మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

ఆమె కలం…ప్రార్థన కూడా…ప్రబోధం కూడా…

by రంగరాజు పద్మజ May 31, 2026
written by రంగరాజు పద్మజ

ప్రముఖ రచయిత్రి వీణా రెడ్డిగారితో మయూఖ ముఖాముఖి. పరిచయం చేస్తున్నది రంగరాజుపద్మజను….

భక్తి దీప్తి, సమాజానికి దిక్సూచి వంటిది ఆమె పరిచయం…
ఒక ఆధ్యాత్మిక రచయిత్రితో అంతర్ముఖ సంభాషణ… చేసినప్పుడు ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలిసాయి…భక్తి-సాహిత్యం- జీవకారుణ్యం ముప్పేటలా ముడివేసుకున్న ఆ అల్లిక జిగిబిగి చూద్దాము…
భక్తి అనేది కేవలం దైవారాధనతోనే ముగిసిపోదు; అది మనసును మలిచే శక్తి, సమాజాన్ని మార్గనిర్దేశనం చేసే దీప్తి. తనలోని ఆధ్యాత్మికతను అక్షరరూపంలో ఆవిష్కరించి, దానిని సామాజిక చైతన్యంతో మేళవించిన రచయిత్రి శ్రీమతి వీణారెడ్డిగారు మన ముందున్నప్పుడు, ఆమె కలం ఒక సాధనగా, ఒక బాధ్యతగా రూపాంతరం చెందిన వైనం …భక్తి పరిమళం, తత్త్వ గాఢత, సమాజంపై స్పందన…ఈ మూడు ధారలూ ఆమె రచనల్లో సమన్వయమై ప్రవహిస్తున్నాయి. ఆమెకు ఆధ్యాత్మికత ఒక అంతర్ముఖ యాత్ర మాత్రమే కాదు; అది ప్రజాహిత దిశగా చూపే దిక్సూచి. పురాణాల నుంచి ప్రస్తుత జీవితానికి, మౌన సాధన నుంచి సామాజిక సందేశానికి సాగిన ఆమె అక్షర ప్రయాణం, పాఠకుని ఆలోచనను మేల్కొలిపే శక్తిని కలిగివుంది. ఈ ముఖాముఖిలో ఆమె ఆత్మానుభూతులు, ఆలోచనా ప్రక్రియ, భక్తి మరియు బాధ్యతలపై తన విశాల దృక్పథాన్ని మనతో పంచుకుంటున్నారు.
మయూఖ పాఠకుల కోసం, ఆమె అంతర్ముఖ స్వరాన్ని వినిపించే ఈ ప్రత్యేక ముఖాముఖి….
నిజం చెప్పాలంటే… “ఆమె కలం…ఆమె బలం …
ఇంకెందుకు ఆలస్యం ? వారిని పలకరించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా?

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ! వీణారెడ్డి గారూ!

వీణారెడ్డిగారు :— నమస్కారమండి పద్మజ గారు!

పద్మజ:–మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్య గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

వీణారెడ్డి:– నాపూర్తి పేరు కడుకుంట్ల వీణారెడ్డి. నాతల్లిదండ్రులు కీ.శే.మర్యాద సులోచనమ్మ- జనార్దన్ రెడ్డి గారు.
పుట్టిన ఊరు కల్వరాల గ్రామం, వనపర్తి జిల్లా. పుట్టిన తేదీ 3 -8 -1955.విద్య -డీ కాం( Dcom) పాలిటెక్నిక్, వనపర్తి.
మెట్టిన ఊరు బొందలపల్లి గ్రామం, నాగర్ కర్నూల్ జిల్లా. భర్త కె.హనుమంత రెడ్డిగారు. పద్య కవి,పోస్టల్ రిటైర్డ్ ఉద్యోగి. మా సంతానం కవిత, వంశీధర్ రెడ్డి, శశిధర్ రెడ్డి. నివాసం నంది హిల్స్ కాలనీ, మీర్పేట్, హైదరాబాద్.
వృత్తి గృహిణి, ప్రవృత్తి సామాజిక స్పృహ గల రచన వ్యాసంగం, అభిరుచులు ఆధ్యాత్మిక చింతన, ధ్యాన ప్రక్రియ, తోట పని, సంగీత శ్రవణం, జీవ కారుణ్య సేవ, మొదలైనవి… సాహిత్య, సంగీత నేపథ్యం గల వ్యవసాయ కుటుంబం మాది! బాల్యం నుండే పొలం పనులకు, ఇంటి పనులకు వచ్చే శ్రామిక జనులతో కూడి, వారి నుండి జానపద కథలు, పల్లె పాటలు శ్రద్ధగా వినేదాన్ని. వీధి నాటకాలు కూడా చూసేదాన్ని. ఐదవ తరగతి నుండి ఏడవ తరగతి దాకా గ్రంథాలయం నుండి బాలల భారత, భాగవత, రామాయణాది పుస్తకాలు, నీతి కథలు అలాగే, అదే పాఠశాల లైబ్రరీ నుండి అప్పటి ఆధునిక రచయిత్రులైన యద్దనపూడి, కోడూరి, మాదిరెడ్డి.. వంటి వారి నవలలు తెచ్చేదాన్ని. అవి అమ్మతో పాటు నేను కూడా చదివేదాన్ని. నానమ్మ, నాన్న పెదనాన్నల అభిరుచుల మేరకు ఇంట్లో కొలువైన పలు రకాల సనాతన భక్తి సాహిత్యాలను పఠించేదాన్ని.
రాత్రి వేళల్లో ఆరుబయట చందమామ వెన్నెల్లో నాన్నమ్మ చెప్పే హరిభక్తికథలను ఆసక్తిగా ఆలకించేదాన్ని. సెలవుల్లో పుస్తకాలను తీసుకొని పొలానికి వెళ్ళి , నాన్న తో పాటు రాతి గట్లమీద,పొలం గట్లమీద, పశువుల పాకలోనూ, పుస్తక పఠనం గావించడం పరిపాటి.
1960 లోనే ఇంట్లో గ్రామఫోన్ రికార్డుల ద్వారా సంగీతం , నాటకాలు, చలనచిత్రాలు వింటూ, పనులు చేసే వారికి వినిపిస్తూ శ్రమతో అలసట పొందకుండా చేసేవాళ్ళం. మానాన్న మంచి చిత్రకారులు… వారు వేసే చిత్రాలలో నేనూ పాల్గొనేదాన్ని

ముఖాముఖి గ్ర

హీత రంగరాజు పద్మజ, వీణారెడ్డి

పద్మజ:– మీ విద్య -ఉద్యోగం ఎలా సాగింది?

వీణారెడ్డి :— ప్రాథమిక విద్యార్థి దశ నుండే తెలుగు అధ్యాపకుల శ్రావ్యమైన పద్యాలు, పాఠ్యాంశాలలోని పౌరాణిక చారిత్రకాంశాలు అమితంగా ఆకర్షించేవి. ఆ కాలం పెద్ద వాళ్ళ పెట్టెలో ఉన్న పుస్తకాలు అపూర్వ చింతామణి ,విషకన్య , వివేకానంద చరిత్ర వంటివి చదివి ఆ కథలను సాటి విద్యార్థులకు వినిపించేదాన్ని. ఎనిమిది నుండి పదవ తరగతి దాకా శ్రీ విద్యా శ్రీ ప్రగతి వంటి అంశాలను వేదిక ప్రసంగాలలోనూ సాంస్కృతిక కార్యక్రమాలలోనూ పాల్గొని, ప్రశంసలు అందడం, పిల్లల చేత ప్రదర్శింపజేయడం శుభకార్యాల్లో పాటలు పాడడం వంటివి చేసే దాన్ని.
పిల్లులు, కుక్కలు, పొట్టేళ్లు, రామచిలుకల వంటి పెంపుడు జంతువులు, పక్షులు, కోళ్లు మొదలైన వాటికి ఆహారం అందిస్తూ ఆవులు, గేదలు పాలు పిండుతూ పెరుగును కవ్వంతో చిలుకుతూ ఆనందించేదాన్ని పద్మజ గారూ…

పద్మజ:–మీ రచనా ప్రయాణం ఎలా ప్రారంభమైంది ? మొదటి ప్రేరణ ఎవరు? మానవీయ కోణంలో రచనలు చేయాలనే ఆలోచన ఎలా ఏర్పడింది? రచయిత్రిగా మీపై ఎక్కువ ప్రభావం చూపిన వ్యక్తులు లేదా గ్రంథాలు ఏమిటీ?

వీణారెడ్డి:— నా రచనా యానం అనేది పుస్తక పఠనం, కథా శ్రవణం వంటివే అదే ప్రేరణగా ఆరంభమైంది. వికలాంగులు, అన్నార్తులు, అభాగ్యుల వంటి వారిని, ఇంకా అమాయకులు, మంచివారు,మహానుభావులు, మంచి కళాకారులను… గాంచినప్పుడు కలిగిన స్పందనలే హృదయాన్ని చలింప చేస్తూ… మానవీయ కోణాలను కదిలిస్తూ.. అవే కలం -కళలుగా రూపొందినవని చెప్పాలి ! రచయిత్రిగా నాపై ఎక్కువ ప్రభావం చూపినవి ఆనాటి పత్రికలు, అందులోని పాఠకుల ప్రశంసలు, మా శ్రీవారి స్పందనా విధానం అని కూడా చెప్పవచ్చు. ఇంక గ్రంథాల మాటకొస్తే.. పాఠశాల దశలో శరత్ సాహిత్యం, కాలేజీ దశలో తెన్నేటి హేమలత గారి మోహన వంశీ, ఆపైన రవీంద్రుని గీతాంజలి ఎక్కువ ప్రభావం చూపాయి. ఆ పై ఆధ్యాత్మిక ఆచార్యులైన ఎక్కిరాల కృష్ణమాచార్య గారి పురుషమేధం గ్రంథం భక్తి- ఆధ్యాత్మికతలకు అంకురార్పణ గావించింది. ఇక రచనల వివరాల విషయానికొస్తే 1975 నుండి ప్రారంభమైన రచనా వ్యాసంగంలో, 1980 ఆ ప్రాంతంలో సాహిత్య దుందుభి పత్రికలో ప్రచురింపబడిన ప్రధమ బహుమతి కథతో ప్రారంభమైన ప్రధమ కథ ఓ ఆకలి కథ నుండి, వివిధ పత్రికలలో ముద్రితమైన 150 పైగా 15 అవార్డులతో… కథలు, 100 దాకా బహుమతులతో కూడిన వ్యాసాలు, 50 దాకా కొన్ని అవార్డులతో కూడిన కవితలు, గేయాలు ప్రచురితాలు…ముద్రణా గ్రంథాలు కథావి పంచి, జీవన్మణులు( 2019) సంవత్సరంలో, *కథావిపంచి-2 *, *నిషాంత కాంతులు(2020) శాంతివనం వ్యాసమాలిక (2022) (1988) లో కావ్య జ్యోతి వారపత్రికకు అసోసియేటెడ్ ఎడిటర్ గా కూడా పనిచేయడం జరిగింది.
ప్రస్తుతం కూడా భక్తి జ్ఞాన ఆధ్యాత్మిక సామాజిక రచనా పరంపర కొనసాగుతున్నది. ముఖ్యంగా ఎడిటర్ పవన్ గారి అక్షరాంజలి మాసపత్రికలో నెల నెల నా ఆధ్యాత్మిక వ్యాసరచనలు ముద్రింపబడుతున్నవి. మరొక కథా సంకలనం, కవితా సంపుటి త్వరలో రానున్నవి.

పద్మజ :- మానవీయ థృక్పధం మీ వ్యాసాల్లో ప్రధానంగా కనిపిస్తుంది… మీ దృష్టిలో మానవీయత అంటే ఏమిటో మనిషి -మనిషిగా నిలబడడానికి ఈ సమాజంలో అత్యంత అవసరమైన విలువలు ఏమిటి? మీ రచనలతో పాఠకుడిలో ఎలాంటి మార్పు రావాలని ఆశిస్తారు?

వీణారెడ్డి:– సృష్టిలో దేని సహజత్వం దానికుంటుంది. మానవుడిగా జన్మించిన వాడికి మానవీయత ప్రధాన గుణమై ఉండాలి! మనిషి ప్రాణంతో ఉండడానికి గుండె కొట్టుకోవడమే కాదు! మానవత్వంతో బ్రతకడానికి హృదయాన్ని పట్టుకొని ఉండాలి. సామాజిక ప్రగతికి సాంకేతికత ఎంత అవసరమో సామాజిక సంక్షోభానికి మానవత కూడా అంతకన్నా ఆవశ్యకం. మనిషి మనిషిగా నిలబడడానికి మనిషి ముందుగా తన స్థాయిని దిగజార్చే ఇంద్రియాలను మనసు ద్వారా జయించాలి. ఆ మనసు మళ్ళి తన చంచలత్వంతో కిందికి జారకుండా బుద్ధి- విచక్షణల ద్వారా దాన్ని నిగ్రహింపజేయాలి. మంచి- చెడు విచక్షణ కలిగి బుద్ధిమంతుడైన మనిషి.. మనిషిగా మనీషిగా మారగలడు. అలా మారాలంటే అందుకు మనిషి పాటించవలసిన మానవీయ విలువలు ఏమిటంటే… మనుషులంతా ఒకటేనని, చావు పుట్టుకలు అందరికీ సమానమేనని, అందరిలోని అంతర్గత ఆత్మ సౌందర్యం ఒకటే ప్రకాశమని… అనేకంలా కనిపించే లోకంలో మానవాళి అంతా ఏకమేనన్న ఏకాత్మతా భావనతో, తనలాగే తన సాటి వారన్న అవగాహనతో చరించగలగాలి! అప్పుడే జాతి, మత, కుల, వివక్ష… ఉన్నోడు- లేనోడు అన్న భేద భావము, అందం- అనాకారితనం అన్న తారతమ్యం; స్త్రీ- పురుష వ్యత్యాసం అనేవి అంతరించి అందరిలోనూ మానవీయ విలువలు సంతరించుకొంటాయి. ఉప్పునీటి దాహం వంటి అంతులేని సంపాదన కన్నా… ఆత్మసంతృప్తి అనే అమృత సంపాదన పొందగలగాలి!
నా రచనల ద్వారా పాఠకుడిలో కొంతైనా స్వార్ధ భావం నశించి, కాసింతైనా పరమార్ధ భావం కలగాలని, ఎన్ని కష్ట నిష్టూరాలు ఎదురైనా ఆదరణ కనువు కానీ పర ధర్మాన్ని అనుసరించక, అంతగా ప్రయోజన కారి కాకపోయినా ఎంతో ప్రశాంతతకు దారి అయిన, ప్రకృతి పరంగా తనకు ప్రాప్తమైన సహజసిద్ధమైన తన స్వధర్మం విలువ తెలుసుకొని, తన వ్యక్తిగత సామాజిక ధర్మాన్ని తన కర్తవ్యం ద్వారా నిరూపించుకోవాలని, ఎన్నెన్నో ఆశయాలకు గాక, కొన్ని ఆశయాలకు తావివ్వగల సుమంలా రూపొందగల ఏ కొద్ది ప్రేరణ కలిగినా చాలనే అభిలాషతో, అనుభవంతో, అంకిత భావంతో నిరంతర ప్రయత్నమే నిజమైన విజయం లా నా రచనా పరంపర కొనసాగిస్తున్నాను.

పద్మజ:– ఒక రచయిత్రికి సామాజిక బాధ్యత ఎంత వరకు ఉండాలని మీరు భావిస్తారు?

వీణారెడ్డి ఒక రచయిత్రికి తన ప్రయత్న లోపం లేని సంపూర్ణ సామాజిక బాధ్యత ఉండాలి. వీలైనంత వరకు తన రచనల ద్వారా సూచించిన ఉదాత్తమైన అంశాలు అనేవి తన జీవితంలో ఆచరించిన అనుభవ సారాలై ఉండాలి. ఎక్కడో చదివినవి ఎవరో బోధించినవి కాక అందులోని సాధకబాధకాలను గ్రహించి మరీ ఖచ్చితమైన తీర్పునివ్వగలిగేలా ఉండాలి.

పద్మజ:– మీ రచనల వల్ల సమాజంలో ఎప్పుడైనా ప్రత్యక్ష మార్పు జరిగిన అనుభవం మీకు ఉన్నదా?

వీణారెడ్డి :– 1986లో వనితలో వచ్చిన నచ్చిన వరుడు అనే కథలోని కట్నం కోరని ఆదర్శ పాత్రలా, మా బంధువుల్లో జరిగిన ఆదర్శ వివాహం ఒక అనుభవం … అలాగే, నా రచనా ప్రేరణ తో మరొక వితంతు వివాహం జరగడం, ఆధ్యాత్మిక రచనల వల్ల పాఠకుల్లో కలిగిన కొంత స్వార్థ చింతన తొలగడం, ముఖ్యంగా మా పిల్లల్లో కలిగిన అనుసరణీయ భక్తి, జ్ఞాన, ఆధ్యాత్మిక చింతన, సామాజిక సేవా నిరతి, జంతు సంరక్షణ, అహింసా విధానం… వంటివి అలవడినవి. ఇవి నాకు జరిగిన అనుభవాలు.

పద్మజ:– నేటి సమాజాన్ని ఎక్కువగా కలవర పెడుతున్న సమస్యలు ఏమిటని మీరు అనుకుంటున్నారు?

వీణారెడ్డి:– నేటి సమాజాన్ని కలవరపెడుతున్నవి అన్నీ ముఖ్యమైన సమస్యలే ! పద్మజ గారూ! ముఖ్యంగా స్వేచ్ఛ పేరుతో క్రమశిక్షణా రాహిత్యం, విచ్చలవిడి ప్రవర్తనం, పై పై వ్యామోహాలకు లోనై పోతున్న విలాసాల జీవితాలు, సంపద అధికమై శ్రమలోపించిన పరిస్థితులు, తాగుడు, వ్యభిచారం, వంటి వ్యసనాలు… యువత సహజీవనాలు, మత్తులోని అత్యాచారాలు, హత్యలు, అహంకార పూరిత హింసా ప్రవృత్తులు, పాలకుల పదవీ వ్యామోహాలు, అధికారుల లంచగొండితనాలు, ప్రజల ప్రలోభాలు తాత్కాలిక ఆవేశాలు, ఆత్మహత్యలు ఎన్నో ఒకదానికొకటి ముడివడిన సమస్యలు సామాజిక సంక్షోభానికి కారణం అవుతున్నవి.

పద్మజ:— ఒక రచన రాయడానికి ముందు మీరు చేసే ఆలోచన లేదా ప్రణాళిక ఎలా ఉంటుంది ?

వీణారెడ్డి :— ఒక రచన చేయడానికి ముందు, ఆలోచనలోనే ఆ కథా సంవిధానం, దాని ఆద్యంతాలు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకుంటాను. ఆ తర్వాత ఆయా పాత్రలుగా మారిపోయిన అనుభూతి- అనుభవాల ద్వారా రచనను గావిస్తాను. తొలిపాఠకురాలి పాత్రగా కూడా రూపొంది మరీ దాన్ని పఠించి, అవసరమైన సవరణలు గావించుకుంటాను. భావం తర్వాతనే శైలి నిర్మాణం జరుగుతుంది.

పద్మజ:– నేటి యువత సాహిత్య రంగంలోకి రావాలంటే ఏ విలువలను పాటించాలి? రచన చేయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

వీణారెడ్డి:— నేటి యువత సాహిత్య రంగంలోకి రావాలంటే సమాజంలో తాను ఎలాంటి విలువలను కోరుకుంటున్నాడో అలాంటివి ముందుగా వీలైనంతగా తాను పాటించాలి! ఏ అంశాలు తనను అధికంగా స్పందింప చేస్తాయో వాటి పట్ల దృష్టిని కేంద్రీకరించాలి. అలాంటి ఉత్తమ రచనలనే పఠించాలి… పరిశీలించాలి! కథ,కవిత, వ్యాసం, పద్యం అనేవి దేని సంప్రదాయం దానికుంటుంది. కనుక అనుభవిజ్ఞులైన రచయితల (రచనల) ద్వారా దాన్ని తీర్చిదిద్దుకోవాలి! మంచి భాషకు, పద రమణీయతకు కృషి చేయాలి. రచనలు అచ్చులో చూసుకోవాలని ఆసక్తే కాక సమాజాన్ని మార్చే శక్తిగా రచన ఉండాలనే తపనతో రచన ఆరంభించాలి. ఫలితాలు ఎలా ఉన్నా పట్టువదలని ప్రయత్నంగా రచనలు కొనసాగిస్తూ ఉండాలి! నిరంతర సాధన ద్వారానే లక్ష్యాన్ని సాధించాలి!

పద్మజ:– రచయిత్రిగా మీ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణం ఏది? ఇంకా మీరు రాయాలనుకుంటున్న కానీ రాయలేక పోయిన అంశాలు కానీ ఉన్నాయా?

వీణారెడ్డి:– నాకు సంతృప్తినిచ్చిన క్షణాలు ఏవంటే ?గృహిణిగా నా పరిపూర్ణ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే… నేను గావించిన తీరిక వేళల్లోని సమాజ సేవలోని భాగంగా ప్రఖ్యాత సంస్థల ద్వారా ప్రముఖుల పేర్లమీదుగా పురస్కారాలు అందుకున్న సందర్భాలు….
రాయాలనుకున్నా కానీ రాయలేకపోయిన అంశమేమిటంటే భగవద్గీత శ్లోకాల ఆధారంగా చిన్నచిన్న కథల శీర్షిక నిర్వహించాలని అనుకున్నా! సరైన వేదిక, ప్రోత్సాహం లేక వీలు కాకపోవడంతో చేయలేకపోయాను. ఇక ముందు వీలైతే అది కూడా సాహితి భవిష్యత్తులో సంపూర్ణం చేసుకుంటాను.

పద్మజ:– మీలో కనిపించే జీవ కారుణ్యం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేక లక్షణం గా కనిపిస్తుంది. ఆ భావం మీలో ఎలా పెరిగింది ? సర్వభూత దయ అనే భావం మనిషి జీవన విధానంలో ఎందుకు ముఖ్యమని మీరు భావిస్తారు? జీవజాలం పట్ల కరుణ చూపడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనంగా మీరు భావిస్తారా?

వీణారెడ్డి:— జీవకారుణ్య భావం అనేది నాకు జన్మతః సంక్రమించిన అంశం. భక్తి భావం పెరిగే కొద్దీ , ధ్యాన రహస్యాలు అందే కొద్దీ అన్నింటిలోని ఆత్మ ఒకటే అని, అందులోని పరమాత్మ ఒకటే అనే సత్యం బోధపడింది. ఆకలిని, ఆవేదనను చెప్పుకోలేని ఆ మూగ ప్రాణుల సంరక్షణ అనేది ఏకాత్మత భావంతో మనుషులు ఆచరించగల మహా యజ్ఞం లాంటిదని అర్థమైంది. సర్వభూత దయ అనేది సర్వేశ్వరుని సందర్శింప చేయగలదు! అలాంటి కరుణ గల హృదయముతోనే… మానవజీవనం ప్రేమమయంగా శాంతి నిలయంగా మారగలదు. నోరులేని మూగ ప్రాణులను అర్థం చేసుకోగల మనిషి సాటి మనిషి మనోభావాలను అతి సులభంగా గ్రహించి,పరస్పర సహకారంతో మానవ సంబంధాలను పెంపొందించుకోగలరని అనుకుంటాను. అందుకే సర్వభూత దయ అనేది శ్రేయోదాయకమైన విషయ విశేషం అని నా విశ్వాసం. ఒక తల్లికి తండ్రికి ఎలా అయితే తమ పిల్లల్లోని మూగ పిల్లలు, అమాయకపు పిల్లల పట్ల అధిక ఆదరణ ,అత్యంత శ్రద్ధ అనేవి తక్కిన పిల్లల కంటే ఎక్కువగా ఎలా ఉంటాయో? అలాగే భగవంతుడికి కూడా తన సృష్టిలోని సంతానమైన మూగజీవాల పట్ల (మాట్లాడగల లౌక్యంగల) మానవుల కన్నా ఆర్ద్రత అధికంగా ఉంటుందని, అందుకే జీవ కారుణ్యం అనేది ఆ పరమాత్మ కరుణను, ప్రేమను పొందగల, ఆత్మానందం అందగల అద్భుతమైన ఆధ్యాత్మిక సాధనగానే నేను భావిస్తాను.

పద్మజ:— మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆధ్యాత్మికత మీ రచనలలో భావగాంభీర్యాన్ని ఎలా పెంచింది?

వీణారెడ్డి:— ఆత్మ అనంతం… దాని ఆధారంగానే జన్మ పరంపర (జీవుడి కర్మ ఫలాల కారణంగా) కొనసాగుతుందని, విశ్వసించగలిగితే… భక్తి ఆధ్యాత్మికంశాలనేవి నాకు (అనంతకాలం) నుండి పూర్వజన్మల, కారణజన్మల సంస్కారాలుగా శ్రీరామ పరంధాముని, శ్రీకృష్ణ పరమాత్ముని, మధుర భక్తిగా సంక్రమించినవని అర్థమవుతున్నది. భక్తి- ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథ పఠనాలు, భక్తి ధార్మిక విలువలతో కూడిన అలనాటి చలనచిత్రాలు, మధుర భక్తి గీతాలు మొదలైనవి లౌకికాలౌకిక స్పందనలుగా నా రచనల్లో చోటుచేసుకుని, భావ గాంబీర్యత నలవరుచుకొని అనుభవైక వేద్య వైవిధ్య నైవేద్యాలుగా బహుమతులు అంది పాఠకులకు అందించబడినవి.

పద్మజ:-మానవత-జీవకారుణ్యం-సామాజికస్పృహ- ఆధ్యాత్మికత ఈనాలుగు కలిసి మనిషి జీవితాన్ని ఎలా సమృద్ధిగా చేస్తాయంటారు?

వీణారెడ్డి :– మానవీయత, జీవ కారుణ్యం, సామాజిక స్పృహ, ఆధ్యాత్మికత అనేవి నాలుగు కూడా జీవన రథానికి నాలుగు చక్రాల వంటివి.
మానవీయత అనేది ఐకమత్యమే బలం అనిపించేలా మనిషిని మనిషిని కలిపి ఉంచే సమతా మమతల సంబంధ సాధనం!
జీవ కారుణ్యం అనేది దయగల హృదయమే దైవ మందిరం అని నిరూపించే నిష్కల్మష విధానం. స్థాయీ బేధాన్ని మరిచి, పసిపాపలను లాలించినట్టుగా సృష్టిలోని జీవజాలాన్ని ఆదరించగల భావ లాలిత్యం కరుణ తత్వమనేది సామాజిక హృదయాన్ని మాతృ మందిరంలా మార్చగలదు.
సామాజిక స్పృహ అనేది మనిషిలోని చేతనత్వాన్ని జాగృతపరిచేది. నిస్పృహను నివారించేది , కర్తవ్యాన్ని బోధించి ఉద్యమింప చేసేది, త్యాగమే యోగంలా సామాజిక సంక్షేమానికి తనకున్నంతలో సర్వ సమర్పణ గావించగల అంకిత భావాన్ని కలిగించేది ఆధ్యాత్మికత!
అనగా ఆత్మను గురించి తెలిపేది, ఆత్మసత్యం తనువనిత్యం అన్న జ్ఞానాన్ని కలిగించేది, అనిత్యమైన తనువు కోసం, అశాశ్వతమైన భోగభాగ్యాల కోసం అర్రులు చాస్తూ, స్వార్థ భావాలతో అనుచిత విధానాలతో మనిషి పతనం కాకుండా, శాశ్వతాశాశ్వతాలను వివరిస్తూ మనిషికి తన జన్మ కారణాలను వివరిస్తూ, చేయవలసింది ఏమిటో చేయకూడనిది ఏమిటో వివరిస్తూ, అవగాహన కలిగిస్తూ ఫలితంపై దృష్టి లేని ధార్మిక కర్తవ్యాన్ని నిర్వహింప చేస్తూ, అశక్తత నుండి శక్తి వైపుగా…చీకటి నుండి వెలుగులోనికి నడిపించేది, మృత్యువును కూడా అమృతంలా భావించి ఆహ్వానింపచేయగల అద్భుత సాధనం….

పద్మజ:— నేటి యువతలో మానవీయ విలువలు, జీవ కారుణ్యం పెంపొందించడానికి ఏ మార్గాలు అవసరం? సాహిత్య రంగంలోనికి రావాలనుకునే యువ రచయితలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

వీణారెడ్డి:— నేటి యువతలో మానవీయ విలువలు పెంపొందించడానికి, చిన్ననాటి నుండి కూడా తల్లితండ్రులు, గురువులు, ప్రధాన బాధ్యత వహించాలి! సాటి పిల్లలు కూడా తనలాంటివాళ్ళేనని, బాధ -ఆనందాలు అందరికీ ఒకటేనని, ఒకరి నుండి తను పొందిన సాయం తను కూడా మరొకరికి అందించాలని, ఒకరి వల్ల తను పడ్డ బాధ తన వల్ల మరొకరు పడకూడదు! అని దైనందిన జీవనంలో నుంచే మంచి- చెడుల పర్యవసానాలను బాల్య దశ నుండే అవగాహన కలిగిస్తూ ఉంటే, వయసుతోపాటు యువతలో కూడా మంచి మానవతా విలువలు ఇంటినుండి, విద్యాలయాలనుండి, ఆరంభమై సమాజం దాకా వ్యాపించగలవు. ముఖ్యంగా యువతలోని మాట వినని ఆవేశం, దుడుకు స్వభావం వంటి వాటిని తొలగించి, సన్మార్గాలననుసరించడానికి తల్లిదండ్రులు ప్రేమగా, అధ్యాపకులు ఓపికగా ముఖ్యంగా ఆచరణాత్మకంగా యువతను కౌమార దశ నుండే మంచి సంస్కారాలతో ముందుకు నడిపించగలగాలి!

పద్మజ:– రచయిత్రిగా మీకు తొలి ప్రేరణ ఎవరు?

వీణారెడ్డి :— రచయిత్రిగా నాకు తొలి ప్రేరణ అనేది ఒక పాఠకురాలిగా పుస్తక పఠనాశక్తి సామాజిక సమస్యల పట్ల అవగాహనా భావమనే చెప్పవచ్చు!

పద్మజ:– సమాజ సమస్యలపై రాయడం ఒక బాధ్యతగా భావిస్తారా? లేక వ్యక్తిగత స్పందనగా చూస్తారా? రచయిత్రి సమాజానికి మార్గదర్శి కావాలా? రచయిత్రి దృక్కోణం ఎలా ఉంటుంది?

వీణారెడ్డి:—- సమాజ సమస్యలపై రాయడం అనేది… ఆయా సమస్యలు వ్యక్తిగత స్పందనలుగా రూపొంది, ఆ సంఘర్షణల ప్రభావమే సాంఘిక బాధ్యతలకు, సాహితీ సారధ్యాన్ని వహింప చేసింది.
రచయిత్రి సమాజానికి తన రచనల ద్వారా, తన ఆచరణాత్మక విధానాల ద్వారా, మంచి మార్గదర్శిని కావాలి !రచయిత్రి దృక్కోణం అనేది వ్యక్తిగతాన్ని కాక సామాజిక హితాన్ని అవలోకిస్తుంది. ఇంటికే పరిమితమై బంధింప పడకుండా సంధించిన అస్త్రంలా సమాజం వైపు దూసుకుపోతోంది! ఇల్లే సమాజంలా… సమాజమే ఇల్లుల భావిస్తూ ఉభయతారకంలో ఉపకరిస్తుంది!

పద్మజ:— మహిళా రచయిత్రిగా మీకు ఎదురైన సవాళ్లు ఏమిటి? స్త్రీ స్వరాన్ని సమాజం ఎలా స్వీకరిస్తుంది? మీ రచనల్లో స్త్రీ పాత్రల ఆవిష్కరణ ఎలా ఉంటుంది?

వీణారెడ్డీ:— మహిళా సాహిత్యకారిణిగా నాకు ఎదురైన సవాళ్ళు సమాజంలో కన్నా సంసారంలోని గృహిణి పాత్ర రచయిత్రికి విసిరిన విసురైన సవాలక్ష సవాళ్లు విద్యుక్త ధర్మాలే!
స్త్రీ స్వరాన్ని ఒకప్పుడు అణిచివేత పర్వం యొక్క ప్రభావంగా భావించిన సమాజం, ఈ ఆధునిక యుగంలో ఎలుగెత్తిన స్త్రీస్వరాన్ని స్వేచ్ఛారావంలా ప్రగతి సంకేతంలా భావిస్తున్నది… గౌరవిస్తున్నది. స్త్రీల హక్కుల స్వరాలనే కాక ,బాధ్యతల పర్వాలను గృహిణి నుండి ఉద్యోగ నిర్వహణ దాకా స్వాగతిస్తుంది నేటి ఆధునిక సమాజం. నా రచనల్లో స్త్రీ పాత్ర అనేది …మంచి కుటుంబ జీవనానికి ప్రతికగా, సామాజిక జీవన ప్రగతిగా ఆదర్శంగా, మాతృకగా, అధర్మ ఖండితగా, హక్కులకన్నా బాధ్యతల్ని మోసే త్యాగ భరితగా, ధన్య చరితగా, నా అభిలాష మేరకు ఆవిష్కరింపబడుతుంది.

పద్మజ:— సాహిత్య ప్రభావం అంటే సాహిత్యం నిజంగా సమాజాన్ని మార్చగలదని మీరు నమ్ముతారా?

వీణారెడ్డి::— సాహిత్యం సమాజాన్ని మార్చగలదు! సమాజంలోని అజ్ఞానాంధకారాలకు జ్ఞాన నేత్రమై దారి చూపగలదు! స్వాతంత్రోద్యమానికి పూర్వం నుండే నినదించిన అక్షర దిక్కార స్వరాలు, ఉద్యమ సాహిత్యాలు, విప్లవ గీతాలు, ఇంకా కరుణరాసాత్మక కావ్యాలు, జానపద నేపథ్యాలు గల నీతి పద్యాలు, వైదిక, పౌరాణిక ,చారిత్రక గ్రంథాలు మానవ నాడీ గ్రంధుల్ని ప్రభావితం గావించి మనో విశాలతకు, త్యాగనిరతికి, సామాజిక ప్రగతికి, సాధనాలుగా… నాటి జీవన విధానాలకు, అరుదైన చరిత్రలకు, అద్భుత పరిణామాలకు స్ఫూర్తి ప్రతీకలుగా… నిలిచినవి… నిలుస్తున్నవి… నిలుస్తాయి!

పద్మజ :—ఈ కాలంలో పాఠకుల అభిరుచిలో వచ్చిన మార్పులపై మీ అభిప్రాయం?

వీణారెడ్డి:– మార్పు అనేది కాలానికి మలుపు వంటిది. కాలాతీతుడు కాలేని పాఠకుడు కూడా మనిషే కనుక, కాల ప్రభావానికి కట్టుబడిపోయిన మానవుడిగా, పాఠకుడిలోని మారుతున్న అభిరుచి కూడా అతి సహజంగా కాలంతోపాటు స్వీకరించవలసిందే!

పద్మజ :— సమకాలీన పరిస్థితులునేటి యువతలో సామాజిక చైతన్యం ఎలా ఉంది? సోషల్ మీడియా ప్రభావం రచయిత్రులపై ఎలా ఉంది?

వీణారెడ్డి :– నేటి యువతలో అధిక భాగం సంపాదనే ధ్యేయంగా, ఆధునిక సౌకర్యాలే సర్వస్వంగా, స్వేచ్ఛే పరమావధిగా, సాంకేతిక విద్యే వైవిధ్య సాధనంగా, అంతకుమించి మరి దేనికీ తీరికలేని యాంత్రిక జీవనమే ఆనవాయితీగా అదే లోకంగా జీవిస్తున్నారు. మరి కొద్ది మంది యువతీ యువకులు సేవా భావంతో మానవీయ విలువలతో సామాజిక స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ సాధన లేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ ఆదర్శభావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని రుజువు చేస్తున్నారు. అరచేతిలో ఉసిరికలా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా అనేది సాధారణ మహిళల కన్నా రచయిత్రులకు ఉపయుక్తమైన ఉపకరణ. అది ముంగిట్లోని సూర్యకిరణాల విశ్వ సందర్శనం కలిగిస్తూ విశాల భావ స్పందనను వైవిధ్య సృజనను రచనకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పవచ్చు!

పద్మజ:- నేటి యువతలో సామాజిక చైతన్యం ఎలా ఉందంటారు?

వీణారెడ్డి:— స్పృహతో కూడిన చైతన్యంతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, సాంకేతిక విధానాలను సైతం సామాజిక ప్రగతికి వినియోగిస్తూ, సాధనలేవైనా సరే ఉపయోగించుకునే విధానాలపై వాటి ప్రభావం ఉంటుందని నిరూపిస్తూ, ఆదర్శ భావాలతో కూడిన ఆధునికత కూడా అద్భుత సామాజిక చైతన్యమని ఋజువు చేస్తున్నారు.

పద్మజ:– ప్రస్తుత సామాజిక సమస్యల్లో మీకు అత్యంత ఆందోళన కలిగించేది ఏమిటి?

వీణారెడ్డి:– ప్రస్తుత సామాజిక సమస్యల్లో అత్యంత ఆందోళన కలిగించేది… పోరాట పటిమతో స్వేచ్ఛనూ, సమాన హక్కులను పొందిన మహిళలను స్వేచ్ఛగా తిరగనివ్వని అత్యాచార పర్వాలు, ప్రగతికి ప్రథమ సోపానమైన పడతిని భాగ్య దేవతగా గాక…భోగ్య వస్తువుగా భావించడం.

పద్మజ రాసే ముందు ఆలోచిస్తారా? లేక ఆవేశంలో రాస్తారా?

వీణారెడ్డి :– రాసే ముందు ఎక్కువగా ఆలోచిస్తాను పద్మజ గారు.

పద్మజ:– మీరు పొందిన పురస్కారాలు, సన్మానాలు ఆయా సందర్భాలు మా మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

వీణారెడ్డి:— నా సాహితీ ప్రయాణంలో అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సన్మాన విశేషాలు సంక్షిప్తంగా వివరిస్తాను.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా 2024 సంవత్సరానికి నాళం కృష్ణారావు గారి స్మారక ఉత్తమ రచయిత్ర కీర్తి పురస్కారం, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక, ఆచార్య పాకాల యశోద రెడ్డి సాహితీ పురస్కారం, 2024 కపిలవాయి లింగమూర్తి సాహిత్య కళా పీఠం ద్వారా కపిలవాయి కిషోర్ బాబు -భార్గవి దేవి*ల పురస్కారం (2002)లో, సాహిత్య వేదిక తెలుగు పూలవనం సంస్థలచే *ఉమ్మెత్తల యజ్ఞరామయ్య కథా సాహిత్య పురస్కారం( 2020)లో, శ్రీశ్రీశ్రీ కురుమూర్తి దేవస్థానం వారి ద్వారా బెల్లం నాగన్న స్మారక పురస్కారం (2024)లో, జయజయ సాయి ట్రస్ట్ వారిచే వేద భారతి *ఉత్తమ జాతీయ పురస్కారం *( 2022)లో,
పుడమి సాహితి వేదిక ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ పురస్కారం(2021)లో, విశ్వహిందూ పరిషత్ వారిచే ఉత్తమ గీతా వ్యాసర చయిత్రి పురస్కారం (2022)లో, రైట్ వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రిగా ఎక్స్లెన్సీ అవార్డు (2019)లో,
శిఖరం ఆర్ట్ థియేటర్స్ వారిచే విజయసేవానంది పురస్కారం( 2021)లో, ఈసీఐ మరియు డి ఐ సి సి ఐ ఫౌండేషన్ ద్వారా మహిళా సేవా రత్న అవార్డు( 2021) లో , ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా సాహితీ సేవా రత్న పురస్కారం ( 2021)లో, డిటెన్ వరల్డ్ ఛానెల్ వారి లాంతర్ * అవార్డు (2020)లో, శ్రీశ్రీ సిరి కల్చరల్ ఫౌండేషన్ ద్వారా *శ్రీ వికారి ఉగాది ప్రతిభా పురస్కారం ( 2019)లో, పివి గారి శతజయంతి కవితాంజలి శుభకృతు ఉగాది పురస్కారం( 2022)లో, ఇంకను పలు ప్రముఖ సంస్థల ద్వారా మరో 15 పురస్కారాలు పొందడం జరిగింది.
కొన్ని సమీక్ష వ్యాసాలు, ప్రసంగాలు ,టీవీ, రేడియో ప్రోగ్రాంలు, ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ, మరియు పలు సంస్థలు నిర్వహించిన కవి సమ్మేళనాలలోపాల్గొని కావించిన కవితా పఠనాలు, ఇంకనూ అతిథిగా పాల్గొనడం వంటివి. వివిధ ప్రక్రియల ద్వారా ఎన్నో వేదికలపై సన్మానాలను అందుకున్నాను. సాహితీ సామాజికవేత్త మరియు భారత్ రాజశ్రీ బిరుదులతో సత్కరింపబడడం జరిగింది.
భారత స్వాతంత్ర అమృత్యోత్సవాల సందర్భంగా 20-21 లో విశ్వహిందూ పరిషత్తు గీతా జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన లక్ష యువగళ గీతార్చన కార్యక్రమంలో ఆ పుస్తక సంకలన ఆవిష్కరణ సందర్భంగా అందులోని భవసాగర తరుణం భగవద్గీత చరణం వ్యాసకర్తగా ఉత్తమ వ్యాస రచయిత్రిగా పొందిన పురస్కారం 15- 5- 2002లో..

పద్మజ -మీ కలం నుండి భక్తి ప్రచోదన రచనలు వెలువడిన ఆ సందర్భం ,వాటి విశేషాలు చెప్పండి!

వీణా రెడ్డి నాకలం నుండి వెలువడిన భక్తి ప్రచోదన రచనలకు మూల కారణం బాల్యంలోనే కలిగిన కృష్ణ భక్తి భావనయే పూర్వజన్మల సంస్కారాల కారణంగా జన్మించిన మధుర భక్తి కృష్ణ ప్రేమ ప్రేరణగా పాటించే కృష్ణ చరితలు, కృష్ణ భక్తి కథలు కృష్ణా అంశం గల చలనచిత్రాలు ఎంతో పారవశాన్ని కలిగించేవి అవే రచనలుగా గేయాలుగా రూపొంది ఆ అలౌకిక అనుభూతితో వాణి సందేశాలను ఆలకిస్తూ ఆ దైవీజ్ఞాన సంపత్తిని నిత్య సత్యాలుగా విశ్వ స్వరూపాలుగా ప్రేమ చాగతత్వాలుగా భక్తి ఆధ్యాత్మిక ప్రచోదన రచనలుగా అవి వెలువడుతున్నాయి.

ముగింపు ప్రశ్నలు…రాపిడ్ ఫైర్ ( ఒక్క వాక్యంలో)

పద్మజ- యువ రచయిత్రులకు మీ సందేశం?

వీణారెడ్డి మహిళా సమస్యల కారణంగా యువ రచయితలకన్నా యువ రచయిత్రులే అదనంగా కృషి చేయాలి.

పద్మజ- మీ ఊహలో సమాజం ఎలా ఉండాలి?

వీణారెడ్డి విలువలు గల కుటుంబ జీవనంతో సామాజిక జీవనం శాంతి మయం కావాలని,

పద్మజ మీ రాబోయే రచనలు ఏ అంశాలపై ఉండబోతున్నాయి?

వీణారెడ్డి సమాజంలో కలగబోయే పరిణామాలకు అనుగుణంగా చెడు పర్యవసానాలకు బలికాకుండా మంచి మార్గాలను సూచించే దిక్సూచిలా ఉండాలని…

ధన్యవాదాలు అండి పద్మజ గారు! మీతో పరిచయ కార్యక్రమం నాకు ఎంతో ఆనందదాయకం మయూఖ పత్రికకు నా మన పూర్వక కృతజ్ఞతలు…

రంగరాజుపద్మజ:–

సామాజిక స్పృహ ఉన్న రచయిత్రి అంటే మాటలతో సమాజాన్ని కదిలించే వ్యక్తి. అలాంటి వారి ఇంటర్వ్యూ అంటే కేవలం ప్రశ్నలు కాదు… ఒక ఆలోచనా యాత్ర. నేను అడిగిన ప్రశ్నలు లోతుగా, ఆవేశంగా, ఆత్మీయంగా ఎలా ఐతే ఉన్నాయో…బహుముఖ ప్రజ్ఞాశాలులైన శ్రీమతి వీణారెడ్డిగారు ఆధ్యాత్మిక ప్రశ్నలకు అంతే లోతైన సమాధానాలు; జీవకారుణ్య సందేహాలకు దయాంతరంగులుగా స్పందిస్తూ…సామాజిక బాధ్యత ఉన్న రచయిత్రిగా తన రచనా కాగడాలను చూపి వెలుగులు పంచిన ఈ ముఖాముఖి ఎందరికో స్ఫూర్తిదాయకమని భావిస్తూ..

మీ రంగరాజు పద్మజ.

May 31, 2026 6 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరమ ధర్మం

by Rama Devi Nellutla May 31, 2026
written by Rama Devi Nellutla

కాలం నడిచి పోతున్నది
చరిత్ర గడిచి పోతున్నది
సంఘటనలకు సాక్షీభూతంగా నిలవడం తప్ప
ఏమీ చేయలేని కలం నిలిచి పోతున్నది.

భూగోళానికి అవతలి పక్కన బాంబుల పేలుళ్లు
ఆకాశానికి చిల్లులు పొడిచి నల్లని పొగ మేఘాలతో నింపుతుంటే
ఉగాది ప్రభాత వేళ తెరలు తెరలుగా కొండలపై అడవులపై
దిగుతున్న తెలిమంచు తెరలను దర్శించి మది పులకించలేకపోతున్నది

పేగుల మంటను చల్లార్చే రెండు రొట్టె ముక్కల కోసం
స్త్రీలు పిల్లలు లైన్లలో నిలబడి దేబిరిస్తున్న వేళ
పండుగ పూట పాక ప్రావీణ్యం బొబ్బట్ల పిండివంటలు
రుచులు రుచులుగా వండి వడ్డించలేకపోతున్నది

కూలిన గోడల ఇటుక రాళ్ల శిథిలాల నడుమ
కొసప్రాణాలేవైనా కొట్టుమిట్టాడుతున్నాయేమోనని
అయినవాళ్ళ ఆశల లాంతర్లు అగ్గగ్గలాడి వెతుకుతుంటే
గుమ్మానికి మామిడి తోరణం కట్టే చేయి వణుకుతున్నది

కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు
తెల్లని బట్టల్లో చుట్టబెట్టి ఖననం కోసం
ఎదురు చూస్తున్న దృశ్యాలు కళ్ళకు గాయాలు చేస్తుంటే
కొత్త ఉడుపులు తొడుక్కోవడాన్ని మనశ్శరీరాలు తిరస్కరిస్తున్నాయి

గంధకపు గాలి గగన తలమంతా నిండి
దేహాలు కాలి కమిలిన కమరు వాసన ఖండాంతరాలు దాటి వస్తుంటే
వేపపూలతో కలిసిన మల్లెల పరిమళపు గాలిని
నాసిక ఇష్టంగా ఆస్వాదించ వెనుకాడుతున్నది

నిస్సహాయుల కనుల గూళ్ళలో నిద్రను చెదరగొట్టి
పీడకలలు స్థావరం ఏర్పరచుకున్నప్పుడు
సుఖనిద్రకు స్వాగతం పలుకలేక
కనురెప్పలు మూతపడనంటున్నాయి

భూమండలపు నలుదిక్కులా
అహంకారం, అభిజాత్యం అతిశయిస్తున్న వేళ
దురాశ, దురాక్రమణలు విచ్చలవిడిగా నర్తిస్తున్న వేళ
మానవత్వాన్ని మరిచిన వారి మదమణచి
దుశ్చర్యల దుఃఖ కారకుల దునుమాడి
యుద్ధకాంక్షల చెలరేగే పగల సెగలను పరాభవించి
మనిషి మనుగడే అంతిమ ధ్యేయమనీ
ప్రకృతి పరిరక్షణే పరమ ధర్మమనీ
చాటి చెప్పమ్మా నవ వసంతమా!
_**

May 31, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

‘నాన్న డైరీ’

by Kattekola Vidyullata May 31, 2026
written by Kattekola Vidyullata

హైదరాబాద్ నగరంలోని ఒక పెద్ద విల్లా. బయట తోటలో రంగురంగుల పూల మొక్కలతో చిన్న తోట అందంగా ఉంది.

 లోపల ఏసీ చల్లదనంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంట్లో ఉండే రాఘవరావు గారి వయస్సు డెబ్బై ఐదేళ్లు. ఒకప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్‌లో పెద్ద అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రెండేళ్ల క్రితం భార్య కాలం చేసింది. వారికి ఒకే ఒక్క కొడుకు అఖిల్. తన జీవితకాలం సంపాదనంతా పెట్టి కొడుకు అఖిల్‌ను అమెరికాలో చదివించారు. ఇప్పుడు అఖిల్ అదే నగరంలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓ. తల్లి చనిపోయాక తండ్రిని తమతో పాటే ఉండేందుకు తన ఇంటికి తీసుకు వచ్చాడు అతను.

రాఘవరావు గారికి ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తినడానికి పోషకాహారం, వేసుకోవడానికి మందులు, చూసుకోవడానికి ఒక అటెండెంట్. కానీ ఆయనకు లేనిది ఒక్కటే, ఆత్మీయ పలకరింపు.

అఖిల్ తెల్లవారుజామున ఆఫీస్‌కు వెళ్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. కోడలు శృతి తన కిట్టీ పార్టీలు, సోషల్ మీడియా లైవ్‌లతో బిజీ. మనవడు సిద్ధూ తన ఐప్యాడ్ లో గేమింగ్ లోకంలో ఉంటాడు. రాఘవరావు గారు ఆ ఇంట్లో ఒక అందమైన పాత కాలపు బొమ్మలా మిగిలిపోయారు. ఎవరూ ఆయనను ఏమీ అనరు, కానీ ఎవరూ ఆయనను పట్టించుకోరు. అది ఒక రకమైన ‘గౌరవప్రదమైన నిర్లక్ష్యం’.

ఒక ఆదివారం ఉదయం. అందరూ బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రాఘవరావు గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చి పక్కనే కూర్చున్నారు.

“అఖిల్.. వచ్చే వారం మన ఊర్లో జాతర ఉందిరా. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు నా భుజాల మీద కూర్చుని జాతర అంతా సంబరంగా తిరిగే వాడివి, రంగుల రాట్నం ఎక్కేవాడివి. ఈసారి వెళ్దామా?” అని ఆశగా అడిగారు.

అఖిల్ ఫోన్ చూస్తూనే, “నాన్నా.. ఇప్పుడు జాతరలు, ఊర్లు అంటే ఎలా కుదురుతుంది? నాకు ఇక్కడ క్లయింట్ మీటింగ్స్ ఉన్నాయి. పైగా అక్కడ ఎండలు, దుమ్ము.. మీకు పడవు. ఇప్పుడు అలాంటి ప్రోగ్రాం ఏమీ పెట్టకండి,” అని తేల్చేశాడు.

కోడలు శృతి అందుకుని, “అవును మావయ్య గారూ, పైగా సిద్ధూకి కోచింగ్ క్లాసెస్ ఉన్నాయి. మనం వెళ్లలేం,” అంది. రాఘవరావు గారి కళ్లల్లో మెరిసిన ఆశ ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆయనకు కావాల్సింది జాతర కాదు, ఆ వంకతో తన కొడుకుతో, మనవడితో కలిసి గడిపే నాలుగు రోజులు.

మర్నాడు అఖిల్ తన ముఖ్యమైన బిజినెస్ ఫైల్ ఒకటి ఇంట్లో మర్చిపోయాడు. అది తీసుకోవడానికి మధ్యాహ్నం అనుకోకుండా ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్తుండగా హాల్‌లో సంఘటన చూసి ఆగిపోయాడు.

అక్కడ సోఫాలో రాఘవరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన ముందు మనవడు సిద్ధూ ఐప్యాడ్‌లో ఏదో చేస్తున్నాడు.

రాఘవరావు గారు సిద్ధూని అడిగారు, “సిద్ధూ.. నీకు ఒక కథ చెప్పనా? నేను చిన్నప్పుడు అడవిలో దారి తప్పి ఎలా బయటపడ్డానో తెలుసా?”

సిద్ధూ విసుగ్గా, “తాతయ్యా.. ప్లీజ్, నేను లెవెల్-10 లో ఉన్నాను. మీ పాత కథలు ఇప్పుడు వద్దు,” అని హెడ్‌ఫోన్స్ పెట్టేసుకున్నాడు. ఆ సమయంలో రాఘవరావు గారి ముఖంలో కనిపించిన వేదన, ఒంటరితనం అఖిల్‌ను ఉలిక్కిపడేలా చేశాయి.

రాఘవరావు గారి మౌనం, సిద్ధూ నిర్లక్ష్యం చూసిన అఖిల్ మనసులో ఏదో అలజడి మొదలైంది. కానీ ఆ అలజడి ఒక తుఫానుగా మారడానికి ఆ రోజు రాత్రి జరిగిన ఒక సంఘటన కారణమైంది.

ఆ విల్లాలో రాఘవరావు గారికి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక ప్రత్యేకమైన గది ఉంది. అఖిల్, శృతి మొదటి అంతస్తులో ఉంటారు. సిద్ధూ గది కూడా పైనే ఉంటుంది. రాఘవరావు గారికి మోకాళ్ల నొప్పుల వల్ల మెట్లు ఎక్కడం కష్టం, అందుకే ఆయన కింద గదిలోనే ఉంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండేది కేవలం భోజనాల సమయంలో మాత్రమే. మిగతా సమయమంతా ఆ ఇల్లు మూడు విడివిడి ప్రపంచాలుగా విడిపోయింది.

ఆ రాత్రి రెండు గంటలు అవుతోంది. రాఘవరావు గారికి హఠాత్తుగా ఊపిరి ఆడనట్లు అనిపించి, విపరీతమైన దగ్గు మొదలైంది. గదిలో నీళ్లు అయిపోయాయి. పక్కనే ఉన్న కాలింగ్ బెల్ కొట్టారు, కానీ కేర్ టేకర్ మంచి నిద్రలో ఉండటంతో ఎవరూ పలకలేదు. నీళ్ల కోసం ఆయన నెమ్మదిగా గోడలు పట్టుకుంటూ హాల్లోకి వచ్చారు. కిచెన్ వైపు వెళ్లే ఓపిక లేక, హాల్లో ఉన్న సోఫాలో ఆయాసపడుతూ కూలబడ్డారు.

సరిగ్గా అదే సమయంలో, సిద్ధూ ఆన్‌లైన్ గేమింగ్ ఆడుతూ, ఆకలి వేయడంతో ఏదైనా తిందామని కిందకు వచ్చాడు. చీకటిగా ఉన్న హాల్లో తాతయ్య సోఫాలో కూర్చుని ఆయాసపడుతూ దగ్గడం చూశాడు.

సిద్ధూ తన చేతిలోని ఫోన్‌ను చూసుకుంటూ విసుగ్గా, “తాతయ్యా! మీరు ఇక్కడ కూర్చుని ఇలా దగ్గితే పైన మాకు నిద్ర ఎలా పడుతుంది? లోపలికి వెళ్లి పడుకోవచ్చు కదా! ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంటే మీ సౌండ్ వల్ల కాన్సంట్రేషన్ పోతోంది,” అని కసిరి కొట్టాడు. ఆ చిన్న పిల్లాడి మాటల్లో కనికరం లేదు, కేవలం తన ఆటకి అడ్డంకి కలిగారన్న కోపం మాత్రమే ఉంది.

అదే సమయంలో మంచి నీళ్ల కోసం కిందకు వస్తున్న అఖిల్, మెట్ల మీద ఆగిపోయాడు. తన కొడుకు సిద్ధూ, తాతయ్య పట్ల చూపిస్తున్న ఆ నిర్లక్ష్యం అఖిల్ గుండెను ముక్కలు చేసింది. సిద్ధూ వెళ్ళిపోయాక, అఖిల్ నెమ్మదిగా తండ్రి దగ్గరకు వచ్చాడు.

రాఘవరావు గారు నీరసంగా తల పైకెత్తి, “క్షమించురా అఖిల్.. దగ్గు ఆపుకోలేకపోయాను. సిద్ధూ నిద్ర పాడైందట.. ఇప్పుడే వెళ్ళిపోతాను,” అంటూ వణుకుతున్న చేతులతో లేవడానికి ప్రయత్నించారు.

అఖిల్ ఒక్కసారిగా తన తండ్రిని పట్టుకుని సోఫాలోనే కూర్చోబెట్టాడు. తండ్రి కాళ్ల దగ్గర కింద కూర్చుని, ఆయన చేతులను తన కళ్లకి అద్దుకున్నాడు. “నాన్నా.. సిద్ధూ నిద్ర పాడవటం కాదు, నా నిద్ర ఇప్పుడే మెలకువలోకి వచ్చింది. ఒక తండ్రికి కొడుకు నీళ్లు ఇవ్వాల్సిన సమయంలో, ఒక మనవడు విసుక్కుంటున్నాడంటే.. దానికి కారణం వాడు కాదు, నేను. వాడికి నేను నేర్పిన సంస్కారం అదే,” అంటూ కుమిలిపోయాడు.

అఖిల్ తన తండ్రిని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాక, ఆ గదిలో ఉన్న టేబుల్‌పై ఒక పాత డైరీ కనిపించింది. అది రాఘవరావు గారి వ్యక్తిగత డైరీ.

కుతూహలంతో అఖిల్ దాన్ని తెరిచాడు. అందులో తేదీల వారీగా రాసిన విషయాలు అఖిల్‌ను కదిలించాయి.

జూన్ 15, 1998: “ఈరోజు అఖిల్ కాలేజీ డే. తనకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు వచ్చింది. నేను తప్పకుండా రావాలని వాడు కోరుకుంటున్నాడు. నేనేమో కలెక్టర్ గారితో పాటు ఫీల్డ్ ట్రిప్ వెళ్ళాలి. ఇప్పుడు రాలేనంటే ఆయన ఏమంటారో తెలీదు. కానీ ఎలాగైనా నేను నా కొడుకు కాలేజీ ప్రోగ్రాం కి వెళ్ళాలి. వాడు బాగా చదువుకుని గొప్ప ప్రయోజకుడు కావడమే నాకు ముఖ్యం.”

సెప్టెంబర్ 10, 2005: “అఖిల్ అమెరికా వెళ్తున్నాడు. విమానం ఎక్కుతున్నప్పుడు వాడు వెనక్కి తిరిగి చూడలేదు. వాడు తన లక్ష్యం వైపు చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది, కానీ నా కళ్లలో నీళ్లు ఆగలేదు. వాడు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో?”

చివరి పేజీలో, అంటే వారం క్రితం రాసిన ఒక వాక్యం అఖిల్ గుండెను పిండేసింది:

“ఇప్పుడు అఖిల్ కోరుకున్నవన్నీ సాధించాడు. ఈ ఇల్లు, ఈ కారు, ఈ హోదా.. ఇవన్నీ చూస్తుంటే ముచ్చటగా ఉంది. కానీ ఇన్ని ఉన్న ఈ ఇంట్లో నా కోసం ఒక ‘పలకరింపు’ కరువైంది. అఖిల్ చాలా బిజీగా ఉంటున్నాడు. నేను వాడికి భారమవ్వకూడదు. నా శ్వాస ఆగిపోయేదాకా వాడికి ఏ ఇబ్బంది కలగకూడదు.”

డైరీ చదువుతున్న అఖిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళాడు. తను చిన్నప్పుడు అడిగిన ప్రతి చిన్న ప్రశ్నకూ తండ్రి ఎంత ఓపిగ్గా సమాధానం చెప్పేవారో.. తను రాత్రి పడుకోకపోతే భుజాన వేసుకుని ఇల్లంతా తిప్పిన తండ్రి, తన చదువు కోసం ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఖర్చు చేయడం… అన్నీ కళ్లముందు కదిలాయి.

అఖిల్ ఆ రాత్రి పడుకోలేకపోయాడు. తను సంపాదిస్తున్న లక్షలు, కొంటున్న కార్లు తన తండ్రి ముఖంలో ఒక్క చిరునవ్వును కూడా తీసుకురాలేకపోతున్నాయని గ్రహించాడు. మర్నాడు ఉదయం అఖిల్ ఆఫీస్‌కు వెళ్లలేదు. హాల్లో కూర్చుని ఉన్న తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్ల దగ్గర కింద కూర్చున్నాడు.

“ఏమైందిరా అఖిల్? ఒంట్లో బాలేదా?” అని రాఘవరావు గారు కంగారుగా అడిగారు.

“లేదు నాన్నా.. నా మనసు బాలేదు. ఇన్నాళ్లు నేను మీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాను అనుకున్నాను కానీ, నా సమయాన్ని ఇవ్వడం మర్చిపోయాను. క్షమించండి నాన్నా,” అని అఖిల్ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

రాఘవరావు గారి కళ్లు చెమ్మగిల్లాయి. “నువ్వు పక్కన కూర్చుని ఒక్క మాట మాట్లాడితే చాలురా.. నాకు అంతకంటే స్వర్గం ఇంకేముంటుంది?” అన్నారు.

అఖిల్ తండ్రి చేతులు పట్టుకుని ఏడుస్తూ, “నాన్నా.. నేను ఐటీ కంపెనీకి సీఈఓని కావచ్చు, కానీ కొడుకుగా ఫెయిల్ అయ్యాను. మీరు నా ఎదుగుదల కోసం మీ కాలాన్ని, మీ సర్వస్వాన్నీ వెచ్చించారు. నేనేమో నా హోదా కోసం మీ మనసును చంపేశాను. నన్ను క్షమించండి నాన్నా,” అని బోరున విలపించాడు.

ఆ క్షణం ఆ ఇంట్లోని ఏసీ చల్లదనం కంటే, ఒక తండ్రి హృదయం లోని వెచ్చదనం గొప్పదని అఖిల్ తెలుసుకున్నాడు.

అఖిల్ కి ఆ క్షణమే అర్థమైంది, మనం ఎదిగే క్రమంలో మన తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలు ‘స్టాక్ మార్కెట్’ లెక్కల వంటివి కావు. అవి వెలకట్టలేని ప్రేమాక్షరాలు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కంటే, మన తల్లిదండ్రులను మనం గౌరవించే విధానమే గొప్ప సంస్కారం. ఎందుకంటే, మనం మన తల్లిదండ్రుల పట్ల చూపే ప్రవర్తనే, మన పిల్లలు మన పట్ల చూపే భవిష్యత్తు ప్రవర్తనకు పునాది.

నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరగడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కాదు, ‘భావోద్వేగాల కొరత’. తల్లిదండ్రులకు మనం ఇచ్చే ఖరీదైన గదులు, ఏసీలు వాళ్లకు ఆనందాన్ని ఇవ్వవు. వాళ్లకి కావాల్సింది మన పలకరింపు, మన సమయం, వాళ్లు మనకు ‘భారం కాదు.. బాధ్యత’ అనే నమ్మకం. మనం పెరిగి పెద్దయ్యాక మన రెక్కలు బలపడవచ్చు, కానీ ఆ రెక్కలు రావడానికి కారణమైన ‘గూడు’ తల్లిదండ్రులే అని మర్చిపోకూడదు.

మరుసటి రోజు నుండి అఖిల్ జీవితం మారిపోయింది. అతను సిద్ధూని తన దగ్గరకు పిలిచి, “సిద్ధూ.. మనం ఇవాళ తాతయ్యతో ఊరికి వెళ్తున్నాం. నీ కోచింగ్ క్లాసులు మళ్ళీ చూసుకోవచ్చు. కానీ తాతయ్య జ్ఞాపకాలు మనకు మళ్ళీ రావు,” అని చెప్పాడు.

ఆ ప్రయాణంలో సిద్ధూకు తాతయ్య తన చిన్ననాటి కథలు చెబుతుంటే, అఖిల్ కారు అద్దం నుండి ఆ ఇద్దరినీ చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు.

May 31, 2026 7 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

అనుబంధాల్లో మేనత్త పాత్ర

by Swayam Prabha May 31, 2026
written by Swayam Prabha

మన కుటుంబాల్లో అనుబంధం, ఆత్మీయతలకు ఎక్కువ ప్రాధాన్యత వుండేది. ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క పేరు. అది ఆంగ్ల భాషలో ఇతర భాషల్లో అంత ఎక్కువగా కనిపించదనిపిస్తుంది. మేనత్త, మేనమామ, చిన్నాయన, చిన్నమ్మ, పెద్దమ్మ, పెద్దనాయన ఈ విధంగా ఉండేవి వరుసలు. వీరితో అనుబంధంలో ప్రత్యేకత సంతరించుకొనేది. అలాంటిదే మేనత్త అనుబంధం.

పిల్లలకు అత్త అంటే ఎనలేని ప్రేమ. ఎందుకంటే ఆడిస్తుంది, పాడిస్తుంది, తినిపిస్తుంది, నిద్ర పుచ్చుతుంది. “అత్త ఒడి పువ్వు వలె మెత్తనమ్మ, ఆదమరచి హాయిగా నిదురపోమా” సినీ కవి వ్రాసినది నిజమనిపిస్తుంది. ‘పద్దత్త, సరత్త, బుౙత్త, ఇలా పిల్లలు పెద్దయ్యాక కూడ పిలవటం చూస్తుంటాం. వాళ్లు పెళ్ళి చేసుకుని అత్తగారింటికి వెళ్తుంటే ఆ పిల్లల బాధ వర్ణనాతీతం. “నీవు వెళ్ళొద్దని” ఎంతో ఏడ్చేవాళ్లు. ఆ పెళ్ళికొడుకును విలన్ లాగా చూసేవాళ్లు.

మేనత్త ఊరికి వెళ్లటం పిల్లలకు ఎంతో ఇష్టం, అక్కడ ఆడిందే ఆట. పాడిందే పాట. కేకలేసే అమ్మా నాన్న అక్కడ ఉండరుగా! అందుకే అంత ఇష్టం. అత్త పిల్లలతో వస్తుందంటే ఎంత సంతోషమో! కలిసి ఆడుకోవచ్చని. వాళ్లు తిరిగి వెళ్తుంటే ఎంతో బాధ కలిగేది ఆ చిన్ని హృదయాలకు. అత్త ఊరికి వెళ్ళేటప్పుడు ఇఇచ్చే పావలా ఎంతో ఆనందాన్ని ఇచ్ౘ్ే విషయం. “కలవారి కోడలు కలికి కామాక్షి, కలికి చిలుకల కొలికి మాకు మేనత్త” అని పాడుకునేవారు పిల్లలు.

మేనత్తలు చేసే త్యాగాలు కూడా కోకొల్లలు. అన్న భార్య, తమ్ముడి భార్య చనిపోతే చేరదీసి పిల్లలను పోషించి పెద్ద చేసేది ఆమెనే. ఒక మేనత్త తనకు ఇద్దరు పిల్లలున్నా “భర్త నన్ను రెండో పెళ్ళి చేసుకోనిస్తేనే నేను నీ మేనల్లుణ్ణి చేరదీస్తానంటే” భర్త పెట్టిన కండీషన్ కు ఒప్పుకున్న అమాయకురాలు. (ఆ రోజుల్లో సంతానమే సౌభాగ్యంగా భావించేవారు)

మరో మహిళ ఉదంతం – పూర్వకాలంలో మగవాళ్ళకు పెళ్ళి అవటం చాలా కష్టంగా ఉండేది. కర్ణాటకలో కొంచెం పేదిరకంతో ఆడపిల్లలను అమ్ముకునేవారు. ఆ విధంగా ఎంతోమంది చిన్నపిల్లలను కొనుక్కొని తెచ్చుకుని పెళ్ళి చేసుకునేవారు. వాళ్ళ మాటతీరు ఒక రకంగా ఉండేది. కందిపప్పును కందిబేళ్ళని, పుళిహోగ్రి అని, బేగి అని అవి వింటుంటే తమాషాగా ఉండేది. ‘కృష్ణుఇ బేగనే బారో, యన మన తన లీల తోరో” అని పేరంటాలలో ఆమె పాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేది. కన్నడీగులు కదా తెల్లగా ఉండేది. ఎన్నో ఏళ్ళు గడిచాక ఆమె మేనల్లుడు “అత్తారింటికి దారేది” అని వెతుక్కుంటూ వచ్చి ఊళ్ళో వాళ్లందరికి ఆశ్చర్యం కలిగించాడు. మొదట ఆ భార్యాభర్తలు నమ్మక ఎన్నో ప్రశ్నలు వేసి మేనల్లుడని మొత్తం మీద నిర్ధారించుకున్నాక ఆమె ఆనందానికి అవధులు లేవు. తన పెళ్ళికి రావాలని పట్టుపట్టి పిల్చుకుని వెళ్ళాడు. ఈ ముసలాయనకు ఒకటే భయం. వస్తుందో రాదోనని. తనూ వెళ్ళాడు. ఇద్దరికి బట్టలు పెట్టి వాళ్ళ కన్నడీగుల లాంఛనాలతో మేనత్తను పంపించారు. వచ్చే అప్పుడు మేనల్లుని పెళ్ళి ఫోటో తెచ్చుకొని గోడకు తగిలించుకుని రోజు చూసుకొని ఎంతో మురిసిపోయేది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికి చూపించేది. ఆ తరువాత అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వచ్ౘ్ేది. . వచ్చే అప్పుడు మైసూరు సాండిల్ సబ్బులు, ఘుమఘుమలాడే కాఫీ పొడి తెచ్చుకునేది.

మేనత్తంటే పైతరం ఆడపడుచు. ‘నేనెవరనుకున్నావు. మొండి చుట్టం మొగుడి మేనత్తనని” పెత్తనం చెలాయించేది. అన్నకు, తమ్ముండ్లకు అండగా వుంటూ సలహాలనిచ్ౘ్ే మంచి మనిషి.

పిల్లలు పలికే తొలి మాట ‘అత్త అత్త’ అని. పిల్లలను తొట్లెలో వేసి కుడి చెవిలో పేరు చెప్పి ఈపులు చరిపించుకునేది కూడా మేనత్తే. అనుబంధాల్లో మేనత్త పాత్ర ఎంత గొప్పదో కదా!

May 31, 2026 8 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

నమ్మకం

by Nellutla Madhava Srinivas May 31, 2026
written by Nellutla Madhava Srinivas

ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటి వ్యక్తి భగవంతుడు ఏదైనా చేయగలడు అని అంటాడు. రెండవ వ్యక్తి ఏదైనా చేయగలడు అని అంత గట్టిగా చెప్తున్నావు ఏంటి నీకు ఆయన మీద అంత నమ్మకం అని అడుగుతాడు. అప్పుడు ఆ స్నేహితుడు ఒక చిన్న కథ చెప్తా విను తర్వాత నువ్వే ఆలోచించు నీకే అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా కాదా అనేది అని కథ చెప్పటం మొదలు పెడతాడు.
ఒక ఊళ్లో ఒక చెప్పులు కుట్టుకునే వాడు ఉంటాడు. అతడు తన పని తాను చేస్తూ కూడా ఆ శివ నామస్మరణ అనుక్షణం చేస్తూ ఉంటాడు. అదే ఊర్లో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ధనవంతుడవటం చేత ఎన్నో రకాల పూజలు, దానధర్మాలు చేస్తూ అందర్నీ పలకరిస్తూ సరదాగా మాట్లాడుతూ అందరూ తనను పొగుడుతూ ఉంటే సంతోష పడిపోతూ ఉంటాడు. అటుగా వెళుతూ ఈ ఇద్దరిని చూసిన నారద మహర్షి ఆ శివుడి దగ్గరికి వెళ్లి ప్రణామములు తెలియజేసి నాకు ఒక సందేహం శివయ్య. అది నువ్వైతేనే తీర్చగలవు అని అంటాడు. ఏంటో చెప్పు అని ఆ శివుడు అడగగా….. ఆ నారద మహర్షి శివుడితో నువ్వు చూస్తున్నావు కదా కింద ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పు ఎవరికి ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ శివుడు చెప్పులు కుట్టే అతనికి అని చెప్తాడు. అదెలా ఆ ఇంకో వ్యక్తి కూడా అనేక రకాల పూజలు దానధర్మాలు చేస్తాడు కదా మరియు చెప్పులు కుట్టుకునే వ్యక్తి అవేమీ చేయకపోగా నీ నామస్మరణతో కాలక్షేపం చేస్తున్నాడు కదా అంటాడు. అయితే ఒక పని చెయ్యి నేను ఒక మాట చెప్తాను దానిని తూ.చా తప్పకుండా వారితో చెప్పు ఎవరు ఏం సమాధానం చెప్తారో దానిని బట్టి ఎవరికి పుణ్యం ఇవ్వాలో నిర్ణయిద్దాం అని అంటాడు. నారద మహర్షి సరే అని శివుడు చెవిలో చెప్పిన విషయాన్ని మారువేషంలో ముందుగా సంపన్నుడి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్తాడు. ఓయ్ పెద్దమనిషి నేను ఆ శివయ్యను చూశాను తెలుసా అని చెప్తాడు. ఓ!!! అవునా. శివయ్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు వెటకారంగా. శివయ్య సూది బెజ్జం లో నుండి ఏనుగును దూరుస్తున్నాడు అని సమాధానం చెప్తాడు మారువేషంలో ఉన్న నారద మహర్షి. చాలు చాలు లేవయ్యా సూది బెజ్జం లో నుండి ఏనుగును దూర్చడమేంటి వెటకారంగా ఉందా అని కసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాస్త ముందుకెళ్లి ఇదే విషయాన్ని చెప్పులు కుట్టుకునే వాడితో చెప్తాడు. చెప్పులు కుట్టుకునే వాడు చాలా సంతోషంగా అవునా!!! అయినా నా శివయ్య ఏదైనా చేయగలడు అని అనుకుంటూ తన పనిలో తాను నిమగ్నమై శివనామ స్మరణ చేస్తూ ఉంటాడు. అది గమనించిన నారద మహర్షి నీకు నేను చెప్పిన విషయాన్ని విన్న తర్వాత కోపంగానీ ఆశ్చర్యం కానీ కలగలేదా అని అడుగుతాడు నారద మహర్షి. లేదయ్యా ఆ రెండు కలగటానికి ఆయన మనలాగా మామూలు మనిషి కాదు కదా!!!! అంటూ పక్కనే చెట్టు మీద నుండి రాలి పడిన మర్రి పండును ఒక దాన్ని తీసి మారువేషo లోఉన్న నారదమహర్షికి చూపిస్తూ ఇంత చిన్న పండు లో నుండి ఇంత పెద్ద వృక్షాన్ని సృజించగలిగిన నా తండ్రి సూది బెజ్జ ం లోనుండి ఏనుగును తీయలేడా??? ఇంత చిన్న విషయానికి ఆశ్చర్యం ఎందుకు???? ఆయన ఏదైనా చేయగలడు. మనకు కావాల్సిందల్లా ఆయన మీద నమ్మకం మాత్రమే అని తన పని తాను చేసుకుంటాడు. ఈ సమాధానం విన్న నారద మహర్షి శివుడి దగ్గరికి వెళ్లి నిజమే స్వామి మీరు చెప్పింది అని ప్రణామాలు చేసి వెళ్ళిపోతాడు.
మనం కూడా చాలాసార్లు మనకు దైవం మీద నమ్మకం లేకపోయినా అలవాయితీగానో అలవాటుగానో ఇష్టం లేకపోయినా ఆడంబరాలకు పోయి పొగడ్తలకు లొంగిపోయి చాలా పనులు చేస్తుంటాం. కానీ ఆ పరమేశ్వరుడికి కావలసింది తన పైన నమ్మకం పెట్టుకోవటం, భగవంతుడు మీద ప్రీతి కలిగి ఉండటం . దేవుడి మీద భారం వేసి మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని చేకూర్చటమే ఆయన పని. తనపైన నమ్మకం పెట్టుకున్న వారిని అనుక్షణం కాపాడటం భగవంతుడు ప్రధమ కర్తవ్యం గా భావిస్తాడు. అందుకే మనం ఏ పని చేసినా అంతా మనదే గొప్ప అని గొప్పలకు పోకుండా ఆ భగవంతుని తలుచుకొని చేసే ప్రతి పనిలో తప్పకుండా విజయం సాధిస్తాం. అప్పుడప్పుడు చిన్నచిన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి.ఇక ఎదురయ్యే ఆటంకాల గురించి అంటారా అవి మన కర్మఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే.

సర్వేజనా సుఖినోభవంతు

May 31, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కష్టపడితేనే ఫలితం

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, May 31, 2026
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

నరసింహపురం లో శరభయ్య అనే  ఒక రైతు ఉండేవాడు.  అతడు కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించేవాడు .  అతనికి రవి అనే ఒక కొడుకు ఉండేవాడు.  అతన్ని చదివించి గొప్ప వానిగా చేయాలని శరభయ్య  ఆశ. 
        రవి మొదట చదువు మీద ఆసక్తి చూపినా  అటు తర్వాత మిత్రులవల్ల అతనికి చదువు మీద ఆసక్తి సన్నగిల్లింది.   అతడు పదవ తరగతి పూర్తి చేసిన పిదప అతనిని శరభయ్య డబ్బు కట్టి ఒక పేరు మోసిన కళాశాలలో చేర్పించాడు .  కానీ రవి చదువు మీద శ్రద్ధ చూపకుండా ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకోసాగాడు.  శరభయ్య కు ఆ కళాశాల వారు  రవి చదవడం లేదని మార్కులు చాలా తక్కువగా వస్తున్నాయని కబురు అందించారు.   ఈ విషయం విని శరభయ్య చాలా బాధపడ్డాడు . 
         ఒకసారి దసరా సెలవులకు రవి ఇంటికి వచ్చాడు.  శరభయ్య  తన వెంట రవిని వ్యవసాయ పనికి తీసుకొని వెళ్ళాడు.   అక్కడ అతన్ని తనతో పాటు పని చేయమన్నాడు .  కానీ రవికి ఆ పని ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అయినా తండ్రి మాట కాదనలేక అతడు చెప్పిన పనల్లా చేసాడు. 
        అలా వారం రోజులు గడిచాయి .  రవికి ఈ వ్యవసాయం కన్నా తాను చదువుకోవడమే ఉత్తమంగా అనిపించింది.   చదువు మీద తనకు కూడా ఆసక్తి ఉంది.  కానీ అనవసరంగా  తాను ఇతర విషయాల పట్ల మక్కువ పెంచుకొని చదువును నిర్లక్ష్యం చేస్తున్నానని అతనికి అనిపించింది. తండ్రి కష్టం చూసిన తర్వాత తన పద్దతిని మార్చుకోవాలని రవి భావించాడు.  
           శరభయ్య కుమారునిలో వచ్చిన  మార్పును గమనించాడు.   అతడు రవితో “ఒరేయ్ ! మేము అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాం .  పంట ఒకసారి వస్తున్నది. మరోసారి రావడం లేదు.   చివరికి ఎప్పుడైనా దేవుడు ఆదుకోకపోతాడా అని వ్యవసాయం  వృత్తిగా భావించి జీవిస్తున్నాం .  నలుగురికి కడుపు నింపుతున్నామన్న సంతృప్తి మాలో ఉంది.  నీవు మందమతివి కూడా కావు.  మరి నీకు  వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగితే అదే చెయ్యి.  అదేం తక్కువ కాదు.    రేపు భార్యాపిల్లలను పోషించాలంటే  నీవు ఏదో ఒక పని చేయాలి కదా !”అని అన్నాడు. 
       అది విన్న రవి ” నాన్నా!  నాకు వ్యవసాయం చేయడం  కన్నా చదవడమే ఉత్తమంగా అనిపిస్తున్నది .  కష్టపడనిది ఏదీ సాధించలేమని నాకు అర్థమైంది .  అందుకే రేపటినుండి కష్టపడి చదివి ఈ వ్యవసాయంలో పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతులు కనిపెడతాను” అని అన్నాడు.   ఆ మాటలకు తండ్రి ఎంతో సంతోషించాడు. 
        ఆ తర్వాత కళాశాలకు వెళ్లిన రవి బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత సాధించాడు.  తర్వాత అతను  వ్యవసాయ శాస్త్రాన్ని చదివి కొత్త కొత్త పద్ధతులు వ్యవసాయంలో తెలుసుకొని రైతులకు దిగుబడి ఎక్కువ వచ్చే మార్గాన్ని  తెలుసుకున్నాడు.  ఆ తర్వాత తన తండ్రితో పాటు ఇతర రైతులకు వ్యవసాయం లోని కొత్త కొత్త పద్దతులను తెలిపాడు. చదువు అంటే ఆసక్తి లేని  తన మిత్రులకు రవి  వ్యవసాయం చేయమని ప్రోత్సహించాడు.    తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు ఆ తండ్రి ఎంతో సంతోషించాడు.  ఆ తర్వాత కొన్ని రోజులలోనే అతను ఒక మంచి కొలువును కూడా సంపాదించాడు.  అందుకే పిల్లలూ! ఎందులో నైనా  కష్టపడనిదే ఫలితం రాదని గ్రహించాలి. 

    May 31, 2026 1 comment
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    కాకతీయులు – పద్మనాయకులు (వెలమలు)

    by డా॥ గండ్ర లక్ష్మణరావు May 31, 2026
    written by డా॥ గండ్ర లక్ష్మణరావు

    భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధమైన అధ్యాయం కాకతీయ సామ్రాజ్యం. క్రీ.శ.1150 నుండి క్రీ.శ.1323 వరకు కాకతీయులు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. వీరి పాలన తూర్పున కంచివరకు, దక్షిణాన కళింగం వరకు ,పడమర గోదావరి(పొలాస), కోటగిరి, కర్ణాటకలో బీదర్  వరకు విస్తరించి ఉంది. ఆయా రాజుల కాలాలలో కొన్ని స్వతంత్రించి, కొన్ని సామంతులుగా అధీనమై కన్పడినా సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి దాదాపు 200 సంవత్సరాలు కాకతీయులు పాలించారు. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, రాజధాని దాకా పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేశారు. వ్యవసాయం, వ్యాపారం, వ్యవసాయసంబంధ వృత్తులను కాపాడడం తో పాటు సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్ప కళలను పోషించారు. కోరిన పొరుగు రాజులకు సహాయంగా నిలబడ్డారు. చెరువులు తవ్వించారు. వేయిస్తంభాల, పాకాల రామప్ప వంటి గొప్ప కళాఖండాలను నిర్మింపజేశారు. ఓరుగల్లులో కోటలను  నిర్మించారు. గొప్ప యుద్ధనైపుణ్యం, రాజనీతి చాతుర్యం, పరిపాలనా ప్రాభవం కలిగి అనేక మార్లు ఉత్తర భారతదేశం నుండి తురుష్కుల దండయాత్రలను ఎదుర్కొన్నారు. స్వయంగా రాజముద్రలుండేవి. నాణెములు మొదలైనవి ఉండేవి.

                       సుదీర్ఘమయిన, సుప్రసిద్ధమైన కాకతీయుల పాలనలో అత్యంత ప్రధానమైన పాత్రను నిర్వహించినవారు నాయంకరులు. వీరికి నాయకులు అనికూడా పేరు. ఈ నాయకులు కాకతీయ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడంలో, అనేక దండయాత్రలలో విజయం సాధించి పెట్టడంలో ప్రధానమైన పాత్రలను నిర్వహించారు. ధైర్యసాహసాలకు, విశ్వాసపాత్రతకు వీరు మారుపేరుగా నిలబడ్డారు. వీరి శౌర్యధైర్యాలను , విశ్వసనీయతను గమనించిన కాకతీయ ప్రభువులు రుద్రదేవుడు మొదలుకొని గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు మొదలైన రాజులందరు ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చి ప్రశంసించారు.

                        రేచర్ల బేతిరెడ్డి లేదా బేతాళనాయకుడు ప్రథముడుగా కనిపిస్తాడు.  రేచడు అనే మాలవాడు చేసిన త్యాగానికి గుర్తుగా రేచర్ల అని వంశానికి పేరుపెట్టుకున్నట్లుగా వెలుగోటి వంశావళి అనే కావ్యం ద్వారా తెలుస్తున్నది. రేచర్ల బేతాళనాయకుని  ధైర్యసాహసాలను గురించి తెలుసుకొని గణపతి దేవుడు రాజధానికి పిలిపించి ఉన్నతోద్యోగం ఇచ్చిఆదరించాడు

                       చెవ్విరెడ్డిని చూడ చేకొని పిలిపించి / యాదరంబొదవంగ నతని జూచి

                       అసహాయ శూరుడౌ నని యాత్మ దలపోసి / చెన్నుమీరగ లక్ష సీమ నిచ్ౘ్ె

                       డాలు డమారంబు తాళిచేపట్లును / గజహయంబుల నిచ్ౘ్ె ఘనత తోడ

                       హెచ్ౘ్ుగా నాతని మెచ్ౘ్ి పిల్లల మఱ్ఱి / బేతాళ రావని పేరొసంగ

                       అదియు మొదలుగ జనులెల్ల నబినుతింప

                       రమణతోడుత విలసిల్లె రావు పేరు

                       వాసికెక్కిన రేచర్ల శాసనుండు

                       దనరె పిల్లలమఱ్ఱి బేతాళుడనగ  ( వెలుగోటి వారి వంశావళి )

             అప్పటి నుండి ఆతని వారసులు కూడా కాకతీయ రాజుల వద్ద అనేక రకాల పదవులు నిర్వహించి రాజ్యసుస్థిరతకు రాజుల రక్షణకు కారకులయ్యారు.

              గణపతి దేవుని తండ్రి మొదటి ప్రతాపరుద్రుడు అనుమకొండకు చుట్టుపట్లగల మండలాదీశ్వరులను జయించి అప్పటి తన విజయమును తన తండ్రి రెండవప్రోలరాజు జయముల నుల్లేఖించుచు తాను తనపేర నిర్మించిన రుద్రేశ్వరాలయమున శాసనము( శా.శ.1084 చిత్రభాను సం.మాఘ శు త్రయోదశి, శనివారం) ను వేయించిన శాసనం ప్రకారం తన సైన్యమునందు సేనాపతుల ధైర్యసాహసకార్యముల వినుతించుచు ఉన్నత పదవులందు పద్మనాయకులు కలరని, తన తండ్రి సేనాని రేచర్ల కామయ తనకు బాసటగా నిలచినాడని పేర్కొన్నారు.” ( పద్మనాయక చరిత్ర , కోటగిరి వేంకట నరసింహ సత్యనారాయణరావు . పుట 75). దీనిని బట్టి గణపతిదేవునికన్న అప్పుడు బేతాళరావు అనే పేరు రేచర్ల అని రేచడి కారణంగా వచ్చిన పేరు గణపతిదేవుని కాలమందే కాక ముందే ఉన్న జరిగిన సంఘటన  అయి ఉండాలి. ముందునుంచి రేచర్ల వారు కాకతీయులతో కలిసి ఉన్నారని తెలుస్తున్నది. 

                       రేచర్ల బేతాళరావు కుమారులు ముగ్గురు. దామా, ప్రసాదిత్యుడు, రుద్ర. వీరు ముగ్గురు వీరాదివీరులై కాకతీయ రాజుల వద్ద గొప్ప పదవులను నిర్వహించారు.   గణపతి దేవుని తదనంతరం రుద్రమ దేవి రాజసింహాసనం అదిష్టించవలసి వచ్చింది. కాని స్త్రీలు రాజ్యపాలనకు యోగ్యులు కారనే నెపంతోను, రాజకుటుంబాలలోని అంతఃకలహాలకారణంగాను, సామంతుల వ్యతిరేకత కారణంగాను ఆమెను సింహాసనం అదిష్టించకుండా అవరోధాలు ఏర్పడ్డాయి. అందులో రేచర్ల బేతిరెడ్డికి ముగ్గురు కుమారులు. దామా, ప్రసాదాదిత్య, రుద్ర. వీరిలో ప్రసాదాదిత్యుడు రుద్రమదేవి సింహాసనానికి వచ్చిన కాలనికి వీరుడుగా రూపొంది ఉన్నాడు. ఆనాటి పరిస్థితులను గమనించి ప్రసాదాదిత్య ఈ అలజడులకు కారణమైన సామంతులను, అంతఃపుర కలహాలకు కారణమైన వారిని తన నైపుణ్యంతోను, శూరత్వంతోను కొందరిని బుజ్ౙగించి, కొందరిని ఒప్పించి , కొందరిని బెదరించి రుద్రమ దేవికి ఆటంకం రాకుండా చూశాడు. రుద్రమదేవి సింహాసనం అదిష్టించడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు ప్రసాదాదిత్యుడు. అందుకే అతనికి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాజ్యపితామహాంక వంటి బిరుదులు రుద్రమదేవి ప్రదానం చేసి సత్కరించింది.అంతే కాదు విజయ సూచకంగా అతని కాలికి విజయఘంట వలె అందె వేసి గౌరవించింది.“ ఆ ప్రసాదాదిత్యుండు కాకతి గణపతి దేవరాయలు చనిన, నతని కొమరిత రుద్రము దేవని బట్టము గట్టి కాకిత రాజ్యస్థాపనాచార్య బిరుదును, రాయపితాంక మహా బిరుదును పొంది డెబ్బడి యేడ్గురు నాయంకరుల దానొనర మించి భైరవ ప్రసాదలబ్ధంబగు పచ్చధరియించి నెగడె”  – వెలుగోటి వారి వంశావళి.

               ప్రసాదాదిత్యుని కారణంగానే రుద్రమ దేవి పాలనలో 77 గురు నాయంకరులను  రాజ్య రక్షకులుగా ఏర్పాటుచేసింది. నాయంకరులు అనేది నాయకుడు వంటిది. ఆయా ప్రాంతాలకు నాయకులుగా నియమించడం కావచ్చును. మరొక అబిప్రాయం ప్రకారం కాకతీయ కోటకు 77 బురుజులుండేవని ఒక్కొక్క బురుజునకు ఒకరు చొప్పున 77 గురు రక్షకులను నియమించింది. అయితే ఈ 77 గురు పద్మనాయకులే. పద్మనాయకులకు వెలమ అనే పేరుకూడా స్థిరపడింది. వెలమనాయకులు అని కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే వెలి మల నుండి ( వింధ్యపర్వతం అవతలి నుండి వచ్చిన వారు) అనే అర్థంలో ఈ పదం వచ్చిందని, వెలుగోటి వారు అనే వంశం పేరుతో వెలమ అని ఏర్పడి ఉండవచ్చుననీ, అబిప్రాయాలున్నాయి. పద్మనాయకులు, వెలమలు పర్యాయ పదాలుగానే అప్పుడు ఇప్పుడు వ్యవహారంలో ఉంది.

                       77గురు నాయంకరులు కెోట రక్షకులైనా, రాజ్యరక్షకులుగానే తమ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. ఈ నాయంకర వ్యవస్థను ప్రతాపరుద్రుడు క్రీ.శ.1279 ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు ప్రతాప చరిత్ర వల్ల తెలుస్తున్నది.సిద్ధేశ్వర చరిత్రకు పీఠిక రచించిన ఖండవల్లి బాలేందుశేఖరం గారు ఇచ్చిన వివరాలు,

    పద్మనాయకులు 77, ఒక్కొక్క నాయకునకు సైన్యం 1500, ఉత్తమాశ్వములు 100, ఏనుగులు 10 , రాజ్యభవన సంరక్షణకు సుశిక్షితులైన సైనికులు 9000, మొత్తము అశ్వములు 24000,ఏనుగులు  2500 ఈ సేనావాహినులకు డెబ్బదియేడుగురు పద్మనాయకుల నాయకుల గావించినట్లు సిద్ధేశ్వర చరిత్ర, వచన సోమరాజీయము మొదలగు గ్రంథములందు చెప్పినారు ”. రుద్రమ దేవి కాలంలో కోట రక్షకులుగా ఉన్న నాయకులు ప్రతాపరుద్రుని కాలంలో నాయక వ్యవస్థ ను నిర్వహించి ఉండవచ్ౘ్ునని ఊహించవచ్చును. ప్రసాదాదిత్యుని అన్న దామ నాయకుడు, తమ్ముడు రుద్రనాయకుడు కూడా వీరి పాలనలో యుద్ధాలలో పాల్గొన్నారు.

                       గణపతి దేవుని తండ్రి మహాదేవుడు మరణించినపుడు గణపతి దేవుడు చిన్నవాడని, అంతఃకలహాలు చెలరేగి గణపతిదేవుని రాజును కాకుండా  చేసే ప్రయత్నాలు జరిగాయని అయితే రేచర్ల రుద్రుని రాజనీతిజ్ఞత , మల్యాల చౌండ సేనాపతి సహాయంతో గణపతి దేవుని కాకతీయ సింహాసనం అదిష్టింపజేసిందని, అందుకు గణపతి దేవుడు అతనికి మాండలిక హోదానిచ్చి తగిన రాజచిహ్నాలు, జతకౌడీలు మొదలైనవి ఇచ్చి గౌరవించాడని  తెలుస్తున్నది. అంతేకాదు రేచర్ల రుద్రుడే చాళుక్యరాజులలో ఒకరైన నాగతిరాజును భ’ద్రాచలం ప్రాంతానికి తరిమివేసి ఆ భాగాన్ని కాకతీయ సామ్రాజ్యం లో కలిపివేశాడని అతనికి కాకతి రాజ్య సమర్థ, కాకతీయ రాజ్య భార ధౌరేయ అనే బిరుదులున్నాయని రుద్రసేనాని మంత్రి అయిన రాజనాయకుడు వేయించిన ద్రాక్షరామ, ఉప్పరపల్లి శాసనాలు పేర్కొన్నాయి . ( కాకతీయులు.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి ). అయితే ఈ రుద్రుడు చెవ్విరెడ్డి కుమారుడైన రుద్రుడా? లేక రేచర్ల రెడ్డి రుద్రుడా అనే విషయంలో కొంత అస్పష్టత ఉంది. పరబ్రహ్మ శాస్త్రి గారి విశ్లేషణ ప్రకారం రేచర్ల  రెడ్డి వంశీయులు, రేచర్ల వెలమ వంశీయులు ఉన్నారని చూపారు. రేచర్ల అన్న పేరు వంశనామంగా బేతాళనాయకునికే ( చెవ్విరెడ్డి) అతని దగ్గర పనిచేసే రేచడు అనే అతడు తనకు భూమిలో దొరికిన నవలక్ష ధనరాశిని పొందడానికి  స్వయంగా బలిదానం చేశాడని, ఆకారణంగానే చెవ్విరెడ్డి వంశం పేరు అతనికి కృతజ్ఞతగా రేచర్ల అని పెట్టుకున్నారని వెలుగోటి వారి వంశావళి స్పష్టంగా తెలుపుతున్నది. రేచర్ల వంశనామంతో రెడ్డి కులస్తులు కాక చెవ్విరెడ్డికి రెడ్డి అని ఉన్నట్లుగా రావు బిరుదు రాకముందు రెడ్డి అనే వ్యవహారం ఉండి ఉండవచ్చునని భావిస్తే రేచర్ల వంశంలో వెలమ, రెడ్డి అనే వారిద్దరు ఉండరు. అయితే పరబ్రహ్మశాస్త్రిగారు రెండు వంశ వృక్షాలు కూడా చూపించారు. రేచర్ల వారిలో రెండు కుటుంబాలు క్రమంగా పెరిగి రెండు వంశవృక్షాలు కావచ్చును. రావు బిరుదు అందరూ ఒకసారి వాడుకొని ఉండకపోవచ్చు. అంతమాత్రాన రేచర్ల వారు రెడ్లు వెలమలు అని వేరు వేరు లేరు. ఇప్పటికీ వెలమ వారే రేచర్ల గోత్రంతో సుప్రసిద్ధులుగా ఉన్నారు. ఇది మరింతగా పరిశోదించవలసిన అంశం.

                                 “ వా లని బెఱకిన పరభూ

                                   పాలస్త్రీభూషణములు పాసి పడును నీ

                                   వా లావనితల తొడవుల

                                   కీలా? రేచర్ల రుద్ర కీర్తి సముద్రా!” -వె.వం.19 వ పద్యం

    శత్రువుల భార్యల భూషణములు తొలగించువాడనగా వారి భ’ర్తలను వధించువాడని అర్థంలో రేచర్ల రుద్రుని వీరత్వాన్ని గురించి పొగిడిన పద్యం ఇది. ఈ రుద్రుడు ప్రసాదాదిత్యుని సోదరునిగురించియే ఉన్నది.

              ప్రసాదాదిత్యుని అన్న దామ కుమారులు వెన్నమనాయుడు, సబ్బినాయుడు. 14 వ శతాబ్దం మొదటి పాదంలో వీరు చాలా ప్రశస్తిని పొందినారు. మహమ్మదీయులు జరిపిన దాడుల సందర్భంగా వెన్నమనాయుడు ఎదురొడ్డి మట్టి కరిపించాడు. ఢిల్లీ సుల్లానులు ఖిల్జీ, తుగ్లక్‌లు కాకతీయులపై ఎన్నో మార్లు దండయాత్రలు జరిపించారు. చరిత్ర ప్రకారం ఐదుసార్లు జరిపిన వివరాలు మాత్రమే ఉన్నాయి. అందులో మొదటిసారి పూర్తిగా విఫలం చెంది వెనుతిరిగినారు. మాలిక్ ఫక్రుద్దీన్ జునా, మరియు మాలిక్ జకరా, అనే వారి నాయకత్వంలో సైన్యాన్ని కాకతీయుల పైకి పంపించాడు. ² అల్లాఉద్దీన్ ఖిల్జీ. క్రీ.శ.1303 లో జరిగినట్లు చరిత్రకారుల అంచనా. ఇందులో వెన్నమనాయుడు వారిని ఎదిరించి పోరాడినా విజయం సాదించలేదనే అబిప్రాయం ఉంది. అప్పుడు ప్రకృతి అనుకూలించలేదు. వర్షాలు కురవడం యుద్ధానికి భంగం ఏర్పడింది. అయినా శత్రువులు కాకతీయ సామ్రాజ్యంలోకి అడగుపెట్టకుండానే వెనుదిరిగిపోయారు. ఇది విజయంగానే భావించాలి.

                       వెన్నమనాయుడితో పాటు పద్మనాయకులలో పైశాల వంశీయుడైన పోతుగంటి మైలి ( మల్లి ) ఉప్పరిపల్లి వద్ద మాలిక్ కాఫర్ జరిపిన దండయాత్రలో బీకర పోరాటం చేసి వారిని తరిమికొట్టినాడు. ఉప్పరపల్లి కరీంనగర్ జిల్లాలో ఉంది. మాలిక్‌కాఫర్ సైన్యం ఇక్కడిదాకా చొరబడింది. అయినా విజయం సాదించలేదు మాలిక్‌కాఫర్. ఢిల్లీ సుల్తానులు కాకతీయ సామ్రాజ్యాన్ని వశం చేసుకోలేదు. క్రీ.శ.1309లో మాలిక్‌కాఫర్ తిరిగి దండయాత్ర చేశాడు. ఈ సారి ప్రతాపరుద్ర చక్రవర్తి పదే పదే దాడుల వల్ల విసిగిపోయి కావచ్చు ,ఢిల్లీ సుల్తానులతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అది ఆయన మరణాంతం వరకు కొనసాగింది. అయితే ఒక సారి ఢిల్లీ సుల్తాన్ సమక్షంలో పోతుగంటి మైలికి, తెలుంగు బిజ్ౙలుడు అనే అతనికి ద్వంద్వయుద్ధం ఏర్పాటు చేశారు. అక్కడ కాకతీయుల 77గురు నాయకులు కూడా ఉన్నారని ఈ ద్వంద్వయుద్ధంలో పోతుగంటి మైలి విజయం సాదించి 77గురు నాయకులతో తిరిగి వచ్ౘ్ాడని తెలుస్తున్నది. డిల్లీ సుల్తానుకు కప్పము చెల్లించడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగి ఉంటుందని చరిత్రకారుల అబిప్రాయం.ఈ పోతుగంటి మైలికి ‘ వైరి గజబీమ, తెలుగుబిజ్ౙలు మణిమూపుర తలాట రాయా” అనే బిరుదులతో కాకతీయ రాజులు సత్కరించారు.

                       వెన్నమనాయకునికి ఎఱదాచ, సబ్బినాయనికి నలదాచ కుమారులు. ఇందులో  ఎఱదాచ ప్రతాపరుద్రుని ఆదేశంతో కంచి సమీపంలో పాండ్యులతో తలపడి కంచిని కాకతీయుల వశమయేటట్టు చేశాడు. పాండ్యరాజుల 9 లక్షల సైన్యాన్ని ఎదిరించి, వీరపాండ్య, విక్రమపాండ్య, పరాక్రమ పాండ్య, సుందరపాండ్య, కులశేఖర పాండ్య అనే అయిదుగురిని ఓడించినాడు. ఈ విజయాలపట్ల సంతసించిన ప్రతాపరుద్రుడు ఎఱదాచను అమితంగా గౌరవించి ‘ పాండ్యదళ విƒ’వ’ పాండ్య గజకేసరి; అనే బిరుదులతో సత్కరించాడు. కంచిలో అంతకుముందునుంచి ఉన్న పాండ్యులు చాలాకాలం గణపతి మహారాజుకు సామంతులుగా కప్పం చెల్లించేవారు. కాని క్రమేణా స్వతంత్రించారు. నెల్లూరు (విక్రమసింహపురి) చోళులకు వీరికి తరచు యుద్ధాలు జరుగుతుండేవి. బహుశ వీరినుండి కాపాడడానికే మహాకవి తిక్కన గణపతి మహారాజుదగ్గరకు రాయబారానికి వచ్ౘ్ి ఉంటాడు. తదనంతర కాలంలో ప్రతాపరుద్రుడు నెల్లూరుకు అదిపతిగా పరిపాలన కొనసాగిస్తున్న ముప్పిడినాయకుని కంచిపాండ్యులపైకి పంపించాడు. కంచి ని వశం చేసుకోవడానికి ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్న తిరుగుబాటు నాయకులలో ఒకరైన కోటతిక్క అనే అతడు , కొద్దిరోజులు మాత్రమే తనకు తాను రాజుగా ప్రకటించుకున్న కేరళ రాజు  రవివర్మ లు పాండ్యుల దాడులలో ఓడిపోతూనే ఉన్నారు. ముప్పిడి నాయకుడు తోడుగా పద్మనాయకుల సైన్యంతో దాడి చేసి కోటతిక్కను తరిమికొట్టారు. క్రీశ.1322 నాటి ద్రాక్షారామంలో దొరికన  ప్రచురితం కాని ఒక శాసనం ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఈ శాసనాన్ని ముప్పిడి నాయకుని కుమారుడు పెద్ద రుద్ర వేయించినట్లుగా ఉంది.

                       చిత్తూరు జిల్లా నారాయణ వనంలో హోయసల భ’ల్లాణుడు అనేవాడు, పాండ్యులపై తిరుగుబాటు చేసే కోటతిక్క ఒక్కటై నారు. పాండ్యులు కూడా కాకతీయులను తరిమివేయడం కోసం మారురూపాలలో సైన్యాన్ని ప్రవేశపెట్టింది. కాని ఈ విషయాలను పసిగట్టిన కాకతీయులు ముప్పిడినాయకునికి ఆదేశాలు ఇచ్ౘ్ారు. ఆయన ఎఱదాచను ససైన్యంగా పంపించారు. పాండ్యులు పంపిన మారురూపంలో ఉన్న సైన్యాన్ని , హోయసల భల్లాణుడి, కోటతిక్కను అందరినీ ఓడించాడు. పాండ్యులకు చెందిన గజదళాలను కైవసం చేసుకున్నాడు. ముప్పిడినాయకుడు, ఎఱదాచలు కంచిపట్టణానికి కాకతీయుల ప్రతినిదిని పాలకునిగా నియమించి ఓరుగల్లుకు చేరుకున్నారు.

                       ఎఱదాచకు ముగ్గురు కొడుకులు.సింగమ, వెన్న, ఏచ. వీరు కూడా కాకతీయులకాలంలోను తదనంతరం కూడా 14 వ శతాబ్దంలో గొప్పవీరులుగా ప్రఖ్యాతి గడించారు.మహమ్మదీయులు కాకతీయులపైకి దండయాత్రలను జరపడం మానలేదు. క్రీ.శ.1321లో మహమ్మద్ బిన్ తుగ్లక్ పక్షాన ఉలూఖ్ ఖాన్ ముందుగా తమ ఏలుబడిలోని కొన్ని ప్రాంతాలను కొల్లగొట్టిన గోసంగీయులను తరిమి తదనంతరం కాకతీయుల ఏలుబడిలోకి వచ్చినారు. అక్కడ ఎఱదాచానాయకుడి కుమారుడు ఏచ అనే అతను అడ్డగించాడు. ఆయనను ఎన్నోమార్లు మహమ్మదీయులు వేధించారు. కొలచెలమ వద్ద ఏచ నాయకుడు ఉలూఖ్ ఖాన్ సైన్యాన్ని ఎదిరించాడు. విజయం సాధించాడు.

                       క్రీ.శ.1323లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ పెద్దసైన్యంతో ఓరుగల్లుపై దండయాత్రచేసి ప్రతాపరుద్రుని బందీగా తీసుకొని పోయాడు. క్రమంగా కాకతీయ సామ్రాజ్యంలో చిన్న చిన్న అంతఃకలహాలు బయలు దేరాయి. వాటిని అణచివేసే ప్రయత్నం సింగమనాయకుడు చేశాడు. అంతవరకు కృతకృత్యుడయ్యాడు. అయితే మహమ్మదీయులు పాలకులుగా నియమింపబడటం దానిని సహించని హిందువులు తిరుగుబాటు చేయడం, కాపయనాయకుడు ముసల్మానుల నెదిరించడం వంటి సంఘటనలు జరిగినా కాకతీయ సామ్రాజ్యం పటిష్టం చేయడం జరుగలేదు. ఫలితంగా సింగమనాయకుడు రాచకొండ రాజ్యస్థాపనకు పూనుకొనవలసి వచ్చింది. అంతకు ముందు సింగమ మత్స ముఖ్యులతో పోరాటం చేసి జీలుగుల వద్ద మత్స కొమ్మ ను మగతుల వద్ద రుద్రను తరిమి వేశాడు. ఇటువంటి సందర్భాలనేకం చూసిన ప్రతాపరుద్రుడు అతనికి అనేక బిరుదులు సత్కారాలు వరాలు ఇచ్చాడు. ఆసీతి వరాల సింగమనాయకుడు అనికూడా పిలిచేవారు.

                       సింగమనాయకుడు తప్పని స్థితిలో రాచకొండ రాజ్యమును స్థాపించాడు. ఈ స్థితిలోనే శత్రువులు జల్లపల్లికి తన బావ చింతలపట్ల సింగమనాయకుని బందించినారని తెలిసి వారిపై దండయాత్రకు బయలు దేరాడు. సింగమనాయని కుమారులు అనపోతానాయకుడు, మాదానాయకులు అప్పటికే చేజర్ల వద్ద జరుగుతున్న ఒక యుద్దంలో ఒకరు మొగళ్ళూరు వద్ద జరుగుతున్న యుద్దంలో మరొకరు ఉన్నారు. జల్లపల్లి వద్ద పైశాల వంశ గన్నమనాయకుడు కోటనుండి శత్రువులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. జల్లపల్లికి సింగమనీడు తన కుమారుల సహాయం తీసుకొనని పరిస్థితులలో సైన్యాన్ని పంపించి తాను కృష్ణాతీరంలో గుడారం లో సైన్యంతో పాటు ఉన్న సందర్భంలో శ్రీశైలానికి చెందిన తంబళ్ళ కృష్ణాజీ బొమ్మ జియ్యరు అను అతని చేత రాయబారం పంపించే నెపంతో గుడారం లోపలికి పంపించి మాట్లాడుతుండగా వెనుక చాటుగా కత్తితో సింగమనాయకుడిని పొడిచి వేశాడు. ఈ వార్త వెంటనే తమ కుమారులకు చారుల ద్వారా తెలిసింది. అక్కడ ఉన్న నాయకులు, ఇతర సామంత రాజులందరూ చేరి ఆ వీరునికి పాదరక్షలు విడిచి వందనాలు సమర్పించారు. చివరి దశలో చేరుకున్న కొడుకులకు శత్రువులను నిర్జించె హితబోధ చేశాడు సింగమనాయకుడు. తండ్రి శరీరాన్ని జల్లపల్లి క్షేత్రంలో ఆసనంపై ఉంచి అప్పటికే అక్కడ ఉన్న నాగన్ననాయకుడితో కలిసి తమ వెంట ఉన్న సైన్యమే కాక నాయకులపై అబిమానం గల ప్రజలెందరో వీరోత్సాహంతో జల్లపల్లికి చేరుకొని యుద్ధంలో పాల్గొన్నారు. విజయమో వీర స్వర్గమే అని ప్రజలందరూ రావడం అనపోతానాయకునికి ఊహించని బలమే అయింది. ఆనాడు జల్లపల్లి వద్ద చేరిన శత్రురాజులు, క్షత్రియులు, రెడ్లు , కళింగ ప్రాంతపు రాజులు అప్పటికి వెలమలకు కాకతీయులు ప్రాధాన్యతనివ్వడం నచ్చని ఎందరో అంతర్గత శత్రువులు అదను చూసుకొని ఈ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే అనపోతానాయకుడు ఈ యుద్ధంలో వీరసింహం వలె విజృంబించాడు.ఈ యుద్దంలో క్షత్రియులకు రాజ్యకాంక్ష ప్రద¥నం కాగా వెలమలకు ఆత్మాబిమానం ప్రద¥నంగా యుద్ధం జరిగింది.  దొరికిన శత్రువులనందరినీ వదించాడు.వెలమ వీరులకు దొరికిన శత్రువులను చిత్రహింసలు పెట్టి చంపివేశారు. కొన్ని తలలను గానుగలాడించారట, కొన్ని తలలను శూలాలకు గుచ్చి పైకెత్తి వీరహుంకారాలు చేశారు.పూర్తిగా విజయాన్ని సాధించి క్షత్రియుల తలలతో రక్తంతో అన్నం కుడిపి భూతపిశాచాలకు కుడుపుగా పెట్టి తండ్రికి వారి రక్తంతో తర్పణలు విడిచారట. ఈ జల్లపల్లి యుద్ధంలోనే ‘ రణము కుడుపు’ చేశారు.శాలివాహన శకం 1273 ( క్రీ.శ.1361) శార్వరి నామ సంవత్సర కార్తీక శు. దశమి నాడు అనపోతానేడు రణము కుడిపెను’ అని చరిత్ర చెపుతున్నది.  మెగలూరు, ఇనుగుర్తి, జల్లపల్లి, మొదలైన ఎన్నో యుద్ధాలు వీరికి విజయాలను కలిగించాయి.క్రీ.శ.1369 ప్రాంతంలో ఓరుగల్లు, భువనగిరి కూడా అతని కైవసంలోకి వచ్సాయి. ఆంధస్రురత్రాణ, అనమనగంటి పురవరాదీశ్వర, మొదలైన బిరుదులు పోందాడు.  తండ్రిగారి ఆలోచన ప్రకారం అనపోతానాయడు రాచకొండ రాజ్యాన్ని సుస్థిరం చేసి ఎంతో వైభ’వంగా పాలించాడు.రాజ్యాన్ని రెండు భాగాలు చేసి రాజకొండ దుర్గం కేంద్రంగా ఉత్తరప్రాంతానికి అనపోతానాయకుడు, దేవరకొండ దుర్గాన్ని తానే నిర్మించి రాజద¥నిగా దక్షిణ ప్రాంతానికి తమ్ముడు మాదానాయకుని రాజుగా చేసి  పరిపాలించారు. వీరిరువురు ఒకే వృక్షానికి శాఖలవలె పరస్పరం తోడుగా ఉంటూ రెండు రాజ్యాలైనా ఒకే రాజ్యం మాదిరిగా పరిపాలించి వెలమలకు అశేషమైన కీర్తిని సమకూర్ౘ్ారు. వీరి తరువాత రెండవ సింగమ, రెండవ అనపోత, రావుమాదÎవ, మూడవ సింగమ వరుసగా రాజ్యాలను పాలించారు.

                       కళింగులపై గెలిచిన సందర్భంగా( క్రీ.శ.1367 ) విజయాన్ని సాదించి సోమకుల పరశురామ బిరుదాన్ని పొందాడు.  రెడ్డిరాజులతోను, బహమనీ రాజులతోను యుద్ధాలు చేశారు. కొన్ని సందర్భాలలో బహమనీయులతో సందికి ఒప్పుకున్నారు. క్రమంగా రాచకొండ, దేవరకొండ సామ్రాజ్యాలు అంతరించాయి.

                       అనపోతానాయకుని పెద్ద కుమారుడు రెండవ సింగమనాయకుడు కళ్యాణ దుర్గాన్ని జయించాడని విశ్వేశ్వరుని చమత్కార చంద్రిక వల్ల తెలుస్తున్నది. పెదవేగి బెండపూడి మొదలైన దుర్గాలను కూడా ఇతడు జయించాడు.

                       క్రీ.శ.1399 -1421 వరకు పాలించిన రెండవ అనపోతానాయకుడు అద్దంకి కొండవీడు రెడ్డి రాజులతో తరచు యుద్ధాలు చేశాడు. పెదకోమటి వేమారెడ్డిని ఓడించి వదించాడు. తమ్ముడు మాదానీడు 1421- 30 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే బహమనీయులు బలపడ్డారు. రాజ్యాదికారం సన్నగిల్లింది. ఈతని భార్య నాగాంబిక క్రీ.శ.1429 లో నాగారం వద్ద నాగసముద్రమనే గొప్ప చెరువును తవ్వించి శాసనం వేయించింది.

              రెండవ అనపోతానాయకుని కుమారుడు మూడవ సింగమనాయకుడు క్రీ.శ.1430- 75 వరకు పాలించాడు. 

    ఈతని కాలంలోనే చివరి దశలో రాజ్యం బహమనీయుల వశమైంది. అయితే కళింగ హంవీరుడనే అతని కారణంగా మరల బహమనీయులు తదితరులతో జరిగిన యుద్ధాల వల్ల రాచకొండ కొంతకాల మరల పద్మనాయకుల అదీనంలోకి వచ్ౘ్ింది. కాని విజయనగరరాజులు కూడా విజృంబించడం వల్ల వీరి పాలన ముగిసింది.

    తరతరాలుగా వెలమలు వీరత్వానికి సాహసానికి త్యాగానికి ప్రతినిధులుగా ప్రతీకలుగా నిలిచారు.

                       పద్మనాయకులు ఎంత వీరులో అంతగొప్ప కళాకారులు. సంగీత, సాహిత్య, నృత్యశాస్త్రములందు పాండిత్యములు గలవారు. స్వయంగా అనేక కృతులు వెలార్ౘ్ినవారు. కవిపండితులను పోషించినవారు. దైవ భక్తులు ఆలయాలు నిర్మింపచేశారు. చెరువులు తవ్వించారు. శిల్పాలు చెక్కించారు. అనేక రంగాలలో వారికి గల ప్రజ్ఞాపాటవాలే ప్రజలు ఆదరించడానికి కారణమయ్యాయి.

                       శ్రీశైలం వద్ద కృష్ణానదికి సోపానములు కట్టించారు. రాచకొండలో అనేక ఆలయాలు నిర్మించారు.

    మొదటి అనపోతానాయకుడు స్వయంగా అబిరామ రాఘవం అనే నాటకం రచించాడు.

    పశుపతి నాగనాథుడు సంస్కృతంలో ‘ మదన విలాసం’ అనే భాణమును, తెలుగులో విష్ణుపురాణమును రచించిన కవి మొదటి అనపోతానాయని ఆస్థానంలో ఉన్నవాడే. పద్మనాయక చరిత్రకు ప్రధాన ఆధారం వంటిదైన ‘ అయ్యనవోలు శాసనం ’ రచించింది కూడా ఈతడే.

    రెండవ సింగభూపాలునికి సర్వజ్ఞ బిరుదముండేది. ‘ సర్వజ్ఞనామదÍయము, శర్వునకే రావుసింగభూపాలునకే, ఉర్వింజెల్లును, తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే’ అనే పద్యం శ్రీనాథుని చాటువుగా ప్రసిద్ధిపొందింది. రసార్ణవ సుధాకరం, సంగీత రత్నాకరం, రత్న పాంచాలిక, కందర్ప సంభ’వం అనే సంస్కృత గ్రంథాలను రచించాడు. చమత్కార చంద్రిక , వీరభ’ద్ర విజయం అనే డిండిమం రచించిన కవి విశ్వేశ్వరుడు ఇతని ఆస్థానంలో ఉన్నారు. బొమ్మకంటి అప్పయాచార్యుడు అమరకోశానికి వ్యాఖ్యాన రూపం అమర పారిజాతము రచించిన కవి కూడా ఈతని ఆస్థానంలోని వాడే. మరొక కవి హరిహరుడు అనర్ఘ రాఘవం రచించారు.

    రావు మాధవనాయకుడు ‘ రాఘవీయం ’ పేరుతో క్రీ.శ.1427లో ఒక రామాయణ వ్యాఖ్యానాన్ని రచించి శ్రీరామున కంకితమిచ్చినాడు.

                       శాకల్యమల్లభట్టు, శాకల్య అయ్యలార్యుడు, వేదాంతదేశికుడు, మల్లినాథ సూరి, కొలిచెలమ పెద్దిభ’ట్టు, బమ్మెర పోతన మొదలైన వారు మూడవ సింగమనాయకుని ఆస్థానాన్ని అలంకరించినవారే. పోతన భోగినీ దండకం ఈయన ఆస్థానంలో నాట్యాన్ని చూసి రచించాడు. సర్వజ్ఞసింగభూపాలుడు అనే బిరుదం ఇతనికి కూడా ఉంది. పోతన ఆక్షేపించిన కర్ణాట కిరాత కీచకులు అనే పదంలో పద్మనాయక రాజులైన సింగమనాయకులకు వర్తించదు. వీరు కర్ణాట నాయకులు కారు. స్వయంగా కవిపండితులైనందున కవిని హింసించే లక్షణం లేదు. పైగా పోతన భాగవతాన్ని పాతిపెట్టిన విషయం తెలుసుకొని

                       అనవిని సింగభూపతియ యప్పుడు భూమిని పాతిపెట్ట జే

                       సిన కృతి బెల్లగించి కవశేఖరులెల్ల పఠింపజేసి, చి

                       క్కిన కృతి భాగమున్ నిలిపి కేవల మప్రతి దృశ్యమైన దా

                       నిని తనుగొల్చె సత్కవులు నింపగజేసె దయారసంబుగన్…..అని ఆయన ఖిలభాగములు పూర్తిచేయించినారు.

                       శ్రీనాథమహాకవి “ ఎటుల మెప్పింతువో నన్ను నింకనీవు,

                                          రావు సింగమహీపాలు దీవిశాలు

                                          నిండుకొలువున నెలకొని యుండినీవు

                                          సకల సద్గుణ నికురుంబ శారదాంబ” అని ఆయన సభామధ్యంలో ఉన్న సరస్వతిని ప్రార్థించినాడు. భువనవిజయాన్ని స్థాపించిన శ్రీకృష్ణదేవరాయల కంటే ముందుగా సభామధ్యంలో సరస్వతిని స్థాపించిన ఘతన సింగభూపాలునిదే. సింగభూపాలుడు సాహితీకళాయుద్ధరంగాలలో శ్రీకృష్ణదేవరాయలకు ఆదర్శం కూడా కావచ్చును.

                       పద్మనాయకుల కాలం నాటి శాసనాలు, కట్టడాలు, శిల్పాలు, రచనలు, శాస్త్రగ్రంథాలు, ఎన్నో శోదించడానికి అవకాశం ఉన్నాయి. తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పద్మనాయకుల ముద్ర చారిత్రకమైనది. చెరగనిది. దాని చాయలు ఇప్పటికీ ఈ కులస్థులలో ఉండడం గమనిస్తున్నాం. వీరిది ఆనువంశికమైన ధర్మవీరము.

                                 అకలంకంబై శౌర్యధైర్యమయి శౌర్యంచద్దయాదైన్యమై

                                 కకుభావేల్లిత కీర్తి పూర్తియయి రంగద్వైరి పాళీ భయా

                                 నకమై విద్యకు దావలంబయి వదాన్యస్ఫీతమై పద్మనా

                                 యక వంశంబు ధరిత్రి పెంపెసగు వెల్మాఖ్యాతకంబై కడున్….( చంద్రహాస విలాసము)

    ఆధార గ్రంథాలు.

    కాకతీయులు – పి.వి. పరబ్రహ్మ శాస్త్రి

    వెలుగోటి వారి వంశావళి, మద్రాసు విశ్వవిద్యాలయ ప్రచురితం, 1939

    వెలుగోటి వారి వంశావళి ఆంగ్ల పీఠిక – నేలటూరి వేంకటరమణయ్య

    పద్మనాయక చరిత్ర -కోట వెంకట నరసింహ సత్యనారాయణ రావు ( బుచ్చినాయన)

    రాచకొండను కాపాడుకుందాం -క్షేత్రపర్యటన నివేదిక వ్యాసాలు, –

    ద్యావనపల్లి సత్యనారాయణ, సంగనభట్ల నరసయ్య, తంగెడ కిషన్‌రావుగారు

    క్రీడాబిరామము చాటువులు

    May 31, 2026 5 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    కొత్తకొణాలు ఆవిష్కరించిన విమర్శకుడు

    by Ammangi Venugopal May 31, 2026
    written by Ammangi Venugopal

    ఘట్టమర్రాజుగారు వరిష్ఠ సాహిత్యవేత్త. నిరంతర గ్రంధపఠనం వారి ప్రత్యేకత. నిన్న మొన్నటి రచయితల్లో సాహిత్య స్నేహాలు కలిగివున్నవారు. తెలుగు, హిందీ కన్నడ భాషా సాహిత్యాలను లోతుగా అధ్యయనం చేసినవారు. సాహిత్య విమర్శ వారికి బాగా ఇష్టమైన ప్రక్రియ. రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారి లాగా సమీక్షా వ్యాసాన్ని విమర్శనావ్యాసంగా మలచినవారిలో వీరొక్కరు. వారి రచనలన్నీ ప్రచురిస్తే ఐదారు సంపుటాలు అవుతాయి. కాని వారు 2021-24 మధ్యకాలంలో ఒక మాస పత్రిక కోసం రాస్తూ వచ్చిన గ్రంధ సమీక్షలుగా పేర్కొనబడ్డ సాహిత్య విమర్శనా వ్యాసాలను పుస్తకంగా వెలువరించటానికి పూనుకున్నారు. ఇది ‘గ్రంధాంతరంగం’ పేరుతో ప్రచురింపబడటం ముదావహం. కేవలం వారి వ్యాసాలతో కూడిన గ్రంధమొకటి వెలవడటం ఇదే ప్రథమం.
    విమర్శకులు ముందుగా సాహిత్య జిజ్ఞాసువులై ఉండాలి. వయసుకు అతీతమైన పఠనోత్సాహం అప్పడే సాధ్యమవుతుంది. ఎనభై సంవత్సరాల ఘట్టమర్రాజు గారు ఇప్పటికీ ఏ కొత్త పుస్తకం వచ్చినా ఆసక్తితో చదువుతారు. ఆ పుస్తకం పట్ల తన సాహిత్య అనుభవం దృష్ట్యా ఒక అభిప్రాయానికి వస్తారు. ఆ అభిప్రాయాన్ని వ్యాసరూపంలో ప్రకటిస్తారు. పరంపరాగతంగా వస్తున్న సాహిత్య చరిత్ర గ్రంధాల పట్ల వీరికి ఆసక్తి ఎక్కువ. ఆయా కవులు, రచయితల మూలరచనలు చాలావరకు చదివినవారు కావటం వల్ల ఆయా సాహిత్య చరిత్రకారుల వాదవివాదాల పట్ల కూడా వారికి ఆసక్తి ఎక్కువే. వీరిలో కొందరితో ఘట్టమర్రాజు గారికి వ్యక్తిగత పరిచయాలు, స్నేహాలు ఉన్నాయి.
    ఘట్టమర్రాజుగారి విమర్శలో పూర్వాపరాలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగటం ఒక లక్షణంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, భోగరాజు నారాయణమూర్తి గారు 1920లో ప్రచురించిన తమ ‘ఆంధ్ర కవిత్వ చరిత్రమట’లో ‘కంచిలోని ఒక జైనమఠంలో తెలుగు జైన శతకమొకటి’ ఉందని సూచించారు. వంద సంవత్సరాలు దాటిగా ‘ఏ పరిశోధకుడి దృష్టి అయినా ఈ చీకటి కొట్టు వైపు ప్రసరించిందా?’ అని ప్రశ్నిస్తున్నారు ఘట్టమర్రాజు గారు. సాహిత్య త్రవ్వకం పని నిరంతరం సాగుతుండాలని, అప్పడే కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని వారి అభిప్రాయం.
    ఏ సాహిత్యకారుడు ఏ కొత్త సత్యాన్ని వెలుగులోకి తేస్తాడా? అని నిర్నిద్ర దృష్టితో ఎదురుచూడటం వారి స్వభావం. ‘కవిత్వవేది’ కళ్ళూరి వేంకట నారాయణరావు గారు 1928లో రచించిన ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహమట’లో సంఘ చరిత్ర, వాఙ్మయ చరిత్ర, కావ్య విమర్శ, యుగలక్షణ సమన్వయము – అన్న అంశాలవారీగా తెలుగు సాహిత్యాన్ని పరిశీలించారు. 1928కి ముందు సాహిత్య చరిత్రలు రాసినవారెవ్వరూ సాహిత్యాన్ని ఈ దృష్టితో చూడలేదంటున్నారు ఘట్టమర్రాజుగారు. చరిత్ర సంస్కృతుల జ్ఞానం ఉన్న చరిత్రకారుడు మాత్రమే ఇట్లా విశ్లేషించగలడని వారి అభిప్రాయం.
    ‘స్వారోచిష మనుచరిత్ర టీకా తాత్పర్య వ్యాఖ్య’ అన్న వ్యాసం పెద్దన కవితాశక్తి గొప్పదనాన్ని, బ్రౌన్ దొర సామాన్య పాఠక దృష్టిలోని నవ్యతను, జూలూరి అప్పయ్య టీకా రచనలోని సరళ సంక్షిప్త వివరణను ప్రశంసించే వ్యాసమిది. అప్పయ్యగారి టీక అచ్చయిన 171 సంవత్సరాల తర్వాత డాక్టర్ కోడూరు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాలను, విశేష వ్యాఖ్యలను సమకూర్చి కొత్త ప్రచురణను 2022లో పాఠకులకు అందుబాటులోకి తేచ్చారు. ఈ సందర్భంలో ‘అటజనికాంచె…’ అన్న పెద్దన సుప్రసిద్ధ పద్యానికి అప్పయ్యగారి టీకతో పాటు ప్రభాకర రెడ్డిగారు తాత్పర్యాన్ని, విశేష వ్యాఖ్యను ఉదాహరించి నేటి పాఠకులకు నాటి షడ్రుచులను చూపించిన ఘట్టమిది. ఇది ఒక రకంగా తరాల మధ్య వంతెనను నిర్మించడమే.


    ఎం.ఎ. (ఆనర్స్) పట్టాకోసం పాటిబంద మాధవశర్మగారు సమర్పించిన లఘు సిద్ధాంత గ్రంధం ‘ఆధునికాంధ్ర భావకవిత్వం’ ఆచార్య వెలుదండ నిత్యానందరావుగారి పూనికవల్ల తెలుగు విశ్వవిద్యాలయం వారు 2012లో ప్రచురించారు. మాధవశర్మగారు పత్రికా సంపాదకులే కాక స్వయంగా కవి. ‘భావకవిత్వమందు వికసోన్ముఖమై యున్న ఉత్తమ లక్షణములను దిగ్మాత్రముగ ప్రదర్శించుట ఈ కావ్యముద్దిష్టము. ఈ కవితపై ని~ది కేవలమ తొలిపలుకు’అని అనటంలోని వినయ సౌశీల్యాన్ని సమీక్షకులు ప్రశంసిస్తున్నారు.
    భావకవిలో జీవితాంతం వెంటాడే ‘అనిర్వాచ్యమైన అనుభూతి’ని గురించి పేర్కొనటమంటే భావ కవిత్వ ఆత్మను సంభావించినట్లే. భావకవులు ‘విశిష్ట కవులు’ని, అప్రాప్తమైన ప్రేమను ఆరాధించటమే భావకవుల ఆశయమని మాధవశర్మగారంటారు. ‘కవి ఎట్టి భావస్థితి యందు కావ్యమును భావించెనో, అట్టి భావస్థితిని పొందగల కొందరు పరిఢితులకు కొని సమయములందే ఇవి రుచించగలవు’ అని అనటాన్ని సమీక్షకులు సమర్థిస్తున్నారు. ll కొని పద్యగేయ కవితల్లోని ‘ఛందోశిల్పవైవిధ్యం, భాషా వైలక్షణ్యాల గురించి ఎక్కువగా వివరించారే కాని కవితా అగ్ని పుష్పాల జ్వాలల్ని విశ్లేషించే అవసరమైన ప్రయత్నం చేయలేకపోయారు’అని ఘట్టమర్రాజుగారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ll ‘అగ్నిపుష్పాల జ్వాలల’ వంటి కవితల విశ్లేషణ భావకవిత్వ పరిధిలోకి రాదని మాధవశర్మగారు భావించి ఉంటారు.
    ‘బ్రౌణ్య మిశ్ర భాషా నిఘంటువు’ (1854)ను సమీక్షించటం అందరితో అయ్యే పని కాదు. ఇందుకు ఘట్టమర్రాజు వంటి బహుభాషావేత్తలు మాత్రమే సరిపోతారు. ఇందులో అరబీ, పార్శీ, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, మరాఠీ, బెంగాలీ, ఒరియా, ఫ్రెంచి, టిబెట్ పదాలకు ఆంగ్లంలోను, తెలుగులోని అర్థాలు ఇవ్వబడ్డాయి. మొత్తం ఆరోపాలు 2286, ‘అస్తావేస్తమట’ అన్న మాటకు బ్రౌన్ దొర ఆంగ్లంలో ఫూలిష్‌నెస్, మాడ్‌నెస్ అన్న అర్థాలను, తెలుగులో చాదస్తమట అన్న అర్థాన్నిచ్చారు. అయితే ఘట్టమర్రాజుగారు ‘అస్తవ్యస్త’ అన్న సంస్కృత పదం దాని మూలం కావచ్చునని తమ ఉపజ్ఞతో సూచించారు. ఇది సరిగ్గా సరిపోయింది.
    దేవులపల్లి రామానుజరావు గారి ‘యాభై సంవత్సరాల జ్ఞాపకాలు’ ఆత్మకథను విశ్లేషిస్తూ 22 సంవత్సరాల పాటు సాహిత్య అకాడెమీకి చేసిన సేవలను ప్రశంసించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తును సాహిత్య వికాసానికి, విద్యావ్యాప్తికి వేదికగా మార్చిన మహానుభావులలో ప్రధాన స్థానం రావుగారిది. ‘రామానుజరావు జాతీయ, ఆంధ్ర, తెలంగాణ పునరుజ్జీవనోద్యమాల్లో తానొక సామాన్య కార్యకర్తగా ప్రముఖ నాయకుల అనుచరునిగా పాత్ర వహించినట్లు చిత్రించుకున్న వినయముద్ర వ్యక్తమవుతుంది’ అంటున్నారు. ఇది వారి సూక్ష్మదృష్టికి తార్కాణం. నిజానికి తెలంగాణ సాహితీమూర్తులెవ్వరిలోను తమ వ్యక్తిత్వాలను ఘనంగా ప్రచారం చేసుకునే తత్వం లేదు.
    ఘట్టమర్రాజుగారికి అన్నమయ్య అంటే ఏడుకొండలంత అభిమానం. ప్రతి వ్యాసంలో ఆ వాగ్గేయకారుని కవిత్వాన్ని సందర్భోచితంగా ఉదాహరిస్తారు. ఈ గ్రంధాంతరంగంలో మరెన్నో విలువైన వ్యాసాలున్నాయి. వారి ఇతర వ్యాసాలను కూడా ప్రచురించి లోకార్పణ చేస్తే బాగుంటుంది. రచయితల రచనలే శాశ్వతంగా మిగులుతాయి. ఇది సాహిత్య సత్యం.

    May 31, 2026 1 comment
    0 FacebookTwitterPinterestEmail
    ఇంద్రధనుస్సు

    క్విజ్ పోటీ-

    by nellutla Indrani May 30, 2026
    written by nellutla Indrani

    నిర్వహణ-
    ⁠నెల్లుట్ల ఇందాణి
    మయూఖ ద్వైమాసిక పత్రికలో జనరల్ నాలెడ్జ్ క్విజ్ ను ప్రారంభించాము. మీరేమి చేయాలో నెల్లుట్ల ఇంద్రాణి చెప్తున్నారు చదవండి- ఎడిటర్

    Hi everyone ! Good morning from “Mayukha and Tharuni.My name is Indrani Nellutla.
    Here I am shooting 20 General Knowledge questions for brain storming.If you know correct answers for 15 questions ” You are good”. More than 15 ” Clap your hands “.

    I am also Providing Correct answers below, “But ……. but…”. don’t look at the answers 🙈. ( Now) 😄

    చూసారా… మీ జవాబు లు 15 సరైనవైతే మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీ తెలివికి , మీ జ్ఞాపక శక్తి కి మీరే నిర్ణాయకులు. ఇదే మనకు ఉత్సాహాన్నిస్తుంది. ఇవిగో ప్రశ్నలు…

    1. Which country is known as “Rising sun” ?
      A. United States of America. B. China. China.D. Japan.
    2. Who is the first black president of South Africa?
      A. Nelson Mandela . B .Musaveni . C. Paul Kagame . D. Barak Obama.
    3. Which is the longest river in Europe?
      A. Godavari. B. Volaga. C. Amezan. D . Nile.
    4. 4.In Which Year United Nations was established?
      A. 1940 . B. 1950 . C. 1945 . D . 1960 .
    5. .Which line separates India and Pakistan?
      A. Red Cliff line. B. Ma Mohan line . C . Equater .D . Tropc of cancer.
    6. Where is Great Barrier Reef located . ?
      A. United States. B. Europe. C. Australai. D. Africa. ?
    7. Who wrote ” The Tale of Two Cities” .?
      A. Charles Dickens .B.G.Shaw .C. Clerk Hemes . D. William Shakespeare.
    8. .What is the National bird of New Zealand .?
      A. Bald eagle .B . Peacock. C. Elephant. 4. Kiwi.
    9. Which mountain separates Europe and Asia ?
      A . Urals . B. Pamir .C. Cascade. D . Andes.
    10. Who is one of the ” Kavithryam” from the below poets ?
      A . Kalidasa. B. Nannaya . C. Bhanu . D. Kanva.
    11. Name the first Indian Sattilite ?
      A. Aryabhatta B. Shankara C. Banabatta D. Bhaskara ?
    12. Who is the first recipient of Gyanpit award ?
      A. Vishwanatha Satyanarana B . Dr. C. Narayan Raddy . C. Dasarathi . D. Arudra.
    13. Which strait separates Iran and Soudi Arabia ?
      A. Hormuz. B . Panama . C. Suez. D. Bay of Bengal.
    14. Which painting of Ravi varma sold approx. 17.9. Million dollars ?
      A. Lord Rama .B. Lord Shiva. C . Lord Indra. D. Lord Krishna.
    15. The study of the kidney is called ?
      A. Cardailogy . B . Nephrology. C. Apthamology. D. Anthropology.
    16. Who is the Lyricist of ” Geet Gata Chal O Sathi Gun Gunatha Chal” ?
      A. Ravindra Jain B. Mahmmad Rafi . C. Gulzar. D . Kishore Kumar.
    17. Who is the founder of ” Amezan” ?
      A.Satya Nadella.B. Bill Gates. C. Jeff Bezos . D. Rishi.
    18. Who invented telphone ? A. Madam Currie .
      Thomas Edison. C. Enlisteen . D. Alexander Graham Bell.
    19. Which fruit is good source of vitamin. C .?
      A. Spinach . B. Orange . C. Potatoes .D. eggs .
    20. Good Year is trade name of ?
      A .Cars .B. Tires . C. Bikes. D. Racing Cars . ———-

      Correct Answers ———.
      1. D. ( Japan. The land of rising sun. The rising sun represents hope, renewal and energy for the Japanese people).

      2. A. Nelson Mandela ( from 1994 to 1999.).

      3.B. Volga ( stretching approximately 3,530 to 3,690 k.m ).

      4. C .1945 ( Biggest funder is United States America ).

      5. A. Red Cliff line ( Established on August 17, 1947 ).

      6. C. Australia ( it spans over 2,3000 k.m ).

      7. A. Charles Dickens ( He wrote about London and Paris).

      8. D. Kiwi ( Flightless bird).

      9. A.Ural mountains ( Running 2,500 k.m. North to South through Western Russia).

      10. B. Nannaya ( He translated Adi Parva ,Sabha Parva and a portion of Aranya Parva ).

      11. A. Aryabhatta ( launched on April 19 , 1975 ).

      12. A. Viswanatha Satyanarana.( For Ramayana Kalpavruksham in 1970 ).

      13. A. Hormuz ( Approximate length 90 to 104 miles ).

      14. D. Lord Krishna ( The Art work was purchased by Dr. Cyrus Poonwala ).

      15. B . Nephrology ( A specialist in this field known as Nephrologist .).

      16. A. Ravindra Jain ( He redefined Bollywood music despite being born blind .).

      17. C. Jeff Bezos ( He is a American Business man ).

      18. D. Alexander Graham Bell ( He invented the devise on March 7 , 1876.).

      19. B. Oranges ( a single orange can meet daily requirement ).

      20 .B. Tires ( Founded in 1898 , is a company that produces tires for passenger cars , trucks and racing Cars ). _**_.

      ఈ 20 ప్రశ్న లకు సరైన జవాబులు ఎన్ని వచ్చాయో మీరే చెక్ చేసుకోండి.. మిమ్మల్ని మీరే అభినందించుకోండి.. ఇది నిజమైన బలం ! – ఎడిటర్
    May 30, 2026 5 comments
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    పేరంటాలు

    by Vijaya Kandala May 30, 2026
    written by Vijaya Kandala

    పెళ్లి ,వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో  మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి  పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.

    అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం  వచ్చింది.    దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో  భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను  కూడా తెలుసుకోవాలి గదా.

    క్లుప్తంగా  సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ  ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని  అంటారు.

     సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ  దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన.పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో,ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.

    భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు  బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్  వర్ణించారు.

                  కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో  సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.

                    సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని  కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో  ఇరువైపుల బంధువులు (  ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు.

    దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని  కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.

                   ఈ సంప్రదాయం  మరో రూపంలో రసపుత్రులలో  ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.

                 19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.

    ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

     నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో  చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు.

     ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి  అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట.

    ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి  ఆ  ప్రదేశంలోకూతురికొకగుడి కట్టించింది.

                 ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో  అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.

    1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒకఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను  సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా  లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.

    మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట  అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలుస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ (  1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ  ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు  పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వాస్తవాలు,విశ్వాసాలు పాలునీళ్లలా కలిసిపోయాయి.

                 ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చారిత్రక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలనుఅవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.

    ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.

    May 30, 2026 2 comments
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • విజ్ఞానదాయకం – కె.బి.సి.
    • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
    • 12, , 14
    • క్విజ్ -3
    • ‘ఆమె’

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us