మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ధారావాహిక నవల

జీవన మాధుర్యం

by Laxmi Madan July 31, 2025
written by Laxmi Madan

5 వ భాగం

అపర్ణ తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనవుతుంది.కానీ మళ్ళీ చదువు పట్ల ధ్యాస పెంచుకుని పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించుకుంటుంది.

పదవ తరగతిలో సైన్స్ సారు చెప్పేది ఎప్పుడు గుర్తొచ్చేది అపర్ణకు.

” కష్టపడి చదవండి. కాలేజీ మెట్లను ఎక్కే అదృష్టం ఇందులో ఎంత మందికి ఉందో” అని ఎప్పుడూ అంటుండేవారు. కాలేజీకి వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది. జీవితంలో చదువు అనేది ప్రాముఖ్యమైన విషయం దానికోసం విద్యార్థి దశలోనే కష్టపడాలి.

“నిజంగా కాలేజీ మెట్లు ఎక్కడం ఒక కలనే” అని అనుకునేది అపర్ణ.

స్కూల్లో ఫేర్వెల్ పార్టీ పెట్టారు. అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. కానీ “ఇలా ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు” అనేది ఊహకందని విషయం. ఇన్ని రోజులు కలిసి ఉన్న అందరూ విడిపోతారని అంతగా తెలియని వయసు. ఆటపాటలతో గడిచిన బాల్యం. అందులో స్కూల్ జీవితం అద్భుతం. అంత మధురమైన జీవితం మళ్ళీ ఎవరికీ దొరకదు.

ఆ సంవత్సరం పదవ తరగతి వాళ్ళు స్కూల్ నుండి వెళ్లిపోతారని, అందరికీ ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చారు స్కూల్ టీచర్స్.

ఆ తర్వాత ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో ఎవరికి తెలియలేదు.

“కాలేజీకి వెళ్తున్నాను “అంటే ఎందుకో భయంగా అనిపించింది. ఎందుకంటే ఉన్న ఊరును వదిలి వేరే ఊరిలో చదువుకోవాలి. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి వెళ్లాలంటే బాధగా అనిపించింది .కానీ తండ్రికి పిల్లలను చదివించాలని చాలా ఇష్టం. అందులో అపర్ణకి కూడా చదువుకోవాలని ఎంతో ఇష్టం. కాబట్టి అన్నీ భరించుకొని వెళ్లాల్సిందేనని అనుకుంది.

కాలేజీకి వెళ్లి చదువుకోవడానికి అప్పట్లో ఇంతగా వసతి గృహాలు లేవు. తండ్రి దక్షిణామూర్తి గారు చెప్పారు ..

“కొన్ని రోజులు మన బంధువుల ఇంట్లో ఉండమని”

అసలే మొహమాటస్తురాలైన అపర్ణకి, బంధువుల ఇంట్లో ఉండడం అసలే ఇష్టం లేదు.ఇంట్లో నాయనమ్మ, అమ్మ గారాబం, తండ్రి ఆత్మీయత, సోదరుల అనుబంధం ఇవన్నీ వదిలి ఉండడానికి మనసొప్పలేదు.

కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోక తప్పదు.

అన్నతో పాటు బయలుదేరింది అపర్ణ. తన సర్దుకోవాల్సిన బట్టలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుంది.అన్నతో పాటుగా బస్సులో కూర్చున్నది. కళ్ళ వెంబడి ధారపాతంగా నీళ్లు కారిపోతున్నాయి.

బంధువుల ఇంట్లో వదిలిపెట్టి అన్నయ్య వెళ్ళిపోయాడు. అతనికి కూడా కాలేజీ ఉంది!

మాటిమాటికి ఏడుపు వస్తూనే ఉంది. చాటుగా వెళ్లి కళ్ళు తుడుచుకుంటూ, మళ్ళీ లోపలికి వస్తుంది.ఆ బంధువులతో అంత చనువు కూడా లేదు అపర్ణకు.

తెల్లవారి పక్కనే ఉండే ఒక అమ్మాయి తో కాలేజీకి బయలుదేరింది.

స్కూల్లో అయితే ఎంతో సంతోషంగా ఉండేది. ఉన్న ఊరు, అందులో చాలా ఏళ్లు చదువుకోవడం వల్ల అందరూ పరిచయమే. కానీ కాలేజీలో అందరూ కొత్త .ఒక్కరైనా తెలిసిన వాళ్ళు కనిపించలేదు.

వెళ్లి మెల్లగా లేడీస్ రూమ్ లో కూర్చుంది. వేరే ఆడపిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ ఎవరి గ్రూపులు వాళ్లకు ఉన్నాయి. అపర్ణను ఎవరూ పలకరించలేరు.

మెల్లిగా తన క్లాస్ రూమ్ నెంబర్ తెలుసుకొని వెళ్లి కూర్చుంది. మొదటి పీరియడు తెలుగు .

భయంగా కూర్చున్న అపర్ణను చూసి తెలుగు మాస్టారు గమనించాడు. అందులో ఆడపిల్లలు ఎవరూ రాలేదు.

సార్ అన్నాడు..

” కాలేజీకి విద్యార్థి పిల్లిలా వస్తాడు. తర్వాత పులిలా మారిపోతాడు” అని అన్నాడు తెలుగు మాస్టారు.

“అది తన గురించే నేమో” అనుకుంది అపర్ణ.

ఇంతలో ఒక అమ్మాయి సుడిగాలిలా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమాత్రం భయం లేకుండా ఉంది.

వచ్చి తన పక్కనే కూర్చుంది.

యక్ష ప్రశ్నలు వేసింది ఆ అమ్మాయి.

” ఏ ఊరు నుండి వచ్చావు”

” నీ పేరేంటి” ఇలా అడుగుతూనే ఉంది. కాకపోతే ఆమె రావడం వల్ల అపర్ణకి కొంచెం ధైర్యంగా అనిపించింది.

సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇద్దరమ్మాయిలే ఉన్నారు. తర్వాత పీరియడ్లో మరో 6 మంది ఆడపిల్లలు వచ్చారు.

వాళ్ళందరూ మామూలుగానే మాట్లాడారు.కానీ స్నేహం చేయాలి అనే భావన ఎవరికి ఉన్నట్టు లేదు. కాలేజీకి వచ్చామా! క్లాసులు విన్నామా! వెళ్ళిపోయామా! ఇలాగే ఉండేవాళ్ళు.

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఫ్రెండ్స్ అయ్యారు.

కాలేజీ వాతావరణం ఇప్పుడు కొంచెం కొంచెంగా నచ్చుతుంది అపర్ణకి. కానీ అబ్బాయిల కామెంట్స్ వింటే మాత్రం చిరాకు వేసేది. తన ఊర్లో చెప్పినట్లు జవాబు చెప్పడానికి కొంచెం జంకుతు ఉండేది.

పదవ తరగతి వరకు బొద్దుగా ఉండే అపర్ణ, సన్నబడి అందంగా కనిపించ సాగింది. లంగా వోణీల్లో చక్కగా ఒదిగిపోయింది.

బంధువులతో కూడా చనువుగా మెలగసాగింది. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లయింది.

ఇంట్లో లాగా అందరితో దబాయింపుగా మాట్లాడటం మానేసి, చక్కగా పలకరించడం నేర్చుకుంది. ఇంట్లో వాళ్లకు చిన్న చిన్న పనులు సహాయం చేసేది.

వాళ్లు కూడా అపర్ణను బాగా మెచ్చుకునే వాళ్ళు”చక్కగా అర్థం చేసుకుంటావు నువ్వు అందరినీ “అని అనేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో ఆటలాడుకుంటూ, వాళ్ళకు అవసరమైనవి చూస్తూ, కొత్త పరిచయాలను పెంచుకుంటూ, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది నేర్చుకున్నది అపర్ణ

జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ వెళుతుంటేనే మనకంటూ ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే, సమస్యలను ఎదుర్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శ్రమ పడాలి.

ఇంటర్ అయిపోతుంది కాలేజీకి దగ్గరలో అపర్ణ తండ్రి ఒక ఇల్లు తీసుకున్నాడు. మూడు గదుల ఇల్లు మాత్రమే.

అనుకోకుండా ఊరికి వచ్చిన అపర్ణకి ,తండ్రి సర్ప్రైజ్ గా ఈ విషయం చెప్పాడు. తనకి ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యిందని, అందుకే ఒక ఇల్లు తీసుకున్నానని, అక్కడే ఉండొచ్చని చెప్పారు. ఆమె ఆనందానికి అవధులు లేవు.

“మరి అమ్మ వస్తుందా!” అని అడిగింది.

” అమ్మ వస్తే ఇక్కడ ఇల్లు వ్యవసాయం పనులు, నాయనమ్మను ఎవరు చూసుకుంటారు! అందుకనే అప్పుడప్పుడు అమ్మ వచ్చి వెళ్తుంది. నీకెందుకు భయం. నేను వంట చేసి పెడతాను. నువ్వు కాలేజీకి వెళ్లి చదువుకో” అని చెప్పాడు తండ్రి.

సంతోషంగా మళ్ళీ కాలేజీ కి వెళ్ళింది అపర్ణ.

తనకున్న సామాను తీసుకొని రిక్షాలో కొత్త ఇంటికి వచ్చేసింది.

ఆ ఇల్లు కాలేజీకి చాలా దగ్గర. స్నేహితుల ఇండ్లు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి.

ఉదయం తండ్రి వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్లిపోయేవారు. అపర్ణ కాలేజ్ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఉండేది. షిఫ్ట్ సిస్టం ఉండేది ఆ కాలేజీలో. ఇంటర్ వాళ్లు ఉదయం సెషన్లో, డిగ్రీ వాళ్ళు ఆఫ్టర్నూన్ సెషన్ లో కాలేజీకి వెళ్లేవాళ్లు..

అపర్ణ ఇంట్లోనే భోజనం చేసి, కాలేజీకి వెళ్ళేది. కొత్త ఇంటి చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ ఉండేవి. అందరూ ఎంతో పరిచయమయ్యారు. అపర్ణను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఈ జీవితం బాగా నచ్చింది.

చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ “అక్క అక్క” అంటూ ఇంటికి వచ్చేవాళ్ళు.

అపర్ణ తండ్రి దక్షిణామూర్తికి వారానికి రెండు రోజుల సెలవు ఉండేది. శని ఆదివారం అపర్ణ తండ్రి ఊరికి వెళ్ళిపోయేవాడు. ఇంటి నిర్వహణ చాలా కష్టం కదా!

పక్కన ఇంట్లో ఒక బామ్మ, తాతయ్య ఉండేవాళ్లు. అపర్ణ నాన్నగారు లేని సమయంలో వాళ్ళింట్లో పడుకునేది.కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అదే లైన్ లో ఒక స్నేహితురాలు ఉండేది. ఆ అమ్మాయి జూనియర్ అయినా కూడా ఎంతో సన్నిహితంగా ఉండేది. ఆ అమ్మాయి చదువుకోవడానికి అపర్ణ దగ్గరికి వచ్చి అక్కడే పడుకునేది తోడుగా.ఇంకా ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ, కాసేపు చదువుకుంటూ ఉండేవాళ్లు.

ఇక అప్పుడు మొదలైంది మరో సమస్య.

కాలేజీకి వెళ్లే అబ్బాయిల ఇళ్లన్నీ ఇంచుమించు ఆ వరుసలోనే ఉండేవి. వీలైనంతవరకు బయటకు రాకుండా లోపలే ఉండేది అపర్ణ.

ఏదో ఒక రకంగా వాళ్లతో ఇబ్బందులు పడుతూనే ఉంది.

ఒకరోజు అపర్ణ అపర్ణ, స్నేహితురాలు వందన రాత్రి తొమ్మిది గంటల సమయంలో చదువుకుంటూ కూర్చున్నారు. ముందటి గదికి కిటికీ రోడ్డు వైపు ఉండేది. ఆ కిటికీ తీసుకుంటే చక్కని గాలి వెలుతురు వచ్చేది.

అలా వీళ్ళిద్దరూ చదువుకుంటూ కూర్చున్నారు. ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయి. అతను కూడా అపర్ణ చదివే కాలేజీలోనే చదువుతున్నాడు. కావాలని ఇంటి ముందు నుండి నాలుగు ఐదు సార్లు వెళ్లేవాడు. ఎన్నోసార్లు గమనించిన అపర్ణకు ఏమని వార్నింగ్ ఇవ్వాలో అర్థం కాలేదు.

ఎక్కువగా తండ్రి లేని శని,ఆదివారంలో ఇలాంటి ఇబ్బంది జరిగేది.

ఒకరోజు ఉదయం ఎప్పటిలాగే వందన వెళ్లిపోయిన తర్వాత కాలేజీకి రెడీ కావడానికి తలుపులు మూసి, బయట గది కిటికీలు మూయడానికి ముందు రూమ్ లోకి వచ్చింది అపర్ణ.

కిటికీలో మడతలు పెట్టిన తెల్ల పేపర్ కనిపించింది.

ఆ పేపర్ ఏంటా అని తెరిచి చూసింది.

ముత్యాల లాంటి అక్షరాలతో ప్రేమను కురిపిస్తూ రాసిన లేఖ.

కాసేపు కంగారుగా అనిపించినా, తనను తాను స్థిమితం చేసుకుని, కాలేజీకి వెళ్ళిపోయింది.

రాత్రికి ఇంటికి వచ్చిన వందనకి ఆ ఉత్తరం చూపించింది.

” అయ్యో ఎవరు రాశారు అక్కా! నాకు భయమేస్తుంది” అని అన్నది వందన.

” నాకు లేని భయం నీకెందుకు! ఇలాంటి వాటికి భయపడితే మనం బ్రతకలేము. అంతగా ఆలోచించకు” అని చెప్పి చదువుకోవడానికి పుస్తకం తెరిచింది.

వందన కూడా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేది. ఆమెకు కూడా అపర్ణ అంటే చాలా ఇష్టం. వందన వచ్చేటప్పుడు ఏదో ఒక స్నాక్ చేసి పంపించేది.

ఇలా వరుసగా రోజు ఒక తెల్ల కాగితం మడతపెట్టి కిటికీలో కనిపించేది.

పేరు రాసే ధైర్యం ఉండదు కాబట్టి పేరు ఉండేది కాదు.
కానీ కొంతవరకు ఊహించగలిగింది అపర్ణ.

ఒకరోజు రాత్రి చదువుకుంటూ కూర్చున్నారు అపర్ణ , వందన.

ఆ సమయంలో తెరిచి ఉన్న కిటికీలో నుండి నాలుగు చాక్లెట్లు ఎవరో విసిరినట్లుగా పడ్డాయి.

చాక్లెట్లను తీసుకొని చూసిన అపర్ణకి ,ఇది ఎవరో కావాలని విసిరారు అని అర్థం అయింది. చాలా కోపం వచ్చేసింది. ఆ చాక్లెట్స్ పట్టుకొని టక్కున లేచి నిలబడింది. వందన వెంటనే అపర్ణ చేయి పట్టుకొని “వద్దక్క, ఆ అబ్బాయి వాళ్లే వేసి ఉంటారు. మళ్ళీ గొడవవుతుంది. ఊరుకో” అని చెప్పింది.

” ఏంటి ఇలా కిటికీలో నుండి చాక్లెట్స్ పడితే ఊరుకోవాలా? అలా ఊరుకుంటే వాళ్లకి మనం అలుసైపోతాము. రోజు ఇదే పని చేస్తారు. అది మనకు అవసరమా” అని చెప్పి తలుపుతీసింది.

అనుకుంటున్నట్లుగానే ఈమె వెంటపడే అబ్బాయి రూమ్ లో ఉండే మరొక జూనియర్ పిల్లవాడు, పరిగెత్తుతూ కనిపించాడు.

పరిగెత్తి ఆ అబ్బాయి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అందులో అందరూ అబ్బాయిలే ఉంటారని ఆమెకు తెలుసు. అది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయిలు. అపర్ణకు భయం వేయలేదు. వెళ్లి ఆవేశంగా తలుపు కొట్టింది. ఊహించని ఆ అబ్బాయిలు తలుపు తెరిచారు. ఒక్కసారిగా అపర్ణను చూసి భయపడిపోయారు.

“ఏంటి! ఏమైందండీ ఇలా వచ్చారు?” అని అడిగాడు అందరికన్నా పెద్దగా ఉన్న అబ్బాయి. నిజానికి ఆ అబ్బాయి పని ఇది.

” ఈ చాక్లెట్స్ కిటికీలో నుండి మా ఇంట్లోకి ఎవరు విసిరారు”? అని చాలా కూల్ గా అడిగింది అపర్ణ.

” ఆ అది వీడు వద్దని చెప్పినా కూడా మీకు ఇస్తానని కిటికీలోనుంచి వేశాడు” అని చెప్పాడు ఆ పెద్దగా ఉన్న అబ్బాయి.

నిజానికి ఆ ఇంటర్ చదివే అబ్బాయికి అంత సీన్ లేదు. వేయించింది ఈ అబ్బాయి అనే విషయం అర్థం అయిపోతూనే ఉంది.

” అమ్మాయిల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? ఇంత రాత్రి సమయంలో మేము చదువుకుంటున్నాము. మీరు ఇలా చాక్లెట్లు లోపలికి విసిరితే ఏమని అర్థం చేసుకోవాలి? కనీస సంస్కారం లేకుండా ఇలా చేస్తారా” అని గట్టిగా అరిచింది.

ఆ అబ్బాయిలంతా భయపడుతూ నిల్చున్నారు. ఎప్పుడైనా అమ్మాయి స్ట్రాంగ్ గా ఎదుర్కొంటే అబ్బాయిలు పదిమంది ఉన్నా సరే భయపడి పోతారు. పిరికితనంగా ఉంటేనే ఇంకా వెనకాల పడి వేధిస్తారు.

ఇంతలో ఆ ఇంటి ఓనర్స్ బయటకు వచ్చారు.

అపర్ణ అంటే ఆ ఇంటి ఓనర్స్ కి కూడా చాలా ఇష్టం.” చూడటానికి చక్కగా ఉంటుంది. అందరితో పలకరిస్తూ మాట్లాడుతుంది. చక్కగా చదువుకుంటుంది” అని ఎంతో ఇష్టపడతారు. ఆ స్ట్రీట్ లో చిన్న పిల్లలకు ఏమైనా తెలియని ఉంటే కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఇలా అన్నీ మంచి లక్షణాలు ఉన్న అపర్ణను ఎవరు మాత్రం ఇష్టపడరు.

“ఏం జరిగింది అపర్ణ” అని అడిగింది ఇంటి ఓనర్.

జరిగినది అంతా చెప్పింది అపర్ణ.

వెంటనే ఆ ఓనర్ అబ్బాయిలను చాలా తిట్టేసింది. మీరు ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే, నేను ఇల్లు ఖాళీ చేయించేస్తాను. అమ్మాయిలను ఏడిపించడం మంచి పని అనుకుంటున్నారా? ఇందుకేనా మీరు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నది? ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను” అని గట్టిగా బెదిరించింది.

ఆ తర్వాత అపర్ణ ఇంటికి వచ్చేసింది. వందన అయితే భయపడిపోతూనే ఉంది. ఇంటికి వచ్చిన అపర్ణను చూసి “అక్క ఏమైంది!” అని అడిగింది.

జరిగిన విషయం అంతా చెప్పింది అపర్ణ. వందన ఎంతో సంతోష పడిపోయింది.
” అక్క నీకు చాలా ధైర్యం. నేను కూడా నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. భయపడి పోతే నిజంగానే భయపెడతారు” అని అపర్ణ చేయి పట్టుకొని అన్నది వందన.

అలా ఆ వీధిలో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరూ అపర్ణను అభినందించారు. జరిగిన వెంటనే వెళ్లి అడగడం మంచి పని అయింది. లేకపోతే మేము చేయలేదని వాళ్ళు బుకాయించేవాళ్లు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ జోలికి ఇంకా రారు అని అన్నారు.

అపర్ణ చాలా ధైర్యంగా ఉండటం నేర్చుకుంది. ఎవరైనా ఒక కామెంట్ చేయాలంటే కూడా ఆలోచించేవాళ్ళు.

అపర్ణ చదువు పూర్తి చేసుకుని వచ్చింది. తరువాత ఇంట్లో సంబంధాలు చూడటం, అపర్ణని వాళ్లు నచ్చడం, ఆమె కూడా ఆ అబ్బాయిని నచ్చడం జరిగిపోయింది. దక్షిణామూర్తి గారి ఆనందానికి అవధులు లేవు.

కానీ అపర్ణకు పీజీ చేయాలనే కోరిక మనసులో చాలా ఉంది. దానికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఒప్పుకున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా అపర్ణ ఎంతైనా చదువుకోవచ్చు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనే హామీ ఇచ్చారు. అందువల్ల అపర్ణ సంతోషంగా ఒప్పుకుంది.

అపర్ణ పెళ్లి నచ్చిన వరుడితో జరిగిపోయింది.

ఆలోచనల నుండి తేరుకున్న అపర్ణకి, సుధ లేచి కూర్చోవడం చూసింది.

” ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావ్”? అని అడిగింది సుధ.

” ఏం లేదత్తా! నీ పెళ్లి జ్ఞాపకాలు, నీ పెళ్లి అయిన తర్వాత నా చదువు తర్వాత నా పెళ్లి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాను” అని చెప్పింది అపర్ణ నవ్వుతూ.

ప్రొద్దున్నే లేపు .వసంత వాళ్ళ ఇంటికి పోవాలి. పోనీ నువ్వు కూడా వస్తావా నాకు తోడుగా?” అని అడిగింది అపర్ణ.

“సరే వస్తాలే! ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం” అన్నది సుధ

సంతోషంతో సుధ మీద చేయి వేసి పడుకుంది అపర్ణ

సశేషం

July 31, 2025 32 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక రెండు చిట్టెలుకలు

by ఒద్దిరాజు మురళీధరంరావు July 31, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక రెండు చిట్టెలుకలు వంట సామాను గదిలోకి పోయి, ఒక గూటిలో మీగడ తునక దొరికించుకున్నవి. మనం దీన్ని పంచుకుందాం అని దాని గురించి మాట్లాడుకున్నవి. “నేను పెద్దదాన్ని కాబట్టి నాకు ఎక్కువ భాగం కావాలి” అన్నది పెద్దది.
” ఓహో ! అదేం కుదరదు” అని అన్నది చిన్నది. “నాకే ఎక్కువ భాగం కావాలి. ఎందుకంటే నేను తిని నీ అంత ఎదగాది ” అని .
ఇలా అనుకుంటూ కాసేపు అవి వాదులాడుకొని మరుసటి రోజు నిశ్చయించుకుందామని పక్కకు పెట్టేసాయి .
మరుసటి రోజు ఉదయం కలిసి పెద్దది చిన్నదానితో “నువ్వు అన్నదే కరెక్ట్. నీవు అనుకున్నట్టే మీగడ తునకను పంచుకుందాం”అని .
అట్లా అనగానే” ఓహో అట్లా కాదు” అని అంది చిన్నది.” ఓ నువ్వన్నదే కరెక్టు” అని పెద్దది. “ఓ నువ్వు అన్నదే కరెక్ట్ “అని చిన్నది ఇలా వాదలాడుకొని చివరకు మర్నాడు తిందాం లే అని ఆ రాత్రి దాన్ని పక్కకు పెట్టి పడుకున్నాయి.
మరుసటి రోజు వంట సామాను గదిలో మళ్ళీ కలిశాయి. ఈసారి రెండు ఒకేసారి” నాకు తెలుసు” అని అన్నవి. ఈ మీగడ తునకను సమానంగా మన మధ్య పంచుకుందాం అని అనుకున్నాయి. కానీ రెండూ కూడా మీగడ తునకను చూసే వరకు అది పాచిపోయింది. పెద్ద ఎలుక అన్నది “మనం దాని గురించి అంతగా విచారించకపోనుంటిమి, దాచిపెడితే పాచిపోయింది!”.

July 31, 2025 36 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రమణార్తి ‘హరే శ్రీనివాసా!’

by chittiprolu Subbarao July 31, 2025
written by chittiprolu Subbarao


నిజాయితీపరుడైన ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజల హృదయరథాల్లో తెలుగునేల నాలుగు చెరగులా ఊరేగిన పేరు కె.వి. రమణాచారి. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చదివి,  ఐ.ఏ.ఎస్. అధికారిగా తలమునకలయ్యే పని భారాలున్నా తన మృదుగంభీర వచస్సుతో సాహిత్యాభిమానుల మనసుల్ని తేలికపరిచే కారంచేడు వెంకట రమణాచారి గారు తన అభిరుచి మేరకు తెలుగులో ఎమ్. ఏ. పూర్తి చేసి, 57 వసంతాల వయస్సులో పిహెచ్.డి. కూడా చేసిన నిరంతర విద్యార్థి.
 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక సలహాదారుడిగా, దేవాదాయ శాఖ కమిషనర్‌గా, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్ కమిషనర్ గా, కడప జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు రమణాచారి గారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టీటీడీ ఈఓ)గా చేసిన సేవలే ఆయన మనుసుకు నచ్చిన సేవలని భావించవచ్చు.
 
2012లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన రమణాచారి గారు ఏవో శుభఘడియల్లో తన పాదాలకు ఏదో పసరు పూసుకున్నట్లున్నారు.  కాలపు వినువీధిలో వెనుదిరిగి 2007-2009 సంవత్సరాలకు పయనించారు. ఆనాడు టీటీడీ ఈఓ గా నిర్వహించిన విద్యుక్తధర్మాలను సంతృప్తికరంగా పునఃదర్శించుకున్నారు. పాత జ్ఞాపకాలను అక్షరాల్లోకి ఒదిగించి, 2024-25 లో ‘స్వాతి’ మాసపత్రికలో వ్యాసాలుగా వెలువరించారు. ఆ అనుభవాల దొంతరనే ఇప్పుడు ఏప్రిల్ 2025లో ఎమెస్కో ద్వారా  ‘హరే శ్రీనివాసా!’ పుస్తకంగా ప్రకటించారు.
 
22 ప్రకరణలుగా విస్తరించిన ఈ పుస్తకంలో ప్రధానంగా రెండు అంతర్లీన సూత్రాలు కనిపిస్తాయి. మొదటిది ఏడుకొండల స్వామి దర్శనాన్ని ప్రజాస్వామీకరించడం – అంటే దేవుణ్ణి ప్రజల వద్దకే తీసుకుపోవడం. తాను ఏది చేసినా, చేయగలిగినా అదంతా దైవానుగ్రహమేనని విశ్వసిస్తూ ‘హరే శ్రీనివాసా’ అని అడుగడుగునా తలచుకోవడం రెండవ అంతఃసూత్రం.
 
దైవ ప్రజాస్వామీకరణ అన్నప్పుడు అలనాడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ చదివి, స్వాతంత్య్ర సమరయోధుడిగా, చివరకు పరమయోగిగా మారిన అరబిందో ఘోష్ వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది:
 
“I want to invoke … direct manifestation of the Divine in our entire being and daily life.” (… మన అంతరంగమంతటా, దైనందిన జీవితమంతటా దైవం ప్రత్యక్షంగా ఆవిష్కారం కావాలని దీక్ష వహిస్తాను.) – అరబిందో
 
దైవచైతన్యం ఈ నేల మీదనే అవతరిస్తుందని అరబిందో విశ్వసిస్తే, కలియుగదైవం సప్తగిరుల మీద అందకుండా ఆగిపోకూడదనీ, సామాన్యప్రజల చెంతకు చేరాలనీ భగీరథ ప్రయత్నం చేసినవారు రమణాచారి గారు. భగీరథ ప్రయత్నమని ఎందుకు అనవలసి వచ్చిందంటే, ఎంత ఐ.ఏ.ఎస్. ఆఫీసరైనా, ఆయన కూడా తన సంకల్పాలకు దేవస్థానం ధర్మకర్తల అనుమతులనూ, ప్రభుత్వనేతల ఆశీస్సులనూ పొందగలగాలి.
 
దేవస్థానం సంప్రదాయాల ప్రకారం శ్రీవైష్ణవులు మాత్రమే గర్భగుడి లోకి ప్రవేశించగలరు. తిరుమల తిరుపతి దేవస్థానం 75 సంవత్సరాల (1933-2008) చరిత్రలో గర్భగుడి లోకి ప్రవేశించిన తొలి కార్యనిర్వహణాధికారి రమణాచారి గారు. ఆయన శ్రీవైష్ణవుడు. నియమనిష్ఠలతో అర్చకత్వమూ నేర్చుకున్న వారు. తన అదృష్టం సరే! మరి సామాన్యుల మాటేమిటి?
 
“స్వామీ! నీ భక్తుల కోసం నువ్వే భక్తుల దగ్గరకు పోలేవా?” – ఇదీ రమణార్తి!
 
ఆయన సంకల్పం వలన ‘భజగోవిందం’ ద్వారా స్వామి గ్రామాలకు వేంచేశారు. ‘దళితగోవిందం’ ద్వారా వాడవాడలకూ చేరుకున్నారు. ఇది దైవ ప్రజాస్వామీకరణ కాక మరేమిటి?
 
తిరుమలేశుడు సాక్షిగా జరిగే వివాహాలు కలకాలం నిలుస్తాయనే నమ్మికతో ప్రారంభమైనది ‘కళ్యాణమస్తు’. అందుకయ్యే ఆర్థికవ్యయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే భరిస్తుంది. ఈ ప్రకరణలో ఒక ఆసక్తికరమైన ఉదంతం కనిపిస్తుంది. బావామరదళ్ళే అయినా కట్నం అడ్డుపడి వివాహం క్లిష్టమైపోయి రమణాచారి గారిని ఆశ్రయిస్తారు రాజేష్, వసంతలు!  రమణాచారి గారు ప్రేమికుల పెద్దలతో మాట్లాడడం ద్వారా కళ్యాణం జరిగిపోతుంది!
 
అత్యంత మహత్వపూర్ణంగా జరిగిన కార్యక్రమం ‘చతుర్యుగ బంధ భక్తిచైతన్య యాత్ర’. కలియుగ దైవసన్నిధి నుండి కృతయుగపు నరసింహ స్థానం సింహాచలానికీ, త్రేతాయుగపు శ్రీరాముడి క్షేత్రం భద్రాచలానికీ, ద్వాపరయుగపు శ్రీకృష్ణుడి ఆలయం మొవ్వకూ సాగిన మూడురథాల యాత్ర, నాలుగు యుగాల అనుసంధానయాత్ర ఈ  ఈ చైతన్యయాత్ర. ఈ యాత్రను సాకారం చేయడానికి రమణాచారి గారు పడ్డ కష్టాలు చదివితీరవలసిందే.
 
నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన ‘శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్’ కూడా రమణాచారి గారి సంకల్పసిద్ధే. అందుకు అవసరమైన కేంద్రప్రభుత్వ అనుమతులూ, ఆర్థిక వనరులూ, నిర్వహణా నైపుణ్యాలూ – ఆలోచన సులభమే గానీ ఆచరణలో ఎన్ని అవరోధాల్ని అధిగమించాలి!
 
పిల్లల కోసం పెద్దల కోసం ఆధ్యాత్మిక విషయ ప్రధానమైన ‘పుస్తక ప్రసాదం’, ఆర్థిక స్థోమత లేని ఆడపిల్లలకు పాఠ్యపుస్తకాలు అందించే ‘శ్రీ పద్మావతీ అమ్మవారి పుస్తక ప్రసాదం’ వంటివి ప్రజల వద్దకే దైవం వేంచేసే ఇతర కార్యక్రమాలు!
 
కాకతాళీయంగా బయటపడ్డ 32,000 అన్నమయ్య కీర్తనలు! 1978 లో పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు ప్రారంభించిన ‘అన్నమాచార్య ప్రాజెక్టు’!  లల్లాయి పదాలంటూ మొదట తృణీకరించి, పిదప పశ్చాత్తాపపడి,  చివరకు అన్నమయ్య కీర్తనలను స్వయంగా స్వరపరచిన మహా సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి గారి వృత్తాంతం! అన్నమయ్య 600వ జయంతి ఉత్సవ సందర్భంగా 2008లో తాళ్ళపాక గ్రామంలో 108 అడుగుల విగ్రహావిష్కరణ!  1,116 మంది సంగీత కళాకారులతో సప్తగిరి సంకీర్తన! హైదరాబాద్ లో అన్నమయ్య అధ్యయన కేంద్రం ఏర్పాటు! అన్నమయ్య వారసులకు నెలసరి జీవనభృతి!  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షగళార్చన! … … … సాయంసంధ్యను అచ్చతెలుగులో ‘దివ్వెలెత్తు పొద్దు’ అని పిలిచిన అన్నమయ్యను తలచుకుంటూ, కొలుచుకుంటూ చాలావరకు తీరిన రమణార్తి రెండు ప్రకరణల్లో విస్తరించి కనిపిస్తుంది.!
 
చిత్రకారుడు శివకుమార్ చిన్నిలేఖ కలిగించిన గొప్ప ఆలోచన టీటీడీ అమృతోత్సవం! 2008లో టీటీడీ కి 75 సంవత్సరాలు నిండినట్లు ఉన్నతాధికారులెవరూ గుర్తించరు. శివకుమార్ తన లేఖ ద్వారా రమణాచారి గారి దృష్టికి తీసుకువస్తారు. చివరకు అమృతోత్సవం రాష్ట్రపతి చేత ప్రారంభమవుతుంది. అలిపిరిలో అమృతోత్సవ స్థూపావిష్కరణ జరుగుతుంది. ‘అక్షరామృతం’ సంచిక వెలువడుతుంది.  ఉద్యోగులకు ‘స్వామివారి బంగారు డాలర్’ బహుమతులు లభిస్తాయి.  ఇంత బృహత్కార్యం రూపుదాలుస్తుండగా ఉద్యోగుల మధ్య ‘రూల్ అఫ్ రిజర్వేషన్’ చిచ్చు రగులుతుంది! రమణాచారి గారి సహృదయతతో చల్లని మాటలతో దావానలం శాంతిస్తుంది! ఇదంతా మరొక ప్రకరణ!
 
“హరే శ్రీనివాసా!” అని వేడుకోగానే “సరే వెంకట రమణా” అంటూ ఎన్నో అభ్యర్థనలను అనుగ్రహించిన అంతటి శ్రీనివాసుడు కూడా దయచూపని సందర్భాలున్నాయి. అందులో ఒకటి ‘దివ్యభారతి’ –  తిరుమల కొండ మీద రద్దీని తగ్గించే దిశగా అలిపిరి టోల్ గేట్ వద్ద 12 వరుసల రహదారిని నిర్మించడం లాంటి ప్రయత్నాలు. మరొకటి ‘ఆనందనిలయం అనంత స్వర్ణమయం’ – గర్భగుడి గోడల మీద లోపలా వెలుపలా  బంగారు పూత పూయడం. ‘మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది’ అనే నానుడికి కూడా ఉదాహరణలు కావాలి కదా!
 
“టీటీడీ ఈఓ కన్నా పెద్ద పోస్టులోకి పంపిస్తున్నాను రమణా!” ముఖ్యమంత్రి పలుకులు. మరింత ఉన్నతమైన పదవిని చేపట్టే అవకాశం  ఎలా విచారహేతువౌతుందో  ‘ప్రాప్తం’ ప్రకరణలో చూస్తాం.
 
ఇక చివరిదైన ‘వేంకటాద్రి దిగి వేంకటాద్రి ఎక్కి’ ప్రకరణ చదువుతూ చదువుతూ మన హృదయాలు ఉద్విగ్నమవుతాయి. నయనాలు అశ్రుసరస్సులవుతాయి. అసలు ఈ ప్రకరణ శీర్షికే అత్యంత భావుకతతో పరిపుష్టమైనది  – దిగినది వేంకటేశ్వరుడి కొండ, ఎక్కినది హైదరాబాద్ వెళ్ళే వేంకటాద్రి రైలు!
 
రైలెక్కడానికి ముందు ఆయనను కలవడానికి, కరచాలనం చేయడానికి, దూరం నుండైనా కడసారి వీడ్కోలు పలకడానికి వచ్చిన అశేషజనసమూహాన్ని చూసిన రమణాచారి గారు కన్నీళ్ళ పర్యంతమవుతారు. వనవాసానికి వెళ్ళే రాముణ్ణి సాగనంపిన అయోధ్య ప్రజల కన్నీటి కాలువలు గుర్తొచ్చాయేమో నగరవాసానికి వెళ్తూ తిరుపతివాసుల కళ్ళను చూసిన రమణాచారి గారికి – వనవాసకాండకు సంబంధించిన ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు ఈ అశ్రుమయమైన ఘట్టంలో! “శంఖమా! పోయివత్తునా!  … చక్రమా! పోయివత్తునా!” అనే అన్నమయ్య పల్లవినీ ఉటంకించి తన కవితాత్మను మరోసారి చాటుకుంటారు. ‘ఉన్నకాలం’ నుండి ‘సన్నకాలం’ లోకి జారిపోయిన స్వామివారి సేవాసౌభాగ్య దినాలను నెమరువేసుకుంటూ తట్టుకోలేక విలవిలలాడుతారు.
 
2007 ఏప్రిల్ 22 నుండి  2009 జూన్ 19 వరకూ ఏడు కొండల మీద  సాగిన తన జీవనప్రస్థానాన్ని రమణాచారి గారు మరచిపోలేరు. చదివితే మనమూ మరచిపోలేం.
 
“స్వామే భక్తుల దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?” టీటీడీ ఈఓ కాకమునుపే రమణాచారి గారు వేసుకున్న ‘వెర్రిప్రశ్న’తో మొదటి ప్రకరణ చదువరులకు కుతూహలం కలిగిస్తే, వివిధ అంశాల్లో తన ఆలోచనలను ఎలా ఆచరణ సాధ్యం చేసుకున్నారో తదుపరి ప్రకరణల్లో వర్ణిస్తారు రమణాచారి గారు. మనసా వాచా కర్మణా కొలిచిన శ్రీనివాసుడికీ, సహోద్యోగులకూ, ఆత్మీయులకూ వీడ్కోలు పలకడమే చివరి ప్రకరణ.
 
రెండు నెలల్లోనే మూడు ముద్రణల్లో వెలువడిన ఈ రచన పాఠకుల అశేషమైన ఆదరణకు నిదర్శనం! రమణాచారి గారి ఆధ్యాత్మిక సేవలను ప్రత్యక్షంగానూ, వ్యక్తిత్వాన్ని పరోక్షంగానూ ప్రతిబింబించే ఈ పుస్తకం హస్తభూషణమే కాదు, హృదయపోషకం కూడా!
 
(‘హరే శ్రీనివాసా’ రచయిత డా. కె.వి. రమణాచారి, ప్రచురణకర్త ఎమెస్కో, పుటలు 192, వెల రూ. 150.)

July 31, 2025 33 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆదిలోనే హంస పాదు

by Dr. Vasundhara July 30, 2025
written by Dr. Vasundhara

ఆంధ్రులొచ్చిఅగ్గిపెట్టిరి
ఆంగ్లేయులొచ్చి ఇంగ్లీషు రుద్దిరి

ఓ తెలుగు బిడ్డ! తెరువు కళ్ళు…
కలుగుతున్నది జాతికి కాంతి లోపం

ఆదిలోనేహంసపాదు
అచ్చ తెలుగును ఆంధ్రులు మింగిరి

పర భాషా గాలి దోషం
తెలుగుకు తీరని శాపం
అచ్చ తెలుగులో పల్లె గొంతులో పలికినవెన్నో…
ఎన్నెన్నో కమ్మని పాటలు
ఏమాయెను ? ఎటుపోయెను?

పొరుగింటి పుల్లగూర
మన ఇంటి అమృతాన్ని అవతలకి నెట్టేస్తున్నది ….
భాషామతల్లికిది ఎంత బాధ ! ఆవేదన అర్థం చేసుకోలేని
అమ్మ బాధను తీర్చలేని పిల్లలెందుకు పుడమి మీద?

పరుల నుండి దేశమాతను పోరాటశక్తి తో కాపాడినట్లు
కమ్మనైన అమ్మ భాషను పర భాషాహస్తాల నుండి
తప్పించని బిడ్డ లెందుకు ?

రండి ముందుకు
పదండి దండుగా
పట్టు విడవక
గట్టి ప్రయత్నం
చేద్దాం రండి

తెలుగే లేని దేశానికి రాజ్యాలు రాజధానులు రాజులు అవసరమా ఆలోచించండని నిగ్గదీద్దాం ….

కేజీ నుండి పీజీ వరకు పెట్టండి తెలుగును విషయం గా
మా పిల్లలు తెలుగోళ్ళు మేమంతా తెలుగోళ్ళం
మాభాష తెలుగు
మా యాస తెలుగు
మా నివాసమే తెలుగు
మా ఊసులన్నీ మా బాసలన్నీ తెలుగులోనే సాగాలిక
మా ఇళ్ళన్నీ మా బళ్ళన్నీ
తెలుగు వెలుగుతో నిండాలంటూ
పైనున్న వాళ్లకు అందిద్దాం మన సందేశం
తెలుగు దేశపు ఊపిరి భాష
ఊపేద్దాం దేశాన్ని మన కవితలతో…
మన పాటలతో ….
పలు సందేశాలతో !
పదండి…పదండి. …
ముందుకు మును ముందుకు
మంచి రోజులు మంచి ప్రభుత్వాలు మన ముందున్నాయి
వినిపిద్దాం మన సందేశం సాధిద్దాం
సంతోష వార్త

July 30, 2025 44 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కంచికి చేరని కథ

by Padmasri Chennojwala July 30, 2025
written by Padmasri Chennojwala

చారిత్రక నవలాచక్రవర్తి , చారిత్రక నవలాసమ్రాట్, అభినవ పాల్కుర్కి బిరుదులు పొందిన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి కలం లోంచి వెలువడి ఆగస్టు – సెప్టెంబర్,1977 వ. సంవత్సరములో  విజయబాపినీడు వారి ‘ విజయ ‘ పత్రికలో అనుబంధ నవలగా ప్రచురించబడిన ‘ఆవాహన ‘ అనే చారిత్రక నవలకు నేను వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం.

ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవల తల్లి ఐతే, ఆ తల్లి గర్భంలోంచి పురుడు పోసుకున్న శిశువే నా ఈ రచన.

  ఇంత అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ రచించిన శివప్రసాద్ గారికి ముందుగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వారే గనుక ఈ రచన చేయకపోయి ఉంటే, ఈ చారిత్రక కథ ప్రపంచానికి ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు.

ఈ నవలపై నేను వ్యాసం వ్రాయడానికి గల కారణాలు తెలియాలంటే, నా జీవితంలో విచిత్రంగా జరిగిన కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాల్సి ఉంటుంది.

నాకు దాదాపు 8 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ ఈ నవలను చాలా ఆసక్తిగా చదివేవారు. ఇంతకంటే ఆసక్తికరమైన మరో విషయమే మిటంటే, ఇది చదివే సమయంలో మా అక్క (అందరిలో పెద్ద) కు మొదటిసారిగా ప్రసవం జరిగిన రోజులవి.ఇంట్లో పసిబిడ్డ ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారు, ముఖ్యంగా ఆమె(బాలింత) తల్లి ఎంతగా పనుల ఒత్తిడిలో ఉంటారో నేను ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని మా అక్క, ఊపిరి సలుపని పనుల్లో ఉండి కూడా ఏ కాస్త సమయం చిక్కినా మా అమ్మ, ఇంటికి వచ్చీ రావడంతోనే మా నాన్న ఇలా అందరూ ఆసక్తిగా చదివేవారు.చదవడమేగాకుండా దాని గురించి చర్చిస్తూ ఉండేవారు. ఆడుకోవడానికి పక్కింటికీ, ఎదురింటికీ వెళ్లినా,అక్కడ కూడా ఇవే చర్చలు సాగుతూ ఉండేవి. వాళ్ళ చర్చల్లో ఎక్కువగా కామసాని, ఆవాహన, నర్తకి , శిల్పి వంటి పదాలు దొర్లుతూ ఉండేవి. ఆ మాటలు అర్థం చేసుకునే వయసు గానీ, కథను గురించి ఆలోచించే శక్తి గానీ నాకు లేకపోయినప్పటికీ, ఎందుకో రెప్ప వెయ్యకుండా వాళ్ళనే చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ ఉండేదాన్ని.

అంతమందిని కదిలించిన ఆ కథ ఏమై ఉంటుందా!? అన్న ఆలోచన  నా వయసు తో పాటే పెరుగ సాగింది. కాస్త సమయం గడిచాక ఆలోచిస్తే నాకు అర్థమైన విషయ మేమిటంటే, స్థానికత వాళ్ల ఆసక్తికి ఒక బలమైన కారణమని. మేమ ప్పుడు వరంగల్ జిల్లాలోని ములుగు లో నివాసం ఉండే వాళ్ళం.

పుస్తక పఠనం అనేది నాకు ఒక అభిరుచిగా మారడం, క్రమక్రమంగా కాస్తో,కూస్తో కలాన్ని కదిలించే శక్తి నాకు దైవదత్తంగా అబ్బడంవల్ల ఎందుకో నాకు ఈ కథను తప్పనిసరిగా చదవాలి, విషయమేమిటో తెలుసుకోవాలి, వీలైతే దానిపై వ్యాసం వ్రాయాలి అన్న కోరిక క్షణక్షణానికీ పెరుగసాగింది. విషయం తెలుసుకున్న మావారు పలు పుస్తక విక్రయదారులను సంప్రదించి 30-08-2022 నాడు పుస్తకాన్ని తెచ్చి నా చేతిలో పెట్టడం, నేను అదే క్షణంలో మొదలుపెట్టి ఏకబిగిన పూర్తి చేయడం, కథలో లీనమై కళ్ళారా  దర్శించిన అనుభూతికిలోనై వర్తమానానికి రావడం జరిగింది. నవల చదివాకగానీ నాకు అర్థం కాలేదు, అది వరంగల్లోని వేయి స్తంభాల గుడికి సంబంధించిన కథ అని.అప్పటి వరకు నేను అది రామప్ప గుడికి సంబంధించినద నుకున్నాను. ఇక చదవడం పూర్తయ్యాక నా మదిలో మెదిలిన భావాలను వ్యక్తపరచాలంటే బహుశా నా రచనాపటిమ సరిపోదేమో అనిపించింది. ఆసక్తీ, ఆశ్చర్యం, ఉద్విగ్నత అన్నీ మిళితమైన అనిర్వచనీయమైన భావన. గతానికీ,వర్తమానానికీ; ఆనందానికీ,విషాదానికీ నడుమ అంతు చిక్కని  అవ్యక్తానుభూతి.

మనం ఎన్నో ప్రేమ కథల్ని చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అందులో కొన్ని ఫలించి ఆనందాల హరివిల్లులైతే మరికొన్ని ఎండమావులకు ప్రతీకలుగా మిగిలిపోతాయి. మనిషి యొక్క ఆత్మ దేహత్యాగం చేసిన మరుక్షణం అందులో ఒదగబడిన ఈ ప్రేమ అనే సుగంధ కుసుమం కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది. అది సర్వసాధారణం, కానీ ఇక్కడ వైవిధ్యభరితమైన, గుండెల్ని మెలిబెట్టే అంశమే నా చేత ఈ వ్యాసం వ్రాయించింది.

 కాకతీయ సామ్రాజ్య ఆస్థాన శిల్పి   భళ్లాల సోమేశ్వరునికీ, ఆస్థాన నర్తకి కామసానికీ నడుమ విరిసిన ప్రణయ కథ.

వరంగల్ జిల్లా పాల్కుర్కి గ్రామంలో జన్మించిన సోమేశ్వరుడు శైశవ దశలో ఉండగానే తల్లిదండ్రులు కాలం చేయడంతో మల్యాల గుండయ్య, కుప్పమ్మ దంపతుల బిడ్డగా పెరిగి పెద్దవాడవుతాడు. ఆస్థాన నర్తకి చామకాంబ కూతురైన కామసాని తల్లి వద్ద నాట్యాన్ని అభ్యసించి, తన నాట్యకౌశలంతో సామ్రాజ్య విస్తరణ గావించినందుకుగాను ప్రభువుల మన్ననలందుకొని ఆస్థాన నర్తకి పదవినలంకరిస్తుంది.

ఐతే ఫలించని ఈ ప్రేమ కథకు కారణాలేమిటి ? వేయి స్తంభాల గుడికీ,ఈ కథకూ మధ్య ఉన్న సంబంధమేమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే, ‘ఆవాహన’ అనే ఈ నవలా వారధిపై 12వ శతాబ్దంలోకి మన ప్రయాణం సాగాల్సిందే.

కళాశాల అధ్యాపకుడైన రామచంద్రరావు, బ్యాంకు ఉద్యోగై న మాధవరావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఉద్యోగరీత్యా వరంగల్ బదిలీ ఐన మాధవ్ అంతకుముందే వరంగల్లో నివాసముంటున్న  రామచంద్రకు తాము వరంగల్ వస్తున్నామనీ, తమకొక మంచి ఇల్లు అద్దెకు చూసి పెట్టమనీ ఉత్తరం వ్రాయడంతో కథ మొదలవుతుంది.

భార్యను, కూతుర్ని వెంటబెట్టుకొని మాధవ్ కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు దిగడం, రామచంద్ర దంపతులు ఆతిథ్య మివ్వడం మామూలే అయినప్పటికీ, రెండు జంటలూ మొదటి కలయికలోనే స్థానిక దర్శనీయ స్థలాలపై పోటాపోటీగా చర్చించుకోవడం, ఎప్పుడెప్పుడు చూడాలా ?! అని అందరికందరూ  ఉబలాటపడటం, అప్పటికప్పుడు పట్టిక రూపొందించుకోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది.

ఐతే కథనెక్కువగా సాగదీయకుండా, పని వేళలు ముగిసి బ్యాంకు నుండి ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో వేయి స్తంభాలగుడి చూడాలన్న ఉత్సు కతతో మాధవ్ లోపలికి అడుగుపెట్టడంతో, గజ్జెకట్టిన కట్టిన కాలికీ,ఉలి పట్టిన చేతికీ నడుమ విరిసిన ప్రణయానికి తెరతీశారు రచయిత.

ఆలయంలోని అణువణువూ నిశితంగా పరిశీలిస్తూ వెళుతున్న మాధవ్ కు పుష్కరిణి, దాని పక్కనే శిలాశాసనం, అక్కడి నుండి పడమరకు మళ్లగా ఉత్తర దిశగా ముఖం పెట్టి ఉన్న నంది కనిపిస్తాయి. నందిపై చెక్కి ఉన్న శిల్ప సౌందర్యానికి ముగ్ధుడవుతూ ఎదురుగా ఉన్న శివాలయంలోకి అడుగుపెట్టి, ఆలయ నిర్మాణాన్నీ , ఆలయ స్తంభాల మీద చెక్కబడి ఉన్న డిజైన్లనూ,సన్నటి లతలనూ గమనిస్తూ,పరమేశ్వరుని దర్శించుకొని ఇవతలికి వచ్చి నందీశ్వరుని వెనుక ఉన్న మరో ఆలయంలోకి అడుగు పెడతాడు.

కొంత భాగం శిథిలమై, మరికొంత అసంపూర్ణంగా ఉన్న ఆ కట్టడాన్ని చూసి , “ఏ కారణం చేతనో కాకతీయులు ఈ మంటపాన్ని పూర్తి చేసినట్లు లేదు, ఆ రోజుల్లోనే ” అని తనలో తాను అనుకుంటూ ఇంకాస్త ముందుకెళతాడు.

వైశాఖ పూర్ణిమనాటి ఆ వెన్నెల మంటపంలోని శిలలు, శిల్పాలు, లతలపై కురుస్తూ ఆ పర్యాటకుని లోని కళాతృష్ణను రెట్టింపు చేస్తోంది.నెమ్మదిగా మరో అడుగు ముందుకేసిన అతనికి ఒక నర్తకి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకో ఆ బొమ్మను చూడగానే అతని శరీరం  గగుర్పొడిచి, కాళ్ళు అంగుళం కూడా కదలకుండా, కళ్ళనుండి నీరు కారిపోతూ ఉంటే, ఆ శిల్పాన్నీ,దానిలోని రామణీయక సజీవ చిత్రణను చూస్తూ, ముగ్ధుడై  ఆ బొమ్మ ముందు తానూ ఒక రాతి బొమ్మలా చలనం లేకుండా నిలబడిపోతాడు. అలా ఎంతసేపు నిలబడ్డాడో? ఎందుకు నిలబడ్డాడో తెలియదు (శిల్ప శాస్త్రానికి సంబంధించిన ఏ విధమైన పరిజ్ఞానంలేని, ఉలి మలుపుల్లో ఇమిడిన రసాత్మకతపై ఏ విధమైన అవగాహనలేని వ్యక్తి నీళ్లు నిండిన కళ్ళతో, తన్మయత్వంతో చూస్తూ, దాని ముందు స్థాణువులా నిలబడి పోవడానికిగల కారణమేమై ఉంటుందన్న ఆలోచన పాఠకుల మదిలో మెదులుతుంది). ఇతను మాత్రమే కాకుండా, ఈ కథను చదివే పాఠకులందరిలోనూ ఇదే గగుర్పాటు కలగడానికి కారణం కంచికి చేరని ఈ కథేనా?! లేక రచనా  వైదుష్యమా?! అనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరికి వారే శోధించాలి.

ఆ పారవశ్యంలో అతను ఇంకెంతసేపు ఉండిపోయేవాడో గానీ,” ఏమిటి చూస్తున్నావు?” అనే పలకరింపుతో ఉలిక్కిపడి వెనుదిరిగిన అతనికి, కాళ్లు చాపుకొని,మోకాళ్ళపై రెండు చేతులు ఆనించుకొని, రాశిపోసిన సౌందర్యంతో వెలిగిపోతూ స్వర్గలోకం నుండి దిగివచ్చిన అప్సరకాంతలా కిలకిల నవ్వుల జవరాలు శిథిల మంటపంలో ఓ వారగా కూర్చుని దర్శనమిచ్చింది.

“మీరు ఎవరు ?”అని యాంత్రికంగా అతనడిగిన ప్రశ్నకు “నేను మీ అమ్మగారి సేవకురాలిని” అని వ్యంగ్యంగా సమాధానమి వ్వడం, ఆజ్ఞాపించినట్లున్న కంఠస్వరంతో “కూర్చో” అంటూ ఏకవచన సంబోధన చేయడం, “సోమూ!” అంటూ తనను ఆత్మీయంగా, చనువుగా సంబోధించడం, అప్పుడే కిలకిలా నవ్వుతూ, మరుసటి క్షణంలోనే వలవలా ఏడుస్తూ, తానెన్నడూ  చూడని ఆ స్త్రీ , తానెప్పటి నుండో పరిచయం ఉన్న వ్యక్తి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే, ఆమె మాటలను అర్థం చేసుకోలేకా ,ఆమె భావోద్వేగాలను అంచనా వేయలేకా , తికమకపడుతూ ఏం మాట్లాడితే ఎక్కడ తననొదిలి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఆమె కోపాన్ని, వ్యంగ్యాన్ని, బాధను, దుఃఖాన్ని, ఆమెలోని అనుకూల – ప్రతికూల భావాలకు  సానుకూలంగా స్పందిస్తూ, సుతిమెత్తగా సమాధానాలిస్తూ ఉండగానే, ఆమె ఏడుస్తూ శిల్పాల చాటుకు వెళ్లి కనుమరుగ వుతుంది. ఎంత వెతికినా ఏ విధమైన ప్రయోజనం లేకపోవడంతో, మౌనంగా ఇంటిదారి పట్టి,మరుసటి రోజు సాయంకాలం మళ్లీ అదే చోటుకి వచ్చి ఆమె జాడ కోసం వేచి చూస్తూ ఉంటాడు.

జాబిలి కిరణాల జల్లుల్లో తడుస్తున్నది అతని శరీరం మాత్రమే. నిన్న జరిగిన సంఘటన నిజమా?! కలా?! అన్న సందిగ్ధంలో మనసు అల్లకల్లోలమవుతోంది. మూడోనాటి వరకు సాగిన ప్రయత్నం వృధా ప్రయాసే  కావడంతో నిస్పృహకు లోనైన అతని అంతరంగంలో రామచంద్రను చూడగానే కొత్త ఆశ చిగురిస్తుంది. ఆదివారంనాటి ఆ విహారయాత్రలో రెండు కుటుంబాలు కోట చుట్టూ హుషారుగా కలియదిరుగుతూ ఉంటే,గుండెలో రేగుతున్న అలజడి అతడిని మాత్రం ఓ పట్టాన నిలువనియ్యడం లేదు. ఒక్కొక్క రాతినీ తాకుతుంటే , అంతుపట్టని అలజడేదో తరంగాలై అతని నాడీ మండలానికి అజ్ఞాత సందేశాలు అందిస్తూనే ఉంది.

ఇక ఏమాత్రం తమాయించుకునే శక్తిలేని మాధవ్, తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లుగా రామచంద్రకు తెలుపడం, తిరుగు ప్రయాణంలో భద్రకాళి అమ్మవారి గుడిలో మాధవ్ స్పృహ కోల్పోవడంతో సాలోచనలో పడిన రామచంద్ర ఒకనాడు ఒంటరిగా ఆలయానికి వెళ్లి, ఆ పరిసరాల న్నిటినీ జాగ్రత్తగా గమనించి, అక్కడ కనిపించిన భక్తులను మాటల్లోకి దింపి ఏదైనా సమాచారాన్ని రాబట్టాలని ప్రయత్నించి, ఏ విధమైన ప్రయోజనంలేక ఇంటికి తిరిగివచ్చి, ఆమె మాధవ్ తో పలికిన పలుకులను మననం చేసుకుంటూ తన స్టడీ రూమ్ లోనికి వెళ్లి, వరంగల్ కు సంబంధించిన చరిత్ర పుస్తకాలను శోధిస్తూ ఉంటాడు.

స్నేహానికి ప్రాణమిచ్చే రామచంద్ర చరిత్ర పరిశోధకుడు కావడం యాదృచ్ఛికమే అయినా, అదే బలమైన కారణమై ఈ కథను ప్రపంచానికి అందించింది.

తనువు, మనసు అదుపు తప్పిన మాధవ్ కు ఎప్పటికప్పుడు కొత్త శక్తి నందిస్తూ ,ఆమె నోటి నుండి వెలువడిన (చిన్నమ్మ, పెద్దమ్మ, మల్యాల గుండయ్య, త్రిసరాలు, తాటంకాలు) మాటలను ఎప్పటికప్పుడు మాధవ్ నుండి తెలుసుకుంటూ, వాటిని గ్రంథాలయంలో రూఢి పరుచుకుంటూ, శిధిల మంటపం లో భూస్థాపితమైన ప్రణయ ప్రబంధాన్ని వెలికి తీసి, జాతికి అందించిన సాహసి, ప్రేమ పిపాసి(రామచంద్ర).

మొత్తం 10 పున్నములు ఆమె ప్రత్యక్షమవగా, చతుర్దశి నాటి సాయంత్రం అలికిడి ప్రారంభమై, పౌర్ణమి నాడు కనిపిస్తుందంటూ రెండవ కలయికలోనే చెప్పగలిగిన అతని (రామచంద్ర) తెలివితేటలు, గ్రహణశక్తి పాఠకులను ఆశ్చర్యంలో ముంచేస్తాయి.భార్యాబిడ్డలతో మొదటిసారి కాజీపేటలో రైలు దిగిన మాధవ్ తో ” మా చెల్లెలికేం సమస్యలేరా ? నేను లేనా శ్రీకృష్ణుడి లాంటి అన్నయ్యను, ఏదైనా కష్టం వస్తే చక్రం అడ్డువేయనూ ” అనీ,
నీవేం భయపడకమ్మా ! ఊళ్ళో నల్లాలు బందైతే నీకోసం హుస్సేన్ సాగర్ నుంచి తెప్పిస్తాం” అనీ
మంచితనం, మాటకారితనం కలగలిసిన పరిహాసంతో అన్న మాటలే అయినప్పటికీ, మానసికంగా, శారీరకంగా కృంగిపోయిన భర్తను చూసి ఆ ఇల్లాలు(మాధవ్ భార్య) పడే వేదనకు శ్రీకృష్ణుడిలా చక్రం అడ్డువేసి వారి అనురాగ బంధాన్ని పువ్వుల్లో పెట్టి వారికప్పగించిన రామచంద్ర ఈ కథకు గుండెకాయ వంటివాడు. ఊళ్లో నా అన్న వారెవరూలేని ఆ ఇల్లాలికి అన్నీ తానై బాసటగా నిలిచిన కాత్యాయిని (రామచంద్ర భార్య) మహిళాలోకానికి ఆదర్శ ప్రాయురాలు. రామచంద్ర కు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించిన ఆనందరావు గారు ఆవాహన అనే ఈ క్రతువులో శ్రీగంధం వంటి వారు.
కోయిల గానాలు, వీణానాదాలు, సెలయేటి గలగలలు, వలిమిన్న జల్లుల అందాలన్నీ కలబోసిన వెన్నెల బొమ్మ ప్రతి పున్నమి రేయిలో అతడిని కరుణిస్తూనే ఉంది. కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది.

మూడవ కలయికైన ఆషాఢ పున్నమినాటి రాత్రి  ఆమె మాటలను బట్టి ఆమె పేరు కామసాని అనీ, అతని పేరు సోమేశ్వరుడనీ, కాకతీయ సామ్రాజ్య మల్లెపందిరిపై వాలిన ఈ ప్రేమపక్షులు సామ్రాజ్యకాంక్ష అనే శ రాఘాతానికి నేలరాలిన జంట గువ్వలనే విషయం పాఠకులకు అర్థమవుతుంది.
తమ పూర్వీకుల నిర్మాణకాంక్ష ఐ న సహస్రమంటపం శిల్ప రూపంలో సజీవంగా ఉండాలన్న సంకల్పంతో రుయ్యమ్మ (తన తల్లి, కాకతీయ సామ్రాజ్ఞి ఐన రుద్రమదేవి పేరుమీద ఆజ్ఞాపత్రం రూపొందించి) గోళకీ మఠ నిర్మాణానికై సోమేశ్వరుని మందడ పంపించేస్తుంది.

సోమేశ్వరుని అమరశిల్పిగా మలచాలనీ,కాకతీయ శిల్పం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలనీ, కామసానీ సోమేశ్వరులు వివాహ చట్రంలో ఇమిడితే, వారిరువురి నడుమ ఏర్పడే బంధం అతనిలోని కళాభిని వేషానికి ప్రతిబంధకంగా మారుతుందనీ,అందుకే అతడిని మందడ పంపించడం అనివార్యమైందనేది ఆమె వాదన.

పుత్ర సంతానం లేని గణపతి దేవులవారు తమ కుమార్తె అయిన రుద్రమదేవిని తమ రాజకీయ వారసురాలిగా ప్రకటించడం, వారి నిర్ణయానుసారం ఆమె పురుష వేషాన్ని ధరించి అత్యంత సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండటాన్ని కళ్లారా చూస్తూ ఉండి కూడా, రుయ్యమ్మ వివాహం వీరిద్దరిలోని కళను దూరం చేస్తుందని ఆలోచించడంలో ఏ విధమైన బలం లేదు. ఇకపోతే రుద్రమదేవిగారికి కూడా పుత్ర సంతానం లేదు. వారి కుమార్తెలైన ముమ్మడమ్మగానీ, రుయ్యమ్మగానీ వారి తదనంతరం ఏ క్షణంలోనైనా పాలనా బాధ్యతలు చేబూనడానికి సర్వసన్నద్ధులై ఉండాలి, కానీ ఈ ఇద్దరు సోదరీమణుల్లో ఏ ఒక్కరు కూడా అవివాహితులుగా మిగిలిపోలేదు సరికదా, చక్కని గృహస్థ జీవితంలో ఇమిడిపోయారు.రాజ్యపాలనకు ప్రతిబంధకంకాని వివాహం కళా సాధనకు ఎందుకు ఈమెకు కారణంగా కనిపించిందన్న ఆలోచనకు సమాధానం దొరకడం లేదు.

తనకు అస్వస్థతగా ఉందన్న విషయం తెలుసుకున్న రుయ్యమ్మ పరామర్శ అనే మిషతో ఒకనాటి సాయంత్రం తమ ఇంటికి వచ్చి, తనకు(కామసానికి) తీరని అన్యాయం చేశానన్న మాట నిజమేననీ(పేజీ-116), ఒక జంటను తీరని బాధకు గురి చేశానని తనకు తెలుసనీ (పేజీ-118), ఒక స్త్రీ  మరొక స్త్రీని  కోరకూడనిదే – అయినా కోరుతున్నాను (పేజీ-119) అని అన్నదనీ, ఐనప్పటికీ తామిద్దరూ విడిపోవడానికి, తాను(రుయ్యమ్మ) పూర్తి కారకురాలిని కాననీ,అందులో తన పాత్ర కొంత వరకే పరిమితమై ఉందనీ మిగిలినదంతా దివ్య సంకల్పాలలో భాగమనీ, ఐతే అదంతా తన కోసం కాదనీ,కాకతీయ సామ్రాజ్య క్షేమం కోసం, సోమేశ్వరుని అమరత్వం కోసం ఈ త్యాగం చేయక తప్పదని (పేజీ- 119)తనతో అన్నదని అతనితో చెబుతుంది. దివ్య సంకల్పాల సంగతి దేవుడెరుగు,దివ్య సంకల్పాలలో భాగమే అయితే తాము విడిపోవడం కూడా యాదృచ్ఛికంగా జరగాలేతప్ప ఏ రాజకుమార్తె  పనిగట్టుకుని చక్రం తిప్పాల్సిన అవసరం లేదు. త్యాగం అనేది పగిలిన గుండెలోంచి ఎగిసిపడే విస్ఫోటనం, తట్టుకోలేని బాధలు, తీరని వేదనల నుండి పెల్లుబికే కఠిన శిలాద్రవం. అక్కడ తడికి ఆనవాలుగానీ, చెమ్మకు చోటుగానీ ఉండదు. అది బద్దలైన అగ్నిపర్వతం లోంచి వెలువడే లావా, భూమి(గుండె) పొరల్ని చీల్చుకొచ్చే మాగ్మా. ఏ వ్యక్తి అయినా తనకు తానుగా తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప, సంతలో దొరికే రెడీమేడ్ వస్తువు కాదు. ఎవ్వరిని అడగడానికైనా, ఎవ్వరికి ఇవ్వడానికైనా. తెర వెనుక సూత్రధారై,తెరమీద పా త్రధారై,చేదు గుళికలకు చక్కెర పూతలద్దినట్లు, మాటలతో మంచు తెరలు కట్టి, ఆమె ఎంత శాంతంగా చెప్పినప్పటికీ, తన గుండెల్లో కుంపటి రాజు కుంటున్నట్టుగానే ఉందనీ చెప్పిన తీరు”పేదల కోపం పెదవికి చేటన్నట్లు……….  ప్రకటించారు (పేజీ – 115) అనే మాట ద్వారా పాఠకులకు స్పష్టమవుతుంది.

“నాకు మిగిలింది అదే రాజకుమారి గారూ!” (పేజీ- 114)అనీ,”నన్ను చూడటం కోసం ఏ రాజకుమార్తె రానవసరం లేదు”(పేజీ – 115) అనీ,”ఒక రాజకుకుమార్తెగా కాక ఒక స్త్రీగా ఆలోచించు” (పేజీ-116) అని అనడం వంటివి ఆమె అనుభవించే వేదనను తెలుపడమే గాక, ఆమెలోని ముక్కు సూటితనం, నిక్కచ్చిత్వం, తన సమస్యను ఎదుర్కోవడానికి ఎంత ఘాటుగా నైనా (కోపం, ఆవేశం, దుఃఖం, వ్యంగ్యం, ధిక్కారం అన్నీ కలగలిసిన ప్రవర్తన) స్పందించే  మనస్తత్వాన్ని వీరిద్దరి నడుమ జరిగిన ఆనాటి వాగ్వాదం పాఠకులకు అద్దంలో చూపెడుతుంది.

వెంజావళి రవిక, హూని పట్టు చీరలో ముస్తాబై వచ్చిన కొత్త పెళ్ళికూతురు సాటి ఆడపిల్లతో ప్రేమను త్యాగం చేయమనీ, పెళ్లిని విరమించుకోమనీ శాసిస్తోంది.  ఆమె  ఔన్నత్యానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఆమెలోని రాజనీతికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

రుయ్యమ్మ చేసిన ధర్మోపన్యాసం(పేజీ -122) ఎంత గొప్పదైనా,ఆదర్శప్రాయమైనదైనా మానసికంగా తాను ఆ స్థాయికి ఎదగలేదనీ,తన స్థానంలో ఆమె ఉంటే ఇలాగే ఆలోచించి ఉండేదా? అనీ అతనితో అంటుంది. కాంచీపురంపై కాకతీయ బావుటా నెగరేసిన అసాధారణ ప్రతిభాశాలి ఐన కామసాని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదు.

కాకతీయ సామ్రాజ్యపు మకుటం లేని మహారాణిగా రుయమ్మనూ, రాజకీయ దురంధరనిగా అన్నయా మాత్యుల వారిని చరిత్రలో సుస్థిర పరచాలని మరెవరైనా పథకం రచించి, అమలు పరిస్తే అప్పుడు గానీ అర్థమయ్యేది కాదు రుయ్యమ్మకు తన ఆదర్శ స్వప్నం సంగతి అన్న ఉక్రోషం ఆమె మాటల్లో ధ్వనిస్తుంది. సామ్రాజ్య క్షేమం కోసం సాంసారిక జీవితంలో పాక్షిక త్యాగాన్ని తాను కూడా చేయగలననీ, కానీ నృత్యానికి అంకితమైన ఒక దేవదాసి లాగా(పేజీ-124), జీవితాంతం ఒక బౌద్ధ సన్యాసినిగా జీవించేందుకు తన మనసు సిద్ధంగా లేదనీ

సోమేశ్వరునితో చెప్పి బాధపడుతుంది (పేజీ – 122).

ఇద్దరూ కాకతీయ సామ్రాజ్య కళాకారులే అయినప్పటికీ, శిథిల మంటపంలోని వారి మొదటి కలయికలో  “నేను మీ అమ్మగారి సేవకురాలిని”(పేజీ- 13)అని ఆమె జీవాత్మ మాధవ్ తో వ్యంగ్యంగా అంటుంది.

కాంచీపుర విజయానంతరం వీరిద్దరికీ ఏకాంతం దొరకనివ్వకూడదని తన రాజకుమార్తె స్థాయిని కూడా పక్కనపెట్టి నిరంతరం శిల్పాల వద్ద కూర్చుని సోమేశ్వరునితో శాస్త్రం గురించి చర్చలు జరపడం, గోళకీమఠ నిర్మాణానికై అతడిని మందడ పంపించేయడం, ప్రతాపరుద్రుని నామకరణ మహోత్సవానికి అతడిని రానివ్వకపోవడం వంటి విషయాలతో పథకం ప్రకారమే రుయ్యమ్మ తామిద్దరినీ విడదీస్తుందని తెలిసి కూడా, సామ్రాజ్య విస్తరణలో ప్రజల్ని, కళాకారుల్ని భాగస్వామ్యం చేయా లే తప్ప, సామ్రాజ్య కాంక్షకు వాళ్లను సమిధలుగా మార్చకూడదన్న విషయాన్ని ఒక రాజ్యాధినేతగా, ఒక మాతృమూర్తిగా రుద్రమదేవి రుయ్యమ్మకు హితవును బోధించకుండా మౌనంగా ఉండటమే ఆమె గొంతులోని వ్యంగ్యానికి కారణమన్న విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమ వుతుంది.

వారి అసమాన శౌర్య ప్రతాపాలు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దృష్టిని ఏకశిలా నగరం వైపు ఆకర్షించి, చరిత్రలో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక ధీరవనిత పేగు తెంచుకు పుట్టిన కుమార్తెను విమర్శించే స్థాయి నాకు లేకపోయినా, బద్దలైన ప్రేమభాండమే నా ఈ స్పందనకు కారణమని పాఠకులకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ స్పందన నాకు మాత్రమే పరిమితమైంది కాదనీ, నా  వంటి ఎంతో మందిలో ఇవే ఆలోచనలు రేకెత్తాయనడానికి ఈ నవల (ఆవాహన) ప్రచురితమైన తొలినాళ్లలో ఇంటింటా జరిగిన చర్చలే బలమైన నిదర్శనాలు.

కేవలం కళ అజరామరం కావాలనీ, కళాకారులైన కామసానీ, సోమేశ్వరులను కళాతపస్వులుగా మలిచి, అమరత్వం ప్రసాదించాలని రుయ్యమ్మ రాజకీయంగా ఇలా పావులు కదిపి ఉండవచ్చా?, ఆదర్శాలనేవి మనకు మాత్రమే పరిమితమైనవనీ, మరొకరిపై బలవంతంగా వేసేవీ, శాసించేవి ఆదర్శాలనిపించుకోవనే సూక్ష్మాన్ని ఆమె గ్రహించగలిగి ఉంటే బహుశా కథ ఈ మలుపు తిరిగి ఉండకపోవచ్చు? ఈ హఠాత్పరిణామాన్ని (ఒకరి కోసం ఒకరు అమరులవడం) ఆమె ఊహించకపోయి ఉండవచ్చా?, ఊహించని ఆ మలుపు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి ఉండవచ్చా?,అంతులేని పశ్చాత్తాపంతో ఆమె హృదయం కలత చెంది ఉండవచ్చా ? కామసాని చాళుక్య పరంపరకు చెందిన వ్యక్తి అయి ఉంటుందా

?, గుండయ్య,కుప్పమ్మల బిడ్డగా పెరిగిన సోమేశ్వరుడు వారికి సమీప బంధువై ఉంటాడా?లీనమై చదివిన పాఠకుల్లో తోడిన కొద్దీ ఊటలై ఊరే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఏ చరిత్రకారుడో కంకణం కట్టుకోవాలే తప్ప, నావంటి సామాన్యులకు సాధ్యపడే విషయం కాదు.

కార్తీక సోమవారం నాటి ప్రదోషకాలంలో స్వయంభూ దేవాలయం నుండి బయటకు వచ్చి, వెనుక ఉన్న కొత్త నిర్మాణాన్ని చూడాలనిపించి వెళ్లిన కామసాని, పద్మకార శిల్పం మీద తలానించి, ఆకాశం వంక చూస్తూ, ధ్యాన నిమగ్నుడై మునిపుంగవుని ప్రతీకగా ఉన్న సోమేశ్వరుని మొదటిసారిగా చూస్తుంది.

శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి, ముంగర, కమ్మలు భవిరెల అలంకరణలో రత్నదీప కాంతుల నడుమ మెరిసిపోయే కళాభినేత్రి అతనికి తపోభంగం కలిగించ లేకపోయినా, అతని అందమైన ముఖం,కలలుగనే ఆ కళ్ళు మొదటి చూపులోనే ఆమెలో అతని యెడ అనురక్తిని కలిగిస్తాయి. ఆరోజు వారిరువురి నడుమ జరిగిన సంభాషణ,  అతనితో ఆమె ప్రవర్తన ఆమెపై గడుసైన సొగసరి అనే భావనను పాఠకుల్లో కలిగిస్తుంది.

     శ్రీవన్నియ చీర, వాయు మేఘపు రవిక ధరించి ఉన్నానని(అప్పటి రోజులను గురించి) శిథిల మంటపంలో కామసాని మాధవ్ తో రెండు, మూడుసార్లు చెబుతుంది. అది ఆమెకు బాగా నచ్చిన వస్త్ర విశేషమై (ఆ రంగుల కలయిక) ఉండవచ్చు. ఆమె నర్తకి కావడం వల్ల సహజంగానే అలంకరణపై ఆసక్తీ,పట్టు ఉంటుంది.

    సోమేశ్వరుని నోటి వెంట ‘గిరిజ ‘ అన్న పేరు విన్నప్పుడు ఆమెలో స్త్రీ సహజమైన ఈర్ష్యను, మాహూరయ్యతో జరిపిన సంభాషణలో చిలిపిదనంతో కూడిన పరిణతిని పాఠకులు గమనిస్తారు. కాంచీపుర యాత్ర గురించి చెబుతూ అతను కూడా వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేస్తుందేతప్ప పులిబోనులో తలదూర్చబోతున్నాననే భయం ఏమాత్రం కనిపించకపోవడం ఆ ప్రేమ ఎంత ఘాటైనదో చెప్పకనే చెబుతుంది.

శ్రీదేవి చొక్కనాధుల ముసుగులో కాంచీపురంవైపు సాగింది వారి రాజకీయ యాత్ర మాత్రమే. ఆ ముసుగు మాటున దాగిన కామసానీ సోమేశ్వరులకు మాత్రం అది ప్రేమయాత్ర. దారి పొడవునా పలు క్షేత్రాలు దర్శిస్తూ , నదీ స్నానాలు చేస్తూ అదొక ప్రేమయాత్రగా వెళతారేతప్ప అత్యంత సాహసోపేతమైన ప్రయాణమనీ,ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఎదురయ్యే పరిణామాలను గురించిన ఆదుర్దా గానీ మచ్చుకు కూడా కనిపించక పోవడం మనసున్న వారిని కలిచి వెయ్యకుండా ఉండగలదంటారా?

కాంచీపురంలో తాను నెరప బోయే గూఢచర్యం గురించి సోమేశ్వరునికి వివరిస్తూ,

” అభినయం దాని ముసుగు. విజయ గండనికీ,శ్రీధర స్వామికీ మధ్య విభేదాలు కల్పించడం అంకురార్పణ.

విజయ గండ పతనం ఫలప్రాప్తి – ఇదీ నా కార్యక్రమం ” అని చెప్పడం,

“నా కళ్ళూ, కాళ్ళూ నీ చేతులతో కలిసి కాంచీపురాన్ని పతనం చేశాయి”  అనీ,

“శాస్త్రం – శస్త్రం ఒకే చోట దర్శనమిచ్చింది ఆ రాత్రి” అని చెప్పిన తీరు సింధువును బిందువులో ఇమిడ్చగలిగే, బ్రహ్మాండాన్ని పరమాణువులో బంధించగలిగే ఆమెలోని ప్రతిభాపాటవాలను అంచనా వేయడానికి ఇంతకన్నా బలమైన పదాలుంటాయా?

(కళ అనేది కేవలం హృదయాన్ని రంజింపజేసేది మాత్రమే కాదనీ, సామ్రాజ్య విస్తరణలోను కీలకమైన పాత్ర పోషిస్తుందన్న కొత్త విషయాన్ని మొదటిసారిగా తెలుసుకున్నానన్న విషయాన్ని పాఠకులతో పంచుకోవాలనిపించి….)

రుయ్యమ్మ,అన్నయల పెళ్లి జరిగిన కళ్యాణ మంటపం (ఈ మంటపాన్ని సోమేశ్వరుడే చెక్కుతాడు) లోనే తమ పెళ్లి కూడా జరగాలని ఉందని సోమేశ్వరునితో అనడం, అదే పెళ్లిలో విశ్వంభర శివాచార్యుల వారికి నమస్కరించి “మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీ” అనడం పద్మాక్షమ్మ కొండపై నుండి నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా మెట్లు దిగి వెళ్ళిపోవడం వంటి విషయాలు తడి ఉన్న గుండెల్ని  వడి వెట్టకుండా ఉండగలవంటారా?

  కూతురి స్థానంలో ఆస్థాన నర్త కిగా తిరిగి తనను నియమించదలచినట్లు  రాజప్రాసాదం నుండి వచ్చిన శ్రీముఖాన్ని చామకాంబ సున్నితంగా తిరస్కరిస్తుంది. కళ్ళ ముందే కృంగికృషించి పోతున్న కూతురిని చూస్తూ ఆ తల్లి మనసు ఎలా అంగీకరించగలుగుతుంది?

 “ఆస్థాన నర్తకి ప్రథమాభినయమా” అన్న సోమేశ్వరుని మాటలకు ఆమె ఇచ్చిన సమాధానం, తనను పరామర్శించడానికి వచ్చిన రుయ్యమ్మతో జరిపిన వాగ్వాదం,

 “నీ ముందు నాకీ  సామ్రాజ్యమెంత ?” అని సోమేశ్వరునితో అనడం వంటివన్నీ అతని ప్రేమ కంటే విలువైనదేదీ  ఆమెకీ ప్రపంచంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది.

తామిద్దరినీ రుయ్యమ్మే  విడదీసిందన్న విషయం రుయ్యమ్మ నోటి వెంటే విన్న కామసాని

‘ నాకీ ఆస్థాన నర్తకి పదవీ వద్దు. ఈ సామ్రాజ్యమూ వద్దు’ అనుకుని అక్కడ అరక్షణం కూడా నిలబడకుండా గిర్రున వెనక్కి తిరిగి రావడం, అంతఃపురం నుండి పరిచారికలతో కబురు మీద కబురంపినా, “రుద్రమగారి తర్వాత ఇతనే రాజవుతాడా? ఈ ప్రతాపరుద్రునితోనే ఈ సామ్రాజ్యం ఏమైనా అయిపోతుందా? నా నృత్య ప్రదర్శన లేకపోతే?” అంటూ పరిచారికలను తరిమేయడం,  రాజాజ్ఞని కూడా ధిక్కరించిన వైఖరి ప్రేమ పట్ల ఆమెకున్న నిబద్ధతను, అది గెలిపించుకోవడానికి సర్వశక్తులొడ్డి  పోరాడిన తీరును తెలుపుతుంది.

కామసాని అతడినెంత గాఢంగా ప్రేమిస్తుందో, అతను కూడా అంతే గాఢంగా, నిజాయితీగా ఆమెను ప్రేమిస్తాడు. కాంచీపుర యాత్రలో భాగంగా సువర్ణముఖి నదిలో స్నానం చేస్తూ, ” కొంగులు ముడి వేసుకొని చేద్దామా ?” అనడం, తిరుగు ప్రయాణంలో “బాలాజీ దర్శనంతో మన వైవాహిక జీవితం ప్రారంభమవుతుంది” అనడం వంటి మరికొన్ని మాటలను బట్టి ఆ విషయం పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

మనఃస్ఫూర్తిగా ప్రేమిస్తాడేగానీ దానిని పండించుకునే ధైర్యం, స్థైర్యం (ఆమెలో నూటికి నూరుపాళ్ళు ఉంటే) ఇతనిలో మచ్చుకు కూడా కనిపించవు. అవే గనుక ఉండి ఉంటే ఈ కథ విషాదాంతం అయి ఉండేదే కాదు. ఆమెతో మాట మాత్రంగానైనా చెప్పకుండా మందడ వెళ్లిపోవడం, తిరిగి ఏకశిలకు వచ్చాక కూడా ఆమెకు ఏ విధమైన సమాచారం ఆమెకు అందించకపోవడం, వారి ఆఖరి కలయికైన పద్మాక్షమ్మ కొండపైన ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా(బీద పలుకులు పలుకుతాడేతప్ప) ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడం ఇతనిలోని పలాయన వాదానికి నిదర్శనాలు.
కామసానికి ప్రతీకగా యశోదర విగ్రహాన్ని వేయి స్తంభాల గుడిలో చెక్కుతానని అంటాడు. వీరశైవం అధికార మతంగా ఉన్న రాజ్యంలో బౌద్ధ మతపరమైన శిల్పం చెక్కడ మేమిటన్న ఆమె మాటలకు మానవత మతానికి అతీతమైందనీ, అది అన్ని చోట్లా వ్యాపించి ఉంటుందనీ, సర్వసంగ పరిత్యాగి ఐన బుద్ధుడు ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకపోయినప్పటికీ , తాను చేసిన త్యాగానికి లక్ష రెట్ల కీర్తిప్రతిష్టల్ని పొంది, లోకానికి ఆదర్శ పురుషుడైనాడనీ, కానీ యశోదర మానసిక సంఘర్షణను ప్రపంచం గుర్తించలేదనీ, అందుకే ఆమెపై తనకున్న అపారమైన గౌరవానికి సూచనగా చెక్కుతానని అంటాడు.
సిద్ధార్థుడు యశోదరను వదిలి వెళ్ళిన విధంగానే తాను కూడా కామసానిని వదిలి వెళుతున్నానని అతని అంతరంగ భావన అయి ఉండవచ్చు. తనలోని కళా నైపుణ్యం శిల్ప రూపంలో కొన్ని యుగాల పాటు నిలిచి ఉంటుందనీ, కానీ కామసాని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన కొద్ది కాలానికి ఆమెలోని మానసిక సంఘర్షణను, ఆమె అందెల రవళులను ప్రపంచం మరిచిపోతుందని కూడా అతడి భావన అయి ఉండవచ్చు.

పైకి యశోదరను ఉదాహరణగా చూపిస్తూ, మాట్లాడుతున్నాడే గానీ అతను చెప్పేదంతా తన గురించేనని క్షణంలో పసిగట్టిన కామసాని అదే మాట అతనితో అంటుంది కూడా. ఆమె ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా, అతను ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకపోవడంతో, నీళ్లు నిండిన కళ్ళతో నిస్సహాయంగా కొండ దిగి వెళ్ళిపోతుంది.

శిల్పం కోసం ప్రేమను త్యాగం చేస్తానన్నవాడు మరి ఆ శిల్పానికైనా న్యాయం చేశాడా అంటే అదీ లేదు. గోళకీ మఠ నిర్మాణానికై వెళ్ళినప్పటికీ, శిల్పం పై దృష్టి నిలపలేకపోతున్నాడనీ, ఇటు తాను రోగిష్టినయ్యాననీ, ఇద్దరినీ కళాతపస్వులుగా చేయాలన్న రుయ్యమ్మ ఆదర్శ స్వప్నం ఫలించలేదనీ,తన తల్లి ఐ న చామకాంబ తనతో చెప్పిందనీ, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆ విషయం తెలిసి పూర్తిగా కుదేలయ్యాననీ, ఆ తదుపరి సంఘటనలు కలలో జరిగినట్లుగా జ్ఞాపకం ఉన్నాయనీ, ఎందుకో శివాచార్యులవారు వచ్చినట్లు,తనను అభిమంత్రిస్తున్నట్లు ఏదో లీలాగా స్ఫురించిందనీ,ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతడిని చూస్తున్నాననీ చెబుతుంది.

మొత్తం 10 పున్నములుగా జరిగిన ఈ కథలో (శిథిల మంటపంలో) ఇక్కడి వరకే ఆమె మాధవ్ తో చెబుతుంది.

మాధవ్ మానసిక, శారీరక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో ఆయుర్వేద వైద్యులైన వేణుగోపాలాచార్యులవారి సలహా మేరకు వరంగల్ వాస్తవ్యులైన మహామంత్రవేత్త, ఉపాసకులైన ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రి గారిని కలిసి శిథిల మంటపంలో మొదటి నుండి మాధవ్ కె దురవుతున్న అనుభవాలను, అతని ప్రస్తుత పరిస్థితిని వివరించి ఎలాగైనా అతడినీ, అతడి కుటుంబాన్నీ ఈ కష్టం నుండి గట్టెక్కించమని ప్రాధేయపడతాడు రామచంద్ర.

తన ఆధ్యాత్మిక శక్తి అంత దృఢమైనది కాదనీ, ఇదివరకెన్నడూ ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన అనుభవం తనకు లేదనీ మొదట అన్నప్పటికీ, చివరకు అంగీకరిస్తారు జ్వాలాపతిగారు.

రామచంద్ర చెబుతున్న విషయాలన్నిటిని కళ్ళు మూసుకొని పారవశ్యంతో విన్న ఆ మహనీయుడు ఊహాలోకం నుండి వాస్తవానికి వచ్చి, ఈ మాధవరావే ఆనాటి భళ్ళాల సోమేశ్వరుడనీ, కామసాని అతడి ప్రేయసి అనీ, శిథిల మంటపంలో ప్రతి పౌర్ణమికి అతడికి కనిపించి, మాట్లాడుతూ న్నది ఆమె జీవాత్మ అనీ చెబుతాడు.

మరుసటి రోజైన త్రయోదశీ,సోమవారం మాస శివరాత్రి నాడు అఖండం వెలిగించి పూజ ప్రారంభిస్తాననీ, ధ్యానంలో తనకేవైనా కొత్త ఊహలు రావచ్చనీ, ఎల్లుండి వచ్చి కనిపించమని చెప్పి పంపిస్తారు.

వారి మాట ప్రకారం మరుసటి రోజు వెళ్లిన రామచంద్రకు నవ్వుతూ ఎదురొచ్చిన జ్వాలాపతి గారు తమకు ధ్యానంలోస్ఫురించిన విషయాలను రామచంద్రకు చెబుతూ….

మందడ నిర్మాణం పూర్తి చేసి, ఏకశిలకు వచ్చిన సోమేశ్వరుడు మనసు అల్లకల్లోలమవుతుండగా సహస్రమంటపాన్ని చెక్కుతూ ఉంటే, ఒకనాడు చామకాంబ వచ్చి కామసాని ఆఖరి ఘడియల్లో ఉందని తెలుపడంతో వెళ్లి చూస్తాడు. పరిస్థితి ఇలా చేయి దాటి పోతుందని ఊహించని అతను కన్నీరుమున్నీరుగా విలపిస్తూ,మహామంత్రవేత్త, రాజ గురువైన విశ్వంభర శివాచార్యుల వారినాశ్రయించి, తన గుండెలోని వేదనను, ఆమె కళ్ళలోని ఆవేదనను తన ఉలి మలుపుల్లో బిగించి, ఆమెకు ప్రతీకగా తాను చెక్కిన శిల్పం శిథిల మంటపంలో యశోదర విగ్రహమై ఉందనీ, తిరుపతిలో బాలాత్రిపుర సుందరి సమక్షంలో మానసికంగా తమకు వివాహం జరిగిందనీ,ఆమె ఆత్మను అందులో ఆవాహన చేయమని ప్రాధేయపడతాడు.

“స్వామీ! కామసాని నన్ను అమరుణ్ణి చేయడం కోసం తన్ను తాను సర్వసమర్పణ చేసుకున్నది. ఆమెను మీరు అమరస్త్రీగా మార్చండి. నా శిల్పంలో ఆమె ప్రాణ ప్రతిష్ట చేయండి” అని అర్థిస్తాడు.

(జ్వాలాపతిగారు రామచంద్రకు తెలిపిన ఈ విషయంపై నా స్పందనను పాఠకులతో పంచుకోవాలనిపించి……

కామసాని – సోమేశ్వరులకు సంబంధించిన ఈ కథను నేను ఈ ఒక్క పుస్తకంలోనే చదివాను. ‘క్రీడాభిరామం’ అనే నవలలో కూడా కామసాని ప్రస్తావన ఉందన్న విషయం ఎక్కడో విన్నాను గానీ,ఆ పుస్తకాన్ని మాత్రం నేను చదవలేదు.

అతని ఉన్నతిని అతనికంటే ఎక్కువగా ఆమె కోరుకుందే తప్ప, తన ప్రేమను త్యాగం చేయడానికి గానీ,అతడితో బంధాన్ని వదులుకోవడానికి గానీ ఆమె ఎప్పుడు కూడా సిద్ధపడలేదు. నవల మొదటి నుండి చివరి వరకు ఎక్కడ కూడా ఈ విషయం పాఠకులకు కనిపించదు, స్ఫురించదు.మరి సోమేశ్వరుడు శివాచార్యుల వారితో  ‘ అమరుణ్ణి ‘ అనే పదం ఎందుకు వాడారో నాకు ఎంత ఆలోచించినా బోధపడలేదు).

మొదట అంగీకరించని శివాచార్యులవారు ఒకనాటి పూర్ణిమనాడు భద్రకాళి అమ్మవారికి పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మను యశోదర విగ్రహంలో ఆవాహన చేశారనీ, ప్రతిష్ట కాలంలో దుఃఖిస్తూ ఉన్న సోమేశ్వరుడు పూజాదికాలు సక్రమంగా నిర్వహించ లేకపోయాడనీ, ఆ కారణంగా ఆకర్షణ సమయంలో పూజలోనో, మంత్రంలోనో ఏదో లోపం జరిగిందనీ,ఫలితంగా ఆ శిల్పం ఎవరు పిలిస్తే వారికి పలకడం లేదనీ, ప్రతి పౌర్ణమినాటి చంద్రోదయ కాలంలో కేవలం 15 నిమిషాలపాటు సోమేశ్వరునితో మాట్లాడుతుందనీ, ఆ పదిహేను నిమిషాల కాలమే జీవప్రతిష్ట జరిపిన ముహూర్తమై ఉండవచ్చనీ, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇదేవిధంగా బయటకు వస్తూ, అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి ఉండవచ్చనీ ,ఇంత కాలానికిగానీ ఆమె నిరీక్షణ ఫలించ లేదనీ, ఆనాటి సోమేశ్వర రూపానికీ ,ఈ మాధవరావు రూపానికీ సంపూర్ణ సాన్నిహిత్యం ఉండటమే ఆమె అతడిని గుర్తుపట్టడానికి కారణమై ఉండవచ్చనీ,అతనే సోమేశ్వరుడ వ్వడంవల్ల అతడికి మాత్రమే కనిపిస్తూ, అతనితోనే మాట్లాడుతూ ఉందనీ, ఆమె భౌతికంగా మరణించిన అనంతరం కళాభినివేషాన్ని పూర్తిగా కోల్పోయిన సోమేశ్వరుడు ” దేవీ! దేవీ!” అంటూ కామసాని నామస్మరణలో పిచ్చివాడై, నిరంతరం సహస్ర స్తంభ  మంటపంలో తిరుగుతూ, తనువు చాలించి ఉంటాడనీ కామసాని సశేషంగా మిగిల్చిన కథను తన ఉపాసనా బలంతో సంపూర్ణం గావించారు . 

ఆ తర్వాత మాధవ్ నూ,అతని కుటుంబాన్ని కాపాడమంటూ అర్థించిన స్నేహశీలి (రామచంద్ర) ఆవేదనకు స్పందించి శాస్త్రోక్తంగా ఆమె జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తారు జ్వాలాపతి గారు.

( ఇక్కడ నా మనసులో మెదిలిన మరో విషయాన్ని కూడా పాఠకులతో  పంచుకోవాలనిపించి…..

ఎంత గొప్ప శిల్పి ఐనప్పటికీ, అతి సామాన్య మానవుడైన సోమేశ్వరుడు ఆమె తనను వదిలి వెళుతుందనే ఊహను తట్టుకునే శక్తిలేకా,ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయగలిగే పరిజ్ఞానంలేకా ఆవాహన చేయమని అభ్యర్థించి ఉండవచ్చు. కానీ మహా మంత్రవేత్త, తపఃసంపన్నులైన శివాచార్యులవారు ఎలా అంగీకరించగలిగారు? అన్న ప్రశ్న మాత్రం నాలో తలెత్తింది. మరుసటి క్షణంలోనే సాధుసత్పురుషుల ఆలోచనల వెనుక ఏదో అర్థం, వారు వాటిని అమలుపరిచే విధానాల వెనుక మరేదో పరమార్ధం దాగుంటుందని మళ్లీ ఆ (నా) మనసే నాకు హితవును బోధించింది.

రాబోయే కాలంలో ఈ కథ ప్రపంచానికి తెలియాల్సిన అవసరముందని వారు భావించి ఉండవచ్చనీ, అందుకే శిల్పంలో ఆవాహన చేసి ఉండవచ్చనీ నాకనిపించింది.

నవల చదవక ముందు అది చదవాలనీ,దానికిపై వ్యాసం వ్రాయాలని మాత్రమే ఉండేది, కానీ ఎప్పుడైతే నేనా నవల చదివానో,ఆ క్షణం నుండే నాలో ఆ శిల్పాన్ని చూడాలన్న కోరిక  పెరుగసాగింది. వ్యాసం వ్రాయాలన్న ప్రయత్నం మధ్యలోనే ఆగిపోవడం, ఎంత ప్రయత్నించినా ముందుకు సాగకపోవడంతో, ఇక ఉండబట్ట లేక 02/07/ 2024 నాడు నేను, మావారు వరంగల్ కు బయలుదేరాం. నేను శిల్పశాస్త్రం, పురాతత్వశాస్త్రం, చరిత్ర వంటి వాటిలో ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాకపోయినప్పటికీ, ఆ శిల్పం చూసి రావాలనుకోవడానికి కారణం, ప్రత్యక్షంగా చూసి వ్రాస్తే నా రచన ఒకింత బలాన్ని పుంజుకుంటుందనీ, మరికాస్త జీవం పోసుకుని కొంతమందినైనా కదిలించగలుగుతుందేమోనన్న చిన్న ఆశ. ప్రయాణం చేస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకోవడం స్పష్టంగా గమనించాను.

విశాలమైన ఆవరణలో అడుగుపెట్టగానే 3 శివలింగాలు, వాటికి కాస్త దూరంలో పుష్కరిణి, పద్మాకారంలో ఉన్న వేదిక, దానిపై ఆలయ నిర్మాణం (ఈ ఆలయ నిర్మాణమే నాకు వినూత్నంగా కనిపించింది. ఇటువంటి నిర్మాణశైలి నేను ఇది వరకెక్కడా చూడలేదు. బహుశా ఉండి ఉండవచ్చు, కానీ పర్యాటక ప్రదేశాలను చూడటంలో నేను అంత చురుకుగా ఎప్పుడూ లేను, అందుకే నాకలా అనిపించి ఉండవచ్చు) మరోవైపు హనుమంతుడు, నాగదేవతల ప్రతిష్ట కనిపించింది. గుడిలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుని, కాకతీయ సామ్రాజ్యపు ఆలోచనలు తలలో చక్రభ్రమణం చేస్తూ ఉంటే,  గోడలను చేతులతో స్పృశిస్తూ, ఆ విషాదగాథను నెమరేసుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ, నందీశ్వరుని చెంతకు చేరుకొని, ఆవాహన నవలను చేతిలో పట్టుకొని,గుండె దడదడలాడుతూ ఉండగా, నెమ్మదిగా శిథిలమంటపం లోనికి అడుగు పెట్టాను.

800 సంవత్సరాల విషాదాన్ని మోసిన ఆ విగ్రహాన్ని చూడాలన్న తపన నన్ను రోమాంచితం చేస్తూ ఉంది. అంగుళం కూడా వదలకుండా మంటపమంతా కలియజూస్తూ, మధ్య మధ్యలో  పుస్తకాన్ని తిరగేస్తూ, ఒక్కొక్క సంఘటనను సరిచూసుకుంటూ, ఒక్కొక్క అడుగే వేస్తూ, అప్పుడప్పుడు దాని గురించి మా వారితో చర్చిస్తూ, అవసరమైన చోట అతని సలహాలు తీసుకుంటూ, అంగుళం అంగుళం గాలించాను.

ఆ మంటప నిర్మాణమే నాకు సరికొత్తగా అనిపించింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ విధమైన పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, ఎందుకో చాలా విచిత్రంగా అనిపించింది. నవలలో పద్మాకార శిల్పాలు అనే మాట కామసాని నోటి వెంట చాలాసార్లు వస్తుంది. ఈ పద్మాకార శిల్పాలు ఏమిటనే విషయంపై చాలా జాగ్రత్తగా గమనించాను. ప్రధాన ఆలయంలో, శిథిలమంటపంలో  రెండు చోట్లా నాకు పద్మకార చెక్కడాలు కనిపించాయి. ప్రధాన ఆలయంలో కప్పు పైభాగంలో అన్ని పద్మాకారంలో చెక్కిన చక్రాలు కనిపించాయి (బహుశా అవి ఇవే అయి ఉండవచ్చు అనుకున్నాను). శిథిలమంటపంలో 4 వరుసల్లో వరుసకు 6 చొప్పున మొత్తం 24 స్తంభాలు కనిపించాయి. ప్రధాన మంటపానికి నాలుగు వైపులా 4 ఉపమంటపాలు కనిపించాయి. ప్రతి ఉపమంటపానికి నాలుగు వైపులా 11 చొప్పున మొత్తం 44 చిన్న,చిన్న స్తంభాలు కనిపించాయి. కానీ ఎంత వెతికినా నాకు యశోదర శిల్పం జాడ కనిపించలేదు. అప్పుడు నాలో కలిగిన ఆలోచనలనుగానీ,నా గుండెలో రేగిన అలజడినిగానీ కాగితంపై పెట్టాలంటే, నా రచనా శక్తి సరిపోదేమో అనిపించింది. కామసాని మాధవ్ తో మాట్లాడుతూ శిల్పాల చాటుకు  వెళుతుందనీ ,అలా వెళుతూ, వెళుతూ అదృశ్యమవుతుందనీ ఉ టంకించారు. యశోదర శిల్పం మాత్రమే కాదు, ఆ మంటపంలో నాకు ఏ ఒక్క శిల్పమూ కనిపించలేదు. రాతి స్తంభాలపై సన్నటి లతలు, చిన్న, చిన్న దేవతా రూపాలు కనిపించిన మాట వాస్తవమేగానీ, స్తంభాలపైగానీ, స్తంభాల చెంతగానీ నాకు ఎటువంటి విగ్రహాల జాడ కనిపించలేదు. అక్కడ ఉన్నవాళ్లను కొందరిని గైడ్స్ గురించి అడిగితే, గైడ్స్ ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటారని చెప్పారు.నలుగురైదుగురు భక్తులను అడిగినప్పటికీ , ఏ విధమైన సమాచారం లభించలేదు. ఆలయ అర్చకులను సంప్రదించమని ఒకరిద్దరు సలహా ఇచ్చారుగానీ నాకెందుకో సమాచారం దొరుకుతుందన్న నమ్మకం కలుగక మౌనంగా ఉండిపోయాను. చివరి ప్రయత్నం గా గోడకు చేరగిలబడి  సెల్ ఫోన్ చూసుకుంటున్న ఒక యువకుడి దగ్గరకు వెళ్లి,విషయం తెలియజేశాను. నా చేతిలో ఉన్న నవలను చూపించి కాస్త వివరించమని అభ్యర్థించాను. దానికతడు తాను చరిత్ర తెలిసిన వ్యక్తిని గానని , ఈ గుడికి సంబంధించిన విషయాలు కూడా తనకేమీ తెలియవని, కాకపోతే ఇక్కడ తానొక డాన్సర్ విగ్రహాన్ని చూశానని, దాన్ని (ఆ శిల్పాన్ని) పగులగొట్టి అటువైపుగా పడేశారని మంటపానికి కుడివైపున చేతితో చూపిస్తూ , వెళ్లి చూడమని సలహా ఇచ్చాడు. ఆ మాత్రం సమాచారమిచ్చిన ఆ యువకుడికి కృతజ్ఞతలు తెలిపి, నవలను చేతిలో పట్టుకొని పరుగు లాంటి నడకతో ఇద్దరం ఆశగా వెళ్ళాం. అక్కడ పగిలిపోయిన శిలా ప్రతిమలు కుప్పగా పడవేసి ఉన్నాయి. అందులో ఆత్రుతగా వెతుకుతూనే, అక్కడ ఉద్యోగ నిర్వహణలో ఉన్న సఫాయి కార్మికులను అడిగితే ఆ విషయాలేవీ తమకు తెలియవని చెప్పారు. కాకపోతే వారిలో ఒక తను నా చేతిలోని నవల ముఖచిత్రాన్ని చూసి , దాన్ని చేతిలోకి తీసుకొని ఇవి రామప్ప దేవాలయంపై చెక్కిన రాగిణి, నాగిని విగ్రహాలనీ, మేమడిగే సమాచారం అక్కడ దొరుకుతుందనీ, చెప్పడంతో ఇక అంతకంటే ఎక్కువ అతనిని అడగడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని మౌనం వహించి, మళ్లీ వెదకడం మొదలు పెట్టగా, అందులో ఒక స్త్రీ విగ్రహం నా కంట పడనే పడింది.

దాన్ని నాకున్న అతి స్వల్ప పరిజ్ఞానంతో నఖశిఖ పర్యంతం పరీక్షించాను. ఇది నర్తకి శిల్పమే అయి ఉంటుందా ? అని కళ్లింతలు  చేసుకుని చూశాను. అత్యంత బాధాకరమైన విషయమేమంటే ఆ శిల్పం రెండు ముక్కలుగా పగిలి, మోకాళ్ళ కింది నుండి వేరు చేయబడి ఉంది. కాళ్లకు   నర్తకీమణులు  ధరించే  అందెలు ఉన్నాయా ?లేదా? అని గమనించాను. అందెలు ధరించిన నాజూకైన కాళ్లతో అది ఆ శిల్పమేనన్న నిర్ణయానికి వచ్చాను. కింది భాగానికి సరిపోలే మరో శిల్ప శకలానికై మళ్లీ వెదుకులాట ప్రారంభించాను. చక్కని అవయవ సౌష్టవంతో నృత్య భంగిమలో ఉన్న మరో శకలం కనిపించింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే తలభాగం మొండెం నుండి వేరైతే పడలేదుగానీ, ఒక వర్తులాకార ఫలకంపై చెక్కిన ముఖ భాగం (తల భాగానికి చెందిన వర్తులాకార ఫలకమేదైతే ఉందో అది మొండానికి అతుక్కునే ఉంది కానీ దానిపై చెక్కిన ముఖభాగం లేదు. పాఠకులకు విషయం స్పష్టంగా అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ఇంత  వివరంగా వ్రాస్తున్నాను) మాత్రం కనిపించలేదు.

ఆ శిల్పం లోని ముద్రనూ, నిలుచున్న భంగిమనూ (ఇంటికి వచ్చాక కాస్త నాట్యశాస్త్రంతో పరిచయం ఉన్న వారిని అన్ని వివరిస్తూ అడిగితే అది ‘ కపిథ’ ముద్ర అని చెప్పడంతో నా ప్రయత్నం మరింత బలపడిందనిపించింది) జాగ్రత్తగా గమనించాను. మోకాళ్ళపై వరకు  ధరింపజేసిన ఆ వస్త్రాలను(ఆ మరుసటి రోజు గూగుల్లో నర్తకీమణులు  ధరించే వస్త్రాలు అని వెదికితే దానిని ‘ చల్లడం ‘ లేదా  ‘చల్లాడం  ‘ అని అంటారని తెలిసింది), ఆభరణాలను జాగ్రత్తగా పరిశీలించాను. ఆ రెండు భాగాలు ఆ శిల్పానికి సంబంధించినవే అయి ఉండవచ్చని నా మనసు చెబుతూనే ఉంది. ఆ  శిల్ప శకలాలను చూడగానే నా గుండె విలవిల్లాడిపోయింది. కామసాని కాళ్ళను ఎవరైనా నరికితే సోమేశ్వరుడు ఎంతగా విలవిల్లాడుతాడో నా మనసు కూడా అంతగా  విలవిల్లాడింది. చేతిలోని  కామసాని – సోమేశ్వరుల ప్రణయ కావ్యం (ఆవాహన నవల) పుటలన్నీ తెగిపోయి గాల్లో ఎగురుతూ వేయి స్తంభాల గుడి నిండా చెల్లాచెదురై పడిపోతున్నట్టు, వాటిని పట్టుకోవడానికి నేను ఆలయమంతా పరుగులు తీస్తున్నట్టు ఏవేవో భావ చిత్రాలు.

మనసు అల్లకల్లోలమవుతుండగా భారంగా పుష్కరిణి వైపు  అడుగులు వేసిన నాకు దాన్నిండా తాబేళ్లు  కనిపించాయి. తాబేలు జీవితకాలం సుదీర్ఘమైంది కదా , వీరి ప్రణయానికివి ప్రత్యక్ష సాక్షులై ఉంటాయన్న నా ఆలోచన నాకే నవ్వు తెప్పించింది. ఆ శిల్ప శకలాలను చూసి మొదలు నరికిన చెట్టులా చతికిలబడిన నన్ను చూసి మావారు  “పర్వతాలే కాలగర్భంలో కలిసిపోగా లేనిది ఒక శిల్పం కోసం అంతగా బాధపడటం అవసరమా ? ” అన్నారు. వారన్నది నిజమే, నేను కాదనడం లేదు, కానీ అది మామూలు శిల్పమా?! కొన్ని శతాబ్దాల గుండె బరువును మోసిన శిల్పం. కొన్ని శతాబ్దాల నిరీక్షణకు వేదికైన శిల్పం. పగిలిన గుండెను తనలో పొదువుకున్న శిల్పం. పగిలిన మరో గుండె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే మౌనసాక్షిగా మిగిలిన శిల్పం. స్పందించే విధానంలో గుండె గుండెకూ తేడా ఉంటుంది. పైగా అది నా పసితనంలో (అప్పటి) నాలో నాటుకున్న విత్తనం. మొక్కై, మానై ,శాఖోపశాఖలుగా  నా హృదయక్షేత్రంలో విస్తరించిన వటవృక్షం. దాన్ని నేనెలా తేలిగా తీసుకోగలను ? అది నాకెలా సాధ్యం? అంత తేలిగ్గా తీసుకొని ఉంటే నాలోంచి ఈ రచన వెలువడేది కాదు సరికదా, ఒక్క అక్షరం కూడా నా కలం లోంచి వచ్చి ఉండేదే కాదు. మనసు స్పందించిన చోటే భావాల ఊట. ఎద కరిగిన చోటే కన్నీటి పాట. నెమ్మదిగా అక్కడి నుండి బయటకు వచ్చి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని నా రచనను నిర్విఘ్నంగా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ప్రార్థించి వెనక్కి మళ్ళాం.

తిరుగు ప్రయాణంలో పగిలిపోయిన ఆ శిలామూర్తి ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఉలితో పగిలిన శిలలా అయింది నా మనసు. ఆ పగుళ్లలోంచి కామసానీ, సోమేశ్వరుల ప్రణయ కథ ఒక్కొక్క అంకం నా మనోఫలకంపై కదలాడుతూ ఉంది. సన్నటి నీటి తెర నా కళ్ళలో చిప్పిలుతూనే ఉంది.

ఎన్ని ప్రేమ కథలు విఫలం కావు? మరీ ఇంతగా స్పందించడం అవసరమా? అన్న ఆలోచన కొందరిలో తలెత్తవచ్చు, అంత ఉన్నత స్థాయిలోని వ్యక్తులను చూసి అంతగా బాధ పడటం ఏమిటి ? అన్న ఆలోచన కూడా మరి కొందరిలో రావచ్చు. ఇక్కడ స్థాయి, సుఖాంతం, విషాదాంతం అని కాదు.నా బాధకు నాకు 3 కారణాలు కనిపించాయి 1. జాలి 2. జాలి 3. జాలి  800 సంవత్సరాలు ఆ జీవాత్మ అనుభవించిన గుండెల్ని పీల్చి పిప్పి చేసే దుర్భరమైన వేదన. నా వంటి ఎంతోమందిని కదిలించిన యాతన. అక్షరాల వెంట పరుగులు తీస్తూ ఉన్నప్పుడు మా నాన్న కళ్ళలోని తడి, మా అమ్మ కళ్ళ నుండి జలజలా రాలిన కన్నీళ్లు నాకిప్పటికీ గుర్తే.తడి ఉన్న ప్రతి గుండెను ఈ కథ కన్నీరు పెట్టించింది. దానికి నా కళ్ళతో నేను చూసిన ఎంతోమంది నాకు సాక్ష్యం. దానికి నేను ప్రత్యేకమూ కాదు, మినహాయింపూ కాదు.

ప్రేమ కథలు కొన్ని సుఖాంతమౌ వుతాయి, కొన్ని విషాదాంత మౌతాయి. కానీ మనిషి బ్రతికి ఉన్నంతవరకే ఆ మనుషులను అవి స్పందింపజేస్తాయి. ఒక్కసారి ఆత్మ దేహాన్ని వదిలిపెడితే గనుక అవి (ఆ భావాలు) పంచభూతాల్లో కలిసిపోతాయి. కానీ ఈ కథ వాటన్నిటికీ అతీతమైనది.

ఒక ఆత్మను శిలలో నిక్షిప్తం చేయడం, ఆ దేహం నిస్తేజమై, కట్టె కాలిపోవడం, ఆత్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం, ఆ ఎదురుచూపు ఎంతకూ ఫలించక, ఆ మనసు నలిగిపోవడం, అటు ఆత్మకు మోక్షంలేకా,ఇటు ఎదురుచూపుకు అంతంలేకా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడిన ఆ యాతనే నా ఈ స్పందనకు కారణం.

నా దృష్టిలో అది శిథిల మంటపం  కాదు. కామసానీ, సోమేశ్వరుల ప్రేమసామ్రాజ్యం. మోహానికీ, ప్రేమకూ  హస్తిమశకాంతరం ఉంది. భూమికీ,ఆకాశానికీ మధ్య ఉన్నంత భేదం ఉంది. అది మోహమే ఐతే నా గుండె లోతుల్లోంచి ఈ భావాల వెల్లువ ఉప్పొంగే కాదు. ఆది కాంక్షే ఐతే నా కలం లోంచి ఒక్క సిరాచుక్క కూడా అక్షర రూపు దాల్చి ఉండేదే కాదు. అది రెండు మధుధారలతో నిండిన అమృతభాండం. రెండు హృదయాల నిర్మల ప్రేమను ఆవాహన చేసిన ప్రణయకలశం. సోమేశ్వరుడు మాధవ్ గా పునర్జన్మ నెత్తి వచ్చినట్లుగానే, కామసానీ, సోమేశ్వరులు పునర్జన్మనెత్తాలి. ఆమె కాలి మువ్వల ఘల్లుఘల్లుల్లో  ఆలయ ప్రాంగణం (వేయి స్తంభాల గుడి) సందడించాలి. వారిద్దరూ జంట పావురాలై జావళీలు పాడాలి. మూడు పువ్వులు ఆరు కాయలుగా పిల్లాపాపలతో వర్ధిల్లాలి. వారి నవ్వులన్నీ పువ్వులై ఆ రుద్రేశ్వరునికి పుష్పయాగం చేయాలి.

ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు

పుత్రపౌత్రాభివృద్దిరస్తు

సమస్త సన్మంగళాని భవంతు

            స్వస్తి

(విజ్ఞప్తి:   ఆ శిల్ప శకలాలు యశోదర విగ్రహానికి సంబంధించినవే అని నేను ఇప్పుడు కూడా అనటం లేదు, బహుశా అయి ఉండవచ్చు అని మాత్రమే అంటున్నాను. విషయ పరిజ్ఞానం లేనప్పుడు  నొక్కి చెప్పడం సరైనది కాదని నాకు తెలుసు.  ఒకవేళ ఆ శిల్పానివే అయితే, మన చారిత్రక సంపదైన, కాకతీయుల కళావైభవ చిహ్నమైన ఆ శిల్పాన్ని ఏ కాస్త అవకాశం ఉన్నా, పునర్నిర్మించి, యథాస్థానంలో ప్రతిష్టించి,ముందు తరాలకు అపురూపమైన కానుకగా అందించాలని నేను అన్ని రంగాల ప్రముఖులకు పేరుపేరునా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను).

July 30, 2025 41 comments
1 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

కథాపంచకం

by Dr. Lakshmanacharyulu M July 30, 2025
written by Dr. Lakshmanacharyulu M

1. పోనీ ! పోనీ !

కోల్‌ కతా ఓ మహానగరం. పెద్ద సంఖ్యలో.. చాలా పెద్ద సంఖ్యలో జనం అక్కడ నివసిస్తూ ఉంటారు. అలాగే అక్కడికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. లక్షల మంది బస్సులు, స్టీమర్ల, హ్రంలు, ట్రైయిన్లు, ఇలా ఏ వాహనం దొరికితే దానిలో, ఆఫీసులకి, ఇతర పనులకి వెళ్తూ – వస్తూ ఉంటారు. రవాణా సాధనాలన్నీ ఎప్పుడూ క్రిక్కిరిసిపోయి ఉంటాయి.

రామం, సుధీర్‌, జేమ్స్‌, అయూబ్‌ – నలుగురూ వేర్వేరు ఆఫీసుల్లో పనులు చేస్తూ, రోజూ ప్రొద్దున్నే వెళ్ళడం, తిరిగి ఇళ్ళకు రావడం చేస్తూ ఉంటారు. పరస్పరం పరిచయాలైతే లేవు, కాని ఇవ్వాళైతే నలుగురూ ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నారు.

బస్సు ప్రయాణీకుల్తో కిటకిటలాడుతోంది. సూదిమొనంత ఖాళీ కూడా లేదు. రామం, సుధీర్‌, అయితే ఎలాగో అలా త్రోసుకుంటూ లోపలికి వెళ్ళ గలిగారు. జేమ్స్‌ కొంచెం కష్టపడితే ఇక లోపలికి వచ్చేస్తాడు కాని పాపం ! అయూబ్‌ బస్సు ద్వారం దగ్గరే కడ్డీ పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు.

ఇంతలో బస్సు కదిలింది. రోడ్డు మీద జనం బస్సుల్లో జనం. ప్రజల మానసిక థ కూడా దిగజారి పోయింది. ఎవరూ ఎవర్ని లెక్క చేయరు. ఎవరి స్వార్థం వారిదే. ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు రామం.

అంతే ! ధడేలన్న శబ్దం. ఏదో పడిపోయినట్టయింది. ఎవరిదో భయం నిండిన ‘కేక’ హృదయ విదారకంగా వినబడింది. బహుశా అయూబ్‌ పడిపోయినట్టున్నాడు. అలా క్రింద రోడ్డు మీద పడిపోయిన అయూబ్‌ మీది నుండి – వెనకాలే వచ్చిన ఒక వాహనం, వేగం నియంత్రణ కోల్పోయినందున, వెళ్ళిపోయింది. అయినా….

రామం, సుధీర్‌, జేమ్స్‌ మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినబడుతున్నాయ్‌…

అరే ! భయ్యా ! మా ఆఫీసుకు లేటయి పోతోంది.

పద, పద !! పోనీ ! పోనీ !! బస్సు పోనీ !!

2. మీ గొప్ప కోసమని…

ఒకప్పుడు గురు శిష్యులిద్దరూ ఒక ఊర్లో ఉండేవారు. ఇద్దరూ ప్రతిరోజూ జ్ఞాన సంబంధమైన  చర్చ జరుపుతూ ఉండేవారు.

ఒకరోజున గురువుగారు శిష్యుణ్ణి పిలిచి – ”ఇవాళ నేను ఓ గంటసేపు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా.. నువ్వు జాగ్రత్తగా విని విశ్లేషిస్తూ, నేనేం చెప్పానో సరిగ్గా చెప్పాలి” అని అన్నాడు.

ఓ గంటసేపు గురువుగారు తన గురించి చెప్పాక, విశ్లేషించమని కోరగా, ”అయ్యా ! మీరు ఎక్కువగా మీ గురించే మీరు పొగుడుకున్నారు. ఆత్మస్తుతి ఎక్కువైంది. మీకు ”నేను” అనేది ఎంత ఇష్టమని తేలిందంటే, సుమారుగా ప్రతి వాక్యంలోనూ దాన్ని ఉపయోగించారు. ఇక ఇతరుల్ని చాలాసేపు నిందించారు, విమర్శించారు. మీకు మీలోని మంచితనం మాత్రమే కనిపించగా, ఇతరుల్లోని లోటుపాట్లు, తప్పులు మాత్రం మీకు కనిపించాయి”.

”మీ వ్యక్తిగత జీవితం గురించి విన్నాక ”మీరు మీ కీర్తి కోసం, మీ గొప్పత కోసం ఇతరుల్ని విమర్శకు గురిచేస్తూ, వారిలో ఏవో తప్పులు వెదుకుతూ ఉంటారని నాకు అర్థమైంది” అని అన్నాడా శిష్య పరమాణువు.

3. స్వర్ణ యుగం

భూమ్మీద ఒక్కో మతానికి చెందిన ఒక్కో వ్యక్తి మిగిలాడు. పరస్పరం పోట్లాడుకున్న దాని ఫలితంగా ఇలా జరిగింది. ఇప్పుడు వారి కళ్ళల్లో ఈర్ష ్యకి బదులు భయం చోటు చేసుకుంది. తమలో తాము పోట్లాడుకుని, పోట్లాడుకుని మనుషుల ఎత్తు బాగా తగ్గిపోగా, చుట్టూ ఉన్న జంతువుల ఎత్తు బాగా పెరిగిపోయింది. ఆ పశువులన్నీ మనుషుల్ని చుట్టుముట్టాయి.

”ఇక మనం బ్రతికి బట్ట కట్టలేం. ఈ జంతువులు మనల్ని తినేస్తాయి” అని అన్నాడో మనిషి.

మరొకడు కొంచెం తెలివిగలవాడు ”అసలు ఇన్ని శతాబ్దాలుగా మనిషి ఎలా తప్పించుకున్నాడో గదా అని ఆలోచిస్తే, మనుషుల్లోని ఐకమత్యమే దీనికి కారణమని తెలుస్తుంది. కానీ… మతం పేర, కలహాలు ప్రారంభం అయినప్పట్నించే మనిషి పరిస్థితి ఇలా అయిపోయింది” అని అన్నాడు.

”సరే ! మనం ఇప్పుడేం చేద్దాం?” అన్నాడు మూడోవాడు.

”రండి! మళ్ళీ అందరం ఏకమౌదాం. ఐకమత్యమే బలం. అప్పుడు బహుశా మనమే మళ్ళీ గెలుస్తాం” అన్నాడు నాలుగోవాడు.

పశువులు చాలా తెలివి గలవి. మనుష్యులంతా ఒకటైతే మనం వారిముందు నిలబడలేం. ఓడిపోతాం అని అనుకుని మనుష్యుల చుట్టూ ఉన్న కట్టడిని తొలగించి వారికి స్వేచ్ఛనిచ్చాయి.

అంతే ! భూమ్మీద కేవలం మానవతా మతం మాత్రమే నిలబడింది. నవనిర్మాణం, మానవ ప్రగతికి సంబంధించిన స్వర్ణయుగం మరల తిరిగొచ్చింది.

4. సంతాప సభ

స్కూల్లో ఒక విచిత్రమైన ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. పిల్లలంతా లైన్‌లలో నిలబడి మౌనంగా ఉన్నారు. ఇంతలో ఓ కారు హారన్‌ శబ్దం వారి నిశ్శబ్దానికి భంగం కలిగించింది.

గోపీ ఇవాళ మళ్ళీ ఆలస్యంగా వచ్చాడు. రాగానే కారు దిగి భయం భయంగా వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. మెల్లగా తన ప్రక్క ఉన్న బాలుని అడిగాడు.

”ఏమైంది?”

”కనబట్టంలా? సంతాప సభ నడుస్తోంది” అని గుసగుసలాడాడు బాలు.

”ఎవరు పోయార్రా?”

”మన రామయ్య మాస్టారు నిన్న రాత్రే కాలం చేసారట”. సంతాప సభ ముగిసింది. ”ఇవాళ స్కూల్‌ మూసేస్తున్నాం” అని ప్రకటించారు హెడ్మాస్టర్‌ గారు.

గోపీకి పట్టలేనంత ఆనందం కలిగింది. బాలు భుజం మీద చెయ్యేసి నవ్వుతూ – ”భలే ! స్కూల్‌ బంద్‌ ! సరేగాని మెట్రోలో క్రొత్త సినిమా విడుదలైందిరా ! పోదామా !

బాలు నిశ్చేష్టుడై అలా చూస్తూ ఉండిపోయాడు.

5. పలాయనం

డాక్టర్‌ సారథి తీరిక అస్సలులేని మనిషి. ఇవాళెందుకో బాగా అలసిపోయాడు. రేయింబవళ్ళూ రోగులు, పరీక్షలు, చికిత్స… ఇదే గొడవ. అసలైతే ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉంటాడు. మంచిగానే రోగులతో ప్రవర్తిస్తాడు. ఇవాళ… విసిగిపోయాడో ఏమో, ఎటైనా దూరంగా, వెళ్ళి ఏకాంతంగా ఉండాలని అనుకున్నాడు.

అప్పుడే ఆయనకి తన మిత్రుడు సుందరం గుర్తుకొచ్చాడు. స్కూల్‌ రోజుల నుండి ఫ్రెండ్‌. ఎన్నిసార్లు ఇంటికి రమ్మని ఆహ్వానించినా సారథి వెళ్ళలేక పోయాడు. ఇవాళ ఎలాగైనా సరే, వెళ్ళి ఓ 2-3 గంటలు ఆయనతో గడపాలని భావించాడు. కాదు… గట్టిగా అనుకున్నాడు. సారథి ఓ పది నిముషాల తర్వాత సుందరం గారింటి ముందు నిలబడి, కాలింగ్‌ బెల్‌ నొక్కాడు. మొహంలో ఆనందం. ఇక్కడ తననెవరూ… ఏ రోగీ… వచ్చి విసిగించదు” అని అనుకున్నాడు.

ఇంతలో తలుపు తెరుచుకుంది. శ్రీమతి సుందరం డాక్టర్‌ సారథిని చూసి, గుర్తుపట్టి నమస్కరించింది.

అరె ! మీరు రావడం చాలా మంచిదైంది. మీ స్నేహితుడి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. నిన్నట్నించి బాగా జ్వరం ఉంది. రండి.. రండి…” అన్నదావిడ.

July 30, 2025 37 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాంప్రదాయక చిత్రకళా పునరుద్ధరణ:

by Anand gadapa Dr. Nirmala July 30, 2025
written by Anand gadapa Dr. Nirmala


 
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు శతాబ్ది అవలోకనం

 
డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు బహుముఖ ప్రతిభాశాలియైన చిత్రకారులు. జనవరి 2024 నుండి జనవరి 2025 వరకు జరుగుతున్న వారి శతాబ్ది వేడుకల సమయంలో శేషగిరిరావు గారి జీవితాన్నీ, వారు కొనసాగించిన చిత్రకళావారసత్వాన్నీ మరొకసారి స్మరించుకుందాం. పురాణగాథల సాంప్రదాయక చిత్రకారులుగా శేషగిరిరావు గారు ప్రసిద్ధులు. కానీ విభిన్న కళారూపాల గురించీ, చిత్రకళాశిక్షణ గురించీ,  సాంస్కృతిక పరిరక్షణ గురించీ, చిత్రకళాచరిత్ర గురించీ వారు చేసిన విశిష్టమైన కృషి మరింత ప్రాచుర్యం లోకి రావలసి ఉంది. తెలుగు తోపాటు ఆంగ్లం లోనూ వ్యాసరచన చేపట్టి ఉంటే శేషగిరిరావు గారి కీర్తి మరింత ఇనుమడించి ఉండేది. చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌ లో ప్రదర్శింపబడుతున్న వారి అరుదైన స్కెచ్‌లు, ఆయిల్ పెయింటింగ్స్, ఆక్వాటెక్స్చర్ పెయింటింగ్స్, చిత్రకళపై వారు రాసిన వ్యాసాలూ, పుస్తకాలూ ద్వారా శేషగిరిరావు గారి సమగ్రరూపం ఆవిష్కృతమవుతుందని ఆశించవచ్చు.
 
1924 జనవరి 27న తెలంగాణలోని మహబూబాబాదు జిల్లా పెనుగొండలో జన్మించిన కొండపల్లి శేషగిరి రావు గారు వరంగల్‌ లోని రామప్ప, వేయిస్తంభాల గుడి మొదలైన దేవాలయాల శిల్పకళా దర్శనం ద్వారా బాల్యదశ లోనే ప్రేరణ పొందారు. ఈ సంక్లిష్టమైన శిల్పాలు వారిలో కళాభిరుచిని మేల్కొలిపి, దక్షిణ భారత సాంస్కృతిక సంపదను పరిరక్షించటమే జీవితలక్ష్యమయ్యేలా పురిగొల్పాయి. అడవి బాపిరాజు, అంత్యాకుల పైడిరాజు, హెచ్.వి. రామగోపాల్ వంటి చిత్రకారులు లేపాక్షి మొదలైన శిల్పాల్లో దేశీయమూలాలను అన్వేషించుకుంటున్న సమయంలో శేషగిరిరావు గారు తెలంగాణ ప్రాచీన శిల్పకళాసంపదలోని కొత్త కోణాలను దర్శించటంలో నిమగ్నమయ్యారు.
 
కాకతీయ శిల్పకళాదృష్టినీ, తన సహజశైలినీ సమ్మిశ్రమం చేసుకుంటూ శేషగిరిరావు గారు ఒక విభిన్నమైన, ప్రాచీనతా సంకేతమైన, తనదైన చిత్రకళారీతిని ఏర్పరచుకున్నారు. మహాకవుల కలాల నుండి వారి కవితానుడికారం ప్రవహించినట్లే, శేషగిరిరావు గారి కుంచె నుండి ‘శేషగిరీయం’ వారి చిత్రరచనా నుడికారంగా జాలువారింది.  మరుగునపడ్డ స్థానిక సంస్కృతిని వెలికితీయటంలో వారికి ఉత్తేజం; ఆ సంసృతిలో  దృశ్యమానమయ్యే వైశిష్ట్యాన్ని కనుగొనటం వారికి ఆనందం. ఆయన చిత్రాలలోని భంగిమలు, హావభావాలు కాకతీయశిల్పం గురించి వారికి గల లోతైన అవగాహనను  ప్రతిఫలిస్తాయి.  శిల్పానుగుణమైన వారి చిత్రాల్లో ప్రాచ్యమైన తాత్వికతా, ఆధ్యాత్మికతా కలగలిసిన ఏవో అతీతభావనలు కనిపిస్తాయి.
 
ఆయన రచించిన “రూపరుచి” పుస్తకం భారతీయ కళా తత్త్వాలను వివరిస్తూ, ఉత్తర, దక్షిణ భిత్తి చిత్రాలను పోల్చి విశ్లేషిస్తుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర చారిత్రకస్థలాల్లోని  హంపీ, లేపాక్షి, కాకతీయ శిల్పకళావైభవం శేషగిరిరావు గారి సురేఖ – I, సురేఖ – II గ్రంథాల్లో ప్రతింబింబిస్తుంది. ఈ గ్రంథాలు చరిత్రను నిక్షిప్తం చేయటమే కాకుండా సంప్రదాయాన్ని ఆధునికకోణం నుండి చూపిస్తాయి కూడా.  
 
నకాషీ పటచిత్రకళను (Nakashi Scroll Painting) పునరావిష్కరించడంలో శేషగిరిరావు గారి కృషి చారిత్రాత్మకమైనది. తెలంగాణకు ప్రత్యేకమైన కుల పురాణ ప్రదర్శనా పరంపరతో ముడివడి ఉన్న కళ నకాషీ. ఆయన చేసిన పరిశోధన వలనా, ప్రచారం వలనా కనుమరుగవుతున్న ఈ కళారూపం పునరుజ్జీవితమైంది. తద్వారా ఆయనకు సాంస్కృతిక పరిరక్షకుడిగా గుర్తింపు వచ్చింది.
 
జానపదకళలను సంరక్షించడంలో శేషగిరిరావు గారు చేసిన ఇటువంటి తొలి ప్రయత్నాలే  తెలంగాణ కళా వారసత్వంపై వారి భవిష్యత్ అధ్యయనాలకు పునాదిరాళ్ళయ్యాయి. పరిశోధనపై లోతైన ఆసక్తితో వారు చేసిన అనేక రచనల ద్వారా ఆంధ్ర, తెలంగాణా చారిత్రక పరిణామాలెన్నో వెలుగులోకి వచ్చాయి. ఈ రచనలు కొన్ని మాత్రమే ఆంగ్లంలో లభ్యమవుతూ, ప్రధానంగా తెలుగు భాషలోనే ఉండటం వలన, ఇతర భాషల పాఠకులకూ పండితులకూ చేరువ కాలేకపోయాయి.
 
పాఠశాల స్థాయిలో దీన్‌దయాళ్ నాయుడు గారూ, తరువాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హైదరాబాద్‌ లో సుకుమార్ దేవ్‌స్కర్ గారూ శేషగిరిరావు గారికి తొలిగురువులూ, మార్గదర్శకులూ.  తదుపరి మెహదీ నవాబ్ జంగ్ బహదూర్ గారి ఆశ్రయంలో, పర్యవేక్షణలో తన కళను తీర్చిదిద్దుకున్నారు. హైదరాబాద్‌లో మొహమ్మద్ జలాలుద్దీన్ గారి ఆధ్వర్యంలో వాష్ పెయింటింగ్ సాంకేతికతలు నేర్చుకున్న ఆయన, తరువాత శాంతినికేతన్‌లో నందలాల్ బోస్ వద్ద శిక్షణ పొందారు. ఇందరి శిష్యరికంలో ఆయన చిత్రకళలో పరిపూర్ణత సాధించారు. ప్రాచ్య తత్వశాస్త్రాలు పునాదులైన వారి బోధనలు శేషగిరిరావు గారి కళాప్రస్థానాన్ని అతిగాఢంగా ప్రభావితం చేశాయి. ప్రాదేశిక అస్తిత్వమూ, లోకప్రియత్వమూ ఒక ప్రత్యేకమైన మిశ్రణంగా రూపొంది వారి కళాత్మక హృదయంలో ఇంకిపోయింది. ఈ మిశ్రణ కారణంగానే శేషగిరిరావు గారి కొన్ని లాండ్‌స్కేప్స్ లో అతిప్రాచ్య  శైలి కనిపిస్తే. మరికొన్ని కాన్వాస్‌లపై జాతీయ, ప్రాంతీయ నిర్బంధనలేవీ లేని సహజత్వం ప్రతిబింబిస్తుంది. ఈ రెండవ శైలి దేవీప్రసాద్ రాయ్ చౌదరి గారి ప్రభావం కావచ్చు.
 
చిత్రకళా కౌశలాన్ని పెంపొందించటం పట్ల ఉన్న అభిరుచి వలన శేషగిరిరావు గారు సుదీర్ఘకాలంగా  జేఎన్‌టీయూ కళాశాలలో ఆర్ట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్థమాన కళాకారులైన  విద్యార్థులకు సంప్రదాయాన్నీ, సృజనాత్మకతనూ బోధించి  రెండిటినీ స్వీకరించేలా  ప్రోత్సహించారు. శేషగిరిరావు గారి చిత్రకళా వైదుష్యం తరగతి గదులకే పరిమితం కాలేదు.  కళా, సౌందర్యశాస్త్రాల గురించి వారు చేసిన  రచనలు అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ప్రాచ్యమైన శైలీ, ప్రాంతీయమైన ప్రజాజీవితమూ శేషగిరిరావు గారి కుంచె నుండి కలగలిసి ప్రవహించి ఆయిల్ పెయింటింగ్స్ గానూ,  వాల్ మూరల్స్ గానూ, ఆక్వా టెక్స్చర్ పెయింటింగ్స్ గానూ అందమైన చిత్రాలుగా ఘనీభవించాయి.
 
చిత్రకళా ప్రపంచంలో ప్రోగ్రెసివ్ వాదులు రివైవలిస్టు కళనూ, ఫార్మలిజం రూపంలో పాశ్చాత్య ఆధునిక చిత్రకళారూపాలు భారతీయ కళనూ కబళించటం గమనించారు శేషగిరిరావు గారు. అయితే నిజమైన ఆధునికతనూ, జాతీయతనూ ఈ నూతన కళారీతులు సమర్థవంతంగా ప్రతిబింబించలేకపోయాయని  అభిప్రాయపడుతూ అదే విషయాన్ని తన వ్యాసాల్లో ప్రకటించారు. బహుశా ఇటువంటి భావనల వల్లనేమో ఆయన ఆనాటి  నూతన విచారధారకూ, సౌందర్యదృక్పథానికీ  దూరంగా ఉండిపోయినట్లు కనిపిస్తారు. అయితే, ఆయన వ్యాసాలు ఆ కాలంలోని సామాజిక పరిస్థితులనూ, హైదరాబాద్ స్కూల్ చరిత్రనూ, కళాకారుల జీవితాలనూ, పూటగడవని వారి జీవన పోరాటాలనూ వివరిస్తాయి.
 
పరిశోధనాత్మకమైన శేషగిరిరావుగారికి నాటి ప్రసిద్ధ కవులైన వానమామలై వరదాచార్యులు, దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి మొదలైనవారితోనూ, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి సామ్యవాదులతోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. వారి భావజాలాలూ, ఆదర్శాలూ శేషగిరిరావు గారి చిత్రాల్లో, రచనల్లో, జీవనశైలిలో ప్రస్ఫుటంగానే ప్రతిబింబించాయి. శేషగిరిరావు గారి ‘హరిజనోద్యమం’ పెయింటింగ్ ఇటువంటి ఆదర్శాల ప్రభావంతో సృష్టించబడిందే. ఆనాటి అమానుషమైన సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకంగా సున్నితమనస్కుడైన ఒక కళాకారుడి బలమైన ప్రకటనగా ఈ చిత్రం నిలుస్తుంది.
 
తనదైన శైలిలో పరిశోధనలు చేస్తూ, కళాభ్యాసం కొనసాగిస్తూ ప్రాచీనతలో నూతనకోణాలు దర్శించిన శేషగిరిరావు రావు గారు తన సంక్లిష్ట దృశ్య నిఘంటువు ద్వారా సామాజిక ప్రయోజనాలను సంకేతిస్తూ ఉధృతమైన చిత్రరచనలు చేశారు. రాజకీయంగా తనకు ప్రీతిపాత్రమైన  జాతీయ కాంగ్రెస్‌ ద్వారా దేశస్వాతంత్య్రం కోసం కృషిచేశారు. ఎందరో ఆత్మీయ సహచరులు గల  కమ్యూనిస్టు పార్టీ ద్వారా రజాకార్ల క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణా విముక్తి లోనూ తన వంతు పాత్ర పోషించారు.
 
తాను రాసిన నోట్సూ వ్యాసాల ద్వారానూ, జాతీయ, ప్రాంతీయ సాంస్కృతికతను పాన్-ఏషియన్ విశాలతతో సమ్మిళితం చేస్తూ ఒక ప్రత్యేక దృశ్య భాషను అభివృద్ధి చేయడం ద్వారానూ స్వదేశీ చైతన్య స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారు.  ఈ విధంగా ప్రాంతీయకూ జాతీయతకూ పెద్దపీట వేస్తూ సాగించిన శేషగిరిరావు గారి కళాభివ్యక్తి వారినొక దార్శనికుడిగా, ఆలోచనాశీలిగా నిలబెట్టింది.
 
చిత్రకారుడిగా విశేష ఖ్యాతిని సంపాదించుకున్న శేషగిరిరావు గారు తన దీర్ఘకాలిక వృత్తిలో పౌరాణిక చారిత్రక సంఘటనలతో, దైనందిన జీవిత ఘట్టాలతో వెయ్యికి పైగా ‘మాస్టర్ పీసెస్’ సృష్టించారు. ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తమైన, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో, ప్రదేశాల్లో చోటు సంపాదించుకున్నాయి.  హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం, మైత్రీ వనం, భారతీయ విద్యాభవన్, అలాగే వాషింగ్టన్ డీసీ లోని భారత రాయబార కార్యాలయం, పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్  శ్రీ వెంకటేశ్వర ఆలయం కొన్ని ఉదాహరణలు.
 
JNAFAU కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ వారూ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వారూ, శేషగిరిరావు గారి కుటుంబసభ్యులూ సంయుక్తంగా కొండపల్లి వారి చిత్రప్రదర్శన నిర్వహిస్తున్నారు.  కళావిమర్శకుల, చరిత్రకారుల ప్యానెల్ చర్చలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉండబోతున్నాయి.  కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు వాష్ పెయింటింగ్ వర్క్ షాప్, చిత్రకళపై పత్రసమర్పణలూ నిర్వహిస్తారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చిత్రకళారంగంలో శేషగిరిరావు గారి పాత్రనూ, స్వదేశీ ఆధునికతలో వారి ప్రాధాన్యతనూ స్మరించుకోవడానికి ఈ కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయి.
 
ఈ శతజయంతి సందర్భంగా, డాక్టర్ కొండపల్లి శేషగిరి రావు గారి చిత్రకళా ప్రస్థానాన్నీ, సంస్కృతీపరిరక్షణనూ, సృజనాత్మకతనూ,  సామాజిక సంస్కరణల పట్ల వారి నిబద్ధతనూ అక్షరీకరించటంలో భాగస్వాములం కావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. శేషగిరిరావు గారి చిత్రాల ప్రదర్శన ఒక అసాధారణ కళాకారుడికి నివాళి మాత్రమే కాదు. చిత్రకళా చరిత్రలో ఆయన ప్రాముఖ్యతను మరోసారి స్మరించుకునే అవకాశం కూడా

July 30, 2025 17 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్వశక్తి

by Nellutla Madhava Srinivas July 30, 2025
written by Nellutla Madhava Srinivas

చిట్టి కథ

చైనీస్ బ్యాoబు అని ఒక చెట్టు యొక్క విత్తనం నాటిన తర్వాత మొదటి నాలుగు సంవత్సరాలు ఎటువంటి ఎదుగుదల కనిపించదు. కానీ ఓపికగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ ఐదవ సంవత్సరము కూడా ఆ నాటిన విత్తనాలకు నీళ్లు పడుతూ ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక సంవత్సరం చాలా తక్కువ సమయంలో ఆరువారాలలోనే 90 ఫీట్ ఎత్తు ఎదుగుతుంది. చూసేవాళ్ళందరూ దానిని ఆశ్చర్యంగా చూస్తారు. అరే!!!! ఇన్ని రోజులు ఎక్కడేసిన గొంగడి అక్కడ లాగే ఉన్నది ఇది. ఆరు వారాల్లో ఎంత ఎత్తు ఎదిగిపోయింది అని. కానీ చూసే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అది స్తబ్దుగా ఉంది కాదు కాదు ఉన్నట్లు కనిపించింది కానీ అది ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది. వేర్లను బలంగా భూమిలోకి పాతుకపోయింది. పైన దాని యజమాని ఎంత కష్టపడ్డాడో, అది అంతకు రెట్టింపు భూమిలోనికి పాదుకొని పోయింది. దేనికైనా ఒక సమయం అంటూ వస్తుంది కదా!!!! అదే విధంగా దానికి కూడా సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అలా ఆకాశానికి ఎదుగుతుంది. దాని యజమాని నిరాశ పడి ఇది పెరగట్లేదు అని దానికి నీరు పట్టడం ఆపేస్తే ఆ మొక్క ఐదు సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉండేదేమో.!!! కానీ ఆయన అలా చేయలేదు .ఐదు సంవత్సరాలు ప్రతిరోజు దానికి నీళ్లు పట్టేవారు .పోషణ అందించేవాడు. యజమాని ఎంత కష్టపడ్డాడో దానికి రెట్టింపు ఆ మొక్క కూడా భూమి లోపల తన పని తాను చేసుకుని అకస్మాత్తుగా అందరు ఆశ్చర్యపడే విధంగా ఆకాశానికి ఎదిగింది.అదేవిధంగా మనిషి కూడా అవకాశం కోసం ఎదురు చూడకుండా అవకాశాన్ని సృష్టించుకుని పనిని కల్పించుకొని నమ్మకంతో మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యేవరకు ఎదురు చూడగలిగితే అది తన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అందుకే మన పెద్దలు అంటారు కష్టేఫలి అని. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వండకుండా నోట్లోకి ముద్ద రావాలి అనుకునే అంత మూర్ఖత్వం. నిజాయితీగా కష్టపడితే ఓపికగా ఎదురు చూస్తే ఏదో ఒక రోజుఫలితం తప్పకుండా దక్కుతుంది . ఈ ప్రకృతిని చూసి మనం నేర్చుకోవాల్సినవి ప్రకృతి మనకు నేర్పించేవి చాలా ఉంటాయి. సరిగ్గా శ్రద్ధ పెడితే ప్రకృతిలో కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదిగానే కనిపిస్తుంది. తదనుగుణంగా మనం మసలగలిగితే అది మన ఎదుగుదలకు సహకరిస్తుంది. చిట్టి కథ గొప్ప సందేశం. నాకైతే బాగా నచ్చి మీ అందరితో పంచుకోవాలనిపించి రాశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.

సర్వేజనా సుఖినోభవంతు

July 30, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

హోమ్ టూర్ ( హాస్య కథ )

by Laxmi Madan July 29, 2025
written by Laxmi Madan

డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది.

తలుపు తెరిచిన జయప్రదకి బయట జయసుధ నిలబడి ఉండటం చూసింది.

“ఏంటి జయా! ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు? ఉరుములేని పిడుగులా ” అన్నది నవ్వుతూ.

” లోపలికి రానిస్తావా లేదా?”అంటూ లోపలికి తోసుకొని వచ్చి సోఫాలో కూర్చుంది.

ఫ్రిజ్లో నుండి చల్లటి నీళ్లు, కూల్ డ్రింక్ తెచ్చి పెట్టింది జయప్రద.

చల్లగా గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమిత పడింది.

“ఇప్పుడు చెప్పు. ఈ అకాల ఆగమనానికి కారణం?”అన్నది జయప్రద.

“ఏమీ లేదే, మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. ఏంటి ఇల్లంతా చిందరవందరగా ఉంది. అందంగా దమడమ ఇల్లు లాగా ఉంటుంది అనుకున్నాను”అన్నది జయసుధ ముఖం చిట్లిస్తూ.

“ఏంటి అద్దంలా మెరుస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది? పిల్లలు, ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు. ఎన్నో పనులు ఉంటాయి. రోజంతా తుడిచినయే తుడవటం కడిగినవే కడగటం చేయలేం కదా!”అన్నది జయప్రద ఆయాసంగా.

” మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను. ఇంతలో మా అత్తయ్య పిలిచారు.

తీరా ఎందుకు పిలిచారు, అని వస్తే యూట్యూబ్ లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి, మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు? అని పెద్ద క్లాసు. ఇలా రోజూ నస తో చంపేస్తుంది .ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను”అన్నది జయసుధ.

ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ చప్పుడు అయింది.

తలుపు తీసి చూసిన జయప్రదకు బయట శ్రీదేవి నిలబడి ఉంది.

“ఒసేయ్ శ్రీ, నువ్వేంటే ఇలా వచ్చావు. ఇప్పుడే జయసుధ వచ్చింది”అన్నది నోరు 70mm సైజ్ చేసి.

శ్రీదేవి కూడా లోపలికి వచ్చి కూర్చుంది. మంచినీళ్లు, కూల్ డ్రింక్ తాగింది.

తనది కూడా అదే సమస్య. ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి, “నువ్వు అలా ఎందుకు సర్దుకోవు?ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయి” అని అరుస్తున్నాడు.

“నా సంగతి అంతేనే! మా ఇంట్లో కూడా అదే గోల. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ..

“ఇది మాహాలు. ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి. ఇది సోఫా, సోలాపూర్ నుంచి తెప్పించాము. ఆర్డర్ చేసిన నెలకి వచ్చింది.

ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుంచి తెచ్చాము. దీన్ని ఇలా నీట్ గా సర్దితేనే నాకు ఇష్టం. ఇదిగో చూసారా దీనిమీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్స్లో అందంగా పెట్టాను. ఈ బాస్కెట్ బాంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను.
ఇదిగో కిచెన్ చూడండి. ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా పెట్టుకున్నానో !ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుంచి పంపించింది. నాకు అన్ని డబ్బాలు నీట్ గా ఉండి, వాటిలో సామాను కూడా సర్దేసి ఉండాలి. కొంచెం డస్ట్ ఉన్నా నాకు అసలు నచ్చదు.

ఇప్పుడు మా బాత్రూంలోకి రండి. టట్టడాయ్! ఎంత బాగుందో చూసారా? అసలు ఎంత పరిమళం! ఎప్పుడు మా బాత్రూం ఇలాగే ఉంటుంది.

ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను. ఇదిగో ఈ షాంపు కంపుల సైట్ లో ఆర్డర్ చేశాను.

ఇదేమో వాష్ బేసిన్. అదేమో కమోడ్ దానిమీద కూర్చుంటాం అన్నమాట. మరి మీరు ఎలా కూర్చుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి”ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది. చివరికి బెడ్ రూమ్ లు కూడా వదలలేదు. ఆమె పెట్టుకునే ఇన్నర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది.

అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది. నువ్వు అస్సలు శుభ్రంగా పెట్టవు అంటూ.

అయితే మీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలి. ఈ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందట. మనం ఒకసారి వెళ్లి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగి వద్దామా”అన్నది జయప్రద.

“నిజమా? ఈ కాలనీలో ఉంటుందా? వెళ్లి కలుద్దాం,ఆమె పేరు డమడమ”అన్నది జయసుధ.

“అయితే మరి వాళ్ళ ఇంటికి వెళితే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో! లేదో! ఏం చేద్దాం”అన్నది శ్రీదేవి.

“ఆమె చూడటానికి కూడా చాల అందంగా ఉంటుంది”అన్నది జయప్రద.

“ఆమె కోసం కొన్ని గిఫ్ట్ లు కొనుక్కొని వెళ్దాము. ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు” అని అనుకోని, ముగ్గురు షాపులో ఖరీదైన గిఫ్ట్ లు కొనుక్కొని, వాళ్ళ ఇంటికి వెళ్లారు. గేటు దగ్గర ఎవరూ లేరు. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే, యూట్యూబ్ లో చూపినంత అందంగా ఏమీ లేదు. ఎక్కడి చెత్త అక్కడ పేరుకొని ఉంది. యూట్యూబ్లో వీడియో లో చూపించినప్పుడు, అందమైన పెద్ద రంగు రంగుల ముగ్గు కనబడింది. ఇప్పుడు కనీసం పాచి ఊడ్చినట్లు కూడా లేదు.

చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. నీళ్లు పోసి ఎన్ని రోజులు అయిందో తెలియదు. యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి. అన్ని ఆర్టిఫిషియల్ గా పెట్టినట్లు ఉంది.

బెల్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది. మురికి పట్టిన పాత నైటీ, ముఖమంతా ముడతలు, జుట్టంతా రేగిపోయి ఉంది.

“ఎవరు కావాలి” అని అడిగింది.

“డమడమ గారు కావాలండి”అన్నారు ముగ్గురు.

“నా పేరు డమడమ మీరు ఎందుకు వచ్చారు”? అని అడిగింది.

ముగ్గురు షాక్ తిన్నారు. ఈమె ఏంటి ఇలా ఉంది? ఎంతో అందంగా ఉంటుంది కదా వీడియోలో” అని అనుకొని మనసులో భావాలు బయట కనబడకుండా నవ్వుతూ..

“మీరంటే మాకు చాలా ఇష్టం. మీ వీడియోస్ చూస్తూ ఉంటాము. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాము. అని గిఫ్ట్ లను చూపించారు.

అవి చూడగానే నోరు తెరిచి పార పండ్లతో నవ్వింది.

లోపలికి రమ్మని పిలవగానే వెళ్లి సోఫాలో కూర్చున్నారు.

అందంగా ఉండనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది. సోఫాలో కుక్క పడుకుని ఉంది .కుక్క జుట్టు అంతా సోఫాల నిండా ఉంది. ఇల్లంతా దుమ్ము .ఎక్కడ సామాను అక్కడే ఉంది. అందంగా కనిపించే ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది.

యూట్యూబ్లో అందంగా కనిపించే ఆ ఇల్లు బూత్ బంగ్లా లాగా ఉంది.

ముగ్గురు ముఖా ముఖాలు చూసుకున్నారు.

“డమడమ గారు! మీ ఇల్లు చూడవచ్చా?”అని అడిగారు.

“దానికేమి భాగ్యం రండి” అని లోపలికి తీసుకెళ్ళింది.

ఘోరాతి ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు. వంటిల్లు అయితే చెప్ప తరం కాదు .అక్కడి వంట ఎవరు తిన్నా, తిన్నగా హాస్పిటల్ కి వెళ్లడమే.

హాల్లో ఉన్న వాష్ బేసిన్ నిండా మరకలు నిండి అసహ్యంగా ఉంది. ఇక బాత్రూం ఏ లెవెల్ లో ఉంటుందో అనుకున్నారు.

“టీ పెడతాను. అక్కడి నుండి నాకోసం వచ్చారు మీరు”అన్నది డమడమ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ లని ఊహించుకొని.

“వద్దు వద్దు” అని ముగ్గురు ఒకటేసారి అరిచారు.

మేము ఇక వెళ్తామండి. చాలా థాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు. అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు” అని చెప్పి ఉరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు.

“ఆ ఇల్లు ఏంటి అంత చెండాలంగా ఉంది? ఒక్కసారి మనవాళ్ళకి చూపిస్తే అర్థం అయ్యేది. యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని? అయినా 24 గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా? పిల్లలు ఉన్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా? వీలైనంతవరకు శుభ్రంగా అమర్చుకుంటాము. మన ఇళ్లే నయం ఆమె ఇంతకన్నా.క అద్దంలా పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా? ఎవరి ఇల్లు అయినా ఓ మోస్తారు గా ఇలాగే ఉంటాయి. మన వాళ్ళకి ఒకసారి ఆ ఇల్లు చూపిద్దాము. అప్పుడు గాని నోళ్లు మూసుకోరు”అని ముగ్గురు అనుకున్నారు. కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది. యూట్యూబ్ లో చూపించే ఇళ్ళు నిజంగా రోజంతా ఇలా ఉండవని.

ఇంట్లో వాళ్లకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలని ముగ్గురు ఆలోచించనలో పడ్డారు.

ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్ లో పెట్టడం, ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా! అని తలబాదుకున్నారు ముగ్గురూ!!

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

మామిళ్ళ ముచ్చట్లు

by Laxmi Madan July 29, 2025
written by Laxmi Madan

మామిడి పండ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ఉండరు కాక ఉండరు. దేవుడికి కూడా ఇష్టమైన పండు మామిడి పండే. కావాలంటే రోజు ఒక పండు నైవేద్యం పెడతారు కదా? మామిడిపండు పెట్టిన రోజు మందిరంలో ఉన్న దేవుడి ముఖం చూడండి. ఎప్పుడు తినాలి అన్నట్టు ఉంటారు స్వామి. అదన్నమాట మామిడిపండు మహిమ.

మామిడి పండు అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలియా లంటే ఈ మామిడిపండ్లు ఏం మాట్లాడుతున్నాయో వినండి!

ఒక తోటలో బోలెడన్ని మామిడి చెట్లు ఉన్నాయి. అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టుకు కాసిన కాయలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.

“మనము ఇప్పుడే పిందెలుగా మారాము. ఇప్పటి నుండే మనకు కష్టాలు మొదలు”అన్నది బంగి నపల్లి.

“అవునే! కసి పిందెలమని కూడా చూడకుండా, కసా కసా కోసి, ఉగాది పచ్చడితో మొదలుపెడతారు. తర్వాత కోసి ఉప్పు కారం పెట్టుకొని ఓ కన్ను మూసుకొని, ఓ కన్ను తెరిచి లొట్టలు వేసుకుంటూ తింటారు”అన్నది తోతాపురి.

“ఏంటో నే సంవత్సరానికి ఒకసారి వస్తామా? మనల్ని పీల్చి పీల్చి పెడతారు ఈ మనుషులు”అన్నది రసాలు.

“పిందే నుండి కాయగా మారుతామా! అప్పటినుండి మొదలు లేతావకాయ అని రోజు ఉప్పు, కారం వేసి మనల్ని ముక్కలుగా తరిగి, వాటిని ఊరబెట్టుకొని రోజు వేడన్నంలో తింటారు”అన్నది మల్లిక.

“ఇంకా ముందుంది! కాయ పాకం పట్టిన తర్వాత ఇక అసలైన ఆవకాయలు మొదలు. ముక్కలు కొట్టి రకరకాల ఆవలు పెట్టుకుంటారు. వాళ్ల ముఖాలు మండ! ఒళ్లంతా మంట పుడుతుంది. ఆ కారంతో సంవత్సరం పొడుగునా ఆ జాడీలల్లో మనల్ని మగ్గబెడతారు”అన్నది నూజివీడు.

“ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్లీ కాయలు మిగిలాయని, తొక్క తీసి ఉప్పు కారం చల్లి, ఎండలో పెట్టుకుని సంవత్సరమంతా తింటారు”అన్నది రసాలు.

“ఇవన్నీ అయిపోయాక అసలు ముచ్చట ఉంటుంది. మనల్ని తీసుకెళ్లి ఓ రూమ్ లో పడేసి, ఆకులు కప్పేసి తలుపులు గట్టిగా బిగించి పెట్టేసి, మగ్గబెడతారు .అసలు ఊపిరాడుతుందా”అన్నది ఆల్ఫాంజా.

“నాలుగు రోజుల తర్వాత తలుపులు తీసి, మెత్తబడ్డ మనలని గొర గోరా తీసుకొని వచ్చి ,నీళ్లలో పడేస్తారు” అన్నది దశేరి.

“ఆ తరువాత చక్కగా వేడి అన్నం కంచాలలో వడ్డించుకుని, మనతోనే పెట్టుకున్న ఆవకాయను వేసుకొని, మనల్ని పిండి తింటారు. లొట్టలేసుకుని వాళ్లు తింటుంటే నాకైతే చిరాకు వస్తుంది” అన్నది కేసరి.

“అదంతా సరే ఎన్ని పండ్లను తిన్నా వీళ్ళకు అగడు తీరదా? వత్తి వత్తి రసమంతా పీల్చేస్తారు కదా? అయినా వాళ్లకు తనివి తీరదు. పీచును పట్టి చీకేసి ,నాకేసి గట్టిగా కొరికేస్తుంటే ఒ ళ్ళంతా నొప్పులు. వీళ్ళకి ఏం పోయేకాలం ?అన్ని పండ్లు తిన్న కడుపునిండదా “అన్నది సువర్ణ రేఖ.

“నన్నయితే వాళ్ళ పిల్లలు బయట అరుగు మీద కూర్చొని, నా లోపల ఉన్న పీచుని అసలు నేనేనా అనిపించేంత ఘోరంగా మార్చివేశారు .తెల్లగా అయిపోయింది. జుట్టంతా పోయింది. ఇంకా నాకుతూనే ఉన్నారు. పిల్లలా పిశాచాలా?”అన్నది నీలం.

ఇలా పండ్లన్ని వాళ్ళ బాధలు చెప్పుకుంటూనే ఉన్నాయి.

“మరి మనమంతా ఏం చేద్దాం? మన బాధకు విముక్తి లేదా?”అని బాధ పడ్డాయి.

అందులో నుండి ఒక మామిడికాయ చెప్పింది “మనం బ్రహ్మ దగ్గరికి వెళదామా? మన సమస్యకు పరిష్కారం అడుగుదాము. అందర్నీ పుట్టించింది ఆయననే కదా?” అన్నది.

“వద్దు, వద్దు పోయినసారి మన చాయ గిన్నె ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అటు ఉంచు ,మళ్ళీ ఆ గిన్నెలో చాయ్ పెట్టమని అడిగాడు.( నా కథ చాయ్ గిన్నె లో )”అన్నది మరో మామిడి.

“పోనీ ఈసారి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాము”అని అన్ని అనుకొని మామిళ్ళన్ని కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయి.

హాయిగా పాలసముద్రంలో శేష శాయి పై పడుకొని లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంటే, కళ్ళు మూసుకొని ఇళయరాజా గారి పాటలు వింటున్నాడు. మామిళ్ళు మెల్లగా వైకుంఠపురం చేరుకునేసరికి మామిడిపండ్ల వాసన స్వామికి విపరీతంగా వచ్చింది.

“లక్ష్మి! చక్కని మామిడి పండ్ల వాసన వస్తున్నది .ఎక్కడ నుండి?”అన్నాడు కళ్ళు తెరిచి.

“ఏమో స్వామి నాకు కూడా వచ్చుచున్నది”అన్నది లక్ష్మి పాదాలు వత్తడం మానేసి.

ఇంతలో మామిళ్లన్ని కట్ట కట్టుకొని విష్ణుమూర్తి చెంతకు చేరాయి.

అన్ని మామిళ్ళను ఒక్కసారి చూడగానే విపరీతమైన ఆశ్చర్యం వేసింది విష్ణుమూర్తికి. లక్ష్మీదేవి కూడా అపురూపంగా చూడ సాగింది.

“ఏంటి ఇలా వచ్చారు”అని స్వామి అడిగాడు.

“ఏం చేయమంటారు స్వామి !మా కష్టాలు ఎలా చెప్పమంటారు? సంవత్సరానికి ఒకసారి కాస్తామా? మమ్మల్ని ఈ మనుషులు పీక్కొని తింటున్నారు. రకరకాలుగా మమ్మల్ని హింసిస్తున్నారు. ప్రతి వంటలో వాడుతున్నారు .పప్పని, ఉప్పని ఇలా అన్నింట్లోనూ మమ్మల్ని వేసేస్తున్నారు. అదీ గాక సంవత్సరం పొడవున నిలువ కూడా ఉంచుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు? మా సమస్య తీర్చండి స్వామి”అంటూ మామిడిలన్నీ మొరపెట్టుకున్నాయి.

“ఆహా కమ్మటి సువాసన వస్తుంది”అంటూ లక్ష్మీదేవి వైపు తిరిగాడు.

“వాళ్ళు ఏదో చెప్తున్నారు. నాకైతే ఏమీ వినపడటం లేదు. నువ్వు వెళ్లి ఒక డజన్ పూరీలు చెయ్యి. అందులోకి ఈ మామిడి పండ్లను రసం చేసి పెట్టు. నేను రాత్రికి మామిడిపండ్ల రసం నంచుకుంటూ పూరీలను తింటాను. ఇంతకు వాళ్ళు వచ్చిన పని ఏంటో అడుగు. నాకు నిద్ర వస్తుంది “అంటూ కళ్ళు మూసుకొని పడుకున్నారు.

లక్ష్మీదేవి మెల్లగా లేచి..

“స్వామి ఏమంటున్నారో విన్నారు కదా! స్వామికి రాత్రి నైవేద్యం మీతోనే రండి మరి” అని దగ్గరికి రాసాగింది.

అంతే! మామిడిలన్నీ కట్టకట్టుకొని ,మనకి ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. పదండి మన కర్మ ఇంతే !మానవులకు పంటికింద ఆహారమై ఉండవలసిందే. ఇప్పుడు స్వామి కూడా మనల్ని ఆరగిస్తే,మన జాతులు మళ్లీ చిగురించవేమో! పదండి పోదాం”అంటూ పరిగెత్తి భూలోకం కి వెళ్ళిపోయాయి.

July 29, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us