రష్యన్ మూలం: అంతోన్ చెహోవ్
ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ
మధ్యాహ్నం. ఉక్కగా ఉంది. ఆకాశంలో ఒక్క మబ్బు సైతం లేదు. ఎండ ధాటికి గడ్డి వడలిపోయి దీనత్వాన్ని, నిరాశను ప్రతిఫలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ వాన పడినా పచ్చదనం నెలకొనదు అన్నట్టుగా చెట్ల పైచివరలతో దేన్నో చూస్తూ ఉపశమనాన్ని ఆశిస్తున్నదా అన్నట్టు అడవి నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది.
చెట్లు లేని ఒక ఖాళీ ప్రదేశంలో ఎత్తైన నలబయ్యేళ్ల పురుషుడొకడు కాళ్లీడ్చుకుంటూ, తడబడుతూ, మందకొడిగా, వంగివంగి నడుస్తున్నాడు. అతడు వెడల్పు లేని భుజాలతో, ఎర్ర చొక్కా మచ్చల ప్యాంటూ పొడవైన బూట్లూ ధరించి ఉన్నాడు. రోడ్డు వెంట రికామీగా నడుస్తున్నాడు. కుడివైపున పచ్చని చెట్లు, ఎడమ వైపున లేత బంగారు వర్ణంతో కనుచూపు మేర వ్యాపించిన సముద్రం ఉన్నాయి. అతడు ఒగరుస్తూ చెమటలు కారుస్తున్నాడు. తలమీద తెల్లని టోపీ ఉంది. దాన్ని ఉదారుడైన ధనిక మిత్రుడెవరో బహూకరించాడు అనిపిస్తోంది. చనిపోయిన అడవికోడి ఒకటి అతని బుజానికి వేలాడుతున్న బట్టసంచిలోంచి కనిపిస్తోంది. అతడు రెండు గొట్టాల తుపాకీనొకదాన్ని పట్టుకున్నాడు. దాని ట్రిగ్గర్ వెనక్కి లాగివుంది. పొదలను వాసన చూస్తూ పరుగులాంటి నడకతో ముందు పోతున్న కుక్కమీదనే దృష్టిని కేంద్రీకరించాడతడు. పక్షులు, జంతువులు వేడిమిని తప్పించుకోవడం కోసం చల్లని ప్రదేశాల్లో దాక్కొనడం చేత చుట్టూ నిశ్శబ్దం, స్తబ్ధత ఆవరించి ఉన్నాయి.
“యెగోర్ వ్లాసిచ్,” అకస్మాత్తుగా మంద్రస్వరంలో ఒక పిలుపు వినిపించింది.
ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ ముఖం చిట్లించాడతడు. భూమిలోంచి ఉబికివచ్చిందా అన్నట్టు సుమారు ముప్పయ్యేళ్ల వయసున్న ఒక స్త్రీ పాలిపోయిన ముఖంతో, చేతిలో కొడవలితో అతని పక్కనే ఉంది. క్షీణించిన ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ అతని ముఖంలోకి చూస్తోంది ఆమె.
“ఓ నువ్వా పెలాజియా. ఇక్కడికి ఎలా వచ్చావు?” అన్నాడు ఆ వేటగాడు, తుపాకీ ట్రిగ్గర్ ను మూస్తూ.
“మా ఊరి మహిళలు కొందరు ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారు. వాళ్లతో కలిసి వచ్చాను.”
“ఓ అలాగా,” అని మెల్లగా నడవసాగాడు యెగోర్ వ్లాసిచ్.
పెలాజియా అతని వెంట నడుస్తోంది. వాళ్లు మౌనంగా ఇరవై అడుగుల దూరం నడిచారు.
“నిన్ను చూడక చాలా కాలమైంది యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా అతని మృదువైన భుజాలను ఆర్తితో చూస్తూ. “ఈస్టర్ నాడు దాహం తీర్చుకునేందుకు ఒక నిమిషం కోసం నా గుడిసెకు వచ్చి నువ్వు నన్ను తిట్టి కొట్టి వెళ్లిపోవడం ఆ దేవునికే ఎరుక. అప్పట్నుంచి నీకోసం ఎదురుచూసి చూసి నా కళ్లు కాయలు కాచాయి. ఓ యెగోర్ వ్లాసిచ్, ఒకసారి రావచ్చు కదా.”
“వచ్చి అక్కడ నేను చేసేదేముంది?”
“అవుననుకో. అక్కడ నువ్వు చేసేదేమీ లేదు కానీ, అక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తూ నువ్వు సంరక్షించాల్సిన చోటు అది. నువ్వే యజమానివి కదా. నువ్వొక అడవికోడిని తుపాకీతో కొట్టావు. ఇప్పుడు నువ్వు కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి యెగోర్ వ్లాసిచ్.”
ఈ మాటలను అంటున్నప్పుడు పెలాజియా చిలిపి అమ్మాయిలాగా నవ్వుతూ యెగోర్ ముఖాన్ని చూసింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
“నీకిష్టమైతే ఇక్కడ కూర్చో. ఎందుకు నిల్చున్నావు? నువ్వూ నాతో పాటు కూర్చోవచ్చు,” అన్నాడు యెగోర్ నిర్లక్ష్యం నిండిన గొంతుకతో. రెండు దేవదారు వృక్షాల మధ్య కూర్చున్నాడతడు.
పెలాజియా కొంచెం దూరంలో నీడలో కూర్చుంది. తన ఆనందం తనకే సిగ్గును తెప్పిస్తుంటే నోరుమీద చెయ్యి పెట్టుకుంది. రెండు నిమిషాలు మౌనంలో గడిచాయి.
“ఒకసారి వస్తే బాగుంటుంది,” అన్నది పెలాజియా.
యెగోర్ తలమీది టోపీని తీసి నుదురును చేయితో తుడుచుకుంటూ, “దేనికోసం రావాలి నేను? వచ్చేందుకు కారణమేదీ లేదు. ఒక గంట లేక రెండు గంటల కోసం వస్తే అది సమయాన్ని వృథా చేయటమే అవుతుంది. వచ్చి నీకు బాధ కలిగిస్తూ ఆ ఊళ్లో ఎప్పటికీ నివసించడాన్ని నా హృదయం భరించలేదు. నేను ఎక్కువగా సుఖాలకు అలవాటు పడినవాడినని తెలుసు నీకు. నాకు పడుకునేందుకు ఒక పరుపు, తాగేందుకు టీ, వీటికి అదనంగా మంచి సౌకర్యాలు, నాగరిక సంభాషణ కావాలి. నువ్వేమో దుమ్ము నిండిన ఊళ్లో దారిద్ర్యంలో బతుకుతున్నావు. అక్కడ నేను ఒక్కరోజు కూడా ఉండలేను. నీతో కలిసి జీవించేందుకు ఒకవేళ అక్కడ ఒక భవనం ఉన్నా నేను నీ గుడిసెను కాల్చెయ్యాలి, లేదా నన్ను నేను బాధించుకోవాలి. చిన్నప్పట్నుంచీ సుఖజీవనం అలవాటైపోయింది నాకు. ఏమీ చేయలేము,” అన్నాడు వ్లాసిచ్.
“ఇప్పుడెక్కడ ఉంటున్నావు నువ్వు?”
“డిమిత్రి ఇవనోచ్ ఆనే ఆసామి దగ్గర వేటకానిగా ఉంటున్నాను. అతని తిండికోసం అడవి జంతువులను, పక్షులను వేటాడుతాను. కానీ నాకు తన యింట్లోనే ఆశ్రయమిచ్చాడతడు. అది అతని ఆనందం కోసమే తప్ప వేరే కారణం ఏదీ లేదు.”
“నువ్వు చేస్తున్న పని సరైనది కాదు యెగోర్ వ్లాసిచ్. వేరేవాళ్లకైతే అది వినోదపు వ్యాపకం లాగా బాగుంటుంది. నీకు మాత్రం అది వ్యాపారం లాంటిదవుతుంది.”
ఆకాశం వైపు విచారంగా చూస్తూ, “నువ్వు అవివేకురాలివి పెలాజియా,” అని తర్వాత ఇలా కొనసాగించాడు యెగోర్: “నీకెప్పటికీ అర్థం కాదు. నేను ఏ రకం మనిషినో నీ మొత్తం జీవితంలో తెలుసుకోలేవు నువ్వు. నేను చెడిపోయిన మూర్ఖుడినని అనుకుంటున్నావు నువ్వు. కానీ వివేకం ఉన్న ఎవరైనా ఈ మొత్తం జిల్లాలో నేను అత్యుత్తముడిని అంటారు. పెద్దమనుషులు ఈ సత్యాన్ని గుర్తించడమే కాకుండా నేను చాలా మంచి వేటగాడినని ఒక పత్రికలో ప్రచురించారు. నాతో పోల్చతగిన స్ఫూర్తిమంతుడైన వేటగాడు లేడు. దానికి కారణం నేను నీ ఊరిజీవితాన్ని నిరసించడం గానీ సుఖమయ జీవితాన్ని అనుభవించడం గానీ కాదు. చిన్నప్పట్నుంచీ నాకు తుపాకులతో, జాగిలాలతో గడపటం తప్ప ఎప్పుడూ వేరే వ్యాపకం లేదు. నా తుపాకీని లాక్కున్నప్పుడు నేను గాలం తీసుకుని బయటికి పోయేవాణ్ని. గాలాన్ని లాక్కున్నప్పుడు పిట్టలను, జంతువులను చేయితో పట్టుకునేవాణ్ని. గుర్రాల కొనుగోలు, అమ్మకం కూడా చేశాను. నా దగ్గర డబ్బున్నప్పుడు నేను సంతలకు పోయేవాడిని. ఒక రైతు క్రీడాకారునిగా మారినా లేదా గుర్రాల వ్యాపారం చేసినా వాడు వ్యవసాయానికి వీడ్కోలు చెప్పినట్టే. ఎవడినైనా ఒక్కసారి స్వతంత్రేచ్ఛ ఆవహించిందంటే దాన్ని నిర్మూలించడం జరగని పని. అదేవిధంగా ఎవడైనా అభినయం మొదలైన కళను ఆశ్రయించాడంటే వాడెప్పుడూ అధికారిగా కానీ భూస్వామిగా కానీ మారడు. నువ్వొక ఆడదానివి. కాబట్టి దీన్ని నువ్వర్థం చేసుకోలేవు. కానీ అర్థం చేసుకోవాలి.”
“నాకు అర్థమైంది యెగోర్ వ్లాసిచ్.”
“ఏడిస్తే నీకు అర్థం కాదు.”
అటువైపు తిరుగుతూ, “నేను ఏడ్వటం లేదు. నేను పాపిష్ఠిదాన్ని యెగోర్. అయినా అదృష్టహీనురాలైన నాతో నువ్వు ఒకరోజు గడపవచ్చు. మన పెళ్లి జరిగి పన్నెడేళ్లవుతోంది. కానీ ఒక్కసారి సైతం మన మధ్య ప్రేమ చిగురించలేదు. నేను ఏడ్వటం లేదు,” అన్నది పెలాజియా.
“ప్రేమ …” అని గొణిగాడు యెగోర్, తల గోక్కుంటూ. తర్వాత, “మన మధ్య ప్రేమ చోటు చేసుకోవడం జరగదు. పేరుకు మాత్రమే మనం ఆలుమగలం. నీ దృష్టిలో నేను ఆటవికుడిని. నా అభిప్రాయం ప్రకారం నువ్వు జ్ఞానం లేని మామూలు రైతు స్త్రీవి. మనం ఒకరికొకరం బాగా సరిపోయామా? నేను సుఖాలు పొందగోరే స్వేచ్ఛా జీవిని. నువ్వేమో తాటాకులతో చేసిన చెప్పులు తొడుక్కుని నడుము వంచకుండా పని చేసే శ్రామికురాలివి. నేను ప్రతి సాహసకార్యంలో ముందుండే మగవాణ్ని. నువ్వేమో నన్ను సానుభూతితో చూస్తావు. ఇప్పుడు చెప్పు మన జత బాగా కుదిరిందా?” అన్నాడు వ్లాసిచ్.
“కానీ మనం ఆలుమగలం. కామా యెగోర్?” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.
“ఆ పెళ్లి స్వేచ్ఛా సంకల్పంతో జరగలేదని మరచిపోయావా? నువ్వు సెర్గేయ్ పేలోవిచ్ దొరనూ, నిన్ను నువ్వూ అభినందించుకోవాలి. నేను అత్యుత్తమ వేటగాడిననే ఈర్ష్యతో ఆ దొర నాకు ఒక నెలరోజుల పాటు వరుసగా మద్యం తాగించాడు. బాగా తాగి ఉన్నప్పుడు ఎవరికైనా పెళ్లి చేయడమే కాదు అతడి చేత మతాన్ని కూడా మార్పించవచ్చు. నా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు, నేను బాగా తాగివున్నప్పుడు మన పెళ్లి జరిపాడు ఆయన. ఒక వేటగాడికి ఆటవిక అమ్మాయితో పెళ్లి! నేనప్పుడు విపరీతమైన నిషాలో ఉన్నానని తెలిసి కూడా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు కౌలుదారువు కాదు కనుక ప్రతిఘటించగలిగేదానివి. ఒక ఆటవిక స్త్రీ ఒక వేటగాడిని పెళ్లాడటం అదృష్టమే అనుకో. కానీ అప్పుడు నువ్వు ఆలోచించి ఉండవలసింది. ఇప్పుడు ఏడుస్తూ కూచో. ఈ వ్యవహారం ఆ దొరకు ఒక జోక్ అయింది. నీకు మాత్రం ఏడుపు తెప్పించే విషయం. గోడకేసి తల కొట్టుకో.”
కొంత సేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. మూడు అడవిబాతులు పైనుంచి ఎగురుతూ వెళ్లాయి. అవి చిన్న చుక్కలుగా మారి కింద వాలేంత వరకు యెగోర్ వాటిని నిశితంగా చూస్తూ నడిచాడు.
“బతుకుతెరువు కోసం ఏం చేస్తున్నావు నువ్వు?” అని పెలాజియాను అడిగాడతడు, చూపును మరల్చుతూ.
“ప్రస్తుతం బయటికి పోయి కూలిపని చేస్తున్నాను. చలికాలంలో ఫౌండ్లింగ్ హాస్పిటల్ లో ఒక పాపకు సీసాతో పాలు తాగిస్తాను. అందుకు నాకు నెలకు ఒకటిన్నర రూబుల్స్ ఇస్తారు.”
“ఓ, అలానా?”
మళ్లీ నిశ్శబ్దం చోటు చేసుకుంది. కోసిన పైరు తాలూకు మొదళ్ల మీంచి మృదువైన పాట వినపడింది. వేడిమి ఎక్కువగా ఉంది.
“అకులినా కోసం గుడిసెను నిర్మించావని చెప్పుకుంటున్నారు,” అన్నది పెలాజియా.
యెగోర్ మాట్లాడలేదు.
“అయితే ఆమె నీకు ప్రియురాలు అన్నమాట.”
“అది నీ దురదృష్టం, నీ కర్మ. పాపం, దాన్ని నువ్వు భరించాలి. ఓకే, బై. నీతో చాలా సేపటినుండి మాట్లాడుతున్నాను. సాయంత్రానికి నేను బోల్టోవో దగ్గర ఉండాలి,” అన్నాడు వ్లాసిచ్ ఒళ్లు విరుచుకుంటూ.
అతడు లేచి నిలబడి, తుపాకిని బుజానికి తగిలించుకున్నాడు. పెలాజియా కూడా లేచి నిలబడింది.
“నా ఊరికి ఎప్పుడొస్తున్నావు?” అని అడిగింది మృదువుగా.
“రావాల్సిన పని నాకు లేదు. ఎప్పుడూ మత్తులో లేకుండా రాను నేను. తాగివున్న నాతో నీకు ప్రయోజనం ఉండదు. మద్యపు మత్తులో మునిగినప్పుడు నేను ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాను. బైబై.”
“బై, యెగోర్ వ్లాసిచ్.”
యెగోర్ టోపీని తల వెనుకభాగం మీద పెట్టుకొని, ధ్యాసను మళ్లీ జాగిలం మీదికి మరల్చి, వెళ్లిపోయాడు. పెలాజియా అతణ్నే చూస్తూ నిశ్చలంగా నిలబడింది. అతని బుజాలను, సొగసైన టోపీని, నిర్లక్ష్యపు నడకను చూస్తున్న ఆమె కళ్లు విషాదంతో, కరుణ పూరితమైన ప్రేమతో నిండిపోయాయి. ఆమె చూపు తన భర్త శరీరం మీదికి పోయి మృదువుగా స్పృశించింది. ఆ చూపుస్పర్శ అనుభూతమైందా అన్నట్టు అతడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతడేం మాట్లాడలేదు. ఏదో చెప్పాలనుకుంటున్నాడని తెలిసింది ఆమెకు అతని ముఖం ద్వారా, బుజాల ద్వారా. ఆమె భయంగా అతని దగ్గరికి పోయి, వేడుకుంటున్న కళ్లతో అతడిని చూసింది.
యెగోర్ వెనుకకు తిరిగి, “దీన్ని తీసుకో” అని, నలిగిన ఒక రూబుల్ నోటును ఇచ్చి వెళ్లిపోయాడు.
దాన్ని తీసుకుంటూ “గుడ్ బై యెగోర్ వ్లాసిచ్,” అన్నది పెలాజియా యాంత్రికంగా.
నిటారుగా నడుస్తూ రోడ్డుమీద నడిచాడతడు. ఆమె పాలిపోయి రాతిబొమ్మ లాగా అతని ప్రతి అడుగును అపేక్షగా చూసింది. కొద్దిసేపటి తర్వాత అతని ఎర్రచొక్కా, నల్లని పంట్లాము, బూట్లు అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏమీ కనపడలేదు. పచ్చదనం నిండిన చెట్లలోకి యెగోర్ ఎకాయెకిన మలుపు తిరగడంతో టోపీ కూడా అదృశ్యమైంది.
“గుడ్ బై యెగోర్ వ్లాసిచ్” అని గుసగుసగా అనుకొని, అతని తెల్లని టోపీని మరొకసారి చూసేందుకు కాళ్ల మునివేళ్ల మీద నిలబడింది పెలాజియా.
పుట్టడం సహజం
చావడమూ అంతే
మధ్యకాలo అర్ధయ్యేసరికి
కళ్ళముందు పొద్దువాలి పోతుంది!!
ఈ మధ్యలో
ఎన్ని అక్షరాలు చెక్కాడో
అవే చరిత్రలో నిలబడే సూచీ స్తంభాలు!!
పూలదండలు
పురస్కారాలు పొగడ్తలు
కవికి కొత్త ఊపిరియే కానీ
ఊనిక కాదు కొలమానాలు కావు
దినపత్రిక మీద మురిపించే
ఒక రోజు బాక్స్ ఐటమ్ !!
కవి అంతిమయాత్ర లో
అతని పద్యాలలోని
పాదాలు గులాబీ రెక్కలై వీధుల గుండా చల్లబడుతాయి!
సిరచుక్కలు ఇకపై
గడ్డ కట్టుకుని పోతాయి
జీవితం శూన్యమా అన్నట్టు
కవి గారి డైరీ చివరి పేజీ అసంపూర్తి
గా బిగుసుకు పోతుంది!
ఆయన పుస్తకాలు పార్థివ దేహం దగ్గర
తలగడయై, కృతజ్ఞతగా ఒదిగి ఉంటాయి!
ఎవరో ఒకరు, పుటలు తెరిస్తే, బావురుమంటాయేమో ?
అంజలి ఘటిస్తూఎవరో అస్పష్టంగా చెప్పిన అమర్ రహే
పదాలు
డోలాయమానమై గాల్లో
ఊగిసలాడుతూనే ఉంటాయి !
ఒంటరిగా..
జై కొట్టే లోగొంతుకలయినా లేక!
కవీ!! బతికి ఉన్నన్ని నాళ్ళు
పుస్తకాల్లో తల ఇముడ్చుకుని
కూర్చున్నావు
ఇప్పుడు నీ గేయం మీద
జ్ఞాపకానివై నిలబడ్డావు!
ప్రజాస్వామ్యం కొరకు
శిర మెత్తి అన్యాయం మీది అరిచిన అరుపులు
నిరసన చెణుకులు క్రమంగా కవి కులం నుండి వెలివేయబడతాయి!
అయినా కవీ
నీ కలం లో పుట్టిన
పదాలు మౌన
విస్పోటనాలు!
దాని
అణుధార్మికత
మెదళ్ళలో
మెల్లిగా మొదలౌతుంది!
కవీ!
భారతదేశం పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి. భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి ముప్పువాటిల్లుతున్న సమయంలోఒక మహాత్ముడు అవతరించి వ్యవస్థను, చక్కదిద్దడం మనకు యుగాలుగా వస్తున్నది.అట్టి వారిని అవతార పురుషులుగా భావించి, ఆరాధించి ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. శివుని అంశతో జన్మించిన ఆదిశంకరాచార్యుల వారు కేవలం 32 ఏళ్ల వయస్సులోనే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని సాధించి ,లోకానికి జ్ఞానం బోధ చేశారు.
వేదములు, స్మృతులు శ్రీశంకరుల అవతారము వల్లనే పున రుద్ధరింపబడినవి, వాటి పునరుద్ధరణ చేతనే మనము శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, సంక్రాంతి తదితర పండుగలు జరుపుకోవడమనే ఆచారం పునరుద్ధరింపబడినది. అట్టి విధంగా శంకర జయంతియే మిగతా అన్ని జయంతులు జరగడానికి మూల కారణమయిందని కామకోటి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి ఉద్ఘాటన.
పరమశివుని అవతారమైన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి అవిశ్రాంత కృషివలనే ఈనాడు మనం సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాం ఆ మహానీయ ఆచార్యులు దేశమంతటా పర్యటించి ఉపనిషత్తుల అద్వైత సారాన్ని వ్యాప్తి చేశారు గొప్ప దూర దృష్టితో శ్రీ ఆదిశంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కులలో నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు వీటిలో శృంగారిలో స్థాపించబడిన దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం, శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రత్యక్ష శిష్యుడైన శ్రీ సురేశ్వర ఆచార్యుల నుండి మొదలుకొని అవిచ్ఛిన్నమైన ప్రసిద్ధ గురువుల పరంపరతో అలంకరించబడింది. ఆచార్యుల జీవితాలు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ఉద్యమాన్ని కొనసాగించడానికి వారు చేసిన ప్రయత్నాలు అద్భుతమైనవి, విశిష్టమైనవి.హిందూ తత్వ శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఆదిశంకరాచార్యుల వారు చేసిన సేవలను ,వారి జీవితాన్ని గౌరవించడమే శంకరాచార్య జయంతి యొక్క ప్రాముఖ్యత.
భారత చరిత్రలో ఆది శంకరాచార్య భగవత్పాదులు ఒక అద్భుతమైన శక్తి, భారతీయ జీవన విధానానికి, సాంఘిక వ్యవస్థకు జీవన గడ్డయైన వేదాంతాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే అద్వైత సిద్ధాంతం. పరమాత్మ, జీవాత్మ ఒక్కటే, జీవాత్మ పరమాత్మలకి అభేదం “ఏకమేవా అద్వి తీయం బ్రహ్మ’ ‘జీవో బ్రహ్మైని నా పరః” అనే వ్యాఖ్యల అద్వైత, సిద్ధిని చెబుతాయి. ఈ జ్ఞానాన్ని పొందిన జీవాత్మ మోక్షం పొందగలు గుతుంది. అంటే పరమాత్మలో లీనమౌతుంది. ఇలాంటి జ్ఞానం పొందడానికీ అందరికీ సాధ్యం కాదు. భారతీయ సంస్కృతి వైభవా నికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు. సాక్షాత్తు పరమశివుని అవతారంగా చెప్పబడుతున్న ఆదిశంకరుల శక్తి అనన్య సామాన్యమైంది.
భారతీయ సంస్కృతి వైభవానికి కృషి సల్పిన మహాత్ములలో శంకరాచార్యులు ఒకరు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలనే త్రిమతాలు. ఆనాటి ఆర్ష ధర్మానికి వ్యతిరిక్తంగా వున్న మతాలను ఖండించడమే కాకుండా భారతీయ సంస్కృతిలో అద్వైత సిద్ధాంత సమభావాన్ని ఆధారం చేసుకొని శంకరులు శైవం, వైష్ణవం, శాక్తం, శూలం, గానపత్యం, కౌమారం అనే మతాలలోని దోషాలను తొలగించి షణ్ముఖ స్థావనాచార్యులై వివిధ మతాల మధ్య సామరస్య భావన పెంపొందించుటకు, సంప్రదాయాల మధ్య వున్న అంతర్లీన సూత్రాన్ని ప్రచారం చేసి, పంచాయ తన పూజా విధానాన్ని వ్యాపింపజేసి, ఇష్ట దైవాన్ని పూజించేట్లుగా విధి విధానాలను అమలు చేసేవిధంగా పూజా విధానంలోని లోపాలను సవరించిన ఆధ్యాత్మిక సంస్కర్త శంకరాచార్యులు.
వేదమాత పునరుద్ధరణ కోసం తొలుత వ్యాసులుగా పిమ్మటశంకరులుగా అవతరించారు.వ్యాసులు నారాయణ స్వరూపం. శంకరులు ఈశ్వర స్వరూపం.ఈశ్వరనామ సంవత్సర, ఉత్తరాయణం, వైశాఖమాసం, వసంత ఋతువు, శుద్ధ పంచమి, సోమవారం, కర్కాటక లగ్నంలో, ఆరుద్ర నక్షత్ర యుక్త ప్రథమ పాదంలో, నవగ్రహాలలో ఐదు గ్రహాలు ఉచ్ఛలో ఉండగా కేరళ రాష్ట్రంలోని పూర్ణానది తీరానగల వృషభా చల వృషాదీశ్వర స్వామి అంతచే ‘కాలడి’ అనే గ్రామంలో శివగురు, ఆర్యాంబ పుణ్యదంపతుల తపః ఫలంగా శంకరులు జన్మించారు.
లౌకిక విషయాలు దుఃఖ మిశ్రితాలు, పారమార్ధికాలు, సుఖ రూపాలు దుఃఖ రహిత సుఖస్వరూపాలు “శంకరోతీత శంకరః” అని దివ్యమైన సుఖాలను ప్రస్తావించువాడు ‘శంకరుడు కనుక ఆ బాలునికి ‘శంకరుడు’ అని నామకరణం చేశారు. ‘శం’ అనే అక్షరం ‘ఐదు’ అంకెకు సంకేతం. ‘క’ అనే అక్షరము ‘ఒకటి’ అనే అంకెకు పర్యాయము. ‘ర’ అనే అక్షరం, ‘రెండు’ అంకెకు సంకేతం. శంకరులు జన్మించిన తిథి, వార, పక్ష, మాస, నక్షత్రాలను అనుసరించి చూచినవారు జ్ఞానం ద్వార ప్రపంచానికి నిత్య సుఖము ప్రసాదించేవాడని స్పష్టం చేశారు.
శంకరులు మూడవ ఏటనే చదవడం, వ్రాయడం ఐదవ సంవత్సరం వచ్చేసరికి సంస్కృత భాషలో వైదుష్యం సంపాదించి, మూడు వత్సరాల కాలంలోనే సమస్త విద్యలను అభ్యసించి సర్వ శాస్త్ర కోవిదుడయ్యాడు. శంకరుని వైదుష్య వైదగ్ధ్యాలను చూసి విద్వాంసులు విస్మయం చెందారు.
శంకరులకు ఏడవ ఏట ఉపనయం చేశారు. ఎనిమిదవ ఏటకే వేద విజ్ఞానాన్నంతటిని ఔపోసనం పట్టారు. ఈ మధ్య ‘కాలంలోనే తండ్రి శివగురువు మరణించాడు. కారణ జన్ములైన శంకరులు నర్మదా నదీతీరంలో శ్రీగౌడ నాదాచార్యుల శిష్యులైన శ్రీగోవింద భగవత్పాదుల నాశ్రయించి సన్యాస దీక్షను స్వీకరించారు. నాలుగు వేదాలను తర్మవిద్యల సభ్యసించి బ్రహ్మ విద్యోపదేశం పొందాడు. తర్క వితర్కాల శాస్త్ర చర్చలలో భారతీయులకు తిరుగులేదని ఋజువు చేసి ఆరాధ్య గురువయ్యాడు.
శంకరులు జన్మించేనాటికి శైవం, జైనం, బౌద్ధం, పలు మతాలు ప్రాబల్యం స్థితిలో ఉన్న సమయంలో స్మార్త, వైష్ణవ, సౌర, శాక్తేయ, గణాపత్య, శైవ మతాల వారితో వాదించి ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచార విదానాలను సంస్కరించి షణ్మత స్థాపకులై శాస్త్ర దృక్పథంలో ఇతర మతాలన్నింటినీ ఒకటిగా గ్రహించి అన్ని మతాలనూ అంతర్లీనం చేసుకొని, భౌతిక, విజ్ఞాన, వాదం చేసే మతాలన్నీ అద్వైత స్థితికి తీసుకొనిపోయే సోపానాలనీ, సిద్ధాంతీకరించి, విశ్వమానవ మతాన్ని స్థాపించినారు శంకరులు. సమాజాన్ని అద్వైత స్థాపనతో ఒకటి చేసిన శంకరులు ప్రచారం కోసం తూర్పున గోవర్ధన మఠం, దక్షిణాన శృంగేరి మఠం, పశ్చి మాన ద్వారక మఠం, ఉత్తరాన జ్యోతిర్మఠం పేరిట భారతదేశంలో నాలుగు మఠాలు స్థాపించి ఈ పీఠాలకు పద్మపాదుడు, సర్వేశ్వరుడు, హస్తామలకుడు, తోటకాచార్యులను పీఠాధిపతులుగా నియమిం చాడు. తదనంతరం దేశమంతటా పర్యటించి ఇతర విశ్వాసాలతో ఉన్న వారినందరినీ అద్వైతంలోకి తెచ్చారు. కర్నాటకలోని తుంగ భద్రానదీ తీరమందున్న శృంగేరికి వేంచేసి అద్వైత వ్యాప్తికి శారదా పీఠాన్ని స్థాపించారు. ఇది శంకరులు స్థాపించిన తొలి శృంగేరి పీఠం, ఆ పీఠాధిపతులందరినీ శంకరాచార్యులనీ పిలుస్తారు.
అద్వైత మనునది అద్భుతమైన, అనిర్వచనీయమైన ఆనందానుభూతి. అద్వైత మనేది ఆచారము కాదు, మతమూ కాదు. జ్ఞాన మార్గంద్వారా పొందేది. తర్కయుక్తులతో సాధించబడేది కాదు. అద్వైతము శంకరులతో ఆరంభమైనది కాదు. అద్వైత ప్రమాణమును శంకరులకు పూర్వీకులైన ఆచార్యులైన, వశిష్ఠ, గౌడ పాద, బ్రహ్మదత్తాదులు ప్రవచించారు.
శంకరులు తమ అసమాన ప్రతిభా పాటవాలతో ఉపనిష త్తులలో వివరించబడిన సనాతన ధర్మము, ఆచారములు విశిదపరిచి వైదిక ధర్మాచరణము సుష్టుపరిచాడు. ఈనాడు భారతీయ వైదిక సంస్కృతి అవిచ్చిన్నంగా పరిఢవిల్లుతున్నదంటే అందుకు కారణం శ్రీశంకరాచార్య భగవత్పాదులే! పతనావస్థలో ఉన్న భారతీయ సంస్కృత సనాతన ధర్మాన్ని పరిరక్షించారు.
వామాచార ధోరణులతో నరులు, పశువుల బలులతో కూడిన అవైదిక పద్ధతులను, పూజాదికాలను, వైదిక ధర్మానికి విఘాతం కలిగించే విధానాలను రూపుమాపాడు. రుద్రమూర్తులైన ఎన్నో దేవతామూర్తులలోని రౌద్రాత్మకమైన బీజాక్షరాలను తొలగించి శాంతపరిచి, సాత్వికరూపంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు.
32 సంవత్సరాలు తన జీవిత కాలంలో 24 గ్రంథాలకు భాష్యాలు రచించడం జరిగింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతపై భాష్యాలు, అమరోక్షానుభూతి, భజగోవిందం, వివేక చూడామణి, శతశ్లోకి, శివానందలహరి, సౌందర్యలహరి, ఆనంద లహరి, భవానీ భుజంగ, గణేశ పంచరత్న, దక్షిణామూర్తి, లక్ష్మీనరసింహ, మీనాక్షి, పంచరత్నాలను ఇంకా బ్రహ్మ మీమాంస, ఉత్తర మీమాంస, బ్రహ్మసూత్రాలను, కనకధారా స్తోత్రాన్ని, మనీష పంచకం, ఇలా ఆదిశంకరాచార్యులు వ్రాసినన్ని విషయాలు ఈ ప్రపంచం మొత్తం మీద మరెవరూ వ్రాసి ఉండరు. అందుకే ఆయన కృతయుగంలో ఆదిశంకరులు అని పండితుల వచనం.
మానవులకు భక్తి, జ్ఞానం, ధర్మాల ద్వారా మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తికి మార్గం చూపిన మార్గదర్శకులు జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు కేవలం 32 సంవత్సరాలు జీవించారు.
శంకరాచార్యను స్మరించడం ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందిస్తుంది, అద్వైత వేదాంతంపై అవగాహనను పెంచుతుంది మరియు హిందూ తత్వశాస్త్ర సంప్రదాయంతో అనుబంధాన్ని బలపరుస్తుంది.అంతే కాకుండా, భక్తులు ఆది శంకరాచార్యుల వారి కాలాతీత జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి మరియు ఆయన బోధనలను తమ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా ఉపయోగపడుతుంది.
సనాతన ధర్మ వృక్షాన్ని చిగురింపజేసి, ద్వైత చీకట్లను తొలగించిన అద్వైత ఆనందమూర్తి ఆదిశంకరులు.
ఆరునెలల నుండి చడీ చప్పుడు లేకుండా మౌనం నిశ్శబ్దం నా జీవితంలో సగానికి పైగా స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఏదో ఊపిరాడని ఫీలింగ్. ఇప్పుడిలా ఈ మాటల పందిరి క్రింద జరుగుతున్న పెళ్లి సంబరంలో ఆ పని ఈ పని అంటూ హడావుడిగా తిరుగుతూ అందరితో మాటలు కలుపుకుంటూ ఆనందం అంతా నా స్వంతం అన్న భావన ఊపిరి పోసుకోవడంతో పెద్ద బరువు దించుకున్నట్టుగా వుంది. ఇదే మాట వీరితో పంచుకుంటే… మరీ ఎక్కువగా సంబరపడకు ఊరికెళ్ళిన తరువాత మళ్ళీ అదే పరిస్థితిని పేస్ చేయాల్సివుంటుంది విమలా! అన్నారు. ఈ మనిషి ఇంతే! భావనారహితంగానే జీవితం గడిపేస్తూ వుంటారు. పొంగిపోవడాలు కృంగిపోవడాలు ఏవీ పట్టక తన మానాన తాను బ్రతికేస్తూ వుంటారు. కాస్త చిరాకన్పించినా తనలా ఉండడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది.
ఏదో పెళ్లింట్లో కాస్త సంతోషం ఇల్లు కట్టుకుంటే వీరి మాటలతో ఆ స్థానంలో గుబులు గూడు కట్టుకుంది. ఓ క్షణం మనసు చివుక్కుమన్నా నెలల తరబడి మౌన సముద్రంలో మునకలేసిన నాకు ఇప్పుడు ఇక్కడ లభిస్తున్న ఈ సందడి సంభ్రమాలను దూరం చేసుకునే ఉద్దేశ్యం లేక ఆలోచనలను విదిలించి ఆ మాట ఈ మాట కలుపుకుంటూ అందరితో కలిసిపోయాను.
రాత్రి భోజనం చేసి పడుకోడానికి వెళ్ళినపుడు రేపు మధ్యాహ్నం ట్రైన్ కు తిరిగి వెళ్ళాలి అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ దిగులు భూతం ఆవహించింది. అదే విషయం అనబోతే ఈ విషయాలకు అతీతంగా వీరి గురక మంచి నిద్రకు జారుకున్న సూచన ఇచ్చింది. పాపం పడుకోని లేపడంఎందుకని అలా ఇలా దొర్లుతూ చివరకు నిద్రకు జారుకున్నా. ఓ గంట గడిచిందేమో మళ్ళీ మెలకువ నిద్రను కాజేసింది.
నీరవపు రాత్రిలో తలపుల ఊరేగింపు…
అమ్మ నాన్న అక్కలు అన్నలు పెద్ద కుటుంబంలో ఆఖరుదాన్ని నేనవడంతో అతి గారాబంగా పెరిగాను. స్కూల్ కాలేజ్ స్నేహితురాళ్ళు అప్పుడప్పుడూ వచ్చిపోయే బంధువులతో ఇరుగు పొరుగువారి ముచ్చట్లతో ఒంటరితనం నన్నెప్పుడూ భాధించలేదు. గారాబంగా పెరగడంతో ఒకింత బేజారుని సహించే ప్రకృతి నాకబ్బలేదు.
పెళ్లయి చేరిన అత్తగారిల్లు కూడా ఉమ్మడి కుటుంబం కావడంవల్ల అక్కడ కూడా సందడే. కాలం గడుస్తూ పిల్లలు వారి ఆలనా పాలనలో రోజులు నెలలు సంవత్సరాలు దొర్లుకుంటూ వెళ్ళిందే తెలియలేదు. పిల్లలు బాగా చదూకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నప్పుడు ఒక్కొక్కరిగా పిన్నలు పెద్దలు కాలం చేసారు. కానయితే ఆ ఎడబాటుని కాస్త మరపించింది పిల్లల పెళ్లి విషయం. ముగ్గురు పిల్లలు వారి కాళ్ళమీద వారు నిలిచే ప్రయత్నంలో సఫలీకృతులవడంతో పెళ్లి చేయాలన్న తపన బలీయమయ్యింది. పిల్లలను మొదటి నుంచి ఎక్కువ ఆంక్షలు విధించక వారి ఇష్టాయిష్టాలకు విలువనిస్తూ స్నేహితులకు మల్లే పెంచాము అన్నది కాస్త గొప్పే. అదే విధంగా వారి పెళ్లి విషయంలోనూ మేము మా అభిప్రాయాలను మోపక ఒకిన్ని విషయాలను వారికి స్పష్టం చేస్తూ ఒక్కొక్కరిగా వారిష్టపడ్డవారితో వారికి పెళ్లి జరిపించాము.
వీరు నిద్ర లేవడంతో నా తలపుల గొలుసు తెగింది. బ్రష్ చేసి స్నానాలయ్యాక బట్టలు సర్ది అందరితో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించి పెట్టె బేడా సర్దుకుని బయలుదేరాము. ఆ హడావుడిలో రాత్రి తినడానికి ప్యాక్ చేసిన డబ్బా వదిలేసి వచ్చిన విషయం స్టేషనుకెళ్లిన తరువాతగాని తెలియలేదు. పోనీలే కనీసం ఇప్పుడే చూసుకున్నామని సంతోషిస్తూ దగ్గర్లో వున్న హోటల్లో ఇడ్లీలు కట్టించుకురావడానికి వెళ్లారు. చాలా పెద్ద క్యూ. ముప్పావు వంతు దూరం వెళ్లారో లేదో ఇడ్లీలు ఖాళీ అయ్యాయి ఇక ట్రైన్ బయల్దేరే టైం అయ్యిందని తిరిగొచ్చేశారు. ఇద్దరం ట్రైన్ ఎక్కి కూచున్నాము.
మాకు ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కూచున్నారు చిన్న పిల్లాడు నిద్రపోతున్నాడు. ట్రైన్ కదిలింది. ఓ పది నిమిషాల తరువాత ఆ అమ్మాయే మాటలు కలిపింది. కాసేపటికి ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఎన్నో రోజులుగా పరిచయమున్నట్టు అనిపించసాగింది. మాటల మధ్యలో మావారు “నేను ఇక్కడ దొరికే పలావు తింటాను నీవైతే అది తినవు. ట్రైన్ ఈ స్టేషన్లో కాసేపు ఆగుతుంది నీకు కాసిని అరటిపళ్ళు బిస్కేట్లూ పట్టుకొస్తానుఅని అన్నారు. వారి మాటలు వింటున్న ఆ అమ్మాయి మీరేమీ అనుకోక పోతే బాబుకి తెచ్చిన ఇడ్లీలు వున్నాయి, వాడు నిద్రపోయాడు మీరు తినండి అంది నాతొ ఆత్మీయంగా. నేను ఓ క్షణం కూడా ఆలోచించక అలాగే ఇవ్వమ్మా అంటూ తీసుకున్నాను. మా వారు నాకేసి వింతగా చూసారు. కారణమింతే … అలా ట్రైన్లో కొత్తవారి దగ్గర తినే వస్తువులు తీసుకోకూడదని వాదించే తను ఇలా ప్రవర్తించడం వారికి కాస్త వింతగా అనిపించింది. ఇన్ని రోజుల ఒంటరితనం, మాటలు ఎక్కువగా లేని మౌనం నాపై ఇంత ప్రభావాన్ని చూపుతోందా?! ఆత్మీయతకు అఱ్ఱులుజాస్తోందా?! అని అనిపించకపోలేదు. నెలల తరబడి నా ఒంటరితనం ఆ అమ్మాయి చూపిస్తున్న అక్కరకు ఆవిరవుతున్నట్టనిపించడమే నా ఈ ప్రవర్తనకు కారణమనిపించింది. ఎందుకో తెలియదు మా ఇంట్లో మనిషిలాగా అనిపిస్తోంది. అందుకే ఏ మాత్రం సంకోచ లేకుండా తీసేసుకున్నాను.
నేను ఇడ్లీలు తింటున్నప్పుడు ఆ అమ్మాయి తన గురించి చెప్పుకోసాగింది. అప్పుడు తెలిసొచ్చింది ఆ అమ్మాయి స్టేట్స్ లో వుంటున్నది అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తున్నాడు. పిల్లాడిని అమ్మాయి తల్లి చూసుకుంటోంది. ఇప్పుడు వారి ప్రయాణం అత్తగారింటి వైపు. వాళ్ళ అమ్మగారిని ఒప్పించి అబ్బాయికూడా స్టేట్స్ కు త్వరలోనే వెళ్ళాలి అన్న విషయం తీర్మానించడానికి. మంచిదే ఒకరక్కడ ఒకరిక్కడ ఇలా పిల్లాడికి దూరంగా ఉంటూ అవస్థలు పడేకన్నా ఇది మంచి నిర్ణయం అన్నపుడు మా పెద్దాడు ఇదే కారణానికి ఆరు నెలలక్రితం ఇల్లొదిలిన విషయం గుర్తొచ్చింది. అప్పుడు పైకనకపోయినా ఈ విషయానికి బాగా నొచ్చుకున్న విషయం కూడా గుర్తొచ్చింది. అయితే ఈ అమ్మాయి మాటలు విన్నాక అలా వాడు స్టేట్స్ వెళ్లడం ఆక్షేపించే విషయం కాదేమో అని అనిపిస్తోంది. అలా అనిపించడంతో నాలో దట్టంగా గూడు కట్టుకున్న దిగులు మేఘాలు కాస్త పలచబడ్డట్టనిపించింది. వెంట వెంటనే ఆఫీస్ చాలా దూరం వెళ్లి రావడం అలసటగా వుంది. పిల్లాడికి కూడా అక్కడే దగ్గరగా వున్న స్కూల్లో చేర్పించి అందరం వీకెండ్స్ వస్తామమ్మా అన్న మూడవ అబ్బాయి మాటలు ఇప్పుడు తేలిగ్గా తీసుకోవాలనిపిస్తోంది. ఇక రెండవది అమ్మాయి. తను పెళ్ళయిన వెంటనే దూరదేశానికి వెళ్లడంతో తాను లేని లోటు కూడా బాధించేది. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే పిల్లల కష్టం కూడా కాస్త కాస్త అర్థమవసాగింది. పిల్లలందరూ ఎలాంటి గొడవలు మనస్థాపాలు లేక కేవలం వారి వారి అవసర కారణాలకు దూరం వెళ్లారు. మూడవ అబ్బాయి కోడలు మనవడు వచ్చీ పోతూ వుంటారు, మంచి చెడూ కనుక్కుంటూ వుంటారు. పెద్దవాడు వీలయినపుడు తప్పక వస్తానమ్మా అంటూ సముదాయించేవాడు. ఎటూ పోయి అందరు కలిసి వున్నపుడు అంత సందడిగా వున్న ఇల్లు అలా ఒక్కసారికి ఖాళీగా అనిపించడం నన్ను ఇంతగా కృంగదీసింది అని అనిపించక పోలేదు.
అపుడు ఇంట్లో పని వంట వార్పూ, పిల్లలతో కాలక్షేపంతో టైం గడిచేదే తెలిసేది కాదు. బుర్రలో అనవసరపు ఆలోచనలకు తావుండేది కాదు. ప్రస్తుతం ఎలాంటి వ్యాపకం లేక చిన్న చితక పనులు చేసుకుంటూ ఎక్కువ శాతం ఖాళీగా వున్న మైండ్ చిన్న విషయాలను బూతద్దంలో చూడడంవల్ల ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను ఈ దైన్య పరిస్థితినుండి బయటపడాలంటే ఒక వ్యాపకాన్ని సృష్టించుకోవాలి. అందులో ఎక్కువ సమయం గడిపితే ఈ మౌనం ఒంటరితనం ఎక్కువగా బాధించదు. చదూకునే రోజుల్లో క్లాసుకు తానే ఫస్ట్. అందులోనూ మాథ్స్ తనకు కొట్టిన పిండి. ఇక హిందీ తాను చక్కగా పాఠం చెప్పగలదు. భోజనం పనులు అయ్యాక నిద్రపట్టక పొర్లుతూ మనసు పాడుచేసుకోవడం కంటే చిన్న పిల్లలకు పాఠాలు చెబితే సమయం వ్యర్థమైన ఆలోచనలకు తావులేక చక్కగా గడిచిపోతుంది. పిల్లలతో గడిపినట్టూ ఉంటుంది. కొడుకులు కోడళ్ళు పిల్లలు అమ్మాయి అల్లుడు అందరితో దొరికిన సమయంలో సంతోషంగా మాట్లాడుతూ మనసుని చక్కగా ఆరోగ్యంగా వుంచుకోవాలన్న నిర్ణయానికొచ్చాను. “ఎందుకు ఉన్నట్టుండి అలా మౌనంగా కూచున్నారు” ఆ అమ్మాయి ప్రశ్నకు తెప్పరిల్లి ” ఆ ఏంలేదమ్మా ఇలా ఏదో విషయం గుర్తొస్తేనూ… అని అన్నాను. మేము వచ్చే స్టేషన్లో దిగుతాము మీ ఫోన్ నెంబరు ఇవ్వండి టచ్ లో ఉందాము అన్న ఆ అమ్మాయిని ముచ్చటగా చూస్తూ అంతర్మధనంతో తేలికపడ్డ మనసుతో మనసారా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దాంతో నాలో అంతవరకూ గూడు కట్టుకున్న దిగులు మేఘాలు ఆవిరైపోయి మనసు నిర్మల ఆకాశంలా ప్రశాతంగా అనిపించసాగింది.
ఆకాశవాణి బెంగళూరు నుండి ప్రసారమైన కథ
“షుగర్ డాడీ కల్చర్” అనేది ఒక సామాజిక విపరీత ధోరణి. ఇందులో సాధారణంగా పెద్దవయసు, ఆర్థికంగా బలమైన వ్యక్తి (షుగర్ డాడీ) మరియు తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి (షుగర్ బేబీ) మధ్య ఆర్థిక సహాయం–వ్యక్తిగత సంబంధం ఆధారంగా ఒక ఒప్పందం లాంటిది ఉంటుంది. మానసిక పరిపక్వత లేని అమ్మాయిలు సోషల్ మీడియాలో కనపడే విలాసవంతమైన జీవితాలు తమ కు ఎందుకు లేవు? దీనికి డబ్బే కారణం కదా! అదెలాగో సంపాదించుకుని ఆ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అందరి ఎదుటా డాబు చూపించుకోవడానికి పట్టే తప్పుతోవనే షుగర్ డాడీ ( ఒక విధమున ట్రాప్) లో పడుతున్నారు.
ఇది ప్రేమ అని మొదలై, క్రమంగా డబ్బు అవసరాల ఆధారంగానే కొనసాగుతాయి. క్రమంగా ఆశలు- అత్యాశలై కుటుంబ విలువల కంటే డబ్బు, లాభం, సౌకర్యం వీటి మీద పడి ప్రేమ కాస్త దోమౌతుంది… డబ్బు.. డబ్బు.. అని కుట్టడం మొదలౌతుంది. ఇవి పాశ్చాత్య ధోరణిని తమ స్వంతం చేసుకుంటున్న సంస్కృతి. కానీ అక్కడో- ఇక్కడో ఒకటీ-అరా ఉన్నత వర్గాలలోఉండేవి. రాను రాను మధ్యతరగతికి ఎగబాకిన గజ్జి సంస్కృతి.దీని వల్ల భారతీయ సమాజానికి ఎంతో హాని కలుగుతుంది. నైతిక విలువల క్షీణత కలుగుతుంది. మన భారతీయ సంస్కృతిలో ఉన్న ధర్మం, గౌరవం, కుటుంబ బంధాలు బలహీనమవుతాయి. మహిళల గౌరవానికి ముప్పు ఏర్పడుతుంది.
ఇది మహిళలను ఒక “వస్తువు”లా చూసే భావనను పెంచుతుంది. యువత తప్పు దారులు తొక్కుతారు, ఎందుకంటే డబ్బు సంపాదించాలనే యావలో పడి వారికి ఎలాంటి నైతికత గుర్తురాదు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ మార్గంలో పడే ప్రమాదం ఉంది. దీనితో మానసిక మరియు భావోద్వేగ సమస్యలు వస్తాయి. ఇలాంటి సంబంధాలు స్థిరంగా ఉండవు. దాంతో ఒత్తిడి, నిరాశ, నమ్మకం కోల్పోవడం జరుగుతుంది. సామాజిక అసమానత పెరుగుదల డబ్బు ఉన్నవారికి మాత్రమే అధిక ప్రాధాన్యత కలిగే పరిస్థితి ఏర్పడింది. మన సంస్కృతికి మూలపట్టైన పవిత్రత మంట కలసిపోతున్నది. దీనివల్ల ఎన్నో గుప్త రోగాల పాలౌతారు. అంతేకాదు! ఏ సోషల్ మీడియాతో ఆకర్షింపబడి ఈ దారిని ఎన్నుకుననదో… అదే సోషల్ మీడియా వాళ్ళ రేటింగ్ కోసం గంటలు గంటలు చర్చోప చర్చలు చేసి, ఆ అమ్మాయి జీవితాన్ని బజారుకీడ్చి, మనసుతో పాటు జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరిని చేసి, వారి నోటి దురద తీర్చుకుంటారు. ఈ అమ్మాయి రాటు దేలినదైతే పర్వాలేదు చావకుండా బతుకుతుంది. లేదా ఆ అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఒకప్పుడు స్నేహితురాలు చెప్పిన మాట సోషల్ మీడియాలో చూసేదంతా నిజంకాదు! జాగ్రత్త గా ఉండాలనే మాట ఆనాడు పెడచెవిన పెట్టినా… ఈ రోజు చెవిలో గింగురుమంటుంది.
ఈ సంస్కృతి రావడానికి కారణాలు పాశ్చాత్య ప్రభావం మరియు సోషల్ మీడియా, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, Instagram వంటి Instagram లో కనిపించే గ్లామర్ జీవితం. కుటుంబాల మధ్య ఆర్థిక అసమానతలు పేదరికం, ఉద్యోగ అవకాశాల లోపం దాంతో అందరివలె తానూ బతకాలనే కోరిక, తామూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నామనే ప్రదర్శన ( ఒకరిని చూసి మరొకరు) సులభంగా డబ్బు సంపాదించాలనే కోరికతో అడ్డదారులు తొక్కడం, వద్దని అంతరాత్మనో లేక స్నేహితులో చెప్పితే విలాసవంతమైన జీవితం ఆకర్షణ వదులుకోలేక, తన స్నేహితురాలి వలె లగ్జరీ జీవితం జీవించాలని దానిమీద ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ దారులు వెతుక్కునే పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం సరిగా ఉండక కుటుంబ, విలువల లోపంతో పిల్లలకు సరైన మార్గదర్శకత లేకపోవడంతోనూ… అందుకు తగిన ఆకర్షణలు ఆ ఊబిలోకి తమంత తామే పడతారు. దీనికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు తోడై ,ఈ చిన్న పిల్లల కోరికలకు వత్తాసు పలుకుతూ ఇలాంటి సంబంధాలను ప్రోత్సహించే వెబ్‌సైట్లు, యాప్స్ యువతను సర్వ నాశనం చేస్తున్నది.
విలాసవంతమైన జీవితం కొరకు తప్పు తోవపడితే తర్వాత బాధ-ఒత్తిడే మిగులుతుంది
దీన్ని అరికట్టడమెలా? అంటే మొదటి మెట్టు కుటుంబమే… నైతిక విలువల విద్య నేర్పించాలి! పిల్లలకు చిన్నప్పటి నుంచే ధర్మం, గౌరవం, స్వాభిమానం నేర్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యం. పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలి, వారి సమస్యలు అర్థం చేసుకోవాలి. వారికి సోషల్ మీడియా అవగాహన కల్పించాలి. అందులోని నిజానిజాలు; సాధక బాధకాలు మొదలైనవి పిల్లల మనసులోనికి ఇంకించాలి. వాస్తవ జీవితం ఇలా తక్కువ వసతులులన్నా పరవాలేదు! గౌరవంగా బతకడమే మనకు ముఖ్యమని, తాత్కాలిక సుఖాలకంటే స్వాభిమానమే గొప్పదని , అలాంటి ప్రలోభాలకు లోనూకావద్దని చెప్పాలి. దాంతో పాటు సోషల్ మీడియా భ్రమలు వివరించాలి. నువ్వు చూసేదంతా నిజం కాదు! తెరమీద అలా కనపడుతుంది వెనుక జీవితాలు వేరేగా ఉంటాయి. అదొక ఊబిలాంటిది. దాని దగ్గరకు పోతే అపవిత్రమైన జీవితంలో కూరుకు పోవడమే తప్ప గౌరవప్రదమైన జీవితం ఉండదని విడమర్చి చెప్పాలి. డబ్బులకోసం ఇటువంటి తోవలు తొక్కవద్దని చెప్పి, వారి అవసరాలు తామే తీరుస్తూ… అలా వీలు కాకపోతే ఆర్థిక స్వావలంబన గురించి చెప్పాలి! దానికోసం ఎలా చదవాలో? ఎలా నైపుణ్యాలను నేర్చుకోవాలో వాటి ద్వారా ఎలా సంప్రదించుకోవాలో తెలిసేలా వివరించాలి. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి. ఇక ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి దోపిడీ సంబంధాలను నియంత్రించడానికి కఠిన నిబంధనలు అవసరం.
“షుగర్ డాడీ కల్చర్” అనేది తాత్కాలిక సుఖం ఇచ్చేదే కానీ దీర్ఘకాలంలో నష్టాన్ని కలిగించే ధోరణి. మన భారతీయ సంస్కృతి గౌరవం, ప్రేమ, బాధ్యత మీద నిలబడింది.
కాబట్టి యువతలో స్వాభిమానం మరియు నైతికత తో పాటు కష్టపడి సాధించే జీవితం విలువలను పెంపొందిస్తే మాత్రమే ఈ సమస్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఒకరిని చూసి మరొకరు ఇందులో కూరుకొని పోతున్నారు.
అంతేకాదు తన తోటి వారితో పోల్చుకోవాడాలు ఎక్కువ అయినవి… ఈ పోలిక చిన్న వస్తువు దగ్గర నుండి అతి ఖరీదైన వస్తువులు, నగలు, ఇండ్లు ఇలా దానికి అంతే లేదు! హద్దు అసలే లేదు. సామాజిక వేత్తలు తమ వంతు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి.
ఇంట్లో ఆధ్యాత్మికత వాతావరణం ఉండి తల్లిదండ్రులు ఆచరిస్తే… పిల్లలలో కాస్త పాపభీతి- భయంతో వెనకడుగు వేసే అవకాశమున్నది. తప్పొప్పులు బేరీజు వేసుకునే ఆలోచన కలుగుతుంది.
ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందో? అన్న వెరపు ఎప్పుడైతే పోయిందో ఇలాంటి అసహజ పనులు చేయడానికి యువతులు వెనుకాడడంలేదు. దైవభీతి, పాపపుణ్యాల పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గి వారు మందలించబోతే ఎదురు తిరిగి వారిని మానసికంగా గాయపరచడం చేస్తున్నది యువత. అందుకని బాల్యంలోనే నైతిక విలువలను నేర్పించడం, తమ శక్తిమేరకు పిల్లల అవసరాలను తీర్చడం చేయాలి. వాళ్ళముందు విలాసవంతమైన జీవితం లేదని తరచూ భార్యాభర్తలు గొడవపడితే అలాంటి కోరిక సమంజసమైనదేమోననే ఆలోచన పిల్లలో కలుగుతుంది. అలా కాకుండా మన పరిథి ఆదాయంలో మనం గౌరవంగా, ప్రశాంతంగా బతుకుతున్నాము. మన జీవితాలకేమైంది హాయిగా ఉన్నామనే సంకేతాలు పిల్లలకు అందించాలి. అపుడు సంతృప్తి ముఖ్యమనే జీవన విధానానికి పిల్లలు అలవాటు పడతారు.
పాఠశాలలోనూ ఉపాధ్యాయులు చెడు తోవ పడ్తున్నాడని పసిగట్టి సరైన దారిలోకి తెచ్చే విద్యాబోధన చేయడం చేయాలి.
ముఖ్యంగా ఈ ఆకర్షణలన్నీ మొబైల్స్, లాప్ టాప్ల వంటి విద్యుత్ పరికరాలే కాబట్టి వాటికి నియంత్రణ ఏర్పాటు చేసి, పిల్లల మీద నిఘా పెట్టాలి. ఎటువంటి పోస్ట్ లు, వెబ్ సైట్లు, చాటింగ్ ఎవరితో చేస్తున్నారని, తరచూ ఎలాంటివి చూస్తున్నారని గమనించి హెచ్చరిక చేయడం, వినకపోతే వాటికి తాళం వేయడం చేయాలి. అలా చేయాలంటే పిల్లలతో సమయం గడిపి, వారికి ఖాళీ సమయం చిక్కనీయ వద్దు.ఇలానే అని కాకున్నా .. తమకు తోచిన విధానంలో ఆకర్షణల వైపు పోనీయకుండా చేయాలి.
మనదేశంలో యువత ఎక్కువ ఉన్నది. దాంతో మన దేశం ఎంతో ఉన్నతి సాధించవచ్చు. ప్రపంచమంతా ఈ మన యువ శక్తికి ఈర్ష్య- అసూయలు పడుతున్నారు. మనం మన శక్తిని మనమే నిర్వీర్యం చేసుకుంటున్నామని త్వరగా గ్రహించాలి! యువతను పెడమార్గం పట్టకుండా చూసి, మనతో పాటు దేశ అభివృద్ధి లో పాలు పంచుకునే కొత్త నైపుణ్యాలతో అవసరమైనవి కనిపెట్టే దిశగా ప్రోత్సహిస్తూ… పిల్లల అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిని కోరుకుందాం!
సర్వే జనాః సుఖినో భవన్తు!!
పిడికిలి బిగించి ఎదిగే ప్రతి క్షణం
శ్రమ జెండా ఎగరే ప్రతి వేళ..
హృదయం పలుకుతోంది
కార్మికుడే నిజమైన వీరుడు అని..!
కడుపు నింపే అన్నం వెనుక దాగిన కష్టాలను
ప్రతి ఇంటి నిర్మాణం వెనుక ఉన్న వారి
శ్రమ గాథలను పదాలుగా మలిచే
కలం చెబుతోంది..
కార్మికుడే సూర్యుడు ఈ భూమికి అని..!
వారి చెమట చుక్క పడిన నేలపై
మన జీవితం మొలకెత్తింది అని గుర్తుంచుకో..!
వారి అలసిన చేతులు ఆగిన క్షణంలో
ప్రపంచం నిలిచిపోతుంది అని గుర్తుంచుకో..!
ఖాళీ కుండతో అన్నం వండే మంటల్లో..
కడుపు ఆకలిగా ఉన్న రాత్రుల్లో..
వారి పేగుల చప్పుడు వినిపించిన ప్రతిసారి
హృదయం బద్దలవుతుంది
వారి చెమటతోనే నిలుస్తుంది సమాజం
వారి శక్తితోనే ముందుకు సాగుతుంది ప్రపంచం
కానీ…. ఏమీ ఆశించక
కుటుంబం నవ్వులే తనకు పండుగ అని
భావించే నిజమైన శ్రామికురాలు మహిళ..!
పొయ్యి వెలిగించే ప్రతి మంటలో
తన కన్నీళ్లను గుండెల్లో దాచుకుని
తన కలలు గిన్నెల్లో మరిగిపోతున్నా కూడా…
చిరునవ్వు మాత్రం తగ్గని నిజమైన
శ్రామికురాలు మహిళ..!
చెమట చుక్కలతో స్వప్నాలు నిర్మించే శ్రామికులకు
వందనాలు తెలియజేస్తూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
“నాస్తి మాతృ సమా ఛాయా / నాస్తి మాతృ సమా గతిః/
నాస్తి మాతృ సమం ప్రాణం/
నాస్తి మాతృ సమా ప్రియా”..
అని మాతృతత్వ మహత్యాన్ని వర్ణిస్తూ సంస్కృతంలో ఒక సుభాషితం చెబుతుంది.
ఈ సృష్టిలో తల్లికి సమానమైన నీడ, తల్లికి సమానమైన గమ్యము, తల్లికి సమానమైన రక్షణ, మరియు తల్లికి సమానమైన ప్రియత్వం అంటూ వేరే ఏమీ లేవని దీని అర్థం.
మాతృతత్వము అతులనీయమైన దని దీనిఅర్థం.
84 లక్షల జీవరాశులలో ఈ మాతృత్వం అనేది ఉండటం చేతనే, సృష్టి క్రమంగా నిరాటంకంగా సాగుతోంది.
అందువల్లనే ఈ మాతృతత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించిన మార్కండేయ మహర్షి వారు, దుర్గా సప్తశతిలో
“యా దేవి సర్వభూతేషు/ మాతృ రూపేణ సంస్థితా/
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః.
అంటూ స్తుతించడం జరిగింది.
చండీ సప్తశతి లో సృష్టికి మూలాధారం శక్తి అని, మాతృ రూపంగానే వర్ణించి ఆరాధించడం జరిగింది.
ఏది ఏమైనా ఈ అనంతమైన సృష్టికి, జీవి
స్థితి మరియు లయములకు కూడా
మాతృ రూపమైన శక్తియే ఆధారమని అర్థమవుతుంది.
కాబట్టి, మన సంస్కృతిలో, మాతృ స్థానాన్ని దివ్యత్వాన్ని జోడించి, సర్వదా పూజనీయమని ఉద్ఘాటించారు మన పెద్దలు.
భాషలో చిన్నదైనా! భావంలో అనంతమైన పదం “అమ్మ” .
ఈ ఒక్క పదంలో సృష్టి, సంరక్షణ ,త్యాగం, కరుణ ,ప్రేమ దైవత్వం ఇలా అన్నీ నిండిఉంటాయి.
భారతీయ సంస్కృతిలో అమ్మ అనే పదం కేవలం కుటుంబ సంబంధాలను సూచించేది మాత్రమే కాదు /
అది దేవతా తత్వానికి ప్రతిరూపంగా వర్ణింపబడింది .
వేదాలలో తల్లి స్థానాన్ని అత్యున్నతంగా పేర్కొన్నారు .
ముఖ్యంగా” మాతృదేవోభవ “అనే వాక్యం
తైత్తిరీయ ఉపనిషత్తులో కనిపిస్తుంది. ఇది తల్లిని దేవతగా భావించమని ఆజ్ఞాపిస్తుంది .తల్లి మొదటి గురువు. తల్లి మొదటి దేవత .తల్లి ప్రేమ నిస్వార్ధమైనది.
వేద దృష్టిలో తల్లి సృష్టి. స్థితి. లయ కారిణి గా భావించబడింది. ఇక మన పురాణాల్లో అయితే తల్లి అనేక రూపాలలో దర్శనమిస్తుంది .ఆమె సృష్టికి మూలమైన ఆదిపరాశక్తిగా, ప్రేమను, శాంతిని పంచే పార్వతీదేవిగా ,
ఐశ్వర్యాన్ని పంచే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని పంచే సరస్వతీ దేవిగా జగత్తును పోషించే శక్తి స్వరూపిణిగా అభివర్ణింపబడినది. ఇతిహాసాల్లో తల్లి పాత్ర ఆదర్శవంతంగా త్యాగమూర్తిగా వర్ణించబడింది .
ఇక భారతీయుల తత్వశాస్త్రం ప్రకారం తల్లి ప్రేమ స్వరూపిణిగా, క్షమామూర్తిగా, త్యాగమయిగా, వర్ణింపబడింది. ప్రపంచంలో ఏ బంధం కూడా
తల్లి బంధంతో సమానంగా ఉండదని నిరూపించింది .
*జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ “
సృష్టికి మూలం స్త్రీ. ప్రకృతియే ప్రకృతిని సృష్టించి, పోషించి, లీనం చేసుకునే తత్వం స్త్రీ రూపంలో మమ్ముూర్తుల మూర్తీభవించి ఉంటుంది .అందుకే ఆమె మాతృమూర్తిగా బిడ్డలను కని పోషిస్తుంది. వారిని జ్ఞాన మార్గాన పయనింప జేసి, ఆనంద ధామం వైపు నడిపిస్తుంది..
పక్షికి ఎగరడం, చేపకు ఈదడం. నెమలికి ఆడడం ఎంత సహజమో ! అమ్మ తన వాత్సల్యాన్ని తమ సంతానం మీద ప్రదర్శించడం కూడా అంతే సహజం. అమ్మకు ఈ గుణం ఎవరో నేర్పితే వచ్చింది కాదు. ఇది సనాతనమైన సహజమైన గుణం.
నిజానికి నేర్పితే నేర్చినది విద్య కాదు .
అమ్మ ప్రకృతి .ఆమెలో అనుభూతి సహజం. ఆమె ప్రకృతి కాబట్టి ఆమె నుండి ఆమె సమకూర్చుకున్నది ధర్మం .
ఈ సనాతన ధర్మాలు స్త్రీలో పూత పూసినట్లుగా పురుషుల్లో కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి స్త్రీత్వం పరావర్తనం చెందినపుడు మాత్రమే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అని త్రికరణాలలో మొదటి స్థానం అమ్మకే దక్కింది .
భగవంతుడు భూమిపైకి వచ్చి ప్రజల్ని సన్మార్గంలో పెట్టాలని తలచి, తనకు బదులుగా తల్లినిపంపించాడని ఒక కథనం ఉన్నది.
దేవుడు చేయని, ఈయని సంస్కారం ,తల్లి ఇస్తుందనే కదా,దీనిభావం.
ఒకవేళ దేవుడే భువికి దిగి వచ్చినా, అమ్మ గర్భాన్ని ఆశ్రయించవలసిందే ! అతనికి కూడా వేరే మార్గం లేదు .
మానవులుగా జన్మించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తల్లి గర్భాన్నే కదా ఆశ్రయించారు? …
అమ్మ అనే పదం కమ్మనిది తీయనిది. అమ్మ పాలధార అమృతభాండం. పున్నమి వెన్నెల. ఆనందాన్నిచ్చే నదీ ప్రవాహం. అనంతమైన కడలి. ఆమె కన్నతల్లి భూమాత,
గోమాత, భూమాత, దేశమాత. అన్నీ ఆమే…..అమ్మ అనంతం, అమ్మ అద్భుతం, అమ్మ ఆశ్చర్యం .
“స్త్రీలలో అమ్మను దర్శించడం, పారమార్థిక మార్గాలలో ఆలోచించడం, పవిత్రంగా భావించడం, సనాతనధర్మం.
స్వధర్మే నిధనం శ్రేయః/ పరధర్మోభయావహః” అనే గీతాచార్యుని బోధనను గుర్తులో ఉంచుకొని, మన భారత భూమిపై తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో , ఆమె కంట తడిపెడితే ఎంతటి ఉత్పాతాలు సంభవిస్తాయో తెలుసుకుంటూ, తల్లిని గౌరవంగా, మర్యాదగా చూసుకోవాలి…
పర స్త్రీలో అమ్మతనాన్ని చూడడం వల్ల, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అందుకే ప్రహ్లాదుని గురించి భాగవతంలో ,
“కన్నుదోయికి అన్యకాంత లడ్డం బైన/ మాతృభావన చేసి మరలు వాడు” అన్నారు పోతన కవి .
కాబట్టే! అతనికి మిగతా సద్గుణాలు అలవడ్డాయి. విష్ణుభక్తి లభించింది.
పుట్టిన ప్రతి జీవి ఆకలిని తీర్చేది అమ్మ మాత్రమే. ఆ అమ్మను అన్నపూర్ణమ్మ అని అభివర్ణిస్తున్నాయి. మన ఇతిహాసాలు.
ఎవరికైనా అమ్మా! ఆకలిని తప్ప, ఇంకో శబ్దం
నోటి వెంట దొర్లదు” ..
అతి ప్రాచీన కాలం నుండి, ఆధునిక కాలం వరకూ, ఆకలి తీర్చేది, ఆత్మీయత పంచేది, అనురాగంలో ముంచి తేల్చేది అమ్మతనం మాత్రమే.
బిడ్డను కనినా, పెంచినా, కన్న బిడ్డలైనా, కాకపోయినా వారైనా, మాతృత్వంతో మురిసిపోయే స్త్రీ మూర్తి,
బిడ్డ పాలన, పోషణ కోసం తన సమస్త శక్తులు ధార వస్తుంది. అలా చేయగలిగేది తల్లి మాత్రమే..దాంపత్య ధర్మం అంటూ ఉంటేనే! ఈ మాతృభావన పరిపుష్టమవుతుంది . ఈ భావం నుండి సమాజము, సామాజిక ధర్మాలు అన్నీ ఆవిష్కరింప బడ్డాయి.
మాతృమూర్తిని గౌరవించడం ద్వారా పురుషులు ఉన్నతిని పొందినట్లుగానే, స్త్రీలు తమ సంతానం ద్వారా, ఉన్నత మార్గాల వైపు నడుస్తారు. శ్రీరామ సోదరులే ఉదాహరణ.
పిల్లల్ని పెంచి, ప్రేమ పంచడంలో, వారి తల్లులు ఎన్నుకున్న దారులు, ఆదికావ్యం రామాయణంలో అద్భుతంగా వర్ణింపబడ్డాయి. అమ్మ అంటే ఏమిటో తెలియజేస్తుంది రామాయణం. కౌసల్య మాత సౌశీల్యం, సుమిత్ర సహనం,
కైకేయి అతిశయం ఏ విధంగా తెలియజేస్తుందో!
సంతానాన్ని సమర జ్వాలల నుండి తప్పించడానికి మండోదరి చేసిన మహా యత్నాలు కూడా మనకు మాతృమూర్తి హృదయ వేదనను తెలియజేస్తాయి.
భర్త చేత పరిత్యజింప బడినా, నీలాపనిందలకు గురి అయినా, నిండు గర్భిణీ అయినా, జానకి దేవి, ఆశ్రమ వాటికలలో అష్ట కష్టాలు పడి తన సంతానాన్ని తీర్చిదిద్దిన విధానం ఆదర్శనీయం. రామాయణ, భారత, భాగవతాలలో, అష్టాదశ పురాణాలలో, ఆధునిక కావ్యాలలో, కొందరు తల్లులు పిల్లలను ప్రయోజకులను చేయడం కోసం, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం, పడిన తపన, ఎదుర్కొన్న కష్టాలు, చదివినా, విన్నా, గుండె చెరువై పోతుంది.
సంతానానికి దూరమైన దేవకీదేవి సంతాపాన్ని, అల్లరి కృష్ణుని ఆటపాటలతో ఆనందించినా కూడా పుత్రుడు, తనను విడిచి వెళ్ళినప్పుడు తల్లి పొందే వేదనకు పరాకాష్టగా యశోద మాతను, మనం గమనించవచ్చును.
అలాగే మాతృత్వాన్ని కాంక్షించి, ముగ్గురు మూర్తులను పసిపాపలుగా మార్చి జోలలు పాడిన అనసూయదేవి మాతృమూర్తిగా మమకారాన్ని తన పిల్లలకు అందించడమే కాదు. కఠోర తపస్సు ఫలితాన్నంతా ఆకలి గొన్నవారికి ఆహారాన్ని అందించడం కోసం, జలాన్ని రప్పించడం కోసం ధార పోసిన వైనం ఆమె అత్యుత్తమ మాతృమూర్తి అనడానికి నిదర్శనం..అరుంధతి, అదితి నుండి నేటి వరకు ఎందరో తల్లులు సంస్కారవంతమైన సమాజాన్ని సృష్టించారు, సృష్టిస్తున్నారు, అలా సంస్కారవంతమైన, సమాజాన్ని సృష్టించడానికి, ప్రధానమైనది, ప్రశస్తమైనది, విశిష్టమైనది, మాతృ స్థానం…
స్త్రీ సంస్కార బలం చేతనే, ఉత్తమ సంతానం కలుగుతుంది.
నారదుని ఉపదేశానుసారంతోనే లీలావతి ప్రహ్లాద సుపుత్రుని కన్నది. కశ్యప ప్రజాపతి వంటి మహనీయుని ధర్మపత్ని అయిన అదితి, ఆమె తన సంస్కార బలంతో దేవతలను కన్నది. ఆ కశ్యపుడే భర్త అయినప్పటికీ దితి తన కుసంస్కారం బలం చేత, రాక్షసులను కన్నది .
ఇక వినత,కద్రువ పిల్లల పెంపకంలో అవలంబించిన విధానాల వలన వాళ్ళు ఎలా తయారయ్యారో మనకు ఆ గాథల ద్వారా తెలుస్తుంది. అలా పెరిగిన వారి వ్యక్తిత్వాలను మనం చదువుకున్నాం చూస్తున్నాం.
ఎంత చెప్పినా తరగని కావ్యం, ఎంత వినినా తనివి తీరని చరితం అమ్మే అంటే, అతిశయోక్తి లేదేమో!
“కు పుత్రో జాయతే / కు మాతో న భవతి“ అని ప్రమాణమైన వాక్యాన్ని వెలువరించిన శంకరభగవత్పాదుల వారిని ఈ సమయంలో మనం స్మరించుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరిసా, ఆర్యాంబ, భువనేశ్వరి దేవి, జిజియా బాయి, పుతలీ దేవి, క్వీన్ విక్టోరియా,
ప్రిన్స్ డయానా, Harry potter writer J.K, Rowling . Biyonce ప్రపంచ ప్రఖ్యాత గాయని, మలాలాతల్లి వంటి తల్లులు, మాతృ దినోత్సవ సందర్భంగా స్మరణీయులు.
దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసం, ధీరమాతలై
తమ సంతానాన్ని సన్నద్ధం చేసి పంపుతున్న ఎందరో మాతృమూర్తులు! వారందరికీ ఈ మాతృ దినోత్సవం సందర్భంగా శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను..
సమాజానికి మార్గదర్శకులు, సంస్కర్తలు,
సహృదయులు, వీరులు ,శూరులు, ధీరులు, ఉత్తమ పౌరులు, వీరవనితలు ధీరమాతలను, తయారు చేసేది అమ్మ. ఆ అమ్మ చూపించిన ప్రేమ ,త్యాగం, ధైర్యం, సేవ, వాత్సల్యం , మార్గదర్శకత్వమై ఎందరినో ఉన్నత స్థానాల్లో, ఉత్తములుగా సంస్కారవంతులుగా, సమాజంలో నిలబెట్టాయి.
మాతృ దినోత్సవం అనేది తల్లితనాన్ని గౌరవించే ఒక పవిత్రమైన సందర్భం. అమ్మ అనే పదాన్ని అపహాస్యం చేస్తున్న ఆధునిక కాలంలో, అమ్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని, ఆమెకు ఆనందాన్ని చేకూర్చి, ఆదర్శంగా మసలే
ఉత్తమ సంతానాన్ని అభినందిద్దాం. తల్లిని గౌరవిస్తూ,
అమ్మ మనసును కనుక్కొని, ఉత్తమురాలైన ఆ తల్లి, ఆశయాలకు, ఆశలకు, అనుగుణంగా జీవించిన నాడు,ఈ భూమి స్వర్గతుల్యమవుతుంది.
ఇది అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తే అద్భుత అవకాశం. ఎందరో ఉత్తమమైన తల్లులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకోవాలి.
ఆకలి కేక వినేసరికి అయ్యో నాయనా వస్తున్నాను ఆగు అంటూ మరుక్షణంలోనే ప్రత్యక్షమై, ఆదరించిన అమ్మ
డొక్కా సీతమ్మ గారు వంటి దయార్ద్ర హృదయులు అయిన తల్లులను, వారి చిరస్మరణీయ సేవలను తలచుకుందాం.
ఈనాటికి ఎందరో తల్లులు మాతృత్వ మమకారంతో , మానసికంగా, శారీరకంగా, నలిగిపోతున్నా, తమ సంతానాన్ని సమున్నత స్థానంలో నిలపడంకోసం, సర్వ శక్తులు ఒడ్డి, పోరాడుతునే ఉన్నారు. అలాంటి మాతృ మూర్తులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం.
మాతృ దినోత్సవ నాడు మాత్రమే మాతృత్వాన్ని, మాతృ మూర్తులని గుర్తిస్తూ, సంవత్సరం పొడవునా సమస్యల
పాల్జేసే కు సంస్కారవంతులైన సంతానానికి ఆ పని ఎంత మాత్రం తగదని, కన్నవారి ఋణం కడదాకా తీర్చుకోలేమని తెలియజేద్దాం. అమ్మను సంతోష పెట్టడానికి సంతానం సహృదయతను కలిగి ఉండాలని విన్నవించుకుంటూ ,
..మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో…
తొంగి చూస్తున్న జాబిల్లి ఇంట్లోకే,
వాయుదేవుని ప్రతిభాపాటవాలతో
వెలుగు లీనుతున్న
ఇంటి పైకప్పు చిల్లులగుండా…!
మెరుపుల తీగలు ఇంటి చుట్టూతా
సిరీస్ బల్బుల్లా ధగధగలాడుతూ
మల్లెపూల దండలా వేలాడుతు
చినుకు చినుకు అతుక్కుని
వసుధను వలపుల మంజరితో అలంకరిస్తుంటే…!!
కుక్కి మంచంలో విరిగిపోతున్న నడుము
అమ్మా అయ్యా అంటుంటే,
పొట్టనే అతుక్కుపోతున్న వెన్నుపూస
గజం లోతుకి వెళ్లిన కళ్ళు
ఏమి చేయలేక!!
తడిసిన చితుకులు
నానిన మెతుకులు
తడిసిన దుస్తులు
ఈ అలమటలతో తలపడి
ఆర్ద్రతలో బతుకుని
అధిగమించి ఆనందంగా గడపాలని !!
జలఖడ్గం విసిరినవల
తెంచాలని తుంచాలని
భారంగా మూసిన మనసు . ...
బ్రతకాలనే కాంక్ష
బ్రతికించాలనే తపనతో
గుండె నిండా స్వప్నాలే
కంటోంది….!!
ఇంతలో దానికదే
హోరు సర్దుకుంది
జడివాన వెలిసింది
పొంగిన వాగులు
ఎగిసిన కెరటాలు
చేరాయి తమ తమ తావులు!!
పచ్చని చేలు
విరబూసిన పూల సువాసన
నాసికను హత్తుకుంటే
మత్తుతో మతిని చిత్తు చేస్తూ…
చల్లని పిల్ల గాలులు మేనిని తాకుతూ
ఎగిరే పక్షుల రావాలు
తిరిగే పశువుల గిట్టెల చప్పుళ్ళు
వీనుల విందు చేస్తుంటే!!
తుడిచిన అద్దంలా
నిర్మలమైన ఆకాశం
మిల మిల మెరిసే తారలతో
వసంతం పూయిస్తుంటే!!
లేవాలనే కోరిక బలీయంగా
అయినా లేవలేక
పై కప్పు పొక్కలోంచి
తదేకంగా చూస్తుంటే !!
బాధంతా బలమై మొలిచింది
వేదన మోదమై
చిలిపిగా చూస్తుంటే
దుఃఖం
సాంఖ్య యోగము వినిపిస్తుంటే
స్వర్గంలో నడయాడుతున్న ట్టు
అనుభూతి!!
ఆహా ఏమి చిత్రం !?
ఈ విచిత్రం ప్రకృతి వైచిత్రి కదా!!
ఇది నా స్వీయ రచన
పాటకు పల్లవి ప్రాణమైతే సినిమాకు మాత్రం పాటే ఆరో ప్రాణం. మాటలు లేని సినిమాలను చూడగలమేమోగాని పాటలులేని సినిమాలను ఊహించలేం. అందుకే కథ, ఇతి వృత్తమేదైనా సరే ,ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో పాటలుం డాల్సిందే! ఆ పాటలు కూడా చక్కని భావుకత తో సాహితీవిలువలతో రూపొందడం వలన సినీగీతం కూడా విశ్వవిద్యాలయాలో ఒక పరిశోధనాంశమ వడం శుభ పరి ణామం.అంతేకాదు తెలుగు పాట ఆస్కార్ పురస్కారం అందుకొని అంతర్జాతీయ వేదికపైన నర్తించడం మరో ముందడుగే!
సాధారణంగా పౌరాణిక,జానపద,సాంఘిక,చారిత్రక చిత్రా లలో ఎక్కువ శాతం పాటల సాహిత్యం ప్రామాణికంగానే ఉంటుంది. అయితే పగ ,ప్రతీ కారం; దొమ్మి,దోపిడి మొద లైన నేరపూరిత(క్రైం) ఉత్కంఠమైన( సస్పెన్స్) సినిమాల లోని పాటలు ఆటవిడుపుగా ఉండటం కోసమే చేర్చడం ఆన
వాయితి. ఇవి ఎక్కువ వాంప్ లేదా క్లబ్ డాన్సర్స్ పైననే చిత్రీ కరిస్తుంటారు.
జేమ్స్ బాండ్ చిత్రాలలో చాలా వరకు కథను కారు ఛేజింగ్ లతో వేగంగా నడుపుతుంటారు కాబట్టి పాటలు స్పీడ్ బ్రేకర్లు గా భావించే నిర్మాత దర్శకులు కూడా ఉం టారు. అయితే మన తెలుగు చిత్రాలకు సంబంధించినంత వరకు గౌతమ
బుద్ధుని గాథ తో తీసిన సినిమా లో సైతం డ్యుయెట్స్ ఉంచి తేనే వసూళ్ళ వుతాయని భావించి ఔచిత్య అనౌచిత్యాల జోలికి వెళ్ళకుండా పాటను పల్లకిలో ఊరేగిస్తారు.
కొంతమంది సాహితీ అభిరుచిగల నిర్మాతలు దర్శ కులు మాత్రం క్రైం చిత్రాలలో సైతం కల కాలం విన దగిన పాట లు రాయించి, మంచి సంగీతాన్ని జోడించి పాటకు పట్టం కట్టారు.
కావ్యవిలువలంటే ..
“కావ్యం యశసే అర్థకృతే వ్యవహారవిదే
శివేతరక్షతయే సద్యః పర నిర్వృతయే కాంతాసమ్మితయోపదేశయుజే.” కావ్యం యశస్సు కొరకు, ధనసంపాదన కొరకు, వ్యవహార ఙ్ఞానం కొరకు, అమంగళ పరిహరణం కొరకు, మోక్ష సాధనకొరకు, కాంతా సమ్మిత మైన ప్రభోధం కొరకు –అని మమ్మటుడు “కావ్య ప్రకాశం “లో కావ్య ప్రయోజనాలుగా పేర్కొన్న అంశాలే ఆ ధునికకాలంలో స్థూలంగా సాహితీవిలువలు గా పరిగణించవచ్చని విమర్శ కుల మాట.
గీతం కూడా సాహితీ ప్రక్రియే కాబట్టి సినీ గీతాలు కూడా విలువలు కలిగివుంటాయి.. అయితే , పక్కా కమర్షియల్ మాస్ మసాల విభాగంలోకి వచ్చే క్రైం సినిమాలలో సైతం సంగీత సాహిత్య విలువలతో కూడిన పాటలుండటం విశేషం.
సినిమా చరిత్రలో 1962లో వచ్చిన డాక్టర్ నో ది ఫస్ట్ ‘ తొలి జేమ్స్ బాండ్ సినిమా. 1958లో ఇదే పేరున ఇయాన్
ఫ్లెమింగ్ రాసిన నవలాధారంగా వచ్చిన చిత్రమిది. Terence Young డైరెక్ట్ చేయగా..Harry Saltzman, Albert R. Broccoliలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ నటించారు. హాలీవుడ్
జేమ్స్ బాండ్ స్ఫూర్తి తో తెలుగులోనూ అపరాధ పరిశోధన చిత్రాలు మొదలయ్యాయి.
తెలుగులో సస్పెన్స్ చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్ గా మారిన తొలి తెలుగు చిత్రం లక్షాధికారి(1963) లో పాటలన్నీ ఆపాత మధురాలే. వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో ఎన్.టి.రా మారావు, కృష్ణకుమారి లతో తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మిం చిన ఈ చిత్రం చివరి దాక కూడా విలన్ ఎవరో తెలి యక పోవడం ప్రేక్షకులను సస్పెన్సులో ఉంచు తుంది.ఈ సిని మాలో కొసరాజు, ఆరుద్ర, సి.నారా యణరెడ్డి పాటలు రాశారు.ఈ ఏడు పాటలలో డా.సి.నారాయణ రెడ్డి గారు రాసిన “మబ్బులో ఏ ముంది మనసులో ఏముంది” all time hit గా జనాదరణ పొందింది
మబ్బులో ఏముంది…
నా మనసులో ఏముంది?
మబ్బులో కన్నీరు..
నీ మనసులో పన్నిరు.
సాహిత్యం మొత్తం ప్రశ్న –సమాధానం లో సాగటం ఒక విశెషం. ప్రకృతిలోని అంశాలను నాయిక ప్రశ్నిస్తే అవే అంశాలతో నాయకుడు జవాబివ్వడం ఓ చమత్కారం .ఇలా రాయడమో శిల్పం! ప్రతి చరణం అంత్యప్రాసతో
నిర్మించడం గజల్ రచనా విధానాన్ని తలపిస్తుంది. చివరి చరణంలో “ఆత్రేయుడి“(చంద్రుడు) ముద్ర కనిపిస్తుంది. టి.చలపతిరావు మధ్యమావతి రాగంఆధారంగా జానపద శైలిలో స్వరపరచగా ఘంటసాల సుశీల పాడిన ఈ గీతం స్వరమధురిమకు ,లయచతురిమకు నిదర్శనం.
విజయ సంస్థ వారు 1965 లో తీసిన ‘సి.ఐ.డి.’ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలే! పింగళి రాసిన పాటలకు ఘంట సాల సంగీతం అందిం చారు. ఈ చిత్రంలోని “నా సరి నీవని“, “నిను తలచిన నిముషమున” పాటలు ఎంతో జనా దరణ పొందాయి. పింగళి సాహిత్యంలో శబ్దాలంకారిక సౌందర్యంతో పాటు అలతి పొలతి పదాలతో కూర్చిన విధం
హృద్యం! సి.ఐ.డి .పక్కా క్రైం చిత్రం కాదు.
.ఉస్తాదోంకె ఉస్తాద్ (1963) హిందీ చిత్రానికి రీమేక్ గా ఎస్.డి. లాల్ దర్శకత్వంలోతీసిన“మొనగాళ్ళకు మొనగా డు (1966) సినిమాలో మూలచిత్రంలోని రఫీ పాడిన” సౌ బార్ జనమ్ లేగే“బాణీని యథా తథంగా తీసుకొని పి.బి. శ్రీనివాస్ తో పాడించిన ” “నేనున్నది నీలోనే..నీవున్నది నా లోనే” గీతం విలువైనదే.
1966లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వం కృష్ణ జయ లలిత హీరో హీరోయిన్లుగా, డూండీ నిర్మించిన తొలి తెలుగు గూఢచారి చిత్రం “గూఢ చారి116′ లోని పాటలన్నీ హిట్ అయ్యాయి.సి.నా.రె.రాసిన“ఎర్రాబుగ్గలమీద మనసైతే” పాటను జానపద శైలి లో రాశారు. ఆరుద్ర రాసిన “పడి లేచే కెరటం చూడు! పడుచుపిల్ల బింకం చూడు!” గీతం లో
“వెన్నెల విరిసే వేళా… వన్నెలు మెరిసే వేళా చందమామ పరుగులు చూడు… చల్లగాలి ఆరడి చూడు/పరులెవరూలేని చోటా… పరు వాలు పూచే చోటా తరుగుతున్న కాలం చూడు ,పెరుగు తున్న ఆశలు చూడు..ఇలా “చూడు” అనే క్రియా పదాన్ని అంత్యపదంగా వేసి ఏమేమి చూడాలో ఎలా చూడాలో ఆరుద్ర కలం చూపించింది.ఇదే చిత్రంలో సి.నా .రె రాసిన “నువ్వు నా ముందుంటే” పాట కలర్ లో చిత్రీకరిం చబడింది. చిత్రంలోని ఒక భాగం కలర్ లో చిత్రీకరించిన చిత్రాలలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.గూఢచారి116 వాణిజ్యపరంగా, సంగీత సాహిత్య పరంగా భారీ విజయం సాధించి, అనంత రం వెలువడిన తెలుగు గూఢచారి సినిమా సీక్వెల్స్ గూడచారి 116 (1966), జేమ్స్ బాండ్ 777 (1971), ఏజెంట్ గోపి (1978), రహస్య గూడాచారి (1981) మరియు గూడచారి 117 (1989)సినిమాలకు మార్గం వేసింది.
ఎస్.డి.లాల్ దర్శకత్వంలొ రామకృష్ణ,గీతాంజలి హీరో యిన్ లుగా తీసిన ” హంతకులొస్తున్నారు జాగ్రత్త“(1966) చిత్రంలోని పాటలను సి.నా.రే లలితభావాలతో రాయగా విజయ కృష్ణమూర్తి ఆపాత మధురంగా మలచారు. ఈ సినిమాలో
పల్లవించిన భావాలు పరిమళించెను ఈనాడు“
అమ్మాయీ నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి“
“మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు, “దిగి రావ య్యా ఓ
దేవా ” మొదలగు పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
1967 లో ఎ.వి.ఎం వారు ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శ క త్వంలో తీసిన ‘అవేకళ్ళు“తెలుగులో విడుదలైన తొలి హారర్, సస్పెన్స్ కలర్ చిత్రం. కృష్ణ, కాంచన హీరో హీరో యిన్లు గా నటించిన ఈ సినిమాలో కొసరాజు, రాసిన“డుం డుం గంగిరెద్దు దాసరోడొచ్చాడు,/మా ఊళ్లో ఒక పడుచుంది దయ్యమంటే భలే భయమన్నది” మొదలైన పాటలు ప్రజాదరణ పొందాయి.
1968 నుంచి సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాలు ఒక దశాబ్ద కాలం వరకు వెల్లువలా వచ్చాయి.
ఈ సినిమాలెంత ఊపందుకున్నాయంటే చివరికీ కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యమిచ్ఛి నటించే అక్కినేని నాగేశ్వ ర రావు సైతం రివాల్వర్ ధరించి జమీందార్ ‘,’బందిపో టు దొంగలు‘,’ అదృష్టవంతు లు‘ మొదలైన సినిమాల్లో హీరో చితంగా నటిం చేంత వరకు.ఎన్.టి.రామారావు సైతం పౌ రాణిక పాత్రల కు స్వస్తి చెప్పి ‘నేనే మొనగాణ్ణి‘ ‘భలే త మ్ముడు: మొదలయిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించి చివరివరకు కొనసాగించారు.
కృష్ణ నటజీవితాన్ని మలుపుతిప్పినవి క్రైం యాక్షన్, చిత్రా లే! హాలీవుడ్ నటులైన సీన్ కానరి,రోజర్ మూరె, వలె టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా పేరు గాంచా డు.
కృష్ణ కాంచన నటించిన ‘నేనంటే నేనె‘ చిత్రం
(1968) లోని యస్.పి.కోదండపాణి సంగీతంలో పాటలన్నీ హిట్టయినవే.సి.నా.రె రాసిన “ఒకే ఒక గులాబికై వాలిన
తుమ్మెద లెన్నెన్నో ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నె న్నో.”కొత్త అభివ్యక్తు లతో ఉన్పది. కొసరాజు జానపదం ‘అంబవో శక్తి వహో” తో పాటు కాంచన ను ఆటపట్టిస్తు కృష్ణ పాడే ‘ఓ చిన్నదాన నన్ను విడిచి’ టీజింగ్ సాంగ్ సూపర్ హిట్ అయింది .ఈ పాటలో “గుంతలకిడి గుమ్మా’ (గానం–ఎస్.పి.బాలు) ప్రయోగం తమిళ చిత్రం ‘నాన్’లో ఉండటం విశేషం. ఈ సినిమా లోనే కాంచన, విలన్ కృష్ణంరాజును కవ్విస్తూపాడే గీతం ‘నువ్వే నువ్వే నన్ను చేరుకోవా’ గీతంలో సి.నా.రె.పద చిత్రాలు భావకవితాసాంద్రమైనవి.
ఒక చరణం లో
“సెలఏరులాగ వస్తా..అల లాగ నినుపొంగిస్తా
చెలరేగి పొంగిస్తా..ఆ..చిన్నారి రాజా
మబ్బులపానుపు కావాల..మల్లెలదిండులు కావాల? ” అని రాశారు.
అక్కినేని నాగేశ్వరరావు,జమున నటించిన
బందిపోటు దొంగలు (1968)చిత్రానికి పెండ్యాల ఆపాత మధురమైన సంగీతం అందించి సాహిత్యానికి పీట వేశారు. కె ఎస్ ప్రకాశ్ రావు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కథా చిత్రంలో సి.నా.రె.రాసిన ” విన్నానులే ప్రియ‘ గీతంలో
“కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు
“చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల” వంటి అలంకారిక అభివ్యక్తులు
అలరిస్తాయి. ఇదే చిత్రంలో దాశరథి రాసిన
“విరిసిన వెన్నెలవో?పలికిన కోయిలవో” లలిత
పదాల పోహళింపుతొ వండిన ‘పొంగళి!
అక్కినేని నటించిన మరో క్రైం చిత్రం అదృ ష్టవం తులు(1969) సూపర్ హిట్టయింది.
ఇందులో ‘అయ్యయ్యో బ్రహ్మయ్య,”చింతచెట్టు చిగురు చూడు, మొదలైన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి.అయితే పెళ్ళయిన కొత్త జంట కోసం “కోడికూసే జాముదాక తోడురారా చందురూడ” పాటలో ఆత్రేయ “చంద్రుడిని కళలు తెలిసిన చందురూడ అని, మత్తు తెలిసిన చందూరుడా తీపి చూపుల చందురూడ” అని రకరకాలుగా సంబోంధించారు.
ఎన్.టి.ఆర్. ద్విపాత్రా భినయం చేసిన “భలేతమ్ముడు‘చిత్రం హిందీలోని “చీనా టౌన్“కు రీమేక్. ఇందులో తొలిసారి మహమ్మద్ రఫి
అన్ని పాటలు పాడించడం విశేషం. చాలా పాటలు హిందీ బాణీలను అనుసరించినప్పటికీ
‘నేడే ఈనాడే ” ఈ పాటను స్వతంత్రించి మధు రంగా స్వరపరచారు టి.వి.రాజు. ఇందులో
ఒక చరణంలో.
” మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదనూ
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదనూ” అని నాయిక తెలి యజేసిన విధానం కావ్య పరిభాషే.
కృష్ణ,విజయనిర్మల నటించిన“టక్కరిదొంగ
చక్కనిచుక్క” కె. ఎస్. ఆర్. దాస్ దర్శకత్వంలో వచ్చిన కౌబాయ్ తరహా చిత్రం.ఇందులో కృష్ణ
ద్విపాత్రాభినయం చేశాడు. సత్యం మ్యుజికల్
హిట్ చేసిన ఈ సినిమాలో దాశరథి రాసిన
” కలలు గనే కమ్మని వయ్యారి” సినారె రాసిన
” నీ నడకలు చూస్తే మనసవుతుఃది ” పాటలు
క్లాస్ ను మాస్ ను అలరించాయి. .
కె.ఎస్.ఆర్.దాస్ 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా నిల బెట్టడంతోపాటు తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా ను హిందీలో ” రాణి మేరా నామ్” పేరుతో పున ర్నించారు. రౌడీరాణిలో శ్రీశ్రీ రాసిన అంత ర్నాటక గేయం” మన దేశంలో ఉన్నారు మహానుభావులు” వస్తువు పరంగా ఎంతో విలువైంది. ఆ తరువాత కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పద్మాలయా పతా కంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ‘మెక్‌న్నాస్ గోల్డ్’ చిత్రం ఆధారంగా రూపొందించిన ‘మోసగా ళ్లకు మోసగాడు’ దేశానికి మొట్ట మొదటికౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టిం చారు. దర్శకునిగా దాస్ కి, హీరోగా కృష్ణకు ఎనలేని కీర్తిని అందించటం.. వీరి కాంబినేషన్ ఓ స్పెషాలిటీగా పేరుపొందటం విశేషం. అనంతర కాలంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ఆరుద్ర కథ మాటలు పాటలు రాశారు. పాటలలో ప్రధానంగా
“కోరినది దరిచేరినది.. ఆహా.. ఎదలు ఒకటాయే
కోరినది నెరవేరినది.. ఒహో.. కలలు నిజమాయే
పాట చెప్పుకోదగ్గది.
తొలివలపే మధురసము..
మన బతుకే పరవశము
పూలతోటలై నా అందాలు పూచేనులే
తనివి తీరగా మకరందాలు గ్రోలేనులే..అని ఒక
చరణంలో
రాగబంధమై పెనవేసుకున్నానులే
మూగకోరిక నే తెలుసుకున్నానులే అని మరో చరణంలో రాశారు.ఆదినారాయణరావు
పాశ్చాత్యబాణీలతో చక్కగా అందించి హిట్
చేశారు.తరువాత కెఎస్‌ఆర్ దాస్ –కృష్ణ కాంబినేషన్‌లో పలు యాక్షన్ చిత్రాలు, దొంగలకు దొంగ, దొంగలకు సవాల్ వంటి కౌబాయ్ చిత్రాలు రూపొందాయి
1969లో ఐ ఎన్ మూర్తి దర్శకత్వంలో నిర్మించిన –జగత్ కిలాడీలు. ఈ చిత్రానికి ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయిత విశ్వప్రసాద్ కథ, మాటలు సమకూర్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన పాటలు “ఎగీరేపావురమా” మరియు “వేళ చూస్తే సంజే వేళ ” పాటలు క్రైం సినిమాల పై గౌరవాన్ని పెంచేవిధంగా ఉన్నాయి.తరువాత తీసిన జగత్ జెట్టీలు (1970), జగత్ జంత్రీలు (1971) చిత్రాలలోని పాటలు
కూడా ఎన్నదగినవే..చలం నిర్మించిన “బుల్లెమ్మ బుల్లోడు” లో ని పాటలన్నీ విలువలున్నవే.ముఖ్యంగా దాశరథి గారు రాసిన “అమ్మ అన్నది ఒక కమ్మని మాట” అమ్మ ఔన్నత్యాన్ని తెలియజేసింది. ఇందులో ” దేవుడే లేడను మనిషున్నాడు..అమ్మే లేదనువాడు అసలే లేడు” అన్న పంక్తి ఆక్షరలక్షల విలువ చేస్తుంది. ఇదే సినిమాలో రాజశ్రీ రాసిన ” కురిసింది వానా నాగుండెలోన నీ చూపులే జల్లుగా” పాట ఈనాటికి జనరంజకంగా నిలిచింది.
హిందీ లో విజయవంతమైన ” ఇంత కామ్” సినిమాను వి.రామచంద్రారావు దర్శకత్వంలో శారద,హరనాథ్, లతో తీసిన “పగబట్టిన పడుచు“చిత్రంలోని పాటలన్నిటిని సంగీత దర్శకుడు ఎం.రంగారావు మ్యూజికల్ హిట్ చేశారు.ఒక పాట మినహా మిగతాపాటలన్నీ హిందీ బాణీల ననుసరించి చేసినవే,కానీ సి.నా.రే.పాటలను భావుకతతో రాశారు.ఈ సినిమాలో “రా రాదా“(ఆ జానే జా ఆ మేరాఏ హుస్న్ జవా– ఇంత కామ్ ) “ఏనీడలో ఏమున్నదో“(మెహఫిల్ సోయీ ..ఐసా కోయీ– ఇంతకామ్). )
“ఏవో మౌనరాగాలు,ఏవో మధుర భావాలు” &
“చిరునవ్వు వెల ఎంత మరుమల్లె పూవంత “
యుగళగీతం సాహితీ పరిమళభరితాలు. జానకి పాడిన “ఓయబ్బో నిషాలో ఉన్నానని ఉలికిపడు తు ఉన్నావా” ( కైసె రహు చుప్ కెమైనే పీహె క్యా హై– ఇంతకామ్) పాటను శారద చిత్తుగా తాగి మత్తుగా అభినయిస్తుంది.
1971 లోనే కె.వి.నందనరావు దర్శకత్వంలో
యస్ వి ఆర్ టైటిల్ పాత్రగా తీసిన ‘రౌడీ రంగడు” చిత్రం లో “కనకమేడల ” కలం నుంచి వెలువడిన
“మౌనముగా కూకుండి చూసేవు..కొంటెతనమా‘
గీతం పరిగణించదగ్గదే. సంగీతం. ,బి.గోపాలం సంగీతంలో ఘంటసాల ఎంతో హుశారుగా పాడారు.
జానపద చిత్ర దర్శక బ్రహ్మ బి.విఠలాచార్య నిర్మాతగా కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తీసిన “సి.ఐ.డి.రాజు ‘ సిని మా లో డా.సి.నా.రె.రాసిన పాటలలో “నేనే లే ! పిలుపు నాదేలే !” మరియు “మనసైన ఈనాటి రేయీ.” పాటలను ఎంతో ఆపాత మధురం గా స్వరపరచారు సత్యం.
1972 లో ఇన్స్ పెక్టర్ భార్యలోని “రాధను నేనైతే” ,కిలాడి బుల్లోడు లోని “నిన్ను చూసీ ఈ లోకం చూస్తే అన్ని వైపులా అందాలే” మొదలైన పాటలలోభావచిత్రాలున్నవే..
ముఖ్యంగా సస్పెన్స్ చిత్రం గూడుపు ఠాణి (1972)లో దాశరథి గారి “తనివి తీరలేదే పాట‘ సార్వకాలికమైన గీతం గా వర్ణించ బడింది. ” ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామె” వంటి అలంకారిక ఆభివ్యక్తి అలరిస్తుంది.
గిడుతూరి సూర్యం దర్శకత్వంలో తీసిన ” పంజ రంలో పసిపాప‘(1973)క్రైం చిత్రం లో గోన విజయ రత్నం రాసిన ” కలం నుంచి వెలువడిన “ఓపచ్చని సంసారం మన చక్కని అనుబంధం” గీతాన్ని ఎస్.హన్మంత రావు హిందీ బాణి “ఓ నీలేగగన్ కే తలే“(మహేంద్ర కపూర్– హమ్ రాజ్)
ఆధారంగా స్వరపరచారు.ఇదే సిన్మాను హిందీలో ” హిమ్మత్
వాలి” పేరున డబ్బింగ్ చేయగా మన్నా డే , వాణీజయరాం తో “మస్తి లుఠాయే హమ్” అని పాడించటం విశేషం
1973-74 లో గుండెలు తీసిన మొనగాడు,నిప్పు
లాంటి మనిషి, (1975 )నుంచి క్రైం &యాక్షన్ చిత్రాల జోరు అకస్మాత్తుగా తగ్గింది .
కాంతారావు నిర్మించిన గుండెలు తీసిన మొనగాడు క్రైం థ్రిల్లర్ చిత్రం.. ఇందులో ” ఓ అల్లరి చూపుల కవ్వించే అందాల నా చెలీ” పాట( గానం: బాలు,రమోల ) మంచి మెలోడి పాట..
.1975 లో 66 సినిమాలు విడుదలకాగా ఎన్.టి.ఆర్ .నటించిన ‘ఎదురులేని మనిషి‘,చిత్రం మాత్రమే క్రైం చిత్రం. గా వచ్చింది.వైజయంతి మూ వీస్ వారి తొలి చిత్రమిది. హిందీ లో దేవానంద్ నటించిన “జానీ మేరా నామ్“చిత్రానికి రీ –మేక్ ఇది. అయితే ఈ చిత్రం తోనే ద్వంద్వార్థం తో ధ్వనించే సాహిత్యం నుంచి సరాసరి అశ్లీలభావ గీతాలకు నాందీ పలికిందని చెప్పాలి. ” కసిగా ఉంది కలువక కలువక కలిసినందుకు కస్సు మంటుంది” అని ఆత్రేయ కలం విజృంభించింది.అంతకు పూర్వం క్రైం చిత్రాలలో కేవలం హలం, జ్యోతిలక్ష్మి ,ప్రభృతులపై డాన్స్ కోసం చిత్రించే క్లబ్ సాంగ్స్ లో మాత్రమే కాస్త‘మసాల ‘వుండేది.
ఎన్.టి.ఆర్ నటించిన ఎదురులేని మనిషి, చిత్రం లో హీరో హీరోయిన్ల యుగళగీతాలను సైతం ద్వంద్వార్థాలతో తో రాయడంతో ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలలో పచ్చి శృంగార గీతాల రచన అనివార్యమైనది. దాంతో ” చిలక
కొట్టుడు” పాటలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.1976 లో వచ్చిన ‘నేరం నాది కాదు ఆకలిది‘(హిం ది చిత్రం“రోఠి“) రీమేక్ లోని ” మంచిని సమాధి చేస్తారా ” వంటి పాటలు కథాపరంగా కాస్త ఫరవాలేదని పించాయి.1976 లోనే హిందీలో విజయవంత మైన “ఫకీరా” చిత్రాన్ని తెలుగులో కృష్ణ జయప్రద లతో ‘దొంగలకు దొంగ” పేరిట పునర్ని ర్మిం చారు. ఇందులో “ఎవరేమన్ననూ తోడురాకున్న ను ఒంటరి గాను పోరా !” ఫకీరా చల్ చలా చల్“పాట బాణీని అను సరించి రాసినది.ఈ సినిమాలో నే దాశరథి రాసిన “ఈరాతిరి ..ఓ చందమామ ..ఎట్లా గడిచేది అయ్యో రామ” పాట, ఆరోజుల్లోమధుర గీతంగా రవళించింది.
1978 లో కేడీ నంబర్ వన్,ఏజెంట్ గోపి,, మొద లైన సినిమాలు వచ్చాయి. క్రైం చిత్రాలు ఎంత తెలుగు నాట ఎంత ప్రత్యేక గుర్తింపు పొందాయం టే చివరికి కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు సైతం ఈ ప్రభంజనంలో పడి శోభన్ బాబు ,జయసుధ లతో తీసిన “కాలాంతకులు“(1978) చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం.ఈ సినిమాలో ” కొండా కోన పిలిచింది, కొమ్మా రెమ్మా పిలిచింది” అనే యుగళ గీతం సాహితీ విలువలున్నదే!
1979 సం లోనే కృష్ణ, రజనీకాంత్ నటించిన ‘ ‘ఇద్దరూ అసాధ్యులే సినిమా లోని “చినుకు చినుకు పడుతూవుంటే ” ప్రజాదరణ పొందిన వాన పాటలలో అగ్రగామిగా నిలిచింది.అలాగే అన్నదమ్ముల సవాల్ ‘లోని నీరూపమే నామది” పాట చెప్పుకోదగ్గ మధురగీతం.
యస్.పి.బాలసుబ్రహ్మణ్యం తొలిసారి సంగీతం అందించిన చిత్రం‘కెప్టెన్ కృష్ణ(1979) సినిమా లోని “కల కాలం ఇలా సాగనీ… నీలో నన్నే చూడనీ” పాట మన మనసుల్ని తడిమి తడిపేసే గీతం.ఈ పాట వింటే ఏదో సాంఘిక చిత్రంలోని ప్రణయ గీతమేమో నని అనుకొంటాం. కానీ ఈ పాట కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించిన సినిమా లోనిదంటే కాస్త ఆశ్చర్యం కలుగు తుంది.
1980 నుంచి ఎక్కువగా హిందీ లో హిట్ అయిన
డాన్, అమర్ అక్బర్ ఆంథోని మొదలగు చిత్రాల ను రీమేక్ తీశారు. కానీ తెలుగు చిత్రాలు మ్యూజి కల్ హిట్ కాలేక పోయాయి. కోడి రామకృష్ణ దర్శ కత్వం లో మెగా స్టార్ చిరంజీవి తొలిసారి గూఢ చారి పాత్ర పోషించిన ” గూఢచారి నం 1 ‘ (1983)లో పాటలంతా విజయవంతం కాలేదు . 1984 లో చిరంజీవి నటించిన ‘ఖైదీ‘ చిత్రం తో కథాంశంలో ఫాక్షనిజం మొదలైంది. సినిమాలలో సిఐడి.డిటెక్టివ్ పాత్రలు విలన్ రహస్య స్థావరాలు తగ్గిపోయాయి..సమరసింహారెడ్డి,ఇంద్ర, ఒక్కడు ప్రేమించుకొందాం రా! , మొదలైన సినిమాలు ఇందుకు ఉదాహరణలు.
నాడు క్రైం సినిమాలైనా పాటలు ఆపాత మధురంగా ఆసక్తిగా ఉండేవి.నేడు భక్తి చిత్ర గీతాలలోను విలువల కోసం జల్లెడ పట్టాల్సి వస్తుంది.
నిజానికి ఇదొక సిద్ధాంత వ్యాసానికి సంబంధించిన అంశం.
ప్రస్తుత వ్యాసం విహంగవీక్షణంగా పరిశీలించి రేఖామాత్రంగా స్ప్రశించిన వ్యాసం!
ఏది ఏమైనప్పటికి ఉత్తమ సాహిత్యాభిరుచి గల నిర్మాతలు ,దర్శకులుంటే క్రైం ,జేమ్స్ బాండ్,డిటె
క్టివ్ సినిమా పాటలు సైతం ప్రజాదరణకు పాత్ర
మవుతాయన్నది అక్షరసత్యం..
****0****
మబ్బులు గ్రహణాలు
పట్టని ఇంటి సూర్యుడామే/
పొద్దుచుక్కన ముగ్గు పెట్టి/
సూర్యుడికే స్వాగతం
పలుకుతుంది
ఉదయపు ఉషస్సు/
బద్దకాన్ని తరిమే తేజస్సు/
వంటిల్లే అవధానాల అరుగు/
ఎన్నో కళలు మెళు కువలు/
భూగోళంలా తిరుగుతూనే ఉంటది
అగ్ని పోరాటాలు కత్తి యుద్ధాలు/
నిత్యవిధి కృత్యాలు/
ఎవరికీ భయాలు గాయాలు లేనియుద్ద మిది/
కమ్మని రుచులకు నాంది/
తొందరపాటో ఏమరుపాటో/
ఎప్పుడైనా చిన్నచిన్న గాయాలైనా/
వంటింటి వైద్యం పసుపు చాలు
చిరు చెమటల్లో
వర్షంలో తడిసిన భూదేవి/
పంటసిరుల్లా వంట రుచులు సిద్ధం
ఓర్పు నేర్పు కూర్పు సహజాతం/
ఇంటెడుపని ఆమే సొంతం/
ఇంటిని తీర్చిదిద్దడం సంతోషం/
అల్లరి ఆకతాయిలకు
శాంతి మంత్రం/
అసహనపు పెద్దల చెలిమి గీతం/
అతిథులకు అమ్మరూపం/
ఇంటతనకి ఇంధనం చందనం..
దేశాన్ని కాపాడే సైనికుడిలా/
ఇంటిభక్తి నింపుకున్న ఇల్లాలు/
ఇంటి గుట్టంతా గుప్పిట్లోనే/
కష్టాలు బాధలన్నీ కొంగు చివర ముడిలోనే
అలసిన సూర్యుడు
సంధ్యఒడిలో సేదతీరి/
అలల ఊయల నిద్రించినా/
ఎప్పటికో పడక చేరే
వెండి వెన్నెల/
అమవసలు లేని ఇంటి చంద్రుడామె
