మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

మరుగుపడుతున్న పేర్లుఆచారాలు

by Acharya Madireddy Andamma March 17, 2024
written by Acharya Madireddy Andamma


ఆధునిక నాగరికత, శాస్త్రవిజ్ఞానాభివృద్ధి చెందడం, ఉద్యోగరీత్యా సమయం లేకుండా ఉండడం, వృత్తులు, జీవనోపాధులలో మార్పులు రావడం, మతాలు మారడం, వలసలు వెళ్లడం, హేతువాదం మొదలైనవన్నీ ఆచారాలు మారడానికి కారణాలు.

వ్యక్తికి సంకేతం పేరు. అందువల్లనే ప్రపంచంలోని కోట్లాది మనుష్యులకు కోట్లాది పేర్లు ఏర్ప డ్డాయి. ఈ కోట్లాది మనుష్యుల్లో వ్యక్తులను పోలిన వ్యక్తులు ఉండడం అరుదేమోగానీ పేరును బోలిన పేర్లు అనేకంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తులను వారి ఇంటిపేరుతోగానీ, తండ్రిపేరుతోగానీ, ప్రాంతం, రంగు, రూపు, ఆకారస్వరూపం, వయసు మొదలైన వాటిని జోడించిగానీ పిలవడం కద్దు. ఈ సువిశాల ప్రపంచంలోని ఇలాంటి పేర్లను, ఓ పట్టిక రాసి, పరిశీలించిచూస్తే అనేక విషయాలు వెలి కి వస్తాయి. కొన్నిపేర్లు చాలా వరకు మరుగున పడిపోయాయి. కొన్నిపేర్లు ఒకనాడు సర్వసాధారణంగా నూ, ఆ తర్వాత అసాధారణంగానూ, ఈనాడు వింతగానూ అనిపిస్తాయి. అంతేగాకుండా ఈ పేర్లను పరిశీలనాదృష్టితో చూసినపుడు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కొంతకాలం క్రితం వరకు ప్రతి ఒక్కరు ప్రకృతి మీదనే భారం వేసి, ‘నారు పోసినవాడు నీరు పొయ్య డా, కిస్కా కిస్మత్ ఉన్కే సాత్, పుట్టేవాడు రాముడౌతాడో, రావణుడౌతాడో (రాకాసుడౌతాడో’ అని కుటుంబనియంత్రణ పాటించకుండా పిల్లలను కంటూ ఉండేవారు. ఇప్పటికీ కొన్ని మతాలవారు, కొన్ని ప్రాంతాలవారు, మూఢవిశ్వాసాలు అధికంగా ఉన్నవారు, అదే పని చేస్తున్నారు. ఎవరైనా ఇద్దరు కొత్తవా రు కలిసినపుడు సర్వసాధారణంగా అడిగే ప్రశ్న ‘మీకు పిల్లలెంతమంది, ఏంచేస్తున్నార’ని అడుగుతారు. కాని ‘నీకెంత ధనముంది, ఎంత సంపద ఉంది’ అని అడగరు కదా’ అని వారి సంతానాపేక్షను సమర్థించుకుంటారు. వీరి సంతానాపేక్షకు తగినట్టుగానే ఆ కాలంలో అరడజనుకు తక్కువగా పుట్టకపోయే వారు. పిల్లలు కలగని వారికి అసలే కలగక పోయేవారు. కొందరు ఇద్దరు, ముగ్గురు భార్యలను చేసుకు న్నా సంతానం కలుగకపోయేది. మరి కొందరికి పుడుతూ గిడుతూ ఉండేవారు. సంతానం లేనివారు, సంతానం పుడుతూగిడుతూ ఉండేవారు.
సంతానం లేని వారు ఎదురైన దేవుళ్లకూ, రాళ్లకూ, రప్పలకూ, దయ్యాలకూ భూతాలకూ దండాలు ద స్కాలు పెడుతుండేవారు. మరికొందరు నాగుపాము, త్రాచుపాము శాపం తగిలిందనుకునేవారు. అందు వల్లనే గర్భస్రావం అవుతుందనుకునేవారు. సంతానం పొందడానికి, వారిని సంరక్షించుకోవడానికి నానా తిప్పలు పడుతుండేవారు. ఈ రోజుల్లోనూ సంతానం కోసం కుటుంబ వ్యక్తులు పడేపాట్లను వార్తాపత్రికల్లోనూ, టి.విల్లోనూ వార్తలుగా చూస్తూనే ఉన్నాం. ఈ తాపత్రయాలు పురాణకాలంనుండి ఈనాటి వరకూ – స్పష్టంగా వారు ఆచరించే ఆచారాల్లోనూ, సంతానానికి పెట్టుకునే పేర్లలోనూ కనిపి స్తున్నాయి. ముందుగా పుడుతూగిడుతూ ఉండే పిల్లలకోసం చేసే ఆచారాల గురించి తెలుసుకుందాం.
గ్రామాల్లో ఇంటివద్ద గర్భిణీస్త్రీ ప్రసవమైతే, శిశువు జన్మించగానే, వారిమీద కలినీళ్లు (కూరాడు కుండలోని నీళ్లు) చల్లి, మెత్తటి బట్టతో తుడిచి, చేటలో ధాన్యం పోసి, మెత్తటి బట్టవేసి, అందులో పడు కో బెడ్తారు. ఇది మనఆచారం.
పిల్లలు పుట్టి చనిపోతున్నపుడు పెద్దలు చెప్పిన ఆచారాల ప్రకారం అన్ని ‘సాగుబాట్లు’ చేస్తే పిల్లలు గిట్ట డం లేదనీ, చనిపోతున్నారని, అందుకు భిన్నంగా చేస్తేనైనా పిల్లలు బతుకుతారేమోనని భావించి, అలా కూడా చేసేవారు. ఆ శిశువును పెంట (చెత్తకుప్ప)మీదనో, బొందలలోనో, గొయ్యిలోనో, గాలిధూళికి కాసేపు పడుకోబెట్టి, తీసుకొని వచ్చేవారు. లేదా వయసుపండిన వ్యక్తి తిన్న ఎంగిలి విస్తరాకులోనో, పుల్లాకులపైననో పడుకోబెట్టేవారు. కొన్నిసార్లు కడుపునిండా కన్నతల్లికి (అధికసంతానం ఉన్న తల్లికి) దత్తత ఇచ్చేవారు. ఆ తర్వాత వారికి ‘తాలో తౌడో, బియ్యమో నూకలో రూకలో ‘ ఇచ్చి, వారి నుండి కొనుక్కునేవారు. లేదా వారి నుండి ఆ సంతానాన్ని భిక్షంగా అడుక్కునేవారు. మరికొందరు ‘చాకటింటి గుడ్డ చలవ’ అని చాకలింటి నుండి ఓ గుడ్డ తెచ్చి, అందులో పడుకోబెట్టేవారు. ఇవన్నీ కూడా సంతాన పరిరక్షణకోసం చేసే చర్యలే. ఈ విధంగా చేసే వారి పనులను బట్టే ఆ పిల్లలకు పేర్లు బెట్టేవారు.
ఉదా:
పెంటమ్మ మీద పడుకో బెట్టేవారిని పెంటయ్య, పెంటమ్మ అనీ, బొందపైన పడుకో బెట్టేవారిని బొందె(ద)య్య, బొందె(ద)మ్మ అనీ, విస్తరి మీద పడుకో బెట్టేవారిని ఇస్తారి, ఇస్తారమ్మ అనీ, పుల్లాకుల మీద పడుకోబెట్టే వారిని పుల్లయ్య, పుల్లమ్మ అనీ, గాలిలో ధూళిలో పడుకోట్టే వారిని గాలయ్య, ధూలయ్య అనీ ఇలా శిశువును దేని మీద పడుకోబెడే ఆ పేరు పెట్టేవారు.
—
శిశువును ఎవరికైనా దానం ఇచ్చేవారు. వారిని ప్రతిఫలం ఇచ్చి కొనుక్కునేవారు. ఆ మారకం (ప్రతిఫలం) వస్తువు తాలు, తౌడు, రొక్కం, రూక మొదలైనవి ఏవైనా కావచ్చు. అలా కొనుక్కున్న వారికి ఆయా వస్తువుల పేరు ‘తాలయ్య, తౌడయ్య, రొక్కమ్మ, రొక్కయ్య’ అని పేరు పెట్టే వారు. దానం ఇచ్చి తీసుకున్న వారిని దానయ్య, దానమ్మ అనీ, భిక్షం ఇచ్చి, మళ్లీ అడుక్కొని తెచ్చుకున్నవారిని భిక్షం, బిక్షమయ్య (బిచ్చం, బిచ్చమయ్య), బిచ్చపమ్మ అనీ పేరు పెట్టేవారు.
స్త్రీ ప్రసవించిన తర్వాత అలసటతో నిద్రించినపుడు, తల్లికి తెలియకుండా శిశువును బంధువు లు ‘దొంగలు’ ఎత్తుకొనిపోయినట్లు ఎత్తుకు పోయేవారు. మెలకువ వచ్చినతర్వాత శిశువుకోసం తల్లి రోదిస్తున్న సమయంలో ఆ శిశువును వెదకినట్లుగా చేసి, తల్లికి తెచ్చి ఇచ్చేవారు. దొంగలు ఎత్తుకు పోయిన ఆ శిశువుకు ‘దొంగయ్య’ అని పేరు పెట్టేవారు.
కొందరు ఏడు ఇండ్లల్లో భిక్షమడిగి తెచ్చిన సొమ్ముతో పంచలోహాలతీగను, ఒక ముత్యాన్ని, పగు(గ)డాన్ని కొంటారు. ఆ తీగకు పగడాన్ని, ముత్యాన్ని గుచ్చి విడిచెవుకు, విడిముక్కును కుట్టించి, పెట్టేవారు. కుడిచెవి, ఎడమ ముక్కుడానీ, ఎడమచెవి, కుడిముక్కును గానీ విడిముక్కు, విడిచెవి’ గానీ కుట్టిస్తుంటారు. భిక్షం అడిగి సంపాదించిన సొమ్ముతో విడిముక్కు విడిచెవి కుట్టించిన పిల్లలకు కూడా ‘భిక్షం, భిక్షమయ్య, బిచ్చపమ్మ’ అని పేరు పెట్టేవారు. ఇప్పటికీ ఇలాంటి పేర్లున్నవారు, ఆ తాలూకు చిహ్నాలు ఉన్నవారు మనకు కనిపిస్తుంటారు.
మొగులయ్య, మొగులమ్మ అని పేర్లు రావడానికి అనేక కారణాలున్నాయి. 1) కొంతమందికి ‘మొగుళ్లజబ్బు’ వస్తుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండడంతో, కడుపు ఉబ్బి, శ్వాస తీసుకోవ డం చాల కష్టంగా ఉంటుంది. ఆ జబ్బువచ్చిన తర్వాత బతికిన వారికి కూడా ‘మొగులయ్య, మొగుల మ్మ’ అని పేరు పెట్టేవారు. 2) మరి కొందరు మొగుళ్లు (మబ్బులు) వచ్చిన సమయంలో పిల్లలను ఆరుబయట పండుకోబెట్టి వారికి మొగులయ్య, మొగులమ్మ అని పేరు పెట్టేవారు. 3) వానాకాలంలో బాగా మబ్బులు పట్టి, వాతావరణంలో తేమ శాతం పెరిగినప్పుడు, పసిపిల్లలకు శ్వాసపీల్చుకోవడం చా లా కష్టమవుతుంది. కడుపు ఉబ్బుతుంది. అలాంటి వారికి కడుపు పైన నూనె, పసుపు రుద్ది, జిల్లేడుపా లు గానీ, తమలపాకులు గానీ పెడుతుండేవారు. మంత్రాలు వేయించేవారు. ఈ జబ్బువచ్చి, బతికి బట్ట కట్టిన వారికి కూడా ‘మొగులయ్య, మొగులమ్మ’ అని పేరు పెట్టేవారు.
ఇలా అనేక బాలారిష్టాల నుండి శిశువు బయటపడి, ఎదిగే వరకు చేసే కొన్ని తతంగాలు కూ డా ఉన్నాయి. ఉదా: వెట్టికి పెంచడం.
పిల్లలను అపురూపంగా, ప్రేమగా పెంచడం వల్ల వారు అపురూపమై పోతున్నారని (మరణిస్తు నారని) భావించి, వారిని వెట్టికి పెంచుతారు. గారాబంతో చూడరు. వారి పట్ల తగిన శ్రద్ధ తీసుకోకుం డా, వెట్టికి పెంచినట్లు పెంచేవారు. అలాంటి వారికి చీమిడి కారుతున్నా, ఈగలు వాలుతున్నా, ఆకలై ఏడుస్తున్నా, అంతగా పట్టించుకోరు. సరైన బట్టలు గానీ, అందమైన బట్టలు గానీ వేయరు. కొత్తబట్టలు అసలే వేయరు. మంచిపేరు పెట్టరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిల్లిపాది తమ మనసును, మమ తానురాగాలను చంపుకొని, ఈసడించుకుంటూ పెంచుతారు. వారు వెట్టిగా పెంచిన విధానానికి తగిన ట్టుగానే వారికి ‘ఎ(వె)ట్టయ్య, ఎ(వె)ట్టమ్మ’ అని పేర్లు పెట్టేవారు.
నరదృష్టి (కొందరిది) మంచిది కాదని, వారి దృష్టి ఎక్కడ పడితే అక్కడ, వారి దృష్టిదోషం వల్ల నష్టం జరుగుతుందని జానపదులు నమ్ముతారు. వారి సంతానానికి దృష్టిదోషం తగలకుండా వారి పిల్ల లకు కనుబొమల మధ్యన (ముక్కు,నొసలు కలిసే చోటు) లేదా గదుమ(చుబుకం) మీద పచ్చబొట్టు పొడిపిస్తారు. శరీరం పైన ఎలాంటి మచ్చలు లేనివారిని, అంగవైకల్యం లేనివారిని, అందమైన వారిని పూర్వకాలం పెద్దపెద్ద కట్టడాలకు, నిధులకు, చెరువులకు, కుంటలకు తరచుగా బలిచ్చేవారు. అంగవైక ల్యం ఉన్నా, పచ్చలు, మచ్చలు, ఉన్నా బలులివ్వరు. (అంతా ఒకందుకు మంచిదే అని మనం చిన్నప్పు డు విన్న రాజు, మంత్రి కథ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు). అంతేగాకుండా అందంగా ఉన్న వారిపై మంత్రాలు నేర్చుకున్నవారు మంత్రానికి ‘పాటి’ చూసుకునేవారు (కుంటారు). పాటి అంటే మంత్రం ఫలిస్తుందా? లేదా? అని ప్రాక్టికల్స్ చేసి, చూసుకోవడం. ‘పాటి చూసుకోవడానికి పనికి రాకుండా కూడా ముక్కుపైన అడ్డంగా పచ్చబొట్టు పొడిపించేవారు.
మరికొన్ని పేర్లు ఆయా వ్యక్తుల ఉనికిని, సంఘటనలను తెలియజేస్తాయి. రెక్కాడితేగాని డొక్కా డని జీవులు కూలికోనాలకో, కట్టెకో పిడకకో, చేనుకో, అడవికో వెళ్తారు. ఇలాంటి పని నిండుచూలాలికై పచ్చిబాలెంతకైనా తప్పదు. నిండుచూలాలు పనికివెళ్లి, తిరిగిరావడానికి వెళ్లే పరిస్థితుల్లో ఏ అడవి లోనో ప్రసవించాల్సి వస్తుంది. ఆ విధంగా ఆగంగా ఆగంగా జన్మించినవారికి ఆ సంఘటనకు గుర్తుగా ‘ఆగయ్య, అడవయ్య, ఆగమ్మ అడివమ్మ ‘ అని పేర్లు పెట్టుకుంటారు. పిల్లలు దక్కని వారుకూడా అడ విలో పడుకోబెట్టి, తిరిగి తెచ్చుకొని, అవే పేర్లు పెట్టుకుంటారు.
ఇవేగాకుండా పిచ్చమ్మ, పిచ్చయ్య, బుచ్చమ్మ, బుచ్చయ్య, డొడ్డమ్మ, డొడ్డయ్య, ఉచ్చమ్మ, రొక్క(ల)మ్మ అనే పేర్లు కూడా ఒకనాడు సాధారణం. ఈనాడు ఇవి వింత పేర్లే. కానీ, ఒకనాడు సర్వ సాధారణం.
ప్రభుత్వం కుటుంబనియంత్రణా కార్యక్రమం చేపట్టనపుడు కూడా ప్రజలు దానిని ఆచరించిన ట్లు తెలుస్తుంది. అందుకుగాను వారు ఆపరేషన్లు చేయించుకోలేదు. భావజాలాన్ని ఉపయోగించుకున్నా రు. భగవంతుని మీద భారం వేసి, పిల్లలు ఇక చాలు, పిల్లలు వద్దనుకొని, అందరికన్నా చిన్నవారికి ‘సాలయ్య, సాలమ్మ (చాలు అయ్య, చాలు అమ్మ)’ అనీ పెట్టుకునేవారు. ‘ముద్దుకు మొద్దోడు’ అని పిలి చినట్లు, వింతగా మనకు అనిపించినా అవి ఒకనాటి మానవుల మనస్తత్వాన్ని, వారి ఆలోచనాసరళిని, ప్రకృతితో మానవుడికున్న అనుబంధాన్ని, గతం తాలూకు వాసనలను, అనుభవాలను, వాటిని వదలలే ని మానవుడిని మనకు గోచరింపజేస్తాయి.
ఆ పేర్లను బట్టి ఆ వ్యక్తులు ఏ ప్రాంతం వారో, ఏ మతం వారో తెలుసుకోవడానికి కూడా ఉపయోగ పడ్తాయి. దంపతులకు ‘సంతానం ఇచ్చే దైవం ముఖ్యం గానీ మతం కాదు. ఆ దైవం తమ మతం వాడా, ఇతర మతం వాడా అని ఆలోచించరు. ఈ కారణంగా తెలుగువారి పేర్లలో ముస్లింమతా నికి చెందిన పేర్లు, క్రిస్టియన్ మతానికి చెందిన పేర్లు కనిపిస్తుంటాయి.
దంపతులు దర్గాల వద్దకు వెళ్లి వచ్చింతర్వాత వారికి జన్మించిన సంతానానికి ఆయా దేవుళ్ల పేర్లు పెట్టుకుంటారు. ఉదాహరణకు – జానయ్య, జంగయ్య, జంగమ్మ, సైదయ్య జానపాడ్ సయ్యద్ ను, జహంగీర్, కాశిం మొదలైన పేర్లు అలాంటివే. పిల్లలను గిట్టించుకోవడానికి వింతైన మరో ఆచా రం, మరో ప్రయత్నం – లింగ సహజం కాని పేర్లు పెట్టడం. పేరు చివర ‘అమ్మ’ను చేర్చి మగపిల్లలకు ‘అయ్య’ను చేర్చి ఆడపిల్లలకు పేరు పెడుతుండేవారు. ఉదా: కిష్టమ్మ (మగవాళ్లపేరు, వేములకొండ గ్రామం, నల్లగొండజిల్లా)
పేర్లను బట్టి కూడా కొన్నిసార్లు – వారు ఏ ప్రాంతం వారో తెలుసుకోవడానికి అవకాశం ఉం టుంది. యాదగిరి పేరు వినగానే ఇది తెలంగాణవారి పేరనీ, మునయ్య, మునమ్మ అనగానే రాయల సీమ వాళ్ల పేర్లనీ, పైడితల్లి, పైడయ్య, పైడమ్మ విజయనగరం వారి పేర్లనీ చెప్పవచ్చు. అప్పయ్య, అప్ప లమ్మ. సింహాచలం (శ్రీకాకుళం), మస్తానమ్మ, మస్తానయ్య పేరు వినగనే గుంటూరు ప్రాంతం వారనీ తెలుసుకోవచచ్చు. ఉస్మానియావిశ్వవిద్యాలయం తెలుగుశాఖలో సుదీర్ఘకాలం తన సేవలందించిన కీ.శే. ఆచార్య నాయనికృష్ణకుమారి గారిని ఆమె ఇంటివారు, బంధువులు ‘మస్తానమ్మ’ అనే పిలిచేవారు. మొట్టమొదటి మన హైకోర్టు న్యాయాధిపతి పేరు మస్తానయ్యనే.


తెలుగువారు సాధారణంగా శిశువు జన్మించిన పదకొండవరోజు ‘పురుడు’ చేస్తారు. ఆ రోజు పేరంటాళ్లను పిలిచి, మంతస్రానితో శిశువుకు ‘పేరు’ పెట్టిస్తారు. మగపిల్లలకైతే ఆ రోజు ‘మొలదారం, మొల్దారం’ కూడా కడ్తారు. అకాలమృత్యువు పొందే పిల్లలకు నిర్ణీతదినం(11 వరోజు) కాకుండా ‘దొంగ పురుడు’ లేదా ‘కుక్కపురుడు’ చేస్తారు. అంటే పురుడును ముందే పదకొండ(11)వ రోజు కాగుండా 3, 5, 9రోజుల్లో – ఏదో ఒక రోజు చేస్తారు. బంధువులకు ఎవరికి తెలియకుండా చేసేది దొంగపురుడు. బంధువులను పిలిచి, విందు మొదలైనవి చేయకుండా కుక్కకు అన్నం పెడితే అది ‘కుక్క పురుడు’. కాలక్రమేణ ప్రజలు విద్యావంతులు కావడంతోనూ, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెరగడంతోనూ నమ్మకాలపైన చెప్పుకున్న ఆచారాలు తగ్గినాయి. ఇలాంటి (ఒకనాటి) ఆచారాలు, పేర్లు మరుగునపడిపోతున్నాయి.


ఇటివల కాలంలో 21వరోజు నామకరణ మహోత్సవమని చేస్తున్నారు. కాని నిజానికి అది డోలారోహణ మహోత్సవానికి ఆ రోజు 21వ రోజు శిశువు తల్లిని (బాలెంతను) బావికి తీస్తారు. ఆ రోజు నుండి బాలెంత ఇంటి పని చేసుకోవచ్చు. ఎవరినైనా పెద్దవారిని వరసవాయి, పెద్దా చిన్నా అనే గౌరవం లేకుండా, పేరు పెట్టి పిలిస్తే – ఏమిరా! ‘బొడ్డుగోసి పేరు పెట్టినావురా?’ అని తిడ్తారు. సంతానం కలుగుతున్న కొద్ది, కొందరి కుటుంబాల్లో ఒక్కొక్కరకి రెండు రోజులు చొప్పున తగ్గించుకుంటూ పురుడు, బారసాల చేస్తారు. ఉదా : ‘పాశం’ ఇంటి పేరు కలిగిన గౌండ్లవారు, ముకునూరు గ్రామం, ఇబ్రహీం పట్నం మండలం.
ఇలాంటి ఎన్నో ఆచారాలు, మూఢ విశ్వాసాలు తగ్గుముఖం పట్టినాయి.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

కాలం మారింది

by Dr. Dasoju Padmavati March 17, 2024
written by Dr. Dasoju Padmavati

సాయి,తేజ బడి నుంచి రాగానే నాన్నమ్మ, తాతయ్య దగ్గరకు పరుగు తీశారు.

నాన్నమ్మా–నానమ్మా ! “ఓ మంచి కథ చెప్పవా”! అంటూ బుద్దిగా కూర్చున్నారు.

“అలాగే చెపుతానురా! శ్రద్ధగా వినాలి మరి” అంటూ చెప్పుకొచ్చింది నాన్నమ్మ. ఓ కాకమ్మ కథను.

ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న పసిబిడ్డ లాంటి చల్లని పల్లె ఆ ఊరు.పచ్చదనానికి పెట్టింది పేరు.

ఊరి పొలిమేరలో ఉంది పురాతన కాలం నాటి శివాలయం.

ఆ ఆలయ ప్రాంగణంలో గున్న మామిడి చెట్టు మీద తన పిల్లలతో కాపురం వుంటుంది ఓ కాకమ్మ.

ఆకసమంతా విహరించి తన పిల్లల కోసం ఆహారం సేకరించి తినిపిస్తుంది.

ఓ రోజు ఆ చెట్టు కిందికి వచ్చింది ఓ నక్క.

ఆత్మీయంగా మిత్రున్ని ఆహ్వానించింది తన రెక్కల రెప రెపతో కాకి.

ఇంకేముంది–తన సహజ స్వభావానికి
పదును పెడుతూ– మిత్రమా ! అంటూ ప్రేమగా పిలిచింది. కుశల ప్రశ్నలు అడిగింది నక్క.

నీ మధుర గానంతో నాకు వినుల విందు చేయమని కోరింది.

“నేనా!” అంటూ సంశయం వ్యక్తం చేసింది కాకి.

నీవే! నీవెవ్వరు? కోకిలమ్మ ఇంటి పంటవు.

పుట్టింటి గళ మాధుర్యం ఎక్కడికి పోతుంది అంటూ ప్రశంసల జల్లు కురి పించింది.

నోటిలోని ముక్కను కాళ్ళ మధ్య పెట్టుకొని రాగాన్ని అందుకుంది కాకి.

నీ గాన మాధుర్యానికి నేను మై మరిచిపోయాను.
ఓసారి నాట్యం కూడా చేయవా ! అంటూ మరో ఎత్తుగడకు సిద్ధ మయ్యింది

ఓ అదెంత భాగ్యం! ఆడుతూ పాడుతాను. పాడుతూ ఆడించగలను అంటూ తన కాళ్లలోని మాంసం ముక్కలు చెట్టు కొమ్మల్లో పెట్టి ఆ రసాలసాల వేదికపై తన గాన కచేరి చేసింది.

నీ గానం, అభినయం అద్భుతం మిత్రమా!

మరి!
నేను వస్తాను! అంటూ మరో ప్రణాళికను రచించడానికి దారి వెతుక్కుంటూ ముందుకు సాగింది నక్క.

నీవు ఎందుకు వచ్చావో! నాకు తెలుసు అనుకుంది మదిలో వాయసం.

మిత్రమా! మిత్రమా– కారణం ఏదైనా- నీవు నా ఇంటి ముందుకొచ్చిన ఆత్మీయ అతిథివి.

అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. అంటూ తన పిల్లల కోసం తెచ్చిన ఆహారంలో ఓ నాలుగు ముక్కలు కిందకు వేసింది.

మిత్రమా! మోసం,ద్వేషం అపజయానికి సోపానాలు.

ఇచ్చిపుచ్చుకునే లక్షణమే స్నేహాన్ని కలకాలం నిలుపు తుంది సుమా!

మనలోని అనైక్యత మరొకరికి బలం కారాదు.

ప్రేమకు, విశ్వాసానికి, నిజాయితీకి, మానవులకు మనమే ఆదర్శం.

ఒకరి కష్టానికి ఒకరం ఆసరాగా నిలబడటం జీవితేచ్చను పెంచు తుంది.

మిత్రమా! నీకు నేనున్నాని ఏనాడు మరువకు–

అంటూ రివ్వున ఆకసాన ఎగిరింది వాయసం.

కృతజ్ఞతా పూర్వకంగా వాయసం ఎగిరిన వైపే చూస్తున్నది జంబూకం.

నాన్నమ్మ ! ఈ కథను తాతయ్య మరోలా చెప్పారు తెలుసా!అన్నారు పిల్లలు. అవును! నాన్న
కాలం మారింది.

ఈ కథను మీరు మరోలా చెప్పే ప్రయత్నం చేయండి. చూద్దాం అంది నానమ్మ.

అలాగే? నాన్నమ్మ.

ఈ “కథ మాత్రం చాలా బాగుంది ! అంటూ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు.


March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యము – హాస్యరసము

by Manjula Vani March 17, 2024
written by Manjula Vani

ఒక ప్రబంధమైనా, ఒక పురాణమైనా, ఒక గేయమైనా, ఏ రచనలోనైనా, అందులో రవ్వంత హాస్యరసము మిళితమై ఉన్నాగాని పఠితులు ఆ కావ్యరసానందాన్ని పొందలేరు.

మనిషి జీవితంలోని విషాదాలను, కష్టాలను మరిచిపోవాలంటే మనసారా నవ్వుకుంటే గాని వాటిని కొద్దిసేపైనా మరచిపోయి తన జీవనయాత్రను కొనసాగించగలడు. ”సంతోషమే సగం బలం” అన్న సామెత ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

శృంగార హాస్య కరుణా రౌద్ర వీర భయానకారి

భీభత్సాద్భుత శాంతాశ్చ రసారి పూర్వైరుదాహృతః

అని మన లాక్షణికులు మొదలు శృంగారానికి ఆ తర్వాత హాస్యానికే ప్రాధాన్యతనిచ్చారు.

శృంగారము కేవలము యౌవనుల మనములను మాత్రమే రంజింపజేయును. కానీ హాస్యము  సర్వవేళ సర్వావస్థలయందు ఆబాలగోపాలము నానందింపచేయును.

హాస్యము అనగా నవ్వు పుట్టించే సంఘటన, మాటలు, చేష్టలు, ఆకారాదులు.

”వికృతి దర్శనాది జన్యో మనోవికారః హాసః” స్వభావ విరుద్ధములగు వేషభూషాదుల వల్ల కూడా హాస్యము లేక నవ్వు గల్గును.

హాస్యరసమునకు స్థాయీభావము హాసము. ఇది 6 విధములుగా విభజింపబడింది.

1) స్మితము

2) హసితము

3) విహసితము

4) అవహసితము

5) అపహసితము

6) అతి హసితము

1. స్మితము : కొద్దిగా చెక్కిళ్ళు వికసింపజేసి, కనుబొమ్మలు కదిలించుచు, పండ్లు కనిపించకుండా మధురముగా నవ్వుట.

2. హసితము : ఎక్కువగా ముఖము, కన్నులు, చెక్కిళ్ళు వికసింపజేసి కొద్దిగా పండ్లు కనిపించునట్లు నవ్వుట.

3. విహసితము : లోలోపలనే మధురస్వరము కలుగగా, ముఖముపై రాగము జూపుచు, నోరగంట తిలకించుచు మంద్రముగా నవ్వుట.

4. అవహసితము : భుజాలు, తల అదులునట్లు ఓరచూపుతో ముక్కుపుటాలు లెస్సగా వికసింపజేసి నవ్వుట.

5. అపహసితము : తగిన కారణం లేకుండా కన్నీరు కారుస్తూ, భుజాలు, వెంట్రుకలు అదురునట్లు నవ్వుట.

6. అతిహసితము : కన్నులనుండి నీరు కారునట్లు చేతులు, కడుపు, పార్శ్వములదురునట్లు, కఠోరధ్వనితో కర్ణకటువుగా నవ్వుట.

ఇట్లు ఇన్ని రకాల నవ్వులు మన లాక్షణికులు నిర్వచించారు. మరియు ఇందులో

ఉత్తములు – స్మిత హసితులు గా,

మధ్యములు – అవహసిత, విహసితులుగా

అథములు – అపహసితాతి హసితులుగాను పేర్కొనబడ్డారు.

ఈ హాస్యము పుట్టుటకు నిర్ణీతమైన కాలముకాని, వస్తువుకాని, దేశముకాని, పదజాలముకాని లేదు. మానవుని చిత్తవృత్తిపై, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. కొందరు ఎంత నవ్వించినను నవ్వరు. నవ్వేవారిని చూసి సహించరు. అందరినీ నవ్వించి, తాను నవ్వుతూ బాధలను మరిపింప చేసేవారు చాలా తక్కువ. ఇది దైవదత్తమగు ప్రతిభ.

”నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడూ

నవ్వుతూ చావాలిరా” అన్న పాట ఇందుకు నిదర్శనం.

వెఱ్ఱి వెంగళాయిలు, బొజ్జ బాపలు, గుజ్జు మనుషులు, నత్తి చెవిటి కుంటి గుడ్డి మొదలగు అంకవైకల్యపు వారి చేతలు, ముదుసలి మొగడు పడుచు పెండ్లాము జంట, బావామరుదుల సంభాషణ, వదినె మరదళ్ళ విసుర్లు, ఛాందసుల ప్రవర్తన, బుడ్డరుఖాను, బఫూను, పిసినారి మొదలగువారి చేష్టా విశేషాలు నవ్వు కల్గించును.

కాని ప్రకృతి వల్ల వచ్చిన స్థితిని చూసి నవ్వరాదు.

సామాన్యముగా నవ్వు ఆకస్మిక సంభవాలకు, పరధ్యానంగా ఉండేవారికి, వంకరటింకర మాటలకు, తిట్లకు, కొత్తపాత ఫ్యాషన్లకి, అలంకారాలు విపరీతమైన, పిరికితనానికి, భయానికి, వ్యర్థ కోపానికి, మిశ్రమ భాషా చేష్టాదులకు కల్గుతుంది.

తప్పర్థాలు, విశేషార్థాలు, అపార్థాలు, వికృతార్థాల వల్ల నవ్వు కల్గును.

ఖ.జు. డిగ్రీని మేకప్‌ ఆర్టిస్టు అనీ, ఔ.ఐబీ. డిగ్రీని బాటా షూ కంపెనీ అనీ, షికారును ఐనీలి ష ్పుబిజీ అనీ, మనిషిని ఖళిదీలిగి ష ఐనీలి అనీ అంటే నవ్వనివారికి కూడా నవ్వు వస్తుంది.

మాటలు మాట్లాడుటలో కూడా కొందరికి నవ్వు కల్గించును. మాలతి అనే అమ్మాయి వద్దకు వెళ్ళి మీరు మాలా? అనుటకు బదులుగా మీరు…. (అని కొంచెం ఆగి).. మాలా? అంటే అపార్థము కల్గి నవ్వు వచ్చును.

అదీగాక ఒకడు కాలుజారి పడ్డాడని నవ్వితే ఎంతో బాధ కల్గుతుంది. అన్ని సందర్భాలలో నవ్వు అంత మంచిది కాదు.

‘నవ్వంగ రాదు పలుమరు

నవ్విన చిఱునవ్వెగాని నగరాదెపుడున్‌’ అన్నట్లు, ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా నవ్వితే అంత మంచిది కాదు. అనేకులు అనేక అర్థాలు తీసుకుంటారు.

నవ్వకు మీ సభలోపల

నవ్వకు మీ తల్లిదండ్రుల నాథుల తోడన్‌

నవ్వకు మీ పరసతితో

నవ్వకు మీ యొరుల మనసు నొవ్వగ సుమతీ !

అని సుమతీ శతకకారుడు బద్దెన కూడా అన్నాడు.

పెళ్ళిళ్లలో వియ్యాలవారి విందులు, వేళాకోళాలు నవ్వు పుట్టిస్తాయి.

బూతాడక నవ్వు పుట్టదన్నాడు గువ్వల చెన్నడు. కానీ బూతు ఉత్తమ హాస్యము కాదు.

నేటి మన సినిమాలల్లో వచ్చే హాస్యము వల్ల నవ్వుగాదు కానీ వెగటు కల్గిస్తుంది.

ఇద్దరాడవాళ్ళ సంభాషణలో ఒకావిడ ”మావారు కలెక్టరు” అంటే మరొకావిడ ”మావారూ బిల్‌ కలెక్టరు” అంటుంది .ఇది విన్నవారికెంతో నవ్వు వస్తుంది.

”నా భర్త డాక్టరు” అని ఒకావిడంటే, ”నా భర్త కండక్టరు” అని మరొక ఆవిడ అంటే నవ్వు రాక మానదు.

అసభ్యంగా వ్యక్తుల స్థాయిని గమనించక, దేశకాల పాత్రముల నెంచక, సంగతి సందర్భములు లెక్కించక, మోతాదు మించిక, శ్రుతి తప్పక, స్థాయి చెడక, మర్యాద విడవక, ఔచిత్యంగా, స్వారస్యంగా,  సవ్యంగా, నవ్యంగా, భవ్యంగా జనింపచేసే నవ్వే నవ్వు. తేలికగా సమయస్ఫూర్తిగా నవ్వింపజేసేదే నవ్వు.

మన తెలుగు సాహిత్యంలో చిలకమర్తివారి ప్రహసనములు, గణపతి, మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం, అడవి బాపిరాజు గారి కొంటె కోణంగి, గురజాడవారి కన్యాశుల్కం, పానుగంటి వారి సాక్షి, మునిమాణిక్యం వారి కాంతం కథలు, విశ్వనాథ వారి ‘హాహాహూహూ” శ్రీశ్రీ వారి వారం-వారం మొదలగునవి ఉత్తమ హాస్యరచనలుగా పేర్కొనబడ్డాయి.

అంతేగాక వైద్యపరంగా కూడా మానవునికి హాస్యము ఒక టానిక్‌ లాంటిది. నవ్వు శ్వాసకోశాన్ని క్షాళనం చేయటము, శిరస్సుకు రక్తాన్ని తోడటము, మానసికశ్రమకు ఆటవిడుపుగా ఉండటం మొదలైనవి కల్గిస్తుంది.

ప్రస్తుతం వచ్చే దిన, వార, పక్ష, మాస పత్రికల్లో నవ్వు పుట్టించే జోకులు, కార్టూనులు తప్పక ఉంటాయి. కొన్ని హాస్యపత్రికలు కూడా వెలువడుతున్నాయి.

ప్రాచీన కవులలో కూడా హాస్యరసం పండించినవారు ఉన్నారు.

ఆదికవి నన్నయ ఆంధ్రమహాభారతంలో అర్జునుడు ద్రుపదుని పట్టితేగా ”వీరెవ్వరయ్య ద్రుపద మహారాజులె ! అని ద్రోణాచార్యులచే మేలమాడించుట ఉత్తమ హాస్యానికి మచ్చుతునక.

అలాగే తిక్కన ఉత్తరుని ప్రగల్భములు, బృహన్నల హావభావ చేష్టలలో హాస్యరసమును గుప్పించాడు.

పోతన కూడా భక్తి శృంగారములతో పాటు యశోదమ్మతో, గొల్లపడుచులు ఫిర్యాదు చేయుట, చిలిపి చిన్ని కృష్ణుని అల్లరి చేష్టలలో హాస్యరసమును మేళవించాడు.

ఇక శృంగార కవియైన శ్రీనాథుడు తన చాటుపద్యాలలో ”జొన్నకలి జొన్న అంబలి” అంటూ, రాయలసీమలో నీటి కరువేర్పడినపుడు

‘సిరిగలవానికి చెల్లును

తరుణుల పదియారువేలదగ పెండ్లాడన్‌

తిరిపెమున కిద్దరాండ్రా

పరమేశా! గంగ విడువు పార్వతి చాలున్‌” అంటూ హాస్యపూరితములగు పద్యములను నుడివారు.

ఇక అష్టదిగ్గజముల వరకు పోతే తెనాలి రామకృష్ణుల వారి చేష్టలు, రాయల ఆస్థానమునకు విచ్చేసిన భట్రాజులను, పండితులను ఓడించుటలో హాస్యము కన్పించును. ఇతనికి ‘వికటకవి’ అని బిరుదుకూడా ఉన్నది. అతనికి హాస్యచమత్కృతికి మచ్చుతునకలు కొన్ని.

ఒకనాడు పింగళి సూరనగారు సభలో అష్టదిగ్గజములతో కొలువుతీరి ఉండగా ”తెనాలి రామలింగడు తిన్నాడు తట్టెడంత” అని అంటుండగానే వెంటనే సూరనగారిని పూర్తి చేయనివ్వకుండా రామకృష్ణుడు లేచి ”బెల్లం బెన్నగ మన పింగళి సూరన్నకు నోరంత పేడయై పోయెనుగా” అని చమత్కరించగా అందరూ నవ్వారు.

ఒకరోజు ఒక భట్రాజును ఓడించాలని

”మేకతోకకు మేకతోక మేకకుతోక

మేకతోకా మేక తోక మేక” అని మేకల మందను వర్ణింపగా అతడు అందులోని అర్థమును గ్రహించక ఓడిపోయి వెళ్ళాడు. ఇలా చెప్తూపోతే ఎన్నో సంఘటనలు ఉన్నాయి.

అలా తన హాస్య చమత్కృతితో వచ్చిన ఉద్ధండ పండితులనందర్నీ ఓడించి పరాభవం గావించాడు.

ఈ విధంగా హాస్యము మనస్సుకు హాయిని కల్పించేదిగా ఉండాలి గాని, అది అపహాస్యమును కల్పించునదిగా ఉండరాదు.

”అన్నమయితే నేమిరా? మరి సున్నమయితే నేమిరా?” అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేతామురా! అంటే ఎంతో నవ్వురాక మానదు.

అట్లే సంభాషణలో చమత్కృతి కలిగినా నవ్వురాక మానదు. ఒకరిని అవమానపరుచబోయి, తానే నవ్వుల పాలవుట ఇందులోని అర్థం.

ఒక రెడ్డిగారు ఒక కవితో ”ఓహో! మీరు కపీశ్వరులా?” అని హేళన చేయగా, ఆతడు ”వే” పట్టినట్లు నీ నోట ”వీ” పట్టదేమి” అనగా ఆరెడ్డి అవనత వదనుడయ్యాడు. ఇట్లే ఒకరిని అనబోయి తానే తిరిగి అదే మాటను పొందుట వినేవారికి నవ్వు వచ్చును.

అలాగే మిశ్రమ భాషలో మాట్లాడినా, ఆంగ్లము-తెలుగు, సంస్కృతం-తెలుగు ఇలా మిళిత భాష విన్నా హాస్యం కలుగుతుంది.

‘ప్రథమం ఆవులించంత

ద్వితీయం కాళ్ళు చాపటం

తృతీయం త్రుళ్ళిపడటం

చతుర్థం లేచిపోవటం”

అన్న ఎవరికైనా నవ్వు వస్తుంది.

ది స్కై యీజ్‌ మబ్బీ

ది రోడ్‌ యీజ్‌ దుమ్మీ

ది మనీ యీజ్‌ కమ్మీ

ది ఫూల్‌ యీజ్‌ బ్యూటీ

అని వచ్చీరాని ఆంగ్లం తెలుగు మిళితం చేసి మాట్లాడినా హాస్యం కలుగక మానదు.

ఉచ్ఛారణా దోషం వల్లను, ఒక మాటకు రెండర్థాలున్నను నవ్వు వస్తుంది.

”కాఫీ తేరా” అంటే నోటుబుక్‌ (కాఫీ) తెచ్చిన నవ్వు వస్తుంది.

కావ్యానికి ప్రతిభ ఎంత అవసరమో, హాస్యసృష్టికి అంతే ప్రతిభ అవసరం.

నవ్వు జీవిత వికాసానికి ఊతకఱ్ఱ వంటిది. మనసారా నవ్వలేని వానికి ఆనందం కించిత్తైనా ఉండదు. జీవితం నిస్సారంగా ఉంటుంది. దుర్భరమవుతుంది. లేనిపోని అంతఃరోగములు వచ్చును. మంచిగా నవ్వు నేర్చినవారు, దుర్భరదురిత దుఃఖములను కూడా ఆనందమయములుగా చేసుకొంటారు. సంస్కృత తెలుగు మిళితమైన ఈ పద్యభావం

కక్షుధాతురాణాం న ఉడికిర్న ఉడకః

అర్ధాతురాణాం న చెల్లిర్న చెల్లః

నిద్రాతురాణాం న మెట్టర్న పల్లః

కామాతురాణాం న ముసలిర్న పిల్లః

అన్నచో నవ్వు పుట్టక మానదు.

మానవులెంత నవ్వగలిగితే అంత శరీరారోగ్యము కలుగుతుంది. నవరసాల్లో హాస్యరసము మాత్రమే మానవునికి ఆనందదాయకమును కల్గుజేయుననుటలో సందేహము లేదు. కడుపార తాను నవ్వి ఇతరులను నవ్వులలో ముంచెత్తేవాడే రసహృదయం కలవాడు.

విషాదంలోంచే హాస్యము జనించిందనే వింతవాదం కలదు. మానవునికెంత కష్టం వచ్చినా నవ్వుతూ బ్రతకడమనేది ఒక గొప్పవరం, కళ. అది సామాన్యంగా అందరికీ అలవడదు. అందరూ ఏడుస్తూ కూర్చుంటే, నవ్వించే వాడొకడుంటే, అందరూ తమ తమ బాధల్ని విస్మరించి, జీవితాన్ని ఆనందమయం చేసుకోగల్గుతారు.

అందువల్లే పూర్వం రాజుగారి కొలువుల్లో విదూషకులుండేవారు. శ్రీకృష్ణదేవరాయల వారి తెనాలి రామకృష్నుడు, అక్బర్‌ పాదుషా వద్ద బీర్బల్‌ అందుకు దాహృతులు. నాటి కాళిదాస, భాస, భారవి లాంటి మహాకవుల కావ్యాలలో విదూషకుని పాత్ర తప్పక ఉండేది.

”అతి సర్వత్ర వర్జయేత్‌” అన్నట్లు అతిగా నవ్వినా ప్రమాదమే.

ఎంత అందంగా ఉన్నా ముఖంలో రవ్వంత చిరునవ్వు కన్పించకపోతే వారితో ఎవ్వరూ స్నేహం చేయలేదు. మనుషులు ఒకరికొకరు పరిచయం కానపుడు, మొదట ‘నవ్వే’ వారిని పలుకరించి స్నేహాన్ని కలుపుతుంది. ఒక చిరునవ్వే వేయివరహాలంత విలువ చేస్తుంది.

మనస్సలను రాగరంజితము చేసే హాస్యరసము ప్రతి గ్రంథరచనలో ఉండటానికి ప్రోత్సహించాలి. హాస్యరచన పోటీలు పెట్టి ఉత్తమ హాస్యమును ప్రచారం చేయాలి.

విషాదాంతమైన కొందరి మానవ జీవితాల్లో వెలుగులు నింపే హాస్యరచనలు ఎక్కువగా రావాలి. అందరి హృదయాలు ఆనందమయం కావాలి.

అరాచకత్వం, అన్యాయం, అశ్లీలం, అధికారత్వం చెలరేగుతున్న ఈ రోజుల్లో ఆధునిక యువ కవులు ముందుకువచ్చి, ప్రజలలోని అవినీతి, కుళ్ళు, కుతంత్రం పారద్రోలి జాతీయ సమైక్యతను నెలకొల్పేటటువంటి సున్నితమైన హాస్యరచనలు చేసి మానవ ప్రజావళిలో మార్పులను, చైతన్యాన్ని తీసుకొని రావాలి.

శ్రీశ్రీ గారు వ్రాసిన ”మహాప్రస్థానం”లా హాస్యభరితమైన అందరికీ అర్థమై, అలరించే విధంగా హాస్యరచనలు పెక్కులు, మిక్కిలిగా రాసి, జనంలో చైతన్యాన్ని తీసుకొని రావాలి. ప్రాచీన కాలంలో మన పూర్వ కవులు వ్రాసిన ఉత్తమ హాస్యరచనలకై కృషిని చేయాలి.

అన్ని రసాల్లో కన్న

హాస్య రసమే మిన్న

అది లేని జీవితం ఓరన్నా !

నిస్సారమేరా ఓ కన్నా !

                                                                          

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆధునిక తెలుగు కథానిక – పర్యావరణ స్పృహ

by Dr. Y. Subhashini March 17, 2024
written by Dr. Y. Subhashini

ఆధునిక ప్రపంచంలో అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లుగానే పర్యావరణంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రపంచంయాంత్రికయుగంగా ఎప్పుడైతే మారిందో అప్పుడేపర్యావరణమూ కలుషితంకావడం ప్రారంభమైంది. ఈ సృష్టిలోని ప్రాణులన్నింటిలో బుద్ధిజీవి మానవుడు. కానీ బుద్ధిగలిగిన మనిషే నేడు మితిమీరిన స్వార్థంతో ప్రకృతి, సృష్టిలోని సమతౌల్యందెబ్బతినడానికి కారణమవుతున్నాడు. ప్రకృతిశక్తులను విచక్షణారహితంగా వాడుతూ పర్యావరణకాలుష్యానికి దోహదపడుతున్నాడు. అందువల్ల నేటి సామాజికసమస్యలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం.

ఈ సమస్యను గుర్తించిన ఎందరో తెలుగు రచయితలు తమ రచనలద్వారా పర్యావరణ స్పృహను తీసుకొస్తున్నారు. నేడు సాహిత్యంలో అత్యంత విలువైన వస్తువు పర్యావరణం కావడంవల్ల తమ రచనలద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రబోధిస్తున్నారు. ప్రజలను జాగృతం చేస్తున్నారు. కర్తవ్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో మైనంపాటి భాస్కర్, పెద్దింటి అశోక్ కుమార్, పాపినేని శివశంకర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, మధురాంతకం మహేంద్ర, సలీం, కస్తూరి మురళీకృష్ణ, చిత్తర్వు మధు,సడ్లపల్లి చిదంబరం, గన్నవరపు నరసింహమూర్తి, గుజ్జారి రామచంద్రరావు,కె. వరలక్ష్మి,ఒమ్మి రమేష్, కాలువ మల్లయ్య, బెలగాం భీమేశ్వరరావు, అప్పిరెడ్డి హరినాథరెడ్డి వంటి ఎందరో కథా రచయితలు పర్యావరణ చేతనపై రచనలు చేస్తున్నారు. వారు రాసిన కొన్ని కథలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.
1. భూ కాలుష్యం : పర్యావరణంలో జరుగుతున్న కాలుష్యాల్లో భూకాలుష్యం ప్రధానమైంది.మనుషులు తమ స్వార్థంకోసం పెరుగుతున్న పారిశ్రామికీకరణతో ఎన్నోరకాల కల్తీ ఎరువులు విత్తనాలు మందులు తయారుచేసి వాటిని ఉపయోగించడం ద్వారా భూమి కలుషితమవుతూ ఉంది. భూమి మాత్రమే కలుషితంకాకుండా పండించిన పంటలు మొత్తం రసాయనాలతో నిండిపోతున్నాయి. వాటినితినడంవల్లఎన్నో వ్యాధులకు మనిషి దేహం కేంద్రం అవుతూ ఉంది. ఈస్థితిపట్ల రచయితలు గాఢంగా స్పందించారు.

విదేశీపంటలను ఆహ్వానించి వాటిద్వారా మననేల, నీరు, గాలివంటివాటన్నింటినీ కలుషితం చేసుకుంటూ మనపైన మనకే హక్కులేని పరిస్థితిని మన ప్రభుత్వం కలిగించింది. ఈ నేపథ్యంతో పెద్దింటి అశోక్ కుమార్ “కీలుబొమ్మలు” అనే కథను రాశారు. ఆంధ్రప్రదేశ్లోని సిరిసిల్ల ప్రాంతం సర్వాయి పల్లెలో గులాబీ పూలసాగును చేపట్టి వాటికి రసాయనిక మందులు స్ప్రే చేయడంవల్ల ప్రజలు ఉక్రిబిక్కిరి అయిన తీరుని చెప్తూరాసినకథ. మరోవైపు ఆహార భద్రతపై, దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేయడంతో విదేశీ మార్కెట్లు విచ్చలవిడిగా దేశంలోకి వచ్చాయి. ధాన్యంరేటు పడిపోయి ప్రభుత్వం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రారంభించడం, వాణిజ్య పంటలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగా కౌలుదారు చట్టాన్ని ప్రభుత్వం మార్చడంవల్ల రైతులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం జెనిటికల్ ఫుడ్స్ ప్రాజెక్టుకు అనుమతిస్తే, దానికి పెద్ద ఎత్తులో రసాయనాలు వాడాల్సి ఉంటుందని అదే జరిగితే వాటిని తిని ఎన్నో సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుందంటాడు కథలో జర్నలిస్ట్. విదేశీ కంపెనీలు ఆర్థిక, జన్యుపరమైన పంటలను మనదేశంలో ప్రవేశపెట్టడం, ఆ పంటలకు విపరీతంగా రసాయనాలను ఉపయోగించడంవల్ల మనభూమి నీరు గాలి అన్నీ కలుషితమైనాయి. దానితో ఎన్నో జబ్బులకు ఆలవాలమై మనిషి మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని రచయిత ఆవేదనతోఆవిష్కరించినకథ.
రసాయనిక ఎరువులు, మందులవల్ల ఒక రకమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, పాలిథిన్ వాడకంవల్ల మరోరకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పాలిథిన్ వాడకంపై ఉండే మోజును వాటి వల్ల జరిగే నష్టాన్ని తెలియజేస్తూ డా. కాలువ మల్లయ్య “గ్లోబలైజేషన్” అనే కథను రాశారు. గ్లోబలైజేషన్ ద్వారా సమాజంలోచాలామార్పులువచ్చాయి. ఆమార్పులవల్ల స్నేహితుడి పెళ్లిలో వాడిన పాలిథిన్ కవర్లు, గ్లాసులు, విస్తర్లు, కాగితాలు వంటి చెత్తాచెదారాన్ని ఆవు తినడం చూసిన అర్జున్ అదిలించడం, ఇవి తినడం వల్ల పశువులు మరణిస్తున్నాయనే ఆవేదన చెందటం, ఇది చూసిన స్నేహితుడు తింటే ఏమవుతుందని ప్రశ్నించడం, దానికి కడుపులోకి వెళ్ళిన ప్లాస్టిక్ తిరిగి బయటకురాదని దీనితో అటు పశువులకు ఇటు భూమికి కాలుష్యం పెరిగిపోతుందని వాపోవడంకథ.మారుతున్న నాగరికత వలన మనం ఆరోగ్యాన్నిచ్చే అరటి ఆకులకు బదులు ప్లాస్టిక్ ఆకులు, ప్లేట్లు, గ్లాసులు వాడడంవల్ల ఇటుమనిషి అటు పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. పెరుగుతున్న అవసరాలకు ఇవి సులభంగా లభిస్తున్నాయి కానీ వాటివల్ల జరిగే కాలుష్యాన్ని మనం గుర్తించడంలేదు. ఒకవేళ గుర్తించినా నాగరికతా వలయంలో చిక్కుకుంటున్నాడనే ఆవేదన రచయితది.
రసాయనికఎరువులు పాలిథిన్ వాడకం ఒక ఎత్తు అయితే, ప్రకృతిలో అత్యంత ప్రాధాన్యం వహించిన వృక్షాన్ని సంరక్షించకపోవడం భూకాలుష్యానికి మరో ప్రధానకారణం. అందుకే‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న ఆర్యోక్తిని శిరసావహించిన సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “ఆకుపచ్చని మాయ”, కస్తూరి మురళీకృష్ణ “మనిషి – మామిడి చెట్టు”అనేకథలను రాశారు. ప్రపంచీకరణ ఫలితంగా మనిషి డబ్బు మాయలోపడ్డాడు. దానితో ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఎక్కువైంది.అయితే పిల్లలకి ఫీజులు కట్టలేక చెట్లని అమ్మాలనుకున్నాడు కొడుకు. దానికి తండ్రి రామయ్య ఒప్పుకోలేదని తన ప్రాణమే తీయాలనుకున్నాడు. తాతలకాలంనాటి వ్యవసాయ పద్ధతులు నలుగురికి తిండినీ నీడనూ ఇచ్చేవి. కానీ నేడు ఆ పాత పద్ధతులు పనికిరావని పొలాల్లోకి వచ్చే ఉడుతల్ని ఎలుకల్ని చంపాల్సిందేనని అప్పుడే పంటను రక్షించుకోగలమని అంటాడు మరోవైపు కంపెనీ నుంచి వచ్చిన వ్యక్తి.“మీరేం మనుషులయ్యా? ఉడత ఎలక పిట్ట గొడ్డూగోదా చీమా దోమా తినకుండా పండించినవన్నీ నీవే తిందాం అనుకున్నావా”? అని మనిషిలో పెరిగిన స్వార్థాన్ని ప్రశ్నించాడు రామయ్య. ఊళ్లో ఇల్లు, పొలంలో చెట్టు మనిషికి నీడ అన్న విషయాన్ని గుర్తించక ఆ చెట్టునే నరికి సొమ్ము చేసుకోవడం పాపమని భూమి నాశనమవుతుందనేహితబోధ చేశాడు రచయిత.
కస్తూరి మురళీకృష్ణ రాసిన “మనిషి – మామిడిచెట్టు” అనే కథలో మనిషికీ చెట్టుకూ ఉన్న చక్కని అనుబంధాన్ని చెట్టునుండి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను బోధించారు. ఒక విత్తనం భూమిలో వేస్తే అది మహావృక్షమై ఎందరికో ఆలవాలమవ్వటమే కాకుండా తరతరాలకు నీడను పళ్ళను అందిస్తూ…ఆచెట్టుపై ఆధారపడి ఒక జీవవలయమే ఉంటుందని తెలియజేసిన కథ. మనిషి ఎంత ఎత్తు ఎదిగినా ఎంతదూరం పోయినా అతని వ్రేళ్ళు భూమిపై స్థిరంగా ఉండాలని చెప్పిన కథ ఇది. కనుక భూమి మనిషికి శక్తి. అలాకానిపక్షంలో గాలి ఎటు వీస్తే అటుకొట్టుకుపోతాడు. ప్రకృతితో కలిసి జీవిస్తే ఎంతో విజ్ఞానం నేర్పిస్తుందనే జీవితసత్యాన్ని వెల్లడి చేసిన కథ. చెట్లవల్ల భూకాలుష్యం జరగకుండా ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో క్రమంగా వివరిస్తూనే అటువంటి చెట్లను నరికి దానవుడు కావద్దని హెచ్చరించాడు కవి. జ్ఞానాన్ని ప్రసాదించే దైవంగా చెట్లను అభివర్ణించారు. ఆదిమానవుడి స్థితి నుండి ఆధునిక మానవుడి స్థాయిదాకా మానవ ప్రస్థానంలో ప్రతి దశలోనూ చెట్టు మనిషికి అండగా నిలిచి ముందుకు నడిపించిందనే స్పృహనందించారు.


జల కాలుష్యం :పెరుగుతున్న జనాభావల్ల పారిశుద్ధ్యంలోపించి నీరు కలుషితమవుతూ నీటి కొరతకు కారణమవుతూ ఉంది. నీటివనరులైన చెరువులు, నదులు, సముద్రాలు వంటివి పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతూ ఉన్నాయి.దానితో ఎన్నో సముద్రజీవులు కోల్పోతూ ఉన్నాం. నీటిలో ఫ్లోరిన్ మోతాదు పెరిగి తాగునీటి కొరత ఏర్పడుతూ ఉంది. నీటికాలుష్యంవల్ల నీటి వ్యాపారం బాగా పెరిగిపోయింది. ఈ స్థితికి చలించిన సాహితీస్రష్టలు ఎన్నో కథలను రాశారు. అందులో ఒకటి ఒమ్మి రమేష్ బాబు రాసినకథ‘మురికి’. నగరాలలో పారిశుద్ధ్యం లోపంవల్ల ప్రజలు పడే ఇబ్బందులను గూర్చి రాసిన కథ. రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ లోపల ఒక హోటల్. పక్కనే నాలుగు కాకా హోటళ్ళు. ఈ హోటల్ లో నుండి పారబోసే వ్యర్థాలవల్ల అక్కడ ఉన్న స్థలం అసహ్యంగా అపరిశుభ్రతతో ఉంది. కాలువల్లో మురికితో నిండిన నీళ్లు. ఆ నీటిలో పొర్లుతున్న పందులు, కుక్కలు.హోటల్స్ నుండి వచ్చి చేరే మురికినీళ్లు. ఇంకోవైపు వ్యర్థ పదార్థాలతో కూడిన పారిశుద్ధ్యలోపంతో పాటు బండి రాముడు హోటల్ వల్ల ఏర్పడిన పెంటకుప్ప. మరోవైపు ఆ హోటల్లో మంచినీళ్ల బానకి పేరుకున్న నాచు. ఇది అక్కడి మంచినీటి పరిస్థితి. జనసంచారం ఉన్న ఇలాంటి చోట్ల అపరిశుభ్రతతో పాటు కాకాహోటల్స్ వల్ల మరింత పారిశుద్ధ్యంలోపం పెరుగుతూ ఉన్న స్థితిని రచయిత కళ్ళకు కట్టించారు. అక్కడి ప్రజల జీవనం ఎంత దుర్భరంగా ఉందో వ్యక్తీకరించారు.

వాయు కాలుష్యం : నేడు నవనాగరిక మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలలో వాయు కాలుష్యం మరొకటి. వాయుకాలుష్యంతో అనేకరకాలైన శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో పరిశ్రమలు వాహనాలు ఎక్కువైపోయి, ఇవి వదిలే విషవాయువులతో వాయుకాలుష్యం పెరుగుతూ ఉంది.ప్రాణవాయువులను ప్రసాదించే చెట్లను నరికేయటం వల్ల జరుగుతున్న పరిణామమిది. మరోవైపు పారిశుద్ధ్యలోపంతో వాయువు కలుషితమవుతూ ఉంది. దీనితోనూ అనేకరకాల వ్యాధులకు మనిషి గురవుతున్నాడు. ఈ విషయాలను గూర్చి సాహితీవేత్తలు తమ సాహిత్యం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పరిశ్రమలద్వారా జరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఆ ధూళితో అక్కడ పనిచేసేవారు అనారోగ్యానికి గురయ్యే తీరును చెబుతూ కె. వరలక్ష్మి “అతడు – నేను” కథను రాశారు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి 15 ఏళ్ల కుర్రాడు గ్రానైట్ మిల్లులో చేరడం, దాని ద్వారా వచ్చే పౌడర్ వల్ల దుమ్ము ధూళితో వారి శరీరాలు నిండిపోవడం, దీనితో ఆకుర్రాడికి టీబీ రావడం, ఎన్ని మందులు వాడినా అదే ధూళిని పీల్చడం వల్ల నీరసించి పోవడం, ఆతర్వాత పనిలోకి రాకుండా నిలిచిపోవడం, దీనితో ఆ కుటుంబం ఏమైందోననే ఆవేదనతో రచయిత్రి రాసిన కథ ఇది. గ్రానైట్ మిల్లులో పనిచేసే వారి జీవితాలు ఎంత అర్ధాంతరంగా ముగిసిపోతాయోననేది చూసినప్పుడు హృదయం ద్రవించిపోతుంది.

కాలుష్యం వల్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిన తీరును కె. వరలక్ష్మి చిత్రీకరిస్తే, చెట్లను నాటి వాయుకాలుష్యాన్ని దూరం చేసుకోవచ్చు అంటూ సడ్లపల్లి చిదంబర రెడ్డి “ఉగాది” కథను రాశారు. ఉగాది పండుగకోసం మామిడి ఆకులను బస్తాలకు బస్తాలు బస్తీలకు కోసుకుపోతూ చెట్లను విరిచేస్తున్న మనుషులకు హితబోధ చేయడమే కథ. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఇంటిముందు రెండు మామిడి మొక్కలు నాటితే నిత్యం పచ్చతోరణాలై ఇళ్లకు శోభనీ శుభాన్నీ అందిస్తాయనే స్పృహను అందించారు రచయిత.ఇదేవిషయాన్ని సుందర్ లాల్ బహుగుణ “ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ” (నాశనంకాని జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అని అంటారు. కనుక మనంకూడా రెండు రోజుల్లో వాడిపోయే మామిడిఆకులను తోరణాలుగా కట్టడం కాకుండా ఇంటిముందు మామిడి మొక్కనే నాటితే శాశ్వతంగా పచ్చదనాన్ని పొందవచ్చునంటారు రచయిత.


ధ్వనికాలుష్యం : వాహనాల వలన వాయుకాలుష్యంతో పాటు ధ్వనికాలుష్యం కూడా పెరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. దీనినే సాహితీస్రష్టలు కథల ద్వారా ప్రజలకు కనువిప్పు కలుగజేస్తున్నారు. వాహనాలు ఎడతెరిపి లేకుండా ప్రయాణించడం వల్ల వాటిద్వారా వచ్చే దుమ్ముతో శబ్దాలతో ప్రజలు పడే కష్టాలను తెలియజేస్తూ సలీం “రూపాయి చెట్టు” కథను రాశారు. వాహనాలు ఎక్కువగా ప్రయాణించే హైవేలలో రమేష్ లాంటివాళ్లు ఎస్టీడి బూత్ పెట్టుకొని చాలీచాలని డబ్బులతో ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వాహనాల ద్వారా వెలువడే వాయువులతో మానసిక ఒత్తిడితో శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తీరును దృశ్యమానం చేశారు.

మైనంపాటి భాస్కర్ రాసిన మరో కథ “డీప్ ఫ్రీజ్”. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకొని 2050వ సంవత్సరం నాటి మానవ సమాజాన్ని సాంకేతిక పురోభివృద్ధిని ఊహించి రాసిన కథ ఇది. భారతదేశ జనాభా 2050వ సంవత్సరంనాటికి 3000 కోట్లు అవుతుందని అంచనా వేసి రాసిన కథ. జనాభా పెరగటంతో విపరీతమైన కాలుష్యంతో వ్యాధి నిరోధక దుస్తులు, ఆక్సిజన్ మాస్క్, చెవులకు ఫిల్టర్లు లేకుండా బయటకు రాలేని దుస్థితి మనుషులకు రాబోతుందని రాసిన కథ. చివరికి ఆరుబయట ఒక్క చెట్టు కూడా కనిపించదని కథలో ఎంతో ముందు చూపుతో రచయిత ఊహించి పాఠకులకు ఒక స్పృహను అందించారు. మనిషి అత్యాశతో చేస్తున్న అసహజమైన పనులవల్ల ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నాడు. అందుకే ప్రకృతిని నాశనంచేసి తిరిగి ప్రకృతిని శాసించే ప్రయత్నం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే ఈ కథ నడిచింది.చనిపోయాడనుకొన్న మనిషి క్యాన్సర్ వ్యాధి ప్రయోగంలో భాగంగా తిరిగి బ్రతికితే ఆకుటుంబ సభ్యులు ఏవిధంగా ఆలోచిస్తారనేది కూడా స్పష్టంచేశారు. ఆధునికత పెరిగేకొద్దీ కుటుంబసభ్యులమధ్య ఉండే ఆర్థిక సంబంధాలు వ్యాపారసంబంధాలైపోయాయి. చివరికి చిన్నపిల్లలను కూడా రోబోలు ఆడించాల్సిన దుఃస్థితిని, మనిషి తనకు కావాల్సిన వాటికి తన మెదడుతోకాకుండా యంత్రాలపైన ఆధారపడటం వంటివన్నీ మనిషి నిర్వీర్యం కావడానికి దోహదమవుతున్న తీరును రచయిత చాలా చక్కగా వ్యక్తీకరించారు.


భూతాపం – జీవవైవిద్య ప్రమాదం : ప్రకృతిలో జీవుల మధ్య సమతౌల్యం నెలకొని ఉంది. అలాగే నేడు మానవతప్పిదాలవల్ల ప్రకృతి వైపరీత్యాలవల్ల జీవులన్నీ నశించి సమతూకం చెడిపోతూ ఉంది. భూతాపం పెరిగిపోయి జీవులకు నీటి కొరత, మరోవైపు ఆహారం దొరకక అవి నివసించడానికి తగిన వసతులులేక అంతరించిపోతున్నాయి. ప్రకృతికి అందాన్నిచ్చే రంగురంగుల పిట్టలు, వన్యప్రాణులు, గర్జించే మృగరాజులు, కనులకు విందుచేసే నెమలి నాట్యాలు, లేళ్ల గంతులు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ చూస్తుండగానే కనుమరుగైపోతున్నాయి. దీనికి మానవ తప్పిదాలు ఒక కారణంకాగాభూతాపం మరోకారణమై నీటికొరతతో, అడవుల నాశనంతో వన్యప్రాణులన్నీ మాయమవుతున్నాయంటూ పాపినేని శివశంకర్ “చివరి పిచ్చిక”; సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి “పిట్ట పాట”,  “కడితివేట”, “అతడిబాధ”; గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”;చిత్తర్వు మధు “రెండు డిగ్రీలు” వంటి కథలను రాశారు.
వ్యవసాయ పంటలకు వాడే రసాయనాలవల్ల భూమికలుషితమై మనిషి మనుగడ కునారిల్లుతుంటే స్పందించిన సాహితీస్రష్ట హృదయం అక్షరంగా ఆవిష్కృతమైన కథ “చివరి పిచ్చిక”. తమ చిత్రవిచిత్ర చేష్టలతో కిచకిచ శబ్దాలతో నిత్యం మనల్ని వెంటాడే పిచ్చుకలు కనుమరుగవటం వల్ల అంతరించిపోతున్న పిచ్చుకజాతికి అంతిమనివాళిగా అందించిన కథ ఇది. వడ్లకంకులను గుత్తులుగా వేలాడదీసి పక్షులకు ఆహారాన్ని అందించే మానవీయత నేడు కరువైంది. చదువుల వేటలో అధికారదాహంలో డబ్బుసంపాదనలో ఈవిషయం మనకు సంబంధంలేనిదైపోయింది.  పర్యావరణంలో పశుపక్షాదులది విడదీయరాని అనుబంధం. కానీ మనిషి తను అభివృద్ధి చెందడానికి ఇతర ప్రాణులకు ఎప్పుడూ హాని చేస్తుంటాడు. అందుకే రచయిత ‘ఏదో ఒకనాటికి ఈ రెండు చేతుల జీవివల్లనే మన జాతి అంతరిస్తుందని నాభయం’ అంటాడు. ఇక్కడ రెండు చేతుల జీవి అంటే మనిషి. సృష్టిలో రెండుచేతులు ఉన్నది ఒక్కమనిషికే. తన స్వార్థంకోసం మనిషి ఏమైనా చేస్తాడనేది రచయిత ఆవేదన.“సృష్టిలో కెల్లా తానే విజ్ఞానవంతుడని తెలివితేటలు కలవాడినని విర్రవీగుతుంటాడు మనిషి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వివిధ జీవరాశులలో ఎన్నో జీవులు తమకి మాత్రమే సాధ్యమైన ప్రజ్ఞని ప్రదర్శిస్తాయని తెలుస్తుందం”టారు కేకలతూరి కృష్ణయ్య గారు. అది అక్షరాలా నిజం. పర్యావరణ సమతుల్యాన్ని మనిషి దెబ్బతీస్తున్న విధానాన్ని రచయిత పిచ్చుకద్వారా స్పష్టపరిచారు. అంతేకాదు మనిషి జాతిసమస్తాన్ని ధ్వంసంచేస్తూ చివరికి తానే ధ్వంసమయ్యే పరిస్థితిని తెచ్చుకోబోతున్నాడనే హెచ్చరిక ఈకథలో ఉంది. ఒకప్పుడు పిచ్చుకలకు పంటపొలాల్లో తినడానికి జొన్నకంకులు అందుబాటులో ఉండేవి. కానీ నేడు మిరపలాంటి తోటల్లో ద్రావకాల్లో తేలుతున్న పురుగులను తినడంవల్ల పిచ్చుకలు అంతరించిపోయాయని పిచ్చుకలకు చోటులేని ప్రపంచం ఒకనాటికి ఎడారిగా మారిపోతుందన్న భవిష్యత్తు ఉపద్రవాన్ని సూచించారు రచయిత.


పరిశుభ్రత పేరిట, నాగరికత పేరిట పిచ్చుకలు పెట్టే గూళ్ళను ఊడబీకడం ఎంత కారుణ్యరాహిత్యమో తెలియజేస్తూ రాసిన మరోకథ “పిట్టపాట”. ఒకప్పుడు పంటపొలాల్లో వచ్చే పురుగులను ఏరి తినే పక్షులు నేడు లేకపోవడం వల్ల పంటలమీద పురుగులు ఎక్కువై దిగుబడి లేక రైతులు అప్పులు పాలైన స్థితిని చిత్రీకరించిన కథ. పాతతరంలో పొలాలు కుటుంబాన్ని పోషిస్తే నేటితరం పొలాన్ని పోషించుకోవాల్సి రావటం బాధాకరం. అది మనిషి స్వయంకృతాపరాధమేనని తెలిపిన కథ. పర్యావరణ చేతనారాహిత్యం జీవావరణ విధ్వంసానికి కారణమవుతుందని హెచ్చరించిన కథ. చివరికి బంధువులను కలవడమన్నది అవసరానికేకాదు హృదయసంబంధమైనదిగా భావించాల్సిన అవసరాన్నికూడా తెలిపిన కథ. అందుకే కేకలతూరి కృష్ణయ్యగారు సామాజిక విలువలు, సమతామమతలను అందించే ‘సృష్టి జనజీవన దర్పణం’ అనే ఒక మంచి పుస్తకం వెలువరించారు. బంధాలు అవసరానికి మాత్రమే అనే నేటి సమాజంలో అవి ఎంతమేర ఉండాలో చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇదే విషయాన్ని ‘పిట్టపాట’ కథలోనూ రచయిత సూచించడం నేటి సమాజానికి ఇది ఎంత అవసరమో తెలుస్తూ ఉంది.
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత చిత్తర్వు మధు. ఇతను వృత్తిరీత్యా డాక్టరు. తన వృత్తిలో భాగంగా పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ లాంటి ముఖ్య విషయాల మీద పరిశోధించి రాసిన కథ “రెండు డిగ్రీలు”. రాబోయే తరాలు ఎలాంటి భవిష్యత్తును ఎదుర్కోబోతున్నారో చూపిన కథ. భవిష్యత్తు పరమైనటువంటి అవగాహనలేని మనల్నిఇక ఆ భగవంతుడే కాపాడాలనేఅద్భుతమైన కథనంతో ఈకథనుమనకుఅందించారు.
ప్రభుత్వంచేసిన నల్లచట్టంవల్ల బాక్సైట్ తవ్వకాలు చేయడంతో జంతువులన్నీ మాయమైపోతున్నాయని చెప్తూ గన్నవరపు నరసింహమూర్తి “అభయారణ్యం”కథరాస్తే, నీళ్లులేక ఎన్నో జీవాలు అంతరించిపోయిన దుస్థితిని చిత్రిస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి“కడితి వేట”అనే కథను రాశారు. నోరులేని మూగజీవాలమీద మనిషి పైశాచికత్వానికి నిదర్శనం జంతువుల అదృశ్యం. అరణ్యాలలోని చెట్లను నరికి మంటపెట్టడంవల్ల ఎన్నో పక్షులు, జంతువులు, లేతచెట్లు మాడిపోయి కనీసం తాగడానికి నీళ్లుకూడా లేని దుస్థితిలో ఒక కడితి నీళ్ల కోసం మడుగులో దిగి తాగితే దాన్ని కూడా చంపి తినడానికి సిద్ధమైన మానవ మృగాలను చిత్రించిన కథఇది.
మన పర్యావరణంలో ఒకరిమీద ఆధారపడి మరొకరు జీవించటం సహజం. కాని ఇది జరగనప్పుడు ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో తెలియజేస్తూ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు “అతడిబాధ” అనే మరోకథను రాశారు. నక్కలు, తోడేళ్ళు అంతరించిపోయాక కుక్కలను పెంచేవాళ్ళులేక అవి తిండికోసం పెద్దనక్కలు తోడేళ్ళ బదులు కుక్కలే గొర్రెలని, కోళ్ళను తినే పరిస్థితికి వచ్చిన తీరుని తెలిపిన కథ ఇది. ఒకప్పుడు కుక్కలకు ఇంట్లో తిండి పెట్టేవారు. కాని నేడు అలాంటి పరిస్థితులు కనుమరుగయ్యాయి. దానితో కుక్కలకి తిండి దొరకక రాబోయేకాలానికి నక్కలు, తోడేళ్ళ మాదిరి మారిపోతాయేమోననే ఆవేదన రచయితది.


ఇలా మనిషి తన స్వార్థంకోసం ప్రతీదాన్ని కలుషితంచేస్తూ జీవులను నాశనంచేస్తూ ప్రకృతి సమతౌల్యాన్ని చెడగొడుతున్నాడు. ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణమవుతున్నాడు. తన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాడు కనుక స్వార్థాన్ని వదలి పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, ఆచరిస్తేనే ఈ భూమి,భూమిపై మనిషి మనుగడ స్థిరమవుతుంది.దీనికోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాల్సినతరుణంఆసన్నమైంది.

***

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సంధి అంటే

by రంగరాజు పద్మజ March 17, 2024
written by రంగరాజు పద్మజ

రెండు పదాల కలయిక. రెండు పదాలు కలిసేటప్పుడు అనేక మార్పులు కలుగుతుంటాయి. అంటే అక్షరాలు తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటాయి. దీన్ని సంధి కార్యం అంటారు. వ్యాకర్తలంటే సూత్రాలు రాస్తారు. అలా చిన్నయసూరి సూరి సంధి గురించి ” పూర్వ పర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి యనంబడు” అంటూ సంధి గురించి నిర్వచించారు.
అంటే పూర్వ పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చుకు పర పదంలో ఉన్న అచ్చుకు కలిసి సంధి జరిగినప్పుడు పర పదంలోని అచ్చు వచ్చి చేరడాన్ని సంధి అంటారని ఫలితార్థం.
ఆ రోజులలో గ్రాంథిక భాష వాడుకలో ఉంది కాబట్టి సూత్రీకరణ కూడా గ్రాంథిక భాషలోనే జరిగింది.

ఉదాహరణకు..
రాముడు+ అతడు
రాముడ్ + ఉ+ అతడు = ఇక్కడ ‘ఉ’మరియు ‘అ’ల మధ్య సంధి జరిగి, ఆ రెండింటి స్థానంలో ‘అ’ వచ్చి చేరి, రాముడ్ + అ+తడు = రాముడతడు అని అవుతుంది.

ఈ సంధులు అచ్చుల మధ్య జరిగితే అచ్చంధులని, హల్లుల మధ్య జరిగితే హల్సంధులని చెబుతారు. ఇవి తెలుగు సంధులు, సంస్కృత సంధులని బేధాలు ఉన్నాయి. ఈ సంధి కార్యాలు మూడు రకాలుగా జరుగుతాయి.
1. ఏకాదేశ సంధులు
2.ఆదేశ సంధులు
3. ఆగమ సంధులు.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.
1. ఏకాదేశ సంధులు:- ఈ సందులలో పూర్వ స్వరానికి, పరస్పరానికి సంధి జరిగినప్పుడు పరస్పరం వచ్చి చేరడం గానీ, లేదా వేరొక స్వరంగానే వచ్చి చేరుతాయి. తెలుగు సంధులలో అంతే పరస్వరమే వచ్చి చేరుతుంది.
ఉదా-:ఉత్వసంధి, ఇత్వసంధి, అత్వసంధి, ఆమ్రేడిత సంధి.

సంస్కృత సంధులలో అయితే పూర్వ పర స్వరాలకు సంబంధం లేకుండా వేరొక స్వరం వచ్చి చేరుతుంది.
ఉదా:- సవర్ణదీర్ఘ సంధి ,గుణ సంధి, వృద్ధి సంధి.

2. ఆదేశ సంధులు:- ఆదేశం అనగా ఒక అక్షరాన్ని కొట్టివేసి, దాని స్థానంలో కొత్త అక్షరం వచ్చి చేరడం. అందేకే వ్యాకర్తలు “శత్రువదాదేశః” అని నిర్వచనం చెప్పారు. అంటే శత్రువులాగా రా నీ కొట్టివేసి దాని స్థానంలో మరొక అక్షరం వచ్చి చేరడం.
ఉదా:– వాడు + కొట్టెను = వాడుగొట్టెను.
ఇక్కడ ‘కొ’ స్థానంలో ‘గొ’ వచ్చి చేరింది.
ఉదా:– సరళవాదేశ సంధి ; గసడదవాదేశ సంధి; పుంప్వాదేశ సంధి; యణాదేశ సంధి.

3. ఆగమ సంధులు:– ఆగమం అనగా కొత్తగా ఒక అక్షరం రావడం.. అంటే ఉన్న అక్షరాలన్నీ ఉండగా, వాటి మధ్య కొత్తగా ఒక అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే వ్యాకర్తలు ‘మిత్రవధాగమః’ అన్నారు. అంటే మిత్రుని వలే కొత్తగా ఒక అక్షరం చేరుతుంది అని ఫలితార్థం.
ఉదా:- మా + అమ్మ
మా +య్+అమ్మ = మాయమ్మ.
ఇక్కడ ‘య్’ మిత్రునిగా వచ్చి చేరింది.
ఉదా:– యడాగమ సంధి; రుగాగమ సంధి; టుగాగమసంధి, నుగాగమసంధి, దుగాగమ సంధి, అనునాసిక సంధి ; జస్త్వసంధి, శ్చుత్వసంధి;
మొదలగునవి.
తెలుగు సంధులు- సంస్కృత సంధులు ఏవో చూద్దాం!!
తెలుగు సంధులు:–
ఉత్వ సంధి;
ఇత్వసంధి;
అత్వ సంధి;
యడాగమసంధి;
ఆమ్రేడిత సంధి;
ద్విరుక్త టకారాదేశ సంధి; సరళాదేశ సంధి ;
గసడవాదేశ సంధి;
నుగాగమ సంధి; టుగాగమసంధి;
నుగాగమ సంధి;
టుగాగమ సంధి; పుంప్వాదేశసంధి;
పడ్వాదుల సంధి ; ప్రాతాదులసంధి;
దుగాగమ సంధి;
త్రికసంధి మొదలైనవి.

సంస్కృత సంధులు:– సవర్ణధీర్ఘ సంధి;
గుణసంధి;
యణాదేశ సంధి;
వృద్ధి సంధి;
అనునాసిక సంధి;
జస్త్వసంధి;
శ్చుత్వ సంధి మొదలైనవి.
చిన్నయ సూరి సంధి నిర్వచనం ఇలా సూత్రీకరించారు. “పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యనంబడు” ఈ సంధి సూత్రం కేవలం అచ్చు సంధులకు మాత్రమే వర్తిస్తుంది. హల్లులకు వర్తించదు. ఈ సంధి నిర్వచనం ఒకటవ సూత్రం నుండి 11వ సూత్రం వరకు వర్తిస్తుంది. మిగిలిన వాటికి ఆగమాలుగానో ఆదేశాలుగానో సంధులు జరుగుతాయి. పైన చెప్పిన 11 సూత్రాలకు మాత్రమే ఏకాదేశం జరుగుతుంది.
ఇక్కడ మనం ఆదేశం, ఏకాదేశం, ఆగమం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
ఆదేశమనగా శత్రువు లాగా ఒక అక్షరమొచ్చి ముందు అక్షరాన్ని తొలగించి దాని స్థానంలో మరొక అక్షరం చేరడం.
కూర+కాయ::: కూరగాయలు
మా+ అమ్మ :::::మాయమ్మ
ఏకాదేశం అనగా పూర్వస్వరానికి పరస్వరానికి కలిపి ఒకే అక్షరం రావడం.
సీత+ అమ్మ…. సీతమ్మ
ఆగమం అనగా మిత్రునిలాగా కొత్తగా అక్షరం వచ్చి చేరడం..
పేద+ ఆలు:::: పేదరాలు
పేద+ర్+ఆలు..
ఇక్కడ రెండు పదాలు మధ్య ర్ కొత్తగా చేరింది.
చిన్నయసూరి చెప్పిన మొదటి సూత్రం చూద్దాం!
“ఉత్తునకచ్చు పరమగునపుడు సంధియగు”
చిన్నయసూరి సూత్రీకరణ అత్వసంధితో కాకుండా ఉత్వసంధితో ప్రారంభించారు. అత్వసంధి బహుళ సంధి , ఉత్వ సంధి నిత్య సంధి. విద్యార్థులకు మొదటే బహుళం గురించి చెప్పి , వారిని తికమక పెట్టడం కంటే నిత్య సంధిని పరిచయం చేయడం విద్యార్థులకు వ్యాకరణం సులభంగా నేర్పించవచ్చని చిన్నయ సూరి అభిప్రాయం. ఎంత మంచి ఆలోచన.
తన బాలవ్యాకరణంలో ఉత్త్, అత్త్ ,ఇత్త్ అని తపరకరణం(హ్రస్వ ఉకార, అకార ,ఇకార ఉకారములు) చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంది. ఉత్తు అంటే హ్రస్వమైన ఉత్వం అని అర్థం. ఉకారం అంటే ఉ మరియు ఊ అని అర్థం.
హ్రస్వమైన ఉత్వమునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది.
రాముడు+ అతడు… రాముడతడు
సోముడు+ ఇతడు… సోముడితడు
వారు+ ఎవరు ….. వారెవరు… మొదలైనవి.
వ్యాకరణ ప్రియులు ఈ సంధిని ఉకారసంధి అని గాక ఉత్వసంధి అని చెప్పాలని సూచించారు. ఎందుకంటే?
ఉకార సంధి అని చెప్పడం వలన ఉ, ఊ లు రెండు వస్తాయి. కానీ ఉత్వసంధి అని చెప్పడం వలన కేవలం హ్రస్వమైన ఉత్వం మాత్రమే ఉంటుంది. కనుక ఉత్వసంధి అని చెప్పడం సబబుగా ఉంది.
ఉత్వసంధి నిత్యసంధి అయినప్పటికీ కొన్నిచోట్ల వికల్పరూపం కూడా కనిపిస్తుంది. అందుకే రెండో సూత్రం ఇలా సూత్రీకరించారు.
“ప్రథమేతర విభక్తి, శత్రర్థక చువర్ణంబులందున్న యుకారమునకు సంధి వైకల్పికముగా నగు”
సూత్రమును ఒకసారి పరికిద్దాం!
విభక్తులు తెలుగులో ఏడున్నాయి. అవి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్టి, సప్తమీ. వీటిలో ప్రథమా విభక్తి గాక మిగిలిన విభక్తుల్లో ఉకారం చివరనున్న విభక్తులు
నన్నున్… ద్వితీయా విభక్తి
కొరకున్…. చతుర్థీ విభక్తి
నాకున్….‌‌ షష్టీ విభక్తి
అందున్…. సప్తమీ విభక్తి .
అందున్ సామ్యం చేత ఇందున్, ఎందున్ కూడా గ్రహించాలి.
ఇవేకాక శత్రర్థక చువర్ణం అంటే వర్తమాన కాలంలోని అసమాపక కాలమును సూచించు చువర్ణమని అర్థము.
వచ్చుచున్, చూచుచున్ ఇలాంటివి శత్రర్థక చువర్ణకాలు. పైన సూచించిన విభక్తి ప్రత్యయాలకు గానీ, శత్రర్థకాలుకు గానీ వైకల్పికముగా సంధి జరుగుతుంది.
నన్నున్+ అడిగె… సంధి జరిగితే మొదట నన్నున్ లో ఉన్న ద్రుతం లోపించి
నన్ను+ అడిగె…‌ ఇక్కడ సంధి జరిగి నన్నడిగె అవుతుంది. సంధి జరగని పక్షంలో ద్రుతం వచ్చి
నన్నున్+ అడిగె.‌..‌నన్నునడిగె అనే రూపం ఏర్పడుతుంది. ఇలా ఈ సూత్రం ద్వారా రెండు రూపాలు సిద్ధిస్తాయి. మిగిలిన ఉదాహరణలు చూద్దాం!
నాకొరకున్+ ఇచ్చె … నాకొరకిచ్చె.. నాకొరకునిచ్చె
నాకున్+ ఆదరువు… నాకాదరువు… నాకునాదరువు
నాయందున్+ ఆశ… నాయందాశ.. నాయందునాశ
ఇందున్+ ఉన్నాడు… ఇందున్నాడు… ఇందునున్నాడు…
ఎందున్+ ఉంటివి.. ఎందుంటివి.. ఎందునుంటివి
వచ్చుచున్+ ఉండెను… వచ్చుచుండెను.. వచ్చుచునుండెను
చూచుచున్+ ఏగెను… చూచుచేగెను… చూచుచునేగెను…
తరువాత యడాగమ సంధిని చూద్దాం!
తెలుగులో అచ్సంధులలో ఎక్కడైనా సంధి జరగకుంటే యడాగం వస్తుంది. దీర్ఘాచ్చులు మీద సంధి జరగదు. అత్వ, ఇత్వ సంధుల మీద కొన్ని చోట్ల సంధి జరగదు. అలాంటి సందర్భాల్లో యడాగమం వస్తుంది. అందుకే చిన్నయసూరి యడాగమం సంధిని ఈ విధంగా సూత్రీకరించారు.
“సంధి లేనిచోట స్వరంబు కంటె పరంబైన స్వరంబునకు యడాగమగు”
మా+ అమ్మ…. మాయమ్మ
మీ+ ఇల్లు..‌‌ మీ ఇల్లు
మా+ ఊరు…మాయూరు
ఈ ఉదాహరణలో పూరస్వరంలో దీర్ఘం ఉంది కాబట్టి సంధి జరగలేదు.
తర్వాత అత్వ సంధిని చూద్దాం చిన్నయసూరి ఆత్వసంధిని ఇలా సూత్రీకరించారు.
” అత్తునకు సంధి బహుళము”.
బహుళమనగా అనేక రకములని అర్థం. కానీ వ్యాకరణ పరిభాషలో బహుళము నాలుగు రకాలు. 1. ప్రవృత్తి (నిత్యము)
2. అప్రవృత్తి (అనిత్యము)
3. విభాష (వైకల్పికము)
4. అన్యత్వం
వీటి వివరణ చూద్దాం!
సంస్కృతంలో బహుళం గురించి ఇలా సూత్రీకరించారు.
క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః
క్వచిత్ విభాషా క్వచిదన్యదేవ
విధేర్విధానం బహుధా సమీక్ష
చతుర్విధం బహుళకం వదన్తి
1. ప్రవృత్తి :- విధించిన వ్యాకరణ కార్యం తప్పక జరగడాన్ని ప్రవత్తి లేదా నిత్యము అంటారు.
సీత+ అమ్మ…. సీతమ్మ
రామ +అయ్య రామయ్య
2) అప్రవృత్తి:- విధించిన వ్యాకరణ కార్యం జరగకుంటే అప్రవృత్తి లేదా అనిత్యం అంటారు.
అమ్మ+ ఇచ్చెను…. అమ్మయిచ్చెను
దూత+ ఇతడు…. దూతయితడు
3) విభాష :- విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి జరిగి మరొకసారి జరగకుంటే దాన్ని వైకల్పికం లేదా విభాష అంటారు.
మేన+ అల్లుడు… మేనల్లుడు, మేనయల్లుడు
పుట్టిన+ ఇల్లు… పుట్టినిల్లు, పుట్టినయిల్లు
4) అన్యత్వం:- విధించిన వ్యాకరణకార్యం ఒక విధంగా జరగవలసి ఉండగా మరొక విధంగా జరగడానికి అన్యత్వం అంటారు.
ఒక+ఒక.. ఒకానొక
పై ఉదాహరణలో ఒక+ ఒక ఆమ్రేడిత సంధి జరిగి ఒకొక్క కావలసి ఉండగా అలా జరగక కకారమునకు దీర్ఘం వచ్చి దాని పైన ద్రుతము వచ్చి ఒకానొక అయినది. అలాగే
తామర+ ఆకు…. తామరపాకు
బొమ్మ+ ఇల్లు… బొమ్మరిల్లు.. మొదలైనవి.
బహుళగ్రహణము చేత స్త్రీవాచక, తత్సమ, సంబోధనాంతములకు సంధిలేదని చిన్నయసూరి సూత్రీకించారు. ఆ సూచన ప్రకారం
అమ్మ+ ఇచ్చెను… అమ్మయిచ్చెను
దూత+ ఇతడు… దూతయితడు
చెలువుడ+ ఇందము… చెలువుడయిందము
స్త్రీ వాచక శబ్దాలు అంటే స్త్రీలను గురించి తెలిపే అమ్మ, అక్క,అవ్వ, మొదలైనవి. తత్సమ శబ్దాలు అంటే సంస్కృత పదాలు మీద తెలుగు పదాలు చేరడం వలన ఏర్పడిన పదాలు. సంబోధనాంతం అంటే ఎవరిని సంభోధన చేస్తామో ఆ పదం. ఇలాంటి పదాల మీద సంధి జరగదని తెలుసుకోవాలి.

ఇత్వసంధిలోని భేదాలు తెలుసుకుందాం!
” ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఏమి మొదలైన పదాల్లో ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు.
ఉదా:- ఏమి+ అంటివి
ఈ పదాల మధ్య సంధి జరిగితే ఏమంటివి అవుతుంది. ఈ రెండు పదాల మధ్య సంధి జరగకపోతే వాటి మధ్య యడాగమం వచ్చి ఏమియంటివి అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే

మరి +ఏమి::: మరేమి, మరియేమి
హరికిన్ + ఇచ్చె సంధి జరిగితే పూర్వ రూపంలో ఉన్న ద్రుతం లోపిస్తుంది .ఆ తర్వాత ఇత్వం మీద సంధి జరిగి హరికిచ్చె అవుతుంది . ఒకవేళ సంధి జరగపోతే ముందున్న ద్రుతంతో కలిసిపోయి హరికినిచ్చె అని ఏర్పడుతుంది. సూరి ఈ సూత్రం కింద “ఏమి, మఱి , కి- షష్టి, అది, అవి, ఇది,ఇవి, ఏది, ఏవి” అనేవి ఆకృతిక గణాలని ఇచ్చారు. పైన ఇచ్చిన పదాల్లో ఇత్వ సంధి వైకల్పికముగా జరుగుతుందని అర్థం.
తరువాత సంధిని చూద్దాం!
“క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఇంతకు మునుపు సూత్రంలో ఎక్కువ భాగం సర్వనామాలు మీదే సంధి జరిగిన విధానం చెప్పబడింది. ఇప్పుడు క్రియా పదాలు మీద సంధి వైకల్పికముగా జరుగుతుందని సూచించారు.
ఉదా- వచ్చిరి+ అపుడు :::
సంధి జరిగితే వచ్చిరపుడవుతుంది. సంధి జరగకపోతే రెండు పదాల మధ్య యడాగమం వచ్చి వచ్చిరియప్పుడు అని అవుతుంది.
ఇలాగే
వచ్చితిమి+ ఇప్పుడు ::: వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు అని అవుతుంది.
తర్వాత సూత్రం గురించి తెలుసుకుందాం. “మధ్యమ పురుషక్రియలందిత్తునకు సంధి యగును”.
తెలుగులో పురుషలు మూడు రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రధమ పురుష .
తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి తెలిపేది మధ్యమ పురుష, దూరంగా ఉన్న వారి గురించి తెలిపేది ప్రథమ పురుష.
మధ్యమ పురుష క్రియల మీదున్న ఇత్వానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్థము.
ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఏలితివి+ అప్పుడు ఇక్కడ ఏలుతివి అనేది మధ్యమ పురుష క్రియ. దీని మీదున్న ఇత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరిగి ఏలితివపుడు అవుతుంది. ఇలాగే ఏలితి+ ఇప్పుడు… ఏలితిప్పుడు, ఏలితిరి+ ఇప్పుడు ఏలితిరిప్పుడు అనే రూపాలు ఏర్పడుతాయి .
తర్వాత సూత్రం చూద్దాం.
“క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు”.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ. భూత కాలిక అసమాపక క్రియలు మీద ‘ఇ’ అనే ప్రత్యయం చేరుతుంది.
వండు+ ఇ:::: వండి
చదువు + ఇ:::: చదివి
ఇలా వచ్చిన క్త్వార్థమునకు అచ్చుపరమైతే సంధి జరగనే జరగదని సూత్రార్థం.
వచ్చి+ ఇచ్చెను. ఇక్కడ వచ్చి అనేది క్త్వార్థక ఇకారం ఉంది కాబట్టి దాని మీద సంధి జరగదు అలాంటి సమయంలో యడాగం వచ్చి
వచ్చియిచ్చెను అని అవుతుంది. అలాగే
వండి+ ఇచ్చెను::: వండియిచ్చెను
దీనితో ఇత్వ సంధి సూత్రాలు పూర్తి అయ్యాయి.
తర్వాత ద్విరుక్త టకారాదేశ సంధి గురించి తెలుసుకుందాం!
“కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకచ్చు పరమైనపుడు ద్విరుక్తటకారాదేశంబగు”
వివరణ చూద్దాం!
కుఱు, చిఱు అనే పదంలోని “ఱ”కారమునకు కడు, నడు, నిడు అనే పదములోని “డ”కారమునకు అచ్చు పరమైతే ద్విరుక్తటకారం అంటే రెండు టకారాలు(ట్ట్) ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.
కుఱు+ ఉసురు
కుఱ్+ ఉ+ ఉసురు
ఈ సూత్ర ప్రకారం ‘ఱ్’ స్థానంలో ట్ట్ వచ్చి చేరి కుట్ట్ +ఉసురు అవుతుంది. తర్వాత ట్ట్ మీద ఉ చేరి ట్టు అవుతుంది. తర్వాత ఉత్తునకచ్చు పరమగునపుడు సంధి యగు అనే సూత్రంతో కుట్టుసురు అవుతుంది.
ఇలాగే
చిఱు+ ఎలుక…. చిట్టెలుక
కడు+ ఎదురు…. కట్టెదురు
నడు+ ఇల్లు… నట్టిల్లు
నిడు+ ఊర్పు… నిట్టూర్పు
తరువాత సంధిని గురించి తెలుసుకుందా!
” అందు, అవగాగమంబులనం దప్ప అపదాది స్వరంబు పరంబగుగనప్పుడు అచ్చునకు సంధి యగు”
అందు,అవక్ అనేవి తప్ప మిగిలిన అపదము
అనగా పదము కానిది పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్ధం. అందు, అవక్ పరమైనప్పుడు వికల్పంగా సంధి జరుగుతుంది.
వాడు+ ఏ అన్నప్పుడు “ఏ” అనేది అపదం. అనగా ఏ అనేది పదం కాదు. అలాంటప్పుడు ఆ రెండు పదాల మధ్య సంధి నిత్యంగా జరిగి వాడే అవుతుంది.
ఇది+ ఓ…ఇదో
అది+ ఓ …. అదో
ఇలా పదాల్లో సంధి నిత్యంగా జరుగుతుంది.
మూర+ ఎడు ఇక్కడ ఎడు అనే పదానికి అర్థం లేదు, అది అపదం కాబట్టి నిత్యంగా సంధి జరిగి మూరెడు అవుతుంది.
వీసె+ ఎడు..‌‌ వీసెడు
అర్ధ + ఇంచు ఇక్కడ ఇంచు అనేది అపదం కాబట్టి సంధి నిత్యంగా జరుగుతుంది. అర్థించు అవుతుంది. ఇలాగే
నిర్జి+ ఇంచు::: నిర్జించు
అందు, అవుక్ అనేవి పరమైతే ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం!
రాముల+ అందు…. సంధి జరిగితే రాములందు అవుతుంది. సంధి రాని పక్షంలో రాములయందు అవుతుంది.
ఎనిమిది+ అవ.. ఎనిమిదవ, ఎనిమిదియవ ఇలా రెండు రూపాలు ఏర్పడుతాయి.

ఆమ్రేడితం గురించి చిన్నయసూరి “ద్విరుక్తం యొక్క పరరూపం ఆమ్రేడితము” అని నిర్వచనం చెప్పారు. ద్విరుక్తం అనగా ఒకే పదం రెండుసార్లు రావడమని అర్థం. పరరూపం అనగా సంధి పదంలోని రెండవ పదం. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండవసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితమంటారని సూత్రార్థం.

ఇప్పుడు ఆమ్రేడిత సంధిలోని వివిధ సూత్రాలను పరిశీలిద్దాం….
1) అచ్చునకు ఆమ్రేడితం పరమగునప్పుడు సంధి తరచుగానగు.
పూర్వ రూపంలో చివరనున్న అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి ఎక్కువ భాగం జరుగుతుంది. సూత్రంలో తరచుగా అని చెప్పడం చేత కొన్నిచోట్ల వైకల్పికముగా కూడా జరుగుతుందని భావం.
ఔర+ ఔర …ఔరౌర
ఆహా +ఆహా… ఆహాహా
ఊరు +ఊరు… ఊరూరు
అక్కడ+ అక్కడ …అక్కడక్కడ మొదలైనవి.
సూత్రంలో తరచుగా అనడం చేత
ఏమి+ ఏమి… అన్నప్పుడు సంధి జరిగితే ఏమేమి అవుతుంది. సంధి జరిగిన పక్షంలో యడాగమం వచ్చి … ఏమియేమి అవుతుంది.
ఏగి+ ఏగి అన్నప్పుడు ఏగి అనేది క్త్వార్థకం కాబట్టి క్త్వార్థక ఇకారం మీద సంధి రాదు కాబట్టి యడాగమం వచ్చి ఏగియేగి అనే రూపం ఏర్పడుతుంది.
రెండవ సూత్రం చూద్దాం.
2)ఆమ్రేడితం పరమగునప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్ల అదంత ద్విరుక్తటకారంబగు.
సూత్రార్థం చూద్దాం! కడ మొదలైన పదాలకు ఆమ్రేడితం పరమైతే పూర్వ పదంలోని తొలి అక్షరం తప్ప దాని మీద ఉన్న అక్షరాలన్నిటికి కలిపి అదంత ట కారం అంటే ” ట్ట” అనేది ఆదేశంగా వస్తుందని భావం.
కడ +కడ …కట్టకడ
చివర+ చివర …చిట్టచివర
పగలు+ పగలు… పట్టపగలు
బయలు+ బయలు బట్టబయలు మొదలైనవి.
కడాదులని క్రింది వాటిని పిలుస్తారు.
కడ, ఎదురు, కొన, చివర, తుద,తెన్ను, తెరువు పగలు, బయలు మొదలైనవి.
ఇంకా మూడవ సూత్రం చూద్దాం!
3)నిందయందు ఆమ్రేడితంలో ఆద్యక్షములకు హ్రస్వ దీర్ఘములకు గి గీ లగు.
నిందను చెప్పే సందర్భంలో ఆమ్రేడితం అనగా రెండో పదంలో మొదటి అక్షరం హ్రస్వం ఉంటే గి వస్తుంది, దీర్ఘం ఉంటే గీ వస్తుంది అని సూత్రార్థం.
రావణుడు +రావణుడు… రావణుడు గీవణుడు ఇక్కడ రెండవ పదంలోని రావణుడు పదంలోని రా కు బదులుగా గీ వస్తే రావణుడు గీవణుడు అని అవుతుంది.
అలాగే కుంభకర్ణుడు+ కుంభకర్ణుడు… కుంభకర్ణుడు గింభకర్ణుడు
పుస్తకం+ పుస్తకం … పుస్తకం గిస్తకం
పూలు+ పూలు… పూలు గీలు అవుతుంది.

ఇక నాలుగో సూత్రం చూద్దాం
4) ఆమ్రేడితం పరమగునప్పుడు విభక్తి లోపం బహుళముగానగు.
మొదటి పదం చివరనున్న విభక్తి ప్రత్యయానికి ఆమ్రేడితం పరమైతే ఆ విభక్తి ప్రత్యయానికి లోపం బహుళంగా వస్తుంది, అనగా అనేక రకాలుగా రాచ్చునని సూత్రార్థం.
అప్పటికిన్ + అప్పటికిన్
ఇక్కడ కిన్ అనే షష్టి విభక్తి మీద సంధి జరిగితే విభక్తి లోపించి అప్పటప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. ఒకవేళ సంధి జరగకపోతే రెండవ పదంలోని మొదటి అచ్చు విభక్తి ప్రత్యయముతో కలిసి అప్పటికనప్పటికిన్ అనే రూపం ఏర్పడుతుంది. అక్కడన్+అక్కడన్ …అక్కడక్కడన్ లేదా అక్కడనక్కడన్ అని అవుతుంది.
మరొక ఉదాహరణ చూద్దాం!
ఊరన్+ ఊరన్ …ఊరూరన్ లేదా ఊరనూరన్ అని వస్తాయి .
సూత్రములో బహుళమని చెప్పడం చేత ఇంచుక , నాడు మొదలైన పదాలు చివరి అక్షరం లోపించి సంధి జరుగుతుంది.
ఇంచుక + ఇంచుక… ఇక్కడ మొదటి పాదంలో చివరి అక్షరం క లోపిస్తే ఇంచించుక అవుతుంది. క లోపించకుంటే ఇంచుకించుక అవుతుంది. అలాగే
నాడు+ నాడు…. నానాడు లేదా నాడు నాడు అనే రూపాలు కూడా ఏర్పడతాయి.
ఇక ఐదవ సూత్రం చూద్దాం
5) ఆమ్రేడితం పరమగునప్పుడు మధ్యమ ము,డుజ్ లకు లోపం విభాషనగు.
డు, ము, వు,లు మొదలైన విభక్తి ప్రత్యయాలు కాగా డుజ్,రు,వు,రు,ను,ముజ్ అనేవి క్రియా ప్రత్యయాలు. ఈ క్రియా ప్రత్యయాలలో మధ్యమ పురుషను చెప్పేటప్పుడు బహువచనములో ము ప్రత్యయము ఏకవచనంలో డు ప్రత్యయము అనేవి విభాషగా లోపిస్తుందని సూత్రార్థము. ఉండుము+ ఉండుము… సంధి జరిగితే ము లోపించి ఉండుండుము అవుతుంది. సంధి జరగకపోతే ఉండుముండుము అనే రూపాలు వస్తాయి.
ఇలాగే కొట్టుడు+ కొట్టుడు… కొట్టుకొట్టుడు
కొట్టుడు కొట్టుడు అనే రూపాలు వస్తాయి.
ఇక ఆరవ సూత్రం చూద్దాం!
ఆమ్రేడితంలో అనేక రకాలుగా కార్యాలు రావడం వలన అన్ని ప్రయోగాలకు సూత్రాలు నిరూపించడం కష్టం కనుక ఒక నిపాత సూత్రంతో వాటికి సాధుత్వం కల్పించాలని చిన్నయ సూరి ఈ సూత్రాన్ని చెప్పాడు. దాన్ని చూద్దాం!
6) అందదుకు ప్రభృతులు యథాప్రయోగముగా గ్రాహ్యములు.
వివరణ చూద్దాం! అందదుకు మొదలైనవి కవి ప్రయోగాలను యథాతథంగా స్వీకరించాలని సూత్రార్ధము.
అదుకు+ అదుకు….అందదుకు
ఇంకులు+ ఇంకులు..ఇఱ్ఱింకులు
ఇగ్గులు+ ఇగ్గులు… ఇల్లిగ్గులు
చెదురు+ చెదరు …చల్లచెదురు, చెల్లాచెదురు
తురుము+తురుము …తుత్తుమురు
తునియలు+ తునియలు… తుత్తునియలు మిట్లు+ మిట్లు, మిరుమెట్లు మొదలైనవి .
పైన ఉన్న ఉదాహరణలు పరిశీలించండి. ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్కరూపంలో ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సూత్రం సృష్టించడం కష్టం కనుక ఇలా సూరి తెలివిగా నిపాతం చేశాడు.

March 17, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మనసు చెమ్మ

by Chandaluri Narayana Rao March 17, 2024
written by Chandaluri Narayana Rao

మనసుది  బహు పెలుసు 
ఇష్టం చిట్లి 
విరిగి కుప్పకూలితే ?

నలిగే మనిషి కేక
వినబడని లోతులో పడి
కంటికి కనిపిస్తుందా?

జ్ఞాపకాల సుడిలో
తునకలైన మాట
ఖాళీ ముఖంలో తేలి

ఎండిన పరిచయానికి
చులకనతో చిరిగి
గాలికి కొట్టుకుపోతూ

పొట్లిన రోజులకి
మనిషి స్తంభంలా ఒరిగి
మనసు పగుళ్లు బారి

కల ఇంకిన కళ్ళలో
చీకటి సెగల మధ్య
కోరిక ఆరిపోతున్నా

వెన్నుముకకు 
వ్రేలాడే శరీరంలోనూ
మనసు చెమ్మ రేగుతునే ఉంది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 17, 2024
written by Narendra Sandineni

అన్నవరం దేవేందర్ తెలంగాణ పల్లె సోయగం అరుగు కవిత్వం.
భరోసా కవిత.
ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండల ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల, అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని అరుగు కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన అరుగు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది. నాలో ఆలోచనలు రేకెత్తించింది.తెలంగాణ పల్లెల్లో ప్రతి ఇంటి ముందట అరుగు ఉంటుంది.కవి దేవేందర్ అరుగు పై వ్రాసిన కవిత ఆద్యంతం మనోహరం.అరుగు కవిత చరణాల్లోకి వెళ్ళి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకోండి. “ఇల్లు వాకిలి ఇంటి చుట్టూరా పడారి “గోడకు ఆనుకునే అటు ఇటూ అరుగులు “ఆడ కూకోని పెట్టుకున్న ముచ్చట్ల మురిపాలు “ఇప్పటికీ చెవుల్ల వినిపిస్తున్న జ్ఞాపకాలు” మొదటి నాలుగు కవితా చరణాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి.తెలంగాణలో పాడిపంటలతో పొంగి పొర్లే పల్లెలు ఎక్కడ చూసినా చెట్టు చేమలతో ఎంతో అద్భుతంగా ఉండేవి.ఈనాడు ఆ పల్లెలు తన సహజ సౌందర్యాన్ని కోల్పోతున్నాయి.పల్లెలో వర్షాలు లేక పంటలు పండక కరువు విలయతాండవం చేస్తున్నది.

ఈనాడు పల్లె జనం పల్లెను విడిచి పట్నాలకు వలస వెళుతున్నారు. ఆరుగాలం కష్టించే అన్నదాత ఇవ్వాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు.పల్లెల్లో ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది.ఆ పల్లెల్లో నివసించే జనాలు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని అరుగుల మీద కూర్చుండి వాళ్ళ కష్ట సుఖాలు కలబోసుకునే వారు. పల్లెలో జనాలు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వారు.పల్లెలో ఎంతో మంచి అనుకూలమైన వాతావరణం ఉండేది.ఇప్పుడు పల్లెల్లో కూడా పట్టణమునకు చెందిన ఘర్షణ వాతావరణం ఏర్పడింది.పల్లెలోని అరుగులు,ఇండ్లు ప్రేమాభిమానాలకు నెలవుగా ఉండేవి.పల్లెలో జనాలు ఆ పాత ఇండ్లను,ఇంటి గుమ్మం ముందు ఉన్న పాత అరుగులను కాపాడుకోడం లేదు.పల్లెలో అరుగులపై కూర్చుండి జనాలు ఆడినారు, పాడినారు,పడుకున్నారు.ఆనాటి పల్లె ప్రజలు ఇప్పుడు ఎవ్వరు లేరు.కాలం వారిని తన వెంట తీసుకుపోయింది.పల్లెలోని కొందరు ఉపాధి పేరిట పల్లెను విడిచి పట్టణాలకు వలస వెళ్ళినారు. ఇప్పటికీ పల్లెను నమ్ముకుని జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు.పల్లె అరుగుల మీద కూర్చుండి ఇప్పటికీ కొందరు తమ కష్ట సుఖాలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.పల్లెలో జనాలు అరుగుల మీద కూర్చుండి మాట్లాడుకోవడం,ఇప్పటికీ అదొక వేడుకగా కొనసాగుతుంది. “వాకిట్లోనే శాద బాయి దాని పొన్న జాలారి “పక్కన్నే పెరిగిన బంతి చెట్ల వరుస “పొద్దుగాల రోజూ కాల్రెక్కలు కడుక్కుంటాంటే “కంటికి ఇంపుగ కనిపించే బంతిపూల సొగసు”. తెలంగాణలో పల్లె ఎలా ఉంటుంది.పల్లె రూపు రేఖల గురించి మనకు పరిచయం చేస్తున్న వాక్యాలు ఇవి. తెలంగాణ మట్టిలో పూసిన మాణిక్యాల వలె మనకు అరుగులు కనిపిస్తున్నాయి.తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంటి వాకిట్లో చేద బావి ఒకటి ఉంటుంది.చేద బావి పక్కనే జాలారి ఉంటుంది.చేద బావి లేని వాళ్లు పక్కింట్లో నీళ్లు తోడుకొని పోతుంటారు. తెలంగాణ పల్లె జనాల్లో నెలకొన్న ఆప్యాయతలు, అనుబంధాలు మనసును అబ్బురపరుస్తాయి.ఒక ఆనంద లోకంలోకి మనల్ని తీసుకువెళ్తాయి.పల్లె పల్లె ఆంతా ఒక వసుధైక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.తెలంగాణ పల్లె ఎక్కడ కని విని ఎరుగని చిత్రమైన దృశ్య కావ్యంలా అగుపిస్తుంది.అలనాటి రామ రాజ్యం రోజులను గుర్తుకు తెస్తుంది.జాలారిలో నీళ్లు నిలవకుండా చూస్తారు.జాలారిని ఆనుకొని ప్రతి ఇంట్లో బంతి చెట్ల వరుస ఉంటుంది.పొద్దుగాల రోజు కాల్రెక్కలు కడుక్కుంటుంటే కంటికి ఇంపుగా కనిపించే బంతిపూల సొగసు మధుర మనోహరంగా ఉంటుంది.చూడడానికి బంతిపూలు ఎంతో అందంగా ఉంటాయి.బంతిపూలు రెండు రకాలు. రిక్క బంతిపూలు మరియు ముద్దబంతి పూలు. మనకు ఘంటసాల పాడిన సినిమా పాట ముద్దబంతి పూలు మూగ కళ్ళ ఊసులు ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే ఈ పాట ఎన్నిసార్లు విన్నా మన హృదయం పరవశించి పోతుంది.మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.అందుకే వాటిని అపాత మధురాలు అంటారు.ఆ బంతి పూలు స్త్రీలు తమ సిగలో అలంకరించుకుంటారు.మరియు కొందరు మాల అల్లి తమ కులదేవతకు సమర్పించుకుంటారు.పల్లెలో ప్రతి ఇంటిలోనూ తోటలో చేనులు చెలకల్లోనూ పొలాల గట్ల మీదనూ బంతి చెట్లు పెంచుతారు.బంతిపూల సొగసు పరిమళాలు కమనీయంగా రమణీయంగా ఉంటాయి.పల్లెలో ప్రతి ఇంటి ముందు పందిరి వేస్తారు.దానిమీద ఈత కమ్మలు,తాటి కమ్మలు మరియు వరిగడ్డితో కప్పుతారు.పల్లెలో పందిరి కింద మంచం వేసి ఉంటుంది.పల్లె జనాలు పందిట్లోనే కూర్చుండి ముచ్చట్లు పెడతారు.వారు అలసి పోయినప్పుడు మంచంలో సేద తీరి అక్కడే పందిరి కింద నిద్రపోతారు. “పెద్దర్వాజ ముందల పరుచుకున్న పందిరి. “గుంజల మీంచి పచ్చగా పారిన అన్వే తీగ. “చిన్నపిందె రోజింత రోజింత పెరిగిన అన్యే కాయ. “అమ్మ తెంపకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే. “ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు”. పెద్దర్వాజల ముంగల తెలంగాణలో ప్రతి ఇంటి ముందు పరుచుకున్న పందిరి ఉంటుంది.పందిరికి వర్షాకాలం రాగానే అనియపు విత్తనాలు నాటుతారు.పల్లెలో అనియపు తీగే పెరిగి పెద్దయి పందిరి నిండా పరుచుకుంటుంది.అనియపు చెట్టు లెక్క లేనన్ని కాయలు కాస్తుంది.సొర కాయలను ఆ ఇంటి వారు తినడమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారికి పంచుతారు.కవి దేవేందర్ తన కవితలో చిన్న పిందె పెరిగి పెద్దది కాగానే అమ్మ తెంపుకపోయి పొయ్యి మీద గోలిస్తాంటే ఇల్లంతా కమ్మ కమ్మని వాసన నోర్లల్ల ఊరిల్లు ఊరుతాయని అంటున్నాడు.అమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందనేది జగమంతా ఎరిగిన సత్యం.ప్రతి పల్లెలో అమ్మ ఎప్పుడు ఇలానే కమ్మ కమ్మగా వండి పెడుతుంది.తెలంగాణలో ప్రతి అమ్మ కుటుంబం కొరకు ఆరుగాలం కష్టపడుతుంది.అమ్మ తన భర్తతో,పిల్లలతో, బంధువులతో మరియు ఇరుగు పొరుగు వారితో ఎంతో సఖ్యతగా మెలుగుతూ కుటుంబాన్ని గుట్టుచప్పుడు కాకుండా గుంభనంగా ఎంతో నేర్పుగా అలవోకగా కొనసాగిస్తుంది.పల్లెలో కోడి కూతతోనే ఆ తల్లి నిద్ర లేస్తుంది.అమ్మ ఇల్లును మరియు వాకిలిని శుభ్రంగా ఊడ్చుతుంది.అమ్మ వాకిలిని పెండ నీళ్లతో కల్లాపి (సాన్పు) చల్లుతుంది. అమ్మ వాకిట్లో సుద్ద మట్టితో ముగ్గులు వేస్తుంది. రంగవల్లులతో వాకిలిని తీర్చిదిద్దుతుంది.అమ్మ ఇల్లు మొత్తం ఎర్రమట్టి కల్పిన పిడుసతో అలుకుతుంది. అమ్మ పశువుల పేడ తీసి వేసి పశువుల కొట్టం శుభ్రం చేస్తుంది.అమ్మ పశువులకు కుడితి నీళ్లు పెడుతుంది.అమ్మ పాలిచ్చే బర్ల పాలు పిండుతుంది. తర్వాత మగ వాళ్ళు పశువులను తోలుకొని వ్యవసాయ పనులకు తరలిపోతారు.అమ్మ తర్వాత పొయ్యి గద్దెలు పుట్ట మట్టి పిడుసతో అలుకుతుంది. తర్వాత పొయ్యి ముట్టించి పాలు వేడి చేస్తుంది. “పదారి గోడకు పొడుగుతా “ఎర్రలుకు మీద సున్నం తీనెలు ,”కడపలకు పుధిచ్చిన పసుపు పండుగ శోభ “ఎర్ర కుంకుమ,పసుపు,తెల్లబొట్ల సింగారం “గల్మల్ల నిలబడంగనే కండ్లకు ఇంపైన మురిపం.” మన తెలంగాణలో ప్రతి పల్లెలోని ఇల్లు ఇలానే ఉంటుంది.పడారి గోడకు పొడుగుతా ఎర్ర మట్టితో అలుకుతారు మరియు సున్నంతో బొట్లు పెడతారు. పల్లెలో దర్వాజా మరియు కడపలకు పసుపుతో అలంకరించి ఎర్ర కుంకుమ పసుపు తెల్లబొట్లతో సింగారం చేస్తారు.ప్రతి ఇంట ఇలానే అలంకరణ చేసి శుభ్రంగా ఉంచుతారు. “పెరట్లో సన్న సన్నగా ఎగబాకుతున్న మల్లె తీగ”. ప్రతి ఇంటిలో మల్లె చెట్టు ఉంటుంది.మల్లె పూల పరిమళం ఎంతో కమ్మగా ఉంటుంది.మల్లె పూలను ఆడవాళ్లు తమ సిగలో అలంకరించుకుంటారు. “గోడ అవతల నుంచి చల్లగాలి విసురుతున్న యాపలు” వేప చెట్టు గాలి ఎంతో అద్భుతంగా ఉంటుంది.వేప చెట్టు గాలి గురించి చెప్ప తరం కాదు.వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజిస్తారు.వేప ఆకులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.వేపాకును ఇళ్లల్లో టేకు దూలాలు అమర్చి టేకు పరోటా చెక్కలను కొట్టిన తర్వాత దానిమీద వేపాకు పరిచి తర్వాత గూన పెంకలు కప్పుతారు.పల్లెలో నివసించే జనాలు గూన పెంకలతో ఇల్లు కట్టుకునే వారు. పల్లెలో గూన పెంకల ఇల్లు కూడా చాలా చల్లగా ఉంటుంది.కాలం మారింది.ఇప్పుడు గూన పెంకల ఇండ్లు కట్టడం లేదు.పాత గూన ఇండ్లు సరైన మరమ్మతులు లేక కూలిపోతున్నాయి.పల్లెల్లో కుటుంబాలు పెరిగి పాత ఇండ్లను విడిచి రోడ్డుకు దగ్గరగా వెళ్లి స్లాబ్ బిల్డింగులు కట్టుతున్నారు.పాత పల్లెలు బీడు పడుతున్నాయి.పల్లెలో జనాలు రోడ్డు దిక్కు వచ్చి షాపులు సెట్టర్లతో ఇల్లు కట్టి ఉంటున్నారు.పల్లె వాతావరణం కనుమరుగు అవుతున్నాయి. కొన్నాళ్లకు గూన పెంకుల ఇండ్లు ఉండవు. “ఆ కళల వాకిట్లో గడెంచ పరుచుకొని ఒరుగుతే” “కాకులు కోయిలలు వూరవిష్కల పలకరింపులు” “దూరంగా గోడ సూరుకు ఉరుకుతున్న ఉడతల జోడి”. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. పల్లెలో జనాలు చెట్ల కింద ఒరిగితే కాకులు కోయిలల కుహు కుహు రావాలు,ఊరవిష్కల కితకితలు,ప్రతి ఇంట్లో జామ చెట్టు,ఆ జామ చెట్టు మీద ఉడతల జోడి కనబడుతుంది. ఉడతలు, రామచిలుకలు జామ పండ్లు తింటాయి. “ఊళ్లే మా ఇల్లు వాకిళ్ళ కమనీయ దృశ్య కావ్యం”. తెలంగాణలో ప్రతి పల్లెల్లో ఇల్లు ఎలా ఉంటుందో అరుగు అనే కవిత ద్వారా కవి దేవేందర్ చాలా చక్కగా గ్రామీణ వాతావరణాన్ని తెలియపరిచారు. పల్లెలో పుట్టి పెరిగిన దేవేందర్ పల్లెలోని మట్టి పరిమళాన్ని పల్లె సోయగాన్ని ఎంతో ఆకలింపు చేసుకొని ఇలాంటి వాస్తవిక కవితను రాశాడని తోస్తోంది.తెలంగాణ పల్లెల్లో పుట్టిన దేవేందర్ తెలంగాణ పల్లె సంస్కారాన్ని పుణికి పుచ్చుకొని తెలంగాణ పల్లె ఎలా ఉంటుందో అరుగు కవిత ద్వారా మనకు అందించారు.ఇప్పటికీ మన తెలంగాణ గ్రామాల్లో అరుగులు ఉన్నాయి.సబ్బండ వర్ణాల ప్రజలు తమ ముచ్చట్లు మురిపాలతో అరుగు మీద తేలిపోతుంటారు.అరుగు కవిత చదివితే మాభూమి సినిమా చూసినట్టుగా ఉంది. గ్రామీణ వాతావరణం మన కళ్ళకు కదలాడుతుంది. మా భూమి సినిమా తీసింది మన తెలంగాణకు చెందిన పల్లె బిడ్డ బి.నర్సింగరావు.తెలంగాణ పల్లె ముఖచిత్రంలో ఇప్పటికీ అరుగు నిలిచి ఉంది.పల్లె వర్తమానంలో కూడా అరుగు ఉంది.పల్లె భవిష్యత్తులో కూడా అరుగు ఉంటుంది.పల్లె వాకిట్ల చేద బావి దాని పొంటి జాలారి,పడారి గోడ పక్కనే పూల చెట్లు,పూబంతులు ముద్దబంతులతో కూడిన ఎన్నెన్నో పూల తోటలు కనిపిస్తాయి.పల్లెలో ఆ పూల వనాలు మన మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. పల్లెలో పండగలప్పుడు ప్రతి ఇంటి దర్వాజలకు బంతిపూల మాలలు కట్టి అలంకరిస్తారు.ప్రతి ఇంటికి మామిడి తోరణాలు కడతారు.దేవుని గదిలో బంతి పూల మాలలతో తమ ఇష్ట దైవాన్ని కొలుస్తారు. పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనంతో చెట్టు చేమలతో ప్రకృతికి పర్యాయ పదంలా కళకళలాడుతుంటుంది. తెలంగాణలో పల్లెల్లో ప్రతి ఇంట అరుగు శోభించాలని మనమంతా కోరుకుందాం.పల్లె వాతావరణం తలపించేలా అరుగు కవితను రాసిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.


అన్నవరం దేవేందర్ భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి,రిటైర్డ్ సూపరింటెండెంట్,మండలం ప్రజా పరిషత్ కార్యాలయం,ముస్తాబాద్,జిల్లా సిరిసిల్ల,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన ఇంటి దీపం కవితా సంపుటిలోని భరోసా కవిత పై విశ్లేషణా వ్యాసం.తెలంగాణ మాండలికంలో రాసిన భరోసా కవితను ఆసక్తితో చదివాను‌.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.భరోసా కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.ఇవ్వాళ సమాజంలో మనిషికి భరోసాను ఇచ్చేవారు అరుదుగా కనిపిస్తారు.హామీ ఇవ్వడం,స్థిరముగా చెప్పుట అనేవి భరోసాకు అర్థం.ఎవరి ఆందోళననైనా
తగ్గించడానికి ఉద్దేశించిన సలహా భరోసా.ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అతనికి చెప్పు ఓదార్పు మాటలు భరోసా.నేను ఇది చేస్తానని ఖచ్చితంగా చెప్పడం భరోసా.కవి దేవేందర్ భరోసా కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.
“ఎవుసం ఎటమటమైతేంది
“ఎట్లనన్నా బతుక రాదా
“సచ్చుడు ముచ్చట ఎందుకు సాయిలు నాయినా !
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మొక్కలను,జంతువులను పోషించి తద్వారా ఆహారాన్ని,మేతను,జనప నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయము లేదా కృషి అంటారు.వ్యవసాయం చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశం. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయాభివృద్ధి ఒక కీలకాంశంగా చెప్పవచ్చు.వెనుకటి కాలంలోనే ఎవుసం బాగుండేది.గప్పటి ఎవుసం వేరు.ఇప్పటి ఎవుసం వేరు.అప్పుడు ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం పని చేసే వాళ్లు.ఈనాడు అప్పటి తీరుగా ఇంటిల్లిపాది అందరూ కలిసి ఎవుసం చేయుట లేదు.అప్పుడు అడవి జంతువుల బెడద లేకుండేది. కాలం మారింది.ఇప్పుడు అడవి జంతువుల బెడద ఉంది.కాలం కలిసి రాక వ్యవసాయంలో పంట దిగుబడి రావడం లేదు.కరువు కాటకాల వల్ల పంట దెబ్బతింది.వ్యవసాయంలో పంట రాలేదని ఎందుకు బాధ పడుతున్నావు‌.కాలం కలిసి రాకనే కదా పంట రాక పాయె.పంట దెబ్బతిందని నువ్వు ఇంత దిగులు ఎందుకు పడుతున్నవు.పంట లేక పోయినా ఎట్లనన్నా బతుక రాదా? అని ప్రశ్నిస్తున్నాడు. చనిపోవడం ముచ్చట ఎందుకు చెపుతున్నావు సాయిలు నాయినా అని అతను ఓదార్చుతున్నాడు. సాయిలు నాయిన ఎవుసం చేసే రైతు అని తోస్తోంది.రెక్కలు ముక్కలు చేసుకుని ఎవుసం చేసినప్పటికి పంట దిగుబడి లేక పోవడం వలననే దిగులు పడిన సాయిలు నాయినను ధైర్యం కలిగిస్తూ ఓదార్చుతున్నాడు.
“కలీగం మీద మనుషులందరు
“ఎవుసమే చేస్తండ్రా
“ ఎన్నో తీర్లుగ బతుకుతుండ్రు.
వేదాల ననుసరించి యుగాలు నాలుగు.1) సత్య యుగం 2) త్రేతా యుగం 3) ద్వాపర యుగం 4) కలి యుగం.ప్రస్తుతం నడుస్తున్న యుగం కలియుగం.కలి యుగంలో అన్యాయం,అధర్మం చెలరేగుతుంది. మంచి వాళ్లకు చెడు ఎదురవుతూ ఉంటుంది. కలియుగంలో నివసిస్తున్న మనుషులందరూ వ్యవసాయం వృత్తిగా చేసుకొని బతుకుతున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసిస్తున్న మనుషులందరు వివిధ రకాల వృత్తులు చేపట్టి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.నీ లాగా ఒక్కటే వ్యవసాయం చేసి మనుషులు బతకడం లేదు.కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మనుషులు తమ బతుకు గడపడానికి ఎన్నో పనులను ఎన్నో తీర్లుగా చేస్తున్నారు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“వో ఫసల్ లుక్సనా అయితది
,”మల్లో పంటకన్నా పచ్చగుండదా
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
“భూమిల నీళ్లు పాతాళం పట్టచ్చు
‘ మొగులుకు కనికరం లేక పోవచ్చు
“ ఆవుసు తీసుకుంటవా ! అన్యాలం చేస్తవా !
ఫసల్ ఉర్దూ పదం.ఫసల్ అనగా పంట.వ్యవసాయం చేస్తున్న రైతుకు వాతావరణం అనుకూలించకపోతే పంటలు పండవు. వర్షాలు లేక కరువు ఏర్పడి ఒక పంట చేతికి రాకపోతే నష్టం వస్తుంది.అంత మాత్రానికే బెంబేలు పడకూడదు.మరుసటి సంవత్సరం వర్షాలు కురిసి పచ్చని పంట చేలతో కళకళలాడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
“కాలం కర్మగాలి
“ఎవుసం ఎల్లెల్కల పడచ్చు
గడియారం తెలిపేది కాలం.నిమిషాలు గంటల గురించి తెలిపేది కాలం.ఏదైనా పనిచేయుటకు ఇచ్చు సమయం కాలం.ఆగమన్న ఆగనిది కాలం. భూత వర్తమాన భవిష్యత్తులను కలిపి చెప్పబడేది కాలం.కర్మ అంటే సరియైన అర్థం పనిచేయడం. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చేసే ప్రతి పని కర్మయే.నిద్రించడం,శ్వాసించడం,ధ్యానించడం,తపస్సు,మౌనం, భుజించడం,ఉపవసించడం కర్మ. జీవించి ఉన్న ప్రాణి కర్మ చేయకుండా ఉండ లేడు. మనం నివసిస్తున్న వర్తమాన కాలంలో మనుషులు తాము చేస్తున్న కర్మల వల్ల ఫలితం అనుకూలంగా రాక నష్టపోవడం జరుగుతుంది.రైతు చేస్తున్న వ్యవసాయం ప్రకృతి మాత కరుణించకపోవడం వల్ల పంట రాకపోవడం జరుగుతుంది.ప్రకృతి మాత ప్రసాదించిన నీరు పాతాళానికి చేరి మనం చేస్తున్న వ్యవసాయ పంటకు నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండి పోవచ్చు.వరుణ దేవుడు కరుణిస్తేనే ఆకాశం నుండి వర్షం కురుస్తుంది.ఆకాశం దయ చూపించకపోవడం వల్ల వర్షం పడక పోవచ్చు.అంత మాత్రాన ఏదో అయిందని ఎందుకు తొందర పడుతున్నావు అని ఓదారుస్తున్నాడు.పంట పండలేదని ప్రాణం తీసుకుంటవా? అన్యాయం చేస్తవా? అని ప్రశ్నిస్తున్నాడు.
“రాజస్థాన్ కరువు రైతులే
“మన తాన స్వీట్లు దుకాండ్లు నడుపుతుండ్రు.
రాజస్థాన్ ఎడారి ప్రాంతం.అక్కడ నివసించే కరువు రైతులు వ్యవసాయంలో రాబడి రాక మన తెలంగాణ రాష్ట్రంకు వచ్చి స్వీట్ల దుకాణాలు పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు.రాజస్థాన్ వాళ్లు అక్కడ ఎల్లు మాను లేక ఇక్కడి ప్రాంతానికి వచ్చి పొట్ట పోసుకుంటున్నారు.రాజస్థాన్ వాళ్ళని చూడు అని చెబుతున్నాడు.
“నేపాల్ బక్క ఎవుసం చేసేటోల్లే
“సలి కాలం ఉన్ని దుస్తులు అమ్ముతుండ్రు.
నేపాల్ దేశం ప్రజలు అక్కడ వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.కానీ వాళ్ల దేశంలో బతుకు బండి సాగక మన దేశంకు వచ్చి చలి కాలంలో ఉన్ని దుస్తులు అమ్మి జీవనం కొనసాగిస్తున్నారు.పుట్టి పెరిగిన నేపాల్ దేశం విడిచి వచ్చి ఇక్కడ బతుకు గడుపుతుండ్రు అనేది వాస్తవమని చెప్ప వచ్చు.
“నాలుగు గీరెల బండి మీద
“కారీలు అమ్ముకుంట తిరిగేటాయన
“మన పక్కపొన్న మహారాష్ట్ర మనిషి.
పొద్దున లేవగానే మన గడప ముందుకు వచ్చి నాలుగు గీరెల బండి మీద కారీలు,తినే పదార్థాలు అమ్ముకుంటా తిరిగే ఆయన మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు చెందిన వాడు.అతను మహారాష్ట్ర ప్రాంతమును విడిచి పెట్టి బతుకు తెరువు కొరకు ఇక్కడికి వచ్చి భార్యా పిల్లలతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
“బతుకు తెరువు లేక
“సోలపురం భీవండి సూరత్ పోయినోల్లను
“ఎందరిని సూల్లేదు ఎన్కటి నుంచి.
మన ఊళ్లో బతుకు తెరువు లేక ఎంతో మంది అన్ని కులాల కుల వృత్తులు చేసుకునేటోళ్లకు ఇక్కడ మన ఊరిలో పని దొరకక సోలాపురం,భీవండి,సూరత్ వంటి ప్రాంతంకు వెళ్లి అక్కడనే పని చేసుకుంటూ భార్యా పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నారు.మన ఊరుని విడిచి పెట్టి వేరే ప్రాంతంలో బతుకు గడుపుతున్నారు.
“అప్పులు కావచ్చు తిప్పల అవుతుండొచ్చు
“వూరు దాటి పోయన్న బతికి రావాలె
“ఉసూరుమంట పాణం తీసుకుంటె ఎట్లనే
“పోనీ సస్తే మాఫీ అయితయా నాయన.
మనిషన్న వాడికి ఎల్లు మాను లేక అప్పులు అయితయి.మనుషులకు కాకుంటే అప్పులు మానులకు అయితయా.అప్పులతోనే తిప్పలు అయితది.అప్పులు ఇచ్చిన అతడు అప్పు తీర్చమని వెంటపడి వేధిస్తాడు.అప్పులు ఉన్నయని ప్రాణం తీసుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పులు తీర్చలేక నీవు చనిపోతే నీవు చేసిన అప్పులు మాఫీ అయితయా నాయనా అని ప్రశ్నిస్తున్నాడు.
“పుల్కు పుల్కున సూస్తున్న
“పొలగాండ్ల మొకమన్న సూడు
“ ఇంటామె నెత్తి నోరు కొట్టుక సస్తది
“ఇల్లంతా ఆగం పక్షి అయితది.
ప్రాణానికి ప్రాణంగా ఎంతో ప్రేమగా నీ వంక చూస్తున్న పిల్లల ముఖము ఒకసారి చూడు.ఒక్క సారి నీ పిల్లల మొఖం చూస్తే నీకు బాధగా అనిపించదా?నీతో పెన వేసుకున్న బంధమైన నీ భార్య,ఇంటామె నీవు లేకుంటే నెత్తి నోరు కొట్టుకుని గోడు గోడున ఏడ్చి చనిపోతది.నీవు లేకుండా నీ ఇల్లు,నీ కుటుంబం గూడు లేని పక్షిలా జీవితం అస్తవ్యస్తం అయితది.గూడు లేని పక్షిలా ఏడ్చి చావదా?అప్పులు చేసినోళ్లు అందరూ ప్రాణాలు తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నాడు.పెద్ద పెద్ద బడా బాబులు దేశాన్ని ముంచి కోట్లకు కోట్లు అప్పులు ఎగ్గొట్టి తిరుగుతున్నారు. కోట్లు అప్పులు చేసి అట్టి అప్పులు ఎగ్గొట్టి సుఖంగా బతుకుతున్నారు.అందులో నీవు చేసిన అప్పు ఏ పాటిది.చాలా చిన్నది.నీవు కష్టం చేసి మళ్లీ ఆ అప్పును తీర్చగలవు అని ఓదారుస్తున్నాడు.
“ఎవుసమే కాదు నాయినా
“ఎన్ని దందలైనా చెయ్యొచ్చు
“ఎద్దూ ఎవుసాన్ని కొన్ని రోజులన్నా
“బందుకు పెట్టు
“బతకనీకి బహు మార్గాలు
“వూరిడువు,ఇల్లిడువు,పల్లె ఇడువు
“కాల్రెక్కలున్నయ్ ఏన్నన్న చేస్క బతుకు
“లోకానికి ఇన్ని రోజులు అన్నం పెట్టినోనివి
“లోకం నీకు ఇప్పుడు అన్నం పెట్టదా !
వ్యవసాయం వృత్తిగా చేయడం కాదు.బతకడానికి ఎన్ని పనులైనా చేయవచ్చు.నీవు చేస్తున్న ఎద్దు ఎవుసాన్ని కొన్ని రోజులు చేయకుండా మాని వేయి అని సలహా ఇస్తున్నాడు.ఈ సమాజంలో బతకాలంటే లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి.నీవు బతకడం కొరకు ఊరిని విడిచి వెళ్లి పోవచ్చు.నీవు బతకడం కొరకు ఇల్లును విడిచి పెట్టు.నీవు బతకడం కొరకు పల్లెను విడిచి పెట్టు.నీవు ఇప్పుడు పట్నంకు పోయి బతుకు.నీ కాళ్లు రెక్కలు చక్కగా పని చేస్తున్నాయి.ఎక్కడికన్నా పోయి ధైర్యంగా ఏదైనా పని చేసుకుని బతుకు.లోకానికి నీవు ఇన్ని రోజులు అన్నం పెట్టిన అన్నదాతవు.అట్లాంటి అన్నదాత అయిన నీకు లోకం ఇప్పుడు అన్నం పెట్టదా? అని ప్రశ్నిస్తున్నాడు.భరోసా కవిత ద్వారా సాయిలు నాయనకు జీవితం పట్ల ఆశ కలిగేటట్టు చేస్తున్నాడు.సమస్యలు ఉన్నాయని బాధపడ వద్దు. నీవు ఎక్కడైనా కష్టపడి పని చేస్తే నీ సమస్యలు ఇట్టే తొలగిపోతాయి.ఈ కవిత ఎన్నో ఉదాహరణలతో రైతు సాయిలుకు మనో ధైర్యాన్ని,భరోసాను కల్పించేదిగా తోస్తుంది.దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు భరోసా కవిత ద్వారా పరిష్కారాన్ని చూపిస్తున్న కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అపార్ధం

by Devulapalli Vijayalaxmi March 17, 2024
written by Devulapalli Vijayalaxmi

అసహనంగా ఫోనులో వాట్సప్ ఓపెన్ చేసాడు రాజశేఖర్.
స్మార్ట్ ఫోను వచ్చినప్పటినించీ వాట్సాప్ ఓపెన్చేయ మెసెజెస్ డిలీట్ చేయా! దీనితో గంటల కొద్దీ సమయం వృధా అవుతోంది. పొరపాటున రెండు రోజులు చూడలేదంటే వార్నింగ్ ఇంటర్నల్ స్పేస్ నిండిపోయిందని. వద్దుమొర్రో అంటే అమ్మాయి రాజశేఖరానికి ,అబ్బాయి వాళ్ళమ్మకి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చారు.
“తెల్లారిందా! పిల్లలకంటే ఎక్కువైంది పొద్దూకులూ ఆ ఫోన్ పట్టుకుని.నాతోకాస్త మంచీచెడు మాట్లడదామనిలేదు. టిఫిన్ , భోజనం
ఆ ఫోన్ పట్టుకొని ఏం తింటున్నారో కూడా తెలియకుండా, ముగించేయడం. ఏమిటో బాబు మీ ధోరణి. కాస్త ఏ.గుడికో గోపురానికో అలా.నడుచుకొని వెళ్దామంటే.మోకాళ్ళ నొప్పులు మోక్షానికి అడ్డు..మీతో మాట్లాడుదామంటే మీకు ఆ వెధవ ఫోన్ తో సరిపోతుంది.” స‌రోజ సణుగుడు వాట్సప్ మెసేజెస్ కి మించి ఉంది.
నిజమే మరి రిటైర్ అయ్యేవరకు తన ఆలనా పాలనా చూసింది.పిల్లల్నిప్రయోజకుల్నిచేసింది.తను తన ఉద్యోగం సంపాదన,తప్పించి వేరే విషయాలు పట్టించుకోలేదు. ఇంటిపట్టునే ఉండి సంసారాన్ని దిద్దింది.యాంత్రికంగా బాధ్యతలతో జీవితం ఎలా గడిచిందో ఊహకి అందటంలేదు.స్వగతంగా అనుకున్నాడు రాజశేఖర్.
“సరూ! నీ సణుగుడు ఆపు. ఫోన్ చస్తున్నానని మొరపెట్టుఘకుంటోంది. డిలీట్ చేయలేదనుకో, వాట్సిప్ ఎగిరి పొయ్యిందంటే పిల్లలతో వీడియో. కాల్ మాట్లాడలేము”.
“సరే బాబు ఒక అరగంటలో ఆ పని కానీండి నేను ఈ లోగా వంటింట్లో పని పూర్తి చేసి వస్తా! యోగా మేట్స్ వేయండి.” అంటూ నిష్క్రమించింది.
పొద్దున్నే ఇద్దరూ కలసి శ్రీ శ్రీ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తారు. రిటైర్ అయ్యిన తరువాత ఒక క్రమశిక్షణని అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలు.అందులో భాగమే ఈ వ్యాయామాలు.
★★★
రాజశేఖర్ రిటైర్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఇంకా రావలసిన డబ్బు చేతికి అందలేదు. వాట్సాప్ లో “రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫ్రెండ్స్” గ్రూప్ లో చేరాడు. ఊరికొకడు గా చెల్లా చెదరవుతున్న సహచరులతో అనుబంధం ఉండాలని విషయాలు తెలుస్తాయని.
అందులో అతిఛాందసులు రోజూ ఏదో సూక్తి లేక దేముడి బొమ్మతో శుభోదయాలు, పండగల్లో శుభాకాంక్షలు పెడ్తూ ఉంటారు. కొందరైతే మరీ వాళ్ళ పిల్లలవి మనవలవి ఫోటోలు పెడ్తారు.ఎవరి గోల వారిదన్నట్లు ఉంటుంది గ్రూప్.
“అందరూ బాధ్యత గలిగిన ఉద్యాగాలు చేసి రిటైర్ అయ్యారు ఏంలాభం గ్రూప్ లో చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారు.” స్వగతంగా అనుకోబోయి కొంచెం గట్టిగానే అన్నాడు.
“ఏమిటండీ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?” చేయిచెంగుకి తుడుచుకుంటూ అడిగింది సరోజ.
“ఆ‍ఁ ! ఏముంది లేవంగానే నీకు ఇల్లూ వాకిలీ శుభ్రం చేసుకోవడం అన్నా అవుతుంది కాని ,నాకు దీన్ని శుభ్రం చేయటం కావటంలేదు.” అంటూ ఫోను చూపాడు.
“చక్రపాణి అయితే మరీను. వీడు గ్రూప్ లో చాలనట్లు పర్శనల్ గా శుభోదయం ,శుభాకాంక్షలు పంపుతాడు. ఎన్నోసార్లు చెప్పాను ఎక్కడో ఒకచోట పెట్ట రా! రెండుచోట్ల ఎందుకురా ?’అని.
దానికి వాడు, “ఒరేయ్ శేఖర్! అది మాస్ గ్రీటింగ్స్. ఇది నాప్రాణ స్నేహితుడికి పంపే స్పెషల్ కోట్స్. నీకో విషయం తెలుసా! నీకు పంపాలంటే గూగుల్ లో ఎంత సెర్చ్చేస్తానో !” అని.
ఏమిటో వాడి అభిమానానికి నవ్వాలో ఏడవాలోతెలియదు. అంటూ స్నేహితు జ్ఞాపకాల్లో హఠాత్తుగా వెన్ను చరచి నట్లయింది.
అవును దగ్గర దగ్గర నెల రోజుల్నించీ సరిగ్గా మెసేజెస్ డిలీట్ చేయడంగాని తిరుగు మెసేజ్ పెట్టటం చేయలేదు.తమ కంపెనీ రిటైర్మెంట్ గ్రూప్ వాళ్ళ కోర్ట్ కేస్ ఎంతవరకు వచ్చిందో చూడనేలేదు . దక్షిణ భారతదేశం తీర్ధయాత్రలకి వెళ్ళటం వచ్చాక కాస్త ప్రయాణం బడలికతో వళ్ళు వెచ్చపడటంతో .
మన గురువుగారివే చాలా ఉంటాయి అనుకుంటూ వాట్సప్ గ్రూప్ తెరిచాడు.
ఏ వేవో చవకబారు జోక్స్,ఫొటోలు తప్పించి శుభోదయం, శుభాకాంక్షలు లేవు.అలా అలా వెనక్కి వెళ్ళి చూస్తున్న నా మతిపోయింది. గత రెండు నెలలుగా చక్రపాణినించీ ఒక్క మెసేజ్ పంపలేదు.వాడి పర్సనల్ ఎక్కౌంటు చూసాను. రెండు నెలల క్రితం అంటే ఆగస్టు పదిహేనున ” స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు”అంటూ చక్రి మెసేజ్ .
దాని క్రింద తనతిట్లు.”ఒ‌రేయ్ చక్రీ!ఒక్కసారి ఫోన్ చేయవచ్చు కదరా! నువ్వు చెయ్యవు,నేను చేస్తే ఎత్తవు”అని. దాని కింద వాడి వైపునించీ ఒక స్మైలీ.
మా చదువు ఉద్యోగం ఒకే చోటవడంతో మా ఇద్దరికీ చాలా అవినావభావ సంబంధం. రిటైర్మెంట్ కి రెండు సంవత్సరాల ముందే వాడి భార్య కేన్సర్ వ్యాధితో పోవడంతో ఆ రెండేళ్ళు ఒంటరిగా అతి కష్టం మీద వంటరిగా సమర్ధించుకున్నాడు.పెద్ద కొడుకు ఢిల్లీలో డిఫెన్స్ లో చేస్తున్నాడు. చిన్నవాడుఅమెరికాలో.తనే సలహా ఇచ్చాడు “పిల్లలు వాళ్ళ దగ్గిరకితీసికెళ్తానంటే వాళ్ళదగ్గరకి వెళ్ళిపోరా!రెండు సంవత్సరాలనించీ చేయికాల్చుకుని అవస్తపడుతున్నావు.” అని.
“ఒరేయ్! ఢిల్లీ వెళ్తే ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదురా!కొడుకు కోడలు వారి ఉద్యోగాలలో వాళ్ళు బిజీ. మనవలు చదువులు.అందులో వాడికూతురు ఐ.ఏఎస్ కి ఎప్పియర్ అవుతోంది.తాత తాత అంటూ అదేకాస్త నాదగ్గరకి ఎక్కువ వచ్చేది” అన్నాడు.
“ఏది ఏమైనా నువ్విక్కడ వంటరిగా ఉండద్దు.
ఫోన్లో మాట్లాడుకుందాం!ఇండియా లోనే కదరా!నువ్వైనా రావచ్చు నేనైనా రావచ్చు.” అని కష్టం మీద ఫ్రెండ్సందరం కలిసి ఒప్పించారు.
గత రెండు నెలలుగా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తటం లేదు.అలా అని ఫోన్ డెడ్ ఏమో అనుకోవటానికి యధావిధిగా శుభోదయాలు, శుభాకాంక్షలు వస్తున్నాయి. మెసేజెస్ కి ఎమోజీ లు.
ఏది ఏమైనా ఇవాళ వాడితో మాట్లడాలని నిర్ణయించుకున్నా. అదేమాట సరోజతో చెప్పాడు రాజశేఖర్.
“అలాగా అండీ! జ్రోత్స్న పోయినప్పటినించీ అన్నయ్యగారు చాలా వంటరి వారయ్యారు సుమా!”
“అవును సరోజా!జంటలో ఏ ఒక్కళ్ళు వంటరిగా మిగిలినా వారి బ్రతుకు దుర్భరం.సరే ఇవాళ వాడితో ఎలాఅయినా మాట్లాడాలి. వాడు కాంటాక్టు లోకి వస్తే నిన్ను పిలుస్తా పలకరిద్దుగాని అంటూ వాడికి అదేపనిగా కాల్ చేస్తునే ఉన్నాడు. అటునించీ స్పందన లేదు. రాజశేఖరానికి పట్టుదల ఎక్కువైంది. రాత్రి ఎనిమిది గంటలైంది. రాజశేఖర్ మొహం వివర్ణమైంది. దుఃఖం తన్నుకు వస్తోంది. “ఏమైంది వాడికి?” అదేమాట సరోజతో అన్నాడు.
“ఫోన్ పారేసుకున్నారేమో! లేదా కొత్తఫోన్లో కాంటాక్ట్స్ లోడ్చేసుకోలేదేమో ! లేదా కొత్త నంబరు తీసు కున్నారేమో! “
సరోజ ఇన్ని కారణాలు చెప్పినా రాజశేఖర్ మనసు రాజీ పడలేదు. అతని మీద అతనికే కోపం వచ్చింది.
ఇండియాలోనే గా అన్నాడు కానీ వాడి ఢిల్లీ ఎడ్రస్స్ గానీ వాడి కొడుకు ఫోన్ నంబరు కానీ తీసుకోవాలని ఎందుకు అనిపించలేదు తనకి పిచ్చి వాడిలా?
నిజమైన స్నేహం అంటే ఇదేనేమో!స్వంత పిల్లల దగ్గరనుండి క్షేమసమాచారం తెలియక పోతే అల్లల్లాడినట్లు అల్లల్లాడిపోయింది మనసు.
“శేఖర్!కోవిడ్ తగ్గాక హైదరాబాద్ వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నా!ఎవరైనా ఉంటే చూడు.” అన్న వాడి మెసేజ్ గురించి ఆతృతగా వెదికా!
మెసేజ్ కనబడింది .ఆఁ ! ఆ మెసేజ్ ఆఖరి మెసేజ్ వాడు టైప్ చేసింది. తరువాత అన్నీ ఎమోజీలు స్మైలీ లు.
నా ఆలోచనలకి అంతరాయంకలిగిస్తూ ఫోన్ మ్రోగింది.చక్రపాణి దగ్గరనించీ.ఒక్కక్షణం సంతో్షం వెంటనే విపరీతమైన కోపం వచ్చింది.ఫోన్ ఎత్తుతూనే ఛడామడా తిట్లవర్షం మొదలుపెట్టా!”ఇడియట్! నన్నింత టెన్షన్ పెట్తావా” అంటూ.
“అంకుల్! నేను రాకేష్ ని.చక్రపాణిగారి పెద్దబ్బాయిని”
“అవునా బాబూ రాకేష్!బాగున్నావా!వాడికివ్వు ఫోన్.”
“అంకుల్ ! నాన్నగారు లేరండీ!”
“అమెరికా వెళ్ళాడా ఫోన్ మరచిపోయి‌‌‌‌‌.వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ బాబూ.”
“లేదండీ !నాన్నగారు పరమపదించి నెలైంది.
ఇవాళ మాసికం ఇక్కడ దగ్గర సంస్థ లో పెట్టివచ్చాం. నాన్నగారి ఫోన్ చాలా రోజులుగా కనపడలేదు. బాయ్ ఎక్కడోపెట్టి వెళ్ళిపోయాడు. నాన్నగారి గది శుభ్రం చేస్తుంటే కనపడింది. చార్జ్ లేకపోవటం తో చార్జికి పెట్టి ఇప్పుడే నాన్నగారి ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెట్దామనుకుంటుంటే మీ మిస్డ్ కాల్స్ చూసా!
ఫారెన్ ఎంబసీస్ ని రిసీవ్ చేసుకోవటం వారి సెక్యూరిటీ ఎరేంజ్మైంట్స్ తో నాన్నగారు పోయాక కంటినిండా ఏడవలేదు అంకుల్ .”
రాకేష్ !గద్గద స్వరం విని రాజశేఖర్ తల తిరిగి పోయింది.
బలవంతంగా తెప్పరిల్లి ,”ఎలా జరిగింది బాబూ రాకేష్ ” .
“నాన్నగారికి మూడునెలల క్రితం పరాలిటిక్ స్ట్రోక్ వచ్చి మాట పడిపోయింది.ఒకచేయి.కాలు పడిపోయాయి. అప్పటినించీ మంచంలోనే ఉన్నారు. ఫిజియోథె‌రపీకి మెడిసిన్స్ కి రెస్పాండ్ కాలేదు.” ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం బ్రయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం ఇవ్వలేదు.అంతా క్షణాలమీద అయిపోయింది దుఃఖాన్ని అదిమి పెట్టుకొని వివరాలు అందించాడు రాకేష్.
“మరి ఆ మెసేజెస్……” రాజశేఖర్ మాట పూర్తి కాకుండానే….,.
“నాన్న గారికి ఒక బాయ్ ని కుదిర్చాము. ఆయన అవసరాలు తీర్చటానికి.వాడి కి ఫోన్ యూసేజ్ బాగా తెలుసు.ప్రతిరోజు ఆయన కాలకృత్యాలు తీర్చిన తరువాత ఆయన చూపెట్టిన వాళ్ళకి గుడ్ మాణింగ్ మెసేజెస్ పంపమనేవారు.మెసేజెస్ చదివి ఎమోజీలు పంపమనే వారు.పండగలకి నేనే గ్రీటింగ్స్ డౌన్ లోడ్ చేసే వాడిని.అవి పంపేవారు. ఆయన ఫ్రెండ్స్ మెసేజెస్ చదువుతుంటే కళ్ళలో ఒక స్పార్క్ చూసేవాడిని. నాబిజీ లైఫ్ లో ఆయన పరిస్థితి మెసేజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు . కాకపోయినా ఆయనకి సింపతీ ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంకుల్ అందుకని.
అంకుల్ మీరెలా ఉన్నారు? మీతో మాట్లాడుతుంటే నాన్నతో మాట్లాడినట్లుంది.గుండె బరువు తగ్గినట్లుంది అంకుల్. వచ్చేనెలలో నేను హైదరాబాద్ వస్తాను. మీ ఇంట్లోనే దిగుదామనుకుంటున్నా! మీకు ఇన్కన్వీనియన్స్ అయితే తెలపండి అంకుల్. మాఇంటి గురించి డెసిషన్ తీసుకోవాలని దానికి మీ సలహా కోరుతున్నా!”
“అలాగేబాబూ!నాకెటువంటి ఇబ్బంది లేదు.చక్రపాణే వచ్చాడనుకుంటా. అమ్మాయిని పిల్లల్ని కూడా” తీసుకునిరా!మీపినతండ్రి పెదతండ్రి ఇల్లనుకో! నా! ఎడ్రస్ వాట్సప్ లో పెట్తా ఉంటా బాబూ రాకేష్!”
రాజశేఖర్ మెదడు మొద్దుబారిపోయింది వాడి సిన్సియారిటీకి.అంత సుస్తీలో కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు వాడి దగ్గర నుండి శుభోదయం రాని రోజు లేదు.తను పెట్టిన మెసేజెస్ కి వాడెందుకు జవాబివ్వకుండా ఎమోజీలు పెట్టెవాడో తెలిసాక రాజశేఖర్ గుండె పగిలిపోయింది.
“ఒరేయ్!చక్రీ “నువ్వు చాలా ‘గ్రేట్’ రా!నీలాంటి స్నేహితుడు ఒక్కడు చాలురా జీవితానికి. నీచిరునవ్వు నీ స్మైలీ లో ఉందిరా! ఒరేయ్!ఎంత అన్యాయంరా!నీవు పోయి రెండు నెలలు, నీవు మంచంలో పడి ఆరునెలలు, వెరసి ఎనమిది నెలలు.
నిన్ను నాలో ఎప్పటిలాగే ఊహించుకునేటట్టు చేసావు. స్నేహానికి నిర్వచనం నువ్వేరా!నీదగ్గిరనించీ మెసేజెస్ రాకపోతే ఎందుకా అని కూడా ఆలోచించని దౌర్భాగ్యుడిని.నువ్వు పోయా వని తెలియక నీ శుభోదయాలు,శుభాకాంక్షలు డిలీట్ చేయాలని తిట్టుకున్నా! తనలో తను ఉన్మాదిలా గుండె పగిలే లాగా ఏడుస్తూ అనుకున్నాడు.
★★★
తెల్లవారింది. ఎప్పటిలా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్..యాంత్రికంగా గ్రూప్ ఓపెన్ చేసాడు.
అందులో మెసేజెస్,గ్రీటింగ్స్ అన్నీ చాలా అమూల్యమైనవిగా ఉన్నాయి.గబగబా అందరికీ శుభోదయాలు,శుభాకాంక్షలు, టైప్ చేసాడు! రెగ్యులర్ గా మెసెజ్ పెట్టే వాళ్ళ దగ్గిర నించీ మెసేజ్ లేకపోతే ఫోన్ చేసి వాళ్ళెలా ఉన్నారో కనుక్కున్నాడు! చాలా తృప్తిగా ఉంది నాకిప్పుడు. అనుకుంటూ వాలుకుర్చీలో వాలుతూ, ‘చక్రీ !నాకు మంచి గుణపాఠం చెప్పావురా! ‘అంటూ చమ్మగిల్లిన కళ్ళని పంచె అంచుతో తుడుచుకున్నాడు రాజశేఖ‌ర్.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

అంగలకుదిటి సుందరాచారి సాహితీసేవ

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

1927 వ సంవత్సరం జూన్ ఆరవ తేదీన వేటపాలెం గ్రామంలో అంగలకుదిటి వంశంలో జన్మించారు సుందరాచారి గారు. తల్లి దండ్రులు అంగలకుదిటి శేషమ్మ, అంగలకుదిటి మల్లిఖార్జునా చారి గార్లు. అన్నయ్య అంగలకుదిటి రామేశ్వరాచారి గారంటే సుందరాచారికి ఎంతో ప్రేమ. ఆయన అతి పిన్న వయసులోనే మరణించారు. శివుడంటే వల్లమాలిన ప్రేమ భక్తి ఆయనకు. ఎప్పుడూ అభిషేకాలూ, పూజలు అంటూ శివుడ్ని కోలిచే వారు అన్నయ్య. అన్నయ్య రామేశ్వరా చారి మరణం తర్వాత సుందరాచారి కట్టిన తొలి రైసుమిల్లుకు అన్నయ్య పేరుతో “శ్రీ రామేశ్వరా రైస్ మిల్ ‘ అని పేరు పెట్టుకొని తన భాతృ భక్తిని చాటుకున్నారు. తండ్రి మల్లిఖార్జునా చారి మంచి శిల్ప వైపుణ్యం కలవారు. కులవృత్తి అయిన బంగారు ఆభరణాల తయారీ చేసుకుంటూ జీవనం గడిపేవారు. ఇద్దరు కోడుకులనూ బాగా చదివించాలనీ పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలని అనుకునేవారు.

సుందరాచారి

తల్లి శేషమ్మ గాన కళా కోవిదురాలు. నిరంతరం పాటలు పాడుతూనే గడిపేది. ఆమె ఏ పని చేస్తున్నా నోరు మాత్రం పాటను పాడుతూనే ఉంటుంది పొద్దున్నే సూర్య నమస్కారాల దగ్గరుంచి అన్ని మడితో భక్తిగా చేసేది. ఆమెకు కూడా శివపార్వతులు అంటే చాలా ఇష్టం . ఉదయాన్నే బావి దగ్గర తలురా స్నానం చేసి, ఆ తడి బట్టలతోనే ఇంటి పనంతా చేసుకుంటుంది. ఆమె మడితో ఉవుప్పుడు ఎవరన్నా తాకారా ! అంతే సంగతులు! వాళ్ళని కోప్పడి మరల పోయి బావి దగ్గరే స్నానం చేసి వస్తుంది.
సుందరాచారి వేటపాలెం గ్రామంలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఆ గ్రామంలో అప్పటికి ఏడవ తరగతి వరకు మాత్రమే చదుపుకోవటానికి వీలున్నది. ఆ తర్వాతి చదువు చదవాలంటే చీరాలకు వెళ్ళవలసి ఉంటుంది. వేటపాలెం చీరాల రెండూ జంట నగరాల్లా ఉంటాయి. ఆయన చదువుకునే సమయంలోనే ఊర్లో స్వాతంత్రోద్యమం ముమ్మురంగా కొనసాగుతుంది. సుందరాచారి కూడా ఆ ఉద్యమం పట్ల ఆకర్షితుడైనాడు. అప్పట్నుంచి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడం తద్వారా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం చేసేవారు. అప్పటి వరకు టెరి కాటన్ ప్యాంటు, షర్టులు వేసుకునే సుందరాచారి మొదటగా ఖద్దరు కట్టడం మొదలు పెట్టారు. అప్పుడు మొదలు పెట్టిన ఖద్దరు ఆయన 1992 డిశంబరు లో మరణించే దాకా ఆయనను వీడలేదు. ఖద్దరు పంచె, లాల్చీ ధరించేవారు. స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యతoగా పనిచేసి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. ఇల్లు, చదువు వదిలేసి ఇలా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటూ ఉండడంతో తల్లి దండ్రులు పెళ్ళిచేస్తే కుదుట పడతాడని పెళ్ళి ప్రయత్నాలు ప్రారంభించారు.
1945 వ సంవత్సరం జనవరి నెలలో చీరాలకు చెందిన సామంతపూడి బ్రమ్మయ్య గారి కుమార్తె అయిన గోవిందమ్మతో వివాము జరిగింది. పెళ్ళి తర్వాత భార్యను కూడా స్వాతంత్ర్య ఉద్యమం దిశగా ప్రోత్సహించాడు. పెళ్ళి సమయానికి భార్య గోవిందమ్మకు పది సంవత్సరాల వయసు అత్త నారింట కాలు మోపిన తరువాత నుంచీ ఆమెను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. ఇంటికి ట్యూషన్ పెట్టించి ఆమెను చదువు వైపు చూపు సారించేలా చేశారు. థర్డ్ ఫారమ్ వరకు చదివించారు. అంతే కాకుండా సంస్కృతం, హిందీ బాషల్లోని అనేక పరిక్షలు రాయించారు. గ్రామంలో ఉన్న లైబ్రరీ అయిన సారస్వత నికేతనంలో మహిళా విద్యను ప్రోత్సహిస్తూ ఎన్నో రకాల విద్యలు నేర్పించారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, విద్య వంటి అన్ని రకాల విద్యలనూ నేర్చుకోవటానికి ప్రోత్సహించారు. స్వాతంత్ర్యానికి పూర్వమే పెళ్ళైన తరువాత భార్యను చదువుకోమ్మని ప్రోత్సహించిన ఆదర్శమూర్తి సుందరాచారి.
స్వాతంత్ర్యం లభించిన తరువాత కొన్నాళ్ళు కమ్యూనిష్ట్ పార్టీలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వేట పాలెం గ్రామానికి కొద్ది కాలం పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఇష్టం చివరి రోజుల వరకూ కొనసాగింది. గాంధీగారు సారస్వత నికేతనాన్ని సందర్శించినపుడు ఆయన్ని అనుసరిస్తూ కుటుంబ సభ్యులంతా నడుస్తూ వెళ్ళారట.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు, తామ్రపత్రం లభించాయి. ప్రభుత్వం ఇచ్చిన పది ఎకరాల పొలం కూడా లభించింది. . ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చిన స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్ కు మాత్రం అంగీకరించలేదు. అప్పటికి ఆర్థికంగా మెరుగ్గా ఉన్నందున ఆ పెన్షనేను వద్దని చెప్పారు. ఆ విధంగా ఆయన గొప్పదనాన్ని చాటుకున్నారు. సమాజంలో స్వాతంత్ర్య సమర యోధులుగా పేరు ప్రఖ్యాతులు, గౌరదం సంపాదించారు.
ఆ తర్వాత రై సుమిల్లు వ్యాపారంలోకి వచ్చారు. వేట పాలెంలో తోలిసారిగా సొంతంగా రైసుమిల్లును నిర్మించుకోని దానికి తన కీర్తి శేషులైన అన్న గారి అవుగారి పేరును పెట్టుకున్నారు. ఏ ఇంజనీరు సహాయం లేకుండా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి స్వయం ప్రతిభ లో రైసుమిల్లును నిర్మించడం అప్పట్లో చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. లోహ యంత్రాలు ఆయన చెప్పినట్లుగా వింటాయని అప్పటి కవులు ప్రశంసించారు . రైసుమిల్లు వ్యాపారంతో పాటుగా, సాహిత్య పిపాస కూడా మొదలయింది. అనేక రకాల సాహితీ పుస్తకాలు చదవడం, ప్రముఖ సాహితివేత్తల ఉప న్యాసాలు వినడం చేసేవారు . అప్పటి నుంచి సాహిత్యం పై విపరీతమైన అభిమానం, మమకారం కలిగి ఉన్నారు. అదే భవిష్యత్తులో కవులకు సత్కారాలు చేయటానికి ఛారిటీస్ సంస్థ నెలకొల్పేలా చేసింది.
1966 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన శ్రీ రామేశ్వర రైసుమిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అనేక మంది పండితుల్ని ఆహ్వానించారు. అప్పటికే వేద కవులకు సహాయం చేయడం మొదలు పెట్టారు .తోలి సారిగా ప్రారంభోత్సవ సమయంలో కవులను పిలిచి సత్కరించడంతో సుందరాచారి సాహితి పిపాస లోకానికి తెలిసింది. వచ్చిన కవులందరూ ఆయన నిర్మాణాన్ని దానగుణాన్ని కీర్తిసూ పద్యాలు చెప్పారు. వారందరికీ వచ్చిన బాధువులందరితో పాటుగా అతిథి మర్యాదలు చేసి ఘనంగా సత్కరించారు. అప్పటి వరకూ సంతానం లేని సుందరాచారి దంపతులను సంతాన ప్రాప్తిరస్తు’ అని కవి పండితలంతా దీవించారు.
పెళ్ళైన ఇరవై సంవత్సరాల దాకా పిల్లలు లేక పోవడంతో బాధపడ్డారు. ఎన్నో నోములు ప్రతాలు నోచారు. ఎంతో మందికి అన్నదానాలు చేశారు. వారాలు చేసుకుని చదువు కునే వారికి అండగా నిలిచి అందరిలో పోటు ఏదో ఒక రోజు అన్నం పెట్టడమే కాకుండా వారికి సొంత ఖర్చులతో ఉపనయనాలు చేయించారు. పీటల మీద కూర్చునీ పెళ్ళిళ్ళు చేశారు. డాక్టర్ల చుట్టూ తిరిగారు. సోముల వ్రత ఫలితమో, డాక్టర్ల చేలి చలవో గాని చివరకు సుందరాచారి భార్య గోవిందమ్మ గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషపడ్డారు.
చీరాలలో 1950-60 ప్రాంతాలలో కంచి కామాక్షి అమ్మవారి గుడిని కొంత మంది కట్టడానికి సంకల్పించారు . ఆ గుడి కట్టాక శాశ్వత పూజల కారకు బంధువులతో పాటుగా సుందరాచారి కూడా కొంత ధనమును ఇచ్చియున్నారు. దసరా నవరాత్రులలో ఆ గుడిలో పూజలు జరుగుతాయి. బంధుగణమంతా ఆ పూజల్లో పాల్గొంటారు.

సుందరా చార్యి భార్య గోవిందమ్మకు నెలలు నిండటంతో చీరాల లోని సాల్మన్ ఆసుపుత్రీ కి తీసుకెళ్ళారు. వారు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని చెప్పారు. అవి దసరా రోజులు.అందువల్ల కంచి కామాక్షి అమ్మవారి పూజ చేయించి ఆపరేషన్ కు పంపారు. ఆ రోజుల్లో సిజేరియన్ ఆపరేషన్ చేయడం చాలా తక్కువ మందికి చేసేవారు. ప్రాణాలకు గ్యారంటీ ఉండేది కాదు. అలా దసరా నవరాత్రుల్లో “గోవిందమ్మ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మవారి దయవల్ల అంతా మంచే జరిగిందని ప్రతియేటా మూలా నక్షత్రం రోజే అమ్మకు పూజలు చేసేవారు. అలా అమ్మయి పుట్టిన రోజే శాశ్వత పూజ అమ్మవారికి సీ ఏర్పాటు చేశారు.
అమ్మాయి బారసులకు కవులను సత్కరంచే అవకాశం కలిగింది సుందరాచారికి. అప్పటికి యద్దనపూడి సులోచనారాణి నవలలు ఆంధ్ర దేశమంతా ప్రభంజనం సృష్టిస్తున్నాయి . సుందరాచారి కూడా ఆమె నవలలు చదివి అభిమాని అయ్యారు. అందుకే తన ఒక్కగానోక్క కూతురికి ‘సులోచనారాణి’ అని నామకరణం చేశాడు.


ఆ మహాత్సవానికి తన మిత్రులైన కవులందరినీ పిలిచాడు. వారు పద్యరత్యాలతో ఆశీర్వదించారు. ఆయన తన కూతురు యద్దనపూడి సులోచనారాణిలా పెద్ద రచయిత్రి కావాలని కోరుకున్నాడు. ఆనాడు వేట పాలెం, చీరాల “ప్రాంతాల లోని కవులందరూ హాజరయ్యారు. 1969 వ సంవత్సరం అక్టోబరు 19వ తేదీ అమ్మాయి పుట్టిన తేది ఆ తరువాత చీరాలకు 20 కీ.మీల దూరంలోని ఇంకోల్లు అనే గ్రామంలో మంగి రైసుమిల్లును నిర్మించ దలిచారు. కుటుంబం అక్కడికి మారింది. అక్కడి రైసుమిల్లుకు ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర రైస్ మిల్లు’ అని పేరు పెట్టారు. దీని ప్రారంభోత్సవానికి చాలా ఎక్కువ మంది కవులను ఆహ్వసించారు. అదే సమయంలో కూతురి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి కొండూరి రాఘవాచారి, పులివర్తి, శరభా చారి, మునుగంటి కృపాచారి, విశ్వనాధ సత్యనారాయణ వంటి పెద్ద పెద్ద కవులు హాజరయ్యారు. ఆరోజు వంగవాలు ఆదిశేషశాస్త్రి గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆ మహా కవుల చేత”అమ్మాయికి అక్షరాలు దిద్దించారు. అప్పటి నుంచి అమ్మాయిని స్కూలుకు పంపకుండా టీచర్లను ఇంటికి పిలిపించి చదువు చెప్పించారు. ఒకే ఒక్క సంవత్సరంలో ఐదు తరగతులనూ పూర్తి చేయించి ఆరు సంవత్సరాల వయసులో హైస్కూలులో జేర్చారు. తక్కవ వయసులో డాక్టర్ చదివించి అమ్మయి పెళ్ళి వేయాలని సుందరాచారి ఆకాంక్ష.
అష్టావధాని వంగవోలు ఆదిశేష శాస్త్రి గారు ‘యశోధర’ అన్న కావ్యాన్ని రాశారు. దానికి ముందుమాట తొలి వెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. ఈ పుస్తకాన్ని సుందరాచారి ఆర్థిక సాయమందించి ప్రింటింగ్ చేయుంచారు. కావ్యదాత సుందరాచారి కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ సభ్యులందరి ఫోటోలు, కుటుంబ దాతృత్వం గురించి నాలుగు పేజీల్లో పద్యాలు రాశారు రచయిత. రైసుమిల్లుల్లోని యంత్రాలు సుందరాంచారి చెప్పినట్లు పని చేస్తాయని కాబోలు “లోహజగల్ చాతుర్య” అని బిరుదునిచ్చారు. పూస పాటి నాగేశ్వర రావు అనే అష్టాదధాని రాసిన “శిల్ప సౌందర్యం” అనే పుస్తకాన్ని అచ్చు వేయించారు. అలాగే వేటపాలెం లోని కవి కడెం వెంకట సుబ్బారావు రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక పుస్తకాన్ని అచ్చు వేయించారు. మరొక వీరబ్రమ్మెంద్ర స్వామి కాలజ్ఞాన తత్వములు అనే పుస్తకానికి ఆర్థిక సహాయాన్నాందించారు. ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో ఉన్న కవుల వెందరివో పుస్తకాలు సుందరాచారి దాతృత్వం వలన వెలుగు చూశాయి. కళాప్రపూర్ణ కొ౦డూరు రాఘవాచారి, దురిశేటి రామాచారి, చిఱ్ఱావూరి నాగభూషణ శర్మ, నాగశ్రీ, వివియల్ నరసింహారావు, ఎర్రోజు మాధవాచారి, మందరపు సత్యా చార్యులు, రావూరి భరద్వాజ వంటి ఎంతో మంది కవులు సుందరాచారి కూతురి అక్షరాభ్యాసానికి హాజరయ్యారు. కవులందరి పద్యాల ఆశీస్సులు తీసుకొని వారిని ఘనంగా సత్కరించి పంపారు సుందరాచారి.
1974 లో సుందరాచారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆతర్వాత చీరాలలో మరో రైసుమిల్లు నిర్మించటానికి తలపెట్టారు. కుటుంబం చీరాలకు మారింది. ఆ రైసుమిల్లు నిర్మాణం పూర్తయ్యేసరికి కుమారుడ్ని బడిలో వేయాలనుకున్నారు. రైసుమిల్లు ప్రారంభోత్సవం తో పాటు కుమారుడి
అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారు. ఈ మహోత్సవానికి వంద మంది కవి పండితులను అహ్వానించి బ్రహ్మాండంగా జరిపించారు. ఈ కవి పండిత సభలో కుమార్తె చేత తెనాలి రామలింగడు మొల్లల మధ్య సంభాషణా పద్యాలున్న కథను చెప్పించారు. కూతురు రాణి చదివిన జట పద్యాలను విన్న కవులు “అమ్మాయికి వేదాలు చెప్పించండి అచారి గారూ” అన్నారు. రాణి ని మంచి రచయిత్రి కావాలని ఆశీర్వదించారు. అంగరంగ వైభోగంగా జరిగిన ఈ కార్య క్రమంలో కవి పండిత సభ సుందరాచారికి “వదాన్య శేకర”, “అభినవ సమాజ భోజ” అని బిరుదల నిచ్చి సత్కరించింది. ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో పూసపాటి నాగేశ్వర రావు గారితో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఫణి భూషణా చారి తో లలిత సంగీతం పాడించారు. ఇది 1978 ఫిబ్రవరి నెలలో జరిగింది. మార్కాపురం నుంచి కన్నెగంటి రాజమల్లా చారి రావూరి భరద్వాజ, ఉటుకూరి లక్ష్మి కాంతమ్మ, వాసిలి వెంకటలక్ష్మీ
నరసింహారావు వంటి మహా కవులంతా వచ్చారు సుందరాచారి కి చిత్ర లేఖనం పై కూడా ఆసక్తి ఎక్కువ. తన రైసుమిల్లుల్లో మద్రాసు నగర సౌందర్యం, ఫ్లోరల్ డిజైన్, కంచి కామాక్షి అమ్మవారి చిత్రపటాలను ప్రముఖ చిత్ర కారులతో వేయించారు. ఆయన స్వయంగా ఎన్నో చిత్రాలు వేశారు.
కుటుంబ శుభకార్యాలలో ఇలా కవులను ఆహ్వానించి “సత్కరించడం కాకుండా ప్రతి ఏటా సత్కరించాలనే ఉద్దేశ్యంతో సొంతంగా ఒక ఛారిటిస్ ను ప్రారంభించారు. “శ్రీ అంగలకుదిటి సుందరాచారి చారిటీస్” అనే సంస్థను స్థాపించి తద్వారా ప్రతి సంవత్సరం నలుగురు కవులు కళాకారులను సత్కరించాలని సంకల్పించారు. అంతే కాకుండా పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు అందజేయాలని తలపెట్టారు. ఆ విధంగా 1974 నుండి 1992 లో సుందరాచారి మరణించే దాకా విద్యార్థులకు స్కాలర్ షిప్పులు అందజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కవులందరూ “సుంధరాచారి పురస్కారాన్ని పొందిన వారే. ఆయా జిల్లాల్లోని విద్యార్థులు చాలా మంది స్కాలర్ షిప్పులను పొందిన వారు నేడు ఉన్నత ఉద్యోగాల్లో ప్రభుత్వ సేవలందిస్తున్నారు. 1992 లో వారు మరణించిన దగ్గర నుండీ చారిటీస్ సంస్థలు నిలిచిపోయాయి.
మరొక కార్యక్రమం 1988 లో తన కుమార్తె వివాహా సందర్భంగా ఏర్పాటు చేశారు. వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి వారి చేత ఆశీస్సులను అక్షరాల రూపంలో అందజేయడం అంత వరకూ ఎక్కడా జరగలేదు. వివాహ ఆహ్వాన పత్రికలో కవి పండితుల అక్షరాక్షతలు అని ముద్రించారు. వివాహానికి ముందుగానే ప్రముఖ కవులందరికీ ఆహ్వానాలు పంపి వారి ఆశీర్వాద పంచరత్నాలను తెప్పించారు. వాటినన్నింటినీ ఒక పుస్తక రూపంగా ముద్రించారు.
సుందరాచారి తన కుమార్తె వివాహ సమయంలో కవి పండిత గోష్ఠి నిర్వహించారు. దీని కోసం ‘వివాహ ముహూర్తాన్ని ఉదయం పూట వచ్చేలా చూసుకున్నారు. మధ్యాహ్య సమయం నుంచి పండిత గోష్ఠి నిర్వహించాలని తలచారు. ఈ పండిత గోష్ఠి అంతా బ్రహ్మార్షి విశ్వామిత్ర సినిమా మాటల రచయిత, కవి నాగభైరవ కోటేశ్వర రావు గారి అధ్యక్షతన జరిగింది. వివాహ మంత్రాల వైశిష్ట్యం గురించి లక్ష్మీ పార్వతి గారు రెండు గంటల సేపు ప్రసంగించారు. సుమారు ఐదారు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కవితా గోష్ఠి కార్య క్రమంలో ప్రాచీన పుస్తక భాండాగార అధ్యక్షులుగా పనిచేసిన డా॥ వి.వి.ఎల్ నరసింహారావు, కళాప్రపూర్ణ కొండూరు రాఘవాచార్యులు, ఉటుకూరు లక్ష్మి కాంతమ్మ, డాll చేబోలు చిన్మయకవి, సంస్కలత పండితులు మునుగంటి కృపాచారి, అష్టావధానికి వంగవోలు ఆదిశేష శాస్త్రి ఈమని దయానంద, దీవి రంగాచార్యులు, చోడా చంద్రశేఖరరావు, షేక్ అలీ, మాగుతారి రామకోటేశ్వర రావు, నాగశ్రీ, మల్లవరపు జాన్, పూసపాటి నాగేశ్వరరావు, అడుగుల రామయ్య బీరం సుందర్రావు నాగభైరవ కోటేశ్వరరావు ప్రభ్రుతులు పాల్గొన్నారు. వచ్చిన కవులoతా ఇలా వివాహ సందర్భంగా కవులను ఆహ్వానించి సత్కరించడం ఎక్కడా వినలెదనీ కనలేదనీ కొనియాడారు.
వివాహ సందర్భంగా ముద్రించిన పుస్తకానికి ‘కల్యాణ కౌముది’ అన్న పెరు పెట్టారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రముఖ కవులందరూఆశీ: పంచరత్నాలను అందించారు. ఈ పుస్తకాలను మూడు వేల కాపీలు ముద్రించారు. వివాహానికి వచ్చిన వెయ్యి మందికి ఈ పుస్తకాలను పంచారు. గత ముప్పై సంవత్సరాలుగా అందరికీ ఆ ప్రతులు అందిస్తూనే ఉన్నారు.
ఇదీ సుందరాచారి గారు బతికి ఉండగా చేసిన సాహితీ సేవ. వారి భార్య అంగలకుదిటి గోవిందమ్మ గత సంవత్సరం 2018 లో భక్తిపాటలను ‘పుష్పాంజలి’ పేరుతో ప్రచురించారు. ఆవిడ ఆ భగవతీ గానాలను చక్కగా పాడుతుంది. 2019 వ సంవత్సరంలో ‘టిక్ టాంబుర్ర’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. పూర్వకాలం లోని జానపద కథలన్నింటిని తన కుమార్తె చేత రాయించి వాటన్నింటినీ బాలల కోసం ప్రచురిస్తున్నారు. వాళ్ళ కాలంలో చెప్పుకునే, పిల్లల కోసం చెప్పే కథలన్నీ చెప్పి కుమార్తె రాణీప్రసాద్ చేత రాయించి ప్రచురించారు. ఈ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం వారు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్నందించారు. గోవిందమ్మ గారు కూడా సుందరాచారి సహచర్యంలో సాహితీ పిపాసి గా మారారు. వారిల్లు నిత్యం కవుల కవితా గానాలతో, వచ్చి పోయే కవులతో విలసిల్లటం వల్ల ఆవిడకూ సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది.
సుందరాచారి గారు మరణిoచాక వారి పేరుతో తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. వారి కుమార్తె, కందేపి రాణీప్రసాద్, అల్లుడు గారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా|| కందేపి ప్రసాదరావు గార్లు రెండు లక్షల రూపాయలు తెలుగు విశ్వ విద్యాలయానికి డొనేషన్ ఇచ్చారు. 2011 సంవత్సరం నుంచీ శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్వ పురస్కారాన్ని తెలుగు విశ్వ విద్యాలయం వారు రెండు తెలుగు రాష్ట్రాల లోని బాలసాహితీ వేత్తలకు అందిస్తున్నారు. వేదాంత సూరి, పైడిమర్రి రామకృష్ణ, డోకల సుజాతాదేవి, వి.ఆర్, శర్మ, పుష్పాల కృష్ణ మూర్తి, బెలగాం భీమేశ్వర్రావు మొదలగు బాల సాహితీ వేత్తలు ఈ కీర్తీ పురస్కారాన్ని అందుకున్నారు.
కుమార్తె కందేపి రాణీప్రసాద్ ప్రతిభ కలిగిన కవులకు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ అంగలకుదిటి సుందరాచారి ఛారిటీస్ తరుపున పురస్కారాలు, సర్టిఫికెట్లు అందిస్తున్నారు. వారిలో ప్రేముఖులు చాగంటి కృష్ణకుమారి, పత్తిపాక మోహన్, షేక్ అబ్దుల్ హకీం జానీ, చిల్లర భవానీ దేవి, వడలి రాధాకృష్ణ వంటి కవులు, రచయితలు ఉన్నారు. సిరిసిల్ల ప్రాతంలోని డాక్టర్ సీట్లు సంపాదించిన విద్యార్థులకూ సర్టిఫికెట్ల సత్కారాలు అందిస్తున్నారు. 2007 రాష్ట్రం లో ఎమ్ సెట్ లో మొదటి ర్యాంకు సాధించిన సాయిష్ రెడ్డిని సత్కరించారు.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

వారాల వాదాలు

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

కాలెండర్ గోడకు వేలాడుతోంది ఆ ఇంటి యజమాని కాలెండర్ వంక చూసి “అబ్బా రేపు ఆదివారం హాయిగా ఇంట్లో ఉండవచ్చు” అని సంతోషంగా అనుకున్నాడు. ఆ ఇంటి పిల్లలు కూడా “అమ్మా రేపు ఆదివారం. మాకు స్కూల్లేదు శలవు” అంటూ అరుస్తూ చెప్పారు. అమ్మ వంటింట్లో నుంచి ‘సరే సరే’ అని విసుగ్గా అన్నది.
గోడ మీదున్న కాలెండర్ లోని ఆదివారం, సోమవారం వంటి వారాలన్నీ ఒకదాన్నోకటి పలకరించు కుంటున్నాయి “అబ్బ! ఆదివారం నీ పని హాయి! అన్ని శలవు. ఏ పనీ ఉండదు నీకెంత అదృష్టం” అంటూ శని వారం నిష్టూరంగా అవ్వది “నాకయితే విపరీతమైన పని ఉంటుంది. ఇంటి వాళ్ళు శుభకరమని ఇళ్ళు కడుక్కోవడం, ఆడవాళ్ళంతా తలస్నానాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం వంటి వన్నీ చేస్తుంటారు .నాకైతే అసలు తీరికే ఉండదు ” అంటూ శుక్రవారం తెగ బాధపడుతూ అన్నది.
‘ఊరుకో నీవున్న రోజేనా పూజలు చేసేది. మరినేనా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును నేను. మగ వాళ్ళందరూ నా వారం నాడే గుళ్ళకు వెళతారు. ప్రసాదాలు చేసుకుంటారు. చాలా మంది ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ సుప్రభాతం చదువుకుంటారు అంటూ శనివారం తన గొప్పను చెప్పింది శుక్రవారాన్ని ఎద్దేవా చేసింది.
అప్పుడు సోమవారం ముందుకోచ్చి ఇలా అన్నది “ ఏమిటి ఇందాకట్నుంచి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలు ఆపండి. సోమవారం అంటే ఆఫీసులు, స్కూళ్ళు అన్ని పనిచేసే రోజు. ఏ పని కావాలన్నా ఈ రోజే వస్తారు మరియు వారాలలో మొదటి దాన్ని. ఇంత ప్రాధాన్యం గల నన్ను వదిలి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకున్న ప్రాముఖ్యం గురించి చెప్పడం లేదు. లయకారుడైన శివుడికి ఇష్టమైన రోజును నేను తెలుసా ? అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. మిగతా వారాలన్నీ భయపడి వెనక్కు తగ్గాయి.
కానీ శుక్రవారం మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి “ నేను ఎవరో తెలుసా ? నా షేరేమిటో తెలుసా ? నన్ను లక్ష్మీ వారమని అంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు, అండ ఉంటేనే ఏ పనైనా జరిగేది. ఏమిటి, హెచ్చుగా మాట్లాడుతున్నావు ” అంటూ కోపంగా అన్నది.
“ఆగండాగండి! అందరూ ఎవరి గురించి వారే చెప్పుకుంటే ఎలా ? మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా! నా గురించి కూడా తెలుసుకో! నేను కూడా గొప్పనే, నేనేమీ అశుభాల మంగళవారాన్ని కాను. సాయి బాబాకు ఇష్టమైన వారాన్ని సాయంత్రమైతే ఎన్నో భజనలు చేస్తారు ” అంటూ గురువారం ముందుకొచ్చి పరుషంగా మాట్లాడింది.
మంగళవారం ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో అన్నది ” నేను మిమ్మలి ఎవరినన్నా ఏమన్నా అన్నానా? నన్ను అశుభం అంటారా. నా పేరేమిటి మర్చిపోయారా నా పేరు మంగళవారం నేను మంగళకరమైన దాన్నని. నా కా పేరు పెట్టారు. నేను ఎవరినీ కించ పరిచేలా మాట్లాడలేదు మీరు నన్నెందుకు తక్కువగా చూస్తున్నారు? ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఇక మాటలు మాట్లాడలేక గొంతు మూగబోయి ఆగింది.
ఆపండి మాటలన్నీ! ఎవరూ ఎవర్ని అనలేదు అసలు విషయం ఏమంటే ఆదివారానికి పనేమీ లేదని అందరూ ఆనాలనుకున్నాయి. మిగతా వారాలన్నీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాయి. ఆఫీసులు స్కూళ్ళు అంటూ చాలా పనుంటుంది కానీ, ఆదివారానికె ఏమీ పనిలేదు. ఆ విషయం చెప్పాలనుకుని చివరకు మీలో మీరు వాదులాడుకుంటున్నారు. అంతే అంటూ బుధవారం ఆసలు విషయాన్ని తేల్చి చెప్పేసింది.
“అవునవును నువ్వు చెప్పింది నిజం ఆదివారానికి అసలు పనేమీ లేదు. కష్టపడేదంతా మనమే. ఆదివారం అన్నీ సెలవే, ఏపనీ ఉండదు” అంటూ అన్ని వారాలూ మూకుమ్మడిగా అన్నాయి.
అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆదివారం నింపాదిగా ముందుకొచ్చి అన్నది ” ఏమిటీ ఆదివారం సెలవా ! నాకేమీ పనుండదా! మరి వారం రోజులూ వేర బెట్టిన పనులన్నీ ఏ వారం నాడు చేస్తారు. ఇల్లు బూజులూ దులపడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఎప్పుడు చేస్తారు. బంధువులింటికి వెళ్ళాలన్నా , సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా ఏ వారం నాడు వెళతారు ? మీరంతా పనులు చేసే వాడావిడి తప్ప అందులో ఆనందం ఉండదు. అదే ఆదివారం నాడు ఎంత పని చేసినా సంతోషంగా ఉంటారు. నాకు పని లేదని మీరెట్లా అంటారు. చెప్పండి ! అంటూ ఆదివారం ప్రశాంతంగా అన్ని విషయాలూ చెప్పింది.
ఆదివారం చెప్పిన మాటలన్నీ విని మిగతా వారాలన్నీ తల ఆడించాయి. తన మాటలు నిజమని ఒప్పుకున్నాయి. ఆదివారాన్ని అభినందించాయి. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ. చేయి చేయి పట్టుకుని కలిసి ముందుకోచ్చాయి “అసలు మనలో మనకు తగాదాలు ఎందుకుని మనందరం కలసి ఉంటేనే మనుష్యులు మనల్ని గుర్తిస్తారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే వారాలు నెలలు అంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంక ఎప్పుడూ మనలో మనకు అభిప్రాయ భేదాలోద్దు” అంటూ అన్ని కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు నడిచాయి. ఆదివారం నుండి శనివారం దాకా అందరూ కలసికట్టుగా ‘వారాలు’ గా ఉంటున్నారు.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us