్తింపుగా సిద్ధించేవే హక్కులు. ఏవీ అప్రమేయంగా లభించవు. ప్రతి ఒక్కరి జీవితానికి ఇవి అనుభవేకవేద్యమే. హక్కు అంటే దండించే అధికారం కాదు, సంస్కరించే ఆయుధం, సాటి మనిషికి సహకరించే సంప్రదాయం. హక్కు అంటే మనిషి మనిషిని కలిపి నడిపే శక్తి.. విడదీసి విసిరివేసే కుయుక్తి కాదు. నీటిలో దిగని వాడెప్పుడూ ‘గజ ఈతగాడు’ కాలేడు! బాధ్యతలనుండి పారిపోయినవాడికి ఏ హక్కులుండవు. ఆ రెండింటి నడుమ నిత్యం జరిగే వరుస ఘర్షణలను సమన్వయించుకుంటూ వెళ్లడమనేదే మనిషి వ్యక్తిత్వానికి అసలైన నిర్వచనం, జీవితానికి లిట్మస్ పరీక్ష. అప్పుడప్పుడు ఈ రెంటికీ సమతుల్యత కుదరక పోయినా భుజంపై ఆనించిన ‘కావడి బద్దను’ అటు ఇటుగా జరుపుతూ తులనాత్మకంగా వ్యవహరించే మెలకువలను జీవితం నేర్పిస్తుంది ప్రతి మనిషికి. ఇది అందరికి తెలిసినా, తెలియనట్టుండే అతి పెద్ద రహస్యం!                

కుటుంబం – బాధ్యతలు – హక్కులు  

కుటుంబమంటూ ఏర్పరచుకున్నాకా బిడ్డల బాగోగులకు సతతం పాటు పడడమే భార్యాభర్తల  బాధ్యత. అందులో అవసరాన్ని బట్టి త్యాగమూ ఉంటుంది, అందమైన స్వార్థమూ ఉంటుంది. హక్కులున్నా.. అవి నిద్రాణంగా ఉంటాయి. పరిస్థితులు చేయిదాటి పోకుండా వాడుకునేవే ఆ హక్కులు. ఏది సూచించినా మాటల్లోనే కాక చేతల్లోనూ నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. ప్రేమ, గౌరవాలే ప్రమాణంగా కుటుంబానికి రక్షణ కల్పించే దిశలో, కుటుంబ విలువలు కాపాడే ప్రయత్నంలో కొన్ని ప్రత్యేక హక్కులను ఉపయోగించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి యెడల ఇంకొకరికి ఉండాల్సిన బాధ్యతలను సంపూర్ణంగా వివరించడం అసాధ్యం. కుటుంబాన్ని బట్టి కాలానుగుణంగా ఉత్పన్నమయ్యె పరిస్థితులను అనుసరించి వాటి ప్రామాణికతతో పాటు పరిమాణం నిర్ధారించబడుతుంది.

ఇష్టమున్న చోటే బాధ్యత, బాధ్యతతో ఉంటేనే ఇష్టం పుట్టుకొస్తుంది. రెండింటికి అవినాభావ సంబంధం. జీవితం ఒక ప్రయాణం. శిశువుగా ప్రారంభించి క్రమంగా ఎన్నో దశలు దాటుకుంటూ వెళ్తాడు మనిషి. తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, ఇంకా ఇతరత్రా బంధాల పాత్రల్లో ప్రతి మనిషికి తప్పదు జీవితంలో బహు పాత్రాభినయం. ప్రవేశం చేసిన పాత్రను బట్టి బాధ్యతలు, హక్కులు సంక్రమిస్తాయి. వ్యక్తిగత ప్రవర్తనకు సమాజం కొన్ని ప్రమాణాలను ఏర్పరచుతుంది. వాటి ప్రాముఖ్యతను అంగీకరించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఆయా ప్రమాణాల ప్రకారం నడుచుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత.           

హక్కులు, బాధ్యతలు రైలు పట్టాలలా ప్రక్క ప్రక్కనే ఉంటాయి ఎప్పుడూ సమాంతరంగా. సర్వసాధారణంగా అవి ఒక దానితో మరొకటి అవిభక్తంగా అనుసంధానించబడి ఉంటాయి. పదవులు, అధికారం హోదాల లాగా, హక్కులు సంపాదించుకునేవి.. ఇవ్వబడవు. ఆడే ఆటను బట్టి మైదానానికి హద్దులు. అలాగే హక్కులకు ఎల్లలు లేదా హద్దులుంటాయి. ఆ హద్దుల రూపాలే బాధ్యతలు. పుట్టిన ప్రతి మనిషికి బ్రతికే హక్కుంది.. కానీ ఇతరుల గొంతు నొక్కుతూ కాదు. జీవించే హక్కును ప్రాథమిక హక్కులన్నింటికీ ‘గుండె’గా భారత సర్వోత్తమ న్యాయస్థానం అభివర్ణించింది. ‘రైట్ టు లైఫ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్!’ నవ్వే హక్కుంది.. ఇతరులను అపహాస్యం చేస్తూ కాదు. ఏడ్చే హక్కుంది.. ఇతరులకు నరకం చూపించడానికి కాదు. మాట్లాడే హక్కుంది.. సాటి వారిని చిన్నబుచ్చడానికి కాదు. చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కులకైనా పరిమితులుంటాయి. చట్టం ముందు అందరు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యం అందరికి సమానమే. ఎలాంటి వివక్షకు తావు లేదు. ముందుకు వెళ్లే హక్కుందంటే.. దారిలో ఉన్నవారి అడ్డు తొలగించుకొని కాదు. నీకంటూ ఒక దారిని సృష్టించుకొని వెళ్లమని అర్థం. హక్కుల విలువ ఇతరుల హక్కులకు భంగం వాటిల్లనంత వరకే. బాధ్యత లేని హక్కు వినాశకరం కావచ్చు. అందుకే ఏ పౌరుడైనా తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది.    

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

బాలల కథ

by Shanthi Prabodha Valluripalli January 31, 2025
written by Shanthi Prabodha Valluripalli

సాయికి పన్నెండేళ్ళు.  

తన చక్రాల కుర్చీలో కూర్చుని కలలు కంటూ ఉంటాడు. తన కలలను నిజం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

ఎనిమిదేళ్ల వయసులో సాయికి జబ్బు చేసింది. ఆ జబ్బు వల్ల సాయి కాళ్లు రెండూ  చచ్చుబడిపోయాయి. లేచి నడవలేకపోతున్నాడు.  ఇక ఎప్పటికీ నడవలేడని వైద్యులు చెప్పారు. 

అమ్మా నాన్న చాలా దుఃఖించారు.  మొదట్లో సాయి కూడా బాధపడ్డాడు. 

సాయితో కలిసి బడికి వెళ్లిన, ఆడుకున్న మిత్రులు అవిటివాడని వెక్కిరించారు. దూరమయ్యారు.  సాయి ఒంటరి అయ్యాడు.  

మిత్రుల ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. 

తన మిత్రులతో  తిరగ లేనందుకు, ఆటలు ఆడలేక పోతున్నందుకు దిగులు పడ్డాడు.  

చక్రాల కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తూ సాయి కలలు కంటున్నాడు. రకరకాల కలలు కంటున్నాడు. 

సాయికి బొమ్మలు వేయడం చాలా ఇష్టం.  ఆ బొమ్మల ద్వారా తన కలలు, ఆశలు  వ్యక్తం చేస్తున్నాడు.   

సాయి గదిలో కిటికీ దగ్గర కూర్చుంటే పచ్చని మైదానం కనిపిస్తుంది. 

ఆ మైదానం సాయి బొమ్మల్లో రంగుల మైదానంగా మారింది.  ఆ మైదానంలో అతను పరుగులు తీస్తున్నాడు.  ఎగురుతున్నాడు. 

ఆకాశంలో ఎగిరే పక్షులు అతని బొమ్మల్లో అతని స్నేహితులుగా మారాయి. 

సాయి ఆ రోజు రాత్రి చాలా సంతోషంగా నిద్రపోయాడు. 

అతని కలల్లో అతను ఒక గొప్ప చిత్రకారుడు. అతని బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతున్నాయి. ప్రజలు అతని బొమ్మలను చూసి ఆనందిస్తున్నారు.

ప్రశంసిస్తున్నారు. 

సాయి ఉదయం లేస్తూనే ఆ విషయం అమ్మతో చెప్పాడు.  ఆ తర్వాత “అమ్మా, నేను పెద్దయ్యాక చిత్రకారుడు అవుతాను. నేను చాలా బొమ్మలు వేస్తాను. నా బొమ్మలు చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు” అని చెప్పాడు.

అమ్మ సాయిని దగ్గరకు తీసుకుని “నా చిట్టి తండ్రీ.., నీ కలలు నిజమవుతాయి. నీవు చాలా తెలివైనవాడివి. నీవు ఏమి అనుకుంటావో అది చేయగలవు” అని ముద్దిచ్చి  ప్రోత్సహించింది.

పెద్ద రంగుల పెట్టె, కుంచె, కాన్వాసు తెచ్చి “నీ కలలు నిజం చేసుకో ” అన్నాడు  నాన్న.  

“అన్నా నీకేది కావాలన్నా నన్నడుగు, నీకు నేనున్నా” చెప్పింది  చెల్లి. 

కిటికీలోంచి వచ్చే వెలుతురులో సాయి ముఖం ఆనందంతో మెరిసింది. 

సాయి చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నాడు కానీ, అతని మనసు మాత్రం ఎల్లప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. కొత్త కొత్త కలలు కంటూనే ఉంది.  కొత్త లోకాల్లోకి తీసుకుపోతూనే ఉంది.  

తన కలల్లో చూసినవన్నీ సాయి బొమ్మలుగా గీస్తున్నాడు. వాటికి రంగులు అద్దుతున్నాడు.  అవి అతనికి గొప్ప గుర్తింపుని ఇచ్చాయి.  ఎన్నెన్నో బహుమతులు తెచ్చిపెట్టాయి. 

సాయి కన్న కలలు అతనికి కఠిన పరిస్థితుల నుంచి బయటపడే శక్తిని ఇచ్చాయి. 

చిత్రకారుడిగా లోకానికి పరిచయం చేశాయి. 

కలలు కనడానికి ఎవరికీ పరిమితులు లేవు. ఆ కలలు నిజం చేసుకోవడానికి మాత్రం కృషి చాలా అవసరం.  

మరి, సాయి ఆ కృషి చేస్తాడా? 

భవిష్యత్ లో గొప్ప చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటాడా? . 

ప్రపంచం అతన్ని గుర్తిస్తుందా? 

మీరు చెప్పండి. 

వి. శాంతి ప్రబోధ 

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నిర్జల నిధి

by Ammangi Venugopal January 31, 2025
written by Ammangi Venugopal

చరిత్ర భూగోళాల మీద ప్రవహించిన నదీ!

అక్షాంశ రేఖాంశాల మీద పొంగి పొరలిన నదీ!

నిరుడు నింగనీ నేలనూ ఒకటి చేసిన నదీ!

ఊళ్ళ కూళ్ళను అష్టదిగ్బంధనం చేసిన నదీ!

ఇప్పుడు ఈ ఎండల్లో

తల్లడిల్లుతున్నావు ఎండిపోయిన డొక్కలతో

నీ దాహం తీర్చుకోవటానికి నీ నీళ్లే నీకు సరిపోవు

ఇసుక మీద ఈదలేక చీదరించుకుంటున్నై చేపలు

పెయ్యి తడుస్తలేదని తిట్టుకుంటున్నై ఊరపిచ్చుకలు

ఒక్క పుక్కలింతకు కూడా సరిపోవని

తిరిగిపోతున్నది చీనులబారు

ప్రతిబింబాలు చూసుకునేందుకు చారెడు నీళ్లులేని

బెంగళూరు నుండి వలసపోతున్నై పావురాలు

అలల హోరు నశించి

ఇసుక లారీల జోరు పెరిగిన వేళ

నెలల క్రితం తలలు ప్రదర్శించిన తాళ్లు

నేడు నిలబడ్డాయి దిసమొలతో

నిరుడు భయంతో మబ్బుల చాటున దాక్కున్న సూర్యుడు

నేడు ఉష్ణ మండల సమ్రాట్టై ఏలుతున్నాడు నేలను

ఇంకా రెండు డిగ్రీల ఎండ పెరిగితే

ఈ ఇసుక తిన్నెలు వేగి వేగి పేలాలవుతయ్

నదీ!

ఏమైంది పిల్లకాల్వలకు గిలిగింతలు పెట్టిన నీ సరసం?

ఎక్కడ పోయింది ఉపనదులతో సంగమించిన నీ పౌరుషం?

ఏది మరి కంటి సైగతో పంటకాల్వలను సారించిన రాజసం?

ఇసుక గడియారంలో కాలం స్తంభించిన వేళ

ఎండ మావులు చేసే గ్రాఫిక్స్ నమ్మకు

ఈ రోజుు నీవు భూమి గీసుకున్న దారిద్ర్యరేఖవు

పుట్టినచోట ఉత్తరీయమంతైనా లేని నీవు

ఎట్లా ప్రవహిస్తావు కడలి అంచుల దాకా?

నదీ! నిర్జల నిధీ!!

January 31, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వికృత సంక్రాంతి

by ChittiProlu Venkata Ratnam January 30, 2025
written by ChittiProlu Venkata Ratnam

భాస్కరుడు రాసులు మారడం మకర సంక్రాంతి

నాయకులు పార్టీలు మారడం వికృత సంక్రాంతి

నారీమణులు ముగ్గులు వేయడం మకర సంక్రాంతి

నాయకమణులు దురాగతాచరణకు స్కెచ్చులు వేయడం వికృత సంక్రాంతి

దాసరులు గంగిరెద్దుల నాడించడం మకర సంక్రాంతి

మోసరులు సంఘాన్నే ఆడించడం వికృత సంక్రాంతి

హరిదాసుల భగవత్సం కీర్తనం మకర సంక్రాంతి

జనరాసుల జగజ్జంత్రీల కీర్తనం వికృత సంక్రాంతి

మకర సంక్రాంతి ఏడాది కొక్కసారే వస్తుండగాా

వికృత సంక్రాంతి ఎల్లవేళలా నర్తిస్తుండడమే

హృదయాలలో జరిగే వ్యధా సంక్రాంతి

వెరసి ఇప్పుడు జరిగేది వ్యధా వికృత సంక్రాంతి

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఎన్నాళ్ళో వేచిన సమయం

by Vijaya Kandala January 30, 2025
written by Vijaya Kandala

13 జనవరి 2025 నుండి మొదలైన మహాకుంభమేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. మయూఖ పాఠకులకు ప్రత్యేకం..

పరిచయం

మహాకుంభమేళా అనేది కోట్లాది హిందువులు సంస్కృతి సంప్రదాయాలపై అచంచల విశ్వాసంతో చేసే యాత్ర ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు సాగే 45 రోజుల యాత్ర.

ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది . ప్రతి ఆరు సంవత్సరాలకు జరిగేది అర్థ కుంభమేళా పూర్ణకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది . ఇలా 12 పూర్ణకుంభమేళాలు జరిగాక జరిగేది మహాకుంభమేళా . అంటే 144 సంవత్సరాలకు జరిగేది .ఇది అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ రోజులలో 12 సంవత్సరాలకు జరిగే దాన్నే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు.

కుంభం అంటే సంస్కృతంలో కుండ అని కలశం అని అర్ధాలు ఉన్నాయి . ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి కూడా కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కలవడం, జాతర అని అర్థాలు, లక్షలాది హిందువులు గంగ ఒడ్డుకు చేరుకొని . చేసే వేడుక ఈ జాతర మరిచాను లక్షలాది ఒకప్పుడు . నేఊ కోట్లాది అనాలి. 2013లో జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ మేళా జరుగుతుంది . సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే త్రయంబకేశ్వర్లో సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది .

అలాగే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగరజ్ లో బృహస్పతి- సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలో జరుగుతుంది . ఇందువల్లే ప్రతి స్థలంలోనూ బృహస్పతి సూర్యుడు చంద్రుడు స్థానాల ఆధారంగా మేళా తేదీలను నిర్ణయిస్తారు. వాటిని షా హిస్నాన్ లేదా రాజస్నాన్ అని అంటారు.

పౌరాణిక ఆధారాలు

పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో, భాగవత విష్ణు పురాణాలలో రామాయణం, మహాభారతాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. – క్షీరసాగ చిలకడం మొదలు పెడతారు. తీరా అమృతం దొరికాక ఎక్కువ వాటా కోసం గొడవలు పడతారు రాక్షసులు చేతిలో ఆ అమృత కుంభం పడితే వారి అరాచకాలకు హద్దులు ఉండవని తెలిసిన మహావిష్ణువు కుంభాన్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్తాడు .అలా వెళ్ళినప్పుడు కొన్ని అమృత బిందువులు ప్రయాగ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్లలోని నదుల్లో పడ్డాయని ప్రజల విశ్వాసం .

ఎన్నో ఏళ్లుగా ప్రయోగరాజ్ లో పురోహిత్యం చేస్తున్న తెలుగు పురోహితుడు శ్రీ ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ గారి అభిప్రాయంలో ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడంపై భిన్న కథనాలున్నాయి . సామ. అధర్వణ వేదాల ప్రకారం సముద్ర మధనం లో వచ్చిన అమృత కలశాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంలో నాలుగు చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని, అందువల్లనే ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. అయితే అమృత కలశాన్ని నోట కరుచుకొని వెళ్ళింది కాకి కాదు గరుడ పక్షి అని మరో కథనం..

చరిత్ర ఏం చెస్తోంది ?

క్రీస్తు శకం 629 -645 మధ్యకాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయున సాంగ్ కుంభమేళాను గురించి ప్రస్తావించాడు. ఇతను హర్షవర్ధనుని కాలంలో మన దేశానికి వచ్చాడు.

ఆధునిక కాలంలో దీని గురించిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపీరియల్ గజేటి ఆఫ్ ఇండియా లో 1796 లో రెండు మిలియన్ల మంది 1889లో 2.5 మిలియన్ల యాత్రికులు కుంభమేళాకు వచ్చినట్లు ప్రకటించారు.

జ్వర్ కుంభమేళాలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ మాంటి గౌరీ మార్టిన్ సందర్శకులలో బుఖారా కాబుల్ తుర్కిస్తాన్ నుండి వచ్చిన గుర్రాల వర్తకులు ఉన్నారన్నాడు. వీధితో బాటు అరబ్బులు పర్షియన్లు గుర్రాల వ్యాపారం కోసం వచ్చారని చెప్పాడు. ఆ మేళాలో రోడ్డుకు ఇరువైపులా ధాన్యం, తినుబండారాలు, బట్టలు, బొమ్మలు అమ్మవారున్నారట. యాత్రికులు నీళ్లలో వదిలే దీపాలు కదలే నక్షత్రాలలో కనిపించేవని కూడా చెప్పాడు. ఎందరో హిందూ రాజులు సిక్కు ప్రభువులు నవాబులు మేళా చూడడానికి వచ్చే వారిని కూడా చెప్పాడు ప్రయాగ లో 1895 లో జరిగిన కుంభమేళాకు వచ్చిన ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్ దీన్ని చాలా మెచ్చుకున్నాడు . 1938లో లార్డ్ అక్లాండ్ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అందువల్ల యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రకమైన మేళాలను ఆదాయ వనరు గానే పరిగణించి, ప్రోత్సహించింది. పన్నులు కూడా వసూలు చేసేది . ఈ సందర్భంలో జరిగే అమ్మకాలపై టాక్స్ కూడా విధించేవారు. 1954లో ఐదు మిలియన్ల మంది 1977లో 10 మిలియన్ల మంది 1989లో 15 మిలియన్ల మంది కుంభమేళాను దర్శించుకున్నారు.

ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంచనా ప్రకారం 2019 కుంభమేళాలో 200 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారు. ఇది ప్రపంచంలో Largest People Gadharing కుంభమేళా అధికారులు ఒకేరోజులో అత్యధిkuలు దర్శించిన తేదీలు 10 ఫిబ్రవరి 2013లో 30 మిలియన్లు 4 ఫిబ్రవరి 2019లో 50 మిలియన్లు అని ప్రకటించారు.

అయితే ప్రాచీన వేదకాలం నుండే ఈ ఆచారం ఉన్నట్లు వేద విద్వాంసులు అంటారు .ఈ కుంభమేళా స్నానాలు 850 ఏళ్లకు పైగా జరుగుతున్నట్లు, ఆదిశంకరులు దీనికి ఆద్యుడు అని కూడా చెప్తారు .వీరి తర్వాత శంకరుల శిష్యులు, అనుయాయు లు, సన్యాసులు,అఘోరాలు, నాగ సాధువులు రాజస్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఇలా షాహి స్నానం చేయడం వల్ల గత జన్మల పాపకర్మల నుండి విముక్తి కలిగి, మోక్షం పొందుతారని ఆస్తికుల విశ్వాసం. అందుకే ఒకప్పుడు లక్షల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కోట్లల్లోకి పెరిగింది పెరగబోతోంది రాబోయే కాలంలో,

మరి కాస్త ముందుకొస్తే 1982లో అమృత్ కుంటే ర్ సంధానే అనే బెంగాలీ సినిమా కుంభమేళా దృశ్యాలను చిత్రీకరించింది. .2001లో మారజయో యో బెంజో, నిక్ డేలు The Greatest Show on earth అనే డాక్యుమెంటరీ తీశారు. నదీముద్దీన్ KUMBH MELA Songs of the river అని 2004లో మరొక డాక్యుమెంటరీ ని చిత్రించాడు. 28 ఏప్రిల్ 2017 BBC. Greatest Show on Earth Kumbha Mela పేరుతో ఇంకో ఆడియో వీడియో రిపోర్టును కూడా విడుదల చేసింది.

అంతేనా

అంటే కాదు అనే చెప్పాలి కుంభమేళా అంటే కేవలం స్నానాలే అనుకుంటే పొరపాటే . అంతకు మించిన విశేషాలు లెక్కలేనన్ని . తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృ పూజలు, దాన ధర్మాలు, సంతలు, విద్యావిషయక చర్చలు, వేద పండితుల వాద ప్రతి వాదాలు సాధువుల సంతుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు You Name It we have it అన్న రీతిలో ఉంటాయి. సామూహిక భజనలు ప్రార్ధనలు, పారాయణాలు అడుగడుగునా కనిపిస్తాయి.

ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే భోజనశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస ఏర్పాట్లు , స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు .టెంట్ సిటీని నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎప్పటికప్పుడే ఔరా అనిపిస్తాయి.

ఈ రోజుల్లో మనలాంటి సాధారణ భక్తులతో పాటుగా, వీఐపీలు, నాగా సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు ( నెల రోజులు దీక్షలో ఉండేవారు) పీఠాధిపతులు, మఠాధిపతులు, విదేశీ వార్తా విలేకరులు ప్రసిద్ధిగాంచిన వీడియో గ్రాఫర్లు, స్వదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు మరెందరెందరో వీటిని ప్రజలకు అందించడానికి ప్రతీక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అయిపోయిందా

నాగా సాధువుల ప్రసక్తి లేకుండా కుంభమేళా వేడుకలు వ్యాసాలు అన్నీ అసంపూర్ణమే అసమగ్రమే వేలాది నాగ సాధువుల ప్రవేశం వారి అద్భుత విన్యాసాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి.

వీరి ప్రవర్తన, వేషధారణ అన్ని ప్రత్యేకమే. వ రు తప్పకుండా ఈ కుంభమేళా వస్తారు ఎలా వస్తారో తెలీదు. మేళా అయ్యాక ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. చాలామంది ఒంటినిండా బూడిద పూసుకొని నగ్నంగా ఉంటారు . తలంతా జడలు కట్టి ఉంటుంది . మేళా మొదలయ్యేసరికి సిద్ధం తర్వాత మాయం. కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు . సడన్గా తిట్టడం కూడా మొదలెడ తారు .కసురుకుంటారు .ఏ కాలమైనా, ఎలాంటి వాతావరణమైనా దిగంబరులే బంధాలను ఇష్టపడరు. అత్యంత తీవ్రమైన పద్ధతులలో శారీరక క్రమశిక్షణను పాటిస్తారు . మనసుతో శరీరాన్ని శాసిస్తారు .ఈ యాత్ర సమయంలో మాత్రమే జనాలతో కలుస్తారు.

సభ్య సమాజం వీరిని దూరంగా పెట్టినా, అసహ్యించుకున్న, భయపడ్డా గ్రామీణ ప్రాంతాల వారు, విదేశీయులు బాగా నమ్ముతారు . ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. వారి ఆగ్రహాన్ని భరించి, ఆశీస్సులను పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . సాధువులు, బిక్షకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు ప్రభుత్వం సాధారణ భక్తులు, దేశ విదేశీ సందర్శకులు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందరు మరెందరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కుంభమేళా కొన్ని గంటల్లో మన కళ్ళ ముందుకు రాబోతోంది .రెండు చేతులు చాచి తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు విశ్వాసాలకు భారతీయతకు చిరునామాగా నిలిచిన ఈ కుంభమేళాను ఆనందిద్దాం. ఆహ్వానిద్దాం. మన మధ్యలో రాజకీయాలను చేరనీయకుండా మానవత్వాన్ని పరిమళింప చేద్దాం .ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎందుకంటే ఇది ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ కనుక.

రెండవ మరియు చివరి భాగం కొరకు ఎదురు చూడండి. త్వరలో..

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

 మౌనం సోమరి కాదు

by Chandaluri Narayana Rao January 30, 2025
written by Chandaluri Narayana Rao

మౌనం
ఖాళీగా తిరిగే సోమరి కాదు

ఏ క్షణంలోనూ రక్తం మరిగి.
పరుష పదజాలం
ముఖంలో పారకుండా కట్టుకున్న ఆనకట్ట.

మెడలో భయం వ్రేలాడుతూ
నెత్తిన పెట్టుకున్న నిజాలే బరువుగా
మెత్తగా కనిపిస్తూ మత్తుగా నటించే స్థితి.

లోపల ఎర్రని కోపాన్ని నాలుకే మూటకట్టి
బొట్టు చూపు  కన్నెర్ర చేయకుండా
శరీరాన్ని బిగించే అరుదైన సందర్భం.

ఆలోచనలు విగ్రహాల్లా బిగుసుకుపోయి
నరాల్లో చైతన్యం పిడచగొట్టుకుపోయి
పాదాలు నేల స్పర్శ మరచే విచిత్రం.

మౌనం
మాట దిమ్మరి కాదు
మనసు కాపలా

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us