మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

వసంత పంచమి గురించి ఒక చిన్న మాట!

by రంగరాజు పద్మజ January 25, 2026
written by రంగరాజు పద్మజ

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చిట్టి కథ గొప్ప సందేశం

by Nellutla Madhava Srinivas January 25, 2026
written by Nellutla Madhava Srinivas

బాగా సంపన్నులు అయిన ఒక కుటుంబంలో వారితో చాలా సంవత్సరాలుగా ఒక కుక్క ఉండేది. ఆ కుక్క చాతనైనన్ని రోజులు ఆ ఇంటికి తను చేయగలిగినంత చేసి కంటికి రెప్పలా కాపాడింది ఇంట్లో వాళ్ళని. ఇక ఇప్పుడు దాని ఓపిక తగ్గి అది ఏమి చేయలేదు అనుకున్న సమయంలో ఆ ఇంటి యజమాని ఇక దీంతో మనకు పని లేదు దీనిని వదిలేసి ఇంకొక దాన్ని తెచ్చుకుందామని దానిని దూరంగా ఉన్న అడవిలోకి వదిలిపెడతాడు. ఆ కుక్కని వదిలేసి ఆ యజమాని వెళ్లిపోయిన తర్వాత నిదానంగా ఓపిక కూడతీసుకొని నడుస్తున్న కుక్కను అటుగా వస్తున్న ఒక పులి చూస్తుంది. హమ్మయ్య !!!!ఎక్కువగా కష్టపడకుండా నాకు ఈ రోజుటి ఆహారం లభించింది అని అనుకుంటూ నెమ్మదిగా కుక్క వస్తున్నవైపు అడుగులు వేస్తూ వస్తుంది. అది గమనించిన కుక్క ముందు భయపడిన ….నిదానంగా ఆలోచించి తనలో తాను అనుకుంటున్నట్లుగా పులికి వినబడేటట్టుగా ఈ విధంగా మాట్లాడింది. కొంచెం సేపు అటు ఇటు నడిచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ పులి దగ్గరికి వచ్చే సమయానికి దానికి వినిపించేటట్లుగా ఇవి నిన్న మొన్న నేను తిన్న పులి ఎముకలు కదా !!! ఇక ఈరోజు ఆహారం వెతకకుండానే నా దగ్గరికి వస్తుంది అని అంటుంది. అది విన్న పులి భయపడి నిదానంగా వెనుకకు జరుగుతుంది అక్కడినుండి. ఇదంతా చెట్టు పైన కూర్చుని చూస్తున్న కోతిగమనించింది. పులి కొంచెం దూరం వెళ్లిన తర్వాత కోతి రెండు చెట్ల అవతలికి దూకి పులితో ఈ విధంగా అంటుంది. అయ్యో!!!! పిచ్చిదానా నువ్వు దాని మాటలు నమ్మావా??? అది ఇప్పుడు తిన్నవి కావు .చాలా రోజుల నుండి ఉన్నాయి ఆ ఎముకలు అక్కడ. నువ్వు ఏమీ భయపడాల్సిన పనిలేదు .ఆ జంతువు నీ నుండి తప్పించుకోవడానికి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది అంతే. నువ్వు వెళ్లి హాయిగా దానిని ఆరగించు. నీకు తోడుగా నేను వస్తాను పద అని పులికి చెప్పి రెండూ కలిసి బయలుదేరాయి. అది గమనించిన కుక్క విషయం గ్రహించి ఇప్పుడు ఏం చేయటం అని ఒక నిమిషం ఆలోచించి తెలివిగా అవి రెండు వినేటట్లుగా నేను ఇందాకే చెప్పి పంపించాను కదా ఒక కోతికి మొన్న తెచ్చిన పులిని మూడు రోజులకు సరిపడా తిన్నాను. పులి మాంసం చాలా బాగుంది. మళ్లీ ఒక పులిని ఆహారంగా తీసుకురమ్మని పంపాను. ఇంకా రాలేదేంటి అని ఆ రెండింటికి వినిపించేటట్టుగా స్వగతంగా అనుకుంటుంది. అది విన్న పులికి చాలా కోపం వస్తుంది. పులి కోపంగా కోతిని చూసి నిజంగానే తనను ఆ జంతువుకు ఆహారంగా ఇవ్వడానికే కోతి పన్నాగం పన్నింది అని భ్రమపడి అమాంతం కోతిని తన పంజాతో కొట్టి చంపి అరవిస్తుంది. ఇది వినడానికి చిన్న కథ అయినా ఎంత నీతి చూడండి. అనవసరంగా ఎదుటి వారి వ్యవహారంలో తల దూర్చకూడదు దూరిస్తే కోతికి పట్టిన గతే పడుతుంది. అంతేకాకుండా అపాయం వచ్చినప్పుడు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలా అని మనం ఆలోచించటం మొదలుపెడితే ఎదుటి వ్యక్తి, ఎదుట ఉన్న ప్రమాదం ఎంత పెద్ద వైనా సరే తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం కనపడుతుంది. అప్పటికి బయటపడే అవకాశం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేయకుండా భయపడితే మాత్రం మనంతట మనమే గోతిలో పడ్డట్లుగా ఉంటుంది. పులిని భయపెట్టడం అనేది కుక్క వల్ల అయ్యే పని కాదు కానీ …..తన ప్రాణం మీద ఉన్న తీపి తో ఒక ప్రయత్నమైతే చేసింది కుక్క. ఆ క్షణానికి కుక్క మాటలను పులి నమ్మటం వలన కుక్క సేఫ్ గా బయటపడగలిగింది.
అందుకే ఆపద రాగానే కంగారుపడి భయపడి హడావిడి చేయకుండా ఏ ప్రయత్నము చేయకుండా కూర్చోవడం కన్నా మెదడుకు పదును పెడితే ఆపద నుండి దాదాపుగా గట్టెక్కగలం . ఒక జంతువే అంత తెలివిగా ప్రవర్తించి తన ప్రాణాలను కాపాడుకోగలిగినప్పుడు ….మనం మానవులం దానికన్నా తెలివైన వాళ్ళం అంతకన్నా తెలివిగా మనం ఆలోచించలేమా చెప్పండి.

నేను విన్నది నాకు నచ్చింది మీతో పంచుకోవాలనిపించి పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి.

సర్వేజనా సుఖినోభవంతు

January 25, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నేనున్నాను

by Gaddam sulochana January 24, 2026
written by Gaddam sulochana

నేను తప్పిపోయాను
వెతుక్కోలేదు కాబట్టి
ఎప్పుడనేదీ చెప్పలేను
నేను మరణించాను
శ్వాసిస్తున్నాను కాబట్టి
ఆ విషయము అర్థంకాలేదు

చిన్న చిన్న ఆశల రెక్కలు
అప్పుడప్పుడు మొలచి రాలిపోయేవి
ఊడ్చి పారేస్తున్నదీ నేనే కాబట్టి
ఎదగలేదన్నది తెలియనేలేదు

ఇదంతా ఎందుకు అంటారా?
చెప్పడం అవసరమే..!

గుండె నిండా నింపుకున్న ప్రేమలో
ఓ తొణికిపాటు
తీగలు తీగలుగా అల్లుకున్న బంధాలు
కొంత విడివడిన వెసులుబాటు

అవకాశవాదులు అవసరార్థులు
తప్పిపోయారిప్పుడు
వెరిసి నాకిదొక అవకాశం

వేకువ మెలకువలో
నేనుగానే మేల్కొంటున్నా
పక్షుల కువకువలు
వినిపిస్తున్నప్పుడు
ఊహల రెక్కలు
విప్పుకుని ఎగురుతున్నా
నేనున్నానని ప్రకటించుకుంటూ,
నాలుగక్షరాలు చదివో రాసో
సంబరపడుతున్నా
నిజంగా నేనున్నాను.

January 24, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్రీ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూరు – తమిళనాడు

by కావ్యసుధ (హరిశంకర్) January 24, 2026
written by కావ్యసుధ (హరిశంకర్)

తమిళనాడు రాష్ట్రంలోని తిరుమేయచూర్ జిల్లాలో ఉన్న లలితాంబికై దేవి పురాతన ఆలయం. ఈ ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది కేవలం సూత్రాలతో ప్రవహించే కావేరీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయం శివుని యాబై ఆరవ ఆలయం. ఆలయంలోని ప్రధాన దేవతలు లలితాంబికై మరియు మహానాడు. ఈ ఆలయంలో పవిత్రమైన పండుగ రాధా సప్తమి జరుపుకుంటారు. వ్యాధి లేని జీవితం మరియు సంపద జీవితంలో శాంతి మరియు ఆనందం నుండి ఉపశమనం పొందాలని భక్తులు వేడుకుంటారు. ఈ ఆలయం పేరు మేఘనాధ స్వామి పలితాంబిక ఆలయం కాగా ఈ ఆలయంలో లలితాపారాయన సూత్రాన్ని పఠించడం భక్తుల కోరికలు తీరుతాయి ఈ ఆలయానికి అమ్మవారికి శాంతి పరిచిన మహాదేవుని ఆలయంగా కూడా పేరు ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో శివుడు మేఘనాథ్ స్వామిగా పార్వతి లలితాంబిక ఆవిర్భవించారు. జగన్మాత పాండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు శ్రీ చక్ర రథంపై ఆసీనురాలై పాండాసురునిక సంహరించింది. ఆ తర్వాత ఆగ్రహంతో ఉన్న లలితాంబిక శివుని ఆదేశాల మేరకు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట.

ఋషులు పరాశక్తి దేవి వద్దకు వెళ్లి, దేవత వారికి భద్రత కల్పించాలని కోరారు. దేవి యాగం నుండి ఉద్భవించి, శ్రీ చక్రంపై లలితాంబికగా ఎక్కి, దెయ్యంతో పాటు యుద్ధాన్ని ప్రారంభించింది మరియు చివరికి దేవి దేవి అతన్ని నాశనం చేసింది. దేవి కోపంగా ఉంది మరియు శివుడు పరాశక్తి దేవిని మనోన్మణి అనే పేరుతో భూమికి రావాలని కోరాడు, తద్వారా దేవి తన కోపాన్ని చల్లబరుస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత దేవత దయగలది మరియు సరళంగా మారింది. దేవత పదాలను పాలించడానికి వాక్ దేవతలను ఏర్పాటు చేసి, సుమారు వెయ్యి పేర్లతో తన స్తుతిని జపించమని కోరింది.

ఆలయ చరిత్ర

తమిళనాడులోని తిరువారూర్ జిల్లా cccccom తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాల ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రాక్షాలన గావిస్తుంది అని అంటారు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కాని యువతులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్య రథసారధి యైన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల విశ్వాసం.

ఈ దేవాలయములో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాళీదేవి మందిరం దర్శించదగినది 8 చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవికా సుఖ మహర్షి సోత్రం గావించాడు. వేద వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళీదేవి చిలుక ద్వారా లలితాంబకు తెలియజేస్తుందని అందుకే ప్రతినిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపై ఎగురుతుందని అక్కడ ప్రచారంలో ఉన్న కథ.

ఈ ఆలయంలో రెండు శివమూర్తులు రెండు పార్వతి మూర్తులు పూజలందుకోవడం ప్రత్యేకత. తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు దాని గుర్తుగా గజవరుష్ట వాహనంపై అధిష్టించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి.

దేవాలయ విశేషాలు

తిరుమీయచ్చూర్ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.

ఆలయ ప్రాశస్త్యం

తిరుమీయచూర్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసుడు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు.

హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని తెలుస్తోంది.

12 నాగమూర్తులు…

ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ ” శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై తిరుమీయచ్చుర్ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.

తిరువాయువు జిల్లాలో మైలాడుదురైకి 12 కిలోమీటర్ల దూరంలో తిరు మీయచ్చుర్ ఉంది. మహిళాడు దొరై నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.

*ఎవరైతే భగవంతుడికి తనను తాను అర్పించుకుంటారో వారికి భగవంతుడు పశుడౌతాడు.

January 24, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలంగాణలో బౌద్ధం

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) January 24, 2026
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

శాంతి కాముకుడు బుద్ధుడు

బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్ధమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956 నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.

బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ ఒప్పుకోవలసిన నిజం. వెతుక్కోవడంలో చూపలేదనేది

ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ-నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది.

ఎక్కడుంది ఈ బౌద్ధ గుహాలయం?

కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా బలమైన పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్ధికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుప వల వేశారు. రక్షిత కట్టడం గా ఏర్పాటు చేశారు.

చతుర్ధశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం

కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా వది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆననంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చని పిస్తున్నాయి.

బౌద్ధ ప్రతిమా శాస్త్రాన్ని పరిశీలిస్తే, ప్రతి భంగిమకూ ప్రత్యేకమైన అర్థం ఉంది. నిలబడే కూర్చుంటే భంగిమలకే కాక చేతి వేళ్లను ఉంచే విధానానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు ఉన్నాయి. ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శముద్ర కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడి విగ్రహాలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది.

ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పిఉంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంది. కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్ధుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్ధంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.

బుద్ధుడేనా లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు.

దెబోగా గృహాలు
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది.

ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు
ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో… రెండవ గుహలో అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.

కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని, 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 15 రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా రెండవ రకమైన బంగారు నాణేలు రెండుతలల గండభేరుండ పక్షి రకానికి చెందినవి. బొమ్మ వైపు దీనిలో రెండుతలల గంఢభేరుండ పక్షి పైపైకి ఎగురుతున్నట్లుగా చిత్రించి వుంది. ఇవి కూడా గుండ్రని నాణేలే గండభేరుండ పక్షికి రెండు వైపులా ఒక్కో ఏనుగును చిత్రించారు.

పక్షి తన తోక్కరు కాళ్ళను క్రిందవైపున అనించి వుంచింది. రెండు మెడలనూ కలుపుతున్న దగ్గర ఒక కంఠాభరణం వంటి నిర్మాణం వుంది.బొరుసు వైపు గమనిస్తే శ్రీవ్రతాపాచ్యుతరాయ అనే అక్షరాలున్నాయి. అయితే ఇక్కడ విజయనగర రాజ్యపు కాలంలో విరివిగా పూజారికాలు జరిగేయని భావించవచ్చు బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికీ దొరికి ఉంటాయి. విగ్రహాలు శిథిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవి ధ్వంసం అయినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా శత్రువు మూకల దాడిలో ధ్వంసం అయినట్లు అర్థమవుతుంది.

సీతమ్మ పాదాలు:
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా కనిపిస్తున్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశి ఉండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరిగాడారని ఇప్పటికే అనేక నిర్దిష్ట ఆధారాలతో నిరూపించబడింది. ఆదిమానవుల ఆవాసాలకు జంతువుల నుంచి ఎండా వానల నుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు ఉండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జాయిన్ కానీ ఆ తర్వాతే బౌద్ధం కానీ ప్రాథమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారి వారి బసదులను పునర్మించారు. వాటిని ధ్వంసం చేస్తూ తదనంర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతున్నది. సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం కారుకొండ గుట్ట ఉన్న ప్రాంతం హేమాచంద్రాపురం అని పిలుస్తున్నారు.

గ్రామ దేవతగా సనాలమ్మ పూజలందుకునేది ఇక్కడే.ఏదో రాయి తెచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దర్శనం పెట్టేస్తున్నారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్షాలు మాతృ స్వామ్య వ్యవస్థ కాలములో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, నడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడుకోవడం ఈ తరం పైన ఉన్నది.
ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం తో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళలు పైనుంచి తోడ్కొని వెళ్తారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, నడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది.

January 24, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తెలివికల్ల చిన్న కోడిపుంజు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

రేనార్డు అనే నక్క ఆకలితో ఉంది. వాతావరణం వసంతం వలె వుంది నిజమే, కానీ అది డిసెంబరు. ఆ నక్క తన ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకోలేదు. సూర్యోదయానికి ముందే అది లాక్‌ వుడ్‌  వాకిలిలోకి దూరి దగ్గరలోనే ఉన్న కోడిపెట్టను మొరటుగా నోట కరుచుకుని వెళ్ళిపోయింది. ఆ కోడిపుంజు నిద్రావస్థలో ఉండి కనులు మిటకరిస్తూ ఆ నక్కను చూసింది. మరుసటి రోజు ఆ నక్క మరో కోడిపెట్టను పట్టుకుపోయింది. మూడవరోజు ఇంకొకదాన్ని. అక్కడ మిగిలిన కోడిపెట్టలు కోడిపుంజును కోపంగా నువ్వు దీని గురించి ఏదైనా ఎందుకు చేయవు అన్నాయి. ఆ రైతు ఆ స్థలంలో కొన్ని వలలు ఏర్పాటు చేసాడు. కానీ అవి నక్క చిక్కడానికి అంత పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నాల్గవ రాత్రి కోడికి ఇష్టంలేని నక్క రాక కోసం తగిన ఏర్పాటు చేసింది. అది ఒక గుడ్ల గంప కొమ్మ మీద పెట్టి ఎదురు చూస్తుంది. నక్క వచ్చి నోరు తెరవగానే కోడి గంపను దాని మీద పెట్టింది. ఆ గుడ్లు నక్క ముఖం మీద పడి చితికిపోయాయి మరియు ఆ గంప దాని తలమీద పడింది. ఆ నక్క గంప నుండి తల బయటికి తీసుకోకముందే కోడిపుంజు పిచ్చిదానిలా అరవటం మొదలెట్టింది. నన్ను ఇంతముందే లేపటం ఎందుకోసం అని రైతు గులుగుతూ మంచం మీదినుండి లేచిండు. వెంటనే అతను నక్క తన తల గంపనుండి తీసే ప్రయత్నంలో గుడ్ల సొనతో కండ్లు మూసుకుపోయాయి. వెంటనే నక్క చర్మపు ముక్కలు కింద పడ్డాయి. కోడిని యజమాని ఎప్పుడు కూడా కోడికూర వండనని వాగ్దానం చేసాడు. అందువలన అది జీవితాంతం కోళ్ల గూటికి యజమానిగా ఉండిపోయింది.

నక్కను పట్టించిన లాక్‌ వుడ్‌ కోడిపుంజు తను చేసిన పనికి గర్వపడుతూ, ఇకనుండి తను ఎందులోనైనా తన అభిప్రాయం తెలుపవచ్చు అనుకుంది. పెట్టెలకు ఏ ఆహారం ఇవ్వాలో, టీవీలో రైతు ఏ ప్రోగ్రామ్‌ చూడాలో ఏ ప్రోగ్రామ్‌ చూడవద్దో తన అభిప్రాయం తెలిపింది. మొదట్లో లాక్‌ వుడ్‌ కోడిపుంజు సలహా వినాలనుకున్నాడు. ఎందుకంటే కోడిపుంజు ధైర్యం కలది, మంచిది. నక్కను కూడా పట్టించింది కాబట్టి. అది తన పక్కింటి యజమాని కూతురు వూలీతో ప్రేమలో పడింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఆమెను వివాహమాడాలి అనుకున్నాడు, కానీ ఈ వివాహానికి పుంజు ఇష్టపడలేదు. చూడు ఇక్కడ ముసలి కొడుకు, అతను రైతుతో బదులుగా విల్‌ కిన్స్‌ కూతురును ఎందుకు వివాహం చేసుకోవు? ఆమె చాలా అందగత్తె మరియు మంచి గుణవతి మరియు ఆమె కోళ్ళ పెంపకంలో దిట్ట. నా అభిప్రాయం ఏమిటంటే ఆ పక్కింటి అమ్మాయి చాలా చెడు లక్షణాలు కలది అని నీవు తెలుసుకోవాలి. ఆ రైతు అటువంటి వారితో ఉండాలనుకోలేదు. అతను అతను నోరు మూయకుంటే తన మాట మార్చి పుంజును పులుసు పెడతానని భయపెట్టినాడు. పుంజు అందుకు భయపడలేదు. ఇంకా చెప్తూనే ఉంది. ఆమె ఇంటిని శుభ్రంగా వుంచుకోదు మరియు గ్రామంలో తెలివైన అమ్మాయి కూడా కాదు. ఒకవేళ అతడు శాశ్వతంగా వెళ్ళిపోతే, కానీ లాక్‌ వుడ్‌ అందువల్ల పాట్టీ విల్‌ కిన్స్‌ కు బదులుగా వివాహమాడుతానని వాగ్దానం చేశాడు. కావున వివాహం జరిగింది. రైతు మరియు అతని కొత్త భార్య ఎంతో సంతోషంగా తృప్తిగా ఉన్నారు. వారు తెలివిగల పుంజుపై గౌరవంతో ఉన్నారు. అందువల్ల పుంజు గర్వమునకు అంతు లేకుండా పోయింది.

January 24, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక కృతజ్ఞత లేని రాకుమారుడు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

గోల్డన్ లాక్ అనే రాకుమారుడికి ఒక బిడ్డీ అనబడే నర్సు ఉన్నది. ఆమె అతడిని ఊయలలో ఊపేది, నిద్ర పుచ్చేందుకు శ్రావ్యమైన పాటలు పాడేది. తన చంకలో ఎత్తుకొనేది. బంగారు తల వెంట్రుకలను దువ్వేది. ఆమె అతనికి మొదటి మాటలు మరియు పాటలు నేర్పింది. తోటలోకి తీసుకొని పోయి ఆహ్లాదకరమైన ఆటలు చూపేది. వారు ఒకరికొకరు అలవాటైనారు. కానీ ఆ యువరాజు  ఎప్పుడైతే యువకుడైనాడో, అతనికి చదువు ప్రొఫెసర్లతోనే నేర్పించాలని అతని తండ్రి నిశ్చయించాడు. బిడ్డీ ఇక అవసరం లేదు, ఆమె ఎక్కడికైనా, ఇష్టమొచ్చిన చోటికి  పోవచ్చు. కానీ రాజభవనంలో ఇక ఆమె అవసరం లేదు. ఆమె మునుపటి వలె యవ్వనంలో లేదు, ఉల్లాసంగా లేదు. ఇది వాస్తవం. కానీ కానీ ఆ యువకునికి ఏ ఇబ్బంది కలిగినా ఆమె హృదయం ద్రవించి పోయేది. అతనికి ఇబ్బంది కలిగినపుడు అతడిని ఓదార్చేది, మంచి విషయాలు చెప్పి సుఖ పెట్టేది.

కానీ ఆ రాకుమారుడు ఆమె దయను త్వరగానే మరచిపోయాడు. అతను వెంటనే పెరగాలని అనుకున్నాడు. ఆమె ఆ ఇంట్లోనే వుండేందుకు తండ్రితో ఒక్కమాట కూడా చెప్పలేదు. వారు ఆమెను బయట చలి, అననుకూలమైన వాతావరణంలోకి పంపేశారు. ఆమె రాచ తోటలు దాటి ముందుకు పోలేక పోయింది. ఆమె అక్కడ బాధతో మెత్తని కొమ్మలు కలిగిన వృక్షముగా (Crooked Willow)మారిపోయింది. వెంటవెంటనే రాకుమారుడు ఏదో తనకు బాగా ఇష్టమైనది కోల్పోయినట్లు అనుకున్నాడు. అతను తన ముదుసలి నర్సును చూసేందుకు బయటకి పరుగెత్తాడు. కానీ ఆమె కనబడలేదు. కానీ అప్పటినుండి తన అన్ని బాధలను ఆ విల్లో చెట్టుకు రహస్యంగా చెప్పేవాడు. అతనికి ఎప్పటికి ప్రపంచంలో తనను అర్థం చేసుకున్నది ఆ వంగిపోయిన ముసలి చెట్టు మాత్రమే నని అనుకునేవాడు.

ఆమె అవసరం తీరాక ఆమెను దయాదాక్షిణ్యం లేకుండా బయటికి పంపడం క్షమించరాని నేరం కదా!

January 24, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక విందు

by ఒద్దిరాజు మురళీధరంరావు January 24, 2026
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.

తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.

ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.

నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.

(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)

January 24, 2026 9 comments
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

ప్రతాపరుద్ర యుగంధర కథలు

by Ammangi Venugopal January 24, 2026
written by Ammangi Venugopal

గ్రహణం

కాకతీయు ప్రధాన గూఢచారి త్రినేత్రుడు ప్రతిభావంతుడే. కాని, తొందర ఎక్కువ. ఒక్కోసారి తన తొందరపాటుకు తాను ఇబ్బందుల్లో పడడమే కాక ఇతరులను కూడ ఇబ్బందుల్లో పడేస్తాడు. శత్రుదేశపు సామంతరాజు తన గూఢచారులను దట్టమైన అటవీ మార్గాల ద్వారా కాకతీయ సామ్రాజ్యంలోకి పంపుతున్నాడు. వారిలో కొందరు మాత్రమే అరకొర సమాచారంతో తిరిగి వస్తున్నారు. మరికొందరు పట్టుబడి బందీలవుతున్నారు. ఇక తక్కినవారు సుభిక్షంగా వున్న కాకతీయ సామ్రాజ్యం విడువలేక అక్కడే ఉండిపోతున్నారు. వీరిలో అవివాహితులు, కాయకష్టం చేసి బతికేవారు ఎక్కువ. ఇట్లాంటివారు అక్కడి అమ్మాయిలనే పెండ్లి చేసుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు.

త్రినేత్రుడు శత్రు రాజు లాగా తాను కూడా దట్టమైన అటవీ మార్గం ద్వారా శత్రురాజ్యంలో ప్రవేశించి అక్కడి సైన్య రహస్యాలను తెలుసుకొని తమ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాలని ఉబలాటపడ్డాడు. ‘లేడికి లేచిందే పరుగు’ అన్నట్టు వెంటనే మహామంత్రి యుగంధరుణ్ణి కలిసి విషయం తెలిపి మారువేషంలో శత్రురాజ్యంలోకి ప్రవేశించడానికి అనుమతి కోరాడు. ఎప్పుడూ వందలకొద్ది రాజ్య సమస్యలతో సతమతమవుతూ క్షణం తీరిక లేని యుగంధరుడు

“సరే! హద్దు మీరి ప్రవర్తించకు. జాగ్రత్త” అన్నాడు.

త్రినేత్రునికి ‘సరే!’ అన్నమాట మాత్రమే వినిపించింది. ఆ తర్వాత వాక్యం వినిపించలేదు!

ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి నమ్మిన బంటు పింగళుణ్ణి పిలిపించి చర్చించాడు. ‘కోయల వేషంలో అటవీ మూలికలు, పలుకులు, జుంటి తేనె తీసుకొని అక్కడి ప్రవేశ ద్వారంలో ఉండే కాపలా సైనికులకు ఉచితంగా ఇచ్చేస్తే, సులభంగా నగర ప్రవేశం చేయవచ్చునని’, పింగళుడు అన్నాడు.

ఇద్దరూ సరంజామాతో శత్రురాజ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశ ద్వారం వద్ద తమ విలువైన దినుసులను కాపలా సైనికులకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరుగా – “మందులోయమ్మ మందులూ, అడవి దినుసులూ” అంటూ వీధుల్లో తిరుగసాగారు. అసలు కోయవాళ్ళు అమ్మే ధరకన్నా తక్కువకే అమ్ముతూ మొదటి నాలుగైదు దినాల్లో కొన్ని రాజ్య రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

రాజధానిలోని ప్రసిద్ధ వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ఇచ్చే సలహాలను అక్కడి – ప్రధాన గూఢచారి సకలాక్షుడు విని పాటిస్తుంటాడని తెలుసుకొని ఒకరోజు రాత్రి అర్చకుని ఇంటికివెళ్ళి పది బంగారు మాడలు దక్షిణగా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసి-

“ఏదో ఉడుతాభక్తి. దయచేసి స్వీకరించండి. వెంకటేశ్వరుడు కరుణిస్తే ఇంకా సమర్పించు కుంటా”నని చెప్పి నిష్క్రమించాడు.

ఎవడో సాటికులం వాడు కులం కట్టుతప్పి, అటవీ దినుసులు అమ్ముతున్నాడని, అసలు కోయలకు తెలిసింది. నిఘా వేసి త్రినేత్రుణ్ణి పట్టుకున్నారు. అతని మాట తీరే వారికి అనుమానాస్పదంగా ఉంది. అసలతడు కోయకాడని అక్కడున్న గస్తీ సైనికునికి అప్పగించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, అట్లాంటివారిని రహస్యంగా సమీప గూఢచారి అధికారికి అప్పగించాలని వారికి ఆదేశాలున్నాయి. పెద్దగా రచ్చ చేయకుండా ఆ సైనికుడు గూఢచారులకు అప్పగించాడు. చాటు నుండి ఇదంతా చూసిన పింగళుడు తన దగ్గర మిగిలిన సరుకులను ప్రవేశద్వారం దగ్గరున్న గస్తీ సైనికులకు పంచేసి, కాకతీయ రాజ్యం ప్రవేశించాడు. వెంటనే విషయాన్ని యుగంధరుని దృష్టికి తెచ్చాడు.

యుగంధరుడు వెంటనే కొన్ని చర్యలు తీసుకున్నాడు. త్రినేత్రుని పోలికలు బాగా ఉన్న అతని కవల తమ్ముడు నేత్రపర్వుణ్ణి, అతని భార్యను ప్రధాన గూఢచారి నివాసంలోకి మార్చాడు. ఇప్పుడు నేత్రపర్వుడే ప్రధాన గూఢచారి వేషభాషల్లో రథం మీద చక్రవర్తి కొలువు కూటానికి పోయి వస్తున్నాడు. త్రినేత్రుని భార్యను వెంటనే అంతఃపురంలోకి ప్రవేశపెట్టాడు. తాను మెరికల్లాంటి పదిమంది సైనికులను తీసుకొని మారువేషాలలో శత్రుదేశం చేరుకున్నాడు. అంచె వేగుల ద్వారా ఏరోజు వార్త ఆరోజు ప్రతాప రుద్ర చక్రవర్తికి తెలియజేస్తున్నాడు.

శత్రుదేశపు గూఢచారులు త్రినేత్రుణ్ణి రహస్య స్థావరంలో ఉంచి విచారణ సాగిస్తున్నారు. అతణ్ణి అదుపులోకి తీసుకున్న విషయం బయటకు పొక్కనీయలేదు. తనది గుంటూరని ఒకసారి, రాజమహేంద్రవరం అని ఒకసారి, ఒరిస్సా అని ఒకసారి పొంతన లేని సమాధానాలు చెప్పుతూ వచ్చాడు. వేధింపులు ఎక్కువ అయ్యాయి. దాంతో తనది ఓరుగల్లు అని, కోయవాణ్ణేనని కాని చాలాకాలంగా తెలుగువాళ్ళ మధ్య ఉంటుండటం వల్ల కోయభాష మరిచిపోయానని చెప్పాడు. ఆ విచారణకు సంబంధించిన పరిణామాలన్నీ పింగళుని ద్వారా యుగంధరునికి, యుగంధరుని ద్వారా చక్రవర్తి ప్రతాపునికి తెలుస్తున్నాయి.

ఒకరోజు శత్రు రాజ్య ప్రధాన గూఢచారి సకలాక్షుడు స్వయంగా వచ్చి విచారణ చేపట్టాడు.

“నీకు కాకతీయుల ప్రధాన గూఢచారి తెలుసా?” అని అడిగాడు.

“త్రినేత్రుడు గారు తెలియకేం. ఆయనకు పుట్టతేనె చాలా ఇష్టం. వారికి సరిపడా తేనెను నేనే సరఫరా చేస్తుంటాను” అన్నాడు.

“మరి వారి భార్య సంగతి?”

“ఆమెకు వజ్రాలు పొదిగిన ఆభరణాలంటే యెక్కడ లేని మోజు” అన్నాడు.

ఈ సమాధానాలు నిజమేనని తమ వేగుల ద్వారా రూఢి చేసుకున్నాడు.

కోయవాడి విషయంలో ఏం చెయ్యాలో చెప్పగలిగే సూక్ష్మ బుద్ధి ఉన్నవాడెవడూ అక్కడ లేడు తమ శత్రుదేశంలో ఉంటున్నానని ఒప్పుకున్నాడు కనుక ఉరితీయటమే మంచిదని న్యాయకోవిదులు తెలియజేశారు. రాజూ, మంత్రీ అదే అభిప్రాయానికి వచ్చి సకలాక్షునికే ఉరి బాధ్యతను అప్పగించారు.

వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకుడు రామానుజాచార్యులు తమ తమ్ముడు లక్ష్మీనరసింహా చార్యులను వెంటబెట్టుకొని ప్రధాన గూఢచారి ఇంటికి వచ్చాడు. తనకు పాదాభివందనం చేయగానే మంత్రసహితంగా ఆశీర్వదించి లడ్డూ ప్రసాదాన్ని అందజేశాడు. ఆ తర్వాత తన సమస్య మనవి చేసుకున్నాడు.

“అయ్యా! మా అమ్మాయికి అనారోగ్యం చేసింది. నన్ను కలువరిస్తున్నదని ఇదిగో ఈ తమ్ముడు వార్త తెచ్చాడు” అంటూ పెద్దపిలక, జంధ్యం, మడి వస్త్రధారణ, నామాలతో తేజోమూర్తిగా కనిపిస్తున్న నడీడువాణ్ణి పరిచయం చేశాడు.

“అయ్యా వీడు మా తమ్ముడు లక్ష్మీనరసింహాచార్యులు. పెద్ద ఘనాపాటి. మా గోదావరి ప్రాంతంలో ఈయన పెట్టిన ముహూర్తానికే కార్యాలు జరుగుతుంటాయి. నేను నెలరోజులు సెలవు మీద వెళ్ళిపోతాను. నా స్థానంలో నా తమ్ముడు ప్రధానార్చకుడిగా ఉంటాడు. అనుమతించండి” అన్నాడు.

“సరే. ఇది చిన్న విషయం మీరు రేపే వెళ్ళిపోవచ్చు. అయితే మాకో సలహా కావాలి. మేం ఒక నేరస్తుణ్ణి ఉరి తీయాలి. ఆ పనికి ఏది అనుకూలమైన రోజో చెప్పండి” అడిగాడు ప్రధాన గూఢచారి.

అప్పుడు ఇద్దరూ వేళ్ళమీద లెక్కించుకొని, ఒక నిర్ణయానికి వచ్చారు.

“నాల్గురోజుల తర్వాత వచ్చే శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండుగంటలకు నరకలోక ద్వారాలు పూర్తి తెరచి వుంటాయి. ఆ సమయంలో ఉరి తీస్తే నేరస్తునికి నరకం. వాడి రాజుకు అరిష్టం ప్రాప్తిస్తాయి” అన్నాడు రామానుజాచార్యులు. దాన్ని కమ్మ మీద రాసిచ్చాడు. ప్రధాన గూఢచారి అంగీకరించాడు. వాళ్ళు సెలవు తీసుకొని వచ్చేశారు.

ఉరితీతకు అన్ని ఏర్పాట్లు రహస్యంగా జరిగాయి. త్రినేత్రుణ్ణి చివరి కోరిక ఏమిటో అడిగారు. అతడు –

“వెంకటేశ్వర స్వామి దైవ ప్రసాదాన్ని తన ఉరికి ముందు అక్కడున్న వాళ్ళంతా స్వీకరించి ఆరగిస్తే, చూసి సంతృప్తితో ఉరికి వేలాడుతా. దైవ కృపతో నాకు నరకం తప్పవచ్చు. ఇదే నా చివరి కోరిక” అన్నాడు. ప్రసాదం విషయమై వెంకటేశ్వరాలయం ప్రధాన అర్చకునికి ఆదేశాలు వెళ్ళాయి.

శనివారం రోజు సంపూర్ణ సూర్యగ్రహణానికి పావుగంట ముందే త్రినేత్రుణ్ణి పెడరెక్కలు విరిచికట్టి నలుగురు బలిష్ఠులైన సైనికులు విచ్చుకత్తులు ధరించి ఉరితీసే వేదికపైకి తీసుకు వచ్చారు. త్రినేత్రుణ్ణి తలారికి అప్పగించి కిందికి వచ్చి క్రమశిక్షణతో నిలబడ్డారు.

తలారి ఉరితాడును పరీక్షించి చూసుకొని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వెంకటేశ్వరాలయం ప్రస్తుత ప్రధాన అర్చకుడు లక్ష్మీనరసింహాచార్యులు మరో పూజారితో పాటు ప్రసాదం తీసుకువచ్చి కింద తమ అశ్వాల పక్కన నిలబడి ఉన్న న్యాయమూర్తికి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధిపతికి, విచ్చుకత్తుల సైనికులకు మంత్రోక్తంగా ఇచ్చి – 

“ఉరితీతకు సమయం లేదు ప్రసాదం వెంటనే ఆరగించండి” అన్నాడు వారంతా వెంటనే సభక్తికంగా ఆరగించారు. బలి వేదిక మీదికి వెళ్ళి తలారికి ఇచ్చాడు. అతడూ దాన్ని నోట్లో వేసుకొని త్రినేత్రుని వైపు తిరిగి –

“అయ్యా! మీరెవరో నాకు తెలియదు. నేనెవరో మీకు తెలియదు. మనిద్దరి మధ్య పగ, ద్వేషం లేవు. మా మహారాజు గారి ఆజ్ఞ మేరకు మిమ్ములను ఉరి తీస్తున్నాను. దేవుడు క్షమించుగాక” అని అంటుండగా సంపూర్ణ సూర్యగ్రహణం మొదలయింది.

చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. చీకటయిందని భ్రమించి పక్షులు అరుస్తున్నాయి. ఆకాశంలో చుక్కలు కనిపించసాగాయి. వేదిక కింద ఉన్న నలుగురు సైనికులు, న్యాయమూర్తి, ప్రధాన వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆ ప్రసాదం మత్తులో నేలకు ఒరిగిపోయారు. పైన తలారి కూడా ఆ మత్తుకు తట్టుకోలేక ఒరిగిపోయాడు. ప్రధాన అర్చకుని వేషంలో ఉన్న యుగంధరుడు అర్చక వేషం వదలేసి సైనికుని దుస్తులు వేసుకున్నాడు. రెండు నిమిషాలలో వారు అక్కడి వాళ్ల అశ్వాలు అధిరోహించి వాయు వేగంతో తమ రాజ్యం వైపు వాటిని పరుగులు తీయించారు. అదివరకే పింగళుని అటవీ దినుసులు ఆరగించి అక్కడి గస్తీ సైనికులు మత్తులో మునిగిపోయారు.

అరగంట దాటీ దాటగానే ఆ చీకటిలో వీళ్ళంతా శత్రు రాజ్య సరిహద్దులను దాటేశారు. అప్పటికి సంపూర్ణ సూర్యగ్రహణం వీడి పాక్షిక గ్రహణంగా మారింది. సన్నని కిరణాలు భూమిని తాకుతుండగా అందరి మత్తు క్రమంగా వదిలింది.

సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ, మత్తుమందును ప్రయోగించి ప్రతాప యుగంధరులు వేసిన ఎత్తును తెలుసుకొని శత్రు రాజ్యం రాజు, మంత్రి, ప్రధాన గూఢచారి సంభ్రమాశ్చర్యాల మత్తులో మునిగిపోయారు.

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కొలువుకూటం ఆనందోత్సాహాలతో కోలాహలంగా ఉంది. చక్రవర్తి, మంత్రి ప్రముఖులు ఉరిశిక్షను తప్పించుకొని ప్రాణాలతో తిరిగి వచ్చిన త్రినేత్రుణ్ణి అక్కున చేర్చుకొని అభినందిస్తున్నారు.

ఆ రణగొణ ధ్వనులను చీల్చుతూ-

“ఇంతకూ బంగారుమాడ ఎవరికి బహుకరించాలి” అని అడిగాడు మేఘ గంభీర స్వరంతో చక్రవర్తి, ఆ మాడను ప్రదర్శిస్తూ.

“దాన్ని లక్ష్మీనరసింహాచార్యుల వేషధారి మన మహామంత్రి యుగంధరుల వారికివ్వటం న్యాయం” అన్నాడు త్రినేత్రుడు.

“ఆ అవతారం శత్రురాజ్యంలోనే సమాప్తమయింది. కనుక మనకు పూర్తిగా సహకరించిన వారి అన్నగారు రామానుజాచార్యుల వారికి బహూకరిస్తే బాగుంటుందని నా విన్నపం” అన్నాడు యుగంధరుడు.

“మరి వారు గోదావరి తీరానికి వెళ్ళిపోయారు గదా!” అన్నాడు ఒక సామంతరాజు.

“ఆ గోదావరి తీరం ఇక్కడ కూడా ఉంది. వారిని ప్రవేశ పెట్టండి” అని ఆదేశించాడు ప్రతాప రుద్ర చక్రవర్తి.

సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న రామానుజాచార్యులు వెంకటేశ్వర స్తోత్రం చదువుకుంటూ ప్రవేశించి బంగారు మాడను స్వీకరించి వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని చక్రవర్తికి అందజేశాడు. దాన్ని స్వీకరించి –

“ఈ ప్రసాదం ఆ ప్రసాదం కాదు గదా!” అన్న చక్రవర్తి ఛలోక్తితో కొలువుకూటంలో నవ్వులు విరబూశాయి.

అయితే, అక్కడ శత్రు రాజ్యంలో ఇంకా గ్రహణం వీడలేదు.

(కల్పితం)

January 24, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మాండలిక ఉప్పెన

by Mucharla Sheshagiri Rao January 24, 2026
written by Mucharla Sheshagiri Rao

యాసంగి ముచ్చట్లు పుస్తక సమీక్ష

 “యాసంగి ముచ్చట్లు” అనే శీర్షిక తెలంగాణ రైతు నిఘంటువులోని అరుదైన శబ్ద ప్రయోగం మరియు మొత్తం సంపుటి తెలంగాణ అస్తిత్వానికి కవితోదాహరణము. ఈ పుస్తకం నిండా తెలంగాణ మాండలిక పరిమళము విభిన్న దృక్పథాల, భిన్న కోణాల నుండి వ్యాపించి యాసంగి పేరిట తెలంగాణ అస్తిత్వాన్ని దృశ్యీకరించింది. తెలంగాణ సాధనకై జరిగిన తొలి,మలి,దశల ఉద్యమస్ఫూర్తిని రచయిత్రి డాక్టర్ వాణి దేవి దేవులపల్లి తన సాహితీ వస్తువుగా ఎంచుకొని మొత్తం తెలంగాణ ఉద్యమ సమరంలో నుండి అంకురించిన అభ్యుదయ విప్లవాగ్నులను ఒక సంకలనంగా ప్రచురించడం అత్యంత ప్రశంసనీయం.

ఈ సంపుటి కవులు తెలంగాణ యాస పైన ముఖ్యంగా మాండలికం పట్ల వారి అభిమానాన్ని ప్రతి పేజీలో చాటుకున్నారు. తెలంగాణ కవిత్వంలో ఆత్మగౌరవ చైతన్య స్వరూపం “యాసంగి  ముచ్చట్లు”. తెలంగాణ సాహిత్యం అనేది కేవలం కవిత్వ పరంపర కాదు. అది ఒక సామాజిక చరిత్ర, ఒక ప్రతిఘటన స్వరం, ఒక ఆత్మగౌరవ ఉద్యమం. అటువంటి సాహిత్య ప్రవాహంలో వెలువడిన ముఖ్యమైన కవితా సంపుటి “యాసంగి ముచ్చట్లు”. డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వంలో రూపొందిన ఈ సంపుటి, తెలంగాణ ఉద్యమానికి ముందు తరువాత కాలాల్ని అనుసంధానిస్తూ, తెలంగాణ ప్రజల జీవన చైతన్యాన్ని కవిత్వంగా మలిచిన అరుదైన ప్రయత్నం.తెలంగాణ ఉద్యమం ఈ సంపుటి కవిత్వానికి ప్రాణాధారం. “యాసంగి ముచ్చట్లు” సంపుటిలోని కవితలు తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ సంఘటనగా కాకుండా ప్రజల జీవన అనుభవంగా ఆవిష్కరిస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాల వంటి సమస్యల వెనుక ఉన్న మానవ వేదనను ఈ కవితలు హృదయపూర్వకంగా చూపిస్తాయి.
 

దాశరథి గారి “నా తెలంగాణ” వంటి కవితలు ఉద్యమానికి మూల వేదనను ప్రతిబింబిస్తే, ఉద్యమానంతర కవితలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయి. ఇలా ఈ సంపుటి ఉద్యమాన్ని కాలప్రవాహంలో చూపగలిగింది. తెలంగాణ యాస భాష మాత్రమే కాదు, సాంస్కృతిక ప్రతిఘటన “యాసంగి ముచ్చట్లు” సంపుటిలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం తెలంగాణ యాసకు ఇచ్చిన ప్రాధాన్యం. ఇక్కడ యాస కేవలం భాషా వైవిధ్యంగా కాదు, ఆధిపత్య భాషలపై ఒక సాహిత్య తిరుగుబాటుగా నిలుస్తుంది. కవులు యాసను అలంకారంగా కాకుండా ఆలోచనా పద్ధతిగా స్వీకరించారు. దీనివల్ల తెలంగాణ ప్రజల మాటలు, పలుకులు, అనుభవాలు సహజంగా కవిత్వంలోకి వచ్చాయి. ఇది “యాసంగి ముచ్చట్లు” సంపుటిని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రధాన బలం. యాసంగి  భూమి నుంచి పుట్టిన ఆత్మగౌరవం ఈ సంపుటిలో కేవలం భౌగోళిక సంకేతం కాదు, అది రైతు చెమటతో తడిసిన భూమి, కూలీ శ్రమతో గట్టిపడిన నేల, అమరవీరుల రక్తంతో పవిత్రమైన తల్లి. అనేక కవితల్లో మట్టి తల్లిగా, సాక్షిగా, సంరక్షకురాలిగా దర్శనమిస్తుంది. ఈ మట్టితో మనిషికి ఉన్న అనుబంధాన్ని కవితలు భావోద్వేగపూరితంగా ఆవిష్క రించాయి.
 
మచ్చుకు కొన్ని  “ప్రాంతం వాడే దోపిడీ చేస్తే” అన్న కాళోజీ  కవితలో అణచివేతకు నైతిక ప్రతిఘటనను స్పష్టంగా ప్రకటిస్తారు. ఇతర ప్రాంతాల వారు దోపిడీ చేస్తే అది అన్యాయం కానీ, స్వంత ప్రాంతపు పాలకులే దోపిడీ చేస్తే అది ఘోర నేరం అని కవి నిర్భయంగా చెబుతాడు. ఇది ప్రాంతీయ చైతన్యాన్ని నిద్రలేపే కవిత. ప్రధాన భావం దోపిడీ ఎవరు చేసినా తప్పే స్వంతవారే దోపిడీ చేస్తే మరింత బాధాకరం ప్రజల మౌనం కూడా నేరమే. కవితా ప్రత్యేకత,నేరుగా మాట్లాడే శైలి,అలంకారాల్లేని వాక్యాలు,సత్యవచన పలుకుబడుల కవిత్వం.
 
“మట్టి పూల పరిమళం” అరుణంపూడి లక్ష్మిగారి కవితలో కవయిత్రి తెలంగాణ పల్లె జీవనాన్ని సున్నితమైన భావాలతో చిత్రిస్తారు. మట్టి నుంచి పుట్టిన పువ్వుల పరిమళంలా, పల్లె జీవితం సాధారణంగా కనిపించినా అంతర్లీనంగా గొప్ప సౌందర్యం, ఆత్మీయత దాగి ఉందని తెలియజేస్తారు.నిజమైన సౌందర్యం నగరాల్లో కాదు  మట్టిలో దాగి ఉంది అని సందేశం. కాకతీయ వైభవం కవితలో, చెరువుల సంస్కృతి, పల్లె పండుగలు, జానపద సంప్రదాయాలు,ఇవి అన్నీ ఈ సంపుటిలో బలంగా ప్రతిఫలించాయి.

కాకతీయ వైభవం వంటి కవితలు తెలంగాణకు చరిత్ర లేదన్న అపవాదును ఖండిస్తాయి. చరిత్రను గర్వంగా గుర్తుచేస్తూ, సమకాలీన తెలంగాణకు ఆ వారసత్వం అవసరమని సూచిస్తాయి. మహిళా కవిత్వం ఒక నిశ్శబ్ద విప్లవంగా కనిపించింది. ఈ సంపుటిలో మహిళా కవుల కవితలు ముఖ్యమైన భాగం. వారు తెలంగాణ ఉద్యమాన్ని తల్లి, భార్య, కూలీ, రైతు మహిళల దృష్టితో చూశారు. మహిళా అనుభవాలను విలాపంగా కాకుండా చైతన్య స్వరంగా మార్చడం ఈ సంపుటిలోని విశేషం. దీని వల్ల “యాసంగి ముచ్చట్లు”  మరింత సమగ్రంగా రూపుదిద్దుకుంది.

విమర్శనాత్మకంగా సమీక్ష అనంతరం కొన్ని కవితల్లో నినాదాత్మకత ఎక్కువగా కనిపించినా, అది ఉద్యమ సాహిత్య సహజ లక్షణమే. భావ ప్రాధాన్యత వల్ల కొన్ని చోట్ల నిర్మాణ సౌష్టవం prose in poetry లా కనిపించినా సంపుటి ఉద్దేశాన్ని అది తగ్గించలేదు. ఎందుకంటే ఈ కవితలు సాహిత్య అలంకారాల కోసం కాకుండా సామాజిక బాధ్యత కోసం రాయబడ్డాయి. యాసంగి ఒక కవితా సంపుటి మాత్రమే కాదు. ఇది తెలంగాణ ఉద్యమానికి సాహిత్య రూపం, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, భవిష్యత్ తరాలకు చరిత్రగా నిలిచే పత్రం.

తెలంగాణను మర్చిపోకుండా గుర్తుచేసే, పోరాట స్పూర్తిని నిలబెట్టే సాహిత్య కృషిగా ఈ సంపుటి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.తెలంగాణను అర్థం చేసుకోవాలంటే రాజకీయ చరిత్ర లో భాగంగా “యాసంగి ముచ్చట్లు” వంటి కవిత్వాన్ని కూడా చదవాలి.
 
“యాసంగీ ముచ్చట్లు”  సంపుటిలోని మొత్తం కవిత్వానికి స్పష్టంగా, అంశాల వారీగా సమగ్రంగా విశ్లేషిస్తే, సంపుటి అనేది కేవలం కవితల సమాహారం కాదు.
ఇది తెలంగాణ చరిత్ర,స్మృతి,పోరాటం, ఆత్మ గౌరవం ప్రజల యాస, నేల, జీవన తత్వం, రాష్ట్ర సాధన తర్వాత కూడా కొనసాగాల్సిన ఆత్మగౌరవ చైతన్యం కలిసిన ఒక సాంస్కృతిక పత్రం. తెలంగాణ ఒక భౌగోళిక గుర్తింపు కాదు,అది చైతన్యపు స్థితి, తెలంగాణ ఉద్యమం  చరిత్రగా కాదు, జీవన స్మృతి. ఈ కవితల్లో ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు తేదీలు, నినాదాలు కాదు, రక్తం, కన్నీరు, త్యాగం, నిశ్శబ్ద గౌరవం, ప్రధానంగా కనిపించేది విద్యార్థి, ఉద్యమం, రైతు, ఆకలి, నిరుద్యోగ యువకుడి తిరుగుబాటు, అమరవీరుల మౌనకేక, ఉద్యమాన్ని గతంగా కాక వర్తమాన బాధ్యతగా చూపిన దృష్టి ఇది. ఈ సంపుటిలోని ముఖ్యమైన సాహిత్య బలం తెలంగాణ యాస. యాస  భాష కాదు, ప్రతిఘటన ఇక్కడ యాస అలంకారం కాదు, కవితా ప్రయోగం అంతకంటే కాదు, అది నిఖార్సయిన ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వా సాల వ్యక్తీకరణ.  ఈ సంపుటిలో కవులు యాసను వాడలేదు, యాసలోనే ఆలోచించారు. ఇది ఆధిపత్య భాషపై నిరాకరణ,పల్లె భాషకు గౌరవ పీఠిక, సాంస్కృతిక స్వాతంత్ర్య ప్రకటన. భూమి మాత్రమే కాదు శ్రమ, జ్ఞాపకం, శరీరం,రైతు, కూలీ, పల్లె మహిళ  అందరి చెమట ఈసంపుటిలో  కలిసినట్టు కవితలు చూపిస్తాయి.ఈ సంపుటిలో మహిళా కవుల భాగస్వామ్యం చాలా బలంగా కనిపిస్తుంది.వారి కవితల్లో బాధను విలాపంగా కాదు తిరుగుబాటుగా, ప్రశ్నగా, స్వరంగా, తెలంగాణ ఉద్యమాన్ని స్త్రీ దృష్టితో చూడటం ఈ సంపుటిని మరింత సంపూర్ణం చేస్తుంది. ఈ సంపుటిలో ఉన్న కవితలు భావకవిత్వం,ఉద్యమ కవిత్వం, సాంస్కృతిక కవిత్వం, చారిత్రక స్మరణ సమకాలీన రాజకీయ వ్యాఖ్య అన్ని కలిసి ఒకే దారిలో నడుస్తాయి.
 


కొండపల్లి నిహారిణి గారి “అక్షర దీపం” కవిత ఒక సామాజిక స్పూర్తిని కలిగించే కవిత. అక్షరాల శక్తిని గుర్తు చేస్తూ, ప్రతి వ్యక్తి జీవితంలో విద్య ఎంత కీలకమో భావగర్భితంగా తెలియజేస్తుంది. ఇది చదివిన పాఠకునిలో ఆలోచనను రేకెత్తించే, బాధ్యతను గుర్తు చేసే కవిత.ఉపమానాలు, రూపకాలు సమర్థంగా ఉపయోగించబడ్డాయి భాష సులభం అయినా భావం లోతైనది సామాజిక చైతన్య కవిత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
 
బాలబోయిన రమాదేవి గారి “గేయాల గొంతులు” కవిత శబ్దం, స్వరం, పాట అనే బాహ్య మాధుర్యం వెనుక దాగి ఉన్న సామాజిక వాస్తవంను ప్రశ్నించే భావగర్భితమైన రచన. ఇది కేవలం పాటల గురించి కాదు మనుషుల గొంతుల్లో వినిపించే నకిలీ మాధుర్యం, మోసపూరిత స్వరాలపై గట్టి వ్యాఖ్య.“గేయాల గొంతులు” ఆధునిక సమాజంలో మాటల మాయను ఎండగట్టే ప్రభావవంతమైన కవిత. ఇది పాఠకుడిని వినేవాడిగా కాక, ఆలోచించే వ్యక్తిగా మారుస్తుంది.
 
డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు రచించిన ‘ఉనికి‘ అనే కవితలోఉపయోగించిన భాషా ప్రయోగం ‘ఒడ్డు లేని నదికి ఉనికి ఎక్కడిది’, ‘అక్షరం భిన్న రూపాల కూడలి కదా’ రచయిత యొక్క సాహిత్య పరిణితి తెలుపుతోంది 
 
‘కర్నాల బంకు’ అనే కవిత రచించిన స్వప్న కృష్ణ గారు ఉపయోగించిన తెలంగాణ మాండలిక శబ్దాలు ‘ఎగిలివారంగానే, మాపటేలికి, అంబటాళ్లకు, పొద్దాక, ఆకిట్ల, తెలంగాణ అస్తిత్వాన్ని కి నిలువెత్తు రూపాలుగా నిలిచాయి. రచయిత తన బాల్యపు జ్ఞాపకాలలో అరుగు ఎంత ఆకర్షించిందో ఎన్ని విషయాలకు సాక్ష్యం అయ్యిందో,వర్తమానంలో కవి ఎంత మిస్ అవుతున్నాడో తన కవితలో అద్భుతంగా వర్ణించారు. 
 
‘తరగనినిధి’ అనే కవితలో రచయిత్రి శారదా హనుమాన్లు గారు భారతీయ సాంప్రదాయ నారి వర్ణనలో ఉపయోగించిన పదచిత్రాలు ‘నిలువెత్తు శ్రమ సౌందర్యదివిటి ,అంగిటిలో రచించిన ఆశుకవిత సంపుటి, దిగుట్లో ఎల్గిలీను దివ్వె, తెలంగాణ తల్లికి ప్రతిరూపాలుగా నిలిచాయి.
 
కవయిత్రి వకుళా వాసు గారు వ్రాసిన ‘అంటుకోని  కుంపటి’ లో ఓ అవ్వ, దినసరి కూలి, తన కాయకష్టముతో రోజంతా శ్రమించి సంపాదించిన కూలి డబ్బులు తాగుబోతు వ్యసనపరుని పాలయినందున, పొయ్యి మండలేదు, అన్నం ఉడకలేదు అని చెప్పటంలో తెలంగాణ సగటు పల్లె కూలి నిత్య రోదన చిత్రాన్ని ఆవిష్కరించింది. ఒక స్త్రీ పడుతున్న వేదనకు దర్పణంలా, కవయిత్రి సామాజిక బాధ్యతను తెలిపింది. డాక్టర్ కాసర్ల రంగారావు గారి ‘అభివృద్ధి జాగృతి తెలంగాణలో’ అనే కవిత,ఉద్యమానికి ఉన్న లోతు, తీవ్రత, నిజాయితీని తెలిపింది. అలాగే ఐక్యత, నిరంతర, జాగృతి ఉంటేనే నిజమైన బంగారు తెలంగాణ సాధ్యం అని కవి అభిప్రాయం. 
 
‘వసంత స్వప్నం’ అనే కవితలో డాక్టర్ అసనాల శ్రీనివాస్ గారు అభ్యుదయ భావజాలంతో ఒక భావ కవితను తన వ్యక్తిగత అనుభవము, సామాజిక చైతన్యము, తెలంగాణ ఆశయాలు, ఈ మూడు అంశాలత్రయంలో వ్యక్తీకరించారు. తన వసంత స్వప్నంలో మార్పు, విప్లవం, అభ్యుదయం, ప్రగతిశీల వాదాన్ని బలపరుస్తూ ఒక అద్భుతమైన భావావేశాన్ని వెల్లడించారు.
 డుంబై శేష పణి గారు రచించిన ‘తెలంగాణ వైభవంలో’ పండుగల గురించి మరియు తెలంగాణ వైతాళికుల గురించి తెలంగాణకు వన్నెతెచ్చిన ప్రకృతి పూల పరిమళాల గురించి ఒక భావ కవిత్వాన్ని తనదైన సంప్రదాయ శైలిలో వెలువరించారు.
 
దేవనపల్లి వీణా వాణి గారు రాసిన  కవిత “పురోగమి” కవితలోని ప్రధాన ఇతివృత్తం చైతన్యం. సమాజంలో అన్యాయం లేదా అశాంతి అనే చీకటి అలుముకుంటున్నప్పుడు, భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఆ చీకటిని ఎవరూ ఆపలేరు. “దీపం వెలిగించడం” అనేది ఇక్కడ ఒక బాధ్యతకు ప్రతీక. మన చుట్టూ జరుగుతున్న తప్పులను చూసి స్పందించకపోవడం కూడా ఒక నేరమేనని కవయిత్రి నొక్కి చెప్పారు. “రోజులు మారుతుంటాయి” అనే పంక్తి ఈ కవితకు వెన్నెముక వంటిది. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, సందిగ్ధాలు ఉన్నా, వాటన్నింటినీ దాటుకుని కొత్త రోజులు వస్తాయని కవయిత్రి భరోసా ఇస్తున్నారు. చీకటిని మింగే సూర్యకిరణం లాగా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, కాలం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదని ఈ కవిత చెబుతుంది. ముసుగు లేని నిజాయితీ అవసరము అని, మనిషి తన లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకలా నటించడాన్ని,ద్వంద్వ ప్రవృత్తిని,హిపోక్రిసీనీ ఈ కవిత విమర్శిస్తుంది. మన తప్పుడు ప్రవర్తనను మన అంతరాత్మ అనే అద్దం చూసి ఎగతాళి చేస్తదని అలా బతకడం ఒక మానసిక భారమని హెచ్చరిస్తుంది. అలాగే, వ్యవస్థను నాశనం చేసే శక్తులను గుర్తించి, వాటిని ఎదిరించడమే నిజమైన “పురోగమి” అని వివరిస్తుంది.ఈ కవిత కేవలం ఒక ఫిర్యాదు కాదు, అదొక హెచ్చరిక మరియు ప్రేరణ. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం నేరమని కవిత హెచ్చరిస్తోంది, పాత ఆలోచనలను, అయోమయాన్ని వీడి, కొత్త చూపుతో (New perspective) లోకాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలనీ ఒక ఆశావాదం optimal కోణం ప్రదర్శిస్తుంది. మొత్తానికి పద ప్రయోగంలో సంక్లిష్టత ఉన్నా అద్భుతమయిన వ్యక్తీకరణ ఉంది. ఈ కవిత కవయిత్రి యొక్క సాహితీ పరిణితికి అద్దం పట్టింది.


 డా. వాణిదేవి దేవులపల్లి గారు రచించిన “యాసంగి ముచ్చట్లు”. తెలంగాణ పల్లెల్లో యాసంగి (రెండవ పంట కాలం) సీజన్‌లో కనిపించే ప్రకృతి సౌందర్యాన్ని, సామాజిక మార్పులను మరియు రైతుల ముఖాల్లోని ఆనందాన్ని ఈ కవిత అద్భుతంగా ఆవిష్కరించింది.కవయిత్రి పల్లెలోకి అడుగుపెట్టగానే “సంపెంగల వాసన” గుప్పుమన్నట్లు చెప్పడం ద్వారా గ్రామీణ పరిమళాన్ని గుర్తుచేశారు. ఊరంతా ఒక పండుగ వాతావరణం నెలకొందని, పల్లె తల్లి “పచ్చని చిలకపచ్చ చీర” కట్టుకున్నట్లుగా పొలాలు కళకళలాడుతున్నాయని వర్ణించడం కవితాత్మకంగా ఉంది. కవితలో ఒక ముఖ్యమైన మలుపు “మిషన్ కాకతీయ” ప్రస్తావన. ఎండిపోయిన చెరువులకు పూర్వ వైభవం రావడం, “కన్నీళ్లు కూడా రాల్చని పల్లె బతుకుల్లో పన్నీటి కాల్వలు గట్టించడం” అనే మాటలు తెలంగాణలో జరిగిన నీటి వనరుల పునరుద్ధరణను సూచిస్తున్నాయి. తరాల కరువుతో తల్లడిల్లిన ప్రజల గుండెల్లో ధైర్యం నింపిందని కవయిత్రి భావోద్వేగంగా చెప్పారు. పంటలు బాగా పండటంతో పల్లెల్లో కుల వృత్తులకు మళ్ళీ పని దొరికిందని కవిత పేర్కొంది. పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళల పాటలను, వారి చేతి గాజుల సవ్వడిని కవయిత్రి జానపద శైలిలో వర్ణించారు. “దుక్కి దుక్కి దున్నంగ ఓ రాచగుమ్మడి…” వంటి పాటల ప్రస్తావన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. శ్రమను కూడా ఒక వేడుకగా మార్చుకునే పల్లె పడుచుల ఉత్సాహం ఇక్కడ కనిపిస్తుంది. కవిత చివరలో పల్లె తల్లిని ఒక ముత్తైదువలా వర్ణించారు. కళ్లకు “సంతోషపు కాటుక” పెట్టుకుని, నిండుగా ఉన్న పల్లెను చూసి కవయిత్రి మురిసిపోయారు. ఎన్నాళ్లకో పల్లె ముఖం మీద ఈ నవ్వులు కనిపిస్తున్నాయని ఆవేదనతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవిత నిండా అల్లుకున్న పదబంధాలు యాసంగి ముచ్చట్లు, గుండె తడి మత్తడి దున్నితే అలుగు వెల్లుగ బారింది కవితకు అదనపు ఆకర్షణ.
 

డా. దేవులపల్లి వాణీదేవి గారి సంపాదకత్వం ఈ సంపుటికి ‘దిశ‘ ఇచ్చింది. యాదృచ్ఛిక కవితల ఎంపిక క్రమపద్ధతి, భావాత్మక ఏకత్వం,ఒక సాహిత్య ఉద్యమానికి రూపము.  ఇవి అన్నీ సంపాదక బాధ్యతలో ప్రతి బింబించాయి. ఈ కసరత్తులో సంపాదకురాలు ప్రథమ శ్రేణి ఉత్తీర్ణులు.విమర్శాత్మకంగా చూసినప్పుడు కొన్ని కవితల్లో భావం బలంగా ఉన్నా, నిర్మాణం సడలింది,కొన్ని చోట్ల నినాద స్వభావం పెరిగింది కానీ ఇది సంపుటి ఉద్దేశానికి లోపం కాదు ఉద్యమ సాహిత్యంలో ఇది సహజ లక్షణం. మొత్తం కవితలలో తెలంగాణ మాండలికం ప్రయోగం జరిగినా అక్కడక్కడ గ్రాంథికం నల్ల వెంట్రుకలలో తెల్ల వెంట్రుకలుగా కనిపించింది. “యాసంగి ముచ్చట్లు” తెలంగాణ ఉద్యమానంతర కవిత్వానికి ఒక డాక్యుమెంట్, భవిష్యత్ తరాలకు ఒక సాంస్కృతిక సాక్ష్యం, ఆధిపత్య భాషా సంస్కృతి మీద ఒక సాహిత్య ప్రతిఘటన,ఈ సంపుటి చదవడం అంటే కవితలు చదవడం కాదు,తెలంగాణను తిరిగి గుర్తుచేసుకోవడం.ఇది మర్చిపోతున్న చరిత్రకు జ్ఞాపకం,అలసిపోతున్న ఆత్మగౌరవానికి మేల్కొలుపు, భవిష్యత్ తెలంగాణకు దిశాసూచి. మొత్తంగా  “యాసంగి ముచ్చట్లు” అనే సంపుటి ఒక “మాండలిక ఉప్పెన”

January 24, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us