మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

నిజమైన పండుగ

by Shuktimati Vemuganti March 1, 2023
written by Shuktimati Vemuganti

“వీల్లేదు పొమ్మంటుంటే శనిలా వెంట పడ్డావేంటి. చెప్పేది నీక్కాదూ…” భార్యను కసిరి కొట్టాడు విశ్వనాథం.
మళ్లీ అదే మాట.” నేను వస్తాను….. నీతో వస్తాను….” మింగేసేలా ఉన్న అతని చూపులకు నిలువెల్లా కంపించి పోయిన ఆమె దిగాలుగా నిలబడిపోయింది. ఆ మరుక్షణం కారు స్టార్ట్ చేసి బుర్రునా అతడువెళ్ళిపోయాడు.

 సాయంకాలం వరకు ఎక్కడ దాక్కుంటుందోగాని ఆకైనా కదలడం లేదు. నాలుగైదు పిచ్చుకలు రొద చేస్తూ అటూ ఇటూ ఎగురుతూ ఆడుకుంటున్నాయి. గోడ మీద పెద్ద బల్లి నిశ్శబ్దంగా ఉంటూనే ఏ చిన్న కీటకం వచ్చినా దొంగలా కదిలి మెరుపులా మీద పడి గుటుక్కుమనిపిస్తోంది. ఆమెకు కళ్ళవెంట మాటిమాటికీ నీళ్లుబుకుతున్నాయి. పక్కకు చూసేసరికి బిక్క మొహం వేసుకొని చిన్న కొడుకు. వాడికి అలవాటే .తల్లి కళ్ళనీళ్ళు తుడిచే వయసు కాదు .చూసే మనసు లేదు.

గొర్రెల మంద దుమ్ము రేపు కుంటూ కదిలిపోతుంది.పిల్లలందరూ ఆ దుమ్ములోనే పెద్దగా గోల చేసుకుంటూ ఆడుకుంటున్నారు. అప్పుడే ఊళ్ళోనుండి బస్సు వెళ్లినట్టుంది ,ఎర్రటి దుమ్ము వలయంలో ఊరంతా చిక్కుకుంది. ఊరికి మధ్యనున్న చెట్టు నీడలో కొంతమంది పేక లాడుకుంటున్నారు.
“అమ్మా.. ఎక్కడికే? చెప్పవే?….” అని అడుగుతున్న కొడుకు మాటను వినిపించుకోకుండా అతని చెయ్యి పట్టుకొని ఇంటికి తాళం వేసి బయటికి నడిచింది.
ఎప్పుడూ ఇంటినుంచి కాళ్ళు బయట పెట్టని తల్లి వీరావేశంతో అడుగులు వేస్తుంటే ఆ పిల్లవాడు అమాయకంగా అనుసరించాడు.

 ఊర్లో మనుషుల కట్టుబొట్టు అలంకరణలు మారాయి. పంచెకట్టు తో ,భుజాన తువ్వాలు తో ఉండే పాత కాలపు పెద్ద మనుషుల సంఖ్య తగ్గిపోయింది. జీన్స్, టీషర్ట్స్ తో యువతరం మారిపోయింది. దారి పొడుగునా ఒకరినొకరు పలకరించుకుంటూ వెళ్తున్నారు. బయటికి రావడం అలవాటు లేని ఆమె తప్పు చేస్తున్నట్టు నక్కినక్కి తలొంచి అడుగులు వేస్తోంది.

ముందు పోలీసులతో నిండిన రెండు మూడు వ్యాన్లు పోతున్నాయి. ఆ వెనుక కాలినడకన కొందరు పోలీసులు లాఠీలు ఝడిపిస్తూ జనాన్ని అదుపు చేస్తున్నారు.
ఆనాడు దసరా పండగ…. దేశమంతటా గొప్ప కోలాహలం సంచలనం హడావిడి. రావణాసురుడి వధ. అంటే చెడు పై మంచి గెలుపు. కాదు. మంచి పై చెడు గెలుపు. అది కూడా కాదు. అసలు ఏది మంచి.. ?ఏది చెడు..’?
రేణుక ఆలోచిస్తూ అడుగులు వేస్తుంది.
రావణాసురుడి రూపంలో ఆమెకు భర్త విశ్వనాథ్ కళ్లముందు కదిలాడు. రాక్షస క్రూరత్వం తో కనిపిస్తున్నాడు. దసరా పండగ సందర్భంగా తాగిన బృందమంతా రావణాసురుని బొమ్మను దగ్ధం చేయటానికి అక్కడ ప్రత్యక్షం. అది లేనివాళ్లంతా ఇంట్లో కుటుంబీకులతో విజయదశమి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆమె ఆ గుంపులో కొడుకు తో పాటు ఒక ప్రక్కగా నిలబడింది. చెడుపై చెడుగెలుపు ఎలా ఉంటుందో అతని చూపుల్లోంచి ఆమెకు ప్రసారమవుతున్నాయి.అయినా చూడాలని ఎన్నడూ లేని తపన ఆమెకు.
అంటురోగాల కు వికటాట్ట హాసాలకు వికృత చేష్టలకు చేవ తీరినఅతడి శరీరం పొడుగ్గా సన్నగా మండుతున్నకావడాలా ఉన్నాడు. తప్పతాగి తూలుతున్న అతన్ని తనివితీరా చూసింది. అక్కడ చేరిన సంఖ్య పెరుగుతోంది.
కొందరు సర్దుకుని విశాలమైన అరుగుల మీద కూర్చుంటే మరికొందరు గోడలకు చేరగిలబడి , ఇంకొందరు గుంజలకానుకుని చూస్తూ నిలబడి ఉన్నారు.
తన భర్త. పెద్దపులి …వీధి లో వస్తుండగానే పంజా విసురుతున్న శబ్దం తరువాత వళ్ళు వాచిపోయేలా దెబ్బలు. కోపం,భయం, జుగుప్స లతో కూడిన భావన ఆమె శరీరంలో నరనరాన ప్రవహించింది. అందరిలో ప్రత్యేకంగా గౌరవించ బడాలని తలకిందుల ప్రయత్నిస్తున్న అతన్ని చూస్తే హాస్యాస్పదంగా అనిపించిందామెకు.రావణకాష్టం మండుతోంది ఆకాశాన్నంటుకుని. ఢాం…ఢాం…ఢాం.. భూ.నభోంతరాలు దద్దరిల్లే బాంబులశబ్దం. రావణాసురుని బొమ్మలో ప్రతీ అవయవం పేలిపోయి కూలిపోతున్నాయి. అతడి శరీరంలో అవయవాలు కూడా కుప్పకూలుతున్నట్టనిపించింది ఆమె కళ్ళకు. గత రెండు దశాబ్దాలు పొరలు పొరలుగా పేరుకున్న మాలిన్యపుపెంకులు వాటంతటవే పగిలి రాలి ఆ రావణ కాష్టం లో పడి తగులబడుతున్నాయి. ఆ వెకిలి నవ్వులు,కళ్ళల్లో కాఠిన్యం, మొహంలో అహంభావం, ఎదుటి మనిషి పై చూపే నిర్లక్ష్యం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. అశ్లీల భాష, మానవ ద్వేషంతో కూడుకున్న పరాచికాలు, వికృత చేష్టలు, తాగి తూలుతున్న శరీరావయవాలు ఒక్కొక్కటి …ఒక్కొక్క టి… పడిపోతున్నాయి. మంటల్లో పడి కాలి బూడిద అయిపోతున్నాయి. చివరకు అస్తిపంజరం మిగిలిపోయి ఊగిపోతుంది. ఆ ఎముకల గూడు కూడా తాగి తందనాలుఆడుతున్నట్టే నిలువలేక తూలుతూ ఆ మంటల్లో కూలిపోయింది. ఆమె కళ్ళు బైర్లు కమ్మాయ. చావు అన్నది ఒట్టి భ్రమలు తోచింది. అంతా ఉన్నట్టే .తనచుట్టూ కళ్ళకు కనిపించనంత మాత్రాన లేనట్టా .మృత్యువు తను జయించినట్లే అమరత్వంతో ప్రత్యక్షమవుతుంది ఆమె కళ్ళకు.
ఇప్పుడతడు లేడు. ఆ మంటల్లో కూలిపోయాడు. ఆ పొగలో పారిపోయాడు. పీడా పోయింది. “రా కొడకా .ఇంటికి పోదాం. మీ ..నాన్న ..చచ్చిపోయాడు .మీ నాన్న… చచ్చిపోయాడు. “నిజంగా చచ్చాడు. తన భర్త. తన భర్తే. అయినా సుఖ పడటానికి రాత ఉండాలిగా. మనిషిగా బ్రతికే గీత ఉండాలిగా. అతడు చావాలని తనకేమైనా ఇష్టమా.. ఆ మనిషి చుట్టూ ఎన్ని జీవితాలు ,అనుబంధాలు , బంధాలు ఉన్నాయో తనకు తెలియదా.. అయినా ఆయన లేడని తనెందుకు ఏడుస్తుంది ??. బతికున్నప్పుడు ఏంసుఖపడింది తను.? ఏ అనుభూతులతో నిమిత్తం లేకుండా రెండు మాంస ఖండాలు ఒకే చూరు కింద బ్రతికాయిన్నాళ్ళు.అతను ఇప్పుడు చనిపోయాడు. మరి తను.. ఎప్పుడో చనిపోయింది. రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
తల్లి తో పాటు వళ్ళు తెలియకుండా ఇంటికి వచ్చిన పిల్ల వాడు జరిగింది ఏది అర్థం కాక బిక్క మొహం వేసుకొని తల్లి ఒడిలో తలదూర్చి భయం భయంగా చూస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియక కొడుకు మొహం లో చూస్తున్న ఆమె ఒక్క సారి ఉలిక్కి పడి గావుకేక వేసింది. ఎదురుగా కాలిపోయాడనుకున్న రావణాసురుడు. అయితే తను చూసిందంతా భ్రమేనా..? బాగా ఉబ్బరించిన మొహం. మెడ మీది దాకా జుట్టు. ఆ మొహంలో అదే కుత్సితం. ఇవాల్టి కోసం కొనుక్కున్న కొత్త చెప్పులు స్వచ్ఛంద సేవకుడిలా తెల్లలాల్చీ, పైజామా. చాలా ఖరీదైన బట్టలే.. పండుగ కదా చెడు పైన విజయ పతాకం ఎగిరే సే ధర్మ చక్రాన్ని ధరించిన దుర్మార్గుడు కదా.
” మీరు తక్షణం బయటికి వెళ్ళండి ఇక్కడి నుండి వెళ్లిపోండి.”
అతడు వెకిలిగా నవ్వుతున్నాడు.
“వెళ్తారా? లేదా? వెళ్ళనంటే నేనే వెళ్తాను , వెళ్ళా నంటే తిరిగి రాను.”
ఆమె ఆచితూచి పలుకుతోంది. గొంతెత్తి మాట్లాడడం అలవాటు లేని ఆమెకుఇబ్బంది కలిగినా గట్టిగా అరుస్తోంది. “వెళ్ళిపోండి.వెళ్ళండి..” అదే మాట మళ్లీ మళ్లీ.
అతనికి చెంప దెబ్బ కొట్టినట్లయింది. ఇన్నేళ్ళలో ఎన్నడూ ఈ విధంగా మాట్లాడలేదామె. అతడు ఖంగు తిన్నాడు.
“ఎక్కడికి వెళ్తావో అడగొచ్చా?.నిన్ను?”
ఆమెకు కోపంతో ముఖం ఎర్రబడింది.
ఇన్ని రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తిరిగావో, ఏమేం చేయకూడని పాపాలు చేశావో నేను ఎన్నడైనా అడిగానా?.. చేసే పాపాలన్నీ కప్పిపుచ్చి అబద్ధాల మాటలు చెబుతున్నా నిన్ను ఏమీఅడగాలని, తెలుసుకోవాలని ఏనాడూ అనిపించలేదు. ఇంటిలో భార్యా పిల్లలతో గడపాల్సిన సమయాన్ని దొంగతనంగా దొంగచాటుగా ఎక్కడ గడుపుతున్నావని , ఏం చేస్తున్నావని అసహ్యం వేసే అడగలేదు. చాలా.. ఇంకేమైనా చెప్పాలా. నన్ను ఒక్క ప్రశ్న అడిగే అర్హత కూడా నీకు లేదు. నా దారిన నన్ను పోనీయ్..”
“నీకేదో పిచ్చి పట్టింది. నువ్వు గడపదాటితే ఊర్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా నా పరువు ఏమి కావాలి?.”
“ఓహో నీకో పరువూ, ప్రతిష్టలు కూడానా?. ఎక్కడ …ఎక్కడుందో చూపెట్టు?. ఆ పని ఈ పని చేస్తానని అమాయకులను మోసంచేసి దోచుకొని కట్టుకున్న ఈ అద్దాలమేడలోనా. మీ బ్యాంకు బ్యాలెన్స్ లోనా.. మీ విలువైన కార్ లోనా.లేక మీ సూటూ బూటు లోనా…? ” ఆమె విరక్తిగా నవ్వింది. కట్టుకున్న నన్నే ఎన్ని హింసలు పెట్టావ్. నన్ను ఎన్నడైనా మనిషిలా చూశారా.? ఇంట్లో ఉన్నప్పుడైనా కారణం లేకుండానే పిల్లల్ని కసిరించడం. మీఅమ్మ చచ్చిఏలోకాన ఉందో. ఆమె బ్రతికున్నప్పుడు కొంచెం ధైర్యమైనా ఉండేది నాకు. ఆమె కూడా పోయి నీకు అడ్డు చెప్పే వాళ్ళు లేకుండా అయిపోయింది. ఇన్నాళ్లూ నన్ను కాల్చుకుతిన్నావు. చివరికి క్రూరమృగంలా నన్ను నా బిడ్డల్ని చావు దెబ్బలు కొట్టి చంపాలనుకున్నావు.” ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండుతున్నాయి. గొంతు వణుకుతోంది. అయినా మాట్లాడుతూనే ఉంది.
ఎన్నో ఏళ్లుగా నన్ను నేను అనుక్షణం శోధించు కుంటూ నిప్పులాంటి బాధతో ప్రక్షాళన చేసుకుంటూ ఉన్నాను. కానీ, ఏ మేరకు బయటపడగల్గాను.??”
నా బిడ్డ లు ఇద్దరి దృష్టి నా మీదే !నాకు జబ్బు చేస్తే పిల్లలిద్దరూ ఆటపాటలు చదువుసంధ్యలు వదిలేసి నాకు పరిచర్యలు చేసేవాళ్ళు.నువ్వే రోజైనా కనీసం ఎట్లా ఉన్నావ్ అని అడిగావా?. అంటే ఇన్నాళ్ళు నేను నా పిల్లలు ఉనికిని కోల్పోయి నీ ఇంట్లో బతికాం. నా మనసులోని శూన్యతను కనిపెట్టిన నా పెద్ద కొడుకు “అమ్మా! నేను పెద్దవాడిని అయ్యాక నిన్ను ఏడవనీయను.”అని అనడం,అమాయకంగా వాడిలోని భయాన్ని అణగతొక్కుకుని నాకు ధైర్యం చెప్పాలనే వాడి ప్రయత్నం.
అంతేగానీ
పెళ్లి చేసుకున్న నాటి నుండి నువ్వు చేసిన అఘాయిత్యాలు ఒకటా.. రెండా.. వర్షం కురుస్తుంటే చూడడం ఇష్టమని కిటికీలో నుండి చూస్తే ఆ విధంగా చూడొద్దని గొంతు చించుకొనిఅరిచి కిటికీ మూసేయడం, ఇంకెంత సేపు నీళ్లు తాగుతావని ,ఇంకెంత అన్నం తింటావ్ అని ,అక్కడ ఎందుకు నిలబడ్డావని, అన్నీ నీ అదుపాజ్ఞలే. అన్నిటికీ తలవొగ్గాను. ఎందుకో… ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తాగుడు మానుతావని. మారుతావని.. కాని రోజురోజుకు రాక్షసుడిలా మారావు.
నా ఏడుపు చూడలేక ఏం చేయలేక నీతో మాట్లాడే ధైర్యం లేక నిస్సహాయంగా నా పెద్దకొడుకు ఇల్లు వదిలి పారిపోయాడు. ఎక్కడున్నాడో ,ఏమయ్యాడో తెలియక చిత్రవధ అనుభవిస్తుంటే ఏ అర్ధరాత్రో తప్ప తాగి వచ్చి నీ చిన్న కొడుకు ఉన్నాడా. పారిపోయాడా అని వికటాట్టహాసం చేస్తావా ?నువ్వా తండ్రివి. అసలు నువ్వు మనిషివేనా?!.
తండ్రీ కొడుకులకుండాల్సిన బంధం లో ఒక సన్నపొరైనా నీలో ఉందా? అసలు నీ కొడుకు ల తో నీకు పరిచయం ఉందా? ఆలోచించు. “మగదిక్కు లేక ఒంటరిగా కష్టపడుతున్న నా తల్లి కోటీశ్వరుడివైన నీ కొడుకుని చేరదీసి తన రెక్కల కష్టంతో వాడిని పెంచుతున్నది.అక్కడ వాడు ప్రశాంతంగా ఉన్నాడు. అసలు వాడు బతికే లేడనుకొని
హాయిగా ఊపిరి పీల్చుకునే నీలాంటి కసాయి తండ్రి లోకంలో మరొకడు లేడు.ఉండడు.

“అమ్మా.!నీకు పులి , వేటగాడు బొమ్మలున్న చీర కొని పెడతా అనే వాడు నా కొడుకు. అంటే ఆ చిన్న మనసులో నువ్వు ఒక వేటగాడివి. నీచుడివి. వాడికే కాదు నీకు తెలిసిన ప్రతి వారిలో నీపై ఇదే అభిప్రాయం. నువ్వనుకుంటున్న నీకున్న గౌరవం ఇదే.
ఇవాళ కాల్చిన ఆ రావణాసురుడి బొమ్మ తగిలేయడానికి చుట్టూ ఉన్నది నీలాంటి తాగుబోతులే. భార్యా పిల్లల్ని పీల్చిపిప్పి చేసే విలాస అసురులే. ఆనాడు సీతమ్మను తీసికెళ్ళిన రావణునికి ఈనాడు కట్టుకున్న భార్యను నట్టేట ముంచిన దుర్మార్గ రాక్షసులకు కాలే రోజు తప్ప, కాల్చే రోజు కాదిది.”
ఇంతసేపూ తను చెప్పిందంతా తలొంచుకొని కూర్చొని నిజమే అన్నట్టు వింటూవున్న అతన్ని చూస్తే ఆమెకు కొత్తగా ఉంది. మనసులో ఏమూలో ఇంకేమీ అనకూడదు అనిపించింది.వీటన్నింటికీ కారణం నీ తప్పతాగే అలవాటే. అదే నీతో ఈ పాపాలన్నీ చేయిస్తోంది. పశువుగా మార్చేస్తుంది.అది మానేస్తే మనిషి వౌతావు. అని అంటూ ఆమెకు తెలియకుండానే అలాగే మంచం మీద ఒరిగిపోయింది. కాసేపటికి కళ్లు తెరిచి చూస్తే గ్లాస్ లో మందు వంచుతున్న అతడు. ఇదే ఆఖరి డోస్ ఇక జన్మలో దీని మొహం చూడను. పలుసార్లు తనలోతను గొణుక్కుంటూ ఒక్కోసారి పెద్దగా అంటున్నాడు. ఆమె మరొక సారి కళ్ళు నలుపుకుని చూసింది. అతని మొహం లో ఏదో ప్రసన్నత. నిజమా.. ఇది కూడా భ్రమనా?.. ఆమె అతడ్నలాగే చూస్తూ కూర్చుంది అతడు తలదించుకుని నేల చూపులు చూస్తూ చేతి వేళ్ళ మధ్య ఉన్న సిగరెట్ ను వేళ్ళతో నలుపుతున్నాడు. అప్పుడప్పుడు తన వైపు చూస్తున్న అతని కళ్ళల్లో నీళ్లు. ఇప్పుడామెకు అతడు ఒక యోగిలా కనిపించాడు. ఆమె ఆలోచనలో పడింది. యుగాల చరిత్రను మననం చేసుకుంది. త్రేతాయుగంలో రాముడు అంటే మంచి. రావణాసురుడంటే చెడు. అందుకే చెడుపై మంచి విజయం. కాని కలికాలంలో ప్రతి మనిషిలో మంచి చెడు కలిసి ఉన్నాయి. అందుకే ఏ మనిషికామనిషి తనలో ఉన్న చెడుపై తనలోనేవున్న మంచి దాడి చేయాలనే పరివర్తన రావాలి. అప్పుడే వ్యవస్థ కూడా క్రమక్రమంగా మారుతుంది. అలాంటి పరివర్తన తన భర్త లో కలిగే‌లావుంది. కలిగిందనేది అతని మౌనంలో ముఖంలో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. లోకంలో ఎంతోమంది ఇలాంటి వ్యసనానికి బలైపోయిన వాళ్లకందరికీ ఇలాంటి పరివర్తన కలిగినప్పుడే వారి వారిఆడవాళ్ళకు నిజమైన ఆనందం. అభివృద్ధి. పండుగ దినం. భగవంతుడా! ఇప్పుడున్న వ్యవస్థ మారాలంటే ఎవడికి వాడు మారటం తప్ప ఎవరో వచ్చి ఏదో చేసేదికాదు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తృప్తిగా ఊపిరి పీల్చింది.
కారే కన్నీళ్ళను లాల్చీ చివరతో తుడుచుకొంటూ వణికే చేతులతో సిగరెట్ నోట్లో పెట్టుకొని గబగబా వీధి లో కెళ్ళి అటు ఇటూ చూస్తూ ఒక్కసారి గుండెల నిండా పొగ పీల్చి వదిలి దాన్ని దూరంగా విసిరికొట్టి లోపలికి ఉరికినట్టుగా వచ్చాడు విశ్వనాథం. మంచం మీద ఒరిగి నీళ్ళు నిండిన కళ్ళను మూసుకున్నాడు. నిద్రలో తాను దేవుడిలా రావణుడిని హతమారుస్తున్న రాముడిలా తనలోని రాక్షసత్వానికి దుర్వ్యసనాలకు నిప్పంటిస్తున్న కల………….

March 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సంక్రాంతి శోభ ..

by Damaraju Vishalakshi January 17, 2023
written by Damaraju Vishalakshi

సంకురాతిరిఅనడంతో సంబరాలుప్రారంభం
ముద్దులొలుకు ముగ్ధలు దిద్దే రంగవల్లులతో ఆరంభం

అంతా సందడి సంరంభం హడావిడులకు ప్రారంభం

గొబ్బిల్లంటూ గెంతులేయడం
కన్నె పిల్లలకు సంతోషం
వారిచుట్టూతిరిగి గెంతడం
కుర్రకారుకిఆనందం .

సున్నాలేస్తూచుక్కలుపెడుతూ స్త్రీలకందరికి సంతోషం

చేనునుకోస్తూ కుప్పలువేస్తూ రైతులు పొందే ఆనందం ..

ధాన్యం పంచి ధర్మంచేసెడి కర్షకవీరుల దానగుణం

వండుతువార్చుతుపంచుతు
తిరిగే వనితలమదిలో
సంతోషo

చుట్టాలంటూ
బంధువు లంటూ పల్లెటూళ్ళలో సందోహం .

అల్లుళ్లతోకూతుళ్ళతో. అందరిమదిలో
సంతోషం

పిల్లలపెద్దల మాటల పాటల
కేకలతోడుతసంరంభం

పంటలు ఇంటికిరాగాపొంగెడి పల్లె ప్రజలలో సంతోషం

ఆనందంతోపండుగజరుపగ
అందరు జరిపే సంరంభం .

కోడిపందెములుగాలిపటములతొ పల్లెప్రజలకు సంతోషం

కోరిన కోర్కెలుతీర్చుకువెళ్ళే
అల్లుళ్ల తో సందోహం

పండుగపేరుతోప్రకృతి కొలిచే
పల్లె ప్రజలలో సంస్కారం

దానంధర్మం భోగం భాగ్యం
సంక్రాంతి పండుగలొ ప్రత్యేకం ..

ప్రత్యక్షదైవమని
పొంగలి పెట్టి
సూర్యునికి మొక్కుట
ఆచారం

రావణకాష్టం రగలగ మంటలు
భోగికి వేయుట సంతోషం
.
.
భోగి పళ్ళతోబొమ్మలకొలువుతొ
పండుగ జరుపుటప్రత్యేకం ..

పేరుపేరునా పెద్దల తలచుట
సంక్రాంతి పండుగ ఆచారం

పసుపు కుంకుమల సంక్రాంతి పురుషుని
స్వాగతించుటే పరమార్థం .

అల్లుళ్ళతో కూతుర్లతో
అమ్మ అయ్యలఆనందం
మనుమలతో మునిమనుమలితో
గడుపుట
ముసలివారికి బహు ఇష్టం .

కొత్తపంటలతొ
పిండి వంటలతొ
పల్లెకుఇళ్ళలో సందోహం

అలకల కులుకుల కిలకిల నవ్వుల
సంక్రమణంతో సంతోషం .

పంటలింటికి తెచ్చెడి పశువుల
పూజలు చేయుట ఆచారం

ప్రతి ప్రాణినీ ప్రేమగ చూచుట కనుమపండగలో పరమార్ధం

వివిధ వృతులను గౌరవించే
రైతుసోదరుల సంస్కారం

సంక్రాంతి పండుగఅంటే నే
సర్వసంస్కృతుల
సమ్మిళితం
సకల ప్రాణులకు సంతోషం .

పండుగ పేరుతోప్రకృతి గొలచే
భారతీయుల సంస్కారం

భావితరములకు బాటలు వేయగ పండుగ చూపును
ఒక మార్గం ..

January 17, 2023 8 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రమీల కథలు -2

by ఆచార్య మస‌న‌ January 17, 2023
written by ఆచార్య మస‌న‌

తిరిగొచ్చిన నెక్లెస్

ఒక వారంలోనే శ్రావణి పెళ్ళి కుదిరింది. అబ్బాయి తండ్రి సత్యనారాయణ కట్నం అడుగకుండానే తన కుమారునికి నా కూతురు శ్రావణిలో పెళ్లి జరపడానికి నిశ్చయించాడు. పెళ్ళి చూపులకు వచ్చి రాగానే సత్యనారాయణ అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన సుల్తాన్ శాయిలో నా అర్థాంగి ప్రమీలకు ప్రైమరీ స్కూల్ లో చదువుచెప్పడమే.

పూర్వ పరిచయం వల్లనూ, అంతకుముందే ప్రమీల పుట్టించివారితో సంబంధం ఉండడంవల్లనూ సత్యనారాయణ పెళ్లికి ఆమోదముద్రవేశాడని నాకు తెలిసింది.

ఐతే, పెళ్ళి ఒక వారంలో జరగాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. కారణమేమంటే వాళ్ళబ్బాయి మా అమ్మాయి పెళ్ళాడి పదిరోజుల్లో అమెరికా వెళ్లిపోవాలి.

నా కంత తొందరగా పెళ్ళి చేయడం ఇబ్బందిగానే ఉండింది. కట్నం క్యాష్ రూపంలో ఏమీ ఇవ్వకున్నా బంగారమైనా పెట్టాలి కదా!  ప్రమీలతో మాట్లాడాను. ఆమె తన పెద్ద గొలుసును, నెక్లెస్ (రాళ్ళులేనిది)ను అమ్మాయికి ఇవ్వడానికి ఒప్పుకుంది. నేనూ సంతోషించాను.

మా ఇంటి ముందు శివయ్యగారు ఒక చిన్నర కొట్టును నడుపుకుంటున్నాడు. నేను ఏదో కొనడానికి పోతే, “ఏం సార్ మీరు కొంచెం విచారంగా కనిపిస్తున్నారు. కారణం తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు.

నేను అమ్మాయికి వారంలోనే పెళ్ళి చేసే విషయాన్ని ఆయనకు చెప్పాను. “చాలా సంతోషం. మీకేమైనా డబ్బు సర్దమంటే సర్దుతాను” అని ఆయనే స్వయంగా అనడం, నేను ఒక రెండు లక్షలు ఆయన దగ్గర మిత్తిలేకుండానే తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.

పెళ్లి బాగా జరిగింది. అబ్బాయి పెళ్లి తర్వాత నాల్గు రోజులుండి యు.ఎస్. వెళ్లిపోయాడు. అమ్మాయి శ్రావణి కూడా నాల్గు నెలల తర్వాత యు.ఎస్.వెళ్లిపోయింది.

శ్రావణికి పెళ్లైన రెండేళ్లకు శ్రేష్ఠ జన్మించింది. శ్రేష్ఠ రెండేళ్లు ఇండియాలోనే పెరిగింది. తన కూతురిని తీసుకపోవడానికి శ్రావణి, నాగరాజులు ఇండియాకు వచ్చారు.

శ్రావణికి నగలంటే వల్లమాలిన ప్రేమ. పాత నగల్ని కరిగించి కొత్తవి చేయడం గాని, పాతవి అమ్మేసి కొత్తవి కొనడంగాని ఆమె కిష్టం.

ఒక రోజు శ్రావణి నన్నూ, ప్రమీలను తీసుకొని ఆబిడ్స్ లోని జ్యువెలరీ షాప్ కు తీసుకొని వెళ్లింది. కొత్త నగలకు ఆర్డర్ ఇస్తూ, పెళ్లినాడు ప్రమీల నుంచి తనకు కట్నంగా వచ్చిన నెక్లెస్ ను అమ్మే ప్రయత్నం చేసింది.

అయ్యో! నేను ప్రేమతో ప్రమీలకు చేయించిన నెక్లెస్ ను శ్రావణి అమ్మయేడం నాకు బాధ కల్గించింది. షాపు నాడు వెంటనే ఆరువేలకు ధర కట్టి తీసుకున్నాడు. ఒక్క క్షణంలో నాకు మంచి ఆలోచన వచ్చింది. నేనే ఆ నెక్లెస్ను తీసుకుంటే ఎంత బాగుంటదనిపించింది. ఆలస్యం చేయకుండా నా దగ్గరున్న ఆరువేలు షాపుతనకిచ్చి నెక్లెస్ ను తీసుకున్నాను. నేను చేసిన పనికి ప్రమీల ఏమనుకున్నదోగాని, శ్రావణి మాత్రం కొంచెం సిగ్గుపడినట్లు కనిపించింది.

శ్రావణి వివాహమై పదిహేనేండ్లు గడిచాయి. అది 2015వ సంవత్సరం. నేను రిటైర్మెంట్ అయిన మూడు మాసాలకే ప్రమీల అకస్మాత్తుగా నన్ను శోక సముద్రంలో ముంచి పరలోకకేగింది.

కొన్ని రోజులు గడిచాయి. ప్రమీల రెండు అల్మార్ల నిండా చీరలే. ప్రత్యేకంగా నగల పెట్టె కూడా ఉంది. నా పిల్లలు ముగ్గురు అల్మారాలు తెరిచారు. నా అనుమతితో చీరలూ, నగలూ వారికిష్టమైన రీతిలో పంచుకున్నారు. ముగ్గురూ సామరస్యంగా నగల్ని పంచుకోవడం నాకూ బాగనిపించింది!

ఆశ్చర్యమేమంటే ప్రమీల ధరించిన ఆభరాల్లో శ్రావణి అమ్మితే నేను కొన్న నెక్లెస్ కూడా ఉంది. ఆ నెక్లెసంను చూడగానే నా కళ్ళు చెమర్చాయి. శ్రావణి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. తన పాలుకు ఆ నెక్లెస్ ఉండాలని కోరింది. అన్నదమ్ములందుకు ఒప్పుకున్నారు.

తన చేతికి తిరిగొచ్చిన ఆ బంగారు నెక్లెస్ను శ్రావణి తన కూతురు శ్రేష్ఠ మెడలో అలంకరించడం కొస మెఱుపు. నా మనుమరాలికంఠంలో ఆ నెక్లెస్ ను చూసి, తిరిగి ప్రమీలనే ధరించినంత ఆనందానుభూతిని పొందాను.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పలు దేశాలు- వాటి ప్రాచుర్యాలు ఇనుమడించిన ఈజిప్ట్ అందాలు

by nellutla Indrani January 17, 2023
written by nellutla Indrani

చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండం గురించి అన్నారు మన ముందు తరాలవారు . కాని గ్లోబలైజేషన్ వల్ల అన్ని ప్రాంతాల లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని ప్రకృతి ఒడిలో అందమైన ప్రదేశం గా చెప్తూ వివరాలు తెలుసుకుంటన్నాం కదా!

ఇప్పటి వరకు మనం ఆఫ్రికా ఖండం లోని అల్జీరియా మరియు బోట్స్వానా దేశాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈజిప్ట్ దేశం గురించి తెలుసుకుందాం.
ఈజిప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది గాజా లోని పిరమిడ్స్. ఇవి చాలా పురాతనమైనవి. వేల వేల సంవత్సరాల కాలంనాటి సంస్కృతి గుర్తుకొస్తాయి. తొలి నాగరికతలోని మొట్టమొదటి దేశంగా ప్రాచుర్యం పొందింది ఈజిప్టు.
ఈజిప్టులో మధ్యధరా సముద్రం, నైలునది మరియు ఎర్ర సముద్రం తీరప్రాంతాలుగా ఉన్నాయి. ఈజిప్టుకు పశ్చిమాన లిబియా, ఈశాన్యంలో గజా స్ట్రిప్, తూర్పున ఇజ్రాయిల్ మరియు దక్షిణాన సుడాన్ దేశాలు ఉన్నాయి.
ఈజిప్టులో అధిక శాతం ముస్లిం మెజార్టీ ఉంది. ఈజిప్షన్ సంగీతం ఒక రకమైన వీనుల విందైన సంగీతం. చాలా డిఫరెంట్ గా సాగే ఈ సంగీతం స్వదేశ మరియు ప్రాశ్చాత్య ప్రభావాల మిశ్రమంగా చెప్పవచ్చు.

ఇప్పుడు ఈజిప్టులో చూడవలసిన ప్రదేశాలు వాటి ప్రాచుర్యాల గురించి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి.అవేంటంటే,
ఇక్కడి ప్రదేశాలలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ప్రదేశం హర్గదా. అసలు ఈ ప్రదేశానికి ‘రిసార్ట్ టౌన్’ అనే పేరు కూడా ఉంది. అంటే ఈ ప్రదేశం యొక్క సుందరతను మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక్కడి అట్రాక్టివ్ ప్లేసెస్ లో ముఖ్యమైంది శర్మల్ షేక్ మరియు దాహెబ్ చాలా టూరిస్ట్ హబ్స్ గా పేర్కొనవచ్చు ఇక్కడ టూరిస్టులు ఎక్కువ యూరోపియన్ కంట్రీస్ నుండి వస్తారు. అక్కడి బ్లూ వాటర్స్ సుందరతను చూసి తనివి తీర వలసిందే. ఇక్కడ స్కూబా డైవింగ్ స్నార్కలింగ్, బెండ్ సర్ఫింగ్, జెట్ స్కీయింగ్ చాలా పాపులర్ సీ యాక్టివిటీస్.
ఇవే కాకుండా మ్యాజికల్ మెరైన్ డ్రైవ్, గ్లాస్ బాటం బోర్డ్ రైడింగ్ అద్భుతాలు. గ్లాస్ బోట్ రైడింగ్ లో పడవలో మనం ఉంటాము కింద గ్లాస్ ఉంటుంది. గ్లాసు నుంచి కిందికి చూస్తూ కింద ఉన్న రకరకాల చేపలను మరియు సముద్ర జంతువులను చూసి మనం మనమే మర్చిపోయే అంత అనుభూతి కలుగుతుంది.
అలెగ్జాండ్రియా ప్రదేశం ఈజిప్టు లో ఇంకో అద్భుతమైన ప్రదేశం. విజిటర్స్ కి ఇది కన్నుల పండుగ చేసే స్థలం. కైరో సిటీ ఈజిప్ట్ కి రాజధాని.
నైలు నది: –

ఇక నైలు నది అందాలు వర్ణించనలవి కానిది. క్రూజ్ డిన్నర్సు, లైట్ వెలుతురులో రెండు ప్రక్కల ఉన్న బిల్డింగ్స్ మైమరపు కలిగిస్తాయి.

ఈజిప్టు అనగానే నైలు నది , నైలు నది వెంట జనజీవన స్రవంతి మనకు గుర్తుకు వస్తాయి. ప్రపంచం లోనే అతి పొడవైన నది గా పిలువబడే నైలు నదికి రెండు ప్రధాన ఉపనదులైన వైట్ నైల్ , బ్లూ నైల్ రివర్స్ జ్ఞప్తి కి వస్తాయి.
పురాతన ఈజిప్టు చరిత్రలో నాగరికత పరిఢవిల్లిన చరిత్ర మొత్తం నైలు నది చరిత్ర లో భాగంగా చెప్తుంటారు . పచ్చని చెట్ల అందాలు కొండకోనల్లో నైలు నది మలుపులూ చూడచక్కని ప్రదేశాలు.
పిరమిడ్స్: –

ఇక ఈజిప్ట్ అంటేనే పిరమిడ్స్, పిరమిడ్స్ అంటేనే ఈజిప్ట్. ఇది మన 7 ప్రపంచ వింతలలో ఒకటి. అన్ని సంవత్సరాల క్రితం అంత పెద్ద పెద్ద రాళ్ళ తో ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ తోటి కట్టడమన్నది ఇప్పటికీ అంతు పట్టని విషయం.

ఇక్కడి మ్యూజియం చెప్పుకోదగ్గది. దీన్ని మమ్మీస్ మ్యూజియం అంటారు. చాలా సంవత్సరాల కింద బాడీస్ ని కెమికల్స్ తో ట్రీట్మెంట్ చేసి ఇన్నేళ్ల వరకు కూడా మమ్మీస్ ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచారు. ఇలాంటి వింతలు, విశేషాలు ఎన్నో ఉన్న ఈజిప్టును చూసితీరాల్సిందే!
బెస్ట్ సీజన్ టు విజిట్ ఈజిప్ట్ – మార్చ్ టు అర్లీ మే మరియు లేట్ సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు!
డిసెంబర్ రెండవ వారం వరకు కూడా పర్వాలేదు.
మరింకెందుకు ఆలస్యం మనం నవంబర్, డిసెంబర్ లలోనే ఉన్నాం కదా. ఈ ఏడాది వీలుకాకున్నా వచ్చే సంవత్సరం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకేం విజిట్ అండ్ ఎంజాయ్.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

‘సంబరాల సంక్రాంతి వైశిష్ట్యం ..తెలుగు సంస్కృతికి బ్రహ్మ రథం’

by cvl sujatha January 17, 2023
written by cvl sujatha

సంక్రాతి సంబరం, సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటి రోజున భోగి’ , రెండోరోజు ‘మకర సంక్రాతి’, మూడోరోజు ‘కనుమ పండుగ.’! మకర సంక్రాంతినే’ తిల సంక్రమణం’ , ‘ పంటల పండుగ’ ‘ఆమని పండుగ’, అల్లుళ్ళ పండుగ’, జానపదుల పండుగ’ వంటి పేర్లతోనూ పిలుస్తారు. సస్య లక్ష్మిని వెంటబెట్టుకు వచ్చే పండుగ ఇది. సర్వ సాధారణంగా సంక్రాంతి జనవరి 13, 14, 15 తేదీలలోనే వస్తుంటుంది.

‘సంక్రాతి’ అంటేనే ఒక కొత్తదనానికి స్వాగతం పలికే శుభతరుణంగా పేర్కొనవచ్చు. ఏడాదికొకసారి వచ్చే మకర సంక్రాంతి తెలుగు వారి విశిష్ట పండుగ. అన్ని పండుగల మాదిరిగానే ఈ పండుగకూ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్ల సంవత్సర ప్రారంభంలోనే వచ్చే మొట్ట మొదటి తెలుగు పండుగ ఈ సంక్రాంతి. మరణానికి సైతం పనికిరాని చేదు కాలంగా భావించే దక్షిణా యుగానికి స్వస్తి పలికి పుణ్య కాలమైన ఉత్తరాయణానికి ‘ మకర సంక్రాంతి’ పండుగే స్వాగతం పలుకుతుంది. ఆ రోజునుంచే మంచి రోజులకు శ్రీకారం. సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించే సంక్రమణాను బట్టి ఒక్కో నెల ఏర్పడుతుంది. ఇలా సూర్యుడు ప్రతి రాశిలో ప్రవేశించే ప్రతి సమయాన్ని సంక్రాంతి అనవచ్చు. కాకపోతే వాటిని ‘మాస సంక్రాంతు’లంటారు. ధనుస్సు రాశి తర్వాత వచ్చే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఉత్తరాయణ పుణ్య కాలం ప్రారంభమైనట్టుగా చెబుతారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాల సంబరాలు మొదలవుతాయి. పండుగకు ముందు, తర్వాత కొన్నాళ్ల పాటు ఆకాశంలో పగటి నక్షత్రాల్లా పతంగులు విహరిస్తుంటాయి. పతంగులు గాలిలో ఎగరవేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది. ఒకప్పుడు ఇది గ్రామీణ క్రీడగానే ఉండేది. కానీ ఇప్పుడు నగరాల్లోనూ, పట్టణాల్లోనూ గాలిపటాల విహంగం అధికమయ్యాయి. గాలిపటాలు ఎగుర వెయ్యటానికి ఇప్పుడు పిల్లలతో పాటు పెద్దలూ ఆసక్తి చూపిస్తున్నారు.

మిగిలిన అన్ని పర్వదినాల మాటెలా వున్నా ఈ సంక్రాంతి తెలుగు ఆడపడుచుల పండుగలా అభివర్ణించవచ్చు. ధనుర్మాస ప్రారంభం నుండే తెలుగు వాకిళ్లు పండుగ సంబరాల్ని సంతరించుకుంటాయి. పసుపు, కుంకుమలు, మామిడాకులు, పూలదండలతో ఇంటి గుమ్మాలని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతివారి వాకిళ్ళ ముంగిట ”ముత్యాల ముగ్గులు” ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు …బంతిపూల అలంకరణలు …గంగిరెద్దుల ఆటపాటలు…హరిదాసు కీర్తనలతో’ సంక్రాంతి లక్ష్మి’ కి స్వాగతం పలుకుతారు.

(తరుణి అంతర్లాజల వారపత్రిక సౌజన్యంతో)

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పిల్లల్ని చెడు ప్రభావాల నుంచి తప్పించే బాధ్యత తల్లిదండ్రులదే !!

by రసస్రవంతి& కావ్యసుధ January 17, 2023
written by రసస్రవంతి& కావ్యసుధ

మనదేశంలో యువతీ యువకులలో చాలా మందికి నేరహింసా ప్రవృత్తి పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. దిగువ మధ్య తరగతి ప్రజల నుంచి వచ్చిన పిల్లలు ఉపాధి అవకాశాల్లేక, పేదరికం నుంచి బయటపడడానికి నేరాలబాట పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యసనాలకు బానిస లౌతున్నారు. జులాయిలుగా తిరుగుతున్నారు. మధ్య తరగతి ప్రజల పిల్లలు ఉద్యోగాలు సంపాదించినా, చాలీ చాలని జీతంతో కనీస అవసరాలు తీరక, లంచగొండు తెలుగా, అవినీతి పరులుగా మారుతున్నారు. ఎగువ మధ్య తరగతి ధనికుల పిల్లలు చదువుకున్నా, విలాసాలు మరిగి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొంతమంది డబ్బు సంపాదన యావతో, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ, అక్కడే స్థిరపడి తల్లిదండ్రులకు, దేశానికి దూరంగా, అనుబంధా లకు అతీతంగా గడుపుతున్నారు. భారతదేశ భవిష్యత్తుగాని, సమాజ సంక్షేమంగాని, భావిపౌరులైన బాలబాలికలపైనే ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు, భావిభారత సౌభాగ్యానికి పట్టుకొమ్మలు. పిల్లలు బాగా చదువుకోవ డమే కాకుండా మంచి గుణగణాలు అలవరచుకోవాలి. క్రమశిక్షణతో పెరగాలి. కుటుంబం సమాజంపట్ల తమ బాధ్యతలను గుర్తించాలి. కాలాన్ని సద్వినియోగం చేసు కోవాలి. పెద్దలను, సంప్రదాయాలను గౌరవించాలి.

సమాజం నుంచి తాము పొందడంతోబాటు సమాజానికి తానేదో చేయాలన్న భావం కలగాలి. ఇవన్నీ నేటి యువతరానికి ఉన్నాయా? అని ప్రశ్నించుకుంటే చాలావరకు లేవని చెప్పాల్సిరావడం నిజంగా దురదృష్ట కరం. నేటి యువతరంలో క్రమశిక్షణ లేకపోయినా, వారు నేరాలకు, వ్యసనాలకు అలవాటు పడినా, లేకపోతే కుటుంబంపట్ల తమ బాధ్యతలను విస్మరించి తమ స్వార్ధ ప్రయోజనాలకే ప్రాముఖ్యతను ఇచ్చినా, మనం వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ అవలక్షణాలన్నింటిలోనూ తల్లిదండ్రుల బాధ్యత ఎంతగానో ఉంది.

నేటి జీవన విధానంలో తల్లిదండ్రులు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉండడంతో పిల్లల పెంపకం చాలా క్లిష్టంగా ఉంటోంది. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలను ఎలా పెంచాలో సరైన అవగాహన ఉండడంలేదు. దీనికి ప్రజల్లోని నిరక్షరాస్యతే కారణం. బాగా చదువుకున్న తల్లిదండ్రులు కూడా పాశ్చాత్య పోకడలతో పిల్లలను పెంచుతున్నారు. కాన్వెంటు, కాన్సెప్టు, టెక్నో వంటి పేర్లతో నడుస్తోన్న ఇంగ్లీషు స్కూళ్లల్లో చదివే పిల్లలకు మన సమాజంపట్ల సరైన అవగాహన ఏర్పడడంలేదు. పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాల్లో సరైన విద్య లభించడంలేదు. పేద కుటుంబాల పిల్లలు చాలామంది చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలతో గడిపే తీరికలేదు. చిన్నప్పుడే పిల్లలను కేర్సెంటర్లలో చేర్పిస్తు న్నారు. వారు పెద్దవుతున్నా వారి స్నేహితుల గురించి, వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడంలేదు. చాలా మంది పిల్లలు గంటలకొద్దీ టీవీ ముందు కూర్చోవడం, కాలం వృథాచేసే క్రికెట్ మ్యాచ్లు, హింసాత్మక కార్టూన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. వీటివల్ల పిల్లల మానసిక దృక్పథం, వైఖరి ప్రభావితం అవుతున్నాయి.

పిల్లలను పాడుచేస్తున్నాయని ఒక విద్యావేత్త అన్నారు. ఇది అక్షరాలా నిజం పిల్లలు విజ్ఞానం పెంచుకోవడానికి, చదువుకోవడానికి, ఆటలాడుకోవడానికి, వ్యాయామం చేయడానికి, సృజనాత్మక శక్తి వంటి నైపుణ్యాలను పెందు కోవడానికి విలువైన కాలాన్ని టివి ముందు వృథాగా ఖర్చుచేస్తున్నారు. సహజ సిద్ధంగా పిల్లలకు ఆ వయసులో ఉండాల్సిన అమాయకత్వం, ఉత్సాహం, పరుగులుతీసే వేగం ఉండడంలేదు.

పిల్లలకు సహజసిద్ధమైన ఆలోచనలుకాక పెద్దపెద్ద విషయాల గురించి ఆలోచించడం పరిపాటైంది. తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల మంచి ప్రవర్తన పట్టించుకోరుగాని చెడును తొందరగా పట్టించుకొని శిక్షిస్తుంటారు. పిల్లల్లోని మంచి లక్షణాలు, నైపుణ్యాలు, బలాలను ఏ మాత్రం గుర్తించరు. గుర్తించినా ప్రోత్స హించరు. పిల్లల్లో చెదులక్షణాలు ఉన్నట్లే మంచివికూడా ఉంటాయి. ఆ లక్షణాలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే పిల్లలు మరింత అభివృద్ధి సాధిస్తారు. రోజులో ఒక్క గంటసేపైనా తల్లిదండ్రులు పిల్లలతో చర్చించాలి. వారి సమస్యల గురించి వాకబు చేయాలి. వారి అలవాట్లు, మానసిక స్థితిని పట్టించుకోవాలి. మన సంప్రదాయం. గురించి, ఉన్నత విలువల గురించి వారికి నచ్చేరీతిలో చెప్పాలి. ఏదైనా చెడుపని చేసినపుడు అది తప్పని నచ్చ: చెప్పగలగాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని అతిగా గారాబం చేస్తారు. వాళ్లు అడిగినది ఏదీ కాదనరు. వారి ప్రవర్తన బాగా లేకపోయినా మండలించరు. దానివల్ల అలా పెరిగినవారిలో మొండితనం ఏర్పడుతుంది. గొడవ చేస్తే తాము అడిగింది ఏదైనా సాధించుకోగలమున్న గర్వం ఏర్పడుతుంది. తీరా వీళ్లు పెద్దయ్యాక తమమాట చెల్లక పోయినా, తమమాటను ఎవరైనా ఖండించినా భరించ లేదు. ఇలాంటివారు బయట ఏ అవమానం ఎదురైనా తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఈ మనస్తత్వానికి కారణం వారి తల్లిదండ్రులే, అతిగారాబం వల్ల మంకుపట్టుదల ఏర్పడుతుంది.

మరికొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలే. ఉత్తి పనికిరానివారుగా, దరిద్రులుగా కన్పిస్తారు. వారిని ఎప్పుడూ శిక్షిస్తూ అవహేళన చేస్తూ అవమానిస్తుంటారు. ఇతరులు ముందు వారి గురించి చులకనగా మాట్లాడు: తుంటారు. ఇలాంటివారికి చిన్నతనం నుంచే తల్లిదండ్రుల మీద ద్వేషం కలుగుతుంది. పెద్దయిన తర్వాత అది. సమాజంపై కసిగా మారుతుంది. దాంతో అలాంటివారు. అందరినీ ద్వేషిస్తూ మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. లేదా కసితో పెట్రేగిపోయి నేరాలబాట పడతారు. రకరకాల వ్యసనాలకు బానిసలవుతారు. నిజంగా ఈనాడు పిల్లల మనసులకు ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చదువు కోకపోతే చెడుతిరుగుళ్లు తిరగడం, చదువుకోమంటే బడి ఎగ్గొట్టి షికారులకు పోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే కొంతమంది పిల్లలకు ఆదుకోవడానికి, ఆలోచించడానికి కూడా టైం ఉండదు. బండెడు పుస్తకాలు మోసుకుంటూ సాయంత్రం వరకు జైలుగదివంటి క్లాస్ రూంలో కూర్చోవడం, తర్వాత ట్యూషన్లకు వెళ్లడం, వీటితో అలసిపోయి ఇంటికి వచ్చాక గంపెడు హెూంవర్కు చేయడం ఇదీ దినచర్య దానికితోడు తల్లిదండ్రులు తమ పిల్లల అభిరుచిని కనుక్కోకుండా తమ ఆశలను, ఆశయా లను వారిపై రుద్ది వారిని హింసించడం. చాలామంది. తల్లిదండ్రులు చదవమని గోల పెడుతూ పిల్లలను రచి రంపాన పెడుతుంటారు. వారికి మానసిక ఉల్లాసం కలిగే వీలేలేదు. ఆ కారణంగా వారు చదువును ద్వేషించడం లేదా చదువుతప్ప వేరే ఏ విషయం పట్టించుకోకపోవడం, దీనివల్ల వాళ్లు ర్యాంకుల రేసులో పరుగెడుతుంటారు. అందుకు తగినట్లుగానే – న్యూన్లు, ప్రైవేటు కాలేజీలు కూడా రోజంతా వారిని రుబ్బుతూనే ఉంటాయి. దీంతో చదువనే జాడ్యం తప్ప సమాజంలో బతకాల్సిన తీరు గురించి సాటి మనుషులతో మెలిగే పద్ధతికూడా తెలియకుండా పోతుంది. అందువల్ల వారు ర్యాంకులు తెచ్చుకొని తల్లిదండ్రులకు గుడ్ బై చెప్పి విదేశాలకు వెళ్లిపోతారు. తండ్రిపోయినా, తల్లిపోయినా లేక వాళ్లు ఇక్కడ దిక్కు లేకుండా పోయినా వారికి చీమకుట్టినట్లయినా ఉండదు. అందులో వారి తప్పేమీలేదు. అలా వారిని తయారు చేసిన తప్పంతా తల్లిదండ్రులదే.

అబ్బాయి, అమ్మాయిగాని బాగా చదివి లక్షలు గడించే ఉద్యోగాలు సంపాదించి, మహానగ రాల్లోనో విదేశాల్లోనో స్థిరపడాలని కలలుగని, ఒక ఏ. విషయాలు పిల్లలకు చెప్పకుండా చదువు చదువు అనే మంత్రాన్నే జపిస్తుంటారు. దానివల్ల ఆ పిల్లలకు పెద్ద వారిని గౌరవించడంగాని, తనవారిని ప్రేమించడంగాని, సంప్రదాయాలను గౌరవించడంగాని తెలియకుండా పోతుంది. చాలామంది తల్లిదండ్రులు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు పిల్లలు తమను లెక్కచేయనపుడు లబోదిబోమని కుమిలిపోతుంటారు. ఇలాంటివారిని చూసి కూడా గుణపాఠం నేర్చుకోకుండా తాము కూడా అదే మార్గంలో నడుస్తుండడం చాలా విచారించదగిన విషయం పెద్దలు పిల్లలు చెప్పేది వినాలి. ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని వికసింపచేసుకోవడానికి తగిన ప్రోత్సాహం, ప్రేరణ తల్లిదండ్రులు కలిగించాలి. అలాగే వారిని అతి గారాబం చేసి చెడగొట్టకూడదు. మగపిల్లలు బయట ఏం చేస్తున్నారో గమనించాలి. వారి అలవాట్లను గమనించాలి. క్రమశిక్షణతో మెలిగేలా శ్రద్ద తీసుకోవాలి. పిల్లల ముందే తల్లిదండ్రులు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకూడదు. తండ్రులు బాధ్యతా రహితంగా ప్రవర్తించడం వారి ముందే తాగడం వంటివి చేయకూడదు. అలాగే వారిముందే తండ్రిని తీసేసినట్టు మాట్లాడడం, ఇరుగుపొరుగువారి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ఆడపిల్లలు ఒంటరిగా గదిలో కూర్చుని నెట్లలో గడుపుతుంటే ఏం చేస్తున్నారో గమనించాలి. చాలామంది నెట్లో ముక్కూ మొహం తెలియనివారితో చాటింగులు చేసి ప్రేమలో పడుతుంటారు. సెల్ ఫోన్ విరివిగా మాట్లాడు. కుంటారు. వీటన్నింటినీ గుర్తించి వాటివల్ల కలిగే చెడు ప్రభావాలనుంచి తప్పించే బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్వేచ్ఛనివ్వకుండా ఉండడం ఎంత తప్పో, అతిగా స్వేచ్ఛనిచ్చి వారిగురించి పట్టించుకోకపోవడం కూడా అంతే తప్పు, పిల్లలకు సారీ చెప్పడానికి తల్లిదండ్రులు వెనకాడకూడదు. అలాగే పిల్లలు వారిమాట నెగ్గించుకోవ దానికి నానాయాగీ చేస్తే వెంటనే వారి కోర్కెలు తీర్చడానికి సిద్ధమైపోకూడదు. తగని విషయాల గురించి పిల్లలు మారాం చేస్తే వారిని మందలించగలగాలి. ముఖ్యంగా చిన్నవాటి నుంచే వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లలకు నేర్చేముందు వారి పెద్దవాళ్లు, తల్లి
దండ్రులు క్రమశిక్షణతో ఉండాలి. పిల్లల్ని క్రమశిక్షణలో
పెట్టే ప్రక్రియ ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ ప్రేమలోనే వారలోపాలను కచ్చితంగా సరిదిద్దగలగాలి. పిల్లల్లోని అసంబద్ధప్రవర్తన అనవసర ప్రసంగాలు మంకుపట్టుతో. మొరాయించడం పెద్దలపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వంటివి ఆదిలోనే తుంచేయాలి. పిల్లలతో చాలా స్నేహంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఒకనాటి పిల్లలే. అని గుర్తుపెట్టుకొని వారిని భయపెట్టకూడదు. వారిని అసహ్యంగా తిట్టకూడదు. వాళ్లను శాంతింపచేయడానికి లంచాలు కానుకలు ఇస్తుంటారు. అది చాలా తప్పు, దాంతో పిల్లలు ఏదైనా ఇస్తామని చెబితేనే మాటవినే పరిస్థితి వస్తుంది. పిల్లల్లో తల్లిదండ్రులు కానుకలిచ్చే అలవాటు చేయడం వల్ల వాళ్లు పెద్దయ్యాక లంచ గొందులుగా మారతారు.

పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని. ఎప్పటికప్పుడు చెబుతుండాలి. అలాగే బహుమానంగా ఏదో ఒకటి ఇచ్చి వారిని మంచి చేసుకోవడం సరైనది. కాదు. చాలా కుటుంబాల్లో ఈ క్రమశిక్షణ భారాన్ని తల్లులకే వదిలేస్తారు. తల్లుల గురించి తండ్రులకు చాడీలు చెప్పి, తండ్రుల గురించి తల్లులకు చెప్పి ఎవరో ఒకరికి దగ్గరై వారినుంచి డబ్బులు, కానుకలు పొందు తుంటారు. ఈ చాడీలను ప్రోత్సహించకూడదు. కొందరు తండ్రులు తల్లి విషయంలో పిల్లలను ప్రోత్సహిస్తుంటారు. అలాగే తల్లులు కూడా. దీనివల్ల పిల్లలకు చాడీలు చెప్పే మనస్తత్వం బాగా అలవడుతుంది. వీడు పెద్దయ్యాక ఎవరో ఒకరిగురించి చెడుగా మాట్లాడుతుంటాడు. పెద్దల్లోనే చాలా లోపాలున్నపుడు పిల్లల్లో లోపాలు అత్యంత సహజం. ఆ లోపాల గురించి వారికి చెప్పాలి. అంతేగాని ఈ లోపంవల్ల నువ్వు దేనికీ పనికిరావని అనకూడదు.
అలాగే మాటవిననివారిని తల్లిదండ్రులు బెదిరిస్తుంటారు.. దీనివల్ల పిల్లల్లో ఒకరకమైన భయం ఏర్పడుతుంది. వారిలో తిరస్కారానికి గురయ్యామన్న భావం కలిగి ఆందోళన చెందుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం వంటివి తగ్గిపోతాయి.

పిల్లలనుకూడా గౌరవించాలని చెబితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది వారి పిల్లలను మనం గౌరవించినట్లు మాట్లాడితే “వాడిమొహం వాడు. దేనికీ పనికిరాదనో లేదా దానిమొహం అదొక ఏడుపు గొట్టుది ఎలా బతుకుతుందోనని భయపడుతున్నాం” అని అంటారు. దానివల్ల వారికి తాము నిజంగా పనికిరామన్న భావం కలుగుతుంది. వీటన్నిటి గురించి మనం చర్చించు కొనేటపుడు పిల్లల్ని పెంచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అనే భావం కలగవచ్చు. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహిస్తే ఇదేమంత కష్టమైనదికాదు. అలాగని ఎంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యవహారంకూడా కాదు. పిల్లల పెంపకం అన్నది గొప్పకళ, కొన్ని కుటుంబాల్లో పిల్లలు పెరిగి పెద్దయి ఎంత ప్రయోజనకారులవుతారో వారు ఎంత చక్కగా కుటుంబ పద్ధతులను సంప్రదాయాలను గౌరవిస్తారో చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. అందుకు వారి తల్లిదండ్రులను ప్రశంసించాలి. కాబట్టి మనం ఒక బంగారం ఉంగరం పోగొట్టుకుంటే ఎంతబాధ పడతామో ఆలోచించండి. అలాంటిది మన పిల్లలంటే మనకు నిలువెత్తు బంగారంలాంటివారు. ఆ బంగారా లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపైనా ఉంది. వాళ్లను తమ బంగారాలుగా భావించగలిగితే ప్రతి తల్లితండ్రీ పిల్లల పెంపకంపట్ల మరింత శ్రద్ధచూపి స్తారు. అప్పుడే ఆ పిల్లలు ప్రయోజకులవుతారు.

“కవి శిరోమణి” -“రసస్రవంతి”
“ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్ “
” కావ్యసుధ

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26)

by రూపాదేవి January 17, 2023
written by రూపాదేవి
(Soft pastel colours తో వేశాను పై చిత్రాన్ని)

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం రూపుదిద్దుకుని 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం లభించింది. కాబట్టి 2015 నుంచీ ఏటా నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం.

1949లో ఆమోదం లభించినా గానీ 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది.

కానీ, భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది నవంబరు 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి నవంబర్‌ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సంవిధాన్ దివస్, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతోనూ వేడుకలను నిర్వహిస్తున్నాం.

రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఈ ఏడాది నవంబరు 26కు 73 ఏళ్లు పూర్తవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం.

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేటి భారతం

by A. Venugopal January 17, 2023
written by A. Venugopal

ఏటి భారతం – ఈనాటి భారతం

మాటల పోటీల బ్రతుకె నేటి భారతం

రాజ ధర్మ పరిరక్షణె నాటి భారతం

ఓటు సీటు, నోట్ల కొఱకె నేటి భారతం

సోదర, ప్రేమలు పంచుట నాటి భారతం

ఉదర పిండ విధ్వంసం నేటి భారతం

గీత బోధ జరిగినదలనాటి భారతం

హితుల కీడు నెంచేటి నేటి భారతం

విదురగీతి నాదరించె నాటి భారతం

అవినీతికి, పట్టమొసగె నేటి భారతం

మానవత్వమున కర్థం నాటి భారతం

అమానుషం, అన్యాయం నేటి భారతం

మనిషిలోనె దేవునిగనె నాటి భారతం,

మనిషికి, మనిషే శతృవు నేటి భారతం

అర్థ, స్వార్థముల నిండెను, అహంకారమే హెచ్చెను

అమాయకపు జనులనెల్ల ‘మాయ’లోనె ముంచేసెను నేటి భారతం

శాశ్వతమేదీ కాదనె నాటి భారతం

అంతా శాశ్వతమని యెంచెను నేటి భారతం….

January 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

వి’శ్వాస’ దీపం

by కె. వీణారెడ్డి, January 16, 2023
written by కె. వీణారెడ్డి,

ఆకాశంలో ఉరుములు మెరుపులు… భూమిపైన జోరుగా వర్షపు చినుకులు… చెవులకు సోకుతున్న హోరుగాలి… ఆ చల్లని వాతావరణంలో టకటక వినిపిస్తున్న ఒక శబ్దం!

హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి, తన బావమరుదులతో కూడి డాక్టర్ రాజారాం చేసుకుంటున్న మందు పార్టీలో అది రెండో రౌండ్. ‘ఛీర్స్… ఛీర్స్’ గ్లాసుల గలగల శబ్దానికి పోటీపడుతున్నట్టుగా టకటకమంటూ మళ్లీ అదే శబ్దం!

చిరాకుగా వెళ్ళి వీధి తలుపు తీసి చూశాడు రాజారాం. తెరుచుకున్న ఆ తలుపుల ముందు… తడిసిన తల కొప్పెరతో, బురదనిండిన చెప్పుల్లేని కాళ్లతో, సన్నగా వణుకుతూ నిల్చున్నాడో పదేళ్ల పిల్లాడు.

‘అరె…. వీడా? ఏడాదినాడే కాలం చేసిన, కాలనీ చివరింటి జానయ్య కొడుకు శీనయ్యగాడా!” అనుకుంటూ అదోలా చూశాడు రాజారాం.

ఆ రాత్రి వేళ తనను డిస్టర్బ్ చేసిన వాడి రాకకు, తడిసి నేలను తడుపుతున్న వాడి తీరుకు అసహనం కలిగింది డా. రాజారాంకు.

“ఏంట్రా శీనూ?” విసుగ్గా అడిగాడు.

“డాక్టర్ సార్… నిన్నట్నుండి మా యమ్మకు జెరం. రాత్రికి రాత్రే ఎక్కువైంది. కరోనా వచ్చిందేమోనని భయమైతుంది. ఓసారి మీరొచ్చి సూడండి సార్… ఏదైనా గవర్నమెంట్ దవకాన్ల సేర్పించి పరీచ్చలు సేయించండి. కరోనా అయితేగాన దయచేసి మందులిప్పించండి!” అంటూ డాక్టర్ గారి కాళ్లు పట్టుకున్నాడు కన్నీళ్ళతో శీనుగాడు.

మజాగా నడుస్తున్న మంది పార్టీ నుండి వైద్యుడిగా బయటకు రానివ్వలేదు రాజారాం మనసు.

“ఒరేయ్ శీనుగా… కష్టం జేసుకునేటోళ్లకు కరోనా రాదు లేరా! శక్తికి మించి పనిచేసిందేమో….. సుస్తీ చేసుంటది. మీయమ్మకేమీ కాదులే… రేపటికల్లా తగ్గిపోతుంది గానీ వెళ్లువెళ్లు!”

అంటూ… వాడిని బలవంతంగా బయటికి పంపించేసి, తలుపులు మూసేసి, గదిలోకొచ్చి మరో బాటిల్ ఓపెన్ చేశాడు డాక్టర్ రాజారాం.

* * *

ఓ వారం అనంతరం….

ఇంట్లోనే ఓ మూల గదిలో… బెడ్ పై అసహనంగా అటూ ఇటూ కదులుతూ చిన్నగా మూలుగుతున్నాడు రాజారాం.

‘వైద్యుడుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, తను కూడా కరోనా బారిన పడక తప్పలేదు. హోం క్వారంటైన్ పద్నాలుగు రోజులు పడకేసే తిప్పలు పడక తప్పడం లేదు! బాధగా, భయంగా, ఒంటరిగా… ఏదోలా గడుపుతున్నాడు తను. కొవిడ్ భయంతో బంధు మిత్రులెవరూ రావడం లేదు. కుటుంబీకులు మాత్రం అన్న పానాదులను గది బయటే పెట్టి తలుపు కొట్టి వెళుతున్నారు. అంతటి వైద్యుణ్ణి తనను తాకడానికే భయపడుతూ…. అందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు. తననో అంటరానివాణ్ణి చేసిన కరోనా కాలమెంతటి భయంకరమైనది!’

ఆయాసంతో కూడిన ఆవేదనతో అనుకున్నాడు ఆరో రోజున డా.రాజారాం.

                   * * *

మందుల ప్రభావంతో, మగతగా పడుకున్న రాజారాం నుదుటిపై ఓ సున్నితమైన చల్లని స్పర్శ తగిలి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు.

ఏదో జ్ఞాపకం… మంద్రపవనంలా అతడి మనసులో కదలాడింది!

‘పక్షం రోజుల క్రితం…. ఆనాటి వర్షపు రాత్రిలో…. నిర్ధాక్షిణ్యంగా వీణ్ణి తను వెళ్ళగొట్టినా ఈనాడు తనకు కరోనా వున్నా, తనను ముట్టుకని తన నుదుట బొట్టుపెట్టిన ఈ శీనుగాడి సింధూరం చేతులు అప్పుడే విచ్చిన మందారాల్లా అన్పిస్తున్నాయి తనకు!’ అనుకొంటూ “శీనూ ఏంట్రా ఇది?” సంచలనంతో కూడిన ఆశ్చర్యంతో అడిగాడు!

‘’దండాలు డాక్టర్ గారూ… నిజంగా మీరు దేవుడే! ఆ రాత్రి మీరు సెప్పిన…. కాదు కాదు మీరు దీవించిన మాటతో మయమ్మకు జెరం తగ్గింది.  కరోనా కూడా రాలేదు. అయ్య లేని నాకు అమ్మ తోడైనా నిలబెట్టిండ్రు మీరు!”

కృతజ్ఞతతో నమస్కారం పెడుతూ అన్నాడు శీనుగాడు.

“నిజమా శీనూ” నమ్మలేనట్టుగా అడిగాడు రాజారాం.

“అవును సార్! మందులేకుండానే మీ నోటి మాటతోనే మాయమ్మ రోగాన్ని తగ్గించిన మనిసి దేవుడు మీరు! అట్లాంటి మీకు కరోనా వచ్చిందని తెలిసి బాగా బాధపడిన. మనిసిదేవుడికి గుళ్ళోని ఆ పెద్ద దేవుడే కదా తగ్గించాలె! అందుకే మన కాలనీలున్న ఆంజనేయస్వామి గుడికెల్లి మీకు తగ్గించమని రోజూ మొక్కేటోణ్ని. ఇయాల గుళ్లో ఏదో పండుగుంట! టెంకాయ కొట్టి దండం పెట్టి సిందూరం తెచ్చిన…. ఎవరు సూడకుండ మీ ఇంటి లోపలికొచ్చిన…. ఆ దేవుని     బొట్టు మీకు పెట్టిన, మీకు తప్పక తగ్గిపోతది సార్!

అంటున్న శీనుగాడి కళ్లల్లో అంతులేని విశ్వాసం అగుపించింది.

అబ్బురంగా వాడివైపు చూశాడు రాజారాం!

‘ప్రాణాంతకమైన కరోనా భయంతో తన వాళ్ళెవరూ తనను తాకనైనా తాకలేని దుర్భరమైన స్థితిలో… తననే దేవుడనుకున్న అమాయకమైన నమ్మకంతో… భయంలేని బాల రుద్రుడిలా తనను తాకిన వీడి హస్తముద్ర తనకెంతో సాంత్వన కలిగించిన మాట నిజం!’

అనుకొంటూ అపురూపంగా చూశాడా పిల్లాడివైపు.
‘ఆనాడు… మందు మత్తులో వాళ్ళమ్మకు మందివ్వని మా గొప్ప వైద్యుడు తను! తండ్రిలేని పిల్లాడు, తల్లినైనా బ్రతికించుకుందామని… ఎంతో ఆత్రంగా ఆ జోరువానాలో తన దగ్గరకు పరుగెత్తుకొచ్చాడు. కానీ… తను… విసుగును దాచుకున్న నటనతో చెప్పిన తన మాయమాటలు నమ్మి, ఆ నమ్మకంతోనే తన తల్లియందు ఆరోగ్య దేవతను దర్శించుకున్న అదృష్టవంతుడు!

ఆర్ద్రతా హృదయంతో అనుకున్నాడు డా. రాజారాం.

అంతలోనే….

“రాజా…. మొన్నటి శాంపిల్ టెస్ట్ రిజల్ట్స్ ల్యాబ్ నుండి నా మొబైల్ కు ఫార్ వర్డ్ చేశారు. నీకు కరోనా నెగెటివ్ వచ్చింది కంగ్రాట్స్ రా!”

సాటి డాక్టర్ మిత్రుడి మాటలతో…. అణువణువునా ఆనంద స్పందన కలిగింది రాజారాంలో, ఆప్యాయంగా శీనుగాడివైపు చూశాడు.

“నీ విశ్వాసంతో, నీ స్పర్శతో నన్ను స్వస్తుణ్ని చేసిన బాల ధన్వంతరివి నీవు శీనూ….      నా వృత్తి ధర్మంలోని పరమార్థాన్నెరిగించిన బాల గురుడవు కూడా నీవే! నీకు నా జోహార్లు శ్రీనివాసా!”

అంటూ పశ్చాత్తాపంతో కూడిన బాధానందాశ్రువులతో వాడి సింధూరం చేతుల్ని పూజా పుష్పల్లా కళ్ళకద్దుకున్నాడు  డాక్టర్ రాజారాం.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అనర్ఘ రత్నాలు

by డా॥ సంగనభట్ల నరసయ్య January 16, 2023
written by డా॥ సంగనభట్ల నరసయ్య

ఉ.       వాడిమయూఖములం గలుగువాడ పరాంబుధి గ్రుంకె, ధేనువుల్

          నేడిట వచ్చే నేకతము, నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్

          పోడిమి వేల్వగా బడియె, బ్రొద్దును బోయె, గచుండు నేనియున్

          రాడు, వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో (ఆది ప. 3-112)

ఈ పద్యం నన్నయ రాసిన గొప్ప పద్యాల్లో ఒకటి. ఆంధ్రమహాభారతంలో కచదేవయానిగాథ లోనిది. మృత సంజీవని విద్య కోసం శ్రతు శిబిరం నుండి అంటే దేవలోకం నుండి వచ్చిన కచుడు గురువు శుక్రునివద్ద శుశ్రూష చేసి విద్య పొందడమే లక్ష్యంగా ఉన్నాడే తప్ప మరో ఆలోచనలేదు. దేవయాని కచుని ఇష్టపడి, రాక్షసుల బారి నుండి రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండగా కచుడు గోవులను తీసికని మేపడానికి అడవికి వెళ్లినాడు. అతణ్ణి రాక్షసులు చంపివేసినారు. తిరిగిరాని కచుని కోసం ఎదురు చూసి, తండ్రితో పై విధంగా అన్నది.

సూర్యుడు అస్తమించినాడు. గోవులు కచుడు లేకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి. మీరు శిష్యులతో కలిసి సాయం కాలపు అగ్నిహోత్రాన్ని పూజించారు. బాగా పొద్దుపోయింది. కచుడింకా రాలేదు. అడవిలో క్రూరమృగాలు, సర్పాలు, రాక్షసుల నుండి ఏమైనా అపకారం జరిగిందేమో అని బాధపడిందని పై పద్యం తాత్పర్యం.

ఈ పద్యం వెనుక అనేక అర్థాలు నన్నయ నిక్షేపించాడు. అవన్నీ “లో నారసి” చూడాలి.

వాడి మయూఖములు (కిరణములు) కలవాడని ప్రారంభించబడిన పద్యంలో నిజానికి సూర్యుడస్తమించడని చెప్పుతోంది. మరి మధ్యాహ్న సూర్యుని ప్రచండత్వ ప్రస్తావన ఎందుకు? అదీ పద్య ప్రారంభంలోనే.

తండ్రి (శుక్రుని)కి సంబంధించిన సేవలు, ఆహారాదులు సమకూర్చి, మధ్యాహ్నం విశ్రాంతి లభించాక, తన ప్రియుణ్ణి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. మధ్యాహ్న సూర్యుని నుండి అస్తమయ సూర్యునివరకు ఎదురు చూస్తున్నదని, క్షణక్షణం లెక్క పెట్టుకని కచుని రాకకై తపన పడుతుందనే అర్థం. మరింకా రాలేదంటే ఆర్తి మొదలైంది.

గతంలో సూర్యుడస్తమించినపుడోసారి, మరోసారి ఆవులను మేపుకని కొంచెం ఆలస్యంగా , మరోసారి అగ్ని హోత్రాదుల పూజలు ముగించేసరికి, మరోసారి ఇంకొంచెం పొద్దుపోయి, చీకటి అలుముకున్నాక కొంచెం ముందు వెనుకలుగా వచ్చినాడు. ఈసారి అన్ని రకాలుగా అన్ని దశలు దాటి నా కచుని జూడలేదని, ఆ దశలననినటిని వరుసగా ఎదురుచూస్తూ, ఐనా రాలేదని, దుఃఖంలో అన్ని సంఘటనలను ఏకరువు పెట్టింది.

ఈ సంఘటనల పరంపర గూర్చి ఇంకా చెప్పాలంటే సూర్యుడూ కచుణ్ణి పట్టించుకోకుండా అస్తమించాడు, ధేనువులూ కాపరిని (కచుణ్ణి) పట్టించుకోకుండా ఒంటరిగా తిరిగి వచ్చాయి, మీరూ ఆయనకు పట్టించుకోకుండా, మీమీ సాయం సంధ్యాగ్ని విధుల్ని నిర్వర్తించుకొన్నారని అర్థం. ఓ రకంగా తండ్రితో నిష్ఠూరాలాడిందని భావం.

క్రుంకె అంటే తనదారిన తాను (మునిగి) పోయాడని, ధేనువులు తమ దారిన తాము వచ్చాయని, మీ దారిన మీరు మీ పూజాదికములు నిర్వర్తించుకున్నారని, ఎవరూ ఆతని గూర్చి ఆలోచించలేరని వాపోయింది.

సూర్యుడస్తమించాడని మొదటిపాదం నిండా మహాకవి పరచినా, తిరిగి “పొద్దును పోయె” అన్న నుడికారంతో వచ్చే సమయం ఐపోయిందని స్పష్టపరచినాడు. లేకుంటే పునరుక్తి కాదా? అంతేకాదు అస్తమయాన్ని పునరుక్తి చేయడంలో దేవయాని ఆర్తి అధికమైందని నిష్కర్ష.

సూర్యుడు పోయాడంటే చిరువెలుగుల్లో మృగబాధలు, ధేనువుల రాకతో సంధ్య పూర్తి ఐందంటే రాక్షస బాధలు, అగ్నిపూజలైనా యంటే చిక్కటి చీకటిలో పాముల బాధలు మూడు దశలకు మూడు బాధలు క్రమాలంకారంగా భాసించాయి.

సూర్యునిలా కచుడు ఈమెను పట్టించుకోకుండా అస్తమించాడు. అంటే రాక్షసులు సంహరించారు. కోర్కెలు ధేనువులు. అవి కచుడు లేకుండా వచ్చినట్టే, కచుడు లేక – తీరని వైనాయి.  ఏకతమ శబ్ద ప్రయోగంలో ఒంటరితనపు దేవయాని మానసిక స్థితిని వ్యంజించినాడని గమనించాలి. కచుడు నిర్లక్ష్యపు ప్రియుడు. కచుని అభాంలో ధేనువుల్లా కోర్కెలు, విరహజ్వాలల్లో అగ్నిజ్వాలలు. కచుడు (చని)పోయాడని, ధేనువులు కోర్కెలా దేహం (ఇల్లు) చేరాయని, అగ్ని విరహంలా ప్రజ్వరిల్లిందని సూచించబడిన క్రియలు. అగ్నిజ్వాలలు విరహజ్వాలలకు సంకేతాలు. అవీ ప్రజ్వరిల్లాయి. అణగిపొయ్యాయి. ఇంటిలోనే కాదు దేవయాని వంటిలో జరుగుతున్న సంఘర్షణలకు గుర్తులు.

ఈ దశ ఇపుడే కాదు, కచుడు స్వర్గానికివెళ్ళి పోయాక కూడా జరిగింది. దేవయాని (దేవలోకానికి ప్రయాణించవలసినది అని శబ్దార్థం) దేవతలవలె సుఖలాలస హెచ్చింది. కచుడు మృతితో అమృతత్వం సాధిస్తే దేవయాన చేయవలసింది, దేవ గురువు పుత్రుని వెంబడి వెళ్ళలేక, తీరని కోర్కెలతో భూమ్మీదే ఉండిపోయింది. స్వధర్మాన్ని (మానవ ధర్మాలను) తిరస్కరించి, పరధర్మాన్ని (దేవతల ధర్మాలను, ఆ లోకాలను) ఆశ్రయించ బోయి తిరస్కృతయై విఫలమైంది.

అబిధార్థం తండ్రికి గోచరమైంది. వ్యంజన పాఠకులకు అందించాడు మహాకవి. ఆనంద వర్ధనుడు అలఁకార శాస్త్ర వాఙ్మయంలో ప్రతిష్ఠించిన వెనక అతనికి శత సంవత్సరం పిదప నన్నయ ఆవిర్భవించాడు. ధ్వనిని ఈ సందర్భంలో అనంగమించాడు. “గతోస్తమర్కః” అన్న వ్యంగ్యార్థ వాక్యం అలంకారశాస్త్రంలో ప్రసిద్ధం. “అస్తంగతః అర్కః” అనగా సూర్యుడస్తమించాడని దానికి ప్రకరణవశాత్తు అనేకార్థాలు ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు ఉదాహరిస్తారు. అది మనసులో సుప్రతిష్ఠం ఐన నన్నయ అర్కుని అస్తమయాన్నే వర్ణించి, తన పద్యంలో ధ్వని ఉందని నిశ్చయపరిచాడు.

ఈ పద్యం శిల్పంలో వైవిధ్యం కలది. ఏకవాక్య తాత్పర్యంతో ఉండే పద్యాలకు భిన్నంగా బహువాక్యభరితం. వాక్య పంచకం ఉంది దీంట్లో. నాలుగు క్రియలు భూతార్థకాలు. ఐదవ క్రియ ‘రాడు’, దేవయానికి సంభాషించేనాటికి భవిష్యదర్థకమే కాక, నిశ్చయార్థకమైనా “వాచమర్థోనుధావతి” ఐంది. ఆరవ క్రియ సందేహాన్ని, ప్రమాదాన్ని సూచించింది.

కచుడు అరణ్యానికి గోవులను మేపడానికి వెళ్లినంతసేపూ కుడు లేని గృహ సీమ ఆమెను విరహంతో బాధించింది. అందుకే పగలొనర్చిన పగటిరేడు బాధకుడై వాడి మయూఖముల వాడయ్యాడు. అస్తమించినపుడు కూడా సూర్యుడామెకు వాడి మయూఖములవాడే. అదే తొలి పాదం అర్థం.

కచుడు రాకున్నా ఎవరూ పట్టించుకోలేదని, ఇంకా ఆలస్యం చేస్తే రాత్రి గడిస్తే ప్రమాదమని, తాను పట్టించుకున్నట్టు బయటపడింది. జరిగిన క్రియలతో జరుగని పని తెలుపుటచే వస్తుధ్వని. మృగరాక్షస పన్నగ బాధలు ఆతడు పొంది ఉంటాడనే ఊహ నిజమే ఐంది. సహజ సాయంకాలవర్ణనలో అసహజమైన కచుని మృత్యువు అలంకార ధ్వని చెప్పక చెప్పిన తన విరహబాధ రసధ్వని. ఈ పద్యం లోనారసి చూస్తే అర్థ రత్నాలగని.

January 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us