మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
అనువాద సాహిత్యం

వృక్షానుబంధం

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు May 9, 2023
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

తొలకరి వాన పడిన మరునాడే

తీవ్రమైన ఆందోళనతో

తిరిగి వచ్చేవాణ్ని మా యింటికి

ఏళ్ల తరబడి అదే జరిగింది

విరగబూసిన ఎర్ర చంపకవృక్షాలు మూడు

మైలు దూరం నుంచే కనిపించేవి

వాటి స్వర్ణవర్ణ రేణువుల పుప్పొడిమేఘం

దారిపొడుగునా దట్టంగా పేరుకుని

అమ్మకు పార్శ్వపు నొప్పినీ

తాత్కాలిక అంధత్వాన్నీ తెప్పించేది

దాని వాసనను ఏ గాలీ వడగట్టలేకపోయింది

నల్లని స్తంభాలతో కట్టిన మా యింటిగోడలకు

చెవులూ కళ్లే కాదు, పెచ్చులూ వాసనలూ

ఎముకల కటుక్కు శబ్దాలూ

రాత్రుళ్లలో వినిపించే గొంతుకలూ ఉండేవి,

అన్నీ ప్రవేశించగలిగే దేహాల్లాగ.

ఏ తలుపూ ఆ పుప్పొడిని ఆపలేకపోయింది

అమ్మ అవస్థ బాల్కనీ లోని

లోహపు తీగ లాంటిది

అది తళతళ మెరుస్తుండేది

దానిమీద మనుమల, మనుమరాళ్ల చెడ్డీలు…

అవి తలనొప్పిని తగ్గించేందుకు

తలమీద పెట్టుకునే తడిబట్టల లాంటివి

అవస్థకు కారణమైనా

ఆ చెట్టును కొట్టనివ్వలేదు అమ్మ!

ఆంగ్ల మూలం: ఎ.కె. రామానుజన్

అనువాదం: ఎలనాగ

***

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఉడుతా ఉడుతా .. ఊచ్

by Shanthi Prabodha Valluripalli May 9, 2023
written by Shanthi Prabodha Valluripalli

అనగనగా ఒక చెట్టుంది. ఆ చెట్టుకేమో పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలో ఉడుత జంట కాపురం ఉంటున్నది. 

ఉడుత త్వరలో తల్లి కాబోతున్నది.  బిడ్డల్ని కనబోతున్నది.  నార, మెత్తటి గడ్డి లాంటివి ఏరుకొచ్చి సన్నగా చీల్చి మెత్తగా దూదిలాగా చేసి, గుండ్రంగా సర్ది,  గూట్లో పరుపులా తయారు చేసాయి ఉడుత జంట. పిల్లలకు ఒత్తిడి తగలకుండా, సౌకర్యంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు చేసాయి. 

ఆ ఉడుత జంటకి నాలుగు పిల్లలు పుట్టాయి.   

ఆ తొర్ర ఇంట్లో పిల్లలతో కాపురం ఉంటున్నాయి ఆ జంట. 

ఉడుత పిల్లలు చాలా చిన్నవి. బుజ్జి బుజ్జి గా ఉన్నాయి. వాటిని ముందే తయారు చేసి పెట్టుకున్న మెత్తటి గడ్డి పరుపుపై వాళ్ళమ్మ పడుకోబెట్టింది.  

చిట్టి చిట్టి ఉడుతలు అమ్మని కరుచుకు పడుకున్నాయి. 

అవి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతాయి.  తర్వాఉడుతా ఉడుతాత నిద్దుర పోతున్నాయి.

పిల్లలు పడుకున్నాయి కదా…  అవి లేచే లోపల తన పిల్లలకు ఆహారం తెద్దామని అమ్మ ఉడుత బయటకు చూసింది. 

తనను ఎవరు గమనించడం లేదు అని నిర్ధారించుకుంది.  బయటకు  వెళ్ళింది. 

టమాటో తోటలో టమాటా కొద్దామని చూసింది. తియ్యటి పెప్పర్ మెంట్ వాసన వస్తోంది . మొహం ఎట్లాగో పెట్టుకుని దూరం జరిగింది. 

వెల్లుల్లి వాసనంటే గిట్టదు . మిరియాల ఘాటు అంటే కూడా ఉడుతకి అస్సలు నచ్చదు.   జాగ్రత్తగా వెతికి వెతికి కూరగాయలు, పళ్ళు తెచ్చింది అమ్మ. 

పగలంతా మొక్కజొన్న, పుట్టగొడుగులు, ఆకుకూరలు, జామకాయలు వెతికి తెచ్చాడు నాన్న.  అన్నిటినీ తెచ్చి చక్కగా ఆ తొర్రలో  భద్ర పరిచారు అమ్మానాన్న.

ప్రతిరోజూ అంతే.  

వెలుతురు ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు తెస్తారు.  వెలుతురు పోయే లోపల పనులు ముగించుకుని ఇంటికి చేరుతారు. రాత్రిపూట ఇంట్లో నుంచి బయటకు రారు. విశ్రాంతి తీసుకుంటారు. 

ఉడుత పిల్లలు రోజు రోజుకు పెరిగి పెద్దగా అవుతున్నాయి.  నిద్ర లేచిన పిల్లలు అమ్మ కోసం వెతుక్కోవడం మొదలు పెట్టాయి.  తొర్రలో అమ్మ కనిపించటం లేదు . నాన్న లేడు.  

పిల్లలు నిద్ర పోకుండా అమ్మ నాన్న ఎటు వెళుతున్నాయో చూడాలని అనుకున్నాయి. రెండు రోజులు పిల్లలు నిద్రపోవడం లేదని వాటికి జాగ్రత్తలు చెప్పి అమ్మ నాన్న ఉడుతలు బయటికి వెళ్లడం మొదలు పెట్టాయి. 

ఓ రోజు “అమ్మ నాన్న రోజు ఎటో వెళ్లి వస్తారు. కానీ మనకు మాత్రం ఇక్కడ నుంచి కదలొద్దు అని చెబుతున్నారు. బయటకు తొంగి చూడవద్దని చెప్పి వెళ్తున్నారు.  

బయట ఎలా ఉంటుందో, ఏమి చేస్తారో చూడాలని ఆత్రంగా ఉంది” అన్నది ఓ ఉడుత పిల్ల. 

“అవును నిజమే, రోజంతా గూట్లో కూర్చుంటే విసుగు వస్తున్నది.  మనం కూడా ఎంచక్కా బయటకు పోతే..  ” అన్నది మరో ఉడుత పిల్ల.  

“అబ్బ !.. బయటికి పొతే… ” కళ్ళు మెరిపిస్తూ అన్నాయి మిగతా రెండు ఉడుత పిల్లలు.  

“ఇంకేం, అయితే పదండి పోదాం” ఉత్సాహంగా అన్నది మొదటి పిల్ల 

అంతలో ఒక పిల్ల అదిగో అమ్మ అటు వెళ్ళింది అంటూ తొర్ర పైకి చూపింది 

అందరూ తొర్ర పైకి వచ్చారు. అంతలో అమ్మ ఆహారం తీసుకుని వచ్చింది.  

పిల్లల్ని చూసి “అయ్యో .. మీరు  ఇక్కడికి ఎందుకు వచ్చారు” కంగారుగా అడిగింది 

“నువ్వు ఇటే వెళ్లావుగా .. అందుకే నీకోసం మేము బయలు దేరాం” అని చెప్పారు పిల్లలు.  

“మీరింకా చిన్న పిల్లలు. అట్లా రాకూడదు. ఇంట్లోనే ఉండాలి” బుజ్జగింపుగా చెప్పింది అమ్మ 

“ఏం ఎందుకని ..? ” మొదటి పిల్ల వెంటనే ప్రశ్నించింది. 

“బయట ఎలా మెసలాలో మీకు తెలియదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు తెలియదు.  రకరకాల ప్రమాదాలు వెన్నంటి ఉంటాయి. ఇంకా కొన్నాళ్ళు పోయాక నేనే తీసుకుపోయి అన్నీ చూపిస్తా, సరేనా ..  ” అని చెప్పింది అమ్మ ఉడుత. 

అంతలో తండ్రి ఉడుత తోక తో ఏదో సంకేతాలు పంపింది .  నోటితో ఏవో శబ్దాలు చేసింది. తల్లి ప్రమాదం పసికట్టింది . 

గప్ చిప్ గా పిల్లల్ని లోపలికి తీసుకుపోయింది తల్లి. 

ప్రతి రోజూ చెట్టు తొర్రలో ఉండే ఉడుతలను గమనించే చిన్నూకి చాలా ఆశ్చర్యంగా ఉంది.  

తండ్రి ఉడుత తోక ఊపగానే తల్లి పిల్లల్ని ఎందుకు లోపలికి  తీసుకుపోయిందో అర్థం కాలేదు.  

“ఉడుత ఉడుతా ఊచ్ .. ఎక్కడికెళ్ళావోచ్ ” పాడుతూ చెట్టు తొర్ర కేసి చూస్తున్నాడు చిన్నూ. 

చెట్టు తొర్ర దగ్గర లో పాము కనిపించింది.   కొమ్మ పైన ఉన్న తండ్రి తోక ఊపుతూ మళ్ళీ ఏదో శబ్దం చేసింది.  

ఇప్పుడర్థం అయింది తండ్రి ఉడుత ఎందుకు తోక ఊపిందో .. 

మరి మీకు అర్ధమైందా .. 

చెప్పండి చూద్దాం .

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఆదర్శ విద్యాలయంలో మెరిసిన ముత్యాల హారాలు

by Rathod Sravan May 9, 2023
written by Rathod Sravan

నన్నయ్య ఉపకథలు

తిక్కన్న నవరసాలు

ఎర్రన్న వర్ణనలు

భారతాన కోకొల్లలు

మహాభారతంలోని పర్వాలు రచించిన కవిత్రయం గుర్చి కవి అద్భుతంగా చేప్పారు. 

వెలుగునిచ్చే దీపాలు

జ్ఞానమిచ్చు పుస్తకాలు

మారిపోవు మస్తకాలు

ఆనందమె జీవితాలు

కవి పుస్తక పఠనం వలన లభించే జ్ఞానమును తెలియజేశారు.

తెలంగాణ ఆదర్శ పాఠశాల జనగాం జిల్లా బచ్చన్నపేటలో తెలుగు భాషోపాధ్యాయులుగా  విధులు నిర్వర్తిస్తున్న కవి, రచయిత,విశ్వవిద్యాలయంలో లెక్చరర్ షిప్ కోసం జరిగే    యూజీసీ నెట్,సెట్ పరీక్ష యందు ఉత్తీర్ణులై

ఎం,ఏ. తెలుగు సాహిత్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల హైదరాబాదు నుండి 2007లో

 సురవరం ప్రతాపరెడ్డి స్వర్ణ పతకం సాధించిన ఉన్నత విద్యావంతుడు *మీసాల సుధాకర్ గారు*   తెలుగు సాహిత్యంలో నూతన లఘు కవిత ప్రక్రియ ముత్యాల హారంలో దాదాపు ఏడు వందల    పైచీలుకు ముత్యాల హారాలు లిఖించి 

“సాహితీ ముత్యాల హార పురస్కారం” పొంది ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తి వంతులవుతున్నారు.

చాలా చక్కని సరళమైన పదజాలంతో ఆకర్షణీయమైన అంత్యానుప్రాసతో అద్భుత రచనలు చేయగల చేయి తిరిగిన కవి మీసాల సుధాకర్ జనగామ జిల్లా రఘు నాథపల్లి మండలంలోని  ఖిలాషాపురం గ్రామంలో శ్రీమతి/శ్రీ, కీ.శే.మీసాల రామయ్య , సోమక్క దంపుతులకు 09‌ జూన్1977‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. జీవిత భాగస్వామి పేరు స్వప్న వీరికి సాయి నిఖిల్, సాయితేజ ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృత్తి రీత్యా తెలుగు భాషోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తూ ప్రవృత్తి రీత్యా సాహితీ సృజనకారుడుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.సాహితీ సృజన కవితలు, మధురిమలు, గేయాలు రాస్తూ, విద్యార్థులలోని దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికి తీయడం మాతృభాష పై మమకారం పెంపొందించడం

పలు సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ముఖ్య భూమిక పోషిస్తూన్నారు.సాహిత్యం మీద ప్రేమతో *తొలి పొద్దు బాలల కవితల సంకలనం-2021* కి సంపాదకత్వం వహించారు. మీసాల సుధాకర్  *అణిముత్యాలు* పేరుతో *ముత్యాల హారాల సంపుటిని* మన ముందుకు తీసుకొచ్చారు. ఇది వారి తొలి కవితా సంపుటి కావడం విశేషం.

ఈ సంకలనం వివిధ సామాజిక, సమకాలీన అంశాల పై వెలువరించడం గొప్ప విషయం.మాతృభాషాభిమానంతో సాహిత్యాన్ని ఎంచుకొని సాహితీ రంగంలో విద్యార్థులను, పాఠకులను, రచయితలను, ప్రోత్సహిస్తు సాహిత్యంలో సేవ చేస్తూ 2020 లో విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బండారు బాలానంద సంఘం వారిచే “ప్రతిభా పురస్కారం” ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు రాథోడ్ శ్రావణ్ సౌజన్యంతో  సాహితీ వేదిక అధ్యక్షుడు కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ ప్రధాన కార్యదర్శి ముంజం జ్ఞానేశ్వర్ వారిచే  “సాహితీముత్యాల హార పురస్కారం” అందుకున్నారు.

తెలుగు పండితులు ఆయన యువకవి మీసాల సుధాకర్ తెలుగు సాహిత్య ప్రక్రియను

అలవోకగా వ్రాయగల దిట్ట.

 “ముత్యాలహారం”  నూతన కవిత ప్రక్రియలో  ఆణిముత్యాలు -ముత్యాల హారాలు

అను పేరుతో మొత్తం నాల్గు వందల నలభై ముత్యాల హారాలతో పుస్తకములో రూపొందించడం సంతోషం. ఈ పుస్తక సాగరంలో ఎన్నో ఆణిముత్యాలాంటి ముత్యాల హారాలు కలవు.

తెలుగు సాహితీ క్షేత్రంలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్న ఈ యువకవి

తెలుగు భాష ప్రచారం,ప్రసారం కొరకు తన వంతు కృషి చేస్తూ, తెలుగు తల్లికి ఎనలేని సేవలందిస్తూ,

అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.అందమైన అంత్యానుప్రాసలతో  ఆకట్టు కుంటున్న చక్కని ముత్యాల హారాల రచన ఇది. ముత్యాల హారాలు రాస్తూ ముందుకు దూసుకుపోతున్న కవి

కలం నుంచి మరిన్ని పుస్తకాలు వెలుగులోకి రావాలని ఉట్నూర్ సాహితీ వేదిక తరుపున మనసార కోరుతూ, తెలుగు సాహిత్యానికి మీసాల సుధాకర్ చేస్తున్న కృషి అభినందనీయం.

వెల:80/-

ప్రతులకు

మీసాల స్వప్న

ఇం.సం:4-6-22/3-4

సి.ఆర్.రెడ్డితోట, జనగామ జిల్లా 9908628430

సమీక్షకులు:-

రాథోడ్ శ్రావణ్

ముత్యాలహారం రూపకర్త, 

పూర్వ అధ్యక్షులు

ఉట్నూరు సాహితీ వేదిక 

ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా

చరవాణి సంఖ్య:9491467715.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

చదువు విలువ

by Krishna Mohan May 9, 2023
written by Krishna Mohan

హన్మకొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నాయి రెండు తండాలు వాటిలో ఒకటి హరి చంద్ర నాయక్ తండ అందులో అందరూ ఉద్యోగస్తులే ప్రతి ఇంటికీ ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆఫీస్ స్థాయి నుండి అటెండర్ వరకూ ఏదో ఒక స్థాయిలో ఉద్యోగం పొందిన వారే అందరూ. దానికి భిన్నంగా దాని పక్కనే ఆనుకుని ఉంది మరొక తండ దాని పేరే నిరూప్ నగర్ తండా ఆ తండాలో గుడుంబా వ్యాపారం ఎక్కువ. అందరూ నిరక్షరాస్యులు తాగి గొడవ పడని రోజ అంటూ ఉండదు ఆకుటుంబాలలో అటువంటి తండాలో హరిసింగ్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకొని ఆసుగుపెట్టింది రాదబాయి.

 పెళ్లి జరిగిన తెల్లవారే నుండి కుటుంబ వారు గుడుంబా బట్టి పెట్టడం నేర్పించారు దానికి ఈ రోజు కూడా తయారుచేయడం పక్కనే ఉన్న పట్టణంలో సాయంత్రం పూట అమ్మడం పనిగా మారింది తరచూ పోలీసులు తండా కి రావడం  మామూళ్ల పేరిట వేధించడం ఏ సందర్భాల్లో అరెస్టు చేసి జైల్లో కి తీసుకెళ్లడం ఇవన్నీ నచ్చలేదు రాధాబాయికి.పక్క తండా లాగా చదివి మంచిగా ఉండలనుకున్నది. అభ్యుదయ భావాలున్న ఆమె అక్కడ బ్రతకడం కష్టమైపోయింది దానికి తోడు తన భర్త తాగుబోతు గా మారిన నిత్యం డబ్బుకోసం వేధింపులకు గురి చేసేవాడు. చేసేది లేక అన్ని భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నది రాధాబాయి. దానికి తోడు కొన్నాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. కొడుకుకి రామ్ సింగ్ అని పేరు పెట్టుకొని తనను చూస్తూ ఆపిల్లవాడిని గూర్చి కలలు కంటూ కష్టాలను మరచి బ్రతుకుతున్నది. ఆ అనదం ఎంతో కాలం నిలవలేదు తనకు

:రామ్ సింగ్ కు నాలుగేళ్ల వయసు వచ్చింది. తాగుడుకు బానిస అయిన భర్త హరిసింగ్ తాగి,తాగి చనిపోయాడు. నాటి నుండి కష్టాలు మరింత పెరిగాయి. తనకు  ఉన్న ఒక్క గది కోసం తోటికొడళ్లు రకరకాలుగా వేధించడం మొదలు పెట్టారు. రామ్ సింగ్ కోసమే బ్రతుకుతున్న తాను తనకొడుకును చదివించి ప్రయోజకుడిని చేయలనుకుంది. తనను బడికి పంపించింది. రామ్ సింగ్ చక్కగా చదువుతున్నాడు. 4వ తరగతి వరకు చేరుకున్నాడు.ఒకరోజు రామ్ సింగ్ వాళ్ళ సార్ రమ్మంటున్నాడని అమ్మని బడికి తీసుకువెళ్లాడు. వెళ్లి సార్ ని కలిసింది రాధాబాయి. నీ కొడుకు బాగా చదువుతున్నాడు ప్రభుత్వ గురుకుల పాఠశాలకు పంపించు సీటు వచ్చింది అని తెలిపాడు. ఎంతో సంతోషించింది. అందుకు కావలసిన పనులకు ఆ ఊరిలో చదువుకున్న లింగన్న సాయం తీసుకుంది. కొడుకును గురుకులంలో చేర్పించింది. అది చూసి తోటికొడళ్లు మరింత రగిలిపోయారు. 

ఈ మార్పును వారు ఆయుధంగా మలుచుకోవాలనుకున్నారు. సెలవులలో ఇంటికి వచ్చిన రామ్ సింగ్ ని చేరదీసి తన తల్లి లింగన్నతో తిరుగుతుందని కావాలనే నిన్ను గురుకులంలో చేర్పించారని లేనిపోనివి నూరిపోశారు రామ్ సింగ్ కి. దానితో తల్లిని శత్రువుగా చూడడడం మొదలు పెట్టాడు రామ్ సింగ్. రాధాబాయి బాధను భరిస్తూ నిజం గ్రహిస్తాడని ఓపికపట్టింది. సెలవులకు ఇంటికి రాకుండా బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళేవాడు. అయినా మంచిగా చదువుతున్నాడుకదా అని సరి పెట్టుకుంది  అలా తొమ్మిదవ తరగతికి చేయూకున్నాడు. అప్పుడే కొత్తగా కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆకౌన్సెల్లర్ దగ్గరకు తీసుకు వెళ్లారు. ప్రిన్సిపాల్ చాలా బాగా చదువుతాడు కానీ సెలవులు వస్తే ఇంటికి వెల్లడు. ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు అని చెప్పారు ప్రిన్సిపాల్ గారు. రామ్ సింగ్ తో గంటపాటు మాట్లాడిన కౌన్సెల్లర్. వారం తరువాత మళ్ళీ కలవమన్నాడు. వారం తరువాత మళ్ళీ ఒక గంటపాటు మాట్లాడి. రామ్ సింగ్ సమస్యను గుర్తుంచాడు. తన తల్లి ఉన్న పరిస్థితులను. తాను పడుతున్న శ్రమను మరోకోణంలో చూడమన్నాడు. అప్పటికి నీ తల్లిది తప్పనిపిస్తే తనని మార్చుకోమని నీకోసమే బ్రతుకుతున్న తనకు నీప్రేమను అందించు అని సూచించాడు. సెలవురాగానే ఆనందంతో ఇంటికి వెళ్ళాడు రామ్ సింగ్ తను ఇన్నాళ్లు చెప్పుడు మాటలు విని తల్లిని బాధపెట్టినందుకు బాధపడ్డాడు. పదేళ్లుగా రాధాబాయి మనసులో అనుభవిస్తున్న బాధను తుడిచివేశాడు. తన తల్లి కలలను నిజం చేస్తూ  చదువు పూర్తి చేసి ఊద్యోగం పొందాడు.

మనసు ఉంటే మార్గం ఉంటుంది.

కష్టాల రాపిడి నుండి అగ్నికణం పుడుతుంది.

May 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ తొలి పొద్దు – కాళోజి

by Kancharla Mahesh May 9, 2023
written by Kancharla Mahesh

“నేను ప్రస్తుతాన్ని నిన్నటి స్వప్నాన్ని రేపటి జ్ఞాపకాన్ని” అని చెప్పుకునే జీవిత తత్వానికి నిదర్శనం కాళోజీ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తెలంగాణ పోరుగడ్డపై జన్మించిన మడికొండ మణిరత్నం కాళోజీ నారాయణరావు. కాలానికి అతీతమైన కవి, మన కాలపు వేమన, ఒక శతాబ్దాపు జీవన ప్రమాణంతో ప్రతి నిమిషం పోరాటాన్ని స్వాసించి కవిత్వీకరించిన వ్యక్తి, తెలంగాణ తొలి పొద్దు, తెలంగాణ ప్రతిధ్వని, రాజకీయ,సాంఘిక,చైతన్య కార్యక్రమాల సమూహాహారం మన కాళోజీ.. కరుడు కట్టిన హృదయాలను కదిలించే అక్షరాలను ఆయుధంగా మలచే కవిత్వాలు రాసిన ప్రజాకవి.

స్వయంగా కాళోజి  “నేనింకా నా నుండి మా వరకు రాలేదు“ అని తనలో ఉన్నటువంటి  సాదాసీదామైన వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించాడు. కాళోజీ కవితలు ప్రజల గుండెల్లో నిరంతర ప్రవాహిలా మారుమోగుతూ ఉంటాయి. ఆయన కవిత్వాలు,కథలు,నవలలు వర్తమాన పరిస్థితులను అద్దం పట్టించే ప్రతీకలను కలిగి ఉంటాయి. ఎక్కడ అన్యాయం, ఎక్కడ అనిచివేత, ఎక్కడ ఆకలి మంటలు ఉంటాయో అక్కడ కాళోజీ యొక్క కవిత్వం వినబడుతుంది.

“ఆకలి మంటలు ఒకచోట – అన్నపు రాశులు ఒకచోట“అనే అక్షరాల పూదోటలో నేటి కాలపు ఆర్థిక అసమానతలను వ్యక్తీకరించే భావాన్ని అక్షరీకరించాడు.

“ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు పదును పెడుతుంది“విద్యా ప్రాముఖ్యతను, విద్యకున్న ఔన్నత్యాన్ని సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా అనువర్తించాడు.

“పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది“అన్న నినాదం జాతీయ ఉద్యమ స్ఫూర్తిని, మానవతా దృక్పథాన్ని, తన బాధ్యతను, ప్రజల యొక్క కర్తవ్యాన్ని కవిత్వీకరించాడు.

తెలంగాణ ప్రజల యొక్క గొడవను నా గొడవగా చేసుకొని సమాజ చైతన్యం కోసము అహర్నిశలు కృషిచేసిన తెలంగాణ పెద్దదిక్కు కాళోజీ నారాయణరావు. ఒకవైపు కవిత్వం,మరొకవైపు రాజకీయం మెలకువలు తెలిసిన మహాకవి కాళోజి. నేటి కాలపు రాజకీయ పరిస్థితులకు కూడా అనువర్తించే కవిత్వాన్ని ఆనాటి కాలంలోనే చిత్రీకరించిన గొప్ప కవి.

“అభ్యర్థి ఏ పార్టీ వాడను కాదు. ఏ పాటి వాడని చూడు“ అని రాజకీయ దుమారం లేపే సూక్తిని అక్షరబద్ధం చేశాడు. కాళోజీ  యొక్క ఎన్నో కవిత్వాలు,కథలు, నవలలు నేటి కాలపు యువకులకు యువ రచయితలకు కవులకు ఆదర్శంగా నిలిచాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ముందుండి నడిపించి,తెలంగాణ భాష,యాస,సంస్కృతి పట్ల హేళన చేసిన వారిని చెంప చెల్లుమని విధంగా తెలంగాణ భాష సొగసులను ,అందాలను తన కవిత్వంలో గుభాలించాడు.

“పరాయి భావాలు

 పరాయిచూపులు

 పరాయి భాష

పరాయి చెవులు

పరాయినడక

పరాయి చేతలు

అట్లా కాకూడదని నాతిక్క” అని పరాయి అనే పదాన్ని ఏ విధంగా వ్యతిరేకించాడు కనబడుతుంది.

నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించి ప్రజలను ఏకం చేయడానికి గణేశు ఉత్సవాలను నిర్వహించాడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకు ప్రాప్తి,సంతృప్తి కలుగుతుంది. ప్రజలను ఏకతాటిపై తీసుకురావడానికి తన కవిత్వానికి పదును పెట్టి,ప్రజల్లో చైతన్యాన్ని రగులుగొల్పి, పాలకుల పట్ల తప్పులను ఎత్తి  చూపించే ప్రజాగలం కాలోజి. ఆంధ్ర మహాసభతో మొదలుపెట్టి తన ఉద్యమాన్నిఆర్య సమాజం, గ్రంధాలయ ఉద్యమంగా,క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన మహాకవి.

రాజకీయ కోణంలో అక్షర సత్యాలను జీవిత సత్యాలను నిర్మొహమాటంగా ఉద్ఘాటించే కవి కాళోజి.”అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో

ఆ అక్షరాలను ఆత్మగా చేసుకుని బ్రతికిన వారు కొందరే “అని మోసం చేసే వ్యక్తులకు,ఆత్మగా భరించి వ్యక్తులకు మధ్య సంబంధాన్ని తన కవిత్వం ద్వారా ప్రజానీకoలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. తాను చేసిన సేవకులను భారత ప్రభుత్వం గుర్తించి పద్మవిభూషన్, జీవన గీతికి ఉత్తమ అనువాద అవార్డులను ప్రచురించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో బైరాన్ పల్లి ఘటనకు చలించి పోయిన కాళోజి కాలంబు రాగానే కాటేసి తీరాలి అని అక్షరాలను ఆయుధంగా రజాకారులపై సవాళ్లు విసిరాడు..

“ఏ భాష రానిది ఏమి వేషము రా

ఈ భాష ఈ వేషమేవరి కోసము రా?

తెలుగు బిడ్డ వై తెలుగు రాదంచును

సిగ్గు లేక ఇంకా చెప్పుకుంటే0దుకురా?

అన్య భాషలు నేర్చు ఆంధ్రము రాదంచు

సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా? అని నెగ్గు తేల్చుతూ విశ్వాసంతో తెలంగాణ భాషా పట్ల,తెలుగు భాషా పట్ల తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు.

“చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చాటలేవు

చెమ్మగిలని కనుల బ్రతుకు కమ్మదనం చూడలేవు“సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు చలించని గుండె అది గుండె కాదు. అదే విధంగా జీవితంలో కనులు చెమ్మగిలకపోతే ఆ బ్రతుకులో ఉన్నటువంటి కమ్మదనాన్ని అర్థం చేసుకోలేడు మానవుడు.. మానవతావాదిగా తాను నిరూపించుకున్నాడు. ఇవన్నీ గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 1946- 51 మధ్యలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని,తెలంగాణ భాషా సాధనకై నిరంతరం కృషి చేసిన తెలంగాణ దివిటి మన కాళోజీ.

May 9, 2023 0 comment
5 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆరాటం

by Rudrakhala Matam Prabhu linga Shastri April 29, 2023
written by Rudrakhala Matam Prabhu linga Shastri

ఏ లక్ష్యము కోసము
వాడున్నాడో దానిని
చేరడమే వాని పని.
వాడెలా చేరినాడనేది
అవసరం లేదంటాడు.

నిర్దేశించుకున్న పద్ధతి
ప్రకారమే చేరుకోవాలి
మరోపద్ధతి ప్రకారము
మరొకరి ద్వార లక్ష్యము
ఎప్పుడు చేరరాదంటాడు.

మొదటివానిది విశ్వాసము
వ్యక్తము కాలేనిది అందరిచే.
రెండవ వానిది పిడివాదము.
చేయబడుతుంది కొందరిచే.

విచిత్రమేమింటే ఈ రెండూనూ
అందరికి పూర్తిగా అందేవికావు.

వీళ్ళిద్దరికి ఒకరి గురించి ఒకరికి
సంపూర్తిగా తెలుసు తామిద్దరు
వాదనకు దిగితే ఏ ‘పరిష్కారము’
రానేరాదని అయినా తమ తమ
ఉనికి కోసమే ఆ ఇద్దరి ఆరాటం.
~~~
౼రుద్రాక్షల మఠం ప్రభులింగశాస్త్రి
తేది:-20-04-2023
వేళ:సాయంకాలం:గం౹౹4:43ని౹౹లకు

April 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

స్నేహ హస్తం

by Rapolu Sridevi April 17, 2023
written by Rapolu Sridevi

రాత్రి 11 గంటలకు అవుతుండగా శ్రీవారు హడావుడిగా బయటకు వెళ్తూ వ్యాన్ కీస్ అడిగారు ఆ కీస్ ఇచ్చేప్పుడు నా చీర కొంగు దానికి చిక్కుకుంది చూడకుండానే తీసుకొని వెళుతూనే ఉన్నారు.
అప్పుడు గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తి లా కనిపించారు.

ఎక్కడికి వెళ్తున్నరని తెలియక మా పక్కింట్లో ఉండే వారి ఫ్రెండుని అడిగాను.

పిటి సార్ వాళ్ళ ఆవిడ బాగా కడుపునొప్పి తో బాధపడుతున్న పడుతుంటే అపెండిటైటిస్ కావచ్చు అని ఆపరేషన్ చేయించాలని హడావుడిగా వ్యాన్లో తీసుకెళుతున్నారు. అని చెప్పారు.
అమ్మ! ” నాన్న ఎక్కడికి వెళ్తున్నారు” అని మా పెద్దమ్మాయి అడిగింది.
నాన్న ప్రాణ దానం చేయడానికి వెళ్తున్నారు .
అని చెప్పాను “ప్రాణదానం” అంటే? అడిగింది పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను సరైన సమయానికి హాస్పిటల్ లో చేర్చడం అంటే ప్రాణదానం చేసినట్టే కదా!….

అసలు “దానం” అంటే ఏమిటి ?
అని అడిగింది పాప
“మనం ప్రతిఫలం (తిరిగి సహాయం) ఆశించకుండా చేసే సహాయం ఏదైనా దానమే” అని చెప్పాను.
అన్నదానం, విద్యాదానం, స్వర్ణదానం, భూదానం, గోదానం, రక్తదానం, ధన దానం అంటూ చాలా ఉంటాయి అన్నాను. అవునా !అంటూ ..
నా వంక ఆశ్చర్యంగా చూసింది.
మీ నాన్నగారు చాలా దానాలు చేశారు తెలుసా? అన్నాను.

అయితే చెప్పమ్మా…అంది

ఓ రోజు ఓ సారు డిగ్రీ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారు.
ఎవరికోసం?
అని అడిగితే.. సార్ “వాళ్ళ తమ్ముని కోసం” అన్నారు.
డిగ్రీ చదివే తమ్ముడు ఇవ్వరా? అని ఆలోచిస్తుండగానే ..
స్కూల్ ఆఫీస్ బాయ్ వచ్చి బుక్స్ అని అడిగితే ఇస్తూ … ఎవరికీ ఇవి ?
అని అడిగాను.
” నా కోసమే మేడం” అన్నాడు.
సార్ వాళ్ళ తమ్ముని కోసం అని చెప్పి తెప్పించారు.
అలా అన్నందుకైనా బాగా చదవాలి అని చెప్పి ఇచ్చాను.
ఇలా విద్యాదానం చేశారు.
టీచర్ గా మీ నాన్న చేసేది విద్యాదానమే అనుకో..

మొన్న మనం భువనగిరికి వెళ్ళినప్పుడు ఓ పిచ్చి ఆవిడ చూసి జాలి పడ్డాము.
కానీ ఏమీ చేయలేకపోయాం.

మరుసటి రోజు మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేసి “ఆమెకు కాస్త తిండి అన్న పెట్టు లేకుంటే విషయం అన్న పెట్టరా “అని ఆవేశంలో అంటుంటే విని ..
ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అన్నాను.
నిన్న భువనగిరిలో ఓ పిచ్చామే కళ్ళు తిరిగి పడిపోతే సోడా తాపించి ..ఇడ్లీ పెట్టించాను .
ఆమెకు మన భాష రాదు అనుకుంటా..
సోడా తాగిస్తుంటే ఏదో భాషలో తిడుతుంది.
అని చెప్తుంటే నవ్వొచ్చింది .
కానీ “నేను చేయలేని పని మీరు చేశారు” చెప్తూ ఆనందపడ్డాను.
మీ నాన్న ఇలా అన్నదానం చేశారు.

నాన్న వాళ్లందరికీ ఒక గ్రూపు ఉంది .
అందులో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వారి వారి బ్లడ్ గ్రూప్స్ నోట్ చేసుకొని పెట్టారు.
ఎవరికైనా బ్లడ్ అవసరమైతే ఆ గ్రూపు వారికి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి రక్తదానం చేస్తారు .
అలా మీ నాన్న ఎన్నోసార్లు రక్తదానం చేశారు .
మరి “ధనదానం చేయలేదా?”అని అడిగింది పాప

ఎవరికి ఏ అవసరం వచ్చినా మొదట మీ నాన్ననే అడుగుతారు. మీ నాన్న జీతం ముందే తీసుకొని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి ఇచ్చి ఏనాడు పూర్తి జీతం తీసుకోలేదు.

మనం ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాం కదా… ఓసారి రామకృష్ణ సార్ వచ్చి
“డాడీ మాకు డబల్ బెడ్ రూమ్ ప్లాట్ ఇప్పించి రెంట్ కడుతూ.. పాపం డాడీ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా?” అని చెప్పే వరకు ఆ విషయం నాకు తెలియదు.
నాన్నను ఆ సార్ “డాడీ” అని ఎందుకు అంటున్నారు ?అని అడిగితే …
ఓ తండ్రిలా వారి బాగోగులు చూస్తున్నారుగా.. అందుకే అలా పిలుస్తున్నారు .
అని చెప్పాను .
మనం ఇంకో ఇల్లు తీసుకుందాం అంటే రెండు ఇళ్లకు కిరాయి కట్టడం కష్టం కాబట్టి మనల్ని ఈ ఇంట్లోనే ఉంచారు మీనాన్న.

“మరి స్వర్ణ దానం అంటే ?
బంగారం దానం చేయడం మా పెళ్లి రోజునే వాళ్ళ ఫ్రెండ్ కి ఏదో అవసరం ఉందని అంటే వాళ్ళ అక్క పెట్టిన బంగారు ఉంగరం పసుపు బట్టల మీద ఉన్నా..తీసి ఇచ్చారు. “అలా ఇవ్వొద్దా?” అమ్మా !అని అడిగింది పాప .
ఇవ్వకూడదని అంటారు.
అయినా అవసరం కంటే ఆచారం ఎక్కువ కాదని ఇచ్చారు.

మరోసారి వాళ్ళ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పరుగు పరుగునా..హాస్పిటల్ కి తీసుకెళ్లి వారిని డాక్టర్ కి చూపించి.. ఇంట్లో దింపి.. వారికి కార్ అవసరం ఉంటుందని మన కారు ఇచ్చి ట్రైన్ కి వచ్చాం .
చెల్లి పుట్టేముందు డెలివరీ ఖర్చుల కాని దాచుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి అవసరమైతే ఇచ్చారు. తీరా డెలివరీ రోజు డబ్బులు అడగడానికి వెళ్లి చెల్లి పుట్టాక ఆలస్యంగా వచ్చారు.

నాన్న సహాయం చేసిన వాళ్ళతో మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పితే బాగుండేది కదా,!.. అన్నది పాప.
అవును అన్నాను.

కొందరు మనుషులు ‘మన’ అనే మాటలో ‘మ’ మానవత్వం మరిచి ‘నా’ అనే స్వార్థంతో బ్రతుకుతుంటారు .
కానీ మీ నాన్న మానవత్వమే తత్వం గా…
మంచితనమే ధనంగా
భావించే వ్యక్తి.
ఒక వ్యక్తి మంచితనం ను ఆ వ్యక్తి కున్న స్నేహితులను జాబితాను బట్టి చెప్పొచ్చు అంటారు. అవును …నాన్నకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదూ …
అవును అన్నాను.

నాన్న ధన దానం, స్వర్ణదానం ,రక్తదానం, ప్రాణదానం, విద్యాదానం ఇన్ని చేశారా? అని ఆశ్చర్యం గా అడిగింది పాప..

మీరు పెద్దయ్యాక మీ పెళ్లి చేసేటప్పుడు కన్యాదానం కూడా చేస్తారని చెపితే సిగ్గుల మొగ్గయింది
అమ్మాయి.

ఆపదలో ఉన్నవారికి సాయం చేసే మనసు తో పాటు.. స్నేహస్తం ఇచ్చేవారు నిజమైన దాతలు..

April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చీరలోని గొప్పతనం

by Ramakrishna Manimadde April 17, 2023
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

  • రామకృష్ణ మనిమద్దె
    9494353828
April 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రామ తత్వం

by V. Kameshwari April 2, 2023
written by V. Kameshwari

శ్రీరామనవమి సందర్భంగా

రాముడు సామాన్యులకు ఆరాధ్యుడు
తాపసులకు పరబ్రహ్మ
జ్ఞానులకు తత్వవేత్త,
గృహస్తులకు ఆదర్శమూర్తి.
ఇలా అనేక వర్గాలలో అనేక రకాలుగా కీర్తింపబడే రాముడు లోకాభిరాముడు. రామ చరితం తెలియని భారతీయుడు ఉండడు. రామాలయం లేని ఊరే ఉండదు. రామస్మరణ చేయని మానవుడే ఉండడు. కష్టాల్లో రామచంద్ర అంటాం సుఖాలలో రామభద్ర అంటాం చివరికి కాటికి పోయేటప్పుడు కూడా రామ్ నామ్ సత్య హై అంటాం. రామస్మరణ చేయని తావే లేదు. ధర్మంలో నడిచి చూపించిన ఆది గురువు మన శ్రీరాముడు. ఏ ఏ సందర్భాల్లో ఎలా నేర్చుకోవాలో మానవాళికి చేసి చూపించిన దివ్య ఆదర్శమూర్తి.
అయోధ్యలో నిర్మల మైన రఘువంశంలో జన్మించాడు, కౌసల్య నందనుడయ్యాడు, విశ్వామిత్ర యాగాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు. అహల్యకు శాప విముక్తి కలిగించాడు. జనక సభలో శివధనస్సు నెత్తి పెళ పెళమని విరిచాడు. సీతను పరిణయ మాడాడు. పరశురాముని గర్వాన్ని అణిచాడు అయోధ్యలో 12 సంవత్సరాలు సీతతో సుఖంగా జీవించాడు పినతల్లి కోరికపై, తండ్రి ఆజ్ఞతో దండకారణ్యం వెళ్ళాడు అక్కడ విరాధ వధ జరిగింది. మాయా లేడి రూపంలో వచ్చిన మారీచుని హతమార్చాడు రావణుడు వచ్చి సీతాపహరణం చేశాడు. సీతా అన్వేషణలో జటాయు, కబంధులకు మోక్షం ఇచ్చాడు. శబరి పూజలు అందుకున్నాడు. సుగ్రీవునితో స్నేహం, తరువాత వాలి వధ, సీత అన్వేషణం వానరులతో, సేతు బంధనం, లంక నగర్ ముట్టడి, యుద్ధంలో దురాత్ముడైన రావణుని బంధు,
మిత్ర, పుత్ర పరివారంతో సహా సంహరించాడు. విభీషణని కి రాజ్యాభిషేకం రాజ్యాభిషేకం చేశాడు. పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగివచ్చి రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇదంతా క్లుప్తంగా చెప్పిన రామ కథ. కానీ దీనిని మన పెద్దలు”కొట్టే, కట్టే, తెచ్చే” అనే మూడు మాటలతో చెప్పుకునేవారు. అలా అంటే రామాయణం అంతా జ్ఞాపకం వచ్చేది. ఇప్పుడైనా ఎవరైనా పని సులువుగా చేసుకొస్తే ఈ మాటే వాడతారుపట్టాభిషేకం విధాలా మనకి. రాముడు మంచి బాలుడు అంటాం బుద్ధిమంతుడైన పిల్లాడిని చూసి . మంచి పరిపాలన చూసి రామరాజ్యం అంటాం. దంపతులను చూసి సీతారాముల ఉన్నారంట. పురుషుడు రాముని వలె ఏకపత్నీవృతుడు అయి ఉండాలంటా. సహనశీలుని రాముడు అంత సహనం కలవాడు అంటాం. ఎవరైనా కష్టాలు పడుతుంటే రాముని కష్టాల కంటే గొప్పవా అంటాం.
ఇక్ష్వాకులను గురించి వశిష్ట విశ్వామిత్రులు ఇలా అన్నారు” సదృశ్య ధర్మ సంబంధః సదృశవరూప సంపదా “అని. వేలాదిమంది బలాఢ్యులు ఎంతో కష్టపడి తీసుకువచ్చిన శివధనస్సును ఎక్కుపెట్టే సమయంలో వాల్మీకి రాముని గురించి ” పశ్యతాంనృ సహస్రానాం బహు నామ్ రఘునంద నః., ఆరోప వత్స ధర్మాత్మ సలీలమిమ దద్దను హు “. నీ పరాక్రమాన్ని చూపించు అనేటట్టుగా.
జనకమహారాజు తన కూతురిని చూపించి ” ప్రతి వ్రత మహాభాగ ఛాయావాను గత సదా ‘” అని చెప్పి కన్యాదానం చేశాడు. అందుకే సీత ఆయనను వెన్నంటి ఎప్పుడూ ఉంది. ఇప్పటికి కూడా ఉంటోంది.
లక్ష్మణుడి విషయానికొస్తే తల్లి సుమిత్ర రామునితో అడవికి వెళ్లడానికి అంగీక రిస్తూ ” రామ దశరథం విద్ధిమామ్ విద్ధి జనకాత్మజామ్ అయోధ్య మండలి విద్ధి గచ్చ తార యధా సుఖం “అంది. సుమిత్ర ఎంతటి ఔదార్యరాలో తెలుస్తోంది.
భరతుని విషయానికొస్తే కైకేయి అంది”త్వత్ కృతే మయ సర్వమేతం విధం కృతమ్.'” ఇదంతా నీ అభ్యుదయం కోసమే చేశానంది. అప్పుడు భరతుడు ” బలమైన ఎద్దు మెడపై ఉంచవలసిన కాడిని లేగ దూడ మెడ పై పెడితే మొయ్యగలదా? రాజ్య భారం అంటే ఏమిటి అనుకుంటున్నావు? అది వహించడం రాముడే చెల్లు అన్నాను “. రాముని దగ్గరికి వెళ్లి రామపాదకులు తెచ్చుకుని వాటికి రాజ్యభిషేకం చేసి రాజ్యాన్ని పాలించసాగాడు. అంటే ధర్మాన్ని ఎంత ఎలా పాటించాడో చూడండి.
సీతా రాముని గురించి ఏముందో ఏముందో”” దధ్యాన్న ప్రతి గృ హిణి యాన్న బ్రుయాత్ కించిత ప్రియం అపి జీవిత వేతోర్వా రామః సత్య పరాక్రమః ” అతడు సత్య పరాక్రమడు. ఎవరికైనా ఇవ్వడమే తప్ప ఎవరి నుండి తీసుకోడు. ప్రాణం పోయినా ఎవరితోనూ అప్రయంగా మాట్లాడడు
రామ రావణ యుద్ధంలో ఇంద్రుడు వస్తే పోయిన వారిని బతికించమని ఇలా అడిగాడు”” మమ హే తో పరాక్రా నా ఏ గతా యమ సాధనమ్, తే సర్వే జీవితం ప్రాప్య సముతిష్టంతు వానరః “” ఎంత దయాద్ర హృదయుడో ఈ రాముడు కదా.
ఒకసారి లక్ష్మణుడితో”‘” ధర్మాన్ని పాటించడం వలన అర్థ కామాలు వెంటనే లభించకపోవచ్చు. అటువంటి అప్పుడు కూడా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించాలి. అర్ధాన్నే ప్రధానంగా చూసేవారిని లోకం ద్వేషిస్తుంది. కామమే ప్రధానంగా ప్రవర్తించే వాడికి గౌరవం ఉండదు.”’ అంటాడు. ఋజు స్వభావాన్ని ఎలా విశదీకరించాడో కదా. “” ఆత్మా నామ్ మనుషo మన్యే రామం దశరదాత్మజం ”” అన్నాడే కానీ నేను భగవంతుని ఎప్పుడూ చెప్పుకోలేదు శ్రీకృష్ణుని వలె.
సుగ్రీవుణ్ణి మా నలుగురికి నువ్వు ఐదవ సోదరుడివి అని చెప్పాడు. . ఆఖరికి హనుమంతుడిని “” తేజోధృతి యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయః, పౌరుషం విక్రమో బుద్ధిర్ యాస్మిన్నే తాని సర్వదా.” అని పొగిడాడు అంటే ఎవరికి ఎప్పుడు తేజస్సు, నేర్పు, ధైర్యం, యశస్సు సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి కలవాడు. రాముని యొక్క వినయానికి ఇదొక నిదర్శనం.
“” ఏ మమే తత్పురా వృత్తా మా ఖ్యా మ్ భద్ర మస్తవః ప్రవ్యహరత విస్ర బ్ద ం బలం విష్ణు ప్రవర్ధితాం “” అని వాల్మీకి చివర రామ కథకి ప ల శృతి కూడా చెప్పారు. దీని అర్థం ఏమిటంటే”” ప్రజలారా! ఈ రామాయణాన్ని తెలుసుకోవాలి అనుకునే వారికి ఈ కథను దృఢ విశ్వాసంతో చెప్పండి. మీకు క్షేమం కలుగుతుంది. ఆ మహావిష్ణువు యొక్క బలం తేజస్సు వృద్ధి చెందుగాక!.
కనుక మనందరం రామ మార్గంలో నడుస్తూ ఈ కష్టమైన కలియుగంలో కాస్త ద్వాపరయుగంలోని రామరాజ్యాన్ని అనుసరిదాం. ఈ శ్రీరామనవమి సందర్భంగా ” పుంసాం మోహన రూపాయ ” అయిన ఆ రామచంద్రునికి మంగళాలు పలుకుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు.x

April 2, 2023 11 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

స్పృహ

by Shanthi Prabodha Valluripalli April 2, 2023
written by Shanthi Prabodha Valluripalli

స్పృహకి ఐదేళ్లు. ఈ మధ్యనే బడికి పోవడం మొదలు పెట్టింది. 
ఆ రోజు ఉదయం బద్దకం గా లేచింది. 
అమ్మ లేపగా లేపగా లేచింది.  వెళ్లి హాల్ లో  అటు ఇటు పచార్లు చేసింది.  
అబ్బా.. ఇప్పుడు తయారై బడికి పోవాలా .. ! 
ఏంటో .. అమ్మానాన్న రోజు బడికి పోవాలని చెప్తారు. బడి అంటేనే బోర్.  ఎంచక్కా ఆడుకుంటే ఎంత బాగుంటుంది. టీవీ చూస్తే ఎంత బాగుంటుంది… ఈ పెద్ద వాళ్లకేం తెలియదు
వెళ్లి టీవీ ముందు కూర్చుంది స్పృహ.  ఆ వేళ బడికి పోవద్దు అని నిర్ణయించుకుంది. 
“బడికి టైమ్ అవుతున్నది.  గబగబా తయారవ్వు” అని అమ్మ తొందర పెట్టింది. 
“నేను ఈ రోజు బడికి పోను. ఇంట్లోనే ఉంటా”. ఎదురుగా కనిపించిన రిమోట్ తీసుకుని టీ వీ పెట్టింది.  సోఫాలో కూలబడింది స్పృహ. 
అమ్మ నాన్న మారు మాట్లాడలేదు.  స్పృహని ఒక సారి అలా చూసి వదిలేశారు. 
పది నిమిషాలు ఆగితే తానే బయలుదేరుతుంది అనుకున్నారు. 
కానీ స్పృహ  కదలడం లేదు. 
అమ్మ నాన్న ఉదయం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ఆమెని  పట్టించుకోలేదు. 
స్పృహ సంతోషంగా టీవీ చూడడంలో బిజీగా ఉంది .  కిడ్స్ ఛానెల్ లో కార్టూన్స్ చూసింది కాసేపు. ఆ తర్వాత ఛానెల్స్ అటు ఇటు పైకి కిందకి తిప్పింది. 

కాసేపటికి పొట్టలో ఆకలి మొదలైంది.  కిచెన్ లోంచి కమ్మటి వాసన వస్తున్నది.  స్పృహకి ఆకలి మరింత పెరిగింది.  నెమ్మదిగా లేచి వెళ్లి బ్రష్ చేసుకుంది . 
అప్పటికే అమ్మ తమ్ముడికి టిఫిన్ పెట్టింది. వాడు తింటున్నాడు. 
తనకి కూడా పెడుతుందేమోనని కొంచెం సేపు  ఎదురు చూసింది. టిఫిన్ ప్లేట్ అమ్మ ఇవ్వలేదు. 
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం స్పృహకి ఇష్టం ఉండదు.  అయినా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి తమ్ముడు పక్కన కూర్చుంది. 
అప్పుడు కూడా అమ్మ టిఫిన్ పెట్టలేదు. తన ప్లేట్ తీసుకుని పెట్టుకుందామని చూసింది. కానీ ఆ గిన్నె టేబుల్ పై లేదు . 
ఎలా .. ?
నాన్న కిచెన్ లోంచి ప్లేట్ లో పెట్టుకొచ్చుకున్నాడు. వచ్చి స్పృహ పక్కనే కూర్చుని తిన్నారు. కానీ స్పృహని పలకరించలేదు. టిఫిన్ తినమని అనలేదు. 
రోజు ప్లేట్ లో పెట్టి పిలిచే అమ్మ పిలవడం లేదు.  తినకపోతే బతిమాలి తినిపించే నాన్న పట్టించుకోవట్లేదు. స్పృహకు ఏడుపొచ్చింది.  
ఆకలితో పొట్టలో పేగులు అరుస్తున్నాయి. ఆఖరికి పాలు కూడా తాగలేదు. 

అంతలో తమ్ముడు పాలగ్లాసుతో అక్కడికి వచ్చాడు.  అది చూసి ఉక్రోషంతో ఉడికిపోయింది స్పృహ. 
పాపం అక్క.  అమ్మ అక్కకి ఏమీ పెట్టలేదు.  
అక్క మొహంలోకి చుశాడు. అయ్యో..  అక్కకి ఆకలేస్తుంది అని బాధపడ్డాడు. 
అక్కా.. పాలు తాగు అంటూ తన పాల గ్లాస్ ఇవ్వబోయాడు. 

ఉక్రోషంతో ఉడికిపోతున్న స్పృహ ఆ పాల గ్లాస్ ని  ఒక్క తోపు తోసింది. పాలు కింద పోయాయి . 
తమ్ముడు భయంతో కెవ్వు అన్నాడు.  ఆ ఏడుపుకి ఏమైందని అమ్మ నాన్న అటు చూశారు. 
 
ఇల్లంతా చెల్లాచెదురైన పాలు .. 
తమ్ముడు ఏడుస్తూనే వెళ్లి ఇల్లు తుడిచే పాత గుడ్డ తెచ్చాడు.  చిట్టి చేతులతో తుడుస్తున్నాడు. 
అమ్మ నాన్న ఏమి అనలేదు.  అక్కడేమి జరగనట్లే తమ పనిలో వాళ్ళున్నారు. 

స్పృహ నెమ్మదిగా వెళ్లి తమ్ముడికి సారీ చెప్పింది.  ఆ తర్వాత, తమ్ముడితో కలిసి తాను కూడా బట్టతో శుభ్రం చేసింది. 
ఆ పని చేస్తూ తనను అమ్మ నాన్న చూస్తున్నారో లేదో అని ఓరగా చూసింది. 
అమ్మ నాన్న అదేమీ పట్టించుకోనట్టు ఉన్నారు.  
అమ్మ మరో గ్లాసులో పాలు తెచ్చి తమ్ముడికి ఇచ్చింది.  

అక్కడే ఉన్న స్పృహని ఒక్క మాట కూడా అనలేదు. కోప్పడలేదు. తినమని చెప్పలేదు. బడికి పంపలేదు. 
తనను నిర్లక్ష్యం చేస్తున్నారని  ఆమె కి అర్థమైంది . 
హూ .. నేను కూడా వాళ్ళని పట్టించుకోను అనుకుంది.  మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ విసవిసా ఇంట్లోంచి బయటకు నడిచింది. 
 
ఇంటి వెనుక జామ చెట్టు కింద కూర్చుంది.  ఆకలి వేస్తుంది కదా.. !
చెట్టుపై చూసింది. జామపండు కోసం కళ్ళతో వెతికింది స్పృహ. 
  
“చిట్టి తల్లీ .. ఆకలేస్తుందా ..  అయ్యో ఒక్క పండు కూడా లేదే తల్లీ.. నీ కడుపు నింపడానికి” అని జామచెట్టు  స్పృహని చూసి బాధ పడింది.  
జామ చెట్టు మాటలకు స్పృహ లోపలున్న దుఃఖం పొంగి పొర్లింది. 
ఏదో అయినట్టు బిగ్గరగా  ఏడ్చేసింది. అయినా అమ్మ నాన్న తనని పట్టించుకోలేదు. 
స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. తమ్ముడు పొట్టనిండా తిన్నాడు. పాలు తాగాడు. 

అమ్మకి నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు అని బాధ తన్నుకొచ్చింది. కుమిలి కుమిలి ఏడ్చింది.  వెక్కి వెక్కి ఏడ్చింది. 

ఆ  ఏడుపు విని “ఎందుకు పాపా ఏడుస్తున్నావ్? అమ్మ కొట్టిందా .. నాన్న తిట్టారా ..? ” అని అడిగింది చెట్టుపై ఉన్న రామచిలుక . 
వెక్కి వెక్కి ఏడుస్తూనే  చెప్పింది స్పృహ . 
“అయ్యో .. మీ అమ్మ నాన్నలకి నీమీద ప్రేమ లేదని ఎవరన్నారు?” అడిగింది రామచిలుక  
“నేనే అంటున్నా. లేకపోతే నన్ను బతిమాలి తినిపించాలి గా.. బడికి పంపాలిగా..” కళ్ళనుండి కారుతున్న నీరు గౌను తో తుడుచుకుంటూ అన్నది  స్పృహ. 
“ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు నిన్ను ఒక్క మాటైనా అన్నారా.. ఒక్క దెబ్బైనా వేశారా.. కనీసం కోపంగా చూశారా..?” ప్రశ్నించింది రామచిలుక 
“ఊహూ .. లేదు” అంటూ తల అడ్డంగా ఊపింది స్పృహ
“అంటే నీ పై కోపం లేనట్లేగా.. “అన్నది రామచిలుక  
“మరి నాకు స్నానం చేయించలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు. టిఫిన్ పెట్టలేదు” దిగులుగా చెప్పింది పాప. 
“నువ్వు అమ్మ నాన్న చెప్పిన మాటలు వినలేదు.  బడికి పోవాల్సిన సమయంలో టీవీ ముందు కూర్చున్నావు. అది తప్పు కదా. 
ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయాలి. లేకపోతే నీకే కష్టం. నష్టం  ” అన్నది జామచెట్టు. 
అవును, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. 
పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళింది. అమ్మకి, నాన్నకి సారీ చెప్పింది.  
నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడు అలా చేయను మాట ఇచ్చింది స్పృహ. 
నవ్వుతూ దగ్గరికి తీసుకుని ముద్దిచ్చారు అమ్మా నాన్న. చప్పట్లతో అక్క పక్కన చేరాడు తమ్ముడు. 

April 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • ఎవరైనా కోయిల జాడ చెప్పండి
  • బంకర్లో కోయిల
  • అస్తిత్వాలు అసలు సంగతులు – Women’s Day ( 2026 మార్చ్ తరుణి సంపాదకీయం)
  • రచయిత వ్యక్తి కాదు సమాజ జీవి – నిఖిలేశ్వర్
  • స్త్రీ అంతర్మథనాన్ని ఆవిష్కరించిన నవల “భానుమతి”

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us