మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

విశ్వకవి : రవీంద్రనాథ్ ఠాగూర్

by Radhika Suri September 29, 2024
written by Radhika Suri

కవి ,రచయిత,ఆధ్యాత్మికవేత్త ,
తత్వజ్ఞాని. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన వీరు కలకత్తాలో మే 7 ,1861న జన్మించారు . దేవేంద్రనాథ్ ఠాగూర్, శారదాదేవిల 14వ సంతానమైన వీరు, ప్రముఖ బెంగాలీ రచయిత. నాలుగు గోడలకే పరిమితమైన బాల్యంతో బయట ప్రపంచం వింతగా తోచేది వీరికి. బాల్యంలో పాఠశాల చదువు ఇష్టపడక ఇంటి వద్దే చదువుకొనసాగించినా చక్కని క్రమశిక్షణతో వ్యాయామం, లెక్కలు, భూగోళం ,సంస్కృతాంగ్లాలను అభ్యసించారు. లలిత కళలపై ఆసక్తితో చిత్రలేఖనం ,సంగీతం నేర్చుకున్నారు. కాళిదాసు, షేక్స్పియర్ రచనలు బాగా చదివారు. రవీంద్రుడు తన16వ యేటనుండే రచనలు చేయడం మొదలు పెట్టారు.వీరు సాంప్రదాయ, సంస్కృత భూయిష్టపు రచనాపద్ధతిని వీడి వ్యావహారిక భాషలో రచనలు చేసి సాహిత్యాభిమానులకు చేరువయ్యారు వీరి మొదటి నాటకం ‘వాల్మీకి ప్రతిభ’.

బెంగాలీ గ్రామీణ ప్రాంతాలంటే ఇష్టపడే ఈయనకు కవిత్వం ప్రియవస్తువైనా పద్యాలు ,నవలలు,నృత్యనాటికలుచిన్న కథలు, కాల్పనిక రచనలు, వ్యాసాలు ,విమర్శలుఇలా ఎన్నో ప్రక్రియల్ని సృజించారు. వీరికి సంగీతమంటే ఎంతో మక్కువ సుమారు 2,230 గీతాలు రచించారు.’సంధ్యా గీతం ‘కావ్యాన్ని కవులంతా ప్రశంసించారు. తండ్రి వీరి రచనలు విని,ప్రచురణకు అవసరమయ్యే డబ్బును సమకూర్చేవారట. విర్గరేర్ స్వప్న భంగ , సంగీత ప్రభాత కావ్యాల్ని రచించారు. రవీంద్రుడు ఇంగ్లాండు లోని ఓ పబ్లిక్ స్కూల్లో చేరి ,ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలకు ఆకర్షితులై , ఆంగ్ల నాటకాలకు, కచేరీలకు వెళ్లడంతో భాష పై పట్టు ఏర్పడింది. 1883 డిసెంబర్ 9న మృణాళినీ దేవిని వివాహమాడారు. భగ్న హృదయం కావ్యాన్ని ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే
రాశారు

వీరి’ గీతాంజలి ‘చాలా గొప్ప రచన. బెంగాలీలో రచించిన కొన్ని భక్తి గీతాలను ఆంగ్లంలోకి అనువదించి ‘గీతాంజలి ‘అని పేరు పెట్టారు .103 బెంగాలీ పద్యాల సంకలనం. ఎన్నో భాషల్లోకి అందించబడిందీరచన .శ్రమైక జీవన సౌందర్యాన్ని, సార్వజనీన ప్రేమమయ జీవనంలోని మాధుర్యాన్ని సూచించే సందేశాత్మక సమాహారమే గీతాంజలి. 1913లో ‘గీతాంజలి’ కి సాహిత్యాంశంలో ‘నోబెల్ ‘బహుమతి లభించింది. ఆసియా ఖండంలో ఈ బహుమతి పొందిన తొలి వ్యక్తిగా కీర్తించబడ్డారు.వీరు ప్రేమ, శాంతి,సామర్థ్యాలే ప్రధానాంశంగా తీసుకుని చేసిన రచనలకు ఎంతోమంది స్ఫూర్తి పొందారు.
అప్పటినుండి వారు ‘విశ్వకవి’ గా కీర్తిగాంచారు.అందరూ’ గురుదేవ్’అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారట. సనాతన పద్ధతిలో బాలల మనోవికాసానికి ‘గురుకులం’ తరహాలో ‘శాంతినికేతన్’ గా ప్రసిద్ధిగాంచిన ‘విశ్వ భారతి ‘విశ్వవిద్యాలయాన్ని 1921 డిసెంబర్లో స్థాపించారు. మొదట అయిదుగురితో ప్రారంభమై క్రమంగా విస్తరించబడింది. చిన్నపిల్లలకు ఉపాధ్యాయుల ఇళ్ళల్లోనే వసతి కల్పించి , భోజన సదుపాయాలన్నీ అక్కడే జరిగేవి. క్రమశిక్షణతో కూడిన దినచర్యలో భాగంగా సత్యాన్ని పలకడం , మితమైన నిద్ర, పరిశుభ్రత, గురువుల్ని, పెద్దల్ని గౌరవించడం, నడక యొక్క ప్రాధాన్యత నేర్పేవారు. 1919లో కళాభవన్ స్థాపించారు, ఇందులో వివిధ కళల్ని నేర్పించేవారు. గ్రామాభ్యుదయంతోనే దేశ పురోగతి సాధ్యం అనేది వీరి భావన. దానికోసం’ శ్రీనికేతా’న్ని ఏర్పాటు చేసి, గ్రామ పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. ‘వాల్మీకి ప్రతిభ’ వీరి మొదటి నాటకం కాగా, పోస్ట్ ఆఫీస్ చిత్రాంగద, ప్రకృతి – ప్రతీక ఇలా ఎన్నో నాటకాల్ని రాశారు. సాంఘిక ప్రయోజనం ,సందేశాత్మక మైన నవలగా ‘గోరా ‘ వీరికి ఎంతో పేరు తెచ్చి పెట్టింది.
రవీంద్రులు తమ 70వ యేట చిత్రకళను సాధన చేసి, వేసిన చిత్రాలు లండన్ ,పారిస్, న్యూయార్క్ మొదలైన నగరాలలో ప్రదర్శించబడ్డాయి. దాదాపు 2,000ల చిత్రాలు గీశారు. విశ్వ కవికి సంగీతం అంటే వల్లమాలిన ప్రేమ ,ఆయన బెంగాల్ జానపద గీతాల్ని, బాపుల్ కీర్తనల్ని విని పరవశించేవారు. స్వయంగా గాయకులైన వీరు’ రవీంద్ర సంగీత్’ అనే ప్రక్రియ ప్రవేశపెట్టారు.

దేశభక్తి మెండుగా గల వీరు
దేశభక్తి గీతాలు పాడుతూ ,ప్రబోధాత్మకమైన పద్య గేయం రచించారు. బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ ను నిర్బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించారు. బెంగాల్ విభజన ప్రతిఘటన ఉద్యమంలో వీరిది ప్రముఖపాత్ర. జాతీయ నిధికి విరాళాలు కూడా సేకరించారు. ఠాగూర్ 1896 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో బంకించంద్ర ఛటర్జీ రాసిన’ వందేమాతర’ గీతాన్ని ఆలపించారు .జాతీయ గీతాన్ని ప్రకటించే ముందు ‘వందేమాతరం’, ‘జనగణమన’ రెండింటిలో దేన్ని ‘జాతీయగీతం’ గా తీసుకోవాలనే తర్జనభర్జనల నడుమ’ రాజ్యాంగ కమిటీ’ అధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ గారు 1950 జనవరి 24న రవీంద్రుని జనగణమనను’ జాతీయగీతం’ గా ‘వందేమాతరా’న్ని జాతీయగేయంగా ప్రకటించారు. రెండింటికీ సమాన ప్రతిపత్తి (హోదా) కలిగిఉంటుందని పేర్కొన్నారు .రవీంద్రుని రచనల్లోని కొన్ని ప్రభావిత పంక్తులు: ‘ గీతాంజలి’ — ఈ మంత్రములు, జపమాలలు విడిచిపెట్టు, తలుపులన్నీ బంధించి ఈ చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు నీవు ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు ఎచట రైతు నేలను దున్నుతున్నాడో, ఎచట శ్రామికుడు రాళ్లు పగలగొడుతున్నాడో అచట ఆ పరమాత్ముడు ఉన్నాడు .వారితో ఎండలో వానలో ధూళీ దూపరితములైన వస్త్రములలో ఉన్నాడు. నీవు కూడా నీ పట్టు పీతాంబరములు ఆవల పెట్టి ఆ నేల మీదికి పద . అంటూ ..ఉపదేశిస్తూనే
2.ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు అనడంలో వారిలోని దార్శనికులు మన కళ్ళముందు కదలాడుతారు. ఈ వాక్యాలు మహాత్మాగాంధీకి చాలా ప్రియమైనవి . జవహర్లాల్ నెహ్రూ ఒక సందర్భంలో రవీంద్రుని ప్రభావం తనపై ఎంతో ఉందని పేర్కొన్నారు. అలాగే గాంధీజీని మొదట ‘మహాత్మా ‘అని పిలిచింది కూడా ఠాగూర్ గారే.
1915 లో బ్రిటిష్ వారు ‘నైట్ హుడ్ ‘బిరుదు ప్రధానం చేయగా జలియన్ వాలాబాగ్ దురాగతానికి నిరసనగా 1919లో దానిని తిరస్కరించారు. బంగ్లాదేశ్ జాతీయ గీతం ‘అమర్ సోనార్ బంగ్లా ‘కూడా వీరు రచించిందే.

ఠాగూర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ,ఇద్దరు కుమారులు తమ 70వ పుట్టినరోజున 1918లో తాను స్థాపించిన విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ఠాగూర్ ఇలా అన్నారు: నేను అనేక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నాను, నిజమేకానీ నా అంతరంగం వీటిలో దేనిలోనూ కనిపించదు. నా ప్రయాణం ముగింపులో నా జీవిత గోళాన్ని కొంచెం స్పష్టంగా చూడగలుగుతున్నాను .వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కవిని (అమీ కవి) మాత్రమే అని నాకు కచ్చితమైన అభిప్రాయం అంటారు.

జీవితంలో ప్రతిరోజు ,క్రితం రోజు కన్నా కాస్తోకూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలంటారు. ‘కళ్ళకు రెప్పలు ఉన్నట్లే ‘మనిషి కి విశ్రాంతి ఉండాలని వీరి అభిప్రాయం.
‘ కాగితపు పడవ’లోని జ్ఞాపకాల దొంతరలోని పంక్తులు కొన్ని : రోజురోజుకు నేను నా కాగితపు పడవలను ఒక్కొక్కటిగా నడుస్తున్న ప్రవాహంలోకి తేలేను. పెద్ద నల్లని అక్షరాలతో వాటిపై నాపేరు ఊరు రాస్తానంటారు.

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యారు .వ్యాధి తీవ్రతతో 1946 ఆగస్టు 7న స్వర్గస్తులైనారు. ‘మై రెమినిసెన్సెస్’ పేరుతో ఆత్మ కథను రాసుకున్నారు.

కొంగర జగ్గయ్య గారు ‘రవీంద్ర గీత’ పేరిట గీతాంజలిని అనువదించారు. తెలుగులో అనువదించబడిన తొలి రచన అందులోని కొన్ని పంక్తులు :
మూడు ప్రొద్దున చిమ్మట లోదిగిల్ల
పదము పాడుచు నేల దున్నే దము మేము
మా కరంములు లోహ సలాక లయ్యు
మా మనమ్మలు మవ్వపు మండసములు అంటూ అనువదించగా,

రామస్వామి నాగరాజు గారు అనువదించిన గీతాంజలిలో తమకు ఇష్టమైన 53వ కవిత:
“ఎంత అందంగా ఉంది
రవ్వలతో రంగురంగుల రత్నాలతో నైపుణ్య యుక్తియుక్తంగా చెక్కబడిన
నీ నక్షత్ర కర కంకణం”అంటూ హృద్యంగా తెనిగించారు.

ఇలా ఎంతోమంది గురుదేవునిపై అభిమానంతో తమ భాషా నైపుణ్యానికి పదునుపెడుతూ చక్కని అనువాదాలతో సాహితీసుధను మనకందించారు.

రచయితగా, సంగీతజ్ఞునిగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవీయవిలువలున్న మహాశక్తి గా చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఠాగూర్.
రవీంద్ర జయంతిని బెంగాలీలు ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. వేకువ ఝాము నుండే తమ తమ గృహ సముదాయాల్లో రవీంద్రసంగీతాన్ని వింటూ నివాళులర్పిస్తారు. విద్యా సంస్థలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి . విదేశీ విద్యార్థులు సైతం ఈ వేడుకలలో భాగస్వాములౌతారు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందిన ఆ సాహితీవేల్పుకు అక్షర ప్రణతులర్పిస్తూ.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

కల్తీయుగం

by Rudrakhala Matam Prabhu linga Shastri September 29, 2024
written by Rudrakhala Matam Prabhu linga Shastri

శ్రీకృష్ణుడి నిర్యాణముతో
తదుపరిది “కల్తీ” యుగమే.
అది ‘కల్తీ’ కావున దీనిని
“కలి” అని అంటున్నారేమో!

ఈ యుగమందే అవైదిక
మతాలు ఆవిర్భవించాయి.
‘కల్తీ’ కావున “ఆత్మ” కు
వేరే అర్థాన్ని చెప్పినాయి.
దేవుడు లేడు అంటూనే
ఆలయాలే కట్టకున్నాయి.

భారతీయ ఆధ్యాత్మిక
చింతన అంటే “కర్మ”యే
ఈ ‘కర్మ’ను కూడా వేరే
విధంగావాడుకొని “కర్మ”
సిద్ధాంతం తప్పంటున్నాయి.

కొంతమంది పండితులేమో
అజ్ఞానంతో పురాణాలను
ఆత్మరక్షణకు ఆధ్యాత్మికాన్ని
ఆశ్రయిస్తూ ప్రతినిత్యం
భారతీయ “సనాతనం”ను
యథేచ్ఛగా’కల్తీ’చేస్తున్నారు

మన తెలుగు భాషంతా ‘కల్తీ’యే
అచ్చ తెలుగు అనవాలే కరువు.
వివాహాది శుభకార్యాలలో “కేక్”
కటింగ్ లతో ‘కల్తీ’దే రాజ్యం.
అర్చనాది క్రతువులలో ‘మడి’
కూడా పట్టు దుస్తులతో ‘కల్తీ’.

అంతర్జాతీయ ‘కల్తీ’లతో సినిమా.
పొసగని వార్తల మీడియా ‘కల్తీ’!
‘కల్తీ’లతో కులాచారాలన్ని అంతం.

మాగపెడుతున్న పండ్లు ‘కల్తీ’యే.
మినరల్ వాటర్, డ్రింక్స్ ‘కల్తీ’యే.
హోటల్ తిండి ‘కల్తీ’కి మారుపేరే!

‘కల్తీ’యుగ దేవుడి “లడ్డు”
కూడా ‘కల్తీ’ యని ఆ దేవుడే
అందరి కళ్ళు తెరిపించాడేమో?

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఆత్మ సౌందర్యం

by Radhika Suri September 29, 2024
written by Radhika Suri

కళ్ళు మాత్రమే చెప్తాయి నిజమైన అందానికి సరైన చిరునామా
చూసే కళ్ళను బట్టే కదా అందాన్ని బేరీజు వేసేది
మాటల మాటున దాగిన సంస్కారానికి
ఆత్మ సౌందర్యం ఆభరణమై భాసిస్తే
మురిసిన మనసు మయూరమై నాట్యమాడుతుంది
హంగులు ఆర్భాటాల వెంట పరుగులు పెడుతూ
నిజమైన సౌందర్యాన్ని చేజార్చుకోకు
సౌశీల్యానికి మించిన సౌందర్యం లేదు
రంగుటద్దాల మాటును దాగిన సొగసులన్నీ పై పూతలే
నీ మనసును కమ్మిన మాయపొర తీసి చూడు
అసలు సిసలైన అందం నీ కంటబడుతుంది
ప్రకృతి సోయగ మెంతో సహజమైనది
గడ్డి పూలలో దాగిన చక్కదనాన్ని మనసు పెట్టి చూడు
కష్టించే చేతుల్లోని శ్రమ సౌందర్యాన్ని చూడు
అమ్మ ప్రేమలోని చెలువమెంత కమ్మనైనదో చూడు
దేహ సౌందర్యాన్ని చూసి మిడిసి పాటెందుకు
ఎంతో కాలం నిలువని ఆ బాహ్య సౌందర్యంపై మక్కువేల
తలపుల్లో సొగసు తావులు
విరజిమ్మాలి
మనోహరమైన హరివిల్లులా
వర్ణ రంజితం కావాలి
ఇన్ని ప్రయాసలెందుకు ఒక్క క్షణం కండ్లుమూసి చూడు
రెప్పల మాటున దాగిన చిత్త సౌందర్యం ఎంత గొప్పదో!

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

జీవనమాధుర్యం

by Laxmi Madan September 29, 2024
written by Laxmi Madan

రెండవ భాగం
🌹🌹🌹🌹🌹🌹🌹

అలా ఎన్నో ఊహలతో ఉన్న అ దాపర్ణకి తను దిగాల్సిన ఊరు ఎప్పుడు వచ్చిందో చూసుకో లేదు. అప్పటికే బస్సు అంత ఖాళీ అయిపోయింది. కండక్టర్ అన్నాడు” మేడం ఇదే లాస్ట్ స్టేజ్ దిగండి”

” ఒక్కసారిగా ఊహా ప్రపంచం నుంచి బయటకు వచ్చి కిటికీలో నుండి బయటకు చూసింది. బస్టాండ్ అంతా కోలాహలంగా ఉంది .తను ఎక్కిన బస్సు ఖాళీగా ఉంది ,వెంటనే తన సూట్ కేసు బ్యాగు తీసుకుని కిందకు దిగింది.

ఎదురుగా కనబడిన మనుషులు చూసి ఆశ్చర్యపడింది. అతను ఎవరో కాదు రామాలయంలో పూజ చేసే పూజారి. వయసు పైబడి నడవలేక నడుస్తూ బసు కోసం అనుకుంటా ముందుకు వస్తున్నాడు.

అపర్ణ వెళ్లి పలకరించింది.

“పెద్దనాన్న బాగున్నారా”అన్నది అపర్ణ.

“ఎవరు తల్లి, నాకు చూపు అనడం లేదు గుర్తుపట్టలేకపోతున్నాను” అన్నాడు వణుకుతున్న శరీరంతో.

“నేను దక్షిణామూర్తి గారి అమ్మాయిని. నా పేరు అపర్ణ .చిన్నప్పుడు మీ అమ్మాయి, నేను ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్లే వాళ్ళం గుర్తొచ్చిందా? పెదనాన్న”అని చెప్పింది అపర్ణ.

గుర్తుపట్టినట్లు తలాడించాడు పూజారి గారు. బ్యాగ్ లో నుంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టి

“ఇది ఉంచండి” అన్నది అపర్ణ.

“ఎందుకు బిడ్డ, నాకు డబ్బులు అవసరం ఉన్నవని నీకు అర్థం అయ్యిందా”అన్నాడు నవ్వుతూ.

“బస్సు వచ్చింది నేను వెళ్తాను బిడ్డ. వెళ్లే లోపల మా ఇంటికి రా?”అని చెప్పి కర్ర సహాయంతో ముందుకు వెళ్లిపోయారు పూజారి గారు.

ఒక్క నిట్టూర్పు వదిలింది అపర్ణ .”రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయో అర్థం కావడం లేదు. పూజారి పెద్దనాన్న గుడిలో అలంకరించిన తీరు చూస్తే ఎంతో బాగుండేది. ఏంటో ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నారు” అని బాధపడింది.

తన స్నేహితురాలు వసంతకు ఫోన్ చేసింది..

” వసంతా! నేను మన ఊర్లో బస్సు దిగాను. మీ ఇల్లు ఎటువైపు ?చెబితే నేను వచ్చేస్తాను” అని చెప్పింది.

” వచ్చేసావా?కాస్త ముందే ఫోన్ చేయకూడదా? కార్ పంపిస్తాను, ఐదు నిమిషాలు వెయిట్ చెయ్.. మన ఊరు నువ్వు చూసినప్పటిలా లేదులే. చాలా మారిపోయింది. నువ్వు మా ఇల్లును గుర్తుపట్టలేవు.అక్కడే ఉండు ” అని చెప్పింది వసంత.

” సరే” అని అక్కడ బెంచ్ మీద కూర్చుంది అపర్ణ.

బెంచ్ మీద తన పక్కనే ఒకతను కూర్చుని ఉన్నాడు.తెల్ల పంచె ,లాల్చీ వేసుకుని ఉన్నాడు. మనిషి బాగా ఎత్తుగా తెల్లగా ఉన్నాడు. వయసు దాదాపు 75 ఏళ్లు ఉంటుందేమో!

“ఎక్కడో చూశాను ఇతన్ని అని అనుకొని

“అయ్యో ఈయన డ్రాయింగ్ మాస్టారు ఆనందం సార్ కదా” అని అనుకొని,

” నమస్తే సార్ బాగున్నారా!” అని అడిగింది అపర్ణ.

” బాగున్ననమ్మా ! కానీ, నువ్వు ఎవరో నేను గుర్తు పట్టలేదమ్మ! ఏమీ అనుకోవద్దు .వృద్ధాప్యం కదా! కళ్ళు కాస్త మసకబారాయి” అని అన్నాడు అతను.

” నేను మీస్టూడెంట్ ను సార్, నాపేరు అపర్ణ.నేను క్లాస్ లో ఎప్పుడైనా మీరు ఇచ్చిన చిత్రాన్ని అచ్చంగా అలాగే వేస్తే, ఎన్నోసార్లు నన్ను మెచ్చుకున్నారు. ఆడ్రాయింగ్ పైన మీరు పెట్టే సంతకంతో పాటు ‘ గుడ్ ‘ అని పెట్టించుకోవాలని క్లాస్ అంతా ప్రయత్నించేవాళ్ళు. అందులో నేను ఒక దాన్ని.ఎన్నోసార్లు నన్ను మెచ్చు కున్నారు .” అని చెప్పింది అపర్ణ.

ఆనందం సారు కొంచెం ఆలోచిస్తున్నట్లుగా తలపైకెత్తి,

” ఆ !గుర్తొచ్చింది. తరగతిలో అల్లరి కూడా బాగా చేసే దానివి. చాలా సంతోషం తల్లి, నన్ను గుర్తుపట్టి మాట్లాడించినందుకు. ఎక్కడ ఉంటున్నావ్ ?ఏం చేస్తున్నావు? భర్త పిల్లలు అందరూ కులాసానా?” అని అడిగాడు సార్.

” అన్ని వివరంగా చెప్తాను సార్ .మీరు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? మీఇంటి అడ్రస్ చేప్తే వస్తాను. నేను ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటాను. మీఇంటికి వచ్చి కాసేపు కూర్చొని అన్ని వివరాలు చెప్తాను” అని అన్నది అపర్ణ.

ఆనందం సార్ తన ఇంటి అడ్రస్ చెప్పి ,తను వెళ్లాల్సిన బస్సు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయారు.

అపర్ణ తన స్నేహితురాలు పంపించిన కారులో వాళ్ళ ఇంటికి చేరుకుంది. దారిలో ఊరంతా చూస్తుంది. తన పుట్టి పెరిగిన ఊరుకు, ఇప్పటి ఊరుకు పోలికే లేదు. అంతా పట్టణ వాతావరణం లాగే ఉంది.

” వసంత చెప్పినట్లు నేను ఒక్కదాన్ని వెళ్లడం కష్టమే” అని అనుకున్నది. ఇంతలో కారు ఇంటి ముందు ఆగింది .

కారు దిగి దిగగానే ఎదురుగా స్నేహితురాలు వచ్చేసింది.ఇద్దరూ ఒకరి ఫోటోలు ఒకరు వాట్సాప్ లో పంపించుకోవడం వల్ల గుర్తుపట్టుకోగలిగారు. లేకపోతే పూర్తిగా మారిపోయిన వాళ్ళ రూపాలను గుర్తుపట్టుకునే వాళ్ళు కాదు.ఎంతో లావుగా అయిన వసంతను చూసి,

” ఏంటే ఇంత మారిపోయావు,?” అని దగ్గరకు తీసుకుంది అపర్ణ.

” అవునే చాలా మారిపోయాను. బాగా ఒళ్లు వచ్చేసింది. ఇంట్లో అందరూ కూడా తిడుతున్నారు. ఆరోగ్యం పాడవుతుంది కాస్త డైట్ చూ సుకో అని ” అని నవ్వుతూ అపర్ణను చేతులతో పట్టుకుంది.

” కానీ, నువ్వు మాత్రం ఏమీ మారలేదు అప్పూ! అలాగే ఉన్నావ్. ఈ చీర కట్టులో బాగున్నావు. అందమైన జడ ఏమాత్రం చెక్కుచెదరలేదు సుమా! ” అన్నది వసంత.

” ఇంట్లోకి రానిస్తావా? లేక ఈ ముచ్చట్లతోనే కడుపు నింపుతావా? నిన్నటి నుండి ప్రయాణం చేసీ చాలా అలసిపోయాను” అన్నది అపర్ణ.

” అయ్యో! నిన్ను చూసిన సంతోషంలో ఆవిషయమే మర్చిపోయానే! పద పద లోపలికి వెళదాము. నీకు గది ఏర్పాటు చేశాను. స్నానం చేసి టిఫిన్ చేసి అలసట తీరేవరకు పడుకో” అని చెప్పి స్నేహితురాలిని లోపలికి తీసుకెళ్ళింది వసంత.

ఇల్లంతా పెళ్లి సందడిగా ఉంది. పూల తోరణాలు, మామిడి ఆకుల తోరణాలు కట్టి ఎంతో అందంగా ఉంది. చక్కని పరిమళాలు వెదజల్లుతుంది . ఒక్కసారి అలసట అంతా మాయమైపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న కొంతమంది తెలిసిన బంధువులను పలకరిస్తూ గదిలోకి వెళ్లిపోయింది అపర్ణ.

తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిన అపర్ణకు, ఆగదిలోని అమరిక ఎంతగానో నచ్చింది. ఆ గది వసంత వాళ్ళ తల్లి తండ్రులదట. వసంత అత్తగారు కూడా ఒకటే ఊరు కావడం వల్ల ఇంచుమించు అందరూ కలిసే ఉంటారు. అందులో వసంత అత్తగారు వాళ్ళు మేనరికం. వసంత ఒకతే అమ్మాయి. అందుకని తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారు. ఆ గదిలోని సామాను చూస్తుంటే చాలా ముచ్చట వేసింది. పాత కాలపు పందిరి మంచం , డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా కొన్ని చెక్క బొమ్మలు. ఇలా ఎంతో బాగుంది.మరో పక్క చిన్న దివాన్.అది తనకోసం కావొచ్చు అనుకున్నది.ఇల్లంతా మార్పులు చేసినా, ఈ గది అలాగే ఉండాలని వాళ్ళ కోరికట.గదిలో గంధపు పరిమళం వస్తుంది. దేవుడి పటానికి గంధపు పూమాల వేశారు.

అపర్ణ తన సూట్ కేస్ తెరచి, అందులో నుండి టవల్, సబ్బు,షాంపూ ,కట్టుకునే చీర బయటకు తీసి,సూట్ కేస్ మూసి, ఒక పక్కగా పెట్టింది.బాత్రూమ్
లోకి వెళ్లి హాయిగా నీళ్లు ఒంటి మీద పోసుకుంటే, బడలిక తీరినట్లు అనిపించింది. ఇంతలో బయట నుండి వసంత పిలుపు వినిపించింది.

” అప్పూ! కుంకుడు కాయ రసం బాత్ రూం లో పెట్టించాను.నీకు నచ్చితే చెయ్యి,లేదా షాంపూ కూడా అక్కడే ఉంది ” అని చెప్పింది .

” ఓహ్! అవునా! ఎన్నాళ్ళయింది కుంకుడుకాయ రసంతో స్నానం చేసి.సరెనే ! ” అని చెప్పి చక్కగా కుంకుడు రసంతో తలస్నానం చేసి ,సున్నిపిండితో స్నానం చేసి బయటకు వచ్చి,తలకి చిన్న పంచె కట్టుకుని ,తనకి ఎంతో ఇష్టమైన పింక్ చీర కట్టుకుంది.లైట్ గా మేకప్ చేసుకుని, కొంచెం పెద్ద బొట్టుపెట్టుకుని,ముత్యాల దండ మెడలో వేసుకుని తనని తాను చూసుకుంది.వెంటనే భర్త గుర్తొచ్చి ఒక సెల్ఫి తీసుకుని పంపించింది.
తర్వాత తలని తుడుచుకుని, జుట్టు వదిలేసి ఒక క్లిప్ పెట్టుకుని బయటకు వచ్చింది.అపర్ణని చూసిన వసంత
” భలే అందంగా ఉన్నావే” అని పిలిచి అందరికీ పరిచయం చేసింది.

అపర్ణ కూడా అదే ఊరు కావడం వల్ల తనకు చాలామంది తెలిసినవాళ్లే.
అలా అందరితో మాట్లాడుతూ కూర్చుంది. ఇంతలో అందరిని టిఫిన్ చేయడానికి రమ్మని పిలుపులు వచ్చాయి. పెళ్ళంతా సాంప్రదాయంగానే ఉండాలని ఏర్పాటు చేసింది వసంత. ఆకాలపు ఉపహారాలు, భోజనాలు ఇంటి వెనక పెరట్లో తడికల పందిళ్లు, పచ్చని విస్తారాకులలో భోజనాలు. కింద కూర్చొని తినగలిగే వాళ్ళకి చాపలు పరిచారు. కింద తినలేని వాళ్ళకి వరుసగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆ తడికల పందిరిలోకి వెళ్ళగానే ఎంతో సంతోషం అనిపించింది అపర్ణకు . తన పెళ్లి జరిగిన విషయం గుర్తుకొచ్చింది. ఇంకా అదే విధంగా ప్లాన్ చేసుకున్న వసంతను మనసులోనే అభినందించింది.

” వసూ! ఎంత బాగా ఏర్పాట్లు చేసావే, ఇంతకీ ఆలోచన నీదా ?మీ ఆయనదా?” అని అడిగింది.

“ఏం? నాకు అలాంటి ఆలోచనలు రావు అనుకున్నావా?. నిజం చెప్పాలంటే మా ఆయనదే” అని చెప్పి పక్కకు తిరిగినంతలో వసంత వాళ్ళ ఆయన శ్రీనివాసరావు వస్తూ కనిపించాడు.

“అదిగో మాటల్లో వచ్చారు మాశ్రీవారు” అని అపర్ణ వైపు చూసి,

“మాఆయన శ్రీనివాస రావు, ఇదేమో నా ఫ్రెండ్ అపర్ణ” అని పరిచయం చేసింది.

పరస్పర పరిచయాలు అయ్యాక..

“రండి అపర్ణ గారూ!టిఫిన్ చెయ్యండి ” అన్నాడు శ్రీనివాస రావు.

” అందరం కలిసి తిందాం మీరూ రండి ” అని వసంత వైపు చూసింది అపర్ణ.

“మేము ఇప్పుడు ఏమీ తినకూడదు.ఈ రోజు అమ్మాయిని పెళ్లి కూతురును చేస్తున్నారు కదా!అంకురార్పణ,ఇంకా కొట్నం ఉంటుంది “అని చెప్పింది.

“అవును మరచే పోయాను.సరే, నేను వెళ్లి టిఫిన్ చేసి వస్తాను. ఏదైనా సహాయం చేస్తాను తిన్నాక ” అని చెప్పి అపర్ణ పందిట్లో కి వెళ్ళింది .

పందిట్లోకి వెక్కిన అపర్ణ ఆ వాతావరణం చూసి మై మరచి పోయింది.

సశేషం

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

అంగూరు గుత్తులు

by Ramesh September 29, 2024
written by Ramesh

అంగూరుతోటలో
అంగూరు నేలమీద అంగూరు తీగలు తీగలు
అందాల అంగూరుగుత్తుల ఆకాశం
ఆ ఆకాశం కింద అంతా అంగూరు తియ్యని గాలే
అన్ని పండ్లు కండ్లైచూచే అద్భుతఅంగూరులోకం
అది అంగూరురైతు కలలుగన్న స్వప్నదేశం
పండ్లవ్యాపారం బండీలెక్కి
అంగూరు గుత్తులు ఆసిఫాబాద్ అంగట్లోకి చేరాక
అగ్గువగా, అంగూరంగూరని తియతియ్యగా పిలుస్తాయ్
తోపుడు బండ్ల పై లేతఆకుపచ్చగా,పసిడిపచ్చగా అమాయక పసిపాపల కండ్ల అంగూరుగుత్తులు
మార్కెట్టులో ఆపిల్స్ ధర ఆకాశాన్నంటినా
తమ రేటు
అరకిలో యాభైయే అని అంగూర్లంటవి
గిరిజన గ్రామాలకు,లంబాడి తండాలకు,గుట్ట మీది పల్లెలకు, గ్రామగ్రామానికి, ఆసిఫాబాద్ పట్టణం ప్రతీవాడకు
యాబై కరెన్సీ నోటుకు ముస్తాబై ఉషారుగా బయలుదేరుతవి
ఆస్తులున్నవారని,పస్తులున్నవారనిభేదంలేకుండా
కడుపులోకింత అంగూరు మధుర రసం భేషరతుగా దుంకుతది
అంగూరపండ్లవానికి
ఉసురు మన్న రోజులు కొన్ని అతనిగుండెలను గాయంచేస్తాయ్
ఊహకందని రోజులు కొన్ని ఆ గుండెలకే మలాం రాస్తాయ్
కలవారి కలల ముందు
శపించిన జీవితం వేస్తున్న ప్రశ్నలముందు
నీరసించి నీల్గుతూతోపుడు బండిని ఈడ్చుకెళ్లిన రోజులుకొన్ని
అతని జీవితానికి పాఠమవుతాయి

ద్రాక్షా గుత్తుల్లో కొన్నిపండ్లు కుళ్లి పోయి పండ్లమ్మేవాడిగుండెను బరువెక్కించినా
ఆధునిక సంఘం ముందు అవంతగా కుళ్ళినవేం కావు బహుశా
ఉస్సురుమంటున్న చీకట్లు తొలగి గిరాకీ సూర్యుడుదయించినపుడు అతడు ఆనందుడవుతాడు

మమకారంగామాట్లాడి అరకిలోపండ్లకి ముత్యమంత ప్రేమను,చిరునవ్వునూ మొగ్గుగా ఇస్తాడు పండ్లవాడు
మరలా రావాలంటది

అతడికండ్లనిండా తొంగిచూసే గిరాకీఆశ
గంపెడు బరువు గల నాలుగుటైర్లతోపుడు బండి
పండ్లవానికి ఎంతఅమ్ముడు పోతే అతనిగుండె అంత అల్కగవుతది కదా
పండ్లను బాగమ్మినరోజు అతడి కండ్లల్లో నియాను వెలుగులు నిండుతాయ్
పండ్లఅమ్మకాలరాబడి ఆగిఆగి పడే వానలు
ఐనా గానీ,రాతిరివేళ ఇల్లు మురుస్తుంది
ఒక కుటుంబం పచ్చవడ్తది
తాజాదనం,సరసమైనధరలనీ ధనవంతులసూపర్ మార్కెట్లు కాకుండా
తోపుడు బండ్ల పై అంగూరుగుత్తుల
బేల చూపుల్ని చూడండి
వేల చూపుల్ని చూడండి
ఆ చూపుల్లో దాగున్న రోజువారి జీవితాల పిలుపులు వినబడతాయ్
అంగూర్ అంగూర్
అరకిలో యాభై అరకిలో యాభై….

మనం బజారుకెల్దాం పదండి, అరకిలోఅంగూర్లకోసం.

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వచన కవిత

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు September 29, 2024
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

There is a pleasure in the pathless woods,
There is a rapture on the lonely shore,
There is society, where none intrudes,
By the deep Sea, and music in its roar:
I love not Man the less, but Nature more.
– Lord Byron

దట్టమైన అడవిలో సంతోషముంది
నిర్జనతీరం మీద తన్మయత్వముంది
అగాధమైన అంబుధి దగ్గరికి ఎవరూ రాకపోయినా
అక్కడ సాంగత్యం తాలూకు శాంతి ఉంది
సముద్రపు హోరులో సంగీతం కూడా ఉంది
మనుషుల పట్ల నాకున్న ప్రేమ స్వల్పమైంది కాదు
కానీ, ప్రకృతిమీద మరింతగా మరులుగొన్నాను నేను

ఛందోబద్ధమైన పద్యాలు (తేటగీతులు) గా…
సాంద్ర విపినములోనుండు సంతసమ్ము
పారవశ్యము గలదొంటి తీరమునను
జనులు లేనట్టి లోతైన జలధి చెంత
సాహచర్యము యొసగెడి శాంతి గలదు

అంతియే కాదు ఆమూలమరసి చూడ
దాని హోరులో నున్నది గానలహరి
నరులపై నాదు ప్రేమలో కొరత లేదు
కాని ప్రకృతిపై నున్నది గాఢరక్తి

(Lord Byron రాసిన Childe Harold’s Pilgrimage అనే కవితలోని ఒక స్టాంజాకు అనువాదం)

September 29, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

విజ్ఞానం కలిగించే ఆయుధంఆనంద లహరి

by Dr. Nannapuraju Vijayasri September 29, 2024
written by Dr. Nannapuraju Vijayasri

రచన: సుతారపు వెంకట నారాయణ
హృదయంలో నుంచిఉదయించే భావనాతరంగాల అక్షర శిల్పం కవిత్వం బాలలగేయాలు, త్యాగం, భృూణహత్య, బాలకార్మికులు, బడి బాలలు, పక్షులు, వానాకాలం, చందమామ, సూర్యుడు, నక్షత్రాలు, గాలిపటం, రైలు, పూలు, జెండా, చేనేత పరిశ్రమ, శీర్షికల నామకరణం అలతి మాటలతో అందంగావిద్యార్థుల హృదయాన్ని ఆకట్టుకునే విధంగా సుదీర్ఘంగా కాకుండా కవితలు సరళంగా సుందరంగా సుతారంగారుబావ వ్యక్తీకరణ చేయడం మీభావానికి పూసిన తొలి మొగ్గ ఈ శంఖారావం అయినఇది నిజంగా కవితా శంఖారావమేరాజ్యాంగ నిర్మాత గురించి,భూస్వామ్య వ్యవస్థ కై పాటుబడిన వట్టి కోట అళ్వారుస్వామి గురించితెలియజేయడం గమనార్హం 57 వ కవితలో అక్టర్ మాధుర్య కవితాస్రవంతిలో చిత్రించారుఅక్షర్ఓంకార్ విలాస్ ,,అక్షర్ ప్రగతీ కీ ప్రతీక్, 60వ కవితమేరా భారత్ మహాన్ లోవిశ్వ్ బర్మే విలక్షణ్ దిఖాతే హై అనివిద్యార్థులకు అందరం ఒకటిగా ఉండాలన్నారు.హమారే జెండాలో పింగళి వెంకయ్యా కీశ్రమకీ సాధనాహమారేయాహి థిరంగ్ జెండా అని వారి ఫలితంగా మూడు రంగుల జెండా వచ్చిందని వివరించారు. 67వఆంగ్ల కవిత వరల్డ్ పీస్ కవితలోమోరల్ వ్యాల్యూస్అండ్ డెవలప్ ద హ్యుమానిటీ విద్యార్థులలో నైతిక విలువలుపెంపొందాలని అప్పుడే మానవులంతా కలిసి మెలిసి ఉంటారని ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు.

ఈశ భక్తినిమించిన దేశభక్తి అంటారు జెండా నినాదాలు స్వాతంత్ర్య సమర0దేశభక్తుల ప్రబోధాలు జాతీయ వీరుల భక్తి త్యాగాలు వీరులు ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవడంఆ ప్రయత్నం కవి సుతారం వెంకటనారాయణ గారు చేశారు. త్రిభాషాసూత్రాన్ని పాటించారు.నేటితరం,ముందు తరాల వారి మార్గంలో నడవడానికి ఈ రచనలు దోహదం చేస్తాయి.భావితరాలకుస్ఫూర్తిని నింపడానికి పూనుకున్నా ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ ఇటువంటి ప్రేరణాత్మకమైన మరెన్నో రచనలు వారి లేఖిని జాలువారించగలదనిఆశిద్దాం.
స్వేచ్ఛ మనిషికి ప్రాణవాయువు లాంటిది మనం అనుభవించుచున్న ఈ స్వేచ్ఛ వెనుక ఎందరో వీరుల తమ ధన, మాన, ప్రాణాలుఅర్పించి సాధించిన స్వాతంత్ర ఫలం విద్యార్థులకు అందించిన కవివర్యులు.
వేరేవర్ లిజన్ కరోనా కరోనాఅని అంతటా అన్ని ఖండాలలో వ్యాపించింది అని వివరించారు.కవి తెలంగాణ భూగోళ పరిస్థితులను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించారు.విద్యాసాగర్ రావు జన్మ వృత్తాంతంనీళ్ల గురించి వారు చేసిన సేవను రమ్యంగా విద్యార్థులమనసుకు హత్తుకునే విధంగా రచించారు.జయశంకర్, వట్టికోట, సి.నా.రే,అంబేద్కర్,అక్షర్ విశ్వస్వరూప్ బోణగిరిశతాబ్దాల చరిత్రగలచైతన్య గిరి
నవ చైతన్యపు కాంతుల నవ్య గిరి
కాకతీయ శిల్పకళా వైభవము ఇక్కడే
సర్వాయి పాపన్న సాహసం ఇక్కడే
భువనగిరి చారిత్రక అంశాలు సామాజిక స్థితిగతులు గురించి అద్భుతంగా వివరించారు.
ప్రాథమిక,ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలలో ఆనందలహరి కవితా సంపుటిని అన్ని పాఠశాలలో మరియు గ్రంథాలయంలో అంగన్ వాడి కేంద్రాలలోఉంచదగిన పుస్తకం’
ఉపాధ్యాయుడిగా,సామాజిక కర్తగా,విద్యార్థి సంఘ నాయకుడిగా,ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర బీసీ టీచర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షునిగా,తెలంగాణ రాష్ట్రం కవుల సంఘంఅధ్యక్షునిగా సేవలు అమోఘం సమస్యలను క్షణంలో తీర్చే వ్యక్తిత్వం ముక్కుసూటి మనిషి కల్లాకపటం లేనివాడు అందరూ తనవారే అని ఆదరించే వ్యక్తిత్వం చిన్నచిన్న కావ్యాలతో జన చైతన్యంసుజన సౌజన్యంఇనుమడింపజేస్తున్న త్రి భాష కవీంద్రులు ఎక్కడ సాహిత్య,ధార్మిక,ఆధ్యాత్మిక,సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యక్షం కావడం వీరి జిజ్ఞాసకు నిదర్శనం.
కరోనా కదలికలు,అక్షర లహరి,ఆనందలహరి అనే గేయ సంపుటాలు రచించారు.తెలంగాణ రాష్ట్ర కవుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్న సుతారపు వెంకటనారాయణ గారు దేశభక్తికి నిదర్శనం ఆనందలహరి కవిత్వం

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ

by mayuukha September 29, 2024
written by mayuukha

ప్రజ్ఞాన్ విద్యార్థి ప్రజ్ఞ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనాలతో ప్రజ్ఞవికాస్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అన్ని పాఠశాలల్లో వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. ఈపోటీలలో రాష్ట్రం లోని అన్ని పాఠశాలలలో దాదాపు 6000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఇందులో మేడ్చల్ జిల్లా ఉప్పల్ లోని ప్రజ్ఞాన్ ది స్కూల్ లో 10వ,తరగతి చదువుతున్న చిరంజీవి వలిపే రామ్ చేతన్ జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందడం జరిగింది. ముచ్చింతల లోని స్వామి వారి ఆశ్రమంలో జిల్లాస్థాయిలో గెలుపొందిన వారికందరికీ మళ్ళీ రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీ శనివారం నాడు నిర్వహించారు. దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో కూడా చిరంజీవి వలిపే రామ్ చేతన్ ద్వితీయ బహుమతి గెలుపొందారు. విజేతగా నిలిచిన చిరంజీవి వలిపే రామ్ చేతన్ ను శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు ప్రశంసాపత్రంతో సత్కరించి చిరంజీవిని ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో చిరంజీవి తల్లిదండ్రులైన శ్రీమతి వలిపే సత్యనీలిమ, శ్రీ వలిపే లక్ష్మీ నరసింహ రావు గార్లు కూడా పాల్గొన్నారు.పాఠశాల యొక్క పేరును రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన చిరంజీవి రామ్ చేతన్ ను పాఠశాల యాజమాన్యం అరుణ్ సూర్య, శకుంతల, నళిని గార్లు మరియు ఇతర ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందించారు.

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సాహిత్యాన్ని ప్రేమించిన గొడవర్తి సంధ్యగారికి అక్షర నీరాజనం:-

by Kondapally Neeharini September 29, 2024
written by Kondapally Neeharini

⁠సాహిత్యం జీవితాన్ని ప్రజ్వలనం చేస్తుంది.వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది. చదువు సంస్కారాల విలువను తెలియజేస్తుంది. గొడవర్తి సంధ్య గారి పరిచయం ప్రథమం గా ఉపాధ్యాయినిగానే ! హైదరాబాద్ రామ్ కోటి , కింగ్ కోటి ల దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో మేం కొలీగ్స్ మి. తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా వారు విధులు నిర్వహించారు.


కానీ నాకు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆమె కవయిత్రి రచయిత్రి అని.
ఆమె సాధన నరసింహాచార్యులు గారి అర్ధాంగి అని. ” సాధన ” అనగానే సాహిత్య సంస్థగా నరసింహాచార్యులు గారికి పేరు. వీరి అర్థాంగి గా అడుగడుగున ఆయన కి సంపూర్ణ సహకారాలు అందిస్తూ సాహిత్య సభలలో వెన్నుదన్నుగా నిలిచారు సంధ్య గారు. కవిత్వం లో అందెవేసిన చేయి సంధ్య గారి ది అని వారి కవిత్వం వింటే తెలుస్తుంది. కొన్ని సభా వేదిక ల మీద కవి సమ్మేళనం లో కవిత చదవగానే నేను దగ్గర గా వెళ్లి అభినందనలు తెలిపేదాన్ని. ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ దంపతులు. హైదరాబాద్ లోని చాలా పాఠశాల లో పద్య పఠన పోటీ, వ్యాస రచన పోటీలు వంటివి పెట్టి తెలుగు భాష కోసం పాటుపడిన జంట.
సంధ్య గారి తల్లిదండ్రులుకీ.శే.భాగ్యలక్ష్మి తెలికిచర్ల కృష్ణ మూర్తి గారు.
సంధ్య గారి ఆడపడుచు వైదేహి నేను ఒకే సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరాం. మాకన్నా సంధ్య గారు సీనియర్. తర్వాత కాలంలో
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
పుస్తకపఠనం ఎంత ఇష్టపడేవారో రచనాసేద్యం అంతే ఇష్టపడేవారు. స్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. అవసరార్థం నాటకాలు కూడా అప్పుడే రాసేవారు. “పోతన చరిత్ర “, “కథా భారతం ” సంధ్య గారి ప్రసిద్ధ ముద్రితగ్రంథాలు.
దూరదర్శన్ ఆకాశవాణి ల లో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ లో ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లో ఎన్నో కవి సమ్మేళనాలలో కవితా పఠనం చేశారు. ఎన్నో అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు, కార్యక్రమాలు నిర్వహించారు. సాహితీ సమీక్షకురాలిగా మన్ననలందారు. సంధ్య గారి కి ప్రాచీన సాహిత్యం అంటే ఎంత ఇష్టమో ఆధునిక సాహిత్య మంటే కూడా అంతే ఇష్టం. తాము చదివిన సాహిత్యం అందరికీ పంచటంలోనే ఆనందం అనేవారు.
ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం లో సంధ్య గారు, మరో సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని రచయిత్రి కొమండూరి అరుంధతి గారు కలిసి నాటకాలు వేయించేవాళ్ళు . తోటి తెలుగు ఉపాధ్యాయులుగా మేమందరం సహాయపడేవాళ్ళం. ఒక సంవత్సరం ” పుష్ప విలాపం” టాబ్లో ను అద్భుతంగా వేయించారు.
వానమామలై వరదాచార్యులు గారు రచించిన
“పోతనచరిత్ర” ను తేట తెలుగు వచనం లో సంధ్య గారు రాసిన పుస్తకం ప్రశంసలు అందుకుంది. పోతనపై తనకు ప్రత్యేక అభిమానం కల్గటానికి కారణం కీ.శే.బ్రహ్మశ్రీ మల్లంపల్లి పరమేశ్వర శర్మగారు అనీ, రాజమండ్రిలో స్థానం ప్రాచ్య కళాశాల లో ఆయన చెప్పిన పాఠాలు “పోతన చరిత్ర” ను రాయడానికి కారణం అని అనేవారు.
శ్రీవానమామలై వరదాచార్యులు గారి కావ్యంలోని అందాలను సులభశైలిలో తేట తెలుగులో రాసి భర్త ప్రోత్సాహంతో వచనంగా ” పోతన చరిత్ర” తో రాసారు. కవయిత్రి గా రచయిత్రి గా ప్రసిద్ధి కెక్కిన సంధ్యగారు ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి కవితలను ఒక కవితా సంపుటి గా ప్రచురించారు కూడా. గొడవర్తి సంధ్య గారు గా సాహితీ లోకంలో పేరు పొందినా, మాకు నర్సమాంబ గారు గానే చాలా దగ్గర. నర్సమాంబగారు మంచి స్నేహశీలి.
ఈ మధ్య కాలంలో నేను నడుపుతున్న అంతర్జాల పత్రిక” మయూఖ” లోనూ సంధ్య గారి వ్యాసం ప్రచురించాను.

దాదాపు 25 ఏళ్ల క్రితం సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో సంధ్య గారి తో పరిచయం. అప్పటి నుండి ఆ సాధన నర్సింహా చార్యులు గారి తో మాకు అంటే నా భర్త కొండపల్లి వేణుగోపాల్ రావు గారి కీ నాకూ పరిచయం. ఒక కవయిత్రి గా, ఒక కవిగా ఈ దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉండేవాళ్ళు. కూకట్ పల్లిలో లో వారి ఇల్లు సాహితీ వేత్తలనిలయం.వీళ్ళ ఏకైక కుమారుడు చిరంజీవి సాయిమానస్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
గొడవర్తి సంధ్య గారు నువ్వు ముఖం తో , మంచి మాట లతో స్నేహశీలి గా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వారి కిదే తరుణి పత్రిక సంపాదకురాలిగా, స్నేహితురాలిగా నా శ్రద్ధాంజలి.*

September 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వలసకూలి (కధాకవిత)

by Devulapalli Vijayalaxmi September 28, 2024
written by Devulapalli Vijayalaxmi

కడుపు సేతెట్టుకుని,కూలి సేసుకుని
కుసింతగ గెంజి నీళ్ళు తాయి,
పది పరక మిగిల్సి
అమ్మ అయ్య బువ్వకి పంపిస్తూ
సల్లంగ ఉందేమని
పొరుగు రాష్టానికి బోయిన మమ్మలీని
మాయదారి రోగాలొచ్చి ముంచినాది
దేవుడో ! దేవుడా!

కూలి బందాయెనని ఓళ్ళూ.. చెరువు పూడ్చినామని ఓళ్ళూ… గుడిసెలెక్కబీకినారు,
కూలి లేక,గుడిసే లేక తిన మెదుకు లేదాయె పో!
తాగ బుక్కెడు గెంజి లేగపాయె!
సొంతూరు బోవ సేతీలో పైసాలు లేక
రైలుకు పైసలు లేక,బొస్సు కూ లేక,బండీ లేక
మా బతుగులు బండలాయె గదరా
దేవుడో ! దేవుడా!

సావో బదుగో ఉన్నూరు బోవాల
అమ్మని నాయన్ని సూడాలని
మూట ముల్లె సరదుకొని నెత్తినెట్టుకొని
కడుపున్న ఆలిని,ఒక సేతట్టుకొని,
సంటిదాన్ని సంకనెట్టుకొని,
సెప్పుల్లేని కాళ్ళతో ఎండలో,ఆనలో
జఱ్ఱి గొడ్డులాటి తారు రోడ్డు మీద
నడుత్తుంటే ఎంతకీ దూరం తరగకబాయె,
రోజులు వారాలాయె వా‌రాలు నెలలాయె,
కాళ్ళు బండలాయె
సంటిది శోసొచ్చి
ఎండకొట్టి,ఆనకి తడిసి సచ్చిపోనాది
ఏడుద్దామంటే గొంతు బెగలక బాయె
ఆనాటి రోజులే కన్నులకు కట్టె…
కల్ల నీల్లు రావాయె
దేవుడో! దేవుడా!

ఒక బరువు తగ్గినాదని సంతోషమాయె
గందా మరి మోయతాలికి నాకేడకట్టం?
బండలు పిండి సేసిన కండలాయె నాయి,
గాని బిడ్డ ఆకలంటే. నాతావేంటుంది?
మట్టి బీడులో కట్టెతో గుంత తవ్వి
గుండె రాయి సేసుకొని బిడ్డను పూడ్సా!!!
ఆనాటి రోజులే మళ్ళీ మళ్ళీ వత్తాండె ..
దేవుడో!ఓ‌రి దేవుడో!
మా బదుకులిట్టా బుగ్గి సేయబోకు
దేవుడో!ఓ‌రి దేవుడో!

పోయిన బిడ్డను సూసి మాట మరిసి
కడుపులో బిడ్డతో నా యాడది
కష్టపడతాంటె ఆదుకోడానికి
సేతకాని మొగోన్ని నేను.
” ఏమయ్యా! కడుపునొస్తోంది ఇంకెట్లనయ్యా అన్న దాని మాటకి తలెత్తిసూసినా!
నా వల్ల కాదని ఆడనే సతికీలా బడినాది నా యాడది.నేనేటి సేతునో
దేవుడో ! ఓ‌రి దేవుడో!

మూటలోని పాతసీర తీస్తి,
బుజాలంట జోలె కట్తి,
నాయాలిని కూకుండెట్టి
నా పయానం సాగించా!
పగోనికీ ఆ కష్టాలు రావద్దు
నా పేరు శి య్య,
ఆ శివయ్య గంగనెత్తి నెత్తుకున్నాడంట
సగం పార్వతిఅయ్యాడంట.
మా ఊరి పంతులు సెప్పిండు.
నాకు సానా సానా. తుప్తిగాఉంది
నేను ఆ శివయ్యకి తీసిపోనని.
నా ఆలిని నా జోలె లో కూకుండెట్టి మోస్తున్నా!
కట్టాలు నీవే ఇత్తావు ఉపాయమూ నీవే సెప్తావు
దేవుడో ! ఓరి దేవుడో!
సితరాల దేవుడో!
.* * *

అడుగులు పరుగులాయె
అల్లంత దూరానఊరాయె!
ఆనాటి కథలన్నీ ఏకరువులేనాయె…
* * *

అదిగయే బవానీ ఊరొచ్చేసినాది
అమ్మతావుకి బోయ
ఏడి ఏడి నీళ్ళోసుకొని
ఉడుకుడుకు బువ్వతిందామె! నులకమంచంలో పెసాంతంగా తొంగుందాం!
దిగయే! పల్లకీలా అమ్మోరు లెక్క కూసున్నావు.
* * *
అంటూ జోలేదింపిన శీవయ్య కి ఉలుకు పలుకు
లేని కట్టె జారిపడింది
నాలుగు నెలల కడుపుతో మొదలు పెట్టిన ప్రయాణం ముగిసింది.
ఎడపిల్ల చావు,సరి అయిన ఆహారమే లేక బిడ్డ కడుపు లో
అడ్డం తిరిగింది కూడా తెలియని స్థితిలో భవాని శివయ్యను వదిలి శివ సాన్నిహిత్యం
చేరింది.
* * *
భోరు భోరుమంటూ గుడిసె దగ్గిరకెళ్ళి తల్లిని
పిలువబోవ పందుల గుంపు గుర్రు గుర్రు మంటూ
మీద పడ్డాయి.
దూరాన గుడిసె లోంచి గవరయ్య,
“శివయ్యా! వచ్చినా వా! శివయ్యా!
ఊ‌రు శశానం అయి పోయినాదిరా!
ఊరిలో సగానికి సగంమందిని ఆనాడు కరోనామహమ్మారి పొట్టనెట్టుకున్నాది ఎవ్వురీకీ ఒక్క అగ్గిపుల్ల ఖర్చెట్టలేదురా శివయ్యా!
ఊరి శివార్లలో ని శివయ్య ఊరుని మరిసాడు
ఆనాటి ఏడుపు మళ్ళ మళ్ళ వచ్చేత్తాంది
* * *

దేవుడో !ఓరి దేవుడో! ఏమి మాయ సేసావురా?
బంగారు తల్లి ని బిడ్డని పోగొట్టుకొని,నా ప్రాణమైన నా బవాని ని పోగొట్టు కొని అమ్మ వడి కని వడి వడిగా వచ్చిన నాకు అమ్మ అయ్య ని అట్టుకెళ్ళినావే
దేవుడో! ఓ‌రి దేవుడో ! నువ్వుండావా? అసలుండావా?

పొట్టకూటికోసం సొంత ఊళ్లకు దూరం అవుతున్న ఎందరో … ఎన్నెన్నో …లెక్కలేనంతమందికి అంకితం.

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us