

హిందీలో కుంవర్ నారాయణ్ రచించిన కవిత.
ఆంగ్ల అనువాదం : డేనియల్ వేయిన్ బోర్డ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కుంవర్ నారాయణ్ కొత్త మార్గం కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత ఇది.డేనియల్ వేయిన్ బోర్డ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు.తెలుగులోకి అనువాదం చేసిన కొత్త మార్గం కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.కొత్త మార్గం కవితను ఆసక్తితో చదివాను.కవితలోని భావం నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.కొత్త మార్గం ఏమిటి? అని మనలో సందేహాలు కలుగ వచ్చు.దారిని మార్గం అని ఆంగ్లంలో Way అని అంటారు.దారి అనగా ఒక నిర్దిష్టమైన గమ్యానికి త్రోవ చూపేది.ఇది సాధారణంగా జనులు ఉపయోగించే దారి.ఒక ప్రదేశం చేరుకొనుటకు వీలు కల్పించే మార్గం దారి అంటారు.రహదారి అనగా ప్రజలు,చక్రాల వాహనాలు ప్రయాణించే మార్గం.దారి గమ్యస్థానాన్ని చేరడానికి ఉపయోగపడే భూభాగం. కుంవర్ నారాయణ్ హిందీలో రాసిన కొత్త మార్గం కవిత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి.
“నేను జీవితాన్నుంచి
“తప్పించుకోవాలనుకోవడం లేదు
“అందులో భాగమవ్వాలనుకుంటున్నాను.
నేను ఈ విశాల ప్రపంచంలో జీవించడానికే నిర్ణయించుకున్నాను.నేను జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలను అయినా ధైర్యంతో ఎదుర్కొంటాను.ప్రతి రోజు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని,బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాను.ఒక పిరికివాడిలా,వ్యసనపరుడిలా జీవితం నుండి తప్పించుకోవాలనే కోరిక అసలు నాలో లేదు. అలాంటి ప్రతికూల ఆలోచనలకు నా హృదయంలో చోటు లేదు.జీవితం అనేది జీవించడానికి మనిషి ఏర్పరచుకున్న ఒక పద్ధతి.అసలు ఎందుకు జీవితం? అని నేను ఎన్నడు మనస్సులో ఏనాడు అలాంటి తలంపులు చేయను.జీవితం అంటే జీవించడమని మరియు మనిషి యొక్క ఉనికి అని నా తల్లి మానవతా విలువలను తెలియ జేసింది.నా తల్లి కడుపులో నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చింది. నేను అంటే అమ్మకు ప్రాణం.చిన్నతనంలో నేను మల విసర్జన చేసినప్పటికీ అసహ్యించుకోకుండా ఎంతో ప్రేమతో నా తల్లి మలాన్ని తీసివేసేది. ఆప్యాయతతో తాను నన్ను దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకునేది.జీవితంలో కష్టాలు ఏర్పడ్డాయని నేను ఊరికే బాధ పడుతూ కూర్చుని ఉండను.కష్టాల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశం ఎన్నడు నాకు కలగ లేదు.సుందరమైన జీవితాన్ని ఇచ్చిన నా తల్లి కష్టాలను ఎలా అధిగమించాలి? అని సాహస వీరుల గాధలను,ధైర్యాన్ని నాకు నూరిపోసింది.సాహస వీరుల కష్టాల ముందు నేను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు చాలా చిన్నవి. కష్టాలను తలుచుకొని ఒంటరిగా కూర్చుండి విచారించడం లేదు.జీవితంలో ఎదురయ్యే కష్టాలను మొక్కవోని ధైర్యంతో సాహసంతో ఎదుర్కొంటాను. కష్టాల నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోను. జీవితాన్నుంచి జీవితం ఏర్పరిచిన సవాళ్ల నుంచి తప్పించుకోవాలనే ఆలోచన నాలో లేదు.జీవితం అంటే ఉనికి యొక్క రూపమని జీవించడానికే నిర్ణయించుకున్నాను.జీవించడానికే అంకితం అయిపోతాను మరియు జీవితంలో ఒక భాగం అవుతాను.జీవితం యొక్క గ్రంథంలో నాకంటూ ఒక పేజిని ఏర్పరచుకుంటాను.అందులో నా పేరు కూడా నమోదు అయి ఉండటం చాలా సంతోషంగా ఉంది. జీవితం అనే నాటకంలో అందులో నా పాత్రను చక్కగా రక్తి కట్టిస్తాను అనే ఒక సూచన కనబడుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.

“జీవితపు ఊహాత్మక ఇరుసుపైన
“కవిత్వానికి
“అనుమానాస్పదంగా వున్నా
“స్థలాన్ని ఓ కుదుపు కుదపాలి.
ఇరుసు అనేది తిరిగే చక్రం లేదా గేర్ కోసం కేంద్ర షాఫ్ట్.గేరు భ్రమణం కోసం అమర్చబడుతుంది. చక్రాలు కలిగిన వాహనాలకు ఇరుసు బిగించబడి ఉంటుంది.బేరింగ్ వ్యవస్థ లేని ఇరుసు చక్రంతో పాటు తిరుగుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న ఇరుసు చుట్టూ చక్ర భ్రమణం చెందుతుంది.బేరింగ్ వ్యవస్థ ఉన్న చక్రంలో బేరింగ్ లేదా బుషింగ్ ఉంటుంది.చక్రం లోపలి రంధ్రంలో అమర్చబడి ఉంటుంది.దీని యందు చక్రం లేదా గేరు ఇరుసు చుట్టూ భ్రమణం చెందుతుంది.నిగూఢతను కలిగి సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు.కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ.కవిత్వము ఒక నిరంతర సాధన.కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు.జీవితానుభవాన్ని ప్రత్యక్షంగా సజీవంగా అనుభూతికి అందివ్వడమే కవిత్వ ధ్యేయం.అసంబద్ధమైన వాటి మధ్య సంబంధమే కవిత్వానికి అర్థం చేకూరుస్తుంది.గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చేది కుదుపు.ఒక్కసారిగా కుదుపు వచ్చిన కారణంగా శరీరంలో కంపన మొదలవుతుంది.కుదుపు కారణంగా పనులకు ఆటంకం కలుగుతుంది.జీవితం నుండి వచ్చిన దుఃఖము,ఆవేదన నుండి కవిత ప్రాణం పోసుకుంటుంది.జీవితం నుండి ఊహాత్మక ప్రపంచంలో జరిగిన సంఘటనలకు అతను మథన పడిపోయాడు.జీవితంలో తాను చూసిన, అనుభవించిన తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లోని బాధ,వేదనలు చూసిన తర్వాత తన మనసులో కుదుపు వచ్చినట్లుగా తోస్తుంది.కవి ఊహాత్మక దృక్పథంతో ఇరుసు పై ప్రయాణం సాగుతున్న వ్యక్తుల జీవితాల్లో కుదుపులు ఉంటాయి.కవిత్వం నేల మీద సాము చేయకూడదు అంటారు.
తాను ఎవరో తెలియకుండా అనుమానాస్పదంగా వీధుల్లో తిరుగుతున్న అతన్ని అట్టి స్థలాన్ని మరియు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఒక్క సారిగా వాహనం అటు ఇటు ఊగుతూ కుదుపులు రావడం సహజమే.అట్టి వ్యక్తులు గతుకుల రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే కుదుపులకు వాహనం కింద మీద పడిపోయినట్లుగా జర్క్ ఇవ్వడం వల్ల ఒళ్ళంతా నొప్పులు ఏర్పడడం సహజమే కదా అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“అందుకు మొదట
“జీవితపు శక్తి మూలాన్ని
“క్రియాశీలం చేయాలి.
శక్తి అనే పదం బహుళ ఆలోచనలను సూచిస్తుంది. విశ్వం యొక్క సృష్టి,నిర్వహణ మరియు విధ్వంసానికి బాధ్యత వహించేది శక్తి.సృష్టికి శక్తి బాధ్యత వహిస్తుంది.భౌతిక శాస్త్రంలో శక్తి అంటే వస్తువు లేదా భౌతిక వ్యవస్థకు బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం.ఏదైనా పని చేసిన శక్తి లభిస్తుంది.ఏదైనా పని చేసిన దాని ఫలితంగా ఉష్ణం,కాంతి లాంటి రూపాలలో శక్తిని గుర్తించవచ్చు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తిని సృష్టించ లేము.శక్తిని నాశనం చేయలేము.శక్తిని ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మార్చగలము. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం శక్తిని జౌల్స్ లో కొలుస్తారు.కదులుతున్న వస్తువు కలిగి ఉండే గతి శక్తి,ఏదైనా ఒక ప్రత్యేక స్థానం వల్ల వస్తువు కలిగి ఉండే స్థితి శక్తి, సాగదీయబడిన ఘన పదార్థానికి ఉండే స్థితి స్థాపక శక్తి,రసాయనిక చర్యలకు సంబంధించిన రసాయనిక శక్తి,విద్యుదయస్కాంత వికిరణాలు మోసుకెళ్ళే వికిరణ శక్తి మొదలైనవి శక్తికి ఉదాహరణలుగా చెప్పవచ్చు.జీవించే అన్ని జీవులు శక్తిని స్వీకరిస్తూ విడుదల చేస్తూ ఉంటాయి.క్రియా శీలత వల్లనే స్థిరంగా మానవులు సవాళ్లతో కూడుకున్న పనులలో నైపుణ్యం సాధిస్తారని అనుభవం తెలుపుతుంది.క్రియాశీలత వల్లనే మనిషి నిర్దిష్టమైన పనిని ఎంపిక చేసుకొని పనులు చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మరియు పనులలో అనుభవం కూడా సంపాదిస్తారు.జీవితంలో ఏదైనా కష్టం వచ్చిన తర్వాత మనిషి ధైర్యంతో ముందుకు సాగాలి. మనిషికి కష్ట పడి పని చేసే క్రియా శీలత వల్లనే మళ్ళీ సంతోషంగా విజయవంతంగా ఉండే సామర్థ్యం అలవడుతుంది. lకష్టాల వల్ల మనసుకు దెబ్బ తగిలినప్పటికీ మనిషి మనస్సుకు తట్టుకునే శక్తి గుండె నిబ్బరం ఉంటుంది.క్రియా శీలం అనేది చాలా శక్తివంతమైన పనిని కలిగి ఉండటంగా చెప్పవచ్చు.మనిషి వ్యక్తిగత కృషి వల్ల మరియు శ్రద్ధతో పనిచేయడం వల్లనే చురుకైన జీవితం ఏర్పడుతుంది.మనిషి తాను జీవితంలో ఎన్నో కష్టాలను ఆటంకాలను ఎదుర్కొంటాడు. అయినప్పటికీ మనిషి కష్టాలు వచ్చాయని బెదిరిపోకూడదు.మనిషి తాను మనుగడ సాగించడానికి జీవితంలో శక్తి యొక్క మూలాలను తెలుసుకొని తాను చేయవలసిన పనులు చేస్తూ నిర్విఘ్నంగా ముందుకు సాగిపోవాలి.కష్టాలు మనిషికి రాకుండా మానులకు వస్తాయా? మనిషి గుండె నిబ్బరంతో తన జీవితపు శక్తి మూలాలను క్రియాశీలంగా పనులు నిర్వహించి ముందుకు సాగాలి అనే భావనను కవి వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది..
“తర్వాత ఆ శక్తిని
“బతుకు కక్షకున్న ఇరుసుకు
“జత చేయాలి.
తర్వాత మనిషి తనలో నిండి నిబిడీకృతమై ఉన్న అపారమైన శక్తిని క్రియాశీలం ద్వారా తట్టి లేపాలి. మనిషి తనలో ఉన్న అనంతమైన శక్తిని బతుకు చక్రంలో తిరుగుతున్న ఇరుసుకు జత చేస్తూ చేతనతో ముందుకు సాగాలి అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది.
“అప్పుడు
“గతంలో లాగా
“యాంత్రికత” లేని
“మానవత్వం” వైపు మరలిన
“కొత్త మార్గం ఆరంభమవుతుంది.
జరిగిపోయిన కాలాన్ని గతం అంటారు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్ని మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి. మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింస, మానవ ప్రేమ మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్నగా భావిస్తారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి.మానవతా వాదం, సాంప్రదాయక మత సిద్ధాంతాలకు విరుద్ధమైనది. మానవతా వాదం పరిణామ సూత్రం అన్ని విధానాలను అధిగమిస్తుంది.మానవత్వం అనేది మానవ స్థితి నుండి ఉద్భవించిన పరోపకార నైతికతో ముడివడి ఉన్న ధర్మం.జీవితంలో మనిషి ముందుకు సాగటానికి జరిగిపోయిన కాలంలో లాగా ఏదో బతుకుతున్నాం.రొటీన్ గా మొక్కుబడిగా దినచర్య కొనసాగుతున్నట్లుగా కాకుండా తనలోని శక్తులను మేల్కొల్పుతూ ఇష్టపడి పని చేస్తూ మానవత్వంతో మెదలాలి.మనిషి మానవత్వంతో నడక సాగించిన రోజున సాటి మనుషులకు తోటి వారికి ఆదర్శంగా ఉంటుంది.మనిషి ఎలాంటి యంత్రాలు లేకుండా పనులు నిర్వహించిన రోజులు చూశాము.ఆ రోజుల్లో అందరు కలిసిమెలసి వ్యవసాయ పనుల్లో పాల్గొనే వారు.సబ్బండ కులాల వారు సఖ్యతతో మెలిగేవారు.మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా శ్రమైక జీవన సౌందర్యానికి సాటి లేదన్నట్లుగా మెలిగే వారు.యాంత్రికత లేని సమాజం వల్ల మనుషులు పరస్పర అనురాగంతో కలిసిమెలిసి ఉంటూ మానవత్వంతో జీవిస్తారు. అందరు మనుషులు కష్టపడి జీవిస్తూ సాటి మనుషుల పట్ల మానవత్వంతో మెలగడం వల్ల కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సూచన కనబడుతుంది.మనుషుల జీవితాల్లో కొత్త మార్గం ఆరంభం అవుతుంది అనే సందేశాత్మకంగా కవితను రచించినట్లుగా తోస్తుంది.మనిషి నడుస్తున్న బాట సమాజానికి కొత్త మార్గం అవుతుంది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
నీ శ్రమను గుర్తించేది ఎవరు.
నిరంతర నీ పరిశ్రమ
ఈ ఇల్లు ని తీర్చిదిద్దడం
ఈ పిల్లలని చదివించడం
పెంచి పోషించడం
ఇంటి బాధ్యతలు మరియు
ఉద్యోగ బాధ్యతలు
అవి కాక కరెంట్ బిల్లు వాటర్ బిల్లు సైతం బ్యాంకు పనుల సైతం పని మనిషి లేకుంటే ఇంటి పని పూర్తి నీవంతే
మగమహారాజులకి ఆఫీసు నుంచి వచ్చి టీవీ చూస్తూ పేపర్ చదువుతూ కూరగాయలు తెచ్చిపెట్టి సెల్ ఫోన్ తో ఆడుకుంటూ కూర్చుంటారు.
నీకెక్కడిది రెస్ట్ నువ్వు తిన్నావా అని అడిగే వారు ఎవరు నువ్వు పడుకున్నావా అని అడిగే వారు ఎవరు నీవు ఒక శ్రామికురాలివి నిరంతర నిర్విరామ శ్రామికురాలివి నీ శ్రమ కు ఫలితం లేదు గుర్తింపు లేదు పిల్లలు ఎవరు చెడిపోయినా తల్లిదే బాధ్యత అంటారు భర్త తాగొచ్చునా భార్యది తప్పంటారు సంసారం చెడిపోయిన భార్యదే తప్పంటారు ఈ లోకం మార్పులు ఎప్పటికీ
ఎప్పటికీ నీవు శ్రామికురాలివి ఎప్పటికీ నీ శ్రమ గుర్తించు వారు లేరు మీ ఆరోగ్య పరిస్థితి నీదే నిన్ను పట్టించుకునే వారు ఎవరు ఎవరికోసం నువ్వు పుట్టావు ఎవరికోసం నువ్వు పెరుగుతున్నావు ఎవరికోసం నువ్వు బ్రతుకుతున్నావు ఎవరికోసం నువ్వు సంపాదిస్తున్నావు ఎవరికోసం నీవు ఎదురు చూస్తున్నావు మార్పు కోసమా ఫలితం కోసమా గుర్తింపు కోసమా నీ శ్రమ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది ఏళ్ల తరబడి ఏడేళ్ల తరబడి కానీ నిన్ను గుర్తించే వారే లేరు అమ్మ మీ శ్రమను గుర్తించే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ కూతురు.
కన్నీటితో రాస్తున్నాను
ఈ కవితని శ్రామికుల దినోత్సవానికి అంకితమిస్తున్నాను.
తెలుగు వాఙ్మయంలో శతక ప్రక్రియకున్న స్థానం విశిష్టమైనది. పాల్కురికి సోమన మొట్టమొదటి “వృషాధిపశతకం” నుండి నేటివరకు జనుల జిహ్వాగ్రముల నుండి శతక పద్యాలు నిరంతరవాహినులుగా జాలువారుతూనే ఉన్నాయి. ఆధునిక కాలంలో శతకరచనలు చేస్తున్న కవులు అనేకులు పద్య రసవాహినిలో అందరినీ అలరిస్తున్నారు. శతకాలు భక్తి, వైరాగ్య, శృంగార, నీతి ప్రధానాలుగా ప్రజల జీవితాల్లో మమేకమైపోయాయి.

అటువంటివారిలో తనకొక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న కవి శంభునికుమార్ గారు. ఇంతకుమునుపే తండ్రి పట్ల అనురాగంతో ఒక స్మృతి కావ్యాన్ని, ఆంజనేయ స్వామిపై భక్తితో ద్విశతిని, మరికొన్ని చిలిపిపద్యాలను రాసిన వీరు తను పుట్టిన సూరారం ఊరి దైవం అనంతపద్మనాభ స్వామి ప్రేరణతో ఒక శతకాన్ని రాసి ఆయనకు అక్షర నైవేద్యంగా సమర్పించారు. అదే “శ్రీ అనంత పద్మనాభ శతకం”.
“పలికెడిది భాగవతమట” అన్న పోతన, “చెప్పుమని రామచంద్రుడు” అన్న మొల్ల బాటలో “పంటపొత్తము గొని వండిన రీతిగా/ పద్యపాకము గూర్చు పాట్లు నావి” అంటూ తనకేదీ తెలియదని, చదువరులకు మెచ్చునట్లు కృతిని సాగనిమ్మని శతక ప్రారంభంలోనే ఆ జగన్నాథుని వేడుకుంటారు కుమార్ గారు.
“నే కుచేలుడను గాను” అనే పద్యంలో నేను నీకు ఏమీ కానని నన్ను విడిచిపెట్టొద్దు అని మొర పెట్టుకుంటారు..”అన్నదాతల మోమునందున” అను పద్యంలో జగతిలో సుఖశాంతులు కలిగి ఉండేలా వరమివ్వుమని, ఆ చిన్ని ఆశ తీర్పమని లోకక్షేమాన్ని కాంక్షిస్తారు. “కన్నవారిని వీడి ఉన్న ఊరిని వదిలి” అనే పద్యంలో మన వీరజవానుల త్యాగాన్ని మంచుకొండల్లో మెరిపిస్తారు.
“గంగా జలమనగ- కప్ప, చేపల ఎంగిలి” అనే పద్యం బాలమురళీ కృష్ణ గారి “ఏమీ సేతురా లింగా” అనే తత్వాన్ని స్ఫురింపచేస్తూ, మనం నిమిత్తమాత్రులమనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
“మూడు కాళ్ళను పొందు ముసలి గాక మునుపె” అని ” శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ”న్నట్లు ఈ శరీరం పూర్తిగా అధీనం తప్పకముందే మురారి నామస్మరణ కవచమై కాపాడుతుందని ఉద్భోధిస్తారు. “లాలిపాటలలేవి? లాలింపులవి యేవి?” అంటూ నేటి బాల్యం పూర్తిగా అదుపు తప్పిందని వాపోతారు.

“పోరి పోరి అలసిపోయితినిక నాకు/ లావొక్కింతయు లేదు, రంధి హెచ్చె” జీవితమనే పోరాటంలో అలసిపోయానని, బలహీనుడయ్యానని చెప్తూ భాగవత పద్యాన్ని గుర్తుకు తెస్తారు.
“పవి పుష్పంబగు, నగ్ని మంచగు” అని భర్తృహరి అన్నట్లు ” నీ దయ మాకున్న” పద్యంలో మా బ్రతుకు నీదే మాధవా! అంటూ హృదయపుష్పాన్ని సమర్పిస్తారు.
భక్తిభావమే కాకుండా ఈ శతకంలో తల్లిదండ్రులు, గోమాత, స్నేహభావం, శ్రమజీవులు, వ్యసనాలు, క్రీడలు, నైతిక విలువలు …మొదలైన ఎన్నో అంశాలు ప్రస్తావింపబడడం కవికి ఉన్న బలీయమైన సమాజ శ్రేయస్సు కాంక్ష గోచరమవుతున్నది. పురాణేతిహాసాల పట్ల వీరికున్న అపారజ్ఞానం అనేక పద్యాల్లో మనకు ద్యోతకమవుతుంది.
‘శంకు’ నుండి తీర్థంలా ఇంకా ఎన్నో శతక మకరందాలు ఈ కవి కలం నుండి ఆ అనంత పద్మనాభుని అనుగ్రహంగా స్రవించాలని ఆశిద్దాం.
భారతీయ రాజముద్ర సత్యమేవజయతే అనే ముండకోపనిషత్ వాక్యంతో అలకరించబడి సమస్త భారతీయుల జీవనతత్వపు అంతఃసూత్రాన్ని విరాజమానం చేస్తుంది. ఏకంసత్ బహుధావదంతి అన్నదీ భారతీయుల అదే జీవనతత్వపు కొనసాగింపు. ఈరెండూ అనాదిగా ఇక్కడి తాత్విక అస్తిత్వభూమికలు, వీటిని అల్లుకొని విస్తరించిన అనేకానేక జీవనపంథాలు మతాలుగా, భావజలాలుగా స్వేచ్ఛగా వికసించి,విస్తరించి తమదైన కళలు,సాహిత్యం,ఆచారం సృష్టించుకొని,పరిఢవిల్లి సుసంపన్న లౌకికజీవనానికి ప్రతీకలయ్యాయి.
ఈ లౌకిక జీవన ప్రయాణంలో ఎక్కడ భావనాత్మక చైత్యనానికి వూనిక దొరికిందో అక్కడనుంచి కొత్తమలువు, కొత్తదారి,కొత్తనడవడి మొదలై కొంతకాలంవిలసిల్లి,అప్పటికే స్థిరపడిన దారులతోతలపడ్డాయి,అనునాయిల ఘర్షణ,రాజాశ్రయం,పోషితవర్గంగా మారినప్పుడు హింసను ఎదుర్కొన్నాయి. సామాజికుల ఆదరణ,నమ్మిక ఉన్నంత కాలం ఉండి కనుమరుగైనవీ ఉన్నాయి.కొత్తగా ఉద్భవించేవీ ఉన్నాయి ఒకసారి ఒక ఆధ్యాత్మిక జీవనమార్గాన్ని ఎంచుకొని మొదలయ్యాక మరొక భిన్నమైనమార్గం వైపు మరలాలనే తలంపు ఎలా కలిగినవీ అంటే అప్పటికే ఉన్నదాంట్లో ఉన్నఎంతో కొంత అసంతృప్తత ,ప్రాతిపదిత అంశాలతో ఏకీభవించలేకపోవడం,ఆచరించడం గహనమవడం, వ్యవహారాలతో సమాధానపడకపోవడంవంటివి నిరంతర తాత్వికఅన్వేషణకు హేతువులయ్యాయి, మరో జీవన ఆచరణకు మార్గాలయ్యాయి.అది రామాయణ కాలంలో జాబాలి నుంచి , జైన , బౌద్ధులు, చార్వాకులు , అజీవకుల నుంచి, శివ , వైష్ణవ, శక్తేయుల భక్తితత్వ మార్గదర్శకులైన మధ్యయుగ మహానుభావులనుంచి నిన్నమొన్నటి సంస్థాగత ఆధ్యాత్మిక అభివృద్ధి కారకుల వరకూ ఇప్పటికీ ప్రపంచం నలుమూలలనుంచీ ఎదిగిన ఎదుగుతున్న విభిన్న భక్తిభావనలవరకు సామాన్య మానవుని భక్తి విశ్వాసాలను అగ్నిపరీక్షకు గురిచేసేదే.అందునా భారత దేశం ఆరవ శతాబ్దం నుంచి గీత గీసినట్టు భక్తి భావాల విభేధానికి గురై భిన్నమార్గాలను ఎంచుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మళ్ళా దారులను సవరించుకొని మళ్ళీ మళ్ళీ అదే విభేధాల్లో కొట్టుమిట్టాడినప్పుడల్లా నిట్టాడెత్తి ఒక గూటికి తెచ్చిన దార్శనీకులు హేతువుతో ఎదురువచ్చి పాతమార్గాల ముళ్ళకంచెలను సంస్కరించపూనుకున్నారు. ఈ హేతువు మానవతావాదం వైపు నిలబడడం అన్న గొప్ప సందేశమే ఇస్తుంది తప్ప వ్యక్తిని విమర్శించదు.వారు హేతువును కోల్పోయిన వ్యవస్థను చీల్చి చెండాడి కూలదోయడానికీ వెనుదీయలేదు.ఇంకా ఏది ఒక సామాన్యుని మనస్సును నిర్మాలంగానూ జీవితాన్నిశాంతి సౌభ్రాతృత్వాలతోనూ నింపగలదో ఆవెలుగును చూడగలిగే దుర్భిణిని చేతికిచ్చారు. అలాంటి మహానుభావుల్లో సత్యంయొక్క అర్థాన్ని వెతుకుతూ తాను తన జీవితం మొత్తం ఖర్చుచేసి కనుగొన్న సత్యాన్ని ప్రకాశింపజేస్తూ సత్యార్థప్రకాశికను వెలువరించిన స్వామి దయానందసరస్వతి ముందుంటారు.సంస్కరణవాదిగా, ఐక్యతామూర్తిగా, మానవతావాదిగా భారత యవనిక మీద చిరకాలం నిలిచి ఉండే హేతువును ప్రతిష్టించారు. అది నిక్షిప్తం చేసన గ్రంథమే సత్యార్ధ ప్రకాశిక,అది ఋషభనాథుడికి, బుద్ధుడికి భిన్నమైన సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్న వైయుక్తిక భారత సంక్లిష్టకాలంలో దీపశిఖ.
దయానందుడు కథియావార్, నేటి గుజరాత్లో 1824లో జన్మించారు. అది అప్పటి బ్రిటిష్ ఇండియాలో బాంబే ప్రెసిడెన్సీ లో ఉండేది. కథియావార్లో వల్లభాచార్యులపంథా, వైష్ణవులపంథాలో ఆధ్యాత్మకజీవనం కొనసాగుతున్న కాలం.బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో భారతదేశం అంతా కుదుపులకు లోనవుతున్న కాలం. భారతదేశం నుంచి ఏమి పొందగలం అనుకున్న బ్రిటిష్ వారికి విస్తారమైన సహాజవనరులు, సంపద కళ్లముందు ఉండగా భారతీయులనుంచి ఏమి పొందగలం అనుకుంటే క్రమశిక్షణగల శ్రామికత్వం ఒక్కటే బలంగా కనిపించిన అంశం. భారతీయుల శరీరాలతో ఇంగ్లండు మేధస్సుతో తమ అధికార విస్తరణకు అనుగుణంగా మార్చబడిన ఆధునికులు, ఉదారవాదులు,లౌకికవాదులను సృష్టించడం, అవసరమైతే మొత్తంగా మతంతో సహా బ్రిటిష్ విధేయులుగా మార్చివేయడం లక్ష్యంగా ఒకవైపు జర్మనుల ద్వారా సిద్ధాంతీకరణలు మరోవైపు మిషన రీల ద్వారా మతాంతీకరణలు కొనసాగించడం. ఇందుకు సన్నద్ధంగా స్వతహాగా లౌకికభావజాలం కలిగిన ప్రజలను న్యూనతకు గురయ్యే విధంగా ఆచారవ్యవహారాలలోని అభ్యంతరాలను లేవనెత్తి బహిరంగంగా తనను తాను వ్యక్తపరచుకోలేని స్థితిని కల్పించడం విరివిగా జరిగింది. బాల్యవివాహాలు,సతీ,కన్యాశుల్కం అట్లా విసృతంగా ప్రచారానికి వచ్చాయి.అప్పటికే విదేశాల్లో విద్యనభ్యసించిన ఆధునికులు కొత్త సమాజాలను ప్రారంభించి వాటిని అధిగమించే ప్రయత్నం చేశారు. ఆది బ్రహ్మ సమాజం, బ్రహ్మసమాజం, ప్రార్థనాసమాజంవంటివి అలా వచ్చినవే. ఇంకా సామాజిక అభ్యున్నతికాంక్షిస్తూ వచ్చిన ఉద్యమాలూ మొదలవుతున్నకాలం.
దయానందుడు జన్మించినకాలానికే 1857 స్వాతంత్ర సంగ్రామానికి డ్రస్ రెహార్సల్ అని పిలవబడ్డ తిరుగుబాటు అప్పటి తూర్పుభారతంలో మొదలైంది.దయానందుడు యువకునిగా ఉన్నప్పుడు ప్రథమస్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యాలు,పర్యవసానాలు గమనించగలిగారు. సమాజం ఒకవైపు బ్రిటిష్ విధేయత మరోవైపు వ్యతిరేకతను ఏకకాలంలో ప్రతిబింబించి సంధిగ్ధంలో ఉంది. ఇన్ని కోణాల్లో సంక్లిష్టమైన సంధర్భంలో మూలశంకర్ అన్న పేరుగల జమీందారీ బ్రాహ్మణుడు తన ఇరవైయొక్క యేట నాటి గౌతమ బుద్దునిలాగా సత్యాన్వేషణకి బయలుదేరి తన జ్ఞానతృష్ణకు తగిన గురువును అన్వేషిస్తూ దయానందగా మారి దేశవ్యాప్తంగా పర్యటించి గ్రహించిన అన్ని మతాలలోని అనాచారాలను,అసంబద్ధాలన ఖండిస్తూ అఖండ మానవాళికి వేదమే మార్గదర్శియని నిర్ధధ్వంధంగా ప్రకటించిన పుస్తకమే సత్యార్ధ ప్రకాశిక.
దయానందుడు సత్యార్ధ ప్రకాశికను 1875లో హిందీలో వెలువరించారు.తదుపరి 1882లో ద్వితీయ ముద్రణచేశారు. ఈరెండు ముద్రణలమధ్య వారే అంగీకరించిన భాషా,వ్యాకరణ వ్యత్యాసాలను సవరిస్తూ మొదట పన్నెండు అధ్యాయాలుగాఉన్న గ్రంథాన్ని పదునాలుగు అధ్యాయాలకు పెంచారు. ఆరేళ్ళ వ్యవధిలో విస్తరించిన వారి భావన గ్రంథపరిధిని పెంచింది. అధ్యాయానికి వారిచ్చిన పేరు సముల్లాసం. మొదటి పది పూర్వార్ధంగా, మిగిలిన నాలుగు ఉత్తరార్థంగా ఇచ్చి పదమూడు, పదునాలుగు సముల్లాసాలను కొత్తగా చేర్చారు. వీరి గ్రంథ రచన అంతా ఉదయపూర్ నవలాఖ మహల్లో జరిగింది. ఇప్పుడది సత్యార్ద ప్రకాష్ న్యాస్ గా ఉంది. ఆనాటి ఉదయ్ పూర్ మహారాజు మహారాణా సజ్జన్ సింగ్ దయానందులపట్ల ఆదరణ చూపి వారికి ఆశ్రయం ఇచ్చారు. నాటికి ఎంతో విమర్శను ఎదుర్కొన్న సత్యార్ద ప్రకాశిక ను తెలుగులో 1906లో మొదటిసారి శ్రీ పండిత ఆదిపూడి సోమనాథ రావు, 1912లో 11 వ సముల్లాసాన్ని శ్రీ పండిత ఆదిపూడి గోపాలరావు , 1932లో 12,13,14 సముల్లాసాలను శ్రీ పండిత ధూళిపేట రాజారత్నమాఛార్యులు, 1940లో పూర్తిగా అనువదించిన శ్రీ పండిత మదన మోహన విధ్యాసాగర్ గారు అనువదించారు.అయితే ఇలా ఒక్కో సముల్లాసం అనువదింపబడడానికి ఆయా సముల్లాసాలలో పేర్కొన్న హేతుబద్ద విశ్లేషణ చాలా సున్నితమైనది కావడమే కారణం. అందునా 19వ శతాబ్దపు తెలుగుభాషా స్వభావం గ్రాంథికం కనుక అనుకున్నంతగా ప్రజాలలోకి వెళ్లలేకపోయింది. మరలా ఈ గ్రంథం తొలి ముద్రణ పొందిన 142 ఏళ్ళకు వాచస్పతి డా. శ్రీ మర్రి కృష్ణారెడ్డిగారి చేత సరళ తెలుగు భాషలోకి రాగా వేద ధర్మ ప్రచార సంస్థ ద్వారా ప్రచురించబడింది.
దయానందులు ఈ గ్రంథంలో భారతీయులను ఉద్దేశించి చూపిన మార్గదర్శనాల్లో ఈశ్వరుడి ఓం కారాది నామాల వ్యాఖ్య , సంతాన శిక్షణ, బ్రహ్మచర్యం, పటన వ్యవస్థ , వివాహం , గృహస్థాశ్రమ వ్యవహారాలు, వాన ప్రస్థం , సన్యాసాశ్రమ విధులు,రాజా ధర్మం , వేదం ,పరమేశ్వర విషయాలు , జగత్తుకు సంబంధించిన ఉత్పత్తి , స్థితి, ప్రళయాలు , విద్య ,అవిద్య, బంధ మోక్షాల వ్యాఖ్యానం, ఆచార అనాచారాలు , భక్ష్య , అభక్ష్యాలు , ఆర్యావర్తంలో మత మతాంతరాల ఖండన మండనలు, చార్వాక , బౌద్ద , జైన మత విషయాలు , క్రైస్తవ మత విషయాలు , మహమ్మదీయుల మత విషయాలు ఈ పద్నాలుగు అధ్యాయాల్లో వివరించబడినాయి.దయానందుల “స్వమంత వ్యామంతవ్య ప్రకాశం”, సర్వతంత్ర సిద్ధాంతంగా అంటే ఏదైతే ఎటువంటి విరోధం లేకుండా త్రి కాలాలాయందు ఆచరించడానికి అనువైనదో, సత్యమైనదాన్ని అంగీకరిస్తూ, అసత్యమైన దాన్ని విడిచి పెడుతూ ఏది సనాతన ధర్మమో దానిని గ్రహించి జీవించమని చెప్తూ యాభై ఒక్క సూత్రాలను వారు అంగీకరించిన సత్యాలుగా ఈ గ్రంథం చివరలో పదునాలుగు అధ్యాయాల తర్వాత వివరించారు. దీనికి వేదాలలో చెప్పిన అంశాలను ప్రమాణీకంగా తీసుకొని సర్వమతాంగీకృత సిద్ధాంతమై భూగోళమంతా వ్యాపించి లోకులు అనాయాసంగా ధర్మార్థ మోక్ష కామాలను సిద్ధింపజేసుకోవాలని ఆశించారు. సత్యములైన అర్థాలను తెలియజేయడానికే ఈ గ్రంథాన్ని రాశానని చెప్పుకున్నారు. సర్వదా సత్యానికి జయం , అసత్యానికి పరాజయం కలుగుతుందన్న ముండకోపనిషద్ వాక్యం మూల స్తంభంగా ఆప్త పురుషులు సదా సత్యం యొక్క అర్థాన్ని పరోపకార నిమిత్తం తటస్థ మనసకులై ప్రకటించాలని చెప్పి అదే విషయాన్ని ఈ గ్రంథంలో రాశారు.
ప్రతి సముల్లాసంలో కొంత విషయం వివరించబడి తదుపరి ప్రశ్నోత్తరాల రూపంలో ఉండడం వల్ల సూటిగా చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పే వీలుగా వివరణలు కొనసాగుతాయి. దయానందులు ఈశ్వరున్ని నమ్ముతారు. కానీ ఈశ్వరునికి చెందిన ప్రయాణంలో అడ్డుగా ఉన్న అసంబద్ద వ్యవహారాలను ఖండిస్తారు. వేదం ఒక్కటే ప్రమాణంగా స్వీకరిస్తారు. దయానందులు మొట్టమొదటి సారి ఇల్లు విడిచి సత్యాన్వేషణకు బయలుదేరి ఎంతోమంది గురువుల వద్ద గడిపి అనేక విషయాలు తెలుసకునే క్రమంలో వారికి మథురలో స్వామి విరజానంద అను సంస్కృత వ్యాకరణ విద్వాంసుడు గురువుగా లభిస్తారు. దయానందుడు అప్పటికి పొందిన భాషా పరిజ్ఞానం వృధా అని తెలుసుకొని స్వామి విరజానంద పర్యవేక్షణలో మళ్ళా నేర్చుకుంటారు. గురువు గారు అంధుడు, అయినా విద్వాంసుడు. శిష్యునికి వ్యాకరణంతో పాటు భారతీయ సనాతన జ్ఞానాన్ని వెల్లడి చేసి ఋషి ప్రోక్త జ్ఞానాన్ని పరిరక్షించాలని కోరతాడు. ఋషి ప్రోక్త జ్ఞానమే ఆర్ష విద్య. గురువు చేత మార్గ నిర్ధేశం పొందిన దయానందులు దానిని అన్వేషిస్తూ దయానందులు వేదాన్ని అన్నింటికీ మూలంగా గుర్తిస్తారు. వేదం అపురుషేయం , అదిగాక విశ్లేషణలు అందించిన వేదాంతాన్ని అంటే మనుషుల చేత చెప్పబడిన దేనిని అంగీకరించలేదు. వేదాన్ని పక్కకు జరిపి వచ్చిన పురాణాలు, అవతార చరిత్రలు ఇవి ఏవి కూడా సత్యం కాదని మనుషులచేత వ్రాయబడిన కల్పితాలని వాటిని అనుసరించడం సరికాదని అంటారు. ఈశ్వరుడు అందరి యందు ప్రకటింప బడే వాడు అయితే ఎవరో ఒకరిని మట్టుబెట్టడానికి అవతరించవలసిన అవసరం లేదని అంటారు. వీటికి బదులుగా తల్లిదండ్రులను పూజించాలని,గురువులను,సచ్చీలురులను గౌరవిస్తూ మానవత్వంతో మెలగాలని కోరతారు.ఎవరో ఒకరి సూచించిన మార్గాలు కాకుండా ఏది మూలమో దాన్ని పాటించాలని విలువైన జీవితాన్ని అర్థం పర్థంలేని అపరిశుబ్రం అనాచారం హింస అమానవీయతతో నిండిన అలవాట్లతో గుడ్డిగా అనుసరించకూడదని భోధిస్తారు. అది స్వేచ్ఛగా భావాలను ప్రకటించ గలిగె నేటి కాలం కాదు, బ్రిటిష్ ఆధీనంలో న్యూనతతో , పరాయి పాలనలో పీడనను ఎదుర్కొంటున్న కాలం, సామాజికంగా వివిధ వర్గాల మధ్య ఉన్న అంతరాలు అస్తిత్వకోసం తలపడుతున్న కాలం. నాటికి ఇంత బలంగా స్వమతంలోనూ పర మతాల్లోనూ ఊడలు దిగిన సంప్రదాయాలకు వ్యతిరేకమైన అంశాలను ప్రస్తావించడం, స్వేచ్ఛగా ప్రచురించడం అన్ని మతాలకు కంటగింపుగా మారింది. స్త్రీ విద్య, వివాహం,సహపంక్తి భోజనం, కులమతాలను అధిగమిస్తూ మానవత్వంతో జీవించమనడం సాంఘికంగా అంగీకరించబడలేదు. వారణాశి పండిత పరిషద్, క్రైస్తవ మిషనరీలు , ఇస్లాం సంస్థలు అన్నీ దయనందుని పట్ల ఆందోళనకు గురయ్యాయి. కొన్ని సత్యార్ద ప్రకాశికను ప్రాంతాల్లో నిషేదించారు. వేదాలకు మరళండి అనే నినాదం బ్రిటిష్ పాలకులను ముఖ్యంగా మిషనరీలను వణికించింది. దయానందుల ప్రభావంతో ఎంతో అప్పటికే మతం మారిన ఎంతో మంది తిరిగి హిందూ మతంలోకి మారారు. కొత్తగా మార్చబడే వారు ఆలోచనలో పడ్డారు. మిషనరీలు విద్యాలయాలు స్థాపించి అటుపై విద్యార్థులను క్రై స్థవ దీక్షను ఇచ్చే పరిస్థితి నుంచి ప్రత్యక హిందూ విద్యార్థుల సమూహాలు ఏర్పడినాయి. బెంగాల్లోనూ, వారణాశిలోనూ , పంజాబ్లోనూ వారికి తిరుగులేని విధంగా ప్రజాభిమానం లభించింది. వారణాశి పండిత పరిషద్ సమావేశాల్లో దయానందుల సిద్ధాంతం పెద్ద చర్చలే జరిగాయి. రామాయణ , భారత భాగవతాల పట్ల దయానందుని అభిప్రాయం తుఫాను అనే చెప్పవచ్చు.
సత్యార్ద పకాశీక తొలిసారి వెలువడిన 1875లోనే బొంబే లో ఆర్యసమాజ్ ను ఏర్పాటుచేసి వేద ప్రచారం చేశారు. అది ప్రజలకు దగ్గరగా వెళ్లడంలో విజయం సాధించింది. తమ స్వాభిమానంతో జీవించే పరిస్థితిని పునరుద్దరిచుకోవాలనే ఆలోచనను వ్యాప్తి చేసింది. స్వతంత్ర ఉద్యమంలో చెప్పుకోదగిన రీతిలో ప్రభావితం చేసింది. దయానందుడు ఆర్య సమాజం స్థాపించే నాటికే 1828 లోనే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించి ఉన్నారు. దయానందుడు ఆశించిన సామాజిక మార్పులు అప్పటికే సూచించారు, అయితే హిందువులను ఆకట్టుకోలేక పోవడానికి కారణం అది భారతీయుల మూలాలని గుర్తించకపోగా క్రైస్థావ ఆచారాలను, ప్రార్థనలను ప్రతీ సమావేశంలో చేర్చడమేకాక స్వీయ మత సంస్కరణలకన్నా వ్యతిరేకతనే ప్రకటించింది. అందువల్ల బెంగాల్తో సహా మిగిలినచోట్లలోనూ ప్రజలను క్రైస్థావ మతఅనునాయులుగా మార్చడానికి భూమికగా మార్చడం తప్ప బ్రహ్మ సమాజం ఏమీ చేయలేదనే అపవాదు మూటగట్టుకుంది. ఆర్య సమాజం స్థాపించబడినప్పుడు కూడా అప్పటికే హిందూ సమాజంలొ అనేక పంథాలో ఇదీ ఒకటిగా మిగిలిపోతుందని హిందూ ఆరాధ్య దేవీ దేవతల పట్ల వెలుబుచ్చిన అభిప్రాయాలు ప్రజలను సంధిగ్దంలో ఉంచుతాయని , బ్రహ్మ సమాజం ఏ విధంగా దాని అనుచరులను క్రైస్తవంలోకి మరల్చిందో ఇదీ అలాగే జరుగుతుందని సంప్రదాయవాదులు అనుమానించారు. అయితే అప్పటికే వివిధ కారణాలతో మతం మార్చబడిన వారు ఎంతో బలంగా ఆర్య సమాజ్ ద్వారా తిరిగి సులువుగా స్వమతంలోకి రావడం బ్రహ్మ సమాజానికి భిన్నంగా ఆర్య సమాజాన్ని నిలబెట్టింది. ఇది దయానందుల శుద్ధి ఉద్యమంగా విస్తృత ప్రచారం పొందింది. దేశవ్యాప్తంగా కుల మతాలను అధిగమించి ఆర్యసమాజ శాఖలు నెలకొలపబడినాయి. స్వాభిమానంతో బతకడం పట్ల ఉన్ముఖులయ్యాయి.
వర్ణాశ్రమ ధర్మాల పట్ల బ్రహ్మాణ ఆధిపత్యం పట్ల కూడా దయానందులు పురుష సూక్తంలోని శ్లోకాల వ్యాఖ్యానాన్ని పునర్ నిర్వచిస్తారు.పురుష సూక్తంలో(12 -13 శ్లోకాలు) చెప్పినట్లు బ్రాహ్మణులు విశ్వపురుషుని ముఖం నుంచి రాలేదని , శ్లోకాల వ్యాఖ్యానంలోని తప్పుల వల్ల అటువంటిభావన కలిగిందని, పరమాత్మకు రూపమే లేదని భావించే మతంలో ముఖ్ం నుంచి బ్రాహ్మణులు , పాదాలనుంచి శూద్రులు వెలువడడం ఉండదని, అది సమాజ రూపానికి బ్రాహ్మణులు ముఖ్యం వంటి వారనే అర్థం అని వివరిస్తారు. తదనంతర కాలంలో అంబేద్కర్ కోరిన మతమార్పులన్నీ దయానందులు అప్పటికే సూచించారు. అయితే అంబేద్కర్కు తన అభిప్రాయలు తనకు ఉన్నాయి.హిందువులకు ఒక్క ప్రామాణిక పుస్తకం అంటూ ఉండాలని భావించిన అంబేద్కర్ దయానందుల వేద ప్రమాణికాన్ని స్వీకరించలేదు.ఇంతటి హేతువాద దృక్పథాన్ని హర్షించలేకపోవడానికి అంబేడ్కర్ వ్యక్తిగత అభిప్రాయాలు కారణం కావచ్చు. అంబేద్కర్ నాస్తికుడుగా లేడు. బౌద్దం స్వీకరించాడు. దయానందులూ నాస్తికులు కారు, అయితే కనిపించే సత్యం అంగీకరించాలని, అనాచార వ్యవహార సంకెళ్లను తెంచి మానవత్వంతో మెలిగి పరమాత్మను పొందాలని సూచించారు.
నూటయాభైయేళ్ళ క్రితం ఇంత బలంగా సామాజిక సంస్కరణవాదం ప్రతిపాదించబడ్డం దానికి విస్తృత ప్రజామోదం లభించడం సాధారణ విషయం కాదు. అది వారి మీద విషప్రయోగం చేత హతమార్చాలనే స్థితికి వెళ్ళింది. వారి యోగ విద్య తో పలుమార్లు మృత్యువునుంచి తప్పించుకోగలిగినా చివరికి విషప్రయోగం ద్వారానే మరణించారు. విషం వల్ల శరీరం అంతా పుండ్లు పడి యే వైద్యానికి లొంగక తీవ్ర శరీర వేదనకు గురయ్యారు. తనకు విషమిచ్చిన వంటవాడిని తప్పుఒప్పుకున్న కారణానికి క్షమించి డబ్బిచ్చి నేపాల్ పంపించి వేశారు.దయానందులు తన 59 వ ఏట1883 లో అజమీర్లో మరనించే నాటికి వేద ఋగ్వేద భాష్యం పూర్తయ్యే దశలో ఉంది. మిగిలిన అన్నీ వేదాలకూ విఖ్యానం రచించాలని లక్ష్యం పెట్టుకున్నా అది వారి మరణంతో అర్థాంతరంగా ముగిసింది. దయానందుని జీవితం సత్యాన్ని వెతుకుతూ మొదలై వేదం వద్ద నిలిచిపోయింది. ఇది 16 వ శతాబ్దపు జర్మనీకి చెందిన క్రైస్థావ మత సంస్కార్త మార్టిన్ లూథర్ తో పోల్చబడింది. మార్టిన్ కూడా భగవంతునికి భిన్నంగా చర్చి వ్యవహారాల పట్ల నిరసన చూపియి ప్రొటెస్టెంట్ వర్గాల సంస్కరణకు పూనుకున్నారు. ఆనాటి కాలానికి వారిదీ సాహసమే. వీరి సంస్కరణవాదాల సాహసాలస్వామ్యాన్ని పోల్చి దయానందులను ఇండియన్ మార్టిన్ లూథర్ అని అన్నారు. ఏదేమైనా దయానందుల సత్యార్ద ప్రకాశిక గత నూటయాభై ఏళ్లుగా తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఉంది. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో నాలుగవ భాషగా ఉన్న తెలుగులో పూర్తి అనువాదం చేయడానికి , సరళీకరణ చేయడానికి వందేళ్లకు పైగా సమయం తీసుకుంటే మన ఆధునిక భారతంలో హిందూ మత సంస్కరణలకు తావిచ్చిన దయా నందుల నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని సునిశితంగా పరిశీలించి ఇతర సంస్క్రణవాదాలతో సరిపోల్చి గొప్ప విశ్లేషణ చేసిన వారిలో విదేశీయులలో జె. టి .ఎఫ్ జోర్డెన్స్ ముందుంటారు. వీరు మొట్ట మొదటి సారి ఆస్ట్రేలియాకు చెందిన ప్రసిద్ధ మెల్బోర్న్ విశ్వ విద్యాలయంలో 1961లోనే భారతీయ అధ్యయన శాఖను ఏర్పరచి అనేక అంతర్జాతీయ వేదికల మీద మన దేశంలో వచ్చిన సంస్కరణ వాదాలమీద ప్రసంగించారు.1978 లోనే దయానంద సరస్వతి : హిస్ లైఫ్ అండ్ ఐడియాస్ అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ఆర్య సమాజ్ వారసత్వాన్ని గాంధీ , అంబేద్కర్ ల సంస్కరణలతో పోల్చి వ్రాసిన వ్యాసాలు మన దేశ ప్రజల సంస్కరణ అభిలాషను అనుసరణను తెలియజేస్తాయి. వాటి లోతుని బహిర్గతం చేస్తాయి. శీలా బాలాజీ రాసిన స్వామి దయానంద సరస్వతి కాంట్రిబ్యూషన్స్ అండ్ రైటింగ్స్ వంటి కొన్ని తప్ప తెలుగులో వచ్చిన పుస్తకాలు లేవు. తెలుగు గడ్డ మీద ఆర్యసమాజ్ సాధించిన విజయాల మీద, దయనందుని మీద రావాల్సినంత విమర్షనో , సమర్థనలో, విశ్లేషణలో రాలేదు. విదేశీయులు విశ్లేషించిన రీతి ప్రామాణిక వ్యాసాలు రాలేదు. కారణాలు ఏవైనా వారి సిద్ధాంతం ఎటువంటిదైనా మనల్ని మనం మానవత్వం దిశగా మరాల్చుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సంస్కరణలకు సిద్ధంగా ఉండాలి , దానిని ఏ ఒత్తిడీ లేకుండా చర్చించగలగాలి. ఏది విస్తృత మానవ ప్రయోజనాన్ని ఇవ్వగలదో దానిని ప్రోత్సహించాలి. ఆ పరిస్థితి మన సనాతన భారతీయ సంప్రదాయంలో ముందునుంచీ ఉంది. దయానందులు మనముందు వారి గ్రంథం ద్వారా మన ఆచరణను, హేతువాద దృక్పథంతో నిర్వచించుకునే స్వేచ్ఛను మనకే వదిలి వెళ్లారు. మతాలకు భిన్నంగా ప్రతీ మానవుడు చదవవలసిన గ్రంథంగా అందులో పేర్కొన్న అంశాలు మన ఆచారణలకు తప్పక మార్గదర్శకాలవుతాయని అన్ని మతాలకు సూచించడం ఈ గ్రంథం గొప్పదనం. మానవత్వం తప్ప మరొకటి లేదని , భక్తి విశ్వాసాలు హింసకు కారణం కాకూడదని భోదంచే ఈ గ్రంథం గురించి ప్రతి ఒక్కరూ తెలుకోవలసి ఉంది.
రేడియో ఒక వినోద, విజ్ఞాన ప్రసార సాధనం.
ప్రస్తుత కాలము నుండి ఒక 50 సంవత్సరాల వెనకకు వెళితే….ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని ఆ కాలంలో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు అందుకుంది. . రోజూ నాలుగు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే, పాటలు, జానపద గీతాలు, శాస్త్రీయ, లలిత సంగీతం వ్యవసాయ కార్యక్రమాలు, క్విజ్, కథానికలు,సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.ఓ నాలుగు దశాబ్దాల క్రితం వరకు పెద్దా, చిన్నా అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం. అసలు రేడియో ఒక వింత సాధనం …. అందులోకి మనుషులు ఎలావెళ్లి మాట్లాడుతారా! పాటలు ఎలా పాడుతారా? అని ఆశ్చర్యంతో కూడిన అమాయకత్వం చాలా మందికి ఉండేది. ప్రతి ఇంట్లో పెద్దదో,చిన్నదో…. ఏదో ఒక రేడియో తప్పకుండా ఉండేది. వివిధ కంపెనీల రేడియోలు అంటే మర్ఫీ, బుష్ ,ఫిలిప్స్, నేషనల్ పానసానిక్ మొదలగునవి….. మా చిన్నతనంలో మా ఇంట్లో బుష్ రేడియో ఉండేది. దానిలో వచ్చే కార్యక్రమాలు నాకు ఇప్పటికే జ్ఞాపకమే. ఉదయం 6 గంటలకు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయము 6 గంటలు అని చెప్పేవారు. రేడియో వింటున్న ప్రతి ఒక్కరు గడియారంలో సమయాన్ని (టైం ని) సరిచేసుకునేవారు. వందేమాతర గీతంతో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యేవి. 6.10 నిమిషాలకు ప్రసారకర్త (అనౌన్సర్) ఆ రోజు కార్యక్రమాల వివరాలు తెలిపేవారు.6.30 నిమిషాలకు… సంస్కృతం నేర్చుకుందాము అనే కార్యక్రమం ‘బర్తృహరి’ శ్లోకముతో మొదలయ్యేది.
“కేయూరాణి న భూషయంతి పురుషం, హారాణ చంద్రోజ్వలా
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్దజాః
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృత ధార్యతే, క్షీయంతేఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం.” 6.45 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు… ‘ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాహః శుయంతాం ప్రవాచకః బలదేవానంద సాగరః’ అని మొదలయ్యేవి. 7.10 నిమిషాలకు ఢిల్లీ నుండి తెలుగులో వార్తలు ‘అద్దంకిమన్నార్’ చదివేవారు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి ‘ప్రాంతీయ వార్తలు’ అద్దంకిమన్నారు, కందుకూరి సూర్యనారాయణ ,పార్వతీ ప్రసాద్ వీళ్లలో ఎవరో
ఒకరు చదివేవారు. తర్వాత కార్మికుల కార్యక్రమం… చిన్నక్క ఏకాంబరం, పీతాంబరం నిర్వహించేవారు.ప్రభుత్వ పథకాలు,కార్మికులు-వారి హక్కులు,బాధ్యతలను తెలియజేస్తూ మధ్య మధ్యలో చిత్ర గీతాలు ప్రసారం చేసేవారు.ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు ప్రయాగ రామకృష్ణ లేక తిరుమల శెట్టి శ్రీరాములు వారిలో ఎవరైనా ఒకరు చదివేవారు.సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకి ‘పాడి-పంటలు’ కార్యక్రమం మొదలయ్యేది. పాడిపంటల కార్యక్రమము తర్వాత ‘మనోరంజని’ మీరు కోరిన పాటలు వింటారు అని మీనాక్షి (లేక )ఏవీఎస్ రామారావు ప్రకటించగానే ఇంట్లో అందరం ఎంతో శ్రద్ధగా ఆ పాటలు చెవులు రిక్కించి వినేవాళ్ళం. అరగంట ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలు వేసేవారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఢిల్లీనుండి వార్తలు అని చెప్పేవారు. ఇంగ్లీషులో వార్తలు ఢిల్లీనుండి ప్రసారమయ్యేవి. స్పష్టమైన ఇంగ్లీషులో వార్తల ప్రసారం సాగేది.సాయంత్రం 6 గంటలకు’ఉర్దూలో వార్తలు,ఏడు గంటలకు ‘ఇల్లు- వాకిలి’ కార్యక్రమము,7.30 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యేవి.ఇక రాత్రిపూట చిత్రలహరి ‘మధురిమ’ అంటూ పాటలు వేస్తుండేవారు. ఆ తర్వాత ఢిల్లీ నుండి శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారుల స్వర విన్యాసాన్ని సంగీతాభిలాషులు ఎంతో శ్రద్ధా,భక్తులతో ఈ కార్యక్రమాన్ని ఆలకించేవారు. ఇక రాత్రి 10 గంటలకు హరికథలు, నాజర్ బృందంచే బుర్రకథలు, సాంఘిక నాటకాలు, నాటికలు, ప్రసారమయ్యేవి.
ఇక ‘సిలోను’లో హిందీ పాటలు వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు, సాయంత్రం 5గంటలకు దక్షిణ భారతదేశపు ప్రాంతీయ భాషలలో పాటలు వచ్చేవి, (కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం )వాళ్లు ప్రసారం చేసే ఒక తెలుగు పాట కోసం పడిగాపులు పడి అన్ని భాషల పాటలు వినేవాళ్ళం. సిలోన్ రేడియోలో ప్రసారమయ్యే ‘బినాకా గీతమాల’ అంటే అందరికీ ఇష్టమే. సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు. చెవి దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినే వాళ్ళము. పండగలప్పుడు ప్రత్యేక ‘జనరంజని’ ఉండేది. దానిలో ఆయా పండుగలకు సంబంధించిన పాటలు ప్రసారమయ్యేవి. పండుగలప్పుడు సినిమానటులతో
గాని,గాయకులతో గాని ప్రత్యేక కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమం మధ్యలో వాళ్లు నటించిన లేక, పాడిన సినిమా పాటలు వేసేవారు. ఇవే కాకుండా ‘పుష్పాంజలి’ భక్తి సంగీత కార్యక్రమం, ప్రతి శనివారం ‘శ్రీవెంకటేశ్వర సుప్రభాతం’, ఉషశ్రీ ‘రామాయణ,మహాభారతాలు’,వినోదవల్లరి,ఇక తెలుగు పాటలలో… ఏకచిత్రా గానమని, మీరు కోరిన పాటలని, చిత్రతరంగిణి అని ప్రసారం చేసేవారు. సైనిక సోదరుల కొరకు ప్రత్యేక ‘జయమాల’ హిందీ సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. ఇంట్లో ఆడవాళ్లు రేడియోలో పాటలు ,ఇతర కార్యక్రమాలు వినుకుంటూ ఇంటి పని, వంటలు చేసుకునేవారు.రేడియోలో ఏమైనా ఇష్టమైన సినిమా పాటలు వస్తే పిల్లలు గానీ,పెద్దలు కానీ ఆ పాట తో శృతి కలిపేవారు.వాళ్ళ గొంతు బాగుందా లేదా అనేది తర్వాత సంగతి.అది వారికి సంతోషాన్ని కలిగించేది.రాగ యుక్తంగా పాడటమే కాకుండా కొందరు ఔత్సాహికులు అవి నేర్చుకోవాలనే తాపత్రయంతో రాసుకోవాలని పెన్ను, పుస్తకం తయారుగా పెట్టుకొనేవారు.రేడియో పుణ్యాన మా తరం వారికి మరియు మా కంటే ముందు తరాల వారికి కూడా పాటలన్నీ చాలావరకు నోటికి వచ్చేవి. పిల్లల పరీక్షల టైములో రేడియో వినడానికి పెద్దల ఆంక్షలు కొద్దిగా కఠినంగానే ఉండేవి. పరీక్షలు అయ్యేదాకా రేడియో విననిచ్చేవారు కాదు. ప్రజా ప్రతినిధులు అంటే… రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ముఖ్యమంత్రి, గవర్నర్, స్పీకర్లు, మంత్రులు…వీరిలో ఎవరు అస్తమించిన రేడియోకి సంతాపదినాలు ప్రకటించేవారు. వాళ్ళ పదవిని బట్టి సంతాపదినాలు ఉండేవి. మొదటి 2,3 రోజులు విషాదసంగీతము,చివరికి వచ్చేవరకు భక్తిగీతాలు మొదలయ్యేవి. మా అందరికీ సంతాపదినాలలో ఏమి తోచనట్టు, కాలం చాలా భారంగా గడిచేది. ఆదివారం వచ్చిందంటే పిల్లలకు,పెద్దలకు పండుగే. మధ్యాహ్నము 2గంటలకు ఢిల్లీ నుండి ఆంగ్లవార్తల తర్వాత 2.10 నిమిషాల నుండి 3 గంటల వరకు బాలానందము…. అనే కార్యక్రమం ప్రసారమయ్యేది. పిల్లలందరము రేడియో చుట్టూ కూర్చుని ఎంతో శ్రద్ధగా,ఇష్టంగా బాలానందం కార్యక్రమాన్ని వినేవాళ్ళం.ఎంతో సరదాగా అనిపించేది మాకు.1950 నుండి ప్రసారం చేయబడిన బాలానందం వినని వారు ఉండరు. న్యాయపతి రాఘవరావుగారు రూపొందించిన ఈ కార్యక్రమము చాలా ఉత్సాహంగా నిర్వహించ బడేది.బాలానందం కార్యక్రమం మొదట పిల్లల పాటతో మొదలయ్యేది. అది ఈ విధంగా…. ‘రారండోయ్- రారండోయ్ పిల్లల్లారా- రారండోయ్, పిల్లల్లారా- రారండోయ్, బాలబాలికలు -రారండోయ్ బాలవినోదం వినరండోయ్. రారండోయ్-రారండోయ్.
హైదరబాదు బాలలము జైహింద్ అంటూ పిలిచాము. జై జై మంటూ రారండోయ్ రేడియో ప్రోగ్రాం వినరండోయ్… రారండోయ్- రారండోయ్’. రేడియో అక్కయ్య, రేడియో అన్నయ్య కార్యక్రమానికి వచ్చిన పిల్లలతో చిన్న పిల్లల పాటలు, శ్లోకాలు, పద్యాలు, సామెతలు, పొడుపు కథలు , క్విజ్, జనరల్ నాలెడ్జ్ విషయాలు ఎన్నో చెప్పించి ఆ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా నడిపేవారు.మూడు గంటలకు నిమిషం ఉందనగా కార్యక్రమం అయిపోయేది.ముగింపు పాటకూడా ఈవిధంగా ఉండేది.’చాలు ఇంకా ఆటలు, మన పాటలు… మన మాటలు, చక చక చక చక పోదామా…
.ఇండ్లకు మనఇండ్లకు,బిర బిర బిర బిర పోదామా….బిర బిర బిర బిర పోదామా…..
సరిగ్గా 3గంటలకు సంక్షిప్త శబ్దచిత్రం మొదలయ్యేది. మూడుగంటల నిడివి ఉన్న సినిమాని ఒక గంట సినిమాగా కుదించి ప్రసారం చేసేవారు.ఎంతో ఆసక్తికరంగా పిల్లలు, పెద్దలు రేడియో చుట్టు చేరి కూర్చొని ప్రసారమవుతున్న సినిమాని వినేవారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం రెండుగంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు బజారులో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడేవి. అంటే…అందరూ ఆ సమయములో రేడియోకి అతుక్కుపోయేవారు అన్నమాట…. ఇంకేముంది సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ ఆదివారం ఎప్పుడొస్తుందా?అని మా లాంటి పిల్లలందరూ ఎదురుచూపులు.ఆదివారం సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారమయ్యేవి. ఆ నాటకాలలో నండూరి సుబ్బారావు, వీ.వీ. కనకదుర్గ ,పాండురంగ విఠల్, ఏ.వీ.ఎస్. రామారావు వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపించేవి. అచ్చమైన తెలుగు ఉచ్చారణతో నాటకాలు చాలా ఆసక్తికరంగా సాగేవి.రేడియోలో క్రికెట్ కామెంటరీ,వాతావరణ విశేషాలు కూడా ప్రసారమయ్యేవి. రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వారు సూచిస్తే…. బాగాఎండలు కాస్తాయని, ఒడియాలు ఎండ పెట్టుకోవచ్చని హాస్యంగా మాట్లాడుకునే వాళ్ళు లేకపోలేదు….. ఎందుకంటే వాతావరణ కేంద్రంవాళ్ళు సూచించిన విధంగా వర్షాలు పడేవి కావు. 😀😀
కాలక్రమేణా రేడియో కార్యక్రమాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్త, కొత్త కార్యక్రమాలు వచ్చాయి. మేము హై స్కూల్ చదువులకు వచ్చాక… 1977 నుండి ‘వివిధ భారతి’ వాణిజ్యప్రసార విభాగం మొదలైంది. ప్రతిరోజు ఉదయం 8గంటలకు భక్తి సంగీతాల కార్యక్రమం ‘అర్చన’ తర్వాత, 8:30 కి ‘వివిధ భారతి ‘వాణిజ్య ప్రసార (పాటల) కార్యక్రమం మొదలవుతుంది. మంచి, మంచి సినిమాపాటలు వేస్తూ.. పాటలమధ్యన ప్రకటనలు వేస్తారు. ‘వివిధ భారతి’ ప్రసారం మధ్యలో సమయం 9 గంటలు కాగానే ‘హోటల్ మమత’ విజయవాడ వారి సమయం 9 గంటలు అనే ప్రకటన వచ్చేది. అమ్మో! 9గంటలు అయింది అని మేము పాఠశాలకు వెళ్లేవాళ్ళం. ప్రస్తుతం అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ‘ఎఫ్.ఎం రేడియో’ ఛానళ్ళ ను ప్రారంభించాయి.రేడియో కార్యక్రమాలలో ఎన్ని మార్పులు వచ్చినా… మనకు గుర్తొచ్చేది ఆ నాలుగు దశాబ్దాల కాలం నాటి రేడియో కార్యక్రమాలు మరియు అంకితభావంతో పనిచేసిన ఆకాశవాణి ఉద్యోగులు మాత్రమే.వారికి ధన్యవాదములు తెలుపుకుందాం. నానా విధాలుగా ఆనందాన్ని, వినోదాన్ని అందించిన రేడియో మనకు ఒక అపురూపమైన కానుక. ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ… రేడియోకి ఆదరణ తగ్గలేదు.ఇప్పటికీ రేడియో కార్యక్రమాలు అంటే ఇష్టపడే రేడియో ప్రియులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రేడియో అభిమానులలో నేను కూడా ఒకదాన్ని.ఆ అభిమానమే రేడియో గురించి రాయాలనే ప్రేరణ నాకు కలిగించింది.మనకు, విజ్ఞాన,వినోదాలను అందించిన రేడియోను కనిపెట్టిన ‘మార్కోని’ కి మనం ఎంతో ఋణపడి ఉన్నాము అని చెప్పక తప్పదు.
అవధానం అంత సామాన్య విషయం ఏమీ కాదు! దానికి ఏకాగ్రత ఉండాలి! ఆశువుగా పద్యం చెప్పే నేర్పు అదీ కూడా ఛందస్సులో కూర్చి తక్కువ సమయంలో పూరణల చేయడం మొదలైన ఎన్నో నేర్పులు ఉండాలి !
అంతేకాదు అవధానం చేసేటప్పుడు ఏకాగ్రత భగ్నం చేయడానికి ఇతర అవరోధాలే కాకుండా అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకులు…
అవధాని గారూ! అంటూ ఏదో ఒక కొంటె ప్రశ్న వేయడం… సభలోని వారంతా నవ్వుతూ ఏకాగ్రతను చెదరగొడుతుంది. అయినా అలా వేసిన ప్రశ్నకు ఏమాత్రం తడుము కోకుండా చక్కటి హాస్యపూరిత సమాధానమిచ్చి అందరినీ నవ్విస్తారు అవధాని.
ఇలా ఎన్నో సభలలో ఆకట్టుకున్నారు మన నేటి అవధాన మలుగు అంజయ్య గారు. ఇదొక పెద్ద కసరత్తే!
అయితే జన్మతః కవితాత్మకత ఉండటం, గ్రంథాలను నిరంతరం అధ్యయనం చేయడం, ముఖ్యంగా పురాణ వాజ్ఞ్మయంతో పరిచయం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు!
తన ఇంట్లో చదువు వాతావరణం లేకపోయినా, పాండిత్యం- కవిత్వం అనువంశికంగా సంక్రమించకపోయినా… ఎన్నో అష్టావధానాలు, రెండు మూడు శతావధానాలు జనరంజకంగా చేసి పండిత పామరుల చేత మన్ననలు పొందిన మలుగు అంజయ్యగారితో ఈనాటి మన మయూఖ ద్వైమాసిక పత్రిక ద్వారా ముఖాముఖిలో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు ఈనాటి అతిథి మలుగు అంజయ్యగారితో ఈ పరిపృచ్ఛ చేద్దాం!

పద్మజ:– అంజయ్య గారు నమస్కారాలండీ!
అంజయ్య:- మీకు మరియు పత్రికా యాజమాన్యానికి ముందుగా వందన మందారాలు!
మారుమూల గ్రామంలో జన్మించి, అవధానిగా ఎదిగి, యావత్ భారత దేశంలో ఎన్నో అవధానాలు చేసినటువంటి నన్ను సమాజానికి అందించాలనే సత్సంకల్పంతో మయూఖ పత్రిక ద్వారా పరిచయం చేస్తున్నందుకు ముందుగా నా నమస్సుమాంజలి!
పద్మజ:– మా పాఠకుల కోసం మీ కుటుంబ నేపథ్యం చెప్తారా?
అంజయ్య:- నేను వికారాబాద్ జిల్లాలో కోడూరు మండలంలోని అంగడి చిట్టంపల్లి అనే గ్రామంలో యాదవ వంశంలో జన్మించాను. మా తల్లిదండ్రులకు మా కుటుంబములో ఎవరికీ అక్షర జ్ఞానం లేదు. గొర్రెలకు కాపరులుగా ఉంటూ, మా కుటుంబాన్ని పోషించేవారు. ఆయా సందర్భాల్లో నేను కూడా వారితో పాటు గొర్రెల కాపలాకు వెళ్ళేవాడిని. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందపడే వాడిని. అదేవిధంగా మా బంధువుల ఇళ్లల్లో కానీ, మా ఇళ్ళల్లో కానీ శుభకార్యాలు జరిగినప్పుడు ఒగ్గు కథ బీరప్ప కథలు చెప్పించే వాళ్ళం. ఆ కథను చెప్పేవాళ్లు….
శరణు! శరణు! మాయమ్మా! రాణీ! అమ్మా! భవాని! గంగాభవానీ! అంటూ పాడడం ప్రారంభించి, అతివేగంగా సందర్భానుకూలంగా గీతాలను పాడుకుంటూ కథలు చెప్పేవారు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఇంత వేగంగా పాటలు పాడుతూ, కథ చెప్తూ ఉంటే చిన్నప్పటినుండి తన్మయత్వంగా వినేవాడిని. ఆ కారణంగానే నాకు సాహిత్యం వైపు మొగ్గు చూపేందుకు పునాది పడింది తల్లీ!
పద్మజ:– మీరు ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకున్న తర్వాత ( O L; BOL ; MOL ) ఓ యల్, బి ఒ యల్, ఎమ్ ఓ యెల్ చేసారు కదా! ఇలా తెలుగు సబ్జెక్టును ప్రత్యేకంగా ఎన్నుకోవడానికి కారణం ఏమైనా ఉందా?
అంజయ్య:– పెద్ద కారణమే ఉందమ్మా! నేను తాళ్లూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివినప్పుడు ఫెయిల్ అయినాను. అలా ఫెయిల్ కావడానికి కారణము మాకు గణితం, ఇంగ్లీషు, సైన్సు చెప్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ సబ్జెక్ట్ లు నాకు రాకపోయేవి. తెలుగు, సోషల్ మాత్రమే ఉపాధ్యాయులు ఉండి చక్కగా పాఠాలు చెప్పేవారు. అందుకే నేను పదవ తరగతి పరీక్షలో తప్పాను… ఆ తర్వాత నేను ఊర్లో ఉండిపోయాను. ఓరియంటల్ కాలేజీలో ఎంట్రెన్స్ రాసి, దాని ద్వారా కాలేజీలో సీటు సంపాదించి, చదువు చదవ వచ్చని ఎవరో చెప్పారు …
అలా చదవాలని ఓరియంటల్ కాలేజీకి వెళ్లాను. ఆ క్లాసులోకి వెళ్ళగానే సిలబస్ లో శ్లోకాలు, పాటలే ఉన్నవి. నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా అంత వరకు నేను చేప పిల్ల చెరువులో నుండి బయటపడితే గిలగిలలా కొట్టుకున్నట్టు నేనుండేవాడిని. అక్కడ ఇటువంటి విద్యా విధానం చూడగానే మళ్లీ చేప నీళ్లలో పడినప్పుడు పడిన ఆనందం పొందాను. కారణమేమంటే అక్కడ ఒక్క తెలుగు మాత్రమే ఉండడం విశేషం.
కాలేజీలో గట్టు గణపతి గారని అధ్యాపకులు ఉండేవారు. తెలుగు పద్యాన్ని ఎంత బాగా చెప్పేవారంటే మాటలలో చెప్పలేము! రామాయణ, మహాభారతాలలో ఉన్న పద్యాలను విడమర్చి చెపుతుంటే.. ఒక పద్యాన్ని ఇంత విశ్లేషించవచ్చా? ఒక పద్యంలో ఇంత మాధుర్యం ఉంటుందా? ఇలా పద్యాన్ని విడదీసి చదివితే ఎంత అర్థవంతంగా ఉందో కదా! అని అనుకునేవాడిని. శ్రీనివాసాచార్యులనే సంస్కృత అధ్యాపకులుండేవారు. వారు సంస్కృతంలో ఉన్న రఘువంశము, కిరాతార్జనీయము, పంచతంత్రము పాఠాలు చెప్తుంటే ఎంతో బాగుండేది.
వ్యాకరణాంశాలు కూడా అన్నీ చెప్పేవారు. నాకు ఏదైతే ఇష్టమో? ఆ తెలుగే అక్కడ లభించడంతో నా ఆనందానికి హద్దే లేదు! ఎందుకంటే నాకు ఇష్టమైన సబ్జెక్టు కావడంతో చక్కగా చదవగలిగాను. తరువాత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరిన తరవాత నేను చెప్పే సబ్జెక్టు కూడా అదే కావడంతో నా బోధన మా విద్యార్థులు ఎంతో ఇష్టపడేవారు. ఒక పద్యమో, ఒక పాటనో ఇలా ఏదో ఒకటి రాసి, పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి గాని గణతంత్ర దినోత్సవానికి గాని పాడేవాణ్ణి.
మా ప్రధానోపాధ్యాయులు నన్ను పాట రాయమని, పిల్లలకు నేర్పించమని అనేవారు. నేను పాట రాసి పిల్లలకు నేర్పించి, ప్రభాత భేరిలోనో, లేక ఏదేని కార్యక్రమంలో వేదిక పైననో ప్రారంభ సమయంలో పాడించేవాడిని. అలా పిల్లలతో పాటు, నాకూ ఎంతో సంతృప్తి, సంతోషం కలిగేది. అదంతా తెలుగు భాష కున్న మాధుర్యం అదే కాకుండా అప్పటికప్పుడు చిన్న చిన్న రూపకాలు రాసి, విద్యార్థుల చేత ప్రదర్శనలు చేయించేవాడ్ని.
ఇవన్నీ కూడా చిన్నప్పటినుండీ ఇష్టమవడంతో… ఉద్యోగ బాధ్యతల్లో చేయమన్నప్పుడు మనస్ఫూర్తిగానే చేసేవాడిని.
నేను శ్రద్ధగా పాఠాలు చెప్పడం వల్ల మా పాఠశాల విద్యార్థులందరికీ తెలుగంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. అందువల్ల నేను ఎక్కడ ఉంటే అక్కడ కోడి చుట్టూ కోడి పిల్లలు మూగినట్టు నా చుట్టూ మా విద్యార్థులు మూగేవారు.
ఒక పాట చెప్పండి సార్ అనో; లేకపోతే ఒక పద్యం చెప్పండి సార్ అని అడిగే వారు. తర్వాత అమ్మా! నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు డీఈఓ గానీ ఎవరైనా మంత్రులు గాని ఆ ప్రాంతానికి వస్తే, తప్పనిసరిగా నన్ను వేదిక మీదకు పిలిచేవారు హెడ్మాస్టర్ గారు. వేదిక మీద పాడడం కోసం నేను వారి మీద అప్పటికప్పుడు ఆశువుగా పద్యాలు చెప్పినా, అభినందన పద్యాలు వినిపించినా వాళ్లకు ఎంతో ఆనందం కలిగేది. వారితో పాటు నాకు ఆనందమే! అటు సమాజము,ఇటు పాఠశాల నాకు ఎంతో తృప్తినిచ్చింది.
మొట్టమొదట స్పెషల్ టీచర్ గా ఉద్యోగంలో 398 రూపాయల జీతంతో చేరాను. ఆ కొద్ది మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నా చేతికి జీతం అందలేదు. అయినా కూడా నా దృష్టి జీతం మీదకు పోకుండా… పిల్లలకు పాఠాలు చెప్పడం మీదనే ఉండేది. పాట మనుసును మురిపిస్తుంది. పాటకు ఉన్న శక్తి అటువంటిది. తెలుగు భాషకు ఆకర్షణ అటువంటిది. నేను వృత్తి నిర్వహణలో చాలా తృప్తి పొందాను. ఒకవేళ మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు టీచర్ గానే జన్మించాలని ఉంది.
పద్మజ:– తప్పక మీరు కోరుకున్నట్టు మరో జన్మలోను తెలుగు ఉపాధ్యాయులుగా ఉండే అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించాలని కోరుకుంటూ…. మీకు ఇష్టమైన గురువు ఎవరు?
అంజయ్య:– బృహత్ ద్వి సహస్రావధాని డా॥ మాడుగుల నాగపణి శర్మ గారు. ఎందుకంటే పద్య మాధుర్యాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి. వారి యొక్క పద్య పఠనంగానీ, పద్యాన్ని పూరించే విధానంగానీ, పద్యాన్ని వర్ణించి చెప్పే విధానంగానీ మరొకరు అలా చేయలేరని నా విశ్వాసం.
ఈనాడు ఎంతో మంది తెలుగు భాష వైపుకు ఆకర్షింప బడటానిక, ఎందరో అవధానాలు చేయడానికి కారణం మా గురువుగారు నాగఫణి శర్మ గారే. వారికి ఏకలవ్య శిష్యుడుగా ఉండి నేను చాలా నేర్చుకున్నాను. వారు కూడా తన ప్రియ శిష్యుడని సంబోధిస్తారు. అది నా భాగ్యంగా భావిస్తాను.
పద్మజ:- నేటి విద్యా విధానానికి నాటి విద్యా విధానానికి ఏమైనా తేడాలు ఉన్నట్టు మీరు గమనించారా? నాటి విద్యార్థుల నేటి విద్యార్థుల ఆలోచనలెలా ఉన్నాయి?
అంజయ్య:– నాటి విద్యా విధానానికి ఈనాటి విద్యా విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆనాటి విద్యా విధానం విద్యార్థిని సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా ఉండేది. విద్యార్థి తన నిజ జీవితంలో ఏ ఒడిదుడుకులున్నా తట్టుకొని జీవించే శక్తిని నేర్పించేది. ఉద్యోగం అంటే ప్రభుత్వం ఇచ్చేజీతం కోసమే బతకడం కాకుండా… తాను స్వయం ఉపాధితో జీవించడానికి తగిన విధంగా ఉండేది. ఆనాటి విద్య తల్లిదండ్రులన్నా, గురువులన్నా, పాఠశాల అన్నా ఒక మంచి గౌరవముండేలా విద్యార్థులకు నేర్పించేలా ఉండేది.
ఈనాడు అంతా యాంత్రికం అయింది లోకమంతా డబ్బువైపు పరిగెత్తుతున్నది కోట్ల రూపాయలు సంపాదించినా కూడా ప్రపంచమంతా నా స్వంతం కావాలనే అత్యాశ లేదా దురాశతో పరిగెత్తుతున్నారు తప్ప ఏ చదువులో ఆనందంగా ఉందామనే ఆలోచన విద్యార్థులకు రావడం లేదు. ఈనాటి విద్యా విధానం కానీ విద్యార్థులు కానీ లేదా తల్లిదండ్రులు గానీ డబ్బు మాత్రమే కోరుకుంటున్నారు. విద్యార్థులు గానీ తల్లిదండ్రులు గానీ ఇంజనీరింగ్ లేదా వైద్య వృత్తులనుకోరుకుంటున్నారమ్మా! ఇతర వృత్తుల చదువులకు సంబంధించిన చదువులు అంతగా ఇష్టపడటం లేదు. నిరాడంబర జీవితం గడిపాలని కానీ సమాజానికి సేవలు చేయాలనిగానీ ఉండడంలేదు. సమాజపరంగా ఏదైనా ఒత్తిడి ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని కానీ ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కోవాలనే స్థిరచిత్తం కాని బోధనలో నేర్చుకోవడం లేదు. చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో కనపడటం లేదు. హృదయం కోమలంగా పవిత్రంగా ఉండాలి. అంటే పురాణ వాజ్మయ పరిచయం ఉండాలి.

పద్మజ:– మీరు ఇలా కాకుండా ఉండేందుకు మార్పులు ఏమైనా చెప్తారా?
అంజయ్య:– ఆలోచనలో మార్పు రావాలి. పైన చెప్పిన రెండే వృత్తులు ముఖ్యం కాదనీ, సమాజం మనుగడ కోసం అన్ని వృత్తులు అవసరమని, తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఆ రెండే వృత్తులు గౌరవం, డబ్బు ఇస్తాయని అనుకోవద్దు. ఏ చదువు అయినా సమాజంలోని అన్ని రకాల ప్రజలకు అవసరమని గుర్తించినప్పుడు ఈ ధోరణి మారుతుంది. అంతేకాదు మనిషికి ఓదార్పు ఇచ్చేది సాహిత్యం. శాంతినిచ్చేది పురాణ వాజ్ఞ్మయం. కాబట్టి ఏనాటికైనా అందరి దృష్టి అటు తిరగవలసిందే! పోతే ఇప్పటికే ఆ కృషి కొంత ప్రారంభమైంది. పాఠశాలల ద్వారా చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థులు వినే దశలో లేరు. తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా? జీవితానికి భద్రత ఉంటుందా? సంఘంలో గౌరవం ఉంటుందా? కేవలం టైం పాస్ కోసం అంటే కాలక్షేపానికి మాత్రమే తెలుగు పనికొస్తుందని కొట్టి పారేస్తారు, తప్ప వినిపించుకోరు కానీ మాతృభాషలో ఎవరైతే క్షుణ్ణంగా చదువుతారో మిగతా సబ్జెక్టులన్నీ చాలా సులువు అయ్యి, అన్ని సబ్జెక్ట్ లు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు సాంప్రదాయ విద్యలే శాంతిని ఆనందాన్నిస్థాయాని విద్యార్థులు తెలుసుకోవాలి!
పద్మజ:- మీకు అవధానం ఎప్పుడు చేయాలనిపించింది? దానికి ప్రేరణ ఏమిటి?
అంజయ్య:– అమ్మా! తెలంగాణ ప్రభుత్వం నాగఫణిశర్మ గారి చేత లలిత కళాతోరణంలో ద్విసహస్రావధానం తలపెట్టి, ఔత్సాహికులైనటువంటి తెలుగు ఉపాధ్యాయులను పృచ్ఛకులుగా పంపించారు. నలబై రోజులు ఓ డి ఇచ్చి పంపారు. నేను ఆ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తలంపుతో మా ప్రధానోపాధ్యాయుడు గారి సలహాతో నేను వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత ఆ నలభై రోజులు ఆవధానంలో ఉండడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాగఫణిశర్మ గారు చెప్పే పద్యం రాగం ద్వారా పద్యాన్ని ఎలా మనం రాయవచ్చు? అని ఒక లయ, ఒక శైలి ద్వారా పద్యాన్ని నిర్మించుకోవచ్చు అనేది నేను గమనించి, నేను వారు చెప్పినట్టే పద్యం చెప్పడం ప్రారంభించాను. నాకు ముందే పద్యం ఆశువుగా చెప్పడం వచ్చినా… అంత మాధుర్యంగా వచ్చేది కాదు! నాగఫణిశర్మ గారు చెప్పినట్టు వికారాబాద్ ప్రాంతంలో ఏదైనా వేదిక మీద పద్యం చెప్తుంటే కాలేజీ ప్రిన్సిపాల్ గారు తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ అయిన “ముళ్ళపూడి సూర్యనారాయణ మూర్తిగారు “అంజయ్య గారూ! మీరు అవధానం చేస్తారా? “అని అంటే ప్రయత్నం చేస్తాను అని అన్నాను.
మొదట డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అందరూ పృచ్ఛకులుగా నా చేత అవధానం చేయించారు. ఆశువుగా నేను పద్యాలు చెబుతుంటే వాళ్లంతా ఆశ్చర్యపోయి, బాగుందని మెచ్చుకోవడమే కాకుండా దీని మీద ఇంకా పట్టు సాధించాలని అవధానానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదవమన్నారు. ఆ గ్రంథాలన్నీ చదవడం వారు చెప్పినట్టుగా కొన్ని సూచనలు అనుసరించడంతో వారే పెద్ద ఎత్తున ఒక వెయ్యి మంది సమక్షంలో పెద్ద వేముల పట్టణంలో ( తాండూరుకు దగ్గరగా ఉంటుంది) అవధానం ఏర్పాటు చేశారు.
వెయ్యి మంది శ్రోతలు ఉన్న సభ అది! అంతమంది సమక్షంలో అవధానం చేసి, వారి మెప్పులు పొందాను. అప్పుడు గురువుగారు ఏమన్నారంటే ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత! నువ్వు ఇంట్లో గెలిచావు! నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అవధానం తప్పనిసరిగా ప్రశంసలు అందుకుంటుంది నాయనా! అని ఆశీర్వదించారు సూర్యనారాయణ మూర్తి గారు. ఆ తర్వాత అంచలంచలుగా అనేక అవధానాలు చేస్తూ చేస్తూ, భారతదేశంలోని మహానగరాలన్నింటా అవధానాలు చేశాను. ఢిల్లీ నగరంలో ఐదు సార్లు, మద్రాసులో ఒకసారి, లక్నోలో ఒకసారి ,తెలంగాణ ప్రభుత్వమే అవధానాల కోసం నన్ను పంపించింది. తర్వాత అహ్మదాబాద్ లో( గుజరాత్ )లోను, హైదరాబాద్ లో ఎన్నో వేదికల మీద అవధానం చేశాను. రవీంద్ర భారతిలోను, సారస్వత పరిషత్తులోనూ, శ్రీధర్ ఫంక్షన్ హాల్ లోను ,శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలోనూ, వేదికలన్నింటిమీద అవధానాలు చేశాను. 200 పైగా అష్టావధానాలు, మూడు శతావధానాలు చేశాను. తాండూర్ లో ప్రాజ్ఞ కళాసమితి వారు అవధానం ఏర్పాటు చేశారు. మా ఆధ్యాత్మిక గురుదేవులు వైరాగ్య శిఖామణి గిరి మహారాజ్ జహీరాబాద్ దగ్గర ఆశ్రమంలో ఉంటారు. అక్కడ శతావధానం చేయించారు. అది జయప్రదంగా ముగిసిన తర్వాత, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగీత విద్వాంసులు అనూప్ ఝలోఠా గారిని బాంబే నుండి పిలిపించి నాకు స్వర్ణకంకణ ధారణ చేయించారు. ఆ విధంగా నా అవధాన ప్రస్థానం కొనసాగుతున్నది. మీ అందరి ఆశీస్సులతో నిరంతరం కొనసాగుతున్నది.
పద్మజ :-మీకు అవధానంలో ఇష్టమైన ప్రక్రియ ఏది?
అంజయ్య:- నా అవధానం లోపల ఎనిమిది ప్రక్రియలు ఉంటాయి. వాటిలో దత్తపది, సమస్యాపూరణం, వర్ణన, ఆశువు, ఛందో భాషణం, నిషిద్ధాక్షరి, వార గణనము, గంటికా గణనము ముఖ్యమైనవి. వీటి అన్నింటిలో నాకు ఆనందాన్ని ఇచ్చేది సమస్యాపూరణం. ఇది అవధానికి ఆనందం ఇవ్వడమే గాక పండితులకు కూడా ఆనందిన్నిస్తుంది. దత్తపది కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
పద్మజ:- మీకు ఆశ్చర్యం కలిగించిన సమస్యా పూరణం గురించి మా మయూఖ పాఠకులకు ఒకటి, రెండు చెప్పగలరా?
అంజయ్య:- అలాగే అమ్మా! మాకు అవధానంలో ఇచ్చిన ఒక సమస్య.
“రోకలికి కాలు జారె తేయాకు మందు.”
రోకలికి కాలు జారడం తేయాకును మందుగా పూయడం ఇది సమస్య. ఇది జరగదు కదా! దీన్ని మనం సమస్యా పూరణ చేసి ఈ సమస్యను అర్ధవంతంగా పూరించాలి. నేను ఇలా తేటగీతి పద్యంలో పూరించాను.
గొప్ప అవధాన సభయందు మెప్పుపొంది
తిరిగి వచ్చేటి వేళలో యెవరొ గాని
తోసి వేసిరి కలిసియు చూసి యెవ్వ
రో కలికి కాలు జారే తే యాకుమందు
ఇది మహబూబు నగర్ లో చేసిన అవధానంలో పూరించిన సమస్య. ఆ సభలో కపిలవాయి లింగమూర్తిగారు కూడా ఉన్నారమ్మా!
ఒక దత్తపది గురించి చెబుతాను. మంచాల ప్రాంతంలో ఒక అవధానం చేశాను. తొమ్మిది ,పది తరగతులు చదివే విద్యార్థులు నన్ను అవధానానికి ఆహ్వానించారు. అందులో ఒక విద్యార్థి ఇచ్చిన దత్తపది ఇది.
మంచాల, జాపాల, వెలిచాల, యాంజాల అనే నాలుగు ఊర్ల పేర్లు ఇచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా ఉన్నాయి . ఎలక్షన్ లు జరుగుతున్నాయి. ఎలక్షన్ లో నిలబడిన అభ్యర్థి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమన్నాడు ఈ పదాలను ఉపయోగించి.
పట్టె మంచాలపై నిదుర పట్టదాయె,
వేలు వెలిచాల ఖర్చయి వేద మిగిలె
తెల్లవారగ భయాం జాలా వెల్లువాయె
ముద్దు ఓటు రాజా! పాల ముంచవోయి
ఇందులో నాలుగు ఊర్ల పేర్లు వచ్చాయి వెతుక్కుంటేనే దొరుకుతాయమ్మా!

పద్మజ:- చాలా బాగుందండీ! ఒకవైపు పాఠశాలలో పిల్లలకు బోధన, మరొకవైపు కుటుంబ బాధ్యత, ఇంకొకవైపు అవధానాలు చేయడం , ఇలా చేస్తూనే మీరు ఎన్నో రచనలు చేశారు కదా! ఎలా సాధ్యమైంది మీకు?
అంజయ్య:- అవధానంలో వందమంది పృచ్ఛకులు ఉంటారు. వందమంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలను మనసులో పెట్టుకొని తిరిగి చెప్పడమే అవధానం. అది ఒక క్రీడగా భావించినప్పుడు శ్రమ అనిపించదు. ఏ పనైనా కూడా ఇది చేస్తున్నాను అనే భావన కలిగినప్పుడు పది నిమిషాల్లో శరీరం అలిసిపోతుంది. మనసు అలసిపోతుంది. దాంతో నీవు పని చేయలేవు. ఎలా అంటే ఒక క్రికెటర్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుతుంటే అతనికి శ్రమ తెలియదు, శరీరము అలసిపోదు. మనసు అలిసిపోదు. చేయవలసిన గోల్ మీద రన్స్ మీదే ధ్యాస ఉంటుంది. మనిషి ఎన్నుకునే అంశంపైన తాను నిరంతరం ఇది పని కాదు, ఇది ఆట అని ఆనందపడుతూ దానిలో లీనమైపోతూ పనిచేస్తూ రాత్రి, పగలు అనకుండా నిరంతరం పని చేస్తుంటే ఆనందాన్నిస్తూనే ఉంటుంది. దానిలో నీవు ప్రావీణ్యం పొందుతూ ఉంటావే తప్ప ఇది నేను చేయాలి, దీన్ని నాచేత చేయిస్తున్నారు దీనివలన నాకు ఏం లాభం? అని ఆలోచిస్తే నీకు అది సంతోషాన్ని ఇవ్వదు. దాంట్లో ప్రావీణ్యం పొందడం కూడా ఉండదు కదా! అదే దృక్పథం నాకు చిన్నప్పటినుండి ఉంది.
నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రక్రియ ఈ సాహిత్య ప్రక్రియ, రచనా ప్రక్రియ కనుక నిరంతరంగా నేను పద్యాలు రాస్తూ, పాడుతూ, పాటలు రాస్తూ, కథలు రాస్తూ సుమారు అరవై పుస్తకాలు పైగా ప్రచురణ చేయించడం జరిగింది. అందులో నలబై పుస్తకాలు పద్య పుస్తకాలు ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు నేను సమాజానికి అందించి సరస్వతి మాత గళ సీమలో వెలుగులీనేటట్లు నేను అలంకరించాను. ఎంతోమంది విద్యార్థులు నా పుస్తకాలోని ఆ పద్యాలను, పాటలను పాడుతూ ఆనందిస్తున్నారు. అది నాకు ఆనందాన్నిస్తుంది. తత్కారణంగా నేను ఉద్యోగంలో ఉన్నా, కుటుంబం ఉన్నా ,సమాజంలో ఉన్నా ఇంకా ఎన్ని పనులు ఉన్నా ఇది పూలలో దారం లాగా అంతర్లీనంగా నా వెంటే ఉండేది. అందుకోసమే ఇన్ని సాధించగలిగాను.
పద్మజ:- అయ్యా! మీరు ఇంతవరకు ఎన్ని రచనలు చేసారు?
అంజయ్య:- అమ్మా! నేను చాలా రచనలే చేసాను. వాటి గురించి చెబుతాను.
1.శతకాలు :-
1. ధామగుండ శతకం (ఆటవెలది)
2.సాయి శతక సంకీర్తనావళి (కందాలు)
3. చేవెళ్ల చరిత్ర శతకం (చంపకోత్పలాలు)
4. జగదంబ శతకం (సీసాలు)
5.బాకవరాంజేయ శతకం (ఏకప్రాస వృత్తాలు)
6. సత్యసాయి శతక మందారాలు (తేటగీతి)
7 అయ్యప్ప మధ్యాకరులు (మధ్యక్కర)
8.అమ్మ (తేటగీతి)
9. ప్రభుదాసు ప్రబోధం (సీసం)
10. దత్తగిరి బోధమృతం (సీసం)
11. శివానంద శతకం (తేటగీతి)
12. రామలింగేశ్వర శతకం (మత్తేభశార్ధూలాలు)
13. శ్రీధామ గుండ క్షేత్రం (మత్తేభశార్ధూలాలు)
2. గేయాలు
1.పాటల పల్లకి
2.బాలానందం
3.రసరంజని
4. గోరుముద్దలు
5. బర్దిపూర్ భజన కీర్తనలు
6. మారిన మనిషి (బుర్రకథ)
7. స్వాతంత్ర దినోత్సవం (పల్లె సుద్దులు)
8 శిశు సంరక్షణ (యక్షగానం)
9.పర్వేదు రామాయణ పద్య నాటకం
10. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (బుర్రకథ)
11. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (నాటకం )
12. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ జీవిత చరిత్ర (గేయామృతం)
3 పద్య గ్రంథాలు
1. కాశీ క్షేత్ర యాత్ర
2. మా ఊరి మందారం
3. బాగన్న చరిత్ర
4. కడియాల తారావళి
5. అవధాన ఆణిముత్యాలు
6. అవధాన పద్య రత్నాలు- తాండూర్ శతావధానం
7.వినాయక స్తవం- పద్య చిత్ర బంధకవిత్వం 8.శతావధానం బర్దీపూర్ ఆశ్రమం
4. సంకలనం గ్రంథాలు
1.పద్యతరంగణి
2. పద్య మంజరి
3. శతకవల్లరి
4. ఆచల గురుతత్త్వ రత్నావళి
5. ఇతర గ్రంథాలు
1.రంగారెడ్డి జిల్లా కవులు- రచయితలు- సాహిత్యసేవ
2.యోగానంద జీవిత చరిత్ర
3. దత్తగిరి మహారాజు జీవిత చరిత్ర
4. భాషాత్రయ సులభ వ్యాకరణం
5. వ్యాకరణ చంద్రిక
6.అభినందన పద్యమందారాలు
7.సాయి రెడ్డి శారదార్చన
8.మోనిగారి నారాయణ షష్టిపూర్తి సంచిక
9. రాం రెడ్డి పదవీ వివరణ సంచిక
10.తెలుగుతేజం
11. పన్నెండు పడగల వెంకటేశ్వర చరిత్ర
12. వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర
13. శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ సంక్షేప్త చరిత్ర
పద్మజ:- వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను రాయాలని మీకెందుకు అనిపించింది?
ఎల కోయిలలు వేయి వెలుగెత్తి పాడినా
కొసరైన కమ్మని గొంతు వారు
లేత మామిడి వేప లేచిగుళ్ళకు లేత
వగరుకు వగరైన పొగరువారు
ఒక మంచి మాటకే యొడలెల్ల నుప్పొంగి
సర్వంబు నర్పించు సదయవరులు
చెయ్యన లేచినా చైత్రమాసపుటెండ
మమతలు కురిసినా మల్లెదండ
ఎవరు ఎవరయ్య ఎవరయ్య యెవరు వారు కలిమిగల వన్నెకాడు సత్కళలరేడు
మూడు లింగాల నడుముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు
సి. నారాయణరెడ్డి
ఇలాంటి తెలుగు సాహిత్యంపైన మమకారం కలిగినవారు ఈ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ప్రాంతంలో అధికంగా ఉన్నారు. సాహితీ సమితి, జాతీయ సాహిత్య పరిషత్తు, అనంత సాహితీ, ప్రాజ్ఞ కళా సమితి ఇలా రకరకాల సాహితీ సంస్థలు ఉన్నాయి. ఎంతోమంది కవులకు పుట్టినిల్లైన ఈ ప్రాంతంలో చాలామంది గ్రంథాలు రాశారు. అవి వెలుగులోకి రాకుండా ఉన్నాయి. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ” అన్నట్లుగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టాను. ఏదైనా నా మాతృగడ్డకు చేయాలని ఉద్దేశంతో ‘రంగారెడ్డి కవులు- రచయితలు’ అనే అంశం పైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2011లో నేను పి.హెచ్. డి చేయడం జరిగింది. అందులో భాగంగా 2018- 19 ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం వారు వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను ఎవరు రాస్తారని గ్రహించి, నాకు ఆ కార్యాన్ని అప్పగించడం జరిగింది. ఆ కారణంగా ఆనాడు అక్కడ ఉన్నటువంటి నందిని సిధారెడ్డి గారు నాకు ఈ అంశాన్ని ఇచ్చి వికారాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను రాయమన్నారు. నేను సంతోషంగా స్వీకరించాను. మా ప్రాంతానికి నాకు జన్మనిచ్చిన మాతకు సేవలు చేసిన వాడిని అవుతాననీ, ఆ పుస్తకం సమాజానికి అందిచాలనే ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి సాహిత్య ప్రక్రియను అనుసరించి ఆ పుస్తకాన్ని రాయడం జరిగిందమ్మా!

పద్మజ :- చాలా సంతోషమండి. మరో విషయం చెప్పండి. శతక పద్యాలను ఒకే జాతికి చెందిన పద్యాలలో రాస్తారు కదా! మీరు చేవెళ్ళ చరిత్ర శతకంలో చంపకోత్పలమాల వృత్తాలలో రాయడానికి కారణాలేమైనా ఉన్నాయా?
అంజయ్య:- అమ్మా! నేను 14 శతకాలు రాయడం జరిగింది. కందం ,ఆటవెలది, తేటగీతి, సీసం, వృత్తాలు, మధ్యాక్కరలు, అదేవిధంగా ఒకే పద్యంలో మూడు, నాలుగు పద్య లక్షణాలు ఉండే గర్భకవిత్వంలో కూడా శతకాలను రాయడం జరిగింది. అయితే మీరన్నట్లుగా ఒకే ఛందస్సులో శతకం రాయాలనే సంప్రదాయాన్ని పాటించాలి. కాకపోతే చంపకమాలైనా ఉత్పలమాలైనా ఒకే ఛందస్సుకు చెందినవి. ఇవి రూపంలో వేరుగా ఉన్నా లక్షణం మాత్రం ఒకటే. ముందున్న ఒక్క అక్షరాన్ని మారిస్తే ఉత్పలమాల చంపకమాలవుతుంది; చంపకమాల ఉత్పలమాలవుతుంది. ఒకే మకుటం రెండు పద్యాలకూ పనికి వస్తాయి. అదే విధంగా శార్దూల, మత్తేభ పద్యాలలో కూడా ముందున్న ఒక అక్షరం మారిస్తే శార్దూలము మత్తేభము అవుతుంది; మత్తేభం శార్దూలము అవుతుంది. ఈ రెండిటికి కూడా ఒకే మకుటం సరిపోతుంది. పూర్వకవులు చాలామంది రెండు వృత్తాలను కలిపి రాశారు. ఉదాహరణకు దూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్మ్యంలో శార్దూల, మత్తేభ పద్యాలు ఉన్నాయి. మారద వెంకన్న రాసిన భాస్కర శతకంలో కూడా ఉత్పల, చంపకమాలలలోనే ఉంటాయి. వాళ్లని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఉత్పలమాల చంపకమాల పద్యాలతో కలిపి శతకం రాశాను.
పద్మజ:- మీ రచనలలో మీకు ఇష్టమైన రచన ఏమిటి?
అంజయ్య :- అమ్మా! తెలుగులో ఉన్న అనేక ప్రక్రియల్లో నూరు పుస్తకాలు రాశాను, అరవై పుస్తకాలు ముద్రణయ్యాయి. ఎక్కువగా పద్యానికి సంబంధించిన కావ్యాలు, శతకాలు, పద్య నాటకాలు ఉన్నాయి. తరువాత కీర్తనలకు సంబంధించిన ఉన్నాయి. బాలగేయాలకు సంబంధించినవి, వ్యాకరణానికి సంబంధించినవి అనేక పుస్తకాలున్నాయి. అయినా కూడా నాకు ఆనందాన్ని, అనుభూతులను కలిగించే పుస్తకం ఆధ్యాత్మిక గురువు ‘దస్తగిరి మహారాజు జీవిత చరిత్ర’ను రాశాను. అది వారి అనుగ్రహంతో రాశాను. అది 550 పేజీల పెద్ద పుస్తకం. అది ఒక పరిశోధన గ్రంథం వలె ఉంటుంది. అయితే ఎందుకు తృప్తినిచ్చిందంటే నాగఫణిశర్మ గారు ఆ జీవిత చరిత్రను రాయాలనుకున్నారు. వారికి సమయం లేక మీరే రాయండి నాయనా! అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కసిరెడ్డి వెంకటరెడ్డిగారు కూడా ఆ పుస్తకం రాయాలనుకున్నారు. సమయం చాలక రాయలేదు. అంజయ్యగారూ! మీరు రాశారు నాకు చాలా ఆనందం అయిందని చెప్పారు. రమణాచారి గారు ఆ గ్రంథాన్ని చూసి నాయనా! ఒక యాదవ వంశంలో జన్మించిన అంజయ్య గారూ! మీలో ఆ దస్తగిరి మహారాజు సంపూర్ణంగా ఉండి రాయించినట్లు ఉంది కనుక మీ జీవితం ధన్యమైందని చెప్పారు. ఈ పుస్తకం అంటే నాకెంతో ఆనందమమ్మా! ఆ పుస్తకమే నాకు కీర్తిని తెచ్చిపెట్టింది, ఆ పుస్తకమే నాకు ఆనందాన్ని కలిగించింది. ఆ గురుదేవుల అనుగ్రహం వలన లభించిన పుస్తకమమ్మా అది.
పద్మజ:- సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి తత్సమ చంద్రిక రాశారు కదా! మీరు వ్యాకరణ చంద్రిక రాశారు. ఈ రెండింటికి ఏమైనా పోలికలు ఉన్నాయా? విపులంగా విశదీకరించండి.
అంజయ్య:- వ్యాకరణమంటే బాల వ్యాకరణమే. చిన్నయసూరి రచించిన బాల వ్యాకరణం వంటిది మరొకటి లేదు. ఆ తరువాత ప్రౌఢవ్యాకరణం వచ్చింది. తర్వాత ముక్త లక్షణ కౌముది వచ్చింది. ఆ తరువాత తెలుగుభాషకు భాష్యాలు మాదిరిగా అనేక వ్యాకరణ గ్రంథాలు ఒక గైడ్ మాదిరిగా వారి అనుభవాలను రాయడం జరిగింది. చాలా మంది వ్యాకరణం రాశారు నేను చిన్నప్పటినుండి కళాశాలలో, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో గురువుగారు రవ్వా శ్రీహరి గారు చెప్పినటువంటి వ్యాకరణాంశాలుగానీ, వరదాచార్యులుగారు చెప్పినటువంటి వ్యాకరణాంశాలు గానీ తర్వాత మా చిన్నప్పుడు కృష్ణయ్య గౌడ్ గారు లక్ష్మణరావు గారు చెప్పినటువంటివి అన్ని వ్యాకరణాంశాలు క్రోడీకరించి ఒక నోట్స్ మాదిరిగా రాసాను. నాకున్న సమస్యలే విద్యార్థులకు ఉండవచ్చని ఉద్దేశంతో ఈ వ్యాకరణ చంద్రికను రాశాను తప్ప సన్నిధానం వారి తత్సమ చంద్రికను చూడలేదమ్మా! దానికి దీనికి పోలికలు లేవు. నా వ్యాకరణంలో అక్షరం, పదం, పద భేదాలు, వాక్య భేదాలు, సంధులు, సమాసాలు, తత్సమ పదాలు, తద్భవ పదాలు, అచ్చ తెలుగు పదాలు, వాటికున్న వ్యత్యాసాలు ఛందస్సుకు సంబంధించిన లక్షణాలు, ఒక పద్యం ద్వారా అనేక పద్యాలు రాయడం నేర్చుకునే సులభమైన పద్ధతులు, దానికి తోడుగా కొన్ని సంస్కృత శబ్దాలు, చిన్నచిన్న వాక్యాలు, సంస్కృత సంధులు, దీనిలో పెట్టి విద్యార్థుల కోసం రాసిన చిన్న ప్రయత్నం తప్ప కొత్తగా వ్యాకరణం సృష్టించింది ఏమీ లేదమ్మా!
పద్మజ :- మీకు లభించిన పురస్కారాలు గురించి మా పాఠకులకు తెలియజేయగలరు?
అంజయ్య:- నాకు పురస్కారాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రభుత్వం ద్వారా ,అనేక మహనీయుల ద్వారా అర్థ శతం పైనే లభించాయి. అందులో నాకు ఆనందాన్ని ఇచ్చినటువంటి పురస్కారాలు మా గురువుగారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అనూప్ ఝలోఠా సంగీత విద్వాంసుల చేత స్వర్ణ కంకణం లభించింది. వేలమంది మహాపండితుల సమక్షంలో చేయడం జరిగింది. అది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రతిభా పురస్కారం ఇవ్వడం జరిగింది. కీర్తి పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. వారణాసిలో హిందూ విశ్వవిద్యాలయం వారు అక్కడ జానపదకళా రంగంలో కళా ప్రదర్శన చేసిన సందర్భంగా వారు అక్కడ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో పురస్కారాలు వచ్చాయి. మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు ఉత్తమ అవధానం పేరుతో 50,000 నగదుతో నన్ను సన్మానం చేయడం జరిగింది. నాకు అన్నిటికంటే ఎక్కువ సంతోషం కలిగించింది ఏమిటంటే? ఐదు వందల సంవత్సరాల నాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను సన్మానం చేసిన వేదిక పైన వారి మనవడు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఎనిమిది మంది కవులకు సన్మానం చేస్తున్నారు. ఆ ఎనిమిది మందికవుల్లో నన్ను ఒకరిగా స్వీకరించి ఐదు సంవత్సరాల నాడు అదే వేదిక పైన హంపి విజయనగరంలో భువన విజయం వేదికపైన అష్టదిగ్గజ కవుల్లో ఒక కవిగా నాకు సన్మానం చేశారు అంతకంటే ఈ జీవితంలో ఏమి సాధించేది లేదు. నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నాగఫణి శర్మ గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో నేను అవధానం చేసిన తర్వాత నా శిష్యుడు అందరిని మెప్పించాడని నన్ను మెచ్చుకొని అవధాన పీఠానికి పిలిపించి వారి చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. ఇది కూడా నాకు చాలా ఆనందం ఇచ్చింది.
పద్మజ :- మీరు కొత్తగా వచ్చే అవధాన్లకు ఇచ్చే సందేశాలు ఏమిటి?
అంజయ్య:- అవధానులు పద్య పూరణ చేసేటప్పుడు ఛందస్సుతో పూరించకుండా కవిత్వంతో పూరించాలి. ఏ పద్యాన్ని పూరించినా పృచ్ఛకులు ఇచ్చిన ప్రశ్నలను గ్రహించి రెండు నిమిషాలో, మూడు నిమిషాలో తదేకంగా ఆలోచించి, పది కాలాలపాటు ఆ పద్యం నిలిచేటట్లు ప్రతి సాహిత్యవేత్త హృదయంలో అది ప్రతిధ్వనించే విధంగా ఆ పద్యం ప్రతి నోట్లో నాట్యం చేసేటట్లు ఉండాలి తప్ప ఛందస్సుతో పూరించి, ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు ఉండకూడదు. ఏ పద్యమైనా అలంకార శోభితంగా ఉండి రానున్న తరానికి ప్రేరణదాయకంగా పద్యం ఉంటుందమ్మా! పద్యాలను రాగయుక్తంగా పాడుకునేందుకు తర్వాత భావవ్యక్తంగా ఉండాలి. ఏదో పదాలను కలిపి ఛందస్సు అల్లితే అది పద్యం కాదు. అటువంటి అవధానుల వలన అవధానం రంజించదు.
పద్మజ:- మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం ఏమిటి?
అంజయ్య:- మయూఖము అంటే సూర్య కిరణము, నెమలి అని అర్థాలు ఉన్నాయి. నెమలి అనే అర్థం తీసుకున్నట్లు అయితే అనేక కళలకు నెమలి ప్రతీక. అది నృత్యం చేస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ నెమలి పింఛం ఆది గురువైన శ్రీకృష్ణుని తలపై ఉంటుంది. ఎంత గొప్పదైతే ఆ స్థాయిని పొందుతుంది? ఏకాగ్రతకు, బ్రహ్మచర్యానికి అది ప్రతీక. మీరు అన్నట్లుగా సూర్యకిరణం అనే భావంతో తీసుకుంటే సూర్యకిరణం లేనిదే ఈ ప్రపంచం నడవదు. సూర్యుడు ఉదయించినదే పగలు కాదు. సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. అలాంటి పేరు కలిగినటువంటి మీ పత్రిక, మన పత్రిక, యావత్ ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని వెలిగించి అనేక కళలకు నిలయమై ఎంతోమంది ఆణిముత్యాల వంటి పౌరులను పైకి తీసుకొని వచ్చి, ఎంతో మందికి ప్రేరణదాయకమై తెలుగు సాహిత్యంలోని అనేక ప్రక్రియలను సమాజానికి అందించి మట్టిలో మాణిక్యంలాంటి మాలాంటి వాళ్లను కూడా పైకి తీసుకుని వచ్చి సమాజానికి అందించారు. ఇది దేవాలయం లాంటిది. అంత గొప్ప పత్రికను ఈ సమాజం ఉపయోగించుకొని దానిలో ఉన్నటువంటి అంశాల ద్వారా జ్ఞాన జ్యోతులు వికసింప చేసుకోవాలి. ఒక వెలిగే జ్యోతి మరొక జ్యోతిని వెలిగిస్తుంది అన్నట్టుగా మీరు జ్ఞానాన్ని పొంది, ఆ అనంతమైనటువంటి సూర్య ప్రకాశాన్ని మీలో ప్రజ్వలింప చేసుకొని మరొక జ్యోతికి మరొక జ్ఞాన జ్యోతిని వెలిగించాలని కోరుకుంటున్నాను.
గ్రహణ శక్తి, ధారణ శక్తి కలిగిన అత్యంత ప్రతిభాశాలి అవధాని మలుగు అంజయ్య గారితో ఈనాటి ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా సాగింది కదా! ఇందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఇంతటితో ఈ ముఖాముఖి ముగిద్దామా? బహుముఖ ప్రజ్ఞాశాలుల పరిచయం కలగడం నాకెంతో సంతోషదాయకం!
ఇంత మంచి అవకాశం కల్పించిన మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రికా సంపాదకురాలికి అగణిత కృతజ్ఞతలతో

సాహిత్యం సార్వజనీనమైనది, సాహిత్యం ఓ అంతశ్చేతన, మనః స్పందనల నుండే చక్కటి భావాలు అక్షరీకరించబడతాయి. ప్రతిలేఖనంలో వాస్తవికత,
కళాత్మకత, జన జాగృతి
కలిగిస్తూ,సమాజహితాల్ని నిజ దర్పణంలో చూపేదే సాహిత్యం. సాహితీ సభలు నిర్వహించడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి. సాహితీవేత్తలు తమ అనుభవాల్ని వెల్లడించే క్రమంలో, వర్ధమాన రచయితలు తమ కలాలను పదునెక్కించుకుని స్ఫూర్తి పొంది తమను తాముతెలివిగా మలుచుకునే అవకాశం ఉంటుంది. శ్రీమతి నిహారిణిగారి పుస్తకావిష్కరణ సభలో ప్రసంగిస్తున్న డబ్బీకార్ గారిని చూసాను.
మృదు గంభీర స్వరం, వాక్పటిమ, సందర్భోచిత వాగ్ఝరి ఒక వక్తకు కావలసిన ప్రధాన లక్షణాలని నా భావన .ఆ కోవలోని వారే పెద్దలు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్ గారు.
వారితో నా మొదటి పరిచయం తెలంగాణా రచయితల సంఘం,
జంట నగరాల శాఖ వారు శ్రీ కందుకూరి శ్రీరాములు గారు, శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో, ప్రతి సోమవారం అంతర్జాలం వేదికగా నిర్వహించే సోమవారం కవి సమ్మేళనంలో.
అందరి కవితలు వింటూ ,తాము సైతం ఓ కవిత చదివి చివరగా తమ అభిప్రాయం చెప్పే కొద్ది మందిలో వీరొకరు. నిక్కచ్చిగా చెప్తారు, ఒక్కోసారి కవితాఛాయలు లేక కేవలం వచనంలా ఉన్నాయంటారు. ఒక సద్విమర్శకుడు దిక్సూచి లాంటివాడని నా అభిప్రాయం. సద్విమర్శ ఎప్పుడూ ఆహ్వానించ తగ్గదే ! తమలోని రచనాపటిమకు మెరుగులద్దుకునే అవకాశానికి ఇది తొలిమెట్టు లాంటిది .
నేను ఈమధ్య చాలా వేదికలమీద డా. రూప్ కుమార్ డబ్బీకార్ గారు
ప్రసంగించడం చూస్తున్నాను. వాగాడంబరం ఉండదు, చెప్పాలనుకున్నదాన్ని సంక్షిప్తంగా, సరైన రీతిలో, ప్రశాంతంగా వెల్లడిస్తారు. సోదరి శ్రీమతి కొండపల్లి నిహారిణి గారి నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభలో వీరు మూడవ సెషన్ కు ఆత్మీయ అతిథిగా విచ్చేసి’ కథామయూఖం’, ‘బాలమయూఖం’ పత్రికల కథా సంకలనాల ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తూ, తమ మృదుగంభీర వచనాలతో సోదరి నిహారిణిని విదుషీమణిగా అభివర్ణించారు. వివిధ ప్రక్రియల్లో తన అసామాన్య ప్రతిభాపాటవాలతో ముందుకు దూసుకెళ్తున్న తీరుకు హర్షం వ్యక్తం చేస్తూనే, వేదికలపై సాహితీ దిగ్గజాలు ,ఆమెను గూర్చి ఎన్నో విశేషాలు చెప్పారంటూ ఇంకా తాను ఏది మాట్లాడినా పునరుక్తం ఔతుందనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, పొదుపైన తమ మాటలతో ‘కథామయూఖం’, ‘బాలమయూఖం’ పుస్తకాలకంటే ముందుగా స్త్రీవాద సాహిత్య వ్యాసాల్ని’ అనివార్యం’ పేరుతో వెలువరించడం సముచితమైన నిర్ణయంగా పేర్కొన్నారు.
వక్తలందరూ చెప్పినట్లుగా నిహారిణి గారి కుటుంబనేపథ్యం ప్రేరణత్మకమైనా, పుట్టింటి పోరాట చైతన్యాన్ని ,మెట్టినింటి కళా చైతన్యాన్ని ఒద్దిరాజు సోదరుల సాహితీ చైతన్యాన్ని (సృజన శీలత) తనలో నింపుకొని, ‘సామాజిక చైతన్యం’తో కొత్త ఊపిరి పోసుకొని తనకు తానే దిశా నిర్దేశం చేసుకున్న ఓ ఆశావాది అంటూఅభివర్ణించారు. ‘వర్జినియా వూల్ఫ్’ అనే ఓ స్త్రీవాద రచయిత్రి ,ఉద్యమకారిణి మాటలను ఉటంకిస్తూ – సుప్రసిద్ధ నాటక రచయిత షేక్స్పియర్ సోదరి ‘జుడిత్’ పాత్ర ను సృష్టిస్తూ ఆమె ఇలా అంటారు. అంత గొప్ప రచయితకు సోదరి, ఒకే డి.ఎన్.ఏ . కలిగిన జుడిత్ మామూలు రచయిత్రిగా కూడా ఎందుకు కాలేకపోయిందని ప్రశ్నిస్తూనే, పితృస్వామ్య, పురుషాధిక్య ప్రపంచంలో ఆమెను ఇంటి వరకే పరిమితం చేయడం అంటారు
‘వూల్ఫ్ ‘.
సరైన పరిస్థితులు, అవకాశాలు ఉండి ఉంటే ఆమె కూడా అద్భుత సాహిత్యం సృష్టించేదేమో అంటారామె. “A Room Of One’s Own ” అనే తమ రచనలో స్త్రీకి కొంత ఆర్థిక సౌలభ్యం మరికొంత ఏకాంత వాతావరణం ఉంటే ప్రశాంతంగా సాహితీ సేవ చేసుకునే వెసులుబాటు ఉంటుందనేది ఆమె భావన. అదే రీతిలో నిహారిణిగారు కూడా లౌక్యంగా వాటిని భాగస్వామి సహకారంతో సొంతం చేసుకున్న నేర్పరి అంటూ చమత్కరిస్తూనే ఆమెకు అన్నీతానై వెన్నంటిఉన్న శ్రీ వేణుగోపాలరావు గారిని అభినందిస్తున్నానన్నారు డబ్బీకార్ గారు. తండ్రి ప్రేరణ ,మామగారి స్ఫూర్తి, భర్త సహకారాలతో గట్టి మనోబలంతో దూసుకుపోతున్న ఆమె, మరిన్ని అద్భుతాలు సృష్టించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. తనకిచ్చిన ఆత్మీయ సభాతిథ్యానికి ధన్యవాదాలు అంటూ చక్కని భాషణం చేసారు శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్.
నాకు తెలిసి సోదరి శ్రీమతి నిహారిణిగారు పెళ్ళితో చదువుకు స్వస్తి చెప్పకుండా, ఉన్నత చదువులు కొనసాగిస్తూనే వ్యాసంగానికి కూడా అంతే ప్రాధాన్యతనిచ్చి తన జ్ఞానతృష్ణను తీర్చుకునే క్రమంలో సాహితీ ప్రక్రియ లెన్నిటినో స్పృశిస్తూ ,తన కలం ద్వారా సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.వారి నిరంతర సాధనే నేటి ఈ విజయ సోపానం అని నా భావన. ఇదే విషయాన్ని రూప్ కుమార్ గారూ అనడం గమనిస్తాం. ఎన్ని సౌకర్యాలు ఉన్నా కవిత్వం అంటే మక్కువ, భాష మీద పట్టు సాహిత్య సృజన చేయాలన్న శ్రద్ధాసక్తులు లేకుంటే ఇలా ఇన్ని పుస్తకాలు, గ్రంథాలు నీహారిణి వెలువరించేవారా? అనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒక రచయితను సరిగ్గా అంచనా వేయగలిగేది మరో రచయితనే అనడానికి నిదర్శనం రూప్ కుమార్ డబ్బీకార్ గారు ఉదాహరణగా నిలుస్తారు. రచనలపై లోతైన విశ్లేషణ చేయడం వల్ల కొత్త రచయితలకు ఎంతో మేలు చేకూరుతుందనేది నిర్వివాదాంశం.
తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :
🌸”అ నుండి అః” వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని “చంద్ర ఖండం” అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత “వశిని” అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.
🌺”క” నుండి “భ” వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని ” సౌర ఖండం ” అంటారు. “మ” నుండి “క్ష” వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని ” అగ్ని ఖండం” అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.
🌺సౌర ఖండంలోని ” క “నుండి “ఙ” వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.
🌺”చ” నుండి “ఞ” వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత “మోదిని” అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
🌺”ట” నుండి “ణ” వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి “విమల”. అంటే మలినాలను తొలగించే దేవత.
🌺”త” నుండి “న” వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత “అరుణ” కరుణను మేలుకొలిపేదే అరుణ.
🌺”ప” నుండి “మ” అనే ఐదు అక్షరాలకు అధిదేవత “జయని”. జయమును కలుగ చేయునది.
🌺అలాగే అగ్ని ఖండంలోని ” య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత ” సర్వేశ్వరి”. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
🌺ఆఖరులోని ఐదు అక్షరాలైన “శ, ష, స, హ, క్ష లకు అధిదేవత “కౌలిని”
🙏ఈ అధిదేవతలనందరినీ “వాగ్దేవతలు” అంటారు. అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది. ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి ఉద్భవించింది. అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.
🌸మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి. అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.
🌺కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు. మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత. మనం చేసే శబ్దమే ఆ దేవత. మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత. ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతం. ఇది మన తెలుగు వైభవం.ఇది సనాతన ధర్మం. ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం……
వృద్ధాప్యపు గూటిలో ‘అమ్మ’
ఒంటరిపక్షి
దానిది కరకు గుండె కాబోలు
అమ్మ రూపం మార్చేసింది
రంగువెలిసి కళాత్మకత కోల్పోయిన పాతబడిన చిత్తరువులా
అమ్మరూపం వెలవెల బోతోంది
గుండ్రని మోములో
కాసంత బొట్టుతో
కళకళలాడిన ‘అమ్మమోము’
గ్రీష్మంలో ఎండిన మానులా
వాడిపోయింది
తోడుండే ‘నాన్న’
సుదూర తీరాలకు తరలిపోతూ
నుదుటి బొట్టును
ఆమె గుర్తుగా
తాను పట్టుకు పోయాడు
ఆమె ముఖం
వాడిన మల్లెలా
తనువు
ఆకురాల్చి
ఎండిన మానులా
మారిపోయింది
తరువు
పచ్చగా ఉన్నపుడు..
పూలు పండ్లతో
ఎన్నింటికో ఆశ్రయం
ఎందరికో నీడనిచ్చినట్లు
అమ్మ మాకూ …
ఎందరికో
బతుకుదెరువు నేర్పింది
బతుకుదారి చూపింది
ఆమె
కరుణ చిందించే
చూపులతో ప్రేమతో పెంచింది
తన రెక్కలబలంతో
మా భవిష్యత్తుకు రెక్కలు తొడిగింది
ఇప్పుడు….
అమ్మ వృద్దాప్యపు గూటిలో ఒంటరి
అమ్మ మోముపై వాలిన వార్థక్యపు ఛాయలు ముడతల చారికలు
చూపులు మసకబారి
వెలుగు తగ్గింది
కాళ్ళు చేతులు పట్టుదప్పి
ఆసరాకోసం చూస్తున్నాయి
పండుటాకులు రాలినట్లు
నోటపండ్లు ఊడిపడి
అమ్మరూపమే మారింది
అయినా..
చిన్నప్పడు..చూసిన
అమ్మరూపం
హృదయంలో
అందంగా పదిలంగానే ఉంది
అమ్మ మాట .. పిలుపులో మాత్రం
వృద్ధాప్యం దరిజేరలేదు
అమ్మమాట
ఆ పిలుపు కమ్మగా
మధురంగా
‘నాయినా’ అని
ఎప్పుడూ పిలిచినట్టగానే
వణుకులేక వార్థక్యం జాడ ఇసుమంతలేక
వాత్సల్యంగా పిలుస్తోంది
అమ్మప్రేమ వసి వాడలేదు
సతతహరితమై సజీవంగానే ఉంది
