మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కురుక్షేత్ర రణరంగం నుండి మునిగిపోయిన ద్వారక వరకు: ‘జన్య భారత’ సరికొత్త ప్రయాణం!

by mayuukha May 31, 2026
written by mayuukha

– మయూఖ ప్రత్యేక వ్యాసం

మహాభారతం అంటే కేవలం రాజుల కథ మాత్రమే కాదు, అది ఒక కాలం.. ఒక నాగరికత.. మరియు కొన్ని వేల సామాన్య జీవితాల సంఘర్షణ. ఈ సత్యాన్ని ఆధునిక పాఠకులకు పరిచయం చేస్తూ, మను (మనోభిరామ్) నెల్లుట్ల గారు రచించిన ‘జన్య భారత’ (Janya Bharata) సిరీస్ ఇప్పుడు చారిత్రక నవలా ప్రపంచంలో ఒక సంచలనం సృష్టిస్తోంది. మొదటి భాగం ‘The War’ తో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు రెండవ భాగం ‘The Deluge’ తో పతాక స్థాయికి చేరుకుంది. ఢిల్లీ వైర్ (Delhi Wire) ద్వారా ‘టాప్ 50 ఇన్ ఫ్లుయెన్షియల్ రైటర్స్’ లో ఒకరిగా గుర్తింపు పొందిన మను గారు, ఈ సిరీస్ ద్వారా ఇతిహాసాలను ఒక సరికొత్త దృక్కోణంలో ఆవిష్కరించారు

1. జన్య భారత: The War – సామాన్యుడి కళ్లలో కురుక్షేత్రం

మనం విన్న మహాభారతంలో అర్జునుడి గాండీవం, భీముడి గద గురించి వింటాం. కానీ, ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది సామాన్య సైనికుల మాటేమిటి?

ఈ సిరీస్‌లో మొదటి పుస్తకం ‘The War’, ‘ఉష్ట్రకర్ణిక’ (Ustrakarnika) అనే ఒక చిన్న తెగకు చెందిన మిత్రజిత్ (Mitrajit) అనే సామాన్యుడి చుట్టూ తిరుగుతుంది.

  • యుద్ధం వద్దు అనుకున్నవాడే యుద్ధంలోకి: మిత్రజిత్ తన భార్య, కూతురుతో ప్రశాంతంగా జీవించాలని కోరుకునే వ్యక్తి. కానీ, కృష్ణుడు రాయబారం విఫలమయ్యాక, పరిస్థితులు అతన్ని బలవంతంగా కురుక్షేత్రానికి లాగుతాయి.
  • భయం మరియు ధర్మం: ఒక సామాన్య తండ్రి, తన ధర్మాన్ని పాటించాలా లేక తన కుటుంబాన్ని రక్షించుకోవాలా? అనే మానసిక యుద్ధాన్ని ఈ పుస్తకం అద్భుతంగా ఆవిష్కరించింది.
  • కొత్త కోణం: రాజుల అహంకారం కోసం సామాన్యులు ఎలా బలైపోయారో ఈ పుస్తకం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

2. జన్య భారత: The Deluge – ద్వారక పతనం మరియు ఒక యుగాంతం

మొదటి భాగం యుద్ధాన్ని వర్ణిస్తే, రెండవ భాగం ‘The Deluge’ (ద డెల్యూజ్) ఆ యుద్ధం మిగిల్చిన శూన్యాన్ని, మరియు ఊహించని ప్రకృతి ప్రళయాన్ని వివరిస్తుంది.

ఈ పుస్తకంలోని ప్రధాన ఆకర్షణలు:

  • మునిగిపోయిన స్వర్ణం – ద్వారక: కృష్ణుడు నిర్మించిన అద్భుత నగరం ద్వారక, సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయింది? ఆ ప్రళయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ ఘట్టాన్ని రచయిత అత్యంత నాటకీయంగా, ఉత్కంఠభరితంగా వర్ణించారు.
  • యాదవ కుల వినాశనం: కురుక్షేత్రం ముగిసిన 36 ఏళ్ల తర్వాత, శాపం వల్ల యాదవులు తమలో తామే కలహించుకుని ఎలా అంతమయ్యారో ఈ కథలో చూడవచ్చు.
  • కలియుగ ఆరంభం: ద్వారక మునిగిపోవడం అనేది కేవలం ఒక నగరం అంతం కావడం కాదు, అది ఒక శకానికి ముగింపు. సముద్రపు అలలు నగరాన్ని కమ్మేస్తున్న వేళ, మిగిలిన ప్రజలు ప్రాణాల కోసం చేసే పోరాటం పాఠకులను కదిలిస్తుంది.

పాఠకులను కట్టిపడేసే అంశాలు:

ఈ సిరీస్ మిగిలిన పుస్తకాల కంటే భిన్నంగా ఉండటానికి కారణం కేవలం కథ మాత్రమే కాదు, రచయిత అనుసరించిన శైలి.

  1. రచయిత మను నెల్లుట్ల గారు తన వృత్తిపరమైన అనుభవాన్ని ఉపయోగించి, సమాజంలోని వ్యవస్థలు ఎలా కూలిపోతాయో, ఒక చిన్న సంఘటన మొత్తం రాజ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించారు.
  2. ఇందులో పాత్రలు అద్భుత శక్తులతో కాకుండా, రక్తమాంసాలున్న మనుషులుగా ప్రవర్తిస్తాయి. వారి బాధ, ఆనందం, మరియు భయం మనకు అత్యంత సహజంగా అనిపిస్తాయి.
  3. చదువుతుంటే మన కళ్ల ముందే కురుక్షేత్ర రణరంగం, ద్వారక సముద్ర తీరం కనిపిస్తున్నట్లు ఉండే సినిమాటిక్ ఫీల్ ఈ పుస్తకాల ప్రత్యేకత.

చరిత్రను ప్రేమించే వారికి, ఇతిహాసాలను కొత్త కోణంలో చూడాలనుకునే వారికి ‘జన్య భారత’ ఒక అద్భుతమైన బహుమతి. కురుక్షేత్ర రక్తం నుండి ద్వారక ప్రళయం వరకు సాగే ఈ ప్రయాణం, పాఠకులను ముగింపు పేజీ వరకు ఊపిరి బిగబట్టి చదివిస్తుంది.

మీరు ఇంకా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకపోతే, వెంటనే ‘The War’ మరియు తాజాగా విడుదలైన ‘The Deluge’ పుస్తకాలను చదవండి. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ కథల్లో ఎన్నో ఉన్నాయి!

రచయిత మను: ఒక అంతర్జాతీయ ప్రతిభ

కెనడాలో నివసిస్తున్న తెలుగు మూలాలున్న రచయిత మను (మనోభిరామ్) గారు కేవలం రచయితగానే కాకుండా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు TEDx స్పీకర్‌గా కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. మూడు ఖండాల్లో నివసించి, ఐదుకు పైగా భాషల్లో ప్రావీణ్యం ఉన్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఆయన జీవితం మరియు సాహిత్యం గురించి మరింత తెలుసుకోవడానికి, ప్రసిద్ధ ‘గ్లోబల్ ఇండియన్’ (Global Indian) పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు: 👉 మను నెల్లుట్ల: ఒక మేధావి ప్రయాణం (Global Indian Article)

ఇప్పుడే మీ ప్రతిని కొనుగోలు చేయండి!

“జన్య భారత” సిరీస్‌లోని ఉత్కంఠభరితమైన కథలను మీరు కూడా ఆస్వాదించాలనుకుంటున్నారా? పుస్తకాలను కొనుగోలు చేయడానికి క్రింది లింక్‌లను క్లిక్ చేయండి:

  • 🛒 Amazon India నుండి కొనుగోలు చేయండి: Janya Bharata Series on Amazon

మరిన్ని వివరాల కోసం మరియు రచయితతో నేరుగా సంప్రదించడానికి ఆయన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: 🌐 ManuNellutla.com

ముగింపు: చరిత్రను ప్రేమించే వారికి, మన మూలాలను గౌరవించే వారికి ఈ సిరీస్ తప్పక చదవాల్సిన పుస్తకం. మారుతున్న కాలంలో మనం నేర్చుకోవాల్సిన ధర్మాలు మరియు సత్యాలు ‘మను’ గారి కలం నుండి జాలువారిన ఈ ‘జన్య భారత’లో పుష్కలంగా ఉన్నాయి.

aw2

May 31, 2026 19 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

నవ్వే రాణి

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు


అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె గోడపైనున్న పటాలు, గదిలోని ప్లేట్లు కిందపడే వరకు బిగ్గరగా నవ్వేది. చాలా చిన్న విషయాలకు కూడా ఆమె నవ్వేది. ఆమె నవ్వు ఎంత బిగ్గరగా ఉండేదంటే న్యాయస్థానంలో ఉన్న వారందరు, నౌకర్లు, కింద అంతస్తులో ఉన్నవారు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది. వారు మొదటగా వారి చేతివేళ్ళను వాడేవారు, చివరికి చెవిలో దూది పెట్టుకొని పనులు చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికి కూడా రాణి పేరు తెలియదు. ఎందుకంటే ఆమెను అందరూ హర్‌ మెర్రీ మెజస్టీ అంటే దొరసానిగా పిలిచేవారు. చాన్సలర్‌ రాజ్యం అప్పులపాలు అవుతుందని ఆమెకు తెలియగానే గిలిగింతలు పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీది నుండి జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. భూకంపం వచ్చినపుడు బంగ్లా మొత్తం ధ్వంసం అయ్యింది. అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేవరకు నవ్వింది. పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేతి సైగతో వాళ్ళను రానివ్వలేదు. నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్లల్లో నీళ్లు ముఖంపైకి కారే వరకు నవ్వింది. కానీ నవ్వు జీవితంలో మంచి అలవాటు. దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆమెకు ఇష్టం కానిది, ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవటంతో ఆమె చాన్సలర్‌ ను చంపేసింది. ఇది ఎంత హాస్యమో…. ఈ సారి ఆమె నవ్వు ఆపుకోలేక నవ్వీ నవ్వీ శ్వాస ఆడక చనిపోయింది. చివరికి దర్బారులోని వారు దేశీయులు కొంత శాంతి, నిశ్శబ్దము, సంతోషంగా అనుభవించగలిగారు. అతి సర్వత్రా వర్జయేత్‌.

May 31, 2026 26 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఫలితానికి మూలం ప్రయత్నం ఒక పిల్ల పక్షి

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక వెచ్చని గూటినుండి ఐదు పక్షి పిల్లలు పొదిగిన గుడ్ల నుండి బయటికి వచ్చాయి. వాటి తల్లిదండ్రులు అవి ఎదిగేందుకు వాటికి పగలు రాత్రి ఆహారం తెచ్చి తినిపించేవి. కొద్ది రోజుల్లోనే అవి ఎంత ఎదిగాయంటే, ఆ గూడు వాటికి ఇరుగ్గా అయ్యింది. వాటి రెక్కలు బలపడగానే ఎలా ఎగరాలో తల్లి చెప్పింది. మీ తండ్రి, నేను మీ ఐదుగురికి ఆహారం అందించేందుకు బాగా తొందరపడేవాళ్ళం. ఇక మీద మీరు మీ కొరకు ఆహారం సంపాదించుకోవడం నేర్చుకోవాలి. అందువల్ల ఒకరోజు తల్లి ఆ ఐదు పిల్లలు ఎగిరేందుకు రెడీ స్టడీ గో అంది. కానీ కేవలం వాటిలోని నాలుగు పిల్లలే చెట్ల కింది కొమ్మలపైన వాలాయి. తర్వాత అవి మళ్లీ గూటికి చేరాయి. మళ్ళీ అవి కిందికి వాలాయి, పైకి ఎగిరాయి. ఆ రకంగా అవి కిందికి మీదికి ఎగురసాగాయి సంతోషంగా. కానీ అన్నిటికన్న చిన్నపక్షి తన కండ్లు మూసుకుని భయంకరంగా ఉన్న కిందికి చూడకుండా ఒదిగి గూటిలోనే కూర్చుంటూ ఉండేది.

ఆ రకంగా రోజులు గడుస్తున్నాయి. ఆ చిన్న పక్షి యొక్క అన్నలు, అక్కలు వాటి ఆహారం అవే సంపాదించుకోగలిగాయి. కానీ ఆ చిన్నది మాత్రం కిందకి చూసేందుకే భయపడుతూ గూటిలోనే ముడుచుకొని కూర్చొని ఉండేది. అప్పుడు తండ్రి పక్షికి ఒక ఆలోచన వచ్చింది. పిల్ల పక్షికి కింద కొమ్మపై వాలే భయంకన్న ఇంకా ఎక్కువ భయం కలిగే దృశ్యం చూపించడం మంచిదనుకుంది. అప్పుడు క్రింద చెట్టు వెంబడి ఒక పిల్లి నడుచుకుంటూ వెళ్తుంది. చాలాకాలం వరకు పిల్ల పక్షికి ఆహారం బాగా తినిపించడం వల్ల లావుగా తయారయ్యింది. ఒకరోజు దాన్ని పిల్లి తినేయడం ఏమంత విచిత్రం కాదనుకుంది. తెలివి తక్కువ పిల్ల పక్షి తనను తినేందుకు తను గూటిలో పిల్లి కోసం ఎదురు చూస్తున్నట్లున్నది. కానీ ఆ కింద పోయే పిల్లి దీన్ని చూడలేదు. దాని పదునైన కోరలు, పొడవాటి కాలిగోర్లు, భయం గొలిపే పసుపు పచ్చని కంటిగుడ్లు చూసి భయపడి పిల్లపక్షి గూటి అంచునుండి కిందికి జారింది. కానీ దానికి ఏం జరిగిందో తెలియకముందే, అది దాని ప్రాణాలను కాపాడుకోవడమే కాక కింది చెట్టు కొమ్మ మీద వాలింది. ఆ కొమ్మపై నుండి ఇంకో పై కొమ్మ మీద వాలింది. ఇలా మూడు నాల్గు సార్లు ఎగురుతూ సంబరపడింది. ఇది గూటిలోనే భయపడి కూర్చునేదానికన్న వెయ్యి రెట్లు మంచిదనుకుంది. ఇన్నాళ్ళు బుద్ధితక్కువగా గూటిలో కూర్చోవడమే, అన్నలు, అక్కల వలె తెలివిగా ఎగరకపోవడం చాలా తప్పు. ప్రయత్నమే ఫలితానికి మూలం.

May 31, 2026 18 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఒక బంగారు చేప

by ఒద్దిరాజు మురళీధరంరావు May 31, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక ముదుసలి వాసిల్ తను సముద్రములో ఒక మూలకు వేసిన వలలో ఏవైనా చేపలు పడ్డాయో చూద్దామని వెళ్లి చూసాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయేవరకు ‘నన్ను నీళ్ళలోనే వదిలిపెట్టు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా’నంది. నాకు ఏమి కావాలో తెలియదు. నా భార్యను అడిగి చెప్పగలను అని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిన సంగతి చెప్పాడు. భార్య నాల్గు చీవాట్లు బెట్టి వెంటనే వెళ్ళి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగి పోయిన పాత జాకెట్ ఒకటే వుంది.
అతను వెళ్ళి కొత్త బట్టలు తేగానే తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి దాంట్లో కూర్చోలేదు. ఆ ముదుసలి వాసిల్ వెంటనే వెళ్ళి బంగారు బండి తెచ్ౘ్ాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు.
ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా, చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు మరియు గుంపెడు నౌకర్లు కావాలని కోరింది. కానీ అది కూడా ఆమెకు తృప్తినివ్వలేదు. చివర్లో ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవలు చేయాలని తలచింది. ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ గుంజుకున్నది. అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ నిలబడింది. తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే నీవు ఏమీ లేకుండా అయితావు.
అతి ఆశ కొంపకు చేటు.

May 31, 2026 23 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

Animal time

by Kondapally Keyura May 31, 2026
written by Kondapally Keyura

Long long ago cheetahs and lizards were friends. One day a cheetah was talking to his friend lizard about a magical rocket ship and do you know who heard this? Tiger Of course!The big creature. Who is very rude and mean. When cheetah saw Tiger she stopped talking. But lizard kept on talking. The next day, when the astronauts went to the rocket ship, tiger was going to launch it. So the astronauts put a plan they were going to capture the tiger and put him in the zoo. So they called the cheetah, lizard, Lion, and the zookeepers. First the lion scared the tiger out of their rocket ship, then the cheetah chased the tiger towards the lizard. Who distracted him, while the zookeepers got

him. Now all the animals can be safe.

 the end

May 31, 2026 26 comments
1 FacebookTwitterPinterestEmail
కథలు

సమాధి పూలు

by Humayun Sangheer May 31, 2026
written by Humayun Sangheer

“ప్రతిసారి పోనీకి నువ్వు ఆ ఇంటి కొడుకువు కాదు, ఒక ఇంటికిచ్చిన ఆడిబిడ్డెవు” అత్త షాజాదీ గొంతు కాస్త రుద్ధంగానే ఉంది. ఇంటికి పెద్ద కోడలు అయిన అర్షియా ప్రతేడాది తప్పనిసరిగా అక్కడికి వెళ్లడం ఆమెకు సుతారమూ ఇష్టంలేదు. ఎంతో సౌమ్యంగా ఉంటూ కోడళ్లను కూతుర్ల కన్నా ఎక్కువగా చూసుకునే ఆమె ఎందుకో ఇవాళ కాస్త అన్యమనస్కంగా ఉంది.   

అత్త మాటకు ఎదురు చెప్పే సాహసం చెయ్యని అర్షియా ఇవాళ తనను ఎవరూ ఆపవద్దని స్థిరంగా అనుకుంటోంది. కానీ అది అయ్యే పనేనా? అత్త మాటను జవదాటని తను ఇవాళ ఆ పని చేస్తుందా?

ఒక ప్రహసనంలా ఏడాదికోసారి సాగే తన పుట్టింటి ప్రయాణాన్ని గతేడాది నుంచి అత్తయ్య బ్రేక్ చేసింది. “ఆడవాళ్లు కబ్రస్తాన్‌కు వెళ్లరు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి రెండు ఖురాన్లు చదివి సమర్పిస్తే సరిపోతుంది కదా? ఇదే నీకు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది” అని షాజాది వాదన. కానీ ప్రత్యక్షంగా కబ్రస్తాన్ దరిదాపుల్లోకి వెళ్లి అమ్మానాన్నల సమాధులను దూరం నుంచి అయినా చూసి ‘నేను మీ దగ్గరికి వచ్చి వెళ్తున్నాను’ అని రెండు మాటలు మాట్లాడినంత సంతృప్తి ఇంట్లో ఉండి ఖురాన్ చదివి సమర్పిస్తే రాదు కదా అనే పెదవి దాటని ప్రతి వాదన ఆమెది!

ప్రతిసారి వెళ్లే తను ఒక్క ఏడాది తప్పినందుకే చాలా బాధపడింది. రంజాన్, బక్రీద్ పండగలు వస్తున్నాయంటే అమ్మానాన్నల సమాధుల దగ్గరికి తానే స్వయంగా వెళ్లి పూలను సమర్పించి వస్తాననే తృప్తే ఆమెకు అమితానందాన్నిస్తుంది.

కానీ అత్తయ్య అడ్డుపడడంతో గతేడాది నుంచి మనసులో మొరం పరుచుకుంది. ఇంట్లో  మునుపటిలా ఉండలేకపోతోంది. బైకులో పెట్రోల్ పోస్తే ప్రయాణం సాఫీగా సాగినట్టు ఏడాదికి రెండుసార్లు అమ్మానాన్నలున్న కబ్రస్తాన్‌కు వెళ్లి తన చేత పూల సమర్పించి వస్తేనే అత్తవారింట్లో తన ప్రయాణం సాఫీగా సాగుతుంది. లేదంటే ఏదో కోల్పోయినట్టు స్తబ్దుగా, వైరక్తికంగా సాగుతుంటాయి రోజులు?

ఈసారి ఎలాగైనా వెళ్లాల్సిందేననే పట్టుదల మీద ఉంది అర్షియా. అత్తయ్యను ఎదురించి అయినా వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎంత ఆపుకుందామన్నా భావోద్వేగం కట్టలు తెంచుకుని అది ఆగ్రహంగా మారేలా ఉందని ఆమెకు తెలుస్తోంది. ఏదైనా పరవాలేదు, భర్త తనను తిట్టినా, కొట్టినా, ఎన్నడూ నోరెత్తని కోడలు నోరెత్తిందని పరిస్థితులు ఎంతవరకు వెళ్లినా కేర్ చెయ్యను అని స్థిరంగా అనుకుంది.

ఇన్నాళ్లూ అత్తింటివాళ్ల మాట జవ దాటకుండా ఉన్నట్టే తన మాటను ఈ ఒక్క విషయంలో గత పదేళ్లుగా నెగ్గించుకుంటూ వస్తోంది. లౌక్యం ప్రదర్శించి మాయ చేసినట్టే అత్తింటి పర్మిషన్ పొందేది. కానీ ప్రతిసారి వాతావరణం ఒకేలా ఉండదు అనేలా ఈసారి అత్తయ్య అడ్డుకాలు వేసింది?  

మడమ మీద పచ్చని నరాలు కనిపించేంత పాల కడలి తెల్లదనం ఆమెది. పెద్ద కళ్లు, పొడవాటి జుట్టుతో కుందన్‌తో నేసిన చమ్కీ చీరలా మెరిసిపోతుంటుంది అర్షియా. ఆమె అందాన్ని చూసే బషీర్ ఇష్టపడి, పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు.

ఇంటికి పెద్ద కోడలిగా అర్షియా అత్త అడుగుజాడలను తూచా తప్పుకుండా ఫాలో అయింది. దీంతో అత్త మెచ్చిన కోడలు అయింది. ఆమె తర్వాత వచ్చిన కోడలు మాత్రం అత్తను అర్థం చేసుకోవడానికే మూడేళ్లు పట్టింది.

పెళ్లయ్యాక మూడేళ్లకే అర్షియా అమ్మానాన్నలు పోయారు. అప్పటినుంచి ప్రతీ రంజాన్, బక్రీద్ పండగలకు పుట్టింటికి అని హఫీజ్ పేటలో ఉన్న కబ్రస్తాన్‌కు వెళ్తుంది. “కబ్రస్తాన్‌లో ఆడవాళ్లకు ఎలాగూ ఎంట్రీ లేదు కదా? వాడు వెళ్తాడులే” అని అత్త భర్తను పంపి తనను ఆపే ప్రయత్నం చేసినా కూడా భర్తతో వెళ్లి తన పంతం నెగ్గించుకుంది అర్షియా. కబ్రస్తాన్‌కు దూరంగా నిలబడి ఆకాశానికి అర్రులు జాచి అమ్మానాన్నల పేరు మీద దువా వేడుకుని దరూద్ సమర్పించుకునేది. గాల్లో సైగలు చేస్తూ వాళ్లతో లైవ్‌లో మాట్లాడినట్టు ఫీలయ్యేది. ఆమెనలా చూసినవాళ్లు పిచ్చిదేమో అనుకునేవారు.   

“మా అమ్మానాయినలకు కొడుకులు లేరు. కొడుకైనా, బిడ్డె అయినా నేనొక్కదాన్నే. వాళ్లు సచ్చిపోయిర్రు. పండగలప్పుడన్నా నేను వోయి వాళ్ల బొందల మీద ఇన్ని పూలు ఏసి వస్తే వాళ్ల ఆత్మ తుర్తివడ్తది గదా? దయుంచి నన్ను ఆపకుర్రి మీకు దండం వెడ్త. పోకపోతే నా పానమంతా గావర గావర అయితది” అత్తను చూస్తూ దండం పెట్టింది అర్షియా.

అత్తను ఎదురించి మాట్లాడ్డంలా అనిపిస్తోంది ఆమె మనసుకు. కానీ తప్పట్లేదు. ఉన్నత చదువులు చదువుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తనని “ఆ ఉద్యోగం ఎందుకు? మనకు ఏం తక్కువని ఈ ఇంటి కోడలు బయటకు వెళ్లి ఉద్యోగం చెయ్యాలి? నీ సంపాదనతో ఇల్లు గడవాల్సినంత అగత్యం లేదు కదా? శుభ్రంగా ఇంటిపట్టునే ఉండి నమాజ్, దువాలో ఉండు” అని అత్తయ్య, భర్తలు హుకుం జారీచేసి తనకు నచ్చిన ఉద్యోగాన్ని మాన్పించేసి ఇంటికే పరిమితం చేశారు.

అలా ఇంట్లో కట్టేసినట్టు ఉండడం ఆమెకు ఎంతమాత్రమూ ఇష్టంలేదు. కానీ వాళ్ల మాటకు ఎదురుచెప్పి ఉద్యోగం చెయ్యలేని నిస్సహాయత? అలా అత్తింట్లో ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని చిన్న చిర్నవ్వుతో భరించింది కానీ పండగ పూట పుట్టింటికి వెళ్లకపోతే మాత్రం తట్టుకోలేనట్టుగా మారిపోతుంది ఆమె నిలువు దృశ్యం.

కబ్రస్తాన్ ముందుకు వెళ్తే ఆమెకు అమ్మానాన్నల్ని పలకరించి వచ్చినంత సంబరంగా అనిపిస్తుంది. ఆ సంబరం అత్తింట్లో ఏడాది పాటు ఉండడానికి కావాల్సినంత మనో స్థైర్యాన్నిస్తుంది. తోబుట్టువులు లేని ఒంటరిది అవడంతో అదొక సెంటుమెంటులా ఫీలవ్వసాగింది.

ఆడవాళ్లు తమకు నచ్చిన పని చేసే స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఈ ప్రపంచానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు. మసీదులోకి ప్రవేశం లేకపోయినా కనీసం కబ్రస్తాన్‌లోకి ఆడవాళ్లకు ప్రవేశం ఉండుంటే ఎంత బాగుండేదో అని ఎన్నిసార్లు అనుకుందో. ఆ అల్లాహ్ అందులో తమకు మినహాయింపు కలిగించాలని చాలాసార్లు దువా చేసింది. కానీ అల్లాహ్ కూడా పురుషుడే కదా? తన మొర ఆలకిస్తాడా? లేకపోతే నా ఆజ్ఞను శిరసా వహించమని చెబుతాడా? అని ప్రశ్నించుకున్న సందర్భాలు కోకొల్లలు.

ఆత్మాభిమానం దండిగా ఉంది. అమ్మానాన్నలు తనను అలా పెంచారు. తన కాళ్ల మీద తను నిలబడేలా చేశారు. అదే అలవాటు అయింది. కానీ పెళ్లయ్యాక తన ఆత్మాభిమానం పూర్తిగా దెబ్బతిన్నట్టైంది. పెళ్లయ్యాక తనిష్ట ప్రకారం ఉద్యోగం చేస్తానంటే తనకేం అభ్యంతరం లేదని భర్త బషీర్ అన్న మాటను గట్టు మీద పెట్టేశాడు. ఎందుకంటే అమ్మ మాటను అతను జవదాటలేడు. మతంలోని సాంప్రదాయాలు, ఆచారాలు ఆడవాళ్లను కట్టడి చేస్తున్నాయనే ఎరుక లేకుండా ఆ ఆడవాళ్లే వాటిని అనుసరిస్తూ, సాటి ఆడవాళ్ల మీద కఠినంగా రద్దుతుంటారు. కొడుకులు అయిన పురుషుల మీద కూడా వాళ్లే గుర్తుచేసి మరీ రుద్దుతుంటారు.

అందుకే ఇవాళ ఆచార, సాంప్రదాయాలు బలంగా నాటుకున్నాయి. అంతకన్నా ఎక్కువ బలంగా స్త్రీలను పాతాళంలోకి అణిచివేశాయి? ఇవన్నీ అర్షియాకు తెలుసు. అభ్యుదయ భావాలు ఎక్కువ. కానీ ఏకాకి అయిందామె. గొర్రెలు బావిలో దూకిన చందంగా అందరు ఆడవాళ్లతో తను కూడా ఆ రొచ్చులో దూకుతూ తన ఆత్మాభిమానాన్ని నిండా ముంచేసుకుంది.  

కొన్నిసార్లు ఆమె స్థానంలో కొడుకును పంపించింది అత్త. “నువ్వు పోయి ఏం లాభం చెప్పు? ఆడోళ్లకు అన్లకు వోయే మోక లేదు గదా? నువ్వు ముట్టి ఇచ్చిన పూలను నీ మొగోడు తీస్కపోయి మీ అమ్మానాయిన బొందల మీద పోసి వస్తున్నడు గదా? సాలదా అది?” కనుగుడ్లు పెద్దవి చేస్తూ అంది షాజాది.

ఆడోళ్లు కబ్రస్తాన్‌లకు పోవద్దు అనే మాట అర్షియా గుండెను పిండేసినంత పనిచేసింది.  “హే ఖుదా.. మా ఆడోళ్ల మీద నీకు ఎందుకంత వివక్ష. మేము కబ్రస్తాన్‌లకు వస్తెనే పాపం అంటుకుంటదా?” అనుకుంది మనసులో. అలా అనుకున్నప్పుడు ఆమె కళ్లలోంచి కన్నీటి చుక్కలు నేలరాలాయి. కొంగుతో తుడుచుకుంది.

తోడి కోడలు నజ్మా అక్కడే నిల్చుని ఎవరు మాట్లాడితే వాళ్ల ముఖం చూస్తోంది. షాజాదీ ఆమెను చూస్తూ కళ్లతో సైగ చెయ్యగానే నజ్మా చటుక్కున లోపలికి వెళ్లిపోయింది.

మల్లేపల్లి దగ్గర ఉన్న జిర్రా ఏరియా అది. ఆ ఇంట్లో షాజాదీ చెప్పిందే వేదం. ఆమె గీత గీసిందంటే ఇద్దరు కొడుకులు అస్సలు ఆ గీత దాటే సాహసం అస్సలు చెయ్యరు. సాంప్రదాయాలను ఫాలో అవడంలో ఆమె చాలా స్ట్రిక్టుగా వ్యవహరిస్తుంది. వాటిని ఫాలో అవడంలోనే అసలైన జీవిత పరమార్థం దాగి ఉందని స్థిరంగా నమ్ముతుందామె. ఆ నమ్మకాన్ని అందరి మీదా ఓ నియంత మాదిరి ఆపాదిస్తుంటుంది. కూతురు సహా కొడుకుల పెళ్లిళ్లు అయిపోయాయి. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. అయినా ఆ ఇంటికి స్ట్రిక్టు రూలర్ మాదిరి మసలుకుంటుంది.

ఇంతలో అక్కడికి అర్షియా భర్త బషీర్ వచ్చాడు. సోఫాలో కుబుసం విడిచిన పాముల బుసలు కొడుతున్నట్టు కూర్చున్న అమ్మని, ధీనంగా నిల్చున్న భార్య ముఖాన్ని చూసి విషయం అర్థం చేసుకున్నాడు. నిన్నే రంజాన్ అయిపోయింది కాబట్టి తన భార్య ఇవాళ హఫీజ్ పేట్‌కు వెళ్తుంది అనుకున్నాడు.

అటు అమ్మ సైడ్ తీసుకున్నా, ఇటు భార్య సైడ్ తీసుకున్నా సమస్యే. బషీర్ ఆడవాళ్ల మధ్యలోకి అస్సలు దూరడు. అలాంటిది ఏదైనా సమస్య ముదురుతుందంటే అక్కడినుంచి నెమ్మదిగా జారుకుంటాడు. ఆడవాళ్ల సమస్యను ఆడవాళ్లే సాల్వ్ చేసుకోవాలి. మధ్యలోకి మగాళ్లు దూరారంటే అది చినిగి చినిగి చాంతాండంత అయి తమ మెడకే చుట్టుకుంటుందని అతనికి తెలుసు. కాబట్టి చాలా సందర్భాలలో అత్తాకోడళ్ల మధ్య అస్సలు తలదూర్చలేదు. ఇంటికి వచ్చాడంటే చెవులున్నా చెవిటిలా, కళ్లున్నా గుడ్డివాడిగా నడుచుకుంటాడు.

తల నొప్పెడుతోంది అన్నట్టు బాగా అలిసిపోయినవాడిలా గొణిగాడు.

నిన్నే పండగ అయింది. చుట్టాలు, బంధువులతో అలాయి బలాయిలు, ఫోన్‌లో ఈద్ ముబారక్ పకలరింపులు, షీర్ కూర్మా తాగెయ్యడంతో అదో రకమైన పండగ మత్తెక్కేసింది. వాళ్ల దగ్గరికి, వీళ్ల దగ్గరికి తిరిగి పండగ శుభాకాంక్షలు చెప్పి తియ్యని సేమియా పాయసం ఎక్కువ తాగేసరికి ఒళ్లంతా కుదేసినట్టు అవుతోంది. ఉదయం ఆఫీస్ లీవ్ పెట్టాలనే మూడ్‌లోనే ఉన్నాడు కానీ అతనికి ఈసారి హఫీజ్ పేట్‌కు వెళ్లాలని లేదు. కొడుకును తీసుకుని అర్షియానే వెళ్తుంది అనుకున్నాడు. కాబట్టి వాళ్ల మధ్యలోకి దూరి అలిసిపోయిన తాను అక్కడికి వెళ్లి ఇంకా అలిసిపోవడం సుతారమూ ఇష్టంలేక అబద్ధం అల్లక తప్పింది కాదు.

“నాకు రేపు ఆఫీస్ ఉంది. ఇయ్యాల్ల బగ్గ అలిసిపోయిన. నేను హఫీజ్ పేట్‌కు పోలేను అమ్మా” అంటూ మరో మాటకు ఆస్కారం లేనట్టు లోపలి గదిలోకి వెళ్లిపోయి నిండా దుప్పటి కప్పుకుని కాళ్లు వారజాపి పడుకుండిపోయాడు. భర్త నోటి నుంచి ఆ మాట వినగానే అర్షియా కళ్లు చముక్కున మెరిశాయి. అలా గదిలోకి వెళ్తున్న భర్తను ఆరాధనగా చూసింది.

ఆమె నిల్చున్న హాలుకి ఎదురుగానే ఉంది బెడ్రూం తలుపు. అలా చూస్తున్న ఆమెను దుప్పటి తొలగించి చూసి కన్ను కొట్టాడు చిలిపిగా. ఆ చర్యకు అర్షియా మరింత షాకైంది? భర్త చిలిపి చేష్టలు తనకు అలవాటు ఉన్నవే అవడంతో అసలు వాస్తవం తెలుసుకుని షుక్రియా అన్నట్టు కళ్లతోనే సైగ చేసింది.

కానీ షాజాదికి మాత్రం కొడుకు చెప్పిన మాట విని అరికాళ్ల మంట తలకెక్కినట్టు అయింది. కోడలు పంతమే నెగ్గేలా ఉందనుకుని ఏం చెయ్యాలో తోచక షాజాదీ బిక్కముఖం వేసింది. ఏమీ అనలేకపోతోంది.

“ఏమో పోర్రి.. అంతా మీ ఇష్టమున్నట్టు జేసుకోర్రి” అంటూ తన గదిలోకి రుసరుసా వెళ్లి ధడేల్న డోర్ వేసుకుంది.

కటువుగా అయినా అత్త నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ అర్షియాకు ఎక్కడలేని ఆనందాన్నిచ్చింది. జీవితంలో ఏడాదికొకసారి వెళ్లే ఆ సందర్భాన్ని ఆమె అచీవ్మెంట్ సాధించినంతగా ఆనందిస్తుంది. గబుక్కున బెడ్రూంలోకి దూరిపోయింది. గబగబా బ్యాగు సర్దుకుంది.

బెడ్డు మీద పడుకున్న బషీర్ నిద్రలోకి జారిపోయాడు. పదేళ్ల కొడుకు అయాన్ గదిలోనే ఆడుకుంటున్నాడు. ఓ బ్యాగు అందుకుంది. ఫ్రిజ్‌లోంచి తమలపాకుల గంప తీసి బ్యాగులో పెట్టింది. ఆ పూలని డాబా మీద నిన్నే కోసి పెట్టుకుంది.

అర్షియాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మూడు అంతస్తుల ఆ భవనం టెర్రస్ మీద చిన్నగా తోట ఏర్పాటుచేసింది. జాబ్ మానేశాక ఏం తోచక యూట్యూబ్‌లో చూసి డాబా మీద గార్డెనింగ్ పనులు మొదలుపెట్టింది. విశాలమైన డాబాను అందమైన పచ్చని నందనవనంలా మార్చేసింది. ప్రతిరోజూ ఆ రకరకాల పూలమొక్కలు, పళ్లు, కూరగాయల మొక్కలకు నీళ్లు పొయ్యడం, కలుపు మొక్కలు ఏరి పారెయ్యడం వంటి పనులు చేస్తూ పొద్దు గడుపడం అలవాటైపోయింది.

అర్షియా ఎప్పుడైతే మిద్దె వ్యవసాయాన్ని మొదలుపెట్టిందో అప్పటినుంచి ఆ ఇంట్లో కూరగాయలు బయట కొనకుండా అయిపోయింది.

ఇంటి ముందు ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలంలో పెట్టిన మల్లె పందిరి తీగ ఆ భవనానికి పోటీ పడుతూ పాకేస్తూ దానంత ఎత్తుకు ఎదిగి టెర్రస్ మీదకు చేరింది. టెర్రస్ మీద పందిరి వేసింది. ప్రతిరోజూ మల్లెలు, గులాబీల గుభాళింపుతో పవళిస్తుంది ఆ డాబా. పండగ సందర్భంగా గులాబీ, చక్రం, గుర్మాశి, నేల గులాబీ, బంతి, చేమంతి, కనకాంబరాల పువ్వులు కూడా విరబూశాయి. ప్రతీ పండక్కి ఆ పూలను ఎంతో అపురూపంగా కోసి కవర్లో పెడుతుంది. వాటన్నింటిని తన చేత్తో తాకుతుంది, కళ్లకు అద్దుకుంటుంది. తన స్పర్శ ఆ పూల ద్వారా అమ్మానాన్నల సమాధిని చేరాలి. తన జ్ఞాపకాల్లో వారెప్పుడూ సజీవంగానే ఉన్నారన్న సంకేతాలు చేరాలని తపన పడుతుంటుంది.

గంపలో వేసి వరిగడ్డి తడిపి పూల మీద పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. అందులో కొన్ని పూలు నిన్న అత్తింటివారి సమాధులను అలంకరించాయి. అత్తయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆ మిగిలిన పూలను తీసుకెళ్లి అమ్మానాన్నల సమాధి మీదకు చేర్చాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూడసాగింది. భర్త కిటుకు వల్ల తన ప్రయాణానికి మార్గం సుగమం అయింది.

ఆనందం పట్టలేనట్టు ఆ పూలను ఫ్రిజ్‌లోంచి తీసి బ్యాగులో వేసుకుంది. బయటినుంచి కొని తెచ్చే పూలను సమర్పించడం ఆమెకు సుతారము ఇష్టంలేదు. తన పెంచి పోషించిన తోటలోంచి పూలను సమర్పిస్తే బాగుంటుందని బయటనుంచి పూలు అస్సలు తెప్పించదు. స్వయంగా తన చేత్తో కోసి సమాధి మీద వేయిస్తుంది.

తొమ్మిదేళ్ల అయాన్‌ బట్టలు మాసిపోవడంతో వేరే డ్రస్ మార్చింది. పౌడర్ పెట్టి, తల దువ్వింది. మధ్యలో బాబు ఆకలి అంటాడని కాసిన్ని స్నాక్స్ కూడా పెట్టుకుంది. వాటర్ బాటిల్, పల్పి ఆరెంజ్ జ్యూస్ బాటిల్ కూడా పెట్టుకుంది.

బయటకు నడిచింది. కారులో డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. వెళ్లి కారులో కూర్చుండగానే కదిలింది.

తన మాటను కాదని పంతం నెగ్గించుకుందని అర్షియా మీద గుర్రుగా ఉంది షాజాది. వెళ్లి తన గదిలో కూర్చుని తస్బీ(జపమాల) పట్టుకుంది. కానీ చదవడానికి మనస్కరించట్లేదు. కోడలి ముందు అహం దెబ్బతిన్నట్టైంది. అలా ఆలోచిస్తూ కూర్చుంది.    

షాజాది భర్త రహమాన్ దుబాయ్‌లో దాదాపు ముప్ఫై ఏళ్ల వరకు ఉండి బాగానే సంపాదించాడు. పెళ్లైన కొత్తలో వెళ్లి తన యవ్వనం, రక్తం, చెమటంతా దుబాయ్ దేశాలకు ధారపోశాడు. అప్పుడప్పుడు అతిథిలా స్వదేశానికి వచ్చి వెళ్తూ ఆ చిన్న చిన్న ఆనందాలనే జీవితానికి ఆపాదించుకున్న అల్పజీవిగా ఉండిపోయాడు. అతని అన్నదమ్ములు, చిన్నాన్న, పెదనాన్నలు కూడా అరబ్ దేశాలకు వెళ్లి సంపాదించుకున్నవారే.

భర్త అక్కడుంటే ఇక్కడ షాజాది పరిస్థితి అంతుకు మించింది. క్షణక్షణం భర్త గురించిన యావే. ఆ యావలోనే తన ముద్దు ముచ్చట్లన్నీ మరిచిపోయి, పిల్లలే ప్రపంచంగా ఉండిపోయింది.   

భర్త సంపాదించిన ప్రతీ రూపాయిని పొదుపు చేస్తూ ఇక్కడ స్థలాలు, భూములు కొని పెట్టడమే కాకుండా పిల్లలను బాగా చదించింది షాజాది. అంతా అయ్యాక రిటైర్మెంట్ ఏజులో దుబాయికి స్వస్తి పలికి ఇండియా వచ్చాడు. అప్పటికే ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి.

మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా గడిపేద్దాం అనుకున్నాడు. పేదరికం సమసిపోయి మంచి స్థాయికి ఎదిగాం, ఇల్లు, భూములు ఉన్నాయి, పిల్లలు ప్రయోజకులు అయ్యారు. నిశ్చింతగా ఉండిపోదాం అనుకున్నాడు. కానీ ఓరోజు గుండెనొప్పి ఆయన్ను అనంత లోకాలకు తీసుకెళ్లింది. భర్త మరణం షాజాదిని చాలా కృంగదీసింది కానీ మనసు రాయి చేసుకుని కుటంబ భారాన్ని నెత్తిన పెట్టుకుంది.

ముప్ఫై ఏళ్లు భర్త దుబాయ్‌లో ఉండగా ఇంటి బాధ్యతలన్నీ తానే మోసింది. కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యతలు తనకేం కొత్తగా లేవు. అలవాటుగా సాగిపోతోంది. ఇద్దరు కొడుకులు, కూతురు తల్లి ఏది చెప్పినా వింటారు. చాలా క్రమశిక్షణగా పెంచడంతో కొడుకులను చూసి కోడళ్లు, అల్లుడు కూడా ఇంట్లో అత్తయ్యను రూలర్‌లా చూస్తారు.

తెలిసిన అమ్మాయే.. అందునా రంగు, రూపమే కాదు గుణం కూడా నచ్చి  అర్షియాను ఇంటికి పెద్ద కోడలిగా తెచ్చుకుంది. పెళ్లయ్యాక మూడేళ్లకు కొడుకు పుట్టాడు. ఎన్నో ఆసుపత్రులు, దర్గాలు తిరగ్గా తిరగ్గా కొడుకు పుట్టాడు.

అర్షియా వాళ్లది హఫీజ్ పేట్. ఆమె పెళ్లయ్యాక ఐదేళ్ల కాలంలో అమ్మానాన్నలు కాలంచేశారు. తనొక్కతే కూతురు ఒక ఇల్లు, రెండు వందల గజాల స్థలం ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి బషీర్ అస్సలు అంగీకరించలేదు.

“మాకు ఏం తక్క ఉందని మీవోళ్ల ఆస్తిని తీసుకోమంటవ్? ఓ పని జెయ్.. మీ బాబాయ్ వాళ్లు శానా గరీబోళ్లు గదా. వాళ్లకు ఆ ఆస్తులన్నీ ఇచ్చేస్తే బతుకులు బాగువడ్తయ్ గదా” అన్న భర్త మాట ప్రకారం వాళ్లకే ఇల్లు, జాగా ఇచ్చేసింది అర్షియా.

                                        ***

సాయంత్రం మూడు గంటల సమయంలో కారు మెహిదీపట్రం, బంజారహిల్స్ మీదుగా  జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దాటుకుని హైటెక్ సిటీ, కొండాపూర్‌లలోని ట్రాఫిక్‌ను ఈదుకుంటూ  హఫీజ్ పేట్ వైపు వెళ్తోంది. అర్షియాకు బుర్కా అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంట్లోవాళ్లు కోప్పడతారని బుర్కా వేసుకుని వచ్చి కారులో కూర్చున్నాక తీసేసి పక్కన పెట్టేసింది.

ఎప్పుడు హఫీజ్ పేట్ వెళ్లినా స్వేచ్ఛా వాయువులు గుండెల నిండా పీల్చుకున్నంత సంబరంగా ఉంటుందామెకు. తన ఆత్మాభిమానాన్ని నిర్మించిన ఏరియా అది.

కారు ఎక్కగానే అయాన్‌కు నిద్ర ముంచెత్తుకొచ్చి ఆమె ఒళ్లో వాలిపోయాడు. అతని తల్లో చేత్తో నిమురుతూ దీర్ఘాలోచనలో పడిపోయింది అర్షియా. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చిరాకు పడుతూ డ్రైవ్ చేస్తున్న డ్రైవర్‌ను గమనిస్తోంది.

అవసరం లేకపోయినా హారన్లు మోగిస్తుండడంతో ఆ డిస్టర్బెన్సుకు నిద్ర ఎగిరిపోయింది అయాన్‌కు లేచి తల గోక్కుంటూ అమ్మను చూశాడు. “అమ్మీ ఇంకా హఫీజ్ పేట్ రాలేదా?” అన్నాడు. “లేదు బెటా” అంటూ పల్పీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ అతని నోటికి అందించింది. ఎండ వేడిమికి తాళలేనట్టు గటగటా ఆ జ్యూసును తాగేశాడు అయాన్.

కిటికీలోంచి బయటకు చూస్తూ “అమ్మీ.. నానా, నానీ కథ చెప్పవా?” అన్నాడు గోముగా. ఆ కథ తనకు తెలుసు అయినా అమ్మతో పదేపదే చెప్పించుకుని రాత్రుళ్లు నిద్రపోవడం అయాన్‌కు అలవాటు. నిజజీవిత కథను ఓ కథలా చెప్పి రక్తి కట్టిస్తుంటుంది అర్షియా.

కొడుకు వైపు మురిపెంగా చూస్తూ చెప్పనారంభించింది. “నానా(అమ్మ తండ్రి) పేరు మహబూబ్. మహబూబ్ ఆ ఇంటికి పెద్దకొడుకు. ఆయన ఎన్క ఇద్దరు చెల్లెండ్లు, ఇద్దరు తమ్ముండ్లు ఉన్నరు. వాళ్ల నాయిన చిన్నగున్నప్పుడే సచ్చిపోవుడుతోని ఇంటికి పెద్ద కొడుకుగా భారం అంతా మహబూబ్ మీదనే పడ్డది. నాంపల్లిల ఉండే బజార్ ఘాట్‌ల ఉండేటోళ్లంట అప్పట్ల. అప్పటికే సర్కార్ బడిల ఎనిమిదో తరగతి సదువుతున్న మహబూబ్ ఇస్కుల్ బందువెట్టి లారీ మీద క్లీనర్‌గా వెళ్లేటోడు. వాళ్లమ్మ కుందన్ వర్క్ చేసేది. అయినా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. చిన్న ఇంట్ల అంతమంది తలదాచుకునేటోళ్లు. దీంతో మహబూబ్ పొద్దస్తమానం లారీ మీద క్లీనర్ పనిజేసి రాత్రుళ్లు రిక్షా తోలి ఆ వచ్చే రెండు, మూడు రూపాయల చిల్లర నాణేలు తెచ్చి వాళ్లమ్మ చేతిల పోసేటోడు. అట్లా మహబూబ్ ఎక్కువ కష్టపడితే గానీ ఇంట్ల ఎవరూ ఉపాసం ఉండకపోయేటోళ్లు. పని జల్ది నేర్చుకుంటే డ్రవర్ అయి ఎక్కువ జీతం తీసుకోవచ్చని మహబూబ్ ఐదేండ్లల్లనే డ్రైవింగ్ నేర్సుకొని దినపత్రికలను ఊరూరా చేర్చే వ్యాన్ నడపుడు మొదలువెట్టిండు. అటెన్క ఎదిగొచ్చిన చెళ్లెండ్ల లగ్గాలు చెయ్యనీకి అప్పులు, తమ్ముండ్లు స్థిరపడనీకి, వాళ్ల లగ్గాలకు పైసలు సరబర జేసుడు, లేదా అప్పులు జేసుడు, ఇట్ల ఇవన్నీ అమ్మా కొడుకులే చూసుకున్నరు. అట్లా అమ్మ కాలంజేసింది. కుప్ప లెక్క ఉన్న అప్పు. తన రెక్కలను ముక్కలు జేసుకొని ఆ అప్పంతా తీర్చిండు మహబూబ్. అమీనాను లగ్గం జేసుకున్నంక ఆమె గూడా ఇంట్ల కుట్టు పనులు, కుందన్ పనులు జేసుకుంట సంపాదించేది. మహబూబ్ ఆ పత్రికల వ్యాన్ నడపనీకి రాత్రుళ్లు ఒంటిగంటకు బయలుదేరి నడ్మల ప్యాసింజర్ చెయ్యెత్తిన చోటల్లా ఆపుకుంట మీద మీద పైసలు సంపాదించుకునేటోడు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డిలకు ఎక్కువగా తోలేటోడు. అట్ల పోయిన ప్రతిసారి ప్యాసింజర్లను దేవుండ్ల లెక్క భావించి ఎక్కిచ్చుకునేటోడు. ఆ సంపాదనే తనకు వచ్చే జీతానికి రెండు మూడు రెట్లు ఎక్కువగా వచ్చేది. దీంతో మహబూబ్ అప్పులన్నీ తీరగా జమా చేసుకుని సొంత ప్లాటు, ఇల్లు కట్టుకున్నడు. తన రెక్కలు సలామత్ ఉన్నన్ని రోజులు సంపాదించిండు. వాళ్లకొక బంగారు పాప ఉండె. ఆమె పేరు అర్షియా” అని ఆగిపోయి కళ్లను చక్రాల్లా తిప్పింది.

అది అమ్మే అని అతనికి తెలిసు కాబట్టి కిసుక్కున నవ్వాడు. మళ్లీ తనే కంటిన్యూ చేస్తూ “బిడ్డెను ఎంతో అపురూపంగా పెంచుకున్నరు. ఆమె లగ్గం జేసిన మూడేండ్లలల్లనే ఇద్దరు ఒకరి ఎన్క ఒకరు సచ్చిపోయిర్రు” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అమ్మ కళ్లలో కన్నీటిని చూసి అతని కళ్లు కూడా చిప్పిల్లాయి. “తాత, అమ్మమ్మ కుటుంబం కోసం శానా కష్టవడ్డరు కదమ్మీ?” అన్నాడు.

“అవున్రా. నీకింకో ముచ్చట జెప్పాల్నా.. వాళ్లకు పుట్టిన బిడ్డె వాళ్ల సొంత బిడ్డె కాదు” అని ఆగిపోయింది.

ఆ మాట విని అతను షాకయ్యాడు? కథలో ఎప్పుడూ ఆ ఊసు ఎత్తని అమ్మ నోటి నుంచి ఆ మాట కొత్తగా అనిపించి చెవులు రిక్కించాడు.

“అంటే అమ్మీ నువ్వు వాళ్ల కన్నబిడ్డెవు కాదా?”

“కాదురా. వాళ్లకు పిల్లలు కాలేరు. దీంతోని యాడనో అనాథగా దొరికిన నన్ను తెచ్చుకొని నడుపుకున్నరు. వాళ్లు గనుక నన్ను నడుపుకోకుంటే నేనియ్యాల్ల ఇంత పెద్ద సదువు సదివేదాన్ని కాదు, జాబ్ జేసేదాన్ని కాదు, ఏడనో పెంట కుప్పలల్ల చెత్త ఏరుకుంట బతికేదాన్ని. ముస్లిం కుటుంబమే అయినా నన్ను వాళ్లు ఆడపిల్ల లెక్క గాకుంట ఆడ పులి లెక్క పెంచిర్రు. నాకు ఏది ఇష్టమో అదే చెయ్యుమన్నరు. ఎక్కడా నామీద ఆచారాల ఆంక్షలు, సంప్రదాయాల సంకెళ్లు పెట్టలేదు. కనీ నా జన్మ మొగ జన్మ అయ్యుంటే ఇయ్యాల్ల కబ్రస్తాన్‌లకు పోయి సమాధుల మీద పూలు ఏసి వచ్చేదాన్ని గదా? కనీసం వాళ్లు నన్ను గాకుంట నీ అసుంటి మొగపోరన్ని సాదుకున్నా ఇయ్యాల్ల వాళ్ల సమాధులు పువ్వులతోని ఎలిగిపోయేటియి” అంటూ నిట్టూర్చింది.

అసలు వాస్తవం తెలిసిన అయాన్ అలా నోరెళ్లబెట్టాడు కాసేపటి వరకు!   

చుట్టూ పరిసరాలను అద్దాల్లోంచి చూస్తున్న అర్షియాకు హఫీజ్ పేట్ సమీపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భావోద్వేగం తన్నుకురాసాగింది. తన బాల్యం అంతా హఫీజ్ పేటలోనే గడిచింది. కాబట్టి అవన్నీ గుర్తుకు వస్తున్నాయి. తన బాల్యంలో ఆ ఏరియా ఇంతగా డెవ్‌లప్ అయి లేదు. చెట్లు, చిన్న చిన్న గుట్టలు ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ ఇళ్లే.

బాల్యం గడిచిన పరిసరాలను అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోనట్టే అర్షియా కూడా ఆ జ్ఞాపకాలను తన గుండెల్లో పదిలపరుచుకుంది. అమ్మానాన్నలకు తను ఒక్కత్తే కూతురు. పెళ్ళయ్యాక వాళ్లు అనారోగ్యాలతో ఒకరి తర్వాత ఒకరు పోవడంతో ఆ ఇల్లును బాబాయ్ వాళ్లకు ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత బాబాయ్, పెదనాన్నలు ఏమైనా ఫంక్షన్లు చేస్తే తప్పితే అటువైపు వెళ్లడం కుదరలేదు ఆమెకు.

అలా ఆలోచనల ప్రవాహంలో కొట్టుమిట్టాడుతుండగా హఫీజ్ పేట్ బ్రిడ్జి వచ్చింది. దాన్నలా చూస్తుండిపోయింది కాసేపటివరకు. బ్రిడ్జి ఎడమ పక్కనుండి లోపలికి వెళ్లాలి.

అక్కడినుంచి నేరుగా ఓ మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ఉంటుంది. ఈ చివరి నుంచి మొదలుపెడితే రైట్, లెఫ్ట్ గల్లీలను నెంబర్లతో పిలుస్తారు. వాళ్లిల్లు ఉన్న గల్లీ తొమ్మిది. ఆ గల్లీ దగ్గరపడుతుంటే గుండెల్లో దడ మొదలైంది.

కారును స్లోగా వెళ్లమని డ్రైవర్‌కు చెప్పింది. ఆ గల్లీలో నాలుగో ఇల్లే తమది. కానీ అది ఇప్పుడు బాబాయ్ వాళ్ల ఇల్లు. తను ఆడుకుని పెగిరి పెద్దైన గల్లీ అది. అవన్నీ తన కళ్ల ముందు దృశ్యాలుగా కనిపిస్తుంటే చాలా ఎమోషనల్ అవసాగింది.

అలా కారు ఇరవైయో నెంబర్ గల్లీ దగ్గర ఆగింది. అక్కడే మసీదు, కబ్రస్తాన్ కలిసి ఉన్నాయి. కారు దిగింది. శాశ్వత నిద్రలో ఉన్న అమ్మానాన్నల దగ్గరికి వచ్చి తట్టి లేపుతునట్టు అనిపించింది.

పండగల సందర్భంగా తమవారు వచ్చి తమ సమాధుల మీద పూలు, దరూద్ సమర్పిస్తే ఆత్మ సంతృప్తి చెందుతుందని అనగా విని దాన్ని మనసులో పెట్టుకుని అర్షియా ప్రతీ రంజాన్, బక్రీద్‌లకు ఇలా వచ్చేస్తుంది.

కొన్నిసార్లు భర్తతో వచ్చింది, కొన్నిసార్లు ఒక్కతే వచ్చింది, ఈసారి కొడుకున తీసుకుని వచ్చింది. బుర్కాను అందుకోబోయి అక్కడే పెట్టేసి బ్యాగులో ఉన్న షాలువాను తీసుకుని తల మీదుగా కప్పుకుని కారు దిగి మసీదు ముందు నిలబడింది.

డ్రైవర్ వెళ్లి మౌల్వీని పిలుచుకువచ్చాడు. అతను రాగానే ఆమెకు సలాం చేశాడు. ఆమె వాలెకుమస్సాలాం అని సమాధానమిచ్చింది.

జానెడు గెడ్డం, కళ్లకు సుర్మా, నుదురు మీద నమాజు మచ్చ, లాల్చీ పైజామాలో ఉన్నాడు. “మా అబ్బా, అమ్మీల సమాధుల మీద ఈ పూల సమర్పించాలి. కాస్త చూడరా. మీతో మా బాబు వస్తాడు” అంది అర్థింపుగా.

“అదెంత పని ఇటివ్వండి” అన్నాడతడు.

ఆ పూల కవర్‌ను అతని చేతికి అందించింది. కూడా బాబును తీసుకుని మౌల్వీ లోనికి వెళ్తుంటే డ్రైవర్ కూడా అతణ్ని అనుసరించాడు. వాళ్ల వెనకాల నడుస్తూ అర్షియా కూడా కబ్రస్తాన్ గేటు వరకు వెళ్లి ఆగిపోయింది. అక్కడేదో లక్ష్మణ రేఖ గీసినట్టు అనిపించింది. గేటు పక్కన నక్కినట్టు నిల్చుని అటే ధీనంగా చూస్తోంది.

రాత్రిపూట అయ్యుంటే ధైర్యంగా ఒక్కదాన్నే కబ్రస్తాన్‌లోకి వెళ్లి అమ్మానాన్నల సమాధుల్ని చూసి వచ్చేదాన్ననిపిస్తోంది. “నాలెక్క ఆలోచించేటోళ్లు ఒక్కరిద్దరు ఉన్నా ధైర్యంగా లోపటికి పోయొచ్చేదాన్ని. మాతృమూర్తి గర్భం నుంచి శాశ్వతంగా పుడమితల్లి గర్భంలకే గదా వచ్చేది. ఇక్కడున్నది ఇద్దరూ స్త్రీమూర్తులే గదా? అయినా ఎందుకీ ఆంక్షలు?” అనుకుని గేటును గోళ్లతో రక్కసాగింది.

కబ్రస్తాన్ నిండా వేపచెట్లే ఉన్నాయి. ఆ వేపచెట్ల నడుమ అంతా సమాధులు కూడా కనిపించనంతగా పిచ్చి చెట్లు మనిషి లోతు వరకు పెరిగాయి. రంజాన్ సందర్భంగా కొంతవరకు పిచ్చి చెట్లను తీసివేయడంతో కొన్ని సమాధులు కనిపిస్తున్నాయి. ఆ సమాధుల మీద ఎర్రని గులాబీలు, మల్లెలు, గన్నేరు, ఇంకా రకరకాల పూలు ఇప్పుడిప్పుడే వాడిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

సమాధుల్లో చాలా ప్రశాంత వాతావరణం ఉన్నట్టనిపించింది. జీవితమంతా తీవ్ర గందరగోళంగా, అహంకారంగా, భీతిగా, గొప్పగా.., బతికిన మనిషి చివరికి ఈ కబ్రస్తాన్‌లో ఎంత ప్రశాంతంగా నిద్రపోతాడో అనుకుంది.

అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనే స్ఫురణకు వచ్చి వెక్కసాగింది. దరూద్ చదువుకుంటూ రెండు చేతులెత్తి ఆ పైవాడితో దువా వేడుకుంటోంది.

“యా అల్లాహ్.. అమ్మానాన్న ఎంతో కష్టపడ్డరు అని నీకు తెలుసు. వాళ్లను నీ జన్నత్‌ల మంచి స్థానంల ఉంచు తండ్రీ. వాళ్ల పాపాలు ఏమైనా ఉంటే క్షమించు తండ్రీ” అని వేడుకుని దరూద్ చదువుతూ వాళ్ల పేర్లు తలుచుకోసాగింది.

కబ్రస్తాన్‌లోకి వెళ్లి వాళ్ల సమాధుల మీద పడి కాసేపు ఏడ్చి ఏడ్చి రావాలని ఉంది. కానీ తను ఆడది, ఆడవాళ్లకు కబ్రస్తాన్‌లోకి, మసీదులోకి ఎంట్రీ లేదు? కాబట్టి అలా నిస్సహాయంగా ఆ గేటు వద్దే కుప్పకూలిపోయింది.

“యా అల్లాహ్.. మేము సచ్చినంక కాదు బతికున్నప్పుడు గూడా మాకు కబ్రస్తాన్‌లకు అనుమతి ఇయ్యయ్యా. మావోళ్లు సచ్చినప్పుడు మా చేత్తోని వాళ్ల సమాధుల మీద ఇంత మన్ను వోసే భాగ్యాన్ని ఇయ్యయ్యా. మేమూ నువ్వు పుట్టిచ్చిన బిడ్డలమే గదా తండ్రీ. కానీ మాకు వేరు రూల్స్, మగవాళ్లకు వేరే రూల్స్ ఎందుకయ్యా? నువ్వు ఆడవాళ్లను కబ్రస్తాన్‌లకు అనుమతిస్తే ఈ కబ్రస్తానే జన్నత్‌కు తొలి నందనవనం అయితది” అంటున్న ఆమె కళ్లు ఏరుధారలయ్యాయి.

కబ్రస్తాన్‌లోకి వెళ్లినవాళ్లు దూరంగా కనిపిస్తున్నారు. ఆ సమాధి మీద పడే ఆ పూవుకు ఉన్న అదృష్టమైనా స్త్రీకి లేదు కదా అనుకుంది. అల్లాతో దువా వేడుకున్నా వింటాడు కానీ అది అయ్యే పనేనా? ఆయనకు కాకుండా నేరుగా పురుషులకే చెప్పాలి. కానీ వాళ్లు ఆడవాళ్ల మాటను లెక్కలోకి తీసుకుంటారా? తనలా ఆలోచించే స్త్రీల సంఖ్య పెగిరినప్పుడే ఆ మార్పు సాధ్యం అవుతుండొచ్చు అనుకుని దీర్ఘశ్వాస వదిలింది.

ఇంతలో వెళ్లినవాళ్లు కాస్తా రావడం చూసిన ఆమె తననితాను సర్దుకుంది. కళ్లను తుడుచుకుంది. దగ్గరికి వచ్చిన మౌల్వీ చేతిలో ఐదు వందల నోటు పెట్టింది. “తుమ్హారే అమ్మీ అబ్బాకో దువా, రెండు ఖురాన్‌ల సవాబ్‌ను బఖష్ దియా హుం” అన్నాడు. ఆ మాటతో ఆమె మనసు దూదిపింజెలా మారిపోయింది.  

“ఖుదాహఫీజ్” అంటూ మౌల్వీ వెళ్లిపోయాడు. కొడుకు వెళ్లేటప్పుడు నానా, నానీ సమాధులను తాకి మొక్కి రావాలని పదేపదే చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే అతని అరచేతులకు అంటుకున్న సమాధి మీది మట్టి రేణువులను చూసి ఆ చేతులను తన ముఖానికి రాసుకుని ముద్దు పెట్టింది. అమ్మానాన్నలకు ముద్దు పెట్టినట్టు ఫీలయ్యింది క్షణం పాటు.

                                        ————————

May 31, 2026 34 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆకాశానికి ఎగసిన పాతకెరటం

by చంద్రకళ దీకొండ May 31, 2026
written by చంద్రకళ దీకొండ

ప్రముఖ రచయిత్రి,కాలమిస్ట్, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీ చందూర్ గారు!

ఆ రోజుల్లో చాలామందికి మాలతీ చందూర్ అంటే ఒక చూడదగిన వింత.పైగా ఆవిడ ప్రమదావనం,వంటలూ-పిండివంటలు… ప్రశ్నలూ-జవాబులు వారం వారం కనిపించేవి గానీ,ఆవిడ ఫోటో ఎక్కడా కనిపించేది కాదు.చాలామంది అభిమాన పాఠకులకు ఉత్సుకత ఉండేది,ఆమెను చూడాలని.పేరును బట్టి ఉత్తరాది వాళ్లనుకునేవాళ్ళు.
చందూర్ ఇంటి పేరనీ, మాలతి అసలు పేరనీ,పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యులనీ తరువాత తెలిసాయి వివరాలు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు.కానీ ఆమె విజయం వెనుక వెన్నుదన్నుగా ఉన్నవారు(ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సరసన సదాశివంలా)
నాగేశ్వరరావు చందూర్ గారు.

ఆవిడ కథల నేపథ్యం చెన్నపట్నమే.సమతూకమైన చక్కని సాహిత్యం అర్థ శతాబ్దికి పైగా తెలుగు పత్రికారంగాన్ని సుసంపన్నం చేసింది.

ముళ్ళపూడి,రా.వి.శాస్త్రి గార్లు సాహిత్య లోకాన్ని ఏలుతున్న రోజులవి.తెలుగు పత్రికలన్నీ మద్రాసు నుండే వెలువడేవి.

“దేశీ పబ్లికేషన్స్” వారు ఆవిడ వ్రాసిన “పాప” అనే కథాసంపుటిని అచ్చువేసారు.
“లజ్ కార్నర్” అనే కథ చాలా బాగుంటుంది.

సినిమాలు అర్థం చేసుకోవడానికి తమిళ భాషను నేర్చుకుని,రెండేళ్లకే అనువాద రచనలు చేసిన మేధావి మాలతీ చందూర్ గారు.
ఆమె తెలుగులో అనువాదం చేసిన “జయకాంతన్” గారి తమిళ నవల “సిలనేరంగళ”, “కొన్ని సమయాలలో కొందరు మనుషులు” శీర్షికతో ధారావాహికగా వెలువడి సంచలనం సృష్టించింది.

ఆంధ్రప్రభలో నిరాఘాటంగా సుమారు అర్థ శతాబ్ది పాటు “జవాబులు” శీర్షికను నడిపిన విదుషీమణి ఆమె.ఎన్నో రకాల సమస్యలకు ఆత్మీయంగా జవాబులిస్తూ, ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ…తెలుగు వారి ఆప్తవర్గంలో చేరారు.వాటిని కొంతమంది అభిమాన పాఠకులు బైండింగులు చేసి, అపురూపంగా దాచుకునేవారు.నేడు పత్రికలలో వస్తున్న “కౌన్సిలింగ్” వంటి శీర్షికలకు ఆవిడే శ్రీకారం చుట్టారు ఆనాడే.

ఆంగ్ల భాషలోని మంచి నవలలను పరిచయం చేసే “పాతకెరటాలు” అద్వితీయం.ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా వ్యాపించి,ఆకాశానికి ఎగసింది ఈ రచనల ద్వారా.వాటిని ఆసక్తిగా చదివిన వారిలో నేనూ ఒకదాన్ని అవడం ఎంతో గర్వకారణం!

“శతాబ్ది సూరీడు”,”హృదయనేత్రి”,
“శిశిరవసంతం”,”సద్యోగం”,
“ఆలోచించు”,”రాగరక్తిమ”,”భూమిపుత్రి”,”ఏమిటీ జీవితాలు”,”ఏది గమనం-ఏది మార్గం”,”రెక్కల చుక్కలు”,”కాంచనమృగం”,”కలల వెలుగు”,”రేణుకాదేవి ఆత్మకథ” వంటి 16 నవలలు రచించారామె.

స్నేహసౌహార్ద్రాలకు పుట్టినిల్లు చందూర్ వారి ఇల్లు.ఎందరో తెలుగు ప్రముఖులు వారి గృహాన్ని సందర్శించేవారు.

మాలతీ చందూర్ గారి రచనల గురించి కొంతమంది ప్రముఖ రచయితలు,రచయిత్రులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఇలా ప్రస్తుతించారు :-


“ఆమె శైలి సూటిగా,సుఖంగా,డొంక తిరుగుళ్లు లేకుండా హాయిగా ఉంటుంది. అనవసర అలంకారాలు ఉండవు.హాస్యోక్తులుండవు.
కథ వడివడిగా నడుస్తుంది.వ్యక్తిగతజీవితం గానీ,సాహిత్య జీవితం గానీ సంస్కారవంతంగా గడిపి,పాఠకుల మదిలో గౌరవప్రదంగా నిలబడిపోయే అదృష్టం మాలతీ చందూర్ వంటి కొద్దిమందికే సాధ్యం”
———– శ్రీ రమణ

“నవలా నిర్మాణము సూటిగా,స్పష్టంగా ఉండి,వ్యక్తులను,పరిస్థితులను కళ్లముందుంచుతారు.మనమే పాత్రను ఇష్టపడతామనేది మన సంస్కారంపై ఆధారపడి ఉంటుంది.”
—————— ఓల్గా

“ఆమె రచనలు స్త్రీలను ఆకట్టుకున్నాయి.ఎందరో రచనలను చేయడానికి పురికొల్పాయి.అట్లా రచయిత్రులు,రచయితలు అయినవాళ్లున్నారు.ఉత్తమ పాఠకులైనవాళ్ళు, ఉత్తమ గృహిణులు, ఉత్తమ సంస్కారం గల మహిళలుగా రూపుదిద్దుకున్నవాళ్లున్నారు.
— ముదిగంటి సుజాతారెడ్డి

“స్త్రీల ఉద్యోగ రంగ, జీవితరంగ సంఘర్షణలను,సర్దుబాట్లను,స్వతంత్ర వ్యక్తిత్వ జీవన ఆకాంక్షలను,ఆత్మగౌరవ చైతన్యాన్ని ఇతివృత్తంలో భాగం చేసిన నవలలు రచించారు మాలతీ చందూర్ గారు.”
—- కాత్యాయనీ విద్మహే

“భావ గాంభీర్యం, సునిశిత పరిశీలన,
విస్తృత పఠనం,అధ్యయనం,
కాలానికంటే ముందుండే నైజం,చెప్పదలచుకొన్న విషయాన్ని సందర్భోచితంగా,వాదనా పటిమతో, సమయస్ఫూర్తితో రచించే శైలీ,నైపుణ్యం…ఇవన్నీ కలగలిపితే ఆమె.
———- డా.శిలాలోలిత


మాలతీచందూర్ గారి కథల్లో మహిళా చైతన్యం

ప్రసిద్ధిగాంచిన “లజ్ కార్నర్” కథలో కౌమారపు ప్రాయంలో ఉన్న ఒక అమ్మాయి,రెండు సార్లు బి.ఏ.ఫెయిల్ అయిన వాడితో తనకు ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి,ఇంట్లో చెప్పకుండా రైల్లో లజ్ కార్నర్ ప్రాంతానికి చేరుకుని;తన స్నేహితురాలి ఇంట్లో కలిసి,ఆశలు కల్పించిన సినిమా డైరెక్టర్ ని కలుసుకోవాలని ఫోన్ చేయగా,అది నెంబర్ లో కొద్ది తేడాగా ఉన్న శేఖరానికి కలుస్తుంది.ఇక్కడ ఒక సన్నివేశంలో ఒంటరి ఆడపిల్ల భయాలను తెలిపేలా, తన భార్యకు ఫోన్ చేయటానికి వచ్చిన వ్యక్తిపై అనుమానంతో గట్టిగా కేకలు వేయడం-పోలీస్ కానిస్టేబుల్ రావడం-సహజంగా వుంటుంది. ఆడపిల్ల ఆత్మరక్షణకు గట్టిగా అరవడం కూడా పనిచేస్తుందని దృశ్యమానం చేసారు రచయిత్రి. తాను ఒంటరిగా ఉన్నానని,రాత్రి పూట భయంగా ఉందని,త్వరగా వచ్చి,డైరెక్టర్ కు ఫోన్ చేయడానికి తన వద్ద నోట్లు తప్ప చిల్లర(రెండు అణాలు) లేనందువల్ల తనను తీసుకెళ్ల మంటుంది.
ముందు విసుక్కున్నా,ఒంటరి ఆడపిల్లపై జాలితో తన ఇంటికి తీసుకువస్తాడు శేఖరం. తనను ఎంతో ప్రేమించే వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయిని ఆదరించి,ఆశ్రయమిస్తుంది.ఇంకా పెళ్లికాని శేఖరం ఆ అమ్మాయితో వేళాకోళం,వెటకారం ఆడడాన్ని అడ్డుకుంటుంది.తెల్లవారి చదువుకున్న దానివి,నీకెందుకు ఈ సినిమాలు?షూటింగ్ చూడు,నీకే అర్థమవుతుంది అంటూ రెండు రోజులు రాత్రంతా షూటింగ్ కార్యక్రమం చూడడానికి అనుమతిస్తాడు డైరెక్టర్. శేఖరంతో పాటుగా తెల్లవార్లూ షూటింగ్ చూస్తుంది.చెప్పిన సంభాషణే మళ్లీ,మళ్లీ చెప్పటం వంటి షూటింగ్ కార్యక్రమం చూసి,తలనొప్పితో శేఖరం ఇంటికి చేరుకుంటుంది.శేఖరం అమ్మ,ఆ అమ్మాయి(శ్యామల)ని ఆప్యాయతతో అడుగుతూ,వివరాలు రాబట్టి,వాళ్ళ నాన్నను ఫోన్ చేసి,పిలిపిస్తుంది.కొసమెరుపేమిటంటే-నెల తిరిగేలోగా, శేఖరానికి,శ్యామలకు పెళ్ళై,ఆ తర్వాత ఓ పాపకు తల్లవుతుంది.పాపం మీ అమ్మ సినిమా తార అవ్వాలనుకుంది.నువ్వన్నా తన కోరిక తీర్చు అంటూ వేళాకోళమాడే శేఖరం మాటలకు ఇంకా ఉడుక్కుంటూనే వుంటుంది శ్యామల అంటూ కథను ముగిస్తారు.
ఆ రోజుల్లో(1951) కనుక, శ్యామల శేఖరాన్ని కలిసి ఆపదను తప్పించుకుంది.డైరెక్టర్ కి కూడా చదువుకున్న ఆడపిల్లలంటే గౌరవం వుంది కనుక,కథ సుఖాంతమైంది.
చక్కని కథను చదివిన అనుభూతిని కలిగిస్తుంది,మాలతీచందూర్ గారి ఈ కథ.
గోముఖ వ్యాఘ్రాల, రుద్రాక్షలు ధరించిన తోడేళ్ల మోసాలు,
మాయలు నిండిన ఈ రోజుల్లో
అలా జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

“డాబా ఇల్లు” కథలో ఒక్కో ఇటుక పేర్చి స్వయంగా కట్టుకున్న ఇంటికై షావుకారు దగ్గర అప్పు చేసిన పేద దంపతులు..అతనికి కాలుకు దెబ్బ తగిలి, కట్టలేకపోయిన మూడు నెలల వాయిదా వల్ల ఇంటి తాకట్టు వాకట్టు అయి,షావుకారు జప్తు చేసుకుంటే, కూలిపోయిన అతని కలల మేడ,ఆ మేడ గోడపై మేకులు కొట్టవద్దంటూ అతను చూపిన మమకారం ఎంతో హృద్యంగా,ఆర్ద్రంగా చిత్రించారు మాలతీచందూర్ గారు.ఇటువంటి ఎంతోమంది పేదల కష్టాలను, ఇటీవల హైడ్రా వారు కూల్చేస్తున్న పేదవారి కట్టడాలను కళ్ళకు కడుతుంది ఈ కథ.

“షణ్ముగం” కథలో తమిళం యాస కలిసిన భాషలో ఆమె అమాయకత్వాన్ని, సహజత్వాన్ని..మాధవి వంటి ఆధునిక మహిళల చిన్నచూపు ఆలోచనలను,కథానాయకుని పేదపిల్లకు సహాయం ముసుగులోని అతని ద్వంద్వ ప్రవృత్తిని మనకు తేటతెల్లం చేస్తారు.

“వారి సఖి” కథలో కథానాయకుడు ఒకప్పటి తాను ప్రేమించిన సఖి సుగుణను తన అర్థాంగి వద్ద పదే, పదే పొగుడుతూ ఉన్నప్పుడు ఆమె పడే మానసిక వేదనను తెలియజేస్తూ,అటువంటి ఎంతోమంది మహిళల వ్యధను మనకు గుర్తు చేస్తారు.అంతేకాక,వారి ఇంటికి భర్త ఆజ్ఞపై వెళ్ళినప్పుడు,ఆ మహిళ భర్త తన కొంగు పుచ్చుకున్న విషయాన్ని భర్తకు చెప్పి,మళ్లీ ఆ సుగుణ మాటెత్తకుండా నోరు మూయించడం.. చక్కని గుణపాఠం తన భర్తకు నేర్పడం చాలా బాగుంటుంది. మగవారి చేతిలో బాధలు పడే మహిళలు నేర్చుకోవాల్సిన విషయమిది.

“లగ్నబలిమి” కథలో ఇరువురు కథానాయకులలో నాయిక ఎవరివైపు మొగ్గుచూపుతుందోనని
ఉత్కంఠను రేపుతూ..పురుషుడు ప్రతి స్త్రీ వద్దా తన ఆంతరంగిక ప్రేమలు చెప్తాడా ఏమిటి?ప్రకృతి నేర్పుతుంది. పద్ధేనిమిది పైబడ్డ మగవాడికి ప్రేమించడమనేది ప్రకృతి నేర్పుతుంది. ప్రేమ లేకుండా ఉండడం అసంభవం.నిన్ను చూసేదాకా ప్రవరాఖ్యుడిలా మడికట్టుకు కూర్చున్నవాడు,నీ దగ్గరకొచ్చినా నువ్వు అతన్ని ప్రేమించలేవు అన్న ఒక్క సంభాషణతో తనను మొదటిసారి ప్రేమించే మగవాడి కోసం ఎదురుచూస్తున్న ఊగిసలాట కు తెరదించుతూ, ఆడవారి,మగవారి మనస్తత్వాలను మనకు తెలియజేస్తారు.

“కాంతమ్మ రెండో కూతురు” కథలో..అక్క చదువు ధ్యాసలో పడి, భర్తను పట్టించుకోకపోతే,చెల్లి బావకు దగ్గరై, గర్భవతి అవుతుంది.తన ఇద్దరి కూతుళ్ళ భవిష్యత్తు గురించి తపన పడే తల్లి మనోవ్యధను ఎంతో బాగా ఈ కథనంలో తెలిపారు మాలతీచందూర్ గారు.

“ఏనాటి జగన్నాథ్” కథలో తన కొడుకు చిట్టి తనను వదిలి హాస్టల్ కి వెళుతూ, తనను పట్టించుకోకుండా ఇంజన్ ను పసిచాపల్యంతో చూస్తున్నప్పుడు,తాను అదే వయసులో ఉన్నప్పుడు అక్క ఇంటిలో పరిచయమైన జగన్నాథ్ తనపై పెంచుకున్న ప్రేమను,తన జడలో గుచ్చుతున్న బంగారపు నారు పోసిన స్ప్రింగ్ చేమంతి పువ్వును పట్టించుకోకుండా,అతను తెచ్చే యాపిల్స్, బిస్కెట్ లు,జాంకాయలనే చూసి సంతోషిస్తూ,తనను విడిచి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్న అతనిని అక్కకు చూపించడం వంటి బాల్యచేష్టలను గుర్తుకు తెచ్చుకుంటుంది.మనం కూడా అంతే కదా.. చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…అప్పుడలా ఎందుకు ప్రవర్తించానో అనుకుంటూ ఉంటాం. అప్పుటి వయసు,జీవితానుభవం లేని పసితనం అలాంటివని ఈ కథ ద్వారా తెలియజేసారు.

“నాన్న” కథలో విశ్వపిత గా వర్ణిస్తూ,తాను ప్రేమించిన జానకిని పెళ్ళైనా ప్రేమిస్తూ,విధవరాలైన ఆమె కొడుకుని లోకం మాటలకు జడవకుండా పెంచిన తండ్రి ఔన్నత్యాన్ని చాటారు.పెళ్లికాకముందు జానకి హేళన చేసినందువల్ల తన ఎడమచేతి ఆరో వేలుని కోసుకుని,సెప్టిక్ అయితే,మణికట్టు దాకా తొలగించిన విషయాన్ని అతని స్నేహితుడు చెప్పేదాకా తెలియనివ్వకుండా ఉంచడం..ప్రేమ వ్యవహారంలో పడి ఐ. ఎ. ఎస్. పరీక్షకు వెళ్లనని మొండికేస్తున్న కొడుకుకి చెప్పడం..కథనం ఎంతో బాగుంటుంది.తన కొడుకు కాకపోయినా,తాను ప్రాణప్రదంగా ప్రేమించిన జానకి కొడుకు కోసం అతని తాపత్రయం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.యాసిడ్ దాడులు చేసే ఈ కాలపు యువత తప్పక చదవాల్సిన కథ ఇది.

“రక్షించా” కథలో నిష్ఠాగరిష్టుడైన తండ్రి,తల్లి రోగచికిత్స కోసం పట్నం వెళ్లి,వ్యసనాలతో నైతికంగా పతనమవుతుంటే చూస్తూ బాధపడే కొడుకు ఆవేదనను కళ్ళకు కడుతూ,ఆ ప్రభావం కొడుకుపై చెడుదారిలో వెళ్లేలా ఎలా ప్రోత్సహించిందో కథనంలో చూపుతారు.చివరకు తండ్రి పెళ్లి చేసుకున్న జానకి,తన సమవయస్కురాలు,అయిన ఆమెతో మోహంలో పడి, గర్భవతి అయిందని తెలిసి,మందు మింగించి,ఆమె మరణానికి కారణభూతుడవుతాడు. మూడేళ్ళ జైలుశిక్షకు పాత్రుడౌతాడు.తీపిలో వగరుంటుంది.నీలాంటి యువకుడు పిరికితనంతో పారిపోకూడదు అంటూ బోధించిన లాయర్ స్నేహితుడు రామంని తాను రక్షించానని చెపుతాడు.
స్త్రీ పురుషునిలా గాలిలో స్వేచ్ఛగా ఎగురలేదు.ఎగిరినా ప్రకృతి స్త్రీని కఠినంగా శిక్షిస్తుంది అంటూ జానకి మాటల్లో జీవితసత్యాలను చాటి చెపుతారు.

“అక్క” కథలో తాను ప్రేమించిన క్లాస్మేట్ జోగరావును కాక, తండ్రి చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకున్న విధికి తలవంచిన బుద్ధిమంతురాలు అని నిర్వచిస్తారు.ఫారెస్ట్ ఆఫీసర్ తనను పెళ్లి చేసుకోలేదన్న అసూయతో,అత్త కూతురు సుశీ జగ్గరావుకు పెళ్లి అయిందని అబద్ధం చెబుతుంది.తన ఇంటికి జగ్గరావును,అక్కను పిలిచి,అవమానిస్తుంది. కానీ అక్క సుశీ వాళ్ళమ్మకి(అత్త) సంయమనంతో సమాధానమిస్తుంది.జరిగిన సంఘటన గురించి బాధపడుతున్న అక్కను ఓదారుస్తూ,ఆమె చెల్లి అవమానాలు భరించాలి.మనం ఆడవాళ్ళం.భూదేవి లాంటివాళ్ళం అంటుంది.ఆడవారి జీవితాల గురించి,ప్రేమించిన హృదయాల త్యాగం గురించి ఈ ఒక్క వాక్యంలో తేల్చి చెబుతారు మాలతీచందూర్.

“అచ్యుతం” కథలో ప్రస్తుతం డాక్టర్ భార్య అయిన రాధ, తనను ప్రేమించిన అన్నయ్య స్నేహితుడు, చివరి దశలో తన వద్దకు వచ్చి,తన చేతిలోనే కన్ను మూయడం విషాదాంత కథనం.స్త్రీకి వివాహంతో బాల్యం అంతర్థానమవుతుంది. ఈ మొగాళ్ళు ఇంద్రజాలికులు*ఇన్నాళ్ళలో నిన్ను చూడటానికి రానివాడు, ఇప్పుడు తన స్వార్థం కోసం ఈ దశలో వచ్చి,నిన్ను మాయ చేస్తున్నాడు అంటూ తన స్నేహితురాలు ఎంతగా చెప్పినా,రాధ అతనిని ఆదరించి,తన నిర్మల ప్రేమను చాటుకుంటుంది.కొంతవరకూదేవదాసు కథను గుర్తుకు తెస్తుంది ఈ కథ.

“జీవితపు విలువ నెలకు డెబ్భయి రూపాయలు” అంటూ గారాబంగా పెరిగిన డిప్యూటీ కలెక్టర్ కూతురు,ఐదు వందల రూపాయల జీతగాడికి భార్య అయిన జయ మతకలహాల్లో భర్త,పాముకాటుకు తండ్రి చనిపోతే..
జయ బ్రతుకుతుంది.చావదు.తనకోసం తను బ్రతుకుతుంది.నెమ్మది నెమ్మదిగా బి.ఈ.డి. కూడా అవుతుంది అని కథను ముగిస్తూ స్త్రీ సాధికారతను ఆ కాలంలోనే చాటారు మాలతీచందూర్ గారు.

ఇలా..ఆ కాలంలోని ఆడవారి,మగవారి మనస్తత్వాలను,ప్రేమను,త్యాగాలను,ధైర్యాన్ని, విధికి తలవంచే పరిస్థితులను తన కథలలో చిత్రించారు మాలతీచందూర్ గారు.అంతేకాక,ఆడవారి సాధికారతను,లేడీస్ క్లబ్బుల్లో ధనవంతులైన ఆడవారి ప్రవర్తనను,తోటి స్త్రీలపై ఆడవారు చూపే ఈర్ష్యాసూయలను కూడా సందర్భానుసారంగా తమ కథలలో చేర్చారు.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఆమె నా కావ్య నాయిక!

by Padmavathi Neelam Raju May 31, 2026
written by Padmavathi Neelam Raju

‘తాతయ్య ఎక్కిన విమానం ల్యాండింగ్ కి ఇంకా అరగంట టైం ఉంది,’ అనుకుంటూ క్యాపిచీనో కాఫీ కప్పు పట్టుకొని విజిటర్స్ లాంజ్ లో ముంబై ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నాడు రవీందర్.  అతని ఆలోచనలు అలా చిన్ననాటి కాలానికి వెళ్ళిపోయాయి. తనకంటే ఎక్కువగా నాన్న కూడా తాతయ్య  బామ్మ ల  దగ్గర గడపలేదు. ఆమె పూర్తి పేరు దుర్గ నందిని. తాతయ్య సీతారామయ్య ఒంగోలులో ఉండేవారు . సాయంత్రాలు తాతయ్యతో సిఆర్ఆర్ రీడింగ్ రూమ్ కి వెళ్లి కాసేపు న్యూస్ పేపర్లు, కథల పుస్తకాలు   తిరగేయడం, ఒక్కోసారి రంగారాయుడి చెరువు దగ్గరకెళ్ళి ఆ గట్టు చుట్టూ నడవడం, అమ్మానాన్న వాళ్లు వచ్చినప్పుడు కొత్తపట్నం సముద్రానికి పిక్నిక్ కి వెళ్లడం ఇలా ఎండాకాలం, దసరా, సంక్రాంతి సెలవులన్నీ గడిచి పోతుండేవి.  తాతయ్య, బామ్మ  దగ్గర ఉంటే నాకు ఎప్పుడూ బోరుగా ఉండేది కాదు.  ఇప్పుడు తాతయ్య బామ్మ  లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడా అని  అనుకుంటాను.  ఆమె పోయి రెండేళ్లయింది. నాన్న హైదరాబాదులో ఇల్లు కొని మకాం  మార్చేశాడు.  నాక్కూడా చదువు పూర్తయి నేను ట్రైనింగ్  కింద ముంబాయి వచ్చి ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకొని ఉద్యోగంలో స్థిరపడిపోయాను. “అర్చన నా జీవితం లోకి వచ్చింది,” తల విదిలించాడు.  విమానం ల్యాండ్ అయిందని అనౌన్స్మెంట్ విని అరైవల్ గెట్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. ఎప్పటిలాగే తాతయ్య ఫిట్. ఆరడుగుల ఎత్తు, చక్కటి ముఖవర్చస్తూ, వయసుతో వచ్చిన గాంభీర్యం, తెల్లగా  నెరిసిన జుట్టు మీసాలు. అనుభవంతో పండిన ఒక జీవిత శాస్త్రవేత నడిచి వస్తుంట్లుగా ఉంది  రవీందర్ కి.  బయటకు వచ్చిన  ఆయన చేతిలోని సూటికేసందుకొని కారు పార్కింగ్ దాకా వెళ్లి తాతయ్యని కారులో కూర్చోబెట్టుకొని ముంబైలో ఉన్న తన అపార్ట్మెంట్ కి చేరాడు.

**************************

 “తాతయ్య ఆ రెండో పడక గదిలో పక్క సర్ది పెట్టాను, నువ్వేళ్లి ఫ్రెష్ అయ్యి కాసేపు విశ్రాంతి తీసుకో. ఈలోపు నీకు మంచి కాఫీ చేసి తెస్తాను,” అన్నాడు రవీందర్.   సీతారామయ్య గదిలోకి వెళ్ళాడు.  అది చాలా చక్కగా ఉంది.  “ఇల్లంతా ఇంత పొందికగా ఉంది అంటే ఒక అందమైన పొందిక గల స్త్రీ హస్త ఉన్నదనిపిస్తోంది” అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి బట్టలు మార్చుకొని మంచం మీద వాలాడు.  రవీందర్  కాఫీ తీసుకొచ్చాడు. ఇంటిని చూసి ఇల్లాలి ని చూడాలన్న మాట  వాస్తవమే. అర్చన మంచి పొందికగల అమ్మాయి”అనుకున్నాడాయన.   “తాతయ్య  ఇదిగో కాఫీ,” అంటూ అందించాడు. “ఏమి తింటారో చెప్తే బయటనుండి తెప్పిస్తాను,” అన్నాడు.  “నువ్వు వండుకోవటం లేదా?” “అదేం లేదు తాతయ్య నాకు అంత బాగా వంట  రాదు,” అంటూ నసిగాడు.  “ఓరిని, నేను వచ్చాగ,  నేను చేస్తాలే వంట,”అన్నాడు.  “మీకు  వంటొచ్చా,” ఆశ్చర్యంతో అడిగాడు.  “ఏ అంత ఆశ్చర్యం.  మీ నానమ్మ నాకు అన్ని నేర్పించిందిలే,” అన్నాడు.  “అవును తాతయ్య, నీది నానమ్మది ఒక అందమైన అద్భుతమైన సహచర్యం,” అన్నాడు అర్చన గుర్తొచ్చి కాస్త నిస్పృహగ. “నాకు వంటగది కూరగాయలు చూపించు,” అంటూ మనవడిని  లేవదీశాడు.  “ఇదంతా నువ్వే చేసుకుంటావంట్రా, చాలా చక్కగా ఉంది! నీ ఇల్లంతాను!” అన్నాడు ఆయన.  “కాదు తాతయ్య, అర్చన. తనకి ఇల్లంత సర్దుకుని అందంగా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం,” చెప్పాడు చాలా సహజంగా. సీతారామయ్య గారికి అర్థమైంది , “రవీందర్ కి అర్చనకి  మధ్య వచ్చిన విభేదం అంత పెద్ద విషయం కాదని.” ఇక్కడికొచ్చే ముందే శ్రీధర్ ద్వారా కొంత తెలుసుకొన్నాడు. వీళ్ళిద్దరూ సాఫ్ట్వే వేర్ జీతగాళ్లే. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్. ఏడాదికే ఇద్దరు ఆకర్షితులయ్యారు. పెళ్లి ఇప్పుడే వద్దు ఇద్దరం కలిసి ఉందామని నిర్ణయించుకొని ‘లివింగ్ రిలేషన్ షిప్’ అంటూ ఇలా మొదలు పెట్టారు. కొద్ది నెలలకే ఇలా అయింది. సీతారామయ్య గారికి అర్థమైంది వీళ్ళ మధ్యన ఈగో అడ్డువచ్చిందని, అనుకున్న వెంటనే  “మిషన్ మ్యారేజ్” ని చేపట్టారు. రాత్రి భోజనం అయ్యాక సీతారామయ్య రవీందర్ కబుర్లు చెప్పుకొని, కొద్దిసేపు అయిన తర్వాత “ఒరేయ్ రవీందర్ నేను పడుకుంటాను, నువ్వు వెళ్లి పడుకోరా,” అన్నాడు.  “నాకు అంత త్వరగా నిద్ర రాదు తాతయ్య. నీ దగ్గర ఏదైనా పుస్తకం ఉంటే ఇవ్వరాదు,” అన్నాడు.  “ఆ సూట్ కేసులో పైనే ఉంది. కావాలంటే తీసుకో” అన్నాడు ఆయన. సూట్కేస్ తెరిచి చూసి “అది నీ డైరీ తాతయ్య” అన్నాడు. “పర్లేదురా అంతా మీ నాన్నమ్మ గురించే చదవచ్చు, తీసుకెళ్ళు.” రవీందర్ డైరీ తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. ముత్యాలన్నీ పేర్చి అక్షరాలుగా దిద్దినంత అందమైన రాతలో ఉంది తాతయ్య చేతిరాత. చదవటం మొదలుపెట్టాడు.

 “నందిని! నువ్వే నా కావ్య నాయకవి!”మొదటి  వాక్యం. అందరూ ఆమెని ‘దుర్గా’ అని ‘దుర్గమ్మ’ అని పిలిచేవారు.  సీతారామయ్యగారు  మాత్రం ప్రేమగా ‘నందిని’ అనిపిలిచేవాడు.  అప్పుడప్పుడు రవీందర్ అల్లరిగా  తాతయ్యలాగా “నందిని!” అని పిలిస్తే, “ఒరేయ్ భడవ!  ఆ పేరు ని  పిలవటంలో కూడా సుకుమారం, మాధుర్యం   చూపిస్తాడు మీ తాతయ్య, అది నేర్చుకో,” అని నవ్వేది. అందమైన ముఖవర్ఛస్సు, నిండయిన విగ్రహము, మెడలో కాసి కాయల రెండు పేటల గొలుసు,  మెడకు దగ్గరగా లక్ష్మీకాసులతో ఉన్న నల్లపూసలు,  రెండు పేటల మంగళ  సూత్రం ఉన్న గొలుసులతో జరీపేటు  చీరకట్టి ఎప్పుడు నిండుగా కనిపించేది. కాళ్ళకి అంగుళం వెడల్పు ఉన్న వెండి పట్టీలు, గజ్జల మెట్టెలు, పసుపు రాసుకొని అచ్చు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే ఉండేది నాకు తెలిసిన బామ్మ! అంత అందమైన బామ్మని తాతయ్య  ఎలా మర్చిపోగలడు, అనుకొని చదవటం కొనసాగించాడు.

************************

 ‘నందిని నువ్వా రోజు ఎదురుచూపులతో భయంతో ముచ్చెమట ముత్యాల్లాగా  నీ నుదుటన మెరుస్తుండగా నక్కినక్కి తలుపు వెనక నిలుచుని నన్ను పిలిచావు.  మా ఇంటి వరండా బయట నేను నిన్ను చూశాను.  దగ్గరకు రాగానే ఒక కాగితం నా చేతిలో పెట్టి పరిగెత్తి పోయావు. దాని సారాంశం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాతోనే నీ పెళ్లి అని.’ నా  మనసంతా అందమైన తెల్లని కొంగలా తేలిపోయింది గాలిలో. అప్పుడే నాకర్థమైంది నువ్వే నా జీవన కావ్య నాయక ‘అభిసారిక’ అని. మన పెళ్లి జరిగిపోయింది. మన వివాహ జీవితం మూడు పున్నములు, ఆరు శోభన రాత్రులుగా గడిచి  పోయింది.

ఆ సమయంలోనే నాకు వేరే ఊరికి బదిలి అయింది.  ‘నువ్వు లేకుండా నేను ఎలా బతకాల’ అని అనుకుంటున్న సమయంలో ‘నీ ఉత్తరాలే నాకు ఊపిరి అయ్యాయి. ఆ ఉత్తరాలలో నీ ప్రేమతో నిండిన ప్రతి పదం నాకు జీవనాధారం అయింది.’  ‘అందమైన నీ రూపు కనుల ముందే కదలాడుతుంటే నీలాగే అందంగా ఉత్తరం రాయాలని ప్రయత్నించేవాడిని.  కానీ అవి  నీ ఉత్తరాలంత  అందంగా మాత్రం ఉండేవి కాదు.  అయినా సరే నీవు మరింత అందంగా నాకోసం ఎలా ఎదురు చూస్తున్నావో రాసేదానివి.’

  “ఉత్తరం చివరలో అందమైన పాటతో “మల్లెపూలు నీకై రోజు రోజు పూచే,” అంటూ ముగించేదానివి నందిని!, నీ అందమయిన పెదవుల ముద్ర వేసేదానివి. నీవు నాకోసం గడియలు  లెక్కిస్తూ ఎదురుచూస్తున్న నా కావ్య నాయక! ‘విరహోత్ కంఠిత !” అనిపించేది.

 జీవితమంతా  ఆనందమయం అయితే , అది జీవితం ఎందుకవుతుంది. అందమయిన కావ్యమవుతుంది. నాకింకా గుర్తుంది అవి గడ్డురోజులు.  ఎమర్జెన్సీ అమలులో ఉన్న  రోజులు. నాకు జీతం రావడానికి పది హేను రోజులపయినే పట్టేది. అప్పటికింకా నేను మామూలు గుమాస్తానే. నా సంపాదన బొటాబొటిగా మన సంసారం గడపటానికి  సరిపోయేది. అప్పటి నీ త్యాగం నేను మరువలేను. అమ్మ మామయ్య చేత టెలిగ్రామ్ ఇప్పించింది, ‘నాన్నకు గుండెపోటు వచ్చిందని.  ఆఫీస్ నుండి ట్రంక్ కాల్ చేశాను అమ్మకి. ‘నాన్నను హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారని, ఆయనకి బైపాస్ సర్జరీ చేయాలనీ, లక్ష యాభైవేలు అవుతుందని’ అమ్మ చెప్పింది. నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పటి పరిస్థితులలో నాకు ఎక్కడ అంత అప్పు పుట్టలేదు. అప్పు అడిగిన పది రూపాయల వడ్డీ ఇస్తేనే ఇస్తామంటున్నారు. నువ్వు వెంటనే నీ చేతి కున్న బంగారు గాజులు, మెడలోఉన్న రెండుపేటల చంద్ర హారం, మంగళ సూత్రం బంగారు తాడు, మీ అమ్మొమ్మ నీకిచ్చిన చేతి వంకీ, పెళ్ళికి నీకు పెట్టిన ప్రధానపు ఉంగరం, మన శ్రీధర్ కి వాళ్ళ తాతయ్య చేయించిన బంగారు గొలుసు  ఇలా ఇంట్లో ఉన్న కొంత వెండి సామాను కలిపి అమ్మేయమని, డబ్బు మామగారికోసం పంపించమని  నవ్వుతూ నా చేతికిచ్చినప్పుడు నీ ఋణం ఈ జీవితం లో తీర్చుకోగలన అనిపించింది. నాన్నగారు బతికి బయట పడ్డారు. ఆ తరువాత ఒకరోజు  మేడలో పసుపు తాడుతో , చేతులకు నిండుగా ఎరుపు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకొని, తలకి నిండుగా మల్లె పూలు పెట్టుకొని,  మంచి వంగపండు రంగు నేత చీరలో నా ముందు నిలుచుని , “సీత! నేను అందంగా ఉన్నానో లేదో చెప్పు!” అని నా కళ్లలోకళ్ళు  పెట్టి నువ్వు చూస్తుంటే అంత  అందమయిన నేత్రాలు నాకు ‘దివ్య నేత్రాలుగా’ కనిపించాయి. నీ చిరునవ్వులో ఆ దేవి కామాక్షి దర్శనమిచ్చినట్టయింది. నేను మంత్రముగ్దుడనయిపోయాను, “తవ పాద పద్మం మమ సన్నిధస్త్వ,” అని నా మనసులోనే నీకు నా మనసుమాంజలి సమర్పించాను.         

 ‘నీకు గుర్తుందా నందిని ఉద్యోగం పనిలో పడి నేను కొంతకాలం నిన్ను మన శ్రీధర్ ని పట్టించుకునే వాడిని కాదు.  అయినా అన్ని సమర్ధించుకునే దానివి. కానీ ఒక రోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే నువ్వు నా చొక్కా నుండి, నా ముంజేటి నుండి వచ్చిన మల్లెపూల అత్తరు వాసన పసిగట్టావు. దానికి నాతో యుద్ధమే చేసావు. మన పెళ్ళిరోజు వరకు మాట్లాడలేదు.  “పిచ్చిదానా నాకు నిన్ను మభ్య పెట్టాలని ఎప్పుడూ ఉండేది కాదు. ఇప్పుడు నిజం చెబుతున్న. ఆ రోజు మా ఆఫీస్ కి లక్నో నుండి అత్తరులు అమ్మే సింగ్ వచ్చాడు. మాకు అన్ని చూపించాడు. అప్పుడే వాడిని “మల్లెల అత్తరు ఉందా?” అని  అడిగితే తన దగ్గర ఉన్నది తీసి  నా  ముంజేతికి,  నా చొక్కాకి రాశాడు. ఆ తరువాత మన పెళ్లిరోజుకి నేను నీకా  అత్తరు బహుమతిగా ఇస్తే నునుసుగ్గుతో ఆ అత్తరు పరిమళంలో ఎంతో అందంగా కనిపించావు. నీ అపార్ధం  తొలిగిపోయింది.  నాకు తెలుసు నందిని!నాతో నే నీ కలహం,నీవే నా కలహాంతరిత!”

 ‘ఇంకొక సంఘటన నీకు చెప్పాలి నందిని. మనకు పెళ్లయి పదేళ్లయిన మన వివాహం జరిగిన రోజుని  నువ్వెప్పుడూ పండుగలాగా చేస్తావు. నాకు ఆ రోజు మర్చిపోలేని రోజు।  అందమైన కుట్టుపూలతో ఉన్నపలుచగా గాలికి తెలిపోయే  ఫారెన్ నయిలెక్స్  లేత గులాబీ రంగు చీరను కట్టి నా ముందు నిలుచుంటే నాలో అంతర్ముఖమైపోయిన కోరిక  కుండలినిలో విశ్రమించి ఉన్న సర్పం మాదిరిగా గుండెలోకి, అక్కడి నుండి అజ్ఞా చక్రంలోకి చేరిపోయి నన్ను నీ ప్రేమ దాసుడిగా మార్చేసింది. నీ పొందులో నన్ను నేను మరిచిపోయి నీ ఒడిలో అలాగే విశ్రమించాను. నువ్వే నా కలల నాయిక స్వాధీన పతిక….!” నీకు నా మీద ప్రేమ పొంగినప్పుడల్లా నన్ను చాలా సార్లు ‘సీత’ అని ముద్దుగా పిలిచే దానివి నీకు గుర్తుందా. నాతో అనేదానివి  కూడా,”  సీతా ! మనం ఎప్పుడు సీతారాములు, శివపార్వతుల్లాగానే ఉండాలా,  రాధాకృష్ణుల లాగా కూడా ఉండొచ్చు.   ప్రేమే మన ప్రపంచం అన్నట్టుగా కూడా ఉందాము. ఆ  ప్రేమ అనుభూతిని  మనసారా  అనుభవిద్దాము,అంటూ నన్ను ప్రేమతో చుట్టేసెదానివి.” ఆనాటి మన ప్రేమ అనుభవమై, అందమైన ఒక అనుభూతిగా మారిపోయింది.

‘నువ్వా రోజు రాత్రి నా గదికొచ్చి నన్ను జరగమని నా పక్కన కూర్చుని, కొద్దిసేపటికల్లా నన్ను ఆనుకొని కూర్చొని ఆ తర్వాత నా గుండెల మీద తలపెట్టి పడుకున్నావు. “నేను హఠాత్తుగా చనిపోతే నువ్వు  ఎలా ఉంటావు సీతా?” అన్నావు. “అవేం  మాటలు. అయినా అలా జరిగితే నీ వెనకాలే నేను. నేనేమన్నా ఈ భూమ్మీద  శాశ్వతంగా ఉండడానికి  వచ్చానా?”అన్నాను. “కానీ ఒక్క మాట మాత్రం నిజం. నువ్వు దూరం అయిపోతే నువ్విక రావని అర్ధమైన రోజు నేను  నీ తోటే ఉండే రంగుల ప్రపంచం సృష్టిస్తాను. అందరికీ దూరంగా అందమైన ప్రపంచం. అందులో నువ్వు నేను మాత్రమే, వెళ్లిపోతానని అనకు, నా మనస్సు, తనువు ఇంకా నీ సాంగత్యమే కోరుకుంటున్నాయి,” అంటూ నిన్ను మరింతగ  పొదివి పట్టుకున్నాను. అలా పట్టుకున్నప్పుడు నువ్వు అల్లరిగా చేసే  చుంబనం చేయలేదు. నన్ను నీ గుండెలకు హత్తుకొని నన్ను ఉక్కిరిబిక్కిరిచేయలేదు.   నీ నుదురు నా గుండెలకు చల్లగా మంచు ముక్కలా తగిలింది. భయమేసింది నిన్ను లేపి పడుకోపెట్టాను.  నాకు అర్థమైంది నువ్వు నాకు  అందనంత దూరంగా పోయి నా రాక కోసం ఎదురుచూస్తున్న  ప్రోషిత భత్రుకవి.” నీ వియోగం నువ్వు నాకు ప్రేమగా వేసిన శిక్ష. నువ్వు లేవన్న సత్యం తెలిసినా  నీవు నాలోనే ఉన్నావన్న భ్రమలో, ఆ అనుభూతిని నా మనసంతా  నింపుకొని ఈ నా చివరి దశ గడిపేస్తాను.  నీవే నా జీవన కథా కావ్య నాయికవు.”

**********************

రవీందర్ కళ్ళు తుడుచుకున్నాడు. అతని  మనసులో తాతయ్య కి బామ్మ తోటి ఉన్న అనుబంధం ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ఎన్ని మాట పట్టింపులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరితో ఒకరిని బంధించేది ఆ శృంగార ప్రేమనుభూతి. అది  అనుభవించాలే  తప్ప, ఒకరు  చెప్పేది కాదన్న సత్యం ఎంత బాగా తాతయ్య నాకు చెప్పాడు అనుకున్నాడు.  ‘అర్చన గుర్తొచ్చింది.’ ఆ రోజు అర్చనతో కలిసి ఒక ఫ్రెండ్ ఇచ్చిన పార్టీ కి వేళ్ళాడు తను. కపుల్స్ డాన్స్ పెట్టారు. అర్చన చాలా బాగా చేసింది.  ప్రేమతన్మయత్వంలో నన్ను “ఒరే, రవీందర్ నాతో అడుగులు కలిపి మంచిగా చేయొచ్చుగా! ’ అన్నది. ఆమె ‘ ఒరే రవీందర్” అనటం   అందరు విన్నారేమో అనిపించి, “నన్ను, ఒరే” అని సంబోధిస్తుందా!” ఆవేశం, అవమానం ఉప్పిరిగొనగా      నేను ఆమెను  దూరంగా తోసేసి, అక్కడే వదిలేసి అపార్ట్మెంట్ కి వచ్చేసాను. నా వెనకాలే వస్తుందనుకున్నాను. అర్చన అభిమానవతి. తాను చాలా హార్ట్ అయిందని అర్ధమయింది. ఎందుకంటే, ఆ రాత్రే తను , ఒక ఫ్రెండ్ తో కలిసి ఆమె హాస్టల్ కి వెళ్లిపోయిందని తెలిసింది. తాతయ్య బామ్మల సాంగత్యం నన్నిరోజు ఆలోచింపచేసింది. తనని దూరం చేసుకొని బాధపడుతున్నాను. ఆమె దగ్గరికెళ్లి క్షమించమని అడగాలి. ఇంకెప్పుడు ఇలాటి  ఇగోలకు పోయి ఆమెని బాధపెట్టనని ఆమెకి చెప్పాలి. ‘నన్ను క్షమిస్తావా అర్చన!’” అలా అనుకుంటుంటే   మనసంతా విహంగయానం చేయ సాగింది. ఎప్పుడు కునుకు  పట్టిందో తెలియలేదు నిద్రలేచేసరికి సీతారామయ్య గారు వాకింగ్ కి వెళ్ళాడు.  రవీందర్ తయారయి,  “తాతయ్య నేను లంచ్ కి కలుస్తాను,” అని చీటీ  రాసిపెట్టి వెళ్ళిపోయాడు.

నేరుగా అర్చన  ఉన్న ఉమెన్స్ హాస్టల్ కి వెళ్ళాడు. ఆమెని చూస్తూనే చుట్టేసి, నుదుటి మీద ముద్దుపెట్టాడు ప్రేమతో. “నా వల్లే తప్పయింది అర్చన, ఇంకెప్పుడు నిన్ను అలా వదిలేయను, పద వెళదాము మన ఇంటికి ,” అన్నాడు. అర్చన మౌనం భయపెట్టింది. “అర్చన ఎం ఆలోచి స్తున్నావు? మన కోసమే మా తాతయ్య వచ్చాడు నిన్ను చూడాలని, పద.” అన్నాడు.

“నీకు లేదా రవీందర్,” అడిగింది శాంతంగా.

“నువ్వు లేకపోతే నాజీతానికి అర్ధమే లేదనిపించింది అర్చన. మన మధ్యన ఇంకెప్పుడు ఈ అభిప్రాయబేధాలు రాకుండా ఉండేలా చూసుకుంటాను. నన్ను నమ్ము,” అన్నాడు కళ్ళనిండుగా వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ.       

 అర్చన రవీందర్ ని  మనఃస్పూర్తిగా దగ్గరికి తీసుకుంది.  ఆమె తో కలిసి  లంచ్ కల్లా  అపార్ట్మెంట్ చేరుకున్నాడు.  అప్పటికే సీతారామయ్య వాళ్ళిద్దరికీ కలిపి వంట చేసుంచాడు.  వస్తూనే “తాతయ్య ఈమె నా అర్చన,” అంటూ పరిచయం చేశాడు.  చూడముచ్చటగా నాజూకుతనానికి చీర కట్టినట్టుగాఉంది అర్చన. సీతారామయ్య వాళ్ళిద్దర్నీ దీవించి “ఒరేయ్ రవీందర్ నేను వెళతాను టికెట్ బుక్ చెయ్యి” అన్నాడు. “లేదు తాతయ్య, మీరే మా వివాహం జరిపించండి,” అన్నాడు మనఃస్ఫూర్తిగా రవీందర్.  తన సంచిలో ఉన్న పంచాగం  తీసి  లెక్క కట్టి , “ఒరేయ్! శ్రావణ మాసం లో మంచి ముహూర్తం ఉందిరా! అదే ఖాయం చేసి మీ నాన్నకి చెప్పి పెళ్లి ఏర్పాటు చేస్తాను,” అని సంతోషంగా చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు సీతా రామయ్య.     రెండు రోజుల తర్వాత విమానం టికెట్ బుక్ చేశాడు రవీందర్. వెళ్లే రోజు వాళ్లిద్దరికి  చెప్పాడు,”మీరే బంధంతో ఉన్న అది అనుబంధమే కావాలి. ప్రేమ అనేది అనుభవంతో కూడిన అనుభూతి.  దాన్ని మనస్ఫూర్తిగా అనుభవించాలి. అప్పుడే అది అనుభూతిగా మారుతుంది. ఆ అనుభూతి  మీ మధ్యన  విడదీయరాని శృంగారానుబంధంగా మారాలి. ఆ ప్రేమభందాన్ని పవిత్రబంధం గా మార్చుకోండి.”

‘అవును! సీతారామయ్య గారి  జీవితం అనుభవం నుండి అనుభూతిలోకి మారిన సౌందర్యలహరి.’ అనుకుంది అర్చన.

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

బోనెపెట్టె

by Thata Kameshwari May 31, 2026
written by Thata Kameshwari

రవికాంత్‌కి ఏడవ తరగతి పరీక్ష పూర్తయి,సెలవులు ఇచ్చేశారు.సెలవుల్లో అతనికి స్నేహితులతో క్రికెట్ ఆడటం,తండ్రి మనోజ్‌ని చదరంగంలో ఓడించడం అంటే చాలా ఇష్టం.కానీ వాటన్నిటికన్నా తల్లి మీనా చెప్పే ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు వినడం ఇష్టం.అవి చందమామ కథలా,ప్రతిసారీ వినూత్నంగా ఉంటాయి.కానీ ఇంటికి బంధువులు రావడం తో మూడు రోజులుగా తల్లికి తీరిక లేదు.ఆ రోజు బంధువులు వెళ్ళిపోవడంతో,రాత్రి భోజనం అయ్యాక తల్లి వద్దకు వెళ్లి “అమ్మా! చుట్టాలు వెళ్ళిపోయారు కదా,ఈ రోజైనా నీ చిన్ననాటి విషయాలు చెబుతావా?”అని అడిగాడు రవి.

మీనా రవికాంత్ తల నిమిరి,”రవీ,వంటింట్లో పని పూర్తి చేసుకుని ఈవేళ నీ పక్కనే పడుకుని కొత్త విషయాలు చెబుతాను. సరేనా?”అని ప్రేమగా అనడంతో రవి సంతోషంతో “హుర్రే!” అంటూ ఒక్క గంతు వేశాడు.

రాత్రి పది గంటలకు మీనా గదిలోకి రావడం చూసిన రవికాంత్ ఉత్సాహంగా మంచంపై కొంచెం పక్కకు జరిగి, తల్లి పడుకోవడానికి కొంత స్థలం ఇచ్చి,‘ఇక చెప్పు’ అన్నట్లు ఆమె వైపు చూశాడు. మీనా రవికాంత్ కి దుప్పటి కప్పుతూ,“అది సరే కానీ,నువ్వు నాన్నతో పెద్దయ్యాక బాగా చదువుకుని లాయర్ అవుతానన్నావట?నిజమేనా?”అన్నది కుతూహలంగా.

“అవునమ్మా, నేను బాగా చదువుకుని, నీ నరసింహ తాతగారిలా మంచి లాయర్‌నవుతాను.ఆయన ఫోటో నీ పెళ్ళి ఆల్బమ్‌లో చూశాను.ఆయనలాగే ఓ మంచి న్యాయవాదినై,బీదలకు న్యాయం ఇప్పిస్తాను,” అన్నాడు గర్వంగా. మీనా వాడికి బీదల పట్ల ఉన్న జాలి, దయ చూసి సంతోషపడి,”సరేలే, ఇంకా నువ్వు పదవ తరగతి పాస్ అవడానికి సమయం ఉంది, అప్పుడు ఆలోచిద్దాం. ఇవాళ మా తాతగారిని గుర్తు చేశావు కదా, నీకు మా నరసింహం తాతగారు,అమ్మమ్మ లక్ష్మమ్మ గురించి, వారు ఉండే పల్లె గురించి చెబుతాను, సరేనా?” అని చెప్పడం మొదలుపెట్టింది.

“నేను, నా తమ్ముడు కలిసి ప్రతి వేసవి సెలవులనూ సరదాగా తాతగారి ఇంట్లోనే గడిపేవాళ్ళం.మేము ఉండే విజయనగరం నుండి వారు ఉండే బొబ్బిలి దగ్గర గొల్లపల్లికి బస్సులో రెండు గంటల ప్రయాణం.గొల్లపల్లి చిన్న పల్లెటూరే కానీ అక్కడ తయారయ్యే వీణ ఆ పల్లెకి ప్రసిద్ధి సంపాదించి పెట్టింది.అక్కడ వీణను సరస్వతి వీణ, బొబ్బిలి వీణ, తేలికగా ఉండే పనస చెట్టు కాండంతో తయారుచేస్తారు కాబట్టి ఏకాండ వీణ అని కూడా అంటారు.నా దగ్గర ఉన్న వీణ కూడా అక్కడిదే.వీణ తయారీకి సుమారు ఒక నెల రోజులు సమయం పడుతుంది తెలుసా,” అని మీనా అనడంతో,“బాబోయ్! అంత కష్టపడి చేస్తారా?అందుకే నువ్వు ఆ వీణ వాయిస్తుంటే అంత మధురంగా ఉంటుంది,” అన్నాడు రవి.

మీనా వస్తున్న నిద్రను ఆపుకునే ప్రయత్నం చేస్తూ, “గోల్లపల్లిలో తాతగారిది వంద సంవత్సరాల నాటి పాత ఇల్లు.తాతగారికి ఒక ప్రత్యేకమైన ఆఫీసు గది ఉండేది. ఆ గదిలో రెండు బీరువాలు నిండా చట్టానికి సంబంధించిన  పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, దేశ విదేశాల రచయితల రచనలు ఉండేవి. ఒక పక్క చెక్క బల్ల, దాని ఎదురుగా రెండు కుర్చీలు ఉండేవి. గదికి ఒక మూలన పాత టేబుల్ ఫ్యాన్, దానికి ఎదురుగా ఒక మడత కుర్చీ ఉండేవి. రాత్రి భోజనం తర్వాత ఆయన ఆ కుర్చీలోనే చారబడి మాకు కథలు చెప్పేవారు” అని చెప్తున్న మీనా కి అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చి, “రవీ! నీకు అక్కడ ఒక అపురూపమైన వస్తువు గురించి చెప్పడం మర్చిపోయాను,” అనడంతో వెంటనే రవి కళ్ళలో మెరుపుతో, “ఏంటమ్మా అది? ప్లీడర్ తాతగారు వాడే వస్తువా?” అని ఆసక్తిగా అడిగాడు.

“అది నువ్వెన్నడూ చూడని ‘బోనె పెట్టె’ ” అంది మీనా.

“పెట్టె అంటే బాక్స్, మరి ‘బోనె పెట్టెఅంటే ఏమిటమ్మా?” రవి ఆశ్చర్యంతో కళ్ళప్పగించి అడిగాడు.

“బోనె పెట్టె అంటే సుమారు ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగులు ఎత్తు, వెడల్పు ఉండే ఒక పెద్ద కర్ర పెట్టె. కొందరు దానిని ‘భోషాణం పెట్టె’ అని కూడా పిలిచేవారు,”అంది మీనా జాగ్రత్తగా వింటున్న రవితో.

“మా అమ్మమ్మ పెళ్ళికి ఆమె తండ్రి స్వయంగా చేయించి, అందులో ఆమె సారె సామానులు పెట్టి పంపారట,” అని మీనా చెప్పగానే, “అది ఇప్పటికీ అక్కడే ఉందా?” అని అడిగాడు ఆత్రుతగా రవి.

“అవునురా, ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మంచి టేకు కర్ర మీద అందంగా చెక్కబడి, తాళం వేసుకోవడానికి ఒక పెద్ద ఇత్తడి గొళ్ళెం కూడా ఉండేది.” అని మీనా వివరించింది.

“మరి లోపల ఎలా ఉంటుంది అమ్మా, ఏమి పెట్టేవారు దానిలో?” అని రవి కుతూహలంతో అడిగాడు.

“పెట్టి లోపల చాలా అరలుండేవి.వాడని ఇత్తడి, వెండి సామాన్లు, పాత ఫోటోలు, దేవుడి విగ్రహాలు, అలాగే బొంతలు, తలగడలు లాంటివి కూడా అమ్మమ్మ చక్కగా అరలో సర్దేది. దసరాకి ‘బొమ్మల కొలువు’ కి వాడే బొమ్మలన్నీ అమ్మమ్మ జాగ్రత్తగా పాత బట్టలలో చుట్టి బోనె  పెట్టెలో ఉంచేది. ఒక్కటేంటి, లెక్కలేనన్ని వస్తువులు ఉండేవి ఆ పెట్టెలో. ఇంట్లో ఏది కనపడకపోయినా, మొదట ఆ పెట్టెలో వెతికేవారు.

“అమ్మమ్మ దానిలో నాఫ్తలీన్ బాల్స్ వేసి పురుగు పట్టకుండా చూసేది. ఆ పెట్టెను సులభంగా జరపడానికి వీలుగా, కింద చిన్న చక్రాలు కూడా ఉండేవి. ఏడాదికి ఒక్కసారి దానిని జరిపి, కింద, లోపల కూడా పనివాడి చేత శుభ్రం చేయించేవారు,” అని చెప్పడం ఆపి, “రవి! మా తాతగారి ఇంటి విశేషాలు ఒక రోజులో చెబితే అయిపోయేవి కావురా. ఇప్పటికే చాలా రాత్రి అయింది, నీకు నిద్ర వస్తుందీ. పడుకుందాం,” అంటు రవికి ఇంకా అక్కడ సంగతులు తెలుసుకోవాలని ఉన్నా, మీనా లైట్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకుంది.

రవికాంత్ కి రాత్రి అంతా గొల్లపల్లి ఇల్లు, బోనె పెట్టె కలలతో సరిగ్గా నిద్ర పట్టలేదు.ప్రొద్దున్నే లేచి వంటగదిలో టిఫిన్ చేస్తున్న మీనా వద్దకు వెళ్లి, ” అమ్మా, మనం వేసవి సెలవులకు గొల్లపల్లి వెళ్దామా?”అన్నాడు విన్నపంగా.

“రవి, మొన్నటి వరకు షిమ్లా వెళ్దాం అని మారాం చేసినవాడివి, ఇప్పుడు గొల్లపల్లి వెళ్దాం అంటున్నావు” అంది చిన్నగా నవ్వి.

“అమ్మా, నువ్వు నిన్న రాత్రి గొల్లపల్లి సంగతులు చెప్పినప్పటినుండి నాకు ఆ ఇల్లు, ఆ బోనె పెట్టె చూడాలని ఉంది. మన పల్లెలోనే ఇంత ఇంటరెస్టింగ్ వస్తువులు ఉంటే, ఇక షిమ్లా వెళ్ళడం ఎందుకు?” అన్నాడు రవి.

“సరేలే, మీ నాన్నకి చెప్పి అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేయిస్తాను. నీకు ఇష్టమని పెసరట్టు వేశాను. పద, టిఫిన్ చేద్దాం,” అని టిఫిన్ ప్లేట్ అందించింది మీనా.

అనుకున్న విధంగానే వేసవి సెలవుల్లో తల్లి, కొడుకు కలిసి గొల్లపల్లికి చేరుకున్నారు. మనవరాలిని, మునిమనవడిని చూసిన లక్ష్మమ్మగారి ఆనందం అవధులు దాటింది. అక్కడికి చేరుకునేసరికి రాత్రి అవ్వడంతో అలసటతో నిద్రపోయాడు రవి. తెల్లవారగానే లేచి, ముఖం కడుక్కుని, ఇల్లంతా తిరిగి చూశాడు. ఇప్పటికి కూడా తల్లి చెప్పినట్లే అన్నీ అమర్చబడి ఉన్నాయి. నరసింహ తాతగారి గదిలో అన్నీ చూసి, చివరికి తల్లితో కలిసి బోనె పెట్టె ఉన్న గది వైపు వెళ్ళాడు. తల్లి చెప్పినట్లే, బోనె పెట్టె చాలా అందంగా నగిషీ చేయబడి ఉంది. రవి, తల్లి సహాయంతో మెల్లగా బోనె పెట్టె మూత తెరవగానే, దాని నిండా రకరకాల వస్తువులు చక్కగా సర్దబడి ఉండటం చూసి రవి చాలా సంతోషించాడు.

 ‘అమ్మా, బోనె పెట్టె ఎంత సదుపాయంగా ఉందో కదా, నువ్వు చెప్పినట్లే అటు ఇటు జరపడానికి సులువుగా కింద చక్రాలు కూడా ఉన్నాయి చూడు” అంటూ కొంచెం జరపడానికి చూసేసరికి “మ్యావ్” “మ్యావ్” అంటూ దాని కింద నుంచి రెండు తెల్ల పిల్లి పిల్లలు బయటికి వచ్చాయి.

అప్పటికే అక్కడికి వచ్చిన లక్ష్మమ్మగారు వాటిని ప్రేమగా చూసి, “రాము, శ్యాము లేచిపోయారా! ఉండండి, తెస్తాను” అంటూ త్వరగా వెళ్లి ఒక ప్లేటులో పాలు, అన్నం కలిపి పెట్టారు వాటికి.

రవి వాటిని చూసి, “భలే, భలే రాము, శ్యాము! చాలా ముద్దుగా ఉన్నాయి, జేజమ్మా,” అంటూ వాటిని ప్రేమగా నిమిరాడు. మరోసారి బోనె పెట్టెను తృప్తిగా చూసి, తాళం వేసి, లక్ష్మమ్మగారికి ఇచ్చి, “థాంక్యూ జేజమ్మా, బోన్ పెట్టె చూపించినందుకు,” అని ఆమెకు ముద్దుపెట్టాడు.

దానికి లక్ష్మమ్మగారు మురిసిపోయి “నా తండ్రే! నేనంటే నీకెంత ప్రేమ రా!” అంటూ కొంగున ముడి వేసిన ఓ 500 రూపాయల నోటును చేతిలో పెట్టి, “నాన్నా, రవీ  ఈ డబ్బుతో అమ్మతో బొబ్బిలి వెళ్ళినప్పుడు నీకు నచ్చింది కొనుక్కో,” అని రవి చేతిలో ఆ నోటును ఉంచారు.

మారునాడు రవి, తల్లితో కలిసి పల్లె అంతా చూసి, బొబ్బిలి వీణలు తయారుచేసే సర్వాసిద్ధి వంశానికి చెందిన వారిని కలిసి, వీణల తయారీని చూసి, అక్కడ గుర్తుగా వారు తయారుచేస్తున్న ఒక చిన్న వీణను కొనుక్కున్నాడు. అక్కడి నుండి బొబ్బిలిలో ప్రధాన ఆకర్షణ అయిన రాయడప్ప కట్టించిన కోట మరియు రాజభవనాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలోనే ఉన్న దర్బార్ హాల్, రాజా కుటుంబం నివసించే భవనాలు, చారిత్రక కళాఖండాలను ప్రదర్శించే చిన్న మ్యూజియంను కూడా చూశారు. కోట ప్రాంగణంలోనే ఉన్న, బొబ్బిలి రాజుల వంశంచే ఆరాధించబడే వారి కులదైవమైన వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

అక్కడ ఉన్నన్ని రోజులు రవి, రోజుకి రెండు మూడు మాటలైనా బోనె పెట్టెను, దాని క్రిందనున్న పిల్లి పిల్లలను చూసి ఆనందించేవాడు. రోజంతా జేజమ్మ వెంటే ఉంటూ ఆమెను వదిలేవాడు కాదు. లక్షమ్మగారు కూడా అతనికి ఆమె చిన్ననాటి సంగతులు చెబుతూ, మధ్యాహ్నం వేళ ఆమె చిన్నప్పుడు ఆడే మేక-పులి, వైకుంఠపాళి, అష్టాచెమ్మా వంటి ఆటలు రవికి నేర్పించి, ఆడేవారు. సాయంత్రాలు నరసింహం తాతాగారు మడత కుర్చీలో కూర్చొని రవికి కథలు చెప్పేవారు. పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. మరునాడు ప్రయాణం అనగా, ఆ సాయంత్రం కథ చెబుతున్నప్పుడు, లక్షమ్మగారు రవి పరధ్యానంగా ఉండడం చూసి ప్రేమగా అడిగారు, “ఏమైంది నాన్న? గొల్లపల్లిని వదిలి వెళ్లాలని లేదా? లేక నీ జేజమ్మాను వదిలి వెళ్లాలని లేదా?” అని అనడంతో రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“అవును జేజమ్మా, నిన్ను, ఆ బోనె పెట్టెను వదిలి వెళ్ళాలని లేదు. నువ్వు నాకు ఎన్నో మంచి మంచి కథలు చెబుతావు, నాతో ఆడతావు, ఎన్నో సంగతులు నేర్పిస్తావు. మరి బోనె  పెట్టె కూడా నాకు చాలా నచ్చింది. నాన్నకు చెప్పి మిమ్మల్ని హైదరాబాద్‌కి తీసుకెళ్ళిపోతాను. ప్లీజ్, నాతో రావా,” అని బతిమాలాడు.

లక్ష్మమ్మగారు రవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు, “రవి, ఒక చిన్న ప్రశ్న, నీళ్లు లేకుండా చేప బ్రతకగలదా?” దానికి రవి ‘కాదు’ అని తల ఊపాడు. “అలాగే నేను కూడా డెబ్బై ఏళ్ల కింద మీ ప్లీడర్ తాతాగారితో పెళ్లి అయి ఈ ఇంటికి వచ్చాను. అప్పటినుండి ఈ ఇల్లే నాకు సర్వస్వం. ఈ ఇంటిని విడిచి నేను ఎక్కడా ఉండలేను. మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి విజయనగరం వెళ్ళినా రెండు రోజుల కన్నా ఉండను. బోనె పెట్టె కూడా అంతే. దానిని నా తో పాటు పుట్టింటి నుండి తీసుకొచ్చాను. నువ్వు దానిని హైదరాబాద్‌లో మీ చిన్న ఫ్లాట్ లో ఎక్కడ పెడతావు?దానిని ద్వారం నుండి లోపలికి తీసుకొని వెళ్ళడమే కష్టం. నేను నా బోన్ పెట్టెతో ఇక్కడే, ఈ మట్టిలో కలిసిపోవాలి. నీకు నన్ను కానీ, బోన్ పెట్టెను కానీ చూడాలనిపిస్తే ఇక్కడికి వచ్చేసేయి. బాధ పడకు, సరేనా,” అంటూ రవికి ప్రేమగా బోధపరిచారు.

ప్రొద్దున్నే విశాఖపట్నం ఎయిర్‌పోర్టు వెళ్ళడానికి మీనా బుక్ చేసిన కారు రావడంతో, మీనా సామాను కారులో పెట్టింది. రవి చివరిసారి బోనె పెట్టె ఉన్న గదిలోకి వెళ్లి, పెట్టెను ప్రేమగా నిమిరి, దాని కింద అప్పుడే నిద్రలేస్తున్న పిల్లి పిల్లను ఎత్తుకొని,” రాము, శ్యాము, జేజమ్మాని అల్లరి పెట్టకండి, జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళా వచ్చేసరికి మీరు పెద్ద అయిపోతారు కదా, అప్పుడు చాలా ఆడుకుందాం” అంటూ ముద్దు చేశాడు.

లక్ష్మమ్మ గారు రవిని దగ్గరకు తీసుకొని, “నాన్నా, ఈ ముసలిదానిని మరచిపోవు కదా, మళ్ళా వస్తావు కదా” అని ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రవి ఆమె కళ్ళు తుడిచి, ” జేజమ్మా, నేను రోజు నీతో ఫోన్ చేసి మాట్లాడతాను. మళ్ళా సెలవులు రాగానే ఈసారి నాన్నని కూడా తీసుకొని వచ్చి బోనె పెట్టెను చుపిస్తాను” అన్నట్లు ఆమెకు ముద్దుపెట్టి కారెక్కాడు. లక్ష్మమ్మగారు బోనె పెట్టెలో జాగ్రత్తగా సామాను సర్దినట్లు,రవి కూడా తన మనసు అనే బోనె పెట్టెలో పల్లెలో గడిపిన జ్ఞాపకాలను భద్రంగా దాచుకున్నాడు.

***

May 31, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

మనిషికి విచక్షణ ఉంటే తప్పులు జరగవు – వేంకట అనంతకృష్ణ శర్మ

by Aruna Dhulipala May 31, 2026
written by Aruna Dhulipala

ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, సాహితీమూర్తి, ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి నారుమంచి వేంకట అనంతకృష్ణ శర్మగారితో మయూఖ ముఖాముఖి

– ధూళిపాళ అరుణ

వృత్తిపరంగా న్యాయస్థానంలో న్యాయవాదిగా సేవలు చేస్తూనే మరోవైపు ప్రవృత్తిగా కావ్య,శాస్త్ర విషయాలను బోధిస్తూ, ధార్మికోపన్యాసాలు ఇస్తూ, యూట్యూబ్ మాధ్యమంగా ఇప్పటివరకు సుమారు నాలుగువేల వీడియోలలో తమ జ్ఞానాన్ని అనేకులకు పంచడమే కాక సాహిత్యసేవ కూడా చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి నారుమంచి వేంకట అనంతకృష్ణశర్మ గారి జీవన ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.

1. నమస్కారమండీ! జ్ఞానమూర్తులైన మిమ్మల్ని మా మయూఖ పాఠకులకు పరిచయం చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మీవంటి ప్రతిభావంతులకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు, మీ జనన, బాల్య విద్యాభ్యాసాలను గురించి తెలపండి.

జ:- నమస్కారం! మా నాన్నగారి పేరు నారుమంచి వెంకట సుబ్రహ్మణ్య శర్మ. అమ్మ పేరు సరోజిని. అమ్మ ఇప్పుడు 90 ఏళ్ల యువతి (నవ్వుతూ). నేను 1957, డిసెంబర్ 27న జన్మించాను. మా నాన్నగారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ లో సుమారు 25 సంవత్సరాలు పనిచేశారు. నేను వరంగల్ లోనే పుట్టాను. నాన్నగారికి హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ కావడంతో విద్యానగర్ కి వచ్చాం. రామ్ నగర్ లో సెయింట్ పయస్ X స్కూల్లో 3వ తరగతి చదివాను. 1964లో ఇల్లు కట్టుకున్న తర్వాత మలక్ పేట్ దగ్గర సలీం నగర్ కు వచ్చాం. అక్కడే స్వామి వివేకానంద సెంటినరీ హైస్కూల్లో 4 వ తరగతిలో చేరి 8 వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. Madrasa-e- Aliya స్కూల్ లో 9, 10 తరగతులు చదువుకున్నాను. దోమలగూడ A.V కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంజినీరింగ్ ప్రవేశం ఒక్క మార్కులో పోయింది. బెంగుళూరులో 5వేలు కడితే ప్రయివేట్ కాలేజీలో జాయిన్ చేసుకున్నారుఅక్కడ బాబాయ్ వాళ్ళింట్లో నాలుగేళ్లు ఉండాలి. నాకు ఇబ్బందిగా అనిపించి వెళ్ళలేదు. నాన్నకు చెప్పలేదు. సైకిల్ మీద అంతటా తిరిగి ఎంక్వైరీ చేసి భద్రుక నైట్ కాలేజీలో చేరాను. నాన్నగారికి తెలిసిన లెక్చరర్ వి.ఎస్.ఆర్. మూర్తిగారు అక్కడ ఉండడం వల్ల సీటు ఇప్పించారు. ఆ తర్వాత ఎమ్.ఏ సంస్కృతం, ఎమ్. ఎస్.సి. సైకాలజీ, ఎల్.ఎల్.బి., ఎల్.ఎల్.ఎమ్. ఇట్లా అనేక క్వాలిఫికేషన్లు సంపాదించుకున్నాను.

2. మీ సాహిత్య పరమైన ఆసక్తికి వారసత్వం కారణమా? అటు వైపుగా మిమ్మల్ని ప్రభావితులను చేసిందెవరు?

జ:  సాహిత్యపరంగా వారసత్వమంటూ లేదు కానీ మా ముత్తాత గారు వేదాంత అధ్యయనం చేసి, సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. బహుశా ఆ వాసన వల్ల నాకు వేదాంతం పట్టుబడిందేమో! కానీ నన్ను తీర్చిదిద్దిన మా గురువులను ఇక్కడ తప్పనిసరిగా స్మరించుకోవాలి. నాలుగవ తరగతి చదువుతున్నప్పుడు లక్ష్మీపతి రావు గారని ప్రిన్సిపాల్. ఆయన మాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేవాడు. తెలుగు ఛందస్సులో పద్యాలు వ్రాయించేవాడు. అట్లా అంత చిన్నవయసులోనే పద్యం మీద మాకు మనసు కలిగేటట్లు చేశాడు. ఆయన ప్రోత్సాహంతో నాల్గవ తరగతిలో ఉత్పలమాల పద్యం రాశాను. ఆ విధంగా చేతిలో తేనేచుక్క వేసిన మాష్టారు. ఆయన చాలా నిక్కచ్చి మనిషి. ఆయన ప్రేమించినంతగా విద్యార్థులను ఎవరూ ప్రేమించలేరేమో? అలాగే ఆయన శిక్షించినంతగా ఎవరూ శిక్షించలేరు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వ్యాకరణాలు చెప్పేవారు. దెబ్బలు తిని చదువుకున్న బుద్ధిమంతులం మేము (గట్టిగా నవ్వేస్తూ). మా వివేకానంద స్కూల్లో ఆ రోజుల్లో చదువుకున్న ప్రతీ ఒక్కరం అన్నం తింటున్నామంటే ఆయన పేరే చెప్పుకుంటాం. ఆరోజుల్లో కర్త, కర్మ, క్రియలను క్లారిఫై చేస్తూ ఆయన చెప్పిన ‘ఇంగ్లీషు గ్రామర్ లో Parsing ‘ ని తరువాత పుస్తకాల్లో తీసేసారని తెలిసి ఆశ్చర్యపోయాను. అంటే విద్యా విధానం అప్పటికీ ఇప్పటికీ ఎంత పలచబడి పోయిందో తెలుస్తోంది. ‘మదర్ సే అలియా’ స్కూల్లో 9,10 తరగతులు చదువుతున్నప్పుడు హనుమంతరావు సార్ అద్భుతమైన గురువు. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని పంచుకోవాలి. ఆ సమయంలో ఒకసారి విద్యార్థులను వైజాగ్ సైన్స్ ఫేయిర్ కు తీసుకువెళ్లారు. మా నాన్నగారు స్టేషన్ కు వచ్చారు. నా పక్క సీటులో కూర్చున్న అమ్మాయి “తమ్ముణ్ణి నేను చూసుకుంటాను” అని నాన్నగారికి హామీ ఇచ్చింది. ఆరోజు నుండి ఇప్పటి వరకు ఆమే మా ఇంటికి పెద్ద ఆడపడుచు. ఇక ఇంటర్మీడియట్ ఎ. వి కాలేజీలో అద్భుతమైన లెక్చరర్లు ఉండేవారు. భద్రుక కాలేజీలో నేను ఇందాక చెప్పిన మూర్తి గారు ఎకనామిక్స్ చెప్పేవారు. ఆ క్లాస్ చివరకు ఉండేది. అన్ని క్లాసులు ఎగ్గొట్టి ఆ చివరి క్లాసుకు మాత్రమే అటెండ్ అయ్యే విద్యార్థులు ఉండేవారంటే ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మా వైపు చూస్తూ చూస్తూ వెనుకవైపు ఉన్న బ్లాక్ బోర్డ్ మీద పర్ఫెక్ట్ గా గ్రాఫ్స్ గీసేవాడు. “Application of knowledge” నేర్పించారాయన. ఆర్. రంగాచారి అని ప్రిన్సిపాల్ ఉండేవారు. ఆయన అకౌంట్స్, స్టాటిస్టిక్స్ లో ఎక్స్ పర్ట్. ఆయన ఒక లెక్క వరుసక్రమాన్ని బోర్డ్ మీద రాసి బుక్ లో ఏ పేజీలో ఉందో చెప్పేవారు. రీప్రింట్ గా ఉండేది. ఏ సబ్జెక్టుకు సంబంధించిన లెక్చరర్ రాకపోయినా క్లాసుకు వచ్చి, ఆ సబ్జెక్టులో ఎంతవరకు క్లాసు జరిగిందో అడిగి అక్కడినుండి కంటిన్యూ చేస్తూ క్లాస్ చెప్పేవారు. అంతటి మహానుభావుడు. ఎల్.ఎల్. ఎమ్ కాకతీయ యూనివర్సిటీలో విజయ్ చందర్ గారు మరో అద్భుతం. ఎమ్.ఏ. సంస్కృతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాములు, పి.టి.జి. రంగాచార్యులు సంస్కృతపండితులు కాంట్రాక్ట్ క్లాసులు చెప్పేవారు. ఆయన కూడా ఏ సబ్జెక్ట్ అయినా చెప్తారు. ఇక సంస్కృత వ్యాకరణం విషయానికి వస్తే కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గారు మా గురువు గారు. వ్యాకరణం తప్ప ఆయన నోటినుండి మరోమాట వచ్చేది కాదు. ఆయన ‘ఆకాంక్ష’ పద్ధతిలో పాఠాన్ని మా చేతనే చెప్పించేవారు. ఇంతమంది మహానుభావుల చేత నేను చెక్కబడ్డాను.

3. అటువంటి గొప్ప గురువుల వల్ల ప్రేరణ పొందిన మీరు ఆ అనుభవాలకు సంబంధించి ఏదైనా మరచిపోలేని సంఘటన ఒకటి చెప్తారా?

జ:   తప్పకుండా. రంగాచారి గారు ప్రిన్సిపాల్ అని చెప్పాను కదా! నా చదువు అక్కడ పూర్తయిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆయనను కలవడం జరిగింది. మా బావగారు రంగావఝల పాండురంగ శర్మ (ఆర్. వి.పి. శర్మ) సంగీత విద్వాంసులు. పురాణం పురుషోత్తమ శాస్త్రి గారి దగ్గర, డి. కె. పట్టమ్మాళ్ దగ్గర, ములుకుట్ల సదాశివశాస్త్రి గారి దగ్గర ఆయన సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీత కచేరీ నల్లకుంటలో ఏర్పాటుచేశారు. ఆ కచేరీకి మా ప్రిన్సిపాల్ గారు వచ్చి కింద వేసిన పట్టా మీద కూర్చున్నారు. నేను ఆయనను చూసి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి, ఫలానా బ్యాచ్ స్టూడెంటునని చెప్పుకున్నా. ‘ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. అప్పటికే ఇంటర్, డిగ్రీ, ఐసిడబ్ల్యూ, సి.ఏ, ఎల్ ఎల్ బి విద్యార్థులకు నేను పాఠాలు చెప్తున్నాను. అందువల్ల మీలాగే అన్ని సబ్జెక్ట్స్ పాఠాలు చెబుతున్నా అన్నాను. వెరీగుడ్. “స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నావా?” అన్నారు. అవునన్నాను. అప్పుడాయన “అనంతకృష్ణా! ఈ రోజుల్లో ఎవరూ కూడా స్టాటిస్టిక్స్ బైనామియల్ థియరం చెప్పడం లేదు. నువ్వు చెబుతున్నావా?” అంటూ అక్కడే పట్టా మీదనే ఆ థియరం అంతా తనవేలితో గీసి “ఇట్లా చెబుతున్నావా, లేదా?” అన్నారు. అంటే ఆయన దగ్గర చదువుకున్న నేను ఇంకొకరికి అన్యాయం చేయకూడదని ఆయన ఉద్దేశ్యం. అలాంటి మెంటల్ ఫ్రేం వర్క్ ఉన్న టీచర్లు ఈరోజుల్లో చాలా అరుదు అనిపిస్తుంది. ఈ అనుభవాన్ని నేను వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టుకున్నాను. లక్ష్మీపతి సార్ తో ఉన్న అనుభవాలను కూడా ఫేస్ బుక్ లో భద్రపరచుకున్నాను.

4. బ్యాంక్ ఉద్యోగి అయిన మీరు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడానికి కారణాలు తెలుసుకోవచ్చా?

జ:    చక్కటి ప్రశ్న వేశారు. నేను మూడు బ్యాంకులకు ఇంటర్వ్యూలకు వెళితే మూడింట్లో ఉద్యోగం వచ్చింది. మొట్టమొదట అపాయింట్ మెంట్ వచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాయినయ్యాను. నేను మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకల్లా నా పని పూర్తి చేసుకొని ఇతర సిబ్బంది చేస్తున్న పనులను చూస్తూ అడిగి తెలుసుకుంటూ ఆరు నెలల్లో అన్ని పనులను నేర్చుకున్నాను. ప్రమోషన్ల విషయంలో తేడాలుండేవి. అందువల్ల ప్రమోషన్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నాను. 5 ఏండ్ల తరువాత రీజినల్ ఆఫీసుకు వెళ్ళాను. భండారు రామచంద్రరావు గారు అని గొప్ప వ్యక్తిత్వం కలవాడు. పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు గారి సోదరులు. ఆయన రీజినల్ మేనేజర్. ఆయన వ్యక్తిత్వం నుండి చాలా నేర్చుకున్నాను. నా టాలెంట్ గుర్తించి ఆఫీసర్ చేసే పనులను కూడా నమ్మకంతో నాకప్పగించే వారు. 5 ఏళ్ల తర్వాత అవే పనులే ఎప్పుడూ చేస్తుండడం తప్ప కొత్తదనం, కొత్తగా ఆలోచించేవి ఏవీ లేవు. మీరు నమ్మరు! ఇదే విషయం రాస్తూ రాజీనామా చేశాను. ఆయన నన్ను పిలిచి అడిగినా అదే చెప్పాను. నా కుటుంబం గురించి అడిగాడు. పెళ్ళయిందని, ఒక పాప ఉందని చెప్పాను. వెంటనే లెటర్ చించేసి పాప పెద్దయ్యాక రిజైన్ చేయి అన్నారు. ఆ తర్వాత మరో బ్రాంచ్ కి వెళ్ళాను. అంతకుముందు బ్యాంక్ లో నాకు ఆఫీసర్ గా ఉన్న సి.వి.శాస్త్రి ఇక్కడ మేనేజర్. మా ఇద్దరి మధ్య ఆయన ఏరా?..అనేంత చనువు ఉండేది. అక్కడ కూడా రాజీనామా లెటర్ ఇచ్చాను. మానేసి ఏం చేస్తావ్? అన్నాడు. నేను అనుకుంటున్న నాలుగు ఆప్షన్స్ చెప్పాను. ఆయన ఇంకేం మాట్లాడలేదు. 2001 లో VRSస్కీం వచ్చింది. వెంటనే దానికి అప్లై చేశాను. అంతకుముందే LLB చేసి ఉన్నాను కదా! ఎవరికిందా ప్రాక్టీసుకు చేరలేదు. N. V. అనంతకృష్ణ అడ్వకేట్ అని బోర్డు పెట్టి దిల్ షుక్ నగర్ లో ఆఫీసు పెట్టాను(గట్టిగా నవ్వేస్తూ). అమ్మవారే అన్నీ చూసుకుంటుందని నమ్మకం.

5. ‘గురువు’ గురించి సహస్రనామ స్త్రోత్రం రాయాలనుకున్న ఆలోచనకు ప్రేరణ ఏమిటి? ఆ విశేషాలు చెప్పండి.

జ: 1990 – 94 మధ్య భాగవత సప్తాహానికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన తట్టింది. మనకు విష్ణు, శివ, లలిత, లక్ష్మి ఇట్లా దేవతలకు సహస్రనామాలున్నాయి. కానీ దేవుడున్నాడని నమ్మకం కలిగించి గురూపదేశం చేసిన గురువుకు సహస్ర నామం లేదు కదా! అనిపించింది. అప్పుడు గురు సహస్రనామం అని పేరు పెట్టి రాయాలనుకున్నా. కానీ అప్పటికి నాకు సంస్కృతం రాదు. సంస్కృతమే రానప్పుడు సంస్కృత ఛందస్సు ఎలా రాయగలను? అప్పుడు వెళ్లి వృత్తరత్నాకరం కొనుక్కొని వచ్చి అనుష్టుప్ ఛందస్సు తెలుసుకొని దానికి నోట్స్ రాసుకున్నాను. నామాలు రిపీట్ కాకుండా చూడాలనుకున్నాను. ఒక నోట్ బుక్ తీసుకొని ఇండెక్స్ లాగా పేపర్లను కట్ చేసుకున్నాను. ఏ పేరు రాద్దామని గుర్తుకు వస్తే ఆ అక్షరం దగ్గర ఆ పేరు రాసుకున్న. అట్లా ముందు వేయి నామాలు తయారు చేసుకున్నాను. ఇది కేవలం నా గురువు కోసం అని కాదు. ప్రతి ఒక్కరి గురువుకు సమన్వయించుకునేలాగా ఉండేలా చేయాలనుకున్నాను. తెనాలిలో చావలి వామనమూర్తి శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. అష్టాదశ పురాణాలు గుళ్లో ప్రవచనం చెప్పడమే ఆయన వృత్తి. గొప్ప పండితులు. ఆయన దగ్గరికి వెళ్లి ఇది చూపించా. మురిసిపోయాడు. ఇంకేమీ ఆలోచించొద్దు అన్నారు. నేను హైదరాబాద్ కి వచ్చాక ఆయన ఒక కార్డు రాశాడు. అందులో చివరగా “మాగాయి త్యప మంగళం..”అన్న శ్లోకం చెప్పి ఏమయ్యా వెళ్లొద్దు. అన్నానంటేఅమంగళం. ‘వ్రజ సఖేతి హీనం వచః’ వెళ్ళమంటే అమర్యాద. ‘తిష్ఠేతి ప్రభుత’ ఉండమంటే నీమీద అధికారం చెలాయించినట్లవుతుంది. ‘యథా రుచి కురుష్వాపి’ అంటే నిర్లక్ష్యం చేసినట్టు. కిమ్ కర్తవ్యమితఃపరం యదుపతే త్రైలోక్య నాథ ప్రభో! స్మర్తవ్యావయ మాదరేణ భవతాం! యావత్ పునర్దర్శనమ్! నిన్ను మళ్లీ దర్శించుకునేంత వరకు స్మరిస్తూనే ఉంటాను. అని రాశాడు. గురువు ఎట్లా ఉంటాడు? ఆయన లక్షణాలు, ఉపదేశాలు, స్థూల రూపం, ఆయన స్వరూపకత, దైవానికి గురువుకు ఉండే అభేదం, ఇట్లా ఒక్కొక్కదాన్ని విశ్లేషించుకుంటూ రాస్తున్నప్పుడు ఒక దశలో ఆపేశాను. ఒక స్టేజీలో ‘నావల్ల కాదు’ అని ఆపేశాను. నేను ఆపేసిన రోజే రోడ్డుమీద ఒక వందరూపాయల నోట్ దొరికింది. దాని వెనుక “Stay with hope. End with success” అని రాసి ఉంది. అది గుర్వాజ్ఞగా భావించి ఇంటికి వచ్చి మళ్లీ మొదలుపెట్టాను. మొదటగా ధ్యాన శ్లోకం రాశాను.
“శాంతం శుచి స్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం
కవచం శిష్య గణస్య, భిషజం భవరోగిణాం
ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాఙ్మానస గోచరం
సద్యః సిద్ధిం కరం గురుం నమామి స్వాత్మ నాయకం”

నేనెక్కడ ఉపన్యాసం, ప్రసంగం చేసినా ధ్యానశ్లోకం ఇదే చదువుతాను. మా గురువు గారిని ఇంటికి పిలిచి, నేను రాసిన సహస్ర నామాలతో ఆయనకు పాదపూజ చేసుకున్నాను.

6.”లలిత పదముల మది లలిత గొలుతు” అన్న మకుటంతో అమ్మవారిపై రాసిన శతకం గురించి తెలపండి.

జ:   ఆ రోజుల్లో ఒక అనుభవం చెప్పాలి. బహుశా శుక్రవారం అనుకుంటా. ఉద్యోగం లేదు కాబట్టి ఖాళీగా ఉండడం వల్ల అమ్మవారి శతకం రాస్తున్నాను. అప్పటికే కొన్ని పద్యాలు రాశాను. నాకు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి నానామాటలు అన్నాడు. నేను కూడా ఆవేశంతో సోమవారం సాయంత్రం వచ్చి డబ్బు తీసుకెళ్లు అన్నాను. అప్పుడు నా దగ్గర డబ్బులేమీ లేవు. “చిన్ని పాపనమ్మా! నన్నిట్లు శోధించ/ తాళలేను తల్లి తెలియవమ్మా/ ఆర్తి తోడ పిలువ ఆదుకొందువటంచు/లలిత పదముల మది లలిత గొలుతు” అని బాధపడుతూ ఈ పద్యం రాశాను. సాయంత్రం నా స్నేహితుడు, తన బ్యాంకుకు సంబంధించిన డేటా సమస్యను గురించి నా దగ్గరకు వచ్చాడు. బ్యాంకులో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విషయమంతా వివరించి ఒక డిపాజిట్ ను మూడు నెలలు ఆపి,తర్వాత రెండవ దాంట్లో కలపమని, బ్యాంకు లావాదేవీలు తెలిసిన వాడిగా సలహా ఇచ్చాను. సరేనని వెళ్తున్నవాడు వెనక్కి వచ్చి ఎవరికో ఎందుకు నీకే ఇస్తాను. మూడు నెలల తర్వాత నాకు ఇవ్వు అన్నాడు. ఆదివారం కూడా పనిచేసే బ్యాంకులో ప్రాసెస్ అంతా చేసి పెట్టాను. చెబితే మీరు నమ్మరు. అతను నా దగ్గర పెట్టుకోమని ఇచ్చిన డబ్బు అక్షరాలా నాకు అప్పు ఇచ్చినవానికి నేను ఇవ్వాల్సిన అమౌంట్. నిజంగా ఇది దైవికంగా జరిగిందే. ఈ శతకాన్ని ఏలూరుపాటి అనంతరామయ్యగారు ఆవిష్కరించారు.

అనంత కృష్ణగారితో ముఖాముఖి గ్రహిత ధూళిపాళ అరుణ

7. మీరు రచించిన ఇతర శతకాల గురించి చెప్పండి.

జ:శక్తి పంచాయతనంలో అమ్మవారి శతకం అయిపోయింది కాబట్టి మిగతా వాటి మీద కూడా శతకాలు రాయాలనిపించి గణపతి శతకం ఉత్పలమాలలో రాశాను. సూర్య శతకాన్ని అనంత భాస్కర శతకమనే పేరుతో సంస్కృత మకుటంతో సీసంలో రాశాను. ఇది సూర్యారాధనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. శార్దూలంలో విష్ణు శతకం ఉంటుంది. విష్ణు సాధన, విష్ణు విద్య, విష్ణు తత్త్వం దీంట్లో ఉంటాయి. ఈశా కల్పద్రుమా! పేరుతో శివ శతకం రాశాను. మా స్నేహితునికి అంకితంగా వాసుదేవ శతకం, నా మనుమడు, మనుమరాలిని ఉద్దేశించి పిల్లల కోసం నీతి శతకాన్ని ‘బంగరు కొండ’ పేరుతో రాశాను. అన్ని విషయాల్లోను సమాజంలో కనబడుతున్న దుర్నీతిని చూసి ఒక్కరోజులో శతకం రాయాలని ‘వెధవ శతకం’ అని రాశాను. విద్య, సంసారం, ఆసుపత్రి… ఇట్లా వివిధ శీర్షికలు 11 ఎంచుకొని ఒక్కో శీర్షిక కింద 9 పద్యాలు రాశాను. ఓ వ్యక్తి నన్ను ఉదాహరణ కావ్యం రాయమన్నాడు. ఆత్మతత్త్వం మీద ‘ఆత్మోదాహరణం’ అనే పేరుతో రాశాను.

8. సాహిత్య చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా ఒకేసారి 32 కావ్యాలను ప్రచురింపజేశారని విన్నాం. ఆ నేపథ్యం ఏమిటో చెప్పండి.

జ:    ఫేస్ బుక్ లో నేను, పట్వర్ధన్ శతావధాని, వి.ఆర్. గణపతి అని మంచి పద్యకవి. ముగ్గురం అడ్మిన్లుగా ‘ప్రజ పద్యం’ పేరుతో ఒక గ్రూపును నిర్వహిస్తున్నాం. ఇందులో పద్యాల పోటీలు నిర్వహిస్తుంటాం. పోటీలకు కొన్ని నియమాలను ఏర్పరిచాం. గెలిచిన వారికి ఐదు, మూడు, రెండు వేల రూపాయల చొప్పున బహుమతులు ఇస్తుంటాం. ఒకసారి ‘మహా సామాజిక పద్య ప్రబంధం’ పేరుతో 32 కావ్యాలు రాయించాం. 150 నుండి 200 పద్యాల వరకు లిమిట్ పెట్టుకున్నాం. అందులో అష్టాదశ వర్ణనలు, సామాజికాంశం తప్పనిసరిగా ఉండాలి అని ఒక నిబంధన కూడా పెట్టాం. పేరు నమోదు చేసుకున్నప్పుడు వందకు పైగా ఉన్నారు. మా గడువు లోపల ఇచ్చిన వాళ్ళు 32 మంది ఉన్నారు. ఈ 32 కావ్యాలను త్యాగరాయ గానసభలో ఆవిష్కరించాం. వెలుదండ నిత్యానంద రావుగారు, అనుమాండ్ల భూమయ్యగారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తిరునగరి గారు మొదలైన వాళ్లు వచ్చారు. ఆ పుస్తకాలకు వీళ్లే ఎవాల్యూయేటర్స్. మా నియమం ప్రకారం ఏ పోటీ పెట్టినా అడ్మిన్స్ తప్పకుండా పాల్గొనాలి. కానీ ప్రైజులకు అర్హులు కారు. సందర్భంలో నేను ‘అనామకుడు’ అనే పద్య కావ్యం రాశాను. ‘యాని నామాని గౌణాని’ అన్నట్లు పేరు లేకుండా ఉపయోగపడిన వాడు అన్న ఉద్దేశ్యంతో రాసిన కావ్యం. 32 పుస్తకాలు ఒకేసారి డిజిటల్ ఆవిష్కరణ అవడం సాహితీ చరిత్రలోనే అదొక మైలురాయి.

9. చిత్రబంధాలతో కూడా మీరు రచనలు చేశారు కదా! ఈనాటి సమాజంలో కూడా వీటిని ఆస్వాదిస్తున్నారా? మీ అభిప్రాయం ఏమిటి?

జ:    అవునమ్మా! నేను రాసిన సూర్య శతకము కొన్ని చిత్ర బంధాలతోనే ఉంటుంది. “కాలోహ్యనంతః విపులాచ పృథ్వీ” అన్నాడు భారవి మహాశయుడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో మనకు తెలియదు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని కాదు కానీ ఒక్క విషయం చెప్పాలి. నా మేనల్లుడు ‘తెలుగు నుడి’ అనే ఒక కార్యక్రమాన్ని రెగ్యులర్ గా చేస్తుంటాడు. రెండు, మూడు గంటల కార్యక్రమం. వందమందితో కలిసి ఆన్లైన్ లో చేస్తున్నాడు. కేవలం వాయిస్ మాత్రమే ఉంటుంది. విశ్వనాథ సాహిత్యం మొదలుకొని అన్ని సాహిత్యాలు చదువుతున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే పేరుతో సంస్థ స్థాపించి వేదాంత గ్రంథాలను అధ్యయనం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా మీరన్నట్లు చిత్రబంధ కవిత్వాన్ని ఆస్వాదించే వాళ్ళు, రాసేవాళ్ళు ఉన్నారు. కర్ణాటకలో కోలార్ నగరంలో ఉండే ఒకాయన కేవలం చిత్రబంధాలే రాస్తారు. నాకు ఫోన్ చేసి ఎట్లా ఉందో చెప్పుమంటాడు. కాబట్టి ఈ కాలంలో కూడా వీటిని ఆస్వాదించేవారున్నారు.

10. న్యాయవాదిగా ఉద్యోగ నిర్వహణలో ఉంటూనే ప్రసంగాలు, సాహిత్యరచన, బోధన ఇవన్నీ ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు?

జ:   నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు కారులో నా వెంబడి తెచ్చుకున్న పుస్తకాన్ని చదువుతుంటాను. అట్లాగే Teaching is twice learning. నేను నేర్చుకుంటూ విద్యార్థులకు బోధిస్తున్నాను. చెప్పేటప్పుడు వాళ్లకు వచ్చే సందేహాలు తీర్చడం కోసం నేను నేర్చుకుంటా. ఇక్కడ నేను వాళ్లకు బోధిస్తున్నాను అనడం కంటే నేను నేర్చుకుంటూ నన్ను నేను దిద్దుకుంటున్నా. ఏ సబ్జెక్టుదైనా సరే కనిపించిన పుస్తకమల్లా చదువుతాను. విపరీతంగా పుస్తకాలు కొంటాను. రాత్రి ఒంటిగంటలోపు పడుకోను. నా మంచం చుట్టూ పుస్తకాలే ఉంటాయి.

11. మీ వృత్తికి సంబంధించిన ఒక ప్రశ్న. ఒక అడ్వకేట్ గా వర్తమానకాలంలో జరుగుతున్న అనైతికతకు కారణాలు ఏమై ఉంటాయి?

జ:   నైతిక విలువలుకోల్పోవడం ఒకటైతే, కుటుంబ వ్యవస్థలో లోపాలు రెండవది. ఒకప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నీతిశాస్త్రం, సైకాలజీ, మానవసమాజంలో ఎట్లా బతకాలన్నది అన్నీ ఒకేచోట ఉండేవి. ఎప్పుడైతే అవి వద్దనుకున్నామో విలువలు మొత్తం తగ్గిపోయాయి. అందువల్ల హింసా ప్రవృత్తి పెరిగింది. ఫాక్ట్ ఏంటంటే ఉదాహరణకు ఆనాటి కాలంలో వాచీ పాడయినా, చెప్పు తెగిపోయినా షాపుల్లో రిపేర్ చేయించుకున్నాం. ఇట్లా ఎన్నో విషయాల్లో ఎంతో సర్దుబాటు ఉండేది. ఇప్పుడు use and throw. వస్తువులలాగానే కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు కూడా అట్లానే ఉన్నాయి. స్త్రీ పురుషులు కుటుంబానికి సారథులు. అక్కడి నుండే ఒక సంస్కారం మొదలవుతుంది. ఈ ప్రాథమిక దశలోనే వ్యవస్థ నాశనమవుతున్నప్పుడు విలువలు ఎట్లా ఉంటాయి? మైక్రో లెవెల్లో జరిగే తప్పును విలువలను గుర్తించి సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల అది తీవ్రసమస్యగా మారి సమాజాన్ని నాశనం చేస్తోంది. ఇక్కడ నేను, నా కుటుంబం, నా సమాజం అనే విచక్షణ కలిగి నేను ఈ తప్పు చేయడం వల్ల రేపటి తరాన్ని నాశనం చేయడానికి ఎంత కారణమవుతున్నానని ఆలోచించుకొని క్షణికమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచి సమాజాన్ని తయారుచేయగలం. ఈ తప్పిదం ఏ ఒక్క రంగానికో పరిమితం కాకుండా అన్ని రంగాల్లో జరుగుతూనే ఉంది. ముందు మనిషి విచక్షణ కలిగిఉంటే తప్పులు జరగవు.

12. మీ అభిప్రాయంలో పదికాలాల పాటు నిలవాలంటే కవిత్వం ఎట్లా ఉండాలి?

జ:   ఏ భాషా కవిత్వంలో నైనా సరే, కవిత్వంలో కమ్మటి వాసన రావాలంటే, భావుకత రావాలంటే, పది కాలాలపాటు నిలవాలంటే రెండు విషయాలు తప్పనిసరి. ఒకటి సమాజాన్ని పరిశీలించడం, రెండు ప్రకృతిని పరిశీలించడం. ఏ వ్యక్తి ప్రకృతితో మమేకమై ఉంటాడో వారి కవిత్వంలో ఆ మట్టి పరిమళిస్తుంది. అందుకే కవిని క్రాంతదర్శి అంటారు. కాళిదాసు వంటి కవుల గొప్పతనం, అన్ని గొప్పలక్షణాలు అంతటి స్థాయిలో లేకపోయినా, ఏదో కొంత నిష్పత్తి ఉన్నవాళ్లు ఈనాటికీ రాణిస్తున్నారు. అటువంటి కవిత్వం చదవడం వల్ల మనం సంస్కరించబడతాం. ప్రాచీన కవులు సమాజంతోను, ప్రకృతితోను మమేకమయ్యారు కాబట్టి అట్లా రాయగలిగారు. మనం ఇప్పటికీ చదువుతున్నాం. కావ్య వృక్షం, సంస్కారవృక్షం ఎప్పటికీ చచ్చిపోవు. నేనిప్పుడు విద్యార్థులకు ఆ కావ్యాలను బోధిస్తున్నానంటే నన్ను నేను సంస్కరించుకుంటూ ఇతరులను సంస్కరిస్తున్నాను. మనమెంత భ్రమలో ఉన్నామంటే సంస్కృత కావ్యాలు, ప్రాచీన కావ్యాలు ఒక కాలానికో, మతానికో, వర్గానికో చెందనవని, లేదా కేవలం భగవంతునికి సంబంధించిన విషయాలను తెలిపేవి అనే భ్రమలో ఉన్నాం. వాటిలో ఉండే మౌలిక విలువలు తెలుసుకోలేకపోతున్నాం. మంచి విలువలతో కూడిన కావ్యాలు ఒకే కాలానికి పరిమితమైనవి కావు కదా! అవెప్పుడైనా శాశ్వతాలే!

13. రచన వ్యావహారికంలో ఉండాలన్న వాదనను మీరు సమర్థిస్తారా?

జ:    మనం రచన చేసేటప్పుడు ఎవరికి చెబుతున్నామో వారికి అర్థం కావాలి. అంటే మీరు తగ్గాలి. అప్పుడు భాషను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భాష కావాలంటే చదివేవాళ్లకు భాష సొగసును చెప్పగలగాలి. అల్టిమేట్ గా చెప్పాలంటే రససిద్ధి ప్రధానం. వ్యావహారికంలో రససిద్ధి కలిగిస్తే అది కూడా గొప్పదే. ప్రాచీన పద్యంలో ఉన్న అర్థం, సొగసు తెలిస్తే అద్భుతంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో తెలుగు భాషను సరిగా నేర్పించకుండా పెద్ద తప్పు చేస్తున్నారు. సమాజం దానివల్లే నాశనమవుతోంది. ఉదాహరణకు పాణిని ‘అష్టాధ్యాయి’ వ్యాకరణ గ్రంథం రాశాడని అందరికీ తెలిసిందే. శబ్దాల యొక్క సాధుత్వాన్ని, అసాధుత్వాన్ని వివరించేది వ్యాకరణం. ఆయన వాటిని సూత్రీ కరించాడు. ఆ కాలంలో ఆయన రాసినప్పుడు సమాజంలో వాళ్లకు బాగా అర్థమైంది. ఆ తరువాత కొన్ని వందల ఏండ్ల తరువాత భట్టోజీ దీక్షితులు ఆ నాలుగువేల సూత్రాలను రీ ఫ్రేమ్ చేసి ‘సిద్ధాంత కౌముది’ ని తయారుచేశాడు. దీనికే ‘ప్రక్రియా విధానం’ అని పేరు. ఆయన శిష్యుడు వరదరాజులు ఇంకా దాన్ని సంక్షిప్తీకరించి ఆ నాలుగు వేల సూత్రాలను తగ్గించి సుమారు 1400 సూత్రాలతో ‘లఘు సిద్ధాంత కౌముది’ తయారుచేశాడు. అది కూడా మనకు అర్థం కాలేదు. ఇప్పుడు పాండిచ్చేరి అరబిందో ఆశ్రమంలో ఇంకా సులభతరం చేసి వంద సూత్రాలతో ‘పాణినీయం’ అని వేశారు. అంటే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలక్రమంలో భాషను అర్థం చేసుకునే శక్తి సన్నగిల్లుతోంది. అందరికీ అవగతం కావాలన్నది నిజమే అయినా భాషా సౌందర్యాన్ని కోల్పోతున్నామని కూడా గ్రహించాలి. ఇందాక చెప్పినట్టు వ్యావహారికంలో కూడా సౌందర్యాన్ని చూపించవచ్చు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శబ్దసౌందర్యాన్ని, పద సౌందర్యాన్ని అర్థం చేసుకునే స్థాయి బాగా తగ్గిపోయింది.

14.  ఒక కవిగా, ఉత్తమ విద్యాబోధకులుగా సమాజానికి ఏదైనా సూచనలివ్వండి.

జ: అమ్మా! మన దగ్గర లేనిది ఏదీ మనం ఇతరులకు ఇవ్వలేం. సరిగ్గా చెప్పాలంటే మీ దగ్గర ఏవి ఎక్కువగా ఉంటాయో అవే మీరు ఎదుటివాళ్లకు ఇవ్వగలుగుతారు. ప్రేమ, ద్వేషం, మంచి, చెడు వీటిలో ఏవి నీ దగ్గర ఉంటే అవే ఇస్తావు. ఏదివ్వాలో నిర్ణయించుకునే విచక్షణ ఒక మనిషిగా ఎవరికి వారికే ఉండాలి. అది ఎట్లా ఉండాలో ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే ముందు input ఉండాలి. దానిని తెలుసుకోవాలి. నేర్చుకోవాలి. అధ్యయనం చాలా ముఖ్యమైంది.తైత్తిరీయోపనిషత్తులో “స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం” అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇతరులకు ఇవ్వాలి అన్నప్పుడు నేర్చుకునేది మంచిదై ఉండాలి. ఇంతకంటే ఏం కావాలి? మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మనిషిగా ఎట్లా ఉండాలన్న జ్ఞానాన్ని బోధిస్తాయి. కానీ అవి మనకు పట్టవు. ఇవి చదవకుండా మన దగ్గర ఏమీలేదని, అదే విదేశీయులు చెబితే ఆహా ఆంటుంటాం. అవే గొప్ప మనకు. “ఉద్యమే న హి సిధ్యంతి కార్యాణి న మనోరథైః న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః” అన్నాడు భర్త్రహరి. ఈ ఒక్క శ్లోకం జీవితాన్ని నేర్పించడమే కాదు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఇటువంటి జ్ఞానాన్ని మన నుండి నేర్చుకొని ఎవడో చెబితే మనం వాటిని చదివి గొప్పవాడని తలమీద పెట్టుకుంటున్నాం. ముందు మనవాళ్ళు ఏం చెప్పారో అధ్యయనం చేయండి. ఆచరించడానికి ప్రయత్నించండి.

ధన్యవాదాలు సార్. అవిశ్రాంతమైన మీ సమయాన్ని మాకోసం కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు మా పక్షాన, మా మయూఖ పాఠకుల పక్షాన అనేకానేక కృతజ్ఞతలు. నమస్కారాలు🙏🏼

May 31, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us