మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

కుంకుమ బరిణ

by Divakarla Rajeshwari March 28, 2024
written by Divakarla Rajeshwari

మేడారం జాతరకు
తరలి వస్తున్నారు సాగరం లా జనం.
ముడుపు లు చెల్లించేందుకు
సమ తూకం బంగారం బెల్లం దిమ్మెలు
తలకెత్తుకున్నారు,
భక్తి పాటల సంబురాలతో
సంతోషం పంచుకున్నారు.
గిరి ఝరుల అందాలకు
పరమార్థ జ్ఞానం కలిగినట్లు
చింతలన్ని మరచారు.

ఆదివాసులకు శ్రమ సేద్యం ,
వేట వృత్తి జీవనం.
కోయ దొరకు పుట్ట వద్ద కనిపించిదొక శిశువు.
పులులు, సింహాలు, కాపలా, చుట్టూ.
దైవాంశమున్న పాపను గూడానికి తెచ్చాడు.
సమ్మక్క అని పిలిచి ఒడిని చేర్చాడు.
అయోనిజ ఆ బిడ్డ చూపింది మహిమ.
గిరి జనుల రుజలన్నింటికి
ఆకు పసరు లిచ్చింది.
కష్టాలను తీర్చింది.
యుక్త వయసున పగిడిద్ద రాజును పెండ్లి యాడింది.
కన్న బిడ్డలకు తల్లిగా మన్ననలను పొందింది

సమ్మక్క సారలక్కలు,
తల్లీ కూతుళ్ళు వాళ్ళు
దివ్య కాంతలు, ధీర వనితలు
స్త్రీల ఆత్మ గౌరవానికి
సాక్షి ప్రమాణాలు.
మట్టి జనుల స్వేచ్ఛకు గాను
గట్టిగ పోరాడారు.
ప్రాణాలకు తెగించారు.
వన దేవతలు వారు
ప్రకృతి రక్షణకు
మనుగడల రూపమెత్తారు.

గిరి జనుల సంస్కృతిలో
జాతర జాతి సమైక్యతకు మూలం
సమ్మక్క ధైర్యం చరిత్ర లో అతి ఘనం.
దేవతా తరుణి ఆమె
రక్తం పడకూడదు నేల మీద
వెన్ను పోటు బల్లెం దిగిన గాయానికి
కట్టు కట్టుకుని పోరాడింది.
శత్రువులను చెండాడింది.
తూరుపు చిలుకల గుట్ట వంకకు మరలి
కంటికి కనుపించక ఎవ్వరికి
నెమలి నారచెట్టు కింద
నిండు పసుపు” కుంకుమ బరిణ” గా మెరిసింది.

మాఘ శుద్ధ పున్నమి నాటికి
గద్దె మీద కొలువుకొచ్చిన
సమ్మక్క సారలక్కలు
హారతులందే వేళకు
డప్పుల చప్పుళ్ళు, , శివసత్తులు పూనకాలు
మేళాలు తాళాలు,
ఇప్పుడు మొదలయ్యాయి
గిర్రున దిగి వచ్చే హెలికాఫ్టర్ ఏర్పాట్లు,
సంప్రదాయాలకు
శాస్త్ర విజ్ఞానం తోడు,
భక్తుల కందరికి ఫలించాలికోరికలు.

March 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం

by రంగరాజు పద్మజ March 27, 2024
written by రంగరాజు పద్మజ

భారతదేశంలో సంస్కృతం ప్రాచీన భాషేకాదు… సాంప్రదాయ భాష కూడా!
మహా మహోపాధ్యాయ వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి వంటి ఎంతోమంది పండితులు సంస్కృత భాష… ఆ భాషలోని భావం పాఠకులకు తెలిపేందుకై ఎన్నోరకాల వ్యాఖ్యానాలు చేసి, ఆ గొప్ప కావ్యాలను ప్రజాదరణ పొందేలా ఎంతో కృషి చేశారన్నది అందరికీ తెలిసిందే! ఎందరో ఋషుల వల్ల వేద సాహిత్యం సంస్కృతంలో అలా బలపడిందని చెప్తారు. ఇంకో గర్వకారణం ఏమిటి అంటే? భారతీయ ఆధునిక భాషల జాబితాలో రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో సంస్కృత భాష చేర్చబడింది. ఇదొక ఆనందించవలసిన విషయం.
ఎన్నో భాషలలోని సాహిత్యానికి సంస్కృతం మూలం. ముఖ్యంగా ఉత్తర భారతంలో దాదాపు అన్ని భాషలకు సంస్కృతమే మూలం. మూలఘటిక కేతన “సంస్కృతంబే యెల్ల భాషకు మూలం”అని అంటారు. ఏ రకంగా చూసినా సంస్కృత భాష గొప్ప భాషే! ధర్మాన్ని చక్కగా నొక్కి చెప్పేందుకు వేదాలన్నీ సంస్కృత భాషలోనే ఉన్నాయి. వేదాంగాలు… అంతే ఇవి ఎవరో రాసినవి కాదని భగవంతుని శ్వాసనుండే పుట్టాయని అంటారు. అంటే సంస్కృతం దేవభాషే కదా!
రామాయణం మొదలైన ఎన్నో కావ్యాలు, మహాభారతం వంటి ఇతిహాసాలు, చారిత్రక కావ్యాలు, గేయాలు, బృహత్కత వంటి కథలు, చంపూకావ్యాలు, ఇలా సంస్కృతంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి .
ఒక సాహిత్యమే కాదు శాస్త్రీయ సంబంధ, చట్టసంబంధ, రాజకీయ సంబంధ, తత్త్వశాస్త్రాలు, ఖగోళ, జ్యోతిష్య, ఇలా ఎన్నో ఎంతో విజ్ఞానం సంస్కృతంలో నిక్షిప్తం చేయబడి ఉంది.
అటువంటి గొప్పదైన సంస్కృత భాషలో తమదైన రీతిలో అవధానం చేయడమంటే ఆషామాషీ కాదు! అతి తక్కువ సమయంలో అలవోకగా చక్కని పూరణలు చేయగల భాషా నైపుణ్యం కలవారు ఈనాటి మన మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక పరిపృచ్ఛా కార్యక్రమ అతిధులు…
మాన్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ అమర్నాథ్ శర్మ గారు. వీరు ఎన్నో వేదికల మీద అవధానాలు చేసిన అవధాన పండితులు.
శర్మగారిని కొత్తగా పరిచయం చేయడం అక్కరలేదు కానీ వారి ముఖతః మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈనాటి పరిపృచ్ఛా కార్యక్రమం .
నాకు ఎలాంటి ప్రత్యేకతా లేకపోయినా… వారితో మాట్లాడే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తూ… ఇంకెందుకు ఆలస్యం వారితో ముచ్చటిద్దాం!

ముదిగొండ అమర్నాథశర్మ

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ! అమర్నాథ శర్మ గారూ!

ముదిగొండ అమర్నాథశర్మ:– అమ్మా నమస్సులు.

పద్మజ:– మీ నేపధ్యం మయూఖ పాఠకులకు వివరిస్తారా?

అమర్నాథశర్మ:– మా మాతా పితరులు సిద్ధమణీ- రామనాథశాస్త్రి గారు. మా తండ్రిగారు సంస్కృతాంధ్రాలతో పాటు వేదాధ్యయనం చేసి, పంచ శతాధిక చండీయాగాలు, దేవాలయ ప్రతిష్టలు చేసినవారు. నా జన్మస్థలం లచ్చపేట. దుబ్బాక మండలం పూర్వం మెదక్ జిల్లా… ప్రస్తుతం సిద్దిపేట.

పద్మజ:– మీ విద్య- వృత్తి- ప్రవృత్తుల గురించి వివరిస్తారా?

శర్మ గారు:- నేను లచ్చ పేటలో ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి పూర్తి చేసుకొని, ఇంట్లో అమర కోశం, శబ్ద మంజరి అధ్యయనం చేసి, కొంత పునాది పడగానే వేములవాడకు వెళ్లి ఆరవ తరగతి నుండి
బి ఏ (ఎల్) వరకు శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాలలో- కళాశాలలో 1980 నుండి 1990 వరకు విద్యాభ్యాసం పూర్తి చేసాను.

పద్మజ:– సంస్కృత భాష పై మీకు అనురక్తి ఎలా కలిగింది?

శర్మ గారు:– మా గురువుగారు శ్రీమాన్ కల్వకుంట్ల నరసింహచార్యుల ఆశీస్సులతో సంస్కృత భాషపై అనురక్తి, పట్టు కలిగింది. తదుపరి కళాశాల స్థాయిలో మా గురువు గారు సంస్కృతాంధ్ర విద్వన్మణి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శ్రీహరి శర్మ గారి సాహిత్య, అలంకారిక, న్యాయ, వేదాంత, వ్యాకరణాది పాఠాలు వింటూ అనుష్ఠుప్ ఛందస్సులో శ్లోక రచనకు శ్రీకారం చుట్టాను. నాకు ప్రేరణ శ్రీహరి శర్మ గారు.

పద్మజ:– మీరు ఏ యే రచనలు చేసారు?
శర్మ గారు:– చాముండేశ్వరి అష్టకం, సుప్రభాతం;

శ్రీ మహాకాళీ సుప్రభాతం;
శ్రీరామచంద్ర సుప్రభాతం;
శ్రౌతశైవగణార్చన;
నరసింహోదాహరణం,
శిరీష సమీరం;
విశ్వేశ్వర శతకం (మందాక్రాంత వృత్తంలో) సద్గురు శివానంద స్తోత్రం; శివ కళ్యాణోత్సవ ప్రకరణం మొదలైనవి రచించాను.]

పద్మజ:– మీకు ఇష్టమైన కవి ఎవరు? రచనా వ్యాసంగం ఎలా ప్రారంభమైంది? ఎలా కొనసాగుతున్నది?

శర్మ గారు:– నాకు ఇష్టమైన కవి మహాకవి కాళిదాసు. నా రచన సంస్కృతంలో నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికీ రోజుకు ఒక శ్లోకమైనా రచించినది నిద్రపోను! ఇంకో మహా గ్రంథం త్వరలో రాబోతున్నది…..

పద్మజ:- మహా గ్రంధం రాబోతున్న సందర్భంలో మీకు శుభాకాంక్షలు తెలుపుతూ…

ప్ర :– సంస్కృతం విద్యార్థులు క్షుణ్ణంగా నేరుస్తున్నారా?
బయట ఒక అపవాదు ఉన్నది. ఏమిటంటే మార్కుల కోసం, తరగతులను ఉత్తీర్ణులు కావడం కోసమే సంస్కృత భాషను ఐచ్ఛికంగా ( option) గా తీసుకుంటున్నారని అనుకుంటున్నారు… దీనిలో ఎంత వరకు నిజం ఉందంటారు?

శర్మ గారు:– మీరన్నట్టు సంస్కృతమును మార్కుల కోసమే ఐచ్చికంగా తీసుకుంటున్నారనే అపవాదు కొంతవరకు నిజం. కానీ నేను 30 సంవత్సరాలుగా సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న సర్దార్ పటేల్ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకునిగా, విభాగ అధ్యక్షుడిగా, వైస్ ప్రిన్సిపాల్ గా, ప్రిన్సిపాల్ గా 1993 నుండి వివిధ హోదాలలో పని చేస్తున్నాను. మా విద్యార్థిని విద్యార్థులకు మాత్రం మార్కుల కోసం కాకుండా జీవితంలో మార్పు కోసం పాఠాలు చెబుతూ శుభోదయం అంటూ పలకరిస్తాను. వాళ్లు అలాగే.. సంస్కృతంలోనే జవాబిస్తారు. వారితో సంస్కృతంలో చిన్న చిన్న ప్రసంగాలు చేయిస్తాను. శ్లోక పఠనంచేయిస్తాను. వ్యక్తిత్వ వికాసం, నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా విలువల గురించి సంస్కృత సాహిత్యంలోని మహాకవుల కావ్యాలను సులభ శైలిలో వివరిస్తాను.

పద్మజ:- సంస్కృత వ్యాకరణం బోధించే పండితుల కొరత ఉందని ఒక మాట అనుకుంటారు నిజమేనా? ఒక వేళ కొరతను ఎలా తీరుస్తారు?

శర్మ గారు:– సాధారణంగా సంస్కృతం, తెలుగు ,హిందీ భాషలంటే పిల్లలు తరగతులకు సక్రమంగా హాజరు కారు. కానీ పిల్లలే అధ్యాపకులకు ఫోన్ చేసి మరీ పిలుస్తారు క్లాసులకు రమ్మని,అంటే చక్కని బోధకులున్నట్టే కదా! కొరతేమీలేదు!

పద్మజ:- సంస్కృత పరిషత్తు ద్వారా ముద్రింపబడుతున్న గ్రంధాల కొనుగోలు ఎలా ఉంది? ముద్రించుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఆశావహ పరిస్థితులున్నాయా?

శర్మ గారు:–ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న సంస్కృత పరిషత్తు వ్యాకరణాన్ని బోధిస్తూ, ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిశీలించి, ప్రచురిస్తున్నారు. ఇటీవల కాలంలోనే అర్థ శతాధిక గ్రంథాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దిశగా సంస్కృత అకాడమీ డైరెక్టర్ ఆచార్య కే. నీలకంఠం గారు నిరంతర కృషి చేస్తున్నారు.

రంగరాజు పద్మజ:- ప్రాచీన సంస్కృత గ్రంథాలను పరిష్కరించే దిశగా కృషి ఎలా సాగుతున్నది?

శర్మ గారు:– కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో సంస్కృత పరిషత్తు గ్రంథాలను ముద్రిస్తుంది.

పద్మజ:–భాషా పరిరక్షణలో భాగంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?

శర్మ గారు:– భాషా పరిరక్షణ కోసం పాఠశాల స్థాయి నుండి వ్యక్తిత్వ వికాసం కోసం, మానవతా విలువల కోసం సంస్కృతి సంప్రదాయ రక్షణ కోసం వాల్మీకి, వ్యాస, కాళిదాస, విష్ణుశర్మ వంటి మహాకవుల రచనలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. ఈ పరిస్థితి మన రాష్ట్రంలో కొరవడింది. మిగతా రాష్ట్రాల్లో కొంతవరకు ఆశాజనకంగా ఉంది.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషా విద్యార్థులకు మీరిచ్చే సలహాలు, సూచనలేమిటీ?

శర్మ గారు:– నేను మా విద్యార్థినీ విద్యార్థులకు “సంస్కృతాన్ని సరిగ్గా ఉచ్ఛరిస్తే మన శరీరంలోని 72 వేలనాడులు సరిగ్గా పనిచేస్తాయి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు. సంస్కృతం మాట్లాడడం వల్ల ఆదర్శంగా ఉంటారని” అని చెబుతుంటాను. 1985లో సుప్రసిద్ధ కన్నడ సినిమా దర్శకుడు జీ వి అయ్యర్ ఆదిశంకరాచార్య అనే సినిమాను రూపొందిస్తే ఆ సీనిమాకు పలు జాతీయ పురస్కారాలు లభించాయి. కర్ణాటకలోని శివమొగ్గ అనే జిల్లాలో మొత్తం సంస్కృత
భాషలోనే మాట్లాడతారు.

రంగరాజు పద్మజ:- సంస్కృత భాషను ప్రభుత్వ కార్యకలాపాలలో వాడుతారా? దానికి మీరు ఎలాంటి చర్యలు అవసరమనుకుంటున్నారు?

శర్మ గారు:– సంస్కృతాన్ని నేటి ప్రపంచీకరణ యుగంలోనూ నేర్పుగా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్లలో ఒదిగి ఉండే సాంకేతిక సౌలభ్యం సంస్కృతంలో బలంగా ఉందని భాషా శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పవచ్చు. నేటి పరిస్థితులలో సంస్కృత భాషా ప్రాముఖ్యత గతంలో కంటే ఎక్కువగానే గుర్తిస్తున్నారని తర్కబద్ధంగా కూడా చెప్పవచ్చు.

పద్మజ:– సంస్కృత భాషకు పూర్వ వైభవం తేవడానికి మన వంతు కర్తవ్యాలు ఏమిటి? అంటే పాఠశాలలు – కళాశాలలు కానివ్వండి ఎలాంటి కృషి చేస్తున్నాయి? ముఖ్యంగా సిద్ధాంత గ్రంథాలు సంస్కృత భాషలోనే రాస్తున్నారా? లేక అన్య భాషలలో రాస్తున్నారా?

శర్మ గారు:– సిద్ధాంత గ్రంథాలు దేవ నాగరలిపిలోనే రాస్తున్నారు. నేనైతే నా MPhil మరియు Phd రెండు కలిపి నా దస్తూరీలో దేవనాగర లిపిలో సుమారు 1000 పేజీల గ్రంథం వ్రాసి సమర్పించాను. శైవాగమంలో చంద్రజ్ఞాన ఆగమంపై తెలంగాణలో మొదటి శోధ ప్రబంధం నాది. అది తిరుపతి విద్యాపీఠంలో చేశాను.

పద్మజ:- సంస్కృత భాషాభిమానులు రాసిన గ్రంథాలకు ప్రజల ఆదరణ ఎలా ఉంది?

శర్మ గారు:– సంస్కృత భాషాభిమానులు చాలానే ఉన్నారు. నేను మందక్రాంత వృత్తంలో సంస్కృతంలో విశ్వేశ్వర శతకం రాస్తే ఏక బిగిన చదివి అభిప్రాయాలు తెలియజేసిన వారు చాలామంది పండితులు, పామరులు ఉన్నారు.

పద్మజ:- సంస్కృతం కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు?

శర్మ గారు:– కేవలం పండితులకే పరిమితం అనే ఒక అపవాదు ఉంది. లేక ఒక వర్గం వారికే అనే మరో వాదన ఉంది. అది ముమ్మాటికి నిజం కాదు. సంస్కృతం పట్ల ఆంగ్లేయుల పాలనా కాలంలో వ్యతిరేకత అంకురించింది. ఆంగ్లేయులు (ఇంగ్లీషు భాషను) వ్యాప్తి చేసుకోవడానికి సంస్కృతాన్ని వ్యూహాత్మకంగా బలహీనం చేశారు. ఇది కేవలం సంప్రదాయ పండితులకే పరిమితం అన్న దుష్ప్రచారాన్ని పెంపొందించి, ఆర్యభాషగా ప్రచారం చేశారు. ఇది నిజం కాదు!

పద్మజ:– మీకు అవధానం చేయడానికి ప్రేరణ ఎలా కలిగింది?

శర్మ గారు;– అవధాన ప్రక్రియ మెతుకుసీమ (మెదక్) కోలాచలంలో ఇప్పుడు కొల్చారంలో మల్లినాథ సూరి తాతగారు శతావధానం చేశారు. ఆయన పేరు కూడా మల్లినాథసూరే! ఆయన సంస్కృతంలో శతావధానం చేశారట. మేము కూడా మెదక్ జిల్లా వాళ్ళం కావడంతో వారి గురించి విని అలా మాకు కొంత ప్రేరణ కలిగింది.

పద్మజ:—మీరూ మరియు మాన్యులు బ్రహ్మశ్రీ ముత్యంపేట గౌరీ శంకరశర్మ గారు కలిసి జంట అవధానాలు చేయాలని ఎందుకు అనిపించింది ?

శర్మ గారు:– మేమిద్దరం కలసి సంస్కృతాంధ్రాలను, శాస్త్రాలతో పాటు అధ్యయనం చేసాం! మా ఇద్దరి భావాలు, పద్య-శ్లోక ఎత్తుగడ, ధార, ధారణ మొదలగు విషయాలలో ఇద్దరిలోనూ సామ్యం ఉంది, కాబట్టి ఇలా యుగళ (జంటగా) అవధానం చేయాలనే సంకల్పం కలిగింది.
2013లో రవీంద్రభారతిలో అవధాన సప్తాహం జరిగింది. ప్రతిరోజు నిర్వాహకులు ప్రముఖ అవధానులచే అవధానం నిర్వహిస్తున్నారు . ఒకరోజు ఒక శతావధాని (వద్దిపర్తి పద్మాకర్ గారు ) రాలేదు… అకస్మాత్తుగా వారికి బదులుగా మా యుగళావధానం ఏర్పాటు చేశారు. గొప్పగొప్ప విద్వాంసుల మధ్య.

రంగరాజుపద్మజ:– కొత్తగాఅవధానాలు చేయబోయే… చేస్తున్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?

శర్మ గారు:– ప్రాచీన సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. నిరంతర రచన కొనసాగాలి, ధారణ కోసం ఫోన్ నెంబర్లు, వస్తువుల జాబితా మొదలగునవి యంత్ర సహాయాన్ని లేకుండా గుర్తు పెట్టుకోవాలి. ప్రతిభ, ఉత్పత్తి , అభ్యాసం, సమయస్ఫూర్తి , ధైర్యస్థైర్యాలు, ఆర్షవాజ్ఞ్మయ అధ్యయనం, ఇవీ నేను భావి అవధానులకిచ్చే సలహాలు!

పద్మజ:– తెలుగు భాష గురించి ఒక్క మాటలో ఏంచెప్తారు?
శర్మ గారు:–
తెలుగు భాషకన్న గొప్ప వెలుగు లేదు
అదియె రాని యేయెడల నంధకారమే యంత!

పద్మజ:– సంస్కృతం గొప్పదనం గురించి ఏం చెప్తారు?
శర్మ గారు :– లలిత కళలకు , అఖిల పురషార్ధాలకు నిలయం సంస్కృతం ! అలాంటి సంస్కృతాన్ని మనమందరం కాపాడుకోవాలి.

పద్మజ:– అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన ప్రక్రియ. సంస్కృతం -తెలుగు కాకుండా వేరే ఏ ఇతర భాషలలో ఈ ప్రక్రియ లేదు. అతి కష్టమైన సమస్యలను అలవోకగా, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబద్ధ, అసంధర్భ ప్రశ్నలను సమర్ధవంతంగా ఎదుర్కొని, ఆశువుగా పద్యాలతో పూరిస్తూ, అవధాని సభలోని శ్రోతలను ఆనందింప చేయడం అనేది అవధాని ప్రత్యేకత. వీటన్నిటిని ఏకకాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానము.
అవధానం ఓ సాహితీ వినోదం!
మనసును పూర్తిగా విషయం పై లగ్నంచేసి, తన కిచ్చిన సమస్యలను పూరించడం ఏకాగ్రత తోనే సాధ్యం!
అవధాని సంగీత పరిజ్ఞానం కలవారైతే చమత్కారాలతో, శ్రావ్యంగా గానం చేయడంతో సభను రంజిల చేయగలుగుతాడు.
ఈ అష్టావధానంలో అనేక అంశాలుంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతనిని పృచ్ఛకుడు అంటారు. అవధాని గారి పాండిత్యాన్ని, సమయస్ఫూర్తిని పరీక్షించడానికి ప్రశ్నలను వారు అడుగుతారు.
ఇందుకుగాను ధారణాశక్తి ఎంతో ఉపయోగకరం.
అవధానాన్ని విద్యార్థులు చూసినా, నేర్చుకున్నా జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచుకోవచ్చును. వారు రాసే పరీక్షలలో ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. సాధన చేయడం నేర్పుతుంది. ఈ అవధాన ప్రక్రియ. మెదడు కంప్యూటర్ పనిచేసినట్టు ఏ సబ్జెక్ట్ ఆయా గడులలో నిక్షిప్తం చేసుకోవచ్చును.
సాహితీ ప్రియులకు అవధానిగారి చతురోక్తులు, పద్యాలు ఆనందాన్ని కలిగిస్తుంది.
మహిళలకైతే ఏకకాలంలో ఎన్ని పనులైనా చేయగల ఆలోచన కలుగ చేస్తుంది.
అటువంటి అవధాన ప్రక్రియలో సాటి లేని మేటి నేటి మన మయూఖ పత్రిక అతిథులైన ముదిగొండ అమర్నాథ శర్మగారితో ఈనాటి ముఖాముఖీ ద్వారా చక్కగా ఎన్నో విషయాలు తెలిసాయి.
వారిచ్చిన అమూల్యమైన సలహాలు, సూచనలు రేపటి తరానికి ప్రేరణనిచ్చే గొప్పవిషయాలు…
మనం చదివి వదిలేయకుండా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం!

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పసివాని కోరిక

by Sammeta Umadevi March 27, 2024
written by Sammeta Umadevi

జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఉద్యమ సారధి 02

by Vijaya Kandala March 27, 2024
written by Vijaya Kandala

ఉద్య మాలకు పురుటి  గడ్డ  వరంగల్లు.  చరిత్ర కందని కాలం నుంచి ప్రజాఉద్యమా లు ఈ ప్రాంతంలో ఊ పిరి పోసుకున్నాయి . ఒక రంగం అని కాదు . శిల్ప కళ ,కవిత్వం నాట్యం ,నీటి పారుదల ,భవన నిర్మాణం మొదలుకొని సామాజిక ఉద్యమాల వరకు  ఎందరో కళా కారులను,ఉద్యమకారులను, నాయకులను అందించిన ఘనత ఈ ప్రాంతానిది.

 కాకతీయ  చక్రవర్తులయిన  గణపతి దేవుడు ,రుద్రదేవ మహారాజు , ప్రతాపరుద్రుడు మొదలుకొని బమ్మెర పోతన వంటి కవులు ,జాయప సేనాని వంటి యుద్ధ వీరుల వరకూ -ఆధునిక కాలంలో మాజీ ప్రధాని నరసింహ రావు గారు,కాళోజీ నారాయణరావగారు,,దాశరధి సోదరులు నేరెళ్ళ వేణు మాధవ గారు ఇలా ఎందరో వరంగల్లు ప్రాంతా నికే వన్నె తెచ్చారు . ఇలా ఎందరో . తెలియని మరెందరో .

ఈ  list ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఆ గడ్డలో పుట్టిన ఓ మహానుభా వుని గురించి   గుర్తు చేసుకుందాం. వారే శ్రీ పెండ్యాల రాఘవ రావు గారు .  15 మార్చి 1917 నాడు  వరంగల్  జిల్లా లోని చిన్న పెండ్యాల  గ్రామంలో జన్మించారు .హై స్కూల్ చదువంత వరంగల్ లో సాగింది . బాల్యం గురించిన వివరాలు ఎక్కువగా దొరకట్లేదు . కానీ నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచి ప్రజాసంక్షేమమే ఆయన మాట,బాట ,గమ్యం కూడా .1935-36 నుండే మతమార్పిడులను  వ్యతిరేకించారు. అందులో భాగంగా హరిజన వా డలకు  వెళ్ళి ,వాళ్ళతో స్నేహం చేసి , నచ్చచెప్పే వారు . వారిలో నమ్మకం , విశ్వాసం కలిగించడానికి సహ పంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు . నిరక్షరాస్య తను పోగొడితే వారిలో మార్పు మరింత త్వరగా వస్తుందని , హరిజన  పాఠశాలను ప్రారంభించారు .

అగ్ర వర్ణాల పురుషులకే అరకొరగా వసతు లున్న ఆ రోజులలో హరిజనుల విద్య కోసం పాటుపడడం ఓ సాహసం . ఇలా ఎన్నో సాహసాలకు లకు ఆయన జీవితమే ఓ చిరునామా .

కుల వ్యవ స్థను  ఖండిస్తూ, పోరాడారు . ఆజంజాహీ  మిల్లు కార్మికులకోసం ఎన్నో ఉద్యమాలు నడిపారు.

తెలంగాణా  సాయుధ పోరాటానికి మూలం అ యిన విసునూరు పోరాటం లో ముఖ్య భూమిక వహించారు .

వెట్టి చాకిరీనీ నిరసించారు .

గుండాలను సంస్కరించారు .

రజాకార్  ఉద్యమానికి వ్యతిరేకంగా సుధీ ర్ఘ మైన    పోరాటం జరిపారు  .

1938 లో కాంగ్రెస్స్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు . కోపంతో బ్రిటిష్ ప్రభుత్వం జైలు శిక్ష తో బాటు 300 రూ  జరిమానా విధించింది. 90 సంవత్సరాల క్రితం 300 రు అంటే ఆలోచించండి . తర్వాతి కాలంలో ఆంధ్ర మహా సభలో చేరారు .1946 లో దాన్ని రద్దు చేసినప్పుడు ఆజ్యత వాసం  చేశారు . ఆయిన జీవితమే ఓ సాహసాల  పందిరి .

వితంతు వివాహాలతో  నైజాం రాజ్యంలో చైతన్యాన్ని జ్వలింప చేశారు .

గ్రం ధాలయ ఉద్యమం  లో పా లు పంచుకున్నారు .

ఎన్నికల్లో విజయం వారి జీవితంలో ఒక అధ్భుత ఘట్టం . ఈ రోజుల్లో ఎలక్షన్లలో గెలవడం కోసం అన్నీ పార్టీలు ,అందరు  అభ్యర్థులు

అనుచరుల సాయంతో వీధి వీధి తిరిగి వోట్లను అడుగుతున్నారు . వారికి ప్రజలపై నమ్మకంలేదు . అందుకే దేశ ఆర్థిక ప్రగతిని తలకిందులు చేసేలా తాయిలా లను  ప్రకటిస్తున్నారు . అలానే ఓటర్లకు  నాయకులపై నమ్మకం లేదు .  ఇచ్చినవన్నీ  పుచ్చుకొంటున్నారు . కొసరు కోసం  బేరసా రాలను  సాగిస్తున్నారు . ఫలితాలను ప్రకటించే వరకూ నేతలను టెన్షన్ లో  ముంచెత్తుతున్నారు . ఇ లాంటి వ్యవస్థలో ఉంటూ ఇదే నిత్యాసత్యమనే భ్రమలో బ్రతికేస్తున్నాం మనం . 1952 సాధారణ ఎ న్నికలలో  కమ్యూనిస్ట్ నాయకునిగా ఒక అపురూప రికార్డ్ ను సాధించారు . రాఘవరావు గారు వరంగల్ లోకసభ స్థానం తో బాటు హన్మకొండ ,వర్ధన్నపేట శాసన సభా  స్థానాలనుంచి పోటీ చేశారు . మూడింటి లోనూ గెలిచారు . వరంగల్ లోకసభస్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

 అవునా?

అంతేకాదు . ఈ ఎన్నికలలో నామినేషన్ ను జైలు నుంచి వేశారు .

ఎందుకలా?

ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేసినందుకు అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది . ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా జైలు నుంచి పోటీ చేసి గెలిచిన ప్రజనాయకునికి ప్రజల తీర్పు అది .

నిజంగానా ?

అంతేకాదు ఈ విజయం సాధిం చేనాటికి   ఆయన వయస్సు 35 ఏళ్ళే . దేశ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డు . నా టి నుంచి ఒకేసారి 3 స్థానాల్లో పోటీ చేసి 3 చోట్ల గెలిచిన నేతలు ఇద్దరే . ఒకరు పెండ్యాల రాఘవరావు గారు ,మరొకరు నందమూరి తారక రామారా వు గారు .

అంటే

మీ అనుమానం  నిజమే . 1952 లో నెలకొల్పిన రికార్డ్ సమానం కావడానికి 33 సంవత్సరాలు పట్టింది.

రాఘవరావ్ గారిది ఆకర్షణీ యమైన విగ్రహం . ముఖంలో చెరగని చిరు మందహాసం . మాటల్లో చా తుర్యం ,చమత్కారం ఉట్టిపడేవి . సమాజం లోని  దుర్మార్గాన్ని ,అన్యాయాలను ప్రతిఘటించడానికి తీ వ్రవాదిగా  మరి తుపాకి పట్టినా , కంఠంలో కారుణ్యం ,మనసులో మానవతా తొణికిసలాడేవి.

,అత్యున్నత చట్టసభలో ఎన్నో కీలకమైన చర్చల్లో పా లుపంచుకున్నారు .  ఆయన ప్రసంగాలు శక్తి నిండిన  ప్రవా హాలు .

M P గా పని చేసినంత శ్రద్ధగా గ్రామ పంచాయితీ సర్పంచ్ గాను పని చేశారు. గ్రామ వికాసానికి తా  గు నీరు ,సాగునీరు, విద్యుత్ సౌకర్యం అతి ముఖ్య మైనవి . వీటి ప్రాధాన్యతను ఆనాడే గుర్తించి , కృషి చేసిన ప్రజానాయకుడు.

ఒక  ఉత్కృష్టమైన జీవితం తన కధనాన్ని తానే రాసుకుంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ వారి ఆత్మ కథ . దాని పేరు నా ప్రజాజీవితం . ఆయనకు తన కన్నా ,తన కుటుంబం కన్నా ప్రజలంటేనే మక్కువఎక్కువ . అందుకే భగవంతుడు ఆయన ఆత్మకధను అసంపూర్తిగా ఆపేశాడు .

ఏ  నాయకుని జీవితము అసంపూర్తిగా మిగిలిపోదు . మరెన్ని  ఉద్యమాలకో ఊపిరి పోస్తుంది . మరేందరికో స్ఫూర్తినిస్తుంది.

అలాంటి త్యాగమూర్తుల కృషి  అనే  పునా దులపైనే మనమీ నాడు జీ విస్తున్నాము .

కొస మెరుపు 

మన ప్రియతమ సోదరి శ్రీమతి కొండపల్లి నీహరిణి గారు వీరి సుపుత్రికే . అవే లక్షణాలు వీరిలో  శా ఖో ప శాఖలై పుష్పించి, ఫలిస్తున్నవి  ఈ నాడు.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆమే అలిగిన నాడు..!

by Aruna Dhulipala March 27, 2024
written by Aruna Dhulipala

వెన్ను భాగాన్ని పరచుకున్న జుట్టును
వేళ్ళతో సుతారంగా ముడివేసి
కంటిరెప్పల బరువును
అమాంతం దించుకొని
కాలి అందెల సవ్వడి ప్రణవంగా
మెత్తని అడుగులతో వడివడిగా
ప్రపంచంపై సూరీడు పాకక ముందే
మొదలయ్యే ఉదయం ఆమెతో

తెల్లటి ముగ్గు రేఖలు 
వేలి సందుల నుండి జాలువారి
వయ్యారాలు పోతుంటాయి
చేతి రుచుల కమ్మదనాలు
బయటివారిని ఒకింత
నిలువరిస్తాయి ఇంటిముందు
అగరొత్తుల పరిమళాలు
దేవతా దీవెనలై వ్యాపిస్తాయి

ఇంటినిండా..
బద్ధకం కప్పుకున్న దేహాలు
మగతగా దొర్లుతుంటాయి 
వారి అవసరాల కోసం ఆమె
శరీరంలో ఇంకిన తేజస్సును
అరువు తెచ్చుకుంటుంది 
మళ్లీ మళ్లీ కొత్తగా

త్యాగాల కుంచె ధరించి
ప్రతి క్షణం వారి కోరికలకు
నునువెచ్చని మమకారాల
వన్నెలద్ది
జీవన కాంతిని ప్రసరిస్తూ ఆమె

అడుగడుగున ఆమె పదనర్తనం
వెన్నెల చల్లదనంలా
స్వచ్ఛతకు మారు పేరవుతుంది
తనకు తాను తప్ప
అందరికి మాత్రం ఆమే

ఆమే అలిగిన నాడు….?
ఏ భాషా భావం
విప్పలేదు ఆ శక్తిని
కూర్చలేదు ఆనందాకృతిని !

అరుణ ధూళిపాళ
8-3-2024
(అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా)

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —– ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 27, 2024
written by Narendra Sandineni

హిమజ కోటు — ధోతీ కవిత్వం.

ప్రముఖ కవయిత్రి,హిమజ కలం నుండి జాలువారిన సంచీలో దీపం కవితా సంపుటిలోని కోటు — ధోతీ కవిత పై విశ్లేషణా వ్యాసం.కోటు – ధోతీ కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.మనుషులు ధరించే కోటు – ధోతీ గురించి కవిత ఏమిటి? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు.మనుషులు చొక్కా పై కోటును ధరించడం గురించి మనకు అవగాహన ఉంది.ధోతీ పంచె అని పిలువబడే ఒక రకమైన వస్త్రం.ధోతీ అనేది పురుషులు ధరించే వస్త్రం.ధోతీ ఒక దీర్ఘ చతురస్రాకార రూపంలో ఉండే వస్త్రం. సాధారణంగా ధోతి సుమారు 4.5 మీటర్లు (15 అడుగులు) పొడవు,నడుము మరియు కాళ్ళ చుట్టు చుట్టబడి,ముందు లేదా వెనుక భాగంలో ముడి వేయబడి ఉంటుంది.ధోతీని మత పరమైన మరియు లౌకిక వేడుకలలో పురుషులు ధరిస్తారు.పీతాంబరం అనేది పసుపు రంగు పట్టు ధోతి.కొందరు వ్యక్తులు ధోతీని ధరిస్తారు. కొందరు పాయింట్ వేసుకుంటారు. కొందరు నిక్కర్ వేసుకుంటారు.లోకంలో భిన్నమైన మనస్తత్వాలు కలవారు ఉంటారు.భిన్నమైన రీతిలో వస్త్ర ధారణ చేస్తారు.మనుషుల అభిరుచి ఒక్క రీతిగా ఉండదు.వారు ఎవరికి ఇష్టమైన వస్త్రం వారు ధరిస్తారు. కవయిత్రి హిమజ కోటు – ధోతీ కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకొండి.

హిమజ

“ ఆ కాలపు ఆహార్యమో
“ఉద్యోగ ధర్మంగా అనివార్యమో
“ఆదివారం మినహాయించి అన్ని రోజులు
“మామయ్య గారు – కోటుతోనే కన్పించే వారు మాకు.
ఆహార్యం అంటే మేకప్.మేకప్ అంటే ఈ రోజుల్లో అందరికీ అర్థమవుతుంది.వేషానికి ధరించే సామాగ్రి ఆహార్యం తెచ్చుకొనతగినది.నాటకాలలో నటుల హావభావాలకు పాత్రకు తగిన ఆహార్యానికి ప్రాధాన్యత ఉంటుంది.వస్త్ర ఆభరణాలు ఆయా పాత్రలకు సందర్భోచితంగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు ఆనందానుభూతి ఏర్పడుతుంది.వీరుడికి కాలోచితంగా కత్తి,డాలు,పిస్టల్,కవచము వంటివి ఆహార్యంలో ఒక భాగం.విషాద సన్నివేశంలో అయితే దానికి తగిన వస్త్రాలు ధరిస్తారు. రసానుగుణంగా పాత్రలు ధరించే ఆభరణాలు, అనులేపనలు అన్ని ఆహార్యంలోనివే.మామగారు ధరించే దుస్తులు అప్పటి కాలానికి సరిపోయే విధంగా ఉండేవి అని తెలుస్తుంది.అతను నిర్వర్తించే ఉద్యోగ ధర్మంలో భాగంగా వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వాడు అని తోస్తోంది.అతడు ప్రతి రోజు తన విద్యుక్త ధర్మమైన విధుల్లో భాగంగా చొక్కాపై కోటు వేసుకొనే వాడు.ఆదివారం నాడు సెలవు దినం కనుక అతను ఆ రోజు సాధారణంగా మామూలు దుస్తులు ధరించే వాడు.ఆ ఒక్కరోజు మాత్రమే అతను కోటు ధరించే వాడు కాదు.మిగతా రోజులలో చొక్కాపై కోటు వేసుకుని మామయ్య కనిపించే వారు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“జమా బందీలు జరిగినా
“శిస్తు వసూళ్లకు సాగినా
“రెవెన్యూ దౌరాలకు కదిలినా “ఒంటినంటుపెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే.
జమాబందీ భారతదేశంలో ఒక నిర్దిష్టమైన భూమికి సంబంధించిన హక్కుల రికార్డును సూచించడానికి ఉపయోగించే హిందీ పదం.జమాబందీలో యజమానుల పేర్లు,భూమి యొక్క విస్తీర్ణం,దాని ఉపయోగం మరియు భూమిపై ఏవైనా తణఖాలు, శిస్తులు వంటి వివరాలను కలిగి ఉంటుంది. పూర్వకాలం నుంచి ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరు భూమి శిస్తు.భూమి శిస్తు వసూలు చేసి ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.అతను రెవెన్యూ శాఖలో తహసిల్దారుగా పని చేసే వాడు అని తెలుస్తుంది.అతను తహాసిల్దార్ హోదాలో జమా బందీలకు,సాధారణంగా సంవత్సరానికి ఒక సారి శిస్తుల వసూలు కొరకు జరిగే సమావేశాలకు హాజరయ్యే వాడు. వ్యవసాయ భూముల శిస్తు వసూళ్లకు అధికారికంగా పర్యటించే వాడు.విధి నిర్వహణలో భాగంగా అతడు రెవెన్యూ దౌరాలకు వెళ్లే వాడు.జమా బందీలకు వెళ్లినా,శిస్తు వసూళ్లకు వెళ్లినా,రెవెన్యూ దౌరాలకు వెళ్లినా అతను కోటు ధరించి వెళ్ళే వాడు.అతను వెళ్లే అధికారిక కార్యక్రమాలకు ఒంటినట్టు పెట్టుకొని కోటు ఉండి తీరాల్సిందే అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.
“పాల తెలుపు అంగీ గ్లాస్కో ధోతీ మీద
“లేత రంగు కోటు ఎంత గంభీరమో అంతే హుందాతనం
“లోపలి మెత్తటి అస్తరుతో కోటు తిర్ల మర్ల తెలియకున్నా
“మామయ్య గారి జీవితమైతే తెరిచిన పుస్తకమే.
అతను పాల తెలుపు రంగు చొక్కా ధరించే వాడు. గ్లాస్కో కంపెనీ తయారుచేసిన ధోతీని కట్టుకునే వాడు.తెల్ల చొక్కాపై లేత రంగు కోటు ధరించిన అతను ఎంతో గంభీరంగా ఉండే వాడు.అతడు హుందాగా ప్రవర్తించే వాడు.అతని నడకలో ఒక రకమైన ఠీవి కనిపించేది.అతను హుందాతనంతో మనోహరమైన అందమైన వర్చస్సుతో ఇతరులను ఇట్టే ఆకర్షించే సుగుణంతో పాటు మర్యాద, మన్ననను పొందే వాడు.అతను వేసుకున్న కోటు లోపలి మెత్తటి అస్తరుతో కూడి ఉండటం వలన కోటు తిర్ల మర్ల తెలిసేది కాదు.మామయ్య గడిపిన జీవితం తెరిచిన పుస్తకం వలె రహస్యాలు, దాపరికాలు,ఏవీ ఉండేవి కావు.అతడు అందరితోనూ ప్రేమగా సౌహార్ధంగా వ్యవహరించే వాడు.అతడు గడిపిన జీవితం ఎలాంటి భేషజాలు లేకుండా ఉండేవి.తెరచిన పుస్తకం అనే మాట మనకు అక్కడక్కడ వినిపిస్తుంది.కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంత కాలం అంతా దాపరికం,దాగుడు మూతలు,మాయగా ఉంటుంది. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి. తప్పదు.దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు.

“ఉద్యోగ బాధ్యతల్లో నిక్కచ్చితనం
“అవినీతికి ఆమడ దూరం – పైస పైస కష్టార్జితం
“తాటాకు మంట కోసం పసి పిల్లల బోళాతనం
“ఆఫీసు ఇల్లు రాముల వారి పూజ
“నుదుట వెలిగే తిరునామమెంత సరళమో
“అంతే సాదా సీదాయైన జీవన సరళి.
రెవెన్యూ శాఖలో ఉద్యోగం అయినప్పటికీ అతను ఎలాంటి ప్రలోభాలకు,అవినీతికి లొంగ లేదు.ఉద్యోగ బాధ్యతలను అతడు నీతిగా,నిజాయితీగా, నిక్కచ్చితనంతో నిర్వహించే వాడు.అతడు అవినీతికి ఆమడ దూరంలో ఉండే వాడు.అతను ఉద్యోగంతో వచ్చిన జీతంతోనే బతుకు బండిని సాగించే వాడు.అతను సంపాదించిన జీతం పైస పైస కష్టార్జితం అని చెప్పవచ్చు. తాటాకు మంట కోసం ఉండే పసిపిల్లల బోళాతనం అతనిలో కనిపించేది.అందరి పట్ల సమాన దృష్టితో పసిపిల్లల వలె అతను వ్యవహరించే వాడు అని తెలుస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అతను ఉదయం ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లే వాడు.ఆఫీస్ పని పూర్తి అయిన తర్వాతనే అతను ఇంటికి చేరుకునే వాడు. అతను ఆఫీస్ బాధ్యతలను ఇంటి బాధ్యతలను సంయమనంతో నిర్వహించే వాడు.ప్రాతఃకాలంలో అతను లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని నుదుట తిరునామం ధరించి ఇంటిలోని రాముల వారిని పూజించే వాడు.అతడు నుదుట ధరించిన తిరు నామం ఎంతో సరళంగా ఉంటుంది. సాదా సీదాయైనా జీవన సరళితో అతను బతుకును సాగించాడు.సభ్యతా సంస్కారాలతో కూడిన అతని జీవన సరళి అందరికీ అనుసరణీయం అని తోస్తోంది.
“కోటు – ధోతీ ఆహార్యంలో
“ఎక్కడ ఎవరు కన్పించినా
“మామయ్య గారి రూపు – నా స్మృతిలో
“తడి మెరుపై మెరిసి మాయమవుతుంది.
ఆమె జీవిత ప్రయాణంలో ఎక్కడికి వెళ్లినా కోటు ధోతీ కట్టుకొని ఎవరు కనిపించినా మామయ్య గారి రూపం ఆమె జ్ఞాపకాల్లోకి వచ్చి కళ్ళముందు అతను ప్రత్యక్షమయ్యే వాడు.మామయ్య గారు అలా కనిపించగానే ఆమె కళ్ళలో కన్నీటి ధారలు ఒక్క సారిగా ఆకాశంలోని మెరుపులా మెరిసి మాయమయ్యేవి మామయ్యగారు చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఆమె జ్ఞాపకాలలో అతను సజీవంగా నిలిచి ఉన్నాడు.అతను ఆమె పట్ల చూపించిన అనురాగం అపారమైనది, అసాధారణమైనది.అందుకే ఆమె ఎల్లప్పుడూ అతనిని జ్ఞాపకాల ద్వారా గుర్తు చేసుకుంటున్నది అని కవయిత్రి హిమజ కవితలో వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ఉద్యోగుల బలవంతపు పదవీ విరమణతో
“ఒక్కసారిగా ఆయన డీలా పడితే
“ఒంటిమీద కోటులన్ని శుభ్రపడి
“అలమరలో దాక్కున్నాయి.
పదవీ విరమణ అనేది ఒకరి స్థానం లేదా వృత్తి నుండి లేదా ఒక చురుకైన పని జీవితం నుండి వైదొలగడంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో చేరిన వారు ఒక నిర్దిష్టమైన వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేస్తారు.ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో ఒక బాధ్యత గల పదవిలో నుండి పదవీ విరమణ కాగానే అతనికి ఏమీ తోచేది కాదు.పదవీ విరమణ పొందిన అనంతరం ఒక్క సారిగా ఎందుకో తెలియదు అతను ఢీలా పడి పోయాడు.అతను రోజు కోటు వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.అందు వల్ల అతను ధరించే కోటు దుస్తులు శుభ్రంగా ఉతికి ఆరిన తర్వాత అలమారలో దాచి పెట్టినారు.అతను ధరించిన ఒంటి మీద ఉన్న కోటులు అన్ని శుభ్రపడి అలమరలో దాక్కున్నాయి అని కవయిత్రి హిమజ చెప్పిన తీరు చక్కగా ఉంది.
“ఆస్తుల్ని నాకిచ్చి అకాలంగా వెళ్లిపోయిన
“ఆయన ఆస్తిగా భద్రంగా
“కోటు జేబులో దాచుకున్నది
“చిన్నారి శైలు ఛాయా చిత్రం ఒక్కటే.
మనిషి జీవితంలో అన్ని రోజులు ఒక్కలా ఉండవు. అకాలం అనగా మంచిగా జరగని కాలం.అతను జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని నాకు ఇచ్చి తిరిగిరాని లోకాలకు చేరినాడు.అతను అకాలంగా వెళ్లి పోయిన రోజు గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుంది.ఈ లోకాన్ని వీడిపోయిన అతను తన చేతుల్లో పెరిగిన చిన్నారి శైలు ఫోటోను ఆస్తి వలె భద్రంగా తన కోటు జేబులో దాచుకున్నాడు అని కవయిత్రి హిమజ కవితలో చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.
“యాభయేళ్ళ క్రితపు డైరీలో
“ఆయన రాసి పెట్టుకున్న ఒకే ఒక్క పేజీ
“శైలు తల్లి పుట్టిన తేది మాత్రమే !
డైరీ దినచర్య పుస్తకం.ఒక వ్యక్తి తను చూసిన లేదా విన్న దాని గురించి గాని వారు చేస్తున్న పని గురించి గాని ఏ రోజు జరిగిన సంఘటనలు ఆ రోజు నమోదు చేయు పుస్తకం డైరీ.ప్రజలు వివిధ కారణాల వల్ల డైరీలను వ్రాసేందుకు ఇష్టపడతారు. డైరీ రాసే వ్యక్తి తన జీవితంలో ఏమి చేశాడనే దాని గురించి తనకంటూ ఒక రికార్డు ఉండాలని అతను కోరుకుంటాడు.ఈ లోకాన్ని వీడిన అతని ఇంటి అలమరలో వెతకగా 50 ఏళ్ల క్రితం నాటి డైరీ ఒకటి దొరికింది.అతను డైరీలో రాసి పెట్టుకున్న ఒకే ఒక పేజీ కనబడింది.అతను డైరీలో రాసి పెట్టుకున్నది శైలు తల్లి పుట్టిన తేదీ మాత్రమే.50 సంవత్సరాల కిందటి డైరీలో మిగతా పేజీల్లో ఏమీ రాయలేదు.ఒక పేజీలో మాత్రం శైలు తల్లి పుట్టిన తేదీని నమోదు చేసి పెట్టుకున్నాడు.అతనికి శైలు తల్లి పుట్టిన రోజు అంత ముఖ్యమైనదిగా,అపురూపమైనదిగా తోస్తోంది.కవయిత్రి హిమజ తనను ప్రాణంగా సాదుకున్న మామయ్య గారి స్మృతిలో కోటు – ధోతీ కవితను రాసి పాఠక లోకానికి అందించింది. కవయిత్రి హిమజ రాసిన కోటు – ధోతీ కవిత ఎప్పటికీ నిలిచి ఉంటుంది.చక్కటి స్మృతి కవిత రాసినందుకు కవయిత్రి హిమజను అభినందిస్తున్నాను.కవయిత్రి హిమజ మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన —- ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 27, 2024
written by Narendra Sandineni

కున్వర్ నారాయణ్ హిందీలో రచించిన కవిత.
ఆంగ్లం అనువాదం : అపూర్వ నారాయణ్.
తెలుగు అనువాదం : వారాల ఆనంద్.
కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రఖ్యాత కవి,కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవిత ఇది.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను అపూర్వ నారాయణ్ ఆంగ్లంలోకి అనువాదం చేశాడు.కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన ఓ వింతయిన రోజు కవితను వారాల ఆనంద్ తెలుగులోకి అనువాదం చేశాడు. తెలుగులోకి వారాల ఆనంద్ అనువాదం చేసిన వింతయిన రోజు కవిత చదవగానే నాలో కలిగిన భావాలకు అక్షర రూపం దాల్చిన విశ్లేషణా వ్యాసం ఇది.ఏదైనా కొత్త విషయం తెలిస్తే మనకు వింతగా అనిపిస్తుంది.ఏదైనా కొత్త వస్తువు అపురూపమైనది చూస్తే మనకు వింతగా అనిపిస్తుంది.మనలను సంభ్రమాశ్చర్యాలకు ముంచెత్తే విషయం వింతగా చెప్పవచ్చు. ఏదైనా వింతను చూస్తే ఆశ్చర్యపోతాం. ఆశ్చర్యం కలిగించే మాటలు వినినప్పుడు మనకు వింతగా అనిపిస్తుంది. అసాధారణమైన మాటలు వినినప్పుడు లేదా చూసినప్పుడు మన మనసులో కలిగే భావనను వింతగా చెప్పవచ్చు. విస్మయము కలిగించే వస్తువును కూడా వింత గొల్పేది అని చెప్పవచ్చు.ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి.రోజుకు 24 గంటల సమయం ఉంటుంది.కాలచక్రం ఎవరికి తెలియకుండానే గిర్రున తిరుగుతూ ఉంటుంది.మనం అనుభవించే ప్రస్తుత క్షణం కూడా రోజులోని భాగమే అని చెప్పవచ్చు. రోజును దినం అని కూడా అంటారు.రోజును వివిధ రకాలుగా పిలుస్తారు.ఏదో ఒక రోజు అని చెబుతాం. ప్రతిరోజు అని కూడా అంటాం.జీతాలు ఇచ్చే రోజును జీతాల రోజు అని అంటాం.కొందరు పుట్టిన రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు. కొందరు భార్యాభర్తలు పెళ్లి రోజు సందర్భంగా వేడుకను జరుపుకుంటారు.సమాజానికి గొప్ప సేవ చేసిన వారు లోకాన్ని వీడిన రోజును వర్ధంతి రోజుగా జరుపుకుంటారు. సమాజానికి గొప్ప సేవ చేసి చనిపోయిన వ్యక్తి జన్మించిన రోజును కూడా జయంతి రోజును వేడుకగా జరుపుకుంటారు. నడుస్తున్న ఈ రోజున మంచి జరిగితే మంచి రోజు అని చెబుతారు.నడుస్తున్న ఈ రోజున ఏదైనా దుర్ఘటన జరిగితే దానిని చెడ్డ రోజు అని చెబుతారు. ఓ వింతయిన రోజు కవిత ఏమిటి? అని ఆసక్తితో చదివాను.అసలు వింతయిన రోజు ఏదైనా ఉంటుందా? అనే సందేహాలు మనలో పొడచూపవచ్చు.వింతయిన రోజు అనగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఓ వింతయిన రోజు ఏమిటి? అనే సందేహాలకు సమాధానాలు కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను చదివితే తెలుస్తుంది.కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవిత ద్వారా ఒక రోజులో జరిగిన వింతలు,విశేషాలను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.వింతయిన రోజు సందర్భంగా అతను ఏమేమి చేశాడు? ఆ రోజున అతనికి ఏమేమి జరిగింది అనే సంఘటనలను పూసగుచ్చినట్టు విడమర్చి చెప్పిన తీరు అబ్బురం కలిగిస్తుంది.వింతయిన రోజున జరిగిన దానిని అతను అదృష్టంగా భావిస్తున్నాడు.వింతయిన రోజు గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తితో కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.వింతయిన రోజులో జరిగిన సంగతులు తెలుసుకొని అలౌకిక అనుభూతులను సొంతం చేసుకుందాం.

వారాల ఆనంద్.


“ నేను రోజంతా గాయి గాయిగా తిరిగాను
“ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు
“ అనేకమంది మనషుల్ని కలిసాను
“ ఎక్కడా అవమానం ఎదురు కాలేదు.
అతను అలా రోజంతా పని చేయకుండా వృధాగా నగరమంతా ఎందుకు తిరిగాడు? అతను ఆ రోజున చేయాల్సిన పని చేయకుండా ఎందుకు వృధాగా వీధులలో తిరుగుతాడు? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.కారణాలు ఏమిటో అతడు చెబుతున్నది నిజమేనా? అని మనకు సందేహం కలుగుతుంది.అతను అంత పెద్ద నగరంలో అలసట ఎరుగక,విసుగు చెందకుండా వృధాగా తిరిగినప్పటికీ ఆ రోజు ఏ వాహనం వల్ల గాని మరే విధంగా గాని ప్రమాదం సంభవించలేదు అని అంటున్నాడు. నిజమేనా?ఆ రోజు ఎలాంటి పని చేయకుండా నగరంలోని వీధులన్నీ తిరుగుతూ వృధా సంచారం చేస్తూ ఖాళీగా ఉండక అనేకమంది మనుషులను కలిశాను,మాట్లాడాను అని అంటున్నాడు.ఆ రోజు కలిసిన వ్యక్తులు అందరు అతనితో సానుకూలంగా మాట్లాడారు.అతనితో ఎలాంటి వాదోపవాదాలు చర్చలు జరప లేదు.ఆ రోజు ఎందుకో ఏ మనిషి వల్ల అతనికి అవమానం ఎదురు కాలేదు.అతను చెప్పిన మాటలు వింటుంటే ఎందుకో మనకు నమ్మశక్యం అనిపించదు.ఆ రోజు జరిగిన సంగతుల గురించి అతని మాటలు వినగానే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.ఆ రోజు అతను కలిసిన అనేకమంది మనుషులు సానుకూలంగా మాట్లాడటం ఏమిటి? ఎలాంటి గొడవలు లేకుండా మనుషులు అందరు సానుకూలంగా ఎలా ఉంటారు?.మనుషులు అందరు ఒక్కలా ఉండరు.మనుషులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు.ఒకరినొకరు విమర్శించుకుంటూ,వ్యతిరేకిస్తూ అవమానించుకుంటారు.కాని ఆ రోజున ఇలాంటివి ఏమీ జరగలేదు అన్న అతని మాటలు వింటుంటే ఆశ్చర్యంతో పాటు ఆనందం కలుగుతుంది.
“ నేను రోజంతా సత్యమే మాట్లాడాను
“ ఎవరూ తప్పుగా స్వీకరించలేదు
“ నేనివాళ అందరిని విశ్వసించాను
“ ఎక్కడ మోసగింప బడలేదు.
అతను ఈ రోజు అందరితో సత్యమే మాట్లాడాడు.అతను మాట్లాడిన మాటలను ఎవరు తప్పుగా అర్థం చేసుకోలేదు. అతను మాట్లాడిన మాటలను ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు?ఆ రోజు సత్యాన్ని మాత్రమే మాట్లాడటానికి అతను సత్య హరిశ్చంద్రుడు కాదు.అతను సత్యం ఎలా మాట్లాడాడు? అతను సత్యం మాట్లాడుతుంటే అందరు అతన్ని సత్యవంతుడుగా ఎలా స్వీకరించారు? అనే సందేహాలు కలుగవచ్చు.అతను ఆ రోజు అందరు మనుషులను విశ్వసించాను అని చెబుతున్నాడు.ఎవరైనా అందరి మనుషులను విశ్వసిస్తారా? అప్పుడే పరిచయమైన వ్యక్తిని ఎలా విశ్వసిస్తారు? అతను ఎవరో? ఏం చేస్తుంటాడో? అతని గురించిన వివరాలు ఏమీ తెలవదు.అతను తెలవని వ్యక్తిని విశ్వసించాను అని చెబుతున్నాడు. అతని మాటలు వింటుంటే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ మనిషి చేత ఎక్కడ మోసగింపబడ లేదు అని చెబుతున్నాడు.మనకు తెలియని మనిషి ఎలా సాయం చేస్తాడు.తెలియని వ్యక్తి సాయం చేస్తాను అని అతనితో చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.సాయం చేస్తానని తెలిసిన మనిషి చెప్పిన మాటలను కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలిసిన మనిషి కూడా నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి.తెలిసిన మనిషిని కూడా పూర్తిగా విశ్వసించలేము.తెలవని వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు. తెలిసిన వ్యక్తులు కూడా అతనిని మోసగిస్తారు.ఆ రోజు అతను ఏం చేస్తున్నాడో? ఎక్కడికి పోతున్నాడో? ఏం పని మీద పోతున్నాడో? తెలియకుండా అయోమయంగా నగరం అంతా సంచరించడం ఆశ్చర్యం గొల్పుతుంది.ఆ రోజు అతను అందరిని ఎలా విశ్వసించగలడు?ఆ రోజు ఎందుకో అతనిపై అందరికి నమ్మకం కుదిరింది. అందుకే అతను అందరిని విశ్వసించాడు అని తోస్తుంది.ఆ రోజు మనుషులు అందరు సత్యవంతులు అని అతడు భావించాడు.సమాజం నిండా మోసగాళ్ళు నిండి ఉన్నప్పుడు ఆ రోజు అతన్ని మోసం చేయకుండా ఎలా ఉంటారు? అనే సందేహాలు మనలో తలెత్తుతాయి.సత్యమేవ జయతే అని సూక్తి ఉంది.సత్యమే జయిస్తుంది. హరిశ్చంద్రుడు సత్యం కొరకు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు.చివరికి విజయం సాధించాడు. హరిశ్చంద్రుడు సత్యమైన బాటలో నడిచి సత్యవంతుడుగా ఖ్యాతి గడించాడు.
“ అద్భుతమయిన విషయమేమిటంటే
“ నేను ఇంటికి చేరుకోగానే
“ తిరిగొచ్చింది ఇంకెవరో కాదు
“ నేనే అని కనుగొన్నాను.
ఆరోజు నగరంలో అతను ఎటు పోతున్నాడో? ఏమి చేస్తున్నాడో? తెలియకుండా అయోమయంగా వీధులన్నీ తనవిగా భావించి తిరిగాడు.ఎందుకో ఆ రోజంతా తిరిగిన తర్వాత అలసిపోయిన అతను ఒక ఇంటికి చేరాడు.ఆ ఇల్లు ఎవరిదో అని అనుకున్నాడు.అద్భుతంగా ఆ రోజు నగరం అంతా తిరిగిన తర్వాత మొహమంతా పీక్కుపోయి బాగా అలసిపోయినాడు.ఇది ఎవరి ఇల్లో? అని మనసులో అనుకున్నాడు.ఆ రోజంతా నగరంలో తిరిగిన తర్వాత అలసిపోయి చిత్రంగా తన ఇంటికే చేరుకున్నాడు.ఎందుకో ఆ రోజు అయోమయంగా ఎక్కడ తిరిగినప్పటికీ ఏం చేసినప్పటికీ అతని అడుగులు మాత్రం మర్చిపోకుండా ఇంటికి చేర్చాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.ఇంకా అతను ఆ రోజు జరిగిన విషయాన్ని గొప్పగా అందరికీ తెలియజేస్తున్నాడు.ఆ రోజు జరిగిన అద్భుతమైన విషయం ఏమిటి? అంటే చివరికి నగరమంతా తిరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. చివరికి తన ఇంటికి చేరుకున్నాడు.అతను తన ఇంటికి చేరిన తర్వాత తెలిసింది.అయోమయంగా నగరమంతా తిరిగి తన ఇంటికే వచ్చినాడు.నగరం అంతా తిరిగి తన ఇంటికి వచ్చినది ఇంకెవరో కాదు తానే అని తెలుసుకున్నాడు.అయోమయంగా నగరం అంతా తిరిగిన ఆ రోజు అతని జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటనగా వింతైన రోజుగా తోస్తోంది.అతను ఆ రోజు ఏం చేసింది? అన్ని విషయాలు అందరితో పంచుకున్న తీరు చక్కగా ఉంది.అతని జీవితంలోని ఆ రోజుకు సంబంధించిన వింత విషయాలను పాఠకులకు అర్థం అయ్యేలా కవి కున్వర్ నారాయణ్ వింతయిన రోజు కవితలో చెప్పిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.ఆ రోజు జరిగిన వ్యక్తి జీవితంలోని సంఘర్షణలను కవితగా మలిచిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.ఆ రోజు వ్యక్తిలో చెలరేగిన భావాలను వింతైన రోజు కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.కవి కున్వర్ నారాయణ్ హిందీలో రాసిన కవితను తెలుగులోకి అద్భుతంగా అనువాదం చేసిన కవి వారాల ఆనంద్ ను అభినందిస్తున్నాను.

March 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

పసివాని కోరిక

by Sammeta Umadevi March 17, 2024
written by Sammeta Umadevi

జిల్లా పరిషత్తులో గుమాస్తాగా పనిచేస్తున్న గంగాధర్ పిల్లలే అరుణ ఆనంద్ లు. పదవ తరగతి చదువుతున్న అరుణ ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ, చదువుకుంటూ ఉంటుంది. ఆరో తరగతి చదువుతున్న ఆనంద్ కేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆడుకోవడానికి తన ఈడు పిల్లలు లేక చిన్నబోయి ఉండేవాడు. ఇప్పుడు గంగాధర్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంట్లోకి మారాక అక్కడ తన ఈడు పిల్లలు కొందరు ఉండడంతో ఆనంద్ తన కొత్త మిత్రులతో సంతోషంగా గడపసాగాడు. ముఖ్యంగా ఆనంద్ కి పక్కింటి రియాజ్ కి మంచి స్నేహం కుదిరింది.

 ప్రత్యేక తరగతులు ఉన్నందున ఆనంద్ అక్క అరుణ రోజూ బడికి ముందు వెళ్ళిపోతుంటుంది.  అందువల్ల ఆనంద్, రియాజ్ ఇద్దరూ కలిసి బడికి వెళ్తున్నారు. పెరట్లో జామచెట్టు కింద చాప వేసుకుని కూర్చుని కలిసి హోమ్ వర్క్ చేసుకుంటున్నారు. పోటీ పడి చదువుకుంటున్నారు. హాయిగా ఆడుకుంటున్నారు. పాలపాకెట్టో, కూరగాయలో ఎవరు తెమ్మన్నా ఇద్దరూ కలిసి వెళ్ళి తెస్తున్నారు. రియాజ్ వాళ్ళ నాన్న ఖాదర్ చెప్పుల షాప్ లో పనిచేస్తాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. తల్లిని ఒప్పించి ఆనంద్ తన నోట్సులు కొన్ని రియాజ్ కి ఇచ్చాడు. అప్పుడప్పుడు పెన్సిల్లు, పెన్నులు కూడా ఇస్తుంటాడు.. ఇక తల్లి సుదతి పండ్లూ పలహారం ఏమిచ్చినా రియాజ్ తో పంచుకుని తినడం అలవాటయ్యింది ఆనంద్ కి. రియాజ్ వాళ్ళ అమ్మ జరీనా ఏమి వండినా ఆనంద్ ని పిలిచి  మరీ పెడ్తుంటుంది. కొన్ని నెలలు గడిచి ఆనంద్ రియాజ్ ల స్నేహం మరింత బలపడింది. కొత్తవా వాళ్ళెవరైనా  ఖాదర్ ఇంట ఈ ఇద్దరు పిల్లలను చూస్తే.. ఖాదర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు. గంగాధర్ ఇంట ఆ పిల్లలిద్దరినీ చూసిన వాళ్లు గంగాధర్ కి ఇద్దరు మొగపిల్లలు ఉన్నారేమో అనుకుంటారు.

 “ఆనంద్ కి ఇదివరకు తినడానికి ఏది పెడ్తే.. ఒక్కటి ఇస్తే ఇంక చాలు చాలు అనేవాడు. ఇప్పుడు ఏది ఇచ్చినా ఇంకొకటి కావాలి అంటున్నాడు” అని భర్తకు  చెప్పింది సుదతి. “పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు వాడికి ఆకలి పెరుగుతుంది. వాడు తినగలిగినన్ని ఇవ్వు” అని చెప్పాడు గంగాధర్. ఎవరు ఏమీ పెట్టినా జామ  చెట్టు వెనకకు వెళ్ళి పంచుకుని తింటున్న మిత్రులిద్దరినీ చూసి ఆనంద్ కి ఆకలి ఎందుకు పెరిగిందో అర్థమై నవ్వుకున్నది అరుణ.

ఇప్పుడు దసరా పండగ వచ్చింది. గంగాధర్, సుదతి పిల్లలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి వెళ్దాం తయారుకండి  అని చెప్పారు. “నాన్నా నాకు రెండు జతల బట్టలు కొనిపెట్టవా?” అని అడిగాడు ఆనంద్.  “రెండు నెలల తరువాత నీ పుట్టినరోజు ఉంది కదా. అప్పుడు మళ్ళీ నీకు కొత్త డ్రెస్ కొనాలి. ఇప్పుడు నేను రెండు జతలు కొనలేను” అని చెప్పేశాడు గంగాధర్. “నాన్నా.. నాకు పుట్టినరోజుకు కొత్త బట్టలు కొనకపోయినా పరవాలేదు.. ఇప్పుడు మాత్రం రెండు జతలు కొనండి నాన్నా” అని బతిమిలాడాడు. గంగాధర్ కి బాగా కోపం వచ్చింది. “ఎందుకు ఎంత జిద్దు చేస్తున్నావు ఆనంద్..”అని కోపంగా అరిచాడు.

“నాన్నా! పాపం రియాజ్ కి సరైన బట్టలు లేవు. బడిలో సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మంచి బట్టలు లేక ఆ రోజు బడి మానేస్తున్నాడు. నాకు ఖరీదైన బట్టలు వద్దు. మామూలు ధరలోనే మా ఇద్దరికీ చెరో జత కొనండి నాన్నా.. వాడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటుంటే.. నేను కొత్త బట్టలు వేసుకోలేను నాన్నా!” అని చెప్పాడు.  స్నేహితుని పై కొడుకు చూపిస్తున్న ప్రేమకు కరిగిపోయాడు గంగాధర్.

పక్కింటికి వెళ్ళి ఖాదర్ ని జరీనాని ఒప్పించి, అరుణా ఆనంద్ లతో పాటు రియాజ్ ని కూడా తీసుకుని.. బట్టల షాప్ కి బయలుదేరారు గంగాధర్ సుదతి దంపతులు.

                                                   ***

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సావిత్రీ దర్శనం

by Devanapalli Veenavani March 17, 2024
written by Devanapalli Veenavani

పాఠక లోకానికి నమస్సులు!

ప్రముఖ కవయిత్రి , రచయిత్రి దేవనపల్లి వీణావాణి మయూఖ పత్రిక లో ‘ దర్శనం‘ పేరుతో కాలమ్ రాస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఇది సమీక్ష నో , విమర్శనో కాదు. ఒక సమున్నత రచన వైపు చూడవలసిన అవసరాన్ని చూపే ఉద్దేశ్యం తో రాస్తున్న కాలమ్. విషయ విశేషతను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని చెప్పడం. భారతీయ సంస్కృతి విశిష్టత ను, అంతరార్థాన్ని గౌరవంతో వివరించడం కోసం మయూఖ పాఠకుల కోసం రచయిత్రి ‘ దర్శనం‘ చేయించే ప్రయత్నం ఈ కాలమ్ ప్రత్యేకత. ఆదరిస్తారని ఆశిస్తూ…

-డాక్టర్ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు.

“యోగం” అంటే నేను అర్థం చేసుకున్నంత వరకు “ధారణ చేసుకోగల శక్తి”. ఈ శక్తి శరీరమూ, మనసు ఒకే సరళ రేఖ మీదకు తెచ్చుకోగలిగినప్పుడే సిద్ధిస్తుంది. మహర్షులు ఈ ధారణా శక్తిని సాధించడానికి అనేక మార్గాలు చూపించారు. వాటిని యోగ దర్శనాలు అన్నారు. భగద్గీతలో కృష్ణుడు చెప్పిన జ్ఞాన, భక్తి, కర్మ యోగాలు, పతంజలి అష్టాంగ యోగం, కపిలుని సాంఖ్య యోగం ఇవి మహర్షులు చెప్పినవి. మనముందు కాలపు యోగులు మహావతార్ బాబాజీ క్రియా యోగం, మాస్టర్ సీవివి గారి భక్తృ రహిత రాజ యోగం, అరవిందుల పూర్ణ యోగం, ప్రస్తుత కాలపు యోగులు మాత నిర్మలా దేవి సహజ యోగం, సద్గురు ఈశా యోగం, దాజీ సహజ మార్గ యోగం ఇలా అనేక యోగ మార్గాలు చూపుతున్నారు.

అనేక మంది ఆధ్యాత్మిక సత్ జీవన చరిత్రలు ఏదో యోగ సూత్రానికి అనుసంధానించి ఉన్నవే.నా మటుకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సాధనాపరులతో ఉన్నప్పటికీ అది నాకు అర్థం కాలేదు, సాధ్యమూ కాలేదు. మనః శరీరాల మధ్య సమన్వయం లేనిదే ఏ యోగ సాధనా సఫలం కాలేదని మాత్రం తెలుసుకోగలిగాను. గీత, కపిలుని సాంఖ్యం, క్రియా, భక్త్రు రహిత రాజయోగం మీద కొంత అవగాహన ఉన్నప్పటికీ అది కేవలం పత్రికలు చదివి వార్తలు గ్రహించినంత మాత్రమే.

అయితే నేను పోటీ పరీక్షలకు చదువుతున్నప్పుడు శ్రీ అరబిందో గురించి , అతను “సావిత్రి “ని రాశారని తెలుసుకున్నప్పుడు అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఒక ICS అధికారి కాగదగినవాడు, విప్లవకారుడు, స్వతంత్ర పోరాటంలో ఉన్నవాడు, ఉన్న ఫలంగా ఎలా యోగ దర్శనం చేశాడు, ఎలా పూర్ణ యోగం సిద్ధాంతం చేశాడు, యోగిగా ఎలా మారాడు అన్నది తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగింది. అయితే అన్నిటికీ మించి అతని ‘ సావిత్రి ‘ లో ఏముంది అని , అది తెలుసుకోవాలనీ అనిపించేది. అది స్వామి రామా రాసినట్టుగా ఆధ్యాత్మిక ప్రయాణపు అనుభవాల సమాహారం అయి ఉండవచ్చు అని చాలా రోజుల వరకు అనుకున్నాను. తెలుగులో చదవగలిగితే బాగుండుననీ అనుకున్నాను.కొన్నాళ్ళకు నాకు వరంగల్ సెంట్రల్ లైబ్రరీ లో ఒక కాపీ దొరికింది కూడా. కానీ ఎంత అడిగినా లైబ్రేరియన్ Xerox తీసుకోవడానికి గానీ ఇంటికి తీసుకు వెళ్లి చదవడానకి గానీ అనుమతించలేదు.ఒకే ఒక కాపీ ఉండడం దానికి కారణం.

మరి కొన్నాళ్ళకు నాకు సిరికోన సాహిత్య అవార్డుల కార్యక్రమం లో శ్రీ వాసిలి వసంత కుమార్ గారి పరిచయమైంది. వారు అరవిందుల సావిత్రిని ఆంధ్ర మహా సావిత్రి లా తెలుగు చేసిన మాస్టర్ శార్వరి గారి పుత్రులు. అయితే ఆ విషయం నాకు తెలియదు. మాటల్లో నేను సావిత్రిని చదవాలని ఉందని ,అయితే అది దొరకడం లేదనీ అన్నాను. వారు, మా తండ్రి గారు శార్వారి , వారే దానిని అనుసృజన చేశారని చెప్పడంతో ఆశ్చర్య పోయాను. అనేక పునర్ముద్రణ ల తర్వాత తిరిగి ముద్రించామనీ , తప్పక ఒక కాపీ పంపగలననీ హామీ ఇచ్చి మరో పది రోజుల్లో పంపారు.

ఇది మూడేళ్ల కిందటి సంగతి. రెండు మూడు సార్లు చదవడానికి ప్రయత్నం చేశాను. కానీ అందులోకి ప్రయాణం చేయలేకపోయాను.
ఈనాటికి మూడు సంపుటాలుగా వెలువడిన వెయ్యి పేజీల బృహద్ గ్రంథం పూర్తి చేయగలిగాను. సాధ్యం అయినంత వరకు అర్థం చేసుకోగలిగాను.

సానిత్రి అనుసృజనకు శ్రీ శార్వరి గారు దశాబ్దకాలం వెచ్చించారు. అరవిందులు కూడా మూల ప్రతిని పూర్తిగా సిద్ధం చేయడానికి పుష్కర కాలానికి పైననే తీసుకున్నారు.
యథా వారి యోగ దర్శనం , తథా కావ్య గతం చేశారు. అటువంటి ధ్యాన యోగ దర్శనానికి శ్రీ శార్వరి వారు అంతే యోగ సాధనా శక్తి ద్వారా అనుసృజన చేయగలిగారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఇద్దరూ యోగ సాధకులు కనుకనే సాధ్యం అయిందని నేను భావిస్తున్నాను.

శార్వరి వారి సావిత్రికి గుంటూరు శేషేంద్ర శర్మ ముందుమాట రాస్తూ వ్యాస వాల్మీకి సరసన నిలబడగల కావ్యం సావిత్రి అన్నారు. అలా అనడానికి కారణం సావిత్రి కావ్య రూప ఆధ్యాత్మిక వాఖ్యానం.

ఇంతకీ సావిత్రి ఏమిటి అంటే మహా భారతంలోని సావిత్రి కథనే. సతీ సావిత్రి తన భర్త అయిన సత్యవంతుని
మృత్యువునుంచి గెలిపిస్తుంది.అయితే ఆమె మృత్యువు(యమున్ని)జయించడానికి చేసిన సాధన, ఆమె చేసిన దర్శనాలు, తెలుసుకున్న సత్యాలు ఇవన్నీ పన్నెండు గ్రంథాలుగా రాశాడు అరవిందుడు. .సావిత్రిలోని పన్నెండు భాగాలు అనేక పర భౌతిక విషయాలను చర్చిస్తాయి. వాటిని మూడు భాగాలు సత్య దర్శనం, యోగ దర్శనం, విశ్వదర్శనం గా కూర్పు చేశారు శార్వరి వారు. ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రయాణం లేకుండా సావిత్రిని అర్థం చేసుకోవడం కష్టం.

ఇవి అరవిందులు తాను సావిత్రిగా మారి ప్రయాణం సిద్ధిస్తేగానీ రాయగలిగేవి కావు.
సావిత్రి దేనిని సాధించిందో దాని ద్వారానే మృత్యువుని జయించింది. ఆ సాధనే ఒక తేజస్సు, అదే గాయత్రి. అరవిందులు పూర్ణయోగం ద్వారా ఆ సావిత్రి సాధించిన అమరత్వ ఉషస్సును పొందమని సూచించారు.
ఇక అరవిందుల పూర్ణ యోగం అంటే భక్తి, జ్ఞాన, కర్మ యోగాలు మూడు కలిసి చేయగల యోగం. అది సావిత్రి చర్చించదు. కాకపోతే ఈ యోగ సాధనలో సావిత్రి ద్వారా చెప్పిన అమరత్వం సిద్ధిస్తుందని భావించాలి.

ఈ విలువైన కృషిని తెలుగులో అందించడానికి మరొక్క మారు ప్రయత్నం చేసిన శ్రీ వాసిలి వసంత కుమార్ గారు ఎంతగానో అభినందనీయులు.
అది నాకు అందించినందుకు కృతజ్ఞతలు

అరవిందుని సావిత్రి పరిచయం తర్వాత మిత్రులు కొంతమంది సావిత్రి గురించి మరి కాస్త వివరంగా రాస్తే బాగుంటుందని అడగడం జరిగింది.

సావిత్రిని చదవడం నా బలమైన కోరిక, అలా ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఒక శిక్షణా కార్యక్రమంలో గెస్ట్ స్పీకర్ గా వచ్చిన ఒకరు మాటల్లో అరవిందుడులాంటి ప్రజ్ఞాశాలి మన స్వతంత్ర పోరాటం నుంచి ఎందుకు బయటికి వచ్చాడు , అలా రాకుండా పోరాటంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనడం నాకు అరవిందుని మీద అంతకు ముందు ఉన్న భావనను మరింత పెంచింది. ఇక పండిత పరమేశ్వర శాస్త్రి రాసిన త్రిపురనేని గోపీచంద్ మనసులో మాట ఆ నవల్లో చెప్పకనే అరవిందుని పూర్ణ యోగాన్ని చెప్తుంది. పూర్ణయోగం సంభవమేనా అన్న సంశయం ప్రధాన పాత్ర వెలిబుచ్చడం ఆ నవల్లో కనిపిస్తుంది. అయితే దానిని ఆచరించిన వారు మాత్రమే చెప్పగల సాహసకార్యమది. అంతటి సాహసం చేయలేను కాకపోతే సావిత్రి గురించి మాత్రం చెప్పగలిగే సాహసం చేస్తాను. ఎందుకు అంటే అర్థం చేసుకోగల వివరణలు ఇంతకు ముందు పెద్దలు అనేకులు అందజేశారు కనుక.

అరవిందుని సావిత్రి అర్థం కావాలి అంటే అంతకుముందు మృత్యువును జయించడానికి ప్రయత్నం చేసిన వారి చరిత్రను కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసి తెలుసుకొని శక్తి మేరకు అర్థం చేసుకున్న దానిని ఇక్కడ రాస్తున్నాను.

17, 18 శతాబ్దానికి చెందిన మహనీయులు, యోగ సిద్ధాంతాలని ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసి ప్రజలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరిన్చడం కోసం సులభమైన విధివిధానాన్ని ఏర్పరచే ప్రయత్నం చేశారు. అయితే పాత కథని తిరిగి దర్శించడం, రాయడం జరగలేదు. అయితే అరవిందుని విషయంలో ఇది జరిగింది.

పురాణాలని అంటుంటాం కదా ఇటువంటి పురాణాలని అరవిందుడిలాంటివాడు సమకాలీనానికి ఏ విధంగా తీసుకువచ్చాడు, తన యోగదర్శనాల కొరకు అతను సావిత్రిని ఎందుకు ఎంచుకున్నాడు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ భారత ,భాగవతం లాంటి వాటి వ్యాఖ్యానం, కాకుండా అందులోని ఒక స్త్రీ కథని అది మృత్యుంజయ కథని ఎందుకు తీసుకున్నాడు? ఆ కథ ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ? ఎవరైనా అసలు మృత్యువుని ఎందుకు చేయించాలి? ప్రతి ఒక్కరూ మృత్యువుని జయించడానికి ప్రయత్నించినట్లయితే ఎలా ? ఎటువంటి సాధన చేసినట్లయితే అటువంటి వారి యొక్క భౌతిక ప్రయోజనము కలుగుతుంది ? అది ఎట్లా ఉండబోతోంది..? అమరత్వము, మృత్యువును జయించడం రెండు ఒకటేనా ? ఇవన్నీ నాకు కలిగిన సందేహాలు.

సందేహ నివృత్తి కోసం లోకంలో చిరంజీవులు గా ఉన్నవారు , మృత్యుంజయులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశాను. మృత్యువును జయించిన వారు ఆ ప్రత్యేక సందర్భంలో మృత్యువుని తప్పించుకున్నారు కానీ వారు శాశ్వతలు కారు అంటే చిరంజీవులు కారు. వారు ఏ ప్రయోజనం కోసం మృత్యువుని వాయిదా వేశారో అది సిద్ధించిన తర్వాత వారు మామూలు మానవుడిలాగే నిష్క్రమించారు. కానీ అమరులు, వారు మృత్యువు యొక్క మితిని దాటి పరివ్యాప్తం చెందారు కనుక వారిని
మృత్యువు అందుకోలేదు. ఇలా మృత్యువు యొక్క మితిని అతిక్రమించి లోకంలో పరివ్యాప్తమై ఉన్నటువంటి వారు చిరంజీవులు. శాస్త్రం ప్రకారం చిరంజీవులు ఏడుగురు అనీ, ఎనిమిది అనీ అంటారు. మనకు హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, మార్కండేయుడు బాగా తెలిసిన పాత్రలు.

అయితే మృత్యుంజయులు మాత్రం ముగ్గురు. మార్కండేయుడు, సావిత్రి దేవి, నచకేతుడు. ఇందులో మార్కండేయుడు మృత్యుంజయుడు ఇంకా చిరంజీవి. మిగిలిన ఇద్దరు సావిత్రి, నచికేతులు మృత్యుంజయులైనప్పటికీ వారు చిరంజీవులు కారు. ఈ మూడు మృత్యుంజయ పురాణాలు లేదా పాత్రలు మృత్యువును జయించడానికి లేదా మరణాన్ని వాయిదా వేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు.
అయితే అన్ని జీవులకి సమవర్తిగా ఉండేటువంటి యముడు వీరి పట్ల ఏ కారణం చేత తన సమవర్తి నియమాన్ని పక్కకు పెట్టాడు ఎందుకు వారి యొక్క విన్నపాన్ని మన్నించి తన సమవర్తి నియమాన్ని దాటి వారికి ఆయువృద్దికి తోడ్పడ్డాడు ? ఇదే ముఖ్యమైనటువంటి విషయం .

ఇవి మనం మూడు కథలుగా అధ్యయనం చేయవల్సి ఉంటుంది. ఒకటి మార్కండేయుని కథ, రెండవది సావిత్రి కథ, మూడవది నచికేతుని కథ. మార్కండేయుని పాత్ర చూసినట్లయితే రామాయణంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది. అయితే సావిత్రి యొక్క ఉపాఖ్యానం మహాభారతంలో మార్కండేయుడు ద్వారా ధర్మరాజుకు అరణ్యవాసంలో తెలియజేయబడుతుంది. ఇక నచికేతుని కథ కఠోపనిషత్ కథ.

మార్కండేయుని కథ చూసినట్లయితే భృగు మహర్షి యొక్క కుమారుడు ధాత. ఇతను పగలుకి అధిపతి.మరొక పుత్రుడు విధాత రాత్రికి అధిపతి. ఒక పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు విధాత తలపున ప్రభవించినది అనాది రాగమని రాస్తారు అంటే చీకటి అధిపతి అయినటువంటి విధాత తలపున ప్రభాతం అనేటువంటి ఒక అనాది రాగం వస్తుందని ఆయన అర్థం. మహాత్ములు పదాలను ఆయాచితంగా వాడరు. అయితే ఇక్కడ ధాత యొక్క కుమారుడు ఎవరైతే పగటి అధిపతి ఉన్నాడో అతని కుమారుడు మృకండుడు. సంతాన ప్రాప్తి కోసం శివునికీ విష్ణువుకీ చేసిన తపస్సు ఫలితంగా మార్కండేయుడు జన్మిస్తాడు. అతని ఆయుషు 16 సంవత్సరాలు.

తల్లిదండ్రుల ద్వారా తాను అల్పాయుష్కుడను అని తెలుసుకున్న మార్కండేయుడు ఏ ప్రయోజనం ఆశించి తన తండ్రి తపస్సు ఫలితంగా తనను పొందాడో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు తనకు వచ్చిన జన్మ యొక్క సార్ధకత్వం ఉండదని దానిని సాధించడం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. అతని తపస్సు ఎంతగా ఫలిస్తుందంటే శివుడు మార్కండేయుడు రెండు రూపాలు సాయుజ్యం అయిపోతాయి. అంటే శివుడే మార్కండేయుడు మార్కండేయుడు శివుడు. మార్కండేయుని ఆయుర్థాయం పూర్తయిన తర్వాత
యముడు మార్కండేయుడుని తీసుకువెళ్లే సమయంలో అతనికి శివుడికి మార్కండేయుడికి భేదం తెలియదు. అయితే అప్పుడు శివుడు యమధర్మరాజు తో ఎవరైతే పరోపకార సిధ్యర్థం తన ఆయుష్షుని వృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయోజనము అంత నిష్కల్మషమైనదీ లోకోపకారి అయినట్లయితే వారికి శివుని అనుగ్రహం ఉంటుంది కనుక వారి ప్రాణాలను హరించవలదని యమునికి ఆజ్ఞ వేస్తాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆయుష్షు ప్రపంచానికి ఉపకారం చేసేటువంటిది అయితే అతను ఏ ప్రయోజనం కోసం కృషి చేస్తున్నట్లయితే అటువంటి ప్రయోజనము నెరవేరేవరకు అతనికి మృత్యువునుంచి శివుని యొక్క రక్షణ ఉంటుంది ఇది మార్కండేయుడు చెప్పేటువంటి సత్యం. మార్కండేయుడు తన తండ్రి యొక్క కోరిక నెరవేరడం కోసం ఏ ప్రయోజనం కోసం తన తండ్రి తనను పొందాడు అది నెరవేరేంత వరకు సమయం ఇవ్వాలని కోరుకుంటాడు. అలా పుట్టిందే మృత్యుంజయ మహామంత్రం..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వరుహ నివ బందనాత్ మృత్యోర్ముక్షీణ మామృతాత్

జీవుడు తను పుట్టి, పొందవలసినవి పొంది, పూర్తిగా మగ్గిన ఒక దోస కాయ తన తల్లి తీగ నుంచి విడిపోయినట్లుగా తాను శరీరం విడిచి పెట్టాలని అర్థం.అదే మార్కండేయుడు కోరిక , అలా శివానుగ్రహం పొంది అలాగే తల్లి తండ్రి సేవ చేసి ఆ పాత్రలకు న్యాయం చేస్తాడు మార్కండేయుడు. లోకహితునికి, పరోపకార ప్రయోజకునికి మరణభయం లేదు ఇది మార్కండేయుడు మృత్యువుని జయించిన వివరం.
మార్కండేయుడు తదుపరి ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్ణయించుకుంటాడు, సమవర్తి నుంచి రక్షణ పొంది చిరంజీవి అయ్యాడు.

తదుపరి నచికేతుడు, సావిత్రి కథలు చూస్తే ముందు నచికేతుని గురించే చూడాలి.ఎందుకంటే నచికేతుడి ద్వారా లేదా కఠోపనిషద్ ద్వారా
ఏ విద్య అయితే లోకానికి అందించబడిందో అది సావిత్రి ఆచరించింది కాబట్టి.

నచికేతుడు, యముడి సంవాదమే కఠోపనిషత్ చెప్తుంది.
అయితే కఠోపనిషత్ అన్న పదం, దాని వివరణ మాస్టర్ పార్వతీ కుమార్ గారు వారి ప్రసంగపాఠం’ మరణ రహస్యం. -3 ‘ లో చక్కగా వివరించారు.

నచికేతుడు ఐదేళ్ల చిన్న పిల్లవాడు, తండ్రి పేరు ఉద్దాలకుడు
గౌతమ వంశస్తుడు, అరుణ కుమారుడు.ఇతను అన్న దానము తదితర దానాలు వంటివాటిని విని అచరించదలిచిన వాడై దానక్రతువు చేస్తాడు. ఇలా తనకు ఉన్నది అంతా ఇచ్చివేసే వ్రతాన్ని చేయడం వల్ల ఇతనికి వాజశ్రవనుడు అనే పేరు వచ్చింది. ఉత్తమ గతులు పొందడమే లక్ష్యంగా చేసినప్పటికీ మంచి గోవులను తాను ఉంచేసుకొని,తనకు అవసరంలేనివి దానం ఇవ్వడం చూసిన నచికేతుడు తండ్రి తప్పుచేస్తున్నాడని మదనపడతాడు.అన్నీ ఇచ్చివేస్తున్నాడు కదా..మరి నన్ను ఎవరికి ఇస్తావు నాన్నా అని తండ్రిని అడుగుతాడు.తండ్రి వెంటనే జవాబు ఇవ్వకపోతే నచికేతుడు ఈ ప్రశ్నని మళ్లీ మళ్లీ అడుగుతాడు, చిరాకు పడ్డ తండ్రి నిన్ను యముడికి ఇచ్చేస్తాను అంటాడు. నచికేతుడు యమలోకానికి వెళ్ళిపోయి యముడి కోసం చూస్తాడు. అక్కడ ఆ సమయంలో యముడు వుండడు. మూడు రోజులకు యముడు వస్తాడు. నచికేతుడి రాకకు కారణం అడుగుతాడు.

యమ లోకంలో మూడు రోజులు భూ లోకంలో మూడు సంవత్సరాలు. అంతకాలం ఎటువంటి ఆతిథ్య ఆదరణ లేక ఒక పిల్లవాడు, బ్రాహ్మణుడు తన లోకంలో ఉండడం వల్ల తనకు అతిధి నిరాదరణ దోషం కలుగుతుందని భావించిన యముడు నచికేతుడిని మూడు వరాలు ఇస్తాను, కొరుకోమంటాడు.

నచికేతుడు సంతోషించి మొదటి వరంగా తన తండ్రి గారు ఇలా యమలోకానికి వచ్చినందుకు తన మీద కోపం కలిగి ఉండకూడదని , రెండవ వరంగా ఏం చేయడం లేదా ఏ విద్యను ఆచరించడం వల్ల స్వర్గాన్ని చేరవచ్చునో తెలియజేయాలనీ, మూడవ వరంగా జీవుడు మరణించిన తర్వాత ఉంటాడా, ఉండడా తెలియజేయాలని కోరతాడు.

యముడు మొదటి వరాన్ని అనుగ్రహించి, నీ తండ్రి ఎప్పటిలాగా నిన్ను ఆదరిస్తాడని, రెండవ వరం స్వర్గం చేరుకునే విద్య అంటే అగ్ని విద్య గురించి చెప్పి ఇకనుంచి ఆ అగ్ని విద్య నచికేత అగ్ని అని పిలవబడుతుంది అనే నాలుగో వరాన్ని ఇస్తాడు. ఒక రంగుల మాల కూడా బహుమతిగా ఇస్తాడు. సృష్టిలో మొదట ఆవిర్భవించినది అగ్ని కనుక అగ్ని విద్యను ఆచరించాలి. అగ్ని విద్య లేదా యజ్ఞం. ఇది బహిర్యజ్ఞం, అంతర్యజ్ఞం. బహిరి యజ్ఞం 24 ఇటుకలతో చతురస్రంగా పేర్చినటువంటి హవనకుండంలో అగ్నిని ఆవాహన చేస్తూ భూత సూక్ష్మాన్ని అనగా బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాలు భూత సూక్ష్మంగా ఏర్పడి ఉన్న వాటిని సంచయనం చేయడం. అంతర్యజ్ఞం ద్వారా మనలో అగ్నిని సంచయనం చేయడం అలా అంతరయజ్ఞం ద్వారా సంచయనం చేయబడిన అగ్ని ద్వారా జీవుడిని ఊర్ధ్వ లోకాలకి తీసుకువెళ్లడం ఆ విధంగా స్వర్గ ప్రాప్తి పొందడం ఇదే నచికేతాగ్ని. దీనికి ఆది శంకరులు భాష్యం చెప్తూ మూడు సార్లు నచికేతాగ్ని సంచయనం చేసిన వారు, తల్లి, తండ్రి, ఆచార్యుల అనుశాసనాన్ని పొంది జన్మ రహితుడు అవుతాడని తెలియజేశాడు.

మూడవ వరంగా నచికేతుడు అడిగిన ప్రశ్న మరణాంతరం జీవుడి అస్తిత్వం ఏమిటో తెలియజేయడానికి యముడు నచికేతుడిని పరిపరి విధాల పరీక్షిస్తాడు. ఇది అత్యంత గహనమైన విషయమని దీనికి బదులుగా మరొక వరం కోరుకోమని అడుగుతాడు, కానీ నచికేతుడు పట్టుబడతాడు. మరణాంతరం
జీవుడు అస్తిత్వం తెలియజేయడానికి తమరి కన్నా ఉత్తమమైన గురువు నాకు దొరకడని మీరు మాత్రమే తెలియజేయడానికి సమర్ధులని నాకది తప్పనిసరిగా తెలియచేయాలని కోరుకుంటాడు నచికేతుని పట్టుదల చూసిన యముడు అతనికి జీవుడు మరణాంతరం ఉన్నాడా లేడా అన్న విషయాన్ని తెలియజేస్తాడు. ఈ ప్రశ్నకి జవాబును అర్థం చేసుకోవడం కొంత కష్టమైనా నచకేతుడి ద్వారా యముడు జీవుడు మరణాంతరం ఉంటాడని ఉండగలడని ప్రతి వ్యక్తి సాధన ద్వారా తన అస్తిత్వాన్ని తెలుసుకోగలరని తెలియజేస్తాడు.

ఇక్కడ కఠోపనిషత్ మీద ఆదిశంకర భాష్యం వివరంగా ఇచ్చినప్పటికీ నాకు మాస్టర్ పార్వతీ కుమార్ గారి ప్రసంగ పాఠం మరణ రహస్యం-3 గా వచ్చిన నచికిత విద్య పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది మాస్టర్ పార్వతీ కుమార్ గారు తన ప్రసంగం ద్వారా చాలా సులభంగా నచికేతుని మూడో వరం వివరించారు. మాస్టర్ పార్వతి కుమార్ గారు కఠోపనిషత్ పదం ఉత్పత్తిని వివరిస్తూ ఇలా చెప్తారు.

కఠోపనిషత్ అంటే క నుంచి ఠ వరకు ఉన్న 12 అక్షరాలు కలది. ఈ 12 అక్షరాలు 12 రేకులు గల పద్మాన్ని ద్వాదశ దళ పద్మం అంటారు. ఇది అనాహిత చక్రాన్ని సూచిస్తుంది.

మన శరీరంలోని షడ్చక్రాలు మీరు వినే ఉంటారు మూలా ధార , స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు అత్యంత పైన ఉన్నది సహస్రార. అనాహితం హృదయ స్థానం హృదయం అంటే గుండె కాదు, గుండె పక్కన శరీర మధ్య భాగంలో ఉండేటువంటి ఈ చక్రము నాలుగు స్థరాలుగా మూడు మూడు దళాలతో మొత్తం 12 దళాలు మధ్యలో ఆత్మని కలిగి ఉంటుంది. మొదటి స్థరం అన్నమయ కోశం, రెండవ స్థరం ప్రాణమయ కోశం, మూడోస్తరం మనోమయ కోశం , నాలుగవ స్థలం విజ్ఞానమయ కోశం మధ్యలో ఉన్నవాడు వెలుగు అదే ఆత్మ.

ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ప్రతిదీపానికి సమానమైన వెలుగు ఉన్నట్టు జీవులను ప్రకాశితమయ్యేటువంటి ఈ వెలుగు ఆత్మ రూపంలో మన శరీరంలోనూ ఉంది. జీవుడు సూక్ష్మ దేహంగా మన నాభి కింద రెండు వేళ్ళ అంత దూరంలో సూక్ష్మ శరీర ధారుడుగా ఉంటాడని అక్కడ ఉన్నటువంటి జీవుడిని అంతర్యజ్ఞం ద్వారా షట్ చక్రాల ద్వారా ప్రయాణింప చేసి అనాహిత ద్వారా ఆత్మను చేరుకొని ఉన్నవాడు తన సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరనీ పూర్వపు రచనల్ని బట్టి అర్థం చేసుకోగలము. అటువంటి సాధన చేసిన వారు
ఆజ్ఞా చక్రం అనగా రెండు కనుబొమ్ముల మధ్య ఉన్న స్థానం ద్వారా సూక్ష్మ శరీరం ధరించి కావలసినప్పుడు శరీరం లోపలికి, బయటకు ప్రయాణం చేయగలరు. పరమహంస యోగానంద తన ప్రసిద్ధ పుస్తకం యోగి ఆత్మకథ లో ఎంతో మంది భారతీయ యోగులను పరిచయం చేస్తూ తన పరమ గురువైనటువంటి శ్యామ చరణ్ లాహిరి మహాశయుల గురించి చెప్తూ లాహిరి మహాశయులు సూక్ష్మ శరీరాన్ని ధరించి ఎంతో మందికి కనిపించారని రాశారు. ఇలా అనేక చోట్ల కోరుకున్న చోట ప్రత్యక్షమైనటువంటి యోగుల్ని చూసిన సందర్భాలు అనేకులు తమ అనుభవాలలో రాశారు.

కఠోపనిషత్ చెప్పింది ఇలా అనాహిత చక్రాన్ని దాటి ప్రయాణం చేయమనే. అలా ఎవరైతే సాధన ద్వారా చేయగలుగుతారో, వారు తమ సూక్ష్మ శరీరాన్ని చూసుకోగలరు, వారు శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా తమ యొక్క అస్తిత్వాన్ని తెలుసుకోగలరు. తమ భూత భవిష్యత్తు ప్రయాణాన్ని వారు నిర్దేశించుకోగలరు. ఆ విధంగా సాధన ద్వారా తెలుసుకున్న వారు తమ మరణాంతరం కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటారని యముడు నచికేతులకి తెలియజేసినట్టు మనం కఠోపనిషత్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక నచికేతుని మూడో ప్రశ్నకు యముని సమాధానం నీ సాధనే నీ అస్తిత్వానికి సమాధానం. అయితే ఈ ప్రయాణం అంతా కూడా సుశిక్షుతుడైనటువంటి గురువు ద్వారానే సాధ్యపడుతుంది అనేది అన్ని పుస్తకాల్లో ఇచ్చినటువంటి వివరణ. అందుకే భారతీయతలో గురువుకి అంతటి పవిత్ర స్థానం.
ఇక ఆజ్ఞా చక్రం నుండి సహస్రార చక్రం చేరగలిగిన వాడు సాక్షాత్ భగవంతుడే అంటాడు సద్గురు.

ఇది సూక్ష్మంగా కఠోపనిషత్ సారము లేదా నచికేత యముని సంవాదము. యముని ద్వారా మూడువరాలనీ, అనుకోని నాలుగో వరాన్ని పొందిన నచికేతుడు తిరిగి తన తండ్రి వద్దకు చేరుకొని యముడు ఏవైతే సూచించాడో వాటిని పాటించి తన భౌతిక ప్రయాణాన్ని ముగిస్తాడు.

మార్కండేయుడు స్వీయ ప్రయత్నం ద్వారా, నచికేతుడు తండ్రి యథాలాపంగా అన్న మాటతో యముడి ద్వారా మరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నారు. వీరు ఇరువురికీ తమ పరిస్థితి అది ఎదుర్కునే వరకు తెలియదు. ఇందుకు భిన్నంగా సావిత్రికి తాను ఏం చేయాలనుకుంటూదో ముందే తెలుసు. యే సాధన ద్వారా తాను సూక్ష్మ శరీరధారి కాగలదో, దానితో ఏమి సాధించగలదో తెలుసు. ఆమెకు తెలుసు కనుకనే అల్పాయుష్కుడు అని తెలిసినా సత్యవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. తన సాధన మీద తనకంత నమ్మకం ఉంది గనుకనే తన అభీష్టాన్ని నెరవేర్చుకోగలిగింది కేవలం తన భర్త ప్రాణాలనే కాకుండా తన మామగారు, తండ్రి గారి అభిష్టాలను కూడా వరాలుగా పొందగలిగింది.

సావిత్రి, మద్ర దేశ అధిపతి అయిన అశ్వపతి కుమార్తె. అశ్వపతి సంతానం కొరకు 18 సంవత్సరాలు రోజుకి పదివేల గాయత్రీ మంత్రాలను అనుష్టానం చేస్తూ తపస్సు చేస్తాడు అతనికి సవిత్రమూర్తి ప్రత్యక్షమై సావిత్రి పేరుతో కుమార్తెగా జన్మించగలదని వరం ఇస్తుంది. అశ్వపతి తనకు పుత్రుడు కావాలని కోరుతాడు అందుకు సవిత్రమూర్తి ఈ కుమార్తె ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి అని చెప్తుంది.

అశ్వపతి సావిత్రిని అపురూపంగా పెంచుతాడు ఆమె యుక్త వయసుకి సత్యవంతుని గురించిన సమాచారం తెలుస్తుంది అప్పటికే ఆమెకు సత్యవంతుడు తన భర్త అయితే బాగుంటుందని అభిప్రాయం ఏర్పడుతుంది. సావిత్రి యొక్క ప్రతిభాపాటవాలకి ఆమెకు తగిన వరుణ్ణి తానే ఎన్నుకోవాల్సిందిగా తండ్రి అయిన అశ్వపతి సూచిస్తాడు. సావిత్రి తాను సాల్వ రాజ్యానికి చెందిన ద్యుమత్సేనుని కొడుకు సత్యవంతుణ్ణి వివాహం చేసుకోగలనని అంటుంది. నారదుడు సత్యవంతుడు అల్పాయుష్కుడని ఒక సంవత్సరం మాత్రమే అతనికి ఆయుష్యు ఉందని అతను ఫలానా రోజు మరణిస్తాడని ముందే తెలియజేస్తాడు. అయినప్పటికీ సావిత్రి తాను సత్యవంతున్నే వివాహం చేసుకోగలనని చెప్తుంది. తండ్రి అశ్వపతి కూడా కూతురు నిర్ణయాన్ని వ్యతిరేకించడు.

అతను సావిత్రిని, సత్యవంతునికి ఇచ్చి వివాహం చేస్తాడు. సావిత్రి వివాహం చేసుకునేటప్పటికీ సత్యవంతుడు రాజ్యం కోల్పోయి అంధత్వంతో ఉన్న తండ్రి, అరణ్యంలో మునివాసం చేస్తూ బ్రతుకుతున్న పరిస్థితి. అందునా అతను అల్పాయష్కుడు. అతను అల్పాయుష్కుడన్న విషయము అతనికి గాని అతని తల్లిదండ్రులకు కానీ తెలియదు కానీ సావిత్రికి తెలుసు. అన్నీ తెలిసి సావిత్రి సత్యవంతుని జీవితంలో ప్రవేశిస్తుంది. అదే సావిత్రి గొప్పతనం. ఆమె తన సాధన మీద ఆమెకున్న నమ్మకం.

సావిత్రి సత్యవంతులు సంవత్సరకాలం ఆనందంగా జీవిస్తారు. సత్యవంతునికి మరణ సమయం ఆసన్నమవుతుంది. యధావిధిగా అరణ్యంలో కట్టెలు సేకరించడానికి సత్యవంతుడు బయలుదేరుతాడు. తానూ వస్తానని సావిత్రి అంటుంది. అతనితో బయలుదేరుతుంది. అరణ్యంలో కట్టెలు సేకరిస్తూ ఉన్నఫలంగా సత్యవంతుడు పడిపోతాడు. సావిత్రికి దీని గురించి ముందే తెలుసు కనుక ఆమె అంతకుముందు మూడు రోజుల నుంచి త్రైరాత్ర వ్రతం చేస్తుంటుంది. త్రైరాత్ర వ్రతం అంటే మూడు రోజులు పగలు రాత్రి సాధనలో ఉండడం. సావిత్రి పరిస్థితిని అర్థం చేసుకొని అతని శరీరాన్ని ఒక భద్రమైన చోటుకు మార్చి తాను అక్కడే ఉండి, తన సూక్ష్మ శరీరం ద్వారా సత్యవంతుని ప్రాణాలను తీసుకున్న యమునితో ప్రయాణం చేస్తుంది. యముడు తనతో రావద్దని వారిస్తాడు. సావిత్రి యమునితో తన భర్త ప్రాణాలు తనకు ముఖ్యమని అందుకనే తను సూక్ష్మ శరీరధారియై తనతో ప్రయాణం చేస్తున్నానని చెప్తుంది. ఈ లోకాలవెంట రాకూడదని యముడు పదేపదే చెప్తాడు. అందుకు ప్రతిగా నాలుగు వరాలను కోరుకో, కానీ ఈ ప్రయాణం మానుకో అని చెప్తాడు. అప్పుడు ప్రతి వరానికి ముందు నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కోరుకో అంటాడు.

మొదటి వరంగా సావిత్రి తన మామగారి అంధత్వం పోవాలని, రెండవ వరంగా రాజ్యం రావాలని కోరుకుంటుంది. మూడవ వరంగా తన తండ్రికి నూరు పుత్రులు కలగాలని కోరుకుంటుంది నాలుగవ వర సమయంలో యముడు ‘నీ పతి ప్రాణాలు తప్ప’ అన్నమాట అనడు. అప్పుడు ఆమె తన భర్తని పునరుజ్జీవున్ని చేయాలని కోరుతుంది.

ప్రసన్నుడైన యముడు నాలుగు వందల సంవత్సరాల పాటు ఎందుకంటే అది కృతయుగం కనుక కృతయుగంలో మానవుని ఆయుషు నాలుగు వందల సంవత్సరాలు కనుక నాలుగు వందల సంవత్సరాలు నూరుగురు పుత్రుల్ని కలిగి సుభిక్షంగా బతకమని వరం ఇస్తాడు. ఆ విధంగా సావిత్రి తన మామగారి చూపుని, రాజ్యాన్ని, తన తండ్రికి పుత్రుల్ని, తన భర్త ఆయుష్షుని యముని ద్వారా పొందగలిగింది. ఆమె తిరిగి తన సూక్ష్మ శరీరంతో తనదేహానికి ప్రవేశిస్తుంది అలాగే సత్యవంతుడు యొక్క ప్రాణాలని యముడు తిరిగి ప్రసాదిస్తాడు. ఆ విధంగా యముడికి సావిత్రి కి మధ్య జరిగిన ప్రయాణం శుభప్రదంగా ముగిసి సత్యవంతుడు పూర్ణాష్కుడై చిరకాలం ఆనందంగా జీవిస్తారు. ఇది సావిత్రి కథ. ఇది మార్కండయుడు ధర్మరాజుకి చెప్పిన ఉపాఖ్యానం.

మాస్టర్ పార్వతీ కుమార్ గారు రాసిన తన ప్రసంగ పాఠం పుస్తకం మరణ రహస్యం -2 లో సావిత్రి సంబంధించిన అంశాలని ఇలా విశ్లేషిస్తారు. సవిత్రు మండలం అంటే 12 సూర్యులని కలిగినటువంటి ఒక మండలం. ఇలాంటి 12 సవిత్రు మండలాలు కలిసి ఒక భర్గో మండలం. సావిత్రి అన్న పదానికి అర్థం సాయం సంధ్య లో ఉన్న వెలుగు అది శక్తివంతమైనది. సావిత్రి వెలుగు యొక్క ప్రతిరూపం. అందుకే గాయత్రి మంత్రంలో ” భర్గో దేవస్య ధీమహి ” అని ఉంటుంది. వెలుగు ప్రతిరూపమే సావిత్రి అది అనుష్టానం చేయడమే గాయత్రి. అశ్వపతి అనే పదానికి అర్థం ప్రాణాలకు అధిపతి అయిన జీవుడు. ఈ అశ్వపతి తపస్సు చేయడం కోసం మిగిలిన కథలలో లాగా శివుడినో, విష్ణువునో ధ్యానం చేయలేదు. అవ్యక్త రూపమైన వెలుగు. సృష్టి లో ఏది వెలుగు ను ప్రకటిస్తుందో అది.
అతను సవిత్ర మండలంలోని వెలుగును, సావిత్రిని పొందడానికి 18 సంవత్సరాలు గాయత్రీ మంత్రోపాసన చేశాడు. ఆ సవిత్ర మండల వెలుగే సావిత్రిగా అశ్వపతికి జన్మించింది. ఆ వెలుగు సూక్ష్మ శరీరాన్ని ధరించగలిగే సాధన కూడా పొందగలిగిన ప్రజ్ఞ. తనకు భవిష్యత్తు తెలిసిన ఆమె వెరవలేదు తన వెలుగు దేహంతో ముందు లోకాలకు సైతం ప్రయాణం చేసి తాను సాధించాలనుకున్న వాటిని సాధించింది.

ఆమె సాధించిన వాటిలో మొదటిది మామ గారి అంధత్వం పోవడం. మామగారు ధ్యుమత్సేన రాజు జ్ఞానముతో మూడో కన్ను కూడా కలిగిన వాడు, కానీ తన అహంకార ప్రభావం చేత తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. సావిత్రి అతని అధంత్వం పోవాలని అంటే తిరిగి జ్ఞానం రావాలని కోరుతుంది. సత్యవంతుడు అసలు పేరు చిత్రాశ్వుడు అంటే చిత్రంగా ప్రాణాలని నిలుపుకోగలిగినటువంటివాడు. వ్యవహార శైలి వలన అతనికి సత్యవంతుడు అనే పేరు వస్తుంది. అతని జన్మతః వచ్చినటువంటి పేరు చిత్రాశ్వుడు లాగానే చిత్రంగా సావిత్రి వల్ల తన ప్రాణాలను పునరుద్ధరించుకోగలుగుతాడు. సావిత్రి యమునితో చేసిన సూక్ష్మలోకాల ప్రయాణం షట్ చక్రాల ప్రయాణమే. చక్రాలు ఒక్కొక్క లోకానికి ప్రతీకగా చూపబడతాయి వాటి ప్రయాణము అనుభవము అరవిందుడు మరింత విపులంగా రాస్తాడు.
పరోక్షంగా సావిత్రి యొక్క ఉపాఖ్యానమంతాను సూక్ష్మదేహధారియై ప్రయాణించగలిగేటువంటి శక్తి సాధన దాని యొక్క ఫలితాలు, శక్తి వంటివి చెప్పడం.

మార్కండేయుడు, నచికేతుడు, సావిత్రి కథల వల్ల అర్థం చేసుకోగలిగింది ఏదైనా ఉంది అంటే అది పరోపకారం, లోక శ్రేయస్సు. మరణం సత్యం, దానిని వాయిదా వేయగల శక్తి వారి వారి సంకల్పాలకు ఉంది. అందుకు దైవం సహకరిస్తుంది.దాని కోసం సంకల్ప వృద్ది చేయాలి.దానికి కొరకు సాధన చేయాలి. అలాటి వారు మృత్యువును వాయిదా వేయగలరు. మరణించినా జనుల స్మృతిలో ఉన్నంత కాలం అమరులుగా ఉండగలరు. ఎందుకు మృత్యువును జయించాలి అంటే ప్రతీ జీవి ఎంతో కొంత నాణ్యమైన, భద్రమైన, ఆదర్శమైన జీవనాన్ని తన తదుపరి తరాలకు మిగిల్చి వెళ్ళాలి.అదీ లక్ష్యం.

అరవిందుడు ఇంకాస్త ముందుకు వెళ్తాడు. తన సాధన ద్వారా ఆయన ప్రయాణం చేసినటువంటి సుక్ష్మ లోకాలు సావిత్రి పాత్ర ద్వారా తన ” సావిత్రి” లో నిక్షిప్తం చేశాడు సావిత్రి ఒక కావ్యానురూప యోగానుభవ ప్రకటన. ఇరవై నాలుగు వేల వాక్యాలు కలిగిన బృహత్ కావ్యం.1872 లో పుట్టిన అరవిందుడు తన 54 వ యేట మౌని గా మారిపోయి తదుపరి 24 యేళ్లు మౌనంగానే ఉండిపోయారు. 1930లో సావిత్రి రచనను మొదలు పెట్టి చాలాకాలం తన యోగానుభవాలను చేరుస్తూ పోయారు. స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారునిగానున్న అరవిందుడు అలీపుర్ కుట్ర కేసులో జైలు శిక్ష అనుభవించే క్రమంలో ఆధ్యాత్మిక అనుభవాలను పొందినట్లు రాశారు. అప్పటినుంచి యోగిగానే జీవించారు.ఆయన రూపొందించిన భక్తి, కర్మ, రాజ యోగాల ఆచరణ , అది సూప్ర మైండ్ థియరీ లేదా పూర్ణ యోగంగా చెప్పబడింది. మానవ మేధస్సులో అనేక స్థరాలు వున్నాయని దానిని కనుగొనే అవకాశం ఉందని చూపారు. అయితే దీనిని విమర్శించిన వారూ ఉన్నారు. అరవిందుడు దీర్ఘకాలం మౌనంగా ఉండడమూ దీనికి ఒక కారణము.

అరవిందుడు మొదట విప్లవకారుడు, దేశాభిమాని.తన దేశ ప్రజలకు యే సందేశం ఇవ్వలేదా అని అనుకున్నప్పుడు ఒక భావన కలిగింది. “పెద్దపులి ఆత్మకథ ” లో ఆర్కె నారాయణ్ , భారత దేశాన్ని పెద్దపులితో పోల్చుతారు. నాకు అరవిందుడి సావిత్రిలో జ్ఞానంతో మూడు కన్ను కలిగి ఉన్నా అజ్ఞానంతో దానిని కోల్పోయి రాజ్య భ్రష్ఠుడైన రాజు ద్యుమత్సేనుడిగా భారత పాలకులూ, అతని విరోధులుగా పరదేశ పాలకులూ కనిపించారు. మరణించి మళ్లీ జీవించిన సత్యవంతుడు ఈ దేశ స్వాభిమానం , దానిని సాధించిన సావిత్రి అదే ఆ వెలుగు సామాన్యుని సాధన లేక పోరాటం.
మనం మన అస్తిత్వాన్ని మర్చిపోవడమే నిజమైన మృత్యువు, మన ఆస్తిత్వం మనం నిలబెట్టుకోవాలని అనుకుంటే నచికేతుడు వలె ప్రయత్నం చేయాలి, సావిత్రి వలే మన దేశమాతకి చూపునివ్వాలి. స్వాభిమానంతో జీవించాలి.సాధనా సమన్వయంతో ఇది సాధ్యం.ఇది నాకనిపించిన ఒక భావన.

ఇది స్థూలంగా అరవిందుడి సావిత్రిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే సుదీర్ఘ వివరణ. తెలుగులో వచ్చిన సావిత్రిని చదివి సులువుగా వారి కావ్యంలోకి ప్రయాణించవచ్చు. అనుసృజన, అనువాదం రెండూ అందుబాటులో ఉన్నాయి. అందరికీ సావిత్రి అవగాహన సులభతరం అవుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను.

దేవనపల్లి వీణావాణి
17.03.2024

March 17, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

స్నేహం ముద్దు, యుద్ధం వద్దు

by ఒద్దిరాజు మురళీధరంరావు March 17, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగనగా ఒక రాజు. అతని పేరు పగ్నాషియన్‌. అతనికి బాల్యం నుండి కొట్లాట ఆటలే ఇష్టము. చెక్క గుఱ్ఱం ఎక్కి కఱ్ఱ ఖడ్గం తిప్పుతూ ఊగుతూ సంతోషంగా ఆడుకునేవాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాడు. యువరాజు అయ్యాడు. అతను రాజు అయిన వెంటనే మావుడ్‌ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
అతను ప్రతీ యుద్ధంలో పాల్గొనేవాడు. అతనికి ఎప్పుడు యుద్ధకాంక్షే. అతను ఎప్పుడూ స్నేహం వద్దు, యుద్ధం ముద్దు అనుకునేవాడు. అతని యుద్ధాల వలన పక్క రాష్ట్రాల రాజులకు కష్టం, నష్టం జరుగుతుండేది. ఈ తలనొప్పి తగ్గించుకోవడం కోసం పక్క మూడు రాష్ట్రాల రాజులు కలిసి ఒక ఒడంబడిక చేసుకున్నారు, ఇతనికి గుణపాఠం నేర్పాలని. ఇతనిపై సవాలు విసిరారు.
ఇది సామాన్యమైన యుద్ధం కాదని భార్యతో చెప్పాడు. తను ఒక సంవత్సరం వరకు తిరిగి రాకపోతే తను ప్రపంచంలో లేననుకొని లేక జైల్లో బంధించబడినానని అనుకొని నీవు స్వేచ్ఛగా వేరే వివాహం చేసుకో అని చెప్పాడు. అంతవరకు ఒంటరిగా వుండలేవు కాబట్టి నీవు రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు మన న్యాయశాఖ పెద్ద గుమాస్తాచేత పుస్తకాలు చదివించుకో. అతను ప్రపంచంలో జీవించి లేననుకోమనే మాట ఆమె మనసుకు బాధను కలిగించింది. అయినా ఒంటరిగా కాలక్షేపం చేయడం కష్టమనుకొని భర్త చెప్పిన పెద్ద గుమాస్తాతో రాత్రిళ్ళు పుస్తకాలు చదివించుకుంటూ వుండమన్న మాట కొంత నయమనుకుంది.
ఆ పెద్దగుమాస్తా కోటలో వున్న పుస్తకాలన్నీ అరడజన్‌ సార్లు ఇదివరకే చదివేశాడు. అతను చాలా గౌరవంగా రాణీగారికి కొన్ని పుస్తకాలు, మరికొన్ని ఆయన రాసినవి ప్రతిరోజు చాలాసేపు వరకు చదివి వినిపించేవాడు. ఆమెగారు అతనితో సంతోషంగా మాట్లాడుతూ ఆ కథలన్నీ వింటూ ఒక సంవత్సరంపైన ఒక దినం కాలం గడిపింది.
భర్త చెప్పిన కాలం గడిచింది కాబట్టి, గుమాస్తాతో తనను వివాహం చేసుకోమని కోరింది రాణి. దానికి గుమాస్తా నేను ధన్యుడను మహారాణి. కానీ నేను చాలా మామూలు వాడిని. మీరు రాజ వంశీయులు. అదీగాక రాజు ఏదైన జైలులో బంధింపబడి ఉండవచ్చు. నాకు ఇష్టం లేదని చెప్పను కాని, ఇంకొక సంవత్సరం, ఒక దినం వేచి ఉండటం మంచిదన్నాడు. ఆ సమయం కూడా గడిచింది. కానీ రాజు రాలేదు.
రాజు పగ్నాషియస్‌ యుద్ధంలో చంపబడలేదు. కానీ అతడ్ని గాయపరిచి రెండు సంవత్సరాలు జైలుశిక్ష విధించాడు రాజు లిటిల్‌ గోర్ము. అతను మూడు ప్రక్క రాష్ట్రాల ప్రతినిధి రాజు. ఆ సమయం గడిచాక రాజు పగ్నాషియస్‌ ను అతను జైలు నుండి విడిపిస్తూ ఇప్పుడు నీకు యుద్ధకాంక్ష జబ్బు కుదిరందనుకుంటా అన్నాడు. ఇకముందు నీపై జాలి చూపను. యుద్ధభూమిలో పట్టుబడితే నీ తల నరికేయబడుతుంది. ఇప్పుడు నిన్ను వదిలి పెడుతున్నాను. రాజు లిటిల్‌ గోర్ము, పగ్నాషియస్‌ గుఱ్ఱాన్ని జుర్మానా కింద తన వద్దనే ఉంచుకున్నాడు. కాబట్టి పగ్నాషియస్‌ తన ఇంటికి నడిచి పోవలసి వచ్చింది.
అతను నడిచి నడిచి చివరకు తన కోట చేరేవరకు అక్కడ పెండ్లికి జోరుగ తయారీలు అవుతున్నాయి. ఎందుకనగా గుమాస్తా పెట్టిన రెండు సంవత్సరాల ఒక దినం గడువు పూర్తి అయింది. పగ్నాషియస్‌ అప్పటికి రాలేదు, కాబట్టి గుమాస్తా వివాహానికి ఒప్పుకున్నాడు.
అప్పుడు ఆ రాణి ఆ గుమాస్తా తను మామూలువాడినన్న మాటను మదిలో ఉంచుకొని, అతడిని రాజవంశంలో చేర్చి, రాజ్య వ్యవహారాలు చూచే అర్హత ఇచ్చింది. ఇప్పుడు అతను ఆమెకు తగిన వాడైనాడు. వారు వారి పెండ్లి వేడుకలకు గొప్ప ఏర్పాటు చేశారు. దానికి దూర దూరాలనుండి రాజులు, ధనికులు, గొప్పవారు అక్కడికి చేరారు. వచ్చిన వారిలో రాజు లిటిల్‌ గోర్ము రాణి మావుడ్‌ కు శుభాకాంక్షలు తెలిపాడు, కాని రాజు పగ్నాషియస్‌ గురించి ఏమీ అడగలేదు. కేవలం ఒక ముసిముసి నవ్వు నవ్వాడు.
విందు భోజనాలు చివరకు వచ్చేవరకు పగ్నాషియస్‌ కోట వద్దకు చేరాడు. ఆ చింపిరి వెంట్రుకల నెత్తితో, చిరిగిన గుడ్డల్లో ఉన్న తమ రాజును ఖడ్గం మరియు గుఱ్ఱం లేనందున ఎవరూ కూడా గుర్తించలేదు. పగ్నాషియస్‌ బాధతో కన్నీరు కార్చాడు. తను యుద్ధం వలన రాజ్యాన్ని, ధనాన్ని, చివరకు తన భార్యను కూడా పోగొట్టుకున్నానని అంటూ మూల్గాడు. నా పని అయిపోయిందన్నాడు. నౌకర్ల ఇండ్లలో అతనికి ఒక కోడి కాలును తినేందుకు ఇచ్చారు. అది తిని నోరు మరియు కండ్లు తుడుచుకొని వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఎక్కడికి పోయాడో ఎవరికి తెలియదు. కనీసం తన పాత రాజ్యంలో మరెప్పుడూ కనబడలేదు. అతను చివరకు అనుకున్నాడు. స్నేహం ముద్దు, యుద్ధం వద్దు. అది ఆనాటికే కాదు, ఏనాటికైనా అదే సత్యం .అదే క్షేమం. ఇదే అతనిలో కలిగిన పరివర్తన.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us