మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

దశ -దిశ

by Devulapalli Vijayalaxmi July 30, 2024
written by Devulapalli Vijayalaxmi

“రత్తాలూ!ఓ రత్తాలక్కా !సీరలేమైనా.ఉన్నాయేందే” అంటూ గుడిసె ముందున్న సిమెంటు తొట్టి లో నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూ కేకేసింది పోచమ్మ.

“అవు వున్నయిగనీ మూట ఇప్పలేదు అక్కా!ఉతకలే,ఇస్తిరీ సేయలా!రెండు రోజులసందె జొరం.”
అంటూ మూలిగింది రత్తాలు.

“అయ్యో సెప్పకపోతీవి.జరంతలోమంచిగా పప్పుసారు బువ్వ తెస్తా.కుసింతబువ్వతిని డోలో ఏసుకో తగ్గుద్ది. పొద్దుగాలే రోడ్లట్టకు తిరగాలాయే.ఛీ! రెక్కాడితే గాని డొక్కాడని బతుకులాయెపో!” ఆప్యాయంగా అంటూ తన రేకుల షెడ్డు వైపు వడివడిగా అడుగులువేసింది పోచమ్మ.

ఆ బస్తీలో అన్నీ రేకులషెడ్డులే కాలవకి ఆనుకొని.అక్కడ ఆడమగా అందరూ ఏదో చిన్నాచితకా కూలిపనులు చేసుకుని పొట్ట పోసుకునే వారే.అందరూ ఒకరి కష్టం ఒకరు తెలుసుకుని ఒకరికొకరు ఆదుకునేవారే.అదే ఆ బస్తీ ప్రత్యేకత.
★★★

రత్తాలు చాలా తెలివైనది.కొడుకు రెండేళ్ళవాడని కనికరం లేకుండా యాదయ్య రత్తాలుని వదిలేసి ఓటక్కులాడిని చేసుకొని పోయాడు.ఇదంతా సర్వసాధారణం ఆ బస్తీలో.

యాదయ్య వెళ్లి పోతానన్నప్పుడు గుండెలు బాదుకొని ఏడవలేదు, గొడవపడలేదు రత్తాలు. పంచాయితీ అన్నారు బస్తీలో కొందరు.వద్దన్నది రత్తాలు.తనంటే ఇష్టం లేని మొగోనితొ కాపరం చేసినా చేయకపోనా ఒక్కటే అని మౌనంగా ఉంది.

“రెండేళ్ళపిల్లోడిని సదివించాల.మంచికొలువులో ఎట్టాల.ఈ మురికికాలవకి దూరం పోవాల”ఇదే పగలూరాత్రి నల్లపోచమ్మ గుడిలో కూచొని ఆ తల్లికళ్ళలోకి చూస్తూ మౌనంగా మాట్లాడేది రత్తాలు.

ఆసంకల్పంతో భర్త వెళ్ళాక ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ దాచిన ఒక వెయ్యి పోగేసింది.పోచమ్మని తీసుకుని స్టీలు ఫేక్టరీకి పోయి స్టీలుసామాన్లు కొంది.మరుసటిరోజు ఒక గంపలో స్టీలు సామాన్లు సర్దుకొని.పిల్లవాడిని జోలెలో కూర్చోపెట్టుకొని,”పాత సీరలకు స్టీలు సామాన్లు ఇస్తామమ్మా”, అని అరచుకుంటూ అంటూ వీధి వీధి ఎండనక వాననక తిరిగేది.
మొదట్లో ఎవరోపిలిచి పాతచీరలిస్తే దానికి తగ్గ సామానిచ్చేది.రాను రాను గృహిణులకి రత్తాలు బాగా. అలవాటైంది.జోలెలోని పిల్లడు కూడా కొంత కారణం.పాతచీరలు నాలుగైదుండగానే రత్తాలు దగ్గిర సామాన్లు కొనే వాళ్ళు.కొంతమంది అయితే “ఒసే! రత్తాలు ఈసారి పులిహార పళ్ళెంతేవే అనో లేకపోతే బియ్యం పోసుకునే డబ్బా తెచ్చిపెట్టు” అంటూ డిమాండ్ చేసేవారు.వాళ్ళ డిమాండ్ కి తగ్గట్టు స్టీలు సామాన్లు తెచ్చేది.ఆ ఇళ్ళవాళ్ళు వాళ్ళ పాతబట్టలకి ఏదో ఒకటి వస్తోందని పెద్ద పట్టించుకునేవాళ్ళుకాదు.పైపెచ్చు రత్తమ్మ డిమాండ్ చేసినంత క్యాష్ పెద్దవస్తువులకి ముట్టచెప్పేవారు. అంతేకాదు నువ్వే ఏదో ఒకటి చేసుకో అంటూ బిగుతైన ప్యాంట్లు, చిన్నపిల్లల బట్టలు పడేసేవారు.
“ఓ!అమ్మో! సీరలకైతేనే సామానిత్తా. ఈ పాంటులకి,పిల్లోళ్ళ బట్టలకి నేనేమివ్వా.” అంటూ ఖరాఖండిగా చెప్పేది రత్తాలు .
” ఏదోఒకటి చేసుకోవే!ఇవన్నీ పెట్టే స్థళంలేదుఅన్నీ బిగుతైనవే మా వాళ్ళకి” అంటూ పడేసేవారు రత్తాలుకి.

అప్పడప్పుడూ షెడ్మీద సొరతీగకి కాసిన సొరకాయలు,తొట్టిదగ్గర మల్లెచెట్టుకి పూసిన మల్లెలు ఆఇళ్ళవాళ్ళకి బహుమానంగా ఇచ్చి,వాళ్ళపనిమనిషి రాకపోతె బాసాన్లు తోమి ఆ ఇళ్ళవాళ్ళకి సన్నిహితురాలయిందిరత్తాలు.

సామాన్ల బదులు వచ్చిన చీరలన్నీ తీసి అందులో ఫాల్ ఊడినవి,జరీ చీరలు,కొంచెం చిరిగిన చీరలు విడి విడిగా చేసి బస్తీలో మిషను కుట్టే సీతమ్మ చేత రిపేరు చేయించి వాటిని ఉతికి ఇస్త్రీ చేయించేది.ఆ చీరలు అమ్మకానికి పెట్టేది రత్తాలు.పిల్లల బట్టలు బస్తీలో పిల్లలకి ఉచితంగా ఇచ్చేది. జీన్స్ ప్యాంట్లు కుర్రకారుకి చవకగా ఇచ్చేది.ఈ విధంగా రత్తమ్మ బస్తీలో మంచిపేరు తెచ్చుకుంది. చీరలమ్మగా వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకుని మిగిలిన దంతా స్టీలు సామాన్లు కని ఖర్చు పెట్టేది.
. ★★★

ఇలా రెండు సంవత్సరాలు కాలంలో కలసి పోయాయి.రత్తాలు కొడుకు సురేసు నాలుగేళ్ళ వాడయ్యాడు.రత్తమ్మకి అసలు కష్టం ఇప్పుడు మొదలైంది.పిల్లవాణ్ణి ఇంట్లో వదలలేదు తను ముందు లాగా పిల్లవాణ్ణి జోలెలో కూర్చోపెట్టుకొని నెత్తి మీద బుట్ట, బట్టల మూటతో మోయాలంటే చేతకావటంలేదు.పోచమ్మ గుడి ముందు కూర్చొని మౌనంగా కష్టం విన్నవించుకునేది.

ఒకరోజు ఒక పెద్ద. గేటుముందాగి “పాతబట్టలకి స్టీలు సామాన్లు ఇస్తా “అంటు గట్టిగా అరచింది రత్తాలు.

లోపలనించీ ఒక నడివయసు ఆయన వచ్చి.” ఇది అనాధాశ్రమం.మేమే వాళ్ళూవీళ్ళు ఇచ్చిన డబ్బు బట్టలు గిన్నెలు తీసుకుంటాం”అంటూ గేటు మూసేసాడు.
మరొకసారి రత్తాలు తిరిగి వస్తుంటే అదే గేటు నుండి చాలామంది పిల్లల సందడి వినిపించి నెమ్మదిగా గేటు తీసుకొని వెళ్ళింది.అక్కడ ఒక ఆజాను బాహుడయిన నలభై ఏళ్ళ వ్యక్తి ముప్పైఐదేళ్ళ స్త్రీ ఆరుబయట పిల్లలని చుట్టూర కూర్చోపెట్టుకునిచదువు చెప్పటం చూసింది.

“అమ్మా ‘అంటూ పిలిచిందిరత్తాలు నెత్తిమీద గంపనేలమీద పెడుతూ.
“ఎవరమ్మా!చెప్పు. ఏంకావాలి? అంటూ ఆప్యాయంగా అడిగింది ఆ స్త్రీ.
“అమ్మా ఈడ అమ్మా అయ్యా లేనోళ్ళేనా నాబోటోళ్ళ పిల్లలుకూడా ఉన్నారా?”అని అడిగింది రత్తాలు.
“నీకు భర్త ఉన్నాడా?ఉంటే ఏం చేస్తున్నాడు”అంటూ అడిగింది ఆస్త్రీ.
‘”లేడమ్మా!ఈ పిల్లగాడు రెండేళ్ళ సందె వదిలేసి ఏరే ఆమెను కట్టుకున్నాడు. ఈపిల్లగాని జోలెలో ఏసుకొని ఈ గంపనెత్తినెట్టుకొని గల్లీలంట తిరుగాడతూ స్టీలుసామాన్ల యాపారం సేసుకుంటున్నా.పోరడు నాలుగేండ్లు అయినాయి. ఎత్తుకోలేను.ఈడా నడసలేడు.మీరు దయెట్టి నా పోరడ్నికూడా ఈపిల్లగాళ్ళతో ఉంచుకుంటే నే సాయంమాపు పిల్లగాన్ని తోలుకు పోతా”అంటూ ఆశగా చూసింది రత్తాలు.

“రత్తాలు!నాపేరు శాంతి.ఈ సార్ నా భర్త.ఈ ఆశ్రమం కేవలం అనాధలకే కాదు. పిల్లలని పోషించుకోలేని ఆశ్రయం లేని మీలాంటి పేదలకి కూడా.ఇక్కడ రైల్వే స్టేషన్లలోనూ వీధుల్లో దిక్కులేక అడుక్కునే పిల్లలని పోలీసులు మాదగ్గర వదిలి పెడతారు.మేము వారికి భోజనం పెట్టి గవర్ననమెంటు స్కూలులో చదివిస్తాము. వాళ్ళు 12వక్లాసు కాగానే ఏదో ఉద్యోగం చూసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే”. అంటూ చెప్పింది శాంతి.
అమ్మా శాంతమ్మా! నా బుడ్డోడిని జరంత పయోజకుణ్ణి సేయమ్మా బాంచను మీ కాళ్ళుమొక్కుతా” అంటూ ఎంతో దీనంగా శాంతి శాంతి భర్తకాళ్ళు పట్టుకుంది రత్తాలు.
“లే లే రత్తాలు మేమున్నది మీలాంటి వారిని ఆదుకోవటానికే.” అంటూ మేము గవర్నమెంటు వారి సహకారంతో పిల్లలని చదివిస్తాము.అందుకని కొన్ని వివరాలు నీ వేలి ముద్ర కావాలంటూ ఫారమ్ లు తెచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసింది శాంతి.

గుండెలమీద భారం తీరినట్టయింది రత్తాలుకి.
“రేపు తీసుకొచ్చి వదులుతానమ్మా!” అంటూ కాళ్ళకి మొక్కి బుట్టా, మూటా నెత్తిన పెట్టుకుని పిల్లాడిని నడిపించుకుంటూ ఇంటి బాట పట్టింది రత్తాలు. మధ్యలో పోచమ్మ గుడి దగ్గర కాస్సేపు కళ్ళనీళ్ళ”పోచమ్మ తల్లీ నీవే దిక్కు”అంటూ బాధ వెళ్ళపోసుకుంది.

“గేం రత్తాలు!ఇయాల గింత ఆలీసమైనాది?”అంటూ రావులమ్మ పలకరింపుతో ఆలోచనలతో నడుస్తున్న రత్తాలు కి ఇంటికి చేరువయ్యానని గ్రహించింది.

“గౌ అక్కా”అంటున్న రత్తలుని చూసి అమ్మా ఇద్దరొస్తోంందే,ఆకలౌతోందే అంటూ ఏడుపు లంకించుకున్నాడు.”సురేసు ఎక్కడ తల్లి రావులమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటుందో అని.
“ఉండయ్యా బుక్కెడు బువ్వతిని పండదుగాని” అంటూ వంట కుపక్రమించింది.
★★★
అమావాస్య చీకటిని పారద్రోలుతూ సూరీడు అరుణ కిరణాలు నీలిరంగు ప్లాస్టిక్ పరదాలగుండా రత్తాలు ముఖాన్ని తాకాయి.
“అమ్మో తెల్లారిందే!” అనుకుంటూ రాత్రి చద్ది పిల్లవానికి తినిపించి తానింతతిని బుట్ట సర్దుకొని పిల్లవాని చంకనవేసుకుని ఆశ్రమం బాట పట్టింది.

తోవలో కొడుకుని ప్రేమతో “సురేసా నీకు మంచి రోజులొచ్చినాయి పోచమ్మ తల్లి దయవల్ల.నిన్న పోయినాం సూడు ఆ ఆంటీ తావున ఉండు.నేను సామాన్లు అమ్ముకొని సందేళ వచ్చేటప్పుడు నిన్ను కొండుపోతా!”అంటూ రత్తమ్మ పిల్లవానికి సంజాయించింది.
వాడి చిన్న ప్రాణానికి వీధి వీధి ఎండనక వాననక తిరగాలంటే కాళ్ళు నొప్పులు.”అమ్మ అన్న తావున మస్తుమంది దోస్తులున్నారు.” అనుకున్నాడు సురేసు.
ఒక్కటే సురేసుకు అర్ధం అయింది.తల్లి తో నడవక్కరలేదు..
పెద్ద పేచీ లేకుండానే శాంతి దగ్గరున్నాడు సురేసు (సురేష్)
★★★
పిల్లవాడి భారం తగ్గటంతో రత్తాలుకి కొత్త కొత్త ఆలోచనలు ఉత్సాహం పెరిగింది.పక్కనే బండి మీద గాజులు, క్లిప్పులు అమ్ముకునే రాజయ్యని పిలిచింది ఒక చక్క మీద “చీరలు అమ్మబడును.”SAREES FoR SALE “అని రాయించిందితెల్ల పైంట్ మీద నల్లపైంట్ తో 7వక్లాసు వరకూ గవర్నమెంటు స్కూలులో చదివి చదువాపేసిన రాజయ్యతో.చాలా ఏళ్ళుగా రాయటం అలవాటు లేక బ్రష్ పెయింట్ తో రాయటం చాతకాక ఏదో కొక్కిరిగా రాసాడు.రత్తాలు తెలుగులో రాయమంటే తన ఆంగ్ల పాండిత్యం అంతా చూపించి పాపం sarees for sale అని కూడా రాసితన చదువు అక్కరకి వచ్చినందుకు తెగ మురిసి పోయాడు రాజయ్య.
రెండు కఱ్ఱలు పాతి ఆ కఱ్ఱలకు పెయింట్ చేసిన చక్కను మేకులతో కొట్టించింది. ఆ పని చేసినందుకు వద్దంటున్నా రాజయ్య చేతిలో 100 రూపాయలు పెట్టింది ఎవరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేని రత్తాలు.రాజయ్య పిల్లలకి తన దగ్గరున్న బట్టలు ఇచ్చింది.
శుక్రవారం నాడు ఆ కఱ్ఱలకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరి కాయ కొట్టింది.
ఇంటిముందు తొట్టిలో నీళ్ళునింపింది.
గుడిసె లో మంచి చాప పరచింది.ఒక అట్టపెట్టెలో ఇస్త్రీ చేసిన మంచి చీరలుపెట్టింది.
పిల్లల బట్టలు ఉతికి మడత పెట్టింది.
అమ్ముకోవడానికి వేళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ బట్టలన్నీ శాంతికి ఇచ్చి”అమ్మా నేను పేదదానిని కానీ నాకూ మనసుండాది.అయ్య,,అమ్మ లేని ఈ పోరలని సూత్తాఉంటే మనసు. నొచ్చుకుంటోంది. మీరేమనుకోనంటే ఈ డెస్సులన్నీ వ ఓరికి సరిపోతే ఆరికివ్వండమ్మా!” అంటూ చక్కగా మడతపెట్టిన బట్టల అట్టపెట్టె ఇచ్చింది రత్తాలు.

అన్నీ మంచి రెడీమేడ్ డ్రెస్సులు. ఒక్కటీ చినగలేదు.అన్నీ బిగుతై రత్తాలుకి ఇచ్చి నటువంటివి..శాంతి అభ్యంతరం చెప్పకుండా తీసుకుంది.
బీదరికంలోకూడా సహాయం చేయాలనే మానవతా ధృక్పదానికి శాంతి కళ్ళు చెమరించాయి.

మానవత్వం శాంతి రత్తాలుని మంచి స్నేహితుల్ని చేసాయి.సురేష్ శాంతి పర్యవేక్షణలో మంచి భాష,నడవడిక,తెలుగు ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకుంటున్నాడు.
ఒక్కొక్క రోజు శాంతి “సురేష్ ఇవాళ ఇక్కడే పడుకుంటాడని”ఉంచేసేది.
రత్తాలుది పల్లెటూరి అందం.పెద్దపెద్ద కాటుక కళ్ళు సూటైన ముక్కుకి ముక్కెర.మొరటుగా ఉన్నా తీర్చి దిద్దినపెదాలు.మంచి ఎత్తు ఎత్తుకు దగ్గబలమైన శరీరసౌష్టవం.తిన్నా తినకపోయినా మనిషిలో నీరసం ఉండేదికాదు.తల్లి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు సురేష్.
రత్తాలు బోర్డు పెట్టిన వేళా విశేషం పాతచీరల అమ్మకం జోరుగా సాగింది.తొట్టె దగ్గర కాళ్ళు కడుక్కుని గాని ఎవరూ లోనికి రాకూడదు.వచ్చిన వాళ్ళు కూర్చున్నాక అట్టపెట్టెలో చీరలు చూపించేది.
రఫ్చేసిన చీరలు మాత్రం బేరమాడనిచ్చేది.యాభై నించీ వంద వరకూ.
మంచి చీరలు రెండువందలు నించీ రెండువందలయాభై.అన్నీ గార్డెన్సిల్క్ లేకపోతే ఫాన్సీ జరీచీరలు.షాపులో పదిహేను రెండువేలు పలికేవి.నూటయాభైకి షాపులో కొత్తచీరదొరికినా పలచగా ఉండటం ఒకనాలుగు ఉతుకులకి జాలీలయ్యేవి.అందుకని బస్తీలో అందరూ రత్తాలు దగ్గిర చీరలు కొనటానికి ఇష్టపడేవారు.అదీకాక డబ్బులు రెండునెలల్లో తీరిస్తేచాలు.

సాయంత్రాలు పెందలాడే వచ్చి చీరల వ్యాపారం చేసేది.

      నెమ్మది నెమ్మదిగా సురేష్ శాంతి దగ్గర మాలిమయ్యాడు.ఇప్పుడు టెంత్ కి వచ్చాడు.ఎయిత్ నించీ తల్లితో  బస్తీలోకి వెళ్ళటం మానేసాడు ఎప్పుడో తప్పించి.చదువు వాడికి ప్రాణం.తనకు తల్లి ఉంది.అక్కడ తల్లీ తండ్రి లేని వారంటే వాడికి ఎనలేని ప్రేమ.చిన్న పిల్లలకి  స్నానం చేయించటం,అన్నం తినిపించటంతోపాటు వాళ్ళచేత హోంవర్క్ చేయించటం లాంటి పనుల్లో శాంతికి శాంతి భర్త ప్రకాష్ కి తలలలో నాలుకయ్యాడు.
                   ★★★

ఒకరోజు శాంతి రత్తాలు వ్యాపారం గురించి తెలుసుకుంది.
“రత్తాలు! ఎన్నాళ్ళిలా రోడ్లు పట్టుకు తిరుగుతావు ఎండనక వాననక ఇంటిదగ్గిరే ఉండి వ్యాపారం చూసుకోకూడదు.”అందిశాంతి.
శాంతి మాటలు వినంగానే రత్తాలు పడీపడీ నవ్వటం
నవ్వుఎంతకీ ఆపక పోయేసరికి ఉక్రోషంతో శాంతికి కోపం వచ్చింది.
“ఎందుకు నవ్వుతావు? నేను నీవైపు ఆలోచిస్తుంటే.” అందికోపంగా శాంతి.
“అమ్మా!నేను చీరల వ్యాపారం చేయట్లేదు పాతబట్టలకి స్టీలు సామాన్ల వ్యాపారం. అలా అని స్టీలుసామాన్ల వ్యాపారం కాదు.స్టీలుసామాన్లు లేకపోతే బట్టలు రావు.బట్టలు అమ్మకపోతే పైసలు రావు.పైసలు రాకపోతే స్టీలుసామాన్లు గెట్లాకొనేది.ఇంట్లో కూర్చునే యాపారం కాదమ్మానాది.”అంటూ శాంతికి కోపం వచ్చిందని గ్రహించి విడమరచి చెప్పింది రత్తాలు.

ఇప్పుడు శాంతివంతైంది పడీపడీనవ్వటం. తలకొట్టుకుని”ఇంత చిన్న లాజిక్ తనేలా మిస్సయింది. అందుకేనేమో చదువుకున్నవానికంటే చాకలివాడు మేలంటారు”అనుకుందిశాంతి.
★★★
ఒకరోజు సాయంత్రం రెండు శుభవార్తలు వినిపించింది శాంతి రత్తాలుకి.
మొదటిది సురేష్ మంచి పర్సెంటేజ్ తో టెన్త్ పాసయ్యాడు.
రెండవది ఒక పెద్ద అట్టపెట్టె నిండా కొత్తచీరలు.అన్నీ 100,150 రూపాయలకి.హోల్సేల్ లో మంచి చీరలు అతి తక్కువ ధరలో శాంతి ఫ్రెండ్ సూరత్ నించీ తెప్పించుకుంటుంటే రత్తాలుకని శాంతి తెప్పించింది.
“రత్తాలు ఇక మీదట పాతబట్టలకు స్టీలు సామాన్లోయ్అంటూ గల్లీ గల్లీ తిరగద్దు.ఇందులో నాస్వార్ధం కొంచెం ఉంది.ప్రొద్దునే ఆశ్రమానికి వచ్చి బాసాన్లుతోమి ఆశ్రమం ఊడ్చి తుడిచి వాషింగ్ మషీన్లో పిల్లల బట్టలుతికి ఆరవేయి.మధ్యాహ్నం వెళ్ళి నీ వ్యాపారం చూసుకో.నీకు ఆరువేలు జీతం.” ఇప్పుడిచ్చిన బట్టలు ఎడ్వాన్స్ అనుకో”అంటూ ఆ బట్టల పెట్టె అందించింది.
“ఏమంటావు రత్తాలు?నీకు ఇష్టమేనా?అడిగింది శాంతి.
“ఏమంటానమ్మా! అడగకుండా వొరాలిస్తున్న దుర్గమ్మతల్లివి.”అంటూ కాళ్ళమీద పడింది.
★★★
బళ్ళు ఓడలు ఓడలు బళ్ళూ. అవుతాయన్నట్లు రత్తాలు రాత మారిపోయింది. పిల్లవాడు స్కాలర్షిప్ తో ఇంటర్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు.ఆశ్రమానికే ఆదర్శం అయ్యాడు. శాంతి వాడి పర్శనాలిటీకి పోలీసు ఉఉద్యోగం అయితే బాగుంటుందని రత్తాలుని అడిగింది.
“నాబిడ్డ కాడు వాడు మీ బిడ్డ.వాడి కి ఏది మంచిదైతే అది చేయండి.”అంది రత్తాలు.
“ఏమంటావు సురేష్?”అంటూ ప్రకాష్ సురేష్ ని అడిగేడు.
“అది చాలా కష్టం కద అంకల్.” అన్నాడు సురేష్.
“నువ్వేమీ ఆలోచించకు.నిన్ను పోలీస్ రిక్రూట్మెంటుకి ప్రిపేర్ చేసే బాధ్యత నాది.నేను ఎక్స్ సర్వీస్ మెన్ ని ” గర్వంగా అన్నాడు ప్రకాష్.
పట్టుదల ,సాధన ఉంటే సాధించలేనిది లేదంటూ ప్రకాష్ గైడేన్స్ లో రిక్రూట్మెంటు లో సెలక్ట్ అయి ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తిచేసుకుని కానిస్టేబుల్ అయ్యాడు సురేష్.
తల్లి కి చీరల వ్యాపారమంటే ఇష్టమని సామాన్యులుండే చోట ముందుషాపు వెనుక ఒకగది కిచెన్ అద్దెకు తీసుకొని చీరల షాపు ఓపెన్ చేయించాడు.
“బోర్డ్ నేనే రాస్తా రత్తాలక్కా!”అన్నాడు రాజయ్య.
“మామా!నీకోదండం.నీబోర్డువంకరటింకర ఒ వానితమ్మడు సొ లా ఉంటుంది”అంటూ ఎక్కిరించాడు సురేష్.
“ఆఁ ! మా సెప్పొచ్చినావు.నేరాసిన బోర్డుతోనే అమ్మ సీరల యాపారం సేసింది.నువ్వుబుడ్డోడుగా ఉన్న సందెనించీ”అంటూ అలిగాడు రాజయ్య.
షాపు ఓపెనింగ్ కి శాంతి ప్రకాష్ దంపతులు వచ్చారు.
రత్తాలు వారికి సురేష్ చేత పూలదండ వేయించింది వారికి బట్టలు పెట్టి కొడుకును “మొక్కరా సురేసు”అంది.
“అమ్మా!సురేసు కాదే సురేష్ అను.గింతమంచి పేరెట్టి గట్ల పిలుస్తవేంటి?”అంటూ తల్లిని కసిరి ముద్దుపెట్టుకున్నాడు.
రత్తాలు షాపుకి
“పోచమ్మ టెక్స్టైల్స్POCHAMMA TEXTILES”
అని పేరు పెట్టింది.
బస్తీని వదిలి షాపులోనే కాపరం పెట్టింది రత్తమ్మ.

పూర్వం రాజుల వైభవ చిహ్నంగా మిగిలిన శిధిలావస్తలో ఉన్నకోటలులా
“చీరలు అమ్మబడును.”SAREES FOR SALE” బోర్డ్ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రత్తాలు ఘన విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.

ఏడాది కొకసారి. బస్తీకెళ్ళి మునుపు తన దగ్గిరకొనే దోస్తులకి పసుపు కుంకం కొత్తచీరలిచ్చి తృప్తి చెందుతుంది .బోనాలెత్తి నల్లపోచమ్మకి కొత్తచీర కట్టిస్తుంది.తను చేసేది పెద్దవ్యాపారం కాకపోయినా గొడ్డుఖారం ఉల్లిపాయ నంజుకుని సద్దన్నంతిన్నరోజులు మరువలేదు.ఈ నాడు ఉడుకుడుకు బువ్వతినగలుగుతోంది.కొడుకుని కొలువులో చూడగలగటం అన్నది పోచమ్మదీవెనని గట్టి నమ్మకం రత్తాలుకి.
“దశ మారినా దిశ మరువలేదు “రత్తాలు, సురేష్.వారిచేతనైనంత సేవ ఆశ్రమానికి అందిస్తూ ఆశ్రమం నడిపించడంలో వారూ సభ్యులయ్యారు.
ఓం శాంతి

                      దెవులపల్లి విజయలక్ష్మి.
July 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తిరిగి వచ్చిన వసంతం

by Maji Bharathi July 30, 2024
written by Maji Bharathi

చెయ్యి వెయ్యగానే ముడుచుకుపోయిన ఆమెను జూసి “నేనంటే యిష్టం లేదా?” అడిగాడతను.

“అబ్బే అటువంటిదేమీ లేదు” సర్దుకొని అతని భుజం మీద చెయ్యవేసిందామె. ఎందుకంటే కస్టమరు తన గురించి నెగిటివ్ రిపోర్ట్ ఇస్తే జరగబోయే పరిణామాలు ఆమెలోని అణువణువుకూ తెలుసు. నెత్తురొలికే గాయాలు తనువునీ, మనసునీ కబలించేస్తాయి. తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికితోడు మనసుకయ్యే గాయాలు కప్పిపుచ్చుకోవచ్చు. కాని తనువుకయ్యే గాయాలు అలా కాదు కదా! నొప్పితో విలవిల్లాడుతూ, మేమున్నామంటూ గుర్తుచేస్తూనే ఉంటాయి. దాని బదులు ఇప్పుడిది భరించడమే సులువనుకొని, అయిష్టంగా ముడుచుకుపోబోతున్న కండరాలను మందలించి, మనసుకు సర్దిచెప్పి, అతనికనుగుణంగా కదిలించింది తనువును. తన స్పర్శకు స్పందిస్తున్న ఆమెను అల్లుకుపోతున్నాడతను.

మధ్యలో చేస్తున్న పనినాపి హఠాత్తుగా “నేనందుకు పనికొస్తానా?” ప్రశ్నించాడతను.

కస్టమరుకి ఏది కావాలో అది అందించి, వాళ్లని సంతృప్తి పరిచి పంపించాలిక్కడ. అందుకే “ఎందుకలా అనుకుంటున్నారు? మీకేమి తక్కువ?” అని లేని ఉత్సాహాన్ని గొంతులో నింపుకొని అడిగింది.

“నిజంగానా! నువ్వబద్దం చెప్పడం లేదు కదా!” అని అంటూ, “పర్వాలేదా! నీకేమీ ఇబ్బంది కలగడం లేదు కదా! ఉంటే చెప్పంటూ” ఆమెను పెనవేసుకుంటున్నాడు.

ఇదో కొత్త అనుభవమామెకు. తన తనువుతో ఆడుకునేవాళ్లే గాని, “నీకేమీ ఇబ్బంది లేదు కదా!” అని అడిగిన కష్టమరుని ఇంతవరకు తన సర్వీసులో చూడలేదామె. తొలిసారిగా ఆమె మనసు స్పందిస్తోంది పరస్పర్శకు. ఆమె తనువును తీగగా చేసి మీటుతున్నాడు. తీగ మీటితే నాదము పలికినట్టు, ఆమె మనసు ఆనందనాదాన్ని పలుకుతోంది.  పారవశ్యం ఉత్తుంగ తరంగంలా ఇద్దరినీ అల్లుకుపోతుంది.

అలసి, సేదదీరిన అతను “నాలో ఏమీ లోపం లేదు కదా?” ఆమె చెవిలో గుసగుసలాడాడు. అలసి అతని చేతుల్లో సేదతీరుతున్న ఆమె “మీకా అనుమానమెందుకొచ్చిందంది ఆశ్చర్యంగా.

ఆమె స్వరంలోని మాధుర్యమో, మార్దవమో కదిలించిందతనిని. “నేనందుకు పనికిరాని వాడినంటున్నారంతా!” చిన్నపిల్లాడిలా చెప్పాడతను.

“మీమీద మీకా నమ్మకం లేదా?” అని అడిగిన ఆమెతో “ఏమో! నా మీద నాకే నమ్మకం పోయింది” నిట్టూర్చాడతను.

“ఎందుకలా?” అని అడిగిన ఆమెతో  “తానిష్టపడ్డ వాడిని పెళ్లి చేసుకుంటానని, ఇంటినుండి వెళ్లిపోయిన నా మరదలిని తీసుకొచ్చి, పరువుమర్యాదల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటే ఆనందంగానే చేసుకున్నాను. ఎందుకంటే తనంటే చిన్నప్పటినుండి నాకిష్టం కనక. మొదటిరాత్రి  ‘యింతకుముందు జరిగిందంతా మర్చిపోదాం. ఇకనుండి ఒకరికొకరమవుదాం’ అని తనను దగ్గరకు తీసుకుంటున్న నాతో, ‘ఛీ! నువ్వసలు మగాడివేనా? చీమూ నెత్తురూ లేదా!’ అని ఛీత్కరించుకొని గదిలోనుండి వెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా, నేను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ప్రేమించాననుకున్నవాడు దక్కలేదన్న బాధతో అలా అందేమోనని సరి పెట్టుకున్నాను. కాని, ఎప్పుడు తనకి దగ్గరవుదామని చూసినా ఆమె ముఖంలో ఒక రకమైన చీదరింపు… ‘నువ్వు మగాడివి కావంటూ….’

నేను మగాడిని కానా అని నామీద నాకే అపనమ్మకమేస్తుంటే …. నాలోనే ఏదో లోపం ఉందేమోనని నామనసుకే అనుమానం వేస్తుంటే…  అవునో కాదో తెలుసుకోవడానికి రహస్యంగా యిలా అప్పుడప్పుడూ ఎక్కడెక్కడికో వెళ్ళినా… వాళ్లు నా మీద చెయ్యి వెయ్యగానే నేను చేస్తున్నది తప్పని నా మనసు నన్నే మందలిస్తుంటే… ముడుచుకుపోయి, ఏమి చెయ్యని నన్ను, జాలిగా చూస్తూ… ‘మగతనం లేనప్పుడు ఎవరి దగ్గరైనా అంతే!’ అనేవాళ్లే గాని నీలా మృదువుగా నన్ను దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఆ అనుమానం” యేమి గుర్తొచ్చిందో కాసేపాగిపోయి….

తాను ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని…. నేను సంసారానికి పనికి రానని, విడాకులు కావాలని నా మరదలు కోర్టుకెక్కితే… వీడు మగవాడు కాదని కొంతమంది జాలిగా… కొంతమంది హేళనగా చూస్తుంటే… కట్టుకున్న భార్యే అవమానాన్ని మిగిల్చి వెళ్లిపోతే ఎందుకీ జీవితమని… బ్రతికి ఎవరినుద్ధరించాలని… ఇంకొకవైపు నా తప్పూ లేదు, నాలో యే లోపమూ లేదు, నేను మగవాడినే… అని అరిచి చెప్పాలని… ఇటువంటి విరుద్ధ భావాలతో, పోయేముందు ఒక్కసారైనా నేను మగవాడినేనని నిరూపించుకోవాలని…. యిదిగో యిప్పుడిలా నీ ముందు…. నీలా నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకున్న వాళ్ళెవరూ లేరు. నువ్వైనా నిజం చెప్పు” అన్న అతని ప్రశ్నకు జవాబు చెప్పకుండా “నీకేమి? నువ్వు బంగారు కొండవి. నిన్ను వద్దనుకున్నవాళ్లే దురదృష్టవంతులు” అతని పెదవులను తన పెదవులతో సన్నగా స్పర్శిస్తూ అందామె.

“నిజంగానా?” అతని మాటల్లో చిన్నపిల్లవాడిలోని ఉత్సుకత.  “కాక?” సమాధానాన్ని అతనికే వదిలేసిందామె. తృప్తిగా ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు.

“నన్ను పెళ్లి చేసుకుంటావా?” కౌగిట ఆమెను బంధించి అడిగాడతను. దూరంగా జరిగిందామె.

“చూసావా! పెళ్లి విషయమొచ్చేసరికి నువ్వూ దూరంగా జరిగావు. అంటే నిజంగానే నాలో ఏదో లోపముండి, నా మరదలు నన్ను విడిచి వెళ్లిందన్నమాట” విచారంగా అన్నాడతను.

“ఆమె  మిమ్మల్ని విడిచి యెందుకు వెళ్లిందో తెలియదు గాని, మీలో యే లోపమూ లేదు” అతని చెయ్యిమీద చెయ్యివేసి చెప్పిందామె.

“నన్ను పెళ్లి చేసుకోమంటే, దూరంగా జరిగావెందుకు?” సూటిగా చూస్తూ ఆమెనడిగాడతను.

“నా సంగతి తెలిసే అడుగుతున్నారా?” దిగులుగా అడిగిందామె.

“నీకేమి? నీలాంటి మంచిమనిషిని నేనింతవరకూ చూడలేదు.”

“నా మంచితనాన్ని మీరేమీ చూసారు?” అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగిందామె.

“ఇంకొకరి బలహీనతను అలుసుగా తీసుకోకపోవడమే అసలైన మంచితనం.  చావు అంచుల దగ్గర వేల్లాడుతున్న నన్ను, వొడ్డున పడేసావు. మోడైపోయిన చెట్టు వసంతంలో విరబూసినట్టు, మగవాడినేనన్న ధైర్యాన్ని నాలో విరబూయించావు. ఒక రకంగా నాకు పునర్జన్మనిచ్చిన నీ రుణమెలా తీర్చుకోగలను? నిన్ను పువ్వుల్లో పెట్టి నీ రుణం తీర్చుకోవాలని వుంది. నన్ను పెళ్లి చేసుకొని, నా జీవితానికొక అర్ధాన్ని కల్పించవా?” అభ్యర్థించాడతను.

ముసుగు వేసుకున్న ఆమె మనసు, లోపలి పొరలను తాకుతున్నాయతని మాటలు. కాని ఆ మాటలు నమ్మొచ్చా! లేదా! ఆమె మనసు తేల్చుకోలేక పోతుంది. నాలుగేళ్ల క్రింద ఇటువంటి మాటలే విని గడప దాటింది. ఏమైంది? జీవితమే చిధ్రమైపోయింది. ఎన్ని కలలో… ఎన్ని ఆశలో…. అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. నిజమేనని నమ్మింది. తనలాంటి వాళ్ళను మోసం చెయ్యడమే అతని వృత్తని తెలుసుకోలేకపోయింది. తెలిశాక ఏమి చెయ్యగలిగింది? కొన్నాళ్లు పోరాడింది బయటపడాలని. కానీ వోడిపోయింది. ప్రాణం తీసుకునే ధైర్యం చెయ్యలేక, ప్రతిక్షణం చస్తూ బ్రతుకుతుంది. అలాగని యిప్పుడితని మాటలు అబద్ధమని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదు.  ఒకవేళ యితని మనసే నిజమైతే…? జీవితంలో కోల్పోయిన వసంతమే తిరిగి వస్తానంటుంటే…   కాని, మరొక్కసారి మోసపోవడానికి మనసు అంగీకరించడం లేదు. ఆశపడి, భంగపడడానికి మనసు సిద్ధపడడం లేదు. అయినా భంగపడడానికి ఏమి మిగిలిందని తనకు జీవితంలో?

కాదంటే, జీవితంలో మరల ఇటువంటి అవకాశం తనకొస్తుందా?  ఒకవేళ ఈ అవకాశాన్ని తాను అందిపుచ్చుకుంటే…. అది తనకూ పునర్జన్మే అవుతుంది. కానీ తానతనిని పెళ్లి చేసుకుంటే అతని పరిస్థితెలా ఉంటుంది? ఇప్పటికే అతనెన్నో అవమానాలను మూట కట్టుకున్నాడు. ఇప్పుడు తనను పెళ్లి చేసుకుంటే, మరింత అవమానించి, అవహేళన చెయ్యదా లోకం? తన నుండి ఆయన మరిన్ని అవహేళనలకు గురికావాలా? ఒప్పుకుంటే… ఏమవుతుంది? ఒప్పుకోకపోతే అతనెలా స్పందిస్తాడు? ఏమి చెయ్యాలో తోచడం లేదు. విరుద్ధ భావాల మధ్య ఊగిసలాడుతుంది ఆమె మనసు.

***

“రమణగాడు పెళ్లి చేసుకున్నాడట”.

“వాడి సంగతి తెలిసి ముందుకొచ్చిన అభాగ్యురాలెవ్వరో?”

“నీకీ సంగతి తెలుసా! వాడు చేసుకున్న ఆడది ఆ టైపట”

“అంతేలే! లేకపోతే వీడి సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు? వాడికున్న ఆస్తి పీల్చేశాక, ఛీ! నువ్వు మగాడివే కాదు పొమ్మంటుంది”

“మగవాడిననిపించు కోవడానికి బజారుదాన్ని పెళ్లి చేసుకోవాలా? ఛీ! ఇంతకన్నా చావే మేలు”

“వీడి చాటుగా దుకాణం తెరుస్తుందంటావా?” అది అనుమానమో! లేక అలా అవ్వాలన్న కోరికో!

“రామ! రామ! ఆఖరికి ఏ స్థాయికి దిగజారిపోయాడో! పదిమందికి పక్క వేసిన దానిని పెళ్ళాడాడా? దాని బదులు కొజ్జా అనిపించుకోవడమే మేలు”

“మమ్మల్నడిగితే మేము మంచి సంబంధం కుదర్చమా! లోకంలో ఆడపిల్లలే గొడ్డు పోయారా? ఇదేమి పనని, లేని పెద్దరికాన్ని నెత్తినేసుకొని మందలిస్తూ కొందరు…

“అదెన్నాళ్ళుంటుందిలే?  ఆరునెలల్లో వీడిని తన్నితగిలెయ్యకపోతే, మీసం గొరిగించుకుంటానని ఒకడి శపథం. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నట్టుంది.  వీడెలాగూ అందుకు పనికిరాడు. ఎన్నాళ్ళు మడికట్టుక్కూర్చుంటుంది. ట్రై చేస్తే పడిపోతుందని ఇంకొకడి దురాలోచన.

రకరకాల వ్యాఖ్యానాలు. మనసును తూట్లు పొడిసేలా మాటల తూటాలు. గుండె గాయమయ్యేలా అసహ్యకరమైన చూపులు…… కుతూహలం ఆపుకోలేక కొందరు… దురుద్దేశాలు మనసుల్లో పెట్టుకొని కొందరు…. రకరకాల ఉద్దేశాలతో రమణ ఇంటి గడప తొక్కుతూనే వున్నారు.

వేటినీ లెక్కించలేదు రమణ. చాలా నిబ్బరంగా ఉన్నాడు. పూర్వాశ్రమంలో ఆమె పేరేమిటో? అడగనే లేదు. వసంత అని పిలుస్తున్నాడు. ఎందుకా పేరని ఆమె అడిగితే నా జీవితంలో తిరిగి వచ్చిన వసంతానివి నువ్వన్నాడు. ఆమె రమణ నమ్మకాన్ని నిలబెడుతూ, యెవరు యెటువంటి వ్యాఖ్యానాలు చేసినా చలించకుండా, రాయిలా రమణ వెన్నంటే  స్థిరంగా నిలబడింది.

***

రమణ పెళ్ళై యెన్నాళ్ళో గడవలేదు. రమణ పెళ్ళాం నెల తప్పిందని యిరుగుపొరుగుల గుసగుసలు.

“కారణం రమణేనంటావా?” ఒకమ్మ అనుమానం. “ఆవిడికే తెలియాలి” ఒకరి సమాధానం.

“ఆవిడకైనా తెలుసంటావా?” ఇంకొకరి సందేహం.  “నిజమేలే! ఎంతమందో!” ఇంకొకరి కనుబొమ్మల ఎగురవేత.

“ఛీ! ఊరుకోండే. కడుపుతో వున్న పిల్లని గురించి అవేం మాటలు” మందలించింది ఒక పెద్దామె.

“మనకెరుక లేని ఆ పిల్ల గతం గురించి మనమెందుకు మాట్లాడుకోవడం? నాలుగునెలల నుండీ చూస్తూనే వున్నాం కదా! వంక పెట్టడానికి వీల్లేని పిల్ల. మీరేమంటే అనండి గాని, ఆ పిల్లని పెళ్లి చేసుకొని రమణ మంచిపనే చేశాడు” వత్తాసు పలికింది ఒకామె.

“మనకెందుకులేమ్మా! ఆవిడ గురించిన తగువులు” ఒకరి నిష్టూరపు మాటలు. నీలాటిరేవు దగ్గర మాటలిలా వుంటే, రచ్చబండ దగ్గర మాటలెలా వున్నాయంటే….

“ఆవిడ నెల తప్పిందట కదా!” కళ్లెగరేసాడొకడు.

“మనోడి ప్రతాపమేనంటావా?” అదోరకంగా చూస్తూ ఒకడు.

“ఏమో! ఎవడికి తెలుసు? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక” పెదవి విరిచాడొకడు.

“మీరేమంటే అనండి గాని, మనందరిలోకెల్లా అదృష్టవంతుడు వాడే” అన్నాడొకడు.

“నిజమేరా! ఈ పిల్లను పెళ్లి చేసుకొని సుఖపడ్డాడు. గతానిదేముంది? ఇప్పుడెలా వుందో చూడాలి గాని!” వత్తాసు పలికాడు ఇంకో స్నేహితుడు.

“ఏరా! మీకేమైనా మత్తు జల్లిందా! వెనకేసుకొస్తున్నారు” ఒకడి వెటకారం. “చూస్తుంటే తెలుస్తోంది కదా!” ఇంకొకడి వేళాకోళం.

“ఛీ! మీరు మారరురా!” ఛీత్కరించి అక్కడ నుండి లేచిపోయారు, రమణ అదృష్టాన్ని పొగిడిన ఆ ఇద్దరు స్నేహితులు.

“రమణను వాళ్ళావిడ గౌరవించినట్టు, మీ భార్యలు మిమ్మల్ని గౌరవిస్తున్నారా? గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండిరా! పోకిరి కబుర్లు చెప్పడం కాదు. ఆవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడితే, మీ అందరి జాతకాలూ బయట పెట్టీగలను” భుజంమీద తువ్వాలు దులిపి వార్నింగిచ్చాడు, అక్కడ కూర్చున్నవాళ్ళలో ఒకడు.

అక్కడున్న ఎంతోమందికి అనుభవమే. రమణ భార్య నిప్పులాంటి మనిషని, ముట్టుకోబోతే కాలుతుందని. దానికి తోడు రమణను ఆమె యెంత అపురూపంగా చూసుకుంటుందో, అక్కడ వున్న అందరూ చూస్తూనే వున్నారు. అందుకే నోరు మెదపలేదు యే ఒక్కడూ.

***

అప్పటినుండీ చర్చల్లో అగ్రస్థానం రమణ గురించే, పుట్టబోయే బిడ్డ గురించే… ఎవరి పోలికలొస్తాయా అని. వీళ్లందరి చర్చలకు తెరదించుతూ అచ్చు గుద్ధినట్టు రమణ పోలికలతో పుట్టి, రమణ లలితలను ఆనంద డోలికలలో ముంచేస్తూ, వాళ్ల జీవితాల్లో వచ్చిన వసంతాన్ని మరింత వర్ణమయం చేశాడు రమణ, లలితలకు పుట్టిన మగబిడ్డ.

***

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మహాకవి దాశరథి శత జయంతి మహోత్సవం

by Nellutla Madhava Srinivas July 30, 2024
written by Nellutla Madhava Srinivas

కాకతీయ ప్రభల కాణాచికోటలో
గూడూరునందుదయించె సూర్యుడు!
తెలగాణతెగువకు తేజోవిరాజితుడు
నైజాముప్రభువుకు నిత్యాగ్నిహోత్రుడు!
రాచరికవ్యతిరేక రామబాణమ్మతడు
ప్రజలగుండెల్లోన మరఫిరంగేయతడు!
భూస్వామ్యపద్ధతిని భూస్థాపితముచేసి
సామ్రాజ్యవాదాన్ని చెత్తబుట్టలో వేసే!
సంస్కృతాంధ్రపద్య ధారలను పారించి
ప్రతిఘటించునటుల ప్రజలనుమేల్కొల్పె!
కవనపాండిత్యాన కవచకుండలధారి
విప్లవాగ్నినిరాల్చ విస్ఫొటక ఝరీ!
విశ్వవేదికనందు శాంతికాముక గాంధి
సమరమునుసాగించ శంఖమూదిన క్రాంతి!
నా తెలంగాణ కోటిరత్నాలవీణంటూ
తిమిరములు బాపగ సమరమెంచిన కాంతి!
ఏరులై పారేటి అగ్నిధారలజూసి పారిపోయిరి
దొంగ బూర్జువా దొరలంతా!
ముసలినక్కకుయేల నైజామురాజ్య?మని
నైజామురాజాల పైజామాలనడిగే!
నిగ్గుతీసెడి నల్లబొగ్గురాతలతోడ
పదఘట్టనల పద్యగద్యాలమేల్కొలిపే!
రుద్రవీణను మీటి ఉక్కుగొలుసులు తెంచి
గాలీబూగీతాలప్రేమసారము పంచె!
సినీ యాకసమున కవిరవిలాగ పేరొంది
అలుగునేనన్నాడు పులుగునేనన్నాడు
వెలుగునేనన్నాడు తెలుగునేనన్నాడు!
సాహిత్యలోకాన శశికాంతుడయ్యాడు
తెలగాణమేథకు తెలివితానైనాడు!
అందుకో మాచేత దాశరథి మా జోత
అందుకో వందనము మా కృష్ణమాచార్యా!

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆంగ్లం బోధించిన ఉపాధ్యాయుడు వారాల అంజయ్య.

by Narendra Sandineni July 30, 2024
written by Narendra Sandineni

వారాల అంజయ్య తేది 28 – 05 – 1935 రోజున పెద్ద గడియారం వీధి కరీంనగర్ లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు నరసమ్మ,నరసయ్య.వారాల నరసయ్య,నరసమ్మ దంపతులకు నలుగురు సంతానం.1) వారాల వెంకటస్వామి భార్య శారద.వెంకటస్వామి వ్యాపారం చేసి జీవనం సాగించాడు.2) వారాల జగన్నాథం భార్య సత్యమ్మ.జగన్నాథం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.3) వారాల సత్యనారాయణ భార్య ఊర్మిళ. సత్యనారాయణ ఫారెస్ట్ గార్డ్ గా పని చేసి రిటైర్ అయ్యాడు.4) వారాల అంజయ్య భార్య రాధ. అంజయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడింది.అది కరీంనగర్ పట్టణంలో మొదటి మిఠాయి సత్తమ్మ స్వీట్ హౌస్ గా పేరు గాంచింది.మిఠాయి సత్తమ్మ వారాల అంజయ్యకు పెద్దమ్మ.సత్తమ్మకు పిల్లలు లేరు.మిఠాయి సత్తమ్మ మరిది నరసయ్య తోటి కోడలు నరసమ్మ పిల్లలను తన పిల్లలుగా చూసుకునేది.మిఠాయి సత్తమ్మది సంపన్న కుటుంబం.సత్తమ్మకు స్వీట్ హౌస్ తో పాటు గాజుల దుకాణం కూడా ఉండేది.సత్తమ్మ స్వీట్ హౌస్ మరియు గాజుల దుకాణంలో 30 మంది వర్కర్లు పని చేసే వారు.మిఠాయి సత్తమ్మ నిజాం కాలంలో గుర్రం ఎక్కి ప్రయాణం చేసేది.

అంజయ్య గడియారం వద్ద గల కానిగి బడిలో 1,2,3 వ తరగతులు చదువుకున్నాడు.ఆ రోజుల్లో కానిగి బడి పంతులుగా యెంబెరు స్వామి 35 మంది పిల్లలకు అత్యుత్తమమైన విద్యను బోధించే వాడు.యెంబెరు స్వామి పిల్లలకు విద్య,వినయం నేర్పించే వారు.కానిగి బడి పంతులు గారి పేరు 40 సంవత్సరాల తర్వాత యెంబెరు స్వామి అని తెలిసింది.ఆ రోజుల్లో టీచర్లు అంటే అంత గౌరవం ఉండేది.మా సారు అని గౌరవంగా చెప్పే వాళ్ళం.కానీ సారు పేరు మాత్రం తెలియదు.అంజయ్య తాహతీయ గంజి స్కూల్ పాఠశాలలో 4 వ తరగతి వరకు చదువుకున్నాడు.గంజి పాఠశాలలో హసన్ అలీ ఉర్దూ చక్కగా బోధించే వాడు.అంజయ్య 5 వ తరగతి నుండి 10 వ తరగతి మెట్రిక్ వరకు గవర్నమెంట్ హై స్కూల్ (పురాణ) కరీంనగర్ లో ఉర్దూ మీడియంలో చదివాడు.ఆ రోజుల్లో గవర్నమెంట్ హైస్కూల్ లో ఆర్.వి.రావు ఇంగ్లీష్ చక్కగా బోధించేవాడు.అంజయ్య ప్రైవేట్ గా చదువుకొని బి.ఏ విద్యను పూర్తి చేశాడు.అంజయ్య బీఈడీ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వరంగల్ లో చదివాడు.అంజయ్య మెట్రిక్ 1952వ సంవత్సరంలో ఉత్తీర్ణులు అయ్యాడు.ఆ రోజుల్లో 10వ తరగతిని మెట్రిక్ అని పిలిచే వారు.మెట్రిక్ విద్య పూర్తి కాగానే అంజయ్య 1952 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల వీణవంకలో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డాడు.వీణవంక పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉండేది. ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.

ఆ రోజుల్లో టీచర్లకు జీతం తక్కువగా ఉండేది.అంజయ్య ఉద్యోగ జీవితం ప్రారంభించినప్పుడు 56 రూపాయల నెల జీతం లభించేది.అంజయ్య గొప్ప గొప్ప హెడ్మాస్టర్ల కింద పని చేశాడు.హెడ్మాస్టర్లకు అంజయ్య పై సదభిప్రాయం ఉండేది.ఆంగ్లము చక్కగా బోధిస్తాడు అనే పేరును అంజయ్య సంపాదించుకున్నాడు.నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు.అంజయ్య పాఠశాలలో పని చేస్తున్న రోజుల్లో వీణవంక గ్రామంలో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడే ఉండే వాడు.వారానికి ఒక రోజు ఇంటికి వస్తూ ఉండే వాడు.అంజయ్యకు 1953 సంవత్సరంలో రాధతో వివాహం వేములవాడలో జరిగింది.అంజయ్య మామగారు మంగారి సుబ్రహ్మణ్యం వేములవాడ దేవస్థానంలో ఆయుర్వేద డాక్టర్ గా పని చేశాడు.సుబ్రహ్మణ్యం వేములవాడలో గొప్ప డాక్టర్ గా ప్రసిద్ధి పొందాడు. అంజయ్య రాధ దంపతులకు ఐదుగురు సంతానం. ప్రథమ సంతానం : వారాల ఆనంద్ భార్య ఇందిరా రాణి.ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కరీంనగర్ లో లైబ్రేరియన్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు.ఆనంద్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు గ్రహీత,ప్రముఖ కవి,సినిమా విశ్లేషకులు,అనేక కవితా సంపుటి పుస్తకాలు, అనువాద సాహిత్యం,సినిమా సమీక్షలు,పుస్తకాలు రాసి ప్రసిద్ధి పొందాడు.ఆనంద్ ఇందిరా రాణి దంపతులకు ఇద్దరు సంతానం.ప్రథమ సంతానం కూతురు రేల భర్త వేణుమాధవ్.రేల,వేణుమాధవ్ దంపతులకు ఒక్కరే సంతానం.పేరు ప్రద్యుమ్న. ఆనంద్,ఇందిరా రాణి దంపతుల ద్వితీయ సంతానం. కుమారుడు అన్వేష్. అంజయ్య ద్వితీయ సంతానం : పసుపునూటి మంజుల భర్త శ్యాంసుందర్.శ్యాంసుందర్ వ్యాపారంలో కొనసాగుతున్నాడు.మంజుల శ్యాంసుందర్ దంపతులకు ఇద్దరు సంతానం.1) కూతురు అఖిల భర్త విజయ్.విజయ్ వ్యాపారం చేస్తున్నాడు.2) కుమారుడు నిఖిల్ బాబు ప్రైవేట్ ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు. అంజయ్య తృతీయ సంతానం : సాయిని అనురాధ భర్త వెంకటేశ్వర్లు.వెంకటేశ్వర్లు రేకొండ గ్రామానికి చెందినవాడు.ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యాడు.అనురాధ వెంకటేశ్వర్లు దంపతులకు ఒక్కతే పాప.పేరు కీరవాణి. అంజయ్య చతుర్ధ సంతానం : వారాల అర్జున్ భార్య ఉషారాణి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అర్జున్ హైదరాబాదులో పని చేస్తున్నాడు.అర్జున్ ఉషారాణి దంపతులకు ఇద్దరు సంతానం :1) కూతురు చరిష్మా 2) కుమారుడు ఆరుష్.ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు.
అంజయ్య పంచమ సంతానం : వారాల అమర్ భార్య శ్రీలత.అమర్ ఫోటో డిజైనర్ గా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.అమర్ కరీంనగర్ లో నివాసం ఉంటున్నాడు.అంజయ్య యు.పి.ఎస్. ధనగర్వాడి పాఠశాలలో హెడ్మాస్టర్ గా పని చేశాడు.అంజయ్య యు.పి.ఎస్. ప్రభుత్వ పాఠశాల,సావరాన్ స్ట్రీట్ లో హెడ్మాస్టర్ గా పని చేశాడు. తర్వాత కార్ఖానా గడ్డ హై స్కూల్,ధన్గర్ వాడి హై స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడిగా పని చేశాడు. అంజయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల గవర్నమెంట్ హై స్కూల్ నుండి 1993 వ సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాడు.అంజయ్య 1983 వ సంవత్సరంలో కరీంనగర్,మంకమ్మ తోట వీధిలో స్వగృహం నిర్మించుకున్నాడు.అంజయ్య భార్య రాధ 1987 వ సంవత్సరంలో అనారోగ్యంతో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.అంజయ్యను భార్య గురించి అడిగితే కళ్ళల్లో నీళ్లు తీసుకున్నాడు.ఎందుకు అన్ని విషయాలు గుర్తు చేస్తున్నావు?బాధగా ఉంది అన్నాడు.మీ భార్య ఉన్నప్పుడు ఎలా ఉండే వారు? అని అడిగితే ఆమె ఉన్నప్పుడు ప్రశాంత జీవనం ఉండేది అని తెలియజేశాడు.జీవితంలో కలయికలు, ప్రేమ,దుఃఖం అన్నీ ఉండేవి.అంజయ్య ఉపాధ్యాయుడిగా బాధ్యతగా పని చేశాడు. అంజయ్యకు పాఠశాలలో బోధన తప్ప మరే వ్యాపకం ఉండేది కాదు.అంజయ్య రిటైర్ అయిన తర్వాత ఎక్కడా పని చేయలేదు.1969 సంవత్సరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గురించి అడిగితే చదువుకున్న వాళ్లలో మాత్రమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉండేది.మామూలు జనాలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి వారికి అంతగా తెలియదు.

2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం చాలా సంతోషకరమైన విషయం.టీచర్లు ప్రశాంతంగా ఉన్నారు.టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలియజేశాడు.మీకు ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు వచ్చిందా? అని అడిగితే ఎలాంటి అవార్డు రాలేదు.అవార్డు రావాలని కూడా ఏనాడు కోరుకోలేదు.ఉపాధ్యాయుడిగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను.అంతే అదే నాకు సంతోషం.అది చాలు అన్నాడు.చిన్నప్పటినుండి అంజయ్య సైకిల్ నడిపేవాడు 88 సంవత్సరాల వయసు వరకు సైకిల్ నడిపాడు.ఈ మధ్యనే ఇంట్లో జారి పడ్డాను.కాలు విరిగింది.కాలు విరిగిన తర్వాత ఎక్కడికి పోవడం లేదు.ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పాడు.సైకిల్ ను ఈ మధ్యనే అమ్మేశాను అని చెప్పాడు. మీ దినచర్య ఎలా ప్రారంభమవుతుంది అని అడిగితే పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుంటాను.ఏ దేవునికి పూజ చేయను.సూర్య నమస్కారం చేయను.దేవుని మనసులోనే తలుచుకోవాలి అని చెప్పాడు.ప్రశాంత జీవనం ఉండేది.చిన్నప్పటినుండి హిందీ పాటలు వినడం అలవాటయింది హిందీ సినిమాలు చూసేవాన్ని అని చెప్పాడు రచయిత నరేంద్ర సందినేని 1978 – 1981 సంవత్సరంలో మంకమ్మ తోటలో గల ధన్గర్ వాడి హైస్కూల్ లో చదువుతున్నప్పుడు అంజయ్య సారు నాకు పదవ తరగతిలో ఇంగ్లీష్ బోధించే వాడు. క్లాసులోని విద్యార్థులు అందరికీ గ్రామర్ చక్కగా నేర్పించారు.నేను పాఠశాలలో చదువుకున్న రోజుల్లో ఉపాధ్యాయులు బెత్తం తీసుకుని క్లాసులోకి వచ్చే వారు.సరిగా నేర్చుకోని విద్యార్థులకు బెత్తం దెబ్బలు పడేవి.ఆనాటి ఉపాధ్యాయులు విద్యార్థుల శ్రేయస్సు కొరకు పాటుపడేవారు.నాకు విద్య నేర్పిన గురువు అంజయ్య సారు గురించి ఆర్టికల్ రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది.అంజయ్య సారును ఇంటికి వెళ్లి కలిశాను.అంజయ్య సారు కుమారుడు అమర్ నా వెంట ఉండి సహకరించాడు.

July 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చీరలోని గొప్పతనం.. 14

by Ramakrishna Manimadde July 29, 2024
written by Ramakrishna Manimadde

చీరకట్టులో సౌశీల్యం ప్రతిబింబిస్తుంది..
సౌందర్యం ఇనుమడిస్తుంది..
భౌగోళిక అస్తిత్వం భాసిల్లుతుంది..
సంప్రదాయం ఉరకలేస్తుంది..

అంతేనా..?
మరెంతో ఉంది అంటున్నారు కవి ‘చంద్రబోస్.’
‘చీరలోని గొప్పతనం తెలుసుకో..’ అంటూ
‘పల్లకిలో పెళ్ళికూతురు ‘ సినిమా కోసం
ఆడపిల్లకు చీరను ఆయనంగా ఇస్తున్న ఆ వైనాన్ని తెలుసుకుందాం..!

చీరలోని గొప్పతనం తెలుసుకో… ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో
సింగారమనే దారంతో చేసింది చీర. ఆనందమనే రంగులనే అద్దింది చీర
మమకారమనే మగ్గంపై నేసింది చీర

సహజ వారసత్వంగా.. సంప్రదాయంగా
మనకు తరతరాలుగా అందుతున్న
అస్తిత్వ సంపద చీరను ఈ తరం అమ్మాయిలు విస్మరిస్తున్నారు.. పక్కన పెట్టేస్తున్నారు.

ఈ చీర కట్టును ఆధునికత కనుమరుగు చేస్తుంది.
దాని గొప్పతనాన్ని కమ్మేస్తుంది..
అందుకే చీరలోని గొప్పతనం తెలుసుకో..!
ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో అంటున్నారు గీతరచయిత చంద్రబోస్.

చీర అల్లిక వెనుక సింగారం అనే దారం ఉంది..
అది అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఆనందపు రంగుల అద్దకం ఉంది..
అది మనసు పొరల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.

మమకారపు మగ్గం ఉంది..
అది పుట్టినింటికి మెట్టినింటికి మధ్య
అనుబంధాన్ని పెంచుతుంది అంటూ చీర తయారీ విధానంలోని కళాత్మకతకు కవితాత్మక సొగసులు దిద్దారు గీత రచయిత.

మడికట్టుతో నువ్వు పూజచేస్తే..గుడి వదిలి దిగివచ్చును దేవుడు
ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే..సిరిలక్ష్మిని కురిపించును పంటలు

ఆధునిక దుస్తులు ధరించి
నియమ నిష్ఠలతో నువ్వు పూజ చేస్తే అందులో నిండుతనం ఉండదు.. నిండార చీరకట్టుకుని, మడికట్టుతో నువ్వు చేసే పూజ వలన గుడిని సైతం వదిలి దిగివస్తాడు దేవుడు. అంతటి మహత్యం ఉంది చీరకు.

చీరను దోసి, ఎంకి కట్టుతో సౌకర్యవంతంగా పొలం పనులు చేస్తుంటే ధాన్యాగారం నీ ఇంట పొంగిపొరలి సాక్షాత్తు మహలక్ష్మియే నట్టింట నిలిచి సిరులు కురిపిస్తుంది.

జారుకట్టుతో పడకటింట చేరితే..గుండె జారి చూస్తాడు పురుషుడు
నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే.. దండాలే పెడతారు అందరూ

కనీ కనిపించని అందాలను పడకటింట భర్త కంట పడేలా చేసేది చీర మాత్రమే.. ఆ కనికట్టు చీరకు ఉంది కాబట్టే జారుకట్టుతో భర్తకు చేరువగా భార్య వచ్చినప్పుడు తన గుండె జారి చూస్తాడు పురుషుడు.. ఎంతటి అలకలు ఉన్నా ఆ క్షణం అన్నీ క్షణభంగురమే కదా..!

నిండైన ఆహార్యంతో చీర కట్టుకుని, ఆత్మవిశ్వాసంతో నడిచి వెళ్తుంటే.. అందరూ దండాలు పెడతారు. ఆ పవిత్రత చీరకట్టుకు ఉంది.

అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది.. కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది
చిన్న చీరకొంగులోన కన్నతల్లి ఉన్నది

కడుపారా అన్నం తిన్న తదుపరి మూతిని తూడ్చే చీర కొంగు, కన్నీరై ఉన్నప్పుడు చెంపను కూడా తడుమును. అన్నంలో ఆపదలో అమ్మను చూపేది, అమ్మలా బాసటగా నిలిచేది చీర కొంగు మాత్రమే అని.. మన జీవనంలో చీర కొంగు నిర్వహించే ఉద్దాత్తమైన పాత్రను తెలియజేస్తున్నారు చంద్రబోస్.

పసిపాపలా నిదురపోయినప్పుడు.. అమ్మ చీరే మారేను ఊయలగా
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు..ఈ చీరేగా అందాలకు అడ్డుతెర

ఆదమరిచి పసిపాపలా నిద్దుర పోయినప్పుడు ఊయలగా మారి హాయినిచ్చును. బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టే ఘడియలకు సాక్షీభూతంగా నిలిచి, అరవిరిసిన అందాలకు అడ్డుతెరగా నిలుచును ఈ చీర..!

గాలి ఆడక ఉక్కపోసినప్పుడు..ఆ పైటేగా నీ పాలిట వింజామర
ఎండ వాన నీకు తగిలినప్పుడు.. ఆ కడకొంగే నీ తలపై గొడుగు
విదేశాల వనితలకు సారె పోసి పంపేది..భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది..
మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది..

గాలి స్తంభించి ఉక్కిరబిక్కిరైన సమయాన వింజామరలా మారి నీ ఉక్కపోతను తీర్చేది ఆ పైటే..

ఎండనుండి నిన్ను కంది పోకుండా కాపాడిన ఆ కడకొంగే, వాన నుండి నిన్ను రక్షించటానికి గొడుగుగా మారి నీ వెతలు తీర్చును.

విదేశీ వనితకు సారే పోసి సోదరిగా గౌరవమిచ్చి ఆదరించి, మన భారతీయ సంస్కృతిని సగౌరవంగా చాటేది చీర.. అంతెత్తున ఎగిసే మన జాతీయ జెండాకు సరితూగి సమానంగా నిలిచేది చీర అని,
ఈ తరానికి చీర గొప్పతనం చాటి చెప్పే గీతాన్ని అందించారు చంద్రబోస్.

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కథాభారతి – 55

by Madhu Jella July 29, 2024
written by Madhu Jella

అంశం: వీడిన మబ్బులు
కథా శీర్షిక:
ఆదివారం.. పిల్లలు..ఆయనా బయటికెళ్ళారు.పనులన్నీ తీరినాక టీవీ ఆన్ చేసి సీరియల్ చూస్తూ కూర్చున్నా. అంతలో ఫోన్ మ్రోగింది..ఆయనదే.ఇంట్లోనే మరిచిపోయినట్లున్నాడు.పట్టించుకోలేదు.
నాలుగైదుసార్లు అదే పనిగా ఫోన్ రింగవుతూంటే .. నేనే వెళ్ళి లిఫ్ట్ చేసా. “హలో సార్..’ ఓ స్వీట్ వాయిస్ పలకరించింది. ‘హెలో..ఎవరు’ అన్నాను.’సార్ .. సార్ లేరా అండీ’ అంది. ‘లేరు.. ఫోన్ ఇంట్లోనే పెట్టి బయటికెళ్ళారు’.ముక్తసరిగా అనేసరికి కాల్ కట్ చేసింది. కొద్దిసేపటికి
మళ్ళీ అదే నంబరు నుండి కాల్.కట్ చేసా. మళ్ళీ కాల్ చేస్తున్నారెందుకో..చిరాకేసింది.
మళ్ళీ కాల్ వస్తోంది.ఇప్పుడు.. కాల్ లిఫ్ట్ చేయగానే ‘హలో..’ అదే గొంతు.తీయగా పలకరిస్తోంది.’ఎవరు?’ .. కొద్దిగా గట్టిగా అనగానే కాల్ కట్ చేసింది.
బయటికెళ్ళి ఇంకా ఈయన రానేలేదు. ఈ ఫోన్ల గోలొకటీ..వెంటతీస్కెళ్ళొచ్చుగా.. ఉన్నట్టుండి ఏదో ఆలోచన మనసులో మెదిలి కళుక్కుమంది. ఏదో అనుమానపు తెర మనస్సును కమ్మేయబోతుంది .ఆ ఊహే భయం కలుగజేసింది.. ఎంత కంట్రోల్ చేసుకున్న..ఆ ఫోన్ కాల్.. తీయని గొంతు.. గుర్తుకొస్తున్నాయి..ఈయనేమైనా….అంతటితో బలవంతంగా ఆ ఆలోచనను మానుకుందామని ప్రయత్నిస్తున్నా..
ఇంతలో అదే నెంబరు నుండి మళ్ళీ కాల్ వస్తోంది.
కాల్ లిఫ్ట్ చేసి ‘హలో..ఎవరు మీరు. కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడకుండా కట్ చేస్తున్నారు.విషయం ఏమిటో చెప్పండి ‘ గట్టిగా అన్నాను. ‘హలో.. అమ్మ..సార్ లేరా?.. ఇప్పుడు మధ్య వయస్సు ఆవిడ మాట్లాడుతోంది.’అమ్మా.. సార్ గారికి చాలా థాంక్సమ్మా.. నిన్న సార్ గనుక సాయం చేయకుంటే నా కొడుకు ప్రాణాలతో బయటపడేవాడే కాదు. మా చిన్నబ్బాయి నిన్న బైక్ ఆక్సిడెంట్ అయి పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూంటే అక్కడే ఉన్న సార్ హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేసి అవసరమైన సాయం చేసాడు.మా వాడి ఫోను,పర్సులో ఉన్న అడ్రస్ తో మాకు సమాచారమిచ్చాడు తల్లి. గాబరాగా..అందరం షాక్ తోనే హాస్పిటల్ కి వెళ్ళాం.మమ్మల్ని సారే గుర్తించి మా అబ్బాయిని ఉంచిన వార్డు కు తీసికెళ్ళాడు.డాక్టర్లతో మాట్లాడించి, మాకు ధైర్యం చెప్పాడు. ఇంతకు ముందు కాల్ చేసింది మా అమ్మాయేనమ్మా..ఆ సార్ కి ఫోన్ చేయమని నేనే చెప్పాను. బాధలో,కంగారులో సార్ పేరు కూడా కనుక్కోలేదు. సార్, మాకు ఫోన్ చేసిన నెంబరు గుర్తించి ఫోన్ చేస్తున్నాము తల్లీ.. దేవుడిలా వచ్చి నా కొడుకుని రక్షించాడమ్మా.. అందరిలా ఆయనా వదిలేసి వెళ్ళుంటే..”’ ఆమే గొంతు గద్గదమైంది.వెక్కి ఏడుస్తోంది..తనే ‘ నా కొడుకు ప్రాణాలు నిలబెట్టాడు.. ఆయనకు చాలా ఋణపడి ఉంటామమ్మా.. సార్.. మీరందరూ చల్లగా ఉండాలి తల్లి.. సార్ తో చెప్పమ్మా..మా వాడు బాగానే ఉన్నాడు..” కృతజ్ఞతతో నిండిన గొంతుతో చెబుతూ ఆమె ఫోన్ పెట్టేసింది.
కొద్ది సేపు నన్ను మౌనం ఆవహించింది. చాలా గిల్టీగా అనిపించింది. క్షణంలో మనసు చేసిన మాయలోపడి మా ఆయనని అపార్థం చేసుకొనే స్థాయికి వెళ్ళినందుకు. ఇప్పుడు మనసు తేలికైంది.ఆ పెద్దావిడ మాటల్లో వినిపించిన కృతజ్ఞతాభావం నాలో మా ఆయనపట్ల ఉన్న ప్రేమా, నమ్మకమూ మరింత బలపడ్డాయి.. తాత్కాలికంగా నా మనసును ముసిరిన అనుమానం మబ్బు తెరలు ఒక్కసారిగా తొలగిపోయాయి. అపోహపడినందుకు మనసులోనే క్షమాపణలు కోరుకున్నా. ఎవరూ కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండానే ఎవరినీ.. మనవారినీ..అయినవారినీ అపార్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా. అలికిడైతే ఈ లోకంలోకొచ్చి..గేటుతీసుకుని ఇంట్లోకి వస్తున్న మా ఆయనవైపు కన్నార్పకుండా ఆరాధనభావంతో చూస్తున్నా…

July 29, 2024 1 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

మిత్రుని కాలం

by Ramesh July 29, 2024
written by Ramesh

ఆనందమంటే
తారల్లా దూరతీరాల్లో ఉన్న మిత్రుడు
తళుక్కుమని చెంతన మెరవడం
రెండుమనసులు ముఖాముఖవ్వడం
కష్టసుఖాల కరచాలనమవ్వడం

ఎదురు చూపులంటే
క్రొత్తజంట కలయిక కోసం కలగనడమే కానక్కర్లేదు
ఇన్నాళ్లు నేను మోసింది
ప్రేయసీ ప్రియుల విరహానికి
ఏ మాత్రం తీసిపోనిదని నేను భావిస్తాను

దీన్ని స్నేహవిరహమని
అనురాగ విరామని అంటాన్నేను

నీళ్లులేక ఎండలకు వలవల
వాడిన పూలచెట్టు
చిరుజల్లులకే
కొమ్మ కొమ్మల పూలై పూచిన చెట్టూ ఆకాశం
పువ్వై నవ్వడమే కదా అందమంటే

ఎన్నాళ్లుగా ఎదురు చూసిన
స్నేహితుని ముఖము
నాకు కేవలంగా కళ్లు ముక్కులు కానేకాదు
అది వేలకొమ్మలు పూచిన మహాపూలమాను

ఎండిన గుండైన చెరువు
వానాకాలం చెరవుగట్టు దాకా
నీళ్లతో నిండిన చందం
చిరకాల మిత్రుడు కలసిన ఆనందం
మమతల మాటలన్నీ అలలు అలలై
మనసునే తాకుతాయి
ఆ సమయమే
ఆ సమయమే మరుపురానిది
ఆ కాలం మిత్రునికాలం.

చందమామను మబ్బులు దాచినట్టు
మిత్రుణ్ణి వేసవి సెలవులు దాచాయి

జీవితాలకే చావుపుట్టుకలు
స్నేహమెపుడూ శాశ్వతమే
మనసున మనసైన
చెలిమి తోడుంటే అదికదా స్వర్గము.

మిత్రుని చెంత ఆనందం ఉంటే
ఆ ఆనందం
వేసవి సెలవులవెంటే ఉందనుకుంటా బహుశా
వేసవి సెలవులు వస్తే
ఉపాధ్యాయులకు,బడి పిల్లలకు సంబరమైతే
అల్లరిపిడుగుల అమ్మానాన్నల్ని,నన్నూ
ఒకింత భరించరానితనం అల్లుకుంటుంది

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వేణు నక్షత్రం కథలు సమకాలీన జీవన చిత్రాలు

by రంగరాజు పద్మజ July 29, 2024
written by రంగరాజు పద్మజ

వేణు నక్షతం కవి, కథా రచయిత. అమెరికా లో నివసిస్తున్నా భారత దేశాన్ని అను క్షణం మననం చేసుకుంటూ ఉంటారని వీరి కథలను చదివినప్పుడు కలిగిన అభిప్రాయం. “మౌనసాక్షి” “అరుగు “అనే రెండు కథా సంపుటాలు వెలువరించారు.

రైల్వే సత్యం ,అరుగు, బిడ్డా నువ్వు గెలవాలి! ధీమా పార్ట్ 1, ధీమా పార్ట్-2,వేకప్, మరియు ముద్రణా రూపంలో మృగాల మధ్య, నాతిచరామి, అశృవొక్కటి,
కౌముది నాటకం మరియు కథ, పర్యవసానం మొదలైన కథలు సమీక్ష కోసం ఎన్నుకున్న కథలు.

” ఏయది హృద్య మపూర్వం బే
యది యెద్ధాని వినిన యెరుక సమగ్రం బై యుండు అఘ నిబర్వణ మే యది యక్కథయే వినగ నిష్టము మాకున్॥”
అంటే కథ హృద్యంగా ఉండాలి !అంటే మనసును ఆకట్టుకునేలా… అపూర్వంగా అంటే అంతకుముందు చెప్పబడని కథ, లేదా ఇంత గొప్ప కథ నేనెప్పుడు వినలేదే? అని అనిపించాలి అని భావము.

సూతుడిని శౌనకాది మునులు అడిగిన ప్రశ్న ఇది!

ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మంచి కథ వినదలచుకుంటే అడగాల్సిన ప్రశ్న ఇది. అఘము అంటే పాపమనే కాకుండా అలసట అని కూడా అర్థం ఉన్నది అలసట తీరే కథ చెప్పమని అడుగుతారు మునులు. అలసట అనేది ఒక శరీరానికే కాదు మనసుకు ఉంటుంది ఆ మనసు అలసట తీరేలా కథ చెప్పాలని ఇక్కడ ఒక హృద్యమే సరిపోదు!

కథ అంటే నీతి ప్రబోధమని…,
కథంటే ఆ కాలంలో నివసించే రీతులు చెబుతుందనీ….
కథ అంటే నిజాయితీ నేర్పిస్తుందనీ,
జీవన ప్రమాణాలు పెంచుతాయని విమర్శకుల ఉద్దేశ్యం…
పిల్లలకు- పెద్దలకు మానసిక వికాసం కలిగించేవి కథలు,
కథలు కళాత్మకమైన ఆలోచనలు కలిగించాలి!
రచయిత కథ చెప్పేటప్పుడు ఆ కథలలోని రేఖా మాత్రపు తన ఆలోచనను, బుద్ధి కుశలతను తన శిల్పంతో పాఠకులకు అందించాలి.

ఇక వేణు నక్షత్రం అశ్రువొక్కటి కథ చదివినప్పుడు… మా అన్నయ్య చాలా కాలం కింద మాకు చదివి వినిపించిన అనా ఫ్రాంక్ డైరీ నవల గుర్తొచ్చింది. ఇందులో 14 సంవత్సరాల అమ్మాయి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలను తన డైరీలో రాసుకుంటుంది.
హిట్లర్ సాగించిన మారణకాండలో అనా ఫ్రాంక్ చనిపోతుంది. ఆమె కుటుంబ సభ్యులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అటక మీద మూడు నెలలు దాక్కొంటారు. అప్పటి యదార్థ సంఘటనలు అన్నీ పూసగుచ్చినట్టు రాస్తుంది. అదే నవలగా వచ్చింది.
ఈ కథ నన్ను ఓ 45-50 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్ళింది.
అన్నలు అని పిలిచే ఉద్యమకారుల గురించి, వాళ్లు సాధిద్దాం అనుకునే ఆశయం గురించి, వారు ఎన్నో కష్టాలు పడడం, అడవుల్లో వారి జీవితాలను గడిపేయడం, వారి ఆచూకీ తెలుపమని వేధించే పోలీసుల గురించి మా ఊళ్లో కథలు..కథలుగా చెప్పుకునేవారు.
కాబోయే పరిస్థితి ఏంటో తెలియనందున వారెందుకు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం వల్ల ఏం సాధిస్తున్నారో తెలియదు అది సరే దాన్ని పక్కన పెడితే ఎంతో కష్టపడి పార్టీ నడపడానికి వారి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి కూడా పెట్టిన డబ్బులు ఆ సైద్ధాంతిక విలువలు తెలియని వారు వాటికి విలువనివ్వక దుర్వినియోగం చేసి వారి గురించి ఆ కార్యకర్తల అవగాహన లేని తన గురించి చర్చించబడిన సంఘటనల సమాహారకథ ఈ అశృవొక్కటి.
కాల మధ్య కథ కూడా ఇలాగే నడిచింది… ఈ కథ నడక చాలా బాగుంది.
ఏ సమస్యైతే మనసును బాధ పెడుతున్నదో? ఆ బాధ తొలగించేలా అంటే ఆయా.. సమస్యలకు ఉపశమనమో? పరిష్కారమో సూచించే కథలు చెప్పితే యువత వారి జీవిత లక్ష్యాలను సాధించుకుంటారని కథా రచయిత ఉద్దేశం.
చెప్ప ప్రభావంతో కథ రూపురేఖ విలాసాలు మారిపోయాయి… ఇప్పటి సమీక్షలకు అవి అందవు.
కాలంతో పాటు మనము మారాలి!
మరి కథలు దేని గురించి చెప్పాయి అని అడిగితే… వెంటనే నాకు సమాధానం చెప్పడంరాదు కానీ కథలు మాత్రం ఏదో ఒక విషయం గురించి చెప్తూనే ఉన్నాయి.
అయినా కథా నియమాలను అనుసరించి సామాజిక పరిస్థితులు గానీ, సమకాలీన సమస్యలు కానీ కథా వస్తువులు అవుతాయి!
కానీ దాని చుట్టూ కథ అల్లడం అంత సులువేం కాదు! చెప్పాల్సిన విషయానికి తగిన పాత్రలను సృష్టించి, సన్నివేశాలు కల్పించి, పాత్రల అనుభవాలనుండి- ప్రవర్తన నుండి తన ఆశించిన భావం పాఠకులకు చేరేలా చేయడం కథారచన నియమం మరియు శైలి!
వేణు నక్షత్రం దాదాపు కథ నియమాలు పాటిస్తూనే రీడబులిటీ ఉన్న కథలనే రాసారు.
రీడబులిటీ ఉన్న కథలు చదువరుల పఠనం సాఫీగా సాగించడమే కాకుండా…ఆకర్షించాయి.అవగాహననూ పెంచాయి, ఆలోచనలను రేకెత్తించాయి. అందుకృ గాను రచయితను అభినందిస్తూ…
ఒక్కొక్క కథను చదివినప్పుడు నాకు కలిగిన భావాలు ఇలా ఉన్నాయి….
ఈ మృగాల మధ్య కథ దిగువ మధ్యతరగతిలోని ఆదాయమంతగా లేని కుటుంబా నేపద్య కథ కొంతవరకు అన్ని కథల వలనే నడిచి , బాబ్రీ మసీదు సమస్య వైపు మలుపు తిరిగింది.
అందునా కాంతమ్మ కులం గురించి చెబుతూ… “గరీబోళ్ల కులము” అని సమాజాన్ని ప్రశ్నించింది అని రచయిత అన్నారు.
తనకు జ్ఞానోదయం అయింది అని రాశారు. అలా రాయడంతో రచయిత హృదయంఅవగతం అవుతుంది పాఠకులకు….
ముష్కర ముఖ కాంతం మను విచక్షణారహితంగా పొడవడం ఆమెకు వైద్యం చేయించడం మానవత్వం ఇంకా బతికి ఉందనీ, ఉండాలనీ చక్కటి సందేశం ఇచ్చారు.
అధికార దాహానికి “మృగాలు వేటాడినా…
అమ్మా! అన్న మూలుగు అతనిక ఆనందాన్ని ఇవ్వడం, దానికోసం అన్ని మతాలవారూ ఆమె ప్రాణాన్ని నిలబెట్టారని చెప్పడం మతసామరస్యాన్ని చెబుతున్నదీ కథ!
నాతిచరామి
ఈ నాతిచరామీ కథ అమెరికా అబ్బాయితో ఇండియా అమ్మాయి పెళ్లి కథాంశం.
T.V నీ మోసాలు జరుగుతున్నాయని, బాధపడడం …కొంత కాలం ఏవేవో ఊహించుకోవడంతో చికాకులు కలిగినా, కొంతకాలం తర్వాత చక్కగా సాగినా.. కడుపులో Sisto రూపంగా వేదన మొదలై, పిల్లలు పుట్టరన్న విషయం కుంగ తీస్తుందా జంటను.
పిల్లల కోసం రమేష్ నురెండో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రుల దగ్గర నుండి ఒత్తిడి రావడం నాతిచరామి అర్థం ప్రసక్తి రావడం, దానికి అర్థమే లేదని అనడం పావని మానసిక స్థితిని తెలుపుతున్నది…రచయిత నూతన థృక్పథం తెలుస్తున్నది.
విడాకులు ఇమ్మని అడిగినప్పుడు “విడాకులు నువ్విచ్చేదేముంది”? నేనే ఇస్తాను! అనే మాట ఆడవారికి స్వాభిమానం, స్వతంత్రత ఉండాలని చక్కని సందేశం ఇచ్చిన కథ .
ఇలా వేణు నక్షత్రం గారి రచన ఇటు ఆధునికతను అటు ప్రాచీనతను సంతరించుకున్నవి.
కౌముది
గుఱ్ఱపు స్వారీ చేస్తూ వర్తకం చేసే యువకుడి వలె రాకుమారుడు రావడం, అందమైన అమ్మాయిని చూసి ఆకర్షితుడవడం, ఆ అమ్మాయి సాహసాన్ని చూసి ఆశ్చర్య పోవడం, మిథిలా నగరానికి తోవ ఎటువైపు అని అడగడం… అది అక్కడికి కనపడుతుండడంతో…
కళ్ళు కనపడటం లేదా? అని ఆ అమ్మాయి ఆ రాకుమారుడిని వెక్కిరించడం…ఈ సంభాషణ చదువుతుంటే కాస్త జానపద పౌరాణిక కథను పోలి ఉన్నది కథ ధైర్యం తెలివి చూసి ఆశ్చర్యపోతూ నేను యువరాజునని నీకు ఎలా తెలుసు అని అడిగితే ఆ అమ్మాయి తన నాయనమ్మ గుర్రం మీద రాకుమారుడు వచ్చి తనను తీసుకుపోతాడు అని చెప్పిన మాటకు తమరే యువరాజు అనుకున్నానని అమాయకంగానూ చమత్కారంగాను అనడం..
అయినా ఈ దేశంలో ఆడపిల్లలతో మాట్లాడే సాహసం ఎవరికీ లేదనడం ఆ రాజు చక్కని పాలనతెలియ చెప్పినట్టైంది.
దేశ పౌరులకు నీతి- నిజాయితీ ఉండాలనే సందేశం చక్కగా కథ సాగుతూనే… కథలోనే ఇమిడిపోయింది.
కౌముదికి ప్రేమించానని,పెళ్లి చేసుకుంటానని మాట అయితే ఇచ్చి వచ్చాడు కానీ తండ్రి ఒప్పుకుంటాడా? లేదా? అనే సందేహం అలాగే ఉంది .
ఎందుకంటే తన ఒక్కగానొక్క అక్క తండ్రి తెచ్చిన సంబంధం కాకుండా… మంత్రి కొడుకును వివాహం చేసుకున్నందుకు కొత్త పెళ్ళి జంటకు మరణ దండన విధించడం గుర్తుకు వచ్చి, బాధ భయం రెండూ కలిసి, తండ్రికి తన విషయం ఎలా చెప్పాలో తెలియక, ఆయన పట్టింపులు నచ్చక తాను కోరిన కౌముదినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవడం అది తాననుకున్నంత సులువు కాదని అనుకున్నా గట్టి పట్టుదల కలవాడు కనుక తనకు లేని జబ్బు ఉన్నట్టు ప్రాణాపాయం ఉందని పుకారు పుట్టించాడు రాకుమారుడు.
పుకారులు నమ్మికుంటల రాజు తన కూతురు వివాహం రాకుమారుడుతో రద్దు చేస్తున్నట్లు కబురు చేయడం మరింత బాధపడిన రాజు కూతురు పట్ల చూపిన మండివైఖరితో ఆమె చనిపోవడం కొడుకు కూడా చనిపోతే తన గతి తన రాజ్యాంగము ఏమవుతుందని తన కొడుకుకు సేవలు వ్యాధి నయం చేస్తే అర్ధరాజ్యం ఇస్తాననడం ఎవ్వరూ రాకపోవడం తరువాత కౌముది తాను వైద్యం చేస్తానని యువరాజు దగ్గరికి వెళ్లిన కౌముదికి అసలు విషయం తెలిసి ఇద్దరు సంతోషంగా ఉండడం వ్యాధి తగ్గిందని సంబరాలు చేయడం ముందు ప్రకటించిన అర్ధరాజ్యం తీసుకోమని కౌముదిని అనడం..హ ఆమె తిరస్కరించడం
వ్యాధి వచ్చిన వారికి ఆదరణ ముఖ్యమనే
మరో సందేశాన్ని చక్కగా కథకు కనుగుణంగా రాశారు రచయిత.
ఈ ఆస్తి అంతస్తులు ముఖ్యం కావని, ప్రేమ ముఖ్యమనే మరో సందేశం ఇవ్వబడిందీ కథలో…
ఇక్కడ కాస్త ఉత్కంఠ అంటే సస్పెన్స్ కథను చదివించేలా తోడ్పడింది.
పూల మాలలతో వివాహం జరిపి, తెలిసి తప్పు చేయవద్దని… అలాగే తప్పు చేస్తున్న వ్యక్తిని సమర్ధించవద్దని రాసి,ఒక నినాదాన్ని గుర్తుచేశారు రచయిత.
ఏకపక్షంగా రాజే నిర్ణయాలు తీసుకోవద్దనీ… సభలోని వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని రాసి, ఈనాటి ప్రభుత్వాలకో హెచ్చరిక చేశారు వేణు నక్షత్రం .
ఈ కథ చదివినప్పుడు ఫీల్ గుడ్( Feel good)కథా కోవలోకి వస్తుంది అనిపించింది.
గుర్రం మీద రాకుమారుడు వచ్చి సామాన్యురాలు వివాహమాడనే కాన్సెప్ట్ తో ఉన్న కథలు వినక చాలా సంవత్సరాలు గడిచింది.
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు విఠలాచార్య గారు సినిమాలు తీయడం మానేశాక ఈ గుర్రాల మీద రాకుమారులు వచ్చేసి సినిమాలు చూడనే లేదు.
కాబట్టి మనసుకు ఉల్లాసం, ఉత్సాహం కలిగి
వెనుకటి తరం కోరుకునే సుఖాంతం టైటిల్ పడింది.
సంతోషంతో కొనసాగుతున్న కుటుంబ కథలను చదివినప్పుడు మనపై ఆ సంతోష ప్రసారాలు మన మీద పడతాయనీ, అలాగే ఇలాంటి స్త్రీ- పురుష వర్ణనలున్న కథలను చదివితే భావుకత కలుగుతుంది. ఇలా కథ రకరకాల రసాస్వాదన చేస్తుంది.
కథ చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి మానసిక వికాసం కలుగుతుంది. అటువంటి కథలే ఈ వేణు నక్షత్రం కథలు.
ఇవాళ మనమున్న సమాజానికి మానవత్వం మేలుకొలుపే కథలు మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే కథల అవసరం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
అదే కాకుండా ఎలా చెప్తున్నారు అన్నది కూడా ముఖ్యం. ఈ రెండూ కథ నిండుగా ఉండాలని మా నాన్నగారు అనేవారు..
వేణు నక్షత్రంకథలలో అలాగే ఆ రెండూ ఉన్నాయి. మొదట కథలు ఎలా ఉండాలని ఆకాంక్షించానో దాదాపుగా అలానే ఉన్నాయి.
కథా సమీక్షలు కొత్తగా కథలు రాసే వారికి ఎంతో ఉపయోగం. రచయితకూ ఉపయోగమే!
వేణూనక్షత్ర కలం మరిన్ని కథలను అల్లాలని..చదువరులను- వినుకరులనూ అలరించాలని శుభకామనలతో…

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వచన కవితాకన్య రూప లావణ్యం – దాస్యం సేనాధిపతి ‘దిక్సూచి’

by Aruna Dhulipala July 29, 2024
written by Aruna Dhulipala

          కాలక్రమానుగతంగా అన్ని రంగాల్లోనూ మార్పు అనివార్యం. అందులో దేనికీ మినహాయింపు ఉండదు. అలాగే సాహిత్యంలోనూ ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు సామాజిక పరిస్థితులకు, మనుష్యుల భావాలకు అనుగుణంగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఛందో బద్ధమైన పద్యకవిత్వం నుండి, మాత్రా ఛందస్సులతో కూడిన గేయకవిత్వంతో పాటు అనేక కవితాప్రక్రియలు సాహిత్య పూదోటలో వికసించి లతలుగా పెనవేసుకున్నాయి. అటువంటి వాటిలో వచనకవిత్వానికి నేటికాలంలో ఎంతోమంది కవులు తమ హస్తాక్షరాలతో అలంకారాలు తొడిగి ప్రకాశింప జేస్తున్నారు.

        కవుల భావనా తరంగమై ప్రవహించి కవిత్వం ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. అలాగని అది ఎటువంటి నియమాలకు లోబడి ఉండక పూర్తి స్వేచ్ఛా కాంక్షతో రూపు దిద్దుకున్నప్పుడు కొంత లోప భూయిష్టంగాను, మరికొంత పొరపాట్లతోను, ఇంకొంత పాఠకులకు అనాసక్తిగా పరిణమించే అవకాశం లేకపోలేదు. జీవన మనుగడ నియంత్రణ అవసరమైనట్లే దేనికైనా ఒక నియమం, ఒక నియంత్రణ అత్యవసరం.

        ‘వచన కవితా పితామహుడు’ గా కుందుర్తి ఆంజనేయులు గారు ఆధునిక కాలంలో వచన కవిత్వ ఆవశ్యకతను గుర్తించి 1958 లో ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ ను స్థాపించారు. వచన కవిత్వ లక్షణాలతో ‘నగరంలో వాన’ కావ్యాన్ని రచించారు. ‘ఫ్రీవర్స్’ అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా తెలుగులో వచనకవిత చెప్పబడుతోంది. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, డా. సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారు వచన కవిత్వాన్ని ఆదరించారు. రచించారు. తరువాతి తరాలకు మార్గదర్శకులయ్యారు.

         ప్రజలకు సన్నిహితంగా ఉండేందుకు, వాడుక భాషలో, అలతి పదాలతో, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వచన కవితకు ప్రధాన లక్షణం. దీన్ని రాసేటప్పుడు కవులు ఏ విధమైన నియమాలను, లక్షణాలను పాటించాలో, సమాజంలో ఏ విధంగా చైతన్యాన్ని వికసింపజేయాలో తెలుపుతూ దాస్యం సేనాధిపతి గారు ‘దిక్సూచి’ అనే పుస్తకాన్ని వెలువరించారు. దీనిని వచన కవితకు కరదీపికగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ఈ పేరు పెట్టడం లోనే ఆయన అంతరార్థం ప్రస్ఫుటమవుతోంది. శక్తివంతమైన రచనా నైపుణ్యతను సాధించే దిశగా ప్రస్తుత కవులకు సుబోధకంగా, సులభసాధ్యంగా ఆయన ఈ పుస్తకాన్ని వెలువరించారు.
           ‘కవిత్వమంటే’ …అని ప్రారంభిస్తూ, అనేకమైన మౌలిక లక్షణాలను క్రోడీకరిస్తూ ‘కవిత్వంలో మానవతావాదం’ వరకు ఉన్న విభాగాలు  వచనకవిత్వ ప్రాధాన్యత, దాని నియమావళిని తెలుపుతాయి.

ఈ భాగాలలో దాదాపు 320 మందికి పైగా ప్రాచీన కవుల నుండి నేటి కవులవరకు వారి రచనలలోని పాదాలను దశలవారీగా ఉటంకించడం, స్వరూప సామ్యాలను తెలపడం సేనాధిపతి గారి తులనాత్మక పరిశీలనను ప్రతిబింబిస్తుంది.

          “కవిత్వమంటే హృదయాలను కదిలించే అనుభూతినివ్వాలి. వస్తువును దాచడం కాదు. పొరలు పొరలుగా విప్పుతూ పద బంధాలతో, భావచిత్రాలతో పాఠకుడిని తన్మయుడిని చేసేది కవిత్వం, కవిత్వం హృదయాన్ని మీట గలగాలి” ఈ మాటలు చాలు కవిత్వం రాసే కవుల కర్తవ్యాన్ని బోధించడానికి. దీనికి ఉపపత్తిగా ప్రముఖ కవి త్రిపురనేని శ్రీనివాస్ గారు రచించిన ‘కవిత్వం కావాలి కవిత్వం’ అనే కవితను మనముందు నిలుపుతారు.

         అలంకారాల గుబాళింపు, పద చిత్రాలు, ప్రతీకలు, విరుపులు, మెరుపులు, ఎత్తుగడ, ముగింపు ఎంతవరకు అమరాలో, ఒదగాలో అది మంచి కవిత్వమని నందిని సిధారెడ్డి గారు చెప్పిన భావాల విశ్లేషణతో సేనాధిపతి గారు ఉత్తమ కవిత్వానికి ఉండాల్సిన ఎన్నో లక్షణాలను విశదీకరిస్తారు.

డా. సి నారాయణ రెడ్డిగారు రాసిన ‘మనోదృశ్యం’ కవిత

ఎత్తుగడ….

“ఆ దృశ్యాన్ని ఎన్నాళ్లుగా చూస్తూ ఉన్నానో/
దాని అందాలను ఎన్నిసార్లు తాగి చూస్తున్నానో/
దాహం తీరలేదు”….ఇలా మొదలవుతుంది. అది పాఠకుని అవ్యక్తభావనలో ముంచుతుంది. అందుకే కవిత్వ నిర్మాణానికి ఎత్తుగడ చాలా ముఖ్యమైనది.
           అలాగే కవితా వస్తువును విశ్లేషించడానికి వినియోగించబడే భాష, పదబంధ ప్రయోగంలో ఔచిత్యం, శైలి, శిల్పం ఇవి ప్రధాన భూమికను పోషించడంతో పాటు నర్మ గర్భత, సంక్షిప్తీకరణలు, కవితా నిర్మాణంలో శబ్ద, అర్థాలంకార ప్రయోగాలు కవిత్వాన్ని పరిపుష్టం చేస్తాయంటారు సేనాధిపతి గారు.

ప్రముఖ కవి యాకూబ్ గారు…

“నిన్ను కలిసాకే
నా మనో ఉద్యానవనంలో పూలు పూచాయి
అక్షరాల కలువలు విప్పారాయి…..” అన్నప్పుడు

మరో ప్రముఖ కవి సుంకిరెడ్డి నారాయణరెడ్డి…

“ముక్కారు
పచ్చని వరెన్నుల్ని ప్రసాదించే
బంగారు బాతు మా వాగు..” అని చెప్పినప్పుడు
ఆ అలంకార ప్రయోగాలు ఎదలను హత్తుకుంటాయి.

            కవిత్వాన్ని నిర్వహించేటప్పుడు భావాలను గణాలుగా, భావవ్యక్తీకరణకు అనువుగా విభజించుకోవడం ఒక పద్ధతి. కవి ప్రతిభను వెల్లడించడానికి, కవిత్వ సౌందర్యానికి, పాఠకులలో ఆసక్తిని పెంచి, క్రమంగా కవిత్వంతో నడవడానికి, సులభంగా అవగాహన చేసుకోవడానికి ఈ గణాలు ఉపయోగపడతాయి.

‘కాలం కాలం చేసింది’ కవితలో సినారె గారు…

మొదటి పేరాలో మూడు పంక్తులు, రెండవ పేరాలో నాలుగు పంక్తులు, మూడవ పేరాలో మూడు, నాలుగవ పేరాలో రెండు…ఇట్లా స్వేచ్ఛా భావనకనుగుణంగా కవితను రూపొందించారు.

అదే విధంగా దాశరథి గారు ‘తమ పునర్నవం’ లో కావ్యంలో ‘రూపాయికి విలువలేని రోజు రేపు వస్తుందట’

అన్న శీర్షికతో రాసిన కవిత నిన్న, ఇవాళ, రేపు పేరాలుగా క్రాంత దర్శనం చేయిస్తుంది. ఈ భావగణాల్లో అక్షరాలు, పాదాల విషయంలో ఎటువంటి నియతి ఉండదు. భావమే ప్రధానం.

           ‘వక్రోక్తి’ వచన కవిత్వానికి ఉండే ప్రధాన లక్షణాల్లో మరొకటి. పాఠకుల హృదయంలో ఆలోచన రేకెత్తించి, స్తబ్ద మనస్తత్వాన్ని నిరసించడం కోసం వక్రోక్తి కొంతవరకు ఉపయోగపడుతుంది. వ్యంగ్యం, చమత్కారం వక్రోక్తికి ఆభరణాలు. కానీ అది వస్తువు యొక్క పరిధి దాటకూడదు. పదబంధ ఔచిత్యానికి భంగం వాటిల్లకూడదు.

శ్రీశ్రీ నిరసన గళంలో…
“మనదీ ఒక బ్రతుకేనా?
కుక్కలవలె నక్కల వలె
సందులలో పందుల వలె…..” అనే వక్రోక్తులు తమను
తాము ప్రశ్నించుకునేలా చేస్తాయి.

కవి డా. ఎన్. గోపి ‘ఫ్రీడం ఫైటర్’ కవితలో…
“అతడు నాకు రోజూ కనిపిస్తాడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు…” లాంటి పాదాలు ఆకలి పేగులను దృశ్యమానం చేస్తాయి.

          కవిత్వ నిర్మాణంలో ‘భావచిత్రాలు’ ఒక ప్రత్యేక లక్షణం. వీటిని ఇంగ్లీషులో ‘ఇమేజరీ’ అంటారు. భావచిత్రాలు కవి భావావేశాన్ని, భావధారను స్పష్టీకరిస్తాయి. భావచిత్రం కంటికి కనిపించేది కాదు. అనుభూతి ప్రధానమైనది.

దాశరథి గారి ‘అగ్నిధార’ లో
“లోకపు చీకటి చీరకు/ ఆకాశం రైక మీది/ చిన్ని చుక్కల పువ్వులు/ తళుక్కుబెట్ట గలిగేనా/ జరి అంచు మెరిసేనా?…..” లాంటి పాదాల భావ చిత్రాలు దృశ్యాలను కట్టెదుట నిలుపుతాయి.

అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని వి.జి. కిర్నన్ ఆంగ్లంలోకి అనువదిస్తే దానిని జం జం సత్యనారాయణ అనే మహబూబ్ నగర్ కు చెందిన కవి తెలుగులోకి అనువాదం చేసారు. అందులో ‘నేటి రాత్రి’ కవితలో “ఈ రాత్రి వీణపై విషాద రాగాలకు/ గతం బాధలన్నీ దూరమైనాయి…..” వంటి పాదాలు కవిత్వ సౌందర్యాన్ని ఇనుమడింపజేసాయి.
సినారె గారు ‘రెక్కలు’ కవితా సంపుటిలో కొవ్వొత్తులు తాగుతాయి/తనమీద దాడి చేసిన/ పురుగుల రెక్కలను….. ” అంటూ అద్భుత భావచిత్ర పద మాధుర్యాన్ని అందించారు.

         కవిత్వంలో వస్తువు ప్రధానమన్నది అందరికీ తెలిసినదే. దాన్ని అందంగా, పొందికగా నిర్మించడంలోనే కవి సృజనాత్మకత ఆవిష్కారమవుతుంది. అయితే కవిత్వంలో విరుపులు, పాదాంతాలు వీటి దగ్గర ఉపయోగించే విరామచిహ్నాలు కూడా కవిత్వంలో ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమే. వీటిని కూడా సందర్భోచితంగా, అవసరమైనంత మేరకే ఉపయోగించుకోవాలి.

       కవిత్వంలో ‘ఔచిత్య పద బంధ ప్రయోగం’ చాలా ముఖ్యమైనది. కవిత్వం మనిషి అంతరాత్మతో సంభాషణవంటిదంటారు సేనాధిపతి గారు. కవి తన భావావేశాన్ని కొన్నిసార్లు అగ్నిపర్వతంలా వెడల గక్కుతాడు. ఒక్కోసారి ఆర్ద్రతతో నల్లని మబ్బులా వర్షిస్తాడు. అయితే సంయమనం కోల్పోయే పరిస్థితుల్లో పద ఔచిత్య విస్మరణకు గురయ్యే ప్రమాదం ఉంది. పాఠకులలో అన్ని రకాల వాళ్ళుంటారు కాబట్టి సభ్యత, సంస్కారయుతమైన పదాలు కవికి గౌరవాన్ని ఆపాదిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరమని సేనాధిపతిగారు చెప్పిన విషయాలు కవులు తప్పక పాటించి తీరాలి.

        చాలా సందర్భాల్లో కవి ‘స్వగతం’ కవితారూపాన్ని పొందుతుంది. ఆనందం, విషాదం రకరకాల పాత్రలుగా దృగ్గోచరమవుతుంది. ఈ స్వగతాన్ని బహిర్గతం చేసేటప్పుడు చమక్కులు, వ్యంగ్యం, మెరుపులు, చురకలు చోటు చేసుకోవచ్చు. వస్తువు స్వగత రూపంలో అంతర్వేదన వాహిని అవుతుంది.

        కవిత్వ నిర్మాణంలో భాష చాలా కీలకమైనది. కవి తన హృదయంతో కవిత్వం రాస్తాడు. ఏ భాషలో నైనా కవులు విశ్వజనీన భాషకే పట్టం కడతారు. వస్తు రూపాలు, శిల్పం, అభివ్యక్తి వీటన్నింటికీ మూలాధారం భాష. కవిని కవిగా నిలబెట్టేది భాష. భాషకు కావలసింది పాండిత్యం కాదు వస్తువును ప్రతిభావంతంగా,

సందర్భోచితంగా, ఔచితీవంతంగా ప్రకటించడానికి మామూలు పదాలు అయినా ఉండవచ్చు అని తమ అభిప్రాయ ప్రకటన చేస్తారు సేనాధిపతి గారు. మాండలికంలో కవిత రాసేటప్పుడు మొదటి నుండి చివరిదాకా ఆ పదాలనే ఉపయోగించాలి. కవిత్వ పదాల్లో సంక్లిష్టత, సందిగ్ధతలకు తావు ఉండకుండా జాగ్రత్త పడాలి. అక్షరదోషాలు ఉండకుండా చూసుకోవాలి.

         ఇక ‘ముగింపు’ అనేది కవితను మొత్తంగా ఆలోచింపజేస్తుంది. ఇది కవి రచనా నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తుంది. కవి శైలి,ముద్ర ఇందులో కనిపించాలి. ఇది ఆలోచనాత్మకంగా, సందేశాత్మకంగా ఒక వ్యంగ్యం, ఒక మెరుపు, ఒక చురుకు, ఒక చరుపులతో ఉండాలి. కొత్త ఆలోచనకు తెరతీయాలి. కవితాత్మకమైన స్పష్టత కనిపించాలి. ఇవన్నీ రావాలంటే కవికి అధ్యయన శీలత్వం, ప్రముఖుల రచనల పరిశీలన, వాటి తీరుతెన్నులను గ్రహించే నేర్పు ఉండాలని కవులకు పథ నిర్దేశం చేస్తారు దాస్యం సేనాధిపతి గారు. ఇంకా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ పుస్తకంలో పొందు పరచబడ్డాయి.

         నేటి కాలంలో కవులు, కవయిత్రులు అనేక మాధ్యమాల ద్వారా వారి కలాలను, గళాలను కదిలిస్తున్నారు. కొంతవరకు వాటిని పరిశీలిస్తే  ఆత్మవిమర్శకు తావు లేకుండా, రాయడమే ప్రధానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాంటి వారందరూ తప్పక చదవాల్సిన పుస్తకం దిక్సూచి. రాయడం ప్రారంభించాలనుకున్నవారికైనా, రాస్తున్న వారికైనా ఆత్మ పరిశీలన చేసుకొని మంచి కవిత్వాన్ని రాయగలిగే మెళకువలను బోధించే ఉత్తమ గ్రంథమిది. దీనికోసం ఆయన చేసిన కృషి అనితరసాధ్యం. ఎవ్వరైనా చేతి ఊతంగా దీన్ని పట్టుకొని వచన కవితా సాగరతీరాన్ని సులభంగా చేరుకోవచ్చు.  తరతరాలు నిలిచివుండేలా ప్రామాణికమైన కవిత్వ లక్షణాలతో ఒక గొప్ప పుస్తకాన్ని అందించిన సేనాధిపతిగారు అభినందనీయులు.

July 29, 2024 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

పిచ్చుక

by Gaddam sulochana July 29, 2024
written by Gaddam sulochana

ఊర పిచ్చుక ఊరు వదిలిందా? ఊరు పొమ్మందా?
చేలల్లో ,చేలకల్లో, వాకిళ్లలో నీ సందడి లేక చిన్న పోతుంది.

వాడదాటి, ఊరు వదిలి, చూరు విడిచి పోయావెక్కడికి?
నీ కిచ కిచల పాటలు
ఓర చూపులు
చిలిపి గంతులు
నీటి ఆటల చిందులు చూస్తుంటే మాకెంత ఆనందమో! తెలుసా?
చిన్ని రెక్కలతో తుర్రుమని ఎత్తులకు ఎగిరిపోతావు.

చూరులో నీవు గూడు కడితే మురిసిపోయాము.
ఇప్పుడేమో
కనపడవు
వినపడవు..
బుర్రుపిట్ట పాటలు
పిట్ట కథలు
పిచ్చుక గుళ్ళు
ఇక కట్టు కథలు అంటే తట్టుకోలేము.

బుజ్జి పిట్ట బాధ ఎవరికి
పట్టదు..
మనిషి మారిపోయాడు..
స్వార్థంతో ప్రకృతి
వినాశనం..
ఎండవేడి భూతాపం కాలుష్యాలు..
తాళలేని చిన్ని ప్రాణి..
తిండి లేక,నీరు లేక, తలదాచుకోలేక తల్లడిల్లుతున్నది. రెక్కలు ఉడిగి పిట్టలు పిట్టల్లా రాలిపోతున్నాయి..
పిల్లల బంగారు
బాల్యంలో బంగారు
పిచ్చుక సందడే
లేదు.

చిన్ని ప్రాణులను
చరిత్రలోకి తోయొద్దు
నిలుపుకుందాం..

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us