అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అబ్దుల్ సత్తార్, బీబీఅమినా అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరిది మంచి జోడి అని ఊరు ఊరంతా ప్రశంసించేవారు. ఎందుకంటే అతను, ఆమె ఇద్దరూ అందమైన వారు. ఇద్దరూ భారీ మనుషులే. అయినప్పటికీ బీబీ ఆమినా ఇంకా అందంగా ఉండేది. పెద్ద తలకాయ, తలలో దట్టమైన నల్లని పొడగాటి వెంట్రుకలు, వెడల్పాటి నుదురు, రెండు కలిసి ఉన్న నల్లని కనుబొమ్మలు, గుండ్రటి నల్లని కళ్ళు, కళ్ళల్లో పెట్టుకున్న కాటుక వల్ల ఆమె ముఖం ఇంకా కళకళలాడుతూ, వెలిగిపోతూఉండేది. ఆమె ప్రశాంతమైన ముఖవర్చస్సును చూడగానే ఎవరికైనా చెయ్యెత్తి సలాం చేయాలనిపిస్తుంది.
అంతకు తగ్గట్టుగా ఆమె ఎంతో సంస్కారవంతురాలు. మంచి తెలివితేటలు గలది. మర్యాద, అణకువ, వివేకత, నైతికత అన్ని ఆమెలో ఉట్టిపడుతూ ఉండేవి. గ్రామంలో అందరూ వాళ్ళిద్దర్నీ ఎంతో గౌరవంగా చూసేవారు. వాళ్ల అదృష్టమేమో గాని ముగ్గురు అమ్మాయిలే వారి సంతానం, మగ పిల్లలు కలగలేదు.
తన భర్తకు ఒక ఎకరం పొలం ఉన్నప్పటికీ బీబీ ఆమినాకు తండ్రి తరఫున ఆస్తి నుండి అల్లాహ్ నిర్దేశించిన వాటా ప్రకారం ఒక ఎకరం పొలం వచ్చింది. ఆ విధంగా వారికి జీవితం సాఫీగా సాగుతోంది.
గౌరవ మర్యాదలగల ఇల్లు కాబట్టి ఎవరు కూడా వారి ముగ్గురు అమ్మాయిలను మరో విధంగా చూసేవారు కాదు. అలా ముగ్గురు అమ్మాయిలు ఎదుగుతూ చదువుతూ మానమర్యాదలతో ఉంటున్నారు.
ముగ్గురు అమ్మాయిలు మంచి అందమైన వారు. కాలేజీ చదువులు పూర్తి చేశారు. హైదరాబాదుకు చెందిన దగ్గరి బంధువులలోని మంచి సంబంధాలను చూసి ఒకరి తరువాత మరొకరికి (నికాహ్) వివాహం చేసి వేశారు.
చూస్తుండగానే కాలం కొవ్వొత్తిలా కరిగిపోతూనే ఉంది. అమ్మాయిల వివాహమైన నాలుగైదు సంవత్సరాలకు భర్త అబ్దుల్ సత్తార్ మామూలు జ్వరంతో కొద్ది రోజుల్లోనే పరలోక యజమానిని కలుసుకోవడానికి వెళ్ళిపోయారు.
చావుకు వచ్చినవాళ్లు నాలుగు ఐదు రోజులలో అందరూ వెళ్లిపోయిన తర్వాత బీబీఆమినా ఒంటరిదైపోయింది. తన జీవితం గురించి దీర్ఘాలోచనలో పడింది. మగసంతానం లేదాయే ఇప్పుడు ఇంత చేసి ఆడపిల్లల వద్ద బతకవలసిన పరిస్థితులు వచ్చాయా? ఒకవేళ అలాంటి పరిస్థితిలేవస్తే ఎవరి వద్ద ఉండాలి? ఎవరు బాగా చూసుకుంటారు అని ఆలోచిస్తుంది. అందరూ బాగానే చూసుకుంటారు కానీ పెద్ద కూతురు పెద్దల్లుడు ఇంకా బాగా చూసుకుంటారని నిర్ణయానికి వచ్చింది. అంతలోనే పెద్ద కూతురు సల్మా ఫోన్ వచ్చింది. బీబీ ఆమినా ఫోన్ ఎత్తింది; అటు నుండి సల్మా: అస్సలాము అలైకుమ్ అమ్మీ జాన్ (మీపై శాంతి కురియు గాక) అనగానే వ అలైకుమ్ అస్సలాం బేటా ( మీపై కూడా శాంతి కురియు గాక) అంటూ మహా సంతోషంతో జవాబు ఇస్తూ సల్మా ముందు నువ్వు చెవి పట్టుకో! ఎందుకమ్మా అంది సల్మా. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా నీ ఫోన్ వచ్చింది అందుకే అంటూ బిగ్గరగా నవ్వింది బీబీ ఆమినా. సరేనమ్మా నా మనసులో ఒక మాట ఒకటి చెప్పాలని ఫోన్ చేశాను. ఒక్కదానివే ఊర్లో అంత పెద్ద ఇంట్లో ఉండడం కంటే మా దగ్గరికి వచ్చేయ్ అమ్మిజాన్. నిన్ననే మీ అల్లుడుగారు నేను నీ గురించి మాట్లాడుకున్నాము. అమ్మీజాన్ న్ని ఇక్కడికి పిలుచుకుందామని చెప్పుకున్నాము. ఆయన కూడా సరేనన్నారు. అందువల్ల నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేయ్ అమ్మీ అంది సల్మ ప్రేమగా.
సల్మా! నిజానికి నేను ఈ విషయమే ఆలోచిస్తుండగా నీ ఫోన్ వచ్చింది నిజంగా ఇది అల్లాహ్ తరఫునుండి అని నేను అనుకుంటున్నాను అంటూ సరేనమ్మా రెండు మూడు రోజులలో బయలుదేరుతాను అంది తల్లి బీబీ ఆమినా.ఖుదాహాఫీజ్ (అంటే నిన్ను అల్లాహ్ పరం చేశాను అని అర్థం) అంటూ సల్మా ఫోన్ పెట్టేసింది.
బీబీ అమీనా, తమ వీధిలోని లలితమ్మను అనసూయమ్మను సుశీలమ్మను ఫాతిమాబీ లతో పాటు ఊరు వారందరి గడపగడపకు వెళ్లి తను హైదరాబాదు వెళుతున్న విషయం చెప్పింది. అందరూ ఎంతో ఆత్మీయత కనబరుస్తూ ఆమె వెళ్లిపోవడం తమకు వెలితిగా ఉంటుందని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కానీ తప్పదుగా. ఆధునిక పేరుతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. దుమ్ము ధూళి గలదారులు నున్నటి రోడ్లుగా మారిపోయాయి అదేవిధంగా ఉదయాన్నే సానుపు జల్లి అందంగా ముగ్గులు వేసే వాకిళ్లు కూడా రోడ్ల పుణ్యమా అని రోడ్లుగా మారి పోయాయి. బీబీ ఆమిన ఇంటికి కొద్ది దూరంలోనే బస్ స్టాప్ ఉంది. బీబీ ఆమినాతోపాటు ఊరిలో చాలామంది బస్ స్టాప్ వద్ద ఆమెకు వీడ్కోలు చెప్పడానికి నిలబడి ఉన్నారు. ఆ గుంపును చూసి డ్రైవరు కండక్టరు ఈరోజు ప్రయాణికుల సందడి బాగానే ఉండేటట్టు ఉందిగా అనుకున్నారు. కానీ ఆమినాతోపాటు మరో ఇద్దరు ముగ్గురు ప్రయాణికులు మాత్రమే బస్సు ఎక్కారు అంతమంది బీబీ ఆమె నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారని విని, సందడిని చూసి డ్రైవర్ కండక్టర్ మతసామరస్యమంటే ఇదే, సౌభ్రాతృత్వం అంటే ఇదే, ప్రేమ అభిమానం అంటే ఇదే అంటూ ఎంతో శ్లాగించారు. వారి మాటలు విన్న జనాలు అవును మా ఊరిలో మతసామరస్యం ఉట్టిపడుతుంటుంది. మేమంతా అన్న తమ్ముళ్ల వలె అక్కచెల్లెళ్ల వలె కలిసి మెలసిఉంటాము అని అన్నారు.
బస్సు కదిలింది. దాదాపు మూడు గంటల తర్వాత జూ పార్క్ వద్దగల తాడ్ బన్ స్టేజిపై ఆగింది. అప్పటికే ఆమె పెద్ద కూతురు సల్మా మనవడు మునవ్వర్, మనవరాలు నజ్మ ఎదురుచూస్తూ ఉన్నారు. ఆమె దిగగానే కూతురు ఆలింగనం చేసుకుంది. అమ్మమ్మగా ఆ ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమతో బీబీ ఆమినా రెండు చేతులతో వారిని అదుముకుంది.
ఇల్లు దగ్గరే అయినా ఆటో మాట్లాడుకుని వెళ్లారు. తల్లి వచ్చిన విషయం మిగతా ఇద్దరు కూతుళ్లకు అల్లుళ్లకు మనవళ్ళకు మనవరాళ్లకు తెలిసిందే గనుక మర్నాడు వాళ్లంతా ఇక్కడికి వచ్చేసారు. అందరూ ఒకరినొకరు సలాములు చేసుకొన్నారు. ఇద్దరు అల్లుళ్ళు కూడా ఎంతో వినయంతో కొద్దిగా ముందుకు వంగి కుడి అరచేతిని తమ వైపు తిప్పుకొని అస్సలాము అలైకుమ్ మామి జాన్ (అత్తగారు) అంటూ సలాం చేశారు. అందరూ పొద్దంతా సంతోషంతో గడిపి సాయంత్రానికి వెళ్లిపోయారు.
బీబీఆమీనా జీవితం సాఫీగానే, సంతోషంగానే గడిచిపోతోంది. తన అత్తవారి ఎకరం పొలం, తన తండ్రి ఆస్తి నుండి సంక్రమించిన ఎకరం పొలం కౌలుకు ఇచ్చింది గనుక వాటి ద్వారా వచ్చే సొమ్ము వల్ల ఆమెకు ఎలాంటి చీకు చింత లేకుండా పోయింది.
కాలం ఆగదు తన పని తాను చేసుకుంటూ పోతుంది.ఆ కాలంలో పుట్టే వారెవరో, గిట్టే వారెవరో ఇంకా సజీవంగా ఉండేవారెవరో అది పట్టించుకోదు.
ఎందుకో బీబీ ఆమినాకు కాస్త నలతగా ఉంది. హాస్పిటల్కు తీసుకు వెళితే డాక్టర్ గారు మందులు రాసి మామూలు జ్వరమే ఆందోళన పడవలసిన అవసరం లేదు, ఈ మందులు వాడండి నయమైపోతుంది అన్నాడు.
ఆ తర్వాత నాలుగైదు రోజులకు మస్జిద్ నుండి ఉదయపు నమాజు అజాఁ ఇస్తుండగా ఆమె ప్రశాంతంగా తన యజమాని అయిన అల్లాహ్ ను కలుసుకోవడానికి పరలోకం వెళ్ళిపోయింది.
హైదరాబాదులోని అల్కాపూర్ లో ఉన్న అబ్దుల్ రహీం వ్యాకులతకు గురవుతున్నాడు, అతని మనసు నిలకడగా ఉండలేక పోతుంది ఎందుకో కాళ్లు చేతులు వణికినట్టుగా అనిపిస్తుంది ఏమిటి విచిత్రం ఎందుకు నాకిలా అవుతుంది అని తనను తానే అబ్దుల్ రహీం ప్రశ్నించుకుంటున్నాడు, పరేషాన్ అవుతున్నాడు.
మరోవైపు ఇంటి ముందు టెంట్ వేయబడింది. కుర్చీలు బల్లలు వేయబడ్డాయి. చుట్టాలు పక్కాలు అందరికీ ఫోన్లు చేయబడ్డాయి అలాంటి ఫోను ఒకటి అల్కాపూర్ లోని అబ్దుల్ రహీం గారికి వచ్చింది. వరుసకు మామ అవుతాడు. మాము! అమ్మీకా ఇంత ఖాల్ హో గయా అమ్మ మరణించింది అని అనగానే ఇన్నాలిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్ ప్రతి ప్రాణి మరణం రుచి చూడ వలసిందే అంటూ తన విచారాన్ని వెలిబుచ్చుతూ ఫోన్ పెట్టి వేశాడు. అప్పుడు అతనికి అర్థమైంది తను ఎందుకు ఆందోళన చెందాడో, ఎందుకు శరీరం వణికిందో,మనసు ఎందుకు నిలకడగా ఉండలేకపోయిందో.
ఎందుకంటే బీబీ ఆమినా చాలా కాలం ముందే కొంత డబ్బు అబ్దుల్ రహీం గారికి ఇస్తూ, నేను చనిపోతే నా డబ్బులతోనే నా చావు ఖర్చులు మీరు చెల్లించాలి. మా అల్లుళ్లకు నా చావు ఖర్చు పెట్టకుండా ఆపాలి. అని చెప్పింది. బీబీఆమీనా మరణ వార్త విన్నాక అతని మనసు కుదుటపడింది. మరోవైపు బీబీ అమీనా ఊరిలో ఉన్న అఫ్జల్ గారి స్థితి కూడా అబ్దుల్ రహీం గారి స్థితిగానే అయింది. అదే ఆందోళన చెందడం, అదే శరీరం వణకడం, అదే మనసు నిలకడగా ఉండకపోవడం స్థితిలో మునిగిపోయాడు. ఎందుకిలా జరుగుతుంది? ఏమైంది నాకు? అంటూ తనలో తానే అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే మొయిన్ అనే యువకుడు అఫ్జల్ గారి వద్దకు వచ్చి బీబీ ఆమినా మరణించిన విషయం చెప్పాడు. అప్పుడు అతనికి అర్థమైంది నా స్థితి ఇలా కావడానికి కారణం ఆమె చావు డబ్బులు నా దగ్గర పెట్టి ఉండడం ఆ డబ్బులు ఆమె చావు ఖర్చులకోసం నేను అందించడం జరగాలి ఎందుకంటే తమ అల్లుళ్లు తను చావు ఖర్చులు భరించకూడదని .అందుకే ఇలా జరిగిందని భావించి అతను వెంటనే బీబీఆమీన పెద్దకూతురు ఇంటికి వచ్చి డబ్బులు సల్మాకు ఇచ్చి వేశాడు. ఈ ఇద్దరు వ్యక్తులకు బీబీ ఆమిన ఆత్మఘోష ఒకే స్థితికి లోను చేసింది. ఆమె ఇద్దరికీ డబ్బులు ఎందుకు ఇచ్చిందంటే ఒకరు కాకపోయినా ఒకరైన తన డబ్బులతో చావు ఖర్చులు చేస్తారని.వాళ్లు ఇద్దరూ చేరుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఆత్మ ఘోష శుభాత్మగా మారిపోయింది.
సుందర వనం అనే అడవిలో ఒక కోతి వర్షంలో తడుస్తూ దారిలో నిలబడింది . ప్రక్కనే చెట్టుపై ఉన్న కాకి దానిని చెట్టు కిందకు రమ్మని ప్రేమతో పిలిచింది. కానీ కోతి ఆ మాటలు వినిపించుకోలేదు. ఆ కాకి తిరిగి దానిని రమ్మని పిలిచింది. అప్పుడు ఆ కోతి కోపంతో కాకి వైపు వచ్చి ఆ చెట్టును ఎక్కి దాని గూడును లాగి క్రింద పడవేసింది. అదృష్ట వశాత్తు అందులో దాని పిల్లలు లేవు. ఆ కోతి కోపానికి కాకి ఆశ్చర్య పోయింది.
అది గమనించిన ఒక పావురం “ఓ కాకీ! అటువంటి మూర్ఖురాలైన కోతిని నీవు రమ్మనడం, దానికి ఉపకారం చేయాలని అనుకోవడం పెద్ద తప్పు. నీవు మంచి చెప్పినా అది వినే స్థితిలో లేదు” అని అంది. ఈ మాటలను విన్న కోతి కోపంతో ఆ పావురంపై దాడికి వచ్చింది. ఆ పావురం వెంటనే ఆకాశంలోకి ఎగిరింది.
అది చూసిన కాకి ” ఓ కోతీ! నీ ప్రతాపం నీకన్నా చిన్నగా ఉన్న మా పక్షులపైన కాదు . నీకు బలం ఉంటే అదిగో ఆ కనబడుతున్న ఆ పెద్ద జంతువు ఆ గాడిదపైన నీ ప్రతాపం చూపించు” అని అంది. వెంటనే కోతి ” నాకేం భయమా ! దాని సంగతి కూడా నేను తేలుస్తాను. దాని వెనుక కాలును లాగుతాను. చూడు” అని ఆ గాడిద వైపు వెళ్ళింది.
అది అక్కడికి వెళ్లి గాడిద వెనుకవైపు వెళ్లి ఆ గాడిద కాలును లాగింది. ఆ గాడిదకు కోపం వచ్చి ఆ కోతిని తన వెనుక కాళ్లతో బలంగా ఒక్క తన్ను తన్నింది. దాని బలానికి ఆ కోతి కళ్లు బైర్లు కమ్మి గాలిలో గిరగిరా మూడు తిరుగుళ్లు తిరిగి క్రింద పడింది. ఆ కోతికి నడుం విరిగినంత పని అయింది.
వెంటనే తేరుకున్న కోతి ” అమ్మో! ఈ గాడిద జోలికి మనం వెళ్లకూడదు. దీనికి చాలా బలం ఉంది. ఇదే కాదు. మరొకసారి ఎవరి జోలికి పోకూడదు. నాకు తగిన శాస్తి జరిగింది ” అని అనుకొని ఇంటి దారి పట్టింది. అప్పుడు ఆ పావురం, కాకులు దానికి బుద్ది వచ్చినందుకు సంతోషించి ఆ గాడిదతో ” మిత్రమా! ఆ పొగరుబోతు కోతికి తగిన గుణపాఠం చెప్పావు. అది మరొకసారి ఎవ్వరి జోలికి పోకుండా చేశావు. నీకు మా ధన్యవాదాలు” అని అన్నాయి.
అప్పుడు ఆ గాడిద” నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా! అది మీతో దురుసుగా ప్రవర్తించడాన్ని నేను ఇక్కడి నుండి కళ్లారా చూశాను. పాపం! మీరు చిన్న ప్రాణులు. అందుకే దానికి తగిన గుణపాఠం చెప్పాను” అని అంది. అందుకే పొగరు ఉన్న వారికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు.
అలల హొయలున్నాయి అలజడి ఉంది
తీరం వెంట పడి లేచే ఉరుకులు పరుగుల్లో ఉత్సాహం ఉంది
ఒడ్డుకు కొట్టుకొని ముందుకు వెళ్లలేని అసహాయత ఉంది
కొండ అడ్డంగా వస్తే చుట్టూ తిరిగి
కదలి వెళ్లే నేర్పరితనం ఉంది
అడ్డంకులు అధిగమించే సాహసం ఉంది
కెరటాల గమకాల్లో శ్రావ్య సంగీతం ఉంది
చెప్పలేని ఏదో బాధల హోరు ఉంది
వెలుగును వెన్నెలను తాగి ఊగుతుంది
వేదనలు దాచుకోలేక
అప్పుడప్పుడు మూలుగుతుంది
భీష్మ గ్రీష్మం చురుకైనప్పుడు వీచికాంతరంగాన్ని మూసుకొని శోషిల్లుతుం ది
వర్ష హర్షం చినుకైనప్పుడు తరంగాల గంతులు వేస్తుంది
హేమంత శిశిరాలు సమీపిస్తే
కాలోర్మికలతో జోకొడుతూ సహిస్తుంది
అన్ని ఋతువుల్లోనూ అదే నడక
ప్రవాహం లయాత్మకం
ప్రయాణం ఆపదు
గమనం ఆగదు
ప్రవాహమే జీవితం
జీవితమే కాల ప్రవాహం
వెలుగు వెంట చీకటి ,చీకటి వెంట వెలుగు
వినోద విషాదాల సమ్మే లనమే జీవనం.
రాత్రి మనసును నిలదీసింది
మొన్నటి కల ఎక్కడని?
ఖాళీ ముఖంతో
నిజం తలదించుకుంది.
ఇష్టం ఒట్టిచేతులతో
అక్షరానికి ఇంకేదో బలం కావాలని
నిజానికి ఇంకెంతో మర్యాద కావాలని
తప్పుపడుతూ పట్టుపట్టింది.
కన్నార్పని కల వాలిన ముఖంతో
రాత్రిని తలుపు కొట్టి
లోపలికి వెళ్ళిన ప్రతిసారీ
చప్పుడు లేని మర్యాదతో గదిది నిరాశే.
కునుకుపై అలిగిన కళ్ళు
రాల్చిన కన్నీటిలో
తొంగిచూసే పొరపాట్లకు
లొంగిన నిజాయితీతో
ఆకలి దప్పిక మానేసిన ఆలోచన
ఒంటరితనంతో ఉరిపోసుకుంది.
అక్షరం మౌనంగా రోధిస్తుంది.
కవిత దిక్కులు పిక్కటిల్లెలా మ్రోగుతుంది.
సోమవారం నిశికాంత ఆగమనంతో మా సోమవార కుటుంబ సభ్యులందరూ అంతర్జాల సాహితీ ప్రాంగణంలోకి ఒక్కొక్కరుగా ఆసీనులవడం మొదలెడతారు. అన్ని వయసుల కలబోత మా లోగిలి, భేషజాలు ఉండవు, మాట్లాడుకోవడం కూడా అరుదే! నమస్కారంతో మొదలై చిన్న సమీక్షో, కవిత్వమో , పుస్తకావిష్కరణతోనో మాటలు మొదలౌతాయి.
మూల స్తంభాలు పెద్దలు ,శ్రీ కందుకూరి శ్రీ రాములు బాబాయ్ గారు గాని ,సోదరులు శ్రీ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు గాని ప్రయోక్తలుగా ,చక్కని భాషణం చేస్తూ కవుల రచనలను విశ్లేషిస్తూ, చిన్నచిన్న సవరణలు చేస్తూ, ప్రశంసిస్తూ సాగుతుందీకవనగోష్ఠి అంతా ‘నేనే’, అంటూ’ శ్రీ నిజాల్ని’ వెల్లడిస్తూ శ్రీరాములు గారు ప్రోత్సహించే తీరు బాగుంటుంది. ‘పట్నం విస్తరిస్తుందంటూ,’ దేశం ఒక అబద్ధపు పాలన ,వంచనలో ఉందని ‘దేశాన్ని బతికించుకుందాం ‘అంటూ ఉత్తేజితుల్ని చేస్తూ సోదరులు సంపత్ గారు తమ కవితలతో అలరిస్తారు. మరియు వీరి విశ్లేషణాపటిమ అమోఘం.
మా కవన కురువృద్ధులైన శ్రీ కందాళై రాఘవాచారి బాబాయ్ గారు ఓసారి’ మట్టి పిల్ల’ శ్రమ సౌందర్యాన్ని చూపిస్తూ , మరోసారి ఇంట్లో మామిడి చెట్టు ఉంటేనే కచేరి చేస్తానంటుంది నా కలంలోని కోయిల అంటూ చెప్తారు. సోదరులు బక్కారెడ్డి గారు స్పృశించని అంశమే ఉండదు. అరవై ఆకుల కాలచక్రం అంటూ కాలాన్ని రాట్నంతో పోలుస్తూనే, ‘కాలానికి పుట్టినరోజు’ కూడా చేస్తారు. మరో సోదరులు శ్రీ దాసరి మోహన్ గారు ‘కల’ను కళతో పోలుస్తూ, కలగంటే హిమాలయాన్ని తలగడగా చేస్తానంటారు. ‘జైలు వారికి విడిది ‘అంటూ నాయకుల పై ఛలోక్తులు విసురుతారు. ఇంకో సోదరులు శ్రీ నల్లగొండ రమేష్ గారు ‘అంగూరు గుత్తుల్ని ‘ చూపించి పండ్ల తీయదానాన్ని వర్ణిస్తూనే , అంగట్లోని ఉల్లిగడ్డల తాత దగ్గరి చిన్నారి చిరుతిండికై చేసే మారాంలోని ఆర్తిని హృద్యంగా వర్ణించి కంటతడి పెట్టిస్తారు. పెద్దలు గజేందర్ రెడ్డి గారు సమీక్షలతో ‘సరోజ’ హృదయాన్ని ఆవిష్కరించినా, ‘తరాజు’లో వ్యాసాల్ని బేరీజు వేసినా వారికే చెల్లుతుంది. మరో పెద్ద శ్రీ రూప్ కుమార్ డబ్బీకార్ గారు తమ గంభీర వచనాలతో ‘ఉగాదికై నిరీక్షణ ‘అంటూ జ్ఞాపకాల తెరతీసి అందమైన కవిత చెప్పినా’ ఇరుసు’ లోబందీయైన స్త్రీ మానసిక సంఘర్షణను అనువదించినా ఎంతో అర్థవంతంగా ఉంటుంది . మరో కురువృద్ధులు శ్రీ నారాయణ రావు గారు తమ చమత్కారపు ధోరణిలో పిల్లలు ‘ ఆట బొమ్మలతో ‘కాకుండా ‘కనుబొమ్మలతో ‘ఆడుతున్నారని, భారతీయ సంస్కృతికి శిలాఘాతం తగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. సోదరులు జగ్గయ్య గారు చక్కని కవిత్వం రాస్తారు. రాజకీయాలపై చమక్కులు విసిరినా, ‘రైతును రాజు’తో పోల్చినా చక్కని సమన్వయం కనిపిస్తుంది. జాగ్రత్త సుమండీ! ‘బెత్తంతో శిక్షించమంటూ’ దేవునికి విన్నపాలు కూడా చేస్తారు.
శ్రీ గాజోజు శ్రీనివాస్ గారు ‘అణచివేత పై స్వేచ్ఛా గీతా’న్నైనా ‘రాయకూడని పద్యా ‘ న్నైనా చక్కగా సమీక్షించి’ జెండాపై కపిరాజు’ను చూపిస్తారు.
శ్రీమతి రంగరాజు పద్మజ గారిని గూర్చి ఎంత చెప్పినా తక్కువే, వారు ఎందరికో స్ఫూర్తిదాయకం. 60 ఏండ్లకోసారి వచ్చే సంవత్సరం నామాన్ని ఉగాదినాడు ఆహ్వానించి,షడ్రసోపేతమై విందారగించమంటూనే ,మంచి చేస్తే సత్కారం చేస్తానంటారు. ‘తెలంగాణ కన్నయ్య’ కష్టాల్ని కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తారు. .ఎరుకల యాదయ్య గారు అడపాదడపా కనిపిస్తూ నేనున్నానంటారు.
సోదరి శ్రీమతి కొండపల్లి నిహారిణి గారు స్త్రీ చైతన్య పై తమదైన తెలంగాణ యాస, భాషలో చక్కని కవితలు రాస్తూనే ,సృష్టికి మూలమైన స్త్రీని ‘ఎనిమిదో అడుగు వేయమంటూ ప్రోత్సహిస్తూనే, ‘విజయకేతనం నీదే’ నా అంటూ ఆనందం వ్యక్తం చేస్తారు.
గాయత్రి అమాయకంగా కనిపిస్తూనే నానీలతో ,పద్యాలతో అలరిస్తుంది. సోదరి అరుణ తను కవిత్వంలో మునిగి తేలుతూ ‘మంచాన పడ్డ తల్లుల దీనస్థితి’ని తెలుపుతూ, నవవసంతాన్ని స్వాగతిస్తూ, జ్ఞాపకాల తెరతీస్తూ కలానికి పదును పెడుతూ ఉంటుంది.
కనకయ్య మల్లముల గారు సీస మాలికతో ‘ఉగాది’ని సత్కరిస్తారు. అందరివాడు అంటూ ‘అంబేద్కర్’ ని చక్కని పొగడ్తలతో ముంచేస్తుంటారు. ష్ … మనలో మాట! మా యువకవి నరేష్ చారిని మాత్రం అస్సలు కదిలించకండి , కొంచెం భూమి కావాలంటూ వెంటపడతాడు. పాపం స్వలాభం కోసం కాదండీ ! సాగుబడిలోని రైతుల కష్టనష్టాల్ని ముందు తరాలకు చూపించాలని మాత్రమే. అక్షర సేద్యాన్ని చక్కగా చేస్తాడు ,జ్ఞాపకాలను అనుభవించమంటూ మరీ గుర్తు చేస్తాడు.
మధ్య మధ్యలో కవులకు ఎన్నో సందేశాల్ని, సమాచారాన్ని అందిస్తూ ఒద్దిరాజు ప్రవీణ్ గారు జాగృతం చేస్తూనే ఉంటారు.
శ్రీమాన్ గజవెల్లి దశరథ రామయ్య బాబాయి గారు ఎక్కడ సంఘర్షణ ఉంటుందో, ఎక్కడ శ్రమదోపిడీ ఉంటుందో అక్కడ తమ కలం కళ్ళతో పహారా కాస్తూ ,తమ చక్కని గళంతో కవితాలాపన చేస్తూ అలరిస్తారు. సోదరులు శ్రీ ఖాసిం గారు ‘అన్నయ్యకు కవితాంజలి’ ఘటించినా ,పండుగలపై కవితలల్లినా వారి తెలుగు తేనెలొలుకుతుంది . వేణుశ్రీ బాబాయ్ గారు వచనంలో సెటైర్లు గుప్పించినా, పద్యంతో దైవాల్ని స్తుతించినా, సమాజాన్ని వేలెత్తి చూపినా సందర్భోచితమై అలరారుతుంది. పెద్దలు శ్రీ జల్ పల్లి బ్రహ్మం గారు అద్భుతమైన తమ పద్య కవితలతో అలరిస్తారు. రామదాసు గారు మధ్యమధ్యలో సాహితీ సభలపై పోస్టులు పెడుతూ అందరినీ చైతన్య పరుస్తుంటారు. భానుజ ‘జీవితం ఒంటరిదైపోయిందంటూ ‘ నిస్పృహకు లోనౌతూ, అప్పులు మాత్రం చేయకండి ‘అని హెచ్చరిస్తూ అప్పుడప్పుడు వందన సమర్పణ చేస్తూ ఉంటుంది. సోదరి సులోచన నానీలతో అంతరంగాన్ని ఆవిష్కరిస్తూనే చేదబావిలోని ‘ ‘బొక్కెన’ ‘జీవన చిత్రాన్ని, మనుషులతో మమేకమైన తీరును చక్కగా తెలిపి అందమైన కవితలల్లుతుంది. మరోయువకవి వంశీధర్ నేనున్నానంటూ అప్పుడప్పుడు తొంగి చూస్తూ నానీలు వినిపిస్తూ, టెక్నాలజీని కలిపి చక్కని కవిత్వం చెప్తాడు. నక్కా హరికృష్ణ వృత్తి ధర్మమో, పని భారమో తెలియదు గానీ పాపం, కాదేది కవనాస్వాదనకనర్హం అంటూ రోడ్డునే వేదికగా చేసుకొని అడపాదడపా హాజరౌతూ, కవనాన్ని వినిపిస్తుంటాడు . గుండెల్లి ఇస్తారి రోడ్డు పైకొస్తున్నాడంటేనే నాయకులు చాలా బెంబేలు పడిపోవాల్సిందే! కటౌట్లలోని వారిని ప్రశ్నల శర పరంపరతో అదరగొట్టేస్తాడు. సహోదరి పద్మశ్రీ చెన్నోజ్వల సంగీత, సారస్వతాలకు సమన్వయం పొసుగుతుందో? లేదో? అనే మీమాంసలో సతమతమౌతూనే చక్కని కవన ఝరులను ఒలికిస్తుంది. రాధికా సూరి అనే నేను అందరి కవితల్ని వింటూ, వ్యక్తిత్వ వికాస అంశాలు ఉన్నాయోలేవోనని దుర్భిణితో వెతుకులాడే ప్రయత్నంలో ఉంటాను. అప్పుడప్పుడు సాహితీస్రష్ఠలతో గోష్ఠులు నిర్వహిస్తూ, అందరిలో ఉత్సాహం నింపుతూ ముందుకు నడిపిస్తారు మా ప్రయోక్త లు.
కొత్తపల్లి నరసింహ ,శ్రీరంగం శ్రీశైలం, రెడ్డిపల్లి వెంకటేశం, లక్ష్మీనారాయణ గార్లు మెసేజెస్ పెడుతూ కనిపిస్తుంటారు. వి.వి .చారి గారు ‘సార్వత్రిక సమర శంఖం ‘ ఊది జ్ఞాపకాల’ డైరీ’ పుటలు తిరిగేసి మధురానుభూతులను గుర్తు చేస్తారు. డాక్టర్ నాగరాజు గారు కవులను సరస్వతీపుత్రులుగా అభివర్ణిస్తారు. సూత్రధారీ ,పాత్రధారీయైన సోదరులు వేణు నక్షత్రం గారు టెక్నాలజీని అందిస్తూ, నచ్చిన కవితల్ని చదువుతూ, ‘చెప్పలేదంటనకపోయేరు’ అంటూ మా అందరినీ తమ పిలుపు టీవీలోకి సాదరంగా ఆహ్వానిస్తారు. ఈ మధ్యనే మాతో జట్టు కట్టిన మరో యువకవి ఇక్బాల్ ఉగాదిపై తేటతెనుగులో చక్కని కవిత చదివి సమాజాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. చివరగా శ్రీమాన్ గోపాల్ రెడ్డి గారు అందరి కవితలపై తమ అభిప్రాయాల్ని సున్నితంగా ఎవరినీనొప్పించకుండా చక్కగా విశ్లేషిస్తారు. వందన సమర్పణతో మా సోమవారం కవి సమ్మేళనం వారందాకా విరామం తీసుకుని, మరోవారానికై కొత్త ఊపిరిని నింపుకుంటూ ఎదురుచూస్తూఉంటుంది.
(పొరపాటున ఎవరిపేరైనా మర్చిపోతే క్షంతవ్యురాలను)
ప్రాంగణం ప్రవేశించేసరికి
విద్యార్థులు చిన్న చిన్న
కోడి పిల్లల లాగా ఇంగ్లీషులో
కిచ కిచ అంటారు
తెల్లబాతుల్లాంటి ఉపాధ్యాయులు
పాఠశాల సరసులో
చిరునవ్వు లేత గాలితో
పిల్లలని స్పృశిస్తారు
పిల్లలను చూస్తే వచ్చి
పోయే వాహనాలు ట్రాఫిక్
సిగ్నల్ లో ఎర్రలైట్లు అవుతాయి
పిల్లల్ని బడిలో దిగబెడుతున్న
తల్లి కోడి లాంటి మమ్మీలు డాడీలు
ముక్కుతో కోడి పిల్లలస్పర్శిస్తారు
ఎక్కడనుంచో ఒక మ్యాక్ ఫై
ఎగురుతూ వచ్చి నన్నో బలిని చేస్తుంది
బుజ్జి గాంధీలు సీట్ డౌన్ సీట్ డౌన్
అంటూ ప్రబోధిస్తారు
జీవన సమరంలో నిరంతరం జ్వలించే
ఇండియా బుద్ధి
ఈ పూల తోటలో
ఆకుల పైన మంచు
బిందువు అవుతుంది
అక్షర సేద్యాలు ఆకుపచ్చగా
మొలకెత్తే పని మెదడు బీడు
భూమిలో మొదలైపోతుంది
మైకులో వినబడుతున్న
సంగీతం లాంటి అనౌన్స్మెంట్
గువ్వ గువ్వల చిరు గొంతుల పైన
నిశ్శబ్దం ముసుగు కప్పేస్తుంది
జీవితం ఎన్ని లలిత క్షణాలను
ఆవాహన చేసుకుంటుందో
ఆస్ట్రేలియా బడిలో మనవరాలితో
అడుగుపెట్టిన క్షణాలలో
అర్థం చేసు కొంటూ
శుభ్ర స్నానం చేసిన
నగ్న మూర్తిగా బయటికి వస్తాను
“మనసెరిగి మసలు కునే వాళ్ళేమన వాళ్ళు.” అప్పటికి లక్షా తొంభై సార్లు… కాదు కాదు కోటీ థొంభై షార్లు… ఇంకా చెప్పాలంటే లెక్కలేనన్ని సార్లు అనుకున్నాడు రంగారావు. కళ్ళల్లో నుంచి నీళ్ళు బయటకు వస్తామూ అని మారాము చేస్తున్నాయి. గొంతు గురఘురా అంటోంది. చీ… తన బతుకెంత అధ్వానం అయిపోయింది? తనేమన్నా చిన్నా చితకా వాడా? ఆకుపచ్చ సంతకాలు చేసిన గెజిటెడ్ ఆఫీసర్! హిప్పుడు చప్రాసీ అయిపోయాడు. ఇంతకన్నా అవమానం ఇంకేముంటుంది? గత కొన్ని నెలలు గా జరిగిన దానికన్నా ఈరోజు జరిగింది గుండెను మండిస్తోంది. రిటైర్ అవుతే జీవితం ఇంతలా మారిపోతుందా? ఆ రోజు…
తన రిటైర్మెంట్ రోజున, తననూ, కాంతం నూ కూర్చోబెట్టి ఘనసన్మానం చేసారు. సహోద్యోగులందరూ తన గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. పెద్దపెద్ద దండలు వేసారు. శాలువా కప్పారు. హబ్బో ఆ ఫంక్షన్ తెలుచుకుంటేనే వళ్ళు ఉప్పొంగుతుంది. తనకు ఇష్టమైన వాటితో మంచి విందు ఇచ్చారు. ఇంటికొచ్చాక ఎవరికీ జరగనంత గొప్పగా తన రిటైర్మెంట్ పార్టీ జరిగిందని తలుచుకొని మురిసిపోతుంటే “ఆ… అమ్మయ్య మనకు వీడి బాధ తప్పింది, అని అంత పార్టీ ఇచ్చారేమోలే” అని తీసిపారేసింది కాంతం. చుప్పనాతి శూర్ఫణక పోనీలే అని ఊరుకున్నాడు.
మరునాడు రోజులాగే పొద్దున్నే మెలుకువ వచ్చింది. ఆ అప్పుడే లేచి చేసేదేముంది అని కాసేపు అలాగే మంచం మీద అటూఇటూ దొర్లి, ఇక దొర్లలేక లేచాడు. కాంతం ఇచ్చిన కాఫీ తాగి, అప్పుడే వచ్చిన పేపర్ చదివాడు. స్నానం అయ్యాక దండం పెట్టుకోవటమే కానీ రోజూ వారీ జపాలు, పూజ ఎప్పుడూ అలవాటు లేదు. కాసేపు వరండాలో అటూ ఇటూ అచార్లు, పచార్లు చేసి టిఫిన్ తిన్నాక ఇంకేం చేయాలబ్బా అని చించీ…చించీ కేబుల్ వాడికి అప్పనంగా కి బోలెడంత డబ్బుపోస్తున్నాము, ఇప్పటి దాకా ఎప్పుడూ చూడలేదు ఇక చూద్దాం అని టీ.వీ పెట్టాడు. ఎన్ని ఛానల్సో! ఎన్ని ప్రోగ్రాం లో! రోజంతా, రోజంతా ఏమిటీ రాత్రి దాకా ఛానల్స్ తిప్పీతిప్పి అర్ణబ్ వార్తలు, టీ.వీ వార్తలూ, అత్తకోడళ్ళ సీరియల్లూ హబ్బో అన్నీ చూసీసీ… అలవాటు లేని పని కావటం తో కళ్ళూ, వేళ్ళూ నొప్పులు పుట్టాక టీ.వీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అరే ఇదేదో బాగుందే! అందుకే అందరూ టీ.వీ కి అతుక్కుపోతారు అని ఆ ప్రోగ్రాం కే ఫిక్సైపోయాడు. తినటం, టీ.వీ చూడటం, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్, స్నాక్స్ తో సహా టీ.వీ ముందే సెటిల్డ్! ఇలా కొన్ని నెలలు గడిచాయి…
సడన్ గా కాంతం కు ఏమయిందో “ఊరికే మిడిగుడ్లేసుకొని టీ.వీ ముందు కూర్చోకపోతే మార్కెట్ దాకా వెళ్ళి కూరలు తేవచ్చుగా” అని సంచీ విసురుగా వళ్ళో వేసింది. కాంతం సణుగుడు భరించలేక కూరలు తెచ్చి ఇచ్చాడు. సాయంకాలం రామం ఏవో స్వీట్స్ పాకెట్స్ తెస్తే, అవేమిటీ నాకిటివ్వరా అని కొడుకును అడుగుతున్నా వినిపించుకోకుండా కోడలు అంజలి కొంగు చాటుగా పెట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది.
ఇదేమిటీ ఎప్పుడూ లేని అలవాటు అనుకొని హాచర్యపోతూ “కాంతం ఇదేమిటే అడుగుతున్నా పెట్టకుండాతీసుకుపోయింది?” రాత్రి భోజనానికి పిలిచిన కాంతం ను అడిగాడు.
“అన్ని ఆరాలూ కావాలి. అయినా ఇప్పుడు నీ తిండికే లోటు వచ్చింది?” విసుక్కుంటూ కంచంలో రెండు ఫుల్కాలూ, పక్కన ప్లేట్ లో ఏవో కూరగాయముక్కలూ, గ్లాస్ లో మజ్జిగ పెట్టింది.
“ఈ రొట్టెముక్కలు, పచ్చి కూరగాయలు, మజ్జిగ ఏమిటీ? నేనెప్పుడైనా తిన్నానా? ఎన్నడైనా పెరుగు తప్ప మజ్జిగ పోసుకున్నానా?” కోపంగా అరిచాడు.
వినిపించుకోకుండా మనవడికి తినిపించటం లో ఉండిపోయింది.
అదిమొదలు తన తిండి ఖనాఖష్టం అయిపోయింది. స్వీట్స్ తనకు పెట్టకుండా దాచుకోని తినటం, తనకిష్టమైన పూరీలు అవీ కూడా తన ముందే తనకు పెట్టకుండా మనవడికి పెట్టటం ఇలా బోలెడు మార్పులు తన తిండిలో. అప్పటికీ ఉక్రోషం ఆపుకోలేక “నేనేమైనా పశువునా ఈ గడ్డీగాదం తింటానికి?” అని అరిచినా పట్టించుకున్న వాళ్ళే లేరు. సాత్వికులైన కొడుకూ కోడలు మారిపోయారు. “నా కొడుకు అమాయకుడమ్మా, వాడికి కాస్త తిండిపుష్ఠి ఉన్నదని వాడి మనసెరిగి కావలసినవి చేసిపెడుతూ, కాస్త కనిపెట్టుకొని ఉంటావని నీ చేతిలో పెడుతున్నానే కోడలుపిల్లా” అని అమ్మ మేనకోడలికి తనను అప్పగించినప్పటి నుంచీ ఏదో అప్పుడప్పుడు అరవటం తప్ప ముద్దుగా చూసుకుంటున్న కాంతం సూర్యకాంతం పేరును సార్ధకం చేసుకుంటూ ముందే కాస్త గట్టిదేమో ఇప్పుడు మరీ గంపగయ్యాళమ్మ అయిపోయి కొడుకుకు, కోడలికి వంతపాడుతోంది. పైగా “ఎద్దులా కూర్చున్నావు. కాస్త మనవడిని పార్క్ కు తీసుకెళ్ళి ఆడించవచ్చుగా” అని కూడా కసురుకుంటోంది మొగుడన్న మర్యాదలేకుండా! అందుకే మావకూతురిని పెళ్ళి చేసుకోకూడదు. ఇట్లాగే నెత్తినెక్కుతారు. ఇప్పుడనుకొని ఏమి లాభం!
అంతటితో తన కష్టాలు ఆగలేదు, “ఎప్పుడూ ఆ టీ.వీ ముందు కూర్చొని అత్తాకోడళ్ళ సీరియళ్ళు చూడకపోతే చెట్లకు నీళ్ళుపోసి, తోట పని చూసుకోవచ్చుగా రెండురోజుల నుంచి మాలి రావటం లేదు. పెరట్లో కూరగాయల మడులు, ముందు పూల మొక్కలూ ఎండిపోతున్నాయి. ఏదీ పట్టదు దిష్ఠిబొమ్మలా హాల్ మధ్యలో కూర్చున్నావు” అని చిరాకు పడ్డాడు రామం.
అట్లా ఒక్కొక్కపని తనకు అప్పగించారు. పకోడీల వాసన వస్తుంటే హబ్బా తనకిష్టమైన పకోడీలూ హూ అని వంటింట్లోకి వెళ్ళాడు. మీకిక్కడేమి పని బయటకెళ్ళండి అని తరిమింది అంజలి. హంతే తనకు పౌరుషం వచ్చేసింది. “రామం” భీకరంగా అరిచాడు.
ఆ అరుపుకు అదురుబెదురు లేకుండా గదిలో నుంచి బయటకు వచ్చి “ఏమిటీ” అడిగాడు థాఫీగా.
“ఆ మధ్య నా బాంక్ పాస్ బుక్ తీసుకున్నావు అది ఇటివ్వు. ముద్దకుడుముల్లా నా పెన్షన్ బోలెడు మీ చేతుల్లో పోస్తుంటే నాకుతిండి పెట్టకుండా గొడ్డు చాకిరీ చేయిస్తూ హీనంగా చూస్తున్నారు. ఇంకా ఊరుకునేదిలేదు. నాకన్నా ముందే మీ అమ్మ డబ్బులు తెచ్చేసుకుంటోంది. నా చేతికి చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేస్తోంది.నా ఎకౌంట్ మీ అమ్మతో జాయింట్ కాకుండా నా పేరు మీదకే మార్చుకుంటాను. నాకు కావలసినవి తెచ్చుకుంటాను. హోటల్ కు వెళ్ళి తింటాను.అప్పుడు కుదురుతుంది మీ తిక్క.నువ్వు పాస్ బుక్ ఇవ్వకపోయినా బాంక్ కు వెళ్ళి మార్చుకోగలను ఏమనుకుంటున్నారో ఖబడ్ధార్” ఆయాసపడిపోయి, ఖళ్ ఖళ్ మని కాస్త దగ్గాడు కూడా!
“ఓయబ్బో మహా వచ్చాడండీ.ఆ పని నువ్వు చేస్తే ఇదో ఈ ఫాన్ కు ఉరేసుకొని చస్తా. దయ్యమై నిన్ను పీడిస్తా” కళ్ళు పెద్దగా చేసి, చేతులు తిప్పుతూ అంది కాంతమ్మ.
ఒక్క క్షణం బిత్తరపోయి, ఇంక ఏమి మాట్లాడలేకవిసురుగా బయటకు వచ్చి మొక్కలల్లో గడ్డిని పీకుతూ కూర్చున్నాడు. పక్కింటి ఛాయమ్మ ఎందుకో బయటకు వచ్చి తనను చూసి “ఇదేంటన్నయ్యగారూ, వేళకాని వేళ గడ్డి పీకుతున్నారు? చాయ్ తాగారా?” అడిగింది.
ఆప్తురాలు దొరికినట్లుగా తన ఘోషను వెళ్ళబోసుకుంటుంటే “ఏమిటో నండి ఇంతబతుకూ బతికి ఇంటెనకాల చచ్చినట్లు” అని సానుభూతిని చూపిస్తున్న ఛాయమ్మను భర్త రమణారావు వచ్చి “నీకెందుకూ లోపలికి రా” అనిగడకర్రలాగాలికి ఊగిపోతూ పిలుస్తూనే ఉన్నాడు లోపలి నుంచి కాంతమ్మ వచ్చింది.
“బజార్ లో పక్కింటోళ్ళతో పంచాయితీ పెట్టిస్తున్నావా?దేభ్యమొహం వేసుకొనిఆడోళ్ళతో నీకేమిటి మాటలు? ఏందమ్మా ఛాయమ్మ నా కాపురంలో నిప్పులు పోస్తావా?” అని అరిచేస్తుంటే ఛాయమ్మ ఊరుకుంటుందా? ఇద్దరూ చేతులు తిప్పుకుంటూ పెద్ద గొంతులేసుకొని అరుచుకుంటుంటే తను ఆ గంపమ్మ కథ చూడలేకఇదో ఇట్లా వచ్చి, పార్క్ లో వేపచెట్టుకింద బెంచీ మీద కూలబడ్డాడు.
అవును ఏ రచయత అన్నాడో కానీ “మనసెరిగి మసలు…కునే వాళ్ళే మన వాళ్ళు.” వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అని మళ్ళీ లెక్కపెట్టలేనన్నోసారి అనేసుకొని, పరిపరి విధాల చింతిస్తూ, ధుఃఖిస్తూన్న రంగారావు నెత్తిన ఠప్ మని ఓ వేపకాయ, ఆ వెనువెంటనే ఓ వేప రెమ్మ వచ్చి నెత్తిన పడ్డాయి. అవి చూడగానే, అప్పుడే కాంతగంపమ్మ ఉరేసుకున్నట్లూ, దయ్యమై తనను ఘట్టిగా పట్టేసుకొని ఖంగాళీ నృత్యం తనతో చేయిస్తున్నట్లూ, మంత్రాల మాంచారయ్య వచ్చి వేపకొమ్మలతో కసాబిసా బాదేస్తున్నట్లూ, గంపమ్మ వికట్టాట్టహ్హాసం చేస్తున్నట్లూ ఊహ వచ్చేసి వణికిపోయాడు రంగారావు. అంతలోనే తెలివి తెచ్చుకొని చుట్టూ చూసాడు. పార్క్ లో అందరూ వెళ్ళిపోయారు. ఆడుకుంటున్న మనవడు కూడా లేడు. వెధవ నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? ఇహ ఇప్పుడేమి గోల ఉందో కొంపలో నిట్టూరుస్తూ, అయినానేనెందుకు వీళ్ళకు భయపడాలి? అసలు ఆ చావేదో నేనే చచ్చి వీళ్ళను పీడిస్తే! మంత్రాల మాంచారయ్య వీళ్ళను చితక బాదాలి.తను భీకరంగా నవ్వాలి. వళ్ళో పడ్డ వేపకాయను నలుస్తూ, కాసేపు ఏ విధంగా చస్తే బాధలేకుండా చావొచ్చా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలతోనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరాడు.
“ఇంతసేపటి వరకు ఎక్కడికెళ్ళావు?” గయ్ మంది కాంతమ్మ.
కాంతమ్మను నిర్లిప్తంగా చూసి, లోపలి నుంచి నిద్ర మాత్రల సీసా తెచ్చి చూపిస్తూ “నేనింక నీ కడవళ్ళు భరించలేను. ఈ మాత్రలు మింగి చస్తాను” అని చేతిలోకి సీసా వంపుకొని, మంచి నీళ్ళ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ, మనవడు, కొడుకు కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద పొగలు చిమ్ముతూ అన్నం, ముక్కుపుటాలను అధిరిస్తూ ఘాటుఘాటు కొత్తావకాయ, కొద్ది దూరం లో చెరుకు రసాలు కనిపించి నోరూరించాయి. అవి తిని చద్దామా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తన పిచ్చికానీ ఈ రాక్షసులు తనను తిననిస్తారా విరక్తిగా అనుకొని వాటి వైపు చూడకుండా మనసును అదుపు చేసుకుంటూ,కళ్ళుమూసుకొని నీళ్ళ గ్లాస్ అందుకున్నాడు.
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
అందరూ గగ్గోలుగా అరిచారు. పక్కింటి నుంచి రమణారావు, ఛాయమ్మ పరిగెట్టుకుంటూ వచ్చారు. రమణారావు, రంగారావు చేతిలోనుంచి మాత్రలు గుంజుకొని “ఏం పనిది” మందలింపుగా అన్నాడు.
“మీకు తెలియదు వీళ్ళు నాకు తిండిపెట్ట కుండా ఎంత హింస పెడుతున్నారో, చాకిరీ చేయిస్తున్నారో” అన్నాడు ఉక్రోషంగా.
“బావండీ నన్ను క్షమించు బావా క్షమించు” రంగారావు చేతులు పట్టుకొని బాధగా అంది కాంతం.
“దీని దుంపతెగ ఇప్పుడూ కాళ్ళు కాకుండా చేతులు పట్టుకుంది హెంత గీర” మనసులో అనుకొని “క్షమించను పో” అన్నాడు రంగారావు మరింత గీరగా!
“నాన్నా అదికాదు, అసలు సంగతేమిటంటే అయిదు నెలల క్రితం నువ్వు టీ. వీ చూస్తుండగా ఏమి జరిగిందో గుర్తు తెచ్చుకో” రింగులు తిప్పాడు రామారావు.
“ఆ …ఇప్పుడు రింగులు తిప్పి అంత హవస్త ఎందుకు కానీ, బావండీ ఆరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. అట్లా రెండు సార్లు జరిగే సరికి నిన్ను రామం డాక్టర్ కు చూపించాడు. అన్ని టెస్ట్ లూ చేసి, నీకు బీ.పీ బాగా పెరిగిందనీ, షుగర్ బార్డర్ లోకి వచ్చిందనీ, బరువు 200 కిలోలు పెరిగావు, బరువు తగ్గాలనీ జాగ్రత్త పడాలనీ చెప్పాడు గుర్తుందా?కుర్చీలో నుంచి లేవటానికీ, నడవటానికీ ఇబ్బంది పడ్డావు. పైగా ఆ శంఖుమార్క్ లుంగీలు వదలవు. గడ్డం చేసుకోమన్నా చిరాకు పడిపోతూ ఎంతసేపటికీటీ.వీ ముందు నుంచి లేవవు. అక్కడికే రకరకాల రుచులతో స్నాక్స్ కావాలి.ఎంత చెప్పినా నీకు తిండియావ తగ్గదు.”
“వాకింగ్ కు వెళ్ళమంటే వెళ్ళవు.”
“అమ్మాయ్ అంజలీ నువ్వు మీ అత్తయ్యా ఓసారి ఈ సీరియల్ లో లాగా పోట్లాడుకోండి అని సరదా పడిపోయారు.”
ఒకళ్ళ తరువాత ఒకరు చెప్పుకుంటూ పోయారు.
“భారీ ఏనుగులా వళ్ళు పెంచేసావు. తాతయ్య కు బీ.పీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి ఎన్నాళ్ళో మంచాన తీసుకొని తీసుకొనిపోయాడు. బామ్మా, తాతయ్యషుగర్ ఎక్కువ అయ్యి గుండెపోటుతో పోయారు. నీకు ఆ పరిస్తితి రాకూడదని ఎంతో ఆలోచించి ఈ ప్లాన్ వేసాము. ఇప్పుడు చూడు నువ్వు గున్న ఏనుగులాగా కాదు బుజ్జి ఏనుగుసైజుకు వచ్చావు. నీకోసమే డాడీ ఇదంతా నీ కోసమే” బాధగా పిడికిలి నోటికి సుతారంగా ఆనించుకొని, మొహం బాధగా పెట్టిఅన్నాడు రామారావ్.
“అవును మామయ్యగారు అట్లా మాట్లాడినప్పుడల్లా ఎంత బాధ పడ్డామో తెలుసా” చేతులు నలుపుకుంటూ, కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది అంజలి.
“బావండీ నిన్ను చూసినప్పుడల్లా మాయాబజార్ లోని ఘటోత్కచునిలా కనిపించి ఎంత దడుచుకునే దాన్నో తెలుసా? ఉమ్మడి కుటుంబం లో యమధర్మరాజులాగా దున్నపోతెక్కి యముండ అని భీఖరంగా అరుస్తూ యమధర్మరాజు వస్తుంటే నిన్ను కాపాడాలని ఆ సావిత్రిలా నీతో ఈ నిరాహార దీక్ష హెంత నిష్ఠతో చేయించాను” అంటూకాంతం కొంగు నోట్లో కుక్కుకుంటూ ఆపసోపాలు పడుతోంది.
హోరినీ హిదా సంగతి అని రమణారవు, ఛాయాదేవి నోరెళ్ళ బెట్టి చూస్తున్నారు.
శుభం కార్డ్ పట్టుకొని తన చుట్టూ నిలుచున్న అందరి మొహాలు ఒకటొకటిగా స్లో మోషన్ లో చూసాడు. చిన్నగా నడిచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు…
“అమ్మాయ్ ఆ రెండు చెరుకు రసాలు ఇటందుకో”అంటూకంచం దగ్గరికి జరుపుకున్నాడు…
వేడి అన్నం, ఆవకాయ కంచంలో తోడుకున్నాడు. తెల్లగా మెరిసిపోతున్న వెన్న ముద్దను చేతిలోకి తీసుకొని మొత్తం వేసేసుకున్నాడు…
అన్నం కలిపాడు…
గుండ్రాయంత ముద్దను చేసి, ఆబగా నోటి దగ్గరగా తెస్తుంటే…
“బావండీ…”
“డాడీ…”
“మామయ్యగారూ…”
“తాతయ్యా…”
“రంగారావ్…”
“హన్నయ్యగారు…”
ఆ ఆర్తనాదాలు పట్టించుకోకుండా, చేతిలోని ఆవకాయ ముద్దను మురిపెంగా చూసి, ఘాఠ్ఠిగా వాసన పీల్చి, ఆ ఘాటుకు, ముక్కు, కళ్లు ధారలు కారుతుండగా అందరి వంకా చిద్విలాసంగా చూసి, నోట్లో కూరుతూ, ఆహా ఇది కదా “స్వర్గం అంటే” తన్మయంగా అన్నాడు.
కారు హారన్ మ్రోగుతోంది.
అన్వేష్ వచ్చినట్టున్నాడు అనుకొని స్నేహ చెప్పులేసుకొని వచ్చి కారులో కూర్చుంది.
‘దారిలో నీలూని పికప్ చేసుకుందాం’ అంది ముక్తసరిగా !
‘ఏమిటే హాట్ హాట్ గా ఉన్నావ్ ! ఎటు వెళ్దాం !’
”హాటా నా ముఖమా? బాధగా ఉంది. అంతే. ఎక్కడికయినా ప్రశాంతంగా ఉండే చోటుకు పోనీయ్” అంది. కాస్త దూరం వెళ్ళగానే కారు ఆపాడు అన్వేష్.
హారన్ ఎంతగా మ్రోగించినా నీలూ రాదేం? చూద్దాం అని లోపలికి వెళ్ళింది.
అప్పుడే బయటకు వస్తూ కనిపించింది నీలిమ తల్లి.
”స్నేహా! నీలూ రాంబాణమ్మ గారి పాపకు జాండీస్ అయితే హాస్పిటల్ లో చేర్చారట. అక్కడే ఉందట”.
”అలాగా! నేను వచ్చి వెళ్ళానని చెప్పండి” అని వచ్చి కారులో కూర్చుంటూ విషయాన్ని చెప్పింది అన్వేష్ కి.
”ఈ విషయం సరే! అసలు విషయం చెప్పు !”
”చెబితే సిల్లీగా ఉందని నవ్వుతావేమో?” సందేహిస్తూ అంది.
”నా సంగతి తెలియదా? కొత్తగా మాట్లాడుతున్నావ్?”
”నాకు అన్నీ కొత్తగానే కనిపిస్తున్నాయి. నలభై యేళ్ళు కాపురం చేసిన మా మాయ్య, అత్తయ్య ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకోవటమేమిటి?”
”అదేముంది ఎప్పుడు పడకపోతే అప్పుడు విడాకులు. దానికి వయసుతో సంబంధం ఏముంది? నాకిందులో ఏం కొత్తదనం కనిపించటం లేదే!”
”జనాలంతా ఇలా తయారయ్యారేం? విడాకులు అనేది మన సంస్కృతికి విరుద్ధం. అలాంటి ఆలోచనే రావద్దంటాను”
”అలా అని ఇష్టం లేకున్నా సర్దుకు పోవాలా? ఎన్నాళ్ళిలా ?”
”అందుకని మనుమళ్ళు వచ్చే వయసులో విడాకులా! ఛ !ఛీ”
‘ఇంతకీ సమస్య ఏమిటీ?”
”ఇన్నాళ్ళూ అత్తయ్య చెప్పినట్లు మామయ్య వినేవాడు. ఏమయ్యిందో తెలియదు. ఎదురు తిరిగాడు. మామయ్య నేనేం చెబితే అది జరగాలి అంటున్నాడు. అది అత్తయ్య తట్టుకోలేకపోతోంది.”
”బుద్ధునికి బోధి చెట్టులా ఎక్కడో జ్ఞానోదయమయి ఉంటుంది”
”నాకనిపిస్తుంది ఈ బుద్ధి పెళ్ళయిన కొత్తలోనే ఉంటే బాగుండేది అని. అప్పుడే ఆవిడను అదుపులో పెట్టుకొని ఉంటే ఈ సమస్య ఉండేది కాదుగా!”
”అదేంటి స్నేహా! ఆడవాళ్ళను అదుపులో పెట్టుకోవటం అనేది మీ స్త్రీవాదులు ఒప్పుకోరుగా!”
”అదే! నాకు ఒళ్ళు మండుతుంది. అదుపులో పెట్టుకోవటం అంటే మనులు చెప్పి చేయించుకొనే పని మనిషిలా చూడటం అని గాదు. తప్పుగా ప్రవర్తిస్తే భార్యనయినా సరైన దారిలో పెట్టాల్సిందే అని. నీకు తెలుసా! మా అత్తయ్యా మాటలు విని మా అమ్మమ్మకు మందులు కూడా కొనేవాడు కాడు మామయ్య. తాతయ్య చనిపోయిన దగ్గరనుంచీ ఒక్కర్తీ కష్టపడి పెంచి, పెద్దచేసి ఇలా తన తిండి తను తిని వీళ్ళందరికీ ఇంత సంపాదించి పెడుతున్నాడంటే ఆ క్రెడిట్ ఎవరిది మా అమ్మమ్మది కాదూ! అలాంటి అమ్మమ్మను సరిగ్గా చూచుకోపోతే ఊరుకోను” అని గట్టిగా చెబితే ఇప్పుడే అవస్థ తప్పేదిగా! ఎవరికిచ్చే వాల్యూ వాళ్ళకివ్వాలని. ఎవరినీ కించపరచుకుండా ఇద్దరికీ న్యాయం చేసే దక్షత భర్తగా ఈ మగవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో’ అని జాలివేస్తుంది కూడా!”
రేపు తను ఒక భర్త అయితే ఇదేనా పరిస్థితి అని దిగులుగా పెట్టాడు ముఖం అన్వేష్!
”ఏమిటా ఫేస్! ఇప్పుడు ఆ కష్టమే నీకు వచ్చినట్లు అంత దీనంగా!”
”నిజంగా వచ్చినట్లే ఉంది”
”వస్తే ఎలా నడుచుకోవాలో చెప్పటానికి నేనున్నానుగా!” అభయహస్తం ఇస్తూ ఉంది.
”ఇంకా చెప్పేదేమిటి ఆల్ రడీ చెప్పేసావ్ గా”
”ఎక్కడ పూర్తిగా చెప్పనివే”
ఇంకా డీలా పడిపోయాడు.
”నువ్వు జాగర్తగా డ్రైవ్ చెయ్యి నాయినా. లేకుంటే ఈ సమస్యలకు దూరంగా పై లోకాలల్లోకి వెళ్ళి తెలియని సమస్యల మధ్య పడతాం”
అన్వేష్ సడెన్ బ్రేక్ వేశాడు విసుక్కుంటూ.
బ్రేక్ పడకపోతే ఆ కాలేజీ కుర్రాడు ప్రాణం అరక్షణంలో గాలిలోకి ఎగిరిపోయేవే! అసలు ప్రాణాల మీద తీపి కనిపించడం లేదే! రోడ్డు వాళ్ళ సొంత ఇంటిదారిలా ఆ నడక లేమిటో!”
”అందుకే! నేనసలు డ్రైవ్ చెయ్యను” అంది స్నేహ.
”అదృష్టవంతురాలివి” అయినా అతనంత ధీమాగా ఎలా వెళ్తున్నాడు? వాళ్ళ అమ్మా నాన్న ఎంత కష్టపడి పెంచుతూ ఉండి ఉంటారు! వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడకపోయినా ఫరవాలేదు. తమ ప్రాణాలు గురించి కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదేమిటి?”
”వింత వింత లోకంలో ఎన్నెన్నో చూడాలి..” హమ్ చేస్తున్నాడు అన్వేష్.
ఒక్కోసారి ట్యూన్స్ కి తగ్గ మాటలు సొంతవి కలిపి పాడటం అలవాటు అన్వేష్ కి.
అవన్నీ గమనించే స్థితిలో లేదు స్నేహ!
”మామయ్య, అత్తయ్యని ఇంట్లోంచి పొమ్మనటమేమిటి?” ఆ విషయం విని తట్టుకోలేక పోతోంది. అత్తయ్య చెడ్డపనులే చేసింది. దానిని సహించటం కూడా చెడ్డపనే. అది మామయ్య చేసాడు. ఇప్పుడు తనో బుద్ధిమంతుడిలా అత్తయ్యను ఉన్న ఫళాన బయటకు పొమ్మంటే ఎక్కడికి వెళుతుంది?”
”ఏమిటి! నాతో మాట్లాడకుండా నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావ్?”
”ఆఁ ఏం లేదు. మా మగవాళ్ళు ఎంత స్వార్థపరులో అని!”
”అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మా మగజాతి మీదకే యుద్ధమా?”
”కాదా మరి! పెళ్ళయిన దగ్గరినుంచీ భర్తే సర్వస్వం అని అతని చుట్టూ అల్లుకుంటూ తన గురించి ఆలోచించుకోకుండా, తన కోసం ఏ డబ్బూ దాచుకోకుండా అంతా మనది అనుకుంటే ఉన్నట్టుండి భర్త నా ఇల్లు, నా ఆస్థి, నీకేం లేదు పొమ్మంటే ఎంత దారుణం?”
అన్వేష్ మౌనం పాటించాడు.
”భర్తే కదా ఆమె ఆస్థి. అతనే నిరాకరిస్తే ఆమె పరిస్థితి ఏమిటి?”
”ఏం చెయ్యమంటావ్!”
”భార్య తనకంటూ సంపాదనను సమకూర్చుకోవాల్సిందే! ఒకరకంగా చూస్తే తప్పే! కానీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిస్తే అది ఒప్పే అనిపిస్తుంది?”
”దీనికి మరో పరిష్కారం లేదా?”
”ఎందుకు లేదు. విడాకులు తీసుకోకుండా చక్కగా కలిసి ఉండటమే అసలైన పరిష్కారం” ఆశ్చర్యంగా చూసాడు అన్వేష్.
”అవును అనూ! భార్య అంటే ఒకరు, భర్త అంటే ఒకరు. ఆ ఒకరు + ఒకరు పెళ్ళితో కలిసిపోయి ఒకరు అవటమే వివాహమంటే, ఒకటి + ఒకటి = ఇద్దరు అంటే అది వివాహ బంధానికి సరైన ఈక్వేషన్ కాదంటాను”
”అసలు ఇదంతా కాదుగానీ ఇన్నాళ్ళూ అత్తయ్య మామయ్యను అలా ఏడిపిస్తోంది, ఇలా ఏడిపిస్తోంది అని మామయ్య మీద జాలిపడే దానివి. మరి ఇప్పుడేమిటి ప్లేట్ ఫిరాయించేసావ్ అత్తయ్య వైపు తిరిగి”
”అప్పుడు మామయ్య బాధితుడు కాబట్టి అతని మీద జాలి. ఇప్పుడు అత్తయ్య బాధితురాలు కాబట్టి ఈమె మీద జాలి. అందులో ఈమె స్త్రీ.”
”అంతేలే ! పక్షపాతం.. ఎక్కడికిపోతాయ్ బుద్ధులు”.
”అవును… అసహాయ స్థితిలో ఎవరున్నా ఆదుకోవల్సిందే ! అత్తయ్యకు బుద్ధి చెప్పాలి. అంతవరకు ఒప్పుకొంటాను. వీధిన పడెయ్యటానికి ఒప్పుకోనంటాను”
”నేనూ ఒప్పుకుంటాను లేకపోతే నువ్వు నన్ను చంపేస్తావ్!”
”ఆడవాళ్ళను ఏడిపించే, మగవాళ్ళందరినీ అదే చెయ్యాలనిపిస్తుంది”
”మరి మగవాళ్ళను ఏడిపించే ఆడవాళ్ళని” భయపడుతూనే అడిగాడు.
”మీకులా మాకు రెండు న్యాయాలు ఉండవు మగాళ్ళకో న్యాయం, ఆడోళ్ళకో న్యాయం. అందరికీ ఒకటే న్యాయం.”
”స్నేహా! అయిపోతున్నా!” అన్నది దీనంగా ముఖం పెడుతూ.
సరే సరదాలోకి దిగిపోదాం. ఈ విడాకుల మాటలు వినీ వినీ ఇంట్లో మేం సరదాగా విడాకులు నీవే ఏర్పరచుకున్నాం! చివరకు ఏం అనిపించింది?
”సరదాకి కూడా ఈ విడాకులు సీను ఇంట్లో బాగోలేదని అందరిదీ ఒకటే మాట”
”మంచిది. ఇంక కారు దిగి మంచి కాఫీ కొట్టిస్తే వెళ్ళిపోతాను”
”అసలు తను చూడనే లేదు. కారు తమ ఇంటి ముందే ఉంది”
”అదేమిటి. ఇంటికి తీసుకు వచ్చావ్?” ఆశ్చర్యంగా అడిగింది.
”నువ్వు ప్రశాంతంగా ఉండే చోటుకు తీసుకు వెళ్ళమన్నావ్? అది నీకు ఇక్కడే బాగా దొరుకుతుందనిపించింది. అందుకే ఇక్కడికే తీసుకువచ్చాను” అన్నాడు.
అతని సమాధానానికి చిన్నగా నవ్వుతూ.. ”సరే! రా కాఫీ తాగి వెళ్దువు గాని” అని అంది స్నేహ. ఇద్దరూ నవ్వేసుకుంటూ లోపలికి నడిచారు.
రాత్రయింది అంటే
ఓ రోజు బతుకు ఖాతాలో
జమైనట్లే…
రెండు జతల
గాజుకళ్ళు, ఓటికాళ్ళు
వయసును భుజానవేసుకుని
మంచం కొండనెక్కుతూ
రేపు ఉదయం ఇద్దరిదో?
ఇద్దరిలో ఏ ఒక్కరిదో?
అన్న నడుము వంగిన ప్రశ్న
దిగులు భయంతో
బిక్కు బిక్కుమంటూ
అవకాశం దొరికనప్పుడల్లా
దేహాన్ని తట్టే బాధకు
చులకనయ్యే ఓపికతో
పండిన అనుభవంలో
ఒకరి ఆకలికి
మరోకరి ఇష్టమే ఆహారంగా
బతుకులో
ఒంటరితనం లేకుండా
ఏకాంతానందం సొంతమైనా
వృద్దాప్యంలో ఏదో ఒక రోజు
ఒకరి మరణం
మరొకరికి నరకమనే
సత్యానికి రెపరెపలాడే జీవులు
ఆఖరిరోజుకూ
ప్రేమతో ప్రాణంపోసే ధన్యులు.
( తొంభై ఏళ్లకు దగ్గరౌతున్న ప్రేమ అనే ఔషధంతో ఉత్తమదంపతులైన
నా వృద్ధ తల్లిదండ్రుల జీవితాన్ని చూస్తూ, వారి పాదాలకు కవితను అంకితం చేస్తూ…..)
ఆ బ్రహ్మ పోసినా ప్రాణమా
విధి వెక్కిరింపుకు సాక్ష్యమా
లేక….
సమాజంలోని కుటిలత్వానికి
శాపంగా మిగిలిన దేహమా
నీ తలరాతను మార్చేస్తున్న ఆ గీతలు
చావుపుట్టుకులే చెప్పలేని రాతలు
బతుకు భారాలను తెలిపే ఒట్టి శరీరపు ముడతలు
శాస్త్రనికి సైన్స్కి మధ్య ఊగిసలాడే విధిలిఖితాలు
తప్పొప్పులు తేల్చలేని ధర్మసందేహాలు
నిగూఢంగా నిలిచిపోయిన వాస్తవ రేఖలు
మనిషి విజ్ఞానానికి అంతుపట్టని రహస్యాలు
సృష్టికి ప్రతిసృష్టి చేయాలనే ఆలోచనలు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మేధావులు
సహజ గుణాన్ని కోల్పోతున్నా దేహాలు
ప్రాణం పోయటానికి పనికిరాని విజ్ఞతలు
ప్రాణాలను తీసేందుకు మాత్రం ఎన్నో తంత్రాలు
మనిషికి మనిషే శత్రువై మార్చేస్తున్నారు
నోసటి మీద గీతలు… మీ తలరాతలు…!!
