మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

తెలంగాణ ఉద్యమ కవి కాళోజీ

by Dr. Aruna Parandhamulu September 30, 2024
written by Dr. Aruna Parandhamulu

ప్రపంచంలోని బాధలలో కన్నీళ్ళను చూసి కవిగా కాళోజీ హృదయం స్రవించి ఆ హృదయ ప్రకంపనలకు అక్షర రూపం కలిస్తూ నూతన పోకడలతో కవిత రూపంలో …
“అవనిపై జరిగేటి అవకతవకల చూసి
ఎందుకో నా హృదిన ఇన్ని ఆవేదనలు…?
పరుల కష్టము చూసి కరిగిపోను గుండెను
మాయ మోసం చూసి మండి పోను ఒళ్ళు
పతిత మానవుని జూసి చితికి పోవు మనస్సు
ఎందుకో ఇన్ని ఆవేశం నా హృదిని ఇన్ని ఆవేదనలు?….” అంటూ
ఆత్మశ్రయ ధోరణితో వ్యక్తపరిచాడు .

“ఉత్తమాటలు కట్టిపెట్టి
పెత్తనాలకు దేవులాడక
చిత్తశుద్ధిగా చేయబూనిన
చేతలెల్ల ఘటించినట్లె “

అంటూ మనసులోని ఆవేదనను వ్యక్తం చేస్తూ , ఐక్యతను కోరుకుంటూ కాళోజీ కవితలు రాయటం జరిగింది.
వరంగల్‌ పట్టణానికి చెందిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గురించి తెలియని వ్యక్తి తెలుగు నేలపై ఉండకపోవచ్చు. సాహిత్యాభిమానులు, సాహితీవేత్తలకే కాదు, సామాన్య వ్యక్తికి కూడా ఆయన సుపరిచితుడు. తెలంగాణ ఉద్యమం పుట్టకముందు నుంచే ఆయన తెలంగాణ ప్రజల కోసం పోరాడిన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టనష్టాలపై అనేక పోరాటాలు, ఉద్యమాలు సాగించిన కవి కాళోజీ నారాయణ గారు.
ఏనాడూ ఉద్యమ నాయకుడన్న ముద్రను ఆయన వేసుకోలేదు. కానీ,ఉద్యమ కార్యకర్తగానే తెలంగాణ చరిత్రలో , ప్రజల గుండెలలో నిలిచిపోయారు. ఒక సాహితీవేత్తగా కలం ఝళిపిస్తూనే, ఒక పోరాటవాదిగా కత్తి కూడా అంతే సమర్థవంతంగా ఝళిపించారు. 1914 సెప్టెంబర్‌ 9న జన్మించి 2002 నవంబర్‌ 13న కన్నుమూసిన కాళోజీ అసలు పేరు రఘువీర్‌ నారాయణ్‌ లక్ష్మీకాంత్‌ శ్రీనివాస్‌ రాం రాజా కాళోజీ ‘నా గొడవ’ పేరుతో వెలువరించిన కవితా సంకలనం
తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.
ఈ అపూర్వ, అద్వితీయ, అపురూప కవిత్వం తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వని అని చెప్పవచ్చు. అది రాజకీయ, సామాజిక చైతన్యాల సమాహారమని పలువురు సాహితీవేత్తలు ‘నా గొడవ’ను సమీక్షించడం జరిగింది. ప్రజల హక్కుల కోసం జీవితాంతం తపన పడిన ఈ ప్రజాకవి మొదటి నుంచి వరంగల్‌ పట్టణంలో నిరాడంబరంగా, సామాన్య ప్రజానీకంలో ఒక వ్యక్తిగా జీవించి, తాను ప్రవచించిన ప్రతి సిద్ధాంతాన్ని ఆచరించి చూపారు. ఆయన ఏ ఉద్యమం నడిపినా, ఏ కవిత రాసినా, సాహితీ ప్రసంగం చేసినా తెలంగాణ ప్రజల హక్కులను ప్రతిబింబించడానికే అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనను తాను ప్రజావాదిగా అభివర్ణించుకున్నారు. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ.
మొదటిసారిగా ఆయన నిజాం దమననీతికి, అరాచకానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కలం, గళం ఎత్తారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్న కాళోజీ తెలంగాణకు సంబంధించిన ఉద్యమాల్లో విరివిగా పాల్గొనడం జరిగింది. ఆయన 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మవిభూషణ్‌’ను
పొందడం జరిగింది. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వరంగల్‌ పట్టణంలో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. హన్మకొండ పట్టణంలో ఆయన పేరు మీద కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది.
కాళోజీ నారాయణ రావును సాటి సాహితీవేత్తలు, ఉద్యమకారులు తెలంగాణ తొలి పొద్దుగా సంభావిస్తుంటారు. ఆయన రాసిన ‘నా గొడవ’కు ప్రజాదరణ పెరగడం చూసిన కాళోజీ తెలంగాణకు సంబంధించి తన మనసులో ఉన్న లక్ష్యాన్నిఆయన ప్రజలకు తేటతెల్లం చేశారు. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే ‘నా గొడవ’కు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి.
అన్యాయంపై పోరాడినవాడే నాకు ఆరాధ్యుడు’ అని ఆయన చెప్పేవారు. తెలంగాణ ప్రజల తరఫున ఉద్యమం సాగించడమే ఊపిరిగా జీవించిన అసలైన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు.
దాదాపు తొంభై ఏళ్ళు జీవించిన కాళోజీ ఇరవయ్యో శతాబ్దంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ప్రధాన ప్రజా ఉద్యమాల్లోనూ ముఖ్య పాత్ర పోషించారు. నిజాము పాలన మొదలుకుని 80ల దాకా రకరకాల ప్రజా ఉద్యమాల గురించి, కాలానుగుణమైన మార్పుల గురించి, నిజాం-బ్రిటీష్ ఇండియా ల మధ్య తేడాల గురించి – ఇలా అనేక సంగతులు పుస్తకంలో ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అన్న రామేశ్వరరావు గురించి ప్రస్తావన చాలా తక్కువ మొదట్లో చిన్నతనం గురించి తప్పిస్తే….
కుటుంబ ప్రస్తావన దాదాపు అసల్లేదనే చెప్పాలి.

నన్ను అమితంగా ఆకట్టుకున్న విషయం – ఆయన రాత అలా మాట్లాడుతున్నట్లే ఉండటం. ఆయనెంత ఎమోషనల్ మనిషో, ఎంత తొందరగా ఉద్వేగాలకి లోనౌతారో ఆయనే రాసుకున్నాడు గాని, పుస్తకంలో వివిధ సంఘటనల వద్ద కూడా – అది రాసిన విధానంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆవేశమో, ఆవేదనో ఏదో కలుగుతుందని సన్నివేశాన్ని బట్టి మనం ముందే చెప్పేయొచ్చు అనమాట కాళోజీ నగర బహిష్కారానికి కూడా గురయ్యారంటే అసలు అలాంటి శిక్షలు జానపద కథల్లోనే అనుకున్నా నేను పరమ ఆవేశపరుడు అనిపిస్తుంది. కానీ, మళ్ళీ నాకు “చిన్న విషయం”గా తోచిన అంశాలకి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానని కూడా రాశారు. మొత్తానికి భలే మనిషి. అడ్వెంచరస్ కూడా. నిజాం కాలంలో వీళ్ళు చేసిన పనుల గురించి, జైలు వాసాలలో జీవితం గురించి చెబుతూంటే పరమ ఉత్కంఠతో చదివాను.

అక్కడక్కడా రాసిన ఆయన కవితలు నాకు చాలా నచ్చాయి. నాకు సాధారణంగా ఎక్కడో ఒక శ్రీశ్రీ, ఒక అజంతా, ఒక ఇస్మాయిల్ – ఇలా కొందరు ప్రముఖులు రాసిన నాలుగైదు కవితలు తప్పిస్తే కవిత్వమంటే భయం. అర్థం కూడా కాదు. దూరంగా జరుగుతాను. కానీ, ఈయన రాసినవి నాకు ఎందుకో చాలా నచ్చాయి. ఎక్కువ భావుకత, మార్మికత అనుకునే తరహా లేకుండా సూటిగా, తేలికైన భాషలో ఉండటం వల్ల కాబోలు. పైగా కొన్ని కవితలు ( “నా ఇజం” వంటివి) కాలాతీతంగా, ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉండటం ఓ కారణం కావొచ్చు.

చాలామంది ప్రముఖుల గురించి ఆసక్తికరమైన స్కెచెస్ ఉన్నాయి – విశ్వనాథ, పీవి నరసింహారావు, రాయప్రోలు సుబ్బారావు, సర్దార్ జమలాపురం కేశవరావు – ఇలా అసార్టెడ్ వ్యక్తుల గురించి. విశ్వనాథ వారి గురించి నాలుగైదు చోట్ల ప్రస్తావన ఉంది. వీళ్ళిద్దరికీ స్నేహం ఉందన్న విషయం నాకసలు ఊహకైనా రాలేదు. పుస్తకం చదివే ముందు నా ఊహ వీళ్ళిద్దరూ భిన్న ధృవాలని. కానీ, ఇందులో ఆయన గురించి రాసిన విషయాలు పుస్తకాలు చదివి ఆయన గురించి అనుకున్నదానికి కొంచెం భిన్నంగానే ఉన్నాయి. అలాగే, భక్తుడు భజనచేసినట్లు కాక, ఒక సమకాలీకుడు, స్నేహితుడు, సాహిత్యకారుడు భక్తిభావంతో-గురుభావంతో కాకుండా, మామూలుగా ఇంకో తెలిసిన రచయిత గురించి రాసినట్లు ఉన్నాయి విశ్వనాథ మీద గుత్తాధిపత్యం తీసుకున్న దురభిమానులు ఇప్పుడు నన్ను ఏకేస్తారు కాబోలు. పీవీ గురించి ఈయన చాలా అభిమానంతో, చనువుతో రాసుకున్నారు. జమలాపురం కేశవరావు గురించి మాకు తెలుగు పాఠ్యపుస్తకంలో ఉండేది స్కూల్లో. పేరు తప్ప ఆట్టే గుర్తులేదు కానీ, కాళోజి రాసింది చదివాక ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

పుస్తకం రచనా కాలం నాకు తెలియదు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం మట్టుకు ఒక కాలం నుండి ఇంకో కాలంలోకి జంప్ అవుతూ ఆయన కథ చెబుతూ పోవడం. రికార్డు చేసిన దాన్ని ఫెయిర్ చేసినట్లే అనిపించింది నాకు – మొదట్లో వాళ్ళు రాసినట్లు. దీని వల్ల ఆయా సంఘటనలతో, కాళోజీ తో పరిచయం లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందే కావొచ్చు. ఏ బయోగ్రఫీనో చదవనిదే పూర్తి పిక్చర్ రాదు. పేర్వారం జగన్నాథం గారు రాసిన జీవిత చరిత్ర ఒకటి కనబడ్డది తెలుగుథీసిస్ వెబ్సైటులో. త్వరలో వీలు చూసుకుని చదవాలి.
గురించి ఆయన రాసిన విషయం ఆలోచింపదగ్గది.

“బ్రిటీష్ ఇండియా సంగతి తెల్వదుగాని నైజాంలో చదువుకున్న ప్రతివాని ఇంట (హైద్రాబాదు, వరంగల్ లలో) భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల ఫొటో వుండేటీది. బజార్లొ అమ్మెటోళ్ళు, వకీళ్ళ ఇళ్ళలో గాంధీ, మోతీలాల్, చిత్తరంజన్ దాసు, తిలక్, లాలా లజపతిరాయ్, సేన్ గుప్త ఫొటోలు కూడా వుండేటివి. ఇవేవీ నైజాం కాలంలో అభ్యంతరాలు కాదు. మరి ఇప్పుడు ’80-’85 లలో మావో సాహిత్యం, విప్లవ సాహిత్యం దొరికినయని దాడులు చేస్తరు, రాడికల్ సభలో ఆక్షేపిoచారు.
నిర్మొహమాటంగా, నిర్భయంగా ప్రజల హృదయాలలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు మన కాళోజీ!

September 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణ భాషా దినోత్సవం

by Cheedella Seetha Lakshmi September 30, 2024
written by Cheedella Seetha Lakshmi

    ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషకు  ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా భాషకు యాసకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడి తెలుగు భాషకు ,తెలంగాణా భాషకు తగిన గౌరవం లభించాలని,మన భాషలో యాసలో రచనలు చేయాలని ఆశించి బాధపడ్డ తెలంగాణా ముద్దు బిడ్డ.   ఒక ధిక్కారస్వరం,నిరహంకారం,ఆవేశం,ఆలోచన ,సమాజంలో జరిగే అన్యాయాలను రచనల ద్వారా ఎండగట్టే మహనీయుడు.అందరి గొడవలను తన బాధగా భావించి ‘ నా గొడవ ‘ లో వినిపించి సమాజంలో మార్పు రావాలని ఆశించి గొంతెత్తిన కలం యోధుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు.

1914 సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన బీజాపూర్లోని రట్టిహళ్ళి అనే గ్రామంలో రంగారావు,రమాబాయి దంపతులకు జన్మించాడు.కాళోజీ చిన్నతనంలోనే తెలంగాణాకు వలస వచ్చారు తల్లిదండ్రులు. కాళోజీకి మరాఠీ,కన్నడ,తెలుగు,ఉర్దూ,ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు.

   నిజాం ప్రభుత్వంలో ఉర్దూ రాజభాషగా ఉన్నందున ఉర్దూమాధ్యమంలో చదివినప్పటికి తెలుగు భాష పట్ల తెలంగాణ భాష పట్ల చాలా అభిమానం కలవాడు. 

   నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.ఆంధ్ర మహాసభలు,ఆర్యసమాజం,తెలంగాణా రైతాంగ పోరాటం,తెలంగాణ తొలిదశ,మలిదశ ఉద్యమాలలో చైతన్య వంతంగా తన వంతు పాత్రను పోషించాడు.తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఒక తెలంగాణా ఆత్మాభిమాన కెరటం.

  తెలంగాణా భాషకు యాసకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తన గొంతును విప్పి కలం ఝళిపించిన భాషాభిమాని. 

   ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో,తెలంగాణా రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.

  అనేక రచనలు చేసిన మహాకవి.కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను,కేంద్ర ప్రభుత్వం వారు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు.అనేక అవార్డులు,రివార్డులు పొందిన మహాకవి.

 ”  అన్య భాషలు నేర్చి 

    ఆంధ్రంబు రాదంచు

     సకిలించు ఆంధ్రుడా

      చావవెందుకురా “

   అని నినదించి తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పాడు.

    ఇంత గొప్ప సేవ చేసిన మహనీయుని జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించినాక తెలంగాణా భాషా దినోత్సవాన్ని,ఆయన పేరు మీదుగా తెలంగాణా సాహిత్య విశిష్ట వ్యక్తికి కాళోజీ పురస్కారమిచ్చి తన్ను తాను గౌరవించుకుంటుంది.కాళోజీ ధిక్కార స్వరం అందరికి ఆదర్శనీయం.బతుకమ్మ మురిసి విరిసి పోయింది.తెలంగాణా ప్రత్యేకతను చాటుకుంది…..

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కసిరెడ్డి జలంధర్ రెడ్డి ఆశ నిండిన శ్వాస

by Narendra Sandineni September 30, 2024
written by Narendra Sandineni

కవితా సంపుటి పై పుస్తక సమీక్ష

కవి,రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల,తెలుగు బాషోపాధ్యాయుడు,కసిరెడ్డి జలంధర్ రెడ్డి కలం నుండి జాలువారిన ఆశ నిండిన శ్వాస కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.కవి జలంధర్ రెడ్డి తొలి కవితా సంపుటి జనవరి 2023 సంవత్సరంలో భవానీ సాహిత్య వేదిక నుండి ప్రచురింపబడింది. ఇందులో ముప్పై అయిదు కవితలతో అలరారుతూ ఉంది.ఈ పుస్తకాన్ని కవి జలంధర్ రెడ్డి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కీర్తిశేషులు కసిరెడ్డి రుక్కమ్మ బాల్ రెడ్డి గారలకు అంకితం ఇవ్వడం ముదావహం.వైరాగ్యం ప్రభాకర్ ముందుమాటలో ఆశ నిండిన శ్వాస కవితా సంపుటిలో సమకాలీన అంశాలు,సందేశాత్మక కవితలతో పాటు నిత్య సత్యాలు,మానవుడు అనుసరించదగు మార్గాలు ఉన్నాయి. సామాన్యుడిగా కనిపించే జలంధర్ రెడ్డిలో ఒక అసాధారణ కవి ఉన్నాడని ఈ సంపుటి నిరూపిస్తుంది.వారి కలం నుండి మరిన్ని కవితా సంపుటులను ఆశిస్తునన్నారు.లేదాళ్ళ రాజేశ్వర రావు ముందు మాటలో మానవత్వం నిండిన అచ్చమైన అమాయకత్వం అతడు.ఆ సగటు మనిషి ఆశ నిండిన శ్వాసలే ఈ కవితలు అన్నారు. విశ్వ మానవాళికి కరోనా రూపంలో పెద్ధ విపత్తు వచ్చింది.చైనాలోని ఊహన్ నగరం నుండి ప్రారంభమై ప్రపంచమంతా పాకింది.కరోనా వైరస్ గాలి ద్వారా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది.కరోనా వైరస్ మొదటి వేవ్ లో పెద్దగా ప్రభావం లేకున్నప్పటికీ,సెకండ్ వేవ్ లో లక్షలాది మంది విగత జీవులయ్యారు.

కవి జలంధర్ రెడ్డి ఆ బాధాకర దృశ్యాలను కళ్ళారా చూసి హృదయం ద్రవించిపోయి వేదనతో ఆశ నిండిన శ్వాస పుస్తకాన్ని అక్షరీకరించారు.కరోనా వైరస్ భయానికి గృహ నిర్బంధంలో ఉండాలి.ఎప్పటికప్పుడు సానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకోవాలి. తుంపర్ల ద్వారా గాలి ద్వారా వ్యాపించే వైరస్ మానవాళికి పెను ముప్పుగా మారింది.ఇప్పటికీ ఆ భయానక దృశ్యాల జాడ వీడ లేదు.ఆ విపత్తు వల్ల సర్వమానవాళి బాధలను ఎదుర్కొన్నారు.కవి కరోనా వైరస్ చూపించిన పెనుభూతాన్ని కళ్ళకు కట్టినట్లు ఆశ నిండిన శ్వాస కవిత ద్వారా తన భావాలను చక్కగా వ్యక్తీకరించారు.మనిషిని ఆవహించిన నిర్వేదం/ఘనీభవించి అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది/అచేతనున్ని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది/కరోనా వైరస్ మనల్ని ఆవహించినప్పుడు కరోనాతో అనుదినం సహజీవనం చేయవలసిన పరిస్థితిని ఎదుర్కొన్నాం. అలాంటి మనిషిని నిర్వేదం అనుదినం వెంబడిస్తూనే ఉంటుంది.వేదం అంటే ప్రమాణం,ఆచరించదగినది. వేదం కానిది నిర్వేదం అని చెప్పవచ్చు.ఒక విధంగా చెప్పాలంటే మౌన రోధన,మానసిక క్షోభ,ఒక విధమైన వైరాగ్య స్థితి.కవి కరోనా రక్కసి వల్ల కలిగిన భయానక స్థితిని కళ్ళకు కట్టినట్లు కవితలో చెప్పారు.కరోనా వైరస్ మనిషిని స్పృహ లేని వ్యక్తిని చేసి వెర్రిగా వెక్కిరిస్తుంది.భయంతో ఉన్న వ్యక్తి అభద్రతాభావపు సుడిగుండంలోకి జారిపోతాడు. సుడిగుండంలో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడడు.నదుల్లో సరదాకని ఈత కొడుతూ ఉంటారు.ఒక్కోసారి నదిలో ప్రమాదవశాత్తు ఈత నేర్చిన వాళ్లు సైతం సుడిగుండంలో చిక్కి ప్రాణాలు కోల్పోతారు.శవం కూడా లభ్యం కాదు.భయం ఎలాంటిదంటే అభద్రతా భావపు సుడిగుండం లాంటిది అని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఊపిరాడని వేళ/గుప్పెడు ప్రాణ వాయువు కోసం/ఆశతో దేహం తల్లడిల్లుతుంది/కరోనా సోకిన వ్యక్తికి ఊపిరాడదు.ఆక్సిజన్ అందితేనే ప్రాణం నిలుస్తుంది.కరోనా వైరస్ బారినపడి వేలాది మంది హాస్పిటల్లో సరైన ఆక్సిజన్ లభ్యం కాక ప్రాణాలు కోల్పోయారు.ప్రభుత్వ హాస్పిటల్లో సరియైన ఆక్సిజన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.ప్రభుత్వాల నిర్లక్ష్యం,చేతగానితనం వల్ల లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.ఒంటరి గదిలో ముసిరిన చీకట్లు/కరిగి పోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంటాయి/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా చీకటి ముసిరిన గదిలో ఉండాలి.ఆ వ్యక్తికి ఒంటరితనం కరిగిపోతున్న ఆయువును జ్ఞాపకం చేస్తుంది అన్నది నిజం అని చెప్పవచ్చు.ఈ చీకట్లో కొత్త వెలుగులు/మోసుకొస్తాయేమోనన్న ఆశ వెంటాడుతుంది/ఈ చీకట్లో ఉన్న వ్యక్తికి కూడా కొత్త వెలుగులు వచ్చి బతకాలనే ఆశ ఉంటుంది.ఆశే మనిషిని బతికిస్తుంది.బతుకులో వెలుగును వెతుకుతాం.ఇవ్వాళ కాకున్న రేపైనా వెలుగు వస్తుందనే ఆశతో మనిషి బతుకుతాడు.ఒంటరి ప్రస్థానపు చేదు నిజాలు/చితాగ్ని కెరటాల్లా/ అనాధృతంగా దహన మౌతున్న దేహాలు/కరోనా సోకిన వ్యక్తి ఒంటరిగా ఉండి కోలుకుంటాడంటే కరోనా తీసుకుపోయింది.చేదు నిజాలు అంటే జీర్ణించుకోలేని వాస్తవాలు.అనుకున్నది ఎప్పుడు జరగదు.అనుకోలేనిది జరుగుతుంది.చనిపోయిన వ్యక్తిని మనం చితిని పేర్చి దహనం చేస్తాం.కానీ అనాధృతంగా దహనమౌతున్న దేహాలు. ఉద్దేశపూర్వకంగా జరిగిన కరోనా వైరస్ దాడిలో ప్రాణహాని కలిగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లి పోయారు.చనిపోయిన లక్షలాదిమంది బాధితుల కుటుంబాలకు ఆ సంఘటనలు సరి కొత్త భాష్యాలు చెపుతాయి అంటున్నారు.జీవితంలో మనం ఎన్నో సంఘటనలను ఎదుర్కొంటాం.కొన్ని సంఘటనలు మనను సన్మార్గం వైపు నడిపిస్తాయి.కొన్ని సంఘటనలు మనను చెడు మార్గం వైపు నడిపిస్తాయి.కరోనా దాడి మనందరికీ ఒక గుణపాఠం నేర్పింది అని కవి ఘంటాపథంగా చెపుతున్నారు.కాలజ్ఞానం వ్రాసిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గాలి ద్వారా వ్యాధులు వ్యాపించి లక్షలాదిమంది చనిపోతారని వ్రాశారు. మహానుభావుడైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాట నిజం అయింది.అన్ని మరణాలకు ఆర్త నాదాలు ఉండవు/కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి శవాన్ని కూడా ఇవ్వరు.హాస్పిటల్ వాళ్ళు శవాన్ని తీసుకుపోయి దహనం చేస్తారు. బంధువులు అందరు ఇక్కడ శవాన్ని చూసి విలపించే అవకాశం లేదు.కొన్ని దుఃఖాలు నిశిత నిశ్శబ్దంలో తలదాచుకుంటాయి/కొన్ని విషాదాలు కారు చీకట్లో కళ్ళు తెరుచుకు చూస్తుంటాయి/ఈ వాక్యాలు ప్రతీకలా ఉన్నాయి.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు/రేపటి ఆశ శ్వాసల కోసం/దాచిపెట్టుకోవాలి/వేదనల నుండి కూడా శక్తి వెలువడుతుందని,అలాంటి శక్తిని రేపటి ఆశా శ్వాసల కోసం దాచిపెట్టుకోవాలి అని కవి ఎంతో అనుభవంతో మనకు చెబుతున్నారు.మనలను ఆశ శ్వాసలపై దృష్టి పెట్టాలని మనలో చైతన్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.శ్వాస మీద ధ్యాస పెట్టు అని పతంజలి మహర్షి మరియు మొదలగు యోగి పుంగవులు తెలియజేశారు.వేదనల నుంచి వెలువడే శక్తి నిప్పుడు రేపటి ఆశ శ్వాసల కోసం దాచి పెట్టుకోవాలి అన్నది అద్భుతంగా ఉంది. మాతృమూర్తి కవితలో అమ్మ అంటే ఆత్మ/ మమకారపు మాధుర్యం/నవ మాసాలు మోసి, పురుటి వేదనలో/మరో జన్మ ఎత్తి/తాను మరో జీవికి జన్మనిస్తుంది/మైమరచి తన్మయత్వం పొందుతుంది అని అంటారు.మనం పురాణాల్లో మాతృదేవోభవ అని చదువుకున్నాం.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించే దైవం.అమ్మ మనల్ని కని పెంచుతుంది.అమ్మ లేని జన్మ లేదు.అమ్మ లేని లోకం లేదు.అమ్మంటే ఆత్మ.ఆత్మ అంటే జీవుడు మరియు జీవాత్మ స్వరూపం.అమ్మ స్వరూపంతోనే మనం భూమి మీదికి వస్తాం.ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు. అమ్మంటే మమకారపు మాధుర్యం అన్నారు. మమకారం అంటే బలమైన అభిమానం.అమ్మ ప్రేమలో స్వార్థానికి చోటు లేదు.అమ్మ యొక్క మమకారపు మాధుర్యాన్ని మనమంతా ఎరిగి యున్నాం.తల్లి జంతువులు మరియు తల్లి పక్షులు ఎంతో ప్రేమగా మమకారపు మాధుర్యంతో మెదులుతాయో మనమంతా చూసి యున్నాం. అమ్మ యొక్క మమకారపు మాధుర్యం వర్ణించడానికి కలం సరిపోదు.స్వార్థం లేని బలమైన ప్రేమతో కూడుకొని ఉంటుంది.అమ్మ నవ మాసాలు కడుపులో మోసి పురిటి నొప్పులను భరించి మరో జన్మ ఎత్తుతుంది మరియు మరో జీవికి జన్మ నిస్తుంది.అమ్మ ఆ పసి పాప లాలనలో తనను తాను మైమరిచి తన్మయత్వం పొందుతుందనే భావాన్ని చక్కగా వ్యక్తీకరించారు.అమ్మకు కలిగిన ఆనందాన్ని మైమరిచిపోయిన తన్మయత్వం కవుల కల్పనలకు కూడా అందదు.మన ఇంటి దేవాలయాల్లో అమ్మ దేవతగా కొలువై ఉంటుంది. మన అమ్మను మనం ప్రేమతో నిత్యం వెలిగించుకుందాం.అమ్మను దేవ దీపంగా వెలిగించుకున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు కొలువై ఉంటాయని మనమందరం ఎరిగినదే.కవి అమ్మలో దైవాన్ని చూస్తున్నాడు.అమ్మలు అందరు దైవ స్వరూపాలే అమ్మపై సాటిలేని ప్రేమను వ్యక్తం చేసిన తీరు అద్భుతం.ఇంకెన్నడు ? కవితలో మనుషుల్లో కుల మత ద్వేషాలు మాసి/వసుధైక కుటుంబముగా విలసిల్లు రోజు/ఐక్యభావమున సహజీవనం గడిపి/ శాంతి సౌఖ్యములను నెలకొల్పు రోజు/ ఎన్నడు..ఇంకెన్నడు/అని అంటున్నారు.మనుషులు కుల మతాల పేరిట ద్వేషంతో మెలుగుతున్నారు. మనుషుల్లో ద్వేష భావం సమసిపోయి విశ్వమంతా ఒకే కుటుంబముగా కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటే శాంతి, సౌఖ్యములు నెలకొంటాయి.శాంతి సౌఖ్యములు ఎన్నడు,ఇంకెన్నడు అని ప్రశ్నించడం చక్కగా ఉంది. చిరంజీవులు కవితలో మాతృభూమి రక్షణలో/మీ వీరత్వం విజయ సంకేతం/ మీ ధీరత్వం ఆత్మ విశ్వాస కేతనం/మీ పట్టుదల,నిబద్ధత మాకు నిత్య స్ఫూర్తి/మీ నిస్వార్థం,నిజాయితీ మాకు నిరంతర దీప్తి/మీరే మా ధైర్యం,స్థైర్యం/మీరే మా బలం, భవిత/శాంతిని స్థాపించే సమరంలో/మీ మరణం చివరి చరణం కారాదు/మీ త్యాగం ఆఖరి వాక్యం కారాదు/చిరంజీవులు మీరు/అని అంటున్నారు.దేశ రక్షణ కొరకు సైనికులు నిరంతరం అప్రమత్తంగా ఉండి కృషి చేస్తున్నారు.కవి సైనికులను చిరంజీవులు అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.ఇంటి దీపాలు కవితలో ఇంటర్ ఫలితాల్లో లోపాలు/ఆరిన ఇంటి దీపాలు/అపజయం విజయానికి పునాది/పడరాదు మనాది../ఈ దేశానికి మీరే భవిత/విద్యార్థులారా!/ఎవరికుండదు బాధ/ చెట్లకు లేదా బాధ/శిశిరంలో ఆకులు రాలి మోడులై/ వసంతంలో చిగురిస్తాయి/పుడమికి లేదా వ్యథ/ గ్రీష్మంలో పగులు బారి/తొలకరితో పులకరిస్తుంది/ మరల ప్రయత్నం మానవ లక్షణం/నిరాశ నిస్పృహలతో/జారిపోయిన గుండెలతో/ రాలిపోవద్దు../మేధావుల్లో కూడా కొందరు మొదట పరాజితులే అని అంటున్నారు.ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేక నిరాశ నిస్పృహలతో కొందరు విద్యార్థులు అర్ధాంతరంగా జీవితాలను ముగించడం మంచిది కాదు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో మరల ప్రయత్నించి పరీక్షలు రాసి విజయం సాధించాలి అని స్ఫూర్తిని కలిగిస్తున్నారు.ఋతువిలాపం కవితలో కాలాన్ని నమ్మి/నార్లు పోసిన రైతుతో పాటు/చాలీచాలని తడితో/భరించలేని ఎండల వేడి/తట్టుకోలేని నారుమడుల/విలాపం/దున్నిన దుక్కులు/వర్షించని మేఘాల వంక/బేల దృక్కులు/అని అంటున్నారు. ఋతువిలాపాన్ని అతివృష్టి,అనావృష్టి,కరువు కాటకాలతో రైతులు అనుభవిస్తున్న కష్టాలను వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది.సాంత్వన కవితలో మనుగడ ప్రశ్నార్థకమై/మనసుకు సాంత్వనము లేక/నిరాధార బాధాకర జీవనం/ దురాచారంగా మారిన/ప్రాచీనాచారం చివరకు/ చారిత్రక పతనం/హృదయ వేదనగా మిగిలిన/ సత్వర తలాక్ విధానం ఇకపై చెల్లదు/అని అంటున్నారు.సుప్రీంకోర్టు తలాక్ విధానం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.ముస్లిం స్త్రీలకు జరుగుతున్న చారిత్రక అన్యాయానికి అడ్డుతెర.సమానత్వ సామాజిక న్యాయానికి విజయం అని కవి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.అంతరంగం కవితలో అందం../వదనంలో ఉండదు/అంతరం ఆవిష్కరిస్తుంది/నలుగురితో నవ్వుతూ మాట్లాడు/ నలుగురిని నవ్వుతూ పలుకరించు/ఆ పలుకరింపుతో/అనురాగ పరిమళం పంచు/ పలుకరింపు చిన్నది అయినా../మనస్ఫూర్తిగా పలుకరిస్తే చాలు../నీకన్నా అందంగా/ ఎవరూ కనిపించరు/ఆనందమే అందం/ఆనందమే../జీవిత మకరందం/మనిషి కన్నా/మనసు గొప్పది/అని అంటున్నారు.మనిషి అంతరంగాన్ని వ్యక్తీకరించిన తీరు బాగుంది.కాలం శ్రమ కవితలో మానవుల్లో కొందరు/శ్రమను నమ్ముతారు/మరి కొందరు/ కాలాన్ని నమ్ముతారు/లక్ష్యంతో శ్రమించి/విజయం సాధించే వారు కొందరు/మరి కొందరు/కాలానుగుణంగా శ్రమిస్తూ/విజయం సాధిస్తారు/కాలం గమ్యం వైపు అడుగు వేయిస్తే/శ్రమ గెలుపుకి దగ్గర చేస్తుంది/ మనిషి జీవితంలో/కాలం – శ్రమ/జీవన గమన చక్రాలు/ అని అంటున్నారు.మనిషి జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు శ్రమను నమ్ముకుంటేనే విజయం వైపు అడుగులు పడతాయి అని చెప్పిన తీరు బాగుంది.జాగరూకత కవితలో ఓటరన్నా!జర పదిలం/మైకానికి,పైకానికి ఆశ పడకు/మనిషిని చూడు వాని నడవడి చూడు/ చేసిన బాసలు మరచి/ముఖం చాటేసే కపట నాయకుల/కనిపెట్టుకుని వుండని తరుణంలో/ రాజకీయాల్లో జరిగెడి/తప్పులే పునరావృతం/ నిన్నటి నీడలు రేపటి జాడలు/అని అంటున్నారు. ఓట్ల కోసం వచ్చే కపట రాజకీయ నాయకులు చూపించే నక్క వినయాలు నమ్మకూడదు. అమాయకంగా వారిని నమ్మి ఓటు వేయకూడదు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న రాజకీయ నాయకుల పట్ల జాగరూకతతో ఉండాలి.లేకుంటే మోసపోతావు అని తెలియజేసిన హెచ్చరిక ఒక చురకలాగా ఉంది. అపర చాణక్యుడు కవితలో శతవసంతాల సౌమ్యవాది/ఆర్థిక సంస్కరణల సారధి/నిరాడంబర జీవి,పి.వి./తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని,జాతి గౌరవాన్ని/దిగంతాలకు చాటి/రాజనీతికి మెరుగులద్దిన/విప్లవ తపస్వి/అపర చాణక్యుడు/ బహు భాషా కోవిదుడు/మనీషిగా,హిమనగమంతా ఎదిగిన సామాన్యుడు/ అని అంటున్నారు. తెలంగాణకు చెందిన పి.వీ.నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి దేశానికి విశిష్ట సేవలు అందించారు.అలాంటి మహనీయుని స్మరించుకోవడం మరియు కవితలో అపర చాణక్యుడు అని పేర్కొన్న తీరు చక్కగా ఉంది. జనమెరిగిన కాళోజి!కవితలో తెలంగాణ వాడుక భాషను/తన భాషగా కాక జన భాషగా/మలచిన మన గొడవ’అతడు/పరభాష వ్యామోహంలో మ్రగ్గే/తెలుగు వాళ్ళని/తల్లి భాషను నేర్చుకొమ్మని/ చురకలంటించగలడు/అని అంటున్నారు.కాళోజి నారాయణరావు స్మృతిలో రాసిన కవిత బాగుంది. తెల్ల కొలనులో నల్ల కలువలు కవితలో ప్లీజ్ ఒదలండి ఊపిరాట్టం లేదు/నిరాయుధ జార్జి ఫ్లాయిడ్ వేదనాభరిత ఆవేదన/పెడ రెక్కలు విరిచి,సంకెళ్ళతో బంధించి/మెడపై మోకాలితో నొక్కి/ఊపిరి తీసిన తెల్ల పోలీస్/మరణ యాతన/ సోషల్ మీడియా సాక్షిగా దారుణ ద్వేషం/అని అంటున్నారు.అమెరికాలో జాతి వివక్షకు బలి అయిన జార్జి ఫ్లాయిడ్ మరణం ఒక ఉదాహరణగా నిలుస్తుంది.తెల్ల జాతి వాళ్లు నల్లజాతి వాళ్లపై వివక్ష ఇంకా కొనసాగడం తీవ్రమైన బాధను కలిగిస్తుంది. జాతి వివక్ష సమసి పోవాలి.అప్పుడే తెల్లకొలనులో నల్ల కలువలు వికసించేది అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.అశ్రునివాళి కవితలో మారుతున్న జీవనశైలిలో/అసహనంతో/మనుషుల్లో పురుడు పోసుకుంటున్న/ఉన్మాద మనస్తత్వం/ విచక్షణను కాలరాస్తున్న ఆవేశం/విధి నిర్వహణలో నున్న అధికారిని/పట్టపగలు/కార్యశాలలో సజీవ దహనం/కౌలు రైతుకూ,భూ యజమానికి/మధ్య వైరం/విజయా రెడ్డిని బలిగొన్న ప్రతీకార జ్వాల/ అభం శుభం ఎరుగని పసి మొగ్గలు/మాతృ ప్రేమకు దూరమైన అభాగ్యులు/అని అంటున్నారు.రెవెన్యూ అధికారి విజయా రెడ్డి తాను పనిచేస్తున్న ఆఫీసులో సజీవ దహనం చేశారు.అట్టి దుర్ఘటన వల్ల విజయా రెడ్డి పిల్లలు తల్లి ప్రేమకు దూరమై పోయిన అభాగ్యులు అని ఆవేదనతో అశ్రునివాళి కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది.ఆలోకనం కవితలో నా ఆలోచనలు/అనుభవాలు/అనుభూతులుఅన్నీ/ ఎవరితోనూ పంచుకోలేను/నాలో నేనే నదిలా ప్రవహించుకుంటూ/నిశ్శబ్ద నిశీధిలో స్వప్నిస్తూ/ దోసెడు భావాల్ని/పిడికెడు మనస్సులో సొగసుగా నింపుకుంటాను/ఒక్కొక్కటిగా నిన్నటిని నెమరేచుకుంటూ/వ్యోమ గామినై జగాలన్నీ చరిస్తుంటాను/విశ్వ యవనికపై/ప్రేమనై ఆవిష్కరించబడుతాను/అని అంటున్నారు.

తన మనసులో కలిగిన భావాలను కవి చెప్పిన తీరు బాగుంది.గ్రీష్మ హవనం కవితలో తన విశ్వ రూపంతో/నిప్పుల కొలిమిలా జ్వలిస్తున్న భానుడు/ ఎండలు నిదాఘమై నిప్పులు చెరుగ/జల
ఊటలు తగ్గి,బీటలు వారి/ఎండిపోయిన పంట పొలాలు/హాలికుల మనో వేదన/తిండి లేక,దాహార్తి తీరక/జీవన ప్రస్థానంలో/చావు బతుకుల నడుమ/ కొట్టుమిట్టాడుతున్న మూగజీవుల దైన్యం/దినమొక గండముగ సామాన్యుల కష్టాలు/తీవ్ర వడ గాడ్పుల విసురులు/తట్టుకోలేని రెక్కాడితే డొక్కాడని శ్రమజీవులు/పిట్టల్లా రాలుతున్న దారుణస్థితి/అని అంటున్నారు.ఎండల వల్ల రైతులు సామాన్యులు పశు పక్షులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కవి వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.వాళ్లు అనాథలు కవితలో వాళ్ల మనసులు/రాళ్ల మధ్య అద్దంలా/ముళ్ళ మధ్య పువ్వుల్లా/విచ్చుకుంటాయి /వాళ్ల ప్రేమ సముద్రమయితే/ఆకాశమంత ఆకలి/ పగలంతా తీరని వేదన/రాత్రంతా ఒడువని దుఃఖం/ బతుకంతా కాయ కష్టం/కళ్ళ మీద వాలిన ఆకలిని/కడివెడు నీ(కన్నీ)ళ్లతో నిద్ర పుచ్చుకుంటూ/ సజీవ సమాధుల్లో జీవిస్తుంటారు/వాళ్ల గుడిసెల్లో ఆకలి గిన్నెల భాష తెలుస్తుంది/వాళ్లు అనాథలు/ అని అంటున్నారు.ఒక వ్యక్తికి ఎవరు లేని స్థితి అనాథ.అనాథల గురించి వ్యక్తం చేసిన భావం అద్భుతంగా ఉంది.ఆనంద రహస్యం కవితలో కొన్ని పుట్టుకతో వొస్తాయి/కొన్ని నేర్చుకుంటాం/కొన్నింటిని నేర్చుకుంటేనే వికాసం/ఎగరడం పక్షులకు/ఈదడం చేపలకు సహజాతాలు/మనం అభ్యసించవలసింది ఆనంద సృజన/అది అంగట్లో దొరికేది కాదు/మనపై మనం చల్లుకునే కర్పూర సుగంధమూ కాదు/ అందుకే ఇపుడు మనిషి/చేయాల్సింది ఆనంద సృజన/ఏ క్షణం నుండి మన మనసు/ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో./ఆ క్షణం నుండి ఆనందం మొదలవుతుంది/అదే అసలు,సిసలు బ్రతుకు రహస్యం/అని అంటున్నారు.మనుషుల జీవితాల్లో క్షోభ,దుఃఖం లేకుండా వచ్చేది ఆనందం. ఆనందం అనేది ప్రియమైన వారితో సమయం గడపడం లేదా ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనడం వంటి సానుకూల జీవిత అనుభవాలతో ముడిపడి ఉంటుంది.ఆనందం అనేది శ్రేయస్సు మరియు మొత్తం జీవితం సంతృప్తికి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది.ఆనందం అనగా మనసుకు ఆనందంగా ఉండే స్థితి,అభిరుచి, సంతోషం అని అర్థాలు.పారమార్థికంగా ఎనిమిది ఆనందాలు ఉన్నాయి.బ్రహ్మానందం,విషయానందం, ఆత్మానందం,అద్వైతానందం,నిత్యానందం, యోగానందం,సహజానందం,పరమానందం ఉన్నాయి.ఆత్మలేని శరీరం కవితలో సడి లేని నడి రాత్రి/శిథిల కుటీరం/మదించిన మానవ మృగం/ అసహాయపు ఒంటరి అబలపై/పాశవిక పంజా/వద్దని వారించినా/ఆర్తిగా అర్థించినా/రాతి గుండెలో కనిపించని/ఆర్ద్రత/అక్రమ ఆక్రమణలతో/వలువలు తొలగిస్తూ/తనువును నలిపేస్తుంటే/ప్రతిఘటించ చేవలేక గట్టునపడిన/చేప పిల్లలా తల్లడిల్లిన/ హృదయ విదారకత/సుప్త చేతనలో/నగ్న శీలాన్ని పాశవికంగా/ హరిస్తుంటే/గుండె గొంతుకలో ప్రతిధ్వనించిన/దుఃఖరోదన/దైహికంగా, మానసికంగా/కుంగిపోయిన మౌనమై/సజల నేత్రాలతో విడిచిన దౌర్భాగ్యపు/నిట్టూర్పు ఆమె/ తనను తాను సాంత్వన పరచుకోవడం/ఎలాగో తెలీని అఘ్రాణిత పుష్పం/ఉనికి కోల్పోతున్న దీపశిఖ/జీవన నైరాశ్యంలో విసుగును,విరక్తిని/ నింపుకొని/మృత్యు స్పృహతో/ఆమె ఒక ఆత్మలేని శరీరం/అని అంటూ కవి వ్యక్తీకరించిన భావాలు స్త్రీల పట్ల సానుభూతిని తెలియజేస్తున్నాయి. సమాజంలో స్త్రీలపై దుర్మార్గుల అత్యాచారాలు, ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాళేశ్వరం జలదృశ్యం కవితలో కాళేశ్వరం జలదృశ్యం/అవుతున్నది ఆవిష్కృతం/అనవరతం జనపదాలు/జల సిరులతో మురిసిపోవగ/ తెలంగాణ వర ప్రదాయిని/ఎత్తిపోతల ప్రాజెక్టు/ కాళేశ్వరం శుభారంభం/అని అంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట పొలాలకు నీళ్లు అందాయి అని వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది.మిత్రుడు కవితలో నవ్వుతూ నవ్విస్తూ/ కాలాన్ని నడిపించే మిత్రుడు కనబడితే/ మహదానందంలో కాసింత సేపు/మనసంతా బాల్యంలోకి జారిపోతుంది/కలతలు కనుమరుగవుతాయి/దిగులు చీకట్లు కరిగి,పున్నమ రేయి/ఆదమరిచి నిదురించినంత హాయి/స్వార్థ మెరుగని స్నేహారామంలో/ఓ పువ్వునై పరిమళించినట్టు/మనసంతా పులకరింపులతో తేలిపోతుంది/మన ప్రతి అడుగులో/వెన్ను తట్టే వారుంటే/జీవితం ఒక పూల చెట్టు/సృష్టిలో స్నేహం కన్నా తీయనిదేమున్నది/ఆత్మీయుని కౌగిలి/ అనుబంధాల లోగిలి/అని అంటున్నారు.ఒక మంచి మిత్రుడు ఉంటే మనిషి జీవితం నందనవనం అవుతుంది అని కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.అగోచర శత్రువు కవితలో కరోనా సృష్టించిన విలయం/కళ్లారా చూచిన పిమ్మట/ నాకిప్పుడు పరదేశాలకు కాదు/మాతృ గర్భంలోకి పోవాలనిపిస్తోంది/కరోనా ఈ కాలానికి మార్గ నిర్దేశనం చేస్తూ/నా నేత్రాలను తెరిపించింది/నా అపరిశుద్ధ చేతులను,చేతలను/శానిటైజ్ చేసుకొమ్మని/ కనిపించని కరోనా నేర్పిన జాగరూకత/తల్లి ఒడిలో హాయిగా/ తలదాచుకున్నట్టున్న నా ఉనికి/నాకై నేను విధించుకున్న గృహనిర్బంధం/జైలు జీవితంలా ఉంది అని అంటున్నారు.కరోనా పెనుభూతాన్ని చూసిన కవి అగోచర శత్రువు పట్ల జాగరూకత ఉండాలని కవితలో వ్యక్తం చేసిన భావాలు చక్కగా ఉన్నాయి. మధుర భావన కవితలో నా చెలి లేని శీతల రాత్రి/
శయన మందిరమొక మంచు గుహ/నా పాన్పు కఠిన హిమ శకలము/నిద్దుర కన్నుల నిరీక్షించు/ఈ ఏకాంత చీకటి శిథిల రాత్రి/నన్నే జాలిగా వీక్షిస్తూ/కాలమై నా కనుల ముందు కరిగిపోతున్నది/ నాకు కావాల్సినదిప్పుడు/మధు కలశము కాదు/ ఇప్పుడొక/ఉష్ణ స్పర్శ నన్నాశ్రయించిన/ఎంత బాగుండును/నా చెలి నా చెంతనే వున్నంత/వెచ్చని మధుర భావన/నన్నలుముకున్నట్లు/ అంతర్నిహితమైన అలజడి/అని అంటున్నారు. కవితలోని భావాలు ఒక్కసారిగా మనిషి మనస్సు మధుర భావనలు తేలియాడుతున్నట్లుగా ఉంది. ప్రగతి పథంలో కవితలో స్మార్ట్ సిటీ ముసుగులో/ అందమంతా ఒళ్ళో దాచుకొని/నగరం అభివృద్ధి చెందుతూనే వుంది/కార్లల్లో బైకుల్లో/గజిబిజిగా, గందరగోళంగా/పరుగులు తీస్తూనే వుంది/రాచ పుండ్లలాంటి గుంతల రహదారులతో/కంపుగొట్టే కాలనీల హట్టవాహినీలతో/పరుల కష్టార్జితాన్ని/ జుర్రుకొని బతికే పరాన్న జీవులతో/అభివృద్ధి చెందుతూనే ఉంది/అని అంటున్నారు.రాజకీయ నాయకులు,అధికారులు,కాంట్రాక్టర్లు కుమ్ముక్కై స్మార్ట్ సిటీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.పేరుకే స్మార్ట్ సిటీ అని పేరు నిధులు మాయం అవుతున్నాయి.ఈ దుస్థితి మారాలని కవి ఆవేదన చెందుతున్నారు.భూమి పూజ కవితలో బాల రామునికి భవ్య మందిరమట/శ్రీరామ ధామానికి శ్రీకరమట/భక్తి పారవశ్యంలో భరత వర్షమట/రామ నామ స్మరణతో పంచభూతాలు/పరవశించే వేళ/పులకరించిపోతున్న అయోధ్యాపురి/అని అంటున్నారు.కవి అయోధ్యలో జరిగిన భూమి పూజకు స్పందిస్తూ రాసిన కవిత ఇది.రగిలే భావుటాలై కవితలో నేటి రాజకీయం వెర్రి తలలు వేస్తున్నది/నాయకుల గోముఖ వ్యాఘ్ర రూపాలు/బయటపడుతున్నాయి/ధరల ప్రవాహంలో/సామాన్యుని బతుకు/అగమ్య గోచరమౌతున్నది/ సంపన్నుల కొమ్ముకాస్తూ/ కష్టజీవులపై ఉక్కు పాదం మోపుతూ/ రాజకీయాలిప్పుడు భ్రష్టు పట్టి పోయాయి/అని అంటున్నారు.ఇవ్వాళ రాజకీయాల్లో విలువలు నశించిపోయాయి అని ఆవేదన చెందుతున్నారు. ప్రజలు రగిలే నిప్పుల భావుటాలై పోరు బాటలో సాగాలి అని స్ఫూర్తిని కలగజేస్తున్నారు.ప్రజా పోరాట యోధుడు కవితలో ఆ పేరు వింటేనే నిజాం నవాబుకు సింహ స్వప్నం/రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి అని అంటున్నారు.గట్టెపెల్లి మురళి ప్రజా పోరాటయోధుడు,తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.అట్లాంటి ఆదర్శమూర్తి ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటారు.మహానీయుడు గట్టెపల్లి మురళిని స్మరించుకోవడమే మనం వారికి అందించే నివాళి.ఆపాత ఘుమ ఘుమలు కవితలో ఆపాత/ఘుమ ఘుమలు/ వంటింటి పరిమళాలు/అమ్మ పోపు పెడితే/వాడంతా కమ్మని వాసన/గుప్పుమనేది/అమ్మ ఏ కూర వండుతుందో వాసనబట్టి/ఇట్టే గుర్తించే వాళ్ళం/ చిటికెడు లవంగాల పొడి వేసి సాంబారు చేస్తే/ఆ ఘాటుకు జలదోషం తోకముడిచేది/వంటింటితో అనుబంధం/ఓ మధుర స్మృతి/అని అంటున్నారు. కవి అమ్మ చేసిన వంట ఘుమఘుమలను మరిచిపోకుండా గుర్తు చేసుకున్న అనుభూతి చక్కగా ఉంది.అమరుడు అలిశెట్టి కవితలో సాహితీ కొలనులో/ఎర్రెర్రని అక్షర కలువలు పూయించి/అలతి అలతి పదాలతో/అనంత భావాలను పలికించినవాడు/దోపిడీ సమాజంపై/ మెరుపుల వంటి పదజాలంతో/కవిత్వ శర పరంపరలు సంధించి/విప్లవ సాహితీ పతాకమెగరేసినవాడు/మరణం నా చివరి చరణం కాదంటూ/ ఆఖరి క్షణం వరకు తన రచనలతో/ సామాజిక రుగ్మతలపై/ అలుపెరుగక పోరాడిన అభ్యుదయ వాది/సంపాదన కోసం ఆరాటపడక/ పీడితుల పక్షాన/నా కలం కుంచె రెండు వుంటాయని/సగర్వంగా ప్రకటించుకున్న సాహసి/ కవితాకాశంలో/రవి అస్తమించని/అక్షర సామ్రాజ్యం/ అలిశెట్టిది అని అంటున్నారు.అలిశెట్టి స్మృతి కవిత బాగుంది.గెలుపు కవితలో ప్రయత్నంలో ఎన్ని అవమానాలు/ఎన్ని అవరోధాలు ఎదురైతే/విజయం అంత గొప్పగా మలచబడుతుంది/ ఓడిపోతున్నానని/తెలిసిన క్షణంలో కూడా/పోరాడే వాడే నిజమైన ధైర్యశాలి/తీరం చేరాలంటే/ఎన్ని అలల్ని ఎదురీదాలి/వెలుగును వీక్షించాలంటే/ఎన్ని చీకట్లలోకి తలవాల్చాలి/అడుగడుగునా అడ్డుగోడలు/కాంతిలో కూడా కనిపించని చీకటి నీడలు/వాటి లోపల మెత్తని మోసాలు/ వెంటాడుతూనే వుంటాయి/వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే/ప్రతి విజయం వెనక/లోకానికి తెలియని కష్టం వుంటుంది/జీవితాన్ని పోరాడకుండా/గెలిచినోడు వున్నాడా..?/అని ప్రశ్నిస్తున్నాడు గెలుపుకు కావలసిన స్ఫూర్తిని అందిస్తున్నాడు.అడవి కవితలో అమ్మలా అక్కున చేర్చుకుని/మన నుండి విషవాయువులను గ్రహించి/ప్రాణవాయువుని ప్రసాదించే/అడవి..జీవ వైవిధ్యం/సకల జీవులకు తోడు,నీడ/అవనికి సారం అందించే వర్ష ఋతువు/స్వచ్ఛమైన వాయువు, వానలు/మంచి జీవనమునిచ్చే అడవికి/హాని చేయకుండా/పర్యావరణాన్ని పరిరక్షిస్తూ/ప్రకృతిని ఆకుపచ్చగా ఉంచాలి/చెట్టు నుండి గుణాన్ని గ్రహిస్తూ/ఆకుల నుండి మార్పును గమనించాలి/ మానవ జీవితం అన్నిటికి ఆకర్షించబడే/ఒక అయస్కాంతం/దేనిని ఆకర్షించాలో వికర్షించాలో/ తెలుసుకోవడమే విచక్షణ/అడవిని రక్షించుకుంటూ/ మనుగడకు బాటలు వేసుకోవాలి/అలా కానినాడు./మనిషి ఒక్కడే తనకు తానే చివరకు/ అనంతానంత తిరస్కారంగా../మిగిలిపోతాడు/ అని అంటున్నారు.అడవి అంటే వృక్షాలు,మృగాలు, జలపాతాలు మొదలైన వాటితో ఉండే జనసంచారం తక్కువగా కలిగిన రమ్యమైన ప్రదేశం.అడవులు వర్షపాతానికి ప్రధాన ఆధారం.అనేకమైన ఆహార పదార్థాలు ఇతర ఉపయోగకరమైన వస్తువులు పుష్కలంగా లభించే ప్రదేశం.జల వనరులకు ఆలవాలం.భూమి ఉపరితలం మీద 9.4% అడవులు ఆక్రమించి ఉన్నాయి.అడవులు జీవావరణ వ్యవస్థలో ప్రకృతిలోని జీవరాశుల సమతుల్యాన్ని సాధిస్తుంది.వాతావరణంలోని వాయు కాలుష్యాన్ని నియంత్రిస్తాయి.వరదలు రాకుండా నివారిస్తాయి.కలప అతి ముఖ్యమైన ఉత్పత్తి.కలప గృహ నిర్మాణంలో,పరిశ్రమలలో ముడి పదార్థంగా వినియోగిస్తారు.మానవులు స్వార్థంతో అడవులు నరికి వేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తున్నాయి.అడవులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.మనిషి – మానవత్వం కవితలో మన కోసం మనం జీవించడం గొప్ప కాదు/సాటివారి కోసం మన జీవితం/కొంత అంకితం చేయగలిగితే/అంతకు మించిన మానవత్వం/మరేముంటుంది?/ఒక మనిషి కన్నీరు తుడువ/రక్త బంధమో,స్నేహబంధమో/ఉండాల్సిన అవసరం లేదు/పిడికెడు గుండెలో/చిటికెడు మానవత్వముంటే చాలు/అంతులేని కోరికల దాహాన్ని అదుపు చేసి/పరులకు కడు మేలు కలిగేలా/తమ జీవనశైలిని రూపొందించుకొని/ మనిషికి.. మనిషి/మానసిక శాంతిని ఇవ్వగలిగాలి అని అంటున్నారు.మనిషి మానవత్వం అలవర్చుకోవాలి అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నువ్వే నా లోకం కవితలో నీ ప్రేమలో తల మునుకలై/తనువంతా పులకించి,రేపవళ్లు/హాయిగా గడిచిపోవాలనిపిస్తుంది/నీ కళ్ళు ఒక్క క్షణమైనా,నా కలల నుంచి/ఎడబాయక ఉండిపోవాలనిపిస్తోంది/ నువ్వు నా దానవనే నమ్మకాన్నే/ఎదలో నింపుకొని/నీ జ్ఞాపకాలను ధ్యానిస్తున్న/నీ తలపై ఓ గడుసు పులకింత/ఒక్క గడియ నువ్వు నాకు ఎడమైతే/ యుగయుగాల ఏకాకి తనమేదో/ నాకు తెలియకుండానే నాలోకి/ఇంకిపోయినట్లుంటది/ నువ్వు లేక ఏకాంతముగా/నక్షత్రాలను వీక్షించలేను/ వెన్నెలను ఆస్వాదించ లేను/అని అంటున్నారు.కవి తనలో కలిగిన ప్రేమ భావనలను చక్కగా వ్యక్తీకరించారు.సంవేదన కవితలో మన ప్రేమ అమరం/అయినా!ఎందుకో నాకీ భయం/నా జీవన నేస్తమా!మదిలో ఏమిటీ కలవరం/పంచిన ఆనందానికి బదులుగా/మళ్లీ ఆ ఆనందం దొరుకదు.. ఎందుకని పంచిన నవ్వులకు మారుగా మళ్లీ ఆ నవ్వులు లభించవు ఎందుకనీ?/వ్యథను పెంచడమే గాని ఒక్క నిమిషం/శాంతి లభించదు ఎందుకనీ?/ నిరీక్షణల కెరటం మీద/ఎంతకాలమని తేలిపోను/ అని అంటున్నారు.వియోగం కవితలో ఏ నయనాలు నీ కోసం/నవయవ్వన సుందర స్వప్నాలు కన్నాయో/ఆ కళ్ళు..నిన్నెడబాసి దిగులుగా విలపిస్తున్నాయి/అని అంటున్నారు.ఆమె కొరకు తాను అనుభవించిన వేదనను వియోగం కవితలో చక్కగా వ్యక్తీకరించారు.
ఆశ నిండిన శ్వాస కవిత్వం
రచన : కసిరెడ్డి జలంధర్ రెడ్డి
ప్రచురణ : భవానీ సాహిత్య వేదిక,సీతారాంపూర్, కరీంనగర్ 505001.
పేజీలు : 78,
వెల:₹ 100/-
ప్రతులకు :
కసిరెడ్డి జలంధర్ రెడ్డి,
ఇంటి నెం. 8 – 3 – 159,
భగత్ నగర్,కరీంనగర్ – 505001.
స్టేట్ : తెలంగాణ,

September 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఇంద్ర ధనస్సు ఏడో రంగు

by Devanapalli Veenavani September 30, 2024
written by Devanapalli Veenavani

‘స్వేచ్ఛ ‘అన్న పదం ‘   స్వాతంత్య్రం ‘  కన్నా విశాలమైన అర్థం కలదని భావిస్తాను.  స్వాతంత్య్రం భౌతికమైనది ,అది అధీనతను సూచిస్తే, స్వేచ్ఛ ఆంతరంగికమైనది వ్యక్తుల ఆలోచనలను సూచిస్తుంది  .  ‘స్వాతంత్య్రం ‘లేని స్వేచ్ఛ విప్లవానికి పునాది అవుతుంది. స్వేచ్ఛ లేని  ‘ స్వాతంత్య్రం’లో  జాతి ఉనికినే  కోల్పోతుంది.  ఆది నుంచి జాతుల మధ్య  ఆధిపత్య పోరాటాలే చరిత్రను సృష్టించాయి.ప్రపంచ వ్యాప్తంగా మానవతా వాదం ముందుకు రావడం తో ఆధిపత్య ధోరణి   తగ్గినా పూర్తిగా తొలిగిపోయిందని చెప్పలేము.  అయితే ఈ మానవతా వాదం అంత సులువుగా అంగీకరించబడలేదు.ముందు దేశాల స్వాతంత్య్రం,  స్వేచ్చ , సమానత్వం, ఆయా  దేశాలు తమ సార్వభౌమాదికారాన్ని సాధించుకోవడం, విప్లవాలు మేల్కొలిపిన నైతిక భావనలు ఇవన్నీ దాని వెనుక ఉన్న నేపథ్యం.

           సార్వ భౌమాధికరం  నెలకొల్పుకొని స్వేచ్ఛాయుత  జీవనం కొనసాగించడంలో ఒక్కో దేశం ఒక్కో పంథా పాటించినా భారతదేశం సాగించిన పోరాటం మాత్రం అద్వితీయమైంది. అహింసా, సత్యాగ్రహం అనే పదునైన నైతిక ఆయుధాలతో భారతదేశం సాగించిన పోరాటం ప్రపంచ స్వతంత్ర పోరాటలలోనే  విలక్షణమైనది. అది 19 శతాబ్దపు నయా యుద్ద రీతిగా  ప్రపంచ దేశాలకు చుక్కాని అయింది.  

               భారత  స్వాతత్య్రోద్యమం పరిశీలించినట్లయితే గాంధీకి ముందు గాంధీ తర్వాత గా విభజించడం తెలుస్తుంది. గాంధీ అంతగా మన స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రభావితం చేయడం వెనుక ఉన్న నేపధ్యం ఏమిటి ?  దక్షిణాఫ్రికా లో గాంధీ సాధించిన విజయాలు ఏమిటి ?దక్షిణాఫ్రికాలో సాధారణ  వకీలు నుంచి ఏ పరిస్థితులు అతని ఇంతటి మహోన్నత కార్యంలో పాలుపంచుకునేలా చేశాయి ? అసలు దక్షిణాఫ్రికా కి భారతదేశానికి ఉన్న సంబంధం ఏమిటి? గాంధీ అక్కడ అంటే దక్షిణాఫ్రికాలో మొదలుపెట్టిన ఉద్యమం ఎటువంటిది? అన్న విషయాలు నన్ను చరిత్ర చదువుకునే రోజుల్లో  ఆలోచింపజేసిన ప్రశ్నలు .  

                   వీటికి  సమాధానంగా నాకు   దొరికిన  సిద్ధాంత గ్రంధానికి సరిసమానమైన పుస్తకం  ఇంద్రధనస్సు ఏడో రంగు. నేనిప్పుడు పరిచయం చేయబోయే ఈ పుస్తకం నూటాయాభయ్యే ల్ల  ఆఫ్రికన్ జాతులు ఇంకా అక్కడ బతక వచ్చిన వివిధ దేశీయుల సంఘర్షణను సంగ్రహంగా 200 పేజీలలో  విశ్లేషణాత్మకంగా అందించిన ఈ పుస్తకం  2003లో వచ్చింది. నేను దాన్ని  ఒక చిన్న వ్యాసంలో కుదించడం  ఇప్పుడు నా ముందున్న సవాలు.   పుస్తక రచయిత పెన్నేపల్లి గోపాలకృష్ణ.1937 లో జన్మించిన పెన్నేపల్లి గారు  జామీన్ పత్రికలోనూ, ఉదయం, వార్త పత్రికలోనూ పనిచేసి 2001 నుంచి పూర్తిగా సాహిత్య వ్యాపకంలో ఉన్నారు.పెన్నేపల్లి వారి రచనల్లో ముఖ్యమైనవి ‘ఇంద్రధనస్సు ఏడో రంగు’ , ‘మధురవాణి ఊహాత్మక ఆత్మకథ’ , ‘గురజాడ డైరీస్ ‘,    ‘గురజాడ కంప్లీట్ వర్క్స్ ‘  . ఇంద్ర ధనుస్సు ఏడో రంగు పుస్తకం రాయడానికి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కి చెందిన ఈ ఎస్ రెడ్డి ( ఏనుగు శ్రీనివాసులు రెడ్డి ) ఐక్యరాజ్య సమితి తరపున దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విమోచన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని   సేకరించిన సమాచారంతో పాటు రచయిత మరి కొంత సమాచారాన్ని సేకరించి దీన్ని సమగ్రంగా తీర్చిదిద్దారు. ప్రతి వాక్యానికి విశ్లేషణకి ఆధారంగా ప్రతి అధ్యాయం చివర దాని తాలూకు ప్రతుల వివరాలు పొందుపరిచారు.రచయిత  2011లో వారి 73వ వయసులో మరణించారు  .ఈ వ్యాసం ద్వారా ఇంతటి సమగ్ర సమాచారాన్ని అందించిన పెన్నేపల్లి గోపాలకృష్ణ గారికి  సవినయంగా నివాళులు అర్పిస్తూ పుస్తకంలోకి వెళ్దాం.

                      దక్షిణాఫ్రికాని ఇంద్రధనస్సు దేశం అంటారు ఎందుకంటే అక్కడ స్వతహా గా  ఉండే నల్లజాతి ప్రజలు , వలస రాజ్యాలు స్థాపించిన  పోర్చుగీస్ వారు ,బ్రిటిష్ వారు , ఫ్రెంచి వారు ఇంకా బతకడానికి వచ్చిన భారతీయులు ,చైనీయులు వీరందరి సంతతి జాతులు ఇలా అనేక రకాల జాతుల సంగమంగా ఉంది గనుక దీనికా పేరు వచ్చింది. స్వతహాగా ఉన్న జాతులు ఎప్పుడూ గుర్తింపుకు నోచుకోలేదు .వారి స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉండేవి.  భారత దేశం లో వలనే పోర్చుగీసు వారు దక్షిణాఫ్రికాలో మొదట  స్థావరం ఏర్పరచుకున్నారు . వారి స్థావరాలలో పని చేయడం కోసం భారతదేశం నుంచి మహిళలను బానిసలుగా  రవాణా చేశారు భారతదేశంలోని డచ్ ఈస్టిండియా కంపెనీ ఈ వ్యవహారాన్ని చూసుకునేది .బెంగాల్, బీహార్ ,ఒరిస్సా,పులికాట్ ,మచిలీపట్నం ,గోవా , బాంబే,  సూరత్ నుంచి ఎక్కువగా ఇలాంటి వలసలు జరిగాయి .కొంతమంది మహిళలు వివాహమాడి అక్కడే స్థిరపడ్డారు.ఇలా మహిళల, కూలీల రవాణా 1650 నుంచి బ్రిటిష్ సామ్రాజ్యంలో  1834లో  బానిస వ్యవస్థ రద్దు చేసే వరకు అంటే దాదాపు రెండు వందల సంవత్సరాలు నిరాటంకంగా కొనసాగింది. అప్పటికీ దక్షిణాఫ్రికాలో డచ్ ఆధిపత్యం లో వలస పాలన ఉండేది.

 భారత్ లో   బ్రిటిష్ ప్రభుత్వం 1860 నుంచి కొత్త చట్టం  Indentured Labour Act ద్వారా వలస దేశాలకు కూలీలను రవాణా చేసింది .ఈ చట్టంలో,  కూలీగా వెళ్లిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కాంట్రాక్టు  కూలిగా మరొక ఐదు సంవత్సరాలు స్వతంత్ర కూలీగా పని చేయవలసి ఉంటుంది . కూలీ యజమానికి ఎదురు తిరిగిన పక్షంలో  కొరడా దెబ్బలు తినవలసి ఉంటుంది. అయినప్పటికీ 1860 లలో భారత దేశంలోని తీవ్ర క్షామ పరిస్థితులలో పేద ప్రజానీకం దేశం విడిచి వెళ్లారు. ఆచరణలో ఈ చట్టం ప్రకారం వలస కూలీల జీవనం దుర్భరం కావడంతో ఇది బ్రిటీష్ సామ్రాజ్యానికి చెడ్డపేరు తేవడంతో కూలీల రవాణా ప్రోత్సహించడం  కోసం 1874లో  కొరడా శిక్షను   రద్దు చేేశారు. కూలీల కనీస సౌకర్యాలు లేకపోవడం ,మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాత్రి 9 గంటల తర్వాత భారతీయులు వీధులలో తిరగకుండా నిషేధం చిన్న చిన్న తప్పులకు జైలు శిక్షలు, యజమానులు  పెట్టే బాధలు ,చాలీచాలని జీతాలు ,అనారోగ్యం భారతీయ కూలీలు తిరిగి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇబ్బందుల పాలయ్యారు.

          ఇక  వ్యాపార నిమిత్తం దక్షిణాఫ్రికా కి వలస వచ్చిన రెండో వర్గం” ఫ్రీ పాసెంజర్ “ల పేరుతో వ్యవహారించబడ్డ వీరు  ఎక్కువగా గుజరాత్ నుంచి వచ్చారు . అయితే ఈ రకమైన వ్యాపార వర్గం ఉండడం ఇష్టం లేని ప్రభుత్వం భారతీయుల వల్లనే అనేక రకాల కష్టనష్టాలు వస్తున్నాయని ,అవినీతి అక్రమాలు పెరుగుతున్నాయని ,రకరకాల జబ్బులు వస్తున్నాయని ఆరోపించి ఈ వలసలు తగ్గించడానికి  జస్టిస్ రాక్ విచారణ కమిషన్ 1857లో ఏర్పాటు చేసి నియంత్రణ విధించింది.అయినా వలసలు తగ్గక పోవడంతో 1895లో ఇమిగ్రేషన్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం భారతదేశం స్థిర నివాసం ఏర్పర్చుకునే భారతీయులు తలకు మూడు పౌన్లు  చెల్లించాలి కాంట్రాక్టు కూలీలు ఉండవచ్చు కానీ స్వతంత్ర కూలీలు పన్ను  చెల్లించి లైసెన్స్ పొందాలి.

పంతొమ్మిది వందల 1897లో మరింత కఠినంగా డీలర్స్ లైసెన్సింగ్ యాక్టర్ ప్రకారం అకౌంట్ లన్ని ఇంగ్లీష్ లోనే ఉండాలి లైసెన్స్ అధికారం ప్రభుత్వానిదే దానిమీద అప్పీల్ చేసుకునే అధికారం వ్యాపారికి ఉండదు.1885లో ఉన్న మరో చట్టం  ప్రకారం 25 పౌండ్లు రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించిన భారతీయులకు మాత్రమే ట్రాన్స్వాల్ లో నివసించే హక్కు ఉంటుంది. డచ్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లి భారతీయుల కొరకు బజార్లు అనబడే వెలి వాడలు కేటాయించాలని అవి దాటి రాకూడదని వ్యాపారులు కూడా వ్యాపారాలు సాధించుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని చట్టం చేశారు .ఆ విధంగా భారతీయులు కూలీలు మాత్రమే అంతకుమించి అంటరానివారు కూడా. అలాంటి పరిస్థితిలో గుజరాత్ వ్యాపారుల తరఫున న్యాయవాదిగా దక్షిణాఫ్రికా చేరిన గాంధీ 1894లో తిరిగి భారత్ రావాలని అనుకున్నప్పటికీ అక్కడ ఉన్న ప్రజల కోరిక మేరకు అక్కడే ఉండి భారతీయుల సమస్యలని పరిష్కారం దిశగా నడిపించాలని తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు .

మొదట మహర్జీల ( మహా ఆర్జీ) పోరాటం. భారతీయుల సమస్యలన్నీ ఆర్జీ రూపంలోప్రభుత్వానికి సమర్పించారుఅయితే వాటికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం పరిష్కారం దొరకలేదు   ఆ  కాలంలోనే  జరిగిన  బోయర్ యుద్ధంతో  (అంటే డచ్ తో ఆధిపత్యం కోసం బ్రిటిష్ వారు  చేసిన యుద్ధాలలో ) బ్రిటిష్ వారి అధికారం 1904లో స్థిరపడింది.అప్పటికి గోపాల కృష్ణ గోఖలే గాంధీ మరికొంతమంది మితవాదులు భారతదేశంలోని దక్షిణాఫ్రికాలో ఓకే సామ్రాజ్యవాదం భారతీయుల సమస్యలు పరిష్కరించబడని అందుకు తగిన అహింసాయుత పోరాటం సరిపోతుందని భావించారు. భారత్ లోనూ దక్షిణాఫ్రికాలోనూ  ఒకే వలస ప్రభుత్వం ఉన్నది కనుక సామరస్యంగా సమస్యలు పరిష్కరించాలని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. బ్రిటిష్ వారు రూపొందించిన భారతీయుల తప్పని సరి  రిజిస్ట్రేషన్ చట్టం( 1906) నల్ల  చట్టం గా పేర్కొంటూ మొదటి సత్యాగ్రహ  ఉద్యమం చేశారు.గాంధీకి సంకెళ్లు వేసారు. సత్యాగ్రహం ఒక పదునైన ప్రజా ఉద్యమంగా రూపు దిద్దుకున్న సంఘటన ఇదే.ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో జరిగిన ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు.కాకపోతే 1911లో అప్పటి భారత ప్రభుత్వం వలస కూలీ చట్టం రద్దు చేసింది.

                ఇక దక్షిణాఫ్రికా లో 1910 నుంచి నాలుగు వలస ప్రభుత్వాల స్థానంలో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది.  ఇప్పుడు మరో మెలిక.. కేవలం క్రైస్తవ పద్దతిలో జరిగిన వివాహాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని. అలా 1913 లో మరింత విశాల భూమికగా మరో సారి సత్యాగ్రహం మొదలైంది.దీన్ని మహాయత్ర గా పేర్కొంటారు. ఉద్యమంలో శ్రామిక వర్గం ప్రవేశించడం ఒక మలుపు.దీని ఫలితంగా ఇండియన్ రిలీఫ్ ఆక్ట్ ఏర్పడింది. గాంధీ ఈ చట్టాన్ని భారతీయుల మాగ్నాకార్టా గా వర్ణించాడు ఆధునిక కాలంలో ఏ ఉద్యమమూ సాధించని ఫలితాలను సత్యాగ్రహం సాధించగలదని గుర్తించాడు.

 ఆ తర్వాత  1914లో  దాదాపు 24 ఏళ్ల ప్రవసాన్ని వదిలి   గాంధీ భారత్ కి వచ్చేశారు. హెర్మన్ కాలాంబక్  అనే గాంధీ అనుచరుడు ఇచ్చిన 1100 ఎకరాల భూమిని గాంధీ ‘టాల్ స్టాయ్ ఫామ్ ‘ పేరుతో  సత్యాగ్రహుల స్థావరం నెలకొల్పారు . ఏమిదేళ్ల పాటు  ఇక్కడినుంచే గాంధీ కార్యకలాపాలు చేసేవారు.గాంధీ వచ్చేసాక భారతదేశంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మరి దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటం ఏమయ్యివుంటుంది ?

భారతీయులను  వలస ప్రభుత్వం రూపొందించిన క్లాస్ ఏరియాస్ చట్టం, పెగ్గింగ్ చట్టం వంటి చట్టాలతో వేధించినా భారతీయ సంతతి నాయకులు యూసఫ్ దాదూ, తంబి నాయుడు , ఆఫ్రికన్ నాయకులు ముఖ్యంగా మండేలా ఈ పోరాటం ఒక సమూహం తోనూ జరిగేది కాదని అందరూ కలిసి వలస ప్రభుత్వాన్ని ఎదిరించాలని నిర్ణయించుకుంటారు .పోరాటం శాంతియుతమా సాయుధమా… ఇలా అనేక రకాల సంఘర్షణలు దాటి 1961లో అంటే భారతీయులు దక్షిణాఫ్రికా వచ్చి నూ రేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో గణతంత్ర దేశంగా మారింది. అదే  సంవత్సరం  మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికా విమోచనోద్యమం లో సాయుధ పోరాట దశను ముగిస్తూ స్పియర్ ఆఫ్ ద నేషన్  అనే సంస్థ ఏర్పాటు చేయబడింది. అనేక పోరాటాల తర్వాత 1994 లో మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకొని  నిజమైన గణతంత్ర రాజ్యం గా నిలదొక్కుకుంది ఈ వివరాలన్నీ మండేలా జీవిత చరిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లో చదవ వచ్చు.

ఇక పుస్తకం రెండవ భాగంలో  ఇచ్చిన దక్షిణాఫ్రికా విమోచనద్యమ భారతీయుల వివరాలు పొందుపరచడం వారి త్యాగానికి నివాళిగా భావించవచ్చు.వారిలో వల్లియమ్మ.17 ఏళ్ల వళ్ళీయమ్మ మాతృ భూమి కోసం ప్రాణత్యాగం చేసిన తొలి దక్షిణఆఫ్రికా భారతీయ మహిళగా గుర్తించబడుతుంది. ఈమె స్మారకంగానే తమిళనాడు ప్రభుత్వం 1982 లో మద్రాసులోని చేనేత కార్మిక సహకార సంఘానికి ‘తిల్లైయాడి వళ్ళియమ్మ మాలిగై ‘అన్న పేరు పెట్టిందిట. గాంధీ చేతి కర్ర అనబడే తంబి నాయుడు, నానా సీత , యూసఫ్ దాదూ, నారాన్ ముఖ్యులు.

తంబి నాయుడు తన నలుగురు పిల్లలు  బాల, బాల భారతి, నారాయణ్ స్వామి, ఫక్రీ లను గాంధీ దంపతులకు శాస్త్రోక్తంగా దత్తత నిచ్చారట.  వీరికి గాంధీ పట్ల ఉన్న అనుబంధంతో వీరిని గాంధీ ముత్యాలు( FOUR PEARLS OF GANDHI )అని పిలిచేవారట. వీరు గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత రవీంద్రుని శాంతినికేతన్ లో 1933 వరకు ఉండి తిరిగి దక్షిణాఫ్రికాకు వచ్చి దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో మహిళలు కూడా పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు శాంతి, ఇలా గాంధీ , ఫిల్లిస్ నాయుడు, అమీనా, ఫతిమా మీర్.ఫతిమా మీర్ రచయిత.  ఇండియన్ వ్యూస్ అనే వార పత్రిక నడిపేవారు. ఆమె 40 పుస్తకాలు రాశారట . దక్షిణాఫ్రికాను కుదిపేసిన వందమంది మహిళల్లో ఒకరిగా ఈమెకు గుర్తింపు ఉన్నది. “Higher than hope : Rolihlahla We love you ” –  నెల్సన్ మండేలా జీవిత చరిత్ర  ఈమె రాసిందే. ఇండియా లో శ్యామ్ బెనెగల్ నిర్మించిన మహాత్మా  ఇన్ మేకింగ్ అన్న సినిమాకి ఈమె రచనలే ప్రామాణికంగా తీసుకున్నారట.ఇలా నేను అనేక విషయాలను కొత్తగా ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. చివరగా   ఇంద్ర ధనుస్సు ఏడో రంగు అంటే ఎరుపు రంగు, ఎరుపు చైతన్యానికి చిహ్నం. దక్షిణాఫ్రికా ఉనికిని, విమోచనోద్య మాన్ని సంయుక్తంగా ధ్వనించే పేరుతో ఈ పుస్తకం.భారతీయుల సాధికార పోరాటానికి సంగ్రహ రూపం.

September 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

సెప్టెంబర్ మయూఖ పత్రిక – విషయసూచిక

by mayuukha September 30, 2024
written by mayuukha

కవితలు:-

1 నీవెక్కడ నేనెక్కడ- చిట్టిప్రోలు వెంకటరత్నం

2. రెక్కలు,- పెద్దూరి వెంకట దాసు

3. నానీలు- జి. సులోచన

4. నవ్య కలం సినారె- డాక్టర్ వసుంధర, చెన్నై

5. శనార్తులు – దేవనపల్లి వీణా వాణి

6. వర్షం వర్షం వర్షం – మహమ్మద్ అబ్దుల్ రషీద్

7. ఉదయ సంధ్యలో- లక్ష్మీ త్రిగుళ్ళ

8. అంగూరు గుత్తులు- రమేష్ నల్లగొండ

9. కల్తీ యుగం -రుద్రాక్షల మఠం ప్రభులింగ శాస్త్రి

10. ఆత్మ సౌందర్యం- రాధిక సూరి

11. వృక్ష మాత- పద్మశ్రీ చెన్నోజ్వల

12. సహన ధాత్రి- అరుణా ధూళిపాళ

13. మహిళా చైతన్యం-కీర్తి శేషులు గొడవర్తి సంధ్య

కథలు:-

1 పాద యుగళం – ధర్మముళ్ళ చంద్రశేఖర్

2. కుజదోషం- డాక్టర్ మజ్జి భారతి

3. మరుగుజ్జు బుద్ధులు – శీలా సుభద్ర దేవి

4. కుబేర- ఒద్దిరాజు సుభాష్ చంద్ర

5. నా ఇల్లు- కథ రెండవ భాగం లక్ష్మీ మదన్

6. సభ్య సమాజం -నారాయణరావు (తరానా)

7. తనూజ లక్ష్మీ త్రిగుళ్ళ

వ్యాసాలు :-

1. లేఖ సాహిత్యంలో భాషా విశేషాలు- డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి

2. తొలి తెలుగు కవయిత్రి మొల్ల- విజయ రంగనాథం

3. నాకు తెలిసిన బిఎస్ రాములు డాక్టర్ భూతం ముత్యాలు

4. తోరణాలు – విజయ కందాళ

5. తెలంగాణ ఉద్యమ కవి కాళోజి – డాక్టర్ అరుణపరంధాములు

6. తెలంగాణ భాషా దినోత్సవం- డాక్టర్ చీదర్ల సీతాలక్ష్మి

7. తంజావూరు కవయిత్రి- మధురవాణి విజయ రంగనాథం

8. ఇల్లు మనిషి చిరునామా,- ఆచార్య కడారు వీరారెడ్డి

9సాహితీ సిరిమల్లి మన వడ్డేపల్లి- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్

10. కవిత్వాస్వాదన – ఈశ్వర్ చరణ్ కవిత ఉషస్సు సంధినేని నరేందర్

11. జాతీయాలు -రంగరాజు పద్మజ

12. ఇంద్రధనస్సులో ఏడోరంగు- దేవనపల్లి వీణా వాణి

13. విద్యుత్కవి డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ – ఎన్.నరేష్ చారి

14. విశ్వ కవి  – మన కవి-రవీంద్రనాథ్ ఠాగూర్ -రాధిక సూరి

15. గూటి పక్షులు గులాబీ ముళ్ళు పద్మశ్రీ చెన్నోజ్వల

16. మహాప్రస్థానం మళ్లీ చదువుదాం – కె.కె.తాయారు

17. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ – కీర్తిశేషులు గొడవర్తి సంధ్య

ధారావాహిక:-

జీవన మాధుర్యం 2 వ భాగం

బాల సాహిత్యం:-

1.ఓ మేక ఓ తోడేలు (అనువాద కథ) ఒద్దిరాజు మురళీధర్ రావు

2.ఆర్మీ వీరుడు – దార ప్రీతిక

ఇంద్రధనస్సు:-

1. మన ఉపాధ్యాయుడు – ముదుగంటి ప్రతాప్ రెడ్డి – సందినేని నరేందర్

2. వేగుచుక్కలకే వేగుచుక్క – రంగనాయకమ్మ – రంగరాజు పద్మజ

3. ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ- వలిపె రామ్ చేతన్

4. కరణ్  బజాజ్ – నారాయణ రావు ( తరానా)

5. సాహిత్యాన్ని ప్రేమించిన కవయిత్రి గొడవర్తి సంధ్య గారికి శ్రద్ధాంజలి

-మయూఖ సంపాదకులు

ఇంటర్వ్యూ లు

1 బహుముఖ ప్రజ్ఞాశాలురు – సంగనభట్ల నరసయ్య గారు-అరుణ ధూళిపాళ

2

పుస్తక సమీక్షలు:-

1. విజ్ఞానం కలిగించే ఆయుధం ఆనందలహరి

-నన్నపురాజు విజయశ్రీ

2. కళ్యాణం శ్రీనివాస్ “పిడికిలి”

— నరేందర్ సాదినేని

3. మాటల చెట్టు మాటలు:-

-కట్టెకోల విద్యుల్లత

అనువాద సాహిత్యం:-

1. “గుల్జార్ షాయరీ” గీతాంజలి విశ్లేషణ -నరేందర్ సందినేని

2. పాఠశాల అనే విశాల భావం ముందు ఎవరు తెలుసుకున్నారు! (అనువాద కథ)-ఒద్ది రాజు మురళీధర్ రావు

3. “వచన కవితగా…”- (అనువాద కవిత)-ఎలనాగ

4. “మీ ఔర్ మీరా ఆంగన్”( అనువాద కవిత)

మూలం : వారాల ఆనంద్

 విజయ రంగనాథం (హిందీ అనువాదం)

September 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

శబ్దసంపదను పెంచుకోవాలి- అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి – డా.గండ్ర లక్ష్మణ రావు

by Ananthaacharaya K.S. September 30, 2024
written by Ananthaacharaya K.S.

డా.గండ్ర లక్ష్మణ రావు గారితో ముఖాముఖి

కే.ఎస్‌ : నమస్కారం సర్

గండ్ర : నమస్కారం అనంతాచార్యా

కే.ఎస్‌. .మీది ప్రధానంగా వ్యవసాయ కుటుంబం.పంటలు, పశువులు ఆ నేపథ్యం లోంచి పద్యం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి ఎట్లా మొదలయింది. ? బాల్యం నుంచే కళల పట్ల ఆసక్తి ఎవరి ప్రభావం వల్ల మొదలయింది.?
గండ్ర : మాది పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. మా బాపు చదువుకున్నవారు. ఆరోజుల్లో మూడవ తరగతి అనుకుంటా. కాని భారత, భాగవత , రామాయణాలుచదివేవారు, వాటిలోని అనేక కథలు రాత్రులు కల్లాల దగ్గర చెపుతుండేవారు. సాయంకాలాలు ఇంటి ముందర కూచొని వచ్చినవాళ్ళతో అవీ ఇవీ మాట్లాడుతూ ఏదో ఒక కథ వాటిల్లోంచి చెపుతుండేవారు. వేసవికాలం రాత్రులు ఆరుబయట మంచంలో పడుకొని పద్యాలు వల్లెవేయించేవారు. హరియను రెండక్షరములు వంటి భాగవత పద్యాలు నోటికి చదివించేవారు.
మా ఇంటి వెనుక తోటలుండేవి. వాటికి మోటలు కొట్టి నీరు పారించేవారు. అప్పుడు పాలేర్లు పోటీలు పడి పాటలు పాడేవారు. ఇంటికి వచ్చిన రకరకాల బిచ్చగాళ్ళు పదాలో పాటలో పాడేవారు. ఇవన్నీ చిన్నప్పుడు నన్నాకర్షించాయి. ఊరిలో కొందరు పద్యాలు, పాటలు కీర్తనలు చదివేవారుండేవారు. ఆయా సందర్భాలలో వారిని చూశాను. విన్నాను. హరికథలు , బుడిగ జంగమవారి కథలు, చిరుతల రామాయణం నాటకాలు, భాగవత నాటకాలు మొదలైనవి మా ఊరి వారే ప్రదర్శించేవారు. ఇంట్లో మా అమ్మ దగ్గరనుంచి ఇంటి చుట్టు ఉన్నవారు ఇతరులు అనేక సందర్భాలలో మాట్లాడే మాటాల్లో దొర్లే సామెతలు బాగా ఆకర్షించేవి.  ఇట్లా అనేకానేక గ్రామీణ సాంస్కృతిక వాతావరణం నాకు తెలియకుండా నన్ను సాహిత్యం వైపు మళ్ళించింది. నా చిన్నతనంలో మూడవ తరగతి, నాలుగ తరగతిలో నా చేత వారు రాసిఇచ్చిన ఉపన్యాసాలు ఇప్పించేవారు. నేను బాగా చదివి నిర్భయంగా నోటికి చెప్పేవాడిని అదే నన్ను ఇప్పుడు వేదికలమీద నిలబెట్టింది.

కే.ఎస్‌, అకాడెమిక్‌ గా బి.ఎస్‌.సి గణితం చదివిన మారు సాహిత్యం వైపు ఎట్లా మరలారు? అట్లా సాహిత్యం వైపునకు రావడానికి దిక్సూచి ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? ..
గండ్ర :  నేను చిన్నప్పటి నుండి గణితంలో చురుకుగా ఉండేవాడిని. మా ఊరులో చదువుకునేటప్పుడు వేమన పద్యాలు, సుమతి పద్యాలు చెట్ల కింద కూర్చోబెట్ట వల్లింప జేసేవారు. బాల ప్రసాద్‌ అనే టీచరు మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన సాహిత్యం పట్ల అభినివేశం గలవారు. మాచేత మాటలు, పాటలు, పద్యాలు చదివించేవారు. నాటకాలు వేయించేవారు. హైస్కూలులో తెలుగు అధ్యాపకులు పలుగులు భూమారెడ్డి పద్యాలు చాలా అందంగా చదివేవారు. డిగ్రీ చదివేటప్పటికే గణితంతో పాటు సాహిత్యం మీద రుచి పెరిగింది. పి.యు.సి.చదివేటప్పుడు మా కాలేజికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, డా. సి.నారాయణ రెడ్డ గారు వచ్చారు,  గొల్లపూడి మారుతీరావు వచ్చారు, ఇట్లా నాలో అంకుర రూపంగా ఉన్న సాహిత్యాభిలాషకు ఈ అన్ని సన్నివేశాలు నీరుపోసి పెంచాయి. డిగ్రీలో ఉండగా 1969లో సెకండ్‌ ఇయర్‌. తెలంగాణ నాన్‌ ముల్కీ ఉద్యమం వచ్చింది. ఒక సంవత్సరం కళాశాలలు మూతపడ్డాయి. ఆ సంవత్సరమంతా నేను విపరీతంగా సాహిత్యం చదివాను. అందుకు దోహదం చేసింది, ప్రోత్సహించింది, ఏవి చదవాలో చెప్పిన వారు కోవెల సంపత్కుమారాచార్యులు. అప్పుడు వారు మాకు తెలుగు ఉపన్యాసకులు. వట్టి గాలి చదువునుండి అచ్యమైన సాహిత్యం వైపు మళ్ళించిన వారు సంపత్కుమారగారు. అప్పుడే విశ్వనాథ, అడవిబాపిరాజు,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ,ఆరుద్ర, దాశరథి, కాళోజి( జీవనగీత), బాపురెడ్డి  మొదలైన వారిని అత్యంత ఆసక్తితో అభిమానంతో చదివాను. అంతేకాదు సింహాసన ద్వాత్రింశిక, హరవిలాసం, ప్రభావతీ ప్రద్యుమ్నము, కళాపూర్ణోదయము మొదలైన ప్రబంధాలు చదివాను. ఆరుట్ల భాష్యాచార్యులుగారు మాకు మరో తెలుగు ఉపన్యాసకులు వారి వద్ద చనువుతో అనేక విషయాలు అడిగి తెలుసుకునే వాడిని. అప్పుడు మా ప్రిప్పిపాల్‌ కొండలరావుగారు. అయన ప్రతి సబ్జుక్టులో  వారం వారం సెమినార్లు నిర్వహించే వారు. శ్రీశ్రీ పై జరిగిన సెమినార్‌ లో నేను ప్రసంగం చేశాను. నాకు హైస్కూలునుండి సహవిద్యార్థి మిత్రులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య నేను కలిసి ఆముక్త మాల్యద, మనుచరిత్ర ,వసుచరిత్ర వంటివి వేదం వారి టీకాతో ఉన్నవి కలిసి చదివాం. అట్లా గణితం మీదనుండి తెలుగుకు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది.

కే.ఎస్‌…సీరియస్‌ గా సాహిత్యం చదువుకున్న మీరు అధ్యయనం,అధ్యాపనం, సృజన మూడింటిని ఎట్లా సంయమనం చేశారు? మూడింటిని ఎట్లా సమాంతరం చేశారు?
గండ్ర : అధ్యయనం నా నిత్యజీవితంలో భాగమయింది. ఇప్పటికీ రోజూ ఏదో ఒక పుస్తకం చదువకుండా ఉండలేను. అధ్యాపనం కోసం కూడా పుస్తకాలు చదివేవాడిని. పాఠం చెప్పడం కోసం ఆయా పాఠాలు ఉన్న కావ్యాలు, కవుల గురించి అధ్యయనం చేసేవాడిని. ఎం.ఏ లో ఆచార్య దివాకర్ల వేంకటావధాని, డా. సి.నారాయణ రెడ్డి, జి.వి. సుబ్రహ్మణ్యం వంటి వారు ఎన్నెన్ని పుస్తకాలు ఉటంకించేవారో చూసి ఆశ్చర్యమనిపించి అట్లా అనేక రచనలు చదవాలని అధ్యయనం పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఎన్నిసార్లు చెప్పిన పాఠమయినా క్లాసుకు పోయే ముందు తప్పక మరోసారి ఇంటి దగ్గరైనా చదివేవాణ్ణి. ప్రతిసారి కొత్త విషయాలు స్ఫురించేవి. అవి అధ్యయనం వల్ల కలిగిన మేలు. అధ్యాపనం నాకు చాలా ఇష్టమైన వృత్తి. పాఠం చెపుతున్న ప్రతి గంటా నా ఆయుస్సును పెంచుతుంది,,,,, అని నేను ఒక కవితలో రాసుకున్నాను. నా ఆరోగ్య రహస్యం ఏమిటని చాలామంది అడుగుతారు. ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం. వీటిలో మురిసపోయిన నేను సృజన వైపు చాలాకాలంగా దృష్టి పెట్టలేదు. అప్పుడప్పుడు మాత్రమే రాసేవాడిని. మూడింటిలో రెండింటికే ఎక్కువ ప్రాధాన్యత. తరువాత అధ్యాపకుడి మలిథలో సృజనవైపు ఎక్కువ దృష్టి పెట్టాను.

కే.ఎస్‌……సాహిత్య సంస్థల నిర్వహణలో మీ పాత్ర గొప్పది. అధిక సమయం వెచ్చించారు. అది మీ సృజనాత్మక పైన ఎంత వరకు ప్రభావం చూపించింది? ఇప్పుడు మీరేమనుకుంటున్నారు?
గండ్ర :  కరీంనగర్‌ లో 1978లో పనిచేస్తున్నప్పుడు మా సహచర ఉపన్యాసకుడు డా. గోపు లింగారెడ్డి జానపద సాహిత్య పరిషత్‌ రాష్ట్ర కార్యదర్విగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పుడు నాయని కృష్ణకుమారిగారు అధ్యక్షులు. కరీంనగర్‌లో ఆయన నిర్వహించే కార్యక్రమాలన్నిటిలో నన్ను భాగస్వామిని చేయడమే కాక జిల్లా కార్యదర్శిగా పెట్టారు. వాటితో పాటు ఆయా కవులు జయంతుల సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ సమయానికి రావలసిన ప్రసంగం చేయాల్సిన వారు రాకపోతే నా చేత మాట్లాడించేవారు. తరువాత నూకలమర్రి గంగయాచారి కరెంటు ఆఫీసుల పనిచేసే అతను సమతా సాహితి అని ఏర్పాటు చేపి నన్ను, డా.బి. దామోదర్‌ రావును, డా.డింగరి నరహరి ఆచార్యను, త్రిపురారి సోమేశ్వర శర్మను, పర్శరామారావును, గజేందర్‌ రెడ్డిని కార్యవర్గ సభ్యులుగా నియమించి ఆయన స్వయం సౌజన్యంతో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఒక విధంగా మా సమయమంతా ( కాలేజి అయినాక) వాటికే గడిచిపోయింది, .. సాహితీ గౌతమి ఏర్పాటు, సినారె పురస్కారం ఏర్పాటు ఆయా కార్యక్రమాలు , అప్పుడే సమైక్య సాహితి , మాడిశెట్టి గోపాల్‌, కె.ఎస్‌అనంతాచార్య  ప్రారంభించడం ఇట్లా కరీంనగరం సాహిత్య వాతావరణాన్ని పెంచాయి. ప్రతి సాహిత్య కార్యక్రమంలో నేను నిర్వాహకుడిగానో, వక్తగానో, ఆయా పనులు చేసేవాడిగానో పాల్గొనని సందర్భం లేదు. ప్రభుత్వం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం తప్పనిసరి అయింది. నెహ్రూ యువకేంద్ర విద్యాసాగర్‌ రావుగారు కో ఆర్డినేటర్‌ గా అనేక కార్యక్రమాలలో మమ్ములను భాగస్వాములను చేశారు. మా సహోపన్యాసకులు పార్వెళ్ళ గోపాల కృష్టగారు అవధానాలు చేశారు.సమతాసాహితి, సాహితీ గౌతమి సంస్థలకు అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పనిచేశాను, ఈ కార్యక్రమాల, సంస్లల నిర్వహణ నా సృజనాత్మక దృష్టికి ఆటంకమే అయినాయి. మిత్రులు కూడా మీరు ఈ పనులు మానేస్తే చాలామంచి కవిత్వం, రచనలు చేస్తారు అని అంటుండేవారు. అయితే నా రచనలే కాదు ఎంతో సాహిత్యం ఉంది, అది అధ్యయనం చేసే ఒక ప్రేరణ కలగాలని, కొత్త వారికి సాహిత్యం పట్ల ఉత్సాహం కలిగించాలని ఎక్కువ ఆరాటపడ్డాను.

కే.ఎస్‌…..కవిత్వంలో నీవు అనే ఆది మకుటంతో శతకం రాశారు. ప్రయోగాత్మక మయిన ఆ శతకం గురించి వివరించండి. తెలుగు సాహిత్య ప్రపంచంలో దానికి లభించిన స్థాన ఏమిటి?
గండ్ర : పద్యం చదవడం, అంటే ఇష్టపడే నేను పద్యాలు రాస్తుండే వాడిని. డిగ్రీలో ఉన్నప్పుడే నేను అనుమాండ్ల పద్యాలు రాశాం. ఎం.ఏ లో జి.రామశేషయ్య నేను ఒకే గదిలో అద్దెకు ఉండి కలిసి చదువుకునేవాళ్ళం. అప్పుడు మేం పద్యాలురాశాం. కృష్ణాపత్రికలో అచ్చయినాయి. మళ్ళీ చాలాకాలానికి పద్యాలు రాశాను. అయితే అప్పటికే ఉపనిషత్తులు అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాఖ్యానాలు, భాష్యాలు వినడం చదువడం నన్ను బాగా ప్రభావితుడ్ని చేశాయి. అట్లా తత్వమసి అనే భావనను తెలుగులో నీవు అనే పేరుతో సంబోధించి కొన్ని పద్యాలు తాత్విక భావనతో రాశాను. అందులో మిగతా శతకాల వలె ఏ దేవుని సంబోధన గాని, పేరుగాని ఉండదు.తత్వం మాత్రమే ఉంటుంది. ఆ విషయం కొంత కష్టమే, దాంతో పాటు నీవు అనేది నొక్కి చెప్పాలని ప్రతి పద్యం అట్లే మొదలయితే బాగుంటుందని అనుకొని అట్లారాశాను. అప్పుడు ఛందోపరమైన ఇబ్బందులున్నాయి. కాని వాటిని అదిగమించ గలిగాను. అది కూడా వీలయినంత వరకు తెలుగులోనే, సంస్కృత సమాస ప్రయోగాలు లేకుండా చేశాను.
                ఈ శతకానికి చాలా ప్రశంస వచ్చింది. మా రామశేషయ్య బాగా ప్రోత్సహించాడు. తరువాత మాదిరాజు బ్రహ్మానందం, గిరిజామనోహరబాబు, సంగనభట్ల నరసయ్య వంటి వారు అమితంగా ఆదరించారు. కపిలవాయి లింగమూర్తిగారు, సముద్రాల లక్ష్మణయ్యగారు, కోవెల సుప్రసన్నగారు అభినందించి ఆశీర్వదించారు. తెలుగులో ఏకప్రాస శతకాలు గతంలో ఒకటి రెండు వచ్చాయిగాని ఆది మకుటంతో రాలేదు. ఇదే తొలి ప్రయోగం. మహామహోపాధ్యాయ, పద్మశ్రీ శ్రీ భాష్యం విజయసారథిగారు ఈ శతకాన్ని చదివి పాతిక పైగా ప్రశంసా శ్లోకాలు రాశారు.అంత బాగున్నాయి పద్యాలు అని మెచ్చుకున్నారు. మహామహోపాధ్యాయులు అవధాని శ్రీ తిగుళ్ళ శ్రీ హరిశర్మగారు సంస్కృతంలోకి అనువాదం చేస్తున్నారు.

కే.ఎస్‌…. పద్యంతో పాటు ముగ్గు, వర్తమాన సంధ్య, శతద్రు లాంటి వచన కవిత్వం కూడా రాశారు. ఆధునిక ప్రాచీన సాహిత్యాలలో మీరు దేనిని ఎక్కువ ఇష్ట పడతారు? ఏది రాయడం మీకు సులువు, అభిమానం?
గండ్ర : కవిత్వం పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా ఇష్టమే. వచన కవిత్వం ఈనాడు ప్రాచుర్యంలో ఉన్న రూపం. నేను కూడా అట్లా వచన కవిత్వం రాశాను. సంపత్కుమార వంటి వారితోపాటు సినారె, శేషేంద్ర, కాళోజి  మొదలైన వారి అధ్యయనం ప్రభావం ఎక్కువ.
ఏది సులభం అని ఏమీ లేదు. నిజం చెప్పాలంటే కవికి ఒక భావన వచ్చినపుడు అది తన రూపాన్ని తానే ఏర్పరుచుకొని బయటికి వస్తుంది.  ఆ రావడం ఒకసారి గేయంగా కావచ్చు, పద్యం గా కావచ్చు, వచనంగా కావచ్చు. తనంతగా వచ్చిందే సరిగ్గా ఆ భావానికి తగిన రూపమవుతుంది. ఈ భావాన్ని నేను పద్యంలో చెపుతాను, వచనంలో చెపుతాను అని అనుకొని రాయడం కృత్రిమమే అవుతుంఇ.  నీవు కవీంద్రులన్‌ కవివి…. అని ఉత్పలమాల ఛందస్సులో ఆరంభం వచ్చిందంటే మిగతాది అందులో కుదిరిపోతుంది. నేను పనిని ప్రేమిస్తాను…. అని వచ్చింది వచనకవిత్వమే అది అందులోనో సరిపోతుంది…. భావానికీ రూపానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. నేను పద్యాలు, వచన కవిత్వం రెండూ విరివిగా చదివిన అనుభవం ఉండటం వల్ల ఏది ఎట్లా వస్తుందో అట్లా రాశాను. శతద్రులో వట్టి వచనంలాంటి వాక్యాలు అట్లే ఉంచాను. వాటిని విరగ్గొడితే కవిత్వం కాదు. వాటిలో కవితా లక్షణముంటే అది కవిత్వమవుతుంది.అది వచనమైనా పరవాలేదు.

కే.ఎస్‌…..కవి సమ్రాట్‌ విశ్వనాథ నవలపై మీరు పరిశోధన చేశారు, దాంతో మీరు విశ్వనాథ అభిమానులు, ఆయన శిష్యులకు ప్రతిరూపం అంటారు మిమ్మల్ని, మీరెట్లా భావిస్తారు?
గండ్ర : విశ్వనాథను నేను చదువుకునే రోజుల్లో బాగా చదివాను. ముఖ్యంగా నవలలు  వేయిపడగలు, సముద్రపుదిబ్బ, శార్వరి నుండి శార్వరిదాక, కుణాలుని శాపము, దమయంతీ స్వయం వరం, చెలియలి కట్ట , ఏక వీర ఇట్లా ఎన్నో , పైకి చదివితే మా తో పాటు రూంలలో ఉన్న విద్యార్థులు, మా ఇంటి ఓనర్లు చదువురాని వారు కూడా విని రోజూ చదువుమనే వారు. ఆవిధంగా విశ్వనాథ పై అభిమానం కలిగింది. కాకతీయలో ఏ అంశం పై చేస్తావన్నప్పుడు ఏ ఆలోచించకుండా వేయిపడగలు అన్నాను. అప్పటికి దానిగురించి ఇది చేయాలని అనుకోలేదు. అంతగా మనసులో పడింది.
                జువ్వాడి గౌతమరావుగారు రామాయణ కల్పవృక్షం చదువుతుంటే ఎంతో మంది వచ్చి వినేవారు. లక్ష్మణ యతీంద్రులు,ఏలూరి పాటి అనంతరామయ్య,శ్రీలక్ష్మణ మూర్తి, బేతవోలు రామబ్రహ్మం, చేకూరి రామారావు, కోవెల సుప్రసన్న, సంపత్కుమార, విశ్వనాథ పావని శాస్త్రి , వాకాటి పాండురంగారావు, అనుమాండ్ల భూమయ్య  స్థానికంగా పార్వెళ్ళ గోపాల కృష్ణ …. వారి ఇంటిలో ఉంటూ రోజులకొద్తీ వినేవారు. వారిలో నేను కూడా ఒకడిని. అట్లా విశ్వనాథ పద్యకవిత్వం పట్ల కూడా అభిమానం కలిగింది. తరువాత విశ్వనాథ పద్యకావ్యాలు చదివాను ,సదస్సులలో వాటిపై పత్రసమర్పణలు చేశాను. కరోనా కాలంలో అంతర్జాలం మాధ్యమంగా మిత్రుల కోరికపై రెండున్నర సంవత్సరాలు రామాయణ కల్పవృక్షం లోని పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పాను. విశ్వనాథ సాహిత్యం పట్ల నాకు గల పరిచయాన్ని బట్టి నన్ను విశ్వనాథ అనుయాయి అని పిలుస్తుంటారు.

కే.ఎస్‌….. విశ్వనాథలో ప్రధానంగా మీకు నచ్చిందేమిటి? భాషనా? ఆధ్యాత్మికతనా? భావ వ్యక్తీకరణనా వివరించండి?
గండ్ర : విశ్వనాథ సాహిత్య క్షేత్రంలో పండించని పంటతేదు. అని వాడుక.ఒక్క వచన కవిత్వం జోలికి పోయినట్లు లేదు. కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ వంటివాటిని సమర్థవంతంగా సాధికారికంగా అనితర సాధ్యంగా రాశారు. మధ్యాక్కరల వంటి ప్రయోగాలు కూడా నాకు ఇష్టంగా అనిపించేవి. నేను 6, 7 తరగతులలో ఉండగా మా బాపు విశ్వనాథ మధ్యాక్కరలు చదువడం చూశాను. అందులో ఒకచోట నాబిడ్డ ఈ కైత, దీని శోభాన గూడ వత్తురు …. అనే పదాలు పాదాలుచూసిన గుర్తు. అప్పుడప్పుడు మా బాపు ఎవరితోనైనా చెపుతున్నప్డుడు విశ్వనాథ సత్యనారాయణ కవిసమ్రాట్‌ కరీంనగర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌… అనేవారు. ఆ మాటలు నాకు జ్ఞాపకం. ఆయన రచనలలో విశేషమేమిటంటే ఒకటి నచ్చితే అన్నీ నచ్చుతాయి. లేకపోతే ఏదీ నచ్చదు. గౌతమరావుగారు చెపుతుండే వారు ఆ రుచి తెలిసిన తరువాత మరేదీ అంతగా రుచించదు అని .
ఆయన ప్రతి రచనలోను ఒక వేదన ఉండేది. పైకి మాత్రం అవి కథలుగా నవలలుగా కావ్యాలుగా కనపడతాయి. కాని సమాజం పట్ల, దేశం పట్ల సంస్కృతి పట్ల అమితమైన అభిమానం అది క్రమంగా నశిస్తున్నదన్న వేదన అంతటా కనపడుతుంది. అది ఆయనను సంప్రదాయ వాదిగా ప్రచారం చేశాయి. కాని ఆధునికమైన దేనికీ వ్యతిరేకి కాదు. నవీనమైన ప్రతిదాన్ని స్వాగతిస్తాను. ఎంతవరకైతే మూలం చెడకుండా ఉంటుందో అంతవరకు అనేది ఆయన నిశ్చయం. భాష పాషాణ పాకం అనేది కూడా ప్రచారమే. రామాయణం చెపుతున్నప్పుడు చాలామంది ఇంత బాగా తేలికగా ఉందికదా? ఎంత గ్రామీణ జీవితం ఎన్ని జాతీయాలు, ఎంత వ్యవహార లక్షణం, ఎంత లోకం రీతి …అన విన్న మీవంటి ఆధునికులు, తెలుగు పండితులు, ఆనందించారు. అయితే ఆయన వ్యక్తీకరణ , శైలి ఆయనదే. లక్షపుటలు రాసినా ఒకరి ఎంగిలి లేదు, అని ఆయనే చెప్పుకున్నాడు.

కే.ఎస్‌….. మీరు విమర్శనా రంగంలో కూడా కృషి చేశారు. వర్తమాన తెలుగు విమర్శ ఎట్లా ఉంది? మీకు నచ్చిన విమర్శకులు ఎవరు? ప్రస్తుతం వస్తున్న సమీక్షలు, విమర్శలు, అర్థవంతంగా ఉంటున్నాయా? నిర్మాణాత్మక సూచనలు ఏమయినా చేయండి.
గండ్ర : కొందరు కవుల కవిత్వాన్ని గురించి, పుస్తకాల గురించి సాహితీ వనమాలి అనే పేరుతో ఒక పుస్తకం ప్రచురించాను,నిజానికి అంతకు కొన్ని రెట్ల వ్యాసాలు, ప్రసంగాలుఆయా పత్రికలలో సంచికలలో ముద్రితాలున్నాయి. విమర్శను కవి అంతరంగాన్ని బట్టి ,కావ్యంలో కవి చెప్పినదాన్ని బట్టి ఎక్కువగా విమర్శించాను.
ఈ రోజుల్లో సమీక్షల విమర్శలు అనే అభిప్రాయం పెరిగిపోయింది. విమర్వలో ప్రాచ్య పాశ్చాత్య విమర్శాధోరణులు, ప్రమాణాలు, సిద్ధాంతాలు ఎన్నో వచ్చాయి. వాటి అవగాహనతో విమర్శ చేస్తున్న వారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆచార్య కోవెల సుప్రసన్న, ఆచార్య బేతవోలు , డా. సంగనభట్ల నరసయ్య, ఆచార్య అనుమాండ్ల, , నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహారెడ్డి, కే.పి.అశోక్‌ కుమార్‌, యం. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, జి.లక్ష్మీ నరసయ్య వారాల ఆనంద్‌ లవంటి వారు కొంతమంది విమర్శను గురించి తెలిసి విమర్శలు చేస్తున్నవారు.

కే.ఎస్‌… ఖలీల్‌ జిబ్రాన్‌ ది మ్యాడ్‌ మ్యాన్‌ పుస్తకాన్ని తెలుగులో వెర్రి మానవుము  పేరుతో తెలుగులో అనువదించారు. ఇప్పుడు అనువాద అవసరాన్ని వివరించండి.
గండ్ర : అది అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఐ పాడ్‌ లో ఏదైనా పుస్తకం చదువుదామని రైటర్‌ ఆప్షన్‌లో ఖలీల్‌ జిబ్రాన్‌ నొక్కాను. చాలా పుస్తకాలు వచ్చాయి. ఎందుకో మాడ్‌ మాన్‌ చదువాలనిపించి చదివాను. వెంటనే తెలుగులో రాస్తే బాగుంటుందని మూడు రోజుల్లో అనువాదం చేశాను.
                ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో అనేక గొప్ప రచనలున్నాయి. వాటిని అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎందరో చేశారు. ఇప్పటికీ ఆ పని చేయాలి. వారాల ఆనంద్‌ ఇరుగుపొరుగు పేరుతో దేశంలోని విదేశాలలోని కవులను తెలుగులో అనువాదం చేస్తూ పరిచయం చేస్తున్నారు. అనువాదం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కవితా ధోరణులు తెలియడంతో పాటు మానవుని ఆలోచనా విధానం, జీవన సంస్కృతి, దేశవిదేశాల పరిస్థితులు ఎన్నో వ్యక్తమై పాఠకుడిని విశాలం చేస్తాయి.

కే.ఎస్‌. ఏడు పదుల వయసులో మీరు అవధాన రంగంలో ప్రవేశించారు. అవధాన అవసరాన్ని మీ అనుభవాల్ని గురించి చెప్పండి.
గండ్ర :…. పద్యాలు కావ్యాలనుండి అలవోకగా సభలలో చదువడం, అప్పుడప్పుడు పద్యాలు ఆశువుగా చెప్పడం చూసిన మిత్రులు వేణుశ్రీ మీరు అవధానం చేస్తారు అని కరోనా కాలంలో నాకు రొజూ సమస్యలూ, దత్తపదులూ, వర్ణనలూ ఇచ్చి రాయమన్నారు. నేను వెంటనే పూరణలు పంపాను. తరువాత మిత్రులు రాజారామమోహన శర్మ ఒకరోజు నిర్ణయించి అవధానం చేయుమన్నారు. పృచ్ఛకులను నిర్ణయించారు. అట్లా ప్రారంభైన అవధానం నాకు కూడా ఉత్సాహంగానే అపినించింది. ఈ అవధాన ప్రక్రియ తెలుగులో అపురూపమైనది. కరీంనగర్‌లో ప్రస్తుతం ఎవరూ లేరు. నన్ను చూసి ఎవరైనా యువ కవులు పండితులు ముందుకు వస్తారని , అందుకు ప్రేరణగా స్ఫూర్తిగా నిలువాలని అవధానాలు చేస్తున్నాను. ఇంత వరకు జరిగిన అవధానాలు ప్రేక్షకులను సంతృప్తిపరచాయి. అదే నాకు ప్రోత్సాహకంగా ఉన్నాయి.

కే.ఎస్‌…. గత యాభైఏళ్ళలో తెలుగు సాహిత్యంలో పలు వాదాలు వచ్చాయి. వాటిలో మీరు ఎటు వైపు?
గండ్ర :     సామాజికమైన స్త్రీ వాదం, దళిత వాదం, మైనారిటీ వాదం, ఇట్లాంటివి వచ్చాయి. వీటి ప్రభావంత తెలుగులో కవిత్వం, కథలు, వెలువడ్డాయి.ఈ వాదాలు కవిత్వంలో భాగమే కాని వాదాలే కవిత్వం కాదు. సాహిత్య వాదాలలో సంప్రదాయం, అభ్యుదయం వంటి వాదాలు వచ్చాయి. మా గురువుగారు సినారె గారి వలె సంప్రదాయం జీర్ణించుకున్న ప్రయోగాన్ని, ప్రయోగంలో జీవిస్తున్న సంప్రదాయాన్ని, నేను ఇష్ట పడతాను.

కే.ఎస్‌…భువన విజయం నాటకం రాశారు. దాని వివరాలు చెప్పండి?
గండ్ర :…. ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయల పంచశతి ఉత్సవాలు జరుగుతున్నాయని నంది శ్రీనివాస్‌ , గాజుల రవీందర్‌,   మీరు నన్ను కలిసి భువనవిజయం నాటకం వేద్దామనుకుంటున్నాం మీరు సహాయం చేయండి అని అడిగారు. సరే నన్నాను. తీరా దానికి తగిన రచన (స్క్రిప్టు) లేదన్నారు. రెండుమూడు రోజులలో కావాలన్నారు. ఆ రాత్రి కూర్చొని అష్టదిగ్గజ కవులు, రాయలు, మంత్రి, నరసరాజు వంటి పాత్రలతో పద్యాలు మాటలు కలిపి నాటకం రూపొందించాను. రెండు రోజులు ఆయా పాత్రలు అభ్యాసం చేసి ప్రదర్శన ఇచ్చాం. అందులో నేను తెనాలి రామకృష్ణుని పాత్ర ధరించాను. ఒకవైపు హాస్యం పండిస్తూ మరో వైపు ఆయా పాత్రధారుల లోపాలు సరిచేస్తూ నాటకం రక్తి కట్టించాం. ప్రముఖ కవి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ నాటకాన్ని చూసి అభినందించారు.

కే.ఎస్‌. : మీ అధ్యాపకత్వంలో ఎందరో శిష్యులను తయారు చేశారు? అధ్యాపకానుభవం గురించి , నేటి విద్యావ్యవస్థ గురించి చెప్పండి? సాహితీ సాంస్కృతిక రంగం వైపు పిల్లల్ని ఎట్లా ప్రోత్సహించాలి?
గండ్ర : అందరూ కోట్లు సంపాదించి ఆనందిస్తే నేను శిష్యకోటిని సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటాను. ఎందరో శిష్యులు ఏ రంగంలో స్థిరపడిన వారైనా నా పాఠాలను గుర్తు చేస్తుంటారు. ఇక మీ వంటి వారు తెలుగు పండితులు కాకపోయినా తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తూ అద్భుతమైన సేవలందిస్తున్నారు. ఎందరో శిష్యులు తెలుగుపండితులుగా, ఉపన్యాసకులుగా, కవులు రచయితలుగా ఎదిగారు. తరువాతి తరాన్ని తయారు చేశాననే సంతృప్తి ఉంది. ఈ కాలం విద్యావిధానంలో సాంస్కృతిక రంగానికి కొంత ప్రాధాన్యత ఉన్నా ఎక్కువగా సినిమా పాటలు, జానపద గీతాలు నృత్యాలు వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. భాష, వక్తృత్వము, కవిత్వము, సాహిత్యము వంటి వాటికి తక్కువ. ఆంగ్ల మాధ్యమం వచ్చిన తరువాత పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. భాష పట్ల అభిరుచిని కలిగించాలి. మంచి  సంభాషణా చాతురిని, వాఙ్నైపుణ్యాన్ని కలిగించాలి. ఈ నాటికీ మాట్లాడడం, సరిగా సమాధానం చెప్పటం రాక ( తెలిసి) పోవడం భాషాలోపం. వ్యక్తిత్వ వికాసంలో భాగంగానైనా భాషను నేర్పించాలి.

కే.ఎస్‌…. నూతన కవులకు రచయితలకు మీరేమి చెపుతారు? ఏ సందేశం ఇస్తారు?
గండ్ర :   ఎవరు చదివినా చదవక పోయినా ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. పుస్తకాలు వేస్తున్నారు. కొందరు సరికొత్త పద్ధతుల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కొందరు కవిత్వం కాని దాన్ని కూడా కవిత్వం అని మురిసి పోతున్నారు. కవులుగా దలచిన వారంతా అధ్యయనం చేయాలి. ప్రాచీనాధునిక కవులను బాగా చదువాలి. పదానికి అర్థాలు తెలియక ఏదో అనుకొని ఏవో పదాలు ప్రయోగిస్తున్న యువ నవ కవులు కూడా ఉన్నారు. శబ్దసంపదను పెంచుకోవాలి, అనేక కవుల కవితారీతులను అవగాహన చేసుకోవాలి. ఎవరినీ అనుసరించకపోయినా ఆ అధ్యయనానుభవం తోడవుతుంది. ఒక పుస్తకం రాయగానే పురస్కారం రావాలని ఆశించడం వంటిది కూడా సాహిత్య రంగంలో అంత ఆశించదగినది కాదు.

ఎక్కువ మంది కవిత్వం రాయడం వల్ల తెలుగు భాష ఆయుర్దాయం పెరుగుతుందనే ఆశ మాత్రం కలుగుతుంది.

కే.ఎస్‌. ధన్యవాదాలు సర్‌.

September 30, 2024 1 comment
3 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

కరణ్ బజాజ్

by Taniparti NarayanaRao September 29, 2024
written by Taniparti NarayanaRao

అనగనగా ఓ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నవలా రచయితయ్యాడు, అమ్మ పోయిన బాధలో యోగిగా మారాడు, అకస్మాత్తుగా సన్యాసం వీడి పారిశ్రామికవేత్తగా అవతరించాడు. ఓ స్టార్టప్ ని ప్రారంభించిన పద్దెనిమిదినెలల్లోనే దానికి 2240 కోట్ల రూపాయల విలువ కల్పించి… అనూహ్యంగా అమ్మేశాడు! అదికూడా జూమ్ మీటింగ్ లోనే, కొనేవారిని ముఖాముఖి కలవకుండా. ప్రస్తుతం అతని వయస్సు 42. చిన్న వయసులోనే ఇన్ని అవతారాలెత్తిన ఆ యువ యోగి-కమ్ -పారిశ్రామికవేత్త కరణ్ బజాజ్ ! చిత్రమైన అతని కెరీర్ ప్రయాణమే భారతీయ స్టార్టప్ రంగంలో గత ఏడాది హాట్ టాపిక్ . ఆ ప్రస్థానం గురించి కరణ్ మాటల్లోనే.

న్యూయార్క్ నగరంలో అదో పెద్ద రెస్టరంట్ . అక్కడ మా ఫ్రెండ్ బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఆ రాత్రి కడుపునిండా తిన్నాను… పీకల్దాకా తాగాను. ఫ్రెండ్స్ తో ఉబుసుపోక కబుర్లేవో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంత చేస్తున్నా నా మనసులో బాధ తగ్గడంలేదు. పొగిలి పొగిలి వస్తున్న దుఃఖం ఆగట్లేదు. అప్పటికి అమ్మ చనిపోయి ఆరునెలలవుతోంది. క్యాన్సర్ తో బాధపడుతూ… మృత్యువుతో నిస్సహాయంగా పోరాడుతూ… నా కళ్లెదుటే చనిపోయింది. అమ్మ కోసం నెలన్నరపాటు సెలవుపైన ఇండియా వచ్చిన నేను ఆ బాధలన్నీ అతిదగ్గరగా చూశాను. మృత్యువు తనని నా నుంచి ఇలా దూరం చేయడం తట్టుకోలేకపోయాను. అప్పటిదాకా నేను చాలా పరిణతి ఉన్నవాడిననీ, తార్కిక బుద్ధి ఉన్నవాడిననీ… అనుకుంటూ ఉండేవాణ్ణి. కానీ అమ్మ మరణం నన్ను చిన్నపిల్లాడిలా… బేలగా మార్చింది. ఆ దుఃఖం ఓ వైపున ఉంటే మరో వైపు నాలో ఎన్నో ప్రశ్నలు. ‘అసలేమిటీ జీవితం… పుట్టుకేమిటీ? చావడమేంటీ? పెళ్ళీ పిల్లలూ సంసారం… వీటి గమ్యమేంటీ!’ ఇలా ఎన్నో తాత్విక ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఈ బాధలూ, ప్రశ్నల నుంచి బయటపడదామనే ఆ రోజు పార్టీకి వచ్చాను. ఇక్కడ వేదన పెరుగుతోందే కానీ తగ్గలేదు. నా ఫ్రెండ్ కెరీతో ఇవన్నీ చెప్పుకుని ఏడ్చేశాను. తను ఓ ఐడియా చెప్పింది. ‘ఓ పని చేద్దాం కరణ్ … ఆధ్యాత్మిక యాత్ర చేద్దాం. అవి మన బాధని ఎంత వరకు తగ్గిస్తాయో చూద్దాం… తగ్గేంత వరకూ తిరుగుతూనే ఉందాం!’ అంది. నాకూ ప్రయాణాలంటే ఇష్టమే కాబట్టి ఆ తర్వాతి వారమే అమెరికా నుంచి బయటపడ్డాం. మమ్మల్ని బాహ్యప్రపంచంతో బంధించే సెల్ ఫోన్ , నెట్ , బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ వదిలేసి ప్రయాణం కట్టాం. అప్పటిదాకా… ఓ సగటు భారతీయుడు అమెరికాలో కోరుకునే విలాసాలన్నీ అనుభవిస్తూ వచ్చినవాణ్ణి నేను. అమెరికాలోని క్రాఫ్ట్ ఫుడ్స్ అనే సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్కులోని ఓ పెద్ద లగ్జరీ ఫ్లాట్ లో నివాసం. అన్నింటినీ వద్దనుకుని కేవలం ఓ జతబట్టలు సర్దుకుని నేనూ కెరీ బయలుదేరాం. స్కాట్లాండ్ లోని బౌద్ధ కేంద్రానికి ఫ్లైట్ లో వెళ్లాం కానీ… ఆ తర్వాత మేం చేసిన ప్రతి ప్రయాణం రోడ్డుపైనే. ఇంచుమించు కాలినడకనే… అదీ ఇండియాదాకా! ఆ యాత్ర నన్ను యోగిని చేసింది. ఆ స్థితి నుంచి పారిశ్రామికవేత్తగా ఎందుకయ్యానో వివరించే ముందు… నా గురించి ఇంకాస్త చెప్పాలి మీకు…

బెస్ట్ సీఈఓగా గుర్తింపొచ్చినా..

మా నాన్న ఆర్మీ ఆఫీసర్ . ఆయనకి ఎన్నో బదిలీల తర్వాత మేం హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో స్థిరపడ్డాం. అక్కడి ఆర్మీ స్కూల్ లో చదువుకున్నాను. ఎంత బాగా చదువుతూ ఉన్నా సరే, నా మనసంతా ఎదురుగా ఉన్న హిమాలయాలపైనే ఉండేది… వాటిని ఎప్పుడు అధిరోహించాలా అని మనసు ఉవ్విళ్లూరేది. ప్లస్ టూ తర్వాత బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో చేరాను. ఆ తర్వాత మేనేజ్ మెంట్ పైన ఆసక్తి పుట్టి బెంగళూరు ఐఐఎంలో సీటు సాధించాను. అక్కడ ఎంబీఏ ముగించగానే ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) సంస్థలో మార్కెటింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్లలోనే ఆ సంస్థ తయారుచేస్తున్న ఏరియల్ వాషింగ్ పౌడర్ కి బ్రాండ్ మేనేజర్ గా అమెరికాకి వచ్చాను. ఏరియల్ తో నేను సాధించిన విజయానికి గుర్తుగా అమెరికాకి చెందిన యాడ్ -ఏజ్ సంస్థ 2007లో ‘టాప్ మార్కెటీర్ 40 అండర్ 40’ జాబితాలో నన్ను చేర్చింది. కానీ ఆ విజయాన్ని ఎక్కువ కాలం ఆస్వాదించలేకపోయాను. టీనేజీ నుంచి నాలో ఏదో మూల ఉన్న ‘రచయితని కావాలనే కల’ నన్ను వెంటాడింది.

రచయితని కావాలంటే కొద్దిగానైనా ప్రపంచాన్ని చూడాలి కదా అనిపించింది! దాంతో ఆరునెలలు సెలవుపైన మొదట దక్షిణ అమెరికా దేశాలైన పెరూ, చిలీ, అమెజాన్ ప్రాంతాలనీ, తూర్పు యూరప్ దేశాలనీ, మంగోలియానీ చూశాను. ఈ ప్రయాణంలో నేను చూసిన అసాధారణ వ్యక్తులకే నా ఊహల్నీ జోడించి ‘కీప్ ఆఫ్ ది గ్రాస్ ’ అనే నవల రాశాను. ‘నేనూ రచయితనైపోయానోచ్ …’ అంటూ ఆనందంతో అమెరికా వస్తే అక్కడ ఆర్థిక సంక్షోభం విలయ తాండవం చేస్తోంది! దాంతో నా ఉద్యోగం పోయింది. అప్పటికి నా వయసు ముప్పై ఏళ్లు. నాతోటివాళ్లంతా పెళ్లై కార్లూ, ఆస్తులని కొనుక్కుంటూ ఉంటే నేను మాత్రం ఉన్న డబ్బంతా పర్యటనలోనే ఖర్చుచేసేసి… అమెరికాలోని మా అక్కవాళ్లింట్లో తలదాచుకున్నాను. దాంతో కుటుంబం, బంధువులే కాదు స్నేహితులు కూడా నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ హేళనల మధ్య నాకు ధైర్యం నూరిపోసింది అమ్మే. తనిచ్చిన ధైర్యంతో ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ బోస్టన్ కన్సల్టన్సీ గ్రూప్ (బీసీజీ)లో చేరాను. అందులో మళ్లీ నన్ను నేను నిరూపించుకున్నాను. ఈలోపు 2010లో నా మొదటి ఇంగ్లిష్ నవల ఇండియాలో అచ్చయి సూపర్ హిట్టయింది! అప్పట్లో పేరున్న రచయితల పుస్తకాలే ఐదువేల కాపీలు పోవడం గగనమైతే… నా మొదటి పుస్తకం ఏడాదిలోనే 70 వేల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అది నా జీవితాన్ని మార్చింది. ఈలోపు నా మొదటి పుస్తకం ముద్రించిన సంస్థవాళ్లు రెండో నవల రాయమన్నారు. రాద్దామని కూర్చుంటే… ఏ కొత్త ఆలోచనలూ రాలేదు. మొదటి నవలతోనే నా సరుకంతా అయిపోయిందనిపించింది. దాంతో, నవల రాయడం కోసమే బ్యాగ్ సర్దుకుని ప్రయాణాలు మొదలుపెట్టాను. ఈసారి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆ అనుభవంతో మరో పర్యటక నవల ‘జానీ గాన్ డౌన్ ’ రాశాను. అది లక్ష కాపీలు దాటింది. దాన్ని సినిమాగా తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు కాపీ రైట్స్ తీసుకున్నారు! ఆ తర్వాత క్రాఫ్ట్ ఫుడ్స్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా మారాను. ఈ విజయాలన్నీ ఆనందిస్తుండగానే అమ్మ మరణం… ఓ సునామీలా నన్ను ముంచెత్తింది. ఆ ఊపిరాడని పరిస్థితిలోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టాను.

అదే ధర్మం అని తెలిసింది.

కెరీతో నా ప్రయాణంలో కొన్ని దేశాల్లో ప్లాట్ ఫామ్ పైన పడుకున్నాం. కొన్నిసార్లైతే ఆగకుండా 50 కిలోమీటర్లూ ప్రయాణించాం. అలా ఇండియా వచ్చి మదురైలోని శివానంద ఆశ్రమంలో చేరాం. రెండు నెలలపాటు అతికఠినమైన శిక్షణ ఇచ్చారక్కడ. ఉదయం ఐదున్నరకే లేచి మంచుగడ్డని తలపించే చన్నీళ్లలో స్నానం చేయడం, కటిక నేలమీద పడుకోవడం, రోజూ యోగా, ధ్యానం మా జీవిత దృక్పథాన్నే మార్చింది. ఆ తర్వాత రుషికేష్ లోని శివానంద ఆశ్రమానికి వెళ్లాం. అక్కడే నేను సన్యాసిగా మారాను. ఏడాది తర్వాతే నాలో చైతన్యం మొదలైంది. మన భారతీయ చింతన ప్రకారం… ప్రతి జీవికీ తాను మాత్రమే నెరవేర్చగల కర్తవ్యం ఒకటి ఉంటుంది. దాన్ని స్వధర్మం అంటారు. నేను ఓ యోగిగా హిమాలయాల్లో ఉండగలిగినా… నా స్వధర్మం పెద్ద సంస్థల్ని సృష్టించడమేనని అర్థమైంది. దాంతో సన్యాసానికి స్వస్తి పలికాను. అమెరికా వచ్చి కెరీని పెళ్ళి చేసుకున్నాను. ఆధ్యాత్మిక జీవనం మనస్సునీ, శరీరాన్నీ శక్తిమంతం చేయడమే కాదు… ప్రాపంచిక వ్యవహారాల్ని తామరాకుమీద నీటిబొట్టులా చూసేలా చేసింది. కోపతాపాలకి దూరం చేసింది. కాకపోతే, ఇంత పరిణతి తర్వాతా ఓటమి నాకు ఎదురవుతూనే వచ్చింది…

వరుస అపజయాలు.

భారతదేశంలో యోగిగా నా ఆధ్యాత్మిక అనుభవాలతో ‘ది సీకర్ ’ అనే నవల రాశాను. దాదాపు 62 పుస్తక ప్రచురణ సంస్థలు దాన్ని తిప్పికొట్టాయి! చివరికి పెంగ్విన్ సంస్థవాళ్లు అచ్చేసినా… ఆశించినంతగా అమ్ముడు పోలేదు. ఆ తర్వాత ఓ స్టార్టప్ లో పెట్టుబడులు పెడితే అందులోనూ నష్టం వచ్చింది. ఆ తర్వాత డిస్కవరీ ఛానెల్ ఇండియా సంస్థకి వైస్ ప్రెసిడెంట్ ని అయ్యాను. ఆ సంస్థ కోసం కొత్తగా హిందీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ మొదలుపెట్టాను. మరెన్నో చేయాలనుకున్నాను కానీ సాధ్యం కాలేదు. నా ఉద్యోగం కాస్తా నెలకోసారి వెళ్లి ప్రధానమంత్రినీ, మంత్రుల్నీ కలవడంతోనే సరిపోయేది. అది నాకు సరిపడక రాజీనామా చేశాను. అంత మంచి హోదాకి రాజీనామా చేశానని తెలిసి నా భార్యవైపు వాళ్లు నన్ను పిచ్చోడిలా చూడటం మొదలుపెట్టారు. ఇద్దరు పిల్లల తండ్రిగా నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏ అత్తామామలు భరిస్తారు చెప్పండి! కానీ ఒకప్పుడు మా అమ్మ చేస్తున్నట్టు ఇప్పుడు మా ఆవిడ నన్ను వెనకేసుకొచ్చింది. ‘అతనో క్రియేటర్ … తను ఇలాగే ఉండగలడు!’ అని తనవాళ్లతో వాదించింది. తనకి నాపై ఉన్న ఆ నమ్మకమే నా ‘వైట్ హ్యాట్ జూనియర్ ’ సంస్థకి పునాది!

శిక్షకులందరూ మహిళలే.

పిల్లలకి కంప్యూటర్ కోడింగ్ ని ఓ ఆటలా నేర్పించే సంస్థ నాది. ఆన్ లైన్ లో ఇలాంటి శిక్షణ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వడం లేదని తెలిసి దీన్ని మొదలుపెట్టాను. కేవలం మహిళల్ని మాత్రమే టీచర్లుగా తీసుకున్నాను. ఇందుకూ… మా అమ్మ జీవితమే కారణం. అమ్మ అప్పట్లోనే పీజీ చేసినా నాన్న బదిలీల కారణంగా తనకంటూ కెరీర్ లేకుండా పోయింది. తనలోని ఆ బాధని నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ వచ్చాను. అందుకే, నేను కోడింగ్ కోచ్ లుగా మహిళలు మాత్రమే ఉండాలనుకున్నాను! ఏ కాస్త ఆర్థిక స్వాతంత్య్రం ఇచ్చినా వాళ్లు అద్భుతాలు చేస్తారనే నమ్మకం నాలో బలంగా ఉండేది. మావాళ్లు దాన్ని నిజం చేశారు!

ఆ అద్భుతాలు ఇవి.

కేవలం పదిమంది ఉద్యోగులతో నా సంస్థని 2018 అక్టోబర్ లో ప్రారంభించాను. మొదటి ఏడునెలలు పెద్దగా లేదుకానీ ఆ తర్వాత పిల్లలూ, తల్లిదండ్రుల నుంచి మేం ఆశించిన స్పందన మొదలైంది. దాంతో టీచర్ల సంఖ్యని నాలుగు వందలకి పెంచాం. అక్కడి నుంచి మరో నాలుగు నెలల్లో నాలుగువేలకి చేర్చాం. అమెరికాలోనూ ఈ సేవలు అందించడం ప్రారంభించాం. రెవెన్యూ పది కోట్ల నుంచి వందకోట్ల మైలురాయిని అందుకుంది. రోజువారి క్లాసుల సంఖ్య పాతికవేలకి చేరింది. దాంతో బైజూస్ మా సంస్థని కొంటామంటూ ముందుకొచ్చింది. సుమారు రూ.2,240 కోట్లు… నగదుగా ఇస్తానంది! కేవలం ఏడాదిన్నర వయసే ఉన్న సంస్థకి ఇంత డిమాండు రావడం ఓ రికార్డు. నాకూ బైజూస్ ద్వారా నా ఆలోచనలు మరింత ఎక్కువమందికి చేరడం మంచిది అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. సంస్థని అమ్మినా సీఈఓగా నిర్వహణ బాధ్యతలన్నీ నేనే చూస్తున్నాను. మా టీచర్ల సంఖ్యని లక్షమందికి చేర్చడం, దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం ప్రస్తుతం నా లక్ష్యాలు. ఇవి పూర్తయ్యాక ఎప్పట్లాగే మరో సరికొత్త రంగంవైపు వెళ్లాలనుంది..!

మా ఆవిడ కెరీ చాలా గ్రేట్.

మా ఆవిడ కెరీ, నేనూ, మా ఇద్దరు పాపలు నీలా, రూమీ అందరం ముంబయిలోనే ఉంటున్నాం. మా ఆవిడ పిల్లల పోషకాహార నిపుణురాలు. తను లేకపోతే నా విజయాలే లేవని చెప్పడం అరిగిపోయిన రికార్డ్ లోని వాక్యంగా అనిపించొచ్చుకానీ… అది వందకు వెయ్యిశాతం నిజం. తనకే నా మీద నమ్మకం లేకుంటే ఇన్ని అపజయాల తర్వాత నిలదొక్కుకునేవాణ్ణి కాదు. బైజూస్ డీల్ తో సంస్థ ప్రొమోటర్ గా వెయ్యి కోట్లు వచ్చినా… ఒకప్పటి మా సన్యాస జీవితమే అలవాటై మేం సొంత ఆస్తులేవీ కొనలేదు. మాకు సొంతిల్లూ, కారూ లేవు. ఇప్పటికీ వీలున్నంత తక్కువ ఖర్చుతోనే నెట్టుకువస్తున్నాం. మా పిల్లలకీ ఈ ‘స్వచ్చంద పేదరికాన్ని’ నేర్పిస్తున్నాం!

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

పాఠశాల అనే విశాల భావం మొదట ఎవరు తెలుసుకున్నారు?

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

⁠గ్యాస్ కోయిన్ కు ఐదుగురు పిల్లలు. అతని భార్య అంటుండేది…” వీళ్లు ఆశ్చర్యం కలిగించే ఒక రకమైన మొసలి లాంటి జంతువులు” అని. ఆమె చెప్పేది వాస్తవమే.( కథల్లో ఆశ్చర్యానికి ఈ మొసలి పేరు వాడుతుంటారు).
ఈ ఐదుగురు పిల్లలు
ఉదయం నుండి చాలా రాత్రి వరకు బయట కీచులాడుతూ, కొట్లాడుతూ, బొడుపులు గాయాలు చేసుకొని తల్లికి చూపించేందుకు ఒకరి తరువాత ఒకరు ఏడ్చుకుంటూ ఇల్లు చేరుతుంటారు. ఈ విషయం గురించి తల్లి చేతులు జాడించుకుంటూ ,” తనకు ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ దురుసు పిల్లలు త్వరలోనే నా తల నరాలు చిట్లిపోవడంలో సందేహం లేదు ” అని అనేది.
ఆమె అన్నదంతా వాస్తవమే అని ఆమె భర్త అంగీకరించాడు. ఆ అంగీకారం ఆమెకు మనసుకు ఎప్పటికన్నా ఎక్కువ బాధ కలిగించింది.
” అలా కూర్చొని తల ఊపకుండా బయటికి వెళ్లి ఏదైనా ఉపాయం చెయ్యి” అంది చికాకుగా.
ఇంట్లో పిల్లల అల్లరి, భార్య గులుగుడు భరించలేక భర్త ఏదైనా చేయాలనుకుని బయటికి వెళ్ళాడు.
ఆరోజు ఆయన అనుకోకుండా ఒక మిత్రుని కలుస్తాడు. పాపం ఆ మిత్రునికి పిల్లలు లేరు, ఉద్యోగం లేదు. ఆయన ఉద్యోగ వేటలో తిరుగుతున్నాడు. అతన్ని చూడగానే గ్యాస్ కోయిన్ మనసుకు ఒక ఆలోచన తట్టింది.
“ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కట్టించి గ్రామస్తుల పిల్లలందరిని కనీసం సగం రోజైనా దాంట్లో కూర్చోబెట్టి తన మిత్రుడిని అక్కడ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? పిల్లలు విసుగు చెందకుండా నా మిత్రుడు వాళ్లకు ఏదో బోధించవచ్చు. మధ్య మధ్యన చదివించడం, రాయించడం , సంగీతం బోధించడం చేయవచ్చు. అది పిల్లలకు చాలా ఉపయోగకరం అవుతుంది కూడా ! ” అనుకున్నాడు. ఆ తీరుగా అదే ప్రథమ పాఠశాల గా మొదలైంది. ఆ టౌన్ పిల్లలకు అతనే ప్రథమ ఉపాధ్యాయుడు అయినాడు. అందరికీ పిల్లలతో సమస్య లేకుండ అయింది. కానీ గ్యాస్నోయన్ ఐదుగురు చిచ్చర పిడుగులను అదుపులో ఉంచడంతో ఆ ఉపాధ్యాయుని తల త్వరలోనే నెరిసిపోయింది.
ఈ విధంగా మొదటి పాఠశాల అనే విశాల భావం గ్యాస్ కోయిన్ తెలుసుకున్నాడు. ( How Mr.Gascoyne invited school?
Internet కొత్త విషయాలను ఆవిష్కరిస్తుంది.)

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వేదం

by K K Tayaru September 29, 2024
written by K K Tayaru

90% శాతం మంది భారతీయులకు ఆ పదం గాని, అసలు అవి ఏమిటో ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు” శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి”.

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది. ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే.

అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరు పొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన – ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాది మంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు.

వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు. అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధి పొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభై రూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంత కాలం ఆమెకు మూడు వందల రూపాయల వంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబ పింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అది కూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమ వాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది.

అది మన జ్ఞానసంపద, అది మన జాతి వైభవం. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.

గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి.

ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ, స్క్రాప్ అంతా మనదేశంలో.

పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు. మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము. మన దేశ ఔన్నత్యం ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ ఇంచు పెరుగుతుంది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ఓ మేక పిల్ల ఓ తోడేలు

by ఒద్దిరాజు మురళీధరంరావు September 29, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగా అనగా ఒక ఊరు, ఆ ఊరి చివర్లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నెల్ అనే మేక తన కూతురు నెల్లితో ఉంటుండేది.
ప్రతిరోజు నెల్ క్యాబేజీ కొనడానికని దుకాణానికి వెళుతూ ఉండేది. ఆమె బయటికి పోయినప్పుడు నెల్లీ తో ” నువ్వు నేను వచ్చి తలుపు కొడితే తప్ప ఎవ్వరికీ తలుపు తీయవద్దు నెల్లీ” అని చెప్పేది.
నెల్లి తలుపు బోల్ట్ పెట్టేసి తల్లి తిరిగి వచ్చేవరకు ఎదురుచూస్తూ ఉండేది.
ఒకరోజు తోడేలు వచ్చి ” తలుపు తెరువు నా ముద్దుల మేకపిల్ల నేను నీ తల్లి నెల్ ను” అన్నది.కాని, నెల్లికి ఆ గొంతు కొద్దిగా వేరుగా అనిపించి తలుపు తెరవలేదు.
మర్నాడు కూడా తోడేలు అలాగే మళ్ళీ వచ్చింది. ఈసారి కీచు గొంతుతో దాదాపు మేక గొంతు లాగానే మాట్లాడుతూ
” పాపా! తలుపు తెరువు .ఇది నేనే! నేను ఇంటికి క్యాబేజీ తెచ్చాను.” అన్నది. నెల్లీ బోల్ట్ తీసి తలుపు తెరిచింది. వెంటనే ఒక నల్ల తోడేలు పంజా తలుపు నెట్టి లోపలికి రాబోయింది.
” నువ్వు నా తల్లివి కాదు”అని అరిచి నెల్లీ తలుపును గట్టిగా మూసేసింది. అలా అప్పుడైతే ప్రమాదం తప్పించుకుంది.
నెల్ ఇంటికి రాగానే ఆ చిన్న పాప నెల్లి జరిగిందంతా తల్లితో చెప్పింది.
‘ కొద్దిగా ఆగు పాడు బుద్ధి ముసలి తోడేలా’ అని తల్లి మనసులో అనుకున్నది తల్లి నెల్.
మర్నాడు ఆమె ఇంటి దగ్గరే ఉండి, ఎదురు చూస్తూ ఉన్నది.
ఒక మధురమైన గొంతు ” లోనికి రానివ్వండి” అని అన్నది.
ఎప్పుడైతే మేక పిల్ల తలుపు కొద్దిగా తెరిచిందో తోడేలు తన పిండి పడిన రెండు పంజాలు పాపను మోసం చేద్దామని లోపలికి చాపింది కానీ అది లోపలికి పోయే ప్రయత్నం చేయకముందే తల్లిమేక ఒక దుడ్డు కర్ర చేతిలో పట్టుకొని ఎట్లా కొట్టిందంటే…..
మేక పిల్లను తినేసి తన ఆకలి తీర్చుకుందామనుకున్న సంగతే తోడేలు మరిచిపోయింది, పరుగులెత్తింది.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us