మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

ఆషాఢ జాతర

by Padmasri Chennojwala July 31, 2024
written by Padmasri Chennojwala

జానపదులు గ్రామ దేవతకు సమర్పించుకునే నైవేద్యం

పసుపు పూసిన కొత్త కుండలకు
కుంకుమ ముగ్గుపిండి వేపమండలు వెలిగే దివ్వెల శోభల నడుమ అన్న పానీయాలతో అమ్మవారికి సమర్పించే భోజనమే బోనం

సంప్రదాయ వస్త్రధారణలో
సౌభాగ్య చిహ్నాలు ధరించిన
సర్వమంగళ స్వరూపిణులు

కల్లాపి జల్లిన వాకిళ్లు కొలువుదీరిన రంగవల్లులు
పసుపు రాసిన గడపలు వేప కొమ్మలతో అలంకరించబడిన వీధులు జానపద శైలిలో హోరెత్తించే అమ్మవారి కీర్తనలు

ఒంటిపై పసుపు నుదుట కుంకుమ
కాలి గజ్జెలు ఎర్ర వస్త్రం ధరించిన స్ఫురద్రూపి బలశాలి అమ్మవారి సోదరుడే పోతరాజు

కార్యక్రమ ఆరంభకుడు
భక్త సమూహ రక్షకుడు

రౌద్రాంశ ప్రతీకైన కాళీమాతను
శాంతింపజేసే తంత్రమే సాక

కర్ర కాగితంతో కూర్చిన తొట్టెలు ప్రత్యేక ఆకర్షణ

గుగ్గిలం మైసాచి డబ్బు చప్పుళ్ళు పోతరాజు విన్యాసాల నడుమ దుష్టశక్తులను దునుమాడే తతంగమే అమ్మవారి ఊరేగింపు

రంగం గావు ఫలహారపు బళ్ళు
పల్లె పాటలు ప్రాంతీయ నృత్యాల నడుమ ఆషాడంలో అంగరంగ వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ

              పద్మశ్రీ చెన్నోజ్వ
July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధన్వంతరీ స్వరూపం

by Padmasri Chennojwala July 31, 2024
written by Padmasri Chennojwala

కొడిగట్టే దీపాన్ని వెలిగించే ధన్వంతరీ ప్రతినిధి

సృష్టికి ప్రతిసృష్టి చేసే అపరబ్రహ్మ

దేహమనే ప్రమిదలో జ్వాలై వెలిగే జీవాత్మకు చమురునందించే శక్తి ప్రదాత

నిస్తేజమయ్యే శక్తి కేంద్రాలను ఉత్తేజపరిచే చైతన్యమూర్తి

తిమిరంతో సమరం చేసే మేని యంత్రాన ఆయువు నింపే ప్రాణదాత

పట్టుతప్పే అంగాలకు ప్రాణవాయువు నందించే జ్ఞానదీపం

ఆరోగ్య పరిరక్షణకే అంకితమైన కారుణ్యమూర్తి

పవిత్ర వృత్తికి తోడైన మహోన్నత ప్రవృత్తితో రోగిని యోగిగా మలిచే విశ్వబ్రహ్మ

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

2024 జూలై మయూఖ విషయ సూచిక

by mayuukha July 30, 2024
written by mayuukha

సంపాదకీయం :-

శతవత్సరాల కవితాశరధి దాశరథి – డాక్టర్ కొండపల్లి నీహారిణి,

మయూఖ పత్రిక సంపాదకులు

కవితలు:-

1. యుద్ధం లేనిది ఎక్కడ?-మారం రాజు శ్రీనివాసరావు

2. సెల్యులార్ జైల్ – శాంతి

3. మనసు – మాట – అరుణ ధూళిపాల

4. The learned poem – ఆర్ ఎం ప్రభులింగ శాస్త్రి

5. పిచ్చుక – గడ్డం సులోచన

6. శవయాత్ర పాఠం – కందాలై రాఘవాచార్య

7. అల్యం గల్లంతైంది – డాక్టర్ బండ సరోజన

8. నాన్న నాకు కొంచెం ధైర్యం యివ్వు- మధు జెల్లా

9. మహాకవి జాషువా స్మృతి గీతాలు – బొద్దుల లక్ష్మయ్య

10. బాట – జ్యోత్స్న తాతి రాజు

కథలు :-

1. దశ దిశ- దేవులపల్లి విజయలక్ష్మి

2. ఉచితం – లక్ష్మీ మదన్

3. శిక్షెవరికి – విజయ రంగనాథం

4. తిరిగి వచ్చిన వసంతం – మంచి భారతి

 వ్యాసాలు :-

1. భారతదేశం మనకు ఏం నేర్పిస్తుంది? – దేవనపల్లి వీణా వాణి

2. అబ్బూరి ఛాయాదేవి – రాధిక సూరి

3. కారా మాస్టారు విజయ రంగనాథం

4. పరిశోధక పరమేశ్వరుడు ఆచార్య వెలుదండ నిత్యానంద రావు – బి. ఆంజనేయులు

5. కత్తి పట్టిన కవయిత్రి – విజయ రంగనాథం

6. హలో హల్లులు- విజయ కందాళ

7. పురుషోత్తమ మాసం – విజయ కందాళ

8. వేణు నక్షత్రం కథలు సమకాలీన జీవన చిత్రాలు- రంగరాజు పద్మజ

9.లక్ష్మయ్య కవిత్వంతో కరచాలనం –  దాస్యం సేనాధిపతి

10. ఆషాడ మాస విశిష్టత-  విజయ గోలి

11. కవిత్వాస్వాదన ( ధారవాహికం) సందినేని నరేంద్ర

         1. మాదాడి సత్యనారాయణ రెడ్డి

         2. డాక్టర్ కొమర్రాజు  రామలక్ష్మి

        3. గుండు రమణయ్య

12. మనం మన సమాజం మారేది ఎప్పుడో ? –  డాక్టర్ బండ సరోజన
13. అవిశ్రాంత సాహిత్య సృజన శీలి’ పెన్న’ -జి శ్యామల దేవి

 ధరవాహిక నవల :-

 దొరసాని- లక్ష్మీ మదన్

పుస్తక సమీక్ష:-

1. వచన కవితా కన్య రూప లావణ్య దాస్యం సేనాధిపతి

      “దిక్సూచి”- అరుణా ధూళిపాల

2. వేణు నక్షత్ర గోపాల్ ” అరుగు” కథలు చదవాల్సిన కథలు

        –  ఎన్.నరేష్ చారి

  3. నైతిక విలువల వెన్నెల వెలుగుల ఆణిముత్యం  వడ్డేపల్లి వెంకటేష్ “పిల్లల జాబిల్లి”- మధు జెల్లా

4. అరుణ కవిత అంతరంగం –  డా.చిటికెన  కిరణ్ కుమార్

ఇంటర్వ్యూలు:-

1. ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకులు ‘విహారి గారి’ తో  మయూఖ ముఖాముఖి – అరుణ ధూళిపాల

2. ప్రముఖ నవలా రచయిత సామాజికవేత్త ‘బిఎస్ రాములు ‘గారితో మయూఖ ముఖాముఖి – అరుణా ధూళిపాల

3. ప్రముఖ కవి, అనువాదకులు ‘వారాల ఆనంద్ గారి’ తో మయూక ముఖాముఖి- ఎస్ .‌అనంతాచార్య

బాల సాహిత్యం:-

1. మన’ విశ్వ’ వీడియో

2. “భక్త ప్రహ్లాద” నాటకం – బి. లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

అనువాద సాహిత్యం:-

1 అలెన్ అతని కుమారుడు ( కథ)- ఒద్దిరోజు మురళీధర్ రావు

2. చిన్న గింజంత బంగారం ( కథ ‌)-  ఒద్దిరోజు మురళీధర్ రావు

3. గుల్జార్ కవిత్వం – గీతాంజలి, డాక్టర్ భారతి (అనువాద కవిత్వం) కవిత్వాస్వాదన –  నరేందర్ సందినేని

ఇంద్రధనస్సు :-

1. చీరలోని గొప్పతనం ( పాట విశ్లేషణ) – రామకృష్ణ మిద్దె

2. వాగిర చారిత్రాత్మక నవల పుస్తక సమీక్ష ( ఆడియో)- రంగరాజు పద్మజ
3. వేముగంటి శక్తిమతి సాహిత్య యాత్ర ‘ ఆకాశవాణి ప్రసంగం ‘(ఆడియో)

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

శతవత్సరాల కవితా శరధి దాశరథి

by Kondapally Neeharini July 30, 2024
written by Kondapally Neeharini

2024 మయూఖ పత్రిక జూలై సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, సంపాదకులు

ఈ ఆధునిక ప్రపంచంలో నిత్య సత్యాలకు విలువనిచ్చే సందర్భాలను తరచి చూడాల్సిన పరిస్థితులున్నవి. ఇదంతా stage of publicity నడుస్తున్న కాలం. ఈ ప్రచార పటాటోపాలు లేకుండా వాళ్ళ జీవితమంతా పోరాటాలకు ధారపోసి వెలుగులోకి వచ్చిన కొందరు మహనీయులను స్మరించుకోవడం కొరకనే శత జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉంటాం.
మహాప్రళయంగా ఉద్యమించిన సముద్ర ఆటుపోటుల వంటి తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలకు ఎందరో వీరులు బలయ్యారు. బరిలోకి దిగి ఉద్యమించిన నేతలందరూ నిస్వార్థ జీవితాలే గడిపారానాడు. సాహిత్యం అనే కత్తిని చేతపట్టి సమాజమనే యుద్ధభూమిలో రాజునెదిరించిన విప్లవకణిక దాశరథి కృష్ణమాచార్య.
ఏ నైసర్గిక సాధన కోసం ఆనాడు గళమెత్తాడు దాశరథి? ఏ అస్తిత్వం కోసం జెండా నెత్తాడు దాశరథి?? సామాన్యుల కోసం! సంఘం కోసం!!
“ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో …” అంటూ కష్టజీవి పక్షాన కలమెత్తిన కవి. ” మా నిజాం రాజు జన్మజన్మాల బూజు …”అంటూ ప్రభుత్వ పనులను ఎదిరించి స్వాతంత్ర్యం కోసం తలయెత్తిన కవి. అలసత్వాలపై, అధికారపు పెత్తనాలపై కవిత్వ నిప్పులు చిమ్ముతూ కవిత్వం రచించినా , కరుణ రసాత్మకంగా పేదవాడి పక్షాన కవిత్వం రచించినా దాశరథి దాశరథే! ఇకమరో కవి ఉండడు అన్నంత గొప్ప కవి.
అది కవిత్వం కావచ్చు అది పాట కావచ్చు బడుగు జీవుల బాధల గాథలు దాశరథి కవిత్వంలో కవిత్వమై కన్నీరు తెప్పించాయి. కవి ధర్మం, కవిత్వ ధర్మం రెండు ఒక్కటి గా కనిపించిన దాశరథి సాహిత్యం ఇప్పుడు ఈ కాలంలోనూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్న వ్యక్తిగా, పద్యాల చురకత్తులు విసిరిన శక్తిగా దాశరధి ఎట్లా నిలబడగలిగారు? ఎట్లా సినీ జగత్తులో అక్షర దివ్వె గా వెలగలిగారు? ఇవి తెలుసుకోవాలి.
ఎంతసేపు పరనింద,ఆత్మ స్తుతి తో బ్రతుకుతున్న మనుషులకు మార్గదర్శకత్వంగా దాశరథి వంటి కవుల కవిత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఈనాటి సాహితీవేత్తలది, పత్రికారంగానిది, ప్రభుత్వానిది. అతిగా పెరిగిన లంచగొండిలపై కంచు గొంతు ఎగరాలి. అడుగడుగునా అవినీతి అవతారాలు కనిపిస్తున్న కసాయి లోకానికి కనువిప్పు కలిగించే దాశరథి కవిత్వం కావాలి.

ఎంతసేపు వాగాడంబరమూర్తుల ఉపన్యాసాలు వినీ వినీ యువత నిస్తేజం లో పడిపోతున్నది. అభ్యుదయ భావకాంక్షతో సత్కవిలోకానికే సంభ్రమాశ్చర్యాలు కలగజేసిన దాశరథి పద్య శక్తి ని తెలుపాలి.
సంగీతం ఆపాత మధురం, సాహిత్యం ఆలోచనామృతం అనే మాట దాశరధి నోట వచ్చిన పాట, పద్యాలు పెద్ద రుజువు.
ఋతు బద్ధంగా వికసన చెందే పంట చేను,ఎండి కడుపు ఆకలి మంటను చల్లార్చే పంట దాశరథి సాహిత్యం. కవుల గురించి రచించినా , పీఠికలు రాసినా, సభనుద్దేశించి మాట్లాడినా జవం జీవం ముప్పిరిగొని పాఠకులకు శ్రోతలకు ఆనందాన్ని ఆలోచనలని కలిగించినవి.
నాటి ఖమ్మం జిల్లా మానుకోట తాలూకా లోని చిన్న ఊరు గూడూరు లో 1925 సంవత్సరంలో జూలై నెలలో జన్మించాడు దాశరథి. పల్లెటూరి చదువు నుండి పట్నం చదువులకు ఎదిగిన ఈ పట్టభద్రుడు పాటను పట్టుకొని చిత్రసీమలోకి అడుగు పెట్టే వరకు దాటిన మైలురాళ్ళు ప్రతి అడుగులో దాశరథికి కొత్త పాఠాలు నేర్పించాయి. తిమిరంతో సమరం జరిపినా ,రుద్రవీణలు మోగించినా, అగ్ని ధారలు కురిపించినా, నవ మంజరులు మ్రోగించినా,కవితా పుష్పకం వికసింపజేసినా, పునర్నవం తో కవితా ప్రక్రియని పరిపుష్టం చేసినా దాశరథి దాశరథే!!
” ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలె గాని
ఇట ఉషస్సులు లేవు,భరింపరాని
అంబువాహన సందోహ నివాళిగాని…..”
భాషా పాండిత్యాల విలువ ఏమిటి అంటే , దాశరథి గారి ఇటువంటి కవిత్వం చదివితే తెలుస్తుంది.
” అది తెలంగాణలోన దావాగ్ని లేచి
చుట్టుముట్టిన భయద సంక్షోభ వేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూసుకొని నిక్కినట్టి పిశాచహేల…”
తప్పు చేసే ప్రభువును ఎదిరించే ధైర్యం అంటే ఇటు ఉండాలి అనేది దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడే ఇదే మాట అనే స్తాను….”అంటూ వాస్తవికతకు అద్దం పడుతూ కృతకంగా లేకుండా స్వచ్ఛమైన కవిత్వాన్ని రాయడం అంటే ఏమిటో దాశరథి గారి ఇటువంటి కవిత్వాన్ని చదివితే తెలుస్తుంది.
” అంబర చుంబి సౌధములు కాయవు పోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగలేని ధనవంతుల బంగారు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు దగ్గరెలెమ్ము! నీ నవా
స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టు మా! ” అంటూ పీడిత పక్షాన ఎలా గొంతెత్తాలో దాశరథి గారి ఇటువంటి పద్య రచనా పాటవాన్ని చూస్తే తెలుస్తుంది.
జైలులోను తమ నిరసన గళాన్ని పద్యమై బొగ్గుతో రాసే వినిపించినా,
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి సాహితీ చైతన్యాన్ని రగిలించినా, అద్భుతమైన ఉపన్యాసాలతో సాంస్కృతిక చైతన్యాన్ని రగిల్చినా కవిగా ఉద్యమ తేజంగా దాశరథి ఓ పెద్ద ఉదాహరణ. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసినా ఎందరో కవులకు దాశరథి మార్గదర్శి అయ్యాడు.
“నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవని రా” అంటూ మచ్చలేని ప్రేమ, మలినం కాని ప్రేమ విలువేమిటో తెలిపాడు.
“గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది” అంటూ పల్లె పట్టున గంతులేసే యవ్వన కాలాన్ని ప్రాసాలంకారాల పాటల్లో పలికించాడు.
” మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా నన్నెన్నడు మరువకురా కృష్ణా”అన్నా,” రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్య” అని వేడుకొనమన్నా,

” నా తెలంగాణ కోటి రత్నాల వీణ” అంటూ ఆనాటి దురాగతాలను ఎదిరించే రుద్రవీణను మోగించిన దాశరథి అంటే అక్షర విప్లవం.

చదువు అంటే బద్ధకం,పనిచేయడం పైన నిరాసక్తత, ఏదో సాధించాలన్న తపన లేని తనం, అయిన వాళ్ళను కూడా ఆదరించలేని యువతరం ఇప్పుడు మన ముందుంది. ఒక నిబద్ధతతో ఒక విశ్వాసంతో ఆనాడున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులను ఎదిరించినా,స్వాతంత్ర్య అందిన తర్వాత ధీటుగా నిలబడినా దాశరథి గారు ఇప్పటికీ ఆదర్శవంతులే. స్వదేశాభిమానమైనా సంప్రదాయ వాదమైనా దాశరథికి ఇష్టమైనవి. ప్రకృతికి మనుషులకు పారస్పరిక బాంధవ్యాన్ని ఆకాంక్షించాడు, వ్యక్తికి సమాజానికి మధ్య సాన్నిహిత్యాన్ని చాటి చెప్పాడు, సాహిత్యం సంఘానికి చేసే మేలును తన రచనలలో చూపాడు.
” రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు పగులకపోతే లేదా సొల్యూషన్?
హింసా యుద్ధం అవుట్ డేటెడ్ అని నేనంటాను!
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్!!” అంటూ ఈ కవిత్వమేదో నిన్న మొన్న రాసినట్టున్నదే అనే ఆలోచనలో పడవేసే దాశరథి అంటే మోడరన్ థింకింగ్ కు నిలువెత్తు నిదర్శనం.
దాశరథి గారి కవిత్వం సార్వకాలికమైంది సర్వజనీనమైనది.

“గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదులుకోను, కాలం నా కంఠమాల” అని చెప్పిన మాటలు దాశరథి శతవత్సరాల కవితా శరధి అంటున్నాయి. నూరేళ్ళ వారి జీవితమే స్ఫూర్తి దాయకం.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నేటితరం

by Kattekola Vidyullata July 30, 2024
written by Kattekola Vidyullata

“రాజీవ్, అనిక కోసం మనం తగినంత చేస్తున్నామని నీకు అనిపిస్తోందా?” ప్రియ అడిగింది. అలా అంటున్న సమయంలో ఆమె కంఠం ఆందోళనతో నిండిపోయింది. ప్రతి రోజూ ఉదయం ఇద్దరూ కలిసి కాఫీ తాగే సమయంలో ఆ దంపతులు కుటుంబం గురించి, ముఖ్యంగా వాళ్ళ ప్రేమ ఫలం ఐనటువంటి చిన్నారి అనిక భవిష్యత్తు గురించి ఆలోచించడం, మాట్లాడుకోవడం చేస్తుంటారు. ఉదయం సూర్యుడు వంటగది కిటికీ గుండా తొంగి చూస్తూ, సొగసైన కౌంటర్‌టాప్‌పై వెచ్చని తన చూపులు ప్రసరిస్తున్నాడు.

హాల్ లో అద్దంలో చూసుకుంటూ షేవింగ్ చేసుకుంటున్న రాజీవ్, తన భార్య వైపు చూస్తూ,”మనం మన వంతు కృషి చేస్తున్నాం ప్రియా. మనిద్దరం కష్టపడి పని చేస్తున్నాం, తనకు కావలసినవన్నీ  అందించేందుకు ప్రయత్నిస్తున్నాం కదా! ఇంకా నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు?” అనునయంగా భార్యను అడిగాడు రాజీవ్.

“నాకు తెలుసు, కానీ కొన్నిసార్లు మనం పాపకు తగినంత సమయం ఇవ్వడం లేదని నాకు అనిపిస్తుంది. తను మంచి గ్రేడ్‌లతో మాత్రమే కాకుండా మంచి విలువలతో ఎదగాలని నేను కోరుకుంటున్నాను,” ప్రియఘ ఘ తన కాఫీ సిప్ చేసుకుంటూ కౌంటర్ వైపు వాలింది.

రాజీవ్ నిట్టూరుస్తూ ఆమె భుజం మీద చేయి వేసి ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. “నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఇకపై నేను ప్రతి సాయంత్రం, ఇంకా వారాంతాల్లో కూడా తన కోసం సమయాన్ని వెచ్చిస్తాను. ఇంకా నాన్న చనిపోయిన తర్వాత అమ్మ కూడా ఊర్లో ఒక్కతే ఉంది కదా, తనని కూడా ఇక్కడికి రమ్మన్నాను. మనం బిజీగా ఉన్న టైంలో అనికని కనిపెట్టుకొని ఉంటుంది. పాపతో ఉండడం వల్ల అమ్మ కూడా తన ఒంటరితనం నుంచి కాస్త కోలుకుంటుంది, ఏమంటావు?”

“నేనేమంటాను అనేది నువ్వు అమ్మని పిలవక ముందు చెప్పాలి. అత్తయ్య వచ్చి మనతో ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కాస్త ముందుగా చెబితే పాపని మెంటల్ గా ప్రిపేర్ చేసేవాళ్లం. నీకు తెలుసు కదా ఈ కాలం పిల్లలు వాళ్ల ప్రైవసీ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.”

అప్పుడే అనిక కిచెన్‌లోకి దూసుకొచ్చింది. ఆమె భుజంపై స్కూల్ బ్యాగ్ వేళ్ళాడుతోంది. “అమ్మా, నాన్నా, నాకు సైన్స్ ప్రాజెక్ట్‌లో మీ సహాయం కావాలి!”

ప్రియ నవ్వుతూ కూతురి స్థాయికి మోకరిల్లింది. “అఫ్ కోర్స్, బంగారం, ఏదీ, నీ ప్రాజెక్ట్ కోసం ఏం చేయాలో చూద్దాం.”

వారు ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించే ముందు, డోర్‌బెల్ మోగింది. అది రాజీవ్ తల్లి శాంత. ఆమె వారితో కలిసి గడిపేందుకు వచ్చింది,

“అమ్మా, స్వాగతం!” రాజీవ్ ఆమె బ్యాగులు తీసుకుని ఆప్యాయంగా పలకరించాడు.

“హలో రాజీవ్. హలో ప్రియా, హలో అనికా బంగారం,” అంటూ సంతోషంగా పలకరించింది. ఏడు సంవత్సరాల వయసు ఉన్న అనిక ఒక రకమైన దినచర్యకు అలవాటు పడింది. తన తల్లిదండ్రుల అవిభక్త శ్రద్ధ, ప్రేమ మొత్తం తానే పొందేందుకు అలవాటు పడిన ఆమెను నానమ్మ రాక కలవరపరచింది. ఇప్పుడు తండ్రి తన సమయంలో కొద్దిగా నానమ్మతో గడపడం జీర్ణించుకోలేకపోయింది. ఆమె మర్యాదగా ఉంది కానీ దూరంగా ఉంది, అదీకాక, ఇతరులతో ఎలా సంభాషించాలో ఆమెకు తెలియదు. శాంత, అనిక సంకోచాన్ని గమనించి బాధపడ్డా,బంధాన్ని ఏర్పరచుకునేందుకు కొంత సమయం పడుతుందని అర్థం చేసుకుంది.

శాంత రోజూ ఉదయాన్నే లేచి వంటగదిలో ప్రియకు సాయం చేసేది. అది ప్రియకు సంతోషం కలిగించినా, రాజీవ్ వంటగదిలో ఏదైనా పని చేస్తుంటే వెంటనే ఆవిడ కలుగజేసుకుని, “ఇది ఆడవాళ్ళ పని, నువ్వు వెళ్లి హాల్లో కూర్చో రాజీవ్,” అని చెప్తూ ఉండడం, ఆవిడ అలా అన్నప్పుడు అనిక ఆమె వంక వింతగా చూడడం ప్రియ దృష్టిని దాటిపోలేదు.

దాంతో ఒకరోజు అత్తగారితో, “అత్తయ్యా మరోలా భావించకండి. మనం మాట్లాడే మాటలు, చేసే పనులు మన పిల్లల మనసుపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఈ కాలంలో భార్యాభర్తలిద్దరూ సమానమైన ఉద్యోగాలు చేస్తూ కుటుంబ జీవనం సమతుల్యంగా నడపాలంటే ఇద్దరూ అన్ని పనులూ చేసుకోక తప్పదు. మీరు పాప ఎదురుగా ఆడపని మగ పని అంటూ మాట్లాడకండి. తర్వాతి తరానికి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటాను,” అంటూ సుతి మెత్తగా చెప్పింది. ఆలోచనలో పడింది శాంత.

ఒక సాయంత్రం, అలసిన పని రోజు తర్వాత, రాజీవ్, ప్రియా ఇంటికి తిరిగి వచ్చారు. శాంత మనవరాలికి హోంవర్క్‌లో సహాయం చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆనందించారు. శాంత చేసిన సంప్రదాయ వంటల సువాసన అపార్ట్‌మెంట్‌ అంతా వ్యాపించింది. 

“అమ్మా, అనిక ఈరోజు ఎలా ఉంది?” సోఫాలో కూలబడుతూ అడిగాడు రాజీవ్.

అలసిపోయిన కొడుకుని చూసి మృదువుగా నవ్వింది శాంత. “తను మంచిది. కానీ ఆ టాబ్లెట్‌తో ఎక్కువ సమయం గడుపుతోంది. నేను ఒక పుస్తకం చదవమని చెప్పాను, కానీ ఆమె తన స్నేహితులందరూ ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నారని చెప్పింది.”

ప్రియ, తన హ్యాండ్‌బ్యాగ్‌ని దింపి, నిట్టూర్చింది. “అమ్మా, ఈరోజుల్లో పిల్లలు ఆ విధంగానే స్నేహం చేస్తున్నారు. మేము ఆమెను సాంకేతికతకు దూరంగా ఉంచలేము. అంతేకాకుండా, తన అసైన్‌మెంట్‌లు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటాయి.”

శాంత చిన్నగా ముఖం చిట్లించింది కానీ నవ్వింది. “కాలం మారిందని నేను అర్థం చేసుకున్నాను, కానీ సమతుల్యత ఉండాలి. మీరు చిన్నతనంలో, ఆరు బయట ఆడేవారు, పుస్తకాలు చదివేవారు ఇంకా ఇంటి పనులలో సాయం చేసేవారు,ఔనా?”

రాజీవ్  కణతలు రుద్దుకుంటూ. “మాకు తెలుసు అమ్మా. మేము ప్రతిదీ కరెక్ట్ గా చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఏం చేస్తాం?. ప్రపంచం మరింత పోటీగా ఉంది మరి అనిక దాని కోసం సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.”

శాంత, తన కొడుకు గొంతులోని అలసటను పసిగట్టింది, ఈ విషయాన్ని మర్నాటి వరకు వదిలేయాలని నిర్ణయించుకుంది. “నేను డిన్నర్ కి టేబుల్ సెట్ చేస్తాను. మీరిద్దరూ ఫ్రెష్ అప్ అవ్వండి.”

డిన్నర్ చేసేప్పుడు రాబోయే వారాంతపు ప్రణాళికల గురించిన సంభాషణలకు టైం . అనిక ఉత్సాహంగా తన సైన్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతోంటే శాంత ఒకింత గర్వంగానూ, మరో కాస్త ఆశ్చర్యంతోనూ వింది. రాత్రి భోజనం తర్వాత, అనిక మళ్ళీ తన టాబ్లెట్‌ పట్టుకుంది. రాజీవ్, ఇమెయిల్స్ చెక్ చేసుకుంటూ వాళ్ల గదిలోకి వెళ్ళిపోయాడు. అది చూస్తూ ప్రియ ఆలోచించింది.

మరుసటి రోజు ఉదయం, కాఫీ తాగుతూ ప్రియ  రాజీవ్ తో, “అత్తయ్య చెప్పింది నిజమే! మనం గ్యాడ్జెట్స్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల అనిక కూడా అలాగే అలవాటు పడుతోంది. మనం దీని నుంచి తన దృష్టి కాస్తయినా మార్చగలగాలి. దీని గురించి ఆలోచించు,” అని చెప్పింది.

  కోడలి మాటలు విన్న శాంత సంభాషణకు ఇది సరైన సమయం అని నిర్ణయించుకుంది.

“రాజీవ్, ప్రియా, మీరు పాపని బాగా పెంచేందుకు మీ వంతు కృషి చేస్తున్నారని నాకు తెలుసు. మీరు కష్టపడి పని చేస్తున్నారు. తను కోరినవన్నీ అనిక కోసం అందిస్తున్నారు. కానీ అనిక నేర్చుకోవలసిన విలువల గురించి నేను ఆలోచిస్తున్నాను. సాంకేతికత ఇంకా విద్య ముఖ్యమైనవి, కానీ కుటుంబం, గౌరవం, బంధాలు కూడా అంతే ముఖ్యమైనవి.

ఆలోచనలో ఉన్న ప్రియ తల ఊపింది. “అత్తమ్మా, మీ ఆందోళన మాకు అర్థమైంది. మేము తనకు ఆ విలువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ మా బిజీ షెడ్యూల్‌లతో ఇది సవాలుగా ఉంది. నేను ఒక పరిష్కారం ఆలోచించాను. కానీ దాని అమలులో మీ సహాయం కావాలి.”

“తప్పకుండా ప్రియా, నా పూర్తి సహకారం ఉంటుంది.”

ప్రియ ఒక్క క్షణం ఆలోచించింది.

 “చిన్నగా ప్రారంభిద్దాం. ఎలాంటి గాడ్జెట్‌లు (స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు)లేకుండా, మనం అందరం వారానికి ఒక రోజు ఉంటే? కలిసి సమయాన్ని గడపొచ్చు, ఆటలు ఆడుకోవచ్చు, కథలు చెప్పుకోవచ్చు ఇంకా మన సంప్రదాయాల గురించి అనికాకు నేర్పించొచ్చు.”

రాజీవ్ దీనిని పరిగణనలోకి తీసుకున్నాడు. “ఇది బాగుంది.ఈ ఆదివారం అందరం గాడ్జెట్ లేని రోజుగా పాటిద్దాం. అంతా సరిగా ఉంటే ప్రతివారం అలాగే చేయొచ్చు,” తన అంగీకారం తెలిపాడు.

ప్రియ నవ్వింది, మార్పు కనుచూపుమేరలో ఉందని తేలిపోయింది. “అనిక కు ఇది నచ్చితే మనం ప్రతి వారం అలాగే చేయచ్చు.”

మరుసటి ఆదివారం,  కుటుంబమంతా వారి మొదటి గాడ్జెట్ రహిత రోజును ప్రారంభించింది. శాంత పెసరట్టు ఉప్మా, అల్లం పచ్చడి సిద్ధం చేసింది. అందరూ కలిసి కూర్చున్నారు. అది తింటూ రాజీవ్, ప్రియ తమ బాల్యానికి చెందిన కథలను పంచుకున్నారు. అవి తల్చుకుంటూ ఇటువంటి అందమైన క్షణాలను ఎంతగా కోల్పోయారో గ్రహించారు. వారి బిజీ జీవితాల హడావిడిలో ఈ ఆనందాలను కోల్పోయారు. మొదట్లో ప్రతిఘటించింది అనిక. తన ఆన్‌లైన్ గేమ్‌లు, స్నేహితులను కోల్పోతానని ఫిర్యాదు చేసింది. శాంత, తన అనంతమైన సహనంతో, తన మనవరాలిని నిమగ్నం చేయడానికి మార్గాలను కనుగొంది. ఆమె అనికాను సాంప్రదాయ బోర్డ్ గేమ్‌లకు పరిచయం చేసింది. కుటుంబం అందరూ కలిసి అష్టా చమ్మా, వైకుంఠ పాళీ లాంటి ఆటలు ఆడుకోవడంతో అనిక సంబరపడింది. పురాణాల నుండి ఇంకా ఆమె చిన్ననాటి నుండి మనోహరమైన కథలను మనవరాలికి చెప్పింది శాంత. అలా రోజంతా తల్లీ తండ్రీ తనతోనే గడపడం అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అనికకి.

వారు బోర్డ్ గేమ్స్ ఆడుతూ, పార్క్‌లో వాకింగ్ చేస్తూ, అనికాకు సాధారణ ఇంటి పనులను నేర్పిస్తూ రోజంతా గడిపారు. శాంత అనికాకు రంగోలిని ఎలా వేయాలో చూపించింది, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఒకరి చేతులతో అందమైనదాన్ని సృష్టించడంలోని ఆనందాన్ని వివరించింది. మొదట్లో సంకోచించిన అనిక త్వరగానే ముగ్గు వేయడం నేర్చుకుంది. ఆమె వేళ్లు ప్రతి చుక్కను, గీతను జాగ్రత్తగా వేయడంలో నిమగ్నం అయిపోయాయి.

వారాలు గడిచేకొద్దీ, గాడ్జెట్ లేని ఆదివారాలు వాళ్ళ కుటుంబ సంప్రదాయంగా మారాయి. అనిక ఆ రోజు కోసం ఎదురుచూడడం ప్రారంభించింది, కథలు, ఆటలతో పాటు తనకు నానమ్మతో ఏర్పడుతున్న ప్రత్యేక బంధాన్ని ఆస్వాదించింది. రాజీవ్ ఇంకా ప్రియ కూడా తమ కుమార్తెలో సానుకూల మార్పును గమనించారు-ఆమె తన చుట్టూ ఉన్న ప్రపంచంపై మరింత దృష్టి, గౌరవంతో వ్యవహరిస్తోంది. ఆమె ఇప్పుడు పుస్తక పఠనం కూడా చేస్తోంది.

ఒక ఆదివారం, వాళ్ళంతా కలిసి కూర్చున్నప్పుడు, అనిక తన చిన్ననాటి గురించి మరింత చెప్పమని నానమ్మను కోరింది. శాంత కళ్ళు వెలిగిపోయాయి. ఆమె తన సమయంలో పిల్లల పెంపకం, పండుగలు, సమాజ సమావేశాలు గురించి చెప్పింది. ఆ కథలలో ఎక్కడా టీవీ, ఫోన్ వంటివి లేకపోవడం అనికను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. “అవన్నీ లేకుండా మీరు ఎలా ఉండేవారు నానమ్మా?” తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక అడిగేసింది.

నవ్వింది శాంత. “మీ అమ్మానాన్నను అడుగు,” అనడంతో వాళ్లకేసి చూసింది అనిక.

ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిన రాజీవ్, ప్రియ, “నిజమే పాపా! మా చిన్నతనంలో టీవీ ఉంది కానీ ఇటువంటి స్మార్ట్ ఫోన్లు లేవు. మేం కాస్త పెద్దవాళ్లమయ్యాకే అవి వచ్చాయి. కానీ అవి ఇప్పుడు మన జీవితాల్ని పూర్తిగా ఆక్రమించేశాయి,” అని చెప్పారు.

నెలరోజుల తర్వాత, ఒక కుటుంబ సమావేశంలో, రాజీవ్ మాట్లాడటానికి లేచి నిలబడ్డాడు. “థాంక్యూ అమ్మా!  నీ సహకారంతో ప్రియ ఆలోచనకు కార్య రూపం ఇవ్వగలిగాము. సంప్రదాయం, ఆధునికత సహజీవనం చేయగలవని  మనం నిరూపించాం. ఆ రెండింటి బ్యాలెన్స్‌ని మేము కనుగొన్నాము. అనిక కూడా ఇప్పుడు ఎంతో మారింది. పైగా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దీని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటోందిట. వాళ్ళ క్లాస్ టీచర్ నిన్న మమ్మల్ని పిలిచి మరీ దీని గురించి వివరాలు కనుక్కున్నారు. వీలైతే ఈసారి పేరెంట్ టీచర్ మీట్ లో మిగిలిన పేరెంట్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పి, వీలైతే ఆచరించమని సూచిస్తాను అని చెప్పారు. ఈసారి పరీక్షల్లో అనిక క్లాస్ టాపర్ గా నిలిచింది. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది.”

శాంత కళ్ళు సంతోషంతో మెరిశాయి. “నాకు మీ ఇద్దరి గురించీ గర్వంగా ఉంది రాజీవ్. మీరు ఇద్దరూ మంచి పేరెంట్స్ గా ఉన్నారు. పిల్లల పెంపకం ఎంత బాధ్యతతో కూడుకున్నదో గ్రహించి, తదనుగుణంగా నడుచుకుంటున్న మీకు హాట్సాఫ్. నిజానికి మా సమయంలో  పిల్లల కోసం మేము ఇంతగా చేయలేదని ఒప్పుకోవాలి.తండ్రి అంటే సంపాదించి తెచ్చేవాడు, తల్లి పిల్లలకు వేళకు ఆహారం అందించడం, అప్పుడప్పుడు వాళ్ళ చదువుపై దృష్టి పెట్టడం మినహా పిల్లలతో ఇంత స్నేహపూర్వకంగా ఉండాలి అనే విషయం మేము గ్రహించలేదనే చెప్పాలి.  మీ తరం వారు ఈ విషయంలో మాకు ఆదర్శంగా నిలిచారు. నిజానికి అప్పుడు మాకన్నా ఇప్పుడు మీరు ఇద్దరూ ఉద్యోగాలతో ఎంతో బిజీ. అయినప్పటికీ మంచి పేరెంటింగ్ యొక్క సారాంశం సంప్రదాయం ఇంకా ఆధునికత మధ్య ఎంచుకోవడంలో కాకుండా రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని మిళితం చేయడంలో ఉందని మీరు తెలుసుకున్నారు. మన ఇల్లు పాత విలువలు మరియు కొత్త ఆలోచనలు సహజీవనం చేసే అందమైన ప్రదేశంగా మారింది. అనిక మంచి చెడుల గుర్తింపు, గౌరవం మరియు ప్రేమతో పెరిగేలా చేసింది. మీరు నేటి తరం తల్లిదండ్రులకు ప్రతినిధులు.”

తపస్వి మనోహరం పత్రిక మరియు

శసాంగ్- అనుశ్రీ మెండు మరియు సేవా ఫౌండేషన్ వారి భాగస్వామ్యం తో నిర్వహించిన ‘ఈ తరం అమ్మానాన్నలు’ అంశం పై కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మహిళామకుటం మల్లాది సుబ్బమ్మ 

by Vijaya Ranganatham July 30, 2024
written by Vijaya Ranganatham

స్త్రీవాద రచయిత్రి, హేతువాది.  స్త్రీ స్వేచ్చా పత్రికా సంపాదకురాలు, మహిళల కోసం పోరాటం చేసిన మహిళామణి. గొప్ప  ఉపన్యాసకురాలుగా ఆరితేరి, మహిళోద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, చురుకుగా పాల్గొన్న, ఎన్నో రచనలు చేసిన ధీటురాలు మల్లాది సుబ్బమ్మగారు.  

ఆవిడ జన్మించి శతాబ్ది సంవత్సరం, మరిణించి సరిగ్గా దశాబ్ద కాలం గడిచిన సందర్బంగా ఆమెను మరోసారి గుర్తు చేసుకుంటూ ఆమెను ప్రేరణగా తీసుకుంటూ, ఆమె బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం మనే ఉద్దేశ్యంతో ఆవిడ గురించి కొత్త తరానికి పరిచయం చేయాలనే ఈ నా ప్రయత్నం. 

1970 ప్రాంతంలో ఆమెను చూడటం, ఆమె అనర్ఘళ ఉపన్యాసం వింటూ కనులు విప్పార్చి చూసిన జ్ఞాపకాలు మరుగున పడలేదు. అప్పుడు జరిగిన ప్రతీ పబ్లిక్ మీటింగులలో ఆవిడ మాట్లాడుతూ ఉండేది. కంచు కంఠంతో ఎక్కడా తడుముకోకుండా తన ఆలోచనలను నిక్కచ్చిగా వ్యక్తపరిచే సమర్దత ఉండేది. అబ్బురపడుతూ చూసేవాళ్ళం. మా అన్నయ్య జ్వాలాముఖి ఆవిడను పరిచయం చేసినప్పుడు పొంగిపోయి మాటలు కరువైనాయి.  పొట్టిగా, కొద్దిగా లావుగా, పెద్ద బొట్టుతో అవన్నిటిని మరిపించే ఆవిడ కంఠ ధ్వని మనల్ని మంత్రముగ్దుల్ని చేసేది. ఎక్కడా ఆడవాళ్ళమనే జంకు మొహమాటం లేవు. మగవాళ్ళు కూచునే వరుసలోనే కూచునేది. మల్లాది సుబ్బమ్మగారు సభకు వచ్చారంటే ఆవిడ స్టేజి ఎక్కకుండా, మాట్లాడకుండా ఉండేవారే కాదు.   

సుబ్బమ్మగారు 1924 సంవత్సరం ఆగస్టు 2 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతర్లంకలో జన్మించారు.    

పురాణాలన్నీ పులిహోర వలె ఆరగించిన కొండూరు వారి వంశంలో సుబ్బమ్మ పుట్టారని ఆవిడ స్నేహితులు అనేవారట. తల్లిదండ్రులు, ఆమె చిన్నతనంలోనే ప్రాథమిక విద్య కూడా పూర్తి కాకుండానే పెళ్ళి చేసి అత్తవారింటికి పంపారు. ఈవిడకు బాపట్ల వాస్తవ్యులైన మల్లాది వెంకట రామమూర్తితో వివాహం జరిగింది. 11వ ఏట వివాహం కాగా 13వ ఏట కాపురానికి వచ్చింది. బాల్య వివాహం తప్పుగా భావించలేదు. అప్పుడు భర్త మల్లాది రామమూర్తికి 17 ఏళ్ళు. వరుసగా ఐదుగురు సంతానాన్ని కన్నారు.  భర్త రామమూర్తి గారు కమ్యూనిస్టుగా ఆరంభించి, మానవతావాదిగా పరిణమించాడు. ఆయన పూర్తి సహాయ సహకారాలు భార్య సుబ్బమ్మగారికి అందించాడు.  

ప్రైమరీ స్కూలతోనే ఆగిపోయిన సుబ్బమ్మగారి చదువు కొనసాగించడానికి, అత్తమామలు వ్యతిరేకించారు. కానీ, భర్త సహకారంతో ఇంట్లోనే విద్య నేర్చి మెట్రిక్‌కి కట్టారు. వరుసగా పి.యు.సి., బి.ఎ., కూడా చదివి, కుటుంబ నియంత్రణ ప్రచారకురాలిగా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.   అంతే మళ్ళీ వెనక్కు చూడలేదు. తన స్వానుభవాలకు పాతివ్రత్యం నుండి ఫెమినిజం దాకా అనే రచనలో వివరించారు. ”కేవలం పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకొంటూ, అత్తమామల అదుపాజ్ఞలలో జీవించడమే నా కర్తవ్యమా?” అని ప్రశ్నించిన స్త్రీవాది. కుల నిర్మూలన, ఛాందస వ్యతిరేక పోరాటం, మూఢవిశ్వాస నిర్మూలన, స్త్రీ జనోద్ధరణ, కుటుంబ నియంత్రణ, స్త్రీ విద్యకోసం కృషి చేశారు. ఆచార్య సి.నారాయణరెడ్డి ఈమెను గురించి “వాలునుబట్టి గాలిని బట్టి సాగిపోయిన వ్యక్తికాదు” అన్నారు. 

బాపట్ల లో అయిదేళ్లు స్త్రీ హితైషిణీ మండలి కార్యదర్శిగా, బాలికా పాఠశాలకు మేనేజరుగా, శారదా మహిళా విజ్ఞాన సమితికి అధ్యక్షురాలిగా పనిచేస్తూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో దిగారు. 1970లో విజయవాడలో వికాసం అనే పత్రిక స్థాపించి పదేళ్లు నడిపారు. ఫిలిం సొసైటీకి ఛైర్మన్ అయ్యారు. 1978లో లండన్లో జరిగిన ప్రపంచ హ్యూమనిస్టు సభల్లో పాల్గొన్నారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను స్థాపించారు. అభ్యుదయ వివాహ వేదిక ద్వారా అతి తక్కువ ఖర్చుతో రెండు దండలు, రెండు ఫొటోలతో ఆదర్శ వివాహాలు జరిపించారు. 

మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళాసేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్టు ద్వారా మహిళలకు సేవ చేశారు. “వికాసం” తర్వాత “స్త్రీ స్వేచ్ఛ” అనే మాస పత్రికకు సంపాదకురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయ పురస్కారం’ నెలకొల్పారు. 1979 నుంచీ ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికీ, 1989 నుంచీ అఖిలభారత హేతువాద సంఘానికీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అరవైకి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం- మహిళా సంఘాలు 1960–1993 అనే పుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. ఆమె చేసిన సేవలకు గాను దుర్గాబాయి, తెలుగు వర్సిటి ఫర్ బుక్, ప్రియదర్శిని, త్రిపురనేని రామస్వామి అవార్డులు లభించాయి.  మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాల ను 2000లో ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’కి రిజిస్టరు చేసారు. 

నిర్విరామంగా రచనలు చేసి, 110 పుస్తకాలు, 500 వ్యాసాలు ముఖ్యంగా మహిళా సాధికారత ప్రధానంగా రాసారు. ఆమె రచనలు కొన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. ఇస్లాంపై విమర్శనాత్మక రచనలు చేసిన సుబ్బమ్మపై ముస్లిం ఛాందసులు దాడిచేశారు.  

సుబ్బమ్మ ఉపన్యాసకులుగా ఆరితేరి, మహిళోద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో, చురుకుగా పాల్గొన్నారు. తెలుగు వారిలో సుబ్బమ్మ పేరు మారుమోగింది. మద్యనిషేధ కార్యక్రమంలో సుబ్బమ్మ పాత్ర గణనీయంగా సాగింది. ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలీకృతురాలైంది. మానవవాద ఉద్యమంలో బాగా కృషి చేసింది. సుబ్బమ్మ స్వీయగాథను ఫియర్ లెస్ ఫెమినిస్టు శీర్షికన ప్రచురితమైంది.  

అమెరికా, ఇంగ్లండ్ పర్యటించిన సుబ్బమ్మ అనేకమంది మానవతా వాదులను కలసింది. తరువాత మహిళోద్యమంలో భాగంగా మహిళాభ్యుదయ సంస్థ స్థాపించి, అనేక సంఘాలకు సహాయం అందించింది.  

మల్లాది రామమూర్తి 1999లో చనిపోయిన తరువాత సుబ్బమ్మ ఏమాత్రం పట్టుదల వదలకుండా, మహిళాభ్యుదయ, మానవవాద కృషి చేశారు. 2014లో చనిపోయేవరకూ పట్టుదలగా పనిసాగించారు. ట్రస్ట్ పెట్టి ఆస్తి అంతా మహిళా సేవకు దానం చేశారు.  

ఆమె చాలా ధైర్యశాలి. 1986 ప్రాంతాలలో గీటురాయి వారపత్రిక వాళ్ళు హైదరాబాద్ లో ఒక సమావేశం నిర్వహించారు. మల్లాది సుబ్బమ్మ, మాలతీ చందూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ డైరెక్టర్ అబ్దుల్లా గారు మగ వక్తలందరికీ పూల దండలు మెడకు వేసి మాలతీ చందూర్ గారికి చేతికి ఇస్తే ఆమె తీసుకున్నారు.అలాగే మల్లాది సుబ్బమ్మగారికి చేతికి ఇవ్వబోతే ఆమె ఎదురు తిరిగి పురుషులకంటే మేము ఏమీ తక్కువ కాదు.”దండ నామెడలోనే వెయ్యండి” అని ఆదేశించి మరీ వేయించుకున్నారు.అలాగే ఈ సభలో అంతా మగవాళ్ళే కనిపిస్తున్నారు.సాయిబుల సభలకు ఆడవాళ్ళను తీసుకురారా? అని ప్రశ్నించారు.లేదమ్మా ఆడవాళ్ళు కూడా వచ్చారు.పైన బాల్కనీలో పరదా చాటున ఉన్నారు అంటే కూడా నమ్మకుండా పరదా తొలిగించాల్సిందే అని వాళ్ళందరినీ మగవాళ్ళతో పాటు మెయిన్ హాలులోనే కూర్చోబెట్టాలనీ ప్రసంగించారు. 

ఆమె రచనలు, ఉపన్యాసాలు, ఉద్యమాలే కాక ప్రస్తుతం సమాజంలో స్త్రీ లు ఎదురికుంటున్న వ్యభిచారం గురించి పుస్తకాలు రాయటమే కాక బొంబాయిలోని రెడ్లైట్ ఏరియాలో తిరిగి మహిళలతో మాట్లాడిన వ్యక్తి. వాళ్ళ సాదకబాధకాలను తెలుసుకుని సహాయ సహకారాలను అందించాలని ఎంతో శ్రమించారు. ఈ విషయంగా ఆవిడ ‘వ్యభిచారం ఎవరినేరం‘ అనే పుస్తకాన్ని కూడా రచించారు. అంతే కాదు ఆమె వివిధ సంస్థలను స్థాపించారు. 

  1. మహిళాభ్యుదయ సంస్థ : దీనిని 1980లో స్థాపించారు. మిగిలిన సంస్థలు దీనికి అనుబంధంగా పనిచేస్తాయి. దీనికి 100 మందికి పైగా సభ్యులు, హితుల సహాయంతో మంచి గ్రంథాలయాన్ని కూడా స్థాపించి నడిపిస్తున్నారు. 
  1. అభ్యుదయ వివాహవేదిక : దీనిని 1981లో స్థాపించి ప్రేమ, కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర, వరకట్నరహిత, విధవా వివాహాలను జరిపించి చట్ట ప్రకారం రిజిష్టరు చేస్తున్నారు. 
  1. కుటుంబ సలహా కేంద్రం : దీనిని 1980లో స్థాపించారు. కుటుంబ కలహాలతో సతమతమౌతున్న భార్యాభర్తలను కలపడం, వీలుకాని పరిస్థితులలో విడాకులు ఇప్పించడం, భత్యాన్ని ఏర్పాటుచేయడం, హింసాత్మకంగా మారిన వారికి చట్టపరంగా శిక్షించడం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది. 
  1. శ్రామిక మహిళా సేవ : దీనిని బాదం రామస్వామి గారి ఆర్థిక సాయంతో 1989లో నెలకొల్పారు. దీని ద్వారా వడ్డీ లేకుండా శ్రామిక మహిళలకు చిన్న వ్యాపారాలు చేసుకొనడానికి ఆర్థిక సహాయం అందజేసి నెలకు 50 రూపాయల చొప్పున తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటుచేశారు. 
  1. స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం : దీనిని 1987లో స్థాపించి స్త్రీలకు శిక్షణ శిబిరాలను నిర్వహించి వారి హక్కులు, కుటుంబ నియంత్రణ, ఓటుహక్కు, ఇతర స్త్రీల సమస్యల మీద అవగాహన కల్గించారు. 
  1. స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం : దీనిని 1989లో నార్వే వారి ఆర్థిక సహాయంతో వివిధ ప్రాంతాలలోని స్త్రీలకు వారి హక్కులు గురించి చైతన్యవంతుల్ని చేయడం కోసం స్థాపించారు. 
  1. సుబ్బమ్మ షెల్టర్ : వివిధ సమయాలలో బాధిత స్త్రీలకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి కొంతకాలం తర్వాత ప్రభుత్వ సంస్థలకు అప్పగించడానికోసం 1990లో స్థాపించారు. 
  1. వృద్ధ మహిళాశ్రమం : దీనిని 1992 సంవత్సరం నార్సింగి గ్రామంలో నెలకొల్పి బాదం సరోజాదేవితో కలిసి దిక్కులేని వృద్ధ మహిళలకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. 
  1. కుటుంబ నియంత్రణ సంస్థ : రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహాయంతో కొద్దిమంది సహాయంతో కుటుంబ సంక్షేమం, జనాభానియంత్రణ మొదలైన విషయాలను తెలియజేసి శస్త్రచికిత్స కోసం పంపిస్తారు. 
  1. వరకట్న హింసల దర్యాప్తు సంఘం : వరకట్నం తీసుకోవడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వీరికి తెలియజేస్తే ఈ సంస్థ ద్వారా కేసును నడిపిస్తారు. 
  1. వికాస కుట్టు, టైపింగ్ సెంటర్ : దీని ద్వారా మహిళలకు జీవనోపాధి కలిగించడం ఉద్దేశం. 
  1. వయోజన విద్యా కేంద్రం : అక్షరాస్యతను వృద్ధి చేయడంలో భాగంగా దత్తాత్రేయ కాలనీలో ఈ కేంద్రాన్ని స్థాపించి కొందరు స్వయం సేవకుల సహాయంతో వయోజనులను విద్యావంతుల్ని చేస్తున్నారు. 

ఎంతవారలైన మరణ దేవత ముందు ఓడిపోవలసిందే కదా. అంతటి గొప్ప స్త్రీ అభ్యుదయవాది, ఎందరి మనసులలో నిలిచిపోయిన మల్లాది సుబ్బమ్మగారు సరిగ్గా పది సంవత్సరాల క్రితం 2014 మే 15 వ తేదీన అనారోగ్య కారణాలవల్ల కన్నుమూసారు. కానీ ఆమే మరణంలోనూ ధీశాలే. తన మరణానంతరం వ్యర్థంగా తన దేహాన్ని అగ్నికి ఆహుతికాకుండా రాబోయె తరాల వైధ్య విధ్యార్థుల ఉపయోగం కోసం ఉస్మానియా మెడికల్ కళాశాలకు అప్పగించమని కోరారట.  

ఇంతటి మహోన్నతమైన ప్రముఖ రచయిత్రి, స్త్రీ అభ్యుదయవాది, సామాజిక వేత్త, గొప్ప ఉపన్యాసకురాలు, స్త్రీ స్వేచ్చా ఉధ్యమ ధీరోదాత్త కి నివాళులు అర్పిస్తూ, ఈ నవతరం మహిళామణుల్లో మరో, ఎందరో మల్లాది సుబ్బమ్మగార్లు గా మళ్ళీ జన్మించాలని మనందరం ఆశిద్దాం.  

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

గ్రీష్మ తాపము

by రంగరాజు పద్మజ July 30, 2024
written by రంగరాజు పద్మజ

ఇంటి వాడి కోపము ఇంగిలీకమోలె
భగ్గుమంటే సంతు సదురుకున్నట్టు…

ఆకలై కాలు చేయి;పెయ్యి కదలనట్టు… కాలమసలు కదలడమే లేదు!

పేదవాని ఆలోచనోలె! పగలు సెగలు
తెగుత లేదు ముడిపడుతులేదు!

ఉద్దెరకు సామానియ్యడని తెలిసీ
దుకాణానికి పోయినట్టు-
ఉత్తరానికి తిరిగే సూర్యుడేమో!

చేతగానోణి కోపమోలె
రోజురోజుకు ఎండ మండిపోయె!

సగటు ఆడదాని నిట్టూర్పు వలె,
వేడి గాడ్పులు వీయబట్టె!

చెప్పులు లేని కాళ్ళకు
ఇసుక సెగలై తాకె!

అప్పులున్నోడికి అరువు పుట్టనట్టు…దప్పి తీర్చుకొన…
బావులు -చెరువులెండిపోయె! చెలిమెలే కరువాయె

బాటసారులొచ్చి నీడకని ఆగంగ-
పుకడుకొచ్చే నీళ్లు- పుడిసెడుకు
పిరము చేసి అమ్మబట్టె!అంగడోడు!

చెట్టు – చేను చెలుకలెండిపోయె!
అధికారి ముందు నౌకరోలె
మాడ మంట పుట్టి-నోట మాట రాక పాయె!

నాలుగు తలలోడికి – నెగులెందుకో?
మింట మంట పెట్టి- నీళ్ళు మసలబెట్టి,
కర్వరిమీద…కుమ్మరించె!

ఆలిమీద మగడు అరచినట్టు,
అడవి మీద అంగారాలే ఆరబోసె!
అమ్మ-అయ్య పంచాయితీ పెట్టుకుంటే
పోరగాండ్లు బొంతల -దూరినట్టు;

పుట్టల్ల మంట బుట్టంగ -పాములన్ని పొదల దూరిపోయె!

ఇంటోడి కోపం ఇంగిలీకమోలె
భగ్గుమంటే – సంతు సదురుకున్నట్టు..

ప్రకృతి అంత వాడిపోయి ముడుచుకొనె!

ఇది అది అని చెప్ప నలవి కాదు!
గ్రీష్మ తాపమింతింత కాదయా!

రంగరాజుపద్మజ.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కాలమా! వెనుదిరుగవూ !

by Aruna Dhulipala July 30, 2024
written by Aruna Dhulipala

ఈరోజు అంతటా
ఎన్నెన్ని సంబరాలో?
ముద్దులు మురిపించి
పట్టుకొని నడిపించి
వ్యక్తిత్వ చిత్రణకు
ప్రేమరంగులు పులిమి
జీవనతీరం చేరికకు
ఎదురీతలను నేర్పి
అరిగిన భుజాల చాటున
మమకారాన్ని దాచిన
తండ్రి కోసం
అక్షరార్చనలు

దుఃఖపాతం
నా గుండె లోతుల్లోని
పసివయసు గురుతులను
ఎగిసి చిమ్ముతోంది
ఊహ కూడా సరిగా రాలేదేమో!
సరిగమలు పలికించిన
ఆ జంటస్వరం
సాగిపోయింది గాలివాటుగా
హార్మోనియం మరుగున దాగి
అటకెక్కింది ఒంటరి వేదనగా
తెగిన నా నాద తంత్రులు
గొంతులో దాక్కున్నాయి నిస్వనంగా

క్రమశిక్షణ సిద్ధాంతంగా
కర్తవ్యదీక్ష ప్రమాణంగా
విలువలు నేర్పిన బోధకుడు
గంభీర గాన స్వరయుతుడు
సంగీత సాహిత్య సంయోగంలో
నిరంతర చైతన్యశీలుడు
నా గాన కౌశలం కోసం
తపించిన పిపాసితుడు

ఓ నాలుగున్నర దశాబ్దాల కాలం
వెనక్కి మరలితే బాగుండు!
వడలిపోని ఆ దరహాసాన్ని
అందమైన ఆ అపురూపాన్ని
అరుదైన ఆ కళానిధిని
పట్టి బంధిస్తా
నా చేయి వీడకుండా
కాలునికి అందకుండా !!

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చెనేత మగ్గాన

by NS Reddy (USA) July 30, 2024
written by NS Reddy (USA)

ఆ సప్త వర్ణాల వస్త్రాలు నేసేటి వైనమ్
మనల మానాల కాపాడె దారాలు అల్లుతావు
అందుకో మా వందనమ్
నీ చేత పుట్టిన నేత బట్టల గట్టి మెరిసేను మానవ సోయగమ్
పొగడలేంత ఘనత …
చెరిగిపోని చరిత…
చేనేత కార్మికా నీ సొంతం……. చేనేత కార్మికా నీ సొంతం.

సృష్టి అందాలన్ని చీరలోన మలచి నక్షత్రాలు తెచ్చి నగిశీల దిద్దేవు
పసిడి కాంతుల్లోన వజ్రాలనద్దేవు

పొదుగూకుల పట్టు బట్టలు నేసి ప్రతిభనే చాటావు
పత్తికన్నా మెత్త మనసున్న నేతన్న……
పత్తికన్నా మెత్త మనసున్న నేతన్న
కొవ్వొతి వెలుగయ్యి కాలేవు దారాన. || చెనేత మగ్గానా ॥

చాలు చాలని పథము సాల మగ్గము రథము
శాలోల్ల యుద్ధాన సాగే సైన్యమవుతాడు
దారం పోగుల దరువు,
తనువు వంచిన ధనువు
వస్త్రాలె అస్త్రాలు పోరాడి గెలిచేడు.
నిండు ఆకాశాన గర్వంగ ఎగిరేటి — జాతీయ జెండయ్యి జేజేలు పొందేడు(వు)

మర మగ్గాల నడుమ మానవ యంత్రమయ్యి
నీ రక్త మాంసాలు ఇంధనంగ చేసి
నీ కండ కరిగించి చేత వస్త్రం నేసి కూడు లేక కోటి తిప్పలే పడతావు

నీ కష్టమే నిలిచి కన్నీళ్లు తుడిచేటి నీ కష్టమే నిలిచి కన్నీల్లు తుడిచేటి
కాలమేదో వస్తుందంటు
కలలెన్నో కంటావు……।
చెనేత మగ్గానా ||

పండగల పబ్బాల, పెళ్లి పేరంటాల రంగు హంగుల వస్త్ర సింగ్గారమయ్యేవు

ఎండా వానల నన్ను సల్లంగ చూసేటి స్నేహితుడవయ్యేవు తనువూ తల్లివి నీవు
ప్రాణమిడిచీ మనిషి మట్టిలో కలువంగ….
ప్రాణమిడిచీ మనిషి మట్టిలో కలువంగ…..
విడివడని బంధమై భూమి ఒడిని చేరేవు || చెనేత మగ్గానా నేతన్నా ॥ ||

నువ్వు నేసే తాడు చేయొద్దు ఉరి తాడు తీసుకోకు ప్రాణం
ఆ ఉరితాళ్లనే తీసి
చిత్రాలుగా చేసి
చేరుకోర గమ్యమ్
తెలిసేను విజయ మార్గమ్

చేనేత మగ్గాన నేతన్నా
నేనున్నానని అనవన్నా నేతన్నా!!
_**

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చెట్టు – మనిషి

by డా. రూప్ కుమార్ డబ్బీకార్ July 30, 2024
written by డా. రూప్ కుమార్ డబ్బీకార్

ఆకులన్నీ రాల్చేసి
నా కళ్లను నక్షత్రాలుగా
అద్దుకుంది చెట్టు!
ఇక –
పచ్చదనాన్ని నింపుకుని
ప్రపంచానికి నీడనివ్వటం
నా వంతయింది!

July 30, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us