మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

కపటం – కాలనాగు

by Krishna Kolanpaka September 28, 2026
written by Krishna Kolanpaka

కపటం కాలనాగై
కాటేస్తున్నది సమాజాన్ని
హద్దులు లేని మోసాలు
కలచివేస్తున్నవి ఎందరినో !

అనంతకోటి ఉపాయాలు
చిత్రవిచిత్ర పోకడలు
అంతుచిక్కని వలలు
అడుగడుగునా మోసాల జాడలు

లేచింది మొదలు
ఎక్కడి నుంచో వల విసురుతోంది కపటత్వం
ఎవరి విషకల్పనలో
ఎవరి దుర్మార్గాలో
మన వివేకం ఎట్లా బందీ అవుతుందోనని
ఎవరూ చెప్పలేని కాలమిది

కల్తీ పాలు కల్తీ సరుకులు
ఆన్‌లైన్ మోసాలు
కపటాల ముళ్లు పేరుస్తున్నది
లోన్ల పేరుతో
పెట్టుబడుల పేరుతో వలలుపన్నుతున్నది

అధిక వడ్డీ ఆశ చూపించి
అదను చూసి పంజా విసిరే
ధన రక్తం రుచి మరిగిన మానవ వ్యాఘ్రాలు

అమాయకులను మింగే తిమింగలాలు
అమ్మాయిల పాలిట రాక్షసులొకవైపు
మరోవైపు…
విషకన్యలుగా మారిన కొందరు—
విలువలు మసకబారిన
నవ్య సమాజపు ప్రతిబింబాలు

ఎత్తుకు పైఎత్తులు వేసే
గుంటనక్కల మాయాజాలం
ఎదుటివాడి సొమ్మును
సులభంగా కొల్లగొట్టి
స్కాముల సామ్రాజ్యాలు కట్టే
కపట నటులు
కాలం కఠినం..
కంచే చేనును మేసే
నమ్మకద్రోహుల మధ్య
సాగిస్తున్నాం జీవనం

దురాశ దుఃఖానికి మూలమనెందుకన్నారో…

సమయస్ఫూర్తి కవచంతో
వివేకమనే ఖడ్గంతో మనలోకి మనం అవలోకనం చేద్దాం
విశ్లేషణ శక్తి విజయాయుధమవ్వాలి

ఎక్కడి నుండి ఏ రూపంలో వస్తాయో ఈ ప్రమాదాల పన్నగాలు
పన్నాగాలు పన్నే
కపటాల కాలనాగులను జయించాలంటే
అప్రమత్తతే ప్రతి మనిషి ఆయుధం
నిజాయితీ ఒక్కటే నిశ్చల కవచం
జాగృత సమాజానికిది తెలవాలా?
తెగువ మనదైతే
తెలివి బహుముఖాలు!

September 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చెదిరిన గూడు

by Radhika Suri September 28, 2026
written by Radhika Suri

మేఘ సౌధాలు అయస్కాంతంలా
ఆకర్షిస్తుంటే!

నిజవాసానికై తపించిన సామాన్యజనుల
పేరాశ పెడదారిపట్టి
భూ బకాసురుల
అక్రమ కట్టడాల
వలయంలో చిక్కి
కూల్చివేత పర్వంలో
గల్లంతైన చిరునామాలతో దిక్కుతోచక
గగ్గోలు పెడుతుంటే …

సర్కారు హుకుంతో
హైడ్రా అత్యుత్సాహపు ఆగడాలకు గూడు చెదిరి
రోడ్డునపడ్డ జనావళి
భీతావహులై
చేస్తున్న ఆక్రందనలు ఆకాశాన్నంటగా…
న్యాయస్థానం ఏలుబడిపై
కన్నెర్ర చేసిందట !

ఎపిగ్రఫీ గ్రాఫుల రూపం మార్చుకుని పాలనాపగ్గాలు
చేతబట్టిన వారి
పాదాక్రాంతమౌతుందట!

ఆశతోనో అవసరంతోనో
కబ్జాల రాబందు పాలబడ్డ ఆకాంక్షాజీవులే అందరూ!

ఆవాసాలు నేలమట్టమై
నిలువ నీడలేక
కన్నీటి నిప్పుల మడుగులో అంగలార్చేవారు కొందరు!

అందినంత దండుకుని
గుంపులో గోవిందా !
అంటూ కిక్కురుమనక
మరికొందరు

కథకంచికి చేరకముందే…
చట్టం లొసుగులు సవరించుకుని బలహీనుడి కంటి
వెలుగైతే శాసనమావర్ధిల్లు !అంటూ
పీడిత జనం
న్యాయ దేవత ముందు మోకరిల్లదా!

  
September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మౌనానంద స్వామికి జై

by రంగరాజు పద్మజ September 28, 2026
written by రంగరాజు పద్మజ
 ఇద్దరు స్నేహితులు కలిసి హార్సిలీ హాల్స్ కు  విహారయాత్రకు బయలుదేరారు. మధ్యమధ్యలో బంధువులను కలవడం, అతిధి మర్యాదలు పొందడం వారిచ్చిన కట్నకానుకలు తీసుకుని ఆనందంతో సంబరంగా ప్రయాణమంతా సాగింది. తిరుగు ప్రయాణంలో చాలా దూరం డ్రైవింగ్ చేసిన తర్వాత అలసట ఇద్దరిని చుట్టేసింది. ఒక పెద్ద చెట్టు నీడలో వాహనం ఆపి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
  దయానంద్ కారు దిగి వెన్నునొప్పి తగ్గాలని, యోగి లాగా ఆసనం వేస్తూ చేతులు చాచి, వంగి నిలబడ్డాడు. అదే సమయంలో అతని స్నేహితుడు దేహబాధలు తీర్చుకోవడాని పక్కకు వెళ్ళాడు. కొంతసేపటికి  వచ్చి “ఒరేయ్ బాబా… లేవరా…  ఆలస్యం అవుతుంది బయలుదేరుదాం!” అని కేక పెట్టాడు.

ఆ మాటలే అతని పాలిట అపశకునమయ్యాయి.

అంతలో అక్కడే పొలాల్లో పనిచేసే కొందరు కూలీలు ఆ వైపు పరుగెత్తుకుంటూ వచ్చి, వంగి ఉన్న దయానంద్ కు నమస్కరించారు. అకస్మాత్తుగా వారు తనకు దండాలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాలేదు. ఇంతలో దయానంద్ నోరు తెరచేసేలోపే, ఇంకొకడు గభాలున తనదగ్గరున్న మూడు అంగుళాల పొడగున్న చిన్న త్రిశూలాన్ని మౌనానంద బాబాకీ జై!బాబాకీ! జై! అంటూ అతని నాలుక మీద గుచ్చేశాడు.
ఒక్క క్షణం! దయానంద్ కు ఏమీ అర్థంకాలేదు! నాలుక నొప్పి! నోరు తెరిచి మాట్లాడుదామంటే అడ్డంగా త్రిశూలం. అప్పటికప్పుడు మూతి వాచిపోయి ముఖం గుర్తుపట్టరాకుండా అయ్యాడు. నొప్పి… కంట్లో నీరు… మాట రాని స్థితి. చేతులతో సైగలు చేస్తూ విలవిలలాడుతున్నాడు. లేవనివ్వకుండా అరడజను చేతులు అతని కాళ్ళను గట్టిగా పట్టుకున్నాయి…. వదలండీ! వదలండనీ అరవలేక సైగలు చేస్తున్నాడు.
వెంట వచ్చిన స్నేహితుడిని ఈ గుంపు వెనక్కి నెట్టేసింది. ఆ గోలలో అతను అరచి చెప్తున్నాడు అతను బాబాకాదు! ఏమీ కాదు! వదలండీ! నా స్నేహితుడని ఎంత అరుస్తున్నా వారు వినిపించుకోలేదు. అక్కడున్నవారు *ఇదో కొత్త నాటకం రేపు బాబాకు వచ్చే డబ్బులు , కానుకలు కాజేద్దామనీ వీడి కుట్ర… వీడిని లాగి అవతల పారేయండని స్నేహితుడిని ఒక్క తోపుతోసారు. అతను చేసేది ఏమీ లేక దగ్గరున్న పోలీసులకు ఫిర్యాదు చేద్దామని పట్టణానికి బయలుదేరాడు.

అంతలోనే ఆ గుంపులోంచి ఓ గొంతు లేచింది.

“సైగల బాబాకు జై! సైగల బాబాకు జై!”అని ఆ ప్రాంతమంతా జయజయ ధ్వానాలతో మారుమోగింది. దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు దయానంద్. చెట్టు కింద రాళ్లు పేర్చి గద్దెలా తయారుచేసి, దయానంద్‌ను దానిమీద కూర్చోబెట్టారు. “చూశారా! ఇంత నొప్పిలోనూ ఎవరికో భవిష్యత్తు చెప్పాలనుకునే మహాత్ముడు!” అని పొగడ్తలు మొదలయ్యాయి.
ఆ మగతలో కూడా దయానంద్‌ కు కోపం తారాస్థాయికి చేరుకుంది. నా భవిష్యత్తే నాకు తెలియడం లేదు … “నేను ఇంకొంకడికి చెప్పడమేమిటి? నా బొంద, నేను చెట్టు కింద ఆసనాలు వేయడమే నేరమా? ఎవరైనా ఈ త్రిశూలం తీస్తే బాగుండును”… అని అనుకుంటున్నాడు. కానీ మోటుగా లాగితే మరింత ప్రమాదమని, సెప్టిక్ అయితే ఏమవుతుందో అన్న భయంతో మాట్లాడలేక మౌనంగా ఉన్నందుకే అతనికి కొత్త పేరు పెట్టేశారు—మౌనానంద స్వామి అని.

ఇంతలో స్నేహితుడు ఎక్కడ? అని కళ్లతో వెతికాడు. అక్కడ కనబడలేదు. ఒంటరితనమూ, నాలుక నొప్పీ, తలంతా నొప్పి కలిసి అతన్ని నలిపేస్తున్నాయి. ఏమీ చెప్పలేని మౌనం చూసి, “లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్న మహానుభావుడు” అని జనాలు మరింత నమ్మేశారు. భజనలు మొదలయ్యాయి.
ఒక ముసలమ్మకు ఒక ఆలోచన వచ్చింది. చుట్టు పక్కల తిరిగి రుద్రాక్ష కాయలు ఏరుకుని వచ్చి దండ గుచ్చి బాబా మెడలో వేసింది. ఆ దండ వల్ల అతనికి ఒకటే దురద పుట్టింది! అతని చేతులు గట్టిగా పట్టుకోవడం వల్ల దురదోపశమనం చేసూకోలేకపోతున్నాడు.

మళ్లీ—జయజయ ధ్వానాలు. మౌనానంద స్వామీకి జై అంటూ….

కోపం… బాధ… అసహనం… దయానంద్
గుడ్లురిమాడు. వదలండి అనే అతని సైగలు అర్ధంకానీ ఆ మూఢులు అది కలి ప్రభావమనీ విపరీత పనుల మీద బాబాకు కోపం వచ్చిందని మొదట గుసగుసలాడిన జనం ఇక పైకే అనడం మొదలు పెట్టారు.
ఆఁ….. బాబాకు కోపం వచ్చిందంటే రాదా? ఆ ఫలానా పిల్ల తను ప్రేమించిన వాడికోసం భర్తను గొడ్డలి పెట్టి నరికి- ఇంటి దగ్గరే ప్రేమికుడి సాయంతో గోతిలో పాతిపెట్టి , పైన నున్నగా ఎవరికీ తెలియకుండా ఉండాలని సిమెంటు గచ్చు చేసిందట! మరి అంతటి అన్యాయాలను బాబా చూసి తట్టుకుంటాడా ? వస్తది! కోపం రావడం సహజమే అంటున్నారు.
బాబాకు కోపం ఎక్కువ అవుతుందేమోనని, పక్కనే పారుతున్న వాగులోంచి నీళ్లు తెచ్చి కుమ్మరించింది ఒక భక్తురాలు. చల్లటి గాలి, చల్లని నీళ్లు… వణుకు పెరిగింది. నోట్లో త్రిశూలం బాధ మరింత పెరిగింది. చూస్తుండగానే జనం బాగానే పెరిగారు. బాబా ఆగ్రహం తగ్గాలని దండకాలు, శ్లోకాలు, కరావలంబ స్తోత్రాలు అసలు ఒక్కటేమిట? నోటికొచ్చిన పద్యాలు చదవడం మొదలుపెట్టారు. రణగొణ ధ్వనితో దయానంద్ చెవులు దిబ్బడ పడ్డాయి.. ఎవరో కుంకుమ తీసి నుదుట పెద్ద బొట్టు పెట్టారు.
నిమిషాల్లోనే దయానంద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. లోలోపల నిజంగానే కోపం వస్తున్నది దయానంద్ కు…అరే! చెప్పింది వినిపించుకోరు! చెప్పనివ్వరు! తన ముఖంలోని కోపాన్ని చూసి పైనుండి ఈ లాంటి వ్యాఖ్యానాలు.. ఏం చేయాలో పాలు పోవడంలేదు!

ఫోన్లు మొదలయ్యాయి—“ఇక్కడ చెట్టు కింద మహిమగల బాబా వెలిశాడు!” అని ఎవరికో చెబుతున్నారు.

నమ్మకాలెక్కువున్న ఓ ఆచారమ్మ భక్తిప్రదర్శనలో ప్రథమశ్రేణిలో ఉండే ఆ మహా తల్లి పులిహోర, పానకాలతో అక్కడికి వచ్చింది.
ఆ గుంపులో ఉన్న వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ చక్కటి అవకాశం ఎందుకు వదులుకోవాలి? నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు! అని—తన వెంట బస్తా కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, కర్పూరం తెచ్చి… చెట్టుకింద పెట్టాడు. మొదట ఒక కొబ్బరికాయ, ఊదుబత్తీలు, కర్పూరం తీసుకొని బాబా దగ్గరకు వెళ్ళి పూజ చేసాడు అంతే… అక్కడ ఉన్నవారికి ఉత్సాహం ఉరకలెత్తింది… కొబ్బరికాయలు తీసుకోవడం, కొట్టడం…. తీసుకోవడం, కొట్టడం….
తానేం తక్కువ తిన్నానా అని మరొక వ్యాపారి దేవుళ్ల ఫోటో ఫ్రేములు, నల్ల-ఎర్ర దారాలు, తాయెత్తులు, టార్పాలిన్ షీట్… పట్టుకుని అక్కడికి వచ్చాడు.
ఇంకొకడు టీ డబ్బా పట్టుకొని వచ్చాడు. వాడి సంచార చాయకొట్టుతోపాటు, వాడి బావమరిది ఏకంగా మరమరాలు, ప్రసాదాల డబ్బా పట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ బూరలు, బొమ్మలవాడు ఇలా ఎవరి బంధువులకు వారు చెప్పుకుని క్షణాలలో దుకాణాలు వెలిసాయి. కాసేపట్లోనే అక్కడ చిన్న జాతర వాతావరణం ఏర్పడింది.
భజనలతో గొంతులు ఎండిపోయినవాళ్లకు చాయ్ అమృతమైంది. కానీ మౌనానంద స్వామికి నోట మంచినీళ్ల చుక్క కూడా లేదు.
ఇంతలో స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుడు, ఆయనతో పాటు చిన్న- చిన్న నాయకులు… అందరూ అక్కడికి వచ్చారు. అక్కడే బాబాకు గుడి కట్టించమని భక్తులు అడగారు… ఆ నాయకుడు వాగ్దానాలు చేయడాలు జరుగుతున్నవి… ఇదంతా చూస్తున్న స్నేహితుడికి ఏమీ అర్థంకావడంలేదు. తన స్నేహితుడు దయానంద్ ఏడి? అని చుట్టుపక్కల వెతుకుతున్నాడు.
బాధతో కళ్ళు తెరిచిన దయానంద్‌కు స్నేహితుడు కనిపించడు. కోపం నషాళానికి అంటుకుంది. కానీ సైగ చేస్తే— చుట్టూ ఉన్నవారు “దేవుడు పూనాడు!” అంటున్నారు. “ఏంకావాలి సామీ?” అని అడుగుతుండగానే ఒక మహిళ పూనకం వచ్చి ఊగింది— హుహుహు….“అరిష్టం! గొర్రెలు, మేకలు నైవేద్యం!” పెట్టాలి! హుహుహు…. అని పూనకంతో ఊగింది…
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇంతలో కోళ్ళు, మేకలు అక్కడికి తెచ్చారు… వాటిని బలివ్వడం మొదలుపెట్టారు.
ప్రజల మూర్ఖత్వం.. మూఢభక్తిని చూసి దయానంద్‌కు ఇదేం మూఢ భక్తి అని విరక్తి కలిగింది. ఇంతలో ఏదో చెప్పాలని దయానంద్ చేయి పైకి ఎత్తుతున్నాడు.
చూడండి “బాబా ఆశీర్వదిస్తున్నాడు!” అంటూ గుంపుగా వచ్చి మౌనానందస్వామికి జై, మౌనానందస్వామికి జై అని అరుస్తూ చుట్టిమూగారు… తలో మాటా…దండాలు మొక్కులు…గడబిడగా మారింది
…అక్కడ బాబా ఆశీర్వాదం కోసం తొక్కిసలాట మొదలైంది…
ఎవరి కోసం కాలం ఆగదు. స్నేహితుడు దగ్గరలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని వెళ్ళాడు కదా! కానీ ఎన్నికల హడావుడి, గొడవలు, బందోబస్తు కారణంగా ఎవ్వరూ అతని మాటలను పట్టించుకోలేదు. దాంతో తాను ఏమీ చేయలేనని కనీసం డాక్టర్ ను తీసుకొని వెళ్ళి స్నేహితుని నాలుక మీద ఉన్న త్రిశులాన్ని పీకివేయాలనుకున్నాడు. అక్కడ డాక్టర్ అందుబాటులో లేదు.
తానే దయానంద్‌ను తీసుకెళ్లాలని అక్కడికి వస్తే అక్కడ ఒక పెద్ద జాతర జరుగుతోంది.
ఇంతకీ ఏది దయానంద్ అని వెదుకుతున్నారు. “బాబా ఎవరు?” అని అడుగుతూ జనసంద్రములోకి తోసుకుంటూ వెళ్లాడు. దగ్గరికి వెళ్లి చూసేసరికి తన స్నేహితుడిని గుర్తు పట్టలేకపోయాడు. ఆకలి, దప్పి, నొప్పితో బాబా కళ్ళు మూసుకున్నాడు. భక్తులు హారతులు, కొబ్బరికాయలు, భజనలు… యువకవులు పాటలు రాసి పాడి, వీడియోలు తీశారు. స్వరకర్తలు పాటలు యూట్యూబ్ లో అప్పుడే అప్లోడ్ చేస్తున్నారు.
ఆ తొక్కిసలాటను ఎలాగైనా ఆపాలని రాజకీయ నాయకుడు తన పలుకుబడితో పోలీసులను అక్కడికి రప్పించాడు. ఇదే అదను అని దయానంద్ స్నేహితుడు ఆ పోలీస్ అధికారితో జరిగిందంతా చెప్పాడు. ఆ పోలీసు అధికారి అంతా విని అయ్యో! ఇంత అన్యాయం జరిగిందా? అని అతను బాబాకాదనీ, ప్రజల మూఢనమ్మకానికి బలైన ఒక అమాయకుడనీ చెప్పి, కొందరు యువకుల సాయంతో ఆ గుంపును అదపులోకి తెస్తూ… వెనుక నుండి పోలీసులు దయానందన్ ను పక్క ఊరిలో ఉన్న ఆసుపత్రికి తరలించారు!.

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ప్రాణవాయువా? ప్రాణహానియా!

by సుదర్శనం వేణుశ్రీ. September 28, 2026
written by సుదర్శనం వేణుశ్రీ.

కాలుష్య కౌగిలిలో
ప్రకృతి కాంత
గిలగిలలాడుతోంది.

ప్రాణవాయువును ఇవ్వలేకపోతున్నాననని
కన్నీరు కారుస్తోంది.

నదులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
గాలి విషపు వాసనను మోస్తోంది.
భూమి తన గర్భాన్నే తాను భరించలేక
మౌనంగా విలవిల్లాడుతోంది.

అయినా—
అహంకార రాజకీయాలు
కాలుష్యానికంటే
ఎత్తైన గోడలు కడుతున్నాయి.

ప్రాణాలు పోయినా పరవాలేదు
అధికారాలు
చేతులు మారకూడదనే
కపట నీతులు
మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి.

ఉచితాల ఊబిలో
వివేకాన్ని ముంచి,
నటనలతో
నిజాలను కప్పిపుచ్చుతున్నాయి.

నాయకుల మాటల్లో
ప్రాణరక్షణ.
చేతల్లో మాత్రం
ప్రాణహాని.

మూసీ వంటి నదులు
మన నిర్లక్ష్యంతో
మరణిస్తున్నాయి.

వాటిని కాపాడాలనుకునే ప్రతి అడుగునూ
వివాదాల బురదలోకి
లాగుతున్నారు.

ప్రశ్న ఒక్కటే—
ముక్కులను మూసుకుని బతుకుతామా?
లేక
నదుల ఊపిరిని కాపాడి,
మన ఊపిరినీ
కాపాడుకుంటామా?

ప్రాణవాయువు లేని అభివృద్ధి
ప్రగతేనా!
ప్రకృతిని రక్షించడం
రాజకీయం కాదు—
మనుగడ.

నది చనిపోతే
నీళ్లు మాత్రమే కావు…
మనిషి భవిష్యత్తూ
మునిగిపోతుంది.
సుదర్శనం వేణుశ్రీ

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తండా నుంచి చరిత్ర మధ్యలోకి…జాటోతు దర్గ్యా నాయక్ వీర కుటుంబం

by Mamindla Ramesh Raja September 28, 2026
written by Mamindla Ramesh Raja

“బంజారా భీం జాటోతు దర్గ్యా నాయక్ (వీర కుటుంబం – ధీర చరితం) ” అనే పుస్తకాన్ని జిలుకర వెంకన్న 2017లో తీసుకువచ్చారు. ఈ పుస్తకం వ్యక్తి జీవితాన్ని నమోదు చేసిన సాధారణ జీవితచరిత్ర కాదిది. తెలంగాణ చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన బంజారా, లంబాడా ప్రజల పోరాట చరిత్రను తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చే ఒక ముఖ్యమైన ప్రయత్నం. నిజాం నిరంకుశ పాలన, దొరలు – దేశ్‌ముఖ్‌ల భూస్వామ్య ఆధిపత్యం, వెట్టిచాకిరీ, అక్రమ వసూళ్లు, భూముల ఆక్రమణ, సామాజిక అవమానాలు వంటి అనేక రూపాల దోపిడీకి వ్యతిరేకంగా తండాల ప్రజలు సాగించిన ప్రతిఘటనకు జాటోతు కుటుంబం ఒక సజీవ ప్రతీక. జాటోతు దర్గ్యా నాయక్‌ను ఒక వ్యక్తిగా చూస్తే.. ఈ చరిత్ర యొక్క అసలు విస్తృతి మనకు కనిపించదు. ఆయన వెనుక ఒక కుటుంబం ఉంది. కుటుంబం వెనుక ఒక తండా, ఆ తండా వెనుక భూమి కోసం.. భుక్తి కోసం.. గౌరవం కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ఒక సమాజం ఉంది. ఆ సమాజం వెనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనే మహత్తర ప్రజా చరిత్ర ఉంది. ఇది కాదనలేని చారిత్రక సత్యం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని సాధారణంగా 1946 నుంచి 1951 వరకు జరిగిన మహత్తర ప్రజా ఉద్యమంగా గుర్తిస్తాం. ఏ చారిత్రక ఉద్యమమూ ఒక నిర్దిష్ట తేదీన అకస్మాత్తుగా పుట్టదు. దాని వెనుక సంవత్సరాలుగా పేరుకుపోయిన సామాజిక అసంతృప్తి ఉంటుంది. భూమిని కోల్పోయిన రైతు ఆవేదన, వెట్టిచాకిరీతో నలిగిన శ్రమజీవి ఆగ్రహం, దొరల గడీల ముందు అవమానించబడిన ప్రజల ఆత్మగౌరవం ఉంటుంది.

పంట పండించిన చేతులకు పంటపై హక్కు లేకపోవడం అనే అన్యాయం కూడా ఉంటుంది. ఈ అనుభవాలన్నీ ఒక దశలో సామూహిక ప్రతిఘటనగా, ఆ తర్వాత రాజకీయ పోరాటంగా, మరింత ముందుకెళితే సాయుధ పోరాటంగా రూపుదిద్దుకుంటాయి.జాటోతు కుటుంబ చరిత్రను ఈ విస్తృత నేపథ్యంతో చదివినప్పుడు దాని అసలు ప్రాధాన్యం తెలుస్తుంది. కమ్యూనిస్టు ఉద్యమం గ్రామీణ ప్రాంతాల్లో బలపడటానికి ముందే తమ భూములపై హక్కు కోసం జాటోతు కుటుంబం, తండా ప్రజలు దొరలతో పోరాడినట్లు అందుబాటులో ఉన్న చారిత్రక కథనాలు సూచిస్తున్నాయి. ధర్మాపురం పడమటి తండాలో గిరిజనులకు చెందిన భూములపై భూస్వాముల కన్ను పడటం, వాటిని ఆక్రమించుకునే ప్రయత్నాలను ప్రజలు ప్రతిఘటించడం, సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను వదులుకోవడానికి నిరాకరించడం లాంటివన్నీ భూమి ప్రశ్న ఎంత తీవ్రమైనదో తెలియజేస్తాయి. భూమి వదులుకుంటే బువ్వ లేదు. బువ్వ లేకపోతే బతుకేదెట్లా? అనే జీవన సత్యమే చివరికి పోరాటానికి పునాది అయింది. ఈ పుస్తకం మన ముందుకు ఒక ప్రాథమిక ప్రశ్నను తీసుకొస్తుంది. భూమిని దున్నేది ఎవరు? దానిపై హక్కు ఎవరిది? పంటను పండించేది రైతైతే, ఆ భూమిని దొర తన సొత్తుగా ఎలా ప్రకటించగలిగాడు? తరతరాలుగా సాగు చేసుకుంటున్న తండాల ప్రజల భూమిని భూస్వామ్య శక్తులు ఎలా స్వాధీనం చేసుకున్నాయి? అధికార యంత్రాంగం ఎవరి పక్షాన నిలిచింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితేనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క సామాజిక మూలాలు అర్థమవుతాయి.బంజారా చరిత్రను చాలాసార్లు వెనుకబాటుతనం, పేదరికం, సంచార జీవితం, సామాజిక అంచుల వంటి అంశాలకే పరిమితం చేస్తారు. బంజారా సమాజ చరిత్రలో మరో శక్తివంతమైన ముఖం ఉంది. అది ప్రతిఘటన, తమ జీవనాధారాలపై దాడి జరిగినప్పుడు వారు మౌనంగా ఉండలేదు. తమ భూములపై దొరల కన్ను పడినప్పుడు ఎదిరించారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. రజాకార్లు, పోలీసు బలగాలు, భూస్వాముల గుండాలు కలిసి దాడి చేసినప్పుడు కూడా తండాల ప్రజలు వెనుకడుగు వేయలేదు. అందువల్ల బంజారా ప్రజలను కేవలం బాధితులుగా చిత్రించే చరిత్రకు ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని అందిస్తుంది. వారిని బాధితులు మాత్రమే అనొద్దు, వారు ప్రతిఘటించిన ప్రజలు. వారు చరిత్రలో చోటు కోసం ఎదురు చూడలేదు. తమ రక్తంతో చరిత్రను నిర్మించారు.జాటోతు ఆమూ – మంగ్లీ దంపతుల ఆరుగురు కుమారులు జోద్య, సోమ్ల, సాంక్రు, దర్గ్యా, ఠాను, దాసు. ఉద్యమంలో పాల్గొన్నారనే వివరాలు ఈ కుటుంబ చరిత్రకు అసాధారణమైన ప్రాధాన్యాన్నిస్తాయి. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉద్యమంలో చేరడం సాధారణంగా కనిపించవచ్చు.

ఒకే కుటుంబంలోని ఆరుగురు సోదరులు ఉద్యమం వైపు నిలబడటం ఒక సామాజిక ప్రకంపనకు సంకేతం. వారి జీవితం వ్యక్తిగత ధైర్యానికి మాత్రమే ఉదాహరణ కాదు. కుటుంబం మొత్తాన్ని కదిలించిన రాజకీయ చైతన్యానికి నిదర్శనం. ఠాను నాయక్, దర్గ్యా నాయక్‌లు దళకమాండర్లుగా పనిచేశారు. జాటోతు దర్గ్యా నాయక్ జీవితాన్ని ఈ కుటుంబ చరిత్రలో ప్రత్యేకంగా చూడాలి. కేవలం ఒక గెరిల్లా యోధుడు కాదు. ఒక దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తండా ప్రజల జీవనహక్కుల కోసం నిలిచిన పోరాట తరానికి ప్రతినిధి. దళకమాండర్‌గా ఆయన చేసిన సాహసాలు ప్రజల్లో ధైర్యాన్ని పెంచాయి. తుపాకీ ఎక్కుపెట్టడం, ఒడిసెలతో పోరాడడం వంటి శారీరక ధైర్యం ఒక కోణం మాత్రమే. దాని వెనుక ఉన్న అసలు బలం ప్రజలతో ఉన్న సంబంధం. ప్రజల సమస్యను తన సమస్యగా స్వీకరించగలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజమైన ప్రజా యోధుడిగా ఎదుగుతాడు.ఈ కుటుంబం ఎదుర్కొన్న దమనకాండ చరిత్రలో అత్యంత విషాదకరమైన అధ్యాయం. దొరల గుండాలు, పోలీసులు, రజాకార్లు తండాలపై దాడులు చేయడం, ఇండ్లను తగులబెట్టడం, పంటలను దోచుకోవడం, కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేయడం వంటి సంఘటనలు కేవలం వ్యక్తిగత కక్ష సాధింపులు కావు. అవి భూస్వామ్య ఆధిపత్యం తనను తాను కాపాడుకునేందుకు ఉపయోగించిన హింసాత్మక అధికార వ్యవస్థకు నిదర్శనాలు. గడీ అనేది కేవలం ఒక భవనం కాదు. అది భూమిపై అధికారం, ప్రజల శ్రమపై పట్టు, స్థానిక పాలనపై ఆధిపత్యం, పోలీసు – రాజకీయ రక్షణ, భయాన్ని ఆయుధంగా ఉపయోగించే వ్యవస్థకు ప్రతీక.జాటోతు సోమ్లా త్యాగం ఈ దమనకాండ యొక్క క్రూరత్వాన్ని బహిర్గతం చేస్తుంది. అందుబాటులో ఉన్న కథనాల ప్రకారం.. విస్నూరు దేశ్ముఖ్ కుమారుడుబాబు దొర (జగన్ మోహన్ రెడ్డి) ముఠా జాటోతు కుటుంబంపై దాడి చేసి సోమ్లాతో పాటు మరికొందరిని పట్టుకొని, వారి చేతనే కట్టెలు తెప్పించి, చితి పేర్చి సజీవంగా దహనం చేసింది. తరువాత తండాలోని ఇళ్లను కూడా తగులబెట్టారు. ఈ సంఘటనను కేవలం వీరమరణ గాథగా చదవడం సరిపోదు. ఒక కుటుంబాన్ని, ఒక తండాను, ఒక ఉద్యమాన్ని భయపెట్టడానికి అధికార శక్తులు ఎంతటి హింసకు దిగజారాయో అర్థం చేసుకోవాలి.అదే సమయంలో ఈ దమనకాండ మరో విషయాన్ని కూడా నిరూపిస్తుంది. భయం సృష్టించడం ద్వారా ప్రజా ప్రతిఘటనను శాశ్వతంగా అణచివేయలేరు. తండా తగులబడవచ్చు. కానీ, ప్రతిఘటన తగులబడదు. ఇళ్లు కాలిపోవచ్చు. కానీ, భూమి కోసం పోరాడే సంకల్పం కాలిపోదు. ఒక యోధుడిని చంపవచ్చు. కానీ, అతని పోరాటం ప్రజల జ్ఞాపకాల్లో బతుకుతుంది. జాటోతు కుటుంబం చరిత్రలో ఇదే మనకు కనిపిస్తుంది.ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కేవలం “నిజాం వ్యతిరేక పోరాటం”గా నిర్వచించడం ఎంత అసంపూర్ణమో తెలుస్తుంది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేక పోరాటం దాని ఒక భాగం. దాని సామాజిక గుండెకాయలో భూమి ప్రశ్న ఉంది. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకత ఉంది. వెట్టిచాకిరీ విముక్తి ఉంది. పేద రైతు, వ్యవసాయ కూలీ, గిరిజన రైతు గౌరవం కోసం పోరాటం ఉంది. అందుచేత బంజారా తండాల పోరాటాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వెలుపల ఉన్న ఒక ప్రత్యేక గాథగా కాకుండా, ఆ మహత్తర ఉద్యమం యొక్క అంతర్భాగంగా చూడాలి.దర్గ్యా నాయక్‌తో పాటు ఆయన సోదరుడు ఠాను నాయక్ కూడా పోరాటంలో కీలక పాత్ర పోషించడం ఈ కుటుంబ చరిత్రను మరింత ప్రత్యేకం చేస్తుంది. ఠాను నాయక్ 1950 మార్చి 20న మొండ్రాయి సమీపంలోని నీలిబండ తండా వద్ద పోలీసులకు చిక్కి, దొరల గడిలో బంధించబడి, చిత్రహింసలకు గురై వీరమరణం పొందాడు. ఆ ఘటనకు ముందు ఆయన దళం భూస్వాములపై, పోలీసు క్యాంపులపై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఈ పోరాట చరిత్రలో దర్గ్యా నాయక్ సోదరుడిగా మాత్రమే కాదు, అదే కుటుంబం నుంచి వచ్చిన మరో దళ నాయకుడిగా నిలుస్తాడు.దర్గ్యా నాయక్ జీవితంలో మరో విశిష్టత ఏమిటంటే, ఆయన కేవలం గతాన్ని గుర్తు చేసే పేరు కాదు. పోరాట చరిత్రకు జీవించి ఉన్న సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి. 2024లో ఆయన మరణించే సమయానికి 107 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఆయన జాటోతు ఆమూ – మంగ్లీ దంపతుల కుమారుడు, రైతాంగ సాయుధ పోరాట అమరుడు ఠాను నాయక్‌కు తమ్ముడు, ఆరుగురు సోదరులలో ఉద్యమానంతరం మిగిలిన వ్యక్తి. అందువల్ల ఆయన జీవితం ఒక వ్యక్తి జీవితాన్ని మించి, ఒక శతాబ్దపు తెలంగాణ సామాజిక – రాజకీయ మార్పులకు సాక్ష్యంగా నిలుస్తుంది.ఒక శతాబ్దం జీవించిన ఒక మనిషి జీవితంలో నిజాం పాలనను చూసిన బాల్యం ఉంటుంది. దొరల గడీలను చూసిన యౌవనం ఉంటుంది. రైతాంగ పోరాటాన్ని చూసిన రాజకీయ చైతన్యం ఉంటుంది. జైలు, నిర్బంధం, అణచివేతల జ్ఞాపకాలు ఉంటాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాతి భారతదేశాన్ని చూసిన అనుభవం ఉంది. గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులను చూసిన వృద్ధాప్యం ఉంది. అందువల్ల దర్గ్యా నాయక్ సాక్ష్యం ఒక వ్యక్తిగత జ్ఞాపకం కాదు. అది ఒక శతాబ్దపు సామాజిక పరివర్తనకు జీవ సాక్ష్యం.ఈ పుస్తకాన్ని మరింత లోతుగా చదవాలంటే మౌఖిక చరిత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. తండాలోని వృద్ధులు, కుటుంబ సభ్యులు, ఉద్యమంలో పాల్గొన్న వారసులు, స్థానిక ప్రజలు చెప్పిన కథనాలు అధికారిక పత్రాల్లో కనిపించని చరిత్రను వెలుగులోకి తీసుకురాగలవు. అయితే మౌఖిక జ్ఞాపకాలను పత్రాధారాలతో పోల్చడం కూడా అంతే అవసరం. ప్రభుత్వ నివేదికలు, కోర్టు రికార్డులు, జైలు పత్రాలు, పాత వార్తాపత్రికలు, భూమి పత్రాలు, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన చారిత్రక పత్రాలు, ఇతర పోరాట యోధుల స్మృతులు వంటి ఆధారాలతో పోల్చినప్పుడు దర్గ్యా నాయక్ కుటుంబ చరిత్ర మరింత పటిష్టమైన ప్రజా చరిత్రగా రూపుదిద్దుకుంటుంది. ఈ కుటుంబ చరిత్రలో మహిళల పాత్రను మరింత వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పురుషులు దళాల్లో చేరి తుపాకులు పట్టిన కథలు మనకు ఎక్కువగా గుర్తుంటాయి. కానీ, తండాలో మిగిలిన మహిళలు ఉద్యమానికి ఆహారం, ఆశ్రయం, సమాచారం, రహస్య సంబంధాలు, కుటుంబ రక్షణ వంటి అనేక బాధ్యతలు నిర్వహించారు. రజాకార్లు, పోలీసులు, భూస్వాముల దాడులను ఎదుర్కొన్న మహిళల ధైర్యం కూడా రైతాంగ పోరాట చరిత్రలో సమాన స్థానం పొందాలి. ఒక “వీర కుటుంబం” చరిత్రను సంపూర్ణం చేయాలంటే పురుషుల వీరత్వంతో పాటు మహిళల మౌన శ్రమ, బాధ, ప్రతిఘటన, త్యాగాలను కూడా నమోదు చేయాలి.జాటోతు దర్గ్యా నాయక్ చరిత్రను వర్గ దృష్టితో చదివితే మరో లోతైన విషయం బయటపడుతుంది. బంజారా గుర్తింపు, రైతు జీవితం, భూమి ప్రశ్న, సామాజిక అణచివేత.. ఇవి విడివిడిగా ఉన్న సమస్యలు కావు. ఒకే మనిషి జీవితంలో ఇవన్నీ పరస్పరం ముడిపడి ఉంటాయి. ఈ పోరాటాన్ని కేవలం “గిరిజన సమస్య”గా చూడటం అసంపూర్ణం. అలాగే కేవలం “రైతు సమస్య”గా చూడటం కూడా సరిపోదు. భూమిని సాగు చేసిన బంజారా రైతు అనుభవంలో వర్గ దోపిడీతో పాటు సామాజిక అంచున నెట్టివేయబడిన అనుభవం కూడా ఉంది. ఈ రెండు పరిమాణాలను కలిపి చదివినప్పుడే జాటోతు దర్గ్యా నాయక్ చరిత్రకు పూర్తి రాజకీయ అర్థం వస్తుంది.ఈ పుస్తకం మన చరిత్ర రచనా విధానాన్నే ప్రశ్నిస్తుంది. చరిత్రను ఎవరు రాస్తారు? చరిత్రలో ఎవరి పేర్లు నిలుస్తాయి? గడీల్లో కూర్చున్న దొరల పేర్లు మాత్రమేనా? లేక ఆ గడీలను ఎదిరించిన తండా ప్రజల పేర్లు కూడా ఉండాలా? ప్రభుత్వ పత్రాల్లో నమోదైన కేసులు మాత్రమేనా? లేక ఆ కేసుల వెనుక ఉన్న ప్రజల బాధ, ప్రతిఘటన, ఆశయాలు కూడా చరిత్రలో భాగమా?జాటోతు దర్గ్యా నాయక్ కథ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.

చరిత్రను కేవలం పాలకుల దృష్టితో రాయలేం. పొలాన్ని దున్నిన చేతుల నుంచి, తండాలో జీవించిన ప్రజల నుంచి, గడిని ఎదిరించిన యోధుల నుంచి, జైలులో సంవత్సరాలు గడిపిన ఖైదీల నుంచి, తమ కుటుంబ సభ్యులను పోరాటానికి పంపి త్యాగం చేసిన మహిళల నుంచి కూడా చరిత్రను రాయాలి.అందుకే “బంజారా భీం జాటోతు దర్గ్యా నాయక్ (వీర కుటుంబం – ధీర చరితం) ” ఒక జీవితచరిత్ర కంటే ఎక్కువ. అది ఒక కుటుంబ చరిత్ర. కుటుంబ చరిత్రను దాటి ఒక తండా చరిత్ర. తండా చరిత్రను దాటి ఒక బంజారా ప్రజా చరిత్ర. ఆ ప్రజా చరిత్రను దాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని ఒక మరుగునపడిన అధ్యాయం.జాటోతు దర్గ్యా నాయక్‌ను గుర్తుచేసుకోవడం అంటే కేవలం ఒక వృద్ధ యోధుడిని స్మరించడం కాదు. ఆయనతో పాటు నిలిచిన ఆరుగురు సోదరుల త్యాగాన్ని గుర్తుచేసుకోవడం. జాటోతు ఆమూ- మంగ్లీ కుటుంబం చూపిన ధైర్యాన్ని గుర్తుచేసుకోవడం. దొరల గడీలకు ఎదురొడ్డి తమ భూమిని తిరిగి దున్నిన తండా ప్రజల సంకల్పాన్ని గుర్తుచేసుకోవడం. సోమ్లా వంటి యోధుల అమరత్వాన్ని గుర్తుచేసుకోవడం. ఠాను నాయక్ వంటి దళ కమాండర్ల సాహసాన్ని గుర్తుచేసుకోవడం. మరీ ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన బంజారా ప్రజల సామూహిక చరిత్రను గుర్తుచేసుకోవడం.తండా తగులబడినా చరిత్ర తగలదు. గడి కూలిపోయినా ప్రజా జ్ఞాపకం కూలదు. యోధుడి శరీరం నేలలో కలిసినా అతని పోరాట ఆశయం ప్రజల్లో జీవిస్తుంది. అందుకే జాటోతు దర్గ్యా నాయక్ పేరు ఒక కుటుంబపు జ్ఞాపకంగా మాత్రమే కాకుండా తెలంగాణ నేలపై భూమి, భుక్తి, గౌరవం, స్వేచ్ఛ కోసం పోరాడిన బంజారా ప్రజల సామూహిక చరిత్రలో నిలవాలి.చరిత్రను దొరల గడీల నుంచి మాత్రమే చదివితే దొరల పేర్లు కనిపిస్తాయి. తండాల గుడిసెల నుంచి చదివితే దర్గ్యా నాయక్ వంటి ప్రజా వీరుల పేర్లు వినిపిస్తాయి. అధికారపు పత్రాల నుంచి మాత్రమే చదివితే కేసులు, శిక్షలు, అరెస్టులు కనిపిస్తాయి. ప్రజల జ్ఞాపకాల నుంచి చదివితే ఆ శిక్షల వెనుక ఉన్న త్యాగం, ఆ అరెస్టుల వెనుక ఉన్న ఆశయం, ఆ రక్తం వెనుక ఉన్న భూమి ప్రశ్న కనిపిస్తుంది.జాటోతు దర్గ్యా నాయక్ చరిత్ర అందుకే గతాన్ని స్మరించే కథ కాదు. వర్తమానాన్ని ప్రశ్నించే చరిత్ర. భూమిని దున్నే చేతులకు భూమిపై హక్కు ఉందా? శ్రమించే మనిషికి గౌరవం ఉందా? అట్టడుగు ప్రజలకు రాజకీయ స్వరం ఉందా? చరిత్రలో వారికి సముచిత స్థానం దక్కిందా? అనే ప్రశ్నలను అది మన ముందుంచుతుంది.తండా నుంచి లేచిన ఆ స్వరం గడీల గోడలను దాటి చరిత్ర మధ్యలోకి రావాలి. జాటోతు దర్గ్యా నాయక్ పేరు ఒక వ్యక్తి పేరుగా మాత్రమే కాకుండా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం, సామాజిక గౌరవం కోసం పోరాడిన బంజారా ప్రజల సమిష్టి సంకల్పానికి ప్రతీకగా నిలవాలి. అదే ఈ గ్రంథం యొక్క చారిత్రక విలువ. అదే జాటోతు దర్గ్యా నాయక్ వీరత్వానికి నిజమైన నివాళి.-

September 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఒంటరిగ – భావగీతం

by Padmasri Chennojwala September 28, 2026
written by Padmasri Chennojwala

దమ్ము శ్రీనివాస బాబు గారు రచించి, పి.వి. సాయిబాబా గారు సంగీతం సమకూర్చిన ఈ భావగీతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లలిత సంగీతం డిప్లమా కోర్సులో పాఠ్యాంశంగా చేర్చబడింది.

పల్లవి:

“ఒంటరిగ ఈ దారి పక్కన – ఒదిగి నిలిచిన దానను

కంటకమ్ముల నడుమ పెరిగిన – గడ్డిపూవును దీనను”

  ముళ్ళ పొదల నడుమ పెరిగిన తన ఉనికిని ఎవరూ గుర్తించడం లేదనీ, అందుకే ఒంటరిగా మిగిలిపోయాననీ ఒక గడ్డిపూవు తన నిస్సహాయతను వెల్లడిస్తోంది.

ఇక్కడ నిజంగా గడ్డిపూవే మాట్లాడుతోందా?! అని ఆలోచి స్తే, కాదనే సమాధానమే వస్తుంది.

గడ్డిపూవును ప్రతీకగా తీసుకుని కవి అంతరంగ ఆవిష్కరణ చేస్తున్నాడు. ఆ వేదన వైయక్తికమా? కాదా? అన్న ప్రస్తావన కూడా అంత అవసరమేం కాదు. ఎందుకంటే వస్తువేదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగిన వాడే కవి అనే విషయం అందరికీ తెలిసిందే.

ఇక్కడ కంటకాలు అంటే సమస్యలు. ఆ సమస్యలు శారీరకమే కావచ్చు, మానసికమే కావచ్చు, ఆర్థికపర మైనవే కావచ్చు. అన్నీ కూడా అయి ఉండవచ్చు. సమస్య మూడు రూపాలను దాల్చి, ముప్పేట దాడి చేస్తే గనుక అప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరిగా(నూటికి నూరుపాళ్ళు) సామాజిక సమస్యను కూడా ఎదుర్కొంటాడు. ఈ సత్యం అనుభవంలోకి వచ్చిన వారెందరో మనచుట్టే ఉంటారు. అందుకే “దీనను” అంటున్నాడు.

చరణం:

” సతము సురభిళ సుమచయము – ఈశ్వరుని పూజల తనియగా”

పరిమళభరితమైన పుష్పగుచ్చంలో తానూ ఒక పువ్వునై పరమశివుడి పాదాల చెంతజేరి, ధన్యత నొందాలని తపిస్తున్నాననీ

“బ్రతుకులో ఆ భాగ్యమబ్బని – గడ్డిపూవును దీనను”

కానీ అంత భాగ్యం ఈ జన్మకు తనకు దక్కలేదంటూ ఆర్తిని వెలిబుచ్చుతున్నాడు.

ఆశించినవేవో అందకోలేక పోయినప్పుడు, సాధించాలనుకున్నవేవో చేజారిపోయినప్పుడు సదరు వ్యక్తి మదిలోని వేదనను గడ్డి పువ్వు ద్వారా పలికిస్తున్నాడు కవి.దాన్ని(ఆ బాధను) సురభిళ, సుమచయము అనే రెండు పదాల్లో బిగించి చూపిస్తున్నాడు. తాను కోల్పోయిన ఆనందమేదైతే ఉందో దాన్ని పొందగలిగిన తన తోటి వారిని పరిమళభరితమైన పుష్పగుచ్చంతో పోలుస్తూ, వాళ్లలో ఒకరిగా తాను ఉండలేక పోయానని కృంగిపోతున్నాడు.

చరణం :

“ఈ సుమపదముల వసింపగ ఎపుడు ఎదలో ఎంతును”

ఆ పూలలో తానూ ఒక పూ వునై పరిమళాలు వెదజల్లాలని తన మనసు ఆరాటపడుతోందంటూ ఆవేదన వెళ్లగక్కుతున్నాడు.

ఉన్నతమైన స్థాయికి చేరుకున్న వాళ్లను చూసి, ఆ స్థాయికి చేరగలిగిన ప్రతిభా పాటవాలు, శక్తిసామర్థ్యాలు తనలోనూ పుష్కలంగా (ఉన్నాయని అతను బలంగా నమ్ముతున్నాడు) ఉన్నప్పటికీ ఆ స్థాయికి తాను ఎదగ లేకపోయానని మనోవేదన చెందుతున్నాడు.

“ఆశతీరని నేనభాగ్యను – గడ్డి పూవును దీనను”

కారణాలేవైనప్పటికీ తన ఆశ అడియాసగానే మిగిలిపోయిందంటూ మానసికంగా నలిగిపోతున్నాడు.

గుండె లోతుల్లో దాగిన గాయాల పచ్చిదనాన్ని కూడా అందమైన, అద్భుతమైన పదజాలంతో ఒలికించిన కవి పుంగవునికి వందనం సమర్పించుకుంటూనే,గాయాల సలపరింతలకు లేపనంగా ఓసారి నాణానికి రెండోవైపు చూసే ప్రయత్నం చేద్దాం.

నువ్వు గడ్డిపూవే అయి ఉండవచ్చు, కానీ దీనవని ఎందుకనుకోవాలి?

నీ అందం నీ సొంతం కాదా?! అది మరొకరికి( మరో పూవుకి) దక్కుతుందా?! గడ్డిపూవులో ఏ అందం ఉండదా? ఔషధ గుణాలు ఉండవా?!అందమనేది గులాబీలు, డాలియాలు వంటి వాటికే పరిమితమనుకుంటున్నావా? గడ్డి పువ్వుతో మానవాళికి ఏ విధమైన ఉపయోగం లేదనే అనుకుంటున్నావా?!

నువ్వు ముళ్ళ పొదల్లోనే పుట్టి ఉండవచ్చు కానీ ఒంటరిగా నిలబడిపోయానని ఎందుకనుకుంటున్నావు?

పుడమి తల్లికి రంగులద్దేది నువ్వు కాదా? అడవి తల్లికి ఆభరణానివి నువ్వు కాదా? గాలికి పరిమళాన్ని అద్ది బాటసారిని సేద తీర్చేది నువ్వు కాదా?!

ఈశ్వరుని పాదాల చెంతజేర లేకపోతున్నానని బాధపడుతున్నావే?! మాటిమాటికీ గడ్డిపూవును, గడ్డిపూవును అంటూ నిన్ను నువ్వే చిన్న బుచ్చుకుంటున్నావే! రెల్లు పొదల్లో ఉద్భవించి, ‘శరవణభవుడ’ ని స్తుతించబడ్డవాడు సాక్షాత్తు శివ తనయుడు కాదా?

నీ గుండెలో పేరుకుపోయిన నైరాశ్యాన్ని తరిమికొట్టు. ఒక్కసారి నీ లోపలికి నీ దృష్టిని సారించు. నీ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకో. అప్పుడు నీదైన ప్రత్యేకత నీకే సొంతమని స్పష్టమౌతుంది .
విధాత రచనలోని ఓ అద్భుతానికి నువ్వు.

గుండెను పీల్చి పిప్పి చేసే వేదన అనుభవించినప్పుడే ఇటువంటి కవిత్వం కాగితం పైకెక్కుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. సముద్రమంత బాధను సున్నితమైన పదాలతో పలికించిన కవి శ్రేష్టునికి కైమోడ్పులర్పిస్తూ…….

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

🔥నిప్పు కణిక🔥

by వకుళవాసు September 28, 2026
written by వకుళవాసు

భారతచరిత్రపుటలపై
అదో మహోజ్వల ఘట్టం

సామాన్యుడే సాయుధుడై
కోపాన్ని అంకుశంగా ఎక్కుపెట్టిన పోరు అది…

ప్రతిపల్లె ఆయుధాలు పట్టి ప్రతిఘటన చేసిన రణం అది…

నిజాం నిరంకుశత్వం పై నిరసనధ్వనులతో
దద్దరిల్లిన ధరణి ఇది…

భూస్వాముల అరాచకత్వాన్ని భూస్థాపితం చేసిన
రైతాంగ పోరాటమిది…

రజాకార్ల రాక్షసకాండ పై
కొంగులో కారంతో కొరకాసులై మండిన
మానవతుల నేల ఇది…

మతోన్మాదం పై మరఫిరంగులెక్కుపెట్టి
మట్టుపెట్టిన సమరమిది…

కలాలే కరవాలములై
అక్షర రుధిరాలను పారించి
విప్లవ సేద్యం చేసిన నేల ఇది…

ఎన్నో అమూల్య ప్రాణాలు
ఎందరో వీరుల త్యాగాల
అపురూప ఫలితంగా
స్వతంత్ర భారతంలో
విలీనమైన నాతెలంగాణ…

ఉద్యమాల పురిటిగడ్డై అరాచకాలపై బంధూకును ఎప్పటికప్పుడు ఎక్కుపెట్టే
నిప్పు కణిక…

🪷వకుళవాసు ✍️

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన ప్రముఖులు

by Dr. Dasoju Padmavati September 28, 2026
written by Dr. Dasoju Padmavati

దాసోజు పద్మావతి ఒక అధ్యాపకురాలు. కవయిత్రి గా రచయిత్రి గా అందరికీ సుపరిచితులు. మయూఖ పత్రిక ద్వైమాసిక పత్రిక. కాబట్టి ప్రతి రెండు నెలల లోపు ప్రముఖుల విషయాలను సాహిత్యంలో తనకున్నటువంటి అనుభవాన్ని జోడించి, విద్యార్థులకు ఉపయుక్తమయ్యే విధంగా రెండు నెలలలో వస్తున్న ప్రముఖుల జయంతులు, వర్ధంతులు వంటి సమాచారం ఇస్తూ, సాహితీపరంగా, సామాజిక సేవా పరంగా గొప్ప వ్యక్తులను గురించి మయూఖ పత్రికకు క్లుప్త సుందరమైన సమాచారం ఇస్తారు . ఆయా ప్రముఖుల ముఖ్య రచనలు కానీ ముఖ్య సేవ కార్యక్రమాలు కానీ చెబుతూ రాస్తున్న ఈ చిన్న చిన్న వ్యాసాలు చదివి విద్యార్థులకు చూపించాలి అని ప్రయత్నం చేస్తున్నాం . దీనిని అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ

– డాక్టర్ కొండపల్లి నీహారిణి,సంపాదకురాలు

తెలంగాణ ప్రజా గొంతుక కాళోజీ

పలుకు బడుల భాష కావాలి”
అని నినదించిన ప్రజా గొంతుక
కాళోజీ నారాయణరావు.

మనం కాళోజీ జయంతి ని
‘తెలంగాణ భాషా సెప్టెంబర్-9 దినోత్సవం’గా జరుపుకుంటున్నాము.

“తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవ సంగతేమిటి రా ?
అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు సకలించు ఆంధ్రుడా ! చావా వెందుకు రా?” అని నిలదీసిన నిక్కూసైన తెలుగు బిడ్డ కాళోజీ నారాయణరావు.

వీరు 1914 సెప్టెంబర్ 9 వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ నందలి రత్నాచంద్ లో జన్మించారు. తల్లిదండ్రులు రమాబాయి రంగారావు. వీరి జీవితమంతా బాల్యం నుండి తుది శ్వాస దాకా మడికొండ వరంగల్ జిల్లా తోనే ముడిపడి ఉంది.

1940 లో న్యాయవాద వృత్తి ని చేపట్టినప్పటికీ కొద్ది కాలంలోనే
వదిలి పెట్టి ప్రజా ఉద్యమాల బాట పట్టారు.
నిజాం నిరంకుశ పాలన నడుస్తున్న కాలం అది. తెలుగు భాష మాట్లాడాలన్నా, సమావేశాలు నిర్వహించాలన్న అనేక ఆంక్షలు. తెలుగు భాష పై జరుగుతున్న అన్యాయాన్ని అడుగడుగున నిలదీశాడు కాళోజీ

“ఎవని వాడుక భాష వాడు రాయాలి, ఇట్ల రాస్తే ఎవడు చదువుతడని ముందుగానే మనం అనుకుంటే ఎట్లా” మనకు నచ్చినట్లు మనం రాయాలే, చదివేటోడు చదువుతడు
అనేవారు.
“అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క
లక్ష మెదళ్లకు కదలిక” అంటూ అక్షర శక్తిని చాటి చెప్పిన ఉద్యమ శిఖరం కాళోజీ.
‘ కాళోజీ ప్రముఖ రచన ‘నా గొడవ ‘
కానీ అది మనందరి గొడవ, తెలంగాణ ప్రజల ఆవేదన.
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి-
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’
అని సగర్వంగా ప్రకటించి
ఉద్యమమే ఊపిరిగా జీవించి,
జనం పక్షాన నిలిచిన ప్రజాకవి.
“అన్నపు రాశులు ఒకచోట ఆకలి చావులు ఒకచోట” అంటూ సమాజం లోని అంతరాన్ని అడుగడుగునా ప్రశ్నించిన తెలంగాణ తొలి పొద్దు కాళోజీ.
తెలంగాణ మండలికాన్ని ,తెలుగు భాషను ఎంతగానో ప్రేమించారు.
కాళోజీ బహుభాషా వేత్త ఆంగ్లం, ఉర్దూ, హిందీ ,మరాఠీ, కన్నడ భాషలు చక్కగా మాట్లాడగలరు, రాయగలరు.
.
కాళోజీ కవిత్వమే కాదు, తెలంగాణ జీవన చిత్రాన్ని ప్రతిబింబించే ‘కాళోజీ కథ’ లు రాశారు.భాషా పరిరక్షణే సంస్కృతి రక్షణ అని నమ్మే వారు కాళోజీ.
లోక్ నాయక్ జయప్రకాశ్
నారాయణ మరణించినప్పుడు కాళోజీ నారాయణరావు అన్న మాటలు సరిగ్గా కాళోజీ కి సరిపోతాయి.
“పుట్టుక అనేది చావు నీది
బతుకంతా తెలంగాణది”
కాళోజీ తెలంగాణ భాష ,సాహిత్యం పట్ల అభిమానంతో వారి కవిత్వంలో ప్రజల భాషకు పట్టం కట్టారు.”నా భాష నా శ్వాస” అంటూ తెలంగాణ మండలికానికి ఉన్నతమైన సాహితీ గౌరవాన్ని ఇచ్చినారు.

ప్రస్తుతం తెలుగు భాషకు చాలా గడ్డు రోజులు వచ్చాయి. మాతృభాష పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం కృషి చేయవలసిన అవసరం ఉంది.

భాష కేవలం భావ వినిమయ
సాధనం మాత్రమే కాదు.
మన కట్టు- బొట్టు ,ఆచార వ్యవహారాలు, సంస్కృతి- సంప్రదాయాలు, కళలు
సమస్త జీవన మూల్యాల సమాహారం భాష.
“మన మాతృ భాషే మన అస్థిత్వం.”

భాష మనుగడ కే ముప్పు వస్తే మన అస్తత్వమే ప్రశ్నార్థకం అవుతుంది.
మన మాతృ భాషను కాపాడుకోవడం అంటే సమస్త జీవన మూల్యాలను
కాపాడు కోవడం.
మనల్ని మనం రక్షించుకోవడం.

ప్రస్తుత పరిస్థితుల్లో మాతృభాష పరి
రక్షణే -మన ప్రధాన లక్ష్యం.
ఆ దిశగా మనం కృషి చేయడమే కాళోజీకి మనం ఇచ్చే నిజమైన గౌరవం.
* * *


సెప్టెంబర్ -15 ఇంజనీర్స్ డే

ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన రోజును ఇంజనీర్స్ డే గా జరుపు కుంటాము. 1861 సెప్టెంబర్ 15వ తేదీన ముద్దెనహళ్లి మైసూర్ ( కర్ణాటక రాష్ట్రం) లో జన్మించారు. తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీనివాస శాస్త్రి. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం వాస్తవ్యులు.
హైదరాబాదు లోని నిజాంసాగర్,ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలను రూప కల్పన చేసారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

మూసి వరదల నివారణకు అనేక చర్యలు తీసు కున్నారు.
ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ రూపకల్పనలో వీరి కృషి కొనియాడదగినది.
వైజాగ్ పోర్ట్ నిర్మాణము వీరి కృషి ఫలితమే.
మైసూర్ బృందావన్
గార్డెన్ విశ్వేశ్వరయ్య
సృజనాత్మక సృష్టికి నిదర్శనం. కావేరి నది పై కృష్ణరాయ సాగర్ నిర్మాణం.
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాట్లు వీరి కృషి ఫలితమే
గంగా నది మీద ఫరక్కా డ్యామ్ నిర్మాణం 94 సంవత్సరాల వయసులో నాటి భారత ప్రధానమంత్రి జహార్ లాల్ నెహ్రూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి అప్పగించడం వారి పనితనానికి, నిబద్ధతకు నిదర్శనం. విశ్వేశ్వరయ్య గారి 100వ పుట్టిన రోజును డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఘనంగా నిర్వహించారు.
30 సంవత్సరాలకు పైగా ఇంజనీర్ గా విశేష సేవలు అందించి అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక భూమిక పోషించిన విశ్వేశ్వరయ్య గారు 1962 ఎఫ్రిల్ 14 న పరమ పదించారు. 101 సంవత్సరాలు జీవించి , జీవితాంతం సమాజం కోసం పని చేసిన వ్యక్తి భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

* * *

విశ్వనరుడు గుర్రం జాషువా జయంతి

ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ ప్రజాకవి. జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించారు.జాషవా కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమాన తలను తన రచనల ద్వారా ప్రశ్నించారు.

ఇవి రెండు నన్ను కవిగా నిలబెట్టాయి అంటారు .
సామాజిక సమతుల్యత, ఆత్మగౌరవం, మానవతా వాదం జాషువా కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.

జాషువా పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే రచన ‘గబ్బిలం’. పేదవాడి వేదనను గబ్బిలం ద్వారా దేవుడికి చేరవేసే వినూత్నమైన ఆలోచనతో
ఈ కావ్యాన్ని రచించారు. ‘ఫిరదౌసి’, ‘క్రీస్తు చరిత్ర’ భారతి మాత వంటి ఎన్నో గొప్ప రచనలు చేశారు.

జాషువా రచనలు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తాయి అదే ప్రేమతత్వం,
దేశ భక్తి, సమసమాజం.

జాషువా సుకవి గొప్పతనం చాలా ఉన్నతంగా కీర్తించారు
తన పద్యాలలో “రాజు మరణించే నొక తార రాలిపోయే, సుకవి మరణించే నొకతార గగన మెక్కే , రాజు జీవించే రాతి విగ్రహమునందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు “
అన్న ఈ కవి పద్యాలు నిరంతరం తెలుగు వాడి నాలుక పై నడయడుతాయి.

కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, పద్మ భూషణం బిరుదులతో గౌరవించింది
మన దేశం. రత్నాల వంటి పద్యాలను మనకు అందించి
1971 జూలై 24 నింగికేగినాడు ఈ కవి.

గురజాడ అప్పారావు జయంతి

ఆధునిక తెలుగు సాహిత్యానికి వేగుచుక్క – గురజాడ అప్పారావు.

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21వ తేదీన జన్మించారు.

“దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్!”
ఈ ఒక్క వాక్యం గురజాడ అప్పారావు సాహిత్య దృష్టిని, మానవతా దృక్పథాన్ని మనకు పరిచయం చేస్తుంది.

గురజాడకు ముందు తెలుగు సాహిత్యంలో రాజులు, రాజ్యాలు, పురాణాలు, దైవం, ఇతిహాసాలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉన్నాయి.

గురజాడ రచనల్లో సమాజం, సామాన్య మానవుడు, స్త్రీ ల సమస్యలు,సామాజిక అసమానతలు, మూఢాచారాలు, మానవ సంబంధాలు సాహిత్యానికి కేంద్ర బిందువులుగా మారాయి.
గురజాడ రచనల్లో సామాజిక చైతన్యం స్పష్టంగా కనిపిస్తుంది. ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా బాల్యవివాహం, కన్యాశుల్కం, వితంతు జీవితంలోని దుస్థితి, స్త్రీలపై జరుగుతున్న అన్యాయం వంటి సామాజిక సమస్యలను సూటిగా ప్రశ్నించారు. పాత్రల ద్వారా సమాజంలోని వైరుధ్యాలను చూపిస్తూ, హాస్యం–వ్యంగ్యాన్ని సామాజిక విమర్శకు ఆయుధాలుగా ఉపయోగించారు.
అలాగే ‘పూర్ణమ్మ’, ‘కన్యక’ వంటి రచనల్లో స్త్రీ జీవితంలోని వేదన కనిపిస్తుంది .

‘ముత్యాల సరాలు’ ద్వారా తెలుగు కవిత్వంలో కొత్త ఛందోరీతులకు మార్గం సుగమం చేశారు.

గురజాడ సాహిత్యంలో మరో గొప్ప మార్పు భాషలో వచ్చింది.

గిడుగు వెంకట రామమూర్తి పంతులు ప్రతిపాదించిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని బలపరుస్తూ ప్రజలు మాట్లాడే భాషలోనే రచనలు చేసారు.
దేశభక్తి గీతం, లవణ రాజు కల, దుద్దుబాటు మెకంజీ పంతులు వాడుక భాషలో వచ్చిన రచనలు.

అందుకే గురజాడ రచనలు నేటికీ పాఠకులకు సహజంగా, సజీవంగా అనిపిస్తాయి.
గురజాడ కవి, నాటకకర్త. ఆయన సాహిత్యంలో మానవత్వం, హేతుబద్ధమైన ఆలోచన, సామాజిక బాధ్యత, దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

ఆధునిక తెలుగు సాహిత్యానికి అడుగు జాడ గురజాడ.

వచన కవితా ప్రవీణ కనపర్తి రామచంద్రా చార్యులు

“వచన కవిత నా- ఉద్యమం
వచన కవిత నా- ఉద్యోగం

అని నినదించి, వచన కవిత్వమే ధ్యాసగా, శ్వాసగా జీవించిన కవి కనపర్తి. తెలంగాణా తల్లి ఒడిలో ఉదయించిన సిద్ధిపేట ముద్దు బిడ్డ. వచన కవితా ప్రవీణ కనపర్తి రామచంద్రాచార్యులు.

కనపర్తి 1947 ఆగస్టు 8వ తేదీన జన్మించారు. తల్లి భూలక్ష్మి, తండ్రి రంగన్న, రంగన్నగారు తెలంగాణ సాయుధ పోరాటంలో వీర మరణం పొందారు. అపుడు కనపర్తికి 5నెలల వయస్సు.
తల్లి భూలక్ష్మిగారు (తెలుగు భాషా పండితులు) తల్లి, తండ్రి, గురువు తానై కనపర్తిని చక్కని విద్యాబుద్ధులతో తీర్చిదిద్ది మంచి కవిని సమాజానికి అందించారు. బయోడేటా అన్న కవితలో కనపర్తి తన గూర్చి ఇలా వ్రాసుకున్నారు.

“నాన్న ఒక ‘అగ్గిపుల్ల’ వెలిగించి వెళ్ళిపోయారు
అమ్మ ‘చమురు’ లాంటిది
ఇంకా నా కోసం లోలోపలే ఇగిరి పోతుంది

కనపర్తి ప్రాథమిక విద్యాభ్యాసమంతా తోర్నాల, సిద్ధిపేటలో జరిగింది. కనపర్తి స్కూల్ స్థాయిలోనే భారత భాగవత రామాయణాది కావ్యాలు ప్రాచీన కావ్యాలు చదివారు.
కనపర్తి మొత్తం 47 వచన కవితా సంపుటాలు
రచించారు.
1)అక్షర శిల్పాలు
2)గీతం నా సంగీతం 3)వెలుతురు పూలు
4)రాళ్లు ముళ్ళు
5)గుండె గూటిలో పక్షులు
6)మనిషి అక్షరమైతే 7)హృదయం
8)ఆవిష్కారం
9)చినుకులు
10)నగరంలో వెన్నెల 11)కెరటాలు,
12) కళ్యాణ రాగాలు+రసరేఖలు
13) చౌరస్తా
14) దేవుడికి ఉత్తరం-
15)చిల్ల పెంకులు- చిలక్కొయా
16)పూజా పుష్పాలు
17) పిట్టగూడు
18) భగవాన్ ఉవాచ
19) నైమిశారణ్యం
20) పల్లేరు కాయలు
21) గడ్డి పోచలు
22) హృదయాంజలి
23) సిరా చుక్కలు
24) ఈ మట్టినే నేను ప్రేమిస్తాను
25) రాళ్ళలో రాగాలు
26) నదీ సుందరి
27) కనపర్తి -వేణుగానం
28) కిటికీలో సముద్రం
29) కర్పూర హారతి
30) పూలు- మనుషులు
31) మోహన మురళి
32) శుభోదయం
33) ఆకులో ఆకునై
34) పొద్దు తిరుగుడు పూలు
35) నైవేద్యం
36) కనపర్తి -మౌన కోకిల
37) అక్షరార్చన
38) మంత్రపుష్పం
39) రాగాంజలి
40) అక్షర వైజయంతి
41) తెల్ల పావురం.( 2010) కనపర్తి
ఇది చివరి రచన.

ఇవి కనపర్తి రామచంద్రాచార్యుల వచన కవితా సంపుటాలు.
వారి రచనలు మొత్తము -47
కానీ 41 మాత్రమే దొరికాయి.

గుండు పిన్ను,
చెత్త కుండి,
మసి గుడ్డ అలుకుపిడస
నీటి గుంట,
పగిలిన గాజు ముక్క
కూడా కనపర్తి కి కవితా వస్తువులే.

కాలికి గుచ్చుకున్న గాజు ముక్క .
వారి చేతిలో అంద
మైన కవితగా రూపు దిద్దుకుంది.

“ఏ తల్లి కరకంకణమై మెరిసిందో –
ఏ చెల్లి హస్తభూషణమై విరిసిందో-
ఏ ప్రణయ కలహంలో అలిగి-
ఏ ప్రళయ సమరంలో నేలరాలిందో-“
ఇది వారి అభివ్యక్తి.

“అయోనిజ “
అన్న కవితలో –

“తనలో తాను రమించే కవి జ్వలించే హృదయం నుంచి జనించే కావ్యం
యజ్ఞ గుండం నుంచి ఉద్భవించే ద్రౌపది.–
తనలో తానే తపించే కవి గుండెలు చీల్చుకొని వచ్చిన కవిత-
పాయలుగా చీలిన భూమి నుండి ఉద్భవించిన సీత!!
సరస్సులైన “నలుగుర్నీ” అలరిస్తుంది.
రసికుడైన ఒక్కడినే వరిస్తుంది.అందుకే కవిత్వం అయోనిజ “అంటారు.

“పుట్టినరోజు పేరుతో ముట్టించిన దీపాల్ని ఆర్పకు పడమటి ఆచారాన్ని పట్టుబట్టి నేర్పకు”
ప్రాశ్చాత్య సంస్కృతికి బానిసలు కావద్దన్న సందేశం ఇది.
“కవిత్వం కనకపు సింహాసనం-
దానిమీద అశ్లీలపదాల శునకాలనీ కూర్చోబెట్టకు-
గాడిద మాసిన గుడ్డల్ని మోసినట్లు కాదు-
అశ్వం వీరయోధున్ని మోసినట్లు-
పదం అర్థ గౌరవాన్ని సంతరించు కోవాలి” అంటారు కనపర్తి.

వారు పలకరించని పువ్వు లేదన్న అతిశయోక్తి కాదు.

వారి 47 కవితా సంపుతాల్లో 50 చొప్పున కవిత లున్నాయి . అముద్రిత
కవితలు అనేకం.
కనపర్తి “వచన కవితాప్రవీణ” “వేముకంటి పురస్కారం”అందు కున్నారు.

కనపర్తి 15-7-2011 న స్వగ్రామం సిద్దిపేటలో మరణించారు.

వారి రచన “కోయిల ఓ కోయిల” ఇంటర్ ద్వితీయ సంవత్సరం తెలుగు వాచకంలో ఉంది.

(బహుశా ఈ సంవత్సరం మారి ఉండవచ్చు)
కనపర్తి రచనల
మీద “కనపర్తి కవిత్వం- సమగ్ర పరిశీలన” అనే అంశంపై డాక్టర్ బి. జయ రాములు గారి మార్గదర్శకత్వంలో నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 2010లో డాక్టరేట్ తీసుకోవడం
నా అదృష్టంగా భావిస్తున్నాను

      

September 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

మధ్యతరగతి మహాభారతం

by Sayyad Khasim Ali September 28, 2026
written by Sayyad Khasim Ali

పుడితే ఉన్నోడిగా పుట్టాలి
లేకుంటే లేనోడిగా ఉండాలి
మధ్యతరగతిలో ఉంటే అధోగతే
ఎప్పటికీ ఇది ఎటూకాని తరగతే

లేనోడి బతుకుకు ఒక అర్థం ఉంది
ఉన్నోడి బతుకులో పరమార్థం ఉంది
ఈ మధ్యతరగతి లోనే అనర్ధం ఉంది

లేనోడికి అన్నిట్లో రాయితీలే
ఉన్నోడికి అంగిట్లో ఆనవాయితీలే
మధ్యతరగతి వాకిట్లో అన్నీ పంచాయితీలే

మేము కలలు కూడా పొదుపుగానే కంటాం
పిల్లల్ని కన్నట్టే
ఖరీదైన కలలు అసలే కనం
గొంతెమ్మ కోరికలు తీరాలి అనం
గొంతెత్తి ఇది కావాలి అనం
కష్టాల్లో కూడా అడగం ఎవరినీ సాయం
హాస్యానికి కూడా దేనినీ అపహాస్యం చేయం

మా జీవితాలు బాధ్యతలకు అంకితం
మా జీతాలు అప్పులకు అర్పితం

ఉన్నోడికి వెన్నుపోటు భయం
లేనోడికి పెన్నుపోటు భయం
మాబోటి వాడికి పన్నుపోటు భయం

నెల జీతం పడంగనే
ఇంట్లో కుస్తీలు
బ్యాంకుల్లో కిస్తీలు
గల్లీలో నయా దోస్తీలు

మా జీవితాలు….
నెలసరి వేతనాలు
దినసరి మంతనాలు
ఇంటింటి రామాయణాలు
నట్టింటి ప్రేమాయణాలు

మా కుటుంబాలు…
అర్థాకలి మంటలు
ఆశ నిరాశల తంటలు
ఎప్పటికీ పండని పంటలు
ఎన్నటికీ వండని వంటలు

మా మధ్యతరగతి బతుకులు
కలిమిలేముల భేదాలు
తీరని కోరికల జూదాలు * అవసరాల అరణ్యవాసాలు
అవకాశాల అజ్ఞాతవాసాలు

అయినా సరే…..
ఈ బాధ్యతల రణరంగంలో
ఈ చిక్కుముడుల చక్రవ్యూహంలో
ఈ నైతిక విలువల పద్మవ్యూహంలో
ఈ ప్రేమాభిమానాల కురుక్షేత్రంలో
మేము ఎన్నటికీ ఓడిపోని సైనికులమే
ఈ కష్టనష్టాల మధ్య తరగతి మహాభారతంలో
మేము ఎప్పటికీ విజేతలైన
పాండవులమే

జైహింద్!!!

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్మ-ప్రేమామృత స్రవంత

by Devulapalli Vijayalaxmi September 28, 2026
written by Devulapalli Vijayalaxmi

నాలుగునెలల పసిగుడ్డు మృదులకు స్థన్యం ఇస్తోందన్నమాటే కానీ యశోద కళ్ళుమాత్రం ఏదో వెతుకుతున్నాయి. స్థన్యం నోటినుంచి జారిపోవటంతో ఏడుపులంకించింది చిన్నారిమృదుల. మరల స్థన్యంఅందించిన యశోద, నోటిలో స్థన్యంతో నిద్రలోకిజారుకున్న మృదులని పదిలంగా ఉయ్యాలలోపడుకోబెట్టి దోమతెరవేసింది. తలుపుచేరవేసి నెమ్మదిగా గదిబయటకు వచ్చింది. 

యశోద ఇల్లంతా కలయతిరిగింది. “కన్నా! కన్నా!” అని పిలుస్తూ. 

అలికిడిలేదు. ‘పిచ్చి తండ్రి ఎక్కడున్నాడో!’ అనుకుంటూ చుట్టూచూసింది యశోద. 

కుర్చీకి డైనింగ్ టేబుల్ కి మధ్య బాసపీట వేసుకొని కూర్చుని ఉన్నాడు రెండేళ్లకృష్ణ. ఏడ్చిఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి. నల్లటి గిరజాలజుట్టు కళ్ళల్లో పడుతోంది. పచ్చటి బుగ్గలు బాగాఏడ్చిన గుర్తుగా గులాబీరంగులో ఎర్రబడ్డాయి. బుగ్గలమీద నీటిచారికలు, తడిసిన జుబ్బా చాలాసేపు ఏడ్చిన ఆనవాళ్ళని మిగిల్చింది. 

“కన్నా! ఇక్కడ ఇరుక్కుపోయావా? రాలేక ఏడ్చావా? పిచ్చితండ్రి. అంటూ కుర్చీజరిపి చేతులు చాచింది.” యశోద.        

గబగబా దేకుతూవచ్చి రెండుకాళ్లు చుట్టుకున్నాడు కృష్ణ. ‘అమ్మ! అమ్మ!’ అంటూ టేబుల్ చూపించాడు.
 
“ఆ మూల ఎందుకు దూరావు తండ్రి?” అంటూ 
ముద్దుల వర్షం కురిపించింది యశోద.

చాపవేసి రబ్బర్  షీట్ పరిచి కృష్ణని పడుకోబెట్టింది.

చేతికి ఒక యాపిల్ ముక్క ఇచ్చి నిక్కర్ తీసేసి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ‘కాడ్లివర్’ ఆయిల్ చేతిలోకి తీసుకుని పీలగాఉన్న కృష్ణకాళ్ళకి మర్దనచేస్తూ, ‘ ఏ జన్మలో నేనుచేసుకున్న పాపమో లేక పసివాడిప్రారబ్దకర్మమో మూడునెలల వరకు బొద్దుగా చలాకీగా ఉన్న 
పిల్లవాడి శరీరంపెరిగింది. కానీ కాళ్లుపీలగా అలాగే  ఉన్నాయి.’ అనుకుంది యశోద.

 ఎంతోమంది డాక్టర్లకు చూపించాడు చక్రపాణి, యశోదలు. ఏమి ప్రాబ్లంలేదని,  ఆయిల్ మసాజ్ చేసి ఎండలో పడుకోపెట్టమని కాళ్లు చిన్నగా ఊపుతూ 
వయసుకితగ్గ ఎక్సర్సైజెస్ చెప్పి చేయించమన్నారు. మొదట్లో ఎనిమిదోనెలవరకు వెల్లకిలాపడుకొని పిచ్చుకలనిచూస్తూ కేరింతలు కొట్టేవాడు. బోర్లపడటం 
ప్రాకటం లాంటివి చేయలేకపోవడంతో డాక్టరు సపోర్ట్ ఇచ్చి డైరెక్ట్ గా కూర్చోబెట్టమంటే నెమ్మదిగా ప్రయత్నించింది యశోద. మొత్తానికి నెమ్మదిగా కూర్చోగలిగాడు. కానీ పాకడానికి ప్రయత్నం చేయలేదు. ఏదైనా వస్తువునిచూపెడితే ముందుకి వెనక్కి ఊగేవాడు అందుకోవటానికి. కానీ ముందుకు జరిగేవాడు కాదు. మసాజ్ ప్రభావంతో కూర్చునే కాళ్లుజాచి మడచి టపటపా 
కొట్టుకోవడం, ఆ ప్రయత్నంలో కొంచంగా ముందుకు
జరగడంతో నెమ్మదిగా రెండు చేతులు ముందుకు ఆనించి కాలు జాపి ముందుకు శరీరాన్ని ఈడ్చి మళ్ళీ రెండోకాలు మడిచి ఎలా అయితేనే దేకడం మొదలు
పెట్టాడు. అలా దేక్కుంటూ దేనిక్రిందోదూరి అక్కడి
నుంచి రాలేని స్థితితో ఏడవటం పరిపాటి అయింది.

యశోద వద్దనుకున్నా అనుకోకుండా మృదుల
 కడుపున పడటంతో శ్రమ ఎక్కువైంది.

 తల్లివారిస్తున్నా  యశోద పురిటినొప్పులవరకు కృష్ణ కాళ్ళకి మసాజ్ చేయటం ఎండలో పడుకోబెట్టడం మాత్రం క్రమంతప్పకుండా చేస్తూవచ్చింది.

                             ★★★

ఏణ్ణార్ధం మృదుల రబ్బరు బొమ్మలా బుడిబుడి నడకలతో ఇల్లంతా పరిగెడుతూ ఉంటే, ఒకచోట బాసిపీట వేసుకుని సంతోషంగా చప్పట్లు కొట్టేవాడు కృష్ణ.
 
మృదులని చూసి కృష్ణ ఆసక్తితో నుంచోటానికి ప్రయత్నించసాగాడు. కండరాల, నరాల బలానికి ఇచ్చిన మందులవల్ల అయితేనేమి చిన్నగా పట్టుకుని నుంచోవటం మొదలుపెట్టాడు. ఆసరాతోనడవడం మొదలుపెట్టిన కృష్ణనిచూసి తల్లిమనస్సు ఉప్పొంగిపోయింది. ముక్కోటి దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకుంది.

భగవంతుడు కృష్ణకి అఖండమైన తెలివితేటలు ఇచ్చాడు. ఏకసంథాగ్రహి.ఐదవయేట స్కూల్ కి 
పంపారు కృష్ణని.

                        ★★★

చక్రపాణి గ్రామీణ బ్యాంకులో మేనేజర్ కావడంతో 
ఎక్కువగా చాలాచిన్నటౌన్ లలో గ్రామాలలో తరచూ బదిలీలతో పిల్లలచదువులకి ఇబ్బంది ఏర్పడేది. కొన్ని సందర్భాలలో భార్యాపిల్లలని ఒకఊర్లో అట్టేపెట్టి తనుమాత్రం వెళ్లివస్తూ ఉండేవాడు ఆ విధంగా కృష్ణకి 
తండ్రికంటే తల్లిదగ్గర చేరిక ఎక్కువ. చిన్నప్పటి 
అనారోగ్యం దృష్ట్యా యశోద కృష్ణని పల్లెత్తుమాట అనేదికాదు. ఆ అవకాశం కూడా ఇచ్చేవాడుకాదు కృష్ణ. అంతటి పల్లెటూర్లలో చదివిన కృష్ణ టెన్త్ క్లాసు స్టేట్ 
ఫస్ట్ వచ్చాడు. 

అసలు సమస్య అప్పుడు మొదలైంది కృష్ణని మేనమామ ఇంట్లో హైదరాబాదులో పెట్టి ఇంటర్ చదివించాలని నిర్ణయించాడు చక్రపాణి.

“నేను అమ్మనివదిలి ఉండను.” అన్నాడు కృష్ణ. తల్లిని బ్రతిమిలాడాడు.

“కన్నా! ఈఊర్లో ఉన్న చిన్నకాలేజీల్లో చదవితే 
భవిష్యత్తు ఉండదు. మావయ్య దగ్గరి ఉండి చదువుకో.  మృదులది ఇంకా స్కూలుచదువు పర్వాలేదు. అంటూ నచ్చచెప్పింది.

ఎప్పుడూ లేనిది మృదులమీద చూచాయగా ఈర్ష 
పొడచూపింది కృష్ణలో. దానికి తగ్గట్టు చక్రపాణి కృష్ణకి నచ్చచెప్పినా మొండిపట్టుదల పట్టడంతో కొంత 
కఠినంగామాట్లాడటం, తల్లి తండ్రికిమద్దతు పలకటంతో తల్లిమీదకూడా అలక వచ్చింది. తప్పనిసరిగా 
వెక్కివెక్కి ఏడుస్తూ హైదరాబాదు మేనమామ ఇంటికి బయలుదేరాడు కృష్ణ.

                          ‌ ★★★

కృష్ణ లేని ఇల్లు నెలవంక లేని నింగి అయింది. మాటకి ముందు వెనక ‘అమ్మ అమ్మ’ అంటూ వెంటపడే కృష్ణని తలుచుకుని కుమిలింది యశోద.
 
“యశోదా! మనం కృష్ణ భవిష్యత్తు రీత్యా పంపాము. అయినా ఎక్కడికి వెళ్ళాడు? మీ అన్నయ్య ఇంటికే 
కదా! నాకు మాత్రం ఇష్టమా? ఇంకొక రెండేళ్లు నేను ఈ రూరల్ బ్రాంచ్ లో పనిచేయక తప్పదు. తర్వాత రిక్వెస్ట్ పెట్టుకొని సిటీకి ట్రాన్స్ఫర్ అయితే కృష్ణని మనదగ్గరే ఉంచుకుందాం. సరేనా!” అన్నాడు చక్రపాణి. 

“అవునమ్మా! అన్నయ్య లేకపోతే నాకు తోచటం లేదు. నాన్న అన్నట్లు కొద్దిరోజులు ఓర్చుకుందాం.” అంటూ ఆరిందాల తల్లిని ఓదార్చింది మృదుల. 

                            ★★★

కాలచక్రానికి ఎవరి సుఖదుఃఖాలతోనూ సంబంధం 
లేదు. దానిత్రోవన అది తిరుగుతూ ఉంటుంది. సెలవులకు కృష్ణరాక ఒక కొడుకుగాకాక బంధువుగా మారిపోయింది. తండ్రితో ముభావంగా తల్లితో రాను రాను ముక్తసరిగా ఉండటం మొదలుపెట్టాడు.
‘కన్నా!’ అని యశోద పిలవంగానే కోపంతో కళ్ళల్లో కి గుచ్చిగుచ్చి చూసేవాడు. యశోద హృదయం తల్లడిల్లేది. మృదులతో గిల్లికజ్జాలు అసలే లేవు.

“ఏమండీ! కన్నా ప్రవర్తన నాకు చాలాభయంగా 
ఉంది.” అంది యశోద.
 
“కొంచెంమార్పు ఉంది.అయినా బాధపడాల్సిన అవసరంలేదు. పదిహేనేళ్ళ వయసులో ఇటువంటి మార్పుసహజం. టీనేజ్ ప్రాబ్లం. నెమ్మదిగా మన నిర్ణయం  వాడి బంగారు భవిష్యత్తుకని అర్థమవుతే అన్ని సర్దుకుంటాయి.” అని సర్దిచెప్పాడు చక్రపాణి.

చెప్పడంఅయితే చెప్పాడుకానీ చక్రపాణికి కృష్ణ లోని స్తబ్దత తుఫాను ముందు ప్రశాంతతలా గోచరించ
సాగింది. 

బావమరిదికి ఫోన్ చేసి కృష్ణ ప్రవర్తనను గురించి ప్రస్తావించాడు చక్రపాణి.

“ఏంలేదు బావా! ఎకడమికల్లీ వాడు ఎక్సెల్. ఇక మూడ్స్ అంటావా  ఆ వయసులో  సహజమే కదా!
నువ్వు నేను ఆ వయసు దాటి వచ్చాం కదా! 
ఇకపోతే వాడికి చెల్లాయి మీద బెంగ ఎక్కువ. ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. ‘ఏరా!’ అంటే ‘ఏం లేదు మామయ్య’ అంటాడు. వీలైనప్పుడు వాడికి నేను 
విడమర్చి చెప్తున్నా వాడిక్కడ ఉండాల్సిన దానికి 
కారణం. పృథ్వి కూడా చదువు రీత్యా బయట ఉన్నాడని.ఆ నిమిషం కాంప్రమైజ్ అయినట్లే అవుతాడు. మళ్ళీ వాడి మూడ్ లోకి వెళ్తాడు.” అన్నాడు చక్రపాణి బావమరిది వంశీమోహన్. 

                               ★★★

కనులుమూసి తెరిచేలోపల రెండేళ్లు ఇట్టేగడిచాయి.
చక్రపాణికి మేనేజర్ గా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది. 

కృష్ణ స్టేట్ ఫస్ట్ లో ఇంటర్ పాస్ అయ్యాడు. ఢిల్లీ ఐ.ఐ.టీలో క్వాంటం టెక్నాలజీ అండ్ కాంపిటేషనల్ ఇంజనీరింగ్ బీటెక్ లో సీట్ వచ్చింది.

మృదుల టెన్త్ హైయెస్ట్ పర్సెంటేజ్ తో పాస్ అయింది. శ్రీ విశ్వా ఐ.ఐ.టి అండ్ మెడికల్ అకాడమీలో ఇంటర్లో చేరింది. 

ఢిల్లీ వెళ్లేముందు వచ్చి ఒక రెండునెలలు తల్లితండ్రి 
దగ్గర ఉన్నాడు కృష్ణ.ఈ రెండునెలల్లో సాధ్యమైనంత ఎక్కువ సమయం కృష్ణ తో గడపటానికి 
ప్రయత్నించారు చక్రపాణి, యశోద, మృదుల. 

చక్రపాణి ఎల్.టి.సి మీద నార్త్ ఇండియా టూర్ కి కుటుంబాన్ని తీసుకుని వెళ్లాడు. 

                           ★★★

సిమ్లా హోటల్లో దిగంగానే పదమూడేళ్ళ రుద్ర వీరి సామాను రూముకి తీసుకెళ్లాడు. 

కృష్ణకి వాడిని చూడంగానే ఆశ్చర్యమనిపించింది. 
పాలు గారే మేనిఛాయ, నీలి కళ్ళు, కోటేరు ముక్కు, 
చెరగనిచిరునవ్వు. ‘ఇంత చిన్న వయసులో ఇంతింత బరువులు ఎలా మోస్తున్నాడా!’ అని.

“రుద్రా! ఆప్ పఢాయి కర్ రహే?” అని అడిగాడు కృష్ణ.
 
“హాఁ సాబ్! ఆఠవీ క్లాస్ మే హూఁ!”

“ఆప్ కే పేరెంట్స్!”అంటూ అర్ధోక్తిగా ఆగాడు కృష్ణ.

“గాఁవ్ మే హై! ఉధర్  ఖేతీబాడీ దేఖ్ రహే హై. మై  ఇధర్ హోటేల్ మె కామ్ కరతే పఢాయి కర్ రహా హూఁ!” అన్నాడు రుద్ర.

కృష్ణ మనసులో ఎక్కడో అలజడి రేగింది. 

మూడు రోజులు సిమ్లా అక్కడి మనుషులను, వారి
 జీవనశైలిని గమనించాడు.

అక్కడనుంచి డెహ్రాడూన్ వెళ్లారు. చక్రపాణి క్లాస్మేట్ 
రవిశర్మ  ఇంట్లో దిగారు. రవిశర్మ ఓ.ఎన్.జి.సి లో సైంటిస్ట్. అక్కడ ఉండి చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలనుకున్నారు. 

కృష్ణ , మృదులకి అక్కడి వాతావరణం, ఎఫ్.ఆర్.ఐ ముందు వాస్ట్ లాన్స్ ఎంతో నచ్చాయి. మార్నింగ్ వాక్ కి వెళ్ళన వారికి ఇండియన్ ఆర్మీ మార్చ్ పాస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చింది.వారందరూ కుటుంబాలకు దూరంగా దేశరక్షణకై జీవితాలని అంకితంచేస్తున్నారని కృష్ణకి 
వారిమీద గౌరవం కలిగింది.

మాటల్లో చక్రపాణి,  “ఏరా! రవీ! నీ పిల్లలు కనపడటం లేదు.” అని అడిగాడు. 

“పెద్దవాడు ఐ.ఎం.ఏ లో ఉన్నాడు. చిన్నవాడు డూన్ బోర్డింగ్ స్కూల్లో ఉన్నాడు. వెకేషన్ కి వస్తారు.
 ఇల్లంతా సందడే. పిల్లలు పైకి రావాలంటే వాళ్ళని 
ఇలా దూరంగాపంపి చదివించాల్సివస్తోంది. మన
 రోజుల్లో కాంపిటీషన్ వేరు.ఇప్పటి కాంపిటీషన్ వేరు. మా ఆవిడ అన్నంముందు కూర్చుని కళ్ళనీళ్లు పెట్టుకోని రోజులేదు. చదువు పేరుతో ఇప్పుడు, తర్వాత ఉద్యోగాల పేరుతో, ఆ తరుత పెళ్లిపేరుతో దూరమవుతారు అని బాధపడుతుంది.” అన్నాడు రవిశర్మ. 

“అంతే కదండీ!” అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో అందరికీ కాఫీలు అందించింది అనురాధ. 

“కృష్ణా! నువ్వు మీఅమ్మ అదృష్టవంతులు. 
పదిహేనేళ్ళు అమ్మదగ్గర ఉన్నావు. మాపిల్లలు 
ఐదారేళ్ల అప్పటినుంచి బోర్డింగ్ స్కూల్.” అంది అనురాధ 

“ఇదిగో ఇద్దరూ రేపు వస్తారు వెకేషన్ కి సుడిగాలుల్లా.  మీరేచూస్తారుగా. వాళ్లువచ్చాక ఔటింగ్ ప్లాన్ చేద్దాం.” అన్నాడు రవిశర్మ

                       ★★★

రవిశర్మ చెప్పినట్లుగానే రాకేష్ రోషన్లు చిచ్చర పిడుగులు.
 రాకేష్ కి పంతొమ్మిది ఏళ్లు, రోహన్ పధ్నాలుగేళ్ళ వాడు.
‘అంకుల్! ఆంటీ!’అంటూ చక్రపాణిని, యశోదని,
 ‘హాయ్ కృష్ణ!’,  ‘ప్యారీ బహన్’ అంటూ మృదులని ఆప్యాయంగా పలకరించారు వస్తూనే.

 వారి స్కూల్లో, కాలేజీలో జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెబుతూ కొంతమందిని ఇమిటేట్ చేసి కడుపుబ్బ నవ్విస్తూ ఇల్లంతా చైతన్యంతో, పాజిటివ్ ఎనర్జీతో నింపారు.

మగపిల్లలైనా తల్లికి వంటింట్లో సహాయం చేయటం, లంచ్ కి డైనింగ్ టేబుల్ అరేంజ్ చేయటం చూసిన 
కృష్ణ తనను తాను విశ్లేషించుకున్నాడు.

‘ సెలవలకి వచ్చినప్పుడు తను ఎంతో కోపంతో, 
విసుగు చికాకుతో, చెల్లెల్ని  పలకరించేవాడు కాదు. 
తనను దూరంపెట్టి అదిమాత్రం అమ్మానాన్నలతో హ్యాపీగా ఉందన్న భావనతో, తనకిష్టం లేకపోయినా తనని దూరంగా మామయ్యఇంటికి పంపారన్న కోపంతో 
సెలవులకు వచ్చినప్పుడు తండ్రితో ముక్తసరిగా, 
తనకు ప్రాణానికి ప్రాణమైన తల్లితో అరాకురా మాట్లాడేవాడు. మరి వీళ్ళిద్దరూ ఏకంగా హాస్టల్లోఉంటూ ఇంటికిరాంగానే వాళ్ళ అమ్మానాన్న పెన్నిధి అయినట్లు ప్రతినిమిషం అపురూపమైనట్లు ప్రవర్తిస్తున్నారు.’ అనుకున్నాడు కృష్ణ.

అందరూ కలిసి డెహ్రాడూలోని కింప్టీఫాల్స్, భట్టా 
ఫాల్స్, ఝరీపాన్ని ఫాల్స్ కి వెళ్లారు. 

 నెక్స్ట్ డే రిటర్న్ బయలుదేరు దామనుకున్నాడు చక్రపాణి.

 “అంకుల్! రేపు మేముముగ్గురం ముస్సోరి ట్రెక్కింగ్ కి వెళ్తాము. విత్ యువర్ కైండ్ పర్మిషన్.” అని అడిగాడు రోహన్ చక్రపాణిని. 

” నేను వస్తాను.”  అంది మృదుల.
 
“నో ప్రాబ్లం” అన్నారు రోహన్,రోహిత్.

“నో! బిటియా నా దగ్గర ఉంటుంది.వుయ్ హావ్ సమ్ అదర్ ప్లాన్.” అంది అనురాధ. 

“అన్నయ్యగారు! మృదుల ఉంటే ఇంటికి లక్ష్మీకళ 
వచ్చింది రంగురంగుల బట్టలతో.ఈ వెధవలు నలుపు నీలం జీన్స్ ప్యాంట్లు చూసి చూసి విరక్తి పుట్టింది.” 
అంది అనురాధ.

వెంటనే రోహన్ అనూరాధని కావలించుకుని, “మామ్! నీకు ఇష్టమైన డ్రెస్సెస్,ఫ్రాక్స్ అన్నీ కొను.  ఇంటికి వచ్చినప్పుడు నేను వేసుకుంటా.అంతేకానీ మా ప్యాంట్స్ గురించి మమ్మల్ని దూరం చేయకు. అంటూ తల్లి దుపట్టాని పమిటలాగా వేసుకున్నాడు.”

“ఛీ! డర్టీ ఫెలో!” అంటూ దుపట్టా లాక్కుంది అనురాధ. 
అందరూ కడుపు చెక్కలయ్యేట్లు నవ్వారు. అందరూ సంతోషంగాఉన్నా యశోదలో ఏదో ఆందోళన, భయం కనిపెట్టాడు చక్రపాణి. 

ఒంటరిగా ఉన్నప్పుడు “యశోదా! ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు?” అనిఅడిగాడు చక్రపాణి.

“మీరు కృష్ణని ట్రెక్కింగ్ కి వెళ్లటానికి ఒప్పుకున్నారు. వాడి కాళ్లు బలహీనమైనవి కదా! బిడ్డ ఇలా తన 
కాళ్ళ మీద నడవగలడని నేను ఎన్నడూ అనుకోలేదు.భగవంతుని దయవల్ల వాడికి కాళ్లు వచ్చాయి తెలివితేటలు కూడా ఆ భగవంతుడి దయ. ట్రెక్కింగ్ చేస్తూ హఠాత్తుగా వాడి కాళ్లు చచ్చు పడతాయేమో అని 
భయంగా ఉందండి. రెండేళ్లుగా మనతో వాడు సరిగ్గా లేడు ఇప్పుడు కాదంటే మళ్ళీ నామీద కోపం పెంచుకుంటాడని భయంగా ఉంది.” అంది దిగులుగా 
యశోద.

“పిచ్చిదానా! అది ఒక పీడకల.  ఇప్పుడు వాడు పదిహేడేళ్ళవాడు. ఒంటరిగా హాస్టల్లో ఉండి ఢిల్లీలో చదువుకోవాలి. పిల్లలు ఢక్కామొక్కీలు తింటేనే  జీవితంలో రాణించగల ధైర్యం వస్తుంది. రాకేష్, రోహన్ లని చూడు. ఎంత డేరింగ్ గా ఉన్నారో. తమని చిన్నప్పుడే హాస్టల్లో వేశారన్న అభియోగంలేదు. వీడువాళ్లతో తిరగటంతో కొంత ఎక్స్పోజర్ వస్తుందన్ననమ్మకంతో 
రిటర్న్ టిక్కెట్టు పోస్ట్ పోన్ చేశా. లీవ్ ఎక్స్టెండ్ చేశా. నువ్వు అనవసరమైన భయాలు పెట్టుకోకు.” అంటూ ఊరడించాడు చక్రపాణి. 

                                 ★★★

ట్రెక్కింగ్ కి బయలుదేరిన ముగ్గురు ఎప్పటికప్పుడు 
ఇన్ఫర్మేషన్ ఇచ్చేట్టుగా ఒప్పుకున్నారు. 

“ఆంటీ! మేము పెద్దహిల్స్ ట్రెక్కింగ్ కి వెళ్ళటంలేదు. అక్కడ కొంచెం ల్యాండ్ స్లైడింగ్ ఇష్యూస్ ఉన్నాయి. 
మేము సరదాగా వెళ్తున్నాం. భద్రాజ్ చాలా ఫ్రెండ్లీ. 
ఎక్కువగా రాక్స్ ఉంటాయి మీ సింహాచలం లాంటిది.”అంటూ యశోదకి రాకేష్ ధైర్యంచెప్పాడు. 

కృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాకేష్ రోహన్లతో కృష్ణకి చాలా ఎక్స్పోజర్ వస్తోందనిపించింది చక్రపాణికి .

పిల్లలు ముగ్గురు ముస్సోరీ కి వెళ్ళంగానే ఇల్లంతా బోసిపోయింది. 

జర్నీలో కృష్ణ రాకేష్ ని “అన్నా! మీకు మీ అమ్మానాన్న హాస్టల్ లో చిన్నప్పటినుంచి ఉంచారని బాధగాను కోపంగాను లేదా !” అని అడిగాడు 

“బాధ ఉంటుంది కృష్ణ. కంటికి రెప్పలా చూసుకునే 
అమ్మానాన్నకి దూరంగా ఉండాలంటే. కానీ మనం 
సొసైటీలో ఒకస్థానం సంపాదించాలంటే కొన్ని సుఖాలని వదులుకోవాలని నాన్నఅంటారు. అప్పుడే
కదా మనం పెద్దవాళ్ళమై మనపేరెంట్స్ ని హ్యాపీగా ఉంచగలం. అయితే నువ్వన్న కోపం మాకు 
అర్థంకాలేదు. వారేమీమనని పనిష్ చేయలేదుకదా! మనకి వారిమీద కోపం రావడానికి. వాళ్లకి దూరంగాఉండి మనమెంత బాధపడతామో! మనం దూరంగాఉంటే వాళ్లు అంతేబాధపడతారు. మేము వెకేషన్ కి రాంగానే అమ్మానాన్నలు సంతోషం వారి ప్రేమ చూస్తే మేము ఇన్నిరోజులు వారినివదిలి ఉన్నామన్న సంగతిమర్చిపోతాం. సరే! నీకు ఈఅనుమానం 
ఎందుకొచ్చింది కృష్ణ?” అన్నాడు రాకేష్.

“ఏమీలేదు ఊరికే ” అని తప్పించుకున్నాడు కృష్ణ. 

                            ★★★

“మనం ఇవాళ  ‘తాప్ కేశ్వర్ మహాదేవ్’ గుడికి వెళ్దాం చాలాపురాతన స్వయంభుశివలింగం గుహలో 
ఉంటుంది. గుహపైకప్పునుంచి నీరు శివలింగంమీద 
పడుతూఉంటుంది.” అని రవిశర్మ అందర్నీ గుడికి 
బయలుదేర తీశాడు. 

పచ్చని ప్రకృతి మధ్య గుహలో ఆ శివలింగాన్ని 
చూసిన యశోద భక్తి భావంతో కైమోడ్చ్చింది. ఆ 
భగవంతుని లీలలు అమోఘం. ఈ గుహలో వెలిసినది ఎలా తెలిసిందో అంది యశోద అనురాధతో. 

“ఈ గుడికి మహాభారతానికి అవినావసంబంధం ఉంది. ఇది గురువు ద్రోణాచార్యులవారు ధ్యానంచేసిన 
గుహ. అశ్వద్ధామతల్లికి పాలులేక శివునివేడుకోగా 
సాక్షాత్  శివుడే అశ్వద్ధామకి పాలిచ్చాడని ప్రతీతి.”
అంటూ స్థలపురాణాన్ని వివరించాడు రవిశర్మ .
ఆనందంగా ఇంటిముఖం పట్టారుఅందరూ. 

పరధ్యానంగా దిగులుగా ఉన్నతల్లిని గమనించింది మృదుల.

“అమ్మా! అన్నయ్యల గురించి దిగులుపడకమ్మా. రేపు సాయంత్రానికి వచ్చేస్తారుగా.” అంటూ తల్లి వీపునిమిరింది మృదుల. 

ఆరాత్రి యశోద కన్నుమూయలేదు. తెల్లవారింది. 
యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగింది. అందరూ కబుర్లలో పడ్డారు. 

మృదులను చూసి, “తల్లీ! నిన్ను చూస్తుంటే!” అంటూ అనూరాధ ఏదో చెప్పబోతుంటే —

“అనూ! ఇవాళ మెనూ ఏమిటి?” అని మాట
తప్పించాడు రవిశర్మ.

“ఏమి చేయమంటారు?” అందిఅనూరాధ.

“జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇవాళ యశోద వండుతుంది.ఏమంటావ్ యశోద?” అన్నాడు చక్రపాణి 

“సంతోషంగా” అంది.యశోద

                         ★★★

హఠాత్తుగా రవిశర్మ వంటింట్లోకివచ్చి, “అనూ! నేను 
చక్రపాణి ముస్సోరివెళ్తున్నాం. న్యూస్ లో ల్యాండ్ స్లైడింగ్ అయిందనివచ్చింది. ప్రాణనష్టం ఏమీలేదు. కానీ పిల్లల్ని కారులోతీసుకువస్తా .ఇన్నోవా తీసుకెళ్తున్నా!”  అంటూ ఆఘమేఘాల మీద చక్రపాణి రవిశర్మ 
వెళ్లారు..
వాళ్లటు వెళ్ళంగానే కుప్పలా కూలిపోయింది యశోద అచేతనంగా. వెంటనే మృదుల,అనురాధ యశోదని తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళారు. 

“ఏమీ పరవాలేదు. బీపీ డౌన్ అయింది అబ్జర్వేషన్ లో ఉంచాలి అడ్మిట్ చేయండి.” అన్నాడు డాక్టరు. 

మూసినకన్ను తెరవకపడుకున్న తల్లినిచూస్తే మృదులకి భయంవేసింది. 

“ఆంటీ! అమ్మకి ఏమికాదుకదా! అన్నలకి 
ఏమీకాదుకదా!” అంటూ దిగులుగా అడిగింది.
 “మృదులా!ఎవ్వరికి ఏమీకాదమ్మా! అందరూ క్షేమంగాఉంటారు. పద క్యాంటీన్లోఏదైనా తిందువుగాని అంటూ 
అనురాధ మృదులని క్యాంటీన్ కి తీసుకెళ్లి లంచ్ తినిపించింది.

                           ★★★

ముస్సోరి చేరిన చక్రపాణి రవిశర్మలకి మేజర్ ల్యాండ్ స్లైడింగ్ అవ్వటంతోను, వీరు ముగ్గురు సోలోట్రెక్కింగ్ కి వెళ్లడంతో రవిశర్మ మిలటరీ వారికి ఇన్ఫామ్ చేసి 
ఎంక్వయిరీచేశాడు. ప్రాణనష్టంలేదని కాకపోతే చాలామందికి దెబ్బలుతగిలాయని మెడికల్ క్యాంపులో ఉన్నారని తెలుసుకొని మెడికల్ క్యాంపుకివెళ్లారు. 

రాకేష్, రోహన్, కృష్ణలకి మైనర్ ఇంజ్యురీస్, కృష్ణకి మైనర్ ఫ్రాక్చర్ తో సేఫ్ గా ఉన్నారు.

తండ్రిని చూసి రాకేష్ రోహన్లు, “నో వర్రీస్ డాడ్! వుయ్ ఆర్ ఫైన్. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్.” అంటూ తండ్రికి ధైర్యం చెప్పారు. 

“నాన్నా!” అంటూ తండ్రిని హత్తుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు కృష్ణ. 

ఆ ఏడుపులో భయం బాధ నొప్పి కాదు అంతకు 
మించిన భావన తండ్రిగా చక్రపాణి అర్థం 
చేసుకున్నాడు. కట్లుకట్టి ముగ్గురిని డిశ్చార్జ్ చేశారు 
డాక్టర్లు.

రిటర్న్ డెహ్రాడున్ వస్తుంటే చక్రపాణికి యశోదపరిస్థితి వివరించాడు రవిశర్మ. ఆందోళన చెందవలసినది
 లేదని తెలిపాడు.

కృష్ణమనసులో తల్లిరూపం మెదిలింది. గతరెండేళ్లుగా తల్లిని మనసులో దూషించాడు.మానసికంగా హింసించాడు. 

‘భుజాన మృదులనువేసుకుని వడిలోతనని 
పడుకోపెట్టుకున్న తల్లిరూపం పదేపదే గుర్తుకు 
రాసాగింది.  ఇక్కడ తనుఆక్సిడెంట్ కి గురవడం 
అక్కడ తల్లి. పడిపోవటం. ఆమెకి తనంటే ఎంత 
ప్రేమ.’ తలచుకుని అప్రయత్నంగా  కంటిలోకన్నీరు 
ధారగా కారింది.
సాయంత్రానికి డెహ్రాడూన్ చేరారు.

తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని కృష్ణమనస్సు
 తల్లడిల్లింది. ముస్సోరి బయలుదేరేముందు తల్లి 
తండ్రితో మాట్లాడింది విన్నాడు. 

‘తల్లిది సిక్స్త్ సెన్స్ అనుకోవాలా? లేదా అమితమైన ప్రేమ అనుకోవాలా? నిజమే తనకాళ్ల స్ట్రెంగ్త్ తనకంటే అమ్మకే తెలుసు. ట్రెక్కింగ్ లో కొంత దూరం ఎక్కంగానే చచ్చుదనం అనిపించింది. వెంటనే వెనక్కు 
మరలటంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.
 తనని చూసి రాకేష్ రోహన్లు వెనకకు మళ్లారు.
చిన్నఊర్లో ఇంటర్మీడియట్ చదివిఉంటే ఏ కోచింగ్ లేకుండా తను ఐ.ఐ.టీలో సీటు సంపాదించగలిగేవాడా? రెండేళ్లు అమ్మని ఎంత అసహ్యంగా చూసాడు. అమ్మ కన్నా! అంటే కళ్ళల్లో కళ్ళుపెట్టి కోపంగాచూశాడే కానీ, అమ్మా! అని పిలవలేదు. ఇవాల్టిరోజున తనకుఏమైందో అన్నఆలోచనకే ఆమెగుండె ఆగిపోయేంత పరిస్థితి తెచ్చుకుంది. టెన్త్ వరకూ రోజుకాళ్ళకి నూనెమర్దన 
చేసి డ్రాయర్ తో ఎండలో నుంచో పెడితే అమ్మని విసుక్కునేవాడిని. కాళ్లులేని నన్ను నాకాళ్ళమీద నేను నిలబడటానికి అమ్మచేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీకావు.’ కళ్ళవెంబడి కన్నీటిధారతో స్వగతంగా అనుకున్నాడు కృష్ణ.
 
మరుసటి రోజు యశోదని డిశ్చార్జ్ చేశారు.

ఇంటికి వస్తూనే, “కన్నా! ఎలా ఉన్నావురా!” అంటూ 
పదిహేడేళ్ళ కృష్ణని పసివాడిని అక్కునచేర్చుకొనినట్ల అక్కున చేర్చుకొని మొహమంతా ముద్దులతో 
ముంచెత్తింది యశోద. 

‘అమ్మా నన్ను క్షమించు’ అంటూ అస్పష్టంగా 
గొణిగాడు కృష్ణతల్లిని పెనవేసుకుని. 

రాకేష్రో,హన్లు అనురాధ రవిశర్మలకి ఆ తల్లి కొడుకుల ప్రేమ అపురూపంగా అనిపించింది. 
హమ్మయ్య అనిఊపిరి పీల్చుకున్నాడు చక్రపాణి.

                           ★★★

సాయంత్రం అందరూసరదాగా ఆల్బమ్ చూస్తున్నారు. అందులోరోహన్ ని ముద్దుపెట్టుకుంటూ రోహన్ పోలికలోఉన్న అమ్మాయినిచూసి. “ఎవరీ అమ్మాయి?” 
 అని అడిగిందిమృదుల.

“మా చెల్లెలు” అన్నాడు రాకేష్. 

“మా అమ్మాయి రోహిణి. రోహన్ రోహిణిలు కవలలు. రోహిణికి హార్ట్ ప్రోబ్లెమ్. మీ ఆంటీ ఎంతో సేవచేసింది కూతుర్ని బ్రతికించుకోవాలని. కానీ భగవంతుడు 
నిర్దయుడు. మృదులా! నిన్ను చూడగానే ఆంటీకి కన్నకూతురు గుర్తుకువచ్చింది. నీలో రోహిణిని చూసుకొని ఈ వారంరోజులు ఆనందించింది.” అన్నాడు రవిశర్మ.

కూతురు జ్ఞాపకాలతో రవిశర్మ గొంతుక గద్గద మైంది. రవిశర్మని, అనురాధని, చక్రపాణి,యశోదలు అనునయించారు. 

పొగిలిపొగిలి ఏడుస్తున్న రోహన్ చేతిలోచేయివేసి ఆప్యాయంగా దగ్గరకుతీసుకుంది మృదుల.

                            ★★★
మూడు రోజులు ఉందామని వచ్చి వారం రోజులు 
మీతో ఎన్నో అనుభవాలను పంచుకున్నాంరా రవి.  
ట్రిప్పు ఎప్పటికీ మరిచిపోలేని ఆత్మీయతని పంచింది. మా కృష్ణలో పరివర్తన తెచ్చింది. అంటూ వీడ్కోలు 
తీసుకున్నాడు చక్రపాణి. 

                                        సమాప్తం

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us