మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

సాహిత్యంలో చిరుధాన్యాలు – జొన్నలు

by Acharya Madireddy Andamma July 25, 2024
written by Acharya Madireddy Andamma

సాహిత్యంలో అనేకరకాల ప్రక్రియలున్నాయి. అందులో చాటువులు కూడా ఒక భాగం. చాటువుకు నైఘంటికార్థం ప్రకారం ‘ప్రియమైనమాట (చాటు: ప్రియవచనం). ఆ చాటువు (ప్రియమైనమాట) వచనరూపంలో, గేయరూపంలో, పద్యరూపంలో ఎలా అయినా ఉండవచ్చు (ప్రస్తావన, సంస్కృతాంధ్ర చాటుమణిమాల). చాటువుల్లో చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం.

చిరుధాన్యాలు: నైఘంటికార్థం

చిఱు:

చిఱు : వై. విణ. వృత్తి యందు చిఱుత శబ్దమునకు మీది వర్ణము లోపింపగా మిగిలిన రూపము. ఉదా. చిఱుగజ్జె,

చిఱుగెంపు, చిఱుచెమట, చిఱుచేప, చిఱుగాలి మొదలైనవి. చిఱుత – చిఱు చిరు

ధాన్యము(0):

ధాన్యము (0) వ 1. కొలుచు (నవధాన్యములు – గోధుమలు, యవలు, పసలు, సనగలు, కందులు, బొబ్బరలు, నువ్వులు, మినుములు, ఉలవలు), 2, దనియాలు (శ.ర). భాషాపరంగా చూస్తే చిరుధాన్యాలు, సిరిధాన్యాలు(శ్రీ-సిరి, ధాన్యాలు) దుష్టసమాసాలు.

సాహిత్యంలో ఒక భాగమైన చిరుధాన్యాల గురించి తెలుసుకుందాం. ఆంగ్లకొలమానం ఎక్కువగా వాడుకలోకి రాక పూర్వం ఏ ధాన్యాలనైనా కొలపాత్రలతో – తవ్వ, పేరు, మానిక, అడ్డ, కుండతో మొదలైన వాటితో కొలిచేవారు. ఈ కారణంగానే ‘కొలుచు’ అనునది ధాన్యానికి మారుపదంగా నిఘంటువుల్లో చేరిందని చెప్పవచ్చు. పదాలకు సంకోచవ్యాకోచాలు చెందుతుంటాయి. అది సహజం. అందువల్లనే ‘నన్నయనాటి కంపు మనకు ఇంపుగాదు’ అని ఈనాడు అంటున్నాం. నన్నయ నాడు (క్రీ.శ.11వ శతాబ్దం) కంపు పదానికి కేవలం ‘వాసన’ అనే అర్థం ఉండేది. ఈ నాడు కంపు అంటే ‘ముక్కు మూసుకునేంత దుర్వాసన’ అనే అర్థంలో ప్రయోగిస్తున్నాం. అలాగే ధాన్యం అనే పదం యొక్క అర్థం ‘కొలుచు’ అనే క్రియాపదం ‘కొలిచే పంట’కు పర్యాయపదంగా మారిందనవచ్చు.

ధాన్యాలు అనేకరకాలు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. వాటిని మనం అనేకరకాలుగా – ఆకారస్వరూపం, పంటపండే కాలం, వంటవండించే పద్ధతులు, విత్తేపద్ధతులు, ఉపయోగం మొదలైన వాటిని బట్టి విభజించవచ్చు. గత థాబ్దం నుండి ‘చిరుధాన్యాల’నే పదం విపరీతంగా వాడుకలోకి వచ్చింది. దానికి అనేక కారణాలున్నాయి. వాటన్నిటి గురించి ఇక్కడ చర్చించడం భావ్యం కాదు.

చిరుధాన్యాలుగా ప్రధానంగా రాగులు, ఊదలు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైనవాటిని మాత్రమే మనం పరిగణిస్తున్నాం. రాగులు, కొర్రలు మొదలైనవి 90 రోజుల్లోనే చేతికి వస్తాయి. కాని వీటి కన్నా సజ్జలు, జొన్నలు ఎక్కువ కాలం తీసుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం జొన్నలు, వాటితో చేసిన అంబలి గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. చాటువుల్లోనూ, శిష్టసాహిత్యంలోనూ వీటి ప్రస్తావన గురించి తెలుసుకుందాం.

జొన్నకూడు, అంబలి:

కావ్యయుగం(క్రీ.శ.14-15వ శతాబ్దం)లో శ్రీనాథుడు మిక్కిలి పేరుపొందినవాడు, కవిసార్వభౌమునిగా ప్రసిద్ధుడు. అతను చిరుధాన్యాల్లో భాగమైన జొన్నలతో తయారైన ఆహారం గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం.

కంద పద్యం:

రసికుడు పోవడు పలనా

డసగంగా రంభయైన ఏకులె వడకున్‌

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్‌ (సంస్కృతాంధ్ర చాటుమణిమాల)

(పలనాడులో రంభ వంటి అందగత్తె కూడా ఏకులే వడకుతుంది. అక్కడి దొరలు (వసుధేశుడు, రాజు) కూడా (నాగలి పట్టి),పొలం దున్నుతాడు. మన్మథుడైనా జొన్నకూడే తింటాడు. కాబట్టి రసికుడు ఎవరైనా పలనాడు పోడని అన్నాడు)

పలనాడులోని పరిస్థితి:

శ్రీనాథుడు రాజాస్థానాల్లో తిరుగుతూ, భోగలాలసాలను అనుభవించినవాడు, రసిక జీవనం గడిపినవాడు. ఆయన ఒకసారి పలనాడు వెళ్లాడు. అక్కడి ప్రజల ఆహారం, ఆచారవ్యవహారాలు మోటుగా ఉండేవనీ, మోటువాడైనా, సుకుమారుడైనా జొన్నకూడే తింటారనే విషయాన్ని పరిహాసంగా పై పద్యంలో చెప్పాడు.

ఉత్పలమాల:

పుల్ల సరోజ నేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావి నా

డల్లదవాగ్ని మ్రింగితి వటంచును నిక్కదవేల తింత్రిణీ

పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో

మెల్లన యొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస గాననయ్యెడున్‌II

‘కృష్ణా! ఆనాడు నీవు చనుబాలవిషాన్ని తాగి హరించుకున్నావనీ, కార్చిచ్చును నోటిలో మింగి, చల్లార్చావనీ గొప్పలు చెప్పుకుంటున్నావు. అదేమంత గొప్ప విషయం కాదు. నీకు చేతనైతే జొన్న అన్నంలో చింత చిగురు వేసి వండిన బచ్చలికూరను కలుపుకొని, ఒక్క ముద్ద తిని చూడు. అప్పుడు నీ సామర్థ్యం తెలుస్తుంది).

శ్రీనాథుడు పలనాడులో తిరుగుతూ ఒకరింటికి ఆతిథ్యానికి వెళ్లాడు. అప్పుడాయనకు జొన్నన్నం, బచ్చలికూర భోజన0లో వడ్డించారు. ఆ సందర్భంలోనే కృష్ణుణ్ని సవాలు చేస్తూ, పై పద్యం చెప్పాడు.

శ్రీనాథుని మాటలను బట్టి చూస్తే విషాన్ని అయినా సులభంగా జీర్ణం చేసుకోవచ్చు కానీ జొన్న అన్నం, చింతచిగురు వేసి వండిన బచ్చలికూర తొందరగా జీర్ణం కాదనే విషయం తెలుస్తుంది. అంతేగాకుండా పలనాడు వాతావరణ పరిస్థితులు, ప్రజాల ఆర్థికపరిస్థితిగతులు, వర్షాధారపంటలు, ఆహారపు అలవాట్లు, ప్రజలస్థితిగతులు తెలుస్తున్నాయి.

శార్దూలం:

కుల్లాయుంచితి కోక చుట్టితి మహాకూర్పాసముం దొడ్లితిన్‌

వెల్లుల్లిం దిలపిష్టము న్మెసవితి న్విశ్వస్త వడ్డించగా

చల్లాయంబలి త్రావితిన్రుచుల దోసంబంచు పోనాడితిన్‌

తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్‌

(సంస్కృతాంధ్ర చాటుమణిమాల)

(కుల్లాయి కట్టుకున్నాను, చీర(కోక) ధరించాను, పొడుగు చేతుల పెద్ద చొక్కా తొడుక్కున్నాను. పూటకూటింటిలో విత0తువు వడ్డించగా వెల్లుల్లిని, నువ్వుపిండిని తిన్నాను. చల్లతో కూడిన అంబలిని తాగాను. రుచులను ఆశించడం తప్పని మానుకున్నాను. ఓ తల్లీ కన్నడరాజ్యలక్ష్మీ! నేను శ్రీనాథుడిని, దయలేదా అని అంటూ ఆ కన్నడతల్లికి తన దుర్దశను శ్రీనాథుడు రాజదర్శనానికి ఎదురుచూస్తున్న రోజులలో విన్నవించుకున్నాడు).

ఒకనాడు శ్రీనాథుడు కన్నడదేశానికి వెళ్లినప్పుడు రాజసన్మానం తొందరగా లభించని సందర్భంలో శ్రీనాథుడు కన్నడరాజ్యలక్ష్మితో మొరపెట్టుకున్న పద్యమిది. అని అంటారు. శ్రీనాథుడు పలనాడులోనే గాకుండా కన్నడనాడులో కూడా కష్టాలుపడ్డట్లు తెలుస్తుంది.

ఆటవెలది:

వంగతోట నుండు వరిమళ్లలో నుండు

జొన్నచేల నుండు చోద్యముగను

తలుపుమూల నుండు తలమీద నుండును

దీని భావమేమి తిరుమలేశI

పై పద్యం చదువగానే వంగతోటలో, పరిమళ్లలో, జొన్నచేలలో, తలుపుమూల, తలమీద ఉండేది ఏమిటి అనే ప్రశ్న,ఆలోచన మన మనసులో మొలకెత్తుంది. కాని కొంచెం లోతుగా ఆలోచిస్తే అందులోనే మనకు జవాబు కూడా లభిస్తుంది. పదాల విరుపును గమనిస్తే అసలు విషయం బోధపడ్తుంది.

వంగ తోటన్‌ ఉండు – తోటలోన వంగ ఉండు

వరి మళ్లలో నుండు – మళ్లలోన వరి ఉండు

జొన్న చేల నుండు – చేలన్‌ జొన్న ఉండు

తలుపు మూల నుండు – మూలన్‌ తలుపు ఉండు

తల మీద నుండును – మీదన్‌ (పై భాగాన) తల ఉండును (ఉంటుంది)

వేసవికాలం – అంబలి ప్రస్తావన:

చంపకమాల:

తెలినులి వెచ్చ యోగిరము దీయని చేరులు దిమ్మనంబులున్‌

బలుచని యంబళుల్‌ చెఱకుబాలెడ నీళ్లు రసావళుల్‌ ఫలం

బులును సుగంధ శీతజలమున్‌ నడపిందెలు నీరు చల్లయున్‌

వెలయగ బెట్టు భోజనము వేసవి జందనచర్చ మున్నుగన్‌బబ

(వేసవికాలంలో అతిథులకు ముందుగా తాపం చల్లార్చే గంధపుపూతపెట్టి, ఆయా పదార్థాలు వడ్డిస్తున్నారు.

కొంచెం వేడి గల అన్నం, తియ్యనిచారు, తీపిపదార్థాలు, పలుచని అంబళులు, చెరకుపాలు, కొబ్బరినీళ్లు, తీపి భక్ష్యాలు, పండ్లు, వాసనగల చల్లనినీరు, వేసవి వడను పోగొట్టడానికి ఊరవేసిన మామిడి పిందలు, నీరులెక్కువగా కలిపిన మజ్జిగతో తృప్తికలిగే విధంగా (విష్ణుచిత్తుడు అతిథులకు భోజనం పెట్టును. (ప.81, ప్రథమాశ్వాసం, ఆముక్తమాల్యద) (పైన చెప్పిన పదార్థాలన్నీ వేడిని పోగొట్టే పదార్థాలు), సజ్జ వేడి, జొన్న చలువ అంటారు.

పై పద్యాలను బట్టి చిరుధాన్యాల వైశిష్ట్యం, వాటిని తినడానికి రసికులు పడే కష్టాలు, ప్రజల స్థితిగతులు తెలుస్తున్నాయి. అంతేగాకుండా ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయనే నానుడి కూడా ఈ చిరుధాన్యాలకు వర్తిస్తుంది. ఒక నాడు తినడానికి అయిష్టపడేవారు ఈనాడు ఆరోగ్య కారణంగా రొట్టెలు, ఉప్మా, గట్క, అంబలి, జావా రూపంలోతప్పనిసరిగా తినవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

జొన్నలు పండే ప్రాంతానికి జొన్నలగడ్డ(గెడ్డ) అనే పేరు ఉన్నట్లుగానే ఆ పేరుతో ఇంటిపేర్లు కూడా ఉన్నాయి. జొన్నలగడ్డ(గెడ్డ), జొన్నాడ అనే ఇంటిపేర్లు రెడ్లలో, బ్రాహ్మణుల్లో కనిపిస్తున్నాయి (బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు -శాఖలు). జొన్నలగడ్డ ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులు ‘ఇంటర్‌ నెట్‌’ లో కూడా కనిపిస్తారు. జొన్నలగడ్డ గ్రామం గు0టూరుజిల్లాలో ఉంది. చిరుధాన్యాలలో భాగమైన జొన్నలు భోగిపండ్లలోనూ, తలంబ్రాలలోనూ కలుపుతారు. జొన్నలు కేవలం ఆహారం మాత్రమే గాకుండా ఒకసాంస్కృతిక వస్తువు అని కూడా చెప్పవచ్చు. వరిధాన్యాన్ని పొట్టుధాన్యంగానూ, సజ్జలు. జొన్నలను గట్టిధాన్యంగానూ పరిగణిస్తారు. వీటిలో పొట్టురూపకంగా ధాన్యం వృధా కాదు.

ఇలా జానపదుల రామాయణం కథలో భరతునికి పన్ను ఎగవేయడానికి (మోసగించడానికి కూడా ఈ జొన్న ఉపయోగపడింది. భరతుడు ‘మంచి ఫిలాసఫర్‌ (తత్త్వవేత్త). కాని సమర్థుడైన పరిపాలకుడు కాడు. హరతుని మంచితనాన్ని అలుసుగా తీసుకొని రైతులు పంటలు పండలేదని, పన్నులు ఎగవేస్తుంటారు. మంత్రులు ఈ విషయాన్ని భరతుని దృష్టికి తీసుకు వస్తారు. అప్పుడు భరతుడు ‘పంట పైకి కనిపించే విధంగా) వంగడాలు వేయమని చాటింపు వేస్తారు. రైతులు మొక్కజొన్న వేస్తారు. రైతులు మొక్కజొన్నలు విత్తి, మధ్యనున్న కంకులు తెంపుకొని, పంట పండలేదనిభరతునికి చూపిస్తారు.

భరతుడు ఈ సారి మొక్కమధ్యలో కాత కాసే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ఉల్లిగడ్డ, వేరుశనగ మొదలైనవి వేస్తారు. వీటికి పైన పూలు వస్తాయి. కాని భూమిలోపల (మొక్కకింద) కాపు వస్తుంది. రైతులు భూమిలోని గడ్డలు తెంపుకొని, మొక్కలను చూపించి పంట పండలేదని చెప్తారు. ఈసారి భూమిలోపల పండే పంటలు వేయమంటాడు. అప్పుడు రైతులు ‘జొన్న’ వేస్తారు.

జొన్నకర్ర, మొక్కజొన్నకర్ర చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. రైతులు జొన్నమొక్క పైభాగంలోని కంకులు తెంపుకొని, పంట పండలేదని చెప్తారు. ఈ విధంగా జొన్నపంట పరిపాలకులను మోసం చేయడానికి కూడా పనికివచ్చింది.అందుకే పరిపాలకులకు క్షేత్రపరిజ్ఞానంకూడా ఉండాలంటారు. ఇలా ఒక్కొక్క ధాన్యం, ఆహారపదార్థం గురించి ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు.

(అంబలి – చిరుధాన్యాలపిండి, నూకలు లేదా బియ్యం చేర్చి జాలువారుగా వండిన ఆహారం., గటక(గట్క) – చిరుధాన్యాలతో గట్టిగా వండిన వంట.

బర్పట – రవ్వలాగ విసరిన ధాన్యం.

ఆధార గ్రంథాలు:

1. సంస్కృతాంధ్ర చాటుమణిమాల

2. ఆముక్తమాల్యద

3. బ్రాహ్మణుల గోత్రములు, ఇండ్లపేర్లు – శాఖలు

4. శబ్దరత్నాకరం

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

హలో హల్లూ

by Vijaya Kandala July 25, 2024
written by Vijaya Kandala

     ప్రపంచ భాషల వ్రాత లిపుల్లో మొదటి ఉత్తమ లిపి కొరియా  దేశానిది కాగా  , రెండవ ఉత్తమలిపి  తెలుగు కావడం మనకు గర్వకారణం .
కాలికి బలపం
        అవసరం ఉన్నందున దూరభారాలు లెక్కించకుండా తిరిగినప్పుడు కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అంటారు .    బలపం అనేది రాతిముక్క. పలకాబలపం అనే వి ఒకప్పుడు విడదీయలేని జంట పదాలు . ఒకప్పటి విద్య విధానానికి ఆనవాళ్ళు . ఒక్కసారి పలక  కొంటె ఒకరి తర్వాత మరొకరు వాడుకునే సౌకర్యం ఉన్న సాధనం . తిరగలేక బాధపడుతున్నట్లు ,తిరగక  తప్పదన్నట్లు చెప్పడమే దీనిలోని అసలు ఉద్దేశ్యం .
ఖండితం
                ఈ సంస్కృత పదానికి నరకబడినది అని నిఘంటు అర్థం . యుక్తులు చెప్పి ,ఒక వాదాన్ని నిరాకరించడం కూడా ఖండించడమే . ఈ రోజుల్లో ఏ రాజకీయ    నాయకుని ఏ విషయంలో అభిప్రాయం అడిగినా  యదుటివారు చెప్పింది ఖండిస్తున్నాను అనే అంటారు . దేన్ని ఖండిస్తున్నాడు ,ఎందుకూ ఖండిస్తున్నాడు అతనికే తెలియదు . అతనికే తెలీనప్పుడు మనకు తెలిసే అవకాశం లేనేలేదు . ఖండితంగా చెప్పడమంటే స్పష్టంగా ,దాపరికం లేకుండా అనే అర్థంలోనే నేడు వాడుతున్నాం
గుడ్డి గవ్వ
         కొన్ని ఏళ్ళ క్రితం గవ్వలు నాణాలుగా చెలా మణిలో ఉండేవి. అంటే గవ్వలిచ్చి ,కావలసిన సరుకులను కొనేవాళ్ళు . గవ్వ విరిగిన ,పగిలిన అది గుడ్డిగవ్వ . అది వ్యాపార వ్యవహారాలలో చెల్లుబాటయ్యేది కాదు . ఎందుకూ  పనికిరానిదని  అర్థం . బీదవారిని గుడ్డిగవ్వ పాటి ఖరీదు చేయడని  భావించేవారు .
ఘంటాపథం
         తెలుగులో ఈ పదానికి నొక్కి చెప్పుట , బల్ల గుద్ది  చెప్పుట అనే అర్థాలున్నవి . తాను నమ్మిన దాన్ని ఎదుటివారు సంశయించినప్పుడు వారికీ బోధ పడేలా నొక్కి చెప్పడం ఘంటాపథం .
చిరునామా
                        చి రునామా అనేది ఇ ప్పుడెక్కడా  వాడటం లేదు . ఆ స్థానం  లో Address వచ్చి , పీఠం వేసుకుని కూర్చున్నది .ఈ అడ్రసునే ఒకప్పుడు చిరునామా , విలాసం అనే వారు . ఇది హిందీ నుంచి వచ్చిన మాట అని సి. పి  బ్రౌన్ అభిప్రాయం . అన్యదేశ్యం అని మరికొందరి భావన . ఇ వన్నిటిని  పక్కకు నెట్టి అడ్రసు స్థిరపడింది . సులువుగా చెప్పాలంటే క్లుప్తంగా ఒక వ్యక్తి నామ , నివాసస్తలాల వివరం చిరునామా.
జరిగిన కథ
             నిజంగా సంఘటిల్లిన కథను జరిగిన కథ అంటారు . అయితే మనం ఇ ప్పుడీ అర్థంలో వాడటం లేదు . వార , మాస పత్రికలు పెద్ద కథలను ,ధారావా హికలను  ప్రోత్సహించడం ,ప్రచురించడం మొదలె ట్టాక  కథలోని కొద్ది భాగాన్ని ప్రచురించి ,మిగిలిన కథను తరువాతి సంచికలో చదవమని సూచించే అవసరం ఏర్పడింది . మిగిలిన భాగాన్ని ప్రచురించేటప్పుడు  అంతవరకూ  జరిగిందాన్ని క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్తితి  ఏర్పడింది . దానివల్ల సత్యమైన ,గడచిన అనే అర్థంలో జరిగిన కథ వాడటం తప్పనిసరైంది .
టిప్పణి
              ఒ  క  గ్రంధంలోని  విశేషాలను వివరిస్తే అది టీక అనీ ,కటిన పదా లకు అర్థాన్ని వివరిస్తే అది టిప్పణీ అని సామాన్యమైన అర్థం . పద్యాల్లోని పదాలను ,అర్థాలను వచన క్రమంలో  పెట్టడమే తాత్పర్యం . తెలుగులో టీ కా తాత్పర్యాలకే ప్రచారం ఎక్కువ . ఒకనాటి సాహితీ సంప్రదాయాలను పరిచయం చేసుకోవాలంటే ఇ లాంటి పదాల పరిచయం అవసరం .
TLAYINCHU
         ఇది హిందీ /ఉర్దూ నుంచి వచ్చిన పదం . తెలుగులో పని ఎగ్గొట్టు ,మోసగించు అనే అర్థాలున్నాయి . అయితే నేడు మనం తప్పించుక తిరుగు ,తప్పుదారి పట్టించు ,మోసగించు అనే అర్థాలతో బాటు కావాలని ఆలస్యం చేయు అనే అర్థంలోనూ వాడుతున్నాం .
డ బ్బాకొట్టు
           డబ్బా అనేది హిందీ మాట  దానికి తెలుగు నిఘంటువుల్లో తుపాకీ మందు ఉంచుకునే తోలుపెట్టే అని అర్థం ఉంది దీనికి కోతలు కోయు ,పొగడు అనే వ్యవహారిక ఆర్గాలు ఉన్నాయి. నేటి వాడుకలో చప్పుడు చేస్తూ పోవడం, పొగడుకోవడంతో పాటు అనవసరంగా పొగడు ,అతిగా పొగడు అనే అర్థాలు ఉన్నాయి నేడు.
అణాకాణీ
               రూపాయికి 100 పైసల విధానం వచ్చాక రకరకాల పాత  నాణా లు వాటి లెక్కలు మరుగున పడిపోయాయి  .పేర్లు కొన్ని వ్యవహారంలో నిలిచిపోయా యి . అలాంటి వాటిలో అణాకాణీ  40 , 50 ఏళ్ల క్రితం వరకు పలుకుబడిలో ఉండేది. ఒకప్పుడు రూపాయికి 16 అణాలు అంటే 96 పైసలు ఉండేవి . దాన్నిబట్టి పదహారణాల ఆంధ్రుడు అనే మాట ఎక్కువగా వినబడేది. అంటే మాట,లో కట్టుబొట్టులో తెలుగు లక్షణాలున్న వాడని అర్థం. రూపాయిలో 16వ వంతు అణా  దాంట్లో నాలుగవ వంతు కాణీ . అందువలన చిల్లర మనిషి అనే అర్థంలో అణాకాణీ  మాట వాడేవారు. ఇలా వాడే రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా పెళ్లి చేశాడు అనే మాటలు పుట్టాయి . అణా అనేది సత్తు నాణెం.
తాహతు
 తెలుగు సినిమాల్లో  తరచూ వినిపించే మాట ఇది .  హిందీలో తాకత్ అనే శబ్దం నుంచి పుట్టిన మాట.  హిందీలో ఈ మాటకు బలం , శక్తి , అధికారం అనే అర్థాలు ఉన్నాయి  తెలుగులో  అధికారంతోపాటు హోదా,స్థాయి  అనే అర్థాలు కూడా ఉన్నాయి  
        ఆయన  తాహతు  ఎక్కడ ?   మనది ఎక్కడ ? ఈ మాటలు మన సినిమాల వల్ల రాజకీయ నాయకుల వల్ల ప్రజల నోళ్లలో నానుతున్నాయి.
దుంప నాశనం
          తెలుగువారికి ప్రత్యేకమైనది  ఈ తిట్టు . మొక్కల పుట్టుకకు  ,పెరుగుదలకు మూల కారణమైంది దుంప . అది నశిస్తే , ప్రస్తుతమున్న మొక్క వంశమే నశించినట్లు లెక్క.  ఎదుటి వ్యక్తి గాక  అతని వంశమంతా నశించాలని   దీనికి అర్థం . ఇంగ్లీష్ తిట్లు  అలవాటయ్యాక  తెలుగు తిట్లు  మరిచిపోతున్నాము  అ.యినా  కొన్ని పదాల యొక్క  అసలు  అర్ధాన్ని  తెలుసుకోవాలి .
ధనియాల జాతి
      తిట్టి, కొట్టి బాధిస్తే ,గాని దారికి రాని, పని చేయని వ్యక్తులను గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు  . ధనియాలను  ఉన్నవి ఉన్నట్లు పాతేస్తే మొలకెత్తవు.   వాటిని  చెప్పు కింద నలిపి, నాటాలనేది విశ్వాసం  అలా  పీడించి, హింసించి, భాధిం చినప్పుడే గాని మర్యాదగా చెప్పితే, పనిచేయని వాళ్లని ధనియాల జాతి అంటారు.
నదీ నదాలు
 ఇది ద్వంద్వ సమాసం .  ఇందులోని నది, నదం రెండూ సంస్కృత పదాలే.   నదం అంటే తూర్పున పుట్టి, పడమటికీ ప్రవహించేది .  మనదేశంలో నర్మదా, తపతి నదాలు .  నది అంటే పడమట పుట్టి, తూర్పుకు ప్రవహించేది.   ఇంత  సూక్ష్మమైన  విషయాన్ని   గమనించి , ప్రత్యేకంగా  పేరు పెట్టిన  మన  పూర్వీకుల పరిశీలనా శక్తికి నమస్కారాలు .
పాలు
 పాలు అనగానే మనకు ఆవు , గేదె ,మేక ,గాడిద  గుర్తొస్తాయి కదా ! ఇవన్నీటిని మరిపింప చేసేది అమ్మ .ఆమె ప్రేమ . ఇవాళ పాలుకు ఉన్న ఎన్నో అర్థాలలో కొన్నింటిని చెప్పుకుందాం పాలతో కలిసి కోపాలు ,తాపాలు ,శాపాలు ,మురిపాలు ఇలా ఎన్నో రకాలు .
          కృష్ణుడు రాయబారంలో పాండవులకు సగపాలిమ్మని అడిగాడు.   ఇక్కడ పాలు అంటే భాగం . రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నప్పుడు  రాళ్ళల్లో కలిసిపోయాయని అర్థం . దేవా నా పాల రావా అంటే  నన్ను రక్షించడానికి రావా  అని భావం .   జిల్లేడు పాలు అంటే రసం అనే అర్థం .ఇలా పాలు అనే పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి .
 ఫల సాయం
             ఫలసాయం   అన్న మాటకి పంట అనే అర్థం ఉంది .  వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయం ఫలాయం . కానీ నేడు పంట దిగుబడిని సూచించడానికి ఫలసాయం అనే మాటను  వాడుతున్నాము .
బాదరబందీ
                ఒకప్పుడు నిజాం రాష్ట్రంలో  ఉద్యోగులు పొడుగాటి అంగీ ధ రించడం సంప్రదాయం . వాటికి ఇప్పట్లో లాగా గుండీలు ఉండేవి కావు .ఓవైపు తాళ్లు   ,మరోవైపు వాటిని దూర్చడానికి రంద్రాలు ఉండేవి . ఎదురెదురుగా వాటిలో నుంచి దూ ర్చిన తాళ్ళను ముడి వేసేవారు . ఇవి 12 ఉండేవి . ఈ పద్ధతిని బారాబంది , బారాబుంది అనేవారు .ఇది చాలా సమయం తీసుకుంటుంది .విసుగు పుట్టిస్తుంది .అలా ఈ బారాబంధి కాస్త బాదర  బందీగా మారిపోయింది . సరిగా కట్ట కుంటే నలుగురిలో నగుబాటు . ఇలా 12 ముళ్ళు వేయడం . విప్పటం చికాకు పుట్టించేది .ముళ్ళు సరిగా వేయకుంటే , విప్పడం మరి కష్టం . ఇలా విసుగు పుట్టించే వ్యవహారం ,అనవసర శ్రమ అనే అర్థంలో బాదరబందీ అనే పదాన్ని వాడతారు .
భత్యాలు
             పనిచేసినప్పుడు ఇచ్చేది జీతం .తర్వాత వచ్చేది పింఛన్ . బత్తా   అనే హిందీ లేదా ఉర్దూ మాటకు తెలుగు మాట భత్యం .ఇది తాత్కాలిక , ప్రత్యేక సేవలకు ప్రతిఫలంగా ఇచ్చేది . రాను రాను భత్య మనేది జీతానికి భిన్నంగా , అదనంగా ముట్ట చెప్పేది అనే అర్థం వచ్చింది .  అప్పటినుంచి  కరువు భత్యం ,దిన భత్యం ,ప్రయాణ భత్యం ,  అదనపు భత్యం ఇవన్నీ వచ్చి చేరాయి   .ఒకప్పుడు జీతభత్యాలు ధన రూపంలోనే గాక వస్తు రూపంలో కూడా ఉండేవి
మందలింపు
           తప్పుగా మాట్లాడిన వారిని , తప్పుడు పనులు చేసిన వారిని సుకుమారంగా హెచ్చరించడాన్ని  మందలింపు అంటారు . తెలంగాణ ప్రాంతంలో ఈ మాటకు పరామర్శ , ఓదార్పు అనే అర్ధాలు ఉన్నాయి . మిత్రులు , బం ధువులు ,ఆత్మీయుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పలకరించి , ఓదార్చి , కష్టసుఖాలు విచారించడాన్ని మందలించడం అని అంటారు ఈ ప్రాంతంలో .
యక్ష ప్రశ్నలు
            సమాధానం చెప్పడం సాధ్యం కానీ చిక్కు ప్రశ్నలు ఎవరైనా అదేపనిగా అడుగుతూ ఉంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నాడయ్యా అని అంటారు  . ఈ జాతీయానికి సంబంధించిన కథ మహాభారతంలో ఉన్నది . పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో , ఈ సంఘటన జరిగింది .ఒకసారి  పాండవులు అందరికీ అలసట , దాహం కలిగాయి . అప్పుడు చెరువులోని నీరు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి యక్షుడు ధర్మరాజును కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పితే ,ఈ నీళ్లు తాగడానికి అనుమతి ఇస్తాను అని చెప్పాడు .  యక్షుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు అడిగాడు . అన్నిటికీ ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు .  తన తమ్ముళ్లందరినీ కూడా కాపాడుకున్నాడు.
రాజధాని
       రాజులు ఉండే ప్రధాన నగరం రాజధాని . ఇప్పుడు రాజులు  లేరు గాని , రాజభోగాలు ఉన్నాయి.   రాష్ట్రాలు ఉన్నాయి . వాటికి పరిపాలనా కేంద్రాలుగా ముఖ్య పట్టణాలు ఉన్నాయి .వాటిని కూడా రాజధానులనే పిలుస్తున్నాము . రాజు లేకున్నా పాత అలవాటు ప్రకారం ప్రధాన నగరాన్ని రాజధాని అంటున్నాము  .
లక్షణ
          మీరు సరిగానే చదివారు ఇది లక్ష్మణుడు కాదు . లక్షణ . శ్రీకృష్ణుని  అష్టభార్యలలో చివరిది లక్షణ . ఈమెను కృష్ణుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ,వివాహం చేసుకున్నాడు . ఈ సంగతి అన్నమాచార్యుల వంశానికి చెందిన తాళ్లపాక తిరువేంగళ నాథుడు అష్టమహిషి  కళ్యాణం అ నే కావ్యంలో  చాలా చక్కగా వర్ణించాడు .మత్స్య యంత్రాన్ని కొట్టడం అనగానే అందరికీ అర్జునుడు మాత్రమే గుర్తొస్తాడు . ఈ లక్షణ స్వయంవరంలో భీముడు , కర్ణుడు కూడా ప్రయత్నించారు , కానీ సాధ్యం కాలేదు . చివరగా శ్రీకృష్ణుడు వెళ్లి మత్స్య యంత్రాన్ని ఛేదించి ,లక్షణను  వివాహం చేసుకున్నాడు
వారాలబ్బాయి
             ఇప్పటిలాగా వసతి గృహాలు , ఉచిత వేతనాలు లేని రోజుల్లో పేద విద్యార్థులు ఏ బడి పంచలోనో  తలదాచుకుని , సంపన్న గృహస్తులను ఆశ్రయించి , భోజన వసతి సంపాదించేవారు . ఏ ఒక్కరి మీదనో ఆధారపడక ,పూటకో ఇంట్లో తింటూ , బట్టల కోసం కొందరినీ ,పుస్తకాల కోసం మరికొందరిని , ఆశ్రయించి , చదువుకునేవాళ్లు . అలా దుర్భర జీవితం గడుపుతూ , చదువుకునే వారిని వారాలబ్బాయి అనేవారు .అమ్మాయిలు ఇలా చదివే పద్ధతి లేనట్టుంది . అందుకే వారాల అమ్మాయి అనే పదం పుట్టలేదు . ఇప్పుడు ఈ రకంగా చదివే వాళ్ళ సంఖ్య చాలా అరుదు .
శాఖాహారం
          చాలా భోజనశాలలను శాఖాహార భోజనశాల అని రాయడం , పలకటం మన అలవాటు . శాఖ అంటే కొమ్మ . శాకం అంటే కూర .మాంసాహారం దొరకదని కూరగాయల వంటలు ఉంటాయని సూచించడానికి  శాకాహారమనే మాట సరియైనది . అయితే  మనము శాఖహారం అంటే కొమ్మలనే ఆహారంగా తీసుకుంటాము అని  ఆ బోర్డు ద్వారా తెలియజేస్తున్నాం . అది సరైనది కాదనుకోండి కానీ , మనకు బాగా అలవాటైపోయింది . అయితే ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పుకోవాలి . ఏది శాకాహారం అనే విషయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి , ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి అలవాటులో ఉంది  .అది చాలా పెద్ద విషయం తర్వాత దాని గురించి చెప్పుకుందాం .
షికారు
                ఈ పదానికి వేట ,సంచారము అనే అర్థాలు ఉన్నాయి .  ఇది పార్శీ మాట .హిందీ ,ఉర్దూ ద్వారా తెలుగులోకి వచ్చింది  మూల భాషలో భక్ష్యం, లక్ష్యం , వేట అని అర్థాలు ఉన్నాయి తెలుగులో వేట , స్వారీ ,వా హ్యాళి అనే అర్థాలు ఉన్నాయి . అడవులు తగ్గి ,క్రూర మృగాల సంఖ్య తగ్గిన తర్వాత ,వనభోజనాలకు , వినోద వ్యవహారాలకు పరిమితమైన సామాజిక జీవనంలో వేట అనే అర్థం కన్నా విహారం వాహ్యాలి అని అర్థాలకే ఎక్కువ ప్రసిద్ధి రూపంలో , అర్ధాల్లో మార్పు వచ్చిందని గుర్తుంచుకోవాలి .
సాము గరిడీలు
               సాము గరిడీ అనే రెండు మాటలు ఒకదానికొకటి పర్యాయపదాలు అనే అర్థం లో ఈ ద్వంద్వ సమాసాన్ని వాడుతుంటాము . సిగ్గు బిడియం , అందం చందం అటువంటిదే ఇది కూడా అనుకుంటాము . అయితే సాము అంటే వ్యాయామం . గరిడీ అంటే సాము నేర్చుకునే చోటు . కాబట్టి  సాము నేర్చే నేర్పే ప్రదేశాలని అర్థం.      తెలుగుదేశంలో ఒకప్పుడు తాలింఖానాలు ఉండేవి అక్కడ వ్యాయామ విద్యలు మాత్రమే నేర్పేవారు .  స్వాతంత్రం వచ్చాక ఇవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి వీటిని గరిడీలు అని కూడా అంటారు కాబట్టి వ్యాయామశాలలు అని అర్థం .
హక్కు
               ఇది ఉర్దూ లేదా హిందీ నుంచి తెలుగులోకి వచ్చిన మాట . . శబ్ద రత్నాకరం ప్రకారం దీనికి బాధ్యత అని అర్థం  నేటి రాజ్యాంగ ,రాజకీయ వ్యవహారాల్లో హక్కు అంటే అధికారమే గాని బాధ్యత కాదు . పదవి వల్ల ప్రత్యేక పరిస్థితుల వల్ల సంక్రమించే స్వామ్యం అధికారం హక్కు . సదరు హక్కు పొందినందువల్ల కర్తవ్యం గా భావించి చేయవలసిన పనులు బాధ్యతలు .నేటి భాషలో ఈ రెండు వేరు వేరు . హక్కు వేరు బాధ్యత వేరు .
            అందరమూ భాషను మాట్లాడుతున్నాము కానీ దానిమీద పట్టును సంపాదించుకోలేకపోతున్నాము .  కారణం శ్రద్ధ తగ్గిపోవడమే .  సామెతలు ,నానుడులు , జాతీయాలు , పదబంధాలు ,  పొడుపు కథలు ఇలాంటివి తెలుసుకున్నప్పుడు  భాష మీద పట్టు దొరుకుతుంది . అలా దొరికినప్పుడు అభిమానము పెరుగుతుంది . అయితే ,కొన్ని పదాల వెనక ఉండే అంతరార్థం కూడా తెలుసుకోవడం అనేది మన భావాలను మరింత స్పష్టంగా వెలిబుచ్చడానికి సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతోటి ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది .ఇది రెండు భాగాలుగా  రాయడం జరిగింది . ఈ రెండింటిని  చదవండి .చదివించండి .  అందమైన భాష మనది .దాన్ని మరింత అందంగా  మన భావాలను వెల్లడి చేయడానికి వాడుకుందాం .
విజయ కందాళ

July 25, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కారా మాస్టారు

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

ఈ సారి మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయాలని వచ్చాను. అతను మరెవరో కాదు, కథ అంటే కారామాస్టారే అని పిలిపించుకున్న, కథాయజ్ఞాన్ని చేసిన గొప్ప రచయిత కాళీపట్నం రామారావు గారు. తెలుగు కథలు గురించి ఏ మాత్రం పరిచయమున్నా, వీరి గురించి తెలియని వారుండరు.

కారా మాస్టారుగా పిలువబడే “కాళీపట్నం రామారావు” 1924, నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో పేర్రాజు, భ్రమరాంబ లకు జన్మించారు. శ్రీకాకుళంలో S.S.L.C వరకు చదివారు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల వివిధ ఉద్యోగాలు చేసినా స్థిరంగా చేసింది మాత్రంఉపాద్యాయవృత్తిలో. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగం చేసారు. అతను 1972లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేసారు.

కాళీపట్నం రామారావుగారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసాడు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించాడు.

ఆయనఒక సందర్భంలో తన రచనా ప్రస్థానం గురించి చెబుతూ, 1935 నుండి పాఠకుడుగా బాల్యం,తరువాత 1940-1942 వరకు రాసేందుకు ప్రయత్నం, 1943 నుండి ఐదేళ్ళు చిన్నా,చితగా పత్రికల్లో ఏవోవో కొన్ని రచనలుచేసానని, 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ , భారతి వంటి పత్రిలలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగానని . 1957 నుండి ఉన్నతస్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనం, ఆ తరువాత 1963 నుండి పదేళ్ళు పాటు మరో పన్నెందు కథానికలు రాసానని అన్నారు. ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించిన అధ్యయనము, అందుకవసరమైన ఇతర ప్రక్రియలతో సహా చదువుతో పాటు అభిప్రాయాలు పదిమంది తో పంచుకోవడమూ ఆగలేదని చెప్పారు.

ఈయన తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు.

ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయని,తన నిజజీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చాడని పలువురితో ఆయన అభినందనలు పొందారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపాడు.

1964లో వెలువడిన ‘యజ్ఞం’ కథ ఫ్యూడల్ విధానంలోని దోపిడీని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అందుకే ఆయన కథలు ఇతర భారతీయ భాషలలోకి, రష్యన్, ఇంగ్లీషు భాషలలోకి అనువదింపబడి పాఠకుల ఆదరణను చూరగొన్నాయి.

కారా మాస్టారు, “యజ్ఞం” కథా రచయితగా సుప్రసిద్ధుడు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.ఆం.ప్ర. సాహిత్య ఎకాడెమీ ఈయనకి అవార్డు ఇస్తే ప్రభుత్వవిధానాల పట్ల నిరసనతో ఆ అవార్డుని తిరస్కరించాడు.

ఆ తరువాత 1995 ప్రాంతంలో కేంద్ర సాహిత్య ఎకాడెమీ అవార్డు ప్రకటించినప్పుడు మేస్టారు సందిగ్ధంలో పడ్డారు. ఆ అవార్డుని తెలుగు కథకి ఉపయోగకరంగా వాడవచ్చు అని చాలామంది ఆత్మీయులిచ్చిన ప్రోత్సాహంతో అవార్డుని స్వీకరించారు. అవార్డుగావచ్చిన సొమ్ముని మూలధనంగా పెట్టి, కథానిలయానికి పునాది వేశారు.

అతని మొదటి కథ చిత్రగుప్త లో ప్రచురితమైన ‘ప్లాట్ఫామ్‘ అనే ఒక చిన్న కథ. అది పోస్ట్ కార్డువెనుక వ్రాయబడింది . 1963లో “తీర్పు” రాశాడు. తరువాత 1960ల చివరలో “యజ్ఞం”, “మహాదాశీర్వచనము”, “వీరుడు-మహావీరుడు”, “అదివారం”, “హింస”, “నో రూమ్”, “స్నేహం”, “ఆర్తి”, “భయం”, “శాంతి”, “చావు”, “జీవన ధార”, “కుట్ర”వంటి అనేక కథలు రాశారు.

“కుట్ర” వ్రాసిన తరువాత, అతను రాయడం మానేశాడు. తన తొలినాళ్లలో తాను చాలా రాసేవాడినని, తాను రాసిన దానితో సంతృప్తి చెందకపోవడంతో వాటిని ప్రచురణకు పంపలేదని చెప్పారు. తర్వాత రోజుల్లో ఏడాదికి ఒకటి రెండు కథలు రాసేవాడు. అతని కథలు రష్యన్ మరియు ఆంగ్లంతో సహా వివిధ విదేశీ భాషలలోకి అనువదించబడ్డాయి.

కాళీపట్నం విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు కూడా.

ఆయన దాదాపు 51 కథలకు పైగా రచించి, ఎన్నో ప్రశంసలను, పురస్కారాలను ముఖ్యంగా ఎంతమందో సాహిత్యాభిమానుల మనసుల్లో కారా మాస్టారుగా చిరస్థాయిగా నిలిచి పోయారు. కాలం కృరమైంది కదా మనమాస్టారుగారిని కూడా మనకు దూరం చేసింది.  ఆయన తన 96 ఏళ్ళ వయసులో వృద్దాప్య కారణంగా 2021 జూన్ 4వ తేదీన శ్రీకాకుళంలో కన్నుమూసారు.

పురస్కారాలు

యజ్ఞం కథ కు రెండవ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు,ఎన్టీర్ జాతీయ పురస్కారం (ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్), కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం.అతను 1995లో “సెంట్రల్ కల్చరల్ అకాడమీ అవార్డు” గెలుచుకున్నారు.1993లో న్యూయార్క్‌లో జరిగిన 9వ తానా సదస్సు – ప్రపంచ తెలుగు మహాసభలకు అతిథిగా ఆయన USలో పాల్గొన్నారు.18 జనవరి 2008న లోక్‌నాయక్ ఫౌండేషన్ (విశాఖపట్నం)వారిచే సత్కరింపబడ్డారు.

బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి స్ఫూర్తి పురస్కారం -2015,

కథానిలయం

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారికి ఒక ఆలోచన కలిగింది. ఒక కథ రాయటానికి ఒక వ్యక్తి కనీసం కొన్ని గంటల నుంచి కొన్ని రోజులు వారాలు నెలలు శ్రమ పడతాడు. ఆ శ్రమ ఫలితానికి ఆయువు ఎన్నాళ్లు? అచ్చైన పత్రికని బట్టి ఒక రోజు, ఒక వారం, ఒక పక్షం, ఒక మాసం. ఆసక్తీ, శక్తీగలవారు పూనుకుని పుస్తకరూపంలోకి తెచ్చుకుంటే కొన్నేళ్లు. ఇలా ఈ శ్రమంతా వృధాపోవలసిందేనా? నన్నింతవాడిని చేసిన కథాప్రక్రియలోని శ్రమనైనా కనీసం కొంతకాలమైనా భద్రపరచలేనా? అని ప్రశ్నించుకున్నారు.

అలా పుట్టింది 1997లో శ్రీకాకుళంలో కథానిలయం. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం. – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.కారామేస్టారి భావనలో కథానిలయం నిజంగా తెలుగు కథకి నిలయం. అక్కడ దొరకని తెలుగు కథ అంటూ ఉండకూడదని ఆయన ఆశయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండాలి. కథలతో పాటు కథా రచయితల జీవిత విశేషాలు, ఛాయాచిత్రాల సేకరణ కూడా చేపట్టారు. ఎక్కడెక్కడి పాత పత్రికల కాపీలు సంపాదించడంలో విపరీతంగా శ్రమించారు. కథానిలయం రెండంతస్తుల భవనం. శ్రీకాకుళంపట్టణంలో ఉంది. విశాఖ నుంచి నాన్-స్టాపు బస్సులో రెండు గంటల్లో వెళ్ళొచ్చు. కలకత్తా రైలు మార్గం మీద ఆమదాలవలసలో శ్రీకాకుళం రోడ్ అనే స్టేషను కూడా ఉంది. భవనంలో కింది అంతస్తు ప్రధాన పుస్తక భండాగారం. వెనుక వైపు అరుదైన పుస్తకాల బీరువాలు. ఇక్కడే తెలుగు కథా త్రిమూర్తులు – గురజాడ, కొకు, రావిశాస్త్రులవి పెద్ద తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి. పై అంతస్తులో ముందు ఒక వందమంది దాకా కూర్చోవటానికి వీలైన పెద్ద హాలు. ఈ హాలు గోడల నిండా అంగుళం ఖాళీ లేకుండా తెలుగు కథా రచయితల ఫొటోలు. వెనక వైపున ఒక అతిథి గది బాత్రూము సౌకర్యంతో సహా – ఎవరైనా లైబ్రరీని ఉపయోగించుకోవటానికి వస్తే రెండు మూడు రోజులు సౌకర్యంగా ఉండొచ్చు. ప్రతి ఏడూ మార్చి ప్రాంతంలో కథానిలయం వార్షికోత్సవం తన ఇంట్లో శుభకార్యంలాగా నిర్వహిస్తారు. బయటి ఊళ్ళ నించి చాలామంది కథకులూ, కథాభిమానులూ వస్తారు.

2014 సెప్టెంబర్ నాటికి రమారమీ 900 పత్రికల వివరాలు, 3000కి పైగా కథాసంపుటాలూ, సంకలనాలూ కథానిలయం సేకరించగలిగింది. వీటితోబాటు దాదాపు 1000 మంది రచయితలు తమ వివరాలను, తమ కథల నకళ్లను (దొరికిన వాటిని) అందించారు. ఇవికాక ఈ కథల కాల నేపథ్యాన్నీ సమాజ నేపథ్యాన్నీ అధ్యయనం చేసేందుకు వీలుగా ఆత్మకథలు, జీవిత కథలు, సామాజిక చరిత్రలు, ఉద్యమ చరిత్రలు కూడా సేకరించబడుతున్నాయి. ఇక్కడ ఏముందో సాహిత్య జీవులకు అందించే ప్రయత్నంలో కథానిలయం వెబ్‍సైట్ ఏర్పడింది. వివిధ మార్గాల ద్వారా లభ్యమైన ఈ రచనలని లాభాపేక్ష లేకుండా ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు.

విశ్వవిద్యాలయాలలోని పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిమానులు, రచయితలు, విమర్శకులు, ఎందరో కథానిలయం సేవలను వినియోగించుకోడం మొదలెట్టారు. ఈ వెబ్‍సైట్ వారందరికీ మరింత సేవలు అందిస్తుంది.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కథానిలయం సేకరణ, సహకారాలతో “కథాకోశం” తీసుకు వచ్చింది. అనేకమంది రచయితలు తమ సంపుటాలను ప్రచురించారు.

ఇదీ కారా మాస్టారి గారి జీవన ప్రస్థానం.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

శిక్షెవరికి

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

రచ్చబండ దగ్గర చేరిన జనాలందరూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడు తున్నారు. “ఏం రోగం, ఉన్నచోట ఉండకుండా తెల్లవారు ఝామున తోటలోకి ఎందుకెళ్ళాలట.” రంగమ్మగారు ఈసడింపుగా అంది.
“రోజూ వెళుతుంది కదా ఈ వేళ ఏమైనా కొత్తా. చిన్నప్పటినుండి వాళ్ళ నాన్న మాలకారి రాఘవ శాస్త్రి గారికి సహాయం చేయటానికి తోటలో కెళ్ళి పూలుకోసుకొస్తుంది కదా ఈ పిల్లా… మరి ఉదయమే దేవుడికి వాళ్ళ నాన్న మాలలు ఇవ్వాలికదా. తప్పదాయే.” తాయమ్మ జవాబిచ్చింది. రోజూ దేవుడి అలంకరణకోసం పూల మాలలు గుచ్చి పోద్దున్నే గుడిలో ఇవ్వటం రాఘవశాస్త్రి గారి ఉద్యోగం. అందుకని అంతా ఆయన్ని ‘మాలకారి’ అంటారు. అంటే మాలలు చేసేవాడు. అంతేకాక మంచి మనసున్న వైధ్యం తెలిసిన వాడు. ఊరి జనాలంతా ఆయన దగ్గరికే మందుల కోసం వెళతారు.
“ఏదేమైనా ఈడొచ్చిన పిల్ల. అన్ని రోజులు ఒక్కలా ఉంటాయా.. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంతకాలం నేను చాలా విషయాలు రాయాలనుకుంటున్నాను ఎక్కడంటే అక్కడ తిరగటం పరవాలేదు. ఇప్పుడు జాగర్తగా ఉండాలని నీవైనా చెప్పాలికదా జానకమ్మా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో” రాధమ్మ తనకు తోచిన విధంగా జానకమ్మని ఓదార్చుతుంది.
“ఊరుకోండి, జానకమ్మను ఊరడించాల్సింది పోయి ఎవరికి తోచింది వారు మాట్లాడుతారా..కాసేపు గమ్మునుండండి. ఆమె పెంపకం గురించి ఇవేళ కొత్తగా తెలిసొచ్చిందా. ఎంతో మర్యాద తెలిసిన పిల్ల. ధైర్యస్థురాలు. ఎవరికి కష్టమొచ్చినా నేనున్నానంటూ వచ్చే పిల్ల. ఇంకెవరైనా ఉన్నారేమో చెప్పమ్మా. మీరు మీ పెంపకం గురించి చూసుకున్నాక పార్వతమ్మ గురించి మాట్లాడండి.” అంటూ కసురుకుంది ఆండాళు. రాదమ్మ ఇంకో మాట అనకుండా చేసింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించానని ఊర్లోంచి వెళ్ళి పోయింది. వయసులో పెద్దది, నిర్మొహమాటంగా మాట్లాడే ఆండాళు అంటే అందరికి హడలు. ఎంతవారినైనా తప్పు చేస్తే వదిలి పెట్టదు. జానకమ్మ ఏడ్చి ఏడ్చి రచ్చబండకి కాస్త దూరంలో ఉన్న రావి చెట్టుకింద, కూతురు పార్వతి పక్కనే కూచుండి పోయింది.
రాఘవ శాస్త్రి గారు జానకమ్మలు, ఒక్కతే కూతురని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అయినా చక్కటి సంస్కారం, తెలివిని నేర్పాడు తండ్రి. ఇంటిపనులు, వంటపనులలో కూడా ఆరితేరింది. తండ్రి, బావకు నేర్పిస్తుంటే తనుకూడా కొద్దిగా వైద్యం, సంస్కృతం నేర్చుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన మేనల్లుడు శంకరాన్ని, చెల్లెలు సీతమ్మను తన దగ్గరే ఉంచుకున్నాడు. పార్వతి, చిన్నప్పటినుండీ బావతోనే లోకంగా పెరిగింది. శరీరాలు వేరైనా మనసులు ఒకటేలా ఉంటారని ఊరంతా అనుకునేవారు. రాఘవశాస్త్రి గారు, పక్క ఊళ్ళో శంకరం హైస్కూల్ చదువు అయిపోగానే పై చదువులకై మేనల్లుడిని దగ్గరలో ఉన్న, చెన్నపట్నం పంపాడు. తరువాత ‘లా‘ చదువుతానంటే ఊళ్ళోని పొలం అమ్మి చదివించాడు. శంకరం, చదువుతో పాటు చెన్నపట్నంలో జరుగుతున్న స్వతంత్ర పోరాట ఉద్యమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. మంచి చెడుల వివరణ పట్ల ఉండే సంస్కారాన్ని చిన్నప్పటి నుండి మేనమామ దగ్గర నేర్చుకున్నాడు. సమాజ శ్రేయస్సు పట్లా, రాజకీయాల పట్లా అవగాహన కలిగిన యువకుడిలా మారాడు. ఈ సంవత్సరం పరీక్షలవంగానే, పార్వతితో పెళ్ళి జరిపించేద్దా మనుకున్నారు ఇంటివాళ్ళు.
పార్వతి తండ్రి దగ్గర ఆయుర్వేద వైద్యం నేర్చుకుని అతనితో పాటు ఊళ్ళో అందరికి తన సేవలందిస్తుంది. దేవుడి మాలకట్టడంలో తండ్రికి సహాయ పడ్డం, తల్లికి ఇంటిపనుల్లో చేదోడు వాదోడుగా ఉండడం. లక్ష్మి, సీత, కళ్యాణి లతో కలిపి ఊర్లో వారికి ఏ సహాయం కావాలన్నా, ఎవరైనా జబ్బు పడినా నేనున్నానంటూ వెళ్ళడం, ఆమె రోజూ దినచర్య. సెలవులకు బావ వస్తే క్షణం వదలకుండా శంకరం తోనే గడపేది.
పార్వతి ఈలోకంలో లేనట్టుగా ఎటో చూస్తూంది. ఆమెని తీసుకొచ్చి చెట్టు దగ్గర కూచోబెట్టి నప్పటునుండి అలాగే జారిగిలపడి కూచునుంది. నల్లని ఓణీ పమిటను, తల్లి భుజం చుట్టూ కప్పినా కూడా చిరిగిన నల్లని జాకెట్టు చేయి సన్నటి ఓణీ లోంచి కనబడుతూనే ఉంది. బారెడు జడ ఊడి పోయి వీపంత పరచుకున్న వెంట్రుకలతో, పాలిపోయిన తెల్లటి ముఖాన గీరుకుపయిన గాయాల్లోంచి రక్తం కారి గడ్డ కట్టి కపోలాలు వాచి, ఎర్రబడ్డాయి. చేతులు కూడా రక్కుకు పోయి రక్తం మరకలు కనబడుతున్నాయి. ఏంజరిగిందో చెప్పకనే చెబుతున్నాయి ఆమె కనబడుతున్న తీరు.
“ఏవరు ఈ దురాఘాతానికి ఒడిగట్టారో చెప్పమ్మా.. నీవు నోరు తెరువక పోతే మా కెలా తెలుస్తుంది.” అంటూ ఊరు పెద్ద పరందామయ్యగారు అనునయంగా అడిగారు. పార్వతికి మాటలు వినబడుతున్నాయో లేదో ఆమె దగ్గరనుంచి ఏ జవాబు లేదు. పక్కనే ఉన్న జానకమ్మ కూడా కూతురుని పదే పదే పిలుస్తున్నా లాభం లేక పోయింది. “లక్ష్మీ, ఎప్పుడూ పార్వతితో వెళ్తావు కదా నీకు తెలియదా” ఆమె ద్వారా నన్నా విషయం తెలుసుకుందామని అడిగాడు. “లేదు బాబాయ్, ఈ రోజు నేను వెళ్ళలేదు. తాను ఒక్కతే వెళ్ళింది.” లక్ష్మి జవాబిచ్చింది. స్నేహితురాలి దీనావస్థచూసి ఏడుస్తుంది.
“పోనీ, ఇంతకు ముందు ఎవరైనా మిమ్మల్ని వెంటబడి ఏడిపించేవారా? వాళ్ళే ఈ దురాగతానికి పాల్పడ్డారేమో…ఏ మైనా జ్ఞాపకముందా..” ‘‘లేదు. ఎవరూ మమ్మల్ని అలా చేయలేదు”. లక్ష్మి అంది.
“అసలు ముందుగా ఎవరు చూసారు?”  అందరిని ఉద్దేశించి అడిగారు పరంధామయ్య. “నేను బాబుగారు, ఆరు గంటలేళ శాస్త్రిగారు నాతో, అమ్మాయి గారు వెళ్ళి ఇంకా రాలేదు. మాలకట్టటానికి సమయం మించి పోతుందని తోట కెళ్ళి చూసి రమ్మన్నారు. నేను వెళ్ళే సరికి తోటలో ఎక్కడా కనబడ లేదు. అప్పుడే వచ్చిన గోవిందు, అమ్మాయిగారు పూలు కోసుకుండగా తాను గోశాల కెళ్ళానని చెప్పాడు. ఒక్కో సారి అమ్మాయిగారు వెనకాల తోట బావి దగ్గర ఉన్న గులాబీల కోసం వెళ్తారు. అందుకని అటు వేపు కూడా చూడమని గోవిందు చబితే వెళ్ళాను. అక్కడ ముళ్ళ పొదల్లో స్పృహ తప్పి పడి ఉన్న అమ్మాయిగార్ని సూసి గుండె గుబేల్ మందండి. వెంటనే తోటమాలి గోవిందుని కేకేసి ఇద్దరం మంచం మీద పడుకో బెట్టి శాస్త్రి గారింటికి పట్టుకొచ్చామండి. అప్పుడే మీరూ వచ్చారు కదండి” అన్నాడు రాఘవ శాస్త్రి గారి పాలేరు రంగయ్య.
“మరి గోవిందూ, నీవేమి చూడలేదా? నీకు పార్వతి తప్ప ఎవరూ కనబడలేదా?”
“లేదు బాబుగారు, అమ్మాయిగారు పూలు కోసుకుని తులసి దవనం, గులాబీలు కోసుకుంటానని వెనకాతల వేపు కెళ్ళారండి. నేనేమో, గో మందల్ని మేతకి తోలడానికి గోశాలకి వెళ్లానండి. అమ్మాయిగారు ఎప్పటిలాగా గులాబీలు కోసుకుని వెళ్ళి పోతారని నేనూ అక్కడ్నుంచి నా పనిమీద వెళ్ళి పోయానండి.” గోవిందు జవాబిచ్చాడు.
“నీవు అమ్మాయి గారితో తోట వెనకాలకు వెళ్ళలేదా? పోనీ, అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నట్టు కనిపించిందా?”
“లేదండి, ఎప్పుడూ పార్వతమ్మకి అలవాటే తోట అంతా తిరిగి పూలు కోసుకోవటం అందుకని నేను అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడూ పార్వతమ్మ, లక్ష్మమ్మ తప్ప ఎవరూ రారు. చాలా చీకటిగా ఉంది. నాకెవరూ ఉన్నట్టు కనబడలేదయ్యా”. గోవిందు బాధగా అన్నాడు. తను కొంచెం జాగర్తగా ఆమె వెంటే ఉంటే బాగుండే దేమో, ఇంత ఘోరం జరిగేది కాదేమో …అంతా తన నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధ పడుతున్నాడు.
పరంధామయ్యగారికి ఎలా దోషిని పట్టుకోవాలి అగమ్యగోచరంగా అనిపించింది. ఎవరైనా ఆ సంఘటన చూసిన వాళ్ళన్నా చెప్పాలి లేదా బాధితురాలైనా చెప్పాలి. అప్పటికే ఉదంతం జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పెద్దగా ఏ ఆధారాలు దొరకలేదు. ఎవరో మట్టి కాళ్ళతో తోట వెనక గోడమీదకి ఎక్కి అటువేపు దూకినట్టుగా మరకలున్నాయి. అలాగే గోడ మీద రక్తపు మరకలు ఉన్నాయి. అంటే ఆ దుర్మార్గుడి కాలు గాయపడి ఉండాలి. ఆ ఒక్క కాలి గాయం ఆధారంగా దోషిని పట్టుకోలేము. లాభం లేదు. ఎలా అయినా పార్వతికి స్పృహలోకి రావాలి అప్పుడేగాని దోషి బయట పడడు.
అక్కడే ఉన్న ఆండాళుని పిలిచి, పార్వతిని మాట్లాడించ్చేట్టు ప్రయత్నించమన్నాడు. అప్పటికే ఆ పనిలోనే ఉంది తను. ముఖాన కాసిని నీళ్ళు చల్లింది. తన పమిట చెంగుతో తుడిచి.  “పార్వతీ..పార్వతీ..ఇటు చూడు తల్లి..మాట్లాడు పార్వతి..ఇంత ఘోరం ఎవరు చేసారో చెప్పు. వాడికి తగిన శాస్తి చేద్దాం నీవేం భయపడకు. పరందామయ్య ఉన్నారుగా. మాట్లాడమ్మా.”  అంటూ మంచినీళ్ళు తాగించే ప్రయత్నం చేసింది. అప్పటి వరకూ స్పందించని పార్వతి గట గటా నీళ్ళు తాగింది. కొంచెం తేరుకో గానే తన పరిస్థితి అర్థమైంది.  వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది. తల్లి జానకమ్మ కూతుని కౌగలించుకుని ఏడుస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్ళు ఆపుకోలేక పోయారు. చెంగు చెంగున ఆ ఊరు ఊరంత లేడి పిల్లలా తిరిగే పార్వతి ఇలా దీనంగా, హృదయవిదారకంగా ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్నారు. ఆండాళు వాళ్ళిద్దరిని ఓదార్చుతూ “పార్వతీ, అలా ఏడిస్తే కాదు. జరిగింది ఘోరమే.. కాని మనం ఇప్పుడు ఆ దుర్మార్గుడిని పట్టుకొని శిక్షించాలి. నీకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి. ఇలాంటి ఘోరం మరోసారి ఈ ఊర్లో మరెవరికి జరగకుండా చూడాలికదా.” అంది.
పరందామయ్య మాట్లాడుతూ..”చూడు తల్లీ! నీవు ధైర్యస్థురాలివి… నాకు తెలుసు. బేలగా బాధపడి ఏడ్చి బలహీన పడకు. నాకు తెలుసు నీవు ఎటువంటి కష్టంలో నైనా పోరాడగలవని. ఏడవకు. నిన్ను నీవు సమాధాన పరచుకో.. జ్ఞాపకం చేసుకో ఎవరు నీపై అఘాయిత్యం చేసింది. చెప్పు తల్లి.” పార్వతి స్వభావాన్ని, ధైర్యాన్ని ఆమెకే గుర్తు చేస్తూ బాధ నుంచి బయటపడేయాలని అనునయంగా చెప్పాడు. ఆ ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు. అప్పటివరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్న వాళ్ళు, అంతా నిశ్శబ్దం అయిపోయారు. పార్వతి, ఏం చెబుతుందోనని, ఆ దుర్మార్గుడు ఎవరని చెబుతుందోనని అందరూ, చెవులు రిక్కించి వింటున్నారు.
పార్వతి ఏడుపు ఉదృతం కొంచెం తగ్గింది. అయినా వెక్కిళ్ళు పడుతూనే ఉంది. “ఎవరో నాకు తెలియదు. చాలా చీకటిగా ఉంది. ముఖాన్నంతా కప్పేసుకున్నాడు. ఎవరో గుర్తించలేక పోయాను. అనుకోని సంఘటనకి నాకు స్పృహ తప్పినట్టైంది. తేరుకుని తప్పించుకోవాలని ప్రయత్నం చేసా..బతిమిలాడాను…పెనుగులాడాను. చివరికి అతని ముసుగు తీయాలని చూసాను. కాని బాగా కొట్టాడు. హింసించాడు….” ఏడుపు  ఎక్కిళ్ళ మధ్య చెప్పింది. ఆమె దీనావస్థకి అందరూ కలత పడ్డారు. పెళ్ళీడు కొచ్చిన పిల్ల బతుకు ఇలా అన్యాయమై పోవటం అందరిని కలచి వేస్తుంది. కానీ, పార్వతి కూడా ఆ మనిషిని గుర్తించలేక పోవటం నిరాశే ఎదురైంది. ఆమె వల్లనైనా దోషి ఎవరని తెలుసుకో వచ్చననుకునే ఆశ కూడా పోయింది.
అదో మప్పై నలబై కడపలున్న, మారు మూల కుగ్రామం. స్వతంత్రం రాక పూర్వం, సనాతన ఆచారాలతో నియమ నిష్టలతో కూడుకున్న బ్రాహ్మణ అగ్రహారం కావటం వల్ల ఆ పల్లెటూళ్ళో పోలీసులు కంప్లేంట్స్ ఇవ్వడాల్లాంటివి లేవు. అన్ని సమస్యలను గ్రామ పెద్దలే పరిష్కరించుకుంటారు. అందుకని డిఎన్ఏ ద్వారా లేదా వేరే పద్దతుల ద్వారా ఆ అగంతకుడిని పట్టుకునే ఆస్కారం ఆరోజుల్లో, ఆ గ్రామం లో లేదు.
పరందామయ్యగారు ఆలోచనలో పడ్డారు.. అక్కడ గుమి కూడిన జనాల్లోకి చూసారు. వాళ్ళలో నిలుచున్న యువకులందరిని తేరిపారా చూసారు. వాళ్ళ కాళ్ళ వేపు చూసారు. ఎవరికైనా కాళ్ళకి గాయాలున్నాయాని. ఆలోచనలో పడిపోయారు.
ఆ గ్రామంలోని వయసులో పెద్దైన, అనుభవజ్ఞులైన అయిదుమంది పెద్దలతో ఆ న్యాయపీఠం ఏర్పడింది. వాళ్ళలోని గంగాధరంగారు “పరందామయ్యా, ఇప్పుడు ఏమిటి దారి. బాధితురాలు ద్వారా తప్ప దోషిని పట్టుకునే అవకాశం లేదనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఆశ లేదు. పార్వతి, అతనెవరో తెలియదంటుంది. ఎవరా వ్యక్తని తెలుసు కోలేక పోయాం..ఏ అవకాశమూ కనబడటం లేదు. ఏం చేద్దాం.” అనడిగారు.
ఇంకో సభ్యుడు మాధవయ్య “సరే, ఇప్పుడెలాగూ దోషిని కనిపెట్టే ఆస్కారం లేదు కాబట్టి…అతనిని పార్వతి కనిపెట్టినప్పుడు శిక్ష విషయం ఆలోచిద్దాం. ఇహ ఇప్పుడు మిగిలిన కార్యక్రమాలు కానిద్దాం. పార్వతి వల్ల ఆ కుటుంభం అపవిత్రం అయిపోయింది కాబట్టి మాలకారి దేవుడి కైంకర్యానికి రాఘవ శాస్త్రి అయోగ్యుడు. ఇకనుంచి సుందరానికి ఈ పనిని అప్పగిద్దాం.‘‘ ఎప్పటినుంచో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మాధవయ్య ఇప్పుడు వదులుకో దలచుకోలేదు. తన బావ మరిది సుందరం చాలా బాగా కొత్త కొత్త పద్దతుల్లో పూల మాలలు కడతాడు. కానీ, అతనికి సరియైన ఉపాది లేదు. పోని ఇక్కడ దేవుడి కొలువు దొరకటానికి రాఘవయ్య అడ్డుగా ఉన్నాడు. తరతరాల నుంచి అతని వంశం వారే ఈ కైంకర్యం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటనని మాధవయ్య ఉపయోగించుకో చూసాడు.
అతని మాటలు జగన్నాధాచారికి అభ్యంతరకరంగా తోచింది. ‘‘ఇది సబబుగా తోచడం లేదు. ఎప్పటినుంచో దేవుడి సేవలో ఉన్న శ్రీమాన్ పరాంకుశంగారి వంశజుల మునిమనుమడైన రాఘవశాస్త్రి గారిని పనిని మాన్పించటం తప్పు. ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన మీ మేనత్త ఎవరితోనో లేచిపోయినప్పుడు మీ నాయన గారిని, దేవుడి రామానుజకూటం వంట పనులు నుండి ఈ కమిటీ దూరం చేయలేదు కదా. చిన్న ప్రాయశ్చిత్తంతో ఆకుటుంభాన్ని వదిలేశారుకదా. గుర్తులేదా. ‘‘  అంటూ కొంచెం ఘాటుగానే అన్నాడు.
జగన్నాధాచారి గారి మాటలు మాధవయ్యని చురుక్కుమనిపించాయి. అయినా ‘‘ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ముందు మాట. ఇప్పుడు మరీ గుర్తుచేసుకుని చెప్పక్కర్లేదు. కాలం మారలేదూ? అయినా ఆ విషయం ఈవిషయం ఒకటేనా ఏమిటి? మరీ చెప్పుకొచ్చారు!‘‘ అంటూ సాగదీశాడు. ‘‘సరే! జరిగిన సంగతులు ఇప్పుడెందుకు గానీ, ఎంతైనా దేవుడి పని కదా, ఏదో ప్రాయశ్చిత్తంతో రాఘవ శాస్త్రి గారిని విధులకు అంతరాయం లేకుండా చేద్దాం. పార్వతికి ఆమె తల్లి తండ్రికి పుణ్యావాచనం, ప్రాయశ్చిత్తం నిర్దారించండి.‘‘ అన్నాడు గోపాలంగారు.
ఆ నలుగురు న్యాయపీఠం సభ్యులు చెప్పిన దాన్ని విని పరంధామయ్య ఆలోచనలో పడ్డాడు. దూరంగా ఉన్న ఆండాళు, వయసుతో వచ్చిన వడిలిన శరీరానికి, ఊతకర్ర సహాయం చేసుకుని నెమ్మదిగా రచ్చబండ మీద కూచున్న పెద్దల దగ్గరగా వచ్చింది. ‘‘ఏమయ్యా, పెద్దమనుషులు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేమయినా న్యాయంగా ఉందా? తప్పెవరు చేశారూ, శిక్ష ఎవరికి వేస్తున్నారు? దోషి పట్టుబడనంత మాత్రాన వాణ్ణి వదిలేసి ఇప్పటికే జరిగిన ఘోరానికి బాధ పడుతున్న వారికా ప్రాయశ్చిత్తము గురించి మాట్లాడుతున్నారు.‘‘ అంటూ అందరిని కడిగేసింది. ఆమె ధాటికి కొద్దిగా జంకారు ఆ నలుగురు.
‘‘మరి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇంత దుశ్శహాసానికి పాల్పడ్డవాడు దొరికితే బాగుండేది.‘‘ అయోమయంగా అన్నాడు గంగాధరం. ‘‘పెద్దమ్మా, నీవెళ్ళి కూచో. మేమున్నాం కదా. న్యాయంగానే పరిష్కరిద్దాం‘ అంటూ గోపాలం గారు ఆవిడకు సర్ది చెప్పారు. సణుక్కుంటూ అక్కడే ఓ పక్కగా కూర్చుండి పోయింది ఆండాళు.
చుట్టూ ఉన్న వాళ్ళల్లో గుసగుసలు మొదలయ్యాయి. గట్టి చర్యలు తీసుకోక పోతే, గ్రామంలో ఇలాంటి అరాచకాలు ఎక్కువ కావా. ఆడపిల్లల్ని అడ్డూ అదుపు లేక బయటకు వెళ్ళనిచ్చే తల్లితండ్రులకు బుద్ది రావాలిగా… అంటూ తలా ఒకరకంగా మాట్లాడుతున్నారు. మాధవయ్య జనాల్లో ఉన్న ఆయన మేనల్లుడు భాస్కర్కి కనుసైగ చేసాడు. ‘‘అవునవును.. ఊరంతా నియమం నిష్టలు లేక పిల్లలంతా బరితెగించి పోతారు. ఇంతవరకూ మన అంబాపురానికున్న మంచి పేరు పోతుంది. తగిన శిక్షలు వేయాల్సిందే. మన ఊరి ఇలవేల్పు భ్రమరాంభికాదేవి ఇలాంటి ఘాతుకాన్ని సహించదు‘‘. అంటూ అందర్నీ రెచ్చగొట్టాడు. జనాలంతా అవునవును అంటూ వంత పాడారు.
‘‘అందరూ అలాంటి అభిప్రాయంలో ఉంటే మనకు గత్యంతరం లేదు మరి. మీరేమంటారు‘‘ అంటూ మాధవయ్య గంగాధరం వేపు చూస్తూ అన్నాడు. ‘‘తప్పదుగా ప్రజలు మాటే మనమాట‘‘ అంటూ గంగాధరం తలూపాడు. ఆ అయిదుగు సభ్యుల్లో ముగ్గురూ అవునవునంటూ వంత పాడారు.
పరంధామయ్యకీ, జగన్నాధం గార్కి వాళ్ళమాటలు అంతగా నచ్చలేదు. ‘‘మీరంతా కాస్త నిశ్శంబ్దంగా ఉంటే సరియైన నిర్ణయం తీసుకునే వీలవుతుంది. అందరి గురించి ఆలోచించే న్యాయ బద్దంగా తీర్పు చెప్పబడుతుంది.‘‘ అక్కడున్న వారితో అన్నారు.
‘‘ఇంకా ఏం నిర్ణయం తీసుకోవటం ఏమిటీ, ముందు నుంచీ ఉన్నదేగా. బలత్కరించిన వాడు దొరికితే, పార్వతి వివాహం జరిపించడం తప్పదుగా. ఆపిల్ల జీవితం చక్కదిద్దాలంటే, ఓ దారి చూపించాలంటే అతడే పార్వతిని పెళ్ళి చేసుకుని తీరాలి. గత్యంతరం కూడా లేదు. ఒకవేళ వాడు పట్టుబడక పోతే, రాఘవ శాస్త్రి వంశపారంపర్యంగా వస్తున్న మాలకారీ కొలువును వదులుకుని కుటుంభ సహితంగా గ్రామం వదిలి వెళ్ళాలి. తీసేయకూడదన్నారుగాని. దేవుడి కైంకర్యమాయే, మరి అతడు ఎలా నిర్వహిస్తాడు. మరో మార్గం అంటే, ఆయన కుటుంభానికి ప్రాయశ్చిత్తం చేసి దోష నివారణ చేసి, ధనదండ శిక్ష వేయాలి. కానీ పార్వతి బతుకేమిటి? ఏ మంటారు‘‘ అని సబ్యులను అడిగాడు మాధవయ్య. ‘‘‘సబబుగా లేదనిపిస్తుంది‘‘ అన్యమనస్కంగా అన్నారు గంగాధరం. ‘‘ అదెలా, ఏ నిర్ణయమైనా దోషి దొరికితేనే కదా తీసుకోగలం.‘‘ జగన్నాధం అడ్డుపడ్డాడు.
‘‘నిజమే కాని అప్పటి వరకూ రాఘవ శాస్త్రిగారి పని ఆపలేం కదా. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అదీ కాక వాడు ఎప్పుడు దొరుకుతాడో తెలియడం లేదు. అందుకని మిగిలిన కార్యక్రమాలు కానిచ్చి సభను ముగిస్తే సరి. అంతకంటే వేరేదారి కనపడ్డం లేదు.‘‘ గంగాధరం జవాబిచ్చాడు.‘‘‘అవునవును‘‘  అంటూ అక్కడున్న వారిలో సగం మంది ఆయనతో ఏకీభవించారు. వారి మాటలు వింటూ పార్వతి భవిష్యత్తు ఘోరంగా కనబడుతుంటే మనసులోనే రోదిస్తున్నాడు రాఘవశాస్త్రి. జానకమ్మ ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లే స్థితిలో ఉంది.
పార్వతి నెమ్మది నెమ్మదిగా పరిస్థితిని గ్రహిస్తుంది. ఆలోచించటం మొదలు పెట్టింది. ‘ఎవరు ఈఘోరం చేసింది. ఏమాత్రం గుర్తుకు రావటం లేదు. సూచనా మాత్రంగా కూడా ఆవ్యక్తిని పోల్చుకునే ఆధారం దొరకటం లేదు. ఎలా కనిపెట్టాలి‘ అనుకుంటూ తన భవిష్యత్తు ఏమిటి? ఎంతగానో ప్రేమించిన బావతో, త్వరలో వివాహం చేయాలనుకునే తల్లీతండ్రీ, అత్తయ్య ఎంత బాధ పడతారో. బావకి ఇలా జరిగిందని తెలిస్తే…. తనను క్షమించి మన్నించగలడా? తన తప్పు లేదని నమ్ముతాడా? అయినా ఎవరో దుర్మార్గుడు వల్ల తను శిక్ష అనుభవించాల్సి రావటం ఏమిటనే ఊక్రోషంతో ముఖం ఎరుపెక్కింది. ఇలా అందరి ముందూ తానే తప్పు చేసిన దానిలాగా నిలబడాల్సి వస్తుంది. తనవల్ల అమ్మా నాన్న కూడా అవమానాన్ని ఎదుర్కుంటున్నారు. ఇంతకింత పగ తీర్చుకుంటాను వాడు కానీ దొరికితే‘ అని బాధ పడుతున్న పార్వతి రచ్చబండ దగ్గర జరుగుతున్న చర్చ వినబడటం లేదు.
‘‘అయితే మరి పరంధామయ్య గారు, పుణ్యావచనం, ప్రాయశ్చిత్త హోమం చేసి, గంగ తీర్త స్నానాధికాలతో కార్యక్రమం పూర్తి చేద్దాం. ఏమంటారు‘‘ అంటూ అడిగాడు గంగాధరం. అందరు పెద్దలు అతని మాటకు సరే నన్నారు. ‘‘అలాగే తండ్రిగా ‘ధన దండన శిక్ష‘ కూడా రాఘవశాస్త్రికి తప్పదు.‘‘  అంటూ మాధవయ్య జోడించాడు. ‘‘అతను ఎక్కువ ఇచ్చుకోలేడు కనక, ఏదో చిన్న మొత్తాన్ని దేవాలయ హుండీలో వేయమని చెబుదాం‘‘. అంటూ గోపాలం సూచించాడు. ఆ మాటలు నచ్చకున్నా ఎక్కువ ఏమి అనలేక పోయాడు మాధవయ్య. పరంధామయ్యకు జరుగుతున్న చర్చా, శిక్షల నిర్ణయాలు ఏమాత్రం నచ్చటం లేదు. ‘‘చూడండి. ఇలా మాట్లాడటం ధర్మం కాదు. తప్పు చేసింది ఎవరో. మనం అపరాధం చేసిన వారికి కాక శిక్షలు వేస్తున్నది బాధితులకు. ఇదెక్కడి న్యాయం. ఆలోచించండి.‘‘ అంటూ తన అభిప్రాయం చెప్పాడు.
‘‘అవును, నీవన్నది సమంజసంగానే ఉన్నది. కానీ ఇక్కడ శాస్త్రి గారు దేవుడి సేవకు అపవిత్రంగా వెళ్ళలేడు కదా. అందుకని అయినా, ఆ కుటుంభానికి పుణ్యావచనం తప్పదు. ఇక కొద్ది మొత్తం దండనగా దేవుడికి సమర్పించటం వల్ల దోషం కూడా పోతుందని నా భావన.‘‘ గోపాలం గారు వివరించారు. దానికి పరందామయ్య ఏమీ అనలేక, మనసుకు కష్టంగా ఉన్నా, న్యాయపీఠం సభ్యుల నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చింది.
అక్కడున్న యువకులంతా హోమానికి సిద్దం చేశారు. ముందుగా పుణ్యావచనం కార్యక్రమం కోసం బ్రాహ్మణులు అన్నీ సిద్దం చేసారు. పార్వతిని శాస్త్రి గారిని జానకమ్మని బావి దగ్గర తలమించి నీళ్ళు పోసుకుని హోమం దగ్గరికి రమ్మని చెప్పాడు పూజారి ఆంజనేయశాస్త్రి. బావి దగ్గర నాలుగు బొక్కెనల నీళ్ళు తల మీద గుమ్మరించుకుని రాఘవశాస్త్రి వెళ్ళగానే తల్లీ కూతుర్లు కూడా తలమించి స్నానం చేశారు. ఆండాళు ఒక శాలువా తెప్పించి పార్వతికి కప్పింది. ఆ కార్యక్రమాన్ని పూజారి తదితరులు ప్రారంభించి హోమగుండంలో మంత్రోశ్చారణుల మధ్య అగ్నిని ప్రజ్వలింప చేసారు. తలవంచుకుని తప్పు చేసిన వాడిలా నడుస్తున్న రాఘవ శాస్త్రి గారితో కలిసి తల్లీ కూతుర్లు తడి బట్టలతో అక్కడికి వచ్చారు. ఆండాళు పార్వతికి సహాయంగా పక్కనే నిలబడింది.
హోమం దగ్గర పూజారికి సహాయంగా నిలబడ్డ ధనుంజయుడు ఒక్కసారిగా మండుతున్న హోమ గుండలో పడ్డాడు. శరీరం పడకుండా చేతులతో ఆపటానికి ప్రయత్నించాడు. హోమం కోసం ఆజ్యపు గిన్నెని పట్టుకున్న అతని చేతులు అగ్ని ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో ఆజ్యంతో పాటు పడ్డాయి. ఇంకేం అగ్నికి ఆజ్యం తోడైనట్టు, నెయ్యిలో మునిగిన అతని చేతులు హోమం మంటతో సహా మండడం మొదలెట్టాయి. ఆ మంటకు దిక్కులు పెక్కుటిల్లేట్టు అరుస్తున్నాడు. చేతులు పైకి తీసేసరికే రెండు అరచేతులూ అగ్నికీలలతో ఎగిసి పడుతున్నాయి. అనుకోని ఈ అవాంతరానికి దిక్కుతోచని పూజారి కలశంలోని నీటిని అతని చేతులపై పోయబోయాడు. అక్కడే ఉన్న మాధవయ్య పరుగున వచ్చి కొడుకు ధనుంజయని పట్టుకున్నాడు. ‘‘ఏ పార్వతీ కలశం తీసుకుంటావేమిటి వీడి చేతులు కాలి పోతున్నాయి. దాంలోని నీటిని చేతులమీద పోయ్యి. త్వరగా‘‘ అంటూ అరుస్తున్నాడు. అప్పటికే పార్వతి పూజారి చేతిలో నుంచి కలశం లాక్కుంది. ఆమె ముఖం ఖణ ఖణ మండే అగ్ని గోళంలా రగులుతుంది.
‘‘కాలనీ, బూడిదవనీ, చేసిన పాపం ఊరికే పోతుందా. నా బతుకుమీద మాయని మచ్చ వేసాడు. పశువులా నన్ను హింసించాడు. నన్ను తాకిన చేతులు మండిపోనీ, వాడికీ జీవితమంతా గుర్తుండే మచ్చపడని. అవిటివాడవని. ఆ భ్రమరాంభికాదేవి శిక్ష వేయకుండా ఉంటుందా‘‘ కోపంతో రొప్పుతూ అరుస్తుంది.
‘‘ఏమైందమ్మా, అమ్మ శిక్ష వేసిందా! ఎందుకు?‘‘ అంటూ గోపాలంగారు మిగిలిన పెద్దలూ అక్కడికి వచ్చారు.
‘‘అవును, ఆ పాపాత్ముడు వీడే. నన్ను నా జీవితాన్ని నాశనం చేసింది ఇతడే‘‘ అంటూ కోపంతో కన్నీళ్ళతో ఏడుస్తూ అంటోంది. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ పార్వతి మతిగాని పోయిందా? నాకొడుకు నీ మీద అఘాయిత్యం చేసాడా? వాడు అమాయకుడు అనవసరంగా మాట్లాడకు‘‘ అంటూ కోపంతో అరుస్తూ, తన మేనల్లుడు భాస్కర్ తెచ్చిన గంగాళంలోని నీటిలో కొడుకు కాలుతున్న చేతులను పెట్టాడు. మంటకు తాళలేక ఏడుస్తున్నాడు ధనుంజయుడు.
‘‘ఏమయింది పార్వతీ, ఇంతవరకూ ఎవరో తెలియ దన్నావు. ఇప్పుడు ఇతడే అంటున్నావు. ఎలా? ఏ ఆధారాలతో చెబుతున్నావు?‘‘ అంటూ పరంధామయ్యగారు ఆమె దగ్గరగా వెళ్ళి అడిగాడు.
ఆమె ధనుంజయ దగ్గరగా వెళ్ళింది. భయంగా చూసాడు ఆమె వైపు. వంగి మండుతున్న చేతులను నీటిలో ఉంచి నిలుచున్న అతని పైన అంగవస్త్రం కింద పడిపోయింది. నగ్నంగా ఉన్న అతని ఛాతీ అంతా రక్తపు గీరికలు. బయటపడ్డ యజ్ఞోపవీతానికి తగులుకుని మెరుస్తున్న పార్వతి బంగారు ఉంగరం వేలాడుతుంది. ఆమె ఉంగరాన్ని ఊరు ఊరంత గుర్తుపడతారు. చాలా ప్రత్యేకంగా కనబడేది. పొడుగు దోసపలుకు ఆకారంలో ఉన్న కెంపు తొడిగిన బంగారు ఉంగరం అది. ఆమె వేలు సగ భాగాన్ని కప్పివేసేది. ఆమె నానమ్మగారు అవసాన దశలో తన ఉంగరాన్ని తీసి పార్వతికి వేలుకి ఆమె బావ శంకరంతో తొడిగించింది. ఇద్దరికి పెళ్ళి చేసేట్టు కూతురు సీతమ్మ, కొడుకు రాఘవ శాస్త్రి గారి దగ్గర వాగ్దానం చేయించుకుంది. ఈ సంగతి ఊరంతా తెలుసు.
అంతకుముందు, స్నానంచేసి హోమగుండం దగ్గరికి వచ్చిన పార్వతికి అక్కడే నిలుచున్న ధనుంజయ ఉత్తరీయం కిందుగా వచ్చిన యగ్నోపవీతం, దానికి చిక్కుకున్న ఆ ఉంగరాన్ని చూసింది. ఆ ఉత్తరీయంతో తన పై భాగాన్నంతా కప్పేసుకున్నాడు. అతడే ఈ ఘాతుకానికి బాధ్యుడని తెలిసిపోయింది. పట్టరాని కోపంతో అతన్ని హోమగుండలోకి తోసింది. అదంతా పక్కనే ఉన్న ఆండాళు చూస్తూనే ఉంది. వాడిని అలా శిక్షించే హక్కు పార్వతికి మాత్రమే ఉందని బలంగా నమ్మింది. చెప్పకనే అందరికీ అర్థమై పోయింది. తప్పు దొరికి పోయినందుకు తన దగ్గరికి వచ్చిన పార్వతిని భయంగా చూస్తూ నిటారుగా నిలబడిపోయాడు. ధనుంజయ చెంపలు బలంగా వాయించింది. రాఘవశాస్త్రి ఆమెని ఆపుతూ శాంతింప చేస్తున్నాడు.
‘‘ఏంటి, అలా కొడుతున్నావు. నీవు అతన్నే వివాహం చేసుకోవాలి. నీకు మరో గత్యంతరం లేదు. లేదంటే కులటలా ఈ ఊరు విడిచి నువ్వు నీ కుటుంభం బయటకు నడవాల్సి వస్తుంది. నీ దూకుడు తగ్గించు కోవటం మంచిది.‘‘ అంటూ మాధవయ్య కోపంగా చూశాడు పార్వతి వైపు. ఆమె అపర కాళిలా ఊగిపోతుంది. ‘‘ఎవడ్ని చేసుకునేది? ఈ దుర్మార్గుడినా? ఎందుకు చేసుకోవాలి.‘‘
గోపాలంగారు పార్వతిని శాంతపరుస్తూ ‘‘చూడమ్మా, నీ జీవితం పాడై పోతుంది. నిన్ను ఎవరు చేసుకుంటారు. మీ తండ్రి గారు నీ బాధ్యత తీర్చుకోవాలికదా. నీ బతుకుని పాడుచేసినందుకు అతను నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోరాదు. అది అతనికి శిక్ష. పెళ్ళి చేసుకోక పోయినా శిక్ష పడుతుంది. అలా కాదంటే నీ తల్లితండ్రులతో పాటు గ్రామ బహిష్కరణ తప్పదు.‘‘  
‘‘అతనికి శిక్షా, నాకా? నేనేపాపమూ చేయకుండా నా తప్పు లేకుండా అన్యాయంగా బలైన నాకెందుకు శిక్ష మరి. ఆడవాళ్ళ పట్ల గౌరవం లేని ఈ పశువుకన్నా హీనమైన వీణ్ణి, నీతి లేనివాణ్ణి చేసుకుని నేను నా జీవితాంతం వీణ్ణెందుకు భరించాలి. పశువు కూడా బలవంతంగా జతకట్టవు. వీడిని పశువుతో పోల్చినా తప్పే. నేనెందుకు చేసుకోవాలి. ఏ ధర్మ శాస్త్రం లో చెప్పబడింది. నేను వీడిని చంపి, ఈ అగ్నిగుండంలో దూకనైనా దూకుతాను కానీ వీడిని చేసుకోను.‘‘ ఆమె కోపం పట్టలేక పోతుంది.
‘‘అవును, నీవు ధనుంజయని పెళ్ళి చేసుకోవలసిందే. ఈ గ్రామ కట్టుబాట్లను కాదనడానికి వీల్లేదు. మేమంతా చూస్తూ ఊరుకోము. ఈ ఊర్లో ఇలాంటి అఘాయిత్యాలు ఇంకోసారి జరగకూడదు. ఇక్కడ నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు.‘‘ అంటూ భాస్కరం కల్పించుకుంటూ కోపంగా అన్నాడు.
‘‘ఎందుకు పనిలేదు? తనే ఎలాంటి నిర్ణయం తీసుకోవటానికైనా అర్హురాలు. ఎందుకంటే తానే బాధితురాలు కాబట్టి. తానే ఎక్కువ నష్టపోయింది కాబట్టి. పార్వతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె శరీరాన్ని, మనసుని గాయపరచి, అవమానించినందుకు ఆమే వాడికి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. అతన్ని శిక్షనుంచి విముక్తుణ్ణి చేయటానికి మాధవయ్య మామయ్య చాలానే ప్రయత్నిస్తున్నారు. పార్వతికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, ఆమెకో జీవితాన్ని ఇవ్వటానికి, ఆమె కాపురాన్ని నిలబెట్టాలని చూడాలని ధనుంజయని దోషిని చేయకుండా, వివాహం చేయటం ధర్మ మనుకుంటుంన్నారు. మరో దారి లేదని దానికో ముద్ర వేస్తున్నారు. తరతరాలుగా ఈ సంఘంలో జరుగుతున్న పురుషహంకార అరాచకమిది. ఏతప్పు జరిగినా ఆమెని కళంకిని, అపవిత్రురాలు, పతిత అనే ముద్రలు వేసి ఆడదాన్నే దోషిగా చేయటమనే జాడ్యం జీర్ణించుకుపోయింది. కానీ, ఒక ఆడపిల్లని పైశాచికంగా బలత్కరించి, శారీరక మానసికంగా హింసించిన వాడితో పెళ్ళి చేసుకోవటమంత ఘోరం మరోటి ఉందా ఆ అమ్మాయికి? జీవితాంతం ఈ జరిగిన సంఘటన తలుచుకుంటూ చిత్రవధ అనుభవించే జీవితశిక్ష ఆమెకెందుకివ్వాలి? ఆమె బాధితురాలా? దోషా? శిక్ష ఎవరికి‘‘
ఎక్కుపెట్టిన బాణాల్లాంటి మాటలు అంటున్నదెవరా నని అందరూ వెనక్కి తిరిగి చూసారు. శంకరం నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి మాధవయ్య ఉలిక్కి పడ్డాడు. అయినా ధైర్యం కూడదీసుకుని ‘‘చాల్లే కుర్రకుంకవి, ఏదో పెద్దచదువులు చదివానని, మామీదే నీ ప్రతాపం చూపించకు. ఎప్పటినుండో వస్తున్న మా ఊరి సనాతన ధర్మాలను కాదనటానికి నువ్వెవరు? అంబాపురం ధర్మ పీఠం, వారి న్యాయ నిర్ణయాలంటే చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో దడ. అలాంటిది మా నిర్ణయాన్నే తప్పుపడతావా?‘‘ అంటూ హూంకరించాడు.
‘‘బాబాయ్, ఇక చాలు, నా చదువు సంస్కారం, మంచేదో చెడేదో నాకు నేర్పింది. ఆ జ్ఞానమే ఈ వివరణ ఇచ్చింది. ఇది కాక చాలా విషయాలు చెప్పగలను నీగురించి.  నీ పెంపకాన్ని, నీ ధర్మపీఠం అధికారాన్ని ఆసరా చేసుకుని ఎంతమందో అమ్మాయిల జీవితాలను నాశనం చేసి బయటపడకుండా వాళ్ళని గంగలోకి తోసారు. పోలీసుల జోక్యం లేదుకాబట్టి పట్టుపడలేదు నీ కొడుకు, నీ మేనల్లుడు. కానీ ఎప్పటికైనా పాపం పండక పోదు. అవన్ని బయట ఊళ్ళల్లో చేసారు కాబట్టి ఈ ఊరివరకు రాలేదు. చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇక పోతే, నీ గురించి. మా మామయ్య మాలకారి పనిని నీ బావమరిదికి ఇప్పించే కుట్రే ఈనాటి సంఘటన. పార్వతిని అడ్డుపెట్టుకుని, కోడల్ని చేసుకుంటే మెల్లిగా మామయ్య మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్నించి ఆ కైకంర్యాన్ని నీ చేతుల్లోకి తీసుకునే కార్యక్రమే ఇది. ఒకవేళ పార్వతి పెళ్ళికి నిరాకరిస్తే ఆ కుటుంభాన్ని గ్రామ బహిష్కరణ చేయించినా ఆ కొలువు మీదే కదా. ఈ మొత్తం గ్రంథం నీ కొడుకు, నీ మేనల్లుడు తో కలిసి రచించావు. అంతే కాదు, నీవు చెన్నపట్నం లోని బ్రిటిష్ అధికారిని కలిసి ఇక్కడిభూములు, వారికి ధారాదత్తం చేయాలనే నీ దురాలోచన కూడా నేను ఆధరాలతో సహా తీసుకొచ్చాను. చాలా? నీవి, నీ పిల్లల అరాచకాలను గురించి ఇంకా చెప్పాలా?‘‘ ఊరందరి ముందు మాధవయ్య బాగోతం వినిపించాడు శంకరం.
తాను ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన ఈ ప్రయత్నం ఇలా ఊరందరి ముందు బయటపడిపోవటం మాధవయ్యకి, ధనుంజయకి, భాస్కరానికి మతులుపోగొట్టాయి. ఏం మాట్లాడి తనని తాను సమర్థించుకోవాలో అర్థం కాలేదు మాధవయ్యకి. అయినా ‘‘ఏం టబ్బాయ్ చిన్నంతరం పెద్దంతరం లేకుండా, న్యాయపీఠం సభ్యుడనని కూడా చూడకుండా అవాకులు చెవాకులూ పేలుతున్నావ్. ఇదేం బాగాలేదు. మాట్లాడరేం గంగాధరం గారు, గోపాలం గారు.  జనార్దనం గారు మీరు చూస్తూ ఊరుకుంటున్నారు‘‘ అని  పీఠం సభ్యులందరిని అడిగాడు తనను సమర్థిస్కారేమోనని.
‘‘నీవు కాసేపు మాట్లాడకు మాధవయ్యా, నీవిపుడు సభ్యుడివి కాదు. ముద్దాయి తండ్రివి. మమ్మల్ని నీ కొడుకుతో మాట్లాడనీ.‘‘ అంటూ జనార్ధనం అతని నోరు మూయించాడు.
‘‘ధనుంజయ్, ఇప్పుడు చెప్పు, తనని ఈ రోజు తెల్లవారు ఝామున అమ్మవారి తులసి తోటలో తనను నీవు అమానుషంగా బలత్కరించావవి నీ మీద అభియోగం మోపింది పార్వతి. దానికి సాక్షంగా నీ యగ్నోపవీతానికి ఆమె ఉంగరం తగులుకొని ఉండటం, నీ చిటికెనవేలు చిట్లి రక్తం రావటం, నీ చేతులు, వంటిమీద పార్వతి గోర్ల గుర్తులుండటం ఆమే నిన్ను దోషి అనటానికి సాక్షాలుగా కనబడుతున్నాయి.‘‘ దీనిమీద నీవు చెప్పాల్సింది ఏమైనా ఉందా?‘‘ అని గోపాలంగారు అడిగారు.
రెండుచేతులు బొబ్బెలెక్కగా, విపరీతమైన మంటతో మాట్లాడలేక పోతున్నాడు ధనుంజయుడు. ‘‘నేను చాలా తప్పు చేసాను. క్షమించుమని అడిగలేనంత పెద్ద తప్పే చేసాను. నేను మారిపోయాను. నన్ను నమ్మండి, మీరంతా అనుమతిస్తే పార్వతిని వివాహం చేసుకుంటాను. నా వల్ల ఆమె జీవితం బలవకుండా కాపాడుతాను. నాకిక ఏ శిక్షా వేయకండి. అమ్మవారే నాకు సరైన శిక్ష వేసింది. నన్ను క్షమించి నాకు ఒక్క అవకాశ మివ్వు పార్వతి‘‘. ఏడుస్తూ అంటున్న ధనుంజయుడ్ని చూసి మాధవయ్య లోలోన మెచ్చుకుంటున్నాడు. తను అనుకున్నట్టుగా తన కొడుకు చేస్తున్నాడని, అంతా సవ్యంగానే జరుగుతుందని, ధర్మపీఠం వాడి మాట నమ్మి వివాహం జరిపించటం, తన గుప్పిట్లోకి రాఘవయ్య కుటుంభం చిక్కుతుందని, శంకరాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చననే ఆలోచనలతో ఉన్నాడు.
పార్వతి శంకరానికి తన ముఖాన్నిచూపించలేక చేతుల్తో ముఖం దాచుకుని కింద కూలబడి పోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ధనుంజయుడు క్షమించమని అడుగుతూ ఆమె దగ్గరికి రావటం తో, కోపాన్ని ఆపుకుంటూ అతని చెంపలు వాయించింది. ‘‘నువ్వు నన్ను కాపాడుతావా? నీవే ఒక వేటగాడివి. నీ వల్ల పాడై పోయిన ఎంతమంది అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటావు. ఛీ.. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ఫో అవతలకి. ఇంకా నాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు.‘‘ అంటూ వెక్కి వెక్కి ఏడవ సాగింది.
ఆండాళు, పార్వతి దగ్గరికి వచ్చి ‘‘నిజమే నమ్మా, వీడు ఊళ్ళో ఉండదగిన వాడు కాదు. నీవు చేసుకోవాల్సిన అవసరమూ లేదు‘‘ అంటూ ఓదార్చింది. పరుగున దగ్గికి వచ్చి అక్కున చేర్చుకున్నాడు శంకరం. ‘ఏడవకు పార్వతి, నీవే తప్పు చేయలేదు. నీకు నేనున్నాను.‘‘ అంటూ ఆమెను ఊరడించాడు.
‘‘మామయ్యా, నిన్ననే పరీక్షలయిపోయాయని ఇక్కడికి బయలుదేరుదామని అమ్మా నేను అనుకుంటున్నాము.   ఇంతలో ఇలా జరుగుతుందని అనుకోలేదు. జరిగిన విషయాలని మనసులో పెట్టుకుని బాధ పడకండి మామయ్యా. అతనికి తగిన శాస్తి జరిగిందికదా. అతన్ని ఏంచేయాలో బాబాయి వాళ్ళు తీర్పు చెబుతారు.‘‘ రాఘవశాస్త్రిగారితో అన్నాడు.
వెనుకనే ఉన్న శంకరం తల్లి, శాస్త్రి గారి చెల్లెలు సీతమ్మ,‘‘అన్నయ్యా, జరిగినదాన్ని పీడకలని మరచి పొండి. పార్వతిని నా కూతురుగా చూసుకుంటాను. నీవు దిగులు పడకు. మంచి ముహుర్తం చూసి పెళ్ళి కానిచ్చేద్దాం‘‘ అన్న చెల్లెలి మాటతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు. సీతమ్మ, ఏడుస్తున్న జానకమ్మను దగ్గరికి తీసుకుని ఓదార్చింది. ఆమె ముఖం దుఃఖం, అవమానంతో దిగులుగా ఉంది.
పరందామయ్య మిగిలిన ముగ్గురూ ఆ ఊరికి వయసుకి పెద్దదైన ఆండాళు కలిసి చర్చించుకుని తమ ధర్మ పీఠం తీర్పును చెప్పారు. ధనుంజయ హోమగుండంలో పడిన విషయం పరందామయ్యకి, కమిటీ వాళ్ళకి వివరించి వాడి శిక్ష ఏవిధంగా వేయాలనే నిర్ణయాధికారం, బాధితురాలిగా పార్వతికి ఉందని, ఆమె ఎటువంటి తప్పు చేయలేదనే విషయాన్ని కమిటీ గుర్తించాలని కరాకండీగా చెప్పింది. అందరూ ఆమె వాదన సమంజసమని వప్పుకుంటూ, ఆ ధర్మపీఠం తీర్పును తీర్మానించింది.
‘‘ఇంతవరకు ఇక్కడ గ్రామ ప్రజలందరి సమక్షంలో జరిగిన విషయాలకు మీరంతా ప్రత్యక్ష సాక్షులు. మేము అందరం కలిసి న్యాయమైన తీర్పును నిరిణయించాం. పార్వతిని అమానుషంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ధనుంజయ బలత్కరించాడు కాబట్టి అతన్ని, అతని కుటుంభాన్ని దోషులుగా పరిగణిస్తూ గ్రామ బహిష్కరణ శిక్షను విధిస్తున్నాము. అపరాధి ఎప్పుడూ తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు దొరికి పోతాడు, తన తప్పుకు శిక్షను తప్పకుండా అనుభవిస్తాడనే రుజువుని ఆదిశక్తి పార్వతీదేవి చూపించింది. అతన్ని బ్రమరాంభికా అమ్మవారు చేసిన తప్పుకు శిక్షను వెంటనే అనుభవింపచేసింది. అయినా శంకరం మాకు అందించిన సమాచారం, ఆధారిత సాక్ష్యాలు పరీక్షించిన మీదట ఈఊరు ప్రజల క్షేమం దృష్ట్యా ఆకుటుంభం అంతా తక్షణమే ఊరువిడిచి వెళ్ళ వలసిందిగా ఊరుమ్మడిగా తీర్మానించాము. రాఘవశాస్త్రి గారి కుటుంభం నిరపరాదులు, వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన అవసరం లేదు. అమ్మవారే ప్రాయశ్చిత్తం కార్యక్రమాన్ని ఆపివేస్తూ విఘ్నాన్ని కలిగించారు. వారు పుణ్యావాచనం వారి గృహంలో చేసుకుని తమ మాలకారి విధులను నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. ఇక పార్వతి, బాధితురాలు. దోషికాదు. ఆమె తన ఇష్ట ప్రకారం తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకి ఉంది. ఆమెని వివాహం చేసుకోవటానికి తమ ఇష్టాన్ని వ్యక్తపరచిన రాఘవశాస్త్రి మేనల్లుడు శంకరం, అతని తల్లిగారు సీతమ్మగారి మంచి మనసును ఈ ఊరంతా అభినందనలు తెలుపుతుంది.‘‘ అంటూ పరందామయ్య గారు చెప్పిన తీర్పుకు గ్రామ ప్రజలంతా హర్షాతి రేకాలతో చప్పట్లు చరితారు.

July 25, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

నాన్నా.. నాక్కొంచెం ధైర్యం యివ్వు

by Madhu Jella July 25, 2024
written by Madhu Jella

నీ చూపులనే
గొడుగగా పట్టి
నా వెంటే నీవున్నపుడు

ఆ గొడుగు నీడలో
నా నడకలు సాగుతున్నపుడు
ఏ భయమూ లేదు
నీవుంటే
నా వెంటే ధైర్యం

నీ తోడుగా…
నాకు తెలియని
లోకాలెన్నో చూసాను
నా రెక్కల గుర్రం నీవే

నా ఎదుగుదలకు
ఉప్పొంగి పోయి
లోకమంతా చాటింపు వేసావు
గర్వంతో..
నా ఉన్నతి
ఉచిత ప్రచారకర్తవు నీవే

మంచి చెడుల మధ్య ఉన్న
చిన్నని గీత ఆనవాలేమిటో
లోకుల తత్వమేమిటో
విశ్లేషించుకొనే
శక్తినిచ్చావు
నీవో మనస్తత్వ నిపుణుడివి గదా..

ఉన్నపుడు పొంగిపోకుండా
లేనినాడు కుంగిపోకుండా
బతకడం నేర్పించావు
బతుకుదారిలో…
నా తోడొచ్చే బాటసారివి నీవే కదా

కఠినంగా… అనిపించినా
నవనీతమువంటి
సున్నితత్వము నీవు

బతుకుబండిని లాగడానికి
ఎన్నెన్ని కష్టాలు పడ్డావో
ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో…

చిన్నప్పుడు నీతో ఉన్న ఙ్ఞాపకాలు
అంతగా గుర్తులేదుగానీ
ఊహ తెలిసిన నాటి ఙ్ఞాపకాలు
మదిపుటలలో
పదిలంగానే ఉన్నాయి

నేస్తంగా..
ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడివో
గురువుగా ఎంత ఙ్ఞానము
పంచావో
ఏమీ తెలియని అనామకునిలా
అమాయకుడిలా
లోకానికి తెలిసిన నీవు
అన్నీ తెలిసిన
ఓ మహాఙ్ఞానివి
మహాయోగివి
నిరాడంబర నిష్కామ యోగివి
నేనెరిగిన సత్యమిదే

నీవు..
యిప్పుడు నా చెంత లేవు
నా కష్టసుఖాలను చూసే..
వినే
ఆప్తులూ.. లేరు
చింత తీర్చే నేస్తాలూ..లేరు

నా ఆనందాలను ఆస్వాదించేవారూ
నా దుఃఖాలకు
ఓదార్పునిచ్చేవారు కరువు
‘నాన్నా’… మరలి రావూ…
నాకు ధైర్యంగా నిలువు
నా బాధ్యతలు..బంధాలలో
తోడై నడువు

నాన్ననైన నేను
నా బిడ్డల తోడుగా
నడిచే
ధైర్యం యివ్వు

July 25, 2024 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మనం మన సమాజం మారేదెప్పుడో ?

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

భగవంతుని దృష్టిలో, సృష్టిలో మానవులంతా ఒక జాతి. సంఘంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు. సంసారపు బండికి రెండు చక్రాలు. సంమాజంలో సగం సగం. ఒక జాతి జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. అన్నాడొక ఫ్రెంచి దేశీయుడు. మానవ జాతిని సృష్టించే ముందు సృష్టికర్త తననుతాను రెండు భాగాలుగా విభజించుకున్నట్టు చెప్పే అర్ధనారీశ్వర సిద్ధాంతం ఒక భారతీయ సంస్కృతిలోనే ఉంది. ధర్మాచరణలోను, కుటుంబ విధుల నిర్వహణలోను భారతీయ స్త్రీలకున్న విశిష్ట స్థానం మరే ఇతర దేశాల ప్రాచీన సాహిత్యంలో, పురాణ గ్రంథాల్లోను కనిపించదు. ”యత్ర నార్యన్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” అంటే స్త్రీలు గౌరవించ బడిన ఇల్లల్లో దేవతలు విహరిస్తారు అన్న సూక్తులను బట్టి మన ప్రాచీనులు స్త్రీకి సమాజంలో ఎలాంటి మహోన్నత స్థానాన్ని ఇచ్చారో గ్రహించవచ్చు. ”మాతృదేవోభవ” అని ముందు తల్లికి, ”పితృదేవోభవ” అని తండ్రికి, ఆ పిదప = ”ఆచార్యదేవోభవ” అని గురువులకు నమస్కరించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇంకా సరస్వతీదేవి మనకు చదువుల తల్లి. లక్ష్మీదేవి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చే తల్లి, పార్వతీదేవి శక్తి స్వరూపిణి, అందరినీ రక్షించే అమ్మ. ఈ ముగ్గురు మనకు ”మూలదైవాలు”. దీన్ని బట్టి మనదేశంలో, మన సమాజంలో స్త్రీలంటే ఎంతటి గౌరవ ప్రతిపత్తులు, భక్తి భావాలున్నాయో తెలుస్తుంది.

మన ప్రాచీనులు తాము అనుభవించే అన్ని కష్టసుఖాలు స్త్రీల పైనే ఆధారపడి ఉంటాయని భావించారు. ధర్మార్థ, కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలను సాధించడానికి తోడు స్త్రీ కావాలన్నారు. అందుచేత పురుషుడు స్త్రీలను అనుసరించి వారి ఇష్టాలకు అనుగుణంగా తమ అభిమతాలను మార్చుకోవాలని నిర్దేశించారు. ధర్మసంస్థాపన, తద్వారా సంఘ సంక్షేమంలో స్త్రీలకు సమానమైన ప్రాధాన్యత ఉందని భావించారు. స్త్రీ పురుషులలో ఒకరు అధికులు, మరొకరు తక్కువ అనే భావన వారి దృక్పథంలో లేనేలేదు. ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగల ‘నేర్పరి’ స్త్రీయని భావించి ‘గృహలక్ష్మి’గా ఆమెకు మహోన్నత స్థానాన్ని కల్పించారు. విశ్వమంతా స్త్రీమూర్తిగా భావించారు. ఇదే ఒరవడిలో డాక్టర్‌ సి.నారాయణ రెడ్డిగారు తమ ‘ప్రపంచ పదులు’ అనే కవితలో ”ఆకసమే బీజ ప్రదాతగ, అవనియే ఒక ఆదిమాతగ, కాంచగలిగిన మానవునకు జగజ్జనావళి ఒకే కుటుంబం” అని నొక్కి వక్కాణించారు. మన పూర్వీకులు నారీరహితుడైన పురుషుడు పరిమళం లేని పుష్పమని భావించారు. గృహస్థాశ్రమం ఎరుగని పురుషుడు మోక్షానికి అనర్హుడని చెప్పారు. స్త్రీల శ్రేయస్సును కోరుకునే ప్రతి తండ్రి, భర్త, సోదరుడు స్త్రీని గౌరవించాలన్నారు ‘మనువు’. అదే సందర్భంలో ”పితారక్షేతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, రక్షాన్తి వార్ధక్యే పుత్ర, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అనే ద్వంద్వభావాన్ని వెలిబుచ్చారు. ఇది స్త్రీలపై ఉండే ప్రేమ, గౌరవం, కారుణ్యమో తెలియదు. ఏది ఏమైనా ఆధునిక మహిళలకిది చర్చనీయాంశమే. వివక్షా పూరితమైన మహిళల జీవన విధానానికి, కొడుకులు కోడండ్ర నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో మగ్గే స్త్రీలకు, సాంఘిక దురన్యాయాలకు బలయిన వితంతువులకిది చుక్కెదురే. ఈరోజు మనం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, శాస్త్ర, సాంకేతిక, విద్యా వైద్య రంగాలలో, క్రీడా ప్రపంచంలో ప్రగతిని సాధించాం అనుకుంటే అది కూడా పురుషుల కంటె తక్కువే. నేటికీ సమాజంలో స్త్రీ స్థాయి, హోదా ద్వితీయ శ్రేణికి చెందినదే అంటే అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా వేదకాలం నుంచి నేటివరకు స్త్రీ స్థాయి హోదా ఎలా ఉందో పరిశీలిద్దాం.

– వేదకాలంలో పురుషునితో సమానంగా స్త్రీకి స్థానం ఈయబడింది. ఆనాడు స్త్రీలు యజ్ఞ యాగాదుల్లో పాల్గొనేవారు. ధర్మవిధులను పాటించేవారు. యుద్ధ రంగాలకు పోయి పురుషులతో ధీటుగా యుద్ధాలలో పాల్గొనేది. నాటి స్త్రీలు ఆయుధవిద్యను అభ్యసించేది. ఉదా: సత్యభామ, కైకేయి, ఖేలుని భార్య ‘విస్ఫల’ యుద్ధంలో కాలు పోగొట్టుకుంది. ముద్గలుని భార్య ‘ముద్గలాని’ శత్రువులను తరిమి కొట్టింది.

– ఆనాడు స్త్రీలు కవులుగా, ఋషులుగా పేరు పొందారు. భాష, సాహిత్యం, లలిత కళలు అన్నీ స్త్రీలకు అందుబాటులో ఉండేవి. ఘోష, లోపాముద్ర, అపాల, రోమష, సూర్య మొదలైన వారు వివిధ రంగాలలో గణనీయులు.

– పండుగలు, పబ్బాలు, తాత్త్వికమైన చర్చలల్లో వాటి స్త్రీలు పాల్గొనేవారు. ఉపనిషత్తుల కాలంలో ‘బ్రహ్మజ్ఞాన’ సముపార్జన విషయంలో పురుషులతో ‘నమనీయ’గా ఉన్న స్త్రీలు గార్గి, మైత్రేయి,  పదవ ప్రాథితేయి. నాటి విద్యార్థినులు రెండు రకాలు. జీవితాంతం మతశాస్గ్రాన్ని అధ్యయనం చేసేవారు బ్రహ్మవాదినులు, వివాహమయ్యేవరకు విద్యనభ్యసించువారు సద్యోద్వాహులు.

– రుగ్వేదంలో కొన్ని రుక్కులు స్త్రీలు రాశారని చెప్పబడుతుంది. అపాల ఇంద్రున్ని కొనియాడుతూ రుక్కు చెప్పింది. విశ్వావర అగ్నిని స్తోత్రం చేసింది.

– కాశకృత్సవ మీమాంసపై ఉద్గ్రంథం రాసింది.

– ఆత్రేయ వేదాంతాన్ని అధ్యయనం చేసింది. ఆమె గొప్ప పండితురాలు. వాల్మీకి, అగస్త్యుని వద్ద ఆమె విద్యనార్జించింది.

– ఆ కాలంలో స్త్రీలకు ఉపనయనం ఉండేది. ఆ కర్మలలో ఆమె నడుముకు పలుపు కట్టేవారు. కర్మలలో పాల్గొనటానికి ఆమెకు ప్రవేశం కల్పించటానికి అది చిహ్నమట.

– బౌద్ధంలో అనేకమంది స్త్రీలు సంఘంలో చేరి సన్యాస జీవితాన్ని గడిపారు. ”తేరీగాథ” అనే గ్రంథాన్ని అలాంటి స్త్రీలు రచించారు.

– గాథా సప్తశతిలో అనేకమంది కవయిత్రుల పేర్లు కనబడతాయి. రేవ, రోహ, మాధవి, అమలక్ష్మీ.

– సంస్కృత కవుల చరిత్రలో పెక్కుమంది స్త్రీల పేర్లు ఉటంకించబడ్డాయి. ఉదా: మారులా, మోరికా, సుభద్రా, ప్రియదర్శిని, శకుంతల, కాదంబరి లాంటి కావ్యాలలో నాయికలు లలిత కళలలో ప్రవీణులు.

– శాతవాహనుల కాలపు నాయనికా క్రీ.పూ. 2 శతాబ్దం

– వాకాటక వంశపు ప్రభావతిగుప్త క్రీ.త. 4వ శతాబ్దం

– చాణక్య వంశపు విజయ భట్టారిక క్రీ.త. 7వ శతాబ్దం

– కాశ్మీరుకు చెందిన సుగంధ దిద్దా క్రీ.త. 10వ శతాబ్దం పరిపాలనాదకక్షులు.

– వయసు వచ్చిన ఆడపిల్లలు గృహనిర్వహణలో ఎక్కువ బాధ్యత తీసుకునేవారు. శకుంతల, కుంతి విధి నిర్వహణ చేసి అతిథి అభ్యాగతులను ఆదరించారు.

– వేద కాలంలో పురాణ కాలంలో స్త్రీలు ‘కందువ’ క్రీడల్లో పాల్గొనేవారు. బంతి ఆట ద్వారా తగినంత శరీర వ్యాయామాన్ని పొందేవారు.

– సర్వ సామాన్యంగా వేదకాలంలో ఆడపిల్లలు ఇంట్లో పెద్దల వద్ద విద్యను అభ్యసించేవారు. స్త్రీలు ఎక్కువ దూరం వెళ్లి విద్యాభ్యాసం చేయలేదని జాతక కథలను బట్టి తెలుస్తుంది.

– వేదకాలంలో కన్య సామాజిక ఉత్సవాలన్నింటిలో పాల్గొనేది. భర్తను వెతుక్కోవటానికి ‘సమనకు’ వెళ్ళేది. తల్లులు కుమార్తెలను అలంకరించి పంపేవారు. వరులు అచట తమకు కాబోయే భార్యల అభిమానాన్ని చూరగొనటానికి ప్రయత్నించేవారు. ‘సమనలు’ సాధారణంగా వసంత ఋతువులో ఏర్పాటయ్యేవి. యువతీ యువకులు చెట్టాపట్టాలేసుకొని నృత్యం చేసేవారు.

– భారతకాలం నాటికి స్త్రీలు, పురుషులు కలిసి ఆడటం ఆగిపోయింది.

– ధర్మశాస్త్ర యుగం – పురాణకాలం స్త్రీకి అంధకార యుగాలని చెప్పవచ్చు. స్త్రీని చూస్తే భయం, స్త్రీని నిరసించడం, ఆమె స్వేచ్ఛను అరికట్టడం, ఆమెను విద్యా విజ్ఞానాలకు దూరంగా ఉంచడం, ఆమె పురుషుని అంటిపెట్టుకొని బతికేలా చేయడం ఆనాటి పురుషుల చర్యలు.

– ముస్లిం యుగంలో పర్దా అవతరించింది. భార్యలను రక్షించుకోవడమే పురుషుల కర్తవ్యంగా పరిణమించింది. విందులు వినోదాలకు స్త్రీ దూరమయింది.

– వాత్సాయనుని కాలానికి వేశ్యాసంగమం ప్రతిష్టాకరమయింది. 10,12 శతాబ్దాలలో నిర్మితమైన దేవాలయాలలో స్త్రీ పురుష శృంగార ఘట్టాలు చిత్రితమైనాయి.

– రజస్వల అయిన స్త్రీ నాలుగు మూరల దూరంలోను, ప్రసవించిన స్త్రీ ఎనిమిది మూరల దూరంలోను ఉండవలెనని బృహస్పతి నిర్దేశించాడు.

– ఋగ్వేదకాలంలో స్త్రీ బలహీనురాలు కాదు. సాహసి, స్వేచ్ఛాజీవి. ఆమెకు వ్యక్తిత్వం ఉండేది. స్త్రీ శిశు జననాన్ని దురదృష్టంగా భావించిన దాఖలాలు లేవు. కాని పురుష సంతానం కావాలని అనేక రుక్కులున్నాయి. పలుసార్లు పురుష సంతానం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేయబడింది.

– బాలిక హోదా మరీ హీనమైనది కాదు. కాని బాలుని హోదాతో మాత్రం సమానమైనది కాదు (అశ్వలాయన గృహ్యసూత్రం)

– అధర్వవేదంలో గొడ్రాలితనం రాకుండా తాయత్తు, పురుష సంతానం కలగటానికి ప్రార్థన, ఆడపిల్ల వద్దని అభ్యర్థనలున్నాయి.

– బ్రాహ్మణాల కాలం సుమారు క్రీ.పూ. 600 వరకు సాగింది. కుమారునికి విలువ పెరిగింది. కుమారుడు మోక్ష సాధనం. కుమార్తెలు బరువుగా ఎంచబడి బాలిక జననం అక్కరలేదని క్రతువులు చేయసాగారు. ఈ క్రతువులను తైత్తరీయ సంహిత నిర్దేశించింది.

– భార్య సహచరి, కుమార్తె దుఃఖభాడనురాలు, కుమారుడు ఉన్నతోన్నత స్వర్గంలో దీపం. (ఐతరేయ బ్రాహ్మణం).

– పురుష ప్రాధాన్యత గల సమాజాన్ని హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు, హిందూ సంస్కృతి ఊహించాయి, పోషిస్తున్నాయి.

– ”విశీలః కామవృత్తోవా – గుణైవ పరివర్జితః ఉపచర్యః స్త్రీయా స్వాధ్యా సతతం దేవత్పతి” (మనుధర్మశాస్త్రం) అనగా భర్త శీలరహితుడైనను, కామ ప్రవృత్తి కలవాడైనను, ఏ సద్గుణములు లేని వాడైనను, భార్య అతనిని దేవునిగా భావించి పూజించవలెనని భావం.

ఈ విధంగా ఒకప్పుడు స్త్రీ జీవితం ఔన్నత్యంతో ప్రకాశించినప్పటికీ, రానురాను ఆమె జీవితంలో అపశ్రుతులు వెల్లివిరిశాయి. ఆమె హోదా, స్థాయిలలో విపరీతమైన పరిణామాలు కలిగాయి. స్త్రీకి ద్వితీయశ్రేణి పౌరసత్వం అంటకట్టబడింది. ఈ సందర్భంగా భర్త మరణానంతరం వితంతువైన ఒక స్త్రీ జీవితాన్ని ఊహించదు. చాలా కష్టసాధ్యమైన పని. అందుకే ఎంతోమంది సంఘ సంస్కర్తలు అప్పట్లో హిందూ సంప్రదాయంలో అమల్లో ఉన్న ”సతీ సహగమనాన్ని” రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. లార్డు విలియం బెంటింగ్‌, లార్డు కానింగ్‌ మొదలైన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఎంతో ప్రయత్నం జరిగింది. తుదకు 1856లో లార్డు డల్‌ హౌసీ కాలంలో ”సతీ సహగమన నిర్మూలన” చట్టరూపకంగా వెలువడింది. భర్త చనిపోయిన స్త్రీ వితంతువులకు ఎన్నో విధాలైన నిబంధనలను, ఆంక్షలకు మన పెద్దలు, పండితోత్తములు, సమాజం, సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు విధించి అమానవీయ దృక్పథాన్ని చాటడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. సాధారణ సమయంలో కూడా స్త్రీలను గురించిన కొన్ని భావనలు చదువుతుంటే, వింటుంటే సభ్యసమాజానికి తలవంపులుగానే ఉంటాయి. ప్రత్యేకించి స్త్రీల గురించి ఇలాంటి ”వివక్ష వైఖరి” ఎందుకుంది? అనేది సమాధానం లేని ప్రశ్న.

స్త్రీని గురించిన కొన్ని భావనలు :

– ‘అస్వతంత్రా ధర్మే స్త్రీ’ ధర్మంలో స్త్రీకి స్వాతంత్య్రమే లేదు.

– భర్త అనుజ్ఞ లేకుండా చేయబడు వ్రతములు రాక్షసులకు చేరునని స్మృతులు చెప్పుచున్నవి. (హిందూ మతం పుట 143)

– ”స్త్రీలు చంచల చిత్తులు” రుగ్వేదం

– ”స్త్రీ అసత్యానికి మారుపేరు” మైత్రాయణ సంహిత

– ”స్త్రీలు అసత్యం అవతారమూర్తి” రామాయణం

– స్త్రీలు క్రూరులు, స్వార్థపరులు – రామాయణం

– స్త్రీలలో మెరుపు యొక్క చంచలత్వం, ఆయుధం యొక్క పదును, డేగ యొక్క వేగం అన్నీ కలిసి ఉన్నాయి. (రామాయణంలో ‘అగస్త్యుని’ పలుకులు)

– స్త్రీలు మనసును అదుపులో పెట్టుకోలేరు (రుగ్వేదం)

– స్త్రీల దుర్గుణాలను లోపాలను వర్ణించాలంటే నూరు నాలుకలు కల మనిషికయినా నూరే&ండ్ల కాలం చాలదు (మహాభారతం)

– స్త్రీలలో చెలిమి అనేది లేదు. వారి హృదయాలు క్రూరమైనవి. (శతపథ బ్రాహ్మణం)

– ”స్త్రీ, శూద్రుడు, శునకం, కాకి అసత్యానికి, పాపానికి, అంధకారానికి మారుపేరు” (శతపథ బ్రాహ్మణం)

– స్త్రీ పాపానికి మూలం (మహాభారతం అనుశాసన పర్వం)

– స్త్రీ చేత పరిపాలింపబడేదే దేశానికి అపకీర్తి సంభవిస్తుంది. స్త్రీ ఆధిపత్యానికి లొంగే పురుషులు అప్రతిష్ఠ పాలవుతారు (అశోకరుద్ర వ్యాసం).

– మనువు, శుక్రుడు – చాణక్యుడు – యాజ్ఞవల్కు ్యడు స్త్రీని తక్కువ చూపు చూశారు.

– ధర్మశాస్త్రాలు, పురాణాలు స్త్రీలకు ద్వితీయ స్థానం ఇచ్చాయి. భర్త నీడలో బతికే మనిషిగా భార్యను మలిచాయి.

– ఋగ్వేదం, అధర్మవేదం, శ్రౌత సూత్రాలు, గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు, స్మృతులు, ధర్మశాస్త్రాలు వాటి వివరణలో భాష్యాలు మరియు ఇతర గ్రంథాలు, ఇండో ఇరానియనుల వలస – హూణుల శకుల దండయాత్రలు, ముసల్మానుల దాడులు, ముసల్మానుల రాజ్యస్థాపన, పాశ్చాత్యుల దేశప్రవేశం, ఇవన్నీ కూడా హిందూ సమాజంపై ప్రభావం చూపాయి. అంతేకాకుండా, జైన, బౌద్ధ మతాలు కూడా కొంతలోకొంత హిందూ సమాజాన్ని మలిచాయి. స్త్రీల హోదాలో, స్థాయిలో అనేక మార్పుల్ని కలుగజేశాయి. వితంతు వ్యవస్థలో పెనుమార్పులు సృష్టించాయి.

– వేదకాలంలో స్వయంవరాలు ఉండేవి.

– వైదిక వాఙ్మయంలో వర్ణాంతర వివాహాలు కనబడతాయి.

– ఆడపిల్లను అమ్మినవారి సంరక్షకులు ఘోరమైన నరకానికి పోతారని బౌద్ధాయనుడు ప్రకటించారు. ఆడపిల్లను విక్రయించిన వాని ముఖం చూడరాదని పద్మపురాణం శాసించింది.

– భ్రూణ హత్య మహాపాతకమని చెప్పబడింది.

– సుమంగళీ, కళ్యాణీ, గృహలక్ష్మీ, వీరాంగన, సతి, సాధ్వి అని స్త్రీలు పొగడ్తలనందారు. భర్తను కోల్పోయిన స్త్రీని విధవ, వితంతువు అంటూ నీచంగా, హీనంగా చూడడం ఆనవాయితీగా మారింది. బయటి ప్రపంచానికి వారి ముఖం కనిపించగూడదనే ఆంక్షలు మొదలయ్యాయి. వితంతు స్త్రీలు అపశకునంగా పరిగణించబడ్డారు.

– ఏక భార్యాత్వం, ఏక భర్తృత్వం ఋగ్వేద కాలంలో ఉన్న నియమం. వేద కాలం చివరి రోజుల్లో బహుభార్యాత్వం కనబడుతుంది.

– భర్త భుజించిన తరువాత భార్య భోజనం చేయాలని ‘శతపథ బ్రాహ్మణం’లో చెప్పబడింది.

– భార్య భర్త ఆజ్ఞలను శిరసా వహించాలని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.

– రాజులు యోచించు చోట స్త్రీలు ఉండరాదు. పండితుల సమావేశాలల్లో పాలు పంచుకోరాదు.

– గృహ్యసూత్రాల్లో ఒక్క పారాస్కర గృహ్యసూత్రం మాత్రమే బహు భార్యాత్వాన్ని సమర్థించింది.

– బౌద్ధంలో ‘సతీ సహగమనం’ లేదు. పునర్వివాహం ఉంది.

– జైనులలో కొందరు సతీసహగమనాన్ని ఆమోదించారు.

– కాదంబరి రచయిత బాణుడు సతీసహగమనాన్ని నిరసించాడు.

– విధవ నూనె అంటుకొని తలస్నానం చేయరాదని సన్యాసి కారాదని ప్రాచేతనుడు స్కాంద పురాణం (కాశీఖండం)లో విధవ విధులను విశదీకరించాడు.

– భర్త చనిపోయిన స్త్రీ ‘శిరోముండనం’ చేయించుకోవాలనే ఆచారం అమల్లో ఉండేది.

– వేదకాలంలో నాట్యకత్తెలు ఉండేవారు. రాజాస్థానాల్లో నృత్యం చేసేవారు.

– ఆడపిల్లను దేవదాసీలుగా ఇస్తే సూర్యలోక ప్రాప్తి జరుగుతుందని భవిష్యత్‌ పురాణం చెప్తుంది.

ఆడపిల్లను తక్కువగా చూడడానికి కారణాలు :

– మగపిల్లవాడు వంశాంకురం, వంశోద్ధారకుడు – ఆడపిల్ల పరాయిది.

– కర్మకాండ చేస్తాడు, పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు.

– వంశం నిలుస్తుంది – మోక్ష ప్రాప్తి కలుగుతుంది.

– తల్లిదండ్రులకు సంరక్షకుడు – పోషణభారం వహించేవాడు.

– ఇంటా బయట సహాయం చేస్తాడు. కుటుంబ స్థాయి, శక్తి వారిమీదనే ఆధారపడి ఉంటాయి.

– కుటుంబ ఆర్థికాభివృద్ధికి, కష్టకాలంలో ఆదుకోవడానికి, కుటుంబ నిర్వహణకు తోడ్పడతాడు అనే ఎన్నో ఇతర భావనలు వివక్షతకు కారణాలు.

– భార్య చనిపోయిన పురుషున్ని గుర్తించడానికి సమాజం అతనికి ఎలాంటి నిబంధనలను అంటగట్టడం లేదు. ఆడవాళ్లకు మాత్రమే ఎన్నో ఆంక్షలు. మగవాళ్లు పెండ్లిల్లు, పేరంటాలలో (నిక్షేపంగా) కుంకుమ బొట్టు ధరించవచ్చు, ఉంపుడుకత్తెల్ని పెట్టుకొని, ద్వితీయ వివాహం చేసుకొని, నిక్షేపంగా లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చు. వీలైతే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లును నిర్వహించుకోవచ్చు. కొందరు పురుషులు మాత్రం నూలు మొలతాడు తీసివేస్తారట. వెండి మొలతాడును ధరించవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేవు. భర్త చనిపోయిన స్త్రీలను మాత్రం విధవ, వితంతువు, ముండతనం అనే భాషా పదాలను అంటగట్టి అనాదిగా అదీ ఒక సాంఘిక ఆచారంగా, కట్టుబాటుగా తయారుచేసి స్త్రీ శక్తి కుంచించుకుపోవడానికి ఎవరు కారణభూతులు?

– నేటి సమాజంలో మగబిడ్డలను కన్నతల్లి హోదా పెద్దది. మగపిల్లవాడు కుటుంబానికి ఒక పెట్టుబడి. పూర్వీకుల ఆస్తికి వారసుడు.

– ఆడపిల్ల ఆర్థిక భారం, ఆమె పుట్టుక, పోషణ, చదువు, వివాహం, ఉద్యోగం, సంపాదన, కుటుంబ నిర్వహణ అన్నీ సమస్యలే. అందుకే భ్రూణహత్యలు, చెత్త కుండీలల్లో పారేయడం, రైల్వే ట్రాకులల్లో, పొదలల్లో పారేయడం, బతికి బట్టకట్టిన వారిని అమ్మేయడం. ఈనాడు సాధారణ స్త్రీలనే ఎన్నో రకాలైన కష్టాలు, కడగండ్లు చుట్టుముడుతున్నాయి. ఇంకా విధవలు – వితంతువుల అగచాట్లు చెప్పనవసరం లేదు.

– అనాదిగా స్త్రీ శృంగారవస్తువు, విలాసవస్తువు, పడకటింటికి పరిమితం, వంటింటి కుందేలు, శక్తీహీనురాలు, బలహీనురాలు, అబల, సుకుమారీ, ఆటబొమ్మ, చెల్లింపు లేని పనిమనిషిగా భావించ బడుతుంది.

– శారీరక నిర్మాణంలో తేడాలున్నాయనే సాకుతో సామాజిక అసమానత్వాన్ని సమర్థించే వాదన.

– స్త్రీ ఇష్టపూర్వకంగా తన వ్యక్తిత్వాన్ని నశింపజేసుకోవడం, పురుషాధిపత్యానికి లొంగి ఉండడం, శ్రమశక్తి దోపిడీకి గురికావడం, సామాజికంగా హక్కులు లేకపోవడం, ఉన్నా అవగాహన చేసుకోక పోవడం, తమ ఇంటిలోనే తాము బానిసలుగా బతుకుతూ బానిసత్వానికి లోను కావడం, ఉంపుడు కత్తెలుగా బతకడం ఇవన్నీ వ్యక్తిత్వ వినాశ లక్షణాలు.

– ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులకు రెండు కళ్లు. ఈ సృష్టి ప్రకృతి పురుషుల కలయిక. సృష్టిలో పరాత్పరుని దృష్టిలో స్త్రీ పురుషులు సమానులు. ఆకాశంలో సగం – ఆకాశంలో విభజన రేఖలు లేవు. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి ఆదిశక్తి, పరాశక్తి, అపారశక్తి స్త్రీ. సంతాన ప్రాప్తిలో మానవ జీవిత పరిణామ గతిలో ఇద్దరూ సమానులు. పురుషుడు బీజప్రదాత, అవనీతల్లి మాత. ఇద్దరూ సగం – సగం – కాని సగాలు సమానం కాని విడ్డూరమైన గణితశాస్త్రం చిక్కుముడుల లెక్కల్లో చిక్కుకుపోయిందీ సమాజం. ”అంతరించిపోతున్న వింతజాతి ఆడజాతి”. పురుషాధిపత్యానికి, శరీర, ధన, మాన, ప్రాణాలను అర్పించిన వ్యక్తిత్వం లేని ఆటబొమ్మగా జీవిస్తుంది. ‘అబల’ అనే సామాజిక ముద్ర వేయించుకుంది. అలాంటప్పుడు వేరుగా విధవలు – వింతతువుల జీవన పరిధులను, పరిణామాలను గురించి ఆలోచించడం, అంచనా వేయడం విడ్డూరం. సమాజంలో ఒక స్త్రీకి ఇవ్వవలసిన గౌరవం, మర్యాద, విలువ, స్థాయి, హోదాతోనే అని ముడివడి ఉంటాయి. ఈ తారతమ్యానికి కారణాలు: 1. మత సంస్కృతి, 2. సనాతన సంప్రదాయాలు, 3. ఆచారాలు, నమ్మకాలు, కట్టుబాట్లు, 4.హక్కులు విధులు, బాధ్యతలు, కర్తవ్యాలు, ధర్మాలను తెలుసుకోకపోవడం, 5.అసమానత, అవిద్య, అజ్ఞానంలో కొట్టుమిట్టాడడం.

తరాలు మారినా తల్లిదండ్రులకు, సమాజానికి ఇష్టంలేని ఉపేక్షిత శిశువుగా, చెల్లింపులేని పనిమనిషిగా స్త్రీ జీవితం అన్ని థలల్లో నేటికీ అభాసుపాలవుతూనే ఉంది. అవివాహిత, గొడ్రాలు, విధవ, అభాగిని, కులట అని స్త్రీలను ఎన్నో విధాలుగా ఈనాటి సమాజం అవహేళ చేస్తూనే ఉంది. మనం మన సమాజం మారేదెప్పుడో?

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నా బాల్యం గల్లంతైంది

by Banda Saroja July 25, 2024
written by Banda Saroja

నా బాల్యం గల్లంతైంది

డా|| సరోజన బండ

‘బొమ్మరిల్లు’లో బొమ్మలాటలు

బొమ్మలాటలో కమ్మని వంటలు

పప్పు బెల్లం నువ్వులు చక్కెర

ఏకుడు పేలాలు వేరుశనక్కాయలు

మక్కజొన్న పేలాలు, పాలకంకుల

‘పిసికిల్లు’

పుట్నాలు, అటుకులు, చిట్టిలువలు

కుడుకలు, బత్తిసపేర్లు, చక్కెర గోళీలు

అప్పుడప్పుడు అమ్మ చేసిపెట్టే

చెగోడీలు, సకినాలు, గరిజెలు

అరిసెలు, గారెలు, సత్తుపిండి, సర్వపిండి

పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి

‘బెల్లం పాశం’

ఒక్కోసారి మా మల్లయ్య పిసికి యిచ్చిన

‘గసిపిండి ముద్దలు’

బుడ్డగిన్నెల్లో భద్రంగా తీసుకుపోయి

వెన్నలాంటి మనసుతో నా చిన్ని చెలికాండ్రకు

పేదరికం లేని నా పెద్దబుద్ధితో

పెళ్ళిభోజనమంటూ ‘మోదుగాకు’లల్లో

ప్రసాదంగా పంచి పరమానందం చెందేదాన్ని

పనికిరాని పాతరాతెండి తలె మాకు

‘పెళ్ళిడప్పు’

చొప్పకర్రలే ‘డప్పుకోలలు’

పీకెలే సన్నాయిలు బాజా భజంత్రీలు

చొప్పకోలలు, పుల్లలు, బెండ్లతో చేసిన ‘బండ్లు’

పల్లకీలో పిల్ల, పిల్లగాని ఊరేగింపు

మేరెసాంబయ్య పారేసిన తుక్కులోని

రంగురంగుల బట్ట పీలికలతో కుట్టిన

చిట్టి బొమ్మల సింగారంతో ‘పెళ్ళితంతు’

ఇవన్నీ మాకు ఆచరణయోగ్యాలు

అనుకరణ సాధ్యాలు ఆటపాటల సంరంభాల

ఆనందానుభూతులు

అగ్గిపెట్టెల టెలిఫోన్లు, తాటికమ్మల గాలిమోటార్లు

కుమ్మరి నర్సయ్య తాత గురుగులు

కమ్మరి రామయ్య తాత కడాయి, జల్లిగంటె

వడ్ల వెంకటయ్య మామ తెడ్లు

బుడ్డ సర్వలు బొడ్డు చెంబులు

గద్దె గిన్నెలు తపేలా పావులు

ఎరుకల ఎల్లమ్మ మొంటె- బిచ్చపు సాలమ్మ ‘సదిరె’

పూసల మల్లయ్య పూసపేర్లు, తరగని అందాల తాటాకు బుట్టలు

అన్నీ అపురూపమైన ఆటవస్తువులు నాకు

చెబ్బీసాబ్‌ గాజుల మలారంలో

పర్రెవట్టిన ఎర్రగాజులు

పచ్చగాజులు పూలగాజులు

సుతిలితో అల్లిన తుమ్మకాయల గజ్జెలు

సన్నటి సిబ్బి తీగలకు సుతారంగా గుచ్చిన

తుమ్మిపువ్వు ముక్కుపోగులు

నత్తులు, చెవికమ్మలు

మాకు అపూర్వ ఆభరణాలు

మా చేనులో ఏరుకొచ్చిన జిట్టరేగు పండ్లు

మా పెరట్లో కాసిన జామపండ్లు, దానిమ్మపండ్లు

సీతాఫలాలు వనచింతకాయలు, మామిడికాయలు

కాకెంగిలి అంటూ అంగీలోవెట్టి కొరికి

అన్నిటిని అందరం పంచుకొని తినేవాళ్లం

అన్నీకూడా ‘ఇందుల్లో’ మాకు విందుభోజనాలే

అమోఘ ఫలరుచులే!

గిల్లికయ్యాలు పెట్టుకున్నా ‘సోపతి గాల్లందరం’

తెల్లారి మళ్లీ కలిసేవాల్లం

లద్దునూరి తోవలు మావి మద్దూరిబాటలు మావి

కొడవటూరి గుట్ట, కొమిరెల్లి మల్లన్న జాతర

బెక్కల్లు రామలింగేశ్వరస్వామి ఆలయదర్శనం

ముచ్చటగా మూడురోజుల జాతర

ఆషాఢమాసం వనభోజనాలు

అన్నీ మాకు ఆనందస్మృతులే!

చేన్లు చెలకలు మావి – చెట్లు గట్లు మావి

ఎర్రమన్ను పుట్టలు మావి ఒర్రెలు వాగులు మావి

ఇసుకతెప్పలు మావి పిట్టగూళ్లు మావి

చింతచెట్లు మావి మామిడి తోపులు మావి

ఎనుగులు మావి గునుగులు మావి

‘తూరుపు తోట’ మాది తురకోని బావిమాది

జమ్మికుంట మాది

ఎల్లంబావి మాది ఎల్లమ్మ చెరువు మాది

హనుమాండ్ల గుడి మాది చెన్నకేశవ ఆలయం మాది

పాత కచ్చేరిమాది పాడువడ్డ బురుజుమాది

దొరవారి ఇంటి దొడ్డి కన్నాలు మావి

బంజరు దొడ్డిమాది బడి ‘శిథిలాల ఆవరణ’ మాది

నొగలు విరిగిన బండ్లు మావి పొణకలు, బోరాలు మావి

‘ఖాజా’ మామయ్య కాలిపోయిన ఇల్లు మాది

కూలిపోయిన గోడలు మావి

ఇల్లిల్లు మాది ఇంట్లోని ముంతగూళ్లు మావి

ఊరంతా మాది ఊల్లోని వాళ్ళంతా నావాళ్ళే

వరుసలతో పిలిచేవాల్లు మురిపెంగా చూసుకునే వాల్లు

కులాల కుటిలత్వంలేని స్నేహ బంధాలు మావి

ఉన్నోల్లు లేనోల్లు అనే తేడాలేని ఉనికి మాది

ప్రేమాప్యాయతలతో పెనవేసుకున్న

ప్రేమబంధం మాది

మమతానురాగాల మరుల విరులు పూయించిన

మనసు పూదోట మాది

తరాలు మారిన నా ఊరు తనరూపం మార్చుకుంది

అరువదేండ్ల కాలంలో అంతా తారుమారయింది

మహోన్నతమైన మానవ సంబంధాలు

మటుమాయమయ్యాయి

అధునాతన పోకడల్లో ఆధునికీకరణంలో

నా బాల్యం గల్లంతైంది

అలముకొంటున్న సంధ్యారాగంలో

అరుణ కిరణాల నా బాల్యాన్ని

జ్ఞాపకాల తెరల మరుగుల్లో

మళ్లీ వెతుక్కుంటున్నాను

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఉచితం

by Laxmi Madan July 25, 2024
written by Laxmi Madan

“వొదినే! ఓ ఒదినే! ఏం సగ వెడ్తున్నవ్! అన్న డూటీకి వొయ్యి శాన సేపాయే! ఇంకేం పనమ్మా!” అనుకుంటూ వచ్చింది మాధవి.

” యే! పనయ్యింది వొదినే! పొద్దు గాల్ల చాయ్ ఉడుకు జేస్తుంటే గిన్నె మాడింది.. గీపీసు వెట్టి రుద్దుతున్న, ఏమో గిట్లోచ్చినవ్ పొద్దు గాల్ల..అన్న ముచ్చట జెప్పనీకా” అన్నది వసంత నవ్వుకుంటూ.

” నీకు ఊకే గాముచ్చటనే! గట్ల గాదు గనీ, ఆషాఢ మాసం గదా, మస్త్ ఆఫర్ లు నడుస్తున్నయి, పోదామా! బట్టల దుకాణంకి ” అన్నది మాధవి.

“అమ్మో! మీయన్న తిడ్తడు, అయినా పైసలు యాడియి”? అన్నది వసంత.

” గట్ల మాట్లాడ్తవ్ వోదినే, నేను లేనా? నిన్ననే శిట్టి ఎత్తిన. ఇస్తపా” అన్నది మాధవి.

” జల్దీ చీర కట్కోని వొస్త.. కూసో. గా కోపుల శాయ్ వట్టు ఉన్నది ఉడుకు జేస్కొని తాగు”అని లోపలికి పోయింది వసంత.

” సరే దబ్బున రా” అంటూ వంటింట్లోకి పోయి చాయ్ వేడి చేసుకుని కుర్చీలో కూర్చొని తాగుతుంది మాధవి.

ఇద్దరు తొందరగా బయటకు వచ్చి షేర్ ఆటో మాట్లాడుకుని వందన బ్రదర్స్ కి వెళ్లారు..

షాప్ నిండా రకరకాల ఆఫర్స్ రెండు కొంటే ఒక చీర ఉచితం, నాలుగు కొంటే మిక్సీ ఉచితం, ఇలా రకరకాల ఉచితాల ప్రదర్శన జరుగుతుంది.

మాధవి మరియు వసంతలకు కళ్ళు తిరిగిపోయాయి. ఇక చీరలు వెతకడం మొదలుపెట్టారు.

వేటి మీద అయితే ఉచితాలు ఉన్నాయో వాటిని వెతికి వెతికి బాగుల నిండా నింపుకున్నారు…

” మంచి గున్నయి కదా వొదినే!” అన్నది మాధవి.

“మంచిగనే ఉన్నాయ్ గాని ఈ చీరలన్ని చూసి మీయన్న ఏమంటడో?” అన్నది వసంత.

“ఏమనడు తీ, ఊకె బుగులు వట్టకు, జెర్ర గట్టిగుండాలే” అన్నది మాధవి.

బ్యాగుల నిండా కొన్ని చీరలు, ఉచితాలుగా వచ్చిన కొన్ని చీరలు, ఆఫర్లుగా వచ్చిన మిక్సీలు, గోడ గడియారాలు అన్నిటిని బ్యాగుల నిండా నింపుకొని చాంతాడంత ఉన్న కౌంటర్లో నిలబడ్డారు.

ఓరెండు గంటల తర్వాత బిల్లు చెల్లించి ఇద్దరు బయటపడ్డారు..

“వొదినే! పోల్లగాండ్లు వచ్చేవరకు మస్త్ టైముంది. కొమురెల్లి దాకా పొయ్యోత్తాం. మీ పిల్లలు మా పిల్లలు పెద్దోల్లే, ఆల్షం అయిన ఏంగాదు” అన్నది వసంత.

“అబ్బో! నువ్వేనా? గట్లనేది. పోదాం పా. గీ సంచులు గీడ మా దొస్తింట్ల వెట్టి పోదాం” అన్నది మాధవి.

ఇద్దరూ ఆ సంచులను మాధవి స్నేహితురాలు ఇంట్లో పెట్టి బస్ స్టాప్ లో నిలబడ్డారు.

“బస్సు కిరాయ ఎక్వనా?” అన్నది వసంత.

“బస్సు ఫ్రీ నే కదా యాది మర్షినవా”? అన్నది మాధవి.

“అవుగదా! నేను ఈ నడుమ ఏ ఊరికి వోలే. గందికే మర్షి పోయిన” అన్నది వసంత.

ఇద్దరూ బస్సు ఎక్కి కూర్చున్నారు. విపరీతమైన జనం ఉన్నారు. అందరూ ఆడవాళ్లు ఉచిత బస్సు కాబట్టి పని ఉన్నా లేకున్నా తిరుగుతూనే ఉన్నారు.

ఒక్క సీటులో ఐదు, ఆరు మంది కుక్కుకొని కూర్చుంటున్నారు. నిలబడ్డ వాళ్ళు లెక్కకేలేరు..

పక్కకు చిన్న అమ్మాయిని పలకరించింది మాధవి.

“ఏడికి వోతున్నవ్ శెల్లే” అన్నది మాధవి.

“ఏడికి లేదు అక్క ఇంట్లో కరెంట్ పోయింది. రిపేర్ చేసేదానికి రెండు రోజులు పడతదట. టీవీ వస్తలేదు పొద్దు పోతలేదు.. ఊకెనే గా ప్రజ్ఞాపురం కాడ మక్క బుట్టలు కొనుక్కొని వేరే బస్సు ఎక్కొస్త” అన్నది ఆ అమ్మాయి.

“మనకన్నా జరంత ఎక్కువనే ఉన్నది” అన్నది మాధవి పక్కన ఉన్న వసంతతో.

అటుపక్కన మరో మహిళను పలకరించింది వసంత.

“నువ్వు ఏడికీ వోతున్నవ్ అక్కా” అన్నది వసంత.

“గీడు నామన్మడు. ఇంట్ల ఉంటే గాయి గాయి జేస్తున్నడు. అన్నం దింటలేడు. గాశామీర్ పేట కాడి దాకా వొయ్యే వరకు బుక్కెడు దింటడు. ఆడ దిగి మా శెల్లే ఇంటికాడ గింత శావట్టు దాగి మల్ల బస్సెక్కుత. గింతట్ల నా బిడ్డ కొలువు నించి వొస్తది” అన్నది ఆ మహిళ.

ఇదంతా వింటున్న కండక్టర్ కి బుర్ర తిరిగి పోయింది. “ఉచితాలు జెయ్యంగ మాకు తల్కాయ నొప్పి. పనున్నోడు, లేనొడు బస్సుల ఉర్కుడే. గిప్పుడే దేవుడు, సుట్టాలు యాదికొస్తరు” అనుకుంటూ ముందుకు వెళ్లాడు.

ఇంటికి వచ్చిన మాధవికి హాల్లో 10 కిలోల గోధుమపిండి కనిపించింది.

“ఏందయ్యా! గిది. గింత పిండి ఏడిది” అన్నది మాధవి.

“ఐదు కిలలు కొంటే ఐదు ఫ్రీ. అట గందికే తెచ్చిన” అన్నాడు మాధవి భర్త సుందర్.

“నీఅగడు పాడు గాను. ఫ్రీ వచ్చిందని గింత కొంటవా?” అన్నది మాధవి కోపంగా.

“నువ్వు ఫ్రీ వస్తున్నది అని గన్ని చీరలు కొన్నావ్ నేను గిద్దేస్తే గట్ల అంటవు” అన్నాడు సుందర్..

కుయ్యమనకుండా లోపలికి వెళ్ళిపోయింది మాధవి.

తెల్లవారి ఉదయమే పిండి సంచులు తెరిచి చూసింది. అంతా పురుగే ఉంది. భర్తను ఏమైనా అందామంటే తాను అలాంటి పనే చేసింది కదా!

చీరలు బ్యాగు మిక్సీ రెండు తెరిచి ముందుగా చీరలను విప్పి చూసింది… చూడడానికి బాగానే ఉన్నాయని ఒక చీర కట్టుకుంది .తర్వాత ఆరోజు ఇడ్లీ కోసం నానబెట్టిన మినప్పప్పును మిక్సీలో వేసుకుంది. మిక్సీ ఏమాత్రం నాణ్యత లేకుండా కనిపించింది…

“గిట్ల ఫ్రీ వస్తుందని కొంటే గిట్లే ఉంటది .ఇప్పుడు ఏమనుకొని ఏం లాభం” అని అనుకొని వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళింది మాధవి.

“వొదినే! మోసం జరిగింది మన మిక్సీ మంచిగ పనే చేస్తలేదు” అన్నది వసంతతో.

“సప్పుడు జెయ్యకు. మీ అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటికే ఇవి కొన్న అని తిడతా ఉన్నాడు. నా చీరలు నీళ్లలో పెట్టిన పొద్దుగాల. మొత్తం రంగు ఎలిసిపోయింది” అన్నది మెల్లగా వసంత.

“ఓయమ్మనే! మొత్తం మునిగినమే. ఈసారి గిట్ల చేయద్దు, అంత నాదే తప్పు .అన్న లేనప్పుడు వస్తతీ వొదినే” అన్నది మాధవి.

“యే, జర్ర నిలవడు. గా పెరంట్ల దిక్కువా”. అనుకుంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది వసంత మాధవిని.

“గిట్ల ఫ్రీ అని తీసుకుంటే గిట్లాయే” వొదినే అన్నది వసంత.

“గిప్పుడు సమజాయే, ఆల్లు మన కోసం గా ఉచితం పెడ్తరా? ఆల్ల లాభాలు జూసు కుంట
రు” అన్నది మాధవి.

“మీ యన్న వొద్దు అంటడు గిసొంటివి. మనమే సోచాయించి పోయ్యేది ఉండే. అయితేవాయే తీ, ఈపారీ గిట్ల చెయ్యొద్దు. ఇగ వోత వొదినే, పని గాలే” అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది మాధవి.

ఇద్దరు జరిగిన పొరపాటున గుర్తించుకుని, మళ్ళీ ఈసారి అలాంటివి చేయొద్దు అనుకున్నారు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ——- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni July 25, 2024
written by Narendra Sandineni

గుండు రమణయ్య హృదయ రోదన కవిత. హృదయం పై కవిత్వం ఓ విశ్లేషణ.
కవి,చిత్ర కళా ఉపాధ్యాయుడు.వాణీ నికేతన్ బాల విహార్ పాఠశాల,తెలుగు మీడియం,కరీంనగర్, గుండు రమణయ్య కలం నుండి జాలువారిన తొలి మెట్టు కవితా సంపుటిలోని హృదయ రోదన కవిత పై విశ్లేషణా వ్యాసం.హృదయ రోదన కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావాలు నాకు నచ్చాయి.నన్ను ఆలోచింపజేసింది.రమణయ్య తాను రాసిన కవితలకు తానే చిత్రం గీసినాడు. డాక్టర్ కాలువ మల్లయ్య ముందు మాటలో ముందొచ్చే కవితా సంపుటుల్లో రచనల్లో కవిత్వం పాలు మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను అని అన్నాడు.కవిత శీర్షిక హృదయ రోదన ఏమిటి?హృదయం రోదిస్తుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.హృదయము లేదా గుండె మన శరీరానికి రక్తాన్ని పంపిణి చేసే ముఖ్యమైన అవయవం.గుండెలోని ప్రత్యేకమైన కండరాలు నిరంతరాయంగా పని చేసి మనిషిని బ్రతికిస్తున్నాయి.గుండె ఛాతి మధ్యలో కొంచెం ఎడమ వైపుకు ఉంటుంది.రక్తాన్ని సరఫరా చేసేది గుండె.ప్రాణులకు ముఖ్యమైన భాగం గుండె. గుండెకు మనసు,ప్రేమ,జాలి,ఆత్మసారం,రహస్యం అని అర్థాలు.రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు.మనసునకు బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది.మన శరీరంలో హృదయం సున్నితమైనది. ఎట్టి పరిస్థితిలోను హృదయానికి బాధ కలిగించకూడదు.హృదయానికి బాధ కలిగితే వచ్చేది రోదన.హృదయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం,ఆవశ్యకత ఎంతైనా ఉంది.హృదయ రోదన కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే కవి రమణయ్య హృదయ రోదన కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.గొప్ప అనుభూతులను సొంతం చేసుకోండి.
“నా పవిత్ర దేశపు గడ్డ పై
“సమస్యల కాన్వాసు పై
“పదిలంగా చిత్రించిన రూపం !
నా స్వచ్ఛమైన దేశం గడ్డ పై సమస్యల చిక్కు ముళ్ళు చుట్టు ముట్టి కలవరం కలిగిస్తున్నాయి. హృదయాన్ని ఆవరించిన సమస్యలు మబ్బుల వలె ఆకాశంలోని దూదిపింజలా తేలిపోవడం లేదు. సమస్యలు ఒక్కొక్కటిగా సుందరమైన కాన్వాసు మీద చిత్రించినట్లు హృదయం కళ్ళకు స్పష్టంగా ఆగుపిస్తున్నాయి.పవిత్రమైన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు జటిలమై హృదయంలో కదలాడుతున్నాయి.గుండెలో చెలరేగుతున్న సమస్యలు అన్నింటిని కాన్వాస్ పై స్థిరంగా గీయగానే అద్భుతమైన చిత్రం రూపు దాల్చింది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆనంద రోదనలో
“ఆవేదనా కోలాహలం
“తరచి చూస్తే తెలుస్తుంది
“నిలిచి చూస్తే కనిపిస్తుంది !
ఒకరి సంతోషం గురించి ఆలోచించడం ఆనందం.ఆలోచించడం లేదా తెలుసుకోవడం ఆనందం.మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళ నుండి బాష్పాలు రావడం సహజం.ఆనందం అనే పదాన్ని నిర్వచించడం సాధ్యం కాదు.ప్రజలకు ఆనందం అనుభవించాలనే ప్రాథమిక భావన హృదయంలో కలుగుతుంది.సంతోషకరమైన సంతృప్తి,ఆనందానికి మూలం.ఒక కల్పిత ప్రదేశం ఆనందం.అద్భుత లోకంలో వింతలు జరగడం ఆనందం.మనుషుల జీవితంలో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం.మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు కలిగే భావన ఆనందం.ఎటు వంటి బాధలు లేకుండా హాయిగా ఉండటం ఆనందం. రోదన అనగా విలాపము,ఏడుపు అని అర్థాలు. మనసులోని బాధ వల్ల కళ్ల వెంట ధారగా వచ్చేది రోదన.ఆవేదన అనగా తీవ్రమైన బాధ, తెలియచేయుట అని అర్థాలు.ఏదైనా ఉపద్రవం సంభవించినప్పుడు గంతులు వేయడం కోలాహలంను సూచిస్తుంది.ఎక్కువ శబ్దం లేదా గట్టిగా అరవడం కోలాహలం.ఉత్సవాలలో శుభకార్యాలలో ఉండే జన సమూహం చేసే సందడి కోలాహలం.వీధిలో జరుగుతున్న కోలాహలంను చూసి ఏదో పండుగలా అనిపించింది.ఆనంద రోదనలు,ఆవేదన కోలాహలం సంగతుల గురించి ఒక్కసారి మనస్సు పెట్టి హృదయపు లోతులను తరచి చూస్తే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. హృదయానికి ఏం జరిగింది? ఒక్కసారి హృదయం పట్ల దృష్టి సారించి చూస్తే కళ్ళకు కట్టినట్లుగా రోదన కనిపిస్తుంది అనే భావం వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.

“కళాకారుల మెదడుల్లో
“కదులుతున్న నిజాన్ని చూడు
“మేధావులు దూషణల్లో
“నలుగుతున్న న్యాయాన్ని చూడు !
ఒక కళను సృష్టించేది కళాకారుడు.కళలను అభ్యసించినది కళాకారుడు.కళాకారుడు కళను సాధన ద్వారా సృష్టించగలడు మరియు ప్రదర్శించ గలడు.కళాకారునికి కళ పట్ల నేర్పు మరియు కళా నైపుణ్యం ఉంటుంది.లలిత కళలు,డ్రాయింగ్, పెయింటింగ్,శిల్పం,నటన,నృత్యం,రచన,చిత్ర నిర్మాణం,కొత్త మీడియా,ఫొటోగ్రఫీ,సంగీతం వంటి కార్యకలాపాలను ఉపయోగిస్తు కళాకారుడు కళను నిర్వహిస్తాడు.కళాకారుడు చురుకుగా తన నైపుణ్యాన్ని సాధిస్తాడు.మెదడు మానవుని తల భాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు అన్నింటికీ మెదడు ఒక ముఖ్యమైన కేంద్రం.మెదడు తనకు తానే మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని తేలింది.మెదడుకి ఏం చెయ్యాలో ఆలోచించడం,నిర్ణయాలు తీసుకోవడం,గత విషయాలు గుర్తు పెట్టుకోవడం వంటి గుణం ఉంటుంది.మెదడు మానవ నాడీ వ్యవస్థ యొక్క కేంద్ర అవయవం.వెన్నుపాముతో కేంద్ర నాడి వ్యవస్థ ఏర్పడుతుంది.మెదడులో సెరెబ్రమ్,బ్రెయిన్ స్టెమ్ మరియు సెరిబెల్లమ్ ఉంటాయి.మెదడు శరీరం యొక్క చాలా కార్యకలాపాలను నియంత్రిస్తుంది.నిజం లేదా సత్యం ఆంగ్లంలో Truth అని అర్థం.నిజం అనగా సత్యమైన,పరమ ప్రమాణం,నిజమని తెలియ జేయుట.నిజం అంటే నిజాయితీ,త్యాగం మనం పాటించవలసిన విధిగా చెప్పవచ్చు.సత్యం వద అంటే సత్యమును చెప్పుము.నిజం మాట్లాడటానికి మించిన దైవత్వం లేదు.నిజం పలకడానికి ధైర్యం కావాలి.ఏదైనా నిజం అయితే అది కనిపెట్టబడడం లేదా ఊహించిన విషయం కాకుండా వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది.నిజం ఖచ్చితమైనది మరియు నమ్మ దగినది.మేధావులు అంటే సమాజం యొక్క వాస్తవికత గురించి విమర్శనాత్మక ఆలోచన, పరిశోధన,సాధారణ సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే వ్యక్తులు.సంస్కృతి ప్రపంచం నుండి వచ్చిన సృష్టికర్తగా లేదా మధ్యవర్తిగా మేధావి రాజకీయాల్లో పాల్గొంటారు.ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనను సమర్పించడం లేదా అన్యాయాన్ని ఖండించడం,సాధారణంగా ఒక భావజాలాన్ని తిరస్కరించడం,విలువల వ్యవస్థను ఖండించడం ద్వారా మేధావులు సమాజంలో ముందు ఉంటారు. తప్పు ఒప్పులలోని నిజాలను నిర్ధారించేది న్యాయం.న్యాయం జరిగే ప్రదేశాలు న్యాయస్థానాలు.న్యాయం అనునది నీతి శాస్త్రానికి సంబంధించినది.నీతి,సత్యం,హేతువులు,చట్టం,ప్రకృతి నియమాలు,సమానత్వం మొదలగు అంశాలపై ఆధారపడినది.వ్యక్తులు సమానమైన న్యాయ పద్ధతిలో వ్యవహరించాలి.న్యాయం అనేది నైతిక మరియు చట్టపరమైనది.న్యాయం సమానంగా మరియు సమతుల్యంగా వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.సమాజం యొక్క అత్యంత ముఖ్యమైనది,చర్చించబడేది న్యాయం.న్యాయం మానవ జీవనానికి పునాది.ప్రజలు అందరికీ న్యాయమైన పంపిణి మరియు సమానత్వం న్యాయమైన ప్రయోజనాలను అందించాలి.ప్రజలు చేస్తున్న స్వార్థపూరిత కార్యకలాపాలను నియంత్రించడానికి న్యాయం అవసరం ఉంటుంది. కులం,మతం,రంగు,ధనిక,పేద అని ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలోని వ్యక్తులందరికీ సామాజిక న్యాయం అందించాలి.దూషణలు అనగా అపవిత్రమైన మాటలు,అసందర్భమైన ప్రేలాపనలు, అశ్లీల మాటలు వల్ల మనిషికి శారీరక గాయాల కంటే ఎక్కువ బాధను కలిగిస్తాయి.దేశంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలు పేద,ధనిక తేడాలు, కులం,మతం పేరిట మారణ హోమం జరుగుతున్నది.పసి పిల్లల నుండి పండు ముదుసలి వరకు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సమాజంలో జరుగుతున్న దారుణ ఆకృత్యాలు చూసి కళాకారుల హృదయం కళ్ళ వెంట కన్నీళ్లు ధారలుగా కారుతున్నవి.ఇలాంటి దారుణ దృశ్యాలు చూసిన తర్వాత కళాకారులు చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా గజ్జె కట్టి పాటను ఆయుధంగా చేసుకుని పాడుతూ వీధుల్లో బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లి నిరసనలు, ప్రదర్శనలు చేస్తూ పోరుబాటలో ముందుకు సాగుతున్నారు. సమాజంలో జరుగుతున్న దారుణమైన ఘోరాలను చూసి మేధావులు స్పందనతో గొంతు ఎత్తి ప్రశ్నిస్తున్నారు.మేధావులు అన్యాయాలు, అక్రమాలను ఖండిస్తూ దూషణలు చేస్తున్నప్పటికీ న్యాయం జరగకపోవడం కలవరపెడుతున్నది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“బడా రాజుల సంపాదనలో
“ధర్మం దాచుకుంటున్నదెంత ?
“నిరుపేదల గుండెల్లో
“దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత?
ధర్మం అనగా చేయవలసిన పని ఆంగ్లంలో Duty అని అర్థం.మనకు కేటాయించిన పనిని చేయడాన్ని ధర్మం అంటారు.మనిషి ప్రతి రోజు చేయ వలసిన విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి.ధర్మం అంటే మానవత్వాన్ని రక్షించే గుణం.సకల ప్రాణి కోటిలో మానవ జన్మ ఉత్తమమైనది.మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో సాటి మానవుల పట్ల ప్రేమ, ధర్మంతో మెలిగితే సాధ్యమవుతుంది.ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషంగా మానవులకు ఉంది. మానవులకు యుక్తాయుక్త విచక్షణా శక్తితో పాటు జ్ఞానం ఉంది.ఆలోచనకు రూపం ఇవ్వగల తెలివితేటలు ఉన్నాయి.మానవులు బుద్ధి ద్వారా ఉత్తమ గుణం అయిన ధర్మాన్ని సాధించవచ్చు.ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది.కవి బడా రాజుల సంపాదనలో ధర్మం దాచుకుంటున్నదెంత అని ప్రశ్నించారు.బడా రాజులు అంటూ ఇప్పుడు ఎవ్వరు లేరు.బడా రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లో రాయబడి ఉంది.బడా రాజులు కాల గర్భంలో కలిసిపోయారు. ఇప్పుడు కొత్తగా నయా బడా బాబులు పుట్టుకు వచ్చారు.బడా బాబులు ప్రజాస్వామ్య దేశంలో పాలనాధికారం చేపట్టి రాజ్యాన్ని ఏలుతున్నారు. బడా బాబులు అంటే ఈనాటి రాజకీయ నాయకులు అనే విషయం అందరికీ తెలుసు.రాజకీయ నాయకులు పారదర్శకంగా పరిపాలిస్తున్నాం అని చెబుతు ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు ఏది చెబితే అది ధర్మంగా కొనసాగుతుంది.బడా బాబులు అధికారం చేపట్టినారు మరియు రాజకీయంగా ఎదిగినారు.బడా బాబుల పాలనలో వంచనతో అధర్మం రాజ్యమేలుతుంది.బడాబాబులు ధర్మం సంగతి ఏనాడో మర్చిపోయారు.ధర్మం అంటే ఏమిటి?అని ముందు ముందు అడిగే రోజులు రానున్నాయా? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.రాజకీయ నాయకులు విదేశీ బ్యాంకుల్లో అవినీతి సొమ్ములు దాచుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజలచే పరిపాలింపబడిన పాలన అని మనకు తెలుసు. ప్రజాస్వామ్యం ఇప్పుడు అపహాస్యం పాలైంది. ప్రజాస్వామ్యాన్ని ఈనాటి నాయకులు,అధికారులు భ్రష్టు పట్టించారు.ఆనాటి నేతలు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు అని కాంక్షించారు.ప్రజలందరు సౌఖ్యంతో జీవనం సాగిస్తారు అని ఆశించారు.ఆనాటి నేతలు ప్రజల సంక్షేమం కొరకు పోరాటం సాగించారు.పరాయి దేశపు పాలన నుండి దేశానికి విముక్తి కలిగించారు. ఆనాటి నేతలు ఇప్పుడు పర లోక గతులు అయ్యారు.ప్రజలకు చేరాల్సిన అభివృద్ధి ఫలాలు పరిపాలకులైన రాజకీయ నాయకులు,అధికారులు కాజేసి దండుకుంటున్నారు.బడా బాబులకు ఇహలోక చింతన పట్ల వ్యామోహం పెరిగింది. ఇప్పుడు సంపాదించినదే డబ్బు అని సంపన్నులు అక్రమార్జనతో ప్రజలను దోచుకుంటున్నారు. సంపన్నులు సక్రమంగా సంపాదించుకుంటున్నారా? అంటే? లేదు అని సమాధానం వస్తుంది.ఇప్పుడు ఎటు చూసినా అధర్మం రాజ్యమేలుతుంది. అన్యాయాలు,అక్రమాలు మితిమీరి పోయినాయి.రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించే వారిని తప్పుడు కేసులు పెట్టి జైల్లోకి తోస్తున్నారు.రాజకీయ నాయకుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు.ప్రజలకు అది చేస్తాం,ఇది చేస్తాం అని శుష్క వాగ్దానాలు గుప్పిస్తున్నారు.ప్రజలను మభ్యపెడుతున్నారు.రాజకీయ నాయకులు సంపన్నులకు దోచిపెడుతున్నారు.రాజకీయ నాయకులకు ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కొరవడింది.రాజకీయ నాయకులు ప్రజా సంక్షేమం కొరకు ఏమీ చేయరు? అని ప్రజలకు తెలిసిపోయింది.ఇవ్వాళ దేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి.ఇందు గల డందు లేడంటూ అవినీతి సర్వత్రా రాజ్యమేలుతుంది.నిరుపేదలు చాలా సాధారణ వ్యక్తులు.నిరుపేదలు డబ్బు లేని వారు. నిరుపేదలు ఎప్పుడు సమస్యలతో ఎందుకు బాధపడతారు. నిరుపేదలు ఎల్లప్పుడు బాధలలో ఎందుకు ఉంటారు.నిరుపేదలు ఎందుకు అశాంతితో జీవితాన్ని గడుపుతున్నారు. కవి నిరుపేదల గుండెల్లో దరిద్ర దేవత దోచుకుంటున్నదెంత అని ప్రశ్నించాడు.నిరుపేదల శ్రమను దోచుకుంటున్నది దరిద్ర దేవత కాదు.నిరుపేదల శ్రమను సంపన్నులు దోచుకుంటున్నారు. నిరుపేదలు పేదరికంలో మగ్గుతున్నారు.నిరుపేదల గుండెల్లో పేదరికం వల్ల బతుకు పట్ల ఆందోళన ఉంటుంది.నిరుపేదలు రేపటి రోజున బతుకును ఎలా గడపాలి? అనే ఆందోళన ఉంటుంది. నిరుపేదలు ఆకాశం పందిరి కింద చెట్ల నీడన నివసిస్తున్నారు.నిరుపేదలు తినడానికి తిండి లేదు.నిరుపేదలు కట్టుకోవడానికి బట్టలు లేవు. నిరుపేదలు నివసించడానికి ఇల్లు లేదు.సంపన్నుల దేవత అని నిరుపేదల దేవత అని ఎక్కడ రాసి లేదు.మనం కల్పించుకున్నవే దేవతా రూపాలు.మన హృదయంలోనే నిండి నిబిడీకృతమై దేవుడు ఉన్నాడు.మన హృదయంలోని దేవుడిని మర్చిపోయినాము.మనం ఆ దేవత,ఈ దేవత అంటూ గుడుల వెంట పరుగులు తీస్తున్నాము.మన హృదయంలోనే దేవుడు కొలువై ఉన్నాడు.ఏ దేవత అయినా సమస్త మానవాళి సుఖ సంతోషాలను, సౌఖ్యాన్ని కోరుకుంటుంది.ఆ విషయం మర్చిపోయి నిరుపేదల ఇంట దరిద్ర దేవత దోచుకుంటున్నది ఎంత అని తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనాలను తప్పుడు మార్గంలో పయనింప జేస్తున్నారు.జనాలు అజ్ఞానంలో ఉన్నంత కాలం ఈ దోపిడీ విధానం కొనసాగుతుంది.

గుండు రమణయ్య

“ఐనా – నా భారతం కన్నులకింపైన “చిత్రం’
“ఎందుకనగా నాది ‘హిమముల నేత్రం’
“అదొక ‘రసార్డ్ర సాగర గాత్రం’.
భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు,దక్షిణాన హిందూ మహా సముద్రం,పశ్చిమాన అరేబియా సముద్రం,తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.భారతదేశం సింధు లోయ నాగరికతకు పుట్టిల్లు.హిందూ,బౌద్ధ,జైన,సిక్కు మతములకు జన్మనిచ్చింది.బహు భాషలు మాట్లాడే జనం ఉన్నారు.బహుళ జాతుల సంఘం ఉంది.వివిధ వన్య ప్రాణులకు నిలయమైన దేశం.భారతదేశం 142 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఇరవై తొమ్మిది రాష్ట్రాలు,ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి ఉంది.అతి పెద్ద పార్లమెంట్ వ్యవస్థ ఉన్న ఒక సమైక్య దేశం. చిత్రం అనేది చదునైన ఉపరితలంపై రంగుల బిందువుల సమూహం.అది వేరొక దాని వలె కనిపిస్తుంది.చిత్రాలు, డ్రాయింగులు,పెయింటింగ్ లు లేదా ఛాయాచిత్రాలు కూడా కావచ్చు.అలాంటి చిత్రాలను రూపొందించే వ్యక్తులను కళాకారులు, చిత్రకారులు అంటారు.విశాల భారతదేశం మనది. హిమాలయాలకు నిలయం ఇది అని చిన్నప్పుడు పాఠశాలలో చదివి ఉన్నాం.అయినప్పటికీ నేను నివసించే భారతదేశం కన్నులకు కట్టినట్లు చిత్రం వలె కనిపిస్తుంది.చిత్రం గురించి చెబుతూ రసములతో తడిసిన సముద్ర రూపాన్ని దాల్చిన శరీరం వలె కనిపిస్తుంది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకే
“నా ‘సహనం’ ‘సద్యోఘృతం’
“నా విశ్వాసం’ ‘విద్యుద్ఘాతం’
“నా ‘నిర్ణయం’ ‘నిశ్చల దృఢం’.
సహనం క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండాలి.మనకు అగౌరవం కలిగినప్పుడు కోపంతో ప్రతి స్పందించకుండా రెచ్చగొట్టడాన్ని సహించగల ఓర్పు ఉండాలి.ఒత్తిడికి గురైనప్పుడు సహనంతో వ్యవహరించాలి.ఇబ్బందులు ఎదురైనప్పుడు సహనంతో ఉండాలి.చిరాకు కలిగినప్పుడు విసుగు చెందకుండా సహనంతో వేచి ఉండాలి.క్షీరసాగర మధనంలో దేవతలను రక్షించుటకు గరళం మింగిన పరమ శివుని వలె సహనంతో మెలగాలి.విశ్వాసం అనగా వ్యక్తి వస్తువు లేదా భావనపై విశ్వాసము లేదా నమ్మకం కలిగి ఉండాలి.విశ్వాసం మనకు నమ్మకం మరియు నిశ్చయత యొక్క భావాన్ని ఇస్తుంది.విద్యుత్తు ప్రవహిస్తున్న యానకంను శరీరం తగిలి ఆ శరీరం గుండా విద్యుత్తు ప్రవహించినప్పుడు శరీరానికి కలిగే ఘాతంను విద్యుద్ఘాతం అంటారు.కరెంట్ షాక్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కరెంట్ షాక్ ను తట్టుకోలేని జీవులకు మరణం సైతం సంభవిస్తుంది.మానవుని శరీరం ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్న మానవుడు దిగ్భ్రాంతికి లోనవుతాడు.విద్యుత్ ప్రవాహం యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల పాలవుతాడు.నా విశ్వాసం విద్యుద్ఘాతం అని హృదయం బాధకు లోనైంది అని తెలియజేయడం చక్కగా ఉంది.మనిషి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు.మనిషి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.మనిషి అనేక అవకాశాలు మరియు సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి.నిర్ణయం నిశ్చలమైనది మరియు దృఢమైనది అయి ఉండాలి.ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చడానికి వీలు కాదు. నా నిర్ణయం నిశ్చలమైనది దృఢమైనది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.కవి రమణయ్య చిత్రకారుడు మరియు తాను రాసే కవిత్వం పట్ల శ్రద్ధ చూపాలి.ప్రాచీన కవులు మరియు ఆధునిక కవులు రాసిన కవిత్వంను అధ్యయనం చేయాలి.గట్టి కృషి చేస్తే గొప్ప కవిగా రమణయ్య రాణించే అవకాశం ఉంది.కవి రమణయ్య మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

July 25, 2024 2 comments
5 FacebookTwitterPinterestEmail
కవితలు

జీవితమంతా గడిపేశా

by Vijaya Ranganatham July 25, 2024
written by Vijaya Ranganatham

జీవితమంతా గడిపేశా, కానీ నాకు తీరికే దొరక లేదు

ఆత్మీయులు ఆహ్వానిస్తే, నాకు తీరికే దొరకలేదు

ఆప్తుల బాధల్ని పంచుకుందామంటే నాకు తీరికే దొరకలేదు

మనసు పొరల భావాల్ని లిఖిద్దా మంటే, నాకు తీరికే దొరకలేదు

శరీరం విశ్రాంతిని కోరినా, నాకు తీరికే దొరకలేదు

కని పెంచిన వారిని పలకరిద్దామంటే, నాకు తీరకే దొరకలేదు

వడలిన వయసు జారుతున్నప్పుడు, సమయంతీసుకుని వైద్యుడ్ని కలవమని స్నేహితులు సలహా ఇచ్చినా నాకు ఆ తీరికే దొరకలేదు

నా మదిలోని తీరని కొండంత పనుల భారాన్ని దించే లోపే , కొత్త సమస్యలు ఎదురైతే ఏం చేయను నాకు తీరికే దొరకలేదు

జీవితం కాలం వృధా చేసాను ఎలా పరిష్కరించను నాకు తీరికే దొరకలేదు

మరి ఈ సమయ మేమయిందని చూద్దామంటే, నాకు ఆ తీరికే దొరకలేదు.

సమయం కోసం వెతకటం తోనే నా సమయమంతా కడతేరింది, మృత్యువు దరిచేరనుంది అయినా నాకు తీరికే దొరకలేదు

ఎవరో ఉర్దూ కవి గారి వీడియో ఆధారంగా నేను తెలుగులో అనువదించాను. విన్న వెంటనే నన్ను కదిలించిందా ముషాయిరా. రాయకుండా ఉండలేక పోయాను. చివరి నాలుగు పంక్తులు మాత్రం కొత్తగా చేర్చాను. ఆ కవి మహానుభావుడికి నమఃసుమాంజలులు.

July 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us