మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya January 25, 2026
written by Sammeta Vijaya

స్వేచ్ఛ నాటిక
విశ్వ శాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వెలువడిన నాటిక స్వేచ్ఛ. వివిధ ప్రదేశాలలో 35కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన నాటిక స్వేచ్ఛ. మూల కథ శ్రీ పి. ఎస్ నారాయణ, నాటకీకరణ శ్రీ పరమాత్ముని శివరాం, దర్శకత్వం శ్రీ బి.ఎం రెడ్డి .
పి .ఎస్ నారాయణ : పి.ఎస్.నారాయణ ప్రముఖ కథారచయిత. ఇతడు 230కు పైగా కథలు, 31 నవలలు, 10 రేడియో నాటికలు, 2 స్టేజి నాటకాలు, ఏన్నో విమర్శా వ్యాసాలు రచించాడు.

స్వేచ్ఛ అంటే మనసుకు నచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు సాగించుకోవడం, ప్రవర్తించడం కాదు అంటారు రచయిత (మూల కథకులు) పిఎస్‌ నారాయణ.
బి.ఎం రెడ్డి : దర్శకునిగా రాణించిన బిఎంనరెడ్డి గారు స్వేచ్ఛ , ఆకెళ్ళ రచించిన కలనేత మొదలైన నాటికలకు దర్శకత్వం వహించారు. స్వేచ్ఛ అంటే నియంత్రణ, సంరక్షణతో కూడుకున్న స్వచ్ఛత ఉండాలని చాటింది విశ్వశాంతి కల్చరల్‌ హైదరాబాద్‌ బృందం. పరమాత్ముని శివరాం నాటకీకరణకు బి ఎం రెడ్డి దర్శకత్వంలో నటవర్గం జీవం పోసింది. ఈ నాటిక యొక్క దర్శకత్వం, నటన, సాంకేతికత ప్రేక్షకులను కట్టిపడేసింది. నాటికలో దర్శకత్వ ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రేక్షకులకు విసుగు కలగకుండా ఒక దాని వెనుక మరో సీన్ విరామం లేకుండా ప్రదర్శిండం వలన నాటికకు అందరూ కనెక్టయ్యారు. కళాకారులు. లైట్స్‌ ఆఫ్‌, ఆన్‌ ఉన్నా… సీనులు, తెరలు మారుతున్నా, ఫ్లాష్‌ బ్యాక్‌ నడిచినా… అంతరాయం అన్న భావన కలగదు. ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఇదే. అందుకే ఈ నాటిక పలు అవార్డులు గెలుచుకున్నది.


విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ అనేది ఒక సాంస్కృతిక సంస్థ, ఇది ముఖ్యంగా నాటక రంగం మరియు సాహిత్యంలో చురుకుగా ఉంటుంది, ప్రముఖంగా “ఆకెళ్ళ నాటిక రచనల పోటీలు” వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది మరియు నాటక ప్రదర్శనలకు మద్దతు ఇస్తుంది, ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రచయితలను ప్రోత్సహిస్తుంది
విపరీతమైన స్వేచ్ఛ ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. సరైన గమ్యమూ, గమనము దానికి ఉండదనే విషయాలను ‘స్వేచ్ఛ’ నాటిక రేఖామాత్రంగా చర్చిస్తుంది.
ఆధునిక సంపన్న కుటుంబ కథ ఇది. మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితమే భర్తతో తెగదెంపులు చేసుకుని అవినాశ్‌తో కలిసి జీవనం సాగిస్తున్నది. మహేశ్వరి కూతురు శ్వేత కూడా తల్లి దగ్గరే పెరుగుతుంటుంది. తల్లి ప్రవర్తన శ్వేతకు నచ్చదు. ఆమెకు దూరంగా, అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటుంది. తల్లి అందుకు అంగీకరించదు. తల్లీ-కూతుళ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది. తన తండ్రి స్థానంలోకి వచ్చిన అవినాశ్‌ అంటే శ్వేతకు నచ్చదు.మహేశ్వరి కూడా మన మధ్య సంబంధం మనవరకే పరిమితమని, ఇతర ఏ వ్యక్తిగత విషయాల్లో కలుగ జేసుకోవద్దని అవినాశ్‌ను హెచ్చరిస్తుంది. కూతురు వరుసైన శ్వేతపై కాముక దృష్టి ఉన్న అవినాశ్‌ కన్నేస్తాడు.

ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… మహేశ్వరి అవినాశ్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.అతని సహాయంతో ప్రమోషన్ రావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది . అవినాష్ ను ఇంటికి ఆహ్వానించి విందు ఇస్తుంది. ఆ సందర్భంలో మద్యం తాగుతూ ఇద్దరూ శ్రుతిమించుతారు. ఆధునిక యుగంలో ఇవన్నీ సర్వసాధారణమని వాళ్ల భావన. ఇంటికి వచ్చిన భర్త మూర్తి మందలిస్తాడు. అతను చెప్పే మాటలు వినక ఎదురిస్తుంది. కోపం లో అవినాశ్‌పై చేయి చేసుకుంటాడు మూర్తి . మూర్తిని ఎదురించి అవమానించి తెగతెంపులు చేసుకుని కొడుకును తీసుకుని బయటకు వెళ్ళమంటుంది మహేశ్వరి . వాళ్లకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు ఆనంద్‌, కూతురు శ్వేత. ‘మగపిల్లవాడిని నీవు తీసుకెళ్లు, కూతుర్ని మాత్రం నా వద్దే ఉంచుకుంటాను’ అని పురుష ద్వేషంతో అంటుంది మహేశ్వరి. చేసేది లేక భార్యకు విడాకులు ఇచ్చేసి ఆనంద్‌ బాధ్యత తీసుకుంటాడు మూర్తి.

కొంతకాలం గడిచాక మూర్తి చేతుల్లో పెరిగిన ఆనంద్‌ పెద్దవాడవుతాడు. మూర్తి లాగే ఉంటాడు . మూర్తి మరణిస్తాడు.తల్లి కోసం చెల్లి కోసం ఆరాటపడి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు . ఆ క్రమం లో శ్వేత పరీక్షకు డబ్బు కట్టడానికి పార్కు కు వచ్చిన విషయం తెలుసుకుని తెలియని వ్యక్తిగా వచ్చి కథ నడిపిస్తాడు.అన్నాచెల్లెళ్లు తల్లికి ఎలా బుద్ధి చెబుతారో చూడాలంటే స్వేచ్ఛ నాటిక చూడాల్సిందే!

మందుకు బానిసవడం స్వేచ్చా? అని మూర్తి సంధించిన ప్రశ్న మహేశ్వరి తో పాటు ఈ సమాజానికి వర్తిస్తుంది.

మితి మీరిన స్వేచ్ఛ తెడ్డు లేని పడవలా ఉండడమా?

స్వేచ్ఛ పేరుతో నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా? వంటి ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి.

పలు అవార్డులు అందుకున్న స్వేచ్ఛ నాటికలో మహేశ్వరి పాత్రలో సురభి లలిత , అవినాశ్ పాత్రలో శ్రీనివాస్ , మూర్తి,ఆనంద్ పాత్రల్లో డా . వెంకట్ గోవాడ, శ్వేత పాత్రలో మంజు , సాంకేతక సహకారం నాగరాజ్ , తేజ , ఫణీంద్ర , రోహిత్, భీం తదితరులు అందించారు. బి ఎం రెడ్డి గారి దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ సమర్పణలో స్వేచ్ఛ నాటిక తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది

January 25, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జీవన స్రవంతి ( ట్రయాలజీ) ( Trayalaji )

by రంగరాజు పద్మజ January 25, 2026
written by రంగరాజు పద్మజ

నవలా సమీక్ష. జీవన స్రవంతినవల ఈ నవలా రచయిత అంధులైన శ్రీ టేకులపల్లి గోపాలరెడ్డిగారు.

దృష్టి లేక పోవడం ఒక శాపం కాదు!
తన లక్ష్యాన్ని సాధించే ఒక సహాయకారైన సామర్థ్యం అని నిరూపించారు! జీవన స్రవంతి నవలా రచయిత దివ్యాంగులైన శ్రీ టేకులపల్లి గోపాల రెడ్డి గారు.
వీరికి దృష్టిలోపం ఉన్నా దాన్ని అధిగమించి, చీకటి దారిని వెలుగులమయం చేసుకున్నారు.
చూపులేని జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు; ఆరాట- పోరాటాలు; మనసు లోపలి పొరల్లోని భావా వేషాలు; సంఘర్షణలు; పరిస్థితుల బేరీజులు; ఆత్మగత సందేశాలతో సాగిన ఆత్మకథ నవల జీవన స్రవంతి.
ఇటీవలే ఒక సాహిత్య సమూహంలో వారు పరిచయమైనప్పుడు…. వారు 1200 పేజీలలో మూడు భాగాలతో ట్రయాలజీ తమ జీవిత కథ ను రాశారని విన్నప్పుడు, అంగవైకల్యమున్న వ్యక్తిలో ఇంత నైపుణ్యమున్నదా? అని ఆశ్చర్యపోయాను.
ప్రపంచంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన అంధ రచయితలు ఎందరో ఉన్నారు. వారిలో ప్రాచీన గ్రీకు కవి హోమర్ గురించి విన్నాము.
మరో ఇంగ్లీష్ అంధ కవి జాన్ మిల్టన్ ఎన్నో రచనలు చేశాడని అందరికీ తెలిసిన విషయమే!
అలాగే హెలెన్ కిల్లర్ కూడా గొప్ప రచయిత్రి. ఈమెకూడా దివ్యాంగురాలే! జార్జ్ లూయిస్ బోర్డెస్ వంటి అంధ రచయితల సరసన నిలువ గలిగిన తెలంగాణ రచయిత శ్రీ గోపాల్ రెడ్డి గారు.
వీరు రాసిన జీవన స్రవంతి నవల చదువుతుంటే మనసు భారం అవడమే కాకుండా, కళ్ళు చెమర్చుతాయి. ధారగా సాగే ఆ పఠనంలో బాధాకెరటం వీచినా, కన్ను మసకబారినా, గొంతు గద్గదించినా ఆగకుండా సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే? పాత్రలు, కథా సంభాషణలు మాత్రమే కాదు! మనసులో భావోద్రేకాలతో సాగుతుందీ నవల.
అంతే కాదు ఇందులో తెలంగాణ ప్రాంతపు ఆచారాలు- సంప్రదాయాలు తెలుస్తాయి. నా మటుకు నాకు అనిపించేది ఆంగ్లంలో అంధుల రచనలు ఉంటే ఉండవచ్చు! కానీ తెలుగు సాహిత్యంలో ఇదే మొదటి నవల అనిపించింది.
దీన్ని బ్రెయిలీలిపిలో తాను రాసిన తర్వాత దాన్ని చెబుతుంటే విని, రచయిత్రి, సమీక్షకురాలైన అరుణా ధూళిపాళ గారు తెలుగు లిపిలో రాసారు.
రచయిత తన నవలను నదీ ప్రవాహంతో పోలుస్తూ రాసిన నవల. ఎందుకంటే జీవితంలో ఒక్కోసారి వేగంగా సంఘటనలు జరుగుతాయి! ఒక్కోసారి మందకొడిగా సాగవచ్చు అచ్చంగా నదీ ప్రవాహం వలె అని కాబోలు !
కంటి చూపు లేని వారిని నిరాశగా బతక వద్దు! ఉత్సాహంగా బతుకుతూ తాను అనుకున్న లక్ష్యాలను చేరాలని అన్యాపదేశ సందేశం ఈ నవల పొడుగునా మనకు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూపు లేకుండా చేసిన భగవంతుడే జీవన గమ్యాలను చేరుస్తాడన్న విశ్వాసం కూడా కావచ్చు ! కానీ ఆద్యంతం ఆసాంతం చక్కగా చదివించే గుణమున్న ఈ నవల గురించి విహంగ వీక్షణం చేద్దాం!!!
సాధారణ మనుషుల జీవితాలే విచిత్రం… అంటే ఇంకా దివ్యాంగుల జీవితాలు మరీ విచిత్రాలు… జీవితంలో ఏమీ సాధించలేమని, ప్రపంచంలోని కష్టాలన్నీ తమకే ఉన్నాయనే నిరాశతో సాగుతాయి జీవితాలు మామూలు వారికి కూడా… కానీ అలా నిరాశగా ఉండొద్దని, మనోధైర్యంతో అంతర్నేత్రం ద్వారా దారిని సుగమం చేసుకోవాలని, చీకటి తెరలను తొలగించుకోవాలనీ వారి అనుభవాలు, జ్ఞాపకాలు, సంఘర్షణలు, సంతోషపుక్షణాలు, అంధుల జీవితాలలోని ప్రత్యేక లక్షణాలు, ఆలోచనలన్నిటినీ గుదిగుచ్చి .. రచయిత అక్షరీకరించారు.
ఆ అక్షరాల అందమైన ప్రవాహమే ఈ జీవన స్రవంతి.
ఈ నవలకు అందమైన ముఖచిత్రం వేసిన చిత్రకారుడు గౌరీభట్ల ప్రవీణ్ కుమార్ ముఖచిత్రం చూడగానే మనకు కనిపించే చిత్రంలో నదీ తీరంలో ఊతకఱ్ఱ సాయంతో ఒక పొడుగాటి మనిషి , సంధ్యా సమయపు కెంజాయ రంగులో వెలుగులీనుతున్న కాంతిలో ప్రవహిస్తున్న నది పైన ఒక కలం -పాళీ వెలుగుచిమ్మిన ఒక చిత్రం! చెప్పకనే లోపలి కథను రేఖామాత్రంగా తమ కుంచెతో రేఖలలో బంధించిన ప్రవీణ్ ప్రతిభ అమోఘం.
కథానాయకుడైన వేణుకు తాను ఊహించని అంధత్వం తననావరించినా, తట్టుకొని నిలబడి, ఆకటిక చీకటి కన్నులకే కానీ .. అంతర్ నేత్రానికి సూర్యకిరణాల్లాంటి వెలుగుల చూపుందని, తన శారీరక అందం ముఖ్యంకాదని, మానసిక అందంతో లోకాన్ని చూసి, కాలం కలిసి రాకపోయినా, పరిస్థితులు ఎదురు తిరిగినా, పట్టుదలతో కాలానికి ఎదురీది జీవన సాఫల్యం సాధించిన మహోన్నత వ్యక్తిత్వం వేణుది.
ఇక నవలా కథానాయకుడైన వేణు వ్యవసాయదారుల కుటుంబంలో పెద్ద కుమారుడుగా పుట్టి, అనుకోని పరిస్థితుల్లో వైద్యం వికటించి, పసి వయసులోనే కంటిచూపు పోగొట్టుకున్నా… తాను అందరివలెనే జీవించాలన్న ఆశయంతో కష్టాన్ని కౌగిలించుకొని, ఱంకెలు వేస్తూ మీదకు వచ్చే సమస్యలనే వన్యమృగాలను మచ్చిక చేసుకుని, తన దారికి మళ్ళించుకొనే మాట నైపుణ్యమున్న బతుకు వేటగాడు.
చదువుకునేందుకు ఎదురైన సమస్యలు, ఇంట్లో ఆధిపత్య ధోరణిలో నలిగిపోయిన వైనం, ఉద్యోగ ప్రయత్నం, ఇవన్నీ అసలే సహకారం లేని తన వారు, స్నేహితుల ఆలంబనతో ఎలా తాను అనుకున్న పని నెరవేర్చుకున్నారనేది ఈ నవల అంతా పరుచుకొని కనపడుతుంది.
ఒక్క చదువు, ఒక ఉద్యోగం లోనే కాదు తన ప్రేమ విఫలతను ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, తన పెళ్ళికి పెద్దలుకుదిర్చిన అమ్మాయిని అర్థం చేసుకోవడంలోనూ విజేతనే వేణు!
ఒక విశిష్టమైనటువంటి నవల అని ఎందుకంటున్నానంటే ? ఒక అంధుడి జీవితంలోని చీకటి కోణాలను వివరించే అద్భుతమైన నవల! తెలుగు సాహిత్యంలో ఇంతవరకు ఈ చీకటి జీవితాలకు సంబంధించినటువంటి చీకటి కోణాల విషయాలు బహిర్గతం చేసే నవలలు వచ్చినట్టు మనకు తెలియవు.
మొట్టమొదటిసారి శ్రీ గోపాల్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన జీవన ప్రయాణంలో వారు ఎదుర్కొన్నవి, చూసినవి, విన్నవి, అనుభవించినవి, అనుభూతులుగా పొందినవన్నీ కూడా తన జీవన స్రవంతి నవల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియచేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎంతో కష్టపడి రాసిన నవల ఇది. దీన్నే ఆత్మ కథాత్మక నవల అని అంటాము. అంటే కొంత జీవిత చరిత్ర కు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పనాశక్తితో నవరసాత్మకమైన సన్నివేశాలను కల్పించి ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు. ఇది ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి ట్రయాలజీ అనే సంప్రదాయాన్ననుసరించి, ఒక జీవితాన్ని- జీవితంలోని దశలను మూడు భాగాలుగా రాయబడిన కొత్త ప్రయోగం. తెలుగులో ఇంచుమించుగా ఇలాంటి నవల ఇంతకు ముందు శ్రీ అంపశయ్య నవీన్ గారు రాసారు. ఇటువంటి రచనలు తక్కువగా వచ్చాయనే చెప్పవచ్చు.
ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకొని ఉన్నది ఈ జీవన స్రవంతి నవల. ప్రత్యేకత అంటే రచయిత, విమర్శకులు ఐన శ్రీ బెల్లంకొండ సంపత్ గారు చెప్పినట్టుగా దీంట్లో ఆంగ్ల సాహిత్య సంప్రదాయమైనటువంటి సమగ్రతాశైలి కనపడుతుంది. అంటే కేవలం ఒక విషయాన్ని మాత్రమే వర్ణించడం కాకుండా ఒక సామాజికాంశము, కుటుంబ సమస్యలు, ఆర్థికాంశాలు, వాటితో ఏర్పడిన చీకటి జీవితపు సంఘర్షణలు ఇలా వ్యక్తికి సంబంధించిన అంశాలే కాకుండా, సామాజిక సమస్యలను చిత్రించిన నవల కాబట్టి సమగ్ర సాహిత్యమంటారు.
తెలుగులో సమగ్రతా శైలితో రచించిన నవలలు చాలా తక్కువ. అందులో ఉదా॥ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు రాసిన మాలపల్లి, విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు వంటి నవలలు చెప్పుకోతగ్గవి. ఎందుకంటే సుదీర్ఘమైన కాలం- నిర్ధిష్టమైన కాలంలో రాయబడిన సామాజిక పరిణామాలన్నింటినీ వర్ణిస్తేనే సమగ్రతా శైలి అని నిర్వచిస్తారు. ఇందులో ఒక కథాంశం వివరించడమే కాకుండా రచయిత బోధనారంగంలో ఉండడంవల్లనేమో? వారిలో సాహిత్యాభిలాష ఉండడం వల్ల రచనలో భావుకత ఉంటుంది. ఈ భావుకత వల్ల పాఠకులను ఆకర్శించిందీ నవల. అంతేకాకుండా అందులోని విషయాలను అవగాహన చేసుకోవాలనే అంశాలుగా మారుతాయి. కాబట్టి ఈ జీవన స్రవంతి చదివేవారికి ఉత్కంఠతో పాటు ఆసక్తిని కూడా కలిగిస్తుంది.
ఈ విధంగా ఎందరి మెప్పులు పొందిన ఈ నవలలో అనేక అంశాలను చర్చించిన కొంత జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు తన ఊహా కల్పన శక్తితో నవరసాత్మకమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ… దాంతో ఆత్మ కథాత్మక నవలగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా దీనిలో అంధుడు తమ సోమా జ్యోతిర్గమయా అన్న ఉపనిషత్తు వాక్య ప్రకారం చీకటినుండి వెలుగులోనికి ప్రయాణం చేయడం నవల యొక్క ముఖ్య లక్షణం అనిపిస్తుంది.
కనుచూపు లేని చీకట్లో ఉన్న వాళ్ళు ఆ చీకట్లోనే మగ్గిపోకుండా, చీకటి నుండి వెలుగులోనికి ఎట్లా ప్రయాణం చేయాలని? అలా ప్రయాణించినప్పుడు ఎన్నెన్ని ఆటంకాలు ఉంటాయో? వాటిని ఆత్మవిశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నాడనీ, ఆ అంశాలు ముఖ్యంగా వాటినన్నిటినీ ధైర్య-స్థైర్యాలతో , ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొన్నారో అన్నీ వర్ణింపబడ్డాయి.
అంతేకాదు ఇందులో ఒక సిద్ధాంతం నవల నిండా కనబడుతుంది … అదేమిటంటే? అవయవ నష్టపరిహార సిద్ధాంతం అంటే శరీరంలో ఒక అవయవం లోపిస్తే… లోపించినటువంటి అవయవం ఏ పనులైతే చేస్తుందో… ఆ లోటు పూరించడానికి మిగిలిన అవయవాలు పనిచేస్తాయని ప్రధాన సిద్ధాంతం! కనుక ఇందులో ఒక చూపు లేకపోవడం వల్ల దాన్ని పూరించడానికి వినికిడిశక్తి, స్పర్శ, ఇతర అవయవాలకు సంబంధించిన పనులన్నీ క్రియాశీలకంగా మారి ఒక చూపులేని లోటును పూరించడం ఉంది… అని ప్రఖ్యాత వక్త వీక్షణం వేణుగోపాల్ గారన్నారు.
కనుక ఈ నవల నిండా కూడా ఆ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. ఇదో ప్రత్యేకత!
ఇంకొక ప్రత్యేక లక్షణం ఏమిటంటే రచయిత తన రచనలు నదితో పోల్చడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నది యొక్క మలుపులు ఏ విధంగా ఉంటాయో జీవితపు మలుపులు కూడా అదే విధంగా ఉంటాయని ఉపమానంతో నిరూపించడం ఇందులో ముఖ్యమైన అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణిస్తేనే జీవితం ప్రవహిస్తేనే నది అని ప్రఖ్యాత తెలంగాణ రచయిత కవి అయిన శ్రీ నందిని సిధారెడ్డి గారు ఈ నవల ఆవిష్కరణ సమయంలో అన్నారు. ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. కనుక జీవితం కూడా ఎప్పుడూ సజీవంగా ఉంటుంది. అలాగే నది కూడా నీటి ప్రవాహంతో ప్రవహించినప్పుడే నది అని అనుకుంటాం! వారన్నట్టుగా కూడా ఈ నవలను నిర్వచించుకోవచ్చు కూడా!
ఇలా అనేక ప్రత్యేకతలున్న నవలని కెనడా దేశంలోని టొరొంటో వేదికగా తెలుగు భాషకెంతో సేవలందించిన కీ.శే. నెల్లుట్ల నవీన్ చంద్ర గారు ఈ జీవన స్రవంతి ఒక ఎన్స్లైక్లో పీడియా (ENCYCLOPEDIA) అన్నారు.అంటే విజ్ఞాన సర్వస్వం అని. ఇది ఎలా అయితే అన్నివిషయాలను పొందుపరిచి మనకందిస్తుందో? ఈ జీవన స్రవంతి నవల కూడా అన్ని విషయాలలోనూ అవగాహన పెంచుతుందని అన్నారు. అలా ఉపయోగపడుతుంది.
రెండవ భాగం ఆవిష్కరణ సందర్భంలో N. వేణుగోపాల్ ఒకే ఒక్క మాటన్నారు.ఈ నవల మన జీవితాలలోని లోతుపాతులను చూసుకునేందుకుపయోగపడే దర్పణం వంటిది అని, అంటే అద్దంలో చూస్తూ మన ముఖంలోని లోపాలను ఎలా అయితే సవరించుకుంటామో, అలాగే ఈ జీవన స్రవంతి నవలను చదివితే కంటిచూపున్నవారు తమకు చూడగలిగే శక్తి ఉందనే గర్వాన్ని విడిచిపెట్టి తమలో ఏ యే లోపాలున్నాయో ఈ నవల చదివిన తర్వాత సరిదిద్దుకునే అవకావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ మాట నవలను చదివాక యథార్థమనిపించింది. అందుకే ప్రత్యేక మైనదని అంటున్నాను. అలాగే ఈ నవలలో చర్చించని విషయం లేదు. బయటి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉన్నాయి.
బయట ప్రపంచ సమాజంలోని లోపాలు, కుటుంబంలోని లోపాలు, ఆర్థిక వ్యత్యాసాలు, బలహీనులను ఏ విధంగా సమాజం చిన్నచూపు చూస్తుందో చెప్తూ వారికి న్యూనతా భావం ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తారో, ఆ ప్రయత్నాల వల్ల ఎన్ని విజయాలు సాధిస్తారో? న్యూనతాభావం మనిషిని తక్కువ స్థాయికి దిగజార్చుతుంది. ఆ తక్కువ స్థాయి నుండి తాము కూడా అందరితో సమానమనే భావాన్ని వ్యక్తీకరించడానికి నవల చదివితే ఎంతో ఉపయోగపడుతుందని వేణుగోపాల్ గారు అన్నారు.
నందిని సిధా రెడ్డి గారు ఏమంటారంటే ఈ నవల కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొనే వారికి ఒక దిక్సూచి వంటిదన్నారు. ఎందుకంటే జీవితమంటేనే చిన్నవో- పెద్దవో కష్టాలుంటూనే ఉంటాయి. దుఃఖమొచ్చినప్పుడు బాధ పడకుండా ఎదురించడానికి ఎలా ప్రయత్నించాలని, దాన్నుండి బయటపడే మార్గంచూపుతుందీ నవల.
అన్నింటికన్నా ముఖ్యం మానసిక సంఘర్షణ అనేది మనిషిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందుకే కురుక్షేత్ర యుద్ధానితో సమానం మనిషి హృదయం అని అంటారు. కురుక్షేత్ర యుద్ధంలో ఏవైతే మంచీ-చెడుల మధ్య సంఘర్షణ జరిగిందో అలానే జీవన స్రవంతి నవలలో కూడా రచయిత పాత్రల ద్వారా- కథానాయకుడైన వేణు ద్వారా మానసిక సంఘర్షణాత్మక అంశాలను వివరిస్తూ ఆ సంఘర్షణల వల్ల చెడును తొలగించి మంచి జయించడమనే ఒక తత్త్వాన్ని వివరిస్తుందీ నవల.
ఇంకా చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో ఆశావాద తత్త్వం కనబడుతుంది. అదేమిటంటే మనం నైరాశ్యంలోకి వెళ్ళినప్పుడు నాకు ఇక ఏ దారీ లేదనుకున్నప్పుడు మనకనిపించేది ఏమిటంటే? ఒక చెట్టు మొత్తం ఆకులు రాలిపోయి మోడు వారినప్పుడు తనను తాను బతికించుకోవడానికి అలాగే నిలబడుతుంది. తిరిగి వసంత ఋతువు వస్తుంది అప్పుడు చిగురులు తొడిగి, పుష్పాలను పూస్తుంది ఫలాలను పండిస్తుంది అలాగే మనిషి జీవితం కూడా అలా పునర్నిర్మించుకోవాలనీ, మంచి రోజులు వస్తాయనీ, జీవన స్రవంతి నవల ఎప్పుడూ నైరాశ్య భావనను దగ్గరికి రానివ్వద్దని గొప్ప సందేశం నవల పొడుగునా అంతర్లీనంగా చెప్తూనే ఉంటుంది. కనుక ఎందరో మెచ్చుకున్న ఈ నవల చదవవలసిన అవసరం ఎంతో ఉంది!
వేణుకు వచ్చిన ఇన్ని కష్టాలలో ఒకే ఒక ఊరట రేడియో వినడం. రేడియో ద్వారానే ఎంతో విజ్ఞానాన్ని పొంది, తన వయసు వారికన్నా ఎక్కువ స్థాయిలో నిలబడడమే కాదు! ఆకాశవాణికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా చర్చించబడ్డాయి. ముఖ్యంగా ఒక రేడియో ఒక మనిషిని ఎలా బతికిస్తుందో ఒక
నిర్జీవమైనటువంటి ఆకాశవాణి మనిషి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ? అతనిలో ఎన్ని ఆశా తత్త్వాలను మొలకెత్తించిందో వాటితో అతడు భవిష్యత్తు వైపు నడవడానికి ఎంత ఉపయోగపడిందోనన్న విషయాన్ని ఈ నవలలో ఎన్నోసార్లు చెప్పారు.
ప్రఖ్యాత నాటక నటి శారదా శ్రీనివాసన్ యొక్క ప్రస్తావన అడుగడుగునా కనిపిస్తుంది. ఆమె అందించినటువంటి మాటలు- ఆమె మధుర కంఠస్వరం యొక్క అమృతం ఒక అంధుడైన కథానాయకుని ఎలా బతికించిందో ఇందులో చిత్రీకరింపబడింది. కనుక రేడియోలో నవలాస్రవంతి ద్వారా – జీవనస్రవంతిని ప్రసారం చేస్తే ఈ నవల సార్ధకత చరితార్థం అవుతుందని ఈ జీవన స్రవంతి నవలపై సమీక్షా ప్రసంగం చేస్తున్నాను. జీవిత సత్యాలను సమగ్రంగా వివరించే ఈ నవలను ప్రతి ఒక్కరూ చదవాలి! ముఖ్యంగా అంధులు చదవాలని సూచిస్తూ.

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

“వివేకం”

by Maji Bharathi January 25, 2026
written by Maji Bharathi

“మీరెన్ని చెప్పండి. మీ అమ్మగారిని యిక్కడికి తీసుకురావడానికి నేనొప్పుకోను. అలవాటైన ఊరు. అలవాటైన పరిసరాలు. అయినా కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి కదా! కాలు చెయ్యి పడిపోయినప్పుడు ఆలోచిద్దాంలెండి”.
“అదేమిటి సరసూ! అంత మాటన్నావు?”
“ఆవిడ అత్తగారి గురించి మీ అమ్మగారన్న మాటలే కదా! నేనేమైనా కొత్తగా అన్నానా ఏమిటి?” “ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు?”
“ఎందుకంటే, అది ఆవిడ చూపిన త్రోవే కదా! నేను అనుసరిస్తున్నానంతే!”
“అది తప్పని నీకు తెలియదా?” “మీకు తెలియదా?”
“తెలుసు కాబట్టే, అమ్మను యిక్కడకు తీసుకొద్దానుకుంటున్నాను”.
“కాలానుగుణంగా మనుషులను బట్టి మీ తప్పొప్పులు మారిపోతాయంటే నేను లెక్కచెయ్యను”
“సరసూ దయచేసి అర్థం చేసుకో! అప్పుడు మా అమ్మ చేసినది తప్పే. కాని ముప్పయ్యేళ్ళ క్రిందట జరిగిన దానికి యిప్పుడు నేనేం చెయ్యగలను?” నాన్న అమ్మను బ్రతిమలాడుతున్నారు.
“ఇప్పుడూ అలాగే అనుకొని ఊరుకోండి. మీకు అమ్మ అయితే అవ్వచ్చు. గాని ఆవిడ మా అమ్మమ్మకు చేసినదానికి, ఆవిడ క్షమించినా నేను క్షమించలేను. కొడుకుగా మీరేం చేసినా నేను అడ్డు చెప్పను. కానీ ఒక కోడలుగా ఆవిడ ఎంతవరకు చేశారో, నేనూ అంతవరకే చేస్తాను. నన్ను ఎక్కువగా బలవంత పెట్టవద్దు” అమ్మ నిష్కర్షగా చెప్తుంది నాన్నతో.
అమ్మానాన్నల సంభాషణను పక్కగదిలో ఉన్న నేను పూర్తిగా విన్నాను. నేను గదిలో లేననుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారో, ఉన్నా ఫరవాలేదు అనుకొని మాట్లాడుకున్నారో నాకు తెలియదు. కానీ వారం రోజులనుండి అమ్మానాన్నల మధ్య ఈ ప్రచ్చన్న యుద్ధం జరుగుతూనే ఉంది నాన్నమ్మ విషయంలో. ఈరోజు ఇద్దరూ బయటపడ్డారు.
అమ్మ, నాన్నకు అత్త కూతురే. తాతమ్మ నాన్నకు నాన్నమ్మ అయితే అమ్మకు అమ్మమ్మ అవుతుంది. నాన్నమ్మ తాతమ్మను బాగా చూసుకోలేదని అమ్మకు కోపం. ముత్తాత చనిపోయాక, తాతయ్య వాళ్ల అమ్మ… అదే తాతమ్మను ఇంటికి తీసుకువస్తానంటే నాన్నమ్మ ఒప్పుకోలేదంట. చివరకు ఆ పల్లెటూరిలోనే తాతమ్మ చనిపోయిందంట. అప్పటికి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నా తాతమ్మ విషయంలో ఏమి చేయలేదని అమ్మకు కోపం. అందుకని ఇప్పుడు తాతగారు చనిపోయాక నాన్నమ్మను తీసుకువస్తానంటే ఒప్పుకోవడం లేదు.
దానికితోడు… మనలో మనమాట… నాన్నమ్మ ఎప్పుడూ అమ్మను కూడా బాగా చూసుకోలేదు. నాన్నమ్మకు ఇష్టం లేకుండా, తాతమ్మ బలవంతంతో అమ్మానాన్నల పెళ్లి జరిగిందని ఒక కారణం. ఏదైతేనేం నాన్నమ్మ, అమ్మల మధ్యలో సయోధ్య ఎప్పుడూ లేదు. నాన్నమ్మ అటు ఆవిడ అత్తగారి విషయంలోనూ, ఇటు కోడలి విషయంలోనూ తన మాటే నెగ్గేటట్లు చూసుకుంది. అధికారం చలాయించింది. ఆ విషయం జగమెరిగిన సత్యం.
ఒకప్రక్క తన అమ్మమ్మకు అన్యాయం చేసిందని, ఇంకొక ప్రక్క తనను ఏ రోజూ ప్రేమగా చూసుకోలేదని అమ్మకు, నాన్నమ్మ అంటే కోపం. ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది. అందరి విషయంలో మంచిగా ఆలోచించే అమ్మ, నాన్నమ్మ విషయంలో మాత్రం తన గతంనుండి బయటపడలేక పోతుంది. మధ్యలో నాన్న నలిగిపోతున్నారు.
ఇప్పుడు పరిస్థితి యిలా ఉంటే…. మరో పాతికేళ్ల తర్వాత…. ఇదే పరిస్థితి నేనూ ఎదుర్కోవలసి వస్తుందా? మీ నాన్నమ్మ గారిని మీ అమ్మగారు చూశారా, నేను మీ అమ్మగారిని చూడడానికి? అని నా భార్య అంటే నేనేమి చెయ్యాలి? నా భార్య మా అమ్మల మధ్య నలిగిపోవాలా! అమ్మో! నా వల్ల కాదు. ఆ పరిస్థితి నాకు ఎదురవ్వకూడదంటే ఇప్పుడే నేను సరైన దిశగా ఆలోచించాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాను.
“అమ్మా! నీ బాధను, మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. గాని కొత్తవారికి ఇవన్నీ అర్థం కాకపోవచ్చు. పాతికేళ్ల తర్వాత ఇదే పరిస్థితిలో నేనూ వుంటానేమోనన్న ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. ఏం చేయమంటావు నన్ను?” ఆ రాత్రి అమ్మ చరవాణికి ఒక సందేశం పంపించాను.
*
“సరసూ! తలుపేసుకో” వేకువజామునే నాన్న మాటలు.
“రేపు పెందరాళే బయలుదేరండి. ఎండ పడ్డాక బయలుదేరవద్దు. మీ అమ్మగారి ఆరోగ్యం అసలే అంతంత మాత్రం” అమ్మ నాన్నకు చెప్తుంది.
నాన్నమ్మను తీసుకురావడానికి ఊరికి బయలుదేరినట్లున్నారు.
నాకు తెలుసు. మా అమ్మ వివేకవంతురాలు. అర్థం చేసుకోగలదు.

January 25, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

“ఎంతదూరం”

by K. Bhanuja January 25, 2026
written by K. Bhanuja

దూరం అంటే ఎంతదూరం
కొలిచి చెప్పే సాధనాలు ఎన్నైనా ఉండవచ్చు
అంతరాలు అవగతమౌతాయా?
మనిషికి,మనసుకు దూరం ఎంత?
శూన్యమా ! అనంతమా !!
కాలం మాటున దాగిన ప్రశ్నలలో
ఊపిరి విలువ ఎంత?
బేరీజు వేయవచ్చా?
సొంతమనుకొని, సొంతం కానీ
అన్ని బంధాలను పెనవేసుకొని
చెట్టాపట్టాలేసుకోకుండా ఉన్నట్టుండి మటుమాయం
హార్ట్ ఎటాక్ తో ఆయువు అంతం
జేబుకున్న చిల్లులు లెక్క పెడితే
గుండెకు ఐన గాయాలు కనిపిస్తాయా?
ఎపుడు ఏ ఉచ్చులో పడుతారో
తనకే తెలియని అమాయకత్వం మనిషిది
కానీ అన్ని ఊహాలు వేయగల అసాధ్యులు !
చిన్న జీవితంలో
దూరమెంతో తెలియని భారప్రయాణం
లెక్కలు చెప్పమంటే ఏమని చెప్పను?
జవాబులు లేని ప్రశ్నలకు
కొలవలేని సమాధానాలకు
నాకు నేనే ఎంతదూరమో??

January 25, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నమ్మకపు పోటు

by Nakka Harikrishna January 25, 2026
written by Nakka Harikrishna

ఓటమి ఒక శాశ్వత జ్ఞాపకం
అనుభవిస్తేనే గాని తెలియనిది

మొన్నటి ప్రణాళిక
నిన్నటి కార్యాచరణ
నేటి ఫలితం

భవిష్యత్తు ఆలోచనకు
‘ధన’ తో ఎవరో
‘తన’ తో ఎవరో తేలిపోయింది

ఓటమికి ఉన్న కసి
గెలుపుకు ఉండదు

నైతికత ఎప్పుడూ గొప్ప లక్షణమే
వెన్నుపోటు చారిత్రిక అవలక్షణం
వెనుక పొడవాలనుకున్నవాడికి
ఆ అవలక్షణమే సాధనం

బుద్ధి మందమైతే
బంధం తెగిపోతుంది
వ్యూహం మారుతుంది
మనిషి అసలు స్వరూపం బయటికి కనబడదు
బాహ్య రూపం ముసుగు మాత్రమే
ప్రవర్తన అంతా ఒక నటన మాత్రమే

ఈ నాటికీయ ప్రయాణం
పంతంతో ఒకలా
పగతో ఒకలా ఉంటుంది
అవసరంతో ఒకలా
ఆదరంతో ఒకలా ఉంటుంది

మనం లేని చోట వినబడే మాటలో
మనమెవరం అనేదే ముఖ్యం
నలుగురు కొట్టిన చప్పట్లు
మనకోసమా కాదా సరిచూసుకోవాలి

కదులుతున్న గడియారం ముల్లు
రేపటికి ఒక కొత్త ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తుంది
కాలం గుండ్రంగా ఉంటుంది
రాత్రి పగలు అందరికీ ఒకటే
ఈ చాపరేఖ ఇప్పుడు నాది కాకపోవచ్చు
కానీ రేపు …. ?

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వసంత పంచమి గురించి ఒక చిన్న మాట!

by రంగరాజు పద్మజ January 25, 2026
written by రంగరాజు పద్మజ

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చిట్టి కథ గొప్ప సందేశం

by Nellutla Madhava Srinivas January 25, 2026
written by Nellutla Madhava Srinivas

బాగా సంపన్నులు అయిన ఒక కుటుంబంలో వారితో చాలా సంవత్సరాలుగా ఒక కుక్క ఉండేది. ఆ కుక్క చాతనైనన్ని రోజులు ఆ ఇంటికి తను చేయగలిగినంత చేసి కంటికి రెప్పలా కాపాడింది ఇంట్లో వాళ్ళని. ఇక ఇప్పుడు దాని ఓపిక తగ్గి అది ఏమి చేయలేదు అనుకున్న సమయంలో ఆ ఇంటి యజమాని ఇక దీంతో మనకు పని లేదు దీనిని వదిలేసి ఇంకొక దాన్ని తెచ్చుకుందామని దానిని దూరంగా ఉన్న అడవిలోకి వదిలిపెడతాడు. ఆ కుక్కని వదిలేసి ఆ యజమాని వెళ్లిపోయిన తర్వాత నిదానంగా ఓపిక కూడతీసుకొని నడుస్తున్న కుక్కను అటుగా వస్తున్న ఒక పులి చూస్తుంది. హమ్మయ్య !!!!ఎక్కువగా కష్టపడకుండా నాకు ఈ రోజుటి ఆహారం లభించింది అని అనుకుంటూ నెమ్మదిగా కుక్క వస్తున్నవైపు అడుగులు వేస్తూ వస్తుంది. అది గమనించిన కుక్క ముందు భయపడిన ….నిదానంగా ఆలోచించి తనలో తాను అనుకుంటున్నట్లుగా పులికి వినబడేటట్టుగా ఈ విధంగా మాట్లాడింది. కొంచెం సేపు అటు ఇటు నడిచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ పులి దగ్గరికి వచ్చే సమయానికి దానికి వినిపించేటట్లుగా ఇవి నిన్న మొన్న నేను తిన్న పులి ఎముకలు కదా !!! ఇక ఈరోజు ఆహారం వెతకకుండానే నా దగ్గరికి వస్తుంది అని అంటుంది. అది విన్న పులి భయపడి నిదానంగా వెనుకకు జరుగుతుంది అక్కడినుండి. ఇదంతా చెట్టు పైన కూర్చుని చూస్తున్న కోతిగమనించింది. పులి కొంచెం దూరం వెళ్లిన తర్వాత కోతి రెండు చెట్ల అవతలికి దూకి పులితో ఈ విధంగా అంటుంది. అయ్యో!!!! పిచ్చిదానా నువ్వు దాని మాటలు నమ్మావా??? అది ఇప్పుడు తిన్నవి కావు .చాలా రోజుల నుండి ఉన్నాయి ఆ ఎముకలు అక్కడ. నువ్వు ఏమీ భయపడాల్సిన పనిలేదు .ఆ జంతువు నీ నుండి తప్పించుకోవడానికి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది అంతే. నువ్వు వెళ్లి హాయిగా దానిని ఆరగించు. నీకు తోడుగా నేను వస్తాను పద అని పులికి చెప్పి రెండూ కలిసి బయలుదేరాయి. అది గమనించిన కుక్క విషయం గ్రహించి ఇప్పుడు ఏం చేయటం అని ఒక నిమిషం ఆలోచించి తెలివిగా అవి రెండు వినేటట్లుగా నేను ఇందాకే చెప్పి పంపించాను కదా ఒక కోతికి మొన్న తెచ్చిన పులిని మూడు రోజులకు సరిపడా తిన్నాను. పులి మాంసం చాలా బాగుంది. మళ్లీ ఒక పులిని ఆహారంగా తీసుకురమ్మని పంపాను. ఇంకా రాలేదేంటి అని ఆ రెండింటికి వినిపించేటట్టుగా స్వగతంగా అనుకుంటుంది. అది విన్న పులికి చాలా కోపం వస్తుంది. పులి కోపంగా కోతిని చూసి నిజంగానే తనను ఆ జంతువుకు ఆహారంగా ఇవ్వడానికే కోతి పన్నాగం పన్నింది అని భ్రమపడి అమాంతం కోతిని తన పంజాతో కొట్టి చంపి అరవిస్తుంది. ఇది వినడానికి చిన్న కథ అయినా ఎంత నీతి చూడండి. అనవసరంగా ఎదుటి వారి వ్యవహారంలో తల దూర్చకూడదు దూరిస్తే కోతికి పట్టిన గతే పడుతుంది. అంతేకాకుండా అపాయం వచ్చినప్పుడు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలా అని మనం ఆలోచించటం మొదలుపెడితే ఎదుటి వ్యక్తి, ఎదుట ఉన్న ప్రమాదం ఎంత పెద్ద వైనా సరే తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం కనపడుతుంది. అప్పటికి బయటపడే అవకాశం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేయకుండా భయపడితే మాత్రం మనంతట మనమే గోతిలో పడ్డట్లుగా ఉంటుంది. పులిని భయపెట్టడం అనేది కుక్క వల్ల అయ్యే పని కాదు కానీ …..తన ప్రాణం మీద ఉన్న తీపి తో ఒక ప్రయత్నమైతే చేసింది కుక్క. ఆ క్షణానికి కుక్క మాటలను పులి నమ్మటం వలన కుక్క సేఫ్ గా బయటపడగలిగింది.
అందుకే ఆపద రాగానే కంగారుపడి భయపడి హడావిడి చేయకుండా ఏ ప్రయత్నము చేయకుండా కూర్చోవడం కన్నా మెదడుకు పదును పెడితే ఆపద నుండి దాదాపుగా గట్టెక్కగలం . ఒక జంతువే అంత తెలివిగా ప్రవర్తించి తన ప్రాణాలను కాపాడుకోగలిగినప్పుడు ….మనం మానవులం దానికన్నా తెలివైన వాళ్ళం అంతకన్నా తెలివిగా మనం ఆలోచించలేమా చెప్పండి.

నేను విన్నది నాకు నచ్చింది మీతో పంచుకోవాలనిపించి పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి.

సర్వేజనా సుఖినోభవంతు

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేనున్నాను

by Gaddam sulochana January 24, 2026
written by Gaddam sulochana

నేను తప్పిపోయాను
వెతుక్కోలేదు కాబట్టి
ఎప్పుడనేదీ చెప్పలేను
నేను మరణించాను
శ్వాసిస్తున్నాను కాబట్టి
ఆ విషయము అర్థంకాలేదు

చిన్న చిన్న ఆశల రెక్కలు
అప్పుడప్పుడు మొలచి రాలిపోయేవి
ఊడ్చి పారేస్తున్నదీ నేనే కాబట్టి
ఎదగలేదన్నది తెలియనేలేదు

ఇదంతా ఎందుకు అంటారా?
చెప్పడం అవసరమే..!

గుండె నిండా నింపుకున్న ప్రేమలో
ఓ తొణికిపాటు
తీగలు తీగలుగా అల్లుకున్న బంధాలు
కొంత విడివడిన వెసులుబాటు

అవకాశవాదులు అవసరార్థులు
తప్పిపోయారిప్పుడు
వెరిసి నాకిదొక అవకాశం

వేకువ మెలకువలో
నేనుగానే మేల్కొంటున్నా
పక్షుల కువకువలు
వినిపిస్తున్నప్పుడు
ఊహల రెక్కలు
విప్పుకుని ఎగురుతున్నా
నేనున్నానని ప్రకటించుకుంటూ,
నాలుగక్షరాలు చదివో రాసో
సంబరపడుతున్నా
నిజంగా నేనున్నాను.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూరు – తమిళనాడు

by కావ్యసుధ (హరిశంకర్) January 24, 2026
written by కావ్యసుధ (హరిశంకర్)

తమిళనాడు రాష్ట్రంలోని తిరుమేయచూర్ జిల్లాలో ఉన్న లలితాంబికై దేవి పురాతన ఆలయం. ఈ ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది కేవలం సూత్రాలతో ప్రవహించే కావేరీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయం శివుని యాబై ఆరవ ఆలయం. ఆలయంలోని ప్రధాన దేవతలు లలితాంబికై మరియు మహానాడు. ఈ ఆలయంలో పవిత్రమైన పండుగ రాధా సప్తమి జరుపుకుంటారు. వ్యాధి లేని జీవితం మరియు సంపద జీవితంలో శాంతి మరియు ఆనందం నుండి ఉపశమనం పొందాలని భక్తులు వేడుకుంటారు. ఈ ఆలయం పేరు మేఘనాధ స్వామి పలితాంబిక ఆలయం కాగా ఈ ఆలయంలో లలితాపారాయన సూత్రాన్ని పఠించడం భక్తుల కోరికలు తీరుతాయి ఈ ఆలయానికి అమ్మవారికి శాంతి పరిచిన మహాదేవుని ఆలయంగా కూడా పేరు ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో శివుడు మేఘనాథ్ స్వామిగా పార్వతి లలితాంబిక ఆవిర్భవించారు. జగన్మాత పాండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు శ్రీ చక్ర రథంపై ఆసీనురాలై పాండాసురునిక సంహరించింది. ఆ తర్వాత ఆగ్రహంతో ఉన్న లలితాంబిక శివుని ఆదేశాల మేరకు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట.

ఋషులు పరాశక్తి దేవి వద్దకు వెళ్లి, దేవత వారికి భద్రత కల్పించాలని కోరారు. దేవి యాగం నుండి ఉద్భవించి, శ్రీ చక్రంపై లలితాంబికగా ఎక్కి, దెయ్యంతో పాటు యుద్ధాన్ని ప్రారంభించింది మరియు చివరికి దేవి దేవి అతన్ని నాశనం చేసింది. దేవి కోపంగా ఉంది మరియు శివుడు పరాశక్తి దేవిని మనోన్మణి అనే పేరుతో భూమికి రావాలని కోరాడు, తద్వారా దేవి తన కోపాన్ని చల్లబరుస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత దేవత దయగలది మరియు సరళంగా మారింది. దేవత పదాలను పాలించడానికి వాక్ దేవతలను ఏర్పాటు చేసి, సుమారు వెయ్యి పేర్లతో తన స్తుతిని జపించమని కోరింది.

ఆలయ చరిత్ర

తమిళనాడులోని తిరువారూర్ జిల్లా cccccom తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాల ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రాక్షాలన గావిస్తుంది అని అంటారు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కాని యువతులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్య రథసారధి యైన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల విశ్వాసం.

ఈ దేవాలయములో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాళీదేవి మందిరం దర్శించదగినది 8 చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవికా సుఖ మహర్షి సోత్రం గావించాడు. వేద వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళీదేవి చిలుక ద్వారా లలితాంబకు తెలియజేస్తుందని అందుకే ప్రతినిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపై ఎగురుతుందని అక్కడ ప్రచారంలో ఉన్న కథ.

ఈ ఆలయంలో రెండు శివమూర్తులు రెండు పార్వతి మూర్తులు పూజలందుకోవడం ప్రత్యేకత. తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు దాని గుర్తుగా గజవరుష్ట వాహనంపై అధిష్టించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి.

దేవాలయ విశేషాలు

తిరుమీయచ్చూర్ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.

ఆలయ ప్రాశస్త్యం

తిరుమీయచూర్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసుడు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు.

హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని తెలుస్తోంది.

12 నాగమూర్తులు…

ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ ” శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై తిరుమీయచ్చుర్ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.

తిరువాయువు జిల్లాలో మైలాడుదురైకి 12 కిలోమీటర్ల దూరంలో తిరు మీయచ్చుర్ ఉంది. మహిళాడు దొరై నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

*ఎవరైతే భగవంతుడికి తనను తాను అర్పించుకుంటారో వారికి భగవంతుడు పశుడౌతాడు.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణలో బౌద్ధం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) January 24, 2026
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

శాంతి కాముకుడు బుద్ధుడు

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్ధమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956 నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.

బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ ఒప్పుకోవలసిన నిజం. వెతుక్కోవడంలో చూపలేదనేది

ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ-నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది.

ఎక్కడుంది ఈ బౌద్ధ గుహాలయం?

కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా బలమైన పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్ధికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుప వల వేశారు. రక్షిత కట్టడం గా ఏర్పాటు చేశారు.

చతుర్ధశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం

కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా వది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆననంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చని పిస్తున్నాయి.

బౌద్ధ ప్రతిమా శాస్త్రాన్ని పరిశీలిస్తే, ప్రతి భంగిమకూ ప్రత్యేకమైన అర్థం ఉంది. నిలబడే కూర్చుంటే భంగిమలకే కాక చేతి వేళ్లను ఉంచే విధానానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు ఉన్నాయి. ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శముద్ర కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడి విగ్రహాలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది.

ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పిఉంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంది. కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్ధుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్ధంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.

బుద్ధుడేనా లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు.

దెబోగా గృహాలు
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది.

ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు
ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో… రెండవ గుహలో అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని, 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 15 రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా రెండవ రకమైన బంగారు నాణేలు రెండుతలల గండభేరుండ పక్షి రకానికి చెందినవి. బొమ్మ వైపు దీనిలో రెండుతలల గంఢభేరుండ పక్షి పైపైకి ఎగురుతున్నట్లుగా చిత్రించి వుంది. ఇవి కూడా గుండ్రని నాణేలే గండభేరుండ పక్షికి రెండు వైపులా ఒక్కో ఏనుగును చిత్రించారు.

పక్షి తన తోక్కరు కాళ్ళను క్రిందవైపున అనించి వుంచింది. రెండు మెడలనూ కలుపుతున్న దగ్గర ఒక కంఠాభరణం వంటి నిర్మాణం వుంది.బొరుసు వైపు గమనిస్తే శ్రీవ్రతాపాచ్యుతరాయ అనే అక్షరాలున్నాయి. అయితే ఇక్కడ విజయనగర రాజ్యపు కాలంలో విరివిగా పూజారికాలు జరిగేయని భావించవచ్చు బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికీ దొరికి ఉంటాయి. విగ్రహాలు శిథిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవి ధ్వంసం అయినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా శత్రువు మూకల దాడిలో ధ్వంసం అయినట్లు అర్థమవుతుంది.

సీతమ్మ పాదాలు:
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా కనిపిస్తున్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశి ఉండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరిగాడారని ఇప్పటికే అనేక నిర్దిష్ట ఆధారాలతో నిరూపించబడింది. ఆదిమానవుల ఆవాసాలకు జంతువుల నుంచి ఎండా వానల నుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు ఉండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జాయిన్ కానీ ఆ తర్వాతే బౌద్ధం కానీ ప్రాథమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారి వారి బసదులను పునర్మించారు. వాటిని ధ్వంసం చేస్తూ తదనంర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతున్నది. సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం కారుకొండ గుట్ట ఉన్న ప్రాంతం హేమాచంద్రాపురం అని పిలుస్తున్నారు.

గ్రామ దేవతగా సనాలమ్మ పూజలందుకునేది ఇక్కడే.ఏదో రాయి తెచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దర్శనం పెట్టేస్తున్నారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్షాలు మాతృ స్వామ్య వ్యవస్థ కాలములో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, నడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడుకోవడం ఈ తరం పైన ఉన్నది.
ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం తో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళలు పైనుంచి తోడ్కొని వెళ్తారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, నడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us