మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఆశయకలలు

by Dr. C Udaysri March 4, 2023
written by Dr. C Udaysri

ఆశయాల ముందు ఆకలి గెలిచేస్తోంది 

భారమైన బతుకుల మధ్య     

ఆనందం కన్నీరు కారుస్తోంది

ఎన్నో వెలుగులేని రాత్రులలో

సన్నని చిరు వెలుగుకై పడే తపన 

నిస్సారమైన ఆ గాజుకన్నులకే తెలుస్తుంది.

ఆకాశంలో మెరిసే చుక్కల్ని చూస్తూ 

ఓ చుక్కైనా రాలదా సంతోషాన్ని 

పెదాల చివర మురిపించటానికని

ఎదురుచూసే మనసుకు తెలుసు 

తీరని కోరికని 

అయినా ఆశల దారాన్ని అందుకునే 

ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదనే 

గట్టి నమ్మకమే జీవితాన్ని నడిపిస్తుంది లోకంలో

అంట్లుతోమే చేతులకు అందించే 

పలకా బలపం ఖరీదు పెద్దదే

ప్రభుత్వ పథకాల్లో అందే ఉచితాలు 

మాత్రం కొందరికే 

అదృష్టవశాత్తు అందినా 

దురదృష్టం మాత్రం 

కన్నవారి కష్టాలకు….అవసరాలకు

తోడుగా వెన్నంటి అణగదొక్కేస్తుంటే  

ఆదరించే చేతులకోసం ఎదురు చూపుల్లో 

ఎన్ని పసి ప్రాణాలు వడిలిపోతున్నాయో

చేయుతనిచ్చే మానవ దేవతలు

దిగివస్తారని కలలు కంటూ 

Dr. సి. ఉదయశ్రీ

March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

విరాటపర్వం -వెన్నెల వైరాగ్యం

by Md Abdul Khaleem Azad March 4, 2023
written by Md Abdul Khaleem Azad

ఆర్తనాదాలు చేస్తున్న అడవిలో పండు వెన్నెలలో నిండు గర్భిణీగా ఒక తల్లి చేసిన యుద్ధన్నీ జయించి జన్మించింది వెన్నెల.

 ప్రాపంచిక మానవసంబంధాలను జయించి భుజావా వ్యవస్థ నుండి సమాజ మనుగడ ను కాపాడడానికి చీకటి పులుముకుంది ఈ వెన్నెల. 
అక్షరాల వెలుగులో కారు  చీకట్లు కమ్మిన అడవి మార్గంలో, ఆకాశం కూడా కనబడని నిండు అరణ్యంలో, కొండల్ని ఎక్కింది కోణాలను దాటింది,  వాగులు వంకలు ఈదుతూ ఆయుధం చేపట్టింది వెన్నెల.

ఉద్యమంలో ఒక సమిధ గా మారాలి అనుకున్న వెన్నెల సమస్యగా మారిందని తాను ప్రేమించిన ఉద్యమ ప్రేమ వెన్నెలను హతమార్చింది.

అడవుల్లోకి వెళ్లేముందు వెన్నెల తెల్లగా స్వచ్ఛమైన ప్రేమతో విప్లవ మీద గౌరవంతో తన కళ్ళను ఎర్రగా మార్చుకుని వెళ్ళింది,
కానీ చివరకు ఎర్రని రక్తంతో తడిసి మాంసంముద్దగా మారింది.

అయినా తను అనుకున్నది సాధించింది తన ప్రేమను చేరుకున్నది , విప్లవంలో సమిధగా మారింది ప్రమిదగా ఆరిపోయింది.

వెన్నెల నీ ప్రేమ అనంతం, అనాణ్యమైన ని విప్లవాస్ఫూర్తి ఆ అరణ్యం ఎప్పుడు ఘోషిస్తూనే ఉంటుంది.

వెన్నెల నువ్వు అడవికాచిన వెన్నెలవై, విప్లవ కాగడావై ఇప్పటికీ వెలుగునిస్తూనే  ఉంటావు.

ఇంత గొప్ప కథకు ప్రాణం పోసిన వేణు అడుగుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు,  చివరిగా వెన్నెలకి రెడ్ సెల్యూట్,


March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ముక్కుపుడక

by Nellutla Sunitha March 4, 2023
written by Nellutla Sunitha

మగని మనసుకే గుర్తు

మగువ ముక్కుపుడక

ఆ సిరితో సప్తపదుల నడక

అద్దాల చెక్కిలిలో

అధరాల వంపులో

మెరిసింది నాసిక

ముత్యపు చినుకై మురిపిస్తూ

ముక్కుపుడక

అనాదిగా మన ఆచారమై

సంస్కృతుల విశేషమై

సాంప్రదాయ లావణ్యమై

సౌభాగ్య సంకేతమై

అందాన్ని ఇమిడ్చి

అలంకరణ భూషణంగా

అతివలకు  ప్రియం

రూపానికి మెరుగై

ఆకర్షణ ఆభరణమై

ముక్కుకి ముచ్చటగా

ముత్యం కెంపు వజ్రం తో

కొనదేలిన ముక్కుపై ఎరుపై

వయ్యారాలు పోతుంది.

ఆరోగ్య రహస్యమై

 అర్థ చంద్రబేసరి

సూర్య నాడీ చంద్ర నాడితో

జీవిత తత్వాన్ని తెలిపే

వేదాంతమై

నాడీ శాస్త్రమై

అతివల సౌందర్యము

మేనమామ ఇచ్చేబహుమతిగా

ముక్కుపుడక ఎంతో ప్రత్యేకం.

వర్చస్సులో తేజస్సు నింపి

ఆకర్షణ అయి ఆకట్టుకునేది.

మగువ ముక్కు పుడక

మగని ఆయుష్ కి ప్రతీక.

 

March 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

‘ప్రళయాక్షరాలు’:

by Sunka Dharani March 4, 2023
written by Sunka Dharani


‘ప్రళయాక్షరాలు’:

ప్రపంచం నా మాట వినట్లేదని
తాళలేని గొంతుక
దారితప్పిన వలయకాలువలా
ఘీంకరిస్తూ బాష్పీభవిస్తుంది
ఆ ఆవిరి సెగలు
ఉరుముల్లా
కాగితంపై నర్తిస్తుంటే
ఎండుటాకు శబ్దాల క్రోధనినాదాలు
చిగురుటాకు లబ్దాల కరతాళాలు
యుద్ధం.. శత్రువు.. గెలుపు..
అనే అభిప్రాయ వేదికపై
సహనములు
సరిగమలు మూటగట్టి
నీకో రహస్యం దాచిపెట్టా!
నిండు కలల వంతెనపై
కదపలేని వేళ్లతో ఈ ఉదాంతాన్ని రాసింది నేనే
నిన్ను చుట్టు ముట్టి
కదిపే కళ్లతో ఈ వేదాంతాన్ని చదువుతున్నది నేనే..

‘కవిత్వ కరవాలం’:

అక్షరం తప్ప వేరే గత్యంతరం లేదు
భావం తప్ప మరో బాంధవ్యం తెలీదు
గుప్పెడు కవిత్వం రాసుకోడానికి
గుక్కెడు భావం అందులో పోసుకోడానికి
పుస్తకాలెన్నో తిరగడం
మస్తకాలెన్నో వెతకడం
అనువైన వాటిని అరువుతెచ్చుకోడానికి
అన్నీ కలిపి ఆకృతిని ఇచ్చి ప్రాణం పోస్తే
అది కవిత్వమని ప్రకృతి చెప్పింది
బహుశా అదే అనుకుంటా ప్రకృతితో మాట్లాడే తీరు
అంతే అనుకుంటా తనకి తాను పెట్టుకున్న పేరు
గాలిని తాగి తాగి
నీటిలో కాగి కాగి
నిప్పులో మాగి మాగి
మట్టిని తిన్నాక అర్థమైంది
మెరుగులద్దుకొని విధిగా నిలువరిస్తే అవగతమైంది
రగిలే ఆలోచనల్లో కాలితేనే ఆశయాల ఆకాశం అందుతుందని
అప్పుడు నేను మారాను మనిషి నుండి
మహత్తు నిండిన కవిత్వంలా
అప్పుడే నేను మారాను కరుణగుణం నుండి
క్రోదాగ్నితనం నిండిన సిరాపాతంలా
నేను రోజు బడభాగ్నితో మాట్లాడతాను
నేను రోజు శూన్యంతో స్నేహం చేస్తాను
నేను రోజు స్వప్నాలతో కలిసి నడుస్తాను
నేను రోజు మెలుకువతో నిద్రిస్తాను
ప్రశ్నలు లేని సమాధానాల్ని ఛేదిస్తూ
ఒంటి నిండా ఖడ్గగుచ్ఛాలతో రోజూ ఉదయిస్తాను..
కర్మాకర్మల కర్మాగారాల పొగ పీలుస్తూ
గాయపడిన కాయంలా జాలిగా హీనంగా నీరసిస్తాను..
ఎండ వానల సమాంతర స్థితిలో జనించిన ఇంద్రధనుస్సులా హాయిగా అద్భుతంగా నవ్వుతాను..
హృదయ ప్రాకారాల ఆవిర్లను ఒడిసిపట్టి
దాహాన్ని తడుముకుంటూ
నిషా నిండిన వాక్యాలతో జీర్ణ కుడ్యాల
ఆకలిని కరుచుకుంటూ
నాటి ప్రణవ శబ్ద మూలం బోధించే
నేటి ప్రయాణ ప్రారబ్దం తెలుసుకుంటూ
అష్టదిక్కుల్లో తిష్టవేసిన అస్థిత్వాన్ని
అర్ధాంతర విన్యాసాల అగోచరత్వాన్ని
అనువుగా సృష్టించుకున్న జ్ఞాన స్థిరత్వాన్ని
కాగితాలపై కారుస్తున్నా కాలాన్ని వల్లె వేస్తూ…
ఖగోళాన్ని ఓ కంట కనిపెడుతున్నా
ఒంటి చేత్తో కవనాలను పూయిస్తూ.

March 4, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ధర్మం చెయ్యండి బాబూ, దిక్కు లేనోడ్ని!

by Pathivada Nastik March 3, 2023
written by Pathivada Nastik

ఇలా అడుక్కు తిని బతకడానికి 

సిగ్గుగా లేదూ?

నేనెందుకు సిగ్గు పడాలి తండ్రీ?

నన్ను అడుక్కు తినేలా చేసిన 

ఈ దేశం సిగ్గు పడాలి!

బాగానే ఉన్నావుగా,

ఏదన్నా పని చేసుకు బతకరాదూ?

నా కష్టాన్ని దోచుకొని 

నా నెత్తురు తాగుతున్న 

ఈ వ్యవస్థను నువ్వు 

బాగుచేస్తానంటే…

అలాగే సామీ, 

పని చేసుకునే బతుకుతాను

ఏం, పిడికిలి బిగించి తిరగబడొచ్చుగా?

సర్కారోడు నన్ను సెల్లోకి తోసి 

కుళ్ళబొడవకుండా

నువ్వు కాపాడతానంటే బాబయ్యా!

తప్పకుండా తిరగబడతాను

సమస్య అందరిదీ కదా,

నువ్వొక్కడివే యెందుకు,

అందరూ కలిసి సంఘటితంగా తిరగబడొచ్చుగా?

అయ్యో , యిది కూడా తెలీదా నాయినా!?

మేం కప్పలం , 

ఎటు పడితే అటు

ఎలా పడితే అలా గెంతుతాం!

మమ్మల్ని కలపాలని చూట్టం

కంఠశోష , వృధా ప్రయాస!

ఆ సంగతి ఆ యేలినోళ్ళకి కూడా తెలుసు

అందుకే ఐదేళ్ళకొక సారి

మాకింత ముష్టెయ్యడమే కాక,

ఏడాదికి పదేసి వేలు 

మా ఖాతాలో ఏసేస్తారు.

అలా నోరెల్లబెట్టి సూస్తావేటి సారూ!?

ఒక ఐదో పదో ముష్టెయ్యు!

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేనొక ఇల్లు

by Jangam veeraiah March 3, 2023
written by Jangam veeraiah

అమ్మానాన్నల 

చెమట చుక్కల కష్టం 

వారి రక్త మాంసాల 

సారం నా రూపం 

కన్న కలల ఫలితం 

ఈ దేహం 

కష్టములు ఎన్నో దాటి 

కడుపు తీపి తోటి ఊహల వులితో తన బిడ్డ రూపం

ఊహించుకుని చక్కని శిల్పం చెక్కుకుంటూ 

కనులు మూసుకుని 

కొన్ని కలలు 

కన్నులు తెరిచి మరికొన్ని కలలు అన్ని ఇన్ని  

కావు కన్న కలలన్నీ 

లెక్క తేలని 

చుక్కల లెక్కల 

ఊపిరి బిగబట్టి 

పురిటి నొప్పులు ఎన్నో 

భరించి 

ప్రసవ వేదనను అనుభవించి నన్ను ప్రసవించి 

దేహం లేని ఆత్మ ఉన్నట్టు రూపంలేని 

పదార్థం ఉన్నట్టు 

రూపానికి రాని ఆకారాన్ని ఆశతో ఆశయంతో 

శంశయం వీడి సకల ప్రయత్నములు చేస్తూ పరాయిండ్ల మాటల బాణాలకు 

గాయం కానీ చోటు లేదు దేహంలో 

రాగం కానీ బాధల నాదం లేదు 

ఇల్లు ఇల్లు తిరిగే 

పిల్లి నై ఇహలోకమంతా 

నా ఇల్లు అనుకుని 

ఇండ్లు 

ఎన్ని తిరిగిన 

ఇల్లు ఒకటి కచ్చితంగా కావాలని 

కాలాన్ని విశ్వసించి కదులుతున్న 

కలిసి వచ్చినది 

ఒక అవకాశం 

ఏదో ఒక లోపం లేకపోతే మరేదో రూపం 

రానే రాదు కదా 

మాట ఒకటి దూసుకొచ్చి మస్తీస్కాన్ని తాకింది మనసున్న పడ్డ మాట 

మదిని మదించి 

పాలసంద్రం చిలికిన 

సురలు దానవుల వలె చిలికినట్టు 

ఒక రూపం కోసం 

పలు దిక్కుల పైనుంచి క్షయణించ 

సుఖనిద్ర సుకలలకై 

సమతల గుండె లయలకై 

మట్టి ఇటుకల 

కలయిక 

కంకర 

ఇసుక సిమెంటుల 

కలబోత పుట్టింగులై 

బీములై పిల్లర్ లై స్లాబై ఇటుకలై మేస్త్రీ రెక్కలై కార్మికుల 

చెమట చుక్కల 

తడికి తడిసి 

అల్లుకొని గోడలై 

పలువురు చేతుల సహకారమై మనుషులు జీవించే నీడై

పద పద మంటూ 

పసిడి కలలు నిజమై 

సుదూర సుసప్నం నిజమై కవిత నిలయమై 

నా దేహమే ఇప్పుడు 

ఒక ఇల్లు.

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorizedకవితలు

రైలు ప్రయాణం

by Jaggiah March 3, 2023
written by Jaggiah


సమ దూరం పాటించే
కలువని పట్టాల మీది ప్రయాణం!!

ఒక దాని వెనుక ఒకటి
క్రమశిక్షణతో కదిలే బోగీలు!

కచేరీలు ఎక్కని సంగీతం
తాళం తప్పని చిరుతల శబ్ధం!

పావలా పల్లీలు
పదిరూపాయలకు అమ్మే
వ్యాపార నైపుణ్యం!

పసితనాన్ని పల్లెతనాన్ని  గుర్తుచేసే
ఎప్పుడో తిన్న, ఎపుడూ తినాలనిపించే
నిమ్మపులుసు పిప్పరమెంటు!

టికెట్ తనిఖీ అధికారిని చూసి
బాతురూముల్లో దాక్కునే
టికెట్ లేని ప్రయాణికులు!!

ఉప్పు కారం పెట్టిన
మామిడి కాయ ముక్కలు
ఉపకారం చేస్తున్నట్లు
పక్కవారితో పంచుకోవడాలు!

శీతల పానీయాలు అమ్మేవాడు
వాడెనుకే వేడి వేడి మిర్చీ అంటూ
పొట్లం చుట్టి  చేతిలో పెట్టేవాడు!

కిటికీనుండి చూస్తే
వెనక్కి పరుగెత్తుతున్నట్లు
పంటపొలాలు, పచ్చని చెట్లు!

దూరమెంతయినా
భారమనిపించని ప్రయాణం!
అద్దములో చూసుకుంటున్న
మన జీవన ప్రయాణం!!

మీ శ్రేయోభిలాషి
జగ్గయ్య.జి
9849525802 ✍️
jagan.gunda @yahoo.com

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆ కోళ్లను చూడు

by Kotam Chandra Shekar March 3, 2023
written by Kotam Chandra Shekar

పౌల్ట్రీఫారంలోని ఆ కోళ్లను చూడు

ఎంత ఆనందంగా వున్నాయ్

ఎంత ఆనాలోచతంగా వున్నాయ్

కరిగే ప్రతీక్షణం కలుసుకుంటూ

జరిగే ప్రతీనిమిషం కబుర్లాడుకుంటూ

దేనికోసం వీక్షించక

దేనికోసం నిరీక్షించక

డబ్బాలోని గింజల్ని తింటూ

డ్రమ్ములోని నీళ్లు త్రాగుతూ

బతకడానికి రోజూ చస్తున్న మనిషి కన్న

చావడానికి బతుకుతున్న ఆ కోళ్లే మేలు   

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : మాలతితీచందూర్.

by Radhika Suri March 3, 2023
written by Radhika Suri

అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావ కారణాలు లింగ వివక్ష , పునరుత్పత్తి హక్కులు , ఉద్యోగం ,ఓటు హక్కు హింస ఇలా అనేక మహిళా సమస్యలే ప్రధానాంశాలుగా ఉద్యమ రూపం దాల్చి తదనంతర పరిణామ క్రమంలో ఏర్పాటయిందీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తొలుత ఎలాంటి నిర్ణీత తేదీ లేనప్పటికీ వివిధ మార్పులు- చేర్పుల అనంతరం ఐక్యరాజ్యసమితి మార్చి8 ,1977 లో దీన్ని గుర్తించి అంతర్జాతీయ మహిళా సెలవుదినంగా ప్రకటించింది .ఈరోజున వివిధ రంగాలలో మహిళలు చేసిన కృషిని ,విజయాలను గుర్తించి ప్రోత్సహించడం ఒక రివాజుగా మారింది. భారతీయ సంస్కృతి- సంప్రదాయాలలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో స్త్రీ మూర్తిదే అత్యంత కీలక స్థానం. ప్రతిరోజూ ఆమె నిర్వహించే పాత్ర ప్రధానమైనదే . మన దేశంలో ఎందరో మహిళామణులు తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభాపాటవాలు ప్రదర్శించి విశ్వవిఖ్యాతినొందారు . వారిలో ఒక మణిరత్నం శ్రీమతి మాలతీ చందూర్ గారు.

‘ప్రమదావనం’లో విరిసన ‘ సిందూర పుష్పం ‘ శ్రీమతి మాలతీ చందూర్. వీరు నూజివీడులో డిసెంబర్ 26,1928 న జ్ఞానాంబ ,వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు . 8వ తరగతి వరకు విద్యాభ్యాసం నూజివీడులోనే సాగించి తదనంతరం మేనమామ చందూర్ గారి వద్ద ఏలూరులో సెయింట్ థెరీసా స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసించారు. అప్పుడే డి . కామేశ్వరి ఆనందరామం, శ్రీ శ్రీ , విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి నండూరి సుబ్బారావు మొదలైన వారిని కలిసే అవకాశం కలిగింది. 1947లో మేనమామ నాగేశ్వరరావు చందూర్ గారితో మద్రాస్ చేరుకుని వివాహానంతరం ప్రైవేటుగా ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1949 నుండి రచనావ్యాసంగంలోకి అడుగు పెట్టారు. అప్పట్లో వారు రేడియోలో రచనలు చదివి వినిపించేవారు. అక్కడే బుచ్చిబాబు , జనమంచి రామకృష్ణ, రాజమన్నార్ , మునిమాణిక్యం నరసింహారావు లాంటి సాహితీస్రష్టలెందరితోనో పరిచయాలు ఏర్పడ్డాయి.
సాధారణ చదువు కలిగిన అసాధారణ ప్రజ్ఞాశాలి. తెలిసింది చెప్పడం అతి తేలిక కానీ అవగాహన లేని అంశాల్ని సైతం కూలంకషంగా తెలుసుకుని ఓర్పుతో నేర్పుగా అర్థవంతంగా అద్భుతంగా వివరించడం ఆమెకే సాధ్యపడింది. తన ప్రతిభాదక్షతలతో ఎన్నో శీర్షికల్ని నిర్వహించారు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో 1952 నుండి దశాబ్దాల పాటు ‘ప్రమదావనం’ శీర్షిక నిర్వహించి ‘గిన్నిస్ ‘ రికార్డు సాధించారు. ఈ శీర్షికలో ఆమె స్పృశించని అంశమే లేదు. స్త్రీల సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడిందీశీర్షిక. ‘వంటలు – పిండి వంటలు’ వంటల పుస్తకం కొత్తగా పెళ్లయిన వారికి ఎంతో ప్రయోజనకారిగా ఉండి 30 సార్లు పునర్ముద్రింపబడింది .
వీరి ‘జవాబులు’ శీర్షికను మగవారు సైతం చదివేవారు.
‘మహిళ ‘ ప్రధానాంశంగా దాదాపు పాతిక నవలలు రచించారు . తెలుగు, తమిళం, ఆంగ్లభాషలపై పట్టున్న ఈమె 300కు పైగా ఆంగ్ల రచనలను అనువదించారు . జేన్ ఆస్టిన్ నుండి అరుంధతీరాయ్ రచనల వరకు ఇలా ఎందరివో అనువదించారు. 1970 నుండి కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలిగా 11 సంవత్సరాలు పనిచేశారు. ఆ క్రమంలో తమిళ సినిమాల కోసం తమిళ భాష నేర్చుకుని అనువాదాలు చేసే స్థాయికి ఎదిగారు. ‘స్వాతి ‘ పత్రికలో ‘పాత కెరటాలు’ శీర్షికన ఆంగ్లానువాదలన్నీ దాదాపుగా
ప్రచురితమయ్యాయి.

వీరి తొలి కథ : ‘ రవ్వల దుద్దులు’

” నవల: ‘చంపకం – చెదపురుగులు’
ముఖ్య రచనలు :- భూమిపుత్రి , ఆలోచించు, హృదయనేత్రి , శతాబ్ది సూరీడు, శిశిర వసంతం మొదలైనవి.
అవార్డులు: 1987 : సమైక్య ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు. (‘హృదయనేత్రి’)
1990: ప్రతిష్టాత్మక భారతీయ
విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్
1992: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (హృదయనేత్రి)
1996: రాజా – లక్ష్మీ అవార్డు
1996: తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
2005: శ్రీ చందూర్ , యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గార్లు సంయుక్తంగా స్థాపించిన ‘లోక్ నాయక్’ మొట్టమొదటి అవార్డు
2005: పద్మావతీవిశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ మరియు ‘కళాప్రపూర్ణ ‘ బిరుదు ప్రదానం.
జిజ్ఞాస , పట్టుదల , అవిశ్రాంత కృషితో సాహితీప్రక్రియలెన్నింటినో సృజించి సారస్వత శిఖరాలను అధిరోహించి అనేక సన్మానాలు సత్కారాలు పొందిన వీరికి జీవన సహచరుడు అందించిన సహాయ సహకారాలు అసాధారణం . తన పేరుకు చివర చందూర్ గారిని ‘మకుటం ‘ గా దాల్చి విరాజిల్లిన ఈ ‘విద్వన్మణి ‘ఆగస్టు 21, 2013న వాగ్దేవి పాదాల చెంత శాశ్వతంగా విశ్రమించారు. ఈ విజ్ఞానభాండాగారానికి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదేముంటుంది
అక్షరసుమాంజలి తప్ప.

March 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పరిత్యక్త

by Padmasri Chennojwala March 1, 2023
written by Padmasri Chennojwala

రెక్కలొచ్చిన పక్షి ఏదో రంగుల లోకాన విహరిస్తోంది

రేకు విప్పని పువ్వు చుట్టూ చంచరీకం పరిభ్రమిస్తోంది

పక్షి ఎరుగదు రంగులలో రాక్షసం దాగుంటుందని

పువ్వు ఎరుగదు పుప్పడిలో ముప్పు పొంచుంటుందని

పరిణతిలేని ప్రాయం పద్మవ్యూహాన చిక్కింది

ఛేదించే శక్తి లేని నిస్సహాయత నిర్దాక్షిణ్యంగా నులిమేసింది

మర్మమెరుగని హరిణమేదో పులినోటికి కబళమయింది

అంకురించిన బీజమేదో భవితకు భారమయింది

మొగ్గ తొడిగిన రూపమేదో మనుగడకు శాపమయింది

ఆవిరైన అమ్మతనం చెత్త  కుప్పను ఆశ్రయించింది

మంటగలిసిన మానవత్వం చేతులు కడిగేసుకుంది

పాప మెరుగని పురిటి గొంతుక గుక్కపట్టి ఏడుస్తోంది

వినగలిగిన శక్తి ఉంటే ప్రశ్నల శరపరంపర –

అది తన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది హక్కుల కోసం పోరాడుతోంది   

బంధాలను నిలదీస్తోంది బాధ్యతలను గుర్తు చేస్తోంది

నడతను హెచ్చరిస్తోంది విలువలను బేరీజు వేస్తోంది

ఈ పాపం వ్యక్తిదా? వ్యవస్థదా? అని సవాలు విసురుతోంది.

March 1, 2023 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us