తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వాన్ని ధిక్కరించి వరంగల్లు వేదికగా అంకురించిన కవిత్వం చేతనావర్త కవిత్వం. ఈ చేతనావర్త కవులలో వేనరెడ్డిగా సుప్రసిద్ధులయిన డాక్టర్ వేణుముద్దల నరసింహారెడ్డి ఒకరు. ప్రగతివాద కవి మార్క్సిస్టు కానక్కరలేదని, అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు, ఉత్తమ కవిత్వానికి ప్రేరణ అని నమ్మిన కవులు చేతనావర్తన కవులు. “గతం నాస్తి కాదు అనుభవాల ఆస్తి” అన్న వేనరెడ్డి “సవిత “అను ఈ సంపుటి మొదట 1973లో సాందీపని ప్రచురణల ఆధ్వర్యంలో ముద్రించబడింది. తొలిముద్రణలో “శత సహస్ర ముఖాల సరస కవి” అనే పేరుతో దాశరధి కృష్ణమాచార్యులు ముందుమాట వ్రాశారు. “పరిశీలన” అనే పేరుతో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు వ్యాసం అందించారు. ఇప్పుడు మళ్లీ “సహృదయ” సాహిత్య సాంస్కృతిక సంస్థ రజతోత్సవాల ప్రచురణలో భాగంగా వేన రెడ్డి గారి “సవిత” వచన కవితా సంపుటి 2023లో ఐదవ ముద్రణకు నోచుకుంది . అదృష్టం కొద్దీ 2023 ఆగస్టు 13న ప్రఖ్యాత పద్య కవి శ్రీ గిరిజా మనోహర్ బాబు గారి ద్వారా కరీంనగర్లో నేను అందుకుంటిని. అందినదే తడవుగా ఆద్యంతం కవితా పఠనం పూర్తి చేసి నాలుగు మాటలు చెప్పాలని ఈ సమీక్షకు పూనుకున్నాను. 34 ఏళ్లు మాత్రమే జీవించిన ఈ చేతనావర్తన కవి కాలం పై చెరగని ముద్రని తన రచనలతో వేశాడు. అందుకే వేనరెడ్డి మరణం తట్టుకోలేక తన బాధను “కరిగే వెన్న ముద్ద” పేరుతో కాళోజి రాసిన కవిత సందర్భోచితం.
“తాపసియై కైతగమారిన రసికుడు/
దారిని తీర్చుచు నడిచిన పథికుడు/
వ్యక్తిత్వం కోల్పోని సాంఘికుడు /
ఆయాసము పడనట్టు సాధకుడు/”
అని వేన రెడ్డి వ్యక్తిత్వాన్ని నా గొడవలో చిత్రించారు.
సవిత అంటే సూర్యుడు. సూర్యుడు వెలుగుకి, వేడికి, విజ్ఞానానికి సంకేతం. వేనరెడ్డి కవిత్వంలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయంటారు 5 వ ముద్రణలో ముందు మాటనందించిన ప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్. వేన రెడ్డి గారిపై తిలక్,శ్రీ శ్రీల ప్రభావం ఉన్నట్లు కొన్ని కవితల ద్వారా మనకు అర్థమవుతుంది. సంపుటిలో 26 కవితలతో పాటు, వేనరెడ్డి తన డైరీలో రాసుకున్న 54 భావ కవితలను ‘రస రేఖలు’గా ఈ సంపుటిలో అందించారు.
తొలి కవిత “జన్మాష్టమి”లో కవి అనన్య భక్తిని ప్రకటిస్తూనే సమకాలీన సామాజిక పరిస్థితులను విన్నవించుకుంటాడు.
“గోమాయుల రాజ్యంలో/
గోవులు జీవించలేవు/
మాకు వెన్నలేదు/
మాకు వెన్నెల లేదు”అంటూ “ఈ తమస్సు చీల్చబడుతుంది” కవితలో
పచ్చని ఎర్రని కామెర్లవాడు/
ప్రజా హృదయమెరుగనివాడు/ప్రజాస్వామ్యానికి తగడు/ఇంటినేదిద్దుకోలేనివాడు/
ఇంటర్నేషనలిస్టు కాలేడు/ అంటూ జాతీయ భావాన్ని తీసిపారేసే వామపక్షులపై విరుచుకుపడ్డాడు. ఈ కవితలోని ఒక్కో పదం, ఒక్కో పాదం ఓ ‘బలమైన ప్రకటన’కి చిరునామా. “యుద్ధం పూర్తి కాలేదు”అంటూ తల్లి నుదుటి కాశ్మీర కుంకుమ నిండుగాఉండాలి /
హుందాగా అందంగా వెలగాలి/
అని కాశ్మీర సంరక్షణ సందేశం ఆనాడే కవి అందించాడు. ‘చీకటి ఆవులించింది’, ‘సూర్యుని విడిపించాలి’ కవితల్లో కవి సామాన్యుని జీవిత సంఘర్షణలను భావాత్మకంగా చెప్పుకొచ్చారు. ఈ కవితలలో అక్షర సంపద జలపాతంలా ప్రవహించినది అని చెప్పవచ్చు రాత్రి, ధాత్రి, తెట్టే, గుట్ట, భీకరమై, కాకరమై, దూకి, ప్రాకి, త్యాగి, జోగి, మకలు, మెలికలు, ఆకలి కేకలు, కామం,క్షేమం …మొదలగు అనేక పదాలతో చిక్కటి, చక్కటి సాంద్ర కవిత్వాన్ని ఒలికించారు.
ఆధునిక కవితా ప్రస్థానంలో వినూత్నప్రయోగాల్ని అందించిన విశేష కవి వేన రెడ్డి. “రఫ్ స్కెచ్” అన్న కవితలో
‘పెద్దలు, గద్దలు తినేసినాక/
తోలూడదీసి వేలాడిన గోమాతల ఉంది దేశం/ఇది నా దేశం రఫ్ స్కెచ్/
అంటూ భారతీయ సామాజిక వ్యవస్థని కళ్ళ ముందు నిలిపాడు కవి.
దేహంలో జీవం లేదు/
జాతి రక్తంలో శక్తి లేదు/
చేతల్లో చైతన్యం లేదు/అంటూనే
వారి నుదుట ఎప్పుడు కాషాయారుణ/
ఉషస్సు ఉదయిస్తుందోనని/ కవి ఆశావాద దృక్పథాన్ని వెలిబుచ్చాడు.
” కాలాన్ని కత్తిరించి చూడకు” శీర్షికనే ఆలోచనాత్మకం. ఇందులో ‘దేశాన్ని విభజించి భజించరాదు/ అది అఖండ స్వరూపం/’అనడం వెనుక కవి జాతీయ సమగ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ దేశం నీది ఈ బ్రతుకు నీది/
నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాల/
నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి/ అంటాడు కవి. “ఆకలి ఒక్కటే సత్యం” కవితలో
‘ఆకలి అంతర్జాతీయమైంది/విశ్వజనీనమైంది’ అనడంలో కవి మానవతా స్థాయిని గుర్తించవచ్చు. ‘పిచ్చి గుండె’లో ధైర్యం నింపుతూ “పిరికిగా చావకు”అంటూ సకల మానవాళికి హితబోధ చేస్తాడు కవి.
నీ చావు నీ బ్రతుకు నీ ఒక్కడి సొత్తు కాదు/ సంఘపరం/ అంటాడు వేనరెడ్డి. “?-!” శీర్షికతో ఉన్న కవిత పాఠకుడికి వాస్తవంగా ఓ ప్రశ్నార్థకమే?ఓ ఆశ్చర్యార్థకమే! ఓ జీవిత సందేశమే.
“కవిత్వం నా ఊపిరి”లో కవి వేనరెడ్డి కవిత్వ లక్ష్యాన్ని సూటిగా తెలియచెప్పారు. మనిషి కోసం/ దేశం కోసం/చిందిన రక్త చందనం కవిత/ అంటాడు. సంచలనం కవిత/సమాజ సంఘటనంకవిత అంటాడు కవి.అవును కదా!! వివిధ వాదాలతో సమాజాన్ని విడదీసే కవిత్వం గుట్టలు గుట్టలుగా వస్తున్న నేటి కాలానికి అనువర్తింపదగినది ఈ కవిత పాదం. సమాజ సంఘటనము కవిత కానీ సమాజాన్ని ముక్కలు చేయడం కాదు. “నీ కాళ్ళ మీద నువ్వు” అనే కవితలో దేశ విచ్చిన్నకర శక్తుల మనస్తత్వాన్ని అక్షర అక్షరాన తెలుపుకొచ్చాడు కవి.
కులం పేర, మతం పేర/
భాష పేర, ప్రాంతము పేర/
నిన్ను విభజించి,చించి/
నీ కళ్ళల్లో దుమ్ము చల్లి/
నీ గాయం మీద కారం చల్లి/
లేపుతారు ప్రే/
రేపుతారు నీలో పశువుని/….
ఎంతటి గాడమైన ప్రకటికరణ. ఇంకా ఈ సంపుటిలోని ఒక్కో కవిత ఓ అధ్యాయమే అవుతుంది. ” జాగృతి”, “సంధుక్షణము”, “ప్రాప్యవరాన్నిబోధత” మొదలగునవి ప్రచండ జాతీయతా భావాలని వికసింపజేసే కవితలే. ఇంతటి భావ కిరణాల “సవిత” తాకిడి మీ హృదయాలని తాకాలంటే మీరు ఈ కవితా సంపుటి పఠనంలో మునగాలి. దీనిని మరోసారి ముద్రించి సాహితీ లోకానికి అందించిన సహృదయ వారు సదా అభినందనీయులు.
ప్రతులకు:
సహృదయ
హనుమకొండ
9949013448
మయూఖ సంపాదకీయం, జనవరి నెల 2024 -డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ సంపాదకులు
కాలం తనతో పాటు మంచి చెడులను తీసుకువస్తూ ఉంటుంది. అంది పుచ్చుకున్న వాళ్లకు అందినంత. రోజులు గడుస్తూ నే ఉంటాయి. క్యాలెండర్ల పేపర్లు తిప్పేస్తూ ఉంటాము. నిత్య జీవన సమరంలో కొన్ని సంతోషాలు కొన్ని దుఃఖాలు భ్రమణం చేస్తూనే ఉంటాయి. 2023
ఇటువంటివే కొన్ని సంఘటనలను మనసు లోతుల్లో పడవేసిపోయింది. సామాజిక అసమానతల ఉద్వేగాలను రగిల్చి పోయింది. కొన్ని అద్భుత ఆవిష్కరణల సందర్భాలను ఇచ్చి పోయింది. మరికొన్ని ఆలోచనాత్మకమైన ధోరణలను అందించిపోయింది. కొత్త సంవత్సరం వచ్చింది, 2024 లో అడుగు పెట్టాము.
విద్య,వైద్యం ఏ పౌరుడికైనా ఎంతో ముఖ్యమైనవి అనే జ్ఞానం ఎప్పుడో మూల మూలన పాకిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లల్ని చదివిస్తున్నారు అట్టడుగు శ్రామిక వర్గాలు కూడా ఈ నిజాన్ని గ్రహించాయి. వీళ్ళలో కొందరు ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారు. కొంతమంది చదవలేక, పరీక్షలు రాయలేక కొందరు వెను తిరుగుతున్నారు. కొందరు రాసి ఉత్తీర్ణత సాధించలేక వెను తిరుగుతున్నారు. అయినా కానీ వీళ్ళేమి ధైర్యాన్ని కోల్పోవడం లేదు. పనిచేసుకొని బ్రతకాలి అని ఒక స్పృహ ఉన్నటువంటి వాళ్ళు.దీనికి కారణం వాళ్ళ ముందు తరం వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు తాతలు, నానమ్మలు అమ్మమ్మలు ఇచ్చిన స్ఫూర్తి. రెండు కాళ్లు రెండు చేతులు ఉన్నాయి ఆలోచించడానికి మెదడుంది ఇంత గొప్ప ప్రపంచాన్ని చూస్తున్నాము, చెడ్డ పనులు చేయకుండా కష్టం చేసుకుని పని చేసుకుని బ్రతికితే తప్పేం లేదు అనే తెలివిడి కి వచ్చి బ్రతుకుతూనే ఉన్నారు.
అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు ఎవరినీ ఎవరు అవమానపరచడం ఎవరు సహించరు అనే విషయాన్ని గ్రహించారు కాబట్టి గౌరవాన్ని కోరుకుంటున్నారు. గతంలో ఉన్నట్టు తమకంటే తక్కువ ఉన్న వాళ్ళను అవమాన పరిచడం ఇప్పుడు ఉన్నత వర్గాల వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు ఈ అలవాట్లను మానుకుంటున్నారు. అందరినీ సమాన దృష్టితో చూడడం అనే భావాలు ఈ కొత్త తరంలో కనిపిస్తున్నాయి .ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్లు తాము తమ జీవన విధానాన్ని అనుసరించి ఉన్నట్టే ఉంటున్నారు. బుద్ధి జ్ఞానంలో మేము కాస్త ఎక్కువ అనుకుంటున్న వాళ్ళు ఆ విధంగానే వాళ్ళ జీవన విధానం తో ఉంటున్నారు, కానీ ఎదుటివాళ్ళను కించపరిచి మాట్లాడమనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ మార్పుకు కారణాలేంటి అని ఒకసారి తరిచి చూస్తే ఈ ఉన్నత భావాలు ఇలాగే కొనసాగుతాయి.
సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ
సింహవలోకనం చేయవలసిన అవసరం ఉంది. కుల మతాలకు అతీతంగా కులమత భేదాలను ఖండిస్తూ సమాజాన్ని సమానత్వంతో చూడాలని చెప్పిన మహా మనిషి. ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన ఇక్కడ కూడా ఒక అగ్నిని రగిలించినటువంటి స్త్రీ మూర్తి. నిమ్న జాతులకు అభ్యున్నతికి కృషి చేస్తూ భర్త జ్యోతిరావు పూలే ఆదర్శాన్ని తలకెత్తుకున్నటువంటి మహిళ. కుల వ్యవస్థకు శూద్రుల అసమానతలకు కారణాలను వెతికి సామాజిక బాధ్యతగా పోరాటం చేసినటువంటి విధుషి. పితృస్వామ్య పరిపాలన లో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గళమెత్తిన ఉద్యమకారిణి. ఎప్పుడో 1848లోనే బాలికల కోసం మరీ ముఖ్యంగా తక్కువ కులాల బాలికల కోసం,స్త్రీల కోసం పాఠశాలలను ప్రారంభించిన ధైర్యశాలి. ఆ రోజుల్లో ఉన్న సామాజిక కట్టుబాట్లను ఆధిపత్య ధోరణలను ధిక్కరించి ఉపాధ్యాయురాలిగా తనను తాను నిరూపించుకున్నటువంటి సావిత్రిబాయి పూలే ఈ ఆధునిక భారత దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు అని కీర్తినందుకున్నారు. మొదటి బడిని స్థాపించిన కొన్ని ఏళ్లలోనే దాదాపు 20 బడులను ప్రారంభించి ఉచితంగా విద్యను అందించే ఉద్యమానికి ఆద్యులయ్యారు. ఆ రోజుల్లో ఒక 18 ఏళ్ల యువతి ఇంతటి సాహసానికి పూనుకోవడం అనేది ఎంతో గొప్ప మాట.
సామాజిక సమస్యలను గురించి, మానవ హక్కులను గురించి స్త్రీలకు తెలియజేస్తూ వాళ్ళని చైతన్యపరచడంలో భాగంగా మహిళా సేవ మండల్ అనే ఒక సంఘాన్ని కూడా స్థాపించింది సావిత్రి బాయి. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు” అని చెప్పిన మాటలను వినడమే కానీ ఆచరణ శూన్యము అని గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని శూన్యము గ్రహించి, “మహిళా హక్కులే మానవ హక్కులు” అని నినదించిన సావిత్రిబాయి పూలే పితృస్వామ్య వ్యవస్థను ఖండించి, బాల్య వివహాలను చేయకూడదని, వితంతువులకు పునర్వివాహాలు చేయవచ్చునని, మూఢనమ్మకాలకు వదలాలని, సతీసహగమనాన్ని వ్యతిరేకించాలని పెద్ద పోరాటాలనే చేశారు. ఎన్ని వేధింపులు ఎదురైనా భయపడలేదు, ఎదురీదారు. వితంతువులకు శిరోముండనం అంటే, తలవెంట్రుకలు తీసి, గుండు చేయడం అనే దుశ్చర్యను ఖండించి క్షురకులకు చెప్పి “వితంతువులకు శిరోముండనం చేయుము” అని వాళ్లచేత చెప్పించి, సమ్మె కూడా చేయించారు. ఇది పద్దెనిమిది వందల అరవైలలోని మాట! జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన సత్యశోధక్ మండలి ద్వారా మహిళా విభాగం నిర్వహించిన సావిత్రి బాయి ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. తన భర్త ఫూలే మరణించిన తర్వాత ఆయన చితికి సావిత్రి బాయి నిప్పు పెట్టి కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చిన సంస్కర్త. భర్త సంఘ సంస్కరణలను తన భుజాలపై వేసుకున్న ధీశాలి. 1897లో పూణే నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఆ వ్యాధిగ్రస్తులకు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. జోలె పట్టుకొని విరాళాలు సేకరించి, ఆ వచ్చిన మొత్తంతో వైద్యశిబిరాలను నిర్వహించి, సేవా కార్యక్రమాలను చేసిన సావిత్రి బాయి పూలే చివరకు ఆ ప్లేగు వ్యాధివలననే మరణించారు. ఆమె మరణించిన 100 ఏళ్లకు అంటే 1997లో భారత ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. ‘సావిత్రి బాయి పూలే’ Savitri bai phule’ పేరుతో 200 రూపాయల విలువ చేసే తపాలా బిళ్లను 1998లో విడుదల చేసి గౌరవించింది. అంతేకాదు పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రి బాయి విశ్వవిద్యాలయం అని పేరును పెట్టడం కూడా ఒక గొప్ప నిర్ణయం.
ఇంతటితో అయిపోయిందా? సావిత్రిబాయి పూలే ఆదర్శాలు నిజంగా ఆచరింపబడుతున్నాయా? ఆచరింపబడితే ఎంతవరకు, ఎలా? అనేది ప్రతి ఒక్కళ్లు వాళ్ల మనసుల్లో ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఒక ‘విజన్’ ఏర్పడుతుంది.
శతాబ్దం గడిచిపోయిన స్త్రీల జీవితాలలో రావాల్సిన అంత మార్పులు రాలేదనేది సత్యదూరం కాదు. ఇంకా ఇంకా అణచివేత అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో పురుషాధిక్య ప్రపంచంలో మగ్గుతున్నటువంటి స్త్రీల పక్షాన గొంతెత్తుతున్న స్వరాలకు సావిత్రిబాయి పూలే పేరు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏం కారణం ఇంకా ఈ 2024లో అడుగుపెట్టినా కూడా మార్పులు ఏవీ రాకుండా సమాజం చెలరేగుతూ ఉంటే అర్థం ఏముంది? ఒకవైపు బడుగు బలహీనవర్గాల వారిని అవమానపరచడమైతే ఏంటి? అదే బడుగు బలహీనవర్గాల కుటుంబాలలో స్త్రీలు ఇంకా పురుషాధిక్యంలో మగ్గి పోవడమైతేనేమి ఎలా చూడాలి అర్థం కాని స్థితి. ఉన్నత వర్గాలనుకునే వాళ్లు, బాగా చదువుకున్నవాళ్లు అని చెప్పబడే వాళ్లు, ధనవంతులు, గొప్ప కులం అనుకునేవాళ్లు అంటూ ఎన్ని రకాల పేర్లు ఉన్న వాళ్ల ఇళ్లల్లోనూ ఆడవాళ్లని అదిమిపెట్టి చులకనగా చూడడం అనేది తగ్గు ముఖం పట్టని ఘోరం. ఇది ఏ దారులను ఏర్పరుస్తుంది?
“కెరత్ నహీ, రోజ్ గార్ చాహియే”. దానమిచ్చే సొమ్ము వద్దు ఉపాధి ఇవ్వండి” అని గొంతెత్తి అరవాల్సిన అవసరం స్త్రీలకు ఇంకా ఎందుకు ఉంది? ఆడవాళ్లకే కాదు అణగారిన వర్గాల మగవాళ్లకి ఈ కష్టం ఏమొచ్చింది, ఎందుకు వచ్చంది? సమాజంలోని ఒడిదొడుకులను ప్రశ్నించిన సావిత్రిబాయి పూలే 1854లోనే ‘కావ్యఫూలే’ అనే పుస్తకాన్ని ప్రకటించిన కవయిత్రి. ప్రకృతి పరంగానైనా, భగవంతుని సృష్టిపరంగా నైనా మనుషులంతా సమానమే. మగ జాతి విభేదాలు శారీరక నిర్మాణంలోనే గాని మానసిక భావనలో తేడాలు ఎందుకు ఉండాలి? అనే ప్రశ్న వేధించిన కవయిత్రిగా తమ కలాన్ని ఎత్తారు. మనుషుల మధ్య అసమానతలను ఖండించారు. పావన కాశీ శుభోదయం అనే పుస్తకము, గొప్ప వక్త అయిన సావిత్రి బాయి ఫూలే ఉపన్యాసాలు వ్యాసాలుగా ప్రచురించిన పుస్తకము వెలువడించారు. ఆ ఆధిపత్య రోజులలో కుల వ్యవస్థను ఖండించి, శూద్రులకు సమానత్వాన్ని ఇవ్వాలని ఎలుగెత్తిన విప్లవ వనిత! వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, సమాజోద్ధరణకు నడుం బిగించిన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి ఫూలెకు నివాళులర్పిస్తూ, ఆమె ఆశయాలను పాటించే దిశలో అడుగులు వేద్దాం. కష్టపడి పనిచేసే వాళ్లకు చేయూతనిద్దాం, విద్యా విజ్ఞానాలు అందిపుచ్చుకునే ఆసరాలవుదాం. ఎవరి ఆత్మ అభిమానాన్ని కించపరచకుండా సమానత్వాన్ని చాటుదాం. కాలం తిప్పే ప్రతి పుటలో మన కోసం కొన్ని అక్షరాలను రాసుకుందాం.
అన్నవరం దేవేందర్ “ఇంటి దీపం కవిత,
“స్వచ్ఛత కవిత,
“పొద్దున్నే లేస్తా…కవిత,
“మా ఊరి బస్సు కవిత,
“చెట్ల మహిమ కవిత,
కవిత్వం ఓ విశ్లేషణ.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషద్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటి లోని ఇంటి దీపం కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇంటి దీపం కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కవి ఊహాజీవి.జీవితంలో చాలా భాగం చదవడం రాయడం సమాజంలో జరుగుతున్న స్థితిగతులు సమస్యల పట్ల స్పందన కలిగి ఉండడం సహజం.కవి చదివిన దానిని చూసిన దానిని తన మనసులో పరితాపం చెంది కలంతో కాగితం మీద వ్రాసి తన ఆలోచనలని సృజనతో ఆవిష్కరిస్తాడు.కరీంనగర్ కు చెందిన దేవేందర్ తెలంగాణ మాండలికంలో రాసిన కవితలు వివిధ దినపత్రికల్లో వస్తున్నాయి.చదివాను.రోజు రోజుకి దేవేందర్ కవిత్వం పరిణతి చెంది సొగసులు శోభను సంతరించుకుంది. తెలంగాణ మట్టిలో నివసించే మనుషులన్నా వాళ్ళు మాట్లాడే భాష,యాస ఇష్టమని దేవేందర్ రాసిన కవితలు తెలియజేస్తున్నాయి.తెలంగాణ మాండలికంలో కవితలు రాసిన కవులు చాలా మంది ఉన్నారు.దేవేందర్ తెలంగాణ మాండలికంలో కవితా వ్యవసాయం చేస్తున్నారు.అది నిరంతర ఝరి.దేవేందర్ కవితల్లో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల పట్ల ఆవేదన ఉంది. సామాజిక సమస్యల పట్ల స్పందనను కవితల రూపంలో మనకు అందిస్తున్నారు.దేవేందర్ రాసిన ఇంటి దీపం కవితా సంపుటిలో ఇంటి దీపం కవిత నాన్న యాదిలో రాయడం జరిగింది.కవితాసంపుటి లో నాన్నగారి ఫోటో చిత్రీకరణ బాగుంది.ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెత తెలుగులో ఉంది. ఇల్లాలు లేకుంటే ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. ఇల్లాలును కోల్పోయిన భర్త బాధాతప్త హృదయుడవుతాడు.ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుంది.ఏ పని చేయాలన్నా అతనికి ఆమె లేని లోటు ఎడబాటు కనిపిస్తుంది.ఇల్లాలే ఇంటికి కాంతి.ఆమె లేకుండా ఇంటి దీపం వెలగదు.దేవేందర్ రాసిన తన కవితకు ఇంటి దీపం నాన్న అని తెలుగు సామెత రాసుకోవాల్సిన అవసరం వచ్చింది.అమ్మ నాన్నలు రెండు కన్నులు అని చెప్పుకోవాలి. అందులో నాన్న అనే కన్ను పోతే కుటుంబం కూడా విషాదంలో మునిగిపోతుందని మనకందరికీ తెలుసు.ఇంటి దీపం కవితలో మొదటి రెండు చరణాలు. “పచ్చ పచ్చని జీవితాన్ని పంచిన “పందిరి గుంజ కూలి పోయింది. ప్రకృతి పెనుభూతానికి పంట చేలు కొట్టుకుపోతాయి.దివిసీమ తుఫానుకు వేలాది ఎకరాలు పండిన పొలాలు,చెట్లు,చేమలు నేలమట్టమయ్యాయి.సునామీ వచ్చి విశాఖపట్నం విలవిలలాడింది.కుటుంబ యజమాని అయిన నాన్న త్యాగానికి ప్రతీక.దేవేందర్ నాన్న పరమాత్మను చేరుకున్నారు.తండ్రి ఏమి ఆశించక కుటుంబం కొరకు తన అణువణువును త్యాగం చేస్తాడు.పగలు సూర్యుడు సకల మానవాళికి వెలుగును ప్రసాదిస్తున్నాడు.రాత్రిపూట చంద్రుడు మరియు నక్షత్రాలు వెన్నెలను వెలుగును ప్రసాదిస్తున్నాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ పల్లెల్లోకి మనం ప్రతి ఇంటికివెళ్లి చూడాలి.ఇల్లు ఉంటుంది. ఇంటి ముందు పందిరి ఉంటుంది.దేవేందర్ వాళ్ళ నాన్నను పందిరి గుంజతో పోల్చాడు.ఎన్నో ఏళ్ల నుంచి పెంచిన చెట్లను నరికి గుంజలను తీసుకొస్తారు.గుంజలు నాటి ఇంటి ముందు పందిరి వేస్తారు.ఇంటిముందు పందిరి ఉంటే ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది.కొన్ని సంవత్సరాలు కాగానే పందిరి గుంజ కూలిపోతే పందిరి ఉండదు. అప్పుడు మరియు ఇప్పుడు పెళ్లిళ్లకు మరియు పేరంటాలకి పందిళ్లు వేస్తున్నారు.అదొక వేడుక.ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. “పీసు పట్టిన మక్క జొన్న చేను . “తలపువ్వు రాలి పోయింది. పీసు పట్టిన మక్క జొన్న చేను పంట పండగానే దాని తలపువ్వు రాలిపోతుంది.

“విస్తరించిన ఊడల మర్రి బలగాన్ని “చెట్టు నీడకు నిలిపి ఎళ్ళిపోయినవా!నాన్న . “అందరి నయనాలు దుఃఖ నదులైనై నాన. ఊడల మర్రితో నాన్నకు సంబంధించిన బంధువులు మరియు స్నేహితులను బలగంతో పోలుస్తున్నాడు. మర్రిచెట్టు మహావృక్షంగా ఎదుగుతుంది.మర్రి చెట్టును దేవతా స్వరూపంగా భావించి పూజిస్తారు. దేవస్థానాల్లో మర్రిచెట్టును దేవునిగా మొక్కడం, ప్రదక్షిణలు చేయడం మనకు ఎరుకే.ఇంటికి వెలుగు నాన్న.ఇంటి దీపమైన నాన్న వెళ్ళిపోగానే అందరి కళ్ళు దుఃఖంతో నదులుగా ప్రవహిస్తున్నాయి. దేవేందర్ నాన్న ఉపాధ్యాయుడుగా పనిచేశారు. ఆచార్య దేవోభవ అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచార్యుడు అంటే దేవునిగా పూజించే సమాజం మనది.శ్రీసాయిబాబా,మెహర్ బాబా,ఆది గురువుగా పూజింపబడుతున్నారు.దేవేందర్ నాన్న ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు.విద్యార్థుల జీవితాల్లో వెలుగులను నింపారు. “నీవు నాటిన అక్షరాలు మహా వృక్షాలై “జీవిత సాఫల్య ఫలాలను పండిస్తున్నాయి. నీ అంశతో జన్మించిన కుమారుడు దేవేందర్ బాల్యంలో నీ చేత అక్షరాలు దిద్ది విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు.ఈనాడు దేవేందర్ కవి పుంగవుడై రాసిన కవితలు జీవిత సాఫల్య ఫలాలను పండిస్తున్నాయి అని అన్నారు. . “శ్రమిస్తే పూజ చేసినట్టేనని సూత్రీకరించి ” నిత్యం ఏదో పనిలో సంచరించే వాడివి. దేవేందర్ నాన్నగారు కష్టపడి పని చేస్తే పూజ చేసినట్టేనని చెప్పారు.ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేవారు.దేవేందర్ నాన్న కుటుంబానికి అండగా నిలిచారు.ఉపాధ్యాయుడిగా పనిచేస్తు పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు చక్కటి విద్యా బోధన చేశారు.సమాజానికి కూడా వారు మార్గదర్శకంగా నిలిచారని చెప్పవచ్చు.నిత్య కృషీవలుడు అని రైతును అంటారు.విద్య నేర్పే గురువును ఆదర్శ ఉపాధ్యాయుడు అంటారు.శ్రీకృష్ణ భగవానుడు సాందీపని గురువు వద్ద విద్య నేర్చుకున్నారు.శ్రీరామచంద్రుడు వశిష్ఠులు మరియు విశ్వామిత్రుని వద్ద విద్య నేర్చుకున్నారు. “నాన్న నీవు బహుముఖీయ వర్చస్సువి “బంధుమిత్రుల ఆత్మాభిమానుడవు. దేవేందర్ వాళ్ళ నాన్నగారిని బహుముఖీయ వర్చస్సువి అని అంటున్నారు.శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు,మహావిష్ణువు,కలియుగ వెంకటేశ్వర స్వామి,అవతార పురుషుల వర్చస్సు అని చెప్తున్నారు.దేవేందర్ నాన్నగారు బంధువులతో మరియు మిత్రులతో ఆత్మాభిమానం సంపాదించుకున్న మహా మనిషి అని చెప్పడం చక్కగా ఉంది. “ముప్పై ఏళ్లు చుట్టూ పదూర్ల పెట్టుగ “నిక్కచ్చి బడిపంతులువని పేరొందినవు. పాతకాలం రోజుల్లో బతకలేని వాడు బడిపంతులు అని సామెత వాడుకలో చెప్పుకునే వారు. బడిపంతులు అంటే ఎంతో ప్రేమ,అభిమానం, గౌరవం ఉండేది.బడిపంతులు చక్కగా చదువు చెప్పేవాడు.ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా విద్యాబోధన చేసేవాడు.విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో వారు ఎల్లప్పుడు ముందుండేవారు.అనవరతం విద్యార్థులకు విద్య నేర్పడం కొరకు శ్రమించేవారు. ఆనాటి గురువు దేవేందర్ నాన్నగారికి వందనాలు చెప్పాలి.ఆచార్య దేవోభవ అన్న పదాన్ని వారు సార్థకం చేసుకున్నారు.ఆనాటి ఉపాధ్యాయులకు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండేది. ఉపాధ్యాయులకు ఏ కోశానా వ్యాపార దృక్పథం ఉండేది కాదు.ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్లి భార్యా పిల్లలతో ఉండి పాఠశాలలో పనిచేసే వారు. దేవేందర్ నాన్న 30 సంవత్సరాలు పనిచేసిన పదూర్లలోను నిజాయితీ బడిపంతులు అని పేరు తెచ్చుకున్నారు.ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారు. దేవేందర్ నాన్నగారిని శిష్యులకు ఎప్పుడు కనిపించినా గౌరవ సింహాం లాగా ఉండేవారని చెప్పారు.బడి వరండాలో నడుస్తుంటే నిశ్శబ్దం ఆవరిస్తది.చెప్పిన పాఠం అప్ప చెప్పకపోతే దండించే వారని చెబుతున్నారు. “మా నలుగురికీ తండ్రివే కాదు “ఆదర్శంగా విద్య నేర్పిన ఉపాధ్యాయుడవు. దేవేందర్ ఇలా చెబుతున్నారు.మా కుటుంబంలోని నలుగురికి తండ్రివి మరియు విద్య నేర్పిన ఆదర్శ ఉపాధ్యాయుడవు.ఆ కాలపు మాస్టార్లను ఎవరు మర్చిపోలేరు.ఆనాటి ఉపాధ్యాయులు చదువు నేర్పే దేవుళ్ళు.దేవేందర్ నాన్నగారికి వ్యవసాయం అంటే మహా ఇష్టమైన వ్యాపకం.వ్యవసాయదారుడికి ఎడ్లు,బాయి,నీళ్లు,పొలం,చేను,నిత్యం సంభాషణలో పలవరింతల పలుకులు.ఎడ్లను మేపడం,నీళ్లు పెట్టడం,వాటికి వరిగడ్డి మరియు పచ్చి గడ్డి వేయడం,బాయి కాడికి వెళ్లి నీళ్లతో పొలం పారించడం,నిత్య సంభాషణలో పలవరింతల పలుకులు అని చెప్పడం చక్కగా ఉంది. . “నీవు నాటిన మామిడి తోట మస్తు కాసింది “నాలుగు మామిడి పండ్లు తిని పో……. నాన్నా. ఆ కాలపు రోజుల్లో మామిడి చెట్ల పండ్లు ఎంతో తీయగా అమృతంలా ఉంటాయి.ఎంతో ప్రేమగా మామిడి పండ్లను తినమని నాన్నను పిలుస్తున్నాడు.ఆ అనుభూతి ఊహ కందనిది. “నాన్న నీకు వైద్యం ఎట్లా అబ్బింది “నౌకరిచేసిన ఊళ్లల్ల మందందరి డాక్టర్ వి “నాడిపట్టి రోగం ఎల్ల గొట్టిన కీర్తి నీది.
“దశరథం సారు చెయ్యి గుణం మంచిదనే పేరు. ఆ కాలంలో కొందరు ఉపాధ్యాయులు వైద్యం నేర్చుకుని ఆదర్శ వైద్యులుగా పని చేసే వారు. దశరథం సారు మంచి ఉపాధ్యాయుడు,మంచి వైద్యుడు అనే కీర్తిని సంపాదించుకున్నాడు. “వైద్యం వ్యవసాయం చదువు చెప్పుడే కాదు “చిత్రంగా చిత్రకారునివి ఎలా అయ్యావు నాన “పనిచేసిన బల్లల్లో రిజిస్టర్లు బోర్డులు అల్మారీల “రంగురంగుల రాతలన్నీ నీ కుంచె లోనివే “ఇంటి దూలాల మీద ఆ రంగులతో చిత్రించిన “సూక్తులు బొమ్మలు తేదీలు మా శిలా శాసనాలు “అందమైన అక్షరాలు రంగురంగుల బొమ్మల సృజన “జీవితాన్ని కళా ఉత్సవంగా జీవించడం నేర్పావు నాన్న. “చేతి వేళ్ళతోనే కళాత్మకత ముఖం మీద నవ్వు “ప్రేమ పరిమళం తప్పుకు మందలింపు ఖాయం “ఎన్ని మెలకువల జీవితం ఎంతో బోధన.

దేవేందర్ నాన్న మంచి చిత్రకారుడు.చిత్రకారుడు చిన్నతనం నుంచి బొమ్మలు గీయడం ఒక హాబీగా పెట్టుకుంటాడు.పొద్దు ఉండదు,మాపు ఉండదు. ఎప్పుడు చిత్రాలు గీయడంతోనే వారికి సరిపోతుంది.చిత్రకారులు ఒక తపస్సులా పని సాగిస్తుంటారు.చిత్రకారుని ముఖం కాంతివంతంగా కళకళలాడుతుంది.మల్లెలు నవ్వినట్లుగా ఉంటుంది. ఎవరి పట్ల ద్వేషం ఉండదు.ప్రేమ పరిమళం కలిగి అందరి యెడల సఖ్యతతో ఉంటారు.తప్పు చేసినప్పుడు మందలింపు ఖాయం.తప్పు చేసినప్పుడు సహృదయంతో వారిలో పరివర్తన తేవాలని మందలించేవారు.చెడు భావనతో కాదు. ఇవాళ తప్పు చేసిన వాళ్ళకి వంత పాడే లోకం తయారైంది.దుర్మార్గాలు,దోపిడీలు,పెచ్చు పెరిగిపోతున్నాయి.తప్పును చూసి చూడనట్లు ఉండడం నేరం.జీవితం పూల పాన్పు కాదు.జీవితం అనే బాటలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఎదుర్కోవాలి. ఎంతో మెలకువగా గడిపి జీవితం సార్థకం చేసుకోవాలి. “మధ్యం వాసన,సిగరెట్ పొగ అంటేనే. “చిరచిరమనే నీకు. “పక్షవాతం ఎట్లచ్చి గోస పెట్టింది నాన్న. “భీమునోలే ఉన్న నిన్ను దీనున్ని చేసింది. దేవేందర్ నాన్నగారికి మద్యం వాసన,సిగరెట్ పొగ అంటేనే గిట్టదు.దురలవాట్లు లేకున్నప్పటికీ పక్షవాతం వ్యాధి సోకింది.ఈనాటి వారు ఆహార నియమాలు పాటించకపోవడం,యోగ ప్రాణాయామాలు చేయకపోవడం వల్ల శరీరంలో సమతుల్యత దెబ్బతిని వ్యాధుల బారిన పడుతున్నారు.పక్షవాతం పగవాడికి కూడా రావద్దు అంటారు.పక్షవాతం వస్తే మంచంలోనే ఉంటారు. నాన్న మీకు పక్షవాతం వచ్చి మంచంలో లేవ లేకుండా ఉంటే అమ్మ నిన్ను సాకింది.నాన్న మీకు మంచం నుండి లేవరాదు.ఏ పని చేసుకోలేరు. ఎవరో ఒకరు దగ్గర ఉండి చేయాలి.నాన్న నీవు భీమునిలా బలం కలిగి ఉన్నప్పటికి పక్షవాతం సోకి నిన్ను దీనున్ని చేసింది.నాన్న నిన్ను ఏమీ చేయలేని అశక్తునిగా చేసింది.పక్ష వాతం వ్యాధి సోకి ఎంతో బాధను అనుభవించావు అని కవి దేవేందర్ ఆవేదన చెందుతున్నాడు. “.అమ్మ నీకు కాళ్లు చేతులైన త్యాగం “అన్ని అవసరాలకు పసి పిల్లగాని తల్లైంది. పసిపిల్లాడి కొరకు తల్లి ఎంతో కష్ట పడుతుంది. పసిపిల్లాడి ఎదుగుదలకు తల్లి ఎంతో ఆరాటపడుతుంది.అమ్మ నిన్ను పసిపిల్లాడిలా సాకింది.నాన్న నీకు కాళ్ళు చేతులు పని చేయక చలనం లేకుండా మంచంలో పడి పోయి ఉంటే అమ్మ నీకు కాళ్ళు చేతులు అయి సేవ చేసింది.నాన్న నీ అన్ని అవసరాలకు తల్లిలా అమ్మ చేసిన త్యాగం మరువలేనిది అని గుర్తు చేసుకోవడం చక్కగా ఉంది. . “నాన్న! “ఇంటికి చుట్టాలు వస్తే ఎంత సంబరం నీకు. దేవేందర్ నాన్నకు ఇంటికి చుట్టాలు వస్తే ఎంతో ఆనందంగా ఉండేవారు.అతిథిదేవోభవ. అతిథిని దేవునిలా పూజించాలని శాస్త్రాలు చెప్తున్నాయి.ఈ రోజుల్లో ఎందరు అతిథులను ఆదరిస్తున్నారు.అతిథులను గౌరవించడం లేదు. చుట్టాలు వచ్చినా వారితో ప్రేమ ఆప్యాయతలతో మెలగడం లేదు. “దగ్గరోళ్ళు అయినా దూరపోల్లు అయినా పండుగ “స్నేహితులు వచ్చిన ఆనందాల పలకరింత “ఇప్పుడు అందరు వచ్చి నిలబడ్డారు నాన “ఒక్కసారి లేచి రా! వాళ్లను ఆరుసుకుందాం. . కవి దేవేందర్ కు నాన్నగారు భౌతికంగా లేరు అని తెలుసు.దేవేందర్ నాన్న ఇంటికి చుట్టాలు వస్తే ఎంతో సంబరంగా ఉండేవారు.ఇప్పుడు ఇట్లాంటి నాన్నలు ఎంతమంది ఉన్నారు?కుటుంబ సభ్యులు బంధువులు ఎప్పుడు వెళ్ళి పోతారా అని ఎదురు చూస్తారు.మంచి పలకరింపు.ఆప్యాయత, అనురాగాలు ఉండవు.దేవేందర్ నాన్నకు దగ్గర వాళ్ళు అయినా దూరపు వాళ్లు అయినా పండుగ. పండుగ అంటే ఇంటిల్లిపాది ఆనందంతో ఉంటారు.పిండి వంటలు చేసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు.దేవేందర్ నాన్నలాంటి స్నేహితులు అరుదు.అలాంటి స్నేహితులు లభించడం అరుదు.ఒక వరంగా భావించవచ్చు. ఎలాంటి కష్టాల్లో ఉన్నా స్నేహితుడొక్కడే గట్టెక్కిస్తాడు.పురాణాల్లో మనం కుచేలుడు శ్రీకృష్ణ భగవానుని గాధను విన్నాం.శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు తెచ్చిన గుప్పెడు అటుకులు తిని వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు.ఒక్కసారి లేచి రా వాళ్లను అరుసుకుందాం.చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా లేచి వస్తారా? అలా జరగదు.క్రైస్తవులు ఆరాధించే బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది.ఏసు లేచి పునరుత్తానం చెందినట్లు చాలామందికి కనిపించాడు అని రాయబడి ఉంది.నాన్నగారి జ్ఞాపకాలు,మర్చిపోలేని వ్యక్తిత్వం,ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. “నాన్న నీ నిక్కచ్చితనమే
“మమ్మల్ని పజ్జొన్న కర్రల్లా నిటారుగా నిలిపింది.
” నీ నిజాయితీ జీవన విధానమే
“ మమ్మల్ని అబద్ధం లేని నిబద్ధ జీవులని చేసింది.
దేవేందర్ నాన్నగారి నిక్కచ్చితనం,నిబద్ధత, నిజాయితి,సౌశీల్యం మమ్ములను సన్మార్గంలో నడిచేటట్లు చేసిందని తెలియజేయడం చక్కగా ఉంది.
“నీ ఆత్మవిశ్వాస వ్యక్తిత్వమే
“ఆత్మగౌరవ పతాకంలా నిలుస్తుంది.
దేవేందర్ నాన్న ఆత్మవిశ్వాసం కలిగి ఉండే వారు.మంచి నడవడి,విశాలమైన భావాలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించారు.ఇతరులు కూడా ఆత్మవిశ్వాసంతో జీవించేటట్లు ప్రేరణ కలిగించాడు.వ్యక్తిత్వ వికాసం వల్ల ఆత్మగౌరవం జెండాలా రెపరెపలాడుతుంది అని కవి దేవేందర్ వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“నిరంతర శ్రమ తనమే
‘పని తనపు ఆలోచనలు రగిలించింది.
దేవేందర్ నాన్న నిరంతరం శ్రమ చేస్తూ జీవితాన్ని గడిపాడు.ఇతరులు కూడా అతనిని చూసి బాగా శ్రమించాలి.బాగా పనిచేయాలి అనే స్ఫూర్తిని కలిగింపజేసింది.
” మానవ సంబంధ బాంధవ్యాలే
“మమ్మల్ని అనురాగపు తీగలుగా మలిచింది.
జీవించడం అనేది ఒక కళ.దేవేందర్ నాన్న అందరు అందరితో కలిసిమెలిసి ప్రేమానురాగాలతో జీవించడం సాధ్యమని నిరూపించాడు.దేవేందర్ నాన్న అందరికి ప్రేమను పంచుతూ ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండే వాడు.మానవ సంబంధాలను అనురాగపు తీగలుగా మల్చినాడు అని తెలియజేస్తున్నారు.
“నీ చిరు దరహాసమే
“మమ్మల్ని నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
నవ్వుతూ బతకాలిరా అనే సినిమా పాట ఉంది. నవ్వడం ఒక కళ.నవ్వు నవ్వించు అన్నారు.నవ్వడం భోగం.నవ్వకపోవడం రోగం అని జంధ్యాల అన్నారు.దేవేందర్ నాన్న చిరు దరహాసమే మమ్మల్ని నవ్వుల పువ్వులు పూయింపజేస్తుంది అన్నారు.
‘ కొంచమంతున్న కోపగుండితనమే
“అన్యాయంపై కన్నెర్ర చేయిస్తుంది. దేవేందర్ నాన్న ఆన్యాయాన్ని సహించే వాడు కాదు. కోపం చూపుతోనే వాళ్లను అణిచివేసేవాడివి అన్నాడు. “నాన్నా నీవు “నా బతుకు పందిరి గుంజవు “ఆఆలు దిద్దిచ్చిన సుద్ద ముక్కవు “నిటారుగా నిలబెట్టిన ఇంటి నిట్టాడువు “నిత్యం వెలుగుతున్న దీపానివి
“నాన్న నాకు రోజు కోసారి కనిపించు. దేవేందర్ నాన్నగారు ఎక్కడికి వెళ్లిపోలేదు. అంతరంగంలో అంతర్యామి రూపంలో హృదయంలో దాగి ఉన్నాడు.దేవేందర్ నాన్న ఆశయాలు సాధన చేస్తూ అనుక్షణం కృషి చేస్తూ ఉంటే దశరథం మాస్టారు ఇంటి దీపం అలా వెలుగుతూనే ఉంటుంది.దేవేందర్ నాన్న తీర్చిదిద్దిన శిష్యుల ఇళ్ళ లోగిళ్లలో వేలవేల దీపాలు కాంతులతో వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయి. తెలంగాణలో నాన్నలు అనురాగపు దివ్వెలుగా త్యాగానికి ప్రతీకలుగా నిలుస్తారు.చక్కటి కవితను అందించిన దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను. రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “స్వచ్ఛత” కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన: నరేంద్ర సందినేని
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన “స్వచ్ఛత” కవిత పై విశ్లేషణా వ్యాసం. స్వచ్ఛత కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను. నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.చెడు పదార్థాలను తీసివేయడం ద్వారా స్వచ్ఛత ఏర్పడుతుంది.రసాయనిక ప్రక్రియ ద్వారా నీటిని స్వచ్ఛత చేసి ఉంచుతారు.ప్రజలు చైతన్యంతో చేతుల్లో చీపుర్లు చేతపట్టి వీధులను శుభ్రంగా ఊడ్చి వేయాలి.వీధుల్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించాలి.ప్రతి ఒక్కరు పారిశుద్ద్యం పైన దృష్టిని కేంద్రీకరించాలి.ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దైవత్వానికి వెన్నంటి ఉండేది,పరిశుభ్రమైన పరిసరాలే అనే సందేశంతో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి.స్వచ్ఛత అనే కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలు అందరు సంకల్పం తీసుకోవాలి.మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ దిశగా ప్రతి పౌరుడు అడుగులు వేయాలి.ప్రతి ఒక్కరు చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్తగా డస్ట్ బిన్ లో వేయాలి. చెత్తను డస్ట్ బిన్ ల నుండి డంపింగ్ యార్డ్ కి తరలించాలి.స్వచ్ఛత అనే ఉద్యమంలో సమాజంలోని ప్రజలు అందరు భాగస్వాములు కావాలి.కవి దేవేందర్ రాసిన స్వచ్ఛత కవితలోని విశేషాలు తెలుసుకోవాలనే తహతహ మొదలవుతుంది.ఒకసారి మనసు పెట్టి స్వచ్ఛత కవిత చరణాల్లోకి దృష్టిని సారించండి.ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.సమాజాభివృద్ధికి దోహదం చేసే ఎన్నో విషయాలు మన దృష్టికి వస్తాయి.స్వచ్ఛత కొరకు పాటు పడండి.స్వచ్ఛతయే మన జీవిత లక్ష్యంగా కొనసాగండి.
“ఆమె రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని
“సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక.
గ్రామాల్లో,పట్టణాల్లో,మెట్రో నగరాల్లో,పారిశుద్ద్య కార్మికులుగా స్త్రీలు పనిచేస్తున్నారు.కొందరు రాత్రిళ్ళు రహదారులు శుభ్రం చేస్తారు.కొందరు పొద్దున లేచిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు వారికి కేటాయించిన వాడల్లో రోడ్లను మరియు రహదారులను శుభ్రం చేస్తున్నారు.మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ద్య కార్మికులను,మునిసిపాలిటీ స్వీపర్లుగా పిలుస్తారు.కవి దేవేందర్ ఆమెను రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక అని అంటున్నాడు. మున్సిపాలిటీ పారిశుద్ద్య కార్మికుల్ని గౌరవించే కనీస సంస్కారం ఎందరికి ఉంటుంది? రోడ్లు ఊడ్చే వాళ్ళను చాలా మంది హేళనగా చూస్తారు.రోడ్లు ఊడ్చే వాళ్లను చిన్న చూపు చూస్తారు.పారిశుద్ద్య కార్మికులు కూడా మనలాంటి మామూలు మనుషులు.జీవనం గడపడం కొరకు పారిశుద్ద్య పనులు చేస్తున్నారు.పారిశుద్ద్య కార్మికులను గౌరవించే సంస్కారాన్ని అలవర్చుకున్న కవి దేవేందర్ ను అభినందించాలి.
“పొద్దంతా పోగుపడ్డ చెత్తా చెదారాన్ని
“అహో రాత్రులు స్వహస్తాలతో స్వచ్చ పరుస్తుంది
“ఆమెకు నిద్రా అలసట పవళింపులు లేవు
“రాత్రంతా పని ప్రయాణ కొలువులే.
పారిశుద్ద్య కార్మికులు పొద్దంతా పోగుపడ్డ చెత్తా చెదారం,దుమ్ము ధూళిని అహో రాత్రులు శ్రమించి స్వహస్తాలతో శుభ్రం చేస్తారు.మనం మన ఇండ్లల్ల ఉన్న చెత్తా చెదారాన్ని సరిగా శుభ్రం చేసుకోవాలి అనే సంస్కారానికి దూరంగా ఉంటున్నారు.నిజంగా పారిశుద్ద్య కార్మికులు చీపుర్లతో వీధులను ఊడుస్తూ నిర్విరామంగా శ్రమిస్తున్నారు అనే విషయం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది.సాధారణ పౌరులైన జనాలు రాత్రి పూట ఏం చేస్తుంటారు.చక్కగా తిని హాయిగా ఇళ్ళలో నిద్రకు ఉపక్రమిస్తుంటారు.అలసట పవ్వళింపులు లేకుండా పారిశుద్ద్య కార్మికులు రాత్రంతా నిద్ర మానుకొని వీధులు శుభ్రం చేసే పని కొనసాగిస్తున్నారు.అయినప్పటికి రహదారులు ఎంతో అధ్వాన్నంగా ఉంటున్నాయి.రహదారులు వేసేటప్పుడు కూడా నాణ్యత పాటించడం లేదు. కొత్తగా రోడ్లు వేస్తున్నారు.నెల రోజులకే రోడ్లు పాత రోడ్లుగా మారి పాడై పోతున్నాయి.భారీ వర్షం పడగానే రోడ్ల నిండా గుంతలు పడి ఎక్కడికక్కడ లేచిపోతున్నాయి.రోడ్లు ఇంత అద్వాన్నంగా ఎందుకు ఉంటున్నాయి?పాలకులు అవినీతికి పాల్పడుతూ ఉండడం వల్ల కాంట్రాక్టర్లు నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు.పారిశుద్ద్య కార్మికులు ఎంతో ఓపికతో రహదారులను శుభ్రం చేస్తున్నారు.వీధుల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నప్పటికి విసుగు చెందకుండా విరామం లేకుండా ఓపికతో శుభ్రపరుస్తున్నారు.రాత్రి అంతా మెలుకువతో ఉండి వీధుల్లో ఊడ్చే పనిని కొనసాగిస్తున్నారు.పట్టణాల్లో చూస్తే షాపుల ముందు చెత్త పడేస్తారు.మోరీల్లో చెత్తను వేయ కూడదు అనే విషయాన్ని మరిచి పోయినారు.మోరీల్లో చెత్తను వేస్తున్నారు.మోరీల్లో చెత్త పేరుకుపోయి పట్టణాలు,గ్రామాలు దోమలకు నిలయాలుగా మారుతున్నాయి.దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో చికెన్ గునియా, డెంగ్యూ దోమకాటు గురై ప్రజలు అర్థాంతరంగా తమ జీవితాలను చాలిస్తున్నారు.చెత్తను డస్ట్ బిన్ లో వేయాలి అని మున్సిపల్ అధికారులు చెప్పరు. ఏదో నామ మాత్రంగానే చెత్త బండ్లు ఏర్పాటు చేసి చెత్తను తరలించడం చేస్తుంటారు.చెత్త బండ్లు ఏర్పాటు చేశాం.ఇక మా పని అయిపోయింది అని చేతులు దులుపుకుంటున్నారు.మున్సిపల్ అధికారులు ప్రతి వాడలో డస్ట్ బిన్ లు,నాలుగు రోడ్ల కూడల్ల వద్ద డస్ట్ బిన్ లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.ప్రతి వాడలో నివసించే ప్రజలు చెత్తను డస్ట్ బిన్ లో వేసేలా అవగాహన కల్పించాలి. ఇంటింటికి చెత్త బండ్లు తిరగాల్సిన అవసరం లేదు. మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు అన్ని చోట్ల అన్ని వాడలలో పెద్ద డస్ట్ బిన్ లు తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది.డస్ట్ బిన్ లు లేకపోవడం వలన ప్రజలు ఖాళీ ప్లాట్ లలో చెత్తను వేస్తున్నారు.ఖాళీ ప్లాట్ యజమానులకు జుర్మానా వేయడం సరి అయిన పద్దతి కాదు.మునిసిపల్, కార్పొరేషన్ అధికారులకు డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయనందుకు జుర్మాన వేయాలి.వేలాది రూపాయలు ఇంటి పన్ను వసూలు చేస్తూ ప్రజల కనీస అవసరాలు అయిన డస్ట్ బిన్ లు ఏర్పాటు చేయకపోవడం,నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ సంస్థలు బాధ్యతలు నుండి తప్పుకొని తమ బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. ఇంటింటికి చెత్త సేకరణ కొరకు బండ్లు వద్దు. కార్పొరేషన్,మున్సిపల్ అధికారులు సరైన కార్యాచరణతో డస్ట్ బిన్ లు ఏర్పాటు చేసి చెత్తను డస్ట్ బిన్ ల నుండి తరలించినట్లయితే కొండలా పేరుకు పోయిన చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.చెత్తతో కరెంట్ ఉత్పత్తి చేసి ప్రజలకు చౌకగా విద్యుత్ సరఫరా చేయవచ్చు.చెత్త పేపర్లను రీసైక్లింగ్ చేయవచ్చు.ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేయవచ్చు.పాలకులకు చిత్తశుద్ధి కొరవడింది.పాలకులు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి మరియు అక్రమ ఆస్తులు సంపాదించడానికి సమయం కేటాయిస్తున్నారు.నగర పాలక సంస్థ సరైన కార్యాచరణతో ముందుకు సాగాలి.ఏదో నామమాత్రంగా పనులు చక్కబెడుతున్నారు.సమాజంలోని పౌరులుగా పారిశుద్ద్య కార్మికులను గౌరవిస్తూ సరైన జీతాలు ఇవ్వాలి.పారిశుద్ద్య కార్మికుల అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలు చేపట్టాలి.
“రోడ్ల మీద నగరీకులు విసిరేసిన
“సకల అపరిశుభ్రాల్ని తొలగించే మాన్విత.
రోడ్ల మీద చెత్త ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తారు. చెత్తను చెత్త డబ్బాలో వేయాలనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు.పౌరులు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోని వాళ్ళు ఉన్నారు.పౌరులు దుకాణాల సముదాయం శుభ్రంగా ఉంచుకోవాలనే ఆరాటం సోయి కరువైంది.పౌరులు చిత్త శుద్దితో మెలిగినట్లయితే చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది.దుకాణాల వాళ్లు చెత్తను రోడ్లపై పారవేస్తారు.మున్సిపాలిటీ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి.ఒక చోట డంప్ యార్డు ఏర్పాటు చేసి అందరు అక్కడ చెత్తను వేసేలా నగర పాలక సంస్థ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.మున్సిపల్ అధికారులు పట్టణ పారిశుద్ద్యం పట్ల శ్రద్దను కనపరచాలి.మున్సిపల్ అధికారులు తమ విద్యుక్త ధర్మాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.ప్రభుత్వాన్ని పాలిస్తున్న పాలకులలో చైతన్యం కొరవడింది.
“రద్దీ రవాణా నిద్రపోయిన తర్వాత
“రహదారులు అలసట తీరినయాల్ల
“అప్పుడే మున్సిపల్ స్వీపర్ల మేలుకొలుపులు.
ప్రతి నిత్యం రోజంతా రోడ్ల పై రద్దీ ఉంటుంది.రాత్రి పూట రద్దీ జనం,రవాణా వాహనాలు కూడా నిద్రపోతాయి.రహదారులు కూడా రాత్రిపూట అలసట తీర్చుకుంటాయి.మున్సిపల్ స్వీపర్లకు రాత్రిపూట నిద్ర ఉండదు.స్వీపర్లు గుడ్లగూబల్లా రాత్రి పూట పనిచేస్తుంటారు.మున్సిపల్ కార్మికుల దీన స్థితిని గురించి సానుభూతితో కవి దేవేందర్ స్వచ్ఛత కవిత ద్వారా ఆవేదన వ్యక్తం చేయడం చక్కగా ఉంది.
“హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కార్పొరేషన్ల
“వాడవాడల వెదజల్లే కాంతులు
“ఆ మహా తల్లుల చీపుర్ల చలవే
“మైల తీసిన నగరాలు తెల్లని మల్లెపువ్వులైతై.
మున్సిపల్ కార్మికులు శ్రమించి శుభ్రంగా చీపుర్లతో ఊడ్వడం వల్లనే వీధులు కాంతులు వెదజల్లుతున్నాయి.ఆ మహా తల్లుల చీపుర్ల చలవ వల్ల మలినాలను తీసిన నగరాలు మల్లెపువ్వులా సొగసు గొలుపుతున్నాయని అంటున్నారు. మల్లెపూలు స్వచ్చతకు ప్రతి రూపాలు,తెల్లగా ఉంటాయి అని మన అందరికి తెలుసు. మల్లెపూవులలో మాలిన్యం ఉండదు.శుభ్రం చేసి ఊడ్చిన నగరాలు మల్లెపూవులా మారి శోభను సంతరించుకుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పొరకల చీపుర్లతో నిత్యం నడిచి క్లీన్ చేసినా
“ఎన్నడు ఆ దారుల మీద డ్రైవ్ చేయని వాళ్ళు
“పని చేయడమే వాళ్ళ జీవనం. పారిశుద్ద్య కార్మికులు చీపుర్లతో ప్రతిరోజు నడిచి రహదారులను శుభ్రం చేస్తారు.చాలీచాలని జీతాలతో బతుకులు గడిపే పారిశుద్ద్య కార్మికులకు వాహనాలు కొనుక్కునే స్తోమత లేదు.వాహనాలు ఎక్కడి నుండి వస్తాయి? పారిశుద్ద్య కార్మికులు శ్రమించి ఊడ్చిన రహదారుల మీద వాహనాలు ఎలా నడుపుతారు.పారిశుద్ద్య కార్మికులు పేదరికంలో బతుకును గడుపుతున్నారు.పారిశుద్ద్య స్త్రీ కార్మికుల గురించి ఆర్తిగా పారిశుద్ద్య స్త్రీ కార్మికులు పని చేయడమే వాళ్ళ జీవనం అని కవి దేవేందర్ వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.
“కాంట్రాక్టర్ దగ్గర తక్కువకు ఎక్కువ పని చేసే
“ఎట్టి పువ్వుల రెమ్మలు వీళ్ళు.
కాంట్రాక్టర్లు పారిశుద్ద్య కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు.కాంట్రాక్టర్లు చాలీచాలని జీతాలు ఇస్తున్నారు.పారిశుద్ద్య కార్మికుల కుటుంబాలు పేదరికంలో కునారిల్లుతున్నారు.పారిశుద్ద్య కార్మికులు రోడ్ల మీద చీపుర్లతో దుమ్ము,ధూళి శుభ్రం చేసి తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారు. పారిశుద్ద్య కార్మికులు ప్రమాదాల వల్ల,గాలి,వానకు కరెంటు తీగలు కింద పడితే కరెంట్ షాక్ కు గురై చనిపోతున్నారు.
“మన రహదారుల కోసం
“రాత్రిళ్ళను దారపోస్తున్న వాళ్ళు
“చీపుర్లకు,వాళ్లకు ఒక్కసారి మొక్కాలె
“నగర స్వచ్చ రాయబారులు ఆ వనితలు.
కవి దేవేందర్ కు పారిశుద్ద్య స్త్రీ కార్మికుల పట్ల సానుభూతి ఉంది.స్వచ్ఛత అనే పేరుతో కవిత రాశారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమెను ఎంతో గౌరవంగా పరిచారిక అని సంబోధించారు.రాజ్యాలు పోయాయి.రాజులు,రాణులు గతించిన చరిత్రగా పుస్తకాల్లో మిగిలి పోయారు.రాణుల దగ్గర పనిచేసే పరిచారికలు ఎక్కడ ఉంటారు? రాణులతో నివసించే పరిచారికలు కాలగర్భంలో కలిసి పోయారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమె రహదారిలో పరుచుకున్న మాలిన్యాన్ని సవ్యంగా శుభ్రపరిచే పరిచారిక.ఎక్కడ చూసినా,ఏ ప్రాంతానికి వెళ్లినా పారిశుద్ద్య కార్మికుల పరిస్థితి మార లేదు. మన తెలంగాణ ప్రాంతంలో స్త్రీ పరిచారికలు రహదారుల శుభ్రం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.పారిశుద్ద్య కార్మికురాలైన ఆమె రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తున్నది.
“రద్దీ రవాణా నిద్రపోయిన తర్వాత
“రహదారులు అలసట తీరిన యాల్ల
“అప్పుడే మున్సిపల్ స్వీపర్ల మేలుకొలుపులు.
ఉదయం,మధ్యాహ్నం,సాయంత్రం,వేళల్లో రోడ్ల పై విపరీతమైన రద్దీ ఉంటుంది.పట్టణంలో అయితే జనాలు రోడ్డు ఇటు వైపు నుంచి అటు వైపు దాటాలంటే చాలా సమయం పడుతుంది.జనాలు వాహనాలను తప్పించుకొని రోడ్డును క్రాస్ చేయడం చాలా కష్టం అవుతుంది.రాత్రి అయిన తర్వాత రోడ్ల మీద రద్దీ తగ్గిపోతుంది.రవాణాకు సంబంధించిన వాహనాలు రోడ్ల మీద తిరగవు.రాత్రి సమయంలో రహదారులు అలసట తీర్చుకుంటాయి.ఆ సమయంలో మునిసిపల్ స్వీపర్లు రోడ్లను శుభ్రం చేస్తారు.పారిశుద్ద్య కార్మికులైన పరిచారికలు తమ నిద్రను త్యాగం చేసి రహదారులు శుభ్రం చేస్తారు. రాత్రి పూట నగరం అంతా తిరుగుతూ పోలీసులు గస్తీ చేయడం మానుకున్నారు.పోలీసులు రాత్రి పూట గస్తీలో తిరుగుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది.రాత్రిపూట పిచ్చివాళ్లు,తాగుబోతులు రోడ్ల పై తిరుగుతూ నానా హంగామా సృష్టిస్తుంటారు.పిచ్చివాళ్లు, తాగుబోతులు,రాత్రిపూట తమకు తోచిన రీతిలో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ అలజడులు రేపుతూ ప్రశాంత వాతావరణము కలుషితం చేస్తూ రోడ్ల పై తిరుగుతారు.పారిశుద్ధ్య కార్మికులకు పిచ్చివాళ్ళ నుండి తాగుబోతుల నుండి ఎలాంటి రక్షణ లేదు. రాత్రిపూట పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాల్సిన విషయాన్ని పాలన చేస్తున్న అధికారులు,పోలీసులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ద్య కార్మికురాలైన పరిచారిక అలాంటి గడ్డు సమయంలో పనిచేసి రహదారులను శుభ్రం చేస్తున్నది.పారిశుద్ద్య కార్మికులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు.మన రహదారుల కోసం రాత్రిళ్లను ధారపోయడం సామాన్యమైన విషయం కాదు. పారిశుద్ద్య కార్మికులను గౌరవంగా నగర స్వచ్ఛ రాయబారులు ఆ వనితలు అని చెప్పిన తీరు చాలా చక్కగా ఉంది.చక్కటి కవితను అందించిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
అన్నవరం దేవేందర్ పొద్దున్నే లేస్తా… కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన పొద్దున్నే లేస్తా కవిత పై విశ్లేషణా వ్యాసం.పొద్దున్నే లేస్తా కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.పొద్దున్నే లేస్తే మనిషి జీవనానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.పొద్దున్నే లేస్తే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు పొద్దున్నే లేస్తే వ్యక్తిగతంగా,సామాజికంగా, ఆరోగ్యపరంగా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.పొద్దున్నే లేస్తే ఎన్నో పనులను వెను వెంటనే పూర్తి చేసుకోవచ్చు.ఏ పని అయిన ఆలస్యం లేకుండా వెంటనే పూర్తి అవుతుంది.చివరి క్షణంలో ఆదరబాదరగా పనులు చేయాల్సిన అవసరము ఉండదు.మీరు త్వరగా నిద్ర లేవడం వలన మీకు రోజులో తగినంత సమయం లభిస్తుంది.మీరు పనులను త్వరగా పూర్తి చేసుకోవడంతో పాటు,మరెన్నో ఇతర కార్యకలాపాలు చేయడానికి సమయం లభిస్తుంది. అదనపు సమయం ఉండడం వల్ల మీరు వ్యక్తిగతంగా ఎదగడానికి తోడ్పడుతుంది.పొద్దున్నే నిద్ర లేస్తే ఎలాంటి పని అయినా శ్రద్ధ పెట్టి పూర్తి చేస్తారు.మీరు చేస్తున్న పని తీరు మెరుగుపడుతుంది.ఒత్తిడి,ఆందోళన మీ దరికి చేరవు.పొద్దున్నే లేస్తే మీరు సరైన సమయంలో నిద్ర పోతారు.పొద్దున్నే లేవడం అలవాటుగా మార్చుకుంటే త్వరగా నిద్రపోతారు.మీ శరీరం ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడానికి సహకరిస్తుంది.పొద్దున్నే లేస్తే మానసికంగా, శారీరకంగా,ఆరోగ్యంగా ఉంటారు.పొద్దున్నే లేస్తే మీకు నులి వెచ్చని సూర్యోదయం,కుండీలో పూల మొక్కపై రాలిన తుషార బిందువులు,తొలి మంచు తెరలు,పక్షుల కిలకిలా రావాలు,స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తాయి.ఒక మనిషి విజయానికి కారణం కష్టపడటం మరియు పొద్దున్నే లేవడం వల్ల సాధ్యపడుతుంది.పొద్దున పల్లెల్లో అయితే కోడికూతతో నిద్రలేస్తారు.ప్రాతః కాలంలో పక్షుల కిలకిలా రావాలతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని యోగ, ప్రాణాయామాలు,ధ్యానం అలవర్చుకుంటే మనిషికి ఆ రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.మనిషిలోని అనంతశక్తులు ఉద్దీపనం చెందుతాయి.పొద్దున లేస్తే మనిషి నిత్య నూతనంగా ఉంటాడు.పొద్దున లేస్తే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు.ఇంకా సమయం కూడా మిగిలి ఉంటుంది. పొద్దున లేస్తే మనిషి జీవితం ఉన్నత పథంలో సాగుతుంది.పొద్దున లేవకుంటే ఏ పని సవ్యంగా చేయలేడు.అనారోగ్యం బారిన పడతాడు.పొద్దున్నే లేస్తే ఎలా ఉంటుంది? కవి దేవేందర్ మనిషి యొక్క దినచర్య గురించి చెప్పినట్టుగా తోస్తుంది.ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది.ప్రకృతి మాతకు మనం సహకరిస్తే ప్రకృతి మాత మనకు సహకరిస్తుంది.ప్రకృతి మాత సహకారంతో మనిషి జీవనం అద్భుతంగా ఉంటుంది.పొద్దున లేస్తే ఏం జరుగుతుంది? ఆ విశేషాల గురించి తెలుసు కోవాలంటే మనం కవి దేవేందర్ పొద్దున్నే లేస్తే కవితలోని చరణాల పట్ల దృష్టిని సారించి,అలౌకిక ఆనందం సొంతం చేసుకుందాం.
“ పొద్దున్నే లేచి ఏం చేస్తా
“ అప్పుడే పూస్తున్న బంతిపూలను పలకరిస్తా
“ అవి చిరునవ్వుల జల్లు కురిపిస్తవి.
పొద్దున్నే లేచి ఏం చేస్తా అని మనలను ఆలోచన తరంగాల్లో తేలియాడ చేస్తున్నాడు.పొద్దున లేవగానే అతడు అప్పుడే పూస్తున్న బంతిపూలను చూసి పలకరిస్తాడు.పలకరించగానే బంతిపూలు చిరునవ్వుల జల్లులు కురిపిస్తాయి అని తెలియజేస్తున్నాడు.పొద్దున్నే లేచి బంతిపూలను చూడగానే మనసంతా ఉల్లాసంగా ఉద్దీపనం చెందుతుంది.ఆ రోజంతా బంతిపూల పరిమళాలను ఆస్వాదిస్తూ పలకరించి అలౌకిక అనుభూతి చెంది పరవశించినాడు.వికసించిన బంతి పూల చిరునవ్వుల జల్లులతో పులకరించి తాద్యాత్మం చెందినట్లు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పందిరి మీద పాకే బచ్చలి కూర అందుకుంటా
“ మనసంతా చెక్కలు గుల్ అయిపోతది.
పల్లెల్లో ఇంటిముందు పందిరి ఉంటుంది.పందిరి గుంజకు అల్లుకొని పాకిన బచ్చలి తీగ పచ్చ పచ్చగా ప్రకృతి మాత ఒడిలో ఉంటుంది.కవి దేవేందర్ పందిరి మీద పాకే బచ్చలి కూర అందుకొనగానే మనసంతా చక్కిలిగింతలు పెట్టినట్లుగా ఆనందంగా హాయిగా అయిపోతది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.బచ్చలి ఆకులను కూరగా వండుకుంటారు. బచ్చలి తీగ పైకి పాకి పందిరి అంతా అల్లుకుంటుంది.బచ్చలి తీగ పందిరికి నీడను చల్లదనాన్ని ప్రసాదిస్తుంది.ప్రకృతిలో భాగమైన బచ్చలి కూర తీగను అందుకొని మనసంతా పరవశంతో ఒక రకమైన చక్కిలిగింతల అనుభూతిని పొందుతున్నాడని చెప్పిన భావం అద్భుతం అని చెప్పవచ్చు.
“ ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు తాపిస్తా
“ ఆ పచ్చనాకులు నాతో ముచ్చట్లు పెడుతయి.
పొద్దున్నే లేచి ఆరోజు జరిగిన చిత్రాల్లో భాగాలను తెలియజేస్తున్నాడు.పొద్దున్నే లేచి ఇంటి ముందున్న మొక్కలకు నీళ్లు పారిస్తా అని చెప్పడం లేదు.ప్రాణం ఉన్న జీవులమైన మనుషులు నీళ్లు తాగుతారు. మొక్కలు జీవించడానికి నీళ్లు కావాలి.నీళ్లు పారిస్తేనే మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతాయి.నీళ్లు పారిన తర్వాత ఆ పచ్చనాకులు నాతో ముచ్చట్లు పెడుతయి.నీళ్లు తాపిన తర్వాత ఆ పచ్చనాకులు
ముచ్చట్లు పెడుతయా అనే సందేహాలు మనలో కలుగుతాయి.మొక్కలు నీళ్లు తాగగానే ఆ పచ్చనాకులు సంతోషంతో మెరుస్తాయి.ముచ్చట్లు పెడుతాయి.ప్రకృతి కాంత పులకరించి పచ్చని ఆకులు ముచ్చట్లు పెట్టినట్లుగా అనిపిస్తాయి అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ కాళ్ళల్ల మెదిలే పిల్లి కూనలకు పాలు పోస్తా
“ అవి మీదికచ్చి గావురాలు చేస్తయి.
పొద్దున్నే లేస్తే ఏం చేస్తాడో అని చెబుతున్నాడు. ఇంట్లో పిల్లి ఈనింది.పిల్లికి పుట్టిన పిల్లికూనలు సందడి చేస్తూ ఇల్లంతా కలయ తిరుగుతున్నాయి. పిల్లికూనలు చూడ ముచ్చటగా ముద్దుగా ఉన్నాయి. ప్రేమతో పిల్లికూనలను దగ్గరికి తీస్తే కాళ్ళల్లో మెదలుతాయి.పిల్లికూనలకు ప్రేమతో పాలు పోస్తాను.పిల్లి కూనలు ప్రేమతో మీదికచ్చి గావురాలు చేస్తయి.పెంచుకున్న పిల్లి కూనలు కాళ్ళల్ల మెదులుతయి,పిల్లి కూనలు గావురాలు చేస్తయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వాకిట్ల వేసిన ముగ్గులను చూసి మురుస్తుంట
“ హృదయం కళాత్మకమై తేలిపోతది.
అమ్మ పొద్దున లేచి వాకిలిని శుభ్రంగా ఊడ్చి పేడతో కల్లాపి చల్లుతుంది.అమ్మ వాకిట్లో అందంగా ముగ్గును తీర్చి దిద్దుతుంది.పొద్దున లేస్తే అమ్మ వేసిన ముగ్గును చూసిన వెంటనే హృదయం కళాత్మకమై ఆనందంతో తేలిపోతది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అరి పాదాలతో నేల మీద అటు ఇటు నడుస్తా
“ దేహమంతా మట్టి తరంగమై పులకరిస్తది.
పొద్దున్నే లేస్తే ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో చెబుతున్నాడు.అరి పాదాలతో నేల మీద అటు ఇటు నడిస్తే కాళ్లలో చలనం కలిగి చైతన్యం వస్తుంది.అరి పాదాలతో నేల మీద నడవడం వల్ల ఒళ్లంతా చెమట పట్టి మట్టి తరంగమై పులకరిస్తది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ నీలి ఆకాశం కేసి తేరిపార చూస్తుంటా
“ మేఘాల నుంచి సూర్యుడు కరచాలనం చేస్తడు.
ఆరు బయట నుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం.భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు నీటి ఆవిరితో కూడిన వాయు ఆవరణాల పై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది.మేఘాలు గాలిలో తేలుతూ ఉండే చిన్న నీటి బిందువులు లేదా మంచి స్పటికాలు.అవి చాలా చిన్నవి కాబట్టి తేలుతూ ఉంటాయి.సూర్యుని ద్వారా జరిగే భాష్పీభవన ప్రక్రియ ఫలితం గాలి లేదా తేమను పొందుతుంది.ఈ తేమతో కూడిన గాలి భూమి యొక్క ఉపరితలం నుండి పైకి లేస్తుంది మరియు మరింత చల్లగా మారుతుంది.నీటి ఆవిరి బిందువులను ఏర్పరుస్తుంది.తగినంత ఎత్తులో గాలిలో ఉండే ఆవిరి నీటి బిందువులను ఏర్పరుస్తుంది.ఈ చుక్కలు గాలిలో ఉండి మనకు మేఘాలుగా కనిపిస్తాయి.పొద్దున్నే లేచి పైన ఉన్న నీలి ఆకాశం దిక్కు తేరిపార చూస్తుంటే మేఘాల నుంచి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేస్తూ కరచాలనం చేస్తాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొద్దు పొద్దున్నే లేచి ఏం చేస్తా
“ ప్రతి ఉదయం ప్రకృతిలో ఆకృతినై పలువరిస్తా.
ప్రకృతిలో వాతావరణం,పర్యావరణ వ్యవస్థ, వృక్షజాలం,జంతుజాలం మరియు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి అబ్బురపరిచే ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ప్రకృతి మన చుట్టూ ఉన్న అందమైన వాతావరణం, జీవరాశికి తల్లి,మనల్ని పోషిస్తుంది.మన మనుగడ కోసం అన్ని అవసరాలు అందిస్తుంది.మనం తినే ఆహారం,మనం పీల్చేగాలి,మనం ధరించే బట్టలు, మనం నివసించే ఇల్లు ఇవి అన్ని ప్రకృతి మనకు ప్రసాదించిన బహుమతులే.ప్రకృతి మన మనుగడకు తోడ్పడుతుంది.కొండలు,లోయలు, పర్వతాలు,పచ్చదనం,నదుల వంటి ప్రకృతిలో చూడటానికి చాలా అందమైన విషయాలు ఉన్నాయి.ప్రకృతిలో ఒక రకమైన సానుకూల శక్తి ఉంటుంది.ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందంగా దర్శనమిస్తుంది.ప్రకృతి మన భౌతిక అవసరాలకు మరియు మన మనశ్శాంతికి, ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.పొద్దు పొద్దున్నే లేచి ప్రతి ఉదయం ప్రకృతి మాత ఒడిలో లీనమై ప్రకృతిలో ఆకృతిగా మారిపోతా,పలువరిస్తా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “మా ఊరి బస్సు” కవిత పై విశ్లేషణా వ్యాసం. రచన : నరేంద్ర సందినేని.
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని “మా ఊరి బస్సు” కవిత పై విశ్లేషణా వ్యాసం.మా ఊరి బస్సు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మా ఊరికి బస్సు రావడం ఏమిటి? అనే సందేహం మనకు కలగవచ్చు.జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుండి పల్లెలకు కూడా పల్లె బస్సులు నడుపుతున్నారు.ఒకప్పుడు పల్లెకు బస్సు సౌకర్యం లేదు.పల్లె నుండి పది కిలోమీటర్లు నడిచి మండలము మరియు తాలూకా ప్రాంతంకు వస్తే అక్కడ నుండి బస్సులు దొరికేవి. పల్లెకు బస్సు రావడం అంటే పల్లెటూరు వారికి ఎంతో సంబురం అని చెప్పవచ్చు.ఏదైనా ఊరికి పోవాలంటే బస్సు సౌకర్యం లేకపోవడం వలన 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వచ్చేది.జిల్లా కేంద్రం బస్ స్టేషన్ నుండి మా ఊరికి పోయే బస్సును గురించి చెబుతూ మా ఊరి బస్సు అని అంటున్నాడు.కవి దేవేందర్ చెప్పే మా ఊరి బస్సు సంగతులు ఏమిటి? తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం అని చెప్పవచ్చు.మా ఊరి బస్సు యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఊరి బస్సు కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించినట్లయితే మా ఊరి బస్సుకు సంబంధించిన అన్ని విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి.
“ ఆ బస్సు మా ఊల్లె కెల్లి
“ పచ్చని పల్లె అనురాగాలను మోసుకస్తంది.
మా జిల్లా బస్ స్టేషన్ నుండి మా ఊరికి వెళ్ళిన పల్లె బస్సు పచ్చ పచ్చగా కళకళలాడుతున్న మా పల్లె వాసులకు సంబంధించిన నిజమయిన అనురాగాలను మోసుకొని వచ్చి ఆనందింపజేస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ తన్మయత్వపు ఊరు గాలి సోకి బయిలెల్లింది.
“ ఊరి దూలినీ తీసుకొస్తంది.
భావనలో నిమగ్నమైన స్థితి లేక భావన తన్మయత్వం అని చెప్పవచ్చు.తన్వయత్వంతో కూడిన మా ఊరి బస్సు పల్లె గాలిని పీల్చుకొని ఒక రకమైన ఆనందంతో పల్లె వాసులను ఎక్కించుకొని బయలుదేరింది.మా ఊరి బస్సు కదలగానే పల్లె లో చెలరేగే దుమ్ము దూళిని కూడా తన వెంట తీసుకొస్తుంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ కిటికీల్లోంచి కనపడుతున్న తలకాయలన్నీ
“ కిల కిలా నవ్వుల ఎరుకున్న మొకాలు.
మా ఊరు నుంచి వచ్చిన ఆ బస్సులో కూర్చున్న వాళ్లలో కిటికీలోంచి చూస్తే కనబడుతున్న మనుషులు నాకు తెలిసిన మా ఊరికి చెందిన వారు.అతను మాత్రం పట్నంలో ఉద్యోగం చేస్తూ బతుకు కొనసాగిస్తున్నాడు.అతను ఉద్యోగం చేస్తూ పట్నంలో ఉండడం వలన ఊరికి పోవడం తగ్గింది. అతను అనుకోకుండా ఆ రోజు పల్లె వాసులను చూడాలనే కుతూహలంతో బస్ స్టేషన్ కు వెళ్లాడు. ఎందుకో చిత్రంగా బస్ స్టేషన్లో తనను చూడగానే కనపడిన ఊరి వారు ఆనందంతో కిలకిలా నవ్వుతున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ సంచులు సందుగలతో దిగే వాల్లంతా
“ మా వాడల కలెతిరిగిన సోపతిగాల్లే.
జిల్లా కేంద్రం బస్ స్టేషన్ లో మా ఊరి నుండి వచ్చిన బస్సు పాయింట్ మీద ఆగింది.మా ఊరు నుండి వచ్చిన బస్సులో నుండి సంచులు సందుగలతో దిగిన ప్రయాణికులు ఎవరు? అంటే అతని ఊరి వారు.అతనితో ఊరిలోని వాడలలో కలిసిమెలిసి తిరిగిన స్నేహితులు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ వాల్లంతా ఎల్లప్పుడూ
“ మా ఇంటికి రావలసిన సుట్టాలు.
జిల్లా బస్ స్టేషన్ లో మా ఊరి బస్సులో నుండి దిగిన ప్రయాణికులు అతని ఊరి వాళ్ళు.వాళ్ళు ఎల్లప్పుడు అతని ఇంటికి రావాల్సిన బంధువులు. ఊరి బంధువులు కాబట్టి ఎల్లప్పుడు అతని ఇంటికి సంతోషంగా వస్తారు.మా ఊరి బస్సులో నుండి దిగిన ప్రయాణికులు అతని యొక్క ఆత్మీయులు, చుట్టాలు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు మీద పేరు చూసినప్పుడల్లా
“ మా ఊరే కండ్లండ్ల చక్మని మెరుస్తంది.
బస్ స్టేషన్ లో నుండి బయలుదేరే బస్సులకు ఆ బస్సు ఏ ఊరికి వెళుతుందో తెలియజేసే సైన్ బోర్డు ఉంటుంది.అతను బస్ స్టేషన్ కు వెళ్లి బస్సు బోర్డు మీద పేరు చూసినప్పుడల్లా మా ఊరి పేరు బస్సు బోర్డు మీద ఉన్నట్లుగా కళ్ళలో మెరుపు మెరుస్తుంది. నేను పుట్టి పెరిగిన మా ఊరు కళ్ళల్లో మెరుస్తది. మా ఊరి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్లు ఎంతో ఆనందంతో ఊరి బస్సు గురించి పంచుకున్న అనుభవాలు చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పచ్చని కొబ్బరాకులు పట్టుకొని
“ కొత్తగ బస్సు వచ్చిన్నాటి ఆనందం
“ ఊరికి దూరమైన నాకు
“ ఆ బస్సు కనపడ్డప్పుడల్లా సంబురం.
మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం.స్వాతంత్ర్యం వచ్చిన చాలా రోజుల వరకు కూడా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించబడలేదు.రెండు వైపులా పచ్చని కొబ్బరి ఆకులు కట్టిన బస్సు మొదటిసారిగా ఊరిలోకి వచ్చినప్పుడు ఆనందంతో గ్రామస్తులంతా స్వాగతం పలికిన రోజును,తన చిన్ననాటి ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్నాడు.అతనికి ఉద్యోగం దొరకగానే తన ఊరి నుండి పట్టణానికి వెళ్లిపోయినాడు.ఊరికి దూరమైనప్పటికీ అతనికి తన ఊరి ఎర్ర బస్సు కనపడ్డప్పుడల్లా కలిగిన సంబురం మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నాడు. కొత్తగా తన ఊరికి బస్సు సౌకర్యం కలిగిన రోజును ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా గుర్తు పెట్టుకుని మా ఊరి బస్సును గురించి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఎనుకటి ఎక్కువ తక్కువ అంతరాలు
“ బస్సు వచ్చిన తర్వాత అంతరాల సమాంతరం.
మా ఊరికి బస్సు వచ్చిన తర్వాత ఊరి వారందరు బస్సులోనే ప్రయాణం చేసేవాళ్ళు.బస్సు వచ్చిన తర్వాత వెనుకటి తీరుగా పెద్ద కులం,చిన్న కులం అనే తేడాలు లేకుండా అందరు బస్సులోనే ప్రయాణించేవాళ్లు.మా ఊరికి బస్సు వచ్చిన తర్వాత పెద్ద,చిన్న అంతరాలు సమసి పోయి ఊరి వారు అందరు ఒక్కటిగా మెదులుతున్నారు.మా ఊరి బస్సు వచ్చిన తర్వాత ఊళ్లోని జనాల మధ్య ఎక్కువ తక్కువ తేడాలు తగ్గిపోయినయి అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ బస్సుల కూకుంటే రచ్చబండ మీద ఉన్నట్టే
“ ఇంటింటి ముచట్లన్నీ ఇమరస
“ పట్నంలో పల్లె యాదికస్తే
“ బస్టాండుకు పోయి తిరిగి తిరిగి రావాలె
“ మా బస్సు వస్తూ వస్తూ
“ ఎన్ని మంచి వార్తలు తెస్తదో !
రచ్చబండ అనేది ఒక భారీ చెట్టు నీడలో సాధారణంగా నిర్మించబడిన ఎత్తైన వేదిక.
రచ్చబండ అనేది గ్రామస్తులు తమ సామాజిక సమస్యలు,ఆర్థిక సమస్యలు ఇతర వివాదాల గురించి చర్చించడానికి ఒక సాంప్రదాయకమైన సమావేశ స్థలం.ఎక్కువగా పెద్దవారు అని పిలవబడే ఒక గ్రామ అధిపతి రచ్చబండపై కూర్చుని అనేక సమస్యలకు పరిష్కారాలను అందించడానికి మరియు గ్రామస్తుల మధ్య ఉన్న వివిధ వివాదాలను పరిష్కరించడానికి రచ్చబండలు పనికి వస్తాయి.ఇవి ఎల్లప్పుడు ఆయా గ్రామాలకే పరిమితమవుతాయి.ఆధునిక కాలంలో పట్టణీకరణ వల్ల రచ్చబండలు అంతరించి పోతున్నాయి.మా ఊరి బస్సుల ఎక్కి సీట్ల మీద కూర్చుంటే మా ఊరి రచ్చబండ మీద జరిగే కార్యక్రమంలో పాల్గొన్నట్లేనని తెలియజేస్తున్నాడు.బస్సులో కూర్చున్న మా ఊరి వాళ్ళు రచ్చబండ మీది లాగా ఇంటింటి ముచ్చట్లు మాట్లాడుతు విమర్శలు చేస్తున్న తీరు రచ్చబండ తీరుగా అనిపిస్తుంది.పట్టణంలో నివసిస్తున్న అతను పల్లె గుర్తుకు వస్తే బస్ స్టేషన్ కు పోయి తిరిగి తిరిగి వస్తడు.బస్ స్టేషన్ కు పోతే ఊరి వాళ్ళందరు కలుస్తారు.ఊరి ముచ్చట్లు అన్ని తెలుస్తయి.బస్ స్టేషన్ కు పోతే పల్లెకు పోయినట్టుగా ఉంటది. మా ఊరి బస్సు పట్నంకు వస్తూ వస్తూ మా ఊరి నుంచి ఎన్నెన్నో మంచి ముచ్చట్లు మోసుకు వస్తుందని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొలం పారుతుంది
“ భూమక్క బిడ్డ లగ్గం దొరింపు అయ్యింది
“ ఏనె కింది బాయిల నీళ్లు పడ్డయి
“ మనూరికి నీళ్ళ కాలువ వస్తందట
“ కొత్తకొత్త మతలావులన్నీ
“ బస్సు దిగినోల్లే ఎల్లడిస్తరు.
పట్నంలో అతను బస్ స్టేషన్ కు వెళితే మా ఊరిలో ఏం జరిగింది? అనే విషయాలు తెలుస్తాయి.మా ఊరి బస్సు నుండి దిగిన జనాలు వివరాలు అన్ని సవ్యంగా తెలియజేస్తారు.మా ఊరిలో వానాకాలం వానలకు మన ఊరి చెరువు నిండి పోయింది. చెరువు నీరు ఎక్కువై మత్తడి దునుకుతుంది. చెరువు నిండిందంటే ఊరి జనాలకు మరియు రైతులకు తాగునీరు,సాగునీరు పుష్కలంగా లభిస్తాయి.ఊరిలో పండుగ వాతావరణం అలుముకుంటుంది అని చెప్పవచ్చు.చెరువులో నీళ్లు ఉంటే వ్యవసాయం మస్తుగా సాగుతది.వర్షాలు పడిన తర్వాత ఊరిలో రైతులు ఇరువాలు దున్ని పొలం మడిని పొతం చేసి వరి నాట్లు కూడా పెట్టినారు.మన ఊరి చెరువు నుండి పొలానికి నీళ్లు పారుతున్నయి.మన ఊళ్ళె పెళ్ళికి ఎదిగిన భూమక్క బిడ్డకు పెళ్లి ఖాయం అయింది.భూమక్క బిడ్డ పెళ్లి కాలేదని అందరు నారాజు అయేటోల్లు. చూడు కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు అంటరు కదా.అదే నిజమైంది.మన ఊల్లే ఏనె కింది బాయి ఎండి పాయె.వర్ష కాలం వానలకు చెరువు నిండింది.ఏనె కింది బాయిల నీళ్లు పడ్డాయి.మన ఊరికి కాలువల ద్వారా నీళ్లు వస్తయట,అందరు అంటున్నారు.పొలాలకు,పెరండ్లకు కాలువల ద్వారా నీళ్లు పారుతె మస్తుగా పంటలు పండించి రైతులకు మంచిగా గిట్టుబాటు అవుతుంది.ఇగ మన ఊరి రైతులకు చేతి నిండా పని.ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు,మన ఊరి బస్సు దిగిన వాళ్ళు తెలియజేస్తరు.బస్ స్టేషన్ కి వెళ్లితె మన ఊరి వాళ్ళను కలిస్తే ఊరి సంగతులు అన్ని తెలుస్తయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ డ్రైవర్ రఘుపతి రాంగా రాంగా
“ మా అమ్మ పంపిన
“ మక్క కంకులు పల్లికాయ ముల్లె తొక్కు సీసా
“ బియ్యం సంచీ ఎన్నెన్ని తెస్తడో
“ ఎంతెంత మురిపెం కడుపు నింపుతడో..
రఘుపతి రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.మా ఊరి బస్సుకు డ్రైవర్ రఘుపతి.రోజు మూడు ట్రిప్పులు పట్నం నుండి బస్సు మా ఊరికి వస్తది.రెగ్యులర్ గా రోజు మూడు ట్రిప్పులకు బస్సు డ్రైవర్ రఘుపతి వస్తడు.మా ఊరి నుంచి బస్సు పట్నం వచ్చేటప్పుడు మా అమ్మ రఘుపతి డ్రైవర్ ద్వారా పంపిన మక్క కంకులు, పల్లికాయ ముల్లె,తొక్కు సీసా,బియ్యం సంచీ ఇంకా ఎన్నెన్నో తెస్తడు.రఘుపతి డ్రైవర్ ఎంతెంతో మురిపెంగా మా అమ్మ పంపినవి తీసుకువచ్చి
మా కడుపు నింపుతాడు అని అతని గురించి ప్రేమ గా తెలియ జేస్తున్నాడు.మా ఊరి నుండి బస్సు పట్నంకు వచ్చేటప్పుడు అమ్మ పంపినవి డ్రైవర్ రఘుపతి ప్రేమతో తీసుకు వస్తాడు,మా కడుపు నింపుతడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు పల్లెకు పట్నంను కలిపే దారపు కండె
“ బస్సు సకల జనుల ఇల్లు వాకిలి.
మా ఊరి బస్సు పల్లెకు పట్టణంను కలుపు దారపు కండెగా మారింది అని తెలియ జేస్తున్నాడు.మా ఊరి బస్సు మా ఊరి జనాల అందరి ఇల్లు వాకిలి. మా ఊరి బస్సు లేకుంటే సకల జనుల ఇల్లు వాకిలి లేదు అని చెబుతున్నాడు.ఇంటికి వాకిలి ఉంటేనే అందం.ఇంటికి వాకిలి లేకుంటే అంతా శూన్యంగా తోస్తుంది.మా ఊరికి బస్సు ఉంటేనే ఇల్లు వాకిలి ఉన్నట్లు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పల్లె బస్సు ప్రయాణం అంటేనే
“ చెట్లు గుట్టలు పిట్టలు చూసి పరవశించుడు.
మా ఊరికి పల్లె బస్సులో ప్రయాణం చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది.పల్లె బస్సులో ప్రయాణం చేయడం వల్ల మా ఊరిలోని పచ్చ పచ్చని చెట్లు, ఎత్తైన అందమైన గుట్టలు,ఆకాశంలో విహరించే రంగు రంగుల పిట్టలు చూసి ఆనందంతో ప్రకృతి మాత ఒడిలో ఉన్నట్లుగా పరవశించిపోతాం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బస్సు ప్రయాణం
“ ఒకానొక సామూహిక ఏకాంత చైతన్యం.
ఏ ఊరికి వెళ్లాలన్నా బస్సులో ప్రయాణం చేయడం ఆనవాయితీగా వస్తోంది.బస్సులో అందరు కలిసి సామూహికంగా ప్రయాణం చేస్తారు.బస్సులో ప్రయాణం చేయడం వల్ల అందరిలో ఏకాంత చైతన్యం ఏర్పడుతుంది.చాలామంది జనాలకు బస్సు ప్రయాణం సామూహిక ఏకాంత చైతన్యం అని చెప్పిన తీరు చక్కగా ఉంది.మా ఊరి బస్సు చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
రచన : నరేంద్ర సందినేని.
అన్నవరం దేవేందర్ “ చెట్ల మహిమ “ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని “చెట్ల మహిమ’ కవిత పై విశ్లేషణా వ్యాసం.చెట్ల మహిమ కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.చెట్లకు మహిమలు ఉంటాయా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.కవి దేవేందర్ చెట్ల మహిమ కవితను గురించి తెలుసుకోవాలంటే కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.చెట్ల మహిమ గురించి అన్ని విషయాలు అవగాహన లోకి వస్తాయి.
“ యాప చెట్ల కింద
“ వాకీట్ల పన్నోనికి తెలుస్తది
“ అదెంత సుఖ నిద్రో
“ చెప్ప తరమా చెట్ల మహిమ.
పల్లెలో వేప చెట్లను యాప చెట్లుగా పిలుస్తారు.వేప చెట్టు నుండి వచ్చే వేప ఆకు,వేప పూత,మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. మనిషికి కావాల్సిన స్వచ్ఛమైన గాలిని వేపచెట్టు అందిస్తుంది.వేప కొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు.వేప చెట్టు కట్టెతో ఇంటికి వాడే ద్వారాలు,తలుపులు,కిటికీలు,బీరువాలు, మంచాలు తయారు చేస్తారు.మనదేశంలో వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. వేపకాయల నుండి వేప నూనె తయారు చేస్తారు. ఉగాది పండుగ రోజున వేప పూత బెల్లంతో కూడిన ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వేప చెట్టు ఏ కాలంలో ఎప్పుడు చూసినా పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది.వేప చెట్టు తీవ్రమైన క్షామ పరిస్థితుల్లో మాత్రమే చాలావరకు ఆకులను రాల్చుతుంది.ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవిస్తారు.ఎన్నో సుగుణాలు ఉన్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా చెప్పవచ్చు. పల్లెలో అతని ఇంటి వాకిలికి ఆనుకొని విస్తారంగా వేప చెట్లు ఉన్నాయి.వేప చెట్ల కింద పడుకున్న వారికి ఎంత హాయిగా ఉంటుందో తెలుస్తది.వేప చెట్టు నీడన పడుకుంటే చక్కటి సుఖ నిద్ర వస్తుంది. వేప చెట్టు నీడ వల్ల ఎంత ఉపయోగమో చెప్పతరమా చెట్ల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ పొలం ఇరువాలు దున్ని
“ టేకు ఆకుల్ల తిన్నోనికి తెలుస్తది
“ అదెంత కండ్ల పండుగో
“ చెప్ప తరమా ఊడల మహిమ.
పొలం అనగా వ్యవసాయ భూమి.రైతులు పంటలు పండించే ప్రదేశం.వ్యవసాయ భూములు సారవంతమైన నేలను కలిగి ఉంటాయి.పొలం యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆహారం మరియు ఇతర పంటలను ఉత్పత్తి చేయుట.ప్రధానంగా వ్యవసాయ ప్రక్రియలకు ఉపయోగించే భూమిని పొలం అంటారు.వ్యవసాయ భూమి అయిన పొలం ఇరువాలు దున్నిన తర్వాత రైతులు తినడం కొరకు పళ్ళెం ఉపయోగించకుండా టేకు చెట్టు ఆకులో అన్నం కలుపుకొని తింటారు.టేకు చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి.టేకు చెట్టు ఆకుల్లో అన్నం తినడం వల్ల ఎంతో కమ్మగా ఉంటుంది.టేకు చెట్టు ఆకుల్లో తినడం వల్ల ఎంతో మేలు చేకూరుతుంది.టేకు చెట్టు యొక్క పచ్చని ఆకుల మహిమ చెప్పతరమా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ అటు ఇటూ మర్రి చెట్ల మధ్య
“ పయనించినోనికి తెలుస్తది
“ అదెంత కండ్ల పండుగో
“ చెప్ప తరమా ఊడల మహిమ.
మర్రిచెట్టు బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతి పెద్ద వృక్షం.మర్రి చెట్టును వటవృక్షం అని కూడా అంటారు.మర్రి చెట్టు పురాణాలలో పవిత్ర వృక్షంగా ప్రస్తావించబడింది. మర్రిచెట్టు కింద అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి.మర్రిచెట్టు ఆయుర్వేదంలో అనేక వ్యాధుల అంటు రోగాల చికిత్స కోసం ఉపయోగపడుతుందని చెప్పబడింది.మర్రి చెట్టు మన దేశపు జాతీయ వృక్షం.మర్రి చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి.బాగా పెరిగిన మర్రిచెట్టు నేల మీదకు వేలాడుతూ ఉండే ఊడలను కలిగి ఉంటాయి.మర్రి చెట్టు ఊడలు బాగా పెరిగిన తర్వాత పెద్ద చెట్టు యొక్క బెరడును ప్రతిబింబించేలా ఉంటాయి.చిన్న చిన్న చెట్లు కలిసి గుంపుగా ఎదిగినట్టు కనిపిస్తాయి.మర్రి చెట్ల మధ్య అటు ఇటు తిరిగిన వారికి మర్రి చెట్టు యొక్క గొప్పతనం గురించి తెలుస్తుంది.మర్రి చెట్ల వద్ద మసలినట్లయితే అక్కడి చల్లదనం కన్నుల పండుగగా ఉంటుందని తెలియజేస్తున్నారు. మర్రిచెట్టు ఊడల మహిమ చెప్పతరమా అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ బంతీ చామంతుల సొగసు
“ పందిరి మీద పారిన మల్లె పరిమళం
“ ఇంట్లో ఉన్నోల్లకే తెలుస్తది సువాసన
“ చెప్ప తరమా తీగల మహిమ.
బంతి పువ్వు బంగారు,పసుపుపచ్చ,నారింజ రంగులలో లభ్యమవుతుంది.బంతిపూలను పూజలలో పెళ్లిళ్లలో అలంకరణ కొరకు సామాజిక కార్యక్రమాల కోసం దండలు తయారు చేయడానికి వాడుతారు.చామంతి అందమైన పువ్వు.చామంతి శీతాకాలంలో పూస్తుంది.మల్లె సువాసనలు ఇచ్చే పూల మొక్క.వేసవి రాగానే మల్లెపూల వాసన గుప్పుమంటుంది.స్త్రీలు తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి,పూజలకు మల్లెపూలు ఎక్కువగా ఉపయోగిస్తారు.పల్లెలో ఇంటి వద్ద గల పెరట్లో గల తోటలో బంతిపూల చెట్లు,చామంతి పూల చెట్లు పెంచుతారు.ఇంటి ముందు గల పందిరి మీద ఏపుగా పెరిగిన మల్లెతీగ సువాసన వెదజల్లుతుంది.పల్లెలో ఇంట్లో ఉన్నవారికి బంతి, చామంతి మల్లెపూల పరిమళం తెలుస్తుంది. సువాసనలు వెదజల్లే బంతి,చామంతి,మల్లె తీగల మహిమ చెప్ప తరమా అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.
“ నిప్పుల్ల కక్కే ఎండల్ల
“ చింత నీడకు సేద తీరినోల్లకే తెలుస్తది
“ హృదయం ఎంత సల్లనో
“ చెప్ప తరమా చింతాకు మహిమ.
నిప్పులు కక్కే ఎండలు అంటే వేసవి కాలం.భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు అని చెప్పవచ్చు. ఎండలు పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.వేసవి వేడి నుండి తట్టుకోవడానికి చింత చెట్టు నీడకు చేరితే ఎంతో హాయిగా ఉంటుంది.ఎండ వేడిమి నుంచి కాపాడుకోవచ్చు. వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి.వేసవి ఎండ నుండి రక్షించుకోవడానికి పల్లెలో జనాలు చింతచెట్టు నీడకు చేరి సేద తీరుతారు.చింత చెట్టు నీడ ఎంతో చల్లగా ఉంటుంది.చింత చెట్టు హృదయం ఎంతో చల్లనిది.చింతాకు వల్లనే చింతచెట్టు చల్లదనం ప్రసాదిస్తుంది.చెప్ప తరమా చింతాకు మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ రచ్చ బండ కాడ పచ్చని చెట్టు నీడన
“ పటాపంచలైన పంచాయితీ పగలు
“ పెట్టుకున్నోల్లకే తెలుస్తది ఆత్మ ఇమరశ
“ చెప్ప తరమా కొమ్మల మహిమ.
రచ్చబండ అనేది పల్లెవాసులు తమ సామాజిక సమస్యలు వివాదాల గురించి చర్చించడానికి ఏర్పాటు చేయబడ్డ సమావేశ స్థలం.గ్రామ పెద్ద రచ్చబండపై కూర్చుని ఇరుపక్షాల సమస్యలను సావధానంగా విని వివాదాలను పరిష్కరిస్తాడు. గ్రామాల్లో రచ్చబండ పచ్చని చెట్టు నీడన కొలువై ఉంటుంది.గ్రామ పెద్ద ఇరుపక్షాలను పిలిచి మాట్లాడి పరిష్కారం చెపుతాడు.గ్రామ పెద్ద చెప్పినట్లు ఇరుపక్షాలు వినాలి.ఇరు పక్షాలు వినకపోతే సమస్య పరిష్కారం కాదుపంచాయతీలో కూర్చున్న ఇరుపక్షాల మధ్య పగలు ప్రతీకారాలు పెరుగుతాయి.ఎందుకు కొట్లాడుకున్నారో కొట్లాట పెట్టుకున్న ఇరు పక్షాల వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి.పచ్చని చెట్టు నీడన రచ్చబండ కింద కొట్లాట పరిష్కారం కావాలి.పరిష్కారం కాని తగాదా గురించి చెబుతూ చెప్పతరమా కొమ్మల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ దట్టమైన ఆకుపచ్చదనం
“ ఆదివాసీలకు ప్రాణాపాణం
“ లీనమైతెనే తెలుస్తది అడవి అందం
“ చెప్ప తరమా అరణ్యాల మహిమ.
ఆదివాసీలు అంటే అడవులకు దగ్గరగా నివసించే ప్రజలు.ఆదివాసీలు తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయం.సామాజిక విలువలను కలిగి ఉంటారు.అనాది కాలం నుంచి ఆదివాసీలు అడవులు కొండ ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు.వేట లేదా వ్యవసాయం వారి ప్రధాన జీవన విధానం.ఆదివాసీ గ్రామస్తులు కూడా అడవితో ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంచుకున్నారు. అడవిలో కొంత భాగాన్ని ఆదివాసీలు పవిత్రంగా పరిగణిస్తారు.ఆదివాసీలకు అడవులు వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. ఆదివాసీలు అడవి నుండి స్వచ్ఛమైన నీటిని పొందుతారు.పండ్లు మరియు కూరగాయలు సేకరిస్తారు.అడవిలో నివసించే జంతువులను వేటాడుతారు.ఆదివాసీలు నివసించే ఇండ్లన్ని అడవి నుండి తీసిన వస్తువులతో తయారు చేయబడ్డాయి. ఆదివాసీలు అనేక మొక్కలను ఆహారంగా మేతగా మూలికలు మరియు ఔషధాలుగా ఉపయోగిస్తారు.వేటాడే స్థలం,దట్టమైన చెట్ల పొదలతో క్రూర మృగాలతో ఉండే స్థలం.అడవి అనేది దట్టమైన చెట్లతో కూడిన ప్రాంతం.దట్టమైన అడవి ఆకుల పచ్చదనం ఆదివాసీలకు ప్రాణం అని చెబుతున్నారు.ఆదివాసీలు అడవి అందాలకు పరవశులై బతుకుతున్నారు.అందమైన అడవిలో లీనమై బతుకు గడుపుతున్న ఆదివాసీల గురించి చెప్ప తరమా అరణ్యాల మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ ఊడల మర్రి కింద బర్ల మంద
“ఎండల ఎంత ఇష్టంగ పన్నయో
“ నెమరు మోము సూస్తేనే తెలుస్తది
“ చెప్ప తరమా మాను మహిమ.
ఊరి బయట సమూహంగా పశువులు ఉండే చోటును మంద అంటారు.వేసవికాలంలో ఎండలో పశువులైన బర్ల మంద ఊడల మర్రి చెట్టు కింద ఎంతో ఇష్టంగా సేద తీరుతున్నది.ఊడల మర్రిచెట్టు కింద పడుకున్న బర్రెలు ఎంతో ఆనందంగా నెమరువేస్తున్నది.చెప్పతరమా ఊడల మర్రి చెట్టు మహిమ అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ మోతుకు చెట్టు మోహన రూపం
“ కుట్టిన ఇస్తార్ల బువ్వ పెరుగు తొక్కు
“ అదెంతా ఆకలి తీరే సంబ్రమో
“ చెప్ప తరమా చెట్ల మహిమలు.
చెట్లను పూజించే సంస్కృతి మనదేశంలో చూడవచ్చు.మనదేశంలో అనేక రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు.మోదుగ చెట్టును కూడా మన దేశంలో పూజిస్తూ ఉంటారు.ఇంట్లో చెడు తొలగిపోయి,మంచి జరగాలని చేసే హోమాలలో, యాగాలలో మోదుగ చెట్టు కొమ్మలను ఉపయోగిస్తూ ఉంటారు,మోదుగ చెట్టు ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది.విస్తర్ల తయారీలో మోదుగ చెట్టు ఆకులను ఉపయోగిస్తారు.మోదుగ చెట్టు ఆకులతో చేసిన విస్టర్లలో వేడి వేడి అన్నం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.మోదుగ చెట్టు మోహన రూపం కలిగి ఉంటుంది.
మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తర్లలో బువ్వ పెరుగు తొక్కు కలుపుకొని తింటే ఆకలి తీరుతుంది, ఎంతో మేలు చేస్తుంది.మోదుగ చెట్టు ఆకుల గురించి చెబుతూ చెప్పతరమా చెట్ల మహిమ అని చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.చెట్ల మహిమ అనే చక్కటి కవిత అందించినందుకు కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
”ఈరోజు బాగా అలసిపోయాను రమా! వేడి వేడి టీ తాగాలి” అంటూనే నాగయ్యను పిలిచి రెండు కప్పులు టీ చేసుకురమ్మన్నారామె.” నాగయ్య టీ తెచ్చి టేబిల్‌మీద పెట్టి నిలబడ్డాడు. అతనిని పంపించేసి ఒక కప్పు తన చేతిలోకి తీసుకుని ”నువ్వు కూడా తాగు రమా!”అని పురమాయించింది. ఆ అమ్మాయి సంకోచిస్తుండటంతో, ”ఫర్వాలేదు. నువ్వూ బాగా అలసిపోయా”వనడంతో ఆమె భయం భయంగా రెండవ కప్పు తీసుకుని కొంచెం దూరంగా నిలబడి సిప్‌చేయసాగింది. ”కూర్చొని తాగు రమా!” ”ఫర్వాలేదు మేడమ్!” ”ఇది ఆఫీస్‌కాదు. ఇల్లమ్మా!” ”అయినా ఇది మీ అధికార నివాసమే కదా మేడమ్!” దాంతో ఆమె నవ్వేసి ఊర్కొన్నారు.
ఆ మరుసటిరోజు సాయంకాలం కూడా దినమంతా టూర్లతో ఆమె బాగా అలసిపోయారు.
”రమా! రేపు నాకు బయట ప్రోగ్రామ్‌లేమీ లేవు. నువ్వు సెలవు తీసుకో. ఉండు ఒక్క నిమిషం”. నాగయ్యను పిలిచి ”ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ వసతి చూపించు” అని ఆజ్ఞాపించారామె. రమకేమీ అర్థం కాలేదు. నాగయ్య ఆమెకు రెండు గదుల వసతిని చూపించి, ”ఈరోజే కలెక్టర్‌మేడం ఆదేశంతో ఇదంతా శుభ్రం చేశారు. నివాసయోగ్యంగా మార్చారు” అని వివరించాడు. ఆశ్చర్యంతో రమ తిరిగి రాగానే, ”రమా! రేపు నీకు సెలవు ఇచ్చాను గదా! నీ సామానులన్నీ సర్దుకుని సాయంకాలానికల్లా ఇక్కడికి షిఫ్ట్‌అయిపో!” అని మేడమ్‌ఆదేశించారు.
”మేడమ్!”ఆ అమ్మాయికిదంతా నమ్మశక్యంగా లేదు.
”ఏం బాగాలేదా? ఇక్కడయితే నువ్వు మీ అమ్మను కూడా పిలిపించుకోవచ్చు!” ”అది కాదు మేడమ్!”
”అయితే ఇంకేమీ చెప్పకు. నేను చెప్పినట్లు చెయ్యి”.
ఒక్కసారిగా ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. కృతజ్ఞతా భావంతో ఆమె కలెక్టరమ్మ కాళ్ళకు దండం పెట్టబోయింది. వెనుకకు జరిగి ఆమె దాన్ని వారించింది. దినమంతా ఆఫీసు పనుల్లో బిజీగా ఉండి సాయంకాలం 8 గంటలకు తన నివాసానికి చేరుకొన్నారు ఉషారాణిగారు. విశ్రాంతికోసం కుర్చీలో వాలిపోయి టీకి ఆర్డరిచ్చారు. వేడివేడి టీ ఘుమఘుమలు ఆస్వాదిస్తూ రమను పిలుచుకురమ్మని నాగయ్యను పంపారు. ఆ అమ్మాయి ముఖంలో సంతోషం, హుషారు గమనించాడు నాగయ్య.
”ఎలా ఉంది రమా! ఇక్కడ?” ”మేడమ్‌మీకు కృతజ్ఞతలు ఎట్లా చెప్పుకోవాలో తెలియటం లేదు. మా అమ్మకు తెలిస్తే ఎంత సంతోషిస్తారో!”
”ఆమె నిక్కడకు రప్పించుకో!” ”దానికి కొద్దిరోజులు పడుతుంది మేడమ్!”
”సరే, నీ ఇష్టం. ఈ రోజు నువ్వు ఇక్కడే తిను. నేను వాళ్ళకు ముందే చెప్పాను.” ”నేను వంట చేసుకుంటాను మేడమ్!” ”రేపటి నుండి చేసుకుందువులే!” అని చెప్పేసి ఆమె తన గదిలోకెళ్ళిపోయారు.
ఒక సాయంకాలం రమకు నాగయ్య ఎదురుపడ్డాడు. ”నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా!” అన్నాడు. ”ఎందుకు నాగన్నా?”
”మేడమ్‌కు నీ మీద మంచి అభిప్రాయమేర్పడింది. అందుకే నిన్ను చేరదీశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. నమ్మకస్తులకు ఆమె అన్నివిధాలా సహాయం చేస్తారు. ఎప్పుడూ మిడిసిపడకూడదు. తోటి ఉద్యోగుల ఎదుట జాగ్రత్తగా ఉండాలి. అసూయపడతారు. ఇబ్బందులు కల్పిస్తారు” అంటూ ఎవరి ఎదుట ఎట్లా ఉండాలో మెళకువలు చెప్పాడు. రమ జీవితంలో ఈ సలహా మార్గదర్శనంలా పనిచేసింది.
రెండవ శనివారం, ఆ తర్వాత ఆదివారం ఆఫీసు పనులన్నింటికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు ఉషారాణి. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్టు ముగించుకుని కూర్చొన్నారు. ఆమె ఏదో చిరాకుగా ఉన్నట్లు గమనించి అక్కడే నిలబడి ఉన్నాడు నాగయ్య. అతనివైపు చూస్తూ, ”ఈ అమ్మాయి కేదో సహాయం చేయాలని చూస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నది! ఆమె నడవడిని కాస్త గమనిస్తూండు” అన్నారు.
”ఏ విషయంలో అమ్మా?” ”తను నాకు చాలా దగ్గరని, ఏదైనా పని కావాలంటే చేయిస్తానని చెప్తున్నదట”. ”అలా ఎప్పుడూ జరుగదు అమ్మగారూ! ఆమెకు మీరు ప్రత్యక్షదైవం. మీ ఫోటో పెట్టుకుని పూజ చేస్తుంది”. ”మరి అతను ఎందుకలా చెప్పాడు?” ”ఎవరు అమ్మగారూ?” ”వెంకట్రావు”. ”అతనికి చాలా దురలవాట్లున్నాయి. ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని తిరిగి చెల్లించడు. ఈ అమ్మాయిని కూడా వేయి రూపాయలు కావాలని అడిగితే ఇవ్వలేదు. అందుకే ఆమె మీద చాడీలు చెప్పి ఉంటాడు. ఆమె చాలా మంచి పిల్ల అమ్మగారూ!” ”ఒకసారి ఆమెను నా దగ్గరకు పంపించు”.
”నమస్తే మేడమ్!” అంటూ చిరునవ్వుతో కలెక్టర్‌గారి ఎదుట నిలబడింది రమ. కొద్దిసేపటి తర్వాత, ”ఎక్కడికైనా వెళ్ళాలా మేడమ్? ఇప్పుడే డ్రెస్‌వేసుకుని వస్తా” అంటూ వెనుకకు తిరిగింది. ”అవసరం లేదు రమా! అయినా నువ్వు ఆఫీసు పనుల మీద వెళ్ళినప్పుడే యూనిఫాం ధరించు. వేరే అప్పుడు మామూలు దుస్తుల్లో రావచ్చు”. ”అలాగే మేడం”. ”ఇప్పుడు వెళ్ళు. నీ పనులు చూసుకో. సాయంకాలం అయిదు గంటలకు రా! నేను లాన్‌లో కూర్చుంటా”, అని రమను పంపించి ఆమె నిండుగా ఊపిరి పీల్చుకున్నారు.
రమ వచ్చి మేడమ్‌కాళ్ళ దగ్గర కూర్చున్నది. తన పక్కన కుర్చీ చూపించి అక్కడ కూర్చోమంటే ఆమె ఒప్పుకోలేదు. ”మేడమ్! మీరెప్పుడూ ఇలా అనకండి. ముఖ్యంగా ఇతరుల ముందర”. కాసేపు మౌనంగా ఉండి ఆమె మేడమ్‌కళ్ళలోకి చూసింది.
”మేడమ్! మీరు ఉదాసీనంగా కనబడుతున్నారు. మీ కళ్ళల్లో విషాదం అగుపడుతున్నది. ఎందుకు మేడమ్?” అకస్మాత్తుగా ఆమె కళ్ళు వర్షించసాగాయి.
”సారీ మేడం! నన్ను క్షమించండి”. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చాలాసేపు నిమురుతూ ముభావంగా ఉండిపోయారు ఉషారాణి. అప్పుడు తేరుకుని కళ్ళు తుడుచుకుని, ”రమా! ఈరోజు పదేపదే నా చెల్లె గుర్తొస్తున్నది” అన్నారు.
”ఆమెకేమయింది మేడమ్?”
”అది ఈ ప్రపంచంలో లేదిప్పుడు. అమ్మను, నన్నూ శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది”. ”అదెలా జరిగింది మేడమ్?”
”ఇంకా టీనేజరే. పందొమ్మిదేళ్ళు కూడా నిండలేదు. అది ప్రేమలోపడి మోసపోయింది. దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నది.” అది విని రమకు దుఃఖం పొంగివచ్చింది.
”ఎందుకు రమా! నువ్వెందుకింతగా ఏడుస్తున్నావు?” ”ఏం చేయను మేడమ్? అక్క విషాదగాథ విని తట్టుకోలేకపోయాను. బహుశా నాకూ ఇలాగే జరిగి ఉండేదేమో! అక్క బాధ స్వయాన నా బాధే అనిపించింది” మేడమ్‌ప్రశ్నార్థకంగా చూసేసరికి తనకు సంభవించిన ఘటనను ఇలా వివరించింది: ”కొంచెం అటూ ఇటూ అక్క వయసులోనే ఒక అబ్బాయి నా వెంట బడ్డాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మూర్ఖంగా ప్రవర్తించాడు. ఓ రోజు నా దారి కెదురు తిరిగాడు. చీవాట్లు పెట్టినా, బతిమాలినా వినలేదు. ఆ తర్వాత రోజు నా వెంట వెంట నడుస్తూ అతని మోటర్‌సైకిల్‌తో నాకు డాష్‌ఇచ్చాడు. పక్కనే ఉన్న రాయి మీద పడటంతో నా ఎడమ తొడ ఎముక ఫ్రాక్చర్‌అయింది. మంచానపడి ఆర్నెల్ల దాకా నడవలేకపోయాను. ఒక సంవత్సరం చదువు కోల్పోయాను. మా కాలేజీ ప్రిన్సిపాల్, నా వెనకటి క్లాసు టీచర్‌నాకు అండగా నిలిచారు. నా ఫీజులు మాఫీ చేశారు. నా ట్రీట్‌మెంట్‌ఖర్చులు భరించారు. ఆ పుణ్యాత్ముల మేలు ఈ జన్మలో మరువలేను మేడమ్!”
”నిన్ను చూసినప్పుడల్లా నా చెల్లె గుర్తొస్తున్నది. ఒక్కొక్కప్పుడు దాన్నే చూస్తున్నానా అనిపిస్తుంది. నీకేమనిపిస్తున్నది? ‘మీ చెల్లెనే అనుకోండి‘ అని నీ మనసులోనూ అనుకోలేదా నువ్వు?” రమ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
తేరుకోగానే, ”మేడమ్! మీరు బాగా అలసిపోయారు. మీ కోసం టీ చేసి తీసుకొస్తాను” అని వెళ్ళిపోయింది రమ. తన గుండెలమీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లున్నది ఉషారాణి గారికి. ఆ తర్వాత తీరిక దొరికినప్పుడల్లా సాయంకాలాల్లో లాన్‌లో కూర్చొని సేదదీరడం, రమను అక్కడికి పిలిపించుకోవడం పరిపాటయింది. రమ ఆమె పాదాల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేది. ఇద్దరూ టీ తాగుతూ చాలాసేపు ఎంజాయ్‌చేసేవారు. నాగయ్య ఇదంతా గమనిస్తున్నాడు. అమ్మగారు సంతోషంగా, హుషారుగా ఉండడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది.
ఓరోజు ఉషారాణిగారి మనసు ఏదో భావుకతలో విహరిస్తూన్నది. ”మేడమ్!” ఆ పిలుపు ఆమెను ఈ లోకంలోకి దింపింది.
”రమా! నువ్వు నన్ను ‘అక్కా!‘ అని పిలువచ్చు గదా!” కొంచెం సవరించుకుని ”కనీసం ఇంట్లోనైనా” అన్నారు.
”మేడమ్! నా మనసులో మిమ్మల్ని అక్కగానే ఆరాధిస్తాను. కాని ఇంటా, బయటా ‘మేడం‘ అనే పిలుస్తాను. లేదంటే ఎప్పుడైనా పొరపాటు జరగవచ్చు. నన్ను క్షమించండి. మీరు నన్ను చెల్లెగా భావించటమే నాకు పదివేలు. ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న మీ చేత గుర్తించబడటమే నా అదృష్టము. అమ్మా నాన్నలు ఏం పుణ్యం చేసుకున్నారో నాకు ఇంత గొప్ప వరం దొరికింది. ‘సదా మీ నమ్మకానికి, విశ్వాసానికి పాత్రురాలనై ఉండాలి‘ అని కోరుకుంటాను” అని ఆమె పాదాలను తాకి కళ్ళకద్దుకున్నది.
క్రమంగా కలెక్టర్‌మేడమ్, రమ మధ్య విశ్వాసం పెరిగి ఆత్మీయతా బంధం దృఢపడసాగింది. టూర్లలో అప్పుడప్పుడు క్యాంప్‌క్లర్క్‌ను తీసుకెళ్ళడం మానేసారు. మేడమ్‌వెంట ఒక తెలివైన అటెండర్, రమ మాత్రమే ఉండేవారు. ఆమెనే మేడమ్‌కవసరమైన కాగితాలను, ఫైళ్ళను అందించేవారు.
అది మార్చి నెల. ఓ శనివారం రోజు. కలెక్టర్‌మేడమ్‌ఓ ప్రముఖ మహిళా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి బాగా లేటయింది. రమను తనతోపాటే భోంచేయమన్నారు. అవసరమైనవన్నీ టేబిల్‌పైన అమర్చిన తర్వాత అందరినీ పంపించి వేశారు. డ్రెస్‌మార్చుకుని వచ్చింది రమ. ఆ అమ్మాయి, తను మాత్రమే ఉన్నారు టేబిల్‌దగ్గర. మొదట ఒప్పుకోకపోయినా మేడమ్‌తో పాటు కూర్చుని ఒకే టేబుల్‌మీద తినక తప్పలేదు రమకు. ”రమా! దేనికదే, ఉద్యోగ ధర్మం వేరు. ఇంట్లో పద్ధతి వేరు. ఇక్కడ నువ్వు నాకు చెల్లెలివే” ”ఎవరైనా చూస్తే బాగుండదు మేడమ్!”
”ఇప్పుడు ఎవరూ లేరులే. దాన్ని వదిలెయ్యి. ఈ రోజు నీకేమి నచ్చిందో చెప్పు”.
”వాళ్ళు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌బాగున్నది. మీ స్పీచ్‌ఎంతో ఉత్తేజకరంగా ఉండే. అమ్మాయిల నృత్య ప్రదర్శన కూడా బాగా నచ్చింది”. మేడమ్‌ఓసారి రమ వంక చూసి, ”నాకైతే నువ్వే ఆకర్షణగా నిలిచావనిపించింది. ఫుల్‌యూనిఫాంలో డైరీ చేతబట్టి ఠీవిగా నా వెంట నడుస్తుంటే, అమ్మాయిలంతా నన్ను కాకుండా నిన్నే కుతూహలంగా చూస్తున్నారు. అందుకే నా స్పీచ్‌లో సైతం పరోక్షంగా నీ రోల్‌నే ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాను.”
రమ కొంచెం సిగ్గుపడింది. ”అది చెల్లె మీద మీకున్న అనురాగం మేడమ్! మీరెక్కడ, నేనెక్కడ?’మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోగలనా?’ అని అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. నాకాశక్తి నివ్వమని ఎప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాను!” అమ్మాయి గొంతు గద్గదమైంది. మేడమ్‌సున్నితంగా ఆమె చేతిని నొక్కింది.
ఆదివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ముగించుకుని లాన్‌లో కూర్చొన్నారు మేడమ్. వెంటనే రమకు కబురుపెట్టారు. ఆమె వచ్చి మేడమ్‌పక్కనే గడ్డి మీద కూర్చున్నది.
”రమా! ఏమైనా తిన్నావా లేదా?” ”తిన్నాను మేడమ్!”
”అయితే లంచ్‌గురించి విచారించకు. నా దగ్గరే నాతోపాటే చేద్దువు. లోపలికెళ్ళి రెండు టీలు పట్టించుకురా!”
టీ సిప్‌చేస్తూ, ”నీ గురించి, నీ కుటుంబం గురించి చెప్పు రమా!” అంటూ ఆమె వైపు కుతూహలంగా చూశారు మేడమ్.
”మాది ఓ అతిసాధారణ నిరుపేద కుటుంబం. దానికి విశేషాలే ముంటాయి మేడమ్!”
ఆ సాదా కుటుంబాల నుంచే నీ లాంటి, నాలాంటివాళ్ళు ఎదిగి వస్తారు. అందుకే అడుగుతున్నాను చెప్పు”
”ఇంకా నాకు సరైన ప్రాపంచిక స్పృహ రాకముందే, నా ఏడవ ఏట నాన్న మరణించాడు. అప్పటినుంచి మా కష్టాలు ఎక్కువయ్యాయి. అమ్మకు కుట్టుపని వచ్చు. ఆమె రాత్రింబవళ్ళు గుడ్డలు కుట్టేది. దానికి వాళ్ళిచ్చే కొద్దిపాటి కూలీ డబ్బులతో కష్టంగా ఇల్లు గడిచేది. నాన్నపోగానే నన్ను బడికి పంపడం మానేస్తుండొచ్చని భయమేసింది. ఓనాడు స్కూల్లో చెట్టుకింద కూర్చొని ఏడుస్తున్నాను. అది మా క్లాసు టీచర్‌గమనించారు. నన్ను చేరదీసి విషయం తెలుసుకొన్నారు. ఓదార్చి సాయంకాలం నాతో పాటు ఇంటికి వచ్చి అమ్మను కలిసారు. నన్ను ఎప్పటివలె బడికి పంపాలని అమ్మకు చెప్పారు. ఫీజూ, ఇతర ఖర్చులు తాను భరిస్తానన్నారు. అప్పటినుండి పదవక్లాసు వరకు నా ఫీజులు, యూనిఫాం, అన్నింటి బాధ్యత ఆమే తీసుకున్నారు. పదవక్లాసులో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఆ టీచరే స్వయంగా ఇంటర్మీడియట్‌కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌ను కలిసి అడ్మిషన్‌ఇప్పించారు. ఫీజు మాఫీ చేయించారు. నాకు ఆక్సిడెంట్‌అయినప్పుడు ప్రిన్సిపాల్‌గారు, టీచర్‌ఇద్దరూ నన్ను ఆదుకున్నారు. ఎక్కడున్నారో? వారికి నా ప్రణామాలు” అని చేతులెత్తి దండం పెట్టింది.
ఇంటర్‌తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాను. కాని నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి రెండు ఇళ్ళల్లో పిల్లలకు ట్యూషన్‌చెప్పే పని దొరికింది. ఆర్నెల్లలోనే అది మానేయాల్సి వచ్చింది. అక్కడ చురకత్తుల్లాంటి కొందరి కళ్ళు నా శరీరానికి తూట్లు పొడిచేవి. కాని అప్పుడే అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. అస్తమా జబ్బుతో ఆమె పూర్తిగా నీరసించిపోయింది. అదే సమయంలో మా మేనమామ అమ్మను చూడడానికి వచ్చారు. అతను ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో నాకు ఉద్యోగం ఇప్పించారు. ఉదయం 8 నుండి 12 గంటల వరకు, పగలు 2 నుండి 6 వరకు తీరిక లేకుండా పనిచేయాల్సి వచ్చేది. ఆ ఉద్యోగం ఆర్నెల్లు చేశాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆమె మళ్ళీ బట్టలు కుట్టడం ప్రారంభించింది. అదే సమయంలో మామయ్య మళ్ళీ వచ్చాడు. ఎట్లైనా నాకు డ్రైవింగ్‌నేర్పించమని ప్రాధేయపడ్డాను. ఆయన నా మొరను ఆలకించి తనతోపాటు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళారు. అక్కడ తనకు తెలిసిన ఒక వెహికిల్‌ఇన్స్‌పెక్టర్‌దగ్గరకు నన్ను తీసుకెళ్ళారు. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ”నీలో తెలివితేటలు, పట్టుదల ఉన్నాయి. ఇది చాలా టఫ్‌జాబ్. అమ్మాయిల కనుకూలమైన రంగాలు ఎన్నో ఉండగా ఇదే ఎందుకెంచుకున్నావమ్మా?” అంటూ ఆశ్చర్యంగా అడిగారు. నేను చెప్పిన జవాబులు, నా మొండి పట్టుదల చూసి నవ్వారు. వెంటనే ఒక ట్రైనింగ్‌ఇనిస్టిట్యూట్‌కు ఫోన్‌చేసి కారు డ్రైవింగ్‌లో నాకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అక్కడ రెండు నెలలు శిక్షణ తీసుకుని సర్టిఫికెట్‌సంపాదించాను. మిడ్‌సైజ్‌కార్లు గూడా అవలీలగా నడిపే నేర్పును స్వంతం చేసుకున్నాను. తిరిగి వెళ్ళి ఇన్‌స్పెక్టర్‌గారికి కృతజ్ఞతలు చెప్పాను. ఆయన స్వయంగా నా డ్రైవింగ్‌స్కిల్స్‌పరీక్షించి ఒక టెస్టిమోనియల్‌ఇచ్చారు. అది మీరు చూశారు మేడమ్!”.
”ఔను. శభాష్!” అంటూ ఆమె రమ భుజం తట్టింది.
”మీ మామయ్య చాలా సంతోషించి ఉంటారు?”
”ఔను మేడమ్! ఆయన ఎప్పుడూ నన్ను ఎంకరేజ్‌చేసేవారు. ఆయన భార్య అందుకు వ్యతిరేకం. శిక్షణ వాళ్ళ ఊళ్ళోనే కాబట్టి నా తిండి, ఉండటం వాళ్ళ ఇంట్లోనే. ఆమె రోజూ నా ఉత్సాహాన్ని నీరు కార్చేది. వెక్కిరింపులు, వెటకారాలు చేసేది. అసభ్యంగా అవమానకరంగా మాట్లాడేది. ఎన్ని చేసినా ఎదురు చెప్పకుండా నేను అన్నింటినీ సహించాను. ఆ అనుభవం నాకు చాలా నేర్పింది.”
”వెరీగుడ్‌రమా! పన్నెండయింది కదా. నేను స్నానం చేసి ఫ్రెష్‌అయి వస్తా. లంచ్‌చేద్దాం. తర్వాత సాయంకాలం మళ్ళీ కలుద్దాం!”
”అలాగే, థాంక్స్‌మేడమ్!”
”డోంట్‌బీ సో ఫార్మల్‌రమా!” అని ఆమె లేచారు.
* * * *
”ఈ లాన్‌లో సేదదీరుతూ టీ సిప్‌చేస్తూ, నువ్వు నా పక్కన కూర్చుని చెప్పే మాటలు వింటూ నేను ఈ ప్రపంచాన్నే మరచిపోతున్నాను. మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ పరిసరాల ప్రభావమా? నీ ఆత్మీయతా? మరింకేదైనానా? తెలియటం లేదు. ఇంత కొద్దిసమయంలో నాకింత దగ్గర ఎలా అయ్యావు రమా? నా హృదయాన్ని గెలుచుకున్నావు నువ్వు”.
”మేడమ్!” నిజంగానే తను మరో లోకం నుండి మాట్లాడుతున్నట్టే ఉంది. ‘భావుక ప్రపంచం!‘
ఆ పిలుపుతో తేరుకుని, ”చెప్పు రమా! ఈ ఉద్యోగంలోకెలా వచ్చావు? నా దగ్గర కెలా చేరావు?”
”కారు నడపాలి. పెద్ద కార్లు నడపాలి అనే కోరిక ఓ క్రేజ్‌లాగా నన్ను వెంటాడింది. ట్రావెల్‌ఏజెన్సీలకు వెళ్ళాను. వాళ్లందరూ రిజెక్ట్‌చేశారు. ఎవరో చెప్తే ఎంప్లాయిమెంట్‌ఎక్సేంజ్‌లో పేరు నమోదు చేసుకున్నా. ఆర్నెల్లు ఖాళీగానే ఉన్నా. త్వరగా ఉద్యోగంలో చేరి అమ్మ మీద ఆర్థికభారం తగ్గించాలనే ఆరాటం ఎక్కువయింది. అలాంటి స్థితిలో ఒక మహానుభావుడు సలహా ఇచ్చాడు: ”ఈ జిల్లా కలెక్టర్‌గారు చాలా మంచివారు. వారి దగ్గరకు వెళ్ళు. ఏదో ఒకటి చూపిస్తారు.” ‘అబ్బో! కలెక్టర్‌గారే‘ అని బెదిరిపోయాను. ‘నువ్వు ప్రయత్నించు. నీ వివరాలతో చీటీ పంపు. మేడమ్‌తప్పక నీకు ఇంటర్వ్యూ ఇస్తారు వెళ్ళు‘ అని ప్రోత్సహించాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. కాని ఈ రోజు నేను మీ సన్నిధిలో కూర్చోవడానికి అతనే కారకుడు”.
”నీ పట్టుదల, నీ ఆత్మవిశ్వాసమే అలా అనుకూల పరిస్థితులను కల్పించాయిరమా! నువ్వు ఇంకా పైకి ఎదగాలి. ఎల్లప్పుడూ నీకు నా ఆశీస్సులుంటాయి.”
”థాంక్స్‌మేడమ్!” అని ఆమె పాదాలను స్పృశించింది రమ.
”అలా చేయకు రమా!”
”లేదు మేడమ్! మీరు నాకు అన్నీను. యజమాని, శ్రేయోభిలాషి, గురువు, నా ఆదర్శము”.
చాలాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దమేలింది. దాన్ని ఛేదిస్తూ, ”మేడమ్! అమ్మగారిని ఇక్కడకు రప్పించండి” అని రమ విన్నవించింది.
”ఆమె రారు రమా! ఆమెకీ ప్రపంచంలో ఆసక్తిలేదు. ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉంటారు. ఇదివరకటి ప్రయత్నాలన్నీ విఫలమయినవి. కనీసం అక్కడి పరిసరాలు ఆమెకు సుపరిచితము. వాటికి అలవాటు పడి ఉన్నారు. ఇక్కడ మళ్ళా అంతా కొత్త. ఇక్కడ ఆమెకు టైమెవరు ఇస్తారు?”
”నేనున్నానుగా మేడమ్! నేనిస్తాను అమ్మగారికి టైం. నా మాట వినండి. నన్ను తీసుకెళ్ళండి. అమ్మగారిని ఇక్కడకు రావడానికి ఒప్పించే బాద్యత నాది మేడమ్!” ఉషారాణి కాశ్చర్యం వేసింది. ‘ఏమి ఆత్మవిశ్వాసమీ పిల్లది!‘
”మేడమ్!” ”ఊఁ!” ”రిలాక్సవ్వండి. బయట పరిసరాలను గమనించండి. ఆ పచ్చని చేల వైపు చూడండి. అల్లరి చేస్తూ అటూ ఇటూ చక్కర్లు కొట్టే పకక్షులను పరికించండి. వాటి చలాకితనం చూడండి. మీ హృదయం తేలిక పడుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది.”
”కవిత్వం చెప్తున్నావు రమా!” ”అమ్మగారిని చూడడానికి వెళ్తుంటే నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉన్నది.”
”నువ్వు ఇన్సిస్ట్‌చేయకపోతే నేను అమ్మను చూడటానికి ఇంత త్వరగా వెళ్ళకపోయేదాన్ని. ఆఫీస్‌పనుల ఒత్తిడితో అమ్మను చూడాలనే ధ్యాసే ఉండడం లేదు నాకు.”
”దగ్గరలో కూడా లేరు కదా మేడమ్!” ”ఔను!”
”అందుకే అమ్మగారిని ఒప్పించి మన దగ్గరకే తీసుకొద్దాం మేడమ్!” ‘Kudos to your confidence!‘ మనసులోనే అనుకొన్నారు ఉషారాణిగారు.
”అమ్మాయిగారు వచ్చారు చూడండి” అని రంగయ్య చెప్పడంతో సరస్వతమ్మగారు ఆనందంతో కుర్చీలోంచి లేచి ముందుకు నడిచారు. తల్లిని అమాంతం కౌగిలించుకున్నారు ఉషారాణి. ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగినయి. తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి రమవైపు చూపిస్తూ ”ఈ అమ్మాయే పట్టుబట్టి నిన్ను చూడాలని ఈ రోజు నన్ను తీసుకువచ్చింది” అని చెప్పారు.
రమ ఆమె పాదాలకు నమస్కరించి ఆమె చెంతనే నేలమీద కూర్చొన్నది. ”నాకు చాలా సంతోషంగా ఉన్నది. మిమ్మల్ని మొదటిసారి చూడడం కద అమ్మాగారూ!” సరస్వతమ్మ ఆమె బుగ్గలు నిమిరారు. చుబుకమెత్తి కళ్ళలోకి చూసారు. ‘అమాయకప్పిల్ల!‘ మధ్యాహ్నం లంచ్‌తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి తల్లి తన గదిలోకి వెళ్ళగానే మేడమ్‌మరో గదిలోకెళ్ళారు. ఆమె బాగా అలసి ఉన్నారు. అమ్మగారు మెలకువతోనే ఉన్నారు. రమ నిదానంగా వెళ్ళి ఆమె కాళ్ళ వద్ద కూర్చుని మృదువుగా మసాజ్‌చేయసాగింది. పాదాలు, పిక్కలకు. తర్వాత పక్కటెముకలు, వీపు, నడుము భాగాలను సున్నితంగా రుద్దింది. దాదాపు గంటసేపు అలా చేసింతర్వాత ఆ అమ్మాయి చేతులను తన చేతుల్లోకి తీసుకుని దగ్గరకు రమ్మని సంజ్ఞచేశారు వృద్ధమాత. నుదుటిమీద ఓ ముద్దుపెట్టి ఆశీర్వదించింది. ఆ యువ హృదయం ఉద్వేగానికి లోనయ్యింది. రెండు కన్నీటిచుక్కలు ఆమె నయనాల నుండి రాలిపడినయి. కృతజ్ఞతతో ”అమ్మగారూ!” అన్నది. ‘ఎక్కడి తను! ఎక్కడ అమ్మగారు! ఎంత అదృష్టవంతురాలు తను!‘ కాసేపటికి తమాయించుకుని, ”అమ్మగారూ! మిమ్మల్నొకటడుగనా?” అన్నది. ”అడుగు”.”మరి కాదనకూడదు.” ఆలోచనలో పడ్డారామె. ”నేను అసాధ్యమైనదేదీ అడగను అమ్మగారూ!” బతిమాలుతున్న స్వరంతో విన్నవించింది.
”సరే చెప్పు”. ”మీరు మేడమ్‌దగ్గరకొచ్చి ఉండండి. నేనక్కడే ఉంటాను! రోజూ పనయిపోగానే మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేసుకుంటాను. మేడమ్‌చాలా మంచివారు. నాకు ఉద్యోగం ఇచ్చారు. ఉచితంగా వసతి కల్పించారు. తన బంగళా ఆవరణలోనే. నన్ను సేవకురాలిగా చూడరు. చాలా ప్రేమతో ప్రవర్తిస్తారు.”
”ఆ విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డా!” ”అట్లాగే అమ్మగారూ!” అని తన వినతికి జవాబు కోసం ఎదురుచూస్తున్నది రమ.
”రమా! నాకు కొంచెం టైం ఇవ్వు. చెప్తాను. అప్పుడు నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్దువు”. ”అమ్మగారూ!” అని లేచి గంతేసింది రమ.
మరుసటిరోజు తిరుగు ప్రయాణంలో, ”ఏమయింది రమా?” ఉషారాణిగారు ఆమెను పరీక్షించ దలచి అడిగారు. ”ఫలితం కోసం కొంచెం ఓపిక పట్టాలిగా మేడమ్!” మేడం స్పందించకపోవడంతో, ధైర్యం చేసి తనే ప్రతిపాదించింది. ”దయచేసి కొద్దిరోజుల తర్వాత నన్ను మరోసారి పంపండి. అమ్మగారిని తప్పక తీసుకొస్తా”. ”సరే”.
నెలరోజులు కావచ్చింది. రొటీన్‌పనులు, మీటింగ్‌లు, టూర్లతో కలెక్టర్‌గారికి తీరికలేదు. ఒక శనివారం సాయంకాలం. అదను చూసి రమ అడిగింది. ”మేడమ్! నాకు రెండు రోజుల సెలవు, కారు కూడా ఇస్తే అమ్మగారిని తీసుకొస్తా. దారిలో ఒక చోట డాక్‌బంగ్లాలో అమ్మగారు విశ్రమించటానికి ఏర్పాటు కూడా చేయించండి”.
”అమ్మగారు రాకపోతే?” ”వస్తారు మేడమ్”.
”తీసుకురాకపోతే ఖర్చులు నీ జీతం నుంచి కోస్తా. సరేనా?” ”మేడమ్! మీ ఆజ్ఞ ఏదైనా నాకు శిరోధార్యం.”
* * * *
ఊరు చేరుకోగానే సరాసరి అమ్మగారి దగ్గరికి చేరి ఆమె పాదాలకు నమస్కరించి ఆ పాదాల చెంతే కూర్చున్నది రమ. తన రెండుచేతులను ఆమె తొడలమీద వేసి తలను మోకాళ్ళ మీద ఆనించింది. ఆ పిల్ల తలను ఆప్యాయంగా నిమురుతూ, ”ఏంటి రమా! ఆందోళనగా ఉన్నావెందుకు?” అని అడిగారు సరస్వతమ్మగారు.
”అమ్మగారూ! ఈసారి మీరు తప్పక రావాలి. మేడమ్‌కు నేను మాట ఇచ్చాను. మీరు రాకపోతే మేడమ్‌నామీద చర్య తీసుకొంటారు. నా జీతంలో కోత పెడ్తారు.”
సరస్వతమ్మ హృదయం కరిగింది. ”ఏడ్వకు, వస్తాను. రేపు ఉదయమే బయల్దేరుదాం. నిశ్చింతగా ఉండు” అని రమను ఓదార్చారామె. మరుసటిరోజు ఉదయమే బయల్దేరి అనుకొన్న ప్రకారం మధ్యలో ఒక డాక్‌బంగ్లాలో ఆగి బ్రేక్‌ఫాస్ట్‌చేసి సేదదీరారు. తిరిగి ప్రయాణం సాగించి మధ్యాహ్నం రెండుగంటలకు క్షేమంగా తమ బంగళాకు చేరుకొన్నారు.
* * * *
అమ్మగారు బంగళాలో బాగా అడ్జస్టయ్యారు. ప్రేమతో కూడిన కూతురు పలుకులు, రమ రోజూ తన దగ్గరకొచ్చి ఇష్టంగా తనకు సేవ చేయడం ఇవన్నీ కలిసి తన జీవితంలో మార్పు వస్తున్నట్లు తోచిందామెకు. ‘ఇది మాటల పిల్లకాదు. స్వచ్ఛమైన హృదయం గలది‘ అని రమ పట్ల ఆమెకు నిశ్చితాభిప్రాయమేర్పడింది. తెలియకుండానే ఆ అమ్మాయి తనకు ఎంతో ఆత్మీయురాలనిపిస్తున్నది. అది తన తొడమీద చేయివేసి మోకాళ్ళమీద తల ఆనించి మరో చేత్తో తన పాదాలను, కాళ్ళను మృదువుగా నలుపుతుంటే తన కూతురు కృష్ణతేజను తలపిస్తున్నది.‘
మేడమ్‌దగ్గర ఒకరోజు పర్మిషన్‌తీసుకొని తమ ఊరికెళ్ళి మరుసటిరోజే తిరిగివచ్చింది రమ. ఆ రోజు ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వుకు బదులు చిరాకు గమనించారు మేడమ్. సాయంకాలం ఆమెను తన దగ్గరకు పిలుచుకుని కారణమడిగారు.
”నాకు తెలియకుండానే మావాళ్ళు నాకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏకంగా ఓ సంబంధం ఖాయం చేసుకొచ్చాడట మా మామయ్య. ఆయన భార్య తరఫు వాళ్లయి వుంటారు. మామయ్య ఆమె ఒత్తిడికి లొంగి అలా చేసి ఉంటారు. నేను ససేమిరా కాదని వచ్చేశాను మేడమ్.” రమ తన ఆవేదననంతా వెలిబుచ్చింది.
”అంత మాత్రానికే అప్‌సెట్‌అయితే ఎలా రమా! సమస్యల నెదుర్కొనడం నేర్చుకో. నన్ను చూస్తున్నావుగా! రోజూ ఎన్ని ఒత్తిళ్ళు. ధైర్యంగా, స్థిరచిత్తంతో ఎదుర్కొనకపోతే దెబ్బతింటాం.” కొంచెంసేపాగి, ”ఒకసారి మీ అమ్మనిక్కడకు పిలువు” అని ఆదేశించారు మేడమ్.
వారం రోజుల్లో ఒక ఆదివారంనాడు ఊరినుండి రమ వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమెను పిలిచి మేడమ్‌చెప్పారు: ”చూడమ్మా! రమ కష్టపడి పైకి వస్తూన్నది. ఆమె ఇంకా ఎదగాలి. ఆమె ఇష్టం లేకుండా పెళ్ళి ప్రయత్నాలు చేయకండి. ఆమె మీరు గర్వపడేలా చేస్తుంది. మీ ఆశలు, ఆకాంక్షలు ఆమెకు తెలుసు. మరో విషయం. ఊళ్ళో మీరు ఒంటరిగా ఉండడమెందుకు? ఇక్కడికి వచ్చి రమ దగ్గర ఉండండి…”
”సరే మేడమ్! దాని కిష్టం లేని పనేమీ చేయం. ఇక నేను ఇక్కడికి వచ్చి ఉండడం గురించి, కొద్ది రోజుల తర్వాతే అది సాధ్యపడుతుంది”అని చెప్పి మేడమ్‌దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయిందామె.
* * * *
కలెక్టర్‌మేడమ్‌దగ్గర ఉద్యోగంలో చేరి రమకు మూడేళ్ళు కావస్తున్నది. మేడమ్‌కామె స్వంత ఇంటిమనిషి లాగయిపోయింది. అమ్మగారి హృదయంలో నైతే ఆమె పోయిన కూతురు స్థానం నాక్రమించింది. అయినా ఆ అమ్మాయి అణకువలోగాని, విశ్వాసంలోగాని కించిత్తు మార్పు రాలేదు. పదిమంది ఎదుట చాలా జాగ్రత్తగా మసలుకొంటుంది. అంతరంగంలోని భావం బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారే కాని మేడం హృదయంలోను రమ తన పోయిన చెల్లె స్థానాన్ని పూరించింది.
రాత్రిళ్ళు రమ అమ్మగారి గదిలోనే పడుకోవాలి. ఒక్కరాత్రి ఆమె లేకపోతే ఆ రాత్రి అమ్మగారి నిద్ర మాయమైపోతుంది. తన పక్కనే ఓ మంచం వేయించారామె. రమ ఆ మంచాన్ని పక్కకు జరిపి అమ్మగారి మంచం పక్కన నేలమీదనే పరుపు పరచుకుని పడుకుంటుంది.
ఓనాటి రాత్రి రమ అమ్మగారి కాళ్ళకు మసాజ్‌చేస్తున్నది. ”అమ్మా! రమా! ఇలా దగ్గరకు రా” అని ఆమెను తన పక్కనే కూర్చోబెట్టుకుని అడిగారు: ”నీకు ఇంకా చదువుకోవాలని ఉంటే నేను నిన్ను చదివిస్తాను. లేదా ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా చెప్పు!”
”అమ్మగారూ! చిన్నప్పటినుండి నేను కలలు కనేదాన్ని. కార్లు నడపాలని, పెద్ద పెద్ద కార్లు నడపాలని ఉబలాటపడేదాన్ని. ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే వాటిని అలా చూస్తూనే ఉండిపోయేదాన్ని. ఎప్పటికైనా వాటిలాగా నేనూ ఎగరాలని ఉవ్విళ్ళూరేదాన్ని.” ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ, ”పైలట్‌కావాలనుకుంటున్నావా?” అని అడిగారు అమ్మగారు. ఔనన్నట్లుగా తలూపిందా అమ్మాయి. ”నేను అక్కకు చెప్పి దాని కోసం ఏర్పాటు చేయిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు”. ”ఎవరు, మేడమ్‌తోనా అమ్మగారూ?” ఔనని చిరునవ్వుతోనే చెప్పారామె.
అమ్మగారి కోరిక మేరకు కలెక్టర్‌మేడమ్‌రాజధానిలో ఉన్న ఒక ఏవియేషన్‌అకాడమీ వారితో మాట్లాడి సెలెక్షన్‌కోసం రమను పంపించారు. అన్ని అర్హతలు సరిపోవడంతో ఆమెను మెడికల్‌ఎక్జామినేషన్‌కు రెఫర్‌చేశారు. అక్కడా ఆమె అర్హత సాధించింది. పద్దెనిమిది నెలల C.P.L కోర్సులో చేరి విజయవంతంగా పూర్తిచేసింది. ఆ వెంటనే వచ్చి నేరుగా అమ్మగారి కాళ్ళ మీద వాలిపోయింది. ”నా బిడ్డ రేపో, ఎల్లుండో రెక్కలు కట్టుకొని గాలిలో ఎగిరిపోతుంది. దానితో పాటు నేనూ ఎగిరిపోతా”.
”అమ్మా!” కలెక్టర్‌మేడమ్‌నవ్వాపుకోలేకపోయారు.
రమ వెనుకకు తిరిగి ఆమెకు పాదాభివందనం చేసి ”మేడమ్! నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇది కలయా! నిజమా! మీ ఋణం ఎలా తీర్చుకోగలను చెప్పండి!” ఆమె గొంతు జీరబోయింది.
”ఇప్పుడైనా ‘అక్కా!‘ అని పిలువు”. చిరునవ్వులు చిందిస్తూ ”మీరు నాకు ఎప్పుడూ ‘మేడమే!” అంటూ సెల్యూట్‌చేసింది రమ.
మరుసటిరోజు సాయంత్రం కలెక్టరాఫీసులో అభినందన సభ ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ఉషారాణి మేడమ్‌అధ్యక్షత వహించారు. సభకు జిల్లాలోని ఆఫీసర్లు, ఉద్యోగులే కాకుండా పురప్రముఖులనూ ఆహ్వానించారు. అందరూ రమను ఘనంగా సత్కరించి, అభినందించారు. ఆమె తన మెడ నలంకరించిన దండలన్నింటినీ తీసి వినమ్రంగా అమ్మగారి పాదాల చెంత పరిచి సాష్టాంగప్రణామం చేసింది. అమ్మగారు ఆ బిడ్డను ఎత్తి ఆలింగనం చేసుకుని కరతాళ ధ్వనుల మధ్య ఆశీర్వదించారు. తనకు బహూకరించిన అభినందన పత్రాలను ఆ అమ్మాయి కలెక్టర్‌మేడమ్‌దోసిట్లో ఉంచి ఆమె పాదాలకు నమస్కరించింది. రమను ఎత్తి నిండుసభలో ఆమెను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించి కలెక్టర్‌గారు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. సభికులందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
ఈ వార్త జిల్లాలో, జిల్లా బయటా ప్రచండ మారుతంలా వ్యాపించింది. స్కూళ్ళలో, కాలేజీల్లో యువతీ యువకులు సంబరాలు చేసుకొన్నారు. ఎవరిని కదిలించినా ‘పైలట్‌రమ‘ పేరే వినిపిస్తూన్నది. ‘మారుమూల గ్రామ మహిళా పైలట్!‘
m m m
ఎగిరే పతంగమా
ఎందాకా నీ పయనం
ఆకాశం అందుకోవాలన్న ఆశ
కానీ దారం తోడు లేక
గాలి సహాయం లేక
ఎత్తు ఎగరలేక
ఎగిరించే వాళ్ళు లేక
వ్యర్థమే కదా నీవు!!
పెద్దవి చిన్నవి
సప్తవర్ణ శోభితం
పూలు,జంతువులు,ఆకులు,చెట్లు
ఎన్నెన్ని బొమ్మలో నీ ఒంటిలో
హనుమంతుడిలా అందమైన తోక
ఆనందంగా ఎగిరిపోతావ్ గాలిలో
ఏదైనా తగిలినా
ఎవరైనా కోసినా
ఎక్కడ వచ్చి పడతావో
ఎన్ని ముక్కలవుతావో!!
సంక్రాంతి వేళలో
పిల్లా పెద్దా అందరూ నీ తోటే ఆట
తిండి తిప్పలు మరచి
డాబాల మీద గ్రౌండ్ లలో
పోటాపోటీగా పతంగులను
మాంజ కట్టి ఎగురేసి
మజా చేసుడే!!

వెనకముందు చూడక
ఆవేశంతో ఆహ్లాదంతో
ఎగురేసి కిందపడి పోవుడో
దెబ్బల రుచి చూసుడో!!
ఏది ఏమైనా ఎవరిమీద ఆశపడక
నీ కాళ్ళ మీద నీవు నిలబడు మనిషి
యుక్తి శక్తి తోడు
గాలి వాటంతో పోయే గాలిపటం ఎగిరితే పడిపోక తప్పదు
తోడులేని గాలిపటం
తోకతెగిన పక్షి!!!
ఎన్నో ఒడిదుడుకులతో ఎదిగే మనిషి
నేర్పుతుంది పాఠం గాలిపటం
కష్టం లేక పోలేవు ముందుకు
ముళ్ల చెట్టు మీద పడ్డ వచ్చును చేటు
జాగ్రత్తగా పైకి వెళితే గాలిలో ఆనంద సంచారం
పవనం లేకుంటే పతనమే
గాలిపటం లాంటి జీవితం
జాగ్రత్త జర భద్రం మనిషి!!
గడియారం కొట్టే గంట కోసం
సంబరంగా నిరీక్షణ
గుండెకు సవ్వడులను పులిమి
కొత్త కాంతి రేఖలకై తపన !
ఆ క్షణం మిగిలేదా? ముగిసేదా?
ఏమీ తెలియని అనిశ్చితి
అదొక భ్రాంతి మోహచక్రం
ఆశా సుగంధాలను చిమ్మి
వెంపర్లాడమంటుంది వాటికై
ఇగురులొత్తే మనసుతో
ఆ దారుల వెంట పరుగులెత్తి
అలసి పోతూనే ఉన్నావు
మనిషిగా చస్తూనే ఉన్నావు
అనుభవాల కొలిమిలో సాగి
పర్యవసానంగా మిగిలే జీవితాలకు
గతం గుర్తుకు రాదెందుకో
వేసే ప్రతీ అడుగుకీ
వెనకటి జ్ఞాపకం ఓ చరిత్ర
నిన్ను నిన్నుగా తీర్చుకునే
గుణపాఠాల ఉలి దెబ్బ
వత్సరాలు మారడం
గాయాలను మాన్పించడం
స్మృతులను మరపించడం
కాలానికి కొత్త కాదు
చెరిగిపోయే గీతకు ముందే
చెరగని సంకేతాన్ని ముద్రించడమే
మనిషికి అసలైన కాంతి !!
పాత, కొత్త సంవత్సరం ఏదయినా
చేదు, తీపి జ్ఞాపకాల సమ్మిళితం
కాలం చేసిన గాయలకు మధుర స్మృతుల
మలాము రాద్దాం.
దేశానికి వెన్నుముకైన రైతన్నలకు
వెన్ను దన్నుగా నిలుద్దాం.
దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైనికులకు
ఉత్తేజాన్నిద్దాం.
క్షీణిస్తున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి
నడుం బిగిద్దాం
ఆకలితో అలమటిస్తున్న అన్నార్థుల ఆకలి తీరుద్దాం
పసిమొగ్గలను సైతం నలిపేసే కీచకులనుండి
స్త్రీలను రక్షించడానికి కంచెగా మారుదాం
సాయంకోరే వారికి ఆపన్నహస్తం అందిద్దాం
మొత్తంగా మనిషిలో మానవత్వాన్ని నిద్రలేపుదాం
సౌభ్రాతృత్వాన్ని పెంపొద్దిద్దాం
దైవత్వాన్ని ప్రేరేపిద్దాం
వసుధైక కుటుంబంగా జీవిద్దాం.
నూతన సంవత్సర శుభాకాంక్షలతో
తెలంగాణలో దోమకొండ సంస్థానం చేస్తున్న సాహితీసేవ అమూల్యమైందని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తంగెడు కిషన్ రావు అన్నారు. ఈ నెల 6 వ తేదీన కామారెడ్డి జిల్లా దోమకొండ గడి కోటలో జరిగిన ‘తెలంగాణ సంస్థానాల సాహిత్య సేవ’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా శ్రీవేంకటేశ్వరవిశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.జయరామరెడ్డి పాల్గొని ప్రసంగిస్తూ తెలుగు సాహిత్యంలో సంస్థానాల పాత్ర విశిష్టమైందని అన్నారు.మరొక విశిష్ట అతిథి కామారెడ్డి జిల్లా పూర్వ పాలనాధికారి డాక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రసంగిస్తూ దోమకొండకోటలో పలు సామాజికాభివృద్ధి కార్యక్రమాలు జరగడం హర్షణీయం అన్నారు. సభకు స్వాగతం పలికిన సంస్థాన పాలకుల వారసులు అనిల్ కామినేని మాట్లాడుతూ తమ పూర్వికులు నడచిన మార్గంలో సాహిత్యసేవను కొనసాగించడానికే ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ప్రముఖ కవి డా.ఏనుగు నరసింహారెడ్డి సంస్థాన సాహిత్య వికాసంపై విపులంగా ప్రసంగించారు. ప్రముఖ చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు డా.లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


ప్రముఖ నృత్య దర్శకురాలు మధుమతి కులకర్ణి శిక్షణలో పలువురు నృత్యవిద్యార్థినులు చేసిన స్వాగత నృత్యం అందరినీ ఆకట్టుకొన్నది. అనంతరం ప్రారంభమైన తొలి సదస్సుకు డాక్టర్ లక్ష్మణచక్రవర్తి, బాబ్జీ జాలాది సమన్వయకర్తలుగా వ్యవహరించారు.ప్రముఖ పరిశోధక పండితుడు వైద్యం వేంకటేశ్వరాచార్యుల అధ్యక్షతన పలు సంస్థానాలలోని సాహిత్యసేవలపై వక్తలు ప్రసంగించారు. ప్రముఖ పరిశోధకులు, రచయితలు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు, డాక్టర్ అంబటి భానుప్రకాశ్,అబ్దుల్ అజీజ్, డాక్టర్ జి.శ్యామసుందర్, డాక్టర్ నాయకంటి నరసింహశర్మ, డాక్టర్ ఎం.అనంతకుమారశర్మ, డాక్టర్ తాడేపల్లి పతంజలి, డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, శాస్త్రుల రఘురామశర్మ, బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ వడ్ల శంకరయ్య తదితరులు వివిధ సంస్థానాల పరిధిలో జరిగిన సాహిత కృషిపై పత్ర సమర్పణలు చేశారు. వేదార్థంమధుసూదనశర్మ అనుసంధానకర్తగా వ్యవహరించారు. సదస్సులో పత్ర సమర్పణలు చేసిన పరిశోధకులను దోమకొండ సంస్థానాధీశులు అనిల్ కామినేని ఘనంగా సత్కరించారు.
ఈ సదస్సుకు ఆత్మీయ అతిథులుగా అమరచింత, ఆత్మకూరు, ఆలంపూరు, ఆనెగొంది, గద్వాల, గోపాలపేట, జటప్రోలు, కొల్లాపూరు, సిర్నాపల్లి, నారాయణపేట, పాపన్నపేట, పాల్వంచ, మునగాల, బేతవోలు, రాజాపేట, సురపురం సంస్థానాల వారసులు హాజరయ్యారు.


అనంతరం జరిగిన కవిసమ్మేళనానికి ప్రముఖ విద్వత్కవి, దాశరథి సాహితీ పురస్కార గ్రహీత డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ అధ్యక్షత వహించారు. డాక్టర్ బోచ్కర్ ఓంప్రకాశ్ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ కవిసమ్మేళనంలో డాక్టర్ వెలుదండ సత్యనారాయణ, గుమ్మన్నగారి బాలసరస్వతి, బండకాడి అంజయ్యగౌడ్, డాక్టర్ శాస్త్రుల రఘుపతి, సాయిప్రసాద్, మంచినీళ్ల సరస్వతీరామశర్మ, కొరిడె విశ్వనాథశర్మ, ప్రసాదం స్వాతి, చింతా రామకృష్ణారావు, పబ్బా విజయశ్రీ తదితరులు కవితాగానం చేశారు.
సదస్సు ముగింపులో సాయంకాలం ఆరుగంటలకు ‘ప్రతాపరుద్రవిజయం’ సాహితీరూపకప్రదర్శన జరిగింది.డాక్టర్ సంగనభట్ల నరసయ్య రచించి, దర్శకత్వం వహించిన ఈ రూపకానికి మరుమాముల దత్తాత్రేయశర్మ నిర్వాహకులుగా వ్యవహరించారు. హైదరాబాదులోని అభ్యుదయకళావికాస్ సంస్థ నిర్వహణలో కొనసాగిన ఈ రూపకానికి ప్రముఖసంగీతదర్శకులు దేశపతి శ్రీనివాస్ శర్మ సంగీతాన్ని సమకూర్చారు.ఎం.ఆనంద్ వ్యాఖ్యాతగా వ్యవహరించి రక్తి కట్టించారు.

దోమకొండసంస్థానవారసుల నిర్వహణలో ఒకరోజు సాహితీసదస్సు ఎన్నో మధురానుభూతులను పంచింది.ఈ సదస్సులో పాల్గొన్న అందరికీ సంస్థానం పక్షాన అనిల్ కామినేని సత్కారాలు చేసి, కృతజ్ఞతలను చెప్పగా ఈ సదస్సు అద్వితీయంగా ముగిసింది.
ఇటలీ దేశంలో వెరోనా అనే పట్టణం. అక్కడ ధనికులైన క్యాపులెట్లు మరియు మోన్ ట్యాగో కుటుంబాలు ఉండేవి. వారి ఇద్దరి మధ్యన చాలా వైరం ఉండేది. వారే కాదు, వాళ్ళ నౌకర్లు కూడా ఒకరినొకరు సహించేవారు కాదు. వారు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగేది.
క్యాపులెట్ల కుటుంబంలోని ఒక అందమైన అమ్మాయి జూలియట్. మొంటాగ్ కుటుంబంలోని రోమియో అనే అబ్బాయి.
లార్డు క్యాపులెట్ ఒక పార్టీ ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించమని నౌకర్లతో చెప్పాడు. అప్పుడు మారువేషంలో ఉన్న రోమియో కూడా పార్టీలో చేరాడు. అక్కడ అతను ఒక మూలన కూర్చున్న అందమైన అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమె కూడా అతణ్ణి ఇష్టపడుతుంది. ఆమే జూలియట్.

వారి వివాహానికి మత సభ్యుడు (ఫ్రియర్) సరే అంటాడు. దీనితో ఆ రెండు కుటుంబాల మధ్య వున్న వివాదం కూడా సమసిపోగలదని అనుకొని వారి వివాహం చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆమె నౌకర్ల సహాయంలో రోమియో తోటలోకి దూకాడు. ఆమె బంగ్లా పైనుండి చీర కిందికి జార విడిచింది. అది పట్టుకొని అతడు బంగ్లా పైకి ఎక్కి ఆ రాత్రి వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. అది ఎవరికి తెలియదు. ఒకరి కొరకు ఒకరు తపించేవారు. అయితే జూలియట్ తండ్రి ఆమె వివాహం పారిస్ అనే అబ్బాయితో నిశ్చయించాడు. కాని ఆ సంబంధం తప్పించుకునేందుకు ఫ్రయర్ సహాయం కోరారు. జ్యూలియట్ మరియు రోమియో లది స్వచ్ఛమైన గ్రహించిన ఫ్రయర్ ఒక ఉపాయం చెప్పాడు.
జూలియట్ తండ్రి వీరి పెండ్లి కొరకు గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు. తీరా పెండ్లిరోజు ప్రయర్ సలహా ప్రకారం ఆమె చనిపోయినట్లు ఉండేందుకు నిద్రగోలీలు వేసుకొని పడుకుంటుంది. ఆమెను స్మశానం గొయ్యిలో పడుకోబెడుతారు. అప్పుడు ఫ్రయర్ సలహా ప్రకారం ఆమెకు నిద్ర నుండి తెలివి వచ్చేవరకు రోమియో వచ్చి ఆమెను లేపి తీసుకుపోవాలి. కానీ ఈ సలహా లేఖ అతనికి అందలేదు. ఎందుకంటే అతడు తన మిత్రుడు మెరికూషియోన్ను టైబాలుటు చంపినందుకు అతడిని రోమియో చంపేశాడు. అందుకు అక్కడి రాకుమారుడు ఎస్ క్యాలస్ రోమియోను దేశ బహిష్కరణ చేశాడు. అందువలన ఫ్రయర్ వేసిన ప్లాన్ అతనికి అందలేదు. అయినా ప్రపంచంలో చెడువార్తలు త్వరగా చేరుతాయి మంచివాటికన్నా ముందు. జూలియట్ మరణవార్త తెలిసి రోమియో ఆమె సమాధి వద్దకు వెళుతున్న సమయంలో పారిస్ అడ్డుపడుతాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగి పారిస్ చనిపోతాడు. ప్రాణం పోయే చివరిథలో తనను జూలియట్ దగ్గరిలో పడుకోబెట్టమని కోరుతాడు. అట్లే చేశాడు రోమియో. రోమియో జూలియట్ మరణించి గొయ్యిలో పడివున్న దాన్ని చూసి మానసిక బాధ భరించలేక విషం తాగి చనిపోయాడు. ఇంతలో జూలియట్ మెలకువ వచ్చి ప్రక్కన ఉన్న శవాలను చూసి తీవ్రమైన బాధతో రోమియో బాకుతో తననుతాను పొడుచుకొని చనిపోతుంది.
ఎస్ క్యాలస్ రెండు కుటుంబాలను శాంతింప చేశాడు. అందువలన వాళ్ళ మధ్య వైరం పోయి స్నేహం ఏర్పడింది. మోన్ ట్యాగులు బంగారంతో జూలియట్ విగ్రహం మరియు క్యాపులెట్లు రోమియో బంగారు విగ్రహం ప్రక్కపక్కన నిలబెడుతామని వాగ్ధానం చేశారు.
”ఇటువంటి విషాధ ఘటన కథ జూలియట్ మరియు రోమియోలది, బహుశా ఇంతకుముందు ఎక్కడ జరగలేదేమో అని” రాకుమారుడు ఎస్ క్యాలస్ ప్రకటించాడు.
షేక్స్ పియర్ ఆంగ్లంలో 22 పేజీల్లో రచించిన కథ 2 పేజీల్లో తెలుగులో దాని సారాంశం ఇది. ఇక షేక్స్ పియర్ గురించి కొంత తెలుసుకుందాం.
చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ పుట్టిన తేదీ – 3-1-1939. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
తండ్రి గారు – పొడిచేటి వీరరాఘవచార్యులు గారు (కీ.శే.) భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానం, ప్రధానార్చకులు, ఆగమశాస్త్ర పండితులు.
ఏడేళ్ల వయస్సులో కవితారచన ప్రారంభించారు లక్ష్మీ నరసమ్మ. గాంధీజీ మరణవార్త విని ”భారత జనకుడు ఇక లేడు. గాంధీతాత ఇకలేడు” అంటూ కవితా ప్రస్థానం సాగించారు. వీరికి బాల్యవివాహం జరగడం , కొద్ది కాలానికే వివాహంభగ్నం కూడా అయ్యింది అనడానికి ఓ నిదర్శనం వీరిని – బావిలో పడద్రోయటం పెద్ద ఋజువు. పాలేర్లు బయటకు తీసి ప్రాణం రక్షించారు. పదిహేనేళ్ల ప్రాయంలో ఈ కష్టాన్ని మోసుకొని పుట్టింటికి రావడం తో లక్ష్మీ నరసమ్మ గారి జీవితం లో పెను మార్పులు వచ్చాయి. ప్రైవేటుగా హిందీ పరీక్షలు వ్రాయటం, పద్యాలు వ్రాయడం వంటివి వీరి చిన్ననాటి ప్రతిభకు ఉదాహరణలు.
దక్షిణ భారత హిందీ ప్రచార సభలో రాష్ట్ర భాష హిందీ ఉత్తీర్ణత సాధించిన ఘనులు.- ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ముఖ్యంగా గోల్కొండ పత్రిక, ప్రజామత ఇలా అనేక పత్రికలలో కథలు, గేయాలు, వచన కవితలు ప్రచురించి ప్రోత్సహించాయని వీరు చెప్తుంటారు.
అంధ్రా మెట్రిక్ ప్రైవేటుగా వ్రాసి, ఉత్తీర్ణులైననారు. ఇల్లందు బి.టి.ఎస్.లో ఎస్.జి.బి.టి. 2 సంవత్సరాలు చదివారు.1964లో భద్రాచలం మల్టీపర్పస్ హైస్కూలులో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం ప్రారంభం.హైస్కూలు కాలేజీ అయింది. ఉద్యోగం చేస్తూ పి.యు.సి., బి.ఏ., ఎం.ఏ. తెలుగు సాహిత్యం అన్నీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.

ఉద్యోగం జీవితంలో అనేక విజయాలు సాధించిన ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. లక్ష్మీ నరసమ్మ 1985-86 ప్రాంతంలో వాచకాల సెలక్షన్ కమిటీలో 2 సార్లు పాల్గొన్నారు.- బెంగుళూరు రీజనల్ కాలేజీకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌తో పాల్గొన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయినిగా విద్యార్థులతో మంచి అనుబంధం ఏర్పడింది. – వృత్తి – ప్రవృత్తి రెండు ప్రాణంగా, రెండు కళ్ళుగా భావించి అక్షరయాత్ర చేస్తూనే ఉన్నారు. నాటినుండి నేటికి ఆపలేదు. 1999 సం|| ఉద్యోగ విరమణ చేసారు. సెకండరీ గ్రేడ్, గ్రేడ్-2 తెలుగు పండిట్, గ్రేడ్1 తెలుగు పండిట్‌గా ఉద్యోగ నిర్వహణ, విరమణ తర్వాత కూడా 3 సంబబ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తెలుగు బోధన విభాగంలో ఉన్నారు.
1981లో కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వీరు ఉద్యోగం చేస్తున్న భద్రాచలం జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి వచ్చినప్పుడు లక్ష్మి నరసమ్మ గారి కి ”అభినవ మొల్ల” బిరుదు ప్రదానం చేశారు.
కరుణశ్రీ, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి, ఆచార్య కులశేఖరరావు గారు, ఆచార్య బిరుదు రాజురామరాజు గారు, ఆచార్య తిరుమల, ఆచార్య ఎన్.గోపీ గారు , ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, దుగ్గిరాల రామారావు గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఇలా ఎందరో మహనీయుల మన్ననలందుకున్న లక్ష్మీ నరసమ్మ గారి కి వందల కొలది సన్మాలు జరిగాయి.
తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు వీరిని కొన్ని కవితలు ఆంగ్లానువాదం చేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఏదో ఒక పురస్కారం గ్రహిస్తూనే ఉన్నారు. తిరుపతి ప్రపంచ మహాసభలు, హైదరాబాదు ప్రపంచ మహాసభలు ఆహ్వానించి సన్మానించాయి.
”ఆడపిల్ల” కవితను వెన్నెల-3 అనే తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి గౌరవించాయి. సమతాభిరామం (భద్రగిరిధామ శతకం) – ఇందులో ప్రకృతిలో పరమాత్మ రామదాసు దాశరథీ శతకం వలెనే ” భద్రగిరి ధామ రఘోత్తమ శ్రీమనోహరా !” పద్యాలన్నింట ఒకేయతి స్థానం తో , ఉత్పల – చంపకమాలలు. శ్రీపథం – ఆళ్వారులు రచించిన ఆరు దిద్యప్త బంధాలకు అనుసృజన – ఇందు గోదాదేవి రచించిన తిరుప్పావై ప్రధానం. ఆటవెలదులు, సీసములు, శార్దూల, మత్తేభాల ఛందస్సు. అక్షర తర్పణం – తండ్రిగారైన వీరరాఘవాచార్యుల గారికి కుమార్తెగా కవితాక్షర తర్పణం (పద్యకావ్యం). మారుతీ సుప్రభాతం – ఇవి తెలుగు పద్యాలు – భక్తిభావ భరిత మేలుకొల్పులు. యోగానంద లక్ష్మీనృశింహ సుప్రభాతం – రాముని ఆలయం కంటే అతి ప్రాచీన దేవాలయం – భద్రాద్రి యోగానందుడు క్షేత్రపాలకుడు. పద్యాల్లో మేలుకొల్పులు రాసారు . నీరాజనం – పద్యకవితా సంపుటి : సమాజానికి ప్రతిబింబంగా అనేక విషయాలు. సమస్యాపూరణ : ఒకానొకప్పుడు ఆకాశవాణిలో ప్రసారమైన పూరణలు. మరి అవధానంలో అవధాని కాకుండా ఈ కవయిత్రి పూరణలు మధువని – పాటలు, గేయాలు. కావ్యగౌతమి – ఇందులో అచ్చులో వెలుగు చూసిన కావ్యాల సంకలనం. రామదాసు, సమతాభిరామం, నీరాజనం, శాంతిభిక్ష, ‘కవితాధనుస్సు’ మొదలైన 11 కావ్యాల సంకలనం. స్వరార్చన – భారతదేశంలో పుణ్యక్షేత్రాల వర్ణానాత్మక చంపూకావ్యాన్ని రచించారు. ఒకానొక కోకిల భారతదేశంలో పుణ్యక్షేత్రాలను సామాజిక స్పృహతో దర్శించి చివరగా భద్రాద్రి రాముని పాదాలపై తులసీదళమై మోక్షాన్ని పొందుతుంది. గోదాకళ్యాణం – రాయలవారు రచించిన ఆముక్త మాల్యద కథను నవలారూపంలో రచింప బడింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీలో ఎం.ఫిల్ చేయబడింది. భద్రాచల క్షేత్ర చరిత్ర – తానీషా – భద్రాచల క్షేత్ర మాహాత్మ్యము – రేడియో నాటకాలు అన్ని కేంద్రాల నుండి ప్రసారం – రేడియో కళాకారులతో కలిసి కేంద్రాల నుండి ప్రసారమయ్యాయి. మాతృభూమి – గజనీ దండయాత్ర కథ. రాజపుత్రుల వీరగాథ (చరిత్రాత్మక కథ) గడియారం వెంకటశేష శాస్త్రి పురస్కారం. దివ్య గీతాంజలి – రవీంద్రుని గీతాంజలి వలె జీవాత్మ పరమాత్మల సంబంధం. జీవనాయిక పరమాత్మ కోసం పడే తపన. ఇది వచన కవిత. నమ్మాళ్వారు రచించిన నాలాయిర దివ్వ ప్రబంధానికి (తమిళం) అనుసృజన. సుందరకాండ – పద్యాంజలి – ద్విపద అచ్చులో ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు. నేటి సామాజికాంశాలు మరియు ఆయా సందర్భాలలో ప్రముఖ వ్యక్తుల విశేషాలు, అభినందనలు, అక్షరాంజలులు.
చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ సంప్రదాయ కవిత్వంలోనూ ఆధునిక విప్లవ భావాలను రాసిన తెలంగాణ ముద్దుబిడ్డ. చైతన్యరహితంగా ఆడవాళ్ళను చులకన చేస్తూ, వాళ్ళ అస్తిత్వంపై దెబ్బకొట్టే ప్రబుద్ధులకు వీరి కవిత్వం ఓ చెంపపెట్టు.
”ఆమె / కాదు కేవలం / ఒక భామ / ఈ తరం సత్యభామ/ ఆమె కాదు కేవలం అభిసారిక/ ఆమె ఈ విశ్వనాటక ప్రథమ భూమిక/లేవామెకు కులుకులు / లేవామెకు అలకలు/లేవామెకు సపత్నీ మత్సరాలు/లేనేలేవామెకు కోపగృహాలు/కాని, ఆమ ధరించిందొక కవితా ధనుస్సు
చీల్చి వేస్తున్నది, జీవన విషాద తమస్సు” అంటూ కణకణమండే నిప్పు కణికల్ని గళంలో గరళంలా దాచుకొని పెల్లుబికిన భావావేశంతో కవిత్వాన్ని సంధించింది. ఈ కవిత వీరు 1980లలోనే రాసారు. స్వీయానుభవాలను పురాణ గాథల నాయికల ప్రతీకలతో పరోక్షంగా చూపిస్తూ రాసినీ కవిత తరతరాల స్త్రీజాతి బ్రతుకుకు చిత్రిక పడ్తున్నది. కట్టుకున్నవాడో, అతని తల్లిదండ్రులో అవమానపరుస్తూ, హింసిస్తే ఇదిగో ఇట్లా కవితా ధనుస్సును ఎత్తినట్లు ఆలోచనా ధనస్సును ఎక్కుపెట్టాలి. ఈ జీవితం ఎడారిపుష్పంగా చేయవద్దు. వాళ్ళతో కలిసి జీవించేందుకు మంచితనాన్ని బాణంగా ఓర్పును ధనుస్సుగా చేసి ప్రయత్నించాలి. ఎన్నో ప్రయత్నాలు చేసినా పరిస్థితుల్లో మార్పు లేకుంటే, పెద్దల సహకార సలహాలు తీసుకోవాలి. అప్పుడూ అట్లాగే ఉంటే వాళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నమైనా చేయాలేగాని జీవితాన్ని అంతం చేసుకోకూడదు. లక్ష్మీనరసమ్మగారి జీవితం ఇందుకు ఆదర్శం. కష్టాలను ఎదుర్కొని తగిన నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఇప్పటికీ వారి ఈ 80వ థకంలోనూ రచనలు చేస్తున్నారు. తన ఇష్టదైవమైన భద్రాద్రిరామునికి సేవలూ చేస్తున్నారు.
తమ పదహారేళ్ళ ప్రాయంలో తల్లిగారింటికి వచ్చినప్పుడు ఆమె ఒంటరి మనస్సుకు తల్లిదండ్రులు నరసమాంబ, కొడిచేటి రాఘవాచార్యులు బాసటగా నిలిచారు. లక్ష్మీనరసమ్మగారు ఇల్లిందల, కొత్తగూడెం దగ్గర చదువుకున్నారు. సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రెయినింగ్ అనే రెండేళ్ళ కోర్సును 1962-64లలో పూర్తి చేశారు. ఇక్కడే వీరు జీవితాన్ని నేర్చుకున్నారు, భారతదేశాన్ని కాపాడుకోగలిగే జ్ఞానాన్నీ నేర్చుకున్నారు. చైనాతో యుద్ధం అయితే అవసరార్థం వీళ్ళను బార్డర్‌కు పంపిస్తారని కట్లు ఎట్లా కట్టాలో అత్యవసరసేవలు ఎట్లా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. ఆ స్థితి రాలేదు గానీ, తమ పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకునే నైపుణ్యాన్ని సాధించుకున్నారు. ఇక వెనుదిరిగలేదు. చదువుకున్నారు. డిగ్రీలు సాధించారు.
1964 ‘భద్రగిరి’ అనే నవలను రాశారు. దాశరథిగారు ఈ నవలకు ముందు మాట రాశారు. ఆనాటి కృష్ణాపత్రిక, గోలకొండ పత్రికల్లో వీరి వ్యాసాలు వచ్చేవి. దాదాపు ఓ 10 సంవత్సరాలు పత్రికా వ్యాసంగంలో ఉన్నారు. మొల్ల తరిగొండ వెంగమాంబల స్థాయిలో వీరి కవిత్వం ఉన్నదని పేరును పొందారు.
‘సోమనాథ విజయం’ అనే ఆధునిక చంపూకావ్యాన్ని ‘రామదాసు’ పద్య కావ్యాన్నీ రాశారు.
”భద్రాద్రి ముంగిట వరకల్పవల్లీ/రాముని పాదాల పాద్యాల వెల్లీ
నా కవితలై పొంగవే ! గోదారి తల్లి” అంటూ భద్రాచల క్షేత్రంపై రాసినట్టే ఇప్పటివరకు వీరి కవిత్వ రచనా ప్రవాహం సాగుతూనే ఉన్నది.
”ఈ కారుచీకట్లను / నీ చేతి చిరుదీపం జయిస్తుంది/ మానవతా శీతశీకరాల / జల్లులో నీ మనోభూమి తడిసి/ఆత్మవిశ్వాస బీజం మొలకెత్తుతుంది / మొగ్గలా నీ అజ్ఞానం నిద్దుర/విజ్ఞానపు వెలుగు కోసం / గుండెలు విప్పుతుంది/వేకువ వస్తుంది / …. అపుడు ఒకేజాతి / ఒకే నీతి/నిలుస్తుందని / ఆశవుంది” అంటూ ఆశావహకంగా వ్రాసిన తీరు ఆలోచనా త్మకంగా ఉన్నది. వీరి అనుభవాలను చరవాణిలో పంచుకుంటూ, వీరు కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పటి విషయాల్ని చెప్పారు. ” ‘సమతాభిరామం’ అనే కవితాసంపుటిలో ఆధ్యాత్మిక భావాలతో రాసాను, సామాజికాంశాలది కాదు ఇది అంటే, ”రామ స్పృహే సామాజిక స్పృహ – ఇంకేముంటుందమ్మా. ఆధ్యాత్మికత లేని సామాజికత ఉండదు” అన్నారట వారి కళాశాల ప్రిన్సిపల్ సామల సదాశివగారు ఆనాడు.
లక్ష్మీనరసమ్మగారు 3వ తరగతిలో ఉన్నప్పుడే ‘మహాత్మాగాంధి ఇక లేడు’ అనే గేయంలో గాంధీ తాతను గురించి వ్రాశారంటే ఆశ్చర్యపోవడం నావంతైంది. వీరికి మనదేశం రాజకీయాలైనా, ప్రపంచ విషయాలైనా మంచి అవగాహన ఉన్నది. ‘మతం మత్తులో’ అనే కవిత ”పంచనదీ వీచికలు / విపంచికలై / ప్రపంచ శాంతి వినిపించిన చోట / మతం మత్తు / మానవతను ఉరితీసింది/ ఆదిగ్రంథం అవతరించి/ అమృత చషకమై…/…./” ఇట్లా సాగిన ఈ కవిత ”శాంతిని తరిమి వేసిందని” ముగిస్తారు. పంజాబ్ దుర్వార్త విని రాసిందీ కవిత. ‘వసంతమూర్తి’ కవితలో…
”నిరుపేద దోసిళ్ళ నింపి కన్నీళ్ళతో/ కడిగెనీ కాళ్మొక్క కన్నెపడుచు/ జాలిచూపుల పూలు జోలినిండుగ దెచ్చి/ పూజింప పిలచెనో పూలపిల్ల/ కరిగిన స్వప్నాల కర్హార మధువుల/ నారబోసెనొక యభాగ్య యువతి/ కడుపులో బడబాగ్ని కర్పూర కళికగా
అందించెనొక్క కక్షుధార్త హృదయ” అంటూ ఉగాది పచ్చడిలో మానవాభ్యు దయము ఆకాంక్షిస్తూ వీరు ”ఒక వసంతగమన వేళలో…”, ”రమ్ము వేంచేయు మఖిల విశ్వముపైకి / హర్షమొలికింప నూతన వర్షమూర్తి” అంటూ నిరుపేద కన్నెపిల్ల వైపునుంచీ, జాలిచూపుల పూలు తెచ్చిన పూలపిల్ల వైపునుంచీ, ‘కరిగిన స్వప్నాల కల్లార మధువులారబోసిన అభాగ్య యువతి వైపునుంచీ కొత్త సంవత్సరానికి విన్నపం చేయడం గమనిస్తాం.
వీరు రాసిన ‘శతక శంఖారామం’ను ‘స్త్రీ మనోహర శతకం’ అంటూ పదివారాలు ఈ.టి.వి.లో జొన్నవిత్తుల రామలింగేశ్వర శాస్త్రి చెప్పడం వీరి కవిత్వ భావాలెంతో ఉన్నతంగా ఉన్నవో తెలుస్తుంది. ఇప్పుడు వీరు ‘సుందరకాండ’ను రాస్తున్నారు. ఇది ద్విపద కావ్యం. ఈ ఆధునికకాలంలో ఇంతవరకూ రాలేదు. ద్విపద తేలికగా హృదయాల్లోకి చేరుతుంది. అందులోనూ మంజరీద్విపదకు యతులు ప్రాసలు వంటి నియమాలు లేకుండా గానయోగ్యంగా ఉంటుంది. ఆనాడు గోనబుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, తాళ్ళపాక తిమ్మక ‘సుభద్రా కళ్యాణం’ గమనిస్తాం.
‘కన్యామేధం’ కవితలో ఛందోబద్ధ కవిత్వం రాసినా సామాజిక స్పృహతో-
ఉ|| ఎవ్వతెవీవు చెల్లి, సెలయేటిని బాసిన తమ్మిపువ్వటుల్
ఇవ్విధి వాడిపోయితివి, యెవ్వరు మాట సూటిపోటిరాల్
రువ్వినవారు, కాపురములో నిటునిప్పులు బోసినారు, వా
రెవ్వరో కాదు ఈ మనుషులే, వరకట్న పిశాచులే!
అంటూ ఆడవాళ్ళ కష్టాలకు కారణాలేమిటో చెప్తారు. వివాదాలు విషాద గీతాలై, వివాహ సంబంధాన్ని ఎట్లా విఘాతం చేస్తారో లక్ష్మీనరసమ్మగారు చెప్తూనే…
”ఓ మానవాభ్యుదయ మూర్తి, ఓ సుకీర్తి! / కర్మవీర ! ఓ భారత ధర్మవీర/ ఓయి! వీర విద్యార్థి! లేవోయి! దీక్ష
బూనవోయి! కట్నాలు ముట్టననుచు! అంటూ అబ్బాయిలకు పిలుపునిచ్చారు. 1980లలో ఆకాశవాణి విజయవాడ అంటూ కేంద్రం నుండి ప్రసారమైన కవిత! బెంగుళూర్ ఇంటర్నేషనల్ కాలేజీవారు వీరికి డాక్టరేట్ ఇచ్చారు. ‘భద్రగిరి నానీలు’ అని 120 నానీలు ఉన్నాయి” సంప్రదాయ కవిత్వం వదిలిపెట్టని కవులు నా నానీలు రాయడం గర్వకారణం” అన్నారు. డా|| ఎన్.గోపీగారన్నారు. దాదాపు 23 పుస్తకాలు రాసిన వీరిని ఎన్నో పురస్కారాలు తీసుకున్న వీరి ‘ఆడపిల్ల’ అనే కవితను తెలంగాణ ప్రభుత్వం వెన్నెల-3లో 8వ తరగతి వారికి పాఠ్యాంశంగా పెట్టారు.
”జీవితపు సానమీద అరిగిపోతున్న / పరిమళాలు వెదజల్లే / మంచిగంధపు చెక్క” అంటూ వీరు రాసిన కవితను పద్యాంజలిలో విద్యార్థులకు అందివ్వడం ముదావహం. ఆడవాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు, సామాజిక స్పృహతో రాస్తున్న చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారి కలాన్ని సంధించారు. ఆ అంతుబట్టని సునామీలు ఆపాలని కవిత్వ వారధి అయ్యారు. అవుతున్నారు.
చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారు మహిళా లోకంలో మరొక మొల్లగా అవతరించింది అని కొనియాడబడ్డారు.
‘రామదాసు’ కావ్యాన్ని మనోజ్ఞంగా అల్లారు. ”రామపద్బా మరంద మాధురీ భోజన రాజమంసి’ అంటూ హృదయోల్లాసం కవిత్వం రాసిన లక్ష్మీనరసమ్మ గారు ఆనాటి మొల్ల, తరిగొండ వెంగమాంబ స్థాయివారు పూర్వ సాహిత్య కవయిత్రుల కోవకు చెందినవారు. వారు వారి రచనల్లో ఎన్ని పాత్రలను సృష్టించి సమాజానికి సుతిమెత్తగా బుద్ధి చెప్పించారు
(నమస్తే తెలంగాణా సౌజన్యంతో)
