మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంట‌ర్వ్యూలు

రంజింపజేసే రచన ఉండాలి – ముక్తవరం పార్థసారథి

by Aruna Dhulipala November 29, 2024
written by Aruna Dhulipala

ప్రసిద్ధ నవలాకారులు, కథకులు, అనువాదకులు ముక్తవరం పార్థసారథి గారితో మయూఖ ముఖాముఖి

                                   – అరుణ ధూళిపాళ

ప్రపంచ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని అందులోని  విభిన్నమైన రచనలను తెలుగువారికి అందించాలనే సదాశయంతో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించిన ప్రముఖ అనువాదకులు, కథకులు, నవలాకారులు ముక్తవరం పార్థసారథి గారి సాహిత్య ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్!

1. మీ బాల్య విశేషాలను తెలుపుతూ మీ కథాపఠనం ఎక్కడ, ఎలా మొదలైందో వివరించండి.
జ :-    నా బాల్యమంతా భువనగిరిలో గడిచింది. నా చిన్నతనంలో మా ఇంటికి ‘నవ్వులు- పువ్వులు’, ‘పాపాయి’ ‘గోల్కొండ’ పత్రికలు వచ్చేవి. నేను ఆ పత్రికలు చదివేవాడిని. అలా తొట్టతొలుత నా కథా పఠనం ప్రారంభమైందనుకుంటా. మాఇంట్లో కూడా వావిళ్ళవారి భారతం, రామాయణం, మనుచరిత్ర ఇలాంటి పుస్తకాలు ఉండేవి. వాటిని చూస్తూనే ఉన్నప్పటికీ పద్యాలు అంటే భయం వల్ల చదవకపోయేవాడిని. మా మామయ్య అక్కడే స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. కృష్ణదేవరాయ నిలయం ప్రోత్సాహంతో మామయ్య లైబ్రరీ ప్రారంభించారు. బహుశా పది, పదకొండు ఏళ్ళ వయస్సులో పుస్తకాలు చదవడం ప్రారంభమైంది. ఇంచుమించు తెలుగు పుస్తకాలన్నీ చదివేశాను. కథాప్రపంచం, కథాసాగరం అని వాల్యూమ్స్ వచ్చేవి. పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు, రావూరి భరద్వాజ, ధనికొండ హనుమంతరావు వంటి వారి రచనలు చదివాను. నవలలూ చదివాను. నాకు కూడా రాయాలనిపించింది. ఆ విధంగా రచనలు చదవడం మొదలయింది.

2. పత్రికల్లో వచ్చిన మీ మొట్టమొదటి రచన ఏది?
జ :-    ఇందాక చెప్పినట్టు పుస్తకాలు చదువుతుంటే రాయాలనే ఆసక్తి కలిగి 1959లో నేను 9వ తరగతిలో ఉండగా, వేసవి సెలవుల్లో ఒక కథ రాశాను. పేరు గుర్తు లేదు. గోల్కొండ పత్రికకు పంపించాను. పత్రికకు ఎలా పంపించాలో తెలియదు. పేజీకి వెనుకవైపు రాయకూడదనే నియమం తెలియదు. ఒక చిన్న కవర్ కొని అందులో కుక్కి పెట్టి పోస్టులో వేశాను. 20 రోజుల తర్వాత పత్రికలో వచ్చింది. ఆరోజుల్లో హైదరాబాద్ నుండి భువనగిరికి పత్రిక రావడానికి మధ్యాహ్నం అయ్యేది. భోజనాలు చేస్తున్న సమయంలో పత్రిక వచ్చింది. మా మామయ్య చూసి తిట్టాడు. స్కూల్లో చదువుకునే కుర్రాడు ఈ కథలు రాయడంలో ఏమైపోతాడోనని ఆయన భయం. గ్రాంథికం రాయాలని, ఛందోబద్ధమైన, భక్తి పద్యాలు రాయాలని ఆయనకుండేది. పిల్లలకు ఇటువంటి ఆలోచనలు రావద్దని ఆయన ఉద్దేశ్యం. ఇంట్లో సంప్రదాయకమైన వాతావరణం ఉండేది కాబట్టి అట్లాంటి భయాలు ఉండేవి. ఆ రోజుల్లో భువనగిరిలో కథలు రాసేవాళ్ళు లేరు. అందువల్ల మా మామయ్య నన్ను తిట్టినప్పటికీ మా అల్లుడు కథలు రాస్తాడని స్కూల్లో చెప్పుకునేవాడు (నవ్వుతూ).
        అదే 1959లో ఒక పోటీలో ప్రముఖ రచయిత వేణు పిళ్ళై కథకు ప్రథమ బహుమతి వచ్చినట్టు గుర్తు. నేను కూడా ఆ పోటీకి కథ పంపాను. ఆయన కథకు బాపు అద్భుతమైన బొమ్మ వేశాడు. మాస్టర్ పీస్ అది. నా స్కూల్ చదువు అయిపోయాక పియుసి కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఇంగ్లీషు మీడియంలో చదివాను. అప్పటికే తెలుగు పుస్తకాల్లో ఇంగ్లీష్  రచయితల పేర్లు అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు, బుచ్చిబాబు, చలం రచనల్లో రచయితల పేర్లు, కొన్ని పదాలు ఇంగ్లీష్ లో కనబడుతుండేవి. అఫ్జల్ గంజ్ సిటీ లైబ్రరీకి రోజూ వెళ్ళేవాడిని. మొదటిసారి ఆ పుస్తకాలను చూసినప్పుడు నేను చదివిన బుచ్చిబాబు, చలం రచనల్లోని పేర్లు అక్కడ చూశాను. ఇంగ్లీషు రాదు. కానీ చదవాలి. అప్పటికి దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వాళ్ళు వేసిన ‘స్రవంతి’ పత్రిక వచ్చేది. దివాకర్ల వేంకటావధాని దానికి సంపాదకులు. ఒక గేయం రాసి పంపాను. అచ్చయింది. ఇంకోటి రాసి పంపితే అది కూడా అచ్చయింది. ఎందుకో నాకు పోయెట్రీ ఇరుకుగా, ఫ్రీగా చెప్పలేకపోతున్నట్టు అనిపించింది. అందుకే కథలు రాయాలనుకున్నాను. కథలు రాసేందుకు కాగితాలు కొనుక్కోవడానికి, పంపడానికి కావలసిన డబ్బులు లేవు. ఈలోపు లీవ్ వేకెన్సీ కింద స్టేట్ గవర్నమెంట్ లో తాత్కాలికంగా చిన్న ఉద్యోగం వచ్చింది. కథలు రాయడం ప్రారంభించాను.

పార్థసారధిగారితో అరుణదూళిపాళ

3. ఆ తరువాత మీ కథారచన కొనసాగిన విధానాన్ని తెలపండి.
జ :-    జాబ్ లో చేరిన తర్వాత స్టేట్ లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదవడం వలన ఇంగ్లీషు అలవాటయింది. William Somarset Maugham రచించిన  ‘Of Human Bondage’ వెయ్యి పేజీల పుస్తకం. దాన్ని చదివాను. అది చదివాక ధైర్యం వచ్చింది. వాళ్ళ పుస్తకాలు పక్కా ఇండ్ల లాగా ఉంటాయి. వాళ్ళు ఫాంటసీని కూడా పక్కాగా రాయగలరు. అప్పుడు18 ఏళ్ల వయస్సు. ఇంట్లో కూర్చొని రాయడం మొదలు పెట్టాను. కిరోసిన్ దీపం పెట్టుకొని రాసేవాడిని. తర్వాత పోస్టాఫీసులో కొంతకాలం ఉద్యోగం చేశాక రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఇక ఆర్థిక సమస్యలు తీరిపోయాయి. దీపావళి, ఉగాది కథలు నవలల పోటీకి రాసేవాడిని. ఒక అద్భుతమైన విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఉద్యోగం రాకముందు ‘అభిసారిక’ అనే పత్రికకు కథ రాసి పంపితే వాళ్ళు “మీరు రాసిన దాంట్లో అభ్యంతరకరమైన వాక్యాలున్నాయి. గవర్నమెంట్ మీమీద ఏమైనా చర్యలు తీసుకోవచ్చు”. అని ఒక కార్డ్ రాశారు. ఏదైనా సరే అన్నాను (నవ్వుతూ). వాళ్ళు దాన్ని అచ్చు వేసి పాతిక రూపాయలు పంపించారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. నెలంతా సరిపోయేది.
         1969లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీకి ‘రంగులవల’ అని ఒక నవల రాశాను. దానికి విద్వాన్ విశ్వం సంపాదకుడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని టెలిగ్రామ్ వచ్చింది. 5500 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఎమెస్కోలో ఎమ్.ఎన్.
రావుగారు అని వుండేవారు. ఆయన 3000 రూపాయలు ఇచ్చి, దాని కాపీ రైట్స్ అన్నీ తీసుకొని వేశారు. బి. గోపాలం అనే సినిమా దర్శకుడు 2000 ఇస్తానని కథ ఇవ్వమని అడిగి తీసుకున్నాడు. మా అంకుల్ ఒకాయన సలీంనగర్ లో 4500 రూపాయలకు 400 గజాల ప్లాట్ ఉంది తీసుకో! అన్నారు. నేనాయన మాటలు వినలేదు. రచయితల గురించి, పుస్తకాల గురించి ఆలోచించడం తప్ప డబ్బులు ఏం చేసుకుంటాం? అన్నట్టు ఉండేది నాకు. కథలు రాస్తే అందరూ నన్ను పిచ్చివాడిలా చూసేవారు. దానికి Utility Value ఉన్నదని వాళ్లకు తెలియదు. ఇంగ్లీష్ సాహిత్యంలో విశేషం ఏంటంటే ప్రపంచ భాషల సాహిత్యమంతా తెలుగుతో సహా ఇంగ్లీషులోకి వస్తోంది. ఆ రుచి మరిగిన తరువాత దాంట్లో మునిగిపోతాం. ఇన్ని లక్షలమంది దృక్పథాలు, అభిప్రాయాలు, స్పందనలు, ఆలోచనలు, సాంస్కృతిక పరమైన వైరుధ్యాలు, మార్పు కోసం చేసిన పోరాటాలు ఇవన్నీ మనకు ఆ సాహిత్యం చదివితే అర్థమవుతుంది. అందువల్ల వాటిని చదివిన తరువాత రాయడం కొనసాగుతూనే వచ్చింది.

4. చలం గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది?
జ :-   నేను కథలు రాయడం ప్రారంభించిన తర్వాత, రెండు మూడు అచ్చు అయినప్పటికీ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా సరిగా దృష్టి పెట్టలేకపోయాను. ఏం చేయాలో తెలియలేదు. ఇంట్లోంచి వెళ్లి పోవాలనుకున్నాను. 1962 మే నెల. నాంపల్లి స్టేషన్ కు వెళ్ళాను. అప్పుడు మద్రాసుకు 16రూ. టిక్కెట్టు ఉండేది. ఆ సమయంలో ‘అష్టగ్రహ కూటమి’ ఒకటి వస్తుందని, దానివల్ల అందరూ మునిగిపోతారని ప్రచారం జరుగుతోంది. ‘ప్రజాతంత్ర’ అనే పత్రికలో శివం అనే ఆయన చలం గారిని ప్రశ్నలు అడుగుతుండేవాడు. అలా చలం గారు తిరువణ్ణామలైలో ఉంటారని తెలిసింది. ఆ పత్రికలో ‘అష్టగ్రహ కూటమి’ వస్తున్నది కాబట్టి దానినుండి రక్షించుకోవాలనుకునే వారు, తిరువణ్ణామలైకి రావాలని చలం చెప్పాడు. నేను ఆయన రచనలు చదివాను కానీ నా వయసుకు మించిన వర్ణనలు కాబట్టి నాకు అర్థం కాక మొదట ఆయన పట్ల ఆకర్షితుడిని కాలేదు. ఇక నేను ఎలాగూ ఇల్లు వదిలాను కాబట్టి ఎలాగో అలా తిరువణ్ణామలై చలం ఇంటికి చేరుకున్నాను. అదొక గొప్ప అనుభవం. అక్కడొక నర్తకి, ఆయన పెంపుడు కూతుళ్లు, సొంత కూతురు చంపక ఉండేవాళ్ళు. నా ప్రశ్న ‘డబ్బులెలా వస్తాయని?’ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే అన్నీ వస్తాయి అనేవాడు. నీకుంది కానీ నాకు లేదు కదా! అని మొండిగా వాదించేవాడిని. ఓపిగ్గా వినేవాడు. ఇంట్లో పదిమంది దాకా ఉండేవాళ్ళం. డబ్బున్నా లేకున్నా ఉన్నది అందరం పంచుకొని తినడం, అందరూ పని చేయడం వాళ్ళ పద్ధతి. గర్భవతులు వంటింట్లోకి రాకూడదు అని నియమం ఉండేది. అలా వాళ్ళింట్లో వారం రోజులు ఉన్నాను. తిరిగి వచ్చి చిన్న ఉద్యోగంలో చేరాను.

5. చలం గారితో మీ అనుబంధం ఎంతవరకు కొనసాగింది? మీ మీద చలం గారి ప్రభావం ఉందని అనుకోవచ్చా?
జ :-    చలంతో అనుబంధం పదేళ్లు కొనసాగింది. ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నేను రిజర్వ్ బ్యాంకులో పని చేయడం వల్ల మద్రాసులో ప్రతీ సంవత్సరం పని ఉండేది. అందువల్ల శనివారం మధ్యాహ్నం భోజనం చేసి తిరువణ్ణామలైకి వెళ్ళిపోయి అదివారమంతా అక్కడ గడిపి తెల్లవారి బ్యాంకుకు వచ్చేవాడిని. అయిదారేళ్ళు ఇలా గడిచింది. ఆయన రచన విభిన్నమైనది. అందువల్ల ఆయన రచనకంటే వ్యక్తిత్వం నన్ను ప్రభావితం చేసింది. సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, ప్రభుత్వం పట్ల అతనికున్న కోపం, తీవ్రత, వ్యంగ్యం ముందు ఆయన మిగతా విషయాలన్నీ చిన్నవి. జంతువుల లాగా బతికేకన్నా స్త్రీ స్వేచ్ఛగా ఉండడం కావాలన్నాడు. అందరూ అదొక ఉద్యమంలాగా చూశారు. కాదు. అది ఆయన వ్యక్తిగతమైన బాధ. తన చెల్లెలు భర్త ఆమెను ప్రతిరోజూ గదిలో బంధించి కొడుతూ ఉంటే అలా బాధపడే కంటే స్వేచ్ఛగా బతికితే బాగుంటుంది కదా అన్న ఆవేదనతో కూడిన ఆయన వ్యక్తిగత ఆలోచనే తప్ప సంఘ ఉద్ధరణ కోసం చేసింది కాదు. రెండు, మూడుతరాల స్త్రీలు ఈ రకంగా తమ వ్యక్తిత్వాలను కోల్పోతే ఎంతో సామాజిక నష్టం జరుగుతుంది. స్త్రీల జీవితాలు సమాజానికి ఉపయోగపడకుండా వంటింటికి పరిమితమై వాళ్ళ సామర్థ్యమంతా వృథా అయిపోతే ఎంత బాధాకరం? అన్నది ఆయన ఉద్దేశ్యం. టాలెంట్ అనేది స్త్రీ పురుషులిద్దరికీ సమానమే. అది పురుషులకు మాత్రమే పరిమితం కాదు. అలాంటప్పుడు స్త్రీలు నిర్బంధంగా ఎందుకుండాలి? అని ఆయన వాదన. నిజానికి ఆయన తిరువణ్ణామలైకి వెళ్లడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఏర్పడిందని కాదు. 1927లో ఆయన ‘అరుణ’ అనే పుస్తకం రాశాడు. అందులో చివరగా “ఆమెకోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి” అని రాశాడు. అప్పటికే ఆ దృష్టి ఆయనలో ఉంది. ఆయన బ్రహ్మసమాజి. రవీంద్ర నాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ స్థాపించిన కొత్త మతం ‘బ్రహ్మసమాజం’. అంటే ఏకోపాసన. కృష్ణశాస్త్రి కూడా దీనికి అనుయాయి.
        1730 ప్రాంతంలో బ్రిటిష్ సమాజం స్త్రీని ఒక వ్యక్తిగా కూడా గౌరవించలేదు. ఆస్తిహక్కు గానీ కన్న బిడ్డల మీద కూడా ఆమెకు అధికారం లేదు. అటువంటి సమాజంలో పుట్టిన స్త్రీ Mary wollstone craft. ఆమె ఇంగ్లాండులో తొలి స్త్రీవాద రచయిత్రి. ఆమె కూతురును ప్రముఖ రచయిత షెల్లీ వివాహం చేసుకున్నాడు. మేరీ ‘A vindication of the rights of Women’ అనే పుస్తకాన్ని రాసి స్త్రీల హక్కుల గురించి అనేక విషయాలు వివరించింది. కానీ ఇలా రాసినందుకు స్త్రీలే నన్ను తిడుతున్నారని ఆమె బాధకు గురయింది. అంటే స్త్రీలే ఆ స్వేచ్ఛను కావాలని కోరుకోవడం లేదు.  చలం స్వచ్ఛమైన మనస్సు ఉన్నవాడు కాబట్టే సమాజాన్ని చూసి కలత చెందాడు. బానిసత్వం అనేది మనసులో ఉంటుంది. ఇతరులకు బానిసత్వం అనిపించినది అనుభవిస్తున్నవాళ్ళకి  అనిపించక పోవచ్చు. అనిపించినా బయట పడకపోవచ్చు. ధైర్యంతో స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు బతకాలంటాడు ఆయన. అందుకే అలా రాసాడనిపిస్తుంది. ప్రపంచ సాహిత్యంతో ఉన్న పరిచయాలు, ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం కలవాడు. ఆయన ఎప్పుడూ, ఏ రకమైన సంకెళ్లను ఇష్టపడలేదు.

6. మీరు భారతీయ సాహిత్యం కంటే కూడా ప్రపంచ సాహిత్యంపై ఎక్కువ అనువాదాలు చేయడానికి కారణం ఏమిటి?
జ :-     మామూలుగా ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, ఒకసారి నేను Arthur Millar రాసిన ‘I don’t need you any more’ (short stories) అనే పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కథా ప్రారంభం చాలా బాగా అనిపించింది. ఎందుకో దాన్ని తెలుగులో రాయాలనిపించింది. మనవాళ్లకు దాని గురించి తెలియజెప్పాలనిపించింది. మనకెవరికైనా ఏదైనా చదివినప్పుడు, ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఎవరికైనా దాన్ని చెప్పాలని, వాళ్ళు విన్నా వినకపోయినా ఆ అనుభూతిని పంచుకోవాలనిపిస్తుంది. ఇది మరో భాషలో ఉండడం వల్ల అనువాదం అంటున్నాం. అలా ప్రపంచ సాహిత్యం చదివినప్పుడు నాకు నచ్చినవి తెలుగులో అనువాదం చేయాలని, మనవాళ్లకు చెప్పాలని కోరిక కలిగింది. అందుకే చేశాను.

7. అసలు అనువాదం అంటే ఏ విధంగా ఉండాలో తెలపండి.
జ :-     అనువాదాల నియమాల గురించి చాలా పుస్తకాలున్నాయి. రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన ‘అనువాద సమస్యలు’ పుస్తకానికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. అందులో అన్ని విషయాలను ఆయన చెప్పారు. నేననేది ఏంటంటే మూలానికి భిన్నం కాకుండా textual గా యథాతథంగా చేసే అనువాదం వేరు. కానీ నేను చేసేది అలా కాదు. నా టార్గెట్ తెలుగు రీడర్. నేను రాసింది తెలుగు పాఠకులకు నచ్చుతుందా లేదా? అన్నది నా మొదటి ప్రాధాన్యత. పాశ్చాత్య రచయితలు ఎక్కువగా వర్ణనలకు ప్రాధాన్యం ఇస్తారు. ఉదా:- ఒక పెళ్లిని వాళ్ళు అనేకంగా వర్ణిస్తారు. అది తెలుగు పాఠకులకు అవసరం లేదు. ఒకవేళ వాటిని నేను రాస్తే పాఠకులు అవి వదిలి చదువుతారు. అందుకని నేనే వదిలేసి రాస్తే బాగుంటుంది కదా! రచయిత ఏ ఉద్దేశ్యంతో రాశాడో అది స్పష్టంగా తెలియజేస్తే చాలు.
         ‘కాసుల కమ్ముడు పోయిన కళలు – సాహిత్యం’ అని నేనొక అనువాదం చేశాను. మూడువేల సంవత్సరాల పాశ్చాత్య సాహిత్య కళారంగాల గురించిన సర్వే. ఆ రచయిత పాశ్చాత్య రచయితలు, కళాకారులు పాఠకులకు ముందే తెలుసుననుకొని వాళ్ళ గురించి ఎలాంటి వివరం ఇవ్వకుండా వ్యాఖ్యానం రాశాడు. నేను అనువాదంలో రచయిత అభిప్రాయాన్ని, ఆయన కాలం, ఆయనను గురించి రచయితలు ఏమనుకున్నారు? వీటన్నింటినీ వివరిస్తూ రాశాను. అప్పుడే దానికి ఒక సమగ్రత వస్తుంది. రచయిత గురించే పాఠకులకు తెలియకపోతే నేనెంత వ్యాఖ్యానం చేసినా లాభముండదు. రచయిత ఉద్దేశాన్ని స్పష్టంగా పాఠకులకు చెప్పగలిగినట్లయితే అంతకంటే వివరాలు చెప్పవలసిన అవసరం లేదు. మన విచక్షణలో కథ ఎక్కడా పక్కకు జరుగకూడదు. చాలామందికి ప్రముఖుల రచనలు అనువాదం చేసేటప్పుడు అంత పెద్దవాళ్లు రాసిన దాంట్లో ఏ ఒక్క వాక్యమైనా మనం వదిలేయడం బాగుండదనే భయం ఉంటుంది. వాళ్ళు పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నారు. మనం కూడా మన పాఠకులను రంజింపజేసేందుకు రాస్తున్నాం. అందుకే అవసరమైతే పెంచాలి. అనవసరమనుకున్నవి వదిలేయాలి.

8. అనువాద సాహిత్యం వల్ల చేకూరే ప్రయోజనాలు ఎటువంటివి?
జ :-    ఇతర భాషల నుండి వచ్చిన అనువాదాలు చదవడం వల్ల మన దృక్పథం విశాలమవుతుంది. ఆ సాహిత్యంలో ఉన్న విషయాలకు మన భాషలో ఉన్న విషయాలకు తేడాలు అర్థమవుతాయి. అయితే ఎటువంటి రచనలు చదవాలన్న విషయం వ్యక్తి అభిరుచిని బట్టి ఉంటుంది. అనువాదం అనే మాట అనడానికి పునశ్చరణ అంటే బాగుంటుంది. అంటే మనం చదివి, ఆనందించి, జీర్ణించుకొని తిరిగి దాన్ని స్నేహితునికి వివరించడం లాంటిది. ‘Re telling’ అన్న మాట. అసలైన రచయితను ఆ సమయంలో మర్చిపోవాలి. చదివి అనుభూతి చెందిన దాన్నే చెప్పాలి. కృష్ణశాస్త్రి పోయెట్రీని ఇంగ్లీషులోకి అనువదించలేము. మాండలికంలో రాసేవాళ్ళున్నారు. మాండలికాన్ని చదివి ఆనందించగలుగుతామే తప్ప దాన్ని మరోభాషలోకి అనువదించలేము. ఇక్కడ కథ చెప్పే పద్ధతి ముఖ్యం. అందుకే నేను నాకు నచ్చినవి ఆ దశలో వ్యాసమో, కథో, నవలో ఏదైనా కావచ్చు, అదే నేను చేశాను. తెలుగు పాఠకులకు అందించే ప్రయత్నం చేశాను.

9. వరవరరావు గారికి, మీకు మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిది?
జ :-    నేను 1962లో చలం గారి దగ్గరకు వెళ్లి వచ్చిన తర్వాత చలం గారు వరవరరావుకు హైదరాబాద్ లో పార్థసారథి అనే వాడుంటాడు. కలవమని ఉత్తరం రాశారు. ఆయన అప్పుడు ఎమ్. ఏ చదువుతున్నాడు. ఆయన, అంపశయ్య నవీన్, ఇంకో ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు. ఆ పరిచయంతో అప్పటినుండి ఇప్పటివరకు మా మధ్య స్నేహం అలాగే కొనసాగుతున్నది. అప్పుడప్పుడు ఆర్థికంగా నాకు సహాయం కూడా చేసేవాడు. నా ‘శూన్యం’ నవలకు ఆయన ముందుమాట రాశాడు.

10. జాక్ లండన్ రచించిన ‘ఐరన్ హీల్’ అనే నవలను ‘ఉక్కుపాదం’గా అనువదించారు కదా! ఇందులోని ఇతివృత్తం ఎవరికి సంబంధించింది?
జ :-   వరుసగా రచనలు చేస్తున్న సమయంలో మా స్నేహితుడు చోడవరపు వెంకటేశ్వరరావు 1908లో జాక్ లండన్ రచించిన ‘Iron Heel’ పుస్తకాన్ని చదవమని ఇచ్చాడు. నేను చదవలేదు. చూసీ చూసీ “నువ్వు చదవకపోతే నేను నీతో మాట్లాడను” అన్నాడు. నాకు పుస్తకం కంటే నా మిత్రుడు ముఖ్యం. అందుకే చదివాను. బాగా ఆకర్షించింది. తెలుగులో రాయడం మొదలుపెట్టాను. మొదటి పేరా అంతా ప్రకృతి వర్ణన. పదిపేజీల తర్వాత కథ మొదలవుతుంది. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కథా రూపంలో అద్భుతమైన నాటకీయతతో రాసినటువంటి సోషియో ఫాంటసీ నవల అది. దాన్ని మార్క్సిస్టు వాళ్ళే కాక సామాన్యులూ అంగీకరించారు. శ్రమ శక్తిని గౌరవించడం, మనకెదురుగా మనలను దోపిడీ చేస్తున్న వాళ్ళను గ్రహించే నేర్పు ఉండడం, చూసి పోట్లాడ గలగడం ఇవన్నీ తెలుసుకోవాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని ఇందులో ఆయన చూపించాడు.
          శ్రీనివాసాచార్య అనే ఆయన దీనిలో కొన్ని ప్యాసేజ్ లను పద్యరూపంలో అనువాదం చేశాడు. 1970 లో హ్యాండ్లూమ్ వీవర్స్ నాయకుడైన జి.సి కొండయ్య అనువాదం చేశాడు. ఆ తర్వాత నేను చేశాను. చెరబండరాజు వారానికి ఒకసారి నా దగ్గరికి వచ్చి అడిగి మరీ తెలుగు అనువాదాన్ని వినేవాడు.  సి.కె నారాయణ రెడ్డి అనే లెఫ్టిస్టు నాయకుడు. ఆయన నాతో మాట్లాడుతూ ఒకసారి నా పుస్తకం వేస్తానన్నాడు. అది రాకముందే సహవాసి అనే ఆయన దానికి అనువాదం చేశాడు. నా పుస్తకానికి ముందే అది పుస్తకంగా వచ్చింది.  అయితే ‘Iron Heel’ పుస్తకానికి ఒక Particular Technique ఉంది. ఈ పుస్తకంలో ఉన్న కథ 20 వ శతాబ్దానికి చెందినది. అది అప్పటి పాఠకుల కోసం రాసినది. కాబట్టి ఆ శతాబ్దికి చెందిన వివరణలు ఇస్తూ కథ సాగుతుంది. కథ సగం ఉంటే మిగతా సగం ఆ వివరణలు ఉంటాయి. నిజానికి ఆ రెండు కలిపి చదివితేనే కథ అర్థమవుతుంది. ఈ ముగ్గురు అనువాదకులు వాటిని వదిలివేసి కేవలం కథను అనువాదం చేశారు. చేస్తే మొత్తం చేయాలన్నది నా ఉద్దేశ్యం. అందుకే ఫుట్ నోట్స్ తో సహా మొత్తం నేను అనువాదం చేశాను. రత్నమాల అనే ఆవిడ తన ‘నూతన’ అనే పత్రికలో వరుసగా దీన్ని వేశారు. ఆ తర్వాత వికాసం వాళ్ళు పుస్తకంగా వేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని పాఠకరంజకంగా, విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్ ఉండేలా సోషియో ఫాంటసీగా జాక్ లండన్ రాసిన నవల.

11. అమెరికన్ రచయిత రాసిన “Burn my heart at Wounded Knee’ కి మీరు చేసిన తెలుగు అనువాదం గురించి చెప్పండి?
జ :-   అమెరికన్ కవి రాసిన కవితలోని ఒక పంక్తి ఇది. అమెరికన్ సామ్రాజ్యాన్ని 400 సంవత్సరాలు జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇటాలియన్ వాళ్ళు వచ్చి అమాయకులైనటువంటి స్థానికులను, ఆదివాసీలను, మోసం చేస్తూ దొంగ వాగ్దానాలు చేసి, హత్యలు చేసి వాళ్ళ భూభాగాలను లాక్కొని వాళ్ళు అమెరికా సంయుక్త రాష్ట్రమనే దేశాన్ని ఏర్పరచుకున్నారు. చివరకు వాళ్ళను బోనులో జంతువుల లాగా చిన్న చిన్న కాటేజెస్ కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ కొంతమంది అలాగే బతుకుతున్నారు. డీబ్రౌన్ అనే వ్యక్తి పరిశోధన చేసి ఈ విషయాలన్నీ పుస్తకంగా రాశాడు. చాలామంది దాన్ని “గాయపడిన మోకాలి దగ్గర నా హృదయాన్ని ఖననం చేయి” అన్నట్టు అనుకుంటారు. అది సరైనది కాదు. అక్కడి నేటివ్ అమెరికన్ తెగల వాళ్ళు పెట్టుకున్న పేరది. Flying eagle, running bul ఇలా ఉంటాయి ఆ పేర్లు. వాటిని అనువాదం చేయలేం. షికాగో అనేది కూడా ఒక తెగ. ఇప్పుడది ఆధునిక నగరంగా మారింది. మిన్నె సోటా కూడా అటువంటిదే. అలా అనేకమైన తెగలను ఆక్రమించుకొని తెల్లవాళ్ళ రాజ్యంగా మార్చుకున్నారు. ఆ హృదయ విదారకమైన గాథని  డీబ్రౌన్ రాశాడు. దానికి నేను చేసిన అనువాదం ‘నరహంతకుని స్వగతం’ అనే పేరుతో వచ్చింది.

పార్థసారథిగారి రచనలు

12. ‘ప్రపంచ రచయిత్రుల కథలు’ సంపుటిలో ఎటువంటి అంశాలకు చోటు కల్పించారు?
జ :-    ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేను. కానీ నేను చదివిన టిల్లీ ఆల్సెన్, గ్రేస్ పాల్ మొదలైన ప్రపంచ రచయిత్రులు ఒక 14 మంది రచించిన కథలను అనువాదం చేసి ఈ పుస్తకం వేశాను. ఇవన్నీ విపుల మాసపత్రికలో అచ్చయినాయి. చెప్పాలనుకున్నది అనువదించాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని చెప్పడానికి గీటురాయి అంటూ ఏదీ లేదు. అందుకే కారణాలు చెప్పలేను.

13. ‘కథల వాచకం’ అనే పేరుతో రాసిన రచనలో 14 దేశాలకు చెందిన 20 కథలు ఒకే కోణంతో రాసినవా? విభిన్న కోణాలను ఆవిష్కరించేవా? అవి ఏ విధమైనవి?
జ :-   ఇది కూడా ప్రత్యేకంగా ఈ కోణంలో మాత్రమే అనేవిధంగా తీసుకున్నవి కావు. నేను ముందే చెప్పాను కదా! నాకు నచ్చినవి, మనకు అభిరుచికి తగినవి తెలుగువారికి అందజేయడం కోసమే నేను అనువాదాలు చేశాను. అలా నాకు నచ్చిన 20 కథలు ఇంగ్లండ్, రష్యా, ఈజిప్టు, సింగపూర్, ఇండోనేషియా, నైజీరియా, చెక్, పోలిష్/ ఇడ్డిష్, చైనా, ఇటలీ, బ్రెజిల్, కరీబియన్, కొలంబియా, యు ఎస్ ఎ దేశాలనుండి తీసుకొని ఈ పుస్తకం వేయడం జరిగింది. వివిధ పత్రికల్లో ఇవి ప్రచురింపబడ్డాయి.

14. ‘బెస్ట్ సెల్లర్స్’ బుక్ పుస్తకాలకు సంబంధించిన ఎటువంటి నేపథ్యాన్ని తెలుపుతుంది?
జ :-   కథ అనేది ఒక ఊబి లాంటిది. ఒకసారి మనం చదవడం ప్రారంభిస్తే అది మనలను లోపలికి లాక్కోవాలి. అది కథకు ఉండే లక్షణం. అది లేకపోతే అది కథ కాదు. కథలన్నీ భావోద్వేగాలు, మానవ సంబంధాలు, మనిషికి, సమాజానికి ఉన్న సంబంధాలను చెప్పగలిగేవి. అలా చెప్పలేనివి మంచి కథలు కావు. ఆ విధంగా ప్రపంచంలో మంచి పుస్తకాలుగా, బాగా అమ్ముడుపోయిన 60 పుస్తకాలకు సంబంధించి చేసిన పరిచయం ఈ పుస్తకం. ఆయా రచయితలు, రచయిత్రులు ఆ పుస్తకం రాయడానికి గల నేపథ్యాన్ని వివరిస్తూ రాసినది. ఒకరకంగా ఆ కథల వెనుక ఉన్న వెతలను కూడా తెలిపేది. ఇవన్నీ ‘నవ్య’ వారపత్రికలో ప్రచురితమయ్యాయి.

15. రష్యన్ విప్లవం గురించి రాయాలనుకోవడానికి కారణం ఏమిటి?
జ :-    కారల్ మార్క్స్ తో నాకు పరిచయం ఆలస్యంగా అయింది. అమెరికా సాహిత్యంలో మునిగిపోయాను. తర్వాత కారల్ మార్క్స్ రాసింది నిజాయితీగా ఉందనిపించింది. స్టీమ్ ఇంజన్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు ఏర్పడడం సులభమైంది. ఒకే రూఫ్ కింద వందలమంది కార్మికులు యంత్రాల ద్వారా పనిచేసే సామర్థ్యం వచ్చింది. చేతివృత్తులను వదిలి అందరూ వాటికి మొగ్గు చూపారు. యంత్రం అనేది రోజు రోజుకూ ప్రగతి చెందుతూనే ఉంటుంది. అందువల్ల యంత్ర సామర్థ్యం పెరిగింది. కార్మికులు చేసే పనిగంటలు పెరగకపోయినా చేసే పని ఒత్తిడి పెరిగింది. జీతాలు పెరగలేదు. వచ్చే లాభం యజమానికే తప్ప వీళ్లకు ఎలాంటి అధికారం, హక్కు ఉండవు. అదే దోపిడి. మార్క్సిజం  సిద్ధాంతానికి మూలం. ఈ శ్రమ దోపిడి ఆగినప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. దీనికోసం పోరాడాలంటే ఒక్కరితో కాదు. అందువల్ల లెనిన్ దీనికొరకు రష్యాలో విప్లవం తీసుకొచ్చాడు. లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవన్నీ చరిత్రలో పుస్తకాలుగా వచ్చాయి. Mary Gabriel రాసిన ‘ Love and Capital’ ను నేను ‘ప్రేమ- పెట్టుబడి’ గా అనువదించాను. రష్యన్ విప్లవం ప్రజల చరిత్ర, కారల్ మార్క్స్ బయోగ్రఫీ రాశాను.

16. మీ ‘నోబెల్ తారలు’ పుస్తకాన్ని గురించి చెప్పండి.
జ :-  ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి అందరికీ తెలిసిందే. తాను కనుక్కున్న డైనమెట్ దుష్పరిణామాలకు చింతించి తన మరణానంతరం నోబెల్ శాంతి బహుమతి కోసం తన యావదాస్తిని ఇచ్చేసాడు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఇది ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ బుక్ లో నోబెల్ బహుమతి పొందిన 32 మంది గురించిన కథానికలు రాశాను. ఇవి కూడా వివిధ పత్రికల్లో అచ్చు వేయబడ్డాయి.

17. ప్రత్యేకంగా ‘విట్ గన్ స్టైన్’ స్మృతి కవిత రాయడానికి కారణం ఏంటి?
జ :-  Wittgenstein గణిత శాస్త్రజ్ఞుడు. అందులో గణిత తార్కికతలో బాగా పరిశోధన చేసినవాడు. Bertrand Russell అనబడే గొప్ప గణిత శాస్త్రజ్ఞునికి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారం లేకున్నా దానికి బదులుగా సాహిత్యంలో ఇచ్చారు. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు విట్ గన్ స్టెయిన్ ఇతనికి శిష్యుడు. కొద్దిరోజుల్లోనే రస్సెల్ తో నువ్వు చెప్పిందంతా తప్పు అని చెప్పిన గొప్ప మేధావి. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో స్టెయిన్ కొంతకాలం పాఠాలు చెప్పాడు. ఒక్కోసారి క్లాస్ లో పాఠాలు కూడా చెప్పకుండా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆయన పాఠం చెప్పదలచుకున్నప్పుడు విద్యార్థులను ఉదయం 6 గంటలకే రమ్మనేవారు. అంతటి మేధావి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి ఆసక్తి కలిగి ఆయన మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. దాంతో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా కలిపి పుస్తకం వేశాను. ఇవన్నీ ‘మిసిమి’ పత్రికలో వచ్చినవే.

18. సాహిత్యం పలు రకాలుగా పరిణామం చెందుతున్న ప్రస్తుత కాలంలో వస్తున్న రచనల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? ఈనాటి రచయితలకు ఏవైనా సూచనలు ఇవ్వండి.
జ :-    ఇప్పుడొస్తున్న సాహిత్యాన్ని ఒక యూనిట్ గా చూడలేము. వేలమంది రాస్తున్నారు. అన్నిరకాల పుస్తకాలు అనేక ప్రక్రియలతో వస్తున్నాయి. ఇదొక సూపర్ మార్కెట్ లాంటిది. Lu Xun అని గొప్ప చైనీస్ రచయిత. ఆయన ఒక మాట అంటారు. “పుస్తకాల షాపులో ఒకటి విప్లవానికి సంబంధించినది, దాని పక్కనే లవ్ స్టోరీకి సంబంధించిన పుస్తకం ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరికి ఇష్టం ఉన్న పుస్తకాన్ని వాళ్ళు కొంటారు. నీ పుస్తకానికి విలువ ఏముంది?” అని. అంతే కదా! ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కో కోణంలో చర్చించలేము. అనేక కోణాలుంటాయి. కానీ అవసరాలు ఎన్నున్నాయో తెలియదు కదా! అందుకే ఇది మంచి చెడు అని చెప్పలేము. ఎవరికి ఇష్టమైంది వారు రాసుకుంటారు. మీకు చెప్పాను కదా! రచన ఏదైనా పాఠకులను రంజింపజేసేదిగా ఉండాలి. మనకు ఇష్టమైనది రాసినా, పాఠకులకు ఆకర్షణీయంగా, ఆలోచింపజేసేదిగా ఉండాలి. చాసో గొప్ప రచయిత. ఒక్కొక్క పదాన్ని చెక్కుతాడు. రాసి అక్కడ పెడతాడు. మళ్లీ మళ్లీ చూస్తాడు. మార్పులు చేస్తాడు. అందుకే వ్యర్థమైన పదం ఒక్కటి కూడా కనిపించదు. కాబట్టి మనలను మనం సరిదిద్దుకుంటూ రచన చేయాలి. అప్పుడే మంచి పుస్తకం రాగలుగుతుంది.

సంతోషం సార్, మా కోసం ఎంతో ఓపికగా మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ సాహితీ యాత్రా విశేషాలను తెలియజేసినందుకు మా తరపున, మా మయూఖ పాఠకుల తరపున కృతజ్ఞతలు నమస్కారాలు🙏🏼

November 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

” గిన్నిస్ బుక్”

by Vijaya Kandala November 22, 2024
written by Vijaya Kandala

ప్రముఖ రచయిత్రి విజయ కందాళ గారు ” గిన్నిస్ బుక్” అనే పుస్తకం గురించి వారు చేస్తున్న ఆడియో ‘ మితభాషి‘ శబ్ద సంచికలో ప్రముఖ రచయిత ముక్తవరం పార్థ సారథి గారు రచించిన పుస్తకం లోనుంచి విషయాన్ని సమీక్షిస్తున్నారు వినండి , తెలుసుకోండి. నోరిస్ మాక్ విర్టర్, రాస్ మాక్ విర్టర్
కవల సోదరులు.
లండన్ లో August 1955
తొలి ప్రచురణ చేసిన గిన్నిస్ బుక్ గురించి మీకోసం..
-సంపా

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.

by Narendra Sandineni November 22, 2024
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (16)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)

ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.
“శత్రువులను కలుద్దామని వాళ్ళ ఇళ్ళని
“వెతుక్కుంటూ వెళ్ళానా …ఇక చూడండి
“అక్కడ నా స్నేహితులతోనే ములాఖత్ అయింది”.
ఒకరికి కొందరికి హాని కలిగించినట్టి,రాజ్యానికి దేశానికి ద్రోహం చేసినట్టి వ్యక్తిని శత్రువుగా భావిస్తారు.మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం శత్రువు.ఒకరికి మరొకరిపై మనసులో కలిగే కీడు భావన ఇరువురి మధ్య శత్రుత్వాన్ని కలిగిస్తుంది. అటు వంటి వాడే శత్రువు.ఒకరి నిర్ణయం ఇంకొకరికి నచ్చనప్పుడు మౌనంగా ఉండకపోవడం వల్ల మనసులో చెలరేగే ప్రతీకార భావనలు శత్రువుల్ని తయారుచేస్తాయి.తన కోపమే తన శత్రువు అని సుమతీ శతకంలో రాయబడి ఉంది.స్నేహితులు కాని వారు శత్రువులు.మనకు హాని కలిగించే వారు శత్రువులు.మనకు వ్యతిరేకంగా పని చేసే వారు శత్రువులు.శత్రుత్వం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సమూహాల మధ్య నెలకొన్న వ్యతిరేక భావనగా పేర్కొనవచ్చు.స్నేహితుల మధ్య సయోధ్య లేక పోవడం,అపోహలు,మనస్పర్ధలు,అవగాహన లోపంతో స్నేహం పటాపంచలై శత్రుత్వంగా మారుతుంది.స్నేహం అద్భుతమైంది.నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహానికి హద్దులు లేవు.అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది.స్నేహం ఓ మధురమైన అనుభూతి.దానికి వయసుతో నిమిత్తం లేదు.ఆట పాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహ భావం ఉంటుంది.అటు వంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది.సృష్టిలో నా అనే వారు, బంధువులు లేని వారైనా ఉంటారేమోగాని స్నేహితుడు లేని వారు అసలు ఉండరు.ఇంట్లో చెప్ప లేని సమస్యలను,బాధలను సైతం స్నేహితులతో ఎటు వంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పును పొందుతారు.అది స్నేహంలోని గొప్పతనం.స్నేహం ప్రకృతి వంటిది.అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయిని ఇస్తుంది.మనిషి జీవన యానంలో స్నేహం శ్వాస వంటిది.స్నేహం ఎంతో తియ్యనైంది.అమ్మ ప్రేమ,స్నేహం వెల కట్ట లేనిది.ఈ రెండే జీవితంలో ముఖ్యమైనవి. స్నేహితులతో కలిసిమెలిసి ఉంటే కలిగే ఆనందం చెప్ప లేనిది.పవిత్రమైన స్నేహం ఉండాలి.అటు వంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఈ కవిత శత్రుత్వం మరియు స్నేహం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది.మనం శత్రువులను వెతుక్కుంటూ వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు తారసపడ్డట్లుగా ఉంది.ఈ కవితలోని భావం మనల్ని ఆలోచింప జేస్తుంది.అసలు శత్రువులు అంటే ఎవరు? మనుషుల మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడుతుంది? స్నేహం మరియు శత్రుత్వానికి గల సంబంధం ఏమిటి?ఈ కవితలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా స్నేహితులను మరియు శత్రువులను గురించి ఆలోచింప జేస్తుంది.శత్రువులు అందరు మన స్నేహితులు కాకపోవచ్చు.స్నేహితులు కూడా శత్రువులుగా మారవచ్చు.మనం ఎవరిని శత్రువులుగా భావిస్తాము అనే సంగతి గురించి ఆలోచించాలి.ఈ వాక్యం ఆలోచనాత్మకంగా మరియు వ్యంగ్య భరితంగా,ఎంతో లోతైన భావాలు,జీవన దార్శనికతతో కూడిన అనుభవాలను ప్రతిబింబించేలా ఉంది.శత్రువులను కలుద్దామని వెతుక్కుంటూ వెళ్లడం అనే వాక్యం మనలను ఆలోచింపజేస్తుంది.ఇది సమస్యను నేరుగా ఎదుర్కోవాలనే సంకల్పంతో ప్రారంభమైన చర్యగా భావించవచ్చు.శత్రువులు అంటే మీరు ప్రత్యర్థులుగా భావించిన వారు అని సూచిస్తుంది. జీవితంలో మనం ఎవరిని శత్రువులుగా భావిస్తున్నామో వాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే అసలు వాళ్లు శత్రువులే కాకుండా స్నేహితులుగా కూడా మారవచ్చు.అక్కడ స్నేహితులతో ములాఖత్ కావడం అనేది ఆలోచింపజేస్తుంది.ములాఖత్ అనేది ఉర్దూ పదం.ఎవరైనా లేదా వ్యక్తులతో సమావేశం కావడం అని అర్థం.ఒకో సారి మనకు జీవితంలో అనుకోని సందర్భాలు కూడా ఎదురవుతాయి.మీరు ఒక ప్రతికూల సంఘటనను ఎదుర్కొనే ఉద్దేశంతో వెళ్లడం అది ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మారిపోవడం సహజం అనిపిస్తుంది.అనూహ్యంగా మీరు శత్రువులుగా భావించిన వారు నిజానికి మీ స్నేహితులు అని తెలిసింది.అక్కడ మీరు అనుకోని స్నేహితులను కలిశారు.మీరు వారిని మనసులో ప్రతికూలంగా భావించారు.కాని సానుకూల పరిణామం ఏర్పడింది.అది జీవితపు వ్యంగ్యాన్ని ప్రతిబింబిస్తుంది.మనం చాలా సార్లు ఒక దాన్ని అనుకుంటాం.విచిత్రంగా వేరే దాన్ని ఎదుర్కొంటాం. మనం కొన్ని సార్లు అపోహతో ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకుంటాం.జీవితంలో మనం కొన్ని సార్లు అనవసరంగా కొందరిని శత్రువులుగా భావిస్తాం.కాని వారిని గమనిస్తే మనకు వాళ్లలో ఏదో తెలియని సంబంధం,స్నేహం మిళితమై ఉంది అనిపిస్తుంది.ఒక్కో సారి మనకు తెలియకుండానే జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి.మన జీవితంలో ఏది ఎలా జరుగుతుందో ముందుగా అంచనా వేయడం చాలా కష్టం.జీవితం అనే మజిలీలో జరిగిన ఆ సంఘటన చిత్రంగా అనుకోని మలుపుగా భావించవచ్చు. జీవితంలో ఎదురైన సంఘటనలు కొన్ని మనలను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాను ఎదురు చూసింది ఒకటి తనకు తెలియకుండానే మరొకటి జరిగింది. తాను ప్రతికూల భావనలతో వ్యవహరించినప్పటికీ చివరకు అది సానుకూల పరిణామంగా మారడం సంతోషాన్ని కలిగించింది.ఈ వాక్యం జీవితపు అంతర్లీన సత్యాలను,అనుభవాలను, దార్శనికంగా వ్యక్తపరుస్తుంది.శత్రువులను వెతుక్కుంటూ వెళ్లి స్నేహితులని కలవడం అంటే తాను అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన అనుభూతిని పొందడం విస్మయం కలిగిస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

శాంతి ఎందుకు అవసరం?

by రంగరాజు పద్మజ November 22, 2024
written by రంగరాజు పద్మజ

బహుముఖ ప్రజ్జాశాలులు శాంతి కాముకులు శ్రీ సిరాజుద్దీన్ గారితో మూఖాముఖీ

ఓం ద్యౌః శాన్తిరన్తరిక్షమ్
శాన్తి పృథివీశాన్తి రాపః
శాన్తి రోషధయః శాన్తి ౹
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః
శాన్తి బ్రహ్మ శాన్తి సర్వం శాన్తిః
శాన్తి రేవ శాన్తిః
సామా శాన్తిరేధి ౹ ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ॥

ఈ శాంతి మంత్రం భావంఏమిటంటే?
ఓ ప్రణవ స్వరూపా! ఊర్ద్వలోకంలో శాంతి నెలకొను గాక! అంతరిక్షంలో శాంతి నెలకొనుగాక!
మరియు జలములందు శాంతి నెలకొనుగాక! ఓషధులలో, అడవులలో,శాంతి నెలకొనుగాక! విశ్వమును పరిపాలించే దేవతలు శాన్తితో ఉందురుగాక! బ్రహ్మ శాంతి వహించుగాక! ప్రపంచమంతా శాంతి నెలకొనుగాక! విశ్వమంతటా శాంతి నెలకొను గాక!
అని వేదసూక్తం మనకేనాడో శాంతి యొక్క ఆవశ్యకతను చెప్పింది. శాంతి ప్రాధాన్యతను బృహదారణ్యక, ఈశావాస్య, తైత్తిరీయ మొదలైన అన్ని ఉపనిషత్తులలోనూ శాంతి మంత్రాలను పఠిస్తూ చివరిగా… ఓం శాంతిః శాంతిః శాంతిః అని ఈ పదాన్ని మూడుసార్లు ఎందుకు పలుకుతాం? అంటే
మూడుసార్లు ఎందుకు పలుకుతామని అంటే మొదటి శాంతి మనమూ, పరిసరాలు బాగుండాలనీ, అంటే అందరి శారీరక- మానసిక ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్థిస్తాం!

రెండవ శాంతి పదం జీవకోటి సమస్తం ఏ ఆపదలూ? ముప్పు రాకుండా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తాం!
మూడవ శాంతి పదం ప్రకృతి నుండి కలిగే ముప్పులు.. ఉదాహరణకు భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ అపాయం కలగ కూడదని ప్రార్థిస్తాం !
మన ప్రార్థనలు విశ్వంలోకి వెళ్తాయనీ, మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా విశ్వశాంతి చేకూరుతుందని మన సనాతన ధర్మం చెప్తుంది.
శాంతి ఎందుకు అవసరం?
ఈ నేలమీద మన మనుగడ చక్కగా సాగాలంటే శాంతి కావాలి. ఈ శాంతిని మనం ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత, కాలుష్యంతో కొంత పోగొట్టుకుంటున్నామంటే… మరికొంత వైషమ్యాల వల్ల పోగొట్టుకుంటున్నాము.
అధికార ప్రదర్శనలో బలవంతులు బలహీనులపై చేసే యుద్ధాల వల్ల కూడా శాంతి కరువౌవుతున్నది. సమాజంలో శాంతి ఉన్నప్పుడు మాత్రమే మన మంతా సామరస్యంగా… అన్ని పనులు చేసుకోగలుగుతాం!
మరి సామరస్యం ఎందుకు లేదని అంటే???
ఒక పరిశీలన చేస్తే ఇద్దరి మధ్య విభేదాలు చర్చించి పరిష్కరించుకోకపోవడం, ఒకరికి ధన బలము, అధికార దర్పము ఉండి, ఇద్దరి మధ్య అవి అడ్డు రావడం ఒకటైతే… కాల ప్రభావంతో మానవ విలువలను మింగేయటమే ముఖ్యం. అయితే దేశాల మధ్య కానీ మానవజాతుల మధ్య కానీ ఆ తేడాలు ఉండడం సహజమే! కానీ శాంతి కావాలనుకున్నప్పుడు ఆ తేడాలను అంతగా పట్టించుకోకుండా
అందరమూ బాగుండాలి అందులో మనముండిలి అనే సిద్ధాంతం పాటిస్తే కొంతలో కొంత శాంతి మన సొంతమవుతుంది. అహాన్ని కొంత వదిలించుకుంటే అంతా శాంతే మరి!
మరి బతుకులోనూ మొండిగా నేను ఇలాగే ఉంటాను.. అంటే శాంతి లోపించి భయంకర పరిణామాలు ఎదురవుతాయి! అంటే అరాచకం చెలరేగుతుంది. మతం ఏదైనా సరే! జాతేదైనా సరే ! వర్ణమేదైనాసరే ? ఎవరైనా అందరూ శాంతి మంత్రాలు పాటించవలసిందే! ఇందులో భాగంగానే అటువంటి శాంతి స్థాపన కోసం మన వరంగల్ నివాసులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ సోదరులు గొప్ప
ప్రపంచ శాంతి పండుగను కనుక్కొని, సమాజానికి పరిచయం చేసి, తాను పాటిస్తూ అందరూ పాటించడానికి గత కొంతకాలంగా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు.. ప్రయాస పడుతున్నారు.
ఆ శాంతి పండగ నేపథ్యంలో ఎందుకు ఆ వారికి ఆలోచన వచ్చిందీ? దానిని వారు ఎలా రూపకల్పన చేశారు? దాని కోసం వారు చేస్తున్న కృషి ఏమిటీ? అసలు శాంతి పండగ అంటే ఏమిటి? ఇలా వారి మనసులోని వసుధైక కుటుంబం అనే విశాల భావనలో నుండి ఏర్పడిన ప్రపంచ శాంతి పండగ ఆశయాన్ని చేరుకోవాలని శాంతి మన సమాజ సొంతం అవ్వాలని, మనః పూర్వకమైన శుభాకాంక్షలతో వారిని పరిచయం చేసుకుందాం… అందరమూ మనం శాంతి పండగను ఆచరించుకుందాం! సంతోషంగా ఉందాం!
శాంతి పండగ వ్యవస్థాపకులు గౌరవనీయులు మహమ్మద్ సిరాజుద్దీన్ గారికి స్వాగతం చెప్పుదామా? రస హృదయులైన సహృదయ పాఠకులకు నమస్కరిస్తూ…మీ రంగరాజు పద్మజ.

1 పద్మజ:- శ్రీ సిరాజుద్ధీన్ గారు నమస్కారాలండి.

Md సిరాజ్ :- నమస్కారాలండి పద్మజగారు.

  1. పద్మజ:- మీ కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా?
    Md సిరాజ్:- మా కుటుంబ నేపథ్యం ఏమిటంటే…
    మా అమ్మ శ్రీమతి మెహెరున్నీసా బేగం.
    నాన్న శ్రీ ఖాజా మొయినుద్దీన్.
    స్వస్థలం: మా స్వస్థలం రంగాపూర్, నల్లబెల్లి మండలం. రెండు గ్రామాలను మా ముత్తాతలు నిర్మించారు. ఇది పాత నర్సంపేట తాలూక, వరంగల్ జిల్లాలో ఉండేది. నేను ప్రస్తుతం హనుమకొండలో నివసిస్తున్నాను.
    మాది రైతుకుటుంబం.
  2. పద్మజ:- మీరు ప్రధానంగా ఏ ఏ రంగాల్లో కృషి చేశారు?

Md సిరాజ్ :– ప్రధానంగా అంటే సామాజికమే. శాంతి స్థాపన నా ధ్యేయం. మళ్లీ అందులో ప్రపంచ శాంతి. ఇవికాక, సాహిత్యం: ప్రధానంగా తెలుగు సాహిత్యం. ఇందులో కవిత, కథ, తదితరాలు. కొంతమేరకు హిందీ, ఉర్దూలలో కూడా.
ఇంకా ఆటా- పాటా రాజకీయాలు, చిత్రలేఖనం, క్రీడలు. నేను స్థాపించుకున్న మూడు సంస్థలు (ఉజ్వల సాహితీ, వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ, మరియు తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య) ద్వారా సంగీత- సాహిత్య మరియు సంస్కృతుల సేవ.

  1. పద్మజ:- మీరు స్థాపించిన తెలంగాణా రాష్ట్ర కవుల సంక్షేమ సమాఖ్య గురించి వివరించండి.

Md సిరాజ్ :— ఈ సంస్థను ఓ ఏడు నెలలు ముందు స్థాపించాను. ఆ మధ్య ఇక్కడ ఇద్దరు కవులు చనిపోయారు. పేదరికం వల్ల కర్మకాండలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే మేము కొందరం కావులము చందాలు వేసుకుని వారిని ఆదుకునే ప్రయత్నాలు చేసాము. ఆ సందర్భాలు నన్ను కలచి వేసాయి. తెలంగాణాలో CM గారు ఆ మధ్య రైతులకు, యాదవులు, గౌడులు, తదితరులకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినాడు, అలాగే రైతులు తదితరుల జీవితాలకు ఉచిత భీమా కూడా చేసినారు. రైతు మరణిస్తే అతడి ఇంటికి 5 లక్షల భీమా డబ్బులు వచ్చేవి. అలాంటి పథకాలు, భీమా, తదితర పథకాలను నిస్వార్థంగా బ్రతుకంతా సమాజ సేవ చేసే కవులకు కూడా కల్పించండని KCR గారిని రాష్ట్ర కవుల తరపున మనవి చేసు కోవాలనే లక్ష్యంతో ఈ సమాఖ్యను స్థాపించాను. మరియు KCR గారికి పలు మార్గాల్లో విన్నవించుకోవటం కూడా జరిగింది. అయితే ఇంతలో ఎన్నికలు రావటం KCR పదవి నుండి దిగిపోవటం జరిగింది. అయినా ఈ ప్రభుత్వానికి కూడా విన్నవించుకోనున్నాము. ప్రస్తుతం ఈ సంస్థను రిజిస్టర్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాము.
కాగా పాటలను (కరోకే విధానంలో పాడే విధానం) పాడే ఏకశిలా కరోకే క్లబ్ తో కలసి నెలనెలా సాహిత్య, సంగీత సమావేశాలను వరుసగా నిర్వహిస్తూ వస్తున్నాము.
ఈ సందర్భంగా ఓ నెల ఒక కవినీ ఇంకో నెల ఈ సంగీత కారుణ్ణీ, సన్మానించుకుంటూ గంగా జమ్నీ తహెజీబ్ (మాట సామరస్యం) కు అనుగుణంగా ముషాయిరా మరియు కవిసమ్మేళనాలను నిర్వహిస్తూ వస్తున్నాం.

  1. పద్మజ:- శాంతి పండుగ, ప్రపంచ శాంతి గురించి వివరించగలరా?

Md సిరాజ్ :- 1995 లో ప్రపంచానికి నేను బహుకరించిన శాంతి పండుగను ఏదో ఆషామాషీగా కాదు, పండుగ ద్వారా నిజంగా ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, గ్రామానికీ, పట్టణం, జిల్లా, రాష్ట్రం, దేశం మరియు అలా సమస్త ప్రపంచానికీ అన్ని రకాల అభివృద్ధులతో పాటు అంతిమంగా శాంతి లభించాల్సిందే అనే అత్యంత పటిష్టమైన పండుగను రచించాను.
వేయి కాళ్ళ జెర్రిలా ప్రపంచాన్ని చుట్టుకుని ఉన్న అశాంతిని నేనొక్కణ్ణి, అందునా కేవలం పండుగ అనే ఒకే ఒక ఆయుధంతో ఎలా నిర్మూలించగలను అనే విషయాలు తెలవని మనిషినేమీ కాను. ఇన్ని తేలిసే నేనీ అశాంతిని నిర్మూలించి, ప్రపంచంలో శాంతిని సాధించే పండుగను సృష్టించే ప్రయత్నం చేసాను.
పండుగను 1995 లో ప్రతిపాదించి, దానిని 1996 లో అప్పటి UNO సెక్రెటరీ జనరల్ గారి దృష్టికి తీసుకు పోయాను. వారు 1996లోనే అభినందించారు. అలా నా ద్వారా జీవం పోసుకున్న ఈ పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేయడం కోసమని World Peace Festival Society పేర ఓ అంతర్జాతీయ శాంతి సంస్థను స్థాపించి రిజిస్టర్ చేయడం జరిగింది.
దీని జీవిత కాల సభ్యుల్లో శ్రీ కాళోజీ, శ్రీ జయశంకర్ తదితరులు ఉన్నారు. కొత్త పండుగను ప్రపంచం నిండా వ్యాపింప చేసేందుకు ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాల్లో శాంతి పండుగల నిర్వహణ, భారత్ శాంతిదూత్ అవార్డుల బహూకరణ, ఉగాది మిలన్, ఈద్ మిలాప్, మన పండుగలు, శాంతి ర్యాలీలు వంటి పలు కార్యక్రమాలు ఉన్నాయి.
భారత్ శాంతిదూత్ అవార్డులు ప్రదానం చేయబడిన వారిలో పద్మవిభూషణ్ Prof MS స్వామినాథన్ గారు, శ్రీ పాలెం కళ్యాణ సుందరం (తమిళనాడు), పద్మభూషణ్ Dr K I వరప్రసాద్ రెడ్డి గారు (శాంతా బయోటెక్), పద్మశ్రీ Dr K విశ్వనాథ్ గారు (సినిమాలు), పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్ గారు, శ్రీ PV నరసింహా రావ్ గారి (మరణాంతర), శ్రీ తక్కెళ్లపల్లి పురుషోత్తమ రావ్ గారు, (గాంధేయవాది), Prof B సురేష్ లాల్, లాంటి ముప్పై మందికి కు పైగా ప్రముఖులు ఉన్నారు.
మా సంస్థకు UNO వారు Affiliation ఇచ్చినారు. ఈ సంస్థను స్థాపించుకున్నప్పటికీ అధ్యక్షులుగా ఇతరులనే నియమించుకుంటూ వస్తున్నాను. ఈ అసాధారణమైన ప్రయత్నం వెనుకాల నిస్వార్థంగా నేరుగా ఇరవై ఏడు సంవత్సారాలుగా జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఇదే ధ్యాసాగా, శ్వాసగా జీవిస్తూ వస్తున్నాను.

  1. పద్మజ:-మీరు సాహిత్యం వైపు అడుగులు వేయడానికి కారణాలేవి?

Md.సిరాజుద్దీన్:- ఏమో నాకే తెలవదు. ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని తీసుకుని క్రొత్త పండుగకు కాళోజీ గారి సహకారాన్ని తీసుకోవటం కోసం వారిని 1996 లో అనుకుంటా కలిశాను. వారు కొందరు కవులను పరిచయం చేసారు. పండుగకు కవుల సహకారం తీసుకోవడం కోసం అపుడప్పుడు కవితలను రాసుకునే నేను కవితా రచనాసక్తి పెంచుకున్నాను. ఊహించని రీతిలో ప్రోత్సాహం లభించ సాగింది. అలా కవిగా కూడా నిలిచి పోయాను. అయితే ఇవన్నీ నాకున్న కొన్ని అభిరుచులే అని తలుస్తాను. వాస్తవానికి నా జీవిత లక్ష్యం గమ్యం ప్రపంచ శాంతి పండుగే.

  1. పద్మజ:- మీ పుస్తకాన్ని శ్రీ కాళోజి గారితో
    ఆవిష్కరించినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పటి అనుభవాలు చెప్పండి. 1997 నుండి శాంతి పండగ ఇప్పటివరకు జరగడం ఆశ్చర్యం కాదా! దీని మీద ప్రముఖుల స్పందన ఏమిటి?

7.Md సిరాజ్ :- శ్రీ కాళోజీ గారు ప్రపంచ శాంతి పండుగ పుస్తకాన్ని చూసి పరమానందం పొందారు. ఈ పుస్తకం ఆవిష్కరించ బడిందా? అని అడిగారు.
ఆవిష్కరించబడలేదని అన్నాను.
నేను ఆవిష్కరిస్తా అన్నారు. సంతోషం అన్నాను. మిత్రమండలి నేతృత్వంలో మరికొన్ని సాహితీ సంస్థలను కలుపుకుని కాళోజీ గారు 27.01.1997 న నా పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వారు,” ఈ పుస్తకం ప్రపంచ భాషలన్నింటిలో రావాలి, ప్రపంచ ప్రజలందరూ దీనిని చదవాలి, అపుడే ఈ పండుగను ప్రపంచమంతా జరుపుకో గలుగుతుంది”. అన్నారు.
Prof K జయశంకర్ గారు, ” ఆనాడు Newton కు వచ్చినటువంటి ఆలోచనే నేడు సిరాజోద్దీన్ కు వచ్చింది. Newton ఆలోచనా ఫలాలను నేటి ప్రజలు అనుభవిస్తున్నారు. సిరాజుద్దీన్ ఆలోచనా ఫలాలను రేపటి ప్రపంచం అనుభవించనుంది”. అన్నారు.
Prof S లక్షణమూర్తి గారు, ” నేనో ప్రతిపాదన చేస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఉర్దూలో తర్జుమా చేసి జుమ్మా (శుక్రవారం) లలో మస్జీద్ ల వద్ద, తెలుగులో ఇంకిన్ని ప్రతులు వేసి శనివారాలలో దేవాలయాల వద్ద, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ఆదివారాలలో చర్చ్ లవద్ద ప్రభుత్వమే ఉచితంగా పంచి పెట్టాలి అన్నారు.
శ్రీ నమిలిగొండ బాల్ కిషన్ రావ్ గారు వ్యక్తిగతంగా ప్రశంసిస్తూ, ” ఓ అయిదు వందల సంవత్సారాల తరువాత ప్రపంచం నిండా సిరాజోద్దీన్ విగ్రహాలే ఉంటాయి, ఇదే కోవలో శ్రీ గౌస్ మోహిఉద్దీన్ గారు ప్రశంసిస్తూ, ” నోబెల్ తో పాటు ప్రపంచంలోని అవార్డులు రివార్డులన్నింటితో సిరాజోద్దీన్ కు సన్మానం జరగాలి. సిరాజోద్దీన్ ను UNO ఆజన్మ ప్రపంచ శాంతిదూత గా ప్రకటించాలి”, ఇలాంటి ప్రశంసలు లభించాయి, లభిస్తున్నాయి కూడా….

  1. పద్మజ:- శ్రీ కాళోజీగారితో మీ స్నేహాన్ని వివరించగలరా?

Md సిరాజ్ :- కాగా కాళోజీ గారు నను కవిగా ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ, కవితా సంపుటి యుద్ధం ను వేసుకునే నాటికి (2005) వారు లేరు.
అయితే కాళోజీ గారితో నా అనుబంధం ఆరు సంవత్సారాల పాటు సాగింది. ప్రధానంగా ప్రపంచ శాంతి పండుగకు వెన్నుదన్నుగా వారే నిలిచారు. KCR గారి కాలంలో కాళోజీ గారన్నా జయశంకర్ గారన్నా ఉండి ఉంటే ఈ పండుగ కనీసం దేశం దాటేదేమో….
కవిగా కూడా కాళోజీ గారితో నా స్నేహం సంతృప్తిగానే సాగిందనేదానికి వారి మరణానంతరం వారిపై నేను రాసుకున్న శ్రద్ధాంజలి కవితా గేయమే సాక్ష్యం.

ఇక్కడ కాళోజీ కవిత పెట్టాలి.

  1. పద్మజ:- మీరు రచించిన పుస్తకాలు పేర్లు చెప్పగలరా? Md సిరాజ్:-ముద్రించుకున్నవి ప్రధానంగా రెండే. మొదటిది 1995 లో ప్రపంచ శాంతి పండుగ. (అది ఓ సామాజిక ప్రయోగంగా నేను తలుస్తాను).
    యుద్ధం….శాంతి అశాంతుల మధ్య
    అనేది రెండోది కవితా సంపుటి.
  2. పద్మజ:- మీకిష్టమైన పుస్తకం చెప్పండి.

Md సిరాజ్ -:నాకు నచ్చిన పుసఏడు తరాలు అనే అనువాద నవల. (Roots అనే ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది).

  1. పద్మజ:- మీరు రాసిన కవితలు మీకు బాగా నచ్చిన కవితను మా పాఠకుల కోసం వివరించగలరా?

Md సిరాజ్
కవత 2 పోస్ట్ చేయాలి.

13.పద్మజ:- మీ రచనలో ప్రధానంగా ఏ యే అంశాలు కనిపిస్తాయి?

Md సిరాజ్:- నా కవితలల్లోశాంతీ సామరస్యాలు, మంచీ మానవత్వం, కవితల్లో మెచ్యూరిటీ నిండుగా ఉండాలనుకుని కోరుకుంటాను. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండి తీరాల్సిందే, అంటాను. కవితల్లో ప్రజా సమస్యలు ఉండాలంటాను. కవితలను వీలైనంతవరకు మధురంగా పాడి వినిపిస్తాను. కవితను ఇష్టంగా కష్టపడి రాస్తాను. నా కవితను ఒక మారు విన్నవారు దాదాపుగా నన్ను మరచిపోరని ప్రతీతి. ఇలాంటి ప్రత్యేకతలతో నా కవితలు కూడుకుని ఉంటాయి. కాబట్టి కవితలంటే పారిపోయే ప్రజలు కూడా నాకవితలను శ్రద్ధగా వింటారు. అలాంటి అభిమానులు నాకు ఉండటం నా అదృష్టం.

  1. పద్మజ:- మీరు ఏ వయసు నుండి సాహిత్యం మీద కృషి చేస్తున్నారు?

Md సిరాజ్:-చిన్నప్పటి నుండే. బహుశా నా16వ ఏటనుండి అనుకుంటున్నా.

  1. పద్మజ:- మీరు ఏ ఏ పత్రికలో వ్యాసాలు రాశారు? వాటి వివరాలు చెబుతారా?

Md సిరాజ్ :-మొదట్లో దాదాపు అన్ని పత్రికల్లో వచ్చాయి. పత్రికల్లో వేసుకోవాలనే కోరిక ఇపుడు లేదు. అట్లాగని కవితలను రాయటం ఆపుకోలేదు. రికార్డు చేసుకుని Youtube లో భద్రపరచుకోవాలని ఉంటుంది. కాని సమయం లభించదు.

  1. పద్మజ:- మీరు మా పాఠకుల కోసం ఇచ్చే సందేశం ఏమిటి?

Md సిరాజ్:- సాహిత్యంలో మిగతా ప్రక్రియలు అంటే కథలూ, నవలలూ, వ్యాసాలూ, సమీక్షలు లాంటివి రాయాలనుకున్నా విలువలు ప్రధానం. కాబట్టి రాయాలనుకునే వారందరూ ముందుగా విలువలను పాటించటం నేర్చుకోవాలి.
అరవై నాలుగు కళల్లో అన్నీ నేర్చుకుంటే వచ్చేవే అనే అభిప్రాయం ఉంది నాకు. ఒక్క కవిత్వాన్ని మినహాయించి , కవిత్వం నేర్చుకుంటే రాదు. అది వ్యక్తితో పాటు పుట్టి వ్యక్తితో పాటు పెరిగి వస్తుంది. అలాంటివారే అసలు సిసలైన కవులు. అలాంటి వారే కాలచక్రం పై నిలుస్తారు. కవి అలా ఉండాలనుకుంటాను.

కవులు తమ కవితలను ఇష్టపడి రాయాలి. కష్టపడి రాయాలి. కవితలు రాసే వారు నూటికి నూరుశాతం పరమ పవిత్రంగా ఉంటేనే అసాధారణ కవితలు వస్తాయి. అల్లాంటి కవులు యుగాల్లో ఒకరిద్దరు ఉండటం కూడా కష్టమే. వారు కాలం పై నిలుస్తారు. మిగతా వారు కూడా నీతి నిజాయితీలతోనే ఉండాలి. కవి లోపల ఏ భావముంటే అదే కవితా రూపంలో బయటకు వస్తుంది. కవి వ్యక్తిత్వమే కవి యొక్క కవితలు.

  1. పద్మజ:- మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం తెలుపండి

Md సిరాజ్:-
నిహారిణిగారు నా కవితను ఇదివరలో మయూఖలో ప్రచురించారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిసి కూడా ఉన్నారు. విలువలతో కూడిన సాహితీ శ్రమ వారిది అనే అభిప్రాయం ఏర్పడింది. నిహారిణి గారిపవిత్ర ప్రయత్నాలు ఇలాగే ఫలిస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

శ్రీ సిరాజుద్దీన్ గారు తలపెట్టిన లక్ష్యం నెరవేరాలనీ, వారు కోరుకునే విలువలు రేపటి తరానికీ అలాగే నిలిచి, వాటిని పాటిస్తూ… బతుకును శాంతిమయం చేసుకొని, వారితో పాటూ ప్రపంచం యావత్తూ శాంతి పండగను దసరా- దీపావళులవలె ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ…
ఈ సందర్భంగా సిరాజుద్దీన్ గారిని అభినందిస్తూ… అడిగిన వెంటనే ముఖాముఖీ జరిపేఅవకాశమిచ్చినందుకు మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక తరపున అభినందనలుచెప్తూ… పాఠకులకు శుభాకాంక్షలతో సెలవు తీసుకుంటున్నది. రంగరాజు పద్మజ, అందరికీ నమస్కారములు.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

కళలకు చదువు కుంటుపడదు – గౌరీశంకర్

by రంగరాజు పద్మజ November 22, 2024
written by రంగరాజు పద్మజ

అవధాని శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారి తో ముఖాముఖీ- రంగరాజుపద్మజ
సాహిత్య ప్రయోజనం హృదయాన్ని స్పందింపచేయాలి.. సాహిత్య ప్రయోజనం జాతీయ ప్రయోజనమైనప్పుడు.. స్పందించే హృదయాలు సంస్కారాలను పెంచుకొని, మంచి పౌరులుగా తయారవుతారు. అలా ఉన్నతులైన వారు మరింతమందికి జీవిత విధానాలకు మార్గదర్శకులుగా .. సమాజానికి ప్రేరణ ఇచ్చేవారిగా చేయడం సాహిత్య లక్ష్యం!
సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో నూతనత్వం యొక్క అవసరాన్ని గమనించి ప్రతి తరంలో కవి పండితులు ఆయా ప్రక్రియలలో రచనలను సృష్టించారు… ఆ కోవలోనే చక్కటి పద్యాలను అవధానాల రూపంలో అందిస్తూ… అటు భాషామ తల్లికి, ఇటు సమాజానికి సాహిత్య సేవకులుగా.. అందిస్తున్న కవి పండితులు శ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మగారు మన మయూఖ ద్వైమాసిక పత్రిక పాఠకుల ఆత్మీయ అతిథులు.
సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని పెద్దలు చెప్పే మాట ! దానితో నేను ఏకీభవిస్తూ..
ఆ దిశగా మన సాహిత్య ప్రక్రియలను బతికి బట్టకట్టిస్తున్న సృజన కారులను గౌరవిస్తూ… రేపటి తరానికి మార్గదర్శకులుగా చూపించాలనే చిరు ప్రయత్నమే ఈ ముఖాముఖి!! ఆస్వాదించండి!

అష్టావధాన కార్య మ
దృష్టముచే గాక యెట్లు దీర్పంగ వచ్చున్
కష్టమో సుఖమో యది యు
తృష్ణ మనుషులే యెఱింగి కీర్తింతురిలన్॥

మన తెలుగు సాహిత్య పరిణామంలో ఎన్నెన్నో ప్రక్రియలు రూపొందాయన్నది అందరికీ తెలిసిన విషయమే!
పరిచయమే అక్కరలేని ప్రముఖ అవధాని గారిని పరిచయం చేయడం మంటే రేపటి తరానికి ప్రేరణ కల్పించడానికే! ఈనాటి మన ముఖాముఖీన కార్యక్రమంలో
బహుముఖీన విద్యా విశారదులు, జంట అవధానులుగా తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన సంస్కృత అవధానులు ,
1,మహాకాళీ సుప్రభాతం ,2. శ్రీరామచంద్ర సుప్రభాతం, 3.శ్రీ శివానందోదాహరణం, 4.శ్రీనోరి నరసింహోదాహరణము, వంటి బహుపుస్తక గ్రంథకర్తలు, మాన్యులు ముత్యంపేట గౌరీశంకరశర్మగారు. శ్రీయుత గౌరవనీయులైన ముదిగొండ అమర్నాథశర్మ గారితో పాటు సంస్కృత- తెలుగు అవధానాల నెన్నిటినో అలవోకగా చేసిన కవి, పండితులు , సాహితీవేత్త గారి ముఖతః గా వారి సాహితీ యాత్ర గురించి తెలుసుకుందాము. పద్మజ. నమస్కారమండీ!

ముత్యంపేట గౌరీశంకర శర్మ:- నమస్కారం.

పద్మజ :- మీవంటి సరస్వతీ స్వరూపులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రుల గురించి, మీ నేపథ్యం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?
గౌరీశంకర శర్మ: మా స్వగ్రామం లచ్చపేట, దుబ్బాక మండలం ॥సిద్దిపేట జిల్లా, మా తల్లిదండ్రులు నాగలింగ శాస్త్రి- రాజ్యలక్ష్మి గారలు. మా నాన్నగారు సంస్కృతాంధ్ర పండితులు. న్యాయ వేదాంతాయుర్వేదాభిజ్ఞ బిరుదు వారికి. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఇద్దరు అక్కయ్యలు తర్వాత నేను, తమ్ముడు.

పద్మజ :- మీ విద్యాభ్యాసము, వృత్తి, ప్రవృత్తుల గురించి వివరిస్తారా?
గౌరీశంకర: నా విద్యాభ్యాసం మా నాన్నగారు సంస్కృత పండితులు కాబట్టి, నాకు కూడా సంస్కృతం నేర్పించాలనే ఉద్దేశంలో శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల కళాశాల వేములవాడలో చేర్పించారు. ఆరవ తరగత నుండి బి ఏ ఎల్ వరకు పది సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా విద్యను పూర్తి చేశాను.సంస్కృతం,సాహిత్యం, తర్క, వ్యాకరణాలు, మొదలగు వాటితో పాటు ఈశ్వర గారి కిష్ఠయ్య ఘనాపాఠీ గారి దగ్గర వేదం కొంత భాగం నేర్చుకోవడం జరిగింది. మా కళాశాలలో మంచి విద్వద్దిగ్గజా ల్లాంటి గురువులు ఉండేవారు. ఆ తర్వాత భాగ్యనగరంలో తెలుగు M A సంస్కృతం MA phd చేసి, 2002లో ఉద్యోగం లభించింది వృత్తిపరంగా వైదిక కార్యక్రమ నిర్వహణం.

పద్మజ : ఉపాధ్యాయ వృత్తిలో ఏవైనా పురస్కారాలు అందుకున్నారా? విశిష్ట సేవలందించినందుకు బిరుదులు గానీ పొందారా?
గౌరీశంకర : వృత్తిలో 2014లో జిల్లా స్థాయి [మెదక్] ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, తెలుగు మహాసభలలో అవధానంలో [మహబూబ్ నగర్] లో అవధాన తిలక అనే బిరుదునిచ్చారు. అలాగే శ్రీశైల పీఠం ఆస్థాన పండితుడిగా, శ్రీ పుష్పగిరి పీఠానికి కూడా ఆస్థాన పండితులుగా శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు నియమించడం నా సుకృతం.

పద్మజ :- పద్య ప్రాశస్త్యాన్ని మీరెలా సమర్ధిస్తారు? దానిని ఎలా కాపాడుకోవచ్చు? విద్యా ప్రావీణ్యత చూపేందుకే పద్యరచన చేస్తారా? ఎందుకంటే ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతున్న నేటి విద్యా బోధనా విధానంలో తరగతి గదిలో పాఠ్యాంశాలలో ఇదివరకు వలె పద్య పాఠాలు కనపడడం లేదన్నది ఒక వాదన వినిపిస్తున్న ఈ తరుణంలో పిల్లల చేత పద్య రచన ఎలా కొనసాగించ గలం ?
గౌరీశంకర శర్మ :- “పద్యము తెలుగువాడిలో భాగమగును భాగమే కాదు మనిషికి భాగ్యమగును” అన్నట్లుగా ఆత్మానందానికి ప్రతీక పద్యం! పద్యం చదువుతుంటే ఆందోళనలు అన్ని తగ్గి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆంగ్లమాధ్యమంలో చదివినా విద్యార్థులకు మంచి, మంచి వేమన పద్యాలు, సుమతీ శతక పద్యాల ద్వారా నీతిని బోధించాలి. ఇదివరకటిలాగా కాకుండా మా పాఠశాలలో నైతే పిల్లల చేత కొంతవరకు రచన చేయిస్తున్నాను

పద్మజ. :- ఉభయ భాషలలో పట్టు సాధించడానికి ఎలాంటి కృషి చేసారు?
గౌరీశంకర ( జ):- ఉభయ భాషలలో పట్టు -అమరకోశం – శబ్ధమంజరి- బాల బోధిని, కావ్య ప్రబంధ పఠనం మొదలైనవి చాలా దోహద పడినవి.

పద్మజ :– నోరి నరసింహోదాహరణము రచించడాని గల ప్రేరణఏమిటి? అసలు ఉదాహరణములను ఎలా చెప్పుకోవచ్చు?
గౌరీశంకర ( జ):- సద్గురు శివానంద మూర్తిగారు మా శైవపీఠానికి పీఠాధిపతిగా ఉండేవారు. వారు లోక గురువులు. ఆధ్యాత్మిక భావనా సంపన్నులు. ఎందరో గొప్పవారు వారికి శిష్యులుగా ఉన్నారు. ఒకసారి వారి ఆశ్రమం భీమిలి [విశాఖపట్నంలో] సభలు జరిగిత వెళ్ళాం. ఊరికే ఎలా వెళ్లడం? అని ఆలోచించి వారికి ఏదైనా సమర్పిస్తే బాగుంటుందని భావించి వారిపై ఉన్న భక్తికి నిదర్శనంగా విభక్తి కావ్యం ఉదాహరణ కావ్యం రచించి వారి సమక్షంలో ఆవిష్కరణ చేసి, వారికే అంకితం ఇచ్చాను.దీంట్లో సంబోధన విభక్తితో కలిసి, ఎనిమిది విభక్తులతో ఒక్కొక్క విభక్తి ఒక్కొక్క పద్యం, అలాగే కళిక- ఉత్కళిక, రగడలతో స్తుతి కావ్యాన్ని సంతరించి గురు పాదాలకు సమర్పించడం జరిగింది. పాల్కురికి సోమనాథుడు వేసిన సంప్రదాయమిది. కవిసామ్రాట్ నోరి నరసింహ శాస్త్రి గారి కుమారులు నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు వారి తండ్రి గారి పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ప్రతి సం॥ పురస్కారాలు ఇస్తున్నారు. అలా మాకు కూడా ఇచ్చారు. వారి పైన సంస్కృతంలో మిత్రుడు అమర్నాథ్ శర్మ, తెలుగులో నేను రచించి వారికి సమర్పించుకున్నాము.

పద్మజ :- మహా కాళీ సుప్రభాతం రచనా నేపథ్యం చెప్పండి?
గౌరీశంకర :- అది 1990 సంవత్సరంలో వేములవాడలో విద్యాభ్యాసం కాగానే నాచారంలో శ్రీ మహా కాళి దేవాలయంలో వాస్తు జ్యోతిష పండితులు శ్రీ వేదాంతం నరసింహమూర్తి గారి దగ్గర శిష్యరికం, పురోహితం చేస్తూ అమ్మవారిపై శ్రీమహాకాళి సుప్రభాతం రచించి శ్రీమతి కే .కమల ఆచార్య రవ్వ శ్రీహరి గారు ముదిగొండ వీరభద్రయ్య గారి చేతుల మీద ఆవిష్కరణ జరిగింది.

పద్మజ :- అవధానాలే కాక ఇతర కళారంగాలలో మీ పాత్ర- వాటి విశేషాలు వివరించండి!
గౌరీశంకర శర్మ:- మా గురువుగారు మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీ హరి శర్మ గారు వేముల వాడలో మాకు సాహిత్యాన్ని బోధించేవారు. వారు అష్టావధానులు వారి వద్ద మెలుకువలు నేర్చుకున్నాము అలా అవధానాలు చేస్తున్న సమయంలో ప్రాచీన కావ్యములు పఠించడం జరిగేది ఆ పద్యవాసన వల్లనే ఆచార్య ముదిగొండ శివప్రసాద్ గారు దివాకర్ల వేదిక తరపున భువన విజయాలు వేసేవారు. ఒకసారి నన్ను దూర్జటి పాత్ర వేయమన్నారు. ఆ పాత్ర వేసి
రక్తి కట్టించేసరికి అలా అన్ని పాత్రల పద్యాలు కంఠస్థం చేయవయ్యా! నీకు ఏ పాత్ర అవకాశమిస్తే ఆ పాత్ర వేయాలి అనేవారు. అలా రాయలు, తిమ్మరసు తప్ప అన్ని పాత్రలు వేసేవాడిని. ముఖ్యంగా పెద్దన, ధూర్జటి, మల్లన పాత్రలు వేసేవాడిని అలాగే ప్రతాపరుద్ర నాటకంలో విద్యానాథుడి పాత్ర కైలాస సాహితీ సభలో శ్రీనాథుడి పాత్ర ఇలా పోషిస్తూ కళా రంగంలో కృషి చేయడం జరిగింది

పద్మజ :- అవధాన విద్య నేర్చుకోవాలనే అభిలాష కలవారికి మీరేమైనా మార్గదర్శనం చేస్తారా?ఇంకా ఇతరులెవరైనా ఆ దిశగా కృషి సల్పుతున్నారా? వారికి మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ:- అవధాన విద్యనేర్చుకోవాలనే తపన గల వారికి మామిత్రులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవగాహన కళాపరిషత్తు స్థాపించి ఎందరికో ఔత్సాహికులకు అవధానులచేత శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం దాంట్లో నేను కూడా పాల్గొని శిక్షణ ఇచ్చాను. నా సలహా ఒకటే పద్యాలు బాగ నేర్వాలి ఇతరులవి కూడా చదవాలి అదే ఆలోచన ఉండాలి. శ్రద్ధ, ఏకాగ్రత మొదలైనవి ఉండాలి!

పద్మజ :- కళలకు సమయం వెచ్చిస్తే చదువు కుంటుపడుతుందనే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరిచ్చే సలహా ఏమిటి?
గౌరీశంకర శర్మ : కళలకు సమయం వెచ్చిస్తే చదువుకుంటు పడుతుంది అనేది కేవలం వారి అపోహ మాత్రమే! అటు చదువుతూ ఇటు సంగీతం, నాట్యం, కరాటే, వాయిద్యాలు పిల్లలు నేర్చుకోవడం లేదా? ఇప్పుడు అలాగే ఈ పద్యరచన కూడా!!


పద్మజ :- తెలుగుభాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టమనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. దానికిమీరేమంటారు?
గౌరీశంకర శర్మ : తెలుగు భాష నేర్చుకుంటే జీవనోపాధి కష్టం అనేది కూడా ఒక అపోహనే! ఇప్పటికీ తెలుగుతో పాటు ఆంగ్లభాష నేర్చుకుని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు కదా! కేవలం తెలుగైతే తెలుగు పండితులుగా భాషావేత్తలుగా అయ్యే అవకాశం ఉంది.

పద్మజ :- కొసమెరుపుగా మీరు తెలుగు భాష- విద్యా బోధన ఎలా ఉండాలనుకుంటారు? అంటే పిల్లవాడికి తనంత తానే తెలుగు భాష మీద మక్కువ పెంచుకునేలా ఏమి చేయవచ్చు? దానిని ఆచరణలో ఎలా పెట్ట వచ్చు? దాని మీద మీ అభిప్రాయం చెప్పగలరా?
గౌరీశంకర శర్మ :- పిల్లవాడికి తెలుగు భాష మీద మక్కువ కలగాలంటే మనం కొన్ని భాష చమత్కారాలు, పొడుపు కథలతో కూడిన పద్యాలు అనుప్రాసాలంకార శోభితమైన పద్యాలు ముందు మనం చదువుతూ, పాడుతూ, ఆడుతూ నేర్పిస్తే నేర్చుకుంటారు. మా పాఠశాలలో పిల్లలకు పద్యంతాక్షరి పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాను. వాటికోసం పద్యాలు కంఠస్తం చేస్తారు.

పద్మజ : అటు వృత్తి ఇటు ప్రవృత్తి రెండింటికీ సమన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? అలాగే సమయ సద్వినియోగం గురించి రెండు మాటలు చెప్పండి!
గౌరీశంకర శర్మ : వృత్తి- ఉద్యోగం -ప్రవృత్తి -వైదిక కార్యక్రమాలు- సాహిత్య- అవధాన, కళారంగాలపై అవగాహన సమయం సెలవులు ఉంటే వాటిని సార్థకం చేస్తున్నాను.
క్షణశఃక౯శశ్చైవ- విద్యామర్ధంచ సాధపేత్! అని మా నాన్న గారు చెప్పేవారు. ఊరికే ఉండొద్దు అంటే సంపాదన. అయితే విద్యాదానం ఇలా…

పద్మజ :- మీరు మెప్పు పొందిన అవధానం గురించి, ఛందోభాషణం కానీ అప్రస్తుత ప్రసంగం సందర్భంగా మీరు చెప్పిన పద్యాలు మా మయూఖ పాఠకులకు చెప్పండి!
గౌరీశంకర శర్మ :- అవధానములో మెప్పు పొందిన అవధానం రవీంద్రభారతిలో ప్రపంచ తెలుగు మహాసభలలో చేసిన అవధానం 17-12- 2017 లోజరిగింది. దానిని శ్రీ నాగ ఫణి శర్మగారు ప్రత్యక్షంగా విని మెచ్చుకున్నారు. అలాగే ఒక అవధానంలో ఒక సమస్యను ఇచ్చారు!

హనుమత్పుత్రుడు భీష్మ సూనను వివాహంబాడె రారండహో!
వినుమా! నేడిట కృష్ణ దివ్య కథలావిష్కారమున్ జేసెదన్
ఘన వంశాంబుధి నోలలాడిన మహా గాంభీర్య తేజస్విమున్
అనుమానింపకు మమ్మ! శౌరి మతడే యాశ్చర్యమౌ దివ్య దే
హనుమత్పుత్రుడు …..అంటూ నందుడు గోపవనితలలో తన కుమారుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పే సందర్భం కొంచెం ఇబ్బంది అయినా బాగా వచ్చింది. అలాగే రచించిన మహాకాళేశ్వర శంకరా! అనే ఏకప్రాస శతకానికి ముందు మాట చెప్పి పద్యంతో ఆశీర్వదించారు ద్వి సహస్రావధాని నాగపణిశర్మ గారు.
మతి మన్మంజులమై, శివా కరుణమై, మాధుర్యమై ధుర్యమై
సతత త్ర్యంబక పాదభక్తివశమై సమ్మాన్యమై మాన్యమై
కృతి మన్మంగళమై సదాశివద గౌరీ శంకర ప్రోక్త- వా
క్యతపః పూర్ణమునౌ శతాత్మకము శ్రేయః ప్రేమముల్ గూర్చుతన్!
అంటూ ఆశీఃపూర్వకముగా అభినందించారు.
దాదాపు అవధాన వరేణ్యులందరి అవధానములలో పాల్గొన్నాను.
నాగఫణిశర్మగారు, గరికపాటి వారు, వద్దిపర్తి వారు, మేడాసాని వారు, జీఎం రామ శర్మ గారు, ఆముదాల, కడిమిళ్ళ వారిలాంటి పెద్దవారితో అవధానాలలో పాల్గొనే అవకాశం లభించింది.

చివరగా మయూఖపత్రికా ప్రశంస
ఈ మయూఖము శిఖరమై యిలను నిలిచి
బహుముఖీనము గాంచుచు భద్రమగుత!
సాహితీ సుధ వెలయించి శాశ్వతమగు
కీర్తినందుచుభవితకు స్ఫూర్తినిడుత!
ఈ అవకాశాన్ని కల్పించిన సహృదయ వరేణ్యులు ఆర్ష ధర్మ ప్రదీపిక రంగరాజు పద్మజ గారికి కృతానేక కృతజ్ఞతా పూర్వక ధన్యవాద నమస్సులు.
శుభం.

రంగ రాజు పద్మజ:- గౌరవనీయులైన అవధాని గారిచే చక్కని సాహిత్య విశేష విషయాలను తెలుసుకున్నాం! మనమూ ఆ దిశగా అడుగులు వేద్దాం!

మాన్యులు అవధాన శిఖామణి శ్రీయుత గౌరీశంకరశర్మ గారితో ముఖాముఖీ భాగ్యం కల్పించిన మయూఖ పత్రిక సంపాదకురాలికి ప్రతేక ధన్యవాదములు తెలుపుతూ…
జయతు ! తెలుగు భాషామతల్లీ! జయతు !

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సుద్దులు

by Achyutuni Rajasri November 22, 2024
written by Achyutuni Rajasri

“సాధారణంగా మనం ఎంతోమంది తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ కొందరు చెప్పే మాటలు మనకు ఆనందం తోపాటు ఆదర్శభావాల్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.అదే మనం తెలుసుకోవాలి” శివా మాష్టారు పాఠం చెప్పేముందు ఇలా కొన్ని మాటలు చెప్పి ఆలోచించమని పిల్లలకు చెప్తారు.అప్పుడు ఆసక్తికరంగా ఆయనపాఠంసజావుగా సాగుతుంది.బెల్లు ఐనా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.” కులం అంటే ఏంటి?” ” అదే సర్! క్యాస్ట్!” పొలోమని అరిచారు.
“అసలు అర్థం నివాసం అని.వృత్తులు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేసేవారు.అలా సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి సహజీవనం గడిపేవారు.ఒకసారి శ్రీరామానుజులవారు స్నానం ముగించుకుని తిరిగి వస్తూ ధనుర్దాసు అనే శిష్యుడు భుజంపై చేయి వేసి నడిచారు.ఒక చుప్పనాతి శిష్యుడు అడిగేశాడు “వాడు తక్కువ కులంవాడుకదా? మీ మడికి భంగం కలగదా?”అని.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు” పిచ్చివాడా! చదువు డబ్బు గొప్ప వంశం కులంలో పుట్టాను అనేవి అహంకారం మదమాత్సర్యాలకి మూలం.వినయవిధేయతలున్నవాడే మానవత్వంతో సాయపడే వాడే దేవుని దృష్టిలో అసలుసిసలు భక్తుడు.శుచిశుభ్రత ముఖ్యం.” అన్నారట శ్రీ రామానుజులు . అంతెందుకు? మనమిసైల్ మాన్ అబ్దుల్ కలాం ని
బడిలో అయ్యర్ అయ్యవార్లు తమ ఇంటికి పిలిచి వంటింట్లో తమతోపాటు భోజనానికి కూచోబెట్టేవారు.మడి తో ఉన్న మాష్టారు భార్య
మామి కూడా కన్నకొడుకు లా బాల కలాం కి అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ వినిపించేది.మీరు కూడా మధ్యాహ్నం లంచ్ అందుకే పక్కపక్కనే కూచుని తినాలి.మీరు తెచ్చినవి ఇతరులతో పంచపకుంటూ,వారివి మీరు పుచ్చుకోవడం లోనే ప్రేమ ఆప్యాయతలు బంధాలు పెరుగు తాయి.” అని శివా మాస్టారు చెప్పారు. అది వింటున్న బడి ఛైర్మన్ మనవడు రాము అన్నాడు” 
సార్! ఇవాల్టినుంచి నేను కూడా అందరితో కలిసి తింటాను.ఆగట్టుమీద కూచోను.మానౌకరు దగ్గర కూర్చుని తినిపిస్తాడు.మా అమ్మ మాట ప్రకారం.”
“సెభా‌ష్ రాము! మీనౌకరుకి చెప్తానులే లంచ్ బాక్స్ ఆయాకిచ్చి
వెళ్లిపొమ్మని.నీవుకూడా మీక్లాసుపిల్లలతో కల్సికూచుని తిను.అందరూ తమ ఇంట్లోంచి రకరకాల వెరైటీవంటకాలు తెస్తారు. అవి పక్కవారితో పంచుకొని తింటారు.వంకాయని రకరకాలుగా వండవచ్చు.కొందరుఅల్లంపచ్చిమిర్చి కొబ్బరివేసి గుత్తికూర చేస్తారు, కొందరు ఉల్లిగడ్డ వేసి ముద్దగా కూర చేసుకుంటారు, కొందరు వేపుడు గా చేసుకుని తింటారు. మరికొందరు వంకాయ పులుసు వండుతారు, కొందరు చట్నీ లా చేసుకుని తింటారు. వాటిలాగానే మనుషుల స్వభావాలుకూడా. చూడండి …. మన రాము ఎంత బాగా సరేనన్నాడో చూడండి.” శివాసార్ మాటల్తో పిల్లలంతా పొలోమని అరిచారు” హాయ్! రేపట్నించి రాముకూడా మనతోకల్సి చెట్టుకింద కూచునే తింటాడు.వాడి లంచ్ బాక్స్ లోని వెరైటీలు మనం కూడా రుచి చూడొచ్చు” .చప్పట్లతో రాముని పిల్లల అభినందించారు🌷

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కవితా సాగర మధనం

by Y. Sujatha November 22, 2024
written by Y. Sujatha

కవిత గాఢంగా ప్రారంభించాలన్నా
గుట్టు విప్పి ముగించాలన్నా
భావాల తీవ్రత
అక్షరాల ఆర్ద్రత
సమతూకం చేయాలి !

కష్టాల కన్నీటి ఉప్పదనంలో
దుఃఖ సముద్ర లవణ శాతమెంతో‌ లెక్కించాలి !

నిట్టూర్పుల గుండె మంటల సెగలో
బాధాగ్ని శిఖ వేడి
ఎంతో గణించాలి !

ఆనందాల క్రీడా కేళిలో
గెలుపు మలుపు
గుట్టేమిటో విప్పి చెప్పాలి !

సంతోషాల వెన్నెల చినుకుల్లో
చిటపటల సందడి
ఎంతసేపో గుర్తించాలి !

భావోద్వేగాల ఆవేదన మూటలో
సమతౌల్యం ఎంతో
తూకమెయ్యాలి !

అనుభవాల క్రమ పరంపరలో
నేర్చుకున్న పాఠాల విలువ
నిగ్గు తేల్చాలి !

త్రుళ్ళిపడే
ఈర్ష్యాద్వేషాల కార్చిచ్చులో
దహించుకుపోయిన
స్వచ్ఛదనం ఎంతో
స్పష్టం చేయాలి !

ప్రతీ విషయాన్ని
సున్నితంగా స్పృశించాలి
నిశితంగా పరిశీలించాలి
సాలోచనగా వీక్షించాలి
ఆర్ద్రతగా శ్రవణించాలి !

అప్పుడే కదా
లోగుట్టు తెలిసేది
భావ సాగర మధనంలో
కవితామృతం పుట్టేది !

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జనని

by Chandu Pendyala November 22, 2024
written by Chandu Pendyala

చెందు పెండ్యాల
తరానికో..
ఆడపిల్ల
తీరొక్క
రూపురేఖ.
కష్ఠానికి
ముందుంటది
సుఖానికి
ఎనుకకు పోతది.
అన్నిటిని
తట్టుకోడానికి
అలంకరించుకుని
మరీ పుడుతది.
ఇది లీలందుమా.
విధి గీతందుమా.
తన రాతందుమా.
పువ్వుకు
ప్రతిరూపమందుమా.
ఓపికకు
భూమాతందుమా.
కన్నీళ్ళ ను
కనపడనీయని
కీకారణ్యపు
పాయ అందుమా.
జన్మలకే
జనని అందుమా.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాల్యం

by Butam Mutyalu November 22, 2024
written by Butam Mutyalu

ప॥ బాల్యం బాలల హక్కు భవితకు గురువే దిక్కు 2
ఆటలాడుతూ పాటపాడుతూ
చదువుతూ ముందుకు సాగాలి
మీరు చదువుతూ ముందుకు సాగాలి ॥ బాల్యం ॥

చిట్టి పలుకుల బుజ్జాయి
చిన్ని నడకల చెల్లాయి
జాగు చేయక రావాలి
జగతి వెలుగులే కావాలి

బడిలో టింగున బెల్లుమోగెరా మారామూ చేయక రావాలి
పలక బలపం చేతపట్టుకొని పరుగు పరుగునా రావాలి
అంక్షల చూసి బెదురేలా
కాంక్షతో బడికి రావాలి ॥ బాల్యం ॥

లేగదూడలా గంతులు వేస్తూ
లేడీ పిల్లల పరుగులు తీస్తూ సమయపాలన పాటిస్తూ
ఓనమాలు నేరుస్తూ చదువులన్ని చదవాలి
నీ భవితను నిర్మించు కోవాలి

ఆ అంటే అమ్మేరా ఆ అంటే ఆవేరా అమ్మనీకుతొలి గురువు
అమ్మ లాలి పాటలు నానబుద్ధి మాటలు మేలవించి చెప్పే టీచర్లు నీ కండ ఉండగా
శ్రద్ధతో బుద్ధిగా చదివినవో
అందవిశ్వాసాల అంతు చూడరా
దిగంతమే నీకు తలను వంచురా

November 22, 2024 0 comment
3 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

యాదోంకీబారాత్ జ్ఞాపకాల ఊరేగింపు-ఒక సృజనకారుడి ప్రయాణం

by Bodla Anuradha November 22, 2024
written by Bodla Anuradha

వారాల ఆనంద్  జ్ఞాపకాల ఊరేగింపు (యాదోంకీ బారాత్) మహా జోరుగా, మరెంతో ఘనంగా అలుపూ విరామం లేక ఆరు దశాబ్దాల చరితను పలకరిస్తూపాఠకులను పులకరింప చేస్తూ సాగుతుంది. కరీంనగర్ ఊపిరిగా మొదలైన ఈ బారాత్ వేములవాడ, సిరిసిల్ల, అగ్రహారం, మంథని, చొప్పదండి, హైదరాబాద్ ఇలా ఒకటీ రెండూ కాదు, తెలంగాణా ఊర్లన్నీ తిరుగుతూ, ఢిల్లీపురవీధులకి కూడ ఏగి పలు అవార్దుల, రివార్దుల హారతులందుకుంది.ప్రతి ఊరినీ అక్కడి వ్యక్తులనూ పరిచయం చేస్తూ మనల్ని తనతో పాటు తీసుకెళ్తుంది.     ఈ ఘనమైన బారాత్ ప్రయాణంలో ఇది అది అనిలేకుండా ఎన్నో విషయాలు మనకు పరిచయమవుతాయి. పలు సంస్థలకు, కార్యక్రమాలకూ జరిగిన రూపకల్పన, పలు సాహితీ ప్రక్రియల వివరణ, ఎందరోసాహితీ వేత్తల పరిచయం, దేశ విదేశ సినిమాల విశ్లేషణ,  పలు ప్రింటింగ్ విధానాలు, డాక్యుమెంటరీ సినిమాలు తీసే ప్రక్రియలు ఇలా ఎన్నింటినోవివరిస్తుంది.      ఈ జ్ఞాపకాల ఊరేగింపులో వందల కొద్దీ వ్యక్తులపేర్లు ఎదురొస్తాయి. కొన్ని తెలిసినవి, మరెన్నో తెలియనివి. ఇందులోఒక దగ్గర అనంద్ చెప్పినట్టు కొన్నిపేర్లు హాయి చెప్తే, కొన్ని హలో చెబుతాయి. ఇంతకుముందే పరిచయం ఉన్నవాళ్ళు హాయిచెబితే, కొత్తవాళ్ళు హలో చెప్పారు అని ఆయనేఒక చోట అన్నారు. అంతేకాదు కొన్నిచాఫ్టర్లలో హలొ చెప్పిన పేర్లు ఆ తరువాతిచాఫ్టర్లలో హాయి కూడా చెప్పేస్తాయి. అంటే ఆ పేర్లు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ మనకి అంతగానూ పరిచయమవుతాయి. ఇక్కడ మామూలు వ్యక్తులే కాదు, పలు సినీ నటులు, దర్శకులు, మరెందరో సాహితీవేత్తలు కూడా కలుస్తారు. అక్కడక్కడా దేశ విదేశసినిమాలూ పరిచయమవుతాయి, ఆపాత మధురాలైన అలనాటి హిందీ, తెలుగు పాటలు పలకరిస్తాయి, కూనిరాగాలుతీపిస్తాయి, మది నింపుతాయి.      ఈ పుస్తకంలో 80 వదశకం నుంచి 2014 వరకు కరీంనగర్ లో సాహితీ పరంగా, ఫిలిం సొసైటీ పరంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల వివరణదొరుకుతుంది. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ పరిధిలో జరిగిన కోర్సుల వివరాలు చేపట్టిన పలుఅభివృద్ది కార్యక్రమాలు, అందుకు ఎంతగానో సహకరించినఉపాధ్యాయులు, కలెక్టర్లు, మంత్రుల వివరాలు ఇలా ఎన్నో పొందుపరచబడ్డాయి.       కరీంనగర్ నేను పుట్టి పెరిగిన ఊరే. మా ఊరిలోనా చుట్టూతానే ఇంత  ప్రపంచం ఉండిందా, ఇన్ని కార్యక్రమాలు జరిగాయా, ఆప్రపంచం నాకు తెలియలేదే,  అందులో నేను లేనే అని నాకు చాలా చోట్ల అనిపించింది. ముఖ్యంగాఫిల్మ్  అప్ప్రీషియేషన్ కోర్స్ నేనూ చేసిఉండాల్సిందని, ఫిలిం సొసైటీ లోని మంచి మంచిసినిమాలు చూసి ఉండాల్సిందని అనిపించింది.    

ఈ యాదోంకీ బారాత్ ఒక సృజనకారుడి ప్రయాణం.సృజనకారుడైన వాడు తనను తాను వ్యక్తం చేసుకోవటానికి ఏదో ఒక్క రూపమే ప్రధానం కాదనినేను విశ్వసించాను అని చెప్తూ ఆనంద్ తన సృజనను,అన్నిరంగాల్లో చూపించారు. కధలు, కవితలు, విశ్లేషణలు, ఫిల్మీకరణలు, ఫిల్మ్ సొసైటీ స్థాపనలు,బోధనలు, ఉత్సాహాలు, ప్రోత్సాహాలు అన్నిటా తానైతను ఎరిగిన, తిరిగిన, ప్రపంచాన్ని మన కళ్లముందు అక్షరీకరించారు అనటం కంటేదృశ్యీకరించారు అనటం బాగుంటుంది.  అయితే ఈ సృజనకారుడిప్రయాణం పర్సనల్ కాదు. సమాజంతో, సాహిత్యంతో, సినీ ప్రపంచంతో ముడిపడి ఉన్న ఎన్నో యదార్ధ సంఘటనల చిత్రణ. ఈయదార్ధ సంఘటనలకు అక్షరరూపం ఇవ్వడం వల్ల అది భావి తరాలకు ఒక సాధికారిక చరిత్రగా మిగులుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం ఉన్నసామాజిక పరిస్థితులు, మార్పుకోసం జరిగిన ప్రయత్నాలు, కార్యక్రమాలులాంటివి అర్ధమవటానికి, అలాటి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ పుస్తకం ఒక ఆలంబన అవుతుంది.   . జీవితంఎల్లవేళలా పూల పానుపు కాదు. అది నవ్విస్తుంది,ఏడిపిస్తుంది, ఎత్తున నిలబెడుతుంది,ఎత్తి  కుదేస్తుంది. ఎంతటి సృజనకారుడిని కూడా ఊహించనిమలుపులు తిప్పుతుంది. కొన్ని చిన్న చిన్న మలుపులైతే కొన్నిపెద్ద కుదుపులు. జీవితంచీకటి వెలుగుల సంగమం అంటూ పుస్తక ముఖచిత్రం చెప్పకనే చెప్తుంది.  “ ఓటమి నాకు ఊపిరి కాదుఅలవాటు కాదు దినచర్య కాదు అది చీకటిలాఎదురు వస్తుంది, చిటికెస్తేపరిగెడుతుంది…” అంటూ అలాటిఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజంలో తనదైన స్థానాన్నినిలబెట్టుకుంటూ తన సృజనకి విరామం ఇవ్వకుండా సాగిన ఆనంద్ ప్రయాణం ‘జ్ఞాపకాల ఊరేగింపు’ ఎంతో ఇంట్రెస్టింగ్ గాసాగుతుంది. ఇందులో దాదాపు ప్రతి చాప్టర్ ఒక కవితతో మొదలవుతూ ఆ చాఫ్టర్లో ఎలాంటిజ్ఞాపకాల సందడిని మనం చూడబోతున్నామో చెప్పకనే చెప్పుతుంది, మన మూడ్ ని దానికి సిద్ధం చేస్తుంది. కొన్నిసార్లు పేజీనిండుగా టెక్స్ట్ ఉంటె ఆమ్మో ఇంత ఉందా చదవాల్సింది అనిపిస్తుంది. అలా కాకుండా మధ్యమధ్యలో ఉన్న ఈ కవితలు చూపుకి, మనసుకి కూడాఆహ్లాదాన్నిస్తాయి. అలా కవిత్వమూ, వచనమూ కలగలిసిన ఈ ప్రయాణంచదువుతుంటే ఒక మంచి పుస్తకం చదువుతున్న ఫీల్ కలుగింది. నాకయితే ఎక్కడా, ఏ పేరా కానీ, ఏ పేజీ కానీ స్కిప్చెయ్యాలి అనిపించలేదు.     యదార్ధ గాధలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానేఉంటాయి. ఒక యదార్ధ గాధ, ఒక వ్యక్తి జీవిత చిత్రణఅయిన ఈ యాదోంకీ బారాత్ మొదలుపెడితే ఆగకుండా చదివిస్తుంది, చదివినవారి జ్ఞాపకాలను తడుముతుంది. ప్రత్యేకించి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలలో పుట్టి పెరిగినవ్యక్తులకు, ఇది ఒక నాస్టాల్జియా.     ఇక పుస్తకం రాసిన వారి గూర్చి చెప్పుకోవాలంటే, దొరికిన వృత్తి వారి ప్రవృత్తి అయిందో లేక వారి ప్రవృత్తికితగిన ఉద్యోగం దొరికిందో తెలియదుగాని వారి వృత్తి ప్రవృత్తి  రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని సాగింది. వారిజీవితం. చేస్తున్న వృత్తిని ఒక సామాజిక భాద్యతగా స్వీకరించి,  నిరంతరంగా అటు సాహితీ సేవచేస్తూనే, నవతరంలో సాహితీ బీజాలు నాటటానికి, వారిలో విశ్లేషణా శక్తి,ఆసక్తికలిగించడానికి, సృజనాత్మకతను పెంపొందించటానికి, అన్ని విధాలా కృషి చేశారు. వారి బహుముఖప్రజ్ఞ, చేసే పనిలో గల నిబద్దత ఈ బారాత్వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది.    నాకు ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కొండంత  ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది, అదేమిటంటేఆరు దశాబ్దాలసంఘటనలలో ఎదురైన వ్యక్తులు, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జరిగిన సభలు, సభా కార్యక్రమాలు అన్నింటి గురించి పేర్లతో సహా చెప్పగలగడం. దాంతోఆనంద్ బహుముఖ ప్రజ్ఞావంతులే కాదు, వెరీ న్యాచురల్లీ ‘ఆర్టిఫిష్యల్ ఇంటెలిజెన్స్’ బ్రెయిన్  గలవారు అని. అయితే వీరి ప్రజ్ఞ పేర్లుగుర్తుంచుకోవటంలోనే కాదు, మంచి అందమైన పేర్లుపెట్టటంలో కూడా ఉంది. అవి పుస్తకాలకు అవొచ్చు,ఆర్టికల్స్కిఅవొచ్చూ, జరిపినకార్యక్రమాలకు అవొచ్చు. నాకు చాలా ముచ్చట కలిగించిన పేర్లలో కొన్ని, ‘కర్ర ముక్కలలో కమనీయ రూపాలు’, ‘కల్లోల జిల్లాలో ఎగసిన వచన కెరటాలు’, ‘మౌనం మాట్లాడింది’, ‘అజ్ఞాతవాసంలో అందాల మ్యూజియం’,  ‘వీక్షించండి-సమీక్షించండి’, ‘మేకప్ టు ప్యాకప్’. “నా గడిచిన జీవితాన్నిగుర్తుచేసుకోవటమే కాదు, ఇది ఖచ్చితంగా తిరిగిజీవించడమే” అంటూ తన అనుభవాల్ని, తన జీవితాన్ని చాలా లైవ్లీగా ప్రెజెంట్ చేశారు. అతి పెద్దజీవన్మరణ సమస్యని ఎదుర్కొని ..‘గతం’ పొరలు పొరలుగా తెరలుతెరలుగా పేర్చుకున్న జ్ఞాపకాల అర‘వర్తమానం’ క్షణ క్షణం నడక ‘భవిష్యత్తు’ రూపం దిద్దుకునే కలలమంచుపల్లకి అంటూ ఒకఆశావహ దృక్పధంతో వారాల ఆనంద్ తన జ్ఞాపకాల ఊరేగింపును ముగించగా  చదివినవారికి ఇది ఒక అందమైన జ్ఞాపకంగామిగులుతుంది.+++++++++++++++++బొడ్ల అనురాధ anubodla@gmail.com ++++++++++++ 
‘యాదొంకీ బారాత్- జ్ఞాపకాల ఊరేగింపు’ రచన: వారాల ఆనంద్ 
పేజీలు -180, వేల: రూ.250/ ప్రచురణ: ప్రాజ్ పోయెట్రీ ఫోరం, కరీంనగర్-505001
కాపీలకు: V.Indira RaniNo.302, R.V.ANUKURA,STREET No-22, MANCHIREVULA NARSINGI, HYDERABAD #9440501281ORNAVAYUGA BOOK HOUSE, HYDERABAD.TeluguBooks.in – Largest collection of Telugu books Online – TeluguBooks.in (Navodaya Book House)

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • మే నెల “మయూఖ ” పత్రిక విషయ సూచిక:-
  • ప్రముఖ గాయిని శ్రీమతి ఆచంట హైమవతి గారు పాడిన లలిత సంగీత గీతాలు, భక్తి గీతాలు, కీర్తనలు
  • ఎన్నికలు- యువతరం
  • మార్పు కోసం నా అక్షరాలు
  • కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us