మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కాకతీయ యుగ తెలుగు సాహిత్యం

by Jyothi Pakanati June 23, 2021
written by Jyothi Pakanati

మనదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించింది కాకతీయ యుగం. శాతవాహనుల తరువాత విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించి సుస్థిరమైన పాలన చేసిన ఘనత కాకతీయులదే. నన్నయకు పూర్వం నన్నయకు తరువాత కూడ తెలుగు దేశంలో మనకు తెలిసిన కొద్దిపాటి విషయాలు తెలియని వాటితో సమానమేనని కొంత వరకు తెలిసిన భాగం కాకతీయుల కాలమేనని సురవరం ప్రతాపరెడ్డి గారు అన్న మాటలు యథార్థాలు1. కాకతీయ సాంస్కృతిక, సాహిత్య చరిత్ర నిర్మాణానికి శాసనాలు, కైఫీయత్తులు(స్థానిక చరిత్రలు) సమకాలీన రచనలు, లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలు, వాస్తుకళ, చిత్రకళ, నృత్యకళారూపాలు మొదలైనవి ముఖ్య ఆధారాలుగా నిలిచాయి. ఇటువంటి అంశాలు ప్రాతిపదికగా చేసుకొని కాకతీయ యుగంలో వెలువడిన సాహిత్యాన్ని పరిశీలించటం ఈ వ్యాస ఉద్దేశం. ముందుగా కాకతీయులు అన్న పేరు వీరి కెందుకు వచ్చిందన్న విషయంలో పలువురు చరిత్రకారులు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాకతి అనే నామాంతరం గల దుర్గను పూజించటం వల్ల కాకతీయులైనట్లు ప్రతాపరుద్ర యశోభూషణం తెలుపుతున్నది. కాకతీయుల మూల పురుషుడు గుమ్మడి తీగకు పుట్టాడని ఖాజీపేట శాసనంలో  ఉంది. కాకతమ్మ అనుగ్రహం వల్ల గుమ్మడి తీగకు ఒక పుత్రుడు జన్మించాడని, అతని సంతతి వారే కాకతీయులైనారని ‘అనితల్లి’ కలువచేరు శాసనం2 తెలుపుతుంది. కూష్మాండిని జైన దేవత. కూష్మాండం అంటే గుమ్మడి. కూష్మాండినికి మరొక పేరు కాకతి. మొదట కాకతీయులు జైనులు కనుక ఆ సంప్రదాయానికి సంబంధించిన వారిగా శాసనంలో పేర్కొనబడినట్లు ఊహించవచ్చు.

కాకతీయ వంశచరిత్రను తెలిపే శాసనంలో క్రీ.శ 956 నాటి మాంగల్లు శాసనం ప్రధానంగా పేర్కొనదగింది. ఈ శాసనంలో కాకర్త్యగుండన అనే పదం ఉందని అది క్రమంగా కాకత్య, కాకత, కాకతిగా రూపాంతరం చెందిందని చరిత్రకారుల అభిప్రాయం. అంతేకాక గుండన రాష్ట్రకూటరాజైన కృష్ణుని అభ్యర్ధన మేరకు అమ్మరాజును జయించాడు. వేంగీ రాజ్యాన్ని దానార్ణవునికి అప్పగించాడు. గుండన మాంగల్లు శాసనంలో రాష్ట్రకూటునిగానే వ్యవహరింపబడ్డాడు. ‘రాష్ట్రకూటు’ అంటే గ్రామాధికారి అనే అర్ధం నాడు వ్యవహారంలో ఉంది. స్థానికంగా ఆ పదం రట్టడిగా ఆ తరువాత రెడ్డిగా మారింది. కాబట్టి రాష్ట్రకూటుడు అనే శబ్దం అధికార పదవినే సూచిస్తుందని తెలుస్తున్నది.

కాకతీయులు దుర్జయ వంశస్థులని బయ్యారం శాసనం తెలుపుతున్నది. ఖాజీపేట శాసనంలో కూడ బేతరాజు చలమర్తి గండ బిరుదాంచితుడని, దుర్జయ కులమనే సముద్రానికి చంద్రుని వంటి వాడని వర్ణింపబడింది.3 (దుజ్జన్‌య కుళాబ్ది చంద్ర)  మరికొన్ని శాసనాలు 4 వీరు విష్టి కులస్థులని తెలుపుతున్నాయి. దుర్జయులు అంటే జయింపనలవి కాని వారని అర్ధం. విష్టి అంటే నిస్వార్ధంగా చేసే సేవ అని అర్ధం. కాబట్టి వీరి శక్తి సామర్ధ్యాలు, పరోపకార బుద్ధి ఆయా శాసనాల్లో ప్రతీకాత్మకంగా వ్యక్తమైనాయి. అంతే కాదు ఆయా శాసనాలు వారి రాజకీయ సాంస్కృతిక జీవన చైతన్యాన్ని పట్టి చూపుతున్నాయి.

కాకతీయులు చంద్రవంశం వారని, మాధవవర్మ సంతతి వారని స్థానిక చరిత్రలో, కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో పేర్కొనబడింది. గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి, పాఖాల, కాంచీపురంలోని శాసనాలలో వీరు సూర్యవంశీయులుగా, క్షత్రియులుగా పేర్కొనబడినా వారు క్షత్రియులు కారని చరిత్రకారుల అభిప్రాయం. విద్యానాధుడు వీరి వంశం సూర్య, చంద్ర క్షత్రియ వంశాల కంటే గొప్పదని ప్రతాపరుద్రీయంలో వర్ణించాడు. బూదపుర శాసనం సమాజంలో నాలుగు వర్గాలుంటాయని వాటిలో నాలుగవ వర్గానికి సంబంధించిన వంశం జగత్ప్రసిద్ధమైందని ఆ వంశంలో కాకతీయులు ఉద్భవించారని తెలుపటం వల్ల వీరు చతుర్ధాన్వయులుగా పరిగణింపబడుతున్నారు. వీరి సంబంధ బాంధవ్యాలు కూడ చతుర్ధ వంశం వారితో ముడివడి ఉండటం ఈ విషయాన్ని నిరూపిస్తున్నది. మొదట కాకతీయులు రాష్ట్ర కూట సేనానులుగా ఉన్నారు. వారి పతనానంతరం నేటి తెలంగాణ ప్రాంతమంతా పశ్చిమ చాళుక్యుల వశం కాగా కాకతీయ గుండయ ఎవరివైపు పోరాడక స్వతంత్రునిగానే ఉండిపోయాడు ఈలోగా ముదిగొండ చాళుక్యులు విజృంభించి కొరివిసీమను ఆక్రమించుకొని గుండయ్యను సంహరించారు. గుండయ సోదరి కామసానమ్మ మేనల్లుడైన బేతరాజును చేరదీసి పశ్చిమ చాళుక్యులతో దౌత్యం నెరపి కొరివిసీమ నుండి హనుమకొండ వరకున్న రాజ్యాన్ని అతనికి ఇప్పించినట్లుగా గూడూరు శాసనం వల్ల తెలుస్తున్నది.5 కాకతీయ రాజ్యపాలనం మొదటి బేతరాజుతో ప్రారంభమైనట్లుగా చరిత్రకారులు నిర్ణయించారు. క్రీ.శ 992 నుండి 1052 వరకు ఇతడు పరిపాలించాడు.

తరువాత అతని కుమారుడు మొదటి ప్రోలరాజు క్రీ.శ 1052 నుండి 1075 వరకు పరిపాలించాడు. పశ్చిమ చాళుక్యరాజైన మొదటి సోమేశ్వరుని వల్ల ‘అనుమకొండ విషయము’ను లిఖిత పూర్వకంగా పొందాడు. రెండవ బేతరాజు తరువాత దుర్గరాజు క్రీ.శ 1108 నుండి 1116 వరకు పాలించాడు. తరువాత బేతరాజు రెండవ కుమారుడు రెండవ ప్రోలరాజు క్రీ.శ 1116 – 1155 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలోనే కాకతీయ రాజ్యం విస్తరించింది. పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా ఉన్నప్పటికి వారి బలం క్షీణించినపుడు ప్రోలరాజు విజృంభించి, వారి అధికారాన్ని త్రోసి రాజని స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొని మహా మండలేశ్వర బిరుదాన్ని పొందాడు.

రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రదేవుడు క్రీ.శ 1158 నుండి 1195 వరకు పాలించాడు. సంస్కృతంలో నీతి సారమనే గ్రంథాన్ని రచించి విద్యాభూషణ బిరుదాన్ని వహించాడు. దేవగిరి యాదవరాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో మరణించాడు. రుద్రదేవుడు మరణించిన తరువాత అతని సోదరుడు మహదేవుడు (1196 – 1198 వరకు) పరిపాలించాడు. కాని జైతుగి మహదేవుని సంహరించి ఇతని కుమారుడైన చిన్న వయస్సులో ఉన్న గణపతి దేవుని చెరపట్టాడు. 11 నెలలు చెరలో ఉంచిన తరువాత ఏ కారణం వల్లనో గణపతి దేవుని విడిచిపెట్టాడు. అంతవరకు రేచెర్ల రుద్రసేనాని కాకతీయ సామ్రాజ్యాన్ని రక్షించి గణపతిదేవునికి అప్పగించాడు. గణపతి దేవుడు క్రీ.శ 1199 నుండి 1262 వరకు పరిపాలించాడు. రాజనీతి దురంధరుడైన గణపతిదేవుని పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యం విస్తరించి రాజకీయ ఐక్యతను సాధించింది. దానిని పెంపొందించింది రుద్రమదేవి. గణపతిదేవుని తరువాత క్రీ.శ 1289 వరకు పాలించిన రుద్రమదేవి త్రిపురాంతకం వద్ద అంబదేవునితో జరిగిన యుద్ధంలో అసువులు కోల్పోయింది. రుద్రమ తరువాత ఆమె దత్తపుత్రుడు(దౌహిత్రుడు ముమ్మడమ్మ కొడుకు) ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ 1289 నుండి 1323 వరకు పరిపాలించాడు. ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ కుమారుడైన ఉలుఘ్ ఖాన్  ఓరుగల్లును ముట్టడించి ప్రతాపరుద్రుని బందీగా ఢిల్లీకి తీసుకొని వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో నర్మదా నదీ తీరంలో ప్రతాపరుద్రుడు మరణించినట్లుగా చరిత్ర తెలుపుతున్నది. నాటితో తెలుగు దేశాన్నంతటిని ఏకచ్ఛత్రాధిపత్యం క్రిందకు దెచ్చిన కాకతీయ సామ్రాజ్యం అంతరించింది.

కాకతీయుల కాలం నాటి సాహిత్యం :

సాహిత్యచరిత్ర అధ్యయనంలో గ్రంథాలకే కాక శాసనాలకు ఎంతో ప్రాధాన్యముంది. వీటి పరిశీలన వల్ల సాహిత్యాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక వ్యవస్థల అవగాహన కలుగుతుంది. కాకతీయుల కాలంలో రాజాస్థానాల నాశ్రయించి వెలువడిన సాహిత్యమే కాక సమకాలీన సాహిత్యం విస్తృతంగా వచ్చింది. తెలుగు భాష, సంస్కృత భాష సమానంగా ఆదరించబడింది. కాకతీయుల పాలన అనంతరం కూడ దాదాపు రెండు, మూడు శతాబ్దాల తరువాత వచ్చిన ఏకామ్రనాధుని ‘ప్రతాపరుద్ర చరిత్రము’ కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్రము’ కూసుమంచి తిమ్మకవి ‘సోమదేవ రాజీయము’ వినుకొండ వల్లభరాయని ‘క్రీడాభిరామము’ మొదలైన గ్రంథాలు కూడ కాకతీయుల సాంస్కృతిక వైభవాన్ని తెలుపుతున్నాయి.

శాసన సాహిత్యం :

శాసన రచయితలు కూడ కావ్య రచనాధురీణుగా తెలిపే శాసనాలు చరిత్రలో కనిపిస్తాయి. ఆనాటి శాసన రచయితల దృష్టిలో శాసన రచన కావ్యరచన వంటిది. నన్నయ్య భట్టారకుడు నందంపూడి శాసనంలో తనను ‘‘కావ్యానాం కర్తా నన్నిభట్ట’’ అని పరిచయం చేసుకున్నాడు. అప్పటికి నన్నయభట్టు మహాభారతాన్ని రచించలేదు. అట్లే అప్పటికి ఇతడు రచించిన ఇతర కావ్యాలేవీ కనిపించవు. అందువల్ల నన్నయ తాను రచించిన శాసనాలనే కావ్యాలుగా పేర్కొన్నట్లు స్పష్టమౌతున్నది. ద్రాక్షారామంలోని భీమేశ్వరాయంలో ఉన్న రెండు శాసనాలు ప్రకాశ భారతీయోగి కావ్యాలుగా అందే పేర్కొనబడ్డాయి. అట్లే కాకతీయ దుర్గ నృపతి ఖాజీపేట శాసనంలో తద్రచయిత దేవన భట్టు దాన్ని ‘ఒడికొణ్డ ప్రభోర్దేవణ భట్టస్య మహకవే: కావ్య మిదం’ అని పేర్కొన్నాడు.6

కాకతీయుల శాసనాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల మత్తేభ వృత్తాలు, కందము, సీసము, ఆటవెలది, తేటగీతి పద్యాలు కనిపిస్తాయి. పాల్కురికి సోమనాధుడు, గోనబుద్ధారెడ్డి మొదలైన కవులతో ఆదరింపబడిన ద్విపద సమకాలీన శాసనాల్లో కనిపించదు. మాత్రాఛందస్సుకు చెందిన కందపద్యం ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కాక చూర్ణమనదగిన వచనాలు కూడ ఈనాటి శాసనాల్లో చూడవచ్చు. కేవలం విషయమే కాక చక్కటి వర్ణనలతో కూడుకున్న సాహిత్య గౌరవం అందుకున్న శాసనాలు కూడ ఉన్నాయి. వీటిలో ఈ క్రింది కరీంనగర్‌ జిల్లా శాసనం ప్రధానమైంది.

‘శ్రీమదపార పారావార పరివృత మహీతలంబున సకల

            జన వినుతంబగు నంధ్రదేశమునకు విభూషణంబైన

            యనుమకొండ యను పురవరంబు నిజ రాజధానిగా

            నొప్పుచున్న కాకతె భూపాలక్రమంబున’ 7………………

శాసన సాహిత్యంలో అచింతేంద్రవరుడు రచించిన వేయిస్తంభాల గుడి శాసనం పేర్కొనదగినది. పురవర్ణన, స్త్రీలవర్ణన మొదలైనవి ఇందులో కనిపిస్తాయి. బెక్కల్లు శాసన రచయిత నాగదేవకవి, కుందారం శాసనం రచించిన బాలభారతి సత్కవి, ఎల్కుర్తి శాసన రచయిత హరిహరార్యుడు కరీంనగర్‌ శాసనకర్త గంగాధరుడు మొదలైన వారే కాక ఉర్సుగుట్టపై ఉన్న శాసనాన్ని రచించిన విశ్వేశ్వర శివాచార్యుని కొడుకైన నరసింహకవి  పేర్కొనదగినవారు. ఉర్సుగుట్టపై సంస్కృతంలో ఉన్న ఈ శాసనం చారిత్రకంగా సాహిత్య పరంగా ఎన్నదగింది. ఈ శాసనస్థ శిల్పకావ్యాన్ని ‘సిద్ధోద్వాహం’ అంటారు. సిద్ధదంపతుల ప్రేమ, వివాహం, పెళ్లి అనే మొదలైన అంశాలతో పాటు ఏకశిలా నగర వర్ణనలు ఈ శాసన కావ్యంలో కనిపిస్తాయి. ఈ రచయిత 10 రూపకాలను, మలయవతి అనే కావ్యాన్ని, ఋగ్వేద వ్యాఖ్యను వ్రాశాడు. అంతే కాక ఒక్క రోజులో 8 సర్గలున్న కాకతీయ చరిత్రను వ్రాశాడని చెపుతారు. కాని ఈ గ్రంథం అలభ్యం. ఈ విధంగా శాసన రచయితలు తమ పాండిత్యాన్ని శాసనాల్లో ప్రతిఫలింపచేసినా దానాది వివరణ సమయాల్లో సామాన్య ప్రజల భాషనే ప్రయోగించటం వల్ల నాటి సాహిత్య చరిత్రేకాక బహుముఖీనమైన ప్రజల సజీవ సంస్కృతిని కూడ తెలుసుకునే అవకాశం కలిగింది.

 

కైఫీయతులు :

‘కైఫీయత్‌’ అనే అరబ్బీ పదానికి గ్రామ లేదా దేశ సమాచారాన్ని తెలిపే వృత్తాంతమని అర్ధం. విలేజ్‌ లోకల్‌ రికార్డ్స్‌ అని కూడ చెప్పవచ్చు.

కాకతీయుల గురించిన చరిత్ర కైఫీయతుల వల్ల కూడ తెలుసుకునే అవకాశం ఉంది. వీటిలో కొన్ని కల్పిత వృత్తాంతాలుండటం వల్ల ప్రామాణికంగా వీటిని పరిగణించే అవకాశం తక్కువ. అయినప్పటికి ఒక్కొక్క సారి చరిత్ర నిర్మాణానికి ఎంతో దోహదం చేసినట్టుగా సితాబ్‌ఖాన్‌ కైఫీయత్‌ నిరూపిస్తున్నది. కొమిరపూడి, వంగిపురం, ముట్నూరు మొదలైన కైఫియతుల ఆధారంగా గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని చరిత్ర, సామాన్యజన వ్యవహారంలో ఉన్న ఎన్నో కథలు, ఆచార వ్యవహారాలు, సృష్టిసంబంధి గాథలు, క్షేత్ర మాహాత్మ్యాలు, పేరంటాండ్ల కథలు, గ్రామదేవతల కథలు, జానపదుల ఆటపాటలు మొదలైనవి తెలుస్తున్నాయి. ఆ కాలపు సమాజాల భిన్న సంస్కృతులను కూడ అవగాహన చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణా రాజకీయ, ఆర్థిక సామాజిక స్థితిగతుల చారిత్రకతను నిర్ధారించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఆనాటి శాసనాలు, కైఫీయతులు.

కాకతీయ యుగంలో తెలుగు, సంస్కృత భాషలకు రెండింటికి రాజాశ్రయం లభించి ఆయా భాషలలో ఎన్నో ఉత్తమ గ్రంథాలు వెలువడినాయి. రాజులే కాక రాజోద్యోగులు, ఇతరులు సాహిత్య కృషి చేసి సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో రెండు వందల మంది కవులున్నట్లుగా స్థానిక చరిత్రలు తెలుపుతున్నాయి. 12 వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రుద్రదేవ మహారాజుకు ‘విద్యాభూషణుడు’ అనే బిరుదున్నట్లు దాక్షారామ శాసనం వల్ల తెలుస్తున్నది. సంస్కృతంలో  ‘‘నీతిసారము’’ అనే గ్రంథాన్ని రచించినట్లు బద్దెన తన ‘నీతి శాస్త్ర ముక్తావళి’ లో పేర్కొన్నాడు. తెలుగులో కూడ ‘‘నీతి సారమును’’ రచించినట్లు  బద్దెన మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. ఆంధ్రకవుల చరిత్రలో ఆ గ్రంథంలోని ఐదు పద్యాలు ఉదాహరింపబడినాయి.

ప్రతాపరుద్రుడు ఉషారాగోదయము (నాటిక), యయాతి చరిత్రము (ఏడంకాల నాటకం), ప్రతాపమార్తాండము, రాజరుద్రీయము (పాణినీయానికి వ్యాఖ్య అయిన కాశికకు వ్యాఖ్య), అమరుశతక వ్యాఖ్యలను రచించాడు. అచింతేద్రయతి, అప్పయార్యుడు, గంగాధరకవి, జాయపసేనాపతి, త్రిపురాంతకుడు, నరసింహకవి, విద్యానాధుడు, విశ్వనాధకవి, వీరభల్లట దేశికుడు, శాకల్య మల్లన మొదలైన వారు ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న ప్రసిద్ధ విద్వాంసులు.

జాయపసేనాపతి కాకతీయ శిల్పానికి లక్షణ గ్రంథమని చెప్పదగే ‘నృత్త రత్నావళి’ ని రచించాడు. విద్యానాధుడు అగస్త్య నిఘంటువు (అగస్త్యుడు విద్యానాధుడు వేరు వేరు కారని ఒకే వ్యక్తి అని చరిత్రకారుల అభిప్రాయం) కృష్ణ చరిత్రము, నలకీర్తికౌముది, ప్రతాపరుద్ర యశోభూషణము, బాల భారతము అనే గ్రంథాలు రచించి సంస్కృత భాషలో సాహిత్య గ్రంథాలు రచించిన వారిలో ప్రథమునిగా కీర్తి పొందాడు. ప్రతాపరుద్ర యశోభూషణము అలంకార శాస్త్ర ప్రకరణ గ్రంథంగానే కాక గొప్ప ఐతిహాసికగ్రంథంగా కూడ ప్రసిద్ధి చెందింది.

కాకతీయు కాంలో ఎందరో తెలుగు కవులు కవితా సృష్టి చేసి తమ అసమాన ప్రతిభను కనబరిచారు. రాజు, రాజవంశాలను బట్టి సాహిత్య చరిత్ర నిర్మాణానికి పూనుకొన్న ఆరుద్ర వంటి వారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్య (మనవి మాటలు) గ్రంథాల్లో చాళుక్యయుగం, కాకతీయ యుగమని వరుసగా సాహిత్య చరిత్రలో యుగ విభజన చేశారు. పాశ్చాత్య చరిత్రలో ఎలిజబెతీయన్‌, జాకోబియన్‌, ఎడ్వర్డియన్‌ మొదలైన రాజవంశాల పేరు మీదుగా యుగ విభజన జరుగడమనేది ఆనవాయితీగా వస్తున్నదని తన పద్ధతిని సమర్థించుకున్నారు. పింగళి లక్ష్మీకాంతంగారు కవుల పేరు మీద యుగ విభజన చేయగా మరి కొందరు సాహిత్యంలో మార్పులాధారంగా పురాణేతిహాసయుగం, ప్రబంధయుగం ఇత్యాదిగా విభజించారు. మరికొందరు సామాజిక భూమిక మీద యుగ విభజన చేయాలని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా దేశచరిత్రలో సాహిత్యం ప్రధానాంశం. ప్రజాజీవిత సంబంధాలను, సమకాలపు రాజకీయ సాంస్కృతికాంశాలను సమర్ధవంతంగా వ్యక్తం చేయటంలో సాహిత్యానికి మించిన శక్తివంతమైన సాధనం మరొకటి లేదు.

తిక్కన :

గణపతిదేవుని కాలంలో రాజ్యం కోల్పోయిన మనుమసిద్ధికి తిక్కన మహాకవి గణపతిదేవుని సహాయంతో రాజ్యం ఇప్పించినట్టుగా ప్రతీతి. సామ్రాజ్య సుస్థిరత కోసం గణపతిదేవుడు మనుమసిద్ధికి తోడ్పడ్డాడు. మనుమసిద్ధి పట్టాభిషేక సందర్భంగా తిక్కన చెప్పిన ఆశీర్వచన శ్లోకమే అనంతర కాలంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణానికి ఆరంభ పద్యంగా కుదురుకున్నదని పాటిబండ మాధవ శర్మగారు (భార. ఆర.పీఠిక.9 అకాడమీ ప్రతి) అభిప్రాయపడ్డారు. కాకతీయుల ఆడపడుచు కంపరాయని భార్య అయిన గంగాదేవి తన ‘‘మధురావిజయమ’’నే సంస్కృత చారిత్రక కావ్యంలో ‘తిక్కయజ్వ కవిసూక్తి’ దప్పిగొన్న చకోరాలతో  కళానిధి (చంద్రుని) యొక్క వెన్నెల లాగా కవుల చేత స్వేఛ్ఛగా సేవింపబడుతున్నదని పేర్కొన్నది. తిక్కన కేవలం ‘యజ్వేకాదు మహాభారత రచన చేసి ‘‘సోమయాజి’’ అయినాడు. వేదవేదాంగపురాణేతిహాస కావ్యశాస్త్రాలను గాఢంగా అధ్యయనం చేసిన గొప్ప పండితుడు. రాజకీయ వేత్త కూడా. ‘‘అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్‌ బారగుడన్‌, కళావిదుడ’’నని’ తిక్కన తన గురించి చెప్పుకొన్నట్లు కనిపించినా ఒక మహేతిహాసాన్ని రచించే కవికి ఉండవలసిన అర్హతలను గురించి చెప్పినట్లే భావించవలసి ఉంటుందని ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు గారు తమ ‘‘పూర్వ కవుల కావ్య దృక్పధాలు’’ గ్రంథంలో అభిప్రాయపడ్డారు.  మహాభారతంలో మొదటి మూడు పర్వములు తప్ప మిగిలిన పదిహేను పర్వములను తిక్కన ఆంధ్రీకరించాడు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని మనుమసిద్ధికి, మహాభారతాన్ని హరిహరనాధునికి అంకితం చేశాడు. హరిహరనాధునికి అంకితం చేయటం కేవలం శైవ వైష్ణవ మతాల మధ్య వైమనస్యాన్ని తొలగించటం కోసమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాని వైష్ణవం, నాటి కాలంలో అంతగా వ్యాపించలేదు. కన్నడ దేశం నుండి వీరశైవం వచ్చినట్టు వైష్ణవం రాలేదు. నిజానికి జైన శైవాల మధ్యనే ఆ రోజుల్లో మత వైమనస్యం ఉంది. తిక్కన హరిహర తత్త్వాన్ని సగుణ నిర్గుణ తత్త్వాల సమన్విత రూపంగా భావించాడు. కనుకనే తన భారతావతారికలో ‘‘శ్రీయన గౌరి నాబరగు చెల్వకు చిత్తము పల్లవింప’’ పద్యంలో ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అన్నప్పుడు సగుణ రూపం విష్ణువని, శివుడు రూపాది రహిత నిర్గుణ తత్వ్తమని తాత్పర్యం. అందుకే హరిహరనాథుని గొల్చెద అనకుండా పరతత్త్వము గొల్చెద నన్నాడు తిక్కన. ఈ దృష్టితో గమనిస్తే తిక్కన సగుణ నిర్గుణ సమన్విత పరబ్రహ్మ తత్త్వోపాసనా లక్షణం వ్యక్తమవుతుంది. నిర్వచనోత్తర రామాయణ అవతారికలో ‘‘జాత్యము గామి నొప్పయిన సంస్కృతమెయ్యెడ జొన్ప’ 8 నని భాషా ప్రయోగాల గురించి తిక్కన చెప్పిన మాటలు ఆనాడు ప్రచారంలో ఉన్న శివకవుల భాషా ప్రయోగాదులకు నిరసనగా ప్రస్తావించినట్లు విమర్శకులు భావిస్తున్నారు.

లలిత పద హృద్య పద్యం

            బుహ కథార్ధంబు ఘటిత పూర్వాపరమై

            యలతి యలతి తునియలఁ గా

            హల సంధించిన విధంబు నమరగ జేతున్‌ (నిర్వ – రామా 1 – ప-16)

లలిత లలిత పదాలతో మహార్ధాన్ని స్ఫురింప చేయటమేకాదు శ్రవ్యకావ్యంలో దృశ్యకావ్యం తీరును అనువర్తింపచేసే ‘నాటకీయత’ను కూడ తన రచనలో నిక్షిప్తం చేసి తనదైన ఒక విలక్షణ కావ్య దృక్పధాన్ని ప్రకటించాడు.

మారన :

ప్రతాపరుద్రుని సమకాలికాంధ్ర రచయితలలో మారన పేర్కొనదగినవాడు. తిక్కన శిష్యుడైన మారన తన మార్కండేయ పురాణాన్ని ప్రతాపరుద్రుని సేనాని నాగయ గన్నయకు అంకితమిచ్చాడు. ఇది ప్రధమాంధ్ర పురాణంగా ప్రసిద్ధికెక్కింది. ఈ గ్రంథంలో హరిశ్చంద్ర వృత్తాంతం, వరూధినీ ప్రవరుల గాథ, మదాలసా కువలయాశ్వుల కథ, రుచి ప్రజాపతికథ, మరుత్తు వృత్తాంతం మొదలైన ఉపాఖ్యానాలెన్నో ఉన్నాయి. ఇందులోని వరూధిని ప్రవరుల గాధ అల్లసాని పెద్దన మనుచరిత్ర కథకు మూలమైంది. శంకర కవి, గౌరన మొదలైన కవులు రచించిన హరిశ్చంద్రోపాఖ్యానానికి ఈ గ్రంథమే మాతృకగా నిలిచింది. నన్నయ కథాకథన శిల్పాన్ని, తిక్కన రసవత్కావ్య కళాశిల్పాన్ని సమన్వయించుకొని పుట్టిన విశిష్ట రసవత్కావ్యమిదని డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు తన ‘ప్రథమాంధ్ర మహాపురాణం’ గ్రంథంలో పేర్కొన్నారు.

తిక్క భూపతి :

మనుమసిద్ధి కుమారుడైన తిక్క భూపతి సకల విద్యా విశారదుడని, కవి సార్వభౌమునిగా పేరు గాంచినవాడని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణ అవతారికలో పేర్కొన్నాడు. ఇతని ఆస్థానంలోనే పెద్దయామాత్యుడనే కవి ఉన్నాడని, ఆశు, మధుర, చిత్ర, విస్తరములనే చతుర్విధ కవితా మార్గాలలో నిష్ణాతుడని జక్కన తన విక్రమార్క చరిత్రలో తెలిపాడు.

బద్దెన :

బద్దెన కవి గణపతి చక్రవర్తి సామంతులలో ఒకడు. భద్రభూపాలుడని ఇతనికి మరొక పేరు. నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, నీతి కృతులు ఈ కవి రచనలు. సుమతి శతక ప్రాశస్త్యం ఎనలేనిది.

రావిపాటి త్రిపురాంతకుడు :

‘‘త్రిపురాంతకోదాహరణము’’ను రచించిన రావిపాటి త్రిపురాంతకుడు ప్రతాపరుద్రుని సమకాలికుడు. ఆయన రచనలు అలభ్యం. సంస్కృతంలో ఇతడు రచించిన ప్రేమాభిరామం గ్రంథం కూడ లభించకపోయినా వినుకొండ వల్లభరాయడు ఈ గ్రంథాన్ని అనుసరించే తెలుగులో క్రీడాభిరామాన్ని రచించాడు. కాకతీయుల సామాజిక జీవనానికి ఈ రచన అద్దం పట్టింది.

భాస్కరుడు :

భాస్కర రామాయణం కాకతీయుల కాలంలో వచ్చిన మరొక గ్రంథం. రెండవ ప్రతాపరుద్రుని అశ్వసైన్యాధ్యక్షుడైన సాహిణిమారునికి అంకితమివ్వబడింది. చంపూ కావ్య రూపంలో వచ్చిన తెలుగు రామాయణాల్లో మొట్టమొదటిది భాస్కర రామాయణం. ఈ రామాయణంలోని బాల కిష్కింధాసుందర కాండలను భాస్కరుని శిష్యుడైన కుమార రుద్రదేవుడు, అరణ్య యుద్ధకాండ పూర్వభాగాలను భాస్కరుడు, యుద్ధకాండ శేషాన్ని భాస్కరుని మిత్రుడైన అయ్యలార్యుడు రచించారు. నలుగురు కవులు వాల్మీకి రామాయణాన్ని అనుసరించినప్పటికి కొన్ని కల్పితాంశాలు ఈ రచనలో కనిపిస్తాయి. కవితా శిల్పంలో, శాబ్దిక చమత్కృతిలో ఒకరికొకరు సాటి అన్నట్లుగా రచించబడిన భాస్కర రామాయణం తెలుగు సాహిత్య చరిత్రలో అపురూపమైనది.

గోనబుద్ధారెడ్డి :

గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాధ రామాయణం ద్విపద సంప్రదాయంలో వచ్చింది. తెలుగులో ద్విపదలో వచ్చిన రామాయణాల్లో ఇది మొదటిది. గ్రంథారంభంలో గోనబుద్ధారెడ్డి తన తండ్రి అయిన విఠ్ఠలుని పేర రచించినట్లుగా ఉంది. గ్రంథ కర్తృత్వానికి సంబంధించిన విషయంలో వాద వివాదాలున్నాయి. గోనబుద్ధారెడ్డే ఈ రామాయణ కర్త అని పలువురి అభిప్రాయం. వాల్మీకి రామాయణమే రంగనాధ రామాయణానికి మూలమైనా, వాల్మీకంలో లేనివి, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న ఎన్నో కథాంశాలు తన రచనలో చేర్చాడు. గ్రంథారంభంలో

పదములర్ధంబులు భావముల్‌ కలుగ

            పదశయ్యలర్థ సౌభాగ్యముల్‌ యతులు

            రసములు కల్పనల్‌ ప్రాస సంగతులు

            అసమాన రీతులు నన్నియు గలుగ’

రామాయణాన్ని రచిస్తానని చెప్పినట్లుగానే సమర్ధవంతంగా రచించాడు. వర్ణనలతో పాటు కథను సరళంగా చెప్పి భావోల్బణం కలిగించడం కవి ప్రజ్ఞకు, కథనరీతికి ఉదాహరణగా చెప్పవచ్చు. రాముడు వనవాసానికి బయలుదేరుతున్నపుడు దశరధుడు పుత్ర వియోగం భరించలేక సుమంత్రునితో రథమాపుమని చెపుతాడు. రథ మాగకనే వెళ్లిపోతుందని అతడు చెప్పినప్పుడు దశరధుని దు:ఖం, మనోవ్యాకులత ఈ సందర్భంలో అద్భుతంగా వర్ణించబడింది.

అనవుడు దశరధుడటు పోక నిలిచి

            తన సూను రథమును తప్పక చూచి

            అదియును గానక ధూళినటు చూచి చూచి

            అదియును గానక బయలటు చూచి చూచి

            హాయని యెలుగెత్తి హా రామ రామ

            హాయని మూర్ఛిల్లె…….

‘అదియును గానక’ అనే మాటను, ‘అటు చూచి చూచి’ అనే మాటలను రెండు సార్లు ప్రయోగించటం వల్ల దశరథుని దు:ఖావేశం అభివ్యక్తమైంది. రధగమనం సూచింపబడింది. పాల్కురికి సోమనాధుడు తెలుగులో ద్విపద రచనా సంప్రదాయాల్ని పాటించినా సోమనాధుని కావ్యాల్లో ప్రతికూల లక్షణం అధికంగా కనిపిస్తుంది. శైవమతాభిమానులకే పరిమితమై పోయింది. కాని రంగనాధ రామాయణం అనుకూల లక్షణం కలది. కాబట్టి అందరికీ అంగీకారమే కాక ప్రబంధ కవుల పద బంధాలకు దూరంగా ఉండటం, ప్రజాసామాన్యంలో వ్యాపించి ఉన్న కథాంశాలను స్వీకరించటం జన భావనలకు సన్నిహితమై ఉండటమనే గుణాలు రంగనాధ రామాయణానికి గొప్ప ప్రశస్తిని తెచ్చిపెట్టాయి.

విశ్వేశ్వర శివదేశికవి :

విశ్వేశ్వర శివదేశికవి గణపతి దేవునికి దీక్షా గురువు. గోళకీ మఠాధిపతి, ఇతడు రచించిన ‘శివ తత్త్వ రసాయన’ మనే గ్రంథం లభించలేదు.

శివదేవవిద్వత్కవి : 

గణపతిదేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల దగ్గర ఇతడు మంత్రిగా ఉన్నాడు. పురుషార్ధసారము, శివదేవ ధీమణి శతకము మొదలైన గ్రంథాలు రచించినట్లు ‘సకనీతి సమ్మతము’ పీఠికలో మానవల్లి రామకృష్ణకవిగారు తెలిపారు.

ఇంకా తెలుగు రచయితలలో విద్యానాధుని సమకాలికులలో కేతన, అధర్వణాచార్యుడు, మంచన, అప్పనమంత్రి, పావులూరి మల్లన, ఎఱ్ఱన మొదలైన వారు పేర్కొనదగినవారు.

 

శ్రీపతి పండితుడు :

శ్రీపతి పండితుడు కాకతీయ సామ్రాజ్య తెలుగు కవులలో శైవ పండిత త్రయంలో మొదటివాడు. రెండవ ప్రోలరాజుకు సమకాలికుడు. శైవులు ఆ కాలంలో తమ మతవ్యాపనం కోసం తెలుగులో రచనలు చేశారు. ఇతడు ‘శివదీపిక’ అనే గ్రంధాన్ని రచించినట్లు తెలుస్తున్నది. అదిప్పుడు అలభ్యం. శివుడొక్కడే దైవమని నిరూపించటానికి కొంగున నిప్పులు మూటకట్టిన మహానీయుడని శివతత్త్వసార గ్రంథంలో పండితారాధ్యులు ప్రశంసించారు.

శివలెంక మంచన :

శివలెంక మంచన శైవ పండిత త్రయంలో రెండవవాడు. రెండవ ప్రోలరాజు కాలంలో ఉన్నట్లు చెపుతారు. ఇతడు రచించిన తెలుగు గ్రంథాలు అలభ్యం. ‘యత్సంవిత్‌’ అనే వాక్యానికి నాలుగు వేల గూఢార్ధాలు (మునుయత్సంవిత్తను వాక్కునకు జెప్పె నాల్గువేల గూఢార్థములన్‌) చెప్పినట్లు శివకవి కంఠాభరణం తెలుపుతున్నది.

మల్లికార్జున పండితారాధ్యుడు :

మల్లికార్జున పండితారాధ్యుడు శైవ పండితత్రయంలో తృతీయుడు. ఆరాధ్యశైవ సంప్రదాయానికి మూలపురుషుడు. కాకతీయ రుద్రదేవుని సమకాలికుడు. పాశుపత శైవ సంప్రదాయానికి చెందినట్లుగా ఇతని ‘శివతత్త్వసారం’ వల్ల తెలుస్తున్నది. దక్షాధ్వరము, వ్యాసాష్టకము, గణాడంబరము, శారభము, పంచగద్యములు, శివతత్వ్తసారము, తుమ్మెద పదాలు, ప్రభాతపదాలు మొదలైనవి పండితుని రచనలుగా తెలుస్తున్నాయి. వీటిలో శివతత్త్వ సారం పేరుతో అయిదువందల కంద పద్యాలు తప్ప మరే ఇతర రచనలు లభించలేదు.

నన్నెచోడుడు :

నన్నె చోడ మహాకవి పన్నెండవ శతాబ్దం కంటే పూర్వుడని కాకతీయ రాజుల ఆరంభ కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కుమార సంభవమే కాక, కళా విలాసమనే కావ్యాన్ని కూడా రచించినట్లు కుమార సంభవ ప్రథమ భాగ పీఠికలో మానవల్లి రామకృష్ణ కవి తెలిపారు. మార్గదేశి భేదాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసి ‘కుమార సంభవం’ అవతారికలో ఈ విధంగా ప్రస్తావించాడు.

 

మును మార్గ కవిత లోకం

            బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం

            గున నిల్పి రంధ్ర విషయం

            బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్‌

అంతేకాక నన్నె చోడుడు ‘సరళముగాగ భావములు జాను తెనుంగున నింపు పెంపుతో’ అన్న పద్యంలో తన కవిత్వ లక్షణాలుగా వస్తు కవిత, జాను తెనుగు, వర్ణనా నైపుణ్యం, అర్ధపుష్టి, రసదృష్టి మొదలైనవి పేర్కొన్నాడు. వస్తు కవిత అంటే ఆయన కావ్యంలో చేసిన వస్తు ప్రయోగ సందర్భాలను సమన్వయిస్తే కావ్యానికి అవసరమైన ‘సూక్తులు, వర్ణనలు, గుణములు రసములు’ మొదలైన సామగ్రిని ఆయన వస్తువుగా భావించినట్లు స్పష్టపడుతుంది.9

నన్నెచోడుడు తన కావ్యాన్ని గురువైన జంగమ మల్లికార్జునికి అంకిత మిచ్చాడు. కావ్యమంతటా శివపారమ్యమే చిత్రింపబడింది. పరమత నిందకనిపించదు. కోవెల సంపత్కుమారాచార్యులు గారు అభిప్రాయపడినట్లుగా కుమార సంభవంలో భక్తి సంప్రదాయం కన్న జ్ఞాన సంప్రదాయమే పుష్కలంగా కనిపిస్తుందన్నది నిజం. ‘జ్ఞాన దీపంబు హృత్సదనంబులో దాన, దీవియగా నెత్త దివురువారు… వెలయ మత్కృతి సదువుడు, వినుడు, వ్రాయుడీశ్వరాంబికాగుహులిత్తురీప్సితము’ .. (12`225) అన్న పద్యమే దీనికి తార్కాణంగా చెప్పవచ్చు.

కేతన :

కాకతీయుల కాలం నాటి వాడైన కేతన తన ‘దశకుమార చరిత్ర’ను తిక్కనకు అంకితమిచ్చాడు. దండి సంస్కృతంలో రచించిన ‘దశకుమార చరిత్ర’ వచన కావ్యాన్ని తెలుగులో పరివర్తింపచేశాడు. ఒక కవికి మరొక కవి కావ్యాన్ని అంకిత మివ్వటం కేతన నుండే ప్రారంభమైంది. విజ్ఞానేశ్వరీయం అనే ధర్మ శాస్త్రగ్రంథాన్ని, ఆంధ్ర భాషా భూషణం అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. వ్యాకరణ శాస్త్ర వికాసంలో, భాషాశాస్త్ర దృష్ట్యా కేతన రచించిన వ్యాకరణ గ్రంథానికి ఎంతో ప్రాముఖ్యమున్నది. దశకుమార చరిత్రలో సామాన్య జనుల విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, అధికార వర్గాల్లో  ఉండే మోసాలు మొదలైన నాటి సామాజికాంశాలు వర్ణింపబడ్డాయి. కాకతీయ యుగంలో బయ్యన, వేములవాడ భీమకవి, యధావాక్కుల అన్నమయ్య ఉన్నట్లు తెలుస్తున్నది. కొందరి కాల నిర్ణయంలో అభిప్రాయ భేదాలున్నాయి. కాకతీయుల సమకాలంలో ఉన్న పాపులూరి మల్లన్న రచించిన ‘‘గణితసారము’’ అన్న గ్రంథం పేర్కొనదగింది. ఇందులో ఆనాటి తూనికలు –  కొలతలు మొదలైన విషయాల వివరణ ఉంది.

పాల్కురికి సోమనాధుడు :

కాకతీయుల సమకాలంలో వెలసిన మహాకవి పాల్కురికి సోమనాధుడు మొదటి ప్రతాపరుద్రుని ఆశ్రయం పొందాడని బండారు తమ్మయ్యగారు అభిప్రాయపడ్డారు.10 కాలం విషయంలో అభిప్రాయ భేదాలున్నప్పటికి కాకతీయరాజుల ఆశ్రయంలో ఉన్నాలేకపోయినా వారి సమకాలంలో సోమన ఉన్నట్లు సర్వులు అంగీకరించిన విషయమే. మత ప్రచారానికి సాహిత్యాన్ని సాధనంగా ఉపయోగించుకున్న సోమన తెలుగు సాహిత్య చరిత్రలో తొలి ఉద్యమకారుడు. క్రీ.శ 1168 వ సంవత్సరానికి ఇంచుక ముందో తరువాతనో జన్మించి క్రీ.శ 1240 ప్రాంతం వరకు జీవించాడని బండారు తమ్మయ్యగారు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సోమన సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో ఎన్నో రచనలు చేసిన గొప్ప సాహిత్య వేత్త. ‘దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావుగారు సోమనాధుని రచనలను ఈ విధంగా పేర్కొన్నారు.  1. అనుభవసారము 2. బసవ పురాణము 3. వృషాధిపశతకము 4. అక్షరాంక గద్య 5. అక్షరాంక పద్యములు  6. పంచప్రకారగద్య 7. శరణుబసవ గద్య (కన్నడం, తెలుగు) 8. అష్టోత్తర శతనామ గద్య (సంస్కృతం) 9. సద్గురు రగడ (తెలుగు, కన్నడం) 10. గంగోత్పత్తి రగడ (అలభ్యం) 11. బసవోదాహరణము (తెలుగు, సంస్కృతము) 12.చతుర్వేదసారము (బసవలింగ శతకము) 13.  సోమనాధ భాష్యము (సంస్కృతం) 14. రుద్రభాష్యము (అలభ్యము) 15. వృషభాష్టకము (సంస్కృతం) 16. చెన్నమల్లు సీసములు 17. సోమనాధ స్తవము 18. మల్లమదేవి పురాణము (అలభ్యం) 19. పండితారాధ్య చరిత్ర మొదలైనవి.

సంస్కృత భూయిష్ఠ రచన సర్వసామాన్యం కాదని, ప్రాచీన పురాణాలను వదలి తేట తెనుగు మాటలతో సోమన తన సమకాలికులైన బసవని, పండితారాధ్యుల జీవితాలనే పురాణాలుగా రచించాడు. సంస్కృత వృత్తాలను వదలి ద్విపదలలో రచన చేసినాడు.

ఉరుతర గద్య పద్యోక్తుల కంటె

            సరసమై పరగిన జాను తెనుంగు

            కూర్చెద ద్విపదల కోర్కెదైవార

            ఆరూఢ గద్య పద్యాది ప్రబంధ

            పూరిత సంస్కృత భూయిష్ఠ రచన

            మానుగా సర్వసామాన్యంబుగామి’ అని

పలికి ‘జాను తెనుగు విశేషము ప్రసన్నతకు’ అని స్పష్టం చేసి భాషా విషయంలో సంస్కృత భూయిష్ఠ రచనకు ప్రతిగా జాను తెనుగును స్వీకరించాడు. మత విషయంలో సాహితీ రీతుల విషయంలో సాహిత్య వస్తువు విషయంలో ఒక విలక్షణ మార్గాన్ని అనుసరించాడు. ఆ కాలంలో ప్రచలితమై ఉన్న మార్గపద్ధతిని కాదని,సంస్కృత కావ్య సంప్రదాయాలకు స్వస్తి చెప్పి, ప్రజల నిత్య జీవితంలో వినబడే దేశీ ఛందస్సంప్రదాయాలను స్వీకరించి వాటికొక ఉత్తమ స్ధానాన్ని కలిగించి విభిన్న దేశి కావ్య పద్ధతులకు శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా ద్విపద, శతక, ఉదాహరణ, గేయాది కృతులకు ఇతడే ప్రవర్తకుడైనాడు. కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఉజ్జీవింపచేసిన వీరశైవ మతం సోమన కవితాశక్తికి ఆలంబనంగా నిలిచింది. ఇతడు ప్రచారం చేసిన శైవ మతంలో భక్తియే జీవనాడి, జాతికుల భేదాలు కాని స్త్రీ, పురుష విభేదాలు కాని లేవు.

బసవ పురాణంలో ఒక్కొక్క భక్తుని కథ ఒక్కొక్క మణిపూస, బల్లేశుమల్ల, కాట కోటయ్య, ముగ్ధ సంగయ్య, రుద్రపశుపతి, బెజ్జమహాదేవి, గొడగూచి, దీపద కళియారు నాట్య నమిత్తండి, కన్నప్ప, మడివాలు మాచయ్య, నిమ్మవ్వ, సిరియాలుడు మొదలైన భక్తుల కథల నెన్నింటినో వర్ణించి వాయార భక్తుల వర్ణింపగంటి పాయక నా జిహ్వ పావనంబయ్యె’ అని భావించినాడు.

ద్విపద సాహిత్యంలోనే మకుటాయమైనది పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్ర గ్రంథం. ఇందులో అతడు స్పృశించని అంశమే లేదంటే అతిశయోక్తికాదు. ఆనాటి ఆటలు, పాటలు, విద్యలు, వినోదాలు మొదలుకొని వస్త్రాలు, వీణలు, రాగాలు, ఆభరణాలు, నేత్ర వ్యాధులు, చికిత్సలు మొదలైన వెన్నో చెప్పాడు. కాకతీయుల కాలం నాటి స్థితిగతులకు ఈ రచన అద్దం పట్టింది. విషయ విన్యాసంలోను, దేశీయతను ప్రదర్శించటంలోను తూగులో, ధారలో, నడకలో, ఔద్ధత్యంలో పండితారాధ్య చరిత్రను మించిన గ్రంథం లేదని తెలుగు సాహిత్యంలో మహాభారతం ఎటువంటిదో, శివకవుల రచనలలో సోమనాధుడు రచించిన ఈ గ్రంథం అటువంటిదని విమర్శకుల అభిప్రాయం. అది ఒక విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. తన కవితా ప్రవాహానికి అవరోధాలనిపించినపుడు భాషా సంప్రదాయాలను, వ్యాకరణ నిబంధనలను నిరాటంకంగా త్రోసి పుచ్చుతాడు. చౌర్యం, ద్యూతం, విటత్వం, రసవాదం, సంగీత శాస్త్రం, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, నానా విధాహార విహార వేష వైఖరులు మొదలైన ఎన్నో అంశాలను సోమనాధుడు సందర్భోచితంగా తన రచనలలో వర్ణించాడు. సోమనాధుని వైదుష్యానికి అతనికి రచనలే ప్రమాణం.

జనసామాన్యం వాడుకలో ఉన్న పలుకు బడులను, జాతీయాలను, సామెతలను విరివిగా ప్రయోగించి ఈ సాహిత్యం తమదే అన్న భావం కలిగించాడు. పునరుక్తులు ప్రయోగించటం, ఒకే అంశాన్ని ఒకేవిధంగా వరుసగా చెప్పుకు పోవటం వంటి బుర్రకథలలోని లక్షణాలను సోమనాధుడు తన కావ్యాలలో స్వీకరించాడు. కథకుడు, శ్రోత ఉభయులు దాదాపు ఒకటిగా మారేస్థితి జానపద కథాగేయాల్లో కనిపిస్తుంది. ఆ లక్షణం తన సాహిత్యంలో ప్రవేశ పెట్టాడు. పండితులకు, జనసామాన్యానికి ఆమోద యోగ్యంగా నన్నయ మార్గానికి ప్రతిగా దేశీ సాహిత్యోద్యమ్యాన్ని ఆరంభించి తుదముట్ట కొనసాగించాడు. తన రచనలో ప్రధాన జీవన సంస్కృతితో పాటు భిన్న భిన్న ప్రజా సమూహాల సంస్కృతిని అభివ్యక్తీకరించటంలో సోమనాధుని మించిన వారులేరు. సోమనాధుని మత పాక్షికత రుచించక పోవటం వల్ల శైవేతర కవులు అతని కావ్యాలను ఉపేక్ష చేసినట్లు కనిపిస్తుంది. ఎవరు ఉపేక్షించినప్పటికి అతని రచనలలోని సాహిత్యపు విలువలు, దేశి ఉద్యమం, తరువాతి కాలపు సాహిత్యాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆనాటి తెలంగాణా జన జీవితాన్ని మన కళ్ళ ముందుంచింది.

వినుకొండ వల్లభరాయడు :

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వచ్చిన ప్రతాపరుద్ర చరిత్రము, సిద్ధేశ్వర చరిత్రము, సోమదేవ రాజీయము, క్రీడాభిరామము గ్రంథాలు కాకతీయ వైభవాన్ని తెలుపుతున్నాయి. ముఖ్యంగా వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామం కాకతీయుల జన సామాన్య జీవన విధానాన్ని ప్రతిబింబింపచేసింది. రావిపాటి త్రిపురాంతకుని సంస్కృత ప్రేమాభిరామానికి ఆంధ్రానుసరణం ఇది.

ఈ త్రిపురాంతకుడు, రావిపాటి తిప్పన ఒక్కరే అని ఇతడు ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నాడని విమర్శకుల అభిప్రాయం. కనుకనే తెలుగులోకి అనువర్తింపబడిన క్రీడాభిరామంలో ఏకశిలా నగర వర్ణన ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాకతీయ కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితుకు అద్దం పట్టింది ఈ రచన. క్రీడాభిరామం ‘‘సిటీమ్యాప్‌’’ లాంటిదని అంటారు. నగర నిర్మాణ తీరుతెన్నులు, నాటి వృత్తులు, కులాలు, ఆటలు, పూటకూళ్ల భోజనాలు, సామాన్య ప్రజల ఆచారాలు, విశ్వాసాలు మొదలైన వెన్నో ఈ గ్రంథంలో మనోజ్ఞంగా చిత్రింపబడ్డాయి. ఏకవీర, మైలారుదేవుడు, భైరవుడు, చమడేశ్వరి, మూసానమ్మ, వీరభద్రుడు, పాండవులు, మాచెర్ల చెన్నడు మొదలైన దేవతల ప్రస్తావనలు ఇందులో చోటుచేసుకున్నాయి. రాజప్రసాదంలో గడియారమున్నట్లు తెలుస్తున్నది. నాడు దేవాలయాలలో కూడా గడియారాలున్నట్లు శాసనాలు తెలుపుతున్నాయి. పూట కూటిండ్లు, వేశ్యావాటికలు, మేషయుద్ధాలు, పాములాటలు, కోళ్ళపోరు మొదలైనవి కూడ వీధి ప్రక్రియకు చెందిన ఈ క్రీడాభిరామంలో ప్రస్తావించబడినాయి. మాచల్దేవి అనే వారాంగన ఇంట్లో ఉన్న చిత్రశాల కూడ వర్ణించబడటం వల్ల కాకతీయుల కాలంలో ఉన్న వాస్తు కళతోపాటు చిత్రకళ ప్రాధాన్యం తెలుస్తున్నది. ఓరుగల్లు మహావైభవాన్ని తెలిపే ఈ గ్రంథం తెలుగు సాంస్కృతిక సాహిత్య చరిత్రలో అపురూపమైంది.

కాకతీయుల కాలంలో వెలసిన తెలుగు సాహిత్యానికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఎందరో కవులు, తమ రచనలతో తెలంగాణా నేలను సుసంపన్నం చేశారు. అవకాశాన్ననుసరించి ఆయా కవుల రచనల్లోని అంతస్తత్త్వాన్ని, సామాజిక చైతన్యాన్ని అందించే ప్రయత్నమే ఈ వ్యాసం. సాహిత్యానికి సంస్కృతికి  పరస్పర సంబంధముంది. సామాజిక యుగధర్మాలు ఆయా కాలాల్లో వెలువడిన సాహిత్యంలో అనివార్యంగా చోటు చేసుకుంటాయి. కనుక తద్వారా సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కూడ అవగతం చేసుకునే వీలున్నది.

పాదసూచికలు :

  1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డి, సాహిత్య వైజయంతి ప్రచురణ, 1982

2,4. Inscriptions of Andhra Pradesh, Warangal District no. 15.

  1. కాకతీయ సంచిక –  సంపాదకుడు డా. మారేమండ రామారావు –  పుట. 363
  2. తెలంగాణా శాసనములు – లక్ష్మణరాయ పరిశోధక మండలి.

6,7.  కాకతీయ శాసనాలు –  ఆంధ్రభాషాపరిశీలన. పుట. 53, 78. డా. ఎన్‌. ఎల్‌. ఎన్‌. ఆచార్య

  1. తెలుగు సాహిత్య చరిత్ర (SDCLCE), Kakathiya University, Warangal.
  2. పూర్వ కవుల కావ్య దృక్పధాలు –  కోవెల సంపత్కుమారాచార్య.
  3. కాకతీయ సంచిక – పాలకురికి సోమనాథకవి – శ్రీ బండారు తమ్మయ్యగారు. పుట. 207

ఉపయుక్త గ్రంథ సూచిక :

  1. ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము – చెలమచెర్ల రంగాచార్యులు శ్రీనివాస పబ్లికేషన్స్‌ – 2005
  2. కాకతీయ శాసనాలు – ఆంధ్ర భాషా పరీశీలన – డా. ఎన్‌.ఎల్‌. ఎన్‌ ఆచార్య – తెలుగు పరిశోధన ప్రచురణలు – 1987
  3. తెలుగు సాహిత్య సమీక్ష – డా. జి. నాగయ్య, నవ్య పరిశోధక ప్రచురణలు – తిరుపతి
  4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరము ప్రతాపరెడ్డి – సాహిత్య వైజయంతి ప్రచురణ – 1982
  5. కాకతీయ సంచిక – సంపాదకులు – డా. మారేమండ రామారావు – పురావస్తు ప్రదర్శన శాలలశాఖ – హైదరాబాద్‌ – 1991
  6. కాకతీయ వైభవ తోరణాలు – డా. పోలవరపు హైమవతి – భార్గవ పబ్లిషర్స్‌ – వరంగల్‌ – 2003
  7. కైఫియత్తు – చారిత్రక పౌరాణికాంశాలు – డా. ఎస్‌. వాణీకుమారి (సిద్ధాంత గ్రంథం) –   1993
  8. కాకతీయ వైభవము – సాహిత్యము – కళలు – శిల్పము – ఆచార్య హరిశివకుమార్‌ –   శ్రీకృష్ణ ప్రచురణలు, వరంగల్‌ – 2000
  9. తెలంగాణా శాసనములు – 1 – లక్ష్మణరాయ పరిశోధక మండలి
  10. తెలంగాణా శాసనములు – 2 – గడియారం రామకృష్ణ శర్మ
  11. పాల్కురికి సోమనాథుని కృతులు – పరిశీలన డా.వే.న. రెడ్డి – జాతీయ సాహిత్య  పరిషత్‌ –  వే.న. రెడ్డి పరిశోధన గ్రంథ ప్రచురణ సంఘం.
  12. ప్రతాపరుద్ర చరిత్ర – ఏకామ్రనాధుడు.
  13. బసవపురాణము – పాల్కురికి సోమనాథుడు.
  14. ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సంస్కృతి – డా. బిఎన్‌. శాస్త్రి
  15. విజ్ఞాన సర్వస్వము – 3,4, సంపుటాలు – తెలుగు భాషా సమితి – మద్రాసు
  16. తెలుగు సాహిత్య చరిత్ర SDLCE (Course Material) Kakaatiya University
  17. పూర్వ కవుల కావ్య దృక్పథాలు – కోవెల సంపత్కుమారాచార్య.
  18. Inscriptions of Andhra Pradesh Warangal District – No. 15.
June 23, 2021 4 comments
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహితీగిరి – డా:తిరునగిరి

by డా: అమ్మిన శ్రీనివాస రాజు June 23, 2021
written by డా: అమ్మిన శ్రీనివాస రాజు

ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన రచయిత, “తిరునగరి” గా అందరికీ సుపరిచితుడైన “తిరునగరి రామానుజయ్య” పద్యం, వచనం, గేయం, సమీక్ష, ప్రక్రియ ఏదైనా సరే తనదైన ప్రామాణికతతో సంబంధిత రచనకు రమణీయత తీసుకురావడంలో సిద్ధహస్తుడు.
చక్కని రచయితగానే కాక, ఎంతో చక్కని వక్తగా, కూడా వాసికెక్కిన తిరునగరి తెలుగు మాస్టారు కావడం “పసిడికి పన్నీరు పూసిన” చందమే!! మూడు దశాబ్దాలపాటు ఆయన చేసిన తెలుగు బోధన వ్యాసంగం ద్వారా వేలాది మంది విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశాల బోధనతో పాటు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి పెంచి ప్రేరణగా నిలిచారు, అనేకమంది కవులు వికసించడానికి కారకుడయ్యారు,
ఈ తెలుగు సాహితీ కృషి వలుడు 1945 సెప్టెంబర్ 24న జానకిరామక్క- మనోహర్, దంపతులకు భువనగిరి సమీపంలోని రాజపేట వద్ద గల బేగంపేట ప్రాంతంలో జన్మించారు, ఉద్యోగరీత్యా ఎక్కువకాలం ఆలేరులో నివసించారు.


“కవిత్వం రాయందే కాలం గడవదు” అని చెప్పుకునే తిరునగరి రోజు ఒక్క కవిత, రచన, చేయందే నిద్రపోయేవారు కాదు,
ఆయన పద్యం ఎంత దారణగా ఉంటుందో, వారి వచనం కూడా అంతే సుందరంగా కనిపిస్తుంది, అంతే కాదు ఆయన మాటల ప్రవాహం కూడా అంతే ఆకర్షణీయంగా సాగుతుంది, అదే ఆయన్ని మంచి వక్తగా మలిచింది, కమ్మనైన వారి ప్రసంగాల పాల బువ్వ నిండా మధురమైన జీడిపప్పు లాంటి సూక్తులు ఎన్నో!! ఏరుకున్న వారికి ఏరుకున్నన్ని.
ఈయన సందర్భోచితంగా పాడే పద్యాల జావళి ఎంతో మనోహరంగా ఉంటుంది, “దాశరథి” అంటే ఆయనకు అంతులేని అభిమానం, అంతేకాదు “దాశరథి కృష్ణమాచార్య” రాసిన కవిత్వం, పద్యాలు, ఆసాంతం కంఠతా పట్టిన నిజమైన కవితామూర్తి మంతుడు తిరునగరి,
“బాలవీరశతకం” తో ప్రారంభమైన ఆయన సాహితీ ప్రస్థానం, ఐదు దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగింది, ప్రతీ రచనకూ తనదైన ముద్రతో నిండిన పరిణితి పులిమే వారు,
తిరునగరి కవిత్వంలోని సరళత, సౌకుమార్యత, ఎంత హృద్యంగా ఉంటాయో ఆయన వ్రాసిన “చెమట నా కవిత్వం” అద్దం పడుతుంది.
అతి సున్నితమైన వస్తువును అత్యంత అద్భుతంగా కవిత్వీకరించిడం ఒక్క తిరునగరికే సొంతం, చెమటకు సమాజానికి దాని ఉన్నతికి గల అవినాభావ సంబంధం ఎంత చక్కగా చెప్పార అంటే….!
“ఈ చెమట తోనే/ బీళ్లు వరి మళ్ళయ్యాయి /ఈ చెమట తోనే పట్టణాల్లో ఫ్యాక్టరీలు వెలిశాయి/……. చెమట తోనే/ ఈ ప్రపంచ మనుగడ/చెమ టోడిస్తేనే /కడుపునిండా తిండి కదా/… అంటారు ఆయన,
కవిత్వంలో నిండి ఉండే ఉత్తేజం, ప్రేరణలను, ఆకళిoపు చేసుకున్న తిరునగరి కవితా అక్షరాలన్నీ ఆదిశగానే అడుగులు వేశాయి,…….. మనిషి ఉన్నతుడు కావాలంటే/ ఉన్నతాశయం ఉండాలి/ ఉన్నతికి చేరాలంటే/ ఉద్యమ స్ఫూర్తి ఉండాలి…..
అంటూనే కార్యసాధనలో విజేత కావాలి అంటే కష్టం అనే “మట్టి” అంటకుండా ఉండదు అనే సందేశం హెచ్చరికను ఎంతో చక్కగా అందిస్తారు.
శృంగార నాయకులు, కొవ్వొత్తి, వసంతం కోసం, అక్షర ధార, తిరునగరీయం, మాపల్లె, ఉషోగీతం, నీరాజనం, యాత్ర, చెమట నాకవిత్వం, ఆయన వ్రాసిన పుస్తకాలలో ప్రధానంగా చెప్పవచ్చు,
ఆలోచన, తిరునగరీయం, పద్య సౌరభం, లోకాభిరామాయణం, లోకాలోకనం, వంటి శీర్షికల పేర్లతో పలు ప్రముఖ సాహితీ పత్రికల్లో ధారావాహికంగా వెయ్యికి పైగా విమర్శనాత్మక వ్యాసాలు రాశారు.
మాతృభాష తెలుగుతోపాటు ఆంగ్లం, సంస్కృతం, హిందీ, భాషలపట్ల కూడా సాధికారత సాధించిన తిరునగరి, కొన్ని ఆంగ్ల, హిందీ, కవితలను తెలుగులోకి అనువదించారు, ఈయన వ్రాసిన కవితలు, గేయాలు, దేశభక్తి గీతాలు, లలితగీతాలు, వందకు పైగా ఆకాశవాణి, దూరదర్శన్, కేంద్రం నుండి ప్రసారం అయ్యాయి.
తిరునగరి రచనలపై విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధనలు సైతం జరిగాయంటే వారి రచనల్లోని ప్రామాణికత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ ప్రక్రియలను స్పృశించిన అది “మాననీయత”అనే చేయితోనే !!
తన కవితా వస్తువు “మానవవేదనకు” ప్రతిబింబమై కనిపిస్తుంది, ఆయన రచనా శైలి అతి సరళమై ప్రతి వారిని పలకరిస్తుంది పరవశింప చేస్తుంది.
నిత్య కవిత్వ చైతన్య శీలి తిరునగరి యొక్క భాష సాధికారతను మెచ్చిన భోపాల్ లోని “అఖిలభారత భాషా సాహిత్య సమ్మేళన్” వారు 2003 సంవత్సరపు “భారత్ భాషా భూషణ్” పేరున “గౌరవ డాక్టరేట్”ను అందించారు.
తిరునగరి యొక్క విశేష సాహితీ కృషిని స్థానిక విశ్వవిద్యాలయాలు, సాహితీ సంస్థలు, కూడా గుర్తించి గౌరవించాయి, అందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, “ఆట వారి” సత్కారంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే “దాశరధి పురస్కారం” ఇది తన వజ్రోత్సవ పుట్టిన సంవత్సరం 2020లో అందుకోవడం కాకతాళీయమే అయినా అది ఆయనకు లభించిన సత్కారాలు అన్నిటికీ మకుటాయమానంగా నిలుస్తుంది.
నిత్యం అధ్యయనం, భాషణం, రచన, అనే త్రివేణి పథంలో పయనించిన తిరునగరి సాహితీ ప్రయాణంలో మాతృ సాహిత్యాన్ని ఎంత అవగాహన చేసుకున్నారో! పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలను, అంతే ఆకళింపు చేసుకున్న సాహితిపిపాసి తనం ఆయనలో అడుగడుగునా కనిపిస్తుంది, “మనిషే జెండా మానవత్వమే ఎజెండా”గాసాగిన తిరునగరి కలం ఏవాదానికి చిక్కని మానవత్వపు అక్షరమై నిలిచింది.
దాశరధి అన్నట్టు తిరునగరి కవితలు” తేజ స్వంతాలు ఓజ స్వంతాలు” “అభ్యుదయ”అంగీకరించిన తిరునగరి నిండా మాననీయ రక్తం ప్రవహిస్తుంది,
చివరిదాకా తనదైన విజన్ తో కలం సేద్యం చేసిన ఈ అక్షర కృషివలుడు హృదయ సంబంధిత వ్యాధితో హైదరాబాద్లోనే 25 ఏప్రిల్ 2021 న “ఆచార్య తిరువడిగలళి”కి చేరినారు, ఆయన భౌతిక రూపం కనుమరుగైన తన కనువిందైన కవనం ద్వారా మన కళ్ళల్లో సదా కదలాడుతూనే ఉంటారు.

••••••••••••••••••••••• {నివాళి} డా:అమ్మిన శ్రీనివాసరాజు,

June 23, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చేజారిన జ్ఞాపకం

by డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి June 22, 2021
written by డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి

బాల్యాన్ని బంధించాలని తెలియనే
లేదు
వేళ్ల సందుల్లోంచి జారిపోయింది
పోతూ పోతూ ఇన్ని ఆనందానుభూతుల్ని
వెదజల్లింది

ఆ తరువాత వసంతంలా వచ్చిన యవ్వనాన్ని పట్టుకోవాలని చూస్తే
అదీ పుస్తకం లో దాచిన
నెమలి కన్నులా
నాకు తెలియకుండానే
ఎక్కడో పడిపోయింది
పోతూ పోతూ
కొన్ని మధురానుభూతులను
వెదజల్లి వెళ్ళింది

ఇక ఇప్పుడు ……

బాధ్యతలకు బందీ అయిన
బరువైన జీవితం ౼
బాల్యం బాదం చెట్టు చుట్టూ
తిరిగి కాయలను ఏరుకుంటుంటే
యవ్వనం మధురానుభూతుల్ని
మనసారా ఆహ్వానిస్తుంటే

నేనున్నాను అంటూ వర్తమానం !

వర్తమానం బాధ్యతల బంధాల చుట్టూ తిరుగుతూ
బరువులను ఎత్తు కుంటున్నది

యవ్వనం ఊహల చుట్టూ తిరిగే
ఉత్సాహాన్ని ఇస్తే

ఉద్యోగం జీతం చుట్టూ తిరిగే
నీరసాన్ని స్తున్నది

ఏమంత్రగాడోవచ్చి
చేజారిన బాల్యాన్నో
చెప్పకుండా పోయిన యవ్వనాన్నో
తిరిగి ఇస్తే బాగుండు…

౼డా౹౹నెమ్మికంటి సంధ్యారాణి

June 22, 2021 1 comment
6 FacebookTwitterPinterestEmail
కవితలు

సృష్టి ఎవ్వరి స్వంతం

by -మారంరాజు శ్రీనివారావు June 22, 2021
written by -మారంరాజు శ్రీనివారావు
సృష్టి ఎవ్వరి స్వంతం
మైల పడి పోయింది అసాంతం
ఎక్కడో అల పైన
భువన భోనాంతరాలలో కూర్చున్న
ఆ బ్రహ్మ పీఠానికే ఎసరు పెట్టింది
ఈ మానవ ప్రపంచం
తన పీఠానికే ఎసరు వచ్చుచువున్నా
ఏ మాత్రం గ్రహించకనే ఉన్నది
ఈ మానవ ప్రపంచం
రాళ్లు పగల గొడుతున్నారు
రత్నాల కోసమని
దేవుని విగ్రహాలు పగల గొట్టుచున్నారు
నిధి నిక్షేపాల కోసమని
స్నేహ హస్తమిచ్చి
రోగమొకటి అంట గడుతున్నారు
ఈ విశాల భూ ప్రపంచములో
తానొక్కడే ఉండాలని ఆశపడుతున్నాడు
కాని తాము తీసిన గోతిలో తామె పడుతున్నారు
ఈ మానవ ప్రపంచం
ఎక్కడో అడవుల్లో రాతి గుహల్లో
పుట్టిన మనిషి
ఆకులు అలాలూ తింటూ
ఎంతో పరిణామం చెంది
పాలకడలి నంతా గాలిస్తూ వున్నాడు
మొదట వాసుకి కనిపించితే
ఆపై విష్ణు మూర్తియే మనకు చిక్కితే
లక్ష్మి దేవి బంగారు నగలకై ఎసరు పెట్టవచ్చు
విష్ణు నాభి దొరికితే బ్రహ్మ పదార్ధాన్ని కనిపెట్టవచ్చు
మనిషి పుట్టుకనే విడమరిచి చెప్పవచ్చు
కాని అటుదిటై ఇటు దటయితే
కాలు జారీ భూమ్మీద పడితే
రెండు ముక్కలవ్వ వచ్చు
మళ్ళీ “” జర”” కోసమై ఎదురు చూడావచ్చు
జర చేతనే సంధింప బడను వచ్చు
మేం నమ్మమంటే మనుషుని బతుకు
కొంప పూర్తిగా మునగ వచ్చు
మనిషి మళ్ళీ తిరోగమనమై పోవచ్చు
ఇప్పుడు జరుగుతున్న దదేనని
అర్ధం చేసుకున్న వారికి అగుపడనువచ్చు.
-మారంరాజు శ్రీనివారావు
June 22, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
కవితలు

మా ఏడ్పు మమ్మేడ్వనిండు!!

by -డా.ఆచార్య ఫణీంద్ర June 22, 2021
written by -డా.ఆచార్య ఫణీంద్ర
ఏడుపన్న నేల ఏవగింపు కలుగు?
ఏడ్పు నందు ముదము నేల గనరు?
ఏడ్పులందు మంచి ఏడ్పులున్నవి గదా!
ఏడ్పు గొప్ప దనము నెరుగ రేల?
అప్పుడ పుట్టు బిడ్డ తన అమ్మ శరీరము వీడి, తానుగా
నిప్పుడమిన్ స్వతంత్రమగు నింద్రియముల్ గల రూపమందునన్
ఎప్పుడు చేరు, నప్పుడిక ఏడుపు తోడనె ఆగమించడే?
గుప్పున వాని ఆప్తు లట గూడి ముదంబున తేలియాడగాన్!
క్రొత్తగ పెండ్లియై మదిని  కోరిక లూరు పడంతి శోభనం
పత్తరు వాసనల్ నడుమ, హాయిగ తా తొలిసారి భర్తనే
హత్తుకొనంగ, నాతడు రసార్ద్రతతో రమియింప, సౌఖ్యమున్
ఎత్తుగ కొండ నెక్కినటు లేర్పడ, కంటను నీరు గారదే?
నవమాసంబులు గర్భ ధారణమునన్ నానా విధుల్ కష్టము
ల్లవి యెన్నో భరియించి, నొప్పులను తాళం జాల కేడ్పేడ్చియున్,
భువిపై బిడ్డకు జన్మ నిచ్చి, పిదపా పుట్టుం గనన్, మోదమే
స్రవియించున్ కనులందు నొక్కపరి బాష్పాలౌచు సంవేదనన్!
దిక్కు దివాణమున్ గనక దీనుడునైన అభాగ్యు డొక్కడున్
ఎక్కడ లేని ఓర్పు గొని, ఎంతయొ కష్టపడంగ, చేరి తా
నెక్కుచు మెట్టుపైన మరి యింకొక మె ట్టటు లగ్ర పీఠమున్ –
ఒక్కపరిన్ గతంబు గన, నొల్కవె చుక్కలు కంటి కొల్కులన్?
తాను గన్న సుతుడు తన కళ్ళ ముందరే
ఇంచు కించు కిటుల యెదిగి తుదకు,
అందనంత యెత్తు నగుపించుచున్నచో
తండ్రి కనులు నీట తడిసిపోవె?
ఏడ్పు గొప్పదనం బెవ్వ రెరుగకుండ –
హీనముగ జూతు; రది గాంచి ఏడ్పు వచ్చు!
ఏడ్పుకే ఏడ్పు దెప్పింతు రీ హీన జనులు!
ఏడ్పును, నను, మా ఏడ్పు మమ్మేడ్వనిండు!!
-డా.ఆచార్య ఫణీంద్ర
June 22, 2021 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సంస్కృత భాషా పరిమళం శ్రీ భాష్యం

by Ananthaacharaya K.S. June 22, 2021
written by Ananthaacharaya K.S.

సంస్కృత భాషతో మూర్తీభవించిన పుంభావ సరస్వతి శ్రీ భాష్యం విజయసారథిగారు. అద్భుతమైన భాషా పాండిత్యంతోపాటు మధుర, మంజుల మనోహరంగా కవిత్వం చెప్పగల పద్మశ్రీ, మహాకవి, మహామహోపాధ్యాయ వాచస్పతి – కులపతి, యుగకర్త, యుగోద్ధర్తా, యుగచక్రవర్తి, సరస్వతీ సంతోత్తంసులు శ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు. వీరు గోపమాంబ – నరసింహాచార్య పుణ్యదంపతులకు – కరీంనగర్ జిల్లా చేగూర్తి గ్రామంలో తేదీ 10.3.1936లో జన్మించినారు. చిన్ననాటి నుండే వీరిలో మానేరు నీటి గలగలలా కవిత్వం ప్రవహించింది. పదకొండవయేటనే ‘శారద పద కింకిణి’ బాసర అమ్మవారిని నుతియించినారు. ఆనాటి నుండి మొదలైన కవిత్వం పాయలు పాయలుగా విస్తరించి 150కి పైగా గ్రంథరచనలు చేసి యావతం భారత్ ప్రజానీకం మన్ననలు అందుకన్న మందాకిని కవి. వీరి రచనలు నాగరి లిపిలోనూ కొన్నింటిని తెలుగు లిపిలోనూ అందించినారు. ఈ మహాకవి గ్రంథాల్లో తాత్త్విక చింతన , సర్వమత సమన్వయం వంటివి విషయపరంగానూ, ఛందో అలంకార వైవిద్యం వంటివి రచనాపరంగానూ అనేక అంశాలు గోచరిస్తాయి. వారి గ్రంథాల్లో ప్రధాన విషయం సమాజం. పైకి వీరి రచనలన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా కనిపించినా అంతఃసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. వివిధ దేవతాస్తతులలోను, చివరికి భక్తికి పరాకాష్ఠగా చెప్పబడే సుప్రభాతాలలోను దైవభక్తి – మోక్షసాధన పైకి కనిపించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమర భావనలు అంతర్లీనంగా ఉంటాయి.

ఈనాటి ప్రపంచమంతా డబ్బుకు లోకం దాసోహం అంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకని శ్రీ భాష్యం వారు రూపాయి మహిమను ‘రూపసూక్తం’లో వ్యంగ్యంగా రాశారు. మనిషి చేత సృజింపబడి మనిషిని ఏ విధంగా రూపాయి ఆడిస్తుందో తెల్పారు. రూపాయి తెల్సుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుందంటూ ఆరంభించిన సూక్తంలో అద్భుతంగా రూపాయి మహిమను తెల్పారు.

శ్రీ భాష్యం వారు ఎంత సనాతన సంప్రదాయ విషయ అవగాహన దార్శనికులు. లోతులు కలిగినవారో అంతే ఆధునికతను జీర్ణించుకున్న విద్వత్ కవి, ఈ విషయంలో మనం లోపలికి వెళ్ళి ‘సృష్టి దర్శనం’ చూస్తే అందరికీ అవగతమవుతుంది. ఈ కవి ఆత్మను పట్టుకోవాలంటే సంపూర్ణ అవగాహన లోతైన పరశోధన అవసరఁ. వీరి గ్రంథాల మీద రచనలలో అంతర్గతాంశముల మీద వివిధ విశ్వవిద్యాలయాల నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. వీరి రచనలు వివిధ ప్రక్రియలలో మనకు అగుపిస్తాయి. దాదాపు అన్ని సాహితీ ప్ర్రకియలను వీరు స్పృశించినారు. సుప్రభాతాలు, స్తోత్రాలు, భక్తి రచనలు, అధిక్షేప కవితలు, విమర్శ, ఆప్తలేఖలు (లేఖా సాహిత్యం) ఖండ కావ్యాలు, నవలలు, ప్రహేళికలు, విమర్శ, వర్ణనాకావ్యాలు, అనువాదాలు.

ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా కరోనా విషూచికతో బాధపడుతుంది. దీనిని దృష్టియందు ఉంచుకొని గురువుగారు ‘కరోనా మూలతో జహి’ రాసి అందులో కరోనా సోకకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చాలా విషయాలు రాసి జనాలను అప్రమత్తం చేసినారు.

ఎంత అద్భుతమైన కవియో అంతే అద్భుతమైన విద్యారు్థల గుండెలలో చోటు సంపాదించుకున్న అధ్యాపకులు. చక్కటి స్వ రూపంతోపాటుగా సుస్వరంతో వారి బోధనలో విద్యార్థులు మైమరచిపోయారన్నది వాస్తవం.

రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందినారు. కళాశాల అభ్యుదయానికి, అస్థిత్వానికి వెన్నెముకగా నిల్చిన అనుపాలన దక్షత వీరిది. లెక్కకు మిక్కిలి బిరుదులు, సత్కారాలు, సన్మానాలు పొందినా సాదాసీదా వ్యక్తిత్వం కలిగిన మహోన్నతులు. ఏ కార్యం చేపట్టినా విజయవంతం చేసేదాకా నిద్రపోని కర్తవ్య పరాయులు శ్రీ భాష్యం విజయసారథిగారు. ఏ పురస్కారమైనా వీరిని వెతుక్కుంటూ వచ్చిందే తప్ప వాటి కొరకు ఎప్పుడూ ప్రయత్నించలేదు.  సర్వ వైదిక సంస్థానమ్ కరీంనగరంలో స్థాపించినారు. ప్రస్తుత సమాజ అవకతవకల సవరించడానికి, వైదిక ధర్మంవైపు మళ్ళించడానికి దీనిని వేదికగా చేసినారు. వీటి ద్వారా పుస్తక ప్రచురణలు, సంస్కృత భాషా పరివ్యాప్తి, ధర్మ నిరతి పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మనిధిని ఏర్పాటుచేసి ప్రతీసంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా వేద పండితులను, కవులను, కళాకారులను సత్కరించే ఒక బృహత్ యజ్ఞం కొనసాగిస్తున్నారు. స్వయంగా శ్రీ భాష్యం వారు ఒక సంస్కృత పండితులకు ప్రతీ సంవత్సరం ఇరువది ఐదువేల నగదు విలువతో గత మూడు సంవత్సరాలుగా పురస్కారం అందిస్తున్నారు.  యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంగా ఒకవైపు ఆధ్యాత్మికతతోపాటుగా సాహితీ కార్యక్రమాలు, చర్చాగోష్టులు, అవధానాలు, సంగీత కచేరీలు నృత్యోపహారాలు ఎన్నింటినో నిర్వహింప జేస్తున్న ఘనత వీరిది. వీరి సమగ్ర వ్యక్తిత్వము, రచనలు, అధ్యాపకత్వం, విశేష కృషిని ఒకచోట చేర్చి డా. మాదిరాజు బ్రహ్మానందరావుగారు జీవన సారిణి పేరిట ఒక గ్రంథం వెలువరించినారు.

కాళిదాసు అంతటి ఈ మహానభావులున్న సమయంలో వారితోపాటు మనం ఉండటం గొప్పతనంగా మనం భావించవచ్చును. ఇటీవలె వీరికి అజో – విభో – కందాళం – 2021 ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని శ్రీ భాష్యం విజయసారథిగారికి హైదరాబాదులో అందించి సగౌరవంగా సన్మానం అందించింది. వీరిని గురించి రాసే ప్రతి అక్షరం అందరినీ కదిలిస్తుంది. సర్వ వైదిక సంస్థానమ్ అదొక ఆధ్యాత్మిక ప్రకారం అడుగులు వేయాలనిపిస్తుంది. భక్తిభావ తరంగిణిలో ఓలలాడాలనిపిస్తుంది. అదొక సాహిత్య క్షేత్రం. అక్కడి నుండి వచ్చే ప్రతి అక్షర పంటను అనుభవించాలనిపిస్తుంది. అదొక సంగీత ధామం. అందులో ఓలలాడాలనిపిస్తుంది. సాహితీ శిఖరం శ్రీ భాష్యం విజయసారథిగారిని ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగినందుకు మిక్కిలి సంతోషిస్తూ ఇంటర్వ్యూలోకి….

జాతీయ భావాన్ని నేపథ్యంగా, భారతీయ ధర్మాన్ని ఆదర్శంగా స్వీకరించి ఆధునిక సామాజికాంశాలను వస్తువుగా తమ రచనల ద్వారా జాతిని మేల్కొల్పిన మహాకవి, మహా మహోపాధ్యాయ పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారధిగారిని కలిసి మయూఖ కోసం సల్పిన ముఖాముఖి.

మీ సంస్కృత అభ్యసనానికి ప్రేరణ ఏమిటి?

తర్క పండితులు మాతామహులు లక్ష్మణశాస్త్రిగారు సంస్కృత సాహిత్యాన్ని సంగీతశాస్త్రాల మర్మాలు ఎరిగిన మాతామహి లలితమ్మగారి ప్రభావం ఎంతైనా ఉంది. మాతృమూర్తి గోపమాంబ, మాతామహిగారల ప్రోత్సాహం సంస్కృత భాషాధ్యయనం వైపుకు అడుగులు పడినాయి. అన్నగారు వెంకటాచార్యుల గారి చలువ అధ్యయనానికి దోహదం చేసినాయి. మాతామహుల దగ్గరికి వచ్చే ఉత్తరభారత సంస్కృత పండితుల కవిత్వం వెరసి సంస్కృత భాషాభ్యసనానికి ప్రేరణలుగా నిలిచినాయి.

మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది?

వరంగల్లు జిల్లాలోని పాలకుర్తిలో శ్రీ సోమనారసింహ వేదపాఠశాలలో సంస్కృత విద్యార్థిగా చేరినాను. అంతకుపూర్వమే మాతామహుల వద్ద న్యాయబోధినీ సహిత తర్క సంగ్రహం, న్యాయమీమాంసాది షట్ శాస్త్రాలను నేర్చుకొనడం, బాసర అమ్మవారి మీద ‘శారద పదకింకణ్” పదకొండవ ఏటనే వచ్చిన రచన. అక్కడ మహా విద్వాంసులైన బ్రహ్మశ్రీ బొడ్డుపల్లి నరసింహశాస్త్రులు శ్రీమాన్ మరింగంటి విజయసారధిగారల సహకారంతో ‘కాదంబరి’ క్షుణ్ణంగ అధ్యయనం చేశాను. దీని ప్రభావంతోనే ‘మనోరమ’ వెయిపుటల సముద్ర గుప్తుని కాలానికి సంబంధించిన రాజకీయ, సాంఘిక పరిస్థితులను తెలిపీ నవల రాయటం జరిగింది. 1948లో నైజాం వ్యతిరేక కార్యకలాపాలతో రజాకార్లు పాలకుర్తి పాఠశాలను మూసివేశారు. ఆ బాధతో ‘విషాదలహరి’ కావ్యం పూర్తి చేయటం జరిగింది. 1953లో వరంగల్లులోని శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో అన్నగారు గోపాలాచార్యులు చేర్పించారు. మేఘదూతం, కిరాతార్జునీయం శృంగార నైషధం, కాదంబరి లాంటివి పూర్తి చేసుకొని, తదుపరి మద్రాసు విశ్వవిద్యాలయం ద్వారా ‘విద్యాప్రవీణ’ పరీక్ష ఉత్తీర్ణులయ్యాను. ప్రతిభను గుర్తించి పాలకమండలి వారు అదే కళాశాలలో అధ్యాపకునిగా నియమింపబడటం జరిగింది.

మీ రచనలకు ప్రేరణ ఏమిటి?

గృహ వాతావరణం, ఆనాటి సమాజ స్థితిగతులు, ఆర్థిక వ్యవస్థ, నైజాం ప్రభుత్వంపై వ్యతిరేకత, వెరసి నా కవిత్వానికి ఊనికలుగా నిల్చినాయి. ఏడేళ్ళ వయసులోనే అమ్మగారి ప్తోత్సాహం మొదటి కవిత్వం బయల్పడింది. చిన్ననాడు పాలలో నీళ్ళు కలిపి పోసే మల్లక్క సరిజేసే కవిత్వం రాసి మార్గాన్ని మళ్ళించినాను. అనేక సంఘటనలు కూడా రచనలకు శీర్షికలుగా నిలిచినాయి.

మీ అభిమాన కవులు ఎవరు? వారి ప్రభావం మీపై ఎలా ఉంది?

భవభూతి, జగన్నాథ పండితరాయలు, బాణభట్టు, కుంతకుని వక్రోక్షి జీవితం అనే గ్రంథంలో ఆయన పదప్రయోగానికి ముగ్దుడినై బాసర సరస్వతీ దేవి స్తుతిలో ఈ పద్ధతిలో కవితా నిర్మాణం జరిగింది. ప్రాచీన కవుల నుండి వచ్చిన సంప్రదాయాలు, ప్రయోగాలు జీర్ణించుకొని నా రచనలో తాత్త్విక చింతన, సర్వమత సమన్వయం వంటివి విషయపరంగా అనేక అంశాలు కన్పిస్తాయి. రచనలు అన్నీ దైవభక్తి ప్రపూరితాలైనా అంతసూత్రంగా సమాజ చిత్రీకరణ ఉంటుంది. దేవతా స్తుతుల్లోనూ దైవభక్తి – మోక్షసాధన పైకి కన్పించినా దేశభక్తి, స్వాతంత్ర్య సమరభావనలు అంతర్లీనంగా ఉంటాయి.

వర్తమాన సామాజిక అంశాల్ని చెప్పడానికి వైదికమైన సూక్త ప్రక్రియను ఎంచుకోవడానికి విశేష కారణం ఏదైనా ఉందా?

సంస్కృత భాష పురాణేతిహాసాల కథలకు, స్తోత్రాలకు మాత్రమే పరిమతమైతావనే అపప్రథమ తొలగించడానికి, నూతనత్వాన్ని, వాటి రూపాన్ని విషయాన్ని మార్చి ఆధునిక సమాజ చిత్రీకరణకు వినియోగించినాను. ఉదాహరణ లేఖా, మాలికా ప్రక్రియలకు సైతం నవీనత్వాన్ని చేకూరుస్తూ సంస్కృత సాహిత్యానికి పరిచయం చేశాను. ప్రస్తుతం అంతః బహిశ్శత్రువులనేకులు దేశ వినాశనానికి కాచుకొని కూర్చున్న పరిస్థితుల ప్రబోధిస్తూ రాసింది ఉషస్సూక్తమ్ అన్నారు. రూపాయికి ధర్మం వదులుకోవద్దని రూపసూక్తమ్ ద్వారా తెల్సడేసాను. సూక్తాలలోని అంతరార్థం గ్రహించడమే ప్రస్తుతం అవసరంగా భావించి ఈ ప్ర్రకియను ముందుకు తీసుకొని వెళ్ళాను.

భారత జాతి యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి?

ప్రతీ భారతీయుడు కులమతాలకతీతంగా తన దేశాన్ని, దేశ సంపదను సంస్కృతినీ పరిరక్షించాలని, ప్రాచీనవైభవ పునరుద్ధరణకు పూనుకోవాలని అరువది శ్లోకాలతో సాగిందీ ఖండకావ్యం, జాతీయత, జాతీయ సమైక్యత దేశభక్తి. ఈ కావ్యంలోని మూల అంశాలు, భారతీయత అనే భావన ప్రజల నిండా నిండుకొని, దేశ పురోగతి సాధించాలంటే స్వధర్మ కౌశలం, స్వశక్తి యుక్తి తో అందరూ తోడ్పడాలన్నదే దీని సారాంశం. ఈ కావ్యంలో భారతభూమి ఔన్నత్యం ప్రస్తుతించినారు.

రాసకేళి గురించి చెప్పండి.

రాధాకృష్ణులు నాయకులుగా శృంగార పరంగా మాత్రా ఛందస్సులో సాగుతుది రాసకేళి కావ్యం. సంగీత నృత్య రూపకంగా ఆయా ఖండలకు ……. నిర్ణయం చేస్తూ రాయటం జరిగింది. శ్రీ కృష్ణుని యందు గోపికల ప్రేమకు లక్ష్యల క్షణంగా మానవ రూపంలో ఉన్న పరమేశ్వరుని యందు ఐక్యం కావటం ఈ కావ్య పరమార్థం. 108 ఖండికలతో రాసకేళి సాగింది. ప్రతీ ఖండిక యందు ఒక్కొక్క భంగిమను, ఒక్కొక్క లీలను వర్ణించి ప్రదర్శన యోగ్యంగా ఉంచడం జరిగింది. వేణుగాన విశ్వాసాలను తెల్పి సంగీత నాట్య యోగ తాత్త్విక శాస్త్ర సమ్మేళనం కావ్యం. జయదేవుని అష్టపదుల్లాగా అగుపిస్తాయి. అలాగే సంగీత ప్రధానంగా సాగింది సంగీత మాధవమం.

ప్రహేళికలపై చాలా కృషి చేశారు కదా కారణం ఏమిటి?

నేటితరం పిల్లలకు పజిల్స్ అంటే చాలా ఇష్టపడుతారు. అలాగే సంస్కృత భాషలోని పొడుపు కథలు ప్రహేళికలను సేకరించి సంస్కృతభాష చమక్కులను గమ్మత్తులను తెల్సుకొని జీవితానికి అన్వయించుకుంటూ, మేధోశక్తిని పదను పెట్టుకోవడానికి చాలా ఉపకరిస్తాయి. రెండువేల ప్రహేళికలు సేకరించి ఎనిమిది గ్రంథాలుగా ప్రకటించి రెండు భాగాలు మాత్రమే అచ్చులో దొరుకుతాయి. యక్ష ప్రశ్నలలాంటి ప్రహేళికల సేకరించి వాటికి జవాబులు అందజేశాం.

రవీంద్రుని గీతాంజలి అనువాదం చేయటానికి కారణం ఏమిటి?

1954-55 ప్రాంతంలో బెంగాలు నుండి శ్రీ సురేంద్రమోహన్ గారు వరంగల్ కు కాకతీయ శిల్పంపై పరిశోధనకు విచ్చేశారు. వారి ప్రోత్సాహంతోనే బెంగాలులోని విశ్వకవి రవీంద్రనాథ ఠాగోర్ రాసిన గీతాంజలి అనువదించాను. గొప్ప రచనను సంస్కృతీకరించటం ఆనందంగా ఉంది. అయితే ఇది రాసి పక్కన పెడితే అమ్మవారు పాడవకుండా గుళ్ళలో కట్టి జీడి గింజలను వేసి కాపాడిన తల్లి. ఇటీవల చెత్తలోంచి దొరికిన మాణిక్యం ఇది. దీనిని సంస్కృతభాషా నిర్దేశకులు ఆచార్య నీలకంఠంగారి ఆధ్వర్యంలో దీనిని ఇటీవలే ముద్రించాము.

పద్మశ్రీ, మహామహోపాధ్యాయ, బిర్లా ఫౌండేషన్ అవార్డు ఇటీవల అభో – విభో కందాళం పురస్కారం అందుకున్నారు కదా. మీకు ఎలా అనిపించింది?

పురస్కారాలు, ప్రేరణలు. అయితే వీటి కోసం ఎదిరి చూడకుండా పరిశ్రమ చేసుకుంటూ వెళ్ళాను. ఇటీవల అభో-విభో కందాళం పురస్కారంలో ప్రత్యేక సంచికను రచనల విశ్లేషణ రాయించి వీటితోపాటు జీవన సాఫల్య పురస్కారం అందించటఁ వలన ఆనందం కలిగింది. ప్రముఖులు పూర్వ ప్రధానమంత్రి పి.వి.నర్సింహారావుగారు, నాటి గవర్నరు శ్రీ కృష్ణకాంతంగారు నాటి వ్యవసాయ శాఖామాత్యుల శ్రీ జువ్వాడి చొక్కారావుగారి నుండి నేటి తెలంగాణా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరంరావుగారు, ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడుగారలు ప్రోత్సాహాన్నిస్తూ, గ్రంథావిష్కరణలు, సత్కారాలు అందించిన విషయం మరిచిపోలేని అనుభవం. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు అందిఁచి ప్రోత్సాహం అందించడం చాలా సంతోషం.

సర్వవైదిక సంస్థానమ్ స్థాపనలో మీ ఉద్దేశ్యం ఏమిటి?

వేద వాఙ్మయాన్ని తరాలకు అందజేస్తూ, ధర్మాన్ని నిలబెట్టి, సంస్కృతభాషా వికాసానికి దోహదం చేయడం ముఖ్యోద్దేశ్యం. యజ్ఞవరాహ క్షేత్రం కేంద్రంలో ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మనిధిని ఏర్పాటుచేసి వేదపండితులు కవులు, కళాకరులను ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి ప్రతీ సంవత్సరం గత 30 ఏళ్ళుగా పురస్కారాలు అందించటం జరుగుతుంది. అలాగే ఒక సంస్కృతి పండితునికి ప్రతీ సంవత్సరం నా స్వంత ఖర్చులతో 25000/- రూ.లు శాలువా, జ్ఞాపికాతో పురస్కారాలు అందజేస్తున్నాం. గత మూడు వత్సరాలుగా ఇది కొనసాగుతుంది.

కె.ఎస్.అనంతచార్య, కరీంనగర్

9441195765

June 22, 2021 2 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథా పంచకం (చిన్న కథలు)

by Dr. Lakshmanacharyulu M June 22, 2021
written by Dr. Lakshmanacharyulu M

అనువాద కథలు

 

మూలం : నరేంద్ర లాహ (హిందీ)                                                  అనువాదం : డా॥ లక్ష్మణాచార్యులు, మరింగంటి

 

  1. దొరికితేనే దొంగలు

ఓ పెద్ద మనిషి తన కొడుకుని పిలచి ‘హితోపదేశం’ చేస్తూ ` ఒరేయ్‌! జీవితంలో ఏదైనా సాధించి గొప్పవాడివి కావడానికి ప్రయత్నించు. అవిగో! ఆ భవనాలు చూసావా? వాటి యజమానుల్లా నువ్వు కూడా ఏదో ఒకటి చేసి గొప్పవాడివి అవ్వు. సరేనా?’’ అని అడిగాడు.

ఆ కొడుకు తన జులపాల జుట్టు పైకెగరేస్తూ ` ఏం చేయమంటావ్‌?’’ అని అడిగాడు మెల్లగా.

ఆ పెద్దమనిషి వేదాంత ధోరణిలో ` ‘‘కష్టపడు. వీళ్ళంతా రేయింబవళ్ళు కష్టపడ్డారు. ఆఖరి చెమట చుక్కనూ కార్చి, శ్రమచేయడం వల్లనే అంత పెద్ద పెద్ద భవనాలు నిర్మించగలిగారు. నువ్వూ అలాగే కష్టించి పనిచేసి, పెద్ద ఇల్లు ఒకటి నిర్మించు. దానిలో నివసిస్తున్నట్టుగా కలకంటూ ఉండు’’ అని అన్నాడు.

ఆ కొడుకు ఏదో ఆలోచిస్తూ దృఢస్వరంతో ` ‘‘అలాగే నాన్నా!’’ అని అన్నాడు.

అదే రాత్రి ఆ కుర్రాడు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. పోలీసులు వాణ్ణి పట్టుకొని జైల్లో పెట్టారు.

ఈ సంగతి తెలిసి, ఆ పెద్ద మనిషి కంగారుగా వచ్చి పలకరించాడు. ‘‘నాన్నా! నేనైతే సరైన మార్గమే ఎంచుకున్నా కాని నాటైం బాగా లేదు. పట్టుబడి పోయా పెద్ద పెద్ద భవనాల్లో ఉండే బడా బాబులు కూడా ఇదే మార్గం పడతారు. దొరకనివాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే, దొరికినవాళ్లిలా ఊచల వెనక ఉంటారు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర! అంతే!!

  1. మసాలా

శ్రీ బాబూలాల్‌గారు నగరానికి చెందిన పెద్ద విమర్శకుల్లో ఒకరు. ఏ అంశమైనా, ఏ సమస్య ఎదురైనా దాన్ని విమర్శిచడంలో వెనుకాడడు. తప్పులు పట్టడంలో ఎవరైనా సరే, ఆయన తర్వాతే.

ఈ మధ్యనే జరిగిన ఒక సంగతి తీసుకుందాం. ఓ రోజు బాబూలాల్‌గారు తన ఇంటివరండాలో కూర్చుని తీరికగా ‘టీ’ త్రాగుతూ ఉన్నారు. వారితోబాటుగా ఇంకొంతమంది ఇలాంటి విమర్శకులు అక్కడ కూర్చొని ఉన్నారు.

ఇంతలో పక్కింటి హరిగారు అటుగా వచ్చారు పాపం! ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా ఆందోళనగా, విచారంగా ఉన్నారు. మన బాబుగారు ఆయన్ని గమనించి ` ‘ఏమైంది! హరిగారూ? ఏంటలా ఉన్నారు?’ అడిగారు ఆదుర్దాగా.

హరిగారు ఒక్క క్షణం ఆగి, ఆయన ఆదుర్దా పడుతూనే ` ‘ఏం చెప్పమంటారు బాబుగారూ! ఇందాక అలా బజారుకు వెళ్ళా. అక్కడ నా సైకిల్‌ని దొంగలెత్తుకుపోయారు’’ అని అన్నారు.

ఇంకేముంది? మన బాబుగారికి ‘మసాలా’ దొరికింది. ఆయనలోని విమర్శకుడు నిద్రలేచాడు ` ‘‘ఏమిటో! ఈ మధ్య మనుషుల్లో హడావుడి, నిర్లక్ష్యం, అజాగ్రత్తలు ఎక్కువైపోయినయ్‌. అసలు బజార్లో సైకిల్‌ ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టగూడదో తెలీదు. పైగా సైకిల్‌కి తాళం కూడా వేయరు’’ అని అక్షింతల జల్లు కురిపించాడు. ఆయనేమన్నా అనుకుంటాడేమోనని హరిగారు అలాగే తలొంచుకుని నిలబడ్డాడు.

ఇంతలో ఆ దేవుడు ఆయన బాధ గమనించినట్టున్నాడు.  ఇంట్లోంచి బాబుగారి శ్రీమతి గట్టిగా అరిచింది `

‘‘ఇదిగో! అలా బజారుకెళ్ళి కొంచెం కూరగాయలు తీసుకురండి’’ అని అన్నది.

బాబుగారు తన సుపుత్రుణ్ణి చూచి ` అరే! బాబూ! కొంచెం వెళ్ళి నా సైకిల్‌ తీసుకురా!’’ అని అన్నారు.

ఐదు నిముషాలు గడిచాక, ఆయన కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చి, కంగారుగా ` ‘‘నాన్నగారూ! మన సైకిల్‌ ఇంట్లో కనబడడం లేదు. మీరు సరిగ్గా తాళం వేసినట్టు లేదు. ఎవడో దొంగ వచ్చి ఎత్తుకపోయాడు.’’

 

  1. పాపం! బ్రహ్మానందం!

బ్రహ్మానందానికి చాలాకాలం తర్వాత బస్సు ప్రయాణం చేసే అవకాశం వచ్చింది. పాపం! దురదృష్టవశాత్తూ మళ్ళీ మధ్యలోనే సీటు దొరికింది. కిటికీ ప్రక్క రెండు సీట్లు మాత్రమే ఉండే అదృష్టం మాత్రం ఎప్పట్నించో  దొరకడం లేదు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ తన సీట్లో కెళ్ళి కూర్చున్నాడాయన.

‘‘హు! ఏమిటీ! ఆ దేవుడికెందుకో నా మీద కోపం. బెండకాయలా తాను ముదిరిపోతున్నా జీవితయాత్రలో తనకెలాగూ ఒకతోడు ఇవ్వలేదు. ఇక బస్సులోనూ ‘మంచితోడు’ ప్రక్కనే కూర్చునే అదృష్టమూ కలిగించడం లేదు’’ అని అనుకున్నాడు దిగులుగా, దిగాలుగా బ్రహ్మానందం అలా గొణుక్కుంటూనే ఉండగా… ఎప్పుడు పట్టిందో…. అలా నిద్రపట్టింది. పూర్తిగా నిద్రలో కూరుకుపోకముందే….

‘‘నేనిక్కడ కూర్చోవచ్చా?’’ అన్న ఓ మధురమైన స్వరం వినబడగానే దిగ్గున లేచి కూర్చున్నాడు బ్రహ్మానందం.

తనేదో అప్సరసల లోకంలో ఉన్నట్టుగా అనిపించిందతనికి చప్పన కళ్ళు తెరచి చూచాడు.అలా అతన్ని అడిగిన మహిళ గొప్ప అందగత్తె అయితే కాకపోయినా బ్రహ్మానందానికైతే ఎంతో అందంగా కనబడిరది. జీవిత సహచరి కోసం తన అన్వేషణ ఈ బస్సు ప్రయాణంవల్ల పూర్తి అయినట్టనిపించింది. ఉబ్బితబ్బిబ్బై….

అరె… ఎందుక్కూచోకూడదు? ఇది మీ కోసమే…. రండి…. తప్పక కూర్చోండి’’ అని అన్నాడు.

బ్రహ్మానందం ప్రక్కన సీటు ఖాళీగా ఉంది. ఏ కారణంచేతనో దాన్ని రిజర్వ్‌ చేసుకున్నవాడు రాలేదు.

ఆ మహిళ ఆ సీట్లో కూర్చుని ‘హమ్మయ్య’ అని అనుకుంది.

‘అవునూ! ఎక్కడిదాకా మీ ప్రయాణం మేడం?’ అడిగాడు మన బ్రహ్మానందం.

‘గుంటూరు’ సర్‌!’’

‘అరె, ఎంత ఆశ్చర్యం!! నేనూ గుంటూరుకే వెళ్తున్నా!!’

నిజానికి బ్రహ్మానందం వెళ్ళాల్సింది అక్కడికి కాదు, ఇంకా పై ఊరికి.

మెల్లమెల్లగా మనవాడు ఆమెను మాటల్లోకి దింపి, తనను పరిచయం చేసుకుంటూ… ‘‘నా పేరు ఆనందం, బ్రహ్మానందం. మీరు నన్ను బ్రహ్మ లేదా ఆనంద్‌ అని కూడా పిలవవచ్చు.

‘బై ద బై మీ పేరు?’ అడిగాడు బ్రహ్మానందం.

‘సార్‌! నా పేరు మోహిని. కాని మీ పేరులా రెండు ముక్కలు చేసి, ఏదో ఒక ముక్కతో మాత్రం పిలవకండి’’.

బ్రహ్మానందం బ్రహ్మాండంగా నవ్వాడు, పడి పడి నవ్వాడు. పరిచయం పెరిగింది. ఆమె చనువుతో మాటలు కొనసాగించింది. బ్రహ్మానందం మనసు గాలిలో తేలిపోసాగింది. తన జీవన సహచరి ఇక ఈమేనని అనిపించింది. అంతే, గాల్లో తేలిపోసాగాడు. తనకో చిన్న, అందమైన ఇల్లు, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు…ఇలా, ఇలా…నా పేరు ప్రక్క ఆమె పేరు ఎంతో ‘మ్యాచ్‌’ కూడా అయింది.

బస్సు ఒక్క ఉదుటున ఆగింది.  మనవాడి ఊహల దారం పుటుక్కున తెగింది.

శ్రీమతి మోహిని తీయని స్వరంతో `

‘గుంటూరు వచ్చేసిందన్నయ్యా! మీరేంటి? దిగదల్చుకోలేదా? నేనైతే దిగిపోతున్నా. ‘మా వారు’ క్రింద నా కోసం వెయిట్‌ చేస్తున్నారు. బై బై…’’

  1. దయచేసి వెళ్ళిపోండి!

ఆ దుర్ఘటన అందరి గుండెల్నీ పిండేసింది. అలాంటి ప్రమాదాన్ని బహుశా ఎవ్వరూ ఇంతకముందు చూసి ఉండరు. ఒక అరవై సంవత్సరాల మహిళ కారు ప్రమాదంలో తన ప్రాణాలు కోల్పోయింది.

మల్లయ్య సేఠ్‌గారి పుత్ర రత్నం దుందుడుకు స్వభావి. తన కారు అత్యంత వేగంగా నడుపుతాడని పేరు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. వాడి వేగానికి ఆ వృద్ధ మహిళ బలైపోయింది.

ఆ సమయంలో అక్కడికి చేరినవారిలో ఆవేశం కట్టలు తెంచుకున్నా, సేఠ్‌గారి కుమారుడి కారుని ఎవరూ ఆపలేకపోయారు. వాడు కారు ఆపకుండా అలాగే వెళ్ళిపోయాడు. వాళ్ళందరికీ వాడిల్లు తెలుసు కాబట్టి అంతా వెళ్ళి ఆ ఇంటి బయట గుమికూడి సేఠ్‌ కొడుక్కి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు.

అక్కడ వరండాలో సేఠ్‌గారు తన గుమాస్తాతో ఏవో లెక్క పద్దుల గురించి చర్చిస్తున్నారు. ప్రజల గుంపు అక్కడికి వచ్చింది. అందరికన్నా ముందున్న యువకుడి రెండు చేతుల్లో ఆ వృద్ధురాలి శవం ఉంది.

‘‘చూడండి సేఠ్‌! మీ కొడుకు నిర్వాకం! అతి వేగంగా వచ్చి ఈ వృద్ధురాలిని పొట్టన పెట్టుకున్నాడు’’ అని అన్నాడతను.

ఆ గొడవేదో చూడమని సేఠ్‌ ఇంట్లోకి గబగబా వెళ్ళిపోగా, ఆ గుమాస్తా బయటకొచ్చి, ఆ వృద్దురాలి శవాన్ని చూసాడు. చూసి అవాక్కైపోయాడు. ఇంతకీ ఆమె అతని భార్యే. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఏమనుకున్నాడో ఏమో… ఆ గుంపులోని వారిని చూస్తూ `

‘‘చూడండి! ఈ విషయంలో మీరెవరూ సేఠ్‌ని ఏమీ అనొద్దు. ఏమన్నా అన్నారో నా మీదొట్టే. ఎందుకంటే మీరు గట్టిగా పోట్లాడిన మరుక్షణమే నా ఉద్యోగం కాస్తా ఊడిపోతుంది. ఈ ముసలితనంలో నేను తిండిలేక మలమల మాడిపోతాను.  పైగా నాకు పెళ్లికాని ముగ్గురమ్మాయిలున్నారు. ప్రమాదంలో చనిపోయినామె నా భార్యే. కాని ఈ విషయంలో నేను ఈ వయసులో సేఠ్‌తో గొడవపడి, నన్ను, నా కుటుంబ సభ్యుల్ని ఎందుకు బాధ పెట్టాలి? మీ అందరికీ ఓ నమస్కారం. దయచేసి వెళ్ళిపోండి.’’

 

  1. అవసరార్థం

డాక్టర్‌ రఘుకి ఇవాళ తప్పనిసరై కార్లో రాంగ్‌సైడ్‌లో వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఒకరోగి పరిస్థితి చాలా విషమించింది. ఆ రోగి ఇల్లు రోడ్‌కి అటు ప్రక్కన ఉంది. సరైన దారిలో వెళ్తే గనక అరగంట కన్నా ఎక్కువ సమయమే పడుతుంది.

ఇంతలో ఆయన్ని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపేసాడు. కాని అంత తేలికగా కూడా వెంటనే వదిలేసాడు ఓ శాల్యూట్‌ కొట్టి. పైగా, అతన్ని ఎందుకలా వదిలేసావ్‌? అని అడిగిన వ్యక్తితో ` ‘‘చూడు! డాక్టర్‌ అంటే నడిచే దేవుడు’’ అని డాక్టరు రఘుతో కూడా ‘‘మీరు దైవ స్వరూపం సార్‌! మీరు చెప్పే కారణం తప్పక నిజమే అయి ఉంటుంది’’ అని ఆయనకూ విష్‌ చేసాడు.

తర్వాత డాక్టర్‌ రఘుకి దగ్గరగా వచ్చి మెల్లగా ` ‘‘డాక్టర్‌! మా అబ్బాయికి ట్రీట్‌మెంట్‌ మీ హాస్పిటల్‌లోనే మీ పర్యవేక్షణలోనే జరుగుతున్నది. కొంచెం వాడిమీద శ్రద్ధ పెట్టండి’’! అని అన్నాడు.

ఇది జరిగిన ఏడు రోజుల తర్వాత కూడా తిరిగి ఇలాగే జరిగింది. డాక్టర్‌ రఘు మళ్ళీ రాంగ్‌సైడ్‌లో డ్రైవ్‌ చేస్తూ వెళ్తున్నాడు. అదే ట్రాఫిక్‌ పోలీసు ఆయన్ని మళ్ళీ పట్టుకున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆయన డాక్టర్‌గారిని వదల్లేదు. డాక్టర్‌గారిపై చలానా వేసాడు.

‘‘ఆ రోజు సంగతి వేరు. మా అబాయి మీ ‘కేర్‌’లో ఉన్నాడు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మావాడు వేరొక డాక్టర్‌గారి ‘కేర్‌’లో ఉన్నాడు. ఇప్పుడిక మీతో నాకేంటి అవసరం? నేను మీకెందుకు సేవ చేస్తాను సార్‌!’’ అని లౌక్యంగా అన్నాడు.

 

June 22, 2021 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

శతక సాహిత్యంలో… ఓ కొత్త ఒరవడికి శ్రీకారం!

by Senathipathi Dasyam June 22, 2021
written by Senathipathi Dasyam

<—-Burra Venkatesham(I.A.S.)

 

మకుటధారియై తెలుగు సాహిత్యంలోకి.. శతకం ఎప్పుడు వచ్చిందో సాహితీవేత్తలకు తెలుసు.. అప్పటి నుండి ఇప్పటివరకు మెరుగులు దిద్దుకుంటూ వస్తూనే ఉంది. మకుటం తలపై ఉంటుంది. కాని శతకంలో సర్వసాధారణంగా క్రిందనే ఉంటుంది. క్రింద ఉండేవి పాదాలు.. శతకం నిండా పాదాలే ఉంటాయి.. అందులో క్రింది పాదం కాని, ఆ పాదంలో కొంత భాగం కాని మకుటంగా ఉంటుంది. శతకంలో జీవితమ్ ఆవిష్కరింప బడుతుంది. ఎందరో మహానుభావులు తమ జీవితానుభవాన్ని రంగరించి.. శతకాలను మనకు అందించారు. జీవన సత్యాలను అద్భుతమైన రీతిలో ఛందోబద్ధంగా పద్యాలను రూపుదిద్దిన వారున్నారు. ఛందస్సనే సంకెళ్లలో బంధించబడటం వల్ల… నేటి ఆధునిక ప్రపంచానికి తగిన విధంగా శతకాలు రావడం లేదు.. నేటి తరానికి ముఖ్యంగా యువతీ యువకులకు సులభంగా పద్యాల్లోని సారం.. సందేశం అర్థమయ్యే రీతిలో.. ఛందస్సును కాస్త ప్రక్కన పెట్టి… నిఘంటువు సహాయం లేకుండా.. చదవగానే మనసుకు హత్తుకునేలా శతకాలు రావలసి ఉంది.

ఈ క్రమంలోనే… సీనియర్ ఐఏఎస్ అధికారి.. సాహిత్యమంటే మక్కువ చూపే తెలుగు భాషా ప్రేమికులు శ్రీ బుర్రా వెంకటేశం గారు తమ అంతరంగంలో గుట్టుగా, గుట్టగా గూడుకట్టుకున్న భావాలను.. జీవన సత్యాలను.. అక్షరబద్ధం చేస్తూ “జీవన ధన్య శతకం” పేరుతో ఓ గ్రంథాన్ని వెలుగులోకి తేవడం ఆహ్వానింపదగింది.. ఛందస్సుతో పని లేకుండా.. సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ శతకంలో వెంటేశంగారు పద్యాలను పొందుపరిచారు. సదా పరిపాలనలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆయన.. లోకహితం కోసం.. సామాజిక చైతన్యం కోసం.. జన జాగృతికై.. తమ జీవితానుభవాలను ఏర్చి కూర్చి చక్కని పదబంధాలతో పద్యాలను అల్లడం ప్రశంసనీయం.. సార్వజనీన అంశాలకు పెద్దపీట వేస్తూ.. ఓ దార్శనికునిగా ఇప్పటి తరానికే కాదు.. రాబోయే తరాలకు సైతం.. మార్గదర్శకంగా ఉండేందుకు వీలుగా.. తమ లోక పరిశీలనను జోడించి.. మేధస్సును మేళవించి ఇందలి పద్యాలకు జీవం పోశారు. యువతీ యువకులకే కాక అన్ని వయసుల వారికి ఉపయుక్తంగా ఉండేలా తీర్చిదిద్దారు.

తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2017లో నిర్వహింపబడిన ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా క్రియాశీలకంగా నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించిన ఆయనకు స్వయంగా తెలుగులో ఆంగ్లంలో గ్రంథాలను వెలువరించిన అనుభవమూ ఉంది. “సెల్ఫీ ఆఫ్ సక్సెస్” అను విజయం మరియు విజేతల గాథల పుస్తకం… అందరి మన్ననలు పొందింది. ఆ పుస్తకాన్నే “గెలుపు పిలుపు”పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథం తెలుగులో.. ఆంగ్లంలోనూ బహుళ ప్రాచుర్యాన్ని పొందటం విశేషం.. తెలుగు భాష పట్ల అమిత ఆసక్తిని చూపే కవి వెంకటేశం గారు సహజమైన రీతిలో “జీవన ధన్య” శతకాన్ని వెలుగులోకి తెచ్చారు. “సత్యమిదే తెలుసుకో మిత్రమా” మకుటంతో తమ రచనను కొనసాగించారు. నాలుగు పాదాల్లో.. మొదటి రెండు పాదాల్లో కవిగా తాము చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పుతూ.. మూడవ పాదంలో నిర్దేశిత లక్ష్యాన్ని సూటిగా ప్రకటించే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. ఛందస్సు లేకుండానే సహజ శతకానికి తెర లేపారు.

శతక సాహిత్యంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కవి వెంకటేశం గారి మనోఫలకంపై ఎప్పటి నుండో నర్తిస్తున్న ఆ జీవన సత్యాలను ఇందలి పద్యాల్లో నిక్షిప్తం చేశారు. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా’ అనే మకుటంతో…

ఈ శతకంలో నాలుగు భాగాలుగా వివిధ అంశాలపై దృష్టి సారిస్తూ పద్యరచన చేయడం విశేషం..

మొదటి భాగంలో జీవన సత్యాలను.. ఆవిష్కరించారు. రెండో భాగంలో “గెలుపు/ ఆత్మవిశ్వాసం”వంటి అంశాలకు చోటు కల్పించారు. మూడో భాగంలో “జీవన బంధాలు.. జీవన దశలను”, నాల్గో భాగంలో “తాత్విక చింతన దైవ చింతన” వంటి అంశాలను పద్యాల్లో నిక్షిప్తం చేశారు. కవి వెంకటేశం గారి పద్యాల్లో ఆయన ఉత్తమ వ్యక్తిత్వం.. సామాజిక చింతనం.. సున్నిత మనస్తత్వం అడుగడుగున మనకు కానవస్తాయి. నాలుగు భాగాలుగా రూపుదిద్దుకున్న ఈ శతకం మరో విశేషమేమిటంటే… ప్రతి భాగం చివరన ప్రతి పద్యంలోని ఆణిముత్యాల్లాంటి నిర్దేశిత లక్ష్యాలను పొందుపరిచి శతకానికి మరింత శోభను కలిగించారు.

అంతేగాక ప్రతి భాగం చివరన “మీ మదిలోని మీ మాట” శీర్షికను పొందుపరిచి.. పాఠకులు శతక పద్యాలను మరింత ఆసక్తిగా చదవడం కోసం.. చదివిన పద్యాల్లోని సారాన్ని మరొక్కసారి మననం చేసుకుని స్వీయ స్పందనకు అవకాశం కల్పించడం ఓ కొత్త ప్రయోగం.. ‘సత్యమిదే తెలుసుకో మిత్రమా!’ మకుటుంతో సాగే ఇందలి పద్యాలను పరిశీలిద్దాం.

“జీవన సత్యాలు” విభాగంలో కవి యొక్క ఉత్తమ సంస్కారాన్ని వీక్షించగలం.. సామాజిక చైతన్యం కోసం ఆయన పడే ఆరాటాన్ని చూడగలం.. యువతీ యువకులకే కాదు అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా పద్యాలకు జీవం పోశారు.

పుచ్చుకొనడం కోసం పోటీ ఏంటి? ఇవ్వటంలో ఉండాలి కాని? అంటూ పుచ్చుకొనటం దైన్యం.. ఇవ్వటం ధన్యమని మొదటి పద్యంలోనే తేల్చి చెప్పారు. ఇంకా ఇందలి పద్యాల్లో…

లొంగుబాటు లేని ధైర్యం కొరత లేని ధనం వంటిదని… నగుబాటు లేని జీవితం ధన్యమని హితవు పలికారు. శాశ్వత సుఖం ఎంతో ధన్యమైనదని తెలియజెప్పారు.

ఎన్నో భాషలు తెలిసిన పండితుడైనా ఇంటి ఇల్లాలు కంటి భాష చదువలేడని.. లిపి లేని కంటి భాష చదువగల నేర్పు ధన్యమని నిగూఢంగా… బలంగా కవి వెంకటేశం గారు తమ భావ ప్రకటన చేయడంలో సఫలీకృతులైనారు.

రాశి-వాసిల జ్ఞానం ధన్యమని.. పదవికున్న విలువ పద్ధతికి లేదు.. వెదికి మరీ వచ్చి గౌరవిస్తారు పదవిలో.. అయితే.. గౌరవం ఉందని గర్వం పెరగకుంటేనే ధన్యమని విడమరిచి చెప్పారు. విలువలు శాశ్వతమని.. వేషభూషణాలు అశాశ్వతమనే విచక్షణ ధన్యమంటూ మరో పద్యాన్ని రాశారు. చకచక మారే పడతి అంతరంగం మధురిమ ధన్యమంటూ రాసిన పద్యంలో పడతి అంతరంగం సాంతం ఎరుగుట అసాధ్యమని నొక్కి వక్కాణించారు.

ఇంకో పద్యం ద్వారా అందరి నవ్వులో నీ భాగముండాలని హితవు పలికారు. ఎదుగుతూ ఒదుగుతూ గెలుచుటయే ధన్యమనే జీవన సత్యాన్ని మరో పద్యం ద్వారా తెలియజెప్పారు.

ఇలా జీవన సత్యాలను అలతి అలతి పదాలతో మొదటి విభాగంలో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

“గెలుపు | ఆత్మవిశ్వాసం” శీర్షికతో రెండో భాగాన్ని తీర్చిదిద్దారు.

ఓ పద్యంలో…

శక్తివంతమైన సంతకం ఏది?

పెద్ద పదవిదా? గొప్ప పనిదా? లాభాలు తెచ్చేదా?

చరిత్ర సృష్టించేదా? అని ప్రశ్నించుకుంటూ.. కవి వెంకటేశం గారు.. గెలుపు ఫలాల పంపకం చేసే సంతకం ధన్యమని తేల్చి చెప్పారు.

నీలోనే నేనున్నానని పిలుస్తుంది గెలుపు… ఆ పిలుపు వైపు మలుపు నీ చూపు.. ఆ దిశగా పయనించే జీవితం ధన్యమని హితవు పలికారు.

ఇంకొక పద్యంలో మలుపు లేని దారి ఉండదని.. వియోగం లేని సహయోగం లేదని గెలుపు ఓటముల సంయోగ జీవనం ధన్యమని అభిప్రాయపడ్డారు.

యువతీ యువకులకు చక్కని మార్గదర్శనం చేస్తూ ఈ విభాగంలో పొందుపరచబడిన పద్యాలు ప్రేరణ దాయకంగా కొలువుదీరాయి.

భయం.. నీలోని బలహీనత.. అభయం నీవు ప్రకటించే బలమని సూచించిన తీరు బాగుంది.

ఇలా రెండో విభాగంలోని పద్యాల ద్వారా నిరంతర శ్రమతో.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశావహ దృక్పథంతో ముందుకు సాగి గెలుపు సాధించాలని సూచించారు.

ధనమే జీవనం కాదని.. జీవితంలో భాగమని, ప్రేమ లేని ధనం విలువ శూన్యమని విడమరిచి చెబుతూ.. మూడో విభాగంలో “జీవన సంబంధాలు జీవన దశలు” శీర్షికతో పద్యాలను రాసి బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు ఎలా పదిల పరుచుకోవాలో వివరించారు.

తల్లిదండ్రుల పట్ల.. స్నేహితుల పట్ల ప్రేమానురాగాలతో వ్యవహరించాలన్న అర్థం ధ్వనించేలా.. ఇందలి పద్యాలకు జీవం పోశారు. మలి సంధ్యలో ధనం ముఖ్యం కాదని.. స్థిరపడిన సంతానం.., బాధించని అనారోగ్యం.. మనస్సుకిష్టమైన పని ధన్యమని అభిప్రాయపడ్డారు.

జీవన దశల్లోని అనుభూతులను అనుభవాలను అక్షరాల్లో నిక్షిప్తం చేస్తూ.. పసితనమున తప్పటడుగులు అద్భుతమని.. పడుచుతనమున జీవన యానపు తడబాటులు.. ముసలితనమున స్థిరచిత్తం.. నిశ్చలత్వం ధన్యమని సూచించారు. మాతృత్వపు మధురిమలో బాల్యం.. రూపసుల మోహంలో యౌవనం.. కాసుల వేటలో మిగతా జీవితం.. అంటూ జీవన సరిగమలను మరో పద్యంలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇంకా ఈ మూడో విభాగంలో పసిపాపల నవ్వుల పువ్వులను, జవనుల చిరునవ్వులను – మలి వయసులోని బోసి నవ్వులను వివరిస్తూ.. కోపతాపాలను కరిగించుట శ్రేయస్కరమని తెలిపారు.

గడచిన గతం బాల్యం….

నేటి జీవన సౌధ పునాది కూడా బాల్యమని..

రేపటి మలిసంధ్య జ్ఞాపకం బాల్యం అదే ధన్యమని విడమరిచి వివరించారు.

కవి వెంకటేశం గారు ఇంకా ఈ విభాగంలో ప్రాణమున్నంతవరకు తరగని మాతృప్రేమను.. ఊపిరున్నంత వరకు సరిహద్దులో దేశ ప్రేమను ప్రస్తావిస్తూ ప్రేమ స్వరూపాలు ఎన్నైనా, ప్రేమ శాశ్వతం ధన్యమని తెలియ జెప్పారు. ఇలా జీవన యానంలోని వివిధ దశలను కవి తమ అనుభవాలను జోడించి జీవన సత్యాలను ఆవిష్కరించి స్ఫూర్తిని నింపేలా మూడో విభాగంలో పద్యాలకు జీవం పోశారు.

ఇక చివరి నాలుగో విభాగంలో “తాత్విక చింతన / దైవ చింతన” శీర్షికతో పద్యాలను పొందుపరిచి.. ఆనందం మన సహజ స్వభావమని.. దుఃఖం మనం తెచ్చి పెట్టుకున్న అనుభవమని..  కలిమి లేముల విచక్షణ మరిస్తే ధన్యమని అభిప్రాయపడ్డారు.

నదీ ప్రవాహంలా.. సాగే జీవన పయనమే ధన్యమని.. మరో పద్యంలో పేర్కొన్నారు.

కాలం – జ్ఞాపకాన్ని ఇచ్చిందా? జ్ఞాపకం కాలాన్నీ గుర్తుకు తెచ్చిందా? అంటూ ప్రశ్నించుకుంటూనే కవి కాలం కొన్ని జ్ఞాపకాలను దాచేస్తుందని….. జ్ఞాపకం కొంతసేపు కాలాన్ని బంధించేస్తుంది… అదే జీవన ధన్యమని పేర్కొన్నారు.

మరికొన్ని పద్యాల్లో.. భిన్నత్వంలో ఏకత్వం.. ఆద్యంతం లేని ప్రేమ… అంతుచిక్కని జీవన సంక్లిష్టత.. భ్రాంతి జీవన వైరుధ్యాలను కవి వెంకటేశం గారు తాత్త్వికతతో సందేశాత్మకంగా ఆవిష్కరించారు.

ఇంకా.. భావనా శక్తి విస్తరణ గురించి.. మనకు మనం చిత్రించే కళాఖండం గురించి.. కవి ప్రకటించిన భావాలు ప్రేరణదాయకంగా ఉన్నాయి.. ఇంకో పద్యం ద్వారా కావాలన్న కోరిక.. ఇంతేనా అన్న నిరాశ అంతా నాదే అన్నీ నాకే అన్న అత్యాశ.. పరులదీ తనకే అన్న దురాశ వదులుకోవాలని సూచించారు.

ఇంద్రియాలకతీతంగా మనోనేత్ర సందర్శన భాగ్యమని.. పరమాత్మ అలౌకిక సౌందర్యం ధన్యమని మరొక పద్యంలో వివరించిన తీరు బాగుంది. ప్రకృతి దైవ చింతన తుదకు శరణ్యం అనుటే ధన్యమని తేల్చి చెప్పారు.

ఇలా ఈ పుస్తకంలోని అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. ప్రతి పద్యం ఓ ఆణిముత్యంలా రూపుదిద్దుకుంది. జీవన సత్యాన్ని ప్రకటించేలా కొలువుదీరింది. కవి వెంకటేశం గారు ప్రకటించిన భావాలన్నీ గొప్ప సందేశాలను మోసుకొచ్చాయి. సామాజిక చైతన్యానికి మధుర గుళికలుగా ఉపయోగపడేలా ఉన్నాయి. ఈ సందర్భంగా కవి వెంకటేశం గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

– దాస్యం సేనాధిపతి

June 22, 2021 3 comments
2 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

 రామాయణం మీద చిన్నారులచే ఉపన్యాస పోటీలు.

by Krishna Kumari Yagnambhatt June 22, 2021
written by Krishna Kumari Yagnambhatt

నిర్వహణ : డా.వై.కృష్ణ కుమారి       

             తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో  బాల బాలిక లకు జరిగిన రామాయణం మీద ఉపన్యాస పోటీలు అత్యంత విలక్షణమైనవి అని సాహిత్య వేత్తలచే కొనియాడబడిన ఈ  కార్య క్రమం గురించి ఒక మాట.

చిన్నారులలో భారత దేశం ,సంస్కృతి, చరిత్ర, సంస్కారాలు, పండుగలు, ఉత్సవాలు, దేవాలయాలు, సామాజిక వ్యవస్థ మొదలైన వాటి గురించి అవగాహన కల్పించాలి అన్న సంకల్పంతో ప్రారంభించిన పోటీలు ఇవి. నేటి చదువుల వల్ల చిన్నారులలో అటు చదువు పట్ల గాని, ఇటు  దేశం పట్ల గాని ఏ రకమైన ఆసక్తి కల్గడం లేదు. మార్కుల మీద ఉన్న దృష్టి  చదువుల లోని మర్మం మీద ఉండడం లేదు. మొక్కుబడిగా మారింది నేటి విద్యా విధానం.

పెద్దలకి క్షణం తీరిక లేని ఉద్యోగాలు.ఉమ్మడి కుటుంబాలు కరవైన ఈ కాలంలో చిన్నారులకు దేశ సంస్కృతి వివరించడం, వాళ్ళను సంస్కారంగల దేశభక్తులుగా చేయగల వాతావరణం ఇంటిలో కల్పించడం దాదాపుగా మృగమై  పోయింది. ప్రతీ వారు వారిదైన పరిధిలో  ఆగమ్యంగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిన్నారుల బాల్యం ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి గడ్డ కట్టుకొని పోతున్నది.శారీరిక మానసిక ఎదుగుదల పోషణ రహితమై ప్రకటనలకు పరిమితమైంది . చిన్నారుల  జీవితాన్ని తప్పు దారిలో నడిపించడానికి  సిద్ధంగా ఉన్నటి. వి లు, సినిమాలు, విచక్షణ రహిత యాంత్రిక మయ ఆటలు   మాత్రం  తమ పాత్రను ఇతోధికంగా పోషిస్తున్నాయి. ఈ పరిస్థితి నాకు చాలా ఆందోళన కలిగించింది. విజ్ఞానవంతులు, సాహితీ వేత్తలు, పండితులు, అవధానులు , ప్రవచన కారులు మొదలైన  ఎందరో మహానుభావులు సాహితీ వ్యవసాయం చేస్తున్నారు భారతంలో ,విదేశంలో కూడా. కానీ, ఆ విజ్ఞానం చిన్నారులకి అందుతున్నదా ? వీరి ఉపన్యాసాలు  చిన్నారులను ప్రభావితం చేస్తున్నాయా? ఒకవేళ లేదు అన్న సమాధానం వస్తే మాత్రం దానికి  మనమందరం బాధ్యత వహించాలి. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండా పిల్లలకి దేశం పట్ల, సంస్కృతి పట్ల  అవగాహన లేదు అని అనే నైతికత మనకు లేదు. ఈ మేధోమధనమే నేటి ఈ పోటీలకు పునాది అయింది. ఉగ్గుపాలతో  నేర్పించే వయస్సులో చేయని పనిని కనీసం ఇప్పుడైనా మొదలు పెడదామని  చేసిన  ప్రయత్నం ఇది. చిన్నారుల భవిష్యత్తు ఆగమ్యంగా మారుతున్న ఈ తరుణంలో వచ్చిన ఒక ఆశాకిరణం ఈ ఆలోచన. మంచికో చెడుకో గాని అనుకోకుండా దొరికిన ఈ మహమ్మారి కాలాన్ని సద్వినియోగ పరుద్దామని , బాలలలో  దేశం గురించి,సంస్కృతి గురించి సరియైన కోణంలో ఆలోచింప చేసే ప్రయత్నం చేద్దామని ఈ ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేసాను.  మొదలు పెట్టినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు.తొలి ప్రయత్నంగా  ఉగాది సందర్భంగా వారం రోజుల పాటు  బాలలకు కవి సమ్మేళనం నిర్వహించాను.. అనూహ్యంగా వందకు పైగా బాలలు వచ్చారు.  ఆ వయస్సు చిన్నారులు కవిత్వం చెప్పగలరని  అసలు ఊహించలేదు. ఆ  కార్యక్రమం  చాలా విజయవంతం అయ్యింది. కొంత వెన్నుదన్నుగా ఉంటే  బాలలు అద్భుతాలు చేయగలరు అన్న స్పూర్తి తో రామాయణంలో నాకు నచ్చిన పాత్ర  అన్న శీర్షికతో  6-10 తరగతి విద్యార్థుల కి  ఉపన్యాస పోటీ పెట్టాను.. దాదాపుగా 400 మంది చిన్నారులు వచ్చారు. కేవలం రావడమే గాదు, వారికి నచ్చిన పాత్ర పై వారి విశ్లేషణను  అత్యంత ఆసక్తికరంగా వివరించారు. ఇతిహాసాలలో వారికి గల ప్రవేశానికి చాలా సంతోషమనిపించింది. చిన్నారులకు ప్రస్తుతం కావలసినది చేయూత. దానిని అందిస్తే ఆ చిన్నారులు అడుగు ముందుకు వేయడానికి  సిద్ధంగా ఉన్నారని అర్థమై, ఆత్మ విశ్వాసంతో అడుగు ముందుకు వేయవచ్చునని అనిపించింది.  మిత్రులు సహకరించారు. సలహాలు ఇచ్చారు. పెద్దలు దిశానిర్దేశం చేశారు.

ఈ పోటీల వలన చిన్నారులకు మన దేశం గురించి, ఇతిహాసాల గురించి, చరిత్ర గురించి తెలిసే అవకాశం ఉంది. అంతే  కాదు, వక్తృత్వ కళలో ఆరితేర  గలరు కూడా.  మాతృ భాషలో చక్కని ,చిక్కని పద సంపద వారి స్వంత మవుతుంది.  మే  నెలలో ప్రతీ శనివారం ,ఆదివారం ఈ పోటీలు జరిగాయి. పాల్గొన్న చిన్నారులందరికి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. విజేతల చేత మరొక్కసారి అదే అంశం చెప్పించి వీడియో తీసి యూ ట్యూబ్ లో పెట్టడం జరిగింది. తరంగిణి ఆనే ఛానల్  లో  వీరి చిరు ఉపన్యాసాలు వినవచ్చును.   వచ్చేనెల మహాభారతం మీద ఇదే విధంగా పోటీలు జరుగుతాయి. పోటీలు తిలకించిన పలువురు  సాహిత్య వేత్తలు  ఇదొక  ఉద్యమం లాగా ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు.

అమెరికా  వాస్తవ్యులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్యమణ్యం గారు ఈ  కార్యక్రమం గురించి  వినగానే వెంటనే  తమ తరపున  విజేతలైన  చిన్నారులకు నగదు బహుమతిని ప్రకటించారు.వారి సూచన మేరకు విజేతలకు నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది కూడా. సుబ్రహ్మణ్యం గారి సహృదయానికి  వినమ్ర ప్రణమాలు. బాలలను ఉత్సాహ పరచాలన్న ఉద్దేశ్యంతో ప్రధమ, ద్వీతీయ. తృతీయ నగదు బహుమతులే  కాక ప్రోత్సాహక నగదు బహుమతులు కూడా చిన్నారులకు ఇవ్వడం జరిగింది. శ్రీ  సుబ్రహ్మణ్యం గారి ప్రోత్సాహం  చిన్నారులలోనే గాక కార్యకర్తలలో కూడా ఉత్సాహాన్ని నింపింది. వారికి మరొకసారి  కృతజ్ఞతలు.

యువభారతి తమ ప్రచురణలలోచిన్నారులకు ఉపయోగపడే  కొన్ని పుస్తకాలను విజేతలైన  చిన్నారులకు బహుకరించింది.  రాబోయే కాలంలో ఆయా పుస్తకాలు వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతాయి.

మయూఖ సంపాదకురాలు శ్రీమతి కొండపల్లి నీహారిణి  గారు ఈ కార్యక్రమం గురించి వినగానే ఆ చిన్నారులచే వ్యాసాలు రాయించి ఇస్తే తమ పత్రికలో వేసుకుంటామని హామీ ఇచ్చారు. విజేతలచే చిన్న వ్యాసం రాయించి వారికి పంపడం జరిగింది. వినూతన మైన ఈ ఆలోచన మా విద్యార్థులలో చాలాఉత్సాహాన్ని నింపింది. ఈ నూతన వరవడికి  శ్రీకారం చుట్టిన కొండపల్లి నీహారిణి గారికి మా సాహిత్య కుటుంబం  ఎంతో ఋణ పడి ఉంది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.   మా చిన్నారుల వ్యాసాలు చదివి ,ఆ వయస్సులో వారికి రామాయణం పట్ల గల ఆసక్తిని, అవగాహనను  ఆశీర్వదించండి.

మీ ముందు చిన్నారుల వ్యాసాలు ఉన్నాయి . న్యాయ నిర్ణేతలు మీరే.

******************************************************************

పేరు : మౌక్తిక తటపర్తి 

తరగతి  : 10

పాఠశాల : సారథి స్కూల్

నగరం : హైదరాబాద్

పాత్ర : మంథర

చరిత్రలో కొందరి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే పైకి కనిపించే వారి స్వభావ స్వరూపాలు, ఆంతరంగిక ఆలోచనలు విభిన్నమై అర్థంకాని వ్యత్యాసంతో ఉంటాయి. రామాయణంలో అటువంటి గుణగాలు కలిగిన వ్యక్తి మంథర. తాను నిలువెత్తు చెడుకు ప్రతిరూపంగా నిలిచి లోక కళ్యాణానికి ముఖ్య హేతువయ్యింది.

దశరథుని భార్య అయిన కైకేయితో పుట్టింటినించి వచ్చిన అరణపుదాసి మంథర. కైకేయికి మంథర అంటే వల్లమాలిన అభిమానం. మంథర కైకేయిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. వృద్ధురాలయిన మంథర కైకేయితో చనువుగా ఉంటూ, ఆమెకు అవసరమైనప్పుడు సలహాలిస్తూ, తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది. దుర్బోధలు చేయడానికి రామాయణంలో మంథర పాత్ర గొప్పగా రాణించింది. ఆమె గూనిదైనా గొప్ప మాటకారి. కాబట్టే తాను ప్రాణప్రదంగా పెంచుకున్న శ్రీరాముణ్ణి అడవులపాలు చేసే విధంగా కైకేయికి నూరిపోసింది.

శ్రీరాముని పట్టాభిషేకం జరగబోతున్నదన్న వార్త విని అయోధ్యా నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంథర కైకేయి దగ్గరకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. ఆ శుభవార్త వింటూనే కైకేయి ఎంతో ఆనందించింది. తన మెడలోని ముత్యాలహారాన్ని మంథరకి బహూకరించింది.  భరతునికన్నామిన్నగా తాను ఎంతో ప్రేమించే రామయ్యకు పట్టాభిషేకం జరుగుతున్నదన్న వార్తకి ఎంతో మురిసిపోయింది. అప్పుడు మంథర, రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతోపాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుందికానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులపాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. దీనికి మంథర ఒక ఉపాయం చెప్పింది. గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొమ్మని సూచించింది మంథర. మొదటివరంగా భరతుని పట్టాభిషేకం, రెండవ వరంగా శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపమని కోరమన్నది.

ఇలా మంథర శ్రీరామ వనవాసానికి దోహదకారి అయ్యింది. మంథర దుర్భోదలు రామావతార ప్రయోజనం కలిగించాయి. రావణవధకు ఉపకరించాయి. ఋషులను సేవించడానికి అనేకమంది రాక్షసులను సంహరించడానికి రామునికి తోడ్పడ్డాయి. చాలా సంఘటనల్లో అల్ప పాత్రల సృష్టి ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయన్న దానికి మంథర వృత్తాంతమే నిదర్శనం. అయోధ్య కాండలో ఒక చిన్న పాత్రలో కనిపించే మంథర, రామాయణ కథను నడిపించే సంపూర్ణ పాత్ర అయ్యింది.

******************************************************************

పేరు : బి. చైతన్య కృష్ణా

తరగతి  : 10

పాఠశాల : కేంద్రీయ విద్యాలయ

నగరం : తెనాలి

పాత్ర : విశ్వామిత్ర

విశ్వామిత్రులవారి పేరు తెలియనివారు ఉండరు. రామాయణంలో కూడా వీరు మహత్తరమైన పాత్రను పోషించారు. రామాయణంలో విశ్వామిత్రులవారు అయోధ్యకు రాకుమారులైన రామ – లక్ష్మణులను యజ్ఞరక్షణకై తీసుకని వెళ్ళారు. అక్కడ రాకుమారులకు తమ సంపూర్ణ జ్ఞానాన్ని దేవాస్త్రాలను గురించి చక్కగా వివరించి బల – అతిబల వంటి పవిత్రమైన మంత్రాలను కూడా బోధించారు. అంతేకాక అసురులైన తాటకి మారీచ సుబాహు వంటి రాక్షసులను ఎలా సంహరించాలో కూడా నేర్పారు. అంతేకాకుండా శివ ధనుస్సు గురించి తెలిపి సీతాదేవి స్వయంవరానికి తీసుకొని వెళ్ళి సీతారాముల కళ్యాణం జరగడానికి ప్రధానపాత్ర వహించారు.

అసలు విశ్వామిత్రులవారు మహర్షి కాక ముందు ఒక రాజు అప్పుడు ఆయన పేరు కౌశికుడు. అయితే వశిష్ఠులవారితో జరిగిన చిన్న యుద్ధం వలన అస్త్రబలం కంటే దైవబలం చాలా గొప్పదని తెలుసుకొని అలాంటి దైవానుగ్రహం తపస్సును ఆచరించినప్పుడు లభ్యం అవుతుందని గ్రహించి కొన్ని సంవత్సరాల తరపడి తపస్సు చేసి చివరకు బ్రహ్మర్షిగా మారారు.

ఇంకా చెప్పాలంటే బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి కోపం చాలా ఎక్కువ, ఎప్పుడూ వారికి ముక్కు మీద కోపం ఉండేది. అందరూ వారి కోపానికి భయపడేవారు. కానీ మహర్షి ఎంత కోమి ఉన్నావారు పేరుకి తగ్గట్లు విశ్వానికి మిత్రునివలే విశ్వ –శాంతి కి ప్రపంచ శ్రేయస్సుకు పరితపించెవారు. అంతేకాకుండా వారు బాగా ఆలోచిఁచి కలియుగంలో మనుష్యులు యజ్ఞ – యాగాలు చేయలేరని తలచి మనందరి శ్రేయస్సు కోసం గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు.

“ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్”

****************************************************************************************************************

పేరు : గిరి ఋతిక

తరగతి  : 10

పాఠశాల : సారథి పాఠశాల

పాత్ర : మహా పతివ్రత అహల్య

పెద్దలందరికీ నా నమస్కారములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు నా నమస్సుమాంజలులు – నా పేరు గిరి ఋతిక. నేను పదవతరగతి సారథి పాఠశాలలో చదువుతున్నాను. రామాయణంలోని ముఖ్యపాత్రల్లో ఒకరైన అహల్యను గురించి చెప్పాను.

అహల్య అనే పేరు వినగానే గౌతమ ముని శాపంతో ఆమె రాయిగా మారి, రాముడి పాద ధూళి సోకగానే తిరిగి స్త్రీగా మారిందనే విషయమే స్ఫూరణకు వస్తుంది. కానీ అహల్య వృత్తాంతం భిన్నమైనది.

అహల్య బ్రహ్మ మానస పుత్రిక – అహల్య అంటే అత్యంత సౌందర్యవతి, ఎలాంటి వంకరలేని స్త్రీ అని అర్థం. దేవతలందరూ ఆమెను పరియమాడాలనుకుంటారు. అప్పుడు బ్మహ్మ, త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులని ప్రకటించాడు. దీంతో తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చిన ఇంద్రుడు అహల్యను తనకు ఇచ్చి వివాహం చెయ్యమని కోరుతాడు. అదే సమయంలో నారుదుడు వచ్చి, ఇంద్రుడికంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టివచ్చాడని చెబుతాడు. అదెలాగా అని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితో  – గౌతముడు తన దైనందిన పూజలో బాగముగా గోవుచుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని అలా ఒకరోజు ప్రదక్షిణలు చేస్తుండగా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గోప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడంతో సమానమని అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందని చెబుతాడు. కాబట్టి అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేసాడు.

అపార తపశ్శక్తి, మేధాశక్తితో ఇంద్రపదవికి కావాల్సిన సర్వవిజ్ఞానం గౌతముడు పొందాక, ఆయన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఒక పథకం వేసాడు. అందుకు గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు అహల్య చెందకు వస్తాడు. అలా వచ్చింది ఇంద్రుడేనని తన పాతివ్రత్య బలంతో అహల్య గ్రహించింది. అప్పుడు సత్యం బోధపడిన మునిపత్ని ఇంద్రుణ్ణి వెంటనే అక్కడ నుండి వెళ్ళి పొమ్మని వేడుకుంటుంది. కానీ ఈ లోగ అక్కడకు వచ్చిన గౌతముడు పొరబడి, ఆవేశంలో ఇద్దరినీ శపించాడు. ఇంద్రుడికి దూరం చేశాడు మరియు శరీరమంతా కళ్ళు మొలుచునట్లుగా శపించాడు. “వేలాది సంవత్సరాలు నీవు అన్న పానాదులు లేకుండా వాయుభక్షణతో తపిస్తూ ఈ ఆశ్రమం నందే ఉంటావు. భస్మశాయినిపై ఎవరికీ కనపడకుండా నీలో నీవు కుమిలిపోతూ ఉంటావు. దశరథ నందనుడైన శ్రీరాముడు ఇక్కడకు వచ్చినప్పుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకినంతనే నీవు పవిత్రురాలివవుతావు. ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తరువాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు” అని అహల్యను గౌతముడు శపించి హిమాలయాలకు వెళ్ళపోతాడు. గౌతముడు చెప్పినట్లుగానే త్రేతాయుగంలో శ్రీరాముడు తమ గురువైన విశ్వామిత్రుడు, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి తాటకను సంహరించిన తరువాత మిథిలా నాగరాధీశుడైన జనక మహారాజుని సందర్శించడానికి వెళ్ళే సందర్భంలో, మిథిలకు సమీపంలో ఉన్న ఒక పురాతన ఆశ్రమాన్ని చూస్తాడు రాముడు. ఈ ఆశ్రమం ఎవరిదీ ఇక్కడ ఎవరుంటారు? అని విశ్వామిత్రుణ్ణి ఆసక్తిగా అడిగాడు రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు అహల్య ఉదంతాన్ని చెపుతాడు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి గౌతమముని ఆ్రశమంలోకి ప్రవేశిస్తాడు.  శ్రీరాముని పాదదర్శనమైనంతేనే అహల్యకు శాపవిముక్తి కలిగింది. ఆమె తన భర్త చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ రామలక్ష్మణుల పాదాలకు నమస్కరిస్తుంది. అతిథి మర్యాదలు అయినా తరువాత రాముడి రాకను గ్రహించిన గౌతముడు అక్కడకు చేరుకొని అహల్యా సమేతుడై శ్రీరాముణ్ణి సేవిస్తాడు. “అహల్యా , ద్రౌపదీ సీతా తారా మండోదరి తథా పంచకన్యా స్మరేన్నిత్యం మహా పాతక నాశనం”. అంటే అహల్య, ద్రౌపదీ, సీత, తార మరియు మండోదరి జీవితంలో ఎన్నో కష్టాల కోర్చి పంచకన్యలుగా మారారని మరియు ఈ అయిదు మహాపాతి వ్రతులను రోజూ తలుచుకుంటే మన పాపాలు తొలగిపోతాయని అర్థం. ఈ శ్లోకంలో ద్రౌపది తప్ప తక్కిన నలుగురు రామాయంకు చెందినవారే! అహల్య తన పాతివ్రత్యంతో, పవిత్రతతో పంచకన్యల్లో మూడవ స్థానం సంపాదించుకోగలిగింది. వాల్మీకీ రామాయణం, రంగనాథ రామాయణం మరియు అనేక రామాయణాలలో అహల్య వృత్తాంతం వేరుగా ఉన్నప్పటికీ, వాటి సారాంశం అహల్య పాతివ్రత్యం గురించి, పవిత్రతను గురించే చెపుతాయి.

******************************************************************************************************************

పేరు : సుధాత్రి వాల్మీకం

తరగతి  : 10

పాఠశాల : గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల

పాత్ర : సుమిత్ర

నా పేరు సుధాత్రి వాల్మీకం. నేను గీతాంజలి దేవాశ్రయ్ పాఠశాల, సికింద్రాబాదంలో పదవ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారి పేరు వి.సునీల్ కుమార్ మరియు మా అమ్మగారి పేరు వి.స్రవంతి.

జాతీయ సాహితీ పరిషత్తు నిర్వహించిన వక్తృత్వ కార్యక్రమంలో  “రామాయణం – వ్యక్తుల పాత్రలు” అనే అంశంపై రామాయణములో నేను ఎంచుకున్న పాత్ర సుమిత్ర మాత….

సుమిత్ర చలించని దీపకాంతి లాంటిది. తను కాశీ రాజ్య రాకుమారి… దశరథుని రెండవ భార్య. లక్ష్మణ, శతృఘ్నల తల్లిగారు.

విన్రమత, శ్రద్ధ, దృఢత్వం, నిష్టత, ఓర్పు, నిశ్చల స్వభావం ఇవన్నీ సుమిత్ర మాత సుగుణాలు… ఇంకా చెప్పాలంటే తన పేరులోనే వ్యక్తిత్వం అంతా మనకు అవగతం అవుతుంది. సు + మిత్ర అంటే మంచి స్వభావం కలది. తను అందరికీ మంచి బోధించేది తోడికోడళ్ళ పట్ల సమభావంతో మెలగి ఎల్లవేళలా మౌనంగా ఉండేది. కౌసల్య చెప్పిన మాట తనకు వేదం…. లా భావించేది. బాల్యం నుంచే అలవరచుకున్న మంచి గుణములు, మౌనంగా ఉండి చురుగ్గా ఉండటం. తన పిల్లల మీదే కాకుండా రాముడు, భరతునిపై కూడా సమ వాత్సల్యం చూపేది. ఆ కుటుంబంలో అందరినీ కలుపుకుంటూ, చక్రాల మధ్య ఇరుసు లాగా ఒక ముఖ్యపాత్ర వహించేది. దశరథుడు ఎంత కిష్టమైన సమస్య వచ్చినా సుమిత్రను సంప్రదించేవారు. సుమిత్ర మంచి గ్రహణశీలి ఇంకనూ చాలాముందు చూపు గలది. రామలక్ష్మణ భరత శతృఘ్నలు లోక కల్యాణం కొరకై జన్మించారని ముందే గ్రహించింది. నొప్పించక తానొవ్వక ఉండే మనస్తత్వం ఆమె వ్యక్తిత్వానికి పూర్తి భిన్నంగా ఉండేది. రాముడు వనవాసానికి వెళ్తున్నాడని తెలిసి కౌసల్యా దేవి బాధలో ఉన్నప్పుడు ఓదార్చి ధైర్యం చెప్పింది. లక్ష్మణుడు తాను కూడా రాముని వెంట వనవాసానికి వెళ్తాను అన్నప్పుడు, సౌమిత్రిని ఆశీర్వదిస్తూ ఇలా అన్నది.

‘రామ మశరథం విది, మామ్ విది జనకాత్మజా

అయోధ్య అటవిం విద్ధి, గచ్చ తాత యధా సుఖం’

అంటే రాముడిని తండ్రిలా, సీతమ్మను తల్లి లా, అడవిని అయోధ్య లా భావించి అన్నా వదినలకు సేవ చేయాలని చెప్పింది. ఇంతటి సుగుణవతి, త్యాగనిరతి కలిగిన సుమిత్ర మాతకు నా వందనములు. ఇన్ని మంచి గుణములు ఉండి, సౌమ్యానికి మారుపేరుగా ఉండే సుమిత్ర ఆదర్శ మాతగా, పత్నిగా నిలిచింది.

చివరిగా సుమిత్ర జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. మొదటిది సాధ్యమైనంత మౌనంగా ఉండడం… ఇది మనకు తెలిసిందే. అవసరమైనంత వరకే మాట్లాడటం, మిగతాది చేతల్లో చూపించడం అనే లక్షణం చాలా మంచిది. అదే అవసరం కూడాను. రెండవది ఓర్పు కలిగి ఉండటం. ఓపిక అనేది ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం. ఓపికతో చేసే ప్రతి పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇదే కాకుండా రామాయణంలోని ప్రతి ఒక్కరి పాత్ర మన జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పుతుంది. రామాయణంలో సుమిత్రదేవి వంటి పుణ్యమూర్తి గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు… శుభం భూయాత్…!!!

******************************************************************************************************************

పేరు : రొంపిచర్ల ఖ్యాతి శ్రీ

తరగతి : పదవతరగతి

పాఠశాల : ఏ.ఏ.ఎన్.ఎం.అండ్ వి.వి.ఆర్.ఎస్.ఇంగ్లీష్, మీడియం, హైస్కూల్, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్

పాత్ర పేరు : తార

శ్రీ గురుభ్యోన్నమః సభకు నమస్కారం. నా పేరు రొంపిచర్ల ఖ్యాతిశ్రీ. నేను ఏ.ఏ.ఎం. అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్.స్కూల్ గుడ్లవలేరు. విన్నకోట గ్రామం కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. నేనిప్పుడు రామాయణంలోని తార పాత్రను గురించి చెప్పదలుచుకున్నాను.

మనిషి ఎక్కడ ఎలా ప్రవర్తిఁచాలో, ధర్మాన్ని ఎలా అనుసరించాలో ధర్మాన్ని పట్టుకున్నవారు ఎంత గొప్పవారు అవుతారో యుగాలు మారినా శ్రీరామచంద్రమూర్తి జీవిత వృత్తాంతం నేటికి పసిపిల్లలు కూడా తమ తల్లుల చేత రామాయణ కథగా వినిపించబడుతోంది. అందులోని పాత్రలు స్వభావాలు నేటి మానవాళికి మచ్చుతునకలు. రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః అనగా రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్.

కిష్కింధకు వానర రాజైన మహాబలవంతుని వాలి భార్య తార. బృహస్పతి కుమారుడైన తారూడి కుమార్తె తార. రామాయణంలో అన్నదమ్ముల అనబంధం గురించి రాముని గొప్పతనం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుందో ఎందుకు పెట్టారో మహర్షి ఆ పేరు తార అంటే నక్షత్రం. తళుక్కుమంటుంది. రామాయణంలో నిజంగానే తళుక్కుమంటుంది.

తారపాత్రలో నాకు నచ్చిన అంశాలు :

  1. వెలుగులాంటి తార, గ్రహణం నాడు సూర్యుడు తన కాంతిని ఎలాగైతే కోల్పోతాడో అలా కోల్పోబడుతున్న కాంతిని తన ఎదురుగా నిలబడి ఉన్న తన భర్తయందు చూస్తుంది.
  2. సుగ్రీవుడు తొందరపడి ఏ తప్పు నిర్ణయం తీసుకోడని గమనించకుండా ఎవరితోనూ స్నేహం చేయడనీ దృఢసంకల్పం కలిగి ఉంది.
  3. నినాదస్య నసం బ్రహ్మోనైవదలపం వికారణం. ఏ కారణం లేకుండా తన తమ్ముడు యుద్ధానికి మళ్ళీ రాడని నెత్తురోడుతు వచ్చిన సుగ్రీవుడు తన భర్త అయిన వాలిని యుద్ధానికి ఆహ్వానించినప్పుడు అతని కంఠం నండి వచ్చిన సింహనాదాన్ని, అతని ముఖంలోని ఉత్సహాన్ని ఉద్యమం లాంటి తొందరని ముందుగానే గ్రహించి తన భర్త వాలిని ఇప్పుడు యుద్ధానికి వెళ్ళవద్దని హెచ్చరించింది.
  4. తము్మడితో యుద్ధం వద్దని హితబోధ చేసింది.

లాలనియోహితే భ్రాత అదియాయసనవనరహ అనగా తమ్ముడు నీ కంటే చిన్నవాడు నీకు కొడుకులాంటివాడు పైగా వానరుడు తప్పు చేస్తే చేసాడో అనుకో మందలించు, లాలించు అయినా వినకుండా నీ నుండి దూరంగా వెళితే అది వాడి కర్మ.

  1. తన మెరుపులాంటి బుద్ధిబలంతో శ్రీరామచంద్రుని ఆశ్రయించిన వారిని నిగ్రహించే శక్తి తన భర్తకు లేదని ముందే గ్రహించిన ప్రజ్ఞావంతురాలు.
  2. గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందినవారికే ఈశ్వరుని స్వరూప జ్ఞానం భాసిస్తుంది. రాముని గొప్పతనం గురించి ఒక్క శ్లోకం చెప్పడంవల్ల తార రామాయణంలోని కిష్కింద కాండలో జాజ్వల్యమానమైన స్థానాన్ని పొందింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నా నం పరాగతి హే ఆర్ తానం సముశ్రేచెయ్ వా ఎస్ సై క భాజనం. ఆహా! ఎంత గొప్పగా చెప్పింది. ఆ తల్లి! శ్రీరామచంద్రుడు నమ్మకున్నవారి పాలిట మహావృక్షం వంటివాడు. ఎవరైతే ఆ మహావృక్షం మూలాలను చేరుకుంటారో అనగా శ్రీరామచంద్రుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఉత్తమ కీర్తులను పొందుతారు. ఒక మహావృక్షం అది నీడనిచ్చేటప్పుడు నువ్వు నేను, ధనిక పేద, మంచి చెడు, స్త్రీ పురుష, తారతమ్యాలను చూపకుండా నీడనిస్తుంది. అలాంటి మహావృక్షం ఈ లోకంలో మరొకటి ఉంది అని అనుకుంటున్నావ్ ఏమో! లేదు . నీ తమ్ముడైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు అనే కీర్తిని పెంపొదిస్తుంది అని చెప్పిన హితబోధ నాకు బాగా నచ్చింది. తార జీవితం నుండి మనం నేర్చుకున్న సందేశం : ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందనన్న విషయం మనందరికీ ఇనుమడించబడుతుంది. ఇలా చెయ్యని వారి కీర్తి నశించి పతనం అవుతారు.

ధన్యవాదాలు

******************************************************************************************************************

పేరు: S.Rimi chaturya

తరగతి : పదవతరగతి

పాఠశాల : Pioneer Concept School

పాత్ర పేరు : మేఘనాథుడు

ఎవ్వరికీ తెలియని ఒక వీరుడి కథను నేను మీకు తెలియజేయబోతున్నాను. ఇక కథలోకి వెళితే రావణాసురుడు”మేఘనాథుడు దేవతలను ఓడించాలంటే సర్వశక్తి సంపన్నుడవ్వాలి. ఒంటిచేతితో లక్షలాది సైన్యాన్ని మట్టికర్పించాలి.” దానికి తగిన సమయం ఇదేనని భావించి మేఘనాథుడిని పంనెండేళ్ళ వయసులో శుక్రాచార్యుడి వద్దకు శిష్యుడిగా పంపుతాడు. మేఘనాథుడు ఇరవై ఐదేళ్ళ వయసొచ్చేసరికి ఎవ్వరికీ సాధ్యంకాని అస్త్ర విద్యలను, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారామైన పరశురామ ప్రభుకే సాధ్యం కాని ఆయుధాలను, ఎవ్వరికీ కనబడకుండా యుద్ధం చేయగలిగే మాయా విద్యలను అవలీలగా సాధించి ఎప్పుడేప్పుడు దేవతల మీదికి యుద్ధానికి వెళ్ళదామా అన్నట్టు ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో రావణుడు దేవతల మీద యుద్ధం ప్రకటిస్తాడు. ముందుగా ఎవరైనా శత్రువులు దేవలోకంలోకి ప్రవేశించాలంటే నాలుగు దశాలను దాటవలసి ఉంటుంది. మొదటగా “కోటచుట్టూ ఏడు కిలోమీటర్ల మేర భయంకరమైన మొసళ్ళతో నిండిన నీళ్ళు ఉంటాయి.” రెండవది “ఎనిమిది వందల అడుగుల ఎతైన గోడలు ఉంటాయి”. తృతీయది” మూడు వందల అడుగుల గోడలకి అక్కడక్కడ నూనె పోసి నిప్పు పెట్టి ఉంచుతారు.” మూడు దశలను దాటితే “ఇక అప్పుడు దేవతలతో యుద్ధం చేయవచ్చు.”ఇంతటి చిక్కుదట్టమైన భద్రతలను అసురులు ఎన్నటికి శ్చేధించలేరని ఇంద్రుడు కాలుమీద కాలు వేసుకొని కూర్చున్నాడు.అప్పుడు మహేంద్రుడి సేనాధిపతి వచ్చి “ప్రభు! అసురులు మనపైకి దండెత్తి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటికే రెండు దేశలను దాటేసారు.” అని చెప్పగానే ఇంద్రుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ! ఇది అసంభవం. వాళ్ళు ఎలా వచ్చారు? అయినా వాళ్ళు రెండు దేశలను చాటేస్తుంటే మన సైన్యం అంతా ఏం చేస్తున్నారు.అని బయటికి వచ్చి చూస్తాడు. అసురులు త్రిపుర విమానంపై వస్తుంటారు. అది చూసిన ఇంద్రుడు మళ్ళీ ఆశ్చర్యానికి లోనవుతాడు. ఇక చేసెదేమీ లేక యుద్ధాన్ని కొనసాగించమని ఆజ్ఞాపిస్తాడు. ఇక ఇంద్రుడి ఆజ్ఞ మేరకు ఇంద్రుడి సేన కనిపించిన అసురులందరిని క్షణాల్లో మట్టికర్పిస్తారు.కొందరు ఎతైన గోడల మీది నుండి అసురులపైకి బాణాల వర్షం కుర్పిస్తారు. మరికొందరు మూడవ దశను దాటనివ్వరు. కొద్ది క్షణాలలో  లక్షలాది సైన్యాన్ని మట్టికర్పిస్తారు.ఏం చేయాలో దిక్కుతోచక అసురులు మలమలా మాడిపోతారు.అప్పుడు అసురులు లంకేశునితో ఇలా అంటారు.”ప్రభూ!మా కోసమే జన్మించిన వీరుడెక్కడ? మమ్మల్ని రక్షించే మా దేవుడెక్కడ?”అని అడుగుతారు. అప్పుడు దశకంఠుడితో సహా అసురులందరి నోట ఒకే మాట “మేఘనాథా” అని. మేఘనాథుడు వచ్చీ రాగానే ఎతైన గోడల మీద అసురులపైకి బాణాల వర్షం కురిపిస్తున్న సైనికులను చంపేస్తాడు.దేవతలపై ఒకేసారి పంనెండు బాణాలను సంధిస్తూ దేవతలకు ముచ్చెమటలు పట్టిస్తాడు.రెప్పపాటు సమయంలో ఇంద్రుడి సేనను ముక్కలుముక్కలుగా  చీల్చిచెండాడుతాడు.ఇంద్రుడు ” మేఘనాథా! పిరికివానిలా దాక్కోని నా సేనను దెబ్బతీయడం కాదు.నీకు దుమ్ముంటే నా ముందుకు వచ్చి నాతో యుద్ధంచేయి” అని అంటాడు. అప్పుడు మేఘనాథుడు “ఇంద్రా! నేను నీ ముందే ఉన్నాను. పైకి చూడు అని బాణంతో ఇంద్రుడి కిరీటాన్ని కొడతాడు.అది సరిగ్గా మేఘనాథుడి కాలి కింద పడుతుంది.మేఘనాథుడు”ఇంద్రా! బుక్కెడునువ్వింకా నా మొఖం కూడా చూడలేదు. కానీ, అప్పుడే నీ మకుటం నా కాళ్ళ కింద కొట్టువిట్టాడుతుంది.ఇక నువ్వేంనాతో యుద్ధం చేయగలవ్. సరే, నువ్వు నీ మకుటాన్ని నీ సిరస్సుపై పెట్టుకుంటే నేను ఈ అమరావతినే వదిలి వేళ్ళిపోతా” అని సవాల్ విసురుతాడు. కొపంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయొగిస్తాడు. అది రావణుడికి తగులుతుంది. రావణుడు స్ప్రూహ కోల్పోతాడు.మేఘనాథుడు కోపంతో ఇంద్రుడిని ఒక్క దెబ్బ కొట్టగా ఇంద్రుడు ఎనిమిది కీలోమీటర్ల దూరంలో పోయి పడతాడు. యుద్ధం ముగిసిన తర్వాత ఇంద్రుడిని బంధించి లంకకు తీసుకుని వెళ్తడు. బ్రహ్మ వచ్చి ఇంద్రుడిని విడిచి పెట్టు, దానికి బదులుగా నువ్వు ఎదైన వరం కోరుకో.అప్పుడు మేఘనాథుడు తనకు ఛావులేని వరం కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మేఘనాథా ఇది సృష్టి విరుద్ధం. ఈ భూమి పై జన్మించిన ప్రతి ఒక్కరూ మరనించక తప్పదు. కాని నీవు అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక వారాన్ని ప్రసాదిస్తున్నాను. “నీవు ఏ రోజైతే యుద్ధానికి వెళ్తావో ఆ రోజు సూర్యోదయానికి ముందే నీకు ప్రీతిబద్దమైన నికుంబలాదేవికి యాగం చేసి వేళితే ఆ రోజు నీవు అమరుడవు. నిన్ను ఎవరు ఓడించలేరు.కాని యాగం భజ్ఞం కాకూడదు. అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని భహుకరించి , నీవు ఇంద్రుడిని ఓడించావు కాబట్టి నీవు ఇకనుండి ఇంద్రజిత్తుగా ప్రసిద్ధి చెందుతావు.అని చెప్పి బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఇక ఈ కాథను బట్టి మనం అర్థం చేసుకోవాలి మేఘనాథుడు ఎంతటి వీరుడని. యుద్ధరంగంలోకి దిగిన ఒక నిమిషం ముపైఏడు క్షణాల్లో యుద్ధాన్ని ముగించాడంటే ఎంతటి శూరుడో అని.

                   ధన్యవాదాలు.
***************************************************************************************************************

పేరు : శ్రీ కౌస్తుభ

తరగతి  : 9

పాఠశాల : KT.School, Pargi

నగరం : Vikarbad Dist.

పాత్ర : కవికోకిల వాల్మీకి

కవిత్వమనే అరణ్యంలో వాల్మీకి అనే సింహం సంచరిస్తుంది. ఆ సింహం రామగాథను గర్జిస్తుంది. ఆ సింహంలో కోకిల సుస్వరం కూడా వుంది. వాల్మీకికి సింహంలాగా గాంభీరంగ చెప్పడమే కాకా కోకిలలా మధురంగా చెప్పడం కూడా అలవడింది. శారద కల పండింది, మన జన్మతరించింది.

బ్రహ్మశాపంవలన వాల్మీకి ప్రాచేతసుని కుమారుడైన బోయగా జన్మించారు. రామనామ స్మరణవలన శాపవిమోచనం కలుగుతుందని చెప్పారు బ్రహ్మ. ఆ బోయ పేరు “రత్నాకరుడు”. ఎన్నో పాపాలు చేస్తూ ఒక బోయ స్త్రీని వివాహం చేసుకున్నాడు. వచ్చే ప్రయాణీకులని అడ్డగించి వారిని హింసిస్తూ వారి ధనాన్నిఅపహరిస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు రత్నాకరుడు సప్తఋషులను కూడా ఆపటానికి వెళ్ళాడు. అంతలో వారు అతణ్ణి ఆపి ఇలా అన్నారు, ‘ఓ బోయవాడా నీవు నీ కుటుంబం కోసం ఇన్ని పాపాలు చేస్తున్నవే మరి వారు నీ పాపాలలో భాగాన్ని తీసుకుంటారా? నీవు కనుక్కుని రా మేము నీ కోసం ప్రతిక్షిస్తాము’ అనగానే రత్నాకరుడు తన యింటికి బయలుదేరాడు.

ఇంటికి చేరుకున్నాక అతని భార్యతో ఇలా అన్నాడు ‘నేను నా పాప రాశులను పంచదలచాను నీవు భాగాన్ని తీసుకుంటావా?’ అని అడిగాడు. వెంటనే అతని భార్య ‘మమ్మల్ని పోషించడం మీ కర్తవ్యం, కనుక నేను ఎలాంటి భాగాన్నీ తీసుకోలేను’ అని నిర్మొహమాటంగా చెప్పడంతో విరక్తి చెందిన రత్నాకరుడు సప్తఋషులను తరుణోపాయం అడిగాడు.

సప్తఋషులు అతనికి రామతారక మంత్రాన్ని బోధించారు. రత్నాకరుడు ఎన్నో సంవత్సరాలు రామనామాన్ని స్మరిస్తూ తపస్సులో లీనమై ఉన్నాడు. అతనిపై వృక్షాలు, పుట్టలు మొలిచాయి.

ఒకరోజు నారాయణుడు అతని భక్తుడైన నారదునికి రామావతరం గురించి చెప్పారు. ఆ వార్తని గుప్తంగా ఉంచమని ఆదేశించారు. కానీ వార్తను పట్టలేకపోయాడు నారదుడు. దారిలో వెళ్తూ ఉండగా అక్కడ కనిపించే పుట్టపక్కన ఉన్న వృక్షాలకు రామకథను వివరించాడు. ఆ కథ పుట్టలో ఉన్న రత్నాకరుని మనసులోకి ప్రవేశించింది. “వాల్మీకం” అనగా పుట్ట అని అర్థం అలా పుట్టలో ఉండి రామగాథని హృదయంలో స్థాపించుకున్నందుకు రత్నాకరుడు “వాల్మీకి మహర్షి”గా మారిపోయాడు.

శ్రీరాముని పాత్రను లోకోత్తర పురుషునిగా, ధర్మమూర్తిగా వాల్మీకి మహర్షి తీర్చిదిద్దారు. లోకంలో ధర్మస్థపానకై రామాయణాన్ని మాధ్యమంగా ఉపయోగించేవారు. రాముని మహోన్నత గుణాలను కళ్ళకు కట్టినట్టు రచించి ఎన్నో ఆదర్శాలను స్థాపించారు. భారత సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.

పితృవాఖ్యా పరిపాలన, రాజధర్మాలు, ధర్మరక్షణ, దుష్టశిక్షణ, సాధురక్షణ లాంటి ధర్మాలన్ని రామాయణం ద్వారా మనకి వాల్మీకి ప్రసాదించినవే. అంతేకాక స్వయంగా వాల్మీకి రామాయణంలో ఒక భాగం. సీతమాత తన వనవాస సమయంలో వాల్మీకి ఆశ్రమంలో నివసించేది. వాల్మీకి సీతమ్మను కూతురిలా చూసుకున్నాడు.    ఒక పుత్రునిలా సేవించాడు.

సత్వగుణ ప్రవృద్ధి కోసం వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఈనాటికి రామరాజ్యం అనే మాట ఒక ఆదర్శ రాజ్యంలా నిలిచిపోయింది. హనుమంతుడు, శబరి, జాంబవంతుడు, జటాయు, సుగ్రీవుడు వంటి పాత్రలను అద్భుతంగా చిత్రీకరించి వాటికి శాశ్వతత్వాన్ని అందించారు. ఇలాంటి ఆదర్శ కావ్యానికి కారణం క్రూర రత్నాకరుడి నుండి పరివర్తన చెందిన ఆదికవి వాల్మీకి మహర్షి మాత్రమే.

“బోయవాని కులం నుండి జాలువారిన రామకథ ఈనాటికి భారతీయుల హృదయాలో ఆరని జ్యోతిలా వెలుగుతూనే ఉంది”. రామాయణాన్ని రచించి నిజమైన ధర్మాన్ని చూయించిన వాల్మీకి నీకు వేవేల వందనాలు. ఆ గాథను ఆదరించి పూజించిన భారతీయులందరికీ వందన శ్రీ చందనాలు.

జై శ్రీరామ్.

June 22, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సత్యకాముని కథ

by ఆచార్య మస‌న‌ June 21, 2021
written by ఆచార్య మస‌న‌

చాలామందికి వేదం గురించి తెలియదు. దాన్ని బ్రహ్మపదార్థంగా భావిస్తారు. కాని వేదం అందరిది. విశ్వజనీనమైంది, సార్వత్రికమైంది, సార్వకాలికమైంది. సృష్టి రచన ఒక మనిషి చేత జరగలేదు. పదిమఁది మనుషులు కలిసి చేసిన పని కూడా కాదు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ మూలంగానే సృష్టి రచన జరిగింది. సృష్టి ఆవిర్భావానికి ముందే పరబ్రహ్మ మానవాళికి ఉపయోగకరంగా వేదాన్ని సృష్టించాడు. నల్గురు రుషులకు వేదోపదేశం చేశాడు. వారు వేదాన్నిఒకరి ద్వారా మరొకరికి వినిపించే ప్రయత్నం చేశారు. వేదానికి ‘బ్రహ్మ’ అని పేరు. వేదంలో ఏముందో తెలిసినవారే బ్రాహ్మణులు. వేదాలలో విషయాలను తెలుసుకొని మానవులను క్రమశిక్షణలో ఉంచే ప్రయత్నం పూర్వకాలంలో జరిగింది. ఆనాడు వేదపాఠశాలలే ఉండేవి. సాధారణంగా గురుకులాలలో వేదాలను బోధిఁచేవారు. వేదమంటే జ్ఞానం. ప్రతిమనిషి జ్ఞాని కావలసిఁదే. అందుకు వేదం ఉపకరించినట్లు మరే గ్రంథం ఉపయోగపడదు.

“యథేమాం వాచం కళ్యాణీమావగాని జనేభ్యః” (యజుర్వేదం 26-2)

వేదం కళ్యాణప్రదమైంది. అది జనులందరికి అందవలసి ఉంది – అని వేదంలోనే చెప్పబడింది.

ఇట్టి వేదోపదేశం ప్రాచీన కాలంలో అందరికి అందేదని చెప్పడానికి బృహదారణ్యకోపనిషత్తులోని ‘సత్యకాముని కథ’ ఆధారం. ఈ కథ అందరికీ వేదజ్ఞానం అందాలని తెలుపుతుంది.

సత్యకాముని కథ వేదాల ఉద్దేశానికి, ఉపనిషత్తుల దృక్పథానికి సంధానంగా కనిపిస్తున్నది. ఈనాటి వలె ఆనాడు కులమత వర్గ భేదాలు లేవు. సామర్థ్యాన్నిబట్టి ఆయా వర్గస్థులుగా గుర్తింపబడినారు. గురుకులాల్లో ఈ ఏర్పాటు ఆనాడుండింది.

సత్యకాముడు ఎనిమిది సంవత్సరాల కుర్రవాడు. సత్యసంధుడు, సుగుణశీలుడు. ఆడుతూ, పాడుతూ బాల్యాన్ని గడుపుతున్న అతడు బ్రహ్మచర్యాశ్రమంలో చేరి గురూపదేశం పొందాలనుకున్నాడు. అలాంటి కోరిక కలగగానే ఆట పాటలకు స్వస్తి చెప్పి వేదాన్ని బోధించే గురువును వెదుకసాగాడు.

పూర్వకాలంలో ఎంతోమందికి బ్రహ్మచర్య దీక్ష నిచ్చిన హారిద్రుమతుడు గొప్ప ఆచార్యునిగా పేరుగాంచినాడు. అతడు గౌతముడనే పేరుతో ప్రసిద్ధి పొందినాడు. వేదవేదాంగాలు తెలిసిన పండితునిగా, గాయత్రీ మంత్ర రహస్యం తెలిసిన విజ్ఞానిగా, శిష్యలంటే ప్రేమగలవానిగా హారిద్రుమతునికి లోకంలో మంచి పేరుంది. అతడొకనాడు తన ఆశ్రమంలో బాలబాలికలకు ఉపనయన సంస్కారం చేస్తుండగా సత్యకాముడు చూశాడు. వెంటనే గురువుగారి సముఖానికి వచి్చ వినయంగా నమస్కరించాడు. తనకు బ్రహ్మచర్య దీక్షనివ్వవలసిందిగా కోరాడు. సత్యకాముని అయ్యని పలుకులకు, వినయానికి మురిసిపోయిన హారి్రదుమతుడు ‘నీ గోత్రం పేరు చెప్పవయ్యా!’ అని అడిగాడు.

సత్యకామునికి అంతవరకు తన గోత్రమేమిటో తెలియదు. తండ్రి నుంచి వచ్చేదే గోత్రనామం. నిజానికి అతడు తన తండ్రిని అంతవరకు చూడనే లేదు. ఒకరు తనను గోత్రం నామం చెప్పమని అడుగుతారని కూడా తానెరుగడు. అయినప్పటికీ తన తల్లి మాత్రమే గోత్రనామం చెప్పగలదని భావించి ఆమె దగ్గరికి వచ్చి కాళ్ళమీద పడ్డాడు. ఆమె ‘ఏమిటి నాయనా?’ అని అడిగింది.

“అమ్మా నా గోత్రనామం ఏమిటో చెప్పు, నేను బ్రహ్మచర్య దీక్షను పొందాలనుకుంటున్నాను” అని సమాధానమిచ్చాడు.

అప్పుడా తల్లి ఇటువంటి ప్రశ్న ఎదురౌతుందని తానూ భావించలేదు. అయినప్పటికీ తన మనస్సును దిట్టపరుచుకొని కుమారునితో  “ఓయి పుత్రక! నీ గోత్రం నాకు తెలియదు, గోత్ర నామం తెలియనందుకు నాకు కూడా బాధగానే ఉంది. తండ్రివల్లనే గోత్రనామం వస్తుంది. కాని తండ్రి ఎవ్వరో తెలియనప్పుడు గోత్రం ఎట్లా తెలుస్తుంది? ఎన్నాళ్ళ నుంచో నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని నీకు చెప్తున్నాను. జాగ్రత్తగా విను. నీవు పుట్టక ముందు నేనొకరి ఇంటిలో పరిచారికగా ఉన్నాను. యౌవనంలో ఉన్నాను. ఆ యింటికి వచ్చిన ఒకానొక అతిథివల్ల నిన్ను కాలవశాన కన్నాను. జరిగినది ఎవరికీ చెప్పజాలని నిస్సహాయురాలిని, పైగా పేదరాలిని. ఐనా నాకు న్యాయం చేసేవాళ్ళుండాలి కదా చెప్పినప్పుడు. పాప పుణ్యాలను విధికే విడిచిపెట్టి తొమ్మిది మాసాలు నిన్ను మోసి కన్నాను, ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఏ గంగాపాలో చేయక, ప్రేమతో నిన్ను పెంచాను. అందరూ బాబూ! నీ సత్ ప్రవర్తనకు నిన్ను మురిసిపోయి సత్యకాముడని పిలిచారు. నేను నీ తల్లి జబాలను, నీవు నా కుమారుడవు సత్యకాముడవు. ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే జబాలసుతుడను. సత్యకాముడను అని సమాధానం ఇవ్వు” అని చెప్పగా విని సత్యకాముడు ఎంత మాత్రం సంకోచం లేకుండా పరుగు పరుగున హారిద్రుమతుని దగ్గరికి వచ్చినాడు. గురువుగారు ‘నీ గోత్రనామం తెలుసుకొంటివా?’ అని అడిగాడు. సత్యకాముడు అమ్మ చెప్పిన విషయాన్ని పొల్లు పోకుండా తెలియజేసినాడు.

సత్య సంపూర్ణములైన సత్యకాముని పలుకులను విన్న హారిద్రుమతుడు సంతుష్ఠాంతరంగుడై ‘గోత్రనామము తెలియవలెనా? గుణము తెలిసిన చాలదా?’ అని తన మనసులో అనుకొని సత్యకామున్ని తన దగ్గరికి తీసికొని చేతిలో శిరస్సును తాకినాడు. “సత్యకామా! వెంటనే సమిధను తీసుకొని రా! నీకు ఉపనయనం చేస్తాను.” అని ఆదేశించాడు.

సత్యకాముడు హారిద్రుమతుని శిష్యకోటిలో అగ్రేసరుడయ్యాడు. వేదవేదాంగాలలోని రహస్యాలు తెలుసుకున్నాడు. హారిద్రుమతుని అనంతరం గురుకులానికి అధిపతి అయ్యాడు. వేలాదిమంది శిష్యులను సంపాదించుకున్నాడు.

సత్యకాముని కథ నిజంగా వట్టి కథ కాదు. ప్రతి వ్యక్తికి జ్ఞానాన్ని కల్గింే కథ. ఎవరెలాంటి జన్మ ఎత్తినా, గోత్రనామంతో సంబంధం లేకుండా వేదాధ్యయనం చేయవచ్చునని సత్యకాముని కథ వెల్లడిస్తున్నది.

వేదం సర్వమానవులది. వేద రహస్యాలు అందరికి తెలియదగినవి. అట్లే వేదజ్ఞానాన్ని ఉపనిషత్తుల ద్వారా మానవాళి  పొందడానికి మన ఋషులు ప్రయత్నించారు. వారు అభినందనీయులు.

-ఆచార్య మసన చెన్నప్ప 

June 21, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us