మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 30, 2026
written by Narendra Sandineni

శిలాలోలిత“అమరత్వం” కవితపై విశ్లేషణా వ్యాసం

శిలాలోలిత కలం పేరుతో తన సాహిత్య ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్న ప్రముఖ కవయిత్రి,తెలుగు భాషా ఉపన్యాసకురాలు,డాక్టర్ పి.లక్ష్మి గారు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ లో 1958 జులై 12న  జన్మించారు.వీరి తల్లిదండ్రులు పి.మంగమణి,రాంరెడ్డి.వీరి తండ్రి పురిటిపాటి రాంరెడ్డి హిందీ ఉపాధ్యాయుడిగా హైదరాబాద్ సమీప ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు.తండ్రి ఉద్యోగరీత్యా వీరి బాల్యం నింబోలిఅడ్డా,మలక్ పేట ప్రాంతాల్లో గడిచింది.వీరు ప్రాథమిక విద్యను శంషాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు.వీరు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1985లో ఆంధ్రా యూనివర్సిటీ,విశాఖపట్నం ద్వారా దూరవిద్యా విధానంలో రాజనీతి శాస్త్రంలో బి.ఏ. డిగ్రీ పొందారు.1987లో హైదరాబాద్ లోని కోఠీ ఉమెన్స్ కాలేజి నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా  పొందారు. 1988లో మాసాబ్ ట్యాంక్ లోని కాంప్రహెన్సివ్ కళాశాలలో తెలుగు పండిట్ శిక్షణ పొందారు.వీరు1989లో తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్ నుంచి ఎం.ఫిల్. పట్టా పొందారు.”కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు గారు పర్యవేక్షకులుగా వ్యవహరించారు.           అనంతరం,హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సీతాకల్యాణి పర్యవేక్షణలో “కవయిత్రుల కవితా మార్గం” అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి, 1998లో పిహెచ్ డి పట్టా పొందారు. కవయిత్రి శిలాలోలిత గారి వివాహం కవి యాకూబ్ గారితో తేదీ మే 10,1991న జరిగింది.వీరికి ఇద్దరు కుమారులు: 1.సందీప్ 2. సాహిర్ భారతి. కవయిత్రి శిలాలోలిత తెలుగు ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.అనంతరం తెలుగు భాషా ఉపన్యాసకురాలిగా సేవలందించి,2016లో పదవీ విరమణ చేశారు.ప్రస్తుతం వీరు హైదరాబాద్ లోని చైతన్యపురిలో గల తమ స్వగృహంలో నివసిస్తున్నారు.వీరు హైస్కూలు చదువుతున్న రోజుల్లోనే సాహిత్య రచనకు బీజం పడింది.అప్పటి నుంచే కవిత్వం రాస్తున్నారు.అయితే,వీరి కవిత్వం తొలిసారిగా 1985లో “ఆంద్రజ్యోతి” దినపత్రికలో ప్రచురితమైంది.

కవయిత్రి శిలాలోలిత ప్రచురించిన పుస్తకాల వివరాలు

పరిశోధనా గ్రంధాలు:
1.“కవయిత్రుల కవిత్వంలో స్త్రీ మనోభావాలు” – పరిశోధనా గ్రంధం,1993.
2.“తెలుగు కవయిత్రుల కవితా మార్గం” – పరిశోధనా గ్రంధం, 2005.

కవితా సంపుటాలు:
* “పంజరాన్నీ నేనే, పక్షిని నేనే” కవితా సంపుటి,1999.
* “ఎంతెంత దూరం” – కవితా సంపుటి.2005.
* “గాజు నది” కవితా సంపుటి, 2013.
* “నేను ఇక్కడ భూమిని” – కవితా సంపుటి,2022.
* “ నారి సారించి” – వ్యాససంకలనం, 2006.
* “వర్తమాన లేఖ” – కవయిత్రులకు లేఖలు, 2018.

ఇంగ్లీష్ అనువాదం:

కవయిత్రి శిలాలోలిత గారి ఎంపిక చేసిన కవితలను “ The Inner Courtyard” పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీతారాణి గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.ఈ పుస్తకం అమెజాన్ బుక్స్ ద్వారా ఆన్ లైన్ ప్రచురణగా వెలువడింది.

ప్రశంసా గ్రంధం:

కవయిత్రి శిలాలోలిత కవిత్వంపై ప్రముఖ కవి సౌభాగ్య గారు “పరిణత కవయిత్రి శిలాలోలిత” పేరుతో ప్రశంసా గ్రంధాన్ని వెలువరించారు.

కవయిత్రి శిలాలోలిత గారు అందుకున్న పురస్కారాలు                                                              
1. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం.
2. తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం.
3. రమ్య భారతి పురస్కారం.
4. హృదయభారతి పురస్కారం
5. ద్వానా శాస్త్రి ఉత్తమ పరిశోధనా పురస్కారం.
6. గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉత్తమ కవితా పురస్కారం.
7. ఖమ్మం సాహితీ మాణిక్యం పురస్కారం.
8. వెంకటసుబ్బు పురస్కారం.
9. తోపుడు బండి స్ఫూర్తి పురస్కారం.

ఆకాశవాణి జాతీయ కవి

2008 సంవత్సరంలో తెలుగు భాష నుంచి “ఆకాశవాణి జాతీయ కవి” గా ఎన్నుకోబడి,భువనేశ్వర్ లో తన కవిత  “లోగిలి బయట” ను వినిపించారు.

కవయిత్రి శిలాలోలిత గారు “విజేత”, “భూమిక”, “మానవి”, “ విశాలాక్షి ”, వంటి సాహిత్య పత్రికలతో పాటు “నెచ్చెలి” ఆన్ లైన్ పత్రికలో కాలమిస్టు గా నిరంతరం సృజనాత్మక రచనలు సాగిస్తున్నారు.వివిధ సాహిత్య ప్రక్రియల్లో తమదైన ముద్రను వేస్తూ,సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్నారు.

అనేక పుస్తకాలకు సంపాదకులుగా వ్యవహరించిన కవయిత్రి,సాహిత్య సంపాదకత్వంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.స్త్రీవాద సాహిత్యానికి వేదికగా నిలిచిన “భూమిక” సాహిత్య పత్రికకు కొంతకాలం సహసంపాదకులుగా బాధ్యతలు నిర్వహించి,సాహిత్య రంగంలో తన సేవలను అందించారు.   

కవయిత్రి శిలాలోలిత కలం నుంచి జాలువారిన “అమరత్వం”కవిత ఆధునిక కవిత్వ ధోరణులకు అద్దం పట్టే ఒక విశిష్టమైన రచన.మానవ జీవన సంఘర్షణను,ఆశావహ దృక్పథాన్ని,   స్వేచ్ఛా కాంక్షను ఈ కవిత అత్యంత గాఢంగా,హృద్యంగా ఆవిష్కరించింది. ఈ కవితలో “అమరత్వం” అనేది భౌతిక మరణం లేకపోవడాన్ని సూచించే భావన కాదు ; ఒక ఆశయం ఎన్నటికీ అంతరించకుండా కొనసాగడం,చైతన్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం,మానవ సంకల్పం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవడమే – అదే నిజమైన “అమరత్వం” అనే తాత్విక సత్యాన్ని కవయిత్రి ప్రతిపాదించారు.   వ్యక్తి భౌతిక ఉనికి కాలగర్భంలో కలిసిపోయినా,వారి ఆశయం,ఆలోచనలు, పోరాట తత్వం సమాజంలో నిరంతరం ప్రభావాన్ని చూపుతూ సజీవ చైతన్యంగా నిలుస్తాయనే భావన ఈ కవితకు అంతర్లీన ప్రాణశక్తిగా నిలుస్తుంది.                                                                                 
ఈ తాత్విక భావనను వ్యక్తీకరించేందుకు ప్రకృతి దృశ్యాలను కేవలం వర్ణన వస్తువులుగా కాకుండా,మానవ జీవన అనుభవాలకు ప్రతీకలుగా మలచడంలో కవయిత్రి విశిష్టమైన శిల్పచాతుర్యాన్ని ప్రదర్శించారు.చీకటి నుంచి వెలుగు వైపు, బంధనం నుంచి స్వేచ్ఛ వైపు సాగే జీవన ప్రయాణాన్ని ప్రకృతి ప్రతీకలతో మేళవిస్తూ, మానవ అస్తిత్వంలోని సంఘర్షణను, మార్పు పట్ల ఉన్న ఆకాంక్షను కవయిత్రి సృజనాత్మకంగా ఆవిష్కరించారు. “అమరత్వం” అనే శీర్షికే కవితలోని ప్రధాన భావసారాన్ని ప్రతిబింబిస్తుంది.జీవితం ఒక వ్యక్తి భౌతిక ఉనికితోనే ముగిసిపోదు.మనిషి కలలు,ఆశలు,ఆశయాలు,పోరాటాలు,  స్వేచ్ఛ కోసం సాగే నిరంతర ప్రయాణం కాలప్రవాహంలో కొనసాగుతూనే ఉంటాయి.ఈ నిరంతర చైతన్యమే మానవ జీవనానికి అసలైన సార్థకతను ప్రసాదిస్తుందని కవయిత్రి సూచించారు.

ఈ కవితలో జీవితం,స్వేచ్ఛ,ఆశ, చైతన్యం,కవిత్వం వంటి అనేక అంతర్లీన అంశాలు ప్రతీకాత్మక చిత్రాల ద్వారా వ్యక్తమయ్యాయి.ప్రకృతి దృశ్యాలను మానవ జీవనానుభవాలతో సమన్వయపరుస్తూ,బాధలు,నిరాశలు, బంధనాల నడుమ కూడా ఆశకు, చైతన్యానికి,విముక్తికి మార్గం     ఉంటుందనే ఆశావాహ విశ్వాసాన్ని కవయిత్రి వ్యక్తం చేశారు.

కవితలోని ప్రతి పంక్తి ఒక భావచిత్రంగా రూపుదిద్దుకొని పాఠకుని అంతరంగంలో ప్రత్యేకమైన స్పందనను రేకెత్తిస్తుంది.      అవి మానవ అంతరంగంలోని సంఘర్షణలకు ప్రతిబింబాలుగా నిలిచి, మనిషి సాగించే అంతరంగ ప్రయాణాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తాయి.ఈ విధంగా “అమరత్వం” కవిత వ్యక్తి జీవితం నుంచి విశ్వమానవ చైతన్యం వైపు విస్తరించే తాత్విక ప్రయాణంగా,ఆశయం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది.

లక్ష్మీ దంపతులు

ప్రతీకాత్మకతలో సామాజిక చైతన్య ఆవిష్కరణ

“నక్షత్రమొకటి నేలమీది/వెలుగు చుక్కల్ని తాకింది/మెరుపులు విచ్చుకున్నాయి” అనే పంక్తుల్లో ప్రతీకాత్మక అభివ్యక్తి ద్వారా సామాజిక చైతన్య వికాసాన్ని కవయిత్రి సృజనాత్మకంగా ఆవిష్కరించారు. సాధారణంగా ఆకాశంలో ప్రకాశించే    “నక్షత్రం” ఇక్కడ కేవలం ప్రకృతి      దృశ్యానికి పరిమితమైన ప్రతీక కాదు.  అది ఒక ఉన్నతమైన ఆశయానికి, ఆదర్శానికి,విప్లవాత్మకమైన ఆలోచనకు ప్రతీకగా రూపాంతరం చెందుతుంది.ఆ నక్షత్రం నేలమీది వెలుగు చుక్కల్ని తాకడం ద్వారా,ఉన్నతమైన భావాలు,ఆశయాలు సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కవయిత్రి సూచించారు.

“వెలుగు చుక్కలు” అనే ప్రయోగం సామాన్య ప్రజల్లో అంతర్లీనంగా ఉన్న చైతన్య శక్తిని సూచిస్తుంది.ఉన్నతమైన ఆలోచనలకు, సామాన్య ప్రజల జీవితానుభవాలకు మధ్య అనుసంధానం ఏర్పడినప్పుడు సామాజిక పరివర్తనకు అవసరమైన చైతన్యం ఆవిర్భవిస్తుంది.ఆ పరివర్తనకు ప్రతీకగానే “మెరుపులు విచ్చుకున్నాయి” అనే రూపక ప్రయోగాన్ని చూడవచ్చు.మెరుపు ఒక్కసారిగా చీకటిని చేదించి వెలుగును ప్రసరించినట్లే,ఒక నూతన ఆలోచన సమాజంలోని నిశ్చలతను చీల్చి కొత్త అవగాహనకు,చైతన్యానికి దారితీస్తుంది, ఈ సందర్భంలో “నక్షత్రం,వెలుగు చుక్కలు, మెరుపులు అనే ప్రతీకల పరంపర కవితా భావానికి అంతర్గత చలనాన్ని సమకూరుస్తుంది.నక్షత్రం ఆశయానికి ప్రతీక అయితే, వెలుగు చుక్కలు ప్రజా    చైతన్యానికి ప్రతీకలుగా, మెరుపులు ఆ చైతన్యం ద్వారా సంభవించే పరివర్తనకు సంకేతాలుగా నిలుస్తాయి.అందువల్ల ఈ పంక్తుల్లో ప్రకృతి ప్రతీకలు కేవలం అలంకారత్మక ప్రయోజనానికి కాకుండా, సామాజిక మరియు భావవ్యక్తీకరణకు సాధనాలుగా మారాయి.

ప్రకృతి మానవీకరణ – మార్పు పట్ల విశ్వస్పందన

“ఆకాశపు చెట్టు/చప్పట్లు చరుస్తూ/ మేఘాలకు సైగ చేసింది/దట్టంగా అలుముకున్న చిక్కదనంతో/అడవి అరాటపడి/చేతులు చాచింది”అనే    పంక్తుల్లో కవయిత్రి ప్రకృతిని ఒక సజీవమైన స్పందించే శక్తిగా చిత్రించారు. ”ఆకాశాన్ని చెట్టు”గా భావించడం కవయిత్రి కల్పనా వైశిష్ట్యానికి నిదర్శనం.

“చప్పట్లు చరుస్తూ”, “సైగ చేసింది”, “ఆరాటపడి”, “చేతులు చాచింది” వంటి మానవ చర్యలను ఆకాశం,మేఘాలు,అడవి వంటి ప్రకృతి అంశాలకు ఆపాదించడం ద్వారా కవయిత్రి “మానవీకరణ” (Personification) ప్రక్రియను సమర్థంగా వినియోగించారు.

ఇక్కడ ప్రకృతి కేవలం అలంకారిక వర్ణనకే పరిమితం కాదు ; మానవ సమాజంలో సంభవిస్తున్న చైతన్యోదయానికి అది ఒక సహచరిగా పరిణమిస్తుంది.ఆకాశపు చెట్టు చప్పట్లు చరుస్తూ,మేఘాలకు సైగ చేయడం అనేది,సమాజంలో రాబోయే మార్పును ప్రకృతి స్వయంగా స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది.ఈ మానవీకరణ వల్ల ప్రకృతికి చలనశీలత మాత్రమే కాకుండా,ఒక అంతర్గత చైతన్యం కూడా సంక్రమిస్తుంది. ఫలితంగా ప్రకృతికి,మానవ సమాజానికి మధ్య ఒక సజీవమైన అంత:సంబంధం ఏర్పడుతుంది.

“దట్టంగా అలుముకున్న చిక్కదనంతో/ అడవి ఆరాటపడి/ చేతులు చాచింది”     అనే పంక్తులు ఈ ప్రతీకాత్మకతను మరింత లోతుగా తీసుకెళ్తాయి. అడవిని కేవలం ప్రకృతి ప్రతీకగానే    కాకుండా సంక్లిష్టతలు, అడ్డంకులు, అస్పష్టతలతో నిండిన సామాజిక జీవన ప్రతీకగా కూడా అర్థం చేసుకోవచ్చు.    ఇక్కడ “చిక్కదనం” సామాజిక     సంక్లిష్టతను సూచిస్తే, ”చేతులు చాచడం” అనేది విముక్తి కోసం, వెలుగు కోసం,   మార్పు కోసం సాగించే నిరంతర అన్వేషణకు ప్రతీకగా నిలుస్తుంది.  ముఖ్యంగా “ఆరాటం” అనే పదం ఈ పంక్తులకు అంతర్లీనమైన ఉద్వేగాన్ని ప్రసాదిస్తుంది.అది కేవలం ఎదురుచూపు మాత్రమే కాకుండా,మార్పు కోసం ఉన్న తీవ్రమైన ఆకాంక్షను సూచిస్తుంది.దట్టమైన చీకటి,సంక్లిష్ట పరిస్థితులు మరియు అడ్డంకులు ఉన్నప్పటికీ,వెలుగును అందుకోవాలనే తపనను కవయిత్రి  “అడవి చేతులు చాచే దృశ్యం” ద్వారా ప్రతీకాత్మకంగా వ్యక్తీకరించారు.  ఈ విధంగా చూస్తే కవితలోని ప్రకృతి    చిత్రణ కేవలం అలంకారాత్మక   సౌందర్యానికే పరిమితం కాకుండా, సామాజిక భావజాలాన్ని వ్యక్తీకరించే ఒక శక్తివంతమైన సాధనంగా పరిణమించింది. మేఘాలు,అడవి వంటి ప్రకృతి ప్రతీకలన్నీ పరస్పరం అనుసంధానమై ఒక సమగ్ర భావచిత్రాన్ని నిర్మించాయి.చీకటి నుంచి వెలుగు వైపు,నిశ్చలత నుంచి చైతన్యం వైపు,పరిమితుల నుంచి విముక్తి వైపు సాగే ఈ పరివర్తనాత్మక గమనాన్ని ఈ ప్రతీకలు చక్కగా సూచిస్తున్నాయి.  

అందువల్ల ఈ పంక్తుల్లో కవయిత్రి ప్రకృతిని కేవలం వర్ణించలేదు ; ప్రకృతి ద్వారా సమాజాన్ని,సమాజం ద్వారా మానవ చైతన్యాన్ని దర్శించారు.ఉన్నతమైన ఆశయం ప్రజలను తాకినప్పుడు పుట్టే చైతన్యం,ఆ చైతన్యం ద్వారా సంభవించే సామాజిక పరివర్తన,ఆ పరివర్తన పట్ల ప్రకృతి సైతం స్పందిస్తుందనే భావన –       ఈ మూడు కోణాల్లోనూ కవితాభావం విస్తరించింది.ఇదే ఈ కవితా భాగంలోని ప్రతీకాత్మకతకు,మానవీకరణకు మరియు కవయిత్రి సృజనాత్మక శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.

నిరంతర ప్రయాణం – రేపటి ఆశ

“ఊరువాడా వదిలిన పాదాలన్నీ/నడక నేర్చుకొని/రేపటి కలను కంటూనే   ఉన్నాయి” అనే పంక్తుల్లో కవయిత్రి నిరంతర ప్రయాణాన్ని,భవిష్యత్తుపై ఉన్న నిలకడైన ఆశను,ప్రతీకాత్మకంగా ఆవిష్కరించారు.ఇక్కడ “ఊరువాడా వదిలిన పాదాలు” అనేది కేవలం వలస వెళ్లే శ్రామికులనే కాకుండా,తమ ఉనికి కోసం,హక్కుల కోసం,మెరుగైన జీవితం కోసం స్వస్థలాలను వీడి ముందుకు సాగుతున్న ప్రజా సమూహాలకు ప్రతీకగా నిలుస్తుంది.తమ జీవన ప్రయాణంలో  అనేక కష్టాలను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సాగిన ఆ పాదాలు క్రమంగా “నడక నేర్చుకున్నాయి”.ఇక్కడ “నడక” అనేది కేవలం భౌతిక ప్రయాణాన్ని మాత్రమే సూచించదు ; అది పోరాటాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ముందుకు సాగాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది.

“రేపటి కల” అనే ప్రయోగం భవిష్యత్తుపై ప్రజలు పెంచుకున్న ఆశకు ప్రతీక.నిన్నటి అనుభవాలను అధిగమిస్తూ,నేటి పోరాటాలను ఎదుర్కొంటూ,రేపటి మెరుగైన జీవితం కోసం సాగుతున్న సామూహిక ప్రయాణాన్ని కవయిత్రి  ఈ పంక్తుల్లో చిత్రించారు. ఇక్కడ “కల” అనేది వ్యక్తిగత ఆకాంక్షకు మాత్రమే పరిమితమైనది కాదు ;  అది సమానత్వం,స్వేచ్ఛ,గౌరవం, మెరుగైన జీవితం వంటి సామూహిక ఆకాంక్షలకు ప్రతీకగా విస్తరిస్తుంది. మనిషి జీవించి ఉన్నంతవరకు శ్రమ, పోరాటం,తపన నిరంతరం   కొనసాగుతాయి. అందువల్ల ఆశ కూడా సజీవంగానే ఉంటుందనే జీవన సత్యం ఈ పంక్తుల్లో అంతర్లీనంగా   వ్యక్తమవుతుంది.గత తరాల పోరాటాలు ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.వారు వేసిన అడుగులు అడుగుజాడలుగా మారి,తరువాతి తరాలకు దిశానిర్దేశం చేస్తాయి.ఆ అడుగుజాడలను అనుసరించి కొత్త తరాలు తమ భవిష్యత్తు కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతాయి.    ఈ దృష్టితో చూసినప్పుడు “పాదాలు” వ్యక్తులకే పరిమితమైన ప్రతీకలు కాకుండా,తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక ప్రయాణానికి సజీవ సంకేతాలుగా రూపాంతరం చెందుతాయి.

“కల ఎప్పుడూ నిజమే/కవితెప్పుడు చలనమే/జీవితమొక గాజు ముక్కే/ జీవనమొక నెత్తుటి స్నానమే”అనే    పంక్తులు ఈ కవిత తాత్త్వికతకు కేంద్ర బిందువులుగా నిలుస్తాయి.కవయిత్రి దృష్టిలో “కల” అనేది కేవలం ఊహకు సంబంధించినది కాదు ; అది భవిష్యత్తు వాస్తవానికి బీజం వేసే ఒక ఆశయ సంకల్పం.“కల ఎప్పుడు నిజమే” అనే పంక్తి ప్రగతిశీల మానవ ఆకాంక్షలపై కవయిత్రికి గల అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది.మనిషి అంతరంగంలో బీజం పోసుకున్న ఉన్నతమైన కలలు, వాటిని సాకారం చేసుకునే దిశగా నిరంతర కృషి కొనసాగినప్పుడు,  ఏదో ఒక దశలో అవి వాస్తవ రూపాన్ని సంతరించుకుంటాయనే ఆశావహ   దృక్పథం ఇందులో ప్రతిఫలిస్తుంది.

“కవితెప్పుడు చలనమే”అనే పంక్తి కవిత్వ స్వభావాన్ని ఒక క్రియాశీల శక్తిగా నిర్వచిస్తుంది.నిజమైన కవిత్వం    నిశ్చలమైన భావవ్యక్తీకరణగా నిలిచిపోదు ; అది పాఠకుడిని ఆలోచింపజేస్తుంది,ప్రశ్నింపజేస్తుంది మరియు చైతన్యపరుస్తుంది.కవిత్వం సమాజాన్ని కదిలిస్తుంది.మానవ    చైతన్యాన్ని మేల్కొలిపే శక్తిని కలిగి ఉంటుంది.అందుకే కవయిత్రి కవిత్వాన్ని ఒక మహాశక్తిగా భావించారు.  ”కల” భవిష్యత్తుకు దిశను నిర్దేశిస్తే,  ఆ కలకు కార్య రూపం ఇచ్చే     కార్యాచరణకు “చలనం” అవసరమవుతుంది.ఈ రెండింటి మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని కవయత్రి అత్యంత సంక్షిప్తంగా,శక్తివంతంగా వ్యక్తీకరించారు.

ఈ నేపథ్యంలో కవిత్వం కేవలం సౌందర్యానుభూతిని అందించే కళారూపం మాత్రమే కాదు ; అది సామాజిక వాస్తవికతను ప్రశ్నిస్తుంది,మానవ చైతన్యాన్ని మేల్కొల్పుతుంది మరియు సామాజిక పరివర్తనకు ప్రేరణనిచ్చే      శక్తిగా రూపుదిద్దుకుంటుంది.అందుకే “కవితెప్పుడు చలనమే” అనే పంక్తి కవయిత్రి కవిత్వ దృక్పథానికి ఒక కీలకమైన ప్రకటనగా నిలుస్తుంది.

“గాజు ముక్క” జీవితం యొక్క సున్నితత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.   గాజు ఎంత అందంగా, పారదర్శకంగా ఉన్నప్పటికీ అత్యంత సున్నితమైనది ; అదే విధంగా మానవ జీవితం కూడా అనేక ఆటుపోట్ల మధ్య కొనసాగుతుంది.దీనికి భిన్నమైన దృశ్యాన్ని “నెత్తుటి స్నానం” అనే బలమైన ప్రతీక ఆవిష్కరిస్తుంది.

ఇది జీవన ప్రయాణంలోని సంఘర్షణలు, బాధలు,శ్రమ మరియు త్యాగాలను సూచిస్తుంది.జీవితం కేవలం సున్నితమైన అనుభూతుల సమాహారం మాత్రమే   కాదని,దాని కొనసాగింపులో పోరాటం, త్యాగం అనివార్యమనే జీవన సత్యాన్ని కవయిత్రి ఈ రూపకం ద్వారా వెల్లడించారు.                                   “గాజు ముక్క” మరియు “నెత్తుటి స్నానం” అనే రెండు ప్రతీకలు పరస్పర విరుద్ధ దృవాలుగా కనిపించినప్పటికీ,మానవ జీవితం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడంలో అవి పరస్పర పూరకాలుగా నిలుస్తాయి.ఒకటి జీవితం యొక్క సున్నితత్వాన్ని, మరొకటి దాని సంఘర్షణాత్మక స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.ఈ రెండు ప్రతీకల సమన్వయం ద్వారా జీవితం ఎంత సున్నితమైనదో,అదే సమయంలో దానిని నిలబెట్టుకోవడానికి ఎంతటి పోరాటాన్ని ఎదుర్కోవలసి వస్తుందో కవయిత్రి ప్రభావవంతంగా వ్యక్తీకరించారు.

ఈ విధంగా కల,చలనం,జీవితం, సంఘర్షణ అనే భావపరంపర కవితలో ఒక అంతర్గత తాత్త్విక నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది.కల మనిషికి భవిష్యత్తుపై ఆశను అందిస్తుంది.ఆ కలను సాకారం చేయడానికి చలనం మరియు కార్యాచరణ అవసరమవుతాయి.ఆ ప్రయాణంలో జీవితం అనేక సంఘర్షణలను ఎదుర్కొంటుంది.అయినప్పటికీ,ఆశను కోల్పోకుండా ముందుకు సాగడమే మానవ జీవన సారమనే తాత్త్విక దృక్పథం ఈ పంక్తుల ద్వారా ప్రస్ఫుటమవుతుంది.

“ఇప్పుడే ఇప్పుడిప్పుడే/గొంతులో స్వేచ్ఛ నిండుతోంది” అనే పంక్తులు కవితకు పరాకాష్టగా నిలుస్తాయి.

సుదీర్ఘమైన పోరాటం,అనేక కష్టాలు మరియు అణిచివేతల అనంతరం మానవ స్వరం స్వేచ్ఛను అందుకుంటున్న చారిత్రక క్షణాన్ని కవయిత్రి ఈ పంక్తుల్లో అత్యంత శక్తివంతంగా ఆవిష్కరించారు.

“గొంతులో స్వేచ్ఛ నిండుతోంది” అనే ప్రయోగం,ఇంతకాలం అణిచివేయబడిన స్వరం క్రమంగా తన ఉనికిని చాటుకుంటున్న పరిణామానికి ప్రతీకగా నిలుస్తుంది.ఇక్కడ స్వేచ్ఛ అనేది కేవలం వ్యక్తిగత విముక్తికి సంబంధించిన భావన కాదు.అది సామాజిక స్వేచ్ఛకు,ఆత్మ గౌరవానికి తన భావాలను స్వతంత్రంగా వ్యక్తీకరించుకునే హక్కుకు ప్రతీకగా విస్తరిస్తుంది.పారతంత్ర్యం నుంచి విముక్తిని పొంది,తన స్వరాన్ని స్వేచ్ఛగా వినిపించగల స్థితికి మానవుడు చేరుకుంటున్నాడనే ఆశావహ దృక్పథం ఈ పంక్తుల్లో వ్యక్తమవుతుంది.

“ఇప్పుడే  ఇప్పుడిప్పుడే” అనే పునరుక్తి ప్రయోగం,స్వేచ్ఛ ఆవిర్భవిస్తున్న ఆ క్షణంలోని ఉద్వేగాన్ని మరియు ఆవశ్యకతను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇంతకాలం నిశ్శబ్దంలో మగ్గిన స్వరం ఒక్కసారిగా స్వేచ్ఛను పొందడం కాకుండా,క్రమంగా గొంతులో నిండుతున్నట్లుగా చిత్రించడం ద్వారా – స్వేచ్ఛ అనేది ఒక నిరంతర పరిణామ ప్రక్రియ అనే భావనను కవయత్రి సూచించారు.అందువల్ల ఈ పంక్తులు కవితకు ఆశావహమైన,పరివర్తనాత్మకమైన ముగింపును అందిస్తున్నాయి.

సాహిత్య విశేషాలు – శిల్పం,శైలి

“అమరత్వం” కవితలో ప్రతీకాత్మకత ప్రధానమైన కవితా శిల్పంగా కనిపిస్తుంది. ”నక్షత్రం”, “వెలుగు చుక్కలు”,“ఆకాశపు చెట్టు”, “గాజు ముక్క”, “నెత్తుటి స్నానం” వంటి ప్రకృతి మరియు జీవన ప్రతీకలు కవితా భావానికి గాఢతను సమకూరుస్తాయి.ఇవి కేవలం దృశ్యాత్మక చిత్రణకు పరిమితం కాకుండా ఆశ, చైతన్యం,సంఘర్షణ,జీవిత సున్నితత్వం మరియు త్యాగం వంటి అంతర్లీన భావాలను ప్రతిఫలించే ప్రతీకలుగా రూపుదిద్దుకున్నాయి.

ఈ కవిత ముక్త ఛందస్సులో సాగుతుంది. ఆధునిక వచన కవిత్వంలోని సహజమైన, స్వేచ్ఛాయుతమైన నిర్మాణాన్ని కవయిత్రి అనుసరించారు.నిర్దిష్ట ఛందోబద్ధతకు పరిమితం కాకుండా,భావోద్వేగ తీవ్రతకు అనుగుణంగా పాద విభజన,పదప్రయోగం మరియు లయను మలచడం ద్వారా కవితకు సహజమైన ప్రవాహాన్ని కల్పించారు.ముఖ్యంగా చిన్న చిన్న పాదాల వినియోగం భావానికి తగిన విరామాన్ని, ఉద్వేగాన్ని ప్రసాదిస్తుంది.  ఈ కవితలో ప్రకృతి దృశ్యాలు కేవలం సౌందర్య వర్ణనకు మాత్రమే ఉపయోగపడలేదు.అవి వెలుగు,

చైతన్యం,పోరాటం,కల,చలనం మరియు స్వేచ్ఛ వంటి విలువలకు ప్రతీకలుగా పరిణమించాయి.

కవితలోని ప్రతి ప్రకృతి దృశ్యం ఒక అంతర్లీన కదలికను,పరివర్తనను సూచిస్తుంది.చీకటి నుంచి వెలుగు వైపు, నిశ్చలత నుంచి చలనం వైపు,అణిచివేత నుంచి స్వేచ్ఛ వైపు సాగే మానవ ప్రయాణానికి ప్రకృతి ఇక్కడ ఒక ప్రతీకాత్మక రూపాన్ని సంతరించుకుంది.

“అమరత్వం” – కవితా తాత్త్వికత

కవయిత్రి దృష్టిలో “అమరత్వం” అనేది శరీరానికి సంబంధించిన శాశ్వతత్వం కాదు.మనిషి అంతరంగంలో జనించే ఉన్నతమైన ఆశయం,సమాజాన్ని కదిలించే ఆలోచన,మార్పు కోసం సాగించే పోరాటం,స్వేచ్ఛ కోసం చేసే నిరంతర అన్వేషణ,వాటిని సృజనాత్మకంగా వ్యక్తీకరించే కవిత్వం – ఇవే కాలాన్ని అధిగమించి నిలిచే సనాతన విలువలు.    ఈ భావనలోనే “అమరత్వం” అనే శీర్షికకు తాత్త్వికమైన విస్తృతి లభిస్తుంది. మనిషి భౌతికంగా లేకపోయినా,అతని ఆశయం,ఆలోచన,స్వప్నం,పోరాట స్ఫూర్తి తరువాతి తరాలలో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అదేవిధంగా,నిజమైన కవిత్వం ఒక నిర్దిష్ట కాలానికే పరిమితం కాకుండా,తరతరాల మానవ చైతన్యాన్ని మేల్కొల్పే శక్తిగా నిలుస్తుంది.అందువల్ల కవయిత్రి ప్రతిపాదించిన “అమరత్వం” అనేది వ్యక్తి శరీరానికి సంబంధించిన శాశ్వతత్వం కాదు ; మానవ విలువలు,ఆశయాలు, ఆలోచనలు,పోరాట స్ఫూర్తి నిరంతరం కొనసాగడంలో అంతర్లీనంగా ఉన్న తాత్త్విక భావన.  ఈ దృష్టిలో “అమరత్వం” ఒక ఆశావహమైన ఆధునిక వచన కవితగా రూపుదిద్దుకుంది.ప్రకృతి ప్రతీకల ద్వారా మానవ జీవిత సత్యాలను,సంఘర్షణను, ఆశావాదాన్ని,స్వేచ్ఛా తపనను కవయిత్రి అద్భుతంగా వ్యక్తీకరించారు.చీకటిని ఛేదించే వెలుగు నుంచి స్వేచ్ఛతో నిండుతున్న గొంతు వరకు కవిత సాగిన తీరు,మానవ చైతన్యం క్రమంగా వికసించే పరిణామ క్రమాన్ని సూచిస్తుంది.                             అంతిమంగా,”అమరత్వం” కవిత మనిషి జీవితానికి ఒక విస్తృతమైన తాత్త్విక అర్థాన్ని ప్రతిపాదిస్తుంది.”అమరత్వం” అంటే శరీరం శాశ్వతంగా నిలిచిపోవడం కాదు ; మనిషి కల.ఆలోచన, కవిత్వం,స్వేచ్ఛా ఆకాంక్ష నిరంతరం కొనసాగడమే నిజమైన అమరత్వం.వ్యక్తి కాలాన్ని దాటి తన ఆలోచనల్లో,తన సృజనలో,తన పోరాట స్ఫూర్తిలో సజీవంగా ఉంటాడనే విశ్వాసాన్ని కవయిత్రి ఈ కవిత ద్వారా వెల్లడించారు. 

“అమరత్వం” వంటి చక్కని కవితను సాహిత్య లోకానికి అందించిన కవయిత్రి శిలాలోలిత గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.వారి కలం నుంచి ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన

సృజనాత్మక రచనలు వెలువడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.   

September 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నా తెలంగాణ

by Thokala Rajesham September 30, 2026
written by Thokala Rajesham

సీ: జనములు మెచ్ఛంగ జనపథమ్ములు కొన్ని
దేదీప్యముగను వర్దిల్లె నిచట
దేశ విదేశ యాత్రికులతో రాజ్య వై
భోగమ్ములే మారిపోయె నిచట
భారతీయ కథా ప్రభల్ మీరహాలుండు
మంచి కథల్ సంకలించె నిచట
పురుషులెల్లరు చిన్నవోవంగ రుద్రమ్మ
అధికార పగ్గాలనందె నిచట

తే. గీ:మనుమసిద్ధి మహారాజు మాట మీద
సైన్యమంపించి గెలిపించ జాలి రిచట
వేయి మాటలాడగనేల విశ్వమెల్ల
వజ్ర వైడూర్యముల పాలు పంచె నిచట

చ:పలుకులలోన తేనెలు ప్రవాహములై పరుగెత్తుచుండ ప
ల్లెలు తెలుగమ్మలై పులకరించిన కమ్మని జ్ఞాపకాలు విం
దులు గయి సేయునిప్పటికి-దున్నిన చాలును చాలు చాలులో
తెలుగు మహా చరిత్ర నినదించదె! ఇచ్చటి నేల లోపలన్

సీ: ఘనమైన శాతవాహన రాజ్య భూభాగ
మున చిన్నపాయగా మొగ్గదొడిగి
ఓర్గల్లు కాకతీయుల యేలుబడి లోన
చిన్ని పాదాలతో చిందులేసి
కుతుబు షాహీల పద్ధతులతోచెయి గల్పి
నాల్గు మినార్లపై నాట్యమాడి
శాంతి తోడుత నసఫ్ జాహి కాలమ్మున
మంచి చెడులలోని మర్మ మెరిగి
తే. గీ.పక్క రాష్ట్రాల వారితో బాధలొంది
తెలుగు తమ్ములతో కొంత దిగులు జెంది
నాటి గడ్డకై తెగని పోరాట మంది
గాంచె రాష్ట్రమ్ము నా తెలంగాణ తల్లి

క: తెలుగుం భాషకు నెలవై
తెలగాణమ్మన్నపేరు దేదీప్యమ్మై
వెలిగిన ఒకనాటి చరిత
కలుగుల్లో నుండి నేడు కన్నులు దెరిచెన్

సీ:పాల్కుర్కి మొదటి విప్లవ కాంతి రేఖలో
కొత్త వెలుంగులు కుమ్మరించి
మొదటి రామాయణమ్మున కూపిరూదగా
గోన బుద్ధారెడ్జి కానతిచ్చి
పోతన్న కైతలో పొంగులెత్తిన సుధా
మధురాక్షరములకు మాట నేర్పి
చిత్ర భారత కృతి స్వీకరింపగనెంచి
చరిగొండ ధర్మన్నకెరుక జెసి

తే. గీ. పాన్నిగంటి కవిత్వానపొంగి పొరలి
రామదాసు శ్రీరామ కీర్తనల దేలి
ఆ మరింగంటి యింటిలో నాట లాడె
ఈ తెలంగాణ తల్లి సాహిత్య వల్లి

మ: కలరీ నేల ప్రసిద్ధులెందరొ!జగత్కల్యాణమాశించి గుం
డెలలో నెత్తురు ధారవోసి ప్రమిదల్ నిండార వెల్గించి పే
దల చీకట్లను పారదోలిన చరిత్రల్ నేటి కాదర్శమై
తెలగాణమ్మును కొత్త తీరముల నుద్దీపింపగా జేయుతన్

              
September 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

జైహింద్ నాటకం – దేశభక్తికి స్పూర్తిదాయకం

by Dr. Nannapuraju Vijayasri September 30, 2026
written by Dr. Nannapuraju Vijayasri

కోలకలూరి సాహిత్యం

కావ్యంలో నాటకం రమ్యమైనది” నాటకాంతం హి సాహిత్యం” అన్న మహాకవి కాళీదాసు భావనలు అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం, కవిత్వం, వ్యాసం, కథ, నవల వీటన్నిటితర్వాత నాటకం వస్తురూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనంతో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం. కవులు కవిత్వ రచనతో పాటు కథలు, నవలలు, నాటకాలు రాసిన వారు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందినవారు ఇనాకు గారు ఒకరు. వేజె0డ్లలో 1.7.1939 న గుంటూరు తాలూకాలో శ్రీమతి విశ్రాంతమ్మ, శ్రీ రామయ్య దంపతులకు జన్మించినారు. వీరు ప్రాధమిక విద్యను పూర్తి చేసి అంచెలంచెలుగా ఎదిగి తిరుపతి శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయఉపాధ్యక్షులుగా ఎదిగివిద్యార్థులకు సేవలందించిన సాహితీ మూర్తి.వేజెండ్ల ఏ.బి.యం.పాఠశాలలో గుంటూర్ యు.యల్. సియం. తిరుపతి హైస్కూల్,ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో వాల్తేర్,ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. ఆనర్స్,శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేశారు.
ఆచార్య పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు సృజనాత్మక రచయిత వృత్తిపరంగా అధ్యాపక వృత్తిని ఎంచుకొని అంచెలంచెలుగా ఎదిగితిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఎదిగి విద్యార్థులను తీర్చిదిద్ది ఎనలేని విద్యా సేవ చేసి,మరో ప్రక్క ప్రవృత్తి పరంగా సాహితీ రంగంలో అతి చిన్న వయసులోఅనేక ప్రక్రియలలో రచనలుఅలవోకగాసృజనాత్మక రచనలు చేస్తూ పాఠకులను ,కవులను,ప్రజలను అలరించారు.అణగారిన,వెనుకబడ్డతరగతులు,మైనారిటీ వర్గాల వారి స్త్రీల సమస్యలను కేంద్రంగా వాస్తవిక సంఘటనలుఆధారంగా చేసుకోనికవిత్వం,నాటకం,కథానిక,వ్యాసం,విమర్శ,పద్యం,కావ్యం,నవలా,నాటకం,ఇలా పలు ప్రక్రియలుపదాలకు వెలుగులుఅది తెలుగు భాషకు వన్నెలనుఅద్దినసాహితీ మూర్తి వీరు దాదాపు 25 నాటకాలు రచన చేసినట్లుమనకు అవగతం అవుతుంది.చైనా దురాక్రమణ,జాతీయ రక్షణ ప్రణాళిక అంశాలుగా నాటక రచన పోటీని నిర్వహించింది.ప్రభుత్వం చైనా దురాక్రమణచేయటం వెనుకకుతగ్గడం నెహ్రూ మరణించడం ఇవి నాటకంలోని పరిస్థితులుగా రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు చిత్రించారు.బ్రహ్మయ్య కథానాయకుడు తండ్రి ఇద్దరు కొడుకులు .తండ్రి దేశభక్తుడు భారత చరిత్ర చూసినవాడు.
సదాశివం :బ్రహ్మయ్య రెండవ కుమారుడు రైతుబిడ్డ.
కృష్ణమూర్తి :పుష్టిగా ,గట్టిగా,బలంగా,ఎత్తుగా ఉన్న మొదటి కుమారుడు.మిలటరీలోపనిచేసినఆప్యాయత నిండిన జైహింద్ నాటక కథానాయకుడు.
ఏకో నారాయణ :పోస్ట్ మ్యాన్ఉద్యోగి అమాయకత్వం చిరునవ్వుతో ఉండే వ్యక్తిత్వం
స్వరాజ్యలక్ష్మి :యుక్త వయసురాలు,అందగత్తె,చలాకి మనిషి,నిషిత ఆలోచన పరురాలు పల్లెటూరి అమ్మాయి కథానాయిక.
చలమయ్య :క్రూరమైన ముఖం ‘మాటలకు చేతలకు పొంతన లేనివాడు.పట్నవాసంకలిగినపల్లెవాడి వాలుకం.

సైన్యంలో చేరిదేశ సేవలో ఉన్న బ్రహ్మయ్య పెద్ద కుమారుడు,చిన్న కుమారుడు,సదాశివ, మేనకోడలు లక్ష్మీ కలసి వుండగాచలమయ్య కన్ను లక్ష్మీపైపడింది.లక్ష్మి దుండగుని చర్యలు ఎలా ఛేదించింది.చైనా దురాక్రమణ 20 యేండ్ల మిలటరీ బంధంపెద్ద కుమారుడు ఎలా వీడవలసి వచ్చింది,యుద్ధ కారణాలు అన్ని అక్కడక్కడ దేశభక్తిప్రేరిత గీతాలు,పాత్రోచితసంభాషణలతో రచయిత పాఠకులహృదయాలను ఆకట్టుకున్నారు.
జైహింద్ నాటకం ద్వారా అర్థమవుతుంది.
దేశభక్తిని ప్రేరేపించే నాటకం అందరుచదవవలసిన దేశభక్తి పూరితమైన, అందరిని ఆకర్శించదగ్గవినూత్నమైన సందేశాత్మకమైన నాటకం.పద్మశ్రీకొలకలూరి ఇనాక్ గారు సుమారు 60సంవత్సరాల క్రితం వ్రాసిన నాటకం,దేశభక్తిని,ఆనాటి దేశవిదేశాంగరాజకీయ విధానాలు,పంచవర్ష ప్రణాళికలు,పాత్రోచిత సంభాషణలు,రచనా శైలి,అనేక అంశాలు పాఠకులను ఆలోచింప చేసే రచన ఇది.
దేశభక్తికి ,దేశ సమగ్రతకు,దేశ అభ్యుదయానికిపాటు పడే అందుకు వర్తమానరచయితలకు దిక్సూచిగా మరియు మార్గదర్శకంగా తప్పకుండా దోహదం చేస్తుంది.
జైహింద్ నాటకం పుస్తకం కొలకలూరి ఇనాక్ గారు ఒక మంచిదేశభక్తిని ప్రేరేపితం చేసే మంచి ఆసక్తిదాయకమైన సినిమా సినిమా రచనకు ఆదర్శంగా,అర్థవంతంగా ఉంది.
నాటి గ్రాంధికానికిసన్నిహితంగా ఉన్న భాషనువ్యవహారికానికి దగ్గరగా చేయటానికి కొన్ని పదాలు , వాఖ్యాలు,అనుకూలంగా మార్చారురచయిత ప్రేమ,అహింసా, శాంతం,దేశభక్తి సమైక్య దృష్టి,దేశ రక్షణ అవసరమని రచయిత ఇనాక్ గారి అభిప్రాయం.విద్యార్థులకు,ప్రజలకుఎంతో ఉపయోగకరమైన నాటకం జైహింద్ అందరుచదవవలసినబాధ్యత గలనాటకం జైహింద్

September 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ముద్దుపళని

by Vijaya Ranganatham September 30, 2026
written by Vijaya Ranganatham

తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు కాలం గడిచేకొద్దీ మరుగునపడిపోయినా, తిరిగి వెలుగులోకి వచ్చినప్పుడు తమ కాలాన్నే కొత్తగా అర్థం చేసుకునేలా చేస్తాయి. అలాంటి అరుదైన పేర్లలోముద్దుఫళనిఒకరు.

ఆమె తంజావూరు రాజసభలో వికసించిన తెలుగు సాహిత్య, సంగీత, నాట్య సంస్కృతికి ప్రతినిధి. అంతేకాదు, స్త్రీ తన కోరికలను, తన అనుభూతులను, తన అసూయను, తన బాధను తానే వ్యక్తపరచగలదని సాహిత్యం ద్వారా చూపించిన ధైర్యవంతురాలైన రచయిత్రి.

నాయక రాజుల కాలంలో మధుర తంజావూరులో ఉన్న సంసృత, తెలుగు కవులు గురించి 1975 సంవత్సరంలో జరిగిన మొదటి తెలుగు మహా సభల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిచే, తిమ్మావజ్జల కోదండ రామయ్య గారు రచించిన పుస్తకాన్ని అవిష్కరించారు. అందులో వివరించిన మన మహిళా సాహిత్యకారులైన ఆనాటి కావ్య నాయికలే రామభద్రాంబ, మధురవాణి, రంగరాజమ్మ, ముద్దుఫళని.

తంజావూర్ రాజసభ సాంస్కృతిక నేపథ్యం.ఆ కాలంలో తంజావూర్ ఒక గొప్ప సాహిత్య, సంగీత, నాట్య కేంద్రం. తరువాత మరాఠా పాలకులు ఆ సాంస్కృతిక సంప్రదాయాలను పూర్తిగా తొలగించకుండా, వాటిలో అనేక అంశాలను కొనసాగించారు. తంజావూరు రాజసభల్లో తెలుగు, సంస్కృతం, తమిళం వంటి భాషలకు, సంగీత నాట్యాలకి విశేషమైన ఆదరణ లభించింది. ఈ నేపథ్యమే ముద్దుఫళని వంటి కళాకారిణులకు విద్య, సాహిత్యం, సంగీతం, నాట్యం వంటి రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించింది.

రాజసభలో నాట్యకళాకారులు, సంగీత విద్వాంసులు, కవులు ఉండేవారు. ముద్దుఫళని కూడా అలాంటి రాజసభలో భాగమైనదేవదాసి సంప్రదాయానికి చెందినవారిగా భావిస్తారు.

దేవదాసీలు కళలో ప్రావీణ్యం కలిగినవారు. వారు సంగీతం, నాట్యం, సాహిత్యంలో నిపుణులు. సమాజంలో వారికి ఒక ప్రత్యేకమైన కానీ సంక్లిష్టమైన స్థానం ఉండేది.భక్తి, శృంగారం కలిసిన కళాసంప్రదాయం. దేవదాసి వ్యవస్థలో కళాకారిణులు రాజసభలో ప్రాధాన్యం పొందేవారు. ముద్దుఫళని కూడా ఈ వ్యవస్థలో భాగం కావడం వల్ల ఆమెకు విద్య, కళ, సాహిత్యంపై పూర్తి పట్టు వచ్చింది. శృంగారం గురించి ఆమెకు ఉన్న అవగాహన సహజంగా ప్రతిఫలించింది. ముద్దుఫళని పద్యాలు సున్నితమైనవి. శృంగారభరితమైనవి. స్త్రీ భావజాలాన్ని లోతుగా తాకేవి.

ముద్దుఫళని 18వ శతాబ్దంలో తంజావూర్ ప్రాంతంలో జీవించిన ప్రముఖ తెలుగు కవయిత్రి. ఆమె తంజావూర్ నాయకుల తరువాత రాజ్యాన్ని పాలించినమరాఠా రాజుల కాలంలోజీవించింది. తంజావూర్ మరాఠా రాజసభలో ఆమెకు ఉన్న స్థానం వల్ల, ఆమె సాహిత్యం ఒకరాజసభీయ శృంగార సాహిత్య సంప్రదాయంకి చెందినది.

ముద్దుఫళనిని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆమెజీవించి  తంజావూరును అర్థం చేసుకోవాలి.ఆమె జీవించిన కాలం తంజావూరును పాలించిన మరాఠా రాజుప్రతాపసింహుడు (1739–1763)కాలంతో ముడిపడి ఉంది. పరిశోధనా వనరులు ముద్దుఫళని ప్రతాపసింహుని రాజసభతో అనుబంధం కలిగిన గణిక/దేవదాసి సంప్రదాయానికి చెందిన కవయిత్రిగా పేర్కొంటున్నాయి. 

ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. అప్పటి‘గణిక’, ‘దేవదాసి’, ‘కళావంతురాలు’అనే సామాజిక పదాలకు నేటి ‘వేశ్య’ అనే ఒక్క పదంతో సమానార్థం ఇవ్వడం చారిత్రకంగా సరైనది కాదు. ఆ వర్గంలోని కొందరు మహిళలు సంగీతం, నాట్యం, సాహిత్యం, సంస్కృతం, తెలుగు వంటి విద్యల్లో ఉన్నతమైన శిక్షణ పొందారు. రాజసభలు, దేవాలయాలు, కళా వర్గాలతో వారి సంబంధాలు సంక్లిష్టమైనవి.

ముద్దుఫళని గురించి మనకు లభించే వ్యక్తిగత జీవిత సమాచారం చాలా తక్కువ. అందువల్ల ఆమె జీవిత చరిత్రను పూర్తిగా నిర్మించడానికి ప్రయత్నించడం కంటే, ఆమె రచనల ద్వారా కనిపించే వ్యక్తిత్వాన్ని పరిశీలించడం మరింత విశ్వసనీయమైన పద్ధతి.

ఆమె తెలుగు, సంస్కృత సాహిత్యంలో పాండిత్యం కలిగినవారిగా, సంగీత నాట్యాల్లో ప్రావీణ్యం పొందినవారిగా ఆధారాలు పేర్కొంటాయి. ఆమె దేవదాసి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినట్లు ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. ఆమె కుటుంబ వారసత్వంలో సంగీతం, నాట్యం, సాహిత్యం ఉన్నాయని కూడా పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె అమ్మమ్మతంజనాయకిసంగీతం, నవరసాల ప్రదర్శనలో ప్రతిభ కలిగిన కళాకారిణిగా ప్రస్తావించబడుతుంది. అందువల్ల ముద్దుఫళని ఒక వ్యక్తిగత ప్రతిభతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కవయిత్రి కాదు. ఆమె వెనుకతరతరాలుగా వచ్చిన ఒక కళా సంప్రదాయంఉంది.ముఖ్యంగా తంజావూర్ కి చెందిన ప్రతాప్ సింగ్రాజు సమయానికి ఆమె రాజసభలో గౌరవ స్థానం పొందింది.

1739-1763ప్రతాప్ సింగ్ రాజుఅంతఃపురంలో ఒక వేశ్య కుమార్తె. తంజావూరులోని భోంస్లే పాలకులు నాయకుల సాహిత్య, సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించారు, వారిని వారు భర్తీ చేశారు. తంజావూరు ఆస్థానంలో ఉన్న చాలా మంది వేశ్యల వలె, ఆమె ఉన్నత విద్యావంతురాలు, సంస్కృతం, తెలుగు భాషలలో ప్రావీణ్యంసంపాదించింది. తెలుగుపై ఆమెకున్న పట్టు ప్రశంసనీయం. ఆమె నృత్యం, సంగీతంలో నిపుణురాలు. వీణపై ఆమె నైపుణ్యం ఆమె సమకాలీనుల ప్రశంసలను గెలుచుకుంది. ముద్దుపళని, అన్నింటికంటే మించి, గొప్ప సాహిత్య యోగ్యత కలిగిన కవయిత్రి, ఆమె రచనలు ఇప్పటికీ ప్రజాదరణ పొందాయి.

తంజావూర్ ముద్దుఫళనితెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన, ధైర్యవంతమైన స్త్రీ కవయిత్రి. ఆమె గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటే, ఆమె జీవితం, కాలం, రచనలుకలిపి ఒక ఆసక్తికరమైన సాంస్కృతిక ప్రపంచాన్ని చూపిస్తాయి.ప్రధానంగా ఆమె రెండు రచనల రచయిత్రి. అత్యంత ప్రసిద్ధ గ్రంథం“రాధికా సాంత్వనం” లేదా ఇలావిద్య.ఇది ఒక శృంగార కవ్యం. కథలో ప్రధాన పాత్రలు రాధ, కృష్ణా, ఇలాగే ఇలావరసి (ఇలా అనే పాత్ర కూడా ఉంది).

ఇది తెలుగు శృంగార ప్రబంధ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన కృతి. ఆధునిక పరిశోధనల ప్రకారం ఇందులో584 పద్యాలు, నాలుగు విభాగాలు ఉన్నాయి. కథకురాధ, కృష్ణుల ప్రేమ నేపథ్యం ఉన్నప్పటికీ, ముద్దుఫళని దానిని సాధారణ రాధాకృష్ణ భక్తి కథగా చెప్పలేదు. ఆమె కథలో రాధ, కృష్ణుడు, ఇల ప్రధాన పాత్రలు.

ఇక్కడ ఇల కృష్ణుని కొత్త భార్య. రాధ ఆమెకు కేవలం బంధువు మాత్రమే కాదు. ప్రేమను, దాంపత్యాన్ని అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేసే స్త్రీ.ఇదే ముద్దుఫళని రచనలో అత్యంత అసాధారణమైన అంశాలలో ఒకటి.రాధకు కృష్ణునితో అనుభవం ఉంది. ఇల మాత్రం కొత్త వధువు.కాబట్టి ఇల కృష్ణునితో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే ముందు రాధ ఆమెకు ప్రేమలోనిసున్నితత్వాన్ని, కొత్త అనుభవం పట్ల భయాన్ని ఎలా అధిగమించాలో చెబుతుంది.సాధారణ సాహిత్యంలో పురుషుడు స్త్రీకి ప్రేమను నేర్పుతాడు. కానీ ముద్దుఫళని కథలోఒక స్త్రీ మరో స్త్రీకి ప్రేమ గురించి చెబుతుంది.

రాధ గురువు పాత్రలో తన స్నేహితురాలు ఇలాకు కృష్ణునితో ప్రేమ, సంభోగం గురించి తెలియచేస్తుంది. ప్రేమ, శృంగారం ఎలా అనుభవించాలో నేర్పుతుంది. చాలా అసాధారణమైన దృశ్యం. ఇది కేవలం శృంగార వర్ణన కాదు. ఇందులో స్త్రీ అనుభవం స్త్రీ నుంచే స్త్రీకి బదిలీ అవుతుంది.ఇక్కడే ముద్దుఫళని రచన కేవలం శృంగార కథగా మిగలదు.

స్త్రీ కోరికను అత్యంత స్పష్టంగా పలికించిన పద్యం. రాధికా సాంత్వనంద్వితీయాశ్వాసంలోని ప్రసిద్ధ పద్యం ఇది:

కనుగవ హరిమోము గనుగొననే కోరువీనులు హరిమాట వినగ గోరు

నాసిక హరిమేని వాసనల్గొన గోరునధరంబు హరిమోవి యాన గోరు

జెక్కిలి హరిగోటినొక్కు టెక్కులె కోరుగుబ్బలు హరిఱొమ్ము గ్రుమ్మ గోరు

గరములు హరి నెంతో కౌగలింపగ గోరుమేను శ్రీహరిప్రక్క మెలగ గోరు

నిన్ని యొక్కటే కోరు నిదిగొ నాదుమనసు గోరెడికోరికెల్‌ మట్టులేవు…

ఇదిరాధికా సాంత్వనంలో 2.62గా ఉదహరించబడిన పద్యం. 

భావం:
కళ్లకు కృష్ణుని ముఖాన్ని చూడాలని ఉంది. చెవులకు ఆయన మాట వినాలని ఉంది. ముక్కుకు ఆయన దేహ పరిమళాన్ని ఆస్వాదించాలని ఉంది. పెదవులకు ఆయన ముద్దు కావాలి. చేతులు ఆయనను కౌగిలించుకోవాలని కోరుతున్నాయి. చివరికి“నా మనసుకు కావలసిన కోరికలకు అంతులేదు”అని స్త్రీ తన కోరికను ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తం చేస్తుంది.

కృష్ణుణ్ని చూడాలని, వినాలని, తాకాలని, కౌగిలించుకోవాలని తన శరీరంలోని ప్రతి ఇంద్రియం కోరుకుంటోందని ముద్దుఫళని నేరుగా పలికించింది. తెలుగు శృంగార సాహిత్యంలో పురుషుని దృష్టి నుంచి స్త్రీని వర్ణించడం సాధారణమైనప్పటికీ, ఇక్కడ స్త్రీ తన కోరికను తానే పలుకుతోంది. ఇదే ముద్దుఫళని కవిత్వంలోని అసాధారణమైన ధైర్యం.

ఈ పద్యం ఎందుకు ముఖ్యమైనది?

ఇక్కడ ముఖ్యమైనది శృంగార వర్ణన మాత్రమే కాదు.కోరేది పురుషుడు కాదు,  స్త్రీ. తన కోరికను చెప్పేది కూడా పురుష కవి కాదు, స్త్రీ కవయిత్రి.అందుకే ఈ పద్యం ముద్దుఫళని సాహిత్య ధైర్యానికి మంచి ఉదాహరణ.

రాధ యొక్క ప్రేమ, ఆకాంక్షను చూపించే పద్యం.

నాకృష్ణ దేవుని నా ముద్దుసామినినా చక్కనయ్యను నాదుహరినినానోముపంటను నారాజతిలకుని

నారాముతమ్ముని నాదువిభునినామనకాంతుని నానందతనయునినా ప్రాణనాథుని నాదుప్రియుని

నామోహనాంగుని నానీలవర్ణునినావిటోత్తంసుని నాది సఖుని…

ఇది కూడారాధికా సాంత్వనం2.72గా ఉదహరించబడింది. 

ఇక్కడ రాధ కృష్ణుణ్ని వరుసగా అనేక ఆప్యాయమైన పేర్లతో పిలుస్తుంది.“నా”అనే పదం పదేపదే రావడం గమనించదగినది. అది కేవలం ప్రేమ కాదు.తనకు అతను ఎంత వ్యక్తిగతమైనవాడో, తన మనసులో అతనికి ఉన్న స్వాధీనత భావాన్నికూడా తెలియజేస్తుంది.

ఇల కృష్ణుని భార్య అవుతుంది.రాధ స్వయంగా ఆమెకు ప్రేమను అర్థం చేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు ఇల కృష్ణునికి దగ్గరవటం రాధలోఅసూయ, బాధ, కోల్పోయిన భావన, స్వాధీనత, ప్రేమఅన్నీ ఏర్పడతాయి.ముద్దుఫళని రచనలో అత్యంత ముఖ్యమైన మనోవైజ్ఞానిక కోణం.రాధ కేవలం కృష్ణుడి కోసం ఏడ్చే భక్తురాలు కాదు.ఆమెకు కోరిక ఉంది.ఆమెకు అసూయ ఉంది.తాను ప్రేమించిన వ్యక్తిని మరొక స్త్రీతో పంచుకోవడం ఆమెకు బాధ కలిగిస్తుంది.తాను నేర్పిన ప్రేమను మరొక స్త్రీ అనుభవిస్తుండటమే ఆమెకు అంతర్గతంగా గాయం చేస్తుంది.

చివరికి కృష్ణుడు రాధను సమాధానపరచడం వల్లే ఈ కృతికి‘రాధికా సాంత్వనం’  రాధను ఓదార్చడంఅనే పేరు వచ్చింది. ఆధునిక పరిశోధనలు కూడా కృతిలో రాధ అనుభవించే అసూయ, బాధ, ఆ తరువాత ఆమెకు లభించే సాంత్వనను ప్రధాన నిర్మాణంగా గుర్తిస్తున్నాయి. 

చక్కనిదాన వంచు రతిసార మెఱింగినదాన వంచు నాయక్కఱ దీర్తు వంచు నను హాయిగఁ గౌఁగిటఁ జేర్తు వంచు నేనిక్కము నమ్మి వచ్చునెడ నీ విపు డీమటుమాయలాండ్రచేనక్కట యెప్పగించి యిటు లారడి సేతురె రాధికామణీ.— చతుర్థాశ్వాసము, పద్యం 26 

ఇందులో కృష్ణుడు తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన రాధను మళ్లీ తనతో చేర్చుకోవాలని కోరుతున్నాడు.అందులో ముఖ్యంగా కృష్ణుడు రాధను తనతో మళ్లీ కలవమని వేడుకునే ఈ పద్యం చాలా అందంగా ఉంటుంది.

ననుఁ కరుణించవే పిలువ నంపవె కౌఁగిట గారవించవేఘనత ఘటించవే చెలిమి గాంచెవె నాపలు కాదరించవేనెనరు గణించవే ముదము నించవె యెంచవె యేల నాపయింగినుక నడంపవే తెలియ కే నిను వేడెద రాధికామణీ.— రాధికా సాంత్వనం, చతుర్థాశ్వాసము, పద్యం 25 

సరళమైన భావం

“రాధా! నాపై దయ చూపవా? నన్ను పిలిచి నీ దగ్గరకు రానివ్వవా? నన్ను నీ కౌగిలిలోకి తీసుకుని ఆదరించవా? మన మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసుకోలేవా? నా మాటలను ఆలకించి, నా మీద కోపాన్ని విడిచిపెట్టవా? నీ మనసులోని అలకను తొలగించవా? నిన్ను ఎలా వేడుకోవాలో కూడా నాకు తెలియడం లేదు.”

ఇది చాలా మంచిసాంత్వన పద్యం. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు తన ప్రేమను ప్రకటించడం కంటేరాధ కోపాన్ని, బాధను తగ్గించడానికి ఆమెను వేడుకుంటున్నాడు. రాధను బాధపెట్టిన కృష్ణుడే చివరికి ఆమెను ఓదార్చడానికి ఆమె ముందుకు వస్తాడు. “నన్ను కరుణించవా? నన్ను కౌగిలిలోకి తీసుకోవా? మన ప్రేమను గుర్తు చేసుకోవా?” అంటూ కృష్ణుడు రాధను వేడుకునే ఈ పద్యంలో ప్రేమికుడి ఆవేదన కనిపిస్తుంది. కానీ అంతకంటే ముఖ్యంగా, రాధ కోపానికి విలువనిచ్చి, ఆమెను ఒప్పించవలసిన అవసరాన్ని కృష్ణుడికే కల్పించడం ముద్దుఫళని సృష్టించిన స్త్రీ పాత్ర యొక్క భావోద్వేగ బలాన్ని తెలియజేస్తుంది.

ఇది“రాధ — కేవలం కృష్ణుడి ప్రేయసి కాదు. తన కోపానికీ, తన బాధకీ విలువ ఉన్న స్త్రీ”అనే విశ్లేషణకు చాలా బలమైన ఉదాహరణ అవుతుంది. 

రాధిక, కృష్ణ ప్రేమలను వర్ణించే శృంగార పద్యం, అసాధారణమైన సాహిత్య శ్రేష్టమైన రచన. ఆమె కవిత్వ ధోరిణి, చిత్రణ చక్కగా ఉన్నాయని, ఆమె వివరణలు మనోహరంగానూ, శైలి సరళమైనది, గృహబద్ధమైనది, మనోహరమైనదని శ్లాఘించబడింది.

ఈ కృతి ప్రత్యేకంగా చెబుతారు. ఇందులో ఆమె స్త్రీ దృష్టికోణం.శృంగారాన్ని ఒక స్త్రీ కోణంలో నుంచి చాలా స్పష్టంగా, నిర్భయంగా వర్ణించింది. ఇది ఆ కాలంలో చాలా అరుదైన విషయం.సాహసోపేతమైన భాష. ఆమె వాడిన పదజాలం, భావాలను చాలా బహిరంగంగా వ్యక్తీకరిస్తుంది. ముద్దుఫళని శృంగారాన్ని వర్ణించడం ఒక్కటే ఆమె ప్రత్యేకత కాదు.స్త్రీని శృంగార అనుభవానికి సంబంధించిన వస్తువుగా కాకుండా, అనుభవించే వ్యక్తిగా చూపించడంఆమె రచనలోని ముఖ్యమైన లక్షణం.స్త్రీ స్వరాన్ని వినిపించడం. మహిళా ఆకాంక్షలు, కోరికలు, భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తం చేసింది. అందుకే ఈ కృతిని కొంతమంది విమర్శించారు.

ఆమె స్త్రీకికోరిక, సంకోచం, ఆసక్తి, అనుభవం, అసూయ, కోపం, బాధ, తనకు నచ్చిన వ్యక్తిని కోరుకునే హక్కు ఉంది.ఈ భావాలన్నింటినీ ఆమె స్త్రీ పాత్రల ద్వారా వ్యక్తం చేసింది.అందుకే ఆధునిక పాఠకుడికి ముద్దుఫళని రచనలో అత్యంత ముఖ్యమైన అంశం కేవలం శృంగారం కాదు.స్త్రీ అనుభవానికి ఇచ్చిన స్వరం.

ఆమెను ‘తొలి స్త్రీవాద కవయిత్రి’ అనవచ్చా?

ఇక్కడ కొంత జాగ్రత్త అవసరం.ముద్దుఫళని 18వ శతాబ్దానికి చెందినది.‘ఫెమినిజం’ అనే ఆధునిక రాజకీయ, సామాజిక సిద్ధాంతాన్ని ఆమెకు నేరుగా ఆపాదించడం చారిత్రకంగా సరైనది కాదు.అయితే ఆధునిక స్త్రీవాద విమర్శ ఆమె రచనలోని కొన్ని అంశాలను స్త్రీ స్వాతంత్ర్యం, స్త్రీ కోరిక, స్త్రీ శరీరానుభవం, స్త్రీ స్వరం వంటి భావాలతో అనుసంధానిస్తుంది.అందువల్ల“ముద్దుఫళని తొలి ఫెమినిస్ట్”అని ఖచ్చితమైన చారిత్రక బిరుదుగా చెప్పడం కంటే,“ఆధునిక స్త్రీవాద దృష్టిలో ముందుగానే చదవదగిన శక్తివంతమైన స్త్రీ స్వరం”అని చెప్పడం మరింత సముచితం.

ముద్దుఫళనికి ఆపాదించబడే మరో ముఖ్యమైన రచన‘అష్టపది’. ఇది జయదేవునిగీతగోవిందంలోని అష్టపదుల తెలుగు రూపాంతరంతో సంబంధం కలిగి ఉంది. ఆమె ఆండాళ్తిరుప్పావైను కూడా అనువదించినట్లు ఆధారాలు పేర్కొంటున్నాయి. సప్తపదులు అనే రూపంలో రచనా ప్రయోగాలు చేసినట్లు కూడా సూచనలు ఉన్నాయి. రచయిత గొప్ప సంగీత ప్రతిభ గురించి మనకు అంతర్దృష్టిని అందించే మూలానికి అనువాదం విలువైనదని సమర్థ సంగీత విమర్శకులు అభిప్రాయపడ్డారు.

దీనివల్ల ముద్దుఫళనిని కేవలం శృంగార రచయిత్రిగా చూడటం ఎంత పరిమితమైనదో తెలుస్తుంది.ఆమెకు భక్తి, సంగీతం, కవిత్వం, శృంగారం ఇవన్నీ పరస్పరం విరుద్ధమైన రంగాలు కావు.తంజావూరు కళాసంప్రదాయంలో ఇవన్నీ ఒకదానితో ఒకటి మిళితమై ఉన్నాయి.

అసలు వివాదం ఎప్పుడు మొదలైంది?

ముద్దుఫళని జీవించిన కాలంలో ఆమె రచనపై మనకు కనిపించే పెద్ద ప్రజా వివాదం లేదు.అది19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ప్రారంభంలోఉధృతమైంది.1855లో తెలుగు పండితుడుసి. పి. బ్రౌన్ముద్దుఫళని రచనకు సంబంధించిన ఒక సిద్ధప్రతిని పొందినట్లు తరువాతి ప్రచురణ చరిత్ర చెబుతుంది. 1887లో పైడిపాటి వెంకటనరసు ఆధ్వర్యంలో ముద్రిత రూపం వచ్చింది. 1907లో మరో ముద్రణ వెలువడింది. అయితే ఆ సంచికల్లో కొన్ని శృంగార పద్యాలు, అలాగే ముద్దుఫళని తన వంశపారంపర్యాన్ని వివరించిన ముందుమాటలోని భాగాలు తొలగించబడ్డాయి. 

ముద్దుఫళని రచనపై కాలక్రమంలో చాలా వివాదాలు వచ్చాయి. బ్రిటిష్ కాలంలో ఈ గ్రంథాన్నిఅశ్లీలంగా భావించి నిషేధించారు.సామాజిక నైతిక విలువలకు విరుద్ధంగా చూశారు.తరువాతబెంగుళూరు నాగరత్నమ్మ అనే ప్రముఖ సాహిత్యాభిమాని ఈ గ్రంథాన్ని తిరిగి ప్రచురించింది.“ఇది అసభ్యకృతి కాదు. ఇది సాహిత్యం” అని రక్షించింది.ఆమె వల్ల ముద్దుఫళని కవిత్వం మళ్లీ వెలుగులోకి వచ్చింది. నాగరత్నమ్మ కూడా దేవదాసి సంప్రదాయానికి చెందిన పండితురాలు, గాయని, కళాకారిణి.

ఆమెకు లభించిన ముద్రితరాధికా సాంత్వనంఅసలు రచనతో సరిపోలడం లేదని తెలిసింది. కొన్ని పద్యాలు లేవు. ముద్దుఫళని తన వంశం గురించి చెప్పిన భాగాలు కూడా తొలగించబడ్డాయి.నాగరత్నమ్మ అసలు తాళపత్ర ప్రతిని వెతికి, దాని ఆధారంగా1910లో పూర్తి రూపంలో రాధికా సాంత్వనాన్ని ప్రచురించింది. ఇది కేవలం ఒక పుస్తక పునర్ముద్రణ కాదు.ఒక స్త్రీ మరో స్త్రీ స్వరాన్ని తిరిగి సమాజానికి అందించిన సంఘటన.

వీరేశలింగం–నాగరత్నమ్మ వివాదం

ఈ పునర్ముద్రణ తీవ్ర చర్చకు దారితీసింది.సామాజిక సంస్కర్తకందుకూరి వీరేశలింగంముద్దుఫళని రచనలోని శృంగారాన్ని తీవ్రంగా విమర్శించాడు. ముఖ్యంగా ఒక స్త్రీ నోటి నుంచి అలాంటి వర్ణనలు రావడాన్ని ఆయన అంగీకరించలేదు. నాగరత్నమ్మ మాత్రం వెనక్కి తగ్గలేదు.

ఆమె ప్రశ్నలో ఒక ముఖ్యమైన సాహిత్యలింగ రాజకీయ అంశం ఉంది.

పురుషుడు శృంగారం రాస్తే అది కవిత్వం. అదే స్త్రీ రాస్తే అది అసభ్యత ఎందుకు?

ఈ ప్రశ్నే తరువాత ముద్దుఫళని చుట్టూ ఏర్పడిన ఆధునిక స్త్రీవాద పఠనానికి ఒక ప్రధాన ఆధారంగా మారింది.నాగరత్నమ్మ రక్షణలో వ్యక్తిగత అనుబంధం మాత్రమే లేదు.స్త్రీ రచయిత్రికి వర్తించే ప్రమాణాలు, పురుష రచయితలకు వర్తించే ప్రమాణాలు ఒకటేనా?అనే ప్రశ్న ఉంది.

బ్రిటిష్ పాలనలో ‘అశ్లీలత’ వివాదం

1910లో నాగరత్నమ్మ ప్రచురించిన పూర్తి సంచిక తరువాత వలస పాలనా యంత్రాంగం దృష్టికి వచ్చింది.1911లోరాధికా సాంత్వనంపై అధికారిక చర్యలు జరిగాయి. కొన్ని ఆధారాల ప్రకారం ప్రచురిత ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో గ్రంథంలోని అనేక భాగాలను అభ్యంతరకరంగా పేర్కొన్నారు. అందువల్ల“బ్రిటిష్ కాలంలో ఈ గ్రంథం అశ్లీలత పేరుతో నిషేధానికి గురైంది”అని చెప్పడం సమర్థించగల చారిత్రక వాదన.

అయితే ఈ నిషేధం గురించి సంవత్సరాలు, ప్రభుత్వ ఉత్తర్వుల అమలు, తరువాతి పునర్ముద్రణల పరిస్థితి వంటి వివరాల్లో వేర్వేరు ఆధారాల్లో తేడాలు కనిపిస్తాయి.

ఒక సాహిత్య కృతిపై మూడు తీర్పులు

ముద్దుఫళని చుట్టూ ఏర్పడిన చర్చను మూడు దశల్లో చూడవచ్చు.

మొదటిది — సంప్రదాయ నైతిక దృష్టి.“ఇంత స్పష్టమైన శృంగారం సాహిత్యంలో అవసరమా?” అనే ప్రశ్న.

రెండవది — సాహిత్య స్వేచ్ఛ దృష్టి.“శృంగారం కూడా ఒక రసమే. పురుష కవులకు ఉన్న స్వేచ్ఛ స్త్రీ కవయిత్రికి ఎందుకు ఉండకూడదు?” అనే ప్రశ్న.

మూడవది — ఆధునిక స్త్రీవాద దృష్టి.“ఇక్కడ ఒక స్త్రీ తన కోరికను తానే పలుకుతోంది. తన అనుభవాన్ని తానే నిర్వచిస్తోంది. అదే అసలు ప్రాధాన్యం” అనే పఠనం.

ఈ మూడు దృష్టుల్లో ఏ ఒక్కదానితోనూ ముద్దుఫళనిని పూర్తిగా అర్థం చేసుకోలేం.ముద్దుఫళని — తనను తాను తక్కువ చేసుకోని కవయిత్రి.

ముద్దుఫళని రచనలో కనిపించే మరో విశేషం ఆమెఆత్మవిశ్వాసం.ఆమె తన ప్రతిభను దాచుకోలేదు.

తాను ఎవరో, తనకు ఉన్న పాండిత్యం ఏమిటో, తన కుటుంబ కళా సంప్రదాయం ఏమిటో చెప్పుకోవడంలో వెనుకాడలేదు.ఇది కూడా ఆమె కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యమైన విషయం.

స్త్రీ తన గురించి తానే గొప్పగా మాట్లాడటం కూడా ఒక సామాజిక అసౌకర్యానికి కారణమయ్యే కాలంలో, ముద్దుఫళని తన సాహిత్య వ్యక్తిత్వాన్ని స్వయంగా ప్రకటించింది.

అందువల్ల ఆమె రచనలోస్త్రీ కోరిక మాత్రమే కాదు, స్త్రీ రచయిత్రి యొక్క ఆత్మగౌరవం కూడా ఉంది.

ముద్దుఫళని రచనలో స్త్రీ మనస్తత్వం

ముద్దుఫళని గొప్పతనం ఆమె శృంగార వర్ణనలో మాత్రమే లేదు.రాధలోని అసూయను ఆమె ఎంత మానవీయంగా చిత్రించిందన్నదే ముఖ్యమైనది.తాను ప్రేమించిన వ్యక్తిని తానే మరో స్త్రీకి పరిచయం చేస్తుంది.ఆమెను తానే సిద్ధం చేస్తుంది.కానీ అదే స్త్రీ కృష్ణుడికి దగ్గరవుతున్నప్పుడు తనలోనే ఒక బాధ మొదలవుతుంది.

ఇది ఒక గొప్ప మానసిక వైరుధ్యం.

“నేను ఇచ్చిన ప్రేమలోనే నేను కోల్పోయిన ప్రేమను చూస్తున్నాను.”ఈ అంతర్గత సంఘర్షణను ముద్దుఫళని రాధ పాత్రలో ప్రతిష్ఠించింది.అందువల్లరాధికా సాంత్వనంను కేవలం శృంగార కావ్యంగా చదవడం దాని సగం మాత్రమే చదివినట్లవుతుంది.ఇదిప్రేమ, కోరిక, అసూయ, స్వాధీనత, బాధ, సమాధానంగురించి కూడా చెప్పే కృతి.

దేవదాసి’ అనే ముద్రతో ముద్దుఫళనిని చదవడం సరిపోదు. ముద్దుఫళనిని అర్థం చేసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఇదే.ఆమెను కేవలం “దేవదాసి”గా గుర్తించి, ఆ గుర్తింపునే ఆమె సాహిత్యానికి వివరణగా ఉపయోగించడం సరైంది కాదు.ఆమె ఒకకళా సంప్రదాయంలో విద్య పొందిన మహిళ.ఆమెకు సంగీతం, నాట్యం, తెలుగు, సంస్కృత సాహిత్య పరిజ్ఞానం ఉంది.రాజసభ సంస్కృతిలో స్థానం ఉంది.అన్నింటికంటే ముఖ్యంగాకవిత్వం రాయగల సృజనాత్మక శక్తి ఉంది.ఆమె సామాజిక నేపథ్యం ఆమెను అర్థం చేసుకోవడానికి అవసరం. కానీ అదే ఆమె సాహిత్య విలువకు పరిమితి కాకూడదు.

పండితుల విశ్లేషణ

ముద్దుఫళని గురించి పండితులు పలు రకాలైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆమెమొదటి ఫెమినిస్ట్ స్వరంగా పరిగణించబడుతుంది.స్త్రీ కోరికలను దాచకుండా చెప్పింది. సాహిత్యంలో ఒక కొత్త దిశ ఇచ్చిందని సానుకూలంగాఅభిప్రాయపడ్డారు.

కాని కొందరుఅశ్లీలత ఎక్కువగా ఉందని, సామాజిక విలువలకు విరుద్ధమని విమర్శించారు.కానీ ఆధునిక దృష్టిలోఇదిస్త్రీ స్వేచ్ఛ యొక్క వ్యక్తీకరణగా భావిస్తారు.సాహసానికి,స్త్రీ స్వరానికి,శృంగార సాహిత్యానికి ఒక మైలురాయి ముద్దుఫళనిని ఒక ప్రతీకగా చూస్తారు.ప్రేమ అనేది కేవలం పవిత్రత కాదు. అది కోరిక, బాధ, అసూయకలిసిన జీవితం అనిముద్దుఫళని కవిత్వం మనకు చెబుతుంది. అది చెప్పడానికి ఆమె ఎంచుకున్న భాషనిజాయితీ, ధైర్యం, సాహసం.

ముద్దుఫళని గురించి పండితుల అభిప్రాయాలు చాలా విభిన్నంగా ఉన్నాయి.

ఆధునిక సానుకూల విశ్లేషణ

“మొదటి ఫెమినిస్ట్ స్వరం”ఆమె స్త్రీ కోరికలను దాచలేదు. స్త్రీకి కూడా శృంగారం మీద హక్కు ఉందని చూపించింది.కొందరు ఆమెను “తెలుగు సాహిత్యంలో తొలి స్త్రీవాద కవయిత్రి”గా పరిగణిస్తారు.

స్త్రీ మనోవైజ్ఞానికతరాధ పాత్రలోప్రేమ, అసూయ, స్వాధీనం భావం. ఇవన్నీ చాలా సహజంగా చూపించింది.సాహిత్య ధైర్యం. ఆ కాలంలోఇలాంటి విషయాలు చెప్పడం సాహసం. కానీ ఆమెఏ సంకోచం లేకుండా రాసింది.

సంప్రదాయ విమర్శలు

1. అశ్లీలత ఆరోపణ. కొందరు పండితులు“ఇది అధిక శృంగారం” అన్నారు. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో దీనిని నిషేధించారు.
2. సామాజిక విలువలు. సంప్రదాయ దృష్టిలోఇది నీతికి విరుద్ధమని భావించారు.

మధ్యస్థ విశ్లేషణ

కొంతమంది పండితులు ఇలా అంటారు “ఇది అశ్లీలం కాదు. కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భంలో, ప్రత్యేక వర్గం కోసం రాసిన సాహిత్యం”. రాజసభ సంస్కృతి. దేవదాసి సంప్రదాయం. ఇవి అర్థం చేసుకుంటేనే ఈ కృతి విలువ తెలుస్తుంది.

రాధికా సాంత్వనంఏమిటి?శృంగార కావ్యం మాత్రమే కాదు. స్త్రీ మనసు యొక్క లోతైన విశ్లేషణ.ముద్దుఫళని ఎవరు?ధైర్యంగా మాట్లాడిన స్త్రీ. తన భావాలను దాచని కవయిత్రి. సాహిత్యంలో ఒక కొత్త దిశ చూపిన వ్యక్తి.ముద్దుఫళని కవిత్వం మనకు ఒక ప్రశ్న వేస్తుంది. “స్త్రీ భావాలు చెప్పుకోవడం తప్పా? లేక వాటిని దాచుకోవడమే తప్పా?”

పునరుద్ధరణ&సమర్థన ధోరణి

ముద్దుఫళని గురించి మాట్లాడితే మొదట గుర్తు చేసుకోవాల్సిన పేరు బెంగుళూరు నాగరత్నమ్మ గారిది.ఆమె రాధికా సాంత్వనంను తిరిగి ప్రచురించింది. బ్రిటిష్ కాలంలో “అశ్లీలం” పేరుతో నిషేధించిన గ్రంథాన్ని రక్షించింది.“ఇది అసభ్యకృతి కాదు. ఇది కళ” అని రక్షించింది. ఆమె లేకపోతే ముద్దుఫళని పేరు మరిచిపోయే అవకాశం ఉండేది.ఆమె అభిప్రాయంలో “శృంగారం అంటే అసభ్యం కాదు. అది సాహిత్యంలో ఒక సహజమైన రసం”. పురుష కవులు రాస్తే గొప్పగా చూస్తారు, స్త్రీ రాస్తే ఎందుకు తప్పు? అని ప్రశ్నించింది.
ముద్దుఫళని తిరిగి సాహిత్య చరిత్రలో నిలబడటానికి కారణం నాగరత్నమ్మే.

స్త్రీవాద&ఆధునిక విశ్లేషణ

కందుకూరి వీరేశలింగం గారు ముద్దుఫళని కవిత్వాన్ని విమర్శించాడు. “ఇది శృంగారం ఎక్కువగా ఉంది” అని భావించాడు.అయితేఇది ఆ కాలపుసామాజిక సంస్కరణ దృష్టిప్రభావం. ఆయన కాలంలో (19వ శతాబ్దం చివర) సాహిత్యంలో నైతికతకు ప్రాముఖ్యత ఇచ్చాడు.

వ్యక్తిగత స్వేచ్ఛ, ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛకు మద్దతుదారైన చలం గారు ముద్దుఫళని ధైర్యాన్ని ప్రశంసించాడు. స్త్రీ కోరికలను నిర్భయంగా చెప్పిన రచయిత్రిగా చూశాడు.ఆయన దృష్టిలోముద్దుఫళని సాహిత్యం “నిజాయితీ గల స్త్రీ స్వరం” గా భావించాడు.

వెల్చేరు నారాయణరావు గారు రాధికా సాంత్వనంను సాహిత్య, సాంస్కృతిక కోణంలో విశ్లేషించాడు.ఇది కేవలం శృంగార కావ్యం కాదు. రాజసభ సంస్కృతి, దేవదాసి సంప్రదాయం ప్రతిబింబం. స్త్రీ అనుభవాలను లోతుగా చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఆయన దృష్టిలోఈ కృతిని అర్థం చేసుకోవాలంటే దానిసాంస్కృతిక నేపథ్యంతెలుసుకోవాలి.

భారతీయ స్త్రీ రచయితలపై పరిశోధన చేసిన సుశీ థారు (Susie Tharu) గారిఅభిప్రాయంలోముద్దుఫళని రచన “స్త్రీ శరీరం, కోరికలను తిరిగి స్వాధీనం చేసుకోవడం” అంటేస్త్రీ తన అనుభవాన్ని తనే చెప్పుకోవడం.

స్త్రీల రచనలను సమగ్రంగా పరిశీలించిన కె. లలిత,ముద్దుఫళనిపురుషాధిక్య సాహిత్యాన్ని సవాలు చేసింది. స్త్రీ కోణాన్ని ముందుకు తెచ్చిందని అభిప్రాయ పడ్డారు.

పరిశోధకుడు, తెలుగు గ్రంథాలను సేకరించి ప్రచురించే సి.పి. బ్రౌన్ సంప్రదాయం,విమర్శాత్మక దృష్టిలోముద్దుఫళని సాహిత్యంలోని శృంగార భాగాలపై అసహనం చూపినట్టు,కాలనీయ నైతిక ప్రమాణాల ప్రభావం ఉందని భావించబడుతుంది.

సంప్రదాయ పండితులు (సామాన్య దృష్టి)శృంగారాన్ని పరిమితంగా మాత్రమే అంగీకరించారు.ముద్దుఫళని రచనలో“అధిక స్పష్టత” ఉందని విమర్శించారు.వారి దృష్టిలోసాహిత్యం అంటే నీతి, సంయమనాలసమ్మేళనం.

ఇప్పటి పరిశోధకుల సమతుల్య ఆధునిక దృష్టిలోరాధికా సాంత్వనంను ఒక రాజసభ సాంస్కృతిక ఉత్పత్తి. దేవదాసి కళాసంప్రదాయం ప్రభావం. స్త్రీ అనుభవాల నిజాయితీ ప్రతిబింబం.

ముద్దుఫళని మీద పండితుల సమగ్ర విశ్లేషణ ఒక పెద్ద విషయం చెబుతాయి.ఒకే కృతిమూడు రకాల అర్థాలు కొందరికి అశ్లీలం.కొందరికి సాహసవంతమైన సాహిత్యం.మరికొందరికి సాంస్కృతిక పత్రం.

ఆధునిక పరిశోధకుల దృష్టిలో ముద్దుఫళని

ముద్దుఫళనిపై ఆధునిక పరిశోధనలో ముఖ్యమైన మలుపుసుశీ థారు, కె. లలిత సంపాదించిన Women Writing in India వంటి సంకలనాల ద్వారా వచ్చింది. అక్కడ ముద్దుఫళని రచనను భారతీయ మహిళల సాహిత్య చరిత్రలో భాగంగా చదివారు. 

అదేవిధంగా వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ సంపాదించిన Classical Telugu Poetryలో ముద్దుఫళనికి స్థానం ఇవ్వడం, ఆమెను తెలుగు శాస్త్రీయ కవితా సంప్రదాయంలో ఒక ముఖ్యమైన కవిగా చూడవచ్చని సూచిస్తుంది. ఈ సంకలనం 11వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తెలుగు కవిత్వంలోని ముఖ్యమైన స్వరాలను పరిచయం చేస్తుంది. 

ఇక ఆధునిక లింగ అధ్యయనాల్లో ముద్దుఫళని రచననుదేవదాసి సంస్కరణ ఉద్యమం, స్త్రీ లైంగికత, వలస నైతికత, సాహిత్య స్వేచ్ఛవంటి అంశాలతో అనుసంధానించి పరిశీలిస్తున్నారు. పరోమితా బోస్ పరిశోధన కూడా Radhika Santwanamచుట్టూ 1911లో జరిగిన చర్చను దేవదాసి సంస్కరణ, స్త్రీ లైంగికత, వలస నైతికతల విస్తృత సందర్భంలో పరిశీలిస్తుంది. 

అయితే ఆమెను ‘ఫెమినిస్ట్’ అని పిలవడం ఎంతవరకు సరైనది?ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న.ముద్దుఫళని స్వయంగా ఆధునిక అర్థంలో స్త్రీవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు.ఆమె రచన ఒక రాజకీయ ప్రకటన కూడా కాదు.కానీ ఆమె చేసిన పని మాత్రం తరువాతి స్త్రీవాద పఠనాలకు అనుకూలంగా ఉంది.ఎందుకంటే ఆమెస్త్రీకి కోరిక ఉందని అంగీకరించింది.తన కోరికను వ్యక్తం చేయగలదని చూపించింది.అసూయ ఉంటుందని దాచలేదు. తన అనుభవాన్ని తానే చెప్పే హక్కు ఇచ్చింది.స్త్రీ తన శరీరం గురించి మాట్లాడటం సిగ్గు కాదని తన రచన ద్వారా చూపించింది.

ఈ కారణాల వల్లనే ఆధునిక పాఠకులు ముద్దుఫళనిలో ఒక శక్తివంతమైనస్త్రీ స్వరాన్నిచూస్తున్నారు.

ముద్దుఫళని ఎందుకు ముఖ్యమైనది?

ముద్దుఫళని మనకు కేవలం 18వ శతాబ్దపు ఒక కవయిత్రి గురించి చెప్పదు.ఆమె ద్వారా మనం ఒక మొత్తం ప్రపంచాన్ని చూస్తాం.తంజావూరు రాజసభను,మరాఠా పాలనలో తెలుగు సాహిత్య వికాసాన్ని,దేవదాసి కళాసంప్రదాయాన్ని,స్త్రీలకు లభించిన ప్రత్యేకమైన విద్యా, కళా అవకాశాలను, శృంగార సాహిత్య సంప్రదాయాన్ని,వలస పాలకుల నైతిక ప్రమాణాలను,19వ శతాబ్దపు సామాజిక సంస్కరణ భావజాలాన్ని,స్త్రీ రచనపై సమాజం పెట్టిన నియంత్రణలను.ముఖ్యంగాఒక స్త్రీ తన గొంతుతో మాట్లాడినప్పుడు సమాజం ఎలా స్పందిస్తుందో.

ముద్దుఫళని రెండు శతాబ్దాల తరువాత కూడా ఎందుకు మనల్ని ప్రశ్నిస్తుంది?

ముద్దుఫళని కవిత్వం మన ముందుంచే అసలు ప్రశ్న“స్త్రీ తన భావాలను తానే చెప్పుకోవచ్చా?”అది కేవలం శృంగారం గురించి ప్రశ్న కాదు.తన ప్రేమ గురించి స్త్రీ మాట్లాడవచ్చా?తన కోరిక గురించి మాట్లాడవచ్చా?తన శరీరం గురించి మాట్లాడవచ్చా?తన అసూయను అంగీకరించవచ్చా?తనకు నచ్చిన పురుషుడిని తానే కోరుకోవచ్చా?తన సాహిత్య ప్రతిభను తానే ప్రకటించుకోవచ్చా?ముద్దుఫళని ఈ ప్రశ్నలకు సిద్ధాంతపరమైన సమాధానాలు రాయలేదు.

ఆమె తన కవిత్వంతోనే సమాధానం చెప్పింది.

ముద్దుఫళనిని కేవలం“శృంగార కవయిత్రి”గా పిలవడం ఆమె సాహిత్యాన్ని చిన్నచూపు చూడటమే.ఆమె ఒక రాజసభీయ కళా ప్రపంచం నుంచి వచ్చిన కవయిత్రి.ఆమెకు ముందు తరాల కళా వారసత్వం ఉంది.ఆమెకు తెలుగు, సంస్కృత సాహిత్య, సంగీతం, నాట్య పరిజ్ఞానం ఉంది.ఆమెకు తన ప్రతిభపై నమ్మకం ఉంది.ముఖ్యంగా స్త్రీ అనుభవాన్ని స్త్రీ స్వరంతో చెప్పే ధైర్యం ఉంది.రాధికా సాంత్వనంలో రాధ కృష్ణుని నుంచి సాంత్వనం పొందుతుంది.కానీ చరిత్రలో ముద్దుఫళనికి సాంత్వనం అవసరం రాలేదు.ఆమెను ఒకప్పుడు అశ్లీలురాలిగా చూశారు.ఆమె రచనను తొలగించారు.ఆమె పద్యాలను కత్తిరించారు.తరువాత మరో కళాకారిణి బెంగళూరు నాగరత్నమ్మ ఆ తొలగించబడిన స్వరాన్ని తిరిగి తీసుకొచ్చింది.

అందుకే ముద్దుఫళని కథలో కనిపించేది కేవలంఒక కవయిత్రి కథ కాదు.ఒక స్త్రీ రాసిన మాటలను చరిత్ర ఎలా అణచివేయగలదో అదే మాటలను మరో స్త్రీ ఎలా తిరిగి చరిత్రలో నిలబెట్టగలదో చెప్పే కథ.

ముద్దుఫళని అందుకే ఈనాటికీ మనకు సంబంధించినది.ఆమె శృంగారాన్ని రాసినందుకు మాత్రమే కాదు. స్త్రీ తన అనుభూతికి తానే యజమాని అని తన కవిత్వంతో నిరూపించినందుకు.

పరిశోధనకు ఉపయోగపడే ప్రధాన ఆధారాలు

  • వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ — Classical Telugu Poetry: An Anthology, University of California Press. ఇందులో ముద్దుఫళనికి ప్రత్యేక అధ్యాయం ఉంది. 
  • సుశీ థారు, కె. లలిత — Women Writing in India. ముద్దుఫళని రచనను మహిళా సాహిత్య చరిత్రలో చర్చించిన ముఖ్య సంకలనం. 
  • పరోమితా బోస్ — “Devadasi Reform in Colonial South India: The Case of Radhika Santwanam”. ముద్దుఫళని–నాగరత్నమ్మ–వీరేశలింగం వివాదాన్ని వలసకాల సామాజిక సందర్భంలో పరిశీలిస్తుంది. 
  • బెంగళూరు నాగరత్నమ్మ 1910 పునర్ముద్రణ చరిత్రకు సంబంధించిన ఆధారాలు. 

September 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మోక్షగుండం బాటలో నడచిన శేషాచారి

by Dr. SriBashyam Anuradha Ashok September 29, 2026
written by Dr. SriBashyam Anuradha Ashok

1958వ సంవత్సరం… నేటి ఉత్తరాఖండ్లోని హరిద్వార్… ఆగ్నేయ ఆసియా దేశాలకు మకుటాయమానమైన ‘రూర్కీ’ విశ్వ విద్యాలయం(ప్రస్తుతం ఐఐటి విద్యాసంస్థ)లో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, సగర్వంగా పట్టాపొంది, ఆనందోత్సాహాలతో స్వంత గ్రామాలకు చేరుకున్నారు విద్యార్థులంతా. అందులో ఓ చురుకైన విద్యార్థి… మోక్షగుండం వారే రోల్ మోడల్, నిరంతర సాంకేతికాభివృద్ధిపైనే ధ్యాస, తాను స్వస్థలం చేరుకున్నారు. ఆ రాష్ట్ర, ఆ ప్రాంతాభివృద్ధి కోసం, కుటుంబం కోసం బృహత్తర కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. తాను పనిచేసే నీటి పారుదల శాఖలో రాణించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో, అనూహ్యంగా తాను చదువుకున్న సంస్థ నుంచి అధ్యాపకుడిగా నియామకపు ఉత్తర్వులు అందాయి. విద్యార్థులంతా నీ ప్రతిభకు తార్కాణమన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోమని అన్నారు తోబుట్టువులు, కానీ, “నేను విద్యార్థిగా వెళ్లిన ఆ సంస్థ నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. ఆ స్ఫూర్తితోనే నేను ఓ నిర్ణయం తీసుకుంటున్నాను” అని పేర్కొన్న ఆ ఇంజినీరే… శ్రీ ఉత్తలూరి శేషాచారి గారు. సొంత ప్రాంతానికి, ఓ వ్యక్తిగా ఉన్నతంగా నిలిపిన విశ్వ విద్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే, సున్నితంగా వారు ఇచ్చిన అవకాశాన్ని స్వీకరించలేనని చెప్పిన మహోన్నత వ్యక్తి ఉత్తలూరి వారు.

వీరు 1923లో శ్రీనివాసాచార్యులు, సీనమ్మ దంపతులకు ప్రస్తుత యాదాద్రి నందలి భువనగిరిలో జన్మించారు. ఉత్తమ విలువలు, ఉన్నత సంస్కారం బాల్యం నుండే అలవరచినారు తండ్రి శ్రీనివాసాచార్యులు. ఉపాధ్యాయ వృత్తి రీత్యా వీరి కుటుంబం గౌలిపుర(ఛత్రినాక) హైదరాబాదు నందు స్థిరపడింది. అక్కడే శేషాచారి విద్యాభ్యాసం కొనసాగింది. ఛాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలో, సిటీ కళాశాలల్లో చదువు పూర్తి చేశారు.

తెలంగాణకే సరస్వతీ నిలయంగా పేరు గాంచి, ఎందరో మహానుభావుల విద్యాక్షేత్రమైన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో మొదటి బ్యాచ్ సివిల్ ఇంజినీర్ పట్టా అందుకున్న ప్రథముడు (1944) శేషాచారి గారు. మాస్టర్ ఆఫ్ ఇంజినీర్ (ఎంఈ) ‘రూర్కీ’ విశ్వవిద్యాలయం ద్వారా పట్టా పొంది, పుట్టిన నేల రుణం తీర్చుకోవడానికి, ఆ నేలను సుభిక్షం చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలకు రూపకల్పన చేయడం ఆరంభించారు వీరు.

వెనుకబడిన నా ప్రాంత అభివృద్ధి కోసం నేనేమైనా చేయాలని నిరంతరం కలలు కనేవారు. ఈ ప్రాంతం అన్నపూర్ణగా ప్రజల ఆకలి తీర్చాలంటే రైతన్నలకు సుస్థిర వ్యవసాయానికి సాగునీరు అందించాలని, నీటి పారుదల శాఖలో ఉన్న తాను రైతులకు ఎలా సాయం చేయాలని తపించారు.

వీరు పనియే దైవం’గా భావిస్తారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా వివిధ హోదాలలో బాధ్యతలను నిర్వర్తించారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ, పరిష్కార మార్గాలు సూచించారు. రైతుల ఆర్థిక, సాంఘిక పురోగతి కోసం తనదైన పంథాలో కృషి చేశారు. నీటి వనరులను అభివృద్ధి చేయడం, నీటి వనరులలోని నీటి నిల్వలు పెంచడం, వ్యవసాయం కోసం రైతుకు సాగునీటిని అందించడం వీరి ప్రధాన ఉద్దేశ్యం.

“ప్రజలకు తాగునీరు, రైతులుకు సాగునీరు” అందించడంతో తన బాధ్యత తీరిపోదని భావించారు. అందుకై సాగునీటి సామర్థ్యాన్ని పెంచుటకు వ్యవసాయ శాఖ అనుబంధంతో వరంగల్ సర్కిల్ ఆఫీసు వెనుక ప్రదర్శన క్షేత్రాలు స్థాపించారు. సాంప్రదాయ రీతిలో వరి పండించే వారు రైతులు. అందుకు భిన్నంగా వాణిజ్య వ్యాపారాభివృద్ధి పెంచడం కొరకు కూరగాయలు, పండ్ల తోటలు పెంచే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పంటలతో వ్యవసాయాభివృద్దే కాక వారి ఆరోగ్యానికి తోడ్పడతాయని తలచారు. దీనిద్వారా తక్కువ నీరుతో ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి ఉంటుందని ప్రయోగాత్మకంగా చూపిన ప్రాజ్ఞులు వీరు.

అంతేకాదు, సాగునీటి వ్యవసాయంలో నీరు ప్రవహించే మేర కలుపు మొక్కలు పెరిగేవి. ఈ కలుపు, పంటకు నానా రకాల ఇబ్బందులు కలిగించేవి. కలుపు నివారణకై చిన్నచిన్న కాలువలు తీసి, సిమెంట్ వేసి, నీరు వృధా కాకుండా పంటకు చేరేలా చేసిన ప్రథములు వీరే. రైతు పురోభివృద్ధి చెందితే, దేశాభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం కలిగిన వారు ఉత్తలూరి వారు. ఎండ సమయంలో నీరు ఆవిరి కావడం, రైతు అలసట చెందుతాడని మోటబావుల ద్వారా నీటిని పంట పొలాలకు ఉదయ సంధ్య వేళల్లోనే అందించాలని సమయాన్ని నిర్దేశించారు ఈ ఇంజినీరు.

ఇలా వ్యవసాయం అభివృద్ధి చెందితే దుర్భిక్షంపోయి, సుభిక్షం అవుతుందని, నీటి పారుదల శాఖలో ప్రయోగాత్మక ప్రణాళికలను సిద్ధం చేసి రైతులకు శిక్షణను ఇచ్చారు. భారత ప్రభుత్వం వీరి సేవలు వినియోగించుకోవడానికి ఆగ్నేయ ఆసియా దేశాల ఇంజినీర్లకు నిర్వహించిన ఉన్నత శిక్షణకు ఆహ్వానించింది. ఆ సందర్భంగా కేంద్రం నుండి వీరికి ఘనమైన సత్కారం, పారితోషికం అందించి, జాతీయ స్థాయిలో వీరి సేవలను ఉపయోగించుకుంది. అక్కడి శిక్షణలో అత్యాధునిక పరికరాలతో నూతన పద్ధతిలో వ్యవసాయం చేయడం, ప్రాంతీయ వనరులతో సాగు చేయడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేకూర్చే వ్యవసాయోపయోగ కార్యక్రమాలలో వారికి శిక్షణను ఇచ్చారు. వీరు చేసిన ఈ కృషి ఫలితంగా ఉత్తర తెలంగాణయే కాకుండా కృష్ణా జిల్లా రైతన్నల పాలిట వరాలై అనావృష్టి పోయి, ఇంటింటా ఆనందాలు వెల్లివిరిసాయి.

శేషాచారిగారు పనిచేసిన జిల్లాలలో వృత్తి ధర్మాలను నిర్వర్తిస్తూనే బృహత్ ప్రణాళికల ద్వారా శాశ్వత నిర్మాణాలక రూపకల్పన చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టు సర్కిల్లో భాగంగా, వ్యవసాయాభివృద్ధికై జలాశయాలపై ఆనకట్టలు నిర్మించడానికి వ్యూహరచనలు జరిగాయి. మొదట ‘కిన్నెరసాని’ ప్రాజెక్టు కోసం అడవి మధ్యభాగాన్ని ఎంచుకున్నారు. ఇది ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద ఉన్నది. ఏ ఆనకట్ట నిర్మాణానికైనా కేవలం ఇంజినీర్లు కాకుండా సహాయ మరియు సాంకేతిక సిబ్బంది అవసరము. నిర్మాణ సమయంలో వీరందరు కుటుంబాలతో ఉండడానికి ప్రాజెక్టు సమీపాన ‘పాల్వంచ’లో అన్ని వసతులతో ఒక కాలనీ నిర్మించారు. వీరి ఆలోచనలకు అప్పటి ప్రభుత్వం సహకారం పూర్తిగా ఉంది. కాలనీవాసులకు తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా(జనరేటర్ ద్వారా) చేయించారు. ఈ కిన్నెరసాని ప్రాజెక్టును ‘పాల్వంచ నుండి యాలం బావి’ వరకు ఏడు వాగులగుండా పది కి.మీ.ల దూరం వరకు రోడ్డు నిర్మించారు. మధ్యలో అడ్డువచ్చే వాగులను కట్టడి చేసి, వంతెనలతో మంచి నాణ్యతగల రోడ్డును వేయించారు. ఈ కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మాణ సమయంలో (10 కి.మీ.ల వరకు వేసిన రోడ్డు) ఆనకట్ట నిర్మాణానికి అవసరమయ్యే బరువైన యంత్రాలు, నిర్మాణపు వస్తువులు సులభంగా చేరవేయుటకు ఈ దారి ఉపయోగపడింది.

‘కిన్నెరసాని’ ప్రాజెక్టు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద మట్టి ఆనకట్టగా పేరుపొందినది. ఈ వంతెన నిర్మాణం ఒక వ్యూహాత్మక ప్రయోజనానికి ఉపయోగపడింది. నిర్ణీత సమయంలో పూర్తిచేసి ‘కిన్నెరసాని’ ప్రాజెక్టు ప్రజల ఉపయోగానికి అందించిన ఘనత ఉత్తలూరు వారిదే.

పాల్వంచ ప్రాంతం అంతా వన్యమృగాలు సంచరిస్తుంటాయి. ఆదివాసులు అభివృద్ధికి నోచుకోక అక్కడే వారు జీవనాన్ని గడిపేవారు. పాలొంచ నుండి రోడ్డు మార్గం ఏర్పడ్డాక ఆ ప్రాంతం అంతా విద్య, వైద్య, ఆరోగ్య అభివృద్ధికి బాటలు పడ్డాయి. వారి వ్యధలు బాసి పురోభివృద్ధికి నోచుకున్నారు. 1960లో అక్కడి నుండే ఆ ప్రాంతాలలో లభించే వస్తువుల ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి, వాటి అభివృద్ధి సాధనకు కృషి చేయడంలో ఉత్తలూరి వారికి సాటి మరొకరు లేరు.

‘ఆస్తుల సంపాదనకన్నా ఆప్తులను సంపాదించుకోవడం మిన్న’ అని నమ్మిన సిద్ధాంత వాది శేషాచారి గారు, మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వీరు ఉన్నత భావాలతో పెరిగారు. వీరికి ముగ్గురు తమ్ములు, ఒక చెల్లి. ఉమ్మడి కుటుంబంలోని ఉన్నత విలువలను ఉగ్గు పాలతోనే నేర్చినవారు ఉత్తలూరి వారు. అన్నదమ్ముల అనుబంధాలు, అక్కాచెల్లెళ్ల ఆత్మీయతలు, బంధుత్వపు బాంధవ్యాలు, సహజీవనంలోని సహాయాలను సంఘరీతి, ధర్మనీతిని తండ్రి నుండి పుణికి పుచ్చుకున్నారు. అందరిలో తానై, అందరికీ తానై కుటుంబ బాధ్యతలను నిర్వర్తించారు. వీరింట డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్తలు ఉన్నతంగా ఎదిగారు. తన కుటుంబానికే కాకుండా తోటివారికి సహకరించే గొప్ప గుణం శేషాచారి గారిది. వీరి సేవ చిరస్మరణీయము అని అంటారు.

శేషాచారి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. హిందుస్థాన్, కర్ణాటక సంగీతం, గాత్ర వాయిద్యాలలో మక్కువ ఎక్కువ. పండిట్ రవిశంకర్ గారు మానసిక గురువు. సితార్ వాయించడంలో నిపుణత తెలిసిన విద్వాంసులు. వారు పనిచేసిన ప్రాంతాలలో సంగీతం ప్రోత్సహించే వారు. ముఖ్యంగా వీరు నిజామాబాద్ ‘ఇందూర్ సంగీత సంస్థ’ను అభివృద్ధి చేశారు. వీరి కుమార్తె కీ॥శే॥ మాలికకు విజయనగరం నుండి ‘వీణ’ను తెప్పించి ఖమ్మం జిల్లాలో అభ్యాసం చేయించారు. అలాగే వాహనాల చిరు మరమ్మత్తులు తానే స్వయంగా చేసుకునేవారు. కిన్నెరసాని ప్రాజెక్టు కొత్తది. అడవి ప్రాంతం. డ్రైవర్ పోస్టు మంజూరైన చాలా కాలం డ్రైవర్ లేని కారణంగా వారి వాహనాన్ని వారే చూసుకునేవారు. ప్రాజెక్టు ప్రాంతాలలో హోటళ్లు లేని కారణంగా తోటి సిబ్బంది, వారి కుటుంబాల సఖ్యత పెంచుటకు, ఉత్సాహం నింపుటకు “క్యాండిల్, మూన్లైట్ డిన్నర్’లు ఏర్పాటు చేసిన ప్రోత్సాహకులు శేషాచారి గారు.

నిజామాబాద్లో కెనాల్ కమాండ్లో విస్తృత పర్యటనలు చేశారు. ఈ పర్యటనలో వ్యవసాయపు నేలలో భూగర్భ జలాలు మరియు లవణీయత పెరగడాన్ని, అలాగే సాగునీరు కాలువ చిట్టచివరి రైతు కమతాలకు (పొలాలకు) చేరకపోవడాన్ని గమనించారు. ఈ సమస్యలను అధిగమించడానికి అప్పటి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ “మిస్టర్ రాబర్ట్ మెన్నామారా” గారి ప్రత్యక్ష సహకారంతో ఒక ప్రణాళిక చేపట్టారు. ఈ ప్రణాళికలో వెలువడిన ఫలితాలు సిఫారసు రూపంలో అప్పటి ఏపీ ప్రభుత్వానికి నివేదికరూపంలో సమర్పించారు. ఈ ఆలోచనలకు ముగ్ధులైన రాబర్ట్ గారు తదుపరి పర్యటనలో ఈ మార్గదర్శకాలు ఇతర కెనాల్ కమాండ్స్ ఉపయోగానికై వీరితో రెండు రోజులు చర్చలు జరిపారు. ఆరోజు వారు వేసిన బాటలే ఈరోజు మార్గదర్శకాలై ఆ పరివాహక ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉంది. ఇదేనేమో “నేడు నాటిన మొక్క రేపటి మహా వృక్షమై ఫలాలు అందిస్తాయనడం”.

నా ప్రాంతమంతా హరితవనం కావాలి. ఒక రైతు పంటకూడా నష్టం కాకూడదని తపించే వారు శేషాచారి గారు. వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చెంది అన్నదాతల కష్టాలు కడతేర్చుటకు కృషి చేశారు. నీటికోసం, వనరుల కోసం కష్టపడకూడదని నీటి నిలువలను పెంపొందించాలని భావించారు. 60సం॥ల క్రితమే ఇంకుడుగుంతల ఆలోచనను చేపట్టారు. బోరు బావులతో, మోట బావులతో సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా నూతన పద్ధతిలో వ్యవసాయ అభివృద్ధికై బాటలు వేశారు. తక్కువ నీటిని ఉపయోగించి, ఎక్కువ పంటను పొందే డ్రిప్ (బిందు సేద్యం మరియు ‘స్ప్రింకిల్ (నీటి జల్లు) విధానాన్ని సాగునీటిలో ప్రవేశపెట్టిన ఆద్యులు వీరే. ప్రభుత్వ ఆమోదంతో దీనిని ప్రయోగాత్మకంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఫామ్స్ ఎంచుకున్నారు. మొదటగా “నిజాం షుగర్ ఫ్యాక్టరీలో – సులేమాన్ ఫామ్ (రుద్రూర్ దగ్గర) ఈ నూతన వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించేందుకు రైతన్నలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అన్నదాతలకు ఈ నూతన పద్దతి ద్వారా నీటి పొదుపుతో వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. ఆ విధానమే ఈనాడు ప్రతి రైతు అవలంబించి, లబ్ధి చేకూరటకు వారి ఆలోచనలే పునాదులు.

మోక్షగుండం గారిని రోల్ మోడల్గా ఎంచుకొన్న వీరు, ఆ బాటలో నడిచి, నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టి, వాటి నిర్మాణం చేయడంలో వీరి ఆలోచనలు సహకరించాయి. ప్రాజెక్టుల నిర్మాణంలో వీరు ప్రధాన సలహాదారులుగా వ్యవహరించారు. ‘కడెం’ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రధాన భూమిక పోషించారు శేషాచారి గారు.
శ్రీరాంసాగర్ (పోచంపాడ్) మేజనరీ డామ్ ఇంజినీర్ గా వ్యవహరించే సమయంలో వీరు పడిన తపన, చేసే దీర్ఘకాలిక, నిర్మాణాత్మక వ్యూహాలు భవిష్యత్తుకు బాటలు వేశాయి. పోచంపాడ్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గడియారంలోని ముల్లులా అహోరాత్రులు శ్రమించి, నాణ్యమైన పనితనంతో నిర్మించారు. ఈ రాతి ఆనకట్టను నిర్ణీత కాలంలో ఆ నీటిని విడుదల చేయడంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. ప్రభుత్వం ఆనకట్ట నిర్మాణానికి కేటాయించిన నిధులలో కోట్ల రూపాయలు మిగిల్చారు. ఆ రొక్కాన్ని ప్రభుత్వ ఖజానాకు జమచేసి తన నిజాయితీని నిలబెట్టుకున్న కార్యదక్షుడు ఉత్తలూరి వారు. నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీచే ప్రశంసలు అందుకున్న మహోన్నత వ్యక్తిత్వం. వీరు నీరు విడుదల ప్రారంభోత్సవానికి ముందురోజే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన ప్రధాని ఆ ఆరంభాన్నే వాయిదా వేయమన్నారు.
పోచంపాడ్ పరీవాహక ప్రాంతమంతా పచ్చదనంతో నిండి, రైతుల కళ్లల్లో వెలుగులు చూడాలని తపన పడ్డారు శేషాచారిగారు, కృషీవలుర కష్టాలు కడదేరి, ఇళ్లల్లో గాదెలు నిండాలని అభిలషించారు. తెలంగాణ ప్రాంతంలో ఏ రైతు కూడా సాగు, త్రాగునీటికై కృంగి పోకూడదని తపించారు. కానీ తానుకన్న కల సాకారమైంది. తాను కళ్లారా చూడకుండానే ఆ నేలలోనే తుదిశ్వాస విడిచారు. అక్కడే తాను నిర్మించిన రామాలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాల చెంత మమేకమై హరిత వనాలను, జలాశయాలను వీక్షిస్తున్నారు.
ఆనాటి వారి ఆలోచనలు, ప్రణాళికలు ఈనాడు తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. వీరి సేవ మన తెలంగాణకే నిర్మాణాత్మకమైన సంపద. రైతుల మనసెరిగిన వ్యక్తిగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి నేటికి (1వ తేదీ జులై 1970) 50 సం||లు పూర్తి అయినది. ఆశయ సాఫల్యం పొంది, ఆనకట్టపై ప్రాణం వదిలిన శేషాచారిగారు అర్థ శతాబ్దంగా పవిత్రాత్మ ఆ ప్రాంతంలోనే నడయాడుతున్నది. వారి ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
వారి నిస్వార్థ, నిజాయితీ, పరోపకారంతో కూడిన సేవకు ఆ భగవంతుడే మెచ్చి, వారి కుటుంబాన్ని సురక్షితంగా చూస్తున్నారు.
“విత్తు ఒకటి పెడితె చెట్టు మరొకటి పుట్టదుగా” అన్నట్లు వీరికి ఒక కూతురు మాలిక (ఫార్మకాలజీ), ఐదుగురు తనయులు. డా॥ రాజా, కిషోర్, విజయ్, అశోక్, డా॥ శ్రీను, వీరు ఎంచుకున్న రంగాలలో ప్రవీణ్యులై తండ్రి బాటన నడుస్తున్నారు.
రైతుకు పాడి, పంటలు సంపదలు. శేషాచారి గారి పెద్ద కుమారుడు ప్రొఫెసర్ డా॥ వి. రాజా వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాలకు రూపకల్పన చేస్తూ రైతులను ప్రగతి బాటన నడిపిస్తున్నారు. ‘స్వీట్ కార్న్’ మరియు ‘బేబీ కార్న్’ వంగడాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలలో ఒకరు రాజాగారు. ప్రైవేటు సంస్థలలో నిర్మాణపు పనుల పర్యవేక్షణ చేశారు కిషోర్, మహరాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బాధ్యతలు నిర్వర్తించారు విజయ్. తెలంగాణ డెయిరీలో జనరల్ మేనేజర్ (క్రికెటర్) వనిచేస్తూ పాడి రైతుల మద్దతు ధర, సంస్థను ప్రైవేటీకరణ ఆపుదల, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారు మరో తనయుడు అశోక్. వైద్య సేవలో జాతీయ స్థాయిలో పేరు పొందారు డా॥ శ్రీను. వీరు రొమ్ము క్యాన్సర్ వ్యాధి నివారణలో అధునాతన సర్జరీ పద్ధతులను కనిపెట్టిన వైద్య శాస్త్రవేత్త.
వీరి కుటుంబంలో ఎక్కువ శాతం ఇంజనీర్స్ కొందరు వైద్యులు. చేసే వృత్తులు ఏవైనా ప్రవృత్తులు మాత్రం తండ్రి బాటన నడిచి, దేశ సేవచేస్తూ జాతిసేవకు అంకితమైన మానవతామూర్తులు.
(శేషాచారి గారి అర్ధ శతాబ్ది వర్ధంతి సందర్భంలో…..)

September 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కాలం vs విషయం

by Ananthaacharaya K.S. September 29, 2026
written by Ananthaacharaya K.S.

మరుగున పడిపోతుంది—
విషయమా?
కాలమా?
కాలం ఎప్పుడూ
ఒక శాశ్వత చలన యంత్రమే!!

విషయం మాత్రం
నాలుక మీద నానే
నువు గింజ లాంటిది!
విషయాన్ని కదిపితే
కాలo కర్రను జళిపిస్తుంది,
పలకరిస్తే చాలు—
పగటి సూర్యుడిని
రాత్రికి మొలిపిస్తుంది!!

కాలం రెక్కల మీద
విషయం సవారీ చేస్తుంది—
నలుగురు కూచున్న అరుగుమీద
మద్దెల మోతలా
మారుమోగుతుంది!!

అరే… చెప్పకముందే
చెవులు నోళ్లకు అప్పగించాయి,
చెంపలు వెక్కిరిస్తున్నాయి,
చేతులు ముడుచుకున్నాయి!!

విషయం కోసమే
ఎదురుచూసి మోసే
పక్కింటి నోళ్లు…
వాటికి నిజం అక్కర్లేదు!
కాలపు వంతెన మీద
నడిచే దారిని
చూడలేని కళ్లవి!!

విషయం శరీరమైతే—
కాలం దాని వయసు!
కాలం మారేకొద్దీ
విషయంపై
నలుపు చారలు పడతాయి;
నిన్నటి నిజం
నేటి నీడగా మారుతుంది!!

కదిలే కాలప్రవాహంలో
విషయం ఒక నావ—
అది ఊగిసలాడే
భావాల రెక్కలపై
దాని తండ్లాట!!

కవిత్వం తీగ మీద
నడిచే కాలానికి
నిద్ర ఉండదు;
విషయానికి
గొంతు పెగలదు!!

కాలం కదలకపోతే
విషయం విచ్చుకోదు;
విచ్చుకోని పువ్వుకు
విజయపు పరిమళం ఉండదు,
జీవితానికి వ్యాఖ్యానం ఉండదు!!

కాలమే విషయానికి ఊపిరి,
విషయమే కాలానికి ముఖచిత్రం!
కాలం నడుస్తూనే ఉంటుంది—
విషయాలు మారుతూ ఉంటాయి;
కానీ…
నిజం మాత్రం
కాలపు పొత్తిళ్ళలో
ఏదో ఒకరోజు
మళ్లీ మొలకెత్తుతుంది!!

September 29, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మౌనానికి ఆవల….

by Modali Padma September 29, 2026
written by Modali Padma

శూన్యం
రెండు గోడల మధ్య శూన్యం
రెండు మనసుల నడుమ దూరం
వేటినీ పూరించలేని ఖాళీతనం
ఖాళీ చేసుకున్నతనం కాదు
ఖాళీ కాబడినతనం
ఒంటరిగా మిగిలినతనం వ్రణంలా సలుపుతూ
దిగులు ఘడియలు మోసుకొచ్చే బరువు
ధారలుగా కంటిచూరు నుంచి

మౌనానికావల ఎందుకో ఏ వ్యక్తీ
సవ్యంగా వ్యక్తం కాడు
అలాగని అస్పష్టంగానూ ఉండడు
మనవే అనిపించే బంధాలు కొనసాగవు
మనవి అనిపిస్తూ మనవి కానివి తెగిపడవు

జీవించిన క్షణాలను వెనుతిరిగి చూస్తూ
జరిగిపోతున్న కాలం
కలకాలం నిలిచిపోతుందేమో అన్నంత
భయపెడుతుంది ఒంటరితనం

ఏదేమైనా రెండు శూన్యాలను దాటుతూ
విరామం లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది జీవితం

దూరం కొన్నింటిని మర్చిపోయాలా చేస్తుంది
కొన్నింటిని భరించేలా చేస్తుంది
నిరాశ ముసురు పట్టినప్పుడల్లా
ఆశల రెక్కలను చుట్టుకుంటూ
ప్రవహించే కాలంతోపాటే
మనసూ కదులుతుంది
తప్పనిసరిగానే అయినా
రేపటిని మరోలా ఊహిస్తూ

ఐనా జీవితం ఎప్పుడూ
కాలం పూరించలేని ఒంటరి వాక్యమే….

మొదలి పద్మ
9248259622

September 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన – ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 29, 2026
written by Narendra Sandineni

డాక్టర్ నలిమెల భాస్కర్ రచించిన “కన్నీరు తడి పంటలు” కవితపై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి, బహుభాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ ఆవార్డ్ గ్రహీత, డాక్టర్ నలిమెల భాస్కర్ కలం నుండి జాలువారిన “కన్నీరు తడి పంటలు” కవితపై విశ్లేషణ.

“కన్నీరు తడి పంటలు” అనే ఆధునిక కవిత హృదయాన్ని తడిపే భావోద్వేగంతో పాటు, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పే అంతర్లీన సందేశాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది.

వ్యవసాయాన్ని, కవిత్వాన్ని రెండు విభిన్న జీవన ప్రక్రియలుగా చూడకుండా, వాటి అంతర్లీన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ, రెండింటిని ఒకే ఉపాధిగా, ఒకే సృజనాత్మక ప్రవాహంగా మలచడం ఈ కవిత ప్రత్యేకత. నేలను దున్నే చేతులే భావాలను దున్ని, అక్షరాల పంటను పండించే సృజనాత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి.

శ్రమజీవుల చెమటలో దాగిన వేదనను, వారి జీవితాల్లో పేరుకుపోయిన కన్నీటి తడిని కవి సున్నితమైన అక్షరాలతో ఆవిష్కరించారు. వారి అంతరంగ ఆవేదనకు, జీవన పోరాటానికి, మానవీయ స్పందనకు ఈ కవిత అక్షర రూపంగా నిలుస్తుంది. అందుకే “కన్నీరు తడి పంటలు” కేవలం ఒక కవితగా కాకుండా, శ్రమజీవుల జీవితాలను ప్రతిబింబించే సామాజిక దర్పణంగా పాఠకుల హృదయాలను తాకుతుంది.

ఈ కవితలోని పంక్తులు సహనశీలతకు, మానవీయ వేదనకు ప్రతీకలుగా నిలుస్తాయి. కవిత్వం కేవలం పదాల కూర్పు కాదు ; అది సమాజపు లోతుల్లోంచి, ముఖ్యంగా శ్రమజీవుల కన్నీటి చుక్కల్లోంచి పుట్టే సజీవ స్వరూపం. కవి దృష్టిలో కన్నీరు బలహీనతకు చిహ్నం కాదు ; అది సృజనకు మూలం. అది హృదయంలోని స్పందనకు ప్రతిరూపం. అది అక్షరాలకు జీవం పోసే ఆర్ద్రత.

వ్యవసాయంలో విత్తనం మొలకెత్తి పంటచేనుగా ఎదగడానికి నేల, నీరు, గాలి, వెలుతురు వంటి సహజ మూలకాలు అవసరం. అదేవిధంగా, నిజమైన కవిత్వం పుట్టి సమాజంలో చైతన్యాన్ని నింపడానికి అనుభూతి, ఆవేదన, స్పందన,మానవీయత వంటి అంతరంగ మూలకాలు అవసరం. ఈ రెండు ప్రక్రియల మధ్య ఉన్న అంతర్లీన సారూప్యాన్ని కవి అద్భుతమైన ప్రతీకల ద్వారా ఆవిష్కరించారు.

శీర్షికలోని అంతరార్థం:

“కన్నీరు తడి పంటలు” అనే శీర్షికే కవితకు ప్రధాన భావసూచకంగా నిలుస్తుంది. సాధారణంగా కన్నీరు దుఃఖానికి, ఆవేదనకు, అనుభూతికి ప్రతీక. పంట మాత్రం నేలతో, విత్తనంతో, నీటితో, రైతు  చెమటతో పెనవేసుకున్న జీవన ప్రతీకగా నిలుస్తుంది. ఈ రెండింటిని కలిపి “కన్నీరు తడిపంటలు” అనే ప్రతీకను కవి ప్రతిపాదించడం ద్వారా, మానవ అనుభవాల తడి నుంచి మొలకెత్తే సృజనకు ఒక సార్థకమైన రూపకాన్ని నిర్మించారు.

ఇక్కడ “కన్నీరు” కేవలం దుఃఖాన్ని వ్యక్తం చేసే ద్రవబిందువు కాదు ; అది జీవనాన్ని మొలకెత్తించే సృజనాత్మక తడి, రైతు చెమటతో. కన్నీటితో తడిసిన నేలలో పంట మొలకెత్తినట్లే, కవి హృదయంలోని ఆవేదన, అనుభూతి, మానవీయ స్పందనల లోతుల నుంచి కవిత్వం అంకురిస్తుంది. బాధను అనుభూతిగా, అనుభూతిని ఆలోచనగా, ఆలోచనను అక్షరంగా మలిచే అంతరంగ ప్రక్రియలో కన్నీరు ఒక సృజనాత్మక శక్తిగా పరిణమిస్తుంది. అందువల్ల ఇక్కడ కన్నీరు సృజనకు ప్రతిబంధకం కాదు ; సృజనకు జీవధార. కవిత్వానికి ప్రాణాధారం.

వ్యవసాయం – కవిత్వం: ఒక సృజనాత్మక సమన్వయం

“మట్టి, నీరు, విత్తనం” అనే వ్యవసాయ ప్రతీకలను “కాగితం, పెన్ను, కన్నీరు” అనే సాహిత్య ప్రతీకలతో

అనుసంధానించడం ఈ కవితలోని ప్రత్యేకత. వ్యవసాయంలో విత్తనం నేలలో పడినప్పుడు, నీటి తడితో, రైతు శ్రమతో అది మొలకెత్తి పంటగా మారుతుంది. అదేవిధంగా, కవి హృదయంలో పడిన అనుభూతి విత్తనం, కన్నీటి తడితో అక్షరాల రూపంలో మొలకెత్తి కవిత్వంగా వికసిస్తుంది.

ఈ ప్రతీకల సమన్వయంతో కవి కవిత్వాన్ని ఒక జీవన ప్రక్రియగా దర్శించారు.

రైతు నేలను దున్ని , విత్తనం వేసి, తన శ్రమతో పంటను పండిస్తాడు. రైతు శ్రమించి పండించిన పంట సమాజానికి ఆహారాన్ని అందించడమే కాకుండా, సమాజ అవసరాలకు కావలసిన ధాన్యాన్ని కూడా సమకూరుస్తుంది. అదే విధంగా  కవి తన అనుభవాలను హృదయంలో దాచుకుని, వాటిని అక్షరాలుగా మలుస్తాడు. కవి కలం నుండి జాలువారిన కవిత్వం సమాజానికి చైతన్యాన్ని అందిస్తుంది.

ఈ విధంగా వ్యవసాయం, కవిత్వం రెండూ మానవ జీవన వికాసానికి దోహదపడే సృజనాత్మక ప్రక్రియలుగా కవి ప్రతిపాదించారు.                                                                                  ”కన్నీటి తడిలో మొలకెత్తే కవిత్వం” అనే భావనలో మనిషి అనుభవించే బాధ, స్పందన, ఆవేదన, అనుభూతి – ఇవన్నీ కవి హృదయంలో పడిన విత్తనాలుగా మారుతాయి. ఆ విత్తనాలకు కన్నీటి తడి తోడైనప్పుడు అవి కవిత్వంగా మొలకెత్తుతాయి. ఈ కవిత్వం కేవలం వ్యక్తిగత భావోద్వేగాల వ్యక్తీకరణగా మాత్రమే మిగిలిపోదు ; అది సమాజపు వేదనను తనలో ఇముడ్చుకుని, సామూహిక చైతన్యానికి ప్రతినిధిగా నిలుస్తుంది.

శ్రమజీవుల కన్నీళ్లను కవి కేవలం చూసి ఆగిపోలేదు ; వాటిలోని జీవన సత్యాన్ని అనుభూతి చెందారు. ఆ అనుభూతి అక్షరాలుగా మారి, కవిత్వంగా రూపుదిద్దుకుంది. అందుకే ఈ కవితలో కన్నీరు ఒక సజీవ ప్రతీకగా నిలుస్తుంది. అది బాధను మాత్రమే కాకుండా, ఆ బాధ నుంచి పుట్టే ఆశను, సృజనను, జీవన వికాసాన్ని కూడా సూచిస్తుంది.

“కన్నీరు తడి పంటలు” అనే కవితలో వ్యవసాయం, కవిత్వం, మానవీయత – ఈ మూడు పరస్పర సంబంధిత జీవన సత్యాలుగా దర్శనమిస్తాయి. రైతు పండించే పంటకు నేల, నీరు, విత్తనం ఎంత అవసరమో, కవిత్వానికి అనుభూతి, ఆవేదన, స్పందన అంతే అవసరం. కన్నీటి తడితో మొలకెత్తిన కవిత్వమే సమాజపు గుండెల్లో చైతన్యాన్ని నింపగలదని కవి ఈ కవిత ద్వారా చాటిచెప్పారు.

ఈ కవితలోని అంతరార్థం ఒక్కటే – కవిత్వం జీవితానికి దూరంగా నిలిచే అలంకారం కాదు ; జీవితం నుంచి, ముఖ్యంగా శ్రమజీవుల కన్నీటి తడి నుంచి మొలకెత్తే సజీవ పంట.

“కవిత్వం – వ్యవసాయం: ఒకే నాణానికి బొమ్మా బొరుసులా”

“గుప్పెడు మట్టి/చారెడు నీళ్లు/ఓ గట్టి విత్తనం/చాలు/నేను కవిత్వమై మొలకెత్తడానికి”                      ఈ పంక్తుల్లో కవి వ్యవసాయ ప్రక్రియను కవిత్వ సృజనకు ప్రతీకగా మలిచిన సృజనాత్మకత          ప్రస్ఫుటమవుతుంది. మట్టిలో పడిన విత్తనం నీటి తడిని అందుకుని మొలకెత్తి, క్రమంగా ఎదుగుతుంది. అదేవిధంగా, జీవితమనే నేలలో పడిన భావబీజం, మానవీయ స్పందన అనే తడిని అందుకున్నప్పుడు కవిత్వంగా మొలకెత్తుతుందనే అంతరార్థాన్ని కవి ఈ పంక్తుల ద్వారా ఆవిష్కరించారు.

“గుప్పెడు మట్టి” కేవలం వ్యవసాయ భూమిని సూచించే పదబంధం కాదు. అది కవి జీవించే సామాజిక వాస్తవికతకు, అతని అనుభవ ప్రపంచానికి ప్రతీకగా నిలుస్తుంది. మనిషి పుట్టి పెరిగిన నేల, అతని చుట్టూ పరివ్యాప్తమైన సామాజిక జీవితం, అతను ఎదుర్కొనే అనుభవాలు – ఇవన్నీ ఈ మట్టి ప్రతీకలో అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. కాబట్టి, కవిత్వానికి తొలి ఆధారం జీవితమేనని కవి     సూచించినట్లుగా భావించవచ్చు.

“చారెడు నీళ్లు” జీవాన్ని మేల్కొలిపే తడికి ప్రతీక. వ్యవసాయంలో నీరు విత్తనానికి జీవశక్తిని అందించినట్లే, హృదయం నుంచి పొంగిపొరలే కవిత్వంలో మానవీయ స్పందన, అనుభూతి, సున్నితమైన భావోద్వేగాలు, సృజనాబీజానికి జీవం పోస్తాయి. కవి హృదయంలో ఈ స్పందన లేకపోతే, ఒక అనుభవం కేవలం ఒక సంఘటనగానే మిగిలిపోతుంది. కవి అంతరంగంలో అది కవిత్వంగా పరిణమించదు.

ఓ గట్టి విత్తనం

“ఓ గట్టి విత్తనం” కవి అంతరంగంలో నిక్షిప్తమైన సృజనాబీజానికి ప్రతీక.  ఒక అనుభవం కావచ్చు, ఒక సంఘటన కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒక ఆవేదన కావచ్చు – ఏదైనా కవి మనసులో బలమైన భావబీజంగా నాటుకున్నప్పుడు, అది కవిత్వానికి ఆరంభ బిందువవుతుంది. ఆ  భావబీజాన్ని అక్షర రూపంలోకి తీసుకురావడమే కవి సృజనాత్మక ప్రక్రియ.

ఇక్కడ “విత్తనం” అనే ప్రతీకకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. విత్తనం పరిమాణంలో చిన్నదైనా, దానిలో  మహా వృక్షంగా పరిణమించే అంతర్లీన శక్తి ఉంటుంది. అదేవిధంగా, ఒక చిన్న అనుభూతి, ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఆలోచన కూడా కవి అంతరంగంలో ప్రవేశించినప్పుడు, అది విస్తృతమైన కవితా ప్రపంచంగా పరిణమించగలదు. ఈ పరిణామశీలతే కవిత్వ సృజనలోని అంతర్గత శక్తిని సూచిస్తుంది.

“చాలు” అనే ఒక్క పదం ఈ మొత్తం ప్రతీకాత్మక నిర్మాణానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. గొప్ప కవిత్వం పుట్టడానికి ఆర్భాటమైన వనరులు, విస్తారమైన భౌతిక సౌకర్యాలు అవసరంలేదని కవి సూచిస్తున్నారు. జీవితం నుంచి వచ్చిన ఒక అనుభవం, దానికి స్పందించే హృదయం, దానిని కవిత్వంగా మలిచే సృజన శక్తి ఉంటే చాలని ఈ పదం సూచిస్తుంది. పదాల పొదుపులో భావవిస్తృతిని సాధించడం ఈ ప్రయోగంలోని ప్రత్యేకత.

“నేను కవిత్వమై మొలకెత్తడానికి” అనే పంక్తి కవికి, కవిత్వానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అత్యంత సున్నితంగా వ్యక్తీకరిస్తుంది. కవి కవిత్వాన్ని సృష్టిస్తున్నాడనే సాధారణ భావనకు భిన్నంగా, “తానే కవిత్వమై మొలకెత్తడం” అనే భావనను కవి ప్రతిపాదించారు. అంటే, కవిత్వం తనకు వెలుపల ఉన్న ఒక వస్తువు కాదు ; తన అంతరంగంలోనే పురుడు పోసుకుని,  తన అనుభవాల నుంచి జీవం పొంది, తానే మొలకెత్తుతుందని కవి భావన.

ఈక్రమంలో “మట్టి – నీరు – విత్తవం” అనే వ్యవసాయంలోని మూడు ప్రాథమిక అంశాలు, కవిత్వ సృజనకు అవసరమైన జీవితం –  మానవీయ స్పందన  – సృజనాబీజంగా రూపాంతరం చెందుతాయి. వ్యవసాయంలో రైతు విత్తనాన్ని నేలలో నాటితే, అది ప్రకృతి సహకారంతో  పంటగా రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా కవి తన చుట్టూ ఉన్న సామాజిక జీవితాన్ని గమనించి, అందులోని అనుభూతులను స్వీకరించి, మానవీయ స్పందనతో వాటికి జీవం పోసి. అక్షరాల రూపంలో కవిత్వమనే పంటను పండిస్తాడు.

అందువల్ల ఈ పంక్తుల్లో వ్యవసాయం కేవలం ఒక జీవన వృత్తిగా కాకుండా, కవిత్వ సృజనకు ఒక శక్తివంతమైన రూపకంగా మారింది. భూమిలో పంటకు పునాది పడినట్లే, కవి హృదయంలోని భావాలు అక్షర రూపాన్ని సంతరించుకుని కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. వ్యవసాయంలో విత్తనం పంటగా పరిణమిస్తే, కవి అంతరంగంలోని భావబీజం సాహిత్య సృజనగా వికసిస్తుంది.  ఈ విధంగా వ్యవసాయ ప్రపంచాన్ని కవితా సృజనతో అనుసంధానించి, కవిత్వానికి జీవితంతో ఉన్న విడదీయరాని సంబంధాన్ని కవి సున్నితమైన ప్రతీకాత్మకమైన శైలిలో ఆవిష్కరించారు.

సజల నేత్రం – కన్నీరు తడి

“ఇంచుక కాగితమ్ముక్క/వేలెడు పెన్ను/ఒక్క సజల నేత్రం/సరిపోతుంది/నేను పంటచేనై తల ఎత్తడానికి/

ఈ కవితలోని పంక్తులు అత్యంత కీలకమైనవి.”సజల నేత్రం”అంటే ఆర్ద్రతతో, కరుణతో ఎదుటివారి బాధను చూసి చలించే కన్ను, సమాజంలోని పేదరికాన్ని, రైతుల కష్టాలను, ఆకలి వేదనలను చూసి    ఏ కన్నైతే కన్నీటితో తడుస్తుందో, ఆ కన్నీటి తడి నుంచే నిజమైన కవిత్వం పుడుతుందని కవి భావించారు. అందుకే “కన్నీరు తడి పంటలు” అనే శీర్షికలోనే కవితా సృజనకు కన్నీటిని జీవజలంగా ప్రతిష్టించారు.

“నేను పంటచేనై తల ఎత్తడానికి”

అనే పంక్తిలో కవి తపన అంతా నిక్షిప్తమై ఉంది. కవి రాసిన అక్షరం చివరకు సమాజానికి మేలు చేసే పచ్చని పంట చేనుగా మారాలని కవి ఆకాంక్ష. పంటచేను పదుగురి ఆకలిని తీర్చినట్లే, కవి రచించిన కవిత్వం కూడా సమాజంలో చైతన్యాన్ని నింపి, అణగారిన వర్గాల పట్ల స్పందనను కలిగించాలనే ఆశావహ దృక్పథం ఇందులో వ్యక్తమవుతుంది.         “ఒక్క సజల నేత్రం” అనే ప్రయోగం కవితలో అత్యంత హృద్యమైన ప్రతీక. కన్నీటిలో దుఃఖం మాత్రమే కాదు ; అనుభూతి, ఆవేదన, కరుణ, మానవత్వం కూడా అంతర్లీనంగా ఉంటాయి. హృదయపు లోతుల్లో నుంచి ఉద్భవించే  ఆ  అనుభూతి కవితకు జీవం పోస్తుంది.అందుకే కవి కన్నీటిని కవిత్వానికి జీవజలంగా చిత్రించారు.

ఇక్కడ “సజల నేత్రం” నీటికి ప్రతీకగా కనిపిస్తుంది. కాగితంపై కలంతో రాసే అక్షరాలు విత్తనాల్లా మారి, కన్నీటి తడితో జీవాన్ని పొందుతాయి. ఈ విధంగా వ్యవసాయ ప్రక్రియను కవితా సృజనతో కవి అనుసంధానించారు.

ఈ పంక్తుల్లో కవిత్వం వ్యక్తిగత భావోద్వేగం నుంచి సామాజిక అనుభూతిగా పరిణమించే అద్భుతమైన క్రమం దర్శనమిస్తుంది. ఒక్క కన్నీటి బిందువులో మొలకెత్తిన భావం, కాగితంపై అక్షరాల రూపాన్ని సంతరించుకుని, చివరికి పంటచేనంత విస్తారమైన కవితా ప్రపంచంగా వికసిస్తుంది. ఒక వ్యక్తి అంతరంగంలో పుట్టిన భావం, అక్షరాల ద్వారా సామూహిక అనుభూతిగా రూపాంతరం చెందే కవితా ప్రక్రియను కవి ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు.

ఈ కవితలో వ్యవసాయ జీవన  ప్రపంచం, కవితా సృజన ప్రపంచం ఒకదానికొకటి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. మట్టి కాగితంగా, నీరు  కన్నీరుగా, విత్తనం భావంగా, విత్తేసాధనం కలంగా, పంట కవిత్వంగా, పంటచేను విస్తరించిన సాహిత్య సృజనగా రూపాంతరం చెందుతాయి. ఈ ప్రతీకల పరస్పర అనుసంధానం కవితకు అంతర్లీనమైన  భావసౌందర్యాన్ని ప్రసాదిస్తుంది.                                                                                                                                                                                                                                                                                                                                 “మొలకెత్తడానికి”,  “తల ఎత్తడానికి” వంటి పదప్రయోగాలు ఈ రూపక సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. విత్తనం నేలలో పాతుకుని మొలకెత్తినట్లే, కవి హృదయంలో నాటుకున్న భావం  అక్షరరూపంలో మొలకెత్తుతుంది. ఆ మొలక క్రమంగా ఎదిగి పంటగా విస్తరించినట్లే, ఒక చిన్న        

భావబీజం కూడా కవిత్వంగా వికసించి.విస్తృతమైన సాహిత్య అనుభూతిని ప్రసాదిస్తుంది.   ఒక చోట విత్తనం మొలకెత్తడం, మరోచోట అదే మొక్క పంటచేనుగా విస్తరించి తలెత్తడం – కవితా సృజన నుంచి కవితా వికాసం వరకు సాగే  సహజమైన పరిణామక్రమానికి ప్రతీకగా నిలుస్తుంది.

ఈ రూపకంలో భావబీజం నుంచి కవిత్వ పంట వరకు సాగిన సృజనాత్మక ప్రయాణం ఎంతో సహజంగా, సుందరంగా ఆవిష్కృతమవుతుంది. వ్యవసాయ క్షేత్రంలో పంటను పండించే రైతు శ్రమకు, హృదయ క్షేత్రంలో కవితను పండించే కవి సృజనాత్మక తపనకు మధ్య ఉన్న అంతరంగ సంబంధాన్ని ఈ ప్రతీకలు స్పష్టం చేస్తాయి.

అలాగే,”గుప్పెడు, చారెడు, ఇంచుక, వేలెడు, ఒక్క” వంటి పరిమాణసూచక పదాలు కవిత్వానికి కావలసిన వనరులు ఎంత స్వల్పమైనవో, ఆ స్వల్పమైన వనరుల నుంచి పుట్టే సృజన మాత్రం ఎంత విస్తృతమైనదో సూచిస్తున్నాయి, “గుప్పెడు మట్టి, చారెడు నీళ్లు, చిన్న విత్తనం” పంటగా విస్తరించినట్లే, ఇంచుక కాగితం, వేలెడు పెన్ను, ఒక్క సజల నేత్రం” నుంచి విశాలమైన కవితా ప్రపంచం ఆవిర్భవిస్తుంది.

మొదటి భాగంలో “మట్టి – నీరు – విత్తనం” అనే వ్యవసాయ ప్రపంచం ఆవిష్కృతమవుతే, రెండో భాగంలో “కాగితం – పెన్ను – కన్నీరు” అనే కవితా ప్రపంచం రూపుదిద్దుకుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఉన్న అంతర్లీన సంబంధమే కవితకు నిర్మాణ సౌందర్యాన్ని, భావ గాంభీర్యాన్ని అందించింది.

“ఇంచుక కాగితమ్ముక్క” విశాలమైన భావ ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న కాగితం ముక్క చాలు అని సూచిస్తుంది. ఇక్కడ కాగితం కేవలం రాసే వస్తువు కాదు ; కవి అంతరంగాన్ని ఆవిష్కరించే కవితా క్షేత్రంగా దర్శనమిస్తుంది.

“వేలెడు పెన్ను” ద్వారా ఆ  ఇంచుక కాగితమ్ముక్క అనే కవితా క్షేత్రంలో భావాలను విత్తే సాధనంగా   పెన్ను ప్రతీకాత్మకంగా నిలుస్తుంది. పెన్ను కేవలం రాయడానికి ఉపయోగించే సాధనం మాత్రమే కాదు ; అంతరంగంలో నిక్షిప్తమైన భావాలను అక్షరాలుగా మలిచే సృజనకు సాధనంగా నిలుస్తుంది.

అయితే, వీటన్నింటి కంటే ముఖ్యమైనది “ఒక్క సజల నేత్రం.” అది కేవలం కన్నీటితో నిండిన కన్ను మాత్రమే కాదు ; అనుభవాలతో తడిసిన హృదయం, ఇతరుల బాధను తనదిగా భావించే కరుణ, జీవితాన్ని లోతుగా దర్శించే స్పందన, మానవ అనుభవాల పట్ల సున్నితత్వం – ఇవన్నీ ఈ ఒక్క ప్రతీకలో ఇమిడి ఉన్నాయి.   కవి వద్ద రాయడానికి కాగితం, పెన్ను ఉన్నప్పటికీ, కవి హృదయంలో స్పందన, అనుభూతి లేకపోతే  కవిత్వం పుట్టదు. అందుకే కవి  “సజల నేత్రం” ను కవిత్వానికి జీవజలంగా ప్రతిష్టించారు. ఇక్కడ కన్నీరు బలహీనతకు చిహ్నం కాదు ; మానవీయ స్పందనకు, అనుభూతికి, సృజనకు మూలమైన జీవజలం.

“నేను పంటచేనై తల ఎత్తడావికి”

అనే పంక్తిలో కవిత ఒక సంపూర్ణ రూపకంగా పరిణమిస్తుంది. కవి భావనలో మొదట కవిత్వం ఒక     భావబీజంగా మొలకెత్తుతుంది. అనంతరం అది అక్షరాలుగా రూపుదిద్దుకుని, చివరకు పంటచేనుగా తల ఎత్తుతుంది. అంటే, కవి హృదయంలోంచి వెలువడే ఒక చిన్న అనుభూతి నుంచి పుట్టిన కవిత, పాఠకుల హృదయాల్లో విస్తరించి సామూహిక అనుభూతిగా మారుతుంది. ఇదే ఈ కవితా శిల్పంలోని ప్రత్యేకత.ఇదే ఈ కవితకు ప్రాణం పోసింది.                                         వ్యవసాయ జీవనాన్ని కవితా సృజనకు రూపకంగా మలిచిన తీరు విశేషంగా ఉంది. ఈ కవితలో మట్టి కాగితంగా, విత్తనం భావంగా, పెన్ను విత్తే సాధనంగా, నీరు కన్నీరుగా, పంట కవిత్వంగా రూపాంతరం చెందడం ద్వారా కవి రెండు భిన్నమైన ప్రపంచాలను ఒకే భావసూత్రంతో అనుసంధానించారు.                                                                                   ఈ ప్రతీకల పరంపర కవితకు అంతర్లీనమైన నిర్మాణ సౌందర్యాన్ని అందించింది.  అలాగే “గుప్పెడు, చారెడు, ఇంచుక, వేలెడు వంటి పరిమాణసూచక పదాల ద్వారా కవి ఆసక్తికరమైన విరుద్ధతను సృష్టించారు. కవిత్వానికి అవసరమైన వనరులు చాలా స్వల్పమైనవే అయినప్పటికీ,  వాటి నుంచి పుట్టే సృజన మాత్రం అపారమైనదిగా ఆవిష్కృతమవుతుంది.

ఈ కవితలో కవి కన్నీటిని బలహీనతకు చిహ్నంగా కాకుండా, సృజనకు జీవజలంగా మలిచారు.    “మట్టి – నీరు – విత్తనం” అనే వ్యవసాయ ప్రపంచాన్ని, “కాగితం – పెన్ను – కన్నీరు” అనే కవితా ప్రపంచంతో అనుసంధానించి, అనుభూతి ఉన్నచోట కవిత్వం మొలకెత్తుతుందని, ఆ కవిత్వం చివరికి పంటలా విస్తరిస్తుందని సున్నితమైన ప్రతీకల ద్వారా ఆవిష్కరించారు.   “కన్నీరు తడి పంటలు” పరిమాణంలో చిన్నదైన కవిత. అయితే దాని అంతరార్థం మాత్రం అనంతమైన

భావప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. శీర్షికలోని “కన్నీరు”, “తడి”, “పంటలు” అనే పదాలే కవితా తాత్త్వికతకు ప్రతీకలుగా నిలుస్తాయి. కవి కన్నీటిని బలహీనతకు ప్రతీకగా చూడలేదు ;  సృజనకు జీవజలంగా దర్శించారు. మట్టిని కేవలం నేలగా  కాకుండా జీవన క్షేత్రంగా, విత్తనాన్ని  కేవలం పంటకు మూలంగా కాకుండా కవితా భావానికిబీజంగా, కాగితాన్ని కేవలం అక్షరాలకు ఆధారంగా కాకుండా  అంతరంగాన్ని ఆవిష్కరించే విశాల క్షేత్రంగా భావించారు.

జీవితాన్ని లోతుగా అనుభవించిన హృదయంలోంచి జారిన కన్నీటి బిందువు  కేవలం కన్నీరుగా మిగిలిపోదు ; అది అక్షరమై, భావమై, కవిత్వమై  రూపాంతరం చెందుతుంది. ఆ అక్షరాలకు కవి తన అనుభవాల సారాన్ని జోడించినప్పుడు, అవి క్రమంగా కవితా పంటగా రూపుదిద్దుకుంటాయి. ఆ పంట కాగితపు పొలాన్ని దాటి పాఠకుల హృదయాల్లోకి ప్రవేశించి, అక్కడ స్పందనల మొలకలకు బీజం వేస్తుంది.                                                                             ఈ దృక్కోణంలో  “కన్నీరు తడి పంటలు” అనే శీర్షిక కేవలం కవితకు పెట్టిన పేరు కాదు.

కవిత యొక్క అంతరాత్మను ప్రతిబింబించే  తాత్త్విక ప్రతీక. కన్నీటి తడిలో మొలకెత్తిన కవిత్వం,

అనుభవాల నేలలో వేళ్లూనుకుని విస్తరించి, సామాజిక పంటగా వికసించాలనే కవి ఆకాంక్షను ఈ శీర్షిక అత్యంత సమగ్రంగా ప్రతిఫలిస్తుంది. కవి భాస్కర్ గారి ఈ వచన కవిత సరళమైన పదాలతో నిర్మితమైనప్పటికీ, దాని భావపరిధి మాత్రం

అత్యంత విశాలమైనది. శ్రమజీవుల స్వేదాన్ని, వారి జీవితాల్లోని కన్నీటి తడిని అక్షరాల్లో ఒడిసిపట్టి,  కవిత్వాన్ని కేవలం ఒక కళారూపంగా కాకుండా, సమాజం మనుగడకు ఆధారమైన వ్యవసాయంతో పోల్చడం కవి భాస్కర్ గారి విశిష్టమైన ఆలోచనా వైశిష్ట్యానికి నిదర్శనం.

వ్యవసాయంలో విత్తనం నేలలో పడి మొలకెత్తి, మొక్కగా ఎదిగి  పంటగా సిరులు  కురిపిస్తుంది. అలాగే  కవి హృదయంలో పడిన అనుభవపు విత్తనం, కన్నీటి తడితో సృజనాత్మకతను సంతరించుకుని, కవితకు బీజమవుతుంది. ఆ కవిత పాఠకుని హృదయాన్ని తాకినప్పుడు, అది మరొక అనుభూతికి విత్తనమవుతుంది
 ఈ కవితలో అంతర్లీన భావపరంపరను కవి అత్యంత సహజమైన ప్రతీకల ద్వారా ఆవిష్కరించారు.

ఈ కవితకు ఒక చక్కని తాత్త్విక నిర్వచనాన్ని అందించే భావప్రపంచం నిజంగా అభినందనీయం. “కన్నీరు తడి పంటలు” అనే హృద్యమైన కవితను సాహితీ లోకానికి అందించిన కవి భాస్కర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి కలం నుంచి ఇలాగే మరెన్నో  భావసుగంధభరితమైన కవితా సుమాలు వికసించి, తెలుగు సాహితీ వనాన్ని పరిమళింపజేయాలని మనసారా కోరుకుంటున్నాను.

September 29, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఒక ధ్యాన విహంగమే- ‘మంచు మైదానం’

by వకుళవాసు September 28, 2026
written by వకుళవాసు

నిలువెత్తు నయాగరా కవి-విద్యార్థి గారి మంచు మైదానం” పై సమీక్ష

అంత గొప్ప మనిషి నన్ను వారి “మంచు మైదానం”పై సమీక్ష రాయమన్నారు. నేను ఒకంత సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యాను. నేను తను మెచ్చే రీతిలో రాయగలనా…. ఏమో? ఇది నాకు పరీక్షే! అయినా ప్రయత్నిస్తాను అనుకున్నాను.
ఎంత ఎదిగిన ఒదిగి ఉండే కొందరు మహానుభావులు నిగర్వులై ,నిరాడంబరులై ఉంటారు. ఆ కోవకు చెందినవారే “శ్రీ వేలూరి రాములు “గారు “విద్యార్థి” కలం పేరుతో సుపరిచితులై నిత్య నూతన విద్యార్థిగా సార్ధక నామధేయులుగా పేరుగాంచిన ఓరుగల్లు సాహిత్య కళామతల్లి ముద్దుబిడ్డ “విఆర్ విద్యార్థి గారు”.

ఈ కవి గారి మాటల్లోనే చెప్పాలంటే పరిచిత ప్రపంచాన్ని ఒక అపరిచిత లోకంలోకి పరివర్తన చెందించి శాంతిని ప్రేమించే ఒక ఖండాంతర కవి… భరతమాత ముద్దుబిడ్డగా సైనికుడిగా కారణజన్మనెత్తి రెండుసార్లు ప్రత్యక్షయుద్ధంలో పాల్గొని తన ఋణం తీర్చుకున్నారు. కానీ తన మనసంతా యుద్ధమేలేని ప్రపంచాన్ని కాంక్షించుతూ
“విశ్వమానవ సంక్షేమం -వినాశ బుద్ధి సంహరణం” కావాలనేదే ఈ కవి ఆకాంక్ష.
అందుకే విద్యార్థిగారిలో ప్రకృతి ప్రేమికుడు విశ్వకవి “రవీంద్రుడు” కనిపిస్తాడు. తన అపరిచిత ప్రపంచంలోకి భావుకుడై మనుషుల మనసులను కలియతిప్పిస్తాడు. వారిలో జీవిత తత్వాన్ని మేల్కొల్పి భావ స్రవంతిలో అలౌకిక అనుభూతులను నింపి ప్రకృతి ఒడిలో సేదతీరేలా చేసే పరిశుద్ధకవి విద్యార్థి గారు.

విద్యార్థి గారు 15 సంవత్సరాలు సైనికునిగా పనిచేసి, స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత 23 సంవత్సరాలు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (నిట్) ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్స్ లో నేషనల్ ఫిజికల్ లాబరేటరీ వారి పరిశోధన ప్రాజెక్టులో పనిచేశారు. అందుకే సైన్సును సాహిత్యంతో ముడిపెట్టి ఎన్ని అద్భుతమైన కవితలల్లారో ఈ “మంచు మైదానం”లో…..

“నాసా” శీర్షికన రాసిన కవితలో నాసా ను వర్ణించిన తీరు అత్యద్భుతం…

"నువ్వు అనంత విశ్వానికి
ముఖద్వారానివి
మానవ యశస్సువి
నవ నవోన్మేష మేధస్సువి"
అంటూ ప్రారంభించి కవిత కొనసాగిన తీరు మనల్ని నాసాకు తీసుకువెళ్తుంది…

"జులై పదహారు నాడే
నీ దర్శన భాగ్యం
నీతో
కరచాలనభవ్యం
అద్భుతం ఈ క్షణం
అనూహ్యం ఈఅనుభవం"....

అంటూ తాము నాసాను పలకరించిన రోజును గుర్తు చేసుకుంటూ ఎంతో అనుభూతికి లోనవుతూనే….

"ఓహో! నాసా! ఈ నీ అంగుళిలో పొదిగిన చంద్రశిలను తాకబోతూ చకితుణ్ణయ్యాను ఆశ్చర్యం!"

అంటూ తన కలలో చంద్రమండలంపై వాలినప్పుడు దర్శించిన చంద్రశిలా శకలాలు, జాడలు, దారులు, వెలుగులు ,నీడలన్నీ దృశ్య వాహినియై కళ్ళ ముందు కదులుతున్నాయంటూ అక్కడ నిల్చొని మహావిశ్వపు దూరకోణాలను కనుగొన్నారు ఆనాడు….
అంతేనా నాసా ముందు కరిగిపోయే దూరాల గురించి అనంత లోకాలు నాసా వాకిట ప్రతీక్షిస్తూ సుదూరలోకవాసుల్ని కలుసుకోవడం అసాధ్యమేమీ కాదని ….ఒకరి మంచి చెడ్డలు మరొకరు తెలుసుకునే రోజుకు దూరమేమీ లేదని ఆనందపడతారు.

చివరలో కవి గారు ఇచ్చిన ముగింపు అతని ఔన్నత్యానికి ప్రతీక తన కావ్యమెప్పుడూ ఆశించేది “విశ్వ మానవ సంక్షేమం- వినాశ బుద్ధి సంహరణం” అంటూ ముగిస్తారు. ఇంతకన్నా ఇంకా వేరే ఉదాహరణ అవసరం లేదనుకుంటా విద్యార్థి గారు విశ్వమానవ సంక్షేమాన్ని కాంక్షించే “విశ్వకవి” అని చెప్పడానికి…

“జియాన్ కేనియన్”కవితలో అమెరికాలోని “ఉటా(Utah)” రాష్ట్రంలో ఉన్న “జియాన్ నేషనల్ పార్క్” లోని ఎర్రటి రాళ్లు డీప్ కెన్యాలు(Deep conyons), మరియు హైకింగ్ మార్గాలకు ప్రసిద్ధి చెందిన ముఖ్యంగా ది నారోస్ (The Norrows) మరియు ఏంజెల్స్ లాండింగ్ ( Angels Landing) వంటి మార్గాలకు ప్రత్యేకత కలిగిన ప్రసిద్ధి చెందిన ఈ పార్కు గురించి వర్ణించిన తీరు ఓ వినూత్న అనుభవంలోకి మనల్ని తీసుకెళ్తుంది.

"ఎడారిలో ఒక ఉదయం
రోడ్డున బడిపోతున్నాం
కొండ దిగువన
సైనిక స్థావరం
లేస్తున్నాయి గాండ్రిస్తూ
యుద్ధ విమానాల పెద్దపులులు
దిక్కులను బెదిరిస్తూ"....

అంటూ మొదలైన ఎత్తుగడతో కాక్టస్ పూలు కవి గారి వైపు చూసి కాంప్లిమెంట్ గా నవ్వుతున్నట్లు ఊహ ఒక తీయని భావన.
ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ముందు పోదు నిప్పుల వాగు, ఎదురు రాని చుక్కల నది, పట్టపగలు సిరా అలికిన ఆకాశం ,పొదలు గమ్మిన ఆగాధం అంటూ సాగుతూ అక్కడి కొండలు గుట్టలు కనుమలు లోయల గురించి మనోహరంగా వర్ణిస్తూ….

"లోయ కడుపులో వంకర టింకరగా పరిగెడుతూ వర్జిన్ నది దూరంగా నిశ్శబ్దం నిండిన ఏంజెల్ కేనియన్ అక్కడ దేవకన్యలు దిగివచ్చి నాట్యం చేస్తున్నారేమో"....

అంటూ అనుభూతి చెందుతూ… నవ్య శివం/ఈ శ్వేత ధాత్రి/భువన లోకంలోనే ఉందా అని/క్షణం పాటు అనుమానం…. అంటూ చక్కని ముగింపునిస్తారు. ఈ విధంగా మనల్ని తన భావన చతురతతో ఎక్కడో దూర తీరాల్లో ఉన్న అందమైన శ్వేత ధాత్రి చుట్టూ తిప్పుతారు. ఈ విస్మయ ధాత్రిలో ఎన్నో వింతలతో నిండి ఉన్న ఈ వసుధలో లోతు తెలియని లోయల్లోకి జారవిడుస్తారు. లెక్కించలేని శిఖరాలను ఎక్కిస్తారు. వెలుగుల బురుజులను, నీడల చెరువులను చూపిస్తారు. అంతేనా ఉషోదయాన పసిడిగనులలో… సంధ్య వెలుగులో తామ్రవనాలలో తిప్పుతారు…

“ఈ కేనియన్ మోము మీద
పొగ మంచు ముసుగు వాలినప్పుడు
‘చర్రు’న ఊరికే శంపాలత వలె
లోయ గర్భాన ‘కొలరాడో’ నది”…..

అంటూ సాగే కవితలో మన చూపుల సీతాకోకచిలుకలను నది అంచుల నుండి లోయల్లోకి దూకిస్తారు. లోయల్నుండి శిఖరాల పైకి ఎగబాకిస్తారు. ఇలా ‘గ్రాండ్ కేనియన్’ తో మాట్లాడి వచ్చాను. సృష్టి రహస్యాలెన్నో తెలుసుకొచ్చాను …అంటూ ఆ అద్భుత మనో బృందాలను మనకు పరిచయం చేశారు.
తన అనంత భావన వీచికలను రువ్వి మన మనసులలో చల్లని వింజామరలను వీయించే భావకవి విద్యార్థి గారు.
“నెవాడ “రాష్ట్రంలో నున్న “లాస్ వేగస్” పై రాసిన కవితలో ..
దేశ దేశ సంపన్నులకు విడిది ఇది/గరీబోడు కాళ్ళు మోపే స్థలం కాదంటూనే…. నిదురించని సొగసులాడి /ఈ నగరం సెలవులేని క్యాలెండర్ అంటారు…. ఎంత నిగూఢ భావన ‘కేసినో’ ల గలగలలు/ క్లబ్బులలో గుసగుసలు/ఈ గాలిలోనే చంచలించు లాహిరులు….మత్తు గమ్ము ఆవిరుల గురించి గమ్మత్తుగా వర్ణించిన వైనం కన్నుల మెరిపిస్తాయి. ఒకింత ఆలోచనలో పడవేస్తాయి. ఎందుకంటే గరీబోడు కాళ్ళు మోపే స్థలం కాదనడంలో అక్కడి వైచిత్రి ఎంత విలాసవంతమైనదో చెప్పకనే చెప్పినా తీరుకు చిత్రిక ఇది….
ఇక “నయాగరా” గురించి వర్ణించిన తీరు ఎంత నయగారంగా ఉంటుందో…. మన మనసులలో చలచల్లని అక్షర తుంపర్ల పుప్పొడి జల్లి శరజ్జల పాత శబ్ద పతంగ విహారం చేయిస్తారు విద్యార్థి గారు…

"అది ఎన్ని యుగాల మాట ఒకానొక జాగృత సంధ్యలో ఏ నక్షత్రం కన్నబిడ్డో ఈ భువన గోళం "

అంటూ సాగే “నయాగరా” కవితలో ఈ భూమి నక్షత్రం నుంచి తెంచుకున్న అంత్రగాయం మాని మబ్బు పొరలు విడిపోయి తాను పర్వతాలుగా, లోయలుగా స్థిర రూపం దాల్చిన పిమ్మట కలిసిన సృష్టి మనస్సు ధ్రువ శిరస్సును వెచ్చగా దీవించుతూ స్పృశించి ఒక వినూత్న జలధరమును అవతరింప చేసిందంట…. విద్యార్థి గారి వర్ణన ఎంత హృద్యంగా మనోసంద్రంలో అద్భుతమైన అలల సవ్వడులు చేస్తుందో….

"మహా సరస్సులు అమృత జలాన్ని స్రవిస్తూ వరదలు వరదలుగా సోన వడివడిగా సుడులు తిరుగుతూ హేషిస్తూ ఘూర్ణిల్లుతూ చంక్రమించే అశ్వీయమై అనూహ్యమైన అగాధాల్లోకి నయగారంగా దూకుతూ మహికంధరలో మణిహారమై ప్రపంచ వింతల్లో ఒక వింతై"......

అంటూ సాగే కవితలో మొదట భూమి పుట్టుక ఆ తర్వాత భూమిపైన ఉన్న ప్రకృతిలోని మార్పులు ఆ తరువాత నయాగరా పుట్టుక గురించిన చక్కని వర్ణనతో కొనసాగించుతూ నయాగరా జలపాతంలో మనల్ని ముంచెత్తుతారు….

"పగలు చూస్తే ప్రాణం పోసుకున్న ముత్యాల గుంపులు చిందుతూ రెక్కలు మొలచిన వజ్ర సమూహమై డోలుతూ నక్షత్ర ప్రవాహమై మిరిమిట్లు గొల్పుతూ అగాధాల దరులకు లావణ్యం పులుముకుంటూ ఇంద్రధనస్సులు పుష్పిస్తూ మేఘ సందోహాలు లేస్తూ"....

అంటూ సాగే కవితలో ఆయన స్పృశించిన తీరు శిశిర జలపాతాన్ని ఒలికిస్తుంది …
హిమశిలాపాత/శబ్దపతంగమై/విను వీధుల్లో ఎగిరిపోయే నయాగరా అప్పుడప్పుడు తన గత వైభవాలను తలుచుకొని చిన్నబోతుందంట…. చింతపడుతోందంట….

"ఆ రోజుల్లో ఎంత స్వేచ్ఛగా క్రేళ్ళు వారేదట! అరణ్యాలు తాను పెనవేసుకు పోయేవట వృక్షజాలం జంతుజాలం అన్నీ తనతోనే తనలోనే తన ఒడ్డున కూర్చుని భూమి పుత్రులు ఎంత గొప్పగా చెమట పాటలు పాడే వారట! తనతో ఎన్ని ఊసులు పంచుకునే వారట!"

కానీ ఇప్పుడు తన చుట్టూ ఊపిరాడనంతగా అల్లుకుపోయిన నాగరికతల కంచెలు, రహదారుల వలలు, వాహన భూతాలు తన అందాలను బంధించబడినట్టు తన స్వేచ్ఛను హరించి తన చుట్టూ నవీన నాగరికత మితిమీరిన పోకడలతో వికృత నాట్యం చేస్తున్నట్టు నయాగరా వేదన చెందుతున్నట్టుగా వర్ణించిన తీరు నిజంగా సాదృశ్యమానం…

"ఆ రోజుల్లో స్వచ్ఛమైన ప్రకృతి ఒళ్ళు విదిల్చి నర్తించే కల్పన పద కింకిణి తాను ఇప్పుడు వికృత ప్రతికల్పన తనని కబలిస్తోంది"....

అంటూ నయాగరా వాపోతుందంట ఇక ఇక్కడ విద్యార్థి గారు…

‌ "ఎప్పుడైనా
నయాగరా స్మృతి ప్లవమెక్కి
‌ బయలుదేరానా
నాలుగు సరోవరాల్లో
జల లతనై లేస్తాను
అమృత ప్రవాహంగా సాగి
నక్షత్ర పాతమై దూకి
నయాగరా నదిగా‌ ఉరికి
'ఒంటారియో' సరస్సులో పొరలి
'సెయింట్ లారెన్స్' రుషికుల్యగా నడిచి
అట్లాంటిక్ మహా సాగరంలో కలుస్తాను
భువన కోశపు సకల శకలాల
పాదాలకు ప్రణమిల్లుతాను
పులకిస్తాను
పునీతుణ్ణవుతాను"-

అంటూ ఇచ్చిన ముగింపుకు అమృత భావ జల ధారలో తడిసి పులకించి పునీతులమై ఆ నిలువెత్తు నయాగరా కవి కలానికి ప్రణమిల్లక మానము….
ఇక “కాన్వాసుపై ఆమె” కవనం ‘విస్కాన్షిన్’ రాష్ట్రంలోని ‘వాకేషా’లో “ఫారెస్ట్ హిల్” పై కూర్చుని రాశారు… ఆ కావ్య కన్యకను ఎంత అబ్బురంగా ప్రేమించారో…. ఎంత అద్భుతంగా స్వాగతించారో ఈ కవనంలో…

"ఆకురాలు కాలం గదా!
అడవంతా నగ్నంగా
చెట్లన్ని పొరకలై
పాడుబడ్డ దీకాడు"-

అంటూ మొదలైన ఎత్తుగడ కవితను నడిపించిన తీరు ఎంత చక్కని భావాల హరివిల్లో…..

"అది పట్టపగలు పసిడిబింబం ఒకటి హరితాన్ని ధరించిన వసంతమై ఆ లోయల బడి ఈ కొండ వైపు వస్తోంది కొండ మీద నిరీక్షిస్తున్న నేను ఆమె రాకను గుర్తించాను సంభ్రమాశ్చర్యాల జలదరింపులు నాలో"

అంటూ ఆమె తన కోసంగాక ఇంకేవరికోసం వస్తోంది….నా నిరీక్షణ ఆమె కోసంగాక ఇంకెవరి కోసం…. అంటారు…ఆ కావ్య కన్యక ఆంతర్యం తెలిసిన జాగరుకుడు ఈ కవిగాక ఇంకెవరు…. ఆ స్పృహ వేరెవరికుంటుంది చెప్పండి…. ఆ వనసుందరి ఈ అపూర్వ స్నేహితుడి పరిశ్వంగంలో పులకించి…. తన మంచు వంటి హృదయంలో కొత్త రంగు కాన్వాసుగా మారి…. చెప్పలేని ఉద్విగ్నతకు లోనై…. విశ్వపు అంచుల దాకా వీరి ప్రేమ విస్తరించి…. ఖగోళపు గుహలు ధ్వనించేంత దూరం… ఒక హాసమై వికసించాలి… అదే కవి గారి కోరిక అందుకే…..

"అడవంతా మంచుతో
వెండి పందిళ్ళల్లుకుంటుంది
దూరంగా
మంచు పొదల మాటున
అల్లుకున్న గూటిలో
‌ వెచ్చగా విశ్రమిస్తున్న గువ్వొకటి
నా నిరీక్షణను
ఆమె ఆగమనాన్ని
తన భాషలో
అభినందిస్తోంది".....

అంటూ సంబరపడతారు కవి గారు… మరి అంతే కదా తనతో ఈ ఎడబాటు ఇప్పటిదా…..

"ఎన్నేళ్ల ఎడబాటు
‌‌ అప్పుడెప్పుడో
చిన్నతనంలో గదా
ఎక్కడో
వేల మైళ్ళ దూరంలో
హిమాలయాలలో
ఒక నిశీధి వీధుల్లో
నిశ్శబ్దమై నడుస్తున్నప్పుడు గదా
తప్పిపోయాం
ఇదిగో
మళ్ళీ ఇప్పుడు
ఇన్నాళ్ళకు కల్సుకుంటున్నాం
వచ్చేసింది ఆమె
నన్నావహిస్తోంది
ఇప్పుడిక
నేను నేనుగా
ఆమె ఆమెగా
ఉండడం కుదరదు”….

అంటారు. అంతే కదా మరి ఆమె కోసం ఎన్నేళ్ళ నిరీక్షణ తనది ….ఆమె రాక కోసం తన హృది సాగర రూపమెత్తి… అలల చూపులతో…. ఉవ్వెత్తు కెరటాలుగా ఎగిసిపడుతోంది… ఆమె ఆప్యాయంగా వచ్చి తనలో కలిసిపోయాక …తన మనో కాన్వాసు పై ఆమె కొలువుదీరాక… తను తానుగా… ఆమె ఆమెగా ఉండడం ఎలా కుదురుతుంది కుదరదు కదా….

“ధీ సంజీవని” అనే కవితలో విద్యార్థి గారు ‘ఉత్తర అమెరికా’లోని “నార్త్ కరోలినా” రాష్ట్రంలో “గ్రాండ్ ఫాదర్ మౌంటెన్” మీద ” శ్రీధర్ కాజీపేట”అని వరంగల్ కు చెందిన ఇంజనీర్ గారు పరిచయమైనప్పుడు వారు అనుభూతి చెందిన తీరు చక్కని కవిత రూపంలో మన ముందుంచారు…

"మిత్రమా మనం ఒకింత బతుకు తెరువు కోసం అమృతం కురిసే రాత్రుల్ని చెమటోడ్చే పగళ్ళలో పోగొట్టుకున్నాం"....

అంటూ ఆరంభించి…
ఒక అర్థగోళాన్ని విడిచి/
మరో అర్థగోళానికి వలస పోయాం”….

అంటూ మన మాటకు మనం పరాయిలమై పోయామంటూ…. మన పాటకు మనం బదిరులమయ్యామంటూ…. మన సంస్కృతి మనకు పరిచయం లేనిదిగా అయిపోయిందంటూ….

వాపోతూనే ‘స్మోకీ’ పర్వత పంక్తులు… ‘బ్లూ రిడ్జ్’ పర్వత శ్రేణులు… గ్రాండ్ ఫాదర్ మౌంటెన్…. మరియు ఆరువేల అడుగుల పొడుగరి అయిన “తాత పర్వతం”గురించి చక్కని వర్ణనలు చేస్తూ సాగుతూ……

"ఒకరి నెరగకుండా ఒకరం రెండు మేఘస్పర్శలమై తాత ముఖాన్ని తాకుతూ ఎదురుపడ్డాం".....

అంటూ సాగిన కవితలో వారి పరిచయం కరచాలనంతో కదిలించివేసి …ఆలింగన ఆప్యాయతలను అందుకున్న “ఊరి వాసన” మహిమను వర్ణించిన తీరు అద్భుతం…

అప్పుడు ఆ తాత కొండ మెట్టుగుట్టపై వనభోజనానికి వచ్చినట్లు…. మన ఊళ్లో మనం తిరుగుతున్నట్లు… అనిపించిందంటూ అనంతమైన అనుభూతిని పొందిన వారి మైత్రి వారధి ఎల్లప్పుడూ ఒక” ధీ సంజీవని” గానే మిగిలిపోతుంది.
వన్నె తెచ్చే తెలుగు పదాల పోహళింపులతో కళ్ళకు కట్టినట్లు అలతి అలతి పదాలతో కవితను నడిపిన యానం బహుదా ఆనందనీయం..

ఆనవాళ్లు, ప్రాణహిత, నిరంతరం ,వరణం, ఉషా ప్రసవం ,తేజోమయం వంటి ఎన్నో అద్భుతమైన కవితలు విద్యార్థి గారే మనల్ని వేలు పట్టుకొని ఆ ప్రాంతాలను తిప్పుతున్నట్లు అనుభూతి చెందకమానము….
ఇంత చక్కని కవితలల్లి తమ సరాగాలతో…. సమీరాలతో… జీవన గీతాలతో… మన మనసులలో కవనవర్షపు బిందువులను కురిపిస్తారు విద్యార్థి గారు….

యూరప్ లోని పశ్చిమ శిలపై పయనిస్తూ విద్యార్థి గారు అనుభవించిన వినూత్న “స్పర్శ” మాటల్లో చెప్పలేనిది….

"మన కింద భూమి మీద ఇటు లేచిన మణిహారాల పందిళ్లు అటు మొలచిన వెండి గుడారాల గుంపులు పరుచుకున్న పగడాల దీవులు అన్నిటిని చుట్టి నీలి మైదానాలు".....

ఇలా సాగే కవితలో వారు మరో ప్రపంచంలోకి రూపాంతరం చెందుతున్న తీరు అమృతాన్ని స్రవిస్తోంది… మానవ జీవితంలో కొంత వ్యవధి దొరికిన తర్వాత మనసులో వచ్చే మార్పును ఎండగట్టిన తీరుకు వందనాలు తెలుపవలసిందే…..

"ఎగిరే పక్షిని పడగొట్టి
కాల్చుకు తినడం
వేటగాడి నైజం
భయపడితే పక్షి
నక్షత్రమై వెలిగేదెప్పుడు
ఆకాశాన్ని సముద్రంగా
మార్చేది ఎప్పుడు"....
అంటూ సాగే ఈ కవిత
ఏమూల/ ఏ యుద్ధం పొంచి ఉన్నదో/ఏ ప్రభుత్వం/దేనికి ఎరవేసి కూర్చున్నదో/ఎవడు/మన సమస్తత్వాన్ని దోచుకోవడానికి సమాయత్తమవుతున్నాడో/ ఎలా తెల్సు….. అంటూ సాగే కవిత ముగిసిపోని యుద్ధంలా మనకు కనిపిస్తుంది…. ఈ యుద్ధంలో మనము సిపాయిలం కావచ్చు…. కానీ ఈ విన్నుత్న స్పర్శానుభూతిని మాత్రం మనం కోల్పోకూడదు… ప్రియతమా! అంటూ విద్యార్థి గారు తన భావ కవన ప్రియురాలితో ముచ్చట్లాడడం చూస్తే ముచ్చటేస్తుంది…..

అమెరికా నుండి తిరిగి వస్తూ భారత పశ్చిమ తీరాన్ని తాకుతున్నప్పుడు కలిగిన అనుభూతిని ‘ఉపాసన’అనే కవితలో అక్షరీకరించిన విధానం అమృతతుల్యం… ఆ ప్రకృతి వర్ణన మన హృదయాలలో మలయానిలమై తెరలు తెరలుగా పరుచుకుంటుంది…
తరుల మధ్య/బయళ్ళ మీద/వెలుగునీడలు కలిసి/నాట్యం చేస్తున్నాయి…..
అంటూ అరుణతార మండలమోలే సాగే పక్షుల గుంపుల వర్ణన … దృశ్య ప్రపంచంలో నుంచి జాగృతం చేస్తూ అదృశ్య లోకాన్ని ఉపాసింప చేస్తుంది… ఈ కవిత చదివిన తర్వాత నిజంగా విద్యార్థి గారు “ఒక ధ్యాన విహంగమే” అనిపిస్తుంది…

ఇలా తాము అమెరికాలో తిరిగిన ప్రదేశాల గురించి “యాత్ర స్మృతి” ప్రక్రియలో దృశ్య లోకాన్ని మన ముందుంచి అదృశ్య ఆనందానుభూతుల అంచుల దాకా తీసుకువెళ్ళి…” మంచు మైదానం”లో ఓలలాడించిన తీరుకు భావకవన జలపాతం లో దూకి అంతులేని అనుభూతులకు మనం లోనవుతాం అనడం అతిశయోక్తి కాదు…

మీ వంటి సాహితీ ఘనపాటి వారి “మంచు మైదానం”(జులై 2005)సంపుటిపై సమీక్ష రాయడం చంద్రునికో నూలుపోగు సమర్పించుకున్నట్లుగా భావిస్తూ…. విద్యార్థి గారి కవన కలానికి ప్రణమిల్లుతూ….

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తెలంగాణ భాషా దినోత్సవం

by Dr. Dasoju Padmavati September 28, 2026
written by Dr. Dasoju Padmavati

(సెప్టెంబర్- 9 తెలంగాణ భాషా దినోత్సవం.

కాళోజీ నారాయణరావు జయంతి ని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

మన మాతృ భాషే
మన అస్థిత్వం.
భాష కేవలం భావ వినిమయ సాధనం మాత్రమే కాదు.
మన కట్టు- బొట్టు ,ఆచార వ్యవహారాలు, సంస్కృతి- సంప్రదాయాలు, కళలు
సమస్త జీవన మూల్యాల సమాహారం భాష.

భాష మనుగడ కే ముప్పు వస్తే మన అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది.
మన మాతృ భాషను కాపాడుకోవడం అంటే సమస్త జీవన మూల్యాలను కాపాడు కోవడం.
మనల్ని మనం రక్షించుకోవడం.

అందుకే కాళోజీ —-
“అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకలించు ఆంధ్రుడా
చావా వెందుకురా” అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మాతృ భాష పరిరక్షణే -మన ప్రధాన లక్ష్యం.

ఆ దిశగా మనం కృషి చేద్దాం

    
September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us